Jump to content

మార్కండేయపురాణము/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

మార్కండేయపురాణము

షష్ఠాశ్వాసము



కాకతినృపరాజ్య
ప్రాకారాయితభుజాపరాక్రమగణ్యా!
లోకజనస్తుతపుణ్యా!
కాకుత్స్థప్రతిమరూప! గన్నచమూపా !

1


వ.

పరమజ్ఞానచక్షు లైనపక్షు లాజైమిని కి ట్లనియె వెండియు మార్కండేయుండు
క్రోష్టుకిం గనుంగొని.

2


క.

ఎనిమిదియవుమను వయ్యిన, తనయుఁడు సావర్ణి యని కదా చెప్పితి న
మ్మను వుద్భవ మైనవిధము, వినిపించెద విస్తరించి విమలచరిత్రా!

3

సప్తశతీప్రారంభము

.
వ.

స్వారోచిషమన్వంతరంబునఁ జైత్రుం డనుధాత్రీపతివంశంబునం దావిర్భవించి
సురథుం డనం బ్రసిద్ధుం డైనమహీపతి మహనీయంబైనమహీరాజ్యంబు సేయుచు.

4


క.

లీలమెయిం దనబిడ్డలఁ, బౌలించువిధమున ధరణిప్రజఁ గడునెమ్మిం
బాలించుచుండ శూరులు, కోలావిధ్వంసు లనఁగఁ గొందఱు శత్రుల్.

5


ఆ.

అతనిమీఁద నెత్తి! రతులబలుం డైన, యతని కావిరోధివితతితోడ
నయ్యె సమర మల్పు లైనను దా శత్త్రు, వరుల నోర్వ లేక సురథుఁ డోడి.

6


చ.

పురమున కేఁగి తొంటిక్రియ భూపరిపాలన మాచరింప న
య్యరివరు లుక్కు మీఱి వెస నాతనిదేశము నాక్రమించిన
న్గర మవినీతులు న్ఖలులుఁ గష్టులు నై పురిలో నమాత్యు ల
ద్ధరణిపురాజ్యము న్బలముఁ దద్ధనముం గొని రంత నుధ్ధతిన్.

7


క.

అపహృతరాజ్యుండై యా, నృపతి హయము నెక్కి వేఁటనెపమున నతిదుః
ఖపరీతచిత్తుఁ డగుచు,న్విపినమునకుఁ జనియె నొకఁడు విను మునిముఖ్యా!

8


మ.

చనియె న్దా సురథుండు శాంతమృగసంచారాతిరమ్యంబు శి
ష్యనితాంతాధ్యయనాభిశోభితము నుద్యద్ధోమధూమావృతం

బును నై యొప్పుతదాశ్రమంబునఁ దపంబు న్సేయు మేధం దపో
ధనవర్యుం గని మ్రొక్కి తా నతనిచేతం బూజలం బ్రీతుఁ డై.

9


ఉ.

అచ్చటఁ గొంతకాలము ప్రియంబున నుండి నరేంద్రుఁ డొక్కనాఁ
డిచ్చఁ జరించుచు న్మమత నెంతయుఁ జిత్తము చేడ్వడ న్గడు
న్వెచ్చనియూర్పు లొక్కమొగి వెల్వడ మోమున దైన్య మొందఁగా
ముచ్చిలి వందుచు న్వగల మొత్త మెదం గలపంగ నాత్మలోన్.

10


సీ.

తాతలచేఁ బాలితం బైనమత్పురం బిటుగోలుపోదునే హీనవృత్తి?
దుర్వృత్తు లైనశత్త్రులు పాడి దప్పక యేలుచున్నారొకో యిప్పు డకట!
యే నెక్కు పట్టంపుటేనుఁగు పాటులుపడియెనో పగఱచేఁ బడి యెఱుంగ
నొకటఁ గొఱంతలే కుండునాయనుచరు లహితుల కనుచరు లైరి నేఁడు


తే.

పెక్కు లిడుమలు పడి కూడఁ బెట్టినట్టి, యగణితం బైనయస్మదీయార్థ మెల్ల
నప్రయోజనవ్యయశీల లై యతివలు, వ్యయము సేయరె యింతకు వమ్ము గాఁగఁ?

11

సురథునకు సమాధి యనువైశ్యునికి సంవాదము

క.

అని మఱియును ఘనచింతా, వినిపాతితుఁ డగుచు మనుజవిభుఁడు మునితపో
వనమునఁ జేరువఁ దిరుగుచుఁ, గనియె నొకవణిజు విషాదకలుషమనస్కున్.

12


మ.

కని నీ వెవ్వఁడ? వేల వచ్చి? తిట శోకవ్యాకులత్వంబుఁ బొం
ద నిమిత్తం బది యేమి? సెప్పు మని యాధాత్రీశుఁ డింపారఁ బ
ల్కినపల్కు ల్విని రాజుతోడ నయలక్ష్మీదుర్యుఁ డై యాతఁ డి
ట్లను నా పేరు సమాధి యే ధనికవైశ్యామ్నాయసంజాతుఁడన్.

13


క.

కడులోభంబున నాలుం, గొడుకులు నాయర్థ మెల్లఁ గొని వెడలఁగ న
న్నడిచిన బంధువుల విడిచి, యడవికి వచ్చితి నరేంద్ర! యార్తి నడలుచున్.

14


ఆ.

ఇట్టు లేను వనట నెరిసెద నిపుడు నీ, కేమి సెప్ప మేదినీశ! వినుము
తనయదారబంధుజనముల కుశలాకు, శలము లెఱుఁగలేక సంతతంబు.

15


క.

నాపుత్త్రకు లెప్పుడు స, ద్వ్యాపారప్రవణు లైనవారో కారో!
యేపగిది నున్నవారో! యోపార్థివ! సుఖులొ దుఃఖులో యే నెఱుఁగన్.

16


వ.

అని వగచిన నన్నరేంద్రుం డి ట్లనియె.

17


క.

తనయాదులు ధనకాంక్ష, న్నిను వెడలఁగ నడిచి యుండ నీమనమున నా
తనయాదులదెస మోహం, బనుబద్ధము సేయ నేల యమలవిచారా!

18


తే.

అనిన వైశ్యుండు నీ చెప్పినంతపట్టు, నిది యథార్థము సుమ్ము నరేంద్రచంద్ర!
యేమి సేయుదు? నీమనం బించు కైన, నిష్ఠురత్వంబు నొంద దానీచులందు.

19


క.

ధనలోభంబున జనకుం, డనుమోహము విడిచి నను నిరాకృతుఁ గావిం
చినఁ బుత్త్రులందు నెయ్యము, ఘన మైనది యేమి సెప్పఁ గమనీయయశా!

20

వ.

ఇది యంతయు నే నెఱుంగనే యెఱింగియు నిది యేమియో దుర్గుణానుబంధు
లగుబంధులయందు నామనంబు ప్రేమఁ బెనగొనియెడు నేమి సేయుదు వారలం
దలంచి నిట్టూర్పు నిగిడెడు డెందంబు గలంగెడు వగలు నివ్వటిల్లెడుఁ బ్రీతిరహితు
లైనవారివలన నైష్ఠుర్యంబు దలకొన దయ్యెడు నని చెప్పె నంత నారాజవైశ్యు
లిరువురుం గూడి చని యాసంయమికి నమస్కరించి సముచితప్రకారంబున నతనిచేత
సమ్మానితులై కూర్చుండి యిష్టకథాపరు లగుచున్న యవసరంబున నమ్మునిపతికి
నమ్మహీపతి యిట్లనియె.

21


సీ.

అర్థి నే నొకటి ని న్నడిగెద నాకు నీ వెఱిఁగింపవయ్య! మునీంద్రవర్య!
యపగతరాజ్యుండ నయ్యు నభిజ్ఞుండ నైననా కిప్పు డజ్ఞాని కట్లు
రాజ్యాంగములయందు రమణ మమత్వంబు ప్రబలమై పాటునఁ బడఁగ నీక
డెందంబు నెవ్వఁగ గొందలపెట్టెడు నకట! యీవైశ్యుండు నాలు సుతులు


తే.

చెలులు చుట్టలు దను విడిచినను దాను, వారి విడువంగఁ జాలక వగచుచున్న
వాఁడు నెయ్యంబు మనమున నాట మైన, దివ్విధం బింతయును నిది యేమియొక్కొ!

22


ఆ.

అనఘ! దృష్టదోష మైనయివ్విషయంబు, లందు మమత చాల నగ్గలించి
యెదను గలఁప నిట్టు లే మిద్దఱము నిది, యేమి వనట నెరియు టెఱుక గలిగి.

23


క.

అలఘుతరజ్ఞానసమే, తుల మయ్యును మేము మోహదుష్టమతులమున్
బలవదవివేకతిమిరాం, ధులమును నగుట యిది యేమి దురితధ్వంసీ!

24


తే.

అనిన నమ్ముని యిట్లను నతనితోడ, విషయగోచరజ్ఞానంబు వినుము జంతు
వులకు నెల్లను నెప్పుడుఁ గలిగియుండు, విషయములు జాతిజాతికి వేఱువేఱ.

25


వ.

ఎట్లం టేని వినుము.

26


తే.

పగలు గానవు భువిఁ గొన్నిప్రాణు లధిపః, రేయి గానవు మఱికొన్ని రేయుబగలు
గాన వొకకొన్ని యెపుడు సమానమైన, దృష్టి గలిగి జంతువులు వర్తించుఁ గొన్ని.

27


క.

జ్ఞానులు నిక్కం బగుదురు, మానవులు మహితలేశ! మనుజుల యేలా
జ్ఞానము గలయవి గావే, మానుగ మృగపక్షిపశుసమాజము లెల్లన్?

28


క.

మానవులకుఁ గలవిషయ, జ్ఞానము పశువులకుఁ బక్షిసమితికిఁ గల ద
జ్ఞానము మానవులకు ధా, త్రీనాయక! కలిమి మనకుఁ దెల్లము గాదే?

29


చ.

పులుఁగులఁ జూడమే యెడఁద బోధము గల్గియు మోహ మెట్టిదో
సొలయక యాఁకట న్నలియుచు న్జని మేఁ పొగిఁ దెచ్చి తెచ్చి చం
చులు వెడలించి పిల్లలకుఁ జొన్పెడు మక్కువ నింత కెక్కు డౌఁ
దలఁపఁగఁ బుత్త్రులందు వసుధావర! మోహము మర్త్యకోటికిన్.

30

సురథసమాధులకు మేధస్సనుమహాముని చెప్పిన మహామాయాప్రభావము

వ.

పుత్త్రమోహంబు ప్రత్యుపకారార్థంబు గా దది సహజంబ యె ట్లనిన సంసారస్థితి
కారిణి యైనమహామాయప్రభావంబునం జేసి మమతావర్తం బగుమోహజలగర్తం

బున నెల్లవారునుం బడినవారు గావున దీని కింత విస్మయం బంద వల దె ట్లనిన
వినుము.


సీ.

ఏమహామాయచే నీచరాచరబహుభూతజాలంబులు పుట్టుచుండు
నేమహామాయచే నెల్లలోకంబులు మోహసాగరమున మునుఁగుచుండు
నేమహామాయచే నెట్టివిద్వాంసుల బుద్దు లెఱుంగమి బ్రుంగుచుండు
నేమహామాయచే నింతయుఁ గ్రమ్మఱ నవసానవేళల నణఁగుచుండు


తే.

నామహామాయ సుమ్ము మహానుభావుఁ, డన సమస్తజగత్కర్త యనఁగ నాది
దేవుఁ డన వెలింగెడువిష్ణుదేవుయోగ, నిద్ర యైనమహామాయ భద్రమూర్తి.

32


క.

ఆపరమేశ్వరి విద్యా, రూపమునఁ బ్రసన్న యై నరులబంధములం
బాపి సనాతనముక్తి, శ్రీపరిణామైక్యయుతులఁ జేయు నరేంద్రా!

33


వ.

అని చెప్పిన నన్నరేంద్రుండు మునీంద్రా! నీవు మహామాయ యని చెప్పి తది
యెవ్వ! రది యెట్లు వుట్టె? దాని స్వరూపంబు ప్రభావంబు చరితంబును నెట్టివి?
విన వేడ్క యయ్యెడు నెఱింగింపు మనవుడు నమ్మునీశ్వరుం డాదేవి నిత్యయు
జగన్మూర్తియు సర్వవ్యాపినియు నై యుండు నున్ననుం దదుత్ప త్తివిధంబులు
పెక్కుతెఱంగులు గల వాకర్ణింపుము.

34


క.

సురకార్యసిద్ధికై యా, పరమేశ్వరి నిత్య యయ్యుఁ ప్రభవముఁ బొందుం
గరుణమెయి నెప్పు డప్పుడు, పరుగు సముత్పన్న యనఁగ భవ్యవిభూతిన్.

35


సీ.

లోకంబు లన్నియు నేకార్ణవం బైనఁ గల్పాంతమునఁ బొందుగా ననల్ప
ఫణవరతల్పంబుపైఁ బరమానందయోగనిద్రాత్ముఁ డై యున్న విష్ణు
కర్ణమలమ్మున ఘనసత్వు లధికులు మధుకైటభాసురు లహితబలులు
ప్రభవించి తన్నాభిపద్మస్థుఁ డైనచతుర్ముఖుఁ జంప నుద్యుక్తులగుడు


ఆ.

సంచలించి యావిరించి యుదగ్రన, క్తంచరులను నిద్రఁ దగిలినట్టి
యసురదమనశౌర్యు నాజనార్దనుఁ జూచి, యచలితాంతరంగుఁ డై యతండు.

36


క.

హరిచారువిలోచనసర, సీరుహమును నిలయముగను వసించి సమస్తే
శ్వర యైన యోగనిద్రను, హరిబోధార్థముగ నిట్టు లభివినుతించెన్.

37

మధుకైటభులవలన వెఱచి బ్రహ్మ యొనర్చిన యోగనిద్రాస్తుతి

క.

జననస్థితిలయకారిణి,యును విశ్వేశ్వరియు నై సముజ్జ్వలతేజో
ఘనుఁ డగువిష్ణునిఁ బొందిన, యనుపమ యగుయోగనిద్ర నర్థి నుతింతున్.

38


క.

స్వధ యన స్వాహ యనంగా, సుధ యనఁగా దేవి నీవ సుమ్ము త్రిమాత్రా
విధియును ద్రిభువనలీలా, మధురవును సనాతనార్ధమాత్రాత్మికవున్.

39


సీ.

నీవ సంధ్యవు దేవి! నీవె తల్లివి సుమ్ము నిఖిలమునకు
నీవ సర్వంబును నిర్మింతు సతతంబు నీవ యీవిశ్వంబు నెమ్మిఁ దాల్తు

లీల నింతయు నీవ పాలింతు కరుణచే సకలంబుఁ దుది నీవ సంహరింతు
సృష్టిరూపవును సుస్థితిరూపవును నీవ సంహృతిరూపవు జనని! నీవ


తే.

శ్రీయు బుద్ధియు ధృతియును హ్రీయు నీవ, పుష్టియును శాంతియును నీవ తుష్టి వీవ
యీశ్వరియు నీవ జగముల కెల్ల మోహ, రాత్రి కాలరాత్రివి మహారాత్రి వీవ.

40


క.

నీవ మహావిద్యవు మఱి, నీవ మహామాయ వమరనికరస్తుత్యా!
నీవ మహామేధవు మఱి, నీవ మహాస్మృతివి! దేవి ! నిత్యానందా!

41


క.

దేవీ! మహేశ్వరీ! త్రిగు, ణావస్థలు నీవె కావె యఖిలంబునకు
న్గావింతు మహాదేవీ!, దేవేంద్రప్రముఖనిఖిలదేవస్తుత్యా!

42


చ.

కరముల శూలము న్గదయు ఖడ్గము చక్రము విల్లు శంఖము
న్పరిఘము బాణము న్వెలుఁగఁ బ్రస్ఫురితాకృతిఁ దాల్చి లోకసుం
దరి వయి దేవి! నీవు సతతంబును నొప్పుదు తల్లి! శాంకరీ!
చరణనఖాంతసంపిహితసర్వదిగీశ్వరరత్నశేఖరా!

43


తే.

సదసదాత్మక మైనయీసకలవస్తు, సముదయమునకుఁ గలయట్టిసహజశక్తి
నీవ యిట్టినీమహిమ వర్ణింప నొకఁడు, శక్తుఁడే సర్వశబ్ధార్థజాతమూర్తి!

44


క.

లోకజనస్థితిలయకర, ణైకవిదగ్ధుఁ డగువిష్ణు నటు మేల్కొనఁగా
నీ కున్న నీమహత్త్వం, బేకవి వర్ణింప నేర్చు నింద్రాదినుతా!

45


క.

దేవీ! నీమహిమన కా, దే విష్ణుఁడు నేను బార్వతీపతియును నీ
శ్రీవిభవంబులు గాంచుట?, గావున ని న్నెవ్వఁ డోపుఁ గడఁగి నుతింపన్.

46


వ.

అని యిట్లు మహోదారంబు లైననిజప్రభావంబులం బ్రశంసించి ప్రజాపతి దేవీ!
యీదుర్ధర్షు లయినమధుకైటభుల సమ్మోహితులం గావింపు మఖిలలోకప్రభుం
డగునచ్యుతుం బ్రబోధంబు నొందించి యీయసురవీరుల వధియింపవలయు నను
బోధం బద్దేవునకు నావహింపు మని ప్రార్థించినం దామసమూర్తి యైన యోగ
నిద్రాదేవి యట్ల సేయం దలంచి.

47


క.

హరినయనవదననాసా, కరహృదయోరస్థలముల గ్రక్కునఁ దా న
ప్పరమేశ్వరుఁ బాసి నిలిచెఁ, బరముం డవ్యక్తభవుఁడు బ్రహ్మ గనుఁగొనన్.

48


వ.

అంత.

49

విష్ణునకును మధుకైటభులకును యుద్ధము

శా.

నిద్రాజాడ్యము దన్నుఁ బాసినఁ గడు న్వే లేచి యాచంచదు
న్నిద్రాబ్జాతుఁ డధోక్షజుండు గనియె న్విస్ఫారదోర్వీర్యశౌ
ర్యోద్రిక్తాత్ముల రౌద్రవక్త్రుల నమర్షోగ్రాక్షుల న్నీలగో
త్రాద్రిప్రాంశుకరాళవిగ్రహుల బ్రహ్మధ్వంసనోద్యుక్తులన్.

50


క.

మధుకైటభులను దనుజుల, నధికబలులఁ గాంచి విష్ణుఁ డతులితబాహా
యుధుఁ డై వారలతో బహువిధముల వడిఁ బెనఁగె నేనువే లబ్దంబుల్.

51

తే.

అలఁత వైముఖ్యమును బొంద కట్లె పోరు, వారిఁ గని హరి మాయి యై వరము వేఁడుఁ
డే నొసంగెద నన వార లిరువు రొకని, నొకఁడు వీక్షించి యపహాస ముత్కటముగ.

52


క.

ఆమధుకైటభులును మాయామోహితు లగుటఁ జేసి యతులితబలలీ
లామత్తు లై జనార్దన!, యే మిచ్చెద మడుగు నీకు నేవర మైనన్.

53


తే.

అనిన విష్ణుండు ప్రీతుల రైతిరేని, యెండువరము మి మ్మడుగంగ నొల్ల నసుర
లార! నాచేత వధ్యుల రగుఁడు మీర, లనిన లోక మేకార్ణవ మగుటఁ జూచి.

54


వ.

వంచనం జావు దప్పించుకొనం దలంచి యానక్తంచరులు నక్తంచరారాతి కిట్లనిరి.

55


క.

మెచ్చితిమి నీరణంబున, కిచ్చెదము వరంబు దప్ప కిమ్మహి నుదకం
బెచ్చట లే దచ్చట మముఁ, జెచ్చెర వధియింపు మనిన జృంభించి వెసన్.

56


ఆ.

అట్ల కాక యని నిజాంకతలమున, నునిచి చక్రి నలువ యుల్లసిల్ల
నసలకణకరాళ మైనచక్రమున న, ద్దనుజవరులతలలు దునిమివైచె.

57


వ.

నరేంద్రా! వాండ్ర మేదస్సుచేఁ గోవిందుండు గల్పించెఁ గావున నీవసుంధర మేదిని
నాఁ బ్రసిద్ధ యయ్యె నామధుకైటభుల సంహరించి విష్ణుండు వినష్టఘోరభయు
నొనర్చినఁ జతుర్ముఖుండు వివిధప్రజల సృజింపం బూర్వసర్గములందువలెఁ గేశవుండు
పాలించె.

58


క.

చతురాననుచే నిటు సం, స్తుత యై యుదయించె దేవి తొల్లి త్రిలోక
స్థితికొఱకు వినుము గ్రమ్మఱ, క్షితిపతి! యద్దేవిమహిమఁ జెప్పెద నీకున్.

59

తపము చేయు దితికి సుపార్శ్వమహర్షి శాప మిచ్చుట

క.

మును దేవాసురయుద్ధ, మ్మున సురపతి సురలఁ గూడి పుత్రులఁ జంపం
జని దితి యి ట్లనియెం దన, జననిం గని యంబ! నన్ను సవతి తనూజుల్.

60


వ.

అపుత్రం జేసి రిట్టినావైరులకుఁ బ్రతీకార మెట్లు సేయుదు ననఁ దల్లి యింద్రాది
నిర్జరులఁ బోరం బరిమార్పఁజాలుకొడుకుఁ బడయఁ దపం బొనరింపు మన మాతకుం
గృతప్రణామ యై తీవ్రమతి నవలంబించి కాన కేఁగి భార్గవుం డగు సుపార్శ్వు
నాశ్రమముదరి సర్వసత్వరూపధారిణి యై వేల్పులుం దాప మొంద నియమనిష్ఠి
తయై పిదప మహిషిరూపముం దాల్చి పంచాగ్నిహోత్రమధ్యమున నుండి జగ
త్త్రయసంక్షోభంబుగాఁ దపం బొనరింప సుపార్శ్వమహర్షియు దత్తపస్సంక్షోభి
తుఁడై కినుక గ్రుడ్లెఱ్ఱ చేసి నీచేష్టితమునకుఁ దగ నిట్టికొడుకు మహావీర్యుఁడు మహి
షుండు పొడము నని శపించె ననంతరము పితామహుఁడు తపఃపరితోషితుం డై
వచ్చి.

61


ఆ.

మహిషముఖమె యైన మానిని! నరశరీ, రార్ధధరత నిష్టుఁ డగుచు నీకు
నమరసహితుఁ డైనయమరాధిపతి నోర్చు, నని సుపార్శ్వనియమి ననునయించి.

62

బ్రహ్మ యనుగ్రహమున దితికి మహిషాసురజననము

వ.

ఆమె తపంబు మాని నిజలోకమున కరిగె నంత మహిషాసురుఁడు పరమేష్ఠివచ
నానుసారముగ జన్మించి శుక్లపక్షనక్షత్రేశుఁడువోలె వృద్ధి నొందిన నావిద్యున్మాలి
పుత్త్రునకు విప్రచిత్తి యనునందనుం డుదయించె నామహాద్యుతి యగుమహిషు
వరదానము విని యేతెంచి దైత్యదానవులు బలసి వినయంబున మహిషుతో నిట్లని
రీత్రిదివాధిపత్యము మనయది విష్ణుబలావలంబంబున సురలు హరించి రట్లే నీవును
నీప్రభావము ప్రకటంబుగా సపరివారుఁ డగుదేవరాజు బవరంబునం గీటడంపు
మన నాదైత్యులతో మహిషుఁ డమరులతో దుర మొనరించుతలంపునఁ దివ
మునకు బయలుదేఱె నంత.

63


మ.

తమసైన్యమ్ముల కింద్రుఁడు న్మహిషుఁడు న్దర్పమ్ముమై నాధిప
త్యములం బూనఁగ దేవదైత్యులకు యుద్ధం బయ్యె నూఱేండ్లు పూ
ర్ణముగాఁ దొల్లి తదాహవాంతరమున న్దైతేయదుర్దాంతవి
క్రమపాండిత్యపటుత్వ మేఁచిన దివౌకస్సైన్య మోడె న్గడున్.

64

దేవతలచే మహిషాసురునిదౌర్జన్యంబు విని శివకేశవులు కోపించుట

మ.

మహిషుం డిట్లు సురావలిం గెలిచి సామర్థ్యంబుమై నింద్రుఁడై
న హతభ్రష్టసమస్తసైన్యు లయి దైన్యం బొంది బృందారకుల్
ద్రుహిణుం దోడ్కొని యొక్కచోన హరిరుద్రు ల్బ్రీతితో నున్నఁ ద
న్మహితస్థానము చేరి వారిఁ గని నానాస్తోత్రవాచాలు రై.

65


వ.

దండప్రణామంబు లాచరించి దుష్టచేష్టితుం డైనమహిషాసురుండు దముం బరి
భవించినవిధం బంతయు సవిస్తరముగా నయ్యిరువురకు విన్నవించువారై దేవత
లిట్లనిరి.

66


తే.

అవధరింపుఁడు నిఖిలలోకాధినాథు, లార! మావిన్నపము బలోదారుఁడైన
మహిషుఁ డెప్పుడు మదమున మసరుకవిసి, కలఁచుచున్నాఁడు త్రిభువనకమలవనము.

67


క.

మహిషునికుచ్చితమును బర, మహిషులఁ జెఱ పట్టుటయును మత్తిల్లి మరు
న్మహిజములు గూల్చుటయుఁ బే, ర్చి హరిం దోలుటయు వానిఁ జెప్పము మీకున్.

68


శా.

తేజస్ఫూర్తి దినాధినాథుఁ డయి కాంతిం జందురుం డై ప్రతా
పాజేయత్వమునం గృశానుఁ డయి ఘోరైశ్వర్యశౌర్యోన్నతిం
దా జిష్ణుం డయి దర్ప మొప్ప గొనియెం దత్తత్పదమ్ము ల్బల
భ్రాజిష్ణుం డసురేశ్వరుం డసురు లుబ్బ న్లోకసంహారుఁ డై.

69


వ.

మఱియును.

70


సీ.

అవలీల నంతకు నతిదీనుఁ గావించి బలిమిఁ గోణాధిపు భంగపెట్టి
పరిగొని వరుణునిఁ బరిభూతి నొందించి కడిమిమైఁ బవనుని గాసి చేసి

మత్తిల్లి విత్తేశు మానం బడంగించి గండున నీశానుఁ గష్టపఱిచి
యేఁచి గంధర్వేశు హీనదశకుఁ దెచ్చి యలుకమై సాధ్యపుఁ దలఁగఁ ద్రోచి


తే.

యప్పురంబులు వడిఁ దాన యాక్రమించి, గరుడసిద్ధవిద్యాధరఖచరనాగ
వరుల నుద్వృత్తిసతతంబుఁ బఱపి పనులు, గొనుచునున్నాఁడు మహిషుండు క్రొవ్వు మిగిలి.

71


చ.

అలఘుపరాక్రముండును దురాత్ముఁడు నై మహిషాసురుండు దో
ర్బలమున నాకముం గొనినఁ బాడఱి పోయి ధరిత్రి నిఫ్డు మ
ర్త్యులక్రియ నున్నవారము సురోత్తములార! భవత్పదాంబుజ
మ్ములు శరణంబుఁ జొచ్చితిమి బుద్ధి దలంపుఁడు దైత్యనాశమున్.

72


క.

అని నాకౌకసు లెఱిఁగించిన విని మధుసూదనుండు శ్రీకంఠుండు
న్గనలిరి వికటభ్రూకుటి, ఘననిటలస్వేదబిందుకలితానను లై.

73

హరిహరాదులతేజఃపుంజములవలన నావిర్భవించిన దేవికి దేవతలు యుద్ధోపకరణము లిచ్చుట

వ.

ఇట్లు రోషసంఘూర్ణితుం డగువిష్ణువక్త్రంబున మహాతేజం బుద్భవించె బ్రహ్మశంకరశ
క్రాదిసకలదేవశరీరంబులయందుఁ దీవ్రతేజంబులు నిర్గమించె నత్తేజంబు లన్నియు
నేకత్వంబు నొంది మహాపర్వతంబునుం బోలె నభంబు దాఁకి దిగంతరంబులు వెలి
గించుచు నక్కజం బై యుండె నంతం దదీయతేజోరాశివలన రుద్రతేజంబున
ముఖంబును యమతేజంబునం గేశసంచయంబును విష్ణుతేజంబున భుజంబులును
జంద్రతేజంబునం గుచంబులును నింద్రతేజంబున మధ్యంబును వరుణతేజంబున
జంఘలు తొడలును భూమితేజంబున జఘనంబును విరించితేజంబునం జరణంబులును
దరణితేజంబునఁ బాదాంగుళిసముదయంబును వసుతేజంబునం గరాంగులిసముద
యంబును గుబేరుతేజంబున నాసికయుఁ బ్రాజాపత్యతేజంబున దంతపఙ్క్తియు నగ్ని
తేజంబున నేత్రత్రయంబును నుభయసంధ్యాతేజంబున బొమలును బవనతేజంబునం
జెవులునుంగా నొక్కదివ్యనారీరూపం బై నిలిచిన మహిషభయభీతు లగు దేవతలు
సూచి హర్షించి రద్దేవికిం దమయాయుధంబులవలన నాయుధంబులు పుట్టించి శూలి
త్రిశూలంబును చక్రి చక్రంబును జలధిపతి శంఖంబును వహ్ని శక్తియు వాయు
దేవుఁడు బాణాసనాక్షయతూణీరంబులు వజ్రి వజ్రంబును నైరావణంబు ఘంటయు
దండధరుండు కాలదండంబును బ్రజాపతి యక్షమాలయుఁ గమండలువును
బ్రభాకరుండు రోమకూపంబులం బ్రజ్వరిల్లునిజరశ్మికలాపంబును గాలుండు ఖడ్గ
ఖేటంబులును విశ్వకర్మ వివిధదివ్యాస్త్రంబులు నభేద్యకవచంబును బరశువు నిచ్చిరి
మఱియు.

74


క.

క్షీరోదధి నిర్మలతర, హారకటక కుండలాంగదాంబరమణిమం
జీరార్ధచంద్రవిపుల, స్పారాభరణములు ధవళపద్మము నిచ్చెన్.

75


తే.

హిమనగేంద్రుండు సింహము నిచ్చె వాహ, నముగ మధుపూర్ణపానపాత్రముఁ గుబేరుఁ

డిచ్చె బహుఫణిమణిఘృణు లెసఁగఁ గరము, చెలువ మగుఫణిహారంబు శేషుఁ డిచ్చె.

76


వ.

అంత.

77


మ.

సురదత్తాయుధరత్నభూషణపరిస్ఫూర్ణత్ప్రభాజాలని
స్ఫురదుద్యద్భుజదివ్యదేహనిబిడాంశు ల్పర్వి భూదిఙ్నభోం
తర మెల్ల న్వెలిఁగింప నత్యధికరౌద్రస్ఫూర్తి నద్దేవి ని
ష్ఠురహాసోద్భటసింహనాదము జగత్క్షోభంబుగాఁ జేసినన్.

78


ఉ.

ధరణీచక్రము దిర్దిరం దిరిగెఁ బాతాళంబు ఘూర్జిల్లె భూ
ధరవర్గంబు చలించె బెల్కుఱి దిశాదంతావళశ్రేణి మ్రొ
గ్గె రవీందుగ్రహతారకావళులు మ్రగ్గెన్ మ్రోసి బ్రహ్మాండము
ల్శరధు ల్పిండలివండుగాఁ గలఁగె నాశ్చర్యం బుదగ్రంబుగాన్.

79


వ.

అప్పుడు దేవత లాసింహవాహనం జూచి హర్షించి జయజయశబ్దంబు లొనరించిరి
భక్తివినమ్రు లగుచు సకలమునులును బ్రస్తుతించి రంత సమససైన్యంబులు
సన్నద్ధంబులు గావించి వివిథాయుధంబులు ధరియించి సుధాశనులు మహాదేవిం
బురస్కరించుకొని మహిషునిమీఁదికి నురవణించిన.

80


క.

కని యాదనుజుం డేమీ, యనిమిషు లోకయాఁడుదాని నక్కట! నాతో
నని నేయఁ దెచ్చినారే?, యనుచుం బటురోషభీషణాకారుం డై.

81


వ.

సమరోత్సాహంబు మెఱసి సకలసైన్యంబులు ముంగల నడువ నపుడ వెడలి.

82


సీ.

అతిరభసాంఘ్రివిన్యాసనిర్భరభరంబున నేల పాతాళమునకు డిందఁ
బ్రత్యగ్రబహురత్నబహుళదీఫ్తిచ్ఛటారంగత్కిరీటంబు నింగి మెఱయ
శస్త్రాస్త్రజాలప్రసారణపటుదోస్సహస్రంబు దిక్కుల నవలఁ ద్రోవ
నుజ్జ్వలదుర్నిరీక్షోగ్రదేహద్యుతిపుంజంబు బ్రహ్మాండపూరితముగ


తే.

నతులహుంకారసింహనాదాట్టహాస, ములు సెలంగఁగఁ దనరౌద్రమూర్తి మెఱయ
వచ్చునద్దేవిఁ దీవ్రదుర్వారశౌర్య, ఘనుఁడు మహిషాసురేంద్రుండు గనియె నంత.

83

మహిషాసురసేనాపతు లగుచతురాదులకు దేవికిని యుద్ధము

క.

ఆదేవితోడ యుద్ధం, బాదానవయోధవీరు లతులితభుజద
ర్పోదారు లై యొనర్చిరి, రోదోంతర మస్త్రశస్త్రరోచుల వెలుఁగన్.

84


క.

మహిషాసురసేనాపతి, యహితులఁ దలపడియెఁ జక్షురాఖ్యుం డలుక
న్మహనీయచతుర్విధబల, సహితుండును ప్రకటశౌర్యసంపన్నుఁడు నై.

85


క.

అఱువదివేలరథము లే, డ్తెఱ నడల నుదగ్రుఁ డడరె దేవిపయిం దా
నుఱక రథకోటితో వడిఁ, దఱిమె మహాహనుఁడు శౌర్యదర్ప మెలర్పన్.

86


వ.

మఱియు నేఁబదిలక్షలరథంబులతో నసిరోముండును గాలుండును నఱువదిలక్షల
రథంబులతోడ బాష్కలుండును గోటిస్యందనంబులతోడ నుగ్రదర్శనుండును

నేనూఱుకోట్లతేరులతో బిడాలుండును ననుమహాసురు లమ్మహాదేవిం జుట్టుముట్టి
ఘోరయుద్ధంబు సేయుచుండ.

87


మత్తకోకిల.

కోటికోటిసహస్రసంఖ్యలు కుంజరంబులుఁ దేరులు
న్ఘోటకంబులుఁ దోడ రాఁ బటుఘోరవిక్రముఁ డై మరు
త్కోటి నెల్ల లులాయదైత్యుఁడు దోలి శాంభవిమీఁది దోః
పాటవం బెసఁగంగఁ దోమరబాణశక్తికృపాణముల్.

88


తే.

ఆదిగాఁ బరగించె బెక్కాయుధములు, గొంద ఱసురులు శక్తులఁ గొంద ఱుగ్ర
పాశములఁ గొంద ఱద్దేవిఁ బరిఘములను, గడఁగి నొప్పించి పరిమార్పఁగడఁగుటయును.

89


శా.

చండక్రోధ మెలర్పఁ జండిక వెస న్శస్త్రాస్త్రవర్షంబున
న్ఖండించె న్దనుజాస్త్రశస్త్రములు తద్గాత్రంబులం బ్రస్ఫుర
త్కాండవ్రాతము నించి నొంచె మునిసంఘంబు ల్నుతింపంగ ను
ద్దండోద్యద్భుజదండలీల మెఱయ న్దర్పంబు శోభిల్లఁగన్.

90


క.

దేవీవాహనసింహం, బావిర్భూతోగ్రదోష మై యప్పుడు ర
క్షోవీరసైన్యములఁ బటు, పావకుఁ డడవిం జరించుభంగిఁ జరించెన్.

91


చ.

సమరముఁ జేయుచుం జెలఁగి శాంభవి యార్పు లొగి న్నిగుడ్పన
య్యమకడ నుప్పతిల్లి ప్రమథాళి యనేకసహస్రసంఖ్య ల
య్యమరవిరోధిసైన్యము రయంబున నాశముఁ బొందఁ జేసెఁ దీ
వ్రము లగుభిండివాలకరవాలపరశ్వధపట్టసాదులన్.

92


తే.

చేసె నద్దేవి గణములు చెలఁగి శంఖ, పటహభేరీమృదంగాదిబహువిధముల
వాద్యములు మొరయించి రాధ్వనులు నిఖిల, దిశలయందును నభమున దీటుకొనియె.

93


సీ.

ఘోరత్రిశూలవిహారంబు శోభిల్లఁ జెలఁగి దైతేయులఁ జీరి చీరి
చండగదాదండసారణోద్ధతి యొప్ప మునుమిడి దనుజుల మోఁది మోఁది
యాభీలఖడ్గవిద్యాకుశలత్వంబు మెఱయ రాక్షసకోటి నఱకి నఱికి
పటుశరాసనకళాభైరవత్వము గడుఁ గొమరుగ నసురులఁ గూల్చి కూల్చి


ఆ.

యుగ్రపాశబంధనోదగ్రవృత్తి న, క్తంచరాలి తలలు దెంచి తెంచి
కసి మసంగి తీవ్రగతి నమ్మహాకాళి, లీల నసమసమరకేళి సలిపె.

94


వ.

అ ట్లమ్మహాకాళి వివిధప్రకారంబుల రణవిహారం బొనరింప వైరులు తదీయచండ
ఘంటానాదంబున గుండియ లవిసి కూలువారును ఖడ్గప్రహారంబుల నిఱుపఱి
యలై పడువారును గదాఘాతంబున నెత్తురు గ్రక్కుచుఁ ద్రెళ్లువారును శూలా
నలం బురంబు వ్రచ్చిన నేలం బడి పొరలువారును శరపరంపరలు శరీరంబులఁ
దగిలిన నొఱలువారును బ్రాణంబులు విడుచువారును దలలు తెగిన నాయుధం
బులు విడువక నిలు నిలు మని యదల్చుచు నద్దేవిపైఁ గవిసి కయ్యంబులు సేసి
పడువారును ద్రుటితహస్తులు ఛిన్నగ్రీవులు భగ్నశిరస్కులును గృత్తకరచరణు

లును విచారితమధ్యభాగులు నై నశించి రంబరంబు బహుతరకబంధబంధురం బయ్యె
బలితంబు లైనకరితురంగభటసముదయాంగంబులను భయంకరంబు లైనరక్తనదీ
ప్రవాహంబులను సమరాంగణంబు ఘోరత్వంబు నొందె నివ్విధంబున నయ్యం
బిక యొకక్షణంబునం దృణదారుసంచయంబులు భస్మంబు గావించువహ్ని
యుంబోలె మహిషాసురచతురంగబలంబులను సంక్షయంబు నొందించె నద్దేవి
సింహంబును బ్రమథగణంబులును సముద్భటరూపంబున నిశాటసైన్యపాటన
పాటవంబున దీపించె నప్పుడు దివిజులు బహువిధంబులం బ్రస్తుతించుచు నప్పర
మేశ్వరిమీఁదఁ బుష్పవృష్టి గురిసి రంత.

95

చక్షురుఁడు మొదలగుమహిషాసురసేనాపతులసంహారము

మ.

దనుజానీకము మ్రగ్గినన్ గని భుజాదర్పంబునం జక్షురుం
డనుసేనాపతి కోపఘూర్ణితముఖుం డై తాఁకి యద్దేవి ను
గ్రనిశాతాశుగవర్షధారల వడి న్గప్పె న్మహాభ్రంబు పే
ర్చి నిలింపాచలతుంగశృంగ మతివృష్టి న్గప్పుచందంబునన్.

96


ఉ.

భైరవి యేచి యద్దనుజుబాణము లన్నియు నుగ్గు సేసి త
త్సారథిఁ గూల్చి యశ్వములఁ జంపి వడి న్విలు ద్రుంచి కేతువు
న్దేరును లీలమై నఱికి తీవ్రశరంబుల వానిమేను దు
ర్వారరయం బెలర్పఁ బలువ్రయ్యలు గా వెస నేసె నేసినన్.

97


తే.

విరథుఁడై చతురుండు దోర్వీర్య మెసఁగ, వాలుఁ బలుకయుఁ గొని శీఘ్రలీల గదిరి
యార్చి సింహంబుశిరముఁ జండాసి సవ్య, బాహువును వ్రయ్య నేసి కోపమున మఱియు.

98


క.

శూలంబు పుచ్చికొని య, క్కాళిధనువు దునిమె వాఁడు గ్రక్కున నది తే
జోలంకృతరవిబింబము, వోలెఁ జదల నుండి యపుడు పుడమిం బడియెన్.

99


వ.

ఇట్లు వడుటయు వేఱొక్కవి ల్లెత్తి.

100


క.

కొని దేవి శరావలి న, ద్దనుజునిశూలంబు నఱికి తను వెల్లను దు
త్తునియలు గా రయమున నే, సిన నాసేనాని విగతజీవుం డయ్యెన్.

101


సీ.

సామజారూఢుఁ డై చామరుం డనుదనుజుండు చండికమీఁదఁ జండశక్తి
నిగిడింప నద్దేవి నిష్ఠురహుంకార మొనరించుటయు నది యుడిగి మడిఁగి
మేదినిఁ బడియె నమ్మేటిరక్కసుఁడు ద్రిశూలంబు వైచె నాభీలలీల
దానిఁ దుత్తునియలు గా నేసె నంబిక, జృంభించి యద్దేవిసింహ మెసఁగి


తే.

కుంభికుంభస్థలం బెక్కి ఘోరబాహు, రణము గావించి వానివారణముఁ ద్రుంచె

దేవతలు చూచుచుండ నద్దేవి దోఃప్ర
హారమున మస్తకము వెసఁ జీరి చంపె.

102


సీ.

తరుశిలాప్రహతి నుదగ్రు భంజించెఁ గరాళుని బిడికిటఁ గూలఁ బొడిచె
గద నుద్ధతుని నేలఁ గలిపి బాష్కలుఁ బటు భిండివాలమ్మునఁ బిలుకుమార్చె
నుగ్రశరముల నుదగ్రవీర్యుని ద్రుంచె నుగ్రాస్యు నొకకోల నుక్కడంచె
ఘనశూలమునఁ ద్రినేత్రునిఁ జంపె గరవాలధార బిడాలుకంధరము నఱకె


తే.

భల్లమున మహాహను గతప్రాణుఁ జేసె నారసంబున దుర్ధరునామ మడఁచె
దుర్ముఖుని శితాస్త్రంబునఁ ద్రుంచె నిట్లు, మారిమసఁగి దైతేయుల బారిసమరె.

103

దేవి మహిషాసురుని వధించుట

వ.

ఇవ్విధంబున నమ్మహాదేవిచేత నిజసైన్యంబు నిరవశేషం బైన విజృంభించి యమ్మహి
షాసురేంద్రుండు మహిషం బైనరూపంబుఁ గైకొని తదీయగణంబుమీఁదఁ గవిసి.

104


ఉ.

కొందఱఁ జండతుండహతిఁ గొందఱఁ గ్రూరఖురాగ్రఘట్టన
న్గొందఱ దీర్ఘవాలమునఁ గొందఱ దీర్ఘవిషాణలీలల
న్గొందఱఁ దీవ్రవేగమునఁ గొందఱ నుగ్రమహారవంబున
న్మ్రందఁగఁ జేయుచు న్బ్రమథమండలి నెల్లను ద్రుంచి యుద్ధతిన్.

105


క.

ఆదేవిమృగేంద్రమునకు, నాదికొనినమహిషుఁ జూచి యయ్యంబిక గ్రో
ధోదగ్రమూర్తి యగుటయు, నాదనుజుఁడు క్రోధఘూర్ణితారుణముఖుఁ డై.

106


సీ.

గగనంబు గడచినఘనఘోరదేహంబు తాఁకునఁ దారకోత్కరము రాలఁ
బెందూళి యెసఁగ నందంద కాల్ద్రవ్వు నుగ్రత మహీతలము గ్రక్కదలుచుండ
గోరాడి బలువిడిఁ గొమ్ములఁ జదిమిన శైలము ల్వినువీదిఁ దూలి పోవ
వాలగుచ్ఛంబున వడి నాహతంబులై వనధులు పిండలివండు గాఁగఁ


తే.

జండనిశ్వాసహతిఁ గులక్ష్మాధరములు, చూర్ణములు గాఁగ మిడుఁగుర్లసోన గన్నుఁ
గడల నడరఁగ జగము లాకంప మొందఁ, దీవ్రముగ వచ్చుమహిషు నద్దేవి గాంచె.

107


మ.

పటురోషంబున వానిఁ జంపఁగ మహాపాశంబు పై వైచి యు
త్కపటత్వంబున నంటఁ గట్టుడుఁ దదాకారంబు పోఁ బెట్టి యు
ద్భటసింహాకృతి దాల్చె దానవుఁడు దత్కంఠంబుఁ జండాసిచేఁ
ద్రుటితం బయ్యె సురారి తాఁ బురుషుఁ డై తోఁచె న్గృపాణంబుతోన్.

108


క.

కరవాలచర్మయుతముగ, శరముల నప్పురుషు నఱకె శాంభవి వాఁ డు
ద్ధురసింధుర మై సింహముఁ, గరమున వడిఁ బట్టి తిగిచె గర్వస్ఫూర్తిన్.

109


చ.

తిగిచినఁ గాళియు న్గజము దీర్ఘకరంబు గరాసిఁ ద్రుంచెఁ దా
మగుడఁగ నమ్మహాసురుఁడు మాహిషరూపముఁ దాల్చి లోకము
ల్బెగడఁగ రోఁజూచు న్జెలఁగి పేర్చినఁ జండిక చూచి రౌద్రము
న్నగవును మోమునం బెనఁగొన న్మధుపానము లీలఁ జేయుచున్.

110

తే.

చెలఁగి యార్చిన మహిషుఁడున్ జలము బలము, మెఱయ శృంగాగ్రములమహా మేదినీధ
రములు పెఱికి యద్దేవిపై రభసలీల, వైచె వైచిన శరతతి వాని దునిమి.

111


వ.

మధుపానరాగస్ఫురితనయన యగుచు నసంపూర్ణమధురాక్షరంబుగా ని ట్లనియె.

112


క.

ఏ నీమధురాసవరస, మానినయందాఁక నెట్టు లైనను మూఢా
త్మా! నలువునఁ జెలఁగుము నాచే నీ వీల్గుటయు సురలు చెలఁగుదురు వెసన్.

113


మ.

అని యద్దేవి రయంబున న్నెగసి దైత్యాధీశుకంఠంబు పె
ల్చనఁ బాదంబునఁ జిక్కఁ ద్రొక్కి పటులీల న్మూలనిర్భిన్న గా
త్రునిఁ గావించిన వాఁడు లావునఁ గడుం ద్రోపాడి మోమెత్తి తాఁ
బెనఁగం జొచ్చినఁ ద్రుంచె వానిశిర మాభీలాసిధార న్వెసన్.

114

సురలొనర్చిన మహిషాసురమర్దనీస్తుతి

వ.

ఇవ్విధంబున నమ్మహిషాసురుం డామహాదేవిచేత హతుం డైన హాహారవంబులు
సెలంగె సకలదైత్యసైన్యంబు నశించె సమస్తసురగణంబులు హర్షించె మహర్షు
లమ్మహాదేవిం బ్రస్తుతించిరి గంధర్వగీతంబులు నప్సరోంగనానర్తనంబులునుం
బ్రవర్తిల్లె మందమారుతంబులు వీతెంచె దివాకరుండు తేజోరమ్యుఁడై వెలింగె
వహ్నులు శాంతంబు లై ప్రజ్వలించె దిగ్గజంబులు మృదుమనోహరస్వనంబులు
నిగిడించె నంత.

115


చ.

అతులభుజాబలోగ్రుఁడు దురాత్మకుఁ డామహిషుండు దేవిచే
హతుఁ డగుడు శతక్రతుముఖామరు లుత్కటహర్షలీలఁ బ్రో
న్నతపులకాంచితాంగులు వినమ్రశిరస్కులు నై వెలింగి య
ద్దితిసుతరాజసంహర నుతింపఁ దొడంగి రనేకభంగులన్.

116


చ.

అరయఁగ సర్వనిర్జరగణాతతశక్తిసమూహమూర్తి యై
పరగెడు నేమహేశ్వరిప్రభావమున న్జగము ల్చరించు న
ప్పరమవధూటి కంబికకు బన్నుగ మ్రొక్కెద మేము భక్తి నా
సురమునిపూజ్య దేవి బహుశోభనము ల్దయ మాకు నీవుతన్.

117


ఉ.

శ్రీవనితావిభుండు సరసీరుహగర్భుఁడు శంకరుండు నే
దేవి ప్రభావము న్బలముఁ దేజము నిట్లని చెప్ప నేర రా
దేవి సమస్తదానవులఁ ద్రెక్కొని లోకము లెల్ల నెప్పుడు
న్గావఁగ బుద్ధి సేయుతను గారుణికత్వధురీణచిత్తయై.

118


క.

నీరూప మచింత్యం బమ, రారిక్షయకారి నీమహత్త్వము మఱి నీ
చారిత్రము లద్భుతములు, ఘోరాజులు మాకుఁ బొగడుకొలఁదియె దేవీ!

119

సీ.

దివిజులఁ బితరులఁ దృప్తిఁ బొందింపఁగ స్వాహవు నిర్మలస్వధవు నైతి
మోక్షార్థు లగుమహామునులచే నెపుడు భావింపఁగాఁ బడునాత్మవిద్య వైతి
వామ్నాయముల కెల్ల నైతివి నిధివి జీవస్థితికై దేవి! వార్త వైతి
సకలశాస్త్రంబులసారంబ వైతివి భవవారిధికి యానపాత్ర మైతి


తే.

హరిభుజాంతరవాసిని యైనలక్ష్మి, వైతి శివునకు సామేన వైతి వీవ
జగములకుఁ గారణము నీవ త్రిగుణమూర్తి, నీవ మూలప్రకృతి వీవ నిర్మలాంగి!

120


ఉ.

భూరిసముద్యదిందురుచిఁ బొల్చి పటుభ్రుకుటీకరాళ మై
దారుణకోపతీవ్ర మగుతావకవక్త్రము చూచినన్త యా
సైరిభదానవుండు వెసఁ జావమి చోద్యము గాదె భైరవీ!
యేరికి బ్రాణము ల్నిలుచు నే కుపితాంతకదర్శనంబునన్?

121


చ.

సుజనులయందు లక్ష్మి యయి సూరిజనంబులయందు బుద్ధి యై
కుజనులయం దలక్ష్మి యయి గోత్రపవిత్రులయందు లజ్జ యై
ద్విజవరులందు శాంతి యయి విస్ఫురణం జెలు వొందుదేవి కే
ము జయజయధ్వను ల్సెలఁగ మ్రొక్కెద మర్థిఁ ద్రిలోకరక్షకై.

122


మ.

మము రక్షింపుము దేవి! నీకరమున న్మానై వెలుం గొందుచ
క్రమున న్గార్ముకశింజినీరవమున న్ఖడ్గంబున న్శాతశూ
లమున న్సంతతఘంటికాధ్వనిఁ గృపోల్లాసంబు శోభిల్ల ని
త్యముఁ బూర్వాపరదక్షిణోత్తరదిగంతస్థప్రదేశమ్ములన్.

123


వ.

అని మఱియు ననేకప్రకారంబులం బ్రస్తుతించి దేవత లమ్మహాదేవిం జందనానులేపన
దివ్యకుసుమధూపదీపార్పణంబులం బరమభక్తి నర్చించి దండప్రణామంబు లాచరించి
నం బ్రసాదముఖియై శాంభవి నిలింపుల నిరీక్షించి మీ కభిమతం బైనవరం
బడుగుఁ డిచ్చెద దుష్కరం బైన నెద్దియేనియుం జేయవలయుదానిఁ జేసెదం
జెప్పుఁ డనిన ననిమిషులు మహేశ్వరీ! భువనకంటకుఁ డగునస్మదీయశత్త్రు మహిషు
వధియించితివి నీచేత సర్వంబునుం జేయంబడియె నొక్కకొఱంతయు లేదు వరం
బిచ్చెద వేని మాచేత నెపుడు సంస్మృత వైతి వప్పుడు మాయాపద లెల్ల హరిం
పుము.

124


క.

విను నీస్తవమున నేనరుఁ, డనిశము వినుతించు నతని కతులధనసతీ
తనయవిభవవృద్ధికి నో, జననీ! మాకెట్టు లట్ల సంముఖి వగుమీ.

125


తే.

అనిన సురలకుఁ గరుణించి యట్లకాక, యని రయమున నంతర్హిత యయ్యె దేవి
దేవదేహతేజముల నద్దేవి లోక, హితముగా జనించినవిధ మిది నరేంద్ర!

126


వ.

శుంభనిశుంభాదిదుష్టజనుల భంజింపను జగంబుల రక్షింపను దినిజులకు నుపకారం
బాచరింపను దలంచి యమ్మహామాయ తొల్లి గౌరీపరమేశ్వరశరీరకోశంబునం

దావిర్భవించినవిధంబు నీకుం జెప్పెద నాకర్ణింపు మని సురథునికి నమ్మహాముని
యిట్లనియె.

127

శుంభనిశుంభులు పుట్టి విజృంభించుట

సీ.

శుంభుండు దొల్లి నిశుంభుండు ననుమహా, సురులు దోర్దర్బవిస్ఫురణ మూఁడు
లోకంబులును దామ కైకొని యజ్ఞభా, గములు హరించుచు నమృతకరర
వీంద్రాగ్నియమజలధీశమారుతకుబే, రాద్యధికారంబు లాక్రమించి
వర్తించుచుండ గీర్వాణు లవ్విధమున, భ్రష్టరాజ్యులును బరాజితులును


ఆ.

నధికదుఃఖతులును నై యమ్మహామాయఁ, దలఁచి తన్నుఁ దారు దలఁచినపుడ
యాపదలు హరింతు నని దేవి తమకు ము, న్గరుణ నొసఁగినట్టివరము దలఁచి.

128


వ.

హిమవంతంబున కరిగి విష్ణుమాయ యైనయమ్మహాదేవి నిట్లని స్తుతించిరి.

129

దేవతలు చేసినదేవీస్తుతి

తే.

దేవి కళ్యాణి శివ మహాదేవి ప్రకృతి, భద్ర చంద్రరూపిణి జ్యోత్స్న రౌద్ర ధాత్రి
సిద్ధి నైరృతి శర్వాణి బుద్ధి యనఁగఁ, గీర్త్య యగుగౌరి కేము మ్రొక్కెదము భక్తి.

130


తే.

దుర్గ కూర్మి మహాలక్ష్మీ దుర్గపార, సార సర్వకారిణి నిత్య సౌమ్య కృష్ణ
భూతి యతిరౌద్ర ధూమ్ర విఖ్యాతి యనఁగఁ, గీర్త్య యగుగౌరి కేము మ్రొక్కెదము భక్తి.

131


తే.

అరయ సర్వభూతములయందు విష్ణు, మాయ యనఁగ నేదేవి తా మహిమఁ దనరు
నామహాదేవి కుడుగక యనుదినంబు, మ్రొక్కెదము మ్రొక్కెదము భక్తిమోసులెత్త.

132


సీ.

అఖిలభూతంబులయందును నేదేవి శక్తి నిద్రాక్షుధాశాంతిశుద్ధి
బుద్ధిరూపంబులఁ బుష్టితృష్ణాకాంతిమాతృరూపంబుల బ్రీతితుష్టి
మేధాక్షమాధృతిస్మృతిరూపములఁ బ్రజాశ్రుతిచేత నావృత్తిరూపములను
ఛాయాచితిస్థితిశ్రద్ధాత్రపారూపములను మాయారూపమునను శ్రీస్వ


తే.

రూపమునను హింసారతిరూపములను, బాయ కుండునాదేవికిఁ బరమభక్తి
మ్రొక్కెదము మేము తలలపై మోడ్పుఁ గేలు, గదియఁ జేరిచి మేము మ్రొక్కెదము మఱియు.

133


ఉ.

దావశిఖిప్రతాపు లగుదైత్యులవేఁడిమిఁ గుందినప్పు డే
దేవికి మేము మ్రొక్కెద మతిస్థిరభక్తిఁ బ్రశంస చేసి యా
దేవి దయార్ద్రభావమున దిగ్గన మాకుఁ బ్రసన్నయై ప్రమో
దావహలీలఁ దాల్చి వెస నాపద లెల్లను బాపుఁ గావుతన్.

134

వ.

అనుచు ననేకప్రకారంబుల ననిమిషు లభినందించుచున్నంత.

135

కౌశికి గౌరీకాయకోశమునుండి యావిర్భవించి గౌర్యాజ్ఞచే హిమవంతమున కేఁగుట

క.

స్నానార్థము పార్వతి గం, గానదికి న్వెడలి సురలఁ గనుఁగొని మీచే
మానుగఁ బొగడఁగఁ బడియెడు, నానెలఁతుక యెవ్వ రిచట ననియె నరేంద్రా!

136


తే.

అనుడు నద్దేవితనుకోశమున జనించి, యప్పు డొకదేవి సురలతో ననియె సురలు!
నన్ను వినుతించెదరు శరణంబుఁ జొచ్చి, యుగ్రశుంభనిశుంభుల నోర్వ లేక.

137


వ.

అనియె నప్పార్వతిశరీరకోశంబున సముద్భూత యగుట నయ్యంబిక కౌశికి యను
పేరం బ్రఖ్యాత యయ్యె నప్పుడు గౌరియుం గృష్ణయై కాళికాభిధానంబున
హిమాచలంబున నెలకొనియె నంత.

138

హిమవత్పర్వతంబునఁ జండముండులు దేవిం గాంచుట

తే.

ఘనులు శుంభనిశుంభులయనుచరులు ప్ర, చండబలశౌర్యధుర్యులు చండముండు
లతిమనోహరాకారసమగ్రదివ్య, తేజముల నొప్పుకౌశికీదేవిఁ గాంచి

139

శుంభునియొద్ద జండముండులదుర్మంత్రము

మ.

చని శుంభుం గని మ్రొక్కి దేవ! హిమవచ్ఛైలంబునం దొక్కచం
ద్రనిభాస్యం గనుఁగొంటి మామహితసౌందర్యంబు నాకాంతిసొం
పును నావిభ్రమభంగియుం గలుగునే పూఁబోఁడులం దెందు? నా
వనితారత్నము చూడ నీక తగు భాస్వల్లీలమై దేవిగాన్.

140


వ.

త్రిలోకంబులం గలగజతురంగాదిసకలరత్నంబులకును నీగృహం బాకరంబు గాదె
పురందరువలన నై రావణోచ్చైఃశ్రవఃపారిజాతంబులును బ్రహ్మవలన హంసయుక్తం
బగుదివ్యవిమానంబును గుబేరువలన మహాపద్మనిధియును నబ్దివలన నమ్లానకమల
మాలికయు వరుణునివలనం గాంచనదండం బగుమహనీయచ్ఛత్త్రంబును బ్రజా
పతివలన రథోత్తమంబును మృత్యువువలన నుతాంతిద యనుశక్తియు నగ్ని
వలన నీలకౌశేయవసనంబులు నాదిగాఁ గలసమస్తవస్తురత్నంబులును బరాక్రమ
బునం బురుషరత్నంబవైననీ వాక్రమించుటకు మెఱుంగు వెట్టిన ట్లుండు నీస్త్రీ
రత్నంబు పరిగ్రహింపు మని చెప్పినఁ జండముండాసురులవచనంబులు విని శుం
భుండు సుగ్రీవుం డనుదూతం బిలిచి నీ వద్దేవికడ కరిగి యది యెట్లు ప్రీతచిత్త యై
చనుదెంచు నట్లు నాపలుకులుగాఁ జెప్పి తోడ్కొని రమ్మని పంపిన మహాప్రసాదం
బని వాఁడు హిమవంతంబునకుం బోయి యక్కౌశికిం గని మధురవాక్యంబుల
నిట్లనియె.

141

దేవియెదుట సుగ్రీవుఁ డనుకుంభదూత చెప్పినరాయబారము

శా.

దేవీ! శుంభునిదూత నే నతఁడు పుత్తెంచె న్నినుం గోరి బా
హావీర్యోత్కటశౌర్యనిర్జితసమస్తాదిత్యదిక్పాలచూ

డావిన్యస్తనిజైకశాసనుఁడు గాఢశ్రీశుఁ డై యొప్పునా
దేవద్విట్పతివాక్యరీతి విను మర్థి న్జెప్పెద న్నీ కొగిన్.

142


సీ.

నాయధీనంబులు నాకాదిలోకము లతివ! మద్వశవర్తు లమరు లెల్ల
యాగభాగము లెన్ని యన్నియు నస్మదీయములు సమస్తరత్నములు నిధులు
మామకంబులు వార్ధిమథనోద్భవము లైనగజరత్నహయరత్నకల్పకములు
కప్ప మిచ్చి సురేంద్రుఁ డెప్పుడు సేవించుఁ దగ నన్ను దివిజగంధర్వపన్న


ఆ.

గాదులందుఁ గలుగునఖిలరత్నములు నాయందు నున్నయవి మహావిభూతిఁ
ద్రిభువనముల నీవు దేవి! యువతిరత్న, భూత! రమ్ము రత్నభుజుల మగుట.

143


ఉ.

క్రమ్మఱ నేఁగుదెంచి యనురాగ మెలర్పఁగ నన్ను నొండె నా
తమ్ము నిశుంభు నొండెఁ బ్రమదం బెసఁగ న్వరియించి లీలసౌ
ఖ్యముల కెల్ల నీవ కుదురై యసమానవిభూతిఁ బ్రీతితో
నిమ్ముల సర్వలోకములు నేలుచునుండుట యెంత యొప్పునో!

144


వ.

ఇంతయు నీవు మనంబున నాలోచించి మత్పరిగ్రహంబు నొందుట మేలని
శుంభుండు నీకుం జెప్పు మనినవచనంబు లివి యనవుడు జగదేకధారిణియు
భద్రయు దుర్గయు ననంబరఁగు నప్పరమేశ్వరి గంభీరాంతస్మితమధురవచన
యగుచు దూత కిట్లనియె.

145


ఉ.

నీవచనంబు దద్దయును నిక్కము బొంకెడునట్టివాఁడవే
నీవు? త్రిలోకభర్త మహనీయుఁడు శుంభుఁడు గేవలుండె? ద
ర్పావహుఁ డానిశుంభుఁడును నట్టిఁడ యల్పులె వార లైన ము
న్నే విను మోసపోయి మది నిట్లని యొక్కప్రతిజ్ఞఁ జేసితిన్.

146


క.

ఎవ్వఁడు జయించు న న్నని, నెవ్వఁడు మద్దర్ప మడఁచు నేడ్తెఱమెయి నా
కెవ్వఁడు జగమునఁ బ్రతిబలుఁ, డవ్వీరుని కేను భార్య నగుదు న్బ్రీతిన్.

147


ఉ.

కావున శుంభుఁ డొండె భుజగర్వ మెలర్ప నిశుంభుఁ డొండె నో
రీ! వెస వచ్చి న న్గెలిచి ప్రీతిమెయి న్వరియించుఁ గాక తా
నావుఁడు దూత యెల్లి యిటు నాయెదుర న్మదలీలఁ బల్కు దే
దేవి! జగంబునం గలఁడె ధీరత నెవ్వఁడు వారి మార్కొనన్?

148


వ.

మఱియు వారలకుం గలదైత్యవీరులకు సమరంబున నెదుర దేవతలుం జాల రనిన
నబలవైననీచాలమి చెప్ప నేల.

149


చ.

సురపతిఁ దొట్టి దేవతలు శుంభనిశుంభముఖోగ్రదానవే
శ్వరులకుఁ బాఱుచుండుదురు సంగరభూముల నాఁడుదాన వీ
వరయఁగ నట్టిదోర్బలపరాక్రమభీకరుఁ లైనవారి ను
ద్ధురగతి నెట్టు మార్కొనియెదో కడువింతలు పుట్టె నీతలన్.

150


క.

చనుదెమ్ము నాపలుకె విని, దనుజేంద్రులకడకు రాక తక్కిన నెట్లున్

జనుదెంచెదవు సుమీ వడిఁ, దనుజులు తల వట్టి యీడ్వ దైన్యముతోడన్.

151


తే.

అనిన నద్దేవి నీ చెప్పినట్టు లాసు, రారు లొనరింపఁ జాలెడువార దాన
గొఱఁత లే దేమి సేయుదు నెఱుఁగ కిట్టి, ప్రతిన పట్టితి నే విచారంబుఁ దక్కి.

152

దేవి ధూమ్రలోచనుని వానిసైన్యమును సంహరించుట

వ.

నీవు పోయి నా చెప్పినవిధం బంతయు మీయసురేంద్రున కెఱింగింపు మతం
డెయ్యది కర్జం బది యొనర్చుంగాక యనిన దూత సముర్థితామర్షం డగుచుం జని
శుంభునకు సవిస్తరంబుగా నద్దేవివచనంబులు విన్నవించిన నానక్తంచరవరుండు
గోపించి ధూమ్రలోచనుం బిలిచి నీవు దనుజసైన్యసహితంబు రయంబున నరిగి
యాదుష్టవధూటిం దలవట్టి యీడ్చికొని రమ్ము దాని కడ్డము పడ నెవ్వరు వచ్చిన
సమయింపు మనిన నమ్మహాసురుండు షష్టిసహస్రాసురవీరపరివృతుండై యేఁగి తుహి
నాచలంబున నున్న యద్దేవింగని యెలుంగెత్తి దేవీ! వేగ శుంభనిశుంభులపాలికి
రమ్ము ప్రియంబున రాక తక్కినం గచాకర్షణం బాచరించి నిన్ను నవశ్యముం
గొనిపోదు ననిన నద్దేవి యిట్లనియె.

153


క.

బలియుఁడు పంపఁగ వచ్చిన, బలవంతుఁడ వీవు దనుజబలయుతుఁడవు నీ
బలిమి మెయిం గొని పోవుదు, ఖలుఁడవు ని న్నేమి సేయఁగల నే నబలన్.

154


చ.

అనవుడు ధూమ్రలోచనమహాసురుఁ డంబికఁ బట్ట నగ్గలిం
చినఁ బటుహుంకృతిం దనుజుఁ జెచ్చెర నంబిక నీఱు సేసెఁ జే
సినఁ గని వానిసైన్యము విశృంఖలవిక్రమలీల దేవిపై
సునిశితబాణపఙ్క్తి పరశువ్రజవర్షము పర్వఁ జేసినన్.

155


సీ.

చటులపటాటోపపటుతరకోపవిస్ఫురణంబు లెసఁగ నిష్టురరవంబు
చెలఁగంగ నద్దేవిసింహంబు దైత్యసైన్యముమీఁదఁ జండరయమున నుఱికి
కరతాడనంబులఁ జరణతాడనముల ముఖతాడనంబుల నఖవిదార
ణంబుల సమరాంగణంబున దానవాంగములు దుత్తునియలు తుమురు పొడియు


తే.

వ్రయ్యలై కూలుచుండ దుర్వారలీలఁ, గెరలి నెత్తురు గ్రోలుచుఁ గోళి సలిపి
వ్రేలుమిడి నబ్బలము లెల్ల నేలఁ గలపె, బహువిధోగ్రవధక్రియాపాటవమున.

156


వ.

అంత.

157


క.

అంతయు శుంభుఁడు విని నే, త్రాంతంబులఁ గెంపు మెఱయ నవుడు గఱచుచున్
స్వాంతము నితాంతరోషా, క్రాంతముగాఁ జండముండఘనదానవులన్.

158


ఆ.

పిలిచి మీరు సకలబలసమన్వితులరై, యరిగి దుష్ట యైనయవ్వధూటి
నలవు చలము మెఱయఁ దలవట్టి యీడ్చి తెం, డొండె నంటఁ గట్టి తెండు పొండు.

159


క.

మొనసి యని చేసె నేనియు, సునిశితశస్త్రాస్త్రతతులసొంపునఁ దద్వా
హనముఁ బొలియించి చండికఁ, దునియలు కావింపుఁ డధికదోర్బలలీలన్.

160

కాళి చండముండుల ఖండించుట

మ.

అని దైత్యేంద్రుఁడు పంచిన న్గణఁకతో నాచండముండాసురు
ల్ఘనశస్త్రాస్త్రకరాళహస్తు లయి నాగస్యందనాశ్వాధిరూ
ఢనిశాటోగ్రబలంబుతోడ నవగాఢస్ఫూర్తిమై నేఁగి కాం
చనచంచన్మణీరమ్యశృంగవిలసచ్ఛైలేంద్రసానుస్థితిన్.

161


చ.

చిఱునగ వెంతయు న్మెఱయ సింహముపైఁ జెలువొందుదేవి నే
డ్తెఱఁ గని చండముండముఖదేవవిరోధులు చుట్టు ముట్టి యం
దఱును గడంగి పట్టుకొనిఁ దద్దయు డాసినఁ జూడ్కుల న్మిడుం
గుఱు లెసఁగంగ వక్త్రమునఁ గోపముఁ జండిక దాల్చెఁ దాల్చినన్.

162


సీ.

ఆకోపమునఁ జేసి యంబికవదన మప్పుడు నీలవర్ణవిస్ఫురణ నొందె
వికటభయంకరభ్రుకుటిత మైనతత్ఫాలభాగంబునఁ గాళి యనఁగ
నొకదేవి ఖడ్గబాణోగ్రవిచిత్రఖట్వాంగధారిణియు జిహ్వాగ్రలిహ్య
మానాధరోష్ఠయు నానిమ్నతామ్రకరాళనేత్రయును శార్దూలచర్మ


తే.

వస్త్రయును శిరోమాలీకావరవిభూషి, తయును శుష్కమాంసాంగియు దారుణాస్య
మండలయునై జనించి యజాండభాండ, మనియ నార్చుచు దైత్యసైన్యంబుఁ జొచ్చి.

163


వ.

కరాళవక్త్ర యగునమ్మహాకాళి రౌద్రప్రభావంబునం గసిమసంగి కవిసి కాలు
బలంబుల మావంతులతో జోదులతోఁ బార్శ్వఘంటలతోడ నేనుంగుల రావు
తులతో గుఱ్ఱంబుల నొక్కకేలన క్రుమ్మరించి యెత్తి వదనగహ్వరంబున వైచి
కొని సితనిశితదశనంబులం బెలుచ నమలి మ్రింగుచు నట్ల రథికరథ్యసారథి
సహితంబు లగురథంబుల రదనాంకురచూర్ణితంబులు గావించి భక్షించుచుఁ
కొందఱం దలలు వెఱికియుఁ గొందఱ మెడలు నులుమియుఁ గొందఱం
జరణంబులఁ జమరియుఁ గొందఱఁ బడఁదాఁకియుఁ బలుదెఱంగుల నుఱుము
సేయుచుం బ్రతివీరులు ప్రయోగించునివివిధాస్త్రశస్త్రవ్రాతంబులు నోరు దెఱచి
త్రెక్కొనుచు మఱియు ఖడ్గఖండనఖట్వాంగతాడనదంతఖాదనంబులం జతు
రంగంబులం బొలియించుచు నత్యంతఘోరం బగువిహారంబు సలుపుచుండ
నేకక్షణంబునం దమసేన యంతయు నశించినం గోపించి చండుండు ప్రచండ
భీమకాండంబుల నాభీమాక్షిం గప్పె ముండాసురుండు ప్రదీప్తంబు లగుచక్రం
బులు నిగిడింప నద్దేవి యాననకుహరంబుఁ బ్రవేశించుచుం బ్రభామండలమండిత
బహుమార్తాండమండలంబుల విడంబించె నప్పు డాభైరవి సింహనాదాట్టహా
సంబులు చెలంగ దంతదీప్తులు వెలుంగ సింగంబుమీఁదనుండి లంఘించి వెండ్రుక
లొడిసిపట్టి తిగిచి మండలాగ్రంబునం జండముండులశిరంబులు ఖండించి యార్చిన
హతావశిష్టంబులగుతదీయసైన్యంబులు భయంబునం గలంగి తొలంగంబాఱె
నాకాళి యద్దనుజమస్తకంబులు పుచ్చుకొని నవ్వుచు నంబికకడ కరిగి సమర

మఖంబునకుఁ బశువు లైనచండముండులు వీరే నాచేత నిహతులై రింక శుంభని
శుంభులం దెగటార్చుట నీపని యనిన నప్పరమేశ్వరి హర్షించి మృదుమధుర
వాక్యంబులం జండికతోడ దేవీ! నీవు చండముండులం జంపితివి గానం
జాముండాభిధానంబున జగంబులఁ బ్రఖ్యాత వగుదనియె నంత.

164


తే.

చండముండదానవులును సర్వసైన్య, ములును జండికచే నట్లు వొలియుటయును
శుంభుఁ డతికోపసంరంభజృంభితాంత, రంగుఁ డై యప్డ దండనాయకులఁ జూచి.

165

శుంభనిశుంభులు యుద్ధసన్నద్ధులగుట

వ.

షడశీతిభేదదైత్యకులసంభవులును
జతురశీతిభేదకంబుకులసంభవులును బంచా
శత్కోట్యర్బుదాసురకులసంభవులును శతకోటిభేదధూమ్రకులసంభవులును గాల
కులు దౌహృదులు మౌర్వ్యులు గాలకేయులును నైనరాక్షసులెల్ల నాయాజ్ఞ
దప్పక యిప్పుడు.

166


సీ.

సమరంబునకుఁ గడుసన్నద్ధులై వేగ తమతమసర్వసైన్యములతోడఁ
జనుదెంచునది యని దనుజేశ్వరుఁడు చెప్పి నానాసహస్రసేనాసమేతుఁ
డై ఘోరరణకుతూహలమున వెడలె యుద్ధతలీల జగములు తల్లడిల్ల
నమ్మోహరము గాంచి యంబిక మెయి పెంచి నిజశింజినీధ్వని నింగి నించె


తే.

సింగ మత్యుగ్రనాదంబు సేసె దేవి, గంటమ్రోఁత యారవముల రెంటి మ్రింగెఁ
గాళియును వివృతాననోద్గతకరాళ, రావమున దిక్తటంబుల వ్రచ్చెఁ గెరలి.

167


క.

భీకర మగుతన్నాదం, బాకర్ణించి నలుదెసల నడరి కుపితు లై
యాకౌశికిసింహంబును, నాకాళిం దెరలఁ జేసి రమ్ములవెల్లిన్.

168

సప్తమాతృక లావిర్భవించుట

క.

ఆసమయంబున దేవి మహాసురులం జంప సురల ననుపమవిజయో
ద్భాసితులఁ జేయ శివప, ద్మాసనగుహచక్రివాసవాదులశక్తుల్.

169


క.

వారలతనువుల వెలువడి, వారలచిహ్నములు దాల్చి వారలబలతే
జోరూపంబులతో నా, భైరవికడ నిలిచె దనుజభంజనరీతిన్.

170


సీ.

ఆఁబోతు నెక్కి శూలాయుధశశిఫణిభూష మహేశ్వరి పొలుపు మిగిలె
హంసవిమానస్థయై యక్షసూత్రకమండలుపాణి బ్రహ్మాణి మెఱసెఁ
గేల శక్తి ధరించి లీల మయూరసమారూఢ కౌమారి యతిశయిల్లె
నైరావణంబుపై నైంద్రి చేఁ గులిశంబు దనర వేగన్నులు తాల్చి యొప్పె


తే.

గరుడిమీఁద వైష్ణవి గదాఖడ్గశంఖ, చక్రములు కరంబుల నుండ జాల నమరె
నఖసటాస్ఫూర్తిఁ జెలువొందె నారసింహి, రౌద్రదంష్ట్రాస్యరుచుల వారాహి వెలిఁగె.

171


క.

హరుఁ డయ్యేడ్వురచేతం, బరివృతుఁ డై యప్పు డసురబలముల నెల్లం
బొరిగొను మని చండికకుం, గర మనురాగమునఁ జెప్పెఁ గ్రక్కున నంతన్.

172

చండికాదేవి సమరసన్నద్ధయై రాక్షససైన్యమును జెండాడుట

సీ.

నిష్టురబహుశివానినదంబు చెలఁగంగ నాచండితనువునం దధికభీష
ణాకార యొకశక్తి యావిర్భవించి యాశంభుతో శుంభనిశుంభఘోర
దైతేయులొద్దకు దూతవై చని యిట్టు లనుము నీ వసురలు వినుచునుండ
భువనత్రయంబును బురుహూతునకు నిచ్చి యమరులహవ్యభాగములు విడిచి


ఆ.

బ్రతుకవలతు రేని పాతాళమునకుఁ బొం, డొల్ల కని యొనర్చునుక్కు గలిగె
నేని యఱిమి నడుపుఁ డిపుడు మీమాంసము, ల్దిని మదీయశివలు తృప్తిఁ బొందు.

173


వ.

అని పంచిన శివుండు దూతయై చనియె నది నిమిత్తంబుగా నద్దేవి శివదూతి యను
నామంబునం బ్రఖ్యాతి యయ్యె నయ్యసురేశ్వరుం డప్పరమేశ్వరుండు చెప్పిన
వచనంబులు విని సరకుగొనక కోపాటోపంబున నురవణించి యాకాత్యాయని
మీఁద నిశితశరశక్తివృష్టి గురిసిన నద్దేవి కోపించి గొనయంబు సారించి ప్రచండ
కోదండప్రవిముక్తకాండంబుల నవ్వర్షం బవలీల నడంగించె నప్పు డద్దేవిముందట
నిలిచి కాళికాదేవి త్రిశూలదళనంబులను ఖట్వాంగప్రహారంబులను బ్రతిబలం
బులు బడలుపడం బఱపె బ్రహ్మాణి కమండలుజలక్షేపణంబున నసురుల నిహత
తేజోవీర్యులం గావించె మాహేశ్వరి త్రిశూలంబును వైష్ణవి చక్రంబును
గౌమారి శక్తియు నైంద్రి వజ్రంబును నడరించి యవక్రవిక్రమక్రియాపాటవంబులు
చూపిన నమ్మహాసురులు కీలాలవర్షధార లెసంగ మహీతలంబున శతసహస్ర
సంఖ్యులు గూలిరి మఱియును.

174


క.

దారుణశితదంష్ట్రాంకుర, దారణముల ఘోరచక్రదళనమ్ముల వి
స్ఫారశితతుండనిహతుల, వారాహి సురారివీరవర్గముఁ దునిమెన్.

175


క.

ఘోరనినదంబు దశది, క్పూరిత మై చెలఁగ సమరభూమి నసురలం
గ్రూరనఖంబుల చెలువిడిఁ, జీరుచూ నమలుచును నారసింహి చరించెన్.

176


ఉ.

చండతరాట్టహాసము దిశాతటము ల్వగులింప నార్చి యు
ద్దండరయంబున న్గవిసి దానవుల న్శివదూతి గూల్చుచు
న్గండలు మ్రింగుచు న్గెరలి కయ్యము సేయఁ దొడంగె నిట్టు లొం
డొండ చెలంగి మాతృగణ ముగ్రత దైత్యులఁ బిల్కుమార్పఁగన్.

177


ఉ.

మాతృగణంబుకోల్తలకు మార్కొన నోడి సురారిసైనిక
వ్రాతము పాఱిన న్గని పరాక్రమదుర్దముఁ డుగ్రవీర్యవి
ఖ్యాతుఁడు రక్తబీజుఁడు సగర్వముగా గద చే నమర్చి రౌ
ద్రాతిశయం బెలర్ప వెస నైంద్రిఁ గడు న్వడిఁ దాఁకెఁ దాఁకినన్.

178


సీ.

జృంభించి మాహేంద్రి దంభోళి నాదైత్యవీరునిఁ గడు బెటు వ్రేయుటయును
క్షతమునఁ దొరఁగినవితతశోణితబిందుతతు లెన్ని యన్నింటఁ దత్క్షణంబ

యాకారభూరిశౌర్యంబుల రక్తబీజునియట్టిదనుజులు ఘనులు పుట్టి
మాతృగణంబుతో మహితహేతివ్రాతసంపాతభీషణసమరకేలి


తే.

సేయ మఱియును దనుజునిశిరము వజ్ర, హతముగా నైంద్రి యేయుడు నగ్గలముగ
నెత్తు రొలికిన రక్కసిమొత్తములు స, హస్రసంఖ్యము లం దుదయంబు లయ్యె.

179


వ.

అయినం గని కోపించి యొక్కట నురవడించి.

180


సీ.

ఆరక్తబీజుఁ జక్రాహతి నొంచె వైష్ణవి యపు డైంద్రి వజ్రమున నేసె
బ్రహ్మాణి నొప్పించె బ్రహ్మదండమ్మున నలి గాఁగ గద మోఁదె నారసింహి
మనశక్తి భిన్నాంగుఁ గావించెఁ గౌమారి లీల మాహేశ్వరి శూలదళిత
వక్షుని గాఁ జేసె వారాహి ఖడ్గతాడితుఁ గా నొనర్చె నద్దితిజుఁ డించు


తే.

కయుఁ జలింపక పటుగదాఘాతమున ర, యమున నొప్పించి యందఱ నార్చి పేర్చె
మాతృగణము సక్రోధమై మఱియు వాని, పైఁ ద్రిశూలశక్త్యాదులు పఱపుటయును.

181


ఉ.

రక్కసుభూరిదేహమున రక్తకణౌఘము గ్రమ్మి చూడఁగా
నక్కజ మై ధరం దొరిఁగె నందు జనించి యనేకదైత్యు లే
దిక్కునఁ దార యై జగము దీటుకొనం గడు నిండఁ బర్విన
న్వెక్కస మంది యెంతయును విహ్వలు లైరి నిలింపు లందఱున్.

182


వ.

అట్లు విషణ్ణు లగునమరుల నాలోకించి యాచండిక మహాకాళితో దేవీ! నీవు
వదనంబు విస్తీర్ణంబు గావించి మదీయశస్త్రపాతసంభూతం బగు రక్తబీజదైతేయ
తంబునల్ల రయంబున భక్షింపు మీరాక్షసుం డంతం బరిక్షీణశోణితుం డై
సంక్షయంబునొందు నని చెప్పి యప్పరమేశ్వరి త్రిశూలంబున నయ్యాభీలదానవుం
బొడిచినం దదంగంబునం గీలాలపూరంబు దొరంగినం గోపించి వాఁడునుం గదా
దండంబునం గదిసి వ్రేసినఁ జండికకు వేదనఁ జేయం జాల దయ్యె నప్పుడు.

183


లయగ్రాహి.

స్థూలతను కాళిమ విశాలలయకాలఘన
             నీలరుచిజాలముల నాలిగొన నేత్ర
జ్వాలలను శూలకరవాలఘృణిమాలికలు
             నోలిఁ దనమ్రోల శిఖపోలిక వెలుంగన్
దూలి పదతాలహతిఁ జాల దీవి గూలఁ గడు
             వాలి మదలీల నవలీల విగళత్కీ
లాల మొగిఁ గ్రోలుచుఁ గరాలగతిఁ గ్రాలుచును
             గాళి దనుజాళి వెసనాలమున మ్రింగెన్.

184


ఉ.

కాళి కరాళ మైనముఖగహ్వరము న్గడు విచ్చి యిట్టు లా
భీలత రక్తబీజుమెయిఁ బెల్లుగఁ గ్రమ్మినరక్త మంతయు

న్గ్రోలఁగ దేవి వెండియును గ్రూరతరాయుధరాజిఁ గ్రమ్మిన
న్గూలె నరక్తదేహుఁ డయి కుంభిని నద్దనుజుండు భూవరా!

185


ఆ.

రక్తబీజుఁ డిట్లు రణమునఁ గూలిన, నతులహర్షభరితు లైరి సురలు
నర్తనంబుఁ జేసె కలి మాతృగణ మసృ, క్పానజనితమదవికారలీల.

186


వ.

అని చెప్పిన విని సురథుండు మునీశ్వరున కిట్లనియె.

187

శాంభవి నిశుంభుని వధించుట

తే.

నీవు చెప్పినయమ్మహాదేవిచరిత, మును మహత్త్వము విస్మయ మొనరఁ జేసె
నట్లు రక్తబీజుఁడు హతుఁ డైన శుంభుఁడును నిశుంభుఁడు నెట్లైరి మునివరేణ్య.

188


చ.

అనిన మునీంద్రుఁ డిట్టు లను నట్లు రణావని రక్తబీజుఁడు
న్ఘనచతురంగసైన్యమును గ్రాగిన శుంభనిశుంభు లుగ్రకో
పను లయి రానిశుంభుఁ డతిభైరవసైన్యసమేతుఁ డై రయం
బునఁ గవిసె న్పరాక్రమము పొందిరి వోవఁగ దేవిపై వడిన్.

189


తే.

అతనిముందటఁ బార్శ్వంబునందుఁ బిఱుఁద, నొక్కయుమ్మడిఁ బెక్కండ్రు రుక్కు మిగిలి
యురువడించిరి దేవిపై నుగ్రదనుజు, లొదవుపేరల్కఁ బెదవు లొండొండ యదర.

190


వ.

అప్పుడు.

191


మహాస్రగ్ధర.

పొలియింతు న్దేవి నంచు న్భుజబలపటువిస్ఫూర్తిమై దాఁకె శుంభుం
డలుకం దన్మాతృవర్గం బడరఁ గవిసె నిట్లన్నయు న్దముఁడు న్ని
శ్చలమేఘద్వంద్వలీల న్శరసముదయవర్షంబున న్గప్పిన న్దే
వి లసత్కోదండముక్తావిరతశరము లావృష్టి మ్రింగంగఁ జేసెన్.

192


ఉ.

చేసి నిశాతబాణములఁ జెచ్చెర వారల నొవ్వఁ జేసిన
న్గాసిలి యానిశుంభుఁ డతిగర్వమున న్గరవాలచర్మరు
గ్భాసితపాణి యై కదిసి భైరవిసింహముమస్తకంబు దా
వ్రేసిన దేవియుం దునియ వేసె నని న్వెస ఖడ్గచర్మముల్.

193


క.

వాలుం బలుకయుఁ దుమురై, రాలినఁ బలుశక్తి వైచె రాక్షసవరుఁ డా
భీలముగ దానిఁ బటుదో, ర్లీలం జక్రమున దేవి రెండుగ నఱకెన్.

194


ఉ.

శూలముఁ ద్రిప్పి యార్చుచు నిశుంభుఁడు వైచిన దానిఁ జూర్ణమై
తూలఁగఁ జేసె దేవి నిజదోఃపటుముష్టిహతి న్నిశాటుఁ డా
భీలముగాఁ జెలంగి గద బెట్టడరించినఁ జండికాభుజా
శూలముచేత నగ్గదయు సొంపఱి నీ ఱయి పోయె భూవరా!

195


మాలిని.

అలుకఁ బరశుహస్తుం డై కడు న్వీఁక ధాత్రీ
తల మద్రువఁగ నుద్యద్రౌద్రత న్వచ్చుదైత్యు

న్బలువడిఁ బడ నేసె న్భైరవాటోపలీల
న్జెలఁగి నిశితబాణశ్రేణి నద్దేవి యంతన్.

196


సీ.

దర్పదుర్దముఁ డైనతమ్ముఁ డిమ్మెయి రణస్థలమున సోలినఁ దద్ద యలిగి
శుంభుండు చండికసొం పడఁగింపఁగఁ జూచి రథం బెక్కి సునిశితోజ్జ్వ
లాయుధస్ఫురితబాహాష్టకం బాకాశ మంతయుఁ గప్పి భయంకరముగఁ
జను దేరఁ గని దేవి సకలారిసైన్యతేజఃప్రాణములు మ్రింగఁ జాలునట్టి


తే.

శంఖరవమున శింజినీస్వనమునను బ్ర, చండఘంటాస్వనంబున సకలదిశలు
చెవుడు పడఁ జేసె వాహనసింహ మడరి, చెలఁగె గజములు మదమఱి చేష్ట లుడుగ.

197


వ.

అప్పుడు.

198


క.

కాళి యెగసి యిరుగేలను, నేలయు నింగియును వ్రేయ నిష్ఠురరవ మా
భీలముగఁ జెలఁగె ముందరి, కోలాహలరవము లెల్లఁ గుంఠితములుగన్.

199


తే.

చేసె శివదూతి తీవ్రాట్టహాస మప్పు, డారవంబును విని శుంభుఁ డధికరోష
దీప్తుఁ డగుటయు నంబికాదేవి వాని, నట దురాత్మక నిలు నిలు మని యదల్చె.

200


వ.

అప్పు డంబరంబుననుండి యమరు లద్దేవిం గెలు గెలు మని దీవించి రానక్తంచర
వరుం డనలజ్వాలాకరాళ యగుశక్తి నిగిడించిన నంబిక మహోల్కాభాతిం బొడి
సేసిన సంరంభజృంభితుం డై శుంభుండు త్రిభువనకుహరంబు నిండి నిజసింహ
నాదంబున ఘూర్ణిల్ల విలయసమయనిర్ఘాతఘోరంబుగా నార్చె నంత.

201


తే.

శతసహస్రసంఖ్య లమితశరము లుగ్ర, లీలఁ దునుమాడుచును రణకేళి సలిపి
రసురనాథుఁడు దేవియు నంత దేవి, శుంభుసుర ముచ్చిపో వైచె శూల మెత్తి.

202


తే.

వైచుటయు రక్కసుఁడు నేల వ్రాలి సొగసె, మున్ను దివ్యాస్త్రహతి మూర్ఛ మునిఁగినట్టి
యానిశుంభుఁడు దెప్పిఱి యంత నొంచె, సింహమును దేవిఁ గాళిని శితశరముల.

203


శా.

శుంభుం డంతట మూర్ఛదేఱి బదివే ల్శుంభద్భుజంబు ల్రణా
రంభస్ఫూర్తి యెలర్పఁ దాల్చి బహుచక్రశ్రేణి నద్దేవి సం
రంభం బేదఁగఁ గప్పినం బటుశరవ్రాతంబునం జక్రము
ల్సంభిన్నంబులు చేసి తద్విశిఖము ల్ఖండించెఁ గాండంబులన్.

204


ఉ.

అంత నిశుంభుఁ డెంతయు రయంబునఁ జండికఁ జంపుకోప మ
త్యంతము గాఁగ వ్రేసె గద నాగద దేవి కృపాణిఁ ద్రుంచె వాఁ
డంతటఁ బోక చే సతి భయంకరశూలము దాల్చివచ్చు దు
ర్ధాంతతఁ జూచి శూలమున వ్రచ్చె సురేశ్వరి వానివక్షమున్.

205


వ.

అట్లు భిన్నవక్షుం డై పడిన నిశుంభునిహృదయంబుననుండి మహాబలపరాక్రమ
ధురంధరుం డొక్కపురుషుండు నిలు నిలు మని యదల్చుచు వెలువడినం

జూచి యొత్తిలి నవ్వుచు నంబిక వానిశిరంబు గరవాలంబున నఱికిన నతండు
పుడమిం బడియె నప్పుడు సింహఖరనఖరదంష్ట్రాంకురవిదారణవిహరణంబులను గాళిక
కరాళకరవాలవిదళనఖేలనంబులను శివదూతినిశాతహేతిపాతవినోదంబులను
గౌమారిశితభయంకరశక్తిప్రహారవిహారంబులను మాహేశ్వరిమహితత్రిశూలా
భీలహననలీలలను వారాహిప్రచండతుండఖండనహేళనంబులను వైష్ణవినిర్వ
క్రచక్రవిక్రమక్రీడలను మాహేంద్రిమహనీయకులిశధారానికర్తనమర్దనంబు
లను బ్రహ్మాణిమంత్రపూతకమండలుజలక్షేపణాటోపంబులను సంగరాంగణం
బునం గపాలంబులు పగిలియు ఫాలంబులు నొగిలియుఁ గరంబులు త్రెస్సియు
నురంబులు హ్రస్సియు మెడలు దునిసియుఁ దొడలు మురిసియుఁ గండలు రాలియు
గుండెలు గూలియు రూపు లడంగియు నేపులు మడంగియు నేకక్షణంబున నాక్ష
ణదాచరప్రకరంబు సంక్షయంబు నొందె నట్టియెడ శుంభుండు ప్రాణసదృశుం
డగుతమ్ముండు నిశుంభుండును సకలసైన్యంబులు సమసినం జూచి కోపించి యంబి
కకు నిట్లనియె.

206


క.

ఒరులభుజబలముప్రాపున, దుర మొనరించెదవు గాక దోర్బలలీలా
స్ఫురణము నీ కెక్కడి దు, ద్ధుర మగుగర్వంబు విడువు తోయజవదనా!

207

శాంభవి శుంభుం జంపుట

తే.

అనిన దేవి జగత్త్రితయంబునందు, నే నొకర్తన కాని నా కితర మైన
మూర్తి యెందు నెపుడు లేదు మూర్ఖ! చూడు, మద్విభూతులు నాయందు మగుడఁ జొచ్చె.

208


వ.

అని పలికినఁ బ్రహ్మాణీప్రముఖదేవీసముదయం బంబికదేహంబునంద లయంబు నొంది
నం జండిక యొక్కతియె నిలిచి యే మదీయవిభూతిం జేసి పెక్కురూపంబులు ధరి
యించితి నిప్పు డన్నియు నుపసంహరించి నేనొకర్తనై యున్నదాన దానవా
ధమా! నీ వింక నెందుఁ బోయెదు సుస్థిరుండ వగు మనియె నంత నయ్యిరువు
రకును దేవదానవులు చూచుచుండం ద్రిభువనదారుణం బైనరణం బయ్యె
నవ్విధం బాకర్ణింపుము.

209


సీ.

అంబిక వెస నేయునమితదివ్యాస్త్రంబు లణంచె శుంభుండు ప్రత్యస్త్రనిహతి
నతఁ డడరించునానాస్త్రశస్త్రములు హుంకారరవంబునఁ గ్రాఁచె దేవి
కెరలి యద్దనుజుండు శరశతోత్కరముల నప్పరమేశ్వరిఁ గప్పెఁ గదిసి
కోపించి చండిక ఘోరంబు లైనబాణంబుల వానివి ల్నఱకి వైచె


తే.

ధనువుఁ దునిమిన నసుర యుదగ్రశక్తి, పుచ్చుకొనుటయుఁ బటుచక్రమున రయమున
దానిఁ దునుమాడె భైరవి దానవుండు, గనలి యనిమిషేశ్వరిఁ బొరిగొనఁ గడంగి.

210

మ.

శతచంద్రోజ్జ్వలఖడ్గపాణి యయి రక్షస్సేనతోఁ జుట్టిన
న్దితిజుం గన్గొని యల్గి యంబిక వెస న్దీవ్రాశుగశ్రేణి నం
చితఖడ్గంబును జర్మముం దునిమి వాజివ్రాతముం గూల్చి యు
ద్ధతి సూతుం దెగటార్చి తేరు తుము రై ధాత్రిం బడ న్జేసినన్.

211


ఉ.

దారుణముద్గరంబు గొని దైత్యుఁడు డాసిన దాని దేవి వి
స్ఫారశరంబుల న్నఱికె బల్విడి శుంభుఁడు దీవ్రముష్టి
భైరవివక్షముం బొడువ బాహుతలంబున వ్రేసె వానివి
స్తారభుజాంతరంబు వడిఁ జండిక వేటున వాఁ డచేష్టుడై

212


మ.

పడి యాలోనన లేచి శుంభుఁడు బృహద్భాహాబలం బేర్పడం
గడువేగంబున దేవిఁ బట్టుకొను వీఁక న్మీఁదికి న్దాఁటిన
న్వడి దోశ్శక్తు లెలర్పఁ బోరి రసమానస్ఫూర్తు లంతంత నే
పడర న్జండికయు న్సురాహితుఁడు లోకాశ్చర్యసంపాదు లై.

213


ఆ.

దనుజరాజుతోడఁ దడవుగా నభమున, లీల మల్లయుద్ధకేలి సలిపి
దేవి వానిఁ జుట్టి త్రిప్పి రయంబున, నెత్తి వైచె వీఁక నిల చలింప.

214


క.

క్షిప్తుం డయ్యును దనుజుఁడు, లుప్తభుజాబల మెలర్ప లోన న్ముష్టి
ప్రాప్తిం జండికఁ బొరిగొన, సప్తార్చిఃప్రతిమకోపసంరంభుండై

215


వ.

సింహనాదంబు సేయుచుం గవిసిన నమ్మహాభైరవి రూక్షేక్షణంబుల వాని
నిరీక్షించి.

216


క.

శూలమున నురము వ్రచ్చినఁ, గూలె గతాసుఁ డయి దైత్యకుంజరుఁ డంత
న్శైలారణ్యాబ్ధిద్వీ, పాలంకృత యైన నేల యల్లల్లాడెన్.

217


వ.

ఇవ్విధంబున ద్రిభువనకంటకుం డగుశుంభుండు చండికచేత నిహతుం డైన సకల
జగంబులు స్వస్థత్వంబు నొందె నదులు మార్గవాహిత్వంబు భజించె నంబరం బమల
త్వంబు నంగీకరించె వాయువులు సుగంధబంధురంబు లై సుడిసె దేవతలు మును
లునుం బరమానందంబునం దేలిరి దివ్యదుందుభులు మొరసె గంధర్వగీతంబులు
నప్సరోంగనానర్తనంబులు వర్తిల్లెం బ్రభాకరుండు ప్రచురప్రభం బ్రజ్వరిల్లె
వహ్నులు శాంతత్వంబున వెలింగె దిగ్గజంబులు మనోహరస్వరంబులు నిగిడించె
నంత.

218

దేవతలు నారాయణిని స్తుతించుట

క.

పరమేశ్వరి శుంభుని నిటు, పొరిగొనిన వికాసివక్త్రపులకితతనుసుం
దరు లగుచు నింద్రశిఖిముఖ, సుర లందఱు దేవిఁ బొగడఁజొచ్చిరి భక్తిన్.

219


క.

శరణార్థులహృదయార్తులు, హరింతు జగములకుఁ దల్లివై యుండుదు నీ
వరయఁ జరాచరముల కీ, శ్వరి వఖిలము గావుమీ ప్రసన్నదయ శివా!

220

క.

ధరణీరూపంబున నీ, వరయఁగ నాధారభూత వై త్రిజగముల
న్ధరియింతు జలాకారత, స్థిరముగ నింతకును దనుపు సేయుదు తల్లీ!

221


తే.

దేవి! వైష్ణవశక్తివి నీ వనంత, వీర్యమహనీయమూర్తి వీవిశ్వమునకు
బీజ మైనమహామాయ వీజగములు, మోహజలధి నీమహిమను మునుఁగుచుండు.

222


వ.

దేవీ! సమస్తవిద్యలును సకలవనితలును నిఖిలజగంబులును నీభేదంబులు నీచేతన చేసి
సర్వంబును సంవ్యాప్తంబై యున్నయది నీవు సర్వభూతాత్మికవు సర్వజనహృద
యంబులందును బుద్ధిరూపంబున నున్నదానవు భుక్తిముక్తిప్రదాయినివి నిన్ను
సంస్తుతింపం దగుపరమోక్తు లెక్కడివి? నీమహిమ యెవ్వ రెఱుంగుదు? రని
మఱియును.

223


దండకము.

శ్రీవిష్ణుశక్తీ! జగన్మూలశక్తీ! త్రిశక్తీ! మహాశక్తి! నారాయణీ! దేవి!
మా మ్రొక్కు గైకొమ్ము కాష్ఠాదికాలస్వరూపంబులం జేసి పాకంబు గావించి
లోకంబుల న్మ్రింగు నారాయణీ! దేవి! మామ్రొక్కు గైకొమ్ము సర్గస్థితిధ్వంస
నంబు ల్పొనర్ప న్నిమిత్తంబ త్రైగుణ్యమూర్తీ! జగద్గీతసత్కీర్తి! నారాయణీ!
దేవి! మా మ్రొక్కు గైకొమ్ము రమ్యాక్షసూత్రాదిచిహ్నావలిం దాల్చి హంసంబు
పై నీవు బ్రహ్మాణివై యొప్పు నారాయణి! దేవీ! మామ్రొక్కు గైకొమ్ము
వాలుం ద్రిశూలంబుఁ గేల న్వెలుంగంగ బాలేందురోచు ల్జటాలంకృతిం జేయ
మాహేశ్వరీమూర్తిఁ బెంపారి యాబోఁతుమీఁద న్వెలుంగొందు నారాయణీ!
దేవి! మామ్రొక్కు గైకొమ్ము హస్తమ్ముల న్జక్రశంఖాదిలోకప్రశస్తాయుధము
ల్మెఱుంగారఁ గా వైష్ణవీరూపలీల న్విహారంబు గైకొన్న నారాయణీ! దేవి!
మామ్రొక్కు గైకొమ్ము రాజన్మయూరంబుఁ దేజంబుతో నెక్కి చే శక్తి శోభిల్లఁ
గౌమారివై పొల్చునారాయణీ ! దేవి! మా మ్రొక్కు గైకొమ్ము వారాహి వై యేక
దంష్ట్రంబున న్నీవు ధాత్రీతలం బెత్తి శ్రీనారసింహాకృతిన్ దైత్యులం ద్రుంచి
లోకైకరక్షావిధి న్ధన్య వైనట్టినారాయణీ! దేవి! మామ్రొక్కు గైకొమ్ము
చూడాకిరీటంబు దోర్వజ్రము న్బ్రజ్వరిల్లంగ వేగన్నులుం గ్రాల వృత్రాది
వీరారులం ద్రుంచి మాహేంద్రివై యున్ననారాయణీ! దేవి! మామ్రొక్కు
గైకొమ్ము శ్రీకంఠదూతీ! శివా! ఘోరనాదంబు మ్రోయంగ దైతేయులం జంపి
నుగ్రాజిఁ జెల్వారు నారాయణీ! దేవి! మామ్రొక్కు గైకొమ్ము దంష్ట్రాకరాళాన
నంబు న్శిరోమాలికాదీఫ్తిజాలంబును న్దేజరిల్లంగ సంగ్రామరంగంబునం జండముం
డాదులం గిట్టి చెండాడి చాముండ వై మేదిని న్బెంపున న్మీఱునారాయణీ! దేవి!
మామ్రొక్కు గైకొమ్ము లక్ష్మీస్వథాపుష్టిలజ్జా మహారాత్రివిద్యాదిరూపంబుల
న్బూజ్య వై యుండు మేధావిభూతీ! శివా! వాణి! శర్వాణి! నారాయణీ! దేవి!
మామ్రొక్కు గైకొమ్ము సర్వంబునం బాణిపాదాస్యము ల్గల్గి సర్వంబున న్నీర్ష
నేత్రాంగము ల్గల్గి సర్వంబున న్నాసికాకర్ణము ల్గల్గి సర్వంబు నీవైనసర్వేశ్వరీ!

సర్వశక్త్యాత్మికా! సర్వరూపా! మహాదుర్గ! మామ్రొక్కు గైకొమ్ము మమ్మర్థి
రక్షింపు ముక్కన్నులం జాలఁ జెన్నొందు నీమోము కాత్యాయనీ! మమ్ము నేభీ
తియుం బొందకుండంగ రక్షించు రక్షోగణాభీల మై నీదుశూలంబు శ్రీభద్ర
కాళీ! మముం దాన రక్షించు నాదంబున న్దిక్కు లల్లార్చు నీఘంట దోషంబులం
దోలి మ మ్మెప్డు రక్షించు నక్తంచరశ్రేణిరక్తంబునం దోఁగి కెంజాయ రంజిల్లునీ
వాలు మ మ్మేలుచు న్మేలు గావించు రోగంబులం బాచి రాగంబుతో నీవు
మాకుం బ్రసాదింపు సంతుష్ట వై యిష్టకామంబు లేప్రొద్దు దేవీ! నిను న్భక్తి
సేవించుసద్భక్తసంఘంబు లెన్నండు నేదుఃఖము ల్పొంద కేబాధలం జెంద కానంద
లీల న్సుఖంబుండఁ గాంచు న్సమస్తైకభద్రా! సమస్తైకపుణ్యా! నమస్తే నమస్తే
నమః.

224


ఉ.

ధర్మవిరోధు లైనబహుదైత్యులఁ జంప ననేకరూపము
ల్పేర్మి మెయి న్ధరించి యిటు భీమరణం బొనరించి గెల్చి తీ
నిర్మలభూతిమై నెగడ నేర్పరి యెవ్వతె నీవుదక్క దుః
ఖోర్మికరాళసంసృతిపయోనిధిబాడబమూర్తి! యంబికా!

225


సీ.

సకలవిద్యాశాస్త్రసరసకావ్యంబుల యం దెల్ల నీవు చెల్వొందియుండు
దమితమమత్వగర్తమహాతమంబునఁ ద్రిప్పు దీవిశ్వంబు దేవి! నీవ
యెచట రాక్షసగణం బెచట సర్పోత్కరం బెచట శాత్రవచయం బెచట నబ్ధి
యెచట దావానలం బెచటఁ దస్కరకోటి యతిభీతిఁ బుట్టించు నచట నుండి


తే.

విశ్వమును నీవ రక్షింతు విశ్వమునకు, నీశ్వరివి నీవ విశ్వంబు నీవ తాల్తు
నీవు విశ్వేశవంద్యవు నీకు భక్తిఁ, బ్రణతు లగువారు విశ్వేశపదవి గంద్రు.

226


ఉ.

భీతుల మైనమమ్ముఁ గృపపెంపున నిప్పుడు గాచినట్లు సం
ప్రీతిఁ బ్రసన్న వై యసురబృందముఁ గ్రాచుచుఁ గావు మమ్ము నీ
భూతి వెలుంగ నెప్పుడును బూని జగంబులఁ గల్గు మేఘజో
త్పాతమహోపసర్గదురితంబు లడంపుము తల్లి! శాంభవీ!

227


తే.

విశ్వవిశ్వార్తిహారిణి! విశ్వవంద్య! సుప్రసన్న వై యనుకంప సొంపు మీఱ
నెప్పుడును భక్తసంస్తుత్య వీత్రిలోక, వాసు లగువారి కెల్లను వరద వగుము.

228


చ.

అనవుఁడు దేవి! నే వరద నైతి నభీష్టవరంబు లిచ్చెద
న్గొనుఁడు నిలింపులార! మదిఁ గోరుఁడు నావుడు వారు సర్వలో
కనిఖిలకాలబాధ లొగిఁ గ్రాఁచుట యస్మదరాతివర్గనా
శన మనిశంబుఁ జేయుటయు శాంభవి! మా కవి చాలు నిష్టముల్.

229

దేవతలకు దేవి తనభవిష్యదవతారములఁ జెప్పుట

వ.

అని దేవతలు వేఁడిన నమ్మహాదేవి యిట్లనియె నీవైవస్వతమన్వంతరంబునం దిరువది
యెనిమిదియవమహాయుగంబున శుంభనిశుంభులు గ్రమ్మఱ నుద్భవింతురు నేనును

నందగోపకులంబున యశోదాగర్భంబున నావిర్భవించి యారాక్షసులను సమయించి
వింధ్యాచలంబున వసియింతు నది నిమిత్తంబుగా వింధ్యవాసిని యనం బరఁగుదు
మఱియు రౌధ్రం బగురూపంబున నవనీతలంబున నవతరించి వైప్రచిత్తాదిత్యు
లం బెక్కండ్ర భక్షింతు నప్పుడు మదీయదంతంబులు దాడిమీకుసుమంబులుంబోలె
రక్తంబులగు నది నిమిత్తంబుగా మర్తామర్త్యలోకవాసులు నన్ను రక్తదంతియని
కీర్తింపుదురు శతవర్షావగ్రహంబునం జేసి జగంబులు నిర్జలంబులై యున్న మహా
మునులు భయంబంది న న్నభినందించిన నయోనిజనై భూమియందుం బ్రభవించి
శతనేత్రంబుల నమ్మునుల నాలోకించి వారిచే శతాక్షీనామప్రశంసావిశేషంబు
నొంది యశేషలోకంబు నస్మచ్ఛరీరసంభూతశాకాహారంబుల భరియించి శాకం
భరి యను పేరం బరగుదు దుర్గముం డనుదుష్టాసురుం జంపి దుర్గాభిధానంబు
గైకొందు భీమవేషంబున హిమవంతంబున నెలకొని సంయమిత్రాణార్థంబు పూర్వ
గీర్వాణవ్రాతంబు నడంచి భీమాహ్వయంబు నంగీకరింతు సకలలోకాపకారి యగు
వరుణుం డనువాని భ్రమర్యాకారంబునం బరిమార్చి భౌమరీసమాఖ్యం బ్రఖ్యాతి
వహింతు నివ్విధంబున నేను మఱియును దనుజబాధ లెప్పుడు వర్తిల్లు నప్పు
డెల్లను జన్మించి యద్దనుజుల భక్షించి భువనంబులు రక్షింపఁ గలదాన నని చెప్పి
యప్పరమేశ్వరి సురేశ్వరులం గరుణావలోకనంబుల నాలోకించి.

230


క.

నను నీస్తవమున నెవ్వం, డనుదినమును భక్తితో సమాహితమతియై
వినుతించు నతనియాపద, లనయంబును నే నసంశయంబుగఁ గ్రాతున్.

231

సప్తశతీపఠనఫలశ్రుతి

సీ.

మధుకైటభాసురమథనప్రకారంబు మహిషభంజనకథావిహరణంబు
శుంభనిశుంభవిశుంభనక్రీడయు నాదుమాహాత్మ్యంబు నాదరంబు
తో నెవ్వ రొగి నష్టమీనవచతుర్దశులఁ గీర్తింతురు దవిలి భక్తి
వారి నఘంబులు చేర వాపదలు పొందవు దరిద్రత్వంబు దనుక దరిభ


తే.

యమును దస్కరభయమును నగ్నిభయము, శస్త్రభయరాజభయములు జలభయంబు
భూతభయమును బాయు నెప్పుడు ననేక, భూరిసంపద లుడుగక పొందుచుండు.

232


క.

వినవలయుఁ జదువవలయు, కొనియాడఁగవలయు భక్తి కొనలు నిగుడఁ గా
ననిశము మన్మాహాత్మ్యం, బనుపమశుభలాభములకు నది తెరు వగుటన్.

233


క.

వినుము మహామారీసం, జనితం బగుదారుణోపసర్గవికారం
బును విధోత్పాతభయం, బును మన్మాహాత్మ్యపఠనమున శమియించున్.

234


సీ.

ఎచట నామాహాత్మ్య మెప్పుడు పఠియింతు రచటు నానిలయ మే నచటు విడువ
నగ్నికార్యమహోత్సవారంభబలిదానసమయంబులందు మచ్చరిత మర్థిఁ

జదువుట వినుట ప్రశస్త మెఱిఁగి యైన నెఱుఁగక యైనను నెవ్వ రేని
బలిపూజనాహోమములు మదర్థములు గాఁ జేయరే యని ప్రతీక్షింతుఁ బ్రీతి


తే.

నట్లు గానఁ బ్రావృట్ఛరదాగమముల, నధికభక్తి మహాపూజ యాచరించి
నన్ను సేవించుమనుజుండు నా ప్రసాద, మున ధనము ధాన్యమును గల్గి మూరిఁబోవు.

235


శా.

నామాహాత్మ్యము విన్న మానవులకు న్సమ్యక్ఛుభోత్పత్తి సం
గ్రామాజేయపరాక్రమంబు ప్రతిపక్షవ్రాతనాశంబు సు
శ్రీమాంగళ్యము గల్గు వంశములు సచ్ఛీలములన్ సమ్మద
శ్రీ మించ న్విలసిల్లుఁ బుత్రుఁడు గుణశ్రేష్ఠుండు పుట్టు న్గడున్.

236


తే.

శాంతికర్మంబులందు దుస్స్వప్నదర్శనంబులందును గ్రహపీడనంబులందు
వేడ్క నాదుమాహాత్మ్యంబు వినఁగవలయు, సంక్షయము నొందు సర్వోపసర్గములును.

237


క.

బాలగ్రహములు సోఁకిన, బాలురకును శాంతి యొనరు బహుజనములకు
న్జాల న్భేదమున న్మై, త్రీలక్ష్మి ఘటించు మచ్చరిత్రము విన్నన్.

238


ఆ.

దుశ్చరిత్రు లెల్ల దుర్బలు లగుదురు, భూతములు పిశాచములును రాక్ష
సావలియును నాశమందు మన్మాహాత్మ్య, పఠనగౌరవమున భవ్యులార!

239


వ.

ఉత్తమంబు లగుగంధపశుపుష్పార్ఘ్యధూపదీపంబులను విప్రభోజనంబులను హోమం
బులను బ్రేక్షణీయంబులను మఱియు వివిధోపభోగంబులం జేసి యేఁడుగాలంబు
నాకుం బ్రీతి యొనర్చు మదీయజన్మకీర్తనసమరప్రవర్ధనాత్మిక మైనచరితంబు నిత్యం
బును సకృదుచ్చరితము శ్రుతమును గావించిన నది దురితంబు లపహరించు నారో
గ్యంబు నావహించు భూతభయంబువలన రక్షించు వైరిపీడ యడంచు మీరును
మహామునులును బ్రహ్మయుం జేసినస్తోత్రంబులును సమస్తశుభంబుల నిచ్చు నని
వెండియును.

240


సీ.

కార్చిచ్చు వొదివినఁ గరిసింహశార్దూలతస్కరశాత్త్రవు ల్దగిలి పట్టు
కొన్నను రాజులు కోపించి చంపఁ బుచ్చినఁ జెఱఁ బెట్టిన వనధినడుమఁ
గలమెక్కి చనఁ జెడుగాలి బెట్టడిచిన బవరంబులోనఁ గైదువులు మీఁదఁ
దఱచుగాఁ బడినను దలముక్క లగువగ లొదవిన నేకీడు నొంద కన్ని


ఆ.

సంకటములవలనఁ జయ్యన నటు వాసి, బ్రదుకుదురు ముదమునఁ త్రిదశులార
నన్ను నాత్మ నిలిపి నాదుమాహాత్మ్యంబు, నర్థిఁ జపముఁ జేయునట్టిజనులు.

241


క.

పెనుఁబాము గఱచినను బగ, గొని వెను తవిలినను ద్రాఁచు గుఱి మచ్చరిత
మును దలఁచిననరు విడుచు, న్జను దువ్వుగ వైరిదస్యుశార్దూలతతుల్.

242


క.

అని ప్రీతిఁ జెప్పి యంబిక, యనిమిషవరు లెల్లఁ జూడ నంతర్ధానం
బును బొందె మేదినీశ్వర, యనుపమసంతోషభరితులై సుర లంతన్.

243


క.

తమతమపురములకుం జని, తమతమయధికారముల యథాస్థితి రక్షా
క్షము లగుచుండిరి సతతము, తమతమక్రతుభాగములు ముదంబునఁ గొనుచున్.

244

ఆ.

అవనీనాథ యిట్టు లాదేవి తా నిత్య, యయ్యు జన్మలీల లాదరించు
జగము లర్థిఁ గాచు జగములు నిర్మించు, మోహమున జగములు మునుఁగఁ జేయు.

245


క.

మానుగ సంపదయును వి, జ్ఞానము దయచేయు దేవి సద్భక్తి మది
న్బూని తనుఁ గొలిచి కోరిన, మానవులకుఁ బ్రీతితోడ మానవనాథా!

246


వ.

మహాకాళియు మహాదేవియు మహామారియు ననురూపంబుల బ్రహ్మాండం బంత
యు నద్దేవి తాన యభివ్యాపించి యుండుఁ గాళియుఁ గౌమారియు సృష్టియు
భవయు నజయు ననునామంబుల దాన పరగు నాసనాతని దాన సకలభూతంబులకు
సంస్థితియొనర్చు లక్ష్మి యనఁ దాన మనుష్యులకు సమృద్ధి యొసంగు వినాశసమ
యంబున నలక్ష్మి యనందాన యవతరించు.

247


తే.

పుష్పగంధధూపాదిసంపూజితయును, సంస్తుతయు నైనయద్దేవి జనుల కొసఁగు
ధనము ధాన్యంబు పుత్రులు ధర్మమార్గ, కలితశుభబుద్ధియును రాజగణవరేణ్య!

248


క.

దేవీమాహాత్మ్యం బిది, భూవర! చెప్పితి సమస్తమును నీ కి ట్లా
దేవి యవిద్యయు విద్యయు, నా విను తా విష్ణుమాయ నాఁగా నొప్పున్.

249


క.

ఆవిష్ణుమాయచేత మహీవల్లభ! యెట్లు నీవు నీవైశ్యుండు
న్గోవీదు లగునితరులు మో, హావిలమతు లట్టు లెప్డు నటు గాన వడిన్.

250


క.

నరవర! నీ వప్పరమే, శ్వరిశరణము సొరుము దన్ను సద్భక్తిధురం
ధరులై కొలిచిన దయ న, న్నరులకు నాదేవి యొసఁగు నానాశుభముల్.

251


క.

అని చెప్పిన మునివాక్యము, విని సురథుఁడు మ్రొక్కి యతని వీడ్కొని చనియెన్
దనరాజ్యము గోల్పడుటను, ఘనమమతం జిత్త మెరియఁ గాఁ దపమునకున్.

252


వ.

సద్బుద్ధి యగువైశ్యుండును నతనితోడనే వెడలె ని ట్లిరువురుం జని యంబికాదర్శ
నార్థం బొకయేటితటంబున నిలిచి.

253


చ.

అతులితభక్తి మంటఁ దగ నంబికమూర్తి యొనర్చి దేవికి
న్సతతజపోపవాసములఁ జందనపుష్పసుపూజల న్నిజ
క్షతజనిమిశ్రితాన్నబలికల్పనల న్గడుఁబ్రీతి సల్పుచున్
క్షితిపవణిగ్వరు ల్దపముఁ జేసిరి పాయక మూఁడువర్షముల్.

254


ఉ.

వారితపంబు పెంపునకు వత్సల యై పొడచూపె నింపు పెం
పారఁగ దేవి మీయెడలఁ బ్రార్థ్యము లెయ్యవి వేఁడుఁ డిచ్చెద
న్సారగుణాఢ్యులార! యనిన న్నరనాథుఁడు వేఁడె రాజ్యము
న్వైరిజయంబు విూఁదటిభవంబున భ్రంశము లేనిరాజ్యమున్.

255


తే.

ఏను నాయది యనుసంగ మెడలఁజేయు, నిర్మలజ్ఞాన మడిగె వణిగర్వుండు
లలితకారుణ్యలతికపల్లవము లెసఁగ, మనుజవిభుఁ జూచి ము న్నిట్టు లనియె దేవి.

256


ఆ.

మనుజనాథ! కొన్నిదినముల నీరిపు, ప్రతతి నోర్చి రాజ్యపదవి నుందు
వొడలు దొఱఁగి రవికి నుదయించి సావర్ణి, మనుత నొంది రాజ్యఘనుఁడ వగుము.

257

క.

ఓవైశ్యోత్తమ! మనమున, నీ వర్థిం గోరినట్లు నిత్యజ్ఞాన
శ్రీవిభవము నీ కిచ్చితిఁ, గైవల్యానంతచిత్సుఖస్థితికొఱకున్.

258


వ.

అని దేవి యయ్యిరువురకును భుక్తిముక్తిప్రదంబు లగువరంబులు ప్రసాదించి
వారలు ప్రస్తుతించుచుండ నంతర్హిత యయ్యె నంత.

259


క.

పరమేశ్వరివరమున నిటు, సురథుఁడు సావర్ణి యనఁగ శోభిల్లి దివా
కరునకు జనించి మను వై, పరగంగలఁ డింక నతఁడు పరమమునీంద్రా!

260


వ.

అని మార్కండేయుండు క్రోష్టుకికి నెఱింగించిన తెఱంగు చెప్పి.

261


చ.

కలియుగకర్ణ! కీర్తిలతికావృతదిగ్గజకర్ణ! భూరిదో
ర్బలవిభవావధీరితసుపర్ణ! వివర్ధితలబ్ధవర్ణ! ని
ర్మలనిజధర్మపూర్ణ! నయమార్గసమార్జితసత్సువర్ణ! కా
వ్యలలితబద్ధనామగుణవైభవ! హృత్కమలస్ఫురద్భవా!

262


క.

భూదేవకదంబాశీ, ర్వాదసదామహితమందిరద్వార! మృషా
వాదవిదూర! నిరంతర, భూదానాద్యఖిలదానపుణ్యవిహారా!

263


మాలిని.

పరజనహితకారీ! బంధులోకోపకారీ!
సరసజనవరేణ్యా! సంతతాగణ్యపుణ్యా!
హరిపదనిహితాత్మా! హారిధర్మైకవర్తా!
పరుషవచనదూరా! భారతీకంఠహారా!

264


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజిప్రసాదలబ్ధసరస్వతీపాత్ర
తిక్కనామాత్యపుత్ర మారయనామధేయప్రణీతం బైనమార్కండేయమహా
పురాణంబునందు సురథవైశ్యు లపహృతవిభవు లై వేధ యనుమునియాశ్రమం
బున కరుగుటయు నయ్యిరువురకు నమ్మునివరుండు సంసారమోహంబునకుఁ గార
ణంబు మహామాయాప్రభావం బనియెఱింగించుటయు బ్రహ్మ యోగనిద్రా
దేవిం బ్రస్తుతించుటయు మధుకైటభులవధంబును సకలదేవతేజంబునం జండిక
యుద్భవించుటయు మహిషాసురవధంబును దేవతలు హిమవంతంబునకుం జని
దేవిం బ్రస్తుతించుటయు గౌరవచనంబు నందచ్ఛరీరంబునఁ గౌశికి యనుదేవి యావి
ర్భవించుటయు శుంభనిశుంభదూతాగమనంబును ధూమ్రలోచనువధమును
చండముండాసురవధంబును రక్తబీజవధంబును శుంభనిశుంభవధంబును దేవతా
స్తోత్రంబును దేవి దేవతలకు నభీష్టవరంబు లిచ్చుటయు దేవీమాహాత్మ్యప్రశంసయు
సురధవైశ్యులతపంబును, దేవీప్రసాదంబున సురథుండు రాజ్యంబు వడసి
దేహాంతరంబున నాదిత్యునకు సావర్ణిమనువై జన్మించుటయు వైశ్యుండు పరమ
జ్ఞానంబు వడసి సుఖి యగుటయు నన్నది షష్ఠాశ్వాసము.