రఘునాథ తొండమాన్ వంశప్రతాపమాలిక

వికీసోర్స్ నుండి

రఘునాథతొండమాన్ వంశప్రతాపమాలిక

సీసమాలిక

[1]శ్రీబృహన్నాయికాసేవాత్తసంపద పదవినతారిభూపతినికాయ
కాయజనళబాహులేయాతిసుందరదరదరాతినిలయదచలకుంజ
కుంజరారిసమాన ఘోరపరాక్రమ [2]క్రమలసత్ప్రాజ్యసామ్రాజ్యవిభవ
భవసుఖవిభవానుభవ సౌభరిసమాన మానవవరనీతిమహితమహిమ
హిమకరసమకీర్తివిమలదిగంతరతరవారిధారాహతారివిసర
సరళనిస్తులతరసద్గుణసంపన్న [3]పన్నగేంద్రసమానవచనచతుర
తురగాధిరోహణతోషితరేవంత [4]విశదయశఃపూరవృతదిగంత
శీతాంశురవికలశీకృతాత్మనిశాంత గర్వితోక్వివరగణకృతాంత
శరణాగతత్రాణకరుణాయుతస్వాంత ఘనతరకవిజనవనవసంత
కోటీకులాంభోధికువలయినీకాంత [5]విబుధాళీకాంక్షితవితరణచణ
దినదిన సంప్రవర్థిత [6]కటాక్షాపూర్ణ లలితాశ్రితద్విజరక్షణకర
[7]భాస్వత్ప్రతాపబిభ్యదమిత్రభూధవ రాజరాజతులితరమ్యవిభవ
లలితయక్ సీలింసి రఘునాథతొండమాన్ బహదరు పుడమిపైఁ బ్రబలఁదగిన
యట్టినీసంతతి యాఖండలుని బట్టి తామరతంపరై తనరుచుండు
ధీరుఁడౌ [8]నలకోటి తిరుమభూపుని బట్టి వరరాయరఘునాథ వసుమతీంద్రు
వఱకు ధరణిలోన మెఱసినయిరువది తరములవారల ధైర్యశౌర్య
విభవప్రతా[9]పాది విశ్రుతగుణముల మాలికగాఁజేసె మహిని వెలయ
ధరణిమహెూద్దండ బిరుదనుదురుపాటివంశ సీతారామవరకవీంద్ర

గర్భసంభవుఁడు వెంకనసుధీవర్యుండు తత్పుత్రుఁడౌ నేను దగినరీతి
నావలివారల యద్భుతచరితముల్ [10]విశ్రుతం బై రహి వెలయుచుండ
[11]మందమారుతలోలకుందబృందాంతరస్యందదమందమరందబిందు
తుందిలసారస్యధూర్వహఫణితిచే వినిపించెద నొకింత వినుము దయను
దక్షిణసీమకుఁ దగినవా పైనట్టి మమదల్లిఖానుఁడు మహితబలుఁడు
కుంపుణీవారలఁ గూడి నడిచినట్టి [12]యది మొదలు జగడ మవధరింపు
చలమున నలచందసాహేబు చెలిమికై యలవిజయరఘునాథావనీంద్రు
కడకేగ నాలమఖానుని బంపిన వెస నతఁ డాతని బేటిసేసి
యప్పుడె యలవాఁడు నతిరయమున
సాగి బేటియైనఁ జతురత మెఱయఁగఁ బలుకఁదొడఁగె వాఁడు వయనముగను
యట్టియాపురమాదియైన భూపాలురు మనపారిపాల్యాల మహిపతులును
దనరనవాపుపై దండెత్తి తిరిచినాపలికోటను జయింపవలసి మేము
పనిఁబూని వ్రాసిన వారలు బలముతో వచ్చి చే[13]రెదమని వ్రాసినారు
తామును నీరీతి దయచేసినట్లైన సగము రాజ్యము మీకొసఁగెద మనుచుఁ
బలుకుమనిన [14]రీతిఁ బలికితి నన విని కూడిరానిపనిని గోరినారు
చెనఁటియయినవాఁడు చెట్లపై పండ్లను గోరినట్టులు మీరు కోరినారు
మేము నవాపుకై మీమీఁద దండెత్తనేర్పడియుండ నిదేటిపలుకు
పలికెదరనుచును బకపక యనినవ్వి వినునవాపుతోడి వింతలనుచు
మమదల్లిఖానుఁడు మహితబలాఢ్యుఁడు మహిఁ బేరుకన్నట్టి మంత్రివరుఁడు
పరవాహినీపతిబడబానలంబును సామదానభేదచతురమతియుఁ
గాన నీబుద్ధిని గడకేగునటు ద్రోసి బ్రదుకుత్రోవను జూడవచ్చు ననుచుఁ
బలికిన[15]యామాట ములుకులవలె నాటఁ గనలుచు నలవాఁడు కడకుఁ దొలఁగి
చేరిన [16]దొరలను జేర్చుక యలప్రాంచు ముసలల్లియనువాని ముందు చేసి
తిరిచినాపలిచుట్టు దిగి రస్తురానీక త్రోవకట్టినమాట తోడనె విని
మంత్రివర్యుండైన మమదల్లిఖానుఁడు తిరిచినాపలికోట చేరనడిచె
బలముతోడుతను కేపన్ కోపుసాహేపు జన్నలారన్ దొర సాగిరాఁగ

గడుసుగా నలువంకఁ గమ్మకయుండిన కోటకు వస్తువుల్ గూర్చుకొఱకు
శిస్తుగావలసిన వస్తువుల్ చేకొని తొండమానునివారు తోడుగాను
వచ్చి కీరణ్ణూరిబైటను విడిసిన నందఱు యోజించి యద్భుతముగ
దండుసాగఁగనిచ్చి తమకుబయలుదేర వాఖబురాలించి యలుక పూని
యాలముఖానుఁడు నాలముగావింపఁ బడమటిదిక్కున బారుతీరి
గగనమధ్యగతార్కకర్కశాంశుప్రతిఫలనదుర్నిరీక్ష్యపటుకృపాణ
పాణితౌరంగికపాదాతఖురపదసంచలద్ధూళి[17]ప్రచ్చాదితాభ్ర
మండలుఁడై రాఁగ మఱికోపుసాహెబు దండురెట్టమలను దాపుచేసి
రే[18]కవాలెగ నెత్తి రేఁగిన శూరులఁ [19]బఱవవద్దటనుచుఁ బట్టుపఱిచి
హౌదావులోనుండు నాలముఖానుని జాగుగాగుఱిసేసి ఫయరటన్న
హౌదావులోనున్న యాలముఖానుని మేనుచెదరి జనులఁమీఁదఁ బడిన
దళము దాని నెఱిఁగి తగినరీతి విఱిగి దాఁగఁదావు లెఱిఁగి తగరు మఱిగి
నానాగతులఁ జెందునట్టి ఫౌఁజులు చూచి చేయునదియులేక చింతనొంది
నిలిచినతావున నిలిచి కలఁక చెందు ఛందసాహెబు దూకు నొందఁజేసి
హితుఁడై నవాపుసాహెబునకు సీమతో ద్రిశిరఃపురంబు గైవశము చేసి
విజయాంకుఁడై తాను వెలయుచునుండఁగ నటుకొన్నినాళ్లపై నబ్బురముగ
గూడలూ[20]రునయందుఁ గుంపిణీవారికిఁ బ్రాంచువారలతోడ బవరమంట
[21]బలముచాలక యున్న బాగుగా యోజించి గౌనర్ బళాయరన్ కారుచిచ్చు
మమదల్లిఖానుని మద్దత్తుగాఁ గోర నతఁడు విజయరఘునాథనృపతి
[22]సాహాయ్యకము సేయ సమయమంచనికోర నప్పుడ యాఘనుం డైదువేల
దండుఁ బంపుమటంచుఁ దాను వ్రాసి పనుప నప్పుడె యాతఁడు నైదువేల
జనముల మున్నూఱు జవనాశ్వములఁ బంప బలయుతుఁడై సాగి ప్రాంచువారి
గెలిచి మోదమున వక్కీలును బిలిపించి సీమకుఁ బొమ్మని సెలవొసంగె
నటులుండ నొకనాఁడు హైదరుసాహేపు ముసలల్లి[23] రప్పించి మోదమునను
మంతనం బొనరించి మమదల్లిఖానుఁడు కుంపిణివారలకుమకువల్ల
నెవ్వ రీడనుచును హెచ్చియున్నాఁడని యేర్పడి కయ్య మొనర్పవలయు
ననుచు దండునుగూర్ప [24]నత్యుగ్రులౌనట్టి పదివేలజనములు ప్రాంచువాండ్రు

[25]పిడుగుచేవలపోల్కిఁ బడుదుచేఁ బొల్పారు పదిపటాళంబులబారువాండ్రు
వహి మీఱఁదగిన యేబైవేలగుఱ్ఱముల్ రాజిగానిడిన పిరంగులలర
ఫౌఁజునడపి చెన్నపట్నము గూడలూర్ దాఁక గ్రమ్ముకయున్నదాడి చూచి
మట్టెఱుంగక వీరు మాపైని విడిసినారంచని [26]మదిలోన నరసిచూచి
పదిపటాళంబులు పదిఋజుముట్లను నిరువదివేవురు నింగిలీజు
[27]తురుపువారు నవాపుతోడిజనంబులు కుమకుగారమ్మని కోటివిజయ
రఘునాధతొండమాన్ రాయహంవీరుని దండుఁ బంపుమటంచుఁ దాను వ్రాయ
నేనూఱుగుఱ్ఱము లేనూఱు చివ్వలు పదివేలసంఖ్యతుపాకివాండ్రఁ
బంపినపిక్కట్టు ఫౌఁజుతోఁ జేర్చుక మొగ్గరంబులువన్ని మొదటఁగొన్ని
పీరంగులనునుంచి పిక్కట్లుగాఁ బంచి దానికిఁజేరువఁదళతళయను
కత్తులు మెఱయంగఁ గక్కసగాండ్రైన తురుపుసవారులు తుదలనిల్చి
యీరువాగునేర్పడి యీసునఁ బోరంగ గొప్పపిరంగులగుండ్లచేత
[28]ఝంఝాప్రభంజనజర్జరీకృతతూలజాలోపమానమై వ్రీలదళము
జడివానకాలానఁ దడిగోడలవితాన గడుసువెల్లువవేళ గట్టులట్ల
వరుసవరుసగాను బడుచుండె వేగమె తెఱపికానఁగనీక నెఱయసాగి
[29]కర తెగినంతలోఁ గ్రమ్ము వెల్లువపోల్కి నొక్కుమ్మడిగఁ బయిఁద్రొక్కసాగి
యిదె మీఱె నదె తూఱె నది పాఱె ననువేళ ఫౌఁజుకు మొనకల్గఁ బలికి పొగడి
[30]ఇది సమయ మనంగ నేకముగా రేగి పైనిఁ ద్రొక్కి నడచి బలము మెఱయ
[31]యెడతెగనీయక గెడగెడవాడిన నెదుటిఫౌఁజుకలఁగు టెఱిఁగి వేగ
తురుపునఁ జెయినూపఁ దూఱి యాశూరులు బ్రద్దలు తుంటలు పాళ్లుగాను
జేకొద్ది నఱకినఁ జెయ్వులన్నియు మాని పడియున్న యాఫౌఁజుపాటు వినుము
కాళ్లును వ్రేళ్లును గన్నులుఁ జన్నులుఁ దొడలును మెడలును నడుముఁ గీళ్లుఁ
జెక్కులుఁ బెక్కులు చేతులు మూతులు విఱిచిపఱచినట్టు వెలయుచుండ
[32]గాయము ల్గన్గొని కళమఁజెందుచుఁజని మొండెముల్ పైఁబడ మొగియువారు

వినుముగాయకాండ్ర వితమేమి చెప్పుదు నెత్తురుజొత్తిల్లఁ దత్తరమున
లేచిపోవఁదలఁచి లేవరాకుండిన జరగువారును నట్టెయొరగువారుఁ
గొఱప్రాణములతోడ గుఱగుఱమనఁ జూచి నొప్పిఁ ద్రుళ్లిపడఁగ నులుకువారు
బరిగుఱా లడ్డంబుపాఱినఁ గనిపెట్టి పొల్లువారును నట్టె త్రుళ్లువారుఁ
జెంగటిచెట్లను జేరఁగా మదినెంచి పొల్లిగింతలు పెట్టి పోవువారు
మేదినిపైఁబడి "మేరెహాద్గయెఅరే అల్లా"యటంచని యడలువారు
“పాయిగేలేకి మీకాయికరూ ” యని చెంగటివారితోఁ జెప్పువారు
‘‘ఏను మాడలి నాను ఇల్లి నమ్మొవ్వరు యెల్లిహోదరొ" యని యేడ్చువారు
[33]"పుదుచేరి యారణ్ణపుణ్ణంగతయెనంచి అరమందపడిపొచ్చుగనెడివారు
ప్రాణము ల్పోలేక పదములఁదన్నెడు నరులఁ జేకత్తిచే నఱకువారుఁ
బాఱిపోవదలంచి పదములురాకున్న మొండెములై పై వైచుకుండువారుఁ
[34]దెగి వ్రేలుతలలూడ నొగులురౌతులతోడ గుప్పుగుప్పున దాఁటుఘోటకములు
ఒకప్రక్కఁ బ్రేగులు నొకప్రక్కఁ బుఱ్ఱెలు నొకప్రక్క నెమ్ములు నొకటసొమ్ము
లలరంగఁ గనఁగూడ కతిరౌద్రమైనట్టి కలనిపట్టులఁ దారు నిలువలేక
విఱిగిపాఱెడివారి వితములే[35]మందును గానలలోవారు కలసిమెలసి
పాఱుచో శిఖలంటి కోరిందముండ్లీడ్వ విడిచిపెట్టుమటంచు వేఁడువారు
నేగుచో మఱుఁగున నెదిరిన తమవారిఁ జూచి దిగ్గున నుల్కి సొలయువారు
బయలు కన్గొనుచోట వడిఁ బాఱి పాఱుచుఁ బొదలుకన్గొనుచోటఁ బొంచిపొంచి
వెనుక వచ్చెడివారి వేగఁ జేతులు చాఁచి గుంప్పు గూడకుమంచుఁ గూఁతలిడుచుఁ
గొండల గుహలందుఁ గోనలఁ గానలఁ గొందఱు పలికిరి కూడియుండి
ఇంగిలీజుదొరల దీఫౌఁ జనుచు విన్న మేము నీదండుకు రామటంచు
గడియదూరంబునఁ గననీకకొట్టిన మనచేఁత లేమిటి కనెడివారుఁ
జేతికత్తికిఁ గత్తి చివ్వకుఁ జివ్వయుఁగాక యీగుండ్లైనఁ దాఁకవశమె
చెండ్లాల గుండ్లను జేటలఁజల్లిన నెదిరిపోర జగతి నెవరితరము

గుండులు గుండ్లంచుఁ గూఁతలు పెట్టిరె తురుపువారీ చేఁత తోఁపలేదొ
జీరాలు కేడెముల్ చిలుతాలుబొమిడికల్ దస్తాలటంచని తట్టువడక
వేసినతావున వ్రేటాఱుతున్కలు గాకరిత్తను [36]సోఁకగాన నెచట
నబ్బబ్బ [37]యెన్నైన నాలములోపల మంచిదెబ్బను దీసె నంచుఁ బలుక
దాఁగవచ్చినచోట దండుమాట లవేల యూరకుండుఁడటంచు నొకఁడు వలుక
నలసినగుఱ్ఱముల్ సొలసిన సోల్జర్లు బడలికఁ జెందినఁ బాఱువాండ్రు
రిత్తసీపాయిలు రుత్తదోస్తానాలు కడిపోయినట్టి చేకత్తు లలర
ఖడ్గకుంతాఘాతఘనతరక్షతిగళద్రక్తధారాతిదుర్దాంతు లగుచు
మోమున ఱొమ్మున ముందటిగాయముల్ నెత్తురెల్లెడఁగన నెరయుచుండ
శూరులు వెడలిరాఁ జూపరు [38]ల్కనుఁగొని యత్యద్భుతరసం బనుభవింప
విజయలక్ష్మి చెలంగ వెడలి పురముఁ జేరి తొండమానునివారిదండుఁ జూచి
మీరు కుంపణివారిమేలు కోరినవార లనుచు గౌనర్దొర హర్ష మొప్ప
మీదొర కెప్పుడు మేలుకలుగుచుండు నని జనులకు నినా మధిక మిచ్చి
సంతోషమునఁ బంపసాగి సీమకు వచ్చి తమతమయిచ్చలఁ దగిలియుండ
[39]గౌనరు మమదల్లిఖానుఁడు మొదలైనదొరలు కొల్వున నుండుతఱిని మనకుఁ
దొండమాన్ బహదరుదండు మిక్కిలికుమ్కు చేసి యించ్చుట ప్రశంసించి వారిఁ
దోడ్తోనె రప్పించి దొర లెల్లను నుతింప సమ్మాన మొనరించి సంతసించి
సీమకుఁ బొమ్మని సెలవిచ్చి పంపఁగా దనము వెల్వడి వచ్చి తనర విజయ
రఘునాథతొండమాన్ రాయహంవీరుని భేటియై ఖబురంత విన్నవించి
తమతమయిచ్చలఁ దగురీతిని జెలంగ నాతఁ డత్యంతసంప్రీతిఁ దనరె
నటులుండ........................దొరవారి కొప్పించి మెఱయుచుండ
నటులుండ నొక్కనాఁ డాలముఖానుని మేనల్లుఁడౌనట్టి మెందుమియ్య
యనుపేర వెలసిన మొనగాఁడు బలిమిచే మధుర తెన్నల్ వెల్లి మట్టుగాను
వ్యాపించియున్నట్టివార్త వినినవాపు గర్న లీరన్నను ఘనుని బిలువఁ
బంపి తెలియఁజేయ వల్లెయంచును వాఁడు తెన్నవల్లికిఁ బోవఁ దెంపుతోడ
నైదుపటాలాలు నాయితమై రాఁగఁ దొండమానునివారితోడుఁ గోర
ఆయన పంపిన యైదువేలజనంబు వెంటరా వానిపై విడిసె

వరిది మేదినిసాయిర్పకు మందానికి నరిదికొన వాఁడు బారుతీరి
చేవడిపిరవంగఁ జెడినజనములు వెలవెలయై గుండె కలఁగి పాఱ
మందుమియ్యాఖాను నెందును బోవక కైదువేలయు సీమ కరిగియుండ
మరియొక్కనాయల్ల మమదల్లిఖానుఁడు మధుకతెన్మల్వల్లి మహికిఁ దగఁగఁ
దనయాజ్ఞఁ జెల్లింపఁ దగును వీఁడంచును నిసుపుర్టాకుముదాని నెంచి పంప
వాఁడు నాఁ[40]దిక్కేలు పాళగాండ్కనునెల్లఁ గూర్చుక యెదురైనఁ గోపగించి
మమదల్లిఖానుఁడు మఱికఱకులైనట్టి శార్వేనుకేమలు పంపఁబిలిచి
యేకాంతమొనరించి యెట్లఫౌఁజును జేర్చి వహి మీఱఁ దిరిచినాపల్లె చేరి
సమరధూర్వహుఁడౌ విజయరఘునాథేంద్రు రప్పించి కలనికి రమ్మటన్న
రాణువల్ రౌతులు రాచఱికమ్మును గలిగినంత జనులు బలిసికొలువఁ
దోడుసూప నడిచి తోడనే మధురపైఁ దగినతావు లెఱింగి దండుదిగిన
నామాట విని వాఁడు నాత్మలోపలఁ గలఁగి ద్రోహిగావున వేరె తోఁపకున్న
జెంతటివారలె చేరుట్టుగాఁబట్టి యూరకయె నబాపు గొప్పగింప
వారిఁదూఁకుందీసిని తోనే యాసీమకుఁ దగినవాని నిలిపి తాను దిరిగి
తొండమానుని వారిదండును దోడ్కొని సీమకుఁ బోయిరా సెలవొసంగె
అటులుండ నొకనాఁడు హన్రెబిల్ కుంపినీకార్యములకు నెల్లఁగర్తయైన
సాహసియైనట్టి జన్నలుల్లాంగునురు శ్రీరంగసీమనుగల...................
గడుల నెల్ల జయించి కానుకలను గాంచి రావలెనంచని రవళిమీఱ
[41]రమ్యుఁడౌ శ్రీరాయరఘునాథతొండమాన్ ఘనుని తో డొనరింపఁ గడఁగివేడ
దండు పంపుమటంచుఁ దాను గాగిత మపంప నప్పుడె సుభటులనైదువేలు
మున్నూఱుగుఱ్ఱముల్ సన్నద్ధముగఁబంపఁ దత్క్షణంబే వాఁడు తరలిపోయి
కరువూరికోటను అరవకురిచ్చియు దిండుకల్ కోటను దీసియుండఁ
గర్నలై నపులటన్ ఘనుఁడల్లదండుకుఁ గార్యకాఁడైవచ్చి గడుసుగాను
బైసాగి బెంగుళూర్ వఱలోనఁగలయట్టి గడుల నెల్ల జయించి కడిమిమీఱ
బాలకాడిం జేరి పైసాగి యచ్చటి దుర్గముల జయించి దొరలవలనఁ
గానుకల్ గైకొని కడుసంభ్రమముతోడఁ దొండమానుని వారిదండులోని
వక్కీలు రప్పించి బాగుగా మీవారు బహుదినంబులుగాను బద్దుతోడఁ
గుంపినీవారికిఁ గుమకుచేసినవారుగాన మీ కిచ్చితి ఘనతమీఱ

రెండుపటాళాలు రెండుపిరంగులు కుంపినిఝంటాను గొనుమటంచుఁ
బ్రేమతో నొసఁగఁగ సీమకుఁ గొని[42]పోయి [43]పడవాళ్లు గమికాండ్రు బలసికొలువ
లీలగా లాటు వాలీసుమెడీనను సరదార్లు రీపుపై సాగునవుడు
రహిని రాజవిజయ రఘునాథతొండమాన్ బహదరువారికి వ్రాసిపంప
నాలాగె పంపిన నాశూరపర్యులు బోరున మున్నీరు పొంగినట్లు
కణవాయిపై సాగ గడుసైనతావులఁ గొందలసందులఁ గోనలందుఁ
బొంచియున్న రిపుల వంచనల నెఱింగి ముందు పిరంగులు పొందుపఱచి
ద్రాక్షగొలలువోని తఱుచైనగుండ్లను విచ్చుగుండ్లు మఱియుఁ బెద్దగుండ్లు
బారుచేయుచుఁ జూచి ఫైరని పల్కినఁ బెళపెళపెళయని బెడిదముగను
ఏకముహూర్తాన నెన్నంగరానట్టి గుండులు వెలువడి గండశిలలఁ
దగిలినవేగానఁ బగిలినచిల్లులు విరియుగుండ్ల వలన వెడలుతునుక
లిసుక చల్లినరీతి నెడలేక విరిసిన నిలువలేకయు వారు కలఁగిపాఱఁ
దఱిమి పైసాగంగదండును నడిపించి శ్రీరంగపట్నముచెంతను దిగి
మొదట నుత్తరప్రక్క మోర్చాలు సవరించి పిరంగులు బిగించి వీథిబడిని
నాలుగేగుండులు నగరివాకిలిముందు పడునట్లుసేసిన వగనుజెంది
కౌలుపల్కుమటంచుఁ గార్యగాండ్రను బంప నేమికవులటన్న నిపుడు మాదు
కోట లెస్సగఁ గట్టి కోటకుఁదగినట్టి రస్తువుల్ తగనుంచి రహిని మించి
యైదేండ్లు గానిచ్చి యావల వచ్చిన జగడముగావచ్చు సాగుఁడనుచుఁ
గోట్లసంఖ్యధనము గొమ్మని యిచ్చినఁ దీసుక సీమకుఁ దిరిగివచ్చి
యబులుండ నొకనాఁడు నారీసాహెపు సేసెడు దుర్నీతి చెవులవినిన
జన్నలగ్నీసనన్ సరదారు కోపించి పదిలముగను పైనిబడఁగ నెంచి
పదిఋజుము ట్లిఱువదిపటాళంబులు తురుపులు పదివేలు తురగములును
గొప్పపిరంగులు గుండ్లు వగలబండ్లు మందుపీపాయిలు పొందుపఱిచి
రహిని రాజవిజయ రఘునాథతొండమాన్ బహదరు జనములఁ బదిలముగను
మద్దత్తుగా వచ్చి మనదండునకు మీరు కుముకుగారండని కోరివ్రాయ
నాలాగె నడిపింప నటసాగిరండని ముందుసాగినదండు ముదముతోడఁ
బదపద యనుచును బారుతీరుగ సాగి శ్రీరంగపట్నము చెంతఁ జేరి
కోటమర్మమెఱుంగ గుండ్లకు వెలిగాను నిలిచి యద్దానిలోనెల వెఱింగి

గుండ్లకులోపల గుప్పుమంచని తూఱి తెగఁబనివాండ్రచేఁ దత్తరమున
నిసుకనించిన గూండ్ల విసువక ముందిడి యెదటిగుండులవల్ల నెత్తిపోక
బలముచేయుచు వేగబత్తెరిగావించి యందుఁ బిరంగులఁ బొందుపఱిచి
యెడతెగకయె గుండ్లు గడగడగడయనఁ జేసినచేఁతలు చెప్పనగునె
యొకప్రక్క నడుగంట నొకటిపై నొకటిగాఁ గోటవిడియగొట్ట గుండ్లరవలి
యొకప్రక్క లోపలియుప్పరిగెలు వ్రీలి ధరణిపైఁ బడునట్టి దడదడలును
నొకప్రక్కఁ గొత్తకా లొడ్డుగాఁ గొని నిల్చి తలలెత్తువారల తలలు చదియ
నింగియెల్లెడఁగన్న రింగనుమ్రోఁతలు నేకముగఁ జెలంగ నెదటిపౌఁజు
కలఁగి పాఱు టెఱింగి కార్యంబనుచు బొంగి యిడియఁగొట్టి యట్టి యిమ్మెఱంగి
యగడి తగఁబూడ్చి తగునట్టిసోజర్లఁ జేసి లగ్గలుపట్ట సెలవొసంగఁ
జేతితుపాకులు చెలఁగంగ సోజర్లు పెరపెరలాడుచుఁ బిఱుతివియక
కొందఱు కోటపైఁ గొత్తరాల్ మొదలుగఁ గలచోట్లను మొనసి కడుదుచూపఁ
గొందఱు వాకిండ్లయందుఁ గ్రమ్ముక నిల్వఁ గొండఱు వరుసగాఁ గోటలోన
వీథివెంబడి సాగ వెఱపున జనములు గుండ్లకు [44]వెఱగంది గుంపు విడక
సందులగొందుల నెందును గనుఁగొన్న నిలిచినతావున నిలిచియుండ
ఆరీపుసాహెబు అడ్డముగా వచ్చి తప్పుగుండులు తాఁకి ధరణిఁబడిన
[45]నామాటలను విని యప్పుడె సరదార్లు గుప్పనిలోఁ జొచ్చి కుతుకమునను
ఖామందులను బట్టి కావలి నిడఁజేసి పేదసాదల నెల్ల వెలికి విడిచి
గడులెల్ల మెల్లగాఁ గైవసం బొనరించి కర్తరుకును రాజ్యకార్య మిచ్చి
తొండమానుని వారిదండులోఁగలయట్టి సరదార్లకును వారిజనుల కెల్ల
నీనాము లిప్పించి యిఁకమీఁద సీమకుఁ బోయిరమ్మనిపంపఁ బురము సేరి
వెలయుచునుండిరి వింత నేనేమన నలన బాపును జేరి యణఁగినట్టి
రెడ్డియు నొడయారి రీతితప్పుచు వీఁగి యాజ్ఞనుమీఱినా రనెడిమాట
నాలించి తానును నాగ్రహవ్యగ్రుఁడై సామాజికులతో యోజనను జేసి
యుగ్రత నుందతుల్ ఉమ్రాబహద్దరు తనమనోభావంబు తగినరీతి
లలితుఁడైన విజయ రఘునాథనృపతికి వ్రాసిపంపిన వారిభావ మెఱిఁగి
తొరయూరిసీమపై సరదార్లఁ దగునట్టి సన్నాహములతోడ సాగుఁడనిన
ఆశూరవర్యులు నపుడె మోహరించి కోటలపురములు ఘోరవనుల

తెట్టుల గడుసైన పట్టుల నొడ్డులఁ గొండల బండలఁ గోనలందు
నిలువనీయక వెంట నెమకినెమకి తాఁక సాగతావులు లేక డాఁగిపోక
కవులుకవులటన్నఁ గరుణతో నుందతు లుమ్రాబహద్దరు కొప్పగించి
బాగుగా నొడయారిపాళెముపై దిగి వేముతుమ్మయు నీఁదు వెదురుమొగిలి
బెత్తముల్ కోరింద పెద్దకలివి మొద లల్లికొనినయట్టి యడవిముందు
రణమండలము భీకరణదురాసదమని విన్నదైనను మేము వెఱవమనుచు
ముందుపిరంగులు పొందుగా వెంటనే సరకొవుల నమర్చి సరవిగాను
జగడమిచ్చుచునుండి జనములు రెండుగాఁ బంచి ప్రక్కలయందు బాగుగాను
జెట్లవెంబడిఁ జొచ్చి చేరి సమీపానఁ బెళపెళలాడిన బెదరి వారు
పరువెత్తి వేగ నబాపుసాహేబున శరణమొందఁగఁజేయు జయము గన్న
వర్తమానము తమవారు వ్రాసియుఁ బంప నది యెఱింగి యధికహర్షమునను
సాహసంబును శక్తి సత్యంబు నమ్మిక కోటివంశంబున కొప్పుననుచు
నొనరంగ నుందతు లుమ్రాబహద్దరు బిరుదులనన్నియుఁ బ్రేమతోడ
రాజన్యమాన్యమై రఘునాథతొండమాన్ బహదరటంచని పరఁగుపేరు
బంగారుబెత్తముల్ బాగైనమోర్ఛలు నవభత్తుభాంకృతుల్ భువిని వెలయ
జంటైన చోపుదార్జంటనకీబులు చదురున బిరుదులు సన్నుతింప
నానందమున నీయ నాతఁడు గై కొని ధరణిఁ బాలించుచుఁ దనరుచుండ
నట్టియాపురమున దుష్టతముండైన మూగివాఁడనునట్టి మూర్ఖుడొకఁడు
తామరతంపరై తగవెలింగెడునట్టి మరుదునివంశంబు మహినిఁగూల్పఁ
గారణమై తోఁచెఁ గైయొసఁగిరి వీరు నొసటివ్రాతను ద్రోయ నొకరితరమ
అటువలె వారలల్లల్లన హాన్రబిల్ కుంపినీవారిదౌ కోపమునకుఁ
బాత్రమయిన వారిపాప మేమందును దమ్ముఁ దా మెచ్చుచు దర్పమునను
వేసినకోలలు వెలువరింపనియట్టి వనదుర్గమును గల్గు ఘనత మెఱయఁ
దెట్టుకుముందు విల్పెట్టుపర్యంతంబు ముండ్లకంప లమర్చి మొళలు కొట్టి
యందుకులోపల నతిచుఱుకైనట్టి వసులఁ బాఁతలను బదిలపఱిచి
తడుకుపెండెముమూసి నడుమ మందులు పూడ్చి ముందు ప్రక్కలఁ జుట్లఁ బొందుగాను
జంజాళ్లు రేకలాల్ సరకోవులు తుపాకు లెడయీక భటులను నెంచి బైటి
రాకపోక లెఱుంగ రహిమీఱ మ్రాకులకొనలను గోటిగాండ్రను నమర్చి
త్రోవకు నిరుప్రక్కఁ దుదముట్టఁ గానలోఁ బల్లముగాఁ ద్రవ్వి భటులనందుఁ

బొంచఁబంచి తడుకుఁ బొడిపించి యుండంగ నట్టివారలభావమంతఁ దెలిసి
జర్నలగ్నీసును కర్నలిన్నీసును దగను యోజన చేసి దండుగూర్చి
ఘనయోజనపరుండు కర్నలుల్యంబ్లాకి పరుఁడు గాన మనము వ్రాసి పంపి
ఆయోజనను గని యటు సాగవలెనంచుఁ బాళెముప్రామలప్రక్క నిల్ప
నాకాగితము చూచినపుడె బయల్దేఱి క్రొత్తకోటకువచ్చి కుతుకమునను
రహిని రాజవిజయ రఘునాథతొండమాన్ బహదురుతోడను బాగుగాను
మంతనంబున నుండి మరుదుఁడనేవాఁడు మత్తుఁడై యేమియు మదిఁ దలఁపక
కుంపినివారిదౌ గుణము తెలియలేక చెలరేఁగి విషమము చేసినాఁడు
కుంపినివారికిఁ గుముకుగాను నడిచి తగఁగీర్తిఁ జెందను దరుణమిదియె
ననుచుఁ బల్కి జనుల నప్పుడె రప్పించి సగముకొట్టాంపట్టి సాగఁబంచి
తక్కినసగమును దాను జేకొనిపోయి యర్ధాంగికాప్రక్క నాని నిలిచి
తిరుమయంకోటలో నరువైనవస్తువు లుంచిపెట్టఁగఁ దావు నొసఁగుమన్నఁ
గోటమాత్రము నేమి కుంపెనివారిదే యఖిలభాగ్యము మమ్ము నడుగు టేమి
యనుచు నుత్తరువిచ్చి యారస్తురక్షింప నమ్మి కౌసరదార్ల నపుడె పంపి
జాగ్రత్త చేయఁగఁ జయ్యన నచటికిఁ గర్నలిన్నీసును గర్నలైన
బ్లాకిబరన్ దొర వచ్చినప్పుడె యెల్లరస్తువుల్ చేకొని లలితముగను
ఓక్కూరిబైటను నోరట్టుగాదిగి ప్రళయకాళాంతకుపగిది నపుడు
పుడమిపయి నలుగడలును నుడుగక నడలునఁ బడగలు కడువడిఁజెడు
పిడుగులఁజడి నెడవిడుపకను తొడుగువడువునఁ గడిమిని దడఁబడకను
గడగడయనునట్టిగాఢనిధ్వాననిర్భిన్నహృత్పరిపంథిబృందుఁ డగుచుఁ
దెట్టుప్రక్కను ఋజుముట్లపిరంగుల నిలిపి జగడమిచ్చి నేర్పుతోడ
గుప్పనిదండు చేకొని ప్రక్క విడిసిన నిలువనీకను జేయవలయుననుచు
చెట్ల మరిఁగియుండి చేతితుపాకులు పెళపెళలాడిన బెదరకుండ
గొప్పపిరంగులగుండ్లు వాగినప్రక్క గురియించి ఫైరన్న ఘోరనీల
నీరదావళిగాఢనిర్ఘాతములఁ బోలి గడగడగడగడగడగడయని
గడెసేపులోనను గణియింపరానట్టి గుండ్లు వెల్వడి మహాఘోరలీలఁ
బొమ్మలు రెమ్మలు గొనలును ననలును దుంపలు జొంపముల్ తూలి వ్రీలఁ
బెదరుచు నొరగుచుఁ జిద్రుపలై యెల్లెడఁ బఱచినట్టులుగాను నెఱయఁబడిన

నడవి నుండఁగ లేక యలవారుపఱచిన మఱి యొక్కప్రక్కల మణిపితొన
సోజర్లు ముందుగాఁ జొరవారు వాండ్రను జేరినడువఁ బంచి చెట్లలోనఁ
జీమలవరుసగాఁ జిటుకుసొటుకు లేక సాగుదండును రెండుభాగములుగఁ
బంచి సగము తెట్టుపైఁదాక నియమించి సగము పట్నముపైని దగను బంచి
యుండినట్టులయుండి యురమక పిడుగులు పడినరీతిని గడగడగడయనఁ
దెట్టులోనిజనము లట్టిట్టుఁజనలేక శరణమన్నను బైట సాగనిచ్చి
పట్నంబునల్గెడ బారుక్రమ్ముక నిల్చి చూఱవెట్టి తగినశూరవరులఁ
జేపట్టుగాఁ బట్టిరే పెట్టులోయని కలకపాఱెడువారి ఖైదుచేసి
ద్రోహులనెల్లనుఁ దూఁకులో వేయించి జగతిలోఁ దమఢాక మిగుల నిలిపి
సరసుఁడైనట్టి రాజాబహద్దరువారి సరదారు రప్పించి సకలమైన
బహుగుతులను నిచ్చి పాయిరమ్మనిపంచి ఉయ్యతెఉనిసీమ నుండఁబంచి
కర్ణునిబోలిన కర్నలుల్యంబ్లాకిపరుఁడు రసీజెంటు బాగుగాను
న్యాయంబున మనువు నాఁగ జగతిలోనఁ దగినట్టు కీర్తిప్రతాప మెచ్చ
ద్వీపాంతరాదికదేశములను గెల్చి పాదుశావుల నెల్ల భంగపఱిచి
చక్రవర్తులఁబోలు శౌర్యసంపన్నులౌ హాస్రబిల్ కుంపినిదైనయట్టి
కార్యధుర్యుఁడయిన గౌనరుసాహేబువారికిఁ బత్రముల్ వ్రాసి పంపి
ముదముతోడుతను ముప్పదివేలమాడలు సేయుకీళానెల్లిసీమ మీకు
నిచ్చినా మదికొని యేలుఁడటంచని వ్రాసినపత్రము తీసి పంప
నారాజ్యమును జెంది యానంద మొందఁగాఁ దద్గర్భమునఁ గల్గి ధరణిలోన
లలితరాజవిజయ రఘునాథతొండమాన్ బహదరు రఘునాథ పార్థివుఁడన
బేరుఁ జెంది జగతి వెలయుచునుండంగ శిశుభావము దలంచి చిత్తమునను
వాత్సల్యమునఁ బుత్త్రభావంబు దగఁబూని సాముచేఁతలయందు సరవిగాను
హయగజాద్యారోహణాదికార్యములందు సకలవిద్యలయందు సాటిలేని
వారలఁగాఁ జేసి వైవాహికాదికశుభముల నన్నింటి సొంపుమీఱ
బాగుగాఁ గర్నలౌ బ్లాకీ పరన్ రసీజంటు సాహేబును సమ్మదమున
రమ్యగుణాఢ్యుఁడౌ రాజాబహద్దర బాగుగా నీవు నావార్త వినుము
యీజగంబున దొర లెంద ఱున్నా రేమి చూడ నీవంశ్యులే శూరవరులు
స్వామికార్యంబున సత్యంబు దప్పక నడిచినవారలు నదియుఁగాక
న్యాయంబు నమ్మిక యధికవిక్రమమును లోకరక్షణశక్తిలోనుగాను

లలితగుణంబులు
                           భవఘనత తగ్గకుండఁ గుంపినిరీతికిఁ గొదవగాక
మునుపటికన్నను నినుమడియౌ
               సింహుని కనుజుఁడవైననీ వట్టిరాజ్యంబున కధిపుఁడగుచుఁ
బాలింపఁ గుంపినివారు నీగుణము
...క్సలింపీ రఘునాథతొండమాన్ బహద్దరనంగారు బరఁగుపేరు
పుడమి వెలయ సుగుణపు
మఱియు జగతిలోన మాన్యుఁడ వగుచును మత్కృతాశీర్వాదమహిమవలన
నీవు తగినరీతి జనపదపరిబృఢ
పటలమకుటతటఘటితమణిగణదీపికాజాలదేదీప్యమాన

(ఈక్రిందివి మూఁడవప్రతిలోనివి )

నానందుఁడై రసీజంటుకర్న లున్యంబ్లాకీబరుండు నెయ్యమున వీర్లఁ జేపట్టి వెలయఁజేయ
కీర్తీకిసాటి మీ కేమియుఁ గానేరదని నెమ్మనమ్మునఁ దలఁచి సకల
భాషలయం దతిప్రావీణ్య మదిగాక హయగజారోహణావార్యపటిమ
నీతిమార్గంబున నిరతిశయప్రౌఢి మొదలగువిద్యల నధికమైన
పాండిత్యవంతులై పరఁగునట్టులు చేయ నందున నగ్రజుండైనరాజ
విజయాంకరఘునాథవిభుఁడు విశ్రుతకీర్తియై రాజ్యభోగంబు లనుభవించె
నారాజసింహున కనుజుఁడవౌ నీవు బృహదంబికాకృపావీక్షణమున
బహుపుత్త్రసంపత్తిఁ బడసి సర్వంసహాచక్రసన్నుతరీతి విక్రమంబు
నీతిమార్గంబువ నిరుపమానఖ్యాతిఁ దగరాజ్యమేలుచుఁ దనరుచుండఁ
గుంపిణివారు నీగుణములు కొనియాడి దిక్సన్నుతంబైన యెక్సలెన్సి
రఘునాథతొండమాన్ రాజాబహద్దర న్పేరు గైకొమ్మని ప్రేమతోడ
నొసఁగిన పేరంది యసదృశర్తివై వెలయుచున్నావని విశదముగను
తావకవంశ మాధరణీధరేంద్రాబ్జమిత్రారితారమై మెఱయుచుండ
వంశావళి రచించి వఱలఁగాఁ జేసితి మత్కృతాశీర్వాదమహిమవలన
నాహిమశైలసేత్వంతరాళావనిభాగోల్లసద్ధరాపాలమకుట
కీలితకురువిందజాలప్రభాదరపాదపంకేరుహద్వంద్వుఁ డగుము


గీ॥

సంగరమృగేంద్రకోటివంశాబ్ధిచంద్ర । లలితయెక్స్లెన్సి రఘునాథరాయ తొండ
మాన్ బహద్దర కుధరసమానధీర । ధరణి వర్ధిల్లు మాచంద్రతారకముగ॥

నుదురుపాటి సాంబశివకవి.

తొండమాన్ వంశప్రతాపమాలికకుఁ బరిషత్పుస్తకభాండాగారమున మూఁ డసంపూర్ణ ప్రతులున్నవి. మూఁడింటినుండి యింతవట్టు ప్రతి వ్రాసి ప్రకటించితిమి. ఇది పరిషత్పత్రిక తృతీయసంపుటము పుట 304లోఁ బ్రకటింపఁబడిన నుదురుపాటి వేంకనార్యుని తొండమాన్ వంశావళి తరువాయి. ఈగ్రంథములోఁ గవి తనపేరును దెల్పక పైవేంకనార్యుని పుత్రుఁడైనట్లుమాత్రము "నుదురుపాటి సీతారామవరకవీంద్ర | గర్భసంభవుఁడు వెంకనసుధీవర్యుండు తత్పుత్రుఁడౌనేను దగినరీతి॥" నని చెప్పుకొనియెను. ఇక్కవి బిల్హణీయమును

రచించెను. చూ పరిషత్పత్త్రిక 3వ సంపుటము 312 పుట మొదలు. ఇందుఁదప్పులు విశేషముగానున్నవి, దిద్దుట కనువుపడని తప్పులు విడువఁబడినవి. ప. అ.

  1. శ్రీబృహన్నాయికా సేవాత్తవైభవ భనసుఖవిభవ సౌభరిసమాన
    శ్రీబృహన్నాయికా సేవాధురంధర ధరణీతలఖ్యాతబిరుదవార
    వారధిపాత్మజవాసదాలయపదపదవినతారిభూపతినికాయ.
  2. గతలసత్ప్రా
  3. పన్నగేంద్రకణాదఫణితిచతుర (వేఱొకప్రతిలో) పన్నగభాషితభాష్యచతుర
  4. మార్గణమధుకరావళిలతాంత
  5. విబుధకాంక్షితార్థ
  6. కళాసం
  7. భాస్వత్ప్రతాపాత్తపరమావిరాజిత రాజితవిఖ్యాతరమ్యమూర్తి
  8. వరకోటి
  9. సముల్విస్తార
  10. ధరణిలోన వెలయఁదగఁదెలిపెద
  11. ఇదియు దీనితరువాత చరణమును 1వ ప్రతిలో
    మాత్రమేయున్నవి.
  12. జగడంబులన్నియు సరవిగాను
  13. రునటుల
  14. మాట
  15. మాటలు
  16. జనముల
  17. సంఛాది
  18. కలాలెగ
  19. బదర
  20. ర్బయలున
  21. బలము చాలకనె మిక్కిలికక్కసంబైన
  22. ఈచరణము 2వ ప్రతిలోలేదు.
  23. తోడమోమోటుకొంత
  24. నఱువదివేల్గుత్తిజనములు
  25. గుత్తిజనంబులగుంపు యేబైవేలు
  26. నవ్వుచు హానరెబిలు
    కుంపిణివారుగాఁబంపిన లాట్టు పిక్కట్టుబహద్దరు హాట్టు గారు
  27. తురుపులఁ గైసేసి తోడ్తో నవాపు సాహేబుకు కుమ్మకుజాబువ్రాయ
    నతఁడు విజయరఘునాధహం వీరున కాలాగె
  28. ఈచరణము లొకదానిలోనే కలవు
  29. ఈచరణము లొకదానిలోనే కలవు
  30. ఇది రెండవప్రతిలోఁ గలదు.
  31. యెడతెగనీయక బడుదుచేదాఁకుచో
  32. రెండపప్రతిలోనె కలదు.
  33. యును
  34. "పయినున్న తమరౌతు పడిన విచ్చలవిడి ఫైసరంబులు నాఱు వారువములు
    వేడెమునట్టుచోవేటు .. తెగనట్ల తిరిగెడి యశ్వములును
    గుండ్లు చుఱ్ఱని తాఁక గుప్పుమంచని తూలి ఫరదళంబులఁ చేరు వాజితతులు”
    అనునివియును రెండవప్రతిలోనున్నవి.
  35. మనిచెప్ప
  36. సోక
  37. యేమైన
  38. లెల్లను ముందఱకన్నను నందమనఁగ
  39. ఇక్కడఁ గ్రిందియేడుచరణము లుండవలయునని మొదటి పుస్తకములోని చిత్రికవలనఁ దెలియును.
  40. పక్కలి
  41. రమ్యగుణునికోటి
  42. ఇచ్చి
  43. దొరవారి కొప్పించి మెఱయుచుండ
  44. దిగులంది
  45. ఆమాటలను విని యపుడె లోనికి వచ్చి నగరివాకిటనిల్చి తగినయట్టి