Jump to content

మొల్ల రామాయణము/అవతారిక/ఇష్టదేవతా సన్నుతి

వికీసోర్స్ నుండి

ఇష్టదేవతా సన్నుతి

[మార్చు]

ఉ. శ్రీ మహిమాభిరాముఁడు, వశిష్ఠ మహాముని పూజితుండు, సు
త్రామ వధూ కళాభరణ రక్షకుఁ డాశ్రిత పోషకుండు, దూ
ర్వామల సన్నిభాంగుఁడు, మహా గుణశాలి, దయా పరుండు, శ్రీ
రాముఁడు ప్రోచు భక్తతతి రంజిల్లు నట్లుగ నెల్ల కాలమున్‌. 1
ఉ. శ్రీనగ మందిరుం, డమర సేవితుఁ, డర్థ శశాంక మౌళి, స
న్మౌని మనఃపయోజ దిననాయకుఁ, డబ్జభవామరేశ్వర
ధ్యాన లసత్ప్రసన్నుఁ డతి ధన్యుఁడు, శేష విభూషణుండు, వి
ద్యానిధి, మల్లికార్జునుఁడు, తా నిడు మాకు శుభంబు లొప్పఁగన్‌. 2
ఉ. తెల్లని పుండరీకముల తేజము మెచ్చని కన్నుదోయితో
నల్లని శక్రనీల రుచి నవ్వెడు కోమల దేహ కాంతితో
నల్లనఁ బిల్లఁ గ్రోవి కర మంచిత సంజ్ఞల నింపు నింపఁగా
గొల్లతలన్‌ విరాళి తగఁ గొల్పెడు కృష్ణుఁడు ప్రోచుఁగావుతన్‌. 3
ఉ. మించి, సమస్త లోకములు మిన్నక తాఁ దన నేర్పు మీఱ ని
ర్మించి, ప్రగల్భతన్‌ మెఱసి, మేలును గీడును బ్రాణికోట్లు సే
వించ ఘటించి శాస్త్రములు, వేదములుం గొనియాడుచుండు నా
కాంచన గర్భుఁ డిచ్చు నధికంబుగ నాయువు నీప్సితార్థముల్‌. 4
సీ. చంద్ర ఖండ కలాపుఁ జారు వామన రూపుఁ-గలిత చంచల కర్ణుఁ, గమల వర్ణు,
మోదకోజ్జ్వల బాహు, మూషకోత్తమ వాహు-భద్రేభ వదను, సద్భక్త సదను,
సన్మునిస్తుతిపాత్రు, శైలరాడ్దౌహిత్రు-ననుదినామోదు, విద్యా ప్రసాదుఁ,
బరశువరాభ్యాసుఁ, బాశాంకుశోల్లాసు-నురుతర ఖ్యాతు, నా గోపవీతు,
తే. లోక వందిత గుణవంతు, నేక దంతు-నతుల హేరంబు, సత్కరుణావలంబు,
విమల రవి కోటి తేజు, శ్రీ విఘ్న రాజుఁ-బ్రథిత వాక్ప్రౌఢి సేవించి ప్రస్తుతింతు. 5
చ. కరిముఖుఁడుం, గుమారుఁడు వికారపుఁ జేఁతల ముద్దు సూపుచున్‌
గురుపులు వాఱుచున్సరిగ గుట్టలు దాటుచుఁ చన్ను దోయితో
శిరములు రాయుచుం గబరిఁ జేర్చిన చంద్రునిఁ బట్టి తీయఁగాఁ
గరములఁ జాఁప నవ్వెడు జగమ్ముల తల్లి శుభంబు లీవుతన్‌. 6
ఉ. సామజయుగ్మ మింపలరఁ జల్లని నీరు పసిండికుండలన్‌
వేమఱు వంచి వంచి కడు వేడుకతో నభిషిక్తఁ జేయఁగాఁ
దామరపువ్వు గద్దియ ముదంబున నుండెడి లోకమాత మా
కాముని తల్లి సంపద లఖండముగా నిడు మాకు నెప్పుడున్‌. 7
ఉ. మేలిమి మంచు కొండ నుపమింపఁగఁజాలిన యంచ నెక్కి, వా
హ్యాళి నటించి వచ్చు చతురాస్యు నెదుర్కొని నవ్వు దేరగా
వాలిక సోగ కన్నుల నివాళి యొనర్చి, ముదంబు గూర్చు వి
ద్యాలయ, వాణి శబ్దముల నర్థములన్‌ సతతంబు మాకిడున్‌. 8