Jump to content

రాఘవపాండవీయము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

ఉపోద్ఘాతము

ఇమ్మహాకావ్యమును నిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వచాతుర్యధుర్యుం డైనపింగలి సూరనార్యుఁడు రచియించెను. ఈమహాకవి నియోగిబ్రాహ్మణుఁడు. యాజుషశాఖాధ్యయనపరుఁడు, గౌతమగోత్రుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. అమరనార్యునకును అబ్బమ్మకును బుత్త్రుఁడు. సూరనార్యునకుఁ బౌత్త్రుఁడు. భావనామాత్యునకు దౌహిత్రుఁడు. ఇతనికిఁ దమ్ము లమలన యెఱ్ఱన యనువార లిరువురు గలరు. ఈయర్థము రాఘవపాండవీయకళాపూర్ణోదయములలోని

సీ.

"శోభితాపస్తంబసూత్రు గౌతమగోత్రు సుచరిత్రుఁ బింగలి సూరసుకవి
పౌత్త్రు నన్నపపతిభావనదౌహిత్రు నమరధీమణికి నబ్బమకుఁ బుత్త్రు
ననుజన్ము లైనట్టియమలన యెఱనార్యు లతిభక్తి సేయంగ నలరువాని
సత్కావ్యరచనావిశారదుం డగువాని సూరననామవిశ్రుతుని నన్ను.”

ఆ 1. ప 9.

అనుపద్యపుసీసపాదములను బ్రభావతీప్రద్యుమ్నములోని

క.

“గౌతమగోత్రునకును బ్ర, ఖ్యాతాపస్తంబసూత్రయాజుషశాఖా
ధీతిపవిత్రునకును లో, కాతిగవశితాజితాంతరామిత్త్రునకున్.”

అనుపద్యమునను స్పష్టమయ్యెడు.

ఈవంశమువారికిఁ బింగలి యనుగ్రామమున నివసించిన కారణమునఁ బింగలివా రనిపేరు వచ్చినట్లు ప్రభావతీప్రద్యుమ్నములోని

మ.

"తరముల్ నాల్గయి దెందు నెందునగుఁ దత్తద్గ్రామనామంబులం
బరఁగున్ వంశము లెల్లఁ బూర్వపునిజప్రఖ్యాతి మాయంగ నే
మరుదో పింగలినామ మందుఁ జిరకాలావాసు లై యున్నసు
స్థిరతం గోకనమంత్రివంశజులకుం జెన్నొందు మి న్నందుచున్.”

అనుపద్యమువలనం దెలియవచ్చెడు. పింగలి యనుగ్రామము కృష్ణా మండలములో నున్నదని కవిచరిత్ర మందుఁ జెప్పఁబడియుండెడు. ఈకవితండ్రి యగునమరనార్యుఁడు రాజేంద్రగురువంశమునం బుట్టిన సోమారాధ్యునకు శిష్యుఁ డైనశైవాచారపరుఁడని ప్రభావతీప్రద్యుమ్నములోని

క.

"శ్రీమద్రాజేంద్రగురు, స్వామిస్థిరవంశకలశజలనిధిసోమ
త్సోమారాధ్యకృపాల, బ్దామలశివభక్తిశోభితాచారునకున్.”

అనుపద్యమువలన నేర్పడియెడు.

ఈకవి జీవించియుండినకాలముం గూర్చి శ్రీ కందుకూరి వీరేశలింగముపంతులుగారు కవిచరిత్రమందు సయుక్తికంబుగఁ జర్చించి క్రీస్తుశకము 1566 సంవత్సరముల ప్రాంతమున నుండినవాఁడని నిర్ధారణము చేసిరి. శ్రీకృష్ణదేవరాయలు 1530-వ సంవత్సరముననే కీర్తిశేషుఁ డగుటచే నీకవి తదాస్థానమం దష్టదిగ్గజము లని పరిగణింపఁబడినవారిలో నొక్కఁ డని తలఁప నవకాశము లేదనియుఁ గవిచరిత్రమునందే సిద్ధాంతము చేయఁబడి యుండెడు. దీనికి వలసినయంశములనెల్ల సాకల్యముగఁ జర్చింపకయే యీతఁడు శ్రీకృష్ణరాయలకాలమువాఁడు గాఁడని సామాన్యముగను నూహింపవచ్చును. పింగలి సూరనార్యుని కవితాచమత్కృతి యత్యంతాదరణీయ మని వేనోళ్లఁ బొగడఁదగియుండుటయు, సుకవులయెడ శ్రీకృష్ణదేవరాయల కత్యంతాదరము కలిమియు విద్వాంసుల కెల్లఁ దెల్లంబ కదా. శ్రీకృష్ణదేవరాయలకాలమునం దీకవి వాస్తవముగ నుండియుండునేని యాకువీటి పెదవేంకటరాయలకును నంద్యాలకృష్ణరాయలకును దనకావ్యముల నంకితము చేసినయీకవి తాను గవియై కవితాదరణబద్ధదీక్షుం డైన శ్రీకృష్ణదేవరాయల నాశ్రయింపక యుపేక్షించుట యీకవికిని, సరసనిరుపమకవనకౌశలమున కలరుచు నిమ్మహాకవిని నిజాస్థానంబునఁ జేర్చుకొన కొప్పరికించుట యా విద్వత్ప్రభుమణికిం బొసఁగునే? కావున నారాజాధిరాజకవియు నీకవిరాజాధిరాజును సమకాలికులుగా నుండియుండ రని నిరాక్షేపముగ నిశ్చయింపఁ దగియుండెడు.

ఈకవిశ్రేష్ఠుండు చిన్నచిన్నకృతు లెన్నియోగాక గరుడపురాణము, రాఘవపాండవీయము, కళాపూర్ణోదయ మనుగ్రంథముల రచియించి పిదపఁ బ్రభావతీప్రద్యుమ్నమునకుఁ దొడఁగినట్లు ప్రభావతీప్రద్యుమ్నములోని యీక్రిందిపద్యమునఁ దెలియవచ్చెడు.

మ.

“జనముల్ మెచ్చఁగ మున్ రచించితి నుదంచద్వైఖరిన్ గారుడం
బును శ్రీరాఘవపాండవీయముఁ గళాపూర్ణోదయంబున్ మఱిన్
దెనుఁగుంగబ్బము లెన్నియేనియును మత్పిత్రాదివంశాభివ
ర్ణనలేమిం బరితుష్టి నా కవి యొనర్పం జాల వత్యంతమున్.”

ఈకవి గిరిజాకళ్యాణ మనుమఱియొక్కకావ్యముం గూడ రచియించినట్లు రంగరాట్ఛందములో నుదాహరింపఁబడిన పద్యమునం దెలియవచ్చెడు నని కవిచరిత్రమునందు వ్రాయఁబడియుండెడు. పై పద్యమునం బేర్కొన్న నాలుగుగ్రంథములలో గరుడపురాణం బొక్కటి దక్కఁ దక్కినవి యెల్లెడలం బ్రచారంబుఁ గాంచియుండెడు. ఆంధ్రగ్రంథరచనఁ దొలుదొలుత సంస్కృతపురాణేతిహాసముల భాషాంతరీకరణరూపముగా నన్నయభట్టారకాదు లారంభించియుండుటం గాఁబోలు నీకవియుఁ దొలుతఁ దద్విధమున బాల్యవయస్సునం గరుడపురాణ మాంధ్రీకరించి యట నాంధ్రకవితాపితామహుం డైనయల్లసాని పెద్దనామాత్యుండు మార్గదర్శిగా వెలయు ప్రబంధరచనకుం గ్రేళ్లువాఱుడెందముతోఁ దక్కినవానిని రచియించెను. అందు రాఘవపాండవీయరచనాకౌశలం బనన్యసాధారణంబు. ఇట్టికథాద్వితయఘటనావైచిత్రి కిమ్మహాకవియే తొలుదొలుతఁ ద్రోవ త్రొక్కినవాఁడు ఇతని తెరువుగొని రామరాజభూషణకవియు హరిశ్చంద్రనలోపాఖ్యానంబు రచియించెఁగాని మఱెవ్వరు నిట్టి కథాద్వయసంఘటనచమత్కారమున నొప్పారు రసవత్కావ్య మింతకుం జేయ రైరి. ఇంతియగాక కళాపూర్ణోదయమును రచియించి నూతనకథాకల్పనాచమత్కృతిం గవివతంసుల కాహ్లాదంబు నాపాదించె. మొట్టమొదటం బ్రబంధరచనఁ గావించిన కారణమున నల్లసాని పెద్దనామాత్యున కాంధ్రకవితాపితామహుఁ డనుబిరుదు గలిగిన ట్లీమహాకవికి ననన్యసామాన్యం బగు శ్లేషమూలకకథాద్వయఘటనావైచిత్రికిని నూతనకల్పనాచమత్కృతికిం దెరువు చూపిన నేర్పునకుఁ దగిన బిరుదు లెన్నియేఁ గలుగవలసియుండిన నాకాలమున శ్రీకృష్ణరాయలుగాని యంతటివిద్వన్మహాప్రభువుగాని లేమింజేసి కాఁబోలు నట్టివి దుర్లభంబు లయ్యె.

రాఘవపాండవీయమందు
శా.

“రెండర్థంబులపద్య మొక్కటియు నిర్మింపంగ శక్యంబు గా
కుండుం దద్గతిఁ గావ్య మెల్ల నగునే నోహో యనం జేయదే
పాండిత్యంబున నందునుం దెనుఁగుకబ్బం బద్భుతం బండ్రు ద
క్షుం డెవ్వాఁ డిల రామభారతకథల్ జోడింప భాషాకృతిన్.”

ఆ-1. ప-10.

అని చెప్పినరీతి నొక్కకావ్యమే వినువారికి రామాయణభారతకథార్థంబుల రెంటిని వివరించినట్లు శ్లేషసంయోజనం బొనర్చు టెంతయు దుష్కరం బని కవుల కందఱకు ననుభవగోచరంబకదా. అలంకారములలో నెల్ల నుపమోత్తేజోల్లేఖాదులు రసపుష్టి నించి శ్రోతృచిత్తముల కానంద మొడఁగూర్చుఁ గాని శ్లేషాలంకార మట్టిది గాదని కొందఱు తలంతురు. అయ్యర్థము ప్రకృతవర్ణనాప్రసంగమున నప్రకృతార్థమున ననేకార్థకశబ్దప్రయోగమునం బరిస్ఫూర్తిఁ గలిగించు శ్లేషవిషయమునఁ దోఁచినం దోఁపవచ్చునేమొ కాని సభంగశబ్దశ్లేషబహుళం బైన రాఘవపాండవీయమునం దట్టియభిప్రాయ మెవ్వరికిం గలుగఁజాలదని తలఁచెదను. అతివిస్తృతంబు లైనరామాయణభారతకథార్థంబులు వివరించునెడ ననేకార్థకశబ్దప్రయోగము శ్లేషప్రధానము గాని కావ్యములందుఁబోలె నత్యంతవిరళంబు గాఁగఁ గేవలపదవిభాగమాత్రమున శబ్దభేదం బేర్పడఁ దనంతన వివక్షితైకార్థప్రతిపాదకంబుగాఁ గావ్యమెల్ల రచియించుటం జూడ నిమ్మహాకవికిఁ గలయుభయభాషాపాండిత్యసామర్థ్యంబు లవాఙ్మనసగోచరంబు లని యెవ్వరికేనియు నొప్పుకొనక తప్పదు.

ఈకవి తాను గథాద్వయసంఘటనంబు సేయునెడ నేర్పఱుచుకొన్న నియమముల వివరించుచు గ్రంథాదియందు

సీ.

"ఆంధ్రభాషాసంస్కృతాభిభాషాశ్లేష యొక్కొకచోట నొక్కొక్కచోట
నుచితశబ్దశ్లేష యొక్కొక్కచోట నర్ధశ్లేష యొక్కొకతఱిని ముఖ్య
గౌణవృత్తిశ్లేషఘటన యొక్కొకతఱి నర్థాన్వయము వేఱె యగుచు నునికి
శబ్దాన్వయవిభేదసంగతి యొక్కొక్కతఱ నివి యొక్కొక్కతఱిని రెండు


తే.

మూఁడు గూడుటయు నన సముజ్జ్వలముగ, నాఁకు దోఁచినగతిఁ బెక్కుపోక లమర
రామభారతకథలు పర్యాయదృష్టిఁ, జూచుసుమతుల కేర్పడ నాచరింతు.”

ఆ-1. ప-17.

అని కొన్నికల్పన లేర్పఱిచికొనియు నందు ముఖ్యముగాఁ బ్రథమతృతీయ ములనే యుపయోగించుచువచ్చెఁ గావున గ్రంథరచన వచనాతీతాద్భుతావేశభాసురంబై సహృదయహృదయంగమతరంబై కన్పట్టెడు. ప్రాయికముగా గ్రంథమెల్ల సభంగసంస్కృతశబ్దశ్లేష, సభంగాంధ్రశబ్దశ్లేష, సభంగోభయభాషాశబ్దశ్లేషనిబిడంబై యుండుటంజేసి యర్థవిదు లగుచదువరు లాయాచోటు లరసి నిలిపి చదివినం దత్తద్వివక్షితార్థంబునుఁ దత్తత్ప్రధాన కావ్యమట్లపాలె నీ కావ్యము బోధించుచుండెడు. కావుననే కవి గ్రంథాదియం దీక్రిందిరీతిం జెప్పెను.

క.

“ఒకకధ వినియెడుతఱి వే, ఱొకకథపై దృష్టి యిడిన నొకయర్థముఁ దోఁ
పకపోవుఁ గాన నేకా, ర్థకావ్య మె ట్లట్లు వినఁగఁ దగు నొకటొకటిన్.”

ఆ-1. ప-18.

అర్థసమన్వయమరసి యుచితరీతిం బదవిభాగంబు సేయుచుఁ జదివిన నాయాయర్థము సుబోధమై యుండుఁ గాని కొన్నిశ్లేషగ్రంథములఁ జదువునపు డెట్టు లట్టుల నానార్థకనిఘంటువుల నన్వేషింప నవసరము తఱచుగా నుండదు. ఒక్కమాఱు చదివిన రామాయణార్థంబును వేఱొక్కమాఱు చదివిన భారతార్థంబును గ్రహించునెడఁ జదువరుల కావృత్తికల్పనంబున వ్యాపారగౌరవంబు గలిగిన నొక్కకావ్యమే యుభయార్థప్రతిపాదకం బగుటం జేసి ప్రయోక్తకు వైయాకరణసమ్మతం బయిన యుచ్చారణలాఘవంబును దీనం జమత్కృతివిశేషంబును సహృదయవేద్యంబై యుండెడు. “శ్వేతోధావతి” ఇత్యాదికావ్యములయెడ శ్రోతల కర్ధపరిజ్ఞానంబున నావృత్తికల్పనాగౌరవ ముండినను ప్రయోక్తలకు సకృదుచ్చారణలాఘవంబు గల దనువైయాకరణసిద్ధాంతము విస్పష్టంబ కదా.

ఇందుఁ గల్పించిన శ్లేషభేదములకుఁ గొన్ని యుదాహరణముల దిక్ప్రదర్శనముగ నీక్రిందఁ బొందుపఱిచెదను.

క.

“విని యతనిం దనపై నిడు, కొని యేఁగినియమికిఁ దగనిఘోరార్తి యొన
ర్చినవాఁడ మీకు దండ్యుఁడ, నని తనుఁ దెలుపుచును వారి కప్పన సేసెన్.”

ఆ-1. ప-28.

ఇందు రామాయణార్థమున 'విని + అతనిన్ + తనపై + ఇడుకొని + ఏఁగి + నియమికిన్ + తగని' యనియు, భారతార్థమున 'వినియతనిందన + పైన్ + ఇడుకొని + ఏన్ + కినియమికిన్ + తగని' యనియు నన్వ యించుచో సంస్కృతాంధ్రపదములకు విభాగమాత్రగ్రాహ్యముగా మేళనము గలుగునట్లు పదసంయోజనము చతురముగాఁ గూర్చుటం జేసి యిచ్చట సంస్కృతాంధ్రభాషాద్వయసభంగశబ్దశ్లేష చెప్పఁబడియె.

క.

“ఏనుం గనికర మరయక, పూనితిఁగా కిట్టియెడలఁ బోసఁగునె యేయన్
గానమె కాలనియమగతి, తో నావేఁట మునియుగముఁ ద్రుంగించెఁ దుదన్.”

ఆ-1. ప-24.

ఇందుఁ బూర్వార్ధమున రామాయణార్థమున 'ఏనుంగు + అని + కరము + అరయక' యనియు, భారతార్థమున 'ఏను + కనికరము + అరయక' యనియు నాంధ్రశబ్దములకు సభంగశబ్దశ్లేషకల్పన చేయఁబడియె. ఉత్తరార్ధమున భాషాద్వయసభంగశబ్దశ్లేష యూహ్యంబు.

శా.

"అక్షుద్రప్రథమానదివ్యశరసంప్రాప్తిం బ్రశాశించునా
కుక్షిద్వంశవతంసుఁ గన్గొని మహాగోదావరీతీరస
ద్రక్షోపాయపథంబు నేఁడు దొరకెన్ రం డంచు సంరక్షణా
పేక్షం దద్వనభూమిదేవతలు సంప్రీతిం గడున్ మూఁకలై.”

ఆ-3. ప-65.

ఇందు రామాయణార్థమున 'మహా + గోదావరీ + తీర + సత్ + రక్షా + ఉపాయపథం' బనియు, భారతార్థమున 'మహత్ = ఆగః + దావ + రీతీ + రసత్ + రక్షః + అపాయపథంబు.' (అనఁగా గొప్పయపరాధము గలవారును దావానలమురీతిని మ్రోయుచున్నవారు నగురాక్షసులనాళమార్గము) అనియుఁ బదచ్ఛేదభేదమున నర్థభేదము గలుగునట్లు సంస్కృతసభంగశబ్దశ్లేషకల్పన చేయఁబడియె.

క.

"ఆకళంకిత ని ట్టనుఁ గొం, చక యేమి మనము సమరసముదారక్రీ
డకు నొండొరు మార్కొనుట దొ, రకు ననివచ్చితి నెఱుంగరావాకినుకల్.”

ఆ-1. ప-81.

ఇందు రామాయణార్థమున ఏమీ మనము = మన మిద్దఱమనియు, భారతార్థమున మీమనము = మీమన స్సనియు నన్వయించుచో మనము అనుద్వ్యర్థ మగు నాంధ్రశబ్దముఁ బ్రయోగించుటం జేసి యాంధ్రభాషార్థశ్లేష కల్పింపఁబడియె.

క.

“ఘనవిగ్రహజృంభణమున, ననయము దనకట్లు దెగఁగ నవ్వాహినిఁ గ్రీ
డన గెలిచి వచ్చునబ్బా, లునిఁ గని వెఱఁ గంది రాత్మలో నచటిజనుల్.”

ఆ-1. ప-25.

ఇందు రామాయణార్థమున విగ్రహజృంభణము యుద్ధాతిశయ మనియు, వాహిని సేన యనియు, భారతార్థమున విగ్రహజృంభణము ఒడలు విఱుచుకొనుట యనియు, వాహిని నది యనియు ననేకార్థకసంస్కృతశబ్దములఁ బ్రయోగించుటం జేసి సంస్కృతభాషార్థశ్లేష నిరూపింపఁబడియె.
క.

“విను పెక్కు లేల విడువుము, జనసమ్మతమతివిదేహజననామయముం
దనయుదితకీర్తిఁ గులవ, ర్తనఁ బ్రజలను లక్ష్మిఁ బ్రోచుప్రభున కిది తగున్.”

ఆ-4. ప-106.

ఇందు రామాయణార్థమున 'జనసమ్మతమతిచే, విదేహజను = సీతాదేవిని, విడువుము. అనామయమును, తనయుదితకీర్తిని, కులవర్తనను, బ్రజలను, లక్ష్మిని ప్రోచుప్రభునకు, ఇది పరదారనిరోధనిరాసము తగున్' అని యన్వయించి, భారతార్థమందు ఓధృతరాష్ట్రా! నీవు 'జనసమ్మతమతివి, దేహజననామయమున్ = దేహమందుఁ బుట్టినరోగమైన, తనయున్ = కుమారుని, దితకీర్తిన్ = ఖండితమైన నష్టమైనకీర్తి గలవానిని, విడువుము = త్యజింపుము. కులవర్తనను, ప్రజలను, లక్ష్మిని బ్రోచుప్రభునకు, ఇది కులదేశరాజ్యరక్షణార్థ మొక్కనిం ద్యజించుట తగు నని యన్వయించునెడ దేహజననామయము' అనువిశేషణము దుర్యోధనున కన్వయించుచో నామయముగాని వాని నామయం బని చెప్పుట పొసఁగదు గావున నాశ్రయదూషణశ్రమాపాదనాదిగుణనిమిత్తమున దుర్యోధనునం దామయసదృశత్వ మారోపితం బై దేహజననామయసదృశుఁ డగువాని నని యర్థముఁ గల్పించుటచే గౌణవృత్తియు రామాయణార్థమున రోగపరముగాఁ గల్పించుటచే ముఖ్యవృత్తియు నొప్పియుండుటం జేసి యిక్కడ ముఖ్యగౌణవృత్తిశ్లేష ప్రతిపాదితం బయ్యె.

సాదృశ్యనిబంధనంబున శౌర్యాదిగుణనిమి త్తముగనే “సింహోమాణవక” ఇత్యాదిస్థలములయందు గౌణవృత్తిచేఁ దత్సదృశత్వ మారోపింపఁబడు నని సర్వశాస్త్రసమ్మతంబు గదా.

సీ.

“దివి మోచియున్నయద్రిని ధర్మకార్యార్థ, మానతంబుగఁ జేసినట్టిఘనుని
మించి లోకము నావరించిన విషరాశి, నాపోశనముఁ గొన్నయద్భుతాత్ము
జీవనదోషవిద్రావణజ్యోతిర్మ, యన్వమూర్త్యాలోకుఁ డగుమహాత్ము
నఖిలవేదాంతవేద్యాత్ముఁడై భువనవం, ద్యతఁ బెంపు మీఱుమహానుభావు

తే.

నమర నిమ్నగానిత్యసేకముల నెలయు, జడలలేఁగెంపు విమలతఁ గడు మెఱయఁగ
మెకముతోలు విభూతి సమిద్ధతనువు, నొండొకటి కందమై యొప్ప నొప్పువాని.”

ఆ-3. ప-34.

ఇందు రామాయణార్థమున నగస్త్యపరముగా నన్వయించునపుడు దివి మోచియున్న యద్రిని = అభ్రంకష మయిన వింధ్యపర్వతము ననియు, భారతార్థమున శివపరముగా నన్వయించునపుడు స్వర్గలోకమును వహించిన మేరుపర్వతము ననియు శబ్దశ్లేష గాని యర్థశ్లేష గాని పదాన్వయభేదము గాని లేకయే యర్థాన్వయము భిన్నభిన్నముగాఁ గలుగునట్లు కల్పించుటం జేసి యిచ్చట నర్దాన్వయభేదకల్పనంబు సూచింపఁబడియె. ఇదియు ముఖ్యగౌణవృత్తిశ్లేష కుదాహరణ మగునని తలఁచునెడఁ దద్విభేదమునే కవి చమత్కారార్థముగాఁ బ్రకారాంతరముగా గణించె ననియుఁ దలఁపఁదగియుండెడు. కవి కల్పించినయితరభేదకల్పనలతో దేనిలోనైనం గలియనియర్థాన్వయభేదకల్పన కుదాహరణము మృగ్య మని యూహించుచున్నాఁడను. విద్వాంసులు విమర్శించి గుణదోషముల నరసి తత్త్వము నిర్ణయింతురని సవినయముగ వేఁడుచున్నాఁడను.

సీ.

“వ్యధలెల్లఁ దీఱ దేవరమహామహిమ వి, లోకింపఁ గంటి నస్తోకగుణత
బరఁగుభూమిజనాధిపతనయాయకలంక, నున్నది శాంతద్విషన్నికాయ
వెసమనమొదవులాలసమానకురుబల,యత్నావరుద్ధంబు లగుచుఁ జనని
తాంతాకులీభవత్ప్రాణవాయువులతో, వనరెడు నేను నివ్వార్తఁ జెప్పఁ


ఆ.

బాఱు తెంచితి నని ప్రత్యభిజ్ఞానస, మర్పణమున నతనిమది యొడఁబడఁ
దా నెఱిఁగినకొలఁది నానారివృత్తాభి, ధానకథ లొకింత తడవు నడిపె.”

ఆ-4. ప-38.

ఇందు రామాయణార్థమున 'దేవరమహామహిమన్, వ్యధ లెల్లఁ దీఱన్, అస్తోకగుణతఁ బరఁగుభూమిజన్, విలోకింపఁ గంటి'ననియు, భారతార్థమున ‘వ్యధలెల్లఁ దీఱన్, దేవరమహామహిమన్, విలోకింపఁ గంటిన్, అస్తోకగుణతఁ బరఁగుభూమిజనాధిపతనయా' యనియుఁ బదముల కర్థభేదము లేకున్నను శబ్దాన్వయభేదపూర్వకముగాఁ గర్మకరణహేత్వాదిభేదకల్పనచే నర్థద్వయముఁ బొసఁగించుటం జేసి యిచ్చట శబ్దాన్వయభేదసంగతి చెప్పఁబడియె. ఈపద్యమందే చతుర్ధపాదమున నిట్టిరచన యింకనుం గలదు.

కవి తాను గల్పించిననియమములలో నొక్కటొక్కటి గాక రెండుమూఁడుభేదకల్పనలనుం జేర్చియుఁ బలుచోట్లఁ గథాసంఘటనంబుఁ గావించియున్నాఁడు: వానికిం గొన్ని యుదాహరణములఁ జూపుచున్నాఁడను.
ఆ.

"వెలయు నఖిలభువనములలో నవారణ, నగరిపురమతల్లినాఁ దనర్చి
రాజ్యలక్ష్మి మిగులఁ బ్రబల
బల నయోధ్యనా, రాజవినుతిఁ గనినరాజధాని.”

ఆ-1. ప-1.

ఇందుఁ బూర్వార్ధమందు రామాయణార్థమున 'అవారణ + నగరిపు + రమ + తల్లినాన్' అనియు, భారతార్థమున 'వారణనగరి + పురముతల్లినాన్' అనియు నన్వయించుచో సంస్కృతాంధ్రభాషాశబ్దశ్లేషయు, నుత్తరార్ధమునందు రామాయణార్థమున 'రాజ్యలక్ష్మి + మిగులన్ ప్రబలన్ +అయోధ్యనాన్' అనియు, భారతార్థమున 'రాజ్యలక్ష్మి + అయోధ్యనాన్ + మిగులన్ + ప్రబలన్' అనియు నన్వయించుచో శబ్దాన్వయభేదసంగతియుఁ గూర్చుటంజేసి రెంటికిఁ గూడిక చెప్పఁబడియె.

సీ.

"పుడమిఱేఁ డీరీతిఁ గడఁగి డెందము మృగ, వ్యాపారఖేలన మభిలషింపఁ
గానలోఁ దారుమృగంబులకైవడిఁ, గైకొని యసమాస్త్రకర్మకలనఁ
దనరుచొక్కపురాణమునిదంపతులు దమ, కంబులు దేర నెయ్యంబు మీఱ
ననిచినతత్ప్రియతనయుం డవారిత, కారుణ్యుఁడై పూని కలశమంబు


తే.

మగ్నముగఁ జేయుచప్పుడు భుగ్నహృదయుఁ, డగుచు వినిశితశరవిశేషాభిహతిని
ద్రెళ్ల నేసె నాఘనులసద్దృష్టినియతి, బ్రుంగఁ గేవలసారంగబుద్ధిఁ జేసి."

ఆ-1. ప-20.

ఇందు మృగవ్యాపారఖేలన మనునెడ రామాయణార్థమున 'మృగవ్య + అపారఖేలన' మనియు, భారతార్థమున 'మృగ + వ్యాపార + ఖేలన' మనియు, సంస్కృతసభంగశబ్దశ్లేషయుఁ, దనరుచొక్కపురాణమునిదంపతు లనునెడ రామాయణార్థమున 'తనరుచు + ఒక్క + పురాణమునిదంపతు' లనియు, భారతార్థమున 'తనరు + చొక్కపు + రాణన్ + మునిదంపతు' లనియుఁ, దమకంబులు దేర ననునెడ రామాయణార్థమున 'తమకు + అంబులు + తేర' ననియు, భారతార్థమున 'తమకంబులు + తేర' ననియుఁ, బూనికలశమంబుమగ్నముగఁ జేయుచప్పు డనునెడ రామాయణార్థమున 'పూని + కలశము + అంబుమగ్నముగన్ + చేయు + చప్పు' డనియు, భారతార్థ మున 'పూని + కల + శమంబు + మగ్నముగన్ + చేయుచు + అప్పు' డనియు నన్వయించుచో సంస్కృతాంధ్రభాషాద్వయశబ్దశ్లేషయు, సారంగబుద్ధిఁ జేసి యనునెడ రామాయణార్థమున గజపరత్వము భారతార్థమున మృగపరత్వముం గల్పించుటంజేసి సంస్కృతభాషార్థశ్లేషయుఁ గూర్చుటం జేసి మూటికిఁ గూడిక యిక్కడఁ జెప్పఁబడియె. ఇట్టివానికి గ్రంథమంతయు నుదాహరణమే కావున విశేషించి వివరింపఁ బని లేదని తలఁచుచున్నాఁడను.

ఇమ్మహాకావ్యమున శ్లేషనిబంధనము సేయునెడఁ గొన్ని వ్యాకరణవిషయములు విచారణీయములై నట్లు చూపట్టుటం జేసి వానిం గూర్చి కొంత చర్చించెద.

క.

“వినియతనిందనపై నిడు, కొని యేఁగినియమికిఁ దగనిఘోరార్తి యొన
ర్చినవాఁడ మీకు దండ్యుఁడ, నని తనుఁ దెలుపుచును వారి కప్పనచేసెన్.”

ఆ-1. ప-28.

ఇందు ద్వితీయపాదమందు రామాయణార్థమున 'ఏగి + నియమికిన్' అని యన్వయించుచో నసమాపకగమనక్రియావాచకం బయిన “ఏగి” యనుపదమున కర్ధానుస్వారము లేనిరూపమును, భారతార్థమున 'ఏన్ + కినియమికిన్' అని 'యన్వయించుచో సంధిని “ఏ” అనుపదమందలి ద్రుతమున కర్ధానుస్వారాదేశంబును దత్పర మగుపరుషవర్ణమునకు సరళాదేశంబును రాఁగా సార్ధానుస్వారరూపంబును గలుగుటవలన నీరెండర్థము లిక్కడఁ గల్పించుట వ్యాకరణవిరుద్ధ మనియుఁ, గల్పింపకున్న నర్థ మన్వయింపఁదనియుఁ దలఁపవచ్చుఁగాని “శ్లేషే సఖండనిర్బిందోర్మేళనం కుత్రచిన్మత” మను నథర్వణకారికావచనమున శ్లేషయం దిట్టివానికి మేళనము వృద్ధసమ్మతంబని నిర్ణీతమైయుండుటం జేసి, వ్యాకరణవిరోధంబు గలుగదు. దానఁ బైఁ జెప్పినరీతి నర్థాన్వయమున కసందర్భముం గలుగదు. ఇట్లే—

మ.

“స్వనిదేశోన్నతి నంతట న్నెఱయుచున్ శక్తిం జతుర్దిఙ్నరేం
ద్రనికాయంబును గెల్చి తమ్ములసమానప్రాప్తవిత్తార్పణం
బునఁ దన్ప న్వశు లైన బ్రాహ్మణులతోఁ బూర్ణాధ్వరారంభుఁ డై
యనఘశ్రీఁ బృథివీశుఁ డొప్పెసగురూఢాపూర్వసత్కీర్తితోన్.”

ఆ-3, ప-15.

అనుపద్యమున “ఒప్పెసగురూఢాపూర్వసత్కీర్తితోన్” అనునెడ రామాయణార్థమున “ఒ ప్పెసఁగున్” అనుచో సకారోత్తరార్ధానుస్వారవిశిష్టరూ పంబును, భారతార్థమున “ఒప్పెన్ + సగురూఢాపూర్వసత్కీర్తితోన్" అనుచో నర్ధానుస్వారరహితరూపమునుం గూర్చునెడను సమాధానము కల్పనీయంబు.

సీ.

“ధృతిఁ గుంతిమద్రభూపతుల నెయ్యఁపుగన్య, కలననవాలుఁదూపుల జయించి
యలరారునతనుజయశ్రీల వరియించె, యవనసౌరాష్ట్రభూధవుల గెలిచె
ద్రవిడకళింగసాల్వవిదర్భవసుధాధి, పతుల నోడించి కప్పములు గొనియెఁ
జోళనేపాళపాంచాలకేరళమత్స్య, వత్సభూపతులగర్వం బడంచె


తే.

శకయుగంధరఘూర్ఖరాశ్మంతసింధు, లాటభూపాలముఖ్యుల నోటుపఱిచె
జగతిఁ గోసలకేకయమగధులతన, యలవరించినయాజ్ఞలో మెలఁగఁ జేసె.”

ఆ-1. ప-7.

ఇందుఁ దేఁటగీతి మూఁడవపాదమునందు రామాయణార్థమున 'కోసలకేకయమగధులతనయలన్ + వరించి + నయాజ్ఞలోన్ + మెలఁగన్ + చేసె' ననియు, భారతార్థమున 'కోసలకేకయమగధుల + తన + యలవరించిన + యాజ్ఞలోన్ + మెలఁగన్ + చేసె' ననియు నన్వయించునెడ భారతార్థమందు “మగధుల” అనుపదమందలి ద్రుతమున కర్ధానుస్వారమును మీఁదిపరుషమునకు సరళాదేశమును రాగా "మగధులఁదన” యనియు రామాయణార్థమందు సమాసమునందు వాని కవకాశము లేదు ' గావున “మగధులతనయల” ననియు రూపభేదము గన్పట్టెడు. ఒక్కయర్థమునకుఁగా నొక్కరూపము గ్రహింతుమేని యర్థాంతరకల్పనమున వ్యాకరణవిరోధము తప్పక కలుగు నని యూహింప నవకాశము చూపట్టెడుఁ గాని యిక్కడ ఖండబిందుసరళాదేశములు లేని "మగధులతనయలవరించినయాజ్ఞలో మెలఁగఁ జేసె” ననుపాఠమే సిద్ధాంతీకరించి యర్థాన్వయము మార్పఁబడునేని వ్యాకరణవిరోధము గలుగదు. అయ్యర్థాన్వయకల్పనం బెట్టిదనిన; భారతార్థమందు 'కోసలకేకయమగధులు + అ' అని యితరప్రయత్నవ్యవచ్ఛేదార్థక మగునకారావ్యయమును విభజించి కోసలకేకయమగధులు తమంతట తామే 'తన + అలవరించిన + యాజ్ఞలోన్ + మెలఁగన్ + చేసెన్ ఏర్పా' టనుకర్మవాచకపదమధ్యాహార్యము. ఇట్టు లన్వయించినచో ద్రుతమునకును ద్రుతస్థానమున ఖండబిందువునకును మీఁదిపరుషమునకు సరళాదేశమునకుఁ బ్రసక్తియే గలుగదు. కావున వ్యాకరణవిరోధ మేమిటం బొసఁగదు. ఇతరప్రయత్నవ్యవచ్ఛేదార్థకమయిన యకారా వ్యయము సుప్రసిద్ధము. ఆంధ్రశబ్దరత్నాకరమునం దకారమున కీయర్ధము నిరూపించి కళాపూర్ణోదయములోని “ఉ. ఇమ్ముగ సర్వధర్మములు నీవ యెఱుంగుదు” అని యుదాహరింపఁబడి యుండెడు

శా.

"వేయుం జెప్పె డిదేమి మౌనివర సద్వృత్తంబుచే నేమిటం
జేయన్ రాదు పితౄణమోక్షము సుతశ్రీఁ దక్కఁ దత్ప్రాప్తికిన్
ధీయుక్తిం గడు నొండుత్రోవ గలదేనిన్ వేఁడెదన్ దేవర
న్న్యాయం బొప్పఘటింపు నాకురుబలం బవ్యాహతిన్ వర్తిలన్.”

ఆ-2. ప-47.

ఇందుఁ జతుర్థపాదాదియందు రామాయణార్థమున 'వేఁడెదన్ + దేవరన్ + న్యాయంబు' అని యన్వయించుచో “దేవరన్న్యాయం” బని ద్వినకారకరూపంబును, భారతార్థమున “దేవరన్యాయం" బని యేకనకారకరూపంబును గలుగుటం జేసి తంత్రసమాహృతరూపమును రెండర్థములకుఁగాఁ బ్రయోగించునెడ నన్యతరార్థము నవ్యాకరణవిరోధం బగునని యూహింపవచ్చుఁ గాని, ద్వినకారకరూపమునే సాధుపాఠముగా నంగీకరించి భారతార్థమును బోధించు నేకనకారకరూపమునందు “అనచిచ” యను పాణినీయసూత్రముచే నకారద్విత్వముఁ గల్పింపఁబడునేని వ్యాకరణవిరోధంబు గలుగదు. ఇట్లే—

తే.

“వఱలునచ్యుతసఖ్యాతివర్ణితాతు, లప్ప్రదీప్తి ని ట్లలరు నీవిప్ప్రభావ
మెందుఁ బెట్టనికోటగా నెఁగుచుఁ గడ, చేర్తువస్మన్మహాశరాజితనిరూఢి.”

ఆ-2. ప-104.

ఇందు ద్వితీయపాదమందు రామాయణార్థమున విప్రభావము విప్రత్వ మనుచో నేకపకారకరూపంబును భారతార్థమున ఈ + ప్రభావమని యన్వయించుచో సంధివశమున “ఇప్ప్రభావ” మని ద్విపకారకరూపమునుం గూర్చునెడను దాని ననుసరించి పాదాదియందుఁ బ్రాసయతినిమిత్తమై “అతులప్ప్రదీప్తి” యనుచోటను ముందుఁ జెప్పినరీతిని “అనచిచ” యనుసూత్రముచేఁ బకారద్విత్వముఁ గల్పించి ద్విపకారకరూపమునే యుభయార్థములందును సాధుపాఠముగా గ్రహింపఁదగును. ఇట్టిచోట్లనెల్ల నిట్లే సమాధానము కల్పనీయ మై యుండెడు.

చ.

“చనియెఁ బ్రశాంతమై యనలసత్వరహేతివిహారవృత్తిచే
తన యనివింటి మిట్టియతిధర్ము యమోదయు రాజమానకా

సనుఁ గొనివచ్చెఁ దానవరజస్ఫురణాఢ్యునిఁ జేసి క్రమ్మఱన్
మనపృథగూఢభాగ్యమహిమస్థితి యిట్టిదివో విచిత్రముల్.

ఆ-2. ప-72.

ఇందుఁ దృతీయపాదమందు రామాయణార్థమున “నవ + రజః + స్ఫురణాఢ్యునిన్” అనుచో ద్విసకారకరూపంబును, భారతార్థమున “అవరజ + స్ఫురణాఢ్యునిన్” అనుచో నేకసకారకరూపంబునుం గలుగుటం జేసి యుభయార్థబోధకతంత్రపాఠమున వ్యాకరణవిరోధంబు గలుగునని యూహింపవచ్చుఁగాని, రామాయణార్థమందుఁ గన్పట్టఁ గలరజశ్శబ్దాంతసకారమునకు “ఖర్పరేశరివా విసర్గలోపో వక్తవ్య” యను కాత్యాయనవార్తికవిహితం బైనవైకల్పికవిసర్గలోపముఁ గల్పించి యేకసకారకరూపమే యుభయార్థములందు సాధుపాఠముగా గ్రహింపఁబడునేని వ్యాకరణవిరోధంబు గలుగదు. ఇట్లే -

క.

"అనిలజుఁ డధికతమస్థితి, నొనరెడుతమి రామదుఃఖ ముడుపుటకు నయం
బునఁ దత్సతీశిరోమణిఁ, గొని చనఁగనియమితదర్పగురుసంభ్రముఁ డై.”

ఆ-4. ప-21.

ఇం “దధికతమస్థితి” యనుచోట భారతార్థమునం బైఁజెప్పినరీతిని వైకల్పికసకారలోపముఁ గల్పించి యర్థద్వయమున నేక కారక పాఠమే గ్రహింపఁదగును. ఇట్టిచోట్లనెల్ల నిట్లే సమాధానము కర్తవ్యము. ఈకవివరేణ్యుఁ డుభయకవిమిత్రునిరీతిం గవిత్వమర్మమెల్ల లెస్స యెఱింగినవాఁడు గావునఁ గథాద్వయంబుఁ గూర్చునెడ సందర్భానుసారమునఁ దగినపదములఁ గూర్చుచు నాయాపదములు విభజింపఁ గొన్నిచోట్ల యతిస్థానమున వర్ణముల కర్ణభేదమున మార్పు గలుగునేనియు యతిభంగము పొసంగనితెఱంగున రెండువిధములఁ జెల్లఁదగినయతులఁ గల్పించి చమత్కరించియున్నాఁడు. చూడుఁడు.

వనమయూరము.

“సారనిజచాపగుణశబ్దసమనుప్ర
జ్యారసికశూరతరసాత్యకిరణాగ్ర
క్రూరతరశాత్కృతినిరూప్యగమనుండై
చేరి యవికారధృతి సింధునృపుఁ జూచెన్.”

ఆ-4. ప-157.

ఇందు రెండవపాదమున "శూరతరసాత్యకిరణాగ్ర" యనుచో రామాయణార్థమున "శూర + తరస + అతి + అకిరణ + అగ్ర" యనుపదవిభాగంబున "తరసాత్యకిరణాగ్ర" యనునెడ సకారోత్తరాకారము నకు స్వరయతియు, భారతార్థమున 'శూరతర + సాత్యకి + రణాగ్ర' యనుపదచ్ఛేదంబున సాత్యకిశబ్దమందలి సకారమునకు వ్యంజనయతియుఁ జెల్లవలసియుండుటం జేసి తదనుగుణముగాఁ బాదాదియందు "జ్యారసిక” యను సమాసమందలి జ్యాశబ్దముఁ గూర్చుటవలన స్వరయతికి యకారమును వ్యంజనయతికి జకారమును సరిపడునట్లు కూర్చెను.

మ.

“రవిపుత్త్రుం డని కిట్లు పూని ప్రతిగర్జద్వీరసంహారకౢ
ప్తివిరాజచ్ఛరభీష్మకుంభజయశోభివ్యాప్తి మీఱన్ మను
ష్యవిభుం డుబ్బఁగ నంత నాప్రబలదోషాచారితోఁబుట్టుగు
న్భువిఁ గూల్చెం బవనాత్మజుండు బలిమి న్దుశ్శాసనాభిఖ్యునిన్.”

ఆ-4. ప-214.

ఇందు మూఁడవపాదమున రామాయణార్థమందు 'దోషా + చారినక్తంచరు' డని యన్వయించునెడ దోషాశబ్ద మాకారాంతావ్యయమై వ్యంజనయతికిఁ దగియుండుటయు, భారతార్థమందు 'ప్రబలదోష + ఆచారి = ప్రబలదోషములు గలయాచారముగ లవాఁ డనునర్థమును “ఆ” యను నుపసర్గము విఱుఁగుటవలన స్వరయతికిఁ దగియుండుటయుం జూచి తదనుగుణముగాఁ బాదాదియందు “మనుష్యవిభుం" డని ప్రయోగించి యందలి “ష్య" యనుదాని స్వరవ్యంజనయతులకు రెంటికిం దగునట్లు గూర్చెను.

క.

"చేవ చెదరి భీమాశుగ, దావహతికృతోరుభంగతాపజ్జ్వలితుం
డై విమతుఁ డడఁగ జయమున, వైవస్వతసంతతినృప ర్యుఁడు మించెన్."

ఆ-4. ప-247.

ఇందు రెండవపాదమందు "భీమాశుగదావహతికృతోరుభంగ + తాపజ్జ్వలితుండై” యనునెడ రామాయణార్థమందు “భీమ + ఆశుగ + దావ + హతి + కృత + ఉరు + భంగ + తాప + జ్వలితుండై” యని విభజించునెడఁ బాదాదియందలి దావశబ్దమందలి దకారమునకు వ్యంజనయతి చెల్లునట్లుగా యతిస్థానమునందు “తాప” యని విఱుఁగునట్లును, భారతార్థమందు “భీమ + అశు + గదా + అవహతి + కృత + ఊరుభంగతా + ఆపత్ + జ్వలితుండై” యని విభజించునెడఁ బాదాదియందు “అవహతి” యని విఱుఁగుటచేఁ దదనుగుణముగా స్వరయతి చెల్లునట్లు యతిస్థానమందును “భంగతా + ఆపత్" అని విఱుఁగునట్లునుం గూర్చి చమత్కారముఁ గావించెను

చ.

“విను పలుమాట లేల యలవేలుపుమూఁకలలోన నేనియున్
వెనుకకు వీఁగఁ బాఱ కొకవీరుఁడు సైఁపఁగలాఁడె యల్కచూ
పినకులుఁ డించుకంత సమపేక్షితసంగరకేళియై నిగు
డ్చినఁ బటుఘోరసాయకవిజృంభణ మన్యుల కోర్వ నెట్లగున్.”

ఆ-4. ప-89.

ఇందు మూఁడవపాదమున రామాయణార్థమందు 'అల్కచూపు + ఇనకులుఁడు' అనియు, భారతార్థమందు 'అల్క + చూపి + నకులుఁడు' అనియు విభజించుచోఁ బాదాదియందలి “చూ, పినకులుఁ" డనునెడ నినకులుఁ డని విఱుచునపుడు స్వరయతియు, 'చూపి + నకులుఁ' డనుచో వ్యంజనయతియుఁ జెల్లవలయుఁ గావున వానికిఁ దగినట్లు విశ్రమస్థానంబున "సమ + పేక్షితసంగరకేళియై" యనుసమాసమందలి సమపేక్షితశబ్దగతమైన “పే” యనుదానిం బ్రాదియతిగా స్వరవ్యంజనయతులకు రెంటికి ననుకూలించునట్లు గూర్చెను. ఇట్టిచిత్రంబు లెన్ని యేనియు నీకవి కవితాధోరణిం గన్పట్టుచుండెడు.

ఈ కవివర్యుం డధికనియమముతోఁ గథాద్వయముఁ గూర్చునెడను జదువువారికిఁ జిత్తానందము గూరునట్లు భాషాజాతీయము లగు వాడుకపదములంగూడ నక్కడక్కడ సందర్భానుగుణముగాఁ బ్రయోగించెను.

తే.

“అపుడు మనుజేంద్రముఖ్యు లాహరి నుతించి
రనఘ నీదుమహత్త్వ మేమని పొగడఁగ
వచ్చు నారాయణమహాస్త్రవైభవ మిటు
లఫలముగఁ జేసి రిపుల క్రొవ్వడఁచి తనుచు.”

ఆ-4. ప-212.

ఇందు రామాయణార్థమున నింద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచే నందఱు మూర్ఛిల్లఁగా హనుమంతుఁడు సంజీవనిం దెచ్చి యెల్లవారిం బ్రదికించి యస్త్రమును వ్యర్థపఱిచె నని యాహనుమంతునిఁ బ్రశంసించునపు డాశ్చర్యసూచకముగా లోకమున సాధారణ మగువాడుక'మెయి "నారాయణ" యనుసంబోధన మిందుఁ గూర్చుట చమత్కారకారియై యుండెడు.

తే.

“అరయ నేరి కి ట్టి ట్టని యాడుకొనఁగ
రానియట్టిది శ్రీరామరామ నీకు

మారు దుశ్చేష్టితంబు నివారితముగఁ
జేయకునికి యొప్పదు దానఁ జేటు వొందు.”

ఇందు భారతార్థమున శ్రీకృష్ణుడు రాయబారము చేయునపుడు ధృతరాష్ట్రునకు దుర్యోధనుదుశ్చారిత్ర ముగ్గడించి చెప్పునప్పుడు ఖేదాశ్చర్యసూచకముగా లోకసాధారణ మగువాడుకమెయి “శ్రీరామరామ” యను సంబోధనద్యయముం బ్రయోగించుట యత్యంతచమత్కారంబు గావించెడు.

రామాయణభారతకథాసంఘటనంబునఁ బ్రసంగవశమున నగరార్ణవాదిమహాకావ్యలక్షణంబులకుఁ బ్రస్తావ మిం దచ్చటచ్చటఁ గలిగి యరయు విద్వాంసులకు గోచరంబులై యుండెడు.

ఈకవిచంద్రుం డింతనియవాముతోఁ గథాద్వయముం గూర్చి గ్రంథమును రచియించుచుం గావ్వకన్య కలంకార మొడఁగూర్చు నర్థాలంకారములం గూడ నచ్చటచ్చటఁ బొందుపఱిచియున్నాఁడు. ఒక్కొక్కచో నొక్కొక్కయలంకారము మాత్రమేగాక రెండు మూఁడుం బర్సంగవశమునం గూడినపుడు సంసృష్టిసంకరప్రకారంబులు నచ్చటచ్చట నూహ్యంబులై యుండెడు. వీనికిం గొన్ని యుదాహరణములు దిక్ప్రదర్శనముగC జూాపుచున్నాఁడను.

మ.

“తలఁపం జొప్పడి యొప్పె నప్పుడు తదుద్యజ్జైత్రయాత్రాసము
త్కలికారింఖదసంఖ్యసంఖ్యజయవత్కంఖాణరింఖావిశృం
ఖలసంఘాతధరాపరాగపటలాక్రాంతంబు మిన్నే రన
ర్గళభేరీరవనిర్దళద్గగనరేఖాలేపపంకాకృతిన్.”

ఇందొక్కటిరెండువర్ణములకుఁ బలుమా ఱావృత్తిఁ గావించుటంజేసి వృత్త్యనుప్రాసాలంకారము.

రగడ.

“పొలిచె మధులక్ష్మి సురపొన్నలను జొన్నలను
దెలివిపడి పుప్పొడుల తిన్నెలను జిన్నెలను
......................పాలికల బాలికల.”

అ-2. ప-6.

ఇందు ఛేకానుప్రాసాలంకారము.

శబ్దాలంకారములచే రసపుష్టి గలుగ దాని వానియెడఁ గవుల కంతగ సాదర ముదయింపదు గావున శబ్దాలంకారవిచార మిఁ యర్థాలంకారముల విచారించెద. సుకవులు శబ్దాలంకారముల నంతగ నాదరింపరని చిత్రమీమాంసలో శ్రీమదప్పయదీక్షితులవారు “శబ్దచిత్రస్యప్రాయో నీరసత్వాన్నాత్యంతం త దాద్రియంతే కవయో నవా తత్ర విచారణీయ మతీవోపలభ్యత ఇతి శబ్దచిత్రాంశమపహాయార్థచిత్రమీమాంసా ప్రసన్నవిస్తీర్ణా ప్రస్తూయతే" అని చెప్పియున్నారు గదా.

క.

"వెండియుఁ బతికోర్కి వొదల, రెండవసతి యనవరగుణరేఖఁ దనరుచున్
గండెసఁగెడు సుతరత్నముఁ, బాండురమణి శుక్తివోలెఁ బడసె హరికృపన్.”

ఆ-1. ప-72.

ఇం దుపమాలంకారము స్పష్టము. భారతార్థమున రూపకసంకీర్ణ మగుట విశేషము.

మ.

"తలపం జొప్పడి యొప్పెనప్పుడు......."

ఆ-1. ప-9.

అని ముందు వృత్త్యనుప్రాసోదాహరణముగాఁ జూపఁబడినపద్యమందు సంబంధాతిశయోక్తివస్తూత్ప్రేక్షలు రెండు గోచరించుటంజేసి వానికిఁ గ్రమమున నంగాంగిభావలక్షణం బైనసంకరమును దీనికిని శబ్దాలంకార మగువృత్త్యనుప్రాసమునకును సంసృష్టియు విపశ్చిద్వివేచనీయంబులై తోఁచెడు.

చ.

“తురగఖురాహతక్షితిజధూళిచయస్థగితాంబరంబుతో
నొరయుచుఁ దచ్చమూగజసముత్కర మప్పుడు చూడ నొప్పె ది
క్కరివరయూథమత్సరవిగాఢతఁ జేసి సమస్త మైనయి
ద్ధరఁ దనపైకి నెత్తుకొని తాల్చెడినో యనుచుండఁ జూపరుల్."

ఆ-1. ప-10.

ఇందు సంబంధాతిశయోక్త్యనుప్రాణితహేతూత్ప్రేక్ష —

సీ.

"అచ్చంపులేఁజిగురాకుజొంపము కెంపు, మేలిచెందిరపుఁగెంధూళి గాఁగ
గ్రుచ్చినట్టుగ జాదుకొన్న మొగ్గలగుంపు, ప్రకటపాటలబిందుపాళి గాఁగ
విచ్చినపరువంపువిరులతండము పెంపు, శోభితభూతిరింఛోళి గాఁగ
నిచ్చలం బైన తేనియవానజడిసొంపు, లాలితదానధారాళి గాఁగ


తే.

సుమపరాగముల్ కేళిపాంసువులు గాఁగ
భ్రమరపఙ్క్తులు పైసరఫణులు గాఁగఁ
బుడమినెల్లెడ వాహ్యాళి వెడలుమదను
మదపుటేనుఁగువోలె నామని దనర్చె.”

ఆ-2. ప-5.

ఇందు సావయవరూపకానుప్రాణితవస్తూత్ప్రేక్ష సహృదయహృదయంగమంబై తనర్చెడు. మఱియు నీపద్యమున సీసపాదములు నాలిగింటిలో సంయుక్తచకారప్రాసంబును, బాదార్ధావసానంబున నేకరీతిగా బూర్ణానుస్వారపూర్వకముగాఁ బకారోత్తర ముకారము నిలుపుటయుఁ బాదావసానంబున నన్నిఁటిలో నొక్కరీతిగాఁ “గాఁగ” ననుపదమే కూర్చుటయు, దానికి ముందు దీర్ఘముమీఁద “ళి” యను దానిని నిలుపుటయు నియతము గావించి శబ్దాలంకారమును గూర్చుటం జేసి వినువారికి వీనులవిందు గొల్పెడు.
సీ.

“నానాఁటి కుప్పొంగునవకంపుఁగళల పెం, పునఁ జిన్నిక్రొన్నెలబోద లనఁగ
నుత్తరోత్తరవృద్ధి నొప్పుతేజోరేఖ, పసఁ గోమలార్కబింబంబు లనఁగఁ
క్రొత్తక్రొత్తగఁ బొదల్కొమరునెమ్మేనుల, బలుపుష్టిఁ గరికలభంబు లనఁగ
నంతకంతకు మించువింతమగంటిమి, యందుటున సింగంపుఁగొదమ లనఁగ


తే.

"వెలసి రిలను ధర్మజభీమవిజయు లనఁగఁ
గ్రాలునృపసుతుల్ దమలోనఁ గవలు గూడి
మనసుమైత్రిచే రామలక్ష్మణచరితము
సనయభరతశత్రుఘ్నుఖేలనము మెఱయ.”

ఆ-2. ప-3.

ఇం దుల్లేఖాలంకారము చమత్కారంబుఁ గూర్చెడు.

మ.

“ఇటుము న్నుర్వరఁ బర్వుచున్నవిజయోదీర్ణప్రతాపాద్భుతో
త్కటవార్తల్ రిపుకోటికిం బిడుగులై గర్జిల్లెడున్ నీకు నెం
తటివాఁడైన నెదిర్చి ప్రాణములతో దాఁ గ్రమ్మఱన్ లేమి ప్ర
స్ఫుట మోభూప యరాతిచేష్టలు భవద్భ్రూభంగపర్యంతముల్.”

ఆ-4. ప-109.

ఇందుఁ జతుర్ధపాదమునం గారణప్రసక్తిమాత్రమునం గార్యోత్పత్తిలక్షణంబుగా నొదవు చపలాతిశయోక్త్యలంకారము ప్రతిపాదింపఁబడియె.

శా.

"శ్రీతోఁ బుట్టి సుధామధుద్రవముతోఁ జెన్నొందుపుష్పంబు శో
భాతారుణ్య మెలర్పఁగా ముడుచుపంపాహేమకూటాశ్రయ
ఖ్యాతబ్రహ్మము ప్రోచుఁగావుత విరూపాక్షాహ్వయం బాకువీ
టీతిమ్మప్రభువేంకటాద్రిహృదయాటీకంబు లోకంబులన్.”

ఆ-1. ప-1.

ఇందు భంగ్యంతరాశ్రయవచఃప్రతిపాదనలక్షణం బైన పర్యాయోక్తాలంకారము నిరూపింపఁబడియె.

శా.

"శ్రీచన్గొండలు రెండు నండకొని వాసిం బేర్చుచున్ భక్తిసా
మీచీన్యామలపెద్దవేంకటనృపోన్మీలన్మనశ్చాతక
వ్యాచిక్రింసకుఁ గైవసంబయి సదోదంచత్కృపాదృష్టిస
ధ్రీచీనం బగుకృష్ణమేఘము జగత్ప్రీతిం గడుం జేయుతన్.”

ఆ-1. ప-2.

ఇందు రూపకాలంకారము విస్పష్టము.

మ.

“యతి యెంతేఁ దనయార్తిఁ జేడ్వడినవాఁడై యాత్మజాయాసమా
గత మైనప్పుడు మేనుఁ బాయు మని యల్క న్నన్ను శాపించె సం
తతి లేకుండినచోఁ దదాశ మిగులం దాఁ బోవు టెట్లేనియున్
ధృతిమై నోర్వఁగ వచ్చు నామదికిఁ జింతింపంగ నం చెన్నెదన్."

ఆ-1. ప-3.

ఇందు రామాయణార్థమున ననుజ్ఞాలంకారము.

చ.

“క్షమయు నమోఘవిక్రమము సద్వినయంబు ప్రతాపమున్ సురూ
పము నవికారభావమును బ్రాభవశక్తియు నిత్యదానశీ
లముఁ దగ నొక్కటొక్కటి కలంకృతిఁ జేయఁగఁ దాల్చి శోభిలున్
విమలత నాకువీటిపురవేంకటరాయఁ డతిప్రసిద్ధుఁడై.”

పీ-1. ప-34.

ఇం దన్యోన్యాలంకారము.

సీ.

“కులవర్ధనుం డైనకొడుకుఁ గాననియట్టి, లాఘవాస్పదునియాలయము లయము
సిరులకుఁ దొడ వైనవరసుతుఁ బడయని, ఘనకలుషాత్ము జీవనము వనము
పితరులఋణముఁ దీర్చెడుసూనుఁ జెందని, దౌర్భాగ్యశీలుగోత్రమ్ము త్రమ్ము
రహి నిహపరసుఖప్రదుఁ బుత్త్రు నెత్తని, వరపుణ్యహీనుభవమ్ము వమ్ము


తే.

"పలుఁబలుకు లేల నిఖిలము ఖిలముసూవె
యాత్మజులు లేనివారి కోయతివరమణి
తరమె యనపత్యువైవర్ణ్య మరయ నతని
యఖిలమును నిట్లు ముఖవర్ణహానిఁ జెంద.”

ఆ-1. ప-46.

ఇందు వినోక్త్యలంకారము, మఱియు నాలయము, జీవనము, గోత్రమ్ము, భవమ్ము, నిఖిల మ్మనుపదముల మొదటియక్షరముఁ ద్యజించి "లయము, వనము, త్రమ్ము, వమ్ము, ఖిల" మ్మనియుం గ్రహించుట శబ్దచిత్రము, వైవర్ణ్యము ముఖవర్ణహాని యనుచో శ్లేషయుఁ జమత్కారముఁ గలిగించెడు.

మ.

“జవవద్ఘోటకపాటితక్షితిరజస్సంక్రాంతిచే నింకుసిం
ధువులం గ్రమ్మఱ నుర్వికిన్ దివికిఁ దోడ్తో నించెఁ దన్నాగముల్

నవనిర్యన్మదనిర్ఘరౌఘమున శుండాశీకరోర్ధ్వప్రవ
ర్షవిధిం దానను జేసి సింధురము లన ఖ్యాతిఁ గాంచెన్ గరుల్."

అ-1. ప-11.

ఇందు శ్లేషోత్థాపితసంబంధాతిశయోక్యనుప్రాణితనిరుక్త్యలంకారము.

క.

"ఉదుటున న ట్లరిగి యతం, డది ప్రాయశ్చిత్తతీర్థయాత్రాలీలన్
వదలక పూతము సేయన్, సదమలగతి పూనె వృథయె సత్సంగరముల్."

ఆ-2. ప-91.

ఇం దర్థాంతరన్యాసాలంకారము.

మత్తకోకిల.

“భూధరాధిపకన్యకామణిపుణ్యపాదపయోజలా
క్షైధితారుణగైరికద్యుతిహేమకూటవిహారలీ
లాధికాదర సాధుసాధితహైమవత్యనురంజనా
రాధితస్మరమోచితాత్మపురాతనాపకృతిస్మృతీ.”

ఆ-3. ప-144.

ఇందుఁ బ్రథమసమాసమున ననుగుణాలంకారము.

ఇమహాకవి కావ్యగుణములుం బెక్కులు పొసఁగునట్లు రచన గావించెను. అన్నియు నిరూపించినం గ్రంథవిస్తరమగునని వానికిని రెండుమూఁడుదాహరణముల మాత్ర మిచ్చట నుదాహరించెదను.

క.

“అది సకలసదాచారం, బది సర్వజ్ఞాన మది సమస్తజనిఫలం
బొదవినకొలఁది నొకప్పుడు, హృదయము నీయందుఁ జేర్తురేని మహేశా.”

ఆ-3. ప-60.

ఇందు శ్లేషాఖ్యగుణము.

ఉ.

"అంత వసంత మొప్పెఁ జరమాగ్రిమభాగచరాఖిలర్తుసా
మంత మనంతజాలకసమంజసరంజితకుంజకుంజరో
ద్వాంతనితాంతసాంధ్రమధుదానవిజృంభితబంభరస్వనా
త్యంతనిరంతరీకృతదిగంత మతాంతలతాంతకుంతమై.”

ఆ-2. ప-4.

ఇం దౌదార్య, ముదాత్తత, యోజస్సు, సౌకుమార్యంబు నూహ్యంబులు.

సీ.

"అచ్చంపులేఁజిగురాకుజొంపముకెంపు, మేలిచెందిరపుఁగెంధూళి గాఁగ..."

ఆ-2. ప-5.

అనుసావయవరూపకానుప్రాణితవస్తూత్ప్రేక్షకు ముం దుదాహరింపఁబడిన పద్యమునందు సమత, యర్థవ్యక్తి, సమాధియు నూహ్యంబులు.

ఇమ్మహాకవి కావ్యమునకు జీవితస్థానీయ మైనవ్యంగ్యవైభవము నిందుఁ బొందుపఱిచియున్నాఁడు.
మ.

“జవవద్ఘోటకపాటితక్షతిరజస్సంక్రాంతిచే....”

ఆ-1. ప-18.

అను శ్లేషోత్థాపితసంబంధాతిశయోక్త్యనుప్రాణితనిరుక్త్యలంకారమునకు లక్ష్యముగా ముం దుదాహరింపఁబడినపద్యమందుఁ దురగఖురోద్ధూతం బైనపరాగముచే సముద్రములును మందాకినియు నింకెననియు, నేనుఁగులమదధారలచేతను దొండములతుంపురులచేతను మగుడ నవి నిండెననియుఁ గల్పించినయతిశయోక్త్యలంకారముచే, సముద్రములను మందాకిని నింకింపఁ జాలినంతపరాగము రేఁపఁ దగినన్ని గుఱ్ఱములును వాని మరల నిండింపఁజాలినంత మదోదకమును దొండపునీరునుం గురియఁజాలినన్ని యేనుఁగులు నాపురమునఁ గల వనువస్తుధ్వని వ్యంగ్యమై విద్వాంసులకు మనోరంజనముఁ గావించెడు.

గ్రంథాదిని రచియింపఁబడిన—

శా.

"శ్రీతోఁ బుట్టి సుధామధుద్రవముతోఁ జెన్నొందుపుష్పంబు శో
భాతారుణ్య మెలర్పఁగా ముడుచుపంపాహేమకూటాశ్రయ
ఖ్యాతబ్రహ్మము ప్రోచుఁగావుత విరూపాక్షాహ్వయం బాకువీ
టీతిమ్మప్రభువేంకటాద్రిహృదయాటీకంబు లోకంబులన్.”

పీ-1. ప-1.

అనుపద్యమందు 'శ్రీతోఁ బుట్టి' యనుటచే “రాఘవత్వే భవే త్సీతా రుక్మిణీ కృష్ణజన్మని” యను విష్ణుపురాణవచనము చొప్పున లక్ష్మీస్వరూపురాలగు సీతాదేవితో ననఁగా సీతాదేవిచరిత్రముతో ననియు 'సుధామధుద్రవముతోఁ జెన్నొందుపుష్పంబుఁ' జంద్రుని ననఁగాఁ జంద్రవంశరాజచరిత్ర ననియుఁ గల్పించి యట 'శో, భాతారుణ్య మెలర్పఁగా ముడుచు పంపాహేమకూటాశ్రయ, ఖ్యాత బ్రహ్మము' పంపాహేమకూటాశ్రయుఁ డైన విరూపాక్షదేవునిచేత, ఖ్యాతకృతిసమర్పణచేతఁ బ్రసిద్ధమైన బ్రహ్మము, వేదతుల్యమైన రామాయణభారతద్వయార్థప్రతిపాదకగ్రంథ మనియు నన్వయించుచో మనాక్కావ్యార్థసూచనము వ్యంగ్యమహిమచే నొనర్పఁబడియె నని రసికు లూహింపఁదగును.

క.

“చను నెడ శ్రీరాముఁడు పా, వని నవనిజరూపవైభవశ్రీ నుల్లం
బున నిడి దానవిచిత్రా, తనురాగప్రౌఢి వచ్చి తనుఁ బైకొనఁగన్.”

ఆ-2. ప.41.

ఇందు రామాయణార్థమున రామునకు సీతాదేవియెడ రాగము రతి యుదయించె నని చెప్పఁబడియె. అయ్యది ప్రసంగసంగతానుభావాదిసామగ్రీసముల్లసితంబై రసమయ్యెడు కైశిక్యాదివృత్తులును ద్రాక్షాదిపాకములును బ్రకరణోచితముగను రసోదయానుకూలముగను రచనావిశేషమున నచ్చటచ్చటఁ గూర్పఁబడి సహృదయవేద్యంబు లై యుల్లసిల్లెడు.
క.

"కొలఁది యిడరానిపాండితి, గలపింగళిసూరనార్యుకవనంబునకౌ
శల మున్నదెల్ల నెఱుఁగఁగ, నలవియె మాదృశున కర్హు లందుఁ గవీంద్రుల్.

విద్వాంసులు విమర్శించి విశిష్టకృపామతింజేసి యిందలిదోషముల మన్నించి గుణ మేదేనుండినం గ్రహింపఁ బ్రార్థితులు.

శ్రీకాళహస్తి.

ఇట్లు,

10-7-1910.

సమస్తవిద్వద్విధేయుఁడు,

శతఘంటము. వేంకటరంగశాస్త్రి.