మొల్ల రామాయణం/అధ్యాయం 3

వికీసోర్స్ నుండి

ఆరణ్యకాండము
---

క. ముని దత్త ధను ర్వేదా !
మునినాథ ప్రియ సతీ సుపూజిత పాదా !
జన కార్చిత గుణ ధామా !
సనకాది స్తవ్య నామ ! జానకి రామా ! ||1||

పంచవటిలో సీతా రాముల మధుర జీవనము
వ.శ్రీనారదమునీశ్వరుండు వాల్మికి కెఱింగించినతెఱంగు విని పించెద. |2|
చ. ఇతనికిఁ బాదచారితన మేటికి వచ్చెనొ పట్టభద్రుఁ, డీ
సతి నవ రూప రేఖలను జక్కని దయ్యును నిట్టి దుర్దశల్
ప్రతివసియించు టెట్లొ రతిరాజ సమానుల వీరి నేల యీ
గతిఁ బడఁద్రోచె బ్రహ్మ యని కాంతురు చెంచెత లమ్ముహాత్ములన్. ||3||
సీ. నడువనేరని కొమ్మయడుగులు పొక్కులై
శర్కరస్థలముల శ్రమముఁ జెందె
వీచిన చేతుల వ్రేళ్ళు నెత్తురు గ్రమ్మి
పొటమర్లు కెంపులపోల్కి నమరె
వడిగాలి సుడివడి వాడిన లెఁ దీఁగ
భావంబునను మేనిచేవ తఱిగెఁ
బూర్ణ చంద్రునికాంతి పున్నమ వేకువఁ
గనుపట్టుగతి మోము కళల విడిచె

తే. దవుని నడుగడుగునకుఁ గై దండఁ గొనుచు
నెగడుదప్పిని నిట్టూర్పు లెగసి లెగసి చిరుగుఁ
బెదవు లెండఁగ నీడకు నుదిల గొనుచు,
మనసులోఁ జేవ యీఁతగఁ జనెడు వేళ. ||4||

వ. ఇట్లాసీతయు రాముండును సత్యఋషింబోని సౌమిత్రియుఁ గతిపయప్రయాణంబులఁ బంచవటికిం జని సంతోష భరి తాంతరంగులై, ||5||

క. అచ్చటఁ గొన్నిదినంబులు
ముచ్చటపడి యుండఁదలఁచి మునిముఖ్యులచే
మచ్చికఁ దమ్ముఁడుఁ దానును
గ్రచ్చఱ నొకపర్ణశాలఁ గావించి తగన్ ||6||
ఆ.అందు రామచంద్రుఁ డనుజున్ముఁడును దాను
గొన్ని వాసరంబు లున్నవేళ
వికృత వేషధారి వేవేగ నట శూర్ప
ణఖ యనంగ దైత్యనారి యోర్తు. |7||

వ. రాముని గని ప్రేమాభిరామం బగుమనంబునఁ దన్నుఁ గామించి రమ్మనిన రామచంద్రుండు సౌమిత్రినిం జూప నతఁ డు మున్ను మా యన్న నభిలషించుటం జేసి నాకు దోషంబు గాన నీ వా రామునికడకు మరలఁ జను మన్న నది యట్ల చేసిన రామచంద్రుండును దిరుగ లక్ష్మణుం జూపినఁ గోపించి యారాక్షసి మనుజేంద్రసూనుల దండింపం దలంచిన నెఱింగి భరతానుజుండు దానినాసికాకర్ణంబులు గోసివైచినది నది నెత్తురు జొత్తిల్లఁ బసిపాపయుంబోలి యేడ్చుచు ఖరదూష ణాదిసోదరులకుం జెప్పిన వారు గనలి రాక్షణంబున ||8||

క. పదునాల్గు వేల దైత్యులు
మదమున సోదరులు గొల్వ మండుచు శూరా
స్పద మగురథనికరముతోఁ
గదనంబున రాముకడకు ఖరుఁ డేఁతెంచెన్. ||9||

ఆ. ఖరుఁడు వచ్చినట్టి కలకలం బాలించి
రాఘవుండు తనదు రమణియొద్దఁ
దొలఁగ కుండ ననుజుఁ దోడుగాఁ గాఁ పుంచి,
బెదర కంతఁ గలని కెదిరి నిలిచె ||10||

శా. అవేళన్ ఖరుఁ డుగ్రవృత్తిలయ కాలాభీల ఘోరాకృతుల్
దైవారన్ గజవాజి సంఘములతో దైత్యాళితో భూరిరో
షవిర్భూత మనస్కుఁడైన నడిచె గర్వారంభ సంరంభుఁడై
దేవ వ్రాతము భీతి నొంది కలఁగన్ దేజంబు సొంపారఁగన్ ||11||
వ. ఇట్లు ఖరుండు ననుదెంచి భయంకరంబుగా రణంబు సేయు సమయంబున. ||12||
ఉ. అప్పుడు రామచంద్రుఁడు భయంకరరౌద్రరసంబు కన్నులన్
నిప్పులు రాల్చుచున్ నెరయనిర్జరులార్వ విచిత్రశస్త్రముల్
కుప్పలుగాఁగ నేయుచును గుంజర వాజిరథావళుల్ ధరన్
దప్పక కూల్చుచున్ రుధిరధారలఁ దేల్చె సురారిసంఘమున్. ||13||

వ. అట్టి సమయంబున, ||14||

క. కరితురగస్యందనములుఁ
బరివారముఁ దెగినపిదపఁ బటురోషమునన్
గరకరపడుచును నెదిరిని
ఖరకరవంశజుఁడు ద్రుంచె ఖరునిశిరంబున్ ||15||

వ. త్రుంచినం గని తీండ్రంబుగా, ||16||

క. ఘోషించి రామచంద్రుని
దూషించును వచ్చినట్టి దూషణుమీదఁన్
రోషించి సురలు కడు సం
తోషింపఁగ వానికరముఁ ద్రుంచెఁ గడంకన్ ||17||

ఆ. త్రిశిరుఁ డంతఁ గనలి దివ్యాస్త్రసంపద
రాముమీఁదఁ జూపి రణ మొనర్చె,
మూఁడుశరము లతఁడు ముదలించి యట వాని
మూఁడుతలలఁ ద్రుంచె మొగ్గరమున. ||18||

వ. ఇట్లు ఖరాది రాక్షసుల శిక్షించి జయంబు గొని ధను వెక్కు డించి మరలి పర్ణశాల కేతెంచి తమ్ముఁడును దానును సమ్మదంబునం గలిసి యున్నసమయంబున; ||19||

శుర్పణఖ వల్ల సీతా సౌందర్యమును విన్న రావణుని కామాంధత

చ. చలమున వంత శూర్పణఖ సయ్యన లంకకు నేఁగి రావణుం
గొలువునఁ గాంచి మ్రొక్కి తనకున్ నౄపసూనులు సేసినట్టి చేఁ
తలు వినుపించి వారు తమ తండ్రి యనుజ్ఞను వచ్చి కానలో
పలఁ దిరుగాడుచందములుఁ బన్నుగ నేర్పడఁ జెప్పి పిమ్మటన్ ||20||
క. ఆ రాము భార్య విభ్రమ
మేరాజతనూజలందు నెఱుఁగము విను మున్
ధారుణిలోపలఁ గామిను
లారమణికి సాటిఁ బోల రభినుతిఁ జేయన్. ||21||

సీ. కన్నులు కలువలో కాము బాణంబులో
తెలివిగా నింత్కిఁ దెలియ రాదు,
పలుకులు కిన్నెర పలుకులో చిలుకల
పలుకులో నాతి కేర్పఱుపరాదు,
అమృతాంశుబింబమో యద్దమో నెమ్మోము
తెంపుతో సతికి భావింపరాదు
కుచములు బంగారు కుండలో చక్రవా
కమ్ములో చెలి కెరుంగగరాదు

తే. కురులు నీలంబులో తేఁటిగుంపు లొక్కొ
పిఱుఁదు పులినంబొ మన్మథు పెండ్లియరుఁగొ