మార్కండేయపురాణము/ప్రస్తావన

వికీసోర్స్ నుండి

ప్రస్తావన

ఈమార్కండేయపురాణము వ్రాసినకవి మారన. ఇతఁడు నియోగి బ్రాహ్మణుఁడు తిక్కనామాత్యునికుమారుఁడు ఉభయకవిమిత్రుఁడు కవిచూడామణి యగు తిక్కనసోమయాజిశిష్యుఁడు తనమార్కండేయపురాణము నీకవివర్యుఁడు కాకతీయవంశభూషణుఁ డగు ప్రతాపరుద్రచక్రవర్తియొద్ద సేనాని యగుగన్నయ్యకుఁ గృతియొసంగెను. ఈగన్నయ నియోగి యనియు, రామాయణము మడికి సింగనవలనఁ గృతినొందిన కందనమంత్రికిఁ దాత యనియు, రావుబహదూరు వీరేశలింగము పంతులుగారు కవులచరిత్రమున వ్రాసియున్నారు చిలుకూరివీరభద్రరావుగా రాంధ్రులచరిత్రము రెండవభాగములో గన్నమంత్రి కమ్మసేనాని యని వ్రాసియున్నారు మార్కండేయపురాణములోని కృత్యాది యీయుభయుల నిర్ధారణమునకు వ్యతిరేకముగ నున్నది.

మ.

అమలంబున్ ద్విజరాజవర్ధనము మర్యాదాన్వితంబున్ గుణో
త్తమరత్నంబు ననంతభోగమహిమోదారంబు గాంభీర్యధు
ర్యము శ్రీజన్మగృహంబునై శుభయుతంబై యాచతుర్థాన్వయం
బమృతాంభోనిధిమాడ్కి నుర్విఁ గడుఁ బొల్పారున్ జనస్తుత్యమై.

(పీఠిక.ప.29)


ఆ.

ఆచతుర్థకులసుధాంబుధి నుదయించె, నమితశాంతిచంద్రుఁ డవనిభరణ
దిగ్గజేంద్రమును వితీర్ణిమందారంబు, మల్లసైన్యవిభుఁడు మహితకీర్తి.

(పీఠిక.ప.30)

పైపద్యములవలనఁ గృతిపతి యగుగన్నయనేనాని శూద్రుఁడనిమాత్రము తేలుచున్నది. కమ్మసేనాని యనియు, నియోగి యనియు వాకొనుట కాధారము లున్నటులఁ దోఁపదు.

మఱియు నీగన్నయసేనానిని, వీరేశలింగము పంతులుగారు, వీరభద్రరావు పంతులుగారు సమముగ గన్నమంత్రి యని వ్యవహరించిరి ఇతనికి మంత్రి యనువిశేషణ మున్నటుల గ్రంథాధారములు లేవు చూడుఁడు

శ్రీగన్నసైన్యాధిపున్ (పీఠిక. ప. 2.)గన్నసైన్యవిభుఁడు (పీఠిక. ప. 39.)

గన్నరథినీపాలున్ (పీఠిక. ప. 3.)గన్నరథినీపతికిన్ (పీఠిక. ప. 46.)

కమ్మదొర యనియు నియోగి యనియుఁ గృతికర్తను వ్యవహరించుట యెట్లు భ్రాంతియో మంత్రి యని పేర్కొనుటయు నటులె భ్రాంతి.

గన్నయసేనానిశాసనములు నిజాముమండలమున మేము శోధించినంతలో నెచ్చటను లభింపలేదు కావున ప్రకృతకథకుఁ జరిత్రాంశములు మార్కండేయపురా ణమునుండి యార్జింతము. గన్నవిభుఁడు సేనానాయకత్వము రాజచిహ్నములు ప్రతాపరుద్రుని పరాక్రమముచే మెప్పించి యార్జించినటుల నీపద్యమువలనఁ దెల్ల మగుచున్నది

చ.

ఎలమిఁ బ్రతాపరుద్రమనుజేంద్రునిచేఁ బడసెన్ బ్రవీణుఁడై
కొలిచియు శౌర్యలీల రిపుకోటి రణావనిఁ గీటడంచియు
న్బలరిపుతుల్యవిక్రముఁడు నాగయగన్నవిభుండు తేజమున్
విలసితరాజచిహ్నములు విశ్రుతలక్ష్మియు నాయకత్వమున్.

(పీఠిక.ప.40)

దీనింబట్టి ప్రతాపరుద్రచక్రవర్తి రాజ్యపాలనమునకు వచ్చిన పిమ్మట (అనఁగా: మధ్యవయస్సున) గన్నయ సేనానాయకపదవి నొందియుండును కృతి నటుపిమ్మట స్వీకరించియుండును. ప్రతాపరుద్రుఁడు 1295 ( క్రీ. శ.) మొదలు 1321 వఱకుఁ బాలించుటచే గన్నయ కృతినందిన కాలము రమారమి 1310 ప్రాంతములలో నని యూహింపనగు.

గన్నయవంశము పరాక్రమభూషిత మైనది. ఇతనితాత మల్లవిభుఁడు సేనానాయకుఁడు. తండ్రి కాకతీయగణపతి యనుంగుతలవరి యగుమేచయకు నల్లుఁడు. తాను ప్రతాపరుద్రునిసేనాని తమ్ముఁడు ఎల్లయ్య రాజనీతిజ్ఞుఁడు. కడసారితమ్ముఁడు మేచయ ప్రతాపరుద్రుని నాని మహాధికారి ఆప్తుఁడు. ఇట్టి పవిత్రవంశసంజాతుఁ డగుగన్నయ కృతి స్వీకరింప వాంఛించుట మారనయంతకవి కృతి యొసంగుటయుఁ ద్రిలింగభాషాసుకృతము.

కృత్యాదియందలి "ప్రతాపరుద్రదేవ సామ్రాజ్యవర్ధన స్థిరవినీతికరణ కుశలుఁడు ” అను వాక్యముచే గన్నసేనాని ప్రతాపరుద్రునిచెంత రాజకీయకార్యధురంధరుఁడనియు, "కాకతిక్ష్మాతలాధీశకటకపాలుఁడు” అను వాక్యముచే గన్నసేనాపతి ఏకశిలానగరపరిపాలకుఁ డనియుఁ దెలియును గన్నయ్యసేనాని జీవితమును బరాక్రమాదికమును దెలుపు శాసనములు లేవనఁజాలము. నిజామురాష్ట్రమునందలి యాంధ్రభాగమునఁ గాకతీయుల సేనానాయకులు నెలకొల్పిన శాసనములు వేలకొలది గలవు వాఙ్మయసేవాధురంధరుఁడగు గన్నసేనాని శాసనము లింతవఱకు లభింపకుంట సంతాపకరము.

మార్కండేయపురాణము కృత్యాది, ఆశ్వాసాంతపద్యములుచూడ గన్నయసేనాని రూపవంతుఁ డనియుఁ బరాక్రమశాలి యనియుఁ బ్రభుభక్తిపరాయణుఁ డనియుఁ దేలుచున్నది. అంతియ కాక—

ఉ.

వారవిలాసినీవదనవారిజమిత్ర! సమగ్రవిద్విష
ద్భూరుహవీతిహోత్ర! గుణభూషణభూషితగాత్ర! నిర్మలా
చారపవిత్ర! సూరివనజైత్ర! వివర్థితగోత్ర! భూమిపం
కేరుహకేళిలోలసితకీర్తిరమేశ్వర పూజితేశ్వరా.

(ఆ. 7.285)

పై పద్యమువలన గన్నయనేనాని వారవధూలంపటుఁ డని తెలియుచున్నది. అందులకు లక్ష్యము మఱికొన్ని విశేషణములు మారన వాకొనియున్నాఁడు. చూడుఁడు.

భామినీచిత్తధామాః భామినీపంచబాణా; మారాస్త్రదళితచేతో, నారీజనసుప్రసన్న; ప్రౌఢస్త్రీమకరాంశా; కామినీభద్ర; బాలారతికేళీపాంచాలా;

గన్నసేనానియందు వారస్త్రీలోలత్వ మున్నటుల పైవిశేషములతో బలపఱుపవచ్చును మనసేనానికిఁ బాలకుఁ డగు ప్రతాపరుద్రచక్రవర్తియు వారకాంతాలోలుఁ డని వల్లభామాత్యుని క్రీడాభిరామము వాకొనుచున్నది.

శా.

ద్వీపాంతంబున నుండి వచ్చితివె భూదేవా! 'ప్రశాంతం మహా
పాపం' సర్వజగత్ప్రసిద్ధసుమనోబాణాసనామ్నాయవి
ద్యోపాధ్యాయి ప్రతాపరుద్రధరణీశోపాత్తగోష్ఠీప్రతి
ష్ఠాపారీణ నెఱుంగ వయ్యెదవు మాచల్దేవివారాంగనన్.

(క్రీడాభిరామము)

కాకతీయుల రాజ్యవిజృంభణకాలమందు పలువురు సేనానాయకులు తలవరులు దేవళములు కట్టించి కృతులు స్వీకరించి దానము లొనర్చి స్థిరకాయు లైరి. వారివారిపవిత్రజీవితాదర్శములు నేఁటికిఁ గనుమాయకున్నవి.

మారనకవి

ఇతఁడు తిక్కనసోమయాజిపుత్త్రుఁ డని కొంద ఱనుచున్నారు. ఇది సమంజసము కాదు గురునామము పితృనామము నొకటిగ నుంటచేఁ గలిగినభాంతియే యిది.

గద్య.

"శ్రీమదుభయకవిమిత్ర తిక్కన సోమయాజిప్రసాదలబ్ధసరస్వతీపాత్ర తిక్కనామాత్యపుత్ర"

ఇట్లు గద్యలో మారనకవి జనకుఁ డగుతిక్కనామాత్యుని వేఱుగను, గురుఁ డగుతిక్కనసోమయాజిని వేఱుగను వాకొని యున్నాఁడు. ఇతఁ డింక నేమేనిగ్రంథము లొనరించినటులఁ దెలియరాదు కవియొక్క పవిత్రమగు జన్మస్థానమునేని తెలిసికొన నాధారములు లేవు. కవిస్తుతిలో నీతఁడు నన్నయ్యను తిక్కనసోమయాజిని మాత్రమే స్తుతిచేయుటచే నెఱ్ఱాప్రగడ భారతభాగము వ్యాప్తికి రానిభాగమున నీకవియున్నటు లూహింపవచ్చును మారన గొప్పలాక్షణికకవి. కవిత్వము సరళముగ శ్రావ్యముగ దేశీయములతో నిండియుండును రసపోషణసంవిధానమున నీకవి తనలేఖనిని మనోభావప్రకటనమునకే నియోగించుచుండును. మొత్తముమీఁద నీకవి కథాంశములఁ గౢప్తముసల్పి సముచితము లగువర్ణనలకుఁ దా వొసంగి కావ్యనిర్మాణ మొనరించుటలో మిగుల నేరుపుగలవాఁడు వర్ణనాంశములకంటె కథాంశములకె యీకవి విలువ గలతనకావ్యమునఁ దానొసంగును. ఈయంశమునను ఈతఁడు తిక్కనసోమయాజిశిష్యుఁ డని చెప్పఁదగినవాఁడె వివిధన్యాయాధ్యాత్మికకథాబంధుర మగునీపురాణమున నెటులో వీలు గలిగించికొని తనసహజకవితాధారతో నాయికల దివ్యస్వరూపములు సాత్వికశృంగార రసముతో నీకవి మనోహరముగఁ జిత్రించియున్నాఁడు. ప్రతిబింబము లిటు లుండ మాతృక లెటు లుండునో యను భ్రాంతి యీయన కవిత్వ మెల్లరకుఁ గలిగించుచుండును. చూడుఁడు.

శృంగారము:—
ఉ.

ఆనగుమోముచెన్ను శశియందును బంకరుహంబునందు లే
దానయనప్రభాతి మదనాస్త్రములందు మెఱుంగులందు లే
దానునుమేనికాంతి లతికావలియందుఁ బసిండియందు లే
దానలినాయతాక్షిలలితాకృతి నామదిఁ బాయనేర్చునే.

(ఆ. 2. 161.)


సీ.

మెఱయు క్రొమ్మెఱుఁగులమించును మెలఁతగా మీనకేతనుఁడు నిర్మించినట్లు
చారుశృంగారరసము తేట నింతిగా నించువిల్తుండు చిత్రించినట్లు
నవకల్పలతీకల నవకంబు నాతిగా శ్రీనందనుఁడు సంతరించినట్లు
నిండారుచందురు నినుపారునునుఁగాంతిఁ జెలువుగా మరుఁడు సృజించినట్లు


తే.

విస్మయంబైన లావణ్యవిలసనమునఁ, బొలుచు నమ్మదాలసఁ జూచి భూపసుతుఁడు
విగతలజ్జుఁడై ననుబాసి వెలఁది యెందు, బోయి తనుచు నాదటఁ జేరఁబోవుటయును.

(ఆ. 3. 93.)

ఇట్లే శృంగారరసము నీకవి సర్వాంగవర్ణనము లొనరింపక భారతకవులమార్గము ననుసరించెను ధారాళముగ నీకవికవితాధార తిక్కనసోమయాజి భారతకవిత్వమునకుఁ బోలిక కలదిగఁ గన్పట్టును, వర్ణనాంశములయందు ముఖ్యముగ సోమయాజిభారతభాగముల మనసున నుంచికొని వ్రాసినటుల నుభయగ్రంథములు సమగ్రముగ శోధించినఁ దోఁపకపోదు. నిదర్శనము చూడుఁడు.

సీ.

చంచులఁ జిగురాకుఁ జించి యాడుచు నలి నెలుఁగిచ్చు గండుకోయిలలసొంపు
నలరుఁదేనియఁ గ్రోలి యొలయుసోలంబున మురియు తేఁటులనునుమ్రోఁతయింపుఁ
దమి పండ్లరస మాని తమలోనఁ జెలఁగుచుఁ బల్కు రాచిల్కలపదుపురంగు
కొలఁకులఁ గెలఁకులఁ గూడి క్రీడించుచుండెడు నంచతండంబునడబెడంగు


తే.

దరగఁ దేలుచుఁ బూదీఁగఁ దగులుపడుచు, వచ్చుచిఱుగాలి సోకున కిచ్చ మెచ్చి
తగిలి కొనియాడుచును వినతయును గద్రు, వయును మున్నీటిచేరువవనమునందు.

(తిక్కనసోమయాజి. భారతము)

సీ.

విరులగుత్తులమీఁద గురువులు వాఱుచు ముద్దిచ్చు తేఁటుల మొరపములకుఁ
జిగురుజొంపములలోఁ జిఱ్ఱుముఱ్ఱాడుచుఁ గెరలుకోయిలలసుస్వరములకును
నెలమావిలతలపైఁ గలఁ గొనఁ దారుచుఁ జెలఁగు చిల్కలకల్కిపలుకులకును
నలరులనెత్తావి నెలమిగాఁ జిలుకుచు సుడియుమందానిలుసొంపునకును


తే.

గళవళించుచు గెందమ్మికొలఁకులందు, గేలి యొనరించు జక్కవ మేలిలీలఁ
గోర్కు లంతంతకును నెడఁ గొనలు నిగుడ, మదనమార్గణవిదళితహృదయ యగుచు.

(ఆ.5.7.)

ఇట్లే పరిశోధించినఁ దిక్కనసోమయాజి పద్యములపోలిక గలపద్యములు మార్కండేయపురాణమునఁ గలవు. దీనిచే గురునికవిత్వముపై శిష్యున కెంతయాదర మున్నది గ్రహింపవచ్చును. నన్నయభట్టారకుఁడు మొదలు శ్రీనాథకవివఱకుఁ గలమహాకవులగ్రంథములలో సామాన్యముగ గురుస్తుతి కానరాదు. ఇది యాకాలమున ననుచారముగ లేదని తోఁచుచున్నది. గురుస్తుతి అల్లసాని పెద్దననాఁటనుండి యథేచ్ఛగ గ్రంథములలోఁ జలిపి రని యూహింపవచ్చును. ఈమార్గమున కల్లసాని పెద్దనకుఁ ద్రోవఁ జూపినవాఁడు మనమారనకవియే. ఒకగురుస్తుతికే కాదు స్వారోచిషమనుసంభవకథాదాతయు నూతనభావప్రదాతయు నీతఁడే అల్లసానికవి మార్కండేయపురాణమునందుఁ బ్రమాణభావముఁ గలవాఁడని యాతనిపద్యరచనవలన స్పష్టపడుచున్నది.

ఉ.

ఈసుకుమారుఁ డెవ్వఁడొకొ యిందుల కెందులనుండి వచ్చెనో
భాసురరూపకాంతి జితభావజచంద్రుఁ డితండు రాగలీ
లాసరసత్వ మొప్పఁ గడులాలసుఁడై ననుఁ జూచె నేని నేఁ
జేసినపుణ్య మెవ్వరును జేయరు కాముని దక్క నేలుదున్.

(మార్కండేయ)


ఉ.

ఎక్కడివాఁడొ యక్షతనయేందువసంతజయంతకంతులన్
జక్కఁదనంబునన్ గెలువఁజాలెడువాఁడు మహీసురాన్వయం
బెక్కడ యీతనూవిభవ మెక్కడ యేలని బంటుగా మరున్
డక్కఁగొనంగరాదె యకటా నను వీఁడు పరిగ్రహించినన్.

(మనుచరిత్రము)


గీ.

అనఘ! మందార విద్యాధరాత్మజన్మ, నే విభావసి యనుదాన నెలమి నీకు
నెల్లభూతభాషలు మది నెఱుఁగునట్టి, విద్యయును నన్ను నిచ్చెద వేగఁ గొనుము.

(మార్కండేయపురాణము)


గీ.

అనఘ! మందారవిద్యాధరాత్మభవను, నను విభావసి యండ్రు గంధర్వవరులు
తెలిసియుండుదు నిమ్మహీతలమునందుఁ, బరఁగు మృగపక్షిజాతులభాష లెల్ల.

(మనుచరిత్రము)

పై నుదాహరించినపోలికలచేఁ బెద్దనకవియు మారనయందుఁ బ్రమాణభావము కలవాఁ డని యూహింపవచ్చును ప్రౌఢకవి మల్లన తనరుక్మాంగదచరిత్రమున వర్ణించిన యమలోకవర్ణ నముగూడ మార్కండేయపురాణములోని ద్వితీయాశ్వాసమునుండి సంగ్రహింపఁబడిన దని వివిధాధారములచే స్థాపింపవచ్చును. వ్యాసము విస్తరమగు నని సూచించితిమి. శంకరకవి హరిశ్చంద్రోపాఖ్యానము, మట్ల అనంతభూపాలుని బహులాశ్వచరిత్రము, పెద్దన మనుచరిత్రము, నీమార్కండేయపురాణమునుండి గ్రహింపఁబడినకథాభాగములు గలవని తెలియుచున్నది శంకరకవి హరిశ్చంద్రకథకు నీపురాణమందలికథకు వ్యత్యాస మెక్కుడుకలదు. మార్కండేయపురాణములోని హరిశ్చంద్రకథ ననుసరించి సంస్కృతమునఁ జండకౌశిక మనునాటకము వ్రాయఁబడినది. సమష్టిమీఁద నీనాటకము మార్కండేయపురాణకథ కెక్కుడుమార్పుఁ గల దన వీలుండదు. శంకరకథకంటే నీపూర్వకథయే సందర్భశుద్ధిగ నున్నది. శంకరకవి హరిశ్చంద్రచరిత్రములోని కంటె మార్కండేయపురాణ హరిశ్చంద్రకథలోని విశ్వామిత్రపాత్రము చక్కఁగఁ బోషింపఁబడి యున్నది. ఇది రసికు లెఱుంగనిది కాదు.

మార్కండేయపురాణము

బ్రాహ్మ, పాద్మ, వైష్ణవ, శైవ, భాగవత, నారదీయ, మార్కండేయ, ఆగ్నేయ, భవిష్య, బ్రహ్మకైవర్త, లైంగ, వారాహ, స్కాంద, వామన, కౌర్మ, మాత్స్య, గారుడ, బ్రహ్మాండము లనుపదునెనిమిదిపురాణములలో మార్కండేయపురాణ మేడవది. నిరుపమ మగునిష్ఠతో మార్కండేయుఁడు తప మాచరించుతఱి వ్యాసమహర్షి శిష్యుఁడును విద్యానిపుణుఁడు నగుజైమిని యాతని దర్శించి “సర్వలోకరక్షాధురంధరుఁడు శ్రీవిష్ణువు మనుష్యత్వ మేల నొందె? పాండవపంచకమునకు ద్రౌపది యొక్కతె యెట్లు కుటుంబినియయ్యె? బలరామునకుఁ దీర్థయాత్రల కరుగుతఱి బ్రహ్మహత్య యెట్లు ప్రాప్తించె? పాండవేయు లగు ద్రౌపదీతనయులు గృహస్థాశ్రమ మవలంబింపకమున్న యేల గతించిరి? ఈ సందియములు భారతము పఠించుటచే నాకుఁ గలిగినవి వీనిం దీర్పు" మన మార్కండేయుఁడు "మా కిది యనుష్ఠానకాలము గాన వింధ్యపర్వతమున ధర్మపక్షులు గలరు వారివలన నీసందియము తీఱు” నన జైమిని యట్ల వింధ్యానగవాసు లగుఁ బక్షులఁ బ్రశ్నింప నాల్గవప్రశ్నకుఁ బ్రత్యుత్తరముగ హరిశ్చంద్రచరిత్రము వాక్రుచ్చిరి. జైమిని మఱల ధర్మపక్షులను డాసి జీవులగర్భజన్మకర్మానుభవాదులం గుఱించి ప్రశ్నింపఁ బితాపుత్రసంవాద మనునుపాఖ్యాన మారంభించి క్రమముగఁ బిండోత్పత్తి జననమరణములు నరకాదిగతులు కీటపక్షిగర్దభాదిజన్మంబులు మదాలసాపుత్రుం డైనయలర్కునకు దత్తాత్రేయుఁడు బ్రహ్మవిద్య నుపదేశించుట లోనగువిశేషములు వాకొన జైమిని యాశ్చర్యమంది క్రమ్మఱ సృష్ట్యాదులఁ గూర్చి ప్రశ్నింప మార్కండేయుండు క్రోష్టికి నుపదేశించిన తెఱంగున సృష్టిప్రళయములను స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాష, వైవస్వతు లనుభూతవర్తమానమనువుల యంతరమును జెప్పిరి సురథుఁ డనురాజు రాజ్యభ్రష్టుఁడై మృగయామిషంబున మేధోమహాముని యాశ్రమసమీపముఁ జేరి సమానచింతుఁ డగుసమాధి యను వైశ్యుని గలసికొని పరస్పరసుఖప్రశ్నలు ముగించికొని తమ యవస్థలఁ దన్మునికి విన్నవించి దేవ్యుపాసనముచే నుత్తమగతిఁ బడసిరను కథయు, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్య, భౌత్యులను కాఁగలమనువుల జన్మాదివృత్తాంతము సూర్యప్రభావమున కుదాహరణముగ రాజ్యవర్ధనచరిత్రము, వైవస్వతమనుసంతతిజాతు లగువృషధ్ర, నాభాగ, వత్సంధ్ర, ఖనిత్ర, క్షుప, కరంధ, నూవేక్షిత మరుత్తచరిత్రములను ధర్మపక్షులు జైమినికిఁ దెలిపిరి. మారన మూలమునుండి యింతవఱకె యాంధ్రీకరణ మొనరించెను. మరుత్తునిపుత్రుఁ డగునరిష్యంతునియొక్కయుఁ బౌత్రుఁ డగుదమునియొక్కయుఁ గథల మారనకవి తెలిఁగింపలేదు.

మొత్తమున మారనకవి యాంధ్రీకరణము భారతాంధ్రీకరణముకంటె మూలమునకుఁ జేరువగ నుండును. ఆవిషయ ముభయగ్రంథములఁ బఠించిన ద్యోతకము కాఁగలదు మారనకవి భావోద్రేకము గలచోటుల నతివ్యాప్తిగఁ గథల కందని వర్ణన వ్రాయువాఁడు కాఁడు గాన నీతనికథాప్రణాళిక శ్లాఘనీయముగ నున్నది. ప్రౌఢకవిమల్లన రుక్మాంగదచరిత్రములో మారనకవి నరకవర్ణనమునే యనుసరించుటయు, నల్లసాని పెద్దనార్యుఁడు మనుచరిత్రమున మార్కండేయపురాణము ననుసరించుటయు నీకవివర్యుఁడు కవిజనసంభావ్యకవితావిభాసురుఁ డని తెలుపును మారన కవితాచాకచక్యము, కథాకల్పనము, భావనాప్రదీపనముఁ గాంచఁ దలంచిన, ద్వితీయాశ్వాసమునందలి కౌశికునిభార్య పాతివ్రత్యమహిమముఁ బఠించినఁ జాలును వర్ణనాసందర్భమునఁ బాత్రపోషణమున మారన యసాధారణుఁడు మారన కథాభాగములోని దుఃఖరసపద్యములు భారతస్త్రీపర్వములోని తిక్కనసోమయాజి పద్యములకు గురుశిష్యన్యాయముఁ జూపును పరిశీలింపుఁడు.

చ.

ఉరగము చేతఁ జచ్చినతనూద్భవునిం గొని శోకవేదనా
పరవశయున్ వికీర్ణకచభారయు నుద్గతబాష్పపూరయున్
గరతలతాడితాస్యయును గద్గదికావికలార్తనాదయున్
జరణవిపర్యయాపగతసత్వరయానయు నై పొరిం బొరిన్.

లోహితాస్యునిఁ గాంచినప్పటి హరిశ్చంద్రగేహినిస్థితి మారనకవి యెంత శ్రావ్యముగ నెంత నైజముగ నెంత ప్రత్యక్షముగ నెంత తాద్రూప్యముగ వాకొనేనో పరిశీలించిన రసజ్ఞులకు మారనకవి కవితాపీఠమున నెట్టియుత్తమస్థాన మలంకరింపఁదగువాఁడో తెలుపఁ బనియుండదు.

ఉ.

బోరనఁ బొంగి శోకరసపూరము నిర్భరబాష్పపూరము
ల్వారక కన్గవం దొఱఁగ వాతెఱలాలలు గ్రమ్ముదేఱ హా
హారవముల్ సెలంగ విరియం బడి వేనలి ధూళిబ్రుంగ న
క్కూరిమిపట్టిఁ బేర్కొనుచుఁ గోమలి మేదినిఁ జేతులూఁదుచున్.

ఈపద్యపటమునఁ జిత్రిత లైన హరిశ్చంద్రగేహినుల నంతరంగదృష్టితో బరిశీలించినఁ దత్కాలోచితసహజస్థితులు కనులముందు నటించినటు లుండును. “కంఠస్తంభితబాష్పవృష్టికలుషః చింతాజడం దర్శనం” అను నభిజ్ఞానశాకుంతలములోని కణ్వవచనమునకు “శోకరసపూరము నిర్భరబాష్పపూరముల్ వారక కన్గవం దొరఁగ” యను మారనకవివచనము మెఱుంగుఁబెట్టుచున్నది. కావ్యోచితము లగుసుగుణము లీమారనకవి గ్రంథమున నెన్నియో గలవు కవిజనసమాదరణీయములగు నీసుగుణముల వాకొనుటకంటెఁ బాఠకలోకమునకే యాభారము వదలుట యుక్తము.

సరస్వతిపత్రికలో నీగ్రంథము తొలుత ముద్రింపఁబడినది. దాని నాధారము చేసికొని ముద్రించుటచేఁ బూర్వముద్రితప్రతియందుఁ గొన్నిదోషములు పడినవి. తాళపత్రగ్రంథసహాయమునను బదునాల్గవశతాబ్దము నాఁటి యాంధ్రభాషానియమముల ననుసరించియుఁ గవ్యభిప్రాయానుసారములగు పాఠములను గ్రహించి ముద్రణస్ఖాలిత్యములు ఇతరదోషములు సవరించి ప్రతిని ద్వితీయముద్రణమునకు శ్రమమీఁద సిద్ధపఱుపఁగలిగితిమి. పరగ యనుపదము సార్ధబిందుకమని శబ్దరత్నాకరకారు లొక యుదాహరణము మార్కండేయపురాణము నుండి యొసంగి యున్నారు. ఆ యుదాహరణము పద్యభాగ మీగ్రంథమునఁ గానరాదు శాసనములందు ఇతరకవుల ప్రయోగమునందు పరగపదము బిందురహితముగాఁ గనుపట్టుచుంటచే నిందారూపమునే తీసికొంటిమి. ఎఱ్ఱాప్రగడ హరివంశములు బ్రదుకు అనుపదము రెండుతావులఁ బ్రాసలోఁ బ్రయోగించెను మారన యొకచోటఁ బ్రయోగించెను పూర్వకవులలోఁ బలువురు బ్రదుకు అనురూపమును దీసికొని యున్నారు. బ్రతుకు ఆధునిక రూపము. కొన సర్వత్ర బ్రదుకు అనియే యుంచితిమి. ఇటులె యాధునికపరిశోధకుల మతము ననుసరించి కొన్ని చోటుల స్వల్ప సంస్కరణములఁ గావించితిమి. గుణదోషములు పాఠకులు గ్రహింపఁగలరు.

నందిగామ

ఇట్లు, భాషాసేవకులు,

1.7.27.

శేషాద్రిరమణకవులు, శతావధానులు