రంగనాథరామాయణము/బాలకాండము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీ రంగనాథ రామాయణము

ద్విపదకావ్యము - బాలకాండము



దేవతాస్తుత్యాదికము

శ్లో.

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్,
ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనమ్.
రామాయ రామభద్రాయ రామచన్ద్రాయ వేధసే,
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః.


శ్రీకామినీనాథు జితదైత్యనాథు - లోకరక్షణకృత్యు లోకైకనిత్యు
నిత్యసదానందు నిర్వాణకృత్యుఁ - గృత్యవిదూరు నకృత్రిమాధారు
నాధారకమలమధ్యామోదభేద - సాధనక్రమసమాచరణషట్చరణు
సింధురవరదు నాశ్రితలోకబంధు - బంధమోచను బలిబంధనోదగ్రు
నారూఢపంచదశాక్షరప్రసవ - పారిజాతాకారుఁ బ్రణవానుకారు
నగ్రామ్యగోపికాభ్యంతరవ్యగ్రు - నగ్రసదాకారు నాకారరహితు
యోగిమానసలసదోంకారదీప్తు - యోగసందర్శితాభ్యుదయప్రచారు
శ్రుతిశిరోభాగవిశుద్దచైతన్యు - నతిలోకు సర్వలోకాశ్రయశ్లోకు
నఖిలాండమౌక్తికాయతనిత్యసూత్రు - నఖిలతత్త్వాతీతు నాద్యంతరహితు
నమలాత్ము నక్షరు నామ్నాయకమల - కమలాప్తు నక్షీణకల్యాణసదను10
శంకావినిర్తుక్తసద్భక్తవర్య - కైంకర్యవత్సలుఁ గారుణ్యసింధు
బోధకుండై వచ్చి బోధ్యమై తోఁచి - బోధమై వీక్షించు పూర్ణస్వరూపు
నాదితత్త్వము తత్త్వ మస్యాదివాక్య - భేదాతిదూరు, నభేదప్రతాపుఁ
గడుకొని నియతులై కర్మబంధములు - గడచి యేకతమునఁ గదలక నిలిచి
యరుదుగా నింద్రియవ్యాప్తుల మఱచి - విరచితాసనబద్ధవిన్యాసిలీలఁ



బరిచితాసనమునఁ బదిలమై నిలిచి - సరవితో మదిలోన సరసత నిల్పి
వెలయ డెబ్బదిరెండు వేలనాడులను - గలయ వివేకించి, కసటు వోఁ దుడిచి
యొకరెండుత్రోవల నొకటిగా మెలఁగి - యకలంకమతితోడ నతిసూక్ష్మముగను
నవయవంబులయందు నానందమైన, పవను నిరోధించి, పశ్చిమవీథిఁ
జొనిపి, కోణత్రయశుద్ధి గావించి - మనసుతోడనె కూడ మఱపించి తెచ్చి20
కుండలినిజశక్తిఁ గూర్చి, సంప్రీతి - నొండొండఁ గమలంబు లొగి నాఱు గడచి
యటఁ జంద్రమండలం బల్లనఁ జేర్చి - యటఁ బరమవ్యోమమై తన్ను మఱచు
పరమయోగీంద్రులభావమ్ము కీలు - పరికింపఁ దానైన బ్రహ్మస్వరూప
మొగి రెంటఁ బెరయక మూఁట నేర్పడక - తగిలి నాల్గవత్రోవ తత్త్వమై యుండి
యైదింటి కాదియై, యాఱిటిఁ గడచి - యాదికి నాదియై యమరినదేవుఁ
దనుతరనిర్మలాంతర్నాడియూప - మనురూప మగుమనం బాబద్ధపశువు
నిష్టాభిరతివేది, నిఖిలేంద్రియములు - కాష్ఠము, ల్బోధ మఖండపావకుఁడు
యోగామృతము ఘృత, ముజ్జ్వలానంద - యోగంబు ఫలముగా, నొగి జెల్లుచున్న
యభిమతాంతర్యనిత్యామోదకర్త - విభవంబు కడపట విలసిల్లు పరముఁ
బరమేశు నవ్యయుఁ బరమకల్యాణుఁ - బరమాత్ము నపరోక్షుఁ బ్రక్షీణకర్ము30
మాదేవుఁ గమలాక్షు మమ్మేలుదేవు - నాదినారాయణు నఖిలలోకేశు
భావించి కీర్తించి, ప్రార్థించి మ్రొక్కి - సేవించి, యభిమతసిద్దిఁ గావింప
హారకర్పూరనీహారగోక్షీర - తారకాకృతి శారదాదేవిఁ గొలిచి,
చారురామాయణచంద్రాబ్ధి యగుచు - వారక విలసిల్లు వాల్మీకి దలఁచి,
భారతమంజరీపారిజాతంబు - సారమానసుఁ బరాశరసూనుఁ దలఁచి,
యతనితనూభవు నాశుకబ్రహ్మ - నతిభక్తియుక్తిమై నభినుతి చేసి,
కథఁ జెప్పిన నెల్లసజ్జనులు - సేకొని కీర్తులు చేయుచు నుందు;
రేకథఁ జెప్పిన నిహపరోన్నతులు - ప్రాకటంబుగఁ జేర్చి ఫలియించుఁ బ్రీతి;
నేకథఁ జెప్పిన నీప్సితార్థములు - గైకొని పుణ్యముల్ గడఁగి కాన్పించు,
ననువిచారములు నాయంతరంగమునఁ - గొనకొని కృతి సేయఁ గోరుచున్నంత;40

గ్రంథరచనకుఁ గారణము

శ్రీరమణీయులై సృష్టిసత్తములు - గోరి వర్ణన సేయఁ గోనవంశమున
ఫలితసదాచారభానుఁ డై తోఁచి - కలికాలదోషాంధకారంబు ద్రోలి,
గురుధర్మపథముల కొలఁదులు దెలిసి - పరనృపనక్షత్రపంక్తుల నణఁచి,
నిత్యపుణ్యోదయనియతిఁ బెంపొందు - నత్యున్నతప్రతాపాభిరామునకుఁ
గరదీప్తినిజఖడ్గగంగాప్రవాహ - పరధరణీపాలఫాలాక్షరములఁ



గలపూర్వగర్వపంకము లొప్పఁగడుగు - నలవు మై నసమానుఁడగు సత్యనిధికి
శరణార్థి రాజన్యషట్పదాధార - కరపద్మునకుఁ గోనకాటభూపతికి,
నయనయోదయదయాయతనిత్యమతికిఁ - బ్రియతనూజన్ముఁడై పృథివిఁ బెంపొందు
రుద్రప్రతాపుండు రుద్రనిర్మలుఁడు - రుద్రాత్ము డగు కోనరుద్రనరేంద్రు
పౌత్త్రుఁ డభంగుఁ డప్రతిమవిక్రముఁడు - గోత్రధీరుఁడు కులగోత్రవర్దనుఁడు50
దివిజేంద్రవిభవుండు ధీరవర్తనుఁడు - భువనవిఖ్యాతుండు బుద్ధభూపాలు
తనుజన్ముఁ డక్షీణదాక్షిణ్యధనుఁడు - ధనధాన్యధనదుండు ధర్మధర్మజుఁడు
అతిపుణ్యసౌజన్యుఁ డరిభీమజన్యుఁ - డతిశౌర్యశరజన్ముఁ డాజన్మశుభుఁడు
కామినీకాముఁ డఖండవిక్రముఁడు - రామత్రయోదారరణవిశారదుఁడు
చందనమందారచంద్రికాహార - కందళత్కుందేందుఘనకీర్తిధనుఁడు
పరఁగు కోనాన్వయపారిజాతమునఁ - బరిపక్వఫలరీతిఁ బరగినవాఁడు
పొలుచు కోనాన్వయపూర్వాద్రియందు - వెలుఁగుభానుఁడు వోలె విలసిల్లువాఁడు
దొరిసి కోనాన్వయదుగ్ధాంబురాశి - బరిపూర్ణచంద్రుఁడై భాసిల్లువాఁడు
నిక్కి యంతంతకు నిర్మలం బగుచు - దిక్కులఁ దనపేర్మి దీపించువాఁడు
దానధర్మక్రియాతాత్పర్యకెళి - దానయై వినుతులఁ దనరారువాఁడు60
మగఁటిమి నసమానమహిమ దీపింపఁ - బగతుఱ నవలీల భంజించువాఁడు
బలితోగ్రరాజన్యబలవజ్రపాణి - లలి నొప్ప వాసపు లలిఁ బోలువాఁడు
ప్రత్యక్షనృపవనపావకోజ్వలుఁడు - సత్యంబుచేతను సరిదగువాఁడు
బలవదుగ్రారాతి బలసముద్రములఁ - గలఁచుచో మంథాద్రిగతిఁ బేర్చువాఁడు
విమలోగ్రరాజన్యవిపులాంధకార - కమలాప్తబింబఖడ్గప్రభావిభవ
విలసితామరవధూవిమలాస్యకమల - ముల వీరమధుకరంబులఁ గూర్చువాఁడు
అరినృపప్రాణానిలాహారభుజగ - వరభుజాస్థాపితావని గలవాఁడు
కురుకేరళావంతికుంతలద్రవిళ - మరుమత్స్యకకరూశమగధపుళింద
సరసపాండ్యకోసలబర్బరముల - నరనాథసభల వర్ణన కెక్కువాఁడు
ఆతతసామభేదాదుల నొప్ప - నీతిక్రమంబుల నెరసినవాఁడు 70
రమణమై నాదిమరాజన్యరీతి - నమితవైభవముల నమరినవాఁడు
వినయనయోపాయవిజయసుస్థిరుఁడు - ఘనకీర్తి విఠ్ఠథలక్ష్మాపాలవరుఁడు
రాజసర్వజ్ఞుండు రాజసింహుండు - రాజశిరోమణి రాజపూజితుఁడు
సకలజగద్ధితచాతుర్యధుర్యుఁ - డొకనాఁడు కొలువున నున్నతుం డగుచు,
బహుపురాణజ్ఞులు బహుశాస్త్రవిదులు - బహుకావ్యనాటకప్రౌఢమానసులు,
హితులు మంత్రులు పురోహితులు నాశ్రితులు - సుతులు రాజులు బహుశ్రుతులును గొల్వ,
దీపించి భూలోకదేవేంద్రుపగిది - నేపారియున్నచో నింపు సొంపొంద



రసికులు భారతరామాయణాది - రసగోష్ఠిఁ జెల్లింప రసికశేఖరుఁడు,
రామకథాసుధారసరక్తుఁ డగుచు - నామహాసభలోన నందఱఁ జూచి,
"రమణమైఁ దెనుఁగున రామాయణంబు - క్రమ మొప్పఁ జెప్పెడి ఘనకావ్యశక్తి80
గలకవు లెవ్వారు గల రుర్వి?"ననుచుఁ - దలపోయ విర్థలధరణిపాలునకు
నున్నతమూర్తికి నురుయశోనిధికి - విన్నవించిరి వేడ్క విబుధులు గడఁగి
“నీతనూజన్ముండు నిపుణమానసుఁడు - ధూతకల్మషుఁడు బంధురనీతియుతుఁడు
సర్వజ్ఞుఁ డనఘుండు చతురవర్తనుఁడు - సర్వపురాణవిచారతత్పరుఁడు
కమనీయబహుకళాగమవిచక్షణుఁడు - సుమనీషిపోషణోత్సుకసుఖోన్నతుఁడు
కనిసార్వభౌముండు కవికల్పతరువు - కవిలోకభోజుండు కవిపురందరుఁడు
ప్రత్యర్థిరాజన్యబలవజ్రపాణి - ప్రత్యర్థినృపదావపావకోజ్జ్వలుఁడు
భీకరనిజఖడ్లబింబితస్వర్గ - లోకానురక్తత్రిలోకదుర్దముఁడు
వరసాధుజలజాతవనజాతహితుఁడు - పురుషచింతామణి బుద్ధభూవిభుఁడు
నీ కతిభక్తుండు నిఖిలశబ్దార్థ, పాకజ్ఞుఁ డత్యంతపాండిత్యధనుఁడు90
మఱియు రామాయణమర్మధర్మజుఁ - డెఱుఁగు నాతని బిల్వు మీకథఁ జెప్ప,"
ననిన మజ్జనకుఁ డుదాత్తవర్తనుఁడు - నను నర్థిఁ బిలిపించి, నను గారవించి,
"భూమిఁ గవీంద్రులు బుధులును మెచ్చ - రామాయణంబు పురాణమార్గంబు
తప్పక నాపేరఁ దగ నంధ్రభాష - జెప్పి ప్రఖ్యాతంబు సేయింపు ముర్వి"
నని యానతిచ్చిన నమ్మృదూక్తులకు - ననయంబు హర్షించి, యట్ల కావింపఁ
బని పూని, యరిగండభైరవుపేర - ఘనుపేర మీసరగండాంకుపేర
లలితసద్గుణగణాలంకారుపేర - నలఘునిశ్చలదయాయతబుద్ధిపేర
నాతతకృతిపేర నతిపుణ్యుపేర - మాతండ్రి విఠ్ఠలక్ష్మానాథుపేర
రాజులు బుధులును రసికులు సుకవి - రాజులు గోష్ఠిని రాగిల్లి పొగడ
బదము లర్ధంబులు భావము ల్గతులు - పదశయ్య లర్థసౌభాగ్యము ల్యతులు100
రసముల కల్పన ల్ప్రాససంగతులు - నసమానరీతులు నన్నియుఁ గలుగ
నాదికవీశ్వరుఁ డైన వాల్మీకి - యాదరంబునఁ బుణ్యు లందఱు మెచ్చఁ
జెప్పిన తెఱఁగున శ్రీరామచరిత - మొప్పఁ జెప్పెదఁ; గథాభ్యుదయ మెట్లనిన:——

—————



కథాప్రారంభము

ఘనతపస్స్వాధ్యాయకమనీయశీలు - మునినాథు నారదు మునిలోకవంద్యు
ననఘతపోనిధి యైన వాల్మీకిఁ - గనుఁగొని యొకనాఁడు కర మర్థి నడిగె,
“ఎవ్వఁడు శ్రీమంతుఁ? డెవ్వఁడు శాంతుఁ? - డెవ్వఁడు ఘనపుణ్యుఁ? డెవ్వఁ డున్నతుఁడు? .
ఎవ్వఁడు నీతిజ్ఞుఁ? డెవ్వఁడు ప్రాజ్ఞుఁ? - డెవ్వఁడు దుర్దముం? డెవ్వఁ డుత్తముఁడు?
ఎవ్వఁడు జితకాముఁ? డెవ్వఁ డజేయుఁ? - డెవ్వడు నిరసూయుఁ? డెవ్వఁ డాఢ్యుండు?
ఎవ్వఁడు సువ్రతుం? డెవ్వఁ డుదారుఁ? - డెవ్వండు సుచరిత్రుఁ? డెవ్వఁడు సముఁడు?
ఎవ్వనికిన్కకు నింద్రాదిసురలు - దవ్వుదవ్వులనుండి తలఁకుచుండుదురు?110
అట్టివాఁ డిలఁ బుట్టి యరిగెనో ? యిప్డు - పుట్టెనో? యిఁకమీదఁ బుట్టనున్నాఁడొ?"
యనినఁ ద్రిలోకజ్ఞుఁ డైననారదుఁడు - దనబుద్ధి నెంతయుఁ దలపోసి చూచి
“యామహి శ్రీవిష్ణుఁ డిపుడు జన్మించె, రాముఁడై దశరథరాజున; కతఁడు
నియతాత్ముఁ, డతిశౌర్యనిధి, కృపాజలధి - జయశాలి స్వజనరక్షణవిచక్షణుఁడు
కంబుకంధరుఁడు చక్కనిమేనివాఁడు - బింబారుణోష్ఠుండు పీనవక్షుండు
వెడదకన్నులవాఁడు విపులాంసతలుఁడు - నిడుదచేతులవాఁడు నియతవర్తనుఁడు
వేదవేదాంగకోవిదుఁడు కోదండ - వేదవిదుండు వివేకభూషణుఁడు
కమలాప్తుతేజంబు కడలిగాంభీర్య - మమరాద్రిదైర్యంబు, నవనిసైరణయు,
ధనదునిత్యాగంబుఁ దనయందు మిగులఁ - ననువొందు నిత్యకల్యాణవిగ్రహుఁడు,
కౌసల్య కానందకరుఁడు శ్రీకరుఁడు - భాసురత్రైలోక్యపావనమూర్తి120
రాముఁడై యిలఁ బుట్టి రాజశేఖరుఁడు - రాము నిమ్మని వేఁడ రాజు పంపఁగను,
మౌని వెంటను బోయి, మఖమును గాచి - దానవి నటు కూల్సి దైత్యుని ద్రుంచి,
రాతి నాతిని జేసి, రాముఁడు వేగ - సీతఁ జేకొనుటకు శివువిల్లు విఱిచి,
ఖ్యాతిగా సీతను గడుఁ బెండ్లియాడి - సీతతోడను గూడి, చెలఁగి యయోధ్య
కేతెంచుచోటను గెరలుచు విప్రు - డేతెంచి, నిలిచిన నేపునఁ గదిసి,
వాపోవ నాతని బలువిల్లు దిగిచి - కోపంబుతో మునుఁ గొమరొప్పఁదీసి,
యేపున నందఱ నెద వేడ్క మీఱ - నాపట్టుననె వచ్చి యప్పురిఁ జేరి,
“యాసక్తి యౌవరాజ్యాభిషిక్తునిగఁ - జేసెద"నని తండ్రి చెలఁగి యయోధ్యఁ
బట్టంబు గట్ట భూపతి సమకట్ట - మట్టు మీఱినయట్టి మంథర యపుడు
నెట్టనఁ గైకతో నెఱినాటఁ జెప్పఁ - గట్టడి కైక సంగరమునఁ దొల్లి130
రెండువరంబు లర్థించిన దౌట - జండించి, కాననస్థలికి రాఘవునిఁ
బనిచిన, జనకునిప్రతిన కై పూని - జనకజాలక్ష్మణసహితుఁడై వెడలి,
దేవనంబునను నెంతేవనంబునను - బావనమునిచర్యఁ బరఁగుసంయములఁ



గరుణమైఁ గాపాడి ఖరదూషణాది - శిరములు శరములఁ జెండుచెండాడి,
ఋశ్యమూకంబున నినజుఁ జేపట్టి - వశ్యత నొకకోల వాలిఁ దూలించి,
సీతకై చలపట్టి సేతువు గట్టి - పాతకదశకంఠుపదితల ల్గొట్టి,
సీతతోఁ గూడి, యాశ్రితలోక పారి - జాతంబు వనచరజాతంబు గొలువ
నింద్రాదివినుతుఁడై యేతెంచి, రామ - చంద్రుండు నిజపూజ్యసామ్రాజ్యలక్ష్మిఁ
బాలించుచున్నాఁడు; ప్రజలకు వేడ్క - గీలించుచును గృతకృత్యుఁడై" యనుచు140
నారాముచరిత మాద్యంతంబు చెప్పి - నారదముని పోయె నలినజుపురికిఁ;
మునిపతి వాల్మీకి ముద మొప్ప నంత - దనశిష్యుఁ డగు భరద్వాజుండు దాను
బ్రకటింప సజ్జనభావంబు పోలె - నకలుషజీవనం బై కరం బలరు
తమసానదికిఁ బోయి, తన్నదీవారిఁ - దమయనుష్టానము ల్డగఁ జేయుచుండి,
యాయేటిదరిఁ గ్రౌంచయమళంబు ప్రేమ - గాయజుకేళిమైఁ గవయుచో, నొకటి
నొకబోయ చంపిన, నున్నయాక్రౌంచి - ప్రకటశోకంబునఁ బలవింపఁ జూచి,
దగవును ధర్తంబు తలపోసి మౌని - పగదాయ నబ్బోయపై నల్క వొడమి.
"యోరి నిషాదుండ! యోరిపాపాత్మ! - యోరి! నీ కేమి యొునరించె? రోరి
కామించి క్రౌంచముల్ గవయుచో నొకటి - నేమిటికై చంపి తిబ్భంగిఁ గదిసి?
యాపాతకమున ననేకదుఃఖములు - ప్రాపించి తిరుగుము బహువత్సరములు."150
అని బోయ శపియించి, యంత వాల్మీకి - దనశిష్యుఁ డగు భరద్వాజునిఁ జూచి,
పలికెను శ్లోకంబుపద్ధతిగాను - “బలికినపల్కును బలుమాఱు చూడ
ఛందోనిబద్దమై సమవర్ణపంక్తిఁ - బొంది నాలుగుపదంబుల హృద్య మగుచు
నిది చాలవిస్మయ మీశాపవాక్య - పదములు దమయంతఁ బద్యమై నిలిచె."
ననిన భరద్వాజుఁ డాదిగా శిష్యు - లనురక్తిఁ బఠియించి రాపద్య మంత;
ననఘుఁ డావాల్మీకి యాశ్రమంబునకుఁ - జనియున్నచో బ్రహ్మ చనుదెంచుటయును
నెదురేగి పదముల కెరఁగి తోడ్తెచ్చి - కుదురుగాఁ గుశపీఠిఁ గూర్చుండజేసి,
కరమర్ధి బూజించి, కరములు మొగిచి - పరఁగ శాపాక్షరపద్యంబుఁ జదువ
విని, బ్రహ్మ నగి, “పద్యవిషయమై వాణి - యనఘ! నీముఖమున నవతరించినది;
శ్రీరామచరిత మశేషంబు నాకుఁ - గోరి నారదుఁడు సంకోచించి చెప్పె.160
నది విస్తరించి నీ వఖిలంబు చెప్ప - నది; సర్వమును దోఁచు"నని చెప్పి పోయె.
నీరీతిఁ గృప వరం బిచ్చి మన్నించి - సారసగర్భుండు సనినపిమ్మటను
మఱి నిర్మలధ్యానమతిఁ బూని మౌని - తఱిగొని సకలంబుఁ దలపోసి చూచి.
రఘుచరిత్రము, దశరథుచరిత్రంబు - రఘురాముజన్మంబు, రామువర్తనము,
తాటకవధయు, నుద్దండరాక్షసుల - యాటోపహరణంబు, యజ్ఞరక్షణము,
దనరు గంగామహత్త్వంబు, గౌతముని - వనితను శాపంబువలనఁ బాపుటయు,

ధనువుఁ ద్రుంచుటయు, సీతావివాహంబు - చనుచోట జమదగ్నిజాతునాగ్రహము,
రామాభిషేకసంరంభంబు, దుష్ట - కామిని కైకేయి కష్టభాషణము,
నభిషేకవిఘ్నంబు, నడవికి రామ - విభుఁడు వోవుటయు, భూవిభునిశోకంబు,
దశరథుమరణంబు, దశరథరాముఁ - గుశలసంభాషియై గుహుఁడు గాంచుటయు.170
నురుపుణ్యు లట గంగ నుత్తరించుటయు - వరతపోనిధి భరద్వాజు గాంచుటయు,
నరిగి, యాచిత్రకూటాద్రి నెక్కుటయు - భరతుండు రఘురాముపజ్జఁ జేరుటయు,
నన్నచేఁ బాదుక లబ్ధిమై బడసి - మన్నన లింపార మగుడి వచ్చుటయు,
దండకాగమనంబు, తగిలి విరాధుఁ - జండవిక్రము నందు సంహరించుటయుఁ,
బరమపుణ్యుని శరభంగుఁ గాంచుటయుఁ - బరువడి మునులతోఁ బ్రతిన లాడుటయు,
చని యయ్యగస్త్యునాశ్రమము చొచ్చుటయు - మునిచేత దివ్యాస్త్రములు పడయుటయు,
ముని చెప్పఁగా వారు ముదమున వేగ - చని పర్ణశాలలో సరగనుండుటయు,
మోహించి రాక్షసి మొనసి వచ్చుటయు - నూహించి దానితో నొగిఁ బల్కుటయును,
రామానుజుండు శూర్పణఖ - ముక్కును, జెవులును మ్రోడు సేయుటయు
నది వోయి ఖరదూషణాది రక్కసుల - కది చెప్ప వా రంత నలిగి వచ్చుటయు,180
నురువడి రఘురాముఁ డొక్కఁడే కడఁగి - ఖరదూషణాదుల ఖండించుటయును,
నట రావణునిబుద్ధి నలుక పుట్టుటయుఁ - గుటిలమారీచుండు క్రొవ్వి చచ్చుటయు,
నసురాధిపతి సీత నపహరించుటయు - విసువక రాముఁడు విలపించుటయునుఁ,
నని జటాయువుచావు నవల గబన్ధుఁ - గనుటయు, మఱి పంపకడకుఁ బోవుటయుఁ,
గరమర్థి ఋశ్యమూకమున సుగ్రీవుఁ - డరుదెంచి కనుటయు, నతనిసఖ్యంబు
వాలిసుగ్రీవులవైరంబుతెఱఁగు - చాలంగ రాముండు సప్తతాళముల
నేలఁ గూలఁగనేసి నెమ్మి మెప్పించి - వాలి నొక్కమ్మున వధియించుటయును,
దారావిలాపంబు దశరథసూనుఁ - డారవిసూను రాజ్యమున నిల్పుటయు,
మానవపతి యంత మాల్యవంతమున - వానకాలం బెల్ల వసియుంచుటయు,
గాకుత్స్థుకోపంబు కపిసమాగమము - నేకతంబున ముద్రి కిచ్చిపుచ్చుటయు,190
నలయక కపులు సీతాన్వేషణంబు - సలుపుటయును, బిలసందర్శనంబు
నాక్షణంబున మహేంద్రాద్రి నెక్కుటయుఁ - బక్షీంద్రుఁడైన సంపాతిదర్శనము,
వనధిలంఘనమున వనధిమధ్యమునఁ - జనుచోట మైనాకసందర్శనంబు,
మద మెత్తి సింహిక మారుతసూనుఁ - గదిసి చచ్చుటయు, లంకాప్రవేశంబు,
లంకను నొప్పించి లలనచే నచట - లంకత్రోవయు గని లంకఁ జొచ్చుటయు,
నంతఃపురంబున కరిగి చూచుటయు, - నంత నశోకవనావలోకనముఁ,
దెఱగొప్ప నందు వైదేహిఁ గాంచుటయు, - నెఱుకకు నానవా లిచ్చి దేర్చుటయు,
బెనచి యావనమెల్లఁ బెఱికివైచుటయు, - హనుమంతుఁ డత్తఱి నక్షు జంపుటయు,


బవనజుఁ డటఁ బట్టువడిపోవుటయును, గవిసి లంకాపురి గలయఁ గాల్చుటయు,
మానినీమణి శిరోమణి నిచ్చుటయును - మానితాత్ముం డబ్ధి మరల దాఁటుటయు,200
మధువనహరణంబు, మణి ప్రీతి నిచ్చి - యధిపతి మారుతి నాశ్వసించుటయు,
నినకులాధిపుఁడు దండెత్తిపోవుటయు, - వనధితీరంబుస వచ్చి నిల్చుటయు,
వనరాశి త్రోవ యివ్వక క్రొవ్వుటయును - గొనకొని రాముండు గోపించుటయును,
నంత విభీషణుఁ డధిపుఁ గాంచుటయుఁ - జింతించుటయు మఱి సేతుబంధనము,
జడధి దాఁటుటయును, జని లంకమీఁద - విడిసి పేర్చుటయు, దోర్వీర్యంబు మెఱసి
కర ముగ్రులగు కుంభకర్ణాదివీర - వరులఁ ద్రుంచుటయు రావణునిఁ జంపుటయు,
నావిభీషణుని లంకాధినాయకునిఁ - గావించి పట్టంబు కరుణఁ గట్టుటయు,
ననుపమశుద్ధి బ్రహ్మాదుల మెచ్చ - జనకజ రఘురామచంద్రుఁ బొందుటయు,
నెలమిఁ బుష్పక మెక్కి యెల్లరు వేడ్కఁ - జెలఁగి యంభోనిధి సేతువుమీఁదఁ
దెలిసి శ్రీకంఠుఁ బ్రతిష్ట సేయుటయు, - వెలయ నయోధ్యకు వేగ వచ్చుటయు,210
భరతు గాంచుటయును, బట్టాభిషేక - మరుదుగా రఘురాముఁ డవధరించుటయు,
గపిసైన్యపతుల నర్కజవిభీషణుల - విపులసంపద లిచ్చి వీడుకొల్పుటయుఁ,
బరికించి ప్రజల కాపద లొందకుండ - గరుణ ట్రోచుట, యనుకథలెల్లఁ దెలిసి
వెలయ నిర్వదినాల్గువేలశ్లోకములు - గలిగి, యేనూఱుసర్గల విస్తరిల్లి
కాండంబు లాఱింటఁ గర మొప్ప మిగిలి - యుండ, రామాయణ మొప్పఁ గావించి
యొనరఁ దక్కినకథ లుత్తరకాండ - మునఁ జెప్పి, వాల్మీకిమునినాథుఁ డంత
ఈకథ పఠియుంప నెవ్వరు నేర్తు - రీకథ జగముల నెబ్భంగి వెలయు,
ననుచుండ కుశలవు లనఘమానసులు - మనసిజాకారులు మంజుభాషణులు,
జననుతుల్ సంగీతసాహిత్యపరులు - మునివేషధారు లిమ్ముల వచ్చి మ్రొక్కి,
యనఘ! రామాయణం బర్థితో జదువ -జనుదెంచితిమి మమ్ముఁ జదివింపవలయు,"220
ననిన సంతోషించి యమ్మునీశ్వరుఁడు - "తనమనోరథమెల్లఁ దలకూడె" ననుచు
గేయమై పాఠ్యమై కేవలపుణ్య - దాయకం బగు రఘూత్తముచరిత్రంబు
ననుపమతంత్రీలయాన్వితఫణితి - మునిపతి చదివింప ముద మొప్పఁ జదివి,
రమణశృంగారాదిరసము లేర్పడఁగ - సమవృత్తిభేదముల్ సంధి సమాస
సమధికశబ్దార్థసంగతు లెఱిగి - క్రమ మొప్ప బాడుచుఁ గవగూడి వారు
మునిజనసభల నిమ్ములఁ బూజనములు - గొని, వినోదింపఁ గాకుత్స్థవల్లభుఁడు
వెలయఁ దమ్ములు దాను వేడ్క లింపొందఁ - గొలువిచ్చి వారలఁ గోరి రావించి
వారిరూపంబులు వారినిల్కడలు - వారినిర్మలతరవాగ్విశేషములు,
తనకు నిం పొనఠింపఁ దత్కథాక్రమము - వినుచుండె రాముఁ డవ్విధ మెట్టిదనిన:—



కుశలవులు శ్రీమద్ద్రామాయణకథను గానము చేయుట

ద్వాదశయోజనాత్యాయం బగుచు - నైదుయోజనముల నది వెడ ల్పగుచు230
నిపుణత మయునిచే నిర్మితం బగుచు - నెపుడు శాత్రవకోటి కెదురుచు క్కగుచు
కొలఁది మీఱిన భానుకులజులకెల్ల - కులరాజధానియై కొనియాడఁ బరఁగి
సరయువుపొంత కోసలదేశమునను - ధరణికిఁ దొడ వయోధ్యాపురం బొప్ప;
మణిగోపురంబుల మణితోరణముల - మణికుట్టిమంబుల మణిగవాక్షములఁ
గేళికాగృహములఁ గృతకశైలముల - బాలానిలంబులఁ బటహనాదముల
మహితవారణముల మానితాశ్వముల - బహురథప్రతతుల భటకదంబముల
విమలసౌధంబుల విపణిమార్గములఁ - గమనీయవనములఁ గమలాకరములఁ
జెఱువుల బావులఁ జెఱకుదోటలను - దఱుచైన శాలికేదారవారములఁ
బరిఘలఁ గోటలఁ బసిఁడిమాడువులఁ - గర మొప్ప లోకవిఖ్యాతమై పరఁగు.
నాపురి దశరథుం డను మహారాజు - చాపవిద్యావరజాలకార్ముకుఁడు240
చతురుపాయజ్ఞుండు షాడ్గుణ్యశాలి - సతతశక్తిత్రయసంధానకర్త
ధర్మోత్తరుఁడు కృతాధ్వరుఁడు శ్రీకరుఁడు - ధర శాస్త్రపురాణతాత్పర్యపరుఁడు
అజునినందనుఁడు బాల్యాదిగా నియతిఁ - బ్రజల పాలించిన పరమపావనుఁడు
జంభారికై పోయి శంబరాసురుని - దంభం బణంచి సుత్రామునిచేత
మందారపుష్పదామములు గైకొన్న - యిందుమతీపుత్త్రుఁ డినకులాధిపుఁడు
తేజంబు కాంతియుఁ దెగువయు నేర్పు - రాజసంబును నుదారతయు ధైర్యంబు
మొదలైనసద్గుణంబులప్రోది యగుచు - నుదయార్కుగతిఁ దనయుగ్రతేజంబు
దీపితంబై యేడుదీవులఁ బర్వ - భూపాలతిలకమై పొలుపొంద నేలు.
నన్నరనాథుకులాంగనామణులు - మున్నూటయేబండ్రు ముఖ్యలై యందు
నచలతసౌశీల్యమైన కౌసల్య - కుచకుంభనిర్జితకోక యాకైక250
యనఘచరిత్రయౌ నాసుమిత్రయును - వినుతి కెక్కిరి త్రయీవిద్యలో యనఁగ.
నిలమీఁద నతనికి హితపురోహితులు - పొలుచు వసిష్టాది పుణ్యసంయములు
అనఘాత్మకుఁడు దృష్టి యనువాఁడు విజయుఁ - డనువాఁడు సిద్ధార్ధుఁ డనువాఁడు మఱియు
నర్థసాధకుఁడు జయంతుఁడు నీతి - తీర్ధుఁ డశోకుండు ధీమంతుఁడైన
మంత్రపాలకుఁడు సుమంత్రుండు ననఁగ - మంత్రులు గల రెనమండ్రు నాతనికి.
నామంత్రు లందఱు నన్యోన్యహితులు - స్వామికార్యవిచారచతురమానసులు
పరమర్మభేదనోపాయధౌరేయు - లరసి ప్రజారక్ష యాచరింపుదురు.
అట్టివా రెనమండ్రు నఖిలకార్యములఁ - బట్టున దిద్దఁ దీర్పను జాలి కొలువ
నష్టాక్షరముల బాహాష్టకంబులను - స్రష్టయై వెలయు నారాయణుకరణి



దశరథుం డలరె, నాతనిదేశమునను - గృపఁడు కొండీఁడు రోగియు దరిద్రుండు260
జారుండు మఱి యనాచారుండు పుణ్య - దూరుండు క్రూరుండు తుచ్చుండు జడుఁడు
మందుండు మఱి లేరు మందునకైన; - నందఱు మణికుండలాద్యలంకృతులు
నందఱు ధర్మపరాయణచిత్తు - లందఱు విహితకులాచారరతులు
అందఱు సకలశాస్త్రాబ్ధిపారగులు - నందఱు శ్రీవిష్ణునతిభక్తిపరులు.
ఈచందమున రాజ్య మేపు దీపింప - భూచక్ర మెల్ల నేర్పున నేలి యేలి
ప్రకటరాజ్యాంగసంపద దేలి తేలి, యొకనాఁడు దశరథుం డుల్లంబులోనఁ

మంత్రులతో దశరథుఁడు పుత్రకామేష్టి సేయుట కాలోచించుట

దనకు సంతతిలేమిఁ దలపోసి వగచి - తనకు నాయువు వేగ తగఁ బోయె ననుచు
మనమునఁ గుందుచు మఱియు నాతండు - తనమంత్రివరుల నందఱను రప్పించి
ఘనముగఁ గొలువిచ్చి ఘనతఁ గూర్చుండి - తనమంత్రివరుల నందఱఁ జూచి పలికెఁ
బెక్కుదానంబులు పెక్కుధర్మములు , పెక్కుయాగంబులు పెక్కువఁ జేసి270
పెక్కేండ్లు మంటి: శోభితకీర్తి గంటి; - మక్కువ మీవంటిమంత్రులు గలుగఁ
గొదవ లే దేమిటఁ; గొడుకులు లేని - కొదువ యొక్కటిగాని, కుల ముద్ధరించు
కొడుకులు లేకున్నఁ గోరి పుణ్యములు - వడయ రుత్తమలోకపదవు లెవ్వరును,
గానఁ బుత్రులఁ గానఁగా నాకు వలయుఁ - గాన నే నింక లోకము లెల్ల మెచ్చఁ
దలకొని యశ్వమేధము సేసి, పిదప - నెలమితోఁ బుత్త్రకామేష్టి వ్రేల్చెదను.
ఈయాగములచేత హితము రంజిల్లఁ - బాయక పుత్రులఁ బడసెద నేను"
నని చెప్ప వారలు. నతిసంభ్రమమున - మనమున సంతోషమగ్నులై యున్న
నామంత్రివర్యుల నందఱఁ జూచి - తా మది నూహించి తగవొప్పఁ బలికె
“ననుపమంబుగ. నేను నశ్వమేధంబు - వినయంబునఁ జేసి విబుధులు మెచ్చఁ
బుత్రులకొఱకునై పుత్రకామేష్టి - నేత్రోత్సవంబుగ నేఁ జేయువాఁడ."280
నని తగుపనులకు నందఱఁ బనుప - ననఘులు మఱి వసిష్ఠాదులు వచ్చి
నిలిచిన మ్రొక్కుచు నెలమిఁ దోడ్తెచ్చి - పలికెను వారితోఁ బార్థివోత్తముఁడు.
“అనఘ వసిష్టసంయములార యిపుడు - ఘనమైనహయమేధకంబు నాచేత
జేయించి పత్రైకసిద్ధి నొందుటకుఁ - జేయింపుఁడీ దాని జెచ్చెఱ" నన్న
నలవడ నీచేయు హయమేధమఖము - నెలకొని యే మింక నిర్వహించెదము.
మది నెన్న శక్యమే మఖరాజమహిమ? - యిది గాక పుత్రకామేష్టియుఁ జేయఁ
దనయులఁ గాంచెదు ధన్యమానసుల" - ననవుడు హర్షించి యవనినాయకుఁడు
అందఱఁ బనిచి శుద్ధాంతంబు సొచ్చి- సుందరీమణుల కాశుభవార్తఁ జెప్పి,
యనురక్తి నేకాంతమైయున్నవేళ - ననఘుండు సూతుఁ డిట్లనియె భూపతికి:—

ఋశ్యశృంగవృత్తాంతము

"ధరణీశ! మీకు సంతానసంప్రాప్తి - వెరవైనకథ మున్ను విన్నాఁడ నేను;290
భూమీశ! విను మంగభూమీశుకొడుకు - రోమపాదుఁడు గుణారూఢుండు దొల్లి
యేమిపాపముననో యెఱుఁగఁజొప్పడక - యామహిలో వర్ష మటు కుర్వదయ్యె.
దా నేలి పాలించు ధరణిపై నెందు - వానలు లేకున్న వగలను జెంది,
వరమునీంద్రులచేత వర్షహోమములు - పరువడి సేయించి, పడయరాకున్న
భూరిశోకంబునఁ బొగలుచునున్న - యారాజుఁ గనుఁగొని యమ్మును లనిరి,
"యోమహీపాలక! యోరాజచంద్ర! - యీమహిపై వాన లిటఁ బర్వుటకును
నొకయుపాయమ్ము మే మొగిఁ జెప్పువార; - మకలంకమతితోడ ననువొందఁజేయు:
పరహితోన్నతుఁడు విభాండకసుతుఁడు - చిరపుణ్యనిధి ఋశ్యశృంగుఁ డన్వాఁడు
నగధైర్య! పట్టిననాఁటనుండియును - నగరరాష్ట్రంబు లెన్నఁడు నెఱుంగమిని
నతఁ డెందు నాఁడువా రనుపేరు నెఱుఁగ; - డతఁడు తాపసవృత్తి నడవుల నుండు;300
వసుధేశ! యతఁ డిందు వచ్చినఁ జాలు; - వెసఁబాయు నీయనావృష్టిదోషంబు."
నావుడు మునినాథు నగరి కేరీతి - రావింతు నని విచారము చేసి తెలిసి
అతఁడు వచ్చుటకును నాత్మఁ జింతించి - మతిమంతు లగునట్టి మంత్రులఁ బిలిచి
మునులను రప్పించి ముద మొప్ప నడుగ - మునులును మంత్రులు ముదముతోఁ జెప్ప
మనమున సంతోషమహిమ శోభిల్ -, మునులమాటలు విని మోదంబు మీఱ
నుండెను భూకాంతుఁ; డొగి మౌను లనిరి - దండిగ నోరాజ! తలపోసి యిపుడు
వారకాంతలనెల్ల వసుధేశ! పంపు; - వారకాంతలచేత వనముల కిపుడు
దండిగా భక్ష్యముల్ దగవారి కిచ్చి - మెండుగ వనముల మేటివస్తువులు
పెట్టి పంపుము నీవు పెంపుతో ననుచు - గట్టిగాఁ గాంతలు కడుప్రౌఢసతులు
తిన్నగ నటుపోయి తెఱఁగొప్పఁ గాంచి - మన్ననచే మౌనిమహిమ వీక్షించి,310
తియ్యనిభక్ష్యముల్ తెఱఁగొప్ప నిచ్చి - నెయ్యంబుచే మది నెఱిఁ గరఁగించి,
యాటలఁ బాటలఁ దేటమాటలను - బాటలగంధులు పదిలులై నిలిచి
మనసెల్లఁ గరఁగించి, మఱి వెంట నంటి - మనసిజాకారలు మఱి మాయ పన్ని
యచ్చుగ నిటు రాగ, నతడు వెన్దగిలి - వచ్చును; నిందుకు వసుధేశ! వినుము."
అని చెప్పి మునివర్యు లట చని రంత - ఘనముగా నారాజు కరుణ నారాత్రి
మన మలరగ నుండి, మఱునాఁడు లేచి - మునులను దలఁచుచు ముద మొప్ప నంత
ననురక్తిఁ గడుఁబ్రోడ లగు వారసతుల - వినుతయౌవనరూపవిభ్రమవతుల
మనసిజుమోహనమంత్రదేవతలఁ - బనిచె నొప్పెడువారిఁ బాటించి యతఁడు.
అతివ లమ్మునియున్న యడవికిఁ బోయి - యతని యాశ్రమభూమి కల్లనఁ జేరి,



చతురనర్తనకళా సంగీతగతుల - నతనికిఁ దమయొప్పు లర్థిఁ జూపుటయు 320
నాపుణ్యనిధి వారి నాఁడువా రగుట - రూపింపనేరక రుచులఁ జేపడక
యలసయానముల నీయడవిలో నొప్పు - మెలఁగెడు నివి వింతమృగములోఁ గాక
యనుచుండ నొక్కనాఁ డతివలు ప్రీతిఁ - దనుఁ జేరవచ్చినఁ దప్పక చూచి.
చన్నుల పే రడ్గి, చన్నులమీఁద - నున్నహారములకు నుపదేశ మడిగి,
“మాకుఁగొమ్మొక్కటి దుఃస్తకమ్మునను - మీకుఁగొమ్ములురెండు మెరసె ఱొమ్మునను:
నేవృక్షములఁ గల్గె నివి యపూర్వములు?-మీవల్కలము లతిమృదులంబు లరయ ;
మాజటాబంధంబు మాడ్కివిగాపు - మీ జటాబంధము ల్మెఱుఁగులఁబొదలె ;
మేనిబూడిదెఁపూత మేల్తావిగొట్టు - వీనులవిందు లీవేదనాదములు ;
కని విని యెఱుఁగ మిక్కాననభూమి - మునులకు నీ వేషములు గలవొక్కొ?
ఎక్కడిమును?"లన్న నింతు లాఘనుఁడు - చిక్కుట భావించి చెలఁగి నవ్వుచును 330
"నానుపూర్విగ శ్రుతిహారియౌ సామ - గానంబుపాడి, చక్కఁగఁ బదక్రమము
శుద్ధమార్గంబునఁ జూపంగ నేర్తు, - మిద్దర మాచర్య లెఱుఁగ మీతరమె?"
యని నేర్పుమాటలనమ్మునిస్వామి - గనుఁబ్రామి, మఱియు నక్కన్యకామణులు
“ఎవ్వరితనయుఁడ? వెవ్వఁడ? వేల - యివ్వనంబున నుండు? టెఱిఁగింపు " మనుడు
“అమలకీర్తులఁ బుణ్యుఁడగు విభాండకుని - కొమరుండ; ఋశ్యశృంగుండు నా పేరు;
విపులతపోనిష్ఠ వెలయ నీ యడవిఁ - దపము సేయుటకు నై తగిలి వర్తింతు,
భాగీరథీస్నానపరత మాతండ్రి - యోగిపుంగవులతో నొగి నేగినాఁడు;
ఒండుదేశంబుల నెఱుఁగక యిచట - దండిమైఁ దపములు తగవొప్పఁజేసి,
కదలకయున్నాఁడు ఘనత మాతండ్రి - సదమలచిత్తుఁడై సద్బక్తి నిపుడు.
వినుఁడు మీ రిచటికి విచ్చేయుకతన - ననఘుండనైతిఁ, గృతార్థుండ నైతి; 340
మాతండ్రికృపచేత మఱియు నిచ్చటను - నాతతంబుగఁ దప మనువొంద నెపుడు
చేసి యిచ్చట నుందుఁ జతురతతోడ - వాసిగా వనముల వరుస మిమ్ములను
గనినయప్పుడు నాకుఁ గడుఁజోద్యమయ్యె - ననునొందఁ బోదమా యాశ్రమమునకు?"
నని మునులను వారియాశ్రమంబునకు - గొనిపోయి ఋశ్యశృంగుండు పూజించె,
నెలనాగ లమ్ముని యిచ్చినపూజ - యలరచుఁ గైకొని, యతని వీక్షించి,
మునివర! మావనంబునఁ దెచ్చినార - మనుపమఫలరాజ మనుచు లడ్వములు
అతిరసంబుల మనోహరము లైనట్టి - యతిరసంబులు వడ లలరుమండిగలు,
సారమౌ రసములు చవు లుగ్గడించి - పేరుపెట్టఁగరాని పెక్కుభక్ష్యములు
నిచ్చిన నమలుచు నెడనెడఁ జవుల - మెచ్చుచుఁ దనిసి యామెలఁతలఁ జూచి
గ్రుక్కిళ్లు మ్రింగుచుఁ గొసరి యడ్గుచును - జొక్కుచు నందంద సొరిదిఁ జేచాచి. 350
ము న్నిట్టిఫలముల మునివరులార! - యెన్నఁ డేనెఱుఁగను నేవనంబులను:



మీతపంబె తపంబు? మీతపోవనమె - యీతపోవనముల కెక్కుడు ధరణి?"
నని పల్క నయ్యింతు లల్లన నగుచు - ననువారఁ దనులత లఁట సోఁకఁగదిసి
తావియూర్పులచేతఁ దాలిమి దూలి - పోవ నొయ్యన ముఖాంబురుహంబు లొత్తి
పలుకులఁదళుకులఁ బాటతేటలను - బిలుపుల సొలపుల బేలించి, యతని
హృదయంబు గరఁగంగ నిరుచన్నుగవలు - గదియించి, బిగియార గౌఁగిళ్ల మరపి,
“యనఘ! పోయెద; మిదె యాశ్రమంబునకు" - నని విభాండకుదెస నడరినభీతి
నరిగి చేరువనుండి రావనంబునకు! - నరవిందలోచన లరిగినపిదప
వా రింక నెన్నఁడు వత్తురో యనుచు - నాఋశ్యశృంగుండు నట నిద్రలేక
యారాత్రి వేగించి, యమ్మఱునాఁడు - ఆరమణులఁ గన్నయచటి కేతేర. 360

ఋశ్యశృంగుండు వారాంగనల దగిలి రోమపాదునియింటికి వచ్చుట

నందియ ల్మెఱయంగ నసదుఁగౌఁదీఁగె - లందంద వడఁక రాయంచలనడల
మగువలు వచ్చి యామహితాత్ముఁ గాంచి - నగుమొగంబులతోడ నలుఁదట్లఁజేరి
"మునివర! మావనంబునకు రావలయు;" - నని పల్క రాకకు ననుమతించుటయు,
కని చాల వెలఁదులు ఘనమునిఁ జూచి - మనసులు గరఁగంగ మఱిమఱి పలికి,
తమయుపాయంబులఁ దమవిలాసములఁ - దమకంబు పుట్టించి, తరలాక్షు లంత
విస్తారపథ మని వెఱచి పోవమికి - హస్తపల్లవముల నాందోళికగను
నొనరెడుదీమంబు లొకవింతమృగముఁ - గొనివచ్చు తెఱఁగునఁ గొనివచ్చి రతని;
నతఁడు వచ్చుటయు నయ్యంగరాజ్యమున - నతులవర్షములు సస్యము లొప్పె నంత.
సకలసౌభాగ్యము ల్సలలితంబుగను - నకలంకమతితోడ నానృపుఁ డుండి
యామౌనిఁ గనుఁగొని యతిభక్తియుక్తి - నేమంబుతోఁ బూజ నెమ్మిఁ గావించి, 370
యనఘుండు దనకూఁతు నారాజు శాంత - యనుదాని నిచ్చిన నారాజునింట
నతఁ డుండ, దశరథుం డమ్మునిఁ దెచ్చి - హితమతిఁ బుత్త్రకామేష్టినాఁ బరఁగు
క్రతు వమ్మునీంద్రుచేఁ గావించెనేని - సుతులనల్వుర బహుశ్రుతుల నున్నతుల
నాతతోన్నతిఁ గాంచు" నని చెప్పెఁ దెలియ - నాతోడఁ దొల్లి సనత్కుమారుండు
అటుగాన నీ వింక నాఋశ్యశృంగుఁ - బటుభక్తి యుక్తిమైఁ బ్రార్థించి తెమ్ము.
అని చెప్పి యాసూతుఁ డరిగినపిదప - మనమున సంతోషమమతలు సెలఁగ,
ననువరి దశరథుం డారోమపాద - జననాథువీటికిఁ జని ఋశ్యశృంగు
మునిపతిఁ గని మ్రొక్కి ముదముతో ననియె - "వినవయ్య! మునిచంద్ర! విమలమానసుఁడ
యనువందఁ బుత్త్రుల నడుగుట కేను - మనమునఁ దలపోసి మమత నీకడకుఁ 380
గొనకొని వచ్చితిఁ; గొనుము నీ" వనుచు - ఘనమున గృప పుట్ట మఱి నుతి సేసి,
క్రతువున కాచార్యుఁగా వరియించి - యతులితచతురంతయానాఢ్యుఁ జేసి



వచ్చుచో దూతలవలను వీక్షించి - పుచ్చి ముందర వారిఁ “బురమును నగరు
వాసవుపురితోడ వైభవం బొప్పఁ - గైసేయవలయును గడువేగ మీరు".
అని పల్క వారును నరిగి పౌరులకు - వినిపింపఁజేసిరి: వివిధశిల్పముల
దుందుభిశంఖాదితుములనాదముల - నందంద మ్రోయించి; రంత భూపతియుఁ
బురమున కేతేరఁ బురజను ల్సేయు - పరమమంగళతతు ల్పరఁగఁ గైకొనుచు,
నతనువిరోధ్యసాధ్యకు నయోధ్యకును - జతురుఁడై తోడ్తెచ్చె శాంతతోగూడ;
నీరీతి నాఋశ్యశృంగుని దెచ్చి - భూరమణుం డంతిపురమున నునిచి
వితతార్ఘ్యపాద్యాదివిధులఁ బూజించి - యతికృతార్థుఁడ నైతి నని సంతసించె; 390
నాసమయంబున నారాజసతులు - కౌసల్యమొదలుగాఁ గలవారు వేడ్క
నలువొంద ఱేనియానతిఁ బూని చాల - నలరి సంతసమున నాశాంత కపుడు
మహితభూషణవస్త్రమాల్యాదు లిచ్చి - బహువిధంబుల వారిఁ బ్రార్థించి; రంతఁ.
గొంతకాలమునకుఁ గువలయజనులు - సంతోష మెసఁగ వసంత మేతేర.
నడరెడువేడుక నాఋశ్యశృంగు - కడకు భూపతి వచ్చి కడుభక్తి మ్రొక్కి,
“సన్నుతస్థితి నన్ను సంయమిప్రవర! - చెన్నొంద జన్నంబు సేయింపవలయు"
నని విన్నవించిన నౌఁగాక యనుచు - నినకులోత్తముఁ జూచి యిట్లని పలికె.
"వేగంబె తెప్పింపు విహితంబులైన - యాగసంభారంబు లన్నియు నధిప!"
యనవుడుఁ దగువారి నయ్యైతెఱంగు - లొనరింపుఁ డనుచు నియోగింపఁబనిచి,
యఖిలసంభారంబు లన్ని దెప్పించి - మఖము చూచుటకు సుమంతునిఁ బంపి 400
కేకయక్ష్మానాథుఁ గీర్తిసనాథు - నాకాశిరాజు నవ్యాహతతేజు
జనకాంగరాజాదిజననాథవరుల - ననఘచరిత్రుల నర్థి రప్పించి,
మనుజనాయకుఁడు సుమంతుతో ననియె - “ననఘుల వేదవేదాంగపారగుల
గృహమేథు లగువారి గృతతంత్రభావ్య - మహితార్థనిశ్చయమతుల భూసురుల
బరఁగు సుయజ్ఞు జాబాలిఁ గశ్యపుని - సురుచిరాత్ముని వసిష్ఠుని వామదేవు
రయమునఁ దోడ్కొనిరమ్ము నీ"వనినఁ - బ్రియమున నాతండు పెంపార నరిగి
యురుభక్తి నందఱ నొగిఁ దోడితేరఁ - బరువడిఁ దా నర్ఘ్యపాద్యాదు లిచ్చి,
నిర్మలవ్రతనిత్యనిష్ఠార్థమైన - ధర్మార్థయుతముగాఁ దగుమాటఁ బలికె.
"మునులార! కొడుకులు మును నాకు లేమి - మనమునఁ దలపోసి మమత రెట్టించి
మిత్రసూక్తుల నశ్వమేధయాగంబు - పుత్త్రులకొఱకునై పుత్త్రకామేష్టి 410
సేయంగ నీఋశ్యశృంగుఁ దోడ్తెచ్చి - మీయనుగ్రహము గామించి యున్నాఁడ."
ననవుడు నావసిష్ఠాదిసంయములు - జననాథుమాటకు సంతోష మంది
"యినకులోత్తమ! లోకహిత మాచరింపఁ - దనయులఁ గోరు నీతలఁ పొప్పు నింక
నశ్వంబు విడువు మీయశ్వమేధమున - విశ్వరక్షకులైన విక్రమోజ్జ్వలులు



నలువురు కొడుకులు నరనాథ నీకుఁ - గలిగెద"రని పల్కఁ గడు సంతసిల్లి
సవనయోగ్యంబైన జవనాశ్వ మరసి - భువనపావనమూర్తి పూజించి నొసఁట
బ్రకటితబిరుదాంకపట్టిక గట్టి - యొకయేఁడు దనయిచ్చ నుర్విఁ జరింప
సమకట్టి విడిచె నశ్వంబు రక్షింప - విమతోగ్రులగు సైన్యవిధులతోఁగూడ.
నంత వసిష్ఠాదు లనుమతి సేయ - వింతఁగా శిల్పకోవిదుల రావించి,
సరయువు నుత్తరస్థలి యాగశాల - విరచింపఁగాఁ బంచె వేదోక్తసరణి. 420
మఱియు నానాదేశమనుజవల్లభుల - వఱలు విప్రనృపాలవైశ్యశూద్రులను
రప్పించె; నంత వర్షము పూర్ణమైన - నెప్పటిమధుమాస మేతేర నృపుఁడు
చిరతపోనిధి ఋశ్యశృంగుసమ్మతియు - గురునియానతియుఁ గైకొని మంచివేళ
స్పృహను శాంతాఋశ్యశృంగులతోడ - నిహితసంభారవర్ణితహోమకుండ
సహితమై యేకవింశతిరమ్యయూప - మహితమై శ్రౌతధర్మక్రియాచార
విహితమై మాయాప్రవీణదైతేయ - రహితమై సకలాఘరహితమై యొప్పు

దశరథుఁడు యాగదీక్ష వహించుట

యాగవాటము చొచ్చి, హయము వచ్చుటయు - యాగదీక్ష వహించి యతిశుద్ధిఁ బొంది
మునుల వసిష్ఠాదిమునిజనోత్తముల - ఘనుల ఋత్విక్కులగా వరియింప
సవనత్రయం బభీష్టమున నొనర్చి - ప్రవిమలయూపాగ్రబద్ధంబులైన
జలచరంబు లరణ్యచరములు విహగ - ములు నురగంబులు మొదలుగా నొప్పు 430
పశువుల మున్నూటిఁ బ్రథితాశ్వమొకటి - విశసించి క్రతుకర్మవేదులు ప్రీతి
నేమంత్రములతోడ నేపలలములు - గామించి వేలుపఁగా జెప్పుశ్రుతులు,
నామంత్రములతోడ నాపలలములు - కామించి వేల్చిరి కడఁగి ఋత్విజులు.
అనలుండు సప్తజిహ్వలఁ బ్రజ్వరిల్లె; - ననిమిషుల్ దనిసి రాహవిరాదికముల;
నాయాగదినముల నాఁకొన్నవాఁడు - నాయాసపడినవాఁ డరసిన లేఁడు.
సారమృష్టాన్నవస్త్రపటీరకనక - హీరభూషాదిసంతృప్తులే కాని
యేక్రియలందును నెడపడకుండ - నీక్రియ హయమేధ మీడేరుటయును,
వెనుక జ్యోతిష్టోమవిశ్వజిదాది - ఘనయాగతతులు సాంగము మీఱఁ జేసి,
యధ్వరదక్షిణకై పూర్వదేశ, - మధ్వర్యునకును బ్రహ్మకు దక్షిణంబు, 440
పొనరంగఁ బశ్చిమభూమి హోతకును, - దనర నుత్తరము నుద్గాతకు నిచ్చె.
నిల నయోధ్యయుఁ దక్క నెల్లదేశముల - నలరి యిచ్చిన ముదమంది ఋత్విజులు
“ఎప్పు డేలుదుము నీ విచ్చినదేశ? - మెప్పు డనుష్ఠాన మేము సల్పుదుము?
ఏ మేడ? దేశంబు లేలుట లేడ? - భూమికి వెల యిమ్ము భూమీశ! మాకు "
ననవుడుఁ బదికోటులగు సువర్ణములు - కనకంబు నలుమడికలధౌతచయముఁ



గోరంగ నొకలక్షగోవుల నిచ్చె - నాఋశ్యశృంగాదు లైన ఋత్విజులు
నవి పంచుకొని ముదమందిరి ప్రీతిఁ; - బ్రవిమలాధ్వరకర్మ పరిచారకులకు
నరనాయకుఁడు సువర్ణములు కోటియును - వరభూషణంబులు వలయువారలకుఁ
గామితార్థంబులు కామించువారి - కేమి వాక్రుచ్చిన నింపార నిచ్చి,
పరఁగు భూసురులకు భక్తితో మ్రొక్కి - వరుస వా రిచ్చు దీవనలు గైకొనుచు 450
బ్రకటదివ్యాంబరాభరణాదు లొసఁగి - యకలంకచిత్తుఁడై యపభృథం బాడి
శ్రీమహితుఁడు ఋశ్యశృంగుచేఁ బుత్త్ర - కామేష్ఠిఁ జేయింపఁగా నేగుదెంచి,
క్రమ మొప్ప యాగభాగములు గైకొన్న - యమరు లారావణు నాత్మలోఁ దలఁచి,

దేవతలు బ్రహ్మకడ కరిగి రావణు బాధలఁ దెల్పుట

బ్రహ్మఁ గనుంగొని ప్రణమిల్లి నిలిచి - "బ్రహ్మ! నీవరశక్తిఁ బంక్తికంధరుఁడు
ప్రవిమలాచార్యుల బ్రహ్మర్షివరుల - దివిజుల మునుల బాధింపుచున్నాఁడు.
దారుణవరశక్తి దలఁప మాచేత - వారిజాసన! వాఁడు వారింపఁబడఁడు.
సురగణంబులతోడ సుత్రాముఁ బట్టి - పరిభవింపుచు నేఁచు బాహుదర్పమున
గంధర్వయక్షాదిగణముల మునుల - బంధించు సాధులఁ బట్టి బాధించు.
వాఁడన్న కులగిరు ల్వడవడ వడఁకు - వేఁడిమి చూపఁగ వెఱచు భాస్కరుఁడు.
వీఁకతో నతఁ డున్నవీట నెన్నఁడును - దేకువచెడి గాలి దిరుగంగవెఱచు, 460
నన్నిశాచరుఁ గన్న నాటోప మెసఁగ - మున్నీరు కడలొత్తి మ్రోయంగ వెఱచు,
నేపునఁ గన్నప్పు డెల్ల మ మ్మేఁచు - పాపాత్ముఁ డగు నట్టిపంక్తికంధరుని
నంతంబు నొందించు నాయుపాయంబు - చింతింపవలయు నీచిత్తంబులోన"
ననవుడు నాతెఱం గంతరంగమునఁ - గని బ్రహ్మయును దేవగణము నీక్షించి
“యమరులచేఁ జావఁ డసురులచేత - సమయఁడు గంధర్వసమితిచేఁ జెడఁడు
రజనీచరులచేత గ్రాగ డెన్నఁడును - భుజగసంఘములచేఁ బొలియఁ డెన్నఁడును
యక్షులచే నీల్గఁ డాలంబులోనఁ - బక్షియూథంబుచేఁ బడఁడు, వానికిని
వర మిచ్చునప్పుడు వాక్రువ్వఁడయ్యె - నరులఁ గావున వాఁడు నరులచేఁ జచ్చు
విశదంబుగా నింక వినుఁడు హిరణ్య - కశిపుఁడు లోకముల్ గారించునాఁడు
నరసింహరూపంబు నారాయణుండు - ధరియించి వాని విదారించినాఁడు :; 470
వాఁడె వీఁడై విశ్రవసునకుఁ బుట్టి - నాఁడు గావున నేఁడు నారాయణుండు
వీని నిర్జించు నవ్విష్ణుని నభయ - దానంబు మన మింకఁ దగ వేఁడవలయు"
నని దేవతలతోడ నాబ్రహ్మ పలుక - ననువొంద నందఱు నప్పుడే కదలి
యమృతాబ్ధికడ కేగి యచ్యుతుఁ గాంచి - విమలచిత్తులు నయి విబుధులు వేడఁ
గరములు ముకుళించి కడుభక్తి మ్రొక్కి - యరుదుగ సుర లప్పు డావిష్ణు గాంచి



దేవతలు విష్ణువును నుతించుట

సన్నుతించిరి మది సంతోష మెసఁగఁ - "గనకాక్షశిక్ష! లోకత్రయాధ్యక్ష!
వనజాలయావక్ష! వసుమతీరక్ష! - వనజాక్ష! మాకు నెవ్వరు లేరు దిక్కు
నీ వొక్కఁడవుదక్క నిక్క మీమాట - గోవింద! పరిపూర్ణగుణ! చిదానంద!
దేవ! జగన్మయ! దేవాదిదేవ! - దేవ! నిస్తారక! దివ్యావతార!
శుభమూర్తి శరణంబుఁ జొచ్చిన మాకు - నభయ మిచ్చితి గాదె యమృతాబ్ధిఁ దొల్లి,480
తలపోయ దానవదళన! నీ బాహు - బలవిక్రమంబులఁ బరఁగు లోకములు!
భక్తవత్సల! నిన్నుఁ బరికింపఁ దరమె? - భ_క్తియోగముదక్క బయలుమాటలను
మధుసూదనుఁడ! నిన్ను మదితోన నమ్ము - నధికపుణ్యుల కెందు నాపద ల్గలవె?
జగదుద్భవస్థితిసంహారగతులు - దగ వినోదంబులై తనరు; నీ మాయ
నాధారభూతమై యఖిలలోకములు - మాధవ! దాల్చు నీమహనీయతనువు;
అహిరాజతల్ప! నీయలరువైభవము - మహిమఁ జూడఁగ నవాఙ్మనసగోచరము;
శరణాగతత్రాణ! శరణు లోకేశ! - శరణార్థు లగుమమ్ము జనుఁ గావ నీకుఁ;
గావున ద్రైలోక్యకంటకుండైన - రావణుఁ బొలియించి రక్షింపు మమ్ముl
మా కొకకార్యంబు మసలక చేసి - లోకకీర్తులఁ బొందు లోకైకవినుత!
నిర్మలచిత్తుండు నిశ్చలవ్రతుఁడు - ధర్మశీలుండు నుత్తమగుణాన్వితుఁడు,490
నగుచున్నదశరథుఁ డశ్వమేధంబు-తగఁ జేసి మది శుచిత్వమున నున్నాఁడు,
కాకుత్స్థవంశునికాంతలఁ దలఁప - నేకాంతలను వారికెన సేయరాదు,
నరమూర్తు లొప్పంగ నాలుగంశముల - సరసిజోదర! నీవు జనియింపవలయు;
వరశక్తి సురల కవధ్యుఁడై లోక - పరితాపకరుఁ డైన పంక్తికంధరుని
మునుల గంధర్వకింపురుషుల సురలఁ - బనివడఁ జంపిన పాపాత్ముఁ జంపి
సవనము ల్సేయింపు సంయమివరుల - భువనము ల్రక్షింపు పుండరీకాక్ష"
యని విన్నపము సేయు నమరులఁ జూచి - వనదగర్జితగతి వనజాక్షుఁ డనియె.
“సురలార! మీ రింక సుఖమున నుండుఁ - డరిగి మర్త్యమున నే నవతార మంది,
యాదట బంధుమిత్రామాత్యపౌత్త్ర - సోదరయుతు దశాస్యుని గీటడంచి,
నిండార నేలెద నియతితోఁ బదునొ - కొండువేలేఁడు లీకుంభినీతలము500
నజునివరంబున నవనీతలమున - రజనీచరేంద్రుండు రాజిల్లఁగలిగె"
ననుచు వరం బిచ్చి యజుని వీడ్కొలిపి - యనిమిషులను బంపి యసురారి చనియె,

దశరథునకు యజ్ఞపురుషుఁడు దివ్యపాయస మొసఁగుట

అప్పుడు విమలహోమాగ్నిలోనుండి - యొప్పెడు పుణ్యాత్ముఁ డొకదివ్యమూర్తి
హరినీలనీలాంగుఁ డరుణాంబరుండు - తరుణార్కతేజుఁ డుదగ్రవిక్రముఁడు



పరఁగఁ బాయసముతోఁ బసిఁడిపాత్రంబు - కరమున ధరియించి గ్రక్కున వెడలి
తనుఁ జూచి యద్భుతాదరమున లేచి - వినయాఢ్యుఁడై యున్న విభుని వీక్షించి
“భూనాథ! విను యజ్ఞపురుషుండ సుతుల - నే నీకు నీఁగోరి యేతెంచినాఁడ;
నాదట నీపాయసాన్నంబు పుచ్చి - నీదేవులకుఁ బెట్టు నిష్ఠతో" ననిన
ననురాగమును బొంది యవనీశుఁ డతని - ననయంబు పూజించి యాపాయసంబు
తా నందుకొనియె సుధాకలశంబు - చే నందుకొన్నశచీపతిమాడ్కి ;510
నంతఁ బ్రాజాపత్యుఁ డటు మాయమైన - నంతఃపురంబున కరిగి భూవిభుఁడు
రమణు లెదుర్కొని ప్రమదాబ్ధిఁ దేల - నమరనిర్మితమైన యాపాయసంబు
సగము కౌసల్యకు సగములోఁ బుచ్చి - సగము సుమిత్ర కాసగములో సగము
కైకకు నిచ్చి యుత్కంఠ నాసగము - ప్రాకటంబుగ సుమిత్రకు నిచ్చె మఱియు
నప్పాయసాన్నంబు లర్థి భుజించి - యప్పడు గర్భిణు లైరి వా రెలమి,
తగిలి వారలఁజూచి దశరథేశ్వరుఁడు మిగుల నానందించి మెఱసెఁ జూపఱకు;
మొగి ఋశ్యశృంగాదిమునుల భూపతులఁ - దగునర్చనము లిచ్చి తగ వీడుకొలిపి
పరమానురాగుఁడై పడఁతులు దాను - ధరణీశుఁ డయ్యయోధ్యకు నేగుదెంచె
దమయాగభాగము లగిలి కైకొన్న - యమరులు దమలోక మరిగెడుచోట

బ్రహ్మ దేవతలను వానరులఁగాఁ బుట్టుఁడనుట

నా కంజగర్భుఁ డింద్రాదులఁ జూచి - లోకరక్షణకళాలోలుఁడై శౌరి520
ధారణిపై నవతారంబు సేయ - మీరును దోడ్పాటు మేకొనవలయు.
నటు గాన లోకహితార్థవర్తనులఁ - బటుపరాక్రమరూపబలపయోనిధుల
బలగర్వముల మిమ్ముఁ బ్రతిపోల్పజాలు - బలియుర వానరపతులఁ బెక్-ండ్రఁ
గిన్నరగంధర్వఖేచరయక్ష - పన్నగామరసిద్ధభామలయందు
బుట్టింపుఁ డే మున్ను పుట్టించినాఁడ - నెట్టన బలపయోనిధి జాంబవంతు
నది యెట్టి దనిన నే నావలించుటయు - నుదయించెఁ జిరతరాయుష్మంతుఁ డతఁడు"
అని బ్రహ్మ తమతోడ నానతిచ్చుటయు - విని సంతసిల్లి యావేల్పులందఱును
అనిమిషపతి వాలి ననలుండు నీలు - నినుఁడు సుగ్రీవు సురేజ్యండు తారు
సింధువల్లభుఁడు సుషేణు గుహ్యకుఁడు - గంధమాదను విశ్వకర్మయు నలుని
దివిజవైద్యయుగంబు ద్వివిదమైందులను - దివిరి పర్జన్యాధిదేవత శరభుఁ530
గరువలి హనుమంతుఁ గడఁగి పుట్టింప - ధరణిఁ బుట్టించిరి తక్కినసురలు
తమతమసత్త్వము ల్దగఁ బుచ్చి పేర్చి - యమితశౌర్యుల వానరాధీశవరుల
నావానరులు జగదాప్తవర్తనులు - దావాగ్నితుల్యు లుదగ్రవిక్రములు
పర్వతాకారులై భాసిల్లవారు - పర్వతయోధులై పరఁగెడువారు

భీమసాహసికులై పెంపారువారు - కామరూపంబులఁ గర మొప్పువారు
దఱిమి యబ్ధులనైన దాఁటెడువారు - పెఱికి కొండలనైన భేదించువారు
నఖదంష్ట్రహేతుల నలిఁ గ్రాలువారు - నఖిలలోకోత్తరులై యొప్పువారు
ధారణినైన విదారించువారు . నై రూఢికెక్కియు నరుదుగ వారు
కొందఱు సుగ్రీవుఁ గొందఱు వాలిఁ - గొందఱు హనుమంతుఁ గొందఱు నీలు
గొందిఅు నలమైందకుముదులఁ గొలిచి - యెందు నభేద్యులై యేపు దీపించి540
మలయదర్దురగంధమాదనవింధ్య - ములు మొదలగు శైలములఁ గాననముల
బహుజలనదనదీప్రాంతదేశముల - విహరించుచుండిరి వేడ్కతో నంత
మహనీయపాయసమహిమచేఁ జేసి - యహిమాంశుకులపత్నులందు గర్భంబు
లలవడ నాధాన మైనదిమొదలు - కలిమిఁ గైకొనెఁ బేదకౌను లెంతయును
నమృతాన్నరుచిలోన నడఁగక వెలికి - గమనించె నన దేహకళ వెల్లవాఱె
రావణుసామ్రాజ్యరమముక్కు నల్పు - గావించుటకు సూచకము లివి యనఁగ
ననపత్యతాదోష మంతయు వెడల - మొనసె నాఁ దగెఁ జనుముక్కులనల్పు
చెక్కులు పలచెక్కెఁ జిట్టుము ల్బలిసె - నిక్కె నాభులు వళు ల్నెరులకుఁ బాసెఁ
దల చూపెఁ గోర్కు లంతటఁ గ్రమంబునను - నెలలు తొమ్మిదియును నిండినపిదప
వర్ణితమధుమాసవరశుక్లపక్ష - పూర్ణయౌ నవమిని బుధవాసరమున550

శ్రీరామాదుల జననము

మహిఁ బునర్వసుతార మధ్యాహ్నవేళ - గ్రహపంచకము నుదగ్రస్థితిఁ దనరఁ
దొలఁగక గురుఁడు చంద్రుఁడుఁ గూడియుండ - లలితకర్కాటకలగ్నంబునందు
సర్వలోకాధారు జగదేకవీరు - శర్వాదిదేవతాసంస్తూయమాను
దివ్యలక్షణకళాదేదీప్యమాను - నవ్యయు నసమాను నార్తార్తిహరణు
భవ్యుఁ జిదానందుఁ బరమకల్యాణు - దివ్యుల రక్షించు దీనార్తిహరణు
గుణగణాలంకారు గురుకీర్తిహారు - ఫణిరాజశయను శ్రీపతి హృషీకేశు
నాకమలోదరునర్థాంశమునను - గాకుత్స్థకులు రాముఁ గనియెఁ గౌసల్య.
యదితి యింద్రుని గన్నయనువునఁ దూర్పు - సుదతి చంద్రుని గన్నచొప్పున, నంత
భూలోకవిదితమై పుష్యనక్షత్ర - లాలితం బగు మీనలగ్నంబునందు
గమలాప్తసమతేజుఁ గమలాప్తవంశుఁ - గమలాప్తు భరతుని గనియెఁ గైకేయి560
ప్రణుతింపఁదగునట్టి ఫణితారకమున - గణితకర్కటకలగ్నంబునఁ గవల
దరళలోచన సుమిత్రాదేవి మిత్ర - చరితుల లక్ష్మణు శత్రుఘ్నుఁ గనియె.
దివి మ్రోసె నప్పుడు దేవదుందుభులు - దివి నాడి రప్పుడు దేవకామినులు
సొరిదిఁ బువ్వులవాన సోనలై కురిసెఁ - బరితోష మందిరి బ్రహ్మాదిసురలు

కలయ నయోధ్యలో గలవార లెల్ల - వెలసి రుత్సవముల వీరు వా రనక
ఆప్పడు దశరథుఁ డనఘు వసిష్టు - రప్పించి జాతకర్మములు సేయించి
పుత్రోత్సవంబును పొరియించె దివిజ - నేత్రోత్సవంబుగా నిఖిలపౌరులకుఁ
బురుడు దీరినయంతఁ బుణ్యాహవేళ - వరుస నాసుతులకు వంశోన్నతులకు
నామకరణములు నలువుర కిప్పు - డేమఱ కీవు సేయింపు వసిష్ఠ
యనవుడు నౌఁ గాక యని తనమదిని - గనుఁగొని పలికెను గౌసల్యసుతుని570
రముక్రీడ యని ధాతు రాజిల్లుచుండ - రమయతి యన నొప్పు రామనామంబు
కైకేయితనయుండు ఘనబలాన్వితుఁడు - సుకుమారతనుడు సుశ్లోకుండు గాన
భరతనామంబున బరఁగు సుమిత్ర - కిరవైనసుతులకు నింపుసొం పెసఁగ
లక్షణగుణులు సంలక్షించి చూడ - లక్ష్మణశత్రుఘ్ను లనునామ మొదవుఁ
గాన వీరలు మహాఘనపుణ్యమతులు - ఈనలువురకును నివి నామము లన
లక్ష్మీసమన్వితులకు రామభరత - లక్ష్మణశత్రుఘ్నలలితాఖ్య లెసఁగ
నొగి నామకరణంబు లొప్పఁ గావించి - తగ నర్థకోటులు దానంబు లిచ్చె

శ్రీరామాదులబాల్యము

వారలుతల్లులు వరుస దాదులును - బోరామిఁ దము నర్థిఁ బోషింపఁ బెరిగి
కల్లరినగవులఁ గన్నులు దెఱిచి - యల్లనల్లనఁ దప్పటడుగులు వెట్టి
మల్లడిగొను డొంకుమాటలు నేర్చి - యెల్లవారికిఁ జాల నింపు లొనర్చి580
కొద్దిగా ముత్తెంపుఁగొనబు వజ్రాల - మద్దికాయలడాలు మలయఁ జెక్కిళ్లఁ
బ్రాకటంబుగ ఫాలబాలేందుకళల - శ్రీకరాకృతి రావిరేక లల్లాడఁ
బొగడొందు మగరాల పులిగోళ్ల మేలి - జిగి డెందములయందుఁ జిందులు ద్రొక్క
నెడనెడఁ బలుపచ్చలేయడ్డి గలుగఁ - గడునొప్ప మొలనూళ్లగంటలు మెఱయ
మువ్వలందెలు పదంబుల రొద ల్సేయ - నవ్వులాటల బాల్యనటన లేర్పడఁగ
విద్దెల నెఱపుచు విభునిముందఱను - ముద్దులు గులుకుచు మోహనాకృతుల
నంత నానలువురు నభివృద్ధిఁ బొంది - సంతతపుణ్యులై సమచిత్తు లగుచుఁ
దమలోనఁ గవకూడి దశరథాత్మజులు - రమణీయమూర్తులు రామలక్ష్మణులు
భరతశత్రుఘ్నులు పాయక పుణ్య - నిరతులై చౌలోపనీతులై యంత
మాయావినోదము ల్మరిగియాడుచును - నాయెడ రఘురాముఁ డాప్తులు దాను590
నిండారుప్రేమతో నెట్టెలు గట్టి - చెండును దండంబు చెలువొప్పఁ బట్టి
తరమిడి యాడెడుతఱిని గైకేయి - వరవు డామంధర వడి నేగుదెంచి
చిట్టంటుచేఁతలఁ జెండు దట్టుటయు - కట్టల్క రాముఁ డాకాష్టంబుచేత
నడచిన నొక్కకా లప్పుడే విఱిగెఁ - దడయక యందందఁ దమకించి రాము

నడరెడువేడ్కతో నాడంగఁ జూచి - తడయక రాముపైఁ దగఁ గ్రూర ముంచి
విరిగినకాలితో వెసఁ గైకనగరి - కరిగి తద్వృత్తాంత మంతయుఁ దెలుపఁ
దరమిడి కైకేయి దశరథాధిపున - కెఱిఁగింప నంతయు నెఱిఁగి భూవిభుఁడు
అల వసిష్ఠుని నయోధ్యకును రావించి - వలగొని మ్రొక్కి "యో వరమునిచంద్ర!
వీరికి వేదాదివిద్యలన్నియును - నేరుపుఁ" డనుచు నానృపుఁ డప్పగింప
ననఘుఁ డమ్మునినాథుఁ డట్ల కావించె - జననాథుతనయు లాసంయమికరుణఁ 600
గరిహయారోహణక్రమము లెఱింగి - వరరథారోహణవైఖరు ల్దెలిసి
యఖిలవేదంబులు నఖిలశాస్త్రములు - నఖిలశస్త్రాస్త్రవిద్యలు నేర్చి రంత
వారిలో రాముఁ డవార్యశౌర్యమున - సారవివేకాదిసద్గుణావళులఁ
దేజరిల్లుచు విష్ణుదేవుండు గాన - రాజిల్లె నాదశరథుఁడును నంతఁ

విశ్వామిత్రుఁడు దశరథునికడకు వచ్చుట

గొడుకుల పెండ్లిండ్ల కొమరొప్పఁజేయ - నడరి చింతింప విశ్వామిత్రుఁ డంత
వచ్చి నిల్చుటయు దౌవారికు ల్దెలిసి - వచ్చి యాదశరథవరు నర్థిఁ జూచి
"యవధారు దేవ విశ్వామిత్రమౌని - తివిరి వాకిట నేగుదెంచియున్నాఁడు"
అనవుడు దశరథుం డాప్తులతోడ - మునివసిష్టుఁడు దాను ముదముతో నపుడు
పరమేష్టి కెదురేగుపాకశాసనుని - కరణి నెదుర్కొని ఘనశక్తి నెఱఁగి
యమ్ముని గొనిపోయి యర్ఘ్యపాద్యముల - నెమ్మి బూజించిన నృపు జూచి యతఁడు610
"కుశలమే ప్రజలకు గుశలమే నీకుఁ! - గుశలమే నీముద్దుకొడుకుగుఱ్ఱలకు?
విశదవ్రతాచార వినుతవసిష్ట - కుశలమే? మునులార! కుశలమే?" యనిన
"నేమిటఁ గొఱఁత లే దేము ధన్యులము - నామందిరము పావనమ్ము చెన్నొంద
భావితమూర్తి! యోపరమమునీంద్ర! - నీవు విచ్చేసితి నేఁడు మాకడకుఁ
గాన లోకములఁ బ్రఖ్యాతుఁడ నైతి - మానవాధిపులలో మాన్యుండ నైతి,
వచ్చినకార్యంబు వలనొప్పఁజెప్పఁ - డిచ్చమైఁ జేసెద నేకార్యమైన"
ననిన విశ్వామిత్రుఁ డారాజుఁ జూచి - “జననాథ! దశరాత్రజన్నంబుఁ దొడరి

కౌశికుడు యజ్ఞరక్షణార్థమై దశరథునితో రామునిఁ బంపుమనుట

కోరి యేఁ జేయుచోఁ గ్రూరరాక్షసులు - దారుణాకారు లిద్దఱు వచ్చివచ్చి
మాయాగశాలలో మాంసరక్తములు - పాయక గురియుచు బ్రబలవిఘ్నములు
సేయుచు నున్నారు; క్షితిపాల! మాకు - నాయాగమధ్యంబునం దల్గరాదు;620
అటుగాన నీపుత్త్రు నభిరామరాముఁ - బటుసత్త్వుఁ గ్రతు వొప్ప బాలించుకొఱకు
గొనిపోవ వచ్చితిఁ గ్రూరులు దనుజు - లనిఁ జావ రొరులచే నతనిచేఁ గాని
యితనిమహత్వ మే నెఱుగుదు బ్రహ్మ - సుతుఁడైన యీవసిష్ఠుండును నెఱుఁగు;

అనఘ! రాముఁడు బాలుఁ డను బుద్ధి మాను - మనఘ నీపుత్త్రకుండను లోభ ముడుగు;
క్రతుకర్త క్రతుమూర్తి క్రతుభాగభోక్త - యతఁడు లోకారాధ్యుఁ డతని బుత్తెంపు
మతులశస్త్రాస్త్రంబు లతని కే నిత్తు; - నతనిచేఁ గ్రతురక్ష యగు మాక ననుడుఁ
బెలుకురి మూర్ఛిల్లి పెద్దప్రొద్దునకుఁ - దెలిసి వెల్వెలఁబాఱి దీనుఁడై మిగులఁ
గలఁగి కంపించి గద్గదకంఠుఁ డగుచుఁ - బలికె విశ్వామిత్రుఁ బ్రార్థించి నృపుఁడు
“రాముఁడు బాలుండు రాముండు నిసువు - రాముఁ డెఱుంగఁడు రణకళాకేళిఁ
బదియును నైదేండ్లప్రాయంబువాఁడు - కదలెడిచిప్పకూఁకటి గలవాఁడు630
పరికించి తనయందుఁ బగవారియందు - నురుబలాబలగతు లూహింపలేఁడు
ఇటువంటి పసిబిడ్డ నేల వేడితిరి - కటకట! ఘనదయాకలితుండ వయ్యు
బహుదివ్యశస్త్రాస్త్రపతులు రాక్షసులు - మహితమాయోపాయమతులు రాక్షసులు
నిపుణసంగరకళానిధులు రాక్షసులు - విపులబాహాటోపవిభులు రాక్షసులు
వారితోఁ బోర నెవ్వఁడు రాముఁ డనఁగ - వా రేడ యితఁ డేడ వరమునిచంద్ర
యరువదివేలేఁడు లవని బాలించి - తఱి దప్పి ముదిసి యీతనిఁ గంటి నేను
ఇతనిఁ బుత్తెంచుట కేఁ జాలనయ్య - క్రతురక్షకై విచారము లేల మీకు?
నేను సేనల గూడి యీప్రొద్దె కదలి - పూనివచ్చెద నిదె పొండు మీవెనుక
మునినాథ! మీయాగమున విఘ్నకర్త - లగు రాక్షసులశక్తు లవి యెంత గలవు
వా రెవ్వరెవ్వరు? వారిపే రేమి? - యీరాఘవుఁడు వారి నెబ్భంగి గెలుచు?"640
ననిన విశ్వామిత్రుఁ డనియె భూపతికి - మనుపులస్త్యబ్రహ్రమనుమండు ఖలుడు
ఆవిశ్రవసుకొడు కఖిలకంటకుఁడు - రావణుఁ డుగ్రసంరంభుడై పనుప
బలసి మారీచసుబాహు లన్వారు - నలిరేఁగి యాగవిఘ్నములు సేయుదురు;
రాముఁడొక్కఁడు దక్క రణభూమి వారి - నేమిచందంబున నెదురలే రొరులు;"
అని పల్క నమ్మక యధిపతి మఱియు - మునినాథుతోఁ బల్కె మోమోట లేక
“బ్రహ్మనాలవవాఁడు పరమసాహసుఁడు - బ్రహ్మచే వరములు వడసినవాఁడు,
అట్టిరావణుచేత నటు పంపు వడసి - నట్టివారల గెల్వ నతఁ డేమి చాలు?
వారిలా వెఱుఁగక వచ్చెద ననుచు - మీఱి పల్కితి నింక మెల్లన జనుఁడు'
ననవుడు రోషతామ్రాక్షుఁడై చూచి - కనలుచుఁ గటము లుత్కటములై యదర
నొడలెల్లఁ గంపింప నురుగతిఁ బలికె - నడరి విశ్వామిత్రుఁ డారాజుఁ జూచి650
"కాకుత్స్థకులజులగతి విచారింప, కీకష్టదుర్భాష లేల భాషింప?
నేను వచ్చినపని యెఱిఁగింపు మంటి - పూని చేసెద నంటి; బొంకెద విపుడు
క్రతురక్షకై రాముఁ గడఁగి వేఁడుటయు - ధృతి మాలి యీ నని తెగిపల్కె దీవు;.
సూనృతేతర నిన్నుఁ జూడఁగారాదు - గానఁ బోయెద" నంచుఁ గడఁగి పల్కుటయు
జలనిధు లింకె; భూచక్రంబు గ్రుంగెఁ - గలఁగె లోకములు; దిగ్గజములు మ్రొగ్గె;

దివిజులు వెఱచిరి; దిశలు గీడ్పడియె - నవశంబులుగఁ జొచ్చె నఖిలభూతములు;
అప్పడు మౌని కోపాటోపవృత్తి - తప్పక భావించి దశరథుఁ జూచి

వసిష్టముని దశరథునితో రామలక్ష్మణుల బంపుమనుట

యావసిష్టుఁడు పల్కె “నర్కవంశజులు - భూవలయంబున బొంక రెన్నఁడును;
మిన్నందు నీకీర్తి మీవారికీర్తు - లన్నియుఁ జెడుఁ గల్ల లాడితివేని;
నిచ్చెద నని పల్కి యీకున్నఁ బొలియు - నచ్చగాఁ జేసిన యఖిలధర్మములు660
దశరథాధీశుండు ధర్మాత్ముఁ డనఁగ - విశదకీర్తుల నీవు వినఁ బ్రసిద్ధుఁడవు;
పుడమిలో నవనీశ! భువనరక్షణము - గడవంగ ధర్మముల్ గలవె రాజులకుఁ?
గాన రాముని నిచ్చి గాధినందనుని - మాననీయునిఁ బంపు మానవాధీశ;
ఘనబలోన్నతులు రాక్షసు లీకుమారుఁ - డనికి దక్షుండు గాఁ డనుచు నీకొడుకు
శైశవంబున కింత శంకింపనేల? - కౌశికుఁ డుండంగఁ గలుగునే భయము?
అధిప విశ్వామిత్సు నత్యుగ్రతపము - లధికసామర్థ్యంబు లతివిచిత్రములు;
భూనాథ! యిమ్మహాపుణ్యుండు దేవ - దానవగంధర్వదైత్యులకంటె
నెఱుఁగు దివ్యాస్త్రంబు లిమ్మహాబాహుఁ - డెఱుఁగని విషయంబు లెందును లేవు
జనలోకనాయక! జయయు సుప్రభయు - ననఁగ దక్షునికూతు లాజయవలన
సుప్రభవలన రక్షోవధార్థముగ - సుప్రభుం డగు భృశాశ్వుండు వేర్వేఱ670
నస్త్రాకృతులఁ బుత్త్రు లరయ నేఁబండ్ర - శస్త్రాకృతుల తనూజన్ము లేఁబండ్రఁ
గామరూపంబులు గలవారిఁ గాంచి - భూమీశ! యిచ్చె నీపుణ్యాత్మునకును
అది కారణంబుగా నఖిలశస్త్రాస్త్ర - విదు డిమ్మునియు నీవు వెఱవంగవలదు;
ఈముని మహిమపెం పెఱుఁగవే యకట! - యీమునితో నాడి యేల తప్పెదవు;
ఈమునిచంద్రుతో నేఁగ రామునకు - సేమంబు జయమును సిద్ధమ్ము సుమ్ము;
ఇతఁడు రక్కసుల జయింపఁగా లేఁడె? - హితమతి నీపుత్త్రు నిద్ధచారిత్రు,
నలఘుశస్త్రాస్త్రవిద్యలఁ బెద్దసేయ - వలసి యిచ్చటికి భూవర వచ్చెఁగాక
కాన రామునిఁ బంపు క్రతువు రక్షింప - నీనిర్మలాత్ముని కిచ్చుట మేలు."

కౌశికునితోడ రామలక్ష్మణులఁ బంపుట

అని వసిష్ఠుఁడు పల్క- నాత్మలో నమ్మి - జననాథుఁ డారామచంద్రుని బిలిచి,
బాలభావము చూచి బాష్పము ల్నించి - యాలింగనము సేసి యర్థి దీవించి,680
చిప్పకూఁకటి దువ్వి, చెక్కిలి పుడికి - తప్పక యొక్కింతతడవు చింతించి,
పుణ్యాహవాచనపూర్వంబు గాఁగ - బుణ్యవ్రతంబులు పుణ్యహోమములు
గ్రహపూజనలు సేసి, కమనీయవస్త్ర - మహితభూషణములు మనసార నిచ్చి,
యొగిఁ దానుఁ గౌసల్యయును వసిష్ఠుండు - తగినదీవన లిచ్చి, దశరథేశ్వరుఁడు

పుణ్యలగ్నంబునఁ బుత్త్రరత్నంబు - పుణ్యాత్ముఁ డగు గాధిపుత్త్రున కిచ్చి
నెమ్మియుఁ దెగువయు నెరిఁ బిరిగొనఁగ - నమ్ముని గొలిచి పొమ్మని వీడు కొలిపె.
నప్పడు లక్ష్మణుం డారాముఁ గొలిచి - తప్పక భక్తితోఁ దానును జనియెఁ.
బొదివి పువ్వులవాన పొరిపొరిఁ గురిసె - వదలక యనుకూలవాయుపు ల్వీచె.
వరఘోషమంగళవాద్యము ల్మ్రో సె - సుర లాకసంబునఁ జూచిరి ప్రీతి,
నారాఘవుఁ డప్పు డరుగుచిత్రముల - నారిపాటుల మహోన్నతశస్త్రములనుు690
మహితతూణీరముల్ మండలాగ్రముల - సహజంబుగాఁ బూని సుప్రీతితోడ
నక్షీణతూణగోధాంగుళిత్రాణ - కక్షలంబకృపాణకలితులై దివ్య
శరచాపహస్తులై సంయమిపిఱుఁద - గరము సంప్రీతిమైఁ గదలి రాఘవుఁడు
ఆవనజాప్తుని నర్ధితోఁ గొలిచి - పోవు నశ్విను లనఁ బోవుచో వేడ్క
నురుపుణ్యమతు లర్థయోజనం బరిగి - సరయువుడగ్గర శ్రమముఁ బొందుటయు
రామసౌమిత్రుల రమ్మని యపుడు - తా మున్ను దారుణతపముచేఁ గొన్న
కనకగర్భుని పుత్త్రికల సర్వమంత్ర - జననుల సర్వదాసౌఖ్యదాయినుల
బల యతిబల యనఁ బరఁగుమంత్రముల - నెలమిమై వారల కిచ్చెఁ గౌశికుఁడు
ఆరామలక్ష్మణు లామంత్రశక్తి - నారూఢరవితేజులై బడలికయు
నాఁకలి నీరువ ట్టాదిగా రుజులు - సోఁకక బలవృద్ధి శోభిల్లి రంతు700
సరయూనదీతటస్థలి నాఁటిరాత్రి - దరుణకోమలదర్భతల్పంబులందు
గౌశికుచేఁ బుణ్యకథ లొప్ప వినుచు - దాశరథులు ప్రమోదమున నిద్రింప
నాగాధితనయుండు నాప్రభాతమున - వేగంబె మేల్కని వేడ్క చిత్తమునఁ
దనరంగ నటఁ దృణతల్పంబులందుఁ - గసుమోడ్చియున్న రాఘవుల నీక్షించి
"యరుణోదయం బయ్యె ననఘాత్ములార - నిరుపమపూర్వాహ్ణనిత్యకృత్యములు
వలయు నేమంబులు వరుసఁ గావింప - వలయుట మేల్కనవలయు మీ" రనినఁ
దెలిసి సంధ్యావిధుల్ దీర్చి కౌశికున - కలరుచిత్తములతో నతిభక్తి మ్రొక్కి
తరణివంశోత్తము ల్దారర్థిఁ జనుచు - సరయుసురాపగాసంగమంబునను
బహుసహస్రాబ్దము ల్పాయనినియతి - బహుతపంబులు సేయు పరమసంయములఁ
గనుఁగొని సంతోషకలితుఁడై గాధి - తనయుతోఁ బలికె నాదశరథాత్మజుఁడు.710

అంగదేశవృత్తాంతము

"ఎవ్వనియాశ్రమం బిది సంయమీంద్ర - ఎవ్వ రుండుదురయ్య! యీతపోభూమి?"
ననపుడు "రామ! యనంగాశ్రమ మన - వినఁబడు నిది లోకవిఖ్యాత మగుచు,
నీయాశ్రమంబున నెలమితోఁ దపము - సేయుచు లీలమై శివుఁ డున్నఁ జూచి
కందర్పుఁ డతిదర్పగర్వితుం డగుచు - నిందుశేఖరుమీఁద నేయంగఁ జూచి

యడరి యాదేవుఫాలాక్షానలమునఁ - జెడుట ననంగాఖ్యఁ జెందె లోకమున
నంగసంగతిఁ దదీయాశ్రమభూమి - యంగదేశం బయ్యె నంతనుండియును.
అరుదారc దపము లీయాశ్రమభూమి - జరిపించుపుణ్యులు చరితార్థు లెందు."
ననుచు విశ్వామిత్రు డత్తెఱంగెల్ల - వినిపించి యూరఘువీరులు దాను
నిలిచి నాఁ డావాహినీసంగమమున - విలసితస్నానాదివిధు లనుష్టించి
యానంద మందఁ దదాశ్రమవాసు - లైనమునీశ్వరు లాత్మలో నెఱిఁగిు720
రమణీయమూర్తుల రామలక్ష్మణుల - నమితతపోధనుఁడైన కౌశికునిఁ
గొనిపోయి వేడ్కలు గొనలొత్త నపుడు - వినుతార్థ్యపాద్యాదివిధుల బూజించి
పుణ్యకథాగోష్టి బొదల నారాత్రి – పుణ్యరాత్రముఁ జేసి పుణ్యసంయములు
మఱునాఁడు నిత్యకర్మంబు లయ్యేటఁ - దెఱగొప్ప నందఱు దీర్చినమీఁద
నీనావికుఁడు నేర్చు నియ్యేఱు గడప - భానువంశజులకుఁ బదిల మీనావ
యనుచు విశ్వామిత్రుఁ డలరంగఁ బలుక - విని రామలక్ష్మణు ల్వెరవొప్ప నపుడు
వారికిఁ బ్రణమిల్లి వారు దమ్మనుప - నా ఋషితోఁగూడ నానావ యెక్కి
సరయువు దాఁటుచో సరయువునడుమ - గరము విస్మయ మంది కరములు మొగిచి
"యివి మహాధ్వనులు పెల్లెసఁగుచున్నవియు - దివి నుబ్బి యిది యేమి తెలుపవే" యనుడు
"గర మొప్పమీఱుచుఁ గైలాసశిఖరి - సరయువు మానససరసి జన్మించిు730
పొంగారుసాకేతపురిచుట్టు గవిసి - గంగలోఁ గూడెడుకరడులమ్రోఁత"
యని ముని చెప్పిన నర్థితో మ్రొక్కి - యనఘు లన్నది దాఁటి యరుగుచో నెదుర
కరులు సూకరములు కాననంబులును - హరిణముల్ శరభంబు లజగరంబులును
పులులు భల్లూకము ల్పొదలుసింగములుఁ – గలమహాటవిఁ జొచ్చి ఘనుఁడు రాఘవుఁడు
"ఖదిరతిందుకపూగఖర్జూరనింబ - బదరీవటప్లక్షపాటలీతరులు
బహుళకంటకలతాపరివృతవృక్ష - సహితంబు నిర్మానుషంబునునైన
నివ్వనభూమి మునీశ్వరచంద్ర - యెవ్వరియాశ్రమం? బెఱిఁగింపు" మనుచు
నడుగ విశ్వామిత్రుఁ డంతయు జెప్పఁ - దొడఁగి యారామునితో నిట్టులనియె
“నలుక నింద్రుండు వృతాసురుఁ జంపి - మలకలుషప్రాప్తి మలినాంగుఁడైన
సురలును మునులును సుత్రాము నిటకు - దురితముక్తునిఁ జేయఁ దోడ్కొనివచ్చి740
పుణ్యోదకంబులఁ బుణ్యమంత్రములఁ - బుణ్యాభిషేకము ల్పొలుపారఁ జేయ
నామలకలుషంబు లనునవి రెండు - భూముల నిడ శుద్ధిఁ బొంది వాసవుఁడు
మలయుక్తమైనది మలదంబు; కలుష - కలితమైనది యొప్పుగాఁ గరూశంబు;
ననియుఁ బాపఘ్నంబు లనియుఁ బే రొసఁగి – జనపదంబునఁ దొల్లి జంభారి తనకు
నల వృత్రువధపాప మందుఁ దీరుటయు - వినుతింప ధనధాన్యవిభవము ల్పొదలఁ
బొలుపార వరము లాపురముల కిచ్చి - వెలయించె నిఁక నొండు విను రఘురామ!



విశ్వామిత్రుఁడు రామునకుఁ దాటకి వృత్తాంతము దెలుపుట

ధరణిఁ దాటకి యను దానవురాలు - కరులు వెయ్యింటికిఁ గల లావు గలిగి
పొలుపేది నీరెండుపురములు సొచ్చి - యలవుమై బాధించు" ననుడు రాఘవుఁడు
"ఎవ్వరు లా విచ్చి రీయింతి? కింత - యెవ్వరినిజపుత్రి యీదుష్టబుద్ధి?
యీపురంబులు రెండు నేల కాఱించు - నీపాపకర్మురా లెఱిఁగింపు" మనుడుు750
"నవని సుకేతుఁ డన్ యక్షుండు తొల్లి - తవిలి పద్మజునకుఁ దప మాచరించి
యడరెడు నిష్ఠమై నతని మెప్పించి - కొడుకు వేడుటయును గొడుకు నీ కీను
వెలసిన గజముల వేయింటిలావు - గల కూఁతు నిచ్చితిఁ గనుము పొ మ్మనిన
నావరంబున దాని నాతండు గాంచి - భావించి సుందుని భార్యగాఁ జేసె;
నతఁ డవ్వధూటియం దతిఘోరసత్త్వ - వతుల మారీచసుబాహు లన్వారి
బడసి లోకాంతరప్రాప్తుఁ డౌటయును - గొడుకులు దానును గూడి గర్వమున
నాయింతి మఱి యగస్త్యాశ్రమంబునకుఁ - బోయి మౌనుల సారె బొదిలి కాఱింప
గలశజుఁ డాపాపకర్ములఁ జూచి - యలిగి రాక్షసులు గం డని శాప మిచ్చె.
నది యాదిగా రాక్షసాకృతు ల్పూని - యదయత మానవాహారముల్ గొనుచుఁ
దా నిందు వసియించి ధరణిఁ గాఱించు - దీనిఁ జంపఁగలేరు తెగువ నెవ్వరును,ు760
నీ వొక్కఁడవుదక్క నీచేతఁ గాని - చావ దాఁడుది యని చంపరా దనకు.
మెనసి గోబ్రాహ్మణహిత మైనఁ జాలుఁ - జనుఁ జంపఁ గామినీజనుల రాజులకు.
దొల్లి ధారణియెల్లఁ ద్రుంపఁ జింతించు - ప్రలదురాలైనఁ బర్ణన్యుఁ డలిగి
సంపన్నమతి విరోచనుకూఁతుఁ బట్టి - చంపఁడె యది పశస్తము గాదె యెందు;
నెఱయ లోకంబు లనిద్రముల్ గాఁగఁ - జెఱుపఁ జిత్తంబునఁ జింతించుటయును
నలుక దృఢవ్రత యగుభృగుపత్నిఁ - జల మొప్ప విష్ణుండు చంపఁడే తొల్లి
యది గాన లోకహితార్థమై సతులఁ - బొదివి చంపుటయును బుణ్యంబు లనఘ"

తాటకవధ

యునిన విశ్వామిత్రునతులవాక్యములు - తనతండ్రిపనుపును దలఁచి రాఘవుఁడు
హాటకగర్బాభుఁ డగుమౌనిమాట - దాఁటక తాటక దండింతు ననుచు
ఘనధనుర్ఘోషముల్ గగనంబు నిండ - నినుచుటయును మండి నిండ గోపించిు770
కర్ణకఠోరమౌ కార్ముకధ్వనికి - ఘూర్జితారుణనేత్ర కుటిలాస్య యగుచు
రెండుహస్తము లెత్తి ఱెక్కలతోడి - కొండ రివ్వున వచ్చు కొమరు దీపింప
విదితాట్టహాసంబు వెలిదంష్ట్రరుచుల - వెదచల్ల దివియెల్ల వెసఁ బెల్లగిల్లఁ
జరణఘట్లటనములఁ జటులసత్త్వంబు - ధరణికిఁ దెలుపుచుఁ దవిలి యేతెంచు
తాటక గనుఁగొని దశరథరాముఁ - డాటోప ముప్పొంగ ననియెఁ దమ్మునికి



“జూచితే లక్ష్మణ చూచితే దీని - నేచంద మేయంద మేయుగ్రదృష్టి
దీనిఁ జూచిన గుండె దిగు లేరికైన - మానునే యటుగాన మర్దింతు దీని”
ననుచుండ గర్జన మాకసం బగలఁ - జనుదెంచి పదధూళి సకలంబుఁ గప్ప
నలిమీఱి ఘోరదానవురాలు తాలు - కలగొనఁ గురియ రాఘవుఁడు గోపించి
యనుపమాస్త్రంబున నమ్మహాశిలలు - దునుమాడి దానిచేతులు ద్రుంచివైచె780
నప్పుడు లక్ష్మణుం డసురేశుచెలియ - కప్పాటు గావింతు నని యన్నకరణి
ముక్కును జెవులును మొదలంట గోసె - నక్కామరూపిణి యక్కజం బొదవ
మాయలు ధరియించి మఱియుఁ బెక్కమ్ము - లాయింతి గురియ విశ్వామిత్రుఁ డనియె
“ననఘ! సంధ్యాకాల మగుచునున్నదియు - దనుజుల నెందు సంధ్యల గెల్వరాదు.
నీ వింకఁ గృప మాని నెలకొని దీని - నీవిశ్వహితముగా నిట చంపు" మనుడు
గాధేయమునిమాట గడపక శబ్ద - వేదిబాణముల నవ్వెడమాయ లడఁచి
పెడపెడ నార్చుచుఁ బిడుగుచందమున - నడతెంచుచున్న దానవి నిరీక్షించె.
మహితాస్త్ర మొకటి చన్మొన నాటనేయ - బహురక్తధారలు పర్వ నావనిత
యసురశిక్షారంభమం దది రాముఁ - డొసఁగెనో శరముల కుపహార మనఁగఁ,
బ్రళయమారుత మనఁ బగిలి సంధ్యాభ్ర - మిలఁ గూలు తెఱఁగున నిలఁ గూలెఁ దూలి790
యప్పు డానందించె నఖిలభూతములు - నప్పు డానందించి రమరులు మునులు;
ఆరాము దీవించి యాలింగనంబు - గారవంబునఁ జేసెఁ గౌశికుఁ డంత.
దేవగంధర్వాదిదివిజులు గొలువ - దేవేంద్రుఁ డచటి కేతెంచి, శ్రీరామ!
దేవునిఁ గాంచి ప్రార్ధించి పూజించి - దేవవిధేయు గాధేయు నీక్షించి,
“మమ్ము రక్షింప నిమ్మహిఁ బుట్టినట్టి - యమ్మహామహునకు నిమ్ము భృశాశ్వ
సంతాన మైన యస్త్రములు శస్త్రములు - నంతయు" నని చెప్పి యరిగిన దివికి
నినుఁ డంతఁ గ్రుంకె నయ్యెడను నాఁ డుండి - ముని మఱునాఁడు రామునిఁ బ్రేమఁ జీరి

శ్రీరామునకు విశ్వామిత్రుఁడు భృశాశ్వసంతానములైన యస్త్రశస్త్రముల నిచ్చుట

"రామ! నీవిక్రమరణకేళి చూచి - యేము మెచ్చితిమి; నీ కిచ్చెద మింక
నమరోరగాసుతయక్షయుద్ధముల - సమధిక మగునస్త్రశస్త్రంబు" లనుచుఁ
దనశుద్ధితోడ సుస్థలినిగూర్చుండి - మునిపతి రాముఁ బ్రాఙ్ముఖునిఁ గావించి800
యమలమనస్కుఁడై యఖిలంబుఁ దలఁచి - క్రమమున దండచక్రంబును ధర్మ
చక్రంబు మఱి కాలచక్రంబు విష్ణు - చక్రంబు శక్రువజ్రంబును నసియుఁ
బాశిపాశము ధర్మపాశంబు కాల - పాశంబు నీశానుభయదశూలంబు
నొగి శక్తియుగ్మంబు నుగ్రమై మిగుల - నెగడు నుష్ణానుష్ణనిర్మితాశనులు



కంకాలమును ఘోరకరవాలముసల - కంకణాఖ్యంబులుఁ గ్రౌంచబాణాది
శస్త్రంబు లొగి నిచ్చి సమ్మదం బడర - నస్త్రంబు లాగ్నేయ మన నొప్పునదియు
బ్రాహ్మంబు తేజఃప్రభంబు నైంద్రంబు - బ్రహ్మశిరంబును బ్రస్థాపనంబు
నారాయణంబు పైనాకంబు శిఖర - దారుణశౌర్యసుదామనంబులును
బ్రశమనమును విలాపనము సత్యంబు - విశదప్రభలఁ బొల్చు విద్యాధరంబు
వాయవ్యసౌమసంవర్తాస్త్రములును - మాయాధరాస్త్రంబు మానవమథన810
సౌమనసహరుద్రసంతాపనములు - తాపసమౌసలదర్పణాస్త్రములు
హయశిరంబును మాయ లడరించి చాల - జయ మిచ్చుగాన్ధర్వసమ్మోహనములు
సొరిది నైష్ఠికమును శోణితాఖ్యంబు - నరుదుగ నాగ్నేయమను సాయకంబు
గరుడబాణంబును గౌబేరశరము - నారసింహాస్త్రంబు నాగబాణంబు
వారింపరానట్టి వైష్ణవాస్త్రంబు - వారక నుతి కెక్కు వైద్యాధరంబు
రౌద్రబాణంబును రాక్షసాస్త్రంబు - భద్రప్రదం బైన పాశుపతాస్త్ర
మొగిఁ గర్తరీచక్రములును మేఘాస్త్ర - మగణితంబైనట్టి యస్త్రజాలముల
నఖిలదారుణ మైన యమరమోదకియు - శిఖి యనఁదగు నుల్లసిలుగదఖడ్గ
వామనపైశాచవాయవ్యశస్త్ర - సోమసౌమ్యాఖ్యానసంవర్తనములు
సామంబు మదనంబు సంతాపనంబు - తామసంబును జగదాస్త్రదారుణము820
కంకోలకాహలకరవాలముసల - కింకిణుల్ మొదలుగాఁ గీలితాస్త్రముల
నెలమి నిచ్చిన దానినెల్లఁ గైకొనుచు - నలరి రాముం డమ్మహాత్మునిఁ జూచి
"మునినాథ! సకలాస్త్రములు భవత్కరుణఁ - గని కృతార్ధుఁడ నైతిఁ; గావున
నింక సలలితంబుగ నుపసంహరణాస్త్ర - ముల నొసంగు," మటన్న ముదమంది యతఁడు
సత్యవంతము రభసము పరాఙ్ముఖము - సత్యకీర్తియు దశాక్షము నవాఙ్ముఖము
ప్రతిహారతరము మారణము సుశుచియు - శతవక్త్రదైత్యదృష్టములు లక్ష్యములు
గ్రశనంబు కరవీరకరిసత్యకీర్తి - దశశీర్షమును శతోదరము జ్యోతిషము
విమలంబు మకరంబు విరుచి నిష్కులియు - బ్రమథనంబును సునాభంబును సర్వ
నాభంబు మఱి దుందునాభంబు పద్మ - నాభంబుఁ దృణనాభనైరాశ్యములును
గామరూపంబు నౌ గంధర్వరణము - సౌమనమును నిద్రసంధానములను830
మోహనవిషమాక్షములు మహానాభ - బాహువిభూతి జృంభకములు ధాన్య
ధనువులు వృత్తవంతము రుచిరంబు - నెనయ సార్చిర్మాలి ధృతిమాలి యనఁగఁ
గామరూపంబులు గల మహాస్త్రములు - భూమీశునకుఁ జెప్పి పొలుపాఱ మఱియు
నివియునుగాక యనేకశస్త్రాస్త్ర - నివహముల్ రఘువంశనేతకు నొసఁగి
తత్ప్రభావంబులు తన్మంత్రములును - దత్ప్రయోగంబులు తదుపసంహతులు విలసిల్లు
శస్త్రాస్త్రవిద్యారహస్య - ములు సర్వమును దెల్ప మొగి రామునెదుట



నంగారసదృశంబులై కొన్ని ఘోర - భంగుల ధూమ్రనిభంబులై కొన్ని
యనుపమదీప్తిరమ్యంబులై కొన్ని - తనరారు బహుదివ్యతనువులై కొన్ని
పరువడి చంద్రప్రభంబులై కొన్ని - పరికింప భానుదీప్తంబులై కొన్ని
బహుళాంధకారవిభ్రమములై కొన్ని - మహితాట్టహాసభీమంబులై కొన్ని840
యకలంకమూర్తు లి ట్లమర నేతెంచి - ముకుళితకరయుగ్మములతోడ నిలిచి,
"యేకార్య మొనరింతు? మేమిటఁ బనుపు; మా కేమి యానతి? మనుజలోకేశ"
యనుడు "నేఁ దలఁచినయప్పుడే మీరు - చనుదెండు పొం" డన్న సకలశస్త్రములు
వలగొని మ్రొక్కి యవ్వసుమతీపతికి - నెలమితో మ్రొక్కుచు నేగె నంతటను.
మునినాథుఁ జూచి కే ల్మొగిచి రాఘపుఁడు - వినయంబు భక్తియు విశ్వాస మెసఁగ
"ననఘ! కృతార్థఁడ నైతి నీకరుణ;" - నని వినుతించి విశ్వామిత్త్రువెంట
నరుగుచో నట వామనాశ్రమభూమి - కర మొప్పుటయుఁ జూచి కాకుత్స్థకులుఁడు
“ఈపర్వతముచెంత నిది యొక్కవనము - చూపుల కింపారి సొంపుల నలరి
పొలుచు నానామృగంబులు గల ధ్వనులు - గలపక్షిమృగములు గలిగి చెన్నగుచు,
నున్న దీయాశ్రమం బో సంయమీంద్ర! - యెన్న నెవ్వరిది? యిం దెల్లజంతువులు850
సుఖలీల నున్నవి చూడ నిక్కడికి; - నిఖిలజ్ఞ! యెక్కడ నీయజ్ఞభూమి?
ఎటనుండి చనుదెంతు రేచిరాక్షసులు - చటులోద్ధతులు నీదుజన్నంబు చెఱుప,
యాగరక్షణముగా నఖిలరాక్షసుల - వేగంబె నిర్జింతు విశిఖాళి" ననిన
నక్కౌశికుఁడు జగదభిరాము రాముఁ - జెక్కిలి పుణికి సుస్నేహుఁడై పలికె.
“ననఘ! నీ వెఱుఁగనియర్థంబు గలదె? - వినుము నాచే విన వేడుకయేని
మును విష్ణుదేవుండు ముదముతోఁ దపము - గొనకొని కావించుకొఱకునై యిచట
యుగము లనేకంబు లుండఁగా ననఘ - మగు వామనాశ్రమం బండ్రు మున్ దీని;

శ్రీరాములకు కౌశికుఁడు సిద్ధాశ్రమవిషయ మెఱిఁగించుట

మఱియును సిద్ధాశ్రమంబును ననఁగ - వఱల నీయాశ్రమవనము లోకముల
జననాథ బలి విరోచనుతనూజుండు - ఘనరాజ్యపదమున గర్వంబు మిగిలి
యేచి మరుత్తుల నింద్రాదిసురల - వేఁచి కాఱింపంగ విబుధులు మునులు860
నీయాశ్రమంబున కేతెంచి మ్రొక్కి - తోయజనాభునితోడఁ దా మనిరి
"శరణాగతప్రియ! శరణు లోకేశ; - సరసిజోదర! మాకు శరణంబు నీవ
పన్నుగా మమ్మేఁచు బలి యనువాఁడు - చెన్నొంద జన్నంబు సేయుచున్నాఁడు
అవ్వారి దానవయజ్ఞవాటమున - నెవ్వ రేమడిగిన నిచ్చుచున్నాఁడు
క్రతువు దీఱకమున్నె కావింపు మాకు - హిత" మంచుఁ బ్రార్ధింప నెల్లదేవతలు
నాసమయంబున నదితితోఁగూడ - భాసురవ్రతనిష్టఁ బరగు కశ్యపుఁడు



ఇమ్ములఁ దపము వెయ్యేఁడులు సేయ - సమ్మదంబున విష్ణు సాక్షాత్కరించె.
"నీమహాతనువున నిఖిలలోకములు - సోమార్కలోచన! చూపుము మాకు
నాద్యంతరహితండ వగు నిన్ను వేద - వేద్యుని శరణంబు వేఁడెద" మనినఁ
గరుణ నావిష్ణుండు కశ్యపుఁ జూచి - “వరము నీ కిచ్చెద వాంఛితం బెద్ది870
యడుగుము నీ" వన్న నలరి కశ్యపుఁడు - కడుభక్తితోఁ గరకమల ముగిచి,
"యతిబలోద్దతి నాకు నదితికి నీవు - సుతుఁడవై జన్మించి సురల రక్షింపు
మిది కోర్కి నాకును నీదేవతలకు - మదిలోన మన్నింప మమ్ము నందఱను"
అనవుడు నావిష్ణు వదితిగర్భమున - ననుపమం బగు తేజ మలర జన్మించి
వామనత్వము దాల్చి వచ్చి యద్దనుజు - భూమి మూఁడడుగులు పొసఁగంగ నడిగి
రెండడుగులనే ధరిత్రియు దివియు - దండిమైఁ గొలిచి యాధన్యు బంధించి
లోలత నీమూఁడులోకము ల్వెలయ - నేలుము నీ వంచు నింద్రున కిచ్చె.
నది గాన నిది వామనాశ్రమం బండ్రు - ఇదియ మాయాశ్రమం బీపుణ్యభూమి
సిద్ధించు నిటు దపస్సిద్ధులు గాన - సిద్ధాశ్రమంబు నాఁ జెల్లు నెల్లెడల
నీవె వామనుఁడవై నెగడి త్రివిక్ర - మావతారము దాల్చినట్టి విష్ణుఁడవు. 880
నాఁడును నిది నీవనంబు శ్రీరామ - నేఁడును నారీతి నీవనం బయ్యె."
ననుచుఁ గౌశికుఁడు నిజాశ్రమంబునకుఁ - జని యందు రామలక్ష్మణులఁ బూజించె.

విశ్వామిత్రుఁడు యజ్ఞముచేయుట

నచ్చట మునిజనం బంతయు గొంత - ముచ్చట దీఱ రామునిఁ బూజ సేసె.
నంత రాఘవుఁడు విశ్వామిత్రుఁ జూచి - సంతసంబున “మునీశ్వర! నేఁడు మీరు
యాగదీక్షకుఁ జొరుం డనుమాన ముడిగి - యాగశత్రులనెల్ల నడఁచెద నేను"
అనిన విశ్వామిత్రుఁ డంత హర్షించి - మునుల రప్పించి యిమ్ముగ దీక్ష వడసి
యాగవేదుల మును లర్థిఁ గావింప - యాగాంగములఁ బూర్ణమయి వేది యొప్పె.
నంచితాజ్యాహుతు లందందు దొరుగ - మించి యగ్నులు మండి మింటికిఁ ద్రాక
హోమాగ్నిఁ బ్రభవించుచున్న తధ్వనులు - సామాదివేదప్రసన్నఘోషములు
నాతతదేవతాహ్వాననాదములు - హోతలపుణ్యమంత్రోపనాదములు890
దిక్కులన్నియు నిండి తివిరి ఘోషింప - నక్కజమయి యాగ మటు చెల్లుచుండ
రామభద్రుఁడు ధనుర్ధరుఁడునై మైత్రి - సౌమిత్రియును దాను జాగరూకతను
రక్కసు ల్వచ్చు మార్గము ము న్నెఱింగి - యక్కౌశికుని మౌనియైయున్నవాని
విశ్వమంతయుఁ దమోవృతము గాకుండ - శాశ్వతధృతిఁ గాంచు చంద్రార్కు లనఁగ
గాచిరి కంటికిఁ గనుఱెప్పకరణి - నేచినభక్తి నయ్యెడ నైదునాళ్లు
నలవుమై గవ గూడి యాఱవనాఁడు - బలిమి మారీచసుబాహు లేతెంచి



మేలిఖడ్గద్యుతు ల్మెఱుఁగులు గాఁగ - గ్రాలుకాలాంబుదోత్కరములో యనఁగ,
దళములుఁ దారు నుద్బటవృత్తి మింట - నిలిచి గర్జనములు నిగుడించి మించి
వదలక యయ్యజ్ఞవాటంబులోన - మదమున నుప్పొంగి మాంసరక్తములు
గురియుచో హతలకోలాహలంబు - గరిమ సదస్యుల కలకలధ్వనియుఁ900
బరిచారకులదీనభాషణధ్వనియుఁ - బరికించి విని, రామభద్రుండు పొంగి
"లక్ష్మణా! చూడు నాలా" వంచు విజయ - లక్ష్మి ధనుర్ఘోషలక్షణం బెసఁగ
నెలకొని వినువీథి నిజదృష్టి నిలిపి - బలువడి వాయవ్యబాణ మేయుటయు
నురవడి మారీచు నువ్వెత్తు గాఁగ - సరభసవృత్తిమై శతయోజనములు
గొనిపోయి యఱిముఱిఁ గ్రూరరాక్షసుని - వనధిలోపలఁ బాఱవైచె నాశరము;
అడరి వజ్రమునకు నళికి యంభోధిఁ - బడినమైనాకమై పడినయయ్యసుర
యొకరీతి దరి చేరి యుగ్రాంశుకులుని - యకలంకవిక్రమం బందందఁ బొగడి
దనుజులఁ బాసి యాతతనిష్టతోడ - ననయంబు నాసుచంద్రాశ్రమభూమి
శూరత విడిచి యాసురవృత్తి నడచి - కోరి తపము సేయఁ గూర్చుండె నంత,
అఱిముఱి రఘురాముఁ డగ్నిబాణమున - నురక సుబాహుని యుర మేసి చంపెఁ910
దక్కినరాక్షసదళముల నొకటఁ - జక్కాడె మానవశరమహత్త్వమున
సురలు మోదించి యచ్చో బుష్పవృష్టి - గురిసిరి మునికోటి గొనియాడె నతని,
మున్ను వృత్తాసురు మునుమిడి చంపి - సన్నుతింపఁగ దేవసంఘంబుఁ గూడి
వెలుఁగొందు దేవతావిభునిచందమున - బలువిడి రాముఁడు బాహుశౌర్యమునఁ
గడఁగి యజ్ఞారులఁ గడఁగి శిక్షించి - విలసిల్లె రాముఁడు విభవంబుతోడ.
నతినిష్ఠ వెలయ విశ్వామిత్రుఁ డంత - గ్రతుకర్మ మంతయు గడతేర్చివచ్చి,
"నెలకొని రఘురామ! నీప్రసాదమునఁ - గలఁగకఁ జెల్లింపఁగంటి నీక్రతువు
నని కృతార్ధుఁడ నైతి" నని కౌగిలించి - వినుతించి రాము దీవించి హర్షించి
యనఘమానసుఁడు విశ్వామిత్రమౌని - యనురాగమును బొంది యచ్చోట దాను
భూవరు లారాత్రిఁ బుచ్చి యచ్చోట - వేవిన పూర్వాహ్ణవిధు లాచరించి920
మునులకుఁ బ్రణమిల్లి మునులతో గాధి - తనయునిఁ గనుఁగొని “తాపసప్రవర!
యింక నెయ్యెది కార్య! మెఱిఁగింపు నీకుఁ - గింకరులము నీదుకృపకుఁ బాత్రులము."
అనిన నచ్చటిమౌనులందఱు గాధి - తనయు మున్నిడికొని తా మిట్టు లనిరి.
“జలజాప్తకులవర్య! జనకభూవిభుఁడు, చెలువొప్ప జన్నంబు సేయుచున్నాఁడు,
మన మందుఁ బోదము మనుజేశునింటఁ - ద్రిణయను పాటించుదివ్యకార్ముకము
గంధాదిపూజలఁ గర మొప్ప దేవ - గంధర్వయక్షరాక్షసవీరవరులు



రాముని మిథిలానగరమునకుఁ బోవ మునులు ప్రేరేపించుట

మొదలైనవారికి ము న్ననేకులకు - నది యెత్త నెక్కడ నలవి గాకుండ
నట్టివిల్లును బట్టి యటు లెక్కుపెట్టి - గట్టిగా నెత్తిన ఘనునకు నతఁడు
తనకూఁతు నిచ్చెదఁ దప్పక నేను - ననుచున్నవాఁ"డని యందఱు నపుడు
"జననాథ యాశరాసనలలామంబు - జనకునిజన్నంబు చనుఁ జూడ నీకు"930
ననుచు విశ్వామిత్రుఁ డాదిగా సకల - మునులు నావీరోత్తముల దాశరథుల
లలితపుణ్యుల మిథిలాపురంబునకుఁ - జెలువారఁ బయనంబు సేసి సమ్మదము
నొంది, భాగీరథియుత్తరతటము - జెంది, హిమాద్రియు సిద్ధాశ్రమంబు
వలపట నిడి, యక్షవల్లభుదిశకుఁ - బొలుపారఁ బొందిన భూరిమార్గమున
మూడుయోజనములు మూఁడుజాములకు - నాఁ డేగి యట శోణనదముతీరమున
విడిసి తీర్థస్నానవిహితకర్మములు, నడిపి రమ్యస్థలి నరనాథసుతులు
సంతోషమున మునీశ్వరులతో నుండి - రంత కౌశికుఁ జూచి యారాముఁ డనియె.

కౌశాంబివృత్తాంతము

“గరము ప్రజావృద్ధి గలుగు నీదేశ - మరయ నెవ్వరిదేశ? మానతిం" డనిన
"భూనాథ విను బ్రహ్మపుత్త్రుండు కుశుఁడు - నా నొక్కముని మహోన్నతకీర్తి గలఁడు
అతఁడును వైదర్భి యనునింతివలన - సుతుల నల్వుర గాంచె సురుచిరాకృతులఁ940
బ్రశమితాత్ముల ధూర్తరజసుఁ గుశాంబుఁ - గుశనాభు వసువు నక్కొమరులు మిగిలి
యనివార్యశౌర్యులై యనుపమలీలఁ - దనరు మహాక్షత్రధర్మంబు నడుపఁ
గొడుకులచరితంబు గుణములు చూచి - యడరు సంతసముతో నాకుశుం డనియె.
“నిలఁ బ్రజాపాలనం బెలమి గావింపఁ; - డలఘుకీర్తులు గల్గ" నన ముద మంది
కౌశలంబున నొప్పు నాకుశాంబుండు - కౌశాంబి యనుపేరుఁ గావించెఁ బురము
దశరథాత్మజ మహోదయ మనుపురము - కుశనాభుఁ డొనరించె గుశలుడై ధరణి
శూరుండు ధూర్తరజుండు నిర్మించె - నారంగపురము ధర్మారణ్య మనఁగ
వసువు నిమ్ముల గిరివ్రజ మనుపేరఁ - బసదుగ నిర్మించెఁ బట్టణం బొకటి
యిది ప్రీతి నవ్వసుఁ డేలుదేశంబు - ముద మంది గిరులైదు ముందఱ నొప్పె,
నానగమధ్యంబునందును మాగ - ధానామమున నొకతటిని చెన్నొందుఁ950
జాల నమ్మగధదేశం బెల్ల వసువు - పాలించుచుండును బరమధర్మమున
నచ్చెరు వడరంగ నాకుశనాభుఁ - డచ్చరలేమ ఘృతాచియం దెలమిఁ
గన్నులు మరునంపగములు నా నొప్ప - కన్నెల నూర్వురఁ గడురూపవతులఁ
గనియె నత్తరుణులకమనీయకాంతి - వినుతయావనకళావిస్ఫూర్తు లమర
మంజీరమేఖలామధురవాచాల - మంజులకంకణమధుశింజితములు



కర మొప్పఁగాఁ దాళగతు లనఁ గూడి - మొరయు లీలాలాస్యములు సల్పువారు,
మురిపెంబు లింపార మొగి మృదంగాది - వరవాద్యములు వేడ్క వాయించువారు
పాణిపల్లవలఘుస్ఫారితలీల - వీణామృదుక్వణవితతంబు గాఁగ
మాకందమంజులమధుపానమత్త - కోకిలధ్వనిఁ గూడికొని పాడువారు
నగుచు నుద్యానంబునందుఁ గ్రీడింపఁ - దగిలి యాచెలువలఁ దప్పక చూచి960
కామాంధుఁడై శర్వగతుఁడైన పవనుఁ - డామానినులఁ జూచి యర్ధితో బలికె.
“మానినీమణులార! మఱి వినుఁ డింక - బూని చెప్పెద మీకుఁ బొసఁగంగ నిపుడు
నన్ను వరింపుఁడు నలినాక్షులార! - చెన్నార నమరత్వసిద్ధి గైకొనుఁడు;
ఎన్నఁడు జరలేని యెలజవ్వనంబు - నున్నతయశము మీ కొప్పారఁ గలుగు"
ననిన నల్లన నవ్వి “యనిలుండ వఖల - జనహృదయంబులఁ జరియింతు వీవు,
నీ వెఱుంగుదు మమ్ము, నీమహత్త్వంబు - భావింప కిది యేమి పలికెద వకట!
నియతుఁడై వర్తించు నిర్మలధర్మ - నయశీలుఁ డగు కుశనాభు కూఁతులము
ఓడక మాతండ్రి యుండ మాయంతఁ - గూడుట యటు సేయఁ గులహాని గాదె?
యిరవార మాతండ్రి యెవ్వరికిచ్చుఁ - బరికింప నాతఁడు పతి మాకు" ననినఁ
బవనుఁడు కోపంబు పట్టలే కప్పు - డవయవంబులఁ జొచ్చి యాతలోదరులఁ970
గుదియంగ దిగిచినఁ గుబ్జలై తండ్రి, - కది యెల్ల నెఱిఁగింప నందఱు వచ్చి
విన్ననై వదనారవిందము ల్వాంచి - సన్నిధి నిలిచి బాష్పములు నించుటయుఁ
గుశనాభుఁ డప్పు డాకూఁతులకైన - దశ జూచి వెఱఁగంది తా వారి కనియె,
“నిట్టిరూపములు మీ కెలనాగలార - యెట్టుగాఁ బాటిల్లె? నెవఁ డిట్లు సేసె?
మీ రేల పలుకరు? మీరింత కేమి - కారణం?" బనవుడుఁ గరములు మొగిచి
తమతండ్రితోడ నాధవళాక్షు లనిరి - "మముఁ జూచి పవనుండు మానంబు విడిచి
నన్ను వరింపుఁడు నలినాక్షులార! - యన్న నామాటకు నౌఁ గాక యనక
“మాతండ్రి నడుగు మీమాట నీ" వనిన - నాతండు కామాంధుఁడై యల్గి మమ్ము
గుబ్జలఁగాఁ జేసెఁ గ్రూరాత్ముఁ;" డనిన - నబ్జలోచనలతో నాతఁ డిట్లనియె.
“తగవును ధర్మంబు దలపోసి మీరు - తగదని శీలంబు దాఁట నోడితిరి980
కన్నియలార! మీగౌరవంబులను - నున్నతసత్కీర్తి నొందె నాకులము,
దేవతావిషయమై తెగి యొల్లరైతి, - రీవిధి మీరు సహించుటే లెస్స.
క్షమయె సత్యంబును క్షమయె శీలతయు, - క్షమయె తపంబును క్షమయె కీర్తియును
క్షమయె ధర్మంబును క్షమయె లోకంబు - నమరంగ రక్షించు" నని విచారించి,
తనమంత్రివరులతో దలపోసి చూచి - యనఘాత్ముఁ డగుచూడి యనుమునీంద్రునకుఁ

విశ్వామిత్రుఁడు తనవంశక్రమంబు దెలుపుట

దనుజన్ముఁ డగు గుణోత్తరు బ్రహ్మదత్తుఁ - డనువాని రప్పించి యమ్మహాత్మునకు

ధర్మపత్నులు గాఁగఁ దనదుకన్నియల - నిర్మలబుద్ధిమై నెమ్మి నిచ్చుటయు
చూడిపుత్త్రుఁడు వారిఁ జూచి కైకొనఁగ - వీడె నానూర్వురవికృతరూపములు
అవనీశ! యది మొద లాపురోత్తమము - అవనిఁ గన్యాకుబ్జ మనుపేరఁ బరఁగె.
నాకుశనాభుండు నప్పు డొప్పారు - నాకృతుల్ గల తనయలఁ గనుంగొనుచు990
నలరి యాకూఁతుల నల్లుని ననిచి - యెలమిమైఁ బుత్త్రకామేష్టి గావింపఁ
గొడుకైన కుశనాభుఁ గుశుఁడు వీక్షించి - పడసెదు పుత్త్రునిఁ బరమధర్మాత్ము
వినుతనిర్మలకీర్తివిఖ్యాతు గాధి - యనుపేరు గల పుణ్యు నని యెఱిఁగించి
పరమప్రియంబున బ్రహ్మలోకమున - కరిగె; నాకును మన్మఁడై పుట్టె గాధి,
దశరథాత్మజ! గాధితనయుండ నేను - కుశవంశమునఁ గౌశికుం డండ్రు నన్ను,
మతిధర్మనిష్ణార్థ మాయక్క సత్య - వతి భక్తిమై సురేశ్వరలోకమునకు
వేడుక దనప్రాణవిభుఁడైన రుచికు - తోడ శరీరంబుతోడఁ దా నరిగి
యీలోకమున లోకహిత మాచరింపఁ - బ్రాలేయపర్వతప్రాంతదేశమున
నది గౌశికీనామనది యయ్యెఁ దాను - వెలయ నన్నదిచెంత విహరింతు నేను,
సిద్ధాశ్రమముఁ బవేశించినకతస - సిద్దంబుగాఁ దపస్సిద్ధుండ నైతి;1000
నాదినుండియు మదీయాన్వయస్థితియు - నీదేశవిధమును నేర్పడ వింటి;
నడురాత్రి యరుదెంచె నరలోకనాథ! - కడుడస్సినాఁడవు కనుమోడ్తుగాక!
చలియింపకున్నవి సకలవృక్షములు - మెలఁగవు వనభూమి మృగసమూహములు;
నెఱి విహంగంబులు నీడము ల్చేరి - మఱిచియున్నవి తమమంజులధ్వనులు;
యామినీచరులైన యక్షరాక్షసులు - భూమి విచ్చలవిడిఁ బొరిఁ జరించెదరు;
దీఁటుగ చీఁకటి దెసలు నాకసము - కాటుకఁ బూసినకరణి నున్నదియు,
నీలాంబరంబున నిండుముత్తెములు - గీలించి బ్రహ్మాండగేహగోళమునఁ
గడు నొప్పుగా మేలుక ట్లెత్తినట్ల - యుడుగణంబులతోడ నున్నది నింగి
యడరంగ జనులకు నానంద మొదవ - నుడురాజు పొడతెంచుచున్నాఁ డటన్న
నామాటలకు మెచ్చి యఖిలసంయములు - నామునీంద్రునితోడ నని రప్పు డలరి1010
"నెఱయ నీవంశంబు నిర్మలం బనఘ! - గుఱిలేని మహిమ నీకులమువారెల్ల
బ్రహ్మసమానులు పరికింవ నీదు - బ్రహ్మవర్చసమును బరికింప నొప్పు;"
ననిన విశ్వామిత్రుఁ డమ్మునీశ్వరుల - వినుతించె నంత భూవిభులు, సంయములు,
నారాత్రి నిద్రింప నాప్రభాతమున - నాఋషిపుంగవు లాగాధిసుతుఁడు,
జననాథ! నిద్రయుఁ జాలింపు మనిన - విని తేఱి పూర్వాహ్ణవిధు లాచరించి,
కౌశికుఁ జూచి “యగాధమై చూడ - నీశోణనదరత్న మింత యొప్పగునె?
యాకీర్ణమీనంబు నతిరమణీయ - సైకతంబును సుప్రసన్నతోయంబు
పరిచితహరితాదిపక్షిసంఘమ్ము - తరుణనీలోచ్చలత్తరళతరంగ



మై యున్న దీయేఱు; ననఘాత్మక! మన - మేయెడ దాఁటుద? మెత్తెఱం" గనినఁ
దఱుచుగా మునులెల్ల దాఁటెడుమార్గ - మెఱిఁగిపోదమటంచు నెడదవ్వు పోవఁ1020
గలహంససారసకారండవాది - జలపక్షిరవములు సరి దమ్ముఁ బిలుచు
విధమునఁ జెలఁగంగ వీను లింపార - నధిపుఁ డాలించి, మధ్యాహ్నకాలమున
సిద్ధమునీంద్రసంసేవ్యతీరమును - శుద్ధపుణ్యోదకసుప్రవాహమును
గలిగి నదీతిలకంబై ధరిత్రి - బొలుపారు జాహ్నవి బొడగాంచి, మ్రొక్కి,
“గాధేయ! చూడ నగాధమై తోఁచు - నాధునీరత్నంబు నట దాఁటిపోవఁ
దెరు వింక నెయ్యెది? దెలుపవే" యనిన - "నరనాథ! యట శోణనద ముత్తరించి
మొగి మూఁడుయోజనములు దాఁటి పోవ - నగు నమ్మహానది యందాఁక మనకు
దోయఫలాదులు ద్రోవఁబె" క్కనుచు - నాయేఱు దాఁటి వా రటు పోవుచోటఁ
జెలఁగు సారసగణసేవ్యమై పుణ్య - సలిలమై, యుత్బుల్లజలజమై
మిగుల ఫేనమై, నిత్యగంభీరమై చారు - మీనమై యతిపుణ్యమిళితమై యమరు1030
గంగాతటంబున ఘనలతాసంఘ - సంగతంబగు సమస్థలమున నిలిచి,
మనుజేంద్రతనయులు మాధ్యాహ్నికంబు - లొనరించి ముదమంది యుచితభోజ్యముల
నోజమై మునిగోష్టి నొప్పుచున్నంత; - రాజన్యతిలక మారామచంద్రుండు
రాజహంసోద్ధూతరాజీవరేణు - రాజీవరాజితరంగత్తరంగ
గంగ నాలోకించి, కౌశికుఁ జూచి - "గంగ యీవసుధ కేక్రమమున వచ్చె?
నేతెఱఁగునఁ బోయె నిట నాకమునకుఁ? - బాతాళమునకు నెబ్భంగిఁ దా నరిగె?
నేచి పారావార మేగతిఁ జొచ్చె? - నేచందమునఁ బుట్టె నిమ్మహాతటిని?
చెప్పవే" యనవుడు శ్రీరాముఁ జూచి - యప్పుణ్యధనుఁడు విశ్వామిత్రుఁ డనియెఁ.
గమనీయకాంతులుగల రూపవతులు - హిమవంతునకుఁ గూఁతు లిరువురు గలరు;
అమరులందఱు గూడి యాగంబుకొఱకు - హిమవంతు వేఁడి యాయిద్దఱిలోన1040
గురుపుణ్య యగు పెద్దకూఁతురి గంగ - నరుదారఁ గొనిపోయి రట నాకమునకు
నటమీఁదఁ బార్వతియను పిన్నకూఁతుఁ - బటుతపోనిష్టతో బరితృప్తుఁడైన
ఫాలలోచనునకుఁ బత్నిఁగా నిచ్చె - నాలోలలోచన నానగాధిపుఁడు
సురుచిరరుచి గంగ సురలోకములకు - నరిగి తా సురనది యనుపేరఁ బరఁగె;"
నని చెప్పిమునినాథుఁ డవనీశుఁ జూచి - “వినుము వృత్తాంతంబు వెండియు నొకటి,

కౌశికుఁడు కుమారస్వామి జన్మము శ్రీరామునకుఁ దెలుపుట

పార్వతి వరియించి పరమానురక్తి - సార్వకాలంబును జంద్రశేఖరుఁడు
అతిలోకగతిలోలుడై దివ్యవర్ష - శతము దా రతికేళి సలుపుచున్నెడను
గమలాసనుం డాదిగా సర్వసురలు - దమలోన నెంతయుఁ దారు చింతించి

వెలయ నీయిరువురవిషమతేజంబు - దలఁప నెవ్వరికైన ధరియింప వశమె
యనుచు నందఱు నమ్మహాదేవుకడకుఁ - జనుదెంచి వినతులై సద్భక్తితోడ1050
"దేవదేవ! మహేశ! దేవ! సర్వేశ! - దేవనిస్తారక! దేవ ! నీమహిమ
సర్వగీర్వాణులు సన్నుతించెదరు - సర్వజ్ఞ మాకుఁ బ్రసన్నుండవగుమ;
యేపార నీతేజ మెవ్వరు దాల్ప - నోపుదు; రటుగాన నుడుగు మీవిధము;
కరుణఁదపోవృత్తిఁ గైకొని మీరు - సరి బ్రహ్మచర్యంబు చరియింపవలయు;"
ననవుడు నౌఁగాక యనుచు నాసురలఁ - గనుఁగొని ముదముతో గౌరీశుఁ డనియెఁ
"జలియించె నిదె నిజస్థానంబువలన - నెలకొని మీలోన నిర్జరులార!
యెవ్వరు దాల్చెద రీ తేజ" మనిన - నివ్వసుంధర దాల్చు నింపార" ననిరి,
హరుఁడు నాసురలతో నౌఁగాక యనుచు - ధరణిపై గావించెఁ దద్విమోక్షణము
దివిజ లయ్యెడ నగ్నిదేవు నీక్షించి - "పవనునితోఁ గూడి పావక నీవు
ఇలమీఁదఁ బడియున్న యిమ్మహాతేజ - మెలమిఁ బ్రవేశింపు మింపార" ననిన1060
స్వవశంబుగా నట్టి శర్వుతేజంబు - పవనపావకులును భరియింపలేక
యంగజహరువీర్య మప్పడు వేగ - గంగ లోఁగొన నిచ్చెఁ గరమర్ధితోడ
నిచ్చిన నాయింతి యిరవొందగాను - మచ్చిక ధరియించె మమత రెట్టింపఁ
దనవిభుతేజ మత్తఱిఁ దాల్పలేక - తనమది భయమంది తత్తఱపడుచు
గంగాతరంగముల్ గరము భీతిల్లి - పొంగెల్లి నడఁగుచుఁ బొదలుచున్నపుడు
చిత్తసంక్షుభితయై శీఘ్రంబుగాను - దత్తీరదేశంబు దాఁ జేర్చుటయును
శరవణంబున యందుఁ జయ్యనఁ జొచ్చి - చిరతరంబుగ నందుఁ జెల్వొందుచుండె
నప్పుడు ఋషిపత్ను లందఱుఁ గూడి - యొప్పుగాఁ దమతమయుచితకృత్యములు
తప్పక తీర్పంగఁ దా మేగుదెంచి - రప్పుడు నార్యుఁడు నాగంగఁ జొచ్చి1070
తోయంబు లాడుచుఁ దొడరి వేవేగ - “పాయక శరవణభవ్యస్థలమునఁ
ద్రేతాగ్నులను బోలి తేజరిల్లుచును - బ్రాఁతిగా బ్రచురమై పరఁగుచు లెస్స
నున్నవి యీయగ్ను లొండొరుల్ మనము - చెన్నారఁ జలిచేత జిక్కి స్రుక్కితిమి.
మన్నన లింపొంద మనము నిచ్చటను - గ్రన్ననచే కొనఁగడఁగుద" మనిన
నీశ్వరతేజంబు నిరవొందఁ బుచ్చి - శాశ్వతంబుగ ధర సత్కీర్తి వెలయ
జాతవేదునిఁ జేరఁ జనిన యింతులకు - నాతతంబుగఁ జూచినట్టియింతులకు
నిర్భరవృత్తిమై నిలిచె గర్భములు - గర్భిణులై వారు కర మొప్పచున్న
బహుభీతు లగుచు నాభామిను - లపుడు తహతహపడి మఱి తన్వయత్వమునఁ
దమతమయిండ్లకుఁ దారర్ధి నరుగ - శమితాత్ము లగుమునిసంఘంబు లప్పు
డంత నావృత్తాంత మాయోగదృష్టి - జింతించి మును లల చెలువల కనిరి1080
“మీసత్యశీలత మీదుగర్వంబు - మీ సౌఖ్య మిప్పుడు మిమ్మింత చేసె”,

ననుచు నాగ్రహమున నవని గంపింప - వనితలమీఁద నవార్యకోపమున
“మతిహీనులరు మిమ్ము మన్నింపనేల - పతిదూర లగుఁ" డంచుఁ బల్కిన వినుచు
మగుడ జాహ్నవిఁ జేరి మగువ లందఱును - దగునమ్మ! నీ కిది? తగునంచుఁ బలికి
తమతమబాహుల తాడనంబులును - దమగర్భములమీఁదఁ దగఁ జేసి రొగిని.
గరతాడనంబులఁ గలఁగి కంపించి - కరమొప్ప గర్భముల్ గరఁగి విచ్ఛిన్న
గర్భంబులై యప్డు కాంతలవలన - నిర్భయంబున జాఱి నెఱయంగ నప్పు
డాఱుఖండంబులై యవనిపైఁ బడియె - జాఱిన యాఖండచయము గ్రహించి
శరవణంబునయందుఁ జయ్యనఁ బెట్టి - యరుదలరఁగ లేచి యాతలోదరులు
తపమున కరిగిరి తద్దయుఁ బ్రీతి - నుపమింప నటఁ జాల నుగ్రవీర్యంబు1090
కవగూడి వృద్ధియుం గడుఁగల్గఁజాల - నవనిపై శ్వేతాద్రి యనఁ గడునొప్పె
నరయ నాశైలంబునందుఁ గుమారుఁ - డరుదార జన్మించె నతనితేజమున,
జననప్రదేశంబు శరవణం బగుట - జననాథ! యతఁ డొప్పె శరజన్ముఁ డగుచు
నిలఁ గృత్తికలు చన్ను లిచ్చుటఁ జేసి - యలరుచుఁ గార్తికేయాఖ్యఁ జెన్నొందె,
నారయ నమ్మాత లార్వురుగాన - వారు సంతోషింప వదనంబు లాఱు
ధరియించి సముచితస్తన్యపానంబు - సరినొప్పఁ జేయుట షణ్ముఖుం డయ్యెఁ,
దరుణేందుమౌళిరేతస్కందమునను - నరుదారఁగా స్కందుఁ డన నొప్పె నంతఁ,
బరువడిఁ దము సురల్ ప్రణుతింప నెఱిఁగి - గిరిపుత్త్రి కన్నులఁ గెంపారఁ జూచి,
“సురలార! సంతానశూన్యత మీకు ధరణికిఁ గానిమ్ము; ధరణికి నింక1100
బహునాయకత్వంబు పాటిల్లనిమ్ము;- బహువిధంబుల" నని పలికెఁ గోపించి
కలఁగిరి సుర లంత; గౌరితోఁ దపము - సలుప హేమాద్రికిఁ జనియె నీశ్వరుఁడు.
అమరేంద్రుఁ డాదిగా నఖిలదేవతలు - కమలసంభవుఁ డున్నకడకుఁ దా మేగి,
“జలజసంభవ! భుజాసత్త్వసంపన్ను - నెలమి సేనాపతి నిమ్ము మా" కనిన,
వారిజగర్భుండు వారి నీక్షించి - "గౌరీశుసుతుఁ డైన కార్తికేయుండు
సేనాధిపత్యంబు సేయు మీ" కనిన - నానిలింపులు వేడ్క “నౌఁగాక" యనుచు
జేకొన నాతఁడు సేనాని యయ్యె - నాకనాయకున కున్నతసౌఖ్య మెసఁగ.”
నని పల్కరఘురాముఁ డధికసంతోష - మును బొంది మఱియు నమ్మునినాథుఁ జూచి
“యీమహానది సంయమీశ్వర; త్రిపథ - గామిని యగు టేమికారణం" బనిన?

గంగానదీవృత్తాంతము

ననఘుండు కౌశికుఁ డారాముఁ జూచి - వినుమని యాకథ వివరింపఁదొడఁగె.1110
“ననఘుఁ డయోధ్యకు నధిపుఁడై సగరుఁ - డనుచక్రవర్తి యుద్ధతకీర్తి గలఁడు.
హిమవంతమున నాతఁ డిచ్చలో సుతులఁ - దమకించి భృగుగూర్చి తప మాచరింప

నంత నాభృగుఁడును నాతపంబునకు - సంతుష్టహృదయుఁడై సగరు నీక్షించి,
"పృథివీశ కొడుకులు పెక్కండ్రు నీకుఁ - బ్రథితోరుకీర్తులు పరఁగఁ బుట్టెదరు
అంచితకీర్తిని నతివలం దొకతె - గాంచు నొక్కని వంశకరుఁ డైనపుత్రు
మఱియొక్కసతి గాంచు మానుగా సుతుల - నఱువదివేవుర నతులవిక్రముల”
నని వరం బిచ్చిన నారాజసతులు - విని కరంబులు మోడ్చి వినయంబుతోడ
మునినాథునకు మ్రొక్కి “ముద మంద నొక్క - తనయుఁ డేసతి కన్నతనయు లేసతికి?”
ననవుడు “మీకోరినట్లయె పుత్ర - జననంబు" లని పల్క సంతోష మంది,
యం దగ్రమహిషి నిజాన్వయరుచిక - నందను నొక్కని నరనాథుఁ గోరె. 1120
మఱి కోరె నాయున్నమగువయు సుతుల - నఱువదివేవుర నధికమోదమున
సగరుండు భృగునకు సతులతోఁగూడ - నొగిఁ బ్రదక్షిణమంత నొనరించి ప్రీతిఁ
బురమున కేతెంచి పొలుపారనంతఁ - గరము వేడుకఁ గొంతకాలంబు చనఁగ
మానుగాఁ దనయగ్రమహిషి కేశినియు - సూనుని నసమంజసుం డనువానిఁ
గనియె; నాసుకృతియుఁ గాంతకుఁ బుట్టి - ఘనతరంబైనట్టి గర్భతుంబంబు
కఱుకైన యాసొరకాయలోఁ బుట్టి - రఱువదివేవు రత్యద్భుతలీల;
నంత దాదులు వారి నాజ్యభాండములఁ - గొంతకాలము బెంపఁ గొమరారి వారు
రూపయౌవనముల రూఢమైఁ బెరిగి - రాపెద్దవాఁ డందు నతులదర్పమున
వాపోవఁ దమ్ముల వడిఁ జుట్టి పట్టి - చాపలంబునఁ గట్టి సరయువులోన
వైచిన నవ్వుచు వచ్చిన మగుడఁ - ద్రోచుచునుండు నాదుష్టాత్ముఁడైన1130
యసమంజసున కంత నంశుమంతుండు - దెసలఁ దేజంబులు దీపెంపఁ బుట్టె.
నాయసమంజసుం డతిదుష్టచిత్తుఁ - డైయున్న నతనిఁ బోనడఁచి యారాజు

శ్రీరాముఁడు సగరులవృత్తాంతముఁ దెల్పు మనుట

శాశ్వతధర్మనిష్ఠాపరుం డగుచు - నశ్వమేధము సేయ ననురక్తిఁ దొడఁగె.”
ననినఁ గౌశికుఁ జూచి యారాముఁ డనియె "మునినాథ! మావంశములవారికథలు
విన వేడ్క పుట్టెడు వివరించి చెప్పు" - మనిన విశ్వామిత్రుఁ డనియె రామునకు
“విడువక హిమశైలవింధ్యశైలముల - నడుమ నాసగరుజన్నంబు వర్తించి
యాగంబుచేరువ నంశుమంతుండు - రాగిల్లి యశ్వంబు రక్షించునెడను,
ననిమిషపతి దైత్యుఁడై ముచ్చిలించి - కొనిపోయి పాతాళకుహరంబు సొచ్చి
కపిలసంయమిచెంతఁ గడఁకతోఁ గట్టి - యపరిమితానందుఁడై పోయె దివికి
భూపాలుఁ డశ్వంబు పొడగాన కిచ్చఁ - గోపించి మండుచుఁ గొడుకులఁ జూచి1140
"యిట కాన మశ్వంబు నెవ్వఁడో వచ్చి - కుటిలుఁడై ముచ్చికొనిపోయినాఁడు.
మూఁడులోకంబులు మును మిడి వెదకి - వాఁ డెవ్వఁడైనను వాని నిర్జించి

తెండు గుఱ్ఱము వేగ తెగువమైఁ గడఁగి - పొం" డన్నసాగరుల్ భుజశక్తి మెఱసి
నెరసి బ్రహ్మాండంబు నిండ గర్జించి - యఱువదివేవురు నాప్రొద్దె కదలి
యానాకమర్త్యంబు లంతయు వెదకి - కానక ధరణి వ్రక్కలు సేయఁదొడఁగి,
“యొక్కొక్కఁ డొక్కొక్కయోజనం బుర్వి - నక్కజంబుగఁ ద్రవ్వుఁడని యేర్పరించి
పరువడి పూర్వదిగ్భాగంబు తొడరి - ధర ప్రదక్షిణముగాఁ ద్రవ్వుద " మనుచుఁ
బొరిఁబొరి కుద్దాలభూరిశూలముల - ధర రసాతలమునందాఁకఁ ద్రవ్వుచును
బాతాళవాసులఁ బ్రకటసత్త్వముల - భూతసంతతులఁ జంపుచుఁ జెలంగుచును
వెస నప్పు డఱువదివేలయోజనము - లసమునఁ ద్రవ్వి రాయసమానబలులు.1150
భూరిసత్త్వములఁ జంబూద్వీప మిట్లు - వారక దిరిగి రావడిఁ ద్రవ్వు టెఱిఁగి,
యమరగంధర్వసిద్ధాదులు బెదరి - కమలగర్భుం డున్నకడ కేగి మ్రొక్కి,
“వనపర్వతద్వీపవతి యైనభూమి - చని త్రవ్వుచున్నారు సగరనందనులు
బలువడి సత్త్వసంపన్నంబులైన - జలచరంబులఁ బట్టి చంపుచు, మఱియు
వీఁడు యజ్ఞమునకు విఘ్నంబుఁ జేసె - వీఁ డశ్వహరుఁడంచు విడువక పట్టి,
బలియులై తమదృష్టిఁ బడువారినెల్ల - జలజసంభవ! వృథా చంపుచున్నారు.
దలఁచి నీ విది సమాధానంబు సేయవలయు” నన్నను బ్రహ్మ వారితో ననియెఁ
“గపిలమునీంద్రుఁడై కైకొన్నవాఁడు - తపము నవ్యయుఁడునై దామోదరుండు
అమ్మునికోపాగ్ని యందంద వారిఁ - గ్రమ్మి భస్మంబు గాఁగలవార లింక"
నని పల్క సురలెల్ల “నౌఁ గాక" యనుచుఁ - జని; రంత నక్కడ సగరనందనులు1160
పిడుగులఁ బోలెడు భీకరధ్వనులు - కడుమ్రోయ నిలఁ బ్రదక్షిణముగాఁ గలయ
జుట్టును ద్రవ్వి యెచ్చోట ఘోటకము - పట్టుగానక తండ్రిపాలి కేతెంచి,
"యశ్వంబుపొడ గాన మఖిలంబు వెదకి - యశ్వచోరునిఁ గానమైతిమి దేవ!
యేమేమి సేయుదు మిటమీఁద" ననిన - భూమీశుఁ డలిగి యాపుత్త్రుల కనియె
“విశ్వంబు కలగొని వెదకి నాయెదుట - నశ్వంబు దేక మీ రరుదేరవలవ"
దని పల్క “నౌఁగాక" యనుచు నాసగర - తనయు లుధ్ధతి రసాతలమున కరిగి
యెలమి శిరఃకంప మలుకఁ గావించి - తలకొని యందంద ధరణి కంపింపఁ
“బరువడి పూర్వదిగ్భాగంబుఁ దొడఁగి - ధరఁ బ్రదక్షిణముగాఁ ద్రవ్వుద" మనుచు
దొరకొని యందఱు తూర్పుదిక్కెల్ల - నరసి గుఱ్ఱముఁ గాన కచ్చోట సకల
ధారణీమండలోద్ధరణముకుంద - చారుభుజాదండసమదండకాండ1170
చతురగ్రముల ధరాచక్రంబు మోవఁ - జతురతగల శుభ్రసామజేంద్రంబు
బొడగాంచి సంప్రీతిఁ బూజించి యచటఁ - దడయక మరి బృహద్భానుదిక్కునకు
బోయి నానావిధంబుల నందు వెదకి - యాయశ్వరత్నంబు నందుఁ జొప్పడక
సతతదానచ్ఛటాసమ్మదామోద - భృతశిలీముఖపుండరీకాఖ్యగజముఁ

గనుఁగొని పూజించి కడువేడ్కతోడ - వినుతించి యవ్వల వెదకుచు యామ్య
భాగంబునకు నేగి పరికించి హయము - లా గొకింతైనను లక్షింపలేక
ఘనతరత్వము త్రివిక్రము నాక్రమించు - నని మించు వామనం బను దంతిఁ గాంచి
యర్చించి యవ్వలి కరిగి నైరృతిని - జర్చించి యందు నశ్వము గానలేక
కుముదమార్దవమునఁ గుముదవర్ణమునఁ - గుముదంబునా నొక్కకుంజరేంద్రంబుఁ
గని నమస్కారంబు గావించి యవలఁ - జనిచని పశ్చిమాశాప్రదేశమున1180
శోధించి తురగంబుచొ ప్పింతయైన - సాధింపలేక యంజనశైల మనఁగ,
రంజితమదనిర్ఝరంబులు గలిగి - యంజనం బనునేన్గు నచ్చోటఁ గాంచి
వివిధసత్కృతులు గావించి యామీఁదఁ - బవనునిదెస కేగి బహువిధంబులను
నెమకి గుఱ్ఱముఁ గాననేరక యచట - నముచిసంహరవారణప్రతిమాన
దంత మయ్యును బుష్పదంతాఖ్యఁ బరఁగు- దంతి నీక్షించి మోదమునఁ బూజించి
యటఁ బాసి చని కుబేరావాంతరమునఁ - దటుకున నరసి సైంధవముఁ గానంగ
లేక యచ్చట నొక్కలేఖాధినాథ - లోకగజాధిపలోకైకసార్వ
భౌమమో యన సార్వభౌమాభిధాన - సామజేంద్రము గాంచి సద్భక్తి మ్రొక్కి
సార్వభౌముని పుత్రసంఘంబు గదలి - శర్వునిదెస కేగు సమయంబునందు
ననతిదూరమున హుతాగ్నిని బోలి - కనుఁగవ మోడ్చి యేకతమ గూర్చుండి1190
తననిష్ఠపెంపునఁ దప మాచరించు - ననఘాత్ముఁ గపిలమహామునిఁ గాంచి
యతనిచెంగట నున్నహయము నీక్షించి - యతని భర్జించిన నతఁ డుగ్రదృష్టి
నఱిముఱి సగరుల నలిగి చూచుటయు - నఱువదివేవురు నట భస్మమైరి.

అంశుమంతుఁడు అధ్వరాశ్వముఁ దెచ్చుట

కొడుకు లయ్యశ్వంబుఁ గొనిరాక చాలఁ - దడసిన సగరుండు దాపంబు నొంది
మనుమని నయ్యంశుమంతుఁ బంపుటయుఁ - జని యంశుమంతుఁ డాజాడనే పోయి
యమరేంద్రుదెస విరూపాక్షంబు గాంచి - సముచితస్థితి ప్రదక్షిణముగా వచ్చి
“మాతంగపుంగవః మాపినతండ్రు లేతెంచి రెటుపోయి? రెందున్నవారొ?
తురగచోరకుఁ డెందుఁ దూరినవాఁడొ? వరుస నీ వెఱిఁగింపవలయు నా" కనిన
నాదిగ్గజాధీశుఁ డాయంశుమంతు - నాదరంబునఁ జూచి యప్పు డిట్లనియెఁ.
"బ్రియమార నొక్కెడఁ బృథివీశతనయ; - హయము గాంచెద” వన్న నౌఁగాక యనుచు
నున్నదిక్కరులను నొగి దాఁటిదాఁటి - నన్నిట నిబ్భంగి నడుగంగ నవియుఁ,
బరువడి తా మిట్టు పలుకంగ వినుచు - నరిగి యాముందర నధ్వరాశ్వంబు
నరయుచుఁ గపిలసంయమిపొంతఁ గనియె - సరిప్రోవులై యున్న సగరభస్మములు,
కని చాల శోకించి కరఁగి తండ్రులకుఁ - బొనరఁ దిలోదకంబులు వోయ వెదకి

యుదకంబు గానకయున్న యయ్యెడకు - సదయుఁడై గరుడుండు సనుదెంచి పలికెఁ.

గంగావతరణకథ

"గపిలుని నలుకమైఁ గలచి యమ్మౌని - కుపితాగ్ని సగరులు కూలి నీఱైరి,
యిది యేల శోకింప? నిటు శోక మంద - నిది వేళగా దొక్క టేర్పడ వినుము.
సరసిజాసనవంద్యచరణారవిందుఁ - డరవిందదళనేత్రుఁ డాదిపూరుషుఁడు
బలిదానవేశ్వరు బంధించునప్పు - డలుక ద్రివిక్రముఁడై నిండఁ బెరిగి.
యగణితశక్తి రెండడుగులయందు - జగతీతలంబెల్ల సరి నాక్రమించి,1210
జలజాతజలచరశంఖచక్రము - లలవడునట్టి మూఁడవపదాంబుజము
కడుకొని బ్రహ్మలోకముదాఁక జాపఁ - గడువేగమున వచ్చి కమలసంభవుఁడు
తలకొన్నభక్తితోఁ దనకమండలువు - జలములఁ దత్పాదజలజముల్ గడిగెఁ.
బొగడొందఁ దజ్జలంబులు నభోవీథిఁ - దగిలి వర్తించు మందాకిని యనఁగఁ,
గావున నీ వింకఁ గమలసంభవుని భావించి తప మతిభక్తిఁ గావించి
కడకమై నాకాశగంగఁ దెచ్చి - తడయక భస్మముల్ తడిపినఁగాని,
పరలోకసుఖములు పడయరు వారు - గురుబుద్ధిఁ దురగంబు గొని యేగు” మనిన
దురగంబు గొనిపోయి తొడరి యంతయును - దరమిడి యాతఁడు తమతాతతోడఁ
జెప్పిన శోకించి చేయఁ గైకొన్న - యప్పుణ్యమఖము సమాప్తంబు చేసి
కామించి యాకాశగంగ నీయుర్వి - కెమ్మెయి దెత్తునో? యే నంచుఁ జింత1220
విడువక ముప్పదివేలేండ్లు తపము - పుడమి నెంతయుఁ జేసి పోయెను దివికి.
నారాజుమనుమఁ డయ్యంశుమంతుఁడు - ధారుణి గంగకుఁ డప మొప్పఁ బూని,
వరుస ముప్పదివేలవర్షము ల్సలిపి - పరలోకగతుఁడయ్యెఁ బదపడి యతఁడు,
అతనిపుత్త్రుఁడు దిలీపావనీనాథుఁ - డతినిష్టతోడ జాహ్నవిఁ దెత్తు ననుచు
విడువక ముప్పదివేలేండ్లు తపము - గడపియు నతఁడు రోగములచేఁ జచ్చె.
ననఘుఁ డాతనిపుత్త్రుఁ డగుభగీరథుఁడు - దనరాజ్య మరయఁ బ్రధానుల నిల్పి
సారధర్మజ్ఞులు సద్గుణోజ్జ్వలులు - శూరులు నగునట్టి సుతులను గోరి,
యెల్లపాపంబుల నిలమీఁదఁ బాపఁ - దెల్లంబుగాఁ గంగఁ దెచ్చెద ననుచుఁ
గరమర్థిఁ దపము గోకర్ణాశ్రమమున - నరుదుగాఁ బదివేలయబ్దము ల్సేయ
ననుపమం బగుచున్న యాతపంబునకు- వనజసంభవుఁ డంత వరదుఁడై వచ్చి1230
యడుగుము వర మన్న నాభగీరథుఁడు - కడుభక్తి బ్రహ్మకుఁ గరములు మొగిచి
“భారతీనేత! ప్రపంచనిర్మాత! - సౌరలోకత్రాత! సత్యసంఘాత!
ధాత! మాతాతలు దగ్ధులై వచ్చి - యాతతకపిలుకోపాగ్నిచేఁ గ్రాగి,
నూఱువేలేండ్లు సన్నుతగతిలేక - నాఱడిపడి భస్మమై యున్నవారు;

కడగి యాభస్మముల్ గంగోదకములఁ - దడుపక గతి లేదు దయసేయు" మనిన
"హరుఁడొక్కరుఁడు దక్క నన్యు లాగంగ - ధరియింపనేరరు దగిలి యెవ్వరును;
నీ వింక హరునకు నిష్టమైఁ దపము - గావించి ప్రార్థింపు గంగ ధరింప"
నని పల్కి మదిలోన నతఁ డుపార్థించు - తనయుల నిచ్చి యద్ధరణీశుకొఱకుఁ
దనరంగ నాగంగ ధర కేగు ననుచుఁ - జనియె పద్మజుఁ; డటఁ జని భగీరథుఁడు
అంగుష్ఠ మొక్కటి యవనిపై మోపి - యంగజహరునకు నతిఘోరతపము1240
దలకొని చేయఁ బ్రత్యక్షమై శివుఁడు - "తలదాల్తుఁ దెమ్ము మందాకిని" ననియె
నంత భగీరథుం డర్థిఁ బ్రార్థింప - నంతరిక్షస్థలమందుండి గంగ
గగనమండలము నక్షత్రమండలముఁ - బగుల లోకము లెల్లఁ బగుల మ్రోయుచును
గులపర్వతములతోఁ గుంభినితోడ - బలసి మహాదేవుఁ బాతాళమునకు
గొనిపోవుతెఱఁగున ఘోరమై పర్వి - చనుదెంచు నురవడి జగములు బెదర
వచ్చు నాగంగగర్వముఁ బాప శివుఁడు - హెచ్చి జూటముఁ బెంచె నింతలో గంగ
వచ్చి మహాదేవు వరజటావీథిఁ - జొచ్చి వెల్వడుత్రోవ చొప్పడకున్న

భగీరథుఁడు గంగను దెచ్చుట

హరుజటాజూటమహాటవిఁ జిక్కి - తిరుగుడుపడుచు వర్తించుచునుండె.
నంత భగీరథుం “డతులప్రవాహ - మంతము నిప్పు డెం దరిగెనో?" యనుచు
వెఱగంది మఱియును విషకంధరునకుఁ - దఱిగొని యత్యు గ్రతప మాచరించి1250
నపరిమితప్రీతి నాభగీరథుని - తప మంత మెచ్చి కందర్పహరుండు
లోలతఁ దనమౌళిలోనున్న గంగ - "భూలోకమున కింకఁ బొ"మ్మని యనుప
వలనొప్పుజూటంబు వాకిలి వెడలి - బొలు పొందఁ బాతాళమునఁ జూపు నిలిపి
తనదివ్యదృష్టి మందాకిని కపిలుఁ - గని “మునిమహిమకుఁ గడుఁజోద్య మంది
తగిలి ని న్నలచిన దారుణాకృతుల - సుగతికిఁ బంపవచ్చుచునున్నదానఁ
గినియకు మీవని కేలర్థి మొగిచె" - ననఁ బద్మముకుళంబు లమరఁ జూపఱకు
నడరు నమ్ముని కిన్క నటు పోవ వెఱచి - సుడివిడుతెఱఁగున సుడులొప్ప మిగుల
మామీఁద జనుదెంచు మలయుచు గంగ - యే మెక్కడికిఁ బోదు మిటమీఁద ననుచుఁ
బఱతెంచి సగరులపాలిపాపములు - మొఱపెట్టుచున్నవి ముక్కంటి కనఁగ
నోలిఁ బంకజముల నుండరాకున్న - దూలి యాకసమునఁ దుమ్మెద ల్మ్రోయ1260
భూతాధిపతిజూటముననుండి ధరణి - కేతెంచు గంగకు నెండగాకుండఁ
గొడుగులుపట్టిన కొమరున హంస - లుడువీథి సుడిపడి యొప్పారుచుండఁ,
దొడఱి యాసగరులదోషోత్కరములు - కడఁకమై బోద్రోచుకరములో యనఁగ
గమనీయతరములై ఘనతరంగముల - గము లంతకంతకుఁ గరమొప్పు మిగులఁ

దనవారిలోపలఁ దగ భగీరథున - కనుపమసితకీర్తు లందందఁ బుట్టి
నెఱసి భూతలమెల్ల నిండ నేతెంచు - వఱుసన నుఱువులు వఱలంగ, గంగ
యప్పటప్పటికిని నతులఘోషంబు - లుప్పొంగి యుప్పొంగి యుడువీథి ముట్టి
బ్రహ్మాండభాండము ల్వగులఁ బెల్లుబ్బి - బ్రహ్మాదిదేవత ల్భక్తితోఁబొగడ
శివుఁడు ధరించిన శ్రీగంగ యపుడు - భువిఁ బామరులకెల్లఁ బుణ్యంబు నీయ
వచ్చితి నని గంగ వరుసగాఁ జెప్ప - వచ్చినవిధమున వరుస ఘోషించి,1270
సురలు ఖేచరులును సుముఖులై చూడ - గరుడగంధర్వులు గరము భూషింపఁ
జనుదెంచి బిందువ న్సరసిలోఁ జొచ్చి - యెనయఁ బ్రవాహంబు లేఱులై పాఱి
యనఘాత్మ! పావని హ్లాదిని నలిని - యనఁ బ్రవాహములుమూఁ డరిగెఁ దూర్పునకు;
సీత సుచక్షువు సింధువు నాఁగ - భాతితో మూఁ డేగెఁ బడమటిదెసకు
నడరుచు నుప్పొంగి యందులో నొకటి - కడఁగి భగీరథక్ష్మాపాలుపిఱుఁద
ఘనతరవిశదోదకప్రవాహంబు - వినువీథి శరదభ్రవిభ్రమం బెసఁగ
దివి కేగ మదిలోనఁ దివురుభూజనుల - కవిరళనిశ్శ్రేణు లమరుచందమున
నిలయు నింగియు మ్రోఁగునెడ బ్రవాహంబు - గలయ నానామాలికలు వీచు లమర
నీభంగిఁ ద్రిప్పుదు నెల్లపాపముల - నాభంగిఁ జూడుఁడీ యన సుడు లొప్పఁ
జెలిమిఁదారలతోడఁ జేయఁజన్కరణిఁ - బెలుచ నింగికి నంబుబిందువు లెగయ,1280
ధర్మాత్ములగువారి ధర్మకీర్తులకు - నిర్మలస్థానమై నెఱిఁబొల్తు ననుచుఁ
గేలి నయ్యాపగాకీర్తులు నవ్వు - లీల డిండీరమాలిక లుల్లసిల్ల
బెక్కుఁగన్నులఁ గాంతుఁ బృథివిపెంపెల్ల - మక్కువ ననుభంగి మత్స్యము లొలయఁ
జరియించు కొమరారు జలచరావళులు - పొరినొప్ప నేతెంచె భూలోకమునకు.
నంత శతార్కమై యమరుచందమునఁ - గాంతిమద్భహురత్నఖచితంబులైన
నిజభూషణంబుల నింగి వెలుంగ - గజవిమానాదులు కర మర్థి నెక్కి
యమరగంధర్వసిద్ధాదులు చూడ - నమరంగ నేతెంచి రజుఁడు నేతెంచె
నట మహానాగంబు లాప్రవాహంబు - చటులవేగము చూచి యట మ్రొగ్గుటయును
అంతయు నానిర్జరాదులు చూచి - చింతించి జపములు చేసి రాలోన
నానదిగట్లనే యవగాహ మంది - యానందమును బొంది యాడి రచ్చరలు1290
అమరమునీంద్రాదు లంత సంతోష - మమరఁగాఁ బువ్వుల నర్చించి రెలమి,
నాపుణ్యనదిలోన నతిపాపరతులు - శాపదగ్ధులు కృతస్నానులై దివికిఁ
జనుచుండ సురలు నచ్చరులు గంధర్వ - దనుజపన్నగయక్షదైత్యరాక్షసులు
కిన్నరాదులు నాభగీరథురథము - వెన్నాడి కనుఁగొంచు వేడ్క నేతేరఁ
బెరిగి పర్వతములు భేదించుకొనుచు - నరుగఁ జహ్నుఁడు యాగ మాత్రోవఁ జేయ
వరదగా నటువచ్చి వలగొని గంగ - సరిచుట్టుముట్టిన సరగున నపుడు

యాగోపకరణంబు లవి వెల్లివోయి యాగవిఘ్నంబైన నతఁ డాగ్రహించి
నింగికి నుప్పొంగి నెఱి నేగుదెంచు - గంగ నాకర్షించి కలుషించి క్రోలె.
అనిమిషమునివరు లాభగీరథుని - గనుఁగొని పల్కిరి కరమర్థి మీఱి
"నీమహాగంగ ని ట్లీమునీశ్వరుఁడు - ఈమాడ్కిఁ గ్రోలెనే యిప్పుడె నీవు
కోపంబు లేకుండఁ గోరి యీమౌని - నీపట్ల వేఁడిన నిచ్చును గంగ"1300
అని యిట్లు దేవత లందఱుఁ జెప్ప - వినయంబుతోఁ బోయి వేడ్క నమ్మౌని
గనుఁగొని మ్రొక్కుచు గరములు మొగిచి - వినయసంభరితుఁడై వేడ్క నిట్లనియె
‘‘వినవయ్య మునిచంద్ర! విమలచారిత్ర! - ఘనమైనగంగను ఘనమైనతపము
చేసి యుర్వికి గంగఁ జెలఁగుచు నిపుడు - వాసిమైఁ దెచ్చితి వరుస నిచ్చటను
మోసమై మీచేత మొనసికోల్పడితి - నోసంయమీశ్వర! యోపరబ్రహ్మ
దయచేసి విడిపింపు ధన్యచారిత్ర - దయచేయు సంయమీ! దయచేయు” మనుచు
వినయంబుతోఁ బల్క విని మౌనివరుఁడు మనమునఁ గృపపుట్ట మఱియు నిట్లనియె.
“నోభగీరథచంద్ర!యోమహారాజ! - యీభంగి గంగను నిలకుఁ దెచ్చుటకు1310
నీమహత్త్వంబును నీతపోమహిమ నేమని చెప్పుదు నిఁక నీదుకీర్తి
విడిచెద గంగను విడిచెద నిపుడు - పుడమిలో నాకీ ర్తి పొలుపొందు" ననుచు
నుమిసి యెంగిలి సేయ నొల్లక యతఁడు - రమణమై దనకర్ణరంధ్రంబునందు,
వెడలింప నెప్పటివిధమున గంగ - యడరుచు జాహ్నవి యనుపేరఁ బరఁగెఁ.
బురుషపురాకృతపుణ్యంబునడుము దొరకొన్న విఘ్నంబు ద్రోచి యేతెంచు
వెరవున నారాజువెంటనే వచ్చి - శరనిధిఁ జొచ్చి యాజాహ్నవీదేవి
దిగి రసాతలమునఁ దిరిగి యందున్న - సగరులభస్మము ల్సరినిండఁబాఱె.
నంత నంబుజగర్భుఁ డాభగీరథుని - సంతసంబునఁ జూచి "జననాథ వినుము
జలనిధి నెందాఁక సలిలంబు లుండుఁ - దలఁప నీసగరులతనయు లందాఁక
దివ్యభూషణముల దివ్యాంబరముల - దివ్యమాల్యంబుల దివ్యగంధముల1320
దివ్యమూర్తుల నొప్పి దివిజలోకమున - దివ్యభోగముల వర్తించుచుండెదరు
అడరంగ నిదిమొద లనఘ నీపేర - నడుచు భాగీరథీనామ మీనదికిఁ
ద్రిపథ యనంగ వర్తిలు వరద యన - నృప జాహ్నవి యనంగ నెగడు లోకముల
అనఘ! మీసగరుండు నంశుమంతుండు ఘనుఁడు దిలీపుఁడు గైకొన్న వ్రతము
నెఱపఁజాలమి నీవు నెఱపంగఁ దివిరి - తెఱఁగొప్ప నీగంగఁ దెచ్చితి కాన
·గంగాంబునిర్మలకమనీయపదము - మంగళచిరకీర్తిమహితుండ వగుము,
కాకుత్స్థకులజుల గౌరవశ్రీల - కాకరం బగు తనయావళిఁ గనుము
లలితధర్మముల మూలస్తంభ మైతి - పొలుపార నింక నీపుణ్యోదకముల
వెలయఁ దీర్ఘస్నానవిధు లొప్పఁదీర్చి - ఫలము గైకొను" మంచుఁ బద్మసంభవుఁడు

తనలోకమున కేగెఁ; దదనంతరంబ - తనర నాగంగఁ గృతస్నానుఁ డగుచు
నఱువదివేవుర కాభగీరథుఁడు - నెఱిఁ దిలోదకములు నిష్ఠతో నిచ్చె.1330
నాతిలోదకముల నమరులై సగరు - లాతని దీవించి యరిగిరి ది వికి
ననఘుండు మఱి యయోధ్యాపురంబునకుఁ - జని భగీరథుఁడు రాజ్యము సేయుచుండెఁ
గలుషఘ్న మీయుపాఖ్యానంబు భక్తి - చెలువారఁ జదివినఁ జెప్పఁగా వినిన
నొనరఁ బుణ్యముల నాయుష్మంతు లగుచు - ధనధాన్యకీర్తులఁ దనరుచునుందు;
రెప్పుడు వారల కెల్లదేవతలు - నొప్పఁ బ్రసన్నులై యుండుదు రెలమి,
నమరంగ సిద్ధించు నఖిల కార్యములు ; - సమకొను నంచితస్వర్గభోగములు
పెనుపారఁగా వారిపితృగణంబులకు - ననుపమసద్గతు లనిశంబుఁ గలుగు”
ననిన రాఘవుఁడు గంగావతారంబు - విని కౌశికునిఁ జూచి వినుతులు సేసి,
నేఁడు విశ్వామిత్ర నీచేత వింటిఁ; - బోఁడిమి నీగంగ భూలోకమునకు
వచ్చినతెఱఁగును, వారితెఱంగు - నచ్చెరు వడరంగ నని ముదం బంది1340
యారాత్రి యందుండి యఖిలలోకములు - నారూఢి కెక్కిన యానది గ్రుంకి,
యాహ్నికకృత్యంబు లన్నియుఁ దీర్చి - జాహ్నవి దాఁటి, విశ్వామిత్రుతోడ
నుత్తరతటమునం దున్నసంయములఁ - జిత్తంబు లలరఁ బూజించి, వీడ్కొనుచుఁ
జని చని యెదుట విశాలయన్పురము - కనుగవ కింపైన గాధేయుఁ జూచి

అమృతోత్పత్తి

"యీపురిపే రేమి? యేరాజవంశ్యుఁ - డేపుమైఁ బాలించు? నెఱిఁగింపు" మనిన
ఘనుఁడు కౌశికుఁడు రాఘవుఁ జూచి పలికె - విను మింద్రుకడ మున్ను విన్నాఁడ నేను
దితిసుతులైన దైతేయులు నదితి - సుతులైన సురలు భాసురలీలఁ దొల్లి
నోలి రసంబులు నోషధుల్ నించి - పాలసముద్రంబు పరువడి ద్రచ్చి
క్రమ మొప్ప నమృతంబు గైకొంద మనుచు - సమమైత్రి నాసుధాజలరాశి డాసి1350
కవ్వంబు తరిత్రాడుగా మందరంబు - నవ్వాసుకిని జేసి యమృతాబ్ధిఁ దరువ
వెలయంగ నటఁ బుట్టి విష ముగ్ర మగుచుఁ - గలయ లోకంబుల గాటించి మించ
బరఁగ రోషానలపరుషంబునైన - హరుఁ డది గొని మ్రింగె నంత నుమియుట
నురగముల్ ధరియించె నోలిఁ దద్విషము - మఱి మఱి తరువంగ మఱియును బుట్టె
వంచన మన్మథావాప్తి లోకముల - ముంచి యెత్తగఁ జాలు మురిపెంబు లమర
గాంచీఝణత్కారఘననితంబములు - నించుకనడుమును నెఱియుఁ జన్గవలు
చంచలతనులత ల్సరిదంతచయము - మించు కన్గవయును మెఱయుమోవియును.
గోమలభ్రూలతాకోదండుఁ డైన - కాముని విలువిద్యగతి చూప నొప్పి
కడఁగంటిచూపులఁ గక్షదీధితుల - భుజలతావిక్షేపములును

అమర నూతనయౌవనాభిరామముల - నమర నరువదికోట్లయప్సరోగణము
లీలమై నచ్చరలేమలనెల్ల - నోలి దేవతలు దైత్యులును గైకొనిరి.1360
వారక దరువ నావరుణాత్మజాత - వారుణి ప్రభవించె వైభవం బలర
నాసురదితిసుతు లపు డొల్లకున్న - నసురులై వర్తిల్లి రవని నెల్లెడల
సుర నాదితేయులు సొరిదిఁ గైకొన్న - సుర లనఁ బ్రఖ్యాతి శోభిల్లి రపుడు
సంతసంబున రమాసతి దురంగంబు - కాంతి మిన్నగు దంతి కౌస్తుభమణియు,
నమృతాంశుఁడును బుట్టె, నమృతంబు సురభి - నమరు సుధాపూర్ణ మగుకమన్డలువు
కలిగి ధన్వంతరి కర మొప్పఁ బుట్టె - వెలయంగ మఱి పుట్టె విష ముగ్రముగను
నంత సురాసురు లమృతంబుకొఱకు నెంతయుఁ దమలోన నేచి దర్పమున
ననుపమస్థితిఁ బోర నసురుల సురలఁ - గనుఁగొని సురలపైఁ గరుణించి మించి
మానినీరూపమై మధుమర్దనుండు - తా నమృతముఁ బంచి తగ నిచ్చువేళ
రాహుకేతువులను రాక్షసు లప్పు - డూహించి పంక్తిలో నొగిఁ గూరుచుండి1370
చెయి జాచి పట్టిన జెలఁగుచు సుధను - మెయిచాయ జూడక మెలఁత యిచ్చుటయు
రవిచంద్రు లప్పు డారమణిని జూచి - కవగూడి యిద్దరుఁ గళవళం బంది
కనుసైఁగ నటుచూపఁ గనలుచు - వనువొందఁ జక్రంబు నటు ప్రయోగించి
శిరములు ఖండించి సృష్టిలోపలను - కఱకురాక్షసుతలల్ కడుగ్రహంబులుగ
నామింట నిలిపెను నమృతంబు ద్రావ - నేమియుఁ జెడకుండ నెప్పుడు వారి
నాదిగా నెప్పు డయ్యాదిత్యుఁ జంద్రు - బాధించుచుందురు పర్వంబులందు
నసురులు గను బ్రామి యమృతంబు సురల - కొసఁగి వారికి జయం బొసఁగె యుద్ధమున.
దైతేయకోటియందఱఁ ద్రుంచి యింద్రుఁ - డాతటి జగంబు లర్థిఁ బాలింప
దితి యంతఁ దనసుతు ల్దెగుటకు నొగిలి - పతియైన కశ్యపుఁ బ్రార్థించి, “యింద్రుఁ
జంపఁజాలిన మహాసత్త్వప్రతాప - సంపన్ను నొకనిఁ బ్రసాదింపు" మనిన
నంగీకరించి “సహస్రవర్షంబు - లంగన! ఘనశుచివై యుండఁగల్గు!1380
మూఁడులోకంబులు మొగి గెల్చువాని - వాఁడిమిమై నింద్రు వధియించువాని
గనియెద వొకపుత్రుఁ గాంత నావలన" - నని పల్కి దితిమేను హస్తాంబుజమున
నయమారఁ బరిమార్జనము సేసి మఱియు - దయ జూచి యతఁ డేగెఁ దప మాచరింప,
జనియె నాదితియును సమ్మదం బెసఁగఁ - జని యుగ్రతప మొప్ప సల్పుచునుండె.
నంతట మఘవంతుఁ డత్తెఱం గెఱిఁగి - చింతించి దితిఁ జేరి శిష్యుండువోలె,
పాయక కుశసమిత్ఫలమూలభవ్య - తోయాదు లతిభక్తితోడఁ దెచ్చుచును
జరణంబు లొత్తుచు సత్కృతు ల్మఱియు - బరిపాటి సేవయుఁ బరిచర్య సేయ
నేవేళ నెచ్చట నేమి గావలయుఁ - గావలసినవెల్లఁ గనుసన్నఁ దెచ్చి
యుపచరింపుచు వేడ్క నుండెఁ బెక్కేండ్లు! - నపు డొక్కనాఁ డింద్రు నాదితి చూచి

యలరుచు మది రహస్యము దాఁపలేక “బలభేది! వినుము నాపల్కు నీవొకటి1390
తనయునిఁ గోరి మీతండ్రి నే నడుగ - వినుము వెయ్యేఁడులు వెడలినపిదప
నిచ్చితి సుతునంచు నింపార నాకు నచ్చుగా వర మిచ్చె నటుగాన నీకు
నిటమీఁదఁ బదియేఁడు లేగినపిదపఁ - బటుశక్తి దమ్ముఁడు ప్రభవింపఁగలఁడు
అలరంగ నీవును నాతండు గూడి - పొలుపార నేలుఁ డీభువనత్రయంబు
వినుతకీర్తుల మీరు విలసిల్లుచుండుఁ" డని పల్క నంత మధ్యాహ్నకాలమునఁ
దల నిడి కాల్గడ దలయంపి గాఁగ - నలతమై నిద్రించు నాదితిఁ జూచి,
శతమన్యుఁ డెంతయు సంతోష మంది - వితతవైఖరి నిదేవేళ నా కనుచు,
దితిగర్భ మతియోగధీశక్తిఁ జొచ్చి - శతకోటిచేఁ దనశత్రువౌ శిశువు
నేడుతున్కలు సేయ నెలుగెత్తి బాలుఁ - డేడువ దితియు నయ్యెడ మేలుకాంచె,
మఘవుఁడు మారుదో! మారుద! యనుచు - లఘురీతిఁ బలుక "బాలకుఁ జంపవలదు.1400
వల” దనియెడు దితివాక్య మాలించి - వెలువడి గర్భ మవ్వేళ వాసవుఁడు
కరములు ముకుళించి కలఁక చిత్తమున - తిరమైనభక్తిచే దితితోడఁ బలికెఁ.
“దనరంగ గాల్గడ తలయంపి గాఁగఁ - గొని ముక్తకేశివై గూర్కుటఁ జేసి
యరసి నీ వశుచి వైతివి గాన తెగువఁ - గార్యంబుకొఱ కేను కడుపులోఁ జొచ్చి
గొనకొని నినుఁ జంప కోడి గర్భంబు - దునిమితి నే నేడుతునియలు గాఁగ
సన్నకు సన్న నాశత్రుండు గానఁ - జిన్నిపాపనిఁ బరిచ్ఛిన్నుఁ జేసితిని
జనని! ధర్మజ్ఞవై సైరింపవలయు" - ననిన దుఃఖింపుచు నాయింద్రుఁ జూచి
"నానేరమంతయు నాకలోకేశ - నీనేర మది లేదు నిక్కువం బరయ”
నని పల్కి మరుదాఖ్య లమరఁదేజంబు - లెనయంగ ఖండంబు లేడ్వురునగుచు
నిమ్ముల "నాపుత్రు లెలమి నెల్లెడల - సమ్మద మింపార చరియింపనిమ్ము1410
సప్తఖండంబులై సరినొప్పువీరి - సప్తమారుతగణస్కంధనాయకులఁ
గావింపు" మని వేఁడగా నట్లుచేసి - దేవేంద్రుఁ డమరావతికిఁ బోయె నంత
వారును దేవతావల్లభుచెలిమి - మారుతగణసంజ్ఞ మఱి దివ్యు లైరి.
దేవేంద్రుఁ డతిభక్తి దితికి శుశ్రూష - గావించె నీపుణ్యగణ్యదేశమున;
నీపుణ్యధరణి మున్నిక్ష్వాకునృపతి - భూపవర్యుం డలంబుసయందుఁ గన్న
కొడుకు విశాలుఁ డన్కువలయాధిపుఁడు - పుడమి నేలి విశాలపురి యిం దొనర్చె.
నావిశాలునిపుత్రుఁ డై హేమచంద్రుఁ - డావిర్భవించెను నతఁడు సుచంద్రు
నతఁడు ధూమ్రాశ్వుని నతఁడు సృంజయుని - నతఁ డంత సహదేవు నతడు కుశాశ్వు
నాతండు సోమదత్తాఖ్యుఁ గాకుత్స్థుఁ - డాతని కెంతయు నమరంగ సుమతి

సుమతి యను రాజు విశామిత్రు నెదుర్కొనుట

భావింప నెప్పుడు పరమధర్మముల - నీవిశాలాపురం బేలెడి రాజు,1420
లనఘ! వైశాలికు లన వీరు జగతి - వినుతికెక్కిరి ధ రవిభవసంపదల ;
నిచ్చల రఘునాథ! యిచట నీరాత్రిఁ - బుచ్చి వేగినఁ జూడఁబోద; మిజ్జనకు
ననునంత గాధేయుఁ డట వచ్చు టెఱిఁగి - మనమున సంతోషమగ్నుఁడై సుమతి
తనపురోహితులును దనబంధుజనులు - తనతోడఁ జనుదేరఁ దనపట్టణంబు
వెలువడి చనుదెంచి విహితమార్గమున - నెలమితో నాసంయమీంద్రుఁ బూజించి
కరములు ముకుళించి కడుభక్తి బలికె - "ధరణిలోపల నేఁడు ధన్యుఁడ నైతిఁ
జరితార్థ మయ్యె నాజననం" బటంచుఁ బరమప్రియంబునఁ బలికి యొండొరుల
నమరంగఁ గుశలంబు లడిగినపిదప - సుమతి విశ్వామిత్రుఁ జూచి తా ననియె:

సుమతికి శ్రీరామలక్ష్మణులనుగూర్చి కౌశికుఁడు తెల్పుట

"మునినాథ! యసమానమూర్తు లీఘనులు - ఘనభుజు లనిమిషక్రమపరాక్రములు
కరిరాజగమనము ల్కంఠీరవములఁ - బురుడింపఁజాలిన భుజసత్త్వములును1430
లలితంబులైన పుల్లసితారవింద - దళములఁ దెగడునేత్రములుఁ జెన్నొందఁ
గరవాలములుఁ గార్ముకంబులు దొనలు - ధరియించి దమదుపదన్యాసములను
జగతి నారవిచంద్రసంచారలీల - మగు నాకసమువలె నలరించువార
లిరువురు దమలోన నెల్లచందముల - సరియగుచున్నారు జనులచూడ్కులకు
నీకుమారకు లెవ్వ రెవ్వ రీసుతుల - నాకు నేర్పడ గాధినందన చెపుమ"
యనిన విశ్వామిత్రుఁ డాతనిఁ జూచి - వినిపింపఁదొడఁగెను వీను లుబ్బంగ
“నోరాజకులచంద్ర! యోసుగుణాబ్ధి! - వీరివృత్తాంతంబు వినుము దెల్పెదను;
సరయువుపొంతఁ గోసలదేశమునను - నరు దొప్పఁగ నయోధ్య యనుపురి యొప్పు
నాపురి నేలుచు నాదశరథుఁడు - నేపుమై మనుజుల నెల్లఁ బాలించు
నాతనివరపుత్రుఁ డైనరాముండు - నితనికి ననుజాతుఁ డీలక్ష్మణుండు1440
మఖము సేయుటకునై మఱి నేను వేఁడ - సుఖమున నిచ్చెను సుతుల నిద్దఱిని
మావెంట వేంచేసి మఖమును గాచి - వేవేగఁ దాటక వెస సుబాహువును
ఆటోప మొప్పంగ ననిలోనఁ గూల్చి - మాటమాత్రంబున మారీచుఁ బోలి
యాగంగ నట దాఁటి యటు మిథిలకును - నేగంగఁదలఁచుచు నిటకు వచ్చితిమి;
ఈరాజశీతాంశు లినవంశకులులు - వీరిసామర్థ్యంబు వినఁగఁ జోద్యంబు"
ననిన విశ్వామిత్రునతులవాక్యములు - విని చాల సుమతియు విస్మయం బంది
యారాఘవుల నప్పు డర్థిఁ బూజింప - వారును బూజలు వరుసఁ గైకొనుచు
నారాత్రి యం దుండి యాప్రభాతమున - నారాజు తముఁ బంప నర్థితోఁ జనిరి.

గౌతమాశ్రమముఁ జేరుట

చనిచని గౌతమాశ్రమము రాఘవుఁడు - కనుఁగొని పలికె నాగాధినందనుని
“సలలితపల్లవసంపద ల్గలఁగి - వెలయు మామిళ్లును వేఱుపనసలు1450
నారంగ జంబీరనారికేళములు - పారిభద్రంబులు బదరికాతతులు
మాతులుంగలవంగమంజీరతరులు - శ్రీతరుసంపంగిసింధువారములు
పొన్నలు పొగడలు పోకమ్రాఁకులును - నెన్నంగ నరఁటుల నెఱయుపుప్పొళ్లు
చిత్తజాంబకములై చెలఁగునశోక - లత్తుకదాడిమలలితమల్లికలు
తిందుకంబులు శివతిలకశాల్మలులు - చందనకర్పూరసహకారములును
భల్లాతగుగ్గులు బ్రహ్మకౌశికము - లెల్లచో నల్లిన యేలకీలతలు
అల్లిన మొల్లలు నలరు చేమంతి - చల్లనిపుష్పవాసనలఁ జెన్నొందు
కాసారములచేతఁ గడురమ్య మగుచు - భాసిల్లు పక్షుల పటురవంబులును
సమధిక మిట్టి యాశ్రమభూమి సకల - రమణీయ మయ్యు నిర్జన మేటి కయ్యె?
ము న్నిందుఁ దపమున మునివర్యుఁ డెవ్వఁ డన్నియు నెఱిఁగింపు" మనిన నిట్లనియె.1460
"గౌతమం డిక్కడఁ గడఁకతోఁ దొల్లి - యాతతనిష్ఠ నహల్యతో గూడి
యతిఘోరతపము సేయఁగ నింద్రుఁ డెఱిఁగి - యతనితపంబు దా నంతయు జెఱుపఁ
గుక్కుటంబై పోయి కుటజంబు సేరి - కొక్కొరొ యని కూయఁ గొమరొప్ప మౌని
మనమున జింతించి మఱియొక్కనాఁడు - మునినిజానుష్ఠానమునకుఁ బోవుటయు
గౌతమాకారంబు గైకొని వచ్చి - యాతనిసతి నహల్యాదేవిఁ గదిసి
"ఋతుకాల మనరు కోరికగలవారు - మతిఁ దలంపఁగఁ బొద్దు మఱి చాలఁగలదు
పొలఁతుక నీతోడి భోగేచ్ఛ నాకు - వలయుటఁ దలపోసి వచ్చితి" ననిన
నెఱిఁగి యహల్య నీ వింద్రుండ వగుట - యెఱుఁగుదు గాకేమి? యిందు రమ్మనుచు
జలజాక్షి తమపర్ణశాలలోపలికి - బలభేదిఁ గొనిపోయి పరఁగఁ గ్రీడించె.
సురనాథుఁ డప్పుడు స్రుక్కుచు భీతి - నరుగుచో గౌతముఁ డంతలో వచ్చి1470
“యోరి పాపాత్మక! యుచితమే నీకు? - నారూపు గైకొని నాపత్నిఁ గవయ
నీపాపఫలమున నీ వముష్కుండ - వై పొమ్ముపొ"మ్మని యంత శపించె.
గౌతముశాప మఖండమై తాఁకి - యాతని యండంబు లంతలోఁ దెగియె.

గౌతముఁ డహల్యకు శాప మిచ్చుట

నడరి గౌతముఁ డహల్యాదేవిఁ జూచి - "పడఁతి! పాషాణమై పడియుండు మీవు;
కర ముగ్రమగునెండ గాలి పెంధూళిఁ - బొరలుచు నెందును బొడ గానఁబడక"
అనిన "శాపమున కెయ్యది తుది నాకు" - ననిన నహల్య కిట్లనియె గౌతముఁడు
“వైకుంఠధాముఁ డవాప్తకాముండు - లోకరక్షణకళాలోలతత్పరత

రాముఁడై వచ్చి పురాణపూరుషుఁడు - భూమిపై జన్మించి పొగడు దీపించి
చనుదెంచి కౌశికుజన్నంబుఁ గాచి - యినకులాధీశ్వరుఁ డీద్రోవ వచ్చి
తొలఁగిపోవక నిన్నుఁ ద్రొక్కిన జాలు - జలజలోచన! నీదుశాపంబు దీఱు"1480
నని చెప్పి శీతాద్రి కరిగె గౌతముఁడు - మునిపత్ని ఱారూపమున నుండె నంత.
సురరాజు దనపాటు సురలతోఁ దెల్పఁ - దరమిడి పితృదేవతల వారు వేఁడి
వెరవరులై మేషవృషణముల్ దెచ్చి - సురలు సంధించితి సురలోకపతికి,
నతులపుణ్యాత్మకు లది యాది గాఁగ - గ్రతువులఁ జంపుదు ర్కడఁగి మేషముల
నాఁడాదిగా మునినాథుశాపమునఁ - బోఁడిమి చెడి యీతపోవని నున్న
యాయహల్య నతుల్యహతమనశ్శల్యఁ - జేయవే శ్రీరామ! చిరపుణ్యధామ!"
యని చెప్పి గౌతము నాశ్రమంబునకుఁ - జనుదేర శ్రీరామచరణంబు సోఁక
మొగు లెల్ల విరియ సోమునికళవోలెఁ - బొగ యడంగిన హవ్యభుక్కీలవోలెఁ
గలఁకఁదొలంగిన కమలినివోలె - బలుమష్టు గడిగిన బంగారుబోలె
శ్రీరామపాదరాజీవపరాగ - దూరీకృతాఘసందోహమై యపుడు1490
వెలఁది యంతయు శిలావేషంబు మాని - తిలకించి తనతొంటిదేహంబు పూని
మునిపతిచేత రాముని మహత్త్వంబు - వినినది గాన నావేదండయాన
యామహామహునకు నాతిథ్య మొసఁగి - "శ్రీమీఱ నిటకు విచ్చేసితి గానఁ
జరితార్థ నైతి; మీచరణపద్మములు - దరి నిచ్చి రఘునాథ! త్రైలోక్యనాథ!
మీపాదతీర్థమౌ మిన్నేరు భువన - పాపంబు లెడఁబాపఁ బాల్పడె ననఁగ,
నిలయెల్ల నొకట మి న్నొక్కటఁ గొలిచి - బలి మెట్టి బ్రహ్మాండభాండంబు ముట్టి
నేదశిరోవీథి విహరించు నీదు - పాదముల్ నాదుశాపముఁ బాచు టరుదె?"
యని రాము వినుతించె నంత గౌతముఁడు - సనుదెంచి రఘురామచంద్రుఁ బూజించి
ప్రాకటజనసాఫల్య నహల్యఁ - గైకొని తొల్లింటిగతి విలసిల్లెఁ.
గ్రొవ్విరిజడివాన కుంభినిఁ గురిసె - నవ్వేళ దేవతూర్యంబులు మొరసె;1500
ఘనపుణ్యు లందుండి కదలి మిన్నంటి - తనరు ప్రాకారసౌధముల యూథముల
నమరిక రత్నగేహముల వాహముల - రమణీయరాజమార్గముల దుర్గముల
నలనొప్పు శృంగారవనుల జవ్వనులఁ - బొలుచు సంతతశుభంబుల నిభంబులను

శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్రునితో మిథిలఁ జేరుట

ననువొందు వైరివర్గాశిథిలకును - జనకుని మిథిలకు జనుదెంచి రంతఁ.
గాళింగ నేపాళ కర్ణాట లాట - మాళవ సౌవీర మగధ పాంచాల
కురు పాండ్య బర్బర కుంత లావంతి - మరు తురుష్కాభీర మనుజవల్లభుల
ఘనతరయాగోపకరణభాగముల - ననురూపపశుగణాయతనయూపముల

భూరిదధిక్షీరపూర్ణకుంభముల - సారసమిద్భారచారుదేశముల
నడరి ఘోషించు సామాదివేదముల - నుడుగక చనుదెంచుచున్న తాపసుల
నుడువీథి నుప్పొంగు హోమధూమముల - నడరెడు దేవతాహ్వానరావములఁ1510
బూజలు గైకొన్న పుణ్యసంయములఁ - బూజింప సొలయని భూసురోత్తముల
నరుదైన జనకునియజ్ఞవాటంబు కరమర్థిఁ జొచ్చె నగ్గాధినందనుఁడు.
అంత నాజనకమహారాజవర్యుఁ - డెంతయు మహిమతో నెదురుగా వచ్చి
మునినాథునకు మ్రొక్కి ముద మొప్ప తోడు - కొనిపోయి పూజించి కుశలంబు లడిగి
‘“నీవు వచ్చితి కాన నేఁడు నే మిగులఁ - బావనాత్ముఁడనైతిఁ బ్రబలె నాక్రతువు "
లని చాలఁ గొనియాడి యమ్మునిచంద్రు - వెనుకనె వినతులై విలసిల్లుచున్న
గురుతరస్ఫీతవక్షులఁ గాకపక్ష - ధరుల మహాధనుర్ధరుల శ్రీకరులఁ
గోమలాంగుల నభంగురయశోనిధుల - భూమి జరించు వేల్పులఁ బోలు ఘనుల
సదయాంతరంగుల సతతప్రసన్న - వదనుల భువనపావనచరిత్రులను
చారుప్రభాభానుచంద్రసన్నిభుల - ధీరుల నయ్యశ్విదేవతాకృతుల1520
నాజానుబాహుల నతులవిక్రముల - రాజీవనేత్రుల రామలక్ష్మణులఁ
జూచి "యాశరచాపశోభితాకారు - లీచతురాత్మకు లెవ్వరివార?
లీపల్లవారుణ మృదుపాదపదు - లేపగిదిని వచ్చి రిచటికి నడిచి?"
యనిన విశ్వామిత్రుఁ “డనఘులు వీరు - జననాథ! దశరథజనపాలసుతులు
నాయతశక్తి నాయాగంబు గాచి - యాయహల్యను బ్రోచి, యనుకంప నేచి,
నిరుపమతరశక్తి నీయింట నున్న - హరునిచాపముఁ జూడ నరుదెంచి" రనుడు
మునినాథుమాటకు ముద మంది జనకుఁ - డనునయంబున వారి నర్థిఁ బూజించెఁ.

శతానందుఁడు విశ్వామిత్రుప్రభావంబుఁ దెల్పుట

గొని గౌతముసూనుఁ - డాశతానందుఁ డిట్లనియె రాగిల్లి
“నీవు రాముని దెచ్చి నెమ్మి మమ్మేలి - తీవిశ్వవిభుఁ దేర నెవ్వరితరము
అడరి మాతల్లి యహల్యపాపములు - కడఁగి రాముని పాదకమలరేణువుల1530
గౌతమశాపదుర్గతి నిస్తరించి - గౌతముఁ గ్రమ్మఱఁ గలసె మాతల్లి
రామచంద్రునిపాదరాజీవమహిమ - లేమందు" నని రాము నీక్షించి పలికె
"నీకౌశికుఁడు పుణ్యుఁ డీక్షోణిమీఁద - నీకు రక్షకుఁడఁట నీ కేమి కొదువ
యరయ విశ్వామిత్రునతులప్రభావ - మరిది ప్రస్తుతి సేయ నైనను వినుము
దశరథాత్మజ బ్రహ్మతనయుండు కుశుఁడు - గుశుఁ డర్థితోడుతఁ గుశనాభుఁ గనియె
గుశనాభునకు గాధి కొమరుఁడై పుట్టెఁ - గుశపవిత్రుడు గాధికొడు కయ్యె నితఁడు
అతిధర్మనిరతుఁడై యఖిలంబు పొగడ - నితఁడు మహీచక్ర మేలుచునుండె.

నొలసినవేడుక నొకనాఁడు దన్నుఁ - బలసి యక్షౌహిణిబలములు గొల్వ
వెడలి కాననముల వేడ్కలు సల్పి - పుడమియంతయుఁ జరింపుచుఁ జాలబడలి
బహుగంధబంధురప్రసవమంజరుల - బహుఫలంబుల నొప్పు పాదపావళుల1540
బహుపక్షిరవముల బ్రహ్మఘోషముల - బహుసరోవరముల బహుళవేదికల
నలరుచు జాతివైరాదులు లేక - మెలఁగు నానావిధమృగసమూహముల
ననిలాంబుజీర్ణపర్ణాశులై తపము - నొనరించు తపసులు యోగిపుంగవులఁ
బన్నగఖేచరప్రముఖగంధర్వ - కిన్నరాదుల వాలఖిల్యాదిమునులఁ
గడునొప్పి బ్రహ్మలోకమువోలె మిగుల - నడరు వసిష్ఠునియాశ్రమంబునకు
నతిముదంబున వచ్చి యావసిష్ఠునకు - నతినిష్ఠ మ్రొక్కిన నతఁడు దీవించి
యుచితాసనంబున నునిచి పూజించి - ప్రచురరసస్వాదుఫలమూలతతుల
వరుసతో నిచ్చిన వానిఁ గైకొనుచుఁ - గరములు ముకుళించి కడుభక్తిఁ బలికె
“ననఘాత్మ! తపసులు నగ్నిహోత్రములు - జనలోకనుతములై జరుగుచున్నవియె?
మీరును శిష్యులు మీయాశ్రమమున - నారంగ వీరు వా రన కెల్లవారు1550
ముదమున నున్నారె? మునినాథ! " యనిన - "నొదవు సమ్మదమున నున్నార మేము
నీతితోఁ జేయుదె? నీవు రాజ్యంబు? - ప్రీతిమై భరియింతె భృత్యవర్గముల?
ముద మొప్ప రాజ్యాంగములు పరీక్షింతె? - వదలక నిర్జింతె వాలుశాత్రవుల?
గుశలమే సర్వంబు కుశలమే నీకుఁ? -గుశలమే నీపుత్త్రకులకుఁ బత్నులకు?"
నని పల్క "మీకృప నఖిలంబు కుశల” -మనియెఁ గౌశికుఁ డంత నవ్వసిష్ఠుండు
“కరమర్థి నాయింటికడ విందు గుడిచి - యరుగుమ యీ" వని యతనిఁ బ్రార్థింప
నందుకు కౌశికుం డనుమతించుటయు - విందు సేయుటకునై వేగంబ యతఁడు
తనహోమధేనువు దలఁచి రప్పించి - జననాథవరునకు సకలసేనలకు
వివిధభక్ష్యంబులు వివిధభోజ్యములు - వివిధభంగుల విందు వేడ్కఁ గావింప
వలయుఁ గావున నీవు వలయువస్తువులు - గలిగింపు మనవుడుఁ గామధేనువును1560
గలమాన్నతతులు శాకములు భక్ష్యములు - గలవంటకము లూరుగాయ లంబళ్లు
ఫలవిశేషంబులు పాయసాన్నములు - చెలువారు వెన్నలు చీనిచక్కెరలు
సద్యోఘృతములు రసాయనంబులును - మద్యవిశేషముల్ మాంసభేదములు
వావిరి మఱియు నెవ్వారికి నేమి - కావలె నవి యడుగకయె కల్పింప
నాధేనుమహిమ కత్యాశ్చర్య మొంది - గాధేయుఁ డప్పుడు కడిమాడసేయఁ
గుడిచి సేనలు దాను గోర్కి దీపింపఁ - గడుఁదృప్తి నొంది, యా గాధితనూజుఁ
డీకామధేనువు నెబ్బంగినైనఁ - జేకొందు ననుచు వసిష్ఠునిఁ జేరి
“లక్షగుఱ్ఱంబులు లక్షధేనువులు - లక్షయేనుఁగులు వేలక్షలు మణులు
నిచ్చెద నీధేను విమ్ము నా" కనిన - నిచ్చలో మునినాథుఁ డెంతయు వగచి

"యిది నాకు జీవనం బిది నాకుఁ బ్రాణ - మిది నాతపంబులకెల్ల సాధనము;1570
హవ్యకవ్యంబులు నతిథిసత్కార - మవ్యాహతముగ నీయావుచే నడుచు;
నీపుణ్యధేనువు నీఁజాల” ననిన - నాపూర్ణబలుఁడు విశ్వామిత్రుఁ డలిగి

విశ్వామిత్రుఁడు వసిష్ఠుని కామధేనువుఁ గొంపోఁజూచుట

"యిమ్మని బతిమాలి యే వేఁడనేల - ర"మ్మని భటసహస్రంబులుఁ దాను
గోవు నుద్ధతిఁ బట్టికొనిపోవఁ బోవఁ - బోవక యది మునిపుంగవుఁ జూచి
"యనఘ! వసిష్ఠసంయమిచంద్ర! నన్నుఁ - గొనిపోవుచున్నాఁడు క్రొవ్వి కౌశికుఁడు
వారింప వకట దుర్వారుండవయ్యు - నూరక తగునయ్య యొప్పింప నన్ను
ననఘాత్మ! నీయెడ నపరాధి గాను - నను నుపేక్షించుట నాయమే నీకు?”
ననుడు ధేనువుమాట కావసిష్ఠుండు - మనమునఁ గృప పుట్టి మఱుమాటఁ బలికె.
“నే నేల విడుతు ని న్నెంతయు బలిమి - భూనాయకుఁడు గొనిపోయెడుఁగాని
క్షత్రియు లుద్దండచారిత్రు లైన - ధాత్రిసురోత్తము ల్దా రెంతవార?1580
లీక్షోణి కధిపతి యీగాధితనయుఁ - డక్షౌహిణీబలం బతనికిఁ గలదు.
ఏవిధంబునఁ గెల్తు నితని నే" ననిన - నావసిష్ఠునితోడ నాధేను వనియె,
"మునినాథ! నృపతేజమునకంటె నెందు- వినుతింప నెక్కుడు విప్రతేజంబు;
గావున నీకంటెఁ గౌశికుం డెక్కు - డేవెంట గాకుండు టే నెఱుంగుదును;
బనుపుము నన్ను నీబలములనెల్ల - మునుకొని యడఁచెద మునినాథ!" యనిన
నావసిష్ఠుఁడు ధేను నపుడు "సైన్యములఁ - గావించు బలములు ఖండింపు ముఱక"
నన విని హుంకార మడరించుటయును - గనుఁగొని ధేనుహుంకారంబునందు
ఘనవాలలతయందుఁ గర్ణంబులందుఁ - దనురుహంబులయందు దంతంబులందు
ఖురమధ్యములయందుఁ గొమ్ములయందు - నురులోచనములందు నూర్పులయందు
మొనయ జంఘలయందు మోఁకాళ్ళయందు - ననువొందఁ దొడలందు నధరంబునందు1590
గాఢతరం బైన గంగడోలందు - రూఢిగాఁ గూడిన రోమకూపములఁ
గెరలు రంకెలను సక్థిప్రదేశమునఁ - బొరి నుద్భవించిరి భువనభీకరులు
కైరాతపల్లవకాంభోజయవన - వీరులు పెక్కండ్రు విషమవిక్రములు
చిత్రరూపాఢ్యులు చిత్రాయుధులును - జిత్రవిలోచను ల్చిత్రహుంకృతులు
నై వీరులై ధీరులై మహోదారు - లై వారు సేనాసహాయులై మఱియు
హరులతోఁ గరులతో నందందఁ గడిమిఁ - బరఁగి విశ్వామిత్రుబలములఁ ద్రుంపఁ
జూచి యాకౌశికుసుతులు నూర్వురును - నేచి నానాహేతిహేతులు నిగుడ
వచ్చి వసిష్ఠుని వధియింపఁగడఁగి - యచ్చట భస్మమై రతని హుంకృతికి.
నంత విశ్వామిత్రుఁ డఖిలసైన్యంబు - లంతకువీటికి నరుగుట చూచి

యతులపరాక్రము లగుచున్న తనదు - సుతులచావును జూచి శోకించి యంతఁ1600
దనరాజ్యమున నొక్కతనయుని నునిచి - చని హిమాచలమునఁ జలమున నిలిచి
త్రిపురారిఁ గూర్చి యతిప్రయత్నమునఁ - దప మొనరింపఁ బ్రత్యక్షమౌటయును

కౌశికుఁడు ఈశ్వరునిచేత వస్త్రాదులు వడసి వసిష్ఠునితోఁ బోరుట

హరుచేత వివిధశస్త్రాస్త్రము ల్వడసి - యురవడిఁ జనుదెంచి యుగ్రుఁడై కడఁగి
మొగి వసిష్ఠాశ్రమంబున వహ్నిశిఖలు - నెగయ బెల్లెగసె నాగ్నేయబాణముల
నప్పుడు బాణాగ్ను లాశ్రమంబెల్లఁ - గప్పి మండుటయును గని వసిష్ఠుండు
కాలదండము గొన్న కాలుండొ యనగఁ - గేల దండము దాల్చి కినుకతో వెడలి
“యోరి విశ్వామిత్ర! యోరి పాపాత్మ -భూరిపుణ్యాశ్రమంబులు గాల్పఁదగునె?
యెనయ నీ వెక్కడ నే నెక్క” డనిన - ఘనరోషచిత్తుఁడై కౌశికుం డప్పు
డతనిపై రౌద్రంబు పాశుపతాస్త్ర - పటుతరవజ్రంబు బ్రహ్మపాశంబు
కనలు పైశాచంబు కాలపాశంబు - ఘనవిష్ణుచక్రంబు కాలచక్రంబు1610
వారుణగాంధర్వవాయవ్యసార - ఘోరాస్ట్రకోటులు క్రూరుఁడై యేయఁ
గలయంగ విస్ఫులింగంబులు చెదర - బలువిడి నుగ్గాడె బ్రహ్మదండమున.
నలుక విశ్వామిత్రుఁ డంత బ్రహ్మాస్త్ర - మలవడ సంధించి యార్చి యేయుటయు
సకలగీర్వాణులు సకలసంయములు - సకలగంధర్వులు సకలపన్నగులు
సకలభూతంబులు సకలదిక్పతులు - సకలతారాగ్రహచంద్రసూర్యులును
సకలలోకంబులు చలనంబు నొంది - సకలదిక్కులు మండఁ జండవేగమున
బ్రహ్మాండభాండంబు బలువిడి నెగడి - బ్రహ్మదండము దాఁటి పరతేరఁ జూచి
బ్రహ్మాదులకు నడ్డపడరానియట్టి - బ్రహ్మాస్త్ర మవలీలఁ బట్టుక మ్రింగె.
సురుచిరబ్రహ్మతేజోమూర్తి వెలుఁగ - నరుదార నమ్మునియంగరోమముల
నెఱిమంట లెగయ ననేకబాణంబు - లఱిముటిఱి వెడలి విశ్వామిత్రుఁ దాఁకి1620
చుఱబుచ్చఁదొడఁగినఁ జూచి కౌశికుఁడు - నెఱి చెడి యెంతయు నిజసత్త్వ మెడలి
తరమిడి యాబ్రహ్మదండమొక్కటను - వరశస్త్రకోటులు వమ్ములై పొలిసె.
"నత్రస్త మచల మీయనబ్రహ్మబలము - క్షత్రబలం బది గాల్పనే" యనుచు

విశ్వామిత్రుఁడు బ్రహ్మర్షిపదంబునకై తపంబు చేయుట

చెనఁటియై మగిడి కౌశికుఁ డాలు దాను - జని ఘోరతప మర్థి సలుపుచునుండె.
అటమీఁద సుతుల విశ్వామిత్రమౌని - పటుసత్త్వవంతులఁ బడసె నల్వురను.
వినుము దుష్యందహవిష్ష్యందనాము - లన దృఢనేత్రమహారథు లనఁగఁ
జలము డింపక పెక్కుసంవత్సరమ్ము - లలఘునిష్టలఁ దపం బటుసేయ మెచ్చి.

వనజసంభవుఁ డంత వచ్చి కౌశికునిఁ - గనుఁగొని యెంతయుఁ గరుణించి పలికె.
నీతపంబున మెచ్చి యిచ్చితి నీకుఁ - బ్రీతిమై నిట రాజఋషిపదం బనఘ!”
యని పోవ గాధేయుఁ డతిదీనుఁ డగుడు - నెనయంగ నీతపం బెంత చేసినను1630
గడపట బ్రహ్మర్షి గానేరనైతి - నెడపడి చెడిపోయి యీయుగ్రతపము
ఈరాజఋషిపదం బేనొల్ల ననుచు - ఘోరతపంబు గైకొని సేయుచుండె.
అంత నిక్ష్వాకుకులాగ్రణియైన - సంతతకీర్తి త్రిశంకుఁ డన్ర్రాజు
తనువుతోడను గూడి తా నాకమునకు - నొనరంగఁ జను జన్న మొనరింపఁ దలఁచి
భక్తి వసిష్ఠునిపాలి కేతెంచి - యుక్తమార్గంబున నుపచరించుచును
"దివిజలోకమున కీదేహంబుతోడ - సవనంబు గావించి చనఁ గోర్కె నాకు
ననురక్తిఁ గావింపుఁ డనఘ నాచేత - మునుల రప్పింపుఁడు ముద మొప్ప" ననిన
"ఓనరనాథ! యొడలితో నాకలోకమున - కరుగ నసాధ్య మీయవనీశులకును.”
అనవుడు రాజన్యుఁ డట దక్షిణమున - ఘననిష్ఠఁ దప మర్థిఁ గావించుచున్న
చిరపుణ్యులైన వసిష్ఠపుత్రులకుఁ - గరమర్థిఁ బ్రణమిల్లి కరములు మొగిచి1640
“దేవలోకమున కీదేహంబుతోడ - బోవచ్చుయాగంబు పూని నాచేతఁ
జేయింపుఁ" డనిన “వసిష్ఠుఁ డిత్తెఱఁగు - సేయుఁడి యనెనేని చేయింతు" మనుడు.
నారాజచంద్రుఁ డిట్లనియె. “వసిష్ఠుఁ - డేరాజులును జేయ రీక్రతు వనియె
మీకడ నిటు రాక మీరైన నన్నుఁ - జేకొని యజ్ఞంబు సేయింపవలయు.
నరయఁ బురోహితు లగువారుగారె - ధరణీశులకు సర్వధర్మసాధకులు”
అనిన వాసిష్ఠు లాయవనీశుఁ జూచి - "ఘనుఁడు వసిష్ఠుండు గాదన్నతెఱఁగు
నిర్తలమతి నొరు ల్నేర్తురే సేయ? - దుర్మతి వగు నీకుఁ దోఁపదుగాక.”
యని పల్క నిర్విణ్ణుఁడై సంయమీంద్రు - తనయులఁ జూచి యాధరణీశుఁ డనియె.
"మీతండ్రి నిరసించె; మీరును జేయ - రైతి; రేతెఱఁగుననైన నీక్రతువు
హితబుద్ధిలేని మీ రేల నా కింక? - నితరులచేతఁ జేయించెదఁగాక!”1650
యనినఁ "జండాలుండ వగు" మంచు నలుక - గనుఁగొని పల్కి రాఘనపుణ్యు లంత.
భాసురంబగు భూమిపాలుతేజంబు - వాసిష్ఠకోపాగ్ని వడిఁ గాలె ననఁగ
నారయ నీలదేహంబును నీలి - చీరయు జుంజురుశిఖయును దనర
నంట నశుద్ధంబులైన మాలిన్య - మంటించు నీరూప మనుభంగిఁ దోఁపఁ
బ్రణుతవర్ణస్ఫూర్తిఁ బరఁగిన కనక - మణిభూషణము లోహమయములై తనర
నోజమైఁ గష్టనామోక్తిభేదములు - నాజాతి కనురూపమైన రూపమున
జననాథుఁ డతిఘోరచండాలభావ - మొనరంగఁ జేడ్పడియున్న నీక్షించి
పౌరభృత్యామాత్యబంధువర్గంబు - లారాజు వర్జించి; రంత నారాజు
నొదవినభయమున నొయ్య మెట్టుచును - నొదుకుచు జనులకు నోసరించుచును

జని మహామహుని విశ్వామిత్రుఁ గనిన - గనికరం బొదవ నాగాధితనూజుఁ1660
"డిల నయోధ్యాపురం బేలెడినీకు - నెలిమిఁ జండాలత్వ మేల పాటిల్లె?
నేతలంపున వచ్చె నెఱిఁగింపు" మనిన - నాతండు ముకుళితహస్తుఁడై పలికే
"నిరవొందఁ బొందితో నింద్రలోకమున - కరుగఁ జొప్పడునట్టి యాగంబు మున్ను
చేయింపుఁడనిన వసిష్ఠుఁ డీతెఱఁగు - సేయింపరాదని చెప్పె నుత్తరము,
నావసిష్ఠునిపుత్రులగువారు నతఁడు - గావింపఁగాదన్నఁ గాదని పలికి;
రితరులచేతఁ జేయింతు నన్మాట - కతిరోషమున మాల వగు మన్న నైత;
ననఘ! నాచేసెద నన్న యధ్వరము - నొనరింతు నామాట కొగి బొంకు లేదు;
ఇట్టియాపదయందు నిటమీఁదనైన - నెట్టని సత్యంబు నెగడఁ బాలింతుఁ;
బెక్కుధర్మంబులు పెక్కుజన్నములు - పెక్కువతోఁ జేసి పెంపు గైకొంటి
గురులఁ బూజించితి గురులు నావలనఁ - గరుణ చాలమి ధర్మకార్యంబు నిలిచి1670
పౌరుషం బది దేవ ఫలము లేకున్న - నేరమి వాటిల్లు నిక్కువం బరయ;
నేవిధంబుననైన నీవు నాపాలి - దైవమై రక్షింపఁ దగుదు నా" కనియె.
ననిన విశ్వామిత్రుఁ డతని వీక్షించి “జననాథ! నీవింక సంతాప ముడుగు

త్రిశంకునికై కౌశికుఁడు యజ్ఞంబు చేయనారంభించుట

దీనునిఁ జేపట్టితిని ద్రిశుద్ధిగను - మౌనుల ప్పించి మఘము సేయించి,
దేహంబుతోడనే తివిరి నేఁ బలుక - పోహంబు గాకుండఁ బుచ్చెద దివికి.
విను నిన్నుఁ బరమపవిత్రుఁ గావించు" - నని పల్కి శిష్యుల నందఱఁ జూచి
“మునుకొని మీరెల్ల మునుల ఋత్విజులఁ - గొనిరండు, వేత్రిశంకునియాగమునకు”
నని నియోగించిన నట్ల వా రేగి - మునివరేణ్యులనెల్ల మొగిఁ దోడి తెచ్చి
కలయ విశ్వామిత్రుకడకు నేతెంచి - చలమేది నిల్చిరి సంయమీశ్వరులు;
వారు వసిష్ఠునాశ్రమవాసులెల్ల - వారలు దక్కంగ వచ్చి రందఱును;1680
ఆవసిష్ఠునిపుత్రు లాడిరి కొన్ని - యావాక్యములు వినుమంచు వా రనిరి.
"మతి విచారింపక మఘము సేయించు - నతఁడు రాజఁట? మాలఁడఁట సేయువాఁడు;
చండాలుమఘమున సకలమునీంద్రు - లుండి భోజనము లేయుక్తిఁ జేసెదరు?
ఆడ కేమొగముల నరుగుదెంచెదరు? - వేడుక సురలు హవిర్భాగమునకుఁ
బరఁగ విశ్వామిత్రపాలితుండైన - నరుఁ డెట్టు లొందెడు నాకలోకంబు?
విన విస్మయం బని వెలయ దూషించి" - రనిన విశ్వామిత్రుఁ డగ్నియై మండి
“కడునిష్ఠఁ దప మిట్లు గావించునన్ను - నడరి దూషించు పాపాత్ము లిందఱును
నూతనగతి నేడునూఱుజన్మముల - బాగుగాఁ గ్రవ్యాదభావంబుఁ దాల్చి
మానవశునకాదిమాంసము ల్దినుచు - హీనులై చరియింప నిమ్ము లోకముల.

నసమున నన్నాడు నామహోదయుఁడు - వసుధ నిషాదుఁడై వర్తింపనిమ్ము"1690
అని శపియించి సంయముల వీక్షించి - "మునులార! యీరాజముఖ్యుఁ ద్రిశంకు
నున్నతకులశీలు నురుకీర్తిలోలు - సన్నుతధర్మజ్ఞు సత్యప్రతిజ్ఞుఁ
గ్రతువు సేయింపుఁడు గాత్రంబుతోడ - నితఁ డింద్రపురి కేగు నిర వొప్ప" ననిన
నాఋషిమాటల కమ్మహామునులు - దారు విచారించి తమలోన ననిరి.
“గాధిసూనునిమాట గా దంటిమేని - క్రోధించి శపియించుఁ గ్రూరవాక్యములఁ.
గానఁ జేయింతము క్రతువు కౌశికుఁడు - మానుగాఁ జెప్పిన మహితమార్గమున”
నని పల్కి మునులెల్ల నవ్వరకర్మ - మొనరింప నామంత్రయోగాదు లమర
నాగాధితనయుడు యాజకుం డగుచు - యాగభాగములకు నమరులఁ బిలిచెఁ.
బిలిచిన “రా”మంచుఁ బేరెలుంగెత్తి - పలికిరి సుర; లటు పలుకఁ గౌశికుఁడు
కుశపవిత్రము చేత గొని స్రువం బెత్తి - దిశల రోషానలదీప్తులు నిగుడ1700
నాకేంద్రలోకంబునకుఁ ద్రిశంకుండ - నీకోరినటువలె నిన్నుఁ బుచ్చెదను;
"నడరంగ నే బాల్య మాదిగా నియతి - విడువక తపము గావించితినేని,
బొందితోడనె కూడఁ బోయి స్వర్గంబు - నందుము పొ"మ్మన్న నాత్రిశంకుండు
తత్తపోబలమునఁ దడయక యెల్ల - సత్త్వము లేగెడి సరణిఁ బోవుటయుఁ
జండాలుఁడవు నీవు స్వర్గలోకమున - నుండ నీనని యింద్రుఁ డుదరి త్రోపింపఁ
గడఁక “విశ్వామిత్ర! కావవే” యనుచు - వడిఁ దలక్రిందుగా వచ్చుచునున్న
శరణార్థియైన త్రిశంకునిఁ జూచి - కరుణావిధేయుఁడై గాధేయుఁ డపుడు
"జననాథ! నీ వాకసమునందె నిలువు" - మని పల్కి నిలుపుచు నటఁ దత్క్షణమున
నలుక త్రిశంకున కమరేంద్రుతోడి - చలమున వేఱొక్కస్వర్గంబు సేసి
లలి నందు సప్తర్షులను తారకముల - నలవడఁ గల్పించి యానాకమునకు1710
వేఱుదేవతలఁ గావింప నింద్రునకు - మా ఱింద్రుఁ గల్పింప మదిఁ దలంచుటయుఁ,
జాల భీతిలి సర్వసంయము ల్సురలు - నోలి విశ్వామిత్రునొద్ద కేతెంచి
యిలలోన మునినాథ! యీత్రిశంకుండు - దలపోయ గురుశాపదగ్ధుండు గానఁ
దగ నాకమున నుండఁదగదన్నమాట - తగవుగాఁ గొని గాధితనయుండు పలికె.
"సురలార! యీతని సురలోకమునకు - నరిగెడి మేనితో" నని పల్కినాడ
నామాట నిజముగా నైన నీనాక - మీమహీనాథున కిటు చెల్లనిండు.
ప్రభ నొప్ప లోకము ల్పరఁగునందాక - నభమునఁ బొలిచి యీనక్షత్రములను
గలయ నచ్చరవీథికంటెను మీఁదఁ - దొలఁగనితేజంబుతోఁ జెలువొంది
బృందారకస్ఫూర్తి పెంపొందు శిరము - క్రిందై త్రిశంకుండు కృతపుణ్యుఁ డగుచు
కరమొప్పు నీతారకంబుల నడుమ - నురుతరకీర్తిమై నుండనిం డనిన1720
ననుమతించుచు నప్పు డాయనుగ్రహముఁ - గొనియాడి ముని వీడుకొని సుర ల్మునులు

లలి నిజస్థానంబులకు నేగి రంత - నెలమి గౌశికుఁడు మునీంద్రులఁ జూచి
"యిమ్ముగా నటమీఁద నిది తపంబునకు - సమ్మర్ద మిక్కడ జాలంగఁ గలుగు.
మునులార! మన మింక ముదము చిత్తమున - దనర నొక్కెడకుఁ బోదము రం"డటంచు
గడఁక నక్కడఁ బాసి కదలి విశాల - కడ కేగి యందుఁ బుష్కరతీర్థ మాడి,

అంబరీషుఁడు యజ్ఞపశువుగా శునశ్శేఫునిఁ గొనిపోవుట

యంబుఫలాహారి యగుచుఁ బెక్కేండ్లు - పంచిననిష్ఠఁ దపంబు గావించి,
యంబరీషుం డయోధ్యాపురివిభుఁడు - శంబరరిపుమూర్తిసముఁ డట్టియెడను
వెలయంగఁ గ్రతువు గావింపఁగాఁ బూని - బలభేదిచే యాగపశువు గోల్పోయి
యరసి లేకున్నఁ బ్రాయశ్చిత్తవిధికి - నరపశు వడుగుచు నానాశ్రమముల
నరయుచు నందంద నట నొక్కమౌని - వరునింటికడకు భూవరుఁ డేగుదెంచి1730
భృగుతుంగవాసియై పేదయై నియతిఁ - దగనున్నరుచికునొద్దకుఁ బోయి మ్రొక్కి,
కరుణాఢ్య! యేను యాగము సేయఁగోరి - పరికింపనేరక పశుపుఁ గోల్పడితి.
గొనకొని యొకలక్షగోవులఁ బుచ్చు - కొని యాగపశువుగాఁ గొడుకు నా కిమ్ము”
నావుడు నాతండు ‘‘నాపెద్దకొడుకుపై వేడ్క సేయుదుఁ బశువుగా నీను
నావుడు మునిపత్ని నాపిన్నకొడుకుపై వేడ్క సేయుదుఁ బశువుగా నీను.”
అని యిరువురు పూని యాడువాక్యములు - విని శునశ్శేవుఁ డుర్వీపాలుఁ జూచి
తనపెద్దకొడుకు మాతండ్రి పాటించుఁ; - దనపిన్నకొడుకు మాతల్లి పాటించు
వారలు నీ కేల వచ్చెద నేను - కోరి వీరల మ్కిము గోసహస్రముల”
ననిన నట్ల యొనర్చి యమ్మునిపుత్త్రుఁ - గొని రథం బెక్కించుకొని శీఘ్రవృత్తి
జననాథుఁ డెంతయు సంతోషమొప్పఁ - జనిచని పుష్కరాశ్రమభూమిఁ జేరె.1740
నచట శునశ్శేఫుఁ డతితపోనిష్ఠ - నచలుఁ డైయున్న విశ్వామిత్రుఁగాంచి
తన మేనమామ యాతఁడు గానఁ బ్రేమ - ననరొత్త నుచితప్రణాముఁడై పలికె,
“ననుఁ దలిదండ్రు లీనరవరాగ్రణికి - ననఘాత్మ! పశువుగా నమ్మి పొమ్మనిరి;
చెలువొప్ప నీరాజు సేయు జన్నంబు - ఫలియింపఁజేసి నా ప్రాణము ల్గావు;
దల్లియుఁ దండ్రియు దైవంబు గురువు - నెల్లచుట్టములు నా కీవేళ నీవ;"
యని దైన్య మొంద విశ్వామిత్ర మౌని - దన తనూభవుల నందఱఁ జూచి పలికెఁ.
"బ్రాకటంబుగఁ దమపరలోకమునకు - నైకదా సుతులఁ బుణ్యాత్ములు గనుట
పరలోక మిదియు నాపాలికి నన్ను - శరణంబుఁ జొచ్చె నీసంయమిపుత్త్రుఁ;
డితఁడు నామేనల్లుఁ డితని రక్షింపుఁ; - డితనికై ప్రాణంబు లిడుఁడు మీరొకరు
అడిగెద మి"మ్మన్న నటుసేయఁ గొడుకు- లొడఁబడమన్న నత్యుగ్రుఁడై మండి1750
"శునకమాంసము దించు సొరిది వేయేడు - లనుభవింపుఁడు దుఃఖ" మని శాప మిచ్చి.

కౌశికుఁ డత్యంతకారుణ్యబుద్ధి - నాశునశ్శేపు నొయ్యనఁ జేరఁబిలిచి
"యేను మంత్రములు రెం డిచ్చెద నీకు - వాని ననుష్ఠింపు వదలక నీవు
అవి నిన్ను రక్షించు నంబరీషునకు - సవనతంత్రంబును సఫలంబు సేయు"
నని చెప్పి మంత్రంబు లవిరెండు నిచ్చె - ననుపమభక్తితో నతఁడు గైకొనియె.
మఱునాఁడు వచ్చి యమ్మనుజవల్లభుఁడు - వఱలెడు తనయజ్ఞవాటంబుఁ జొచ్చి
విశసింపఁబూని యావిమలాత్ముఁ దెచ్చి - పశుపూజ చేసి యూపమున బంధించె.
నంత శునశ్శేపుఁ డమ్మంత్రజపము - శాంతుఁడై చేయుచుఁ జలియింపకున్న.
నచటి కింద్రోపేంద్రు లర్థితో వచ్చి - సుచరిత్రు నంబరీషునిఁ జేరఁబిలిచి
క్రతుపూర్ణఫల మిచ్చి కడనున్నరుచికు - సుతుఁ జిరాయువు చేసి సురలతోఁ జనియె1760
అరుదైన తపమున నంత వెయ్యేండ్లు - జరిపిన బ్రహ్మ విశ్వామిత్రుఁ గదిసి
"నీకు ఋషిత్వంబు నీతపశ్శక్తిఁ జేకూడె" నని యొప్పఁ జెప్పి విచ్చేసె.
నంతటఁ దనియక యత్యుగ్రతపము - సంతతనియతితో సలుపుచు నుండఁ
గాముదీమములీలఁ గైకొననేర్చు - కామునిబాణంబు కమనీయకంబు

విశ్వామిత్రుఁడు మేనకను గూడుట

చెలువొందునప్సరస్స్త్రీమూర్తి దాల్చి - మెలఁగెడుగతితోడ మేనక యపుడు
లలితయౌవనకళాలావణ్యగణ్య - జలకేళిఁ దేల నాసతిజారుకొప్పు
చికిలిచూపులు నునుజెక్కులముద్దు - మొకము కెంపులమోవి మొలకనవ్వులును
బొంగారుకుచకుంభములు పదార్వన్నె - బంగారుపొడి రాలు బాహుమూలములు
చిన్నారినూఁగారు సింగంపుఁగౌను - పొన్నపూపొక్కిలి బొదలెడుపిఱుఁదు
లూరులతీరు నోరూరఁగాఁ జూచి - పేరువాడిమరుండు పెళపెళనార్వ.1770
ధ్యానంబు మౌనంబు దపముఁ బోకార్చి - మేన గళ ల్గ్రమ్ము మేనకఁ జూచి,
“నన్నుఁ గాయజుకేళి నలినాక్షి పొందు” - మన్న నామాటను నంగీకరించి,
పదియేండ్లు మది సోలి భావజుకేళి - సదమదంబుగ సౌఖ్యసరసిని దేలి,
మఱి వివేకము పూని మౌని యెంతేని - దఱుగనితనతపోధనము పోవుటకుఁ
బరితపించుచు మది పదిలంబు చేసి - సురలోకమునకు నాసుదతి వీడ్కొలిపి,
యింద్రునియత్నంబు లివి యంచుఁ దెలిసి - యింద్రియజయశుద్ధి యేఁ గాంతు ననుచు,
శీతాద్రి కరిగి కౌశికిచెంతఁ జేరి - యాతపంబునను మహాతపం బపుడు
వర్షముల్ పెక్కైన వచ్చి విరించి - హర్షించి “నీవు మహర్షి వై ” తనిన
"నీరజాసన నన్ను నీవు నీచిత్త - మారంగ బ్రహ్మర్షి యన్నంతదాఁకఁ
జరియింతుఁ దప" మన్నఁ “జరియింపు"మనుచు నరవిందభవుఁ డేగె నంతఁ గౌశికుఁడు.1780
బ్రహ్మదేవుఁడు పోవఁ బరమపావనత - బ్రహ్మర్షితనమును బడసెద ననుచు

నూరుపు పుచ్చక యూర్ధ్వబాహుండు - మారుతాహారుండు మౌనియు నగుచు
బనివడి వేసవి బంచాగ్నిమధ్య - మున వానకాల మిమ్ముల బటబయిట
మంచుకాలంబున మడుఁగులయందు - సంచితంబుగఁ జేసె నత్యుగ్రతపము.
నీభంగి వెయ్యేడు లేగినపిదప - సౌభాగ్యవతి రంభ జంభారి చూచి
“యెలమిమై దేవతాహితకార్య మొకటి - చెలువార నే నీకుఁ జెప్పెద వినిము.
సురహితంబుగ గాధీసూనుతపంబు - సురుచిరంబుగ మాన్పు సుందరి” యనుడు
"గ్రూరతపంబు గైకనియున్నయతనిఁ - జేర నాతరమె శచీనాథ! నీకు
మ్రొక్కెద నమ్మహామూర్ఖునిదిక్కు - నిక్కి చూడఁగ నోప నీపాద మాన!
నాకేశ! కోపించు నన్ను శపించు - నాకౌశికుని సైఁపనని జాలిఁబడును1790
నెఱిఁగి యెఱింగి తా రెట్టివెంగలలు - కొఱవిచేఁ దలఁ గోకుకొనువారు గలరె?"
యన విని “యింత భయం బేని నీకు - మనసిజమాధవు ల్మఱి సహాయముగ
వత్తురు చను”మన్న వనితయు నతని -ంచిత్త మెఱింగి చెచ్చెఱ భూమి కరిగి
గాధిసూనుఁ డున్నఘనతపోవనము - మాధవమన్మథు ల్మరి సహాయముగఁ
గీరకోకిలసమాకీర్ణమయూర - శారికానిజసఖీసహితయై చొచ్చి
యారంభయును మనోహరలాస్యగరిమ - నారంభ మొనరింపి నలిగి కౌశికుఁడు
“పదివేలవర్షము ల్పాషాణభావ - మొదవంగఁ గైకొనియుండి యామీఁద
నురుతపోనిధియైన యొకవిప్రువలన - సరసిజానన పొందు శాపమోక్షంబు"
నని పల్కఁ బాషాణ మయ్యె నారంభ - మనసిజుండును నేగె మతిభీతుఁ డగుచుఁ.
దనతపం బొక్కింత దఱిగిన నంతఁ - దనలోన నగ్గాధితనయుఁ డూహించి1800
యపుడు కామంబున నడఁగె నాతపము - నిపుడు క్రోధంబున కిచ్చితి ననుచు.
మదిలోన వగచి కామంబు క్రోధంబు - వదలి నిరాహారవంతుఁడై నియతి
విజితేంద్రియుండునై వేయువత్సరము - లజుఁడు మెచ్చఁగఁ దపం బతినిష్ఠఁ జేసి
యనయంబు బ్రహ్మర్షి ననిపించుకొందు - నని యుత్తరము వ్రాసి యట దూర్పుదెసకు
నెనసి వెండియును దేవేంద్రుండు సేయు - ఘనవిఘ్నకోట్లకుఁ గదలక నిలిచి
యరుదెంచి యంత సిద్ధాశ్రమభూమి - నురుఘోరతపము సేయుచు నుండఁగలిగె.
వరతపోనియతిమై వర్షసహస్ర - మరుగఁ బారణ సేతు నని యున్నచోట
నివ్వరిబియ్యంబు నెరినెరిఁ దెచ్చి - యవ్వియన్నియుఁ బాకయత్నంబు చేసి
యారయ దేవతార్పణముగాఁ జేసి - వా రవి భుజియింప వడిఁ దలంచుటయు
బలభేది యొకముదిబాపఁడై వచ్చి - నిలిచి గ్రాసము వేఁడ నెమ్మితో నిచ్చె1810
నాయమరాధీశుఁ డడరి భోజనము - చేయుచో నన్నంబు శేషింపకున్న
మఱియును వెయ్యేండ్లు మౌనియై నిలిచి - తఱుగని నిష్ఠతోఁ దప మాచరింప.
నప్పుడు మునినాథు నౌదలఁ బుట్టి - కప్పె లోకముల నుత్కటమైన పొగయుఁ,

గలఁగెఁ బయోధులు కంపించె ధరణి - కులగిరు లదరె దిక్కులు చిక్కువడియె.
నమరులు గంధర్వు లఖిలసంయములు - కమలగర్భుని బ్రీతిఁ గని మ్రొక్కి యనిరి
“యాయతచిత్తుఁడై యత్యుగ్రతపము - చేయుచు నున్నాఁడు చెలఁగి కౌశికుఁడు!
అతనిమనోరథం బర్థి సిద్ధింప - మతి మెచ్చి తప మింక మాన్పకయున్న
యనఘు విశ్వామిత్రునత్యుగమైన - ఘనతరవహిచేఁ గాలు లోకములు.”
అన విని వారితో నప్పుడు కదిలి - వనజాసనుఁడు వచ్చి వరదుఁడై నిలిచి
"వినుము కౌశిక! యింక విపరీతతపము - పని లేదు చాలింపు బ్రహ్మర్షి వైతి.”1820
వనినఁ గౌశికుఁడు బ్రహ్మాదిదేవతలఁ - గనుఁగొని పల్కె నక్కజమైనభక్తి
“బ్రహ్మర్షిపద మేను పడసితినేని - బ్రహ్మపుత్తుఁడు లోకపావనమూర్తి
చిరపుణ్యశాలి వసిష్ఠుఁడు వచ్చి - యరసిన బ్రహ్మర్షి వనకున్న నమ్మ”
ననిన వశిష్ఠుని నబ్జసంభవుఁడు - ననిమిషులును బిల్వ నర్థితో వచ్చి
"బలితంపుఁదపమున బ్రహ్మర్షి వైతి - తెలిసితి మింక సందేహంబు లేదు
ముద మొప్పఁ జను" మన్న ముని వసిష్ఠునకుఁ - బదిలుఁడై మ్రొక్కి సద్భక్తిఁ బూజించె
నంత విశ్వామిత్రు నఖిలదేవతలు - నెంతయు దీవించి యేగిరి దివికి.
నారూఢపదుఁడు విశ్వామిత్రుమహిమ - లారయ నిట్టి మహాద్భుతక్రియలు."
అని పల్క రాముఁడు నాలక్ష్మణుండు - జనకాదులును సభాసదులు మోదిలిరి.
యిల్లడ జనకునియింట నుగ్రాక్షుఁ - డెల్ల రెఱుంగ ము న్నిడినచాపంబు1830
కడఁకమై విఱిచి రాఘవుఁ డేపు మెఱసి - కడుమోదమున సీతఁ గైకొను నెల్లి
నని రసాతలమున కంతయుఁ జెప్పఁ - జనినచందమున భాస్కరుఁ డస్తమించె.
జనకు వీడ్కొని గాధిసంభవుఁ డొక్క - యునికిపట్టున రామయుక్తుఁడై యుండె.
ననుపమప్రీతితో నారాత్రి గడపి - యినుపొడుపున నిత్యకృత్యము ల్దీర్చి
జనకుచెంతకు రామసహితుఁడై పోయి - యనియె విశ్వామితుఁ డందఱు వినఁగ.
“నినకోటిసమతేజు లీవిశ్వమూర్తు - లనఘకీర్తులు వీ రనన్యగోచరులు,
ఈపుణ్యధనులు నీయింటిలోనున్న - చాపంబు చూడఁగఁ జనుదెంచినారు.

జనకుండు శివునిచాప మెఱింగించుట

ఆవిల్లు దెప్పింపు" మనవుడు జనక - భూవరుం డప్పు డద్భుత మంది పలికె!
“భవుఁ డంధకాసురభస్మాసురాది - దివిజారివరుల సాధించె నావింట.1840
నుల్లోకుఁడై శివుఁ డుగ్రదానవులఁ - దొల్లి యనేకులఁ ద్రుంచె నావింట
విపులకోపాటోపవిభవుఁడై హరుఁడు త్రిపురదుర్గములు సాధించే నావింట!
నావింట మఱి దక్షయాగంబుఁ జెఱిచె! - దేవేంద్రముఖ్యులఁ ద్రిదశులఁ దోలి,
నియతాత్మ! మాతాత నిమిచక్రవర్తి - నయనయాన్వితునకు నాఱవతరము

నగుదేవరాతుచే హరుఁ డిచ్చెఁ దొల్లి; - యగణితబలమైనయావిల్లు పిదప
నది యాదిగా నుండు ననఘ మాయింట - విదితమై యావిల్లు వినుతుల నొప్పి
జన్నంబు గావింప సమకట్టి యేను - సన్నుతనియతభూస్థలి శుద్ధికొఱకుఁ
గతుశాల దున్న నాఁగటిచాలులోన - నతులితంబుగఁ జాలునం దొప్పు మిగిలి
మందసంబును రాఁగ మది నుబ్బి చూచి - మందసంబును నేను మమత దీయంగ
నతివైభవంబుగా నందులో నపుడు - నతివ యొక్కతె పుట్టె నాశ్చర్యలీలఁ.
బ్రీతితో సీతయన్ పే రొప్పఁబెట్టి - యాతన్వి నాకూఁతు రని పెంచుచుండ,1850
నిల వసంతంబులనెలతీఁగెఁ బోలి - నళినారికళఁ బోలి నానాఁటఁ బ్రబలి
యింతయై యంతయై యెలజవ్వనమున - వింతయై యాయింతి వెలయుట జూచి,
తలకొని తరుణికై ధరణివల్లభులు - బలియులై యేతెంచి పడుచును దమకు
నడిగినవారల కంటి నే నప్పు "డుడురాజబింబాస్య కుంకువ గలదు
హరునివి ల్లిది దీని నతిసత్త్వయుక్తిఁ - బెరిగి యేతెంచి మోపెట్టినఁజాలు
నతనికి నాకూఁతు నబ్జాక్షి నిత్తు! - నతిమోదమున” నన్న నన్నరేశ్వరులు
నెత్తినకడఁకతో నేతెంచి చాప - మెత్తజాలకపోదు రెందరేనియును;
ధను వెత్తఁజాలనిధరణీకు లెల్లఁ - దనరారు సిగ్గునఁ దల లెత్తలేక
“కూఁతు నిచ్చెద నని కోదండమొకటి - బ్రాఁతిగా నెపమిడి భ్రమియించె మనల.
జనకుఁ డాతని నింక సకలయత్నముల - నని సేసి సాధింత” మని విచారించి1860.
చనుదెంచి కోటపై సంవత్సరంబు - ఘనసైన్యములతోడఁ గడిమిపై విడియఁ
దగమున్ను గూర్చు నాధాన్యాదులెల్ల - నొగిఁ దీర మదిలోన నొకటిచింతించి
వడి దేవతలఁ గొల్చి వారిచే నపుడు - వడసినచతురంగబలము గైకొనుచు
విడిసినబలముపై వీఁకతో నడువఁ - దొడరఁజాలక భీతితో కొంద ఱరుగఁ
గొందఱు మాతోడ ఘోరాజి చేసి - చిందరవందరై చెడి వార లోడి;
రక్కజమగుశక్తి నావిల్లు రాముఁ - డెక్కుపెట్టినఁ గూఁతు నెలమి నిచ్చెదను;
విల్లున్న మందస వేగ తెమ్మ” నుచు - బల్లిదులగువారిఁ బదివేలఁ బనిచె;
నది లోహమయమును నత్యాయతంబు - విదితాష్టచక్రంబు విపులంబు నగుచు
నమరెడుమందస మావింటితోడ - తమతమసత్త్వము ల్దగఁగొని వారు
కనకాద్రితోఁ గూడఁ గమలజాండంబు - గొనివచ్చుగతి నీడ్చుకొనివచ్చు దాని1870
జనకునంతఃపురచారులౌ వారు - పనివడి దాదులు పరితెంచి వేగ
జానకి నూర్మిళ జనకునిదేవి - కానంగఁ జనుదెంచి కని చెప్పి రెలమి;
"వినరమ్మ! చెలులార! విన్నపం బొకటి- మనరాజుసభలోన మఱి మును లుండ
గాధినందనుఁడైన కౌశికువెనుక - నరవరోత్తముల నాజానుబాహువుల
నమరంగ దేవగంధర్వులకన్న - కొమరైనతేజంబు కొమరొప్పువారి,

చెలువైనతేజంబు చెలఁగి వీక్షించి - యలవీరు లెవ్వార లని జనకుండు
అడిగినఁ గౌశికుఁ డతిహర్ష మాత్మ - నడరంగ “దశరథునాత్మజు ల్వీరు
హరుచాప మెక్కిడ హర్షించి రిటకు - ధరణీశ! తెప్పింపు తగువారిఁ బనిచి;"
యన నిట్లు కౌశికుననుమతి మీఱఁ - దనమంత్రులను బిల్చి ధనువు దేఁబనిచె
సోరణగండ్లలోఁ జూడఁగవచ్చు - నారయ వేగ రం” డని నాఁతి పిలువ1880
కులము శౌర్యము రూపు గుణమును బొగడ - చెలఁగి చెవుల సుధ చిలికినట్లుండ
ప్రేమ వెగ్గలమైన పృథివీజ కపుడు - రోమాంచ మయ్యె నారూఢమై మేన
ప్రియమును భయమును బిరిగొని పొదల - నయమెంచి తలవాంచి ననఁబోణి యుండె,
అలివేణి సిగ్గున నటఁ బల్కకున్న - చెలువకుఁ బరిచర్య చేసిరి సఖులు;
పన్నీట కుంకుమ పద నిచ్చి యొకతె - చెన్నార మకరిక ల్చెక్కిళ్ళ వ్రాసె
తట్టుపునుంగును దగుచందనంబుఁ - దట్టంబుగాఁ బూసెఁ దరళాక్షి కొకతె;
నుదుటఁ గస్తురిలేఖ నుతముగాఁ దీర్చె - నెదుట నద్దముఁ బెట్టె నెలనాఁగ యొకతె;
కురులు నున్నగఁ దువ్వి కొ ప్పమర్చుచును - విరు లందు నొకతన్వి వింతఁగాఁ దురిమె;
వాసించుబాగాలు వడి నాకుమడుపు - లాసతీజనమణి కందిచ్చె నొకతె;
అలినీలవేణికి నందంబుగాను - మొలనూలిఘంట లిమ్ముల మ్రోయ నిడియె;1890
కులుకుఁబాలిండ్లపై గొప్పముత్యములు - విలసిల్లుహారముల్ వేసె నొక్కరితె;
కాంత గట్టిన చంద్రకావివల్వలను - వింతగా నెరినొప్ప వెసఁ దీర్చె నొకతె;
యీమాడ్కి చెలికత్తె లెలమిఁ గైసేయ - హేమపీఠంబున నెలమితో నుండ
నప్పుడు కల్యాణి నవనినందనను - తప్పక వీక్షించి తల్లి దా నపుడు
కనకసౌధగవాక్షకలితగా నపుడు - వనజాక్షిఁ దోడ్కొనివచ్చె నాయెడకు
నెప్పుడు వీక్షింతు మినవంశజాతు? - నెప్పుడు గనుఁగొందు మేము రాఘవుని?"
అని వారలందఱు హర్షంబుతోడ - ఘనగవాక్షములందు గనుఁగొని రంత;
రాముని లోకాభిరాముని దివ్య - ధామునిఁ గన్గొని తరలాక్షు లపుడు
ఘనశౌర్యరూపముల్ గలిగినవానిఁ - గనకచేలునిమాడ్కిఁ గళ లొప్పువాని,
జోకపువ్వులవిల్లుఁ జొనిపినవాని - జ్యాకిణాంకితహస్తజలజుఁడౌవాని1900
రూపంబు లొక్కట రుచిరవర్ణముల - నేపార వేఱుగా నెన్నఁగవచ్చు
శ్రీపతియంశజుల్ క్షితిపాలసుతులు - భూపాలరత్నము ల్పొలుపారు టౌర;
జనకజ దగు రామచంద్రున కిరవు - ఒనరు సౌమిత్రికి నూర్మిళ యనుచుఁ,
దనరుఁగా కని వారు దగ నెన్నికొనుచు - ననుపమప్రేమతో నటఁ జూచుచుండ;
నమరేంద్రసభఁ బోలు నాసభనడుమ - నమరంగ మందస మటఁ జేర్చి రపుడు;
సభలోన నునుపంగ జనకభూవిభుఁడు - శుభమూర్తి నగ్గాధిసుతుని వీక్షించి
‘‘కిన్నరగంధర్వగీర్వాణయక్ష - పన్నగరాక్షసప్రభృతు లెవ్వరును

నెక్కుపెట్టఁగజాల రీచాప మనినఁ - దక్కిననరులకుఁ దలఁపంగఁ దఱమె
కౌశిక రామలక్ష్మణులకుఁ జూపు - మీశరాసన" మన్న నెలమి నమ్మునియు
రామచంద్రుని జూచి "రఘువంశవర్య - యీమహాధను వెత్తి యెక్కిడి తివియు1910
మాదివరాహమై యవలీల గోట - మేదినీతల మెత్తి మెఱసిన నీకుఁ
దనర నీవిల్లెంత? తలపోయ ననఘ” - యని యిట్లు మునివరుఁ డానతిచ్చినను,
మనువంశతిలకుఁడు మఱి వేగఁ బుత్తు - నని ముని సభలోన నారాజుక్రియను
సౌమిత్రియును దాను జయ్యనలేచి - ప్రేమయుఁ దమకంబు పెనఁగొనుచుండఁ
జెలఁగుచుఁ దనమీఁదిచెఱఁగు రాఁదిగిచి - మొలనూలు బిగఁజుట్టి మోహనాకృతులఁ
దిరముగా నిగ్గులు దిశల శోభిల్ల - నరవిందలోచనుం డసమసాహసుఁడు
మొలనూలిఘంటలు మురువు మించగను - మలఁగుచు నవరత్నమాలిక ల్పొరల
బాహువు ర్లుంగరాల్పటుకంకణములు - బాహువు లంగుళావళి కాంతు లీన
నమరంగఁ గర్ణభూషాదులకాంతి - కొమరారుచెక్కిళ్లు గుదిగొని మెఱయ
అలకలు పెడతల నటనృత్యమాడి - తళుకొందు బంగారుతనుకాంతులీన1920
కోటిమన్మథలీలఁ గొమరుదీపింప - నీటుగా నటువచ్చి నెఱి యెల్ల రెఱుఁగ
జనకునిసభలోన జననుతంబై న - మనువంశతిలకుండు మందస దెఱిచి
ధరణీతలంబెల్ల దనమీఁద నునిచి - చిరనిద్ర సుఖియించు శేషాహి యనఁగఁ
గాలమేఘములోనఁ గదలనిరుచులఁ - దూలక పొలుచు విద్యుద్దండ మనఁగ
నిరుపమాకారత నిండారియందుఁ - గరమొప్పువిల్లెత్తి గవిసెన వుచ్చి

శ్రీరాములు శివునివిల్లును విఱుచుట

గర్వించి తనునెత్తఁ గడఁగి యేతెంచు - నుర్వీశబలము లాహుతులుగ మ్రింగ
నరుణరత్నప్రభ యనుమంటలొలుకఁ - బెరుఁగురు నిలుచున్న పెనుచిచ్చువోలె
నక్కజమగుశక్తి నావిల్లు రాముఁ - డెక్కుపెట్టుచు నుంట నెఱిఁగి కౌశికుఁడు
"హరుని చాపము రాముఁ డతిసత్త్వయుక్తిఁ - బెరిగినేఁ డిదె; యెక్కుపెట్టుచున్నాఁడు;
అదరకు భూదేవి! యాత్మలో నీవు - చెదరి చలింపకు శేషాహి! నీవు1930
కడక ధరింపుము కమఠేంద్ర! నీవు - కడునేమరకుఁడు దిక్కరులార! మీర”
లని ముని పల్కఁగ నామేటివిల్లు - గొనయ మెక్కించి కైకొనక రాఘవుఁడు
తనబాహుసత్త్వంబు దర్పంబు మెఱసి - జనకుని కనియె నాచాపంబు చూచి
"యిది చాలఁ జులకన యిది చాలఁ బ్రాత - యిది చాల నిస్సార మిది చాల నలఁతి
తెగఁగొన నిలువదు దీని నాయెదుటఁ - బొగడితి పలుమాఱు భూపాల" యనుచు.
సురలు ఖేచరులు భూసురులు కిన్నరులు - నరులును నృపతులు నలిఁ బర్వి చూడ.
నెడపక తనజయం బెల్లెడఁ జాటు - వడువున విలుగుణధ్వని చెలంగించి

సీతగుణంబులు చెవిసోఁకె ననఁగ - చేతివింటిగుణంబు చెవిసోఁక దిగువ
వడిరక్కసులపట్టు వదలె నన్నట్లు - పిడిపట్టు వదలినఁ బెకలి పేటెత్తి
పెళపెళధ్వనులును బెటపెటధ్వనులు - కలయ దిక్కులద్రువఁగాఁ బెల్లువిఱిగె;1940
విఱుగ రాజన్యుల విపులమానములు - పఱియలువాఱె భూభాగమంతయును
జిదిసె దిగ్గజములు శేషాహి మ్రొగ్గె - బెదరె భూతములు గంపించె లోకములు;
జనకుఁడు రామలక్ష్మణులును గాధి - తనయుండు నొగిఁ దక్కఁ దక్కినవారు,
బిట్టుల్కి మూర్ఛిల్లి పృథివిపైఁ బడిరి - నెట్టనఁ బొడము నానిష్ఠురధ్వనికి,
జనకభూవిభుఁ డంత సంతోషమంది - ఘనవిస్మయము నొంది కౌశికుఁ జూచి
‘‘నామాట దప్పక నాముద్దుకూఁతు - నీమహితాత్మున కిచ్చెద నింకఁ
దడయక పెండ్లికి దశరథాధీశుఁ - గడుసంభ్రమమున నిక్కడికి రప్పింతు”
నని దశరథునకు నత్తెఱఁగెల్ల - వినుతించి తోడ్తేర వేడ్కతో నపుడు
తనయాప్తమంత్రులఁ దడయక పిల్చి - పనిచిన పనిపూని పరువడి నేగి
జవనాశ్వములమీఁద సాకేతపురికి - దివసత్రయమున నెంతే వేగ వచ్చి1950
తనయుల సేమంబు దలపోసి పోసి - వనరుచునున్న యవ్వసుధేశు గాంచి
వినతులై జనకభూవిభుఁ డంపినట్టి - జననుతవస్తువుల్ సన్నిధి నునిచి
“నీకుమారుఁడు శౌర్యనిధి రామచంద్రుఁ - డాకౌశికుని యాగ మర్థితోఁ గాచి
జనకుజన్నముఁ జూడఁ జనుదెంచి యందు - మునులు రాజన్యులు ముదమంది చూడ
ధర సురాసురులకు ధరియింపగాని - హరువిల్లు మోపెట్టి యవలీల విఱిచె;
విఱిచిన జనకభూవిభుఁ డిచ్చె సీత - నఱలేక తనకూఁతు నారాఘవునకుఁ
యనవుడుఁ దనమది నానంద మంది - జనపతి పెండ్లికిఁ జాటింపఁ బనిచి
బ్రియమునఁ బెండ్లికిఁ బిలువఁ బుత్తెంచె - రయమున విచ్చేయు రాజన్యచంద్ర”
జనకుమంత్రులకు నుత్సవ మొప్ప నిచ్చె - ఘనరత్నభూషణకనకాంబరములు
అఱలేనికులగురుఁ డైనవసిస్ఠుఁ - దెఱఁగొప్పఁ దావామదేవు జాబాలి1960
ఘనునిఁ గశ్యపుని మార్కండేయు నత్రిఁ - దనరు బాంధవులను దనయమాత్యులను
నిమ్ములఁ బిలిపించి యిట్లని పలికె; - "సమ్మదం బడర విశ్వామిత్రునొద్దఁ
దేజంబుతోడ విదేహదేశహమున - రాజిలుచున్నారు రామలక్ష్మణులు;
అందు రాముఁడు రాజు లందఱు చూడ -నెందు నసాధ్యమౌ నిందుశేఖరుని
చాపంబు విఱిచిన జనకుండు సీత - నేపార రామున కీనిశ్చయించి
యెలమిఁ బెండ్లికిని మ మ్మేగుదెమ్మనుచుఁ - బొలుపార నిట వీరిఁ బుత్తెంచినాఁడు.
జననుతం బగుఁగదా జనకుసంబంధ" - మనిన నందఱు మెచ్చి యమ్మఱునాఁడు,

దశరథుఁడు మిథిలకుఁ బోవుట

మొగి వసిష్ఠాదిసన్ములతోఁగూడఁ - దగు బంధరాజన్యతతులతోఁగూడ

రమణీయదివ్యాంబరములతోఁగూడ - విమలమౌక్తికవజ్రవితతితోఁగూడ
గరిరథభటతురంగములతోఁగూడఁ - బరమాప్తవరమంత్రిపతులతోఁగూడ1970
వినుతపుణ్యాంగనావితతితోఁగూడ - ననుపమవైభవం బలరఁ గైసేసి,
కరమొప్ప రథ మెక్కి కల్యాణమునకు - నరనాథతిలకుఁ డానంద ముప్పొంగఁ
గడుఁగెలంకుల గజస్కంధంబులందుఁ - గొడుకులు ముత్యాలగొడుగులనీడఁ
బరమసమ్మదమున భరతశత్రుఘ్ను - లిరువురు గొల్చిరా నేపు దీపింపఁ
గ్రందుగా నిండి మంగళతూర్యకోటు - లందంద మొఱయ మహాభూతి మెఱయ
నెడనెడ విడుదు లనేకవస్తువులు - నడపింప మంత్రులు నాల్గుదినములఁ
జనియెను మిథిలకు; జనకుండు నంత - నినకులాధిపునకు నెదురుగా వచ్చి
కొనిపోయి వేడ్కలు కొమరొత్త నపుడు - జనపతి కుచితోపచారముల్ సేసి
మునివరనివహంబు ముదమంద జనకుఁ - డనియె మహానంద మలర నాతనికి
నాకూఁతు దశరథనరనాథ యేను - నీకుమారుని కిచ్చి నెమ్మిఁ బెండ్లికిని1980
నటు పిల్వఁ బంచిన నీవు విచ్చేసి - తటుకాన నేను కృతార్థుండ నైతి
నీవసిష్ఠమహామునీంద్రుఁ డీవామ - దేవాదిమునులు నేతెంచుటఁ జేసి
నాకోర్కి సిద్ధించె నాజన్మ మలరె; - నా కులం బతిపావనంబయ్యె నేఁడు;
రవికులోత్తములైన రాజులతోడి - యవిరళసంబంధ మది నాకుఁ గలిగె;
నెల్లి పెండ్లికి లగ్న మిష్టులఁ బిలిచి - తెల్లంబుగాఁ బ్రవర్తింపుఁడు ప్రీతి"
ననవుడు దశరథుం డట్లగా కనుచు - ననురాగ మొంది యత్యంతపుఁబ్రీతి
జనకుఁ డమర్చిన సదనరాజమున - ననురక్తి వసియించె నంత నచ్చటికిఁ
గడుఁబ్రీతి రామలక్ష్మణులతఁగూడ - నడరి విశ్వామిత్రుఁ డరుగుదెంచుటయు
ననఘుండు దశరథుం డమ్మహామునికి - వినతుఁడై పూజించి వినయంబుతోడ
“దనరార నీదయ ధన్యుండనైతి - ననఘాత్మ" యన విని యక్కౌశికుండు1990
‘‘అకలంకచరితుండ వైన నీ వనఘ - సుకృతంబు గావించి శుద్ధుండ వైతి,
రవికులోత్తముఁడైన రాముండు పుత్త్రుఁ - డవుట విశేషించి యధికపుణ్యుఁడవు
క్రతురక్షణార్థమై కడఁగి రాఘవులు - హితబుద్ధి నీవె మాకిచ్చితి నాఁడు;
నెమ్మదినున్నారు నీసుతు ల్వీరె - నెమ్మిఁ గన్గొను" మన్న నృపతి కాసుతులు
నాలోన మ్రొక్కిన నలర దీవించి - యాలింగనము చేసె ననురాగ మెసఁగ;
జనకుండు నాదివసంబున నంతఁ - దనయాగకర్మ మంతయు నెఱవేర్చి
యలరువేడుక నినుఁ డస్తాద్రి కరుగఁ - బొలుపొంద నారాత్రి పోయినపిదప
మఱునాఁడు కల్యాణమంటపవేది - నెఱయ మంత్రులతోడ నిండుగొల్వుండి
యిమ్ములఁ దనపురోహితు శతానందు - సమ్మదంబునఁ జూచి జనకుండు పలికె.

ఊర్మిళాదులవివాహయత్నము

“ననఘాత్మ! మాతమ్ముఁ డగుకుశధ్వజుఁడు - కనుగొనవలయు నీకల్యాణ మతఁడు2000
తిరముగా నిక్షుమతీతీరభూమిఁ - బొరి నొప్పుసాంకాశ్యపురి నున్నవాఁడు
అతనిఁ దోడ్తేర నీ వరుగు" మనంగ - నతిజవాశ్వములతో నమరు తే రెక్కి
యతివేగముగ నేగి యాకుశధ్వజుని - నతులితంబుగఁ గని యర్థమైఁ జెప్పి
"జనకపుత్రికి నేఁడు జననాథవర్య! మనువంశచంద్రుఁడౌ మనరామునకును
ఘనముగఁ బెండ్లియౌఁ గడువేడ్కతోడ - జనకుండు యత్నంబు జరుపంగఁగోరి
పతి నిన్నుఁ దోడ్తేరఁ బనిచె నన్నిపుడు - సతులతో హితులతో సకలసైన్యయుతిఁ
గదలుద మిప్పుడే ఘనత మిథిలకు - పద” మని చెప్పినఁ బరఁగ నందఱును
దనరారువేడుకఁ దగ రథం బెక్కి - తనయాద్వయముతోడఁ దా నేగుదెంచి
యనఘమానసుఁడు శతానందునకును - జనకభూవిభునకు సద్భక్తి మ్రొక్కి
యెలమి నమ్మానవాధీశుసమ్మతిని - నలువొప్ప సింహాసనమునఁ గూర్చుండె,2010
నంత సుధామాఖ్యుఁ డను మంత్రి జనకుఁ - డెంతయు ముదమున నీక్షించి "నీవు
చని వసిష్ఠునితోడ సచివులతోడఁ - దనయులతోడ నాదశరథేశ్వరుని
వెరవారఁ దోడ్కొని వేగ ర” మ్మనిన - నరిగి యాతఁడుఁ బ్రీతి నమ్మహీపతికి
వినతుఁడై యిట్లను “వేడ్కతోనున్న - జనకుఁడు పుత్తెంచె జనలోకనాథ!
నీయుపాధ్యాయులు నీతనూభవులు - నీయమాత్యులు నీవు నేతేరవలయు”
ననిన నాదశరథుం డందఱితోడఁ - జని సుఖాసీనుఁడై జనకుతో ననియెఁ
“బరఁగ వసిష్ఠుండు పరమదేవతయు - గురువు నీయిక్ష్వాకుకులమున కెల్ల
సర్వజ్ఞుఁ డగుట నీసంయమీశ్వరుఁడు - సర్వకాలములకుఁ జాలు మా కనిన”
నప్పుడు దశరథునన్వయక్రమముఁ - జెప్ప భావించి వసిష్ఠుఁ డిట్లనియె.

దశరథుని వంశక్రమము

"నరనాథ! విను నిర్గుణబ్రహ్మమైన - హరి సగుణైకలీలాకృతిఁ దాల్చి2020
నిజలీలకై నాభినీరజంబందు - నజునిఁ గల్పింపంగ హరి కజుఁ డొదవె
భూమీశ బ్రహ్మకుఁ బుట్టె మరీచి - యామరీచికిఁ బుట్టె నవనిఁ గశ్యపుఁడు
నతని కర్కుఁడు సుతుఁ డాజగదాప్త - మతికి వైవస్వతమనువు నందనుఁడు
నతనికి నిక్ష్వాకుఁ డనురాజరత్న - మతనికిఁ గుక్షియౌ నాత్మసంభవుఁడు
కుక్షియన్ భూనాథుకొడుకు వికుక్షి - యక్షరాత్ముఁడు బాణుఁ డతనినందనుఁడు
నతనికి సనరణ్యుఁ డతనికిఁ బృథుఁడు - చతురమానసుఁడు ద్రిశంకుఁ డాతనికి
నతనికిఁ దనయుండు నాహరిశ్చంద్రుఁ - డతనికి లోహితాస్యాఖ్యపుత్త్రుండు
అతనికి దుందుమారావనీనాథుఁ - డతనికి యువనాశ్వుఁ డను నరేశ్వరుఁడు

వసిష్ఠుఁడు యువనాశ్వునివృత్తాంతముఁ దెల్పుట

నతనికిఁ బ్రియభార్య లతిరూపవతులు - సతులిద్దఱకుఁ బుత్త్రసంతతిలేమి
నంతట నారాజు నఖిలసన్మునుల - సంతతికొఱకునై సరగ రప్పించి2030
యామహాత్ములకును నర్ఘ్యపాద్యములు - ప్రేమతోఁ దగ నిచ్చి ప్రియవాక్యములను
“ఘనులార! నన్నును గరుణించి మీరు - దనయుల నాకును దయసేయవలయు.”
నని విన్నవించిన నారాజునకును - ననువొంద నమ్మును లపు డిట్టు లనిరి.
"ఐంద్రయాగము సేయు మవనీశ! భక్తి - సాంద్రంబుగాఁ బుత్త్రసంతతి గలుగు.”
నన జన్నమున కప్పు డఖిలవస్తువులు - ననువొందఁ దెప్పించె నాక్షణంబునను
నైంద్రయాగం బను నామఖం బపుడు - సాంద్రానుమోదులై సంయమీశ్వరులు
పుత్త్రలాభంబుకై పొలుపొంద నంత - చిత్రయజ్ఞము దారు సేయఁగ నందు
జలములు మంత్రించి జలకుంభములను - నలరార నియతిచే నటు దాచియుండ
ధరణీశుఁ డారాత్రి దప్పితో నంత - మఱపొంది యాయజ్ఞమందిరమందు
కలశంబులో నీళ్లు గ్రక్కునఁ ద్రావ - జలహీన మగుకలశంబును జూచి2040
“యెవరు ద్రావిరి జలం? బెటుపోయె?” ననుచు - ప్రవిలాత్ములు వారు భావనిరీక్ష
నరసి యానృపతియే యానీరు ద్రావు - టెఱిఁగి చోద్యం బంది యిది దైవమాయ
యని చూచుచుండఁగ నానృపాలకుఁడు - ఘనమగు గర్భంబు కడువేగఁ దాల్చె
గర్భ మంతటఁ బడి కడుచోద్య మలర - నర్భకుం డుదయించె నారాజు చచ్చెఁ
గడఁగుచు ఋషులెల్లఁ గడుదుఃఖ మంది - సడలని యమ్మంత్రసామర్థ్యములను
బనివడి యువనాశ్వు బ్రతికించి ఱంత - ననుపమశుభమూర్తియై యుండి యతఁడు
వరుసతోడుతఁ జక్రవర్తిచిహ్నంబు - లరుదార నుండెడి యాపుత్రుఁ జూచి
యితఁ డేడుదీవులు నేలునటంచు - చతురత ఋషులెల్ల సంతోషపడిరి,
అల యువనాశ్వుండు నామౌనిజనుల - కెలమితో ధరాసు లిచ్చినఁ జనిరి
తల్లియే లేనికతంబున బాలుఁ - డల్లన నాఁకొని యట నేడ్చుచుండ2050
వరుస నాయింద్రుండు వచ్చి తా నప్పు - డరయంగ నాశిశు వాఁకలి దీర
బెనుపొందఁగా నోరఁ బెనువ్రేలు వేగ - నునిచిన నమృతంబు నొయ్యనఁ ద్రావఁ
సుధ గ్రోలుటయుఁ జేసి శుభయుతుపేరు - బుధులతో మాంధాత భూమీశుఁ డనుచు
నతనికి నామధేయం బటు చేసి - యతివేగమునఁ బోయె నాబిడౌజుండు
అంత నామాంధాత యలపూర్ణచంద్రు - నంతటిప్రభతోడ నతిశయిల్లుచును
రూఢిగా యౌవనారూఢుఁడై యంత - గాఢశౌర్యస్ఫూర్తిఁ గడు దేజరిల్లి
రావణాదుల బహురణముల గెలిచి - భూవలయంబెల్లఁ బొందుగా నేలి
విష్ణునిభక్తుఁడై వెలసి యాగములు - జిష్ణుబలంబునఁ జేయుచునుండె.

నారాజునకు విమలాంగియన్సతికి - భూరితేజోయుతు ల్పుత్త్రరత్నములు
నరయంగ ముచుకుందుఁ డాసుసంధియును - దరుణు లేబండ్రును దగ జనియింప2060
సుదతుల ప్రాయంబు సొరిది వచ్చినను - ముదమున సౌభరి మునిపతి కిచ్చె
నతివల కగ్రజుఁడగు ముచుకుందుఁ - డతివేడ్క హరిభక్తుఁడై యేగె దివికి.
నాతని సోదరుం డాసుసంధియును - నాతతపుణ్యాత్ముఁ డై భువి నేలె.
నతనికి ధ్రువసంధి యనురాజు పుట్టె - నతఁడు ప్రసేనజి త్తనురాజుఁ గనియె.
దొరయ ప్రసేనజిత్తుకు భరతుండు - నరయ నాభరతున కసితుండు పుట్టె
నతఁడు రాజ్యము సేయ నాతనిశత్రు - లతులపరాక్రము లైన హైహయులు
దారుణాకారులు తాళజంఘులును - నారంగ సేనబిం దనువాఁడు గూడి
యతిఘోరయుద్ధంబు నతులతఁ జేసి - యతనినె యనిలోన హతుఁ జేసి చనిరి.
అంత నాతనిసతు లతిదుఃఖ మంది - మంత్రుల రాజ్యంబు మఱిఁ దీర్ప నునిచి
మేలిమి నుండిరి మెలఁత లిద్దఱును - కాళింది యనుసతి గర్భమైయున్న2070
మేలోర్వలేక యామెలఁతలం దొకతె - చాలంగ సవతిమచ్చరమునఁ జేసి
గర్భిణియైయున్న కాళింది కపుడు - గర్భంబుఁ జెఱుప నొక్కతె విచారించి
యోర్వక విషము ప్రయోగించె నంత - నావిషమున గర్భ మట వీడిపడక
తా వేగి వేదన తల్లడం బంది - యావనితయుఁ దుషారాద్రికిఁ జనుచుఁ
చ్యవనుని గాంచి యాసంయమీంద్రునకు - నవిరళభక్తితో నల్లన మ్రొక్కి
తనదు వృత్తాంతంబు తగ విన్నవింప - వినియు నాపుత్త్రివి వెఱవకు మనుచుఁ
బొందారఁ గరుణతో బూఁబోడి నెత్తి - కందువదృష్టిని కడఁగి లోఁజూచి
“ప్రతిపక్షదమనుండు పరమధార్మికుఁడు - నతులతేజుండు మహాత్ముండు నగుచు
వరకీర్తివంతుండు వంశవర్ధనుఁడు - పరమరూపంబున భాసిల్లు జగతిఁ
బొగడొందఁ గరముతోఁ బుత్త్రుండ నీకు - నగుఁగాకఁ గాళింది" యనుచు దీవించె
వలగొని యమ్మునీశ్వరునకు మ్రొక్కి - యెలమితో దనయింటి కేగి యాయువతి
యతిముదంబున నున్న యాశుభాంగికిని - సుతుఁ డుదయించెను శుభముహూర్తమునఁ
గరమొప్పఁ బుత్రునిఁ గాంచి కాళింది - గరముతో ముద మందెఁ గడుసంభ్రమమున.
నాతండు శత్రుల నణఁచి రాజ్యంబు - చేతోముదంబునఁ జేయుచునుండ
సతతంబు విలసిల్లె సగరుఁడు పేర - నతనికిఁ దనుజన్ముఁ డసమంజసుండు
అతనికి సుతుఁ డయ్యె నంశుమదాఖ్యుఁ - డతనిపుత్త్రుఁడు దిలీపావనీనాథుఁ
డతని కున్నతపుణ్యుఁడగు భగీరథుఁడు - సుతుఁ డాతనికిఁ గకుత్స్థుం డనురాజు
నతనిసూనుఁడు రఘు వనుమహీపాలుఁ - డతనిపుత్రుఁడు పురుషాదకుం డగుచుఁ
గమనీయసితకీర్తి కల్మాషపాదుఁ - డమరశంఖణుఁ డయ్యె నతని కాతనికి
మతుఁడు సుదర్శనక్షోణీతలేశుఁ - డతని తనూజన్ముఁ డగ్నివర్ణుండు2090

అతనికి ఋతుపర్ణుఁ డతనికి మరువు - అతనికి శీఘ్రగుం డతనికి మనువు
సుతుఁ డయ్యె నంబరీషుం డనురాజు - సుతుఁ డాతనికి జనస్తుత్యుండు నహుషుఁ
డతనికి సుతుఁడు యయాతియvd మేటి - యతనికి నాభాగుఁ డాతని కజుఁడు
అతనికి దశరథుఁ డనఘ! నీపుణ్య- సుతుఁ డయ్యె సఫలనిస్తులమనోరథుఁడు
రాముఁ డీదశరథరాజతనూజుఁ - డేమని వర్ణింతు? నింక నే నధిప!
యితనికి నీకూఁతు నీఁగంటి వీవు - కృతకృత్యుఁడవు శుభాంకిత మయ్యెఁ గులము”
అని యిట్లు రఘువంశ మభినుతి సేయ - విని శతానందుండు విమలమానసుఁడు
జనకానుమతి సభాసదు లెల్ల వినఁగ - మునివసిష్ఠునిఁ జూచి ముద మొప్పఁ బలికె.
“మునినాథ! మీచేత ముదమార వింటి - ననఘాత్ము దశరథునన్వయక్రమము
సన్నుతి కెక్కు నే జనకునన్వయము - చెన్నగు మీ కేను జెప్పెద వినుఁడు.2100

శతానందుఁడు జనకువంశక్రమంబు దెల్పుట

సద్విజపరమహంసప్రతిపాద్యుఁ - డద్వితీయబ్రహ్మ మైన యచ్యుతుని
నాభిసరోజంబునను బ్రహ్మ పుట్టె - నాభూతనిర్మాత యగు ధాతవలనఁ
బుట్టె మరీచి యాపుణ్యవర్తనుని - పట్టియై కశ్యపబ్రహ్మ జనించె.
నతనికి దిననాథుఁ డాత్మజుం డయ్యె - మతిమంతుఁ డతనికి మనువు జన్మించె,
నమ్మను వచ్యుతధ్యానకాలమున - దుమ్మఁగ వైవస్వతుఁడు తుమ్మువలను
నిర్మలాచారుఁడు నీతికోవిదుఁడు - ధర్మశీలుఁడు జగద్భరితమానితుఁడు
విమలమూర్తి త్రిలోకవిశ్రుతకీర్తి - నిమి యనురాజు మానితతేజుఁ డొప్పె
నతనిపుత్రుఁడు మిథి యతనికి జనకుఁ - డతని కుదావసుం డమ్మహీజాని
తనయుండు నందివర్ధనుఁడు సుకేతుఁ - డనువిభుఁ డతనికి నమ్మహాత్మునకు
రాజర్షి యగుదేవరాతుఁ డెల్లెడల - రాజిల్లె మఱి బృహద్రథుఁడు దత్సుతుఁడు2110
నతనినందనుఁడు మహావిభుఁ డతని - సుతుఁ డయ్యె సుధృతి యాసుధృతికి ధృష్ట
కేతుఁ డాతని కురుకీర్తి హర్యశ్వుఁ - డాతనికిని మరుం డామరునకును
సుతుఁడు ప్రతీంధకక్షోణీశుఁ డతని - సుతుఁడు కీర్తిరథుండు సుతుఁ డావిభునకు
దేవమీఢుండు తదీయుఁ డౌ విబుధుఁ - డావిబుధునిపుత్త్రుఁ డామహీధునకుఁ
గీర్తిరాతుఁడు వానికిని మహారోముఁ - డార్తిదూరుఁడు వాని కాస్వర్ణరోముఁ
డాస్వర్ణరోముండు హ్రస్వరోమాఖ్యు - భాస్వరగుణశాలిఁ బడసె నాతనికి
జనకభూపాలకుశధ్వజు ల్వీరు - జనియించి రిరువురు సౌజన్యధనులు
జనకుఁ డంతట మహీజనులఁ బాలింపఁ - గని యొక్కనాఁడు సాంకాశ్యభూవిభుఁడు
ధన్యవిక్రముఁడు సుధన్వుఁ డన్వాఁడు - సైన్యసమేతుఁడై చనుదెంచి మిథిల
సీతాసమేతంబు శివునివి ల్లడుగ - దూతఁ బుత్తెంచినఁ ద్రోపించె వెడల2120

పై వచ్చి హరునిచాపంబు సీతయును - గావలె నని ఘోరకలహంబుఁ జేయ
జనకుండు సంగరస్థలి వానిఁ గూల్చి - తనతమ్ముఁ బూన్చె నద్ధరణికి ననుచు,
జనకుఁ డాదిగ వంశజాతు లందఱికి - జనకనామము ప్రశస్తము ధాత్రిలోన
నిమివంశమునఁ బుట్టునృపతు లందఱును - సమధికయోగవిజ్ఞానసంపదల
చిరజీవు లటుగానఁ జెచ్చెఱ వీరి - తరమును కొంచెమై తగును లెక్కకును
జనకునివంశంబు సద్వర్తనంబు - గొనియాడి యాసీతగుణమును బొగడి
విశదప్రతాపుని విమలభాషణుని - దశరథుఁ గనుఁగొని దశరథాధీశ!
నీతనూజుని రాము నిత్యాభిరాము - సీతతోడుతఁ బెండ్లి చెలువొప్పఁ జేసి
యలఘుకీ ర్తులఁ బొందు" మనుశతానందు - పలుకుల దశరథపతి యుత్సహించి
ఘనుఁ డావసిష్ఠుని గాధినందనునిఁ - గనుఁగొని వారితోఁ గడువేడ్కఁ బలికె.2130
“చారువిచారు నీజనకభూవిభుని - మీ రడుగుండు సౌమిత్రి కూర్మిళను
బ్రకటగుణోత్తరు ల్భరతశత్రుఘ్ను - లకుఁ గుశధ్వజనృపాలకుని కూఁతులను"
అన వారు జనకున కత్తెఱం గెల్ల - వినిపించి యనుమతి వేవేగ పడసి
జనకునివాక్యము ల్సకలంబు వేడ్కఁ - దనరారఁ జెప్పి రాదశరథుతోడ,
ననురాగ ముప్పొంగ నామఱునాఁడు - ఘనశుభగ్రహదృష్టి గలుగుటఁ జేసి
పనివడి యుత్తరఫల్గునియందు - జనకుండు లగ్ననిశ్చయము సేయించి

పురాలంకారము

పురమును దనయంతిపురముఁ గైసేయఁ - బరిచారకుల వేగ పంపిన వారు
"గంధకస్తూరికాకలితాంబుపూర - గంధిలసకలమార్గధరాంగణంబు
చీనిచీనాంబరశ్రేణీవితాన - నానామణీతోరణధ్వజాంచితము
ఫలభారకమ్రరంభాస్తంభపూగ - కలితప్రతిద్వారకక్ష్యాంతరంబు2140
సాంకవలిప్తవిస్తారవితర్ది - కాంకితరంగవల్ల్యాదిశోభితము
మణిశాతకుంభకుంభవితర్కితార్క - గణసౌరగోపురోత్కరశిరోగ్రంబు
దీపితమాణిక్యదీపసాంబ్రాణి - ధూపపుష్పకలాపధూర్వహణంబు
నై పురమెల్లెడ నలరఁ గైసేసి - నైపుణి మెఱసి యంతఃపురంబంత
గరమొప్పఁ గైసేసి కల్యాణవేది - విరచింపుఁ" డన శిల్పవేదు లంతయును
బచ్చఱాజగతిపైఁ బసిడికంబములు - మెచ్చుగా నిల్పి యామీఁద నీలంపు
బోదెలు గురువిందముల దూలములును - పాదుగా నిడి తీరుపడఁ జెక్కడంపు
గోమేధికంబుల కొణిగెలు బరివి - గా మల్చి పై వజ్రగార యొసంగి
హాటకమణిమయాయతకవాటములు - వాటంబుగా నాల్గువాకి ళ్ళమర్చి
అందుల బంగరుహరువుచిత్తరువు - లందంబుగాఁ దీర్చి హరినీలగరుల2150

గమి గమిచినపటికంపుసింగముల - గమక మౌ సౌపానగతు లేర్పఱించి
కలితలామజ్జకకాయమానములు - కలువడంబులు డంబుగాఁ జుట్టికట్టి
యాలోన నేకాండ మౌ బలుపచ్చ - మేలిపెండ్లియరుంగు మృగనాభి యలికి
ముత్తెంపునిగ్గుల ముగ్గు లేర్పఱిచి - చిత్తజజనకలక్ష్మీవివాహంబు
గుజరాతికెంపులగోడ లిఖింపఁ - బ్రజలకుఁ గన్నులపండువై యుండె.
అంత వసిష్ఠవిశ్వామిత్రమునుల - సంతతపుణ్యుల జనకుండు చూచి
మీర లయోధ్యకు మిథిలకుఁ గర్త - లేరూప ముచితమౌ నిటమీఁది పనులు

దాశరథుల నలంకరించుట

అది సేయుదురుగాక" యనవుడు వారు - చదురొప్ప దశరథజనపాలచంద్రు
కొడుకుల నల్వురఁ గొమరొప్పు నప్పు - డెడతెగనట్టి యాయెల్లవాద్యములఁ
బాటలు పాడుచుఁ బరఁగ నంగనలు - తేటగా నందఱు తెచ్చి పీఁటలను2160
గూర్చుండఁ దలలంటి కుదురుగ వార - లేర్చి నల్వులు పెట్టి యెంతయుఁ బ్రీతి
స్నానముల్ సేయించి చక్కగా నుదుట - మానవతిలకంబు మఱి భూషణములు
చీనాంబరంబులు చెలువొప్ప నిచ్చి - నానావిధంబుల నలువుగఁ బొంగి
దశరథుభార్యలు దశరథేశ్వరుఁడు - విశదప్రతాపుండు వేడ్క నుప్పొంగి
సకలభూషణములు సరసతఁ బెట్టి - యకలంకమతితోడ నంతట నుండి
యాయతశుభమైన యభ్యుదయంబు - సేయింప నర్థితోఁ జేసె నవ్విభుఁడు
ఎక్కుడుసంతోష మెసఁగఁ జిత్తమున - నొక్కొక్కసుతున కభ్యుదయంబుకొఱకు
వెలయంగ నన్నియు వేదోక్తయుక్తి - గలయఁ బదాఱులక్షల ధేనువులను
గలధౌతఖురములు కనకశృంగములు - తలకొని చెలువొందు తామ్రపుచ్ఛములు
దొరయ మించిన కాంస్యదోహళంబులును - వరుస వేష్టించిన వరవస్త్రములును2170
గలిగి సవత్సలై కర మొప్పువాని - లలి భూసురోత్తములకు భక్తి నిచ్చి
మఱియు నసంఖ్యాతమహితహేమములు - తఱుచుగా నంతట దక్షిణ లొసఁగి
భూదానవసుదానములు మొదలైన - వేదోక్తదానము ల్వేర్వేఱ నొసఁగి
తదవసరమున యుధాజిత్తు ప్రేమ - తుద మీఱఁగా భరతుని మేనమామ
తనతండ్రి కేకయధరణీశ్వరుండు - మనుమని భరతుని మైత్రిఁ దోడ్తేరఁ
దను నంపఁగా నయోధ్యకు వచ్చి యచటఁ - దనయులపెండ్లికి దశరథేశ్వరుఁడు
జనకునివీటికిఁ జనుట యెఱింగి - యనురక్తి వేవేగ యచటి కేతేర
దశరథుం డతని నాదరణఁ బూజించి- కుశలంబులెల్లఁ బేర్కొనుచుండె నంత.
మఱునాఁడు స్నాతకమహితకృత్యములు - తఱితోడఁ గావించి తమ్ములుఁ దాను
రాముఁ డత్తఱి దశరథునొద్ద నిలువ - శ్రీ మీఱ నతనిఁ గైసేయింప నృపుఁడు2180

నారాము నౌఁదల నమరెఁ గిరీట - మారోహణాద్రిశృంగాగ్రమో యనఁగ,
బద్ధకంకణుఁ డయ్యె భక్తులఁ బ్రోవ - సిద్ధ మన్నట్లు దాల్చెను గంకణములు.
ఎద మున్ను పుట్టిన యిందుదీధితులు - పొదలె నేఁడన హారములు చెన్నుమీఱెఁ
దన కనకాంబరత్వము భూమిఁ దెల్పె - ననఁ గనకాంబరం బలరారెఁ గటిని.
గష్టరావణునిచేఁ గాసిల్లినట్టి - యష్టదిక్పాలురు యశము లిర్వంక
మౌక్తికచ్ఛలమున మనవులు దెల్పు - యుక్తిమైఁ జౌకట్టు లొప్పె వీనులను
వదనశృంగార మీవైఖరి నొప్పఁ - బొదలినఁ గస్తూరిబొట్టు చూపట్టెఁ.
బదపడి లక్ష్మణభరతశత్రుఘ్ను - లుదయార్కతేజు లొండొరులు వేర్వేఱఁ
గుండలకేయూరకోటీరహార - మండనావళి సుకుమారదేహములు
గైసేయ నందు దిక్పతులమధ్యమున - వాసవుం డన రామవల్లభుం డొప్పె.2190
అంత నక్కడ జనకావనీనేత - కాంతిమై నలువురు కన్యకామణులఁ
గైసేయ సైరంధ్రికలఁ బంప వారు - భాసురమణిపీఠిపై వారి నునిచి
పేరఁటాం డ్రొగిఁ బాడు పెండ్లిపాటలకు - శారికాకీరము ల్సందడి సేయఁ
గుంకుమకస్తూరిగోరోచనంబు - సంకుమదంబు వాసనఁ గదంబింప
నలుగురి కొక్కట నలుఁగులు పెట్టి - కలమృదుధ్వనులఁ గంకణములు మెఱయ
కురులసం పెఁగనూనెఁ గూర్చియింపొంద - హరిచందనంబుల నటకలు పెట్టి
ఘనసారసురభినఖంపచాంబువుల - జనకపుత్రికలకు జలకము ల్దీర్చి
జిలుఁగులఁ దడియొత్తి చెంగావివన్నె - చలువపావడలపై జాళువాసరిగె
కొంగుల నొప్పు దుకూలము ల్గట్టి - శృంగారములగుప్పఁ జేసిరో యనఁగ!
గొప్పగా నొప్పుగాఁ గొప్పు లమర్చి - విప్పుగా జాజిక్రొవ్విరు లందుఁ దుఱిమి2200
పచ్చకప్పురముతోఁ బన్నీటితోడ - పచ్చికస్తురికలపము గూర్చి యలఁది
బంగారుసరిగెగన్పడు కుట్టుపనుల - కంగుల ఱయికలు కనుపట్లఁ దొడిగి
చనుకట్లమీఁదఁ బచ్చలబన్నసరము - లును దాహారంబులును బొందుపఱిచి
ముద్దుమోముల కొక్కముఱువు కాఁ గోరఁ - దిద్దుకుఁ గస్తూరితిలకము ల్దీర్చి
చెక్కుల మకరిక ల్చిత్రించి గొప్ప - ముక్కర ల్నాసాగ్రములఁ గీలుకొల్చి
మగరాలతళుకుఁగమ్మలును గట్టాణి - బొగడలు చుఱుకుఁ గెంపుల బవిరెలును
బచ్చకడియము ల్పద్మరాగములు - గుచ్చిన మొలనూళ్లు గోమేధికముల
యందియల్ మొదలైన హారభూషణము - లందంబుగాఁ జేర్ప నపుడు కన్యకలు,
శారదపూర్ణిమాచంద్రునికళలొ? చారువసంతవాసనపుష్పలతలొ?
సానదీఱిన మంచిజాతిరత్నములొ? - శ్రీ నిండఁబట్టి నార్చిన కుందనంపుఁ2210
గమ్మలో? కఱిఁబులుగడిగినముత్తి - యమ్ములో నెఱతావి నలరు గంధంపుఁ
గొమ్మలో? యనఁ బెండ్లికూఁతు లొప్పారి - రమ్మక్క యని సతు లక్కజంబంద

వారిలో సీత లావణ్యవిఖ్యాత - సారగుణవ్రాత జగదేకమాత
యాదిమలక్ష్మి దానై పుట్టెఁ గాన - నాదేవిచెలువ మింతంతని తెలిసి
భూషింప శక్యమే? భూషణంబులకు - భూషణంబై యొప్పె భూదేవికరణి;
మెఱసి రత్నాకరమేఖల యగుచు - మఱి గంధవతి వసుమతియుఁ దా నగుచు,
అంత వసిష్ఠసంయమి లగ్నసమయ - మంతయు జనకున కరసి యేతెంచి
దశరథుతో సమస్తము దెల్ప నతఁడు - కుశికపుత్త్రవసిష్ఠగురులతోఁ గడలి
యమరేంద్రవిభవుఁడై యర్హయానములఁ - గొమరొప్పఁ గైసేసి కొడుకులు నడువ
శృంగారములు సేసి చెలువలు నడువ - సంగడిఁ గొలిచి రాజన్యులు నడువఁ2220
గ్రంతలు గొన పుణ్యకాంతలు నడువ - నంతంతఁ బొగడుచు నర్థులు నడువఁ
గైసేసి హయమత్తగజములు నడువఁ - గైసేసి మంత్రివర్గంబు తో నడువ
వేదనాదములతో విప్రులు నడువ - మోదంబుతో మునిముఖ్యులు నడువ
నడచి యజ్జనకునినగ రొప్పఁజొచ్చి - పుడమిఱేఁ డప్పుడు పుత్త్రులు దాను
వనజలోచనలు నివాళు లొసంగ - జనకుఁ డెదుర్కొని సంభ్రమం బెసఁగ

శ్రీసీతారామకల్యాణము

ఖచితోరునవరత్నకల్యాణవేది - నుచితపీఠంబున నున్నచోఁ బ్రీతిఁ
దనపురోహితునితోఁ దడయక జనకుఁ - డనలుఁ బ్రతిష్ఠించి హైమవేదికను
వేదోక్తగతి హోమవిధు లాచరించి - యాదేవకన్యక లననొప్పు తనదు
కన్యకామణుల నగణ్యలావణ్య - మాన్యల నలువుర మైత్రి రావించి
జనకుండు మధుపర్కసమయంబుఁ దీర్చి - తనకూర్మిపుత్రి సౌదామినీగాత్రిఁ2230
గామినీజనమణిఁ గమలాక్షి సీతఁ - గోమలి దెరమఱుంగుగ వేడ్క నిలిపి
రామాభిరాముఁ డారామచంద్రునకుఁ - గామితసిద్ధి సంకల్పపూర్వముగ
"శ్రీరామ నాపుత్రి సీత సద్ధర్మ - చారిణిఁ గొను మగ్నిసాక్షిగా” ననుచు
దారవోసెను డేవతాపుష్పవృష్టి - ధారతో దివ్యవాద్యధ్వనుల్ మీఱఁ
బ్రమదంబుతోడ దీపాలపళ్లెములు - సమదయానలు మహాసంభ్రమంబునను
దలఁబ్రాలు బంగరుతబుకుల నునిచి- కెలఁకుల రమణులు కెలుచుఁ బట్ట
గుడముతో జిల్కఱఁ గూర్చి యిద్దఱకు - వడి శిరస్సులమీఁద వలనొప్ప నుంచి;
రంతట సుముహూర్త మని తెరదీయఁ - గాంత నెమ్మోము ము న్గనుఁగొని యలరె;
రామునికనుఁగవ రాకాసుధాంశు - గోమున నలరెడు కుముదంబు లనఁగ
భామచూపులు నిల్చెఁ బతిపాదయుగళిఁ - దామరపై తేటితండంబపోలె,2240
నింతిలావణ్యాబ్ధి కెదురెక్కు మీన - సంతానమై రామచంద్రు చూ పడరె;
వరుదేహకాంతిప్రవాహమధ్యమున - దరుణిచూపులు పద్మదళములై గ్రాలె

సతిచూపుఁ బతిచూపు సరసతఁ జూపు - రతిరూపు రతిమనోరమణుని రూపు
నెలమి నొండొరులు మే నెఱుఁగరాకుండఁ - గళలంట దాఁకినగతిఁ గొంతసేపు
వెలసె నంతట రఘువీరకుంజరుఁడు - చెలికేలుఁగెందమ్మి చెలువునఁ బట్టి
యొండొరు ల్పులకించి యొక్కపీఠమున - నుండి హోమము సేయుచుండిరి ప్రీతి
ఉరుపయోధన్య నాయూర్మిళాకన్యఁ - గరము సంప్రీతి లక్ష్మణకుమారునకు
వలనొప్పు నాకుశధ్వజకూఁతులందు - నలినాయతాక్షి మాండవి భరతునకు
నత్రిజబింబాస్య యగు శ్రుతకీర్తి - శత్రుఘ్నునకు నిచ్చె జనకుండు ప్రీతి!
నిగమోక్తవిధినిఁ బాణిగ్రహణములు - తగిలి కావించి రాదశరథాత్మజులు!2250
తలఁబ్రాలు వోసి రందఱు లాజహోమ - ములు దీర్చి కాంచిరి మునులదీవనలు
దివినుండి ఘోషించె దేవదుందుభులు - భువినిండ వర్షించె బుష్పవర్షములు ;
అప్పు డానందించి రఖిలదేవతలు - నప్పు డానందించి రఖిలసన్మునులు;
పాడిరి గంధర్వసతు లుత్సహించి - యాడిరి సంప్రీతి నమరకన్యకలు;
అపుడు వసిష్ఠుఁ డాయవనీశసుతుల - నుపమింప వైవాహికోక్తమైనట్టి
హోమాంతమున వారి యుచితకృత్యములు - నేమంబుతో నగ్ని నెఱిఁ బ్రదక్షిణము
సేయించి సప్తర్షిసేవ లొనర్చి - యాయతంబుగ దీక్ష నలరుచు నపుడు
కూర్చుండి రందఱు కుదురుగా నందు; నేర్చుచు మౌనులు నెసఁగు భూసురులు!
సరగున నందఱు సంతోష మెసఁగ - పరఁగ దీవన లిచ్చి పరమపావనుల
శుభలక్షణంబుగా సుందరీజనుల - విభవసమృద్ధిగా విలసిల్లి నప్పు2260
డాయతంబుగ దీక్ష నలరి మోదమునఁ - జేయించి మఱునాఁడు చెలఁగి సదస్సు
గావించి సంతోషకలితులై యపుడు - దీవించి రందఱు దివ్యచిత్తములఁ;
దెఱఁగొప్పఁగాఁ బెండ్లి దినములు నాల్గు - నెఱయ నిత్తెఱఁగున నిండియుండుటయు.
అన్నిశోభనములు నన్నితేజముల - కన్నులపండువుగాఁ జూచి ప్రీతిఁ
దరణివంశాధీశు దశరథాధీశు - శరధిసన్నిభశీలు జనకభూపాలు
వెఱవొప్ప దీవించి, వేడ్క వా రనుప - నరిగెఁ గౌశికుఁడు హిమాచలంబునకు;
నప్పుడు మిథిలేశుఁ డానందకేళి - నుప్పొంగి నిజవిభవోన్నతి మెఱసి
ధరణీశులకుఁ జాలఁ దద్ద్రాజయుగము - వరభూషణంబులు వస్త్రంబు లొసఁగఁ
దమదేశములకును దగఁ జనిరంతఁ; - గ్రమమున నర్థాంగణముల కెల్ల
నపరిమిత ద్రవ్య మట యిచ్చి పనిచి - నృపయుగ్మ మొప్పెను నెనగొప్పఁగాను;2270
గరమొప్ప బుద్ధులు గఱపి కూఁతులకు - వరరత్నభూషణావళులు విచిత్ర
చిత్రాంబరములు దాసీజనంబులును - నేత్రోత్సవంబుగా నెమ్మితో నొసఁగి
కరిరథహయభటగణభూషణాదు - లరణంబుగాఁ దనయల్లుండ్ర కిచ్చి.
యావసిష్ఠాదిసంయములకు దశర - థావనీశునకు ననర్ఘ్యమాణిక్య

భూషణంబు లొసంగి పూజించి వినయ - భాషణంబుల యుక్తపద్ధతి ననుపఁ
గొడుకులఁ గోడండ్రఁ గొమరొప్పఁ గొనుచుఁ - గడఁకతో దశరథక్ష్మాపతి గదలి
యడరి యయోధ్యకు నరుగుచోఁ ద్రోవ - వడిఁబేర్చి ప్రతికూలవాయువు ల్వీచెఁ;
దడయక దుర్నిమిత్తము లనేకములు - పొడచూప నప్పుడు భూపతి కలఁగి,
“యేలొకో మునినాథః యిబ్భంగిఁ గడఁగి - పోలనిశకునము ల్పొడచూపఁదొడఁగె?"
ననవుడు దశరథు ననుకంపఁ జూచి - యనియె వసిష్టసంయమి నిశ్చయించి2280
“యుర్వీశ! ముందఱ నొకమహాభయము - పర్వి యాలోననే పాయు నోడకుము”
అనుచుండ వాయువు లందంద విసరెఁ - గనుకను పెంధూళి గప్పెఁ గప్పుటయుఁ,
గరులు జోదులుఁ దురంగములు రాహుతులు - విరథులై రథులు నివ్వెఱపాటు పడిరి
సేనలు నల్దెస ల్చీకాకుపడియె! - భానుమండలమునఁ బ్రభ మానె; నంత,
నిరువదియొక్కమా ఱేచి రాజులను - దరమిడి చంపిన ధన్యవిక్రముఁడు
క్రమ్మినజడలలోఁ గాఁపున్నగంగ - చెమ్మ నానుదుటను జెమ టుబ్బుచుండ
ఘోరమై మండెడు కుత్తుకవిషముఁ - గ్రూరదైత్యులమీఁదఁ గోపించి యుమిసి
పరమేశ్వరుఁడు దనఫాలనేత్రమునఁ - బెరిఁగి మండుచునున్న పెనుమంటఁ బుచ్చి
తనరెండుకన్నులఁ దగఁ బంచిపెట్టు - కొని వచ్చుపగిదిఁ గన్గొనలఁ గెంపెసఁగఁ
దెగి లోనమండెడు తీవ్రకోపాగ్ని - యెగసి మై సుడిగొన్న యెఱమంట లనఁగ,2290
వెలసి కెంజాయల వెదజల్లు జడలు - బలిసి జూటంబున భాసిల్లుచుండఁ
దమకించి భుజలక్ష్మి తాఁ బట్టి యాడు - విమలనాళముతోడి విరిదమ్మి యనఁగఁ
బరశువు మూఁపున భరియించి వచ్చు - పరశురామునిఁ జూచి భయమున నలఁగి
రయమున దశరథరాజు సన్మునులు - భయనివారణమంత్రపరతంత్రు లగుచు

పరశురాముఁడు శ్రీరాము నెదుర్కొని భంగపడుట

ననఘులై యెదురుగా నర్ఘ్యపాద్యములు - గొనిపోవ వానిఁ గైకొనక రౌద్రమున
దశరథభూపాలు దర్పించి చూచి - దశరథరాము ముందఱ వచ్చినిలిచె;
నిలిచిన భార్గవునిజమూర్తిఁ జూచి - తల యూచి మెచ్చి సద్భక్తితో మ్రొక్కి,
చక్కఁ గట్టెదుర హస్తము లొప్ప మొగిచి - యొక్కింతభయమున నున్న వీక్షించి
“నీ వెంత మ్రొక్కిన నిన్ను మన్నించి - పోవ నాతోఁ బోరు భూపాల" యనుఁడు,
‘భూసురోత్తమ! కశ్యపుఁడు మొదలయిన - భూసురోత్తములకు భువి నెల్ల నిచ్చి2300
యతిజితేంద్రియవృత్తి నడవుల నుండ- నతులతపోరాశి వగుటను జేసి,
యొనర నీ కెఱఁగుట యుచితంబు గాన - మునినాథ! యే నీకు మ్రొక్కితిఁ గాన,
వెఱచి మ్రొక్కుట గాదు వెరవరి నన్ను - నుఱకఁ బోనాడుట యుచితమే నీకు?”
ననవుడు దాపసుం డని నన్నుఁ బలికి - తనిలో సహస్రబాహార్జునుఁ దొట్టి

యిరువదియొక్కమా ఱేచి రాజులను - తరమిడి చంపితి ధరణిపైఁ దొల్లి
నెఱిఁ దిలోదకములు నెత్తుట నొసఁగి - తెఱఁగొప్ప మీపితృదేవతలెల్ల
భూపాలశవములఁ బొందొంద దివికి - సోపానములు చేసి సొరిదియై చనిరి;
అట్టి భార్గవురాము ననఘ - నన్నెఱుఁగ కిట్టేల రాముఁడై యిలఁ బుట్టి తీవు?
రాజన్నఁ బొరిఁగొందు రామనాములను - రాజుల సైఁతునే రణభూమి నేను?
రాజకులుండవౌ రాముని నిన్ను - నాజి మన్నింతునే? యదియును గాక2310
రాజని మీతండ్రి రణమునఁ ద్రుంప - నాజికి వచ్చిన నాకును నోడి
స్త్రీలమఱుంగునఁ జెలువొప్ప నున్న - కాలవశంబునఁ గాచితి నతనిఁ
దాన గర్వాంధుఁడై తద్దయు నిపుడు - మానక యున్నాఁడు మఱి యుబ్బి యిచట..
మఱుఁగుజొచ్చిననైన మననీయ” ననుచు - వెఱవక పల్కిన వెఱపుతో నపుడు.
అనవుడు దశరథుఁ డతిభీతుఁ డగుచు - వినయోక్తి భార్గవు వీక్షించి పలికె.
"నీవు బ్రాహ్మణుఁడవు నీకు రోషంబు - గావింప నేటికి? ఘనముగా నాదు
తనయులు బాలురు తగదు కోపంబు - వినుతశాస్త్రపురాణవిఖ్యాతిఁ గనుట,
నెఱుఁగనే? భార్గవ! యెఱుఁగవే నీవు - ఎఱుఁగని మర్మంబు లెందైనఁ గలవె?
నీతోడఁ బోరాడ ని న్నెదిరింప - నాతతంబుగ నుండు నట భవుం డైన,
నోపునే? భార్గవ! యొరు లెదిరింపఁ - బాపవే యీతఱిఁ బరమపావనుఁడ!2320
దేవేంద్రుఁ డైన నీతీవ్రప్రతిజ్ఞ - భావించి యుడుపంగ భవ్యుండు గాఁడు;
మన్నించి రక్షించి మమ్ము నందఱను - జెన్నుగాఁ జను" మని శిరసును వంచి
మన్నింపు మని వేఁడి మఱియు మ్రొక్కినను - గన్నులఁ గోపంబు గడునొప్పి యుండె;
నని తన్నుఁ గొనియాడ నతనివాక్యములు - విని యాదరింపక విపులరోషమునఁ
గనలుచు నత్యంతకఠినుఁడై యపుడు - దమియింతు నని మదిఁ దలఁచి యిట్లనియె.
“కర మొప్ప విలువిద్యఁ గడిమిమై నేను - హరునితోఁ దొల్లి యభ్యాసంబు సేయ
నాఁడు కుమారుండు నాతోడఁ దొడరి - పోఁడిమి చెడి యోడిపోయినఁ జూచి,
నాపెంపు మెచ్చిన నాగకంకణుని - చాపంబు విఱిచిన సైఁతునే? మఱియు,"
అనిన నారఘురాముఁ డారాముఁ జూచి - యనియె నిశ్చలవృత్తి నతిసమ్మదమున
"నేను వినోదమై నెక్కిడి తివియఁ - గా నది విఱిగెను గాకఁ దానట్ల2330
నాతెగ కేల పినాకివి ల్నిలుచు? - నాతతభుజసత్త్వ మట్టిదె నాకు;
నెసఁగ యుద్ధములందు నిక్ష్వాకుకులులు - పసుల బ్రాహ్మణులఁ జంపఁ దలంప రెందు.
నీ వెన్ని పలికిన నీ కవి చెల్లె; నీవు బ్రాహ్మణుఁడవు నినుఁ జంపనొల్ల;
నిదె నాదుకంధర మీదె నీదుపరశు - వదరక యుచితకృత్యము సేయు మింక;"
ననవుడు రఘురాము నలుక దీపింపఁ - గనుఁగొని పలికె భార్గవరాముఁ డడరి
"భావింప నాకు నీపలుకులఁ జూడ - నీవు క్షత్రియుఁడవు నేను బ్రాహ్మణుఁడ

నను గర్వమున్నది యటు చూడవలదు - వినుతవిక్రమశక్తి వేఁడిఁ జూపెదను;
వఱలు నజ్జనకభూవరునింట నీవు - విఱిచిన విల్లు నీవిల్లును దొల్లి
యర్మిలి నిండార నమరులు విశ్వ - కర్మచే నొక్కటఁ గావించి రెలమిఁ
బురములు నిర్జింపఁ బోయెడునాఁడు - హరునకుఁ దగ నిచ్చి రందులో నొకటి2340
నావింటఁ ద్రిపురంబు లణఁచి రుద్రుండు - దా వీరగర్వముద్రారతుఁ డగుచు
నసహాయమున నేను నసురత్రయంబు - వసుధపైఁ గూల్చి తెవ్వరు నాకు నీడు?"
నని పల్క “చక్రి బుద్ధాకృతిఁ బూని - తునిమించెఁ గాక రుద్రునికి శక్యంబె”
యని యాడకాడకు నమరులు మునులు - సనకాదిహరిపార్శ్వచరులును బిలువ
విని రుద్రగణములు వినుపింప శివుఁడు - విని రోషమునఁ బోర విష్ణునిఁ బిలువ
సురగరుడోరగవరు లెల్లఁ గూడి - సరసిజాసనుఁ జేరఁ జని విచారించి
హరిహరసత్త్వంబు లరయుద మనుచు - మురవైరి కపుడు కార్ముకరాజ మిచ్చి
యిరువుర కెంతయు నెఱుక సేయుటయు - హరియు రుద్రుఁడు బోరి రరుదుగా నపుడు
నారాయణుని తీవ్రనారాచఘోర - ధారచే శివునికోదండంబు సగము
విఱిగి పేటెత్తిన వీక్షించి రపుడు - హరిశక్తి ఘన మని యమరు లందఱును2350
ఇరువుర మాన్పి రాయీశుఁ డవ్వేళ - సురలచిత్తస్థితిఁ జూచి యావిల్లు
రయమున నాదేవరాతున కిచ్చె - జయధన్యుఁ డాతండు జనకున కిచ్చె
వనజలోచనుఁడును వలనొప్ప నిచ్చెఁ - దనచేతిచాప మత్తఱి రుచికునకు
జమదగ్ని కిచ్చె నిశ్చలమతి నతఁడు - జమదగ్ని నా కిచ్చె సదయుఁడై దీని
బెనఁకువ నది తొల్లి పేటెత్తియుంటఁ - గని నీవు విఱచితి గాక భూనాథ!
ఆవింటితోడిదె నరయ నాచేతి - యీవిల్లు నిదె చూడు మినవంశతిలక!
నెలకొని యీవిల్లు నీ వెక్కుపెట్టి - తలకొని బాణసంధానంబు సేసి
కడిమిచూపక నిన్నుఁ గదలనీ" ననినఁ - దడయక రోషించి దశరథాత్మజుఁడు
కన్నుల ఘనవహ్నికణములు దొరుఁగఁ - ద న్నెఱుంగని జామదగ్నితో ననియె.
"నిరుపమనిజశక్తి నీకుఁ గల్గుటయుఁ - దరమిడి రాజులఁ దరిమి చంపుటయు2360
నెఱుఁగుదు నన్ను నీ వితరునిమాడ్కి - వెఱవకఁ బలికెదు బీరంబు మెఱసి
నీ వెఱుంగవు నాదు నిజబాహుబలము - నీ వెంతవాఁడవు నీచాప మెంత?
తె"మ్మని విలుఁ దీసి తెగువ మోపెట్టి - క్రమ్మఱ నత్యుగ్రకాండంబు దొడిఁగి
"నీకాళ్లు దెగవేసి నీగర్వ ముడిపి - నీకోప మడఁచెద నేఁ” డన్నఁ దలఁకి
యురుసత్వగర్వంబు నుబ్బును దూలి - పరశురాముఁడు రాముఁ బ్రార్థించి పలికె.
“నేను గశ్యపునకు నిల నిచ్చినాఁడఁ - గాన రాత్రులు నిల్వగా నేర దిచట;
ననుదినంబును మహేంద్రాచలంబునకు - జనవలె నటుచేసి చరణము ల్వలయు
నాకాళ్ళ నేయక నాపాలిపుణ్య - లోకమార్గంబు లాలోకింప నేయు

నన్ను రక్షింపుము నరనాథచంద్ర! - మన్నింపవే రామ మనుజలోకేశ!"
యనవుడు రఘురాముఁ డాజామదగ్ని - ఘనపుణ్యలోకమార్గము నేసె నంత;2370
జడురీతి నిలుచున్న జమదగ్నిరాముఁ - గడునుగ్రుఁడై యున్న కాకుత్స్థరాముఁ
జూచుచునుండిరి సురసిద్ధసాధ్య - ఖేచరు లద్భుతక్రీడలఁ దగిలి
వలనొప్పఁగాఁ బుష్పవర్షము ల్గురిసె - నలినగర్భాదులు నానంద మంది
పొగడిరి రామునిఁ; బొందుగా సురలు - మిగులుతేజంబున మిన్నున నుండి;
యంత భార్గవరాముఁ డారాముఁ జూచి - యంతరంగంబున నతని భావించి
“యనఘ! నీసత్త్వ మే నాత్మలోఁ జూచి - నిను వివేకించితి నీవు విష్ణుఁడవు;
కాకుత్స్థ! యటుగాన గదనంబునందు నీకు నోడుట నాకు నింత గా దెందు;
నాబలంబును నీవె; నాయాత్మ నీవె; - నాబంధువులు నీవె; నారామచంద్ర!
నామాట లన్నియు నాత్మ నుంపకయ - రామ! రక్షింపవే రఘుకులాధీశ!"
యనుచుఁ బ్రస్తుతి సేసి యానంద మంది - మనమున రఘురామమహిమ లెన్నుచును2380
వరుస శ్రీరాముని వలగొని భక్తిఁ - గరములు ముకుళించి కరము సంప్రీతి
వినయవిధేయుఁడై విభు నటు చూచి - మనమునఁ గృప పుట్ట మఱి యిట్టు లనియె.
"సెలవిమ్ము రాఘవ శ్రీజానకీశ - సెలవిమ్ము పోయెద సెలవిమ్ము నాకు
నాతప్పు లెన్నక నన్ను మన్నించి - యీతఱి రక్షించి యింపుగాఁ బనుపు
మనసు నేకము చేసి మది వెల్గుఁ గనుచుఁ - గనుమూసి నినుఁ గూర్చి కదలక తపము
లొనరంగఁ జేసిన నొయ్యన మునులు - మనముల నానందమగ్నులై యుందు"
రనుచుఁ బ్రస్తుతిఁ జేసి యభినుతుల్ చేసి - యనుపమప్రీతితో నప్పుడే కదలి
"నిరుపమతరశక్తి నీశక్తి" యనుచు - నరిగె రాముఁడు మహేంద్రాచలంబునకుఁ
బరశురాముని విల్లు ప్రార్థింప నొసఁగె - వరుణుచేతికి రఘువర్యుఁ డాక్షణమె
యప్పుడు వాయువు లనుకూలగతుల - నొప్పే నుత్సాహంబు లొదవె సేనలకు.2390
నరు దరు దని సుర లభినుతిసేయ - వరజయశ్రీ గూడి వచ్చి రాఘవుఁడు
తనతండ్రి దశరథధరణిపాలునకు - ననఘ వసిష్ఠున కతిభక్తి మ్రొక్కె.
మ్రొక్కిన దీవించి మొగిఁ గౌఁగిలించి - యక్కున నందను నౌదలఁ జేర్చి
పరమసమ్మదమునఁ బార్థివేశ్వరుఁడు - “సరసోక్తి నేఁ బునర్జాతుండ నైతి
గొమ రొప్ప నీవంటికొడుకును గనుట - నమరేంద్రుఁ బోలితి నవనిలో నిపుడు
పరమపావనుఁడైన పరశురాముండు - పరమేశుపగిదిని బరఁగ నిచ్చటికి
వచ్చుట నేఁ గాంచి వడలెల్ల వడఁక - యిచ్చలో భయ మంది యిఁక నేది త్రోవ?
యనుచు భయంబున నాతనితోడ - మనవిగాఁ జెప్పిన మఱి వినకున్నఁ
బరవశత్వం బొంది పలుకనేరకయ - పరమమైత్రికి నేను బాల్పడియుంటి;
నతని గెల్చుటయె నా కాశ్చర్య మయ్యె - నతులితవైభవం బందితి నేను2400

బాసెను భయమెల్లఁ బ్రౌఢి నీచేత - వాసి కెక్కితి నిల వైభవం బబ్బె”
ననుచు రామునిఁ జాల నభినుతి చేసి - మునివసిష్ఠాదులు ముదమునఁ గూడి
పరమసమ్మదమున బలములుఁదాను - నరిగె నయోధ్యకు నవనివల్లభుఁడు.

దశరథుఁడు పుత్రులం దోడ్కొని అయోధ్య కేగుట

పుణ్యచిహ్నములతోఁ బుణ్యులతోడ - బుణ్యమంగళతూర్యములు మ్రోయ నరిగి
తానును గొడుకులు దశరథాధీశుఁ - డానందమున నయోధ్యాపురిఁ జొచ్చి
రాజితాలంకారరమణఁ జేపట్టు - రాజమార్గంబున రారాజముఖులు
సఖులుఁ దారును గేళిసౌధంబు లెక్కి - సుఖతరాకృతుల రాసుతులఁ గన్గొనుచు
సేసలు చల్ల నాశీర్వాద మెల్ల - భూసురు లొసఁగ విస్ఫురణఁ బెంపెసఁగ
నగణితశృంగారమై యొప్పు దనరు - నగరుఁ బ్రవేశించె నరనాథుఁ డంతఁ
గౌసల్య కేకయక్ష్మాపాలపుత్రి - యాసుమిత్రాదేవి యాదిగాఁ గలుగు2410
నంతఃపురాంగన లందఱు నప్పు - డెంతయుఁ బ్రీతితో నెదురుగా వచ్చి
జేరి వారలమీఁద సేసలు చల్లి - నీరాజనంబులు నెఱి నిచ్చి రంతఁ
గొడుకులందఱు మ్రొక్కఁ గోడండ్రు మ్రొక్కఁ - గడుబ్రీతి దీవించి కౌఁగిటఁ జేర్చి
సీతాదికాంతల చెలువంపుబుద్ధి - చాతురి కన్నుల చల్లగాఁ జూచి
తనరారుచుండిరి దశరథుం డపుడు - తనయులు నలుగురు తను భజియింప
నాల్గుచేతుల నొప్పు నలినాక్షుఁ డనఁగ - నాల్గుకొమ్ములుగల నాకేభ మనఁగ
సకలజనానందచతురుఁడై రాజ్య - మకలంకరక్షకుఁడై యేలుచుండి
యొకనాఁడు దశరథుం డుచిత మెఱింగి - ప్రకటితశుభరతు భరతు నీక్షించి
"ఘనుఁడు మీమామ కేకయరాజు - దోడుకొనిపోదు ని న్నని కోరియున్నాఁడు
గాన శత్రుఘ్నుతోఁ గదలి మీమామ - తో నేగి యతని సంతోషంబు నెఱపు2420
తాతకు నవ్వకుఁ దగ మేనమామ - కాతతభక్తితో ననిశంబు మ్రొక్కు
సురల కాఁ దలఁచి భూసురులకు వత్స - పరమప్రియంబునఁ బరిచర్య సేయు
వారలచేత నవారణస్యంద - నారోహణములు శస్త్రాస్త్రవిద్యలును
నెఱి వేదశాస్త్రము ల్నీతిశాస్త్రములు - నురుకళావిద్యలు నొగి నభ్యసింపు
మేకక్షణంబును నెడపక నియతిఁ - జేకొని నీమేలు చెప్పి పుత్తెమ్ము."
అనవుడుఁ దల్లుల కవనిపాలునకు - వినతుఁడై రఘురామవిభునకు మ్రొక్కి
తాను శత్రుఘ్నుండుఁ దనమేనమామ - తోన యిమ్ముల భరతుఁడు పుణ్యరతుఁడు
రాజగృహంబున రమణీయమైన - రాజధానికి నేగి రఘుకుమారకులు
తాతకుఁ దమరాకఁ దగ నెఱిఁగింపఁ - బ్రీతిమైఁ బుచ్చ నాపృథ్వీవరుండు
పట్టణంబునఁ దీరువడ తోరణములు - గట్టించి బహుపతాకలు కల్వడములు2430

కలయంగ నెత్తించి గంధోదకములు - పొలుపొందఁ జల్లించి పుష్పధూమములు
కరమొప్ప రాజమార్గమున వాసింపఁ - బరిచారకులఁ బంచి బలయుతు లగుచు
వనితలు నిజమంత్రివర్గంబుతోడ - జనుదేర నెంతయు సంభ్రమం బెసఁగ
వరుస నానాగీతవాద్యనృత్యములు - పరమశుభాచారభంగుల నడువఁ
బ్రీతి నెదుర్కొని ప్రియ మొప్ప వంది - సూతమాగధజనస్తుతు లోలిఁ జెలఁగ
మనుమలఁ దోడ్కొని మహిమతో వచ్చె - బనిగొన్నభక్తితో భరతుండు నంతఁ
దమతాత మొదలుగాఁ దగిన పెద్దలకుఁ - గ్రమము దప్పక నమస్కారము ల్పేసి
పొలుపొంద వారిచేఁ బూజితుం డగుచుఁ - దళుకొత్త వేడుకఁ దాతతో ననియె
“నార్యక! నాకు విద్యాభ్యాస మింకఁ - గార్య మాచార్యులై ఘనులైనవారి
కప్పగింపుఁడు నన్ను" ననిన నారాజు - చెప్పిన వారిచే శిక్షితుం డగుచు2440
నమర విద్యాభ్యాస మంతయుఁ జేసి - విమలైకమతి నొకవిప్రునిచేతఁ
దమతండ్రి యగుచున్న దశరథేశునకు - “సముచితస్థితి మేము సకలవిద్యలును
జెలువంబుగా నభ్యసించితి మింక - దలఁపు పుట్టెడు మాకుఁ దముఁ జూడవలయు”
నని చెప్పు మన నయోధ్యాపురంబునకుఁ - జనుదెంచి యతఁడు నాజననాయకునకు
రాజపత్నులకు నారామలక్ష్మణుల - కోజ నెంతయుఁ జెప్పె నుల్లంబు లలర
నంత శ్రీరాముండు యౌవరాజ్యమున - నెంతయుఁ జతురుఁడై యెల్లవారలకు
బ్రాకటంబుగ నొండుబాధ లేకుండ - నేకప్రబుద్ధిగా నిటఁ దండ్రిఁ గొలిచి
ధారుణీప్రజలకు దయ యొప్పఁ జేసి - వీరు వారన కతివిశ్రుతకీర్తి
సమచిత్తుఁడై ధర్మచరితంబుఁ బూని - యమరేంద్రవిభవుఁడై యారామవిభుఁడు
సీతయుఁ దానును జెలువొప్పఁ గూడి - నూతనరతిసుఖార్ణోరాశిఁ దేలి2450
చంద్రశాలలఁ గేళిసౌధవీథికలఁ - జంద్రకాంతాతివిశాలవేదికల
గాజుటోవరుల బంగరుపడకిండ్ల - జాజిపూఁబాన్పులఁ జంపకక్రముక
నారికేళరసాలనారంగరంగ - నారామములఁ గృతకాద్రిసానువులఁ
గొలఁకులఁ గెలఁకులఁ గుంజపుంజములఁ - జలువచప్పరముల సైకతస్థలులఁ
జాతురి మెలఁగుచు సకలభోగములు - నాతతసౌఖ్యంబు లందుచునుండె.
అని యాంధ్రభాషభాషాధీశవిభుఁడు - వినుతవాక్యాగమవిమలమానసుఁడు
పాలితాచారుఁ డపారధీశరధి - భూలోకనిధి గోనబుద్ధభూవిభుఁడు
దమతండ్రి విట్ఠలధరణీశుపేరఁ - గమనీయగుణధైర్యకనకాద్రిపేర
నలఘునిశ్చలదయాయతబుద్ధిపేర - లలితనిర్మలగుణాలంకారుపేర
నాచంద్రతారార్కమై యొప్పు మిగిలి - భూచక్రమున నతిపూజ్యమై యొప్పు2460
నసమానలలితశబ్దార్థసంగతుల - రసికమై చెలువొందు రామాయణంబు
పరఁగ నలంకారభావన ల్నిండఁ - గరమర్థి నీబాలకాండంబుఁ జెప్పె

నారూఢి నార్షేయమై యాదికావ్య - మై రసికానందమై యల్లనాఁడు
నివ్వసుమతి నొప్పు నీపుణ్యచరిత - మెవ్వరు చదివిన నెవ్వరు వినిన
సామాదిబహువేదచయధామరామ - నామచింతామణి నవ్యభోగములు
పరహితాచారముల్ ప్రభువిచారములు - పరిపూర్ణశక్తులు ప్రకటరాజ్యములు
నిర్మలకీర్తులు నిత్యసౌఖ్యములు - ధర్మైకనిష్ఠలు దానాభిరతులు
నాయురారోగ్యంబు లైశ్వర్యములును - బాయనిశుభములు పాపక్షయములు
వరపుత్రలబ్ధియు వైరినాశనము - సరినొప్పు ధనధాన్యచయసమృద్ధియును
నేవిఘ్నములు లేక యిండ్లలో నధిక- లావణ్యవతులైన లలనలపొందు2470
కొడుకులతో నెప్జుఁ గూడియుండుటయు - నెడగాఁగ నాపద లెల్లఁ బాయుటయు
సమ్మదంబున బంధుజనులఁ గూడుటయు - నిమ్ములఁ గామ్యంబు లెడపకుండుటయు
సతతంబు దేవతాసంతర్పణంబు - పితృగణతృప్తియుఁ బెంపారుచుండు
వ్రాసినవారికి వరశుభోన్నతులు - వాసవభోగాదివాసులఁ జేయు
నెందాఁక కులగిరు లెందాఁక జలధి - యెందాఁక రవిచంద్రు లెందాఁక దిశలు
ఎందాఁక వేదంబు లెందాఁక ధరణి - యెందాఁక భువనంబు లేపు దీపించు
నందాఁక యీకథ యక్షతానంద - సందోహదోహళాచారమై పరఁగు.

బాలకాండము సమాప్తము

————