రంగనాథరామాయణము/యుద్ధకాండము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీరంగనాథరామాయణము

యుద్ధకాండము



శ్రీరామచంద్రుఁ డాశ్రితహితోదయుఁడు - వారిజబాంధవవంశవర్ధనుఁడు
ప్రియములయం దెల్లఁ బ్రియ మైనయట్టి - ప్రియవాక్య మంజనాప్రియసుతుచేత
బ్రియమున వినఁగోరి ప్రియసీత యునికి - ప్రియము రెట్టింపంగఁ బ్రీతితో ననియె.
“హనుమంతుచేసిన యంతకార్యంబు - చనునె సేయంగ నిర్జరులకునైన?
నరిది సత్వమున నీహనుమంతుఁ డొండె - కరువలి యొండె నగ్గరుడుండు నొండె
వనధి దాఁటఁగఁ జాలువారలు గాక - మనమునఁ దలపోయ మఱి యెవ్వఁ డోపు?
దేవగంధర్వదైతేయకిన్నరులు - భావించి చొరరాదు పగలును రేయు
రాక్షసానీకవిరాజితబాహు - రక్షితమౌ లంక రమణమైఁ జొచ్చి
ప్రాణంబుతోడనే బ్రతికి క్రమ్మఱను - ఏణాంకధరుడైన నెట్లు రానోపుఁ?
గడుమోదమున బుద్ధకార్యంబు పతికి - వడిఁ జేయు నెవ్వఁడు వాఁ డుత్తముండు10
ఏలినపతికార్య మెడ రైన యెడను - వాలూర నటు సేయువాఁడు మధ్యముఁడు,
పలుమాఱు మూల్గుచుఁ బతి పంపుపనికి - దొలఁగఁ బాఱెడువాఁడు దుస్సేవకుండు,
ఈమువ్వురందును నెక్కువ యైన - యామేటివాఁడు నై యఱ యింతలేక
యనురాగమునఁ బెద్ద యైనకార్యంబు - ననుపమంబుగఁ జేసె ననిలనందనుఁడు
కావునఁ బ్రత్యుపకార మీతనికి - నేవిధంబునఁ జేయ నే నేర్చువాఁడ?
నాలింగనంబె నా యర్థ" మం చతని - నాలింగనము సేసె నప్పు డవ్విభుఁడు
ఈభంగి మెచ్చిన నినసూతి వినఁగ - నాభవ్యుఁ డనియె నాయాంజనేయునకు
“ననిలతనూజ! నీ వంబుధి దాఁటి - జనకజఁ గని రాఁగ సంతోష మొదవె;
నిట నాకుఁ బొడమిన యీముదం బెల్ల - నిటమీఁద మఱి తుది యెట్టిదో కాని;
యది యెట్టి దంటేని యగ్గలం బైన - యుదధి లంఘింపంగ నోపెడివెఱవు20.
కపిసేన కెబ్భంగిఁ గలుగునో యనుచుఁ - గపినాథ! నామది గలఁగంగఁ జొచ్చె."
నని పల్కి యటమీఁద నాస్యంబు వంచి - మనుజేశుఁ డేమియు మఱి పల్కకున్న
శ్రీరామదేవునిచిత్తంబుకలఁక - యారవిజుఁడు మాన్తు నని విచారించి
"యిది యేమి దేవ! నీ వితరులభంగి - మదిలోన శోకంబు మాన వయ్యెదవు;
దాఁటరా దననేల? దాఁటెద నబ్ధి; - దాఁటి సువేలయు దాఁటి, యాలంక

సాధించి రావణుఁ జంపి, లోకముల - బాధ మాన్పెదవు భూపాలక! చూడు.
ముర్వీశ! కపు లెల్ల నుద్యోగయుతులు - దోర్విజయాఢ్యులు దుర్జయక్రములు.
వీరుండ రాఘవోర్వీనాథ! నీకు - వారక యిబ్భంగి వగవ నేమిటికి?
నుద్యోగి వగుము సముద్యోగి కెందు - సద్యఃఫలంబులు సకలకార్యములు
ఉత్సాహి యగువాని కులుకుదు రహితు - లుత్సాహరహితున కులుకరు గాని;"30
యని యతం డిబ్భంగి నాడు వాక్యములు - విని హనుమంతుతో విభుఁ డర్థిఁ బలికె.
"వేఁడెదఁ గాదేని వెడలు నాయంప - వాడిమి నైనను వార్ధి నింకింతు
బంధింతుఁ గాదేని పవనతనూజ! - కంధి దాఁటుట కెంత గగనంబు నాకు?'
నది యెంత పని? విను మనిలతనూజ! - పదిశిరంబులవాని పట్టణంబునకు
నెన్నికోటలు? బల మెంత? వీక్షింప - నన్నిటగవనులు నవి యెవ్విధములు?
కావలియుండు రాక్షసు లెంద ఱందు - భావింపఁ దద్గృహపంక్తు లేతెఱఁగు?
చూచి వచ్చితి గాన చూచినతెఱఁగు - నీచేత వినియెద నిక్కంబు చెప్పు,”

హనుమంతుఁడు లంకాప్రభావము దెలుపుట

మనిన నంజలి మోడ్చి యాంజనేయుండు - వినయోక్తు లెసఁగ నవ్విభున కిట్లనియె
ఉడుగనిమదధార లొలుకుచు నుండ - కడుఁ గ్రొవ్వి పర్వతాకారంబు లగుచు
రౌద్రంబు మోముల రంజిల్లుచుండు - భద్రదంతావళప్రతతు లగ్గలము40
పెక్కాయుధంబులఁ బెఱిగి చూడ్కులకు - నక్కజంబై ఘోరమై కనుపట్టు
గొడుగులఁ బడగలఁ గొమరారుచుండు - నడియాల మైన టెక్కెంబులు గ్రాల (?)
భానుబింబప్రభాపటలంబుకరణి - మానైనమణిదీప్తి మహిమ వెలుంగు
రథము లెక్కుడు దశరథరాజతనయ! - రథికసారథిమనోరథములై యుండు
ఘనవీరరసవారికరడులో యనఁగఁ - దనరారి యెంతయుఁ దఱుచువన్నియలు
మెఱసినచూడ్కులు మిఱుమిట్లు గొనఁగ - వఱలిన హేషారవంబులు చెలఁగ
హరిఘోటకంబుల నైన వేగమున - హరియింప నోపిన హరిశక్తి గలిగి
హరు లెంతయును మనోహరములై యుండు - హరిహరాదులు మెచ్చునట్టి యగ్గలము
పిడుగులతోడఁ బ్రబ్బిన నల్లమొగులు - అడరి దానవరూప మయ్యెనో? యనఁగ
నేర్చి రౌద్రంబుతో నెనసి యంగంబు - గూర్చిన నల్లనికొండలో యనఁగఁ50
గాదేని హరుఁడు మ్రింగిన నాఁటిగరళ - మీదైత్యకోటియై యెసగెనో? యనఁగ
బ్రళయకాలమునాఁటి పావకధూమ - మలవడ రాక్షసు లైరొకో యనఁగఁ
గలిగినయట్టి రాక్షసులకు సంఖ్య - గలుగదు; దేవ! రాఘవధరాధీశ!
దట్టమై యట్టళ్లఁ దనరి చూపట్టు - నిట్టికకోటయు నిరవైనజాతి
కోటయుఁ బొడవునఁ గొమరొందు నినుప - కోటయు నట యుక్కుకోటయు గంచు
కోటయు మఱి వెండికోటయుఁ బసిఁడి - కోటయు ననునేడుకోట లొప్పారుఁ

గాలునివక్షంబుకరణిఁ బొల్పెక్కి- మేలైనతలుపులు మెఱసి యెంతయును
అక్కోట లన్నిటియందును జూడ - మిక్కిలిదీప్తుల మిక్కుటం బగుచు
నఖిలరత్నముల మేలైనవాకిళ్ళ - నఖిలావనీనాథ! యరయ నాల్గేసి
వరమంత్రవిధుల దివ్యంబు లై నట్టి - శరచాపచయము లసంఖ్యలై యుండు60
నాకోటచుట్టును నఖిలలోకేశ! - భీకరమకరసంభృతములై పరఁగు
నాలుగగడ్తలు నాల్గుదిక్కులను - జాలంగఁ బాతాళసమితి నొప్పారు
దేవ! యానాలుగుతెరువులయందుఁ - గావలియుండు రాక్షసకోట్లు దఱచు
అమితశిలాబాణయంత్రజాలములఁ - దమతమయంతనే దాయలఁ జంపు
ఛాత్రీశ ! యింటింటఁ దప్పక యగ్ని హోత్రము లున్నవి యోంకార మెసఁగ"
ననవుడు విని యతఁ డతిచోద్య మంది - మనమునఁ జింతింప మారుతి యనియె.
"సత్యంబు ధర్మంబు శౌచంబు దయయు - నత్యంతశూన్యంబ యసురులయందు”
నని పల్కుటయు సాధ్య మౌ నని లంక - జనపతి ముదమందఁ జతురుఁడై పలికె.
“నవి యెల్ల నిట్టిట్టి వని యెన్న నేల - యవనీతలేశ! మహావైభవమున
వారక సేనతో వాహ్యాళి వెడల - నారావణుండు నిత్యము తోడుచూచు70
వాలినమదమున వడి గయ్యమునకు - గాలు ద్రవ్వుచునుండు గమలాప్తవంశ!
యగ్గలికయు లావు నడర వైరులకు - లగ్గఁ బట్టఁగరాదు లంక భూనాథ!
జలవనకృత్రిమస్థలశైలదుర్గ - ములు నాల్గు నుండు సముద్రంబులోన
నవి యెల్లకాలంబు నైనను గాల - కదియఁ బోవఁగ రేవు కానంగరాదు
మృత్యుజిహ్వయుఁ బోలె మెఱుఁగులతోడి - యత్యుగ్రశూలంబు లనిశంబుఁ బట్టి
కడునుగ్రరాక్షసు ల్కాచియుండుదురు - పడమటివాకిటఁ బదివేలసంఖ్య
లక్షదైతేయు లాలంకాపురంబు - దక్షిణద్వార ముద్ధతిఁ గాతు రెపుడు;
నటఁ దూర్పువాకిట నమరారి యుండుఁ - బటుతరచతురంగబలసమేతముగ
నగణితశస్త్రసహాయులై యుండుఁ - దగ నొక్కలక్ష యుత్తరపువాకిటను
చాలరాక్షసులు లక్షయు నిర్వదేను - వేలు తత్పురమధ్యవీథి నుండుదురు80
ఆలంక మీకృప నర్కకులేశ! - యేలీలఁ జొచ్చితి నింతఁ గైకొనక
వడిఁ జొచ్చి యట్టళ్ళు వడిఁ గూలదన్ని - యడరి కోటలఁ బ్రాకి యగడిత ల్పూడ్చి
యచ్చెరువుగ లంక యంతయుఁ గాల్చి - వచ్చి మీశ్రీపాదవనజము ల్గంటి
నడరి యక్కడికార్య మంతయు వింటిఁ - దడయ నేటికి యబ్ధి దాఁటుద మింక
దాఁటినయప్పుడే దశకంఠులంక - మీటి వైచెదరు వ్రేల్మిడిలోనఁ గపులు"
అనవుడు రఘురాముఁ డర్కజుఁజూచి - “యినసుత! యాలస్య మేటికి నింక
వెడలింపు కపిసేన విజయలగ్నమునఁ - గడులెస్స మధ్యాహ్నకాలంబు మనకు
నాయస్త్రమును దక్క నరభోజనునకు - నేయుపాయము గల దెందు దాఁగెడిని?"

అని నీలుదెసఁ జూచి యర్కవంశజుఁడు - విను మనబుద్ధిగా వివరించె నపుడు
"కడునింపుఁదనమును కడునిర్మలంబు - కడుతీపునీరును గలుగంగఁ జూచి90
పరిపక్వఫలముల భరితంబులైన - తరువులు నజ్జాడ తఱుచయ్యెనేని
నడుపుము ముంగలి నడుచొరనీక - వడిఁ బరికింపు మొప్పని లాఁతివారి”

సుగ్రీవుఁడు కపిసేనల వెడలించుట

ననిన నారాముని నానతి నెల్ల - విని నీలుఁ డట్ల కావించె శీఘ్రమున
నప్పుడు సుగ్రీవుఁ డఖిలవానరులఁ - దప్పకుండఁగఁ బిల్చి దండెత్తఁ బనిచెఁ
బనిచినఁ దమతమపటురభసమున - ఘనగుహలందుండి కపిసేన వెడలె.
భూరిపదాఘాతములఁ దల్లడిల్లి - ఘోరరావంబుల గుహలు ఘూర్ణిల్ల
వీరగర్జనములు వీరహాసములు - వీరనాదంబులు వెస నింగి ముట్టఁ
బెల్లునఁ గోపించి పెడబొబ్బ లిడుచుఁ - ద్రుళ్ళుచుఁ బటుశక్తితో దాఁటువారు;
కొందఱు పండిన కుజములు మూపు - లందిడి నమలుచు నరిగెడివారు;
రావణుతోఁగూడ రాక్షసప్రతతి - నేవిధంబున నైన నేమె చంపుదుము100
రామభూపాలక రణమున ననుచు - రామునిముందఱ రాగిల్లువారు;
కెరలి పై కుఱుకుచుఁ గేక వైచుచును - వెరవార దోఁకల విసరి యాడుచును
జెచ్చెఱ పర్వతశిఖరంబు లెక్కి - ఇచ్చఁ గొందఱు బొబ్బ లిడువారు; నగుచు
నప్పుడు కపివీరు లందఱు చెలఁగి - యప్పరమేశ్వరుఁ డానందమొంద
నారవంబున మ్రోసె నాకాశవీథి - నారవంబున భూమి యటునిటు పడియె
నారవంబునఁ బెల్చ నద్రులు వణఁకె - నారవంబున మ్రొగ్గె నాదిగ్గజములు
నారవంబున భార మయ్యె శేషునకు- నారవంబునఁ గూర్మ మణఁచె శిరంబు
ఇటుసేన నడవంగ నెగసినధూళి - పటలంబు మిన్నంది బహువర్ణములను
ఆరవంబున భారమై యిల నెసఁగు - తోరంపునిశ్వాసధూమంబు లనఁగ
నప్పుడు ముంగలి యై నీలుతోడ - నొప్పు సైన్యంబు లత్యుగ్రతుండముగ110
నిరుదిక్కులందును నేపారి నడుచు - తరుచరబలము లుద్ధతపక్షములుగ
స్ఫురణ మొప్పఁగ మధ్యమున వచ్చువారు - ధరణీతలేశుఁడు తనయాత్మ గాఁగఁ
గడఁగ సొంపారి చక్కఁగ వెన్కఁ గాచి - వడివచ్చుసైన్యంబు వాలంబు గాఁగ
నురగపాశంబుల నొందంగ నున్న - తరణివంశజు నవస్థలు తొలఁగింప
గరుడుండు భూస్థలిఁ గైకొని నడచు - కరణి నొప్పారె మర్కటమహాసేన.
సరి ప్రజంఘుండు కేసరి దధిముఖుఁడు - పరువడి సందడిఁ బాయ వ్రేయగను
విరళమై శ్రీరాము వెల్లువ నడువ - పరమసంతోషసంభరితాత్ము లగుచు
గవయుండు తారుండు గంధమాదనుఁడు - పవమానసూనుఁడు పనసుఁ డంగదుఁడు
శరభుండు నలుఁడును జాంబవంతుండు - హరుఁడును మైందుండు నాదిగాఁ గల్గు

వనచరపతులెల్ల వడి నేగుదేరఁ - జనుదెంచి రఘుపతి సహ్యపర్వతముఁ120
గని యందు విడిసె లక్ష్మణసమేతముగ - ఘనతతో నపుడు నగ్గలముగా నందుఁ
బెంపారువనములఁ బెన్దటాకముల - నింపారునీడల నిరవైనయెడల
విడుదులు గైకొని వెలయు నబ్బలము - విడిసె సుగ్రీవుండు విడియంగఁ బనుప
మఱునాడు నెప్పటిమాడ్కి లక్ష్మణుఁడు - దొరలు మహీపతి త్రోచి యేగఁగను
నురువీరరసమున నుప్పొంగి పొంగి - భరితస్వనంబునఁ బరిపొంది యొంది
తనుకాంతికరడులఁ దనరారి యారి - ఘనమైనమ్రోఁత నాకస మందియంది
మునుకొని వనశైలముల నొప్పి యొప్పి - మనువంశచంద్రుచే మది నుబ్బి యుబ్బి
యాసముద్రముపెంపు నడఁగింప నడచె - భాసురం బగు కపిబలసముద్రంబు
ధైర్యాఢ్యు లామహీధవు లభ్రమధ్య - సూర్యచంద్రులమాడ్కి శోభిల్లి రంత.
నదులలోఁ జొచ్చి వానరసేన నడువ - నెదురు దొట్టుచు నుబ్బి యెసఁగి యానీరు130
సహ్యాద్రిమలయాద్రిసంధులనడుమ - సహ్యమై కపిబలసమితితోఁ బొడము
చిఱుగాలిచేఁ దరుశిఖరాగ్రసమితి - నొఱపైనకొమ్మ లొండొంటితో రాసి
యగచరావళిమీఁద నలరులు రాల్చెఁ - దగనట్టిదే కాదె? తలపోసి చూడ
వనలక్ష్మి శ్రీరామవల్లభుఁ జూచి - యెనయఁ బుష్పాంజలు లీ కేల మాను?
నప్పుడు కపివీరు లయ్యయియెడల - నొప్పెడుకొలఁకుల నురవడిఁ జొచ్చి
యానిర్మలపునీరు లారంగఁ గ్రోలి - యానందమును బొంది యందందఁ గదిసి
కమనీయమృదుకరకమలయుగ్మములఁ - గమలము ల్ద్రుంతురు కమలంగఁ బట్టి
కమలాకరంబులఁ గమలాప్తకులుఁడు - కమలారియును బోలి కమలముల్ నొంచుఁ
గ్రమ మొప్పఁగా దశకంధరువదన - కమలంబు లని తెల్పుకరణిఁ జెలంగి
దొగలు పెట్టింతుము దుష్టారిసతుల - తొగలు జానకి యింక దొలగంగ వైచు140
తొగలార! యిఁకమీఁద దొగ యెట్టి దనుచు - దొగలెల్లఁ జిదిమివైతురు పెచ్చు పెరిగి
బిరుదులై యసురులప్రేవులు పెరుకు - కరణిఁ బెరుకుదురు ఘనమృణాళములు
ఇటు వినోదింపుచు నెల్లవానరులు - తటములమీఁది కుద్ధతశక్తి దాఁటి
గిరు లెక్కి పణముల గ్రిక్కిరియంగఁ - బెరలతేనియ లాని ప్రేలరింపుచును
గడునుత్సహించి యుత్కటబలాధిపులు - నడిచిరి వానరనాయకోత్తములు.

శ్రీరాములు మహేంద్రాద్రి జేరుట

ఇనవంశుఁ డపుడు మహేంద్రాద్రి యెక్కి - యనతిదూరంబున నంబుధిఁ గనియె.
కరిమకరంబులు కరిసమూహములు - తరగలు గుఱ్ఱపుదళములు పెల్లు
కమఠకర్కటములు ఘనరథావళులు - సమదజలార్భకసమితి భటాళి
పొలుపార ఫణిఫణంబులు కేతనములు - లలిఁ జొరమీనవాలము లడిదములు
తలదురుమీనాళిచామరప్రతతి - పొలుపొందు మరువు నొప్పఁగ ఛత్రసమితి150

పెనుపైనఘోషంబు భేరీరవంబు - వినుతింపఁగా వీరు వీరరసంబు
గానున్నఁ జేరినకడిఁది రావణుని - నే నేల చంపంగ నిత్తు నన్మాడ్కిఁ
దనరిన క్రూరసత్త్వస్థితిఁ బేర్చి - తన కెదురై మహోద్ధతి నున్నదానిఁ
గని పెద్దవెఱగంది గాంభీర్యధనుఁడు - వనధితీరముఁ జేర వచ్చి రాఘవుఁడు
ప్రకటంబుగా సర్వబలము గూడుటకు - నొకమంచిచంద్రకాంతోపలస్థలిని
జలధితీరంబునఁ జరియించుచున్న - బలితంపురావణపాఠీనవరుని
ననుపమం బగు తన యంప గాలమునఁ - గొని తివుచుటకునై కూర్చున్నపగిది
నాసీనుఁడై యున్న యర్కకులేశుఁ - డాసన్నుఁ డై యున్న యర్కజుఁ బలికె.
“వచ్చితి మిమ్మహి వారిధిఁ జేర - నెచ్చొప్పు ఘటియింత మిది దాఁట? మనకు
నాయుపాయము మఱి యాత్మ చింతింత - మీయగచరకోటి నెందుఁ బోనీక160
యింపైనయెడ విడియింపంగఁ బనుపు - సొంపారఁగాఁ దోడు చూడంగవలయు”
నని రాఘవేశ్వరుఁ డర్కజుఁ బలుక - నినసుతుండును నీలు నిటు సేయఁ బనిచె.
నీలుండు నప్పుడు నిరతంబు గాఁగ - వాలినసేనల వడి విడియించె
వనచరారవము నావలనను గలిగి - వనచరారవము నీవలనను గలిగి
యునికి సహింతునే? యోసముద్రుండ! - యని యప్పు డావార్ధి నదరించుమాడ్కి
విడియువానరసేన వెడలెడుమ్రోఁత - నడచుపెల్లైన యాయంబుధిమ్రోఁత
నట రెండువేలంబు లై యాపయోధి - తటవనభూములఁ దరుచరు ల్విడియ
నప్పుడు రాముఁ డేకాంతంబునందు - నొప్పెడులక్ష్మణు నొయ్యనఁ బలికె.
"సౌమిత్రి! వింటె యీజలనిధికైన - నీమెయిఁ దుద నిశ్చయింపంగ వచ్చు
నివి యింత యిం తని యెన్నంగరాదు - తుద లేదు నామనోదుఃఖవారిధికి"170
నని రామవిభుఁడు శోకాంబుధిలోన - మునుఁగుచుండఁగ మూఁడుమూర్తులు గలిగి
యతనితోడిదె లోక మనిన చందమున - నతివేగమున నినుఁ డపరాద్రిఁ గ్రుంకె,
నినుఁడు గ్రుంకుటయును నెల్లలోకములు - పెనుపొంద మణిలేని పెట్టియఁబోలె
మనసిజానలతీవ్రమానసు రాముఁ - గనుఁగొని యనువుగాఁ గప్పుటకొఱకు
చెలివోలు నపరాశ చెంగావిచీర - నెలమి నిచ్చినక్రియ నెరసంజ యొప్పె.
నినవంశచంద్రుచే నింద్రారిమోము - ననిశంబు నిటు వాఁడు ననినచందమునఁ
దళమున బిగు వెల్లఁ దప్పి యందంద - లలిఁ దక్కుచును గమలంబులు మొగిడె.
చెలువుగా రాముని శీతలక్రియకు - నలిరేఁగి యీశాంగనలు గూడ వైచు
లలితతమాలపల్లవరాసు లనఁగఁ - గలయంగ బలువుచీఁకటు లగ్గలించె.
దిననాథకులు దేవిఁ దెచ్చి మోదించు - దనుజనాథునిమోముదమ్ములు విరియు180
నని నగియెడిమాడ్కి నప్పు డందంద - తనువొందఁగాఁ గుముదంబులు విరిసె.
శ్రీరామదేవుని శితమార్గణముల - నారత్నములు దక్క నంబుధిఁ గ్రుంకె.

నీరూపమున నుండు నిఁక ననుమాడ్కి - తారకావళిచేతఁ దనరారె మిన్ను
యానిశీధిని రాము నంగతాపమున - కై నిబిడంబుగా నమరించియున్న
సారంబు మల్లికాశయ్యన నొప్పెఁ - దారల ప్రతిబింబితం బైనయబ్ధి
విరహంబుచే రామవిభుఁడును నరిగె - నరిదియే విరహుల మౌట మే మనుచుఁ
దెసలకుఁ జెప్పెడి తెఱఁగునఁ బాసి - వెస మఱి మఱి చక్రవాకము లనియె.
రాజనై యేను వారాశి యుబ్బింతు - రాజవై నీవు వారాశి యింకింపఁ
దలఁచుట పాడియే ధరణీశవర్య - విలసితసత్కళాన్వితుఁ డగు నీవు
నటు చేసితేని దోషాకరత్వంబు - పటువృత్తి నీయందు బ్రభవించు నంచు190
దూఱ వచ్చినమాడ్కిఁ దోచెఁ జందురుఁడు; - మీఱినకరములు మిన్నుల ముట్టి
జనకజకై రామజననాథతిలక; - ననుఁ దలఁ దాల్చి మన్ననఁ జేసినట్టి
హరువిల్లు విఱిచిన యాదోషమునను - విరహి వైతివి సీతవెఱపున ననుచుఁ
జందురుఁ డట్టహాసము చేసె ననఁగ - నందందఁ జంద్రిక లతిశయ మొందె
శరనిధి నురువను చందనం బర్థిఁ - గరమొప్ప వీచికాగణములఁ గల్చి
కరములు పుచ్చి దిక్కాంతలమేనఁ - బొరిపొరి యారాజు పూసెనో యనఁగఁ
దలకొని మఱియును దట్టమై పర్వి - వెలయంగ వెచ్చనివెన్నెల యొప్పె.
నప్పుడు వేడుక నాచకోరములు - నొప్పుచిత్తములఁ బెం పొలయంగఁ గదిసి
పొరిఁ బొరిఁ దమచంచుపుటములు చాచి - నిరతంబు గాఁగ వెన్నెల పుక్కిలించి
లలితోడఁ దమప్రియులకు నిచ్చి యిచ్చి - యెలమితో నవి యంది యీగ్రోలి గ్రోలి200
మలసి యాడుచుఁ బలుమఱు సోలి సోలి - పొలుచువెన్నెలరసంబులఁ దేలి తేలి
గమిఁ బాసి యడుగులు గన తారితారి - కొమరారి యింతులఁ గూడియుండుటయు
గనుఁగొని మదనమార్గణవర్గభిన్న - తనుఁ డైనరాముఁ డాధరణిజఁ దలఁచి
యంతకంతకు మదనాగ్నిచేఁ గుంది - యంతరంగంబున నడలుచు నుండె.
అప్పుడు లక్ష్మణుం డన్నసంతాప - ముప్పొంగుటయుఁ జూచి యొగి మాన్తు ననుచు
“నిదె యబ్ధి దాఁటుద; మిదె దాఁటిపోయి - పదిశిరంబులవాని పటుశక్తి నాజి
భంజించి మిథిలాధిపతికూర్మిపుత్రిఁ - గంజాస్య యగుసీతఁ గైకొనె దధిప!
వసుధేశ! నీ వింక వగవ నేమిటికి? - నసమానవీరుండ వారూఢకృతివి,”
యనవుడు తమ్మునియనునయంబులకు - జననాథుఁ డెంతయు సంతోషమందె.
ఆదట వెన్నెలయందు వానరులు - మోదంబుతోడ నిమ్మునుల నెల్లెడల210
నారామదేవుగుణాంకంబు లింపు - లారంగఁ బాడుచు నాడెడువారు,
కూడి యాజలనిధికూలంబునందు - వేడుకతో నుబ్బి విహరించువారు,
హరియవతారంబు లన్నియుఁ గథల - వెరవుగా నింపుగా వినుచుండువారు,
కడఁగి యాయాచంద్రకాంతోపలముల - వడలు సొంపారఁగాఁ బవళించువారు,

నై ప్రొద్దు గడపి ప్రియంబును బొదల - రయమున నంతఁ బూర్వమున కింపెసఁగ
జలనిధి రాఘవేశ్వరుఁ డేయునపుడు - బలుశిలీముఖములఁ బడుదునో యనుచు
కడువేగ తొలఁగి యాకంపంబు నొంది - బడబాగ్ని యుదయాద్రిఁ బ్రాకెనో యనఁగ
రాముబాణాగ్ని వారాశి దహించు - చో మిన్నుముట్టి యర్చులు పర్వె ననుచు
వెఱచి తొలంగిన విధమునఁ గ్రుంకె - నెఱసినచుక్క లన్నియుఁ దోడుతోడ
నిది యేల దడపెద? వీయబ్ధిఁ గట్టి - వదలక చంపు రావణు రాఘవేంద్ర!220
యని మనుమనికిఁ దోడై రేపకడను - జనుదెంచె ననఁగ భాస్కరుఁ డుదయించెఁ
గమలాప్తకులుని రాఘవుని సద్విజయ - కమలయుఁ దద్రాజ్యకమలయుఁ గీర్తి
కమలయు నని మేలుకనినచందమునఁ - గమలంబు లెల్ల నొక్కట మేలు కనియె.

రావణుఁడు మంత్రులతో నాలోచించుట

నప్పుడు తగినసంధ్యాదికృత్యములు - నొప్పంగ సలిపి రాయుర్వీశు లంత.
నక్కడ రావణుఁ డఖిలమంత్రులను తక్కఁగ రావించి తగ వారి కనియె.
"మంత్రికోవిదులార! మర్కటుం డొకఁడు - జంత్రంబుఁ జూపిన చందాన వచ్చి
లంకిణి నొంచి యీలంక శోధించి - పంకజానన సీతఁ బరికించి కాంచి
నావనంబుఁ బెఱికి నాసుతుఁ జంపి - నావిక్రమము మీఱి నాపురిఁ గాల్చి
పెక్కువ నసురులఁ బెక్కండ్రఁ జంపి - చిక్కియు మనచేతఁ జిక్కకపోయె.
నదె తెచ్చె రాముని నావానరుండు - పదిలుఁడై యంబుధిప్రాంతంబునకును230
భల్లూకబలములు ప్లవగసైన్యములు - వెల్లువలై వచ్చి విడిసిరి వారి
స్థిరముగా నీవార్త తెఱఁగెల్లఁ దెలియఁ - జరజను ల్చెప్పిరి సకలంబు నాకు.
నినకులుఁ డీయబ్ధి యింకించి యైనఁ - దనసేనఁ బంచి యుద్ధతిఁ గట్టియైన
దాఁటి వచ్చిన మఱి తప్పుఁ గార్యంబు; - దాఁటకమున్నెమీ ర్తద్జ్ఞత మెఱసి
యిది కార్య మని చెప్పుఁ డిందఱు గూడ - నదియె సేయుదము మే లగుతెఱంగైన”
నని యడిగిన రాక్షసాధీశుతోడ - ననిరి మంత్రులు కడునల్పజ్ఞు లగుచు.
"దివ్యుల కైనను దృష్టింపరాని - దివ్యాస్త్రములు పెక్కు దేవరయందుఁ
గ్రక్కున విషములు గ్రక్కంగఁ బట్టి - యుక్కడంగించితి వురగాధిపతిని;
రుద్రునిసఖుఁ గుబేరుని మదం బణఁచి - భద్రకం బైనపుష్పకముఁ గైకొంటి;
మయుని ప్రఖ్యాతుని మర్దించి యతని - ప్రియసుతఁ బెండ్లియుఁ బేర్మితో నైతి;240
వంతకు నెక్కుడై యంతకుఁ గిట్టి - యంతకునకు నీవ యంతకుఁ డైతి;
వారని బలుఁడైన వరుణునియాత్మ - నీటు గావించితి నిర్జరారాతి;
చక్రవర్తులరాజ్యచక్రము ల్ద్రిప్పి - చక్రము ల్గొంటి రాక్షసచక్రవర్తి;
శూలాయుధునిఁ గిట్టి శూరత మెఱసి - మూలకుఁ జొనుపవా ముక్కంటి యనక!"
వాసవు నన్నాకవాసులతోడ - వాసి దప్పింపవా వాసికి నెక్కి?

వేఁడికిఁ బలుమాఱు వేఁడిమిఁ జూపి - వేఁడిమిఁ బాపవా వేఁడికో ననలు?
బలియునిఁ గోణాధిపతి దైత్యనాథు - నలిగి మర్దింపవా యధికశౌర్యమున?
నిలిచినచోటను నిలువంగనీక - పలుమాఱుఁ దూలవా పవనునిదూత?
మనుజుఁ డాతఁడు నీవు మనుజాసనుఁడవు - మనుజుండు నీచేత మను టేల కలుగు!
నీశ్వరుఁ గూర్చి మహేశ్వరక్రతువు - శాశ్వతకీర్తిమై సలిపె నీసుతుఁడు;250
సాంద్రానుమోదియై సఫలత నొంది - యింద్రుని భంజింప నింద్రజిత్తయ్యె;
నాయింద్రుఁ జెఱఁబెట్ట నజుఁడు వేఁడుటయు - నాయజునకు విడ్వ డాయింద్రజిత్తు;
ఆతఁడు చాలఁడే యాలంబు గెలువ? - దైతేయకులనాథ! తగదు చింతింప”
అని మంత్రు లాడుచో నధికదర్పమున - ఘనమైనలావులు గలదైత్యవరులు

రాక్షసాధిపులు రావణునితో ప్రతాపము దెల్పుట

ప్రళయకాలాంతకబలు లైనవారు - సులభశౌర్యుఁడు ప్రహస్తుఁడు నింద్రజిత్తు
శతమాయుఁడును బలశాలి దుర్ముఖుఁడు - అతికాయుఁడును మకరాక్షుండు ఖడ్గ
రోముండు వృశ్చికరోముండు సర్ప - రోముండు మఱియు విరూపాక్షకుండు
అక్షీణబలుఁడు ధూమ్రాక్షుఁ డన్వాఁడు - అక్షతోన్నతుఁడు యూపాక్షుఁ డన్వాఁడు
రమణీయబలశాలి రశ్మికేతుండు - అమితవిక్రమపూర్ణుఁ డగ్నివర్ణుండు
వజ్రదంష్ట్రుండును వజ్రకేతుండుఁ - వజ్రదేహుఁడుఁ బలవంతుఁ డైనట్టి260
సుప్తఘ్నుఁడగు మఱి శోణితాక్షుండు - ప్రాప్తశౌర్యుఁడు మహాపార్శ్వుఁ డన్వాఁడు
ఒనర కుంభుఁడు నికుంభుఁడు సూర్యనేత్రుఁ - డును నగ్నికోపనుఁడును మహోదరుఁడు
దివ్యుల గెలిచిన దేవాంతకుండు - నవ్యవిక్రమశాలి యానరాంతకుఁడు
కడునుగ్రుఁ డగుమహాకాయుఁ డన్వాఁడు - నడరి విద్యుజ్జిహ్వుఁ డనువాఁడు మఱియుఁ
గంపనుఁడును మహాఘనుఁ డకంపనుఁడు - పెంపారుచున్న యభేద్యవిక్రముఁడు
నాదిగాఁ గల్గు మహాదైత్యవరులు - నాదైత్యవల్లభు నగ్రభాగమునఁ
గన్నులఁ గోపంబు గడలుకొనంగ - మిన్నులు ముట్టంగ మీఱి పల్కుచును
బ్రళయావసరమహాపవననిర్ధూత - కులపర్వతము లన గుంభిని యదర
నొండొరుఁ జూచుచు నుద్దండవృత్తి - నొండొరు మెచ్చక యుగ్రత మెఱసి
యూర్పులు నిగుడ నత్యుగ్రత మ్రగ్గు - సర్పంబులును బోలె సరభసవృత్తి270
శూలంబు లంకించి సురియలు బిగిచి - వాలము ల్జళిపించి వరతనుత్రాణ
సబళంబు లమరించి చక్రము ల్ద్రిప్పి - ప్రబలంబు లగు భిండివాలము ల్దిగిచి
పట్టసం బెసఁగించి ప్రాసము ల్ద్రిప్పి - గట్టివిండ్లును గుణకంపము ల్చేసి
యుడుగక యెలుగు లొండొంటితో రాయ - మిడుగురు ల్మంటలు మిక్కుటంబుగను
ఒండొరు విపులకేయూరంబు లోరయ - నొండొరు మకుటంబు లుగ్రత రాల
భాసురమౌక్తికప్రకరము ల్చెదర - రాసిన నవహేమరజములు దొఱుగ

సందడింపుచు మహాసంరంభ మెసఁగ - బృందారకారితోఁ బేర్చి యిట్లనిరి,
"దేవగంధర్వదైతేయకిన్నరులు - దేవ! నిన్ జూడ భీతిల్లుదు రనిన,
నరు లెంతవారు? వానరు లెంతవారు? - సురవైరి! నినుఁ జూచి స్రుక్కక నిలువ
నేము నాఁ డొకకొంత యేమఱియుండ - నామర్కటాధముఁ డ ట్లేగెఁగాక!280
యింక మాముందఱ నీలంకఁ జొచ్చి - శంకింప కెవ్వరు చనఁగలవారు?
వానరు లనియెడి వార్త లేకుండఁ - బూని నిర్జించి యిమ్ముల మహీధవులఁ
జంపి యేతెంతుము చయ్యన మమ్ముఁ - బంపు; దానవనాథ! పలుకు లింకేల?"
యని గర్వదుర్వారు లై పల్కుచున్న - దనుజుల నందఱఁ దప్పక చూచి
“యురవడింపకుఁడు యోహో! మాను మానుఁ - డరసి కార్యము చూత“ మని విభీషణుఁడు
చిత్తంబులోనఁ జేర్చినయింద్రియముల - నొత్తియ డించినయోగియుఁ బోలె
బరఁగ గర్జించు నుత్పాతమేఘముల - నిరుపునఁ బెట్టిన యింద్రునిభంగి
ననువొంద నెప్పటియట్ల కూర్చుండఁ - బనిచి కార్యము ముట్టఁ బలికె వారలకుఁ,
“బెనుపొందఁగా సామభేదదానములఁ - గొనరాని కార్యంబు గొనకొనె నేని,
మఱి గదాదండంబు మాయలఁ బెనచి - నెఱపుట మున్నె దుర్నీతి యేమిటికి?290
నెనయంగ శాత్రవుఁ డేమఱియుండ - మన కిక నేమఱి మనుటకుఁ దోఁచు
నాతల కొకశత్రుఁ డతనిపై విడియ - నేతెఱంగున నేన నెత్తిపోఁ జనును
దానిపై నతనికి దైవశక్తియును - హీనమై యున్న నీ యింతయుఁ దగును
యెన్నఁడు నేమఱఁ డెదు రెందు లేదు - మున్నె దైవంబు రాముఁడు గాఁడె మఱియు
హరువిల్లు విఱిచినయట్టిసాహసుఁడు - పరమవివేకి దోర్బలజయాధికుఁడు
మీచేత సాధ్యుఁడే మిహిరకులేశుఁ - డేచి మీ రతనిపై నెన్ని యాడినను
గడలేని యీవార్ధి కాలువకరణి - వడి దాఁటి రాఁడె యావాయునందనుఁడు
వచ్చి యీలంకలో వలసినమాడ్కి - నచ్చెరువంది మీ రందఱుఁ జూడ
నేమేమి చేసెనో యెఱుఁగరా మీరు? - రాముని వింటిశూరత్వంబు చూప
నతఁ డొక్కవానరుఁ డా యెన్ని చూడ? - నతనికి నెక్కుడై నట్టి వానరులు300
నావానరుల కెక్కు డైనవానరులు - భావింపఁగా లెక్క పరఁగంగ రాదు
మీరు రాఘవుని నెమ్మెయి నోర్చువారు - వారనికోపంబు వలన నేపారి
యెదిరిని దన్నును నెఱుఁగక పలుకు - టిది వివేకమె దానవేశ్వరులార!
రామలలో నభిరామ యాసీత - రామునిదేవి నరణ్యమధ్యమున
భయమున రామునిఁ బలుమాఱుఁ జీర - రయమునఁ దెచ్చె నీరాక్షసేశ్వరుఁడు
మదిలోనఁ దలపోయ మన కీడె కాక - యితనికిఁ జేసిన యెగ్గేమి? యతఁడు
ఖరదూషణాదుల కడిఖండములుగ - ధరణిపైఁ గూల్చెఁ గదా యని మీరు
తలఁచెద రతనిపై దైత్యులపోక - తలఁపుచు వారిపై దాడి పోఁదగునె?

తమనేరముల వారు ధరణిపైఁ గూలి - యమరలోకము కేగి రది చెప్పనేల?
మేటివానరు లిట మీఱకమున్నె - కోటలు వారిచేఁ గూలకమున్నె,310
సౌమిత్రి బాణవర్షము రాకమున్నె - రామునికోపాగ్ని రాఁజకమున్నె,
యాయగ్నిచే లంక యడఁగకమున్నె - యీయసురావళి యీల్గకమున్నె,
సీతఁ బుచ్చుఁడు వేగ శ్రీరాముకడకు - సీతఁ దెచ్చినకీడు చేఁజేతఁ గుడుపు
ధర్మాత్ముఁ డౌ రామధరణీశ్వరుండు - ధర్మంబువలననే తగ నుండు జయము,”
అని పెక్కుభంగుల నావిభీషణుఁడు - దనుజవీరులఁ బల్కి దశకంఠుఁ జూచి
“తలపోయ సుఖమును ధర్మంబుఁ జెఱుప - వలతియై పరఁగుదుర్వ్యసనంబు విడువు
సుఖము కీర్తిని జేయు సురుచిరధర్మ - మఖిలనీతిజ్ఞుఁడ వగచుఁ గైకొనుము
చలము మానుము సుప్రసన్నుండ వగుము - కుల మెల్ల రక్షించుకొనఁ జూచితేని
జనకజ విడువు మాజననాథుతోడ - మన కేల వైరంబు? మది మది నుండి”
యని విన్నవించిన నతనివాక్యములు - విన బుద్ధిపుట్టక వెసఁ గొల్వు విడిచి320

విభీషణుఁడు రావణుని యొద్దకుఁ బోవుట

రావణుఁ డంతఃపురంబున కరిగె - నావిభీషణుఁ డంత నామఱునాఁడు
ప్రథమసంధ్యావిధు ల్పరిపాటిఁ దీర్చి - రథ మెక్కి నల్గడ రాక్షసుల్ గొలువ
రమణీయచిత్రతోరణరాజవీథి - కమనీయశిల్పము ల్గనుఁగొంచు వచ్చి
పటుహేషితంబులు పటుబృంహితములు - పటహశంఖాదులబహునినాదములు
సేవాగతాంగనాశింజితంబులును - సావాసు లడరించు చండహుంకృతులు
సూతమాగధవందిశుభకీర్తనములు - నాతతభటసంకులాలాపములును
మాతంగనిశ్వాసమారుతోద్ధూత - కేతనాంశుకపటాత్కృతు లోలిఁ బెరయ
బధిరదిగ్భాగమై బహుళోర్మి జలధి - విధమున మ్రోయంగ విశ్వాస మొదవ
రాక్షసవీరుల రక్షచే నమరి - నక్షత్రపరివృతనవసౌధ మనఁగఁ
దెఱపిలే కిభములు తేరులు హరులు - గిరికొన్ననగరివాకిటఁ దేరు డిగ్గి330
ఆజ్యపాత్రాదుల నర్చితు లగుచుఁ - బూజ్యగుణంబుల భూసురోత్తములు
పుణ్యాహవాచనపూర్వకంబై న - పుణ్యశాంతులు సేయఁ బోరిఁ గన్గొనుచు
మనసింప నాస్థానమంటపంబునకుఁ - జనుదెంచి యన్నకు సద్భక్తి మ్రొక్కి
యలమి నాతఁడు చూప నర్హపీఠమున - నెలమితోఁ గూర్చుండి యేకాంత మెఱిఁగి
మంత్రులసన్నిధి మహనీయమంత్ర - తంత్రజ్ఞుఁ డనియె నాదశకంఠుతోడ
"అవధరింపుము దేవ! యసురాధినాథ! - యవనిజఁ దెచ్చిన యంతనుండియును
దుర్నిమిత్తంబులు తోఁచుచున్నవియు - నిర్ణయింపఁగ రాదు నిక్కువం బరయ
హోమగుండంబుల నున్నత్రేతాగ్ను- లేమియు వెలుఁగ వీయీదివసముల
నాగుండములఁ జొచ్చి యలమిఁ జుట్టియును - సాగిలఁబడియుండు సర్పము ల్పెక్కు

నుడుగనిమదముల నొలయుతుమ్మెదలు - కడునొప్పు నమ్మదకరు లెల్ల నిపుడు340
కడుమేను డిల్ల మైకంబులతోడ - మెడ లెత్తుకొని స్రుక్కి మెదల కున్నవియు
నున్నతస్థితిగల నుత్తమాశ్వములఁ - గన్నుల నీళ్ళును గాఱుచున్నవియుఁ
గవణంబు నీరును గడ్డియు నుడిగి - జవసత్త్వములు దూల సడలి యున్నవియు
వానితోఁకలయందు వడి నగ్నిశిఖలు - మానుగా నలుగుల మంటలు వెడలు
నరదాలపై నగ్ను లటరాలుచుండుఁ - బొరిపొరి యుల్కము ల్భువిఁ బడఁదొణఁగె
జడిగొని వీరమస్తముల వాయసము - లడరుచుఁ బురములో నాడంగఁదొణఁగె
ఖ్యాతిగా శిఖలతోఁ గడఁగి కూపములు - భాతిగా మండూకపతు లుద్భవించె
దేవగేహముల భూదేవగేహములు - భావింప శిథిలాధిపఙ్క్తులు పుట్టె
ఇంద్రధనుస్సులు నిట రాత్రులందుఁ - జంద్రధారికి నైన జయము లేదండ్రు
పూని చూడఁగ శుభంబులు గావు మనకు - వీని విచారించి విగ్రహం బుడుగు350
మటుఁగాన నిన్నిటి కసురాధినాథ - శర మేల విను మొక్కశాంతి చెప్పెదను.
శ్రీరామునకు నిమ్ము సీతఁ గొంపోయి - నేరమిఁ బట్టఁ డానృపకుంజరుండు
ఎందు నీతిజ్ఞుల కిది లెస్సకార్య - మిందఱు నెఱుఁగరా యిది బుద్ధి యనుట
దనుజేశ! నీచిత్తధర్మంబు నూఁది - విను మని చెప్పంగ వెఱతురు గాక
నాకుఁ బోరాదు దానవనాథ! గాన - నీకుఁ జెప్పితి నిట్లు నీతిమార్గంబు”
అని బుద్ధి చెప్పిన నవ్విభీషణుని - వినుతవాక్యంబులు వీనులఁ జొరక
“నెవ్వరిదిక్కున నేభయం బెఱుఁగ - నెవ్విధంబున సీత నీను రామునకు
దుర్జయుం డగు నాకు దురములో నెదిరి - నిర్జరు ల్తోడైన నిలుచునే" యనుచుఁ
గోపంబు దీపింపఁ గొలువెల్ల విరిసి - వేపోయె దానవవిభుఁడు లోపలికి.
మఱునాఁడు లేచి క్రమ్మఱ రావణుండు - మఱువక సంధ్యాసమాధులు దీర్చి360
యనుజునివచనంబు లాత్మఁ జింతించి - తనప్రధానులు తాను దలపోయఁ దలఁచి
భానుమండలసమప్రభ గలయట్టి - మానైనదివ్యవిమానంబు నెక్కి
కమనీయబహురత్నకలితంబు లగుచుఁ - గొమరారఁగాఁ బైఁడికుంభముల్ మెఱయ
వెన్నెలచూ లన విరచించినట్టి - యున్నతఛత్రంబు లొప్పారుచుండఁ
గంకణఝణఝణత్కారము ల్మెఱయ - నంకించి చామర లతివలు వీవ
బెక్కుతూర్యంబులు పెల్లుగా మ్రోయఁ - బెక్కండ్రు సుభటులు పెంపారి కొల్వ
వందిమాగధులు కైవారంబు సేయ - సందడి జడియ నైశ్వర్యంబు మిగులఁ
జనుదెంచి బహుమంత్రిసహితంబు గాఁగ - మనుజాశనుఁడు సభామంటపంబునకు
నర్కవంశుని శరాహతిఁ దెగి పిదప - నర్కబింబముఁ జొత్తు నని తెల్పుకరణిఁ
జొచ్చి సింహాసనస్థుండునై పిలువఁ - బుచ్చె నాయకుల నప్పుడు పడవాళ్ల,370
వారును దమరథావళులపై నెక్కి - వారణంబుల నెక్కి, వాజుల నెక్కి,

చారుచామీకరచ్ఛత్రంబు లొప్ప - వారక భీషణాకారంబు లొప్ప
తమతమతూర్యనాదములతో వచ్చి - క్రమమున మంటపాంగణములయందు
దమవాహములు డిగ్గి తనరుసింహములు - కొమరారగా గిరిగుహఁ జొచ్చుకరణి
నామంటపముఁ జొచ్చి యాదానవేంద్రు - చే మన్ననలు గాంచి చిత్తంబు లలర
నుచితాసనంబుల నుండి పడాలు - రుచితంబు లెఱిఁగింప నుత్తమం బనుచు
"దేవ! నేఁ డెంతయు దెలిసియున్నాఁడు - దేవరతమ్ముఁ డుద్దీపితబలుఁడు
ఘనుఁడగు నాకుంభకర్ణుండు" నాఁగ - విని “పిల్వుఁ" డనవుడు వేగ వా రేగి
“దేవారి సభకు నేతెంచి కొల్వుండి - దేవ! ని న్బిలువఁ బుత్తెంచె" నావుడును
కొడుకులు కుంభనికుంభులు గొలువఁ - గడువేగమున గుంభకర్ణుఁ డేతెంచి.380
మణిమయంబై దివ్యమహిమలు గలిగి - గణికాసమూహంబు గాననాదముల
నెంతయు నింపార నెసఁగిన మంట - పాంతరంబునను సింహాసనస్థలిని
నున్న యన్నకు మ్రొక్కి యొగిఁ గొల్వుఁ జొచ్చి - యున్నతాసనమున నున్నయావేళ
నన్నతోడనె వచ్చి యావిభీషణుఁడు - క్రన్ననఁ గూర్చుండెఁ గనకపీఠమున
నప్పు డారావణుం డమరవల్లభుని - యొప్పెల్లఁ గైకొని యుండి ప్రహస్తుఁ
గనుఁగొని పలికె "లంకాపురంబునకుఁ - బనుగొనఁ బెట్టుము బలువైనకాపు
మతి నేమఱకు మెల్లమార్గంబులందు - బ్రతిదివసంబులోపలను వేల్పులను"
నని దానవాధీశుఁ డాకుంభకర్ణుఁ - గనుఁగొని పల్కె నుత్కంఠ దీపింవ

రావణుఁడు కుంభకర్ణునితో రాముని రాక యెఱింగించుట

“విను కుంభకర్ణ! నీ విననిది యొకటి - జనపదంబున కేగి చయ్యన నేను
రామునిదేవి ధరాసుత సీతఁ - గామించి తెచ్చితిఁ గంజదళాక్షి390
మఱి మొన్న నొకహనుమంతుఁ డన్ కోఁతి - పఱతెంచి సీతకుఁ బరిణామ మొసఁగి
దేవి! నీపతి రామదేవుండు వచ్చు - నావిని మదిలోన నమ్మి మోదమున
నున్నది యాసీత యుద్దండవృత్తి - నన్నరుండును నబ్ధి కవ్వల విడిసె
వనములోఁ గల వనచరావలిని - బెనుమూఁకగాఁ గూడఁబెట్టు కేతెంచె
సురనాథసురలను స్రుక్కించినాఁడ - హరుఁ డున్నకైలాస మగలించినాఁడ,
శంభుచేఁ జంద్రహాసముఁ గొన్నవాఁడ - నంభోజభవు వరం బడిగికొన్నాఁడ,
దానిపై నీలావు తవిలియున్నాఁడ - మానవుండే నన్ను మర్దించువాఁడు
రాముఁ డెన్నఁడు గెల్చు రణభూమి నన్నుఁ? - గోమలి నెన్నఁడు గొనిపోవు నతఁడు?"
అవవుడుఁ గోపించి యాకుంభకర్ణుఁ - డనియె రావణుతోడ నందఱు వినఁగ
"రాము వంచించి యారామునిదేవి - నేమఱి యుండంగ నెత్తి యుద్వృత్తి400
దెత్తురే? యిటు లేల తెచ్చితి? కడఁగి - చిత్తంబులో నీతి చింతింపవైతి.
ధర్మమార్గము నీవు దలపోయ వైతి - నర్మిలి కులమెల్ల నడఁగఁ జేసితివి;

సీతఁ దెచ్చినయప్డె చెడియె నీలంక - నేతెఱంగున నైన నిదియ నిశ్చయము
ఎట్టెన నేమి? యాయినకులేశ్వరుని - నెట్టన శరములు నెఱి గాడకుండ
బ్రతికి వచ్చితి నీదుభాగ్యంబుకతన - నిది మేలు కీ డని యెన్నంగనేల
పోవచ్చునా యింకఁ బూనుదు గాక - రావణ! యింతకార్యము చక్కఁబెట్ట
నామీఁదఁ బడియె వానరుల రాఘవుల - నేమియుఁ దలఁపక యింక సుఖింపు"
మని పల్కుచుండ మహాపార్శ్వుఁ డనియె - "ఘనభుజ యెల్లలోకములకు నీవ
పతి వఁట? యాసీత బలువునఁ బట్టి - రతి సల్పనేరవా? రాక్షసాధీశ!”
యనవుడు జిత్తంబునందు మోదించి - దనుజాధినాథుఁ డాతని జూచి పలికె.410
"విను మహాపార్శ్వ! యే వేధకొల్వునకుఁ - జనుచోటఁ బుంజికస్థల యను నాతి
వలు వూడిపడఁ బట్టి వడఁ గుదియించి - బలిమి భోగించితి పైఁబడి తొల్లి;
యామేర లెల్లను నబ్జజుం డెఱిఁగి - నామీఁదఁ గోపించి నయ మింతలేక
“యోరి! రాక్షస! కడు నుచితంబు దప్ప - నారీజనము లేడ? నయ మింతలేక
బలిమి నెవ్వతె నైనఁ బట్టి భోగింపఁ - దలఁతు వెప్పుడు నీదు తల లప్పు డవిసి
వారక యిల నూఱువ్రయ్యలై రాలు - పోరోరి" యనుచు శప్తునిఁ జేసి విడిచె.
నది కారణంబుగా నంగనాజనుల - హృదయంబె కదియక యే నెందుఁ గదియ
నాలావు గొనక వానరులతోఁ గూడి - యీలంకపై రాముఁ డిట వచ్చుటెల్ల
నిద్రించుసింహంబు నిరి మేలుకొల్పు- భద్రదంతావళప్రతతివిధంబు”
అని పల్కుటయు నవ్వి యవ్విభీషణుఁడు - దనుజనాథునితోడఁ దగ విన్నవించె.420
"మొనయునిట్టూర్పులె మ్రోఁగుట గాఁగ - ఘన మైనచింతయె గరళంబు గాఁగఁ
గోపంబు చలమును గోఱలు గాఁగ - నేపరి యుండుటే యెరగొంట కాఁగ
నమరంగఁ జెక్కున హత్తిన చేయి - కమనీయతరఫణాకారంబు గాఁగ
నిజనఖంబులు మణినికరంబు గాఁగ - భుజయుగమధ్యంబు భోగంబు గాఁగ
దారుణంబైన సీతాకాలసర్ప - మేరూపమున నైన నేల పోనిచ్చు
నపకీర్తి యఁట పాప మఁట సుఖంబునకు - విపరీత మఁట యిట్టివిత మేల యుడుగు?"
మని యన్నతోఁ బల్కి యంతటఁ బోక - సునిశితమతిఁ బ్రహస్తునిఁ జూచి పలికె,
“నెఱి పిడుగులఁ బోలు నృపునిబాణములు - గఱు లాని నీదువక్షము గాడునాఁడు
ఎఱిఁగెదు గాకేల? యిట్టట్టు పడెదు - కఱకు లాడెడుమాడ్కి గాదు మీఁదటను
ఈకుంభకర్ణుండు నీనికుంభుండు - నీకుంభుఁడును మఱి నీమహోదరుఁడు430
నీమహాపార్శ్వుండు నీయింద్రజిత్తు - రాముని గెల్చువారా రణంబునను
ఏపు చూపక యప్పు డెందుఁ బోయెదరు - ప్రాపులై మీ రడ్డపడెదరు గాక!
కడఁగి యింద్రుఁడు వచ్చి కాచిన నైనఁ - గడునడ్డపడి సుర ల్గాచిననైన,
కాలాగ్ని రుద్రుండు గాచిననైనఁ - గాలమృత్యువు వచ్చి కాచిననైన

రావణుఁ జంప కారామభూపాలుఁ - డేవిధంబుననైన నేల పోనిచ్చు?'
దనుజేశుపై విల్లు ధరియించునపుడు - మనచేతఁ బోవునే మనుకులేశ్వరుఁడు?
పిడికిట నడఁగునే పేర్చుకాలాగ్ని? - పుడిసిట నడఁగునే పొంగారుజలధి?
పట్టంగ నలవియే పాతాళతలము? - గట్టింప నలవియే గగనభాగంబు?
తెంపంగ వచ్చునే దిగ్వితానంబు? - తుంపంగ వచ్చునే ధూర్జటివాలు?
నఱచేత నడఁచిన నడగునే సూర్యుఁ? - డెఱుఁగని మీతోడ నిట్లాడనేల?440
కడుమూర్ఖు నాకారి కామాతురుండు - మడియఁడె మీయట్టి మంత్రులు గలుగ?
నాబుద్ధి వినునె యీనాకేశవైరి - మీబుద్ధిఁ జెడుగాక మిక్కిలి క్రొవ్వి"
యని మొగమోడక యాడఁ బ్రహస్తుఁ - డనువాఁడు గైకొన కావిభీషణుని
"నురగులతోఁ బోరి యోడ మెన్నఁడును - సురలతోఁ బోరాడి స్రుక్క మెన్నఁడును
యక్షులతో గిట్టి యలయ మెన్నఁడును - రాక్షసావళిచేతఁ గ్రాగ మెన్నఁడును
నరుఁ డై నయారామనరనాయకునకు - దురములో నే మోడుదుమె విభీషణుఁడ?
యేచందమున వారి నెఱుఁగుదో కాని - నీచేత వింటిమి నేఁ డింత వింత

ఇంద్రజిత్తు విభీషణునికి తనలా వెఱింగించుట

దనుజులలా వంత తక్కువే" యనినఁ - జనియె నాగ్రహ మెత్తి జంభారిజిత్తు
తోరమై పేర్చిన దుర్మదగ్రంథి - యారాముతమ్ము శరాగ్నిచేఁ గాలఁ
గారణం బటమీఁదఁ గలుగుటఁ జేసి - యేరూపమున నీతి నిచ్చలో నిడక450
విను విభీషణ నీవు వెఱచెదుగాక - మనయందు రాక్షసమహిమ లూహింప
హీనుఁడైనను నోపు నింతటిపనికి - మానక రామలక్ష్మణుల మర్దింప
మూఁడులోకములు నిమ్ముల నేలువాని - వాఁడివజ్రము గల వాసవుఁ బట్టి
చెఱఁబెట్టనా వాని సితకరిఁ బట్టి - విఱువనా కొమ్ములు వింతయే నీకు
ననలు గాఱించి యయ్యంతకు నొంచి - దనుజు లారించి యాతఱి వాని నొడిచి
గాలిఁ దూలించి యక్షపుని మర్దించి - శూలి నోడించి నిష్ఠురత వాటించి
యేచిన నాచేత నీనరు ల్చావ - రా చెప్పె దుబ్బి వారలఁ బెద్దచేసి,
కలఁతునా సప్తసాగరములు సొచ్చి - మలపుదునా మేరుమందరంబులను
దాఁటుదునా ధరాతల మెల్లఁ గడవ - మీటుదునా నేల మింటితో నంటి
వంతునా జగములు వనచరకోటి - ముంతునా బెగడొంద మున్నీటిలోనఁ460
బుడమి మోచిన నాగపుంగవుఁ బట్టి - పిడుతునా విష మెల్లఁ బిచ్చిలి వోవ
నొక్కట దుండంబు లొడిసి రాఁ దిగిచి - దిక్కరీంద్రుల నీడ్చి తెత్తునా పూని?
భూమితో నిప్పుడు భుజశక్తి మెఱసి - ప్రాముదునా చంద్రభానుబింబముల
వనచరకోటుల వైతునా పట్టి - దినకరబింబంబు దిక్కులు గడవ
నాలంబులో వానరాలి రక్తములు - గ్రోలింతునా భూతకోటులచేతఁ

గప్పుదునా యంపగములచే మిన్ను - నిప్పు డన్నియుదిక్కు లిన్నియుఁ గూడఁ
గడునొగ ల్కలములఁ గబళించి త్రిప్పి - యడఁతునా నేలతో నర్కునిరథము
పెడచేత లోచేతఁ బృథివియు మిన్ను - నడఁతునా పొడిపొడి యై రాలిపోవ
దనుజాధినాథుని తమ్ముఁడ వగుట - నిన్ను నొండనక మన్నించితిఁ గాక
యొరుఁడైన సైఁతునే? యూరకయుండు - వెరవిడి మాటలు వే యాడనేల?"470
ననవుడుఁ గోపించి యావిభీషణుఁడు - గనుగొని పలికె నుద్గాఢవాక్యముల
“నెవ్వనిగాఁ జూచి తినకులేశ్వరునిఁ - క్రొవ్వులు పలికె దీకొలువులోపలను
గణుతింప నింద్రుండు గాఁడు నీ కోడ - రణభీషణుండగు రాముండు గాని
గణుతింప ననలుండు గాఁడు నీ కోడ - రణభీకరుండగు రాముండు గాని
గణుతింపఁ గాలుండు గాఁడు నీ కోడ- రణమహోగ్రుండగు రాముండు గాని
గణుతింప నిరృతి గాఁడు నీ కోడ- రణవిశారదుఁడగు రాముండు గాని
గణుతింప వరుణుండు గాఁడు నీ కోడ - రణజయోన్నతుఁడగు రాముండు గాని
గణుతింప ననిలుండు గాఁడు నీ కోడ- రణనిపుణుండగు రాముండు గాని
గణుతింప ధనదుండు గాఁడు నీ కోడ- రణకౌశలుండగు రాముండు గాని
గణుతింపఁ బశుపతి గాఁడు నీ కోడ - రణవిచక్షణుఁడగు రాముండు గాని480
వారి కోర్చినరీతి వచ్చునే యోర్వ - నారామవిభునకు నాలంబులోనఁ
దలము కప్పినయట్టి తలఁపులు దలఁచి - తలక్రిందు వడియెదు తద్దయుఁ గ్రొవ్వి
కులనాపకుండవు కొడుకవా నీవు? - వలయు రావణు పగవాఁడవుగాక!
పావకనిభరామబాణఘట్టనకు - రావణుండే యోర్చు రణములో నిలిచి
యీరావణుఁడు తనహితులతోఁగూడ - నారామభూపాలునడుగుల కెరఁగి
మణులతో వారణమణులతోఁ దురగ - మణులతో మానినీమణి నిచ్చు టొప్పు”
ననవుడు రావణుం డావిభీషణుని - దనరోషదృష్టులఁ దప్పక చూచి
"పగవానితో నైనఁ బాయక కూడి - మిగిలిన యేపుతో మెలఁగంగవచ్చుఁ
బటువిషం బొలికెడుపాముతోనైనఁ - జటులనిర్భరవృత్తిఁ జరియింపవచ్చుఁ
దనవానివలె నుండి దాయలఁ గూడి - మనువానితోఁ గూడి మనరాదు కాక490
వారక నీ వట్టివాఁడవు గాన - వైరుల నాయొద్ద వర్ణించె దుబ్బి;
తమ్ముఁడ వని చంపఁ దగదు కా కీవు - తమ్ముఁడవా పగదాయవు కాక”
యనవుడు బ్రహ్మశాపాతిశయంబు - గొనకొనుట యెఱింగి కుంభకర్ణుండు
తమ్మునిమాటలు తగ వనలేక - యెమ్ములాడెడి నన్న నెట్టనరాక
యగ్గౌరవముతోడ నన్నకు మ్రొక్కి - దిగ్గున గుహకు నిద్రింపఁగఁ జనియెఁ
జనినపిమ్మట విభీషణుఁడు రావణుని - కనియెఁ జిత్తంబున నలుక రెట్టింప
"నన్నవు గాన నీయాపద కులికి - యిన్నియుఁ జెప్పితి హిత వని నీకుఁ

బొసఁగదు బహుముఖంబులు గాన నీకు - నసురేశ! చెప్పిన యాప్తులబుద్ధి
హితవు చెప్పెడిమంత్రు లెందును గలరు - హిత వని వినురాజు లెందు గల్గుదురు
తగు నాకుఁ జెప్పుట తగు నీకు వినుట - తగ సీత నిచ్చుట తగు నీతి నీకు500
బల మెంత గలిగినఁ బరికించి చూడ - నల వెంత గలిగిన నది యేమి సేయుఁ?
బురుషుని వెరవునఁ బోనీక పేర్చి - పరికింప దైవంబు ప్రతికూల మైన
దైవంబ నా నొండుదైవంబు గలదె - దైవంబు దశరథతనయుండు గాక"
యని విభీషణుఁ డాడ నారావణుండు - విను బొమల్ ముడివడ వికృతాస్యుఁ డగుచు
మిన్నందఁ గోపించి మీసంబు లదరఁ - గన్నులమంటలు గ్రమ్మ నిట్లనియె.
“నెన్నెదు రాముని నిటు దైవ మనుచు - నన్నరుఁడే దైవ మయ్యెడు నేని
వెడగయి తండ్రిచే వెడలంగ నోటు - వడి యడవుల నేల పడి మ్రగ్గి స్రుక్కి
విను మాకు నలమును వేరు వెల్లంకి - దినియెడివానినే దేవర యండ్రు
నను దాఁకవలదె క్రన్నన నెదిరించి - తనదేవిఁ గొనిరాఁగ దైవంబ యేని
నలసి తమ్ముఁడు దాను నడవులలోనఁ - బలవించి పలవించి పలుమాఱుఁ దిరిగి510
వచ్చి సుగ్రీవుఁడ న్వానరుమఱుఁగు - చొచ్చుట దైవంబు చొప్పులే తలఁపఁ
బలుమఱు నేటి కాపందమానవునిఁ - జెలఁగి నాతో సరి చేసి చెప్పెదవు"
అనిన రావణుతోడ ననియెఁ గ్రమ్మఱను - దనలోన నవ్వుచుఁ దగ విభీషణుఁడు,
"ఎసఁగి దివ్యులఁ బెంప ఋషుల రక్షింప - నసురుల శిక్షింప నవనిఁ బాలింప
నాదినారాయణుం డర్కవంశమున - నాదశరథునకు నమర జన్మించె
వనజాసనాదులు వర్ణింపలేక - సనకాదులును గూడి చర్చింపలేక
ఆమహామహిమ నీ కలవియే తెలియ? - రాముఁడు మర్త్యుండె? రాక్షసాధీశ!
కాన రామునిఁ గని కంజాస్య నిమ్ము- దానవేశ్వర! మనఁ దలఁచెద వేని?
యలుగక యర్థకామంబులవలనఁ - దలఁ పగ్గలంబైన ధర్మ మెక్కడిది?
నీ వొల్ల వెన్నఁడు నీతిమార్గంబు - నీవారు నొల్లరు నీకంటె మున్న520
కానఁ గార్యాకార్యగతి యిట్టి దనిన - దానవేశ్వర! నీకు ధర్మంబు గలదె?
వాతూలసుతుచేత వనము చెడ్డట్లు - సీతచే లంకయుఁ జెడఁగల దింక
వచ్చెద రగచరు ల్వారిధి దాఁటి - వచ్చి యీరాక్షసవనితల నెల్ల
మోడ్చినకరముల ముందల ల్వట్టి - యీడ్చెద రటువలె నీడ్వకమున్నె
యొప్పింపు మాసీత నుర్వీశ్వరునకుఁ - దప్పక చెప్పితి దానవాధీశ!
మండెడి నగ్నులమాడ్కి రాఘవుని - దండిబాణంబు లుద్దండత వచ్చి
నీఱొమ్ము కొనికాఁడ నేర్తునె చూడ? - నీరాజ్యగతి చూడ నేర్తుఁ గా కేను
ప్రళయానిలము ఘనపర్వతశిఖర - ములు ద్రోచుపగిది రాముఁడు భండనమున
నీతల అంలందంద నేలపైఁ గూల్ప - నేర్చును వీక్షింప నిర్జరారాతి”

యనుడు విభీషణు నదరంటఁ జూచి - మునుకొని పదిమొగంబులు జేగురింపఁ530

రావణుఁడు విభీషణుని దన్నుట

గటము లుప్పొంగ నొక్కట నూర్పు లెసఁగఁ - బటుధూమములతోడి పావకుం డనఁగఁ
బదహతి మేదినీభాగంబు వగుల - నదలుపుబెట్టున నాకస మగల
నద్దిరా! యితనికోపావేశ మనఁగ - గద్దియమీఁద డిగ్గన డిగ్గనురికి
యడిదంబు జళిపించి యటు వ్రేయఁ బూని - యుడిగి విభీషణు నుగ్రతఁ దన్నెఁ,
దన్నిన వజ్రంబుతాఁకునఁ గూలు - నున్నతగిరి వోలె నుర్విపైఁ బడియెఁ,
బడిన వెండియు వ్రేయఁ బాఱఁ బ్రహస్తుఁ - డెడ చొచ్చి వల దని యెడలించె వారి
కొలు వెల్ల నాతనికోపంబుఁ జూచి - తలకొని యెంత వింతలు పుట్టె ననఁగ
ననలార్చునక్షుల నడర దైతేయుఁ - డనియె నిర్దయత ప్రహస్తునిఁ జూచి,
"వీనిదురుక్తులు వింటె ప్రహస్త! - వీని నమ్మెడిది యెవ్విధి నమ్ముఁ డనుచు;
వెడలంగఁ దోయుము వేగంబె వీని - నెడచేసి మొగమోడితేని నాయాన!”540
యనినఁ బ్రహస్తుండు నవ్విభీషణునిఁ - గనుఁగొని పలికె నాగ్రహవృత్తి దోఁప
“వల దిట నీ వుండవలసినయెడకు - వెలువడి యరుగు మివ్వీటికిఁ బాసి”
యనిన విభీషణుం డతికోపుఁ డగుచు - ననలుండు నలుఁడును హరుఁడు సంపాతి
యనువారితోఁ గూడి యసురేంద్రుతోడ - ననియె నుద్భటగదాహస్తుఁడై నిలిచి
“మదనాతురుండవు మఱి పాపములకుఁ - గుదురైనవాఁడవు క్రూరకర్ముఁడవు
మున్నె కదా నిన్ను మూర్ఖునిఁ బాయ - నున్నాఁడ, నిది క్రొత్తయును గాదు నాకు.
నార్తరక్షకునిఁ గృపాంబుధి దివ్య - మూర్తి జగద్ధితంబుగఁ బుట్టినట్టి
సత్యసంధుని రామజనపాలచంద్రు - నిత్యయశోనిధి నిర్మలాత్మకుని
శర ణని పోయెద శరణన నతఁడు - కరుణతోఁ బ్రోచు నెక్కాలంబునందు
నేను పోయిన నైన నిటమీఁద నెఱిఁగి - మానైన నీతితో మను దానవేంద్ర!550
యట్టును గాదేని యగచరు ల్లంకఁ - జుట్టినయపుడైనఁ జొనుపు నాబుద్ధి;
యట్టును గాదేని యర్కవంశజుఁడు - దట్టించునపుడైనఁ దలఁపు నాబుద్ధి;
నొండేని రఘురామునుగ్రబాణములు - దండించునపుడైనఁ దలఁపు నాబుద్ధి "
నని పల్కి యన్నకు నవనతుం డగుచుఁ - దనతల్లినగరి కుద్ధతగతిఁ బోయి.
చెలఁగినసింహంబుచేఁ బడి తప్పి - మలుగనివగతోడి మదకరివోలె
భీకరారావసంస్ఫీతుఁడై వచ్చి - చేకొని పిడు గడఁచిన యద్రివోలెఁ
జని యఁటఁ గైలాససదృశమైనట్టి - ఘనతరంబగు విశ్వకర్మచే నైన
గృహమున నుపవాసకృశ మైనమేన - మహితశుక్లాంబరమానిత యగుచు
వెన్నెలరసమున విదళించి తివిచి - మిన్నేటినురువున మెఱుఁ గిడ్డకరణి
నరసినబొమలును నరసినశిరము - గరమొప్పఁ బెద్దయు గౌరవం బొప్పఁ560

బన్నుగా ముదుకకుప్పసములు దొడిగి - చెన్నారఁ బ్రద్దలు చేతులఁ బట్టి
ముదిసినవిప్రు నిమ్ముల నెందఱేని - వదలక చేరి సావాసులై కొలువఁ
గరుణాప్రవాహంబుగా వచోభంగి - సరళత్వమూర్తుల చందంబు గాఁగఁ
బొలుపారు శమదమంబులు తటంబులుగ - గలసరులెల్లఁ జొక్కపునుర్వు గాఁగ
వెలసిన తనయొద్దివేదఘోషములు - సలలితం బగుచున్న జలఘోషములుగ
వినుతబహుద్విజవితతులుఁ జెలఁగఁ - గనుపట్టు జాహ్నవి గంగ నా నొప్పి
బహుపురాణంబులు బహువేదములును - బహుశాస్త్రములు పెక్కుబ్రహ్మరాక్షసులు
బహుభంగిఁ జదువంగ బహుభక్తి వినుచు - బహుళనిర్మలశుభప్రభఁ దేజరిల్ల
నుండియు రావణు నొప్పమిఁ దలఁచి - కొండంతవగపు చేకొనియున్న తల్లిఁ

తల్లియొద్దకు విభీషణుఁడు వచ్చుట

గాంచి దండము పెట్టి కన్నుల నీరు - నించి దుఃఖితుఁ డైన నివ్వెఱగంది570
కైకేసి నందనుఁ గరముల నెత్తి - కైకొని యక్కునఁ గదియంగఁ జేర్చి
“లోపలియిండ్ల నాలోకింపరాని - యాపద ల్పుట్టెనో యటుకాక మఱియు
బ్రాహ్మణవధయుఁ జొప్పడియెనో? కాక - బ్రహ్మ కోపించెనో? పరికించి చూడ
హరి యల్గెనో? హరుఁ డల్గెనో? రాముఁ - డరుదారఁ గ్రోధసమగ్రుఁ డైనాఁడొ?
యిది యేమి నాపుత్ర! యింతశోకింప! - నిది యేమితెఱఁగు నా కింతయుఁ దెల్పు;
మడిగెద నది విన్న యంతకు నాకు - నొడలిలోఁ బ్రాణంబు లుండవయ్యెడిని!”
అని పల్కుతల్లికి నావిభీషణుఁడు - మునుకొని కరములు మొగిచి యిట్లనియె.
"నవధారు! దేవి! నీయగ్రనందనుఁడు - రవికులాధీశ్వరురాకకు నేఁడు
మంత్రులు దానును మంత్రకూటమున - మంత్ర మిట్టిది యని మదిఁ జర్చ సేయ,
నిన్నివిచారంబు లేల? రామునకు - నెన్నిభంగుల సీత నిచ్చుట లెస్స;580
యీకున్న రాఘవుం డీయబ్ధిఁ గట్టి - యీకులం బడపక నేల పోనిచ్చు?
నని యొత్తి చెప్పిన నాపంక్తికంఠుఁ - డనలుండు మండిన యాకృతి మండి
తన్నె గద్దియతోడ ధరఁ బడ నన్నుఁ - దన్ని యంతటఁ బోక తాలిమి దక్కి
యడిదంబు జళిపించి యటు వేయఁ బూనఁ - జెడక నే బ్రతికి వచ్చితి నొకభంగిఁ
బోయెద నారామభూపాలుఁ గానఁ - బోయి యాతనికృపఁ బొంది యుండెదను
ఈవీట నా కింక నెవ్వరుఁ గలరు - భావింపఁగా నాప్తబంధువు లొరులు?
అనవుండు నతిభీతయై మూర్ఛ నొంది - ఘనమైనధైర్యంబుకతమునఁ దెలిసి
కైకేసి నందనుఁ గనుఁగొని పలికె - "నీకథ మున్ను నే నెఱిఁగినదాన,
నది యెఱింగించెద నమరులు మునులు - త్రిదశేంద్రుఁడును బ్రహ్మదేవుఁడు గూడి
యమృతాబ్ధికడ కేగి యచ్యుతుఁ గాంచి - తమపడునిడుములు తా మెఱింగింప590
"నీరసంబున మిమ్ము నేచుచునున్న - క్రూరుల రావణకుంభకర్ణులను

జంపుటకై యుర్వి జనియించువాఁడ - సొంపార వర్తించు సూర్యవంశమున"
నని దేవుఁ డాడిన నావార్త నాకు - వినుపించె మాతండ్రి విశదంబు గాఁగ
విని యేను వెఱచి మద్విభున కిట్లంటి - "నెనయంగ నీకులం బెవ్వఁడు నిలుపు
నీపుత్రకులలోన నిక్కంబు చెపుమ - ఆపుణ్యుఁ డెవ్వఁడో? యనఘ! నా" కనిన
సత్యంబు ధర్మంబు శౌచంబు గలిగి - నిత్యయశోనిధి నీకడఁగొట్టు
కొడుకు రామునికృపఁ గోరి యీలంక - కడునొప్పఁ బాలింపఁగలవాఁడు మీఁద,
నని చెప్పి తపమున కరిగె మీతండ్రి - యొనర నమ్మేరునగోపాంత్యమునకు
గాన నాతఁడు హరి కంజాప్తకులుఁడు - మానిని యాసీత మహనీయలక్ష్మి,
విశ్రవసునిమాట వేఱొక్క టగునె - విశ్రుతకీర్తి యేవిధములనైనఁ600
జనుము రామునిఁ గని శర ణని మ్రొక్కి - మనుము రాక్షసకోటి మనుట చింతింపు
ఆయువును శ్రీయు నగుగాక నీకు - నాయన్న! పొమ్ము శ్రీనరనాథుకడకు”
నని యక్షతలు పెట్టి యర్మిలిఁ బేర్మి - తనయుని దీవించి తగు వీడుకొలుప
నతఁడును తల్లికి నవనతుం డగుచు - మతిలోనఁ బొంగుచు మంత్రులు దాను
రావణుతనువునఁ బ్రాణంబు లైదు - నీవిధంబునఁ బోవు నిఁక ననుమాడ్కి
వేగంబె యాకాశవీథికి నెగయ - నాగుణాఢ్యునిఁ జూచి యాలంకవారు
తమతమవీథులఁ దమదులోగిళ్లఁ - గుమురులుగాఁ గూడుకొని పల్కి రపుడు
“ధర్మంబు దిగనాడి తగఁ దమ్ముఁ డనక - పేర్మివోఁ బల్కి విభీషణు విడిచె
నీతెఱంగున నిపు డీరావణుండు - నీతియు ధర్మంబు నేర్పుఁ గోల్పోయెఁ
జెడియెఁ గా కీలంక చెప్ప నే?" లనుచు - నుడుగనివగలతో నుండెడువారు,610
“ఈలంక యీతఁడె యేలుఁ బొ"మ్మనుచుఁ - బోలించి తమమనంబుల నెంచువారు
"గోరి యీతఁడు రాముఁ గూడుఁ గాకేమి - యీరావణుఁడు మ్రగ్గునే" యనువారు,
“నరనాథుఁ డీతని నమ్మునే యచటి - కరిగిన” ననువార లనుచు నుండఁగను

విభీషణశరణాగతి

అంత విభీషణుఁ డాకాశవీథి - సంతసంబున మంత్రిజనులతో నెగసి
వచ్చుటఁ గనుఁగొని వనచరు లెల్ల - నచ్చెరువడి చూచి రటు తలలెత్తి
యెత్తిన రాముచే నింద్రారి యింక - నెత్తఁడు దలలు పేడెత్తు దత్కులము
ఎత్తినభయమువో నిట సురలార; - యెత్తుఁ డాత్మలతల లెత్తుఁ డన్మాడ్కి
నప్పుడు సుగ్రీవుఁ డగచరాధిపులఁ - దప్పక వీక్షించి తగ వారి కనియె.
“వనచరులార యీవచ్చురాక్షసునిఁ - గనుఁగొనుం డదె వాఁ డఖండవిక్రముఁడు
ఘనమైన పర్వతాకారంబు వాఁడు - ధనురాదిశస్త్రముల్ దాల్చినవాఁడు620
మిక్కిలి పొడవున మెఱసినవాఁడు - స్రుక్కక యిటకు వచ్చుచునున్నవాఁడు"
ననవుడు గడఁగి యయ్యగచరాధిపులు - ఘనపర్వతములు వృక్షములు చేఁబట్టి

"మముఁ బంపు సుగ్రీవ! మముఁ బంపు దేవ - సమరంబులో దైత్యుఁ జంపెద” మనఁగ
నావిభీషణుఁ డనె “నగచరులార! - మీవాఁడ నిటు సంభ్రమింపంగవలదు
రావణుతమ్ముఁడ రాక్షసేశ్వరుఁడ - భావింప నేను నిష్పాపమానసుఁడ
శర ణని యారామజనపాలుఁ గాన - నరుగుదెంచినవాఁడ నట లంకనుండి
రావణుతో నేను రామభూపాలు - దేవి నిమ్మని పెక్కుతెఱఁగుల నంటి
ననవుడు నామాట కతఁడు కోపించి - తనసభలోపలఁ దన్నె న న్నిట్టు
తన్ని యంతటఁ బోక తనవీటిలోన - నున్నఁ జంపుదునని యోటిల కాడె
నేనును వెలువడి యీరామచంద్రుఁ - గానంగ వచ్చితిఁ గానఁ జింతింపఁ630
గపటుండఁ గాను నిష్కపటమానసుఁడ - గపులార! నాయెడఁ గపటంబు లేదు
సభయుండ నగు నాకు సంప్రీతి వెలయ - నభయ మిప్పించుఁడీ యవనీశుచేత"
ననవుడు సుగ్రీవుఁ డారాముకడకుఁ - జని విన్నపము చేసె సవినయుం డగుచు
"రావణుతో నల్గి రాయిడి పుట్టి - దేవ! వీఁ డొక్కఁ డేతెంచియున్నాఁడు
మొత్తంబుతో నభంబున నున్నవాఁడు - చిత్తంబు మీదెసఁ జేర్చినవాఁడు
అమరారితమ్ముఁడ ననుచున్నవాఁడు - విమలవాక్యంబుల వెలసినవాఁడు
ఆదిత్యకులనాథ! యభయ మి మ్మనుచు - మోదవాక్యంబుల మొనసినవాఁడు
మీకృపకలిమి యెమ్మెయి నున్నయదియొ - నాకుఁ జూడఁగ వీని నమ్మంగరాదు
నరనాథ! కపటంబునకుఁ బుట్టినిల్లు - లరయ రాక్షసులు గా కన్యులు గలరె?
దనుజాధినాథుని తమ్ముఁ డేమిటికిఁ - జనుదెంచు? నీనీచుఁ జంపంగవలయు”640
ననవుడు నంతట నాంజనేయుండు - వినయసంభరితుఁడై విభున కిట్లనియె.

రామునకు విభీషణుని యోగ్యత నాంజనేయుం డెఱింగించుట

“దనుజాధినాథుఁ డుద్దండకోపమునఁ - దను సభలోపలఁ దన్నె నన్మాట
లఖిలంబు నెఱుఁగంగ నాడె నీయసుర - నిఖిలేశ! యీమాట నిజము గానోపు
నుడుగక మనలకై యుచిత మాడుటయు - వెడలఁద్రోచినవాని విడిచి వచ్చుటయు
గలుగనోపును గాని కపటంబు గాదు - వలవదు శంకింప వసుధేశ! యితనిఁ
గపటమానసు లెట్టి క్రమమున నున్నఁ - గపట మింతటిలోనఁ గానంగవచ్చు.
నితనిమాటలలోన నేమాట యైనఁ - గృతకమై తోఁపదు కీ డనరాదు
మనుజేశ! దనుజుల మర్మజ్ఞుఁ డితఁడు - మనదెస నుండుట మానైననీతి
నను రావణుఁడు పట్టి నాఁడు బంధించి - యెనలేనిబాధల నేచుటఁ జూచి
యితఁడు నాకై పెక్కుహితవులు పల్కె - నితనిచిత్తస్థితి నెఱుఁగుదుఁ గొంత"650
యనినమాటలు దనయాత్మకు నెక్కి - వనజాప్తసుతుఁ జూచి వసుధేశుఁ డనియె.
“నర్కజ! దీన మే లౌటఁ గీడౌటఁ - దర్కించ నేటికి ధర్మంబుత్రోవ
శర ణని వచ్చిన శత్రువు నైనఁ - బరికింపఁగా రాచపాడి రక్షింప

నొకకపోతము డేగ యుద్ధతి తఱుమ - వికలభావంబున వేగంబె వచ్చి
శిబిమాటు సొచ్చెఁ జొచ్చిన డేగ యడుగ - శిబి తను విచ్చి చెచ్చెర గువ్వఁ గాచె.
నపకీర్తిఁ బొందక నార్తుఁ జేకొన్న - కృప నశ్వమేధసత్క్రియఫలం బిచ్చు
నీవిభీషణుఁ డేల యేచినయట్టి - రావణుండైన గర్వము దక్కి వచ్చి
శరణన్నఁ గాతు నేచందంబునైన - మరియాద లిట్టివి మాకులంబునకు
నభయ మిచ్చితి వేగ, నర్కజ! పోయి - సభయుని నవ్విభీషణుఁ దోడితెమ్ము"
అనవుడు సుగ్రీవుఁ డారామకృపకుఁ - గనువ్రాల్చి యటు శిరఃకంపంబుఁ జేసి660
"పరికింప నీవేళఁ బగవానితమ్ముఁ - డరయంగ శర ణన్న నలరి రక్షింప
నీకె కా కెందు నేనృపులకుఁ జెల్లు - కాకుత్స్థతిలక! నిక్కము ధాత్రిలోను”
నని పల్కి సుగ్రీవుఁ డాకాశమునకుఁ - దనసేనతో సముద్ధతగతి నెగసి
"చేకొని యభయంబు శ్రీరాముఁ డిచ్చె - నీకు విభీషణ! నిక్కంబు నమ్ము
ర”మ్మని కపిరాజు రాక్షసరాజు - నిమ్ములఁ గౌఁగిట నెనయంగఁ జేర్చి
తోడ్కొని వచ్చి సంతోషంబుఁ గృపయు - వేడ్కయు నొసఁగ నవ్విభుఁ గానుపించె
నిండ నానందించి నృపుఁ జూచి యపుడు - దండప్రణామము ల్దగఁ జేసి పలికె.

విభీషణుఁడు శ్రీరామచంద్రు నుతించుట

"నిత్యసత్యత్రాణ! నిత్యకల్యాణ! - నిత్యజగత్రాణ! నిత్యగీర్వాణ!
జగదన్వయాకార! జగదేకవీర! - జగదుదయాకార! జగదబ్ధిపూర!
సర్వసంగాతీత! సర్వానుభూత! - సర్వజగత్పూత! సర్వసమేత!670
గురులఘుక్రమరూప! గురుబోధదీప! - గురుమధురాలాప! గురుచారుచాప!
పద్మసన్నిభనేత్ర! బహుజీవసూత్ర! - పద్మాకలితగాత్ర! పరమపవిత్ర!
కవిమనస్సంవేద్య! కరుణానవద్య! - వివిధశాస్త్రాపాద్య! వేదాంతవేద్య!
పరమాత్ముఁడవు నీవ, పరమంబు నీవ - పరమవిద్యయు నీవ, పరికింప నెందు
భువనకర్తవు నీవ భువనంబు నీవ - భువనహర్తవు నీవ, భువనైకవీర!
యాగభోక్తయు నీవ, యాగంబు నీవ - యాగఫలప్రదుఁ డరయంగ నీవ,
చంద్రార్కులును నీవ, జలధులు నీవ - యింద్రాదులును నీవ, యిలయును నీవ,
శబ్దార్థములు నీవ, శబ్దముల్ నీవ - శబ్దముల్ భేదించు శ్రవణముల్ నీవ,
మూఁడుమూర్తులు నీవ, మూఁడుమూర్తులకుఁ - బోడిమి నవ్వలిపొడవును నీవ,
క్షరమును నీవ, యక్షరమును నీవ - క్షరసాక్షి వీవ, యక్షరసాక్షి వీవఁ,680
ద్రిభువనవందిత! దేవాదిదేవ! - యభయ మీదేవ! నా కఖిలాధినాథ!
జయ జయ శతకోటిజలజాప్తతేజ! జయ జయ సంసారసర్పసుపర్ణ!
లలితాగమస్తోత్ర! లక్ష్మీకళత్ర! - విలసద్దయాపాత్ర! విబుధారిజైత్ర!
దినకరశశినేత్ర! దివ్యచారిత్ర! - యనుపమశుభగాత్ర! యఖిలైకసూత్ర!

వేయునోరుల భోగివిభుఁ డైన నుతులు - సేయంగ నోపునే శ్రీరామ నిన్ను
నప్పద్మసంభవుం డైన నీమహిమ - యొప్పెల్ల నుతియింప నోపునే తెలియ?
నే నిన్ను నుతియింప నెంతటివాఁడ - దానవుండను వృథాతరళచిత్తుఁడను;
భూనాథ! నీ వాదిపురుషోత్తముఁడవు - కాన నిన్నితరులు గానఁగ లేరు
నరనాథ! యార్తుని నన్ను రక్షింపు - పరమదుర్జనదైత్యపతి ద్రుంచివైవు;
మఖిలశరణ్యుండ వైన నీమఱుఁగు - సుఖ మని యే వచ్చి చొచ్చితిఁ బ్రీతి”690

శ్రీరామచంద్రుఁడు విభీషణు ననుగ్రహించుట

ననవుడు నతని కృపాంబుధిలోన - మనుజేశ్వరుండు క్రమ్మఱ నోలలార్చి
“నమ్ము విభీషణ! నాకేశవైరి - తమ్ముఁడవా? నాకుఁ దమ్ముఁడ వింతె;
మఱువకు మింక; లక్ష్మణుకంటె నిన్ను - నఱలేనివానిఁగా నాత్మఁ గైకొంటి "
నని భయం బుడిపి దయార్ద్రవాక్యముల - జననాయకుఁడు విభీషణు నాదరించి
నెయ్యంబుతోడ నానృపుఁ డప్పు డతని - చె య్యూదుకొని వార్ధిఁ జేరంగఁ బోయి
"మాకు నిక్కము చెప్పుమా విభీషణుఁడ - నాకారిశక్తియు నమ్మినబలము”
ననిన విభీషణుం డారామచంద్రుఁ - గనుగొని మ్రొక్కి నిక్కము విన్నవించెఁ.

విభీషణుఁడు రామునకు లంకోత్పత్తిని రావణుని బలం బెఱింగించుట

“దోయజదళనేత్ర! తొల్లి నారదుఁడు - వాయువుకడ నాగవరులావుఁ బొగడి
ఫణిరాజు ముందఱఁ బవమానులావుఁ - బ్రణుతించి వారికిఁ బగ సేయుటయును
రాసి లావులకు వారలు మత్సరించి - భాసురహేమాద్రి ఫణిరాజుఁ జుట్టి700
పట్టంగ దానిఁ గంపము నొంద వీతు - నెట్టన నే నని నియమించె గాలి
తనసత్త్వ మంతయుఁ దగఁ బూని శేషుఁ - డనిమిషగిరిఁ జుట్టి యసదృశలీల
వేయుఫణంబుల వేశిఖరముల - నాయతభుజశక్తి నంటంగఁ బొదివి
చలమునఁ బట్టిన సప్తవాయువులు - వెలయంగఁ బవనుండు వీవఁగఁ దొడఁగె.
శేషుని భేదింపఁ జేకూఱకున్న - భీషణగతి వీచెఁ బేర్చి వాయువులు
ఆగాలి నచలంబు లన్నియు విఱిగె - నాగాలి భువనంబు లన్నియు వణఁకె
నాగాలిఁ జలియించె నర్కునిరథము - నాగాలి భూతంబు లన్నియు నఱచెఁ
గదిసిన లోకసంకట మెల్లఁ జూచి - యిది మహాపద వచ్చె నిత్తఱి ననుచు
నర్థిమై బ్రహ్మాదు లచటికి వచ్చి - ప్రార్థించి పవను మాన్పఁగలేకపోయి
పరమసాత్త్వికుఁ డైన ఫణిరాజుఁ గదిసి - “యురగేంద్ర! నీవైన నోర్వంగవలయు710
మీమచ్చరంబుల మిహిరుండు గూలె - మీమచ్చరంబుల మేదిని గ్రుంగె,
మీమచ్చరంబుల మితిమీఱె నబ్ధి - మామాట లాలించి మమ్ము మన్నించి

గాలిని గెలిపించి కరుణ వాటించి - కేళిమై మము రక్షింపవే” యనిన
సురలప్రార్థనకు శేషుఁడు శాంతి బొంది - కరువలికిని వీవఁగా నను విచ్చి
యించుక యొకఫణం బెత్తినఁ జొచ్చి - మించినబలిమి సమీరుండు ద్రోయఁ
జెలువేది యందొక్కశిఖరంబు విఱిగి - తలకొన్నగాలిచే దవ్వుగాఁ దూల
గురుతరగతి నద్రికూటంబు గాఁగ - ధరణీశ! యబ్ధిమధ్యంబునఁ బడియె,
దేవ! యాసింహళద్వీపంబునందు - దేవేంద్రుపనుపున దేవతాశిల్సి
కరకౌశలమున లంకాపురం బనెడు - పురము నిర్మించెఁ దత్పురవరంబునకుఁ
గోట లే డొప్పు; నక్కోటగోడకును - వాటమై నాల్గేసి వాకిళ్ళు గలవు;720
తఱుచైన యట్టికొత్తడములతోడ - నిఱవైన ముందఱి యిట్టికకోట;
పడమటిద్వార మేర్పడఁ గాచి యుందు - రెడపక రాక్షసు లెనుబదికోట్లు;
దానవు లుత్తరద్వారంబు గాచి - యేనూటడెబ్బదియేడుకో ట్లుండుఁ ;
దూర్పువాకిలియందు దొలఁగ కేప్రొద్దు - దర్పించి యుందురు తగ నూఱుకోట్లు;
దక్షిణద్వార ముద్ధతిఁ గాచియుందు - రక్షీణదానవు లఱువదికోట్లు;
అరయ నాలోపలి యాఱుకోటలను - నరనాథ! యిరువదినాల్గువాకిళ్ల;
వరుస నీచెప్పిన వడువున నెపుడు - దరి గాచియుందుదు ధరణీతలేశ!
తిరు మగుచున్నట్టి దిడ్డివాకిళ్ళ - నురుసత్త్వు లుండుదు రొక్కొక్కకోటి;
పురమధ్యవీథి నెప్పుడుఁ గాచియుందు - రఱువదిలక్షలు నార్నూరుకోట్లు;
కుంభకర్ణునినిద్రగుహఁ గాచియుండు - జృంభణ మొప్ప వసిం చాఱుకోట్లు;730
మొనసి యారావణు మొగసాలఁ గాచి - కొనియుందు రొకలక్షకోటిరాక్షసులు;
ఒనర నావాకిట నుండురాక్షసులు - వినవయ్య! యిఱువదివేలకో ట్లెలమిఁ;
జెలువంబుగా నింద్రజిత్తువాకిటను - బలవంతు లుందురు పదివేలకోట్లు;
ఘనులైన యాయతికాయాదివీర - దనుజులవాకిళ్ళఁ దరలకుండుదురు;
ఎన్నికతో మఱి యినకులాధీశ! - యెన్నరా దాసేన యెంతయు ఘనము
వాసవాంతకులావు వర్ణింపఁదరమె? - యీసునఁ గైలాస మెత్తినవాఁడు,
వనజజుం డతనికి వర మిచ్చినాఁడు - దనుజులచేత గంధర్వులచేత
నమరులచేత నయ్యక్షులచేత - సమరంబులోపలఁ జావు లేకుండ
సమరంబు లేల? యేచందంబులందు - సమయింపరాదు రాక్షసలోకనాథు;
నతఁడు మీచేతన యనిఁ జచ్చుఁ గాని - క్షితినాథ! యితరులచే నసాధ్యుండు;740
కుంభకర్ణుండు చేకొనఁడు చీరికిని - జంభారినైనను సమరంబులోన
నెత్తినమదమున నెఱుఁగఁ డేభయము; - చిత్తంబులో నింద్రజి త్తనువాఁడు
హరునకుఁ బ్రియముగా యాగంబుఁ జేసి - వరశక్తిఁ బడసెను వజ్రకవచము
నరుదుగా మాయావియై విల్లు వట్టి - యరుల నాకాశంబునందుండి గెలుచు

నతిసత్త్వధనుఁడు ప్రహస్తుఁ డన్వాఁడు - చతురుండు రావణసైన్యపాలకుఁడు
ఖండేందుధరుచెలికానిసామంతు - భండనంబున మాణిభద్రుని నోర్చె;
దనుజవీరులు మహోదరమహాపార్శ్వు - లనువారు నతికాయుఁ డనువాఁడు దేవ!
బలిమి గైకొనిన దిక్పాలుర నైన - గెలుతురు రణమున గిట్టిన యపుడె;
యనిమిషకంటకు లైనబల్లిదులు - దనుజేశునకు లక్షతనయులు దేవ!
జ్ఞాతులతో బంధుసమితి లెక్కింప - ధాతకు నైనను దరముగా దధిప!750
యరయఁ గుబేరాదు లరిగాపు అన్న - విరచింపవచ్చునె? విభవంబు కొలఁది
నెత్తుట మెదడున నెట్టనఁ దనిసి - మత్తులై సంగరోన్మత్తులై చాల
నద టెక్కినట్టిమహాదైత్యవరులు - పదివేలకోటులు బలియు లుండుదురు;
వారిలావునఁ జేసి వసుమతీనాథ! - యారావణుఁడు గెల్చె నఖిలదిక్కులను”
అనవుడు రాఘవుం డతనితో ననియె - "విను విభీషణ! మున్ను విన్నాఁడ నేను;
మీయన్న యెంతయు మిక్కిలిబంటు - పాయక యాతని బలము నట్టిదయ
వాఁ డెంతవాఁడైన వచ్చి నాయెదుర - వాఁడిమి వాటింప వాఁ డెంతవాఁడు?
హరిహరబ్రహ్మాదు లాదిగాఁ గల్గు - సుర లడ్డగించినఁ జూర్ణంబు చేసి,
వానిఁ జంపుదు ని న్నవశ్యంబు లంకఁ - బూని యేలింతు నిమ్ముల దానవేశ!”
యనిన విభీషణుం డారాముఁ జూచి - వినయంబుతో మ్రొక్కి విభున కిట్లనియె.760
"నీరావణుం డెంత? యీలంక యెంత? - శ్రీరామ! నీబాణశిఖి పర్వునపుడు
లంకకోటలు ద్రోసి లగ్గలు పట్టి - కిన్కతో నసురుల గిట్టినయపుడు
నాలావు చూడుము నరనాథచంద్ర! - కాలాగ్నిరుద్రునిగతిఁ బేర్చువాఁడ,"
ననవుడుఁ బతి వాని నాలింగనంబు ఘనముగాఁజేసి లక్ష్మణునకు ననియె.
“నీసముద్రమునీట నినజుండు నీవు - భూసురాశీర్వాదపుణ్యనాదములఁ

శ్రీరాముఁడు విభీషణునకు లంకాభిషేకము సేయుట

గట్టుము వేగ లంకారాజ్యమునకుఁ - బట్టంబు వానికిఁ బ్రతి విభీషణుని"
అని యానతిచ్చిన నతఁడును నతని - వననిధిజలములు వనచరు ల్దేర
నభిషేక మొనరించి యసురుల కెల్లఁ - బ్రభుఁడవు గమ్మని పట్టంబు గట్టి
తలపోయ నాచంద్రతారార్కముగను - సలలితంబుగ రామచంద్రునికీర్తి
యెంతకాలము గల్గు నిల విభీషణుఁడ!- యంతకాలంబు రాజ్యము సేయు" మనుచు770
నార్చె వానరకోటి హర్షించి యంతఁ - బేర్చి రాఘవుఁడు విభీషణుఁ జూచి
"యీయబ్ధి దాఁటంగ నేయుపాయంబు - సేయుద” మనవుడుఁ జేతులు మొగిచి
"యీవార్ధిఁ గట్టక యింద్రాదులకును - దేవ! యెమ్మెయి దాఁటఁ దీరదు కాన
నిది గట్టుటకు నైన నినకులాధీశ! - పదిలంబుగా వార్ధిఁ బ్రార్థింపవలయు."
నని పల్కుచుండంగ నట దశగ్రీవు - ననుమతి శార్దూలుఁ డనుదూత వచ్చి,

కపిసేనకొలఁదియుఁ గపులమాటలను - గపులతో నాడు రాఘవునిమాటలను
అరసి క్రమ్మఱఁ జని యసురేశుఁ గాంచి - కరములు మొగిచి నిక్కము విన్నవించె.
“నుత్తుంగయశులును నుత్తుంగభుజులు - నుత్తుంగసత్త్వులు నుత్తుంగమతులు
నగురామలక్ష్మణు లలవుమై విడిసి - రగచరసేనతో నబ్ధితీరమున
గణుతింప నగు నుడుగణముల నైన - గణుతింపఁ దగు వృష్టికణముల నైన780
గణుతింప నగు నబ్ధికరడుల నైన - గణుతింపఁగా రాదు కపిసేనసంఖ్య
నుచిత మీవేళ సామోపాయమునకుఁ - బచరింపఁ బంపు నేర్పరు లైనవారి”
ననవుడు శార్దూలుఁ డనువానిమాట - విని శుకునకు దైత్యవిభుఁ డర్థిఁ బలికెఁ
జని నీవు వానరసైన్యంబుఁ జొచ్చి - యినసూనుతోఁ బ్రియం బేర్పడఁ బలికి
పగలేమిఁ దెలిపి యాభానునందనుని - మగుడించి రమ్ము సమ్మతి లెమ్ము పొమ్ము."
అనవుడు నతఁ డేగి యర్కజుఁ గాంచి - యనియె రావణుచెప్పినంతయుఁ దెలియ
"వైరంబు సేయ రావణుతోడ నీకుఁ - గారణం బేమి? యర్కజ నాకుఁ జెపుమ
వాలి మీయన్నన వలవదు వినుఁడు - వాలికి నీకును వైరంబు గలదు
వాలి యాదానవేశ్వరు పగవాఁడు - చాల రావణుతోడి సంధి నీ కొప్పు
రావణుం డీరామురామఁ దెచ్చుటకు - నీ విటు రాఁదగునే? కపిరాజ!790
యనిఁ గుబేరుని గెల్చి యతనిపుష్పకము - గొనినరావణు నెఱుఁగుట లెస్స గాదె?
అట్టేల హరునితో నయ్యద్రి యెత్తి - నట్టిరావణుఁ డల్పుఁడా? కపిరాజ!
దేవేంద్రుఁ డాదిగా దివిజుల నెల్ల - నావిధంబున గెల్వఁడా? వానరేంద్ర!
కొలఁది మీఱిన హోమగుండంబులందుఁ - దలలు ఖండించి యుద్ధతగతి వ్రేల్చి
జలరుహసంభవుఁ జాల మెప్పించి - వెలయంగఁ త్రైలోక్యవిజయంబు గొనఁడె?
హీనమానవుతోడ నేటిసఖ్యంబు? - దానవేశ్వరుతోడఁ దగఁ జేయు సంధి"
యనవుడుఁ గోపించి యగచరు లెల్ల - వినువీథి కెగయుచు వెస వానిఁ బట్టి
బెడిదంబుగాఁ బెక్కుపిడికిళ్ళఁ బొడిచి - కడుమీఱి మసగి రెక్కలు ద్రెవ్వఁ గొట్టి
ముక్కును జెవులును మొగిఁ గోసివైచి - యొక్కటఁ గడఁగిన నుదరి రాఘవుఁడు
“దూత నేటికి నింత దొసఁగులఁ బెట్టఁ - బ్రాతిగా వీని నేపక పోవనిండు."800
అనవుడు రాఘవునాజ్ఞకు నులికి - వనచరు లందఱు వాని విడ్చుటయు
వినువీథి కెగసి యావినువీథినుండి - యినసూతితో శుకుం డేర్పడఁ బలికె.
"రావణుతోఁ గపిరాజ। యేమందు" - నావుడుఁ దారాధినాథుండు గినిసి
"తా నెంచ ద్రోహి యీధరణీశ్వరునకుఁ - గాన నాద్రోహిని గని సైఁప ననుము
సొరిది నేలోకంబుఁ జొచ్చిన నైనఁ - బొరిగొందుఁ గాని యేఁ బోవనీ ననుము
పటుకార్ముకంబె యూపంబుగా నిలిపి - చటులాస్త్రములు పరిస్తరణము ల్సేసి
పరఁగఁ గెంధూళ్ళను బ్రభలుగాఁ జేసి - తరుచరస్రుక్స్రువతతులు చేపట్టి

సమరభూవేదికాస్థలమున నిలిచి - యమరుల కెల్లఁ బ్రియం బెక్కుచుండఁ
గర మొప్ప వీరాంకములఁ బెల్లుబ్బి - తొరఁగుచు నున్న నెత్తురు నెయ్యి వోసి
మహితగుణధ్వనుల్ మంత్రము ల్గాఁగ - బహురాక్షసశ్రేణి పశుకోటి గాఁగఁ810
దనరిన విరహనాదంబులపేర్మి - యనిమిషావలికి నాహ్వానంబు గాఁగఁ
విడువని కాహళవితతులమ్రోఁత - కడునింపుగా సామగానంబు గాఁగ
ఘన మైన రామలక్ష్మణులకోపంబు - మునుకొని నాకోపమును మండుచుండ
ననుపమాగ్నిత్రయంబై యుండ నందుఁ - దనదుప్రాణముల నత్తఱి నాహుతులుగ
రణమునఁ దనవీరరస మడంచుటయు - బ్రణుతింపఁగా సోమపానంబు గాఁగఁ
బ్రకటరాక్షసవీరపశుపలలములు - సకలభూతవ్రాతసంతృప్తు లెసఁగ
విడువక సంగ్రామవిపులయజ్ఞంబు - గడునొప్పఁ జేయు రాఘవసోమయాజి
యటుగాక మున్నె సీతాంగనఁ దెచ్చి - యిట యిచ్చి బ్రదుకుట యిది బుద్ధి యనుము"
అని పేర్చి సుగ్రీవుఁ డాడువాక్యములు - విని శుకచారుండు వేగంబె పోయి
యంత నావృత్తాంత మారావణునకు - మంతనంబునఁ జెప్పె మఱి రాముఁ డిచట820
వనధితీరంబున వనదర్భశయ్య - యొనరించి తాత్పర్య మొప్పారుచుండ
నమృతపయోధిలో నహిశయ్యమీఁద - నమలచిత్తంబున నానంద మంది
మున్నున్న తనయాదిమూర్తిచందమున - నన్నరనాయకుం డతికౌతుకమున
నవరత్నకటకమండనమండితంబు - వివిధోర్మికామణివిపులరావంబు
నుర్వీతనూజామృదూపధానంబు- గర్వితాహితభిదాకాలదండంబు
ఘోరప్రతాపకుంకుమచర్చితంబు - సారంగమదలేపసంవాసితంబు

శ్రీరాములు దర్భశయనము సేయుట

నిరతమహాదాననిపుణతానకము - ధరణీభరణధుర్యతాసమం బగుచుఁ
బొలుపొందు దక్షిణభుజశాఖ దాన - తలగడగాఁ జేసి ధరణీశ్వరుండు
ఏవిధంబున నైన నిటు దాఁటి పోవఁ - ద్రోవ నా కిమ్మని తోయధి ననుచు
రామభూవరుఁడు వారక నుపవాసి - యై మూఁడుదివసంబు లటు శయనించి830
తెలిడెందమున జలదేవత నిలిపి - పలుమఱు నిష్ఠతోఁ బ్రార్థనఁ జేసె,
"కడ గానరాని నీకడిఁదిచిత్తంబుఁ - బడయుటకై యేను బడియున్నవాఁడ
నీ కేను మాన్యుండ నీరధి వేగ - నా కిమ్ము త్రోవ యానాకారిఁ జంప”
నని వేఁడుకొనుటయు నారామునెదురఁ - దనరారి యంతకంతకుఁ బొంగి పొంగి
తోరంపుఁదెరలఁ జేతులు విచ్చి విచ్చి - బోరన నురువుతెల్పున నవ్వి నవ్వి
ఘనమీనరుచినాలుకలు గ్రోసి క్రోసి - చనుమ్రోఁత నట్టహాసము చేసి చేసి
తుది నిరుదిక్కులతోఁ జెప్పి చెప్పి - కదిసినసుళ్ల వక్రతఁ జూపి చూపి
యుదధి యారాముని నొక్కింత గొనఁడ - యది యట్టిదయె కాదె యారసి చూడ

జడుఁ డైనవాఁడు దుర్జనుఁ డైనవాఁడు - కడుఁగ్రూరజీవసంగతి నుండువాఁడు
మలుగక తనలోన మండెడువాఁడు - కులగోత్రమైనఁ జేకొని మ్రింగువాఁడు840
నెదురెంత వేఁడిన నెఱుఁగునే పెద్ద - వదరుచు నంతంత వడి నుబ్బుఁగాక!
కదియంగ వచ్చుచోఁ గడిఁదిచిత్తంబు - చెదరంగ విషము పైఁ జిలికించుఁ గాక!
నడనీక తనప్రార్థనంబు గైకొనక - జడధి వొంగినఁ జూచి జానకీవిభుఁడు
నిడుదకన్నులక్రేవ నిప్పులు రాల - ముడివడి బొమలు గ్రమ్ముచుఁ గోప మెసఁగ
జలధిదిక్కును మఱి సౌమిత్రిదిక్కుఁ - బలుమాఱుఁ జూచుచుఁ బలికె భూవిభుఁడు.
"వీనిగర్వము గంటివే? లక్ష్మణుండ! - నే నెంత వేఁడిన నింతఁ గైకొనక
పొడచూపకున్నాఁడు పొడచూపకున్నఁ - బొడ వడఁగింపక పోనేల యిత్తు?
నెడపక క్రోలియు నింకింపలేని - బడబానలంబె నాబాణానలంబు
అటు చూచుఁ గాక! నాయస్త్రంబు కొలఁది - పటుతరమకరసర్పములు మీనములు
గండకంబులు కూర్మకర్కటంబులును - మండూకముల నీరుమానిసుల్ పశువు 850
లురవడి నొండొంటి నొరయంగఁ బాఱి - కెరలెడి తిమితిమింగిలతద్గిలములు
దండిరాక్షసులును దఱుచు నెగళ్లు - కొండలు మునదూరుకొని రూపుమాపి
పరఁగుచునున్న నాబాణాగ్నిశిఖల - నెరసిన తనలోని యెమ్ములో యనఁగ
జలములఁ గప్పి యాజలచరకోటి - మెలఁగుట మాన్పించి మీఁదఁ దేలించి
చిప్పలు గుల్లలు చిక్కంగఁ దన్నఁ - నిప్పుడు ధూళిగా నింకించువాఁడ
సిరితండ్రి యని పెద్దఁ జేసితిఁ గాని - హరిమామ యనుచుఁ బాలార్చితిఁ గాని
యిందుకుఁ దను వేఁడ నేటికి నాకుఁ - బొం దెఱుంగక తేర్చి పొంగెడుజలధి
న న్నశక్తునిగా మనంబునం దలఁచి - యిన్నిచందంబుల నేఁచె సౌమిత్రి!
తే విల్లు నమ్ములుఁ దెగి పొంగియున్న - యీవార్ధి నాచేత నింకుటఁ జూడు
వనధిలో జగములు వడిఁ జూఱఁ బుత్తు" - ననుచు రాఘవుఁడు వి ల్లందుమాత్రమున860
బలభేది వణఁకె, దిగ్భాగంబు పగిలె - జలధులు గలఁగె, నాశాకరు లడఁగె.
ధారణి గ్రుంగె, భూధరములు గూలె - నీరజాసనుఁడును నివ్వెఱగందె,
చుక్కలు డుల్లె, శేషుండు భీతిల్లె - దిక్కులు ద్రెళ్లె, నద్దివి యొడ్డగిల్లె,
నినకులాధీశ్వరుం డేపు దీపించి - వినుతులు శోభిల్ల వి ల్లెక్కుపెట్టి
సమవర్తి సంవర్తసమయదండంబు - సమమైనవాని నుజ్జ్వలమైనవానిఁ
బ్రళయకాలానలప్రభ నొప్పువాని - విలయోగ్రచండాంశువిధమైనవాని
సాయకంబులు పెక్కు సంధించి పేర్చి - తోయధిలోపలఁ దొడరి యేయుటయుఁ
కడఁకఁ బొంగితి నన్ను గరుణింపు మనుచుఁ - జెడక వారిధి యోరసిల్లెడుమాడ్కిఁ
గడు మ్రోసి పర్వతాకారంబు లగుచు - గడువేఁగఁ దరఁగ లాకస మప్పళించె
బలితంపురామభూపాలునిబాణ - ములు పెక్కు నాఁట సముద్రునినోట870

"క్రమ్మెడులాలలకైవడి నురువు - లమ్మహావీచులయందుఁ బెల్లెసఁగి
సొరిది నేలోకంబుఁ జొత్తు నన్మాడ్కి - ధరియింప రాక యెంతయుఁ దల్లడిల్లె
జలనిధి యుదక మాస్వాదింప వచ్చి - మలుగక రామాస్త్రమహిమకు నులికి
మొగుళులు మగిడి వెమ్ముచుఁ బోవుభంగిఁ - బొగ లెడఁద్రవ్వక పొరిపొరి నెగసె
నొఱయుచు రాక్షసు లొఱలుటఁ జూపు - తెఱఁగున నొఱలె నెంతే జంతుసమితి
మనుకులవల్లభు మార్గణవహ్ని - తునుకసొచ్చిన సముద్రునిచిత్తవృత్తి
ఘనతరం బగు నహంకారాదు లెల్లఁ - బెలుపేది నిలువక పెడఁబాయుకరణి
దైతేయులెల్లఁ బాతాళంబు విడిచి - భీతిల్లి పాఱిరి పెక్కుదిక్కులకుఁ
దనచేతి నింకక తనరినవార్ధి - ననయంబు నింకింతు నని వచ్చుచున్న
యినకులబాణాగ్ని కెదురుగా వచ్చి - యనువుగా నాలింగనము చేసె ననఁగ880
నుడుగ కంతయు వడి నొడఁగూడి లోని - బడబాగ్ని వారిధిపై మండఁ జొచ్చె.
నప్పుడు లక్ష్మణుం డంతకుభంగి - నుప్పొంగి రౌద్రసంయుక్తుఁడై యున్న
యన్నచందముఁ జూచి యళుకుచు వచ్చి - మున్నీటి కెడసొచ్చి మోడ్పుఁగే లమర
“మానవేశ్వర! యిది మథనంబు సేయ - రాని కాలునివీరరసవార్ధి గాదు
మానవేశ్వర! యిది మథనంబు సేయ - రాని రుద్రునిరోషరసవార్ధి గాదు
ఈనీరు నిబ్భంగి నెఱయింపఁ దొడఁగె - మాన కిప్పుడు నీదుమార్గణవహ్ని
వెలికి నేతెంచి దిగ్వతతితోఁ గూడఁ - గలయ లోకం బెల్లఁ గాల్చునో తగదు .
సర్వజగద్ధితచరితంబుఁ బూని - యుర్వీశ! యీకోప ముపసంహరింపు
నీకోపమునకు నీనీరధి యెంత? - తే కార్ముకం బింకఁ దెగఁగొన కధిప!"
యని విల్లు పట్టిన నతఁ డీక కోప - మినుమడింపఁగఁ గను లెఱుపును బొంది890
యంబకం బేల? నాయంబకంబులనె - యంబుధి నింకింతు ననినచందమునఁ
గ్రూరదృష్టులఁ గనుఁగొని యౌడు గఱచి - “యోరీ సముద్రుండ యోడవు నాకు;
నీనీరు నింకించి నీయందుఁ గలుగు - వాని నన్నింటిని వడి నీఱుఁ జేసి
భర్జింతు నీ వింక బంటవై నిలువు - దుర్జనత్వమునను దొడరి నాయెదుట

శ్రీరాములు సముద్రునిపై బ్రహ్మాస్త్ర మేయుట

యిదె తొడిగెద బాణ మే నారి ననుచు - నదలించి యపుడు బ్రహ్మాస్త్రంబు దొడుగ
బ్రహ్మయు నింద్రుండు భ్రమఁ గానరైరి - బ్రహ్మాండ మెల్లను బగిలిన ట్లయ్యె,
భువనంబులెల్లను బొగిలిన ట్లయ్యె - భువనత్రయములోని భూతంబు లఱచెఁ,
గలయంగ దిశలఁ జీఁక ట్లగలించె - వెలుఁగవు రవిచంద్రవిపులబింబములు
అశనులు వడియె మహానీల మడరె - నశరీరి యొఱలె మధ్యాగ్నులు నెగసె
నుడుగక యొకమ్రోఁత యూరక మ్రోసె - జడధి యప్పుడు గ్రాహసమితియు దానుఁ900
బొం గెల్ల నెక్కడఁ బోయెనో యనఁగఁ - దుంగసేనము లెందుఁ దూలెనో యనఁగఁ

బటుఘోష మెమ్మెయిఁ బాసెనో యనఁగఁ - జటులోగ్రవిష మెందు సమసెనో యనఁగఁ
బెంపెల్ల నెక్కడఁ బెట్టెనో యనఁగ - సొంపెల్ల నెక్కడఁ జొచ్చెనో యనఁగఁ
భంగంబు లేకయుఁ బరికించి చూడ - భంగంబునకుఁ దాన పట్టనం బరఁగి
సత్త్వంబు చెడియు నాశ్చర్యంబు గాఁగ - సత్త్వసమగ్రుఁడై చలనంబు నొంది
భ్రమణంబు లేకయు భ్రమణంబు నొంది - యమితవేగంబున నధికత దక్కి
యారాముచేతి బ్రహ్మాస్త్రంబు దనకు - బీరంబు చెడి వచ్చి బిందువై యుండె.
వరమునఁ బెరుఁగు రావణుమస్తకములు - కర మరుదార నొక్కటఁ ద్రుంచుకొఱకుఁ
గడఁగి రాఘవుఁ డంపగమి నాఁడినేయఁ - బడబాగ్ని నిడి నీటఁ బడ నిడుకరణిఁ
జింతింప దేవ! నాజీవనం బెంత - యింతియ కా కని యిబ్భంగి మఱియు910
నాసముద్రుం డిప్పు డఖిలంబు చూడ - భాసురరత్నప్రభాయుక్తుఁ డగుచుఁ
బ్రజ్వరిల్లెడు పెనుపడఁగలతోడ - నుజ్వలదహికోటి యొక్కటఁ గొలువ
గంగాదినదు లెల్లఁ గడఁకతో నడువ - మంగళబహుపుష్పమాలిక ల్మెఱయఁ
దలకొని జలచరతతు లోలి నడువ - జలనిధి సనుదెంచి సాష్టాంగ మెఱఁగి
కరపద్మములు మోడ్చి కడుసంభ్రమమున - నరవరాగ్రణికి సన్నుతి విన్నవించె.
"నేను మీయలుకకు నెంతటి వాఁడ? - భూనాథ! నీ వాదిపురుషో త్తముఁడవు
వాయుభూజలనభోవహ్ను లాదిగను - నీయాజ్ఞలోనివి నిక్కువం బరయ
నీయందు నున్నవానికి లెక్కలేవు - నీయధీనంబులు నిఖిలలోకములు
తప్పు సేసితి నని దండింపవలదు - చెప్పు మేపనియైనఁ జేసెదఁ గాని,"
యని విన్నపము సేయ నంత నారాముఁ - గనుఁగొని యప్పుడు గంగాదినదులు920
ధర శిరములు మ్రోవ దండము ల్వెట్టి - కరములు ఫాలభాగంబునఁ జేర్చి
"శరణార్థులము రామ! జగదభిరామ! - కరుణింపవే మము కరుణాసముద్ర!
యభయంబు వేఁడెద మయ్య! యిందఱము - నభినవంబుగను నీయబ్ధీశుఁ గాచి
శుభతరమంగళసూత్రము ల్నిలుపు - త్రిభువనాధీశ్వర! దీనమందార!
యపరాధిఁ గాచుట యదియె నీగుణము - కృపఁ జూచి రక్షించు గీర్వాణవంద్య!
నీమహిమల నెంచ నేరవు శ్రుతులు - నే మెంతవారమే? యిట మిమ్మఁ బొగడ
దేవతామయుఁడవు దేవదేవుఁడవు - కావను బ్రోవను గర్తవు నీవ;
భూమీశ! లోకేశ! భూరిప్రకాశ! - భూమిజాహృదయేశ! పుణ్యస్వరూప!"
యని యిట్లు నదు లెల్ల నభినుతుల్ సేయ - విని యప్పు దారామవిభుఁడు వారలను
మన్నించి భయమెల్ల మానుఁ డటన్న - నన్నరనాథున కబ్ధి యిట్లనియె.930
“సరసిజోదర! మౌనిజననుతచరణ! - శరణాగతార్తరక్షక! దివ్యమూర్తి!
తరుచరసేన యుద్ధతి నేగునపుడు - కరిమకరాదులఁ గదలంగ నీను
ఉప్పొంగి కయ్యల కొత్తి బెల్విరిసి - తప్పింప నమ్మారుతముఁ జూచి మ్రోయఁ

గడలేక మిగుల నగాధమై యుండు - సుడి వొడమింప నాసొంపు వాటింప
నలరి సేతువుఁ గట్టి యైనను నడుపు - మలఘువిక్రమ! యూర కైనను నడుపు”
మనిన రాఘవుఁ డమోఘాస్ర మబ్ధీశు - పనుపున మరుభూమిపైఁ బ్రయోగింప
విలసిల్లు నయ్యంపవేఁడిమిచేత - సొలవ కందులనీరు శోషింపఁజేసి
యామరుభూమి కుదాత్తుఁడై సర్వ - కామసమగ్రంబుగా వరం బిచ్చె,
నది మరుదేశమై యంతనుండియును - వదలక యమ్మాడ్కి వర్తించుచుండె
మగుడంగఁ జనుదెంచె మనుజేశుశరము - తగ నబ్ధి పూర్వవిధంబున నుండె.940
నప్పు డంభోనిధి యనియె రామునకు - నుప్పొంగునయమున నొప్పువాక్యముల
"మీతండ్రి దశరథమేదినీశ్వరుఁడు - దైతేయదేవయుద్ధమునఁ బెంపొంది
న న్నయోధ్యకుఁ గొని నరనాథ! పోయి - మన్నించి యప్పుడు మగుడ వీడ్కొలిపి
పుత్తేర వచ్చితి భూతలాధీశ! - యిత్తెఱంగున మీకు నేఁ దక్కినాఁడ,
దొరకొని కట్టు సేతువు రాఘవేంద్ర! - తరుచరసేన నుద్ధతి నడపింపు."

శ్రీరాములు సుగ్రీవునితో సేతువు గట్ట నాజ్ఞాపించుట

మనవుడు రఘురాముఁ డర్కజుఁ జూచి - పనుపు సేతువు గట్టఁ బ్లవగపుంగవుల
రయమున నప్పుడు రవినందనుండు - ప్రియమునఁ బంచె వారిధిఁ గట్టుఁ డనుచుఁ
జని రంగదుండును జాంబవంతుండు - ఘనులైన యనిలజగజగవాక్షులును
పనసుండు నలుఁడును పావకనేత్రుఁ - డును గంధమాదనుండును గవయుండు
కరమొప్ప నీలుఁడు ఘనుఁడు తారుండు - శరభుండు ఋషభుండు శతబలి బలుఁడు950
హరిరోమవక్షుండు నట సుషేణుండు - సొరిదిఁ గేసరియును జ్యోతిర్ముఖుండు
దధిముఖుండును వేగదర్శియు మఱియు - నధికులు కపిసైనికాధిపు లెల్ల
మ్రాఁకులు గొండలు మల్లటి గొనఁగ - వీఁకతోఁ గొనివచ్చి విషధిలో వైవ
నొకటియు నీటిపై నుండక మునుఁగ - వికలురై కపులెల్ల వెఱగంది వచ్చి.
పతికిఁ జెప్పుటయు భూపతి యాత్మలోన - నతివిస్మయం బంది యబ్ధి కిట్లనియె.
"నిది యేమి? కపివరు లిబ్భంగిఁ దెచ్చి - వదలక తరులు పర్వతములు వైవ
నొకటియు నీఁటిపై నునికి లే” దనిన - సకలాధిపతికి నాజలధి యిట్లనియెఁ
"బరమేశ! వినుము లోపలి కవి వోవఁ - బొరిపొరి జలచరంబులు మింగె నవియు
నమరంగ శతయోజనాయతం బగుచు - దిమి యనుమత్స్యంబు దిరుగు నాలోన
మ్రింగు నామీను దిమింగిలంబోటి - మ్రింగు నామత్స్యంబు మిగులఁ దగ్గిలము960
ఇటువలె నొండొంటి నెఱ గొనుచుండుఁ - జటులసత్వంబు లసంఖ్యముల్ దేవ”
యన విని "యట్టి మహాంబుధిఁ గట్ట - ననువేది? చెప్పవే యబ్ధీశ!" యనుడు
“నినకులాధీశ్వర! యీనలుఁ బనుపు - ఘనుఁడైన యీవిశ్వకర్మనందనుఁడు
భానుకులేశ! యుపాయజ్ఞుఁ డితఁడు - దా నంతయును దమతండ్రిచే నేర్చె.

వడి వానిచేఁ దప్ప వననిధిఁ బట్టు - వడ దది యెట్లన్న? వసుధేశ! వినుము
శిశువేళ వింధ్యాద్రిచేరువ నడవిఁ - బశుకణ్వుఁ డనుమునిపజ్జ నాడుచును
ముని యనుష్ఠాన మిమ్ములఁ జేయఁబోవ - మునివేల్పులను బట్టి మోరతోపునను
వనధిలోపలఁ బాఱవై చే నీనలుఁడు - చనుదెంచి యమ్ముని చయ్యన నెఱిఁగి
చాలంగఁ గోపించి శప్తుఁ గావింప - బాలుండు తగఁ డని పరఁగఁ జింతించి
తనసొమ్ము పోకుండఁ దాఁ దెచ్చుటకును - ననువుఁ జింతించి యాయర్భకుఁ జూచి970
తనతపోమహిమ నత్తాపసోత్తముఁడు - ఘనతరం బగు నొక్కకట్టడ సేసె.
నీయబ్ధిలోపల నేతృణంబైనఁ - బాయక వీఁ డేమి పట్టి వైచినను
అవి దేలుగా కని యవ్వరం బియ్య - నవి యంతలోఁ దేల నతఁడు గైకొనియె.
నదిగాక దేలెడు నతనిచే గిరులు - వదలక నేఁ గట్టువడియెద నిపుడు
ధరణీశ! యీవారిఁ దగఁ గట్టు నంత - కురుభక్తిమైఁ గొల్చి యుండెద నలుని
రప్పింపు" మనవుడు రఘుకులోత్తముఁడు - రప్పించి యత్యాదరంబునఁ జూచి
“యోవనచరరాయ! యోమహావీర! - నీవిక్రమం బెల్ల నీరధి సెప్పెఁ
గాన నీ విపు డబ్ధిఁ గడఁకతోడుతను - బూనికఁ గపులచేఁ బొంకంబు మీఱఁ
దరుగిరు లందఱు తార తెచ్చెదరు - వెరవొప్ప నసదృశవిద్య యేర్పడఁగఁ
గట్టు మంథోరాశిఁ గడఁకతో నీవు - నెట్టన నీలావు నేర్పున మెఱసి"980
యనవుడు గరయుగం బర్థితో మొగిచి - వినయంబుతో రామవిభునకు ననియె,
నుర్విపై నే నిట నుదయమొందుటకు - నుర్వీశ! కలిగెఁ బ్రయోజనం బిపుడు
దేవ! యీజలధి బంధించెదఁ బనుపు - మావెర వెల్లను మాతండ్రిచేత
ధారణీతలనాథ! తగనేర్చినాఁడ - నారయ దేవరయానతిఁ జేసి
నానేర్పు మీయొద్ద నరనాథ! చెప్పఁ - గానేల? యిపుడు సాగరము బంధించి,
చెచ్చెర దేవరచిత్తంబు వడసి - మెచ్చించువాఁడ నమ్మికఁ బంపు" మనుడు
నలినాప్తకులమణి నలునిఁ బంపుటయు - నలునితోఁగూడ వానరసేన లెల్ల
నేలయు నింగియు నిఖిలదిక్కులును - వాలినయూర్పుల వ్రయ్యఁజేయుచును
ఆయతశైలవృక్షావళి వైచి - తోయధిఁ గట్ట నుద్యోగించి రపుడు
రామచంద్రుండను రాజు గణేశు - దా మదిలోపలఁ దలఁచి మ్రొక్కుచును990
అరయోజనం బైన యద్రి సుగ్రీవుఁ - డురవడిఁ గొనివచ్చి యుర్వర వగులఁ
గలయంగ దేవతాగణములు వొగడ - నలవునఁ దొలితొలి నలుచేతి కిచ్చి
దొరకొని నలుఁడును దోయధియందు - వెరవార నిలిపె నవ్విపులశైలంబు
తనిచేయు సేతుబంధమునకు రాము - ననుపమకీర్తికి నావిభీషణుని
వినుతపట్టమునకు విశదప్రభాతిఁ - దనరారు శాసనస్తంభంబుమాడ్కి
నంత వానరవీరు లాశావితాన - మంతయుఁ దారయై యద్రులుఁ దరులు

నవలీలఁ బెఱుకుచు నవి దెచ్చి నలువ - కవసరోచితముగా నంది యిచ్చుచును
ఒకకొండపై నుండి యొకకొండపైకిఁ - బ్రకటజవంబు లొప్పంగ దాఁటుచును
గెరలుచు నొకకొన్నిగిరు లెత్తి కొన్ని - గిరులఁ గ్రిందలఁ బెల్లగిల్లవైచుచును
గొండలు తల నెత్తి గునిసియాడుచును - దెం డని కొందరఁ దిట్టనవ్వుచును1000
గొండపైఁ గొండ, యాకొండపైఁ గొండ - నొండొండ డొల్లక యుండఁబేర్చుచును
నిమ్ముల గిరు లంది యిరుచేతులందు - నిమ్మపండులమాడ్కి నెగరవైచుచును
నొకడు కొండల మోచి యురవడి నడువ - నొక డది పడఁద్రోచి యుబ్బి యార్చుచును
దాఁటి యాకొండ లుద్దండతఁ బట్టి - మీటుదునా నీవు మెచ్చంగ ననుచు
నీతరు లీగిరు లింత వేగిరమె - త్రోతునా నలునియొద్దకుఁ బాఱ నిపుడు
అని బాస లిచ్చుచు నగ్గించుకొనుచు - వనచరు లిబ్భంగి వడిఁ దెచ్చి తెచ్చి
తరువులు నగములు తగ నిచ్చుచుండ - దొరకొని నలుఁడు సేతువు గట్టఁదొడఁగె.
ముందటిచందాన మునుఁగక యుండె - నం దొక్కటైన నయ్యంబుధిలోన
నట్టిచందంబున నాకపికోటి - గట్టెను గటకటా కష్టజీవనము
గలిగె నా కని మది గలఁగెడుమాడ్కిఁ - గలయ నంభోరాశి గలఁగె నెంతయును
నలుఁడు నిమ్మెయిఁ బదునాల్గుయోజనము - లలవడఁ దొలినాఁడె యబ్ధి బంధించె
నంత సూర్యుఁడు గ్రుంక నాసేతువునకు - నెంతయు బలుకాపు లిడి వలీముఖులు
వచ్చి వేలముల నివాసస్థలములఁ - జొచ్చి యెంతేనియు సొంపుతో నుండఁ

చంద్రోదయవర్ణనము

గృతకృత్యుఁ డగు రాము కీర్తిపుష్పములు - చతురతమై వెదచల్లినయట్లు
కరమొప్పఁ జుక్కలు గాన్పించెనంతఁ - జిరకాలములసీమ శిశువులమామ
పొలుపొందుకలువల పోరానివిందు - కలసిన జక్కవకవఁ బాపుమందు
పాలవెల్లిని ద్రచ్చి పడసిన వెన్న - శూలి యౌదలపూవు చుక్కల నవ్వు
నెరిచకోరములకు నెలనెలపంట - యురువేది విరహుల నుడికించుమంట
గగనంబుతొడవు దొంగలగుండెదిగులు - నొగి నబ్ధిఁ బొంకించు నూరటపట్టి
హరిహరబ్రహ్మల యానందదృష్టి - సరసిజరిపుఁడైన చంద్రుఁడు వొడిచె.1020
నినుపారి కలశాంబునిధి వెల్లివిరిసె - ననఁగ వెన్నెల పర్వె నట నిద్రలేక
“యెన్నం డొకో సేతు వేము గట్టెదము? - ఎన్నం డొకో లంక యేము సూచెదము?
ఎన్నం డొకో దానవేంద్రుండుఁ గూలు? - నెన్నం డొకో సీత యీరాముఁ గూడు?
నెప్పుడు వేగునో యీరేయి యింక? - నప్పుడు వచ్చితి మాత్మలో సొలసి;
యేల వచ్చితిమి రే యెల్ల నందుండి - యోలి సేతువుఁ గట్టుచుండక మనము"
అనుచు నవ్వానరు లందఱు నట్లు - మనమునఁ జింతించి మక్కువల్ దక్కి
యారేయి గడపి సంధ్యాదులు దీర్చి - చారుతరంబుగా సకలవానరులు

నొండొరుఁ జీరుచు నుత్సాహ మొప్ప - నొండొరుఁ గడువంగ నురవడితోడ
బృథివీధరంబులు పృథివీజములును - బృథులసత్వంబునఁ బెఱికి యేతెంచి
యంబుధిలో వైవ నపుడు సుగ్రీవుఁ - డంబరవీథికి నరిగి వేగమున1030
వెరవారఁగాఁ బట్టి వింధ్యాద్రిశిఖర - మరయోజనము నిడువైనది విఱిచి
యాసుషేణునిచేతి కందిచ్చుటయును - నాసుషేణుం డిచ్చె నానలుచేతఁ
దారాతనూజుండు దర్దురశైల- మారూఢగతిఁ దెచ్చి యబ్ధిలో వైచె
మలయాద్రిశృంగంబు మ్రాఁకులతోడ - నలునకు నీలుఁ డున్నతగతి నిచ్చె
ద్వివిదుండు మైందుండు దెచ్చి యావార్ధి - గవగూడి వైచిరి గ్రావంబు లెత్తి
గజుఁడు గవాక్షుండు గంధమాదనుఁడు - భుజబలాఢ్యుఁడు శరభుండును గవయుల
డిలఁ జలియింప మహేందాద్రి శిఖర - ములు దెచ్చి వై చిరి మున్నీటిలోన
నవి యెల్ల మునుఁగక యావేళ నలుఁడు - తవిలి యంబుధిఁ గట్టఁ దరుచరు లిట్లు
ప్రకటించి తెచ్చు పర్వతములు దరులు - నొకకేల నంది పయోనిధియందు
నునుపంగఁ గనుఁగొని యుగ్రకోపమున - గనలుచుఁ బలిమిమైఁ గరువలిసుతుఁడు1040
చయ్యన నేడుయోజనముల కొండ - నయ్యెడఁ గొనితేర నది రాముఁ డెఱిఁగి
యనయంబు నిరుగేల నంద ననుజ్ఞ - యొనరింప నట్లని యొనరించె నలుఁడు.
అప్పుడు కపిసేన యార్పులమ్రోఁత - యుప్పొంగి వారాశి యుబ్బెడుమ్రోఁత,
తరుగిరు లొండొంటిఁ దాఁకుడుమ్రోఁత - తరుచరు లొండొరు ల్తగఁ బిల్చుమ్రోఁత.
కుదిసి భూతంబులు ఘోషించుమ్రోఁత - వదలి దిగ్గజములు వాపోవుమ్రోఁత,
కడునగ్గలంబుగా గగనంబు ముట్టఁ - నుడుగక పెల్లైన యురవు చింతింప
బృందారకాసురబృందంబు లెత్తి - మందరగిరి యెత్తి మథియించునాఁటి
యమృతాబ్ధిమ్రోఁతయో యనఁగ నామ్రోఁత - కమలభవాండదిక్తటమును నిండె
నంతట మధ్యాహ్న మైన వానరులు - శాంతిఁ బుచ్చుటకు వృక్షంబులు చేరి
పలుతెఱంగుల మంచిఫలములు నమలి - నెలవులఁ జల్లని నీ ళ్ళొప్పఁ ద్రావి1050
నీడల నొక్కింత నిలిచి క్రమ్మఱను - వేడుక రెట్టింప వేలంబు మిగుల
నాకొండ లెత్తితే నరుగుండు కొంద - ఱీకొండలను వేగ నెత్తి తెం డనుచు
పెక్కైనతరువులు పెక్కైనగిరులు - పెక్కుమొత్తంబులై పెక్కునఁ దెచ్చి
యూరక నలునకు నొప్పించువారు - వారిధిలోపల వైచెడువారు;
నట నెదురేగి పెల్లందుకొన్వారు - నిటఁ దెచ్చి చేరువ నిడియెడివారు
నలుఁ డందుకొనఁగ వానరు లంది యొసఁగ - బలుతరుగిరులు నిబ్భంగి మర్నాఁడు
ఆసేతు విరువదియాఱుయోజనము - లీసున బంధింప నినుఁ డస్తమించె.
నప్పుడు సుగ్రీవుఁ డాదిగాఁ గపులు - చెప్పి రప్పను లెల్ల శ్రీరాముతోడఁ
జెప్పి వేలమునకుఁ జెచ్చెర నేగి - యొప్పెడుసుఖనిద్ర నుండి యారాత్రి

గడపుటయును రేపకడ వలీముఖులు - వడి నందఱును గూడి వారిధిఁ గట్ట1060
నే మేమె తెచ్చెద మెల్లభూజముల - నే మేమె తెచ్చెద మెల్లకొండలను
నని పాఱి తరువులు నద్రులుఁ దెచ్చి - వనధిలోపలఁ బడవైచెడివారు
కొంద ఱంతయుఁ గనుఁగొనుచుండువారు - కొందఱు నీడలఁ గూర్చుండువారు
కొందఱు సేతువు గొలపెట్టువారు - కొందఱు నిద్రలఁ గూర్కెడువారు
కొందఱు తెలినీరు గ్రోలెడివారు - నందఱు నీక్రియ నలసులై యుండ
నప్పుడు రవి చంద్రుఁడై తను వొసఁగె - నప్పు డింద్రుఁడు నించె నమృతంపువాన
యప్పుడు చల్లఁగా ననిలుండు వీచె - నప్పుడు సౌరభం బానంద మొసఁగెఁ
దరుచరులంత నుత్సాహులై శైల - తరువు లంబుధి మహోద్ధతిఁ దెచ్చి వైవ
నారభసంబున కతిభీతి నొంది - వారిధిలోన జీవంబు లన్నియును
దెరలుచు నొరలుచు దిరుఁగఁ బాఱుచును - నెఱియుచు నటఁ దల లెత్తి చూచుచును1070
ముందటిపగిది నమోఘబాణంబు - మ్రందింప వచ్చునో మ మ్మెల్ల ననుచు
దలఁచి యంతటిలోనఁ దగిలినభీతిఁ - దెలిసి సేతువుగట్టు తెఱఁగు నా నెఱిఁగి
మఱి సంతసంబులు మదిలోనఁ గలిగి - వఱలు నిజేచ్ఛల వర్తించుచుండెఁ
బంధురంబుగఁ గపిపతులు నాఁ డబ్ధిఁ - బంధించి రెలమి నేఁబదియోజనములు
రవి గ్రుంకె నంత మర్కటనాథులెల్ల - నవిరళలీల సంధ్యలు వార్చి రంతఁ
బంతంబు మెఱయంగఁ "బదియోజనంబు - లింతియ గట్టుట యెల్లి యీజలధి"
నని మాటలాడుచు నరిగి వేలముల - ననుపమలీల నిద్రానంద మొంది
యుదయావసరమున నుర్వీశుఁ జేరి - ముదమునఁ గపిరాజముఖ్యులు మొక్కి
పని విన్నపము చేసి పరవసం బొప్పఁ - జని తరువులు మహాశైలంబు లెత్తి
యనుపమలీలమై నలి శీఘ్రవృత్తిఁ - గొనివచ్చి నలునకుఁ గొమ్మని యొసఁగ1080

శ్రీరాములు ఉడుతభక్తిని జూచి సంతోషించుట

నప్పుడు శ్రీరాముఁ డాసేతు వెల్లఁ - దప్పక గనుఁగొనుతాత్పర్య మొప్ప
వనధీశ్వరుండును వనచరాధిపుఁడు - దనుజనాయకుఁడును దనుఁ జేరి కొల్వ
సౌమిత్రికరముపై సౌభాగ్యలీల - వామహస్తముఁ జేర్చి వడిఁ గట్ట మీఁద
సన్నపుదరహాసచంద్రికల్ వొలయ - నన్నరనాయకుం డటఁ జూచువేళఁ
దరుచరేశ్వరు లెల్లఁ దరువులు గిరులు - బిరుదులై వడిఁ బేర్చి పెకలించి తెచ్చి
నలుచేతి కొసఁగ నానలుఁ డవి పుచ్చి - తలకొని కట్ట నాతఱి యొక్కయుడుత
గొబ్బున పేతువు గొనసాగవలయు - నిబ్బలియులకుఁ దో డేనె గావింతు
ననుచు శ్రీరాముని యడుగుఁదామరలు - మనమునఁ జేర్చి యమ్మనుజేశు నెదుర
నచ్చపుభక్తితో నల వార్ధి మునిఁగి - వచ్చి తా నిసుకలో వడిఁ బొరలాడి
తడయక చనుదెంచి తనమేనియిసుక - వడిఁ గట్టపై రాల్చి వనధిలో మునిగి1090

తేలి గట్టున కేగి తిరుగంగఁ బొరలి - వాలినభక్తితో వచ్చి విదుల్చె.
నివ్విధంబున నుండ నినకులాధిపుఁడు - దవ్వులఁ బొడఁగాంచి తమ్మునిఁ జూచి
"పొందుగా లక్ష్మణ! పొర్లదే చూడు - ముందఱ నొకతరుమూషకం బెలమి
నామీఁద భక్తి యున్నతగతిఁ బూని - తా మేను జలములఁ దడిపి గట్టునకుఁ
జని వేగ నిసుకపైఁ జల్లాడి తిరుగఁ - జనుదెంచి కొండలసందున రాల్చి
కర మొప్పుచున్నది కపికులాధీశు - లురుశక్తిఁ దరుగిరు లొగిఁ దెచ్చుచోటఁ
దా నెంత యని మది దలఁపక ప్రేమఁ - బూని సహాయమై పొదలుచున్నదియు
కనుగొంటివే” యనఁ “గమలాప్తవంశ! - కనుగొంటి భవదంఘ్రికమలయుగ్మమును
నెవ్వఁడు మది నిల్పి యెసఁగుఁ దృణంబు - నవ్వేల్పు గిరిఁ బోలు ననినఁ గాకున్నె?
కావున భక్తియ కారణం బనఘ!" యనవుడు ముదమంది నలినాప్తసుతునిఁ1100
గనుఁగొని “మఱి దానిఁ గనుఁగొనువేడ్కఁ - బెనఁగొనుచున్నది ప్రేమ నిచ్చటికిఁ
దె”మ్మన్న వేగంబె దెచ్చి సుగ్రీవుఁ - డమ్మహాత్మునిచేతి కంది యిచ్చుటయుఁ
బలుదెఱంగులఁ జాలఁ బ్రస్తుతిఁ జేసి - కలితదక్షిణకరాగ్రమున దువ్వుటయు
నల యుడుతకు వెన్క నమరెఁ ద్రిరేఖ - చులుకనై చూడ్కులు సుఖకరంబుగను
నెంతయు సంతోష మినుమడింపంగ - నంత లక్ష్మణుఁడును నబ్ధినాయకుఁడు
దనుజేశ్వరుండును దరుచరాధిపులు - ననయంబు సంతోష మతిశయింపంగ
నందందఁ గైకొని యలరుచు నుండఁ - జందనమందారచంపకక్రముక
పున్నాగసహకారభూరుహప్రతతు - లున్నచో విడిపించె నుర్వీశుఁ డంత
హనుమదంగదనీలహరిరోమకుముద - పనసాదివానరప్రముఖులు గూడి

శ్రీరామాదులు సేతువును జూచి సంతసించుట

కనుఁగొన నాశ్చర్యకర మైనయట్టి - ఘనతరంబైన యాకట్టపై నిలిచి1110
"బాపురే! యెంత నేర్పరియొకో! నలుఁడు - రూపింపఁ బెద్దయు రూఢికి నెక్కి
యరుగు దీర్చినమాడ్కి నలవడఁ దీర్చె - దొరకొని సేతువు దుదిదాఁక” ననుచుఁ
దనబాహుబలమునఁ దనవిద్యకలిమి - ఘనమైనసేతువు గట్టె నీనలుఁడు.
అది శతయోజనం బైనట్టినిడుపు - పదియోజనంబుల పరపును గలిగి
వెలసిన మలయసువేలాచలముల - నొలసి యెంతయుఁ జూడ నొప్పు వహించి
మెలఁగి యాడెడు గండుమీల మైరుచులు - వెలిగెడుచుక్కలవిధమున నుండ
నిరుదెస నల్లనై యేపారు నబ్ధి - కరమొప్పుచున్న యాకాశంబు గాఁగఁ
గలయంగ దీపించె ఘనసేతు వపుడు - వెలసిన నక్షత్రవీథిచందమునఁ
దను నట్టు గాంచిన తనపేర్మిఁ జూచి - తనరార మన్నింపఁదగు నని రామ
విభుఁ డాసముద్రుని వేడుకతోడ - నభయపట్టము గట్టె నన మించి మఱియు1120
నప్పుడు దేవత లామింటనుండి - యప్పౌరుషముఁ గన్నులారంగఁ జూచి

"నిక్కంబు నిట్టిద నీచు మృదూక్తి - జక్క నేలగు? దండసాధ్యుండు గాక
యటు వేఁడుకొనుటయు నబ్ధిఁ గైకొనమి - నిటుసేయ నేరఁడే యినకులేశ్వరుఁడ?
చేకొని యెవ్వఁ డీసేతువుఁ జూచుఁ - జేకొని యెవ్వఁ డీసేతువుఁ దలఁచు
నతనికి విజయంబు నతులకీర్తియును - వితతపుణ్యంబులు వేవేగఁ గలుగు
నెంతకాలం బేని నీసేతు వుండు - నెంతకాలం బేని నీయబ్ధి యుండు
నెంతకాలము రాఘవేశ్వరుకీర్తి - యంతంత కెక్కుచు నానంద మొసఁగు”
నని మదిలోపల హర్షించుకొనుచుఁ - దనువునఁ బులకలు తఱుచుగా నెగయఁ
బువ్వులవానలు పొరిఁ బొరిఁ గురిసి - రవ్వేళ దేవతూర్యంబులు మ్రోయ
నప్పుడు రఘురాముఁ డానంద మొంది - యొప్పుసేతువుఁ జూచి యొనర నిట్లనియె.1130
"నెలమితో నీసేతు వెల్లకాలంబు - నలుపేర సేతువు నానొప్పుఁ గాత!"
అనుటయు రఘురామునానతి నలునిఁ - గనుఁగొని పొగడిరి కపివీరు లెల్ల
ముదముతో నపుడు సముద్రుండు రాము - సదనంబునకు సైన్యసహితంబు గాఁగఁ
బొలుపారఁ దోడ్కొని పోయి దివ్యాస్త్ర - ములును దివ్యాంబరములు భూషణములు
నొకవజ్రకవచంబు నురుభక్తి నిచ్చి - యకలంకచిత్తుఁడై యారాముఁ జూచి
“రామభూపాలక! రాజపుత్రులకు - నీమునివేషంబు లేల యుద్ధములఁ?
జారువస్త్రములు భూషణములు నిపుడు - మీరు ధరింపుఁ డిమ్మెయి నుచితంబు”
అనవుడు దివ్యాంబరాభరణంబు - లనుపమగంధమాల్యాదులు దాల్చి
చారుతేజముల భాస్వరమూర్తు - లగుచు నారవిచంద్రులో యన వెలుంగుచును
వననిధి యపుడు దీవనలతో ననుప - ననిలజనీలుర యంసంబు లెక్కి1140
సకలదేవతలును సమ్మతి సేయ - సకలలోకంబులు జయపెట్టుచుండ
సకలతరంగిణీశ్వరు వీడుకొలిపి - సకలేశ్వరుం డనుజన్ముండుఁ దాను
రమణీయ మైనట్టి రాక్షసలక్ష్మి - సీమంతవీథిపైఁ జెలఁగెడుమాడ్కి
మునుకొని లంకాభిముఖుఁడు నై నడిచె - ఘనమైన సేతుమార్గంబున వేడ్కఁ
దగ విభీషణుఁడు గదాహస్తుఁ డగుచు - మొగిఁ గపిసేనకు ముందఱు నడిచెఁ
దనమంత్రులును దాను దర్పంబు మెఱసి - వినుతవిక్రముఁడు సువేలాద్రి నుండె
మిగుల మొత్తంబులై మిన్నంది యంది - నగచరసేనలు నడువంగఁ జొచ్చె
వడిఁగొని సేతుక్రేవల వచ్చువారు - విడువక త్రోవల వెస వచ్చువారు
వేడుకతో వినువీథిఁ జన్వారు - నాడ కాడకు గుములై యేగువారు
దోయధిలోన నీదుచు వచ్చువారుఁ - బాయలుగాఁ గూడ పఱుగిడువారు1150
నప్పుడు సేనల యార్పులమ్రోఁత - యుప్పొంగి వారాశి యురుఘోష మడఁచె
దివియుఁ బాతాళంబు దిక్కులు భువియు - నవిరళగతిచేత నల్లలనాడఁ
గడునొప్ప సేతువుఁ గడచి యిబ్భంగి - విడిసె రాఘవుఁడు సువేలాద్రియందుఁ

శ్రీరాములు సువేలాద్రి చేరుట

దడయక వనచరదళము లేతెంచు - కడుసంభ్రమముఁ జూచి ఘనధనుర్ఘోష
మడరింప బ్రహ్మాండ మనిసిన ట్లయ్యె - నుడువీథి జుక్కలు నురలె మ్రోయుచును.
బెడిదంబుగా భూమి బెగడొంది యడరె - నుడుకారి వైదేహి యుల్లంబు చెలఁగె
ఖండపరశు శిరఃకంపఁబుఁ జేసె - దండి రాక్షసు లెల్లఁ దల్లడపడిరి
చారులచే రామజననాథు రాక - యారావణుఁడు విని యఖిలరాక్షసుల
బిలిపించి నవరత్నపీఠంబునందుఁ - గొలువుండె నసురులు గొలువఁ బెక్కండ్రు
అంత నావృత్తాంత మంతయు నెఱిఁగి - చింతించి కైకేశి చిడిముడితోడ1160
వంత గుందుచు మాల్యవంతునిఁ బిలిచి - యెంతయుఁ బొగలుచు ననియె నాతనికి
"అలఘువిక్రమశీలుఁ డారామవిభుఁడు - చలమున వానరసైన్యంబుతోడ
విడిసెను వేలాద్రి విను మింక లంక - చెడును దప్పదు బ్రహ్మశివులు గాచినను
బదుఁ డింక మనము నప్పఙ్క్తికంఠునికి - విదితంబుగా సీత విడు మని బుద్ధి
చెప్పి వత్తము నీతి శీఘ్రంబ యిపుడు - చెప్పిన మనబుద్ధి చెవి యాని వినునె?
యైనను తలిదండ్రు లైనట్టివారు - తనయుండు ధర్మంబు దప్పి నడిచినను
దగ బుద్ధి సెప్పుట తగవు ధర్మంబు - లగు నంచుఁ జెప్పుదు ననఘాత్మ! బుధులు
విను మున్నె నాకు నావిశ్రవసుండు - వినిపించె నంతయు విశదంబు గాఁగ”
ననుచు దేవరహస్య మతనికిఁ జెప్ప - విని మాల్యవంతుండు వెఱగంది కూఁతుఁ
గనుఁగొని "యది యట్ల కా కేల పోవు? - మనబుద్ది వినఁ డని మానంగరాదు1170
అమ్మ! నీవును నేను నద్దశాస్యునకు - నిమ్మహామంత్రంబు లిన్నియుఁ దెలియఁ
జెప్పుదు మనము మీస్థితిగతు లెల్ల - నిప్పుడె గదలుద మిది వేళ గాన
వలనొప్ప నావిశ్రవసునియాపలుకు - దలగ బ్రహ్మాదులు దప్పింపలేరు;
చెప్పుము నీవు నేర్చిననీతు లెల్ల - నొప్పుగ" ననవుడు నువిద యాక్షణమె
పసిఁడిపల్లకిమీఁదఁ బరఁగఁ గూర్చుండి - యసముతో నచ్చరయతివలు మోయ
ధవళాంబరంబులు తగునట్లు గట్టి - ధవళచామరములు ధవళమాల్యములు
ధవళగంధంబులు ధవళాక్షతములు - ధవళభూషణములు తలకొని ప్రేమ
నవిరళంబుగఁ దాల్చి యతివైభవమునఁ - దవిలి దివ్యాంగనాతతి వెంట నడువ
సుతభృత్యహితబంధుసోదరుల్ నడువ - వ్రతధర్మగుణచారువర్తనుల్ నడువ
శ్రుతిపాఠతంత్రులు సూనృతోన్నతులు - వ్రతధర్మగుణచారువర్తనుల్ నడువఁ1180
గిన్నరగంధర్వగీర్వాణసిద్ధ - పన్నగాసురయక్షభామలు నడువ
వంకృతి యను మాల్యవంతునివనిత - సంకృతి యనుమాలి సతి కేతుమతియు
మానినియైన సుమాలియింతియును - దానవాంగనలు గొందఱు వెంట నడువ
ముగ్గురుతల్లులు ముందఱ వెనుక - డగ్గరి నడువంగ ధవళచామరలు

గరుడగంధర్వాదికాంతలు వీవ - నరుగుచో నాట్యంబు లచ్చరల్ సేయ
బంధురంబుగ మిత్రభ్రాత లైనట్టి - బంధుజనంబులు బలిమితో నడువ
యూపాక్షుఁ డతికాయుఁ డొగి విరూపాక్షుఁ - డేపున ముందఱ నేచి తో నడువ
ముదుకకుప్పసములు ముదముతోఁ దొడిఁగి - ముదిసినరాక్షసముగ్ధలు నడువ
సందడి జడియంగ సాహో యటంచు - ముందఱ ఫణిహారముఖ్యులు నడువ
గురుతరబహువేదఘోషంబుతోడ - సరి లేని యాబ్రహ్మసభతోడఁ గదిలి1190
చంద్రదీధితులతో శారదాదేవి - యింద్రుమందిరమున కేతెంచుకరణి
మందారచంద్రికామల్లికాశ్వేత - కందలహిమశైలకర్పూరహార
చందనగోక్షీరశరదిందురుచుల - నందమై విలసిల్లు నభినవస్ఫురణ
మందాకినీదేవి మఱి దివినుండి - బృందారకులు దాను పృథివి కేతెంచి
విలసిల్లువిధమున వీక్షింప నొప్పెఁ - గలితనవీనమై కైకేశికొలువు
వరరత్నమణిగణవలయంబు లెలమిఁ - గర మొప్ప ముత్యాలకంఠహారములు
వెఱవొప్పఁ దనమేన విలసిల్ల నమరి - మెఱుపులఁ దగుశుభ్రమేఘమో యనఁగ
దీపించు దేదీప్యతేజంబు గాగ - నేపారి యంతయు నిభములు నడువఁ
బ్రబలనీలాంబుదపటలంబుభంగి - నిబిడమై రాక్షసనిచయంబు నడువ
రథిసింధుఘోటకరాజిసైన్యములు - పృథివి బీటలు వాఱఁ బెల్లుగా నడువ1200
వనజోదరునిపుత్రి వాహినుల్ గొలువ - నెనయంగ నజుసభ కేతెంచె ననఁగ!
నమృతవారిధి వొంగి యఖిలదిక్కులకు - విమలమై యటు వెల్లివిరిసెనో యనఁగ
నరిది నక్షత్రంబు లన్నియు వచ్చి - గురిగాఁగ నొకచోటఁ గూడెనో యనఁగ
నుదధిముత్యము లెల్ల నొక్కటై వచ్చి - పొదిగొని లంకలోఁ బొడమెనో యనఁగ
దిగ్గని వెన్నలదీవియో యనఁగ - · నిగ్గైనగొడుగులనిచయంబు మెఱయ
నిబ్భంగి నప్పు డయ్యింద్రారిసభకుఁ - బ్రాభవస్పురణమైఁ బరఁగ నేతేర
విభవశుభాచారవినుతులు చెలఁగ - శుభలీలఁ గైకేశిఁ జూచి రావణుఁడు
ముదముతో గద్దియ మొగి డిగ్గి వచ్చి - ముదితకు నందంద మ్రొక్కి కైదండ
ప్రమదంబుతో నిచ్చి పల్లకి డించి - యమరారిఁ గొనివచ్చి యాస్థానమునకు
దనభద్రపీఠంబు దరియఁగ నొక్క - కనకాసనం బిడి కైకేశి యందుఁ1210
గూర్చుండఁ దల్లులఁ గూర్మిసోదరులఁ - గూర్చినభక్తితోఁ గూర్చుండుఁ డనఁగ
నంతరాంతరముల నందఱు నంత - నంతంతఁ గూర్చుండి రర్హపీఠముల
నంత నాకైకేసి యనుమతిఁ జేసి - చింతామణీభద్రసింహాసనమున
దానవేంద్రుండును దత్ప్రకారమున - నూనినసంతోష మొప్పఁ గూర్చుండి
యచలితమతిమంతు నమ్మాల్యవంతు- నుచితాసనంబున నుండంగఁ బనిచి
యావేళ రావణుం డమరవల్లభువి - భావంబు గైకొని భాసిల్లుచుండె

నలయు మ్రోఁతయు లేని యంబుధికరణి - యల బలం బుడిగె నాయసురేశుకొలువు
ఆలోన నమరారి హస్తము ల్మొగిచి - కైలాసనిభకేశి కైకేశి కనియె,
"జనయిత్రి యిబ్భంగి జననులతోడ - నెనయంగ నాసభ కెన్నఁడు రావు
చాలంగ నామది సంతోష మయ్యె - నేల విచ్చేసితి? వెఱిఁగింపు" మనిన1220
నప్పుడు కైకసి యమ్మాల్యవంతుఁ - దప్పక కనుఁగొని తగునీతి మెఱసి
ప్రాభవస్ఫురణాఢ్యుఁ బఙ్క్తికంధరుని - శోభనగుణశీలఁ జూచి యిట్లనియెఁ.

కైకేశి రావణునకు హితము సెప్పుట

"దెలియంగ మీతండ్రి దివ్యరహస్య - మెలమిఁ జెప్పినవార్త లెఱిఁగింతు వినుము
సురలు బ్రహ్మాదులు సొరిదిమై మునులుఁ - దరగనిభీతిచే దనుజారిఁ జేరి
తమతమయిడుమలఁ దమపాటు లెల్ల - దానవాంతకుతోడఁ దా మొప్పఁ జెప్పి
రావణకుంభకర్ణాదిరాక్షసుల - నేవగ నైనను నేపడఁగించి
కావవే దీనులఁ గరుణచే ననుచుఁ - గమలజాసనుఁ డాదిగా సుర లెల్ల
నభయదానము వేఁడ నతికృపాంభోధి - యభయంబు లిచ్చె నయ్యమరుల నెల్ల
నినకులంబున జనియించి రాక్షసుల - ననిలోనఁ దునియెద నవలీల ననుచు1230
వర మిచ్చి సకలదేవతల వీక్షించి - తరుచరులై మీరు ధరణి జన్మించి
యనిలోన నాకుఁ దో డగుఁ డని పలికె - నని చెప్పె మీతండ్రి యారీతి నిప్పు
డమరులు వానరులై పుట్టి రెలమి - నమరకంటక నిన్ను నణఁప శ్రీహరియు
వనజసంభవుఁ డిచ్చువరముఁ బాలించి - యినకులంబునఁ బుట్టె నిందఱుఁ బొగడఁ
జెనటి తాటకిఁ జంపెఁ జిన్ననాఁ డేచి - మునియాగరక్షణంబును జేసి కాచె,
పదధూళిచే ఱాయి పడఁతిఁ గావించె - వదలక జనకభూవరువీటిలోన
నరు దరు దని జనం బభినుతి సేయ - హరువిల్లు మోపెట్టి యవలీల విఱచి
జనకభూపతితనూజను బెండ్లియాడి - మొనచిన పరశురాముని భంగపఱచి
తమతండ్రిపనుపునఁ దపసియై మునుల - కమితసత్త్వంబున నభయంబు లిచ్చె
ఘను విరాధుఁ గబంధుఁ గడువిక్రమమున - దునుమాడి విడువఁడే దోషాచరేంద్ర!
వెఱపు చెప్పుట కాదు వేయుభంగులను - వెఱవ కుండితి వేని వేఱేల నీదు1240
చెలియలి ముక్కును జెవులును బట్టి - బలిమిఁ గోసిననాఁడె పగ గెల్వరాదె?
ఘనఖరదూషణు ఖండించుమాట - విని యూరకుండుట వెఱచుట గాదె?
మారీచు నొకకోల మడియించునాఁడు - నూరకె యొకవంక నొరిగితి వీవు
రామునిముందఱ రమణిఁ దేలేక - యేమఱుపాటున నెలనాఁగఁ గొంచు
వెనువెన్కఁ జూచుచు వెలవెల నగుచు - నెన లేని భీతిచే నెలమిఁ బాఱుచును
వచ్చితి గాక భూవరుల జయించి - వచ్చితివా? యోడి వచ్చితి గాక!
సచ్చరిత్రను రామచంద్రునిదేవి - మ్రుచ్చిలి తెచ్చుట మొగతనం బగునె

వాలంబునను జుట్టి వారిధి ముంచు - వాలిఁ ద్రుంచుట నిన్ను వంచుట కాదె?
యిన్ని యెన్నఁగ నేల? యినకులేశ్వరుఁడు - మున్నీరు నొకకోల మొనకుఁ దేలేదె?
నేఁ డోడితే రామనృపశేఖరునకు? - నాఁ డోడితివి గాదె? నాకేశవైరి!1250
మాటిమాటికి బేల మనుజు లటంచు - నేఁటికి నాడెన వెంతయు నేచి?
ఘనతపోమహిమచేఁ గరుణించి నీకు - వనజభవుఁడు మెచ్చి వర మిచ్చువేళ
నరుల నెన్నక యున్న నాఁటిత ప్పెల్లఁ - దరమిడి నేఁ డిదే తలకూడె నీకు;
గెలు పేది యిఁక నీకు గీర్వాణవైరి - చలమునఁ గుల మెల్ల సమయింతుగాక!
యేటి కిన్నియు నెంచ నిపు డొక్కకోఁతి - దాఁటి సముద్రం బుదగ్రుఁడై పేర్చి
లంకలోపలఁ జొచ్చి లంక శోధించి - లంకిణిఁ బరిమార్చి లలి శంకలేక
జానకిఁ బొడఁగాంచి జననాథుసేమ - మూనినభక్తితో నొనరంగఁ జెప్పి
మరలిపోవుచు నీదు మధువనం బెల్లఁ - బెరికి కావలికాండ్రఁ బెక్కండ్రఁ జంపి
యక్షకుమారుతో నసురాధిపతులు - నక్షణంబున నెంద ఱైనను త్రుంచి
బలిమి నట్లన యుండి పచరించి మఱియు - బలమరి లంకను భస్మంబుఁ జేసి1260
యావిమానములేక యసురేశ! దివికిఁ - బోవఁగా సురవరుల్ పొరిఁ బొరి నగరె?
యింత సేసియు మఱి యిటఁ బట్టువడెనె? - యెంతయు నెదురులే కేర్చి పెల్లార్చి
నీవును నీవారు నెరిచెడి చూడఁ - బోవఁడె యల వాయుపుత్రుండు తొల్త?
గురుసత్వమున నిన్ను గొనిపోయి రామ - ధరణీశుముందటఁ దటుకునఁ బెట్టి
తెచ్చితిఁ బొమ్మన్న దేవేంద్రవైరి - యచ్చట నీసత్త్వ మది యేమి సేయు?
నటుగాక యీలంక నగలించి పట్టి - తటుకున ధరణిపై దాఁటించె నేనిఁ?
జిందరవందరై చెదరి పల్వగల - నందఱు ద్రుంగరె? యమరు లుప్పొంగ
నతనికి నోడితి వసురాధినాథ! - యతనియేలిక గెల్వ నలవియే నీకు?
వనచరు లని కదా వ్రాలుచున్నావు - వనచరులను గెల్వ వశమె ము న్వినుము
వనచరుచేఁ జేటు వచ్చుఁ బొ మ్మనుచు - గొనకొని నంది దాఁ గోపించి నీకుఁ1270
బాయ కిచ్చిన శాపఫల మెల్ల నీవ - వాయుపుత్రునిచేత వాలిచేఁ గనవె?
ఫాలాక్షవాసవబ్రహ్మాదిదివిజు - లీలీల దైత్యారి యిష్టంబు నొంది
నీలంకయును నిన్ను నిఖిలరాక్షసుల - గూలఁద్రోయుటకునై ఘోరరూపముల
భూలోకమున వచ్చి పుట్టిరి కాక - యీలాగు వనచరు లెందైనఁ గలరె?
యలఘుబలుండవై యఖిలలోకములఁ - జలముపెంపున గెల్చి చనుదెంచునపుడు
కిన్నరగంధర్వకింపురుషాది - పన్నగగుహ్యకపక్షీంద్రయక్ష
సురవరమునివరసుదతుల నెల్ల - బిరబిరఁ జెఱలను బెట్టెడువేళఁ
బరమపతివ్రత ల్వడవడ వణఁకి - పరకాంతనెపమున భస్మమై నీవు
కులముతో బలముతోఁ గూలిపొ మ్మనుచు - నలిగి శాపం బిచ్చి రది తలకూడె;

వాలికి నెక్కు డవ్వాలినందనుఁడు - వాలికి నెక్కు డవ్వాయుపుత్రుండు1280
వారునిన్ రణములో వధియింపలేరె? - వారికి నెక్కు డవ్వాలితమ్ముఁడును
సమరంబునను బలసహితంబు గాఁగ - సౌమిత్రి నినుఁ బట్టి సమయింపలేఁడె?
మఱి యొక్కటియు విను మనుజాశనేంద్ర - యరయంగ నీ వింక నెఱుఁగవు గాని,
రామలక్ష్మణు లేల రవిసూమఁ డేల - కోమలి యాసీత కోపానలంబె
యరుదుగా బ్రహ్మరుద్రాదిదేవతలు - వరదులై యిచ్చిన వరములతోడ
హరుఁ డొసంగిన చంద్రహాసంబుతోడ - నరయు మూడరకోటియాయువుతోడఁ
గైలాస మెత్తిన ఘనశక్తితోడఁ - జలనంబు లేనట్టి సంపదతోడఁ
దక్కనిభుజబలదర్పంబుతోడ - దిక్కులు గెలిచిన తేజంబుతోడ
రాక్షసకులముతో రావణ నిన్ను - నీక్షణంబునఁ బట్టి యెరియింపలేదె?
ధర్మపతివ్రతఁ దగ దన కీవు - కర్మపాశంబునఁ గైకొని తెచ్చి1290
యఱిముఱి చెఱపట్టి యాపుణ్యవతిని - మొఱిఁగిన సంకటమునఁ బుట్టువహ్ని
నిన్ను నీకులమును నీవారి నెల్ల - నెన్నిభంగులఁ గాల్ప కేల పోనిచ్చు?
నసురేశ యిది యెట్టి దనినను వినుము - విడువక నీవు దిగ్విజయంబు చేసి
యకలంకగతి పూని యమరుల గెల్చి - సకలలోకంబులఁ జరియించునపుడు
ప్రథమయుగంబున బ్రహ్మర్షివరుఁడు - ప్రథితోరుసుజ్ఞానపరమార్థవిదుఁడు
పరమసాత్త్వికగుణాస్పదకుశధ్వజుని - వరపుత్రి యగు వేదవతియును దలఁపఁ
బరమపతివ్రత పాపాత్మ! నీదు - వరగర్వ మంతయు వమ్ముగాఁ జేసి
సుతులతో సతులతో సోదరప్రభృతి - హితులతో భృత్యసంహతులతోఁ గూడ
నమితవిక్రముఁ డైన నతనిచే నిన్ను - సమరంబులోపలఁ జంపింతు ననుచు
నరిమురిఁ గోపించి యాధర్మశీల - మరుగుచు శపియించె మఱచితే తొల్లి?1300
యాసతి యీసీత యైనశ్రీదేవి - భూసుత యై పుట్టె భువనరక్షకుఁడు
ఆదినారాయణుం డంబుజోదరుఁడు - వేదవేద్యుఁడు రామవిభుఁ డైనవాఁడు

కైకేశి రావణునకు రామునిమహిమ చెప్పుట

అసురుల మర్దింప నమరులఁ గావ - వసుమతి రక్షింప వచ్చె విష్ణుండు
ఎఱుఁగ నీవును నేను నెంతటివార? - మెఱుఁగరు బ్రహ్మరుద్రాదిదేవతలు(?)
పుట్టించుఁ బోషించుఁ బొలియించుఁ బిదప - నెట్టును గాక తా నేకమై యుండు
నతఁ డందఱికి మేటి యాతనితోడఁ - బ్రతిపోల్పఁదలఁచినఁ బాపంబు గాదె?
చెదరి లోకములెల్లఁ జెడినపిమ్మటను - వదలక యుండెడువాఁడు వో యతఁడు
శర ణన్న వేగ నాసామజవరునిఁ - గరుణ లీలామతిఁ గాచె నీఘనుఁడు;
మధుకైటభాదుల మహి రాక్షసులను - నధికతేజస్ఫూర్తి నణఁచె నీఘనుఁడు
సొచ్చి సోమకుఁ జంపి శ్రుతు లర్థితోడఁ - దెచ్చి బ్రహ్మకు నిచ్చి దీపించె నతఁడు1310

అమృతాబ్ధిఁ దాఁ ద్రచ్చి యమృతంబు వడసి - యమరులకును నిచ్చె నరయ నీఘనుఁడు
భాసురంబుగ దైత్యుఁ బట్టి శిక్షించి - భూసతి నెత్తిన పుణ్యుఁ డీఘనుఁడు
కడఁగి, బాలుని గావఁ గండానఁ బోడమి - తోడరి హిరణ్యాక్షుఁ దునిమె నీఘనుఁడు.
ధరణి మూఁడడుగులఁ దా నర్థి వేఁడి - పెరిఁగి యాబలిఁ జెరపెట్టె నీఘనుఁడు
రాజసంబున భృగురాముఁడై పుట్టి - రాజులఁ ద్రుంచిన రణదక్షుఁ డితఁడు
తప్పక చెప్పితి ద’నుజలోకేశ! - యిప్పుడు దేవతాహితము చింతించి
రాముఁడై జనియించె రవివంశమునను - దామసగుణ మేఁచి దనుజేశ! నీవు
ఏమి పాపమొ కాని, యెఱుక చొప్పడదు - కామాంధునకు ధర్మగతు లేల కలుగు?
గొడుకుచే నైనను గూఁతుచే నైన - నడరి కీర్తియ కాని యపకీర్తి గాని
వచ్చు గోత్రమునకు వడిఁ బెద్దలకును - జెచ్చెఱ నని జను ల్చెప్పెడి దెల్ల1320
నరయ నిందలు రెండు నసురేశ! చూడ - మఱి యేవ్వరికి వచ్చె మనకుఁ గా కిపుడు?
అది యెట్టి దంటేని నంతయు వినుము - మదిఁ గొంక దలఁపక మనశూర్పణఖయు
ఆయన పరమాత్ముఁ డనక కామించి - పోయి ముక్కును చెవు ల్పోకార్చుకొనియెఁ
బరసతి యన కాసపడి పట్టి తెచ్చి - కరకరిఁ గులమెల్లఁ గాల్చెద వీవు,
ఇంతకంటెను నింద యిఁక నెందుఁ గలదు? - పంక్తికంధర! యిట్టి పాపంబు లేల?
బలసి రజోరాజ్యప్రముఖు లందఱును - నెలమి విష్ణునితోడ నెదిరించె కాదె?
చక్రంబుఘాతకు సైరింపలేక - శుక్రశిష్యులు భువిఁ జొచ్చిరి వెఱచి
శంక లేటికి నీవు జన్మించువెనుక - గ్రుంకిన రాక్షసకుల మెల్ల నెగడె;
నని మనంబునఁ గొంత యలరుచుండంగ - దనుజేశ! తలఁపులు డలకూడ దయ్యెఁ;

కైకేశి రావణునికి జలప్రళయము దెల్పుట

జేకొని లోకముల్ చెడినపిమ్మటను - యేకమై యుదకంబు లేపారుచుండ1330
మక్కువ నాజులమధ్యంబులోన - నొక్కఁడై తనకుఁ దో డెవ్వరు లేక
బాలుఁడై యట వటపత్రముమీఁద - లోలతఁ దేలాడు లోకరక్షకుఁడు
కమనీయ మగు సృష్టికార్యంబునందు - విమలచిత్తంబున వెస నున్న నంతఁ
గమలోదరునినాభికమలంబు పుట్టెఁ - గమలంబులోఁ బుట్టుఁ గమలసంభవుఁడు
కమలాసనుఁడు సృష్టికార్యంబుకొఱకు - నమర నవబ్రహ్మ లనువారిఁ బడసె.
వరపుణ్యు లైనట్టి వారిలోపలను - బరమాత్ముఁ డయ్యె నాపౌలస్త్యవరుఁడు
గమలాప్తనిభునకు ఘనయశోనిధికి - విమలాత్ముఁడై పుట్టె విశ్రవసుండు
నరుదార జన్మించి తతనికి నీవు - పరికింప నాలవబ్రహ్మవు గావె?
బ్రహ్మసంతతి యేడ? పరదార లేడ? - ఇమ్మహాపాతక మిటు సేయు టేడ?
చేకొని లోకము ల్చెఱిచెద వీవు - లోకరక్షణగుణలోలురు వారు,1340
ధర్తఘాతకుఁడవై తనరుదు వీవు - నిర్మలధర్మైకనిపుణులు వారు,

మీఱి తాపసులను మ్రింగెద వీవు - వారు తాపసులను వడిఁ బ్రోతు రెపుడు,
చేరి పరస్త్రీలఁ జెఱుతువు నీవు - పరదారరక్షకు ల్పరికింప వారు
వేదబాహ్యుండవై విహరింతు వీవు - వేదార్థసత్కర్మవిహితులు వారు
ధర్మ మెక్కడ నుండుఁ దగిలి దైవంబు - నిర్మలస్థితితోడ నిలుచు నక్కడను,
ఎక్కడ దైవంబు లింపారుచుండు - నక్కడ విజయంబు లమరుచు నుండు.
వర మిచ్చి చెఱచిన వనజజుతోడ - నురగకంకణుతోడ నురగులతోడ
సురసిద్ధఖేచరు ల్సుముఖులై వచ్చి - యరిమురి నీకుఁగా నడ్డంబు నిలిచి
కాచిన నైనను గాకుత్స్థవంశుఁ - డేచిన నినుఁ జంప కేల పోనిచ్చు?
నొప్ప దొప్పదు చల మొప్పదు విడువు - తప్పక చెప్పితి దనుజలోకేశ!1350
వాలినవరగర్వవహ్నిలోపలను - నేల కాలెదు వడి యెంతయు నేచి?
బద్ధవైరము మాని పరికించి నాదు - బుద్ధి నిర్మలమగు బుద్ధిలోఁ గొనుము
తల్లిదండ్రులబుద్ధి దల మోచుధర్మ - వల్లభునకుఁ గీడు వచ్చునే తలఁపఁ?
దల్లి చెప్పినమాట తగ దన కీవు - ప్రల్లదంబుల మాని పరికించి వినుము
అక్షరుం డమృతుండు నఖిలరూపుండు - పక్షీంద్రవాహుఁడు పరమపావనుఁడు
మోక్ష మియ్యఁగఁజాలు మోహనమూర్తి - రక్షకుం డురుకీర్తి రణకర్కశుండు
ఆదినారాయణుం డమరులఁ బ్రోవ - మోదంబుతో మునిముఖ్యులఁ గావ
భూదేవిభారంబుఁ బుచ్చిపోవైవ - నాదశరథుని క ట్లమరి జన్మించె.
నేరాజు జలధుల నింకింపఁజాలు - నేరాజు హరువిల్లు నెలమి మోపెట్టి
తృణలీల విఱిచెను దివిజు లుప్పొంగ - గుణరత్నఘనఖని కోదండగురుఁడు1360
మనుకులాధీశుండు మాధవుం డరయ - నినవంశుదేవి యౌ నిందిరాదేవి
జగతీతనూజాత జగదేకమాత - నిగమసన్నుతపూత నిగమవిఖ్యాత
యమితగుణోపేత యైన యాసీతఁ - బ్రమదంబుతో నీతి పాటించి బుద్ధి
సకలభూషణమణిసహితంబు గాఁగ - సకలేశుఁ డగు రామచంద్రుఁ బ్రార్థించి
యిప్పుడె కొనిపోయి యెలమి రామునకు - నొప్పించి నీప్రాణ మొగిఁ గాచుకొనుము
తా నొరువరములు దప్పించుఁ గాని - తా నిచ్చువరములు దప్పింపలేఁడు,
గురుధర్మపోషణగుణు విభీషణుని - హరిభక్తితోషణు ననఘపోషణుని
సమరవిభీషణు సత్యతోషణునిఁ - గ్రమ మొప్పఁ గనుటయుఁ గడులెస్స నీకు;
నతిమృదుభాషణు నావిభీషణుని - నతివేగ ప్రార్థించి యతని రావించి
పరఁగ లంకారాజ్యపట్టంబు గట్టి - శర ణని మ్రొక్కుమా జననాయకునకు1370
శర ణన్న నెటువంటి చందంబునందు - గరుణతోఁ గాచు నాకరిఁ గాచురీతి”
నని పెక్కుభంగుల నధ్యాత్మవిద్య - ఘనమతి యైనట్టి కైకేశి తనకు
నిర్మలతరపుణ్యనీతిమార్గంబు - ధర్మతత్పరబుద్ధి దగిలి చెప్పినను

దలల కెల్లను బెద్దతల యైనయట్టి - తలతోడఁ గూడ నాతల లెల్ల వంచి
దండప్రణామంబుఁ దగ నాచరించి - నిండినభక్తితో నిలిచి రావణుఁడు
ఆసనత్సుతునిచే నట మున్ను విన్న - భాసురం బైనట్టి పరతత్త్వ మెల్లఁ
దనకు సిద్ధించుటఁ దనలోనఁ దెలిసి - మనమున నెంతయు మగ్నుఁడై యపుడు
తలకొన్న వేడ్కతోఁ దల లెల్ల నెత్తి - తలఁపక యప్పుడు తల్లితో ననియె,
"నెఱుఁగుదు మున్ను నే నెఱిఁగినయట్టి - మొఱఁగులు గలవె యీమూఁడులోకములఁ
దరమిడి యీపరతత్త్వంబుతెఱఁగు - లెఱిఁగి యెఱుంగవు హృదయంబు చెదరి1380
తల్లి! నీ వెఱిఁగిన ధర్మశాస్త్రంబు - లెల్ల నిష్ఫలములై యిప్పుడు తోఁచెఁ;
దల్లిదండ్రులు పల్కు తప్పు లెన్నైన - నుల్లంబులో నాఁటియుండవు గాని
యామహాత్ముఁడు విష్ణుఁ డైనరామునకు - నీమేనితోఁ బోయి యే మ్రొక్కఁజాల
హేయపదార్థమై యెసఁగుచున్నట్టి - కాయంబు పెంచుట కష్టంబు గాదె?
నరులు వానరులు నెన్నఁగ నెంతవారు? - సురలకన్నను వారు శూరులే తలఁప?
గెలుతు నవశ్యంబు గెలుపు లేకున్న - నిల రాముశరముల నీల్గుదుఁ గాని,
హీనమానవునకు నే మ్రొక్కఁజాల - మాను మిమ్మాట ముమ్మాటి కోయమ్మ!
చాలు నీబుద్ధులు చాలు నీమమత - చాలించ వైతేని జనని విచ్చేయు;
గొనకొని నీపిన్నకొడుకుతోఁ గూడి - యెనలేనిసంపద నేలు మీలంక;
ఈలోకసంపద లిన్ని నీకృపను - నాలోలమతి నేను ననుభవించితిని1390
బలిమిని గలిమిని భయ మింతలేక బలిసి లం కేలితిఁ బదిలక్షలేఁడు
లెలమి నాకును నెదు రెవ్వరు లేక - విలసిల్లు ప్రాభవవిభవంబు మెఱసి
విచ్చేయు నగరికి వేగంబ" యనిన - నచ్చుగా రావణుం డాడుమాటలకుఁ
గైకేశి మదిలోనఁ గడుచోద్య మంది - యాకొడుకును జూచి యనియెఁ గ్రమ్మఱను.
“వరతపోనిధి విశ్రవసుఁ డానతిచ్చు - పరతత్త్వ మది యేల పడిపోవు" ననుచు
వనిత యప్పుడు మాల్యవంతునిఁ జూచి - "మన మెంత చెప్పిన మానునే యితఁడు"
అన విని యిట్లనె నమ్మాల్యవంతుఁ - “డెనయంగ నీ విప్పు డేల చెప్పెదవు?
జడునకు నార్యులు చాటువాక్యములు - కడుఁబ్రీతిఁ జెప్పిన గా దని వినఁడు
గానఁ గానఁడు వీఁడు కార్యంబు తెఱఁగు - మానుము నీ వింక మానిని! లెమ్ము"
అనవుడుఁ గైకేశి యట్ల కా కనుచుఁ - "నెనయంగఁ జెడుతోవ యేటికిఁ దప్పు?1400
నేతెఱంగునఁ బోవ దిది దైవకృత్య - మోతండ్రి మననీతి యుచితమే" యనుచు
దాతయుఁ దానును దలకెడువగల - భ్రాతలు దల్లులు బాంధవుల్ గలఁగఁ
జని యప్పు డాసభాసదనంబుఁ బాసి - తననగరికిఁ బోయి ధర్మక్రమంబుఁ
దననిత్యకర్మంబు దప్పక యపుడు - మనమున దెలిసి సమ్మదమున నుండె.
నట దశగ్రీవుండు నధికదర్పమునఁ - బటుతరనిస్సాణభాంకృతుల్ చెలఁగఁ

జేయించి రాక్షససేన వారించి - యాయోధనోద్యుక్తు లై యేపు మీఱి
యున్నమంత్రులఁ జూచి యుగ్రుఁడై పలికెఁ - గన్నులఁ గోపంబు కడలుకొనంగ
“శ్రీరాముఁ డిప్పు డీసేతువుఁ గట్టి - వీరుఁడై వచ్చి సువేలాద్రి విడిసెఁ.
బటుగతి నామీఁదఁ బగవాఁడు రాఁగ - నిట నిద్రవోవుట యే నేర్పు మీకు?
మి మ్మేమి చేయుదు మిము మంత్రు లనుచు - నమ్మినవీఱిడి నను నండ్రు గాక!1410
కాదు పో మీ రుపేక్షాపరులైన - నాదెస కీడొందునా యివ్విధమున?
సామభేదంబులఁ జక్కఁ గాకున్న - రామునితోఁ బేర్చి రణము సేసెదను"
అని రావణుం డాడ నఖిలరాక్షసులు - దనకిన సిగ్గులఁ దల లెత్తలేక
యూరకుండిరి; యూరకుండ నే లనుచు? - ధీరుఁడై యావేళ దివిజారియైన
రావణుతోడ దర్పంబునఁ దనదు - చేవ దోఁపఁగ నింద్రజిత్తుండు పలికె.
“దేవ! రావణ! సర్వదేవసంఘముల - నావిధంబున గెల్చునంతటి నీకు
నిల యేలఁగా లేని యీరామలక్ష్మ - ణులచేత నేకీడు నూల్కొను నింక
వలదు చింతింప నే వ్రాలినవాఁడ - నలవు చలంబు ధైర్యముఁ గలవాఁడ
నాగపాశంబుల నాకేశుఁ గట్టి - యాగతి నేపనా? యసురాధినాథ!
కాలకేయాది రాక్షసవీరవరులఁ దోలనా? - దానవోద్దురసంగరముల,1420
మనుజులఁ గృశులఁ దామసుల దుర్బలుల - దనుజేశ! దశరథతనయుల నాకుఁ
జంపుట పెద్దయే సమరఁబులోనఁ? - జంపెద నీమది సందేహపడకు;"

రావణున కతికాయుఁడు నీతి సెప్పుట

మన విని యతికాయుఁ డనువాఁడు పలికె - దనుజేశ్వరునితోడఁ దదజ్ఞులు మెచ్చ
“విను దానవేశ్వర! విశదనీతిజ్ఞుఁ - డను పెంపుతోడ నీయఖిలంబు నెఱుఁగఁ
బరులసొమ్ముల కాసపడక వర్తించు - నరనాథుఁ డిల యెల్లనాఁడును నేలు;
నిది నీతి గతి యని యిచ్చఁ జింతింప - కెదు రెందు లేదని యేల చూచెదవు?
ఇనకులోత్తముఁడు నీ కె గ్గేమి చేసె? - దనుజేశ! నీకు నాతనిదేవి యేల
నీదైనలంకయు నిన్నును జెఱుప - నీదుష్టరాక్షసు లెత్తుకొన్నారు;
గావున సీత రాఘవునకు నిచ్చి - యావిభీషణునకు నట లంక యిచ్చి
యూనినభక్తితో నూరకయుండి - మానితంబుగ బుద్ధిమంతుండ వగుము”1430
అని పెక్కుభంగుల నతికాయుఁ డపుడు - తనతోడఁ బలుకంగ దనుజేశ్వరుండు
శుకసారణులఁ జూచి క్రూరుఁడై పలికె - "నొకమానవుం డబ్ధి నుఱక బంధించె,
ఘనుఁ డిట్టివాఁ డెందుఁ గలఁ డది చిత్ర - మనయంబు రాముఁ డీయబ్ధిని దాటె
ననుచున్నవారు మీ రాసేనఁ జొచ్చి - ఘనమతులై యెల్లక్రమము వీక్షించి
రం" డని పనిచిన రయమున వారు - దండి వానరవేషధారులై వచ్చి

శుకసారణులు శ్రీరాముని కపిసేనఁ జూచుట

వనములయం దుపవనములయందు - ననుపమలీల మహాద్రులయందు
వరసేతువందు నవ్వార్ధి కవ్వలను - గురుగుహాంతరములఁ గొమరైనయెడలఁ
గలయంగ విడిసిన కపిసేనఁ జూచి - తల యూచి వెఱగంది తలఁకి యాచరులు
మేనులు గడుపార మెల్లనఁ జొచ్చి - వానరసేనలో వచ్చుటఁ జూచి
యెఱిఁగి విభీషణుం డేచి పట్టించి - యురక వాండ్రను రామునొద్దకుఁ దెచ్చి1440
“మనుజేశ! రావణమంత్రులు వీరు - వనచరవేషులై వచ్చినవారు
శుకసారణులు వీరు సొచ్చి యివ్వీట - సకలంబుఁ గనుఁగొని చనఁగలవారు”
అనవుడు వారలు నతిభీతి నొంది - మునుకొని చేతులు మోడ్చి మ్రొక్కుచును
“దేవ! రావణుఁడు పుత్తెంచిన చరుల - మీవిభీషణుమాట లిన్నియు నిజము
ఏచి యారావణుం డెలమి మీసేనఁ - జూచిర మ్మనవుడుఁ జూడ వచ్చితిమి”
అనుటయు నవ్వుచు ననియె రాఘవుఁడు - "వినుఁడు రావణుమంత్రివిభు లౌటఁ జేసి
మిముఁ జంపుట దగు మిముఁ జంపఁగాని - మిమ్ముఁ జంపఁగ వచ్చు మే లేమి నాకు?
నది చెప్ప నేల వీ డంతయుఁ జూడుఁ - డది చూడు మిది చూడ మనక మీ రిప్పు
డిట తెఱగొనక వీ డంతయుఁ జూడుఁ - డటఁ బోయి వెసఁ జెప్పుఁ డారావణునకు;
నేలావు నమ్మి నీ విట సీతఁ దెచ్చి - తాలావుఁ జూపర మ్మనుఁ డాజిలోన1450
నెల్లి యీలంకయు నెల్లరాక్షసులఁ - ద్రుళ్లెడి నిన్నును దునుమాడు ననుడు
చనుఁ" డని రావణుచారులఁ బనిచె - జననాథుఁ డారామచంద్రుండు ప్రీతి
వారు విభీషణువలన నవ్వీట - వారక సకలంబు వడిఁ జూచి పోయి
రావణుఁ గాంచి యారావణుతోడ - "దేవ! నీపంచినతెఱఁగునఁ బోయి
కపిసేన యంతయుఁ గనుఁగొనుచుండ - నెపమాత్రమున మమ్ము నీతమ్ముఁ డెఱిఁగి
పట్టించి కట్టించి భానుకులేశు - కట్టెదిరికిఁ దెచ్చెఁ గలుషంబుతోడఁ
జంపింపఁదలఁచిన సదయుండు గాన - జంపింపఁడయ్యె నిక్ష్వాకువల్లభుఁడు
నీలంకయును నిన్ను నిఖిలరాక్షసుల - నాలంబులోపల నడఁగించుటకును
రామభూపాలుశౌర్యముఁ జెప్ప నేల - సౌమిత్రి యొక్కఁడే చాలు లంకేంద్ర!
సురవైరి సేతువుఁ జూచితి మెందు - నెరసి వానరసేన నిండి యున్నయది1460
అది శతయోజనం బైనట్టి నిడుపు - పదియోజనంబుల పరపును గలిగి
కపిసేన నెంతయు గణుతింపరాదు - కపు లాడకాడకు ఘనగిరులందు
విడిసిన సేనయు విడియు సేనయును - విడిదలపట్లకు వెదకు సేనయును
నుదధికి నవ్వల నుంచు సేనయును - వదలక మఱియును వచ్చు సేనయును
నై యుండుటకు మాకు నాత్మలో వెఱఁగు - పాయనివెఱపును బ్రభవించె దేవ!
యొక్కొక్కచోటన యున్న యాసేన - లెక్కించి బ్రహ్మయు లిఖియింపలేఁడు

కాన నారామునిఁ గని సీత నిచ్చి - దానవనాథ! మోదంబున నుండు”
మనవుడు రావణుం డామాట లెల్ల - విన నింపుగాక గ్రొవ్వినరోష మెత్తి
"దేవగంధర్వు లెత్తిన నైన సీత - నే విడుతునె యేల యీపందతనము?
మిమ్ముఁ గోతులు పట్టి మెదిచిన మీరు - బమ్మర వోవుచుఁ బఱతెంచినారు1470
వలవ దోడకుఁడు దుర్వారులై మిమ్ము - దలఁచి కోఁతులు రారు దాడిమై వెనుక"
నని ధీరుఁడై పల్కి యారావణుండు - చని తనతో శుకసారణు ల్నడువ
మిక్కిలిపొడ వైన మేడపై నెక్కి - యక్కపిబలముల నంతయుఁ జూచి
యచ్చెరువంది తా ననియె వారలకు - “నీచందమున నున్న యీసేనలోన
నెవ్వఁడు ముంగల నేపారి నడుచు? - నెవ్వఁ డెవ్వఁడు వెన్క నేమఱకుండు?
నెవ్వఁడు శూరుఁ? డిం దెవ్వఁడు వలఁతి? - యెవ్వనిమాట లయ్యినసూతి సేయు?
నెవ్వనితో రాముఁ డిష్టంబు పలుకు? - నెవ్వనిచే సేన యేపారియుండు?
నెవ్వరు రేపగ లీసేనఁ గాతు? రెవ్వరు సామంతు లీసేనలోన?
నెవ్వఁడు సుగ్రీవుఁ? డెవ్వఁడు రాము? - డెవ్వఁడు లక్ష్మణుం? డేరూపువాఁడు?
చూపుఁ డేర్పడ మీరు చూచితి రేని - కోపింప నే వారిగుణములు విన్న"1480
ననవుడు సారణుఁ డారావణునకు- వినుపింపఁ దొణఁగెఁ బ్రవీణత మెఱసి
"దేవ పుళిందానదీతీరవర్తి - పావకసుతుఁ డైన ప్రబలుఁ డీధాత్రి,
వీఁడె యీలంకెల్ల వెసఁ బెల్లగిల్లఁ - బోడిమి నార్పులు బొబ్బలు చెలఁగఁ

రావణునకు శుకసారణులు కపిపుంగవులఁ దెలుపుట

గురుతరకపినాయకులు లక్షగొలువ - దరుచరసేనముందఱ నున్నవాఁడు;
అలఘుసత్వుఁడు నీలుఁ డనువాఁడు దేవ - జలజాప్తసుతునకు సైన్యపాలకుఁడు;
వీకతో దిక్కులు వెసఁ బెల్లగిల్ల - దోఁకఁ దాటించుచు దుర్దమవృత్తి
వెఱగందఁ జేయుచు వేయుపద్మములు - మఱి నూఱుసంఖ్యలు మర్కటోత్తములు
బలవంతు లగువారు బలసి త న్గొలువ - గొలు వున్నవాఁ డొక్కకొండయుఁ బోలె
వాలినందనుఁ డల్ల వాఁడె యంగదుఁడు - వాలికంటెను బలవంతుఁడు వీఁడు
అడరంగ నాచందనాద్రివల్లభుఁడు - కడుఁబ్రసిద్ధుఁడు విశ్వకర్మనందనుఁడు1490
విను ప్లవంగంబులు వేయుఁ గోటులును - నెనుబదిలక్షలు నేపారి కొలువ
ఘన మైనసేతువుఁ గడఁకతోఁ గట్టి - వనచరసేన నవ్వలికి దాఁటించి
వ్రాలిననలుఁడు పో వాఁడు దైత్యేంద్ర - వాలినందనున కవ్వల నున్నవాఁడు
తరుచరయూథముల్ తనుఁ బెక్కు గొలువ - సురలోకకంటక సుతరుఁ డన్వాఁడు
తనసేనతోఁగూడ తా నొక్కరుండు - మనలంక సాధింప మండుచున్నాఁడు
రజనీచరాధీశ! రమణీయకాంతి - రజతాద్రిఁ బోలుచు రవిపుత్రునెదుర
బలముల నన్నింటిఁ బరిపాటిఁ దీర్చు - వలఁతి యాశ్వేతుఁ డన్వానరుఁ జూడు

గురుబలాఢ్యులు వేయుకోటులు గొలువ - వఱలు నాతఁడు వేగవంతుఁ డన్వాఁడు
చూడుము మనదిక్కుఁ జూచుచున్నాఁడు - చూడుము లంకేంద్ర! సుగ్రీవసఖుని
దగ వింధ్యశైలసుదర్శనముఖ్య - నగముల కెల్లను నాథుండు వాఁడు1500
కొమరారుసింగపుఁగొదమయుఁ బోలె - నమరినవాఁడు లంకాధీశ! వినుము
గాంభీర్యవారిధి కపిలవర్ణుండు - రంభుండు ఘనకేసరంబులవాఁడు
బలువిడి నూటముప్పదిలక్ష లెలమి - గొలువ నున్నాఁ డిదిగో చూడు! దేవ!
కుముదుఁ డన్వాఁడు సంకోచనాచలము - నమరంగఁ బాలించు నమరారి! యతఁడు
పదికోట్లయగచరపతు లోలిఁ గొలువ - మదమున మలయు నామర్కటుఁ జూడు
రమ్యశైలమునకు రాజైనవాఁడు - రమ్యోరువిశ్రుతోరస్స్థలుం డతఁడు
నలువదిలక్షలు నాలుగువేలు - గొలువంగ లంకపైఁ గోపంబు మీఱఁ
గుదియక యిరుఁగెలంకులఁ జూచువాఁడు - త్రిదశారి! యదె చూచితే! శరభుండు
బలసి తన్నెప్పు డేఁబదికోట్లకపులు - గొలువ నున్నాఁ డదే గురుసత్త్వధనుఁడు
పారియాత్రాచలపతి ఘోరసమర - ధీరుండు పనసుండు దేవేంద్రవైరి!1510
లలి నొప్పుడెబ్బదిలక్షలకపులు - గొలువ నున్నాఁ డదె! గురుబలోన్నతుఁడు;
సింధురగతిఁ జాయ చె న్నగ్గలించి - యందమౌ క్రోధనుం డనువాఁడు దేవ!
యేనె చాలుదు లంక నిలఁ గూలఁద్రోయఁ - గా నని పూని యిక్కడఁ జూచువాఁడు
బలవంతు లగు కపు ల్బలసి త న్నెపుడు - లలి నొప్ప డెబ్బదిలక్షలు గొలువ
గవయుఁ డున్నాఁ డదే కనుఁగొను దేవ! - వివిధప్రతాపసంవృతుఁ డైనవాఁడు
కామరూపులు వీరు ఘనఘోరసత్త్వు - లీమెయి ననిలోన నెక్కుడౌ వారు
తలపోయఁగా దేవ! దైత్యులకైనఁ - గలఁగనివారు ముంగలివారు వీరు
నడుమ నెప్పుడును సేనాసమేతముగ - నడతెంచువారి దానవనాథ! వినుము
ఉరుభుజు ల్వివిధవర్ణోజ్జ్వలు లద్రి - చరులు నానాసహస్రంబులు గొలువ
నీతోడ నెక్కటి నెఱిఁ బోరఁ దివురు - నాతండు హరుఁడను నగచరోత్తముఁడు.1520
నలు పెంతయును మీఱ నానావిధముల - నెలుఁగులసంఖ్యలు నేపారి కొలువ
నతినీలమేఘమధ్యస్థుఁ డై పొలుచు - శతమఖుఁ బోలి యుజ్జ్వలుఁ డైనవాఁడు
నర్మదాతీరంబునను ఋక్షనగముఁ - బేర్మితో నేలెడు పృథుబాహుబలుఁడు
వాఁడె ధూమ్రుఁడు జాంబవంతుతమ్ముండు - వాఁడిమిఁ దనయట్టివారు త న్గొలువ
నీలశైలంబుల నెలవెల్ల దార - యై లీల నొప్పిన యాకృతు ల్గలిగి
యుల్లసిల్లుచు నున్న యొకకోటిసంఖ్య - భల్లూకములు గొల్వ బలసియున్నాఁడు
తొల్లి దేవాసురోద్ధురయుద్ధ కేళి - నెల్లవరంబుల నింద్రుచేఁ బడసి
వ్రాలిన యాజాంబవంతుఁడు వాఁడె - దూలఁ డెన్నఁడు రణధూమలోచనుఁడు
ఉక్కలుం డిదె వీనియుభయపార్శ్వముల - నొక్కొక్కయోజనం బొడలిలోఁ బొడవు

గలపద్మసంఖ్యల కపిసేన గొలువ - సలలితుం డగువాఁడు సన్నాథుఁ డతఁడు1530
నాకారిబిరుదు వానరపితామహుఁడు - నాకేశుతోఁ బోరి యని గెల్చినాఁడు
దహనునివలన గంధర్వకన్యకకు - మహనీయమైన జన్మంబు దా నొంది
పరపైన యాద్రోణపర్వతం బేలుఁ - దిరముగా జాంబూనదీతీరవర్తి
వేయుకోటులు కపు ల్వేడ్కఁ ద న్గొలువ - నీయగచరుఁ జూడు మేచినవాఁడు
నీలునితమ్ముఁడు నిర్జరవైరి - చాలువాఁ డింద్రసుజాలుఁ డన్వాఁడు
కుపితమర్కటు లాఱుకోటులు గొలువఁ - గపివీరుఁ డాతఁ డుగ్రధనుఁ డన్వాఁడు
కరము సంప్రీతి గంగాతీరమునను - జరియించువాఁడు శాశ్వతబాహుబలుఁడు
చిరతరలీలమై శిశిరాద్రి వేడ్క - నిరవొంద నెప్పుడు నేలెడువాఁడు
పదికోట్లనగచరు ల్బలసి త న్గొలువ - నదె చూడు మాగజుం డనువాఁడు దేవ!
కోటికోటుల వేయు కొమరుగా జముని - పాటి గోలాంగూలబలములు గొలువ1540
నదె గవాక్షుం డను నతఁ డాలమునకుఁ - ద్రిదశారి! యౌడులు దీటుచున్నాఁడు
ధవళవర్ణాంగు లుద్దండవిక్రములు - రవిసన్నిభులు రణరంగభీషణులు
వివిధరూపంబుల విఖ్యాతులైన - ప్లవగసామజములు బలిసి త న్గొలువ
నున్న కేసరిఁ జూడు మొప్పారుకాంచ - నోన్నతశిఖరికి నొడయండు వాఁడు
బహువర్ణులై పటుభాషణధ్వనులు - మహి గదలఁగ దంతమండలి వెలుఁగ
సింగంపుఁగొదమల చె న్నగలించి - పింగళాక్షంబులఁ బెద్దయు మెఱసి
వేయుకోటులకపు ల్వేడ్కతోఁ గొలువఁ - బాయక రాముకృపారసం బంది
తనప్రాణములు రామధరణీశ్వరునకు - ననయంబు నీఁగోరు నతులవిక్రముఁడు
అమరారి! వాఁడె యత్యాయతబలుఁడు - సమరకర్కశుఁడైన శతబలిఁ జూడు
వీఁడె సుషేణుండు వేకోట్లకపులు - వాఁడిమిఁ దన్నుఁ గొల్వఁగ నున్నవాఁడు1550
పదికోట్లయగచరపతు లోలి గొలువ - నొదవు నాతనిఁ జూడు ముల్కాముఖుండు
ఇటఁ జూడుమా వీఁడె ఋషభుఁ డన్వాఁడు - భటముఖ్యు లతనికిఁ బదికోటు లధిప!
వనచరశతకోటి వలనొప్పఁలు గొన - దనరు నాతనిఁ జూడు దానవాధీశ!
కనకాద్రిధైర్యుఁ డఖండవిక్రముఁడు - ఘనభుజస్కంధుఁడు గంధమాదనుఁడు
మొనకు వేకోట్లుగా ముయ్యేడుమొనలు - తనరఁ గల్గినవాఁడు దధిముఖుఁ డతఁడు
విను మిరువదియొక్కవేయుశంఖంబు - లును మఱిరెండు వేల్నూఱుబృందములు
గల యల్ల మొన దివాకరసూనుమూల - బల మావలీముఖప్రముఖులఁ జూపు
మొలయఁ గిష్కింధలో నుండెడువారు - లలి దేవగంధర్వులకుఁ బుట్టినారు
కామరూపముల సంగరకౌతుకముల - భీమవిక్రమములఁ బెంపారువారు
అనికి సన్నద్ధులై యార్చుచున్నారు - కనుఁగొను వారి రాక్షసలోకనాథ1560
అమృతంబు బ్రహ్మచే నమరంగఁ బడసి - రమరులకంటెను నధికులు వీరు

వినుతింప మైందద్వివిదులనువారు - విను దేవ! యేకాంగవీరులు వీరు
పదికోట్లప్లవగులు బలసి కొల్వంగ - నుదధితీరంబున నున్నారు దేవ!
వీరులు సుముఖుండు విముఖుండు ననఁగ - ఘోరవిక్రములఁ గన్గొనుము లంకేశ!
మృత్యువుకొడుకులు మిగిలినచేవ - మృత్యువుకంటెను మీఱినవారు
మిగిలినతెగువతో మితి మేర లేని - యగచరుల్ తను భృత్యులై కొలువంగ
నున్నవాఁ డదె చూడు ముదధి లంఘించి - నిన్ను నీబలమును నీవారిఁ గొనక
చనుదెంచి వనములో జానకిఁ గాంచి - వన మెల్లఁ బెఱికి నీవరసుతుఁ జంపి
లంక భస్మముఁ జేసి లంకిణి నొంచి - జంకెతోఁ గ్రమ్మరఁ జన్నవాఁ డతఁడు
ఆవాయుసూనుండు హనుమంతుఁ డగుట - నీవును నెఱుఁగుదు నిర్జరారాతి1570
విను చిత్ర మొక్కటి వీఁడు బాల్యమున - నినమండలం బుదయింపంగఁ జూచి
పెరిఁగినయాకటిపెల్లున దానిఁ - బరికించి ఫలబుద్ధిఁ బట్టంగఁ దివిరి
వేగంబుతో మూఁడువేలయోజనము - లాగగనంబున కపుడు బిట్టెగసి
యంతటనుండి పూర్వాద్రిపైఁ బడియె - నెంతయు రయమున నీవానరుండు
హనువు భగ్నంబయ్యె నంతనుండియును - హనుమంతుఁ డనునామ మయ్యె నీతనికి
వీర లందఱును బృథ్వీధరం బెల్ల - వార యొక్కింత వడి గెల్చువారు
ఇట్టికపీందు లనేకులు దేవ - యె ట్టని సంఖ్యగా నెన్నంగ వచ్చు”
నని సారణుఁడు పల్క నసురేంద్రుతోడ - సునిశితమతియైన శుకుఁ డర్థిఁ బలికెఁ

శుకుఁడు శ్రీరాములతేజోవిశేషములఁ దెల్పుట

వారల కెల్ల జీవన మైనయట్టి - యారాముఁ జెప్పెద నసురేశ! వినుము
నయరీతి హరినీలరత్నప్రభాతి - మెయిచాయ నెంతయు మెఱసినవాఁడు1580
కమలంబులను బోలు కన్నులవాఁడు - విమలనీతిస్థితి వెలసినవాఁడు
ఆజానుబాహుండు నఖిలేశ్వరుండు - రాజతేజోనిధి రఘుకులోత్తముఁడు
సత్యంబులోపల సార మౌవాఁడు - నిత్యధర్మంబున నెగడినవాఁడు
శస్త్రాస్త్రవిద్యావిశారదుం డఖిల - శాస్త్రజ్ఞుఁ డురుకీర్తిసంపదవాఁడు
తపనునినైనను దమతాత యనక - తపియింపఁజేయు ప్రతాపంబువాఁడు
చక్కాడునభ మైన శరజాలములను - వ్రక్కలుగాఁ జేయు వసుమతినైన
నలిగిన నాతని యలుక వైరులకుఁ - దలఁపంగ మృత్యువు దశకంఠ! వినుము
తెగువ నీ వాసీతఁ దెచ్చితి గాన - జగతీశుఁ డిబ్భంగిఁ జనుదెంచె ననికి
వరశరణాగతవజ్రపంజరుఁడు - బిరుదుల కెల్లను బిరుదైనవాఁడు
శరణన్నఁ గాచు నేచందంబునందు - దొరకొన్న యలుకకుఁ దుది లేనివాఁడు1590
మిక్కిలి యైన నీమీఁదికోపమున - నక్కన్నులం దెఱ్ఱ యమరినవాఁడు
మూఁడులోకముల నిమ్ముల నేలువాఁడు - వాఁడె పో రాముండు వనజాప్తకులుఁడు

వారక శుద్ధసువర్ణవర్ణాంగుఁ - డారామువలపట నట నున్నవాఁడు
చలమున నీరేడుజగముల నైన - నలుకతో నిర్జించు నతిశక్తివాఁడు
ఆరామునకుఁ బ్రాణ మైనట్టివాఁడు - ఆరాముతమ్ముఁ డుదగ్రవిక్రముఁడు
భావింప మ మ్మేర్చి పట్టినవాఁడు - దేవ! యాలక్ష్మణదేవునిఁ జూడు
మలుకమై నిన్ను నుగ్రాజిలోఁ గలఁచి - చల మొప్ప లంక నిశ్శంక నేఱుటకుఁ
బట్టంబు రామభూపాలునిచేతఁ - గట్టించికొని ప్రీతిఁ గ్రాలుచున్నాఁడు
ఆవిభీషణుఁ జూడు మసురాధినాథ - భూవరువెనుక నేపున నున్నవాఁడు
ఆరాముతమ్ముని యావిభీషణుని - చేరువ నవ్వలఁ జేరియున్నాఁడు1600
మహనీయతరధరమార్గంబువాఁడు - మహితనీతిస్థితి మరిగినవాఁడు
మానఘనాధీనమతి నొప్పువాఁడు - పూని కిష్కింధ నెప్పుడు నేలువాఁడు
చిరకపిరాజ్యాభిషేచనహేతు - కరహేమమాలికాకలితవక్షుండు
గురుభుజుం డంతకఘోరవిక్రముఁడు - సురవైరి! చూచితే సుగ్రీవుఁ డతఁడు
వీనికిఁ గలసేన వివరింతు వినుము - దానవనాథ! చిత్తంబున నిలిపి
సంఖ్య వేకోటులై చను నూఱువేల - సంఖ్యలు మఱి మహాసంఖ్య నాఁబరఁగు
నవి లక్ష గూడిన నగు బృందసంఖ్య - యవి లక్ష గూడిన నగుఁ బద్మసంఖ్య
యవి లక్ష గూడి మహాపద్మ మయ్యె - నవి లక్ష గూడిన నగు ఖర్వగణన
యవి లక్ష గూడిన నగు మహాఖర్వ - మవి లక్ష గూడిన నగు సముద్రంబు
అవి లక్ష గూడ మహాసముద్రంబు - నవి లక్షతో మహదాఖ్యమై పరఁగు1610
నవి కోటి పో వాలియనుజునిబలము - వివరించి చూడుము విశదంబు గాఁగ
నిది తుద మొద లని యెన్నంగ దీని - చదురుతనంబున సంఖ్య దేరాదు
కావున రాముతోఁ గదిసి పోరాడ - రావణ రాదు దుర్వార మాబలము"
అని శుకుం డెఱిఁగింప నారావణుండు - ఘనమైనకపిసేనఁ గలయంగఁ జూచి
తనలోన బడబాగ్ని దరికొనుచుండ - దనరారు వార్ధిచందంబున నపుడు
వెఱచియుఁ దనలోని వెఱ పడఁగించి - వెఱవనిగతిఁ గోపవివశుఁడై పలికె
“మంత్రి యేలికచిత్తమార్గంబు దప్పి - మంత్రంబుఁ జెప్పునే మన సెల్ల విఱుగ?
నేతెఱం గెఱుఁగక యెదిరి నాయెదుర - నీతెఱంగునఁ బల్కు టిది మీకుఁ దగునె?'
యనవుడుఁ దల లెత్త కచ్చోటు వాసి - చని రప్పు డాశుకసారణు లంతఁ
జవిన పిమ్మట నాప్తసచివులు దాను - దనుజాధినాథుఁ డెంతయును జింతించి1620
వారి వీడ్కొల్పి దుర్వారుఁడై వైర - మార విద్యుజ్జిహ్వుఁ డనువానిఁ బిలిచి
“రామునిధనువు శిరంబును బోలె - నీమాయ నతివేగ నిర్మింపు" మనిన
నతఁ డది నిర్మించి యర్థిఁ దెచ్చుటయు - నతనికి మెచ్చు ప్రియంబున నొసఁగి
సురుచిరంబైన యశోకవనమున కరిగి - యాదశకంఠుఁ డవనిజఁ గనియెఁ.

బె ల్లగునీవగఁ బెట్ట నేమిటికిఁ - దల్లి న న్నన వసుంధరదూరుకరణిఁ
దల వంచుకొని విన్నదనమునఁ దూలి - సొలవక ధాత్రిఁ జూచుచు నున్నదాని
నొడలఁ జిత్తములఁ బెం పొదవు దావాగ్ని - యుడికిపొంగుచు వెలి కురుకుచునున్న
రాక్షసుపై రోషరసధార లనఁగ - నక్షీణబాష్పధారావళిదాని
పుత్త్రి యీదురవస్థఁ బొందితే యనుచు - ధాత్రి దానును బరితాపంబు నొంది
యాలింగనము సేసినట్టిచందమున - ధూలి గప్పినమేనితో నున్నదాని1630
రావణ! నిన్ను నీరాక్షసకోటి - నేవిధంబునఁ ద్రుంప కే నేల పోదు?
నని వానిక్రూరధర్మాదిదైవంబు - గొనకొన్నకైవడిఁ గూర్చున్నదాని
నమరారులను నీరసావనీజములఁ - దమకించి తా విటతాటంబు సేయు
నని దరికొను విలయానిలుపగిదిఁ - దనరు నిట్టూర్పులఁ దఱు చైనదాని

సీతకు శాంబరీమాయచే గల్పితం బైన శ్రీరాముల శిరోధనువులను జూపి వెఱపించుట

గని చెడఁ దలఁచిన కష్టదానవుఁడు - తనదిక్కుఁ జూడని ధరణిజ కనియె.
"వెరవు చాలని యవివేకి దానవుల - ఖరదూషణాదులు ఖండించె ననుచు
జనకనందన! రాముశౌర్యంబు నమ్మి - నను గణుతింప వెన్నఁడుఁ జిత్తమునను
నసమునఁ గపులతో నంబుధి దాఁటి - యసముఁడై యాసువేలాద్రిపై నుండి
యలసి నిద్రింపంగ నగచరసేన నలమి - యీరాత్రి ప్రహస్తుఁ డన్వాడు
నాకూర్చుబంటు చూర్ణంబుగాఁ జేసి - కాకుత్స్థునురుకార్ముకంబును దలయు1640
గొని వచ్చె రాముని కూర్మితమ్ముఁడును - వనచరాధిపుఁడును వగచుచునుండఁ
దప్పించుకొని పాఱెఁ దా విభీషణుఁడు - చుప్పనాతిని ముక్కు సురియచే గోయు
నాపాపమునఁ బాఱె నపుడు నీమఱఁది - వాపోవుచును జాంబవంతుఁడు పఱచె
నూరక యంగదుం డూడంగఁ బాఱె - దారితప్పునఁ బోయెఁ దారుండు భీతి
నీలుండు శరభుండు నిలిచి పోరాడి - వాలిరి మేనులు వ్రయ్యలై జగతిఁ
బోక నిల్చి సమీరపుత్రుండు వడియె - మోఁకాళ్లు విఱిగి రాముని బాయలేక
నెత్తుఱు గ్రక్కుచు నేగె సుషేణుఁ - డుత్తలంబున ధూమ్రుఁ డుదధిలోఁ బడియె
జెయ్యెత్తి మ్రొక్కఁ గూల్చిరి దధిముఖుని - మాయచే గేసరి మయి దాచిపోయె
కుముదుండు తలఁ దెగఁగొట్టినఁ బడియె - సమసె మైందుఁడు వీగి చనియెను నలుఁడు
పనసుఁ డెఱింగి దెబ్బర వచ్చె ననుచుఁ - బనసచెట్టును బోలి బ్రమసి తా నిలిచె1650
నాలంబులోపల నఖిలవీరులును - గూలుటయును జూచి కూడినభీతి
జివ్వఁ జాలించి వచ్చినకపు లెల్ల - నవ్వంగఁ బరుగెత్తె నలినాప్తసుతుఁడు
సేతువుఁ జూడ వచ్చినకపు లెల్ల - భీతిచే నిల్లాండ్ర బిడ్డలఁ దలఁచి
ముగిపె కార్యం బని మొదలిటెంకులకుఁ - దగఁ గొట్టఁ బాఱిరి దైత్యులు దరుమ

గాన గంజాస్య రాఘవునాస విడిచి - నానారులకు నెల్ల నాథవై యుండు
నాయింట దాసీజనము లైదువేలు - పాయక మణిమయాభరణము ల్దాల్చి
యచ్చరు లున్నవా రతివ! నీసేవ - కిచ్చెద నీమన సిమ్ము నా కిపుడు.
విరిదోఁటలోఁ గల్పవృక్షంబు లైదు - తరుణి! నీముడిపువ్వుదండల కిత్తు
నమరభూధరరోహణాచలమణులు - రమణి! నీకిత్తు నన్ రతులఁ దేలింపు
నామీఁచఁ గామధేన్వాదిధేనువుల - భామిని! నీయింటిపాడి కే నిత్తుఁ1660
గొమ్మ ముప్పదిరెండుకోట్లచేరువలు - నెమ్మి నం దొక్కొక్కనికి వేయివే
(?)దానవబలపద్మ మాప్తంబు నాకు - దీన బోఁ గెలిచితి దేవతాధిపుల
నాబలం బెల్ల నీయడుగులు గొలిచి - యోబాల! యిటమీఁద నుప్పొంగఁ గూర్తు”
ననుచు విద్యుజ్జిహ్వుఁ డనువానిఁ బిలిచి - వనజాక్షి ముందఱ వైవఁ బంచుటయు
“దనుమధ్య! యిదె రాముతలయును విల్లు" - నని యటు వైచి వాఁ డరిగె నవ్వుచును
దలకొని రామభూధవుఁ డిప్పు డసుర - తల లెల్ల ద్రుంచు నుద్ధతి రణస్థలిని
దలఁకకు నీపతితలయు నింపారు - నిల ధర్మగుణముతో నిఁక ననుమాడ్కిఁ
దరలాక్షి యాతల తప్పక చూచి - కర మొప్పురాని కన్నులు మోము
దలకట్టుమౌళి రత్నప్రభావళియుఁ - బలువరుసయుఁ గర్జభాతియు మోవి
తలపోసి రామునితలయ కాఁ దలఁచి - బలుమూర్ఛ బాల్పడి వడియె నాధరణి1670
యిది బొంకు నీపతి కేమియుఁ గాదు - సుదతి నీ కీమాయ చూడఁగా దినుచుఁ
దనయురిస్స్థలికి నత్తన్వంగిఁ దివిచి - కొనియెనో కాక యీకుంభిని యనఁగఁ
బడి యంతఁ దనలోనఁ బడఁతుక దెలిసి - యడరెడుశోకాగ్ని నలయుచుఁ బలికెఁ,
“గటకటా కైకేయి కలహంబుఁ బన్ని - యిటు క్రుంగఁజేసితె యిక్ష్వాకుకులము!
నీరాఘవేశ్వరుం డె గ్గేమి సేసె! - నూరక యడవుల నుండంగఁ బనుప
వనధి బంధించితి వచ్చి నీ వింకఁ - గొనిపోయె దనియెడి కోర్కి దీపింపఁ
బెద్ద నమ్మితిఁగదా పృథ్వీశ! నిన్ను - నిద్దెస నాదైవ మిటు సేయు టెఱుఁగఁ?
నాకును నీకుఁ బ్రాణం బొక్క టగుట - గాకుత్స్థ! యిటు బొంకుగాఁ జేయఁదగునె?
పతికంటె ముందఱఁ బ్రాణముల్ విడుట - కతివ గా నైతినే? నర్కకులేశ!
యెఱుఁగుదు గా కేమి యడరి నీకడకు - నరనాథ! పుత్తెంతు నాదుప్రాణముల1680
వసుధ నాతల్లి నావరుఁడవు నీవు - వసుధకౌఁగిటఁ జేర్ప వావియే నీకు?
జనకుచే న న్నగ్నిసాక్షిఁ జేపట్టి - కొనివచ్చి యిటు సేయఁ గూడునే నీకు?
నెట్టొకో రామ నీ విట నూరకున్నఁ - గట్టడిప్రాణముల్ గ్రాఁగవయ్యెడిని;
గ్రాఁగని యప్పుడే కారణం బీవు - గ్రాఁగుట నిక్కంబు గాకుండు" ననుచు
నీవిధంబున సీత యేడ్చుచు నుండ - దౌవారికులు వచ్చి దనుజేశుఁ గాంచి
"దేవ! కార్యంబు లెంతేని బుట్టుటయు - నీవరమంత్రులు ని న్సభాస్థలికి

నరుగుదె మ్మని ప్రహస్తాదులు వచ్చి - తరమిడి యున్నారు దారపట్టమున”
నని విన్నవించిన నారావణుండు - చనియె శీఘ్రంబున సభకు నత్తఱిని,
దనుజుండు చనఁగ నాతలయును విల్లు - విన విస్మయంబుగా వెస మాయమయ్యె
నారావణునిలక్ష్మి యంతలోపలనె - బోరన మాయమై పోవు నన్నట్టు1690
ఇదె రాఘవుఁడు వచ్చె నెత్తిపై ననుచుఁ - ద్రిదశారి యెంతయు ధీరుడై కడఁగి
వేగులు వారిచే విన్నవార్తలకు - వేగ నిస్సాణంబు వేయంగఁ బనిచి
తనసేనఁ గూర్పఁ బ్రధానులఁ బనిచె - జనకనందన నంత సరమ వీక్షించి
“యేల మాయమ్మ! నీ విటు ప్రలాపింపఁ? - బోల దీవార్తలు బొంకు గానోపు
వనిత! నీముందఱ వైచినశిరము - దనుజునిమాయగాఁ దలపోయవలదె?
వనజాక్షి యసురదుర్వాక్యంబు లెల్ల - విని యేను బోయితి వెనుకనే యరయ
నావార్త విను రాముఁ డని కెత్తె ననుచు - దేవారి యెంతయుఁ దిరుగంగఁబడియె.
నదె విను నిస్సాణహననఘోషంబు - లదె విను మారాక్షసావళియుగ్ర
రథములమ్రోఁతయు రథికసారథుల - పృథులభాషణములు పెల్లుగా మ్రోసె.
నటుఁ గాన రామున కాపద లేదు - కుటిలకుంతల! నీవు గుందంగవలదు”1700
అని చెప్ప నాలంక యగలనార్చుచును - వనచరసేనలు వచ్చుటఁ జూచి
"యంతరంగమున బిట్టదరి రావణుఁడు - చింతించి మంత్రులఁ జెచ్చెరఁ బిలిచి
యదె రాఘవుఁడు వచ్చె ననికి మీ రిపుడు - విదితవిక్రమశక్తి వేగంబు పోయి
మనుజుల నిద్దఱ మడియించి రండు - వనచరసేనల వధియించుఁ డోలి
నరుగుఁడు లెం" డన్న నారావణునకు - వరనీతిమతి మాల్యవంతుఁ డిట్లనియె.

మాల్యవంతుఁడు రావణునితో నీతి సెప్పుట

"నుచితకాలంబున నొప్పగు సంధి - యుచితకాలంబున నొప్పు వైరంబు
గాన నయోచితకార్యంబు సేయు - వానికి రాజ్యంబు వర్తించుచుండు
నధముతో విగ్రహ మధికుతో సంధి - బుధులమతంబునఁ బోనిచ్చు టొప్పు
వలవదు మనకంటె వనజాప్తకులుఁడు - బలవంతుఁ డగువాఁడు బలవైరివై రి
దైవకార్యంబుగా ధరఁ బుట్టినాఁడు - దైవబలంబు నాతనియందె కలదు1710
ఆరయ ధర్మాత్ముఁ డది చెప్ప నేల? - వారక ఋషులదీవనలు గన్నాఁడు
సురల బాధించి భూసురల మర్దించి - యురుపాపబుద్ధివై యుండుదు వీవె
గెలుపు ధర్మముదెసఁ గీల్కొనుఁ గాని - యిల నధర్మముదెస నేల వర్తించు?
నక్కమలజుచేత నటు నాఁడు వరము - తక్కినవారిచేతను జావకుండఁ
బడసితి గాని యిబ్భంగి నీమీఁద - నడతెంచు నరుల వానరులను గెలువఁ
బడయవు నీ వెన్నిభంగుల నైనఁ - జెడుట తథ్యము వీరిచేతను నీవు;
దాని కింతటికిఁ బ్రత్యక్షంబుఁ జూడు - మానైనవిపులహోమములు ధూమములు

జడిసె రాక్షసులతేజంబులు మాసె - నుడుగక మనవీట నొప్పము ల్వుట్టె
నటుగాన నాదినారాయణుం డతఁడు - ఇటు సేయుటకుఁ బుట్టె నిద్ధరమీఁద
రామునితోడ విగ్రహ మొప్ప దుడుగు - రామునిబాణపరంపర ల్బెట్టు1720
వలదు రామునిఁ గని వనిత నొప్పించి - కుల మెల్ల రక్షించుకొనుము లంకేంద్ర!”
యనవుడు దశకంఠుఁ డమ్మాల్యవంతుఁ - గనుఁగొని రోషసంకలితుఁడై పలికె.
“మిగులఁదేజంబున మేటినై యెందు - నెగడిన నాయొద్ద నీపగవానిఁ
జెప్పెదు; ని న్నేమి సేయుదు నింక - నెప్పుడు మాన వయ్యెదు పందతనము;
సీత నేమిటి కిత్తు సీత నిచ్చుటకు - భీతి నా కేమిటఁ బేర్చె నింతటనె?"
యని మీఱి పలికిన నమ్మాల్యవంతుఁ - డనియె నామాట నీ వాత్మఁ గైకొనక
యారామచంద్రుని నాలంబులోన - శూరత గెలువంగఁ జూతుము గాక!
యెందుఁ బోయెద మని హెచ్చి కంటకము - లందందఁ బలుకుచు నలుకమైఁ బోయెఁ.
బోయినపిమ్మట బుద్ధిలోఁ దలఁచి - యాయసురేశ్వరుం డప్పుడు గడఁగి
యలఘుబలాఢ్యుఁ బ్రహస్తునిం బనిచె - దొలితొలి బలుకాపు తూర్పువాఁకిటికి1730
దక్షిణంబున మహోదరమహాపార్శ్వు - లక్షీణబలయుతులై యుండఁ బనిచె.
వారక పడమటివాకిట నుండ - శూరత నటఁ బంచె సుతు నింద్రజిత్తుఁ
దనమాఱు గాఁగ నుత్తరపువాకిటికి - జని యుండుఁ డని పంచె సారణశుకుల
నందఱికిని ముఖ్యుఁ డై పురమధ్య- మం దుండఁగా విరూపాక్షునిఁ బనిచె
నీవిధంబున లంక కెల్లఁ గాపిడుచుఁ - రావణుం డంతఃపురంబున కరిగె,

శ్రీరాముఁడు లంకాపురవైభవముఁ జూచుట

నంత నక్కడ రాముఁ డనుజు నర్కజుని - నంతకన్నను హితుం డగు విభీషణుని
వాలితనూజుని వాయునందనుని - వాలిన యాజాంబవంతు సుషేణు
నాలోన రప్పించి యందఱితోడ - నాలోచనంబునకై కూర్చి పలికి
“నవగుణంబున కెల్ల నాలయం బైన - దివిజారి లంక యేతెఱ గొకో యింకఁ
జూతమా యేర్పడఁ జూడుఁడా యొకని - చేతఁ దత్కుల మెల్లఁ జెడుట సిద్ధంబు"1740
నని పల్కి యారాముఁ డనుజుండుఁ దాను - నినసుతుఁ డాదిగా నెల్లవానరులుఁ
గొలువంగ వచ్చి యెక్కుడువేడ్కతోడ - నలరుచు నాసువేలాచలం బెక్కి
గుణములు గలవాఁడు గోత్రంబునందుఁ - బ్రణుతికి నెక్కు నిబ్భంగి నన్మాడ్కిఁ
గనియె రాఘవుఁడు లంకాపురం బపుడు - దనచేతఁ గడక సాధ్యం బగుదాని
ననిలజుఁ బట్టిన యంతనుండియును - దనరార లోపల దరికొన్న చిచ్చు
నాఁడు నేఁడును మండు నామణిప్రభలఁ - బోఁడిమి గలుగు గోపురములదానిఁ
గడు నొప్పు నారాము ఘాతకుఁ జొనుప - మిడికెడు రావణమృగముఁ బోనీక
విలయకాలుండను వేఁటకాఁ డర్థి - వెలివారు వారిన విధమునఁ జూడఁ

దనరారు పెద్దకొత్తడములతోడఁ - గనుఁగొన నొప్పు ప్రాకారంబుదాని
రావణుఁ బొరిగొన రామ రమ్మనుచుఁ - జేవీచుపడగలఁ జెలు వైనదానిఁ1750
మహనీయతోరణమంగళసూత్ర - మహిమతో నంబరమణిసంగమమునఁ
దళతళ వెలుఁగు నద్దంబుల నొప్పి - చెలువారఁగా దట్టు చేతులు గలిగి
పగలును రేయును బాయక కూడి - మగలచే నొప్ప కొమ్మలు గలదాని
నెసఁగ నారాము కట్టెదిరికిఁ గాలుఁ - డసురేశుఁ డనులులాయముఁ బట్టితేర
నొరపుగాఁ ద్రవ్విన యోదంబు లనఁగ - నెరసినపరిఘల నెలకొన్నదాని
కైలాస మమరారి క్రమ్మఱఁ బెఱికి - మేలైనపేర్మి నిర్మించినమాడ్కి
దనరారి యల మిన్ను దానికి తెల్పునను - గనుపట్టు మేడలు గలిగినదాని
ఘనలక్ష్మి నెదురుకోఁ గడఁగె రామునకు - నని చెప్పునట్టి తూర్యధ్వనిదానిఁ
జిలుకలపలుకుల చెలువు వహించి - యళులనాదంబుల నానంద మంది
కలకంఠరవములఁ గడుఁబ్రీతిఁ జేసి - పలికెడు శారికాస్ఫారత మెఱసి1760
పల్లవఘనచయపల్లవం బగుచుఁ - బల్లవంబుల రాగభరితంబు లగుచుఁ
గడివోనిపూవులగంధంబువలన - నెడపక నందంద నింపులు చూపఁ
జెప్పఁ బెక్కగుచు నేచినయట్టితరుల - నొప్పెడివనముల నొప్పారుదానిఁ
గమల కెందును మనఃకమలంబు లైన - కమలాకరంబులఁ గర మొప్పుదాని
నటు చోద్యపడి చూచు నారాఘవునకు - బటుతరోద్యత్ప్రభాభాతి తా నొసఁగి
యాకాశమణి గ్రుంకె నపరాబ్ధిలోనఁ - గాకుత్స్థమణి నమస్కారంబు సేయ
నారాముఁడును సువేలాద్రియం దుండి - యారాత్రి గడతేర్చి యంత వేగుటయు
గపులు వినోదంబుఁగాఁ బెల్లురేఁగి - విపినంబులం దెల్ల వెసఁ జొచ్చి చొచ్చి
యందలిశరభసింహాదులనెల్ల - నందందఁ దోలుచు నార్చుచుఁ దిరుగ
నట్టికోలాహలం బంతయు లంక - ముట్టి రాక్షసుల నెమ్ములు పగిలింప1770
నది విని రావణుం డది యేమి రవము? - పొదుఁ డని వచ్చి గోపుర మెక్కి చూచె
నప్పుడు గోపురం బతనితోఁ గూడ - నొప్పెఁ జూపరులకు నుజ్జ్వలం బగుచుఁ
ధవళాతపత్రము ల్దఱుచుగాఁ బట్టి - ధవళచామరములు తఱుచుగా వీవఁ
బొరిపొరి సురదంతిపోటుల నమరు - నురమునఁ బతకంబు లొనరుచుఁ గ్రాల
నాయతరత్నసింహాసనాసీనుఁ - డై యెంతయును బొలుపారె నెయ్యెడను
నపరాచలముమీఁది యర్కునితోడి - యుపమకు మాత్రుఁడై యుజ్జ్వలుం డగుచు
బహువిధరాక్షసపరివృతుం డగుచు - మహితాయుధప్రభామండలంబులను
మెఱుపులు గల నీలమేఘంబు వోలెఁ - దఱచుగా మెఱసి మదంబులుఁ గురియ
నెసఁగంగ నాదానవేశ్వరుం డప్పు - డసమానుఁడై యుండె నాగోపురమున
మహనీయరావణమహిమచేఁ జేసి - మహితవిద్యుత్ప్రభామండలం బైన1780

గోపురం మపుడు దృగ్గోచరం బైన - భూపాలతిలకుఁ డద్భుతమంది పలికె.
"రా విభీషణ! గోపురంబున వచ్చి - యీవిధంబున నున్నయితఁ డెవ్వఁ డొక్కొ?
ప్రళయకాలమునాఁటి భానుబింబముల - వెలుఁగులపొది పోలె వెలుఁగుచున్నాడు"
అనుడు విభీషణుం డారాముతోడ - ననియె “నయ్యసుర మాయన్న రావణుఁడు
సురనాథు సురలను స్రుక్కించువాఁడు - సురకామినులఁ జెరఁ జొనిపినవాఁడు
ముల్లోకములఁ దనమూర్తిచే హల్ల - కల్లోలమై పడఁ గావించినాఁడు"
అనవుడు సు గ్రీవుఁ డారాముతోడ - ననియె “మీయెదుట నీయసుర గర్వించి

సుగ్రీవుఁడు రావణునితో మల్లయుద్ధము చేయుట

వైభవ మిటు చూపువాఁడె శ్రీరామ! - యీభంగినుండ నే నె ట్లోర్తు" ననుచుఁ
గుటిలవర్తనుఁడును గ్రూరుండు నగుచు - నటు తల లెత్తిన యసురారిమీఁద
నకుటిలశౌర్యసంపన్నుఁడై యపుడు - ప్రకటదివ్యాంగసువర్ణుఁడై పేర్చి1790
మస్తకకోటీరమహితశృంగము - విస్తరోరస్స్థల విపులసానువుల
గురుకొని వాఁ డొక్కకొండయై యున్న - బిరబిరఁ బడవచ్చుపిడుగుచందమున
వెస నగ్గలముగ సువేలాద్రి నుండి - యసురేశ్వరునిమీఁది కర్కజుం డెగసి
దేవారి రావణుఁ దృణముగాఁ జూచి - "రావణ! విను మేను రామునిబంట
మాకు నీవైభవమా చూపె"దనుచు - వీఁకతో మకుటముల్ వెస డొల్ల వ్రేసె
వ్రేసిన నుఱుములై వెలుఁగుచు రాల - భాసురకోటీరపంక్తి యొప్పారెఁ
గాలరుద్రుఁడు మిన్ను గద గొని వేయ - రాలు తారాగ్రహరాజిచందమునఁ
జాలఁ గోపించి దశగ్రీవుఁ డంత - వాలితమ్మునిఁ బట్టి వడిఁ బడవైచె.
నంతటిలోన నయ్యర్కతనూజుఁ - డెంతయు రయమున నేచి పెల్లెగసి
యసుర చేతులలోన నడగంగఁ బట్టి - దెసలు గంపింపంగ ధృతి దూలవైచెఁ1800
గటములు నుదురులు కంధరంబులును - విటతాటములు సేసి వీఁ పెల్లఁ జీరి
కడకాళ్లు దొడలతోఁ గదియంగఁ బట్టి - వడి గోపురంబులో వైచి నొప్పించె.
నిటు పోరుచో వార లిద్దఱు దప్పి - పటుగతి నేలపైఁ బడగ వచ్చియును
నానేల మోపక యతిలాఘవమునఁ - బూనిక నెఱపి గోపురముమీఁదటను
బెనఁగిరి పెనఁగుచో బృథులసత్త్వముల - గొనిన విన్నాణ మెక్కుడుగఁ ద్రోయుచును
డాసి మోఁకాళ్లు ఘట్టనలు సేయుచును - బాసి క్రమ్మఱ ముష్టిబలము జూపుచును
బదముల గుండెలు పగులఁ దన్నుచును - గదిసి మోచేతు లంగముల మొత్తుచును
గరవలయంబులఁ గడఁగి యౌదలలు - పొరిపొరి నెత్తురుల్ పొడమ వ్రేయుచును
దడఁబడఁ బెక్కువిధంబులఁ బెనఁగి - కడఁగి యప్పటితానకములు గైకొనుచు
నుబ్బునూర్పులతోడ నొకకొంతసేపు - ఉబ్బరింపక పట్టి యూరకుండుచును1810
నిమ్మెయిఁ బోరుచో నిద్దఱిమేనఁ - గ్రమ్మెఁ బెల్లెగయు రక్తప్రపూరములు

జేగురుపేరులఁ జెలువైన గిరులు - బాగున నెంతయు భాసురు లగుచు
నున్నచో రావణుం డురవడి మాయఁ - బన్ని తన్నపుడు చంపఁగఁ జూచుటయును
నెఱిఁగి యాకసమున కెగసి వేగమున - గఱుకురాక్షసులు వెక్కసమంది చూడఁ
గపు లెల్ల మ్రొక్క నుత్కటసంభ్రమమున - గపిరాజు వచ్చి రాఘవునకు మ్రొక్కె.
భక్తిమై రణరజఃపటలసమ్మిళిత - రక్తపంకము నిజోరస్స్థలం బంటఁ
గపిరాజు రాముఁడు కౌఁగిటఁ జేర్చి - కృప దళుకొత్త నీక్షించుచుఁ బలికె.
“వాసవాంతకుని రావణునిఁ గైకొనక - నీసాహసము జేయ నిట నీకుఁ జెల్లె;
నే వానిఁ జంపెద నీవిభీషణుని - నావీట నిలిపెద నను బాసకొఱకు
వానిఁ జంపక నీవు వచ్చుట లెస్స - యేను మెచ్చితి నిన్ను నినసూతి నీవు1820
వాలితమ్ముఁడవు రావణుని నిర్జింపఁ - జాలవే తలఁపంగ సైరించు టెల్ల
నది నాకుఁ బాలిడి యవని నాకీర్తి - వదలక చెల్లింప వచ్చితి" ననుడు
"దేవ! యాద్రోహినిఁ దెఱఁగొప్పఁ జూచి - యేవిధంబునఁ గోప మేను సైరింతు”
నని యర్కజుఁడు పల్క నతనిమాటలకు - మనమున హర్షించి మఱియు నిట్లనియె.
“స్ఫురితతారకము భాసురికృష్ణరక్త - పరివేషమున నగు భానుమండలము
వలన మంటలు దెగి వ్రాలుచున్నవియు - జలదము ల్పెక్కు రాక్షసరూపములను
జెలఁగుచు నెత్తురు ల్చిలుకుచున్నవియు - కలయంగ నొకట భూకంప మయ్యెడిని
మేటిగాడ్పులను భూమీధరకోటి - గూటము ల్ధరణిపైఁ గూలుచున్నవియుఁ
బెగడక దినకరాభిముఖంబు లగుచు - నిగిడి వాపోయెడి నెరిజంబుకములు
సారెకు నిట్టు రాక్షసకులప్రళయ - కారణోత్పాతము ల్గానంగఁబడియె1830
దిరముగా నాంగికాస్తికశుభప్రకర - పరసూచకంబు లేవలనఁ గన్పట్టె
మనకు జయం బనుమానంబు లేదు - ఒనగూడు నిఁకఁ దడయుట గా" దటంచుఁ
గరువలిసుతునిపైఁ గర మొప్ప నెక్కి - వరపుణ్యనిధి జాంబవంతుఁ డంగదుఁడు
సౌమిత్రియును విభీషణుఁడును నలుఁడు - భీమవిక్రమకళాభేద్యులై కొలువ
నానగస్థలి డిగ్గి యతులవిక్రముఁడు - వానరసేనలు వడితోడు చూప
చాను ముందర ధనుర్ధరుఁడునై నడిచెఁ - దోన యాలక్ష్మణాదులు చేరి కొలువఁ
దక్కినసేన లుద్దండవేగమునఁ - బెక్కుభంగుల నొక్కపెల్లుగాఁ దోఁచె
నడువ నెంతయుఁ బేర్చి నలినాప్తకులుఁడు - కడుఘోర మైన రాక్షసకోటిచేతఁ
దనరిన లంకయుత్తరపువాకిటను - విన విస్మయంబుగా విడిసె రాఘవుఁడు.

శ్రీరాముఁడు వానరులచే లంక ముట్టడి వేయించుట

ద్వివిదమైందులతోడఁ దెగువ నీలుండు - నవిరళభుజశక్తి నమరులు పొగడఁ1840
బరువడి కపిసేన బలసి త న్గొలువ - వరమతి విడిసె పూర్వద్వారమునను
గజుఁడు గవాక్షుండు గవయుండు భూరి - భుజుఁడైనఋషభుండు పొంకంబుతోడ

దనతోడఁ గూడి రా దక్షిణద్వార - మున వాలి యవ్వాలిపుత్రుండు విడిసెఁ.
బసతో సుషేణుని బవననందనుఁడు - వెసఁ గూర్చుకొని బాహువిక్రమం బొప్ప
వాఁడె పో యీలంక వడిఁ గాల్చినట్టి - వాఁ డనఁ బడమటివాకిట విడిసె.
మేటిగాఁ బెద్ద నమ్మిన ముప్పదాఱు - కోటులకపినాయకులు తన్నుఁ గొలువ
విసువక వీరుఁడై విశదంబు గాఁగ - వెస రాముపడమట విడిసె నర్కజుఁడు
పస గల భల్లూకబలములు గొలువ - నసమానబలయుతుం డై మహాబలుఁడు
అంబుధు లే డొక్క టైనచందమున - జాంబవంతుఁడు రాముసన్నిధి విడిసె
మనుజేశుఁ డపుడు లక్ష్మణవిభీషణులఁ - గనుఁగొని పల్కె నుత్కంఠ దీపింప1850
“వనచరావలుల నవారితబలులఁ - బనుపుఁడు మఱియును బైదళంబుగను
నెక్కడ నేమియు నేమఱకుండ - నొక్కొక్కపద్మ మొక్కొక్కవాకిటను”
ననవుడు నలుఁడును హర్యుడు సంపాతి - యనువారు “మనము శస్త్రాస్త్రసంతతుల
మిగిలి రాక్షసకోటిమీఁదఁ బెల్లుగను - దగిలి యిక్కడనె యుద్ధంబు సేయుదము"
అని పల్క రాముఁ డయ్యగచరాధిపులఁ - గనుఁగొని యపు డొక్కకట్టడ సేసి
"క్రందైనసందడి కయ్యంబునందు - నిందు నందును మన మెఱుఁగంగవలయు
కపిరూపములే కాని కామరూపములు - కపటరూపంబులు గాకుండుఁ" డనుచు
నిటు రామునానతి నెల్లవానరుల - నటు లంకచుట్టు నత్యంతవేగమున
నిశ్చలచిత్తులై నెలకొని పూర్వ - పశ్చిమోత్తరయామ్యభాగము ల్నిండి
పదియోజనంబుల పరపున వీడిసి - పదిలులై యుండి రప్రతిమవిక్రములు1860
వికృతవాలంబులు వికృతాననములు - వికృతదంష్ట్రంబులు వికృతనఖాళి
యమరంగఁ దరుశైలహస్తులై పేర్చి - సమరంబు సేయంగ సన్నద్ధులైన
వారియదల్పులు వారియార్పులును - వారిహుంకారరవంబులు చెలఁగ
భీమమై లంకలోఁ బేర్చి యాదైత్య - భామినీజనుల గర్భంబులు గలఁగె.
నట్టికోలాహలం బంతయుఁ జూచి - నెట్టన రాక్షసనికరంబు బెదరె,
కమలాప్తకులుఁ డప్డు కల్యాణరాముఁ - డమితసత్త్వోన్నతుం డతిదయాశాలి
“రావణునొద్దికి రాయబారంబు - పోవను నెవ్వని బుత్తెంత" మనుచుఁ
గపికులోత్తముఁ డైన కంజాప్తసుతునిఁ - గపిరాజుఁ బంపుట కార్యంబుగాదు
బల్లిదుం డగు జాంబవంతుఁ బంపుటకు - నెల్లవిధంబుల నెఱుఁగఁడు వాఁడు
పరమవిక్రమశాలిఁ బవమానసుతుని - మరలను బంపుట మర్యాద గాదు1870
భుజవిక్రమంబున భూరివేగమున - భుజగవైరికి సరిపోలు నంగదుని
నంపుట మే" లని యతివేడ్క - నెంచి సంపద వెలయంగ సర్వజ్ఞుఁ డైన
మనుజేశుఁ డంతట మంత్రులతోడి - యనుమతిఁ గైకొని యంగదుఁ బిల్చి
"యరిగి రావణుతోడ నజునిచేఁ గన్న - వరగర్వమున మునివరుల దేవతల

నడఁచి బాధించిన యటుగాదు నేఁడు - విడిసె నీపై రామవిభుఁ డని పల్కు
మేలావు నమ్మి నీ వెలనాఁగఁ దెచ్చి - తాలావు చూప ర మ్మను మాజిలోన
సందీప్తరామాస్త్రచయఘట్టనలకుఁ - బందవై యెందునుఁ బాఱకు మనుము
అటు చాల వై తేని నవనిజఁ దెచ్చి - యిట నిచ్చి బ్రతుకుట యిది బుద్ధి యనుము
పరఁగ లంకారాజ్యపట్టంబునకును - గరుణ విభీషణుఁ గట్టినాఁ డనుము
చంపెడు రాఘవేశ్వరుఁ డిదె నిన్నుఁ - జంపక మున్నె నీసకలబాంధవులఁ1880
జూడుము లంకయుఁ జూడు మేర్పడఁగఁ - జూడుము నీకూర్చుసుందరీజనుల
నీవు నీబంధువుల్ నిరవశేషముగఁ - జావంగఁగలవారు చచ్చినమీఁదఁ
గార్యంబు నిష్ఫలకార్యంబు మనుట - కార్యంబు విను దశకంఠ నీ వింక
ననుము పొ"మ్మని రాముఁ డాన తిచ్చుటయు - మనమున హర్షించి మర్కటోత్తముఁడు
వినయంబుతో రామవిభునకు మ్రొక్కి - యనురాగమున నేగె నమ్మహాబలుఁడు

అంగదరాయబారము

ఘనతరపర్వతాకారంబుతోడ - ననిమిషు ల్పొగడంగ నాలంకఁ జొచ్చెఁ
గడుదుష్టరాక్షసగహనముల్ గాల్ప - నడరెడువిలయకాలాగ్నియుఁ బోలె
నెగసి యాకసమున నింద్రారిఁ జంపఁ - దగిలినమృత్యుదూతయుఁ బోలె నపుడు
దశరథాత్మజునాజ్ఞఁ దల మోచికొనుచు - దశకంఠుముందఱఁ దడయక నిలువఁ
గనుఁగొని యపుడు రాక్షసకోటి యెల్ల - "నినజుండు క్రమ్మఱ నేతెంచె" ననుచు1890
నాయోధనోద్యుక్తులై సంభ్రమింప - నాయసురుల నెల్ల హస్తముల్ సాచి
వలవ దోహో! యని వారణ సేసి - పలికె నంగదునితో పంక్తికంధరుఁడు.
"క్రొవ్వి వానరుఁడ! యీకొలువులోపలికి - నెవ్వగ నొందక నేఁడు వచ్చితివి.
ఎవరు నిన్ బంచినా? రెవ్వండ వీవు? - ఎవ్వనితనయుండ? వేమి నీపేరు?
నివ్వటిల్లెడు లంక నీ విటు చొచ్చి - యెవ్వరిపనిఁ బూని యేగుదెంచితివి?
వనచర! చెప్పరా వచ్చినకార్య" - మని రావణుం డిట్టు లదలించి పలుక
విని క్రోధవివశుఁడై వికృతాస్యుఁ - డగుచు వనచరపతి యంత వాని కిట్లనియె.
“నీ వెవ్వఁ డని పల్క నెఱుఁగవే నన్ను - రావణ యేను నారామునిబంట
రాముఁ డెవ్వఁడు పరాక్రమమునఁ బరశు - రాముని గెలిచిన రణవిచక్షణుఁడు
అతఁ డెవ్వఁ డుద్ధతుం డైకార్తవీర్యు - నతివీరుఁ ద్రుంచిన యతులవిక్రముఁడు;1900
అతఁ డెవ్వఁ డెఱుఁగవా యాజిలో నిన్ను - జితుఁ జేసికొని పోయి చెఱనిడ్డవాఁడు;
ఎవ్వనితనయుఁడో యెఱుఁగవా నన్ను - నివ్వటిల్లఁగఁ బట్టి నినుఁ దోఁకఁ గట్టి
మొఱపెట్ట వార్ధుల ముంచి ముం చీడ్చి - కరుణించి విడువఁడే ఘనుఁడైనవాలి;
యావాలి మఱచితే? యకట! యంతటనె - యే వాలిసుతుఁ డౌట యెఱుఁగవా యోరి
యంగదుం డనువాఁడ నాహవవార్ధి - నంగద నిను ముంతు నాతండ్రివోలె

మాతండ్రి యెఱుఁగక మఱి నిన్నుఁ బట్టి - యాతతంబుగ నీట నట ముంచెఁ గాక!"
యనవుడుఁ గోపించి యసురేశుఁ డనియె - "వనచరాధమ! నీవు వచ్చినదూత
చెనకి నిన్నిట శిక్ష సేయరా దనుచు - ఘనముగా బెడిదంపుఁగాఱు లాడెదవు
వలనుగా నిట మున్ను వచ్చినదూత - యలరుచు హనుమంతుఁ డనువాఁడ ననుచు
వలనొప్ప నిట వచ్చి వైదేహితోడఁ - గలవి లేనివి కొన్నికాఱులు వల్కి1910
యీచతురోక్తు లనేకంబు లాడి - మాచేత దండన మఱి పొంది పోయె.
నోరి! యావానరుఁ డున్నాఁడో? లేఁడొ ? - వెరవారఁగా నాకు వివరించి చెప్పు.”
మనవుండు నంగదుం డసుర కిట్లనియె - “ఘనులు రామునిసేనఁ గపులెల్లఁ గినిసి
బలితహుంకారోగ్రపటుశక్తి మెఱసి - చెలఁగి యాహనుమంతు చెంపలు గొట్టి
యని రావణునితోడ నరమాటలాడి - పనివడి లంకకుఁ బనిపూని పోయి
యడరి యింద్రారిచే నాలంబులోన - వడిఁ బట్టువడి చిక్కి వనచర! నీవు
తోఁకఁ గాల్పించుక తొలఁగివచ్చితివి - వీఁకతో రామునివీటిలోపలను
సరి కపికులములో సడి తెచ్చి తనుచు - వెరవిడి తోలిన వీటికిం బాసి
యటఁ బంప కడ కేగె నావానరుండు - ఇట రాముసేనలో నిద్దఱి మమ్ము
నినజుండు వానరహీనులఁ జేసి - పనివాడి యిటువంటిపనులు సేయించు”1920
నని యంగదుఁడు వల్క నసురేశుఁ డంత - మనమున బెగడొంది మగ్నుఁడై యుండె
మలయుచు జలము క్రమ్మఱ నూలుకొలిపి - యలఘుఁడై యంగదుం డప్పుడు పలికె.
నేర రావణ! రాము నెఱుఁగుదుగాక! - యీరీతి గర్వింప నేటికి నీకు
లోకవిక్రముఁడు త్రిలోకభీకరుఁడు - లోకశరణ్యుండు లోకైకనుతుఁడు
లోకరక్షకుఁడును లోకశిక్షకుఁడు - ప్రాకటచంద్రమో భానువీక్షణుఁడు
వేదాంతవేద్యుండు వేనగోచరుఁడు - నాదినారాయణుం డతిసత్యవాది
యసదృశుం డారాముఁ డభిరాముఁ డనఘుఁ - డసహాయకూరుఁడు నతులవిక్రముఁడు
ఆద్యంతరహితుండు నాచారపరుఁడు - నాద్యుండు పరుఁడును నగుదివ్యమూర్తి
దశరథరామభూతలనాయకుండు - విశదోరుసత్కీర్తి విదితశూరుండు
అడరి నీచెలియ లత్యాసక్తి డాయ - నడఁచిన నాశూర్పణఖ ముక్కు సెవులు1930
వడిఁ బట్టి కోసిన వరఖడ్గధార - వడియు నెత్తురుఁ దుడువఁగఁ గోసి వేసి
ఖరదూషణాంగరక్తంబులఁ గడిగి - కర మొప్పఁ జేసిన కాకుత్స్థతిలకు
నెఱుఁగవా? రాముని నేటికిఁ బ్రేలె - దెఱిఁగెదు కా కేమి? యెందుఁ బోయెదవు?
మూఁడులోకంబులు ముట్టి గర్వమున - మాడించు నిన్ను నమ్మనుజవల్లభుఁడు
దునిమెడినుగ్రత దొలఁగక నిలిచి - యని సేయు బంటవై యంతియ చాలు
లంక నీ వింక నేలఁగలేవు వినుము - లంకకుఁ బతి సుమ్ము లలి విభీషణుఁడు
తడయక నీమీఁద దయ గల్గి యిపుడు - కడువేగమున నిట్టి క్రమమున మంచి

బుద్ధి నీకును జెప్పఁ బుత్తెంచె నన్ను; - వద్దురా! రాక్షస! వైదేహి నిమ్ము
మది మది నుండి రామాధిపుతోడఁ - గదిసి కయ్యమునకుఁ గాలు ద్రవ్వకుము
రాక్షసాధమ! యోరి! రామునిదేవి - నీక్షితి మొఱగి నీ విట్లు తేఁదగునె?1940
లోకపావనసీత లోకైకమాత - నీకుఁ దేఁదగ దోరి! నీచరాక్షసుఁడ
నినుఁ జెప్ప దోషంబు నినుఁ జూడరాదు - ఘనతర మగు పాపకర్ముండ వీవు,
లోకంబులకుఁ దల్లి లోలాక్షి సీత - నీకుఁ దల్లియ కాదె? నిర్భాగ్యదనుజ!
యవివేకమునఁ జేసి యపకీర్తి పడితి - వివి కీర్తులా నీకు? నెఱుఁగలే వైతి
వెడపక రఘురాముఁ డె గ్గేమి సేసె? - గడుగర్వి యన మీఁదుఁ గానంగలేక
యిహపరదూరుఁడ వీ వేపు మీఱి - విహితమార్గం బింత వివరింప వైతి;
వుడుగక రామాగ్ని యొడిఁగట్టుకొంటి - పుడమిలో భస్మమై పోయెడి కొఱకు
నీపాలివిధి పట్టి నీమెడఁ గట్టి - యీపాలు చేసె నిన్నీ రసమెత్తి
నీ వేమి సేయుదు; నీవ్రాఁతఫలము - గావించి యజుఁ డిట్లు కట్టడ సేసి
కడఁగి రాఘవు నంప కార్చిచ్చులోనఁ - బడి శలభంబవై వ్రాలెదె వెల్లి;1950
చాల నొప్పినయట్టి సౌఖ్యత లంక - యేలుభాగ్యంబు లే దే మందు నిన్నుఁ?
జెడకుము శర ణని చేరు మారాముఁ - బుడమిలో నీప్రాణములు గాచికొనుము
నీపుత్త్రమిత్రాదినిఖిలరాక్షసులు - నేపరి రాముచే నీల్గకమున్నె,
కార్యంబు మునుపడఁ గైకొని బ్రతుకు - కార్య మొల్లక పోరు గావించితేని?
చుట్టాల నింతుల సుతుల సోదరుల - నిట్టె యందఱఁ జూడు మిఁకఁ జూడలేవు;
ఎలమి నీమోహంపుటింతుల నెల్లఁ - గలయ భోగింపుము కాంక్షలు దీర,
వెలయంగ నీరాజ్యవిభవంబు లెల్లఁ - బలుదెఱంగుల నేఁడె పాటించి చూడు
హరిహరబ్రహ్మదు లడ్డగించినను - దురములోపల నిన్నుఁ ద్రుంచు రాఘవుఁడు
ఇన్నియు నేటి కాయినకులేశ్వరుని - కున్నతమతి సీత నొప్పించి బ్రతుకు
మిటు రామునానతి యెఱుఁగఁ జెప్పితిని - గుటిలరాక్షస! యేమి గొబ్బునఁ జెప్పు;1960

రావణుఁ డంగదునితోఁ దనపరాక్రమము సెప్పుట

మన రోషచిత్తుఁడై యద్దశాననుఁడు - ననియె నంగదుతోడ నప్పుడు కినిసి
రాముఁ జెప్పెదు పరాక్రమశాలి నన్ను - రాముఁ డెఱుంగఁడా రణవిజయుఁడుగ
దివిజేంద్రుఁ డాదిగా దేవసంఘముల - బవరంబులోపలఁ బఱపినవాఁడ
హరుఁ డున్నకైలాస మగలించినాఁడ - నెరియంగఁ గాలుని నెదిరించినాఁడ
వరుసతో జగములు వర్ణింప నలరి - సరవి లోకములెల్ల సాధించినాఁడ
వనజాపసనునిచేత వరముఁ గొన్నాఁడ - మొనసి దివ్యాయుధంబులు గలవాఁడ
నిట్టి పిమ్మటను నే నీరాముమఱుఁగుఁ - బట్టిన దేవతల్ పకపక నగరె?
యనుజుండు నాతోడ నలి గటు పోయి - జననాథుమఱుఁగు వంచనఁ జొచ్చెఁగాక!

ఏనును జొచ్చిన హీనత గాదె - వానరాధమ నాకు వసుమతిలోన
మగపాడి దిగనాడి మానంబు విడిచి - పగవానిఁ గలయుట పంతమే నాకు1970
పగవాఁడు దండెత్తి పై వచ్చినంత - మగఁటిమి చెడి సంధి మఱి సేయునపుడె
జగతి రాజులు నన్ను సరకు సేయుదురె? - తగదురా! సంధి యిత్తఱి వానరుండ!”
యనిన దశాస్యుని కనియె నంగదుఁడు - "ఘనపరాక్రముతోడి కయ్యంబు వలదు
దానవ! రఘురాముతర మెఱుంగకయ - పూని యున్నాఁడ విప్పుడు కావరమున
సురల గెల్చినమాడ్కి శూరు రాఘవుని - దురములో నెదిరించి తొడరుట యెట్లు?
బల మేది రఘురామపార్థివు నెదిరి - బలుముష్టి వి ల్లెట్లు పట్టంగవచ్చు?
నొరుల గెల్చిన మాడ్కి నోర్చి రాఘవుని - శరవృష్టిముందఱఁ జరియించు టెట్లు?
కణకతో నీ వెత్తగా లేని విల్లుఁ - దృణలీల విఱువఁడే త్రిజగంబు లెఱుఁగ?
వెఱ వేది రఘురామువిక్రమస్ఫురణ - మెఱుఁగని యవివేకి వేమందు నిన్ను?
జనకనందన నిచ్చి శరణన్న లెస్స" - యని యంగదుఁడు పల్క నసురేశుఁ డనియె,1980
"నోరి! వానరుఁడ! నీ వోడక యిపుడు - సారెకు రఘురాముశౌర్య మెన్నెదవు
ఆరామువిక్రమ మారాముకడిమి - యారాముభుజశక్తి యది యెంత పెద్ద?
చలమునఁ దాటకఁ జంపెనంటేని - తలపోయ నాఁడుది దానిటె క్కెంత
జనకుని విలు విర్చి జనకతనూజ - ఘనతఁ జేగొన్నట్టి ఘనుఁ డంటివేని?
నావిల్లు నేఁటిదే యది చెప్పనేల? - కావున నది వీరకర్మమే? మఱియు
జమదగ్నిరాముని సమరమధ్యమునఁ - గ్రమమున గెలిచిన ఘనుఁ డంటివేని?
యని బ్రాహ్మణుని గెల్చు టది బంటుతనమె? - వినఁ బోల దీమాట విక్రమస్ఫురణ
నలపున ఖరదూషణాదిరాక్షసులఁ - జలమున నొక్కఁడే చంపె నంటేని?
నలర వారలు వృద్ధు లది చెప్పనేల? - తలపోసి యెంచిన ధరణీశ్వరుండు
తెగువ మారీచు మర్దించె నంటేని - మృగమాత్ర మగువాని మేర యే దొడ్డ?1990
ఎసఁగ వాలినిఁ గూల నేసె నంటేని - వసుధలోపలఁ గోఁతి వాఁ డెంత దొడ్డ?
జవసత్త్వమున వార్ధి శరముఖంబునకుఁ - గవగొని తెచ్చిన ఘనుఁ డంటివేని?
నావీరవరునకు నారాఘవునకు - నావార్ధి జలమాత్ర మది యేమి బలిమి?
ఇవి బంటుతనములే? యీరాఘవునకు - నివియెల్ల గెలుపులే యిల రాజులకును?
బూని నాముందఱఁ బొడవులు చేసి - వానర! రఘురాము వర్ణించె దీవు”
అని దశాస్యుఁడు పల్క ననియె నంగదుఁడు - "అనుపమోన్నతగుణోద్యముని రాఘవుని
సకలలోకారాధ్యు జగదభిరాము - సకలజగద్ధితచరితు శ్రీరాము
నకలంకవిక్రము నతివీరవర్యు - నకట దూషింపంగ నర్హమే నీకుఁ?
జెలఁగు నీరఘురాముశౌర్యంబునకును - ఖలులగు క్రవ్యాదగణములే సాక్షి;
గొనకొని వాలిని గోఁ తంటి వందు - కనెద ని న్ముంచిన యంబుధుల్ సాక్షి;2000

అలఘువిక్రమశాలి యైనరాఘవునిఁ - జెలఁగి దూషించిన జననాథుపెంపు
తప్పెనో నీ కేమి ధన్యత వొడమె? - నిప్పుడు రఘురాము నిట్లు దూషింప
నీరాజసంబును నీదుభోగంబు - దూరమౌ; నాయువు దొలఁగును సిరియుఁ;
దనర శ్రీరామునిఁ దలఁచినంతటనె - ఘనమైనపాపంబు గ్రక్కునఁ బాయు
రాముపాదము సోఁక తా యింతి యయ్యె; - రామరా మని బోయ రాశికి నెక్కె;
రామనామస్తుతి రావణ! నీకు - నేమి పాపముననో యెరుక చొప్పడదు?
అట్టి శ్రీరాముని యసురేశ! నీవు - నెట్టన దూషింప నీ కేది గతియొ?”
అని యంగదుఁడు పల్క నసురేశుఁ డనియె - “వనచర రఘురామవసుధేశుశక్తి
యెఱుఁగుదు చెప్పఁగా నేల? యాస్వామి - పరమైనతారకబ్రహ్మం బనంగ;
నాడవలయు మాట లాడితి కాక! - పోడిమి రాముతోఁ బురుణింపఁగలనె?2010
చలపట్టి రాముతో సమరంబు సేయఁ - గలుగునో? యని కోరి క్రాలుచున్నాఁడ;
విందు నందును మెచ్చ నినవంశుతోడఁ - జెంది కయ్యము సేయ శివుఁ డెఱింగెడిని;
అతనితోఁ బోరాడి యతనిచేఁ జచ్చి - ప్రతిలేనివైకుంఠపదవిఁ గైకొందు;
నీలోకసౌఖ్యంబు లింతియ చాలు - నేల చెప్పంగ? నే నెఱుఁగు దన్నియును
బలవంతుఁ డగు రాముప్రాభవోన్నతులు - దెలియ చిత్తంబులోఁ దివురుచున్నాఁడ”
నని చెప్పి దశకంఠుఁ డనియెఁ గ్రమ్మఱను - దనవివేకము చెడి తామసుం డగుచు
“ధరణీతలం బెల్లఁ దమ్మునిచేతఁ - బరగంగఁ గోల్పోయి పడఁతియుఁ దాను
ననుజుండు గూడంగ నడవులఁ బడుచుఁ - దనసతి నొకనిచేఁ దాఁ గోలుపోయి
వచ్చి సుగ్రీవాదివానరవరులఁ - జొచ్చియు నటమీఁద శూరతఁ జూపఁ
జనుదెంచె రాముఁడు సంగరస్థలిని - నను దాఁక నేర్చునే నరనాయకుండు2020
అటుగాన రఘురాముఁ డాలంబులోనఁ - బటుతరశౌర్యసంపన్నుండు గాఁడు
మనుజులు కోఁతులు మగఁటిమిచేత - దనయొద్దఁ జెప్పకు తరుచరాధముఁడ!
వనచరాధమ! యోరి! వాలికి నీవు - తనయుండవై తేని? దశరథాత్మజుని
గొలిచితి బంటవై కొల యీగవైతి - చలమున నీతండ్రిఁ జంపినాఁ డతఁడు;
అట్టి రామునిఁ గొల్చి తధమవానరుఁడ! పుట్టి తింద్రజుగర్భమున వృథా నీవు;
చంపినపగవానిఁ జంపక రాము - పంపుసేయుచు నిట్లు బంటవై తిరిగి
యెలమిఁ గొల్చెద నన్న నీరాజె కాని - తలపోయ రాజులు ధరణిపై లేరె?
గొనకొని పగవానిఁ గొలిచినవాని - నినుఁగాని యెవ్వరి నెఱుఁగ మెన్నఁడును
నీమగఁటిమికిని నీదుపెంపునకు - సీమవా రెల్లరు సీయని నగరె
కొడు కైనపిమ్మటఁ గులవైర మెల్ల - వడితోడ నీగని వాఁ డెట్టికొడుకు?2030
ఈగతి బంధువై హీనమానవునిఁ జేరి కొల్చుట యెట్లు చేవయు లేక?
నిను వాలికొడు కన్న నెటు నమ్మవచ్చు? - వనచర! యెవ్వరివాఁడవో? కాక!

విను బుద్ధి సెప్పెద వివరంబు గాఁగ - మనుజులఁ గొలుతురే? మనుజులు నాకుఁ
బగవారు; నీకునుఁ బగవారు గాక! - నొగి దౌత్య మిటు సేయుచుండుట దక్కి
నన్నుఁ గొల్చిన నిన్ను నంగద యిపుడు - వనచరులకు నెల్ల వరప్రభు గాఁగ!
ఘనభూషణంబులు ఘనవాహనముల మనఁ జేతు నిప్పుడు మహిమీఁద" ననిన
దనుజాధిపతిఁ జూచి తారాసుతుండు - ఘనకోపమునఁ జాల గరిమ నిట్లనియె.
“నగణితోన్నతశక్తుఁడై నరాఘవుఁడు - తగ నాదు తలి దండ్రి దాత దైవంబు
ఏమి గర్వము నీకు? నెఱుక చొప్పడదు - భూమీశుతో రిపు ల్పురణింపఁగలరె?
యరయ లేక వివేకు లారామవిభుని - నరుఁ డంచు నెంతురు నక్తంచరేంద్ర!2040
యతఁడు మానవమాత్రుఁడా యసురేశ! - యతఁడు లోకారాధ్యుఁ డతఁ డప్రమేయుఁ
డతఁడు శ్రీవిష్ణుండు నతఁ డాదిమూర్తి - యితనికి సరిపోల్ప నెవ్వరు గలరు?
సనకాదులును గూడి చర్చింపలేరు - వనజాసనాదులు వర్ణింపలేరు
దానవాంతకుఁడు నై దశరథేంద్రునకుఁ - బూని జన్మించిన భూపాలుఁ డితఁడు
నితనికోపాగ్నికి నెవ్వఁడు నిల్చు? - నితనితో డీకొని యెవ్వఁడు పోరు?
నితనిబాణాహతి కెవ్వఁడు నోర్చు? - నితని నెన్నవశంబె యింద్రాదులకును?
నీ వెఱుంగవు రాము నిపుణవిక్రమము - కావరంబున నేల కాఱు లాడెదవు?
వరరాము నెఱిఁగెదు దురములో నెల్లి - కర మర్థి దురమునఁ గదలక నిలుము.
కర్మపంకము లెల్లఁ గడతేర్చి వాలి - నిర్మలాత్మకుఁ డయ్యె నృపుచేతఁ జచ్చి
పదపడి వైకుంఠపదముఁ గైకొనియె - నిది కీడుగా మమ్ము నెన్న నేమిటికి2050
నితనిఁ గొల్చిన నాకు నిహపరోన్నతులు - నతులితంబుగఁ గల్గు నమరులు పొగడ
నీమదంబును లావు నీరాజసంబు - రామచంద్రునిఘోరరణరంగమందు
బోయెడు నెబ్భంగిఁ బొలు పేది నీవు - వేయుఁ జెప్పఁగనేల? విధి నిన్నుఁ జుట్టి
కొనిపోవుచున్నది కుటిలరాక్షసుఁడ! - మునుపటివరగర్వములు చెల్ల వింక;
నిన్నియు నేటి కాయినకులేశ్వరున - కున్నతమతి సీత నొప్పించి బ్రతుకు

రావణుఁడు తనభటులతో నంగదునిఁ బట్టి కట్టుం డని నియమించుట

తొడరిన బలవంతుతో సంధియగుట - పుడమి రాజుల కెల్ల బుద్ధియె సుమ్ము;"
అనవుడుఁ గోపించి యారావణుండు - ఘనబాహుబలుని నంగదుఁ బట్టి కట్టఁ
బనిచినఁ గొందఱు బలితంపుటసురు - లనయంబు నుద్ధతులయి పట్టుటయును
సొలవక తనశక్తి చూపెడికొఱకుఁ - దొలఁగ నొల్లక యంగముఁడు పట్టువడియె.
నటు పట్టువడి యతఁ డాకాశవీథిఁ - బటుశక్తి నెగసి యుద్భటవృత్తి మెఱసి2060
విద్రిచినఁ బదివేలవీరులు ధాత్రి - యద్రువంగ నుగ్గునూచై త్రెళ్ళి రంత
నలిగి యంతటఁ బోక యంగదుం డసుర - కొలువున్నయమ్మేడఁ గూలఁ దన్నుటయు
నది వజ్రహతిఁ దుహినావనీధరము - తుదిఁ గూలుపగిదిఁ దుత్తునియలై కూలె.

వెండియు నంగదు విడువక పట్టఁ - బొం డని దైత్యులఁ బుచ్చె రావణుఁడు
పుచ్చిన వారును బొదివి యంగదుని - నచ్చెరువయి యుండ నాకాశమునను
బరశుపట్టసభిండివాలశూలములఁ - గరవాలతోమరగదల నొప్పింపఁ
బిడికిళ్ళతోడనే ప్రేవులు వెడల - బెడిదంబుగా నొంచి పృథివిపైఁ గూల్చి
యరుగుచునున్న యాయంగదుఁ జూచి - ఖరసూతి సుకరుండు కార్ముకం బెత్తి
"నిలు నిలు మంగద! నీ వెందుఁ బోవఁ - గలవాఁడ" వని పేర్చి కాండంబు లైదు
నుదురు గాడఁగ నేసి నొప్పించి మఱియుఁ - బదితీవ్రశరముల బాహువు లేయ2070
నలుకతోఁ బిడికిట నంగదుం డతని - తల పెక్కువ్రయ్యలై ధరఁ గూలఁ బొడిచె.
దానికి దైత్యులు తల్లడమంద - దానవేశ్వరుఁడు చింతామగ్నుఁడయ్యెఁ
దారాతనూజుఁ డత్తఱి నేగుదెంచి - యారామచంద్రునియడుగుల కెరఁగి
“యోజగదారాధ్య! యోరామచంద్ర! - భూజననుత రామభూపాలతిలక!
దేవ! మీయానతి ధృతితోడ నేను - రావణునొద్దికి రయమునఁ బోయి
చెప్పఁగాఁ గల వెల్లఁ జెప్పితి దేవ - చెప్పినమాటలు చెవిఁ బెట్టఁడయ్యెఁ
గట్టిగాఁ జావుకుఁ గడుతెంపు చేసి - యుట్టిగట్టుక నూఁగుచున్నాఁడు దేవ!
‘యినకులనాథ! నీ వీదశగ్రీవు - ననిలోన మడియింపు మఖిలలోకేశ!”
యనుచు నావృత్తాంత మంతయుఁ దెలియ - వినుపించె నంతయు విశదంబు గాఁగ
జననాయకుండును సంతసం బందె - ఘనతరంబైన యంగదసత్త్వమునకు 2080
నట రావణునితోడ నసురు లందఱును - బటుతరవాక్కులై పలికి రెంతయును
"ఇది యేమి దేవ! నీ వి ట్లూరకునికి? - యదె కపిసేనతో నారాఘవుండు
విడిసినాఁ డీలంక వేడించి యింకఁ - గడిమి నెన్నఁడు చూపఁగలవాఁడ వీవు?
మముఁ బంపు రామలక్ష్మణుల వానరుల - సమరంబులో గెల్చి చనుదెంతు" మనుచు

రావణుఁడు యుద్ధసన్నద్ధుఁడై యుత్తరగోపురమునకు వచ్చుట

వీనుల కరుదుగా విని దశాననుఁడు - భానుజాదులకును భయము పుట్టంగఁ
దనవైభవము రామధరణీశునకును - ఘనముగాఁ జూపెదఁ గా కంచుఁ దలఁచి
సాంద్రప్రతాపనిస్తంద్రుఁడై తొల్లి - యింద్రనాగేంద్రధనేంద్రుల గెలిచి
కప్పముల్ గైకొన్న ఘనవస్తువితతిఁ - దెప్పించి మే లేర్చి దీధితు ల్నిగుడఁ
జీనాంబరంబులు చెలువారఁ గట్టి - నానాదిశల వాసనలు వెదచల్ల
మృగమదశ్రీగంధమిళితమనోజ్ఞ - మగుదివ్యచందన మర్థితో నలఁది2090
సరసమంజుళపారిజాతప్రసూన - విరచితమాలికావితతులు ముడిచి
పంకజరాగాదిబహురత్నకలిత - కంకణముద్రికాంగదభుజాభరణ
ఘనతరగ్రైవేయఘంటికానేక - వినుతహారంబులు విపులంబులైన
పదకంబు లాదిగా బహుభూషణములు - పదకశుద్ధిగ వన్నె పచరింపఁ దాల్చి

కుండలంబుల మెండుకొనుమణిప్రభలు - గండమండలములఁ గడలుకొనంగఁ
జండాంశుమండలోజ్జ్వలములై దిక్కు - లొండొండ వెలిఁగించు నురుకిరీటములు
దశశిరంబుల మించు దహనుఁడో యనఁగ - దశశిరంబుల లీల ధరియించి మించి
సురవరానలయమాసురనాథవరుణ - మరుదర్ధనాయకస్మరసంహరులను
గండడంచి జయించి కైకొన్న బిరుదు - గండపెండంబు డాకాల ధరించి
శరశరాసనపట్టసప్రాసచక్ర - పరశుతోమరభిండివాలత్రిశూల2100
కరవాలపాశముద్గరచంద్రహాస - పరిఘాదులగు వరప్రహరణశ్రేణు
లిరువదికరముల నేపారఁ బట్టి - పరిచారు లొగివెంట బలిసి యేతేర
గొబ్బున నుత్తరగోపురంబునకు - గబ్బు నుబ్బును గ్రాల ఖడ్గశూలాది
హస్తులై యెడగల్గి యాప్తరాక్షసులు - విస్తరంబుగఁ బరివేష్టించి కొలువ
స్ఫురితభూషణవస్త్రభూషితు లగుచు నిరువంక మంత్రు లనేకులు గొలువఁ
దుద లేని రత్నపంక్తులు దాపినట్టి - పెదపెద్దపసిఁడికుప్పెలు మీఁద నొప్ప
ప్రవిమలంబగు నెనుబదివేలసంఖ్య - ధవళాతపత్రముల్ దనుజులు పట్ట
నలశేషఫణములో యన నన్నివేల - సలలితవ్యజనముల్ సకియలు పూనఁ
దళుకువెన్నెలలచందమున నాసంఖ్య - గలచామరంబులు కాంత లిర్వంకఁ
గంకణఝణఝణత్కారము ల్మెఱయ - నంకించి చామర లందంద వీవ2110
మరల గెల్చినజయస్ఫురణ లెల్లెడల - బిరుదు లెత్తుచు వందిబృందంబు వొగడ
మంద్రమధ్యమతాళమానభేదముల - జంద్రాస్య లెఱుఁగ మెచ్చఁగఁ బాడ వినుచు
సన్నుతమాణిక్యజాలప్రభాస - మున్నతసింహాసనోపరిస్థలిని
అపరాచలముమీఁది యర్కునితోడి - యుపమకుఁ బాత్రుఁడై యొగి రావణుండ
వలనైన తనవైభవంబెల్ల మెఱసి - కొలువుండె నుత్తరగోపురంబందు
నాగొడుగులనీడ యాదిత్యుఁ గప్ప - వేగంబె చీఁకటి విలసిల్లుటయును
నావేళ మాయామృగాజినంబునను - దేవేంద్రమణికాంతి దీపించుమేని
వామభాగము మోపి వామభుజాగ్ర - సీమఁ గపోల మూర్జితముగాఁ జేర్చి
యుగ్రాంశుబింబసముజ్జ్వలుం డయిన- సుగ్రీవుతొడలపై సొంపుసౌందర్య
సంపద లొలుక రాజసముగా నొరగి - పెంపారుమహిమచేఁ బ్రియభక్తుఁడైన2120
పవనజుతొడలపైఁ బాదపద్మములు - సవరణఁ జాప నిశ్చలభక్తి నతఁడు
మృదురీతి నొత్త నర్మిలి నంగదుండు - కదిసి దక్షిణభుజాగ్రం బిరుకేల
నంది యంగుళము లొయ్యనఁ బట్టుచుండ - వందిబృందములవైఖరి నిలిచి
నలనీలభల్లూకనాయకప్రముఖు - లలరుచు సకలలోకారాధ్యచరణ
జానకిహృదయాంబుజాతషట్చరణ! - దీనార్తిహరణ! కీర్తితకృపాభరణ!
హరనుతనామ! సూర్యకులాబ్ధిసోమ! - యరిభీమ! రఘురామ! యని సన్నుతింపఁ

గందని పూర్ణరాకాచంద్రుఁబోలు - మందస్మితాననమండలంబునను
నవిరళకరుణామృతాపూర్ణ మగుచు - ధవళారవిందసౌందర్యంబుఁ దెగడు
తేలికన్నుఁగవకాంతి దెస లెల్ల నిండ - లలితానవలోకవిలాసచంద్రికలు
వెదచల్లఁగాఁ గరద్వితయసన్నిహిత - వదనుండు రాక్షసవరమర్మవిదుఁడు2130
నగువిభీషణుతోడ నతిరహస్యంబు - లగు మాట లాడుచు నప్పటప్పటికి
రమణీయలీల శ్రీరాఘవేశ్వరుఁడు - అమర దక్షిణముఖుఁడై యున్నవాఁడు
గావున గోపురాగ్రమునఁ గొల్వున్న - రావణుఁ బొడగాంచి రఘురాముఁ డనియె.
"నో విభీషణ! చూడు మున్నతంబైన - యావిశాలపుగోపురాగ్రంబునందు
భోగియై యెంతయుఁ బొగడొందువాఁడు - బాగొప్ప వానికిఁ బట్టినయట్టి
శరదభ్రవిభ్రమచ్ఛత్రసంఘములఁ - బరఁగెడునీడ భూభాగంబుఁ గప్పె
నారూఢవైభవాయతవృత్తితోడ - నీరీతి నున్నవాఁ డితఁ డెవ్వఁ" డనిన
నారాముఁ జూచి యిట్లని విన్నవించె - నారావణునితమ్ముఁ డగువిభీషణుఁడు
"దేవ! రాఘవ! వీఁడు దేవారియైన - రావణుఁ డమరవిద్రావణుం డఖిల
దివిజులచేఁ గొన్న దివ్యభూషణము - లవిరళంబుగఁ బూని యాప్తు లై నట్టి2140
దనుజముఖ్యులు గొల్వఁ దనకు నిండారఁ - బనుపడఁగా నెనుబదివేలసంఖ్య
గలగొడుగులు పట్ట ఘనచామరంబు - లలవుమై వీవంగ నాలవట్టములు
పూనంగఁ దనదుపెంపును రాజసమును - దా నిట్టి దనుచు మోదమున మీయెదుటఁ
జూపంగఁ దలఁచి భాసురవైభవమున - గోపురోపరిసీమఁ గొలువైనవాఁడు”
నా విని నవ్వి మానవకులేశ్వరుఁడు - దేవారిగర్వంబుఁ దీర్పంగఁ దలఁచి

శ్రీరాములు రావణుని ఛత్రచామరంబులు బాణములతో దెగనేయుట

వెనుకొని లక్ష్మణ! విల్లుఁ దెమ్మనుచుఁ - దనకుఁ బిమ్మటనున్న తమ్మునిచేతి
ధనువు చేత నెంతయు వేడ్క నంది - కొని దక్షిణాంఘ్రియంగుష్ఠాన వింటి
కొన నంబుఁ బూని గ్రక్కున నెక్కు పెట్టి - కన దర్ధచంద్రమార్గణ మరివోసి
ధీలక్షితోల్లాసి తెగనిండదీసి - యాలీల నొఱగిన యట్లనే యుండి
యలచామరవ్యజనాతపత్రౌఘ - ములమీఁద నేసె నద్భుతవృత్తి మెఱయ2150
శర మొక్కటియుఁ బదిశరములై నూఱు - శరములై పదివేలశరములై మఱియు
లక్షయై కోటియై లక్షించి చూడ - నాక్షణంబున సంఖ్య లన్నియుఁ గడచి
తాలవృంతంబులు దాల్చు చేడియల - మేలిచామరములు మెఱయించుసతుల
సంగీతములు సేయు సరసిజముఖులఁ - బొంగుచుఁ గైవారములు సేయు బోంట్ల
ధవళాతపత్రముల్ ధరియించు దైత్య - నివహంబులను గొల్చి నిల్చినభటులఁ
గరములు ద్రుంచక గళములు ద్రెంచ - కురములు నాటక యురుకిరీటములు

ధర డొల్లఁజేయక తలలు ఖండింప - కరు దరు దిది యని యమరు లుప్పొంగ
నాలవట్టంబులు నాతపత్రములు - చాలశోభిల్లు వింజామరంబులును
కత్రించికొనిపోయెఁ గంఠమాత్రములఁ - జిత్రమై తనరిన సితచామరములు
నాలవట్టములు సితాతపత్రములు - దేలుచు ఝల్లని దివినిండ నెగసి2160
కొలువులోఁ గొన్ని దిక్కులయందు గొన్ని - కొలువు లోపలి దైత్యకోటిపైఁ గొన్ని
లంకలోఁ గొన్నియాలవణాబ్ధిఁ గొన్ని - లంకేశుపైఁ గొన్ని లఘులీలఁ బడియె.
నలవుమై నటు చేసి యాదివ్యశరము - పొలయక రఘురాముపొదిఁ జొచ్చె నంత,
మహితాతపత్రచామరతాలవృంత - రహితదండధరాసురశ్రేణినడుమ
నున్న రావణుఁ డప్పు డొప్పారెఁ జూడ - దన్నుఁ గొంపోవ నుద్ధతి వచ్చియున్న
దుర్వారులగు యమదూతలనడుమ - గర్వంబు చెడియున్నగతి నుండెఁ జాల
వెఱఁగంది రఘురామువిలువిద్యపెంపు - తఱిగొని తలపోసి తల లూచి యూచి
బట్టుకైవడి మెచ్చి పటుతరధ్వనుల - బెట్టెత్తి రఘురాముఁ బేర్కొని పొగడె.
“నల్ల యోరఘురామ! నయనాభిరామ! - విల్లువిద్యకు గురు! వీరావతార!
కరశరలాఘవక్రమకళానిపుణత! - స్ఫురదురుచాపసంతోషితకృపణ!2170
భుజసారదృఢముష్టి! భువనవిఖ్యాత! - విజితరిపువ్రాత! విజయసమేత!
మానవరాజకుమారకంఠీర! - వాసవ్యదివ్యశస్త్రాస్త్రసంపన్న!
స్ఫారఘోరాక్షయబాణతూణీర! - వీరాగ్రగణ్య! యోవిశ్వశరణ్య!
బాపురే! రామభూపాల లోకముల - నీపాటివిలుకాఁడు నేర్చునే కలుగఁ?
బాటించి పురముల పైఁ బడ్డహరుని - యేటొప్పు నిందు నీ యే టొప్పుఁగాక!"
అని యని పదినోళ్ల నందందఁ బొగడ - విని మంత్రు లాదైత్యవిభున కిట్లనిరి.
"పగవాని నీరీతిఁ బంతంబు విడిచి - పొగడుదురే? దైత్యపుంగవ! యిట్లు
పొగడిన భయ మందఁబోలు నటంచుఁ - బగవారుఁ దనవారు బలుచగాఁ జూతు
రది కాన రాచకార్యంబు గా" దనిన - మది నవ్వి యమరారి మంత్రుల కనియె,
“విలువిద్యపెంపును విక్రమక్రమము - కలికితనము బాహుగర్వరాజసము2180
లాదిగా గుణముల నధికుఁడై నట్టి - కోదండదీక్షాదిగురునితో రాజ
వరునితో రామభూవరునితో నొరులు - పరికించి చూడ నేపట్టుననైన
సాటియే యిమూఁడుజగములయందు - మేటిశూరులపెంపు మెచ్చంగ వలదె?”
యని నీతి చెప్పుచు నచ్చోటు వాసి - దనుజేశ్వరుఁడు వోయె దనుజనాయకులు
తెగిపడ్డ గొడుగులఁ దెఱఁగొప్పఁ జూచి - మిగిలినభీతిమై మెల్లనఁ జనుచు
నటు రఘురామునియతులవిక్రమముఁ - బటుగతిఁ బొగడుచుఁ బలుతెఱంగులను
ఆరాఘవుఁడు కరుణాంబుధిగాన - ఘోరబాణంబున గొడుగులఁ ద్రుంచె
నిటు వంచియేసిన నిందఱితలలు - పటుతరంబుగఁ దెగి పాఱవే యనిరి!

ఇట నంత నారాఘవేంద్రుండు కార్య - ఘటనాప్రయత్నసంగతచిత్తుఁ డగుచు
ననుజవిభీషణార్యమజాదు లైన - తనవారియనుమతిఁ దగుముహూర్తమునఁ2190
బనిచె నప్పుడు లంకఁ బట్ట వానరులఁ - బనిచిన వానరబలములు లంక
ఘనభీతి నిక్కడక్కడఁ బడనార్చి - వనజాప్తకులు రామవల్లభుఁ జూచి
"దేవ మాశౌర్యంబు తెఱఁగొప్పఁ జూడు - మేవిధంబులఁ బ్రాణ మిత్తుము నీకు”
నని పర్వతంబులు నవనిజంబులును - గొని వేలులక్షలు కోటానకోటు
లక్షౌహిణులు గుమురై కూడివచ్చి - యాక్షణంబున ముట్టి రాలంకకోట
ముట్టిన గెల్పు రామునకు నౌ ననుచు - దట్టించి పేర్చి యుదగ్రులై కినిసి
బహుకాష్ఠపాషాణపాదపావళుల - నహితదుర్వారులై యందందఁ గదిసి
తరమిడి యాయగడ్తలు పూడ్చు నప్పు - డురుశక్తిఁ గపివీరు లున్నవిధంబు
పొలుపార నపుడు చంపుడుఁ గట్టమీఁద - దశముఁగా నున్నచందము నివ్వటిల్లెఁ
గుముదుఁ డత్తఱిఁ బదికోటులతోడ - సమత దూరుపుమొగసాలకు నరిగెఁ2200
బై దళంబై యుండ బలసి రాక్షసులు - పైద్రోచి రాకుండఁ బలిమిఁ జూపుచును
గొనకొని యెనుబదికోటులకపులు - తనతోడఁ బేర్చి యుద్దండత నడువ
ఘనబాహుబలుఁడు దక్షణపువాకిటను - బనియుండె శతబలి బలియుఁడై యపుడు
పడమటిదెస కఱువదికోట్లకపులు - నడువ సుషేణుఁ డున్నతి నేగియుండె
రామలక్ష్మణులును రాక్షసేశ్వరుఁడు - నామర్కటేశ్వరుం డయ్యుత్తరంపు
వాకిట నుండిరి వనచరోత్తములు - నాకోట లెక్కించి యడరి యార్చుచును
గజుఁడును గవయుండు గంధమాదనుఁడు - భుజబలాఢ్యుఁడు శరభుఁడు నుగ్రవృత్తి
దట్టించి కోట యంతటికిని లగ్గఁ - బట్టింపుచుండిరి పలుమాఱు దిరిగి
కోపించి వానరకోటులు గవిసి - యోపి నంతంత నొండొరులఁ ద్రోయుచును
ఇది తోరణపుగోట యిది దానికొమ్మ - యిది యది యని యేమి యెఱుఁగరాకుండ2210
వడిఁ గోట లెక్కి యాశ్వరులపై కురికి - పెడబొబ్బ లిడి తమపేరుఁ బాడుచును
ఉడుగక నిడుతోఁక లొడిసెల్లు సేసి - వడి ఱాళ్లు లోనికి వైచి యార్చుచును,
మ్రాఁకులతుదలు సమంబుగాఁ బట్టి - వీక లోపలియిండ్లు విఱుగవైచుచును,
గుడులు నట్టళ్లును గోపురంబులును - బడఁదన్ని కోటపైఁ బరుగులెత్తుచును
అట్టళ్ళతోడనే యసురవర్గములు - నెట్టనఁ గూలిన నిలిచి నవ్వుచును
ఇమ్ముల రూపించి యిదె చూడుఁ డనుచుఁ - గొమ్మలు విఱుగంగ గుండ్లు వైచుచును.
దోరణంబులును గైదువులు రాక్షసులు - చారుతరధ్వజచ్ఛత్రదండములు
కొమ్మలు కోటలు గూలుటఁ జూచి - క్రమ్మఱఁ దిక్కులు గలయ నార్చుచును
ముంచి కొండలు కరమ్ములఁ బెట్టు పట్టి - దంచనాలకు నివె దంచనా లనుచుఁ
గ్రచ్చఱ నట విఱుగంగ వైచుచును - మచ్చరంబునఁ బలుమఱు నిట్లు కపులు2220

వడి వైచు తమతమవాటులచేతఁ - గడుఁజిత్రముగను లంకాపురిలోనఁ
గూలెడి మేడలు గ్రుంగు మేడలును - వ్రాలెడి గోడలు వ్రాలు మావులును
నుఱుమైన యిండ్లును నుగ్గునూ చైన - తఱుచుఁ గొమ్మలు చూచి తదనంతరంబు
దానవక్షయకరోత్సాహులై కపులు - పూని యంతయు భీతి బుట్టించుటయును
ఇటు గని యెఱుఁగమే యెన్నఁడు ననుచుఁ - జటులతరాట్టహాసములు సేయుచును
నార్చు వానరులపై నాదైత్యకోటి - పేర్చి యెంతయును గోపించి శూలములఁ
బొడిచియుఁ గరవాలములను దెంచియును - గడుబెట్టిదంబుగాఁ గదల మోదియును
జొచ్చి తన్నియుఁ బరశువుల వ్రచ్చియును - గ్రుచ్చి యగడ్తలఁ గూలఁ ద్రోచియును
దంచెనగుండ్లచేఁ దాఁకించి కడిమి - ముంచిన లగ్గ యిమ్ముల విడిపించి
యలరి రాక్షసు లార్వ నాకపు లార్వ - నిలయు దిక్కులుఁ జలియించె నెంతయును2230
నీగి దిక్కరులు ఘీంకృతు లొనరించెఁ - గ్రాఁగిన యసురలగతి నబ్ధు లింకెఁ
గులగిరు లెత్తిన గుండులమాడ్కి - నిలమీఁద నందంద నెత్తిపైఁ బడియె
నురగాధిపతి విషం బొలికెఁ గూర్మంబు - గిరులు నొండొంటికిఁ గ్రిందుమీఁ దయ్యె
నాకారి యప్పుడు నడుచక్కి నున్న - భీకరసైన్యంబుఁ బిలిచి యుబ్బించి
కడిమి సొంపారంగఁ గపిసేన లంక - వెడలి తాఁకుం డని వెసఁ బురికొలుప
భేరీరవంబులు భీకరకాహ - ళారవంబులును శంఖారవంబులును,
భటహారవంబులు బహుతూర్యరవము - పటుతరనిస్సాణభాంకారములను
తురగోగ్రహేషలు తోరంబు లైన - కరిబృంహితంబులు ఘననేమిరవము
నత్తఱిఁ జెలఁగు భుజాస్ఫాలనములుఁ - జిత్తంబు లగలించు సింహనాదములు
నడరి యొండొండ బ్రహ్మాండంబు నిండ - సడలి దిగ్దేవతాసమితి భీతిల్లఁ2240
బలువిడి రాక్షసప్రవరసైన్యములు - వలనొప్ప నాలుగువాకిళ్ళ వెడలె.
నటు జాతవక్త్రంబునందుఁ దక్కంగఁ - బటుభీషణాకృతిఁ బ్రళయరుద్రునకు
నున్నముఖంబుల నుడుగక వెడలు - చున్నమంటలమాడ్కి నొక్కట మెఱసి

వానరరాక్షసులద్వంద్వయుద్ధము

వెడలి వానరసేన వెసఁ దాఁకునపుడు - తడయక ద్వంద్వయుద్ధమునకుఁ జొచ్చెఁ
గడిమిమై నప్పు డంగదు నింద్రజిత్తు - గడుబెట్టిదంబుగా గదఁ గొని వ్రేసె.
వజ్రంబుఁ బట్టి పర్వతముపై నలిగి - వజ్ర వేసినక్రియ వారణలేక
అంగదుండును బేర్చి యయ్యింద్రజిత్తు - సంగరంబున గిట్టి సమశక్తి మెఱసి
భూరిభూధరశృంగమున వైచెఁ బేర్చి - సారథిరథరథ్యచయములు గూల
వారక యేసె దుర్వారుఁడై మూఁడు - క్రూరాస్త్రములఁ బ్రజంఘుండు సంపాతి
విజయుఁడై యతఁడును వెస నశ్వకర్ణ - కుజ మెత్తుకొని ప్రజంఘుని బడవైచె.2250
వినతుని రంభుని వెస నొంచెఁ బెక్కు - ఘనబాణముల నతికాయుండు పేర్చి

పూని యయ్యిద్దఱు భూరిశైలములు - వానిసేనల వాని వడి నొంచి రపుడు
దట్టింపుచును మహోదరుఁడు సుషేణు - గిట్టి యాతనిమీఁదఁ గినుక సొంపార
నడరించె బాణంబు లయదును మూఁడు - వెడదవక్షంబున వెడదఫాలమున
వానిరథంబును వానిసారథిని - వానిరథ్యములఁ బర్వత మొక్క టెత్తి
నలియంగఁ జావఁ జూర్ణంబులై పోవఁ - జెలఁగుచు నార్చి సుషేణుండు వైచె
మఱి జాంబవంతుండు మకరాక్షుమీఁద - బిరబిర ద్రిప్పుచుఁ బెనుమ్రాను వైచె
నడుమనే యది ద్రుంచి నాటించె నతఁడు - కడుఁబెక్కుశరము లుగ్రస్ఫూర్తి మెఱసి
యతనిభుజంబుల నతనిఫాలమున - నతనివక్షంబున నతిలాఘవమున
నాజాంబవంతుండు నలుకమై వాని - భాజనంబుగఁ జేయు పర్వతం బొకటి2260
వైచిన రథమును వరరథాశ్వములు - చూచెడునంతలోఁ జూర్ణమై రాలె.
శరములఁ బెక్కింట శతబలిగిట్టి - యురులాఘవమున విద్యుజ్జిహ్వుఁ డేసె
నతనివక్షముఁ దాఁక నత్యుగ్రభాతి - శతబలి యొక్కవృక్షముఁ బూని వైచెఁ
బెక్కండ్ర దైత్యుల పీఁచంబు లడచి - పెక్కుచందంబులఁ బేర్చిన గజునిఁ
దప్పక విక్రమధనుఁడు కోపించి - వి ప్పైన వానరవిభునివక్షంబు
శూలంబుఁ గొని పొడుచుటయును - వ్రేసె సాలవృక్షమున రాక్షసుని నాగజుఁడు
వ్రేయంగ నతఁడును వెస మృతుం డయ్యె- నాయెడ నగచరు లార్చి మోదింప
వని గుంభకర్ణుని యగ్రనందనుఁడు - ఘనుఁడు కుంభుఁడు ప్లవంగములఁ బెల్లడరి
కుత్తుకలో వైచికొనఁగ నాధూమ్రుఁ - డెత్తి వక్షంబులే డేపున వైచెఁ
గ్రూరుఁడై దేవాంతకుఁడు గవాక్షుండు - చారుతరోరువృక్షస్స్థలం బేడు2270
శరముల నేయవచ్చుట నొచ్చి యతఁడు - సరభసవృత్తిమై సాలవృక్షమున
వైచిన వాఁ డేడువాఁడిబాణములఁ - బూచి యగ్గరి నేసి పొడిపొడి చేసి
తొమ్మిదియమ్ముల దూపిడ్డ వానిఁ - గొమ్మని గిరి యెత్తికొని వైచె నతడు
ఋషభుని ముసలాన నేసె సారణుఁడు - వృషభుండు సారణు విపులవక్షంబు
వృక్షంబు గొని వైవ విల్లునమ్ములును - నాక్షణంబున వైచి యతఁడు మూర్చిల్లె
గిరివోనిగజము నెక్కిన త్రిశిరుండు - శరథుని తల వ్రేసెఁ జని తోమరమున
శరభుండు గోపించి సాలవృక్షమున - హరి గిరి వేసిన ట్లాత్రిమస్తకుని
వ్రేసి యగ్గజమును వ్రేసెఁ గూలంగ - రాసి రాక్షసునకు రాక్షసుం డగుచు
ననయంబుఁ బేర్చి నరాంతకుం డపుడు - పనసునిపైఁ దీవ్రబాణంబు లేయఁ
బనసుండు నాతనిపై వృక్ష మెత్తి - ఘనముగా వైచె నుగ్రతఁ జూపి యంతఁ2280
బరిఘంబు గొని యకంపనుఁడు వేయుటయు - ధరణిపై మ్రొగ్గి యుద్ధతశక్తి నెగసి
కుముదుండు పిడికిటఁ గుపితుఁడై పొడువ - భ్రమసి చయ్యన నకంపనుఁడు మూర్ఛిల్లె
గిట్టి ధూమ్రాక్షుండు కేసరిమీఁద - నెట్టన నంప పెన్నీటను ముంప

వానిసేనలను బర్వతములు వైచి - మానక నొప్పింప మఱి వాఁడు విఱిగె.
మండితభుజగంధమాదను గిట్టి - భండనంబున మహాపార్శ్వుండు పెనఁగఁ
దరులను గిరులను దంష్ట్రల వానిఁ - గరము నొప్పించె నాగంధమాదనుఁడు
దఱచుగా నా వేగదర్శిపై శుకుఁడు - నెఱినాట నమ్ములు నిగిడించుటయును
వానిరథంబు దుర్వారుఁడై వేగ - పూనికమైఁ దొక్కి పొడిపొడి చేసె
నడ నకంపనుఁ డంత నలునకు నెదుర - నడతేరఁగా దొడ్డనగమున నతఁడు
ఉరవడితో గ్రుద్దు లురుకునట్లుగను - బెరిఁగి యాతనిమీఁదఁ బెట్టుగా వ్రేసె2290
వాఁడి బాణంబులు వడి నలుమీఁద - వాఁ డేసె నేసిన వాని వాలమున
గురుతరంబగుశక్తి గొని జంబుమాలి - యరుదుగ నురవడి హనుమంతు నేసె
నెరి జవంబున నాంజనేయుండు గినిసి - యురక రథంబుపై నురికి యుగ్రతను
గిరివరశిఖరంబుక్రియ నున్నవాని - శిరమరచే వ్రేసి చేసే వ్రయ్యలుగ
శరపరంపర విభీషణుని మిత్రఘ్నుఁ - డురవడి నెత్తురు లురల నేయుటయుఁ
గలుషించి యాతఁడు గద వేయుటయును - దలకి మూర్ఛిల్లె మిత్రఘ్నుఁ డెంతయును
వనచరసేనల వారక పట్టి - కొని లీల మ్రింగు నికుంభుని గిట్టి
ఘూర్ణితారుణకటాక్షుండునై సప్త - పర్ణవృక్షంబున భానుజుం డడఁచె.
మొనసి యుద్ధతి వజ్రముష్టి యన్వానిఁ - బెనుపార మైందుండు పిడికిటఁ బొడువ
నాలంకగోపురం బవనీస్థలమునఁ - గూలెనో యనఁ దన్నుకొని వాఁడు గూలె2300
వినువీథి సుర లార్వ ద్వివిదుండు శైల - మున నశనిప్రభు మొనఁ గూల నేసెఁ.
గర మల్గి నీలమేఘము సూర్యుఁ గప్పు - కరణి నందంద నుగ్రప్రకారమునఁ
బరఁగ దివ్యాస్త్రసంపదలచే నీలు - గురుభుజుండైన నికుంభుండు గప్పెఁ
గప్పిన నీలుండు గదిసి నికుంభుఁ - జప్పరించుచు రథచక్రంబు దెచ్చి
రయమున వైచి సారథి దలఁ ద్రుంప - భయమంది వాఁడు విభ్రాంతుఁడై పాఱె.
శరపరంపరలు లక్ష్మణుమీఁద గినుకఁ - గురియువిరూపాక్షుఁ గొనక సౌమిత్రి
యొక్కబాణముఁ గొని యొగి వాని నేయ - దక్కగ మూర్ఛచే ధరణిపైఁ బడియె
రాముపై సుప్తఘ్నరశ్మికేతువులు - నామెయి నగ్నికోపాగ్నికేతువులు
కెరలి మేఘంబులక్రియ నంపసోన - గురిసిరి గుణరావఘోరగర్జనల
నలినాప్తకులుఁ డంత నాల్గుబాణముల - నలువురతలలును నలిఁ ద్రుంచివైచె2310

యుద్ధభూమివర్ణనము

నక్కడికయ్యంబు లటు చెల్లుచుండఁ - దక్కక విఱిగిన తఱుచైనవిండ్లు
చెదరినకరములు చిద్రుపలై పడిన - గదలును దునిసిన కరవాలములును
ముఱిసినశక్తులు ముద్గరంబులును - పరిసినపరిఘలు పట్టసంబులును
గడికండలైన చక్రప్రాసములును - బొడియైనసురియలు భూరిశూలములు

తుదలేక పడియున్నతోమరంబులును - గదిసినరథములు కరిసమూహములు
గూలి పెల్లుగఁ దన్నుకొనుఘోటకములు - వ్రాలి మన్గఱచినరథచోదకులును
రాలినకోటీరరత్నపుంజములు - నేల మిట్టెడి బాహునిచయఖండములుఁ
జచ్చిన యసురులు సమరభూభాగ - మచ్చెరు వయియుండె నప్పుడు చూడ
మర్దితారాతి రామక్షితీశ్వరుఁడు - దుర్దాంతశరములఁ ద్రుళ్లడంచుటయు
మలగొన్న యురుమీనమకరోరగాది - జలచరంబులు చిక్క జల మెల్ల నింక2320
వశగతంబై రామవల్లభునెదుఱఁ - గృశ మైనయంబుధిక్రియ నుండె రణము,
అట్టివిధంబున నవనిజఁ దెచ్చి - నట్టిరావణునకు నట్టె పైశిరము
ల ట్టేల నిలుచు నన్నట్టిచందమున - నట్ట లాకాశంబునం దాడె నపుడు
నెఱిగల్గు మజ్జంబు నెత్తురుఱొంపి - తఱుచైనవెండ్రుకతండంబు నాఁచు
పునుకలు చిప్పలు పొరిఁబొరి నున్న - ఘనములౌ పలుకలు కమఠతుండములు
తుమురులై పడిన కైదువులు మీనములు - రమణీయతరచామరములు హంసములు
కొమరారు తెల్లనిగొడుగులు నురుగు - లమరుభూషణచూర్ణ మందలియిసుక
యొడ్డనంబు నెగళ్లు నురుదంతిచయము - లొడ్డి పెంపారిన యుద్ధతుల్ గిరులు
తరుచరాసురదేహతతులు వృక్షములు - దొరిగినప్రేవులు దుష్టసర్పములు
కొఱప్రాణములతోడఁ గుంభినియందు - నొఱగిన రాక్షసు లొరలుట మ్రోఁత2330
కలఁగొన ఘనతురంగములు గ్రాహములు - నలి దూలుపడగ లున్నతి నందు తెరలు
ఇవ్విధంబున మీఱి యేఱుల నెల్ల - నవ్వుచుఁ బటురక్తనదు లుబ్బి పాఱె
నారయఁ బాపిష్ఠుఁ డగుఁగాక యేమి? - యారామునకు ద్రోహి యగుగాక యేమి?
యతిలోకకంటకుం డగుఁ గాక యేమి? - యతులఁ జంపినపాపి యగుఁగాక యేమి?
హితమతినై యిప్పు డీడేర్పఁదలఁచి - ప్రతిలేనిరఘురాముబాణజాలముల
ధృతిఁ దూలఁ గట్టి యాదేవకంటకుని - హితమతి నీదేహ మిటు విడిపించి,
లోఁగొని వాని నాలోపల ముంచి - బాగొప్ప గలుషము ల్వాపి రక్షించి

సాయంకాలాదిరాత్రివర్ణనము

ఖలుఁడైన యట్టియుక్కలుని రావణునిఁ - బొలుపార ముక్తికిఁ బుత్తు నన్ మాడ్కి
సంగతి నొప్పారు జాహ్నవి యనఁగ - సంగరస్థలి మహాశ్చర్యమై యొప్పె
నప్పుడు లంకలో నాదైత్యకాంత - లుప్పొంగుశోకపయోధిలో మునిఁగి2340
గ్రద్దనఁ జేయు నక్కయ్యంబునందుఁ - బ్రొద్దు గ్రుంకినఁ గాని పోడు రాఘవుఁడు
ఎప్పుడు గ్రుంకునో యినుఁ డింక ననుచు - నప్పటప్పటికిఁ బెట్టడరుచు నుండ
నంచితకఠినపుంఖాస్త్రాంశుతతుల - ముంచి రావణుని తమోగుణం బణఁప
భీమప్రతాపసంస్ఫీతుఁ డైయున్న - రాముఁడే చాలు దుర్వారుఁ డన్మాడ్కి
ఘనతరంబగు తనకరములు ముడిచి - వనజాప్తుఁ డపరదిగ్వనధిలో మునిఁగె.

ఖలుఁ డైన యద్దశకంఠునిచేటు - దెలుపుటకై నిశీధిని కచభరము
విరళమై జల్లున విరిసెనో యనఁగఁ - బరపొంది చీఁకటి ప్రబలమై పర్వె
నప్పుడు బొబ్బలు నార్పులు పెట్టు - చప్పుడుల్ మల్లులు చరచునడిదము
లట్టహాసంబులు నడరి యొండొరులఁ - దిట్టెడినెలుఁగులు దీవ్రహుంకృతులు
ఝంకారరవములుఁ జప్పరించుటలు - నంకించుపలుకులు నాహ్వానములును2350
రథనేమిరవములు రథికసారథుల - పృథులవాక్యోద్ధూతభీమనాదములు
గుణనిస్వనంబులు గుంజరాగముల - ఘణిఘణి ల్లని మ్రోయుఘంటాస్వనములు
కరిబృంహితంబులు ఘనతూర్యరవము - తురగోగ్రహేషలు తోరమై పేర్చి
ప్రొద్దు గ్రుంకిన నైనఁ బోవక చలము - పెద్దయై కపులును బేర్చి రాక్షసులు
నతినిబిడం బైన యంధకారమున - నతిభయంకర మైన యని సేయునపుడు
పొడుపొడుఁ డన్మాట పోకుఁ డన్మాట - విడువిడుఁ డన్మాట వ్రేయుఁ డన్మాట
చలము డింపక చంపుచంపుఁ డన్మాట - తొలఁగక తల ద్రుంచుత్రుంచుఁ డన్మాట
యిందు రాలే దేడి యేడి యన్మాట - యిందు రానిమ్ము రాని మ్మనుమాట
అటమీఁద హుంకృతుల్ హాసముల్ చెలఁగ - నిటు చెల్లుమాటల యెక్కువ లెఱిఁగి
పోరుచోఁ గెంధూళి బోరున నెగయ - పేర్చి యాచీఁకటి పెద్ద యౌటయును2360
బ్రమయుటఁ జేసి యేర్పఱుపంగరాక - తమతమవారల తామె చంపుదురు.
కోపించి వానరకోటు లుప్పొంగి - యాపాపకర్ముల నసురులఁ గిట్టి
రథికులఁ జంపి సారథుల గీటడఁచి - పృథులరథ్యంబుల పీఁచంబు లడఁచి
కడనొగ లెలమి యొక్కటఁ దేరులెత్తి - యడతురు నుగ్గునూ చై నేల రాలఁ;
దుమురుగా జోదుల త్రు ళ్లడఁగించి - సమరవారణముల చరణంబు లెత్తి
యిరులఁ గేల నమర్చి యేచి తాటించి - వరుస నల్లటు పాఱవైతురు చంపి
చిదురలై దెసలందుఁ జెదరుగుఱ్ఱములు - గదసి తోఁకలతోడఁ గడకాళ్లు నొడిసి
పట్టి బెట్టుగఁ ద్రిప్పి వడి నేలతోడ - నెట్టన వ్రేసి పెన్నెత్తురు లొలుక
గోలెమ్ము లురములు గుండెలు బరులు - వాలినభుజములు వదనదంష్ట్రలును
బునుకలు మెదడును భువిమీఁదఁ జెదరఁ - గనుఁగొని కాల్వురఁ గడఁగి చంపుదురు2370
అరదాల వెల్లున నడరు ధూళియును - దురగఖురోద్ధూతధూళియు నెగసి
దానవానీకంబు తలఁపులోనున్న - కానమి నెల్ల నొక్కట వెల్లివిఱిసె
ననఁగఁ జీఁకటి కడు నగ్గలం బగుచు - వినువీథి నడుమెల్ల విపులమై నిండె
నసురుల యసువుల నగచరాధిపుల - యసువులు నొక్కట నపహరించుటకు
నామెయి నారాత్రి నసురేంద్రుచేత - రామునిచేఁ గాళరాత్రియై తోఁచె
దమవేళ యగుటయు దైత్యు లందందఁ - గుమురులు గట్టి త్రికూటాచలంబు
దమయార్పులకుఁ బ్రతిధ్వను లిచ్చుచుండ - సమరసన్నద్ధులై సరభసవృత్తి

మిగిలి యారాఘవుమీఁదను గదిసి - గగనంబు నిండ మార్గణము లేయుటయు
నారామవిభుఁడును నగ్నిబాణమునఁ - బేరినచీఁకటి పెంపెల్ల నడఁచి
తన్ను గిట్టిన మహోదరమహాపార్శ్వ - సన్నుతబలులైన సారణశుకుల2380
నటు వజ్రదంష్ట్రు మహాకాయు నేసెఁ - బటువేగమున నాఱుబాణముల్ దొడగి
యార్వురు దైత్యులు ననిఁ బాఱి రపుడు - పర్విన భీతిమై బ్రమసి దిక్కులకు
నట నున్న రాక్షసు లారామవిభునిఁ - బటుబాణశిఖి శలభంబులై పడిరి.
అరదంబు సూతుండు హరులు నంగదుని - కరముక్తగిరిశృంగకఠినపాతమున
నవనిపైఁ గూలిన నాజి వర్జించి - సవనశాలకు వేగ చని యింద్రజిత్తు
తగుహోమసాధనతతులు రాక్షసులు - మొగిఁదేరఁ గైకొని ముఖ్యమార్గమున
వలనొప్పఁగా రక్తవర్ణంబు లైన - తలచుట్టు నుభయవస్త్రములు మాల్యములు
ధరియించి వహ్నికిఁ దగపరిస్తరణ - మురుతోమరంబులు నుగ్రవస్త్రములు
గరిలేనిశరములు గావించి నలుపు - గరికొన్న పెనుమేఁకకంఠరక్తమున
నొగిఁ దాడిసమిధల హోమంబు సేయఁ - బొగ లేక మండుచుఁ బొడవుగా నిక్కి2390
యెలమితో విజయంబు లెఱిఁగింపఁ జాల - వలతియై దక్షిణవరమానశిఖల
నొప్పుచు ననలుఁ డాహుతులఁ గైకొనియె - నప్పుడు నిష్ఠతో నయ్యింద్రజిత్తు
యుక్తక్రమంబున హోమ మొప్పార - భక్తితో నొనరించి పావకువలన
నాలుగుహయములు నానాస్త్రశస్త్ర - జాలంబు మహితకాంచనమయరథముఁ
బడసి యాతే రెక్కి బ్రహ్మాండ మగలఁ - గడువడి నార్చి యుక్కటకోపుఁ డగుచు
నింద్రాదిదేవత లెల్ల భీతిల్ల - నింద్రజిత్తుఁడు మఱి యేపు దీపించి
చెచ్చెర దానవసేనతోఁ గూడ - వచ్చి యదృశ్యుఁడై వడి దివినుండి
మసలక రామలక్ష్మణులపై నేసె - నసదృశకాండంబు లందందఁ బెల్లు
ఆరామలక్ష్మణులపై లాకాశమునకు - భూరిశరంబులఁ బోవనిచ్చుటయు
నం దొక టైనను నయ్యింద్రజిత్తు - నందుఁ దాఁకమి మఱి యాదైత్యవిభుఁడు2400

ఇంద్రజిత్తు మాయాయుద్ధము సేయుట

దనుఁ గానరాకుండ దర్పంబు మెఱసి - వినువీథిఁ గడుఁ బెక్కువిధములఁ దిరిగి
కదిసి యంతటఁ బోక ఘను లగుకపుల - నవలీల దునుమాడి యందందఁ బేర్చి
నలుదెస నేయుచో నగచరులకును - నలినాప్తకులునకు నలినాప్తకిరణ
విభములై పరతెంచునిష్ఠురాస్త్రములు - నభమున నెందుఁ గానఁగవచ్చుఁ గాని
యరదంబు మ్రోఁతయు నాఘోటకముల - ఖురముల మ్రోఁతయు గుణము నిస్వనము
సారథి పలుకు కశాఘాతరవము - లారథికునియార్పు లతనిమూర్తియును
నారథంబును దాని యధికధ్వజంబు - లీరూపు లని కని యెఱుఁగంగ రాక
యావిధం బాసేన కప్పుడు దోఁచె - నావాలిఁ దునుమాడి యసమునఁ బేర్చు

రామునిమీఁద సురప్రభుం డలిగి - రామణీయకమహోగ్రప్రకాండముల
నాతనయునిఁ గూల్చినాఁ డని పేర్చి- యీతెఱంగున డాఁగి యేసెనో యనఁగ?2410
నప్పు డాకపిసేన యంగంబు లెల్లఁ - జిప్పలు చిదపలై చెదరంగఁ జూచి
జనలోకపతితోడ సౌమిత్రి పలికె - "వినువీథి డాఁగిన వీనిచే నిట్లు
మనుజేంద్ర! చూచితే మర్కటోత్తములు - మనకొఱకై వచ్చి మడియుచున్నారు
విస్మయంబుగ నింక వీనివంశంబు - భస్మంబు సేయుదు బ్రహ్మాస్త్ర మేసి"
యనవుడు రఘురాముఁ డనుజుతో ననియెఁ -"జనునె యొక్కరునికై చంపఁ బల్వురను
ఎఱుఁగవే రణధర్మ మెందు రాజులకు - వెఱచి డాఁగినవాని వెన్నిచ్చువాని
ముకుళితహస్తుఁడై మ్రొక్కినవానిఁ - జకితాత్ముఁడై వచ్చి శరణన్నవానిఁ
గదనంబులోఁ బూరి గఱచినవానిఁ - బిదప నాయుధములు వదలినవాని
నిద్రవోయినవాని నిర్జింపఁదగునె? - భద్రంబు గోరు నప్పరమపుణ్యులకు
నధికమాయలఁ బేర్చు నయ్యింద్రజిత్తు - వధియింపనోపెడు వానరోత్తములఁ2420
గామచారులఁ బంపఁ గాలంబు గాని - సౌమిత్రి! బ్రహ్మాస్త్రసమయంబు గాదు”
అని నలు నంగదు ననిలనందనుని - ఘనుని గవాక్షుని గంధమాదనుని
భరితవిక్రమధాముఁ బనసుఁ గేసరిని - శరభుని ఋషభుని సన్నాథు గజుని
మఱి గవయుని నీలు మైందుని ద్వివిదు - నఱిమురిఁ గోపించి యసురుపైఁ బనిచె
నట రాఘవుఁడు పంప నగచరాధిపులు - పటుగతి మిన్నులపై కప్పు డెగసి
తరుశైలములు వైవ దర్పించి క్రూర - శరపరంపరల రాక్షసరాససుతుఁడు
వారి నొప్పించిన వార లాదైత్యు - నేరూపమునఁ గాన కెప్పటిపగిది
వచ్చిరి రయమున వసుమతీస్థలికి - నచ్చెరు వొంది యింద్రాదులు సూడ
విలయమేఘశ్యామవిపులగాత్రంబు - నలుకఁ గెంజాయల నడరు నేత్రములు
గల ఘోరరూపంబు గానరాకుండ - మెలఁగుచుఁ బలికె నమేఘనాదుండు2430

నాగపాశబంధనము

"నరనాథసుతులార! నన్నుఁ గయ్యమున - నరుదు లక్షింప సహస్రాక్షునకును
మీ రెంతవా?" రని మిన్నెల్ల నద్రువ - ఘోరంబుగా ధనుర్గుణము మ్రోయించి
యశనిసంకాశంబు లగుసాయకములు - దశరథాత్మజులపై దళముగాఁ బఱపి
మఱియును నందంద మర్కటోత్తముల - గరు లిచ్చి పోఁ బెక్కుకాండంబు లేసి
యట నంతఁబోవక యయ్యింద్రజిత్తు - చటులతరక్రూరసర్పబాణముల
నినకులేశ్వరులపై నేయఁగ వారు - ఘనబాణముల వాని ఖండించి మఱియు
నిదె వచ్చె బాణంబు లిం దేయు మనుచు - నదె వచ్చె బాణంబు లందేయు మనుచు
నేదెస బాణంబు లేతెంచుచుండు - నాదెసలందు నుదగ్రులై యేయ
నురగసమేతులై యుండుట మీకుఁ - గరమొప్పఁ దొల్లియుఁ గల దటుగానఁ

దరణివంశజులార! తప్పక యిపుడు - నురగసమేతులై యుండుఁ డన్నట్లు2440
బంధురంబుగ నబ్జబాంధవకులుల - బంధించె వడి నాగపాశసంతతుల
వారును నాబ్రహ్మవరము మన్నించి - తారు రాక్షసుచేతఁ దద్దయుఁ దూలి
యాదినారాయణువంశజులైన - మేదినీనాథు లిమ్మెయిఁ గట్టువడిరి.
నేఁడు రాముఁడు గాక నిక్క మూహింప - నాఁ డితఁడే వామనస్వరూపంబు
నటు దాల్చి భూదాన మడిగి యాబలిని - బటుకృతఘ్నతఁ బట్టి బంధించినట్టి
ఫలము రామున కిట్లు ప్రాప్తంబుఁ గాక - పొలియునే మనుజుఁడై పుట్టి యుండగను
అని తమలోఁ దమయాత్మలఁ గుంది - యనిమిషుల్ ఋషులును నాశ్చర్యపడఁగ
ఖిన్నుఁడై యున్న సుగ్రీవునిఁ జూచి - సన్నుతమతి విభీషణుఁ డర్థి పలికె.
"నిది యేల చింతింప నెట్టివారలకు - నొదవవే యాపద లొక్కొక్కచోట
నినకులేశ్వరులకు నే మయ్యె నిపుడు? - ఘననాగపాశముల్ గట్టినంతటనె"2450
యని పల్కి యతఁడు మాయాదృష్టిఁ జూచి - కనియె రావణసుతు గగనమార్గమునఁ
గని నీరు మంత్రించి కన్నులు దుడిచి - వనజాప్తసుతునకు వలనొప్పఁ జూపె
నారవిజుండును నవ్విభీషణుని - చారుమహామంత్రశక్తిచేఁ జేసి
యాయింద్రజిత్తుని నప్పుడు కాంచి - యాయతోన్నతమగునచలంబుఁ బెఱికి
యెగిసి వేయఁగఁ జూచి యింద్రజిత్తుండు - మొగిఁ దిరిగించె నమ్ములవెల్లి పఱపి
యినజుండు తిరిగిన నినజుని రాకఁ - గని మున్ను వెఱచు రాక్షసులు మోదింప
నప్పుడు విజయుఁడై యయ్యింద్రజిత్తు - ముప్పిరి గొను ముదంబునఁ దన్ను గొలుచు
వారును దానును వడి లంక కరిగి - యారావణునిఁ గాంచి యప్పు డి ట్లనిరి
“చంపితిఁ గపులను సర్పబాణములఁ - గంపింపఁజేసి తిక్ష్వాకువల్లభుల"
నని వేడ్కతోఁ జెప్ప నంతరంగమునఁ - దనయునిమీఁద నెంతయు సంతసిల్లి2460
రావణుఁ డప్పుడు రయమునఁ ద్రిజట - రావించి యనియె “ధరాపుత్రి నన్ను
నొల్ల దారాముని నొనఁగూడుకొనుట - కుల్లంబులో నమ్మి యుండుటఁ జేసి
నేఁ డింద్రజిత్తుచే నేలకు వచ్చి - పోఁడిమి చెడిన యా భూపాలునునికి
సీతఁ దోడ్కొనిపోయి చెచ్చెఱఁ జూపు - మీతఱిఁ బుష్పక మెక్కించి నీవు
అంత రామునిమీఁది యాసలు దక్కి - చింతింప కిట నన్నుఁ జేరును సీత"
యనవుడు రావణు ననుమతిఁ ద్రిజట - దనుజాంగనలు దాను ధరణీతనూజ
నెనయఁ బుష్పకముపై నెక్కించి వేగ - చనుదెంచి సంగరస్థలిఁ బడియున్న

నాగపాశబద్ధులై యున్న రామలక్ష్మణులఁ జూచి సీత దుఃఖించుట

కపులను రామలక్ష్మణులను జూపఁ - జపలాక్షియును నట్టిచందంబుఁ జూచి
కన్నీరుధారలై క్రమ్మ నందంద - విన్ననై కడుఁదూలి విలపింపఁ దొడఁగెఁ.
"గటకట! రామ! ఓ నీకార్ముకవిద్య - యెటు పోయె? నీయందె యేపారియుండు!2470

జామదగ్నిని నైన సరకుగాఁ గొనవు - నీమెయిలావున నీభువి నీవు
సకలమునీంద్రులు సర్పముల్ నీకుఁ - బ్రకటితశయ్యఁగాఁ బలుకుదు రెందు;
నట్టిసర్పంబులే యవనీశ! నిన్ను - గట్టంగఁ ద్రాడులై కదిసెనే నేఁడు?
లాక్షణికులు నన్ను లక్షించి సకల - లక్షణంబులు మేన లలితంబు లగుచు
విలసితరేఖారవిందంబు లంఘ్రి - తలమునఁ గలుగుటఁ దరళాయతాక్షి!
పట్టాభిషేకంబు పతితోడఁ గల్గుఁ - బుట్టుదు రింపారఁ బుత్రులు నీకు
నైదువ యై యుండు దనుమాట లెల్ల - నాదిత్యకులనాథ! యకట! బొంకయ్యె.
రోలంబకులనీలరుచిశిరోజములు - నీలమేఘము డాలు నెఱవు మైజిగియు
తొగ లించుకయు లేక తోరముల్ గాక - మిగుల వట్రువలునై మించుపెందొడలు
కరములు నిటలంబు కన్నులు మోము - చరణముల్ రుచిరలక్షణసమేతముగ2480
వరకాంతి నునుపారి వట్రువ లగుచు - సరినొప్పు నఖములు సంగతాంగుళులు
ఏచి చిత్రాకృతి నెనసి క్రిక్కిరిసి - నీచాగ్ర మైనది నీకుచద్వయము
ఉరుతరస్నిగ్ధంబు లుదరపార్శ్వములు - కర మొప్పుచున్నది గంభీరనాభి
కమనీయతరదివ్యకాఁతిఁ జెన్నగుచు - రమణీయ మైనది రమణ! నీమేను;
సౌభాగ్యమున నీకు సరి యెవ్వ రనెడి - నాభాగ్య మి ట్లయ్యె నరనాథ! కంటె
లలన లీపదియేనులక్షణంబులను - గలవార లత్యంతకల్యాణవతులు
అని చెప్పునార్యోక్తు లవియెల్లఁ దప్పె - మనుజేశ! నాపుణ్యమహిమ గా కిదియుఁ
గెందామరలభంగిఁ గెంజాయ మెఱసి - యందంబులై చూడ నఱచేతు లొప్పుఁ
బల్లవారుణకాంతిఁ బరఁగుపాదాగ్ర - పల్లవంబులు సమస్పర్శంబు లగుచు
నడు పొప్పు నెలు గొప్పు నగుమొగం బొప్పుఁ - గడునొప్పు నివి కన్యకాలక్షణములు2490
పరికింప నని పల్కు పలుకులు దప్పె - నరనాథ! చూచితే నానోముఫలము?
తలఁపులు దైవంబు తలకూడనీక - వెలయఁగ నిటు సంభవించెనే నాకు?
ధరణీశ! నను జనస్థానంబునందు - నురవడి గొనిపోవు నుగ్రదానవునిఁ
బొరిఁబొరి వెదకి నాపోయినజాడ - కర ముగ్రగతిఁ దెల్పి కపిసేనఁ గూడి
జలనిధి బంధించి చనుదెంచి పిదపఁ - బొలు పేది గోష్పదంబున మునింగితివె?
ఆరయ నతిఘోర మగు యామ్యశరము - వారుణబాణంబు వహ్నిసాయకము
నెఱయ బ్రహ్మాస్త్రంబు నెఱిఁ బ్రయోగింప - మఱచితివే నేఁడు మనుజలోకేశ!
పగవాఁడు మీదృష్టిపథములఁ బడినఁ - దెగి నేలఁబడుగాక తిరిగి పోఁగలఁడె?
యిది దైవకృతము గా కెల్లచందముల - నెదురంగ శక్తులె యెవరైన నిన్ను?
మేఘనాదుఁడు మాయ మెఱసి మి మ్మాజి - నీఘోరశరముల నిటుఁ గట్టె నేఁడు2500
కాలంబుకడిమిమైఁ గడప నెవ్వరికిఁ - బోలునే తలపోయ? భూలోకనాథ!
హానాథ! హావీర! హారామచంద్ర! - యే నీకు శోకింప నిట నీకు వగవ;

నీకుఁ బ్రాణము లిచ్చి నిర్మలుండై న - కాకుత్స్థమణికి లక్ష్మణునకు వగవ
మనసు గుందఁగ నాకు మరుగుచు నున్న- జననికి దుఃఖింప సతతంబు నీకుఁ
జిత్తంబు లోపలఁ జింతించుచున్న యత్త కౌసల్యకై యడలెద నధిప!
ఎప్పుడు పదునాలుగేడులు చనునొ - ఎప్పుడు వచ్చునో యిటు రాముఁ డనుచు
నీతెఱంగున నీకు నెదురులు సూచు - నీతల్లియాసలు నిలిచెనే నేఁడు?
హరిహరాదుల నైన నదలించు నీదు - శరములఁ గలశక్తి సమసెనే నేఁడు?
నీదివ్యశక్తియు నీబాహుబలము - నీదుర్దమక్రమనిపుణవిక్రమము
నెక్కడఁ బోయెనో? యే మందు నింక? - నక్కటా! విధి! నీకు నలగెనే నేఁడు?
చెలువొంద నేను నోచిననోము లెల్ల - ఫలియించె నేమని పలవింతు విధికి?"
నని ప్రలాపింపంగ ననియె నాత్రిజట - జనకజ నూరార్చి సదయచిత్తమున
"రాముని కొకకీడు రాదు నీ వేల - నీమెయి శోకింప నిందీవరాక్షి!
యట్టిద యైన యీయగచరసేన - యిట్టేల పెద్దయై యేచి వర్తించు
నదె చూడు మాదేవి! యగచరేశ్వరులు - పదిలులై నీవిభు బలసియున్నారు,
గాదు పో యీపుష్పకం బేల మోచు? - మేదినీతనయ! యిమ్మేదినిఁ బడక
కాన రామున కొండు గాదు చింతింప - మానిని! నామాట మనసులో నమ్ము
లంకేశుఁ జంపి యీలంక సాధించి - పంకజానన! నిన్ను భానువంశజుఁడు
నలిఁ దోడుకొనిపోవు; నమ్ము నామాట; - కలఁగకు నేఁ డెల్లి కల్యాణి! నీవు"
అనవుడు సీత మాయామస్తకంబు - ననువుగాఁ బోలని యాత్మలో నమ్మె2520
సుందరి త్రిజట యశోకవనంబు - నందుఁ గ్రమ్మఱఁ దెచ్చి యవనిజ నునిచె.
మనువంశతిలకుండు మదిఁ దెలివొంది - తనకుఁ జేరువనున్న తమ్మునిఁ జూచి
“నాతమ్ముఁ జూచితే నలినాప్తతనయ! - యీతెఱంగునఁ గుంది యిట్లున్నవాఁడు;
సీతఁ గోల్పడి సీతచెఱ మాన్పలేక - యీతనిఁ గోల్పోవు టిటు సంభవించె;
సౌమిత్రిఁ గోల్పడి జనకజ నాకు - నేమిటి కిటమీఁద నేల నాబ్రతుకు?
యత్నంబు చేసిన యవనిజఁ బోలు - పత్ని నొండొకచోటఁ బడయంగ వచ్చుఁ
గలరు కాంతలు సుతు లలరు బాంధవులు; - గలరె గా కెందును గలరె సోదరులు?
తమ్ముఁ డన్మాత్రమే తలపోయ భక్తి - నిమ్ముల ననుఁ గొల్చు నిమ్మహాభుజుఁడు.
అరయఁ గౌసల్యకు నాసుమిత్రకును - సరియ కా వర్తించు సద్భక్తితోడఁ
దగ లక్ష్మణునికంటె దయతోడ నన్ను - మిగుల మన్నించు సుమిత్ర నావలన2530
వాత్సల్య మెప్పుడు వదల దాపుత్ర - వత్సల యగుతల్లి వగఁబెట్టవలసెఁ!
బురి కింక నొకఁడును బోయితినేని -భరతశత్రుఘ్నులు భ్రాతృవత్సలులు
ఎట చిక్కె లక్ష్మణుం డేల రాఁ డనిన - నట నేమి చెప్పుదు నకట! తమ్ములకు
వనటమై నీవొంటి వచ్చుటఁ జూచి - మనములు గలఁగెడి మాకు నోతనయ

సౌమిత్రితో నేల చనుదేర వనిన - నే మని యుత్తరం బిత్తుఁ దల్లులకు
నేమని యూరార్తు నీమోముతోడ? - నే మని యటుఁబోదు నీ మేనితోడఁ ?
బ్రాలేయశైలంబు పగిలిన నినుఁడు - నేలఁ గూలిన నీరు నిశ్చలంబైన
వనధు లింకిన గాలి వర్తింపకున్న - ననలుండు కడుఁజల్ల నై యున్న నైన
నామాట గడువఁడు నాకు నప్రియము - లేమాటలును నాడఁ డెన్నఁడు నితఁడు
ఇతనిచిత్తంబు నాయెడ నొక్కచంద - మితనిఁ బోలెడితమ్ముఁ డింకెందుఁ గలఁడు?
ఇతఁడె నాప్రాణంబు లితఁడె నాబంధుఁ - డితని నొక్కెడఁ బుచ్చి యే నొంటి నుండ2540
నితఁ డెందుఁ బోయిన నే నందుఁ బోదు - నితనితోడిదె లోక మీలోక మెల్లఁ
జనుదెంచె నాతోడ సౌమిత్రి నాఁడు - చనియెదనే నేఁడు సౌమిత్రివెనుక
హితబుద్ధిఁ గార్యంబు లేఱుఁగక చేసి - తతులవిక్రమశాలి యవి నాకు నెక్కె;
దరుచరో త్తమ! వాలితనయుఁ దోడ్కొనుచు - గిరిచరసేనతోఁ గిష్కింధ కరుగు
మే లక్ష్మణునితోడ నేగినపిదపఁ - బౌలస్త్యపతి మిమ్ము బాధింపఁగలఁడు.
జయశాలి యగుచున్నసౌమిత్రి లేని - జయము నా కంధుని చంద్రోదయంబు
మద్భక్తుఁడై పూని మారుతపుత్రుఁ - డద్భుతకార్యంబు లవి పెక్కు సేసె;
జలనిధి లంఘించి జనకజఁ గాంచి - కలనఁ బెక్కండ్ర రాక్షసుల మర్దించె;
నీయంగదుండును నీసుషేణుండు - ధీయుతులైన యాద్వివిదమైందులును2550
నీగవయుండును నీగవాక్షుండు - నీగజుండును రక్తి నెనయ నీలుండు
మెఱయ సంపాతియు మేటి కేసరియు - మఱియుఁ దక్కినవీరమర్కటోత్తములు
నాకొఱకై వచ్చి నలినాపత్తనయ! - చేకొని లావులు సేసి రందఱును;
ఇక్కాల మిక్కడ నెబ్భంగి మమ్ముఁ - ద్రెక్కొన్నవిధిఁ దాఁటఁ దీర దెవ్వరికి;
రణభూమిఁ బలువుర రాక్షసపతులఁ - దృణలీలఁ బొలియించి తీవ్రబాణములఁ
బగతుచే నిబ్భంగిఁ బడి లోచనములు - మొగియుచు భూరజంబున బ్రుంగినాఁడు
వరతల్పమున నుండువాఁడు నేఁ డకట! - శరతల్పమున రణస్థలి నున్నవాఁడు
సంకీర్ణరవికుల జలధిపొం గడఁచి - గ్రుంకెనే లక్ష్మణకువలయప్రియుఁడు;"
అనుచు విలాపింప నఖిలవానరులు - మనముల శోకాబ్ధిమగ్ను లైరంత.

ఇంద్రజిత్తు రెండవసారి యుద్ధమునకు వచ్చుట

ననికి గ్రచ్చఱ వచ్చె నామేఘనాదుఁ - డనుబుద్ధి దూరస్థు లైనవానరులు2560
ఘనతరాంజనశైలకల్పుఁ డై యున్న - తనుఁ జూచి వెఱవ గదాపాణి యగుచు
సైన్యమధ్యంబునఁ జరియించుకపుల - దైన్యంబుఁ బాపుచుఁ దగ విభీషణుఁడు
ఏతెంచి రవిసూను నీక్షించి పలికె - "నీతెఱుగున మీకు నేల చింతింపఁ
గైకొని యిది యుద్ధకాలంబు కాని - శోకింప వేళయె సుగ్రీవ! మనకు
దుర్ణివారోర్మిబంధుర మైనజలధి - కర్ణధారుఁడు లేని కలముచందమున

మనసైన్య మున్నది మన మింక వేగ - యనికి నుద్యోగించు టదియె కార్యంబు.”
అన విని యంగదుం డావిభీషణునిఁ - గనుగొని "నీమాట కడునుత్తమంబు
నరనాథతనయులు నాగపాశములు - నురవడిఁ బెనఁగొని యుర్విపై నొరగి
బాణక్షతంబుల బలువిడి వెడలు - శోణితంబుల బ్రుంగి సొరిది నున్నారు
ఈదాశరథుల మీ రేమఱకుండుఁ - డాదిత్యుఁ డుదయాద్రి కరుదేర మున్నె2570
యేను రాక్షసకోటి నెల్ల నిర్జించి - జానకిఁ దెచ్చెద జననాథుకడకు
హనుమంతుఁ డాదిగా నఖిలవానరులఁ - గొని కవాటములతోఁ గోటలతోడఁ
దోరణశ్రేణులతోఁ గూడ లంకఁ - దోరంపుఁబిడికిళ్ళఁ దుమురు సేసెదము.
విస్మయంబుగ బంధువితతితోఁ గూడ- భస్మంబు సేయుదు పంక్తికంధరుని
నావిక్రమంబును నాభుజాబలము - భూవరువలన నాపూనుభక్తియును
దెల్లంబు సేయుదుఁ దెగువతో నెల్లి - యెల్లభూతంబులు నీక్షింపనిమ్ము
మలయజకేయూరమహితానుభూతిఁ - బలుమఱు గన్న నాబాహుదండములు
అనవరతంబును నధికదర్పమునఁ - దనరుచున్నవి రఘూత్తముకార్యమునకు
రావణు నిర్జించి రఘువీరుఁ డలర - నీవిభీషణు లంక నెలమి నిల్పెదను
గాదేని నాజి రాక్షసులచేఁ జచ్చి - పోదును సౌమితి పోయిన త్రోవ"2580
నన విని సుగ్రీవుఁ డంగదుఁ జూచి - "తనయ! నీ వింక నీదశరథాత్మజు
గొనిపొమ్ము కిష్కింధకును వేగ నేను - జని యింద్రజిత్తుని సకలరాక్షసుల
రావణు నిర్జించి రఘురాముదేవి - నేవిధంబుననైన నేఁ దెత్తు వేగ"
యని దైన్యపాటుతో నాడుసుగ్రీవుఁ - గనుఁగొని ఖిన్నులై కపులు భీతిల్లి
మునుకొని శోకాబ్ధి మునుఁగ సుషేణుఁ - డనువాఁడు వల్కె నయ్యందఱఁ జూచి
యీనాగపాశంబు లిపుడు వాయుటకు - వానరేశ్వరులార! వలను సెప్పెదను
తొల్లి దేవాసురోద్ధురసంగరమున - నెల్లదేవతలకు నివి గట్టియున్న
దేవత లప్పుడు దివ్యౌషధములు - చే వానిబాధఁ బాసిరి కట్లు విడిసి
యాయౌషధము లిప్పు డమృతాబ్ధికవలఁ - బాయకున్నది ద్రోణపర్వతస్థలిని
హనుమంతుఁ బుచ్చుఁడీ యతఁ డౌషధములు - గొనివచ్చు మీ రిట గుందంగ వలదు.”2590

నారదుఁడు శ్రీరాములకడకు వచ్చుట

అనునంత సూర్యసహస్రసంకాశుఁ - డననొప్పి కృష్ణమృగాజినం బమర
మెఱుఁగులతో శుభ్రమేఘమో యనఁగ - నెరయు బింగళజటానిచయంబు వెలుఁగ
బొనర నున్ననియూర్ధ్వపుండ్రంబుఁ బెట్టి - తనరంగఁ గౌపీనదండము ల్దాల్చి
రమణమై నొప్పునారాయణమంత్ర - మమలత దనవీణయం దొప్పి మొఱయ
దనతోడియోగీంద్రతతి నాకసమున - నునిచి చిత్తంబున నుల్లాస మొదవఁ
బరమయోగేంద్రుండు పరతత్త్వవేది - పరమపావనమూర్తి పరమవైష్ణవుఁడు

నారదుం డారామనరనాథుఁ గాన - గారవంబున వచ్చి కరములు మొగిచి
వలగొని వచ్చి యవ్వసుమతీశునకుఁ - దలకొన్నభక్తితోఁ దగ విన్నవించె,
"దేవ నిన్ బ్రహ్మాదిదేవతలెల్ల - నావార్ధిమధ్యంబునం దొప్పఁ గాంచి
రావణబాధాపరంపర ల్సెప్పఁ - గా విని వారిపైఁ గరుణించి నీవు2600
వారిఁ బ్రోచుటకు రావణునిఁ జంపుటకు - ధారణిఁ బుట్టితి దశరథేశునకు
నటు గాన నీ విటు లలమట నొంద - నిటు తగునయ్య! మహీపాలవర్య!
నీనామ మాత్మలో నిలిపినంతటనె - భూనాథ! యజ్ఞానములు పొంద వనిన,
నీకు నజ్ఞానంబు నెప మైనఁ గలదె? - చేకొని నిను నీవె చింతింతు గాక!
నారాయణుఁడవు పూర్ణజ్ఞాననిధివి - చారుకౌస్తుభరత్నసహితవక్షుఁడవు
అనిశంబు లక్ష్మికి నాటప ట్టైన - ఘనతరాంగంబులు గలుగుదేవుఁడవు;
ఆదిదేవుఁడవు, సర్వాంతరాత్ముఁడవు - వేదవేద్యుండవు, విశ్వరూపుఁడవు,
తలఁచుయోగీంద్రుల ధ్యానంబునందు - నలువొందు సచ్చిదానందరూపుఁడవు
ధరణి యంఘ్రులు వియత్తలము మ స్తకము - పరపైన నిటలంబు పద్మాసనుండు
కన్నులు చంద్రుండు కమలమిత్రుండు - నున్నతం బగుచున్న యూర్పు మారుత ము2610
వదనంబు శిఖి సరస్వతి జిహ్వ యొప్పు - రదనప్రతతి వేదరాశి చింతింపఁ
జెలు వైనగాయత్రి శిఖి ప్రణవంబు - వెలసినహృదయంబు వీనులు దిశలు
మహనీయధర్మంబు మనసు దేవతలు - బహుజయస్థితిగల బాహుసమృద్ధి
గొనకొన్న బహ్మాండకోట్లు నీకుక్షి - తనరారు దొడలు మిత్రావార్ధిపతులు.
ఆశ్వినేయులు జాను లాత్మలోఁ జూడ - విశ్వంబు నీరోమవితతి చింతింప
నిదె చూడుమా వీరె యెల్లదేవతలు - గదిసి కిన్నరయక్షగంధర్వపతులు
నాదిగా వచ్చి జయంబు నీదెసకు - మేదినీశ్వర! కోరి మింట నున్నారు;
అకలంకమతివి నీ వజ్ఞాన ముడిగి - సకలరాక్షసులను సమయింప వేగ
వారక నరులైన వారు సంసార - పారంబుఁ జేరు నుపాయంబు లేక
బాళి నాశాపాశబద్దు లై రేని - నీలీల నటియించు టింతియకాక!2620
నీవేల యీసర్పనికరంబుచేత - భావింపఁగాఁ గట్టుపడుదు; శ్రీరామ!
నీ వాదిమూర్తివి నీమూర్తిదలఁపు - నీవాహనం బైన నీకేతు వైన
గరుడుండు వచ్చిన గరుడునిచేత - నురగపాశము లెల్ల నూడు నీక్షణమె.”
యని చెప్పి దీవించి యానారదుండు - చనియెఁ గ్రమ్మర సుధాసాగరంబునకు
నానారదుఁడు సెప్ప నారాఘవుండు - తా నాదిహరి యౌటఁ దలపోసి చూచి
తెలిసి ధీరుని వైనతేయునిఁ దలఁచెఁ - దలఁచిన నతఁడును తలఁపుతోఁ గూడి
యారూఢ మగు నమృతాబ్ధియుత్తరపుఁ - దీరంబునందుండి దిగ్గనలేచి
యూని మెట్టినపాదయుగముచే బయలు - గానంగ ధరణిలోపలిశేషుఁ డులుక(?)

గడుపెద్దయైన ఱెక్కలగాలి మిన్ను- సుడివడి దిక్కులు సొరవులై తూల
నమ్మ్రోఁతపెల్లున నఖిలలోకములు . నమ్రులై తమచేతనము దక్కి స్రుక్క2630
నెఱకలు విద్రిచిన నెగసినధూళి - నెఱసి చీఁకట్లుగా నిఖిలంబు గప్ప
జనుదెంచు నురువడి శైలంబు లురుల - వననిధి పిండలి వండలై కలఁగఁ
బదివేలసూర్యులప్రభ లెల్లఁ గూర్చి - మెదిచి చేసినక్రియ మెయి ప్రకాశింప
మెఱయురెక్కలతోడి మేరువో యనఁగ - బఱతెంచె గరుడుఁ డంబరమునఁ బేర్చి
పఱతెంచుటయు నాగపాశంబు లెల్ల - వెఱచి యానృపతుల విడిచి పెల్లురికె.
నది యట్టిదయ కాదె? యనినఁ జింతింప - వడలు బంధంబు లెవ్వారల కైనఁ
దనుఁదానె చింతించి తనదుబంధములు - చనఁ ద్రోవ రాముండు చాలఁడే తలఁప?
నినసుతుం డాదిగా నెల్లవానరులు - విన విస్మయంబుగా వెఱగంది చూడ
భానుకోటిప్రభాభవ్యతేజమున - నానందకరమూర్తి యమరులు పొగడ
హీరకిరీటంబు హేమాంబరంబు - గారుత్మతోజ్జ్వలగ్రైవేయకంబు2640
రత్నకుండలములు రాజీవరాగ - నూత్నమంజీరమనోహరాంఘ్రులును
మౌక్తికమాలికల్ మాణిక్యకవచ - సక్తమై మించు విశాలవక్షంబు
మరకతకేయూరమంజుబాహువులు - నరుణపక్షములు చంద్రాననాబ్జంబు
కరుణావలోకముల్ కంబుకంధరము - నరుణపల్లవకోమలాగ్రహస్తములు
దుందుభిస్వనము లత్తుకచాయ మేను - మందరమేరుసమానగాత్రంబు
లలితోర్ధ్వపుండ్రలలాటపట్టికయుఁ - సెలవులఁ దేరెడు చిఱునవ్వు లొలుక
వైనతేయుండును వలగొని వచ్చి - యానరపతులకు నందంద మ్రొక్కి
మెఱుగారుఱెక్కల మేనులు దుడిచి - నెఱికరంబులు మోడ్చి నిలిచి యిట్లనియె.
"బాసె మీ కీనాగపాశబంధములు - వాసవాంతకుని రావణుఁ ద్రుంచి వైచి
ధరణిజఁ గొని యయోధ్యకు వేగ చనుము - ధరణీశ! యసురులు దండించునపుడు2650
మాయలు పెద్ద యేమఱక వర్తింపు - మేయుపాయంబుల నిఁక మోసపోకు"
మని ప్రదక్షిణముగా నరిగి యానృపుల - వినుతించి దీవించి వెసఁ గౌఁగిలించి,
మ్రొక్కి యాయమృతసముద్రంబుకడకు - గ్రక్కున గమనించెఁ గశ్యపాత్మజుఁడు
పాములక ట్లెల్లఁ బాయుటఁ జేసి - రామలక్ష్మణులును రాగిల్లి రపుడు,
వనచరు లారామవల్లభు నెదుర - ననురాగరసమున నందందఁ దేలి
తనరుచు సింహనాదములు సేయుచును - వినువీథిఁ దోఁకలు విసరి యాడుచును
గురువులు వారుచు గునిసి యాడుచును - నురవడి దాఁటుచు నుబ్బి నవ్వుచును
ఘాటించి శైలవృక్షము లెత్తి లంక - కోటలో కెత్తునఁ గొనఁదలంచుచును
మిగిలినవారల మిక్కిలి రభస - మగలించె లంకపై ల్లగలించె నభము.
అంత సూర్యోదయ మగుటయుఁ జరుల - నంతయు నరయ దశాస్యుండు పనిచెఁ.2660

బనిచిన నక్కోటపైనుండి వారు - గనిరి సుగ్రీవుండు కదిసి కొల్వఁగను..
సవినయుండై విభీషణుఁడు సేవింపఁ - బ్రవిమలమతి కపిబలము రంజిల్లఁ
బోరికి సేనలఁ బురికొల్పుకొనుచుఁ - జారువిశృంఖలసమదేభయుగము
గతినున్న రామలక్ష్మణుల నిక్ష్వాకు - పతుల బంధంబులు వాసినవారిఁ
గని విన్ననై వారు క్రమ్మఱఁ బోయి - దనుజేశ్వరున కవ్విధం బెఱిఁగింప
విని ఖిన్నుఁడై కడువెఱ గంది యపుడు - తనమంత్రివరులతో దశకంఠుఁ డనియెఁ
"బన్నగపాశాప్తిఁ బడియును మగుడ - నున్నయారామలక్ష్మణులచే నింకఁ
జెడఁగల దీలంక సిద్ధంబు గాఁగ - బడయవచ్చునె నాగపాశంబు లూడ?
జయ మెక్కడిది నాకు? సమరంబులోన - రయమునఁ జెడుఁగాక రాక్షసలక్ష్మి!
గరుడుండు వచ్చెనో కాక లేకున్న - నురగపాశము లేల యాడు వారలకు;2670
గరుడుండు నను గెల్చెఁ గాక లేకున్న - నరు లెంతవారు? వానరు లెంతవారు?”
అనుచు మత్తేభరవానుకారముగ - ఘన మగు నిట్టూర్పు గ్రమ్మ ధూమ్రాక్షుఁ

ధూమ్రాక్షుఁడు యుద్ధమునకు వచ్చుట

బనిచె నగ్గలమైన బలములఁ గొనుచుఁ - జను వేగ రామలక్ష్మణులపై ననుచుఁ
బనిచిన నాదైత్యపతికి మ్రొక్కుచును - నని కెత్తి ధూమ్రాక్షుఁ డప్పుడు వెడలె.
వానిబలంబు వెల్వడఁ జొచ్చె నపుడు - నానావిధంబుల నలుగడలందు
వృకసింహముఖముల వెలసినయట్టి - ప్రకటితస్ఫూర్తితురంగంబు లొప్పఁ
బటపటార్భటిఁ జెవుల్ పగిలించునట్టి - పటురవంబుల దిశాపటలంబు లద్రువ
వడి భయంకరము దివ్యం బైనదీప్తు - లడర ధూమ్రాక్షునియరద మొప్పారె.
భేరులు శంఖముల్ పృథుమృదంగములు - భూరిఘోషంబు లద్భుతముగా మ్రోయఁ
దురమున కటు వచ్చుధూమ్రాక్షునకును - బరువడిఁ దోఁచె నొప్పనిశకునములు2680
నలి నార్చి ముందఱ నడుచు రాక్షసులు - నిలిచి యెంతేనియు నిశ్చేష్టులైరి,
అయ్యును నిలువక నగ్గలం బైన - కయ్యంబుమీఁదను గవిసి యార్చుచును
వచ్చుధూమ్రాక్షుండు వారిధివోలె - నచ్చెరు వై యున్న యగచరసేన
దాఁకిన నసురులఁ దరుచరేశ్వరులు - దాఁకిరి మిన్నులు దాఁక నార్చుచును
దానవావలి యడిదంబుల వ్రేయ - వానరావలి వేసె వారి వృక్షముల
దానవేశ్వరులు కుంతంబులఁ బొడువ - వానరు ల్పిడికిళ్ల వారి మోఁదుదురు
దానవుల్ హరులఁ బంతంబునఁ దోల - వానరుల్ వానిని వ్రత్తురు గోళ్ల
దానవోత్తములు రథంబులు వఱప - వానరుల్ వానిని వ్రయ్యఁ దొక్కుదురు
దానవుల్ మదకరితతుల ఢీకొలువ - వానరుల్ వాని నుర్వరఁ గూల్తు రలుక
నివ్విధంబునఁ బేర్చి యిరువాగుఁ బోర - నవ్వనచరవీరు లసురులఁ గిట్టి,2690
యంతకాకృతిఁ గాళ్ల నలమి మదోగ్ర - దంతుల నేలపైఁ దాటించి చంపి,

వానిఁ జేకొని కడువడి వ్రేసి వ్రేసి - దానవానీకంబు దర్పంబు మాపి
గెడపి కొల్లొడిసి పక్కెరలతోఁ బట్టి - పుడమి బెట్టుగ గుఱ్ఱముల వేసి చంపి
వానిఁ జేకొని కడువడి వ్రేసి వ్రేసి - దానవానీకంబు తనువులు చదిపి
యసమునఁ గడునొగ లలమి యందంద - వెసఁ ద్రిప్పి యరదముల్ విఱుగ దాటించి
వానిఁ జేకొని కడువడి వ్రేసి వ్రేసి - దానవానీకంబు ధరఁ గూల్చి కూల్చి
యిరియు కాల్బలములయెమ్ము లన్నియును - నురుముగాఁ దన్ని పీనుఁగులుగాఁ జేసి
వాని నేర్కొని కడువడి వ్రేసి వ్రేసి - దానవానీకంబు ధరమీఁదఁ గూల్చి
మఱియుఁ గ్రందుగఁ జొచ్చి మహితదంష్ట్రముల - గఱకురాక్షసకోటి గఱచి యీడాడి
చాచినయట్టి శస్త్రంబులు విఱిచి - మోచేతులను వారిమొగములఁ బొడిచి2700
పడఁద్రోసి చేతుల బలిమిగా నదిమి - మెడలును గాళ్లును మిడుకంగఁ బట్టి
మోఁకాళ్ల నూఁది యిమ్ముల దైత్యవరుల - వీక కోలెమ్ములు విఱుగంగఁ బొడిచి
కడువడి నిడుదతోఁకలు దవిలించి - యుడుగక మెడలకు నురులు గావించి
యఱిముఱిఁ బరవశులై గ్రుడ్లు వెలికి - నుఱికి బెట్టుగఁ జావ నొగి బిగియించి
పెల్లుగాఁ బీనుఁగుపెంటలు సేయ - మల్లడిగొని త్రెళ్లి మహిమీఁద నపుడు
ఇవి తల; లివి కన్ను; లివి వదనంబు; - లివి చెక్కు; లివి ముక్కు; లివి కంధరంబు;
లివి బాహు; లివి మేను; లివి జఘనంబు; - లివి యూరు; లివి జాను; లివి చరణంబు;
లని యేరుపడకుండ నసురవర్గముల - నెగడును మజ్జంబు నెత్తురు మెదడు
నెరసియుఁ బ్రేవులు నెమ్ములు తోలు - పురియలతోఁ బెనుప్రోవులై యుండె.
నప్పుడు ధూమ్రాక్షుఁ డాకపిసేనఁ - జప్పరింపుచుఁ దాఁకి చతురత మెఱసి2710
తలలు వ్రయ్యలుగ ముద్గరముల వేసి - సలలితుం డగుచుఁ బ్రాసంబులఁ బొడిచి
పరిఘంబులను భిండివాలశూలముల - గరవాలముల మహోగ్రతఁ బెంపు చూప
గడు నొచ్చి నెత్తురుల్ గ్రక్కుచుఁ బడిరి; - కడిమికిఁ బెడఁబాసి కపులు పెక్కండ్రు
తక్కటికోఁతు లుదగ్రత దక్కి - దిక్కులఁ బఱచిరి ధృతి పెంపు దూలి;
పఱచినఁ గోపించి పర్వతం బొకటి - యఱిముఱిఁ గొని వైచె హనుమంతుఁ డలిగి;
వైచిన గద గొని వారించి యప్పు - డాచావునకుఁ దప్పి యసుర దాఁటుటయు
నది దానవాధమునరదంబుమీఁదఁ - జదరంబుగా వచ్చి చదియంగఁ బడియె.
నంతటఁ బోవక యనిలతనూజుఁ - డెంతయుఁ గడఁకతో నేపు దీపించి
యలుకతో జముఁడు బ్రహ్మాండంబు వగులఁ - బలువుర నుగ్గాడు పగిది రోషించి
తరుశైలపాషాణతతుల రాక్షసుల - శిరముల నుగ్గాడి సింహవిక్రముఁడు2720
అడరి వాండ్రను దోలి యగశృంగ మొకటి - తొడిబడఁ గైకొని ధూమ్రాక్షుమీఁదఁ
గడఁగి యేతేరంగ గదఁ గొని యతఁడు - మడియు మంచును హనుమంతు మస్తకము
వ్రేసిన ధూమ్రాక్షువీఁకయు లావు - నీసును శౌర్యంబు నింతఁ గైకొనక

హనుమంతుఁ డుగ్రత నరచేత నున్న - ఘనతరశైలశ్యంగం బెత్తి యార్చి
యేచి యద్దానవు నేపెల్లఁ దూల - వైచినఁ దల పెక్కువ్రయ్యలై కూలె.
నప్పుడు కొండ వజ్రాహతిఁ గూలు - చప్పుడు దోఁచె నజ్జగములకెల్ల
నటు వాఁడు మృతుఁడైన హతశేషులైన - కుటిలదైత్యులు గాలికొడుకున కులికి
భూచక్ర మగలంగఁ బొరిఁబొరి మగిడి - చూచుచు వెస లంకఁ జొచ్చిరి పాఱి
యంత రావణుఁడు ధూమ్రాక్షుఁడు చచ్చు - టంతరంగము నెరియంగఁ జేయుటయుఁ

అకంపనుఁడు యుద్ధమునకు వచ్చుట

గలన దేవతలకుఁ గంపింప కునికి - గలిగినవాని నకంపనాహ్వయుని2730
దివ్యాస్త్రశస్త్రప్రదీప్తులవాని - దివ్యరథోపరిస్థితి నొప్పువాని
వడి నాజికినిఁ బడవాళ్లను బనిచి - వెడలించె బహుబలవితతితోఁ గూడ
మొనసి కాలాంబుదమూర్తియై వాఁడు - దనరు భూషణదీప్తిధామంబు లడర
మణిదీధితుల సూర్యమండలం బగుచు - బ్రణుతి గాంచిన హేమరథముపై నిలిచి
యిదె వచ్చె నాజికి నితఁ డని తెల్పు - చదురునఁ గేతువు ల్చదలఁ బెల్లడరఁ
గుటిలరాక్షసవీరఘోరనిస్సాణ - పటహభేరీభూరిభాంకృతు ల్సెలఁగ
వితతంబుగా లంక వెడలంగఁ దోన - చతురంగబలములు చతురత వెడల
నగచరసేనయు నార్చుచుఁ దాఁకె; - గగనంబు పగుల రాక్షససేనతోడ
నుభయబలంబు లి ట్లుగ్రతఁ బేర్చి - రభసంబుతోఁ దాఁకి రణ మొనరింప
నెగసిన కెంధూళి యెల్లదిక్కులను - గగనభూభాగంబుఁ గప్పె నాలోనఁ2740
జీఁకటి మిగులఁ బేర్చినచంద మయ్యె; - నాకపిసేనల కసురసేనలకు
నప్పుడు తమతమ యడియాలములను - దప్పక రణము కొందఱు సేయువారు;
పలుకుల సన్నలఁ బరు లని యెఱిఁగి - తలపడి పేర్చి కొందఱు పోరువారు;
వారు వీ రనక యెవ్వరి నైనఁ దాఁకి - దారుణక్రీడఁ గొందఱు పోరువారు;
తరుచరావలి వైచు తరులును గిరులు - నురుదైత్యు లడరించు నుగ్రశస్త్రములు
పెరసి నల్దెసలందుఁ బెల్లుగాఁ బరచి - పొరిఁబొరి జలచరంబులభంగి నొంది
మానైన ధూళి తమఃపటలమున - మానితాంభోనిధి మాడ్కిఁ గావించె.
నప్పు డాయుభయసైన్యంబులనడుమ - నుప్పొంగుతనువులు నురులురక్తములు
ధరణీపరాగంబు దక్కినదైత్య - తరుచరపతులు యుద్ధము వేడ్కఁ జేయ
నావానరులు కడు నగ్గలం బైన - బావకాకృతి నకంపనుఁడు కోపించి2750
నారి సారించి యున్నతసత్త్వుఁ డనియెఁ - సారథితోడ నుత్సాహంబు మిగుల
“మ్రాఁకులఁ గొండల మర్కటసేన - వీఁకతో రాక్షసవితతి నొప్పించె.
నాదిక్కునకుగా రయంబునఁ దోలు - మా దర్పమున నీవు మనరథం" బనుడు
వాఁడును బరపిన వాఁడు నగ్గలిక - వాఁడిమిఁ దాఁకి యవ్వనచరసేన

బెడిదంపుశరములఁ బెల్లేయుటయును - జెడి వలీముఖులు నిశ్చేష్టితు లయ్యు
హనుమంతుఁ డడరిన నతనితోఁ గూడి - దనుజసైన్యంబులఁ దాఁకిరి బెట్టు
అప్పుడు మేరునగాకృతి నున్న - యప్పవనజుమీఁద నయ్యకంపనుఁడు
వీరరసస్ఫూర్తి వెల్లువదొట్టి - ఘోరంపుటార్పు నిర్ఘోషమై చెలఁగఁ
గడుబెట్టుగా లయకాలమేఘంబు - వడువున నురుశరవర్షంబు గురియ
నవి గణింపక యట్టహాసంబు చేసి - పవననందనుఁ డంతఁ బ్రళయకాలాగ్ని2760
రుద్రునికైవడి రూక్షకటాక్ష - రౌద్రరసంబు ఘోరంబుగా నిగుడ
విగతభయుండు నై వ్రేళ్లతోఁ గూడ - నగలించి పెఱికి మహాశైల మెత్తి
వైచి నముచిపయి వజ్రి వజ్రంబు - వైచినచందాన వారణలేక
దానవుం డర్ధచంద్రప్రదరమున - దాని నుగ్గాడె నుద్ధతశక్తి మెఱసి
మానితం బగుసత్త్వమహిమ దీపింప - గా నగ్నికణములు గన్నులఁ దొరఁగఁ
జని వేగ వేఱొకశైలంబుఁ బెఱికి - కొనివచ్చి యఱిముఱిఁ గ్రూరుఁడై యార్చి
కడుబెట్టిదముగ రాక్షసుమీఁద వైవ - వడిఁగొని తుమురుగా వాఁ డది ద్రుంచె
దానికి మారుతితనయుండు గినిసి - వే నగంబును బోలు వృక్షంబుఁ బెఱికి
యడుగులఁ బెట్టున నవని కంపింప - మిడుగురుగములు గ్రమ్మెడు కన్ను లొప్ప
మసలక తక్కిన మాఁకులు విఱుగ - విసరి యాడుచు దైత్యవితతిపైఁ గవిసి2770
రథికులఁ జంపి సారథుల గీటడఁచి - రథరథ్యములను ధరాస్థలిఁ జదిపి
కొమ్ములు నెమ్ములు కుంభస్థలములు - నమ్మీఁదిజోదులు నంకుశంబులును
మురియంగ ఘంటలు మొరయఁగఁ బెట్టు - చరణము ల్వెసఁబట్టి సామజ ప్రతతిఁ
దడఁబడగా వేసి తరమి కొన్నింటిఁ - బొడిపొడిగాఁ జేసి పుడమిపై గెడపి
తుమురుగా రౌతులతోను గుఱ్ఱముల - సమయించి కాల్వురఁ జదియంగ మోఁది
యంతకాకృతిఁ బేర్చుహనుమంతుమీఁద - నంతరంగమునఁ గోపావిష్టుఁ డగుచు
వాటంబుగా దైత్యవరుఁ డుచ్చిపాఱ - నాటించె నొకపదునాల్గుబాణములు
కరమునఁ గలయశ్వకర్ణవృక్షమున - మురియలు గావించి మునుమిడి యార్చె.
నప్పుడు నెత్తురు లడర నశోక - మొప్పఁ బూచినక్రియ నొప్పి యావేళ
హనుమంతుఁ డొకవృక్ష మవలీలఁ బెఱికి - తనర నకంపనుతల వ్రేయుటయును2780
లోకంబులు గలంగ లోగుచుఁ బర్వ - తాకృతి బెట్టుగా నవనిపైఁ గూలి
పొరిఁబొరిఁ జెదరెడి పునుకలతోడ - నరభోజనుండు ప్రాణంబులు విడిచె
వాఁడు గూలినయంత వానరోత్తములు - వాఁడిమి నార్చిరి వసుధ గంపింప
దనుజులు గనుకని తలలోలివీడఁ - జని లంకఁ జొచ్చిరి సరభసంబునను
అగచరేశ్వరులును హనుమంతుకడిమి - బొగడిరి తమమనంబులు మెచ్చి మెచ్చి,
పరులచే నని నకంపనుఁడు గూలుటయుఁ - బరితాపమున విని పఙ్క్తికంధరుఁడు

“మనుజుల కపులను మడియించి వేగ - చనుదెమ్ము నీబలశౌర్య మింపార”

మహాకాయుఁడు యుద్ధమునకు వచ్చుట

నని మహాకాయుని నప్పుడె పనిచెఁ - బనిచిన వాఁడును బనిఁబూని యపుడు
రమణీయతరమయూరధ్వజం బొప్ప - నమితమణిప్రభ లఖిలంబు నిండఁ
బనిగొని శస్త్రాస్త్రపఙ్క్తులు మెఱయ - ఘనపిశాచాననగార్ధభప్రతతిఁ2790
బూనినయరదంబు బొలుపార నెక్కి - నానాస్త్రశస్త్రసన్నద్ధసైన్యములు
నడువంగ నిస్సాణనాదంబు లెసఁగ - నడియాల మైనతూర్యంబులు మ్రోయ
దనరినదక్షిణద్వారంబునందు - వినుతవిక్రమశాలి వెడలె వేగమున
నప్పుడు గురిసెఁ బై నస్థులవాన - చొప్పడఁ బిడుగులు సోనలై పడియె
గొడుగులు పడగలుఁ గూలెఁ గూలుటయు - నడరి మహాకాయుఁ డవి యెల్లఁ గొనక
కడిమి వానరసేనఁ గదిసి దాఁకుటయుఁ - బుడమి చలింప నప్పుడు వలీముఖులు
తరుశైలవితతులు తఱుచుగా మీఁదఁ - గురియుచుఁ దాఁకిరి క్రూరదానవుల
నప్పుడు దానవు లాసేనమీఁద - నుప్పొంగుబీరంబు లొలుకుచునుండఁ
దడబడఁగా నరదంబులు వఱపి - కడువేగమునఁ గరిఘటలు డీకొల్పి
తురగచయంబులఁ దోలి యుగ్రతను - దరముగా ముంచి పదాతి ద్రోచియును2800
గరవాలములఁ ద్రుంచి గదల నొప్పించి - సురియల నాటించి శూలాలఁ జించి
పరిఘల విదళించి ప్రాసాల నొంచి - శరపరంపర లేసి చక్రము ల్వైచి
పట్టసంబులఁ ద్రుంచి పరశుల నొంచి - కిట్టి ముద్గరముల గినిసి ధట్టించి
మిగిలినకపులును మేటిరక్కసులు - నగపాదపములవానల ముంచి రంత
నారభసంబున నవనీపరాగ - మారవిమండలం బంతయుఁ గప్పె
నారజఃపటలంబునం దిరువాగుఁ - బోరుచో నొండొరుఁబొడ గానరాక
తరువులు కొండలు దరుచు మ్రోయుచును - దెరలంగ మీఁద నేతెంచు చక్కటికి
నురవడి నేయుదు రుగ్రదానవులు - శరపరంపర లాకసంబునఁ గప్పఁ
బరఁగుచక్రంబులు పట్టసంబులును - శరములు తోమరచయము ప్రాసములు
వడి మ్రోయుచును మీఁద వచ్చుచక్కటికి - విడుతురు తరుశైలవితతులు గపులు2810
అంతఁ బోవక చెవులందును ధూళి - యెంతయు నిండిన నిరువాగువారు
మ్రోయుచక్కటికి నిమ్ముల విక్రమంబు - సేయునేర్పులు దక్కి చేష్టలు మఱచి
కపులు వీ రనక రాక్షసులు వీ రనక - చపలత్వమునఁ బెల్లు చంపుదు రెలమి
నటు పోరఁ దనువుల నడరురక్తములు - పటునదులై రజఃపటలంబు నణఁప
దిమిరంబుఁ బాసియు దీప్తశౌర్యములు - నమరులు వెఱగంద నని సేయునపుడు
వెస దైత్యులకుఁ గాక విఱిగి యాకపులు - కసిమిసియై కనుకని పాఱుటయును
గనియంగదుఁడు పల్కెఁ “గపివీరులార - కనుకని యిటు పాఱఁగా నేల? నేను

గలుగంగ" నని వారిఁ గ్రమ్మఱ ననికిఁ - దలకొనఁజేసి యుత్సాహంబుతోడ

రాక్షసులతో వానరులు ఘోరయుద్ధము సేయుట

నొకమహాపర్వతంబును వడి నెత్తి - యకలంకుఁడై రాక్షసావలిమీఁద
నడువ నాతనితోడ నలి నార్చియార్చి - నడచిరి వానరనాయకు లేచి2820
యంగదుండును బేర్చి యసురులఁ గట్టి - యంగంబు లవియఁగ నాసేన నెల్ల
పెడచేతఁ బడఁ దాచి పిడకిళ్లఁ బొడిచి - యడరి ముంజేతుల నంగము లోచి
మోచేతఁ బగులంగ మొగములఁ బొడిచి - పూచినశస్త్రాస్త్రములు పొడిసేయ
గఱకురాక్షసులు నంగదునకుఁ గాక - విఱిగి హాహాకారవివశులై తూలి
నలుగడఁ బాఱ నున్నతశక్తి వారి - వలువ దోహో! యని వారణ సేసి
ఖ్యాతి మించిన మహాకాయుని మంత్రు - లాతతగతి రుధిరాశనుం డనఁగ
వ్రాలెడివాఁడును వజ్రనాభుండు - కాలదంష్ట్రుండును గాలకల్పుఁడును
మఱి వపాశుఁడు శతమాయుండు ధూమ్రుఁ - డఱిముఱి దుర్ధరుం డనువాఁడు గడఁగి
యట్టహాసములతో నగచరసేనఁ - గిట్టి నొప్పింప వీక్షించి పృథుండు
పనసుండు మేఘపుష్పకుఁడు గవాక్షుఁ - డును ఋషభుఁడు గజుఁడు క్రోధనుండు2830
శతబలి తారుండు సబలులై వారి - నతులితగతిఁ దాఁకి యని సేయునపుడు
రుధిరాశనుం డంత రోషంబుతోడ - నధికబాణములు గవాక్షుపై నేయ
వేగంబె పర్వతవృక్షంబు లెత్తి - యాగవాక్షుఁడు రుధిరాక్షుపై వైచె
వైచిన నడుమనె వాని నన్నింటి - నేచి చూర్ణములుగా నేసి గవాక్షుఁ
బడనేసె మూర్ఛచేఁ బడిన గవాక్షుఁ - బోడఁగని తారుఁ డప్పుడు కలుషించి
ఘనమైన సాలవృక్షం బెత్తి వ్రేసె - ననువొంద రుధిరాక్షు నరదంబుమీఁద
నారుధిరాశనుం డమ్మహీరుహము - బోరన నడుమనె పొడిపొడి చేసి
పదిబాణములఁ దారు బడనేసి మించి - కదిసి చలంబునఁ గపిసేన గిట్టి
కడునుగ్రుఁడై లయకాలంబునాఁడు - మిడుక లోకములెల్ల మ్రింగునంతకుని
ఆకృతిఁ గైకొని యాసేనలోన - భీకరవృత్తితోఁ బేర్చుచునుండె.2840
నప్పు డొకింత గవాక్షతారులును - దెప్పిరి కనువిచ్చి తెలియంగఁ జూచి
యంతలో గద వ్రేసె నడరి గవాక్షుఁ - డంతకాకృతి రుధిరాశుమస్తకము
వేసిన నసురయు వికృతాంగుఁ డగుచుఁ - బాసి ప్రాణములకుఁ బడియెఁ దత్తనువు
అని వజ్రనాభుఁ డుదగ్రుఁడై పృథునిఁ - గనుఁగొని పెల్లేసె ఘనసాయకములఁ
బృథివీధరము వైచెఁ బృథుఁ డప్పు డలిగి - ప్రథితంబుగా నేసెఁ బదివ్రయ్యలుగను
పృథుఁడును రోషసంస్ఫీతుఁడై వాని - రథముపై కెంతయు రయమున నురికి
విల్లు ఖండములు గావించి గుఱ్ఱముల - డొల్లించి రథము బెట్టుగ నుగ్గు వేసి
యనయంబుఁ గోపించి యవ్వజ్రనాభు - ఘనశక్తి వలకేలఁ గడకాలు వట్టి

వెసఁ ద్రిప్పి నేలతో వ్రేసి రోషమున - నసురులఁ బెడఁబాపి యాపృథుం డార్చె
బరువడి ఋషభునిపైఁ గాలదంష్ట్రుఁ - డురవడి గొల్చె మహోద్దండదంతి2850
నటుమీఱి చనుదెంచునగ్గజంబునకు - నటునిటుఁ దొలఁగక యాఋషభుండు
వేగంబుమైఁ బదద్వితయ మొక్కటిగ - లాగించి కుంభస్థలములఁ దన్నుటయు
మదకరిఘీంకృతి మానక నిగుడ - నది యొక్కవింటిప ట్టరిగె వెన్కకును
మఱియును ఋషభుండు మానక మీఁద - దరిమి యయ్యేనుఁగుదంతంబుఁ బెఱికి
బాగొప్ప వేసి యప్పటుకరిఁ జంపి - లాగును వేగంబు లావును మెఱసి
కాలదంష్ట్రుని గిట్టి కాలొగిఁ బట్టి - కేళిమై ధర వేసి గీటడఁగించె
నసురసైన్యములు హాహారవం బంద - నసమునఁ గపిసేన యార్చె నందంద
కాలకల్పుఁడు నగ్నికల్పబాణముల - పాలు గావించె నప్పనసునిఁ గిట్టి
పనసుఁ డయ్యరదంబుపైకి లంఘించి - మును బెట్టుగా గుఱ్ఱములఁ జదియించి
సారథిఁ బడఁదన్ని సత్త్వ మేపార - నారథం బెల్ల నుగ్గై రాలఁగొట్టి2860
పిడికిట గళసంధి బెట్టుగాఁ గిట్టి - పొడిచె నకాలకల్పుఁడు దన్ని కొనఁగఁ
బొడిచిన వాఁడు నప్పుడు పండ్లు డుల్లి - దొడదొడ నోట నెత్తురుఁ గ్రక్కుకొనుచు
మిడుకుచు గ్రుడ్డులు మిడుక ప్రాణములు - విడిచె రాక్షసు లెల్ల విస్మయం బందఁ
బలియుఁడై కపుల వపాశుండు గిట్టి - చలమున నేసి జర్జరీతులఁ జేయ
వానిపైఁ బాషాణవర్షంబుఁ గురిసె - జానుగా గజుఁ డాకసం బెల్ల నిండ
నావపాశుఁడు వాని నన్నింటి నడుమఁ - గావించె దునియలుగా నంపగములఁ
గావించి మఱియును గజు నురుమాడఁ - బావకాభము లేడుబాణంబు లేసె
నేసి వెండియు గిట్టి యిరువదేనింట - నేసి నూఱింటమే నేసెఁ దూరంగఁ
గజుఁడు నైదమ్ములఁ గడునొచ్చి వాని - నిజరథం బంతయు నెళనెళ విఱుగ
గరుడునివిధమునఁ గడువేగ దాఁకి - కరి గోపురాగ్ర ముగ్రతఁ ద్రోయుకరణి2870
నావపాశునితల యట్టకుఁ బాపి - పోవైచె నప్పుడు భూమిపైఁ బడఁగ
రోషించి యపుడు ధూమ్రుండు దుర్ధరుఁడు - భీషణాస్త్రముల నొప్పించి వానరులఁ
దఱిమినఁ గినుకఁ గ్రోధన మేఘపుష్పు - లుఱుక రథంబుల కుఱికి యుగ్రతను
గరతలంబున మస్తకంబులు చరచి - దురమున గెడపి రద్భుతశక్తి మెఱసి
యటు వారు హతులైన యసురు లందఱును - బటురయంబునఁ జెడి పాఱిరి భీతి
నసురులు పాఱుట యప్పుడు చూచి - మసలక వడి శతమాయుండు పేర్చి
కవిసినఁ జే పరిఘం బమరించి - కవిసి యాతనిమీఁద గజుఁ డెదిరింపఁ
జల మొప్ప ఋషభుండు శతబలిపనసుఁ - డలుక గవాక్షు నలాంగదుల్ గూడి
కడఁగి వృక్షంబులు ఘనశైలములును - మడవక యాశతమాయుని వైవ
శరతోమరప్రాసచక్రగదాది - వరశస్త్రచయముల వర్షంబు గురిసి2880

వడి శతమాయుండు వనచరేశ్వరులఁ - బెడిదంబుఁగా నొంచి పేర్చి పెల్లార్చె
వానిచే నటునొచ్చి వానరాధిపులు - మానక రోషసమగ్రులై కదిసి
యడరి గవాక్షుండు హయములఁ జంపెఁ - గడిమి ఖండించె నంగదుఁడు పతాకు
పఱియలుగాఁ ద్రొక్కెఁ బనసుండు రథము - నురుముగా ఋషభుండు నొంచె సారథిని
నలవొప్పు నలుఁడు శస్త్రాస్త్రముల్ విఱిచెఁ - జలమునఁ బిడికిట శతబలిఁ బొడిచెఁ
బిడికిటిపోటునఁ బిమ్మటఁ గొనక - కడులఘుత్వంబున గరుడుండు వోలెఁ
బటుఖడ్గమును బెద్దపరిఘయుఁ గొనుచుఁ - జటులవేగంబున శతమాయుఁ డెగయఁ
బరవశంబున వాలు పడియున్నబ్రద్ద - పఱియను గొని శతబలియుతో నెగసె
నెగసి భేరుండంబు లెడ రెండుఁ గవిసి - యొగిఁ బోరుతెఱఁగున నురువడి మిగుల
వ్రేయుచుఁ దిరుగుచు వేస దప్పుకొనుచు - బాయుచు డాయుచు బాటవం బొప్ప2890
గెరలుచుఁ దెరలుచుఁ గ్రిందుమీఁ దగుచుఁ - బొరిబొరి నాకసంబునఁ బోరుతఱిని
శతమాయుఁ డడిదంబు జళిపించి పూన్చి - శతబలివిపులవక్షం బేయుటయును
సరభసుండై యప్డు శతబలి బ్రద్ద - పఱి దప్ప నొడ్డి కృపాణోగ్రధారఁ
జలమునఁ దెగవేసె శతమాయుతొడలు - తలక్రిందుగా వాఁడు ధరమీఁదఁ బడఁగ
నవిసె దైత్యునితల యందందఁ జెదరి - యవనిపై గిరిశృంగ మనియుచందమున
శతమాయుఁ డపుడు చచ్చినఁ దోడికపులు - శతబలితోడ నచ్చట నార్చుటయును
ధరణి మిన్నును గుణధ్వని బీటులెగయ - నరద మత్యుగ్రరయంబునఁ బఱపి
యంగదు నపుడు మహానాదుఁ డార్చి - యంగదుమేన మూఁడమ్ములు గ్రుచ్చి

మహానాదుఁ డంగదునితోఁ బోరి మడియుట

మఱియును వెస నేయు మర్కటేశ్వరుఁడు - వఱలుకోపంబున వానిపైఁ గిట్టి
యోజనాయతగిరి యొకటి రథంబు - పై జవంబున వైవఁ బడకుండ వాఁడు2900
నడుమనే గద పైచె నగమెల్లఁ బొడిగి - వడిఁ ద్రుంపఁ గోపించి వాలినందనుఁడు
అతనిరథంబున కవలీల దాఁటి - చటులసత్త్వోన్నతిఁ జాపంబు విఱిచి
పట్టి రథంబుపైఁ బడవైచి ఱొమ్ము - మెట్టి గ్రుడ్డులువడి మిడుక రోజఁగను
మెడ నుల్చి త్రెంచి క్రమ్మిననెత్తు రొలుకఁ - బుడమి పై వైచె నప్పుడు వానిశిరము
తమ్ముఁడు చావ నుద్దండకోపమున - నెమ్ములు పగులంగ నేచి యార్చుచును
మఱియును గనలుచు మహనీయరథము - మెఱయుచు నలుగడ మెఱుఁగులు వార
గదలించి యమ్మహాకాయుఁ డుద్వృత్తి - మదమున సింహంబు మలయు చందమున
గుదులు గ్రుచ్చినమాడ్కిఁ గ్రూరబాణముల - నెదిరి ధారణిఁ గూల నేసె వానరుల
వనచరవీరులు వావికిఁ గాక - హనుమదాదులపోరు నచటికిఁ జనిరి
సారథి జూచి "యీచక్కటి మనల - వారక మార్కొనువారలు లేరు2910
బోరన రాముపైఁ బోనిమ్ము రథము - నేరుపు వాటిల్ల నీ" వన్న వాఁడు

కడఁగి యుగ్యముల పగ్గములు వదల్చి - వడి నదల్పఁగను దీవ్రంబునఁ గదల
నాక్రూరతకుఁ గాక నగచరుల్ పరువ- “నోకోఁతులార! మీ కులుక నేమిటికి?
శివునిచాపముఁ ద్రుంచి సీతఁ జేకొన్న - యవనీశుపైఁ గాని యాజి నే నలుగఁ
బరశురాముని భంగపఱచినయట్టి - నరనాయకుఁడు గాని నాయీడు గాఁడు
ఆజిలో ఖరుని నుక్కడఁచినయట్టి - రాజుమీఁదనె కాని రాదు నాయమ్ము
ధృతి నమ్ము తుద కబ్ధిఁ దెచ్చినయట్టి - పతితోడఁ గాని యే బవరంబు సేయఁ
ద్రిజగంబులందును దీపించునట్టి - రజతాద్రి యెత్తిన రావణుసుతుఁడఁ
దుది నింక నింద్రజిత్తునికిఁ దమ్ముఁడను - నిదె మహాకాయుండ నేతెంచినాఁడ”
ననుచుఁ జెప్పుచు రాగ నంబుదపటల - మున నున్నసూర్యుండు మొనసినమాడ్కిఁ2920
గపిరాజతనయుఁ డంగదకుమారుండు - కపిసేనలోనుండి కడఁగి యేతెంచి
వెనుకొని కోపంబు విలసిల్ల నపుడు - ఘనమైనకడిమితోఁ గలుషించి పలికె.
“నోరి మహాకాయ! యుడుగక రజ్జు - లీరణస్థలమున నేల ప్రేలెదవు?
మీతండ్రి గిరియెత్తి మెఱసె మాతండ్రి - మీతండ్రిఁ దోఁక నిమ్మెయిఁ గట్టి యెత్తె.
నీకు నాకును దగు నిష్ఠురరణము - కాకుత్స్థనిధి యేల కపిముఖ్యు లేల?”
యని మ్రాఁకు గొని మీఁద నడరింప నతని - తనువు నిండగఁ గప్పె దారుణాస్త్రములఁ
గదిసి వెండియు మహాకాయుఁ డంగదుని - గద గొని వ్రేసె నుత్కటకోపుఁ డగుచు
వేసిన నెంతయు వివశుఁడై పడియే - నాసమయంబున నతఁడు మూర్ఛిల్లి,
కుతలంబు పగుల నెక్కొని దైత్యు లార్చి - రతఁడు మూర్ఛిల్లిన నగచరపతుల
కవిసి యందఱు మహాకాయుపైఁ గవిసి - శిలలు భూజంబులుఁ జెచ్చెఱ వైవ2930
నవి యెల్లఁ దనదుబాణావలిచేత - నవలీలఁ దునిమి గవాక్షునిం బదిటఁ
బృథుని నైదిట నూటఁ బృథుసత్త్వు గజునిఁ - బ్రథితంబుగా శతబలి ముప్పదింట
నెనుబది యమ్ముల ఋషభునిఁ గినుకఁ - బనసుని డెబ్బది పటుసాయకముల
మెఱసి క్రోధనుని నమ్మేఘపుష్పకుని - నఱువదింటను నూట నదరంట నేసె.
నిటు వానరుల నతఁ డే పడఁగింప - నటు మూర్ఛనొందిన యంగదుం డపుడు
దెలిసి మోమునఁ గ్రమ్ముదెంచురక్తములఁ - బలుమఱుఁ గరములఁ బాయఁ ద్రోయుచును
నదరుచు నప్పు డయోమయంబైన - గద యెత్తికొని మహాకాయునిరథము
పయికి లంఘించి యుద్భటశక్తితోడ - జయశీలుఁడై వాని సారథిఁ జంపి
వెస విల్లుఁ బెల్లున విఱుగంగఁ గొట్టి - యసమున హయముల నన్నింటిఁ గూల్చి
తల వ్రేసె వ్రేసిన దైత్యపుంగవుని - తల బొమలికె యూడి ధరణిపైఁ బడఁగ2940
నామహాకాయుండు నరదంబు డిగ్గి - భీమగదాదండభీషణుం డగుచు
నంగదు నంగంబు నదరంట వ్రేసె - నంగదుండును వ్రేయ నతఁడు దర్పించి
యంగదుమస్తకం బలుకతో మఱియుఁ - బొంగి గదాదండమున వ్రేసి డాసె.

నాఘాతమున నెత్తు రడరిన నైన - రాఘవుబంటు శౌర్యం బింత చెడక
గదఁ బుచ్చుకొని మహాకాయుని వ్రేసె - నుదురు భగ్నముఁ గాఁగ నురుశక్తి మెఱసి
యెదిరిన తనతండ్రి యీతనితండ్రి - విదితంబుగాఁ బట్టి వేమాఱుఁ దొల్లి
మున్నీటిలోపల ముంచుటఁ దలఁచి - మున్నంటిపగకునై ముంచెనో యనఁగ
నస మేది దనుజుఁ డాయంగదుఁ బట్టి - వెసఁ బేర్చి నెత్తురువెల్లువ ముంచె
ముంచ రావణుఁ బట్టి ము న్నబ్ధి వాలి - ముంచినగతి వాని ముంచె రక్తమున,
నిటు మహాకాయుండు నింద్రుమన్మఁడును - పటుగతిఁ బోరుచోఁ బరఁగురక్తముల2950
జేగురుటేరులఁ జెలు వైనగిరుల - బాగున నెంతయు భాస్వరు లైరి
గదయును గదయు నుగ్రంబుగాఁ దాఁకి - చిదురుప లగుటయుఁ జెచ్చెఱ వారు
బలుఁడును నిర్జరపతియును దొల్లిఁ - గలిసి పెనంగినకైవడిఁ దోఁపఁ

మహాకాయుఁ డంగదునితో మల్లయుద్ధము సేసి మడియుట

బలుధూళి యద్దరి పదహతి నెగయఁ - దలపడి మల్లయుద్ధము సేయుచోటఁ
జతురతమై వనచరవీరుఁ డీతఁ - డితఁడు రాక్షసుఁ డని యెఱుఁగంగ రాక
కీలుబొమ్మలు లు పోరుక్రియలును దోఁప - వాలిసుగ్రీవులవడువునఁ బోర
నాదటఁ గపు లెల్ల నంగదుఁ జూచి - "యీదుష్టరాక్షసు నేల పాలార్చ
వాలినందనుఁడవు వాలికైవడిని - వఱలినవాఁడవు వరభుజశక్తి
వాలి దుందుభియును వడిఁ బోరుచోట - వాలి దుందుభి నింత వడి నిల్వనీఁడు
వేవేగ చంపు నిలింపకంటకుని - నీవిక్రమంబున నిపుణత మెఱసి"2960
యని జయశబ్దంబు లడరింప నతఁడు - దనుజునితల ముష్టిఁ దాటించి బెట్టు
పిడికిటఁ దాచిన బెట్టుగా విఱిగి - పడియు నద్దెత్యుండు బలమఱి నేలఁ
బడియున్న రాక్షసపతిఱొమ్ముఁ ద్రొక్కి - మెడ నుల్చి తలఁ ద్రెంచి మీఁదికి వైచి
యంగదుం డార్చె నయ్యంగదుఁ జూచి - యంగదు నార్చి రయ్యగచరాధిపులు
విచ్చి దానవులును వెస నేగి లంకఁ - జొచ్చియు వారిధిఁ జొచ్చియు నాల్గు
దెసలకు నుఱికియు దీనత నొంద - నసమున నుతియించి రంగదుఁ గపులు
నుతియించి సీతామనోనాథుకడకు - నతనిఁ దోడ్కొని చని యత్తెఱంగెల్ల
వినిపింప రఘుపతి విని సంతసమున - ఘనముగా నుప్పొంగి కౌఁగిటఁ జేర్చి
కరుణాకటాక్ష మంగదుమీఁద నునిచి - సరసంపుమందహాసంబున నొప్పె.
హతశేషులగు రాక్షసావలి చెప్పఁ - గతపడ్డ యమ్మహాకాయునిఁ దలఁచి2970
విన్ననై తలవంచి వెఱగంది కుంది - కన్నీరు నించి రాక్షసకులేశ్వరుఁడు
అంతఃపురంబున కరిగి యారాత్రి - జింతించుచును నిద్రఁ జెందక యుండి
మఱునాఁటిరేపు సామంతులు గొలువ - మెఱుఁగారు నరదంబు మీఁదికి వచ్చి
యరిగి పెంపారిన యాశ్వరి (?) నెక్కి - పరపైన తనకోటఁ బరికించి గాంచి

చూచి పాళెంబులు శోధించి మీఁది - నేచినబలుగాపు లిడఁదించి యపుడు
ఆరావణుండు ప్రహస్తుతో ననియెఁ - “బేరెక్కి యెందు నభేద్య మిక్కోట
యెట్టిశాత్రవులకు నెన్నఁడు డాయు - నట్టిదిగా దప్పు డగచరప్రతతి
వచ్చి భేదించి దుర్వార మై యునికి - యచ్చెరు వైనది యదియునుంగాక
శ్రీరాముభుజబలశ్రీ యెల్లచోట - నారూఢతరము ప్రహస్త! కావునను
నీ వొండె యటుఁగాక నే నొండె రణముఁ - గావింప నాకుంభకర్లుండు నొండె2980
తగువార మిందు నిద్రాసక్తి తనకు - మిగిలి నాతమ్ముఁడు మేల్కొనం డయ్యెఁ
బోయెదవో యేను బోదునో" యనుడు - నాయసురేంద్రున కతఁ డిట్టు లనియెఁ.
“బోయెద నిదె నాదుభుజబలం బెల్ల - నాయమరులు మెచ్చ నరులఁ ద్రుంచెదను
డాసి భూతప్రేతడాకినీగణము - లాసవంబున నెత్తు రాని మోదింప
నటు చూడు మాజిఁ బ్రహస్తుండు కపుల - నిటు సేయునే యన నెంతఁ బేర్చెదను
బోరికిఁ జను మన్న బుద్ధులు సెప్ప - నారయఁ బాడిగా దైనను వినుము
దనుజేశ! యొకమాట తగ దన కింక - విను వినకుండు వివేకించి చూడు
దానికిఁ గాదన దనుజేశ! మున్ను - మానైనబుద్ధులు మంత్రులు సెప్ప
వినవైతి విఁక నైన విను సీత రామ - జననాథునకు నిమ్ము సమరంబు వలదు”
అనుచు రావణునిఁ బ్రహస్తుండు వీడు - కొని వచ్చి తాఁ దనకోలల వారిఁ2990
బనిచి యప్పుడు నాల్గుబలములవారిఁ - దను గూర్చుకొని మహోద్దండభావమున
ఘన మైన కపివరాంగంబుల గాలి - తనమీఁద వీచునంతకు మ్రోయుచున్నఁ
గొమరున జలదనిర్ఘోషంబు దాని - నమరంగ విహగేంద్రు లనఁగఁ బెల్లెగసి
తక్కక ద్రుంచు నంతకుఁ గ్రాలుచున్న - చక్కనియురగధ్వజస్ఫూర్తి దాని
మణిగణకింకిణీమహనీయభూరి - రణనంబుఁ గలిగిన రథ మప్పు డెక్కి
పెక్కుతూర్యముల గంభీరరావముల - దిక్కులు ఘూర్ణిల్ల దివి యొడ్డగిల్లఁ
జుక్కలు డుల్ల వసుంధర యెల్ల - వ్రక్కలు వాఱఁ బూర్వద్వారమునను
గాలాంతకునిఁ బోలి కడగి యిబ్భంగి - నాలంబు సేయఁ బ్రహస్తుండు వెడలె.
నప్పు డాదైత్యుల యార్పులు నతని - యొప్పారఁ బేర్చినయుగ్రమూర్తియును
నక్కజం బగుటయు నావిభీషణుని - కక్కడఁ జూపి రామావనీశ్వరుఁడు3000
"తేజంబు బలమును దీప్తి శౌర్యమును - రాజిల్లుచున్న యీరాక్షసవరుని
పేరేమి? సాహసస్ఫీతుఁడై కపుల - పై రాకఁ జెప్పఁ జూపఁగఁ జోద్యమయ్యె"
ననుడు విభీషణుం డర్కవంశ్యునకు - ననియె “దేవా! యితం డారావణునకుఁ
గలిగిన సైన్యసంఘములకు నెల్ల - దళవాయి యీతనిదళములలోన
మూఁడవపా లిటు మూఁడులోకముల - వాఁడివీరుండు రావణుమాతులుండు
ఖండేందుధరుచెలికాని సామంతు - భండనంబున మాణిభద్రుని నోర్చెఁ

దపనకులేశ! యీదైత్యునితోడఁ - గపినాథులకు లెస్స కయ్యంబు గలుగు"
నని చెప్పుచుండంగ నగచరు లెల్ల - దనుజుల కెదురుగాఁ దరుగిరు లెత్తి
యార్చుచు వచ్చిన యసురసైన్యముల - నార్చుచు మార్కొని యని సేయునపుడు
ప్రళయకాలాగ్నికి బాడబాగ్నికిని - గలుషతఁ దలపోయఁ గలుగదు గాని,3010
పోడిమిగా మిన్ను భువియు నొండొండ - నోడక తాఁకుటయును లేదు గాని,
.మొనసి యాబ్రహ్మాండములు దమలోన - ఘనముగాఁ దాఁకుట గలుగదు గాని,

ప్రహస్తుని యుద్ధము

గలిగిన నిబ్భంగిఁ గపిదైత్యనాథు - లులుకక పోరుట యుపమింపవచ్చుఁ
బావకవిధబాణపఙ్క్తుల దైత్యు - లావనచరులపై నార్చుచు వైవ
నందు వెండియుఁ గొంద ఱసిగదాప్రాస - సందీప్తముసలోగ్రచక్రము ల్వైవఁ
దరుచరబలములు దరులును గిరులు - మరల దైత్యులమీఁద నురువడి వైవ
ధరమీఁద డొల్లెడితలలును వ్రయ్యు - నురములు నురుమైనయురుకంధరములు
దొరిగెడిప్రేవులుఁ దునియువాలములు - మురిసినయమ్ములు ముంచురక్తములు
చెదరినమెదడు విచ్ఛిన్నంబు లయిన - పదములు మిట్టెడు బాహుదండములు
ముడిగి ముద్దలభంగి మురియుపీనుఁగులు - నడుములు దెగిన యున్నతదేహములును3020
ద్రెళ్లెడి మేనులుఁ దిరిగెడిగ్రుడ్లు - పెల్లుగా నెంతయు భీకరం బగుచుఁ
దలఁకక సంగరస్థలమునఁ బోరి - కలగొనఁబడినరాక్షసులును గపులుఁ
గలఁగి యంతటఁ బోక కలుషించి మించి - చల మగ్గలించి యుత్సాహంబుఁ బెంచి
బెడిదంబుగా దైత్యబృందంబుమీఁద - నడచి యార్చుచుఁ గపినాయకోత్తములు
ద్వివిదుండు వైచెఁ బృథ్వీధరశిఖర - మవిరళశక్తి నరాంతకుమీఁద
నకలంకుఁడై కుంభహనుఁ బడవైచె - నొకవటంబునఁ దారుఁ డుగ్రవేగమున
వడిఁ బెద్దగిరి జాంబవంతుఁ డుగ్రతను - నడరించి మించె మహానాభుమీఁద
భూరిభూజంబునఁ బొరి గోల నేసె - ఘోరంబుగా దుర్ముఖుఁడు సమున్నతిని
వానరనాథులవాటులచేత - దానవు ల్నలుగురు ధరణిఁ ద్రెళ్లుటయుఁ
దన ప్రధానులచావుఁ దప్పక చూచి - యనయంబు నలిగి ప్రహస్తుండు కపుల3030
నొకటఁ బదుండ్రను నొకట నేఁబండ్ర - నొకటఁ బదార్వుర నొకట నూర్వురను
రథచిత్రగతు లొప్ప రయమునఁ బేర్చి - పృథివిపైఁ గూల్చినఁ బేర్చి వానరులు
ద్రుమశైలములఁ బ్రహస్తునిసేన లెల్ల - జమరినగతి నుండఁ జంపిరి కడఁగి
యప్పుడు వెల్లువ లయి పాఱఁ జొచ్చె - జొప్పడ మిన్నంటి శోణితనదులు
అందులోపలనుండి యసురులుఁ గపులు - నందంద నని సేసి రార్చుచుఁ దేర్చి
యాయగ్గలికఁ జూచి యఖిలదేవతలు - వేయువిధంబుల వినుతించి రంత
నాప్రహస్తుండు కాలాంతకాకారుఁ - డై ప్రతి లేక సొంపారి యావేళఁ

గరములు పదములు ఖండించి వైచి - యురములు నుదురులు నుచ్చి పో నేసి
తలలును భుజములు ధరమీఁదఁ గూల్చి - తలఁగ నెమ్ములును దంతంబులు రాల్చి
మురియలుగాఁ జక్రములఁ ద్రుంచి త్రుంచి - పొరిఁబొరి నంకుశంబులఁ జించిచించి3040
కడునుగ్ర మగు పరిఘలఁ గొట్టికొట్టి - ముడివడ ఘనపాశములఁ గట్టికట్టి
లలి మీఱఁ బరశువులను వ్రచ్చివ్రచ్చి - పొలుపార బలుశూలములఁ గ్రుచ్చిగ్రుచ్చి
మునుమిడి పట్టసంబులఁ జిమ్మిచిమ్మి - గొనకొన్న కడిమి శక్తులఁ గ్రుమ్మిక్రుమ్మి
పలలంబు మెదడుఁ గుప్పలు చేసిచేసి - సొలవక యంపరాసులు వోసిపోసి
పటుభూతకోటికి బలి యిచ్చియిచ్చి - పటపట దిక్కులు పగుల నార్చుచును
సమరవిక్రమకళాసంరంభ మెసఁగ - నమితుఁడై మెఱసి ప్రహస్తుఁ డేపొందె
నాకపిసైన్యంబు లడఁగుటఁ జూచి - భూకంపముగ మహాద్భుతవృత్తి నడఁచెఁ
బెరిఁగి యుద్భటరణాభీలుఁ డన్నీలుఁ - డురుతరహంకారహుంకారుఁ డగుచు
ధీరుఁడై యపుడు ధాత్రీజంబుఁ బెఱికి - యారాక్షసునితేరి కవలీల దాఁటి
యరమి సారథి నొంచి హయములఁ గూల్చి - యురక యవ్విల్లు మహోగ్రత విఱువ3050
ముసలంబు గొని యార్చి ముద మొప్ప నప్పు - డసమున రథము బ్రహస్తుండు డిగ్గి
నీలునిముందఱ నిలిచె నెదిర్చి- నీలుండు నెదిరించె నిర్జింతు ననుచు
నొండొరు గెల్చు నుద్యోగంబులందు - గండుమీఱిన వృత్రకౌశికు లనఁగ
నలుక నీలునిఫాల మడిచె వీక్షించి - లలి బ్రహస్తుఁడు ముసలంబునఁ బగుల
నడఁచిన నందంద నడరునెత్తురులు - దుడిచికొంచును బ్రహస్తుని బెట్టు గిట్టి
వ్రేసె నన్నీలుఁడు వృక్షంబుఁ ద్రిప్పి - వ్రేసిన ముసలాన వ్రేసె నయ్యసుర
వ్రేసిన సోలియు వృక్షంబు విడిచి - యాసమయంబున నందందఁ గదిసి
యార్చుచు నతఁడు ప్రహస్తుమస్తకముఁ - బేర్చి వ్రయ్యగ వైచెఁ బెనుగిరి యెత్తి
యానీలువ్రేటున నాప్రహస్తుండు - మేనును శిరమును మెయి భూషణములు
చెదరి వృత్రారిచేఁ జెలువెల్లఁ బొలిసి - కుదిరి ధారణిఁ గూలుకొండచందమున3060
బడుటయు నాకపిబల మెల్ల నార్చెఁ - జెడిపారి లంకఁ జొచ్చిరి దైత్యు లపుడు
సురుచిరామృతవార్ధిసుతయును బోలె- హరియుక్తమైన నిజాంగంబు గలిగి
చారువసంతమాసంబును బోలె - నారక్తపుల్లపలాశాళి గలిగి
వరదానశీలునివాసంబుఁ బోలెఁ - గరమొప్ప నధికమార్గణకోటిఁ గలిగి
దీపించునేరేడుదీవియ పోలె - రూపింప నవఖండరూపంబుఁ గలిగి
వలచినపతియొద్ది వనితయుఁ బోలె - సలలితరాగరసంబును గలిగి
కడిఁదియై చొరరాని కానయుఁ బోలెఁ - గడునొప్పుపుండరీకంబులు గలిగి
సడలనిమృడునివాసంబును బోలెఁ - గడఁగి యాడెడు భూతగణములు గలిగి
కమలాప్తరుచి నొప్పు గగనంబ బోలెఁ - గ్రమముఁ దప్పిన తారకంబులు గలిగి

సరభసం బైనవేసవియునుఁ బోలె - సురుచిరాంబరమణిస్ఫురణంబుఁ గలిగి3070
కలిసిన శివుఁడును గౌరియుఁ బోలెఁ - దలపోయఁగా నర్ధతనువులు గలిగి
పెక్కుచందంబులఁ బెంపుసొంపడిరి - యక్కజం బయ్యె రణావనిస్థలము
అంత నీలుఁడు రాఘవాధీశుకడకు - నెంతయు వెసఁ జని యెరఁగె నంఘ్రులకుఁ
బొగడొందఁ గపులెల్లఁ బొగడిరి నీలుఁ - దెగనిరాక్షసులు భీతిలి పాఱి చెప్ప
విని రావణుఁడు శోకవివశుఁడై మంత్రి - జనులతో ననియెను జల మగ్గలించి.
“యేవీరు లరిగిన నిట రాకలేక - యావానరులచేత నకట! మ్రగ్గెదరు.
వైరులవలని గర్వం బడంగింప - నేరూపమున నైన నేనె పోయెదను."
అని పేర్చి కనలుచో నామాట లెల్ల - వినియు మందోదరి వెస మాల్యవంతు
కరము చేపట్టి డగ్గరి దైత్యవనిత - లిరుదెసఁ గొలువంగ నెంతయు వేడ్క
నతికాయుఁడును దోడ నరుగుదేరంగ - ప్రతిహారు లురువడి బలసి యేతేర3080
నాయుధహస్తు లంతంతటఁ గొలువఁ - బాయక చామరప్రతతులు వీవ
సకలభూషణమణిజాలంబు వెలుఁగ - సకలమంత్రులు తోడఁ జనుదెంచుచుండఁ
గడునొప్పునీలమేఘముఁ జొచ్చు మెఱుపు - వడువునఁ జొచ్చె రావణసభాస్థలము
ఆసతి నప్పు డర్ధాసనాసీనఁ - జేసి రావణుఁడు విశేషప్రియోక్తి
నుచితపీఠంబున నుండంగఁ బనిచె - నచలితమతు లగు నమ్మంత్రివరుల
మ్రొక్కినయతికాయు మోహంబుతోడఁ - దక్కక యునిచె నొద్దనె గద్దెమీఁద
నంత నక్కొలు వెల్ల నలబలం బడుగ - నింతితో నద్దానవేశ్వరుం డనియెఁ.
“గొలువులోపల కిట్లు కువలయనేత్ర! - తలఁప నెన్నఁడు రానిదానవు నీవు.
వడవడ వడఁకుచు వచ్చుట లెల్లఁ - గడుఁజోద్యమైనది కారణం బేమి?"

మందోదరి రావణునితో శ్రీరాములపరాక్రమము దెలుపుట

యనిన మందోదరి యాత్మేశుఁ జూచి - “దనుజేశ! నాకు రా దరవాయి గాన3090
వచ్చితి నేఁడు నావచ్చుట కెల్ల - నిచ్చలోపలఁ గడు నెగ్గు సేయకుము.
అనిలోన ధూమ్రాక్షుఁ డాదిగాఁ గలుగు - మనవారు దనుజేశ! మడియుటకంటె
యల జనస్థానంబునందు రాక్షసుల - నలిఁ దునుమాడెఁ బద్నాలుగువేల
సరి ఖరత్రిశిరులఁ జంపినవాఁడు - నరుఁడు గాఁడంటి నానరనాథు రాముఁ
డలిగి వెండియు దండకారణ్యమందు - బలవంతుఁడైన కబంధు నిర్జించె.
మారీచుఁ దునుమాడె, మాయఁ బోనీక - ఘోరాస్త్రమున వాలి గూలంగ నేసె.
దేవహితార్థమై తివిరి రాఘవుఁడు - భూవలయంబునఁ బుట్టినవాఁడు
ఆదినారాయణుం డతఁడు గాఁడేని - మేదిని నింతటి మిక్కిలినరుఁడు
కలుగునే? మఱి కఱకంఠునిచాప - మలవొప్ప విఱిచెఁ బ్రఖ్యాతంబు గాఁగఁ,
దమతండ్రిపనుపునఁ దపసియై సత్య - సమయంబుతో వనస్థలినుండ నతని3100

సీతఁ దెచ్చితి వీవు శ్రీరామచంద్రుఁ - డేతెఱంగున నీకు నె గ్గేమి చేసె?
రామలక్ష్మణులతో రణ మొనరింప - నీమూఁడుజగముల నెవ్వరు గలరు?
నలి సామభేదదానంబులు సూప - గలిగిన దండంబు గాదు పాటింప!
దండంబుఁ బాటింపఁ దలఁచెద వేని - దండింపఁబడుదురె దశరథాత్మజులు
దేవ! రాముఁడు పరదేవత గాన - నీవు మ్రొక్కుటయెల్ల నింద గా దెందు;
శర ణన్నఁ జేకొను శర ణన్న నీకు - నురుశుభం బగుఁగాని యొకకీడు రాదు;
గుణరూపదాక్షిణ్యగుణగణకేళి - గణుతింప నలవియె కాకుత్స్థరాముఁ?
డలిగిన నిలువ రింద్రాదిదేవతలు - దలఁపవయ్యెదు నీకుఁ దరము గా దెందు?
వలదు వృథాగర్వవహ్నిఁ గూలకుము - చలమొప్ప నొప్పదు సంతాప ముడుగ
నింక నైనను సీత నిచ్చుట మేలు - లంకేశ! కులమును లంకయు నిలుపు3110
మహనీయవాహనమణిభూషణాది - సహితంబుగా నీవు జానకి నిచ్చి
యూపాక్షు నతికాయు నొగి మాల్యవంతు - భూపాలుపాలికిఁ బుచ్చు సంధికిని
మతిమంతుఁ డగుచున్న మనవిభీషణుఁడు - హితబుద్ధిఁ గావించు నీసంధి మనకు
వేయునేటికి? కార్తవీర్యుతో సంధి - సేయవే? యతని గెల్చినభృగురాము
గెలిచినరాముఁడు కీర్తిధాముండు - తలపోయ సంధికిఁ దగఁడె చర్చింప?”
నని దైన్యపాటుతో నాడువాక్యములు - విని రావణుఁడు కడువేఁడియూ ర్పడర
గలయంగ నెఱ్ఱనికన్నులఁ గోప - మొలుకుచునుండ మందోదరిఁ జూచి
"హితమతివై నాకు నిన్నియుఁ జెప్పి - తతివ! నీమాటలయం దొక్కటైన
మనసునఁ బట్టదు మగఁటిమికలిమి - ఘనుఁడనై మూఁడులోకంబులు గెలిచి
దానవయక్షగంధర్వదేవాదు - లై నను వెట్టిసేయఁగ నున్న నన్నుఁ3120
ముదిఁ బోయి యింకఁ గోఁతులమర్గు సొచ్చి - బ్రతికెడినరునకుఁ బ్రణమిల్లు మనుచు
నిది యేమి మాటగా నీసభ నాడి? - తిది నీకుఁ బాడియె? యిక్ష్వాకుకులుఁడు
ఎఱిఁగి యెఱింగి ము న్నె గ్గొనరించె - మఱికదా తెచ్చితి మనుజేశుదేవి?
జడమతి నతనితో సంధి చేసినను - గడఁగి ఖరాదులఁ గడతేర్చినట్టి
పగయు నీమఱఁదలి బన్నంబు నెట్టి - పగిది నీగఁగను జొప్పడు? నటుగాన
భీమబాణముల విభీషణు నినజు - రామలక్ష్మణుల మర్కటములఁ ద్రుంచి
గెలుతు నవశ్యంబు గెలుపు లేదేని - చల మొప్ప దురమున సమయుదుఁ గాని,
మానవేశ్వరుతోడ మఱి సేయ సంధి - జానకి నీను నిశ్చయ మిట్టి దతివ!
యాయింద్రజిత్తుం డుదాత్తవిక్రముఁడు - నీయగ్రసుతుఁ డుండ నీ కేల వెఱపు?
నా కెదు రెవ్వరు? నాతనూభవులు - భీకరాకారు లభేద్యవిక్రములు."3130
అన విని చింతించి యవనత యగుచుఁ - జనియె మందోదరి సభ నెడఁబాసి
నీచైనయట్టి దుర్నీతి చేపట్టి - యేచందమునఁ దన్ను నెఱుఁగునే యనుచు,

రమణీయతరమైన రావణులక్ష్మి - క్రమ మేది చనియెడి కైవడిఁ దోఁప
నారావణుండును నప్పుడు గడఁగి - వారక తనపగవాండ్రకు ననియెఁ.
“జిరకాల మేను నాచిత్తంబులోన - దొరకొన్నయలుకకుఁ దుది సేయువాఁడ;
నాతనిపాలి కే నల్లరుద్రుండ - నాతఁడు నాపాలి కంధకాసురుఁడు
మునుకొని తూణీరమున వెలువడుచుఁ - దనరారు నాయంపతండంబుఁ జూడు;
కుబుసంబు లూడ్చిన క్రూరసర్పముల - నుపమింప ననువులై యొడియు రాఘవునిఁ
గాలంబు ప్రేరేపఁ గపిసేన నమ్మి - వ్రాలుగర్వంబున వచ్చియున్నాఁడు.
ఉరుదివ్యశస్త్రాస్త్రయుక్తంబు గాఁగ - నరదంబు దెండు కయ్యంబున” కనుడు3140
వారు నర్క ప్రభావరరథం బప్పు - డారూఢగతిఁ బన్ని యర్థిఁ దెచ్చుటయు

రావణుఁడు యుద్ధమునకు వెడలుట

దొలఁగక తనదైన దుర్మనోరథము - నెలమి నెక్కినక్రియ నెక్కి రావణుఁడు
దిక్కులమింటను దీప్తిజాలంబు - లక్కజంబై యొప్ప నరదంబుమీఁద
మెఱసినతొడవుల మీఱుట్లు గొనుచుఁ - దెఱఁగొప్ప నప్పు డద్దేవారి యొప్పె,
నారామబాణానలార్చులచేత - నారథంబును దాను నలిఁ గూలుకరణిఁ
బటుతరనిస్సాణభాంకారములును - బటహభేరీశంఖభయదరావములు
హస్తిబృంహితములు నశ్వఘోషములు - ప్రస్తుతిపాఠకప్రకరరావములు
నరదాలమ్రోఁతయు నార్పులరవము - ధరణి గల్గెడు పదతాడనధ్వనులు
నడరి యొండొండ బ్రహ్మాండంబు నిండి - కడుభీకరంబులై కలయంగఁ బర్వె,
లలి సముద్రమునకు నలుగుచందమున - నలిగె నిందును రాఘవాధీశుఁ డనఁగ3150
మునుకొని లంకాసముద్రంబులోన - ననువేది జీవంబు లఱచుచందమునఁ
గోని వచ్చితిమి దైత్యకోటి శ్రీరామ - కొను మని యొప్పింపఁ గొంపోవుకరణి
భీమరథంబులు పేర్చి యందంద - రామచంద్రుని మనోరథములై నడిచె
రాముశిలీముఖరాజి మైనాటి - యీమదం బుడిపెడి నింతలోపలనె
త్రాగుద మిమ్మదధారల నాడ్కి - మూఁగి యాడెడి శిలీముఖలతోడఁ
గరములు కడుభయంకరములై రాము - కరముల కెందు దుష్కరములు గాక
కర మొప్పఁగా సముత్కరములై యపుడు - కరికోట్లు వసుమతిఁ గంపింప నడిచె.
వలనెల్లఁ దప్పె రావణునకు రణము - వలన జయంబు మావలన నెక్కడిది?
వలనేది కూలు రావణుఁ డనుమాడ్కి - వలనొప్ప హయములు వ్రాలుచు నడిచె.
వ్రాలిన రాఘవేశ్వరుని బాణాగ్నిఁ - గ్రాలుబలం బెల్లఁ గాలుబలంబు,3160
అనిన చందంబున నార్చుచు నడిచె - ఘనతరం బై నట్టి కాలుబలంబు
కాలమేఘంబులకరణి నొ ప్పగుచు - శైలంబులో యనఁ జతురత మెఱసి
ప్రళయకాలమునాఁటి భానుబింబముల - కొలఁది మీఱిన మిడిగ్రుడ్డులతోడఁ

గటములు నుదురులు ఘనదంష్ట్రములును - బటుకేశచయము నొప్పఁగఁ జూడ నపుడు
ప్రళయకాలునికైన భయముఁ బుట్టించు - చలమును వికృతవేషములును మెఱయఁ
బెక్కాయుధంబులుఁ బెక్కుమాయలును - బెక్కుతేజంబుల పెక్కువ గలిగి
యే మేమె రాము జయించెద మాజి - నేమేమె యని యస మెక్కినవారు,
రాక్షసవీరులు రాక్షసాధిపులు - రాక్షసేశ్వరునితో రణబాస లిచ్చి
పరఁగంగ నార్చుచుఁ బటునినాదములు - నురువడి మ్రోయుచు నురుబలోన్నతిని
నడువంగ నప్పు డున్నతశక్తి మెఱసి - నడనడ వడఁకి వానరులెల్లఁ గలఁగ3170
నినవంశునకుఁ ద్రోవ యిచ్చుట కలిగి - వననిధి నింకింప వడి నేగుకరణి
నినుఁడ నీతనయుండు నీరాముఁ గూడె - నని యర్కుఁ గబళింప నరిగెడుమాడ్కి
దనయురవడి సముద్రంబులు గలఁగఁ - దనప్రతాపంబునఁ దపనుండు మాయఁ
దెగువ యెల్లను ముఖదీప్తులఁ దోఁప - మగఁటిమి జయలక్ష్మి మఱి పొందుఁ బాయ
నారవంబునఁ దాను నాజికి వెడలె - నారావణుం డట్టహాసంబు చెలఁగఁ
బెక్కాయుధంబులఁ బేర్చుదీధితులు - మిక్కిలి కన్నులు మిఱుమిట్లు గొలువ
పంబి వాయువులచేఁ బడగలు టెక్కి - యంబులు మిన్నంది యందందఁ గ్రాల
ఘనతరభీషణాకారంబుతోడ - ననయంబు నందంద నార్చుచు రాము
బాణానలంబునఁ బాల్పడనున్న - ప్రాణంబులను దృణప్రాయంబు చేసి
వారణ లే కటు వచ్చుచునున్న - దారుణాసురసీమఁ దప్పక చూచి3180
రావణానుజుతోడ రఘురాముఁ డనియె - “నీవచ్చుచున్నవాఁ డెవ్వఁడో వీఁడు?
మిక్కిలి సత్త్వసమేతుఁడై కడిమి - పెక్కువ లింతయుఁ బేర్చినవాఁడు"
అనిన విభీషణుం డారాముఁ జూచి - “దనుజనాయకుల నందఱి వేఱువేఱ
వినుము శ్రీరఘురామ! విన్నవించెదను - దనరంగ" నని వారిఁ దగఁ జెప్పఁ దొడఁగెఁ
"వాఁడె సింధురగంధవారణేంద్రంబు - వాఁడిమి నెక్కి యుజ్జ్వలుఁ డైనవాఁడు
ఉదయార్కబింబసముజ్జ్వలాస్యమున - నొదవినఘనరోష మొప్పినవాఁడు
పొరిఁబొరి నంకుశంబున నియమించి - కరి ఝాళి సేయింపఁ గడఁగెడువాఁడు
ఉరువడిఁ జనుదెంచుచున్నట్టి వీరుఁ - డురుబలాఢ్యుని గంటె యూపాక్షుఁ డతఁడు;
కడునొప్పు భీకరఘంటారవంబు - లడరిన రథ మెక్కి యావచ్చువాఁడు
పోరులఁ బెక్కండ్రఁ బొరిగొన్నవాఁడు - ధారణీశ్వర! మహోదరుఁ డనువాఁడు;3190
భరితరత్నప్రభాపటలంబుతోడఁ - బరువైన యరుణంపుఁబక్కెర వెట్టి
గరుడవేగంబున ఘనమైన యట్టి - తురగంబు నెక్కి యుద్ధురవృత్తితోడఁ
జనుదెంచువాఁడు పిశాచనాథుండు - ననికి నీతని కెదురగువారు లేరు
మిక్కిలి కడిమిపై మెఱసి సింహంబు - నెక్కి శూలముఁ బట్టి యేతెంచువాఁడు.
అనిమీఁదివేడుక నలరినవాఁడు - దినకరకులనాథ! త్రిశిరు డన్వాఁడు

పృథులఘంటారవస్ఫీత మైనట్టి - రథ మెక్కి వడి గుణారవము సేయుచును
ఘనసర్పకేతువు గలిగినవాఁడు - ఘననీలతనుఁడు రాక్షసుఁడు కుంభుండు
కనకమహామణిఖచితంపుఁబడగఁ - దనరారు చిత్రరథంబుపై నెక్కి
యరుగుదెంచుచు నున్నయారాక్షసుండు - గురుశక్తియుతుఁడు నికుంభుఁడు దేవ!
యనలసన్నిభమైన యరదంబు నెక్కి - ఘనగర్వమున మీఱి కయ్యంబు సేయఁ3200
గలవాఁడు వాఁడె యీకపిసేనదిక్కు - సొలవక విషదృష్టిఁ జూచుచున్నాఁడు
శర మటు వింటితో సంధించుకొనుచు - నరుదెంచువాఁడు నరాంతకుం డధిప!
భీషణరూపమై పేర్చువాక్యముల - రోష మెక్కెడి మిడిగ్రుడ్డులతోడఁ
గరివక్త్రముల ఘోటకపువక్త్రములను - హరివక్త్రములఁ గిటివ్యాఘ్రవక్త్రముల
నురగవక్త్రమ్ములఁ, నుష్ట్రవక్త్రములఁ - గర ముగ్రులైన రాక్షసు లుత్సహించి
కొలువ భూతంబులు గొలువ ఫాలాక్షు - నలవొప్పువాఁడు దేవాంతకుం డధిప!
ఘన మైనఘోషంబు గలపైఁడిరథము - దనరార నెక్కి యుద్దండభావమున
నతితృణీకృతలోకుఁ డై గుణారావ - మతిశయిల్లఁగఁ బుట్టి నంత నుండియును
నెన్నఁడు నోటమి యెఱుఁగనివీరుఁ - డన్నరభోజను నాత్మసంభవుఁడు
అరుణచందనము మే నలఁదినవాఁడు - తిర మైనయరుణంపుదృష్టులవాఁడు3210
సంధ్యాంబుదమువంటిచాయలవాఁడు - వింధ్యాచలమువోలె వెలసినవాఁడు
కోటానకోటులగొడుగులచేత - మేటిచామరముల మెఱసినవాఁడు
అవధరింపుము దేవ! యతికాయుఁ డతఁడు - అవనీశ! యాజిలో నధికశూరుండు;
భూరిసితచ్ఛత్రములు పదివేలు - చారుచామీకరచామరావళులు
పరగంగ సింగంపుఁబడగతో గ్రాలు - పరపైనఘోటకప్రతతుల నొప్పు
నరదంబుమీఁది గుణారవం బెసఁగ - భరితశస్త్రాస్త్రసంపదఁ దేజరిల్లి
యజునివరంబున నఖిలదేవతల - భుజబలస్ఫీతుఁడై పోరిలో నేచి
సురపతిపురిఁ బట్టి సొంపారునట్టి - వరగర్వమునఁ జాల వ్రాలినవాఁడు
నిచ్చట మనమీఁద నిడిన చూ పడర- వచ్చుచునున్నాఁడు వాఁ డింద్రజిత్తు;
ఇంకఁ జూపెదఁ జూడు మినకులాధీశ! - లంకాధినాథు నుల్లసితప్రతాపుఁ3220
గనకరత్నప్రభాకలితతండముల - నొనరినచామరంబులు నుల్లసిల్ల
సొలవక పండ్రెండుసూర్యబింబములు - గలయంగ దశకంబుగాఁ గరఁగించి
చేసినపగిది విచిత్రరత్నాంశు - భాసురకోటీరపఙ్క్తి నొప్పారి
మహనీయతరమైన మణికుండలమున - మహిమ దిక్కుల నెల్ల మట్టాడుచుండ
రోషమహాదృష్టిరోచులఁ జాల - భీషణాకారతఁ బేర్చినవాఁడు
హరుఁ డున్నకైలాస మగలించినాఁడు - సురకామినులఁ జేరఁ జొనిపినవాఁడు
లోకంబు నెల్లఁ బెల్లుగఁ గెల్చినాఁడు - పాకశాసను ననిఁ బరపినవాఁడు

ఐరావతము దంత మాడినయురము - తో రమణీయమై తోఁచినవాఁడు
ముల్లోకములఁ దనమూర్తిచే హల్ల - కల్లోలమై పడఁ గలఁచినవాఁడు
వాఁడు సేనామధ్యవర్తి యైనాఁడు - వాఁడు పో దేవ! రావణుఁ డనువాఁడు"3230
అని విభీషణుఁ డోలి నందఱఁ జెప్ప - విని రాఘవుఁడు కడువిస్మయం బంది
"హరిహరి! చిత్ర మీయసురేశ్వరుండు - సరిలేనియట్టి తేజంబె రూపైన
యట్టిచందంబువాఁ డసురులయందు - నిట్టితేజోధనుం డెవ్వఁడు గలఁడు?
కడుఁగ్రూరకర్ముండు గాకుండెనేని? - బుడమి కింతటికిని బూజ్యుండుఁ గాఁడె?
పరికింప నిందఱు పర్వతాకృతులు - నురుశక్తిగలిగిన యోధులు క్రూర
చరితులు మఱి వీని సైనికు లెల్లఁ - గరము భీషణులు రాక్షసవీరు" లనుచు
నుగ్రలోచను పినాకోగ్రచాపంబు - నిగ్రహక్రమకళానిపుణుఁడై నృపుఁడు
ధరియించి కడఁకతోఁ దాను లక్ష్మణుఁడు - వరబాణచయములు వరుస నుప్పొంగఁ
గోపించియును ధర్మగుణముఁ జేపట్టి - రీపార్థివులకు నీఁ డెవ్వరు నాఁగ;
నారావణుండును నఖిలనిశాట - వీరుల వీక్షించి వినుఁ డని పల్కె.3240
“నగరివాకిళ్ళ నున్నతితోడఁ బెద్ద - మొగసాలలందును మోసంబు లేక
కడుసురక్షితముగాఁ గావలియుండుఁ - డడరి యీలంకలో నందఱుఁ బ్రీతి
నేనును మీరును నీకయ్యమునకు - మానుగాఁ బోయిన మఱి వలీముఖులు
లంకలోఁ జొచ్చిన లా వేమి సేయు - శంకింపవలవదు చనుఁ" డన్న వారు
చనిరి రావణుఁడును జటులవేగమున - ధనువును నస్త్రముల్ ధరియించి పేర్చి
కార్చిచ్చు వనము లుగ్రంబుగాఁ గిట్టి - యేర్చుకైవడి దోఁప నిమ్ములఁ గిట్టి
జగతీతలము నాకసముఁ దాఁకుకరణి - నగచరసైన్యంబు నదరంటఁ దాఁకి
యిది ధరణీభాగ మిది వియత్తలము - ఇది దిశావలి యని యేర్పడకుండ
నతినిశితాస్త్రంబు లందందఁ బరపి - యతులబలోదగ్రుఁడై దశాననుఁడు
కలఁచి కొందల మందఁగాఁ జేసి కపులఁ - జులుకఁగా ఖండించి చూర్ణంబు చేసి3250
నెమ్ములు మజ్జంబు నెరసియు మెదడు - గ్రమ్మి నెత్తురు నేలఁ గలయంగ నించి
తనరి యార్చుచు గుణధ్వని దిక్కులందు - నించి ఘోరాజిలో నెఱయఁ బేర్చుటయుఁ
బడియెడువానరుల్ భ్రమయువానరులు - మడియువానరులును మగ్గువానరులు
నొరలువానరులును నులుకువానరులు - నరచువానరులు రూపఱినవానరులు
గలిగిన సంగరాంగణభూమిఁ జూచి - తలఁకిరి సురలు చిత్తంబులు బెదరఁ
గాలకాలానలకాలదుర్వార - కేళికరాళుఁ డక్షీణుఁడై యపుడు
పేర్చుకోపంబున భీషణుం డగుచు - నార్చుచు నున్న దశాననుఁ జూచి
యతనికి నెదురుగా నరిగి సుగ్రీవుఁ - డతిరయంబున నొక్కయగ మెత్తి వైచె
నారావణుండును నది మధ్యమునను - భూరిశరంబులఁ బొడి సేసి మఱియు

నొండొండ ఘనదీప్తు లొడవ నాకసము - నిండి మండుచునుండ నిశితాస్త్ర మినజు
నురమాడ నేసిన నుచ్చి యాయమ్ము - ధరఁ గాడె నత్తఱి దానవు లార్వఁ
దరుచరు లెల్ల నుద్దతి బాష్పధార - లురుళింప నర్కజుఁ డొరలుచుఁ గూలె
భుజబలాఢ్యుఁడు శరభుఁడు ఋషభుండు - గజుఁడు గవాక్షుండు గవయుండు నలుఁడు
జ్యోతిర్ముఖుం డది చూచి కోపమున - నాతతగతిఁ బర్వతావనీజముల
నడరించి రతనిపై నవి యెల్ల నతఁడు - నడుమనే తునిమి వానరుల నేడ్వురను
నొక్కొక్కయమ్ముల నుర్వరమీఁద - గ్రక్కునఁ జచ్చినగతి నుండనేసె.
నాలోన హనుమంతుఁ డాయోధపతులు - గూలుటయును జూచి కోపంబుతోడ
నసురాధినాథుని యరదంబుమీఁది - కసమున లంఘించి యతనితో ననియె.
“దేవేంద్రుఁ డాదిగా దివిజుల నెల్ల - రావణ! మఱి యక్షరాక్షసకోటిఁ
ద్రుళ్ళడంచితి నని త్రుళ్లెద వీవు - చెల్లదు రోరి! నీ చే వడఁగింతు3270
నున్నతిఁ జిరకాల ముర్విపై బ్రతికి - యున్ననీమీఁద నాయున్నతంబైన
వలకేలు నేఁడు రావణ! యిదె చూడు - మలమి సాగెడు దనయంతన పేర్చి
యిదె నిన్ను బొరిఁగొని యేచి యంతకుని - సదనంబు కనుపక సైఁపను నిజము”
అని పేర్చి పలికిన హనుమంతుమాట - విని రావణుఁడు క్రోధవికృతాస్యుఁ డగుచు
"గలితనంబును లావు గలదేని నీవు - నలు వొప్ప నుప్పొంగి నను మున్నుబొడిచి
పేరు గొమ్మిటమీఁదఁ బేర్చిన నీదు - శూరతయును లావుఁ జూచి యే నేచి
పొడిచెద" ననుడు నద్భుతశౌర్యుఁ డగుచుఁ - గడఁగి మారుతి దశకంఠునిఁ జూచి
“దేవదేవుఁడు రామదేవుండు పనుప - నీవీటిలో మేదినీపుత్త్రి వెదకి
తడయక పొడగాంచి తగ విన్నవించి - వెడలి యేఁ బోవుచో విక్రమస్ఫురణ
నీతోఁట నుగ్గాడి నీలంకఁ గాల్చి - నీతనూభవుఁ జంపి నిన్ను దట్టించి3280
యుక్కున నిలిచి దైత్యులు చూచుచుండఁ - జక్క నెప్పటిత్రోవఁ జన్న నాలావు
నేఁడు చూచెద వని నీవాఁడె దుబ్బి - నాఁ డెందుఁ బోతివి నాకారి! నీవు?"
అనవుడు కోపించి హనుమంతు వక్ష - మనువొప్పఁ బొడిచె నయ్యసురేశ్వరుండు
పొడిచిన స్రుక్కియుఁ బోనీక యతఁడు - పిడికిట రావణుఁ బెట్టుగాఁ బొడిచెఁ
బెనుగాలి యడఁచిన బిట్టు కంపించు - ఘనవృక్షమును బోలి కంపించె నసుర
యంతట నొచ్చిన యసురేశుఁ జూచి - యెంతయు నార్చి రయ్యింద్రాదు లెల్ల
దనుజాధిపతియు నంతనె మూర్ఛ దెలిసి - హనుమంతుఁ జూచి యిట్లను “నీబలంబు
గడు మెచ్చవచ్చు నీఘనముష్టిహతిని - గడఁకతోఁ బ్రేతలోకముఁ జూచి వచ్చె
దేవారి!" యనుడు నద్ధీరాత్ముఁ డనియె - "రావణ! విను మీవు ప్రాణంబుతోడ
నున్నవాఁడ విదేల? యురక నాలావు - సన్నుతించెదు లజ్జ జనియింప నాకు"3290
నని పల్కి “నీవు న న్నటు పిడికిటను - గొను మొనపో” టన్నఁ గొను మని యతఁడు

ననయంబు కోపించి యనిలనందనుని - ననుపమాశనికల్ప మగు ముష్టి నార్చి
వక్షంబుఁ బొడిచిన వడి మూర్ఛనొంది - యక్షణంబునఁ ద్రెళ్లె నవనిపై నతఁడు
నరిమురి హనుమంతుఁ డటు కూలుటయును - నెరసి రావణుఁ డంత నీలుపైఁ జనియె.
హనుమంతుఁడును మూర్ఛ యంతలోఁ దెలిసి - దనుజుండు నీలుపైఁ దఱముటఁ జూచి
“యెటుఁ బోయె” దని పిల్చి యెదురుగా నిలిచె - నటు తన్నుఁ గిట్టి పెళ్లార్చుచునున్న
మనుజాశనునిమీఁద మలయశృంగంబు - గొనివచ్చి నీలుండు కోపించి వైవ
నడుమనె దునుమాడె నాకారి దాని - నెడపని కడఁకతో నేడమ్ము లేసి
వెండియు నీలుండు విపులకోపమునఁ - గొండలు దరువులు గొని వైచుటయును
వాని నన్నింటి రావణుఁడు చూర్ణములు - గా నిశితాస్త్రసంఘంబులఁ దునిమి3300
నీలుని మేనఁ గ్రొన్నెత్తురు లొలుక - వాలికయమ్ములు వడిఁ బెక్కు లేసె
నేసిన నొచ్చియు నింత గైకొనక - గాసిల్లు నీలుండు కడులాఘవమున
ధారణి దైత్యులు దల్లడం బంద - వీరుఁడై దానవవిభుతేరి కుఱికి
పొలుపొంద నప్పు డద్భుతశక్తి మెఱసి - నిలిచి చలంబున నిగిడి యుప్పొంగి
వడిఁ బేర్చి దానవధ్వజమున కెగసి - పొడి చేసి చాపాగ్రమునకు లాగొప్ప
నెగసి చలంబున నె క్కెడలించి - మగిడి రావణు ఘనమకుటముల్ ద్రొక్కి
యురుభుజనిజవిక్రమోన్నతి మెఱసి - సురసిద్ధసాధ్యులు చోద్యంబు నొంద
నొకమౌళిపై నుండి యొకమౌళి వచ్చి - యొకమౌళిపై నుండి యొకమౌళి యూచి
యొకమౌళిపై నుండి యొకమౌళి డుల్చి - యొకమౌళిపై నుండి యొకమౌళి దన్ని
మకుటంబు లన్నియు మట్టి మల్లాడి - యకలంకుఁడై నీలుఁ డంతటఁ బోక3310
వారక తనుఁ బట్ట వచ్చిన సూక్ష్మ - మై రావణునిఁ జూచి యందంద నగుచు
గొడుగులు ద్రుంచి గ్రక్కున మీఁదఁ ద్రోచి - పొడి గాఁగఁ జామరంబులు ద్రుంచి వైచి
విఱుగంగ నరదంబు వీఁక దాటించి - కరకరితోడ నుత్కంఠ దీపింప
దనుజేశు నురుముష్టి దాఁచి హారములు - పెనచి రాదిగిచి యాపృథులవక్షంబు
జరచి యందంద యుత్సాహంబు మెఱసి - యురక నీగతి నాఁడుచుండుటఁ జూచి
తరుచరసేనలు దైత్యసేనలును - బొరిఁబొరి నద్భుతంబుగఁ జూచుచుండ
వెఱగంది రారామవిభుఁడు లక్ష్మణుఁడు - మఱి రావణుం డంత మహితాగ్నిశరము
నయ్యెడ నారితో నలుక సంధించి - యయ్యగ్నిసుతుతోడ ననియె మండుచును
"నీలాఘవము లెస్స! నిన్ను మెచ్చితిని - నీలాఘవమె నాకు నెడపక చూపు
మిదె వచ్చె నాబాణ మినవహ్నిరుచుల - బ్రదికెడుచందంబుఁ బరికించికొనుము”3320
అని యేయుటయు నీలుఁ డగ్నిబాణమునఁ - దను వెల్ల మండుచు ధరణిపైఁ బడియె
నగ్నిపుత్రుఁడు దాన నాతీవ్రశరపు - టగ్నిచేఁ జావక యవశుఁడై యుండె
నంత ధనుర్ఘోష మడర సౌమిత్రి - యంతకుగతిఁ బేర్చి యద్దైత్యుఁ దాఁక

నగ్గుణారావంబు నతనిసాహసము - నగ్గించి యతనితో ననియె రావణుఁడు
"పిన్నవై యుండియుఁ బేర్చుచు ననికి - సన్నద్ధగతి నీవు చనుదెంచు గొప్పఁ
బుచ్చెద నంతకుపురికి లక్ష్మణుఁడ! - యిచ్ఛందమున నిల్వు మించుకతడవు”
అనవుడు విని రాఘవానుజుం డనియె - “దనుజాధముఁడ! యీవృథాగర్వ మేల?
డాసినవాఁడ మాటలు సెప్ప కిపుడు - చేసి చూపుదుఁగాక చెలఁగి నీలావు”
అనిన సౌమిత్రి నేడమ్ముల నేసె - దనుజునియమ్ము లుధ్ధతి లక్ష్మణుండు
నడుమనె త్రుంచిన నాకారి యప్పు - డడరెడుకోప ముదగ్రమై పర్వ,3330
ఘనతరజ్యానాదకలితంబు గాఁగ - ననయంబు నిగుడించె నమ్ములవాన
నయ్యంపతండంబు లందందఁ ద్రుంచి - వెయ్యేసిశరములు వెస నేసె నతఁడు
నాయస్త్రములకు మా ఱైనయస్త్రముల - నేయ నేరక దానవేశ్వరుం డపుడు
తలకొని యొకబ్రహ్మదత్తబాణమున - లలితవక్షం బేయ లావెల్లఁ దూలి
విల్లూతగాఁ గొని వేగంబె తెలిసి - పెల్లుగా నార్చుచుఁ బేర్చి లక్ష్మణుఁడు
ఘనబాణ మొకట రాక్షసనాథువిల్లుఁ - దునిమి యంతటఁ బోక దోర్బలం బెసఁగ
మూఁ డగ్ను లనఁ బోలు మూఁడుబాణముల - వాఁడిమి మీఱంగ వడి వక్ష మేసె.
నేసిన మూర్ఛిల్లి యింతలోఁ దెలిసి - యాపన్నసత్త్వసమగ్రుఁడై కదిసి
తనవిల్లు విఱిచిన దానికి నసుర - మనములోఁ జాల విస్మయమును బొంది
కలుషించి నిచ్చలు గంధపుష్పముల - నలవడఁ బూజింప నమరినదాని3340
నిలయు బ్రహ్మాండంబు నెల్లదిక్కులును - వెలుఁగొందుమంటల విలసిల్లు దాని
నడరెడు పదికోట్లయశనులఁ బోలి - కడుబెట్టిదపుమ్రోఁత గలిగినదాని
నలినమిత్రుని కిరణంబులకంటె - వెలుఁగొందుమంటలవేఁడిమిదాని
ననిమిషు ల్వెఱఁగంద నాబ్రహ్మశక్తి - గొని లక్ష్మణుని వైచెఁ గ్రూరుఁడై పేర్చి
వైచినఁ గాలాగ్ని వడువునఁ బెద్ద - యేచి వజ్రమునకు నెక్కుడై నిగిడి
యనిమిషావలి యెల్ల నాహారవంబు - లొనరింపఁ బరితెంచు నుగ్రతఁ జూచి,
వారింప నమ్ములవాన లక్ష్మణుఁడు - ఘోరతరంబుగాఁ గురియంగఁ ద్రోచి

లక్ష్మణుఁడు మూర్ఛిల్లుట

యది వచ్చి భుజమధ్య మాడ లక్ష్మణుని - వదలక తాఁకిన వసుధపైఁ బడియె.
నరిగి దశాననుం డంత లక్ష్మణుని - నిరువదిచేతుల నెత్తఁ జూచుటయు
నాతఁడు విష్ణుని యంశజుఁ డగుట - నేతెఱంగున వాని కెత్తరాదయ్యె.3350
నత్తఱి రావణుం డంతరంగమున - నెత్త రాకుండిన “నేను గైలాస
మెత్తి త్రిలోకంబు లెల్లను నెఱుఁగ - నిత్తఱి నాసత్త్వ మెల్లను దరిగె,
మఱియు మేరువునైన మందరంబయిన - నెఱయ నెత్తఁగ నోపు నిజశక్తివాఁడ
వీఁ డింత వేఁ గౌట విస్మయం" బనుచుఁ - బోడిగాఁ గరములఁ బూని రావణుఁడు
అతులసత్త్వోన్నతి నందంద నెత్త - మతిలోనఁ గోపించి మారుతి గడఁగి

పఱతెంచి నిర్ఘాతపటుముష్టి నార్చి - కఱకురాక్షసుని వక్షస్థలిఁ బగులఁ
బొడుచుటయును మూర్ఛఁ బొంది రావణుఁడు - కడుదూలి యంత మోఁకాళ్లు మ్రోవఁగను
బడియెఁ బిఱిందికిఁ బద మిడలేక - పడినరావణుని యెప్పటిభంగిఁ జూచి
యార్చిరి దేవత లప్పుడు కపులు - పేర్చిరి రాక్షసు ల్భీతిఁ గీడ్వడిరి
పావని యట విష్ణుభక్తుండు గాన - రావణునకు నెత్తరాని లక్ష్మణుని3360
గురుసత్త్వమున నెత్తికొని పోయి రామ - ధరణీతలేశుముందఱఁ బెట్టె నపుడు
రాముతేజమునఁ బరాజిత మగుచు - సౌమిత్రినాటిన శక్తియు నూడి
యసురేశురథమున కరిగె సౌమిత్రి - యసమానబలశాలియై మూర్ఛ దేరె
నట రావణుండును నటు మూర్ఛ దెలిసి - చటులబాణాసనసన్నద్ధుఁ డయ్యె
సౌమిత్రి యటు పరిశ్రాంతి నొందుటకు -నామర్కటులు భీతి నడరి పాఱుటకు

రామరావణుల ప్రథమయుద్ధము

రావణుఁ డేచి పై రాకకు రామ - దేవుండు కోపంబు దీపింపఁ బేర్చి
భీకరగుణరవస్ఫీతుఁడై వేగ - నాకారి కెదురుగా నడచుటఁ జూచి
యనిలతనూభవుం డనియె రామునకు - "నినకులాధీశ్వర! యీరావణుండు
అరదంబుపై నుండి యాలంబు సేయ - వెర వగునే నీకు? విభుఁడ! గాల్నడవ
నామీఁద వడి నెక్కి నాకారి కెదుర - రామ! విచ్చేయుట రాజధర్మంబు"3370
అనవుడుఁ గడఁకతో హనుమంతు నెక్కి - యనిమిషకరిమీఁది యమరేంద్రుకరణి
నొప్పి గుణధ్వని యెప్పారఁ జేసె - నప్పుడు కోపించి యాటోప మొప్ప
రావణుఁ డుగ్రుఁడై రాము నీక్షించి - పావకజ్వాలోగ్రబాణజాలములు
గురిసిన రాఘవక్షోణీశుఁ డలిగి - యురుబాణతతు లేసి యురువడి వాని
నింద్రారి తెగనేసె నేసిన రామ - చంద్రుఁ డుద్ధతి నర్ధచంద్రబాణమున
దనుజేశు కోదండదండంబు దునిమి - సునిశితభీకరాశుగపంచకమున
మర్మము ల్నొప్పించి మఱియును నొక్క - ధనువును జేకొని దశకంధరుండు
పటుబాణ మొక్కటఁ బవననందనుని - నిటలస్థలం బేసె నిపుణుఁడై మెఱసి
యనిలజుఫాల ముగ్రాస్త్రంబు దాఁకఁ - గనుఁగొని కోపించి కాకుత్స్థకులుఁడు
భల్లంబు దొడిగి యాపఙ్క్తికంధరుని - వి ల్లంతలోననే విఱుగంగ నేసి3380
యొక్కట సారథి నొకట నశ్వములు - నొక్కట నరదంబు నొకటఁ బతాక
మొక్కట గొడుగును నొకట వస్త్రములఁ - గ్రక్కున నేసి చూర్ణములు గావించి
మనుజనాయకుఁడు సమంత్రకశరము - దనుజుని వక్షంబు దాఁక నేయుటయు
నారాముశరమున నారావణుండు - వారక కడునొచ్చి వడవడ వడఁకి
యనికి నిశ్చేష్టితుం డగు దశకంఠుఁ - గని యర్ధచంద్రమార్గణ మరివోసి
దశదిశలందును దనరినదైత్యు - దశ యడఁగించుచందముఁ జూపుకరణిఁ

ద్రిదశులు మెచ్చు నుద్దీప్తకోపమునఁ - బదిమకుటంబులు వడి డొల్ల నేసె
నేసిన మదిలోన నెంతయు స్రుక్కి - భాసురమకుటప్రభావలిఁ బాసి
గ్రద్దనఁ జేయు నక్కయ్యంబు దక్కి - తద్దయు నిశ్చేష్టదశకంఠుఁ డుండె,
నప్పుడు రాఘవుం డనియె రావణున - "కిప్పుడు కపులతో నిబ్భంగిఁ బోరి3390
కడు డస్సినాఁడవు గాన నిన్ జంప; - విడిచితి నీ వింక వేగంబె చనుము.
పో లంక" కనుడు నప్పుడు చిన్నవోయి - యోలిన వేఁడినిట్టూర్పులు నిగుడ
మండెడికోపంబు మలఁగి చింతించి - దండిగర్వము దక్కి దశకంధరుండు
బలమెల్లఁ బొలిసి దర్పము పేర్మి దూలి - వెలవెలఁ బాఱుచు విరథుఁడై నడిచి
పెదవులు దడపుచు బిమ్మడి గొనుచుఁ - గదరినభీతి గద్గదకంఠుఁ డగుచుఁ
జేరి యొండొరువుల చేతులు చరచి - బోరన నవ్వుచు భూతంబు లార్వ
గురువులు వారుచు గునిసి యాడుచును - గెరలి వానరకోటి గేలి సేయంగఁ
గఱు కెల్ల నుడిగి యొక్కరుఁడును వేగ - పఱచి యాలంకలోపలఁ జొచ్చె నపుడు
అటు లంకలోపలి కరిగి రావణుఁడు - పటుతరం బగు చింత పడి తల్లడిలుచుఁ
బంచాననంబుచేఁ బడియుఁ జావునకు - నించుక తప్పిన యేనుఁగు పగిది3400
గరుడుని కగపడి క్రమ్మఱ బ్రతికి - సురిగిపోయిన దందశూకంబు వోలె
స్ఫీతవిద్యుత్ప్రభాభీలకీలముల - నాతతబ్రహ్మదండాతిశయంబు
లగురాముబాణంబు లడరి ప్రాణములఁ - దెగటార్చు చునికి చింతించి చింతించి
యుడుగని వేఁడినిట్టూర్పులఁ బెల్లు - వడిగాలిఁ బోలి యవ్వల నైన సుడియఁ
దలకొన్న సిగ్గున దైర్యంబు దూలి - కొలువులోపలి దైత్యకోటి నీక్షించి
“నాలావుకలిమి దానవవీరులార! - నేలతోఁ గలియుట నేడు పోఁ గలిగె.
సహజపరాక్రమశాలి యొక్కరుఁడు - మహిమీఁదఁ బుట్టి రామక్షితీశ్వరుఁడు
సొరిది యుద్ధములందు సురసిద్ధసాధ్య- గరుడగంధర్వరాక్షసపక్షియక్ష
కిన్నరోరగమృగకింపురుషులును - నన్ను జయింప నెన్నఁడు లేకయుండ
వరము గాంచితి బ్రహ్మవలన నే నపుడు; - సరకు సేయను నరసమితి మోసమున3410
నామోస మెల్లను నాకుఁ బై వచ్చె - నేమని చెప్పుదు నీదురవస్థ?
కోట మీ రేమఱకుండి వాకిళ్లఁ - బాటించి యెంతయుఁ బలుకాపు లిడుఁడు
దురములోపలఁ బహస్తుఁడు మొదలైన - యురువీరు లందఱు నొగిఁ బోరిపడిరి.
మఱి యింక రామలక్ష్మణుల జయింప - నెఱవీరుఁ డెవ్వఁడు నిజగతి జగతి
బహుసంగరాంగణపరిణతుం డైన - సహజశూరుఁడు రామజనపాలుమీఁద
నడువ నేర్చిన యట్టి నాతమ్ముఁ డైన - కడిఁదివీరుఁడు కుంభకర్ణుండు గాక
వినుతింప మఱియొండు వీరుండు గలఁడె" - యనుచు నద్దశకంఠుఁ డందఱఁ జూచి
నెఱయంగ నిరుమూఁడునెలలు నిద్రించి - మఱి మేలుకొని సభామంటపమ్మునకు

నలరి యేతెంచి మంత్రాలోచనంబు - పొలుపారఁగాఁ జేసి పోయి క్రమ్మఱను
“నేఁడు తొమ్మిదినాళ్లనిద్రమై నున్న - వాఁడు శత్రులనెల్ల వధియింపఁగలఁడు3420

కుంభకర్ణుని నిద్ర మేల్కొనఁజేయుట

ఆతని మేల్కొల్పి యతులవిక్రముని - నేతెఱంగున నైన నిటకుఁ దెం" డనిన
బహుగంధపుష్పము ల్భక్ష్యభోజ్యములు - బహువిధంబులఁ గొని పఱచి రాక్షసులు
ఆతతానంతభోగాస్పదం బగుచుఁ - బాతాళమును బోలెఁ బరఁగినదాని
మహనీయశతకోటిమహిమచే నిందుఁ - మహితాలయము పోలె మానైనదాని
నిఖిలంబునందును నెగడుతేజమున - శిఖినివాసము పోలెఁ జెలువైనదాని
సమధికంబైన భీషణవృత్తి గలిగి - యమనివాసము పోలె నమరినదాని
వివిధమేదోమాంసవితతిఁ గవ్యాదు - భవనాంగణము పోలి భాసిల్లుదాని
నిరుపమతరవారుణీయుక్త మగుచు - వరుణాలయము పోలె వ్రాలినదానిఁ
దిరమైనయాసుగంధీస్పర్శనమున - మరుదాలయము పోలే మానైనదాని
విలసితనిధులచే వెలసి కుబేరు - నెలవును బోలె వర్ణితమైనదాని3430
నురువిభూతికి నెల్ల నునికిప ట్టగుచు - హరునివాసము పోలె నమరినదానిఁ
గలిగిన పద్మరాగప్రభావళుల - నలువ యున్నెడ పోలె నలరినదాని
నఖిలదిక్కుల యోజనాయతం బగుచు - సుఖతరంబగు గుహఁ జొచ్చి యచ్చటను
ఆవిపులపుటూర్పు లడరినఁ దూలి - లావున నెట్టకేలకుఁ జేరఁబోయి
కడునొప్ప నెంతయు గరగరి కైన - వెడలుపు గల హేమవేదికమీఁద
నంసంబుతోఁ గపోలాంగంబుఁ జేర్చి - హంసతూలికతల్పమందు శయించి
యుడుగక తఱుచైన యూర్పులతోడఁ - బెడఁగైన యాఘర్మబిందులతోడఁ
గరమొప్ప మోడ్చిన కన్నులతోడ - దఱుచైన కపురగందపుఁబూఁతతోడ
నురమున నెంతయు నుజ్జ్వలం బగుచు - నెరసిన మణిహారనికరంబుతోడ
సల్లలితానందసంపదతోడ - నెల్లప్పుడును దన్ను నెఱుఁగమితోడ3440
సరస నిద్రాంగనాసంభోగకేళిఁ _ బరిణమించినభంగి భాసిల్లువాని
పలుమఱు దివిజుల భంజించునట్టి - కల లబ్ధిఁ గను కుంభకర్ణునిఁ గనిరి
కని యిట్టివానికి ఘననిద్ర యుంచె - వనరుహాసనుఁ డని వగచుచు నపుడు
ఆతనిముందట నన్నరాసులును - బ్రాతిగా మహిషవరాహమాంసములుఁ
బోసి యంచితగంధపుష్పార్చనములు - సేసి ధూపంబులు చెలు వొప్ప నిచ్చి
పొరిఁబొరి బహుదీపముల నివాళించి - కరములు మొగిచి పొగడ్తలు నెఱపి
పిడుగులు మ్రోసిన పెక్కువకంటె - నెడప కార్చుచు బొబ్బ లిడుచుఁ జీరుచును
నురువడి శంఖంబు లూఁదుచు బెట్టు - మొఱయంగ నిస్సాణములును భేరులును
జెంది వ్రేయుచుఁ దోన సింహారవంబు - లందంద చెలఁగింప నమ్మహారవము

దక్షతఁ బాతాళతలము దిక్కులను - నక్షత్రపథములు నాకంబు నిండె3450
నంతటఁ దెలియక యాకుంభకర్ణుఁ - డంతకంతకుఁ గడు నగ్గలంబైన
నిదుర వోవఁగఁ జూచి నిఖిలరాక్షసులు - గదలును ముసలముల్ ఘనముద్గరములు
బెనుపారఁ బట్టసభిండివాలములు - మును మిడి యందఱు ముసరి వ్రేయుచును
బదివేలకుంతముల్ బరుల గ్రుముచును - వదలక కొండలు వైచియుఁ బోక
యురముపై నందంద నుఱికి పాదములఁ - గరము మెట్టియు మేలు కాన్పంగ లేక
తడబడ సింహనాదములు సేయుచును - గడుబెట్టు గాఁగ శంఖంబు లూఁదుచును
బటునాదముల గ్రందు పటుకుంభవాద్య - పటహభేరీభూరిబహువాద్యములును
దొడరి వాయింపుడు దోడనె మఱియు - నుడుగక పదివేలయుగ్రరాక్షసులు
క్రందుగా నిస్సాణఘనతరరావ - మందంద చెలఁగింప నారభసమున
నీలాద్రియును బోలే నిశ్చలుం డగుచు - నాలోనఁ దెలియక యతఁ డున్నఁ జూచి3460
కరుల హయంబుల ఘనతరోష్ట్రముల - నురులులాయములచే నురము ద్రొక్కించి
కొంకక మేనెల్ల గుదియల మోఁది - యంకించి సకలవాద్యములు వాయింప
లంక గంపించి కోలాహలం బయ్యె - శంకించె నవ్వనచరసేన లెల్ల
నిటు సేయునప్పుడు నేమియుఁ దెలియ - కటు నిద్రవోవంగ నఖిలరాక్షసులు
కొందఱు దిక్కులు ఘూర్ణిల్ల భేరు - లందంద వ్రేయుచు నధికదర్పమునఁ
గొందఱు పర్వతగుహ లెల్ల నద్రువ - దందడి సింహనాదములు సేయుచును
గలయంగఁ గొందఱు కరములు పెనచి - పెలుచ శిరోజముల్ పెఱికివైచియును
గొందఱు ఘనకర్ణకుహరము ల్సొచ్చి - క్రందుగా గూబలు గఱచి పట్టియును
నటు ఘోర మగు బాధ లడరించి మఱియుఁ - బటుగదాముద్గరప్రాసఖడ్గముల
ముసలంబులను బెట్టు మొగము నురంబు - మసల కందఱు పలుమఱు వ్రేయవ్రేయఁ3470
దననిద్ర యించుక దఱిగి యంతటను - మనుజాశనుం డొకమఱి యావులింపఁ
దఱుచుగాఁ గన్నులు దరికొనవైచి - యిఱియ మ్రోకులసందు లెల్ల బంధించి
తెరలఁ గాచిననూనె దెచ్చికర్ణములఁ - గర ముగ్రముగ వేయిఘటములు వోసి
మునుకొని యాతని ముక్కుగో ళ్లందు - ఘనమైన పారలు గనలఁబెట్టియును
ఏకయత్నంబున హేమదండముల - భీకరగతి మ్రోయ భేరుల మ్రోసి
విడువక హయకరివితతి నురంబు - గడఁగి త్రొక్కింప రాక్షసుఁడు శంకించి
చక్కశేషోగ్రహస్తంబులు సాచి - యొక్కింత మేల్కొని హుమ్మని నీల్గి
బడబాముఖాభమై పరఁగెడి నోరు - కడుఁ జూడ వికృతంబుగా నావులించి
యురవైనయట్టి సాయుజ్యపదంబు - నెరయంగ రాముఁడు నేఁడు నా కిచ్చు
నీ రిత్తనిద్ర నా కే లని దాని - దూరంబుగాఁ బెడఁద్రోచెనో యనఁగఁ3480
గనువిచ్చి యసురులు కంపింప మేలు - కని కుంభకర్ణుఁ డుగ్రతను గూర్చుండెఁ.

బ్రళయకాలమునాఁటి భానుబింబంబు - చెలువంబుతో మోము జేగురింపంగఁ
బటువింధ్యగుహలలోపలనుండి వచ్చు - చటులానిలంబుల సరి యూర్పు లెసఁగఁ
బ్రళయకాలాగ్నిబింబంబులఁ బోలి - కలయంగ నెఱ్ఱనికన్నుల మెఱయ
దానవు లిట్టు లాతని మేలుకొల్పి - దానవేశ్వరునియొద్దకుఁ బోయి నిలిచి
"దేవ! నీతమ్ముఁ డెంతేనియు బాధ - గావింపఁగా మేలు కనియె; నంతటను
నటు కయ్యమునకు బొమ్మందుమో కాక - యిటు తోడితెత్తుమో యేతెఱం" గనుడు
రాగిల్లి తోడ్కొని రండు నావుడును - వేగంబె యాదైత్యవిభునాజ్ఞ వచ్చి
తనకట్టెదురనున్న దానవప్రతతిఁ - గనుఁగొని యాకుంభకర్ణుఁ డిట్లనియె.
“మీ రేల న న్నిటు మేలుకొల్పితిరి? - యారావణునకుఁ గార్యం బేమి పుట్టె?3490
నది యేమి చెప్పుఁడీ" యనవుడు వారు - “త్రిదశారిచేతనే తెలియంగ వినుము
నినుఁ దోడి తెమ్మని నిర్జరారాతి - పనిచె నింతియకాని పని యేమొ తెలియ"
దనవుడు జలక మింపారఁగా నాడి - చనుదెంచి యెంతయుఁ జతురత మెఱసి
చారువస్త్రములు భూషణములు దాల్చి - భూరికోటీరదీప్తుల నొప్పుటయును
నతిముదంబున నప్పు డాదైత్యులెల్ల - నతని కనేకభక్ష్యములు భోజ్యములు
మధువును సూకరమహిషమాంసములు - నధికంపుమెదడును నాజ్యభాండమును
ముదముతోఁ గొనివచ్చి ముందఱ నిడిన - మొదల మేదోమాంసములఁ బ్రీతి నమలి
రుధిరంబు మద్యంబు రూఢిగా గ్రోలి - యధికసంతుష్ఠుఁడై యతఁ డున్నఁ జూచి
మ్రొక్కి నిశాచరు ల్ముందఱ నిలువ - నక్కుంభకర్ణుఁ డిట్లనియె వారలకు
"మీఱినసుతులకు మేటిబంధులకు - వారక రాక్షసేశ్వరునకు శుభమె?3500
యెడరు పుట్టదుగదా యెవ్వరివలన? - నడరి యీలంకకు నట్లైన నిపుడు
నడచెద నభమైన నమరేంద్రు నైన - వడిఁగిట్టి నాకంబువలనఁ బాపెదను;
నార్చెదఁ గాలాగ్ని నైనఁ బెంపొదవి; - తేర్చెదఁ బగవారి తీవ్రదర్పములు"
అనిన యూపాక్షుండు హస్తము ల్మొగిచి - కనుఁగొని యాకుంభకర్ణుతో ననియె.
"విను నిశాచరవీర! విబుధులవలన - దనుజులవలన గంధర్వులవలన
నేభయం బెన్నండు నెఱుఁగని మాకు - నీభీతిఁ బుట్టించి రిప్పుడు నరులు
దివిజారి జానకిఁ దెచ్చుట కలిగి - రవికులోత్తముఁడైన రామచంద్రుండు
కడిఁది విక్రములైన కపులతోఁ గూడి - విడిసినాఁ డీలంక వేడించి యిప్పు
డగచరుం డొక్కఁడె యక్షకుమారు - మొగిసేనతోఁగూడ మున్ను నిర్జించి
లంక భస్మము చేసి లావుమై జనియె; - నింక నెవ్వఁడు గెల్చు నిమ్మహాకపుల3510
ననిలోన దేవాసురాదులకంటె - ఘనవిక్రమఖ్యాతి గలరాముతోడ
నురక కయ్యము సేసి యోడి రావణుఁడు - వెఱపునఁ బఱతెంచి వెస లంకఁ జొచ్చె."
నని విన్నవించిన నన్నిశాచరుఁడు - కనుగవ విస్ఫులింగంబులు చెదర

యూపాక్షు నీక్షించి యుగ్రకోపమున - దీపించి యౌడులు దీటుచుఁ బలికె.
“సమరంబులో నేఁడు సకలవానరులు - నమితవిక్రములైన యాదాశరథుల
మడియించి కపివీరమాంసరక్తములఁ - దొడరి రాక్షసకోటిఁ దృప్తిఁ బొందించి
రామలక్ష్మణుల యారక్తముల్ గ్రోల - కేమని వత్తు నే నింద్రారికడకు?
నటు చేసి వచ్చెద"నన మహోదరుఁడు - నట మ్రొక్కి ముకుళితహస్తుఁడై పలికె.
"ఘనుని దశగ్రీవుఁ గని సేయవలయు - పనులెల్ల విని పోయి పగవారి గెలువు
మనవు డౌఁ గా! కని యాహారకాంక్షఁ - దనయొద్ది రాక్షసతతిఁ జూడ వార3520
లిరవొందఁగా నప్పు డిరువదియొక్క - పురుషులమాంసంబుఁ బ్రోవుగాఁ బోసి
యెనుబదిమహిషంబు లెనమనూ - ఱజములును వ్రేయు క్రోడంబులును నాల్గువేలు
ఘనశశకములు మృగంబు లార్నూరు - ననువొందఁగా దెచ్చి యావి వేఱువేఱఁ
జంపి సుపక్వమాంసములుగాఁ దెచ్చి - యింపార నాతనియెదుటఁ బోయుటయుఁ
దనివోవఁ గుడిచి యుద్ధతి రెండువేల - ఘనఘటంబులనిండఁ గల మద్య మాని
పటపట దిక్కులు పగులవేయుచును - జటులంబు లైన మీసములు దీటుచును
జనుదెంచు నురువడి జగము గంపింపఁ - గనుదోయి ఘూర్ణిల్లఁగా గుహ వెడలె
నల రాహువదనగహ్వరముననుండి - విలయకాలార్కుండు వెడలినమాడ్కి
బలుగిట్టి ధాత్రియు బ్రహ్మాండతలము - వెలయ దర్పించు త్రివిక్రముపగిది
నాచందమున వికృతాకారుఁ డగుచు - నేచినపొడవుతో నేతేరఁ జూచి3530
కోట యవ్వలి కపికోటు లన్నియును - మేటిరాక్షసుఁ గని మిగిలినభీతిఁ
గొందఱు వెఱఁగందఁ గొందఱు డాఁగఁ - గొంద ఱట్టిటుపడఁ గొందఱు వెఱవఁ
గొందఱు మూర్చిల్ల గొందఱు జలధి - యందఱుగఁ గొంద ఱద్దిరా యనఁగఁ
గొందఱు రాముదిక్కున కొదుగంగ - నందఱఁ గనుఁగొని యాసమయమున
సౌమిత్రి! విల్లును శరముఁ దెమ్మనుచు - రాముఁడు పలికె నారావణానుజుని
"నదె యాకసంబును నవనీతలంబు - గదిసిన దేహంబు గలిగినవాఁడు
ప్రళయకాలాంబుదపటలంబు పోలె - బొలయు భూషణరుచి బొలుపైనవాఁడు
మూఁడులోకంబు లిమ్ముల మ్రింగునట్టి - వాఁడిమి దెరచిన వదనంబువాఁడు
కాలుండొ? యటు గాక కాలానలుండొ? - కాలరుద్రుఁడొ? లయకాలమారుతుఁడొ?
కాలార్కుఁడో ? మహాకాలాహిపతియొ? - కాలమృత్యువొ? లయకాలాబ్దివిభుఁడొ?3540
కాలకాలుఁడొ? లయకాలభైరవుఁడొ? - కాలరుద్రునకును గాలరుద్రుండొ?
భీమంపురూపు విభీషణ! యిట్టి - దే మెన్నఁడును జూచి యెఱుఁగము మున్ను;
దానవుఁడో? వీఁడు దైత్యుండొ? కాక - వీనికులం బేమి? వీఁ డెవ్వఁ? డిందు
వాఁడె? యాపురవీథి వడి నేగుచున్న - వాఁ డెవ్వఁ? డెఱిఁగింపు; వానిపే రేమి?
వీనిఁ గనుంగొని వెఱచిరి కపులు - వీనిచందముఁ జూడ వెఱగయ్యె" ననుడు

విభీషణుఁడు శ్రీరాములతో కుంభకర్ణునిశాపప్రకారము దెలుపుట

నావిభీషణుఁడు రామాధిపుఁ జూచి - "దేవ! యీదైత్యునితెఱఁగెల్ల వినుము
వరనందనుఁడు విశ్రవసునకు నితఁడు - కరము గ్రూరుఁడు కుంభకర్ణుఁ డన్వాఁడు
రావణుతమ్ముఁడు రణవీథి గిట్టి - దేవసంఘంబుల దిక్పాలకులను
బలుమఱు దోలిన బాహుబలాఢ్యుఁ - డలఘుశూలాయుధోద్ధతసత్వధనుఁడు
బ్రహ్మాండ మయినను బగిలింపనోపు - బ్రహ్మాదులకుఁ బట్టువడఁడు సత్వమున3550
వీఁడు పుట్టిననాఁడె వికృతంపునోరఁ - బోడిమి చెడ జీవముల మ్రింగఁ జొచ్చె
మునుమిడి యటు భూతముల మ్రింగమ్రింగ - విని వజ్రి కోపించి విపులవజ్రంబు
వీనిపై వైచిన వీఁడు గైకొనక - యానాకగజదంత మగిలించి పెఱికి
సురపతిపై వైవ సురసుర స్రుక్కి - సురపతి యప్పుడు సురలతో వచ్చి
యంభోజభవుఁ గాంచి హస్తము లొగిచి - " కుంభకర్ణుండను ఘోరరాక్షసుఁడు
పొలుపారఁ బ్రజలఁ జంపుచునున్నవాఁడు - సొలవక సురల నేచుచునున్నవాఁడు
గడఁగి పరస్త్రీలఁ గవయుచున్నాఁడు - తొడరి లోకము లెల్ల ద్రుంచుచున్నాఁడు
ఈనీచు నీక్రియ నిటమీఁద నున్న - వీనినిగ్రహమున విశ్వంబు పొలియు"
నన విని యప్పు డయ్యంబుజాసనుఁడు - తనమనంబున నల్క తద్దయు మిగుల
రాక్షసావలి నెల్ల రప్పించి యందు - వీక్షించె నప్పుడు వీనిరూపంబు3560
వీక్షించి యెంతయు వెఱఁగంది "వీఁడు - భక్షించుఁబో వెస బ్రహ్మాండమైన
వీనిచందముఁ జూచి వెఱపు నాయందు - నూనెడు వీఁ డింతయుగ్రుఁడై యున్న
వీఁ డాజిలోపల విదళింపకున్నె - మూఁడుకన్నులవేల్పు ముట్టిననైన”
నని వీనితో నప్పు డనియె నాబ్రహ్మ - చనదని మిగుల నాజ్ఞాపింపఁదలఁచి
యాపులస్త్యునియుత్తమాన్వయంబునను - నీపుట్టు టెల్లను నిఖిలభూతములఁ
బొలియించుకొఱకు నాభువనంబులెల్ల - నలుకంగ నిట్టి శౌర్యము చూపె దనుచుఁ
జావుతో సరియైన శాపంబు నిచ్చె - నీ వుడుగని యట్టి నిదుర బొమ్మనుచు
జలిపిడుగును బోలె శాపంబు దాఁకి - నిలువలే కెంతయు నిద్రితుండయ్యె.
రావణుం డప్పు డాబ్రహ్మకు మ్రొక్కె - "దేవ! చూడుము కృపాదృష్టితో వీని
దారు పెట్టినచెట్టుఁ దారె త్రుంపుదురె? - యేరూపమున నితఁ డెంతకీడైనఁ3570
దగుబుద్ధి సెప్పుట తగ వగు వాని - దగ దిటువలె శాపతప్తునిఁ జేయ
వీనినిద్రకుఁ దుది వివరింపు" మనిన - దానవుతోడ నుత్తరమిచ్చె నజుఁడు
“అక్కజంబుగ నిద్ర యాఱేసినెలల - కొక్కొక్కపరిఁ దెలియుచునుండు" ననుచు
నంతనుండియు నితం డవ్విధంబునను - జింతసేయక నిద్రఁ జెందు మేల్కాంచు
దేవ! యిప్పుడు నీదు దివ్యబాణోగ్ర - పావకశిఖలఁ బాల్పడి సైఁపలేక
యవసరంబునను తా నారావణుండు - తను మేలుకొల్పంగ దైత్యులఁ బనుప

దానును బేర్చి యుద్ధప్రసన్నద్ధుఁ - డై నేఁడు నగరికి నరుగుచున్నాఁడు.
వెస వీఁడు రావణు వీడ్కొనివచ్చు - నసమున మనమీఁద నంతకుమున్నె
వీనియాకృతిఁ జూచి వెసఁ బాఱకుండ - వానరసేనలో వడిఁ జాటఁ బనుపు
"దనుజుండు గాఁ డిటు దారుయంత్రమున - నొనరంగఁ జేసిన యుగ్రరూ" పనుచు3580
నిటు చాటఁగాఁ బంచి యెల్లవానరులఁ - బటుభీతియును బాపి భండనంబునకు
సన్నద్ధులుగఁ జేయు సకలాధినాథ! - మున్నె యానతి యిమ్ము మోహరింపంగ”
ననవుడు నీలున కానతి యిచ్చి - జననాథుఁ డమ్మెయిఁ జాటంగఁ బనిచె
నాకుంభకర్ణుండు నప్పురాంగనలు - చేకొని పూవుల సేసలు చల్లఁ
జని నిండువెన్నలసదనమో యనఁగఁ - దనరారుచున్న యాస్థానంబుఁ జొచ్చెఁ
బరఁగినధవళాభ్రపటలంబుఁ జొచ్చు - సురుచిరకరుఁ డైన సూర్యునిభంగిఁ
జొచ్చి యన్నకు మ్రొక్క సొంపార నతఁడు - గ్రుచ్చి కౌఁగిటఁ జేర్చి కూర్మి దీపింప
గనకాసనం బిడఁగాఁ బంచుటయును - దనుజాధినాథుని తమ్ముఁ డందుండి
యన్న నాలోకించి “యసురాధినాథ! - నన్నుఁ దెల్పినకారణం బేమి యిపుడు?
ఎవ్వఁడు నీయెడ నె గ్గొనరించె? - నెవ్వనిఁ జంపుదు? నెత్తెఱం"గనుడు3590
నాకుంభకర్ణున కనియె రావణుఁడు - "నీకుఁ బెల్లగుచున్న నిద్రపెంపునను
నేకార్యగతియును నెఱుఁగవు గానఁ - జేకొని యంతయుఁ జెప్పెద వినుము
రాముఁడు దశరథరాజనందనుఁడు - కోపించి నామీఁద కోఁతులఁ గూడి
వననిధి బంధించి వచ్చి యీకోట - వెనుకొని బలువిడి విడిసియున్నాఁడు
అనికిఁ జొచ్చుటయుఁ బ్రహస్తాదివీర - దనుజుల నందఱ ధరమీఁదఁ గూల్చె;
వానరవీరు లెవ్వరుఁ జావ రందుఁ - గాన నారామలక్ష్మణుల భంజించి
యావిభీషణరవిజాదులఁ జంపి - లావునఁ జెడకుండ లంక రక్షింపు,”

రావణునకు కుంభకర్ణుఁడు నీతి సెప్పుట

మని పెద్దకృప పుట్ట నాడువాక్యములు - విని కుంభకర్ణుఁ డవ్విబుధారి కనియె.
“మునునాఁటియేకాంతమున మంత్రు లెల్ల - గనుగొన్న యాకీడె కాక చింతింప
వారక యిది నేఁడు వచ్చిన కీడె? - యేరూపమున నిది యేటికిఁ దప్పు?3600
మదముపెంపునఁ జేసి మఱి యెవ్వఁడైన - దుది మొద లెఱుఁగక తొడరుకార్యంబు
వాఁడు గదా యెల్లవలనఁ జేటొందు - వాఁ డని చెప్ప నెవ్వఁడు నీవె కాక
మతి గల మంత్రుల మంత్రానుమతులఁ - గృతకార్యములు పరికించు నేవిభుఁడు
ఒగిఁ బ్రభుమంత్రసముత్సాహశక్తు - లగణితఫలదంబు లై వాని కమరఁ
బతి దేశకాలవిభాగంబు లెఱిఁగి - చతురజనద్రవ్యసంపద గలిగి
కార్యంబు మీఁదగు కార్య మూహించి - కార్యవిఘ్నప్రతీకారంబు సేసి
ఫలసిద్ధిఁ గైకొని బహురాజ్యభోగ - ముల నిత్యుఁడై యుర్వి మోదింపవలయుఁ

బగవానిబలశక్తి భావించి సంధి - తగుబుద్ధిమైఁ జేయఁ దలపోయవలయు
రూపించి సమబలారూఢునితోడ - నేపుమై చని నిగ్రహింపంగవలయు
నటుకాక బలశూన్యుఁ డగుట చింతించి - పటుసత్త్వుఁడై శత్రుపై నెత్తవలయు3610
విడిసినబలిమి వివేకించి మీఁద - విడిసి మార్తుర గెల్వ వెస వూఁదవలయు.
వైరు లసాధ్యులై వ్రాలుదురేని - లోరెండుపుట్ట విలోకింపవలయు
నతిసత్త్వులై వైరు లజితులై రేని - హితబుద్ధిమై నాశ్రయింపంగవలయు
నీయాఱుగుణముల నెఱిఁగి వర్తించు - నాయవనీశ్వరుఁ డభివృద్ధిఁ బొందుఁ
బూని యేపురుషుఁ డెప్పుడు సామభేద - దానదండము లుచితము దప్పఁ జేయు
నెఱియ వానికిఁ గల నీతిశాస్త్రములు - కొఱమాలి యుండు నిక్కువ మివ్విధంబు
పరధనపరసతీపరచిత్తుఁ డెవ్వఁ - డరయ నాతఁడు కులం బంతయుఁ జెఱుచు"
నని కుంభకర్ణుఁ డి ట్లాడువాక్యములు - విని రావణుఁడు క్రోధవివశుఁడై పలికె.
"నను నన్న యనుచు మనంబునఁ గొనక - కినిసి యిబ్భంగి శిక్షించెదు వచ్చి
యీవృథాజల్పంబు లింక నేమిటికి - నేవిధంబున నైన నీకార్య మేను3620
గడవందఁ జేసితిఁ గాదన కీవు - కడిమిమై నిది చక్కఁగాఁ జేయు మింక"
ననవుడు విని యనె నాకుంభకర్ణుఁ - "డని సేయఁ బోయెద నైనను నొకటి,
విను దానవేశ్వర! వేడుక నొక్క - దినమున నే నిద్ర దెలిసిననాఁడు
చేకొని కడుఁబెక్కుజీవుల మ్రింగి - యేకాంతమున నెమ్మి నేనున్నచోట
ననఘుఁడు నారదుం డరుగ నే గూడఁ - జని విన్నవించితి సంయమితోడ
నెక్కడనుండి నీ విటు సంభ్రమమున - నెక్కడఁ బోయెద వెఱిఁగింపు నాకు
ననవుడు కనకాద్రియందుండి రాక - విను వార్తలన్నియు వినుపింతు నీకుఁ
బంకజనాభుండు ఫాలలోచనుఁడు - పంకజాసనుఁడును పాకశాసనుఁడు
ననలుండు యమనైరృతాంబుధీశ్వరులు - ననిలుండు యక్షేశుఁ డగు కుబేరుండు
నోషధీపతియును నుష్ణకర్ణుండు - శేషగ్రహంబులు సిద్ధులు మునులు3630
కిన్నరగంధర్వగీర్వాణయక్ష - పన్నగగుహ్యకప్రముఖసంఘములు
సభ గూడి మంత్రి విచారంబు సేయ - శుభమతి నూహించి సురగురుం డనియెఁ.
“గ్రోధించి మనలఁ గైకొనక లోకములు - బాధించుచున్నాఁడు పంక్తికంధరుఁడు
శుంభద్బలంబున సుడివడఁజేసి - జంభారి భంజించె సమరంబులోన
వడి నంతకునిఁ దోలె వరుణు నోడించె - నొడిచెఁ గుబేరుని నురుబలోజ్జ్వలుని
గట్టల్కతో నతిగర్వంబు మెఱసి - పట్టి ధర్మాత్ములఁ బలువురఁ జంపె
దినకరచంద్రులతేజంబు లణఁచె - దనయాజ్ఞ ననుపంగఁ దట్టించి పనిచి
గ్రహముల నందందఁ గాఱించె మంత్ర - మహితంబు లగుచున్నమఖములు చెఱిచె
వఱలు మహోద్యానవనములు పెఱికె - జెఱవెట్టె నుత్తమస్త్రీలఁ బెక్కండ్ర

నివి లోనుగా బాధ లిట్లు సేయుచును - భువనంబులకు భీతిఁ బుట్టించెఁ గాన3640
నడరి రాక్షసులతో నద్దశాననుఁడు - చెడునుపాయము మీరు చింతింపుఁ డింక”
నని బృహస్పతి పల్క నామాట లెల్ల - విని బ్రహ్మ పలికె నావిబుధులతోడ
“వర మిచ్చినాఁడ నే వానికి మున్ను - సురగరుడోరగాసురయక్షవరుల
చేనైనఁ జావమి సిద్ధంబు గాఁగ - దీనికి మాఱు చింతించితి వినుఁడు
దడవఁడు మనుజుల దైత్యుండు గాన - దడవ నేనును వరదానకాలమునఁ
గాన రావణుని సంగరభూమియందు - మానవు లోర్తురు మనుజలోకమునఁ
జనియింపఁ బ్రార్థింపఁ జను నాదివిష్ణు - వనజనాభుని లోకవంద్యు ముకుందు"
ననవుడు సురమును లట్ల కావింప - ననఘుండు హరి మర్త్యుఁ డై పుట్టెఁ బుడమి"
నని చెప్పి నారదుం డరిగె దైతేశ - దినకరకులుఁ డాదిదేవుండు గాని
మనుజుండు గాఁడు రామక్షితీశ్వరుఁడు - జనకనందన నిచ్చి శరణము వేగ3650
వనచరు లెల్ల దేవతలుగాఁ దలఁపు - దనుజేశ! నామాట తథ్యంబు నమ్ము.”
అనిన మాటలు విని యద్దశాననుఁడు - తనలోన నధికసంతాపాగ్నిఁ గుంది
యొకకొంతవడి యూరకుండి నిట్టూర్పు - ప్రకటంబుగాఁ బుచ్చి బహుచింతతోడ
వెఱచియు వెఱవని విధమున నప్పు - డఱిముఱి కోపించి యనుజన్ముఁ జూచి

రావణుఁడు కుంభకర్ణుని దిరస్కరించుట

“సొలవక యెపుడు విష్ణుఁడు విష్ణుఁ డనుచుఁ - బలికెదు నీ కింత భయ మేల పుట్టె?
విష్ణువై యుండిన వెఱవను నేను - విష్ణుండు మానవవేషుఁడై యున్న
వెఱతునే? న న్నేల వెఱపించె దిట్లు? - వెఱచె దేనియు నీవు వెఱతు గా కింక
నారాఘవుఁడు విష్ణుఁ డగుఁగాక! యేమి? - యారామునకుఁ దమ్ముఁ డైనసౌమిత్రి
యారయ శర్వుండె యగుఁ గాక! యేమి? - యారవిసుతుఁ డింద్రుఁ డగుఁగాక! యేమి?
సురలయై యుండంగ సొరిది నే వెఱవ - నిరవొంద వీరికి నే నేల వెఱతు?3660
నెఱయంగ నీ వెల్లనీతిశాస్త్రములు - నెఱుఁగుట నిష్ఫలం బిటు విచారింప,
నతివిరోధము గొన్న యారాముతోడ - నతిహీనమైత్రికి నాస చేసెదవు;
సమరోర్వి మనలను సమయింప మునుల - నమరుల రక్షింప నటు విచారించి
యంచితదేవత్వ మటు మాని వచ్చి - వంచన నిట మానవత్వంబు నొంది
జగదేకరక్షకై సరసిజోదరుఁడు - జగతిపై రాముఁడై జనియించినాఁడు,
వైరంబు గొని మనవధకొఱకైన - నారాముతో సంధి యది యేల పొసఁగు?
వాలి దూలఁగఁ బోయి వానరాశ్రితుని - నీసమయంబున నేమని కాంతు?
బలిజన్నమునకు నీపంకజోదరుఁడు - పొలుచు వామనమూర్తి బొంది తా నరిగి
ధరణి మూఁడడుగులు దానంబు వేఁడి - యరుదారఁ గొని యప్పు డతని బంధించె;

నొప్పార నుపకార మొనరించు నతని - కప్పుడె కావించె నపకార మితఁడు3670
పగగొన్నమనలను బరిమార్ప కేల - మగుడ నెక్కడి సంధి మనకు రామునకు?
నేను నీవును గూడి యింద్రలోకంబు - పైనెత్తి చని భుజాబలము లింపార
నిబిడవిక్రము లైన నిర్జరేంద్రాది - విబుధులఁ దోల నావిష్ణుఁ డెం దరిగె?
నిను మేలుకొల్పుట నీతి నీచేత - వినఁగోరియే నీకు వెఱ పేల పుట్టెఁ?
బ్రాణభయంబునఁ బలుమాట లేల?- ప్రాణంబు తీపైన బ్రదుకు నెమ్మదిని
ఘనమైనయూయువుఁ గరమర్థిఁ గంటి - మునుమిడి గెలిచితి మూఁడులోకముల
ననుభవించితిఁ బెక్కులగురాజ్యసుఖము - లనుపమం బగుతేజ మంతంత కెసఁగ
నతిహీనవిక్రముఁ డైనరామునకు - నితరులగతి నింక నే మ్రొక్కఁజాలఁ
బోరికిఁ జను మన్నఁ బోనోప కీవు - వారక యాడెదు వక్రోక్తు లిట్లు
నిద్రవోవఁగ బొమ్ము నెమ్మది నీవు - నిద్రవోయెడివాని నిర్జింప రరులు3680
రామలక్ష్మణులను రవితనూభవుని - భీమవిక్రము లైన బిరుదువానరుల
నేనె చంపెదఁ బేర్చి యెల్లదేవతల - నేనె చంపెద విష్ణు నేనె చంపెదను
నోలి నవ్విష్ణుని యొద్ది శూరులను - నాలంబులోపల నధికదర్పమున
నెద్దెసఁ గదిసిన నేనె చంపెదను - బెద్దకాలము నీవు పిఱికివై మనుము"
అని పల్కి వెండియు నద్దశాననుఁడు - గనుఁగొని యాకుంభకర్ణుతో ననియెఁ.
"జెలువారఁగా నిటు సీతయై లక్ష్మి - యిలకు జనించుట యే నెఱుంగుదును
అరయంగ రఘురాముఁ డావిష్ణుఁ డగుటఁ - బరికించి యెఱుఁగుడు భావంబులోన
వలనొప్ప దేవతల్ వానరు లగుచు - నిలమీఁద జన్మించు టే నెఱుంగుదును.
రాముచే మరణంబు రణములో నాకు - నీమెయి సిద్ధించు టే నెఱుంగుదును,
నెలమిఁ గామంబున నే సీతఁ దేను - బలిమిఁ గ్రోధంబునఁ బట్టి యేఁ దేను3690
రణములోపల రఘురాముచే నీల్గి - ప్రణుతింప విష్ణుని పరమపదంబు
దక్కక పొందంగఁ దలఁచియే సీత - నిక్కంబు దెచ్చితి నిం కేల దాఁప?”
నని పెక్కుభంగుల నాడురావణునిఁ - గనుఁగొని యాకుంభకర్ణుఁ డిట్లనియె.
"నే నీకుఁ గలుగంగ నేల తూలెదవు? - దానవనాథ మోదంబున నుండు
పగ యడంచెద” నని పలికి యాస్థాన - మొగి నంతయును జూచి యుచితవాక్యముల
"నేఁ డిందులో లేఁడు నిర్మలాచారుఁ - డేడి విభీషణుం డింద్రారి" యనుడు
“మనమీఁద రామలక్ష్మణు లెత్తి వచ్చి - రనువార్త విని సభ నందఱుఁ గూడి
యాలోచనను సేయ నంతలో నీవు - వాలిననిద్రవో వడిఁ నేగుటయును
నిష్ఠతో రఘురామునికిఁ గాఁగఁ బెద్ద - నిష్ఠుర మతఁడు నానెరి నాట నాడె
నాడినఁ దన్నితి నావిభీషణునిఁ - గూఢదు నా కని కోపంబు పేర్మిఁ3700
దన్ని యంతటఁ బోక తాలిమి దక్కి - యున్నఁ జంపుదు నని యోట లే కంటి

ననవుడు ననుఁబాసి యారాముకడకుఁ - జని యిప్పు డావిభీషణుఁ డున్నవాఁడు."
అని చెప్పుటయుఁ గార్య మది తుదముట్టె - ననికిఁ బోవుట యుక్త మని విచారించి
యింకఁ బోరాదని యింద్రారియెదుట - నంకకాఁడును బోలె నతఁ డిచ్చెబాస.
"కిట్టి భంజించెదఁ గీనాశు నైనఁ - బట్టి మర్దించెదఁ బద్మజు నయిన
జిఱజిఱఁ ద్రిప్పెద శేషుని నయిన - వెఱగందఁజేసెద విహగేంద్రు నయిన
బలువిడి మ్రింగెదఁ బ్రళయాగ్ని నైనఁ - జలమునఁ గ్రోలెద జలనిధి నైన
నేపారఁ దోలెద విష్ణుని నైన (?) - రూపఱఁ జేసెద రుద్రుని నైనఁ
గడఁగి ఖండించెదఁ గాలుని నైన - మెడ నుల్చివైచెద మృత్యువు నైన
వడి చెడఁజేసెద వరుణుని నైనఁ - గడుపు చించెద నలకాపతి నైన3710
బిడికిలించెద రవిబింబంబు నైనఁ - బడఁద్రోచి వచ్చెద బ్రహ్మాండ మయినఁ
గోఁతులఁ బట్టి మ్రింగుదు నను టెల్ల - లేఁతనా సమరకేళిసముద్ధతికిని
నామర్కటుల నెల్ల నద్రుల కనిచి - యామనుజులఁ ద్రుంతు నసురాధినాథ!
నీమనం బలరంగ నెమ్మది నుండు - రాముఁడు నాచేత రణములోఁ బడిన
సీత యనాథయై చిక్కు నంతటను - నీతలంచినకోర్కి నీకు సిద్ధించు”
ననిన మహోదరుం డావాక్యములకు - ఘనభుజుం డగు కుంభకర్ణుతో ననియె.
“సత్కులంబున నీవు జనియించినాఁడ - వుక్కటంబగు కార్య ముచితమే నీకుఁ?
దగ నయానయములు దలపోయ కిట్లు - పగతుఁ జంపెద నని పలుకునే ఘనుఁడు?
కోపంబు దీపింప ఘోరసింహంపు - టేపున నున్నవాఁ డెసఁగు తేజమునఁ
గేవలమానవాకృతి గాఁడు రాముఁ - డావిష్ణుఁ డీరూపమై వచ్చినాఁడు3720
ఆవాలి నొకకోల నడఁచినశూరుఁ - డావీరవరు గెల్వ నలవియే నీకుఁ?
బ్రకటవిక్రముఁ డైన పగవానిమీఁద - నొకడ పోవుట నాకు నొడఁబాటు గాదు,
బలముతోఁ జని మహాబలుఁ డైనరాము - గెలువు మీ"వని దశగ్రీవుతో ననియె.
"నేము గల్గఁగ నీకు నేల చింతింప - నీమనోరథసిద్ధి నెఱపంగలేమె?
జానకికొఱకు విచార మేమిటికి? - నేను సంపాతియు నీద్విజిహ్వుండు
గంభీరవిక్రమకలితబాహుండు - కుంభకర్ణునిఁ గూడికొని పోయి రాము
నెలమి గెల్చితి మేని నేయుపాయమున - వలనొప్ప సిద్ధించు వైదేహి నీకు
నటుకాక రామనామాంకితబాణ - చటులోగ్రపాతంబు సైరింపలేక
వడి భిన్నతనులమై వచ్చితి మేని - నడరంగ నేము నీయడుగుల కెరఁగి
ప్రణుతోగ్రవానరబలముతోఁ గూడ - రణభూమిలోపల రామలక్ష్మణుల3730
వధియించి భక్షించి వచ్చితి మనుచు - నధిప చెప్పిన మమ్ము నధికమోదమున
నాలింగనము చేసి యర్థి మన్నించి - పోలంగ నీవార్త పురములో నెల్ల
నీవు సాటించిన విజముగా సీత - భావించి యటమీఁదఁ బతియాస విడిచి

మతిఁ బూని నీమాట మఱి సేయు" ననిన - నతనిఁ గోపించి యయ్యమరారిఁ జూచి
యీబొంకు లగుమాట లెల్ల నేమిటికి - నాబాహుబల మేచి ననుఁ జూతు గాక!
నిశ్చయంబుగ రాము నిర్జింతుఁ బోర - నిశ్చింతమున నుండు నీ విటమీఁద”
నని కుంభకర్ణుఁ డుదగ్రుఁడై పలుక - విని రావణుఁడు గడువేడ్క దీపింపఁ
దనకుఁ బునర్జన్మతాసిద్ధి గలిగె - నని చాల మోదించి యనుజన్ముఁ జూచి
“చని యాజి రామలక్ష్మణుల నిర్జింతు - వని నమ్మినాఁడ నీయతులసత్వంబు
శౌర్యంబునందు నీసరి యైనవీర - వర్యులు లేరు ధ్రువం బివ్విధంబు3740
మునుకొని శూలంబు మొదలుగాఁ గలుగు - ఘనతరాయుధములఁ గయ్యంబు సేయు"
మని ప్రీతి రెట్టింప నతనికి నిచ్చె - ననుపమరత్నమయాభరణములు
నారావణునితమ్ముఁ డాభూషణములు - వారక దాల్చి ప్రజ్వలితాంగుఁ డగుచుఁ
దనరారుపసిఁడికత్తళ మొప్పఁ దొడిగి - వినుతసంధ్యాంబుదావృతగిరి వోలె
బహురత్నమేఖలాబద్ధుఁ డై యొప్పె - నహిరాజబద్ధమంథాద్రిచందమున
నొప్పి రణోత్సాహ ముప్పొంగి పొంగి - యప్పుడు చనుదెంచి యసురపుంగవుఁడు
త్రిజగద్భయంకరదీప్తమై పర్వ - విజయసూచకభేరి వేయంగఁ బనిచె.

కుంభకర్ణుఁడు యుద్ధమునకు వెడలుట

శూలిశూలముకంటె సొంపారి మొనల - వ్రాలినమంట లుజ్జ్వలములై నిగుడ
నిప్పులు చెదర మానిత మైనపూజ - నొప్పి రత్నప్రభ నుజ్జ్వలం బగుచుఁ
బ్రతివీరశోణితభంజితంబైన - యతులశూలముఁ బట్టి యన్నకు మ్రొక్కి3750
యతనిదీవనలతో నాసభాంతరము - వితతసముద్యోగవేగుఁడై వెడలె.
నీకష్టతనువులో నే మేల నిలుతు - మోకుంభకర్ణ! రణోర్వర దీని
వైతువు రమ్మని వానిప్రాణంబు - లాతతగతి నీడ్వ నరుగుచందమున
నంత రాక్షసకోటి యాకుంభకర్ణు - నంతంతఁ గూడి కయ్యంబున కరిగెఁ.
దురగంబు లెక్కి సింధురముల నెక్కి - యరదంబు లెక్కి సింహంబుల నెక్కి
కాటుకకొండలగతిఁ దనరారి - మేటిదంష్ట్రంబుల మెఱుఁగులు చెదర
గ్రౌర్య మంతయుఁ గూర్చి కరులిడ్డకరణి - శౌర్యంబు రూపులై చరియించుభంగి
గయ్యంబు సేఁత యేకార్యంబు గాఁగ - నయ్యయితెఱఁగుల నాటోప మొప్పఁ
బరిఘపట్టసగదాప్రాసకోదండ - కరవాలకుంతముద్గరభిండివాల
పరశుచక్రాయుధపటుసాధనములు - పరఁగఁ బదాతి యుద్భటవృత్తి నడిచె3760
నీచందమునఁ గూడి యెల్లసైన్యములు - వే చనుదేర గర్వితచిత్తుఁ డగుచు
బురకామినీతతి పుష్పవర్షములు - గురియ రణోద్యోగి కుంభకర్ణుండు
చంద్రమండలనిభచ్ఛత్రంబు లొప్పఁ - జంద్రబింబాస్యలు చామర లిడఁగఁ
దురగహేషలును సింధురబృంహితములు - వరరథనేమినిస్వనపరంపరలు

పటుతరనిస్సాణభాంకారములును - పటహభేరీశంఖపణవరావములు
ఘంటామృదంగఢక్కారవంబులును - మింట దిక్కుల నిండి మిగుల మ్రోయఁగను
వెడలిన యపుడు పృథ్వీభాగ మగలె - జడధులు గలఁగె దిశావలి పగిలె
గగనంబు వడఁకె దిగ్గజములు మ్రగ్గె - జగములు బెగడొందె శైలంబు లురిలె
దౌర్జన్యమున దుష్టదానవ! నీవు - పర్జన్యు నేచిన ఫల మింకఁ గుడువు
మని రాఘవునకుఁ దోడై వచ్చి పేర్చి - తనరార వాని నదల్చినమాడ్కిఁ3770
గలయంగ నప్పుడు కాలమేఘములు - పలుమఱు బిడుగులు పరఁగించి మ్రోసెఁ,
దోరంబుగా నార్చి త్రుళ్లెడువీఁడు - ఘోరాహవక్షోణిఁ గుపితుఁ డైనట్టి
తారాధిపతిచేతఁ దా రూపఱుటకు - నీరాజవరునిచే నిటఁ గూలుటకును
దారు సాక్షుల మని తగఁ జెప్పుకరణిఁ - దారలు మండుచు ధరణిపైఁ బడియె.
ఘోరాజిలో నతిక్రూరుఁడై యసుర - దారుణాకారత దర్ప ముప్పొంగ
తను మున్ను నొంచిన దానికి ననిలుఁ - డనయంబు రాముని యానతి వీనిఁ
బడవైతు నని పేర్చి ప్రబలినమాడ్కి - వడి గొని ప్రతికూలవాయువుల్ వీచె
రాముఁడు చంప నీరాక్షసాధముఁడు - నామీఁదఁ బడువేళ నా కెంత బళువు
పుట్టునో యని భీతిఁ బుట్టి కంపించు - నట్టిచందంబున నవని గంపించెఁ
బక్షపాతుల మని పరికింపవలదు - రాక్షసాధమ! నీవు రాఘవేశ్వరుని3780
ఖగములచేఁ జావఁ గల వనుకరణి - ఖగములు సుడివడఁగాఁ బాఱఁ జొచ్చె,
నివి యెల్ల గొనక సాహసము రెట్టింప - సవరణ యుడుగ కుత్సాహంబు మిగులఁ
జూపులచేతనే చూర్ణం బొనర్తుఁ - గోపించి వానరకులమెల్ల ననుచు
మేటియై వచ్చుచో మీఱి కన్గొనియెఁ - గోటయవ్వలి కపికోటుల నెల్లఁ
గపులును నాకుంభకర్ణునిఁ జూచి - విపరీతమారుతవిధుల మేఘముల
కరణిఁ బాఱఁగఁ గుంభకర్ణుండు లంక - యురువడి వెడల మిన్నొరలంగ నార్చె
నాయార్పు విని వానరావలి యెల్ల - బాయని మూర్ఛలఁ బాల్పడి రంత
శరధి గలంగె భూస్థలి గంప మొందె - సురలకుఁ గడుభీతి సొచ్చెఁ జిత్తముల
నంత వానరవీరు లంతలోఁ దెలిసి - యంతకాకృతి గల యాకుంభకర్ణుఁ

వానరవీరులు కుంభకర్ణునితో యుద్ధము సేయుట

గిట్టి పాదపములు గిరులు శృంగములు - పట్టి బెట్టుగ నెదుర్పడి వ్రేసి యార్చి3790
పొరిఁబొరిఁ బోరుచోఁ బోనీక కదిసి - తరుచరసేనపై దానవసేన
యురువడి గలన ని ట్లుభయసైన్యములు - బరవసంబున దలపడియె నావేళఁ
బ్రళయకాలమునాఁటి పటుసాగరములు - దలకొని యొండొంటి దార్కొన్నకరణి
నొడలును నెమ్ములు నూరులు బరులు - పొడిపొడిగాఁ జేసి పోనీక మఱియుఁ
దవిలి ప్రేవులు మెడల్ దలలు ఫాలములు - నవియంగఁ బెట్టు రథ్యములఁ ద్రొక్కించి

కడ లగలించిన కత్తులచేతఁ - గడికండలుగఁ జేసి కట్టల్కతోడ
నంతఁ బోవక భూనభోంతరాళంబు - నంతయుఁ గడువాఁడియమ్ములఁ గప్పి
వడిఁ బేర్చి రథముల వార లిబ్భంగిఁ - గడిమిఁ జంపిరి మహోగ్రముగ వానరుల
వానరులును రథావళులనుఁ గిట్టి - పూనిచి వెనుకకుఁ దోవఁ దన్నియును
గడునొగ లలమి దిగ్గన నేలతోడ - నడచియుఁ జఱచి యల్లంత వైచియును3800
భయదంబుగాఁ జొచ్చి పదియుగళముల - రయమునఁ జదియ సారథులఁ ద్రొక్కియును
పెళ పెళ నరములు పెనచి రాఁదిగిచి - తల లురువడిఁ ద్రుంచి ధాత్రి వైచియును
రథికులై పేర్చిన రాక్షసాధిపులఁ - బృథుగతిఁ జంపిరి పెక్కుచందముల
నది గని రాక్షసు లధికరోషమున - వదలక వానరావలిఁ జుట్టుముట్టి
మదము పెంపునఁ బలుమఱు కరిఘటల - పదముల సన్నలఁ బైఁ గదియించి
కడకాళు లొడిసి యుత్కర్షు లై పట్టి - యెడపక నేలపై నెత్తివ్రేసియును
మెదడును బునుకలు మేదినిఁ గలయఁ - బదములఁ ద్రొక్కించి భయదంబు గాఁగ
నోలిఁ బూర్ణంబులై యుర్వి నొండొండ - రాల నుగ్రపదరంబు లేసియును
కరులపైనున్న రాక్షసు లేపుమీఱి - యురవడిఁ జంపి రత్యుగ్రతఁ గపులఁ
గపులు నుగ్రంబుగాఁ గవిసి యెంతయును - గుపితులై గజముల కొమ్ములఁ బట్టి3810
కుదిచి రూపణఁచియుఁ గుంభస్థలములఁ - బదములఁ బరియలువాఱఁ దన్నియును
బలలంబు రక్తంబు బహుళాస్థిచయము - గలయఁ గాళ్లను బట్టి కడక వ్రేసియును
నాయేనుఁగులమీఁద నలవుఁ జలంబు - వేయుభంగులఁ జూపి వేగ దానవులఁ
బట్టినవిండ్లును బాహువు ల్తలలు - నట్టలు మరువులు నవనిఁ గూల్చియును
నసమునఁ గపులు గజారూఢు లైన - యసురులఁ జంపి రత్యంతరౌద్రమునఁ
గూడి దట్టము చేసికొని దైత్యవరులు - వాఁడిమూఁకలను గ్రొవ్వడరంగఁ గదిసి
పలుదెఱంగుల బాణపంక్తు లేసియును - నలుఁగుల సెలకట్టియలను వ్రేసియును
సునిశితఖడ్గవిస్ఫురణ శోభిల్ల - మొన సొచ్చి నవఖండములుగ వ్రాసియును
ఉక్కలు లైన రాహుతు లేపుమీఱి - తక్కక చంపిరి తరుచరాధిపుల
గిరిచరవరులును గిట్టి యశ్వములఁ - గరములఁ దోఁకలు గాళ్లను బట్టి3820
దెసలకు వైచియు దివికి వైచియును - వసుమతి వైచియు వ్రచ్చి వైచియును
బదఘట్టనంబులఁ బగులఁ దాఁచియును - వదలక యామీఁది వారి వచ్చియును
రాహుతులైన యారాక్షసాధిపుల - సాహసంబున నేలఁ జమిరిరి కడిమి
నప్పుడు రాక్షసు లధికదర్పమున - నిప్పులు కన్నుల నివ్వటిల్లంగ
నమ్ముల వేసియు నడరి కుంతములఁ - గ్రుమ్మియు సురియలఁ గ్రుచ్చి త్రోచియును
శితఖడ్గసమితి వ్రేసియు ముద్గరముల - వితతచూర్ణములు గావించియు మఱియుఁ
గలయాయుధముల నుగ్రతలు సూపియును - శిలలఁ బాదపములఁ జెదరఁ ద్రోచియును

కడిమి సొంపున నిట్లు కాల్వురఁ బట్టి - బెడిదంబు గాఁగఁ జంపిరి తరుచరులఁ
దరుచరపతులు పదాతిపైఁ గదిసి పొరిఁబొరి - నాయుధంబులు విఱిచియును3830
నెట్టనఁ బదకరనికరంబు లలమి - చట్టలు వాపియుఁ జమరివైచియును
ఇరుచేతులందును నిరువురఁ బట్టి - యురవడిఁ దాటించి యురులవైచియును
అట్టలు శిరములు నమరంగఁ బట్టి - దిట్టతనంబునఁ ద్రెంచి వైచియును
నుడుగక చంపి రత్యుగ్రవేగమునఁ - గడిమి దీపింపఁ బెక్కండ్రరాక్షసుల
నివ్విధంబునఁ బేర్చి యిరువాగుఁ బోర - నవ్వనచరులందు నసురులయందు
నిండిన నెత్తురు నీళ్ళభంగియును - గండలు నిండు చెంగల్వల మాడ్కి
మానితాస్యములు తామరలచందమున - నానేత్రములు కుముదావళి పగిది
తోరంపుబ్రేవులు దూడుల తెఱఁగు - పేరినమెదడును ఫేనంబురీతి
మెండువెండ్రుకలు తుమ్మెదలపోలికయు - దండిశస్త్రంబులు దరగలవడువు
చామరావళులు హంసంబుల యొప్పు - భూమిపరాగంబు పుప్పొడిక్రమము
గైకొని యపుడు సంగరమహీస్థలము - భీకరం బయ్యును బెద్దయు నొప్పె3840
ననిమిషారులపాలి యామృత్యుదేవి - గొనకొని వర్తించు కొలనిచందమున
గానఁ గదా యింకఁ గాకుత్స్థరాముఁ - డూనెడు జయలక్ష్మి కునికిప ట్టయ్యె
సురఖేచరులు మెచ్చి సొంపారి రపుడు - దురమున నిరువాగుఁ దొడరి పోరాడఁ
గపికోటి నొచ్చినఁ గడఁగి యందంద - కపినాయకులు చూచి కపటరాక్షసులఁ
గెరలి క్రోధంబున గిరిమహీజములఁ - దరమిడి నొప్పింప దానవుల్ బెదరి
కడువేగమున కుంభకర్ణునివెనుక - నడఁగి పాఱిరి శర ణనుపల్కు లెసఁగ
నాకుంభకర్ణుండు నద్దైత్యవరులఁ - జేకొని దిక్కులు చెదర నార్చుచును
నోడ కోడకుఁ డని యూరడింపుచును - గూడి పైపైవచ్చు కోఁతుల నెల్లఁ
జూపులచేతనే చూర్ణింతు ననుచుఁ - గోపించి శూలంబు గొని పెచ్చు పెరిఁగి
బలితంపుఁగపికోటి పాలింటివిధియొ - కలుషత నేతెంచు కాలుఁడో యనఁగ3850
రావణుతమ్ముఁడు రాక్షసాధీశుఁ - డావనచరకోటి నడఁగింపఁజొచ్చె.
గఱ కైన యాకుంభకర్ణునియందు - నెఱ వైనకడిమికి నిలువక కపులు
వడి మూర్ఛ నొంది యుర్వరఁ బడువారు - కడువడి నెత్తురుల్ గ్రక్కెడువారు
వాతూలగతి దివి వడిఁ బ్రాఁకువారు - సేతువుత్రోవనే చెడి పాఱువారు
నగువానరులఁ జూచి యంగదుం డేచి - తగ నప్పు డతిబలోదగ్రుఁడై పలికె.
"నేల వానరులార! యిటు చెడి పాఱ - నేలినపతి డించి యేపు పోకార్చి
వరకపీంద్రులు మహావంశవర్ధనులు - కెరలి పాఱుదురె ప్రాకృతులచందమున?
రామునిముందఱ రణములోఁ బడిన - రామణీయకసురరాజ్యంబు గలుగు
నటుగాక బ్రతికిన నతికీర్తి గలుగు - నిటు మగుడుఁడు పాఱనేల మీ"కనుచు

బుద్ధులు సెప్పుచు పురికొల్పికొనుచు - గ్రద్దన మగుడించెఁ గపికోటి నెల్ల3860
నాకపు లంగదు నతులవాక్యములు - గైకొని యొప్ప నాకర్ణించి మించి
“ప్రాణంబు లిత్తుము రామున కతని - ప్రాణంబుకన్న మాప్రాణ మే"లనుచుఁ
గొండలు గొని తెచ్చి కో యని యార్చి - కొండఁ బోలినదైత్యుఁ గొండల వైవ
శూలంబు గొని కడుఁ జూర్ణంబు చేసె - నాలోన రాక్షసుం డాపర్వతముల
వదలక యంతఁ బోవక రౌద్ర మెసఁగ - గద చేతఁగొని త్రిప్పి కడఁగి వేయుటయుఁ
బదియేడుకోటు లేఁబదియేడులక్ష - లదనము పదివేలు నార్నూరుకపుల
హుంకారరవముల నుగ్రత మెఱసి - కింకతో నారణక్షితిమీఁదఁ గూల్చెఁ
జెలఁగి యంతటఁ బోక చేతులఁ గపుల - బలువిడి కబళించెఁ బటురౌద్ర మెసఁగ
గరుడుండు వడి నురగంబుల మ్రింగు - కరణి నెంతయు భయంకరవృత్తి దోఁప
వీక్షించి యిరువదివేవురుకపుల - నక్షణంబున మఱి యార్నూరుకపుల3870
లక్షించి యెనిమిదిలక్షలకపుల - రాక్షసాధీశుండు రయమున మ్రింగె.
మ్రింగి యంతటికంటే మిక్కుటం బగుచు - సంగరాంగణమునఁ జరియింపుచుండె.
నరభోజనుండు వానరభోజనుండు - ధరణిపైఁ దానయై దర్పించుచుండ
ఘూర్ణిల్లుచును ముక్కు గోళ్ళందు నోటఁ - గర్ణరంధ్రంబుల గపిసేన వెడలె
నంత నాతనిగదాహతిఁ బడ్డకోఁతు - లెంతయుఁ దమమూర్ఛ లెల్లను దెలిసి
-యార్పులతోఁ దరు లద్రులు దెచ్చి - దర్పించి నిలిచిరి దానవునెదుర
గనలుచు ద్వివిదుండు గండశైలంబు - గొని యపు డసురవక్షోవీథిఁ బగుల
నడరింప నది దానికి యంతట మిట్టి - పడియె రాత్రించరబలములు జడియ
నప్పుడు హనుమంతుఁ డధికరోషమున - నిప్పులు రాలెడు నేత్రంబు లొప్ప
గిరిపాదపము లెత్తి గిఱికొని వైవ - నురువడి దైత్యుఁ డత్యుగ్రశూలమునఁ3880
దుమురుసేయుచును బైఁ ద్రోచి రా మఱియు - నమరులు మెచ్చంగ నాంజనేయుండు
నసురపై వైచె మహాపర్వతంబు - నసమానబలుఁ డని యందఱుఁ బొగడ
దానిచే నాదైత్యుతనువు గంపించి- మేనెల్ల నెత్తురు మిక్కుటం బయ్యె
దాన నెంతయు నొచ్చి దానవేశ్వరుఁడు - మానక మెఱుఁగులు మంటలు గ్రమ్మ
భూతలం బగల నభోభాగ మదువ - భీతిల్లి నిర్జరబృందంబు దలఁకఁ
గర ముగ్ర మైనట్టి ఘనతరశూల - మురువడిఁ బూని సముల్లాసి యగుచు
మడవక శక్తికుమారుండు పేర్చి - వడిఁ గ్రౌంచగిరిమీఁద వైచినకరణి
హనుమంతుపై నెత్తి యతిరభసమున - వనచరుల్ బెదరంగ వైచె నయ్యసురు
నటు వైవ దాన నయ్యనిలజునురము - పటపటఁ బగుల నప్పావని యపుడు
ఉరుకోపరస మెల్ల నుమియుచందమున - దురములోఁ బడియె నెత్తురులు గ్రక్కుచును3890
బ్రళయకాలమునాఁటిపటుమేఘరవము - బలువున నెంతయుఁ బరఁగ రోఁజుచును

గపులు గంపింప రాక్షసులు మోదింపఁ - గపిశేఖరుఁడు గూలె గలలావు దూలి
యాలంబులో నప్పు డనిలజుపాటు - నీలుఁడు గనుఁగొని నెరయుకోపమునఁ
గైకొని వైచె రాక్షసులెల్ల బెదర - నాకుంభకర్ణు మహాపర్వతమున
వడితోడఁ బైఁబడ వచ్చుపర్వతము - బెడిదంబుగా వాఁడు పిడికిటఁ బొడిచెఁ.
బొడిచిన నదియు నద్భుతముగాఁ జెదరి - యెడపక చిఱుమంట లెగసి నుగ్గయ్యె.
నమరారిపై నప్పు డాగ్రహవ్యగ్రు - లమితబలోదగ్ధులై మహాకపులు
చలమున ఋషభుండు శరభుండుఁ బేర్చి - కలుషత నలుఁడును గంధమాదనుఁడు
నగ్గవాక్షుండును నధికరోషంబు - లగ్గలింపఁగ నప్పు డడరి పెల్లార్చి
తరమిడి వానిపైఁ దరులు వైచియును - గిరులు వేసియుఁ బిడికిళ్లఁ బొడ్చియును3900
బదముల దన్నియుఁ బటునఖప్రతతి - విదళించియును బహువిధముల నొంచి
యేచిన నన్నియు నింత గైకొనక - యేచి యద్దానవుం డెసఁగు రౌ
బటుతరంబుగ నేలఁబడి తన్నుకొనఁగఁ • జటులత బిడికిట శరభునిఁ బొడిచె
నురువడి ఋషభుని నొడిసి రాఁదిగిచి - కరములఁ గొని ముద్దగాఁ గబళించెఁ.
గుదికిలఁ బడి తన్నుకొని గుండె లవియఁ - గదిసి యన్నీలు మోకాళ్లు దాటించే
నసమున నిగుడు గవాక్షునిఁ గిట్టి - యసురేశుఁ డఱచేత నదరంట నేనెం
గ్రమినతేగువమై గంధమాదనుని - బిమ్మిటి గొని వ్రేళ్లఁ బెడచేత వేసె
రయమున రణరాగరసములు గ్రక్కు - క్రియ నెత్తురులు గ్రక్కి కెడసిరి కపులు
శూలంబు ద్రిప్పి యార్చుచు నట్టిహాస - లోలుఁడై యాలంబులోఁ దిరుగుచును
వితతవజ్రాభీలవృత్రారిభంగి - నతులదండోద్దండయమునిచందమునఁ3910
గడుభయంకరవృత్తి గాఁగఁ బెల్లార్చి - ముడివడ నెమ్మొగంబున నిప్పు లురులఁ
బ్రళయకాలమునాఁటి పటుశూలరుచులఁ - దొలుకాడు నాదిరుద్రునితెఱంగునను
మెఱసెఁ బొ మ్మనుమాట మిక్కిలి గాఁగ - నెఱవార నందఱ నిర్జించెఁ గాన
నప్పుడు సుగ్రీవుఁ డని సేయ నాకు - నిప్పుడు తఱి యని యిచ్చఁ జింతించి
కులశైలపతిమీఁదఁ గోపించి వచ్చు - బలభేదిపగిది నప్రతిమసాహసుఁడు
పొరిఁబోరి సర్వాంగములు పెంచి పేర్చి - పరుషరోషానలప్రభ లుప్పతిల్లి,
కొండల కెల్లను గొండ యైనట్టి కొండనా నొక పెద్ద కొండ చేపట్టి
కోఁతులు నెత్తుటఁ గొమరొప్పఁ దోఁగి - మూతియుఁ దనువును ముదకయై తోఁచి
వీక్షింప నరుదైన వేషంబుతోడ - రాక్షసాధీశుపై రయమున వచ్చి
“న న్నెఱుంగవె యేను నలినాప్తసుతుఁడ - సన్నుతుఁ డగురామచంద్రునిబంట3920
నీకు నాకును గాక నిష్ఠురయుద్ధ - మీకపికోటుల నేల చంపెదవు?”
అని పేర్చి సుగ్రీవుఁ డాడువాక్యములు - విని కుంభకర్ణుండు విపులరోషమున
"సుగ్రీవ! కడు నిన్ను శూరుండ వందు - రాగ్రహింతురె శూరు? లని వెలి గాఁగ

శూరత రణమునఁ జూపుదుఁ గాక - యూరక పెడమాట లొప్పునే నీకు”
నన రాక్షసునిమీఁద నర్కనందనుఁడు - కినిసి తాఁదెచ్చిన గిరి యెత్తి వైచె.
వైచిన నది వాని వక్షంబుఁ దాఁకి - చూచు నంతటిలోనఁ జూర్ణమై రాలె
నాబెట్టిదమునకు నార్చె నిర్వాగు - నాబల్లిదునిచేత నసుర స్రుక్కియును
దడయక యత్యంతధైర్యంబుతోడఁ - గడుభయంకరవృత్తి గాఁగఁ బెల్లార్చి
దిగులొంది యగచరాధిపులగుండియలు - వగులంగ నిలువునఁ బ్రాణముల్ వోవ
జగతీతలము నాకసంబు దిక్కులును - నగల రాక్షసుఁ డట్టహాసంబు చేసి3930
హుంకారరవమున నుగ్రత మెఱయఁ - గింకిణీఘంటికాఘీంకారరవము
వాసి కెక్కిన యిరువదివేలతలలఁ - జేసి గంధాక్షతార్చితమూర్తి నొప్పు
శూలంబు నిర్జరాసురులకు నైనఁ - దాలుప వ్రేఁగైన దాని నక్షణమె
సుగ్రీవుమీఁద వైచుటయును శూల - ముగ్రంపుమంటల నుజ్జ్వలం బగుచు
నేలయు నింగియు నిఖిలదిక్కులును - జాలంగ దరికొని సాగి మండుచును
బదివేలపిడుగులపగిది మ్రోయుచును - వదల కర్కజుమీఁద వచ్చుటఁ జూని
ఘనవిషజ్వాలోరగప్రభుఁ గిట్టి - వినతాత్మజుఁడు ద్రుంచువెరవు దీపింప
నెడ సొచ్చి హనుమంతుఁ డేపార నొడిసి - కడుఁ బెక్కువ్రయ్యలుగాఁ ద్రుంచివైచి
కుప్పించి దాఁటి యెక్కుఁడు పేర్మి నార్చె - నప్పుడు వానరు లందఱుఁ బొగడ
శూలంబు విఱుచుటఁ జూచి కోపించి - యాలోన వేగ నయ్యసురేశ్వరుండు3940
కనలుచు వచ్చి లంకామలయాద్రి - ఘనశృంగ మెత్తి యర్కజుమీఁద వైవ
నుగ్రముగా నది యురముఁ దాఁకుటయు - సుగ్రీవుఁ డపుడు రోజుచు నేలఁ బడియె.

సుగ్రీవుఁడు కుంభకర్ణునిచే మూర్ఛనొందుట

నాతఁడు పడుటకు నఖిలరాక్షసులు - చేతోగతులయందుఁ జెలఁగి యార్వఁగను
గుంభకర్ణుం డతిక్రూరుఁడై వచ్చి - కుంభినిఁ బడియున్న గురుసత్త్వధనునిఁ
గనుఁగొని తలపోయఁ గపిబలంబునకు - నినకులేశ్వరునకు నీతండె లావు
ఈతఁడు పడుటచే నెల్లవానరులు - భూతలంబునఁ బడి పొలిసినయట్ల
సుగ్రీవు మాయన్న చూచుఁ గా కనుచు - నుగ్రుఁడై కొనిపోయె నొనర లంకకును
గాలానిలము వచ్చి కాలమేఘమును - గూలించి గుహకును గొనిపోవు కరణి
నట సురావళి యెల్ల “నకట సుగ్రీవుఁ - డిటు పట్టువడి పోవునే” యని వగవ
నక్కుంభకర్ణుని యలవుఁ జలంబు - దక్కక యంవంద దనుజులు వొగడ3950
వెనుకొని రవిసుతు విడిపింపలేక - వనచరు లాహారవంబులు సేయ
శరభుండు ఋషభుండు జాంబవంతుండు -శరభుండు ధూమ్రుండు (?) సోముండు హరియు
గిరిభేది సుతరుండు కేసరి పృథుఁడు - హరిరోముఁడును పావకాక్షుఁడు హరుఁడు
ద్వివిదుండు మైందుండు వేగవంతుండు - గవయుండు శతబలి గజుఁడు దుర్ధరుఁడు

సుముఖుండు తాలపాశుఁడు గవాక్షుండు - కుముదుఁడు జ్యోతిర్ముఖుఁడు సుషేణుండు
దధిముఖుఁడును వేగదర్శి రంభుండు - గ్రథనుండు ధూమ్రుండు గంధమాదనుఁడు
తారుండు క్రోధనతపనప్రజంఘ - ఘోరాక్షజంఘాలగోముఖవిముఖ
పనససన్నాదసంపాతీంద్రజాల - వినుతసుదంష్ట్రకశ్వేతదుర్ముఖులు
వీ రాదిగాఁ గల వీరవానరులు - దారుణాకారు లుదగ్రవిక్రములు
ధరణీధరములు తరువులుఁ గొనుచు - నారూఢభుజసత్త్వు లై మింటి కెగసి3960
యట్టహాసంబుల నార్పుల దిక్కు - లట్టిట్టు గాఁగ బ్రహ్మాండంబు పగుల
నినసుతు విడిపింత మెట్లైన ననుచు - దనుజునిపైఁ బడఁ దమకించునపుడు
కరమెత్తి వలదని కరువలిసుతుఁడు - వరనీతిమతి గాన వారి కిట్లనియె.
“భానుతనూజుఁ డుద్భటశూరవర్యుఁ - డూనిన మూర్ఛచే నున్నాఁడు గాని
యామూర్ఛఁ బాసిన నాత్మలోఁ దెలిసి - యామహాత్ముఁడు వచ్చు నటుగాన మనము
విడువని యసురచే విడుపించుకొన్నఁ - గడులాఘవంబునఁ గపికులేశ్వరుఁడు
మదిలోన నెప్పుడు మఱగుచునుండు - నిది విచారము కాదు యించుక సైఁచుఁ
డటు చూడ నీలోన నతఁడు రాకున్నఁ - గుటిలంపురావణకుంభకర్ణులను
జటులవిక్రములైన సకలరాక్షసులఁ - బటుముష్టినిహతుల భగ్నంబు చేసి
హాటకదీప్తుల నలరెడు నేడు - కోటలు లంకయుఁ గూలంగఁ దన్ని3970
ప్రళయంబు నొందించి భానుజుఁ గూడి - చలము కోపము మీఱఁ జనుదెంత మెలమి"
నని యిటు హనుమంతుఁ డాడువాక్యముల - మనముల నలరి యామర్కటేశ్వరులు
వినువీథి నత్యంతవేగులై దనుజు - వెనుకొని పోవ నావిధ మెఱుంగకయ
అటఁ గుంభకర్ణుండు నర్కజుఁ గొనుచుఁ - బటురయంబునఁ జొచ్చె బలియుఁడై లంక
రాజమార్గంబుల రా మేడలందు - రాజిల్లు నాగోపురంబులయందు

సుగ్రీవుఁడు మూర్ఛదేరి కుంభకర్ణుని విరూపునిగాఁ జేయుట

నొప్పెడిపురకాంత లొగిఁ బుష్పవృష్టి - యప్పుడు కురియంగ నర్కనందనుఁడు
దెలిసి యాపురవీథిఁ దెరగొని చూచి - వెలవెలనై కడు వెఱఁ గంది కుంది
“యిటు పట్టుపడితినే యీదైత్యుచేతఁ - బటుతరమూర్ఛచేఁ బడి యింతతడవు"
అని కరములఁ బట్టి యాదైత్యుచెవులు - పెనచి తమ్మెలతోడఁ బెఱికిరాఁ దిగిచి
బొటములతో ముక్కు బోసిపోఁ గఱచి - పటుగతి మీఁదికి భానుజుం డెగయ3980
నిమ్ములఁ బోనీక నేచి రాక్షసుఁడు - క్రమ్మఱ నాతనికా ళ్లొగిఁబట్టి
నేలతో నేసిన నెగసి సుగ్రీవుఁ - డేలినపతికడ కేగె నయ్యెడను.
సుర లాకసంబునఁ జోద్యంబు నొందఁ - దరుచరపతు లెల్లఁ దనుఁ జూచి మ్రొక్క
వారును దానును వచ్చి సుగ్రీవుఁ - డారామచంద్రుని యడుగుల కెరఁగ
నాలింగనము చేసె నంత రాఘవుఁడు - నాలోనఁ గపులెల్ల నానందమంది

రాయసురేశ్వరుం డటు ముక్కుఁ జెవులు - వోయిన నెంతయు బుద్ధిలో రోసి
"మును చెలియలి బన్నమునకు నై యాత్మ - నెనసిన సిగ్గులు నె గ్గొనరింప
వనజాప్తకులునితో వలవనిపైర - మున మగఁటిమితోడఁ బోరాడుచున్న
నాకారికడకు మానము గోలుపోయి - యీకష్టతనువుతో నేమని పోదుఁ?
బోరికి నుచితంబు పోవుట యనుచు - నారక్తపూరంబు లందందఁ గ్రమ్మి3990
తనువుల నిండ నుద్దండవర్తనుఁడు - ఘనతరరోషంబు గడలుకొనంగఁ
జేవురుచాయల సెలయేఱు లమరఁ - గా వచ్చు నీలాద్రికైవడి దోఁప
నటుగాక వీఁడు యుగాంతంబు నాఁటి - చటులాగ్ని యన రణస్థలికి నేతెంచి
యఱిమఱి గోపించి యగచరసేనఁ - దఱిమి దానవుఁ డత్యుదగ్రుఁడై మెఱసి
కడునుగ్రముగఁ గడకా ళ్లొగిఁ బట్టి - వడిఁ గ్రప్పి త్రిప్పి యుర్వరవ్రేసివ్రేసి
బిఱబిఱఁ బ్రేవులు పిడికిటితోనఁ - బెఱికిరాఁ గొందఱఁ బిడికిళ్ళఁ బొడిచి
నిబ్బరంబుగ దాచి నెరయ గుండియలు - ద్రొబ్బలు నురకంగఁ ద్రొక్కి పాదములఁ
బిడుగులఁ బోలెడు పెడచేతు లెత్తి - కడు నుగ్రముగ మన్నుఁ గఱువంగ నేసి
తనమీఁదఁ బ్రాకిన తరుచరావళుల - విన విస్మయంబుగా వే నిగ్రహించి
యగపడ్డరాక్షసు నైనను బట్టి - తిగిచి వేగమునఁ గుత్తికలోన వైచు4000
ఝంకారరవముల శవములు సేయు - హుంకారరవముల నుసురులు వెఱుకు
దివిజవిమానముల్ దిరుగుడుపడఁగఁ - దివిచి మర్కటులమీఁదికి నెత్తి వైచు
నెగసిన కపులతో నేటు దాఁకంగ - నగచరావలిఁ బట్టి యందంద వైచు
నెమ్ములు నురుముగా నేపారఁ ద్రిప్పి - యిమ్ములఁ గొందఱ నెడగల్గ వైచుఁ
గొందఱ నిరుగేలఁ గుదియంగఁ బట్టి - యందందఁ దాటించి యల్లంత వైచు
నీవానరులఁ జూడుఁ డేర్పడ ననుచు - లావునఁ గొందఱ లంకలో వైచుఁ
బెంపార నినుగట్టి పేర్చినకపుల - ముంపుమీ యని యబ్ధి మునుఁగంగ వైచు
నివ్విధంబున దానవేశ్వరుం డెలమి - నవ్వానరుల దిక్కులం దెల్లవైచు
మేదినియందును మిన్నులయందు - నేదిక్కులందును నెడము లేకుండఁ
బడిఁ జచ్చుకపులును బడి దొర్లుకపులు - బడి కూఁత లిడుకపుల్ భ్రమనొందు కపులుఁ4010
బడి తన్నుకొను కపుల్ పడి రోఁజుకపులు - పడియున్న కపులును బడియెడుకపులు
నై రణస్థలి యెల్ల నగచరాక్రోశ - మారాక్షసునిచేత నగ్గలం బయ్యె,
నాకుంభకర్ణుని యత్యుగ్రభీష - ణాకృతి కాలాంతకాకృతి యైన
నణఁగెఁ దారాపతి యణఁగె నంగదుఁడు - నణఁగె గవాక్షుఁ డున్నతిఁ దక్కె గజుడు
చలియించె ఋషభుండు శంకించె నలుఁడు - పెలుకురె నీలుండు బెగ్గిలెఁ బృథుఁడు
వెఱఁగందె శరభుండు వెఱచె ధూమ్రుండు - నురుకంపమును బొందె నొగిఁ బనసుండు
కడుభీతి నొందెను గంధమాదనుఁడు - నడరి చూచుచునుండె ననిలనందనుఁడు

చూడ భయంబొందె జ్యోతిర్ముఖుండు - జాడ చేకొని పాఱె జాంబవంతుండు
ఉలికిరి వెండియు నున్నవానరులు - కలయ నంతటఁ గుంభకర్ణునిఁ జూచి
ఘనబాహుబలుఁడు లక్ష్మణుఁడు గోపించి - చనుమర నాటించి శరము లేడింటి4020
మఱియుఁ బెక్కింట లక్ష్మణదేవుఁ డేయ - గఱకు రాక్షసుఁడు లక్ష్మణుని గైకొనక
బలువిడి రాఁగ నాపాదమస్తకము - లలమి ప్రాకిరి కపు లాదైత్యుమేన
నలిగి మీసములు నుయ్యాల లూఁగుచును - కలుషత దోఁకలఁ గలయఁ జుట్టుచును
నఱిముఱిఁ గవిసి యయ్యైసంధులందు - వఱలంగ లాగులు వైచి హత్తుచును
జిందఱ వందఱ చేసిన నసుర - డెందంబులోని కడిందికోపమున
పటుసత్త్వులై తనపై నున్న కపులఁ - జటుల మత్తేభంబు జాడించు కరణి
జలకేళిఁ దనిసిన సమదసూకరము - వెలయ బిందులు రాల విద్రిచినభంగిఁ
బ్రళయకాలమునాఁటి బ్రహ్మాండతలము - డులడుల చుక్కల డుల్చుకైవడిని
దనమీఁదఁ బ్రాఁకిన తరుచరావళులఁ - దనువు గదల్చి యద్ధరణిపైఁ గూల్చె
నప్పుడు విస్మితుండై కుంభకర్ణుఁ - దప్పకఁ గనుఁగొని తనకన్నుగవల4030
నిప్పులు రాలంగ నిగిడి కోపమున - నప్పన్నగాధీశునాకృతి గలిగి
కర మొప్ప కాంచనకార్ముకం బెత్తి - నిరుపమబాణతూణీరము ల్బిగిచి
భీమవిక్రమకళాభేద్యుఁడై కనలి - రాముండు నడుచు సంరంభంబుఁ జూచి
సమరమహారంభచతురు లొండొండఁ - దమకంబు నిండ నుద్దండవర్తనులు
పరుషాద్రిపాషాణపాదపావళులు - ధరియించి యుగ్రులై తరుచరాధిపులు
నొగి సప్తపాతాళములును భేదిల్ల - నొగిఁ గూర్మ మగలఁగ నుదధులు గలఁగ
దిగిభంబు లడరంగ దివి తల్లడిల్ల - నగచరాధీశుల కతిధైర్య మొదవ
నదిమి కుప్పించి మిన్నగలఁ బెల్లెగసి - యుదితవిక్రములు మహోగ్రభీకరులు
సురసిద్ధసాధ్యులు సొరిదిఁ గీర్తింప - గర మర్థి నడువ రాక్షసుఁ డెదురేగె
నాపతిముందట నావిభీషణుఁడు - కోపంబుతో గదఁ గొని శౌర్యమునను4040
గడువేగమునఁ గుంభకర్ణునిమ్రోల - బుడమి చలింప నప్పుడు వచ్చి నిలిచె
నావిభీషణుఁ జూచి యనియె నవ్వుచును - "రావణుతమ్ముఁడ రాక్షసేశ్వరుఁడ!
విను విభీషణ నీదు విక్రమంబునకు - నను వైనతఱి యిది; యధిపతియొద్ద
నిన్నరనాథుని హృదయంబె పట్టు - మన్నదమ్ములపాడి యని స్రుక్కవలదు
పూని యెన్నఁడు నిన్నుఁ బొంద వాపదలు - భానువంశ్యునికృపఁ బడసితి గాక!
నారాముదయ గల దటుమీఁద నీవు - సారదయోదయ! శ్లాఘ్యచిత్తుఁడవు;
లంక సద్గుణగణాలంకృతి నేల - నింక నెవ్వరు గల రిట నీవె కాక?
సాహసబలమహోత్సాహంబు మిగిలి - యాహవంబున వేగ మడరి నాయెదుట
మగతనంబును బాడి మనసునఁ దలఁచి - తగ నీవు నాతోడఁ దాకు మటంచుఁ

బలికితి గాని యీపట్టున నిలువ - వల దొక్కఁడైనను వలయు వంశమున"4050
ననిన విభీషణుం డన్నతో ననియె - “దనుజకులం బెల్ల దగ్ధమై పోవు

విభీషణుఁడు కుంభకర్ణునికి నీతిఁ జెప్పుట

నను భయంబున మనయన్నతోఁ దెలియ - ఘన మైన నీతిప్రకారంబు లెల్లఁ
జెప్పితి నేను నేర్చినయంతవట్టు - చెప్పిన నామాటఁ జేకొనఁ డయ్యె.
నటుఁగాన నిన్నును నన్నను బాసి - యిటు వచ్చి శ్రీరాము నేఁ బొడగంటి"
నని చెప్పుచును దనయంతరంగమున - దనుజేశు నవినీతిఁ దలపోసి పోసి
కన్నీరు దొరఁగంగఁ గడుదుఃఖ మంది - యన్నఁ జూడఁగలేక యవ్వలఁ దొలఁగె
నారాఘవేశ్వరుఁ డనుజన్మయుక్తుఁ - డై రణోద్యోగుఁడై హరులతోఁ గూడ
ఘనరౌద్రరసము రాక్షసరూపుఁ దాల్చి - యనికి నేతెంచెనో యనఁదగువానిఁ,
జారుకోటీరభూషణములవాని - వీరరసావేశవేషంబువాని,
ధీరుఁడై కపులను దెగఁజూచువానిఁ - దోరంపునెత్తుటఁ దోఁగినవాని,4060
కనుఁగొని మదిలోనఁ గడువెఱఁ గంది - మనుకులోత్తముఁడు రామక్షితీశ్వరుఁడు
“నారికై పుట్టిన నాకోప మెల్ల - నారిచేఁ జూపెద నాకారి” కనుచు
నార్చుచు వచ్చు నయ్యసురుకోపాగ్ని - నార్చెద శరవృష్టి నని బిట్టుఁ గవిసి
కరియాన నిజధర్మగతిఁ జెందు ననెడు - కరణి దిక్కరులు ఘీంకారము ల్సేయ
నింక నీఱుగఁజేయు నీరామునలుక - లంకేశు ననుమాడ్కి లంక ఘూర్ణిల్ల
నెరయంగ జగములన్నియుఁ జెవుడ్పడఁగ - గురిలేనిరవముగా గుణము మ్రోయించె
నాగుణధ్వని విని యలుకమై నెదురు - గా గర్వమునఁ గుంభకర్ణుండు రాఁగ
మానైన దర్పంపుమాట లింపార - వానితో ననియె నావనజాప్తకులుఁడు
“ఏర రాక్షస నీకు నెదురంగరాదు - ధీరుఁడవై యింకఁ దెగువ వాటించి
యమరులు మెచ్చంగ నమరి నాయెదుట - సమరంబు సేయంగఁ జక్కఁగా నిలువు4070
మటుఁగాక కపటుండవై మాయఁ బన్ని - యెటుపోయినను నిన్ను నేల పోనిత్తుఁ
గానవే యని పోయి కమలజుఁ గన్నఁ - గావ నాబ్రహ్మలోకము నాకు నెదురె?
కావవే యని పోయి కఱకంఠుఁ గన్నఁ - గావ నారుద్రలోకము నాకు నెదురె?
కావవే యని పేర్చి కమలాక్షుఁ గన్నఁ- గావ నావిష్ణులోకము నాకు నెదురె?”
యని పేర్చి పలికిన నారాముపలుకు - విని కుంభకర్ణుండు విపులంబు గాఁగ
దిగులొంది యగచరాధిపుల గుండియలు - పగిలి నిల్వులతోడఁ బ్రాణము ల్వోవ
జగతీతలము నాకసము దిక్కులెల్ల - నగల రాక్షసుఁ డట్టహాసంబు చేసి
నలువొంద నారామనరనాథుఁ జూచి - పలికె నుద్భటరణప్రౌఢి దీపింప
"వెడఁగుమాయల వన్ని వెఱచి నీచేత - మడియంగ నే నల్ల మారీచు గాను;
రయమున నీచేత రఘురామచంద్ర! - భయమునఁ జావఁ గబంధుండఁ గాను;4080

గ్రమ మొప్ప నీశరఘట్టనచేత - రమణమైఁ గూల విరాధుండఁ గాను;
అనిమొన నొకకోల నవనిపైఁ గూల - నినకులాధీశ్వర! యే వాలిఁ గాను;
చేతివి ల్లిచ్చి నీచే భంగ మొందఁ - బూతాత్ముఁ డగు ఋషిపుత్రుండఁ గాను;
రావణుతమ్ముఁడ రాక్షసేశ్వరుఁడ - దేవకంటకుఁడను దీప్తవిక్రముఁడ
న న్నెఱుంగవె? రామ! నగచరకోటి - క్రొన్నెత్తు రానిన కుంభకర్ణుఁడను;
యెఱుఁగక బ్రహ్మయు నింద్రుండు నిన్నుఁ - గఱపిన బేలవై గర్వించి పుట్టి
యీతరుచరు నమ్మి యినకులేశ్వఁరుడ - నాతోడి యుద్ధంబునకు వచ్చి తీవు;
ఘనమైన పరుషరాక్షసభాషణములు - సనకాదియోగీంద్రసన్నుతుల్ గావు;
ఉరవడిఁ బఱతెంచు నుగ్రదానవులు - పరిచారికామరప్రతతులు గావు;
చలమున నార్చు రాక్షసభటోత్తములు - నలిఁ బాడు తుంబురునారదుల్ గారు,4090
వ్రాలుచు నీమీఁద వచ్చునాగాలి - యాలవట్టంబుల యనిలంబు గాదు,
యుద్ధరంగం బమృతోదధి గాదు - యుద్ధంబు మఱి కొలు వుండుట గాదు;
ఇ ట్టేల పుట్టితి వియ్యాజిలోన - నట్టిసౌఖ్యంబు నీ కవనీశ! కలదె?
యది చెప్ప నేల ని న్ననియెడి దేమి - యిదె చూడు నాగద యెట్టిదో? రామ!
దీనఁ బో గెలిచితి దేవసంఘముల - దీనికి సాటియె దివ్యాయుధములు
బలమును శౌర్యంబు బాహువిక్రమము - గలదేని ఘోరాజి గదియుము నన్ను
నెఱయ నీయందలి నిజశక్తిఁ జూచి - మఱి నిన్నుఁ జంపెద మానవాధీశ!

శ్రీరామునిచేఁ గుంభకర్ణుఁడు గూలుట

యనుటయు రఘురాముఁ డలిగి వేగమున - ఘనశిలీముఖములు గడుఁ బెక్కువేలు
నావాలి నేసిన యట్టిబాణంబు - దేవకంటకుమీఁదఁ దివిరి యేయుటయు
జలబిందువులు గ్రోలు చాతకం బనఁగ - బలువిడి నాబాణపఙ్క్తులు గ్రోలి4100
కర ముగ్రమైన ముద్గరము ద్రిప్పుచును - బరువడి వానరపతులఁ దోలుచును
యెదురుగాఁ జనుదెంచు నింద్రారిఁ జూచి - మది లెక్క సేయక మానవేశ్వరుఁడు
కవిసి యుద్భటగదాకలితహ స్తంబు - నవలీలఁ దెగనేసె ననిలబాణమున
దానిపాటునకుఁ గొందఱు తరుచరులు - నానావిధంబుల నలుదెసఁ బాఱ
నది మీఱి పాఱంగ నలవి గాకున్నఁ - జిదిసి వానరులు చచ్చిరి దానిక్రింద
నున్న దాపలిచేత నొకపెద్దవృక్ష - మన్నరభోజనుం డవలీలఁ బెఱికి
యింద్రాదు లడరంగ నేతేర రాముఁ - డైంద్రబాణంబున నదియును దుంప
నాభూరితరబాహు లమరు లుప్పొంగ - భూభాగ మగల నద్భుతముగాఁ దునిసి
పెక్కండ్రుకపులు నిర్భిన్నులై క్రింద - నొక్కటఁ బడి కూల నుర్విపైఁ బడియె.
నిటు రెండుభుజముల నినకులేశ్వరుఁడు - పటుబాణములఁ ద్రుంప బలభేదిచేతఁ4110
గడిమి వజ్రమున రెక్కలు ద్రుంపఁబడిన - నడగొండయును బోలె నలినార్చి యార్చి

చేతులు ముక్కును జెవులును లేక - యాతతంబున వికృతాకారుఁ డగుచు
నరుగుదెంచుచునున్న యాకుంభకర్ణు - నురవడిఁ గనుఁగొని యుర్వీశ్వరుండు
దురమున నీకష్టుఁ ద్రుంతు నే ననుచు - సరభసంబున నర్ధచంద్రబాణములు
దెగ నిండ రెండు సంధించి ఖండించె - జగములు మెచ్చఁ దచ్చరణయుగంబు
పదములు దెగియును బాహువు ల్దెగియు - గుదియక యత్యుగ్రకోపుఁడై నడిచి
బడబాగ్నిచక్రంబుపగిది నాననము - కడువికృతంబుగాఁ గావించుకొనుచు
బలువిడి భాస్కరుఁ బట్టెడురాహు - నలవాటుఁ గైకొని యారాముఁ గదిసెఁ
గదిసిన నాకుంభకర్ణునినోటఁ - బొది గొన్న నిష్ఠురభూరిబాణములు
ఇనకులేశ్వరుఁ డేయ నేర్పడ నొక్క - దొనకోల లొకదొన దూరినకరణి4120
ఘనమైన యాయంపగమి నోరు నిండ - దనుజుడు సింహనాదము సేయ రాక
యేపారువికృతపుటెలుఁగుహుంకృతులు - చూపుల జంకెలు సూపుచు వచ్చె.
వచ్చిన యాదైత్యవల్లభుమేన - నచ్చుగా దృష్టించి యైంద్రాస్త్ర మేసెఁ
బ్రదర మమ్మెయి రఘుపతి యేయుటయును - నదియును మధ్యందినార్కుచందమున
దలపోయ నాబ్రహ్మదండంబుపగిది - వలతియై నిగుడుచుఁ బవనునికరణి
నెఱయ లోకములెల్ల నిండ నొండొండ - నెఱమంట లొలుకుచు నేపుతో వచ్చి
కుంభకర్ణుని ఱొమ్ము గొని యుచ్చి పాఱి - కుంభిని నాటె దిక్కులు మ్రోయుచుండ
నంతలో మఱియును నారాఘవేంద్రుఁ - డంతకబాణ మత్యంతవేగమున
సంధించి యేసిన సకలదిక్కులును - బంధురంబుగ మ్రోయ బ్రహ్మాండ మవియఁ
బ్రకటంబుగా భూమి పటపటఁ బగుల - సకలభూతంబులు చైతన్య మెడలఁ4130
గలయంగ శతకోటికాలచక్రములు - బలుపెక్కి యొక్కటై పఱతెంచుభంగి
వ్రాలినబడబాగ్ని వడి వచ్చుకరణిఁ - గాలకూటంబు మారణ మైనపగిది
విచ్చలవిడిఁ బర్వి వేగంబు మెఱసి - వచ్చి యాబాణంబు వడిఁ ద్రుంచివైచెఁ
బటునీలగిరిశృంగభాతితో నున్న - కుటిలరాక్షసుతల ఘోరంబు గాఁగఁ
బుడమిపై నాదైత్యపుంగవుశిరము - పడునప్డు లంకలోపల వడిఁ బడియెఁ
బొడవైనగోపురంబులును మేడలును - బొడిపొడి యయి రాలి పుడిమిలోఁ గలయఁ
బధికోటు లగచరపతు లోలి మ్రగ్గ - నుదధిలో జలచరయూథముల్ బెదర
వసుధపై సగమును వనధిలో సగము - నసురదేహము గూలె నద్భుతం బడర.
నారవంబున నబ్ధు లన్నియుఁ గలఁగె - ధారుణి వణఁకె దిక్తటములు పగిలె.
లంకాధినాథు నుల్లము వ్రయ్య లయ్యె- లంకలో నెల్ల కోలాహలం బయ్యె4140
జగములు మోదించె సంతోషవార్ధి - నగచరాధిపు లోలలాడి రందంద
రవికులాధీశ్వరు రఘురామచంద్రు - వివిధభంగుల సురల్ వినుతించి రపుడు
ఘనుఁడు రాముఁడు కుంభకర్ణుని జూచి - తనలోనఁ జిఱునవ్వు దళుకొత్తుచుండ

దేవసంఘములకు దిక్పాలకులకు - భావింప నెక్కు డీపడినరాక్షసుఁడు
ఇంక లోకములకు నెన్నండు నొండు - శంక లే దని మది సంతోష మందె
నప్పుడు కరమర్థి నాహవలక్ష్మి - నుప్పొంగి కైకొని యుజ్జ్వలుం డయ్యె
గడునుగ్రరాహువుఁ గబళించి పిదప - విడిచిన వెలుగొందు విమలార్కుఁ డనఁగ
దదనంతరంబ యాదానవకోటి - మదిలోన నెవ్వగ మల్లడి గొనఁగ
విన్ననై వదనము ల్వెలవెలఁ బాఱ - నున్నరావణుఁ గాన నురవడిఁ బాఱి
“దేవ! నీతమ్ముండు త్రిదశాంతకుండు - వావిరి నగచరావళి నెల్లఁ దోలి4150
దెసలు భూభాగంబు దివియుఁ దా నగుచు - నసమసాహసబలాహవకేళి వ్రాలి
నెలకొని దుగ్ధాంబునిధి మందరాద్రి - గలఁచి యాడెడుక్రియఁ గపికులాంభోధి,
నిక్క డక్కడఁ జేసి యింద్రాదు లెల్ల - వెక్కసపడఁ బోరి వివశుఁడై తూలి
యంత శ్రీరాముని యధికబాణాగ్ని - నెంతయు దగ్ధుఁడై యిలమీఁదఁ ద్రెళ్లె"
నని కుంభకర్ణుఁ డయ్యనిలోనఁ బడుట - దనుజులు చెప్ప నాదానవేశ్వరుఁడు
తనపాటు నింకఁ దథ్యం బన్నకరణిఁ - గొనకొన్న బలుమూర్ఛఁ గుంభినిఁ బడియె.
నతికాయుఁ డధికశోకాయత్తుఁ డయ్యె - ధృతి దూలి శోకించె దేవాంతకుండు
దిక్కు దప్పినమాడ్కిఁ ద్రిశిరుండు పడియెఁ - దక్కక యానరాంతకుఁడు మ్రాన్పడియె
దనుజవీరులు మహోదరమహాపార్శ్వు - లును మహాలోకవిలుంఠితు లైరి.

రావణుండు కుంభకర్ణుని మరణమునకు శోకించుట

బలుమూర్ఛ నంతటఁ బాసి రావణుఁడు - పలుమాఱుఁ దమ్మునిఁ బలవింపఁ దొడఁగె.
“వడిఁ దేర్చు రాఘవవైరాంబురాశి - నెడపక యే నింక నేతెప్ప గడతు
రామలక్ష్మణులను రణములోఁ జంపు - దేమెయి? నీ వని యే నున్నచోటఁ
జటులరాఘవమహాశరవహ్నిశిఖల - నిటు నేలఁ గూలితి వేకాంగవీర!
నిద్రారతుండవు నేఁ డిట్లు దీర్ఘ - నిద్ర గైకొంటె? నిర్ణిద్రవిక్రముఁడ!
కులిశధారకు నైనఁ గూలనిమేను - యిల నరునేటున నిటుఁ గూలవలసె;
నంతకునకు నీవ యఖిలంబు నెఱుఁగ - నంతకుం డన నుంటి వారూఢశక్తి
నంతటి నీకు నీయవనిలో నిప్పు - డంతకుఁ డయ్యెనే యకట రాఘవుఁడు?
నిద్ర మేలని నీవు నిష్ఠురవృత్తి - రుద్రుఁడవై తమ్ము రూపడం తనుచు
నిద్రివిద్రావణుం డాదిగా సురలు - నిద్రఁ బో రెన్నఁడు నెరసినభీతి
నీ వాజిఁ ద్రుంగుట నిర్జరు లింక - నేవిధంబున నన్ను నేల కైకొండ్రు?4170
కుల మెల్ల రక్షించుకొఱకు నాతోడఁ - జలమునఁ బలుమాఱు సద్బుద్ధి చెప్ప
వినక విభీషణు వెసఁ దన్ని వెడల - చనుమన్న పాపంబు సైఁచునే నన్నుఁ?
గడుకొని నీ వాదిగా బుద్ధిమంతు - లుడుగక చెప్పిన యుచితోక్తు లెల్ల
నెమ్మితో విననైతి నిన్నుఁ గోల్పడితి - నమ్మిన జయలక్ష్మి నా కేల కలుగు?

బలిమిమై నావలపలిమూపుభంగిఁ - గలహరంగంబునఁ గడిమి వాటించి
పటుబాహుబల మేది పడితి వీ వాజి - నిటమీఁద దిక్కు నా కెవ్వరు గలరు?"
అని కుంభకర్ణుని నందందఁ దలఁచి - వనట నిట్టూర్పులు వడిఁ బుచ్చి పుచ్చి
పరితాప మనియెడి బడబాగ్ని గలిగి - పెరిగెడిలాలయన్ ఫేనంబు గలిగి
వెడలుకన్నీ రను వెల్లువ గలిగి - కడలేనివగ పను కరుడులు గలిగి
ప్రకటరోదన మను రావంబు గలిగి - చకితత్వ మనియెడి చలనంబు గలిగి4180
మునుకొని శోకసముద్రుఁడై పెద్ద - వెనుఁబడి యెంతయు వికలుఁడై యున్న
యారావణునిఁ జూచి యప్పు డొక్కింత - ధీరత వాటించి త్రిశిరుండు పలికెఁ.
"బదిలంబు దప్పి యిబ్భంగి శోకించె - దిది యేమి? దేవ! నీ వితరులమాడ్కి
వనజాసనునిచేత వరమును గొన్న - ఘనశక్తి నీయందుఁ గలిగియుండఁగను
అవిరళమంత్రపూతాస్త్రము ల్వజ్ర - కవచంబు నీయందుఁ గలిగియుండఁగను
ఉరుతరగతి గల యుజ్జ్వలరథముఁ - గర మొప్ప నీకును గలిగియుండఁగను
శోకింతురే నన్నుఁ జూడు మొక్కింత - నీ కెదు రెవ్వరు? నిర్జరవైరి!
వేవేగ యవలీల వెడలి రాఘవుని - నీవిక్రమంబున నేలపైఁ గూల్పు;
మిట శోక ముడుగు నీ వింతయ చాలు - నట నేను బోయి మహాజిరంగమున
నతులవిక్రమకళాహంకారవృత్తి - నతిశూరుఁ డితఁ డన నంతటఁ బేర్చి4190
గరుడుండు పాముల ఖండించుమాడ్కిఁ - దరుచరావళి నెల్ల ధరణిఁ గూల్చెదను
సురపతి వృత్రుని స్రుక్కించుభంగి - హరుఁ డంధకాసురు నణఁగించుపగిది
రామునిఁ ద్రుంచెద రణములో నిప్పు; - డీమెయిఁ బోయెద నెలమి న న్ననుపు"
మనిన రావణుతోడ నప్పుడు కడఁగి - ఘనబాహుబలుఁ డతికాయుండు పలికె.
“యింత శోకింపంగ నేటికి నీకు? - బంతంబుతో దైత్యబలములఁ గూడి
యేను బోయెద నంపు మిటఁ జిత్రముగను - గాననంబులు గాల్చు కార్చిచ్చుపగిది
విపులబాణంబుల విశదంబు గాఁగఁ - గపులతో రామలక్ష్మణులఁ జంపెదను"
అని పల్కునపుడు నరాంతకుఁ గూడి - యనుపమబలుఁడు దేవాంతకుఁ డనియె.
“నే మిద్దఱముఁ బోయి యీక్షణంబునను - రామలక్ష్మణుల మర్కటులఁ ద్రుంచెదము"
అనిన మాటలకు దైత్యాధీశ్వరుండు - దనశోక ముడిగి మోదంబున నుండి4200
తనయులతోఁ గూడి తద్దయు నొప్పె - ననిమిషగణయుక్తుఁ డగునింద్రుమాడ్కి
నవ్విధంబున నుండి యారావణుండు - నవ్వుచుఁ గొడుకుల నలువురఁ జూచి
"రామలక్ష్మణుల మర్కటసైన్యములను - భీమాస్త్రములఁ జంపి పేర్చి రం"డనుచు
దనతమ్ము లగుమహోదరమహాపార్శ్వు - లను వీడుకొలిపె “నాలము సేయుఁ” డనుచు
మాకతంబునను నీమనుజాశనుండు - చేకొని సీతకై శ్రీరాముఁ దొడరె
నని యరిషడ్వర్గ మారావణునకు - మునుమున్నె రాము నిమ్ముల దాఁకఁ బోవు

పగిది నాయార్వురు బ్రహ్మాండభాండ - మగలంగ నార్చుచు నని కేగునపుడు

అతికాయమహోదరులు మొదలగువీరులు యుద్ధమునకు వెడలుట

భూరిశారదఘనస్ఫురణంబు గలిగి - యైరావతేభంబునంశంబు గలిగి
తనరారుచున్న సుదర్శనేభంబు - నినుఁ డస్తశిఖరిపై నెక్కినకరణి
నెక్కి మహోదరుఁ డేపారి నడిచెఁ - దక్కక నిశితాయుధంబులు వెలుఁగఁ4210
బటుజవసత్త్వప్రభావము ల్గలిగి - చటులంబు లైన యశ్వంబులఁ బూన్చి
యెసఁగు చాపంబును నింద్రచాపంబు - పస మీఱి సూర్యునిభంగి వెలుంగ
నరదంబుమీఁద నీలాభ్రంబ పోలెఁ - దిర మైన వేడ్కతోఁ ద్రిశిరుండు వెడలె
వితతధనుర్వేదవిద్యాఢ్యుఁ డైన - యతికాయుఁడును నప్పు డధికతేజమున
శరచాపఖడ్గాదిశస్త్రాస్త్రసమితిఁ - గర మొప్పి సూర్యప్రకాశమై వెలుఁగఁ
దనరారు కనకరథం బెక్కి వెడలె - ఘనభూషణద్యుతిఁ గనకాద్రి యగుచు
సురవరఘోటకస్ఫురణఁ జెన్నొంది - యురుభూషణప్రభ నుజ్జ్వలంబైన
యవదాతహయము నరాంతకుఁ డెక్కెఁ - బ్రవిమలతేజోవిభాసితుం డగుచు
శక్తి యుద్భటబాహుశక్తిమైఁ దాల్చి - శక్తిపాణియుఁ బోలె సన్నుతి కెక్కి
దీపితగదఁ దాల్చి దేవాంతకుండు - రూపింప విష్ణునిరూపున నడిచె.4220
గురుగదాపాణియై గుహ్యకేశ్వరుని - యరుదైనకడిమి మహాపార్శ్వుఁ డొప్పెఁ
గాలచక్రంబులగతి నుజ్జ్వలంబు - లైలీలఁ బెక్కైన యరదముల్ వెడలెఁ.
గొండలవడువున గోటానకోట్లు - గండుమీఱిన మదగర్వముల్ గలిగి
దండిమై వెడలె నుద్దండతహస్త - దండంబు లొప్ప వేదండసంఘములు
హేషారవంబుల నెల్లదిక్కులను - ఘోషింపఁజేయుచు గుఱ్ఱము ల్వెడలెఁ
గాలకింకరసమాకారంబు లమరఁ - గాలుబలంబు లుగ్రత నేఁచి వెడలెఁ
జతురంగబలము లీచందంబు నొంది - యతులితం బగుటయు నప్పుడు నడుమఁ
బ్రళయకాలార్కులభంగి నెంతయును - వెలుఁగొంది రాదైత్యవీరు లార్వురును
అతిశుభ్ర మగు శరదభ్రంబు లొప్పు - గతివార పుండరీకంబు లొప్పారెఁ
గడిమిమై గెలుతుము కాదేనిఁ జత్తు - ముడుగ మెబ్భంగి రణోత్సాహ మనుచు4230
నడచిరి కలనికి నానావిధముల - నెడపక పంతంబు లిచ్చుచు వారు
అప్పు డొండొరువులయాహ్వానములను - జెప్పఁ జోద్యం బైన సింహనాదముల
రథఘోషములను దురంగహేషలను - పృథులదంతావళబృంహితంబులను
గర ముగ్ర మగు పదఘట్టనధ్వనులు - నిరుపమధ్వజకింకిణీనిస్వనములఁ
బటహభేరీశంఖభయదనాదములఁ - బటుతరనిస్సాణభాంకారములను
దిక్కులు ఘూర్ణిల్లె; దివి పెల్లగిల్లెఁ; - జుక్కలు డుల్లె; వాసుకి యొడ్డగిల్లె;
మేరువు గంపించె; మేదిని వణఁకె; - భార మోర్వక దిగిభములు చలించె;

నటు దానవానీక మాకోట వెడలఁ - బటుభయంకరవృత్తిఁ బ్లవగవల్లభులు
భూనభోంతరము లాస్ఫోటనధ్వనులఁ - బూని యొక్కట నిండ భూరిసత్త్వముల
దలకొని గిరులును దరువులు వైచి - చెలగించి రప్పుడు సింహనాదములఁ4240
జలమున దైత్యులు చటులబాణములు - బలువిడి గురిసిరి ప్లవగులమీఁద
నసురావళికి మున్నె యాకపివరులు - నసురులఁ జంపంగ నడరి పెల్లారి
కపులకు మున్నె రాక్షసు లుగ్రవృత్తిఁ - గపులఁ జంపెద మని కడక వాటించి
యసమునఁ జలము పెంపార నొండొరుల - వసుమతిపైఁ బడవైతురు కినిసి
యసురులచేతిశస్త్రాస్త్రంబు లొడిసి - వెసఁ బుచ్చి పెళ్లున విఱుతురు కపులు;
కపికోటిచేతివృక్షంబులు గిరులు - కుపితులై విఱుతురు క్రూరదానవులు
కపుల కాళ్ళను బట్టి కదిసి రాక్షసులు - కపులతోడనె మహోగ్రతను వేయుదురు
అసురుల కడకాళ్లు నలమి వానరులు - నసురులతోడనే యడఁతురు బెట్టు
అటుపోర జర్జరితాంగులై నేలఁ - గుటిలదైత్యులుఁ గపికోటులుఁ ద్రెళ్లి
దురములోఁ బడియు నెత్తురులు గ్రక్కుచును - బొరిబొరి మూర్ఛలఁ బొంది యంతటను4250
దెలిసి వానరులును దేవశాత్రవులు - కలిసి కయ్యము సేయఁగా నందుఁ గపులు
దానవుతో నెత్తి దానవు వేసి - యేనుఁగుతో నెత్తి యేనుఁగు నేసి
తురగంబుతో నెత్తి తురగంబు నేసి - యరదంబుఁ గొని కరి నడరంట నేసి
కరి నెత్తుకొని తురంగముఁ బడవైచి - తురగంబు నెత్తి దైత్యుని డొల్లనేసి
యురుసత్త్వధీరులై యుగ్రత నార్చి - తరుచరవీరులు దర్పంబు మెఱసి
పొరిఁ బొరి నిబ్బంగిఁ బొరిపుచ్చుటయును - సురరిపు ల్గొందఱు స్రుక్కుటఁ జూచి
రయమునఁ గోపంబు రంజిల్ల దైత్య - చయమును వానరసమితిపైఁ గదిసి
ప్రదరంబు లేసి చక్రంబుల నేసి - గదల నొప్పించి ఖడ్గంబులఁ ద్రుంచి
భిండివాలంబులఁ బీచంబు లణఁచి - ఖండించి సురియల గండలు బరులు
కుంతశూలంబుల గ్రుచ్చి వానరుల - నింతలింతలు చేసి యెసఁగి యార్చుటయు4260
నంతటఁ బోవక యగచరు లార్చి - యంతంత కడరి దైత్యావళిఁ బట్టి
తరుషండములఁ బర్వతప్రకరముల - నురవడి నెత్తి యత్యుగ్రత వైవఁ
బడియెడిదైత్యులు పాఱుదైత్యులును - నుడుగక యందంద నొరలుదైత్యులును
గలయంగ నెత్తురు గ్రక్కుదైత్యులును - పొలుపరి నేలపైఁ బొరలుదైత్యులును
అందంద నట్టలై యాడుదైత్యులును - మంది ప్రత్యర్థుల మఱచుదైత్యులును
నెక్కినరౌతుల నిటునటుఁ బడఁగ - లెక్కచేయక కరాళించుగుఱ్ఱములు
పక్కెర లూడంగఁ బఱచుగుఱ్ఱములు - దిక్కులు సుడివడఁ దిరుగుగుఱ్ఱములు
కీ లెడలినక్రియ గెడయుగుఱ్ఱములు - కూలి కాళ్లను దన్నుకొనెడుగుఱ్ఱములు
వికలంబులై పోరు విచ్చుగుఱ్ఱములు - నొకరూపు నేర్పడకుండుగుఱ్ఱములు

కరములు దునిసినఁ గంపించుకరులు - వెరవారఁ గొమ్ములు విఱిగినకరులు4270
మరలి లంకకు వెస మగిడెడికరులు - తిర మేది దిర్దిరఁ దిరిగెడుకరులు
కొండకైవడి వడిఁ గూలెడికరులు - కండతుండంబులై కలఁగెడికరులు
రథికసారథిరథ్యరహితరథములు - ప్రథితంబుగా భువిఁ బడురథంబులును
వారగండ్లును బడ్డ వరరథంబులును - నారగఁ దలక్రిందు లగురథంబులును
కీళ్లెల్లఁ దప్పి మగ్గినరథంబులును - త్రాళ్లెల్లఁ ద్రెళ్లి పొందనిరథంబులును
చాలంగ నుగ్గునూ చగురథంబులును - నాలంబులోఁ దఱు చగుటయుఁ జూచి
సురఖేచరాదికస్తోమంబు చోద్య - తర మని యాత్మలోఁ దద్దయు మెచ్చ
నప్పుడు కినిసి నరాంతకుం డార్పు - లొప్ప నిజాస్యంబు నుఱవడిఁ బఱపి
యసురుల నోడకుం డనుచు వానరుల - నసమునఁ గిట్టి బెట్టగలించి తాఁకి
నెలకొని యొక్కొక్కనిమిషంబులోన - నిలఁ గూల్చె నేడునూఱేసివానరుల4280
సురపతిశౌర్యంబు సొంపారుచుండ - గిరుల వ్రేయుచును నేగినత్రోవ వోలెఁ
దరుచరకోటులుఁ దఱచుగాఁ బడుట - నిరవొంద వాఁడు పోయినత్రోవ యొప్పె
నేవానరుండైన నేఁచి కోపమున - భావంబులోఁ దన్నుఁ బరిమార్పఁ దలఁచు
నంతరంగముఁ జొచ్చి యరయుచందమున - నంతకుమున్ను తా నతనిను క్కణఁచు
నేకపియైనఁ ద న్నెదురంగఁ దలఁచి - భీకరుండై గిరిఁ బెరుకంగఁ జూచు
నంతకు మున్ను తా నధికరౌద్రమున - నంతంత దగ్గరి యతనిరూ పణఁచు
నేబలీముఖుఁ డైన నే పగ్గలించి - తా బెట్టు గాఁగఁ బాదప మెత్తఁ దలఁచు
నంత కంతకు హెచ్చి యతిభీషణముగ - నంతకుమున్నె తా నతనిగీ టణఁచు
నంతటఁ బోవక హయము పైఁ బఱపి - యంతంత పెనుగుంపు లైనవారుల
ప్రేవులు ద్రొబ్బ పెల్లుగా నురుము - గా వివిధములైన గతులఁ ద్రొక్కించు4290
గుండెలు వగులంగ గోలెమ్ము లగల - నొండొండఁ దాఁకించి యుర్వరఁ గూల్చు
నలుకతోఁ బ్రళయకాలానలుపగిదిఁ - దలకొని యెందును దానయై నిండి
వానరవరసైన్యవనములు విఱుగ - మాన కుగ్రతఁ బవమానుఁడై మోద
వానిశౌర్యంబును వానిశక్తియును - వానరు లెల్ల నోర్వఁగలేక యపుడు
వికలులై యుండిరి విస్మితు లగుచు - సకలదేవతలును జలియించి రపుడు
పటుభీతిఁ బొందిన ప్లవగసైన్యములు - నటు పేర్చుచున్న నరాంతకుఁ జూచి

అంగదనరాంతకుల ద్వంద్వయుద్ధము

యనయంబు కోపించి యంబుదపటల - మున నున్న సూర్యుండు మొనసినమాడ్కిఁ
గపిరాజతనయుఁ డంగదకుమారుండు - కపిసేనలోనుండి కడఁక నేతెంచి
"యోరి నరాంతక! యుగ్రతఁ గపుల - నీరసంబునఁ బేర్చి యేల చంపెదవు?
ఇంత చేసినను నీ విటు బంట వైతె? - యంతశూరుఁడవైన ననిఁ దాఁకు నన్ను”4300

ననవుడు నవ్వి నరాంతకుం డనియె; - “వనచర! నీ వెంతవాఁడవు నాకు?
నఖిలదిక్పాలుర నద టడంచితిని - నిఖిలదేవతల మన్నింప కేచితిని
అట్టి నాతోడ నీవా యెదిరెదవు? - పట్టి చట్టలు చీరి పాఱవైచెదను;
“ననుఁ జూతుగా" కన్న నగుచు నంగదుఁడు - “దనుజ! దశగ్రీవుదర్పంబు మాన్పి
పూనిన ఖరసూతిఁ బొరిగొని పిదప - నే నేగునపుడు నీ వెఱుఁగవే నన్ను?"
ననుడు దానవుఁడు కాలాహిచందమున - మునుకొని యార్పులు మ్రోయంగ వచ్చి
ఘనతరవిస్ఫులింగంబులు చెదర - ననయంబు తనశక్తి నంగదు వైవ
గరుడునివక్త్రంబు గదిసినంతటనె - పరచిన కాలసర్పంబును బోలె
నది వజ్రనిభ మైన యతనివక్షంబు - గదసినయంతనే ఖండంబు లయ్యె
వజ్రాయుధంబున వరశైల మణఁచు - వజ్రిచందంబున వాలినందనుఁడు4310
అఱచేతనే వాని హయముమస్తకము - పఱియలు వాఱ నిర్భరవృత్తి నేసెఁ
జెచ్చెఱ వేయంగఁ జేట్పడి నోరు - విచ్చుచు నాలుక వెడలఁబెట్టుచును
వెరవిడి కాళ్లును వెసఁ దన్నికొనుచు - ధరమీఁద బడి చచ్చెఁ దత్తురంగంబు
అటు తురంగము పడ్డ నన్నరాంతకుఁడు - చటులకాలానలజ్వలితాస్యుఁ డగుచుఁ
గెడయు మంచును బిడికిట మస్తకంబుఁ - బొడిచి యంగదు మూర్ఛఁ బొందించుటయును
అంతనె తెలిసి “నరాంతక! నీకు - నింతశక్తియుఁ గలదే” యని పేర్చి
పెరిఁగినపిడుగైన పిడికిట వాని - వరశైలనిభ మైనవక్షంబుఁ బొడిచెఁ.
బొడిచిన నెత్తురుల్ పొరిఁబొరి దొరఁగఁ - బొడిపొడియై ధరఁ బునుకలు సెదరఁ
గడుఘోర మైనసంగరభూమిలోనఁ - బడి నరాంతకుఁ డంత బ్రాణము ల్విడిచె.
నార్చిరి దేవత లామింటనుండి - యార్చిరి వానరు లవనీతలమున4320
దనుజాధినాథుని తనయునిపాటు - గని మహోదరుఁ డుగ్రకరిఁ బురికొల్పె.
ననుజుండు పడుటకు నడలుచు వాలి - తనయు నేచుటకు నుద్దండకోపంబు
ముప్పిరి గొనఁగ నిమ్ములఁ బరిఘంబుఁ - ద్రిప్పుచుఁ బఱతెంచె దేవాంతకుండు.
రవిమండలము బోలు రథ ముగ్రభంగి - నవని గంపింప నుద్ధతి దోలుకొనుచు
ద్రిశిరముల్ త్రేతాగ్నితెఱఁగున వెలుఁగ - ద్రిశిరుండు గవిసె నుద్దీప్తకోపమున
నప్పు డంగదుఁడు శాఖాయుతం బగుచు - నొప్పెడు నొకవృక్ష మురవడి బెఱికి
యడరంగ నార్చి దేవాంతకు వైవ - నడుమనె త్రిశిరుండు నలగఁగ నేసె;
నేసిన మీఁదికి నెగసి యంగదుఁడు - గాసిల్లి శైలవృక్షంబులు మిగుల
నడరింప నపుడు దేవాంతకత్రిశిరు - లెడబడఁగాఁ ద్రుంచి యెంతయు మించి
పరగించి రతనిపైఁ బటుతోమరంబు - లరుదారఁగాఁ జేరి యత్యుదగ్రతను4330
నంతటఁ బోవక యార్చుచు మఱియు - వింతగాఁ బొదువుచు వేగంబు మెఱసి
యావాలిసుతుమీఁద నధికరోషమున - దేవాంతకుఁడు వైచె దీపించి పరిఘ

దరమిడి సింహనాదంబు సేయుచును - దెరలక శరవృష్టి త్రిశిరుండు గురిసె.
నురుదంతి గొలిపె మహోదరుం డేఁచి - పరఁగించె నతనిపైఁ బటుతోమరములు
ఎనసి మువ్వురు దమయేపు చూపుటయు - ఘనరోష మొదవ నంగదుఁడు కోపించె;
దంభోళిక్రియ మహోదరుని యేనుంగు - కుంభస్థలము దాఁకఁ గుధరశృంగంబు
గెరలి వేసిన నది ఘీంకార మెసఁగ - నొరలి గ్రుడ్డులు వెలి కురికి చచ్చుటయు;
జయలక్ష్మి రాఘవేశ్వరుఁ బొందఁ గోరి - ప్రియమునఁ గైసేయఁ బెట్టియఁ దెరిచె
ననఁగ నాకరితల యటు వ్రస్సి యొప్పె - ననుపమం బైన ముత్యంబులు సెదర;
నంతటఁ బోక దేవాంతకు వ్రేసె - దంతిదంత మగల్చి తారాసుతుండు4340
అటు వ్రేటుపడి వాతహతిఁ జలియించు - పటుసాలవృక్షంబు పగిది దూగాడి
నెత్తురు గ్రక్కియు నెఱసాహసమునఁ - జిత్త మొక్కింతగాఁ జేసి యయ్యసుర,
పరిఘంబు గొని వ్రేసెఁ బర్వతతటము - కరణి నొప్పారు నంగదునురస్స్థలము
నంగదుండును దాన నవనిపై మ్రొగ్గి - యంగముతోడ ధైర్యము చిక్కఁబట్టి
కోపించి్రిదేవాంతకునిమీఁద నడువ - దీపితాస్త్రంబులఁ దిశిరుండు మూఁట
నావాలితనయుని నాత్మఁ గైకొనక - లావున ఫాలస్థలము నాట వేసె
నంత నీలుండును ననిలనందనుఁడు - పంతంబుతోఁ దోడుపడి రంగదునకు
నందు నీలుఁడును మహాశైల మెత్తి - యందందఁ ద్రిశిరుపై నార్చుచు వైవ

హనుమంతుఁడు మొదలగువారలు త్రిశిరాది రాక్షసవీరులఁ జంపుట

నశనిచందం బగు నస్త్రంబుఁ దొడిగి - త్రిశిరుండు నగ్గిరిఁ దెగనేసె నడుమ;
ధీరత వాటించి దేవాంతకుండు - వారియై యొప్పిన పరిఘఁ ద్రిప్పుచును4350
బలియుఁడై చనుదేరఁ బవమానసూనుఁ - డలుకతో రాక్షసు నౌదలఁ జూచి
బెడిదంబుగా వెసఁ బిడికిటఁ బొడిచె - బొడిచిన నప్పుడు పొరిఁబొరిఁ బండ్లు
డుల్లంగ నోరు బెట్టుగ దెర్చుకొనుచుఁ - ద్రెళ్లె దైత్యుఁడు గ్రుడ్లు దిరుగవైచుచును.
దేవత లార్చిరి దివినుండి యపుడు - దేవాంతకునిపాటు తెఱఁగొప్పఁ జూచి
త్రిశిరుండు కోపించి తీవ్రత నేసె - నశనివేగాస్త్రంబు లన్నీలుమీఁద
దగ వెండియును మహోదరుఁ డుగ్రవేగ - మగు నొక్కకరి నెక్కి యార్చుచు వచ్చి
కులగిరిపై వాన గురియుచందమున - నలువు దీపింపంగ నతనిపై నేసె
నానీలుఁడును వానియస్త్రసంతతులఁ - దా నెంతయును భిన్నతనుఁడునై నొచ్చి
యటు మూర్ఛ నొందియు నంతనే తెలిసి - పటుగతితోడ నభంబున కెగసి
తరువులతోడ నుద్ధతి మీఁది కెత్తె - ధరణీధరము మహోదరునిపై వైచె;4360
వైచిన దానిచే వారణయుక్తుఁ - డై చచ్చెఁ దల వ్రస్సి యమ్మహోదరుఁడు!
ధరమీఁద నమ్మహోదరుఁడు గూలుటయుఁ - దిర మైనకడిమితోఁ ద్రిశిరుండు పేర్చి
సరిగొందు నని పెక్కుశరములు నేసె - నరవాయి గొనక యాహనుమంతుమీఁదఁ

జెచ్చెఱఁ బర్వతశిఖరంబు విఱచి - తెచ్చి యారావణి త్రిశిరుపై వైచె;
నది నడుమనె తుమురై రాల నేసెఁ - ద్రిదశులు వెఱఁగందఁ ద్రిశిరుండు పేర్చి
హనుమంతుఁడును వానియరదంబుమీఁది - కనువారగా దాఁటి యత్యుగ్రముగను
సింగంబు గజములఁ జెలఁరేఁగి వచ్చు - భంగి రథ్యంబులఁ బటుగతిఁ జంపె
నాత్రిశిరుండును ననిలజుమీఁద - నాతతంబుగ శక్తి యడరించుటయును
బలుమంట లెగయంగఁ బఱతెంచుదాని - బలువిడిఁ బట్టి యప్పావని ద్రుంప
శక్తి ద్రుంచిన నిజశక్తి వాటించి - శక్తిజిహ్వయుఁ బోలు చటులాసిఁ గొనుచు4370
నచ్చెరు వైన రయంబు సొంపార - వచ్చి యాహనుమంతు వక్షంబు దాఁక
నేసిన నతఁడును వెస నఱచేత - వ్రేసె నారాక్షసువిపులవక్షంబు
నటు వ్రేటుపడి తనయడిదంబు వైచి - కుటిలరాక్షసుఁడు గ్రక్కున మూర్ఛనొందె;
ననిలజుం డటుఁబడ్డ యడిదంబుఁ బుచ్చు - కొని బిట్టుగా నార్చెఁ గుంభిని పగుల
నాలోనఁ దెప్పిరి యాత్రిశిరుండు - వాలిన పిడికిట వాయుజుఁ బొడిచె;
హనుమంతుఁ డంత నత్యంతరోషమునఁ - దనకటంబులు పొంగ దర్ప ముప్పొంగఁ
రూపించి యావిశ్వరూపుమస్తకము - నేపున ద్రుంచు సురేంద్రుచందమునఁ
జెచ్చెఱ దనుజుని శిరములు మూఁడు - నచ్చెరు వైన యాయడిద మంకించి
తెగనేసె నాదైత్యుతీవ్రకర్మంబు - దిగఁ బుచ్చుకొని త్రుంచు దైవంబుకరణి
దిశలు భూభాగంబు దివియు ఘోషింపఁ - ద్రిశిరుండు భూస్థలిఁ ద్రెళ్ళెఁ ద్రెళ్లుటయుఁ4380
బటురౌద్రమున మహాపార్శ్వుండు గినిసి - నిటలంబు బొమలును నెరి ముడివడఁగ
నలరునెత్తుటఁ దోఁగి యాశాకరీంద్ర - కరభీకరం బైన కనకచక్రముల
నురుమణిప్రభల నత్యుగ్రమై యముని - పరుషోగ్రదండంబు పాటిగాఁ గలిగి
యరుణపుష్పంబుల నరుణగంధమున - నురుతరం బగుచు నయోమయం బైన
యుదయార్కభాసమానోజ్జ్వలం బగుచు - నొదవు గదాదండ ముగ్రుఁడై తాల్చి
తనకోపశిఖి మండ దర్ప ముప్పొంగ - హనుమంతుమీఁద రయంబున నడువ
నెడ సొచ్చి యొక్కమహీధరం బెత్తి - యెడపక దైత్యుపై ఋషభుండు వైచె;
నడరి యంతటిలోన నమ్మహీధరము - దొడి వడ గదఁ గొని తుమురుగా వ్రేసె
జటులత గద ద్రిప్పి సమదుఁడై ఋషభుఁ - బటుసత్త్వమున మహాపార్శ్వుండు వైచె;
దానిచే వక్షంబుఁ దాఁకి యావృషభుఁ - డూనినమూర్ఛచే నొక్కింత దెలిసి4390
యాలోన వేగ మహాపార్శ్వుఱొమ్ము - వ్రాలినపిడికిట వ్రయ్యఁ దాటించెఁ
దాటించుటయు గదాదండంబు విడిచి - మేటిసత్త్వము దూలి మేదినిఁ బడియె;
నాగదాదండంబు నాఋషభుండు - వేగంబె కొనియార్చి వ్రేసిన దైత్యు
వ్రేసినవజ్రంబు వ్రేటునఁ గొండ - తో సరియై తల తుమురుగాఁ గూలె;
నటు మహాధ్వనితో మహాపార్శ్వుఁ డవని - బటుభయంకరవృత్తిఁ బడుటయుఁ జూచి

కరువలిచేఁ దూలు కారాకు లనఁగ - దిరిగి దైత్యులు నలుదెసలకుఁ జనిరి;

అతికాయుఁడు యుద్ధము చేయుట

ఆచందమున వార లవనిపైఁ బడుటఁ - జూచిన రోషవిస్ఫురణ శోభిల్ల
మిడుక లోకములెల్ల మ్రింగెద ననుచుఁ - గడగినక్రియ నతికాయుఁడు పేర్చి
వేయుసూర్యులభంగి వెలుఁగుచు మిగుల - నాయతం బైనట్టి యరదంబు నెక్కి
తనరార సింహనాదము చెలఁగించి - తనపేరు సెప్పి యుద్దండకోదండ4400
నిష్ఠురారావంబు నిగుడఁ గాలాగ్ని - కాష్ఠంబు లడగింపఁ గవయుచందమునఁ
గపిసేనపై మహోగ్రంబుగాఁ గవియఁ - గపులు నిశాటు నాకారంబుఁ జూచి
పటురౌద్రలీల నిప్పటి కుంభకర్ణుఁ - డిట వచ్చెనో యని యెంతయు బెదరి
కొందఱు మూర్ఛిల్లఁ గొందఱు వెఱువఁ - గొందఱు వెఱుగు చేకొని చూచుచుండఁ
గొందఱు వాపోవఁ గొందఱు గలఁగ - గొందఱు రామ చేకొనుమని మ్రొక్కఁ
బర్వినభీతిమైఁ బఱతెంచుకపుల - నుర్వీశ్వరుం డోడ కోడకుం డనుచుఁ
గలయ లోకములెల్లఁ గప్పి గర్జిల్లు - ప్రళయావసరమేఘపటలంబ పోలె
బెడిదంబుగాఁ బేర్చి పృథులవేగమున - నడతెంచుచున్న దానవనాథతనయు
నగ్గలికయు లావు నధికరౌద్రంబు - నగ్గతియును దవ్వులందె వీక్షించి
యనయంబు వెఱఁగంది యప్పు డారామ - జననాథుఁ డావిభీషణుఁ జూచి పలికె.4410
“బిడుగు మ్రోసినమాడ్కి బెడిదంపుమ్రోఁత - నడరి వచ్చుచునున్న యరదంబుమీఁద
నింద్రచాపముతోడ నెనవచ్చునట్టి - సాంద్రప్రభాయితచాప మొప్పారఁ
బరిఘగదాప్రాసపట్టసశూల - పరశుతోమరభిండివాలచక్రాది
వరదివ్యశస్త్రనిర్వాహంబుతోడ - నరు దైనయట్టి సింహధ్వజం బొప్ప
నలువొంద నార్చుచు నలుగురు సార - థులు తోల నొకవేయితురగము ల్పూన్చి
మూఁడుకన్నులు గలమూర్తియుఁ బోలె - వేఁడిమి దిక్కుల వెదచల్లుకొనుచుఁ
గపులఁ దోలుచును నిక్కడనె చూచుచును - విపరీతగతి వచ్చు వీఁ డెవ్వఁ" డనిన

విభీషణుఁడు శ్రీరాముల కతికాయుని ప్రభావముఁ దెలుపుట

"దేవ! యీదైత్యుఁడు దేవారిసుతుఁడు - రావణుకంటెను రణగరిష్ఠుండు
చతురంగములయందు సమరంబు సేయ - నతినిపుణుండు వీఁ డవనీశతిలక!
యరుదైన వేదశాస్త్రాదివిద్యలను - బరిణతుం డెంతయుఁ బరతత్త్వవేది;4420
లంక యీవీరుని లావునఁ జేసి - శంకలే కెపుడు నిశ్చలవృత్తి నుండు
ననిమిషు లలిగిన ననిఁ జావకుండ - వనజాసనునిచేత వరము గొన్నాఁడు;
దివ్యాయుధంబుల దివ్యశస్త్రముల - దివ్యమంత్రంబుల దీపించువాఁడు
మీఱి యింద్రాద్యనిమిషులను నూఱు - మాఱులు గెలిచిన మగఁటిమివాఁడు
వాసవువజ్రంబు వరుణుపాశంబు - నాసమవర్తి మహోగ్రదండంబు

ధనపతిగదయు నీతనిశస్త్రసమితి - ననిశంబు గడుఁబ్రతిహతములై యుండు;
మనుజాశనుఁడు ధాన్యమాలినియందె - గనినపుత్రుం డతికాయుండు వీఁడు
ఈదానవునిచేత నీకపులెల్ల - మేదినీనాయక! మెదుగక మున్నె
సమరంబులో వీనిఁ జంపుట లెస్స; - యమితవిక్రమకేళి" నని చెప్పుచుండ
వాఁ డంతఁ బటుగుణధ్వని దిక్కు లద్రువ - వాఁడిమిమై నట వచ్చుటఁ జూచి4430
ఖండనోదగ్రుండు గవయుండు గోము - ఖుండును జ్యోతిర్ముఖుఁడు కుముదుండు
మారుతాత్మజుఁడును మైందుండు నలుఁడు - శరభుండు నీలుండు శతబలి గజుఁడు
నాదిగాఁ గలుగు మహాకపివరులు - మేదినీజంబులు మేదినీధ్రములు
వడి నెత్తుకొనిపోయి వానికి నెదురు - నడువంగ నటు చూచి నవ్వి దానవుఁడు
“కలహవిక్రమకళాకఠినసత్త్వములు - గలుగవు తొలఁగుఁడు కపులార! మీరు
త్రిజగంబులును మెచ్చఁ దివిరి వారాశి - నిజశరాగ్రంబున నిల్పినశూరుఁ
డతఁ డెవ్వఁ డిటు చూపుఁ డతనిపైఁ గాని - యతులితం బైన నాయస్త్రంబు విడువ;
దురమున నింద్రజిత్తుఁడు గట్టినట్టి - యురగపాశంబుల నూడ్చుకొన్నట్టి
యతఁ డెవ్వఁ డిటు చూపుఁ డతనిపైఁ గాని - యతులితం బైన నాయస్త్రంబు విడువ;
మూఁడులోకంబులు మునుమిడి గెలిచి - వాఁడిమి మగఁటిమి వ్రాలినశూరు4440
నలఘుబలోదీర్లు నాకుంభకర్ణుఁ - దలఁ దైవ్వనేసి యుద్ధతిఁ బేర్చియున్న
యతఁ డెవ్వఁ డిటు చూపుఁ డతనిపైఁ గాని - యతులితం బైన నాయస్త్రంబు విడువ;
దేవదానవయక్షదివిజుల కాజి - భావింప నెక్కుడై పరఁగినయట్టి
రావణు నోర్చెద రణములో ననుచు - నీవిధంబున లంక కేతెంచు శూరుఁ
డతఁ డెవ్వఁ డిటు చూపుఁ డతనిపైఁగాని - యతులితం బైన నాయస్త్రంబు విడువ;"
నని పెక్కుగర్వంబు లాడుచునున్న - దనుజాధినాథునితనయునిఁ గిట్టి
కడిఁదికోపమున వృక్షంబులు గిరులు - నుడుగక కపినాయకోత్తము ల్వైవ
వవి యంతపట్టును నతికాయుఁ డెడనె - యవిరళమార్గణాహతిఁ ద్రుంచి వైచి
గురుతరాస్త్రంబులఁ గుముదుని మూఁటఁ - గర ముగ్రశరపంచకంబున ద్వివిదు
నరుదార మైందు నైదమ్ము లేడింట - శరభునిఁ దొమ్మిదిసాయకంబులను4450
ఘనతరబాణాష్టకంబున గజునిఁ - గినిసి బెట్టుగ నాలుగింట గవాక్షు
గవయుని నెనిమిదిఘనసాయకములఁ - దవిలి జ్యోతిర్ముఖు దశమార్గణములఁ
బలుకాండముల శతబలిఁ బదేనింట - నెలమితో నీలుని నిరువదేనింటఁ
బెడిదంబుగా నేయఁ బృథివిపై నొరగి - కడుమూర్ఛ నొంది రాకపివరు లెల్ల
దివిజులు వెఱగంది దివినుండి చూడఁ - దవిలి వెండియును నుద్దండకోపమున
మృగములఁ దోలెడి మృగపతిమాడ్కి - నగచరావళిఁ దోలె నతికాయుఁ డపుడు;
తోలియుఁ దన్ను నెదుర్కొనుకపుల - నేలనుఁ గూల్చుచు నిగిడి రామునకుఁ

బగతోడిభక్తి నప్పరమేశువలనఁ - దగ ముక్తి గలుగు నింతట నని తలఁచి
నిగిడి యారాఘవునికి నతికాయుఁ - డగలని తెగువమై ననియె నవ్వుచును;
"రామ! యీసమరధరాస్థలిలోన - నీమగఁటిమి చూపు నిక్కంబు నాకు;4460
నెంతటివాఁడవో యెన్నఁడు నిన్ను - నింతటివాఁ డని యెఱుఁగ రెవ్వరును;
మాతండ్రికతమున మానిసి వైతి; - మాతండ్రికతమున మహి రాజ వైతి;
నమరేంద్రయమవరుణాదిదేవతలఁ - గుమిలోన నొకఁడవు గావు ని న్నెదురఁ;
గడముట్ట శూరుఁడై కదిసినవానిఁ - గడిమిమై నెదురంగఁ గవియుదుగాక!
యేను నీమగతనం బెఱుఁగనే ముందు - మానాభిమానము ల్మఱి నీకుఁ గలవె
గణుతింప న న్నెఱుంగవు గాక! నీవు - గుణహీనుఁడవు; సత్త్వగుణ మెందుఁ గలదు?
ఏజాతిఁ గలవాఁడ? వేమి చెప్పెడిది? - రాజకులాచారరతుఁడవే నీవు?
అనఘ మానస! మానసాటవు లూరు - ననుఁ జేరి పోరాడ నాయీడు గావు;
గొనకొని వేదాద్రిగుహలలో నుండు - ననుఁ జేరి పోరాడ నాయీడు గావు;
సనకాదిమునియోగిసదనము ల్చొరుము - ననుఁ జేరి పోరాడ నాయీడు గావు;4470
కాషాయవస్త్రసంకలితులై విగత - దోషులై భవరోగదూరులై పోయి
కూరలు గాయలు కూళ్లుగాఁ గుడిచి - నీరసాహారులై నిష్ఠల డస్సి,
ఘోరాటవులలోనఁ గ్రుమరుచున్న - వారిలోపలఁ బోయి వర్తింపు మీవు;
కలహవిక్రమశక్తి కడపట లేదు - తలపోసి యెఱుఁగుదు తగిలి నీలావు;
నొగి నొంటివాఁడవై యుండెడి నీకు - జగతిలో నీకపిసైన్యంబు గలిగె;
ది క్కెవ్వరును లేక తిరిగెడి నీకు - దిక్కయ్యె నిప్పుడు దినకరాత్మజుఁడు;
ఎక్కడ గురుఁడని యెఱుఁగని నీకు - నక్కడ గురుఁడు విశ్వామిత్రుఁ డయ్యె;
నొకదేశమును లేక యుండెడు నీకు - నకలంక మగుననయోధ్యాదేశ మొప్పె;
నివి నీకుఁ బెద్దగా నిచ్చలో నుబ్బి - తివురకు నీ వింక ధృతిపెంపుఁ దూలి;
చలియించి మీనమై సకలవారిధులు - సొలవక చొచ్చినఁ జొత్తుగా కేమి?4480
తలఁపు నీమీఁదిదె తప్పదు నాకుఁ; - బలుకు లేటికి? నిన్నుఁ బట్టెద వెదకి;
తలఁ గ్రుచ్చి కూర్మమై ధరణిలోపలికి - సొలవక చొచ్చినఁ జొత్తుగా కేమి?
తలఁపు నీమీఁదిదె తప్పదు నాకుఁ - బలుకు లేటికి నిన్నుఁ బట్టెద వెదకి;
యలిగి వరాహంబ వై రసాతలము - సొలవక చొచ్చినఁ జొత్తుగా కేమి?
తలఁపు నీమీఁదిదె తప్పదు నాకుఁ - బలుకు లేటికి నిన్నుఁ బట్టెద వెదకి;
చలమున వికృత వేషమున నెందైన - సొలవక చొచ్చినఁ జొత్తుగా కేమి?
తలఁపు నీమీఁదిదె తప్పదు నాకుఁ - బలుకు లేటికి నిన్నుఁ బట్టెద వెదకి;
కడుగుట్టవై నీవు కార్పణ్యవృత్తి - బొడ వేది పోయినఁ బోదుగా కేమి?
తలఁపు నీమీఁదిదె తప్పదు నాకుఁ - బలుకు లేటికి నిన్నుఁ బట్టెద వెదకి;

ధారణీసురవేషధారి కుఠారి - వై రాజసంహారి వగుదుగా కేమి?4490
తలఁపు నీమీఁదిదె తప్పదు నాకుఁ - బలుకు లేటికి నిన్నుఁ బట్టెద వెదకి;
అచ్చెరు వగునరుణాంబుధిలోనఁ - జెచ్చెఱ నిన్ను మోచియుఁ దేలియాడఁ
బరికింప నల వటపత్రంబు గాదు - కరము భీషణము నాకంకపత్రంబు;
దురమున నను నీకుఁ దొడరంగ రాదు - వరగర్వమున నెందు వ్రాలినవాఁడ;"
నని పేర్చి పలికెడు నయ్యతికాయు - ఘనగర్వమునకు లక్ష్మణుఁడు గోపించి

లక్ష్మణాతికాయుల ద్వంద్వయుద్ధము

"యోరీ! నిశాట! నే నుండ రాఘవుని - తో రణం బొనరింపఁ దొరకొననేల?
నాదెసఁ జక్కనై నడతెమ్ము ; నిన్ను - నాదుబాణముల భగ్నంబు చేసెదను;”
అని దానవునిగుండె లవియ నందంద - ఘనగుణధ్వని చేసి కదిసిన వాఁడు
నారభసంబున కాశ్చర్య మంది - క్రూరాస్త్ర మొక్కటిఁ గొని యార్చిపట్టి,
"నిలు నిలు లక్ష్మణ! నీవు బాలుఁడవు; - వలదంత నీకంటె వ్రాలినవాఁడ;4500
నావరశరఘట్టనంబు సహింప - నీవసుంధర యొండె? హిమగిరి యొండె?
రావణుం డెత్తిన రజతాద్రి యొండె? - దేవత లున్న ధాత్రీధరం బొండె?
నంజక హరువిల్లు నడఁచి గర్వమున - రంజిల్లు మీయన్నరాఘవుం డొండె?
గాక న న్ననిమొనఁ గదియ శక్యంబె? - నీకు నాముందట నిలువంగఁ దరమె?
యీవరబాణంబు నిట నిన్నుఁ గట్టి - త్రావెడు నీదురక్తంబు సౌమిత్రి!"
యని దురహంకృతి నాడిన నతఁడు - “దనుజుఁడ! నీకు వృథా గర్వ మేల?
పోర నీలావు చూపుదుగాక! నీకు - నీరిత్తమాట లిం కేల? నాయెదుట
నీవును శస్త్రాస్త్రనిచయంబుతోడ - నీవిధంబున రథ మెక్కి యుద్వృత్తి
మానక యిటఁ బోటుమగవాఁడపోలెఁ - బూనియున్నాఁడ విప్పుడు నిశాచరుఁడ!"
యనవుడు కోపించి యతనిపై నేసెఁ - దనచేతిబాణ ముద్ధతి వాఁడు దొడఁగి4510
యేసి యార్చిన దితి నింద్రాదిసురులు - నాసమయంబున నాశ్చర్యపడఁగ
వదలక రాఘవేశ్వరుననుజుండు - నది యర్ధచంద్రబాణాహతిఁ ద్రుంచి
చెలువార బహ్మ వ్రాసినవ్రాత యింక - వల దని తా భువి వైచినకరణిఁ
జటులాస్త్ర మొక్కటి సంధించి వాని - నిటలస్థలము నాట నిపుణుఁడై యేసె;
నేసిన రుద్రునియేటున వడఁకు - భాసురాసురపురప్రాసాద మనఁగఁ
జలియించి నాతోడ సమరంబు సేయఁ - గలిగె వీఁ డని యతికాయుండు పేర్చి
కడిమిమై నరదంబుఁ గదియఁ దోలించి - తడయక యారాము తమ్మునిమీఁదఁ
జల మొక్కటియె తక్క చంపవే నన్ను - చెలువున నొక్కనిశితబాణ మేసె;
మూఁడంబకంబుల మూర్తి గాచినను - బోడిమిఁ దక్కింతుఁ బొమ్మన్నకరణిఁ,
జటులవేగంబున సంధించి మఱియుఁ - బటుతరంబగు మూఁడుబాణంబు లేసె4520

ననయంబు బెరుకుదు నైదుప్రాణములు - ననుమాడ్కి వెండియు నైదమ్ము లేసె;
నేడువార్ధులు సొచ్చి యీఁదిపోయినను - తోడనే నినుఁ బట్టి త్రుంతు నన్నట్టి
కరణి నెంతయు భుజాగర్వంబు మీఱి - యిరవొంద సంధించి యేడమ్ము లేసె;
నవి వేగ లక్ష్మణుం డంతలోపలనె - వివిధఖండములు గావించి పెల్లార్చి,
యతికాయుపై నేసె నాగ్నేయబాణ - మతఁడు నూ ఱేసె సౌరాస్త్రంబుఁ దొడిగి
యారెండుశరములు నడరి యొండొంటి - తో రణం బొనరించి తుమురులై రాలె
చేకొని దనుజుఁ డైషికబాణ మేసెఁ - గాకుత్స్థతిలకుఁ డాకంపంబు నొంద
నది యైంద్రమునఁ ద్రుంచె నడరి లక్ష్మణుఁడు - అది గని దైత్యుండు యామ్యాస్త్ర మేసె
నది ద్రుంచె నతఁడు వాయవ్యాస్త్ర మేసి - యదిగాక పెక్కమ్ము లసురపై నేయ
నవి వాని మైమరు వటుఁ దాఁకి విఱిగి - భువిమీఁద నొఱగినఁ బోక లక్ష్మణుఁడు4530
వెండియుఁ బెక్కేయ విఱుగుటఁ జూచి - "కాండంబు లేమొకో కాడవు వీని;
నని" యని చింతించి యలయుచున్నంత - "నెన లేనియామర్మ మెఱిఁగింతు” ననుచు
నప్పు డాతనితోడ ననిలుండు వచ్చి - చెప్పె “లక్ష్మణ! బ్రహ్మచే వీఁడు వడసె,
వరముగాఁ గోరి యీవజ్రకవచము - శరము లెవ్వియు వీనిఁ జాలవు నాటఁ
బలుదునియలు గాఁగ బ్రహ్మాస్త్ర మేసి - పొలియింపు" మనవు డుప్పొంగి లక్ష్మణుఁడు
అది సమంత్రకముగా నార్చుచు దొడిగి - త్రిదశారిసుతుమీఁదఁ దెగఁగొని యేసె.
నేసిన బ్రహ్మండ మెల్లను బగుల - వాసవుం డదర దేవతలు గంపింప
ధరణి వడంక దిక్తటము లల్లాడ - శరధులు ఘూర్ణిల్ల శైలము ల్వడఁక
ధరణిచంద్రులగతి దప్పంగఁ జుక్క - లురులంగ రత్నపుంఖోజ్జ్వలం బగుచుఁ
బ్రళయకాలమునాఁటి పావకుభంగి - నెలకొని లోకముల్ నిండి మండుచును4540
యమదండమును బోలె ననిలవేగమునఁ - గ్రమ మొప్ప నింతయుఁ గడురభసమున
నమ్మెయి బ్రహ్మాస్త్ర మరుదేర దైత్యుఁ - డమ్ములు నిగుడింప నవియుఁ గైకొనక
వచ్చుటయును శక్తి వైచె; వైచుటయుఁ - జెచ్చెఱ నాశక్తిఁ జేకొన కదియు
లావున రాఁగ శూలంబున వైచె - నావిధంబును గొన కది మీఱి రాఁగ
గద వ్రేసె వ్రేసిన గదయును ద్రోచి - యది వచ్చుటయుఁ జూచి యడిదాన వ్రేసె
నది దాఁటిరాఁ బరశ్వాయుధం బెత్తి - వదలక వ్రేయ దీవ్రంబున నదియుఁ
గడచి యేతేరంగఁ గడఁగి కటారిఁ - బొడిచిన నందున బోక పై రాఁగ
వలనొప్ప మొల నున్న వంకిని బొడిచెఁ - జలమున నది మీఱి చటులవేగమునఁ

అతికాయుఁడు లక్ష్మణునిచేఁ జచ్చుట

బోవ కేతెంచినఁ బొడిచెఁ బిడికిటను - దేవతల్ దలలూపఁ దివిరి యాశరము
మండితకోటీరమండలితోడఁ - గుండలంబులతోడఁ గూల్చెఁ దచ్ఛిరము;4550
పటువజ్రహతి రోహణాద్రిశృంగంబు - చటులతఁ గూలిన చాడ్పునఁ బడ్డ

నతికాయుతలఁ జూచి యతిభీతిఁ బొంది - హతశేషు లైనదైత్యాధముల్ పఱచి
లంకఁ జొచ్చుటయుఁ గెలంకుల కపులు - నంకించి రెంతయు నారాముతమ్ముఁ;
డరుదెంచి శ్రీరాము నడుగుల కెరఁగఁ - గరము సంతోషించి కౌఁగిటఁ జేర్చి
వినుతించు నాకపివీరులతోడ - ననయంబు హర్షించె నవనీశుఁ డంత;
నాదైత్యనాథుండు నయ్యతికాయుఁ - డాదిగాఁ గలదైత్యు లార్వురు వడుట
విని మూర్ఛపాల్పడి వేగంబె తెలిసి - ఘనముగాఁ గన్నీరు గ్రమ్మ నందంద
నతిదుఃఖమును బొంది యడలుచు నున్న - పతికడ కేతెంచి పల్కె మయుసుత!
"యసురేశ! లోకంబు లన్నిటిలోన - నసమానసత్త్వుఁడ వైన నీకిట్లు
పాడియె శోకింపఁ బంటవై నీవు - నాఁ డేల తెచ్చితి నరనాథుదేవి?4560
నొప్పింప నేరవై తుచితకాలమునఁ - దప్పె నారామునిఁ దలపడ్డ దైత్యు
లరుదెంతు రనుమాట లవియుఁ బోవిడువు - సురవైరి యాజిలోఁ జూపు నీకడిమి"
యను మాట లాలించి యాత్మఁ జింతించి - వనిత నంతఃపురవరమున కనిచె.
నినిచినవగలతో నిట్టూర్పుఁ బుచ్చి - తనమంత్రివరులతో దశకంఠుఁ డనియెఁ.
“గటకటా! తమ్ములు గాదిలిసుతులు - నిటు నేలఁ గూలి రిం కే మనఁ గలదు?
విబుధుల కైనను విడిపింపరాని - ప్రబలంబు లగు నాగపాశబంధములఁ
బాసిరి మాయపో బలిమి నో మనుజు - లాసచేసినఁ జెల్ల దది నాకు జయము;
ఆరాముతమ్ముని నాజిలో గెలుచు - వీరుని నెవ్వని వెదకియుఁ గాన
భయ మెన్నఁడును లేక పరఁగునీలంక - భయమును బొందె నాబలియులవలన
నారామవిభుని పరాక్రమంబునకు - మేర యెయ్యది? యిఁటమీఁద నీలంక4570
యతనిచేఁ జెడకుండ నరసి యేమఱక - ప్రతిదినంబును గావఁ బంపుఁడీ" యనుచు
నంతఃపురంబున కరిగి యొక్కరుఁడ - యంతరంగంబున నడలుచునుండె.
నప్పుడు చనుదెంచి యామేఘనాదుఁ - డప్పంక్తికంఠున కనియె నింపార
"నే నీకు గలుగంగ నిటు వగ పేల? - దానవాధీశ్వర! తగదు చింతింపఁ
బటుతరం బైన నాబాణసంహతికి - నెటు సహింపఁగఁ జాలు నీశ్వరుం డైన?
నటు చూడు రాముని నాతనితమ్ముఁ - జటులాంబకముల జర్జరితులఁ జేసి
యసువులు వెఱికి యయ్యగచరావళుల - వసుమతిపైఁ గూల్చి వచ్చెదఁ గడిమి
విబుధకంటక! నేఁడు వినుము నా ప్రతిన - విబుధలోకేశుండు విష్ణుండు యముఁడు
శిఖియును రుద్రుండు సితకరార్కులును - నఖిలసాధ్యులు బలియజ్ఞవాటమున
నేచి విజృంభించునెడఁ ద్రివిక్రమునిఁ - జూచినగతి నన్నుఁ జూతురు గాక!"4580

ఇంద్రజిత్తు రెండవమాఱు యుద్ధమునకు వెడలుట

యని వీడుకొని దివ్య మగు రథం బెక్కి - దనుజేంద్రతనయుఁ డెంతయు సొంపుమీఱి
నడువంగ నప్పుడు నానాముఖములఁ గడువేగమున నుర్వి గదలగాఁ గదలి

వెడలె రథంబులు వెడలె నేనుఁగులు - వెడలె గుఱ్ఱంబులు వెడలెఁ గాల్బలము;
పుండరీకంబుల బొలుపారువారు - పుండరీకాక్షులఁ బొలుపారువారు
పుండరీకచ్ఛాయఁ బొలుపారువారు - పుండరీకోన్నతిఁ బొలుపారువారు
నప్పు డుగ్రతఁ జతురంగసైన్యముల - నొప్పిరి దానవు లుగ్రాసనముల
నార్పులు బొబ్బలు నతులఘోషములు - దర్పితసింహనాదస్ఫురణములు
నేమీరవంబులు నిస్సాణరవము - రామణీయకము లుగ్రంబులై యమర
భాసురధవళాతపత్ర మొప్పార - నాసుధాకరుతోడి యాకాశ మనఁగఁ
గమలలోచనములు గ్రాల నందందఁ - బ్రమదాజనము చామరంబులు వీవ4590
బహుభూషణప్రభాపటలంబు వెలుఁగ - సహజవైభవమహోజ్జ్వలుఁ డింద్రజిత్తు
చనుదెంచి రణమహీస్థలమున నిలిచి - ఘనభుజుం డత్యంతకౌతూహలమున
రక్తవస్త్రంబుల రక్తమాల్యముల - రక్తగంధంబుల రాజితుం డగుచు
వరమంత్రముల హుతవహుఁ బ్రతిష్ఠించి - శరములు తోమరచయములు వరుసఁ
బరిధులుగాఁ జేసి పలుస్రుక్స్రువములు - కర మర్థి లోహముల్ గా సంఘటించి
తనలోని నిష్ఠ యుదాత్తమై యొప్ప - దనుజేంద్రతనయుఁ డథర్వణోక్తముగఁ
దగ నెయ్యి లాజలు దాడిసమిధలు - నొగి వేడ్క వేల్చుచు హోమాంతవేళఁ
గడిఁది కృష్ణచ్ఛాగకంఠర క్తంబు - నడరెడువహ్నిఁ బూర్ణాహుతి వేల్వ
ననలుండు పొడసూపి హవ్యముల్ గొనియె - ననలునికరుణ బ్రహ్మాస్త్రంబు రథము
ధనువును గవచంబుఁ దద్దయుఁ బ్రీతిఁ - గొని యార్చుటయును దిక్కులు పెల్లగిల్ల4600
దానవుం డర్కేందుతారకాసమితి - తో నభం బగులంగ దుర్దాంతుఁ డగుచు
రథరథ్యకేతుసారథులతో నెగసి - ప్రథితవేగమున నంబరవీథి డాఁగి
యగణితబలసత్త్వుఁడై యొప్పఁ బలికెఁ - దగియెడుబుద్ధిగాఁ దనసేనతోడఁ
"దరలక నిలిచి యుద్ధము సేయుచుండుఁ - డురక యే నిదె దివినుండి ఘోరముగ
రణ మొనరించి యారామలక్ష్మణుల - గణుతింప కెంత వేగమె చంపువాఁడ”
ననిన నుత్సాహవాక్యము విని పేర్చి - దనుజులు సేనావితానంబుతోడఁ
దరుచరసేనలు దరియంగఁ జొచ్చి - బరవసంబునఁ బెక్కుభంగులఁ బోర
నాదివినుండి దివ్యాస్త్రంబు లేయ - నాదానవునిదెస కగచరు లెగసి
యగములు వైవంగ నవి ద్రుంచి గుండె - లగలించి పెక్కండ్ర నవనిపైఁ గూల్చి
వేగంబె యొక్కొక్కవిషమబాణమున - నేగురఁ దొమ్మండ్ర నేడ్గుర నేసె;4610
మఱియును గడిమిమై మర్కటేశ్వరులు - నెఱసిన గిరి ధరణీజంబు లెత్తి
యాయింద్రజిత్తుపై నడరింప నతఁడు - సాయకంబుల వానిఁ జతురుఁడై త్రుంచి
పదియు నెన్మిది తీవ్రబాణంబు లేసె - మద మెల్లఁ జెడ గంధమాదనుఁ గడిమి
దీపింప నలుఁ దొమ్మిదిట రూపు మాపె - నేపార మైందుని నేడింట నొంచెఁ;

గదిసి పంచకమున గజుని నొప్పించెఁ - బదియింట భల్లూకపతిఁ గూలనేసెఁ;
నూటను హనుమంతు నొప్పించి మించె - మూఁట గవాక్షుని మొగి గాడనేసెఁ;
బదియింట హరిరోముప్రాణముల్ గొనియె - నద టణంగ గరంబు నాఱింట నేసెఁ
దగిలి యాఱిట వేగదర్శి భంజించెఁ - దెగి సుషేణుని నెన్మిదింట నొప్పించె;
ననయంబు పదిట సూర్యప్రభు నొంచెఁ - బనసునియంగంబుఁ బదుమూఁట నేసె;
ఘనతరబాణాష్టకంబునఁ గుముదు - నెనసి నీలుని ముప్పదింటను ముంచె?4620
మసలక మఱి పెక్కుమార్గణంబులను - రసికత దూలఁ దారాతనూభవుని
సునిశితంబై న యాశుగముల నూట - దినపనందనుని నైదిట నింద్రజాలు
గిరిభేది రెంటను గెడపి యాఋషభు - నిరువదిశరముల నిలఁ ద్రెళ్లనేసె,
గేసరి పదునాలుగిట దధిముఖుని - భాసురంబుగ బాణపంచకంబునను
సుముఖునిఁ గ్రథనుని సొరిది నాఱింట - విముఖు నేడింటను ద్వివిదు నాఱింట
శరభు నేడింటను శతబలిఁ బదిట - సరినెన్మిదిట హరు సన్నాదు మూఁట
నరుదుగాఁ డక్కిన యఖిలయూథపుల - వరదివ్యశస్త్రాస్త్రవర్షంబు గురిసి
కడుభిన్నగాత్రులఁ గాఁ జేసి నేలఁ - బడవైచి మఱి గతప్రాణులఁ జేసి
కొందఱ నమ్ములు గొని గాడనేసి - కొందఱ గద లెత్తుకొని బిట్టు వేసి
కొందఱ శూలముల్ గొని గాడనేసి - కొందఱ శక్తులు గొని నిగుడించి4630
దనుజేంద్రతనయుఁ డెంతయుఁ బ్రతిలేక - తనరు బ్రహ్మాస్త్రమంత్రప్రభావమున
నందఱ నీక్రియ నందందఁ బేర్చి - యెందును బోనీక యయ్యింద్రజిత్తుఁ
డున్నవానర సేనయును జంపి వైచి - యున్నతజయమున నుగ్రుఁడై యార్చెఁ;
గపికోటి నొచ్చినఁ గడఁగి సౌమిత్రి - కుపితుఁడై యన్నఁ గన్గొని విన్నవించె.
"దేవ! బ్రహ్మాస్త్రంబు దీపింపఁజేసి - రావణసహిత మీరాక్షసకోటి
నంతయుఁ జంపెద నానతి యిమ్ము - చింతింప నేటికిఁ జెచ్చెఱ” ననుడు
"వీనిమాయలఁ జేసి వీనిరూపంబు - గాననియప్పుడు గడఁగి లోకములు
భస్మంబు సేయుచు బ్రహ్మాస్త్ర మరుగు - విస్మయం బగు బలావిర్భావ మొప్పఁ
గావున వీనికై కడఁగి లోకములు - నీ వేల కాల్చెదు నిష్ఠురవృత్తి
నీరాక్షసుఁడు బ్రహ్మ యిచ్చినవరము - కారణంబునఁ జేసి కపికోటిఁ జంపె;4640
ననయంబు మన మింక నాబ్రహ్మవరము - మనమున నొకకొంత మన్నింపవలయు”
నని పల్క నింద్రజి త్తారఘుకులుల - ఘనబాణముల నేసెఁ గదలక నిలిచి

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రముచే రాముఁడు మొదలగువారల మూర్ఛనొందించి మరలుట

గర్వితుం డగు దశకంఠనందనుఁడు - పర్విన నీలాభ్రపటలంబు గాఁగ
నడరించు కార్ముకజ్యానినాదంబు - లుడుగక వెస మ్రోయు నుఱుములు గాఁగ

వడిఁ బూన్చి దైత్యుఁడు వైచుచునున్న - బెడిదంపుశక్తులు పిడుగులు గాఁగ
నగణితదివ్యశస్త్రావళి యందు - మిగిలినదీప్తులు మెఱుఁగులు గాఁగఁ
బొరిఁబొరిఁ బుంఖానుపుంఖంబు లగుచుఁ - నరుదెంచునమ్ములు నతివృష్టి గాఁగఁ
గరుల నొప్పిన సెలకట్టియ లెల్లఁ దఱుచుగా నాడు చాతకములు గాఁగఁ
గనకరత్నప్రభాకలితంబు లగుచుఁ - దనరు చాపం బింద్రధనువును గాఁగ
నసురులయందును నగచరులందు - వెస గ్రమ్ము నెత్తురు వెల్లువ గాఁగ4650
బింబహారములకు విఱిసిన మౌక్తి - కంబులు నెరి వడగండ్లును గాఁగ
నురులిన మకుటమహోజ్జ్వలమణులు - పరఁగంగ నింద్రగోపంబులు గాఁగ
లాలితాయతకాహళారవంబులును - వ్రాలిన కేకారవంబులు గాఁగ
సమధికపటహోగ్రసన్నాహరవము - రమణీయమండూకరావంబు గాఁగ
నసమున రఘుపతి హలికుఁడై పేర్చు - నసురేశు విపులదేహక్షేత్రమునను
అడరి లోకములెల్ల నలరంగ ముష్టి - విడువక యమ్ములు వెతఁ బెట్టుకొఱకు
వచ్చిన తొలుకరి వానకాలంబు - నచ్చుగా నొప్పారె నాసమయంబు
గానఁ గదా యింకఁ గడఁగి రాఘవుఁడు - మానక బాహుసమగ్రతఁ బూని
కలనికి నద్దశకంఠునిఁ దెచ్చి - తలకోఁత కోసి యుద్దండత నునుచు
ననినచందంబున నతివిచిత్రముగ - నెనయంగ డెబ్బదిరెండువెల్లువల4660
వనచరులను నృపవరుల జయించి - ఘనతరజ్యానాదకలితుఁడై మగిడి
యాలంబు చాలించి యాయింద్రజిత్తుఁ - డాలంకలోనికి నరిగె నవ్వుచును;
మనుజేశుదురవస్థ మది విచారించి - కనుఁగొనఁ జాలక కన్నులు మొగిచి
కొని తొలఁగినమాడ్కిఁ గ్రుంకె నర్కుండు - వనచరాననపద్మవనములు మొగుడఁ
గపికోటిచే లంక కాలుచో ధూమ - ముపమింప నీగతి నుండు నన్నట్లు
కడునగ్గలముగ లోకం బెల్ల నిండి - తడయ కెంతయు నంధతమసంబు పర్వె;

హనుమద్విభీషణులు బ్రహ్మాస్త్రముబాఱిఁ బడక సైన్యమును బరీక్షించుట

నప్పుడు తొడిగి బ్రహ్మాస్త్రమంత్రంబు - లొప్పఁ జపింపంగ నొకటియుఁ గాక
యున్న విభీషణుఁ డుర్వరఁ గూలి - యున్నసుగ్రీవాదియోధులఁ జూచి
"వనచరులార! గీర్వాణారిసుతుఁడు - వనరుహగర్భుని వరమునఁ జేసి
పన్ని యేయుటయును బ్రహ్మాస్త్రశక్తి - మన్నింపఁ దగు నని మనమునఁ దలఁచి4670
వంచించి యారామవసుమతీనాథుఁ - డించుక సైఁచినాఁ డింతయే” యనుడు;
వాయుసూనుఁడు బ్రహ్మవరమునఁ జేసి - యాయింద్రజిత్తుదివ్యాస్త్రసంతతుల
జావకుండుట విభీషణుతోడ ననియె - "భావింపు మిప్పుడు భండనభూమి
నిటఁ బడ్డవారిలో నెవ్వరు గలరు? పటుబాణహతు లయ్యు బ్రతికినవారు”

అని యిద్దఱును గూడి యంధకారమునఁ - గొనకొని మండెడి కొఱవులు పట్టి
కొని కలనెల్లను గ్రుమ్మరునపుడు - ననయంబు నాసంగరావనిలోన
నందంద నుడుగక యాడునట్టలును - క్రందుమాంసములను గఱచుభూతములు
బెడిదంబుగా నారు బేతాళములును - అడరెడురక్తంబు లానుఢాకినులు
కండలు గబళించు కంకగృధ్రములు - నొండొండ నెలుఁ గిచ్చు నురుసృగాలములు
గెడసి రక్తములు గ్రక్కెడిభల్లుకములు - నుడుగక యందంద నొరలు కోఁతులును4680
గుదిచి కాళ్ళను దన్నుకొను వలీముఖులు - కదిసినదంతము ల్గలప్లవంగములు
లావరిపడిన గోలాంగూలములును - భావింపరాని రూపముల వానరులు
కీలాలవారిఁ దోఁగిన యగచరులు - కేళిమై ధూళి బ్రుంగిన వనచరులు
పదుగుర నేఁబండ్రఁ బ్రదర మొక్కటను - గుదులు గ్రుచ్చినక్రియఁ గూలినకపులు
అంతంతఁ దుత్తుము రైన శైలములు - నింతింత లైన మహీరుహములును
ఖండంబు లైన రాక్షసులశస్త్రము - దండిగాఁ దునకలై ధర నున్నగదలు
నిండినసామజనికరముల్ సమర - మండలి బడియున్న మఱి వెఱఁగంది
కనుఁగొని ఖిన్నులై కడుదుఃఖ మడరి - యనిరి విభీషణహనుమంతు లపుడు
“వలయు కార్యము జాంబవంతుని నడుగ - వలయు కార్యంబుల వల నాతఁ డెఱుఁగు
నతఁ డున్నయెడ నింక నరయుద మరసి - యతఁడు చెప్పినత్రోవ నరుగుద" మనుచు4690
గల నెల్ల వెదకుచుఁ గనుఁగొని రపుడు - బలితంపుకరశయ్యఁ బడియున్నవానిఁ,
గని జాంబవంతు డగ్గఱి దైత్యనాథుఁ - డనియెఁ బెద్దయు నార్తుఁ డై వగనొంది,
"బ్రతికియున్నాఁడవే ? పలుకంగఁ గలవె? - యిదె ఋక్షరాజ! మ మ్మెఱుఁగుదె?" యనిన
దానవుశరహతి దర్పంబు దక్కి- హీనస్వరంబున ఋక్షేశుఁ డనియె,
“స్వరవిశేషంబు విచారించి బుద్ధి - పరికించి నీ వని పలికెదఁ గాని
కలయ నమ్ములు కండ్ల గాడుటఁ జేసి - చలిదృష్టిని విభీషణ! గానరాదు
చెవులకు నింపుగాఁ జెప్పుము నాకు - పవమానసూనుండు బ్రతికియున్నాఁడె?"
యనవుడు వెఱఁగంది యాజాంబవంతు - కనియె విభీషణుఁ డతిసంభ్రమమునఁ
"గడువెఱఁ గయ్యెడు ఘనుఁ డై నరాము - నడుగక, లక్ష్మణు నడుగక, యినజు
నడుగక, యంగదు నడుగక, యతని - నడుగుట యేతలం పగు? ఋక్షరాజ!"4700
యనిన "విభీషణా! హనుమంతు డొకఁడు - తనువుతో నుండినఁ దరుచరు లెల్ల
బ్రతుకుదు రాతఁడు బ్రతుకఁడేనియును - బ్రతికియుండిన నైన బ్రతుకరు కపులు;"
అనుమాట విని ముదం బంది వాయుజుఁడు - దనపేరుఁ జెప్పి పాదములకు మ్రొక్కె.
మ్రొక్కిన నెఱిఁగి యిమ్ముల ఋక్షరాజు - తక్కక యాత్మ ముదంబును బొంది
తనుఁ బునర్జాతుఁగాఁ దలపోసి యనియె - ననిలనందనుతోడ నర్థి దీపింపఁ
“దలపోయ వాయునందన! నీవు దక్కఁ - గలుగునే యొక్కఁ డీకపులకు దిక్కు

అది గాక యిప్పు డీ యంబుధిఁ దాఁటి - వదలక యాహిమవంతంబు గడచి
హేమకూటంబును ఋషభపర్వతము - నామేరువును రజతాద్రియుఁ గడచి
శ్వేతాచలముదాఁటి శీఘ్రంబు మెఱసి - యాతతమగు లవణాంబుధిఁ గడచి
యరిగి శాకద్వీప మవ్వలి కేగి - తరఁగల నొప్పు సుధావార్ధి దాఁటి,4710
చంద్రశైలద్రోణశైలమధ్యమున - సాంద్రదీధితుల నుజ్జ్వలత వహించి
తిర మైన యాయౌషధీశైల మెక్కి - కర మొప్పు సంజీవకరణి విశల్య
కరణియు సంధానకరణి సౌవర్ణ - కరణియు నా నాల్గు గల వౌషధములు;
అవి తెచ్చి యీవానరావళి నెల్లఁ - బవనతనూభవ! బ్రతుకంగఁ జేసి
రాగంబు నొందింపు రామలక్ష్మణుల - వేగంబె" యనవుడు విని వాయుజుండు

ఆంజనేయుఁ డోషధీశైలము దెచ్చి రామలక్ష్మణాదుల మూర్ఛ దేలించుట

అతని వీడ్కొని సువేలాచలం బెక్కి - చతురుఁడై పదములు సమముగా మెట్టి
లలితశేషాభవాలము మీఁది కెత్తి - నెలకొని భుజములు నిక్కించి పొంగి
రామునిఁ దలఁచుచు రయమున నెగయ - నామహనీయాద్రి యవనిపైఁ గ్రుంగె
దెసలు గంపించె దిర్దిర ధాత్రి దిరిగె - నసమాన మైనట్టి యారభసమున
నతఁ డట్టు లెగసి యయ్యాకాశవీథి - నతిభీషణం బైన యంబుధి దాఁటి4720
హరిచక్రమునుబోలె నరుగుచు నడుమ - తర మిడి పెక్కుచోద్యములు గన్గొనుచు
సాంద్రఫేనామృతజలనిధి దాఁటి - చంద్రశైలద్రోణశైలమధ్యమున
తిర మైనయాయౌషధీశైల మెక్కి - యరయుచు వచ్చుచో నాయౌషధములు
కామరూపులు గానఁ గపిశేఖరునకు - నేమియుఁ బొడచూపనీ వయ్యెఁ దమ్ము
ననిలనందనుఁడును నవి గానకుండి - తనలోన నందంద దలపోసి చూచి
యతివినయంబున నాపర్వతంబు - నతులగుణోదాత్తుఁ డై వేఁడఁదొడఁగెఁ.
"బ్రాలేయగిరియును బర్జన్యగిరియుఁ - గైలాసగిరియును గైకొన కేను
క్రన్నన వచ్చితిఁ గార్యాతురుండ - నిన్ను నుద్దేశించి నిఖిలాద్రినాథ!
నీయందు నిర్జరుల్ నెఱి దాఁచియున్న - యాయౌషధము లెవ్వి? యవి నాకుఁ జూపు;
మారాఘవునకు గార్యము పుట్టియున్న - దేరూపమున నైన నిచ్చుట లెస్స!"4730
యనిన నగ్గిరి యట్టహాసంబు చేసి - యనిలనందనుతోడ ననియె గర్వమునఁ;
"బెలుచ నీ విటు వచ్చి పెక్కు లాడెదవు; - తలఁకక యీయౌషధములు న న్నడుగ
నీ వెంతవాఁడవు? నిన్ను దెమ్మనఁగ - నేవిధంబున రాముఁ డెంతటివాఁడు?
చేకొని సురలు దాఁచినయౌషధములు - నీకు నిచ్చుటకంటె నేరమి గలదె?”
యని గర్వ మాడిన ననిలనందనుఁడు - కినుకతో ననియె నగ్గిరితోడఁ బేర్చి
"యే నిన్ను వలె నని యిటు వేఁడుకొనిన - దాని విచారింపఁదగదొకో నీకు?

నగలించి నాభుజాయతశక్తి నిన్ను - నగమ! మూలోన్మూలనంబుగాఁ బెఱికి
యిదె కొనిపోయెద నెఱుఁగని రాము - హృదయంబులో నప్పు డెఱిఁగెదు గాక!"
యని భీషణంబుగా హనుమంతుఁ డద్రి - యనువారగాఁ బట్టి యగలించి పేర్చి
పెఱికి గంధర్వుల బెదరంగఁ దోలి - గురు తిడరాకుండఁ గొనిరాఁ దొడంగె4740
ననిలనందనుఁడు సహస్రధారలను - ఘనముగా మండు చక్రముతోడి విష్ణు
కరణి నేతేర రాక్షసవీరముక్త - శరహతి నొచ్చి మూర్ఛల నున్నకపులు
వరమహౌషధవాతవశతచేఁ దేరి - కరము సంప్రీతితోఁ గడఁగి యార్చుచును
అనిమొనఁ బడిన దైత్యావళిఁ గిట్టి - వనధిలోఁ బాఱంగ వైచిరి చెలఁగి
హనుమంతుఁడును సువేలాద్రిపై నుండి - చనుదెంచి యాకపిసైన్యంబునడుమ
మహనీయ మైనట్టి మందులకొండ - మిహిరప్రతాపుఁడై మెల్లన డించి
తపనవంశజులగు తపనసుతాది - కపిముఖ్యులకును స్రుక్కక ప్రయోగింప
ధీయుక్తి నట మూర్ఛఁ దెలిసిరి వారు - నాయౌషధముల మహత్త్వంబువలన
ననిమొనఁ దునక లైనట్టి దేహములు - ఘనమైన సంధానకరణిచేఁ గదిసె.
శరపుంజ మురుశస్త్రచయము విశల్య - కరణిచే నపు డూడి గండులు పూడె.4750
సౌవర్ణకరణిచే సకలాంగకములు - సౌవర్ణకాంతి నుజ్జ్వలములై మించెఁ
గలయంగ సంజీవకరణిచేఁ బ్రాణ - ములు వచ్చి చెలఁగుచు మునుపటికంటెఁ
గడునొప్పి రెంతయుఁ గపివీరులెల్ల - గడఁకతో నిద్ర మేల్కనినచందమున
నప్పుడు కపివీరు లనిలనందనుని - నొప్పార నగ్గించి రుత్సాహ మొదవ
ననిమొనఁ జచ్చిన యసురులఁ గపులు - వనధి నంతకుమున్నె వైచుటఁ జేసి
కదనంబులోని రాక్షసుఁ డొకఁడైన - బ్రతుకుట లేదయ్యెఁ బరమౌషధముల.
నంత సుగ్రీవాదు లైనవానరులు - సంతసంబున సూర్యచంద్రులభంగి
గర మొప్ప రామలక్ష్మణులకు మ్రొక్కి - యరుదార నుతియించి రనిలనందనుని
నప్పుడు మ్రొక్కెడు నాంజనేయునకు - నుప్పొంగ విబుధాళి యుర్వీశుఁ డనియె.
“మనకు వాసవునాజ్ఞ మన్నింపవలయు - ననయంబు గావున నమరులు మెచ్చ4760
నీయోషధీశైల మెప్పటి చోట - వాయుతనూభవ! వైచి ర"మ్మనుడు
మారుతాత్మజుఁ డసమానవేగమున - నారాఘవుఁడు మెచ్చ నగ్గిరిచంద్రు
నెనయ నెప్పటిచోట నిరవొంద నునిచి - చనుదెంచె రయమున సంగరస్థలికి,
అంత సూర్యోదయం బయ్యె రాఘవుని - చింతతోడనె కూడి చీఁకటి వాసె.
నప్పుడు సుగ్రీవుఁ డారామచంద్రు - నొప్పారఁ గనుఁగొని యుల్లాస మెసఁగ
"వసుధేశ! పొలిసె రావణుబలం బెల్ల - నసమసాహసబలాహవకేళి వ్రాలి
గుదులు గ్రుచ్చినక్రియఁ గుంభకర్ణుండు - మొదలైనరాక్షసముఖ్యు లందఱును
అదిగానఁ దనవర్గ మంతయుఁ గడఁగి - త్రిదశారి కయ్యంబు తెఱఁ గొల్లఁ డింక

లంకఁ గాల్పంగ గోలాంగూలబలము - పంకజహితవంశ! పనుపు మీరాత్రి"
ననుమాట విని కపు లందఱుఁ గూడి - యినమండలము గ్రుంకు టెప్పుడో యనుచు4770

వానరులు లంకం గాల్చుట

దమకింపుచుండంగఁ దరణి గ్రుంకుటయుఁ - దమమును పెద్దయై దట్టమై పర్వ
అప్పుడు కపివీరు లధికరోషమున - నుప్పొంగి ధీరులై యుగ్రులై కపులు
గునియుచు నార్చుచుఁ గొరవులు పట్టి - కొని జవంబులు మీఱ గుప్పించి దాఁటి
వడి లంక ముట్టియు వాకిళ్ళవారు - కడుభయంబునఁ బాఱఁగా లంకఁ జొచ్చి
యారావణునిపురి యడలి కాల్చుటకు - నారామవిభుని కోపాగ్ని యేమిటికి?
నీయనలము చాలదే? యని పేర్చి - పాయక లంకఁ గాల్పంగఁ జొచ్చుటయు
అనలుండు దరికొని యందందఁ బర్వి - వినువీథిఁ దాఁకి దిగ్వివరంబు నిండె.
నాయగ్ని బడబాగ్ని యై ధూమపటలి - తోయమై మిన్నప్డు తోయధి వోలె
విస్మయంబుగ మణివితతులు చెదర - భస్మంబుగాఁ గాలెఁ బ్రాసాదతతులు
పొడిపొడిగాఁ గాలి పొడ వెల్ల నడఁగి - పుడమి గంపింప గోపురములు గూలె4780
గ్రక్కున మంట లుగ్రంబుగా నెగయ - నక్కజంబుగఁ గాలి యట్టళ్లు రాలె
మహనీయకాంచనమంటపంబులును - బహురత్నమయగృహపంక్తులు గాలె
నిండినసొమ్ములు నిండినట్లుండ - భండారగృహములు భస్మంబు లయ్యె.
వెల లిడగా రాని వివిధాంబరములు - దలఁపఁ బెక్కైన గంధద్రవ్యములును
బహువిధరత్నకంబళచయంబులును - మహనీయమరకతమౌక్తికాదులును
అగరుకుంకుమమలయజఘనసార - మృగమదాద్యము లైన మేలివస్తువులు
దరగనిబహువిధధాన్యరాసులును - మఱియును గల్గిన మహితవస్తువులు
కడునొప్పు కరితురంగములపక్కెరలు - నెడనెడఁ బ్రోవుఁగా నిడినట్టిజోళ్లు
దొరల ననేకవస్తువులు దైత్యులకుఁ - గరకరి చిత్తము ల్గ్రందంగఁ గాలెఁ;
దడయక పైఁడికత్తళములు పూని - వడి నాయుధములు దుర్వారులై పూని4790
కపులఁ జంపెద మని గడఁగినవారిఁ - గపులపైఁ బఱతెంచి కదిసినవారిఁ
బొలఁతులతో సుఖంబుల నున్నవారిఁ - దొలఁగంగనేరక తూలెడువారిఁ
బోలింపఁ గడునిద్ర బోయెడివారి - బాలుర గొని భీతిఁ బాఱెడువారి
నాలుగుదెసలకు నలి నేగువారిఁ - జాలరోదనములు సల్పెడువారి
నార్పంగ నురుమందిరాగ్రంబు లెక్కి - నేర్పున మఱి దిగనేరనివారి
విడువక ధనముల వెడలంగఁ - బట్టి కడుసంభ్రమంబునఁ గదిసినవారి
ద్రోవలు గానక ధూమంబుచేత - నావలింపుచుఁ బడి యడలెడువారి
గూడి నివ్వెఱఁగంది గుమురులు గట్టి - వాడవాడలయందు వదరెడివారి
నప్పుడు చూడఁ గాలాగ్నిచందమున - నిప్పులు మంటలు నెరయు నప్పురము
గాలుచు నందందఁ గడురభసమున - గాలిచేఁ జెడిరి పెక్కండ్రు నవ్వేళ4800

లలనలమణిమేఖలారవంబులును - గలయఁ జెన్నొందుకంకణరవంబులును
బొలుపారురత్ననూపురరవంబులును - చెలఁగెడునావిపంచీరవంబులును
సురుచిరమధురవచోరవంబులును - నరుదైననృత్తగీతారవంబులును
గర మింపుఁ గులుకు కేకారవంబులును - చరియింపుచుండు హంసలరవంబులును
సొంపారు పంజరశుకరవంబులును - ఇంపారు టెంతయు నేలతోఁ గలిసి
సలలితం బైనట్టి చంద్రికకంటె - తెలుపును బొందిన దీధితుల్ గలిగి
ప్రణుతింప నొచ్చిన పద్మరాగాది - మణులచే నొప్పిన మహిమలు బలసి
కాలెడిరవములఁ గప్పెడిపొగల - వ్రీలి పెల్లెగసెడి విస్ఫులింగముల
నాలంకలోపలి హర్మ్యంబు లెల్ల - చాలభీషణముగా సమసె నన్నియును
గాన సుఖంబెల్ల గ్రాగి నీఱైరి; - మానినీజను లభిమానంబు దూలి4810
చండతరం బైన శబ్దంబుతోడ - మండుచు నుండెడి మంటలఁ గూడి
నెఱపైనతోరణనికరంబు లొప్పె - మెఱుఁగులతో నొప్పు మేఘంబు లనఁగ;
వినువారి గుండెలు వీనులుఁ బగుల - ననయంబు బెట్టుగా నాలంకలోన
తరమిడి యందంద దైన్యంబు మీఱి - వరవధూరోదనంబులు వినవచ్చెఁ;
గాలికాలక తమకట్టులు ద్రవ్వి - నీలిగి విడివడ నేరని కరులు
హయములు గ్రందుగా నాపురంబందు - రయమున ముందు రాముబాణాగ్ని
తలకొని జలచరతతులు సమ్మర్ద - ములను ఘోషించు సముద్రంబు వోలె
బారెడువారిని బఱతెంచువారిఁ - గూరినవగలతోఁ గుందెడువారి
నొదిగెడివారిని నొకకొంత గాలి - విదిలించి కొంచును వెడలెడివారి
లంఘించువారి విలాపించువారి - సంఘంబులై నీరు చల్లెడివారి4820
బట్టి యామంటలో బడఁ ద్రోచి త్రోచి - నెట్టన నార్తురు నెరయంగఁ గపులు
అటు లంక వికలత నంద రాఘవుఁడు - పటుతరకోదండపాణియై కదిసి
త్రిపురము ల్సాధింపఁ ద్రిణయనుఁ డలిగి - విపులపినాకంబు వీఁక మ్రోయించు
కరణి నిర్వక్రవిక్రమశాలి రాముఁ - డురుతరజ్యాఘోష మొనరించుటయును
వసుధాతలంబున వడిఁ జుక్క లురిలె - వసుమతి గంపించె వార్ధులు గలఁగె;
దెస దప్పి రినశశు ల్దవిజాద్రి యొరగె - దెసలసందులు వ్రీలె దిక్కరుల్ బెదరె;
నసమాక్షుఁ డతివిస్మయం బందె భూత - విసరంబు ఘూర్ణిల్లె విధి తల్లడిల్లె;
రయమున రోదోంతరాళంబు మ్రోసె - భయమంది రెంతయుఁ బౌలస్త్యు లెల్ల;
గోదండరవము రక్షోభటసింహ - నాదంబు వీరవానరులయార్పులును
దిక్కు లొక్కట నిండె దివిజారిపురము - దిక్కు గోపించుచుఁ దీవ్రవేగమునఁ4830
గైలాసశిఖరంబుకరణిఁ జెన్నొందు - నాలంకగోపురం బైదుబాణముల
వడి నూఱుతునియలై వసుమతిమీఁదఁ - బడనేసి మఱియును బహుసాయకముల

నేసె గేహములపై నేసె సౌధముల -నేసెఁ దేరులమీఁద నేసె నేయుటయు
నారాక్షసులు పోరు కాయత్తపడఁగ - నారాత్రి వర్తించె నతిఘోరలీల
అప్పుడు సుగ్రీవుఁ డఖిలవానరులఁ - దప్పక చూచి యుదగ్ధుఁడై పలికె
“లావు నొప్పారంగ లంకవాకిండ్లఁ - గావలియుండు రాక్షసుఁ డెవ్వఁడైన
వెడలినఁ జంపుఁడు వెఱచితిరేని - కడుదప్పు సైరింపఁ గపివీరులార!"
అనవుడు కపివీరు లందఱు పేర్చి - కనలుచుఁ గుజములు ఘనశైలములును
చారుభీషణరణోత్సాహులై పూని వారక యక్కోటవాకిండ్లనుండి
దర్పించి యార్చినఁ దరుచరావళుల - యార్పులు సైరింప కసురవల్లభుఁడు4840

కుంభనికుంభాదులు యుద్ధమునకు వచ్చుట

కుంభకర్ణుని కొడుకుల నని కనిచెఁ - గుంభనికుంభుల ఘోరవిక్రములఁ
బనిచి వెండియును గంపనుని బ్రజంఘు - ననికిఁ దోడుగ శోణితాక్షు యూపాక్షు
నారాక్షసులును గజాశ్వరథంబు - లారసి యుద్ధతి నడరి తోనడువఁ
బరిఘపట్టసగదాప్రాసాదికూల - కరవాలకుంతముద్గరభిండివాల
శరశరాసనము లుజ్జ్వలభంగిఁ దాల్చి - గురుశక్తి దానవకోటులు నడువఁ
జారుపతాకాదిచయములు గ్రాల - భూరిభూషణదీప్తిపుంజము ల్వెలుఁగ
నధిక మైనట్టితూర్యంబులు మ్రోయఁ - గుధరంబు లడల దిక్కులు నిండ నార్చి
పరువడిఁ గల్పాంతపవనసంఘములు - తరమిడి కాలాంబుదంబులఁ దాఁకి
విఱియించుతెఱఁగున వీడెల్లఁ గాల్చి - యఱిముఱి విహరించు నగచరావళుల
నురవడిఁ దాఁకి మహోగ్రులై కదిసి - తెరలించి నొంచి యుదీర్ణవిక్రముల4850
వాకిండ్లయందు దుర్వారులై యున్న - యాకపిసేనల నందందఁ దోల
నాలంక వెడలిన యగచరసేన - లోలి వీగుటఁ జూచీ యోడకుం డనుచు
నురుబాహుసత్త్వసంయుతులయి పేర్చి - హరిరోమకేసరు లాదిగా గల్గు
వానరు లాదైత్యవర్గంబుతోడ - మానక రోషసమగ్రులై కదిసి
తరులును గిరులును దఱుచుగా వైవ - కరవాలముద్గరగదల శూలములఁ
బరిఘపట్టసభిండివాలచక్రాది - వరశస్త్రముల నొంచి వ్రాలిన నంత
వారు నఖంబుల వక్షస్థలంబు - జీరియుఁ గర్జనాసిక లోలి దైవ్వఁ
గడిమిమై పండ్లును గఱచియుఁ దలలు - పిడికిళ్లఁ బొడిచియు బేర్కొన నపుడు
నొకవానరుఁడు వచ్చి యొకదైత్యుఁ బొడువ - నొకదానవుఁడు వాని నుద్ధతిఁ బొడుచు.
నొకరాక్షసుఁడు వచ్చి యొకకపిఁ జంప - నొకకపి యాదైత్యు నురవడిఁ జంపు4860
నొకకపి చనుదెంచి యొకదైత్యుఁ బట్ట - నొకదైత్యుఁ డాకపి నుగ్రతఁ బట్టు
నొకదైత్యుఁ డొకకపి యుద్ధ మిమ్మనిన - నొకకపి వానితో యుద్ధంబు సేయు.
నెడపక యేడ్గుర నెనమండ్ర నొక్క - పిడికిటఁ గపు లేచి పెల్లడంగింప

నందంద గూలుదు రసురులు గపులు - నందఱు నుగ్రులై యార్చుచు నపుడు
ఇరువాఁగుఁ బోరంగ నింతింతయైన - తరుమహీధరముల తరుచరాంగములఁ
గరిహయదనుజనికాయకాయముల - వరశస్త్రముల రణోర్వరఘోర మయ్యెఁ
గడిమిమై నప్పు డంగదునితోఁ జేర్చి - కడఁగి కంపనుఁడు నగ్గద యెత్తివైచె,
నంగదుండును నొచ్చి యంతలోఁ దెలిసి - తుంగశైలమున దైత్యుని వేయుటయును
ఆకంపనుఁడు చూర్ణమై నేలఁ గలిసె - నాకపినాయకుఁ డార్చి మోదింప
నతఁడు చచ్చిన శోణితాక్షుండు గినిసి - గతి దప్ప నరద మంగదుమీఁదఁ బఱపి4870
యక్షరాస్త్రము లేయ నడరి యంగదుఁడు - రాక్షసుఁ డున్న యారథముపై కుఱికి
విల్లు ద్రుంచుటయును వెస నొడ్డనమ్ము - నుల్లసితాసియు నుగ్రతఁ గొనుచు
నాకాళమునకు నయ్యసుర పోవుటయు - నాకపివీరుండు నతనితో నెగసి
యారాక్షసునిచేతియడిదంబుఁ బుచ్చి - యారాక్షసుని వేయ నతఁడు మూర్ఛిల్లె;
నంతకుఁడై రాక్షసావలిఁ దునుమ - నంతలోననే శోణితాక్షుండు తెలిసి
గదఁ బుచ్చికొనుచు నంగదుఁ గూడఁ బాఱఁ - గదిసె నప్పుడు తోడుగాఁ బ్రజంఘుండు
యూపాక్షుఁ డది చూచి యొగి రాఁగఁ జూచి - యేపున ద్వివిదుండు నేచి మైందుండు
నాయంగదునకుఁ దోడై కూడికొనిరి - ఆయార్వురకు ఘోరమయ్యె రణంబు
అప్పుడు వానరు లగములు గురియ - జప్పరింపుచును బ్రజంఘుండు ద్రుంచె;
మఱియు నామువ్వురుమర్కటేశ్వరులు - దఱుచుగా గిరులును దరులును నెత్తి4880
కరిరథాశ్వములపైఁ గడుబెట్టు వ్రేయ - నరుదుగా నడుమ యూపాక్షుండు ద్రుంచె.
విన విస్మయంబుగా ద్వివిదమైందులును - బెనఁగొని వృక్షము ల్పెఱికి వైచుటయు
నవి యన్నియును శోణితాక్షుండు నడుమ - గవిసి చూర్ణములుగా గద గొని యేసె.
గలకలధ్వని యొప్పఁ గరవాల మెత్తి - జళిపించుకొనుచుఁ బ్రజంఘుండు గదియ
మానైన యొకనల్లమద్దిమా నెత్తి - వానిపై నడరించి వారక మఱియుఁ
బిడికిట వక్షంబు బెట్టుగాఁ బొడువ - నడిదంబు వైచి యయ్యసురు కోపించి
పిడుగున కెనయైన పిడికిటఁ బొడిచెఁ - బొడిచిన వెస మూర్ఛఁ బొందియు దెలిసి
సమధికముష్టిఁ బ్రజంఘు మైందుండు - తమకించి పొడిచిన ధరణిపైఁ గూలెఁ;
బృథివిపై నిటు దనపినతండ్రి పడుట - ప్రథితంబుగాఁ జూచి రథ మటు డిగ్గి,
యడిదంబుఁ దాల్చి యూపాక్షుండు నడువ - విడువనియలుకతో ద్వివిదుండు దాఁకి4890
వరముష్టి యమరించి వక్షంబుఁ బొడిచి - గురుసత్త్వుఁడై పట్టుకొనుటయు నపుడు
అతనితమ్ముఁడు శోణితాక్షుండు వచ్చి - వితతబలం బొప్ప ద్వివిదునిఱొమ్ముఁ
బిడికిట నొప్పించి పెనుమూర్ఛఁ బుచ్చి - విడిపించుకొనిపోయె వేగ యూపాక్షు
దెలిసి మైందునితోడ ద్వివిదుండు గూడి - సొలవక యూపాక్షశోణితాక్షులను
అటు దాఁకి వారితో నని చేయునపుడు - చటులత ద్వివిదుఁ డాశ్చర్యంబు గాఁగ

నలమి క్రమ్మిన శోణితాక్షునిఁ బట్టి - యిల వైచి ప్రామె రూ పేర్పడకుండ
నడరి మైందుండు యూపాక్షునిఁ గిట్టి - బెడిదంబుగాఁ దనపిడికిటఁ బొడిచి
చలమున ధీరుఁడై చంపెను బేర్చి - నలియ నెమ్ములు మేను నలినలి గాఁగ
నిలమీఁదఁ గపులచే నిట్టిచందమున - నలువురుఁ బడుటయు నానాముఖముల
నేపరి రాక్షసు లెల్లను బాఱఁ - గోపించి యప్పుడు కుంభుండు వారి4900

కుంభనికుంభుల యుద్ధము

వెఱవకుం డని తనవింటిలా వొప్ప - మెఱుఁగుటమ్ములు దొడ్గి మెఱుఁగులతోడి
సురచాప మనఁజాలి శోభిల్లుదాని - పరఁగఁ బ్రత్యాలీఢపాదుఁడై నిల్చి
తెగఁగొని వేయఁగ ద్వివిదుండు భిన్న - నగముకైవడిఁ గూలె నతిఘోరలీల
ముందఱ ననుఁగుఁదమ్మునిపాటుఁ జూచి - యందంద మైందుండు నసమవేగమున
గుంభునిపై నొక్కకొండ వైచుటయుఁ - గుంభుఁ డైదమ్ములఁ గుధరంబుఁ ద్రుంచి
మఱియు నొక్కమ్మున మైందుని నేయ - నొరిగె నయ్యచరుం డుర్వరమీఁద
ధరమీఁద నీగతిఁ దనమేనమామ - లిరువురుఁ గూలిన నేచి యంగదుఁడు
కుంభునిపై వైచె ఘోరభూధరము - కుంభుఁ డేడమ్ముల గుధరంబుఁ ద్రుంచి
నెరబాణములు మూఁట నిటలంబు నేసి - మఱి పెక్కుశరముల మర్మంబు లేయ
నెరియుచుఁ గుంభుపై నెగసి యంగదుఁడు - తరు లెత్తి వైచె నత్తరువును ద్రుంచి4910
యాకుంభుఁ డంగదు నందంద మఱియు - భీకరబాణసంపీడితుఁ జేయ
నతఁడు మూర్ఛిల్లిన నారాముకడకు - నతివేగమున వానరావలి పాఱి
యంతయుఁ జెప్పిన నధిపతి జాంబ - వంతుఁ డాదిగఁ గల వనచరోత్తములఁ
బనిచిన వారును బాదపశిలలు - దనుజుల నొంచుచుఁ దఱుమఁ గుంభుండు
వారి ననేకతీవ్రప్రకాండముల - వారక నొప్పించి వారి వారించె;
నప్పుడు సుగ్రీవుఁ డాకపివరుల - నప్పరుసునఁ బడ్డ యంగదుఁ జూచి
కోపంబు ముడివడఁ గుంభునిఁ జూచి - యేపారఁగాఁ జొచ్చి యెన్నఁ బెక్కైన
ఘనశైలములు నశ్వకర్ణవృక్షములు - వనచరు లార్వంగ వైచి పెల్లార్చె;
నవి యన్నియును గుంభుఁ డంతలోఁ ద్రుంచి - రవిజుని బెక్కుమార్గణముల నొంప.4920
స్రుక్క కాతనివిల్లు సుగ్రీవుఁ డొడిసి - యక్కజంబుగఁ ద్రుంచి యటు పాఱవైచె;
దంతంబుఁ దునిమినఁ దఱిమి పైవచ్చు - దంతిచందంబునఁ దఱిమి కుంభుండు
కడురోషమున మండి కడఁగి సుగ్రీవుఁ - బడవైతు నని పాఱి పట్టుకొన్నప్పు
డినజుండు కుంభుండు నిభములు రెండు - పెనఁగినకైవడి పెనఁగి రుద్దతిని
గరలాఘవము గొప్పఘనశక్తి మెఱసి - చరణఘట్టనల భూస్థలము గ్రక్కదలఁ
బొగలచందమున నూర్పులు గ్రమ్ముచుండ - మిగిలినతాఁకుల మిన్నెల్లఁ బగుల
అప్పుడు సుగ్రీవుఁ డాకుంభుఁ బట్టి - త్రిప్పి యంబుధి వైచె దేవత లార్వ

దనుజుఁ డావారిధితలము ఘోరంబు - దనరారఁ బడియె మందరశైల మనఁగఁ
బడియు నాదనుజుండు భానుజుఁ జేరఁ - గడఁకతోడుత మహోగ్రత నేగుదెంచి
బెడిదంబుగా ఱొమ్ముఁ బిడికిటఁ బొడువ - నెడ వచ్చి యదియు నాయెమ్ములు దాఁకఁ
గడిఁది వజ్రము దాఁకఁ గనకాద్రి వెడలు - మిడుగురులో యన మిడుగురు లెగసె4930
దానికిఁ గోపించి తరణినందనుఁడు - దానవాధము నురస్స్థల మారఁ జూచి
యచ్చెరువుగ ముష్టి నమరించి పొడువఁ - జచ్చె నద్భుతబహుసత్వుండు దూలి
వాఁ డంత శాంతపావకుఁడును బోలె - వేఁడిమి చెడి పడ్డ వెఱచి రాక్షసులు
పఱచిరి దివియు భూభాగంబు పగుల - నెఱి దప్పి యెంతయు నీరధి గలఁగ
నప్పుడు దమయన్న యవనిఁ గూలుటయు - నిప్పులు చెదరెడు నెరిచూడ్కు లడరఁ
గొలఁదికి మీఱిన కోపంబుతోడ - నలి నికుంభుఁడు సింహనాదంబు చేసి
కనకరత్నప్రభాకలితమై తనరి - యనయంబు గంధపుష్పార్చితం బైన
పరిఘఁ ద్రిప్పుటయును బ్రహ్మాండ మెల్ల - నురిలెడుగతి నుండె నుగ్రభావమున
నాశ లన్నియు దీరినట్లయ్యె వాయు - పాశంబులును ద్రెస్సి పలువిధం బయ్యె
హనుమంతుఁ డప్పు డుద్ధతి దైత్యుఁ దాఁకి - యినతనూభవునకు నెడసొచ్చి పేర్చె;4940
ఘోరాజిఁ బరిఘ నికుంభుండు ద్రిప్పి - మారుతివక్ష మున్మత్తుఁడై వ్రేసె
వ్రేసిన నత్యుగ్రవిస్ఫులింగములు - భాసమానంబులై పర్వుచునుండ
నురములో చెయువెట్టి దోయన నపుడు - కర మరుదుగఁ బరిఘము తుమురయ్యె;
వాలినపరిఘంబు వాటున నతఁడు - గాలిచేఁ దూలు వృక్షంబును బోలెఁ
దూలియు ధైర్యంబుతోడ నికుంభు- వాలినపిడికిట వక్షంబు వొడిచెఁ;
బొడచిన నాదైత్యపుంగవు నురము - కడు వ్రస్సి నెత్తురు గ్రమ్ముదెంచుటయు
నతఁడు మహానిలాహతి మహీజంబు - గతిఁ గంప మొందియుఁ గ్రమ్మఱఁ దెలిసి
హనుమంతుఁ బట్టి యుద్ధతి మీఁది కెత్తి - దనుజు లార్వఁగ వియత్తల మెల్ల నద్రువఁ
గడువేగమున వైవఁ గపికుంజరుండు - విడిపించుకొని రణోర్వీస్థలి కుఱికి
కడఁగి నికుంభు నుగ్రత బిట్టు వొడిచి - వడిఁ బడవైచి యవ్వసుమతిమీఁద4950
విసరి యమ్ములు పారవ్రేసి ఱొమ్మెక్కి - దెస లద్రువఁగఁ దల ద్రుంచి పెల్లార్చె;
నారభసంబున నవనియు మిన్ను - వారిధులును దిశావలయంబు మ్రోసె;
హతశేషరాక్షసు లాలంకలోని - కతిరయంబునఁ జని యారావణునకుఁ
గుంభనికుంభాదిగురుసత్త్వధనులు - కుంభినిమీఁద నాల్గురుదైత్యవరులు
కూలుట చెప్పినఁ గోపించి యసుర - వాలిన ఖరుఁడను వానినందనుని
మకరాక్షుఁ బిలిచి “సమగ్రసైన్యములఁ - బ్రకటంబుగాఁ గూర్చి పరఁగంగ నీవు
రామలక్ష్మణుల మర్కటములఁ జంపి - రా మగఁటిమి” నని రావణుఁ డాడ

మకరాక్షుఁడు యుద్ధమునకు వచ్చుట

విని మహోత్సాహుఁడై వేగంబ వాఁడు - దనతండ్రి పగఁ దీర్ప దన కబ్బె ననుచు

ముదమంది తనరెండుమూపు లుప్పొంగఁ - ద్రిదశారి కప్పుడు ధీరుఁడై మ్రొక్కి;
వీడ్కొని రథ మెక్కి వెడలి కయ్యంబు - వేడ్కతోఁ దనయొద్ది వీరుల కనియె;4960
"మీరు సమగ్రత మెఱసి యుగ్రతను - బోరుఁడు కపులతోఁ బొరిఁబొరి నేను
రామలక్ష్మణుల మర్కటుల నాదైన - భీమశరాగ్నుల భిన్నులఁ జేసి
యేఁచెద" ననవుడు నెలమి దానవులు - త్రోచి తో నడవంగ దుశ్శకునములు
గలిగెఁ బె క్కవియెల్లఁ గనియు నయ్యసుర - తలఁకక తూర్యనాదంబులు సెలఁగ
నలి నార్చి కవిసె వానరసేనమీఁద; - నిలయు నాకాశంబు నిట్టట్టుఁ బడఁగఁ
దఱిమి వానరులును దరులును గిరులు - దఱచుగా వైచిరి దైత్యులమీఁద
దానవులును గదాదండకోదండ - మానితఖడ్గాదిమహితశస్త్రముల
వాని నన్నింటిని వడిఁ ద్రుంచి వైచి - వానరకోటి దీవ్రత నొంది యార్చి
రాసమయమున నమ్మకరాక్షుఁ - డాసర్వకపులపై నతివేగ రథము
పఱపుచుఁ గదిసి ముప్పదింట నూఱింట - నఱువదింటను మఱి యరువదేనింట4970
నిరువదింటను వెస నిరువదాఱింటఁ - బరఁగ నాఱింటను బండ్రెంట రెంటఁ
బదిటఁ బదేనింట బదునెన్మిదింటఁ - బదుమూఁట నాల్గింటఁ బదునాలుగింటఁ
దెగఁగొని మూఁట నైదింట నేడింట - నగలించి తొమ్మిది యమ్ముల నేసె;
నవి సహింపఁగ లేక యఖిలవానరులు - భువి తల్లడిల్ల నప్పుడు పాఱుటయును
ఏమి భయం బిట నే నుండ ననుచు - రాముఁడు విలుఁగొని రాక్షసు ల్బెదరఁ
జతురంగబలములఁ జంపుటఁ జూచి - యతికోపమున మకరాక్షుండు పేర్చి
యరదంబు వఱపించి యారాము డాసి - "ఖరసూతి నేను రాఘవ! మున్ను నీవు
పెరిగి మాతండ్రిఁ జంపినఁ దానఁ జిత్త - మెరియుచు నుండె నా కింతకాలంబు
నాకు నీతోడి రణం బబ్బుటయును - జేకొని చింతింతుఁ జేకూడె నేఁడు;
తరలకు నీవు మాతండ్రిసూఁడునకు - నెరయంగఁ బోరాడ ని న్గంటి నేను4980
దుర మొనరింపు నాతో వింట నైనఁ - గరవాలమున నైన గద నైన” ననుడు
వానితో రాఘవేశ్వరుఁడు కోపించి - "దానవాధమ! యీవృథాగర్వ మేల?
భాసిల్లు నాబాహుబలము సొంపారఁ - గా సమరంబున ఖండింతు నిన్ను”
ననుడు రాముని మకరాక్షుండు గిట్టి - ఘనమైన నిశితాంబకంబులు నేసె
నేసిన నవి రాముఁ డెడఁ ద్రుంచివైచె - నాసమయంబున నవనియు మిన్ను
నిండ నాయిద్దఱ నిష్ఠురచాప - దండమహాగుణధ్వనులు పెల్లడరె;
సురఖేచరాదులు చోద్యంబు నొంద - నరుదార నేయు రామాస్త్రంబు లెల్ల
నతివేగమున మకరాక్షుండు ద్రుంచి - యతనిపై బాణంబు లడరించుటయును
నవి రాఘవుఁడు త్రుంచి యమ్మకరాక్షు - వివిధనిష్ఠురశరావృతుఁ జేయ నతఁడు
నవి యెల్లఁ గడఁగి యత్యంతరోషమున - వివిధఖండములు గావించి పెల్లార్చెఁ;4990

గోపించి కాకుత్స్థకులుఁడు నద్దైత్యు - చాపంబు వెస నొక్కశరమునఁ ద్రుంచి
సారథి నెనిమిదిసాయకంబులను - నారథంబును మఱి యన్నిబాణముల
వికలత్వ మొనరింప విరథుఁడై యపుడు - మకరాక్షుఁ డొక్కసమగ్రశూలంబు
వైచిన నది వేగ వచ్చుట విభుఁడు - చూచి మూఁడమ్ములఁ జూర్ణంబు చేసే;
అనిమిషు లారాము నగ్గించి రపుడు - దనుజుండు కినిసి యాదశరథాత్మజునిఁ
బిడికిటఁ బొడువంగ బి ట్టేగుదేర - నడుమనె యారామనరనాయకుండు
అనలాస్త్రమున హృదయము గాడ నేయ - ననిమొన నమ్మకరాక్షుండు గూలెఁ;

ఇంద్రజిత్తు యుద్ధమున కరుగుట

బ్రథితారుణప్రభాభాసియై యంత - బ్రథమాద్రిపై దోఁచెఁ బద్మబాంధవుఁడు
హతశేషరాక్షసు లాలంక కరిగి - యతఁడు చచ్చుటఁ జెప్ప నారావణుండు
కోపంబు చింతయుఁ గూడి చిత్తమున - నేపార ననియె నయ్యింద్రజిత్తునకు5000
“రణమునఁ గపులను రామలక్ష్మణులు - క్షణమాత్రమునఁ జంపఁగాఁ జాలువాఁడ
వీవె కా కింక నాకెవ్వరు గలరు? - నీ విట నీవాహినీసమేతముగఁ
జని యందఱను జంపి చనుదెమ్ము తొల్లి - యనిమిషకోటుల ననిఁ ద్రుంచుకరణి
రణమున గెల్చి సంరంభంబుతోడఁ - బ్రణుతింప నేతెమ్ము ప్రమర మొప్పార"
ననవుడు నింద్రజి త్తారావణునకు - వినయంబుతో మ్రొక్కి వీడ్కొని కదలె;
వాయువేగములయశ్వంబులఁ బూన్చి - యాయితం బైనట్టి యరదంబు నెక్కి
శరదభ్రసంవృతశైలంబుకరణి - గురుభుజుండై వెలిగొడుగులనీడ
రమణీయకంకణరణితము ల్మెఱయ - రమణు లిమ్ములఁ జామరములు వీవ
నొలసి మోమున సంగరోత్సాహలీల - దళుకొత్త నేతెంచి తల్లికి మ్రొక్కి
జనని దీవింపంగఁ జని తనపత్ని - దనయుల వీడ్కొని తమ్ములచావుఁ5010
దలపోసి కోపాగ్ని దరికొనఁ బేర్చి - యలఘుదర్పంబున నయ్యింద్రజిత్తు
మానక రోషసమగ్రతతోడ - దానవకోటులు దన్ను సేవింప
ఘనకామరూపులు దనమంత్రివరులు - తనుఁ గొల్వ నుత్తరద్వారంబునందు
నద్రులగతిఁ దేరు లఱువదికోట్లు - భద్రగజంబులు పదుమూఁడుకోట్లు
కొరలెడు నాల్గేసి కొమ్ములు కరులు - పరఁగంగఁ గోటి నిర్భరవృత్తి నడువఁ
దురగంబు లరయంగఁ దుద నూఱుకోటు - లురుతరహేషంబు నొప్పుచు నడువ
భేరుండములఁ బోలి పెంపు వహింప - భూరివేగంబునఁ బొలుపారునట్టి
చిలుకవన్నియలతోఁ జెలఁగుగుఱ్ఱములు - కొలఁదులై నాలుగుకోటులు నడువ
వలుదనిస్సాణాదివాద్యముల్ మ్రోయఁ - గలనికి వెడలి లంకాపురినుండి
తనచుట్టు దైత్యు లంతములేక గొలువ - ఘనతరభీషణాకారంబుతోడ5020

వానరవీరదుర్వారనాదముల - మానైన రణమహీమధ్యంబుఁ జొచ్చి

ఇంద్రజిత్తు హోమముఁ జేసి కృత్తి యనుశక్తిఁ బుట్టించుకొని మాయాయుద్ధము చేయుట

యరదంబు డిగి ధీరుఁడై కాచి యుండఁ - దిరిగిరా దైత్యులఁ దెఱఁగొప్ప నిలిపి
గురుతరవేది త్రికోణమై పెద్ద - పరపొంది దక్షణప్రవణమై యున్న
భూరిశ్మశానాగ్ని పొలుపారఁ దెచ్చి - ధీరుఁడై వేదిలో దీపింపఁజేసి
రక్తవస్త్రంబులు రక్తమాల్యములు - రక్తచందన మనురక్తుఁడై తాల్చి
దండంబు నుపవీతతతియు మౌంజియును - నిండుమనంబుతో నెరయంగఁ బూని
యలవడ నచట ఖట్వాంగధ్వజంబు - నిలిపి కపాలంబు నిష్ఠతో నెక్కి
పరఁగంగఁ గంకాళపరిధిఁ గావించి - తిరముగా దక్షిణదిశ స్రుక్ప్రువంబు
లినుపపాత్రల మంచి యేర్పడఁ గృష్ణ - తనుఁ డైనవానిరక్తమును మాంసమును
పొరిఁ బొరి నవి నిండఁ బోసి మౌనంబు - ధరియించి యప్పు డథర్వణక్రమము5030
దప్పక యుండ మంత్రము లుచ్చరించి - చొప్పడ నినుపస్రుక్స్రువములు పట్టి
కమియఁ బావకుఁడును గడునొప్పుతాటి - సమిధలు తిలలును సర్షపంబులును
హోమంబు సేయంగ నురుతరంబగుచు - నామహాధూమ మజాండంబుఁ గప్పె
నాయగ్నిలోనుండి యప్పుడు వేగ - యాయతం బై నట్టి యరదంబు వెలుఁగ
రయమున నుగ్రకరాళకేశములు - భయదరూపంబు కపాలపాత్రయును
దళతళ మను కోఱదవడలు మెఱయ - మలగ కార్చుచు నస్థిమాలిక లలర
నెఱమంట లొలికెడునేత్రంబు లొప్ప - నుఱక హాసముతోడ నొకకృత్తి వెడలి
“పంపుము పంపు మేపని కైన నన్ను - సొంపారఁ జేసెద సురవైరి!" యనుడు
నాకృత్తి నడిగి యింద్రారి శస్త్రములు - నాకృత్తిఁ గైకొని యాకాశమునకు
నరదంబుతోడనె యరిగి వానరులఁ - దిరిగి యేయుటకు నదృశ్యుఁడై యుండె,5040
అంతట నారావణాత్మజుసేన - యంతయుఁ గ్రమ్మఱి యరిగె లంకకును;
అట నింద్రజిత్తును నాకపిసేనఁ - బటుశిలీముఖపరంపరల నొప్పింప
వలియ దాఁకెడిశిలావర్షంబుచేతఁ - బలుదెసఁ జెడి పాఱుపక్షులో యనఁగ
ఛిన్నభిన్నాంగులై చెదరిరి కొంద; - ఱున్నతగతి దప్పి యుండిరి కొంద;
ఱెసఁగంగఁ జేవురుటేఱులతోడి - వసుమతీధరములు వడిఁ గూలుకరణిఁ
బడిరి రక్తంబులపైఁ బయి దొరఁగఁ - గుడుసుగా మఱి యొకకొందఱుకపులు;
అప్పు డాయమ్ములయంధకారంబుఁ - గప్పి యెవ్వరికినిఁ గానరాకుండ
నంత వానరవీరు లంతరిక్షమున - నంతర్హితుం డగు నాయింద్రజిత్తుఁ
బొడ గానఁజాలక భూనభోంతరము - వడి నిండఁ బఱతెంచువాఁడిబాణముల
నడుములుఁ దెగువారు నలి యైనవారు - కడికండలై నేలఁ గలిసినవారు5050

కడిమిమై నాజికిఁ గైకొన్నతరులు - విడిచి యమ్ములు గాడ వెసఁ జచ్చువారు
నడునెత్తిఁ బడు ఘోరనారాచసమితి - పుడమితోఁ గీలింపఁ బొడవులు సెదర
నిలువుచచ్చినవారు నిఖిలాంగకముల - బలుబాణములు గాడఁ బడి పొరల్వారు
మాతంగశవముల మాటుకొన్వారు - చేతుల గిరు లెత్తి చేష్టించువారు
దృష్టికిఁ దోఁపక తిరిగి విన్వీథి - దృష్టించి యౌడులు దీటెడువారు
నఖిలాశుగప్రవాహములు పైఁ దొరఁగ - ముఖసరోజములకు మురియ రాకుండ
బొందిమీఁదికి నెత్తి భూరిసేతువుల - చందంబుగాఁ బ్రకోష్ఠము లొడ్డువారు
ప్రేవులు ప్రోవులై పృథివిపైఁ బడఁగ - నావులింతలతోడ నధికనిద్రలను
గనుమూయువారును “గడిమీరామునకు - నని ప్రాణ మీగంటి" మని పల్కువారు
చిచ్చఱపిడుగుల చెలువునఁ జదర - వచ్చు కోలలఁ గేల వడి నొడ్డువారు5060
వాలంపపొదువుల వాలఘాతములఁ - దూలించువారు నెత్తుటఁ దోఁగువారు
ఘోరాంబకంబులఁ గొనియు ధైర్యంబు - లారంగ నిశ్చలు లై యుండువారు
“దుర్లక్ష్యుఁ డితఁ డని తొడరంగ నేఁడు - దుర్లభం" బని బ్రహ్మ దూషించువారు
"బ్రహ్మ యిచ్చినశక్తిఁ బదిలుఁడై వీఁడు - బ్రహ్మాండమునఁ గానఁబడకున్నవాఁడు
బ్రహ్మవరం బెంత? బ్రహ్మాండ మెంత? - బ్రహ్మ యెంతటివాఁడు? పార్థివేంద్రునకుఁ
దలపోయ ననిలోన ధరణీశుఁ డేటి - కలుగఁడో" యనువారునై యుండ మఱియు
నుద్దండకోదండ మొకచోట మొఱయ - నుద్దామశరజాల మొకచోట నిగుడ
నొకచోట దను జెప్పు నొకచోట నార్చు - నొకచోట నదలించు నొకచోట నవ్వు
నొకచోట హుంకార మొనరించు నట్లు - సకలభీకరలీలఁ జరియింప నలిగి
యురుభుజుం డాంజనేయుఁడు నంగదుండు . శరథుండు ఋషభుండు జాంబవంతుండు5070
గజుఁడు గవాక్షుండు గంధమాదనుఁడు - విజయుండు నీలుండు వెస సుషేణుండు
పనసుండు మొదలుగాఁ బటుపరాక్రములు - వనచరు లందఱు వడి దరు ల్గిరులు
నిగిడి యాకస మెల్ల నిండ వైచుటయు - మొగి వచ్చుకరములు మురియులై చెదరి
జడి యశరానిల చటులవేగమున - నుడుగని మ్రోఁతతో నురువడి వచ్చి
యాశైలములు దరు లప్పుడు దునిసి - యాశకలములపై నందందఁ దొరఁగ
నాశంబు లైరి వానరులు పెక్కండ్రు - ఆశాకరీంద్రంబు లవని కంపింప
మెఱసినకడిమిమై మేఘనాదుండు - నెఱయంగ నిగుడించు నిబిడబాణములఁ
గొందఱు తునియలై కూలిరి భీతి - నొంది కొందఱు పాఱి రొదిగి దిక్కులకుఁ
బ్రదరపరంపర ల్పఱపుచు నిట్టు - పదికోటు లగచరపతుల రూ పడఁచి
వెండియు నెదిరిన వీరవానరుల - ఖండించి యతిచండకాండసంతతుల5080
నతులవిక్రముఁ డైన హనుమంతు వాలి - సుతు శతబలి గవాక్షుని నీలు నలుని
బంధురబలుఁడైన పనసునిఁ గుముదు - గంధమాదను ఋక్ష కపియూథపతుల

మఱియుఁ గొందఱ నుగ్రమార్గణావళుల - నఱిమురి నిశ్చేష్టు లై యుండ నేసి
యాదితేయుల గుండె లవియ నమ్మేఘ - నాదుండు పటుసింహనాదంబు సేయ
మనముల భీతిల్లి మానము ల్దూలి - వనచరు ల్దనవెన్క వచ్చి చొచ్చుటయు
సౌమిత్రియును రామచంద్రుని జూచి - “భూమీశ! యీమాయపొందున వీఁడు
వినువీథి నత్యంతవిభవంబుతోడఁ - దనుఁ గానరాకుండ దర్పించినాఁడు
గర్వించి యిబ్భంగిఁ గపివీరబలము - సర్వంబు సమయింప సమకట్టినాఁడు
మన మింతలో వీని మడియింపవలయు” - ననవుడు శ్రీరాముఁ డనుజుతో ననియె,
"విను బ్రహ్మవరమున వినువీథి వీఁడు - దనరూపు చూపక దాఁగి యున్నాఁడు 5090
మన మెంత యలిగిన మనకు లోఁబడఁడు - వినుము లక్ష్మణ! నేఁడు వీఁ డసాధ్యుండు
అస్త్రంబు లేమియు నతనిపైఁ గొలుప - నస్త్రము ల్చెడిపోవు" నని పల్కుచుండ
నాసమయంబున ననిలుండు వచ్చి - భాసురమృదువచోఫణితి నిట్లనియె.
"విను వీనిమాయకు వెరవు భూనాథ - దనర నాగ్నేయమంత్రము జపియించి
నీవు బాణం బేయ నెరిఁ దప్పి కృత్తి - దేవారిఁ బాసి యదృశ్యమై పోవు;"

శ్రీరాముఁ డాగ్నేయాస్త్రముచే నింద్రజిత్తునిమాయ దెరల్చుట

నని యర్థి దీపింప ననిలుండు పలుక - జననాథుఁ దాహవసంరంభ మెసఁగ
మానితం బగు నగ్నిమంత్రపూతంబు - గా నమ్ము సంధించి కడఁకతో నేయఁ
గృత్తి యత్యద్భుతక్రియ నింద్రజిత్తు - నత్తఱి నెడఁబాసి యరిగె నెందేని;
ఆయింద్రజిత్తును నవని కేతెంచి - యాయెడఁ గార్ముకజ్యానాద మడరఁ
గడఁగిన నంత నక్కపికులోత్తంసు - లడరిన యామూర్చ లందంద తెలిసి5100
వడిఁ గూడికొని వచ్చి వానిపైఁ గవిసి - కడిఁదియౌ శైలశ్యంగమును వాయుజుఁడు
గండశైలముల నంగదుఁడు మైందుండు - దండిమై ఘనపర్వతమును గజుండు
జయమూల మైన వృక్షమును నీలుండు - రయమున నశ్వకర్ణంబున నలుఁడు
అవనీధరంబును నర్కనందనుఁడు - నవిరళశాఖిని నటఁ బనసుండు
కదిసి యుగ్రం బైన గద విభీషణుఁడు - గదరుచు సాళవృక్షమును సంపాతి
భూజమహాశైలముల వలీముఖులు - నాజాంబవత్ప్రముఖాదివీరులును
నలి నార్చి మూఁడుబాణముల లక్ష్మణుఁడు - కలయంగ నూరంబకముల రాఘవుఁడు
వానిపై నడరింప వాఁ డంతపట్టు - నానాంబకములఁ జూర్ణములు గావించి
యనలోగ్రఘోరంబు లైనబాణముల - వనచరసేనల వడిఁ బెల్లువఱపి
కరలాఘవం బొప్ప గంధమాదనునిఁ - బరుషోగ్రకరములఁ బదునెన్మిదింట5110
నేడింట మైందుని నేడింట ద్వివిదు - నేడింట హనుమంతు నేడింటఁ గుముదు
వడిఁ దొమ్మిదింట నవ్వాలినందనునిఁ - గడిమి నన్నియ సాయకమ్ముల నలుని
నైదింట నీలు గవాక్షు నేడింట - నాదిత్యనందను నఱువదేనింటఁ

బనసుని నిరువది పటుసాయకముల - నెనయంగ దధిముఖు నేకబాణమున
నెసఁగ లక్ష్మణు డెబ్బదేనంబకముల - వసుధేశు నఱువదివరసాయకముల
సాయకత్రయమున శతబలి నూఱు - సాయకంబుల విభీషణుని నొప్పించి
మఱియుఁ దక్కినఋక్షమర్కటవరుల - గొఱప్రాణములతోడఁ గూలనేయుటయు
నప్పుడు హనుమంతుఁ డచలశృంగంబు - నుప్పొంగి యంగదుం డురుగండశిలయు
పనసవిభీషణు ల్బలుగద ల్బలిమి - దనర సంపాతి యుత్తాలతాలమును
నలుఁడు సారాశ్వకర్ణముల నందంద - నలినాప్తతనయుఁ డున్నతిగ్రావములను5120
సౌమిత్రి మూఁడుగ్రసాయకంబులను - భూమీశుఁ డురుశరంబులు నూఱు పఱుప
శరభుండు ఋషభుండు జాంబవంతుండు - నురుభుజుండగు గవయుఁడు సుషేణుండు
వెస గవాక్షుండును ద్వివిదమైందులును - నసమానవిక్రము లయినవానరులు
తక్కినవారును దరుశైలతతుల - నక్కజంబుగఁ బేర్చి యందంద వైవ
వానిఁ దుత్తునియలై వడిఁ గూలనేసి - భానునందను నొక్కభయదభల్లమున
వక్షంబు నొప్పింప వడఁకి పెన్గాలి - వృక్షంబు చలియించువిధ ముండె నతఁడు;
ఆలోన ఋషభగవాక్షసుషేణ - వాలినందనజాంబవంతులు కుముద
మారుతసుతగంధమాదననలులు - వీరాదిగాఁ గల వీరవానరుల
వివశులగాఁ జేసి వివిధబాణముల - నవనీశుపై నేసి యస్త్రలాఘవము
విలసిల్ల లక్ష్మణు విలుఁ ద్రెవ్వనేసి - యలుక విభీషణు నదరంట నేసి5130
విలయకాలాంబుదవిధమునఁ జెలఁగి - పలుమాఱు గర్జించి పలికె నెంతయును;
“చూచితె! రఘురామ! సుగ్రీవముఖ్యు - లేచందమునఁ గూలి రే నల్గి నపుడు
నరనాథతనయ! ని న్నమ్మినయట్టి - బిరుదువానరజాతి పీచంబు లడఁగె;"
ననుచు వెండియుఁ బేర్చి యన్నిశాచరుఁడు - ఘనబాణతతుల నక్కపిసేనమీఁద
నడరించె ఘనభూధరాభదేహముల - నెడలేక యుండ ననేకమార్గణము
లటులేసి “తెలిసితి" నని యార్చికొనుచుఁ - బటుగతి లంకలోపలి కేగి యంత
తనసంగరక్రీడ దశకంఠుతోడ - వినుతంబుగాఁ జెప్ప విని యతం డుబ్బి
తనయ! రమ్మనుచు నందనుఁ గౌఁగిలించి - కొని" నాకు నీయట్టికొడుకు గల్గంగఁ
బగవారిచే నాజిఁ బడినబాంధవుల - పగ నీగఁ గాంచితి బాసె నావగపు;
కడిఁదివీరుఁడు కుంభకర్ణుండు మడిసె; - నడఁగె మహాబలుం డగు ప్రహస్తుండు5140
మృతిబొందెఁ ద్రిశిరుండు మేటివీరుండు - హతుఁడయ్యె నతికాయుఁ డాలంబులోను
నొగి మహాపార్శ్వమహోదరు ల్వడిరి - తెగిరి నరాంతకదేవాంతకులును
గుంభకర్ణునిసుతు ల్ఘోరవిక్రములు - కుంభుండు పడియె నికుంభుండు సమసె
మకరాక్షుఁ డనిలోన మడిసె తోడ్తోన - సకలనిశాచరసైన్యంబు వొలిసె
లంకఁ గాల్చెను నొకలావగుకోఁతి - ఇంక నేటికి మాట లివి యెల్లఁ దలఁచి;

రయమునఁ జని నీవు రామలక్ష్మణుల - భయదసాయకపరంపర లేసి చంపు
రణదక్షుఁడవు నీవు రణములోఁ దొల్లి - తృణలీల గెలిచి దేవేంద్రునిఁ గడిమి
నీ వేచి నడచిన నిఖిలలోకములు - భావించి నప్పుడె భస్మమై పోవు;

ఇంద్రజిత్తు హోమమును చేసి శస్త్రసమేతముగా రథమును బడయుట

నరు లెంతవారు? వానరు లెంతవారు? - పరికింప నీ" కని పల్కి వీడ్కొలుప
నెలమితోడన పురోహితునిఁ దోడ్కొనుచు - బొలుపారఁగా రణభూమి కేతెంచి5150
చెన్నొంద హోమంబు సేయంగఁ బూని - యున్నంతఁ బరిచారు లొగి వేగమునను
బరఁగంగ నరసి కపాలపత్రికలు - సొరిది నుక్కున నయినస్రుక్స్రువంబులును
శస్త్రంబులును దాటి సమిధలు రక్త - వస్త్రగంధాదులు వరుసఁ దెచ్చుటయు
రక్తాంబరంబులు రక్తమాల్యములు - రక్తగంధంబును రయ మొప్ప నతఁడు
ధరియించి మారణతంత్రమార్గమునఁ - బరువడిఁ దోమరప్రాసఖడ్గములు
సరిపరిధులు పెట్టి సప్రాణకృష్ణ - హరిణంబు మెడ యస్థి యది పుచ్చుకొనుచు
నక్తంచరాధీశునందనుం డెలమి - యుక్తక్రమంబున హోమంబు సేయఁ
దనరిన ధూమప్రదక్షిణశిఖల - ననలుండు వెలుఁగుచు నాహుతు కొనియె
జయనిమిత్తంబులు చాలఁ గల్గొనుచు - జయశీలుఁ డానిశాచరవీరుఁ డలరి
నియతిహోమము దీర్చి నిరుపమం బైన - హయచతుష్టయముతో నతిఘోరలీల5160
నురుతరబాణాసనోజ్జ్వలం బగుచు - సురుచిరాలంకారశోభితం బగుచు
సరినొప్పుసింహార్ధచంద్రచిహ్నములు - బరఁగుచు వైడూర్యభాసురం బయిన
పడగచే నమరుచు బ్రహ్మాస్త్రరక్ష - నడరుచు నని నదృశ్యం బయియుండు
నట్టి యారథ మెక్కి యనికి నేగుచును - గట్టల్కఁ బల్కె రాక్షసు లెల్ల వినఁగ
“మిథ్యాతపస్వుల మీఱి సంగ్రామ - రథ్యఁ గూలుతు నేఁడు రామలక్ష్మణుల;
పగ దీర్చి మాతండ్రిఁ బఙ్క్తికంధరుని - విగతశోకునిఁ జేసి విజయ మే నిత్తు;
భానునందనముఖప్లవగవల్లభుల - నే నేఁడు సమయింతు నిమిషమాత్రమున;
మఱియుఁ దక్కినయట్టిమర్కటోత్తముల - నెఱయంగఁ జంపుదు నేఁ డాజిలోన
దెగువతో" ననుచు నదృశ్యుఁడై యచట - నొగి రాక్షసుల నేయుచున్న రాఘవులఁ
బొడఁగని భీకరభ్రుకుటియై విల్లు - వడి నెక్కువెట్టి దుర్వారవేగమునఁ5170
బ్రళయకాలమునాఁడు బలువృష్టి గురియు - జలదంబువిధమున శరవృష్టి గురిసె;
గగనంబు నిండ నాఘనులు రాఘవులు - నొగి నేసి రలుకమై నుగ్రబాణములు
అమరారి యవి ద్రుంచి యమ్ములసోనఁ - దిమిరంబు పరగించె దిక్కులం దపుడు ;
పృథుచండకోదండభీకరధ్వనియు - రథనేమిరవమును రథతురంగములు
గొరిజలమ్రోఁతయు గుణమునిస్వనము - నరుదార జనియించు నతనిరూపంబు
వినఁ గానఁబడకుండ విస్మయం బంది - ఘనవీథిఁ బరికింపఁ గ్రమ్మఱ నతఁడు

అఖిలాంబకంబుల నాదాశరథులు - నిఖిలావయవములు నిండ నేయుటయు
నాఖరకరకులుం డారాఘవేంద్రుఁ - డాఖరసూదనుం డపుడు కోపించి,
వాఁ డేయుమార్గణావళు లెందు వచ్చు - వాఁడిభల్లములందు వడి నేసి యేసి
యాబాణజాలంబు లందందఁ దునుమ - నాబాహుబలశాలి యగు నింద్రజిత్తు5180
బహుముఖంబులఁ దేరుఁ బఱపుచు నేసె - బహుశరంబుల నంతఁ బార్థివసుతులు
కమియఁ బూచిన కింశుకంబులతోడి - సమత నొప్పిరి శరక్షతయుతాంగముల
కరముగ్ర మైనట్టి కాలమేఘంబు - కరణి నొప్పిన తనఘనశరీరంబు
తెలియకుండఁగ యామ్యదిక్కుననుండి - పలికే నయ్యింద్రారి పార్థివేశ్వరుల
“ఎక్కడఁ బోయెద? రెందు డాఁగెదరు? - చిక్కితి రిట మిముఁ జేరి కావంగ
ది క్కెవ్వ రిలమీఁద? దివిజులటన్నఁ - జుక్కవా ల్నావంకఁ జూడనోడుదురు;
బక్కక్రోఁతుల నమ్మి బవరమునకును - మొక్కలమ్మున వచ్చి మోసపోయితిరి;
పటుతరం బైన నాబాణాగ్నిశిఖలఁ - బెటపెటఁ బ్రేలక ప్రిదిలి పోఁగలరె?
యావిభీషణునివాక్యములె నిక్కుము - గా విని నాశక్తిఁ గానలే రైతి;
రిదె మిముఁ దెగటార్చి యేచి యీప్రొద్దె - కదలి యయోధ్యలోఁ గలవారి నెల్లఁ5190
బరిమార్చి మించి యాభరతశత్రుఘ్ను - లిరువుర జంపి నే నేతెంతు" ననినఁ
గడు వెఱఁగందిరి కపులు నాకపులు; - నడరుకోపంబున నాయింద్రజిత్తు
పడమటఁ దనపేరు పంతంబు లాడుఁ - దడయ కుదిచిన ధనువు మ్రోయించు
ధీరుఁడై యటఁ దూర్పుదిక్కుననుండి - ఘోరంపుశరవృష్టి గురియించు మఱియు
దక్షిణంబున కేగి ధరణి గ్రక్కదల - నక్షీణశక్తిచే నడరి పెల్లార్చు
నిబ్భంగిఁ దిరుగు చనేకమార్గములు - నబ్భానుసూన్వాదు లరుదంది చూడ
శరముల వింటితో సంధించుకొనుచుఁ - బరువడి వాఁ డేయుబాణజాలములు
జనపతు ల్ద్రుంతురు చటులాంబకముల - ననిమిషు లప్పు డత్యాశ్చర్య మంద
అప్పుడు శతసంఖ్య లతనిచేఁ గపులు - కుప్పలు కుప్పలై కూలుట చూచి
సౌమిత్రి కోపించి జనపతి కనియె - "భూమీశ! వీనిచేఁ బొలిసిరి కపులు;5200
ఇది యేమి? దేవ! నీ వి ట్లూరకున్కి - యిదె చూడుమా భువి నెల్లదిక్కులను
బడి పొర్లుచున్నారు భల్లూకపతులు; - మడిసి రనేకులు మర్కటేశ్వరులు;
జగదీశ! నిను నమ్మి సకలవానరులు - మిగిలినభక్తితో మేకొని వచ్చి
తగిలి యీయింద్రారి దారుణాస్త్రముల - నొగిలి నీనామమే నొడువుచున్నారు;
పగవాఁడు చేరి నీబల మెల్లఁ దుంపఁ - దగ దింకఁ దెగకున్నఁ ద్రైలోక్యనాథ!
వగ దగ నల్గు నీబాణజాలములు - గగనంబు దిక్కులు గలయంగ నిండి
నిండినభక్తితో నిజదివ్యతనువు - లొండొంట ధరియించి యున్నవి వానిఁ
గైకొమ్ము రిపుఁ జంపు కమలాప్తవంశ! - నీ కెదురై పోర నేర్తురే రిపులు?

ఇంతశాంతము దగునే నృపులకును? - జింతింప వేల విచిత్రంబు గాఁగఁ?
బరఁగిన నీబాహుబలపరాక్రమము - తరుణార్కసమతేజ! తలపోయ వకట!5210
యీనిశాచరకోటి నీయింద్రజిత్తు - నేన చంపెద దేవ! నీమహత్వమున
నిటమీఁద బ్రహ్మాస్త్ర మేఁ బ్రయోగించి - కుటిలరాక్షసకోటికుల మెల్ల నడఁతు;"
అనవుడు రఘురాముఁ డనుజుని కనియె - "వినుము లక్ష్మణ! యొకవీనికై పూని
చనునె పల్వురఁ జంప? సంగ్రామమునకుఁ - జనుదేని వారల సమయింప నగునె?
యనిమిషబ్రహ్మరుద్రాదులచేత - ననిఁ జావఁ డితఁ డని యజుం డిడిన
వరము చెల్లింపంగ వలసియే వీని - నిరవొందఁ గాచితి నిఁక నుండె నేని?
వీనిఁ జంపఁగఁజాలు వీరవానరుల - నేను బంచిన వారె హింసింతు రితని;
నటుగాక తక్కిన నమ్మేఘనాదుఁ - డట నింద్రలోకంబునందు డాఁగినను,
నట బ్రహ్మలోకంబునందు డాఁగినను - నట రుద్రలోకంబునందు డాఁగినను,
ధరణి దూరిన రసాతలముఁ జొచ్చినను - శరధిలో మునిఁగిన జముఁడు గాచినను5240
దనతాతయగు ధాత తనవెన్కఁ బెట్టు - కొనిన నేఁ బోనీను ఘోరాజిఁ ద్రుంతు;"
నని పల్క రఘురామునలుక వాఁ డెఱిఁగి - యని సేయనొల్లక యాలంకఁ జొచ్చి,
ఘోరనిశాచరకోటితోఁ బోయి - యారావణునితోడ ననె నింద్రజిత్తు.
“కట్టల్కఁ గపులను గయ్యంబునందు - నెట్టన నేసితి నేలపైఁ గూల
మనుజుల నిద్దఱ మానము ల్గొంటి" - ననవుడు రావణుం డతనిఁ గోపించి
"యిది యేమి పోకయా? యిది యేమి రాక? - యిది యేమి సేతగా నెన్ని చెప్పెదవు;
ఒకపఱియును జంప కూరక వచ్చి - ప్రకటించె “దందఱు వడి”రని నీవు;
నీవేచి నడఁచిన నిఖిలలోకములు - భావింప నప్పుడే భస్మ మై పోవు;
నదిగాన నిది యొక్క యధిక మటంచుఁ - దుదిఁ దలంపకుము సంతోషంబు గాక
మగఁటిమి రామలక్ష్మణుల వానరులఁ - దెగటార్చి కాని నాదెస కేగుదేకు;”5230
మనవుడు “నౌఁ గాక” యని యింద్రజిత్తు - దనుజేంద్రు వీడ్కొని తనమదిలోన
"నతికాయకుంభకర్ణాదిదైతేయ - పతులెల్ల మడిసి రిబ్భంగి నుగ్రాజిఁ
గాన నారామలక్ష్మణుల నేరీతి - నైనను గెల్చెద" నని నిశ్చయించి
సీతచందము గాఁగఁ జెలువొంద నొక్క - నాతినిఁ దనమాయ నాకేశవైరి

ఇంద్రజిత్తు మాయాసీతను దెచ్చి తలఁ దఱుఁగుట

యటఁ జేసి ప్రీతి మాయాసీతఁ గొనుచుఁ - బటుబలసహితుఁడై పడమట వెడలె
వానికిఁ గాక యావానరు లెల్ల - నానాముఖంబుల నలికి పాఱుటయు
హనుమంతుఁ డపుడు మహాశైలశ్యంగ - మనువారగాఁ బట్టి యసుర మార్కొనఁగ
నరుదార నడచుచో నల యింద్రజిత్తు - నరదంబుమీఁద మాయాసీతఁ జూచె;
వెక్కసంబుగ రామవిరహానలంబు - నిక్కిన నాహారనిద్రలు దొరఁగి

కడలేని వగఁబొంది గతిఁ గానఁబడక - వెడలునిట్టూర్పుల వెలవెలఁ బాఱి5240
కడుఁ గృశంబగుమేను కమలపత్రములు - నొడుచులోచనముల నొలుకుబాష్పముల
జడగట్టి సీమంత సరణిఁ జిక్కొదవి - యడగొని మలినంబు లగుశిరోజములు
ధరణిరజోలిప్తతనుతరాంగములు - గరము విన్ననిమోము కరపల్లవంబు
గదిసిన చెక్కు నై గాలిచేఁ జాల - గదలెడులతవోలెఁ గంపించుచున్న
యామహీసుతఁ జూచి "యకట! వీఁ డింక - నేమి సేయునొ రామహృదయవల్లభను?
నీదీనదశ నాకు నీక్షింప వలసె - హాదైవమా!" యని హనుమంతుఁ డడరి
ఘోరవానరవీరకోటితో నడువ - దారుణాకృతిఁ బేర్చి తనమీఁద ననికి
నడుచుచో నవ్వాయునందనుఁ గాంచి కడుఁగ్రూరుఁడై దశకంఠనందనుఁడు
"ఇది యేల వచ్చెఁ దా నీసేనతోడ - ఇదె చూడరా సీత? యీసీతకొఱకు
నలజడి వడియెద రటుఁగాన దీనిఁ - దలఁ ద్రెవ్వనేసెదఁ దవిలి యే" ననుచుఁ5250
గలఁగి శార్దూలంబుకడ నున్నహరిణి - పొలుపున నయనాంబుపూరంబు లొలుక
“హారామ! హారామ! యనునార్తరవము - లారంగఁజేయు మాయాసీత నొడిసి
తలవెండ్రుకలు వట్టి దట్టించి యీడ్వ - నలగి యాదైత్యుతో ననియె వాయుజుఁడు.
"తగునె? దురాత్మక! దనుజుండవైన - నగుదుఁగా! కేము నీ వావిశ్రవసుని
మనుమఁడ విబ్భంగి మనుకులేశ్వరుని - వనిత ముందలఁ బట్టి వారక తిగువ”
ననపుడుఁ గరవాల మంకించి యసుర - దనరుమాయాసీత తలఁ ద్రెవ్వనేసెఁ,
"జను మింక రామలక్ష్మణులకుఁ జెప్పు" - మన ఖిన్నుఁడై యుండె ననిలనందనుఁడు.
వసుధాతలంబున వడి నెత్తు రొల్క - నసిధారఁ దెగియున్న యాసీతఁ జూపి
హనుమంతుతో ననె నాయింద్రజిత్తు - “వనచరోత్తమ! రామువనిత నీసీత
ఘనతరంబైన నాకరవాలమునను - దునిమితి; మీరణోద్యోగంబు లింకఁ5260
జిక్కెఁ బొ"మ్మంచు విజృంభించి పలికి - దిక్కుంభికర్ణము ల్దిశలును బగుల
సంహారఘనఘనస్తనితమో యనఁగ - సింహనాదము సేయఁ జిత్తము లలఁగి
యప్పుడు రణములో నాయింద్రజిత్తుఁ - దప్పక కనుఁగొని తనరినభీతి
వనచరు లారంగ వాయునందనుఁడు - కనుఁగొని పలికె "నోకపివీరులార!
సమరవిక్రమములు చాలించి పాఱ - సమయమే వినరొకో సమరధర్మంబు?
దలఁప బంధులకెల్లఁ దలవంపు గాఁగఁ - గలనఁ బాఱుటకంటె కష్టంబు గలదె
నడఁచెద నే మున్ను ననుఁ గూడి మీరు - కడిమి వాటింతురు గా" కంచుఁ బలుక,
నందఱు తరువులు నద్రిశృంగములు - నందంద కయికొని హనుమంతుఁ గూడి
రయమున నార్చుచు రాక్షససేన - పయి వైచి, రంత నాపవమానసుతుఁడు
చలమున నొకమహాశైల మంకించి - యలుకతో వైవంగ నానిశాచరుని5270
సారథి రథ మౌలఁ జనఁదోల నదియు - దారుణధ్వనితోడ ధర క్రుంగఁబడియె.

ఆలోన వెండియు నగచరు ల్తరులు - శైలశృంగములు రాక్షసులపై వైవఁ
దనసేన విఱిగిన దశకంఠసుతుఁడు - కనుగొని కోపించి కపియూథపతులఁ
బటుశూలముద్గరప్రాసఖడ్గములఁ - జటులవేగంబున సమయించె; నపుడు.
మారుతాత్మజుఁడును మదిలోనఁ గినిసి - ఘోరవిక్రమకళాకుశలుఁడై పేర్చి
కడిమిచేఁ గవియు రాక్షసులరూ పడఁచి - వడి శిలాతరుఘోరవర్షముల్ గురిసి
యానిశాచరసేన నవలీలఁ దోలి - వానరావలిఁ జూచి వాయునందనుఁడు
"వనచరపతులార! వసుధేశుదేవి - దనుజాధముఁడు జంపెఁ; దప్పెఁ గార్యంబు;
సమర మేటికి నింక? జనకజవార్త - కమలాప్తకులున కొక్కట నెఱిఁగింప
నరుగుద! మటమీఁద నారాముఁ డెద్ది - వెర వానతిచ్చు నావిధము సేయుదము5280
మీరందఱును సంభ్రమింపక యుండుఁ - డీరాక్షసుఁడు క్రూరుఁ డేమఱవలదు”
అని యటు మగిడిన హనుమంతుఁ జూచి - తగ మది నప్పు డద్దశకంఠసుతుఁడు
“ఈమహాబలుఁ డేగె నిటమీఁదఁ దనకు - హోమవిఘ్నము సేయ నోప రెవ్వరును;”

ఇంద్రజిత్తు నికుంభిళయాగము సేయుట

అని నికుంభిళ కేగి యచట విశాటుఁ - డెనసిననిష్ఠతో నేపు దీపింపఁ
గల్లు నెత్తురు పాలు ఘనకచ్ఛపముల - బల్లుల బిల్లుల బలు సర్పములను
గారుకోళ్ళను మంచిగంధంబు తేనె - నారికేళంబుల నల్లనికోళ్ళ
సూకరంబుల మఱి సొరిది కేశములఁ - గాకులఁ దెల్లని గార్దభంబులను
గాఱెనుపోతుల ఘనమేషములను - నాఱు నాలుగు రెండు నఱువదికరులఁ
గొండగొఱ్ఱెలు వేయికోటుల లక్ష - మండూకములఁ గోటి మాణిక్యములను
ముత్యంపుఁజిప్పలు మూఁడర్బుదములఁ - గాత్యాయనీదేవికడ నిష్ఠ నిలిపి5290
మనమున నిగమనమంత్రపూతముగ - ననలుని రుధిరమాంసాదులఁ దనిపి
హోమంబు సేయుచు నుండె నయ్యెడను - రాముండు పడమటిరభస మంతయును
విని జాంబవంతుని వేగంబ పిలిచి - వినవచ్చెఁ బడమట విపులఘోషంబు
హనుమంతునకు నెట్టి యని యైనయదియొ? - ఘన మైనయట్టి యాకలకలం బరయఁ
జనుము రయంబున సైన్యంబుతోడ - ననిన ఋక్షేశ్వరుం డతిశీఘ్రవృత్తి
బలువిడి భల్లూకబలములు దన్ను - గొలిచి యప్పుడు నూఱుకోటులు రాఁగ
వడిగొని పశ్చిమద్వారంబుదెసకు - నడుచుచోఁ గనియె నన్నడుమ వాయుజుని
వాయుజుండును జాంబవంతునితోడ - నాయింద్రజిత్తుసేఁ తంతయుఁ జెప్పి;
"యీవార్త రామున కెఱిఁగించి వత్తు - నే వచ్చునందాఁక నే నున్నయెడను
గాచి యావాకిటఁ గదలక యుండు - మేచినపగవాని నేమఱవలదు;”5300
అవి పంచి వచ్చుచో ననతిదూరమున - హనుమంతుఁ బొడగని యారాఘవుండు
“ఇతనిముఖస్థితి నేమొకో? కార్య - గతి దోఁచుచున్నది; కనుఁగొన నిపుడు

ఇది యేతెఱం" గని యిచ్చఁ జింతింపఁ - గదిసి వాయుజుఁడు రాఘవునకు మ్రొక్కి
“దేవ! యే మెల్లను దెంపుమై దాన - వావలితోడఁ గయ్య మ్మొనరింప
మాముందటనె తెచ్చి మది శంక లేక - భూమిజతలఁ దెంచెఁ బొరి నింద్రజిత్తు;
ఆవాకిటికిని ఋక్షాధీశుఁ బెట్టి - యీవార్త చెప్పంగ నేను వచ్చితిని;”
అనువార్త చెవులలో నడరకమున్నె - ఘనవాతనిహతివృక్షంబును బోలె
నతులశోకాగ్నియు నడరి దహింప - ధృతి దూలి రవికులాధిపుఁడు మూర్ఛిల్లి;
యవనిపైఁ బడియున్న నతిభీతి నొంది - ప్లవగవల్లభు లెల్లఁ బటుశోకులైరి;
కైకొని యపుడు లక్ష్మణుఁ డన్నతొడల - పైకి రాఁ దిగిచి సంభ్రమచిత్తుఁ డగుచు5310
“నక్కటా! రామ! నీయట్టియుత్తమున - కిక్కళంకము పుట్టెనే యిట్టిచోటఁ
దలపోయఁగా "మేలు ధర్మంబునందుఁ - గల" దనుమాట నిక్కము గాకపోయె;
నదియె నిక్కం బైన నకట! నీయట్టి - సదయచిత్తున కేల సంతాప మొదవు?
నీచేత రావణునికిఁ జావులేక - యీచందమున నుండ నేటికి వచ్చు?
జానకి కేల యీచావు సిద్ధించుఁ? - గాన ధర్మముకంటె ఘన మధర్మంబు
త్యాజ్యంబు గాదని తలపోయ కట్టి - రాజ్యంబు విడిచి యరణ్యంబులందుఁ
దిరుగ వచ్చితి; మటుఁ దిరిగెడుమనకుఁ - బురుషార్థములు సిద్ధి వొందునే? యధిప!
అవనీశ! “నిర్ధను లగువారుసేయు - వివిధయత్నంబులు వెస నిదాఘముల
నడరెడుసెలయేరు లడఁగినభంగిఁ - జెడిపోవు" నని బుధు ల్చెప్పంగ వినమె?
ధనము లార్జించిన ధర్మకామాదు - లనుపమస్థితితోడ నధిప! సిద్ధించు;5320
ఎసఁగంగ నర్థంబు లెవ్వాని కొదవు - వసుధ వానికి నెల్లవారు చుట్టములు
అర్థంబు గలవాఁడె యరయంగఁ బురుషుఁ - డర్థంబు గలవాఁడె యధికుండు జగతి;
అర్థంబె విద్యయు; నర్థంబె నేర్పు - నర్థంబె కీర్తియు; నర్థంబె పెంపు;
అర్థంబె బలమును; నర్థంబె కులము; - నర్థంబె బలగంబు; నర్థంబె గుణము;
అర్థంబె శీలంబు; నర్థంబె ప్రాణ; మర్థంబె పుణ్యంబు; నర్థంబె భూమి;
అర్థంబె రూపును; నర్థంబె నీతి; - యర్థంబె ఖ్యాతియు; నర్థంబె భూతి;
అర్థంబె గతియును; నర్థంబె మతియు; - నర్థంబె యెఱుకయు; నర్థంబె సుఖము;
అర్థంబు కావున నఖిలకామ్యములు - నర్థసంపన్నున కరచేతి వరయ;
అధికులు వేదవేదాంగపారగులు - బుధులు దూర్వంబులఁ బూతాక్షతముల
నర్థంబు గలవాని నమరఁ బూజింతు - రర్థి మోక్షార్థులై యడవుల నుండు;5330
మునిపుంగవులు కందమూలంబు లిచ్చి - ధనవంతు లగువారి దర్శింతు రెలమిఁ!
బాయక మంగళపాఠకానీక - గాయకకులములు కలవారిఁ బొగడు
ఉన్నతకుచములు నురునితంబములు - నన్నువనడుములు నలసయానములు
బింబోష్ఠములు చంద్రబింబాననములు - నంబుజలలితంబు లగు లోచనములు

రోలంబకులనీల రుచిరధమిల్ల - లీలాలకంబులు లేఁతసిగ్గులును
ఒయ్యన నవ్వుట నోరచూపులును - దియ్యమాటలు గాముదీమంబు లనఁగ
నెలయించునేర్పులు నెలజవ్వనములు - గలకాంత లర్థంబు గలవృద్దు నైన
మనమారఁ గొలుతురు మహితభోగేచ్ఛ - ధనహీను నొల్లరు దర్పకు నైన
లేమియే నరకంబు; లేమియే రుద్ర - భూమియు; లేమియే భూరిశోకంబు;
లేమియే రోగంబు; లేమియే మృతియు; - లేమియే పాపంబు; లేమియే జరయు;5340
లేమియే కష్టంబు; లేమియే కరువు; - లేమియే దైన్యంబు; లేమియే వగపు;
లేమియే సకలమాలిన్యంబు దలఁప; - లేమియే సర్వంబు; లేమి గావునను
అచ్చెరువుగ రాజ్య మంతయు విడిచి - వచ్చినప్పుడు కాదె వచ్చె నాపదలు?
జానకిమరణంబు సైరింపఁజాల - మానవలోకేశ మార్గణావళుల
విసువ కాసురబలాన్వితముగా లంక - మసలక నింక భస్మంబు చేసెదను;”
అని లక్ష్మణుఁడు పల్క నావిభీషణుఁడు - దనమది నూహించి ధరణీశు కనియె.
“నాయింద్రజిత్తుమాయయె కాని సీత - కేయపాయంబును నిటుఁ గాదు వినుము.

విభీషణుఁ డింద్రజిత్తునిమాయ శ్రీరాములతోఁ జెప్పుట

ఖలుఁ డైనయాపఙ్క్తికంఠుండు దలఁచు - తలఁపు నేఁ నెఱుఁగుదు త్రైలోక్యనాథ;
జానకి నొప్పింపు జనపతి కనుచు - నే నెన్ని చెప్పిన హితవుగాఁ గొనఁడు;
జనకనందన నేల చంపించు నతఁడు - మనుజేశ! యిది వానిమాయ గావలయు;5350
అట్టిది యైన నోయవనీశవర్య! - నెట్టనఁ బొలియవే నిఖిలలోకములు?
ఇది బొంకు; చింతింప నేల? యాసీతఁ - బదిలంబుగాఁ జూచి ప్రతివార్త దెత్తు!"
నని రాముననుమతి నవ్విభీషణుఁడు - దనరూప మంతయు దాఁచి వేగమున
నలిరూపుఁ గైకొని యసురేశువనము - తలఁకకఁ జొచ్చి సీతను గాంచి మరలి
వచ్చి యారామభూవరునకు మొక్కి - యచ్చపుభక్తితో నంతయుఁ జెప్ప;
విని “విభీషణ! యిట్టి విధ మేలు సేసె? - ననిలోన నింద్రజి" త్తని రాముఁ డడుగ
దనుజుఁ డాసురహోమతాత్పర్యబుద్ధిఁ - జనుటకునై యిట్టిచందంబు చేసె,
హనుమంతుఁ డాదిగా నగచరకోటి - మనములు గలఁచి యిమ్మాడ్కిఁ బుత్తెంచి
“తనహోమవిఘ్నంబు తగఁజేయువార - లనయంబు లే రింక" నని నికుంభిళకు
నరిగినవాఁడు వాఁ డచట హోమంబు - పరిసమాప్తము గాఁగఁ బటునిష్ఠ నేఁడు5360
దనహోమమంత్ర మింతయుఁ జిక్కకుండ; - మనుయుక్తి నవధానమతిఁ జేసెనేని
దేవదానవు లైన దృష్టించి నిలిచి - యావీరవరు నెవ్వ రని గెల్వలేరు;
అటుగాన నీలోన నసురవ్రేలిమికిఁ - బటుగతి విఘ్న మాపాదింపవలయుఁ
జనియెద నే నిదె సైన్యంబుతోడ - మనుజేశ! పంపు లక్ష్మణుఁ దోడు మాకు
సౌమిత్రి యవ్వీరుఁ జండకాండముల - భూమిపైఁ బడనేసి పొలియింపఁగలఁడు;

నేఁ డింద్రజిత్తును నీతమ్ముఁ డొడుచు - వాఁడు నికుంభిళావనములోపలను
దపము గైకొన్నాఁడు దశకంఠసుతుఁడు - తపము నిండకమున్న దండింపకున్న
బ్రహ్మ మెప్పించి యాపరమేష్ఠివలన - బ్రహ్మశిరం బను బాణంబు విల్లు
కవచంబు ఖడ్గంబు కవదొన ల్మఱియు - నవిరళమంత్రపూతాస్త్రము ల్వడసి
కామగాశ్వంబును గమనీయకేతు - భీమంబు మారుతస్ఫీతవేగంబు5370
నగురథం బాయగ్నియందు వెల్వడిన - దగ నారథం బెక్కి ధను వందెనేని
నావాసవారాతి నాలంబులోన - దేవాసురాదులు దృష్టింపలేరు;
వానికి నిమ్ముల వరమిచ్చునప్పు - డానీరజాసనుం డతని వీక్షించి,
"నీవు నికుంభిళ నెఱయహోమంబు - గావించి తేని నేగతి నజేయుఁడవు;
కావించుహోమంబు గడ మగునేని - రావణసుత! నీవు రణములోపలను
బగతుచేఁ జ" త్తని పల్కినవాఁడు - జగదీశ! యటుగాన సమరయత్నంబు
సేయించి నేఁ డింద్రజిత్తుఁ జంపింపు - మాయావి యగు వీఁడు మడిసినఁ జాలు;
నమరకంటకుఁ డగు నద్దశాననుఁడు - సమరంబులో మున్నె చచ్చినవాఁడు”
అని పల్క రఘురాముఁ డపు డనుజన్ముఁ - గనుఁగొని “యనఘాత్మ! ఘనుఁ డింద్రజిత్తు
ఘనతిరోహితతిగ్మకరుఖంగి నింగి - ఘనమాయఁ దనగతి గానరాకుండఁ5380
జరియించు నవ్వీరు శక్రాదిసురులు - దురమునఁ గడిమిమైఁ దొడరంగ లేరు
హోమమధ్యంబున నుగ్రరాక్షసుని - సౌమిత్రి! నీ వేగి సమయింపు వేగ
పటుతరభల్లూకబలముతోఁ గూడి - చటులవిక్రముఁ డైన జాంబవంతుండు
హనుమంతుఁడును దోడు నరుగుదెంచెదరు; - ఘనతరవిజయవిక్రమధురన్ధరుఁడు
ఇమ్మంత్రివరులతో నివ్విభీషణుఁడు - నెమ్మి నయ్యాగంబు నీకుఁ జూపెడిని;"
అని పల్కి రఘురాముఁ డనుజాతునకును - వనధి యిచ్చినయట్టి వజ్రవర్మమ్ము
ఘనతరఖడ్గంబు కవదొన ల్విల్లుఁ - బెనుపొందఁగా నిచ్చి ప్రీతితో మఱియు
వరభూషణంబులు వరుసగా నిచ్చి - యరు దైనపేర్మి ని ట్లనుచు దీవించె.
"అనిశంబు జయము శ్రీహరి యొనఁగూర్చు; - ఘనతరశుభము శంకరుఁ డిచ్చు; నజుఁడు
నీ కాయువు ఘటించు; నిఖిలదేవతలు - గైకొని దిశలందుఁ గాతురు నిన్ను;5390
అనిలుండు ననలుండు నభిరక్షణంబు - దనరఁ జేయుదురు ముందల వెన్క నీకు"
అనవుడు లక్ష్మణుం డప్పు డుప్పొంగి - ధను వందుకొని తనుత్రాణంబుఁ దొడిగి
కవదొన న్ధరియించి ఖడ్గంబు దాల్చి - వివిధభూషణముల విలసితుం డగుచు
నారాముఁ గనుఁగొని యతిభక్తి మ్రొక్కి - ధీరవాక్యంబులఁ దెఱ గొప్పఁ బలికె;
“నలినాకరములోన నలి మరాళములు - కలఁగొనఁబడునట్టిగతి గానఁబడఁగ
నాతెల్లగరులబాణము లింద్రజిత్తు - వేతూరి చని నేఁడు వెస లంక పడును;
విపులతూలస్తోమవిధమున దాని - నృపవీర విశిఖాగ్ని నీఱు చేసెదను;"

అని యథోచితభంగి నారామచంద్రు - మనమార వీడ్కొని మహితతేజమున

లక్ష్మణుఁడు యుద్ధమునకు వెడలుట

గరుడుని నెక్కిన కమలాక్షుపగిదిఁ - గరువలిసుతు నెక్కి కరమొప్ప మిగిలి
పంబి గోలాంగూలబలములు గొల్వ - జాంబవదాదులు చనుదేరఁ గదలి5400
బలువిడి నటకు ముప్పదియోజనములు - గలనికుంభిళ కేగి ఘనతరంబుగను
నురుమదేభంబులు నుత్తమాశ్వములు - నరిది రథంబులు నలరు కాల్బలము
స్తోమమైనవనంబు చుట్టును గాచి - భీమమై యెందు నభేద్యమై తనరి
బలము లన్నియు నల బల మెల్ల నుడిగి - యలలు లేనట్టి యాయంబుధికరణి
నున్న రాక్షససేన నొప్పారఁ జూచి - సన్నుతశస్త్రాస్త్రసన్నద్ధుఁ డైన
సౌమిత్రితో విభీషణుఁ డిట్టులనియె - "నీమహాసైన్యంబు నిషుపరంపరల
నెడల నేసినఁ గాని యింద్రారి మనకుఁ - బొడగానరాఁడు నీభూరిబాణములఁ
దూలింపు మీసేనఁ దొలితొలి పిదప - హాలాహలాభీల మైన శరాలి
దొరకొన్నహోమంబు తుదిముట్టకుండ - దురితాత్ముఁ డగువానిఁ ద్రుంపుము వేగ”
అనవుడు సౌమిత్రి యత్యుదగ్రతను - గనుఁగొనలం దగ్నికణములు దొరఁగఁ5410
బలుతెఱంగుల బాణపఙ్క్తులు వఱపె - నలఘుబలోదగ్రులై పెల్లు రేగి
తరుచరాధిపులును దరులును గిరులు - పొరిఁబొరి వైచి రప్పుడు సొంపు మిగిలి
అసురులు నత్యుగ్రులై వనచరుల - వెసఁ బరిఘంబుల విసరివైచియును
గదలచే మోఁదియుఁ గరవాలములను - విదళించియును బహువిధములఁ గడఁగి
మఱియును దక్కిన మహితశస్త్రములు - నురక నొప్పించిరి యుగ్రత నిట్టు
మార్పడ నసురుల మర్కటేశ్వరుల - యార్పుల నాలంక యట్టిట్టుఁ బడఁగ
అంతఁ బోవక రాక్షసావలిఁ దఱిమి - యెంతయుఁ గడఁక ననేకశస్త్రములఁ
గపుల నొప్పింపంగఁ గపులును గవిసి - కుపితులై రాక్షసకోటి నొప్పింప
విఱిగి రాక్షసు లెల్ల వెస నింద్రజిత్తు - మఱుఁగున కరిగిరి మతమెల్లఁ దక్కి
ఆలోన నొక్కొక్కయాహుతిఁ బట్టి - యాలోలకీలమహావహ్ని కసుర5420
పరఁగంగ నిన్నూటపదియాహుతులకు - దొరకొని యొకనూటతొమ్మిది వేల్చి
కడమయాహుతులు నాకైవడిఁ బట్టి - విడువక నిష్ఠతో వేల్చుచు నుండి
యురుతరసత్త్వులై యుగ్రతఁ బేర్చి - ధరణి గంపింప నత్తరుచరవరులు
బలువడి నేతెంచి పై నార్చుటయును - గలుషతఁ జిత్తంబు గలఁగినఁ జేతి
యాహుతి యటు వైచి యాయింద్రజిత్తు - నాహవోన్ముఖుఁడు మహారోష మెత్తి
కన్నుల నిప్పులు గ్రమ్మంగ భీష - ణోన్నతి రథ మెక్కి యుగ్రకార్ముకము
ధరియించి మించి యుద్ధతి నేగుదెంచి - తరుచరసేనలఁ దఱిమి నొప్పింప
దనుజేశుతమ్ముండు దనర సౌమిత్రిఁ - గొనిపోయి వన మతిక్రూరుఁడై చొచ్చి

సమధికం బగు నీలజలదంబపోలెఁ - గొమరారుచున్న న్యగ్రోధంబుక్రిందఁ
దొడఁగి యాయింద్రజిత్తుఁడు సేయఁజేయ - గడమచిక్కినహోమకర్మంబుఁ జూపి5430
"సౌమిత్రి! చూచితే సమరంబుకొఱకు - హోమ మిక్కడ దైత్యుఁ డుగ్రతఁ జేసి,
బలి భూతముల కిచ్చి పావకువలనఁ - గలశక్తిసహితులఁ గడఁగి జయించుఁ
దొల్లియు నిటుచేసి దుర్మదవృత్తి - బల్లిదుఁడై యనిఁ బర్జన్యు గెలిచె;
నిప్పుడు నిదె చూడు! మీహోమవహ్ని - నొప్పార వెడలుచునున్నది రథము
అరుణనేత్రంబుల నరుణకేశముల - నరుణవస్త్రంబుల నరుణమాల్యముల
జడిగొన్న నల్లనిసారథితోడఁ - గడునెఱ్ఱ నగు తురంగంబులతోడ
వాఁడు క్రమ్మఱ వచ్చి వరహోమశక్తి - వేఁడిమి నెంతయు వెడలించి మించి
యీరథం బెక్కిన నింద్రాదులైన - నారావణాత్మజు నని నోర్వరాదు;
కాన నింతటిలోనఁ గడఁగి సౌమిత్రి - వానిని బటుశరవ్రాతంబుచేతఁ
బొలియింపు" మనుడును బొంగి లక్ష్మణుఁడు - తలఁగక కార్ముకధ్వని చెలింగింపఁ5440
గరవాలహస్తుఁడై కవచంబుఁ దొడిగి - యరుదార శిఖివర్ణ మగు రథం బెక్కి
తనరూపు చూపిన దశకంఠసుతునిఁ - గనుఁగొని సౌమిత్రి కడునల్కఁ బల్కె
"మాయలఁ బనియేమి? మగవాఁడ వేని - నాయెదుటికి వచ్చి ననుఁ జూతుగాక!
నిక్కంపులావున నీవు గయ్యమునఁ - జక్క నిల్వుము నిన్ను జముఁ గూడఁ బుత్తుఁ;
గపటంబుఁ గైకొన్న గైకొనకున్నఁ - గపటరాక్షస! నిన్నుఁ గడతేర్తు వేగ;
నెఱసిన కడిమితో నిలువు నాయెదురఁ - గఱకురాక్షస!" యనుకడ నింద్రజిత్తు
భీలకరాళసంస్ఫీతుఁడై పలికె - “బాలుండవై యిట్టి పంతంబు లేల?
లక్ష్మణ! నిన్ను నాలంబున వీర - లక్ష్మికిఁ బెడఁబాపి లా వెడలించి,
యసువుల నాదు బాణావలిఁ బెఱికి - వసుమతిపైఁ గూల్చి వారక వ్రచ్చి
కాకుల గ్రద్దలఁ గండలఁ దనుప - భీకరాకారతఁ బెంపారువాఁడ;5450
ఉరక నాకట్టిన యురగపాశముల - మఱచితె ? లక్ష్మణ! మది నింతలోనె”
అని లక్ష్మణునిఁ బల్కి యట విభీషణుని - గనుఁగొని యింద్రారి కడువల్కఁ బలికెఁ;
“బినతండ్రివఁట నీవు ప్రియమార నేను - దనయుండ నా కెగ్గు దలఁపంగఁ దగునె?
దుర్మతివై కులద్రోహంబు సేయ - ధర్మఘాతుక! నీకుఁ దగ వేల కలుగు?
ఎడరైన బంధుల నెట్టినీచుఁడును - విడిచి శత్రులఁ బోయి వేఁడునే శరణు?
తగవు దప్పిననైనఁ దనవారిఁ బాసి - పగవారి సేవించి బ్రతుకు టేబ్రతుకు?
ఆనిశాచరనాథుఁ డధికతేజుండు - నీనిష్ఠురోక్తులు నీతిగా వినునె?
అన్న కోపించిన నట యింటిమూల - నున్న నే మగు? నుండకున్న నే మగును?
నీలావుబలిమినే యెల్లదేవతల - నాలంబులో గెల్చె నాదశాననుఁడు
హితుఁడవై మర్మము హిత మెఱింగించి - యతనిచేతన చెడు" మన విభీషణుఁడు5460

"నావర్తనము మేఘనాద! యీ వెఱుఁగు - దీవృథాజల్పంబు లేల యియ్యెడను?
ఆతండ్రికొడుకైన యవనీతిమతికి - నీతియు ధర్మంబు నీ కేల కలుగు?
పొసఁగఁ జేపట్టిన భుజగంబు పగిది - వెసఁ గ్రూరుఁ డగుబంధు విడువఁగావలయు;
పాపాత్ముఁడగునట్టి పఙ్క్తికంధరుఁడు - నాపలుకులు విన్న నాఁ డింత లగునె
పరధనంబులకును బరకాంతలకును - బరితాపములఁ బొందు పాపకర్ములకుఁ
దగ వేల? మే లేల? ధర్మంబు లేల? - జగదేకహితమైన చరితంబు లేల?
మగ్నమౌ మీమది మదము గర్వంబు - నగ్నులై కాల్పక యవి యేల పోవు?
తలకొని యెపుడు నధర్మవర్తనమె - కలిగి వర్తింతురు కడుఁ గ్రొవ్వి మీరు
సురల బాధింతురు సువ్రతులైన - పరమమునీంద్రులఁ బట్టి చంపుదురు;
కావున నాదశకంఠునితోడ - నీవును లంకయు నిఖిలబంధువులు5470
మాన కిచ్చకమాడు మంత్రులు గూడ - సేనలు రాజుచేఁ జెడుట సిద్ధంబు;
బుద్ధిశూన్యుఁడ వైతి; స్ఫుటకాలపాశ - బద్ధుండ వై; తేమి పల్కినఁ బల్కు;
మిటమీఁద నీమాయ లెక్కవు వినుము - వటముక్రిందికి హోమవాంఛఁ బోరాదు;
చనరాదు లంకకు సౌమిత్రిఁ దొడరి - చనవచ్చు నిఁక వేగ జముపురి" కనఁగఁ
బ్రథమాద్రిపయి వచ్చు భానునిపగిదిఁ - బృథుగాత్రు హనుమంతుఁ బెంపార నెక్కి
యమరిన లక్ష్మణు నావిభీషణుని - సమరార్థులగు నగచరుల వీక్షించి
"వీరులై నాబాణవృష్టికి మీరు - సైరించెదరు గాక! సమరోర్వి నేఁడు
ఉడుగక నావింట నొదవుబాణాగ్ని - యడరి మిమ్మిందఱ నాహుతి గొనును;
గరవాలపట్టిసఘనభిండివాల - శరజాలముల మిమ్ము సమయింతు” ననుచు
"రోదసీకుహరంబు మ్రోయంగ సింహనాదంబు సేయుచు నానాశుగముల5480
వెస నేయుచును బాహువిక్రమస్ఫూర్తి - నెసఁగు నాముందఱ నెవ్వండు నిలుచు?"
అనవుడు లక్ష్మణుం డాదై త్యుతోడ - “దనుజాధముఁడ! యీవృథాగర్వ మేల?
చేరక యడఁగి ముచ్చిలిపోటు వొడుచు - టేరణంబునఁ బాడియే మగతనము?

ఇంద్రజిల్లక్ష్మణుల ద్వంద్వయుద్ధము

నీమాయలన్నియు నిరసించి నిల్వు - నామార్గణములఁ బ్రాణముల హరింతు;”
అనవుడుఁ గోపించి యతఁ డేసె నతని - ఘనకాలసర్పప్రకాండకాండముల
అవి లక్ష్మణుని గాడి యవ్వల వెడలి - యవనీస్థలము గాడె నద్భుతశక్తి
మఱియును వాఁడు లక్ష్మణదేవుమీఁదఁ - గరు లాడగాఁ బెక్కుకాండంబు లేయ
వడి వచ్చి తాఁకి యవ్వల గ్రుచ్చి పాఱె - వెడలు రౌద్రరసంబు వెల్లియపోలెఁ.
గడుఁబెల్లునెత్తు రంగంబుల వెడల - నడరంగ రాక్షసు లార్చుచునుండ
ఱంకెల నట్టహాసములు చేయుచును - లంకేంద్రతనయుఁ డాలక్ష్మణుఁ జేరి,5490
"నరనాథసుత! నేఁడు న న్నాజిఁ గదిసి - బిరుదవై యిటు విజృంభించిన నిన్నుఁ

దొలుతఁ గత్తళముఁ దుత్తునియలు సేసి - తల త్రుంచివైచెద దారుణాస్త్రముల
పెను పేరి పడియున్న ప్రియసహోదరుని - నిను జూచు రాముఁడు నేఁ డవశ్యమును,"
అని పల్క లక్ష్మణుం డన్నిశాచరునిఁ - గనుగొని “యీవృథాగర్వ మేమిటికి
పలుకులఁ బని యేమి బవరంబులోనఁ - దొలఁగక నాతోడ దొడరుదుగాక!
మాటలాడక వహ్ని మడియించుమాడ్కి - మాటలాడక నిన్ను మడియింతు నిపుడు,
పని లేని పంతము ల్పలుకంగనేల” - యనుచు నుగ్రాస్త్రంబు లరివోసి తిగిచి
ఘనతరభీషణాకారుఁడై పేర్చి - కనుగవఁ గెంజాయ గడలుకొనంగ
నమరంగఁ గోపించి యర్కదీధితులు - గమియంగ దిక్కులఁ గలయంగఁ బర్వి
విలయాగ్నికీలల విస్ఫులింగములు - కనుఁగొనఁ దెరలేడు ఘనతరశక్తి5500
కలయమ్ము సంధించి కఱకురక్కసుని - యలఘువక్షస్స్థల మట గాడ నేయ
దాన దైత్యుండు రక్తము గ్రక్కి మూర్ఛ - నూని యంతనె తెల్వి నొంది పెల్లార్చి
వాఁడిమి మిగులఁ దీవ్రంబున నేసె - మూఁడుబాణములు రామునితమ్మునురము
అప్పుడు ధీరులై యధికరౌద్రములు - నిప్పులు గన్నుల నివ్వటిల్లంగఁ
జెలగు నయ్యిద్దఱ సింహనాదములు - బలువిడిఁ బఱతెంచు బాణఘట్టనలు
నురుగుణస్వనములు నొక్కట నెసఁగ - నరయ మృత్యువునట్టహాసంబువోలె
వెలసిన లావుల విక్రమంబులను - బొలుపులఁ జలముల భూరిరౌద్రముల
ననిశంబు వెలుఁగు చంద్రార్కులఁ బోలెఁ - దనరు చతుర్దంతదంతుల వోలెఁ
గొమరారుసింగంపుఁగొదమలఁ బోలె - గ్రమ మొప్ప శంబరకాములఁ బోలె
నమరఁ ద్రినేత్రాంధకాసురు ల్వోలె - రమణఁ గుమారతారకులును బోలె5510
నేపారు వృత్రాసురేంద్రులఁ బోలె - రూపింప లయకాలరుద్రులఁ బోలెఁ
బాయనిజయకాంక్ష బలియురై పోర - నాయిద్దఱును నొప్పి రప్పుడు చూడ
కోపించి కోదండగుణఘోష మెసఁగఁ - జాపరథధ్వజసహితంబు గాఁగ
నామేఘనాదుని నంపవర్షమున - సౌమిత్రి ముంచిన సైరింప కతఁడు
ప్రతిసాయకము లేయ బలువిడి ద్రుంచి - వితతంబుగా బాణవృష్టిఁ గప్పుటయు
ఆయింద్రజితుఁ డప్పు డల వెల్లఁ బొలిసి - యాయస్త్రములకు మాఱైనయస్త్రములు
నెరి నేయనేరక నిట్టూర్పు పుచ్చి - తరిగొని చూడ నత్తరి విభీషణుఁడు
సౌమిత్రిఁ గనుఁగొని “జననాథతనయ! - నీమార్గణంబుల నిర్విణ్ణుఁ డగుచు
దశకంఠుసుతుఁ డున్నదశఁ జూడు మింక - దశరథాత్మజ! రణస్థలి వీని గెల్వు"
మనవుడు నుగ్రంబు లైన బాణములు - గొని యంగకము లెల్లఁ గ్రుచ్చి పో నేయ5520
నొకముహూర్తము మూర్ఛ నొంది వే తెలిసి - "యకట ముందే వాసవాదుల గెల్చి
పరికింప దైవంబు ప్రతికూలమైన - నరునకు నిటు నేఁడు నా కోడవలసె;
ననిలోన రాక్షసు లందఱుఁ బొలిసి - రినవంశజులచేత నిఁక నేటి బ్రతుకు?”

అనుచుఁ గోపమున నయ్యమరకంటకుఁడు - జననాథసుతుఁ జూచి చల మగ్గలించి
"నరనాథనందన! నావిక్రమంబు - బరికించి నీ వింక బంటవై నిలువు;"
మనుచు నేడమ్ముల నతని నొప్పించి - హనుమంతు బదియింట నదరంట నేసి
వెస విభీషణుమీఁద విశిఖము లాఱు - మసలక నిగుడించి మఱి విజృంభించెఁ;
గాకుత్స్థతిలకుఁ డాకడిమి గైకొనక - నాకేంద్రరిపుఁ జూచి నవ్వుచుఁ బలికె,
“నధికుండు పంతంబు లాడకే గెలుచు - నధముండు పంతంబు లాడియు నోడు
ననుచితస్థితి శూరు లగువారు డాఁగ - రనిలోన వంచించు టది యొక్కగెలుపె?5530
కుటిలయుద్ధము సేయఁ గ్రూరాత్మ నీకు - బటుగతి నిహమును బరము లే" దనుచు
దినకరకరజాలతీవ్రార్చు లడరఁ - గనకపుంఖంబులు గలుగు బాణములు
వానిపై నిగుడించి వడి జోడుఁ ద్రెంచి - మే నుచ్చి చనఁగ నమ్మెయి మరు వపుడు
కాలోగ్రసర్పంబు కంచుకం బనఁగ - నాలోకనాఖీలమై నేలఁ బడియె;
వాఁడు వెండియు నొక్కవజ్రాంగిఁ దొడిగి - వాఁడిబాణంబులు వడి నేయ నపుడు
పరువడి నొండొరు బాణఘాతముల - నురువడి వెలువడు నురుశోణితముల
గైరికనిర్ఝరకలితంబు లైన - భూరిభూధరములు పొలుపుఁ గైకొనుచుఁ
గరవేగశర వేగగతులు నేర్పులును - గరమొప్పఁ బోరుచోఁ గారాకు రాలి
పూచినకింశుకభూజంబు లొప్పు - నాచందమున నొప్పి రస్త్రఘాతముల
నమరగంధర్వాదు లచ్చెరువంది - సమరంబు చూడ నాసమయంబునందు5540
కలభవేష్టితమ త్తగజలీల మంత్రి - కలితుఁడై భీకరగతి విభీషణుఁడు
విలుగుణధ్వని చేసి విపులరోషమున - వెలుఁగుమంటలతోడి విశిఖంబు లేయఁ
బిడుగులు చఱచిన పృథులభూజముల - వడువున రాక్షసు ల్వసుధపైఁ బడిరి;
అనలుండు మొదలుగా నతనిమంత్రులును - ఘనశూలపట్టిసఖడ్గఘాతముల
నెగడి రాక్షసకోటి నేలపైఁ గలిపి - రగచరావలిఁ జూచి యవ్విభీషణుఁడు
“ఇంక నీతనిఁ జంపు డిందఱుఁ బొదివి - లంకేంద్రుబల మన్న లా వన్న నితఁడె;
అని నీతఁ డీల్గిన నాదశాననుఁడు - దనసేనతోఁ గూడఁ దా నీల్గినాఁడు;
మును ప్రహస్తుని వజ్రముష్టిఁ బ్రజంఘుఁ - డనువాని సుప్తఘ్నుఁ డనువాని మఱియుఁ
గుంభనికుంభుల ఘోరవిక్రములఁ - గుంభకర్ణుని మహోగ్రుని నతికాయుఁ
వికటు మహాపార్శ్వు వెలయ ధూమ్రాక్షు - మకరాక్షు రక్తాక్షు మఱి శోణితాక్షు5500
యూపాక్షఁ ద్రిశిరు మహోదరు నగ్ని - కోపుని దేవాంతకుని నరాంతకుని
ఖరు జంబుమాలిని కంపను మఱియుఁ - బరుషవిక్రము లైన పగతురఁ జంపి
యాహవసాగరం బవలీల దాఁటి - బాహాబలంబులఁ బరఁగితి; రింక
సౌమిత్రికిని మీకు సమయంబు దాఁటు - డామెయి నింద్రజి త్తనుగోష్పదంబు
కొడుకుఁ జంపఁగ నాకుఁ గూడదు వీఁడు - చెడునుపాయము మీకుఁ జెప్పెద వినుము

హింస గావించిన నెదిరిచేఁ బంచి - హింస సేయించిన నివిరెండు సరియె
ఇది రాముకార్యార్థ మిది లోకహితము - నదికాన పాతకంబైనఁ గానిండు;
సౌమిత్రిచే నేఁడు చంపింతు వీని - నేమాయలును గొల్వ విటమీఁద ననఁగ
జాంబవంతుఁడు ఋక్షసంఘంబుతోడ - నంబరం బగలంగ నార్చి రాక్షసుల
నగశృంగతరుసింహనఖదంతములను - బగతుర నవలీలఁ బాల్పడి సొచ్చి5560
నొప్పింపఁ గపులచే నొగిలి రాక్షసులు - నిప్పులు సెదరంగ నెరిదారు ఘోర
పరశుముద్గరశూలపట్టిసప్రాస - పరిఘశరాసనపాణులై బెరయఁ
బొరి సురాసురులకుఁ బోలె నయ్యద్రి - చరనిశాచరులకు సంగ్రామ మయ్యె.
హనుమంతుఁ డాసమయంబున నలిగి - ఘనులక్ష్మణుని డించి కాలునిపగిది
నొక్కొక్కవాటున నొక్కొక్కమాటు - పెక్కండ్ర దైత్యులఁ బృథివిపైఁ గూల్చి
శైలశృంగంబుల సాలవృక్షముల - లీలమైఁ జంపి బల్లి దుఁడునై పేర్చె
సరభసంబున విభీషణుఁ డంత నలుక - నురుతరజ్యాఘోష మొనరించి మించి
తనమంత్రులును దాను దద్దయుఁ గడిమి - దనుజులఁ బెక్కండ్ర దరమిడి చంపి
కరమొప్పఁ గనకపుంఖప్రదరములు - నొరఁగించె నింద్రజిత్తునిమేను గాడ
తరమిడి వాఁడు నుదగ్రుఁడై కినిసి - యరిదిశరంబు లేయఁగ నవి వచ్చి5570
పొరి విభీషణునురంబున నుచ్చి పాఱి - ధరఁ గాడె ధరణియుఁ దల్లడపడియె
దురము విభీషణుతో నింద్రజిత్తు - కర ముగ్రముగ నిట్లు కావించుచుండఁ
గనుఁగొని యపుడు లక్ష్మణుఁడు కోపించి - హనుమంతు నెక్కి తీవ్రాస్త్రసంతతుల
వడి మీఱి రాక్షసవరునిపై నేయఁ - గడునొచ్చియును భయంకరముగా నపుడు
మగుడ వాఁ డుజ్జ్వలమార్గణపఙ్క్తి - మిగులంగ లక్ష్మణుమీఁదఁ బెల్లేసె;
అడరి యయ్యిద్దఱు నతికోపు లగుచుఁ - గడిఁదిబాణంబు లుగ్రత నేయ నపుడు
ఆయంపతండంబు లడరి యొండొరుల - కాయంబు లందంద కప్పిన నపుడు
అంబుధారలతోడి యంబుదంబులను - నంబుదంబులతోడి యర్కచంద్రులను
బోలి రామార్గణంబులు వచ్చుచున్న - యాలోనివేగ మే మని చెప్పవచ్చు?
తొడిగినశరములు తొడిగినయట్లు - విడువరొకో? యను విధమున నుండె;5580
ఆరెండుతెఱఁగుల యమ్ములు గగన - మారంగఁ గప్పిన నడరెఁ జీఁకట్లు;
వీరరసావేశవివశత నెఱుఁగ - రైరి యొండొరుల మహాజిరంగమున
ఆయవసరమున నచ్చెరు వడర - వాయువు రణభూమి వర్తింపదయ్యె;
అనలుండు వెలుఁగొందఁ డయ్యె దిక్పతులు - ననిమిషగంధర్వయక్షకిన్నరులు
చకితాత్ములై వచ్చి శరణంబు సొచ్చి - సకలదేవతలు లక్ష్మణుఁ బ్రశంసించి
యాలక్ష్మణునకు జయం బగునటులు - చాలదీవన లిచ్చి సమ్మదంబునను
నతిలోకకంటకుం డైనయాద్వైత్యు - మృతునిగాఁ జేయుసౌమిత్రి! నీ వనుచుఁ

బలుకుచునుండ నాభానుకులుండు - పెలుచ నార్చుచు గుణాభీలరావంబు
చెలఁగంగ నాయింద్రజిత్తును గిట్టి - బలుకాండములు మీఁదఁ బరఁగించుటయును
ఆరాక్షసుఁడు వేగ యవి త్రుంచివైచి - ఘోరనారాచము ల్గురిసి పెల్లార్చె;5590
మదిలోనఁ గోపించి మఱియు లక్ష్మణుఁడు - గదిసి యీశాఖామృగంబు లార్వఁగను
జలమున నొకయర్ధచంద్రబాణమున - బలియుఁడై వానిచాపము ద్రుంచివైచి,
పడగ యేడింటను బడనేసి యొకటఁ - దడయక సారథితల ద్రెవ్వ నేసి
పదియింట వక్షంబు పగులంగ నేసి - యదరంట నేసె రథ్యముల నాల్గింట;
ఆరావణునిసుతుం డప్పుడు తానె - సారథి రథియునై సౌమిత్రిఁ గిట్టి
నెట్టన నేయుడు నిగుడుకోపమున - నట్టహాసము సేయ నాలక్ష్మణుండు
నరదంబుఁ గడపుచు నని సేయుదైత్యు - నరుదార వీక్షించి యదరంట నేసె;
ఆవాఁడియమ్ముల నధికంబు నొచ్చి - రావణుసుతుఁడు మూర్ఛాగతుం డగుచు
నంతన తెలివొంది యాత్మలోఁ బెద్ద - చింతించి యిది యేమి చిత్రమో? నరుఁడు
నన్ను నొప్పించె నెన్నఁడు నిట్టి దెఱుఁగ - ము న్ననేకాహవంబులఁ బోరునపుడు5600
కాల మెవ్వరికినిఁ గడవరా దనుచు - వాలిన యుష్ణనిశ్వాసంబు లడరఁ
జాపంబు తివియంగ శరము సంధింప - నోపక పరిపంథి నొనరంగఁ జూడ
నేరక యుండిన నిఖిలదేవతలు - నారాముతమ్ముని నగ్గించి రపుడు;
వెలవెల నగువాని విన్ననిమోము - కలయంగఁ గనుఁగొని కపివీరు లార్వ
వీరులు గ్రథనుండు వెసఁ బ్రమాథియును - మేరుసన్నిభుఁ డగుమేఘనిస్వనుఁడు
శరభుండు ఋషభుండు శైలము ల్వైచి - రరుదార నింద్రారియరదంబు విఱుగ
నటుపైన కేతురథ్యంబులతోడ - విటతాటమై కూల విపులకోపమున
నసురనాయకసుతుం డంత బిట్టార్చి - వెస విభీషణు రామవిభు ననుజన్ము
నుదురును వక్షంబు నో నాట నేసె - వదలక మూఁడేసి వాఁడిబాణముల;
నేసి గుణధ్వని యెసకంబు గాఁగఁ - జేసి చెలంగించె సింహనాదంబు;5610
అప్పుడు కోపించి యధికరౌద్రమున - నిప్పులు కన్నుల నివ్వటిల్లంగ
రావణుతనయునురం బుచ్చిపాఱఁ - గా విభీషణుఁ డేసెఁ గాండంబు లయిదు
ఆతఁడు గోపించి యాగ్నేయబాణ - మాతండ్రి పయి నేయ నది రాఁగఁ జూచి,
వారుణాస్త్రం బేసె వడి లక్ష్మణుండు - నారెండు నటఁ బోరి యవనిపైఁ బడియె;
ఉరగాస్త్ర మాదైత్యుఁ డుగ్రుఁడై యేయ - గరుడాస్త్రమునఁ ద్రుంచె గళము సౌమిత్రి;
తగఁ గుబేరాస్త్ర ముద్దతి నాతఁ డేయ - నగణితంబుగఁ ద్రుంచె యామ్యబాణమున;
నతఁడు వెండియును వాయవ్యాస్త్ర మేయ - నతఁ డదియును ద్రుంచె నైంద్రాస్త్ర మేసి;
దానవుం డపుడు గంధర్వాస్త్ర మేయ - దాని లక్ష్మణుఁడు రౌద్రంబునఁ ద్రుంచె;
చలమున నిటు వారు సమరంబు సేయఁ - బ్రళయకాలమునాఁటి భంగియై తోఁచె;

సౌమిత్రి రణపరిశ్రాంతి మాన్చుటకు - నామందవాయువు లల్లన వీచె;5620
అంత లక్ష్మణుఁడు నాయంతకుపగిది - నంతకంతకు నుగ్రుఁడై యింద్రజిత్తు

లక్ష్మణునిచే నింద్రజిత్తు చచ్చుట

నటు చూచి కార్ముకజ్యానినాదంబు - పటుశక్తితో దిశాభాగంబు పగులఁ
జెలఁగించి మెయి పెంచి సింహనాదంబు - సెలఁగించి దేవేంద్రుచేఁ గొన్నయట్టి
యారూఢి మీఱ నింద్రాస్త్రంబు దొడిగి - యారామవిభుఁడు ధర్మాత్ముఁ డౌనేని
దేవి యాసీత పతివ్రతయేని - దేవతాకరుణ నాదెసఁ గల్గెనేని
నింద్రాదులకు నెల్ల హిత మగునేని - నింద్రజిత్తునితల యిమ్మహాశరము
త్రెంచుఁ గావుత! మని దృష్టి సంధించి - మించి యేయుటయును మి న్నెల్ల నిండి
పృథుదీర్ఘనిర్ఘాతభీషణం బగుచుఁ - బ్రథనవికాసనప్రారంభ మగుచు
బహురత్నపుంఖశోభాయితం బగుచు - విహగేంద్రసమజనావిర్భావ మగుచు
నహిముఖానలకణాత్యాలోల మగుచు - నహిమాంశుబింబప్రభాభీల మగుచు5630
మండుచు రుచులతో మహియు నాకసము - నిండుచు నత్యుగ్రనిగ్రహోదగ్ర
గతులమైఁ బఱచి రాక్షసలోకనాథు - సుతుఁ గిట్టి యందంద సురలు మిన్నంద
దనరిన నమ్మహోద్దండాస్త్ర మతని - యనుపమమణికుండలాంచితం బైన
లలితారుణేక్షణాలంకృతం బైన - తల బొమిడికముతో ధరఁ గూలఁద్రోసెఁ;
గలుషభావమున లంకానిధానంబు - చలమున నుగ్రుఁడై సాధింపఁ గోరి
బలి యిచ్చుకొఱకునై పటులులాయంబు - దల ద్రుంచి వైచువిధం బచ్చుపడగ
ననిలోనఁ బడియున్న యాయింద్రజిత్తుఁ - గనుఁగొని జయలక్ష్మి గైకొని దిశలు
గలయంగ నపుడు శంఖంబు పూరించి - విలు గుణధ్వని చేసి వెస లక్ష్మణుండు
నలి నప్పు డురుసింహనాదంబు సేసెఁ - జెలువొంద నప్సరస్త్రీల లాస్యములు
వీనుల సొలయించె; విశ్రుతశ్రుతుల - మానైన గంధర్వమధురగానములు;5640
అంత విభీషణుం డంతంత కెచ్చు - సంతోషమునఁ గ్రుచ్చి సౌమిత్రి నెత్తి
యాలింగనము సేసె నాలంబులోన - నాలోన వనచరు లందంద చెలఁగి;
రంతలో హతశేషు లగునిశాచరులు - నెంతయు భీతిల్లి యేపెల్లఁ బాసి
వనచరుల్ దోలంగ వడి ధృతు ల్గూల - దనరారుపదహతి ధరణి గంపింపఁ
గలఁగొని చీఁకట్లు కన్నులఁ గవియఁ - దలలు వీడఁగ నాయుధంబులు వైచి
చెందినభయమునఁ జెడి పాఱి లంకఁ - గొందఱు చొచ్చిరి, కుధరశృంగములు
కొంద ఱెక్కిరి; వార్ధిఁ గొందఱు పడిరి - కొందఱు దూరిరి గుహనికుంజములు
అనలుండు తీవ్రార్చు లడరంగ వెలిఁగె - దినకరుం డుజ్జ్వలదీప్తిఁ జెన్నొందె;
జలము లెందును నతిస్వచ్ఛంబు లయ్యెఁ; - గలయ దిక్కుల కప్పుకావిరి విఱిసె;
గగనప్రసన్నత గలిగె నిష్కంప - మగుచు భూతల మొప్పె; నప్పు డెంతయును5650

బవనసూనుఁడు శతబలియును నలుఁడు - జవశాలి పనసుండు శరభుండు ఋషభుఁ
డతులవిక్రమశీలుఁ డావాలిసుతుఁడు - నుతబలుం డగు సుషేణుం డర్కజుండు
గజుఁడును గవయుండు గంధమాదనుఁడు - విజయు లైనట్టి యాద్వివిదమైందులును
దక్కినవానరోత్తములు నేతెంచి - మ్రొక్కి కీర్తించిరి ముదితాత్ము లగుచు.
నప్పుడు లక్ష్మణు నఖిలదేవతలు - నొప్పార నుతియించి యొగిఁ బుష్పవృష్టిఁ
గురిసిరి; వానరకోటి పెల్లార్చెఁ - బరిమళయుతముగఁ బవనుండు వీచె;
ఆలక్ష్మణుఁడు విష్ణువంశంబు గాన - నాలంబులోపల నతనిచేఁ దెగిన
కపటరాక్షసుఁడును గాయంబు విడిచి - యపరాబ్ధిఁ గ్రుంకిన యర్కుండు వోలె
విష్ణుసాయుజ్యంబు వెలయంగ నందె - నుష్ణాంశుకులకీర్తు లొగి దిశ ల్నిండ
సౌమిత్రి యట జయస్తంభంబు నిల్పి - రామునియొద్దకు రయమునఁ జనియె;5660
సర్వవానరవిభీషణవాయుజులును - బర్వి యెంతయుఁ దన్ను బలిసి యేతేర
వచ్చి రామునిపాదవనరుహంబులకు - నచ్చుగా నెరఁగిన నప్పు డుప్పొంగి
యలరి కౌఁగిటఁ జేర్చి యానందబాష్ప- ములతోడఁ దొడలపై ముదమొప్ప నునిచి
పొరి నంగముల వీరపులక లనంగ - నరగరు ల్చొర గాడినట్టిబాణముల
మునుకొను నాదుఃఖమున మేఘనాదుఁ - డనిలోనఁ గూలినయాసంతసమున
నతిరయంబున మూర్ఛ యంతలోపలనె - ధృతి దూలుకొనఁ దోన తెలివియు గలిగి
"యాయోధనంబున నలవుమై నింత - సేయునే యీతం డజేయుఁడై నేఁడు
బహుదివ్యశస్త్రాస్త్రబలు నింద్రజిత్తు - నహితభయంకరు ననిలోనఁ జంపె;
నటుగాన నాచేత ననిఁ జచ్చు నింకఁ - బటుశౌర్యధనుఁ డైన పఙ్క్తికంధరుఁడు
ఆతనివిభవంబు నాతనిబలిమి - యాతనిసుతునితో నట నేఁడు పొలిసె;5670
నిఖిలశస్త్రంబులు నిపుణుఁడై మెఱసి - యఖిలరాక్షసులకు నాధారమైన
కొడుకుచావున కెల్లకోర్కులు విడిచి - కడిమిపై నాతోడఁ గయ్యంబు సేయ
సర్వాయుధోజ్జ్వలసన్నద్ధుఁ డగుచు - గర్వించి దుర్వారగతి వచ్చెనేని?
చతురంగబలదైత్యసంఘంబుతోడ - వితతాహవక్షోణి విశిఖజాలముల
బలువిడి దునుమాడి బలి భూతములకు - నలవడఁ గావింతు నద్దశాననుని”
నని సుషేణునిఁ జూచి యారాముఁ డనియె - “దనరునోషధశైలతటవనంబునను
నురుతరప్రభలతో నొప్పువిశల్య - కరణి వేతెచ్చి లక్ష్మణవిభీషణుల
వానరావలి శరవ్రణవేదనలను - వానరోత్తమ! పాపవలయు నీ" వనిన
ఆతండు నత్తెఱం గటు సేయ - వారు వీతక్షతాంగులై వెస నుల్లసిలిరి;
ఇనసూనుపనుపున నెల్లవానరులు - మనమారఁ గైసేసి మహితతేజమునఁ5680
జంద్రదివాకరసదృశులౌ రామ - చంద్రసౌమిత్రుల సరిగొల్వ నపుడు
రామలక్ష్మణులును రవితనూజుండు - యామినీచరవరుఁ డగువిభీషణుఁడు

నుతబలుం డనిలసూనుఁడు సుషేణుండు - శతమన్యుమనుమఁడు జాంబవంతుండు
నీలుండు మొదలుగా నిఖిలయూథపులు - పౌలస్త్యులకు నెల్లఁ బట్టుగొమ్మైన
యావీరవరునిచా వధికసమ్మదము - గావింప సంపూర్ణకాము లై రిటను.

రావణుఁ డింద్రజిత్తుమరణమునకు శోకించుట

అంత నారాక్షసు లట లంక కరిగి - యెంతయు కోపంబు లెసఁగ నవ్వేళ
రావణు లోకవిద్రావణుఁ గాంచి - “దేవ! నీపుత్రుండు దేవేంద్రవైరి
తనబాహుబలమునఁ దఱిమి వానరుల - దునుమాడి పెక్కండ్ర దురములోపలను
దివిజు లచ్చెరువంద దివ్యాస్త్రకోటి - నవిరళంబుగఁ బేర్చి యంతటఁ బోక
బలువిడి లక్ష్మణు ప్రాణము ల్గలఁగఁ - బలుసాయకంబులఁ బ్రౌఢుఁడై యేసి5690
యామేఘనాదుం డుదగ్రవిక్రముఁడు - సౌమిత్రిచేఁ జచ్చె సమరమధ్యమున”
ననవుడు రావణుం డధికశోకమున - మునిఁగి పెద్దయుఁ బ్రొద్దు మూర్ఛిల్లి తెలిసి
"హావంశవర్ధన! హామహావీర! - హావీరరణధుర్య! హాశూరవర్య!
ఆశతమన్యుని నవలీల గెలుచు - నాశౌర్య మెవ్వఁ డుదగ్రుఁడై యడఁచె?
బలసూదనాది దిక్పతులు ఖేచరులు - పలుమాఱు నీవన్నఁ బాఱుచుండుదురు;
నీయుగ్రశక్తికి నిలిచి ని న్నెదిరి - యాయోధనంబున నడఁచెనే నరుఁడు?
చటులకోపంబునఁ జండకోదండ - పటుబాణపాణివై బవరంబులోన
నిలిచిన జముఁడైన నీ కోడు నట్టి - బలిమి యెక్కడ బోయెఁ బరికింప నేఁడు
వక్రమై దైవంబు వలనుగాకున్న - శక్రారి! నీకంటె జముఁ డెక్కు డయ్యె;
అక్కజంబుగ మందరాచలంబైన - వ్రక్కలు సేయు నీవాఁడిబాణములు5700
రణములోపల మున్ను రామలక్ష్మణులఁ - దృణలీల గెలిచితి తివిరి పల్మాఱు;
ఆమహత్వము దూలి, హాపుత్ర! నీవు - సౌమిత్రిచే నిటు సమసితే? యకట!
అమరులు మునులును నమరారి! నీవు - సమరోర్విఁ బడుటకు సంతసించెదరు;
సంహారఘనఘనస్తనిత మైనట్టి - సింహనాదము నీవు చేసిన బెదరు;
నిఖిలలోకంబుల నీ వజేయుఁడవు - నిఖిలనిర్జరులకు నీపేర్మి దక్కి
యల్పునిగతిఁ గూలి తకట! యాబ్రహ్మ - కల్పన దప్పినఁ గానేరవైతి;
సచరాచరములైన జగము లీరేడు - సుచిరవిక్రమ! వీరశూన్య మైనదియు
నందన! నీలావు నమ్మిన నన్ను - బృందారకులు నవ్వఁ బెడఁబాయఁ దగునె?
చెవులార రాక్షసస్త్రీవిలాపములు - వివిధభంగులు నేఁడు విన నాకువలసె;
నీయౌవరాజ్యంబు నీదులంకయును - నీయిష్టబంధుల నీతల్లి నన్నుఁ5710
దనయ! నీపత్నులఁ దనయుల డించి - చనఁజాలితే? యెందుఁ జనితి వీ! వకట!
నాఁ డంతకుని గెల్చినాఁడ వాలమున - నేఁ డెట్టు వోయితి వీవు తత్పురికి?

పరలోకకృత్యము ల్భక్తితోఁ దనయుఁ - డరయఁ దండ్రికిఁ జేయు నవి యెల్లఁ బోయి
యే నీకుఁ జేయంగ నిటు నేఁడు వలసె; - నే నింక నే మందు? నేమి సేయుదును?
రామలక్ష్మణులును రవితనూజుండు - యామినీచరపాలుఁ డగువిభీషణుఁడు
భీమవిక్రమలీలఁ బెంపొందుకపులు - నామర్మములు దూర నాటియున్నారు;
అట్టి నాహృదయశల్యంబు లోపుత్ర! - నెట్టనఁ బెఱుకక నేఁ డెందుఁ జనితి?
నాపాలిజయ మయ్యు నాతేజ మయ్యు - నాపుణ్యఫల మయ్యు నాభాగ్య మయ్యు
నాపెంపుగతి యయ్యు నాకీర్తి యయ్యు - నేపార నోపుత్ర యెంచిన వెల్ల
నీవయై యుండుదు నీయట్టికొడుకు - చావఁ జూచితి; నింక జన్మ మేమిటికి?5720
ఈకష్టశోకాబ్ధి యెడతెగ కీద - నాకు నెయ్యది తెప్ప? నలినాప్తతేజ!
“నినుఁ గొని రాముని నిర్జింతుఁ బోర" - నని నమ్మియుండితి; నదియును దీరె;
ఆశలన్నియు దీరె; నకట! యే నింక - నీశోకదవవహ్ని నెరియంగఁజాల;"
నని యని శోకించి యందంద పొగిలి - మనసు డిందకయుఁ గ్రమ్మఱ మూర్ఛనొంది.
యున్నదశగ్రీవు నుగ్రప్రభావు - నున్నతాత్ములు మంత్రు లొయ్యనఁ దెలుప,
బలురోషశోకము ల్బలిసి కన్బొమలు - పలుమఱు ముడివడఁ బరవసం బొప్ప
నేచినకిన్కమై నేదిక్కు చూచెఁ - జూచినదిక్కున స్రుక్కి రాక్షసులు
ఘనభీతిఁ బఱవ రాక్షసలోకవిభుఁడు - కన దుగ్రదంతసంఘట్టనరవము
లతిభయంకరవృత్తి నప్పుడు దిశలఁ - బ్రతిరవం బొనరింపఁ బదిముఖంబులను
గనుగవలను నగ్నికణములు దొరుఁగ - దనమంత్రివరుల నందఱఁ జూచి పలికె;5730
విడువనితపమున వేధ మెప్పించి - పడసితి శస్త్రాస్త్రపంక్తులు పెక్కు
ఎన్నఁడు నపజయం బెఱుఁగ యుద్ధముల - నెన్నఁడు నేశోక మెఱుఁగఁ జిత్తమున
నిరుపమస్థితి నొప్పు నీలాభ్ర మనఁగ - బరమేష్ఠి మెప్పించి పడసినజోడు
గైకొని రథ మెక్కి కదలితి నేని - నాకనాయకుఁ డైన నను గెల్వఁగలఁడె
నలినసంభవుచేత నాఁ డేను గొన్న - విలునమ్ములును మీరు వేగంబ తెండు;
వాఁడిమి మీఱంగ వడిఁగిట్టి కలన - నేఁడు నే గెల్తు; నానృపులను గపుల”
నని పేర్చి ప్రళయకాలాగ్నియుఁ బోలె - మనమున జాజ్వల్యమానుఁడై యుండి
దివ్యవాద్యములతో దిక్కులు మెఱయ - నవ్యబాహాస్ఫాలనంబు సేయుచును
అనియె ని ట్లుగ్రుఁడై యధికరోషంబు - పెనఁగొన మఱియును బేర్చి యిట్లనియె.
"నేఁడు నాతమ్ముల నేఁడు నాసుతుల - నేఁడు నాబంధులు నేఁడు నాభటులఁ5740
జంపెను సీతకై చనుదెంచి కడిమి - పెంపార రాముఁ డభేద్యుఁడై పేర్చి
యాయింద్రజిత్తు మాయాసీతఁ జంపె - నాయుపాయంబు నిరర్థకం బయ్యె

రావణుండు సీతను దెగ వేయఁ బోవుట

నే నింక నిజముగా నిప్పుడు పోయి - జానకిఁ దెగటార్చి చలము సాధింతు”

నని హస్తమునఁ జంద్రహాసంబు పూని- తనరినపదహతి ధరణి గంపింపఁ
జనుచుండ వృద్ధరాక్షసమంత్రివరులు - దనరంగ నూహించి తమలోన ననిరి;
“దశరథాత్మజుల నీదశకంధరుండు - నిశితబాణంబుల నిర్జింప లేఁడె?
కైకొన కీతఁడు కడిమిమై సకల - లోకపాలుర నాజిలో మున్ను గెలిచె;
నోలి మరుత్తుల నుగ్రాహవమునఁ - దోలెను నలువలఁ దొమ్మండ్ర గెలిచె;
నెనమండ్రువసువుల నే పడంగించెఁ - ఘనతతోఁ దొమ్మిదిగ్రహముల నడఁచె;
దెగువఁ బన్నిద్దరాదిత్యుల నొంచెఁ - బగ గెల్చె రుద్రులఁ బదునొక్కరుండ్ర5750
నరుదార గంధర్వయక్షరాక్షసుల - నురగుల గరుడుల నుగ్రదానవుల
నతిభీతి పొందించె నారసి చూడ - నితనికి నరులన నెంతటివారు?
తమకించి సతిఁ జంపఁ దగవుగా దనుచు - సమవర్తిఁ బోలె నాసమయంబునందు
లోకభయంకరాలోకుఁడై తివిరి - నాకేంద్రవైరి జానకిఁ జంపఁ గదిసె;
అప్పు డప్పాపాత్ము నత్యుగ్రదృష్టి - కప్పుణ్యవతి స్రుక్కి యనదచందమున
నొందినభీతితో నుగ్రగ్రహంబు - ముందటనిల్చిన మోదంబు దక్కి
పడియున్నరోహిణి పగిది నాసీత - పతితుఁడౌ రావణుభావంబుఁ జూచి,
“యీదురాత్మునిచేత నిటుఁ జావవలసె - హాదైవమా! యని యతిబాధ పొంది
దురమున నింద్రజిత్తుఁడు చచ్చు టెఱిఁగి - సురవైరి చంప వచ్చుచునున్నవాఁడొ?
కాక యారామలక్ష్మణుల జయించి - చేకొని ననుఁ జంపఁ జేరుచున్నాఁడొ?5760
వీనిచే చావ నావిధి చెరఁ బెట్ట - నే నేమి సేయుదు నిలమీఁద నింక
నక్కటా! దైవంబ! యతిపుణ్యధనులఁ - బెక్కుసంకటములఁ బెట్టితే తెచ్చి?
రామాభిరాముల రామలక్ష్మణుల - నామీఁద పగ” నంచు నలినాయతాక్షి
పలవించి పలవించి భావమధ్యమున - నెలకొన రఘురాము నిజమూర్తి నిలిపి
పరవశయై తూలిపడి మూర్ఛ వోయె - ధరణిపైఁ బడియున్న ధరణిజఁ జూచి
ధరణిజదెస నల్గు దశకంఠుఁ జూచి - కరము శోకించి రాక్షసు లెల్లఁ గలయ
"హాహానినాదంబు లందంద చెలఁగ - నోహో! దురంత మీయుగ్రకృత్యంబు”
అనుచుండు నత్తఱి నమరారిఁ జేరి - ఘనుఁడు సుపార్శ్వుండు ఘననీతిధనుఁడు
వెఱవక తననీతివిభవంబు మెఱయఁ - దెఱఁగొప్ప నతని బోధించుచుఁ బలికె.
"ధాతపులస్త్యుండు తండ్రి ధర్మైక - నీతిజ్ఞుఁ డురుయశోనిధి విశ్రవసుఁడు;5770
నీవు వేదాగమనిధివి; నీపెంపు - భావింప కేల దుర్భావుండ వయితి?
తగ దుత్తమస్త్రీలఁ దవిలి వధింప; - నగణితం బగు దోష మటుఁగాన వలదు!
ఈకోప మంతయు నెల్లి యుద్ధమునఁ - గైకొని రామలక్ష్మణులపైఁ జూపు"
మని చెప్పి యాచంద్రహాసంబు పుచ్చి - కొని సుపార్శ్వుండు దోడ్కొని వచ్చె మగుడ
అంత నాదశకంఠుఁ డధికరోషమునఁ - జింతించి విన్ననై చిత్తంబునందు

మఱపు పుట్టని పుత్రమరణాతురమున - మఱుఁగుచు నాస్థానమంటపంబునకు
జనుదెంచి కొలువుండి చటులవేగమున - తనమంత్రిబాంధవతతుల రప్పించి
కొందల మందుచుఁ గొడుకుచందంబు - మది నుగ్గడించుచు మౌనత నుండె.

ఇంద్రజిత్తుభార్య సులోచన శోకించుట

అంతఃపురంబున నతివలు గూడి - చింతింపఁగా విని శేషునిపుత్రి
యైనసులోచన యాత్మేశుచావు - విని చాల వగచుచు వివశత నొంద5780
పొలుపొందగాఁ బెద్దప్రొద్దుకుఁ జెలులు - తెలుపగా నొకకొంత తెలివొంది కుంది
నానావిధంబుల నాథునిఁ గూర్చి - యాననం బదరఁ బ్రలాపింపఁదొడఁగె.
“హాప్రాణనాయక! హాజీవితేశ! - హాప్రాణనాథ! నీ వాజిలో నెదిరి
యేపార నిన్ను జయించెనే నరుఁడు? - చూపోపఁజాలకఁ జులకఁగాఁ జూచి?
పాపపుబ్రహ్మ యీపట్ల నిద్దఱినిఁ - బాపంగఁ దగునె తాత్పర్యంబు లేక?
యెప్పు డెక్కడి కైన నేగుచోఁ బిలిచి - చెప్పిపోదువు నన్ను సేమ ముప్పొంగ;
నాకుఁ జెప్పిన నీకు నాథ! యీచావు - చేకూరునే శత్రుచేత నీలాగు?
మాతండ్రి నన్ను ప్రేమము మీఱ నీకు - బ్రీతి రెట్టింపఁగఁ బెండ్లి గావించు
తఱి "నీవు జయకాంక్ష దలఁచితి వేని - సరవికార్యంబులు సతితోడఁ దెల్పి
అరిగిన నజహరాదుల కజేయుఁడవు - నరు లనఁగా నెంత? నాకేశవైరి!”5790
యనుచు శిరోరత్న మపుడు నాచేతి - కొనరంగ నిచ్చి నా కొకబుద్ధి దెల్పె;
"తనయ నీపతి శత్రుతతిమీఁదఁ బోవ - మానుగాఁ దలపయి మణి నివాళించి
పంపినఁ బగఁ దీర్చుఁ బగతుల నెల్ల” - నింపుగాఁ జెస్పిన నీమామమాట
మఱచి యిప్పుడు నీవు మఱి వైరిదివ్య - శరవహ్నిచే రణస్థలిని వ్రాలితివి;"
అని తనప్రాణంబు లాత్మేశునకును - మునుకొని మది ధారఁ బోసి యాక్షణమె
తనయులఁ జూచి యాతరలాయతాక్షి- “ఘన మైన శోకసాగరమున మునిఁగి
భీతిల నేల? విభీషణుం డుండ - నాతఁడు మన్నించు నధికతేజమున
వర్ధిష్టులై తనూభవులార! మీరు - వర్ధిల్లుఁ డెప్పుడు వరగుణోన్నతిని.
నా కింక నుండుట న్యాయంబు గాదు - ప్రాకటంబుగఁ బోదు ప్రాణేశుకడకు"
నని ముద మందుచు నన్నిట రోసి - మనమునఁ గలవాంఛ మమత రెట్టింప5800
నలయుచు సొలయుచు నసు రుసు రనుచు - లలిఁ దూలి యజపుష్పలతికచందమునఁ
జని దశకంఠునాస్థానంబుఁ జేరి - తనకన్నులను బాష్పతతులును దొరుఁగ
మదిరాక్షి యేడ్చుచు మమత రెట్టింప - నొదుగుచు మామతో నొయ్యనఁ బలికె.
“పతివియోగంబైన సత్నియాక్షణమె - పతి నంటి యేగుట పరమధర్మంబు;
అటుగానఁ బతి నంటి యరుగంగవలయుఁ - బటుబుద్ధితోడ నాపతికళేబరము
తెప్పింపు మిప్పుడు తీవ్రంబుగాను - తప్పక మది భటతతుల బాంధవుల"

ననిన నాతఁడు నాత్మ నల్లఁ జింతించి - మనుజాశనుండు నామగువ కిట్లనియె.
“విన్ననై యాహవవిముఖమధ్యమున - పన్నుగాఁ బడియున్న పడఁతి నీవిభుని
నేను బో యడిగిన నిత్తురే వారు - కాన నాచేతను కాదు మృగాక్షి;
నీమన సటుమీఁద నే నేమి చెప్ప? - భామ! నీ వెఱుఁగని పని యేమి కలదు?5810
చెప్పితి నాకుఁ దోఁచినవిధం” బనిన - నప్పద్మలోచన యతని కిట్లనియెఁ
"గైలాసనగము వేగమె కేల నెత్తి - ఫాలాక్షునకు నతిభయముఁ బుట్టించి
కడఁకమై మూఁడులోకములను గెల్చి - కడిమి గల్గిన మహాఘనుఁడవు నీవు;
సురనాథు గెల్చిన శూరున కిపుడు - నరు లెంతవారు? వానరు లెంతవారు?
నరులలో హీనవానరులలోఁ బడిన - గురుసత్త్వశాలి నీకొడుకుదేహంబు
"తేలేను నే" నని ధీరత్వ మెడలి - యీలీల ననఁ గాలహేతువో యనుచుఁ
గర మొప్పఁగా బాహ్యకర్మంబులకును - తరుణులు పతిరహితం బైన నగ్ని
సరవితోఁ జన ధర్మసరణియుఁ గాన - వెఱవక నే విన్నవించినమాట
నెగ్గుగాఁ గొన కానతిచ్చి న న్ననుపు - దిగ్గున చని పతిఁ దెచ్చుకోవలయు;"
ననిన నాదశకంఠుఁ డతివ వీడ్కొలుప - మానినియును తనమామకు మ్రొక్కి5820
మెలుపైన దొలుకరిమెఱుపుచందమున - కలితమౌ తనమేనికాంతిజాలములు
తలకొని భూనభోంతర మెల్ల - నిండ జలరుహనేత్ర నిశ్చలబుద్ధిచేత
వినువీథి రాఁ గపివీరు లందఱును - మనమున నాశ్చర్యమగ్నులై చూడ
నంతఁ గొందఱు కడు నాశ్చర్యమునను - వింత రెప్పలు విచ్చి వేవేగ చూడ
వెఱఁగొందుచున్న యీవెలఁదులు మేటి - సురపురినుండి యీసుదతీలలామ
దేవత లంపినది లక్ష్మి రామ (?) - దేవునికడ కేగుదెంచెనో కాక
తనయుఁడు మృతుఁడైన దశకంధరుండు - మనమున రోషంబు మఱి యింతలేక
కక్కసం బుడిగి వెగమె సీత రథము - నెక్కించి మగుడ నంపించెనో గాక?
కాక వేఱొకదేవకాంతయు నిందు - రాఁ గారణం బేమి రయమున ననుచు,
అంగదసుగ్రీవు లాంజనేయుండు - సంగరస్థలి నున్న తరుచరాధిపులు5830
వెరవొప్ప శ్రీరామవిభుఁడు లక్ష్మణుఁడు - దొరకొని చోద్యమందుచు నుండి రపుడు
పరమపావనుఁడైన పవమానసుతుఁడు - వెరవున నాకాశవీథి నేతెంచు
భామినీమణిఁ జూచి పరఁగ రామునకు - తామసింపక వేగఁ దగ విన్నవించె;
"ఈమానవతి మది నెంచఁగా దేవ - భామ కాదిది రామపత్నియుఁ గాదు
మానుగాఁ బతిలేని మగువయే కాని - దానికి నదిగొ ప్రత్యక్షంబు గలదు;
అప్పడఁతుకయున్న యరదంబుమీఁదఁ - గప్పినధూళి రాఘవ! విలోకింపు"

సులోచన శ్రీరాముల నుతించుట

మని చూపుచుండ నయ్యబ్జాక్షి వేగ - చనుదెంచి యరదంబు చయ్యన డిగ్గి

పుత్తడిబొమ్మయో పొసగంగ మొదల - క్రొత్తగుముత్తెమో కొదమరాయంచొ?
యనఁగ సన్నపునడు మసియాడుచుండఁ - గనుగవలను బాష్పకణములు దొరుఁగ
నందందఁ దూలుచు నసురుసు రనుచు - మందయానంబున మగువ రాఘవునిఁ5840
గదిసి సాగిలి నమస్కారంబు సేసి - ముదిత హస్తంబులు ముకులించి నుదుట
“రవికులాంబుధిసోమ! రామాభిరామ! - ప్రవిమలగుణధామ! పరరాజభీమ!
జలదసన్నిభగాత్ర! సారసనేత్ర! - విలసితచారిత్ర! వితతపవిత్ర!
కలశాబ్దిగంభీర! కనకాద్రిధైర్య! - లలితోక్తిమాధుర్య! లావణ్యధుర్య!
జననాథ! నీపాదసంసేవకతన - యెనయు నాపాపంబు లెల్లను బాసె"
నని విన్నవించుచు నరనాథునెదుట - వినయంబుతో నున్న వెలఁది నీక్షించి
మానవేంద్రునియనుమతిమీఁదఁ జేరి - భానుతనూజుఁ డాపడఁతి కిట్లనియె.
"నెలనాఁగ! నీ వెవ్వ? రిచటికి నిపుడు - వెలయంగ వచ్చిన విధ మేమి నేఁడు?
వెలఁది నీపే రేమి? విభుఁడు నీ కెవఁడు? - పొలుపొంద నెవ్వనిపుత్రివి నీవు?
చెప్పు మేర్పడ నీదుచందం”బటన్న (?) - నప్పు డప్పడఁతి తా నశ్రువు లొలుక5850
“భానుజ విను భోగిపతి నాదుతండ్రి; యేను సులోచన, యిదియ నాపేరు;
నాకు నాథుఁడు మేఘనాదుఁ; డాపుణ్య - ప్రాకటబహుభోగభాగ్యశీలుండు
నధికబాహాటోపుఁ డధికతేజుండు - కదనభీకరుఁడు వాసవభంజనుండు
కడిఁదిశూరుఁడు దశకంఠనందనుఁడు - కడఁక మందోదరీగర్భసంభవుఁడు”
అని చెప్పి శ్రీరాము నతివ వీక్షించి - మనమున నతిశోకమగ్నయై పలికె.
“నిట్టిశూరుని రాఘవేంద్ర! రణోర్విఁ - బట్టి చంపితి కృపాపరులయ్యు! మీర
లేట్లు చంపితిరయ్య? యినకులాధీశ!- పుట్టునే యిటువంటి భూరివిక్రముఁడు;
పతివియోగాగ్నిచేఁ బడఁతులు మదిను - పరితాప (?) మొందరె పలుతెఱంగులను?
ఎఱుఁగవే సర్వజ్ఞ యేఁ బతిఁ బాసి - ధరణి వైధవ్యంబు దాల్పంగఁ గలనె?
శరణార్థిరక్షక! సదయాంతరంగ! - పరిపూర్ణహృదయ! శోభనకృపాపాంగ!5860
మరుగుచొచ్చితిఁ గాన మన్నించునట్టి - బిరుదు నీబిరుదు; రూపింప నావిభుని
మరలఁ బ్రాణము లిచ్చి మన్నించు నాకు - పురుషభిక్షము పెట్టి భువి నన్ను నిలుపు;”
మనుచుఁ బ్రార్థించిన నవనీశ్వరుండు - ఘనదయాపరమూర్తి గాన నయ్యింతి
పురుషుని బ్రతికింప బుద్ధి నూహించు - టెఱిఁగి మారుతియును మఱి విన్నవించె;
"నిది యేమి? రాఘవ! యెఱుఁగరే మీరు? - వదలక యాబ్రహ్మవరము తప్పింప
నీతియే? మీరు మానినికినిఁ జెప్పి - ధాతను మన్నింపఁదగును భూనాథ!”
యని మారుతాత్మజుఁ డాడువాక్యములు - అన విని దలపోసి యపు డిట్టులనియె.
"జలజాక్షి యింకొక్కజన్మంబునందు - కలసెదు విభు పెద్దకాలంబుదాఁక
పెక్కుసంపదలచేఁ బెంపు సొంపార - యక్కజంబుగ భోగ మనుభవం బొంది,

యామీఁద వైకుంఠమందు నిర్వురును - కామితార్థోన్నతి కాంతురుగాక”5870
యనిన సంతోషించి యతిదయాపరుని - వినయపూర్వకముగా వినుతింపఁ దొడఁగె
సదయాంతరంగ! శోభనకృపాపాంగ! (?) - సదమలగుణధీర! సాధుసాంగత్య!
పరఁగ నాపతికళేబరము తెప్పించు - పురమున కతివేగఁ బోవంగ వలయు”
ననవుడు సుగ్రీవుఁ డపు డిట్టు లనియె - “వనజలోచన! పతివ్రత వౌదువేని?
నీదుపురుషునితోడ నీచంద మెల్ల - తగఁ బల్కు మిప్పుడు తడయక" యనినఁ
గడువేగమునఁ బోయి కదనరంగమును దడయక చొచ్చి యాతరలాయతాక్షి
పడియున్నతలఁ జూచి పలుతెఱంగులను - అడలుచు బతిఁ జేర నరిగియు దుఃఖ
జలధిలో మునిఁగి మూర్ఛయుఁ బొంది తెలిసి - పలువిధంబులఁ బడి ప్రాణేశుమీఁద
నెలుఁగెత్తిఁ హా! యని యేడ్చి ధైర్యంబు - నిలిపి సుస్థిరమున నిలిచి యాలేమ
పలికె సత్యప్రభాభాసిత యగుచు; - వలనొప్పు నామనోవాక్కాయకర్మ5880
ములయందుఁ బతిభక్తి మొనసితి నేని - సలలితధర్మసంచారంబునందు
పతియె దైవం బని భావంబులోన - సతతంబు వ్రతముగా సలుపుదు నేని
చెలఁగి నావిభునకు జీవంబు వచ్చి - యలర నాతో మాటలాడుఁగా! కనుచు
అని తమయాత్మ మర్యాదలు కొంత - యనినఁ గన్విచ్చి దశాస్యనందనుఁడు
"నెలఁత చంపినవాఁడు నీతండ్రి గాఁడె? - తలపోయ నొరులకు తరమె న న్గెల్వ?
నిలిచి యుద్ధము సేయ నిమిషమందైన - బలుచింతపడ నీకు పనిలేదు వినుము;
తనదుఋణానుబంధము గూడియున్న - నెనసియుందురు నరు లింతులఁ గూడి
వెలయఁగ యోగవియోగము ల్బ్రహ్మ - వెలయంగఁ గల్పించె వెలఁది జీవులకు;
ఇటుగాన మఱి కాలహేతువు గాన - కుటిలకుంతల ! యిట్లు కూలితి ధరణిఁ;
జను" మని కన్నులు చయ్యన మూయఁ - గని మదిలోఁ జింత గడలుకొనంగ5890
నప్పుడు బహుదుఃఖ యై కొంతసేపు - అప్పొలఁ తందుండ కతివేగ వచ్చి
శ్రీరామువిభునకుఁ జేతులు మొగిచి - యారామ వినుతించె నతిమోదమునను;
నప్పుడు రఘురాముఁ డంగదుఁ బిలిచి - "యిప్పడఁతుకపతి నిప్పింపు" మనిన
తరమిడి యారామధరణీశునాజ్ఞ - తలనిడి యాయింతిధవుకళేబరము
నిచ్చిన యురముపై నిడి రాఘవునకు - నచ్చపుభక్తితో నతివ వీడ్కొలుప,
నతివేగమున పురి కప్పుడే పోయి - యతివ మందిరమున కప్పుడు పోక
వామాక్షి పతికళేబర ముంచఁదగిన - భూమిని నిల్పి కాపుండఁగాఁ జేసి,
యంతఃపురంబున కటు చేర నరిగి - చింతించి తనమదిఁ జింతించి మఱియుఁ
దనపుత్రులను ప్రేమ తగఁ జేరఁదీసి - కనుగవలను బాష్పకణములు దొరుఁగ
శిరము మూర్కొని ప్రేమఁ జెక్కిలి నొక్కి - కరమర్థితోఁ దనకౌఁగిటఁ జేర్చి5900
"సుతులార! మీముద్దు చూడంగ నాకు - హితవు మీఱఁగ దైవ మియ్యక పోయె;

మహిమీఁద నుండ ధర్మము గాదు తనకు - సహగమనంబు నిశ్చయముగా గూర్తు;
నిక్కడ నుండుట యిది బుద్ధి కాదు; తక్కక పొండు పాతాళంబునకును,
స్థిరబుద్ధి మీ రాదిశేషునియింట - వెఱవ కుండుఁ డటంచు వేగంబె పంపి,
కడువేగమున దశకంఠుసన్నిధికి - గడగడ వడఁకుచుఁ గమలాక్షి పోయి
విన్ననై వదనారవిందంబు వాంచి - కన్నీరు విడిచి, గద్గదకంఠ యగుచుఁ
గరములు మొగిచి యగ్గపుభక్తితోడఁ - బురపురఁ బొక్కుచుఁ బొలఁతి మామకును
బోయినవృత్తాంతమును విన్నవించి - కాయము దెచ్చినక్రమ మెఱిఁగించి
“రామచంద్రునిదయారసము, లక్ష్మణుని - ప్రేమాతిశయము, విభీషణుకూర్మిఁ,
గపికుంజరులపరాక్రమము, నామహిమ - విపరీత" మని చెప్ప విని రావణుండు5910
విన్ననై మోమున వేడుక లేక - తిన్ననిస్వరమునఁ దెలిసి తెలియకయె
యాయింతితెగువయు నాయింతితెలివి - నాయింతిసమబుద్ధి కామహామహిమ
కాయింతిపతిభక్తి కాయింతి వేగఁ - గాయము దెచ్చిన క్రమశక్తియుక్తి
కే మనఁజాలక యేయుత్తరంబు - కోమలి కియ్యకఁ గొతుకుచునున్న
కని సులోచన దైవకారణంబునకు - "మనమున జింతించి మఱి యేల యింక?
నా కానతీవయ్య! నాకేశవైరి! - యేకచిత్తంబున నేగెద నింక;"
ననఁగ వ్యాకులచిత్తుఁ డై రావణుండు - తనదుకోడలిమోము తప్పక చూచి
యాయింతితెగువయు నాయింతితెలివి - పాయక యిఁక నిల్వఁ బట్టరా దనుచు
"నేమి చెప్పుదు నీకు? నిందీవరాక్షి! - నీమదిపూనిక నీతెఱం గెదియొ?
ప్రియు సుతాగ్రపుఁ జంపి భీతులచేత - భయదుఃఖవారిలోఁ బడియున్నవాఁడ5920
నా కేమి తోఁచదు; నాతి! యీమీఁద - నీకుఁ దోఁచినజాడ నీ వేగు" మనిన

సులోచన సహగమనము సేయుట

తరలాక్షి మ్రొక్కి సంతస మంది మదిని - "కరమొప్ప దనకు భాగ్యము గల్గె" ననుచు
గృహమున కేగి కోకిలవాణి తనదు - సహవాసులౌ పెక్కుసతులు గొల్వంగ
దశకంఠునానతిఁ దగుబాంధవులను - దశదిశ ల్నిండ మృదంగనిస్సాణ
పటహభేరీశంఖపటుకాహళాది - చటులనాదములు విచ్చలవిడి మ్రోయ
సతతనిశ్చలకృతస్నానయై యపుడు - నతివేగమునను గార్యార్థియై యచట
సిరి పట్టుబుట్టంబుఁ జెలువొందఁ గట్టి - సరసత రత్నభూషణములుఁ బెట్టి
పువ్వులదండలు పొలుపొంద వేసి - యవ్వారిగాఁ జుట్టి యాణిముత్తెముల
సూచకం బొనరించి సుందరి నొసలఁ - బ్రాచుర్యగంధలేపనము గావించి
తిర మొప్పఁగా నింద్రజిత్తుదేహంబు - కరమొప్పఁగా నలంకారం బొనర్చి5930
మంచివస్త్రంబులు మహితభూషణము - లంచితశృంగార మలవడఁ జేసి
వరవిమానంబుపై వరుఁ దెచ్చిపెట్టి - వరవాద్యతూర్యరావంబులు చెలఁగఁ

ద్రేతాగ్నులును గొంచు దిరముగా దైత్యు - లాతతంబుగ వెంట నరుగుదేరంగ
వెనుకొని వేదోక్తవిధిపూర్వకముగ - మొనసి యుత్తరభాగమునఁ జితి పేర్చి
యాగతలైన ముత్తైదుల కపుడు - బాగైనపసిఁడిశూర్పములు దానముల
నిచ్చి వస్త్రంబు లనేకంబు లొసఁగి - యచ్చపుభక్తితో నాచితిమీఁదఁ
బరఁగఁ బ్రవేశించి ప్రాణేశునురము - కరమర్థితోఁ దనకౌఁగిటఁ జేర్చి
యనలంబు సంధింప నాయింతి మేను - పనిగొని పతి సమర్పణముగాఁ జేసి
సకలదేవతలును సన్నుతు ల్సేయఁ - బ్రకటంబుగాఁ దనపతితోడఁ గూడి
దేవవిమానంబు తెఱఁగొప్ప నెక్కి - దేవతాకోటిలోఁ దేజరిల్లుచును5940
గడువేడ్కఁ బుణ్యలోకంబునఁ జేరి - పడఁతి యుండెను దనపతితోడఁ గూడి

రావణుఁడు యుద్ధమునకు వెడలుట

యంతట రావణుం డధికరోషమున నంతయు మూలబలాళి రప్పించి
చలమును బలమును సమరనైపుణియుఁ - గలసైనికులనెల్లఁ గలయ నీక్షించి
“కపులను రామలక్ష్మణుల మీ రేఁగి - నెపమార నిర్జించి నెఱిఁ బగఁదీర్చి
రండు పొం" డనవుడు రభసంబుతోడ - నొండొరుఁ గడచుచు నుద్దండవృత్తి
సామజఘోటకస్యందనసుభట - సామగ్రితో యుద్ధసన్నద్ధు లగుచు
వజ్రసమానేకవరసాధనములు - వజ్రాంగు లాదిగా వలయువర్మములు
కర మరుదయి భయంకరలీలఁ దనర - ధరియించి మించి యుదగ్రులై పేర్చి
కరిఘటాఘీంకారఘంటికానేక - తురగోగ్రహేషితదుందుభిశంఖ
పటహఢమామికాపణవాదివాద్య - పటురభసధ్వజపటపటాత్కార5950
రథనేమిశింజినీరావసంకులము - మథితార్ణవధ్వనిమాడ్కి ఘూర్ణిల్లఁ
బలుధూళి జలరాశి పట్టుగయ్యంపు - గలను సేయఁగ నేగుకరణిఁ బెల్లెగయ
బింకము ల్జంకెన ల్పృథుతరఘోర - హుంకారములును నొండొరుల పంతములు
వంకించునెలుఁగులు నార్పులు చెలఁగ - నంకితమణికుండలానేకహార
కంకణకోటీరకాంతులు నిగుడ - లంకేశుసైనికు ల్లంక వెల్వడిరి;
భూకంప మెసఁగ నార్పులు మిన్నుముట్ట - భీకరగతి నేచి పెడబొబ్బ లిడుచు
ఘనసత్త్వమునఁ బేర్చి కపికులాంభోధి - గనుఁగొని బెగడొందఁగా నుత్సహించి
కడఁకతో నపుడు లంకావార్ధి వెడలు - బడబాగ్నికోటులభంగి శోభిల్లి
కాటుకకొండలగతిఁ దనరారు - మేటిదైత్యులఁ జూచి మిగిలినకడఁక
నప్పుడు కపివీరు లార్పులు నిగుడ - నుప్పొంగి చెలఁగుచు నుడుపదం బవియఁ5960
గ్రుంకి దిగ్గజములు కుదికిలఁబడఁగ - నింగికి లంఘించి నేలకు దాఁటి
బ్రహ్మాండ మగలంగ బాహువు ల్పరచి - బ్రహ్మాదిదివిజులు పరికించి చూడఁ

మూలబలయుద్ధము

గొండలు తరువులు గోటానకోట్లు - గండశైలంబులు కడువడిఁ బెఱికి

కొని వచ్చి తాఁకిరి క్రూరులై యంత - ననిలోన రఘురాము హస్తవైచిత్రి
గనుఁగొనువేడుకఁ గమలబాంధవుఁడు - చనుదెంచె ననఁ బూర్వశైలాగ్ర మెక్కె
వననిధి వననిధి వడిఁ దాఁకునట్లు - దనుజబలంబును దరుచరబలము
నొండొంటిఁ దలపడి యుగ్రత మెఱయ - మెండుగాఁ గపిసేన మిగులంగఁ జొచ్చి
యరదము ల్వఱపుచు హరులఁ దోలుచును - గరుల డీకొలుపుచుఁ గవిసి రాక్షసులు
మునుమిడి నొప్పింప మొక్కలంబునను - వనచరు ల్దరు లెత్తి వైవంగ నపుడు
వాటుల వ్రేటుల వడి నిందు నందుఁ - బోటులఁ గాటులఁ బొరి నందు నిందుఁ5970
గరవాలముల భయంకరవాలములను - గరగండముల గదాఘనదండములను
బరశులఁ బరిఘలఁ బట్టసంబులను - గిరులను దరులను గిరిశృంగములను
దరుచరు ల్వైవంగ దనుజులు వైవ - ధరణిపై శోణితధారలు దొరుఁగ
వనచరు ల్గొండలు వాలయంత్రములఁ - గొని మీఁద వైవ నాకొండలనడుము
దుత్తుమురై నేల దొరుఁగఁ జక్రంబు - లెత్తి వేసియు గద లెత్తి మోఁదియును
సరి పోరి రొండొరు ల్చలమునఁ గిట్టి - సుర లద్భుతం బంది చూడంగ నపుడు
కరులను హరులను ఘనరథంబులను - సరిఁ దోలి కపుల రాక్షసులు నొప్పింప
వనచరేశ్వరుఁడును వాలినందనుఁడు - ననిలజుండును నీలుఁ డాదిగాఁ గలుగు
నగచరప్రముఖులు నధికవేగమున - నగపాదపముల వానలు వెసఁ గురియఁ
బరియలై పడియెడుబహురథంబులును - గర ముగ్రగతిఁ గూలు కరిసమూహములు5980
నఱిముఱి గెడయువాహనములు నేల - కొఱుగుదానవులునై యుండంగఁ గినిపి
రథరథ్యవేగంబు రథికు లగ్గింప - రథములు పఱపి సారథులు బిట్టార్వ
రథములు తమమనోరథములకరణిఁ - బృథివీతలంబెల్లఁ బెల్లుగా నద్రువ
గవిసినకడ నొగ ల్కరములఁ బట్టి - యవలీల దివి కెత్తి యవనిపై వైచి
తురగము ల్దోలినఁ దొలఁగక కపులు - తురగంబుతో నెత్తి తురగంబు వేసి
కరుల డీకొలిపినఁ గరులపైఁ గవిసి - కరిఁగరిఁ దాటించి గములకు నుఱికి
డాకాల నొక్కని డాకేల నొకని - నాకేల నొక్కని నాకాల నొకని
నదిమి నొంచియు నదరంట వేసియును - గుదియించి వైచియుఁ గూలఁ దన్నియును
బెక్కువిధంబులఁ బేర్చి రాక్షసుల - నిక్కడక్కడ సేయునెడఁ బెచ్చుపెరిఁగి
తురగరింఖాదుల ధూళి గప్పుటయుఁ - దరుచరాధిపులును దానవాధిపులు5990
నరుదైన యానిబిడాంధకారమునఁ - గరవాలరోచులఁ గలకలం బెసఁగ
వీరు వారును బోర వెడలినరక్త - ధారామరీచులు దఱచుగాఁ గవిసి
బలురేణు వను తమఃపటలంబు నడపఁ జలమరి కయ్యంబు సందడియైనఁ
గుంజరరథకూల ఘోటకమకర - పుంజధ్వజానేకభూరుహసుభట
కరకాండకల్లోలఖడ్గపాఠీన - కరికరోరగఖేటకచ్ఛపనికర

వికలభూషణరత్నవిసరవికీర్ణ - శకటసైకతకేశజాలకైవాల
జనితచామరఫేనచయరక్తనదులు - వనచరు లనుజులు వడి దాఁటి దాఁటి
తాఁకుదు రాలోనఁ దరుచరు ల్గినిసి- వీఁక గోలెమ్ములు విఱుగ నొక్కియును
మోఁకాళ్ల మోచేత ముష్టి నందంద - తాఁకించి పడదీసి తలలు ద్రొక్కియును
బొట్టలు చీల్చియుఁ బోనీక పట్టి - చట్టలు వాపియుఁ జదియ వ్రేసియును6000
గఱచియు విఱచియుఁ గడకాళ్లు పట్టి - జిఱజిఱఁ ద్రిప్పియుఁ జిదిమివైచియును
బలువిడి దల లొగిఁ బట్టి వెండ్రుకలు - పెళపెళ మనఁ బెల్చఁ బెఱికివైచియును
నిరుచేతులందును నిరువురఁ బట్టి - పొరిఁ బొరి దాటించి పొళ్లు సేయుచును
నెరసి రంధ్రంబుల నెత్తురు ల్వెడల - నురువడిఁ బడఁద్రోచి యురములు సరచి
నఖరదంతంబుల నాసికాకర్ణ - ముఖపాలపట్టిక ల్ముసరి త్రెంచియును
నొప్పించియును గపు ల్నూర్గు రొక్కొకని - నుప్పొంగ యొక్కొకం డొనర నూర్వురను
బట్టి చంపియుఁ జలపట్టి దానవుల - నట్టిట్టు వోనీక యవనిపైఁ గూల్చి
చిందరవందర సేయంగ నప్పు; - డందఱ వెసఁ జూచి యధికరోషమున
ధరణి గంపింప దిక్తటములు పగుల - శరధులు గలఁగ ముజ్జగములు బెగడ
దారుణాకారులై తద్దయుఁ బేర్చి - భేరీమృదంగగంభీరవాద్యములు6010
చెలఁగించి యక్కపిసేనపైఁ గవిసి - బలసూదనాదిదిక్పతులు భీతిల్ల
వికృతమస్తకములు వికృతహస్తములు - వికృతఃప్రకోష్ఠము ల్వికృతోష్ఠములును
వికృతనఖంబులు వికృతముఖములును - వికృతగాత్రములును వికృతనేత్రములు
వికృతహాసములును వికృతనాసములు - వికృతవక్షములును వికృతకక్షములు
వికృతకర్ణములును వికృతవర్ణములు - వికృతపాదములును వికృతనాదములు
గలసైనికులు లయకాలాభ్రపఙ్క్తి - బలువిడి విడివడి పఱతెంచుకరణిఁ
బరిఘగదాచక్రపట్టసప్రాస - పరశుతోమరభిండివాలత్రిశూల
కరపత్రకుంతముద్గరయష్టిపరశు - కరవాలఖేటకక్రకచాసినాగ
ముఖశిలీముఖచాపముసలాయుధాది - నిఖిలసాధనములు నెరయంగఁ బూని
నరికియు నడచియు నలియ మోఁదియును - నురువడిఁ జిమ్మియు నొనరఁ గ్రుమ్మియును6020
వ్రేసియుఁ బొడిచియు వీఁక వైచియును - నేసియుఁ గోసియు నీరీతిఁ గపుల
నొప్పింప నెంతయు నొచ్చి భీతిల్లి - యప్పుడు తరుగిరు లవనిపై వైచి
“మన కేల యుద్ధంబు? మన కేల చలము? - నినకులేశ్వరుఁ డేల? యినసూనుఁ డేల?
యడవిలోఁ గాయపండ్లాకులు నమలి - కడుపు నించుకయుండఁ గానక వచ్చి
మదిమది నిచ్చట మడియంగ నేల? - పదపదం" డని కపిపతులు రాఘవుల
విడిచి ధైర్యంబులు విడిచి రాక్షసులు - విడువక చలమున వెనువెంటఁ దఱుమ
సేతువుదిక్కుకై చెడి పాఱునపుడు - వాతూలసుతనీలవాలినందనులు

గని సేతువును దాఁటి గ్రక్కున నెందుఁ - జనకుండ మరలింపఁ జనుదెంచి భీతి
వనచరు ల్దనవెన్క వచ్చి చొచ్చుటయు - గనుఁగొని రాముఁ డక్కపివరు ల్చెలఁగ

శ్రీరాముఁడు మూలబలముపై మోహనాస్త్రము వేయుట

దనుజులమనములు తల్లడం బంద - ధను వందుకొని గుణధ్వని సేసి డాసి6030
కరలాఘవము చిత్రగతి నొప్ప మెఱయ - శరములు గురియ నిశాచరు ల్బెగడి
తెరువులు గానక తిరుగుడు పడుచుఁ - దెరలియు మరలియుఁ దీవ్రకోపమున
ధరణీశుఁ గాన రాధరణీశుఁ డేయు - శరముల తఱుచున సమరాంగణమున
రవికులతిలకుండు రభసంబుతోడ - వివిధభంగులఁ దనవిలువిద్య మెఱసి
యేసినశరము లనేకంబు లగుచుఁ - గాసి సేయుచుఁ దాఁకఁగా దైత్యవరులు
నడుమునఁ దెగియు నెన్నడిమికిఁ దొడరు - కడి ఖండ మయ్యు వక్షములు వ్రస్సియును
వదనము ల్వాడి భావంబులు సెదరి - పదములు దునియలై బాహువు ల్విఱిగి
గళములు దునిసియుఁ గరములు దెగియుఁ - దల లవిసియుఁ దనుత్రాణము ల్దాఁకి
శరములు మెయి నుచ్చి చనఁగ నెత్తురులు - దొరుఁగ నంగములఁ దుత్తునియలై రపుడు
కెడయు రాక్షసులు బెగ్గిలెడు రాక్షసులు - పుడమిపై మూర్ఛను బొందురాక్షసులు6040
నొగులు రాక్షసులును నోరులు దెఱచి - దిగులొందు రాక్షసు ల్ధీరత సడలి
వారణంబులవారు వాజులవారు - దేరులవారునై తిరుగుడువడుచు
నదె రాఘవుం డేసె నదె రాముఁ డేసె - నదె డాసె నిదె పాసె నదె యిదె యనుచు
వీక్షింప రానట్టి వేగంబు మెఱసి - రాక్షసబలములు రయమునఁ బఱచె;
నంతఁ బోవక రాఘవావనీనాథుఁ - డెంతయు ఘనరోష మెసఁగ వెండియును
సమ్మోహనాస్త్రంబు సంధించి పఱపఁ - దమ్ ముఁ దామెఱుఁగక దనుజులు బ్రమసి
దానవుం డీతఁడు తరుచరుం డితఁడు - దా నని తెలియక దనుజుండు దనుజుఁ
గని తాఁకునప్పుడు గాంధర్వశరము - ఘనమహత్వమున రాక్షసులకుఁ జూడ
నొక్కొక్కనికి రాముఁ డొక్కొక్కఁ డగుచు - నొక్కొక్కనికి రాము లొగిఁ బదుం డ్రగుచు
నొక్కొక్కనికి రాము లొగి నూర్గు రగుచు - నొక్కొక్కనికి రాము లొగి వేవు రగుచు6050
నొక్కొక్కరికి రాము లొగి లక్ష యగుచు - నొక్కొక్కనికి రాము లొగిఁ గోటి యగుచు
శతకోటియర్పుదసంఖ్యలు గడచి - యతులితం బైనట్టి యాజిరంగమున
మఱి సర్వమును రామమయ మయ్యె నపుడు - గిరికొని యుండ నీక్రియ నల్కతోడ
వడి నేయునప్పుడు వారక గుడుసు - పడియున్న రఘురాము పసిఁడివిల్ చూచి
"సమరసమాభీలచక్రి యుగ్రతను - నముచిపై వైచిన నాఁటి చక్రంబొ?
కిరణజాలంబుల గిరికొన్నభాను - పరివేషచక్రమో పరికింప” ననుచు
దమమనంబుల నెంచి దైత్యు లయ్యంప - గముల మెఱుంగులు గనుఁగొని పఱవ
నమరారిసేనలో నప్పు డొక్కొక్క - నిమిషంబులోపల నెత్తురువాన

లాన వాజులు పదునాలుగువేలు - నేనుఁగు లోపదునెనిమిదివేలు
లక్షతేరులు రెండులక్షలవీర - రాక్షసవీరులు రణభూమిఁ గెడయ6060
శరము లరంబులై చాపంబు నేమి - కరణియై గుణరవక్వణితమై మెఱసి
కిరణస్ఫులింగము ల్గిరికోన్న రామ - కరచాపచక్రంబు కాలచక్రంబు
గతి నుల్లసిల్లంగఁ గనుఁగొని పెలుచ - హతశేషదైతేయు లతిభీతిఁ బొంది
కడుఘోరమైన సంగరభూమి విడిచి - వడి లంకఁ జొచ్చిరి వనచరు లార్వఁ;
గాలాంతమునఁ గాలకంధరుం డలుకఁ - గేళి సల్పిననాఁటిక్రియ నుండె రణము;
వలనయినట్టి రావణుమూలబలమునఁ - జలమున రఘుపతి సమయించునపుడు
పదివేలు కరులు నిర్వదివేలు హరులు - పదిపదు లరదము ల్పద్మంబు బలము
నాలంబులోపల నతిదారుణముగఁ - గూలిన నొకయట్ట గునియుచు నాడు
నట్టలు కోటాడ నారామువింటఁ - గట్టిన యొకగంట ఖణి లని మొరయు
నొరయ ఘంటలునాద మూర కీరేడు - మొరసె నవ్విభుచాపమున నరజాము6070
భావింప రాకుండఁ బడి యేడుగడియ - లావీరవరుని బాణాసనవిద్య
కిన్నరగంధర్వఖేచరయక్ష - పన్నగామరవరు ల్ప్రణుతించి రెలమి;
ఆరామచంద్రుండు నప్పు డింపలర - శూరపుంగవుఁడగు సుగ్రీవుఁ గనియె;
“జగదేకభయద మీసమ్మోహనాస్త్ర - మొగిఁ బ్రయోగింపను నుపసంహరింప
నే నొండె విషధరుం డీశ్వరుం డొండెఁ - గాని నేర్పరు లొరు ల్గారు లోకముల
కౌశికుం డిచ్చిన కనదస్త్రమహిమ - గౌశికాదులకైనఁ గన నశక్యంబు”
అనిన విభీషణుఁ డారాముఁ జూచి - వినయసంభ్రమములు వెలయ నిట్లనియె.
“దేవ! యీబలములు దేవేంద్రుఁ డాది - దేవతలకు నైనఁ దెరల వెన్నఁడును
బౌలస్త్యునకు మూలబల మిది నేల - పాలయ్యె నిఁకఁ గూలుఁ బంక్తికంధరుఁడు
తలకొని నీపెంపుఁ దలఁపవు గాక - తలఁచిన నెదురింపఁ దరమె యెవ్వరికి?"6080

రాక్షసస్త్రీలు రావణుని నిందించుట

అని విభీషణుఁ డాడునట్టివాక్యములు - విని యప్పు డారామవిభుఁ డాత్మ నలరె;
అంత నక్కడ దానవాంగన లెల్ల - నంతంతఁ బెనుమూఁకలై లంకలోనఁ
బొరిఁ బొరి శోకాగ్నిఁ బొగులుచుఁ బలికి - “రరయ జగన్నింద్య మగు చరిత్రంబు
ప్రాయిడిమోమును బలితరోమంబు - లైయున్న శిరము నభ్యాయతోదరము
వికృతవేషంబును వికృతయౌవనము - గ్రకచోగ్రదంష్ట్రలు గలుగుశూర్పణఖ
సకలగుణోజ్జ్వలు సత్యసంపన్ను - సుకుమారు మరుతేజు సుముఖు నారాముఁ
గందర్పసురుచిరాకారుఁ గామించె - నందని పంటికి నఱు చాపఁ దగునె
యీలంకలోఁ గల యెల్లరాక్షసులు - కాలగోచరు లైన కారణంబునను
భానువంశజునకుఁ బంక్తికంఠునకు - నానిశాచరి సేసె నధికవైరంబు;

తగవు చింతింపక దానిమాటలకుఁ - బగ గొని వచ్చి యీపంక్తికంధరుఁడు6090
తనచావునకె కాదు; ధరణీశుదేవిఁ - గొనివచ్చె; రాక్షసకుల మెల్లఁ జెఱుప;
నింతట సిద్ధించెనే సీత దనకు - నింతతెంపునకుఁ దా నితఁ డేల దొడఁగె?
మారీచు నొకకోల మడియించె దండ - కారణ్యమునఁ జంపెఁ గనలి విరాధు
నిది యెఱిఁగియు రాము నెఱుఁగలేఁడయ్యె; - మదిలోన గర్వించి మనరావణుండు
అనలసమానంబు లగుసాయకముల - జననాయకుఁడు జనస్థానంబునందుఁ
బదునాల్గువేవురఁ బరిమార్చి రోష - మొదవంగ నేచి యత్యుగ్రబాణములఁ
ద్రిశిరు దూషణు ఖరు దృణలీలఁ జంపె - దశకంఠుఁ డదియును దలపోయఁ డయ్యె;
రుధిరాశనుని నతిక్రూరవిక్రముని - నధికయోజనబాహు నాకబంధకుని
గ్రౌంచవనంబునఁ గడతేర్చి పుచ్చి - రంచితవిక్రము లగు దాశరథులు
ఇట్టిరాక్షసులచా వెఱిఁగియుఁ దొడరె - నట్టిరాముని గెల్వ నలవియే తనకు;6100
జగదీశుఁ డగు రామచంద్రుతోఁ బోర - మగఁటిమి గలుగునె మనరావణునకు?
నవలీల వాలి నొక్కమ్మునఁ గూల్చి - రవిజుఁ గిష్కింధకు రాజుఁ గావించె;
నధికపరాక్రము నాకుంభకర్ణు - వధియించె నొక్కఁడె వసుధేశ్వరుండు;
కరిసహస్రంబు లగ్గలము లౌ పెక్కు - తురగలక్షలు రథస్తోమకోటులును
గణనకు మిక్కిలి గల కాలుబలము - నణుమాత్రముగఁ జంపె నాజిరంగమున
నట్టిపరాక్రమం బది యెల్లఁ గనియె - నిట్టివాఁ డని రాము నెఱుఁగలేఁ డయ్యె;
ఆమేటి నతికాయు నయ్యింద్రజిత్తు - సౌమిత్రి యొక్కడ సమయించె నాజి.
ఇంక నైనను రాము నిట శరణనఁడు - లంక నింటింట విలాపము ల్వుట్టె
"తమబంధు లీల్గిరి తమమగ ల్దెగిరి - తమసుతు ల్మృతులై రి తమసహోదరులు
హతులైరి రణభూమి" నని యెల్లవారు - నతిశోకమును బొంది యడరుచున్నారు6110
దుర్మతియును నీతిదూరుండు గ్రూర - కర్ముండునై నాఁడు కపటరూపమున
సీత నీపురికిఁ దెచ్చిననాఁటనుండి - తోతెంచుచున్నవి దుర్నిమిత్తములు;
దశకంఠుఁ డింక నీదశరథసుతుని - విశిఖాగ్నిఁ గూలుట వేగంబ యుండు;
నక్కటా! నీతిజ్ఞుఁ డగువిభీషణుఁడు - పెక్కుభంగులఁ జెప్పెఁ బ్రియమున బుద్ధి
నతఁడు చెప్పినబుద్ధు లన్నియు నాఁడు - హితవులుగా విన్న నీలంక సెడునె?
కులశైలపక్షము ల్గులిశఘాతమున - నలుకమైఁ దునుమాడు నాపురిందరుఁడొ?
మధుకైటభాదుల మర్దించునట్టి - యధికుఁ డావిష్ణుఁడో యదయుఁ డంతకుఁడొ?
ప్రళయకాలమునాఁటి ఫాలలోచనుఁడొ? - యిల రాముఁడై పుట్టి యిటు చంపఁదొడఁగె;
దశరథతనయుండు దర్పంబు మెఱసి - దశకంఠు ననిలోనఁ దగఁ జంపునపుడు
ఘను లగు సుర లైన గంధర్వు లైన - మును లైన వీనికి మును వరం బిచ్చు6120
వనజసంభవుఁడు శర్వాణీశుఁ డయిన - వినుఁడు రాక్షసు లైన విడిపింపలేరు

వర మిచ్చునప్పు డావనజసంభవుఁడు - నరులచేఁ జాకుండ నాఁ డీడు గానఁ;
బరికింపఁగా సర్వబంధులతోడ - ధరణీశుచేఁ జచ్చు దశకంధరుండు;
ఇది నిజ మెట్లన్న నింద్రాదిసురలు - మది దయలేక పల్మాఱు నొప్పింప
నీరావణునిచేత నెంతయు నొచ్చి - నీరజాసనుఁ గాంచి నిఖిలదేవతలు
నభయంబు వేఁడిన నాచతుర్ముఖుఁడు - శుభతరస్థితి వారిఁ జూచి యిట్లనియె.
"నేబాధలను జెంద విటమీఁద మీకు - మీబుద్ధి వర్తించు మీ రుండుఁ డెలమి"
నని వారు దాను మహాదేవు కడకుఁ - జని ప్రస్తుతింపఁ బ్రసన్నుఁడై శివుఁడు
కమలాసనాదులఁ గరుణ నీక్షించి - యమరరక్షార్థమై యఖిలరాక్షసుల
సమరంబులోపలఁ జంపించుకొఱకు - నమర నిందిర పుట్టు నాసతీమణికి6130
బతి యయి ప్రజల నాపద లొందకుండ - సతతంబు గావ దుర్జనుల రాక్షసులఁ
జంపంగ విష్ణుండు జన్మించుఁ బుడమి - నింపార నని యాన తిచ్చె; రాముండె
యరయంగ నావిష్ణుఁ డామహీజాత - పరికింప నిందిర భావంబులోనఁ
దలపోయ శివుమాట దప్పదు గాన - మలఁగనిశోకంబు మనకుఁ బాటిల్లె!
మనకు ది క్కెవ్వరు? మనరావణుండు - మననేరఁ డిఁకమీఁద మరుగంగ నేల?
మన కందఱకు దిక్కు మనవిభీషణుఁడు - చని రామచంద్రుని శరణంబు సొచ్చె”
నని పెక్కుభంగుల నసురకామినులు - పనుపుచుండఁగ విని పంక్తికంధరుఁడు
చింతాసమాకులచిత్తుఁడై యపుడు - వంతతో నొక్కింతవడి యూరకుండి
చండకాలవ్యాళసమలీల దోఁప - నిండుకోపంబున నిట్టూర్పు వుచ్చి
యవుడులు దీటుచు నందంద కన్ను - గవల నిప్పులు రాలఁగా నుగ్రుఁ డగుచు6140
నురవడిఁ గనలి యుద్ధోన్మత్తు మత్తు - సొరిది విరూపాక్షుఁ జూచి “మీ రెలమి
దందడి సింహనాదములు తూర్యములు - నందంద మెఱయంగ ననికి నేతెండు;”
అని పల్క భయమున నానిశాచరులు - విని యూరకున్న నవ్విధము వీక్షించి
“యాలంబునకు వేగ యత్నంబు సేయుఁ - డేల యుత్సాహంబు లిటు మాని యుండ”;
ననిన వా రరిగి పుణ్యాహకర్మంబు - లొనరించి సన్నాహ మొప్ప నేతెంచి
యారాక్షసేంద్రున కవనతు లైన - నారాక్షసులఁ జూచి యతఁ డల్కఁ బల్కె;
"నానాఁటి కిబ్భంగి నాబలం బెల్ల - హీన మయ్యెను; భృత్యు లెల్లఁ జచ్చుటయు,
నసురేంద్రవిక్రముఁ డైనయాఖరుఁడు - నమితబలోదగ్రుఁ డగునింద్రజిత్తు,
నాకుంభుఁడును శూరుఁ డగునికుంభుండు - నాకుంభకర్ణుండు నాప్రహస్తుండు
భీమవిక్రమవిజృంభితుఁ డతికాయుఁ - డామహాకాయుండు నామహోదరుఁడు6150
నాసురాంతకుఁడును నానరాంతకుఁడు - భాసురయశు లకంపనుఁడు గంపనుఁడు
నాకాధిపతి నైన నని నోర్చువారు - నాకునై పొలిసిరి నాగర్వ మడఁగె;
నటుగాన శత్రుల నందఱఁ దునిమి - పటుపరాక్రమమునఁ బగ నీగువాఁడ,

మీఱినశరములు మిన్నులు ముట్టి - యేఱులు జలధులు నెఱుఁగరాకుండ
నఖిలంబుఁ గప్పుచు నచ్చెరువార - నిఖిలవానరులను నేఁడు నిర్జింతు;
నేపున నల్క నే నేయుబాణము - లాపుంఖముగఁ గాడి యగచరాస్యములు
నాళము ల్గలిగిన నవపంకజములఁ - బోలంగ నేఁ డాజిభూమిఁ గైసేతు;
మగలు తనూజులు మాసహోదరులుఁ - దెగి రింక నెవ్వరు దిక్కు మా కనుచు
లంకాపురస్త్రీలు లలిఁ దూలి సోలి - యింక నీశోకాబ్ధి నిట మునింగెదరు
మార్తురఁ బొలియించి మఱి పురజనుల - యార్తి వాపుదు శోక మడఁచెదఁ గాక6160
నేఁ డాజిఁ బ్రతిపక్షనికరసైన్యమున - వాఁడిబాణంబుల వడిఁ ద్రుంచివైచి
కరమొప్ప ఫేరవకంకగృధ్రములుఁ - బొరి పిశాచప్రేతభూతజాలములుఁ
దనివోవ మాంసరక్తంబులఁ దృప్తి - యొనరింతు” ననుచు యుద్ధోన్మత్తుమత్తు
నక్షీణబలుఁ డగు నవ్విరూపాక్షు - నీక్షించి రణమున కిప్పుడ వేగ
యనుపమం బగునట్టియరదంబు దేరఁ - బనుపుడు నేఁడు నాపటుసాయకముల
ఘనులైనరామలక్ష్మణులప్రాణములు - గొని వారిరుధిరము ల్గ్రోలఁ గోరెడిని
శతసంఖ్య లొక్కొక్కసాయకంబునను - మృతిబొందఁ గపికోట్లమీఁద నేసెదను
అనికి బలాధ్యక్షు లగువారిఁ జూచి - కొనిరండు సేనలఁ గూర్చుక వేగ”

రావణుఁడు రెండవసారి యుద్ధమునకు వెడలుట

యని వారు పిలిపింప నఖిలరాక్షసులు - వినువీథి యద్రువంగ వీఁక నార్చుచును
గరవాలచక్రభీకరభిండివాల - పరశుశూలప్రాసపట్టసగదలు6170
ముసలంబులును గాఢముద్గరంబులును - నెసఁగెడుశక్తు లనేకవిచిత్ర
వివిధాయుధంబులు వెలుఁగ నేతెంచి - రవిరళోత్సాహంబు లడరంగ నంత
దనుజులు నానాస్త్రతతులతోఁ గూడ - దినకరప్రభగల తేరు తెచ్చుటయు
రమణీయరత్నాంశురాజివిరాజి - తములైన కర్ణావతంసంబు లమరఁ
బదికంఠముల రత్నపదకము ల్గ్రాలఁ - బదిముఖంబుల వింతపంతము ర్దనర
మహనీయకేయూరమణికంకణాది - బహుభూషణాంకితబాహుదండముల
శరశరాసనఖడ్గచక్రాసిపరశు - పరిఘాదిసాధనప్రకరంబు మెఱయ
దివిజారి చెఱఁబెట్టె దినకరు నొకని - దివి నొక్కదినమణి దిరుగుచున్నాఁడు;
తలఁపఁ దక్కినభానుదశకమో యనఁగఁ - దలకొని కోటీరదశకంబు వెలుఁగ
నంత నాదశకంఠుఁ డారథం బెక్కి - దంతిరథాశ్వపదాతులు నడవఁ6180
బటుతరనిస్సాణభాంకారవీర - భటసింహనాదాది బహునినాదములు
విలయకాలాభీలవేళ ఘూర్ణిల్లు - జలరాశితో లంక సరివోలుచుండ
నవిరళవందిజనావలివినుత - రవముతోడుత నుత్తరద్వార మపుడు
బలువడి వెలువడి పౌలస్యముఖ్యుఁ - డలుక యుద్ధోన్మత్తు నావిరూపాక్షు

మత్తుని వీక్షించి మహి వ్రయ్య వార - నొత్తిలి యార్పుచు నోలి నాలంక
వెడలంగ రవిదీప్తి వెలవెలఁ బాఱె - నడరి దిక్కుల నిండె నంధకారంబు
ధరణి గంపించె రథంబులు విఱిగెఁ - దురగంబు లొఱిగె నెత్తురువాన గురిసెఁ
గడుఁగీడుశకునము ల్గానంగఁ బడినఁ - గడిమి డింపక దశకంధరుం డడరె;
లంకేశు నానాబలంబులఁ జూచి - పంకజగర్భునిభాండంబు పగులఁ
నిగుడునార్పులతోడ నిఖిలవానరులు - నొగి వీఁకతోఁ దాఁకి రుగ్రదానవులఁ6190
గలుషించి యాలోనఁ గపిసేన గిట్టి - బలములు నెరయంగఁ బంతము ల్మెఱయఁ
గఱకు రాక్షసులు నుగ్రముగ నేయుదురు - నెఱకులు దూరంగ నిశితబాణముల
ముసలతోమరశక్తిముద్గరచక్ర - విసరము ల్వైతురు వీఁకఁ బెల్లేచి
యంకుశకుంతశూలాదులఁ బొడుతు - రంకించి వ్రేయుదు రాభీలగదల
నడిదము ల్ఙళిపించి యలుక నంగములు - కడిఖండములఁ జేసి కడిమిఁ జూపుదురు
కపులును గుపితులై కడిమి వాటించి - విపులశైలంబుల వృక్షజాలములఁ
బదదంతనఖవాశపాశహస్తముల - సదయులై యారాక్షసావలి నెల్ల
శిరములు నరములు చేతులు మూతు - లురములు బాహువు లోష్ఠకంఠములు
ద్రెంచియు నొంచియుఁ దీవ్రవైఖరులఁ - జించియు వంచియుఁ జిదిమియు నదిమి
తరమిడి నిబ్భంగి దనుజుల నొంపఁ - దరుచరావలిఁ జూచి దనుజేశుఁ డంత6200
దారుణాకృతివత్సదంతాశ్వకర్ణ - నారాచభల్లాదినానాస్త్రవితతి
నగచరరుధిరంబు నవనిపైఁ దొరుఁగ - నిగుడించి యొక్కొక్కనిశితబాణమునఁ
గపిపంచకంబును గపిసప్తకంబుఁ - గపినవకంబును గదనరంగమునఁ
గుదులు గ్రుచ్చినక్రియఁ గూల నేసియునుఁ - వదలక తరుచరు ర్వైచుశైలములు
ఘనతరు ల్శకలము ల్గానేసి మఱియుఁ - గనలి యేనమ్ముల గంధమాదనునిఁ
బదునెన్మిదింటను బనసుని మఱియుఁ - బదియింట నీలునిఁ బదియింట నలునిఁ
ద్వివిదు నాఱింటను వినుతు నేడింటఁ - బవననందను నిరువదింట గవాక్షు
నైదైదులను మైందు నైదింటఁ గుముదు - నైదింట గోముఖు నైదింట ఋషభు
నేడిట శరభుఁ బదేడింట గజుని - నేడమ్ములను బృథు నేడింట హరునిఁ
దరిమి యొక్కుమ్మడి దారుని గ్రథునిఁ - జెరిమూఁట సాయకాశీతి నంగదునిఁ6210
దక్కినవనచరతతి నిలఁ గూలఁ బెక్కు - బాణంబులఁ బేర్చి యుగ్రతను
వెస నేసె మగఁటిమి వీఁకతో మెఱయ - నసురేశు మునుమన నందంద కపులు
నడుములు నిశితబాణంబుల విఱిగి - పడువారు నిలలేక పడి తూలువారు
నురములు వ్రయ్యలై యొగిఁ గూలువారు - చరణము ల్తునియలై సరి మ్రగ్గువారు
చేతులు దెగువారు శిరములు పగిలి - భూతలంబునఁ బడి పొరలెడివారు
గళము లూరులును జంఘలు ద్రెవ్వ నొచ్చి - పలుమాఱు మూల్గుచు బడియెడివారు

నంగంబు లివియవి యని యేరుపడక - సంగరాంగణమునఁ జచ్చినవారు
బాణము ల్గాడినఁ బఱచుచు నడుమఁ - బ్రాణము ల్వోయి యుర్వరఁబడువారు
నయ్యండ నప్పు డయ్యసురేశుఁ జూచి - చయ్యన రణమున సైరింపలేక
వానరు ల్పాఱిరి వసుధ గంపింప - దానవేంద్రుండును దవిలి వెన్వెంట6220
బలువిడి నేతేరఁ “బాఱ నేమిటికి - నిలునిలుం డని పల్కి నిలువక పాఱు
సేనలఁ గావ సుషేణుని నునిచి - భానుసూనుఁడు వృక్షపాణియై నడచె
తరుశిలాహస్తులై తరుచరపతులు - నిరుగెలంకుల వెన్క నేపు దీపించి
నడుమ నాతఁడు సింహనాదంబు జేసి - తొడరి కాలాగ్నిరుద్రునివిధంబునను
వృక్షతాడనముల వెసఁ జంపి చంపి - వృక్షశిలాఘోరవృష్టి నందంద
రాక్షసబలముపై రయమునఁ గురియ - రాక్షసవరులు శిరంబులు పగిలి
కులిశోగ్రహతిభగ్నకూటంబులైన - కులశైలములభంగిఁ గూలిరి మఱియు
రవినందనుఁడు క్రోధరక్తాక్షుఁ డగుచు - నవనిధరాభీలహస్తుఁడై నడవ

సుగ్రీవునిచే విరూపాక్షుఁడు మొదలగురాక్షసవీరులు చచ్చుట

నంత విరూపాక్షుఁ డధికరోషమునఁ - బంతంబు మెఱయంగఁ బయిఁ దేరు వఱపి
విలుగుణధ్వని సేసి విపులనిర్ఘాత - తులితంబులగు వాఁడితూపుల నేయ6230
నవి లెక్క సేయక యరదంబు పైకి - రవిజుండు లంఘించి రథసూతహరులఁ
బృథివీధరంబునఁ బృథుశక్తితోడఁ - బృథివిపైఁ బడనేయఁ బృథివికి నుఱికి
విరథుఁ డయ్యును దైత్యవీరుండు వివిధ - శరము లేయుచుఁ బాదచారియై నిలువ
నమరారిపనుపున నఖిలాయుధములు - సమకూర్చి మావతు ల్సమదసామజము
దెచ్చిన వెస నెక్కి దీకొని కపుల - విచ్చలవిడి నేసి విక్రమం బెసఁగ
నుగ్రదానవు లార్వ నుగ్రబాణములు - నుగ్రాంశుతనయుపై నురవడి నేసె;
నక్కజంబుగ విరూపాక్షుండు మఱియుఁ - బెక్కాయుధంబులఁ బెక్కుబాణములు
వసమర నేయంగ వసుధ గంపింప - వెసఁ బాఱు తనవారి వెఱవకుం డనుచు
నలుకతో సుగ్రీవుఁ డతని నిర్జింపఁ - దలపోయఁ గ్రథనుఁడ న్దరుచలోత్తముఁడు
విపులవృక్షమున దద్ద్విరదంబు శిరము - గుపితుఁడై యేయంగఁ గుంభంబు పగిలి6240
తఱుచుగా శోణితధారలు దొరుఁగఁ - బిఱిఁదికి నొకవింటిపె ట్టొనరించి
యది మ్రొగ్గ నేల యయ్యసురయు దాఁటి - కదురుచు ఖేటకఖడ్గముల్ గొనుచు
మర్కటపతి దాఁకె మార్కొనివాని - నర్కసూనుఁడు వైచె నతులశైలమున
నక్కొండఁ దెగవ్రేసె నడరి దానవుఁడు - రక్కసుఁ బిడికిట రవిజుండు వొడిచె
నాలోనఁ గరవాల మంకించి యసుర - వాలితమ్ముని వ్రేసె వడి చెడ కపుడు
పిడికిటిపోటునఁఁ బెలుచ దానవుఁడు - నడిదంబువ్రేటున నర్కనందనుఁడు
నొక్కటఁ బడి యంత నొక్కట దెలిసి - యొక్కలాగునఁ బోరి రొగి నుక్కు మిగిలి

యప్పుడు సుగ్రీవుఁ డఱచేత వ్రేయఁ - దప్పించుకొని హేతి దనుజుండు వ్రేసెఁ
గరవాలనిహతి కగ్గతి దప్ప నుఱికి - కరహేతి జడిసిపోఁ గపిరాజు వ్రేసె;
మగఁటిమితో నంత మల్లయుద్ధమున - మిగిలినవెరవుల మెఱసి పోరుచును6250
దినవల్లభులభంగిఁ దేజరిల్లుచును - గనలు కాలాగ్నులకరణి మండుచును
బలిబిడౌజులమాడ్కి బాహుగర్వములు - వెలయుచు నిరువురు విజయంబు గోర
నక్కజం బగుశక్తి నఱచేత నినజు - మొక్కలంబున వాఁడు మూర్ఛిల్ల వ్రేసి
కరవాలహస్తుఁడై కపులపైఁ బాఱ - ధరణిజుం డాలోనఁ దనమూర్ఛ దెలిసి
పఱతెంచి నిర్ఘాతపాత మైనట్టి - యఱచేత నావిరూపాక్షువక్షంబు
నెఱలావుతొ నేయ నెత్తురు గ్రక్కి- యుఱలుచు ధరఁ గూలె నుగ్రదానవుఁడు
తరుచరు ల్చెలఁగిరి దానవు ల్గలఁగి - తిరుగుడువడి రంత దీనాస్యు లగుచు
స్రుక్కి యుద్ధోన్మత్తుఁ జూచి రావణుఁడు - తక్కనికడక యెంతయుఁ దోఁపఁ బలికెఁ
"గంటె యాసుగ్రీవు కడిమి మీయన్నఁ - గంటె విరూపాక్షుఁ గలనరంగమునఁ
బడి రనేకాసురభటులును బెక్కు - మడిసెఁ గుంజరములు మడిసె నశ్వములు6260
విఱిగె రథంబులు విరిసె మూఁకలును - నుఱక నొప్పించుచు నున్నారు కపులు,
సమయంబు నీ కిది సమరంబు సేయ - సమరాంగణంబున సమయింపు రిఫుల"
నన విని యని గూలి యఖిలేశుఁ డైన - మనుజేశుఁ గలయంగ మది నిశ్చయించి
తరుచరానీకంబు దరియంగఁ జొచ్చి - శరగదాఖడ్గాది సకలాయుధముల
నడరి విరూపాక్షు ననుజుఁడు కపులఁ - గడిమిమై నొప్పింపఁ గని భానుసుతుఁడు
నగ మెత్తి వైచిన నడుమనె దానిఁ - దెగనేసె దనుజుఁ డాదినకరాత్మజుఁడు
తనర సాలము వైచె దానిదానవుఁడు - దునియలుగా మూఁడుతూపుల నేసె
లక్షించి బాణజాలము లేయుచుండ - రాక్షసు లదరంగ రథముపై కుఱికి
భానుసూనుఁడు వానిపరిఘాయుధమున - వావికేతువు విల్లు వడి ద్రుంచివైచి
రథసూతుఁ దెగవ్రేయ రయమున వాఁడు - పృథుగదాపాణియై పృథివికి దాటి6270
యిరువురు పోరాడి రిల చలియింపఁ - బరిఘగదాభీలభాహువు ల్మెఱయఁ
గంఠీరవంబుల కరణి గర్జిలుచుఁ - గంఠము ల్వదనము ల్గరము లంసములు
చరణము ల్నఖములు జానుజంఘములు - నురములు వెన్నులు నూరులు వ్రేళ్లు
బరులును బిరుదు జబ్బలు మధ్యములును - శిరములుఁ జెవులును జెక్కు లోష్ఠములు
వరుసతో నపు డురవడిఁ దాఁకి తాఁకి - వెరవులు చిత్రము ల్వెసఁ గల్గుచుండ
సరిగాఁగ నత్యంతసాహసలీల - నిరువురు పోరి రనేకమార్గముల
నాలోనఁ బరిఘగదాభీలహతుల - వాలుదు రొక్కట వ్రాలి యాలోనఁ
గడిమిమై నొండొరుకంటె మున్దెలిపి - వడినార్తు రెంతయు వసుధ గంపింప,
దానవుం డురుగదాదండంబు రెండు - సేనలవారు నచ్చెరువందఁ ద్రిప్పి

భానుజుఁ బడవైచెఁ బడిలేచి వచ్చి - వనజాప్తసుతుఁ డేసెఁ బరిఘంబు ద్రిప్పి6280
దనుజాంగనిహతి దత్పరిఘంబు దునియఁ - గనలుచు దనుజుండు గరవాలమునను
వనచరపతి వైవ వడిఁ దత్కృపాణ - మినజుండు గొని దీప్తు లెనగ నంకించి
వికలమై ధర డొల్ల వ్రేసె దైతేయు - మకరకుండలదీప్తిమయమస్తకంబు
కనుఁగొని విరిగి రాక్షసులు రావణుని - వెనుకకు లంకకు వెసఁ బాఱి రపుడు
బలగర్వ మెసఁగ సుపార్శ్వుఁ డంగదుని - బలుసేనపైఁ గిట్టి పటుసాయకముల
వానరశిరములు వడిఁ గూలనేసి - తోన హస్తంబులు ద్రుంచెఁ గొందఱను,
గొందఱబాహువుల్ ఘోరబాణముల - నందంద తునుమాడె నంత వానరులు
నానిశాచరునకు ననిఁ బాఱఁ జూచి - వానితేఱికి దాఁటి వాలినందనుఁడు
వస యేరుపడ వాని పరిఘాయుధంబు - వెసఁ బుచ్చుకొని నేల వివశుఁడై తూల
వడి నేసె నాజాంబవంతుఁడు నొక్క - వెడఁద పాషాణంబు వీకతో నెత్తి6290
యరుదార నంకించి యరదంబు విఱుగ - హరులు సూతుఁడు జావ నలుకతో వ్రేసె;
దనుజుఁ డాలోఁ దేరి దశసాయకములఁ - గనలుచు నంగదు ఘనభుజం బేసి
యంబకత్రయమున నధికరోషమున - జాంబవంతుని నేసి చలనంబు నొంద
వేసె గవాక్షుని నిషుపంచకమున - నాసమయంబున నంగదుఁ డలిగి
వజ్రసన్నిభముష్టి వడిఁ గిట్టిపొడువ - వజ్రంబుతాఁకున వసుధాధరంబు
వసుధఁ గూలినక్రియ వాఁ డాజిఁ గూలె; - నెనఁగ దేవత లార్చి రేచి మిన్నద్రువ;
నంత రాక్షసబలం బతిభీతిఁ బాఱ - నంతయుఁ జూచి దశాననుం డనియెఁ
“బరుషవిక్రముఁడు సుపార్శ్వుండు మడిసె - నురుబాహుబలుఁడు యుద్ధోన్మత్తుఁ డీల్గె
ననిఁ గూలె నావిరూపాక్షుఁడు మఱియు - ఘనమైనరాక్షసు ల్గడతేరి రింక;
బలసమన్వితు లైన పార్థివసుతుల - బలువిడి గెలిచి నాబంధులవలన6300
నెలకొన్నశోకాగ్ని నెరియు నీలంకఁ - గలవారి వగపెల్లఁ గడఁకతోఁ దీర్తు
నవిరళక్షత్రధర్మైకమూలంబు - నవజయోన్నత లక్ష్మణప్రకాండంబు
భానునందనముఖప్లవగశాఖంబు - మానవపతికీర్తి మంజరీకంబు

రావణుఁడు రామలక్ష్మణులపైఁ గదియుట

ప్రకటసీతానామఫలభాసురంబు - సకలామరాశ్రితచ్ఛాయంబు నైన
రామద్రుమం బేను రయమారఁ బెఱికి - నామనోదుఃఖంబునకు మందుచేసి
యెసఁగెద జగములో నే” నంచు నప్పు - డసురేశుఁ డధికరోషాయత్తుఁ డగుచు
సారథి కనియె ”నీచతురత మెఱసి తేరు - రాఘవులపైఁ దీవ్రతఁ బఱపు
వారిఁ జంపెద నేఁడు వారాజిఁ బడిన - తా రేగుదురు విచ్చి తరుచరు ల్చెదరి”
యన విని వాఁ డట్ల యరదంబు వఱపె - ఘననేమిరవము లుత్కటముగాఁ జెలఁగ
సాయకాసనధనుర్జ్యానినాదంబు - మ్రోయంగ నిస్సారణము బోరుకలుగ6310

వందిమాగధసూతవరనుతు ల్మించ - నందంద నిజసేన యార్పు లుప్పొంగఁ
దరుచరసేనపై దారుణాస్త్రంబు - లరుదార నిగుడించె నద్దశాననుఁడు
అజనిర్మితంబులౌ నాబాణతతుల - భుజబలంబులు దూలి భూరిసత్త్వులును
నేలఁ గూలిరి పెల్లు నిఖిలప్లవంగు - లాలోన రఘురాముఁ డనుజుండు దాను
గోదండపాణులై కోపించి నిలిచి - రాదశాననుఁడును నలుక మార్కొనఁగ
నుడువీథి యవియంగ నుదధులు గలఁగఁ - గడుతేర్చి దిక్కుంభికర్ణము ల్వగుల
నడరు రామునిధనుర్జ్యాఘోషమునకు - గడుమానసంబులు గలఁగి రాక్షసులు
గుపితదశగ్రీవకోదండముక్త - తపనోగ్రసాయకధ్వనికి వానరులు
భయమంది ధరణిపైఁ బడిరి యుక్కడఁగి - రయమార నాలోన రామలక్ష్మణులు
రవిసుధాంశులభంగి రాగిలి కదియ - దివిజారి రాహుప్రదీప్తుఁడై కవిసె6320
నంత నాలక్ష్మణుం డతితీవ్రవిశిఖ - సంతతు లేసె దశగ్రీవుమీఁద;
నడుమన తెగ నేసి నాకేశవైరి - కడిఁదిబాణములు నుత్కటముగా మఱియు
నొక్కొక్కశర మేయ నుగ్రుఁడై వాని - నొక్కొక్కశరమున నొగి ద్రుంచివైచి
మూఁడేసిశరము లిమ్ములవడి నేయ - మూఁడుమూఁడమ్ముల మురియలు చేసి
పదియమ్ము లేసినఁ బదియింట వానిఁ - జిదురుపలై ధరఁ జెదరి పో నేసె;
నూఱేసి యేసిన నూతనగతుల - నూఱునూఱమ్ముల నుగ్గు గావించి
సౌమిత్రి నటు రణస్థలిఁ జిక్కుపఱిచి - రామచంద్రునితోడ రణము సేయుటకు
దనుజాధినాథుఁ డుద్గతి నేగుదేరఁ - గనుగొని సమవర్తిఁ గని పాఱుకరణిఁ
గనుకనిఁ జెదరి మర్కటు లనిఁ బాఱఁ - గని కన్నుగవఁ గెంపుగడల రాఘవుఁడు
విల్లంది దివిజులు వినుతింప ధరణిఁ - దల్లడపడఁ దాఁకె దానవేశ్వరుని6330
ముఖములఁ గోపంబు ముడివడ నతఁడు - నఖిలలోకాతిభయకరంబుగను
రామునిఁ దాఁకె నారామరావణులు - భీమాట్టహాసము ల్బెరయించి మించి
సైన్యద్వయంబున సరి నార్పు లెసఁగ - నన్యోన్యకార్ముకజ్యానినాదములు
పరువడి దశదిశాభాగంబులందు - మొఱయఁ బరస్పరముక్తబాణంబు
లొండొంటితోఁ దాఁకు నుగ్రంపురవము - మండుమంటలు నభోమండలి నిండ
సరినొప్పి యిరువురు శరలాఘవములఁ - గరలాఘవంబులకరణి నొండొరులు
మెచ్చుచు నొండొరు మీఱువైచిత్రి - కచ్చెరుపడుచును నని సేయునపుడు
క్షోణీశుపై నొక్కఘోరతమిస్ర - బాణంబు నిగుడించెఁ బంక్తికంధరుఁడు
ఆకాండ మడరిన నఖిలవానరులు - చీఁకటి గప్పి నిశ్చేష్టితు లైరి
అప్పుడు గన్నుల నలుకఁ గెంజాయ - లొప్పార రఘురాముఁ డుగ్రబాణములు6340
పదిపదు లేసినఁ బటుభల్లసమితిఁ - ద్రిదశారి వానినిఁ దెగనేసి మఱియు
నిశితబాణము లేయ నృపుఁ డర్ధచంద్ర - విశిఖంబు లడఁగించి వేగంబ త్రుంచి

యసురేశునిఖిలావయవములు దూర - నసదృశం బగుననేకాస్త్రము ల్వఱ పె
రౌద్రబాణం బంత రావణుం డేయ - రౌద్రబాణంబున రఘురాముఁ డేసె;
అవి రెండు నన్యోన్యహతములై పడఁగ - నవనీశదనుజేశు లాలోనఁ గినుక
దివిరి యొండొరు లేయుతీవ్రబాణములు - దివినిండఁ గప్పినఁ దిమిరంబు గప్పె
రణములో నప్పుడు రయమున మ్రోఁగు - గుణరావములచేత ఘూర్ణిల్లుచున్న
యురుచాపసాగరయుగమున నెగయు - శరవీచు లొగిఁ బరస్పరఘట్టనముల
విరియంగ దైతేయవిభుఁడు కోపించి - నరనాథునుర మేసె నారాచసమితి
నది యుండె నీలోత్పలావలికరణిఁ - గదిసి రాముఁడు చండకాండము ల్దొడిగి6350
కవచంబు సించి వక్షము గాడనేసె - దివిజారి యప్పు డెంతే నొచ్చి మఱియు
నహి శిలీముఖముల నడరింపఁ దోన - యహిమాంశుకులనాథుఁ డవి ద్రెవ్వనేసె;
నాసమయంబున నమరేంద్రవైరి - యాసురసాయకం బడరింపఁ బెక్కు
ముఖముల శార్దూలముఖములు నుష్ట్ర - ముఖములు సూకరముఖములు నురగ
ముఖములు కరివైరిముఖములు దంతి - ముఖములు ఘనగృధ్రముఖములు దనరు
ఘనశిలీముఖములై కడుఁబెక్కు నిగుడఁ - గని వానిఁ దునుకలుగాఁ జేసి మఱియు
జననాథుఁ డాగ్నేయసాయకం బేయఁ - గనుగొని నెందు నుల్కాముఖాస్త్రములు
మహితవిద్యున్ముఖమార్గణంబులును - గ్రహముఖంబులు గల్గు ఘనసాయకములు
మిహిరముఖంబుల మెఱయుబాణములు - దహనముఖంబులై తనరుశస్త్రములు
నగుచు నచ్చెరువుగా నడరంగ వానిఁ - దగ నేసి యప్పుడు దైత్యవల్లభుఁడు6360
మయునిచేఁ బడసిన మాయాశరంబు - రయమున సంధించి రాముపై నేసె
నేసిన దాన ననేకంబు లగుచుఁ - బ్రాసతోమరగదాపరిఘంబు లడరె
గాంధర్వశర మంత ఘనకార్ముకమున - సంధించి నిగుడించె జనలోకవిభుఁడు
నాదిత్యతులితంబు లైనచక్రంబు - లాదివ్యబాణంబునం దనేకములు
జగములు భయమంద జనియించి రుచుల - నిగిడి యాకస మెల్ల నిండఁ బెల్లడరి
యామార్గణంబున నడరినపరిఘ - తోమరాదుల నెల్లఁ దునియలు సేయ
దశకంఠుఁ డంత నద్ధరణీశుమీఁద - నిశితనారాచము ల్నిగిడించె నలుకఁ
బరఁగించె నృపుఁడును బ్రతిసాయకములు - పొరిఁబొరిఁ బుంఖానుపుంఖంబు గాఁగ
జగతీశదనుజేశ శరపరంపరలు - గగనభాగంబెల్లఁ గప్పె నాలోన
నెడఁ జొచ్చి లక్ష్మణుం డేడుబాణములఁ - బడగయు వి ల్లొక్కపటుసాయకమున6370
సారథిశిర మొక్కశరమునఁ ద్రుంచి - యారావణునివక్ష మైదింట నేసె;
నీలధరాధరనిభతురంగములఁ - గూలంగ నేసె మార్కొని విభీషణుఁడు
విరథుఁడై దైతేయవిభుఁ డంతలోన - ధరణికి లంఘించి తరుచరు ల్బెదర
భ్రూకుటిదశకవిస్ఫురితాస్యుఁ డగుచు - భీకరశక్తి విభీషణు వైవ

నడుమనె మూఁడుబాణంబుల దాని - మిడుగురు ల్మంటలు మింటఁ బెల్లెగయ
ధరణిపైఁ బడనేసెఁ దరుచరు లార్వ - ధరణీశుననుజుండు దశకంఠుఁ డంత
కడు నల్గి మయునిచేఁ గన్నయాశక్తి - వడి విభీషణుమీఁద వైవ నంకింప
శరణాగతత్రాణసద్ధర్మపరులు - శరణాగతులచావు సైతురే యనుచు
దనుజేశుతమ్మునిఁ దనవెన్కఁ దిగిచి - కొని రాముతమ్ముఁడు క్రూరబాణములు

రావణునిశక్తిచే లక్ష్మణుఁడు మూర్ఛిల్లుట

పరఁగించె నప్పుడు పంక్తికంధరుఁడు - "బిరుదవై వచ్చి విభీషణు వెనుక6380
నిడుకొంటి లక్ష్మణ! యీశక్తిహతికిఁ - గడిమిమై నోర్తువు గా” కంచుఁ బలికి
ప్రళయకాలాదివ్యపరివేషఘోర - వలయమై దీపింప వడిఁ ద్రిప్పి వైచె;
నది కింకిణీఘంటికానేకరవము - లొదవంగ మ్రోయుచు నుదధులు గలఁగ
వడిఁ గులాచలములు వడకాడ దిశలు - బెడఁక దివాకరబింబంబు గదలఁ
బిడుగులు దొరఁగంగఁ బృథివి గంపింప - నుడుపథం బవియంగ నుడుపంక్తి చెదర
మిడుగురు లెగయంగ మింటఁ బెన్మంట - లడరంగ శేషజిహ్వాకార మగుచు
రయమునఁ బఱతెంచి రాముఁ డాలోక - భయదసాధనముచేఁ బ్రాణభయంబు
సమకొనకుండెడు సౌమిత్రి కనఁగ - నమరులు మింట నాహాకృతు ల్సేయ
నెడనెడఁ బయినేయు నిషుపంక్తి జడిని - వడిమీఱఁగా వచ్చి వక్షంబునందు
భీకరఘనశక్తి పెల్లుగా గాడ - రాకుమారుఁడు దూలి రణభూమి వ్రాలెఁ;6390
గాలావసానంబు గదియఁ బెం పేది - కూలుమహామేరుకుధరంబుపగిది
ధరణిపైఁ బడియున్న తమ్మునిఁ జూచి - దరికొన్న శోకాగ్ని దనచిత్త మెరియఁ
గనుగవ బాష్పము ల్గ్రమ్మి పై నిగుడ - దనుజేశుపటుబాణతతులు గైకొనక
పృథుతరవక్షంబు పెల్లుగాఁ గూడి - పృథివిగూడినయట్టి భీకరశక్తిఁ
బఱతెంచి వానరపతు లెల్లఁ గూడి - పెఱుకఁజాలకయున్నఁ బెఱికిపోవైచి
యర్కజానిలసుతు లాదిగాఁ గలుగు - మర్క టేశులఁ జూచి మనుజేశుఁ డనియె.
"శౌర్యంబు సలిపెడి సమయంబు గాని - కార్యంబు లడఁచు శోకపువేళ గాదు
ఘనులార! మీరు లక్ష్మణుఁ గాచికొనుఁడు - వినుఁడు నాపలికెడు వీరప్రతిజ్ఞ;
వెనుకకు రాజ్యంబు విడుచుట బంధు - జనులఁ బాయుట వనస్థలులఁ గ్రుమ్మరుట
బాణబాణాసనపాణినై యుండి - ప్రాణంబు దానైన పత్నిఁ గోల్పడుట6400
కడిఁది మాయావిరాక్షసులతో ననికిఁ - దొడరుట మొదలైన దుఃఖంబు లెల్ల
ఘోరాజిలోఁ బాపుకొనువాఁడ నేను - దారుణకర్ము నీదశకంఠుఁ దునిమి
సమరోర్వి నీతనిఁ జంపెడికొఱకు - నమితవిక్రముఁ డైన యావాలిఁ గూల్చి
కపిసేనకై దినకరతనూభవుని - గపిరాజ్యపట్టంబు గట్టితిఁ బ్రీతిఁ;
జండతరగ్రాహసంకులం బగుచు - నొండొండ మిన్నందు నూర్పులు గలిగి

కడలేనియావార్ధి గట్ట గట్టించి - కడచి వచ్చితి మహాకపిసేనతోడ
వచ్చి లంకాపురవరము వేఁడించి - యిచ్చట సౌమిత్రి నిటు గోలుపడితి
నాదశాననుఁ డేచి యాలంబులోన - నాదృష్టిమార్గంబునకు వచ్చెనేని?
దృష్టివిషంబులఁ దీవ్రసర్పంబు - దుష్టజంతువు గాల్చు తెఱఁగు చూపెదను;
బ్రదికిపోనీ నింకఁ బఙ్క్తికంధరునిఁ - బ్రదరపరంపరపాలు చేసెదను6410
గిరు లెక్కి నేఁ డెల్లగిరిచరావలులు - సొరిది యారణకేళి చూతురు గాక!
లోకపాలురు నెల్లలోకులు నేఁడు - నాకార్ముకప్రౌఢి నలువారఁ జూచి
రణములోపల నేను రఘురాముఁ డగుట - ప్రణుతవిక్రమలీలఁ బరికింప నిండు
సురకంటకుఁడు డాఁగి సురలోకమునకు - నరిగిన, నబ్ధిమధ్యమునఁ గ్రుంకినను,
ధరణిఁ దూఱిన రసాతలముఁ జొచ్చినను - బొరిపుత్తుఁ గాకేల పోనిత్తుఁ దన్ను,
భువి నర్కకులమునఁ బుట్టితినేని - రవితేజుఁడగు దశరథుతనూజుండ
నైతినేని, రాముఁడ నైతినే, నింక - దైతేయపతి రణస్థలి నిల్చెనేని
నేవిధంబున నైన నిపుడె నిర్జింతు - రావణుం డయ్యెడి రాముఁ డయ్యెడిని
నిల రామరావణు లిరువురయునికి - గలుగంగ నేర దీకదనరంగమున"
ననుచు నారాచంబు లందందఁ దిరిగి - దనుజేశుపై నేయ దశకంధరుండు6420
ప్రతిశిలీముఖపరంపరలు పైఁబఱప - నితరేతరాశుగానేకసంఘములు
మండుమంటలు నభోమండలి నిండ - నొండొంటితోఁ దాఁకు నుగ్రంపురవము
గురుతరకోదండగుణనినాదములు - బెరసె నొక్కొట లోకభీకరగతులు
అంత జర్జరితాంగుఁడై రామువిశిఖ - సంతానవేగంబు సైరింప లేక
గజవైరిఁ గని పాఱు గజముచందమున - రజనీచరేంద్రుండు రణభూమి విడిచి
కచభారములు వీడఁ గమనీయరత్న - ఖచితభూషణములు గనుకనిఁ జెదర

రావణుఁడు విభీషణాదులమాట దలంచి చింతించుట

ఘనపాదహతి నేల కంపింపఁ - బాఱి వనచరు లార్వంగ వడి లంకఁ జొచ్చి
కొలువుకూటంబునఁ గూర్చుండి బుద్ధిఁ - దలపోసి తనకు ముందర విభీషణుఁడు
చెప్పినబుద్ధులు చిత్తంబులోన - నప్పుడు తలఁచుచు నారాముఁ డేయు
నేటులు దలఁచుచు నెల్లందు సుభట - కోటులు గొనియాడఁ గుంభకర్ణుండు6430
నతికాయుఁడును ఘనుం డగు నింద్రజిత్తు - మృతులౌటఁ దలఁచుచు మిగులఁ జిత్తమున
గవిసినశోకాంధకారంబువలన - నవశభావముఁ బొంది యాలోనఁ దెలిసి
యంతఃపురంబున కంత నేతెంచి - యంతరంగమునఁ జింతాక్రాంతుఁ డగుచుఁ
దనసతి రావించి తలవాంచి పలికె - "విను రాముజగదేకవిక్రమక్రమము
నేమని చెప్పుదు? నిదె నాకు నెదుర - రామసహస్రము ల్రమణి తోఁచెడిని!
ఎక్కడఁ జూచిన నీలంకలోన - నక్కడ రఘురాముఁ డైయున్నవాఁడు;

ఇంక జయోపాయ మేమియు లేదు; - శంకరుచరణము ల్శరణంబు నాకుఁ;
ద్రిపురంబు లేదేవుదివ్యోగ్రబాణ - విపులాగ్ని నీఱయ్యె విస్మయం బెసఁగ?
నిందుఖండంబున నేదేవుమకుట - మందమై విలసిల్లు నభినవస్ఫురణఁ?
దనర నేదేవుహస్తమునఁ బినాక - సునిశితఖడ్గత్రిశూలము ల్మెఱయు?6440
నేదేవుఁ డఖిలలోకేశుఁ డేదేవుఁ - డాదక్షు మర్దించి యాగంబు చెఱిచె?
అలుకతో నేదేవుఁ డంధకాసురుని - బొలియించె? నేదేవుఁ బొగడు వేదములు?
తెలియ నేదేవుఁడు దేవుఁడు దేవుఁ? - డెలమి నాదేవుని నే భజించెదను;"
అని కృతస్నానుఁడై యగ్రజన్ములకుఁ - దానియంగ బహువిధదానము ల్చేసి
మదిలోన మదదర్పమానము ల్విడిచి - పదిలుఁడై సాత్వికభావంబు పూని
రక్తాంబరంబులు రక్తమాల్యములు - రక్తోపవీతము ల్రక్తగంధంబు
రక్తాక్షసూత్రము ల్రాజిల్లఁ బరమ - భక్తితో మంత్రజపంబు సేయుచును
నీశ్వరాలయమున కేతెంచి రాక్ష- సేశ్వరుం డచలితహృదయుఁడై నిలిచి
తగవేది గావించి దర్భాంకురంబు - లొగిఁ జేర్చి తనకుఁగా నుగ్రదానవుల
నన్నిదిక్కుల నుండ నమరించి వేల్వ - నున్నంత నెఱిఁగి మందోదరి వచ్చి6450
కనుఁగొని యోపఙ్క్తికంధర నీకుఁ - జనునె దీనునిభంగి శౌర్యంబు విడువ?
ఉఱక నీ వలిగిన నుదధులు మ్రోయ - వెఱచు; సమీరుండు వీవంగ నళుకు;
వినువీథి నర్కుండు వెలుఁగ శంకించు; - ననలుండు తీవ్రార్చు లడరింప నోడు;
జగములు నీసన్నఁ జలియించు; నేల - మగఁటిమి చెడి విప్రమతము గైకొంటి;
నేఁ డింతధైర్యంబు నీకు లేకున్న - నాఁ డేల తెచ్చితి నరనాథుదేవి?
మారీచుమాటలు మదిలోన నాఁడు - నేరము ల్గాఁ గొంటి నీతి గావంటి;
నీతి విచారించి నీచేటు సైఁప - కాతతధర్మాత్ముఁ డగు విభీషణుఁడు
తొడరి పల్మాఱును దోషాచరేంద్ర - చెడుత్రోవ లేటికి సీత నీపైని
విడుచుట గడుమేలు విడు మంచు నీకు - విడువక చెప్పఁడా? వినవైతి గాక!
మాతామహుం డైనమాల్యవంతుండు - నీతి దాఁ జెప్పఁగ నీసు గైకొంటె?6460
తప్పక మీతల్లి తగవు చింతించి - చెప్పినబుద్ధులు చెవియొగ్గి వింటె?
జననాథుతో నేల శాత్రవం బనినఁ - గనలవే మఱి కుంభకర్ణుమాటలను?
వల దని చెప్పినవారివాక్యములు - తలగూడెనే? నేఁడు దనుజలోకేశ!
భుజవిక్రమం బెల్లఁ బోవంగ విడిచి - నిజముగా మునివృత్తి నేఁడు గైకొంటి;
ఇంద్రుండె యని నోడ నెఱుఁగఁడు రామ - చంద్రుని నని జగజ్జనులు ని న్నగరె?
యని వాని గెల్తుగా కసురేశ! నీకు - ననదచందము లేల" యని తూలఁబల్క
నెలకొన్న సిగ్గున నిట్టూర్పు పుచ్చి- “నెలఁత నీమాటలు నిజమగు నైన
రామచంద్రుని కింక రమణి నే వెఱవ - హోమంబు గావించి యుద్ధరంగమున

జననాథవరులను జంపెద నీవు - చను”మన్న మ్రొక్కి బాష్పంబు లందంద
దొరుఁగ మందోదరి దుఃఖించి లోని కరుగుచో నాడిన యార్ద్రవాక్యములు6470
విని సిగ్గుపడి వ్రేల్మి విడిచి రావణుఁడు - చనియె సజ్జకు నంత జననాథుఁ డిచట
ఒడలు నెత్తుట దోఁగి యూర్పులు సడలి - పడియున్న శేషాహిపతిఁ బోలియున్న
యనుఁగుఁదమ్మునిఁ జూచి యాలోన ధృతికిఁ - జొనుపనిమతితోడ శోకింపఁదొడఁగె;

లక్ష్మణుని మూర్ఛకు శ్రీరాముఁడు శోకించుట

"ఇబ్భంగి సౌమిత్రి యిలమీఁద నుండ- నెబ్భంగి బ్రాణంబు లేను నిల్పుదును?
లలి రణం బొనరింప లా వెట్లుగలుగు? - బలుముష్టి విల్లెట్లు పట్టంగవచ్చుఁ?
గన్నుల బాష్పము ల్గ్రమ్మంగ నెట్టు - పన్ని పైఁబఱతెంచు పరిపంథిఁ జూతు?
నాకన్నులెదుటనే నాసహోదరుఁడు - నాకూర్మిబంధుండు నాప్రాణసఖుఁడు,
నాకుఁ బ్రాణము లిచ్చి నను డించిపోయె - నాకు సిగ్గయ్యెడి నాశౌర్యమునకు
నా కేల రణ మింక? నా కేల జయము? - నా కేల రాజ్యంబు? నా కేల సీత?
నా కేల శౌర్యంబు? నా కేల బ్రతుకు? - నాకు నీతోడిద నాకంబుగాక!6480
జయశాలివై మున్ను శరభశార్దూల - భయదాటవులలోనఁ బాటించి తెచ్చి
యరు దైనతుచ్ఛదైత్యాటవియందుఁ - బరునికై వడిఁ గాఁడుపఱచితే నన్ను?
ఉన్నతోన్నతబుద్ధి నోరంతప్రొద్దు - నన్నుఁ గాచుటకుఁ గాననభూములందు
నిద్రవో వెన్నఁడు నేఁ డిట్లు దీర్ఘ - నిద్రపోవుట నీకు నీతియే? తండ్రి!
పలుమఱు నిబ్భంగిఁ బనపుచుఁ బిలువ నెలుఁగెత్తి “యో" యన వేమి? లక్షణుఁడఁ!
ఇంక నెవ్వరు గల? రే నెందుఁ జొత్తు? - నింకఁ బాలయితిగా యీశోకవహ్ని;
శుభలక్షణోపేతసురుచిరాకారుఁ - డభిరామబలుఁడు నా కతిభక్తిపరుఁడు
ప్రియసహోదరుఁడు గంభీరుండు సమర - జయశాలి నాప్రాణసఖుఁడు లక్ష్మణుఁడు
ఇతఁడు నాతోఁ గాన కేతెంచె నిప్పు - డితనితో నేగెద నేనింద్రపురికిఁ;
గల రిందు నెందును గలరు బాంధవులు - నిల నిట్టిసోదరు లెక్కడఁ గలరు?6490
యత్నంబు చేసిన నవనిజఁ బోలు - పత్ని నొండొకచోటఁ బడయఁ జొప్పడును;
ఇట్టిసద్గుణశీలుఁ డిట్టిదయాళుఁ - డిట్టిమహాబలుం డిఁక నెందుఁ గలఁడు?
తమ్ముఁ డన్మాత్రమే తలపోయ భక్తి - నిమ్ముల ననుఁ గొల్చు నిమ్మహాభుజుఁడు
ఇతఁడె నాపౌరుషం బితఁడె నాశాంత - మితఁడె నాకీర్తియు నితఁడె నాస్ఫూర్తి
యితఁడె నాశౌర్యంబు నితఁడె నాధైర్య - మితఁడె నానయమును నితఁడె నాజయము
భావింప నాపాలిభాగ్యంబు నితఁడె - పావనం బగురాజ్యపదవియు నితఁడె”
యని పెక్కుభంగుల నడలుచునుండ - విని సుషేణుఁడు రామవిభుఁ జూచి పలికె
“ఇది యేమి దేవ! నీ కింత శోకింప? - హృదయంబుఁ గుందింప కిదె చూడు మితని
యొడలఁ బ్రాణములు లేకున్న నాననము - కడు నొప్పి యుండునే కళలు దేరుచును

గన్ను లిందీవర కమనీయకాంతిఁ - జెన్నొంది యుండునే చెలువంబు మిగిలి?6500
అందంబులై యున్న నఱచేతు లెలమిఁ - గెందామరలభంగిఁ గెంజాయ మెఱసె;"
నని పల్కి రఘురామునడలు వారించి - హనుమంతుఁ గనుగొని యతనితో ననియె,
"మును జాంబవంతుండు ముదముతోఁ దెల్ప - వినినాఁడ నౌషధవిధ మెల్లఁ దెలియ;
బొలుచు మహాద్రోణభూధరేంద్రమునఁ - జెలువొందు దక్షిణశిఖరంబునందు
బరికింప దీప్తులఁ బరఁగు విశల్య - కరణియు, సౌవర్ణకరణియు, మఱియు
సంధానకరణియు, సంజీవకరణి - బంధురతరశుభప్రభ నొప్పుచుండు
నాలుగౌషధములు నవి దెమ్ము వేగ - మీలక్ష్మణుని ప్రాణ మెత్తంగవలయు;
లవణసముద్రంబు లంఘించి పోయి - యవకుశద్వీపము లవియును గడచి
వడి నేగి దుగ్ధార్ణవము నాక్రమించి - తడయక పోయి చంద్రద్రోణగిరులఁ
బంబిదేవాసురు ల్బలువడి దొల్లి - యంబుధి మథియించి యమృతంబు వడసి6510
యందు దాఁచుటఁ జేసి యమృతంబువలన - నందు జన్మించె నానౌషధలతలు
అందు దేవేంద్రునియనుమతంబునను - మందరంబులఁ బోలు మహనీయతనులు
గంధర్వు లొగి వానిఁ గాచియుండుదురు - గంధర్వులకు నీకుఁ గలుగుఁ గయ్యంబు
తెరువున రాక్షసు ల్దిరుగుచుండుదురు - వరుస మాయావులై వారి నేమఱక
ద్రోణాద్రి కవలీలతో నేగి యితని - ప్రాణ మెత్తుము రఘుపతి సంతసింప;
నిరుమూఁడులక్షలు నిరువదివేలు - పరికింప నిన్నూటపదియోజనములు
వాయునందన! నీవు వాయువేగమునఁ - బోయిర మ్మిటఁ బ్రొద్దు పొడువకమున్నె;
భానుండు వొడిచినఁ బ్రభఁ దూలి శక్తి - హీనంబు లైపోవు నీయౌషధములు
అటమీఁద లక్ష్మణు నాయు వెత్తుటకు - ఘటియిల్లనేరదు గాన నీలోన
వానరోత్తమ! నీవు వడిఁ బోయిరమ్ము - వానిలక్షణములు వలయు నీ కెఱుఁగ6520
హరితఫలంబులు నరుణపుష్పములు - నరుదారఁ దెల్లనియాకులు నమరు
జననాథనుత! విభీషణు జాంబవంతు - నినసూను నంగదు నెలమి వీడ్కొనుము”
అని సుషేణుఁడు పల్క "నౌఁగాక" యన్న - యనిలనందనుఁ జూచి యవనీశుఁ డనియెఁ.
“బడియున్న లక్ష్మణుప్రాణంబు లెత్తి - పడయుము త్రిభువనప్రఖ్యాతకీర్తి;
అనుజులు మును మువ్వు రరయ నా కిప్పు - డనిలనందన నల్వురైరి నీతోడ,”
నన విని “నీబంటు హనుమంతుఁ డుండ - నినకులోత్తమ! నీకు నేల చింతింప?
నీయాజ్ఞఁ దలమోచి నృపసింహ! వేగ - మాయేడుదీవుల కవల నుండినను
నినుఁ డుదయాద్రి కేతేరకమున్న - కొనివత్తు నౌషధకుధర మే" ననుచు
నడుగుల కెరఁగిన హనుమంతు నెత్తి - నడుఁ గ్రుచ్చి యాలింగనము సేసి విభుఁడు
“ఇంద్రుండు నీశిర, మినుఁడు నీముఖము - చంద్రుండు నీమది, శక్తి నీపిఱుఁదు,6530
లనిలుండు నీవెన్ను, హరుఁడు నీవాల - మనలుండు నీయంఘ్రు, లజుఁడు నీబుద్ధి

వరుణుండు నీశక్తి, వాణి నీవాణి - గరుడకేతనుఁడు నీఘనబాహుయుగము
కుంజరాననుఁడు నీకుక్షి రక్షింతు - రంజనాసుత! వేగ యరిగిర” మ్మనిన

హనుమంతుఁడు సంజీవకరణికొఱకు ద్రోణాద్రికిఁ బోవుట

సరవి నర్కజవిభీషణఋక్షరాజ - పురుహూతపౌత్రు లప్పుడు వీడుకొల్ప
మేదిని వడి వ్రయ్య మెట్టిన నగము - పాదంబు లూదిన బలువడిఁ గ్రుంగ
మెయి గాలి యవ్వీరు మిన్నేఱు గలఁగ - రయమున లంకాపురంబు గోపురము
వెసఁ గూలఁ గుప్పించి వినువీథి కెగసి - లసితవిద్యున్నిభలాంగూలలతయు
నుగ్రబాహార్గళయుగళంబు నెత్తి - యుగ్రాంశుపటుమండలోదగ్రలీల
వదనంబు గడుసముజ్జ్వలితమై వెలుఁగఁ - బదకర్ణసంకోశభంగిఁ జెన్నగుచు
బహుపర్వతంబులు బహుదేశములును - బహునదీనదములు బహువనంబులును6540
పురములు సాగరంబులు గనుంగొనుచు - నరుదారఁ దుహినాద్రి నవలీలఁ గడచి
దెసలు ఘూర్ణిల్లంగ దిగ్భాగ మగల - నసహాయశూరుఁడై హనుమంతుఁ డరిగె
వేవులవా రట్టివిధ మెల్లఁ జెప్పఁ - గా విని విఘ్నంబుగాఁ జేయఁదలఁచి

కాలనేమివృత్తాంతము

యొంటిమై రావణుం డొగిఁ గాలనేమి - యింటికి నడురేయి నేగుదెంచుటయు
భక్తితోడుత నర్ఘ్యపాద్యాదు లిచ్చి - నక్తంచరేంద్రున కాతఁ డిట్లనియె:
“నీమధ్యరాత్రి మీ రిటకు విచ్చేయు - టేమి కారణ? మానతిండు నా” కనిన
"నని నేఁడు నాశక్తిహతి మృతుండైన - యనుజునికై రాముఁ డటుఁ దన్నుఁ బనుప
సంజీవకరణిచే సౌమిత్రిఁ బడయ - నంజనాసుతుఁ డిప్పు డరుగుచున్నాఁడు
చని వేగ హనుమంతుఁ జంపు కాదేని - విను భాను గనునంత విఘ్నంబు సేయు
కలదు దేవాసురకల్పితం బైన - నలినాకరము ద్రోణనగసమీపమున6550
మదముతో నొకమహామకరి యం దుండు - నది దేవతల మ్రింగు నగచరుం డెంత?
ఆసరోవరమున కనిలజుం డరుగ - మోసపుచ్చుము వేగముగ నేగు" మనిన
మనమున నట నీతిమార్గంబు దెలియ - దనుజేశుతో నాడెఁ దగఁ గాలనేమి
"మాయామృగాకృతి మారీచుఁ డరిగి - మాయమై పోడె యామతము పోనిమ్ము;
ఘోరాజిఁ గూలిరి కుంభకర్ణాది - వీరదానవులెల్ల విను మింక నైన
మనుజేశునకు సీత మరలంగ నిచ్చి - దనుజేశ! లంక నీతమ్ముని కిచ్చి
యరిగి మృడావాస మైన కైలాస - ధరణీతలంబున తపసివై యుండు;
కాదేని బిరుదుమైఁ గదనరంగమున - మేదినీపతిచేత మృతిఁ బొంది మీఁద
నొనరంగ విష్ణుసాయుజ్యంబు నొందు” - మని పల్కఁ గన్నుల నలుకగెం పెసఁగ
నాయెడ వెసఁ జంద్రహాసంబు పెఱికి - వ్రేయఁ దలంచె నావిధ మాతఁ డెఱిఁగి,6560
"యిదె చనుచున్నాఁడ నే" నంచు నచటు - గదలి మనోవేగగతి లావు మెఱసి

చని చూతపున్నాగచంపకక్రముక - పనసచందనజంబుపాటలీవకుళ
కదలికాఖర్జూరకర్పూరతరులు - మొదలుగాఁ గల భూజములసొంపు మిగిలి
బహుశిష్యగణవేదపఠనంబు చెలఁగ - మహనీయమణిదీపమాలిక ల్వెలుఁగ
భాసురమంజరీఫలహోమధూమ - ధూసరీకృతలతాద్రులఁ జెన్ను మిగిలి
కలకంఠశుకనీలకంఠశారికల - కలహంసకలరవకలకలం బెసఁగ
హుతదానమంత్రస్వరోదీర్ణ మైన - కృతకాశ్రమము ద్రోణగిరిసమీపమున
నిర్మించి మునివోలె నియతితోఁ గపట - నిర్మలాకృతిఁ దాల్చినేత్రముల్ మూసి
సన్నపుటెలుఁగున జపమాలపూస - లెన్నుట మంత్రమై యెదిరికిఁ దోఁప
నావనంబున నుండ నాకాశవీథిఁ - బోవుచో మారుతపుత్రుఁ డీక్షించి6570
“యిది యొక్కమునివనం బింతయొ ప్పగునె? - యిది నాఁడు లే దిప్పు డెందు వచ్చితినొ
యెక్కడి దుగ్ధాబ్ధి? యెక్కడి మేరు? - వెక్కడి మునివనం? బిది త్రోవ దప్పెఁ;
దెరు విమ్మునీంద్రుచేఁ దెలియంగ నడిగి - యరిగెదఁ గా"కంచు నవని కేతెంచి
వనపక్వఫలములు వాంఛఁ బుట్టించి - మునిశాపభయమున ముట్ట నోడుచును
మునిఁ జేరఁ జనుదెంచి మ్రొక్కి కేల్మొగిచి - "మునినాథ! దుగ్ధసముద్రంబుకడకు
మనుజేశకులశిఖామణియైనరామ - జననాథుపనుపునఁ జనుచున్నవాఁడ;
హనుమంతుఁ డనువాఁడ నధిక మౌ తృష్ణ - జనియించె నిచ్చోట జలములు గలవె?
చెప్పవే” యనవుడుఁ జిఱునవ్వు నవ్వి - “డప్పివో మాకమండలువుతోయములు
ద్రావు మీఫలములు దనియంగ నమలు - నీవింక రాతిరి నిద్రింపు మిచట
నగచరోత్తమ! యతీతానాగతంబు - లగుమేర లెఱుఁగుదు నంతరంగమున6580
రాము వంచించి యారామునిదేవి - భూమిజఁ జెఱగొనిపోయె రావణుఁడు
అవనీశుఁడును వాలి నవలీలఁ జంపి - లవణాంబునిధిఁ గట్టి లంకపై విడిసి
యనిలోనఁ గుంభకర్ణాది రాక్షసులఁ - దునుమాడి యింద్రజిత్తును ద్రుంచివైచెఁ;
బుత్రశోకంబునఁ బుట్టినయలుక - రాత్రించరేంద్రుండు రణభూమిలోన
మయునిచేఁ బడసిన మహనీయశక్తి - రయమునఁ గొని సుమిత్రాపుత్రు వైచెఁ;
బడిన యాసౌమిత్రిప్రాణము ల్వడయ - వడి నౌషధములకు వచ్చితి వీవు;
వినుము నీ విప్పుడు వేయోజనంబు - లనిలనందన! వచ్చి తనిలవేగమున
నన్ను నధర్మాత్ములకుఁ గానరాదు - నిన్ను నుత్తమునిఁగా నిశ్చయించితిని;
జగదేకహితముగా జనియించెఁ గాన - జగదీశుపని మాకు సమకూర్పవలయు
దివ్యౌషధంబులు దీపించునట్టి - దివ్యమంత్రము లుపదేశింతు నీకుఁ6590
గంజాప్తు నుదయంబు గని శక్తి మిగుల - సంజీవనీముఖ్యసకలౌషధములు
గలవు మావనమునఁ గనుఁగొని యందు - వలసినయవి గొంచు వడి లంక కరుగు
కనురెప్ప వెట్టెడు కంటె వేగమునఁ - జనియెదు నామంత్రసామర్థ్యమునను"
అనవుడుఁ గపటసంయమిఁ జూచి పవన - తనయుండు పల్కె "నోతాపసాధీశ!
అక్కడ లక్ష్మణుం డబ్భంగి నుండ - నిక్కడ నుచితమే యిటు నాకు నిలువ?
ఫలములు నా కేల? పతి పంచుకోర్కి - ఫలముగా సౌమిత్రిఁ బడయకమున్న
నిద్రవోవుట నాకు నీతియె? దీర్ఘ - నిద్ర గైకొని రామనృపుతమ్ముఁ డుండ
జలము లల్పంబులు చాలవు; లేదె - నలినాకరంబైన నదియైన?" ననుఁడు
"ఉన్నది చేరువ నొకదివ్యసరసి - కన్నులు మూసి యాకమలాకరమున
నమృతోపమానంబు లగునిర్మలోద - కములు ద్రావిన దివ్యకాయుండ వౌదు6600
దృగ్గోచరము లగు దివ్యౌషధములు - దిగ్గనఁ జను"మంచుఁ దెరువు సూపుటకుఁ
కపటసంయమి శిష్యగణము నంపుటయు - గపివీరుఁ డేతెంచి కనియె నక్కొలను
మాకందమందారమాధవీవకుళ - శాకోటకుటజకచందనసాల
నీపార్జునాశోకనింబకదంబ - తాపింఛతరు లసత్తటముల దాని
లలితకల్లోలడోలాకేలిఁ దేలు - కలనాదకలహంసగతు లొప్పుదానిఁ
బటుహంసవేషచుంబకపికక్రౌంచ - పటలకారండవప్రతతులదాని
వెనుకొని తముఁ బిల్చి విరహులమీఁద - బనిచిన గెల్చి నిర్భరవృత్తి గొన్న
విపులాభిమానార్థవితతు లీకున్నఁ - గుపితుఁడై రతిరాజు కొఱ్ఱులఁ బెట్టె
ననఁ బక్వబంధంబులై వాఁడి మిగుల - మొనసిన కైరవముకుళాగ్రశిఖల
మూఁగి చలింపని మొకరితుమ్మెదల - బాగొప్ప నొప్పుల బలసినదాని6610
మఱికొన్నియెడలను మకరందములకుఁ - దెఱపి చూపక తమ్ముఁ ద్రిప్పుచు నున్న
కమలగేహాంతరకమలకుఁ బ్రీతి - సమరీతి మంగళాచారగీతములు
నలిఁ బాడుగాయకనాయకు లనఁగ - మెలపున నందంద మృదురీతి మ్రోయు
మధుపానరసమత్తమధుకరతతుల - బధిరాబ్జపుటసమీపము లొప్పుదానిఁ
గాము నుగ్రాక్షుచేఁ గ్రమ్మఱఁ బడయఁ - గామించి నీరమాకందబృందంబు
లలరు నగ్నులలోన నాజ్యహోమములు - చెలువొంద నందంద చేయుచందమునఁ
జిలుకలు చంచులఁ జించినఁ దొరుఁగు - పొలు పెంతయును జూడఁ బొసఁగెడుదాని
ఫలరసంబులు వచ్చి పైఁబయిఁ దొరుఁగ - నొలసి చెందొవలలో నుండరాకున్నఁ
దొలఁగు నుజ్జ్వలహోమధూమంబు లనఁగ - నలు లాకసంబున నమరెడుదాని
నాకంచపత్రంబు లనుపళ్ళెరముల - శ్రీకరాక్షతములు చెలువొప్ప నునిచి6620
కొల నప్పుడును త్రుళ్ళఁ గువలయవలయ - దళవిలోచనములఁ దనరాక కెదురు
చూచుతెఱంగున శోభిల్లుదానిఁ - జూచి డగ్గఱ వచ్చి సుఖకేలిఁ దేలి
యడరు సమ్మదమున నానంద మంది - కడు విస్మయం బంది కన్నులు మూసి
యక్కొలనికి డిగ్గి హనుమంతుఁ డంత - నెక్కొన్నతృష్ణతో నీళ్ళు ద్రావఁగను
బొలుపార సంసారభూరివారాశి - మలగుచు వర్తించు మాయావధూటి
విషయరసంబులు వేడ్కతోఁ గ్రోలు - తృషితునిఁ గబళించితెఱఁగు దీపింప
నురవడి యందుండి యొకమహామకరి - హరినాథుపాదంబు లలమి పట్టుటయుఁ
దగిలినయంఘ్రు లుద్ధతశక్తిఁ దిగిచి - తిగువఁజాలక చాల ధీరుఁడై నిలిచి
యిది యేటిదో యని యేర్పడఁ జూచి - మది వాయుసూనుండు మకరిగా నెఱిఁగి
యంతకంతకు మది నలుక రెట్టింప - నంతలో నతినిష్ఠురాకారుఁ డగుచు6630
వేవేగ రఘరాము విజయవల్లభుల - కావాలమమై వ్రాలు నావాల మెత్తి
రాగరసోద్రేకరావణాయోగ - భోగసంచితపాపములు డుల్చుపగిది
వాల మంకించి దుర్వారుఁడై విజయ - లోలుఁడై మకరిపండులు డుల్లవ్రేసె

హనుమంతుని మకరి మ్రింగుట

సంతతమునిశాపరోగమున - కంత మీయౌషధ మని మ్రింగుకరణి
నఱిముఱి మకరి మహారోష మెత్తి - మెఱసి యాహనుమంతు మ్రింగఁజొచ్చుటఁయు
"నక్కటా! రాముకార్యము నిల్వఁబడియె - నిక్కడ దీనిచే నిట్టిచందమునఁ
దెగిపోదునో యింకఁ దెఱ గేది?" యనుచుఁ - దగ విచారించి యుద్ధతి వాయుసుతుఁడు
కడుపులోపలఁ జొచ్చి కడతేర్తు ననుచు - నొడిసి మ్రింగుచునున్న నూరకయుండి
పదిలుఁడై యంధకూపముబోని మకరి - యుదరంబుఁ జొచ్చె నాయురుబాహుబలుఁడు
అంత నామకరియు నాహారబుద్ధి - సంతోషమునఁ బోయె జలమధ్యమునకు6640
ఆవీరవరుఁ డంత నలుకతో దాని - ప్రేవులు నరములు పెనచి త్రెంచుచును
నడరినకడఁకతో నమ్మహామకరి - కడుపులోపల విషకబళంబపోలె
నరుగక తిరుగుచు ననలంబుభంగి - జురపుచ్చఁ దొడఁగిన స్రుక్కి యమ్మకరి
దేహంబులోపలి ధృతి దీఱ డించి - దాహంబుపెంపున ధరియింపరాక
వఱువట్లు వెట్టెడు వదనగుహ్వరము - తెఱచి నిల్పుటయు నత్తెరువున వచ్చి
క్రూరనక్రగ్రాహఘోరప్రవాహ - వారిపైఁ బడుటయు వారినందనుఁడు
పెనచి త్రెంచిన దానిప్రేవులు ముద్ద - గొనివచ్చి చెచ్చెఱఁ గుత్తుకఁ దురిమె
ఆలోన మకరియు నాహార మరుగఁ - బోలదు పొమ్మని బుద్ధిఁ జింతించి
పరవశ యగుటయుఁ బవననందనుఁడు - దరిఁ జేర్చి మకరి నుద్ధతి వ్రచ్చి వెడలి
కోరి చూడఁగ నొప్పె ఘోరాంధకార - దారుణనిర్ముక్తతరుణార్కుపగిదిఁ6650
బ్రళయారుణోదగ్రబడబాగ్నిశిఖలు - కలయఁ బర్విన నాఁటిఘనపయోరాశి
కరణి నమ్మకరిరక్తములతోఁ బెరసి - యరుణమై కడునొప్పె నప్పు డాసరసి
యంత నామకరియు నమరియై యమరి - యంతరిక్షమున నుద్యద్విమానమున
జలదంబులోపలఁ జపలత మాని - మెలఁచు తిరమ్మైన మెఱపుచందమున

ధాన్యమాలిని తనశాపప్రకారము హనుమంతునితోఁ దెల్పుట

నిలిచి మారుతిచేత నిజశాపముక్తి - గలిగిన నలరి యక్కపిముఖ్యుఁ జూచి
“యోకపికుంజర! యోవానరేంద్ర! - నీకతంబున శాపనిర్ముక్తి గంటి;
నే నింకఁ బోయెద నింద్రలోకమున - కేను నీ కొకవార్త యెఱిఁగింపవలయు;”
నని మున్ను హనుమంతు నక్కొలనికినిఁ - బనిచిన కపటదాపసిఁ జూపి పలికె;
“వానరోత్తమ! మునివరుఁడు గాఁ డరయ - వీని నమ్మకుమయ్య! వీఁడు రాక్షసుఁడు
చలమున దానవేశ్వరునియోగమున - బలియుఁడై నినుఁ జంపఁ బనిపూని వచ్చి
యే నిందులో నున్కి యెఱిఁగి నాచేతఁ - బూని ని న్జంపింపఁ బుత్తెంచినాఁడు;
వీఁడు వధ్యుఁడు నీకు వీని నమ్మకుము - వీఁ డొప్పఁ డిటమీఁద వేవేగ చంపి
పొమ్ము నీ వౌషధంబులకు ద్రోణాద్రి - కిమ్ముల నటఁ బోవ నిదె నీకుఁ ద్రోవ”
అన విని హనుమంతుఁ డాశ్చర్య మంది - వనితఁ గనుంగొని వలనొప్పఁ బలికె;
"మదిరాక్షి! మును నీవె మకరివై యుండి - త్రిదశభామిని వైనతెఱఁ గేమి?" యనిన
“వినవయ్య! పావని! వీరాగ్రగణ్య! - కనకాద్రిసమధైర్య! గాంభీర్యధుర్య!
ధాన్యమాలిని యనఁ దనరుగంధర్వ - కన్యక నాజన్మకథ యేర్పరింతు;
నఖిలలోకారాధ్యుఁ డగుసదాశివుఁడు - సుఖగోష్ఠి రజతాద్రి శోభిల్లుచుండ6670
నరుదార నే పాడి యాడి మెప్పించి - హరుచేత నసమాన మగువిమానంబు
వడసి యిక్కొలనిలోపల జలక్రీడ - లెడపక కావింప నేగుదెంచుటయు
శాండిల్యుఁ డనుముని చనుదెంచి నన్ను - నిండినప్రేమంబు నెలకొనఁ జూచి
యాలోనఁ దనలోన నానందకేలి - నాలోకనాలోలుఁ డయి తేలి తేలి
కొనకొని తూకొన్న కోర్కుల వాలి - మనసిజజ్వరమున మానంబు దూలి
"యేను బుణ్యాత్ముండ నేఁ దపోధనుఁడ - నే నేడ? యెలనాఁగ యేడ? పొ" మ్మనక,
యూని న న్గామించుచున్న క న్నెఱిఁగి - "యే నేడ? యీ వేడ? యీదృష్టి యేల?
నీవు తపస్వివి నీవు పుణ్యుఁడవు - భావింప నిది తపఃఫలవిఘ్నకారి”
యన విని మునినాథుఁ డతికాముఁ డగుచు - ననుఁ జూచి మదిలోనియాస వోవిడిచి
"యిది తపఃఫలసార మెలనాఁగ! నాకు - నిది పుణ్యఫలసార మెలనాఁగ! నాకు;6680
నిది మోక్షసాధన మెలనాఁగ! నాకు - నిది స్వర్గసోపాన మెలనాఁగ! నాకు”
ననిన “రజస్వల యటుఁ గాన నేఁడు - మునినాథ! నను మీరు ముట్టఁగా రాదు
ఇమ్మూఁడుదివసంబు లేను మీయింట - నెమ్మితో వసియించి నిజశుద్ధిఁ బొంద
మఱి పొందు" మని గంధమాదనంబునకు - నెఱి నేగి మునియింట నిష్ఠతో నుండ
దిక్కులు సాధించి తివిరి రావణుఁడు - నక్కొండ సబలుఁడై యారాత్రి విడిసి
యాపర్వతాగ్రంబునం దేను బాడ - నాపాట విని దశాననుఁ డేగుదెంచి
తనసొంపు దనపెంపు దనప్రతాపంబు - తనపేరు నెఱిఁగించి తగ బుజ్జగించి

"వనిత! నీరూపయౌవనవిలాసములు - మునుమిడిఁ దుదముట్ట ముట్టవే నన్ను”
ననినఁ “బరాధీన నంటఁగారాదు - నను ముట్టఁ దగ" దన్న నరభోజనుండు
“ఆరయ రజస్వల లయినకామినులు - పరభామినులు సువ్వె భామ! నా మెచ్చు6690
వనిత! నన్ గాఱింపవలదు ర"మ్మనుచు - ననుఁ బ్రియోక్తులఁ దేల్చి నాతో రమింప
నతికాయుఁ డుదయించె నంత నాపుత్రు - నతివేగమున దానవాగ్రణి కిచ్చి
దివసత్రయంబును దీఱినపిదప - ప్రవిమలతనుశుద్ధిఁ బాటించి యేను
మునిగణాధీశ్వరు ముందఱ నిలువఁ - గనుఁగొని నాయున్నగతి వివేకించి,
“నాయింటిలో నుండి ననుఁ డాఁగురించి - పోయి నీ వెవ్వరిఁ బొందితి ప్రీతి?
నింతి! నీయౌవన మెవ్వండు గొనియె? - చింతింప కి ట్లేల చేసితి వీవు?
పరమపరిజ్ఞానభావమార్గమున - నరసి చూచిన నది యట్టిద కాదె?
పరహిత మేయూరు? పడఁతు లేయూరు? - గురుశీల మేయూరు? గొంతు లేయూరు?
జలజాక్ష లేయూరు? సత్య మేయూరు? - కలకంఠు లేయూరు? కరుణ లేయూరు?
వనజాక్షు లేయూరు? వరుస లేయూరు? - ననఁబోడు లేయూరు? నచ్చి కేయూరు?6700
తరలాక్షు లేయూరు? తగవు లేయూరు? - పరికింప సతులకు బాస లేయూరు?"
అని తీరఁ గోపించి యమ్మునీశ్వరుఁడు - ఘనశాప మిచ్చె సత్కరుణఁ బోవిడిచి
"యీసరోవరమున నీవిలాసంబు - గాసిగాఁ బడ నీవు గ్రాహివై యుండు
మెందేని బహుపుణ్యహీనుఁ డై నిన్నుఁ - బొందినవాఁడును బుత్రమిత్రాది
బలములతోఁ గూడ భస్మమై పోవఁ - గలఁ డింక నీపాతకంబున" ననుచు
శాప మిచ్చుటయును జలనంబు నొంది - యాపుణ్యనిధిమ్రోల హస్తము ల్మొగిచి
“యోమునివల్లభ! యోమునిచంద్ర! - యోమునిసింహమ! యోమునిశ్రేష్ఠ!
యీశాపజలరాశి యేతెప్పఁ గడతు? - నీశాపదావాగ్ని యేనీట నార్తు?
గరుణింపవే దయాకర! నన్ను" ననుచు - నురుభీతి నొందుచు నున్న వీక్షించి,
తిరమైనసుజ్ఞానదృష్టి నూహించి - పరమకృపామూర్తిపరుఁ డిట్టు పలికెఁ ;6710
“గామిని! యొకకొంతకాలంబు చనఁగ - రాముకార్యార్థమై రానున్నవాఁడు
హనుమంతుఁ డిచటికి నతనిచే నీకు - ఘనశాపనిర్ముక్తి గలుగుఁ బొ" మ్మనుచుఁ

మునివేషధారి యగుకాలనేమిని హనుమంతుఁడు చంపుట

బోయె గంగాతీరమునకు నమ్మౌని - పోయె శాపం; బేను బోయెద నింక;”
నని చెప్పి దీవించి యాసరోజాక్షి - యనిలజు వీడ్కొని యరిగె నద్దివికి;
ఎడపనికడఁకతో నిటఁ గాలనేమి - కడ వచ్చి నిలిచె నాకపికులోత్తముఁడు
అప్పు డప్పాపాత్ముఁ డచలసమాధిఁ - దప్పక యున్నచందమునఁ గూర్చుండి
యొడలిపూరంబుతో నుర మెల్ల విచ్చి - నడుము నిక్కించి యానన మొప్ప వంచి
కపటచింతావృత్తిఁ గన్నులు మూసి - జప మాదివరుసఁ బూసలు త్రోసిత్రోసి

నిక్కంపుజపముగా నెఱ నోరు గదల - నక్కలి గనువిచ్చి హనుమంతుఁ జూచి
“యీయున్నమడు వేల? యీతడ వేల? - పోయినపని యెంత? ప్రొ ద్దెంత వోయె?6720
నొలసి నీమదిలోన నుపదేశవాంఛ - గలదేని గురుపూజ గలదె యేమైన?
మా కిప్పు" డనవుడు మారుతాత్మజుఁడు - "నీ కిదె గురుపూజ! నెమ్మిఁ గొ" మ్మనుచుఁ
బ్రథననిష్ఠురుఁడు నిర్భరవృత్తి వాని - బృథుబాహుమధ్యంబుఁ బిడికిటఁ బొడిచె
నాక్షణంబున దైత్యుఁ డారూప ముడిగి - పక్షియై రణవీథిఁ బావనిఁ గదిసెఁ;
గదియుటయును బట్టి కడిమి దీపింప - జరిపి రెక్కలు రెండు సరిద్రుంచివైచె;
నారూప ముడిగి మాయాశక్తి మెఱసి - ధీరసింహాకృతిఁ దివిరి లంఘించి,
గర్జించి దంష్ట్రల గడునుగ్రుఁ డగుచు - గర్జించి రణవీథి దర్పించె నసుర;
అలయక హనుమంతుఁ డక్కాలనేమి - తల బిట్టుపగుల నుద్ధతశక్తిఁ బొడిచెఁ;
బొడిచిన నారూపు పోనిచ్చి యసుర - కడఁగి సుగ్రీవుఁడై కదియ నేతెంచి
"యిది యేమి? మారుతి! యిచట నేమిటికి? - పదపద! లక్ష్మణుప్రాణము ల్వచ్చెఁ6730
దొలఁగక నీ వింక ద్రోణాద్రి కరుగ - వల దౌషధంబులు వల దింక మనకు”
ననవుడు హనుమంతుఁ డతని సుగ్రీవుఁ - డని చూచి తెలిసి కాఁ డని నిశ్చయించి
యలిగి రాక్షసునుర మదరంట వేయ - నిలఁ గూలి మూర్ఛిల్లి యింతలోఁ దెలిసి
యతఁడును శతశృంగుఁ డై హనుమంతు - నతిశాతనఖముల నడరి నొప్పింప
ముష్టిఘట్టనముల మొగిఁ బాదహతుల - నష్టసత్త్వునిఁ జేసి నలిఁ జిక్కువఱిచిన
యమితసత్త్వక్రీడ నవలీలఁ దిగిచి - కమలనాళము ద్రెంచు గంధసింధురము
పరుసున రాక్షసప్రవరమస్తకము - తెరలిచి వెన నుల్చి త్రెంచి పోవైచి
నలి నేచి వెస సింహనాదంబు చేసి - తొలఁగక మారుతి ద్రోణాద్రి కరిగె.
నరిగి యాగిరిమీఁద నౌషధలతలు - పరికించి పరికించి పవననందనుఁడు
బహుదివ్యలతికావిభాభాసమాన - మహిమయు నిర్మలమణిగణప్రభల6740
దీపవృక్షంబుల దీప్తులు పర్వి - దీపించునక్కొండ ద్రిమ్మరి చూచి
హితపుష్పగంధంబు లివె లత లనుచు - నతఁడు దగ్గరఁ బోవ నవి డాఁగిపోయె!
నంత నాహనుమంతుఁ డంతరంగమునఁ - జింతించి సంతాపచిత్తుఁడై పలికె
“నోపర్వతాధీశ! యోయద్రిరాజ! - యోపుణ్యవత్సల! యోగిరిచంద్ర!
యనఘుఁ డారఘురాముఁ డౌషధంబునకుఁ - బనిచిన వచ్చితిఁ బనిపూని యేను
నిన్నిలోకములకు హిత వైనపనికి - న న్నేల వంచింప నగరాజ! నీకు
నడరి నీయందున్న యౌషధలతలు - పొడసూపు వేవేగ పోఁ బనిగలదు;
ఇమ్ముల నిది లోకహితకార్య మగుట - మిమ్ము వేఁడెద మీరు మీప్రభావముల
దీపింపుఁడీ యోషధీలతలార! - చూపుఁడీ నాకు మీసురుచిరాకృతుల"
నని పల్క వంచన నపుడు తేజముల - పొనుపటఁ దన కవి పొడసూపకున్న6750

నగకులోత్తమ! నీకు నారాక చూచి - తగు ప్రియం బొనరింపఁ దగ దూరకుండ”
నని తన్నుఁ బ్రార్థించి యడుగుచునున్న - తనకు నౌషధము లాధరణీధరంబు
చూపకుండుటయును జూచి యెంతేని - కోపించి వానరకులవజ్రపాణి
"యే నెంతవేఁడిన నేల నీమనసు - నానదు నాయెడ నగకులాధముఁడ
తలకొని ఱాలకు దయగల్గు నన్నఁ - గలుగునే గుణశూన్యకఠినమూర్తులకు”
నని యుగ్రకోపాగ్ను లంగరోమములఁ - గనదగ్నికీలలై క్రమ్మఁ బైఁ గ్రమ్మి
రాముతో నెదిరిన రావణాచలము - నీమెయిం బెరుఁగుదు నిల ననుమాడ్కి
దశయోజనముల విస్తారంబు పంచ - దశయోజనోన్నతత్వంబును గలుగు
నాభీలతరశైల మవలీలఁ బెఱికె - భూభాగ మగల నభోభాగ మద్రువ
నపు డాగిరి సురేంద్రుననుమతిఁ గాచు - తపనతేజులు త్రయోదశకోటిసంఖ్య6760
గలచిత్రసేనాదిగంధర్వపతులు - బలశౌర్యములు మీఱఁ బావనిఁ జూచి
"యిది దివ్యగణవాస మిది మేరుతుల్య - మిది జగజ్జీవనం బిది నీకు వలదు;
నీ కిది దక్కదు నెరి డించి పొమ్ము - పోకున్నఁ బ్రాణము ల్పోకుండ" వనుడుఁ
గదనోగ్రసమవర్తి కపివీరుఁ డార్చి - వదలనికడిమిమై వారి నీక్షించి
బంధురం దిగు వాలపాశంబుతోడ - బంధించి బంధించి బలువిడిఁ ద్రిప్పి
యలుకమైఁ గొందఱ నబ్ధిలో వైచె - నలుకమైఁ గొందఱ నడరి కారించె;
నలుకమైఁ గొందఱ నదరంట వేసె - నలుకమైఁ గొందఱ నవనిపైఁ గూల్చె;
నామహావీరు నుద్ధతిశక్తిఁ జూచి - సోమింపరా దని స్రుక్కి కేల్ మొగిచి
“యోకపికుంజర! యోవానరేంద్ర! - యీకొండ గొనియేగు మెలమితో నీవు”
అని వాయునందను నర్థి దీవించి - వినుతించి గంధర్వవీరులు దొలఁగ6770
నధికసత్వంబున ననిలనందనుఁడు - కుధరంబు బి ట్టెత్తుకొని మింటి కెగసి
కడువేగమున భయంకరవృత్తి దోఁప - నడరి జితారాతియై సొంపు మిగిలి
భూచరఖేచరాద్భుతవేగుఁ డగుచు - నాచందమునఁ బోవ నామధ్యరాత్రి
భ్రామితమిత్రుఁడౌ భరతుస్వప్నమున - రామసౌమిత్రులు రణమధ్యమునను
దలనూనియలతోడ దనువులు డస్సి - బలహీనులై క్రుస్సి పంకమధ్యమున
బడి పలవించుచు పలురోదనంబు - లుడుగక కావించుచున్న బిట్టులికి
భరతుండు మేల్కని పాపంపుఁగలకుఁ - బరితపించుచు వెలుపలికి నేతెంచి
కలలోన రామలక్ష్మణు లున్నతెఱఁగు - తలపోసి తలపోసి తలఁకుచు నుండఁ
దొడఁగి దానికిఁ దోడు దుర్నిమిత్తములు - కడఁగి పెక్కులు దోఁపగా భీతిఁ బొంది
"యిది యేమి పాపమో? యిది యేమి తెఱఁగొ? - యిది యింక నిటమీఁద నేమి గాఁగలదొ?6780
రామసౌమిత్రు లరణ్యమధ్యమున నేమైరొ? జానకి యేమైనయదియొ?
యెన్నంగఁ బదునాలుగేండ్లును నిండు - చున్నవి; వినఁగరా దొకవార్తయైన,

నాసత్యధనులకు నాయుదారులకు - నాసదాచారుల కాకృతార్థులకు
నేకీడుఁ గాకుండ నేను నాసుకృత - పాక మిచ్చితి" నని భరతుండు పలికి
భావించి వేదతత్పరుల భూసురుల - వేవేగ రావించి వేదోక్తయుక్తి
సకలదానంబుల సకలధర్మముల - సకలహోమంబుల శాంతి చేయించె,
నాలోన హనుమంతుఁ డాకాశవీథి - నాలోలబాలార్కుఁడై వచ్చివచ్చి
బలిసిననిష్ఠతో భరతేశుఁ డున్న - పొలుచు నందిగ్రామపురిఁ జేరవచ్చి
ఘనజటాభారవల్కలములతోడ - ఘనఘనశ్యాముఁ డై కమలాప్తకులుఁడు
భరతుఁ డారఘురాముభంగిఁ దోఁచుటయుఁ - గర మద్భుతం బంది కపిముఖ్యుఁ డపుడు6790
"సౌమిత్రి మృతుఁ డైన జానకి డించి - రాముఁ డొక్కరుఁ డిటు రాఁబోలు” ననుచు
నడుగుదునో యంచు నడుగఁబొ మ్మనుచు - గడఁకతోఁ దలపోసి కపికులోత్తముడు
శరణాగతత్రాణచరితార్థచరితుఁ - డరయంగ రఘురాముఁ డభిరామబలుఁడు
తనసూనృతము డించి తమ్ముని డించి - తనకులసతి డించి తనపేరు డించి
యంగదసుగ్రీవు లాదిగాఁ బ్లవగ - పుంగవకోటులఁ బోరిలో డించి
మొనసి రావణుఁ బ్రాణములతోడ - డించి తనమేనుఁ దెచ్చునే దశరథాత్మజుఁడు?
మానవసామాన్యమతిఁ జేసి రాము - నే నేల చూచితి? నీ పిన్నచూపు;
ఒలసి రామునిఁబోలు నొకతపోధనుఁడు - కలిగినాఁ డింతియ కాఁబోలు ననుచు
నతివేగమున లంక కరిగెడుత్రోవ - నతులబలోదాత్తుఁడై పోవఁబోవ
కల గన్నభరతుఁ డాకాశంబుఁ జూచి - యలఘుఁడై చనుచున్న హనుమంతుఁ గాంచి6800
యిట దోఁప నేలొకో? యీదుర్గ్రహంబు - నటు బాణములు దీనిఁ బడనేయవలయు
నని శరచాపంబు లాటోప మొప్ప - ఘనసత్త్వుఁ డప్పుడు కైకొన్నఁ జూచి
కాకుత్స్థతిలకుఁ డాకర్ణించుకొలఁది - నాకాశముననుండి యశరీరి పలికె;
“నీతనిదిక్కున హితబుద్ధి సేయు - మీతఁడు మీబంధుఁ డీ వల్గవలదు”
అని యొప్పఁ బలికిన యశరీరిపల్కు - విని శరచాపము ల్విడిచె నవ్విధుఁడు;
అంత నాహనుమంతుఁ డంభోధిఁ గదియ - నంతలో రాక్షసు లక్షీణబలులు

హనుమంతునితో మాల్యవంతుఁడు పోరుట

ఉదితబలోదగ్రు లుగ్రవి క్రములు - పదివేలుకోటులు బలిసి త న్గొలువ
రావణుపనుపున రణజయస్ఫురణ - వావిరి నమ్మాల్యవంతుఁడు వచ్చి
చదల నెదుర్పడి జలధిమధ్యమునఁ - బొదివి యాహనుమంతుఁ బోనీక కదిసె
గదిసిన నక్కొండ ఘనబాహుశక్తి - బదిలంబుగాఁ బట్టి పవననందనుఁడు6810
దాఁకిన భుజబలదర్పము లెఱయ - వీఁకతో రాక్షసవీరులు గదిసి
పరశుతోమరచక్రపట్టసప్రాస - కరవాలశూలముద్గరభిండివాల
తతుల నొప్పింప నుద్ధతిఁ బెచ్చు పెరిఁగి - యతులవిక్రమదక్షుఁ డవి లెక్కగొనక

యమరు లచ్చెరువంద ననిలనందనుఁడు - సమరలీలాభీలచటులవాలమునఁ
గడఁకతో నొడిసి రాక్షసవీరవరుల - వడిఁ జుట్టిపట్టి యవ్వనధిలో వైచె;
భంజించెఁ గొందఱఁ బదతాడనముల - భంజించెఁ గొందఱ భయదనాదముల,
భంజించెఁ గొందఱఁ బటువాలహతుల - భంజించెఁ గొందఱఁ బరుషోగ్రదృష్టి
గొందఱఁ బడఁద్రోసెఁ గొందఱ వ్రేసెఁ - గొందఱఁ గారించెఁ గొందఱ నొంచె
నంత రోషాయత్తుఁడై మాల్యవంతుఁ - డంతకాకారుఁడై హనుమంతుమీఁద
నెనయ బాణములు నూ ఱేసె నేయుటయు - ఘనవాలమున వాని ఖండించివైచి6820
యలుక వి ల్లొడిసి యల్లటుఁ బాఱవైచి - బలుతోఁకచేఁ గాళ్లు బంధించి యెత్తి
వడి వైచుటయు మాల్యవంతుఁడు మగిడి - పొడిచె నమ్మారుతపుత్త్రు శూలమున
నది లెక్క సేయక యతఁ డున్నఁజూచి - యదరులు చెదరంగ నత్యుగ్రశక్తి
నురము నొప్పించిన నురుశోణితంబు - లురువడిఁ దొరుఁగంగ నొక్కింత నిలిచి
యలుకతోఁ గపివీరుఁ డసమున వాని - తలఁదాఁచి చని వియత్తలమున నిలిచె;
దలకొని దివిజులు తల లూచి పొగడఁ - దలఁ దన్నుటయు వానితల బిట్టుపగిలి
యోలిఁ గీలాలంబు లొలుకలో దారి - యాలోన మూర్ఛిల్లి యంతలోఁ దెలిసి
“కదనరంగమున నిగ్గద గదా నీకుఁ - దుది" యంచు గద యల్కతో బిట్టు వైచి
తడయక యది తాఁకుతఱి మంట లెగయ - వడిఁ జూచి యమ్మాల్యవంతుఁ డిట్లనియె.
“నోరివానరుఁడ! యీయుదధిలో నద్రి - బోరనఁ బడవైచి పో నిన్నుఁ జంప6830
మొననేసి తొల్లి సముద్రమధ్యమున - వినతాత్మజుని నెక్కి విష్ణుండు వచ్చి
నాతోడ యుద్ధంబు నలిఁ జేసి చేసి - భీతుఁడై చాలక పెనుపేది పోఁడె?
లోకంబు లెఱుఁగ ముల్లోక మీకడిమి - నీ కోర్వరాదు రా నెరి నాదుకిన్క”
అనవుడు హనుమంతుఁ డమ్మాల్యవంతుఁ - గనుఁగొని పలికె నుత్కటకోపుఁ డగుచు
“యుద్ధమధ్యమున మహోద్ధతి - మెఱసి వృద్ధరాక్షస నీవు వెఱవక నన్నుఁ
గదియ నెవ్వఁడ” వని కదియు నవ్వీరు - మదభాషలకు నల్గి మాల్యవంతుండు
ఘనచంద్రహాసోగ్రఖడ్గ మంకించి - హనుమంతువక్ష ముద్ధతిశక్తి వైవ
నది వజ్రనిభకాయుఁ డగు నాంజనేయు - విదితంబుగాఁ దాఁకి వెసఁ బెల్లు విఱిగె;
ననిలజుఁ డాఖడ్గహతి కింత నొచ్చి - కినిసి నిశాచరుఁ గిట్టి బిట్టలిగి
భూతభయంకరాద్భుతవాల మెత్తి - యాతనిమెడఁ జుట్టి యలుకతోఁ బట్టి6840
చెలఁగి యాకసమున జిరజిరఁ ద్రిప్పి - యలఘువిక్రమశీలుఁ డబ్ధిలో వైచె;
వైచినఁ బడి మాల్యవంతుఁ డాత్రోవ - వేచని పాతాళవివరంబుఁ జొచ్చె;
హతశేషరాక్షసు లన్నిదిక్కులకు - ధృతిదూలి పఱచిరి దివిజు లుప్పొంగఁ
గొండంతగెలుపుతోఁ గొండతో నమర - మండలి వొగడ ధీమండనుం డరిగెఁ;
బర్వతదీప్తిఁ బ్రభాతవిభ్రాంతి - పర్వినభీతిమై భానువంశజుఁడు

శ్రీరాముఁడు లక్ష్మణునిఁ జూచి పరితపించుట

సమరలక్ష్మీరతిశ్రమ నిద్ర నొందు - క్రమమునఁ జెలువుఁడై రణశయ్య నున్న
తమ్మునిఁ గనుఁగొని “తమ్ముఁడా! నీవు - తమ్ముఁడవై యుండుతఱి నోచనైతి
నిల జీవులకు నెల్ల నిదె వేగెఁ బ్రొద్దు - పొలుపేది నాపాలి ప్రొ ద్దస్తమించె;
నఱిముఱి నడవిలో నాలిఁ గోల్పడితి - నెఱయ నేఁ డాజిలో నిన్నుఁ గోల్పడితి;
నెడ నాకునైన దుష్కీర్తిపంకంబు - గడప దిక్కెవ్వరు గలరు సౌమిత్రి6850
మానపయోనిధి మహనీయశీలు - నానోచి కన్న యున్నతపుణ్యశీలు
నేను నీచే నమ్మి యిచ్చిన నకట - కానలోఁ గొనిపోయి కడతేర్చి తన్న!
యే నేమి సేయుదు? నిటమీఁద నన్న - నేను సుమిత్రతో నే మన నేర్తుఁ?
దుదిఁ బోయి భరతశత్రుఘ్నులు నన్ను - గదియ నేతెంచి "లక్ష్మణుఁ డేడి" యనిన
నే మని చెప్పుదు? నేమని పోదు? - నాముఖంబునను దైన్యము దోఁప నింకఁ;
దేనికిఁ జింతింప; దేనికి వగవ - నేను జింతించెద నిను దీర్ఘచింత;
బలుఁ డైన రావణు గతులకుఁ జేసి - తలపోసి మది రోసి తమయన్నఁ బాసి
హితభృత్యవృత్తిమై నీవిభీషణుఁడు - చతురుఁ డైనను వచ్చి శరణంబుఁ జొచ్చెఁ
జొచ్చినఁ బ్రీతి రక్షోరాజ్య మెల్ల - నిచ్చితి నీ కని యే నూఱడించి
పట్టంబు గట్టితిఁ బ్రతినతోఁ బలికి - నెట్టన నిందింప నేర్పులేదయ్యె;6860
నిది వేగుచును వచ్చె నింక లక్ష్మణుఁడు - బ్రదుకఁడు నా కింకఁ బ్రాణము ల్వలదు;
దురితదూరుని వీనితోడిదె లోక - మరసి చూచిన నింక నడ లోర్వరాదు;
శరణన్నవారి నెచ్చట వీడరాదు - ధరణిపై క్షత్రియధర్మ మూహింపఁ
దారు లోనైనను ద మ్మాశ్రయించు - వారల రక్షింపవలయు రాజులకు
నీవిభీషణుఁ గొంచు నీ వేగి పుణ్య - భావుఁడైనట్టి మాభరతుతోడుతను
నరయ నిక్కడికార్య మంతయుఁ జెప్పి - పరఁగంగ లంకకుఁ బ్రతిగాఁగ నతని
వెలయునయోధ్యకు విజయలగ్నమున - ఫలసిద్ధి సొంపారఁ బట్టంబు గట్టు
మని "యేను జెప్పితి" నని యొప్పఁజెప్పి - యొనరంగ నందుండి యుచితంబుతోడ
వానరేశ్వర! నీవు వాలినందనుఁడు - సేనలఁ గొంచుఁ గిష్కింధకు నరుగు”
మన దైన్యపాటుతో నాడ భీతిల్లి - వనచరాధీశుండు వలనొప్పఁ గదిసి6870
“పరికించి చూడఁ బ్రభాతంబు గాదు - నరనాథ యిప్పుడు నాలవజాము
సొచ్చె నింతియ వాయుసూనుండు నిపుడ - వచ్చుసంతాపింపవల”దంచుఁ దేర్చె;
దేర్చిన నంతయుఁ దేలక మఱియుఁ - బేర్చిన శోకాగ్ని పెల్లున మిగులఁ
బొరిఁబొరి భూమిపైఁ బొరలుచు నగలఁ - బురపురఁ బొక్కుచు భూవరతనయుఁ
“డన్న! నే జనకాజ్ఞ నడవి కేతేర - నిన్నుఁ బొమ్మనకున్న నీవు నావెనుకఁ
జనుదెంచి యిడుమలఁ జాలంగఁ బడగఁ - గనుఁగొని మనమునఁ గరము శోకింతు

నేఁడు నీ వొరుచేత నీలావు దూలి - పోడిమి చెడి యిట్లు భూమిపై నుండ
నే నెట్లు బ్రదుకుదు? నేమని వగతు? - నే నిను డించి యె ట్లేగుదుఁ బురికి?
సీత నా కేటికి? జీవ మేమిటికి? - నీతరుచరసేన లేటికి నాకు?
నోతండ్రి! నా కింక నుర్వి యేమిటికి? - నాతండ్రిక్రియ నన్ను నరయుచుండుదువు;6880
నావిధి నిను నేఁడు నాకారిచేత - నీవిధి నిటు సేసె నీరసం బెత్తి;
దేశదేశముల సతీజనంబులను - దేశదేశములందుఁ దివిరి బాంధవుల
నరసి కానఁగ వచ్చునట్టిదేశములఁ - బరఁగుతమ్ముని నెందుఁ బడయంగ వచ్చు,”
నని యచేతనుఁ డగు ననుజుపై వాలి - కనుఁగొని దిక్కులు కడుధైర్య మెడలి
“యన్నరో! నీవు న న్న న్నని పిలువ - నెన్నఁడు వినఁగల్గు నింక వీనులకు?
సీత సుమిత్రగా నీమతిఁ జూకు - చూతు న న్దశరథక్షోణీశుఁ గాఁగ
నెప్పుడు నాతోడ నెడఁబాయకుండు - దిప్పుడు పాడియే యెడఁబాయ నన్ను
నాతతవిషమఘోరారణ్యభూమి - బ్రీతి నయోధ్యగాఁ బెంపునఁ జూతు
పూవుపాన్పున నిద్రఁ బొందించుమేను - నీ వెట్లు నేర్చితి నేఁడు ఱానేలఁ?
బడియు నిద్రించెదు పరిణామ మొందు - పుడమిపై నందన పొలుపొంద నీవు;6890
పదునాలుగేండ్లును బాయక నిద్ర - పదిలంబుగా డించి పన్నుగా నడవి
నరసి న న్రక్షించి యాజిమధ్యమున - నరులఁ జంపకపోవ నగునయ్య! నిద్ర!
నిద్ర నీ విట్లున్న నిజమయ్య! దీర్ఘ - నిద్ర మీయన్నకు నృపనందనుండ,
మీయన్న కెప్పుడు మిక్కిలి భక్తి - సేయుదు నేఁ డేల చింతింప వకట!
యున్నవంతయుఁ దూలి యుండెడుమాట - లిన్నియుఁ బొంపిరి నేల పల్కెదవు?
"రావణకోటుల రణములోఁ గూల్చి - భూవిభునందను భూసుతఁ గూర్తు"
నని నాకు వీనుల కసలారఁ బలుక - కునికికిఁ గత మేమి? యోపుణ్యమూర్తి!
యిప్పుడు మేల్కని యేల శ్రీరామ - తప్పఁ బల్కఁగ నీకుఁ దగునయ్య" యనుచు
“నొప్పెడిమాటలు నూఱడఁ జేసి - తప్పక కనువిచ్చి తనుఁ జూడు” మనుచు
రాసుతుకెంగేలు రమణమైఁ దిగిచి - భాసురంబుగ గండపాలికఁ జేర్చి6900
ననుఁ దేర్పవే” యని నరనాథుఁ డపుడు - మనమునఁ దెలియక మహిమీఁదఁ బడియెఁ
బడియున్న యారఘుపతిమూర్చ దెలిపి - యడలు వారించి రాయగచరాధిపులు;
అంత ప్రభామండలాభీలుఁ డగుచు - నంతలో హనుమంతుఁ డరుగుదెంచుటయు
దేజంబు పెంపున దృష్టింపరాక - తేజోదివాకరదీప్తుఁ డైయున్నఁ
గపులెల్లఁ గలఁగి యుక్కట భీతిఁ బొంది - విపులతరభ్రాంతివివశులై తూల
నాలోనఁ గమలాప్తుఁ డని చూచి విభుఁడు - కాలకాలోదగ్రగతి నిండనుండఁ
‘గపికులాధీశులఁ గలయ నీక్షించి - "కపులార! సూర్యునిఁ గంటిరే మింటఁ?
జేకొని బహుపుణ్యశీలంబులందు - మాకులంబున కెల్ల మహిఁ గర్తయైన

యంధకారారాతి యకట! యీపద్మ - బంధుండు నేఁడు నాపగవానిఁ గూడి
యుదయించుచున్నవాఁ డుగ్రత మిగిలి - యిదె వడి సౌమిత్రి యిబ్భంగి నుండ6910
నీసూర్యమండలం బిలమీఁదఁ గూల - నేసెద" నంచు నహీనసాహసుఁడు
బ్రహ్మాండకోటుల భంగింపఁ బొంగి - బ్రహ్మాదు లదరంగఁ బ్రళయకాలంబు
నాఁ డుగ్రవృత్తిఁ బినాకి విల్లంది. - వాఁడిమి మెఱయ నవ్వడువు దీపింప
నాపూర్ణభుజనైపుణాటోపకోపుఁ - డాపినాకియుఁ దానె యగుటఁ దెల్పుచును
విల్లంది భుజబలవిస్ఫూర్తి మెఱయఁ - బెల్లుకోపించి సంభృతవేగుఁ డగుచు
జటులరౌద్రాస్త్రంబు సంధింపఁ దివురు - పటువృత్తిఁ గనుఁ గొని భయవృత్తిఁ గలఁగి
యసమానసత్త్వుతో నతికోపుతోడ - వసుధేశుతో జాంబవంతుఁ డిట్లనియె.
"నగణితశక్తిమై నలుక దీపింప - జగతీశ! నీ విటు శరము పుచ్చుటయు
ధృతిదూలి నలుగడ దేవగంధర్వ - పతులెల్ల భీతులై పాఱుచున్నారు;
ఇది యేమి? రఘురామ యిచ్చలో నీవు - పదిలుండపై చూచి భావింపలేవు;6920
వెలుఁగొందు బహుదీపవృక్షదీధితులు - దొలుకాడు నుజ్జ్వలద్రోణాచలంబు
గొనివచ్చుచున్నాఁడు గురుసత్త్వధనుఁడు - అనిలసూనుఁడు గాని యర్కుండు గాఁడు
భానుప్రభాభాసి పవనసూనునకు - భూనాథ! యెదురుగాఁ బుచ్చు వానరుల"
ననుటయు శ్రీరామునానతి వడసి - హనుమంతునకు నెదు రరిగిరి కపులు;
ఆకాశముననుండి హనుమంతుఁ డంత - నాకొండఁ గొనివచ్చి యవనిపై నునిచి
జననాథుఁ డగు రామచంద్రున కర్థి - వినతుఁడై కరములు వెరవొప్ప మొగిచి
"యుర్వీశ! నేఁ బోయి యొగి నౌషధములు - పర్వతంబునఁ బెక్కుభంగుల వెదకి
పనివడిఁ గానక పర్వతంబెల్లఁ - గొని యేను వచ్చితిఁ గువలయాధీశ!
యడరి, మీయానతి నటఁ బోవునపుడు - నెడపనికడఁకతో నిట వచ్చునపుడు
కడఁగి విఘ్నము లనేకము లయ్యె నడుమఁ - దడయుట దప్పుగాఁ దలపోయ వలదు"6930
అనవుడు రాముఁ డాహనుమంతుఁ జూచి - ఘనతరసంతోషకలితుఁడై పలికె.
“నీ కేటి తప్పులు? నీచేత బ్రదికెఁ - గాకుత్స్థకులలీలగౌరవోన్నతులు;
సురుచిరశక్తిమై సురలకు నైన - నరుదైనపని చేసి" తని ప్రీతినొందె;

సుషేణుఁడు సంజీవకరణిచే లక్ష్మణుని మూర్ఛఁ దేర్చుట

నాసమయంబున నర్కతనూజుఁ - డాసుషేణునిఁ జూచి "యర్థి దీపింప
నిక్కొండఁ దడయక యీవు వానరులు - నెక్కి మహౌషధు లేర్పడఁ దెచ్చి
భావించి లక్ష్మణు ప్రాణము ల్వడయు - వేవేగ” యనవుడు విని సుషేణుండు
పని పూని యప్పుడు బరవసం బొప్ప - వనచరసహితుఁడై వడిఁ గొండనెక్కి
యమరేంద్రుఁ డిక్కడ నర్థితోఁ దొల్లి - యమృతపానము చేసె నమరులు దాను
నిచట విష్ణుఁడు జగద్ధితబుద్ధి పూని - యచలుఁడై తనచక్రహతిఁ ద్రుంచివైచె;

నురురాహుమస్తకం బుగ్రుఁడై" యనుచు - దరుచరవరులకు దవిలి చూపుచును6940
నొగిఁ బర్వతమున మహోషధు ల్దెచ్చి - తగఁ బ్రయోగింప నంతన దానిశక్తిఁ
దగిలి నాటినబాణతతు లోలి వెడలి - మగిడెఁ బ్రాణములు లక్ష్మణకుమారునకు;
నప్పుడు వానరు లందఱు గొలువ - నెప్పటిపేర్మితో నినవంశుకడకుఁ
జనుదేరఁ గౌఁగిట సౌమిత్రిఁ జేర్చి - కనుగవ హర్షాశ్రుకణములు దొరుగ
నాసమీరజుఁ జూచి “యతులపుణ్యాత్మ! - యీ సుమిత్రామిత్రు నిచ్చితి నాకుఁ
గాకుత్స్థకులమిత్రుఁ గమనీయగాత్రు - నేకతంబునఁ గంటి నేఁడు లక్ష్మణుని;
బడిననాతమ్ముని ప్రాణంబు లెత్తి - పడసితి నిపుడు నాప్రాణము ల్మగుడఁ;
బ్రాణంబులన నాకుఁ బరికింప నితఁడ; - ప్రాణబంధుండవు పరమబంధుఁడవు;
తరుచరోత్తమ! నీవ తలఁప నీచేయు - పురుషార్థ మొరులకుఁ బోలునే చేయ?
నుపకారమునకుఁ బ్రత్యుపకార మెలమిఁ - గపివీర! సేయుట గడునుత్తమంబు6950
నీకుఁ బ్రత్యుపకృతి నే నేరఁ జేయ - నీ కాపదలు లేవు నిఖిలలోకముల”
నని పల్కి రఘురాముఁ డంత సుషేణు - గనుఁగొని కొనియాడి కౌఁగిటఁ జేర్ప
ముదితాత్ముఁ డగుచు నిమ్ముల సుషేణుండు - నుదధి పొంగినక్రియ నుబ్బి యారాము
ననుమతి రణములో నటఁ బడియున్న - వనచరోత్తములు జీవము లెల్లఁ బడసె;
నంత వానరవీరు లంతరంగమున - సంతోష మెసఁగ నాశైలంబుఁ గదిసి
సకలరత్నోజ్జ్వలసానుశృంగముల - నకలంకరుచిఁ బొల్చు నాసొంపు చూచి
యవనీశు ననుమతి నగ్గిరి యెక్కి - వివిధస్థలంబుల వేడుకఁ దిరిగి
పరిపక్వఫలములఁ బరితృప్తి వొంది - పెరయతేనియ లాని పెన్నీరుఁ గ్రోలి
యవరోహణము చేసి రందఱు నంతఁ - బవననందను జూచి పలికె భూవిభుఁడు
“ఎప్పటిచోటనే యేర్పడఁ బెట్టు - మిప్పర్వతాధిపు నింక నీ"వనుచు6960
రాముఁడు పంప సంరంభంబు మెఱసి - యామహాశైలంబు ననిలనందనుఁడు
అలఘుఁడై కొనిపోవ నాకాశవీథి - జలధిమధ్యమున రాక్షసులు వీక్షించి
పఱచి యిత్తెఱఁగెల్లఁ బరువడిఁ దనకు - నెఱిఁగింప నేర్పడ నెఱిఁగి కోపించి
లంకాధిపతి జయాలంకారధనుల - శంకుకర్ణస్థూలజంఘులతోడ
నట మహానాదుని నటమహావక్త్రు - నటఁ జతుర్వక్త్రునిఁ నట మేఘజిత్తు
నట హస్తికర్ణు మహావీరజైత్రుఁ - గటువాక్యశాలి నుల్కాముఖుఁ జూచి
“యలపు సొంపును మీర లడ్డంబు దాఁకి - బలియు నాహనుమంతుఁ బట్టి తెం డొండె?
కొనిపోవుచున్న యక్కుధరంబు వుచ్చి - వనధిలోపలఁ బాఱవైచి రండొండె?
ఈ రెండుతెఱఁగుల నేర్పడ నొకటి - ధీరులై చేసి యేతెంచినఁ జాలు;
నచ్చుగా నతనికి నర్మిలి వెలయ - నిచ్చమై సగరాజ్య మిచ్చెద నిపుడె;”6970
నావిని విపులసేనాసహస్రముల - తో వారు వెడలి బంధురసత్త్వధనులు

దానవామరవేషధారులై కినుక - లూని రణోదగ్రు లుగ్రవిక్రములు
క్షురికాసితోమరశూలకోదండ - పరశుకుంతాదిక ప్రముఖశస్త్రములు
గనుకని గరించు కాలమేఘములు - పొనుపడ సూర్యునిఁ బొదువుచందమునఁ
ధరియించి మించిన దర్పంబు మెఱసి - యురుతరహుంకారహుంకారు లగుచుఁ
బొదివి యాహనుమంతుఁ బోనీక కదిసి మదమునఁ బేర్చి దుర్మదులు బిట్టార్చి
“దేవాసురుల మమ్ము దృష్టింప కోరి - పోవుచున్నాఁడవు భుజశక్తి మెఱసి,
యీకొండఁ గొనుచు నీ వెటఁ బోయె” దనిన - నాకపివీరుఁ డాయసురులఁ జూచి
విలయకాలాచలవిస్ఫులింగములు - తొలుకాడ నుజ్జ్వలదుర్జయాభీల
కాలచక్రాకారఘనవజ్రకఠిన - వాలచక్రముఁ ద్రిప్పి వడి వ్రేయఁ దొడఁగె;6980
సప్పు డారాక్షసు లడరి యెంతయును - నొప్పింప వాయుజుం డుగ్రకోపమున
భంజించెఁ గొందఱఁ బటువాలనిహతి - భంజించె గొందఱఁ బరుషోగ్రదృష్టి
భంజించెఁ గొందఱఁ బదతాడనముల - భంజించెఁ గొందఱ భయదనాదముల
ఘనసత్త్వుఁ డిబ్భంగి గయ్యంబు చేసి - వినుతవిక్రమమున విజయంబు నొంది
తోయజాప్తుఁడు పేర్చి తుప్పల దూలఁ - దోయదంబుల దూలఁ దోచుచందమున
రాక్షసవీరుల రణవీథి నొడిచి - నక్షత్రవీథి నున్నతశక్తి మెఱసి
పోవుచునుండ నాభుజశక్తిఁ జూచి - దేవగంధర్వుల దివినుండి యపుడు
పొరిఁబొరి నతనిపైఁ బూవులవాన - గురియుచునుండిరి కొలఁది కగ్గలము
అంతలో హనుమంతుఁ డతివేగుఁ - డగుచు నంతరిక్షంబున నరిగి యక్కొండ
మున్నున్నచోటనే ముదమొప్పఁ బెట్టి - క్రన్నన రఘురాముకడకు నేతెంచి6990
వినతుఁడై తనపోవువృత్తాంత మెల్ల - వినుపింప శ్రీరామవిభుఁడు హర్షించి
యావాయునందను నాలింగనంబు - కావింపఁ గనుఁగొని కపివీరు లెల్ల
వచ్చి లంకాపురవర మెల్లఁ గలఁగ - జెచ్చెఱఁ జేసిరి సింహనాదములు
భూరిదశానను పుణ్యచిహ్నములు - బోరున నొండెడ పోవుచందమునఁ
దఱిగి యాకసమునఁ దార లొండొండ - యరిగిపోవఁగఁ జొచ్చె నట వేగెఁ బ్రొద్దు:
దారుణస్ఫుటరోషదైత్యగర్వాంధ - కారంబుతో నంధకారంబు విఱిసె;
నని మీఱి వానరాననసరోజాత - ములతో సరోజాతములు వికసించెఁ
దమపెంపు లొగిఁ దూలి దనుజాస్యకైర - వములతో భువిఁ గైరవమ్ములు మొగిడె
భానువంశాధీశ బహుళప్రతాప - భానుతో భానుండు ప్రాగ్దిశఁ దోఁచె
జానకీవిభుఁ డంత సౌమిత్రిఁ జూచి - యూనినసంతోష ముల్లంబు నిండ,7000
“సదమలగుణముల సౌమిత్రి! నీవు - బ్రదికితి; నాపాలి భాగ్య మెట్టిదియె?"
యని యని కొనియాడు నతులవాక్యములు - విని లక్ష్మణుఁడు రామవిభునకు మ్రొక్కి
"దేవ! ప్రాకృతుఁడవె? దేవ! దీనుఁడవె? - దేవ! నిర్ధనుఁడవే? దేవ! యల్పుఁడవె?

యీభంగి యానతి యీ నేల నాకుఁ? - ద్రాభవంబునఁ బెంపుఁ బరికింప మఱచి
మును దండకారణ్యమునులకు సాధు - జనుల కిచ్చిన ప్రతిజ్ఞలు విచారించి,
యిచ్చలో మిము నమ్మి యీవిభీషణుఁడు - వచ్చిన నిచ్చినవరముఁ జింతించి
యినుఁ డస్తశిఖరికి నేగకమున్న - యని రావణునిఁ జంపు మఖిలలోకేశ!"
యనవుడు రఘురాముఁ “డౌఁగాక" యనుచు - ఘనరణవిక్రమక్రమశక్తి మెఱసె
నంత నావృత్తాంతమంతయు నెఱిఁగి - యెంతయుఁ జింతించి యిచ్చలోఁ గలఁగి

శుక్రునివద్ద రావణుఁడు శోకించుట

విక్రమక్రమశక్తి విడిచి రావణుఁడు - శుక్రుసన్నిధి కేగి స్రుక్కుచు మ్రొక్కి7010
“చుట్టాల భృత్యుల సుతుల సోదరుల - నెట్టన రఘురామునిశితబాణాగ్ని
దరికొని కాలిచి దగ్ధులఁ జేసి - పరఁగి యమోఘమై ప్రళయాగ్నిపగిది
నున్నది మాన్పరా కున్నది పోర - నన్నియుఁ దెగటారె నన్నియుఁ బొలిసె;
నేను బ్రాణములతో నెబ్భంగి నిలుతు? - నానతి యి"మ్మన్న నాశుక్రుఁ డనియె,
“నలఘుసంగరవీథి నరుల సాధింపఁ - గలయుపాయంబును గలుగ నేమిటికి?
నేవిఘ్నములు లేక యీవు హోమంబు - గావించు పుణ్యంబె కలిగినఁ జాలు;
భీమసంగ్రామగంభీరంబు లగుచు - హోమాగ్నిముఖముననుండి నీకడకు
నురురథాశ్వంబులు నుగ్రఖడ్గములు - శరచాపకవచము ల్సనుదెంచుఁ గడఁగి
యవి సాధనములుగా నరుల సాధింపు - మవి నీకు జయసిద్ధు" లనుచు నాతనికి
హోమమంత్రము లెల్ల నుపదేశ మిచ్చి - హోమమంత్రము లెల్ల నొగి నేర్పరించి7020
పొ" మ్మన వీడ్కొనిపోయి రావణుఁడు - క్రమ్మినకడఁకతోఁ గడునుగ్రుఁ డగుచుఁ
బురవప్రరక్షకు భూరిసత్త్వులను - బరికించి చతురంగబలములఁ బనిచి
యవధానతత్పరుఁ డయి నేగ లంక - గవకులు వేయించి కలయ శోధించి
యంత విద్యుజ్జిహ్వుఁ డనుమహావీరు - నంతకాకారు నుద్దతశూరుఁ బిలిచి
"నీవు నీబలమును నెలకొని నగరు - గావు మేమఱకుము గదలకు" మనుచు
బనిచి యనుష్ఠానపదశుద్ధిఁ బొంది - చని మృత్యువక్త్రంబుఁ జనఁ జొచ్చుభంగి
బాతాలగుహఁ జొచ్చి పదిలుఁడై నిలిచి - యాతతహోమకృత్యములకుఁ దగిన
రక్తవస్త్రంబులు రక్తమాల్యములు - రక్తచందన మనురక్తుఁడై తాల్చి

రావణుఁడు పాతాళహోమము చేయుట

బంధురదక్షిణప్రవణవేదికకు - గంధపుష్పాక్షత ల్గరమొప్ప నిచ్చి
యామహావేదిలో నగ్ని సంధించి - హోమమంత్రము లెల్ల నొగి నుచ్చరించి7030
వెరవొప్ప నాహోమవేదిలోఁ గలయఁ - బరికించి నిశితాస్త్రపరిధులఁ జేర్చి
శ్రీవృక్షభల్లాతసితముఖ్యసమిధ - లావృత్తిఁ గైకొని యంతట మఱియు

నోజసర్షపములు నొనర దూర్వములు - లాజలు దగ గుగ్గులంబును నగరు
నేయి దేనియ గల్గు నెత్తురుఁ బెరుఁగు - పాయసాన్నములు దర్భలు ప్రవాళములు
తగరులు మీలు గ్రద్దలు వరాహములు - నొగి నివి మొదలుగా నొప్ప వ్రేల్చుచును
నాశ్చర్యకరమైన యామహావేది - నిశ్చలతాధ్యాననిరతుఁ డై యుండె;
బలువిడి రావణుపాపంబు లెల్లఁ - గలసి పెల్లెగసినకైవడిఁ దోఁప
నామహాగుహనుండి యప్పు డత్యుగ్ర - ధూమంబు లురుతరస్తోమంబు లగుచుఁ
బటుతరనిర్ఘాతపవనసంఘాత - చటులంబులై నిక్కి చదలఁ బర్వుటయు
వెఱచిరి దివిజులు; వెఱచిరి మునులు; - వెఱచిరి దిక్పతు; ల్వెఱచిరి కపులు;7040
ఆమహాధూమంబు లప్పుడు చూచి - రాముతో ననియె నారావణానుజుఁడు
"నెలకొని యనిమొన నినుఁ దాఁకి గెలువ - నిలువనేరక పోయి నేఁడు రావణుఁడు
కపటకర్మారంభగంభీరవృత్తి - విపులజయార్థియై వేల్చుచున్నాఁడు
అవధరించితె పొగ లాకసంబునను - నివుడుచునున్నవి నిండి యొండొండ
హోమంబు నిర్విఘ్నయోగమై యితఁడు - కామించుతెఱఁగునఁ గడముట్టెనేని
రావణు లోకవిద్రావణుఁ బోర - దేవాసురులకైనఁ దెగి గెల్వరాదు;
కావున హోమవిఘ్నము సేయవలయు - వేవేగ వానరవీరులఁ బనుపు”
మనవుడు రఘురాముఁ డగుఁగాక యనుచుఁ - బనిచినఁ బనిపూని బలువిడిఁ గడఁగి
గురుబలాఢ్యుఁడు గవాక్షుండు దారుండు - శరభుఁడు క్రధనుండు శతబలి నలుఁడు
గవయుండు మైందుండు గంధమాదనుఁడు పవమానసూనుండు పనసుఁ డంగదుఁడు7050
కుముదుండు జ్యోతిర్ముఖుండు గోముఖుఁడు - క్రమమున వీ రాదిగాఁ గపివరులు
పదికోటు లుద్భటప్రథనవిక్రములు - విదితప్రతాపులు విదితకోపనులు
గగనమార్గమున లంకకు నేగుదెంచి - యగణితాహంకారులై పెచ్చు పెరిగి
పదఘట్టనముల భూభాగంబు పగులఁ - జదియ దిగ్గజములు చదలు గ్రక్కదల
నార్పులు బొబ్బలు నడరఁ బెల్లడరి - దర్పితనిర్భరోత్సాహసాహసులు
చలిఁ దాఁకి రావణు నగరు గాపున్న బలియురఁ బెక్కండ్రఁ బట్టి చెండాడి
క్రూరులై దౌవారికులఁ జంపివైచి - భూరిసత్త్వములఁ దల్పులు వీడఁ దన్ని
నగ రుద్దవిడిఁ జొచ్చి నగరూపధరులు - నగచరు ల్వడి దశానను రోయువారు
పృథురథశాలలు బిరుదులై చొచ్చి - రథములు విఱుగ నుర్వర వ్రేయువారు
గజశాల లొగిఁ జొచ్చి ఘనముష్టిహతుల - గజమస్తకములు వ్రక్కలు సేయువారు.7060
హయశాల లొగిఁ జొచ్చి హయశరీరములు - భయదోగ్రనఖములఁ బడవ్రచ్చువారు
సొరిదిశాలల నున్న జోడుపక్కెరలు - దరమిడి చింతించి దరలాడువారు
చలమొప్ప నాయుధశాలలఁ జొచ్చి - కలయ శస్త్రాస్త్రము ల్ఖండించువారు
నేచి బండారపుటిండ్లలోఁ జొచ్చి - రాచి యర్థములు చూరలు చల్లువారు

నురుసత్త్వగతు లొప్ప నుప్పొంగి పొంగి - వరుస తోరణములు వడిఁ ద్రెంచువారు
పసిఁడిగోపురములు భర్మహర్మ్యములు - వెస నుర్విఁ గూల బల్విడిఁ ద్రోయువారు
కట్టల్కఁ గొందఱఁ గని జగద్రోహిఁ - బట్టితెం డని పట్టి బాధించువారు
వనితలు సుతులును వాపోవఁ గన్న - జనను లడ్డముచొర సదనము ల్సొచ్చి
నెట్టన వెలికీడ్చి నెరసి రాక్షసుల - దట్టించి తలలూడఁ దాటించువారు
వాసిమై నిబ్భంగి వనచరు ల్గూడి - గాసివెట్టుచునుండఁగా భీతినొంది7070
దీనదశాతురస్థితి దూలపోయి - దానవువీడు విధ్వస్తమై కలఁగి
హరిపీడితానేకహయహేషితములు - కరిఘటానేకభీకరబృంహితములు
వృద్ధబాలాంగనావిలవిలాపములు - సిద్ధవిక్రమకపిసింహనాదములు
గలయఁ బర్విన లంక కల్పాంతకాల - ములఁ బేర్చు బడబాగ్నిముఖముఖార్చులకు
నులికి వాపోవుపయోధిచందమునఁ - గొలఁది కగ్గలముగా ఘూర్ణిల్లఁ దొడఁగె;
అంత సూర్యోదయ మయ్యె రావణుని - నంతటఁ బరికించి యతఁ డున్నచోటు
కానక చింతించి కడుసంభ్రమమున - వానరు ల్వెదకంగ వారి నీక్షించి
చతురతమై విభీషణుపత్నిసరమ - పతిహితం బాత్మలో భావించి యపుడు
వడి నంగదునకు రావణుఁ డున్నచోటు - చిడిముడిపాటుతోఁ జేసన్నఁ జూపె
చూపుటయును జూచి సుభటదంభోళి - కోపించి యప్పు డగ్గుహవాత నున్న7080
శిల నుగ్గుఁగాఁ దన్ని చెచ్చెఱఁ జొచ్చి - యలఘువిక్రమకళాయతకేలి వ్రాలి
పొలుపొంద భుజసత్వమునఁ బెంపు మీఱి - కలఁగి రాక్షసులెల్లఁ గడుభీతి బొందఁ
జని హోమనియతి నిశ్చలుఁ డైనవాని - ఘనమంత్రతంత్రసంగతుఁ డైనవాని
రావణు నమరవిద్రావణుఁ గాంచి - “రావణుఁ బొడగంటి రండు రం" డనిన
నవిలతనూభవుం డాదిగాఁ గలుగు- వనచరాధిపులెల్ల వడిఁ గూడముట్టి
యగ్గుహారక్షకు లైనరాక్షసులు - నుగ్గునూచము చేసి నుతశక్తి మెఱసి
యొక్కఁడై వేల్చుచు నున్నయద్దనుజు - నక్కడఁ బొడగని యలుక దీపింపఁ
దో డెవ్వరును లేక తుది నొంటిపడియెఁ - దోడువేలుత మని దొరకొని కపులు
సొరిది నవ్వేదికచుట్టులనున్న - పరిధులు సమిధలు బహుకలశములు
హస్తికుక్కుటజంబుకాశ్వోష్ట్రశునక - మస్తకంబులు ఘృతమధుపాత్రతతులు7090
నఱిముఱిఁ బుచ్చి హోమాగ్నిలో వైచి - నెఱసి యార్చిరి దైత్యనికరంబు బెదర
నప్పుడు పాపాత్మునంగంబులందు - నిప్పులు సల్లుచు నెఱమంట లొదవు
గుండంబులో మండు కొఱవులు పుచ్చి - యొండొండ వేయుచు నుండిరి కపులు
చేతిస్రుక్స్రువములు చెనసిరాఁ దిగిచి - వాతూలసుతుఁడు రావణు వ్రేసి డాసె;
నిత్తెఱంగునఁ గపు లేచి కాఱింపఁ - జిత్తంబులో నిష్ఠ చెదరంగనీక
కనియక కదలక క్రతునిష్ఠ నుండెఁ - గొనకొని నిద్రించుకొండచందమున

అంగదుండు మందోదరిని రావణువద్దికి నీడ్చుకొని వచ్చుట

సంగరక్రమకళాసంగుఁ డభంగుఁ - డంగదుం డంగదనంచితాంగదుఁడు
అంతఃపురంబున కరిగి యాదైత్యు - కాంతానివాసంబు కరమర్థిఁ జొచ్చి
“పరికింప రోహిణిఁ బాసినచంద్రుఁ - దరుణపల్లవదగఁ శయ్యఁ జేర్చుకరణిఁ
గందినముఖచంద్రుఁ గరపల్లవమునఁ - బొందించి వగలచేఁ బొగిలెడిదాని7100
ఘోరాహవంబునఁ గుంభకర్ణాది - వీరులు పెక్కండ్రు విషమవిక్రములు
దక్కి రందఱు విభుం డొక్కఁడ చిక్కె - నెక్కటి రఘురాము నితఁ డేమి గెలుచు?”
నని యని రావణు నపజయంబునకుఁ - దనబంధువులు దాను దలఁకెడుదాని,
చిత్తంబులో నింద్రజిత్తుచావునకు - నొత్తిలి యేడ్చుచు నున్నట్టిదాని,
రమణీయమణిమందిరమునఁ గొల్వున్న - రమణి మందోదరి రాజాస్యఁ గదిసి
యొలసినగతి రాహు వొడిసి పట్టుటకుఁ - జలదిందుమండలీచంద్రిక వోలెఁ
దిగిచినఁ బెడమర దిరుగు వేగమున - మృగనేత్రమొగమున మెఱుఁగులు సెదర
నెఱుఁగమితోఁ గూడ హృదయంబు గలఁగు - తెఱఁగున నలివేణిఁ దిగిచి పట్టుటయు
గమ్మసౌరభములు గలుగుసంపుల్ల - ధమిల్లమల్లికాదామంబు లనఁగ
గెడఁగూడి రావణుకీర్తిపుష్పములు - గడివోయి భువిరాలు కైవడిఁ దోఁప7110
సేసముత్తియములు చెలువంబు వాసి - గాసిలి వసుధపై గనుకనిఁ జెదర
వలనేది చెడిన రావణు రాజ్యపదవి - చెలువున నెరి దప్పి సీమంతవీథిఁ
గృతకంపుదైత్యలక్ష్మీపదాబ్జమున - శ్రితచంచరీకము ల్చెదరుచందమున
నాలోలలోలముఖాంభోజనీల - నీలాలకంబులు నెరిదప్పి చెదర
నురుమంగళంబులై యొప్పెడినాత్మ - వరభూషణములు రావణులక్ష్మి చెవుల
నుండనిక్రియ వడి నొండొండకర్ణ - మండనంబులు మహిమండలి రాల
దనుజేశునపకీర్తిధారలో యనఁగఁ - గనుగవఁ గాటుక కన్నీరు దొరుఁగ
నొగి దైత్యపతికి మహోల్కలు డుల్లు - పగిది భూషణమణిప్రకరము ల్డుల్ల
వరభర్మనిర్మలావరణంబు కలఁగ - నిర వేది రావణు నిహపరోన్నతులు
చలియించుతెఱఁగునఁ జనుగట్టు దొలఁగి - చలియింప నున్నతస్తనకలశములు7120
కొమరేది సురవైరిగుణవల్లి మరియు - క్రమమున నెంతయుఁ గౌఁదీఁగె నులియు
నిర్మలుఁ డగు రామనృపతిచేఁ దెగిన - కర్మబంధములు రాక్షసలోకపతికి
వదలు నీక్రియ నను వడువున నీవి - వదలుచు మేఖలావల్లియు వీడఁ
బ్రమదరాక్షసరాజ్యపదసంధి రోసి - విమలవర్ణావలి వీడుచందమున
నుదితరావంబులై యొండొంటిఁ గడవఁ - బదనూపురము లూడిపడి మ్రోయుచుండ
వెఱచి రాక్షసవధూవితతి శోకింపఁ - జెఱ నున్న నిర్జరస్త్రీ లుత్సహింప
వీరసంబునఁ బట్టి యీడిచి తెచ్చె - వారక రాక్షసేశ్వరుని ముందఱికి

నంత మందోదరి యాత్మేశుఁ జూచి - యంతరంగమున శోకాగ్నులు నిగుడ
"నింద్రు గెల్చినసత్త్వ మెక్కడఁ బోయెఁ - జంద్రహాసము వాఁడి సమసెనే నేఁడు
ఫాలలోచనుతోడఁ బ్రమథులతోడఁ - గైలాస మెత్తిన గర్వ మెం దణఁగె?7130
మూఁడులోకంబులు మునుమిడి గెలిచి - నేఁ డేల తూలెదు నీపేర్మి విడిచి?
యింద్రజిత్తుఁడు నన్ను నిటఁ బాఱవైచి - యింద్రలోకంబున కేగక యున్న
న న్నిట్లు చూచునే? నాకొడు కున్న - నిన్నీచదుర్దశ లేను బొందుదునె?
సిగ్గు లజ్జయు లేని చెనఁటిరో నన్ను - బగ్గించుచున్నారు పగతు లిబ్భంగి
నీహోమ మేటికి? నిష్ఠ యేమిటికి- ? నాహుతు ల్నిన్నుఁ బూర్ణాహుతిఁ జేసెఁ;
బటుబుద్ధివై రాముబాణాగ్నిఁ బడుము - కుటిలక్రియల కింకఁ గొలఁదిగా దుడుగు"
మన వివి దశకంఠుఁ డలుక దీపింపఁ - దనచేతియాహుతు లరణిపై వైచి
యురుతరం బగునిష్ఠురోగ్రకోపాగ్నిఁ - బురవధూతోరణంబులు వోని బొమలు
ముడివడ సమవర్తి మూర్తియై పేర్చి - కడఁకమై నత్యుగ్రఖడ్గ మంకించి
యతులరత్నాంగదు నంగదు వ్రేసి - వితతవిక్రముఁ డింతి విడిపించి పుచ్చె7140
వీడిన నెఱివేణి వెన్నున జార - వాడినమోముతో వగలఁ దూలుచును
నంతఃపురంబున కరిగె దైతేయు - కాంత చింతించుచుఁ గడుఁ జిన్నవోయె;
నప్పుడు హనుమంతుఁ డత్యుగ్రముష్టిఁ - దప్పక దశకంఠుతల బిట్టు వొడిచె;
నావాలిసూనుండు నంతలోఁ దెలిసి - రావణు వ్రేసె విక్రమకేలి వాని
తోరంపునెత్తుటఁ దోఁగి యెంతయును - గ్రూరుఁడై జేగురుకొండచందమున
నతి ఘోరకోపాట్టహాసంబు లెసఁగ - నతులసత్త్వోదాత్తుఁడై దశాననుఁడు.
అంగదుఁ దగ వ్రేసె ననిలనందనుని - భంగించె నిశితాసిఁ బటుశక్తి మెఱసి
నలి శూలముఖమున నలుని నొప్పించె - నలవున గజు నొంచె నంకుశనిహతి
మొగి నీలుఁ ధట్టించె ముసలఘాతమునఁ - దగుశక్తి శతబలి దర్పంబు మాపెఁ;
బవితుల్యముద్గరప్రదరంబు పుచ్చి - ద్వివిదుని మైందుని వ్రేసె వేయుటయు7150
వానరవరులు దుర్వారులై తమదు - సేనలఁ జొచ్చి రచ్చెరువుగాఁ బఱచి,
యనిలసూనుఁడు రాఘవాధీశుకడకుఁ - జని మ్రొక్కి హస్తాంబుజంబులు మొగిచి
“రామావనీశ్వర! రాక్షసేశ్వరుని - హోమంబుఁ జెఱిచితి మొప్ప వచ్చితిమి”
అనవుడు విని రాముఁ డంతరంగమున - ననయంబు హర్షించె నట దైత్యపతియుఁ
గడువేగమునఁ బోయి ఘనశోకవహ్ని - నుడుకుచునున్న మందోదరిఁ జూచి
“యతివ! నీమనమున నక్కట! దైవ - కృతమున కింత శోకింప నేమిటికి?
నని మొన నేఁడు రామావనీనాథుఁ - దునిమెద నటుగాక దురములో నతఁడు
నను సమయించిన నలినాయతాక్షి! - జనకనందనఁ జంపి, సాహసం బొప్ప
వేవేగ యగ్నిప్రవేశంబు సేయు - నీ" వనుటయు నింతి నిజనాథుఁ జూచి,

మందోదరి శ్రీరాములమాహాత్మ్యము రావణునికిఁ దెల్పుట

“యోదశానన! నీకు యుద్ధమధ్యమున - రాదు జయింపఁగ రఘురామదేవు;7160
నీ వొక్కడవ యేల? నెఱసి రాఘవుని - దేవాసురులకైనఁ దీఱదు గెలువ;
నీమది రాజుగా నిర్ణయింపకుము - రామచంద్రుండు పురాణపూరుషుఁడు
ఆమేటి తొల్లి మత్స్యావతారమున - సోమకు నిర్జించి శ్రుతు లుద్ధరించె;
ఘనమంథశైలంబు గమఠమై యతఁడు - దనవీపుఁ గుదురుగా ధరియించెఁ దొల్లి;
రాముఁడు మున్ను హిరణ్యాక్షుఁ జంపి - భూమి వరాహమై పొగడొంద నెత్తె;
నతఁడు నృసింహుఁడై యలుకమైఁ దొల్లి - పతితు దైత్యునిఁ జంపి ప్రహ్లాదుఁ గాచె;
నలిగి యాతఁడు వామనావతారమున - బలి నర్థిపై వేఁడి బంధించెఁ దొల్లి;
జమదగ్నిరాముఁడై జన్మించి యతఁడు - విమలశౌర్యునిఁ గార్తవీర్యుని ద్రుంచె ;
వీకను జేకొన్న విశ్వ మంతయును - నాకశ్యపబ్రహ్మ కర్థితో నిచ్చె;
సన్నుతగతి విరోచనుఁ జంపివైచె - మున్ను మాయారూపముఖుని నిర్జించె;7170
జలధిమధ్యంబునఁ జరణఘాతమున - బలువిడి రాక్షసపతుల రూపడఁచె;
లవణాసురునిఁ జంపె లలిఁ బార్ష్ణిహతుల - జవమార నీరామచంద్రుండు మొదల;
నధికుఁడై యాతఁడ యాదికాలమున - మధుకైటభాదుల మర్దించె నతఁడు;
తనసత్త్వ మంతయుఁ దలకొని వచ్చి - నినుఁ జంప నిప్పుడు నిష్ఠమైఁ బూని,
దిశలఁ దేజంబులు దీపింపఁ జేసి - దశరథేశ్వరునకుఁ దనయుఁడై పుట్టె;
నామహామహిమ లత్యద్భుతక్రియలు - నేమని చెప్పుదు నేను వాక్రుచ్చి,
యలఘువిక్రమకళాయతశక్తి మెఱసి - బలియుఁడై యీతఁడు బాల్యంబునందు
గౌశికప్రముఖదిక్పతులెల్లఁ బొగడఁ - గౌశికుం డొనరించు క్రతువు రక్షించె
శతసహస్రాయుతసంఖ్యలు గడవ - నతనిచేఁ బడసె దివ్యాస్త్రశస్త్రముల
జనకుండు మొదలుగా జగమెల్లఁ బొగడ - ఘనశక్తి విఱిచె శంకరుశరాసనము7180
దైవయోగంబునఁ దనకుఁ బట్టమున - దేవిగాఁ బూని వైదేహిఁ గైకొనియె;
సోమించి నిజబలస్ఫురణంబు చూపి - రాముఁ డాభార్గవరాము భంగించెఁ;
దనతండ్రి పనుపునఁ దప మొప్పఁ బూని - మునివృత్తి వనవాసమునకు నేతెంచె
సన్నుతశక్తిమైఁ జంపె విరాధుఁ - బన్నుగాఁ బేర్చి శూర్పణఖ శిక్షించె;
నడుగుల నాదండకారణ్యభూమి - గడుఁబుణ్యభూమిగాఁ గావించినాఁడు;
ఖరదూషణాదిరాక్షసవీరవరులు - ధరఁ గూల్చె మఱి చతుర్దశసహస్రముల,
మారీచుఁ దునుమాడె మాయఁ బోనీక - ఘోరరూపుఁ గబంధుఁ గూలంగ నేసె;
నీగండుగుణ మెల్ల నిలిపి దట్టించి - లాగొప్ప నిన్ను వాలమున బంధించి,
చతురబ్ధిజలములఁ జలమున ముంచి - యతులసత్త్వక్రీడ నడరి కాఱించి
విడిచిన యావాలి వెస నొక్కకోలఁ - బడనేసె సుగ్రీవుఁ బట్టంబు గట్టె;7190

నలవుమైఁ దనదు బాణాగ్నికీలలను - జలనిధి నింకించె జగములు మెచ్చఁ,
గలనిలోపలఁ గుంభకర్ణు ఖండించెఁ - జలమున నఖిలరాక్షససమేతముగ
సమరంబులోపలఁ జంపె లక్ష్మణుఁడు - నమర నయ్యతికాయు నయ్యింద్రజిత్తు
నలుగఁ డెన్నఁడును రామావనీనాథుఁ - డలిగిన నిలువ రింద్రాదులు నెదుట
మది మది నుండ నామనుజేశుదేవిఁ - ద్రిదళారి! వంచనఁ దే నీకుఁ జనునె?
నీ వెఱుంగవె రామునిత్యసత్యములు - నీ వెఱుంగవె రామనృపుమహత్త్వములు
రాముసత్త్వస్థితి రావణ! నీకు - నేమి పాపముననో యెఱుఁగఁ జొప్పడదు.
నీ వింక రఘురాము నిష్ఠురబాణ - పావకజ్వాలల భస్మమై పడక
జనకనందనతోడ సకలరాజ్యంబు - నెనయ రాఘవునకు నిమ్ము వేవేగ;
మరలి తపోవృత్తి మన మరణ్యములఁ - జరియింత మింతియ చాలు భోగములు;7200
నీవు దీఱిన నాకు నీతోడఁగూడఁ - బావకుముఖమునఁ బడి కాలరాదు;
మున్ను మాతండ్రియు ముదిమియుఁ జావు - నన్ను బొందకయుండ నా కిచ్చె వరము,
వరభోగ మే నొల్ల; వలవ దీత్రోవ; - తరము గా దింక దుస్తరము తద్వరము;
సరమకు నొండె, నాజనకజ కొండె - వరవుఁడనై యేను వర్తింప వలసె;"
ననవుడు దశకంఠుఁ డాకలకంఠిఁ - గనుఁగొని పలికె నుత్కటరోషుఁ డగుచు
“నింతేల చింతింప నెలనాఁగ! నీకు - నింతకు వచ్చితినే యేను నేఁడు?
చుట్టాల భృత్యుల సుతుల సోదరుల - నెట్టనఁ జంపించి నేఁ డింక నాకు
దేవదానవభయోద్వృత్తిఁ బోనాడి - మీపట్టిప్రాణంబు లేల రక్షింప?
దురమున నింద్రజిత్తునివంటికొడుకుఁ - బరులచేఁ జంపించి బ్రదుక నేమిటికి?
గరుడోరగామరగంధర్వవరులఁ - బొరిఁగొంటిఁ జెఱిచితిఁ బుణ్యగేహినులఁ;7210
దపసులఁ జంపితిఁ; దరుణి! యే నింకఁ - దపసినై పోయినఁ దపసులు నగరె?
కావ నీమాటలు కార్యంబుతెఱఁగు - భావింపనేరవు పద్మాయతాక్షి!
ఏ నెల్లభంగుల నింక రాఘవులఁ - బో నీను జంపుదు భూమిజ నీను;
ఆరూఢబలుఁడనై యటుఁగాక యేను - శ్రీరాముశరములచేఁ జత్తునేని;
నాకవాసులు మెచ్చ నాకోరుచున్న - వైకుంఠ మెదురుగా వచ్చు నిచ్చటికి;
లలన! నీ వేటికి? లంక యేమిటికిఁ - దలకొన్న ముక్తిసత్పథముఁ గైకొందు;
ఎలనాఁగ! నీ వింక నేను లేకున్నఁ - గలపుణ్యలక్షణకళలెల్లఁ బొలిసి;
కమలబంధుఁడులేని కమలిని బోలె - కొమరేది శశిలేని కుముదినిఁ బోలె;
రేరాజు లేనట్టి రేయును బోలె - శారిక లేని పంజరమునుబోలె,
ఎనయఁ గోయిల లేని యెలమావి వోలె - దినమణిలేని యాదినమును బోలె7220

రావణుఁడు మూఁడవసారి యుద్ధమునకు వెడలుట

ఉండుము నీ" వన్న నొం డాడ వెఱచి - యుండె మందోదరి యుదరి లజ్జించి;

యంత దశగ్రీవుఁ డాహవోద్యోగ - సంతోషపోషిత్సాహుఁడై కినిసి
యాదిత్యు లదర బ్రహ్మాండభాండంబు - భేదిల్లఁ బటురణభేరి వేయించి,
కలహవిక్రమకళాకల్పుఁడై తివిరి - బలములఁ బన్నింపఁ బడవాళ్లఁ బనిచి
యుదయార్కబింబసముజ్జ్వలప్రభలఁ - బదికిరీటంబులు పదిలమై యొప్ప,
వినుతరత్నప్రభావిద్యోతమాన - ఘనకుండలంబులఁ గర్ణంబు లడర,
నాయతభుజశాఖ లన్నియు రత్న - కేయూరకంకణాంకితములై తనర
నిరవొంద డాకాల నింద్రాదిభయద - బిరుదభీషణ గండపెండేర మొప్పఁ
గరము లన్నిటను భీకరచంద్రహాస - శరశరాసనగదాచక్రాదు లమరఁ
బటురోషదృష్టిప్రభావహ్ను లెందుఁ - జటులంబులై పర్వఁ జనుదెంచి యపుడు7230
స్ఫుటబంధబంధురషోడశచక్ర - ఘటితకోటిద్వయఘంటికాబద్ధ
భయదోగ్రసంపుల్లభల్లూకవర్మ - హయసహస్రోదగ్ర మగు రథం బెక్కి,
కాకుత్స్థుశరములఁ గడతేరి మీఁద - వైకుంఠరథ మెక్కువడువు దీపింప
నెలకొని రథకళానిధి కాలకేతుఁ - డలఘుబలోదారుఁ డాతేరుఁ గడప,
దీపించు వెన్నెలతేటలై మీఁద - నేపారుగొడుగు లనేకంబు లొప్ప,
మండితమార్తాండమండలచంద్ర - మండలకబళనోన్మదసముద్యోగ
రాహుత్రయమ పోలె రహి మిన్ను ముట్టి - సాహసరాహుమస్తకము ప్రశస్త
బిరుదధ్వజంబు లాభీలమై మూఁడు - దరలంగఁ బటపటధ్వనులతో వెడలె;
భేరీమృదంగాది భీమగంభీర - భూరిభాంకృతుల నంభోధు లుప్పొంగ,
ఉప్పొంగుకడకుల నుర్వి గంపింప - నప్పుడు కరులును హరులుఁ దేరులును,7240
బలసముద్భటమహాభటకదంబములు - బలువిడి వెడలె దిగ్భాగంబు నిండఁ
బ్రళయకాలమునాఁటి భానులభంగిఁ - దలకొని వెడలి రుదగ్ధులై ఖడ్గ
రోముండు నగ్నివర్ణుఁడు గయ్యమునకుఁ - దా మేగఁ బదహతి ధరణి పెల్లడరె;
నప్పు డంభోనిధు లన్నియుఁ గలఁగె; - నప్పుడు లోకంబు లన్నియు బెదరె;
నప్పుడు దిగ్దంతు లన్నియు వ్రాలె; - నప్పుడు కులగిరు లన్నియు వడఁకె;
నెడపనికడఁకతో నిబ్భంగి వెడల - నుడువీథి సురలు దా రొండొండ నిండి
రావణోద్యోగసంరంభంబు సూచి - "దేవారి యిటుఁ గ్రింద దేవదేవారి
యోధులపైఁ బేర్చి యుద్వృత్తి నెత్తి - క్రోధించి మించి పేర్కొని పోవువాఁడు
ఈరీతి యీభాతి యీరణోద్యోగ - మీరోష మీవేష మెన్నఁడు లేదు;
నేఁడు లక్ష్మణసమన్వితుని రాఘవునిఁ - బోడిమితోఁ దాఁకి పోరాడకున్నె?"7250
యని రత్నమయవిమానారూఢు లగుచు - ననిమిషు లనిమిషులై చూచుచుండ
రాశివానరబలారణ్యంబుఁ గాల్ప - గా సొంపుతో వచ్చు కార్చిచ్చు పగిది
నడతెంచె; నసురసేనాసహస్రమును - బొడగని కపివీరపుంగవు లెల్ల

నంగదఁ జెలరేఁగి యట్టహాసమును - పొంగ నుప్పొంగి యార్పును నింగి ముట్టు
దర మైనతరులు నుద్ధత మైన గిరులు - గిరిశృంగములఁ గొని గిరిసమాకృతుల
దరమిడి బరువడి దనుజసైనికులు - దురమును నిరువాఁగుఁ దొడరి రొండొంటి
నక్షీణబలము లేపారంగఁ దాఁకు - దక్షిణోత్తరసముద్రములచందమున
నప్పుడు దానవు లాసేనమీఁద - ముప్పిరిగొను రోషములు మండుచుండ
నార్పులు జంకెలు నతులహుంకృతులు - నేర్పులు కడఁకలు నిండ నొండొండఁ
గటమదోత్కటదంతిఘటల ఢీకొల్పి - పటుజవాశ్వంబులు బలువిడిఁ దోలి7260
యలవొప్ప నరదంబు లఱిముఱిఁ బఱపి - నలుగడఁ గాల్వుర నలిఁ గవియించి
కరవాలమునల ముద్గరభిండివాల - పరశుతోమరశరప్రాసఖడ్గములఁ
గనుకని వైచియు గాడఁ బొడిచియుఁ - దునిమియు మెఱమియుఁ దూల నేసియును
వ్రచ్చియు మోదియు వసుధఁ గూల్చియును - గ్రుచ్చియుఁ గపులఁ బేర్కొని విదళింప
మొనసి వానరవీరముఖ్యులు గడిమిఁ - గినిసి యుద్భటరణక్రీడమై గదిసి
యుఱికి సమీపమం దున్న శైలములు - తఱుచైనగిరిశృంగతతులు వృక్షములు
శిలలును వడి వేసి చెలరేఁగి మఱియుఁ - దలమీఱి గుఱ్ఱపుదళముల కుఱికి
యుదితోగ్రసత్త్వంబు లొప్పఁ గుప్పించి - కుదియక రౌతులఁ గూలఁదన్నియును
గర ముగ్రులై కరిఘటలపైఁ గవిసి - సొరిది శైలము లెత్తి జోదులు పెలుచఁ
గుంభమధ్యంబులఁ గ్రుంగ నేనుఁగులఁ - గుంభిని నొక్కటఁ గూలనేయుదురు7270
రథములతోడ సారథులు రథ్యములు - రథుల నొక్కట నెత్తి రణమధ్యవీథిఁ
బెలుకుర నందంద పృథివి గంపింప - నలవున నటువేసి నలియఁజేయుదురు
ధరణీధరంబులఁ దరుకదంబముల - నురువడిఁ గాల్వుర నురక మోఁదుదురు
కఱతురు పండ్లకు గరతలాగ్రములఁ - జఱతురు పదములఁ జదియఁ బ్రాముదురు
వ్రత్తు రుజ్జ్వలనఖావలుల వాలముల - మొత్తుదు రలతురు ముష్టిఘట్టనల
పనసనీలాంగదప్రముఖులు మరియు - వనచరపతులు దుర్వారులై యెగసి
తనియనికడిమి నుద్దండదానవుల - మొనలపై నాకసంబుననుండి నిండి
భూరిధారాధరంబులు లయవేళ - ఘోరనిర్ఘాతము ల్గురియుచందమున
గురుతైలపాషాణకోటు లందంద - కురియ నుద్భటరణక్షోణి నెల్లెడలఁ
గూలునేనుంగులు కుంభమధ్యముల - వ్రాలుమావుతులు పై వ్రాలుచందములు,7280
విఱుగువిండ్లును గూలు వీరరాక్షసులు - నొఱగునశ్వములు పై నురులు రావుతులు
చదియురథంబులు సమయు సారథులుఁ - జిదియు పీనుంగులు చెదరు మాంసములు
పడుకిరీటంబులు పగులు మస్తకము - లడరునెత్తురులు బెల్లవియు గాత్రములు
తొలుకాడుప్రేవులుఁ దునియు ఖడ్గములుఁ - గలిగి యప్పుడు రణాంగణ మొప్పెఁ జూడ
బహుభోగపర్జన్యభాగ్యంబపోలె - మహితాభ్రమాతంగమదసిక్త మగుచు

నతిరౌద్రరుద్రవిహారంబ పోలె - హతగజాసురపిశాచానంద మగుచు
నక్షీణరామకటాక్షంబ పోలె - ప్రేక్షణహృష్టవిభీషణం బగుచుఁ
గలియుగాంత్యోదగ్రకాలంబ పోలె - బలశూన్యవిధ్వస్తబహుధర్మ మగుచు
గతతోషసంపుల్ల కమలిని పోలె - శ్రితశిలీముఖపుండరీకౌఘ మగుచుఁ
జారుశుభోదారుసదనంబ పోలె - నారక్తఘనమార్గణాకీర్ణ మగుచు7290
స్థిరపుణ్యమూలనదీభర్త పోలె - హరిసత్త్వనిర్మథితాభీల మగుచు
ననఘక్రమాగమయాగంబ పోలె - ననిమిషలోకచింతాభీష్ట మగుచు
నొప్పెడిరణములో నుగ్రభావమున - కుప్పతిల్లుచు సుర లొగిఁ జూచుచుండఁ
దొడగి నెత్తుట దొప్పదోఁగి లోఁగలయఁ - బడియున్న ప్రేవులు పవడంపుఁబొదలు
రథములు యానపాత్రము లూడిపడిన - రథచక్రతతులు గూర్మములమొత్తములు
మొగి నున్నశవములు మొసళులు గలయఁ - దెగిపడ్డభుజములు దీర్ఘసర్పములు
ఆయుధరజమిసు మస్థిసమూహ - మాయతశైలంబు లతులదంష్ట్రములు
తిమితిమింగిలములు దీర్ఘఘోటకపు - గములు సముల్లోకకల్లోలతతులు
వివిధాశ్వలాలలు వెలి నుర్వులందు - ధవళాతపత్రసంతతులు హంసములు
బహుకిరీటప్రభ ల్బడబాగ్నిశిఖలు - మహిమీఁదఁ జెదరినమాంసము ల్మణులు7300
ప్రీతనిశాచరప్రేతబేతాళ - భూతాట్టహాసము ల్భూరిఘోషములు
చంద్రుండు రఘురామచంద్రుఁ డవ్విభుని - సాంద్రహాసద్యుతు ల్చంద్రిక లగుచు
నడరెడు రక్తాబ్ధి యద్ధితోఁ దొరసి - యుడువీథితో రాసి యుప్పొంగుచుండె;
నప్పుడు హనుమంతుఁ డసురేశుమీఁద - నుప్పొంగి కవియ నుద్యోగంబు సూచి
యచలాచలాకారుఁ డతిబలోన్నతుఁడు - రుచిరఖడ్గుఁడు ఖడ్గరోముండు గినిసి

ఖడ్గరోముఁడు మొదలగు రాక్షసులు వానరవీరులతో యుద్ధము సేయుట

"యం దెందుఁ గడగెద; వం దేల నీకు? - నిందు ర మ్మనిలజ! యే నున్నవాఁడ;”
ననవుఁడు గుప్పించి యతనిపై కుఱికి - తనురోమశితఖడ్గధారల మునిఁగి
యొకభంగి నిగిడి మహోగ్రుఁడై కడఁగి - ప్రకటసత్త్వోన్నతిఁ బవమానసుతుఁడు
కులశైలమనఁ బోలు కొండ చేఁబూని - పెలుచ నార్చుచు వచ్చి పృథివి గుంపింప
వానిపై నురువడి వైచె వైచుటయు - దాని వాఁ డురురోమధారాభిహతిని7310
గండ్రించి ప్లవగుల ఖండించుకొనుచు - దండి నప్పవమానతనయుఁ దాఁకుటయుఁ
బావని మఱియును బర్వతం బొకటి - వేవేగ దానవవీరుపై వైవఁ
గులిశధారాహతిఁ గూలుపర్వతము - పొలుపునఁ గూలె నప్పుడు రక్కసుండు
సర్పరోముఁడు తీవ్రసర్వాంగుఁ డగుచు - దర్పించి కడఁకతోఁ దాఁకి యంగదుని
దనురోమసర్పసంతతుల నొప్పింప - ఘనమైనకడిమి కంగదుఁడు గోపించి

గ్రద్దన లయకాలకాలుఁడై మండి - యద్దెత్యుమ స్తకం బఱచేత వ్రేసె
దనుజునిశిర మంతఁ దద్దయుఁ బగిలి - ఘనరక్తధార లొక్కటఁ గ్రమ్ముచుండ
రోషాగ్ను లొలుకుచు రోమసర్పముల - భీషణాకారుఁడై పేర్చి యద్దనుజుఁ
డంగదునంగంబు నంగద వ్రేయ - నంగదుం డధికరోషాయత్తుఁ డగుచు
నసురశిరోమధ్య మతిఘోరముష్టిఁ - బసచెడఁ దాటించి పడవైచి త్రొక్కి,7320
తలఁ ద్రుంచి వైచి యుద్ధతశక్తి వాని - బలువిడి నిర్గతప్రాణుఁ గావించె;
భీషణరణకళాభీలు నన్నీలు - రోషించి వృశ్చికరోముండు దాఁకి
ఘనవిషజ్వాల లొక్కటఁ బిక్కటిల్లఁ - దనురోమవృశ్చికతతుల నందంద
యేచి నొప్పింప సహింపక నీలుఁ - డాచేఁత దానవుఁ డాత్మ గైకొనక
విరథులై రాక్షసవీరులు పర్వ - నురుసాలతరువున నురువడి వ్రేసె
వ్రేసిన దనుజుఁ డావృక్షంబు ద్రుంచె - గాసిల్లి విషరోమకంటకాగ్రముల
ద్రుంచిన కనుఁగొని తోరంపుఁగడిమి - కంచితజయశీలుఁ డానీలుఁ డలిగి
ఘోరబాహాశక్తిఁ గుశలుఁడై పేర్చి - భూరిశాఖల నొప్పు భూజంబు పెఱికి
కొనివచ్చి వాని వక్షోవీథి వ్రేసి - యనిమిషు లుప్పొంగ హతజీవుఁ జేసె
భగ్నారివీరుఁ డభగ్నప్రతాపుఁ - డగ్నివర్ణుం డనునతఁ డా7330
వడి మహాటవుల దుర్వారతఁ బేర్చి - కడఁగి యుగ్రత నేర్చు కార్చిచ్చుకరణి
నగణితస్ఫుటవహ్ను లంగంబులందు - నిగిడించి కోఁతుల నీఱు సేయుచును
బ్రళయాగ్నియును బోలి పఱతెంచుచుండ - నలుకమై వీక్షించి యవనీశ్వరుండు
బలిముఖప్రముఖుల పరిభవక్రమము - తిలకించి కరుణావిధేయుండు గాన
దలఁపున నోర్వ కద్దనుజు నుగ్రతకుఁ - దలయూఁచి దశకంఠుతమ్మున కనియె
“నోవిభీషణ! నాకు నూహింపఁ దెలియ - దీవచ్చుచున్నవాఁ డెవ్వఁడో? చూడ
నారావణుఁడు బంప నని సేయఁ గోరి - ధీరుఁడై యనలుఁ డేతెంచుచున్నాఁడొ?
వీఁ డొకరాక్షసవీరుఁడో కాక - వీఁ డెవ్వఁ డేర్పడ వినుపింపు నాకు!".
ననవుడు “దేవ! వీఁ డగ్నివర్ణుండు - దనమేనిమంటలు దరికొల్పి వీఁడు
పర్వతంబుల నైన భస్మీకరించు - గర్వదుర్వారుఁ డఖండవిక్రముఁడు"7340
అనిన నచ్చెరువంది యర్కవంశజుఁడు - ఘన మైనవానియుగ్రతఁ జూచి యలిగి
వాసవనుతుఁ డంత వరుణాస్త్ర మేసె - నేసిన నది మింట నెడమీక నిండి
కప్పారుమేఘంబు గప్పి యార్భటము - లుప్పొంగ జడివాన లుడుగక కురిసి
యల వేఁడిమంటల నార్చి పెల్లార్చి - ఖలు నగ్నివర్లు నొక్కట నేలఁ గూల్చె;
నాలంబులో నప్పు డగ్నివర్ణుండు - గూలుటయును జూచి క్రూరుఁడై పేర్చి
కోపంబు పేర్మి నక్షుల నిప్పు లురులఁ - జూపుల లయకాలసూర్యుఁడై మండి
రాముఁ గనుంగొని రాక్షసేశ్వరుఁడు - "రామ! న న్నెఱుఁగవే? రణమధ్యవీథిఁ

గ్రూరనిష్ఠురవజ్రఘోరదుర్వార - ధారావిదారితోద్ధతకులాచలుఁడు
దేవేంద్రుఁ డుద్వృత్తి దేవసంఘములు - తో వచ్చి యెదరినఁ ద్రుంతు నే నాజి;
ని న్నేలఁ గైకొందు నీచకాపేయ! సన్నాహమే నన్ను సాధింప నహహ!7350
పదిలుఁడై మగపాడి పాటింతుఁ గాక - తుదిముట్ట నన్ను నెదుర్కొందుఁ గాక!
త్రోచి శస్త్రాస్త్రపఙ్క్తుల నొంతుగాక - యేచి నీలావు నా కెఱిఁగింతు గాక!"
యనవుడు రఘురాముఁ డద్దురాత్మకుని - చెనఁటిమాటలు విని చిఱునవ్వు నవ్వి
గంధసింధురము ఘీంకార మాలించి - సింధురాంతకమత్తసింహంబ పోలె
నూరకుండుటయు మహోగ్రుఁడై కినిసి - యారాముతమ్ముఁ డయ్యసురారిఁ దాఁకి
ఘోరనారాచము ల్గురియఁ దద్బాణ - ధారలు ద్రుంచి, యాతని లెక్కగొనకఁ
యెంతయుఁ ద్రోచి పెల్లేచి లంకేంద్రుఁ - డంతకాకారుఁడై యఱిమి పైఁదఱిమి,
భానుపై నడచు స్వర్భానుచందమున - భానువంశాధీశుపై నప్పు డడరి,
దారుణస్ఫుటవజ్రధారానుకారి - నారాచతతుల నన్నరనాథుఁ గప్పెఁ;
గప్పిన నప్పు డాకాకుత్స్థుఁ డలిగి - నిప్పులు రాలెడు నిష్ఠురాస్త్రముల7360
నుగ్రుఁడై యేయంగ యుద్ధమధ్యమున - నిగ్రహింపఁగఁ జొచ్చె నెఱసి రావణుఁడు

దేవేంద్రుఁడు శ్రీరామునకు రథంబుఁ బంపుట

ఆసమయంబున ననియె మాతలికి - వాసవుఁ డారామవల్లభుఁ జూచి
“దేవహితార్థమై తివిరి రాఘవుఁడు - పోవక దనుజుతోఁ బోరుచున్నాఁడు;
వాఁడె పదాతియై వసుధ నున్నాఁడు - వాఁడు రథస్థుఁడై వ్రాలుచున్నాఁడు:
ఎందు లోకోన్నతుఁ డితఁడె దుఃఖముల - డింది యక్కుమతికి దిగువ నున్నాఁడు;
వేదపల్లవముల విహరించుసౌఖ్య - వేది కర్కశరణవీథి నున్నాఁడు;
కమలామనోరథగతుల నున్నతుల - నెమకెడు సుఖి నేల నిలుచున్నవాఁడు;
ఇనకులాధిపునకు నీదివ్యరథము - గొనిపొమ్ము వేవేగ కుంభిని" కనుడు
ననిలమనోవేగ మగుతురంగములఁ - గనకదండాబద్ధఘనకేతనముల
మహనీయరుచిరోరుమణికదంబముల - మహితమై బాలార్కమహిమ దీపింపఁ7370
దనరారురథము మాతలి మహీస్థలికిఁ - గొనివచ్చి వేడ్కతోఁ గుంభిని నిలిపి,
యారాముముందట హస్తము ల్మొగిచి - యారూఢబలశాలి యై విన్నవించె;
"దేవ! రాఘవ! ధరాధీశ! సమస్త - దేవతారాధ్య! వందితభక్తసాధ్య!
శరచాపకవచాదిసన్నాహరథము - పురుహూతుఁ డిదె నీకుఁ బుత్తెంచినాఁడు;
కాకుత్స్థ! నీ వింకఁ గౌశికుపనుపుఁ - గైకొని యీవజ్రకవచంబు పూని,
యీదివ్యరథ మెక్కి యీయాయుధముల - నీదుర్మదాంధుని నెదిరి సాధింపు;
మేను సారథి గాఁగ నింద్రుండు సకల - దానవావలి గెల్చె; ధరణీశ! తొల్లి”
ననవుడు విని రాముఁ డవ్విభీషణుని - యనుమతితోఁగూడ నారథంబునకు

వలగొని వచ్చి యుజ్జ్వలతనుప్రభలు - పొలయంగ నీరేడుభువనంబు లలర
జదల నొక్కటఁ బర్వ జయజయధ్వనులు - పొదివి శాఖామృగంబులు మిన్ను ముట్ట7380
నురవడిఁ గమలాప్తుఁ డుదయాద్రి నెక్కు - కరణి నారథ మెక్కెఁ గమలాప్తకులుఁడు
నప్పుడు నభమెల్ల నల్లాడుచుండి - యుప్పతిల్లుచునుండె; నొండొండ నిండి
శరదభ్రసంధ్యాభ్రచయసమానములు - గరుడోరగామరగణవిమానములు
సరిచూచు సురలు ఖేచరులు గిన్నరులు - పరమసమ్మదమును భయము నుప్పొంగ
నీపర్వతద్వంద్వ మీయబ్ధియుగళ - మీపావకద్వయ మీనభోయుగము
గదిసె పోఁ బోరాడఁ గదిసెఁ బో పోర - నిది సమానస్కంధ మెట్లొకో యనుచుఁ
గంపింప జగము లాకంపింప నిట్లు - కంపింప నిరువాఁగు కంపింపఁ గడఁగి
రణజయోదగ్ధులై రామరావణులు - రణజయవ్యగ్రులై రామరావణులు
గదిసినదృష్టి నిర్ఘాతపాతములఁ - జదిసిన మెఱుఁగులు చదలపైఁ జెదర
చెలఁగె సేనల రెంట సింహనాదములు - గలఁగె నాకాదిలోకంబు లన్నియును7390
నామేటివిలుకాఱు లన్యోన్యవిజయ - కాములై రథచిత్రగతు లొప్పు మెఱయ
దినకరానలకల్పదీర్ఘనిర్ఘాత- ఘనశాతశరసముత్కరపరంపరలఁ
గరములు గళములు కక్షము ల్భుజము - లురములు నిటలంబు లూరులు బరులు
నేసి నొప్పించుచు నిరువురు గదిసి - త్రాసులై దొరసి విత్రాసులై బెరసి
యంపకయ్యము సేయునప్పు డొండొరుల - సొంపు బెంపును దెంపు చూడ నచ్చెరువు
ఫలితవిక్రమసమప్రారంభు లగుచుఁ - దొలఁగక చేతుల దొనలయములకుఁ
జాచిరి తివిచిరి సంధించి రేయఁ - బూచి సేసిరి పోయెఁ బొమ్మని తెలియ
రాకుండె నప్పు డారామరావణుల - భీకరకరశరాభీలవేగములు
గణనలు క్రమములు గడచి యందంద - రణచండకోదండరవిమండలములఁ
బ్రేంఖచ్ఛరాంశులఁ బేర్చి పుంఖాను - పుంఖంబు లగుటయుఁ బొంకు గావించి7400
బాణబాణాసనప్రౌఢు లక్షీణ - తూణీరు లేయుచోఁ దొడఁగి యొండొరులఁ
బ్రతి సేసి యొకటికిఁ బదియింటివెనుక - నుతశక్తి దానికి నూటింటివెనుక
వెనుకొని దానికి వేయింటివెనుకఁ - బనిగొని దానికిఁ బదివేలువెనుక
నుడుగక దానికి నొకలక్షవెనుక - మడువక దానికి మఱికోటివెనుక
నేసినశరము ము న్నేసినశరము - రాసి యొక్కట దాఁకు రామరావణుల
నరి నప్పు డమరారి నారి సారించి - తలకొని దేవగంధర్వబాణములు
పరువడి నేయంగఁ బఱతెంచుచునికిఁ - బరికించి చూచి యప్పరమాస్త్రవేది
తడయక దేవగంధర్వబాణములు - వడినేసి పొడిసేసె వసుధేశుఁ డంత
నలుకమై రావణుం డారాముమీఁద - బలువిడి రాక్షసబాణ మేయుటయు
మిడిగ్రుడ్లు నిడుదలై మెఱయుకోఱలును - సుడిగొన్న కఱకుజుంజురువెండ్రుకలును7410

నసదృశోన్నతి మించునట్టికాయములు - పొసఁగ దానవరూపములతోడ నిగుడఁ
గనుఁగొని రఘుకులాగ్రణి యల్క మదిని - దనరంగ వైష్ణవాస్త్రముఁ బ్రయోగించి
తరణిదీధితి నంధతమసంబు నడఁచు - కరణి రాక్షసబాణగౌరవం బడఁచె;
నంత రావణుఁ డురగాస్త్రంబు వింట - నెంతయు సంధించి యేసె నేయుటయు,
నామహాబాణమునందు బాణములు - భీమసర్పంబులై పేర్చి యందంద
పదియు నిర్వదియును బండ్రెండు రెండు - పదుమూఁడు మూఁడును బదునేను నేను
తలలతోఁ దలలపైఁ దళతళరుచులు - గలమహామణులతోఁ గడఁకమైఁ బేర్చి
గరుడవాహనుఁ డని కాకుత్స్థుమీఁదఁ - బరవసంబున వచ్చుపాపదం డనఁగఁ
జదల నత్యుజ్జ్వలజ్వాల లెల్లెడల - వెదచల్లుచును వచ్చువిధము వీక్షించి
కాకుత్స్థకులభర్త గారుడాస్త్రంబు - గైకొని సంధించి కడఁక నేయుటయుఁ7420
గడుకొని గారుడాకారబాణములు - వడి నందుఁ బ్రభవించి వసుధ కంపింప
నరపక్షసంఘాతవాతవిధూత - ధరణీధరంబులై తడయక నిగిడి
నడుమన త్రుంచె నన్నాగబాణముల - నుడువీథి సురలుండి యుప్పొంగి యార్వ
వెండియు నాదైత్యవిభునిపై నగ్ని - కాండంబు నిగిడించెఁ గాకుత్స్థుఁ డలిగి
అది ధూమవిస్ఫులింగాక్రాంతదిశము - నది సికాదగ్ధసురాధీశవనము (?)
నగుచు నేతెంచు సురారాతి యుగ్ర - మగువారుణాస్త్ర ముద్ధతి నేయుటయును
ఘనసమూహంబు నాకస మెల్లఁ గప్పి - పొనర శంపాజాలముల వాన గురిసి
యనలసాయకము పెంపడచి గర్జిల్లఁ - గనుఁగొని రాముఁ డాకాండంబుమీఁద
వాయవ్యశర మేసి వారించె దనుజుఁ - డాయెడ దంతిముఖాస్త్రంబు పఱప
దానఁ బెక్కగు దంతితతిగళద్బహుళ - దానజంబాలితధాత్రియై కదియ7430
శ్రీరాముఁడును నారసింహాస్త్ర మేసె - బోరునఁ దద్బాణమున సింహచయము
దారుణతరసటాతారితసకల - నీరదనివహమై నిజఘోరనాద
చలితదిగ్గ్విరదమై చటులత నిగిడి - కులిశోగ్రనఖములఁ గుంభము ల్వ్రచ్చి

రావణుఁడు శ్రీరాములపై శూలము వేయుట

హస్తిసంతతిఁ ద్రుంచె నయ్యెడ సురలు - ప్రస్తుతి చేసి రాపార్థివో త్తముని;
గలుషించి యప్పుడు కల్పాంతవహ్ని - తులితమై మంటలు దొలుకాడుచుండ,
నాలోన లోకభయంకరాకార - శూలంబు గొని రాముఁ జూచి రావణుఁడు
వసుమతి కంపింప వారిధు ల్గలఁగ - దెసల నెల్లెడలఁ బ్రతిధ్వను ల్సెలఁగ
బిట్టుల్కి భూతము ల్బెదరఁ గట్టల్క - దట్టించి సింహనాదము చేసి పలికె;
"పన్నిరారామ! యీపటుశూలవహ్ని - నిన్ను నీతమ్ముని నీఱు గావించి
పోర ని న్నెదిరించి పోరాడి చన్న - వారినారుల బాష్పవారి వారింతు;7440
జూడుము నీ" వంచు శూల మంకించి - యోడక రాముపై నుంకించి వైచె;

దానిపై రాముఁ డుదగ్రుఁడై కినిసి - వానలు కల్పాంతవహ్నిపైఁ గురియు
పురుహూతుపగిది నద్భుతశితాస్త్రములు - గురియంగ నది దాన గుదియక వాని
నుఱక నీఱుగఁ జేసి యుగ్రవేగమునఁ - బఱతెంచుగతిఁ జూచి భానువంశజుఁడు
దేవేంద్రుఁ డర్థిఁ బుత్తెంచినశక్తి - వావిరిఁ గైకొని వైచె; వైచుటయు
నది నిర్గళర్ఘంటికారావ మగుచు - నది విస్ఫురత్పావకారంభ మగుచు
నది యక్షసురఖేచరానంద మగుచు - నది రాక్షసాలోకనాభీల మగుచు
వఱలు మనో వేగవాయువేగమునఁ - బఱతెంచుశూలంబు భస్మంబు చేసె;
నప్పుడు రావణుం డలుక చిత్తమున - ముప్పిరి గొనఁగఁ గార్ముకదశకంబు
ధరియించి పేర్చి యుదగ్రుఁడై యార్చి - శరవృష్టి ముంచిన జననాథసుతుఁడు7450
తా నేకకోదండధరుఁ డయ్యుఁ దునిమె - వానియస్త్రము లెల్ల వారనికడిమి
మదము మత్సరమును మానంబు చలము - గదురఁ గన్నుల నిప్పుకలు నివ్వటిల్ల
రావణుఁ డెంతయు రఘురాముమీఁద - వావిరి నమ్ములవానలు గురిసి
కుదియనికోపంబు కొలఁదికి మిగులఁ - బదియింట మాతలిఁ బదియింట హరుల
వికలసత్త్వులఁ జేసి విషమాస్త్ర మొకటఁ - బ్రకటంబుగాఁ ద్రుంచెఁ బటుకేతనంబు
విపులచింతాభరవివశులై తూలి - కపులు నాకపులు నొక్కట విన్ననైరి;
భువనము ల్శంకించె బుధుఁడు వేధించె - జవమున రోహిణీశకటంబునందుఁ
బటుతరతేజంబు భయదంబు గాఁగ - నట విశాఖకు వచ్చె నంగారకుండు;
చటులోగ్రతరభంగి జలధు లుప్పొంగ - నట దూర్మిమాలిక ల్నభ మంది పొరలె;
నెగయునౌర్వానలనిష్ఠురశిఖలు - పొంగలచందము గాఁగఁ బొగయంగఁ దొడఁగె;7460
ఉగ్రాంశుబింబంబు నొరయుచు వచ్చి - యుగ్రదీప్తులతో మహోల్కలు డుల్లె
నవిరళతరతేజ మటు మ్రానుపడఁగ - రవియును గడుమందరశ్మియై తోఁచె;

శ్రీరాముల కగస్త్యు లాదిత్యహృదయ ముపదేశించుట

నలి నప్పు డేచి మైనాకంబు పోలెఁ - దలఁకఁగ నందంద దశకంఠుఁ డేయు
శరవేగగతిఁ జూచి జనలోకనాథుఁ - డరు దంది చింతింప నట యగస్త్యుండు
చనుదెంచి యారామచంద్రు నీక్షించి - "విను మహాభుజబల వీర యోరామ!
వితతంబుగా నాజి విజయంబు చేయు - నతిగోప్య మగుచున్నయట్టిమంత్రంబు
నెలమితో నాదిత్యహృదయంబు హృదయ - మలర ననుష్ఠింపు మవనీశతిలక!
యిమ్మహాజపమున నిప్పుడు నీవు - సమ్మదం బడరంగ శత్రు గెల్చెదవు;
ఇది యాయు వొనరించు నిది దుఃఖ మడఁచు - నిది సర్వమంగళహేతుభూతంబు
వెలయ సురాసురవినతుఁడై పొల్చు - జలజాప్తుఁ బూజింపఁ జను నీకు నధిప!7470
యీలోకలోచనుం డెల్లలోకములఁ - జాలరశ్ములు నిండఁ జరియించుచుండు
బ్రహ్మయు విష్ణుండు ఫాలలోచనుఁడు - బ్రహ్మకల్పాదినిధాను లైనారు (?)

మది సర్వదేవతామయునిఁగా నెఱిఁగి - కదనంబు నప్పు డీకమలబాంధవుని
నెవ్వఁడు కీర్తించు నింపుసొంపార - నవ్వీరునకుఁ గల్గు నాహవజయము"
అనుచు నమ్మునివరుం డాశ్రమంబునకు - జనుటయు నాసౌరజప మాచరించి
యప్పు డత్యున్నతుఁడై రాఘవేంద్రుఁ - డుప్పొంగి రావణోద్యోగంబుఁ జూచి
ఘోరావలోకనాగ్నులు మండుచుండ - భూరిధూమ్రాయతభ్రుకుటి నిక్కించి
పెరిఁగి రావణురథాభీలఘోటముల - నురుతరాస్త్రంబుల నుఱక నొప్పించి
వరశరత్రయము రావణులలాటమున - సరిఁ గ్రుచ్చి యురురక్తసంసిక్తుఁ జేసె;
నప్పుడు రక్తసిక్తాంగుఁడై చూడ - నొప్పె లంకేశ్వరుం డొగి రామచంద్రు7480
శరవసంతాగమసమయసంఫుల్ల - తరుతారుణాశోకతరువుచందమునఁ
గుపితుఁడై యంత రక్షోభర్త రాము - విపులవక్షం బేసె వేయిబాణముల:
”నధమప్రయుక్తంబు లై సురద్రోహ - విధి కోసరింపక విషశక్తి మెఱసి
నిర్మలగుణయుక్తి నెఱిఁబెడఁ బాసి - ధర్మంబు విడిచి యుద్ధతశక్తి నిగిడి
చనుదెంచి రాఘవేశ్వరుని నొప్పింపఁ - జన నధోగతి గాక సద్గతి గలదె?”
యనినచందంబున నద్దశాననుని - ఘనబాణములు వచ్చి కాకుత్స్థు గాడి
జగదద్భుతంబుగాఁ జని భూమి దూరి - తగులక నిగిడి పాతాళంబుఁ జొచ్చె;
నురుతరక్షతముల నుఱక పెల్లుబ్బి - తొరుఁగునెత్తుట దొప్పదోఁగి రాఘవుఁడు
ప్రళయాకాలాభీలపావకజ్వాల - లలవుమై నిట్లుండు నన నిండ మండి
మండుచిచ్చఱకంటిమంటలు మింట - నొండొండఁ బర్వు కాలోగ్రుఁడో యనఁగఁ7490
జండతేజమునఁ బ్రచండమార్తాండ - మండలకిరణసమానాసమాన
మానితశరపరంపర లోలి పఱపి - మానగర్వము తొంటి మదమును నుడిపి
యని సేయఁ గాలుసే యాడకయుండఁ - దనువెల్ల జర్జరితంబుగాఁ జేయఁ
బర్విడి రఘురాముబాణవేగమున - నిర్విణ్ణుఁడై యుండె నిల్చిరావణుఁడు;
దశరథసుతుఁడు ప్రతాపభాస్కరుఁడు - దశకంఠుఁ జూచి యుదగ్రుఁడై పలికె.
“నేలరా! రావణ! యిట్లు నిర్విణ్ణ - శీలుఁడవై యుండఁ? జేష్టలు మఱచి
యోడ నెన్నఁడు నని యుగ్రాహవముల - నాడుదు బీరంబు లవి యెందుఁ బోయెఁ?
బెరిఁగి, మీయన్నఁ గుబేరు గాఱించి - పరునిచందమునఁ బుష్పకముఁ దెచ్చుటయు
మఱి యరణ్యములందు మము డాఁగురించి - చెఱఁగొని లంకకు సీతఁ దెచ్చుటయు
నివి వీరకృత్యంబులే దశగ్రీవ! - యివి పౌరుషములని యిందు గర్వింతు7500
వడిఁ బురాకృతదోషవశుఁడవై చిక్కు - పడి నేఁడు నాదృష్టిపథమునఁ బడితి
పడితిగా కింక నీప్రాణము ల్గొనక - విడుతునే ని న్నేల విడుతునే లంక?
హరిహరబ్రహ్మదు లడ్డ మైరేనిఁ - బొరిగొందుఁ బోనీనుఁ బోర సాధింతు;
రావణ! నేఁడు నీరక్తమాంసములు - సేవింపఁజేయుదుఁ జెలఁగి భూతములఁ;

గష్టచిత్తుఁడ వతికామాతురుఁడవు - దుష్టబుద్ధివి సురద్రోహివి గానఁ
బదిలమై నిలువక పాఱితేనియును - బొదివి నిన్ జంపుట పుణ్యంబు నాకు,
నాసన్నమృత్యుఁడ వైననీతోడ - నీసుమాటలు వల్క నింక నేమిటికి?
నీవిక్రమంబును నీభుజాబలము - నీవైభవంబును నేఁడు వాపెదను;
గలన నీతమ్ముని ఖరుఁ డనువానిఁ - బొలియించు టెఱుఁగవే భువనభీకరుని?
నింక నొక్కటి నీకు నెఱిఁగింతు వినుము - శంకింప వలవదు జనకజ నిచ్చి7510
శర ణను కాచెద సమరంబు సేయ - నురుజయం బిది నీకు నోటమి గాదు;
ఆయువు వరశక్తి నధికంబు వడసి - మాయావిధంబులు మఱిఁ బెక్కు లెఱిఁగి;
సమరోగ్రశస్త్రాస్త్రసామగ్రి గలిగి - యమరేంద్రుఁ డాదిగా నఖిలదిక్పతుల
మూఁడులోకంబుల మును గెల్చియున్న-వాఁడి వీరుని నిన్ను వధియింతు" ననిన
మర్కటయూథవు ల్మది సంతసిల్లి - రర్కతనూభవుం డావిభీషణుఁడు
"భూవర! జయమును బొందు నీ"వనఁగ - రావణు వీక్షించి రఘురాముఁ డనియె.
“నింక నొక్కటి నీకు నెఱిఁగింతు వినుము - శంకింప వలవదు జనకజ నిచ్చి
శర ణను కాచెద; సమరంబు సేయ - నురుజయం బిది నీకు నోటమి గాదె?"
యనుచున్న రఘురాము నత్యుగ్రభాష - లనలార్చులై తన్ను నడరి కాల్చుటయు
నలుకమై నులుకుచు నద్దశాననుఁడు - బలియుఁడు జానకీపతిఁ జూచి పలికె;7520
“దురమునఁ గొందఱ దుష్టరాక్షసులఁ - బెరిఁగి జంపితి నని పేర్చెదు కడఁగి
న న్నెఱుంగవు నీవు నాలావుకొలఁది - ము న్నెఱుంగవు నేను మునుమిడిఁ దొల్లి
యతిలోకకృతు లైన యక్షగంధర్వ - పతుల దేవతల దిక్పతులఁ బెక్కండ్ర
బలువిడిఁ గాఱించి భంగించి నొంచి - చెలఁగి వర్తింతు విశృంఖలవృత్తి
సమబలప్రౌఢి విచారింప కేను - సమరంబులో నిన్ను సరకు సేయుదునె?
నిన్ను నీతమ్ముని నేఁ డాజిఁ జంపి - కన్నులపండువుగాఁ జూచి కాని
యీలంకఁ జొర నింక నే” నంచు మించి - కాలాగ్నికల్పుఁడై గడఁగి రావణుఁడు
మహియు నాకసమును మండ రాఘవుని - బహుదివ్యశస్త్రాస్త్రపంక్తులఁ బొదివెఁ
బొదివినఁ గోపించి భూపాలుఁ డేసెఁ - బొదిగొని ప్రతిబాణములు సహస్రములు
అప్పుడు రఘురాముఁ డధికసంతోష - ముప్పొంగ రెట్టించి యురుపరాక్రమము7530
చెనఁటియౌ తాటక జీఱిననాఁడు - ముని యిచ్చుదివ్యాస్త్రముల మదిఁ దలఁపఁ
దలఁపులోనన వచ్చి తమమూర్తు లొప్ప - విలసితజయలింగవిస్ఫులింగముల
నమరదివ్యాస్త్రంబు లవి వెలుంగుటయు - సముచితస్థితి వాని సంధించి మించి
కొండపైఁ బిడుగులు గురియుచందమునఁ - జండత సవ్యాపసవ్యంబు లేసి
తనియక మఱియు నుద్ధతశక్తి మీఱ - ఘనబాణవృష్టులఁ గప్పి నొప్పించి

రావణుఁడు మూర్ఛిల్లుట

కడఁకమై బోరాడఁగాఁ బొడసూపు - నడుమీక దశకంఠు నలిఁ జిక్కు పఱిచె.

నారాముశరహతి నవశుఁడై దనుజుఁ - డారథమధ్యంబునందు వ్రాలుటయుఁ,
గనుఁగొని భీతుఁడై కాలకేతుండు - గొనిపోయె నరదంబు ఘోరాజి వెడల
సుర లప్పు డెంతయుఁ జూచి యార్వంగఁ - దరుచరయూథము ల్దగ నుత్సహింప
నొలసినలావుమై నొకకొంతవడికి - బలశాలి రాక్షసపతి మూర్ఛఁ దేరి,7540
ప్రథనవిక్రమసమప్రారంభుఁ డగుచు - రథముపై నిలిచి సారథిఁ జూచి పలికె;
"ఓరి రాముఁడు నవ్వ నురుకీర్తిఁ ద్రెవ్వఁ - దే రింతయెడదవ్వు దెత్తురే” యనిన
“నోడినవాఁడవై యుండ నీపగతుఁ - గూడినవాఁడనై కొని రాక గాదు
రథిసంకటంబు సారథి గన్నచోట - రథము మరల్చుట రణధర్మ మెందు
నటుగానఁ దెచ్చితి" ననవుడు వాని - పటువివేకమునకు బలుమాఱు మెచ్చి
పరమసమ్మదమున బసదనం బిచ్చి - సురవైరి యప్పుడు సూతు వీక్షించి
"రాముఁ డున్నాఁ డదె! రణమధ్యవీథి - రామునిరథముపై రథముఁ బోనిమ్ము"
నావుడు నరద మన్నరనాథుఁ గదియ - ద్రోవ నక్కాలకేతుఁడు బిట్టు వఱపె;
దశకంఠునరద ముద్ధతి రాఁగఁ జూచి - దశరథసుతుఁడు మాతలిఁ జూచి పలికె;
“నదె! రావణునిరథ మరుదెంచుచున్న - దదె! మనరథమును నటఁ బోవనిమ్ము;7550
దృష్టి చలింపక తీవ్రబాణముల - దృష్టించి వెఱవక తిరుగుడువడక
వదలక కుదియక వరుసఁ బగ్గములు - పదిలంబుగాఁ బట్టి పఱపు రథ్యముల
మాతలి! హయముల మనసు నీ వెఱుఁగు - దాతతరథ వేగ మతివిచిత్రముగ
సారథ్య మొనరింపు సకలంబు నీవు - నేరనియది లేదు నీ కేల చెప్ప?"
ననవుడు నపసవ్య మగుత్రోవ నాతఁ - డనిమిషారాతిపై నరదంబు పఱప
లోకకంటకుఁడు త్రిలోకభీకరుఁడు - భూకంపముగ మహాద్భుతశితాస్త్రములు
రథముపైఁ గప్పి సారథిఁ జిక్కుపఱిచి - రథవాహముల నొంచి రౌద్రంబు మించి
కాండ మొక్కట విల్లు ఖండించి పెక్కు - కాండంబు లేసి రాఘవుని నొప్పించె;
నొప్పింప నొచ్చి మనోవీథి నలుక - ముప్పిరిగొన నుగ్రమూర్తియై కడఁగి
దేవేంద్రుఁ డర్థిఁ బుత్తెంచినవిల్లు - వావిరి రామభూవరుఁ డెక్కుపెట్టి,7560
నెఱసిన ఘనశింజినీనినాదములఁ - బఱియలై బ్రహ్మాండభాండంబు పగుల
దానవగర్వాంధతమసం బడంగ - భానుభాసురములై పరఁగునస్త్రములు
శతములు వేలు లక్షలు కోట్లు మఱియు - శతకోటు లర్బుదసంఖ్యలు గడవ
వాసవప్రముఖ గీర్వాణు లుప్పొంగ - నీసున నింద్రారి నేసె నేయుటయుఁ
“గడుఁబాపకర్ముండుఁ గష్టుఁ డస్థిరుఁడు - వెడమాయములప్రోగు వీనిలో నునికి
ధర్మప్రయుక్తమైఁ దనరెడి మాకు - ధర్మంబు గా”దని తలపోసి రోసి
పోవుపోలిక నుచ్చి పోవుచునుండు - రావణుఁ గొని కాడి రాముబాణములు
"ఎడలేదు రావణుం డిలఁ గూలు నింక - నడలకుం డిటమీఁద" నని ముదం బొదవ

ధరణికి సురలకు ధరణినందనకుఁ - బొరిఁ బొరి నెఱిఁగింపఁ బోవుచందమున
నొకకొన్ని ధరణికి నొకకొన్ని దివికి - నొకకొన్ని లంకకు నురువడిఁ బోవు7570
పావకోగ్రంబులై పరువడి నిగిడి - రావణుఁ గొని కాడు రాముబాణములు
నెఱసి యిత్తెఱఁగున నిబిడంబు లగుచు - నఱిముఱి జడిగొన్న యంపవానలకుఁ
దెరలక మరలక దివిజారి దివిరి - ధరణీశు నురుశరోత్కరముల నొంచె;
ఘనబాణవిక్రమక్రమబాహు లగుచుఁ - బెనఁగి రిబ్భంగి నభేద్యవిక్రములు
సమసత్వసమవేగసమబాణవిభవ - సమసమరారంభచతురులై కదిసి
బలముల నేర్పుల బాహుగర్వముల - దులదూగి యిద్దఱు దురములోపలను
నెఱసినకినుకలు నిండ నొండొండ - చెఱవిడి పోరాడు సింగంబు లనఁగ
నేడహోరాత్రంబు లెడతెగకుండ - రూఢిఁ బోరాడి రారూఢి విక్రములు;
అత్తఱి రావణునరదంబుమీఁద - నెత్తురు వర్షించె నిల్చి మేఘములు;
ఘనరథాశ్వములతోఁకల నిప్పు లురిలె - నినరుచిచ్ఛాయ లనేకంబు లయ్యె 7580
నిలువవు చచ్చెదు నేఁడు నీవనుచుఁ - బలికె రావణుఁ జూచి బలసి భూతములు
గెలిచెదు రాఘవక్షితిప! నీ వనుచు - వలనొప్ప నాకాశవాణి భాషించె;
తనకైన దుర్నిమిత్తము లటు సూచి - యనిమిషారాతియు నాస పోవిడిచి
ధృతి పెంపు దీపింపఁ దివిరి కాకుత్స్థు - నతిశాతశరముల నడరి నొప్పించి
కరవాలములు మహాగదలు చక్రములు - పరిఘలు శక్తులు బ్రాసము ల్వైచె
వైచిన వానిపై వజ్రసన్నిభము - లై చండకాలానలాకృతు లైన
సాంద్రార్ధచంద్రాస్త్రచయ మేసి రామ - చంద్రుండు నడుమన చక్కు గావించె;
నారావణుండును నత్యుదగ్రతను - ఘోరనారాచము ల్గురియించె మఱియుఁ
జలమున రాఘవేశ్వరుఁడును వాని - నలినర్ధచంద్రబాణము లేసి త్రుంచె;
నారీతి నిరువురు నన్యోన్యసమర - ధీరులై జయకాంక్షఁ దెగి పోరుచుండ7590
సమరంబులో నద్రిచరనిశాచరులు - దమతమయుద్ధసాధనములు గొనుచు
రణవిచక్షణు లైన రామరావణుల - రణకేళిఁ గనుఁగొని రణకేలి మఱచి
పరువడిఁ జిత్రరూపంబులో యనఁగ - నరుదంది చూచిరి; యద్దశాననుఁడు
తనచావు నిక్కంబు తా నెఱింగియును - గినిసి రాముఁడు దనగెలు పెఱింగియును
నెంతయుఁ గడఁకతో నిరువురుఁ జలము - లంతకంతకు నెక్కుడై పోరుతఱిని
గనలి కాలానలకల్పుఁడై రోష - మునఁ గన్నుగవల నిప్పుక లుప్పతిలఁగ
నింద్రారిరథకేతు విలఁ గూల్చె రామ - చంద్రుండు నిశితార్ధచంద్రబాణమున
నారావణుండును నధికరోషమున - ఘోరబాణముల నెక్కొని రథాశ్వముల
మాతలి నేసె నామార్గణనిహతు - లాతతాంబుజనాళహతులచందమున
నారాఘవేంద్రుని నాతురంగముల - సారథి నొప్పింపఁ జాలకయుండ7600

హాసంబులును నట్టహాసము ల్సెలఁగ - వాసిగఁ గపులు రావణుని మార్కొనినఁ
దరుచరసేనపైఁ దనమాయ మెఱసి - సురకంటకుఁడు మహాశుగవృష్టిఁ గురిసెఁ
గురిసినఁ దద్బాణకోటులచేతఁ - దరుచరు ల్జడిసి; రత్తఱి రామవిభుఁడు
సారథిరథరథ్యసహితుఁగా దైత్యు - భూరిమార్గణములఁ బొదివి నొప్పించె;
దశరథసుతునిపై దశకంధరుండు - విశిఖజాలంబుల వృష్టిగా నపుడు
కురిసినఁ గనుఁగొని ఘోరబాణముల - నరుదుగా సంధించి యమరులు వొగడ
నతని నాకాశంబు నవనీతలంబు - నతిరయంబున రాముఁ డమ్ములఁ గప్పె;
బగ లెల్ల నమ్ములపందిరినీడ - నొగి రాత్రి శరదీప్తి నుడుగక యుండి
తనరు మహేంద్రమందరమహీధరము - లొనరు ధైర్యంబుల నొప్పుచందమున
నలిఁ దిరంబై నిల్చి నభముతో నభము - జలధితో జలధియు సరిఁ బోరుకరణి7610
“రామరావణుల సంగ్రామంబుతోడ - రామరావణుల సంగ్రామంబె పోలు”
ననుటకుఁ దగి మహోదగ్రకోపనులు - దనరార నిరువురుఁ దమకించి పోర
జలదగర్జితధనుర్జ్యాఘోషములను - గలహనిష్ఠురబాణఘట్టనధ్వనుల
జితవర్మసమరోగ్రసింహనాదములఁ - జతురరథాశ్వహేషావిరావముల
నుదధులు ఘూర్ణిల్లె నుల్కలు డుల్లెఁ - ద్రిదశు లుప్పొంగిరి దిక్కు లల్లాడె
బెగడె భూతంబులు పృథివి కంపించె - దిగిభంబు లూటాడెఁ దిరిగె లోకములు
నగములు వడఁకెఁ బన్నగభర్త దలఁకె - నగణితప్రౌఢి ని ట్లరిమి పోరాడఁ
గడకలు విడిచి యుగ్రత లుడ్గి కొంత - తడ విద్దఱును బాహుదర్పము ల్సడలి
ఘనబాణసంధానగతు లుజ్జగించి - కనుఁగొనుచుండిరి కలయ నొండొరులఁ
దెమలి పైపయిన పూత్కృతులు నార్పులును - జెమటలవఱదలు చిఱుతహుంకృతులు7620
నలయికలును ఘటికార్ధానఁ దేరి - మలుగనిచలములు మఱియుఁ బ్రేరేప
నత్యుగ్రనిగ్రహవ్యగ్రులై కదిసి - రత్యంతకాలకాలాకృతి నప్పు

శ్రీరాములు రావణునికరశిరంబులఁ దెగనేయుట

డలవుధైర్యంబును నలుక దీపింపఁ - బ్రళయకాలమునాఁటి ఫాలాక్షపగిది
ఘనశాతకర్కరిక్రకచభల్లంబు - నినవంశవల్లభుం డెసఁగ సంధించి
యరు దరు దనఁ ద్రుంచె నద్దశాననుని - శిరములు పదియును జేతు లిర్వదియు
త్రుంచుట బొంకొకో? త్రుంచితి ననుచుఁ - ద్రుంచిన రాముఁ డద్భుత మంది చూడ
గరవాలములను ముద్గరభిండివాల - శరచాపకేయూరచయములఁ దనరు
కరము లిర్వదియును ఘనకిరీటములు - శిరములు పదియును జెచ్చెర మొలచె
మొలచినఁ గోపించి మొగిఁ ద్రుంచె మఱియు - దలలు చేతులు పేర్మి దశరథాత్మజుఁడు
తల లుద్దవిడిఁ ద్రుంచు తఱిఁ క్రింద మొలచు - తలలకిరీటము ల్తద్బాణతతులు7630
దాఁకి మ్రోయుట చెవిఁ దాఁకక మున్న - తాఁకు నత్తలల యుదగ్రహాసములు

తరమిడిఁ ద్రెవ్విన తల లోలి మొలవఁ - బరమేష్ఠిచేఁ దొల్లి పడయుచో వరము
గలకరంబులతోడఁ గనుకని మొలవ - బలియుఁడై యీతఁడు వడసెనో యనఁగఁ
దల లొగి మొలతేరఁ దడపకుత్తుకల - నలిఁ గాడి రాముబాణము లుండె నోలి
మొగిఁ ద్రెంచు తలలు, నమ్ములతోన మీఁది - కెగయఁ ద్రోచుచు వెన నెగయునత్తలలు
దొంతుల కుత్తుక ల్ద్రుంచు నస్త్రములు - నెంతయు రమ్యమై యెసఁగెఁ జూపరకు
ఫలితసౌరభరామబాణోత్పలములఁ - గలిపి రావణశిరఃకమలసంతతులు
రమణమై రక్తధారాసూత్రతతులఁ - గ్రమ మొప్ప నెత్తులు గట్టి వేల్పులకుఁ
బొలుపొంద నాకాశపుష్పలావికుఁడు - సొలవక పలుమఱుఁ జూపుచందమున
దనుజాధిపతి గొంతదడవు చూడ్కులకు - నినకులాధీశ్వరుం డేయుచో మఱియుఁ7640
దైవ్వి రాలెడునెడఁ ద్రెవ్వనితలలు - గ్రువ్వని పేరులై కొమరొప్ప నప్పు
డనిమిషావలి యెల్ల నచ్చెరువంది - కనుఁగొన నద్దశకంధరుం డమరె;
లలి శిరోమాలికాలంకృతుండైన - ప్రళయావసరఘోరభైరవుపగిది
నావేళ రఘురాముఁ డాగ్రహవ్యగ్ర - భావుఁడై రణబలప్రౌఢి దీపింప
లక్షించి దృఢముష్టి లాఘవగతుల - దక్షుఁడై రావణుతలలు బాహువులు
త్రెంచు గ్రమ్మఱ మొలతెంచు వెండియును - ద్రెంచుఁ గ్రమ్మఱ మొలతెంచు నిబ్భంగిఁ
గరములు శిరములు కాకుత్స్థతిలకు - శరపరంపరలచేఁ జటులవేగమునఁ
దెగుటలు మొలుచుట ల్దెలియరాకుండె - నగచరావలికి నయ్యనిమిషావలికి
నాలోన రఘురామునమ్ములఁ ద్రెస్సి - రాలుచు నున్న యారావణుతలలు
ఆవులింపవు నొవ్వ వలసము ల్గావు - లావు దూలవు నిజోల్లాసము ల్సెడవు7650
గాజువారవు మిడుకవు రెప్పవేయ - వోజఁ దప్పవు వైర ముడుగ వెంతయును
బగ యొండె బొమముడిపా టొండె నిండు - నగ వొండె నా ర్పొండె నలుకచూ పొండె
పలు కొండె మె చ్చొండెఁ బై వడిఁ బోరు - నల వొండె ధృతి యొండె హంకృతి యొండె
గలుగని తలలేదు ఘనరణభూమి - తలమునఁ బడియున్న తలలలో నొకటి
తలలందు సమములై తలకొనుచుండ - మొలతెంచు తలలందు మొగి నుర్వి గూలు
దానవాధీశ్వరుతలలు బాహువులు - భూనభోంతరము లద్భుతముగా నిండె
నిండుటఁ గనుఁగొని నిండఁ గోపించి - వెండియు రామభూవిభుఁ డేయుచుండెఁ;
ద్రెంచినశిరమును ద్రెవ్వినకరముఁ - ద్రుంచినశిరమును దునిఁగినకరము
బలువడిఁ బుట్టిన బాహుదండముల - నలమి యప్పుడు పట్టి యద్దశాననుఁడు
గణుతింపరాని వేగము లావు మెఱసి - రణరోషదృష్టిమై రాముపై వైచె7660
నఱిముఱి దశకంఠుఁ డందంద వైవఁ - బఱతెంచు శిరములు బాహుదండములు
గువలయహితవృత్తి కుశలుఁడై కళల - నవిరళాకృతి జగదానందుఁ డగుచుఁ
గమనీయవానరగ్రహమధ్యవీథి - రమణుఁడై యొప్పెడు రఘురామచంద్రుఁ

గని చంద్రుఁ డనుబుద్ధి గమలషండములు - ఘనరాహుకోటులఁ గడఁకతోఁ గూడి
యడరి యన్యోన్యసహాయము ల్వడసి వడిఁ బేర్చి వచ్చుకై వడిఁ దాఁకుచుండె ;
శిరములు గరములు సెలఁగి యేతెంచు - వరుసలు పంక్తులు వర్ణింప నొప్పు
శ్రీరామవిజయలక్ష్మీవివాహమున - నారణదేవత లర్థి శోభిల్లఁ
బల్లవరత్నదర్పణతోరణములు - తెల్లమై కట్టిన తెఱఁగు దీసింపఁ
దరిగినతలలు నుద్దామబాహువులు - గురిసెడిసరములు ఘూకకాకాది
ఖగములు జగము లాకంపింపఁ బేర్చి - గగనమండల మెల్లఁ గలగొన నిండ7670
గురుతరంబై జముకొలువుకూటమునఁ - గర ముగ్రముగ మేలుక ట్లనఁ బరఁగి
యిది దివ మిది రాత్రి యిది సంధ్య యనుట - త్రిదశులకైనను దెలియరాకుండె;

రావణుని కరశిరంబులు మరల మొలుచుటకై శ్రీరాములు చింతించుట

ప్రథితబాణాసనబాణదీప్తులును - ప్రథనంబులోఁ బట్టపగ లయి తోఁచె;
నప్పుడు రఘురాముఁ డాదైత్యు గెలుచు - చొప్పింత యైనను జొప్పడ కునికి
గనుఁగొని శరసంధిగతులుఁ బాలించి - తనలోనఁ బలుమఱు దలపోయఁ దొడఁగె.
““తెరలక శిరములు తెంచి వేసరితి - దొరకొని కరములు త్రుంచి వేసరితి;
నెసఁగుమర్మము లెల్ల నేసి వేసరితి - విసువక పలుమాఱు వేసి వేసరితి;
నెబ్భంగిఁ దెగటారఁ డీదుష్టచిత్తుఁ - డెబ్భంగి దెగటార్తు నిద్దురాత్మకుని?“
నని యని తలపోసి యలయుటఁ జూచి - జననాథుతో విభీషణుఁ డర్థిఁ బలికె.
“వనజాతజాతుని వరమునఁ జేసి - యినకులాధీశ్వర! యీతనినాభి7680
నమృత మున్నది కుండలాకృతిఁ గలిగి - యమృతత్వమూలమై యది చంపనీదు;
దానవుతలలు నుద్దండబాహువులు - మానక నీ వెన్నిమాఱు లేసినను
మొలతెంచుచుండు; నున్మూలము ల్గావు; - తలఁకఁడు దీన నద్దనుజవల్లభుఁడు
తఱిమి యిమ్మెయి నీవు తలలు బాహువులు - నఱుకుచున్నాఁడవు నరనాథ కడఁగి,
తుది యేది దీనికి? దొస గొడ్డి నీవు - చదురొప్ప నాగ్నేయశర మేయు మింక
నానాభిమూలమూలామృతం బిగురు - దాన దానవపతి దాన లోదారు,
నిగిడెడు భవదీయనిష్ఠురాస్త్రములఁ - దెగి మఱి చేతులు త్రిదశారితలలు
దురములోపల నూటతొమ్మిదినూఱు - లరుదుగా మొలతెంచు నంతటఁ బొలియు"
ననవుడు విని లక్ష్మణాగ్రజుం డతని - వినయనయజ్ఞానవిశ్వాసభక్తి
భావశుద్ధికి నాత్మఁ బలుమఱు మెచ్చి - దేవత లుప్పొంగ దివిజారి గ్రుంగఁ7690
గ్రుంగనిధర్మంబు కొనలు సాగంగఁ - గ్రాగిన నదులెల్లఁ గలఁక దేరంగఁ
దీరనిచిత్తంబు దేరి రాఘవుఁడు - ఘోరంబుగా ధనుర్గుణము మ్రోయించి,
కనలెడి దీర్ఘనిర్ఘాతము ల్గురియు - ననలాస్త్ర మరివోసి యలవొప్ప నేసి

యారావణుని నాభియం దున్నయమృత - మారూఢశరవహ్ని కాహుతి చేసి,
మఱి నూటతోమ్మిదిమాఱులు ద్రుంచి - తఱికొని రావణుతలలు బాహువులు
నిరుపమాస్త్రంబున నృపకులాధిపుఁడు - పరికింప మఱి నూటపదియవసారి
యొక్కశిరంబును నొగిఁ గరద్వయము - దక్కంగఁ దక్కినతలలు బాహువులు
దెగనేసె; నేసినఁ ద్రిదశులు చెలఁగి - రగచరవరు లార్చి రందంద పేర్చి
తల లోలిఁ దెగి రక్తధారలు ధాత్రి - నొలుకఁగ దివి కుబ్బ నొప్పె రావణుఁడు;
లోకహవిర్భాగలోలకీలములు - పైకొని మండెడి ప్రళయాగ్నిపగిది7700
దనువున ఘనరక్తధారలు నిండ - దనుజేశుతనువుపైఁ దల యొప్పెఁ జూడ;
నరుణారుణచ్ఛాయ లడరునస్తాద్రిఁ - బరఁగెడి భానుబింబంబుచందమున;
నప్పుడు రావణుం డావిభీషణునిఁ - దప్పక చూచి యుదగ్ధుఁడై యలిగి
“యెవ్వరు నెఱుఁగని యిట్టి నామర్మ - మివ్వసుధేశున కెఱిఁగించె వీఁడు;
వీనిఁ ద్రుంచెద" నంచు విపులోగ్రశక్తి - పూని వైచుటయు నభోవీథినుండి
యఱిముఱి నిగిడి కాలాగ్నిచందమున - నెఱమంట లుమియుచు నేతెంచుచుండ;
నారామవల్లభుం డచలుఁడై ఘోర - నారాచముల దాని నడుమనే త్రుంచె;
జడిగొని రఘురాము శరవృష్టి పర్వి - యుడుగకుండుటయు నందుండ రాకున్న
వలనేది రాక్షసేశ్వరుకోపవహ్ని - పొలుపరఁ బెడఁబాసి పోవుచందమునఁ
బోయె రావణుదేహమున నున్నతేజ - మాయవసరమున నద్భుతం బగుచు7710
తలలు చేతులు ద్రెవ్వి దశకంఠుఁ డొక్క - తలయుఁ జేదోయు నై దర్పించి యపుడు
వీరరసంబను వెల్లిచందమునఁ - దోరమై తొరుఁగునెత్తుటఁ దొప్పఁదోఁగి,
తడఁబడ నెత్తుటఁ దడిసి రణోర్విఁ - బడియున్న తలలును బాహుదండములు
వాని చంచులఁ జించువరపక్షిరణము - బూని యొక్కటఁ జూచి భూనాథుఁ జూచి,
చఱగొని తనదైన సటలెల్లఁ బెఱుక - చెఱవిడి వడిమ్రోయు సింగంబుభంగి
నేపారు తనకోఱ లెల్లనుఁ బెఱుకఁ - గోపించి పైఁబడు ఘోరాహికరణి
మీసంబు లూఁచిన మిగులఁ గోపించి - శాసింపఁ గడఁగిన జమునిచందమున
మెఱసి లోకము లెల్ల మ్రింగెడిరీతిఁ - నుఱక కోపించి మహోగ్రుఁడై తొంటి
యన్నిచేతులఁ గల యాసత్త్వ మెల్ల - నున్నచేతులరెంట నుగ్రమై తోఁప
నాసురవరుఁ డట్టహాసంబు చేసి - ప్రాసతోమరశూలపరశుఖడ్గముల7720
శరముల సురియల శక్తుల గదల - నురువడి వేసియు నురక వైచియును
బొడిచియు నడచియుఁ బోనీక రాము - నుడుగక నొప్పించి యుగ్రుఁడై యేచి
దేవత ల్భయమందఁ దెగి మహారణము - గావించుచుండె నక్కజమైన కడిమిఁ
గడఁకయు లావును గర్వంబు మిగుల - నడరి ధీరతఁ బోరు నమరారిఁ జూచి
మాతలి భీతుఁడై మఱి రాము ననియె - "నీతడ వేటికి నినకులాధీశ!

తలలు బాహువులు నిద్దనుజాధిపతికి - మొలచునో క్రమ్మఱ మొలవకమున్నె;
యెడపక బ్రహ్మాస్త్ర మేసి యీనీచుఁ - బడవైతు కాక! దోర్బలశక్తి మెఱసి"
యనవుడు విని రాముఁ డభిరామబలుఁడు - వినుతవిక్రమభుజావిభవనిర్భరుఁడు
విదితమౌ శస్త్రాస్త్రవేది గావునను - నిది వేళ బ్రహ్మాస్త్ర మెత్తంగ ననుచు
భూదేవదేవతపోధనువేద - వైదికకర్మప్రవర్తనఁ దలఁచి7730
తనప్రతాపంబును దర్పంబు మెఱసి - ధనువు మోయించుచు ధరణి గంపింపఁ
గౌశికకృతమైన క్రతువేళఁ దనకుఁ - గౌశికుఁ డిచ్చిన గైకొన్నయట్టి
యక్షయబ్రహ్మాస్త్ర మప్పుడు దలఁచి - దక్షత వేదమంత్రములతోఁ బుచ్చి
తిరముగా నరివోసి తెగ నిండఁ దిగిచి - పరఁగఁ బ్రత్యాలీఢపాదుఁడై నిలిచి
దేవేంద్రుఁ డాదిగా దివిజు లుప్పొంగ - దేవారి యురముపై దృష్టి సంధించి
యేసె నేయుటయుఁ బెల్లేచి యాబాణ - మాసురాలోకకీలాభీల మగుచు
వసువులు కెలఁకుల వనజాతమిత్ర - వసువు లగ్రంబున వసురత్నతతులు
పిఱుఁదుముందఱ మహాపృథులమారుతము - గరుల నుజ్జ్వలదివ్యకళ లెల్ల కడల
సహజంబులై పేర్చి సంతతామోఘ - మహితమై దేదీప్యమానమై సకల
శాఖామృగాభీష్టసఫలమై చతుర - లేఖావలోకనాలీఢమై నిగిడి7740
నిలువక విలయాభ్రనిర్ఘోషఘోష - ములు పర్వ రాక్షసముఖ్యులు బెదర
జయజయధ్వనులతోఁ జదలు గ్రక్కదల - రయమున రావణోరస్థలి గాడి

రావణుఁడు బ్రహ్మాస్త్రముచే మడియుట

యయ్యింద్రయమవరుణాదులచేత - వ్రయ్య నీమర్మము ల్వ్రచ్చి రావణుని
ప్రాణము ల్గొని యుచ్చి పాఱి యాదివ్య - బాణంబు వెస మహీభాగంబు గాడి
నీకూఁతుఁ జెఱఁబెట్టి నీచభావమునఁ - గైకొనఁ దలఁచిన ఖలుని ప్రాణములు
కైకొంటి నే నని కదిసి భూస్థలికిఁ - బ్రాకటంబుగఁ జెప్పఁ బఱచెనో యనఁగ,
మహి గాడి పఱతెంచి మగిడి రాఘవుని - మహితతూణీర మున్మదవృత్తిఁ జొచ్చె;
నలి బ్రహ్మమనుమని నాటి చంపుటకుఁ - గలిగినదోషంబు గడతేర్చుకొనఁగ
నేచందమున నెందు నితరంబు లేమి - చూచి రాఘవుమర్వు సొచ్చెనో యనఁగ,
రాఘవాస్త్రాక్షతరక్తాంబుధార - లోఘంబులై పర్వ నొరయుచు వచ్చి7750
కులిశధారాహతిఁ గుంభిని గూలు - కులశైలమును బోలెఁ గూలె రావణుఁడు
ఆదైత్యభూరిదేహాతిపాతమున - భూదేవి యప్పు డద్భుతముగాఁ గ్రుంగెఁ;
గ్రుంగె శైలంబులు గ్రుంగె దిక్కరులు - గ్రుంగె భుజంగంబు గ్రుంగెఁ గూర్మంబు
తలఁకిరి సప్తపాతాళవల్లభులు - దలఁకిరి హతశేషదనుజపుంగవులు
గిరిచరు లార్చిరి కీర్తించి రమర - వరులు కిన్నరులు దిగ్వరులు ఖేచరులు
ఆరఘురాముపై నప్సరస్త్రీలు - బోరనఁ గురిసిరి పుష్పవర్షములు;

దివ్యదుందుభులును దివ్యకాహళులు - దివ్యశంఖంబులు దివినిండ మ్రోసె;
శీతలపరిమళాశ్లిష్టవాయువులు - వీతెంచె దిక్కులు విమలంబు లయ్యె;
సురమునిఖేచరశోకంబు డించి - పరికించి సకలభూధారంబు డించి
యభిమతజయశీలుఁడై పేర్చి రామ - విభుఁ డంతఁ దనచేతివి ల్లెక్కుడించి,7760
యానందమయచిత్తుఁ డగుచు నవ్విల్లు - జానకీవిభుఁడు లక్ష్మణు చేతి కిచ్చె;
సకలవానరులును సకలఖేచరులు - సకలదిక్పతులును సకలభూవరులు
సకలభూతంబులు సకలదేవతలు - సకలలోకంబులు సన్నుతి సేయ
నని మొన గర్వాంధు నంధకాసురునిఁ - దునుమాడి విలసిల్లు ధూర్జటివోలె,
రావణు లోకాభిరాముఁడై విజయ - ధాముఁడై నవసుధాధాముఁడై యొప్పె;
నంత విభీషణుం డధికశోకమున - సంతాప మందుచు సమరమధ్యమున
నలఘుఁడై పడియున్న యగ్రజుఁ జూచి - పలుమఱు నెలుగెత్తి పలవింపఁ దొడఁగె.
“నాహవోదగ్రసురాసురభయద - బాహులు పక్షులపా లయ్యె నేఁడు,
సురుచిరమృదుతల్పసుభగదేహంబు - పరుషసంగరభూమిఁ బడియెనే నేఁడు,
అహితాంధకారబాలార్కబింబములు - మహి గూలెనే నేఁడు మణికిరీటములు7770
వినయవిక్రమనయవిఖ్యాతులందు - నినుఁ బోల రెవ్వరు నీయంతవాఁడు;
కడపట నరయంగఁ గష్టుండు ఖలుఁడు - బెడిదుండు వీఁ డనఁ బృథివి నేర్పడితి;
తప్పుట తప్పని తలపోయవైతి - చెప్పినమాటలు చెవిఁ బెట్టవైతి;
వెమ్మెయి నయమార్గ మెఱుఁగ లేవైతి - విమ్మన్న జానకి నీనేరవైతి;
మంతనంబుస రాము మర్త్యుగా నీవు - చింతింపవల దన్నఁ జేకొనవైతి;
నీమానగర్వంబు ని న్నింత చేసె - నేమని శోకింతు నే నింక నీకు
వలదు రామునితోడి వైరంబు విడువు - చల మొప్పదని నీకుఁ జాటనే తొల్లి?
నిరుపమనయనిధీ! నీయట్టిసుకృతి - పరసతిఁ దల్లిగా భావింపవలదె?
జగతిలో తగవు విచారింపవైతి; - తగిలి నామాటలు తలకూడె నేఁడు;"
అని యని శోకించు నన్ననేరములు - మనమునఁ జింతించు మఱియు శోకించు7780

మందోదరి మొదలగు రావణునిభార్యలు శోకించుట

నంత మందోదరి యాదిగా దనుజ - కాంతలు గూడి లంకాపురి వెడలి
యడుగుల కెంజాయ లవనిపై నొలుకఁ - దడఁబడి మేఖలాదామము ల్సడల
నఱకౌను లసియాడ నలసయానములు - మెఱయ లోయలతల మెయిదీఁగె లులియ
హారము ల్దెగి రాల నశ్రుపూరములు - తోరంబులై యొల్క దొలఁగఁ బయ్యెదలు
వీడినవేణులు వెన్నుల నొరయ - వాడినమోములు వరవట్లు గట్ట
మొకములు దలలును మొగి మోఁదికొనుచుఁ - బ్రకటరోదనములు బహువిలాసములు
గుదియఁగ రోదసీకుహరంబు నిండఁ - గదిరెడి శోకాగ్నిఁ గాలుచు వచ్చి

విఱిగినరథములు వికలభావముల - బఱియలై యున్న కపాలకుంభములు
తునిసిన చేతులు తునియలై పడిన - తనువులు నురుమైన దంతిదంతములు
చిదిసినతలలు విచ్ఛిన్నంబులైన - గదలును బొడియైన ఘనకంకణములు7790
తెగిన గుండియలును దృఢమస్తకములు - పగిలినగళములు భగ్నశస్త్రములు
ప్రేవులప్రోవులు పిశితఖండములు - జీవము ల్విడిచియుఁ జెలువొందుకపులు
హయములు చిద్రుపలు నద్రిశృంగములు - పయిఁబయిఁ బడిన కబంధబృందములు
నిలువక పాఱెడి నెత్తురుటేర్లు - కలిసి మెండుగఁ బాఱు కరటితుండములు
నడ్డంబు నిడుపునై యద్రులక్రింద - గ్రుడ్డులు వెలి కుర్కి కూలినభటులు
చేకొని శవములఁ జిట్టుముట్టాడు - కాకఘూకానేకకంకగృధ్రములు
రామశరక్షతరక్తపానములు - సోమపానము లని సోలుభూతములు
రామునిఁ గికురించి రాక్షసేశ్వరుఁడు - భూమిజఁ దెచ్చుట పొగడుభూతములు
శిరములు పదియును జేతు లిర్వదియు - నరుదార నొకరిత్త యట్టఁ బొందించి
"దైతేయకులనాథ! తగదు రామునకు - సీత ని”మ్మ ని బుద్ధిచెప్పు భూతములు7800
కోఁతి బొందులు సొచ్చి కోఁతులై వచ్చి - బ్రాఁతైనకరటికబంధముల్ దెచ్చి
వడిఁ బేర్చి ఘనరక్తవార్ధిలో ముంచి - గడఁకతో సేతువుఁ గట్టుభూతములు
“నారాయణుఁడ నేను నాకులు మీరు - మీరు రాక్షసు" లని మేరలు చేసి
పనివడి కరటికబంధము ల్దెచ్చి - ఘనతఁ బ్రేవులు శేషుగాఁ జేసి చుట్టి
కోరి రక్తాబ్ధిలోఁ గొని తెచ్చి వైచి - ధీరత మించి మర్ధించు భూతములు;
“మారాముబాణనిర్మథితమాంసముల - కీరాదె? నీనాక మేల యిచ్చెదవు?
సొలవక మెఁకనంజుళ్లకు” ననుచు - నలి నింద్రుదెసఁ జూచి నవ్వు భూతములు
"మదిఁ జేవ గలిగి కుమారతారకులు - గదిసిన సంగరాంగణముఁ జూచితిమి;
అదయులై విషకంధరాంధకాసురులు - గదిసిన సంగరాంగణముఁ జూచితిమి;
త్రిదశేంద్రవృత్రులు దెగువమై మెఱసి - కదిసిన సంగరాంగణముఁ జూచితిమి;7810
ఈమాంసఖండంబు లీకబంధంబు - లీమహారక్తంబు లీవింతచవులు
పొడగాన మే”మని పొంగి యొండొండ - నడరుచుఁ దొడరుచు నాడుభూతములు,
రవికులాధిపుఁ డైన రామువిక్రమము - తివుటమై గడఁగి కీర్తించుభూతములు,
"ఈరామవిక్రమం బేటివిక్రమము - ఘోరాహవంబులు కోటులు సలిపి
వర్గమాంసరక్తప్రవాహము ల్వఱపి - పరితృప్తి గావించు పఙ్క్తికంధరుని
ననిమొనఁ దెగటార్చె నాచవు లింక - మనకెందుఁ గల"వని మరుగుభూతములు;
ఉరురథధ్వజదండయుగళము ల్నిలిపి - పొరిఁబొరిఁ బ్రేవులు పొందొంద ముడిచి
పరమసమ్మదమునఁ బ్రమదలుఁ దారు - సరసడోలాకేళి సలుపుభూతములు;
ఎమ్ములు నమ్ములు నెడలుగఁ ద్రోసి - యిమ్మైనచోటుల నెడగల్గ నిలిచి

ప్రియ మొప్పఁ బ్రియులును బ్రియలను గూడి - ప్రియరక్తపానసంభృత కేలి దేలి7820
చెలువొప్ప రాముఁడు సీతతోఁ గూడి - వెలయుఁగా” కంచు దీవించుభూతములు
కలిగి భయంకరాకారమై యున్న - కలహరంగముఁ జొచ్చి కడుచోద్య మంది
పనవుచు నేడ్చుచుఁ బతిఁ బేరుకొనుచు - జనుదెంచి యందు రాక్షసవధూజనము
తునిసి నెత్తుటఁ దొప్పదోఁగినకేలు - తనుపారు కిసలయతల్పంబు గాఁగ
నకలంకతరములై యడరి పైఁ బర్వు - మకుటరత్నారుణమండలప్రభలు
తనుఁ బెక్కు గప్పినఁ దద్దయు నొప్పు - ఘనధాతువస్త్రనికాయంబు గాఁగ
నని వడఁ బర్వి సర్వాంగంబులందుఁ - దలకొన్న మెదడు చందనచర్చ గాఁగఁ
జతురసంఘట్టనజాతాస్థిరజము - ప్రతిలేని పుష్పపరాగంబు గాఁగఁ
దాలసముత్తాలదండము ల్విరిగి - వ్రాలి తూఁగాడెడు ధ్వజములఁ గ్రాలు
కోమలమృదులదుకూలఖండములు - వేమఱుఁ బై వీచు వీవన ల్గాఁగఁ7830
నంతంతఁ జుట్టును నవనిపై నున్న - దంతావళోరుముక్తాఫలావళులు
వరుసతో బడిసిపో వైచినఁ జెదరి - కరమొప్ప మల్లికాకళికలు గాఁగ
నరుదుగాఁ బర్విన యారామచంద్రు - శరచంద్రికలచేత సంతాప మంది
వీరలక్ష్మీఘనవిరహాగ్ని గ్రాగి - ధారణిఁ బడియున్న దశకంఠుఁ గనిరి
కని యంత శోకాబ్ధి కరడులఁ దేలి - దనుజేశుపైఁ బడి దానవాంగనలు

మందోదరీవిలాపము

పనువ మందోదరి పతిమీఁద వ్రాలి - తనరెడుశోకాబ్ధిఁ దరియింపలేక
కలసి బాష్పంబులు కన్నుల దొరుఁగ - బలుమాఱు నెలుఁగెత్తి పలవింపఁ దొడఁగె
“హారాక్షసేశ్వర! హావీరవర్య! - హారణాలంకార! హానాథ!" యనుచు
నలఁతయుఁ బలువగ లడలు దీపింపఁ - బలుమాఱుఁ బలవించి పతిఁ జూచి పలికె.
"లంకేశ! నేఁడు నీలంకలోపలికి - శంకింప కినరశ్మిజాలము ల్చొచ్చె;7840
నెడ రయ్యె నిపు డని యింద్రాదిదివిజు - లుడువీథి నందఱు నుబ్బుచున్నారు;
అమరాధిపతి గెల్చి యనలుని గెల్చి - సమవర్తి నాజిలో సాధించి, మఱియుఁ
బాశహస్తుని గెల్చి పవమాను గెలిచి - యీశానుసఖు గెల్చి యీశాను గెలిచి
నీలావు లావుగా నిఖిలలోకముల - వాలుదు వెందు దుర్వారుండ వీవు;
నీ కిట్టిదుర్దశ నేఁ డేల కలిగె? - నీకంటె బలియురు నేర్చిరే కలుగ?
"ధారణీసుత నిమ్ము తగదు రాఘవుఁడు - నారాయణుఁడు గాని నరుఁడు గాఁ డతఁడు"
అని నీకుఁ జెప్పితి నకట నాపలుకు - వినవైతి నీవిధి విన నేల నిచ్చుఁ?
‘‘దప మాచరించుచో దశకంఠ! దొల్లి - విపులైకనిష్ఠతో విదితంబు గాఁగ
నీ వింద్రియంబుల నెఱి నిగ్రహించి - తావైరమున నిప్పు డవి యేమఱించి
యనుకూలశత్రులై యాయింద్రియములు - జనకజఁ దెప్పించి సమరంబులోనఁ7850

నినవంశుచే నిన్ను నిట్లు చంపించె" - నని నీకు హితు లెవ్వ రసురాధినాథ!
సురలకు నెబ్భంగిఁ జొరరానిలంక - నురవడి హనుమంతుఁ డొక్కఁడే చొచ్చెఁ
గలఁగక జలరాశి కట్ట వానరుల - కలవియే? సురలు వీ రంటి నే నపుడె;
తరమిడి నాజనస్థానంబునందు - ఖరదూషణాది రాక్షసులఁ బెక్కండ్ర
బలువిడి నొక్కండె పటుబాహుశక్తి - నలిరేఁగి చంపిననాఁటనుండియును
దలఁకుదు రామునిఁ గలఁచి నిన్ జూచి - తలఁకుట యెల్లను దలకూడె నేఁడు;
ధర్మతత్పర యరుంధతికంటె నిత్య - నిర్మలమతి రోహిణీదేవికంటె
భూరిగుణోజ్జ్వల భూదేవికంటె - సైరణగల పుణ్యసాధ్వి జానకిని
దెగిఁ దెచ్చినప్పుడే దేవికోపాగ్నిఁ - బొగిలినాఁడవు గద్దె భువనంబు లెఱుఁగఁ?
గైకొని యెవ్వఁ డేకర్మంబుఁ జేసె - నాకర్మఫలము వాఁ డందకపోఁడు;7860
అతినీతిపరుఁడైన యావిభీషణున - కతులసౌఖ్యము గల్గె ననఘాత్ముఁ డగుట
ఏపున లోకంబు లెల్లఁ గాఱించు - పాపికి దురవస్థ పాటిల్లె నేఁడు;
కలరు సీతాదేవికంటె సౌభాగ్య - కలితలు పెక్కండ్రు కామిను ల్నీకుఁ;
గామాంధకారంబు కన్నులఁ గప్పి - నీమదిఁ దెలియంగ నేరవుగాక;
కులరూపదాక్షిణ్యగుణగణాకేళిఁ - దలఁప వై దేహి నాతరము గా దెందు;
నాకంటే నెక్కుడో నాతోడ సరియొ - నీకానమికిఁ జెప్పి నేర గా కేను,
మృత్యు వొక్కొక్కనిమిత్తంబువలన - సత్యంబు గలుగుట సకలజీవులకు;
నెడ రైనమృత్యువు నిటఁ జేరఁ దెచ్చు - వడువునఁ దెచ్చితి వైదేహి! నీవు
భాగ్యంబుగలసీత పతితోడఁ గూడి - యోగ్యంబు లగుసుఖం బొనర బెంపొందె;
నాథ! భాగ్యములేని ననుఁజూడు దుఃఖ - పాథోధిలోపలఁ బడి మునింగెదను;7870
పొలుపార నీతోడఁ బుష్పకం బెక్కి - లలితంబులైన లీలావిహారములు
సలిపితి; మందరశైలంబునందుఁ; - గలధౌతగిరియందుఁ గనకాద్రియందు
నాతతనందనోద్యానంబునందుఁ - బ్రీతిమై మఱియును బెక్కుదేశముల;
నక్కటా! యాలీల లన్నియు నన్నుఁ - దెక్కొన్న విధి కడతేర్చెనే నేఁడు
మయుఁడు నాతండ్రి నామగఁడు రావణుఁడు - ప్రియపుత్రుఁ డాహవప్రియుఁ డింద్రజిత్తుఁ
డని గర్వముననుండి యనిలోన రామ - జననాథుచే నీవు చచ్చు టే నెఱుఁగ?
పిడు గడచిన యద్రి పృథివిపైఁ గూలు - వడువునఁ జూర్ణమై వసుధపై బడితి;
మృత్యువునకు నీవె మృత్యువై యుండి - మృత్యువుపాలైతి మేదినిఁ గూలి;
వైరులసతులకు వైధవ్య మిత్తు - నీరామలకుఁ గల్గె నేఁ డాఫలంబు;"
అని యేడ్చుఁ బలవించు నసురేశుమోముఁ - గనుఁగొని వర్ణించుఁ గన్నీరు నించుఁ7880
దొడలపైఁ దల యిడుఁ దొరుఁగుకన్నీటఁ - గడుగు నాననధూళి కడుఁ జిన్నవోవు
కీలించి కేలు కెంగేలిలోఁ దారు - వాలు డెందము గంద వగచు నాత్మేశు

తలయెత్తి డాకేల ధరియించి చూచు - తల యూఁచు వలచేయి ధరణిఁ బొరల్చు
“పోయెఁ బొమ్మను; రామభూపాలుఁ డింత - సేయునే? నే నేమి సేయుదు నింక?”
నని యలమటఁ బొందు నవనిపైఁ బొరలుఁ - దనదిక్కులేమికిఁ దద్దయు వగచు;

విభీషణుఁడు మందోదరిని చూచి దుఃఖించుట

తుదిలేనిశోకాగ్నిఁ దొడరి యిబ్భంగి - వదలక కాలెడి వదినెను జూచి
యడుగులపైఁ బడి యాత్మలోఁ బెద్ద - యడలి న్మడింపఁగ ననె విభీషణుఁడు,
“వడితోడఁ బేర్చి రావణపయోరాశి - పడతుక! రఘురాముబాణాగ్ని నిగిరె;
పఱతెంచి రాఘవప్రళయమారుతము - సరస! రావణపారిజాతంబుఁ గూల్చె;
గమి విచ్చిపాఱ రాఘవనాగవైరి - సమద! రావణసామజంబును జంపె;7890
నతులిత నిశితరామామోఘబాణ - శతకోటి రావణశైలంబు దునిమె;
బలువిడి రాఘవప్రళయదావాగ్ని - నని దశాననకాననము నీఱుచేసెఁ;
బడఁతుక! రాఘవాపరపయోరాశిఁ - గడఁగి రావణదివాకరుఁ డస్తమించె;
ఖరకరామోఘరాఘవనీలమేఘ - శరవృష్టి రావణసప్తార్చి నార్చె;”

రాముఁడు విభీషణు నోదార్చి రావణునకుఁ బ్రేతకృత్యంబులఁ జేయించుట

నని పెక్కుభంగుల నడలుచునున్న - ఘనవిభీషణుఁ జూచి కాకుత్స్థుఁ డనియె
“నీవనితలయేడ్పు లింక వారింపు; - మీరును శోకింప కిటమీఁద నుడుగు;
పరిగొని శూరులు బవరంబులోనఁ - బరులచేఁ జత్తురు; పరులఁ జంపుదురు;
జయ మిద్దఱికి లేదు సమరంబులోన; జయపరాజయము లస్ఖలితము ల్గావు;
సకలసుపర్వుల సాధించె నితఁడు; - సకలగంధర్వుల సాధించె నితఁడు;
సకలదిక్పాలుర సాధించె నితఁడు; - సకలభూపాలుర సాధించె నితఁడు;7900
ఏకాంగవీరుం డహీనసాహసుఁడు - లోకైకజితుఁడు త్రిలోకభీకరుఁడు
మీయన్న రణమున మిక్కిలికడిమిఁ - జేయాపఁ దెలియఁ జూచితి కాదె? నీవు
ఈచందమున నిచ్చి యెవ్వండు పోరు - నీచందము నెదిర్చి యెవ్వండు చచ్చు?
నీలావు నీచావు నెవ్వరు వడయఁ - జాలుదు రక్కటా! జయ మేమి సేయు?
ననఘ! మీయన్నకృతార్థుండు వగవఁ - బనిలేదు ధైర్యంబు పాటించి వినుము
కడఁకతో నగ్నిసంస్కారాదివిధులు - తడయక చేయు మీదనుజాధిపతికి”
ననవుడు భీతుఁడై యావిభీషణుఁడు - ఘనభక్తియుక్తిమైఁ గరములు మొగిచి
"యెక్కడి సంస్కార? మీతఁడు నాకు - నెక్కడితోఁబుట్టు? వితఁడు నాపగత,
నీదేవిఁ దెచ్చిన నీచుండు కష్టుఁ; - డీదుష్టచిత్తున కెక్కడివిధులు?
పరవధూజనులసంస్పర్శంబు సేయు - పురుషు లధోగతిఁ బోయి కూలుదురు;7910
అట్టివారల ముట్ట నర్హంబు గాదు - గట్టిగాఁ గనుగొనఁ గా దటుఁగాన;

నీపాపకర్ముని నే ముట్టుటకును - నోప; వైదికవిధి కుచితుండు గాఁడు;"
అనుటయు నమ్మాట లంతరంగమునఁ - జొనిపి విభీషణుఁ జూచి రాఘవుఁడు
“అనఘ! నీచెప్పిన యంతకుఁ గలఁడు - దనుజాధిపతి నింకఁ దగదు దూషింపఁ;
గడఁకతో సమరగంగాప్రవాహమునఁ - గడిగికొన్నాఁ డొగిఁ గలకల్మషములు
అచ్చుగా నాపను లన్నియు నయ్యెఁ - జచ్చినపిమ్మటఁ జనదు వైరంబు;
పరువడి నితనికిఁ బరలోకవిధులు - కరమర్థిఁ జేయుము కడఁకతో నీవు;"
అనవుడు నౌఁగాక యని విభీషణుఁడు - తనబుద్ధి వైదికధర్మంబుఁ బూని
యచటికి నగ్నిత్రయంబుఁ దెప్పించి - యచలమానసుఁ డప్పు డగ్రజన్మునకుఁ
గరమొప్ప నగ్నిసంస్కారాదు లైన - పరలోకవిధు లెల్ల భక్తితోఁ జేసి7920
చనుదెంచి యారామచంద్రునంఘ్రు లకు- వినతుఁడై యున్న యవ్విమలాత్ముఁ జూచి
ప్రియభాషణంబులఁ బెద్ద మన్నించి - దయపెంపు మిగుల నాతని నూఱడించి
ధరణీశుఁ డప్పుడు తమ్మునిఁ జూచి - నిరుపమకారుణ్యనియతుఁడై పలికె.

విభీషణుని లంకాపట్టాభిషేకము

"నీ వింక లంకలోనికిఁ బోయి పుణ్య - భావు విభీషణుఁ బట్టంబుఁ గట్టి
రమ్ము పొ" మ్మనవుడు రాఘవానుజుఁడు - నెమ్మితో లంకలోనికిఁ బోయి యపుడు
తడయక తరుచరోత్తములను బనిచి - కడఁక సముద్రోదకములఁ దెప్పించి
వారిపురోహితవరుల రప్పించి - వారిసజ్జనమంత్రివరుల రప్పించి
భూరిమంగళతూర్యములు మ్రోయ నతని - నారూఢనియతితో నభిషిక్తుఁ జేసి
సంచితమంగళాచారము ల్మెఱయ - నంచితసింహాసనాసీనుఁ జేసి
కరమొప్ప నతని లంకారాజ్యమునకుఁ - బరమసమ్మదమునఁ బట్టంబుఁ గట్టి7930
“యెందాఁక రవిచంద్రు లెందాఁక ధరణి - యెందాఁక కులగిరు లెందాఁక నభము
నెందాఁక జలనిధు లెందాఁక దిశలు - నెందాఁక రాఘవాధీశుకీర్తనము
లారూఢముగఁ జెల్లు నందాఁక నేలు - మీరాజ్య" మని యప్పు డెలమి దీవించి,
“పరఁగ రక్షారాజ్యభరణ మెవ్వరికిఁ - బరికించి నడపుట పరమదుర్లభము.
దీని నేమఱక వర్తింపుము నిత్య - మైనధర్మము సేయు" మని యొప్పఁ బలికె.
నంత విభీషణుం డక్షీణరాజ్య - సంతోషమును బొంది చతురమానసుఁడు
తడయక మంగళద్రవ్యము ల్మంచి - తొడవు లంబరములు దూర్వాక్షతములు
గొని లక్ష్మణునిఁ గొల్చి కొమరొప్ప వచ్చి - జననాథునకు నిచ్చి సద్భక్తి మ్రొక్కె
నలవుమై రఘురాముఁ డవియెల్లఁ బుచ్చి - యెలమితో మాతలి కిచ్చి వీడ్కొలిపి
మాతలి రథ మెక్కి మహనీయమహిమ - నాతతరథవేగుఁడై పోయె దివికిఁ,7940
దదనంతరంబ యద్ధరణివల్లభుఁడు - మదిలో విచారించి మారుతిఁ జూచి
“జనకిపుత్రికి మనజయము సేమంబు - వినుపింపు లంకకు వేగ పొ"మ్మనుడు

చని హనుమంతుఁడు సంతోష మొదవ - ఘనవేగమున లంకఁ గడఁకతోఁ జొచ్చి
యారామువిజయంబు నాత్మఁ జింతించు - నారాముసతి నశోకారామవీథిఁ
గని మ్రొక్కి, వచ్చితిఁ గల్యాణి! యనుచు - వినతుఁడై పలికెను వినయంబుతోడ
"సంతోష మెంతయు జానకి! నీవు - చింతించుపగిదినే సిద్ధించె నీకు
దేవి! నీపతి రామదేవుండు - వచ్చి రావణు లోకవిద్రావణుఁ జంపి
తొడరి యనేకుల దుష్టరాక్షసులఁ - బొడి చేసి సమర మద్భుతముగాఁ జేసి,
తమ్ముఁడు సౌమిత్రి తనుఁ గొల్వఁ బరమ - సమ్మదంబున రామచంద్రుఁ డున్నాఁడు."
అని చెప్పి యాదేవి యడలార్పఁ దొల్లి - పనివచ్చి యాడిన బాసలు దలఁచి,7950
“జలజాక్షి! నీపతి జలధి బంధించు; - లలన! నీనాథుండు లంకపై విడియు,
రమణి! నీరమణుండు రావణుఁ ద్రుంచుఁ; - గమలాక్షి! నీభర్తఁ గైకొను నిన్ను;
నని విన్నవించితి నర్థి నాఁ డిచట, - వనిత! నా ప్రతినలు వచ్చె నన్నియును
పని వినియెద నింకఁ బతిపాలి కేను - బను లానతి" మ్మన్నఁ బవనజుఁ జూచి
రావణుమరణంబు రఘురాముజయము - భావించి భావించి పడఁతి హర్షించి
"తెగి నీ ప్రతాపంబు దీపింప రామ - జగతీశ్వరుఁడు వచ్చి సాధించెఁ గాక!
ఘనదైత్యగర్వాంధకార మీలంకఁ - జనఁ జొచ్చి పరులకు సాధింపఁ దరమె?
నీధైర్యగాంభీర్యనిరవద్యశౌర్య - మాధుర్యపర్యాయమహిమ లే మందు?
నే మని వర్ణింతు నేను నీచరిత? - మే మని పొగడుదు నేను నీకడిమి?
నూత్నభూషణజగన్నుతవస్త్రహేమ - రత్నసంపదలతో రాజ్య మిచ్చినను7960
బరఁగ నీచే ధనపౌరుషంబునకుఁ - పరికింప సరిగావు పవమానతనయ!
సంతోష మందితిఁ జాల నీవలన - నంతరంగంబున" నని సీత పలుక,
హనుమంతుఁ డత్యంతహర్షంబు తనదు - మనమునఁ బెనఁగొన మగువ కిట్లనియె.
“నన్ను మీ రిటు కరుణాదృష్టిఁ జూచి - మన్నించి యాడిన మాటయె చాలు;
భావింప దేవేంద్రపదమునకంటె - నేవస్తువులకంటె నిది ఘనం బరయ;"
నని పల్క మఱియును నమ్మహీపుత్రి - హనుమంతుఁ గనుగొని యతని కిట్లనియె.
"బలమును శౌర్యంబు బాహువిక్రమము - నలఘుతేజంబును నంచితక్షమయు
శ్రుతము మాధుర్యంబు సుస్థిరత్వంబు - సతతంబు నిశ్చలస్వామిభక్తియును
వినయంబు మొదలైన విశ్రుతగుణము - ననుపమస్థితి నొప్పు ననఘ! నీ" కనిన
గడుభీకరాకృతు ల్గలిగి యద్దేవి - కడనున్న రాక్షసాంగనల నీక్షించి7970
"యాపాపకర్మునియాజ్ఞ పాటించి - యీపాపమతులు నీ కెగ్గు సేయుదురు;
ఘనముష్టినిహతులఁ గడతేర్చిపుత్తు" - ననవుడు జానకి హనుమంతుఁ జూచి
"యేసినవాఁ డుండ నిషు వేమి సేయు? - దాసీవధం బెందుఁ దగదు చింతింపఁ;
దొల్లి నేఁ జేసిన దుష్కర్మఫలము - లెల్లను గంటి; వీ రేమి సేయుదురు?

అనఘచారిత్ర! పాపాత్ములందైన - ఘనులు దయాబుద్ధిఁ గలిగియుండుదురు;
గాన నీరాక్షసకాంతలఁ జంప - వానరోత్తమ! నీకు వల" దన్న నలరి
“నిర్మలగుణరత్ననిధివి నీ వరయ - ధర్మపత్నివి గాఁగఁ దగుదు రామునకు,
భూనాథుకడ కింకఁ బొ మ్మని నాకు - నానతి యి” మ్మన్న నద్దేవి పలికె.
“భావంబు తా నని పట్టితిఁ బ్రాణ - మేవానరోత్తమ! యింతకాలంబు
తన్నుఁ జూడక యింకఁ దడ వోర్వఁజాల - నున్నరూ పని తెల్పు ముర్వీశునకును7980
బొ" మ్మని దీవింప భూమినందనకు - నెమ్మితో మ్రొక్కుచు నిపుణమానసుఁడు
చనుదెంచి యారామజగతీశ్వరునకు - వినతుఁడై పావని వెస విన్నవించె
"దేవ! నీసేమంబు, దేవ! నీజయము - దేవితోఁ జెప్పిన దేవి హర్షించె;
వనజాతనేత్ర దేవరఁ జూడవలయు - నని విన్నపము సేయు మని పంచె నన్ను”

శ్రీరాములు విభీషణునితో సీతను దెమ్మనుట

ననిన నించుకతడ వాత్మఁ జింతించి - జననాథుఁ డావిభీషణుఁ జేరఁ బిలిచి,
"జనకజ మంగళస్నానంబు సేయఁ - బనిచి దివ్యాంబరాభరణమాల్యములు
వెలయఁ గై సేయించి వేడ్క నిక్కడికిఁ - బొలఁతుకఁ దోడ్తెమ్ము పొ"మ్మన్న నతఁడు
సంతసంబున నేగి సరమాదు లైన - యంతఃపురస్త్రీల కంతయుఁ జెప్పి
జనకజఁ దెండన్న సంప్రీతి వారు - చని భూమిజకు మ్రొక్కి సద్భక్తితోడ
"దేవి! నీపతి రామదేవుండు పిలిచి - యావిభీషణుతోడ నానతి యిచ్చి7990
పుత్తెంచుటయు మమ్ముఁ బుత్తెంచె నీవు - చిత్తంబులోపలఁ జెలువు పాటించి
యభిమతమంగళాయతుఁ డైనరామ - విభుఁ డున్నచోటికి వేంచేయవలయు
నీవేష మేటికి నెలనాఁగ నీకు? - నీవు కల్యాణివి నీరేరుహాక్షి!"
యని మంగళస్నాన మర్థిఁ జేయించి - తనులతాతన్వికిఁ దడియొత్తు లొత్తి,
నవ్యాంబరంబుల దివ్యమాల్యముల - దివ్యభూషణముల దేవిఁ గైసేసి,
యసమానమహిమతో నసురకామినులు - పసిఁడిపల్లకియందుఁ బడఁతుక నుంచి
తోడితెచ్చుటఁ జూచి తోరంపుభక్తి - గడునొప్పు మిగుల రాక్షసకులేశ్వరుఁడు
ప్రకటరాజ్యమునకు ఫాలపట్టమును - నకలంకనియతికి హస్తవేత్రమును
ధరియించి యత్యంతధన్యతఁ బొంది - పరమానురక్తుఁడై బంటునై కడఁగి
ముందర రాక్షసముఖ్యులు నడవ - సందడి జడియుచుఁ జతురుఁడై వచ్చి8000
ననతిదూరంబున నద్దేవి నునిచి - చనుదెంచి యావిభీషణుఁడు రామునకుఁ
జెచ్చెఱ వినతుఁడై చేతులు మొగిచి - "తెచ్చితి, విచ్చేసె దేవి" నావుడును
నతిహర్షరోషదైన్యాయత్తుఁ డగుచు - మతి నింత చింతించి మనుజవల్లభుఁడు
"పిలిచి, తె” మ్మనుడు విభీషణుం డరిగి - యెలసినకడఁకతో నుచితసంవేది
తావనవీథి నప్పరమపావనుఁడు - దేవి జానకిఁ దోడితెచ్చుచోఁ గదిసి

ఘనవేత్రహస్తుఁడై కపుల రాక్షసులఁ - గనుఁగొని సందడి గ్రంద వేయుటయు
నామహాకలకలం బప్పు డాలించి - రాముఁడు రాక్షసరాజు వీక్షించి,
“యోహో విభీషణ! యుచితమే నీకు ? నూహింప నేటికి నుగ్రకృత్యములు?
వింతవా రెవ్వరు వీరిలో మనకు - నింత నొప్పింతురే యిబ్భంగిఁ గడఁగి?
వలవదు వారింప వచ్చి యందఱును - గలసి చూతురుగాక! కలదె యిం దేగు;8010
కాలదేశాంతరక్రమమునఁ జెడని - యీలు వొక్కడ మరు వింతియ కాక.
యెనసినకోటలు నిండ్లును దెరలు - వనితల కెందు నావరణము ల్గావు
వ్యసనంబులందు వివాహంబులందు - నెసఁగుకయ్యములందు నిష్ఠలయందు
తలకొని చెల్లు నుత్సవములయందు - వలవ దావరణము ల్వారిజాక్షులకు;
నే నిందు నున్నాఁడ; నిధి రణభూమి; - గాన నెగ్గేమియుఁ గాదు రానిమ్ము;"
అనిన విభీషణుం డారాఘవుండు - పనిచినతెఱఁగునఁ బద్మాక్షిఁ దెచ్చె;
నప్పుడు కల్యాణి కవనీతనూజ - కుప్పొంగుసంతోష ముల్లంబు నిండ
వెలికి నేతెంచిన విధమునఁ జెమటఁ - గలయఁ దనూలతఁ గ్రమ్మి దైవార,
రాకాసుధాకర రామచంద్రావ - లోకనామృతపానలోలయై, తేలి
చిరవిరహాగ్నులఁ జెచ్చెఱ నార్చి - పరమానురాగసంభరితాత్మ యగుచు8020
నేచినకోర్కుల నెలమి దీపింపఁ - జూచెఁ జూడఁగ నాఁగఁ జూచి రాఘవుని
నవనతవదనయై, యశ్రుపూరములు - ధవళవిలోచనోత్పలములఁ దొరుఁగ,
భయమును బ్రియమును బైపాటు సిగ్గు - పయిఁబడుచుండ నప్పడఁతుక యుండె;
నప్పుడు రఘురాముఁ డాత్మలోఁ గోప - ముప్పొంగఁ దప్పక యుగ్మలిఁ జూచి,
మానంబు ప్రాణంబు మహితవృత్తులకు - మానాభిరక్షణ మతి చింత చేసి,
“మానిని! వినుము నామహితవర్తనకు - నే నిన్ను దెచ్చితి; నింతియె కాని,
యింతి! నీదెస నాకు నింతకు మిగుల - నంతరంగంబున నాసక్తి లేదు;
కాకుత్స్థకులజులు గాంభీర్యధనులు - లోకరక్షణకళాలోలతత్పరులు,
వారివంశంబున వచ్చి జన్మించి - భూరివృత్తోన్నతిఁ బోకార్చె నందు;
పగవానియింటిలోపల నున్న నిన్నుఁ - దగిలి వరించుట ధర్మంబు గాదు;8030
“ఆలిఁ గోల్పడిపోయి యక్కటా! మగుడఁ - దేలేఁ డితం" డను తిట్టు వాటునకు
వెఱచి తెచ్చితిఁ గాని వెలఁది! నిన్నొల్ల - నొఱుపైనచోటుల నుండు పొ"మ్మనిన
జననాథుపరుషభాషాసాయకములు - గొనికాడ నొప్పింపఁ గువలయనేత్ర
యప్పటిసంతోష మంతయు మఱచి - చెప్ప నోరాడక చేష్టలు దక్కి
తాపంబుఁ బొంది యుత్తలమంది కుంది - కోపించి వగచి డగ్గుత్తికపెట్టి,
జలజాప్తకులు రామచంద్రునిఁ జూచి - యెలనాఁగ యేడ్చుచు నిట్లని పలికె.
‘‘దేవ! నాచిత్తంబుఁ దెలియదే నీకు? - నీవు సర్వజ్ఞమనీషివి గావె?

ననుఁ దెచ్చి నాపిన్ననాఁటనుండియును - బెనిచి రక్షించి గాంభీర్యంబు నించి
యీనీచభాషల నేల నొప్పించె? - దే నేల? నీ వేల? యీమాట లేల?
భూదేవికడుపునఁ బుట్టితి; జనకుఁ - డాదట ననుఁ బెంచె; నంతటిమీఁద8040
నృపశిరోమణి వైన నీదేవి నైతి - చపలవధూవృత్తి సైఁచునే నాకు?
మగవారు నమ్మని మగువల నాడు - తగవుల నాడెదు తగులు వోవిడిచి,
నమ్మనివాఁడవు నాఁడు నన్నరయఁ - బొమ్మని హనుమంతుఁ బుచ్చిన యపుడె
చెప్పి పుత్తెంచినఁ జెనఁటిప్రాణములు - నప్పుడె విడువనె యడియాస లుడిగి”
యని లక్ష్మణునిఁ జూచి "యనఘ! మీయన్న- యనుమాన ముడిగి న న్నాడుచున్నాఁడు.
తగునె యీక్రియ నాడఁ దరము నాతరము - తగని మాటలు నీకుఁ దగ దనఁదగదె?
కలపుణ్యగుణములఁ గడచన్నప్రోడ - నొలసి నీ యెఱుఁగని యుచితంబు లేదు
నావర్తనముఁ జూడు; నాయందుఁ గలదె - భావింపఁ గల్మషభావ మింతైన?

సీత యగ్ని చొచ్చుట

శంకింపవలదు విచారంబు చేసి - యింక మీనిశ్చయ మిట్టిదయేని
యిక్కడ సొదఁ బేర్చుఁ డిండఱు చూడ - స్రుక్కక యనలంబు సొచ్చెదఁ జొచ్చి8050
పావకుముఖమునఁ బతి కింకఁ బరమ - పావనురాలనై బ్రహ్మాదిసురల
మెచ్చించి మి మ్మెల్ల మెచ్చించి భూమిఁ - జొచ్చెద" ననవుడు స్రుక్కి లక్ష్మణుఁడు
రాముఁ గనుంగొని రాముక న్నెఱిఁగి - భూమిజ కప్పు డద్భుతముగాఁ దెచ్చి
సొద పేర్చుటయు మహీసుత సీత ప్రీతి - సొదఁ జూచి ప్రణమిల్లి సొద చుట్టుఁ దిరిగి
యభినుతు లింపొంద నగ్నిదేవునకు - నభిముఖియై నిల్చి హస్తముల్ మొగిచి
"ధర్మదేవతలార! ధర్మంబులార! - నిర్మలమతులార! నియతాత్ములార!
జగదధిపతులార! చంద్రార్కులార! - నిగమసాధకులార! నిగమంబులార!
సంచితోన్నతులార! సర్వజ్ఞులార! పంచభూతములార ! పరహితులార!
నరవరులార! కిన్నరవరులార! - సురవరులార! భూసురవరులార!
కరుణాఢ్యులార! దిక్పతులార! విమత - హరులార! పాపసంహరులార! యేను8060
ఘనమనోవాక్కాయకర్మంబులందుఁ - బనిగొన రామభూభర్తకుఁ దప్పఁ
దప్పిన నీయగ్ని ధరియింపలేక - యిప్పుడు నీఱౌదు నిందఱు చూడ;"
నని యొప్పఁ బలుకుచు నమ్మహీపుత్రి - తనచిత్తమున నున్న తాత్పర్య మొప్పఁ
గనుఁగొని బ్రహ్మాండకటకంబు నిండి - యనుపమాకారంబులై పేర్చి పేర్చి
యొండొండశిఖల మహోదగ్ర మగుచు - మండెడు నగ్నిలో మానిని చొచ్చె.
నావంతయును గంద దాపూవుఁబోడి - పావకసరసిలోఁ బదిలమై నిలిచి
కరచరణాననకమలంబు లొప్ప - వరకుచద్వయచక్రవాకంబు లొప్ప
నవబాహువల్లి మృణాళంబు లొప్పఁ - బ్రవిమలత్రివళీతరంగంబు లొప్ప

మహితలోలన్నేత్రమత్స్యంబు లొప్ప - సహజరోమావళిశైవాల మొప్పఁ
గమలిని తెఱఁగునఁ గర మొప్పుచున్న - కమలాక్షి గనుఁగొని కపులు రాక్షసులు8070
శోకింపఁ దొడఁగిరి సురసిద్ధసాధ్య- లోకంబులెల్ల నాక్రోశింపఁ దొడఁగె;
నామరుత్తనయుండు నర్కనందనుఁడు - సౌమిత్రియును విభీషణుఁ డంగదుండు
దరుచరయూథపు ల్దానవాధిపులు - సరమాదు లైన రాక్షసవధూజనులు
నధికశోకంబున నడలుచు నుండి - రధిపతి నిర్విణుఁడై యుండె నంత,
హరుఁడు వాగ్వరుఁడును నఖిలదిక్పతులు - గరుడగంధర్వులు ఖచరవల్లభులు
వరవిమానస్థులై వచ్చి రందఱును - బరఁగఁ బ్రత్యుత్థానపరుఁ డైన రాము
వీక్షించి, "వేదాంతవేద్యుండ వఖిల - సాక్షివి, కర్తవు, సంవిదాకృతివి,
నిర్వాణపరుఁడవు నిత్యపూర్ణుఁడవు - సర్వసంవేదివి జగదేకనిధివి,
యక్షీణపుణ్యుఁడ, వవ్యక్తపరుఁడ - వక్షరత్రయమూర్తి, వాద్యంతపతివి,
భువనంబు లబ్ధులు భూతము ల్నదులు - సవనంబు లద్రులు జంతుసంతతులు8080
తరువులు తెరువులు తంత్రము ల్విధులు - సురలు నక్షత్రము ల్శ్రుతులు శాస్త్రములు
గనుఁగొన వేలు లక్షలుకోట్లు గణన - ననుపమశతకోటు లరసి యెవ్వరును
గడగాన రొక్కొకకమలజాండమునఁ - బడి యట్టి బ్రహ్మాండపఙ్క్తులు గలసి
నీకుక్షి నున్నవానికి లెక్కలేదు - నీకడఁ గానంగ నేర్తురే యొరులు?
భవదీయమాయాప్రభావంబు దెలియ - భవదీయులకుఁ గాక పరులకు వశమె?
యొకనిఁ జంపితి గెల్చి తొకఁడు నిలిచె - నొకఁడు సాధ్యుడు నీకు నొకఁ డెక్కు డను
స్తుతినింద లవి నిన్ను సోఁక వెన్నఁడును - నతిమహత్త్వోన్నతు లట్టివి నీకు
దానభావంబునఁ దక్క నొండొకట - నీసంవిదాకృతి నిత్యదుర్ఘటము
నరనాథ! నీవాదినారాయణుండ - వరయ నజ్జానకి యయ్యాదిలక్ష్మి,
లోకైకరక్షణలోలత నీవు - కాకుత్స్థుఁ డనఁగఁ బ్రఖ్యాతుండ వైతి8090
ని న్నేల మఱచితి? నిష్ఠురవహ్ని - నున్న జానకిఁ జూచుచుండుట తగదు;
పిలిపించి కైకొమ్ము ప్రీతి మన్నింపు - వలవ దుపేక్షింప వనజాక్షి నింక?”

అగ్నిదేవుఁడు సీతను శ్రీరాముల కొప్పగించుట

నని పెక్కుభంగుల నఖిలదేవతలు - గనుఁగొని పలుకుచోఁ గడఁగి పావకుఁడు
వనిత చెమర్పదు వాడదు మోము - తనువల్లి గందదు తలఁక దింతయును
బొలఁతి ధరించిన పుష్పమాలికలు - నలఁగవు తొలఁగవు నాతి మైపూఁత
యనుచు దైత్యులు కపు లందంద నిక్కి - కనుఁగొంచు నుబ్బుచుఁ గనదశ్రు లగుచు
జగదీశుఁ డీపుణ్యసతి నింతపలుకఁ - దగ దంచు నీతెంపు తగ దంచు నుండఁ
గోమలిఁ దగ నెత్తుకొని వచ్చి ప్రీతి - రామ సన్నిధి నిల్పి రాముతో ననియె:
"నీవె దైవంబును నీవె ప్రాణంబు - నీవె చుట్టంబును నీవె సర్వంబు

గా నుండు నొండొకగతిఁ జిత్తవృత్తిఁ - గాన దీకల్యాణి కడుముద్దరాలు8100
రావణుపనుపున రాక్షసస్త్రీలు - వేవురు వేవేలవిధముల వచ్చి
తఱిమి నొప్పింతురు దారుణక్రియల - వెఱపింతు రలఁతురు వెడ్డు వెట్టుదురు
ఇన్నియుఁ జేయంగ నెంతయు సాధ్వి - త న్నింత మఱవదు తలఁక దెంతయును
నీయందె చిత్తంబు నిలిపి సర్వంబు - నీయధీనము చేసి నిల్చె నీయింతి;
కైకొమ్ము నెమ్మి నీకమలాక్షి నింకఁ - గైకొనకుండుట గాదు ధర్మంబు;"
అని పావకుఁడు పల్క నారామవిభుఁడు - దనమది నొక్కింతతడవు చింతించి
యాదిదేవుండు బ్రహ్మాదులు వినఁగ - నాదేవసభలోన నప్పు డిట్లనియె.
"నీయింతిదెసఁ బాప మింతయు లేదు - నాయెడఁ దప్ప దున్నతచిత్తురాలు;
కఱవును భక్తియు విమలశీలంబు - నెఱుకయు ధైర్యంబు నీయింతియందుఁ
గల దెఱుంగుదు నట్టుగాక దైత్యునకు - మెలఁతుక గదియరామియు నెఱుంగుదును;8110
అధిగతబహుదోషుఁడగు దశగ్రీవుఁ - డధికబలోన్మత్తుఁ డై కొనిపోయి
తనవినోదారామతరుమధ్యసీమ - నునిచిన జానకి నూరక తెచ్చె;
నిలమీఁది రఘురాముఁ డిట్టికాముకుఁడు - గలఁడె? దుష్కీర్తికిఁ గలఁగఁ డేమియును”
అని లోకమునఁ బుట్టు నపవాదమునకు - జనకజ నిబ్బంగి శాసింపవలసెఁ;
గలశంక లన్నియుఁ గడతేరె నింకఁ - మెలఁతుకఁ గైకొంటి మీమాట వింటి;"
నని సమీపంబున నద్దేవి నుండఁ - బనిచి రాఘవుఁడు చూపఱు చూడ నొప్పె,
దివినుండి రోహిణిదేవియుఁ దాను - నవిరళప్రభ నొప్పు నమృతాంశుభంగి
నప్పు డయ్యఖిలలోకారాధ్యచరణుఁ - డొప్పు మహోల్లాస ముల్లంబు నిండ
శ్రీమహాదేవుఁ డాశ్రితకల్పతరువు - రాముఁ గనుంగొని రాగిల్లి పలికె;
"నెవ్వఁ డుద్యోగించు నింతటిపనికి? - నెవ్వఁడు సాధించు నీజగద్ధితము?8120
లోకకంటకుఁడు త్రిలోకభీకరుఁడు - నాకాదిలోకప్రణామసాధకుఁడు,
రావణలోక విద్రావణబలుఁడు - రావణు మర్దింప రా దెవ్వరికిని;
వీనితోఁ బగఁగొని వీనిపై విడిసి - వీని నివ్విధిఁ జంపి వీనిఁ గాల్పించి
బలవిక్రమక్రమప్రౌఢిమ మెఱయఁ - గలరె లోకమున నెక్కడనైన మగలు?
ఆరావణునిఁ జంపి తనఘ! నీవలన- నీరేడుభువనము లిటమీఁద బ్రదికె;
మీతండ్రి దశరథమేదినీనాథుఁ - డేతెంచె దివినుండి యీయొప్పు చూడ;
నదె విమానారూఢుఁడై యున్నవాఁడు - త్రిదశగణాధీశదీప్తుఁడై వాఁడె!
అజద్ధితకృత్యుఁ డగుసత్యనిధికిఁ - బూజానమస్కారములు సేయఁ బొమ్ము;"
అనవుడు రఘురాముఁ డభిరామశీలుఁ - డనుజన్మయుక్తుఁడై యవనీశునకును
నిండినప్రేమంబు నెలకొన నపుడు - దండప్రణామముల్ దగఁ జేయుటయును8130
జిత్తసమ్మదమునఁ జేనిండఁ గూర్చి - యెత్తి కౌఁగిటఁ జేర్చి యినవంశుఁ డనియెఁ.

"గైకేయిమాట లాకర్ణించి నిన్ను - లోకరక్షణకళాలోలుఁ గానలకుఁ
బుచ్చితిఁ దగవింత పోలింప నైతి - నిచ్చలో శుభకర్మ మెఱుఁగలేనైతి;
నిన్నుఁ బట్టము గట్టి నీవు రాజ్యంబు - కన్నులపండువుగాఁ జేయుచుండఁ
జూచి లోకంబులు సుఖియించు చునికి - చూచుపుణ్యము నాకుఁ జొప్పడవయ్యెఁ;
బుత్రశోకంబునఁ బోయిననాకు - సుత్రామలోకంబు చొరఁ బూటగలదె?
అతాప మెప్పుడు నంతరంగమున - నాతతస్ఫుటవహ్ను లై మండుచుండు
నమరలోకంబున నాఱ దాచిచ్చు - శమియించె నేఁడు నీసన్నిధిఁ జేసి
కమలాప్తసమతేజ! కమలాభిరామ! - కమలాప్తవంశ! యక్షరకీర్తు లొప్ప
నీ వయోధ్యకుఁ బోయి నిఖిలధర్మములు - భావించి మదిఁ బెట్టి పట్టంబుఁ బూని8140
రాముఁడ లోకాభిరాముఁడ సుతుల- తో మహి యేలుము తుదముట్ట" ననుచు
సౌమిత్రిఁ గనుఁగొని “సౌమిత్రి! నీవు - రామునివెనుక నరణ్యభూములకుఁ
జనుదెంచి యుత్తమసాహసక్రియల - ననఘుఁడై వర్తించి తతులపుణ్యుఁడవు
మెలకువ నిటమీఁద మీయన్న మనసు - నలగకుండఁగ నీవు నడపుమీ" యనుచుఁ
దన కర్థి మొక్కి యౌదల వాంచియున్న - జనకనందనఁ జూచి జననాథుఁ డనియెఁ.
“బరమపాతివ్రత్యపదశుద్ధి నీకు - సరి యెవ్వ? రుత్తమసాధ్వివి నీవు;
నిను రాముఁ డాడిననిష్ఠురోక్తులకుఁ - గినియకు నొవ్వకు గీడ్పడియుండు;
ఘనకీర్తియుతుల రాఘవుఁ బోలుసుతులఁ - గనుము; పుణ్యము లెల్లఁ గైకొని మనుము;"
అని మువ్వురను మెప్పు లలర దీవించి - తనలోన మోదించె దశరథేశ్వరుఁడు,
చంద్రశీతలు రామజననాథచంద్రు - నింద్రాదిదేవత లెల్ల వీక్షించి8150
“మనుజుండవై నీవు మాకుఁగా వచ్చి - జనియించి రాక్షసక్షయము గావించి,
యీభంగి దుఃఖంబు నిన్నియు నోర్చి - భూభార మంతయుఁ బుచ్చి పోవైచి,
మ మ్మిట రక్షించి మాజీవనములు - నెమ్మితో మా కిచ్చి, నిలుకడ లొసఁగి
పుచ్చుచున్నాఁడవు పుణ్యాత్మ! వరము - లిచ్చెద మడుగు మభీష్టంబు లేమి?"
యనవుడు రాముఁ డాయమరులఁ జూచి - తనలోనఁ జిఱునవ్వు దళుకొత్తఁ బలికె.
నింపొందు మీకృప నెల్లకామ్యములు - సంపూర్ణములు మాకు జగములయందుఁ;
దమతమభూములఁ దమమందిరములు - దమబంధుజనులను దమతనూజులను
దమకళత్రాదులఁ దగ వొప్ప విడిచి - సమరంబులోపల సకలవానరులు
తెగి తమ్ముఁ డాపక తివిరి నాకొఱకుఁ - బగరతోఁ బోరాడి ప్రాణము ల్విడిచి
యున్నారు; కపివీరు లున్నతాత్మకులు; - నన్ను మన్నించుట నా కిండు వీరి”8160
ననవుడు విని దివ్యు “లౌఁ గాక" యనుచు - "వనచరప్రాణము ల్వచ్చుఁ గా" కనిరి
అని మహాదేవుండు నబ్జసంభవుఁడు - ననఘులై యింద్రాదు లైనదిక్పతులు
మునులును సురలు నిమ్ముల నుతించుచును - జన దశరథుఁడును జనియె నద్దివికి.

ననిలోనఁ దెగిపడ్డ యగచరు లపుడు -ఘననిద్ర మేల్కను కైవడిఁ దోఁప
నమరులవరశక్తి నద్భుతం బెసఁగ - సమరోర్వి నందఱు సప్రాణు లగుచుఁ
జనుదెంచి యారామచంద్రుని వేఁడఁ - గనుఁగొని హర్షించి కలయమ్రొక్కుటయుఁ
దనరార నందఱ దయతోడఁ జూచి - జనలోకనాథుండు సంతోష మొందె.
నంత విభీషణుండారాముతోడ - నెంతయు భక్తితో నేర్పడఁ బలికె.
"దేవ! రాఘవ! ధరాధీశ! నీ వింక - వేవేగ లంకకు వేంచేసి, యచట
నవిరళమతితోడ నభిషేక మిప్పు - డవధరింపఁగ వేళ" యనిన రాఘవుఁడు8170
భరితశిరోజటాభారవల్కలుఁడు - భరతుఁ డక్కడఁ దపోభరమున నుండ
నతనిఁ జూడక మాకు ననుచితం బిచటఁ - జతురభోగక్రమసముచితక్రియలు”
అనుటయు నుచితజ్ఞుఁ డగువిభీషణుఁడు - ఘనభక్తియుక్తిమైఁ గడఁక దీపింపఁ
గనకపాత్రంబుల గంధాక్షతములు - ఘనరత్నభూషణకనకాంబరములు
పుణ్యనాదములతోఁ బుణ్యలతోడఁ - బుణ్యచిహ్నములతోఁ బుణ్యభామినులఁ
బనిచి. తెప్పించి నిర్భరభాగ్యధనుఁడు - వినయాభిరతి వినువీథి నందంద
సురదుందుభులు మ్రోయ సురలు నుతింప - సరసాక్షతముల సేసలు నిండఁ జల్లి
రామలక్ష్మణులకు రాజీవనేత్ర - భూమినందనకు నప్పుడు గట్ట నిచ్చె.
నంత రాముఁడు నిశ్చలానందుఁ డగుచు - నెంతయుఁ బ్రియమంది యింపొందఁ బలికెఁ.
"గడుఁబెద్దకార్యము ల్గలవు మా కింకఁ - దడయుట గా దయోధ్యకుఁ బోవవలయు"8180
ననుటయు రాముని నావిభీషణుఁడు - కనుఁగొని భక్తితోఁ గరములు మొగిచి,
"భీషణరణకేళిఁ బేర్చి రావణుఁడు - రోషించి మును కుబేరుని గెల్చి కొన్న
బుష్పకం బున్నది పురుహూతలోక - పుష్పకక్రమమహాద్భుతవేగ మరయ
నెలమి నాపుష్పక మెక్కి సమ్మదము - వెలయ నయోధ్యకు వేంచేయవలయు!"
నన విని రఘురాముఁ డనుమతించుటయుఁ - జని మహాసంభ్రమసంప్రీతు లోప్ప
నరిదివైభవముల నమరుపుష్పకముఁ - గరమర్థిఁ దెచ్చె రాక్షసకులేశ్వరుఁడు
రావణు లోకవిద్రావణుశక్తి - భావించి యెంతయు భయమును బొంది
నఱిముఱిఁ గదలుప ననిలుండు గదియ - వెఱచునో దీపము ల్వెఱచునో కదల
నవరత్నదీపంబు లచలరూపములు - నొనరు మందానిలంబుల నొప్పుదాని,
ఘనవిమానోదరకలితపుష్పములఁ - గొనకొన్నగంధముల్ గ్రోల నేతెంచి;8190
యులికి లోపలఁ జొరకొన్నతుమ్మెదల - చెలువున దీప్తుల చెన్నగ్గలించు,
నావిమలద్వారహరినీలమణుల - భావింప నెంతయు భాసిల్లుదాని,
తలకొని తోఁటలఁ దమపిన్ననాఁడు - వలపించి తముఁ బాసి వచ్చినఁ జూచి,
పొగులుచు షట్పదంబులతోడ వచ్చి - మొగి నున్నమల్లికాముకుళంబు లనఁగ,
నానీలమణులతో నలవడఁ గ్రుచ్చి - మానైనమౌక్తికమణు లొప్పుదాని,

త్రిభువనంబులయందుఁ దిరిగెడు గంగ - యభిమతవిశ్రాంతికై యున్నధరణి,
ఖచితహంసావళి కమలదుకూల - రచితవితానంబు రాజిల్లుదాని,
"నెప్పుడు వచ్చునో యిందు నారాముఁ - డెప్పుడు చూతుమో యేము రాఘవుని."
నని యని చింతించి యమరకన్యకలు - తనువు లుజ్జ్వలమణిస్తంభము ల్చేర్చి
నిలిచినచెలువున నిర్మలస్తంభ - ముల మణిపుత్రిక లొగి నున్నదానిఁ,8200
జేకొని వసుధపై సృష్టి రక్షింప - వైకుంఠపతి రామవల్లభుఁ డైనఁ,
బొలుచు వైకుంఠంబు పుష్పకంబైన - చెలువున నంతయుఁ జెలఁగెడిదానిఁ
గనుఁగొని యప్పు డా కాకుత్స్థతిలకుఁ - డనురక్తితో రాక్షసాధీశుఁ జూచి,
“రావిభీషణవీర! రావణోదగ్ర - పావకు నార్చిన పటుపయోదముల
వీరి నారాధింపు వీరిఁ బూజింపు - వీరి సంభావింపు విపులసంపదల"
నని వానరులఁ జూపి యర్థి దీపింపఁ - బరచిన రాక్షసపతి విభీషణుఁడు
ధనము లంబరములు తగుభూషణములు - కనకము ల్దెప్పించి కడుఁబ్రీతి మెఱసి

శ్రీరాములు పుష్పకవిమాన మెక్కి యయోధ్యకుం జనుట

జనపతిసన్నిధి సంభ్రమం బొప్ప - వనచరపతులకు వరుసతో నిచ్చెఁ
బతి రాముఁ డపుడు పుష్పకము నర్చించి - సతియుఁ దముఁడుఁ దాను సద్భక్తియుక్తిఁ
గృతకృత్యుఁడై ప్రదక్షిణముగా వచ్చి - యతిహర్షమున నెక్కె నవ్విమానంబు8210
లెక్కి సుగ్రీవాదిహితుల వానరులఁ - దక్కక వీక్షించి దశరథాత్మజుఁడు
“మీరు చేసినయట్టి మిత్రకార్యములు - నేరరు సురలైన నిష్ఠతోఁ జేయ;
నెల్లతేజంబులు నెల్లసౌఖ్యములు - నెల్లయశంబులు నేను మీవలనఁ
బడసితిఁ బుణ్యులు పరమపావనులు - కడుధన్యు లగుమీరు కపులార! యింకఁ
బొండు మీమీదేశములకు” నావుడును - నిండారువేడ్కల నృపుఁ జూచి కపులు
"ధరణీశ! మే మయోధ్యకుఁ గొల్చి వచ్చి - పరమానురక్తి మీపట్టంబుఁ జూచి,
నిరుపమచరితుల నీసహోదరుల - భరతశత్రుఘ్నులఁ బరమపావనులఁ
జూచి, మీతల్లులఁ జూచి, మీపురము - చూచి, భాగీరథి చూచి వచ్చెదము;”
అనవుడు విని రాముఁ డంతరంగమున - ననయంబు హర్షించి యావిభీషణుని
భానుజు నంగదుఁ బవనజు నీలు - మాననీయాత్ముల మఱియుఁ బెక్కండ్రు8220
వనచరప్రముఖుల వాత్సల్య మొప్ప - నెనయ నాపుష్పక మెక్కఁ బంచుటయు
ధరణీశుమన్ననఁ దగ నుత్సహించి - పరమపావనులు పుష్పక మెక్కి రంతఁ
ద్రిజటాదిసతులు ధాత్రీజకు మ్రొక్కి - నిజగృహంబుల కంత నెమ్మితోఁ జనిరి;
దశరథాత్మజుఁ జూచి దానవేశ్వరుఁడు - విశదంబుగాఁ బల్కె "వినుము శ్రీరామ!
యెలమి నీపుష్పక మెంద ఱెక్కినను - సలలితంబుగఁ జోటు చాలి వెండియును
నొకమూల కడమయై యుండు నేనూటి - కకలంకగతిని జో" టన ముదం బంది

ధరణీశుఁ డప్పుడు తరుచరాసురులఁ - గరుణఁ బుష్పక మెక్కఁగా నానతిచ్చె.
నప్పు డాపుష్పకం బాకాశవీథి - నొప్పెడివేడుక నుప్పొంగి యెగసి
ఘనమనోవేగంబుఁ గైకొని నిగిడి - వినువీథి దివ్యులు వినుతింపఁబేర్చి
పర్వినప్రభలతో భానుబింబంబు - పూర్వపశ్చిమపథంబులఁ బోక మగిడి8230
దక్షిణంబుననుండి తగ నుత్తరమున - కక్షీణగతిఁ బోవు నాకృతిఁ దోఁపఁ
బోవునప్పుడు నిత్యపుణ్యుండు రామ - దేవుండు జానకీదేవితో ననియె,

శ్రీరాములు సీతకు రాక్షసవీరులవిక్రమముఁ దెల్పుట

"శుకవాణి! జానకి! చూచితే లంక - యకలంకలక్ష్ముల నమరుచున్నదియుఁ,
గమలాక్షి! యిది విశ్వకర్మ నిర్మింపఁ - గొమరు దీపించెఁ ద్రికూటమధ్యమున
నీలంక నిమ్ముగ నేలుపుణ్యంబు - చాలక పొలిసె దుర్జనుఁడు రావణుఁడు,"
అని రక్తమాంసగజాశ్వతండములు - ఘనమైన సమరభాగముఁ జూపి విభుఁడు
"కదనవిక్రమశక్తిఁ గడఁగి యేతెంచి - మదిరాక్షి! యిక్కడ మడిసె రావణుఁడు;
ఘనసత్త్వుఁడై కుంభకర్ణుండు దొడరి - యని ఘోరముగఁ జేసి యక్కడఁ గూలె
నహితుఁడై నీలుఁ బ్రహస్తుండు దాఁకి - బహుసత్త్వుఁ డిక్కడ భస్మమై పొలిసె;
శూరతఁ బవమానసుతుఁడు ధూమ్రాక్షు - నారూఢబలుఁ ద్రుంచె నతివ యిక్కడను;8240
భేదించి యిచట నభేద్యుఁడై మేఘ - నాథుండు మముఁ గట్టె నాగపాశముల,
ధృతియు లావును బేర్చి తెగువమై బోరి - యతికాయు సౌమిత్రి యక్కడ గూల్చె;
నలఘుఁడై మకరాక్షుఁ డక్షీణబలుఁడు - బలమేది యిక్కడఁ బడియెఁ టోరాడి,
భగ్నారివీరుండు భగ్నప్రతాపుఁ - డగ్నివర్ణుఁడు గూలె నయ్యెడ నతివ!
కడిమిమైఁ టోరాడి గర్వంబు లావు - నెడలి యకంపనుం డిక్కడఁ గూలె;
నలుకమై సౌమిత్రి యాయింద్రజిత్తు - నలవొప్పఁ దెగటార్చే నయ్యెడ నబల!
యనుపమబలుఁ డగునమ్మహాకాయుఁ - దునిమె నియ్యెడ నంగదుఁడు సరోజాక్షి!
తఱిమి యయ్యెడ మహోదరమహాపార్శ్వు - లఱిమి చచ్చిరి మహోదగ్రవిక్రములు;
క్రూరులై దేవాంతకుఁడు నరాంతకుఁడు - పోరాడి యిక్కడఁ బొలిసి రిద్దఱును;
ఇదె పయోనిధిమీఁద నేపు దీపింపఁ - గదిసి మాకట్టిన ఘనసేతు వబల!8250
ఇదె గంధమాదనం బిదె పుణ్యతీర్థ - మిదె సదాశివసమాహితనివాసంబు;
కమలాక్షి యీతోఁచు కాంచనాచలము - రమణీయ మిదియ హిరణ్యనాభంబు;
పవమానసూనుండు పడఁతి! ని న్వెదక - జవ మొప్ప లంకకుఁ జనుదెంచునాఁడు
అతనికి నాతిథ్య మర్థిఁ గావించు - మతి నబ్ధి వెడలె నమ్మహితశైలంబు;"
నని చెప్పుచును రాఁగ నారాఘవునకు - ఘనతరభీషణాకారంబుతోడ
నేతెంచి దశకంఠుఁ డెదుటఁ దోఁచుటయు - భీతిల్లి యపుడు విభీషణు కనియె:
"జలజజుం డాదిగా సకలదేవతలు - పలుమఱు గొనియాడఁ బఙ్క్తికంధరునిఁ

దునిమితి నాజిలో దోర్బలశక్తి; - నెనయ నారావణుఁ డేతెంచి యిటకు,
గదియుచు నాకనుగవ మ్రోల నిలిచె - నిది చిత్ర మేర్పడ నెఱిఁగింపు" మనుడు
"జననాథ! యాబ్రహ్మసంతతియందు జనియించి నట్టి దుర్జనుని రావణునిఁ8260
దెగటార్చి తటుగాన దేవ! యాహత్య - దగిలి యేతెంచి ముందటఁ దోఁచె మీకుఁ;
గడఁక నీపాప మక్కడఁ బాపి వేగ - కడచిపోయినఁ గాని కార్యంబు గాదు;
అవనీశ! మీయాత్మ నబ్జసంభవునిఁ - దవిలి తలంపుము; దలఁచిన నతఁడు
అతిముదంబున వచ్చి యమరులుఁ దాను - మత మెఱింగించెడి మనువంశతిలక;
యనవుడుఁ బుష్పక మవనికి డించి - తనమదిలోపలఁ దాత్పర్యమొప్ప,
భూమిశుఁ డప్పు డంబుజసంభవునిని - గావించి తలఁప నక్కడి కేగుదెంచె;
నఖిలదిక్పాలురు నఖిలదేవతలు - నఖిలసంయములును నందందఁ గొలువఁ
బ్రేమ నిట్టేతెంచి ప్రియపూర్వకముగ - రాముతోఁ బలికె నారాజీవభవుఁడు;
"దేవ! రాఘవ ! యేమితెఱఁగున నన్ను - రావించి” తనవుడు రఘువల్లభుండు
తనముఖంబునఁ దోఁచు తత్క్రమం బెల్ల - వినిపింప నాతఁడు విస్మయంబంది,8270
"దేవ! దైత్యుఁడు నాదుతేజంబునందు - నీ వసుమతిఁ బుట్టి యిన్ని పాపముల
నురుతరంబుగఁ జేసి యుగ్రత మెఱయఁ - బరికింపఁ బిదప నిష్పాపుఁడై పొలిసె;
ధరణిపై విప్రుండు దనకులక్రమము - నరసి తా నిలుపక యన్యవర్తనము
నరయుచు నతులదోషాచారుఁ డైన - గురుదూషకుం డైనఁ గులశిక్షుఁ డైన
నారయ గోబ్రహ్మహత్యాదిఘోర - దారుణకర్ముఁ డై తనరువాఁ డైన
వధకు నర్హుఁడు గాఁడు వసుధపై నెన్ని - విధముల నైనను వివరించి చూడ
నట్టి దుర్జనునకు నట్టిక్రూరునకు - నట్టిపాపాత్తున కాజ్ఞ యే మనిన
నతనికులంబున కంత్యంబుఁ జేసి - పతి తనభూమిలోపల నుండనీక,
తగ వెడలించుట దండంబు సుమ్ము - జగతీశ! యిపుడు విశ్రవసుపుత్రుండు
మోక్షంబుఁ గోరి నీముందటఁ దోఁచె - మోక్షకామునిఁ జేయు ముదమున నిపుడు8280
భావించి నీపేర భవునిఁ బ్రతిష్ఠఁ - గావింపు మున్నీటికట్టపై నొప్ప
రమణమై నొకముహూర్తములోన ననుచుఁ - గ్రమమొప్పఁ దెలిపి యాకమలజుం డరిగె

శ్రీరాములు లింగప్రతిష్ఠ సేయుట

నావేళ రఘురాముఁ డాసన్నుఁ డైన - పావని నీక్షించి పలికె నిట్లనుచు,
"సన్నుతబలశౌర్య! సాహసధుర్య! - పన్నగాశనవేగ! పరమానురాగ!
మాకార్య మీడేర్చి మము నుద్ధరించి - మాకీర్తి నెగడించి మముఁ బ్రోచి తీవు;
వినయవిక్రమధైర్యవిఖ్యాతులందు - నినుఁ బోల రెవ్వరు నిఖిలలోకములఁ;
గావున నిపు డొక్కకార్య మీడేర్పు - మావార్త యెఱిఁగింతు మది యెట్టులనిన
నగచరాధీశ! యత్యంతవేగమున - నగణితఫలరాశియగు కాశి డాసి

కరమొప్ప నొక్కలింగము గొని తెమ్ము - పరఁగ విన్నూటనల్వదియోజనములు
గల దిచ్చటికి రెండు గడియలలోన - నిలువక చనుదెమ్ము నీవాహవమున,8290
ధరమీఁదఁబడిన నాతమ్మునికొఱకు - నిరుమూఁడులక్షలు నిరువదివేలు
పదియోజనములును బవనవేగమునఁ - గదలి మందులకొండఁ గ్రక్కునఁ దెచ్చి
తిరుగ నెప్పటి చోటఁ దిరముగా నునిచి - యరుగుదెంచితి నప్పు డరజాములోన
నదిగాన నీ కిది యధికమే” యనిన - ముదమున నుప్పొంగి మొక్కి వీడ్కొనుచు
నరిగి యప్పుడు మహేంద్రాచలం బెక్కి - యురుతరశక్తిమై యుంకించి యెగసి
ఘనతరం బగు కాశికాపురి డాసి - యనఘతరంగిణి నాగంగఁ గ్రుంకి
కాశికానిలయుని ఘను విశ్వనాథు - వాసవనుతు నీశు వరదయాలోలుఁ
గని మ్రొక్కి నుతిఁ జేసి కదలి యాఘనుఁడు - ఘనబుద్ధి నొక్కలింగంబుఁ గైకొనుచు
నధికవేగంబున నరుదెంచుచుండె - బుధజనవినుతుఁ డాభూమీశుఁ డంత
హనుమంతురాకకు నటు చూచి జూచి - "తనరంగ నిట ముహూర్తము చేరవచ్చెఁ8300
జనుదేరఁ డేమొ? రాక్షసుఁ డెవ్వఁడైనఁ - జెనకిన జగడంబు సేయుచున్నాఁడొ?
యేమికార్యమొ?" యని యిచ్చఁ జింతించి - ముహుర్తము దప్ప కిట లింగ మొకటి
నెనయఁ బ్రతిష్ఠింతు నిసుకచే ననుచు - జననాథుఁ డట సమస్థలమున కరిగి
కరముల నొక్కలింగము గాఁగ నిసుకఁ - గరమొప్పఁ జేసినఁ గంజాక్షి సీత
నంది గావించె నా నగజాధినాథు - ముందట నిసుకచే మొగి రామవిభుఁడు
నాయెడఁ బూజ సేయఁ గడంగునంత - వాయువేగంబున వాయునందనుఁడు
అరుదెంచి రఘురామునడుగుల కెరఁగి - ధరణీశుఁ డుంచిన దర్పకారాతిఁ
గనుఁగొని ఖిన్నుఁడై కళవళం బంది - తనువు గంపింప గద్గదకంఠుఁ డగుచు
నంజనాసుతుఁ డప్పు డనియె “నోరామ! - కంజాప్తకులసోమ! కాశికి నన్నుఁ
బనిచినఁ బనిపూని బ్రహ్మాదిసురలు - గనుఁగొన నచటి లింగమును దెచ్చితిని,8310
ననుఁ బంపి యిచ్చట నగజాధినాథు - నునుపంగఁ దగునయ్య! యుర్వీశచంద్ర!
అనువొంద నేఁ దేర నర్హుండఁ గానొ? - మనమున నామీఁద మక్కువ లేదొ?”
అనుడు రాముఁడు మందహాసంబు జేసి - హనుమంతుఁ జూచి యిట్లనియె "నా కరయఁ
దమ్ములలో నొక్కతమ్ముఁడ వీవు - నెమ్మితో నీమీఁద నెయ్యంబు ఘనము;
ఈముహూర్తముఁ దప్ప నీక యీశివునిఁ - గామించి యిసుకచేఁ గావించి తర్థి
నంతలోనన నీవు నరుగుదెంచితివి - సంతోష మయ్యె; నీశ్వరుని నవ్వలికిఁ
దెమలించి నీతెచ్చు దేవుని నిలుపు - మమరులు వొగడంగ" ననిన వాయుజుఁడు
ముదమంది తనవాలమున నీశుఁ జుట్టి - కదలించి కదలించి కదలింపలేక,
మదిలోన శంకించి మఱియు నింకించి - మెదలింపఁ జాలక మిగులఁ జింతించి
"యక్కట! మున్ను ద్రోణాచలం బేను - దక్కక యగలించి తనరఁ దెచ్చితిని8320

భుజగకంకణుతోడ భూతాలితోడ - రజతాద్రి నెత్తిన రావణునకును
నెత్తంగ నలవిగా కెసఁగు సౌమిత్రి - నెత్తితి నింద్రాదు లెల్లఁ గీర్తింపఁ
దటుకున మేరుమందరముల నైన - బొటవ్రేల జిమ్ముదు భూరిసత్త్వమున;
నిది యేల వే గయ్యె? నీరీతి నాకుఁ? - బదిలంబుఁ దప్పెనో భానువంశజుని
గినిసి యే మాఱుపల్కినపాపముననొ - కనుఁగొన నటుఁ గాక కాశీశు నీటకుఁ
జేకొని యేను దెచ్చినపాపముననొ - కాకున్న నిది యేల ఘన మగు" ననుచుఁ
బదిలంబుఁగాఁ దనబలమెల్లఁ గూర్చి - త్రిదశులు వెఱగందఁ దివిరి వెండియును
నగచరేశ్వరుఁడు ధైర్యముతోడ నభవు - నగలింపలేక బాహాగర్వ మెడలి
పటురక్తములు గ్రక్కి ప్రాణము ల్గలఁగి - యట మూర్ఛతోడ నయ్యవనిపై ద్రెళ్లె.
నాసమయంబున నారామవిభుఁడు - భాసురమృదుకరపద్మము ల్సాచి8330
హనుమంతు నెత్త నొయ్యన మూర్ఛదెలిసి - జననాథవరునకు సాష్టాంగ మెఱగి
“జయ భూమిజాస్వాంతజలజషట్చరణ! - జయ ఘోరకుటిలరాక్షసచయహరణ!
జయ ఖండితోద్దండశర్వకోదండ! - జయశోషితాబ్ధిప్రచండోరుకాండ!
జయ రావణోన్నతశైలామరేంద్ర! - జయ భక్తపరిపూర్ణసత్కృపాసాంద్ర!
జయ నిర్మలాత్మ! సజ్జనకల్పభూజ! - జయ పద్మబాంధవశతకోటితేజ!
నీమహిమంబులు నేర్తురే తెలియ? - నామహేశ్వరుఁ డైన నమరేజ్యుఁ డైన
నాగేంద్రుఁ డైనను నాకేంద్రుఁ డైన - వాగీశుఁ డైనను వసుధాతలేంద్ర!
ఏ నిన్ను నెఱుఁగంగ నెంతటివాఁడ - నే నిన్నుఁ గొనియాడ నెంతటివాఁడ
బేలనై మీరు నిల్పిన యీశు నెఱుఁగ - కేలీలఁ దెమలింప నెంచిన యట్టి
నాతప్పు లోఁగొని నన్ను మన్నించి - యీతఱి మీయాజ్ఞ నేఁ దెచ్చినట్టి8340
యీయీశునకు వెర వెఱిఁగింపు" మనుచుఁ - బాయనిభక్తితోఁ బ్రణుతించుచున్న
హనుమంతుఁ జూచి యిట్లనియె రాఘవుఁడు - “మనమున నీ వేల మరిగెద విట్లు?
నీవు దెచ్చినకాశినిలయు నిచ్చోటఁ - బావని యునుపు మీభవునకు మునుపు;
ప్రీతిఁ బూజ నొనర్చి పిదప నాయీశు - నాతతభక్తితో నర్చింతు; సకల
భూజనంబులు నిట్లు పూజ గావింతు - రాజాహ్నవీజలం బవనిలో జనము
తెచ్చి నీతెచ్చినదేవున కర్దిఁ - జెచ్చెర నిట నభిషేకంబు సేయ
నతఁ డొనర్చిన బ్రహ్మహత్యాదియఘము - లతనిఁ బొందవు కీర్తు లలర సిద్ధించు
నతులితపుత్రపౌత్రాభివృద్ధియును - నతులభోగంబులు నమరంగఁ గలుగు"
నని పల్క హనుమంతుఁ డతిముదం బంది - మనమున సంతోషమగ్నుఁడై పొంగెఁ
బరమాత్ముఁ డట నుమాపతిఁ బ్రతిష్ఠించి - యురుభక్తిఁ దగ షోడశోపచారముల8350
గర మొప్ప మునుమున్ను కాశికావాసు - ధరణివంశ్యుఁడు సొంపు దనరారఁ బూజ
గావించి పిదపఁ దాఁ గావించుశివుని - భావించి యర్చించెఁ బరమహర్షమున;

రమణఁ బూవులవాన రఘురాముమీఁద - నమరులు గురియింప నగచరు ల్మురియ
నంత విభీషణుం డధిపతి కనియె - సంతోష ముప్పొంగ "జగతీశ! యిప్పు
డీకట్టతెరవుగా నెవ్వరికైన - రాకుండఁ జేయు మో రామ లంకకును”
నావుడు హర్షించి నలినాప్తకులజుఁ - డావిభీషణుఁ జూచి “యౌఁ గాక" యనుచు

శ్రీరాములు సేతుమహిమను దెలుపుట

నడరంగ నటఁ గోన్నియడుగులు మగిడి - నడుసేతుమీఁద నున్నతితోడ నిలిచి
కపు లుగ్రముగ నబ్ధిఁ గట్టిన యట్టి - విపులబంధము లెల్ల విడిచెనో యనఁగఁ
దనసహోదరుచేతి ధను వందిపుచ్చు - కొని వేగమున ధనుష్కోటిఁ గావించి
“పరదారగమనంబు బ్రహ్మహత్యలను - గురుజనద్రోహంబు గోగణవధయు8360
సోదరీరతియును సురఁ గ్రోలుటయును - వేదదూషణమును విత్తాపహరము
సుందరీచ్ఛేదంబు చోరసంగమము - మందిరదహనంబు మాంసభక్షణము
మొదలైనపాతకంబులు చేసి యైన - గదిసి యిచ్చట నవగాహంబు సేయు
పురుషముఖ్యున కగుఁ బుణ్యసంఘములు - అరుదారు నాయువు నారోగ్య మెపుడు
పరహితాచారసౌభాగ్యసంపదలు - చిరకీర్తులును వేగ చేకూరు" ననుచు
నారాఘవేశ్వరుం డపుడు పుష్పకము - నారూఢగతి నెక్కె నధికమోదమున
నమరులు దీవింప నగచరు ల్వొగడ - నమరంగ నెప్పటియట్ల పుష్పకము
ఘనవేగమునఁ జన గగనమార్గమున - మనుకులేశ్వరుఁ డంత మహిపుత్త్రి కనియె.
"హిమకరబింబాస్య! యిదె విభీషణుఁడు - మముఁ గన్నచోటు సమ్మదమున వచ్చి
ఇక్కడఁ గుశతల్ప మేను గైకొంటి - నిక్కడ నుండితి నేకతంబునను8370
పూని బ్రహ్మాస్త్ర మద్భుతశక్తి మెఱసి - యేను బయోధిపై నిక్కడఁ దొడుఁగ
నదులతో నన్నదీనాథుండు వచ్చి - ముదముతో నను గాంచి మ్రొక్కినచోటు,
అలఘువిక్రమశక్తి నమ్ము సంధించి - జలజాస్య! యిక్కడఁ జంపితి వాలి
పుష్కరబహుఫలాద్భుతకాననములు - కిష్కింధ కంటె సుగ్రీవుపట్టణము;"
అని యని తెల్పుచో నాలోలనేత్ర - జనకనందన రామచంద్రుతో ననియె.
"జననాథ! సుగ్రీవుసతులతోఁ గూడ - వినుఁ డయోధ్యకుఁ బోవ వేడ్క పుట్టెడిని;"
ననవుడు పుష్పకం బయ్యెడ నిలిపి - జనపతి యనిచినఁ జతురుఁడై యరిగి
తారాధినాథుండు తారాద్రికీర్తి - తారాపథంబునఁ దారాదిసతులఁ
జెలువొందఁ దోడ్తేర సీతకు మ్రొక్కి - యెలమిఁ బుష్పక మెక్కి రింపార వారు;
ఎంతయుఁ బదిలమై యేపు దీపింప - నంత నెప్పటిమాడ్కి నరిగెఁ బుష్పకము.8380

శ్రీరాముఁడు మార్గమధ్యములోని విశేషములు సీత కెఱిఁగించుట

ఆలోన రఘురాముఁ డాఋష్యమూక - శైలంబు డగ్గరి జానకిఁ జూచి

"హితవానరానీక మీఋష్యమూక - మతిలోక మీగిరి నర్థితో మున్ను
శరణాగతుం డయి చనుదెంచుటయును - గరుణ సుగ్రీవునిఁ గాన్పించుకొంటి;
నాసన్నరవికిరణాసక్తకమల - భాసురోదరము పంపాసరోవరము;
ఇదె చూచితే యొప్పు నీపుణ్యసరసి - మృదులతీరంబున మెలఁత నిన్బాసి,
బహుదుఃఖములఁ బొందఁ బవమానసుతుఁడు - మహితపుణ్యాత్ముండు మము వచ్చి కాంచి
హృదయపద్మమునకు నింపు పుట్టించి - మదిరాక్షి! కాన్పించె మర్కటేశ్వరుని
ఒదవుకాననముల నొప్పుచునున్న - దదె! శబర్యాశ్రమ మజ్జాయతాక్షి!
యలిగి యిక్కడ మహాహవకేలి వాలి - బలశాలియైన కబంధుఁ జంపితిని;
నినుఁ జెఱఁగొనిపోవునీచు రావణునిఁ - గనుఁగొని పోనీక కడిమిమైఁ దాఁకి8390
మిన్న కయ్యసురుతో మెఱసి పోరాడి - యున్నతాయువు జటాయువు గూలె నిచట;
నదె యాజనస్థాన మర్జాయతాక్షి! - పొదలువనంబులఁ బొలుపొందెఁ జాల;
నదె శూర్పణఖ నుగ్రుఁడై ముక్కుఁజెవులు - కుదియఁగ సౌమిత్రి కోసినతావు;
అదె చూడు ఖరదూషణాదిరాక్షసులు - మదమునఁ జనుదెంచి మడిసి రిచ్చోట;
నీయెడ నన్నొగి నెలయించుచుండె - మాయామృగాకృతి మారీచుఁ డేచి
మదిరాక్షి! యిక్కడ మఱి వాఁడు మడిసె - నిదె పంచవటిఁ జూడు మిదె పర్ణశాల;
పటుమాయ నిక్కడఁ బఙ్క్తికంధరుఁడు - కుటిలుఁడై మ్రుచ్చిలి కొనిపోయె నిన్ను;
నదె సుతీక్ష్ణాశ్రమ మాశ్రమరత్న - మదె యగస్త్యాశ్రమం బబ్జాయతాక్షి
యదె శరభంగుని యావాస మింతి - యదె యత్రిమౌని పుణ్యాశ్రమభూమి;
అదె నీకు ననసూయ యంగరాగములు - హృదయరాగముతోడ నిచ్చిన చోటు;8400
అదె చిత్రకూటాద్రి యక్కడ నన్నుఁ - బదిలుఁడై భరతుండు ప్రార్థించి చనియె;
విమలకాననముల విలసిల్లుచున్న - యమున యల్లదె కంటె యనతిదూరమున;
ముదమొప్ప బహుదివ్యమునులు సేవింప - నదె చూచితే గంగ నమలతరంగ?
ఒదవినకొలఁకులు నుద్యానములను - నదె శృంగిబేర మొప్పారుచున్నదియు;
నదె గుహుం డేతెంచి యర్థితో మమ్ము - గదిసి కాంచినయట్టికమనీయభూమి;
నదె సరయూనది యధికయూపముల - బొదిగొన్న తటములఁ బొదలుచున్నదియు;
నదె యయోధ్యాపుర మబ్జాక్షి మ్రొక్కు - మది కానవచ్చె నాయతపుణ్యరాశి;"
అని భూమిజకు రాముఁ డర్థితోఁ జూప - ఘనమైనవేడ్కలఁ గపులు రాక్షసులు
బహురత్నకాంచనప్రాసాదతతుల - బహుతోరణంబుల బహుపతాకలను
బహువారణంబుల బహుతురంగముల - బహురథోత్కరములఁ బ్రణుతింప నెందు8410
నమితవైభవముల నతులమై మెఱయ - నమరావతియుఁ బోలె నమరు నప్పురము
నినిచినవేడ్కల నెఱ నిక్కినిక్కి - గనుఁగొనఁ దొడఁగిరి కడఁకతో నంతఁ
బదునాలుగవయేడు పరిపూర్ణమైన - వదల కప్డు శుభకృద్వత్సరమందు

శ్రీరాములు భరద్వాజాశ్రమంబునకు వచ్చుట

మదిలోన నుప్పొంగి మాఘమాసమునఁ - బదపడి యాశుద్ధపంచమినాఁడు
అశ్రాంతశుభతేజుఁ డగు భరద్వాజ - నాశ్రమోపరివీథి నవ్విమానంబు
ధీయుక్తి రాముండు దిని నిల్పి డిగ్గి - యాయాశ్రమంబున కర్థి నేతెంచి,
యమ్మునిపాదంబులందు మోదంబు - గ్రమ్మ ఫాలస్థలిఁ గదియించి మ్రొక్కి
మునిచేత దీవన ల్ముదమొప్పఁ బడసి - వినయరసావేశవివశుఁడై పలికె.
"నేను మీ దగుసేమ మేమియు నరయఁ - గానఁ గానకుఁ బోయి కాలంబు గడచె.
కలవు కదా మీకుఁ గందమూలములు - ఫలములు జలము లపాయంబు లేక8420.
ఎల్ల తెఱంగుల నెప్పుడు చెడక - చెల్లుఁ గదా మీకు శిష్టకృత్యములు?”
అనవుడు మునినాథుఁ డారామచంద్రు - వినయవాక్యంబులు విని సంతసిల్లి
"నిఖిలలోకారాధ్య! నీవు జన్మించి - నిఖిలలోకంబులు నిష్ఠఁ బాలింప
గలవె సంకటములు? గలవె దుఃఖములు? - గలవె బాధలు? పుణ్యకర్ముల కెందు?
నిత్యసత్యోన్నత! నీప్రసాదముల - నత్యంతసుఖులమై యఖిలధర్మములు
సలుపుచు వేదోక్తసముచితక్రియలు - సలుపుచుఁ దపములు సలుపుచుండుదుము;
నీ విందు విచ్చేసి నెమ్మి నేఁ బనువఁ - గా వీడుకొనిపోయి క్రమ్మఱ నిందు
విచ్చేయు నీలోని వృత్తాంత మెల్ల - నచ్చుగాఁ బొడగంటి నధ్యాత్మదృష్టి;
నరయ నీచేసిన యద్భుతక్రియలు - నరిది యనుష్ఠింప నాదివ్యులకును
నీ వరణ్యములకు నిష్ఠ దీపింపఁ - బోవుట మొదలుగా భోగంబు లుడిగి8430
ఘనజటాభారవల్కలములు దాల్చి - పనివడి భరతుండు భక్తి వాటించి
నీపాదుకలయందు నిఖిలరాజ్యంబు - రూపించి నిలిపె నారూఢమానసుఁడు;
చెప్ప నక్కజమైన చిత్తానురక్తి - నెప్పుడు నీరాక కెదురు వీక్షించు;
నీవు నీతమ్ముని నెయ్యంబు దలఁచి - వేవేగ పోవ భావింపఁగావలయు;
వనవాసమున డస్సి వచ్చినవాఁడ - వనఘ! మాయాశ్రమంబందు నేఁ డుండి
భూపాల! నీ వెల్లి ప్రొద్దునఁ గదలి - మాపంపుఁ గైకొని మఱి పొమ్ము విందుఁ
గావింతు" నని చెప్పి ఘనతపోమహిమ - నా వేళ రాముఁ డత్యాశ్చర్యమంద
నామహామునివరుం డాత్మలోపలను - గామధేనువుఁ గుతుకముతోడఁ దలఁప
మిలమిల మెదలెడి మృదుతరాన్నమును - ఫలములు ఘృతము సూపము లపూపములు
సరవితో శాకము ల్శర్కర పెరుఁగు - పరమాన్నమును నానబాలును జుంటి8440
తేనియ శిఖరలు తియ్యచారులును - బానకం బొబ్బట్లు పచ్చళ్లు జున్ను
వరుగులు వడియము ల్వాసనోదకము - లురుతరరుచి నొప్పునూరగాయలును
మొదలైన వావేల్పుమొదవు కల్పింప - ముదమునఁ గపిదైత్యముఖ్యులతోడ
నచ్చపుభక్తిమై నారామచంద్రుఁ - డిచ్చ మెచ్చుచు భుజియించుచున్నంత,

ఆభరద్వాజుఁ డిట్లనియె రామునకు "శోభనగుణధామ! సుగుణాభిరామ!
యేము నీ కొకవరం బిచ్చెద మిపుడు - కామింపు" మనుటయుఁ గరములు మొగిచి
"పోడిగా సాకేతపురముచుట్టులను - మూఁడుయోజనములు మునినాథ! వినుఁడు.
ఏచి తలిర్చుచు నెల్లకాలమును - బూచుచుఁ బండుచు భూజంబు లుండ
వర మిండు మఱి యొండువరము నే నొల్లఁ - గరుణింపు" మనవుడు గరుణించె మౌని,
ఆయీగిఁ జరితార్థు లైనవానరులు - మాయనిహృదయసమ్మదమునఁ బొదలి8450
రప్పుడు రఘుపతి యనిలనందనునిఁ - దప్పక చూచి యుదాత్తుఁడై పలికె;
“నతులసత్వోన్నతి నత్యంతవేగ - రతి శృంగిబేరపురంబున కరిగి
భూరిమానసు గుహుఁ బుణ్యాత్ముఁ గాంచి - మారాక యతనికి మానుగాఁ దెలిపి
యాయున్నతాత్ముచే నటఁ బోవుత్రోవ - ధీయుక్తి నెఱిఁగి నందిగ్రామపురికి
నరిగి మాభరతున కతిశుభవ్రతున - కురుదయారతునకు నున్నతాత్మునకు
నేము వచ్చితి మని యెఱిఁగించి రమ్ము - పో మారుతాత్మజ! పొమ్ము” నావుడును
మారుతాత్మజుఁడును మానుషవేష - ధారియై యరిగి యద్భుతవేగుఁ డగుచు
గంగాతరంగిణిఁ గడఁకతో దాఁటి - శృంగిబేరమునకుఁ జెచ్చెరఁ బోవఁ
బరహితాత్మకుఁ డైన పరమేశురాక - నరసి కానక గుహుం డాత్మలోపలను
“నన్నేలుశ్రీరామ నరలోకవిభుని - సన్నుతపదపంకజంబులఁ గొలిచి!8460
పోలేక నిలిచితి భూరిదుర్గముల - నేలీల మెలఁగిరో? యెందున్నవారొ?
శరభభేరుండరాక్షసవహ్నిభుజగ - గరళబాధలచేతఁ గ్రాగిరో కాక?
లేకున్న వ్రతము చెల్లినమీఁద మగిడి - రాకయుండునె? రఘురాముండు పలికిఁ
దప్పునే కార్యంబుఁ దప్పె నే నింక - నిప్పుడే సొదఁ జొచ్చి యెనయుదు రాము"
నని మనంబున నున్న యాందోళ ముడిగి - తనసతు ల్సుతులును దమ్ములుఁ దాను
సొరిదిఁ గుండమునందు సొదఁ బేర్చి మిగుల - దరికొల్ప ననల ముదగ్రమై మండ
నరుదైనభక్తితో నాగుహుం డపుడు - ధరణీశుఁ డగురాముఁ దలఁపులో నిలిపి
యయ్యగ్నిలోఁ జొర నరుగుదేరంగ - నయ్యెడ హనుమంతుఁ డడ్డమై నిలిచి
పుడమితేఁ డిదె వచ్చె బొంకుగా దెల్లి - యుడుగక తనవ్రతం బొనరఁ జెల్లించి
పదపడి నగ్నిలోఁ బడినశ్రీరాము - పదములయా" నంచుఁ బలికిన నాతఁ8470
డనిలజునకు మ్రొక్కి యారామురాక - కనుచరసహితుఁడై హర్షంబు నొంది
పరఁగ నగ్గుహుఁడు సంభావింప నరిగి - యురుపుణ్యనిధి సరయూనది దాఁటి
పోవ నందిగ్రామమున భరతుండు - పావనచరితుండు భావంబులోన
"నారామలక్ష్మణు లవనినందనయు - నేరీతి నున్నారొ? యేమైనవారొ?
ఎన్నినఁ బదునాలుగేండ్లును నిండెఁ - గ్రన్నన రాముఁ డిక్కడికి రాఁడేమొ?
మోసపోయితి నాఁడె మునివృత్తి రాము - భాసురకోమలపాదపద్మములు

నాసుమిత్రాపుత్రుఁ డర్థితోఁ గొలిచి - యాస మీఱఁగఁ దోన యరిగినరీతి
నరుగలే నైతి నే నారాముఁ బాసి - ధరణి నేవిధమునఁ దనువు ధరింతు?
పదునాలుగేండ్లును బరిపూర్ణమైన - సదయాళుగుణనిధి చనుదేరకున్న
ఘన మైనసొదఁ బేర్చి కడఁకతోఁ జొత్తు - నని నిశ్చయంబుగా నాడిన ప్రతిన8480
హితమతి రిత్త వోనిత్తునే” యంచు - మతి నిశ్చయముఁ కేసి మంత్రుల కనియె.
"శాత్రవమదహారి శౌర్యసంపన్నుఁ - బాత్రు శత్రుఘ్నునిఁ బట్టంబుఁ గట్టుఁ
డేనగ్నిలోఁ జొచ్చి యేగెద రాముఁ - గానంగ" ననిన నాఘనుఁ జూచి యపుడు
శత్రుఘ్నుఁ డిట్లను “జగతీతలేశ! - యీధాత్రి నా కేల? యీతను వేల?
నీపాదములఁ గొల్చి నీతోడఁ గూడ - నేపార నేనును నేగుదెంచెదను;"
అని కృతనిశ్చయు లైనయానరులు - గనుఁగొని భీతులై కలఁగి రందఱును;
ఆసమయంబున నధికవేగమున - నాసమీరాత్మజుం డరుదెంచి భరతుఁ

హనుమంతుఁడు భరతుని జూచుట

గనుఁగొని వినతుఁడై కరములు మొగిచి - కొని నిల్వఁ గాకుత్స్థకులుఁ డిట్టులనియె.
"నీకులం బెయ్యది? నీకుఁ బేరేమి? - చేకొని యిటకు వచ్చినపని యేమి?
యెవ్వండ వెందుండి యెట కేగె" దనిన - నవ్వసుధేశుతో ననిలజుం డనియెఁ8490
“గపి నేను శ్రీరాముగాదిలిబంటఁ - దపనకులాంభోజతపనుఁ డున్నతుఁడు
తనపుణ్యచరిత యుత్తములెల్ల మెచ్చ - ననిమిషు ల్గొనియాడ నారామవిభుఁడు
వినుము జగద్ధితవృత్తిమై మెఱసి - వనవాససమయంబు వలనొప్పఁ దీర్చి
సౌమిత్రియును దాను జనకనందనయు - రాముండు వచ్చి యరణ్యము ల్విడిచి
నెమ్మితో ముందఱ నీసేమ మరసి - రమ్మన్న వచ్చిన రాక యీరాక,”
అనవుడు భరతుఁ డత్యంతహర్షమునఁ - గొనకొని పులకించి కోర్కి దీపింప
“రా పుణ్యవత్సల! రా కపిశ్రేష్ఠ ! - రా పవనాత్మజ! ర” మ్మంచుఁ దిగిచి
నరనాథసుతుఁడు వానరనాథసుతునిఁ - గరము సమ్మదమునఁ గౌఁగిటఁ జేర్చి
గజమాల్యమణు లిచ్చి గజముల నిచ్చి - గజరాజగమనలఁ గరమర్థి నిచ్చి
కనకాంబరంబులు కడువేడ్క నిచ్చి - వినుతభూషణములు వెలయంగ నిచ్చి8500
తగుపట్టణము లిచ్చి, ధనకోటు లిచ్చి - యగణితగుణధీరుఁ డనియె మారుతికి.
"నడవుల కరిగి రామావనీవిభుఁడు - దడసినకార్యంబుఁ దలఁప నచ్చెరువు;
నెందెందు వర్తించె? నెందెందుఁ బోయె? - నెం దున్నవాఁ డిప్పు డినకులేశ్వరుఁడు?
నీవు రాఘవునకు నిజదూత వగుట - యీవిధంబంతయు నెఱిఁగింపు మనఘ!
యిచ్చలోపల నమ్మ నీపలు కేను - వచ్చుట నిక్కమే? వనచరాధీశ!"
యనవుడు విని, నవ్వి, యవ్విమలాత్ముఁ - డెనసినభక్తితో నేర్పడఁ బలికె,
మీతండ్రి దశరథమేదినీశ్వరుఁడు - భూతలరాజ్యప్రభుత్వంబు మాన్చి

యడవికిఁ జను మన్న నన్నరేశ్వరుఁడు - జడలు వల్కలములు శాంతుఁడై తాల్చి
భానుప్రభాభాసి పాదచారమున - జానకీలక్ష్మణసహితుఁడై వెడలి
చిత్తసమ్మదమునఁ జిత్రకూటాద్రి - నుత్తమమునిగోష్ఠి నున్నచో నీవు8510
భూరాజ్య మొల్లక పోయి మీయన్న - నారాధనము చేసి యర్థిఁ బిల్చుటయుఁ
బతి రాకయున్నఁ దత్పాదుకాయుగళ - మతిభక్తియుక్తిమై ననురక్తి నడిగి
తల మోచికొనివచ్చి ధారణీరాజ్య - ఫలభోగ ముడిగి తపస్వి వై తిచట;
గుటిలదానవబలక్రూరవర్గములు - నట రాఘవుఁడు దండకారణ్యమునకుఁ
జని శరభంగునాశ్రమభూమి నిలిచి - మునుల నూఱడఁ బల్కి ముద మొప్పఁ బోయి
యాజనస్థానంబునందున్న దైత్య - రాజుచెల్లెలిఁ బట్టి రాజిమి మెఱసి
నలిమీఱి యాశూర్పణఖముక్కుఁజెవులు - కొలఁదులు మొదలంటఁ గోసిపోవైచి,
ఖరదూషణాదిరాక్షసులఁ బెక్కండ్ర - నరభోజనులఁ బదునాలుగువేలఁ
జంపి యొక్కడ పర్ణశాలలో నుండఁ - దెంపుమై రాక్షసాధిపుఁడు ప్రేరేప
మారీచుఁ డనియెడి మాయావి యొకఁడు - భూరిమృగాకృతి బొడచూపుటయును8520
మృగనేత్ర సీత యామృగము నీక్షించి - "మృగ మొప్పు నాకు నీమృగముఁ దేవలయు”
ననవుడు శరచాపహస్తుఁడై దాని - వెనుకొని రామభూవిభుఁ డొగి నేయఁ
గూలెడు నప్పు డాకుటిలరాక్షసుఁడు - "హా లక్ష్మణా!" యను నార్తరావమున
నారూఢిఁ జీరిన నతివ భీతిల్లి - యారాఘవానుజు ననుప నచ్చటను
మునివేషధారియై ముద్దియ నెత్తి - కొనిపోవు రావణుఁ గూడి పోనీక,
ఘనుఁడు జటాయువు గని యడ్డపడిన - ననిమొన భర్జించి యతని నిర్జించి
దనుజాధిపతి సముద్రము దాఁటి పోయి - తనలంకలోనియుద్యానంబునందు
సీతామహాదేవిఁ జెచ్చెఱ నునిచి - యాతతజయశాలి యై యుండె నంత.
మాయామృగముఁ జంపి మఱి రామచంద్రుఁ - డాయాసపడి ఖిన్నుఁడై వచ్చివచ్చి
సౌమిత్రిఁ బొడగని జానకి డించి - యేమిటి కిట వచ్చి తీవంచు వగచి8530
యతఁడు దానును గూడి యాపర్ణశాల - కతిరయంబున వచ్చి యందులో సీతఁ
బొడగాన కిరువురు భూరిశోకమునఁ - బడి యంద వెదుకుచు బహుదుర్గములకుఁ
బోవుచో రావణుభుజశ క్తిఁ దూలి - వావిరిలోదారి వసుధపైఁ గూలి
యున్నజటాయువు నొయ్యనఁ గదిసి - యన్నీచదుర్దశ యద్దశాననుఁడు
గావించి సీత లంకకు నెత్తుకొనుచుఁ - బోవుట యతనిచేఁ బోలంగ నెఱిఁగి
యావిహగాధీశు నచట దహించి - పోవుచు ఘనదుర్గభూములఁ గడచి
ముందట నాఋష్యమూకంబుఁ గాంచి - యందు సుగ్రీవునకై వాలిఁ జంపి
తారతో నాచంద్రతారార్కముగను - నారాజ్య మంతయు నతనికి నిచ్చె
నిచ్చిన సుగ్రీవుఁ డెంతయు మెచ్చి - విచ్చలవిడి సీత వెదకెడికొఱకు
లక్షల రెండేసిలక్షలఁ గపుల - నక్షీణబలుల మహాయశోధనులఁ8540

బదిదిక్కులకుఁ బంపఁ బఱచి వానరులు - వదలక వెదకంగ వచ్చి సంపాతి
సీత యున్నది లంకఁ జింతింప వలవ - దీతెఱం గిటఁ జేయుఁ డిటమీఁద ననిన
జలరాశి నూఱుయోజనము లే దాఁటి - నలఁగి యశోకవనంబులో నున్న
వైదేహిఁ గని యానవాలు నే నిచ్చి - యాదేవిమాణిక్య మర్ధి నిచ్చుటయు,
నది దెచ్చి యిచ్చిన నవనివల్లభుఁడు - ముదమంది విస్మయంబునుఁ బొంది యపుడు
సకలశాఖామృగసహితుఁడై పోయి - యకలంకవిక్రముం డబ్ధి బంధించి
లంకపై విడిసి యలంకృతశక్తి - లంకేశుఁ జంపి కళంకంబు లుడిపి
యవ్యయశ్రీయుక్తి నాలంకఁ బుణ్య - భవ్యు విభీషణుఁ బట్టంబుఁ గట్టి,
పావనాత్మకు లైన బ్రహ్మాదిసురల - చే వరంబులు గొని చెలు వగ్గలించి
హితమతి సురలతో నేగుదెంచుటయు - నతిభక్తి మీతండ్రియడుగుల కెరఁగి8550
యనలముఖంబున నతిశుద్ధయైన - జనకజఁ గైకొని సమ్మదం బొప్ప
ఖ్యాతి పెంపొంద నాకపులు రాక్షసులు - ప్రీతి సుగ్రీవవిభీషణు ల్మొదలు
బలసి తన్గొలువఁ బుష్పక మెక్కి వచ్చి - ఫలితవిక్రమశోభభరితుఁడై విభుఁడు
ఆభరద్వాజసంయమియాశ్రమమునఁ - బ్రాభవస్ఫురణ మొప్పఁగ నున్నవాఁడు;
చందనచంద్రికాసమచారుకీర్తి - యిం దెల్లభంగుల నెల్లి విచ్చేయు, "
ననవుడు భరతేశుఁ డతనివాక్యముల - జనితానురాగుఁడై శత్రుఘ్నుఁ జూచి
"తడయక నీవయోధ్యాపురంబునకుఁ - గడువేగమునఁ బోయి కడఁక దీపించి
యాయతమంగళాయతనమై యొప్పు - నీయుత్సవము వీట నెల్లఁ జాటింపు;
గొనకొని మనరాజు కొలువుకూటమున - ఘనసేతుబంధాదికథలు వ్రాయింపు;
దేవగేహములు భూదేవగేహములు - నీవు సన్నిధినుండి నెలయఁ బాటింపు;8560
వరరత్నతోరణధ్వజపరంపరలఁ - బురవీథులన్నియు భూషింపఁ బంపు;
తరుణులఁ బిలిపించి తగినముత్యములు - వెరవార మ్రుగ్గులు వెట్టింపఁ బంపు;
లలితవస్తువుల నిండ్లకు నెల్లఁ బంపు - కలయఁ బౌరుల నెల్లఁ గైసేయఁ బంపు;
శ్రీరామనృపతి వేంచేసినశుభము - చేరువనృపులకుఁ జెప్పంగఁ బంపు;
కరితురంగాదుల క్రందు గానీక - పరువడిఁ జతురంగబలములు గొలువ,
నెమ్మి మంత్రులతోడ నీవు వేగమున - నమ్మలఁ గొలిచి ర"మ్మని నియమించె;
ననవుడు శత్రుఘ్నుఁ డత్యంతవేగ - మున నయోధ్యకుఁ బోయి ముదము దీపింపఁ
గరమొప్ప రాఘవాగమనమంగళము - వరుసతో నిట బంధువరులకుఁ జెప్పి
కౌసల్యకును జెప్పి కైకకుఁ జెప్పి - యాసుమిత్రాదేవి కర్థితోఁ జెప్పి
యది యిది లేదుగా యనకుండ నిండ్లు - చదురొప్ప నంగళ్లు చక్కఁజేయించి8570
చందనకర్పూరజలములు గూర్చి - యందంద చల్లించి యర్థితో ననుపు
పురవీథులందు నొప్పుగ నవరత్న - వరతోరణంబులు వరుసఁ గట్టించి

భరతుఁడు వసిష్ఠాదిసహితుఁ డై శ్రీరాముల నెదురుకొనుట

భరతుఁడు తనుఁ బిల్చి పనిచినరీతిఁ - బురము సర్వంబును భూషింపఁజేసి,
యనఘమానసు లైన యావసిష్ఠాది - మునులు పురోహితు ల్మునిపుణ్యసతులు
జననులు బంధులు సచివులు హితులు - వనితలు దాదులు వరవృద్ధజనులు
కొంద ఱందలములఁ గొంద ఱశ్వములఁ - గొందఱు రథములఁ గొంద ఱేనుఁగుల
నెక్కి యేతేరఁ బెంపెక్కి శత్రుఘ్నుఁ - డెక్కుడుమహిమతో నెలమి దీపింపఁ
బంచమహావాద్యపటురవం బెసఁగ - నంచితగతి వచ్చె నన్న యున్నెడకు
తల్లులు తమ్ముఁడు తాను సేనలును - వెల్లియై భరతుండు వేడ్కతోఁ గదలి
యెనయ రాఘవునకు నెదురేగుచోట - హనుమంతుఁ డనియె నుదాత్తుఁడై భరతు
“నదె చూడు రాఘవుం డాభరద్వాజు - సదనంబునందుండి చనుదెంచువాఁడు
అదె చూడు పుష్పకం బదె చూడు రాముఁ - డదె చూడు కపిసేన యదె వచ్చెఁ జూడు8580
సరయూప్రవాహ ముజ్జ్వలశ క్తి చాటు - తరుచరకలకలోద్ధతపటుధ్వనులు"
అన విని భరతేశుఁ డవ్విమానంబుఁ - గనుగొని యుబ్బి గద్గదకంఠుఁ డగుచుఁ
గన్నంత దవ్వులఁ గడుభక్తి మ్రొక్కి - యన్నకు సాష్టాంగ మక్కడ నెరఁగి
యుదయాద్రిపై నున్న యుదయార్కుపగిది - బదిదిక్కులను ప్రభాపటలంబు పర్వ
బుష్పకారూఢుఁడై పొలుపారుచున్న - నిష్పాపు రఘురాము నెరిజేరి మ్రొక్కె;
నంత నాపుష్పకం బవనికి డించి - యెంతయు హర్షించి యినకులేశ్వరుఁడు
ఒండొండ కావించె నొనరఁ దల్లులకు - దండప్రణామము ల్దాను లక్ష్మణుఁడు
పరువడి వారును బరఁగ దీవించి - పరిరంభణముల సంభావించి రెలమి;8590
భరతశత్రుఘ్నులు భక్తితో రామ - ధరణివల్లభునకు ధరణినందనకుఁ
జతురత వెలయ లక్ష్మణునకుఁ బ్రీతిఁ - గృతకృత్యమతులు మ్రొక్కిరి పుణ్యధనులు
భరతశత్రుఘ్నులఁ బరఁగ దీవించి - పరిరంభణముల సంభావించి రొప్ప
నత్తఱి సీతామహాదేవి ప్రీతి - నత్తల కెల్ల నాయతభక్తి మ్రొక్కె;
మ్రొక్కినకోడలి మొగిఁ గౌఁగిలించి - యొక్కట దీవించి రోలి నందఱును,
రామలక్ష్మణులును రాగిల్లి మ్రొక్కి - రామహామునివర్యుఁ డగు వసిష్ఠునకు,
నమ్ముని దీవించి యాలింగనంబు - నెమ్మిఁ గావించె నానృపనందనులను
రూపించి భరతశత్రుఘ్నులు ప్రీతి - నాపూర్ణ హృదయులై యప్పుడు వచ్చి
తమతల్లులకు మ్రొక్కి తగుభక్తి గలిగి - విమలాత్ములై రాము వెనుక నున్నట్టి
నావిభీషణునకు నర్కసూనునకు - నావాలిసుతునకు నట ముఖ్యు లైన8600
కపులకుఁ బ్రియములు గావించి వారి - విపులపరీరంభవితతి నూరార్చి
జయమును గీర్తియు సాధించె రాముఁ - డయనయోదయకృతు లయి మీరు గలుగ
జెలులు భృత్యులును నై చిత్తంబు లింత - కలసినబంధువు ల్గలరు మా కనుచు,

”నేకొలందులుఁ గాని హృదయసమ్మదము - గైకొనుచుండిరి కడఁకతో నంతఁ
దల్లులు బాంధవు ల్దమ్ములు కపులు - వెల్లియై బలములు వేడ్క నేతేరఁ
దేజంబు మెఱయ నందిగ్రామపురము - రాజశిరోమణి రాముండు సొచ్చె;
నంతఁ బుష్పకమున కర్చన లిచ్చి - యెంతయు భక్తితో నినకులేశ్వరుఁడు
తలచినప్పుడు రమ్ము ధననాథునొద్ద - నలకలోపలనుండు మనుచు వీడ్కొలిపె,
భరతుఁ డప్పుడు రాముపంచకుఁ జేరి - కరమొప్పఁ గరములు కడుభక్తి మొగిచి
"మీపాదుకలయందు మేదినీభార - మేపార నునిచి యే నింతకాలంబు8610
నవధానమతితోడ నాలస్య ముడిగి - యవనీశ! మీరాజ్య మరసితి నొప్ప”
నని చెప్పి పాదుక లర్థి నొప్పించి - వినతుఁడై యత్యంతవినయంబు మెఱసి
"వెలయ నయోధ్యకు వేంచేయవలయు - నొలసిన మునివేష ముచితంబు గాదు;
రాజమండనములు రమణమైఁ బూనుఁ - డీజటాభారంబు లీవల్కలములు
మానుండు మీ”రన్న మనుజవల్లభుఁడు - పూనిక నిండుట బుద్ధిలోఁ దలఁచి
యవుఁగాక యనవుడు నప్పుడు గదిసి - వివిధవిధిజ్ఞులు వెరవు భక్తియును
గలవారు కడఁకతో ఘనజటాబంధ - ములు వీడ్వ నభ్యంగము లవధరించి
దమ్మునుఁ దాను నుత్సవజలస్నాన - మిమ్ములఁ గావించి యినకులేశ్వరుఁడు
ప్రకటదివ్యాంబరాభరణమాల్యములు - నకలంకచిత్తుఁడై యమరఁ గైసేసె;
ధరణీతనూజకు దశరథాంగనలు - కరము ప్రియంబునఁ గై నేసి రెలమి8620
సుదతులు తారాది సుగ్రీవసతులు - ముదమొప్ప శృంగారములు సేసి రపుడు,
ఆలోన హనుమంతుఁ డర్థిఁ దోడ్తేర - వేలసంఖ్యలు చెంచువిలుకాండ్రు గొలువ
లలితజటావల్కలములతోడఁ - గొలఁదిమీఱినవేడ్క గుహుఁ డేగుదెంచి,
జవ్వాదిపిల్లులు చమరవాలములు - మవ్వంపుగజదంతమౌక్తికంబులును
గిటిదంష్ట్ర వేణుమౌక్తికములు సర్ప - నిటలసంభవమణు ల్నిబిడశార్దూల
నఖములు భేరుండనఖములు సింహ - నఖములు కృష్ణాజినంబులు మిగుల
నాణెంపుగోరోచనంబు కస్తూరి - వీణెలు తేనియ ల్వివిధంబులైన
ఫలములకావళ్లు, భయభక్తు లాత్మ - మొలవఁ గానుకలుగా ముందటఁ బెట్టి,
పొడగాంచి యానందమున రాఘవునకుఁ - దడయక సాష్టాంగదండంబు వెట్టి,
నిటలాగ్రహస్తుఁడై నిలుచున్న గుహుని - జటిలత్వ మీక్షించి జనలోకవిభుఁడు,8630
తనకృపాజలధి నాతని నోలలార్చి - చనువిచ్చి, యమృతభాషల నిట్టులనియె.
"సురుచిరతేజ! చెంచులరాజ! నీదు - పిరిగొన్నభ క్తియుఁ బెంపును దెంపు
సొంపార నీవాయుసుతునిచే వింటి - నింపుగా మాలోన నీవు నొక్కఁడవు
గాన నాజడలు వల్కలములు విడిచి - పూనుము మాయట్ల భూపచిహ్నములు"
అని యానతిచ్చిన నరిగి వల్కలము - లును జటాపటలంబులును వేగ విడిచి,

సుమహితోదకముల సుస్నాతుఁ డగుచు - విమలాంగుఁడై రామవిభునిసన్నిధికి
వచ్చినఁ జూచి దివ్యము లైనయట్టి - మెచ్చులసొమ్ములు మేలివస్త్రములు
నెట్టన నొసఁగిన నెరయఁ గైసేసి - దట్టంపుభక్తి భూధవుఁ గొల్చియుండె;
నంత శత్రుఘ్నునియాజ్ఞ సుమంతుఁ - డెంతయు రయమున హితసమాహితుఁడు
బహురత్ననిర్మలప్రభ నొప్పు మిగుల - మహితార్కబింబసమంచితరథముఁ8640
గొనివచ్చి యట రఘుకులభర్త కెదుట - నునిచిన శ్రీరాముఁ డున్నతాత్మకుఁడు

శ్రీరాము లయోధ్యఁ జేరుట

తల్లుల చరణపద్మములకు మ్రొక్కి - యెల్లవారును నెలుఁగెత్తి దీవింప
ననఘుండు సుముహూర్త మగుట భావించి - మునివసిష్ఠుఁడు దనముందట నెక్కి
బృథుకీర్తు లింపెక్క పృథివి పెంపెక్క - రథ మెక్కి జనమనోరథ మెక్కుకరణి
నిరుపమకరభక్తినిరతుఁడై చేరి - భరతుండు ధవళాతపత్రంబుఁ బట్ట
నాసుమిత్రాపుత్రు లర్థి నిద్దఱును - నాసన్నులై పట్ట నాలవట్టములు
ఆరూఢపంచమహావాద్యరవము - తోరాసి దేవదుందుభు లోలి మ్రోయ
వినువీథి సురపుష్పవృష్టులు గురియ - జనులెల్ల జయజయ శబ్దంబు లొసఁగ
నతులరథారూఢుఁడై మహోదార - గతు లొప్ప వెనుక రాక్షసభర్త నడువఁ
బరువడిఁ జతురంగబలములు నడువ - వరుసతో నిజబంధువర్గంబు నడువఁ8650
గెలకులఁ గదిసి సుగ్రీవాదికపులు - బలువారణము లెక్కి పదిలులై నడువ
ఘనసేతుబంధాది కథ లుగ్గడించి - పెనుపొంద వరవందిబృందము ల్నడువ
జననులు తారాదిసతులు జానకియు - ఘనరథంబులమీఁదఁ గర మొప్పి రాఁగ
నడచె నయోధ్య కానందకందళితు - లెడనెడ దీవింప హితపురోహితులు
కరిబృంహితంబు లుత్కటరథధ్వనులు - తురగహేషితములు తోరంబులై న
భేరీరవంబులు పృథులఖడ్గాగ్ర - ధారాభిఘట్టనధ్వనులుఁ బెల్లెసఁగ
నక్షీణకల్యాణుఁ డగురామవిభుఁడు - నక్షత్రపరివృతనవచంద్రుభాతి
తియ్యంబు దీపింపఁ దేజంబు మెఱసి - యయ్యయోధ్యాపురం బర్థితోఁ జొచ్చె;
నప్పుడు సంతోష మంతరంగముల - నుప్పొంగ బహుమంగళోన్నతు ల్మెఱయఁ
బల్లవహస్తలు వల్లవాధరులు - పల్లవారుణపాదపల్లవోజ్జ్వలులు8660
హరిమధ్యసమమధ్య లమృతాంశుముఖులు - కరిరాజగమనలు కమలలోచనలు
అలినీలకుంతల లంబుజగంధు - లెలదీఁగబోఁడు లింపెక్క నందంద
కైసేసి చనుదెంచి కామినీమణులు - ప్రాసాదగోపురప్రతతులం దుండి
పుణ్యావలోకనంబులఁ బుణ్యసతులు - పుణ్యపుష్పాక్షతంబులు చల్లుచుండ
మేడలపై నుండి మీనాక్షు లోలిఁ - బ్రోడలై తమతమబోఁటులతోడ
"నీసునఁ బిన్ననాఁ డీపుణ్యధనుఁడు - చేసినచేఁతలు చెప్పనచ్చెరువు

తను నెదిర్చిన మాత్రఁ దాటక చంపె - ననఘుఁడై కౌశికుయాగంబు గాచె;
సర్పకంకణుమహాచాపంబు విఱిచె; - దర్పించె జమదగ్నితనయు భంగించె;
నహితలోకాంతకుం డంతటిపనులు -లసహజశూరుఁడు గానఁ జనఁజేసెఁగాక;
అముద్దుప్రాయంబునందుఁ గానలకుఁ - బొమ్మన్నఁ దపసియై పోయె వేడుకను,8670
పోయి జగద్ధితపుణ్యకృత్యములు - సేయ నెవ్వఁడు చాలుఁ జేవ దీపింప?
వనధి బంధించి రావణుఁ బోరఁ ద్రుంచి - దనుజులఁ బెక్కండ్ర ధరణిపైఁ గూల్చెఁ;
దనతండ్రిపనుపునఁ దవిలి కానలకు - మునివృత్తిఁ జనునాఁటి ముద్దుప్రాయంబు
లీపెద్దచందంబు లెన్నిచందములఁ - దీపించుచున్నవి తెలియఁజూచితిరె?
పర్జన్యు నవలీల భంజించి మరలఁ - దర్జించి భుజశక్తి దర్పించినట్టి
యామేఘనాదు నుగ్రాజిలోఁ జంపె - సౌమిత్రిఁ గంటిరే చపలాక్షులార!
పడఁతి! రావణుఁ డతిపాపాత్ముఁ డైన - విడిచి లంకాపురీవిభుఁ డయ్యె నితఁడు
వనజాక్షి! యీతఁడు వాలిసోదరుఁడు - వనిత! యీపుణ్యుండు వాలినందనుఁడు
తడయక యంబుధి దాటి యాసీతఁ - బొడఁగాంచి వచ్చిన పుణ్యాత్ముఁ డితఁడు;
కలకంఠి! యవలీలఁ గడలి బంధించి - నలి లంకపై రాము నడపించె నితఁడు;8680
నీరేరుహానన! నిఖిలౌషధముల - బోర లక్ష్మణుప్రాణములు దెచ్చె నితఁడు"
అని తన్నుఁ దమ్ముల నసురను గపుల - గొనియాడుచును జెప్పికొనుచుండ వచ్చి
నగరు ప్రవేశించె నలినాప్తకులుఁడు - జగదేకనిధి రామచంద్రుఁడు తాను
భరతశత్రుఘ్నులఁ బనిచి దైత్యేంద్ర - తరుచరపతులను దగుమందిరముల
నిడియించి యిష్టాన్నవివిధభోజ్యములు - కడఁకతోఁ బుత్తెంచెఁ గారుణ్యమొప్ప,
సురుచిరమతి నంత సుగ్రీవుతోడఁ - బరమసమ్మదమున భరతుఁ డిట్లనియె.
"నెల్లి రే పభిషేక మినవంశనిధికి - నెల్లతెఱంగు లాయితము చేసితిమి;
సంగతిఁ జతురబ్ధిజలములు వలయు - గంగాదితీర్ధోదకములు దేవలయుఁ;
దెప్పింపు” మనవుడు దిననాథతనయుఁ - డప్పుడు పరమహర్షానందుఁ డగుచు
వలనొప్ప గజు జాంబవంతు సుషేణు - నలఘువిక్రమవేగుఁ డగు వేగదర్శిఁ8690
గమనీయనవరత్నకలశంబు లిచ్చి - క్రమమున దీర్థోదకములు తేఁబనిచె;
నలు గవాక్షుని వాయునందను ఋషభుఁ - గలయ సముద్రోదకములకుఁ బంచె;
బనిచినఁ గడిమిమైఁ బ్లవగవల్లభులు - వినువీథి నత్యంతవేగులై పోయి

శ్రీరాములపట్టాభిషేకము

యురవడి మరునాఁటియుదయకాలమున - కరు దరుదనఁ దెచ్చి రఖిలోదకములు
చేతోవినిర్మలశిష్టు వసిష్ఠు - గౌతమజాబాలికశ్యపకణ్వ
వామదేవాదులౌ వరమునీశ్వరుల - సామాదిబహువేదచతురబోధకుల
భరతుండు రప్పించి భయభక్తు లొప్పఁ - బరమసమ్మదవచోభంగుల మెఱసి

"శ్రీరామునకు నభిషేకంబు సేయుఁ - డారూఢనియతితో" నని పల్క వారు
పూని మంగళతూర్యములు మ్రోయుచుండ - జానకీరాములఁ జదురొప్పఁ దెచ్చి
రమణీయతరమైన రత్నపీఠమునఁ - గొమరొప్ప నిరువురఁ గూర్చుండఁ బనిచి8700
మానితవేదోక్తమంత్రపూర్వకము - గా నభిషేకంబుఁ గరమర్థిఁ జేయ
నారామునొదల నాపూర్ణవారి - ధార దగ్గరునప్డు దగఁ జూడనొప్పె;
గీర్వాణముఖ్యులు కీర్తన ల్సేయఁ - బార్వతీసహితుఁడై ప్రణుతింప నొప్పు
నంగజహరుమౌళి నమలమై తొరుఁగు - గంగానదియుఁ బోలెఁ గమనీయ మగుచు.
నాతీర్థజలధార లంఘ్రుల కొలికి - భూతలంబున నిండి పొలుపారెఁ జూడ,
హరిపాదమునఁ బుట్టి యయ్యాదిగంగ - ధరపైనఁ బరఁగువిధం బచ్చుపడగఁ
బరికించి రామభూపాలకుం డపుడు - హరుఁడు విష్ణుఁడు దాన యనుమాడ్కి నుండె;
మఱి పట్టభద్రుఁడై మనుజవల్లభుఁడు - నెఱసెఁ బట్టముతోడి నిటలంబుతోడ;
సరసజటారుణచ్ఛాయల మాని - కరమొప్ప శశిరేఖ గంగవీచికల
సరిదాఁటి నుదిటికి జారిననొప్పు - హరునిచందంబున నలరెఁ జూపఱకు8710
గరుడవియచ్చరగంధర్వపతులు - సురసిద్ధసాధ్యులు సౌరిదిమై నపుడు
చదల నుత్సవపటుజయజయధ్వనులఁ - గుదియక యందంద ఘోషించి రెలమి
నప్పు డచ్చర లోలి నాడిరి ప్రీతి - నప్పుడు పుత్తెంచె నమరవల్లభుఁడు
పారిజాతామలప్రసవమాలికయు - హారంబుఁ బ్రియమున ననిలునిచేత
నమితమంగళమూర్తి యయినరాఘవుఁడు - గొమరొప్ప వానిఁ గైకొనియె వీక్షించి;
వసుధ యెంతయు సస్యవతి యయ్యెఁ బ్రీతిఁ - గుసుమఫలంబులు గొమరొప్పెఁ దరుల
ఘనగంధబంధము ల్గలిగెఁ బుష్పముల - వినుతింప దిక్కులు విమలంబు లయ్యె;
నప్పుడ రఘురాముఁ డక్షీణవిభవ - మొప్ప భూసురులకు నున్నతాత్ములకు
ననుపమతరభక్తి యంతరంగమునఁ - గొనకొన ముప్పదికోటులధనము
లక్షగుఱ్ఱంబుల లక్షయుష్ట్రముల - లక్షగోవుల నిచ్చె లలి సొంపుమీర8720
లలితదివ్యాంబరాలంకారతతులు - పొలుపొందు కాంచనపుష్పమాలికయుఁ
గొలఁది మీఱిన ప్రియోక్తులఁ జేరఁ బిల్చి - యెలమి సుగ్రీవున కిచ్చెఁ బెంపొంద;
ఘనవజ్రవైడూర్యకలితాంగదంబు - ననఘుఁ డంగదునకు నర్థితో నిచ్చె;
మహితోరుకేయూరమకుటంబు గొప్ప - సహజపుణ్యుఁడు విభీషణునకు నిచ్చె;
నమితబలోదాత్తుఁ డగువాయుజునకుఁ - గమనీయరత్నకంకణయుగం బిచ్చె;
నాలోలరుచినిచయామాన మైన - నీలహారము ప్రీతి నీలున కిచ్చె;
వలనొప్ప నవరత్నవరహార మొకటి - నలునకు నిచ్చె నానంద ముప్పొంగ;
నంబరమణిభూషణాదివస్తువులు - జాంబవంతున కిచ్చె సమ్మదం బొదవ;
నభిమతవేదియై యందఱఁ జూచి - విభుఁడు వానరులకు వీరు వా రనక

ప్రకటదివ్యాంబరాభరణమాల్యంబు - లకలంకమహిమతో నందఱ కిచ్చె;8730
శారదనిర్మలచంద్రికానూన - హారంబు సీతకు నర్థితో నిచ్చె;
ధరణిజ హారంబుఁ దాను గైకొనుచుఁ - గరముల ధరియించి కాకుత్స్థుమోము
చూచెఁ జూచుటయును సుదతిచూ పెఱిఁగి - యాచతురాత్మకుఁ డనుమతించుటయుఁ
దనకృపారసధారఁ దనరు నాహార - మనిలజుకంఠంబునం దొప్పఁ బెట్టె;
నానిర్మలోదారహారంబుఁ బూని - యానిర్మలాత్మకుఁ డనిలనందనుఁడు
శారదాబ్రావలి సరిఁ జుట్టియున్న - మేరువు తెఱఁగున మెఱసెఁ జూడ్కులకు;
నంత వసిష్ఠునియనుమతి రాముఁ - డంతఃపురంబున కరిగి తల్లులకు
వరుసతో మ్రొక్క దీవన లిచ్చి రపుడు - ధరణీతనూజ యత్తల కెల్ల భక్తి
చెలఁగంగ మ్రొక్కిన శ్రీదేవిఠేవ - నల సరస్వతిభాతి నగజాతరీతిఁ
బతిభక్తిమతియు సౌభాగ్యంబు కాంతి - యతులకీర్తియును బెంపలరంగఁ గలిగి8740
యినచంద్రు లనఁ గాంతి నెనయుపుత్రులను - గనుము నీ వని ప్రేమఁ గౌఁగిటఁ జేర్చి
దీవింప రఘుకులాధిపుఁడు వేడుకలు - గావించు భోజనాగారంబునకును
జనుదెంచుహితులను సకలబాంధవుల - ననుజుల రవిజాదు లైనవానరుల
విభీషణముఖ్యు లగుదైత్యవరులఁ - బావనాత్మకు గుహుఁ బరఁగ రావించి,
యుచితాసనమునఁ గూర్చుండంగఁ బనిచి - సుచరిత్రు నంజనాసూనునిఁ “దనదు
పొత్తుల వేడుక భుజియింపు” మనియె - నత్తఱిఁ జాలనెయ్యము దియ్య మమర
నెనయంగ నవ్వేళ నెలఁతలు దెచ్చి - కనకపళ్లెరములఁ గ్రమమొప్ప నునిచి
పరఁగఁ బాయసము సూపములుఁ బూపములు- వరుగులు వడియము ల్వాంఛఁ బుట్టించు
కూరలు పచ్చళ్లు కోరొందుశిఖర - లూరుగాయలును శాల్యోదనం బాత్మఁ
దనరఁగ సద్యోఘృతము వింతరుచులఁ - బెనుపొందుఫలములు పేర్మితో నిడఁగ8750
నినకులాధీశ్వరుం డింపురెట్టింప - "ననిలజ భుజియింపు" మనుచుఁ దా నొక్క
కబళంబుఁ గొనిన నాకపికులోత్తముఁడు - ప్రబలమౌ భక్తి నప్పళ్లెరం బెత్తి
తలమీఁద నిడుకొని తనర నాడుచును - "జెలఁగుచు నోకపిశేఖరులార!
రండు రామునిపళ్లెరము ప్రసాదంబు - దండిగా దొరకె నందఱకు నేఁ" డనుచు
మునివృక్ష మెక్కి యిమ్ముల దానిదళము - లనువొందగాఁ ద్రుంచి యాప్రసాదమును
నొనరించి సంతోష ముల్లంబు నిండ - ఘనభక్తి నొసఁగె నాకపినాయకులకు
వారును దానును వాంఛలు దీర - నారూఢిఁ దృప్తులై రాప్రసాదమున
ననిశంబు నదిమొద ల్హరివాసరముల - మునివృక్షపర్ణము ల్ముఖ్యంబు లయ్యె;
నంత నారఘురాముఁ డంజనాసుతుని - సంతతభక్తికి సంతోషమంది
వెరపైన వేరొకపళ్లెరంబునను - ధరణీశ్వరుండును దగ భుజియించి8760
జలముల నొగి నార్చి జతనంబు మీఱ - లలితసుగంధమాల్యము లొప్ప ముడిచి

కర్పూరతాంబూల గంధాక్షతములు - నర్పింప దయమీఱ నందఱఁ జూచి
యినకులోత్తముఁ డిచ్చె నెల్లవస్తువులు - మనమార నప్పుడు మహిమ దీపింప,
సకలభృత్యామాత్యసహితుఁడై వేడ్క - నకలంకచిత్తుఁడై యటఁ గొలువుండె.
నప్పుడు సౌమిత్రి ననురక్తితోడ - నొప్ప నిద్రాదేవి యొగిఁ బొందుటయును
గొలువులోపలను గాకుత్స్థునియెదుటఁ - గలకల నవ్వినఁ గమలాప్తకులుఁడు
జనకజయును విభీషణుఁడు సుగ్రీవుఁ - డును మారుతాత్మజుఁడును వాలిసుతుఁడు
నల నీల శరభ సన్నాథ తారాది - బలిముఖు ల్శత్రుఘ్నభరతులు భీతిఁ
దలలు వాంచిరి; యఫ్డు తమయందుఁ జెంది - లలి మీఱినట్టి కళంకము ల్దలఁచి
యందఱు నట్లుండ నలుక చిత్తమునఁ - జెంద లక్ష్మణుఁ జూచి శ్రీరాముఁ డనియె:8770
“దగవు వోవిడిచి యాస్థానంబునందు - నగు టేమి? నిష్కారణముగ సౌమిత్రి?"
అనవుడు భయమంది యాలక్ష్మణుండు - తనకరంబులు మోడ్చి తగ నిట్టులనియె.
“వనవాసమునకు దేవరఁ గొల్చి వచ్చి - వనముల నున్నచో వచ్చెఁ జూ నిదుర;
వచ్చినఁ బదునాల్గువత్సరంబులకు - నచ్చుగాఁ జేరకు" మన నిద్ర చనియెఁ.
బదునాలుగేండ్లును బరఁగ నిండుటయు - వదలక యిప్పుడు వచ్చెఁగా నిద్ర.
యది కారణంబుగా నవనీశతిలక! - యిది యేను నవ్వితి; నిదియె నాతప్పు;
నీవు సహింపు మో నిఖిలాధినాథ! - దేవదేవేశ! యో దీనమందార!"
యనవుడు సంతోష మంది రందఱును - ననుమానములు వాసి యలరి రెంతయును
నిర్మలకారుణ్యనిధి రాముఁ డంత - నర్మిలి నిండార నందఱఁ జూచి
“యెల్ల తెఱంగుల నెట్టికార్యముల - నెల్లధర్మంబుల నేమఱ కెపుడు8780
గొనకొని చేయుఁడీ కోర్కి దీపింప - ననువొంద” ననుచు నత్యాదరం బొప్పఁ
బొం డని కడఁకతో బుద్ధులు గఱపి - యొండొండ ప్రియముల నూఱడఁ బలికి
యనిలజసుగ్రీవు లాదిగాఁ గపుల - దనుజపుంగవుల నత్తఱి నీడుకొలుప
కిష్కింధ కెలమి సుగ్రీవాదికపులు - నిష్కళంకాత్ములై నెమ్మితోఁ జనిరి.
చనియె లంకకు విభీషణుఁ డర్థిఁ దన్ను - దనుజులు గొలువ నుత్సవకేళిఁ దేలి
రాముఁడు మఱి యౌవరాజ్యంబునందు - సౌమిత్రిభరతులఁ జతురమానసులఁ
దగఁ బ్రతిష్ఠించి యాతతరాజ్యభూతిఁ - దగిలి సుఖించుచుఁ దాను సీతయును
సకలభోగంబుల సౌఖ్యంబు నొంది - యకలంకచిత్తుఁడై యనవరతంబు
వేదోచితాచారవిమలమార్గమున - నాదిరాజన్యుల నందఱఁ గడచి
పూజితానుష్ఠానములు నశ్వమేధ - వాజపేయాదికవరయాగతతులు8790
సొలవక చేయుచు సురల భూసురుల - నెలమి రక్షించుచు నేపు దీపింప
నిండార ధర్మైకనిష్ఠతోఁ బదునొ - కొండువేలేండ్లు దా నుర్విఁ బాలించెఁ;
బాలించి యేలుచోఁ బ్రజలు దుఃఖములఁ - దూలరు దురితము ల్దుర్భిక్షతతులు

కలుగ వెయ్యెడలను గాలదోషములఁ - జలియింప వెన్నఁడు సత్యధర్మములు;
పరహితాచారతాత్పర్యంబులెల్ల - పురుషులయందును బొలుపారుచుండు"
నని యాంధ్రభాష భాషాధీశవిభుఁడు - వినుతకావ్యాగమవిమలమానసుఁడు
పాలితాచారుం డపారధీశరధి - భూలోకనిధి కోనబుద్ధభూవిభుఁడు
తమతండ్రివిఠ్ఠలధరణీశుపేరఁ - గమనీయగుణధైర్యకనకాద్రిపేరఁ
బని పూని యరిగండభైరవుపేర - ఘనుపేర మీసరగండనిపేర
నాచంద్రతారార్కమై యొప్పు మిగుల - భూచక్రమున నతిపూజ్యమై వెలయ8800
నసమానలలితశబ్దార్ధసంగతుల - రసికమై చెలువొందు రామాయణంబు
పరఁగ నలంకారభావన ల్నిండఁ - గరమర్ధి నీయుద్ధకాండంబు చెప్పె.
నారూఢి నార్షేయమై యాదికావ్య - మై రసికానంద మై యెల్లనాఁడు
నివ్వసుమతి నొప్ప నిప్పుణ్యచరిత - మెవ్వరు చదివిన నెవ్వరు వినిన
సామాదిబహువేదచయసారరామ - నామచింతామణి నవ్యభోగములు
పరహితాచారము ల్ప్రభువిచారములు - పరిపూర్ణశక్తులు ప్రకటరాజ్యములు
నిర్మలకీర్తులు నిత్యసౌఖ్యములు - ధర్మైకనిష్ఠలు దానాభిరతులు
నాయురారోగ్యంబు లైశ్వర్యములు - బాయక పాటించుఁ బాపక్షయంబు
వరపుత్రలబ్ధియు వైరినాశనము - సరినొప్పు ధనధాన్యచయసమృద్ధియును
నేవిఘ్నములు లేక యిండ్లలో నధిక - లావణ్యవతులైన లలనలపొందు8810
కొడుకులతో నెప్డుఁ గూడియుండుటయు - నెడగాఁగ నాపద లెల్లఁ బాయుటయు
సమ్మదంబున బంధుజనులకూటమియు - నిమ్ములఁ గామ్యంబు లెడపకుండుటయు
సతతంబు దేవతాసంతర్పణంబు - పితృగణతృప్తియుఁ బెంపారుచుండు
వ్రాసినవారికి వరశుభోన్నతులు - వాసవలోకాదివాసులఁ జేయు
నిది మోక్షసాధనం; బిది పాపహరము; - నిది దివ్య; మిది భవ్య; మిది శ్రీకరంబు;
ఎందాఁకఁ గులగిరు లెందాఁక జలధు - లెందాఁక రవిచంద్రు లెందాఁకఁ దార
లెందాఁక భువనంబు లెందాఁక దిశలు - నెందాఁక వేదంబు లేపు దీపించు
నందాఁక నీకథ యక్షరానంద - సందోహదోహళాచారమై పరఁగు.8818

శ్రీ రంగనాథరామాయణము యుద్ధకాండము

సమాప్తము