Jump to content

మీఁగడతరకలు/ఈశ్వరుఁడు—శనైచ్చరుఁడు

వికీసోర్స్ నుండి

ఈశ్వరుఁడు - శనైశ్చరుఁడు


 సిరులు చెలరంగ కై లాసశిఖరిమీఁద
ప్రమథగణములు సేవింప ప్రమద మలర
పార్వతీసహితుం డయి పరమశివుఁడు
నిండుకొలువును దీర్చి కూర్చుండియుండె.

అంత నచటికి శని వచ్చి, " పంత మొప్ప
నేను తలఁచితి." , యెట్టి వాని - నైన
కొందలము గూర్చి దైన్యంబు నొందఁ జేసి
పట్టి పీడింతుఁ గా " కని ప్రతిన వట్టె.

అతని ప్రజ్ఞ బరీక్షింప ననియె శివుఁడు:
" ఓయి నను గూడ దైన్యంబు నొందఁ జేయఁ
గలవె  ? అటులైన మాసంబు గడువు నిత్తు,
ఏదిచూచెద చూపుమా నీదుమహిమ "


వల్లె యని పల్కి. శని యేగె నుల్లసమున ;
ఈతఁ డెట్లు బాధించునో చూత మనుచు
దారుణాటవియం దొక్కమాఱుమూల
మడువులో దాఁగె నభవుండు గడువుదాఁక.

అంత నీశుండు తనగిరి కరుగుదెంచి
శనిని బిలిపించి, " ఓరి నీ శపథ "మేమి
యయ్యె ? నన్నేల పీడింపవైతి ? " వనుచు
నడుగ పక్కున నవ్వుచు ననియె నతఁడు .

"విబుధు లెల్లరు సేవింప విభవ మొప్ప
వెండికొండపై ఠీవిఁ గూర్చుండు నీవు
అడవిలో నొక్కమడుఁగున నడఁగియుంట
నాదు మహిమంబు గాక యిం కేది గలదు? "