ముకుందవిలాసము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీ హయగ్రీవాయ నమః

శ్రీమతే శ్రీ భూచెన్న కేశవాయ నమః

ముకుందవిలాసము

ప్రథమాశ్వాసము

    శ్రీ మేల్ గూర్పు భరింపుమీ సకలధాత్రీరాజ్యము న్నీవ యం
    చామోదాప్తి నొసంగు లీల వలనౌ హస్తంబునం దెల్పు నా
    శ్రీమత్కేశవ శౌరి సాంద్ర కరుణశ్రీ రంజిలన్ సద్గుణ
    స్తోముం దిర్మలరాయ సోమనృపతిన్ సుశ్రీయుతుం జేయుతన్.1

ఉ. శ్రీలలనాంశజన్మపరిశీలను నీలసునంద గోపక
    స్యాలసుతన్ వరించు తఱి సంగతమంగళఘోషచాతురీ
    లీల ఘటించు లీల మురళీశ్రుతి వర్తిలు కృష్ణమూర్తి గో
    పాలుఁడు భక్తపాలుఁడు కృపాళుఁడు సోమనృపాలు నేలుతన్.2

శా. శ్రీ మాంగల్యవతీనివాసత నురఃశ్రీ దెల్ప శేషాచల
    గ్రామ గ్రామణినా నెసంగి త్రిజగత్కల్యాణ సంధాతయౌ
    శ్రీమద్వేంకటనేత బ్రోచు శుభదృష్టిన్ ముష్టిపల్ల్యన్వయున్
    సోమున్ రాజలలాము నూర్జితకళాస్తోమున్ జయస్థేమునిన్.3

సీ. ఏ నాతి యాకాశ భూనాథ సుతయౌట
              దెలుపు సంచిత మధ్యదేశ కలన
    నే రామ ధరణీ కుమారియౌ టెఱిగించు
              పృథు విడంబ నితంబ బింబ గరిమ

    నే నీలవేణి కళానిధి సోదరి
              యౌటఁ జాటు మనోహరాస్య లీల
    నే యింతి శేషశైలేశ వాసిని యౌటఁ
               జూపు రోమాళి వక్షోజ పాళి
        నట్టి శ్రీశానుషంగ దయాంతరంగ
        లాలితాపాంగ శ్రీ యలమేలు మంగ
        యమ్మహాలక్ష్మి సుకుమారుఁ డని యనేక
        భాగ్యము లొసంగు సోమభూపాలమణికి.4

సీ. దనుజభేదనధురంధరమౌ శరమును
              శరమును వహియింపఁజాలు గరియు
    గరిమేతలకు నాథగరిమ గాంచు గుణంబు
              గుణముపై వసియింపఁగూర్చు రథము
    రథవరాధారమై రంజిల్లు విల్లును
               విల్లునిలుగనుండు వీరభటులు
    భటకులజ్యేష్ఠుడై ప్రబలు సారథియును
               సారథి ముఖవచస్తతులు హరులు
    హరుల రక్కసిడాచిన యిరవు పొదియు
    పొదినిఁ జొరబాఱలు చక్రవిస్ఫురణలెసఁగఁ
    ద్రిపురవిజయంబు గైకొన్న దేవమౌళి
    సోమవిభు శాశ్వతైశ్వర్యధాముఁ జేయు.5

మ. హరికిన్ సోదరియౌటఁ దద్గుణమునన్ శ్యామాకృతింబొల్చి యీ
    శ్వరు భామామణియౌటఁ దద్గుణమునంచన్మందహాసంబునం
    దరయందాల్చి గజాస్యుమాతయగుటన్ యానంబునందెల్పు నా
    గిరిసంజాత యొసంగుఁగాత జయలక్ష్మిన్ సోమభూజానికిన్.6


మ॥ హరినాభీకమలంబునందు నిజవక్త్రాళిశ్రుతిస్వానవి
     స్తరతంగల్గుటఁ దత్సువర్ణరుచితోఁ దానున్ సువర్ణాకృతిన్
     నెరయం దాల్చి సువాణి వాణి నలివేణిం బ్రేమ రంజించు వా
     గ్వరుఁడిచ్చున్ సుచిరాయురున్నతులు వేడ్కన్ సోమభూభర్తకున్.7

ఉ॥ విశ్వనుత శ్రుతి స్తవ నవీన సుధారస ధారలట్ల యౌ
     శాశ్వత పూరుషార్థముల సజ్జనవత్సలయై వసించి యా
     త్మేశ్వరు దేవతావృషభు నెప్పుడుఁ బాయని కామధేను వా
     గీశ్వరి సోమభూవరున కిష్టపదార్థ సమృద్ధి గూర్చుతన్.8

చ॥ నిజభజనాభియోజనవినీత సుధీజన సూక్త సత్కృతి
     వ్రజముల మాధురీగుణ మవశ్యము నిల్పు నిరీక్ష నిక్షుసా
     రజలధిమధ్యవాసతను రంజిలు బాహుదళాంచితున్ మహా
     గజముఖు భక్తిమత్సుముఖు గణ్యగణప్రముఖున్ భజించెదన్.9

కం॥ అల భోగ సుకీర్తి బలో
     జ్జ్వల యోగనిరూఢి సుప్రసక్తులు హరి భ
     క్తులు వరముక్తులు మత్కృతి
     వెలయింతు రనంతగరుడ విష్వక్సేనుల్.10

మ॥ సవితృం డాదిగురుండుగాఁ జదివి తత్సాహిత్య విఖ్యాతికై
     కవితామాధురి నాటకాకృతికృతిం గల్పించి రామాయణం
     బవనిన్ వాగమృతంబు నించిన శుభస్వాంతున్ హనూమంతు స
     త్కవికాంతున్ నుతియింతు మామకకవిత్వప్రౌఢి సాహ్యార్థమై.11

కం॥ వరధర్మయుక్తి నరిదర
      కర జగదానందకముల కంపిత వికృత
      స్మర పంచాయుధ గుణముల
      హరి పంచాయుధగణముల నభినుతి సేతున్.12



కం॥ శ్రీకలితరామకృష్ణ
      శ్లోక పతాకాయమాన శుభవాగమృత
      స్వీకృతవిలాసులను వా
      ల్మీకి వ్యాసుల నుతింతు మేదురభక్తిన్.13

కం॥ వివరింతు నుతుల నతుల
      వ్యవహారుం జోరు సుకృతి వైభవభూతిన్
      భవభూతిన్ శివభద్రుం
      గవిరుద్రున్ హేళిదాసు కాళీదాసున్.14

ఉ॥ నన్నయభట్టు భీమన ననంతు నథర్వణుఁ దిక్కహోత్రి నె
      ఱ్ఱన్నను సోము భాస్కరుని నయ్యలు నైషధకావ్య కర్తఁ బో
      తన్ననుఁ బిన్నవీరుని చినన్నను సూరప రామభద్రుఁ బె
      ద్దన్ననుఁ దిమ్మనార్యు గరుడాంకుని మూర్తి సుకీర్తి నెంచెదన్.15

కం॥ ఎల్లప్పుడు సేవించెద
      నుల్లంబున వేదశాస్త్రయోగాన్వితులన్
      బిల్లే వంశాంచితులన్
      మల్లేశ్వరదీక్షితులను మద్గురు వరులన్.16

కం॥ ఉర్వర వీరనృసింహా
      ఖర్వ కృపాలబ్ద సరస కవితాలహరీ
      ధూర్వహు మద్భగినీధవు
      దూర్వసి నాగార్యు సుగుణధుర్యు నుతింతున్.17

వ॥ అదియునుంగాక18

కం॥ కాకవుల వాక్కులుండఁగ
     నాకవుల మధూచితోక్తు లభినుతి గనియెం

     గాకవుల వాక్కులుండఁగ
     నాకవుల మధూచితోక్తు లభినుతి గనవే.19

వ॥ అని యిష్టదేవతానమస్కృతియును, సుకవిజన పురస్కృతియునుఁ,
     గుకవిప్రకారాంతర పరిష్కృతియునుంగావించి యే నొక్క ప్రబం
     ధంబు రమారమణ పరిణయ ప్రసంగ సంగత శృంగార చమ
     త్కార రసానుబంధముగా నొనరింపంబూనియున్నసమ
     యంబున.20

సీ॥ భుజ శౌర్యదీప్తు లుప్పొంగి నెల్గెడిలీల
                మౌళిసీమను హేమమకుట మమర
     మనివికి కవిబుధమణులు వీనులఁజేరు
                సరణి నొంటీలు పచ్చలు సెలంగ
     తను సోముఁడని తార లనుసరించిన మాడ్కి
                రమణీయ తారహారములు దనర
     తము వెచ్చపెట్టకుండ మణిసువర్ణాద్రు
                లడిగెడునన కేలఁ గడెములలర
     మంజు మంజీర మణిపుంజరంజనాప్తి
     లలిత చరణారుణిమతోడఁ గలసిమెలఁగ
     దివ్య భూషాంబరములతోఁ దేజరిల్లు
     పాలితనృపాళి సోమభూపాలమౌళి. 21

వ॥ వెండియుం దారాచల తారాబల హీరోపల హారోజ్జ్వల రాకాధిప లోకా
      ధిప వరనందన హరిచందన బృందారక మందారక కుంద శరత్కుంద
      మరుత్సింధుర దరసుందరతర ప్రభానుభావ కీర్తిసుధా లేప దీపితదిశా
      ప్రదేశ ప్రసారుండును, హరిచరణ సంజాత సురవాహినీ సహోదరీ
      భూత మహాన్వయ విశిష్టముష్టిపల్లి వంశాలంకారుండును, నిజ సంప్ర


     దాయ పారంపరీ కల్పితాగ్రహార సమూహ మహిత మహీసుర మహా
     విభవ రక్షణ విచక్షణుఁడును, స్వకీయ సోమపౌత్రతా సార్థీకృత
     చక్రవర్తి లక్షణుండును, శ్రీమత్కేశవస్వామి చరణకమల యుగళ
     భక్తి నిష్ఠాగరిష్ఠుండును, షోడశ మహాదాన చతుష్షష్టి విద్యాపటిష్ఠుండును,
     కేశాదిరాయ రాజవేశ్యా భుజంగ సంగ్రామ ధనంజయాదిగర్భేశ్వరాది
     బిరుద సార్థసమర్థన ధూర్వహ సాహసాంకుండును, తిరుమలరాయ
     మహీశ్వరార్ధాంగ లక్ష్మీవిడంబ మంగాంబా గర్భసుధార్ణవ పూర్ణిమా
     శశాంకుండును, శ్రీమద్విజయలక్ష్మీ సహాయుండును నగు సోమ
     భూపాలరాయుండు నొక్క శుభవాసరంబున సుధర్మా సమాన సభాంత
     రంబునం జింతామణివింత రాణించు మాణిక్య సింహాసనంబున నధ్యాసీ
     నుండగుచు హీరతనుత్రాణహారంబుల నైరావతోచ్చైశ్రవంబుల ననుక
     రించు కరితురంగంబు లెసంగం గార్యచాతుర్య సుపర్వమంత్రులగు
     మంత్రులును, విద్యావిశేష ప్రసిద్ధకవి బుధులగు కవిబుధులును, నారద
     సదృశ గానచర్యులగు గాయక వర్యులును, నాసత్య గుణహృద్యులగు
     వైద్యులును, నప్సరస్సమానతావశ్యలగు వేశ్యలును నాదిగాఁగల
     పరివారంబు పరివేష్టింప సకలవైభవ సాంద్రుండగు దేవేంద్రుని
     సొంపున సంపదల నింపొందుచు. 22


సీ॥ నను నందవరపురాన్వయ పయోనిధి చంద్రుఁ
               గాణాదవంశ విఖ్యాతి సాంద్రు
     నాశ్వలాయనసూత్రు నాత్రేయముని గోత్రు
               సకల విద్వత్కవిప్రకర మిత్రుఁ
     బ్రౌఢలక్ష్మీపతి పండిత సోదర్యు
               బాహట గ్రంథానుభావధుర్యు
      వేదశాస్త్ర వురాణ వివిధ మర్మధురీణు
               వర చతుర్విధ కవిత్వ ప్రవీణు

   భోజచంపూ ప్రబంధార్థ బోధనాను
   బంధ గీర్వాణ టీకా నిబంధనాది
   పేశల వచో రచనచర్యుఁ బెద్దనార్యుఁ
   గాంచి దయమించి పలికె సగౌరవముగ.23

గీ॥ కాదివర్ణంబు లిరువదియైదు విడిచి
   చేసితి వపంచ వర్గీయ చిత్రకృతిని
   “శేషశైలేశ లీలా'ఖ్యచే నెసంగ
    యాది మితవర్ణ నియతి శక్యంబె జగతి.24

ఉ॥ శ్రీరమణీయతన్ సురపురీనగరీ సగరీయదేశ భూ
     భారధురీణుఁడౌ బహిరిరామనృపాలు సభాంతరంబునన్
     మారమణాంకితంబుగను మత్స్యపురాణ మొనర్పఁబూనవే
     సారసుధాప్రసార విలసత్కృతి సాంద్ర వచశ్చమత్కృతిన్.25

కం॥ మీ తాతయు మీ తండ్రియు
     మీ తమ్ముఁడు మీరు మఱియు మీకులజులు వి
     ఖ్యాత ప్రబంధరచనా
     ప్రీతచరిత్రులు కణాదపెద్దన సుకవీ!26

కం॥ కృతిముఖమున సరసాలం
     కృతిముఖమునఁ బేరుఁగాంచు నిల సుతవన సం
     తతిముఖములగుట వాణీ
     కృతముఖమణి మాకు నొక్క కృతి హితవందన్. 27

కం॥ పురుషోత్తమాష్ట మహిషీ
     పరిణయములలోన మున్ను భద్రాదేవీ
     పరిణయ మెవ్వరు తెనుఁగున
     విరచించుట వినము పూర్వవిబుధులలోనన్.28

కం. కావున మీరది తెనుఁగున
     కోవిదు లౌననఁగ శ్రీముకుందవిలాసా
     ఖ్యావిధిఁజేయుడు కేశవ
     దేవున కంకితముగాఁగ ధీరవతంసా!29

కం. అని బహుమతి నొనరించిన
     విని బహుమతి నేను సోమవిభు ననుమతిచే
     ననుమతిమంతులు మేలన
     ఘనకృతి రచియింతుఁ జతురకవితావిహృతిన్.30

కం. శ్రీకలితాంకుఁడు సోమ
     క్ష్మాకాంతుఁడు దోడుగాఁగ సరసయగు కృతి
     శ్రీకి నధిపతినిఁ జేసితి
     శ్రీకేశవపతిని సుగుణసింధుఁడ నగుచున్.31

గీ. ఇందు సకలహితము నిచ్చు మున్ విష్ణుచి
    త్తీయతుల్యమౌ మదీయకవిత
    యుదుట చేవ దొలువ నులిఁ బోలు నళిమోము
    మృదువు గాదె విరుల మీద వ్రాలి.32

కం. కుందవిలాసము తావి ము
    కుందవిలాసము సదా ముకుందవిలాసం
    బిందు విలాసమును సుధా
    బిందువిలాసము హసించు పేశలఫణితిన్.33

వ. అని నిశ్చయానుసంధానంబున మదీయ ప్రబంధ సంధాయకుండగు
    సోమభూపాలరాయవతంసుని వంశాభ్యుదయం బభివర్ణించెద.34

కం. శ్రీదామోదరపాద
     ప్రాదుర్భావమున సురతరంగిణి తనకున్


    సోదరిగా మేదినిఁ దగు
    నాదిని నేవంశ మట్టి యన్వయసరణిన్.35

కం. శ్రీ ముష్టిపల్లినామ
    గ్రామప్రాముఖ్య నాడగౌడు కులమునం
    బ్రేమను మాధవసేవా
    శ్రీమంతుఁడు వెలసెఁ బెద్దనృపవరుఁ డవనిన్.36

ఉ. పెద్దనఁగా నెసంగి నృపబృందములోపల ముష్టిపల్లి మా
    పెద్దన బొల్చు వామనుని పెద్దన గల్మిని బల్మిఁ గ్రీడికిం
    బెద్దనవాడిచే నకులుపెద్దన పాడి సమీరసూతికిం
    బెద్దన సత్కృపన్ గదుని పెద్దన నద్దిర యిద్ధరాస్థలిన్.37

గీ. అట్టి ముష్టిపల్లి యా పెద్దనృపుఁడు పూ
    డూరినాడ గౌడువీరఘనుని
    తనయ బక్కమాంబికనుఁ బెండ్లియాడె న
    వ్వీరవిభుని నెన్న నేరి వశము.38

సీ. తన శివావిర్భూతి దక్షభూసురమహా
             ధ్వరముఖ్య కార్యవర్ధన మొనర్పఁ
    దన మహాభ్యుదయ మెంతయు దంతిముఖ మహా
             సేనాది సహజ ప్రసిద్ది నెరపఁ
    దనదు భద్రానువర్తనము ధర్మనిరూఢి
             నఖిల విలాసయోగాప్తిఁ బెనుపఁ
    దన శౌర్యమర్యాద యనివార్యచర్య సూ
             ర్యాదితేజోభేద మావహింపఁ
    దన బలస్ఫూర్తి సకలభూత ప్రపంచ
    భైరవారూఢి ప్రతిరోధిబలము నణప

     సాధుగణములు గణుతింప జగతి నలరె
     వీరవిభుఁ డన దేశాయి వీరవిభుఁడు.39

కం. వీరప్రభునకుఁ దిమ్మాం
    బారత్నమునందుఁ బొడమె బక్కాంబ సుధా
    సారగుణాధార మహో
    దార యగుచు వెలసెఁ బెద్దధరణిపు సతియై.40

సీ. తన కీర్తిపుత్రి దిగ్ధవముగ్ధలకు శుద్ధ
            ధర్మపద్ధతి కుపాధ్యాయి గాఁగఁ
    దన శాసనవినీతి యనుశాసనమురీతి
            జనధీసమున్నతి ననునయింపఁ
    దనదు వాగ్వైఖరి తనరు వాగ్వైఖరి
            సకలవాక్యములకు జననిగాఁగఁ
    దనదు సంతానంబు ననఘసంతాన మ
            ట్లఖిల శుభాభ్యుదయములఁ బెనుప
    నలరు బుధకల్పవల్లి యర్థులకుఁ దల్లి
    శిష్టకాంతాజనమతల్లి ముష్టిపల్లి
    యన్వయము పెద్దవిభుని యర్ధాంగలక్ష్మి
    దిక్కలిత సద్గుణకదంబ బక్కమాంబ.41

ఉ. కందనవోలు ముఖ్యముగఁ గల్గిన సీమల నాడగౌడు కీ
    ర్తిందగి తుంగభద్రను కృష్ణకు మధ్యమసీమ రాజ్యల
    క్ష్మిందగి ముష్టిపల్లి కులసింహుఁడు పెద్దనభూవరుండు బే
    రందె నిరూఢి వీరఘనునల్లుఁడు వైరిమృగాళి భిల్లుఁడై.42

గీ. పాకనాటి మేటి పరిపాటి కులకోటి
    నేటి తండు పెద్ద నృపకిరీటి

    గనియెఁ బెద్ద సోమఘను సిరిగాహ్వయు
    నాత్మజులను బక్కమాంబయందు.43

సీ. అనురక్తి నుదయించినపుడ ప్రభావాప్తిఁ
            గువలయపాలనప్రవణ మించి
    మఱి నిజకృష్ణాంక మండలంబు వెలుంగ
            నుదయాద్రి మొదలుగా నొగి గ్రహించి
     తుంగభద్రోన్నతి దొడరి రా కందన
            వోలి మిన్నగు దేశమేలుబడిగ
     కరకాండ విస్ఫూర్తి గల యవనాశుల
             బలములఁ గడు భీతిఁ బాఱనణచి
     తనరి విష్ణుపదాసక్తి దనకు నదియ
     సత్పథముగాఁగఁ బ్రహ్లాదసరణి వెలసి
     దిక్కులందెల్లఁ గీర్తి చంద్రికలు నించి
     సోముఁ డలరారె శుభకళాస్తోముఁ డగుచు.44

సీ. పంకజోదరపాదభక్తిఁ బ్రహ్లాదుఁడె
            శౌరికీర్తనమున నారదుండె
    హరిసువ్రతముల రుక్మాంగదాధీశుఁడె
            కృష్ణాభిరతి నంబరీషవిభుఁడె
    విష్ణుగుణస్ఫూర్తి వినఁ బరీక్షిత్తుఁడె
            నచ్యుతధ్యానచర్యను శుకుండె.
    మాధవబంధు సంపద ధర్మసూతియె
            గరుడధ్వజాసక్తి నరుఁడెకాక
    యతఁడు నృపమాత్రుఁడె దిగ్జయప్రభూత
    భూరికేశవ సామ్రాజ్య పుణ్యగణ్య

    విలసదిభవాజి విభవాది వివిధభాగ్య
    ధీవిభుం డొప్పుఁ బెదసోమ భూవిభుండు. 45

సీ॥ అమలిన దానధారామృత యుక్తిచే
                భాగీరథీరీతిఁ బరిఢవించి
     యవనశోణిత పూరితాసి సంక్షాళణ
               నల సరస్వతిరీతి నతిశయించి
     యరివధూటి కజ్జలాశ్రు మిశ్రితలీల
               యమునానదీరీతి నధిగమించి
     యాత్మదేశంబున నలరెఁ గృష్ణానది
               త్రివిధవర్ణముల సుస్థితి వహించి
     యహహ పెదసోమ భూపాలుఁ డాహవముల
     యవనుల జయించి భువనవిఖ్యాతిఁ గాంచి
     యార్యజనములఁ బ్రోచి తద్వ్యా ప్తి నెఱప
     నతని దేశ మార్యావర్త మగుటఁజేసి. 46

మ॥ గురు భూమీసుర మౌళికిం దన మహాగోత్రైక సామ్రాజ్యమిం
       పరయన్ భార్గవుఁ డిచ్చినట్లు పెదసోమాధీశుఁ డౌరా యనన్
       గురుభూమీసురమౌళికిం దన మహాగోత్రైక సామ్రాజ్యమిం
       పరయన్ దానమొనర్చె నిట్టి నృపుఁ డాహా కల్గఁగా నేర్చునే. 47

వ॥ వెండియుం దత్సోమ భూమండలాఖండలుండు హరిచరణ పరతంత్ర
      చర్యుండును, హరిపదాయత్త సామ్రాజ్య ధుర్యుండును, హరిగృహ
      సమ్మార్జన కరదీపికారోపణ వ్యజనాతపత్ర పల్యంకికా వహనాది
      కైంకర్యాలంకృత హర్ష పులకాంకుర సకలాంగుండును, నిరంతర
      క్రియమాణ మహాధ్వర దీక్షాదక్ష కమలాక్ష కరుణాకటాక్ష వీక్షణ
      కల్పిత దక్షిణాది ఫలోత్కృష్ణ మృష్టాన్నసత్ర సంతుష్ట విశిష్టజన
      బహు సహస్రశీర్వాదాపాదిత మహాభ్యుదయుండును, . శరచ్ఛిశిర

    పూర్ణిమా మహోత్సవ సముత్సాహ దిగంత విశ్రాంత విశ్రాణన ప్రీతా
    సేతు కాశీతల పర్యంత భూతలాగత విద్వత్కవిగాయకాద్యర్థి సంతా
    నుండును, చండతరదండయాత్రా సముద్దండ మండలాగ్ర ఖండితా
    నేక భండనాగత యవస మహీనాథ సేనామండలుండును నగుచుం
    బేరయ్యె నయ్యెడ. 48

గీ॥ అట్టి పెదసోమభూజాని హర్షమూని
     ప్రబలు గద్వాల యను మహారాజధాని
     నతిశయించి ప్రతిష్టించి యందు మించి
     ప్రేమఁ బూడూరి కేశవస్వామి నిలిపె. 49

శా॥ సద్వర్యోపల రమ్య హర్మ్య పటలీ సంక్రీడనాసక్త భా
      స్వద్వామా కచబంధ బంధుర సుమస్రగ్గంధ సంబంధ సం
      పద్వాంఛాగత కల్పపుష్ప మధులిట్పాళీ సముద్వేలతన్
      గద్వాలాఖ్య పురంబు భాసిలు రమాకాంతా వరావాసమై. 50

క॥ ఆ పురమున నత్యున్నత
     గోపురమున సాలరూప గురుతర ధరణి
     నూపురమున నధిపతియై
     ప్రాపు రమావిభుఁడు కేశవస్వామి దగున్. 51

సీ॥ శ్రీ ధారుణీ సతుల్ జెలఁగి పత్నులు గాఁగ
                 బరమేష్ఠి దగు మంత్రివరుఁడు గాఁగ
     బ్రహ్మాండ భాండవర్గములు రాష్ట్రంబుగా
                జత మహాదేవుండు సఖుఁడు గాఁగ
     గాంచన శైలాదికంబు కోశంబుగా
               వైకుంఠదుర్గ మావాసముగను
     పరఁగ నింద్రాది దిక్పతులు బలంబుగా
               బంచభూతములు ప్రకృతులుగను

     సకలరాజ్యాంగములఁ బ్రోచు చక్రధరుఁడు
     రక్షకుండును దేవుండు రాజునగుచు
     నచటి సోమాన్వయుల దాస్యమాదరించి
     చేరి గద్వాల కేశవశౌరి వెలయు. 52

కం॥ ఆ దేవుఁడు చేదోడున్
       వాదోడుగ ముష్టిపల్లి వర పెద సోమ
       క్ష్మాదయితుఁడు వర్ధిల్లెన్
      మేదిని సామ్రాజ్యజయ సమృద్ధి సెలంగన్. 53

కం॥ సిరిగాధిపుఁడిల వెలసెన్
       సిరిగా పెదసోమ నృపతిసింహు ననుజుఁడై
       సరిగారే నృపు లతనికి
       సరిగాపులఁజేసెఁదనకు యవనాధిపులన్. 54

గీ॥ అందుఁ బెదసోమభూమీశుఁ డమ్మమాంబఁ
     బేర్మి లింగాంబ రామాంబఁ బెండ్లియాడె
     నందు లింగాంబ సకలగుణావలంబ
     కలిమి జగదంబ యన బేరుకలిమి నలరె. 55

సీ॥ సంపూర్ణ సంపత్పరంపరావిస్స్ఫూర్తి
                నిందిరాసుందరి నెఱుఁగఁజేసె
      నిరతాన్నదాన మానిత సత్రవిఖ్యాతి
               నిల నన్నపూర్ణాంబ నెఱుఁగఁజేసె
      నమలిన బహువిధ వ్యవహార చాతురి
               నెసఁగు సరస్వతి నెఱుఁగఁజేసెఁ
      బ్రాజ్యసామ్రాజ్య వైభవ శుభావిర్భూతి
               నింద్రచంద్రానన నెఱుఁగఁజేసె

      దనదు కోనేట నమృతఖేలన మొనర్చు
      హరికిఁ గలశాబ్ది సుఖకేళి నెఱుఁగఁజేసె
      లీలఁ బెదసోమవిభుభార్య లింగమాంబ
      తనకు లింగాంబపేరు సార్థంబుగాఁగ. 56

గీ॥ అట్టి పెదసోమనృపతి లింగాంబవలనఁ
     బ్రేమఁ దిరుమలరాయలు రామరాయ
     లను సుతులఁ గాంచె భూమిజయందు రాముఁ
     డలరఁ గుశలవులను గాంచు ననువు మీఱ. 57

కం॥ అందగ్రజుండు జగతి ను
       తిం దగియెను సోమనృపుని తిరుమలరాయం
       డిందుధర కుంద శర శర
       దిందుదరస్ఫూర్తి కీర్తి హితవిభవుఁ డనన్. 58

సీ॥ సత్యభాషా హరిశ్చంద్రుండు చంద్రుండు
                   సుకళాప్రపూర్తిని సుగుణవర్తి
     మతి వివేకసనత్కుమారుండు మారుండు
                   రూపవిస్ఫూర్తిని రుచిరమూర్తి
     తతవైభవాప్తి సుత్రాముండు రాముండు
                  గురుభక్తియుక్తిని సరసకీర్తి
     భవ్యప్రభాచిత్రభానుండు భానుండు
                  పరతమోపహృతినిఁ బరుష హేతి
     యతఁడు దగు కేశవప్రభావానుభూత
     భూతలాధీశతాజాత పుణ్యజాత
     గణ్య సౌభాగ్య సంతాన కౌశలాభి
     రామశుభపాళి తిరుమలరాయమౌళి. 59

సీ॥ ఆరిదరకర విశేషారూఢిని వహించి
                   ద్విజరాజ పక్షసుస్థితినిఁ గాంచి
      యూర్జితాహీనగోత్రోన్నతి వర్తించి
                   జనులకు నభయహస్తము ఘటించి
      యమల భాస్వత్సత్ప్రియాలోకత గ్రహించి
                  విజయ సాంగత్యంబు విస్తరించి
      యనఘ మంగాఖ్యా ప్రియఖ్యాతి రాణించి
                 శ్రీనివాస సమాఖ్యచేత మించి
      రమణ నీతఁడె తిరుమలరాయశౌరి
      యనఁగ నుతిమీఱి వెలసె దయావిహారి
      ముష్టిపల్లి కులోద్ధారి ముఖ్యకారి
      రమ్యగుణహారి తిరుమలరాయశౌరి. 60

గీ॥ అట్టి తిరుమలరాయేంద్రుననుజుఁడైన
     రామరాయఁ డుపేంద్రుని రహి నెసంగి
     విక్రమస్పూర్తి స్వాధీన చక్రుఁడగుచు
     నతని సామ్రాజ్యరక్షణం బాచరించె. 61

సీ॥ కన నయోధ్యాంకమౌ దనపురి దగియంత
                 మహితనయోద్యోగ మహిమ నంది
     ధృతిసహజప్రియాదృతిఁ జేరి యావన
                వరయుక్తి దక్షిణాధ్వమున నరిగి
     ఖరముఖావృత్తి నా ఖలులు నాజినడంగ
                హరిముఖ్యసైన్య ప్రయత్నమునను
     పరవాహినీశాళిఁ బఱపి వచ్చి యనేక
               ముఖమహోద్ధతి మాన్చి ముదము మించి

      యవనిఁ బాలించె రామరాజ్యంబు గాఁగఁ
      దన చరిత్ర రామాయణాదరత నెసఁగ
      నసమధర్మాప్తిచే నగ్రజాన్వయావ
      నాయతి విహారి దగు రామరాయశౌరి. 62

ఉ॥ శ్రీమహనీయ ముష్టిపలిశేఖర రాజలలాముఁడైన యా
      సోముని రామరాయనృపసోముని భోగము సత్యమున్ దృఢ
      స్థేమము సత్త్వమున్ విజయశీలతయున్ హసియించు నందనా
      రాముని రామునిం బరశురాముని రాము సుమాభిరామునిన్. 63

వ॥ అందు 64

క॥ శ్రీ తిరుమలరాయనికిన్
     ఖ్యాతిగ లక్ష్మాంబ మంగమాంబయు ననఁగాఁ.
     జేతఃప్రియసతు లొలసిరి
     శ్రీ తరుణియు భూతరుణియు శ్రీహరికి బలెన్. 65

క॥ తిరుమలరాయల భామిని
     మరు నమ్మన సిరుల వెలయు మంగాంబ దగున్
     తిరుమలరాయల భామిని
     మరునమ్మన సిరుల వెలయు మంగాంబ యనన్. 66

సీ॥ తిరుమలరాయ భూవరుని సుందరి యౌట
                ధర నహీనాచలస్థిరతఁ దనరి
     భావింప లక్ష్మీసపత్నినా వెలయుట
                సుస్థిరాంశ సముద్భవస్థితిఁ దగి
     వరుసతో సోమభూవరుతల్లి దానౌట
               లసదనసూయాప్తి వెసనెసంగి
     ప్రణుతపాతివ్రత్య గుణపవిత్రత యౌటఁ
              దులసీసహజలీల నలవరించి

     యౌర చెలువందె రమణ క్షమాధిపాల
     గర్భవారాశి రత్నవైఖరినిఁ గనుట
     సుగుణనికురుంబ యన మించి శుభవిడంబ
     మంజుల యశోవలంబ శ్రీమంగమాంబ. 67

చ॥ రమణ సుఖప్రభూతి నల రంగకళానిధితోడఁ బుట్టి యీ
      క్షమఁ గమలాకరస్థితినిఁగాంచి తనంత ననంతగోత్ర సౌ
      ఖ్యమునను శ్రీయనాఁ దనరె నర్మిలిఁ దిర్మలరాయశారి గూ
      ర్మిమహిషి మంగమాంబ యురరీకృత సంపదపద్మ పాణియై 68

క॥ తిరుమలరాయ మహీవరుఁ
     డరయన్ మంగాంబయందు ననురూపముగా
     సరసీరుహాంబకాంచితు
     స్మరసదృశుం బిన్నసోమజనవరుఁ గనియెన్. 69

మ॥ హరికిన్ జాంబవతీసతీమణికి మున్నా సాంబుఁడై పుట్టి శం
       కరుఁడీ తిర్మలరాయ శౌరికిని మంగానామక శ్రీకి నేఁ
      డరయన్ సోమసమాఖ్యఁ గల్గె ననఘార్థావృత్తి గాదేని యీ
      శ్వరతావాప్తియు రాజశేఖరత సర్వజ్ఞత్వమున్ గల్గునే. 70

పంచరత్నాలు



సీ॥ తనమానసస్థితి తనమానసస్థితి
                భాతి శౌర్యాశ్రయప్రతిభఁ గాంచఁ
      దన సమాఖ్యారూఢి తన సమాఖ్యారూఢి
               యటుల సోమస్ఫూర్తి నతిశయించఁ
      దనదు నాహవలీల తనదు నాహవలీల
               నానావనీపకానంద మూన్చఁ
      దనదు జన్యాయతి తనదు జన్యాయతి
              రీతి శాంతనవప్రతీతి నించ

     నమరు కరిగిరి కిరిహరి కమఠభరణ
     కరణలఘుతా విధాయి దోఃకలితధరణి
     వహన మహనీయతా కృతావార్య శౌర్య
     పటువిజయశాలి సోమభూపాలమౌళి 71

సీ॥ మతినీతి నల బృహస్పతి సమంబౌనె కా
               యఖిలవిద్య లెఱుంగ నతనిసమమె
      హరిభక్తి నారదుఁడన సమంబౌనె కా
               యసమగాన రసాప్తి నతని సమమె
     శౌర్యచర్యను ధనంజయు సమంబౌనె కా
              యాకారరేఖచే నతనిసమమె
     గురునిష్ఠ రాఘవేశ్వరు సమంబౌనె కా
              యతుల ప్రభుత్వాప్తి నతనిసమమె
     కాక యితరుల సమమెన్నఁగాఁదరంబె
     యతులితాంధ్రక్షమా మండలాంతరాళ
     హృద్యగద్వాల పట్టణ శ్రీవిభాసి
     పుణ్యవిహృతికిఁ జినసోమ భూమిపతికి. 72

సీ॥ తన రథ్యహయచయంబును బట్టెనని భక్తి
                ననురక్తి నా హరిహయముఁ బట్టి
     తన కీర్తి వెలయించెననుచు నా హరికీర్తి
                వెలయించుగతిఁ జుట్టు విరులఁ జల్లి
     తన శౌర్య మలరించెననుచు నా హరిశౌర్య
               మవని నించెటిలీల దివిటి బూని
     తనకు రాజ్యం బిచ్చెనవి యాత్మసామ్రాజ్య
              రమకెల్ల నా హరి రాజుఁజేసి

      నరుఁడు నరుఁడయి గద్వాల తిరుమలేంద్రు
      సోమభూవరుఁ డనఁ బొల్చి ప్రేమ నిల్పి
      హరికిఁ బరిచర్య లొనరింప హరియు మెచ్చి
      యతని నరపతిఁ గావించె నతిశయముగ 73

సీ॥ సుకవుల కొకరొక్కరి కొసంగె నే ఘనుం
                 డలరి వేనూటపదార్లు గాఁగ
      బహుభక్ష్య సత్రముల్ బరగించె నే దాత
                 ద్విజుల కర్థము పదివేలుగాఁగఁ
      మాఘకార్తిక పూర్ణిమల నిచ్చె నేరాజు
                విప్రకోటికి బహువేలుగాఁగ
      నొగిఁ గేశవస్వామి కొనరించె నే మేటి
                లలితభూషాదులు లక్షగాఁగ
      నతఁడు సామాన్యుఁడే యనేకాగ్రహార
      భూసురాశీర్వచస్సార భూరిపూరి
      తాయురారోగ్య భోగభాగ్యాత్మజాది
      బహువిభవపాళి సోమభూపాలమౌళి. 74

సీ॥ దయ బర్వ లీలచేఁ దనరి విద్వన్మండ
                లమునకుఁ జంద్రహారము లొసంగె
      శ్రుతి హితస్థితి సుదృక్తతికి రసికతాప్తి
                మణికుండలాది భూషణము లిడియె
     మతి మెచ్చి వరదుఁడై హితపండితాళికి
               భూరికాంచీయుక్తి బొసఁగఁజేసె
     సవరించెఁ దగునభిజ్ఞత సత్కృతి స్ఫూర్తి
               కవిగాయకుల కలంకారపుష్టి

      హిత వొనర్చిన రాజునకేనిఁ దమిని
      వసువులును తారహారాదు లొసఁగఁజాలు
      తత్తదుచితార్థ సంధానతాధురీణ
      బహుగుణవిహారి సోమభూపాలశౌరి 75

మ॥ ఘటియించెం గటిసూత్రముల్ కటకముల్ కంటీలు నొంటీన్మణి
       చ్ఛటలున్ హేమపటాళికీ ర్తి మహిళా సంధాన విస్ఫూర్తి కొ
       క్కట నానాకవిపండితాళుల కిలన్ గద్వాల సోమేంద్రుఁ డ
       క్కట తత్కీర్తివధూటి కెంతయొసఁగంగా నెంచినాడో కదా! 76

చ॥ తిరుమలరాయ సోమనరదేవ శిఖామణిరీతి భావసు
      స్థిరత విభూషణాంబర విశేషధనాదులు భక్ష్యభోజ్యముల్
      పెరదొర లియ్యలేరెకద పేర్మినతండొకనాఁడె యింత యీ
      వరిది యొసంగెనా యనకనందున మెచ్చినఁజాలు నెంతయున్. 77

చ॥ వరకరుణాభిరామత నవార్య కళావిభవాను భావతన్
      గురుతరశౌర్య ధుర్యత నకుంఠితభాగ్య సమగ్ర సంగతిం
     దిరుమలరాయ సోమనరదేవ శిఖామణు లీడువత్తురౌ
     తిరుమలరాయ సోమనరదేవ శిఖామణికిం గ్రమంబునన్. 78

ఉ॥ దాత దయావిశిష్టుఁడు స్వతంత్రుఁడు శాంతుఁ డనేక భాగ్య సం
      ధాత యొకప్పుడున్ వెగటు దట్టని నిండుమనంబువాఁడు వా
      క్చాతురి నీతియుం గలుగు జాణ భళీ హితగోష్ఠినుండు రా
      ౙతఱి ముష్టిపల్లి ధరణీంద్రుఁడు సోముఁడె యెంచి చూచినన్. 79

సీ॥ ఆదివిష్ణునకు శ్రీమేదినుల్ దగుమాడ్కి
                  ననురక్తి భక్తిచే నతిశయించి

      శౌరికి రుక్మిణీ సత్యాంగనల లీల
               సత్కులాభ్యున్నతి సంతసించి
      రాజీవశరునకు రతిరుక్మవతులట్ల
              యనురూపవైఖరి ఘనత గాంచి
      శశికిని రోహిణీస్వాతీ సతులరీతి
              సుప్రభావాప్తి విస్ఫూర్తి మించి
      పూర్ణభాగ్యక్షమాశీల భోగరూప
      ధనవిభాగుణరత్న సంతతులఁ దనరి
      సోమవిభునకు భామినుల్ ప్రేమ వెలసి
      రీ మహిని వెంకమాంబయు రామమాంబ. 80

ఉ॥ దక్షత భర్త సోముఁడని తాను సతీస్థితి నొందియున్ దయా
      వీక్షుఁడు పూరుషోత్తముఁ డధీశ్వరుఁ డంచు నిజాఖ్య వేంకటా
      ధ్యక్షునిఁ జేసి ప్రాణవిభుఁ దా నలమేలు విధంబు గాంచె నౌ
      నీక్షితి వేంకమాంబ హృదయేశ్వరు భవ్యగుణానువర్తనన్. 81

శా॥ శ్రీరామామణిరీతి నాథహృదయశ్రీ రంజిలం గూర్చుచున్
      భూరామామణిలీల వర్తిలుచు సంపూర్ణక్షమారూఢిచే
      నా రామాంగనవైఖరిన్ జనకవంశానంద సంధానతన్
      శ్రీరామాంబ దనర్చు సోమనృపతి ప్రేమాభిరామాకృతిన్. 82

క॥ ఆ మానవతీమణు లిటు
     ప్రేమాయతిచే భజింప శ్రీముష్టిపలీ
     సోమాధిపుఁ డలరె గుణ
     స్తోమాధికుఁడగుచుఁ దనదు శుభసంతతితోన్. 83

క॥ సోమునకునుఁ దిరుమలనృప
     సోమునకును రామునకునుసోమునకొసఁగెన్

      భూమీసామ్రాజ్యము హరి
      యామేటికి సోమకులనరావన మరుదే. 84

శా॥ భూదారుండును చక్రి పద్మియును నాభూభృత్తునై శౌరి యీ
      భూదేవిన్ భరియించి సోమకులులన్ బూనించినన్ వారలున్
      భూదారత్వము చక్రిపద్మితల నా భూభృత్త్వముం గాంచ లో
      భూదారంబును చక్రిపద్ములును నా భూభృత్తులున్ నిల్పవే. 85

వ॥ ఇవ్విధంబున 86

కం॥ ఈ ముష్టిపల్లి సోమ
       క్ష్మామండలనాథ విభవ సంరక్షణచే
      శ్రీమంతుఁ డగుచు లక్ష్మీ
      వామాదృతి కామికేశవస్వామి దగున్. 87

సీ॥ సిరిగుఱించినయాలు నరిధరించినకేలు
               నరి హరించినవాలు నమరుసామి
     నుడుగునేలినచూలు నడుగుదేలినజాలు
              వడుగుబోలినమేలు నడరుసామి
     నీటనింపగుప్రోలు హాటకంబగుశాలు
              నాటకంబగుచాలు నడుపుసామి
     సగము మ్రోచినవ్రేలు జగము బ్రోచినదీలు
             ఖగముదాచినడాలు దగినసామి
     వారినిధిఁబారి గిరిదూరి వసుధఁ జేరి
     వైరిఁ దెగజీరి ధరగోరి వరకుఠారి
     దారికుముదారి కులుపేరిసీరి నెనరు
     మీఱి హయచారి కేశవశౌరి వెలయు. 88

సీ॥ సురలువేఁడఁగ నాలదొరలు గూడ వనాలఁ
                దరులజాడఁ జరించి తగమెరించి
      సతుల వేలకుమించి యతులలీల వరించి
                సుతులఁ జాలఁగఁగాంచి శుభము మించి
      పలువిధంబుల దానవులవధంబుల మాన
                వుల పదంబులఁ గాడ యిలనుఁ బ్రోచి
      నరునిచేత సుభక్తవరునిచేత విముక్త
               శరునిచేతన యుక్తవరుల నణచి
      భారతరణంబునను ధరాభారతరణ
      మావహించి జయోత్సాహ మావహించి
      యా విరించి ముఖార్థనం బాదరించి
      శ్రీ రహించిన కేశవశౌరి వెలయు. 89

సీ॥ కరిశిరోర్పిత హేమఘటపయః స్నానంబు
               హాటకాంబర భూషణాంచలంబు
      చందనకుసుమోపచారాది రచనంబు
              వివిధమృష్టాన్న నివేదనంబు
      బ్రాహ్మణోత్తమ వేదపఠనాది ఘోషంబు
              వారాంగనానాట్య వైభవంబు
      భేరీపటహఘంటికారవాకలనంబు
              పంచమహావాద్య పరికరంబు
      భోరు కలుగంగఁ జెలగంగ భూరిమహిమ
      ప్రతిదివసవాసరక్షపాపక్షమాస
      వత్సరోత్సవముఖ్యోత్సవముల సిరుల
      మీఱి గద్వాలకేశవశౌరి వెలయు. 90

షష్ఠ్యంతాలు

కం॥ ఏతాదృశగుణ జాత
       ఖ్యాతాలంకరణునకునుఁ గరిశరణునకున్
       పూతభవాజ్జాత భవా
       నీత నవాపచితి ఖచిత నిజచరణునకున్. 91

క॥ శరణాగత రక్షునకున్
     శరణాయిత విమలకమల సఖవక్షునకున్
     కరుణారస పరిణాహస
     దరుణాభ సమీక్షణాంతికాలక్షునకున్. 92

కం॥ హేళినుతాకేళికృతా
      బ్జాళివృతాభరణునకు దయాభరణునకున్
      నీలాముఖ బాలాసుఖ
      హేలాదిక యోగభోగ హితకరణునకున్. 93

కం॥ ఆలోలక నీలాలక
       జాలాళిక ఫలకరుచివిశాలునకును గ
       ద్వాలపురీ శ్రీలహరీ
       పాలనరీతి ప్రమోదపరిఖేలునకున్. 94

కం॥ శ్రీమహిళా శ్రీమదిలా
       ప్రేమకళాలోలరతికి శ్రీముష్టిపలీ
       సోమాధిప సామోద
       క్షేమాదరమతికిఁ జెన్నకేశవపతికిన్. 95

వ. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా సమర్పింపం బూనిన భద్రా పరిణ
    యోల్లాసంబగు ముకుందవిలాసంబను మహా ప్రబంధంబునకుఁ గథా
    క్రమం బెట్టిదనిన. 96

చ॥ ఆనఘ విదేహదేశ వసుధాధిపుఁడై మిథిలాపురంబునన్
      మనుజనక క్షమాధవుని మాధవునిన్ భజియింపుచుం గనుం
      గొన నిగమాగమా గమశుకుండు శుకుండరుదేఱ వేడెఁ బూ
      జన మొనరించి మౌని మహిజాని మురారి వివాహసత్కథల్. 97

వ॥ ఇట్లమ్మహీభుజుండు శుభసంప్రశ్నంబొనరించిన 98

కం॥ ఒకపరి రుక్మిణి మొదలగు
       సకియలకార్గురికి పెండ్లిసవరణ వినఁబొం
       దికపఱచి యవలిసతికథ
      శుకముని యా జనకనృపతిసోమున కనియెన్. 99

ఉ॥ శ్రీరమణీయమై సరసశీతకరోపల సౌధవీథికా
      వారిచరద్వధూమధుర వాక్కలనాకలనాద సంకుల
      స్వైరకుల స్వరభ్రమదశా వివశత్రిదశద్రు కీరమై
      ద్వారవతీపురంబు దనరారు ధరారుచిరావతంసమై. 100

మ॥ తనలోనుండు ముకుందుఁ డందు నిలువందానంటునందోన ని
       ల్చిన చండద్యుతి మండలంబొ యన నక్షీణప్రతాపోగ్రమున్
       జనదృక్చిత్రకరం బనంతమణియుం జంచత్ర్పభాపూర్ణమై
       యనువొందుం బురి రత్నహేమవరణం బభ్రంకషప్రౌఢిమన్. 101

కం॥ హరిధర్మాశ్రయము గదా
       కరవాసము సకలనందకము శంఖనిధి
       స్ఫురితంబగుటనుఁ దత్పురి
       వరణంబున్ జక్రిరీతి వర్తిలుటరుదే. 102

కo॥ నూత్నముగఁ బరిఘ యెప్పెఁ బ్ర
       యత్నముగా నచటఁ దటయుగాబద్ధ మహా

      రత్నాకర ఘనసంపద
      రత్నాకరమనఁ గభీరరచితాంతరమై. 103

చ॥ అనిమిషకోటి దైత్యవధ మాత్మను మర్వకయుండఁ దెల్పఁగా
      వెనుకొని కోటతంతియల వెంబడిగా డిగివచ్చి నందనం
      దనుఁ గనునన్నచోఁ బిదప దాని సమున్నతిఁ జెప్పనేటికిం
      దనర నగడ్త వారిధియె దాని గభీరతఁ జెప్పనేటికిన్. 104

సీ॥ ఏ వీథిఁ జూచిన శ్రీవిష్ణుకల్యాణ
               కల్యాణవైభవాకర్ణనములు
      నే సీమఁ జూచినఁ బ్రాసాద శృంగార
              శృంగారలీలా నిరీక్షణములు
      నే వాడఁ జూచిన నావాసకల్పాగ
             కల్పాగ సుమరసాఘ్రాణనములు
      నే నాటఁ జూచిన నానారసారాల
             సారాలసానిల స్పర్శనములు
      ఎందుఁ జూచిన సంతతానందజాత
      నంద జాతగుణాస్వాదనములు గలిగి
      యౌర సకలేంద్రియప్రీతి నావహించు
      కాపురంబున నా ద్వారకాపురంబు 105

గీ॥ రాజహంసల సద్విహారములు గలిగి
     యశ్వముఖ భావితస్ఫూర్తి నతిశయిల్లి
     వివిధ ఘనమార్గములచేత విస్తరిల్లి
     యల నగరి సోమసూర్యవీథులు దనర్చు 106

కం॥ ఆ పురి పరిసరసీమలఁ
      బ్రాపిత కరినికర ఘంటికారావములన్

      దీపించుట వీథులు ఘం
      టాపథనామముల నెసఁగె నాటంగోలెన్. 107

గీ॥ చంద్రశాలల యున్నతి సంఘటించు
     చంద్రశాలలయున్నతి శౌరినగరి
     నింద్రశాలల సంపద లెసఁగు నప్పు
     రీంద్రశాలల సంపదలింపు నింప. 108

కం॥ అందలరు మేరురోహణ
       కందరములునాఁ దనర్చు గాంగేయమణీ
       మందిరములు తత్తద్రుచి
       సుందరములునగుచు దము వసుంధరనెన్నన్. 109

ఉ॥ అందుల హర్మ్యబృందము తమందిలి కుందనపుందళంబులిం
      పొందంగఁ జందురుందొరయ నొందిన సాంద్రతరంబుగా సుధా
      స్యందముఁ జింద నందునను సౌధము లయ్యెను గాకయున్న నా
      చందురుశాల లేమిటికి సౌధసమాఖ్యలుగాంచు నెంచఁగన్. 110

ఉ॥ చందురు రేకడంచు నిడఁజాలియు తారలతారహారపుం
      జందముగాఁగఁగైకొనియు సౌరములంచును మేఘబృందముం
      బొందికఁ గొప్పులందురుమఁ బూనియుఁ బ్రౌఢలు మాన్పనుందురౌ
      ముందుగ సౌధవీథులను ముగ్ధవధూటులు రాజధానికన్. 111

ఉ॥ పూటలఁ బూటల న్నగరిబోటుక లాటలు నేర్పు జాళువా
      నాటకశాలలం బొడవునం బొడకట్టెడి కూటవాటముల్
      హాటక శైలకూటములటం జని యచ్చట వచ్చు నచ్చరల్
      చీటికిమాటి కచ్చెరువుచేఁ గననౌ ననిమేషభావముల్. 112

చ॥ ముడిచిన ద్వారబంధముల ముతైపుఁజాలు మెఱుంగురంగులుం
     గడపలఁ బచ్చరాసిరులు గప్పి పరస్పర బింబితంబులై
     ముడిగొను పచ్చతోరణము ముచ్చట ముంగిటిమ్రుగ్గునిగ్గులై
     గడువడి నిచ్చ మంగళముగాఁ గనుపట్టును పట్టణంబునన్. 113

ఉ॥ ముతైపు పాలగచ్చునునుపుల్ జిగికెంపుమెఱుంగుటోరులుం
      గ్రొత్తగు కప్రపుంజికిలి మ్రుగ్గులు నిగ్గులుదేరు భావపుం
      జిత్తరువ్రాతలుం గలికిచెక్కడపున్ మగఱాల తావులుం
      బుత్తడియిండ్ల తీర్పులును బొందులవిందులొనర్పు నప్పురిన్ . 114

చ॥ విలసితహర్మ్య వాటికల వేల్పుమిటారులఁ బేరటాండ్రఁగాఁ
      బిలిచిన వచ్చి బాలికలు బెట్టిన గజ్జనబువ్వపున్‌రుచిన్
      వలచుచు నందె నిల్వఁగని వారిప్రియుల్ సరిప్రొద్దుగాఁ దమిన్
      సొలసి తదాగమం బెదురుచూతురు స్వర్గపుటూరవాకిటన్. 115

కం॥ అప్పురిఁ గల యుప్పరిగల
      నెప్పరులగు మగువలెక్కి నిక్కి తమ నెఱిం
      గొప్పులఁ గల కల్పకముల
      గొప్పసుమము లేరికోరి కోయుదు రదనన్. 116

ఉ॥ ఆటలు పాటలుం గలుగు నందపుగందపుఁ గూటవాటముల్
      కోటలు పేటలుం బసిఁడిగోడలు మేడలు గల్వవిందు రా
      చోటుల నీటులం గులుకు చుక్కను చుక్కను నిండుఁ జెల్వపుం
      బోటుల మేటులం దగిన పొన్నలు చెన్నలువొందు వీటిలోన్. 117

సీ॥ శ్రుతిపదక్రమలీలఁ జూపనేరడటంచు
                 శేషునిఁ గ్రిందుగాఁ జేయఁగలరు

      కావ్యసంపద నించుకయు నెఱుంగడటంచు
                 గురు నాదివికృతిగా నెఱపఁగలరు
      పంచశిరోమణిప్రౌఢిఁ జాలఁడటంచు
                బ్రహ్మను మాటలోఁ బట్టఁగలరు
      కడుప్రభాకరయుక్తిగని యడంగునటంచు
               ద్విజరాజునొకటఁ గుందింపఁగలరు
      సాంగవేదంబు సాహితీ సంగతియును
      తర్కమీమాంసలెల్ల సాంతముగఁ దెలిసి
      వెలయుదురు కల్పతరుపరిమళము నెఱిఁగి
      భూమిసురలన నవ్వీటిభూమిసురులు. 118

ఉ॥ శత్రుబలచ్ఛిదాచణులు శౌర్యవరప్రభవత్వ భూతికిం
      బాత్రులు దివ్యకల్పులు సమగ్రమహాహవ భాగసద్యముల్
      మిత్రశుభోదయాశయ సమీహితసుస్థితిచేఁ బవిత్ర స
      ద్గోత్త్రులు దూరితాహిభయకోటులు బొల్తు రిలేంద్రులప్పురిన్. 119

ఉ॥ ము న్నిజపూర్వు లాకులలముల్ దినియుండఁగ నొక్కదిక్కుగా
      నెన్నిక కొన్ని తానెఘటియించియ విన్నవతం ఘటించనై
      యున్నఁ గుబేరుఁబేరు కొన రూర నవాధికలాభసిద్ధి మా
      ద్యన్నిధి మద్విహారులు బెహారులు ముత్తరముందిరంబుగన్. 120

సీ॥ హరి పదావిర్భూతి నావహించుటఁజేసి
                  హరిపదావిర్భూతి నావహించి
     హలధరారూఢిచే నతిశయించుటఁజేసి
                 హలధరారూఢిచే నతిశయించి
     ప్రద్యుమ్న విస్ఫూర్తి పరిఢవించుటఁ జేసి
                 ప్రద్యుమ్న విస్ఫూర్తి పరిఢవించి

      సఫలతుర్యోదయాంశత గ్రహించుటఁజేసి
                 సఫలతుర్యోదయాంశత గ్రహించి
      అమరసింధువు తోడుగా నలరి మనుట
      నమరసింధుపు తోడుగా నలరి మనుచుఁ
      దనరు వర్ణత్రయప్రీతిఁ గనుచు దాన
      సార్ధవిఖ్యాతి నచటఁ జతుర్ధజాతి. 121

మ॥ తగు శృంగంబులఁ జిత్రగైరిక ముఖోత్కర్షంబులం గుంజర
       త్వగతిం బద్మకవృత్తి గండఫలకోద్యద్వైఖరిన్ మేఘయు
       క్తిగణింపంబడి యున్నతోన్నతములే కృష్ణప్రభావాప్తిచే
       నగముల్ మున్నుగ వృద్ధిగాంచి నగరిన్ నాగంబులయ్యెంగడున్ 122

శా॥ ధారారీతి సమీరపంచకము పాదశ్రేణికం బట్టగా
      నారాచంబులునోడి పార్శ్వముల నంటంగొల్వఁగా నాత్మవే
      గారూఢింగనుఠేవ దేవమణి మాద్యత్కంఠ భూషాద్యలం
      కారంబుల్ బిరుదుల్ ధరించి పురిలోఁ గన్పట్టు ఘోట్టాణముల్. 123

ఉ॥ దారున రత్నకుట్టిమశతంబులు దోప శతాంగరీతులన్
      హారిమణీ శిరోగృహములందు ఫలింప విమానలీలలన్
      హీరపురాలజారి చననిచ్చఁ దనంతట స్యందనస్థితిన్
      దీరులుమీఱ నూరఁ దగుఁ దేరులు పేరులు సార్థకంబుగన్. 124

కం॥ తోరంబున సారంబున
       బీరంబున నోడిపార చేతీడైనా
       నూర నటులు సారభటులు
       వీరభటులు గలరు వేనవేలకు మీఱన్. 125

కం॥ రతి వలచు నచటి పురుషుల
      నతనుండే వలచు నచటి యతివల నౌరా
      క్షితినెంతనఁ బురిఁ బురుషుల
      చతురవిలాసములు సతుల సౌందర్యంబుల్. 126

గీ॥ కులుకుఁజెక్కులు పసిఁడియాకుల దిసింప
     చిన్నికుచములు పోఁకల చెన్నుమీఱ
     కలికిలేనవ్వు సుధగూడఁ గన్నె లాట
     పాటలను జాటుదురు మేటివీటిసిరుల 127

సీ॥ ఏ రాజవరునేని యీ తారకానఖి
                 భ్రమియింపఁజేయదే తమి ఘటించి
      యే మహాఘనునేని యీ చంచలాభాంగి
                కళలఁ దేలింపదే క్షణములోనె
      యే ధనేశకుమారునేని యీ రంభోరు
                వొలసి లోఁజేయదే యుత్తరమున
      నే పురుషోత్తమునేని యీ పద్మాస్య
               మదిఁ గరగింపదే యెద వసించి
      యెట్టి చతురాస్యునేని మోహించుకొనదె
      మాటలోననె కూడి యీ మధురవాణి
      యని తము గణింపఁబోల్తురు హావభావ
      వైభవోన్నతు లయ్యూర వారసతులు. 128

మ॥ చెలి యీబంతులు రెండు వట్రువలు మాచేగూర్పు నీవిచ్చునా
       వెలఁబొందింపుము పొన్నపూవురుచి ఠీవిన్మించు బంధూకమీ
       గలవే యాననటన్ విటాళి దమివేడ్కంగూడఁ గైకొండు రా
       జులు మీరల్ వసువీరె యంచు సొలయించున్ బుష్పలావీతతుల్. 129

క॥ చెంగలువతమ్మికొలనులు
     చెంగట రాజనపుచేలు చెఱుకుందోటల్
     బొంగారు విరులతోటలు
     శృంగారమొనర్పు నప్పురిందిలకింపన్. 130

ఉ॥ అందుల నందమౌ నుపవనాళి సమున్నతి సూనబృందని
      ష్యందమరందధార నదనందఁ బురందరు వీటితోట నిం
      పొందఁగ సాకి వీఁకఁ దమయొంటుల నంటులనాటి యెప్పుడున్
      నందనునట్ల పెంచుటను నందనసంజ్ఞ ఘటిల్లె దానికిన్. 131

చ॥ సిరుల గభీరభావముల శీతలతాలలితాశయంబులం
      బరమవినిర్మలస్థితుల భవ్యవయశ్శుభరూపలీలలన్
      వరసుమనస్సమృద్ధి తమవారిల సద్గుణరీతి నెంచుచున్
      సరసులచాలు బొల్చునట సారసరాగముఖాద్యలంకృతిన్. 132

సీ॥ మల్లికావల్లీమతల్లికా శ్రేణితోఁ
                   దఱిసి దండాదండిఁ దఱుములాడి
      శీతలతరవాహినీతరంగములతో
                   నెనసి హోరాహోరిఁ బెనఁగులాడి
      గురువధూవక్షోజ కుసుమగుచ్ఛములతోఁ
                   గుమిసి బాహాబాహిఁ గుమ్ములాడి
      రసవద్వనాంతర ప్రసవ సంఘములతో
                   వెరసి ముష్టాముష్టి వ్రేటులాడి
      కేళికాసారనాళీకపాళితోడఁ
      బోక నొరసి కచాకచిఁ బీకులాడి

      శౌరి చనవరినాసరా సరిఁ జరించు
      నందు చందనశైలమందానిలంబు 133

కం॥ అందుల వీరును వారన
       కందఱు కులశేఖరులు మహాత్ములు సరసుల్
       సుందరకవిముఖ్యులు గో
       విందపదారాధనమున వెలసినకతనన్. 134

సీ॥ వసుదేవచిరభాగ్యవాసనాసారంబు
                 దేవకీకృత పుణ్యజీవనంబు
      నందయశోదాజననసంచితఫలంబు
                 బలదేవసుకృత సంబంధసీమ
      రమ్యబృందావనా రామకేళిపికంబు
                 కంసాదిఖలతమఃఖర మరీచి
      రుక్మిణీముఖవయోరూప సరోహంస
                శుక వాక్యమాణిక్యసూత్రసరణి

     యా నగరమేలు మేలున యానగరము
     భూజనమునకు బహుసౌఖ్యభాజనముగ
     మదనశతమూర్తి వల్లవీమానవస్తు
     చౌర్యవిస్ఫూర్తి యదువంశచక్రవర్తి. 135

సీ॥ అపరంజివన్నె చొక్కపు రెక్కపులుగు రా
                 బలుగురాని వయాళి బఱపువాఁడు
      వనజగేహకు మోహవనరాశి బొంగార
                సింగారమొలయు మైచెలువువాఁడు

      తెలిదీవి నమృతలీలల ఠీవివాడలో
                 మేడలో సుఖకేళి మెలఁగువాఁడు
      తొలుపల్కుకొనల పొందులు గాంచి గడిదేఱు
                 జడదారు లెన్నఁగా నడరువాఁడు

      జాళువాశాలువాఁ డెల్లజగము నేలఁ
      జాలువాఁ డంఘ్రిగననైన జాలువాఁడు
      నమరవరుల పూజన్‌మించి యమరుశౌరి
      యవని జన్మించి విహరించె యదుకులమున. 136

కo॥ నళినదళాక్షుని నిచ్చలు
      గొలుచుచు హితబంధురాజగురుభావనలన్
      దలఁచుచు భక్తి నొనర్చిరి
      యిలలో యాదవుల భాగ్య మేమనవచ్చున్. 137

ఉ॥ గొల్లమిటారిగుబ్బెతల కోర్కెలపంట తదీయమానముల్
      గొల్లలుబెట్టు దంటమరుకూరిమి గాంచినమేటి రాధికా
      పల్లవపాణిభాగ్యపరిపాకము నందుని ముద్దు నిందిరా
      వల్లభుఁడైన శౌరిచెలువంబు లవంబు గణింప శక్యమే. 138

చ॥ సిరికి వరుండు భాగ్యమునఁ జెల్వమునన్ మరుఁగన్న మేటి ధీ
      సరణి విరించికిన్ గురుఁడు శౌర్యమునం బుంభేది నోటమిం
      బఱపినయట్టి జోదు శితభానుని వియ్యము సత్కళాప్తి సు
      స్థిరకృప శౌరి యే మఱి నుతింపఁగ శక్యమె తద్గుణావళుల్. 139

సీ॥ అతిరమ్యత నెసంగు హరినీలకాంతులు
                    హరినీలకాంతుల నతిశయించు

      నామోదగతినించు హరిసమ్ముఖస్థితి
                  హరిసమ్ముఖస్థితి నతిశయించు
      నరిఘనోద్ధతి మాన్చు హరివేగవిస్ఫూర్తి
                 హరివేగవిస్ఫూర్తి నతిశయించు
      నాహవోద్యతి మించు హరిపరాక్రమలీల
                 హరిపరాక్రమలీల నతిశయించు

      నహహ యెంతన హరివచోవిహృతి రీతి
      హరివచోవిహృతుల రీతి నతిశయించు
      హరి పభావాప్తి హరిధర్మ సరణియుక్తి
      హరిహరి గణించి చూడనే హరికిఁ గలదు. 140

గీ॥ కేశవుండగు నా హృషీకేశుఁ డలరుఁ
     గొనలు నిగుడ గుడాకేశుఁడను నిరూఢి
     కేళినొక నరుమరి గుడాకేశుఁజేయు
     నీశునొందదె తాదృశకౌశలంబు. 141

కం॥ హృదయమున మును జనించితి
      నదనన్ ద్విజరాజునయ్యు నది గాదని యం
      దుదయించు చంద్రుఁడో యన
      వదనము దనరారు వికచవనజాక్షునకున్. 142

గీ॥ అలర సన్మిత్రతను సుధామాప్తి నెసఁగు
     హరివిలోచనములు కమలానుకృతియు
     కువలయాదృతి గాంచెను నవని నటుల
     యౌటరుదె శ్రీమహీభర్తయగు విభునకు. 143

కం॥ వనజము వదనంబగుటను
      మునుకొని రదనములు కుందముకుళములగుటన్
      నునునగవు జాజులగుటను
      కనకసుమము నాసయయ్యెఁ గమలాక్షునకున్. 144

కం॥ హరి కులుకు తళుకుఁ జెక్కులు
       హరినీలపు దర్పణములె యవుఁ దెలిసెను నం
       దరియున్ దరముందోచిన
       నరయం దద్రేఖలందు రార్యు లెఱుఁగమిన్ . 145

కం॥ మధురిపు నధరముఁ గనుఁగొని
       సుధరమ విధురిమము గాంచె శుచిరుచికడమై
       మధురమ యప్పులఁబడి చెడె
       మధురిమ సద్వంశరతికి మాఱెవ్వరిలన్. 146

కం॥ కంఠమునకు మధురరవో
       త్కంఠమునకు సమముగాక దరగతిచే వై
       కుంఠునకుఁ జిక్కె శంఖమ
       కుంఠతచేఁజిక్క రేల కూతల మారుల్ . 147

ఉ॥ ఆ నెలయందుఁగల్గు పదియాఱుకళల్ మఱిరెండు హెచ్చుగా
      నాననసీమఁ గల్గు కళ లా హరికిం బదునెన్మిదంచుఁ దా
      నూని మఱుంగుగా గుఱుతులుంచె విరించియు లేక రెండుగా
      వీనుల పేరి తొమ్ముదులు వేడ్క ఘటించునె పార్శ్వసీమలన్. 148

మ॥ సరి రాకన్ హరిదానరేఖ కమితైశ్వర్య ప్రదంబౌటచే
       సురశాఖల్ సురలోకవాసమున కచ్చో నొక్కటిన్ నిల్పి త

      త్కరశాఖాకృతిఁబొల్చె నిల్చి వచతుష్కంబుం దళశ్రీలచే
      మఱిగాకన్ సుమనః ప్రియస్థితుల నేమంబొప్పనీ జాలునే. 149

కం॥ శ్రీకాంత కొలువుకూటమొ
       పాకాంతకుభీతి డాఁగు పటునీలగిరి
       శ్రీకాంతసానువో నా
       శ్రీకాంతు నురఃస్థలంబు సెలఁగు వితతమై 150

కం॥ సరసిజయుతమగు నాభీ
       సరసియు నందొదవు నూర్మి శై వాలములై
      తదులును రోమావళియును
      నిరవగు నుదరప్రదేశ మిరవగు హరికిన్. 151

కం॥ నరహరి రూపముఁ దాలిచి
       హరి యాకృతిదాల్చె ముఖము నందట తిరుగా
       హరినరరూపము దాలిచి
       హరియాకృతిఁ దాల్చె శౌరయై మధ్యమునన్. 152

కం॥ కదళీలలగద లీలలఁ
       బొదలీలలి నూరుకటులు బొదలీ జంఘల్
       పదలీలలు కిసలయసం
       పదలీ యదులోకపతికి భవ్యాకృతికిన్ . 153

సీ॥ ఇవిగదా దుక్కి కై దువ సంకురవతమ్మి
                  కంటివాల్గెరల బొక్కసములయ్యె
     నివిగదా మువ్వేల్పుటిక్కవౌ కరెవాక
                 ధరిరేకరంగ పాత్రంబులయ్యె

      నివిగదా నాలనెల్‌ఠవర రాజవరాండ్ర
                 గడుసుగుబ్బలకుఁ గెందొడవులయ్యె
      నివిగదా తెలిమావురవుతు సంతుపిసాళి
                 దొడసజ్జఁ బవళించు నొడయలయ్యె

      నివిగదా యంటి తెఱగంటి యింటివింటి
      దంటదలనంటి పలిగుంటి గెంటుమింటి
      జల్లులకుఁ దల్లులుగ నుల్లసిల్లెఁ దొల్లి
      యనఁగనగు శౌరి చిన్నారియడుగు లమరు 154

చ॥ హరికరపాదశేఖరనఖాళులు తారలసప్తవింశతిన్
      మఱి యభిజిత్తునున్ శుచిసమన్వితులౌట సురార్యశుక్రులం
      దిరము సమస్థితిన్ గనఁగఁ ద్రింశతియై కనుపట్టె నౌఁగదా
      సరియె రమేశునంగముల సంగతిచే ననురక్తి మించుచున్. 155

ఉ॥ఆ హరిదేహరోచులకు నా హరినీలము లోడుటం దృణ
     గ్రాహులుగాఁగఁ గాంచి సమరంబులనోడి విరోధులుం దృణ
     గ్రాహులునై గుణగ్రహణకౌశల మందిరి యోఁగదా గుణ
     గ్రాహులు గారె చిక్కినను కాలగతిం బ్రతిపక్షు లెంతయున్. 156

కం॥ దానవమానవతీబృం
       దానవ మానవదురోజహారిమక రికా
       దానవిధి విహితమే కద
       దానవదళనునకు మకరదళనుండగుటన్. 157

కం॥ రాజుల సమస్తదేశవి
    రాజుల నింద్రాదిదిగధిరాజుల నతిఘో

      రాజుల గెలిచె నతులుగా
      రాజిల హరి యీవిభుండె రాజిలననఁగన్. 158

సీ॥ తను దేవతాభావమునఁ గొల్వ వాంఛించు
                భూపాలు ధర్మస్వరూపిఁజేసి
      తమ నెల్లవేళ మిత్రతఁగూడి వర్తించు
               విమలశీలుని సదావిజయుఁజేసి
      తను భక్తితోఁడ వేడిన దీను నైశ్వర్య
               మెనయించి ధరణీసురేంద్రుఁజేసి
      తను నాత్మమూర్తిగా మనసున నీక్షించు
               విజ్ఞాననిధి మహావిదురుఁ జేసి

      యాశ్రితశ్రీ సముద్వహనాప్తి నెఱపఁ
      గంకణముగట్టి ఖలజిహ్మగ ప్రశ స్తిఁ
      జెఱుప ధ్వజమెత్తి ద్వారకాపురి వసించి
      యేలె జగముల హరిలీల లెన్నఁదరమె. 159

కం॥ ఈరీతి నీతిదైతే
       యారాతిని రీతిగా జనావనభూతిన్
       మీఱి సుఖస్థితి నొకనాఁ
       డారూఢప్రీతిమతి సమాదృతి నెఱయన్. 160

కం॥ ఇంద్రప్రస్థపురంబున
       కింద్రప్రస్తరనిభుండుపేంద్రుఁడు కరుణా
       సాంద్రత నింద్రతనయు ని
       స్తంద్రనయున్ విజయుఁజేయఁ దాఁ జనువాంఛన్. 161

సీ॥ తన చిత్తమునఁ గ్రొత్తననలెత్త నెనరొత్త
                 ధర్మజాదులఁజూడఁ దలఁపుదలఁచి
      తన సొంపుఁదనమింపుగను పెంపునొనరింపు
                 గతినంగరాగ శృంగార మెనసి
      తన డాలుననడాలుగొనఁజాలు ననఁజాలు
                 లలితభూషాంబరావళులు దొడఁగి
      తన కేల ననుకూలతన క్రేల ఘనలీల
                 నరిదరాసిశరాసనాదు లూని
      యూరడించినవారల నూఱడించి
      యలవరించిన చెలులదోనలవరించి
      వీటివారాది యుడిగెముల్ వీటివారు
      శూరకులులంటిరాగ నా శూరకులుఁడు. 162

మ॥ ప్రమదోద్యద్బలమైన సైన్యమును ధారారూఢి నుల్లంఘితా
       భ్రముగాఁబొల్చు బలాహకంబు మఱియున్ రమ్యోర్మికావర్తసం
      భ్రమలీలందగు మేఘపుష్పమభిరామస్ఫూర్తినౌ సూర్యతే
      జము సుగ్రీవమునాఁ దనర్చు హయరాజశ్రీలఁ బెంపొందుచున్. 163

కం॥ మాతంబూఁతగ నాతఱి
       నేతెంచెను సుధకు నేటి కేటికని సురల్
       భీతిల భుజగారాతిని
       కేతనముగఁ దనరు తనదు కేతనము దగన్. 164

సీ॥ హీరసారసరాగ పూరితద్యుతితమో
                  నుదములౌ చక్రసంపదలు దిరుగ

      భూరిమహాచలస్ఫూర్తి నఖిలభార
                   భరణాఢ్యమైన కూబరము దెఱలఁ
      దన మణిప్రభలనెంతయు ననంతవిభూతి
                   మెఱుఁగొప్పుగొప్ప చప్పరము దొఱయ
      శ్రుతిహిత సంఖ్యాత గతిపదక్రమసిద్ధ
                  హరులును ఖగవృషభాంక మలర
      చారుతారూఢి విపులాప్తి మీఱు సౌరు
      దేరు గడిదేరు వడిదేరు తేరుదేర
      ననఘవిధి దారకుండు దా ననుపమగతి
      నలరెనచటఁ బురారినా నమ్మురారి. 165

కం॥ ఈరీతిఁ దేరు జేరి ము
       రారాతి సనన్ హృతామరారాతి యజా
       తారాతి యూరిదారిన్
      భేరులు భోరుకొనె రిపులు భీరులు గాఁగన్. 166

మ॥ పురముల్ గోపురముల్ సరంబులు ఝరంబుల్ బ్రాంతరంబుల్ వనాం
       తరముల్ ఘోషములాత్తఘోషములు గానల్గోనలున్ రత్నసుం
       దరముల్ కందరముల్ నదుల్ నిధులు గొండల్ దండలందత్తదా
      కరమార్గంబులు దుర్గముల్ గనుచు మార్గశ్రీలలో శౌరియున్. 167

కం॥ కానుక లేనిక లాదిగఁ
       బూనుక మానక యనేకభూనాథులు రా
       వానిఁ గటాక్షింపుచుఁ బ్రభు
      వాని కటాక్షీణపదవి నరుగుచుఁ బదవిన్. 168

చ॥ యమున నఘవ్యపాయమున నభ్రగమోచిత వీచికానికా
      యమున వినీలతోయమున నాతతపత్రి కులావళీకులా
      యమునఁ దటీసహాయమున నంబునిమజ్జనసిద్ధముక్త్యుపా
      యమున నెసంగుదానిఁ గని యానదిఁ జేరె మురారి యంతటన్. 169

కం॥ ఆ కాళిందీపతి దా
       నా కాళిందీపయోవిహారస్నాన
      స్వీకృతి దానికిఁ బ్రతిభా
      శ్రీకృతి నతిశయముగాఁగఁజేసి చని యటన్. 170

కం॥ ఇంద్రప్రస్థ పురస్థలి
       నింద్రప్రస్థితి వసించి శ్రీశుఁ డలరిచెం
       జంద్రాగతిబలెఁ దన శుభ
       సాంద్రాగతిఁబొంగు బంధుజనసింధువులన్. 171

వ॥ అంత 172

సీ॥ తన గౌరవావృత్తిననురక్తి దగుటచేఁ
                 గుంతి నార్యాదృతిఁ గొంత నెఱపి
      తన వీక్షణముల సంతతికిఁ బాత్రంబౌట
                ధర్మజు రాజవర్తనలఁ గాంచి
      తన గుణఖ్యాతికి ననుమోదపరుఁడౌట
               భీము సదాగతి ప్రేమఁ సేసి
      తన సహజాప్తత దనరారి యుండుట
              నర్జును సంబంధతాప్తిఁ గలసి

      తనదు నాసత్యగతి నెన్నఁదలపు గనుటఁ
      గవల నియమస్థితికిఁ జాల గారవించి
      తనదువేరన గణియింపఁ దనరియుంట
      నపుడు కృష్ణుండు ద్రౌపది నాదరించి.173

కం॥ హితులఁ బురోహితుల ధరా
       పతుల సుతుల నతులగతులఁ బతిదేవతలన్
       సతుల గుణవతులఁ దగుసం
      స్తుతులఁ నతులఁ దేల్చె బహుమతుల బహుమతులన్. 174

చ॥ సనయ తనంతవారలు వెసం దనువిందను ప్రీతి నిల్పగా
      నెనరునఁ గొన్నినాళ్ళచటనే హరి దా వసియింప నొక్కనాఁ
      డనలుఁడు నొక్కచో హరియు నర్జునుఁడుండఁగఁ గాంచి వారలం
      దన కమరేంద్రు ఖాండవ వనంబును నాహుతివేఁడు వేడుకన్. 175

సీ॥ అసమప్రభావృత్తి నలరి సప్తవ్యాప్తి
                వితతమై తగు శిఖావితతితోడు
      మూడుమూర్తులు జోడుగూడి వచ్చినలీల
               బహువేదిరీతి రూపంబుతోడ
      పటుసదాగతిమైత్రిఁ బ్రబలి పంకవనాళి
               బొరినేర్చు నిజతపఃస్ఫురణతోడ
      నటఁ బూర్వమెన్న రెండవదేవుఁడో యనఁ
              బొలుపుమీఱు మహావిభూతితోడ
      నధ్వరముల విహారయోగ్యప్రసిద్ధి
      యాజకులకెల్ల ముఖ్యపూజ్యత వహించి

      సృక్స్రువవ్యజనాదులు చే గ్రహించి
      వెలయు శుచిమూర్తి శుచిమూర్తి విప్రుఁడగుచు. 176

కం॥ ఆ కృష్ణులఁ బ్రార్థించి ని
       జాకాంక్షిత మెఱుఁగఁజేయ నా సుశ్లోకుల్
       లోకనుత జాతవేద
       స్వీకృతవాంఛా ప్రదాన సిద్ధాశయులై . 177

చ॥ కరుణ సహాయమూన్ప హరి గాండివి ఖాండవ మప్పురందరుం
      దురమున లెక్కగాఁగొనక దుర్జయుఁడై హుతభోక్తకాహుతిం
      బఱపఁగ సవ్వనిన్మయుఁడు పావకదాహము నోర్వకెంతయే
      భరమున వేడఁబ్రోచె మయుఁ బార్థుఁడు శౌరి యనుజ్ఞనంతటన్. 178

కం॥ నియతి ధనంజయుఁడు ధనం
       జయునకుఁ దగువస్తువొసఁగి జనహృతదహనా
       మయుఁడగు మయుఁ డన్నరునకు
       మయసభ యనుపేరి దివ్యమయసభ నిచ్చెన్ . 179

కం॥ అంతఁ దనంత మురాంతకుఁ
       డంతకసుతుఁడనుప ననుపమైశ్వర్యముతో
       నెంతయు నిజనగరికిఁ జన
       నంతట నమ్మయుఁడు చింతితాంతరుఁడగుచున్. 180

కం॥ నరుఁడుండనేమి వైశ్వా
       నరుఁడుండఁగనేమి మీద ననుఁ బ్రోచుటకా
       హరికరుణాపరిణాహ
       స్ఫురణాదరణా ప్తి గాదె సూచకమనుచున్. 181

ఉ॥ చేరి మయుండు వేఱెయొక చిత్రసభన్ హరికిచ్చుబుద్ధిచే
      ద్వారక కేగి యందు దనుజాంతకు నొక్క సభాంతరంబునం
      దారయఁజొచ్చి యచ్చట మహాద్భుతసూత్రవిహారి శౌరి మా
      యారచిత ప్రభావమున నాత్మగమాగమదుర్గమస్థితిన్ . 182

స॥ ఒకయోరఁ గాసారనికరారచనఁ గాన
                    కూరక చని వాని వారి దడియు
      నొకజాడ నతిగూఢనికటగాఢాగ్ర భి
                   త్తికద్వారమని దూరుమొకము గాడ
      నొకచెంతఁ దెలివింతటికి వింత యని కొంతఁ
                  జొచ్చి చీకటి హెచ్చ ఱిచ్చనుండు
      నొకచోట బహుకవాటక వాటమని దాట
                 గమకించి తెరు వెఱుంగక భ్రమించు

      నొకటఁ గనిపించు జనమంచు నొగిఁ జలించు
      నంచుఁ బాంచాలికలఁగాంచు ననుసరించు
      తన సభ నొరుండు భ్రమియించు దారిదిరుగు
      హరిసభను విభ్రమముగప్పి యసురశిల్పి 183

వ॥ ఇవ్విధంబున నివ్వెఱం జరింపుచు మఱియును 184

చ॥ వెడలుతెఱుంగెఱుంగ కతివిస్మయముని భయమంది సిగ్గు పెం
      పడర మయుండు విశ్వమయుఁ డచ్యుతుఁ డవ్విభుమాయ బ్రహ్మయుం
      గడవఁగలేఁడు మాదృశులకా కనఁబోలుట యంచు నెంతయేఁ
      దడవుచుఁ దాను దేఁదలచు తత్సభమాటయ వీడి యంతటన్ . 185

కం॥ ఒకదిన మా సభలోఁ దన
       కొకయేఁడై తనర వనరుహోదరుఁ గరుణా

      మకరాలయు హరి నయ్యహి
      మకరాలయునెన్న నతని మన్నన గలుగన్. 186

కం॥ ఆ దివ్యసభాంతరమున
      శ్రీదయితునిఁగాంచి దనుజశిల్పి యనల్పా
      మోదరమ నిట్టులను దా
      మోదరునకు వినుతిసంభ్రమోదయమతియై. 187

కం॥ నేనేమి యొసఁగఁదలచిన
       నానాచిత్రతఁ గనుంగొనఁగ నవియెల్లన్
       నీనగరిఁ గలిగియున్నవి
       దాన న్నేనొసఁగు టేది దానవభేదీ ! 188

కం॥ పావకశిఖ ననుఁ బ్రోచితి
       కావున నే మీకు భక్తిగావించెద నీ
       రైవతకాచలసానుత
       లావని నొక కేళివని దయారత్నఖనీ. 189

గీ॥ అనుచు విజయసఖుని యనుమతి గైకొని
     ద్వారకాసమీపధరణియందు
     హరికిఁ గేళిశైలమగునట్టి రైవత
     శిఖరిశిఖరసానుసీమఁ జేరి 190

సీ॥ సుమనస్థ్సితి నభీష్టసుఫలపూర్తి నెసంగు
                 సురసాలపాళి భాసురమునగుచుఁ
      గిన్నరప్రముఖవిశ్వోన్నతక్రీడలఁ
                బటుశివామోద సాఫల్యమగుచుఁ

      గమలాకరవిభూతికలితపయస్సింధు
                   వృతనగాంచితరీతి వితతమగుచు
      నజరతాహేతుభవ్యామృతరసయుక్త
                   వస్తుసంగతి దివ్యవసతియగుచు

      శక్రునందన మర్ఖేశు చైత్రరథము
      వరుణు ఋతుమంతమును దేవ వనచయంబు
      సమముగ నొనర్చె రైవతశై లసీమ
      నంచితారామమొక్కటి హరికి మయుఁడు. 191

సీ॥ రతిమనోహరకేళిరచనానుకూలమై
                 దట్టంపుఁదమి నింపు దంపతులకు
      సకలేంద్రియానందసంధాన హేతువై
                 యపుడ తాపముఁబాపు నధ్వగులకు
      బహుదివ్యపరిపక్వఫలపుష్పసులభమై
                 వలయుకోర్కెలు గూర్చు వాంఛకులకుఁ
      జిత్రరమ్యనికుంజసీమాభిరామమై
                 లీల ముచ్చటలిచ్చు ఖేలకులకుఁ

      గనకకమలము రత్నసైకతము రజత
      కైరవము దివ్యహంసమై కనినమాత్రఁ
      దృప్తినొసఁగు నా సుధాసరోదేశములను
      నందమొనరించు జనమున కవ్వనంబు. 192

కం॥ చలువయు వేడిమి తమముం
       దెలివియు దలఁచిననె కలుగు దివ్యతరులతా

      వళిమహిమ వెలుఁగుచుం గన
      నలరుం దద్వనము సుఖవహనజీవనమై. 193

కం॥ ఆ వనరాజోదరమున
       కా వనజోదరుఁడు దక్క నన్యులు జేరం
       గా వెఱతురు భయరతులై
       దేవవితతులైన వాసుదేవుని యాజ్ఞన్. 194

వ॥ ఇట్లతివిస్మయంబుగా మయుండయ్యుపవనంబు నిర్మించి
      చనుటయు. 195

ఉ॥ అంత బలారి ఖాండవవనావనదక్షుఁడు గాఁక నాకలో
      కాంతరసీమఁజేరి మునుపవ్వననిర్మితివేళ గాంచి తా
      నెంతయు విశ్వకర్మ శిఖి కివ్వనజాక్షుఁ డిచ్చుఁ గా
      లాంతరమైన నంచుఁ దనకప్పుడె చెప్పుట లోఁదలంచుచున్. 196

కం॥ అపరాధినైతి హరికే
       నపరాధమబుద్ధి నకట యని సురపతి నా
       కుపకారి శౌరి యతనికిఁ
       గృప రా నుపహార మిచ్చి హెచ్చెద ననుచున్ 197

కం॥ తనకుఁగల దివ్యవస్తువు
       లనేకములు వింతవింత లగునవి భువిలోఁ
       గనుఁగొన నెయ్యెడ లేనివి
       గొని యనిమిషభర్త నరసఖునిఁ గనుఁగొనఁగన్. 198

గీ॥ ద్వారకప్రవేశ మొనరించి తత్పురంబు
     నందు నింటింటఁ దాఁ దెచ్చినట్టి వస్తు

      చయములన్నియుఁ గాంచి విస్మయముఁ బెంచి
      శౌరిశుద్ధాంత మటుఁ జేరి శైలవై రి. 199

కం॥ హరినగరివస్తువితతికి
       నరయ సహస్రాంశమైన యాత్మార్థంబుల్
       సరిగామి నగారియు మది
       నురగాధిపశయనుమహిమ కోహా యనుచున్. 200

ఉ॥ అన్నియు మాని దేవపతి యచ్యుతుఁగాంచి తదంఘ్రిపాళికిన్
      నెన్నుదురాన మ్రొక్కి హరి! నేనపరాధిని ఖాండవంబు మీ
      రు న్నరుఁడున్ హుతాశనున కాహుతి గూర్పగ దర్పమూని నేఁ
      బన్నిన దుష్టచేష్ట నగు పాపముఁబాపు కృపాపయోనిధీ! 201

గీ॥ అనుచు విన్నప మొనరించి యనుసరించి
     సన్నుతించినఁ జాలఁ బ్రసన్నుఁడగుచు
     నముచిదమనున కనియె నా నందసూతి
     సముచితమృదూక్తిమాధురి సాధురీతి. 202

కం॥ సోదరుఁడవు భయభక్తిర
       సోదరుఁడవు నీవటంచు నురుకరుణ విలా
       సోదరుఁడగుచునుఁ దామర
       సోదరుఁ డవ్వజ్రి హర్షయుతుఁజేసి తగన్. 203

కం॥ నీ కోరిక నే నెఱుగుదుఁ
       బాకారిక కొదవయే యుపాయనములకున్
       నాకమునఁగల పదార్థ మ
       నేకము గలదిచట నివియు నీయవి గావే! 204

వ॥ అనిన నింద్రుం డుపేంద్రునకుఁ బునఃప్రణామం బాచరించి స్వామీ!
      నే మీకు సభక్తికంబుగా యథోచితోపచారం బొనరించెద ననుగ్రహిం
      పవే యని యిట్లనియె. 205

కం॥ మయవిరచితవనమున వి
       స్మయకరములుగాఁగ దివ్యమయములగు లతా
       చయముల నునిచెదనని ఫణి
       శయనుని వేఁడుకొని యతని సమ్మతి నంతన్. 206

కం॥ నందనవనమునఁగల హరి
       చందనముఖనిఖిలవస్తుసమితి యశోదా
       నందను క్రీడారామము
       నం దనరిచి నగరి కపుడ నగరిపుఁ డరిగెన్. 207

వ॥ అంత నవ్వనాంతరంబు దొంటికంటె నాహ్లాదప్రదం బగుటయు. 208

గీ॥ అది మొదలుగాఁ దనంత మురాంతకుండు
     ప్రియవధూటులు వెంటరా రెంట మూట
     వచ్చిపోవుచు నయ్యుపవనమునందు
     నుచితకేళి సుఖింపుచు నుండునంత. 209

గీ॥ అప్పుడొకనాఁడు వసుదేవుఁ డాత్మభగిని
     యైన శ్రుతకీర్తి సాత్వతి నరయుటకునుఁ
     గేకయుని పట్టణంబున కేకతమునఁ
     బ్రియకుమారుని గదునిఁ బంపిన నితండు. 210

కం॥ ఆ యూరం గాంచనమణి
       కేయూరాంచితుని దృష్టకేతుని జనతా

      గేయునిఁ గైకేయుని శుభ
      కాయుని గుణమణినికాయుఁ గనుఁగొని యంతన్. 211

మ॥ తమ మేనత్తను నత్తఱిన్ విమలచిత్తన్ సాత్వతిం గేకయో
       త్తమభూభృత్తమమత్తకాశిని నుదాత్తం జూచి తా వచ్చి వే
       గమ రత్నాంగదుఁ డగ్గదుం డచటి వేడ్కల్ దండ్రికింజెప్పి య
       క్కమలాక్షు గని యేకతంబ తగు యోగక్షేమముల్ సెప్పుచున్ 212

కం॥ ఆ కైకయపురమునఁ గల
       లోకైకవిలాసవతులలో నృపతనయా
       లోకములోపలఁ దనయా
       లోకమునకు నతివిచిత్రలోలత దోపన్. 213

గీ॥ భద్రనాగగమన భద్రనాలగమన
     మేనయత్తతనయ భూనుతనయ
     కేకయేంద్రుకన్నె కే కన్నియలు సాటి
     కోటివారు భువనకోటివారు. 214

పంచచామరము:- వినంగనంగ భద్రకు న్నవీనమైన మేని ఠీ
                         వి నంగనం గణింపలేరు వేఱుగాఁగ మాఱుదే
                         వినంగ రంగదుజ్జ్వలాప్తి వీడు జేతురేమొ తె
                         ల్వి నంగరంగవైభవాప్తి విద్వదాళి దా వినన్. 215

కం॥ అమ్మమ్మ తావి యమ్మరు
       నమ్మమ్మగఁజాలు మోవి యమ్మధురసపా
       కమ్ము వెడబలుకుఠీవిఁ బి
       కమ్ము కురుల సిరులు తేటికమ్ము గణింపన్. 216

గీ॥ మిన్ను చెన్నుఁ దన్ను నన్నువసతికౌను
     మించుమించు మించు మెలఁతమేను
     తూపురూపుఁబాపు నేపునఁ జెలిచూపు
     మావిమోవిఠీవి మగువమోవి.217

కం॥ అమ్ములకుం జెలిచూపు చ
     యమ్ములకుం జలిమివాడి యందమ్ములకుం
     దమ్ములకుం దమ్ములకుం
     దమ్ములకదరదపదములు తరుణీమణికిన్.218

కం॥ ఒక యేటఁ జిక్కె మీనము
     నొకనెలచేఁ జిక్కెఁ బద్మమొకపగటింటన్
     వికలతఁ జిక్కెం గుముదము
     సకి నయనసమంబులగునె జడగతు లెపుడున్.219

కం॥ పలుకులు సిలుకల నేలుం
     గలకలమను నవ్వుమోముకళ లద్దంపుం
     దళుకుల నేలుం గపురపు
     పలుకుల నేలుం గపోలఫలకము లహహా !220

చ॥ కలికికి పొంబసింబెసరి గాయలు వ్రేళ్ళు మిటారిగుబ్బలా
     చెలువగు నిమ్మపండ్లు రుచిఁజిల్కెడు వాతెర దొండపండు మె
     చ్చుల చుబుకంబుడంబు నునుసొంపుల మామిడిపండు పల్కులా
     యలరెడి తేనెపండ్లగుట నంగము కల్పకవల్లి గావలెన్.221

కం॥ దాని సొగసునడకలు నల

     దాని జిగిఁ జూపు సిరిగల
     దాని జిగింజూపు జిలుకు తళుకుం గలిమిన్.222

కం॥ చతురాస్యుపంచభూతా
     యతసృష్టిన్ మేలుజూడ నాద్యంతము లా
     సతి కటిమధ్యములే కద
     సతత మనంతానుభావ సంగతిఁ గనుటన్.223

శా॥ సారంగంబు హసించు మేచకకచాంచచ్చాకచక్యంబునన్
     సారంగంబు హసించు నీక్షణరుచాసౌభాగ్యభాగ్యంబునన్
     సారంగంబు హసించుఁ గంఠనినదస్వారస్యవిస్ఫూర్తులన్
     సారంగంబు హసించు యానగరిమం జంద్రాస్య సాంద్రస్థితిన్.224

మ॥ గతి మత్తేభము నాస చంపకమొగిం గైశ్యంబు కందంబు సం
     గతవాక్యంబులు మత్తకోకిలలు దృక్పాండిత్య మయ్యుత్పల
     ద్యుతి మో మంబురుహంబు దేహరుచి విద్యున్మాలిగా మానినీ
     తతవృత్తస్థితు లెన్నఁగాఁ దరమె తద్వాగ్జానికైనం దగన్.225

గీ॥ కుంభకుచ మీనలోచన గోనితంబ
     యబ్జధామాస్య హరిమధ్య యళిశిరోజ
     చావపసుభ్రూయుగళ నక్రజంఘ యతుల
     కన్య సరసక్రియలరాశి గాదె జగతి.226

కం॥ లక్షణములు శుభరోహిణి
     యక్షీణస్వాతిభూతి హస్తాంబుజ ధీ
     లక్షితచిత్త సదుత్తర
     నక్షత్రపుమొలక గాదె నాతి విభాప్తిన్.227

వ॥ మఱియును 228

చ॥ ఆళిరుచికొప్పుఁ గొప్పు శశియందుర మందిరమోము మోము చం
     చలసమమేను మేను లకుచమ్ములలీలకుచమ్ములింపు సొం
     పలరెడుమోవి మోవిగడునన్నువ మిన్నువ గౌనుగౌను నా
     వెలఁదికయారె యారెదగు వేమఱు నా మరుచేతిహేతిగన్.229

కం॥ రతనాలదొంతి వింతగు
     రతినాయకుదంతి కడునెఱాకుందనపుం
     బ్రతిమే కద కాంతి భళీ
     యతివలమేల్బంతి యింతి యభివర్ణింపన్.230

వ॥ కావున231

కం॥ మేనత్త కన్నె మించున
     మేనత్తగజాలువన్నె మీకది చెలియై
     మేనత్తం గాఁజాలిన
     మేనత్తంగాని వానిమేకొను గెలువన్.232

గీ॥ పద్మదృశ నీలకచ మహాపద్మవదన
     శంఖగళ కుందరదన కచ్ఛపపదాగ్ర
     వరమకరజంఘ జెందనీసిరి ముకుంద
     యట నవస్ఫూర్తి నిధిలాభ మందినటుల.233

గీ॥ వసుధ శృంగారసారప్రవాహసరణి
     నతను తుంగాయతశ్రీల నధిగమించి
     వెలయునది భద్ర యా కృష్ణవేణిఁ గలయఁ
     గలుఁగు నీకు విలాససాగరత శౌరి.234

కం॥ అని చూపి చూపి చెప్పిన
     యనుజుని వచనములు విని గదాగ్రజుఁ డా జ
     వ్వని నెపుడు జూడఁగలుగునొ
     యని యువ్విళులూరుచుండె నా సమయమునన్.235

సీ॥ సురసాలసమశీల సురసాల తరుజాల
              సరసాలవావాలపరిసరంబు
     మలయాగతటభాగనిలయాగమాభోగ
             వలయాగతసదాగతిలసితంబు
     వనితాజనసమాజజనితాజరమనోజ
             జనతాజయవిరాజదనునయంబు
     సురతాంత సునితాంత పరితాంత సదుదంత
             భరితాంతరసకాంతవరచయంబు
     గహనసహచర సహచరావహిత మహిత
     వికచరుచికుల విచికల సకలవకుళ
     విసరమధురస మధుర సదసమకుసుమ
     సముదయము బొల్చె మధుమాససముదయంబు.236

సీ॥ వరపర్వవిస్ఫూర్తి వనరాసు లుప్పొంగె
            దగువిధిఁ జంద్రుఁ డుత్కర్ష మించె
     ధర్మాశఁ గనె జగత్ప్రాణధారారూఢి
            యతనువైభవలీల లతిశయించె
     సుమనస్సమూహముల్ సొంపుచే నింపారె
            జగతి సాఫల్యంబు సంగ్రహించె
     శుకముఖద్విజరాజసూక్తులు విలసిల్లె
            సారసస్థితి హంసచయము లమరె

      యోగవితతికి నానంద ముదయమందె
      వేడ్క దనుజాతి హరణప్రవృత్తి యనుచు
      సకలజగములు గణుతింప సరసరీతి
      భూరిగతిఁ బొల్చు మాధవాభ్యుదయమహిమ.237

శా॥ శ్యామాళుల్ పురుషవ్రజంబు సుమనోవ్యాప్తిన్ ఫలశ్రీలచే
      నామోదింపఁగ నమ్మహావనివిభుండై మాధవుండొప్పె నౌ
      శ్యామాళుల్ పురుషవ్రజంబు సుమనోవ్యాప్తిన్ ఫలశ్రీలచే
      నామోదింపఁగ నమ్మహావని విభుండై మాధవుం డొప్పడే. !238

కం॥ పేరు వహించి వసంతుఁడు
      సౌరభ్యము గాంచఁ దత్ప్రసవసంతతియున్
      సౌరభ్యము గాంచెను భళి
      యారయ సత్పురుషకులము లట్టివె కావే !239

సీ॥ కలరవంబుల రకంబులఁ బికంబులు గేరె
                      రమణఁ గీరములు బేరములు బారె
      పొదలు పూఁబొదలు సంపదల సొంపలరారె
                      జాత భీతిని జాతిరీతిదారె
      పొలుపొంద సుమబృందముల మరందము లూరెఁ
                      దద్బిందువుల మిళిందములు సేరె
      మరుహేతి విరహిమర్మములు బిమ్మర దూఱె
                  శమనదిగ్వాతపోతములు వాఱె
      రవి రవళిదేరె పథికధైర్యములు జాఱెఁ
      దాప మేపారె జనము శీతలము గోరె
      సుమరజము గూరె వనవిహారములు మీఱె
      మాఱె శిశిరంబు బెంపారె మధుదినంబు.240

ఉ॥ చందనశైలసానువుల సందులఁ జల్లని మల్లికాలతా
      మందిరసీమలన్ రతిసుమాళములం బయికొన్న దేవతా
      మందమరాళగామినుల మైవలపుంజెమటల్ హరింపఁగాఁ
      బొందుగ వీచు వీవనలఁ బొల్చి చరించె సమీర మత్తఱిన్.241

కం॥ హెచ్చిన కూర్మి వసంతుఁడు
      నెచ్చెలియై రా బిరాన నెమ్మి నకీబుల్
      హెచ్చరికఁ దెలుప మదనుఁడు
      వచ్చెం జయమంద విరహవచ్చయమందన్.242

కం॥ మాకంద మాకరందర
      సాకరసీకరపరంపరామోదపరీ
      పాకవశోన్మదమధుకర
      పాకము లమ్మరుని నల్ల బజయనఁ దిరిగెన్.243

కం॥ నెఱిఱెక్కకొనలు మొనలుగ
      సరదళికులకములు నాయసపు ములుకులుగా
      శరముల సరులగు విరులన్
      మరుతూణములనఁగఁ దనరె మధుదినవనముల్.244

కం॥ ఆ వనములఁ గీరావళి
      యావళితగతిన్ భ్రమించునందం బలరెం
      గావా తిరిగెడు మారుని
      మావా లన నపుడు వికటమండలగతులన్.245

కం॥ ఆ విరులు గళ్ళెములుగాఁ
      బావనచలనంబు గమనభావముగాఁ బ
      త్త్రావళి పల్యాణములుగ
      మావు లమరె నపుడు మరుని మావులలీలన్.246

సీ॥ పద్మిను లాసవపరిపూర్తిచే మించి
                    మధుపాళికేళికై మలయుచుండ
      ఘనతరుల్ విటపసంగతులఁ జాల నెసంగి
                    పరలతాతనుయుక్తిఁ బరిఢవిల్ల
      బహుసుమనస్తతుల్ పల్లవావళిఁ గూడి
                   గడకైనకొమ్మలఁ గలసిమెలఁగఁ
      గూత పంచమవృత్తి గొని వనప్రియరాజి
                   గణికాప్తి పత్రభంగము లొనర్పఁ
      గృతరజోవ్యాప్తి మంచి వారినిఁ గలంచి
      జాతిహీనతఁ బెంచి కుజాతి నించి
      యతిశయించి తపఃస్ఫూర్తి నపహరించి
      మధువిభుం డాత్మవిభవైకమహిమఁ దెలిపె.247

సీ॥ నిండుచల్వలుదేఱు పండువెన్నెలనీరు
                   చండాంశురుచితీరు సంఘటించెఁ
      గలయ మెల్లనఁ బాఱు మలయానిలము సౌరు
                   విలయానలముతీరు వెగటునించె
      కలకలమ్ములఁజేరు నళికులమ్ముల చేరు
                  చిలుకుటమ్ములు తీరుగలఁక మించె
      మిసమిసమ్ముల మీటు కిసలయమ్ములమారు
                  నసిచయమ్ములతీరు నావహించె
      సంతతామోదలహరీ నిశాంతమగు వ
      సంతము దురంతకల్పాంతసమయమయ్యె
      నంత రతికాంతలతికాంత కాంతకుంత
      తాంతహృదయాంతలై యున్న కాంతలకును.248

పారిజాతహరణశ్లేష :-
చ॥ ధర మధుహరిలీలగొనఁ దా సురసాలముపై మరుద్వరుం
      డురుసుమనోదళోద్గతుల నూన్పఁగఁ గృష్ణశిలీముఖావళుల్
      మెఱసె దివిం దదీయజవలీల సనంగ నపూర్వవైఖరిం
      బురిగొని వచ్చి తత్తరువుబూన్చె నటం బ్రమదాలయంబునన్. 249

అక్షరద్వయ కందము :-
కం॥ కోకిల కలకలలీలలఁ
      గేకుల కేకలఁగులాళికిలకిలలకళా
      కాకలికేళాకూళుల
      లోకాళులు కేళికళికె లోలాకులలై.250

కం॥ సవములు భూసురులకు నా
      సవములు నళివిసరములకు సరసవసంతో
      త్సవములు జనులకు సతతో
      త్సవములుగా నమరెఁ గుసుమసమయముల మహిన్. 251

కం॥ ఆ మధుదినమున నొకనాఁ
      డా మధుకులనేత ప్రాతరారంభమునన్
      నేమంబు దీర్చి యిష్ట
      స్తోమంబులతో భుజించి సుఖమున నంతన్.252

సీ॥ పసిఁడితాయెతల సొంపెసఁగ రుక్మిణి బూన్చు
                      సిగదండ విరిదండ సొగసుబాఱు
      ముద్దుమోమునఁజొక్కముగ సత్య మునిగోటఁ
                      దీర్చిన కస్తూరితిలక మమర

      జనుదోయి పస పంటుకొని ఘుమ్మురన జాంబ
                    వతి సవర్చిన వల్లెవాటు మెఱయ
      వలఁతిగాఁ గాళింది యలఁదిన పచ్చక
                   ప్పురపుగందము మేనఁ బరిమళింప
      గందవొడి సొంపుగా మిత్రవింద పూయ
      గళమున సుదంత హారసంఘములు గూర్ప
      రాధ చేదండఁ జుట్టఁ బై రమణులెల్ల
      నింపు సవరింప హరి యలంకృతుఁడు నగుచు.253

వ॥ మఱియును254

సీ ॥ చిన్నారి చెలువంపు చికిలి యొంటీల పొం
                   కము ఠీవిగా భుజాగ్రముల నెరయఁ
      గొఁదమచుక్కల సిగ్గుగొను ముత్తెములు కంఠ
                   సరణి బంగరుగుండ్లసరుల దొరయ
      నుదయారుణద్యుతు లుప్పొంగ నురమునఁ
                   గౌస్తుభమణిపతకంబు మెఱయ
      రాజ్యభారధురంధరంబౌ కరంబున
                   నమితరత్నాంగుళీయకము లొరయ
      రాజకోటీర రత్న నీరాజితాంఘ్రి
      కళలు దులకించు పరభయంకరశుభాంక
      గండపెండెరచాకచక్యములు బెరయ
      ధారుణి మహేంద్రుఁడన మీఱి దానవారి.255

గీ॥ చలువ చెలువారు నెలరాల చప్పరాలఁ
      గుప్పఁగారాలఁ గ్రొవ్విరుల్ కుసుమశరుని

      తగిన కూటంబనాఁ బొల్చు నగరితోట
      లోపలిహజారమునఁ గొల్వుఁ జూపె శౌరి256

వ॥ ఆయ్యవసరంబున 257

కం॥ వనమాలికడకు రైవత
      వనపాలురు వచ్చి ప్రీతి వచియించిరి త
      ద్వనపాళీసునగాళీ
      ఘనకేళీమేళనేచ్ఛ గలుగఁగ నిటులన్.258

కం॥ దైవతవరదైవతగిరి
      భావితమయరచితమగుచు భాసిలరుచి నిం
      పావనగతి పావనగతి
      పావనవృతి నలరు జగతి ప్రాణపదముగాన్.259

ఉ॥అచ్చటి మాధవోద్గమము లచ్చటి హంసగమప్రవర్తనం
      బచ్చటి నీలకంఠగతి యచ్చటి పుష్పవదాగమోచ్ఛ్రయం
      బచ్చటి శక్రయక్షవరుణాదిక దివ్యతరుల్ వసించుటల్
      నిచ్చలు నే వనిం గలవు నీదు మహావనలీల దక్కఁగన్,260

కం॥ మహితరసంబుల సుమనో
      వహితరజంబులనుఁ గాలువలు గనిమలుగా
      విహితగతి నెఱపి మాకున్
      సహచరములు నయ్యె నచటి సహచరచయముల్.261

కం॥ అలివేణులఁ బికవాణులఁ
      బులినశ్రోణులఁ బ్రవాళపుటపాణుల న
      య్యలరుంబోణుల మాధవ
      యలరున్ వనరమ భవత్సమాగమవాంఛన్.262

సీ॥ బహువిహితాభీష్టఫలపాళిఁనీఁజాలి
                    యది మధూదయముల ముదముఁజేయు
      సుమనోవిశేషాత్తహిమవారిపూరమై
                   యవి వేసవులఁ బ్రేమ నలవరించు
      బలునింపుగల జొంపములు మేడలై కూడ
                   నది తొల్కరుల హర్ష మావహించు
      లలితాగ్నిశిఖలయం దలరువేడిమితోడ
                   నది శీతులనుఁ బ్రీతు లతిశయించు
      నెరయు నురుకుంజములఁ బగ లిరులొనర్చు
      వెలయు జ్యోతిర్లతల రేలఁ దెలివిగూర్చుఁ
      దలఁచుకోర్కె లొసంగు వింతల నెసంగు
      నగమసంతానసంగతి నా వనంబు.263

కం॥ ఈ విధి వివిధవినోద
      శ్రీవిధమున రక్తిగనుటచే నెన్నంగా
      నేవారి వశము మాధవ
      నీవె తగుదువిలఁ దద్వనిశ్రీలఁ గనన్.264

గీ॥ అనుచు వనపాలకులు పల్క నెనరు జిల్కఁ
      తన వనశ్రీల దర్శింప దయ జనింప
      మెచ్చువగఁ గట్టి సారథి దెచ్చినట్టి
      రథముపైఁ జేరి మురవైరి రయము మీఱి.265

కం॥ తన దివ్యచిత్త మెట్టిదొ
      యనుగతి నొక వనజనయననయినం బిలువన్
      బనుచక వనజేక్షణుఁ డా
      వనవీక్షణవాంఛ నపుడు వనపాలురతోన్.266

చ॥ అటఁ జని కాంచెఁ గృష్ణుఁడు నభోంతరటత్తటకూటవాటికా
      చటులవనాటినీ ఘటితసౌరనగర్యుపకారికామరీ
      పటలపటుభ్రమీభ్రమదుపాంత విమానమరుత్సమాజమున్
      రటదళినీవలత్సుమధరాజము రైవతకాద్రిరాజమున్.267

గీ॥ ఆ నగవిశేషలీల లిట్లరసి ప్రేమ
      నా నగవిశేషలీలలనలరు నలిన
      నాభు వనపాలకులు సూచి యతులగతుల
      నా భువనపాలకునితోడ ననిరి భక్తి.268

కం॥ స్వామీ! యీ మీ కేళీ
      భూమిధర మెన్నఁదరమె భువనస్తవన
      శ్రీ మీఱు దైవతంబని
      సామోదరసాప్తిఁ దత్ప్రశంసాపరులై.269

సీ॥ చమరీనికరవాల సమరీతిరతిఖేల
                    దమరీగళితవాలసమితిలీల
      మతికాంతమణికూట తతికాంతి కృతఖేట
                    గతికాంతరుచి ఝాటగగనవాట
      మబరీణఘనభవ్యశబరీఘటితనవ్య
                    కబరీభరితదివ్యకాల్యభావ్య
      మసమానసురగానరసమానసుసమాన
                    లసమానతరుసూన రసదళీన
      మలఘుతరశీతకర శిలాఫలక ఫలిత
      కలితపరిసర శశికరావళితలలిత
      తతబిసాశయ నానటత్తటతటాక
      జలజాలపదాళి యీ శైలమౌళి.270

కం॥ అన్నియు నారోహణగతు
      లన్నియును గిరీశవసతులన్నియు సురవా
      సోన్నతు లిన్నగ శృంగము
      లన్నియు మణిరజతకాంచనాద్రులు సుమ్మీ271

గీ॥ కలితరుచి నిందురాజితగ్రావసీమ
      లందుఁ దగు నీలకంఠ నృత్యంబులమరుఁ
      గలితరుచి నిందురాజిత గ్రావసీమ
      లందుఁ దగు నీలకంఠనృత్యంబులరుదే.272

కం॥ అంచున నంచ నటించఁగ
      నంచితచతురాస్యగతుల నలరుచు నచటం
      గాంచనఘనశిల గననగు
      కాంచనగర్భునివిధమునఁ గమలజజనకా!273

కం॥ చంచత్సహస్ర శిఖరా
      భ్యంచితమగుచున్ సుపర్వవంశావృతమై
      కాంచనగు నీ నగంబా
      కాంచననగవసతి యనఁగఁ గాంచనవసనా!274

కం॥ హరి యీ గిరులన్విరులం
      దరులం గురులంబమానతరులం దరులన్
      హరులన్ హరులంగిరులం
      గరులం గల సిరులదొరల గనుమని మఱియున్.275

సీ॥ ఈ దారిఁ బోరాదు కేదార కోదార
                  శాదారతము? వేఱె చనగవలయు

      నీ సారువులసారెసా సారకాసార
                భూసారతటగతుల్ బూనవలయు
      నీ వాకలో వీఁక హేవాకయావాక
                నావాకలనలెక్కి పోవవలయు
      నీకేరినిటఁజేరి శ్రీకారికోకారి
                పాకారిశిలలెల్లఁ బ్రాకవలయు
      కేళినగమిది వళితకంగేళినగము
      కూటపాళిక యిది రత్నకూటపాళి
      యనుచు ననుచరు లెఱిగించిరపుడు హరికిఁ
      గేళివనపాళిమార్గాళిహాళి దేలి.276

      అంత నయ్యాదవేంద్రుఁ డత్యంతవిభవ
      సాంద్రుఁడై సురసాలనిస్తంద్రమైన
      నందనవనంబుఁ జేరి యానందపూరి
      తముగ నేత్రసహస్రపత్రములఁ గాంచి.277

కం॥ హృద్యానవద్యచరణల
      సద్యానములొలయఁజొచ్చి చని తనదు విలా
      సోద్యానము మనమునఁ గడు.
      సోద్యానంబొదలి దనుజసూదనుఁడచటన్.278

సీ॥ ఇవి పారిజాతంబులివి వారిజాతంబు
                  లివి శారజాతంబు లిందువదన
      యివి కుంజభాగంబులివి వంజులాగంబు
                  లివి మంజునాగంబు లిభశరణ్య

      యివి మాతులుంగంబులివి జాతిలుంగంబు
                       లివి జాతిరంగంబు లీశ్వరేశ
      యివి గంధసారంబులివి సింధువారంబు
                      లివి కుందవారంబు లీడితాంగ
      యివి విశాలరసాలంబు లీశమిత్ర
      యివి సరాగసురాగంబు లింద్రవిభవ
      యివి కదంబకదంబంబు లినసమాన
      యనుచు వనపాలకులు డెల్పనరిగి శౌరి.

కం॥ అందొక యిందుమణీతట
      సందీప్తసుధాంబుసరసి సరసంజలువల్
      చిందు నొక ద్రాక్షపందిటి
      క్రింద ముకుందుఁడు వసించి కృతవిశ్రముఁడై.

కం॥ ఆ సవఫలభోక్త విభుం
      డాసవఫలభోక్తయయ్యె నంత నచటఁదా
      నాసవఫలదుండగు హరి
      యాసవఫలదుఁడయి హితుల కభిహితరీతిన్.

సీ॥ అట దేవవల్లభుండరసెఁ గేసరములఁ
               బొన్నల విహరించెఁ బురుషవరుఁడు
      తిలకించెఁ దిలకపంక్తులను శ్రీమంతుండు
               మన్నించె వాసంతి మాధవుండు
      కాంచనవాసముల్ గాంచెఁ గాంచనవాసుఁ
               డల కృష్ణమూర్తి శ్యామాళి నెనసెఁ
      దనరె గంధవిశేషతరుల ముకుందుండు
                సరస గోరంట శ్రీసహచరుండు

      సాధుసంతానములలోన సంచరించె
      సాధుసంతాన మీరీతి సరసభాతి
      నా వనంబునఁ గ్రీడించె నాదిత్రిభువ
      నావనంబునఁ గ్రీడించు నఖిలభర్త.282

శా॥ ఆమోదాన్వితపల్లవైకగణికాశ్యామాంకముం బ్రస్ఫుర
      ద్దామోద్యద్దళముం బ్రఫుల్లకురువిందప్రోజ్జ్వలత్సాల జా
      లామేయోన్నతమున్ శ్రుతిప్రియదశాబ్దాంచద్ద్విజంబున్ వర
      శ్రీమంతంబుగ శౌరికవ్వనము వొల్చెన్ బట్టణశ్రీ యనన్ .283

ఉ॥ పూవులఠీవులం జెలఁగు పొన్నలగున్నల నెన్నికైన పెన్
      మావుల మోపులంగలసి మల్లికలల్లిన గొప్పకప్రపుం
      దీవుల ఠావులం జలువతెమ్మెర గ్రమ్మ రహించు సమ్మద
      శ్రీవలమానమానసముచే హరి యవ్వనకేళి సల్పుచున్.284

ఉ॥ పుప్పొడితావులన్ వలచు పూవులనుం బొదరిండ్లదారులం
      గప్పురపుంబిడారులనఁ గమ్మని క్రొన్ననతేనెసోనలం
      జొప్పగు చల్వసోనలను జొచ్చి ముదంబు హృదంబుజంబునం
      దుప్పతిలంగఁ జూచె వనజోదరుఁ డెంతయు సాదరంబుగన్.285

కం॥ చిలుకల కంఠములను రా
      చిలుకల కంఠముల నింపుఁజిలుకు పలుకులం
      గలకలరవముల సొంపగు
      గల కలరవములఁ బ్రియంబు గని హరి మఱియున్.286

సీ॥ పొదలు దూరఁగ మేనఁ బొదలు పుప్పొడిరంగు
                  పసనెసంగు నలుంగుపసపు గాఁగఁ

      దిరుగుచో శిరముపై నఱయు సంపెగగుంపు
                     సుకరంపు శిబికంపు సొంపు గాఁగ
      విరుల నంటిన నంటు గురుమరందరసంబు
                     కరపంకజమునఁ గంకణము గాఁగఁ
      బరిపక్వమై రాలు ప్రసవంపుగమి చాలు
                    బటువులౌ ముత్తేల పాలు గాఁగ
      గుత్తులై యున్న కిసలయకుట్మలములు
      రతనములఁ గూర్చి తివియు హారతులు గాఁగ
      నపుడు వనలక్ష్మి నెనయు పీతాంబరుండు
      క్రొత్త పెండ్లి కుమారుని కొమరు దెలిపె.287

కం॥ సప్తదళీఘనసార
      వ్యాప్తతనుండగుచు నలుగు నలఁదినగతిచే
      నాప్తులకుఁ దెలిపె యదుపతి
      సప్తమమహిషీవివాహసంభ్రమలీలల్.288

వ॥ అంత289

కం॥ ఈలీల నచట బాళిం
      గేళీలసమానలీలఁ గీలించి శర
      న్నాళీకాక్షుఁడు మఱియు వ
      నాళిపాళీవిలోకనాదృతి నుండెన్.290

కందద్వయగర్భితచంపకమాలికావృత్త శేషబంధచిత్రము

      అతివిమలా యనంతసుకరా కమనీయ యశోవిహారక
      ల్పితసుమహారరీతిక నవీనమిలజ్జయతావధాని నం
      ద్యతరవిభాతమాతత సదాసవవద్వరదామ జాలసం
      గతనవనాయ జాతవరగౌరవరక్షిత సోమభూవరా!291

గర్భగత ప్రథమకందము
      విమలా యనంతసుకరా
      కమనీయయశోవిహార కల్పితసుమహా
      సుమహారరీతికనవీ
      నమిలజ్జయతావధాని నంద్యతరవిభా!292

ద్వితీయకందము
      రవిభాతమాతతసదా
      సవవద్వరధామజాల సంగతనవనా
      నవనాయజాత వరగౌ
      రవరక్షితసోమభూవరా యతివిమలా!293

ఆశ్వాసపూర్ణ నియతశైలబంధ చిత్రకందము
      శ్రీశా గరుడాంచద్వా
      హా! శివనఖ! లలితశీలి! యాదృతకేళీ
      దాశరథి! కనకరశన! ద
      యాశరధి శ్రితాంబుజభవ యంచితవిభవా!294

పుష్పగుచ్ఛ బంధచిత్ర పంచచామరవృత్తము
      నరాదరా! సురవనా! సనాతనా! ఘనాకృతీ
      వరావరా! కరాహృతాభ్రపాదపా! కృపామతీ
      ధరామరాత్మరాజితా! సదాప్రదా! చిదాదృతీ
      స్మరాభిరామ! రాధికాసమాగమా! రమాపతీ.295

గద్య॥ ఇది శ్రీమదుభయకవితా నిస్సహాయది
 సాహితీవిహార కాణాదాన్వయ తిమ్మనార్య
  కుమార వినయగుణధుర్య పెద్దనార్య
   ప్రణీతంబైన భద్రాపరిణయోల్లా
    సంబగు ముకుందవిలాసంబను
      మహాప్రబంధంబునందు
        ప్రథమాశ్వాసము
           స మా ప్త ము.