మార్కండేయపురాణము/అష్టమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

మార్కండేయపురాణము

అష్టమాశ్వాసము



కంఠాకుంఠితకరు
ణాకల్పలతాప్రభూతనానార్థఫల
స్వీకారధన్య బుధమా
న్యా! కాంతివిజితసువర్ణ! నాగయగన్నా!

1


వ.

పరమజ్ఞానచక్షు లైనపక్షు లాజైమిని కిట్లనియె నిట్లు మార్కండేయుండు క్రోష్టుకిం
జెప్పినవిధం బాకర్ణింపుము.

2

వత్సంధ్రసంతతి

క.

ఆనరపతికి సునందకు, భూనుతచరితులు ప్రతాపభూయిష్ఠులు స
త్సూనులు పదుండ్రు, పుట్టిరి, నానాసంగ్రామకేళినైపుణరూఢుల్.

3


వ.

ప్రాంశుండును శూరుండును సుచక్రుండును విక్రముండును గ్రముండును బలి
యుండును బలాంకుండును జండుండును బ్రచండుండు నను నీపదుండ్రయందు
నగ్రజుండైన ప్రాంతుండు తనకుఁ దమ్ములు భృత్యులువోలె విధేయులై
వర్తింప రాజై పూజ్యంబగు రాజ్యంబు సేయుచు మహీసురోత్తములకు మహ
నీయవసురాసు లొసంగి మహికి వసుంధరాభిధానంబు సార్థంబు గావించుచుఁ
బ్రజల నౌరసు లగుపుత్త్రులయట్ల పరిపాలించుచు.

4


తే.

శతసహస్త్రసంఖ్యల నతఁ డతులవైభ, వంబు మెఱయంగఁ జేయు నధ్వరచయంబు
సంఖ్య యేరికి నెఱుఁగంగ శక్య మట్టి, ప్రాంశునకుఁ బ్రజాతి జనించె భవ్యయతుఁడు.

5


ఉ.

మానుగ నింద్రుఁ డెవ్వని సమంచితయాగములందు భాగము
ల్దానును వేల్పులు న్గని ముదంబున దేలుచు శౌర్యలీల నే
కోనశతామరాహితుల ను క్కడఁ న్బలజంభదైత్యుల
న్బూని మహాజి నట్టినృపపుంగవుఁ డైనప్రజాతికి న్సుతుల్.

6

ఖనిత్రచరిత్రము

క.

ఘనులు ఖనిత్రుం డాదిగ, జనించి రేవురు సమగ్రశౌర్యోజ్జ్వలు లం
దనుపమశుభచారిత్రుఁడు, ఖనిత్రుఁడు ధరిత్రి యేలెఁ గడుఁబెం పారన్.

7


చ.

నిరుపమసచ్చరిత్రుఁడు ఖనిత్రుఁడు సర్వజనైకమిత్రుఁ డి
ద్ధరణజితోగ్రశత్త్రుఁ డతిదాంతుఁడు శాంతుఁడు సత్యవంతుఁ డా
దరనయధర్మవంతుఁడు వదాన్యుఁడు హన్యుఁడు ధన్యుఁ డంతరం
గరహితమన్యుఁ డై కరము గారవ మారఁగ నేల యేలుతన్.

8


సీ.

అఖిలభూతములకు నానంద మగుఁ గాత శత్త్రునకును మైత్రి సలుపుఁ గాత
సకలజీవులకు శాశ్వతసుఖం బగుఁ గాత నాధులు వ్యాధులు నడగుఁ గాత
వసుధామరులకు శివంబు చేకుఱుఁ గాత ధాత్రీశులకు మనఃప్రీతి గాత
సర్వవర్ణులకును సంతతంబును నభివృద్ధి గాత సుకర్మసిద్ధి గాత


తే.

ననుచు జనులార! మీయందుఁ దనయులందు, నట్ల హితబుద్ధి నడతు మీ రట్టు నడువుఁ
డెల్లవారలయందు నెపుడు పరమ, హితము చెప్పితి నాపలు కెలమి వినుఁడు.

9


తే.

అహిత మొకని కించుక యెవ్వఁ డాచరించు, నజ్ఞుఁడై వానిఁ దత్ఫల మపుడ పొందు
నింత యెఱిఁగి జంతువులయం దెల్ల నెపుడు, మహితమతిమంతులరు గండు మనుజులార!

10


క.

అని యిట్లు ఖనిత్రుఁ డఖిల, జనములకును హితము గోరి సతతంబు ప్రియ
మును జెప్పుచు సద్గుణములఁ, దనరుచు మహనీయధర్మతత్పరుఁ డయ్యెన్.

11


క.

ఆరాజు నిజానుజుల ను, దారభుజావీర్యవిక్రమాఢ్యుల ఘనులన్
శౌరి నుదావసు సునయు మహారథుఁ బూర్వాదిదిశల కధిపులఁ జేసెన్.

12


వ.

అందు నత్రికులోద్భవుం డైనసుహోత్రుండు సుదావసునకు గౌతమాన్వ
యజుం డైనకుశావర్తుండును సునయునకుఁ గాశ్యపుఁ డైనప్రమతియు మహా
రథునికి వాసిష్ఠుం డైనపురోధసుండును బురోహితు లై వర్తింప నన్నలువురు
తమతమరాష్ట్రంబులందు రాజ్యసుఖంబు లనుభవించుచుండిరి ఖనిత్రుం డాభా
తృవర్గంబునకు నఖిలధాత్రీపతులకు నధిపతి యై పరమానురాగంబునఁ బ్రజా
పాలనంబు సేయుచున్నంత నొక్కనాఁ డేకాంతంబున శౌరికి విశ్వవేది యను
మంత్రి యి ట్లనియె.

13

విశ్వవేదిదుర్మంత్రమువలన శౌరి మొదలగువారు నశించుట

సీ.

ఎవ్వని కీయిల యెంతయుఁ జేకుఱు వసుధేశు లెల్లను వశ్యులగుదు
రతఁడు రా జతనిసంతతిపరంపర కంత నారాజ్య మలవడి యతిశయిల్లు
నమహీపతిభ్రాత లత్యల్పవిషయాధిపతు లైనఁ దత్పుత్త్రపౌత్రు లల్పు
లగుచుఁ గాలంబు వో నంత కంతకుఁ బేద లై కృషీవలవృత్తి యాశ్రయింతు

తే.

రుర్వి యేలునాతఁ డుద్ధరింపఁడు నెయ్య, మెసఁగ భ్రాతృజనము నింత దెలియ
నేర కునికి యధిప! నీమోస భాతృపు, త్త్రులకు నేల మీఁదఁ గలుగుఁ బొందు.

14


క.

వారలకొడుకులు దమలో, నారయ లాఁతు లయి పోదు రంతట నోధా
త్రీరమణ! భాతృసంతతు, లేరూపునఁ గూడి నడుచు నే సప్రీతిన్.

15


వ.

కావున నల్పరాజ్యపదస్థుం డగు నీవు వృథాసంతోషం బేల వహించెదు సకలరా
జ్యంబు నిన్నుఁ బొందునట్లుగా విచారింపుము విచారింపవై తేని మంత్రుల మైన
మాప్రయోజనంబు నీ కేటికి? మాచేతం గార్యజాతం బంతయు ఫలితం బైనఁ
బితృపైతామహం బైనరాజ్యం బంతయు ననుభవింపు మనిన నతం డి ట్లనియె.

16


క.

అతఁ డన్న యేము దమ్ముల, మతులిత మగుధరణివలయ మతఁడును మామా
క్షితిభాగము లేమును సు, స్థితి నేలుచు నునికిసేయుఁ జిత్తప్రీతిన్.

17


వ.

అది యెట్లంటేని వినుము.

18


క.

ఏవురము సోదరుల మే, మేవురకును వేఱ వేఱ యీయొక్కధరన్
శ్రీవిభవైశ్వర్యోన్నతు, లేవిధమునఁ గలుగ నేర్చు నీతలఁ పేలా.

19


వ.

అనుడు విశ్వవేది యమాత్యుం డిట్లనియె.

20


ఆ.

అధిప మీర లేవు రైన నెగ్గేమి మీ, యన్న మీపదంబులంద నిలిపి
యందఱకును నీవ యధిపతి వై బాహు, లీల మెఱయ నేల యేలు మనిన.

21


వ.

శౌరి యిట్లనియె.

22


క.

తనయునికంటెను నను న, మ్మనుజేంద్రుఁడు గరము నెమ్మి మన్నించు మన
మ్మున నట్టి యగ్రజన్ముని, యనుపమరాజ్యమున కలుగ నగునే నాకున్.

23


వ.

అనిన వేద్యవిదుం డగుసచివుం డతని నాలోకించి.

24


తే.

నీవు రాజ్య మంతయుఁ గొని నెమ్మి నగ్ర, జుని సమగ్రధనంబులఁ దనుప రాదె
వినుము రాజ్యకాముకులకు మనుజనాథ, వర్య! యన్నతమ్ముం డనువావి గలదె?

25


చ.

అనవుడు నట్ల కాక యని యానరనాయకుఁ డాత్మ సమ్మతిం
చిన నెడ విశ్వవేది వికసిల్లుచు నాతని భాతృపుత్త్రుల
న్మునుకొని తత్పురోహితులు మువ్వురనుం బిలిపించి యేకత
మ్మున నిజకార్య మంతయును బొచ్చెము లే కెఱిఁగించి చెచ్చెరన్.

26


వ.

ఆమువ్వురు పురోహితులం దనపురోహితుం గూర్చి ఖనిత్రునకు నాభిచారంబు
వేల్వంబంచి యావిశ్వ వేది యమ్మహీశ్వరుభృత్యామాత్యులందు సామదానాదులు
జేసి భేదం బాపాదించి దండనీతిస్ఫురణంబు మెఱయ సంగరోద్యోగంబునుం
జేసె నంత.

27


చ.

తలకొని విశ్వవేదికృతిఁ దద్దయు నుధ్ధతు లై పురోహితు
ల్నలువురు నాభిచారిక మనారతము న్బహుమంత్రతంత్రసం

కలితముగా నొనర్ప ఘనగాత్రభయంకరవక్త్రశక్తు లు
జ్జ్వలతరనేత్రశూలరుచిజాలకరాళకరోగ్రమూర్తు లై.

28


సీ.

కృత్యాచతుష్టయం బత్యద్భుతంబుగ నుద్భూత మై కడునుగ్రగతి ఖ
నిత్రుపాలికిఁ జని నిర్దోషుఁ డైనయాతనివినిర్మలగుణోత్కరముచేత
హతిఁ బొంది మరలి రయమునఁ బురోహితవితతిపై నావిశ్వవేదిమీఁదఁ
బడిన నందఱు వెస భస్మమై రవ్విధం బచ్చెరు వందించె నఖిలజగము


ఆ.

నంత నమ్మహీశుఁ డాపురోహిత రు, లొక్కమాఱె మంత్రియుతము గాఁగ
విగతజీవు లగుట విని కడువెఱఁ గంది, యిట్టు లగుట కకట! యేమి కతమొ?

29

తమ్ములు మొదలగువారు నశించుటచే దుఃఖితుఁ డై ఖనిత్రుఁడు దివి కేఁగుట

క.

అని మదిలోన ఖనిత్రుఁడు, వనరుచు నుండఁగ మునీంద్రవంద్యుఁడు విజ్ఞా
ననిధి వసిష్ఠుం డేతెంచిన నతనికి వందనంబుఁ జేసె వినీతిన్.

30


వ.

అన్నరేంద్రుండు మునీంద్రా! మదీయభాతృవరుల మంత్రిపురోహితు లొక్క
మాటె యేమికారణంబున మరణప్రాప్తు లై రెఱింగింపవే యనిన నత్తపోధనోత్త
ముండు తద్వృత్తాంతంబు సవిస్తరముగాఁ జెప్పిన విని విషణ్ణత్వంబు నొంది తన్నుఁ
దాన నిందించుకొనుచు నతం డి ట్లనియె.

31


క.

అనుపగతపుణ్యగతిశో, భను దైవోపహతు నల్పభాగ్యుని దోషా
తుని నఖిలలోకగర్హితు, నను నిస్సీ యేమి చెప్ప నానాఘమయున్?

32


తే.

నానెపంబున సమసిరి నలువు రవని, సురవరేణ్యులు కటకటా! ధరణిఁ బాప
కరుఁ డెవ్వఁడు గలఁడు నాకంటె? నింక, నేమి సేయుదు దైవమ! యెందుఁ జొత్తు?

33


క.

ఈయిలను నొక్కపురుషుఁడ, నై యేను జనియింపకున్న నాద్విజులకు రా
నీయెడ రిటు పాపంబునఁ, బోయితి నీకష్టతరపుఁబుట్టువుకతనన్.

34


చ.

చెనఁటి నృపాన్వయోద్భవము సీ! యిది గొల్పనె పాపహేతు వై
తనరెడురాజ్య మేల? వసుధామరవర్యులు నాదుతమ్ముల
న్ఘనతరరాజ్యవర్ధనులు గా నొనరింపఁ గడంగి నాకతం
బున మృతులైరి పాపమునఁ బోయితి వేయును జెప్ప నేటికిన్.

35


వ.

అని విషాదవేదనాదూయమానమానసుం డై యప్పుడు ఖనిత్రధాత్రీపతి నిజ
ప్రథమపుత్రు నిఖిలరాజ్యాభిషిక్తునిం గావించి మువ్వురుభార్యలుం దానును
వనంబునకుం జని వానప్రస్థవిధానంబున నొక్కయాశ్రమంబున వసియించి నిఖి
లేంద్రియంబుల నిగ్రహించి మున్నూటయేఁబదిసంవత్సరంబులు దారుణం బగు
తపం బొనరించి శరీరం బుజ్జగించి ధర్మపత్నీసహితం బక్షయపుణ్యలోకప్రాప్తుం
డయ్యె నని చెప్పి మార్కండేయుండు.

36


క.

వినుము ఖనిత్రచరిత్రము, వినినఁ బఠించినను జనులు వీతాఘులు శాం
తినిరూఢులు శ్రీమంతులు, ననుపమశుభయుతులు సుఖులు నగుదురు ధరణిన్.

37

వ.

అని చెప్పి మఱియును.

38

క్షుపచరితము

చ.

నృపకులశేఖరుం డగు ఖనిత్రతనూజుఁడు నీతిసత్యధ
ర్మపరుఁడు దానశీలుఁడు సమస్తమహాధ్వరకేళిశాలి యా
క్షుపుఁ డరిమిత్రతుల్యుఁ డయి సుస్థితి రాజ్యము సేయఁగాఁ ద్రివి
ష్టవపదు లేఁగుదెంచి మునిసత్తమ! యిట్లని రానరేంద్రుతోన్.

39


క.

క్షుపుఁ డనువిరించిసూనుఁడు, విపులాధీశుఁ డయి తొల్లి విమలచరిత్రన్
విపులయశుఁ డయ్యె నట్టుల, నృప! నీవును నతనిచరిత నెగడుము పుడమిన్.

40


ఆ.

అనుడు తదుపచరిత్ర విన వేడ్క యయ్యెడు, నమ్మహాత్తు నడచినట్ల నాకు
నడువ శక్య మేని నడచెదఁ జెప్పుఁడా, యనిన నతని కిట్టు లనిరి సురలు.

41


క.

భూమిసురస్వీకృత యగు, భూమికి గోచయము మేఁత పొలమునకును నా
భూమీశ్వరుఁ డరి గొనఁడు మ, హాసుఖము లొనర్చె నాతఁ డగణితములుగన్.

42


వ.

అనిన విని క్షుపుఁడు.

43


తే.

అమ్మహాత్ముఁ డొనర్చినయ ట్లొనర్ప, నలవి యగునె మాదృశు లగునల్పజనుల
కయిన నవధరింపుఁడు మదీయప్రతిజ్ఞ, నమరులార! యాక్షుపుని నే ననుకరింతు.

44


వ.

ఎట్లనిన వినుండు నిపులాతలంబునం గలయం జరించుచు శమ్యామాత్రక్షేత్రంబున
మూఁడేసి యజ్ఞంబులు చేసెద నాక్షుపునియట్ల గోబ్రాహ్మణులనిమిత్తం బరిగొననని
ప్రతిజ్ఞ చేసి యవ్విధంబున వర్తించుచు మహనీయరాజ్యంబు చేసె.

45


తే.

అట్టిక్షుపునకుఁ బ్రమధకు నాత్మజుండు, వీరుఁ డుదయించె భువనైకవీరుఁ డతులి
తప్రతాపానలచ్ఛటాదహ్యమాన, వైరిరాజన్యసైన్యకాంతారచయుఁడు.

46


క.

వీరునకు విదర్భక్షో, ణీరమణతనూజ నందినికి నుదయించె
న్భూరిగుణుండు వివింశుం, డారాజగణితబలాఢ్యుఁ డై యిల యేలెన్.

47


చ.

ఇలఁ దఱితోన వాన గురియించుసురేంద్రుఁడు సస్యవృద్ధి య
య్యిల యొనరించు సస్యము లనేకఫలంబుల నిచ్చుఁ దత్ఫల
ములు విలసిల్లు భూరిరసపూర్తిరసం బది పుష్టికారి యై
పొలుచు మదంబుఁ జేయ దొగిఁ బుష్టి వివింశునిపాలనోన్నతిన్.

48


క.

ఘనుఁడు వివింశుండు సుహృ, జ్జనులం దగఁ బ్రోచి పెక్కుజన్నంబు లొన
ర్చి నరేంద్రుల నోర్చి రణం, బున మృతుఁ డై చనియె నింద్రుభువనమ్మునకున్.

49

వివింశపుత్రుఁ డగు ఖనిత్రునిచరిత్రము

వ.

ఆవివింశపుత్రుండు ఖనిత్రుండనుధాత్రీపతి యొనర్చు నధ్వరములందు.

50


క.

సతతము నత్యాశ్చర్యా, న్వితు లై గంధర్వు లీఖనిత్రసమసము
న్నతుఁ డీయుగమున లేఁ డని, యతిముదమునఁ బాడుదురు జనాహ్లాదముగన్.

51

సీ.

పదివేలక్రతువు లాపార్థివుం డొనరించి యఖిలధాత్రియును బ్రాహ్మణుల కిచ్చి
తపమున నగణితద్రవ్య ముపార్జించి భూరిధనంబు విప్రులకుఁ బెట్టి
మహి వారిచేతఁ గ్రమ్మఱ విల్చికొని కడుముదమున దెబ్బదిమూఁడువేలు
నేడునూఱఱువదియేడుయాగమ్ములు ఘనదక్షిణాసమగ్రములు గాఁగఁ


తే.

జేసి పుత్రుండు లేమికిఁ జింతనొంది, యతఁడు మృగమాంసమునఁ బితృయాగ మాత్మ
జార్థముగఁ జేయఁ దలఁచి హయంబు నెక్కి, లలితగోఛాంగుళిత్రాణములు వహించి.

52

ఖనిత్రమృగసంవాదము

క.

శరములు శరాసనమును, ధరియించి నృపుం డొకండు దారుణవిపినాం
తరమున కరిగిన నొకమృగ, మరుదుగ నవ్విభునిఁ జేర నరిగి యిటు లనున్.

53


ఆ.

మనుజనాథ! వేగ నను సమయించి నీ, యభిమతం బొనర్పు మనిన నృపుఁడు
మృత్యుభీతి నెల్లమృగములు పాఱంగ, నేల చావఁ దివిరె దీవు? చెపుమ.

54


క.

అనిన మృగంబి ట్లను నే, ననపత్యుఁడఁ బుత్రహీనుఁ డగువాఁడు వృథా
జననుండు వానిప్రాణము, లునికికి నేఁ గాన నొకప్రయోజన మధిపా!

55


క.

అని యమ్మృగంబు సెప్పిన, యనంతరమ యతనిఁ జేర నన్యమృగము స
య్యన వచ్చి యోనరేశ్వర, విను మీమృగము పని లేదు వేగమ నన్నున్.

56


ఆ.

పటుశిలీముఖమునఁ బడనేసి నాదుక్ర, వ్యమున నిష్టకర్మ మాచరింపు
ననుఁ గృతార్థుఁ గాఁగ నొనరింపు నీయుప, కార మెఱుకపఱుపు ధారుణీశ!

57


క.

పుత్రునిఁ బడయుతలంపునఁ, బిత్రధ్వర మాచరింపఁ బ్రియమందెద వీ
పుత్రరహితపలలమున, న్ధాత్రీశ్వర! పడసె దెట్లు తద్వాంఛితమున్.

58


వ.

వినుము దుర్గంధంబు నణంప సుగంధంబు వలయునట్లు నిష్పాద్యం బగుకర్మం
బెట్టిది దానికిఁ దగినట్టిద్రవ్యంబు గొనవలయుట నిశ్చితం బనిన మృగంబునకు వివిం
శజుం డిట్లనియె.

59


ఆ.

ఈమృగంబు నాకు నెఱిఁగించె బుత్త్రహీనత విరక్తికారణముగ నాకు
నీవు చెప్పు మేది నీప్రాణములయందు, నొల్లఁబాటు నీకు నొలయఁ జేసె.

60


వ.

అని యడిగిన నామృగంబు.

61


క.

పలువురు గొడుకులు గూఁతులు, గలుగుటఁ దచ్చింత నొంది ఘనదుఃఖదవా
నలపటుతరకీలాసం, వలితుఁడ నై యెరియుచున్నవాఁడ నరేంద్రా!

62


వ.

అది యె ట్లం టేని.

63


సీ.

సకలంబునకు మృగజాతి సుసాధ్యము నత్యంతభీతయు నగుటఁ జేసి
బిడ్డలపైఁ జేర్చుప్రేముడిపెల్లున వగలకు నేఁ గొలు వగుచు సింహ
శార్దూలవృకమనుష్యప్రకరమ్ములచే నెప్పు డెయ్యెడ వీని కేమి
పాటిల్లునో యని భయ మందుచుండుదు నేము చెప్ప నపత్యహితము గోరిఁ

తే.

సారమేయాదికక్రూరసత్వచయము, లెల్లఁ దెగి పాడు గావలదే ధరిత్రి
పులులు మేయుగవాదులు పొలిసి పోలె?, తనయులకు మేత సొంపారు ననితలంతు.

64


చ.

నరవర! నాయపత్యములు నల్దెసల న్వెస మేయఁ జన్న నేఁ
బురపురఁ బొక్కుదు న్వలల బోనుల వాగురల న్మహావనాం
తరములఁ జిక్కునో శ్వవృకదంష్ట్రలపా లయి పోవునో ధను
ర్థరమృగయోగ్రబాణములతాఁకునఁ గూలునొ యంచు వానికిన్.

65


ఉ.

ఒక్కటి మున్ను వచ్చుటయు నున్నవి రామికి బెగ్గడిల్లుదు
న్మక్కున మన్కిపట్టునకు మాపున నన్నియు వచ్చె నేని నే
నక్కిలితేఱి తత్కుశల మారయ నుండుదు రేయి వేగిన
న్బెక్కువగ ల్మదిం బొడమి బిడ్డలసేమము వార్తు భూవరా!

66


చ.

పగలును రేయి నెవ్వగలపాలయి సంతతి కెప్డు సేమ మె
ట్లగునొకొ యంచు నుత్కటపుటర్మినిఁ గుందుచునున్నవాఁడ సా
రగుణవరేణ్య! నామది విరక్తికిఁ గారణ మీయవస్థ యా
శుగము మదీయదేహమునఁ జొన్పుము న న్సుఖిఁ జేయు మీయెడన్.

67


వ.

ఏ నత్యంతదుఃఖావిష్టుండ నయ్యును నాయంతన ప్రాణంబులు విడువమికి గార
ణంబు విను మాత్మఘాతుకు లగువా రసూర్యంబు లనులోకంబులకుం బోదురు
యజ్ఞోపయుక్తం బగుపశువులు పుణ్యలోకంబులకుం బోవుఁ గావున నీ వను
గ్రహించి మదీయమాంసంబునం బితృయజ్ఞం బాచరించి పుత్రలాభసంపన్నుండ
వగు మనిన నయ్యపుత్రమృగంబు రాజున కి ట్లనియె.

68


తే.

సుతులు పెక్కండ్రు గలవానిసుకృతి నీమృ
గేంద్రు వధియింపఁగాదు నరేంద్ర! పుత్ర
హీనతాదుఃఖతాపాగ్ని నెరియు నేను
నీకు నగుదు హంతవ్యుఁడ నిశ్చయముగ.

69


వ.

అనిన నయ్యపుత్రమృగంబును సపుత్రమృగం బాలోకించి.

70


క.

ఏకశరీరుండవు నీ, వేకము దుఃఖంబు సుకృత వీవు మృగేంద్రా!
నాకొడుకు లనేకము ల, నేకములు దుఃఖములును నే నధముండన్.

71


వ.

ఎట్లంటేని మొదల నేకశరీరుండనై యున్న యప్పుడు నాదుఃఖం బేకంబ మఱియు
భార్యామమత్వంబునం జేసి దుఃఖద్వయం బయ్యెఁ గ్రమంబున నపత్యము లావిర్భ
వించిన నయ్యపత్యదేహము లెన్ని యన్నిదుఃఖము లుద్భవించి న న్నిప్పు డలంచు
చున్నవి నీ వనతిదుఃఖాత్ముండ వగుటం గృతార్థజనుండవు నే నిహపరవిరోధిసంతా
నరక్షణపోషణార్థం బత్యంతచింతాతురుండ నగుచున్నవాఁడఁ జింతాతురునకు
నరకంబు ధ్రువం బనిన మృగేంద్రునకు నరేంద్రుం డి ట్లనియె.

72

క.

తనయవిహీనుఁడు ధన్యుఁడొ, తనయులు గలయతఁడు ధన్యతముఁడో యెఱుగ
న్దనయాధ్వర మిప్పుడు, ఘనడోలాయతమనస్కుఁగా ననుఁ జేసెన్.

73


క.

సంతానము దేహుల క, త్యంతము దుఃఖములఁ జేయు నది నిజమైన
స్పంతానముచేత నప, క్రాంతము లగు ఋణము లండ్రు కర్మవిధిజ్ఞుల్.

74


క.

కావునఁ బుత్రార్థముగా, జీవవధం బింక నేను జేయక మత్పూ
ర్వావనిపతులవిధంబునఁ, గావించెద నుగ్రతపము గడఁగి మృగేంద్రా!

75


వ.

అని చెప్పి యప్పుడు.

76


చ.

వితతయశోభిరాముఁడు వివింశతనూజుఁడు వేడ్క నేఁగి గో
మతి యను నేటిపొంత నియమస్థితుఁ డై మఘవుం గుఱించి యు
గ్రతపము సేయుచు న్సమధికస్థిరభక్తి నొనర్చు నుత్తమ
స్తుతులకు మెచ్చి వచ్చి బలసూదనుఁ డానృపసూతి కి ట్లనున్.

77


చ.

జనవర! నీతపంబునకు పంస్తవనమ్మున నేను మెచ్చితి
న్నను భవదీప్సితం బడుగు నావుడు నాతఁడు పుత్రు నాకు నీ
మ్మనుపమశస్త్రశాస్త్రవిదు నద్భుతకర్మగరిష్టు ధర్మవ
ర్తను ననిన న్బురందరుఁడు తద్వర మిచ్చి నిజేచ్ఛ నేఁగినన్.

78


మ.

అనురాగంబునఁ దేలుచుం బురికి ముద్యద్వేగుఁ డై యేఁగి యా
జనపాలుండు ప్రజానురంజనకరస్వామ్యోన్నతిం బొల్చుచు
న్దనయు న్శక్రవరప్రసాదమున మార్తాండోజ్జ్వలుం గాంచి యా
తనికిం జేసె బలాశ్వనామము జగత్ఖ్యాతంబుగాఁ బ్రీతితోన్.

79


వ.

అట్లు నామకరణంబు గావించి నందను నఖిలాస్త్రశస్త్రవిద్యావిశారదుం గావించి
ఖనిత్రుండు సురలోకప్రాప్తుం డయ్యె నంత.

80

కరంధముఁ డను నామాంతరము గలబలాశ్వునివృత్తాంతము

క.

ఘనుఁడు బలాశ్వుఁడు నిజశా, సనమున భూజనుల నిలిపె శౌర్య మెసఁగ న
ప్పనములు వారల చేతం, గొనుచుఁ బ్రజాపాలనమునఁ గుశలుం డై నన్.

81


క.

అలుక నతని దాయాదులు, చులుకన భూప్రజల నొంపఁ జొచ్చిన వారు
న్దలరి యరి యప్పనంబుల, నిలపతికిం బెట్ట కడలి రెంతయుఁ గలఁకన్.

82


క.

బలువిడి మతియును నాశ, త్రులు దేశం బెల్లఁ గొనిన దోర్బల మఱి వి
హ్వలుఁడై నిజపురిలోనన, బలాశ్వుఁ డొదుగుటయుఁ గూడి పగతురు కడిమిన్.

83


మ.

చతురంగధ్వజినీపదప్రచలితక్ష్మాచక్రులై విక్రమో
న్నతి నవ్వీటిపయి ని్రిపు ల్విడిసిన న్సంక్షీణసైన్యార్థుఁ డై
యతిభీతి న్శరణంబు వేఁడుచు వగ న్హస్తంబు లాస్యంబుఁ జే
ర్ఛి తతోచ్ఛ్వాసము లబ్బలాశ్వుఁ డొనరించె న్శోకసంవిగ్నుఁ డై.

84

ఉ.

అంతఁ దదీయపాణివివరాంతరమం దతివిస్మయంబుగా
దంతితురంగసైనికరథప్రతతు ల్శతసంఖ్య లంబరం
బంతయు నిండి క్రిక్కిఱియునట్లుగ వ్రేల్మిడి నుద్భవించిన
న్సంతస మంది యానృపతిసత్తముఁ డప్పుడ దీప్తమూర్తియై.

85


స్రగ్ధర.

ఉత్సాహాడంబరం బత్యుపచితముగ శత్రూత్కరప్రాజ్యరాజ్యా
దిత్సావిష్టాంతరంగద్విగుణీతరణ ముద్విస్ఫురద్వీరశృంగా
రోత్సేకానాసవక్త్రం బుదితసకలచంద్రోపమశ్రీ వహింపం
దత్సైన్యశ్రేణితో నుధ్ధతిఁ బురి వెడలెఁ న్ధారుణీనాథుఁ డంతన్.

86


క.

వెడలి విరోధుల నని మొనఁ, బొడిచి గెలిచి వారి నతులభుజవిక్రమ మే
ర్పడఁ దన కరిగాపులుగాఁ, గడుకొని యాలం బొనర్చె గర్వ మెలర్పన్.

87


క.

కరయుగధమనంబున నరి, వరవీరనిరాసనోగ్రబలము గలుగుటం
బరఁగె బలాశ్వుం డప్పుడు, కరంధముం డనఁగ లోకగణ్యచరిత్రా!

88


ఆ.

అమలధర్మనియతుఁ డైనయన్నరపతి, యట్టు లార్తుఁ డైన నరివినాశ
కారి యైనబలముఁ గల్పించె నతనిధ, ర్మంబు దాని దాన మగుడఁ గడఁగె.

89

బలాశ్వునకు వీర యనుదానియందు అపేక్షితుఁడు పుట్టుట

వ.

వీర్యచంద్రుం డనురాజుకూఁతురు వీర యనుసుందరి ప్రియంబున స్వయంవరంబునం
గరంధముని వరించిన నయ్యింతియం దతం డొక్కకొడుకు బడసి దైవజ్ఞులం
బిలిపించి మత్పుత్రుండు జన్మించిననక్షత్రలగ్నంబులు ప్రశస్తంబు లై శుభగ్రహ
దృష్టి గలిగియున్నయవియె పాపగ్రహంబులలో బాలు నేగ్రహంబును జూడఁడు
గదా యని యడిగిన వార లి ట్లనిరి.

90


సీ.

క్షత్రవరేణ్య! నీపుత్రునుక్షత్రలగ్నము లెంతయును బ్రశస్తముల గురుఁడు
శుక్రుండు నేడవచో నుండి శశి చతుర్థస్థుఁ డై బుధుఁ డుపాంతమున నిలిచి
యొగిని వీక్షించెద రుష్ణాంశుభౌమార్కసుతులు వీక్షింపరు వితతపుణ్యుఁ
డైనకుమారున కనిన నాజోస్యులఁ గనుగొని హర్షించి మనుజవిభుఁడు


తే.

సురగురుం డాదిగాఁ గలశుభులచేత, వీఁ డవేక్షింపఁబడియెడుఁ బోఁడి గాఁగ
ననిరి. పలుమాఱు మీర లి ట్లనుట నాదు, సుతుఁ డవేక్షితుఁ డనుపేర నతిశయిల్లు.

91

అవేక్షితుని బెక్కురాజకన్యలు వరించుట

వ.

అని కరంధముండు సుతునికి నామకరణం బొనరించె నంత నక్కుమారుం డఖిలవేద
వేదాంతపారగుం డైనకణ్వపుత్రుం డాచార్యుండుగా నఖిలాస్త్రశస్త్రవిద్యావైశా
రద్యం బంగీకరించి.

92


చ.

అతులితరూపవిస్ఫురణ నశ్వినులే సరి కాంతిసంపద
న్సితకరుఁ డే సదృక్షుఁడు వినిర్మలతేజమునం బతంగుఁ డే

ప్రతి ధృతిఁ గాంచనాచలమె పాటి మతి స్సురమంత్రియే సముం
డితని కనంగ ధాత్రి నుతి కెక్కినయుత్తము నయ్యవేక్షితున్.

93


వ.

స్వయంవరంబునందు హేమవర్మ తనూజ యగు వరయును సుదేవతనయ యగు
గౌరియు బలినందన యగుభద్రయు వీరాత్మజ యగులీలావతియు వీరభద్రపుత్రిక
యగుదారికయు భీమప్రసూతి యగుమాల్యవతియు వైదర్భనృపప్రభవ యగు
కుముద్వతియు బ్రియంబునఁ దార వరియించి రన్నరవరాన్వయదీపకుఁ డగు
నక్కుమారుండు వెండియు.

94


క.

విలసితబహుస్వయంవరముల భుజబలలీల వెలయ మూఁగిననృపుల
న్గెలిచి వరియించె బలిమిని, బలువురుకన్నియలఁ గమలపత్రనయనలన్.

95

అవేక్షితుఁడు విశాలాస్వయంవరమున నెదిర్చి రాజుల నోడించుట

వ.

మఱియు నొక్కనాఁ డక్కుమారుఁడు విదిశాపురంబున కరిగి విశాలభూపాలతనయ
యైనవిశాల యనుదాని స్వయంవరంబున సకలదేశమ్ములరాజులం బరాజితులం
గావించి బలిమిని నమ్మహీపతులు వివర్ణవదనులు విషణ్ణహృదయులు నగుచు
నొండొరులం గనుంగొని యిట్లనిరి.

96

పరాజితులగు రాజు లవేక్షితునితో యుద్ధసన్నద్ధులగుట

ఉ.

ఈనరనాథనందనుఁ డహీనపరాక్రమలీల నందఱ
న్హీనులఁ జేసి చేకొనియె నీమృగలోచన నిప్పు డిస్సీరో !
యీనగుఁబాటు మేలె మన మియ్యెడ నుత్కటశౌర్యధర్మము
ల్పూనక యుంటి మేని మనపుట్టువు నక్కట రాచపుట్టువే!

97


క.

వందిజనసూతమాగధ, బృందంబులు మనలఁ బొగడుబిరుదాంకము ల
స్పందితభుజాబలుని రిపునిం దునిమి యొనర్పవలయు నిక్కంబులు గాన్.

98


మ.

అనిన న్రాజులు రాజపుత్రులు ముమూరామర్షసంగ్రామహ
ర్షనిరూఢాత్మకు లై మహోగ్రవివిధాంచద్దీప్తిజాలోల్లస
ద్ఘనదోర్దండవిలాసు లై పటుతురంగస్యందనారూఢు లై
యనలోద్దీఫ్తపదాతిపాదజపరాగాక్రామితాకాశు లై.

99


క.

అక్షీణశౌర్యధుర్యు న, వేక్షితునిం జుట్టిముట్టి యిట్లలముగ బా
ణక్షురికాశక్తిగదా, కౌక్షేయాద్యాయుధములఁ గడు నొంచుటయున్.

100

శత్రురాజులు నవేక్షితుఁడును స్వయంవరనిమిత్తము ద్వంద్వయుద్ధము చేయుట

క.

పెక్కండ్రు నరేంద్రులతో, సుక్కున నారాజతనయుఁ డొక్కఁడు ధైర్యం
బెక్కఁగఁ జల మెక్కఁగ నస, మెక్కఁగ నని చేసె నప్పు డెసకం బెసఁగన్.

101


క.

ఆనరనాయకు లేసిన, నానానిశితాస్త్రతతుల నడుమన తునియం
గా నేసె నవేక్షితుఁ డా, సైనికు లావీరు నిశితశరములు మఱియున్.

102

వ.

నొప్పించిన న్గనలి కరికలభంబులపయిం గవియుకేసరికిశోరంబునుం బోలె నక్కు
మారుండు కోపించి నిశితవిశిఖపరంపరలు పరగించిన.

103


సీ.

కంఠదోరంతరకరపాదఖండనక్రీడఁ గాల్బలముల గీఁటడంచి
దంతకుంభాస్యహస్తప్రవిదారణకేళి నేనుంగుల నేలఁ గలిపి
పదముఖకంధరాపార్శ్వవిపాటనపరిణతి హయముల బారిసమరి
రథ్యసారథికేతురథికాంగనిర్ధళనప్రౌఢిఁ దేరుల నజ్జుసేసి


ఆ.

రక్తనదుల మాంసరాసులు మస్తిష్క, కర్దమముల భూతకలలములను
ఘోర మైనసమరధారుణిఁ బొలుపారె, నేకవీరుఁడై యవేక్షితుండు.

104


చ.

వితతపరాక్రమోన్నతుఁ డవేక్షితుఁ డిట్లు రణంబున న్విజృం
భితుఁ డగుడు న్మహీపతులు పెల్కుఱి పాఱఁ దొడంగిన న్గ్రపా
న్వితులుఁ గులీనులు న్మరణనిశ్చితబుద్ధులు భూరిశౌర్యగ
ర్వితులును నైనసప్తశతవీరనృపాలురు దాఁకి రాతనిన్.

105


వ.

ఇట్లు పెక్కండ్రు రాజులు మీఱి యొక్కమాఱు తన్నుం బొదివిన నొదివిన కోపం
బున నాభూపాలనందనుం డొక్కరుండ ఢీకొని యుద్ధంబు నేయుచు ననేకశస్త్రా
స్త్రంబు లడరించి యవ్వీరుల కవచకార్ముకకంకపత్రాదులు ఖండించిన నమ్మేటిమగలు
కోపించి యప్పాటన యతనిం జుట్టుముట్టిన.

106

అధర్మయుద్ధమునఁ బరరాజు లవేక్షితునకు బంధాదు లొనరించుట

ఆ.

ఒకఁడు విల్లు ద్రుంచె నొకఁడు సారథిఁ గూల్చె, నొకఁడు పడగఁ దునిమె నుక్కు మిగిలి
యతనిహరులఁ గొంద ఱరదంబుఁ గొందఱు, మఱువుఁ గొంద ఱేచి నఱకి రపుడు.

107


క.

లీలం గొందఱు పటుశర, జాలంబుల నొంచి రతనిఁ జల మెడపక య
వ్వాలుమగఁడు పలుకయుఁ గర, వాలుం గొనుటయు నొకండు వడిఁ దునుమాడెన్.

108


క.

పొలి వోవనిమగఁటిమి న, బ్బలియుఁడు గద గొనిన దానిఁ బఱియలుగా ను
జ్జ్వలశరముల నొకఁ డేసె, న్బలువురు నృపు లతని మఱియుఁ బటువిశిఖములన్.

109


తే.

పాడి మాలి నొప్పించినఁ బడియెఁ బుడమి, నాకరంధమనందనుం డంతఁ జెలఁగి
ధర్మ మేది విశాలాదిధరణిపాలు, రదయు లై యక్కుమారుని నంటఁ గట్టి.

110


వ.

విదిశాపురంబునకుం గొనిపోయిని విశాలుం డాస్వయంవరస్థలంబున నిలిచి తానును
బురోహితుండును గూఁతునకు ననేకరాజకుమారులం జూపె నది యెవ్వరి వరియింప
కున్న నమ్మహీపతి దైవజ్ఞులం జూచి నేఁడు వివాహవిఘ్నకరంబైనయుధ్ధంబు ప్రవ
ర్తిలెలే నీదినం బొప్ప దింకఁ బరిణయోత్సవం బొనర్ప నెన్నండు మే లనిన వారు విచా
రించి కతిపయదినానంతరంబునం బ్రశస్తలగ్నయుక్తం బగుదినంబు గలదు నాఁ డీ
కన్యకవివాహంబు నేయు మనిన నట్ల కాక యని యతం డాయుత్సవంబుఁ జాలించి

చనియె నంత నక్కడఁ గరంధముండు ధర్మపత్నీసహితుండై యనేకవీరావనీశ్వరులు.
గొలువం బేరోలగంబున నుండి నిజనందనుం డధర్మయుద్ధపరు లైనపరులచేతఁ
బట్టువడి బద్ధుండగుట విని పెద్దయుం బ్రొద్దు చింతించుచున్నసమయంబున దీని
కెంతయుఁ జింతింప నేల యనువారును బెక్కం డ్రొక్కని నిట్లు చేసినయాపాపా
త్ముల నిపుడ పొరిగొనవలయు ననువారును రయంబునం జతురంగంబుల సన్నద్ధంబు
గావింప నియోగింపుఁ డనువారును నింతకు మూలం బైనవిశాలుం దెగటార్పక
కోపంబు దీఱదనువారును మనకుమారుండు తగవు దప్పి స్వయంవరంబున బల
దర్పితుం డై కన్నియం బలిమిం బట్టుకొని యాగడంబుఁ జేసిన వార లేల సహింతు
రనువారును గా మఱియు ననేకు లనేకప్రకారంబులం బల్కుపల్కు లాకర్ణించి
వీరవంశప్రసూతయు వీరపత్నియు వీరమాతయు నగువీరమహాదేవి హర్షించి
పతి నాలోకించి సకలభూపతులు విన నిట్లనియె.

111

కరంధముఁడు భార్యాప్రేరితుఁడై యవేక్షితు విడిపించుట

క.

నానారాజకుమారుల, మానధనుల నోర్చి మత్కుమారుఁడు కన్యం
దాను బలిమి న్వరించిన, యానిరుపమశక్తి యెంత యతిశయ మగునో!

112


ఆ.

అవనిపతులు బలియు రందఱు నొక్కొనిఁ, దన్ను బొదివికొనినఁ దలఁక కడరి
పోటు లాడి నాదుపుత్రుండు వడుట దాఁ, గీర్తికరము గాని కీడు గాదు.

113


క.

మది నీతి గణింపక యు, స్మదచేతోరౌద్రరససమగ్రతఁ గడుబె
ట్టిదుఁ డై సింహముక్రియ రిపు, విదళనముం జేఁత సువ్వె వీరగుణ మిలన్.

114


ఉ.

భూతలనాథనందనులు భూరిబలాఢ్యులు సూచుచుండఁగా
నాతనయుండు విక్రమగుణస్ఫురణోజ్జ్వలుఁ డై స్వయంవరో
పేతనరేంద్రకన్యకల నెంతయు బల్మిఁ బరిగ్రహించు టె
గ్గే? తగ వేది వేఁడుకొనునే నృపసూతి జఘన్యుచాడ్పునన్.

115


చ.

వినుఁడు నరేంద్రులార! పటువిక్రముఁ డైనకుమారుబంధనం
బున కయి వంత నొందకుఁడు భూరిభవద్భుజదండవిస్ఫుర
త్సునిశితహేతిఘాతములఁ జూర్ణము సేయుఁడు వీరవిద్విష
జ్జననరనూత్నరత్నవిలసన్మకుటోజ్జ్వలమస్తకస్థలుల్.

116


క.

కరితురగరథపదాతులఁ, బరవసముగ నిపుడ పన్నఁ బంపుఁ డెడఁదఁ బ
ల్వురతోడివిగ్రహం బతి, భర మని తలఁపకుఁడు వినుఁడు పార్థివు లెల్లన్.

117


తే.

అల్పు లగుమేదినీశ్వరులం దొనర్సు, నల్పవిక్రమమున శూరుఁ డైనవాని
కెవ్వనికిఁ గల్గుఁ బెంపు మహీశులార!, వినుతబలవిక్రమాధీశుఁ జెనసినట్లు.

118


క.

కావున నాప్రల్లదు లగు, భూవరుల జయించి వారిభూసామ్రాజ్య
శ్రీవిభవము గైకొనుఁడు మ, హీవల్లభులార! వెడలుఁ డెక్కుఁడు రథముల్.

119

వ.

అని యమ్మహాదేవి తెంపుసొంపు పొంపిరివోవం బలికినం గరంధముండు సకల
రాజ్యసమేతంబుగ సమరసన్నద్ధుం డై పుత్రశత్రుధాత్రీపతులపయిం జనియె
వారు నవార్యశౌర్యధుర్యు లై యతనితోడ మూఁడుదినంబులు దారుణం బగు
రణం బొనరించి రంత విశాలుండు నిజపక్షక్షత్రియప్రకరం బపక్రాంతం బగుట
గనుంగొని.

120


క.

వినయముఁ బ్రియము భయంబును, మనమున ముష్ఫిరి గొనంగ మహితార్ఘ్యముఁ ద
తనయునిఁ దనకూఁతుం గొని, చనియెఁ గరంధమునికడకు సంభ్రమ మెసఁగన్.

121


క.

చని ప్రీతచిత్తుఁ డగున, జ్జనపతిఁ బూజించి యావిశాలుఁడు వినయం
బొనర నవేక్షితుఁ గనుగొని, యనఘా! యక్కన్యఁ బరిణయం బగు మనుడున్.

122

వివాహనిమిత్తము వైశాలినీవిశాలకరంధమావేక్షితుల సంవాదము

వ.

అక్కుమార్కుం డి ట్లనియె.

123


ఉ.

ఈనలినాక్షి చూడ నని నెంతయు వైరుల కోడి యే నిసీ!
దీని వరింతు నే మగుడ దీని నె కాదు వరింప నొల్ల నిం
కేనెలఁత న్నిజం బిది యహీనపరాక్రముఁ డైనవానికిం
దీని నరేంద్ర! యి మ్మిదియు నెమ్మి వరింపఁగ నిమ్ము తద్విభున్.

124


వ.

అనిన విశాలుండు కూఁతు నాలోకించి.

125


క.

పొలఁతీ! యీ రాకొమరుని, పలుకులు వింటే? దురాశ పడకు మొరుని నీ
వలసిన రాజకొమారుని, నెలమి న్వరియింపు మతని కిచ్చెద నిన్నున్.

126


ఆ.

అనిన మోముఁదమ్మి యల్లన వ్రాల నా, బాల యిట్టు లను విశాలుతోడఁ
బలువు రొకని గెలుపు గెలుపులం దోడిన, వాఁడు గాఁ డితండు వారి కాజి.

127


మ.

బలుసింగంబు బహుద్విపప్రకరము న్భంజించుచందంబున
న్బలవద్వైరినృపాలపాటనకళాపారీణతం బొల్చె నీ
బలియుం డుత్కటశౌర్యవిక్రమయశోభ్రాజిష్ణుఁడై యాజిఁ గే
వలుఁడే? యేరికి ధర్మయుద్ధమున గెల్వ న్వచ్చునే యాతనిన్?

128


క.

కొమరారునీకుమారుసు, కుమారరూపంబె గాదు గురుధైర్యము శౌ
ర్యమును బరాక్రమము నొ, క్కొ మొగి న్నామనము నాఁచుకొనియెం దండ్రీ!

129


ఆ.

వేయు నేమి చెప్ప? వేఁచికొ మ్మీరాజు, తనయు నాకుఁ గాఁగ ధరణినాథ!
యొరుని నింక నేను వరియింప నిది నిక్క, మనిన నవ్విశాలుఁ డతనిఁ జూచి.

130


చ.

మనసిజతుల్యసుందర! కుమారవరేణ్య! మదీయపుత్రి ప
ల్కినపలుకు ల్మనోజ్ఞములు కీర్త్యము లారయ నీసమానుఁ డెం
దును నిల లేమి నిశ్చయము దోర్బలశౌర్యఘనుండ వీవు నా
తనయ వరింపవే కులము ధన్యముగా నొనరింపవే దయన్.

131


క.

అనిన నవేక్షితుఁ డే నీ, వనితన కా దధిప! యొండు వనిత వరింప

న్జన నిజ మీపలు కనవుడుఁ, దనయునకుఁ గరంధముండు దా ని ట్లనియెన్.

132


క.

ఈనృపతికి సంతోషము, గా నీధవళాయతాక్షిఁ దగ నబ్జసప
త్నాననఁ బ్రేమార్ద్రీకృత, మానస వరియింతు గాక మనసిజమూర్తీ!

133


తే.

అనిన నాతండు దేవ! నీయాజ్ఞ కే నొ, నర్ప నింతకు ముంద రెన్నఁడు నవజ్ఞ
యిప్పు డేదైన నానతి యిమ్ము సేయఁ, దగనిపని నన్నుఁ బనుపకు ధర్మవేది!

134


వ.

అనిన నక్కుమారునివచనంబులు విని విశాలుండు వైశాలిని నాలోకించి తల్లీ! నీ
వింక నీతనితగులంబు విడువు మనేకరాజకుమారు లున్నవా రందు నీ కభిమతుఁ
డైనవాని వరియింపు మనిన నక్కుమారికారత్నంబు.

135


తే.

నిన్ను వేఁడెద వర మిమ్ము నెమ్మి నాకు, నన్ను నితఁ డిప్పు డొల్లకయున్న మీఁది
భవమునం దిక్కుమారుఁడె వరుఁడు గాఁగ, దారుణాటవిఁ జేయుదుఁ దండ్రి! తపము.

136


తే.

అనియె నంతఁ గరంధముం డావిశాలు, తోడినెయ్యంబు మనమునఁ దొంగలింప
నప్పురంబున దివసత్రయంబు నిలిచి, వేడ్కఁ గొడుకుఁ దోడ్కొని తనవీటి కరిగె.

137

వైశాలిని యరణ్యమునఁ దపము సేయుట

వ.

స్వయంవరోత్సవదర్శనాగతు లైనరాజకుమారులు తమతమపురములకుం జని రంత
వైశాలినీకన్యక సకలబాంధవులం బరిత్యజించి యరణ్యంబున కరిగి పరమవైరాగ్యా
యత్తయు నిరాహారయు నై దారుణం బగుతపం బొనరించుచుండ మాసత్రయం
బతిక్రమించిన.

138


క.

అతులనిరాహారతపో, వ్రతదారుణనియతి నొడలు వట్టి నరము లు
న్నత మై తోఁపగ మరణే, ప్సితమతి నయ్యబల దొట్టి పెద్దయు నార్తిన్.

139

దేవదూత వైశాలిని మరణోద్యమమును నివారించుట

తే.

తనువు దొఱఁగంగఁ దలఁచినఁ దరుణి తెగువ, సుర లెఱింగి చయ్యన నొకచరునిఁ బనిచి
రతఁడు చని యంతరిక్షంబునందు నిలిచి, యాకృశోదరిఁ గాంచి యి ట్లనియెఁ బ్రీతి.

140


ఆ.

దేవదూత నేను దేవత ల్ప్రార్థించి, యర్థి నీకుఁ జెప్పు మన్న కార్య
మబల! వినుము దేహ మతిదుర్లభము దీని, విడువఁ దగవు గాదు వితతపుణ్య!

141


వ.

సప్తద్వీపశోభితావనీచక్రసంవహనసమర్థుం డగుచక్రవర్తికిం దల్లివవు దమ్మహాత్ముండు
నిజభుజవిక్రమంబున న్దివిజరిపుభంజనం బొనరించుచు దస్యుప్రముఖదుష్టజనని
గ్రహం బాచరించుచుఁ దమతమధర్మంబులు తప్పక వర్తిల్లునట్లుగా మహీజనములం
బాలించుచు శతసహస్రసంఖ్యము లశ్వమేధాదిమహాధ్వరములు సేయు ననిన
నయ్యింతి యల్లన ని ట్లనియె.

142


క.

త్రిదివముననుండి వచ్చిన, త్రిదశచరుఁడ వగుదు వీవు తెల్లము సుగుణా
స్పదమూర్తిని సంతానా, భ్యుదయము నా కెట్లు గలుగు పురుషుఁడు లేమిన్.

143

చ.

తరణినిభుం డవేక్షితుఁడు దక్కఁగ నే విను మీభవంబున
న్బరుని వరింప నింక నని పట్టితిఁ దండ్రికడం బ్రతిజ్ఞ యా
పురుషవరుండునుం బ్రతిన పూనినవాఁడు కరంధమంక్షితీ
శ్వరుకడ న న్వరింప నని సంతతి యెమ్మెయి నాకుఁ గల్గెడిన్.

144


ఆ.

అనిన దేవదూతుఁ డను నీ బహూక్తు లే, మిటికి నీకుఁ జెపుమ మీననేత్ర!
తనయుఁ డుద్భవించుఁ దపము పెంపున సమ, స్తమును సిద్ధిఁ బొందు దైవయుక్తి.

145


వ.

నీ వీవనంబున వసించి కృశం బైనశరీరంబు పుష్టంబు గావించుకొ మ్మని చెప్పి దేవ
దూత సనియె నాసుందరి తపం బుడిగి రుచిరాహారమ్ముల దేహపోషణ మొనరించు
చుండె నక్కడ నవేక్షితునితల్లి యొకపుణ్యదివసంబునం గొడుకు రావించి తండ్రీ
యేను మీతండ్రిచేత ననుజ్ఞాత నై దుష్కరం బగుకిమిచ్ఛకవ్రతంబు దొడంగిన
దాన నీవు నిర్వహింపవలయు ననిన నాకొండుధనంబు లేమి శరీరంబు నిష్పాదించి
యైన నీవ్రతంబు పారంబు నొందించెద నిశ్చింతంబుగ ననుష్టింపు మనిన నద్దేవియు.

146

కిమిచ్ఛకవ్రతమిషమున నవేక్షితునకుఁ బెండ్లిపూనికి పుట్టించుట

ఆ.

నియతి నుపవసించి నిధులకు నధిపతి, యైనధనదు ముంద ఱధికభక్తి
బూజఁ జేసి నిధులఁ బూసీ.జించి లక్ష్మికిఁ, బొలుపు మిగుల నగ్రపూజ సేసి.

147


అద్దేవి భక్తిఁ దదారాధనము సేయుచుండఁ గరంధముం డొకవివిక్త
తలమునఁ గూర్చున్నతఱి నాప్తమంత్రు లతని డాయ నరిగి యిట్లనిరి నెమ్మి
ధరణీశ! ముదిసి తెంతయు నీకును గొడు కొక్కఁ డుండ నాకొడుకు నారి
వరియింపనని యున్నవాఁడు మీకుల మింకఁ దెగ నోపుఁ బృథివికి దిక్కు లేక


తే.

యుండ నోపు నకట! పితృపిండవిధులు, నిలువబడ నోపు నిది గడునెగులు పుట్టె
నిట్లు గాకుండఁ బ్రార్థింపవే కుమార, వరుని భార్యాపరిగ్రహపరుని గాను.

148


వ.

అనుసమయంబున భవనద్వారముననుండి పురోహితుఁ డర్థిజనుల నుద్దేశించి
కరంధమమహిషి కిమిచ్ఛకవ్రతంబు సలుపుచున్నయది మీ కెవ్వరికి నేమి యిచ్ఛ
దాని నడుగుఁ డనియె నవ్వచనంబు విని యవేక్షితుం డచ్చటికిం జని.

149


ఆ.

అస్మదీయజనని యర్థిఁ గిమిచ్ఛక, వ్రతము సల్పుచున్న దతిశయముగఁ
బ్రీతి నడుగుఁ డెవ్వరికి నేమియిచ్ఛ మీ, రర్థులార! యిత్తు నదియె నేను.

150


చ.

అనిన తనూజుమాట విని హర్షమున న్వెస నేఁగి భూవిభుం
డనుపమసత్యవాణి వగు మన్వయవర్ధన! యర్థి నేను నా
కు నొసఁగు మీప్సితం బనుడుఁ గొడ్కు భవత్ప్రియ మేమి నావుడు
న్మనుమనిసుందరాననము మానుగఁ జూపుము నాకుఁ బుత్రకా!

151


చ.

అనిన నవేక్షితుండు వసుధాధిప! నీకు సుతుండ నేన యే
నును విను బ్రహ్మచర్యము మనోజ్ఞముగాఁ గయికొన్నవాఁడఁ బౌ

త్రునివదనంబు చూపఁ గడుదుర్లభ మెమ్మెయి నొండు వేఁడు మీం
పొనరఁగ నిత్తు నావుడు నృపోత్తముఁ డాతనితోడ ని ట్లనున్.

152


తే.

తల్లివ్రతము చెల్లింపఁగఁ దలఁపు పట్టి, యేమి యడిగిన నిచ్చెద నే నటంటి
విచ్చనా కొండు నందు లే దిందుఁ గాని, ప్రతిన నెరపు మవశ్యంబుఁ బౌత్రు నొసఁగి.

153


వ.

అకారణబ్రహ్మచర్యంబు పాపహేతువు దానిఁ బరిత్యజింపు మీబహుభాషలతోడి
ప్రయోజనం బేమి నామనోరథంబు సఫలంబుఁ జేసి సత్యప్రతిజ్ఞుండ వగు మనినం
బుత్రుం డిట్లనియె.

154


తే.

స్వీకృతప్రతిజ్ఞుఁడ నగునాకు నధిపఁ, యిపుడు నీకు నభీప్సితం బీ నవశ్య
మగుట సంకటప్రాప్తుండ నైతి సత్య, సంగి గానఁ జేసెద దారసంగ్రహంబు.

155


వ.

తండ్రీ! యేను నీచేత సత్యపాశబద్ధుండ నైతి నింక నీ చెప్పినయట్ల చేసెద నని
తల్లివ్రతంబు సగుణంబు గావించె నని మార్కండేయుండు.

156

దృఢకేతుం జంపి యడవియం దవేక్షితుండు వైశాలిని బ్రోచుట

క.

అంత నొకనాఁ డవేక్షితుఁ, డెంతయుఁ గుతుకమున వేఁట యేఁగి మృగములం
గాంతారాంతరమున న, త్యంతాసక్తిమెయి నేసి యాడుచు నొకచోన్.

157


తే.

నన్ను రక్షింపు మని కరుణముగఁ బెక్కు, మాఱు లాక్రోశ మొనరించుమగువయెలుఁగు
విని యతం డోడ కోడకు మని హయంబు, నచ్చటికిఁ దోలికొని వెస నరుగునపుడు.

158


క.

ఘనుఁడు దృఢకేశుఁ డనియెడు, దనుజునిచేఁ బట్టువడినదాన ధరిత్రిం
దనరుకరంధమసుతుసతి, నని మఱియును నవ్వధూటి యాక్రందించెన్.

159


వ.

అప్పు డద్దానవుండు.

160


మ.

ధరణీవల్లభ యక్షకింపురుషగంధర్వాదు లెవ్వాని సం
గరరంగంబున మార్కొన న్వెఱతు రల్కన్మృత్యువు న్విక్రమ
స్ఫురణ న్గాలుని మీఱు నెవ్వఁడు రిపుక్షోణీశ్వరశ్రేణికి
న్ధర నే నట్టికరంధమాత్మజుని కాంతం బట్టికొం చేఁగెదన్.

161


వ.

అనుపలుకు లాలించి యవేక్షితుండు వెఱఁగుపడి మద్భార్య యివ్వనంబునం
దెక్కడియది దనుజమాయ గానోపు దానికేమి పోయి యెఱింగెదం గాక యని
యతిత్వరితంబునం జని యాసురకరగృహీత యై యాక్రోశించుచున్న కన్యకం
గని దాని నాశ్వాసించుచు.

162


క.

వినుతప్రతాపవినతా, వనివిభుఁడు గరంధముండు వసుమతి యేల
న్వనితాహరణము చేసితి, దనుజాధమ! పొలిసి తనుచుఁ దిద్దయుఁ నలుకన్.

163


సీ.

చనుదెంచునృపవరు ఘనధనుర్ధరుఁ గని యెంతయు నార్తి నయ్యిందువదన
రాజేంద్రుఁ డైనకరంధముకోడల నలఘువిక్రమయశుం డగునవేక్షి

తునిభార్య నీదురాత్మునిచేత నేను సనాథ నయ్యును ని ట్లనాథ మాడ్కి
నడవిలోపలఁ బట్టువడి తల్లడిలుచున్నదాన రక్షింపవే దయ దలిర్ప


తే.

ననిన నిది నాకు నా లెట్టు లయ్యె నొక్కొ, రాజునకుఁ గోడ లగుట యేక్రమమొ యనుచు
దగిలి యాతన్వి చెఱ మున్ను దలఁగి యింత, తెఱఁగు నెఱిఁగెదఁ గా కంత దీనిచేత.

164


వ.

అదియునుంగాక క్షత్త్రియునకు శస్త్రధారణం బార్తత్రాణకారణంబు గాదె
యని తలంచి యవేక్షితుం డారాక్షసు నిరీక్షించి.

165


తే.

బ్రదుకవలతేని వేగ యీపడఁతి విడిచి, యరుగు మోరిదురాత్మ! నీయాత్మ గొండు
తలఁపు గలదేని చక్కనై నిలువు మనుడు, బాల విడిచి నిశాటుఁ డాభీలలీల.

166


ఉ.

దండము బాహుదండమునఁ దాల్చి నృపాలతనూజుమీఁద ను
ద్దండరయంబున న్గదియ దైత్యుని నాతఁడు గప్పె విస్ఫుర
త్కాండపరంపరం గెరలి దానవుఁడు న్బొలుపార వైచె నా
దండము చండశంకుసహితం బగుదానిఁ గుమారుపై వడిన్.

167


శా.

ఆదండంబు నిశాతబాణములఁ దున్మాడెం గుమారోత్తముం
డాదైత్యుం డొకభూజముం బెఱికి తీవ్రామర్షుఁ డై వైచిన
న్వే దానిం దిలమాత్రఖండములు గావించె న్నరేంద్రాత్మజుం
డాదైతేయుఁడు గప్పె నావిభుని సాంద్రాశ్మోగ్రవర్షంబునన్.

168


తే.

నిశితశరముల నాశిలానీక మెల్లఁ, జూర్ణముగఁ జేసె భూపాలసుతుఁడు మఱియు
దనుజుఁ డెయ్యది యడరించె దాని నెల్లఁ, దూఁపుగములఁ దోడ్తోడన తునియ వైచె.

169


ఉ.

రక్కసుఁ డట్లు సాధనపరంపర వ మ్మయి పోయిన న్దిశ
ల్పిక్కటిలంగ నార్చుచును భీమగతి న్వడి ముష్టిఁ జాఁచి పే
రుక్కున డాసిన న్నరవరోత్తమనందనుఁ డొక్కతూఁపున
న్గ్రక్కున నమ్మహాసురుశిరంబు ధరం బడ నేసె నేసినన్.

170

దేవత లవేక్షితునకు వర మొసంగుట

మ.

సుర లగ్గించుచు సంప్రమోద మెదల న్పొంపార నవ్వీరుతో
వర మే మిచ్చెద మేమి? వేఁడు మనిన న్వాఁ డిండు సత్పుత్రునొ
క్కొరు నత్యద్భుత శౌర్యవీర్యఘను నాకు న్బ్రీతిమై నన్న నా
సుర లీకన్యకయందు నీకు జనియించు న్బుత్రుఁ డుద్యద్గుణా!

171


ఆ.

అతఁడు చక్రవర్తి యగు నని చెప్పిన, ననియె నాకరంధమాత్మజుండు
జనకుచేత నేను సత్యబద్ధుండ నై, కొడుకు మిమ్ము వేఁడుకొంటి వినుఁడు.

172


వ.

భండనంబునఁ బగతుర కోడి పాఱి భార్యాపరిగ్రహం బింక నొల్ల నని విశాలరాజ
తనూజ నేను బరిత్యజించితి నిదియు నిన్నుఁ దక్క నన్యుసంగమంబు పరిత్యజించిన

యది యట్టివైశాలినిం బరిగ్రహింపక యిపు డీయన్యనారీపరిగ్రహం బెట్లు సేయుదు
ననిన నద్దేవత లిట్లనిరి.

173


క.

ఇదియ కదా నీ చెప్పిన, యది నీసద్భార్య నీకు నై చేసెఁ దపం
బొదువఁగ నీకును దీనికి, నుదయించును సుతుఁడు సత్త్వయుతుఁడు గుమారా!

174

వైశాలిని యవేక్షితునకు నిజవృత్తాంతముఁ జెప్పుట

వ.

అని చెప్పి బృందారకు లరిగినం గరంధమనందనుం డాసుందరిం జూచి నీవిధం
బంతయు నిది యేమి? నా కెఱింగింపు మనిన నది యిట్లనియె.

175


ఉ.

నన్నుఁ బరిత్యజించి నృపనందన! నీ వటు చన్న నంత నే
ను న్నిఖిలాప్తబంధువులను న్బెడఁబాసి యరణ్యభూమికిం
గ్రన్నన వచ్చి మేను దొఱఁగం దెగి తీవ్రతపస్సమాధిమై
నున్ని సుధాశను ల్వనుప నొక్కచరుం డరుదెంచి ప్రీతితోన్.

176


ఆ.

ఇట్లు తగునే యింతి! యీ యేడుదీవులు, నేలుచక్రవర్తి యీడ్యకీర్తి
పుణ్యమూర్తి సుతుఁడు పుట్టు నీ కిది దేవ, వాక్య మొడలు విడువవలవ దనిన.

177


క.

అనిమిషులదూతపలుకులు, విని సంతస మంది తపము విడిచితి నంత
న్నినుఁ బొందఁగఁ గాంతును నేనని మనమున నూఱడిల్లి యంగజమూర్తీ!

178

వైశాలిని నాగలోకవృత్తాంతము చెప్పుట

వ.

అంత నపరదినంబున నేను గంగకుఁ జని యొక్కమడువున నీ రాడుచున్నంత నొక్క
వృద్ధనాగేంద్రుండు రసాతలంబునకు నన్నుఁ దిగిచికొని పోయిన నందలినాగపతులు
నాగాంగనలు నాగకుమారులు సహస్రసంఖ్యులు నాకడకు నరుగు దెంచి బహువిధం
బులఁ బ్రశంసించి పూజించి సవినయంబుగా నిట్లనిరి.

179


క.

నీ పుత్రున కపరాధం, బీ పవనాశను లొనర్తు రిందఱఁ గ్రుద్ధుం
డై పొరిగొనకుండఁగ నీ, వాపురుషవరేణ్యు మాన్పవమ్మ కడుఁగృపన్.

180


మ.

అని ప్రార్థించిన నట్ల చేసేదఁ బ్రియం బారంగ మీ కంటి న
న్న నహీంద్రు ల్బహురత్నభూషణముల న్వస్త్రంబుల న్సాంద్రచం
దనమాల్యంబుల వేడ్క నన్నుఁ జెలు వొంది న్బ్రీతిఁ గైసేసి యం
త నిజావాసము వెల్వరించిన నరేంద్రా! వచ్చి నే నిచ్చటన్.

181


చ.

అనుపమరూపకాంతిమహిమాతిశయంబునఁ నొంటియట్ల నా
తనులత యొప్ప భూషణవితానరుచిం జెలువారుచున్న నీ
దనుజుఁడు చూచి చాఁ దలఁచి దర్పితుఁ డై ననుఁ బట్టుకొన్నఁ గా
చినభవదీయబాహుబలజృంభణ మేఁ బొగడంగ నేర్తునే?

182


క.

నాకుఁ బ్రసన్నుడ వగుము గు, ణాకర! వరియింపు నన్ను నతులభుజబల
శ్రీకరకమనీయత నిల, నీ కెన నృవసుతుఁడు లేఁడు నిక్కం బరయన్.

183

క.

అనిన యెలనాగమాటలు, విని పితృవచనములు దలఁచి విమలవిచారుం
డనఘుం డవేక్షితుం డా, వనితకు నిట్లనియె గారవంపుబలుకులన్.

184


ఆ.

సానురాగహృదయ వైనని న్నపుడు నే, రిపుజితుండ నై పరిత్యజించి
నాఁడ నిపుడు శత్రునాశవసరమునఁ, బ్రాప్త వైతి సేయుభాతి యేది?

185


ఆ.

అనిన నింతి యిట్టు లనియె మత్పాణిగ్రహము సేయు మీవనాంతరమునఁ
గామకలితు లైనభామినీపురుషుల, సంగమంబు పొలుచు సగుణ మగుచు.

186

గంధర్వుఁ డవేక్షితునకు వైశాలినీజన్మరహస్యము దెలుపుట

క.

అనిన నతఁ డిట్టు లయ్యెడు, విను పాణిగ్రహణ మిపుడు విధియుక్తముగా
నొనరింపవలయుఁ దన్వీ!, యనునెడ గంధర్వనాథుఁ డధికవిభూతిన్.

187


వ.

అనేకగంధర్వాప్సరఃపరివృతుం డై యరుగుదెంచి యవేక్షితుం గాంచి మహాత్మా!
యీమానిని నాకూఁతురు దీనిపేరు భామిని యిది బాల్యంబున నగస్త్యాశ్రమ
మునగకుం జని విహరించుచున్న నమ్ముని మనుష్యయోనిం బుట్టు మని శపియించిన.

188


క.

మునివల్లభ! యిది యవివే, కిని యెంతయు బాల దీనిఁ గృపఁ జూడు మన
మ్మున సైఁపు దప్పు దీనికి, ననుగ్రహము సేయు మనిన నతఁ డి ట్లనియెన్.

189


క.

బాల యని తలఁచి కాదే, యీలలనకు నల్పశాప మిచ్చితి ననిన
న్జాలఁగ వగచితి నేను వి, శాలున కిది పుట్టెఁ దపసిశాపమున నృపా!

190

వైశాలిన్యవేక్షితుల వివాహము

వ.

అని చెప్పి గంధర్వవిభుం డిది నాపుత్రి గానఁ జనుదెంచితి దీనిఁ బరిగ్రహింపుము
నీకుం జక్రవర్తియగుపుత్రుం డుద్భవించు ననిన నవేక్షితుండు తుంబురుండు
హోతగా సుముహూర్తంబున భామినిపాణిగ్రహణమహోత్సవం బంగీకరించె
నప్పుడు గంధర్వగీతంబులు నప్సరోనర్తనంబులుం బ్రవర్తిల్లెఁ బుష్పవర్షంబులు
గురిసె దేవతూర్యంబులు మనోహరము లై ప్రవర్తిల్లె నంత.

191


క.

గంధర్వలోకమున కా, గంధర్వవిభుండు చనియె గంధర్వులతో
బంధురవిభూతిఁ గూఁతుఁ గ, రంధమసుతుఁ దోడుకొని కరము ప్రియ మొదవన్.

192

వైశాలినియు నవేక్షితుఁడును గంధర్వలోకమున కేఁగి విహరించుట

తే.

ఇట్లు గంధర్వపురమున కెలమి నేఁగి, యానవీనపుదంపతు లాత్మవేద్క
లగ్గలింపఁ గోర్కులు తొలఁకాడ నడరి, తమకములు దీర బహువిహారములఁ దగిలి.

193


సీ.

కమనీయకాంచనకాంతిసురమ్యహర్మ్యోపరిస్థలుల నొక్కొక్కమాటు
శుకపికమధుపమంజులవిహారోల్లసదుపవనాంతముల నొక్కొక్కమాటు
కలహంససారసకలరవాంచితసరిదురుపులినముల నొక్కొక్కమాటు
శృంగసంగతరత్నరంగదుత్తుంగశైలోపకంఠముల నొక్కొక్కమాటు

తే.

తివుట నొక్కొక్కమాటు పద్మినులపొంత, నర్థి నొక్కొక్కమాటు గుహాంతరములఁ
బ్రీతి నొక్కొక్కమాటు కృత్రిమనగముల, బహువినోదము ల్సలిపిరి పతియు సతియు.

194


క.

అడిసిగ్గులు తమకంబులు, నుడి వోవఁగఁ గేలికడఁక లొదవఁగఁ జెయువు
ల్దడఁబడ మలుపులు దెలుపులు, నడరి రతిక్రీడ సలిపి రతివయుఁ బతియున్.

195


క.

కిన్నరగంధర్వులు రుచి, రాన్నప్రశ్చందనాంబరాభరణాదు
ల్పన్నుగఁ దమ కొసఁగఁగ సం, పన్నము లగుభోగములకుఁ బాత్రము లగుచున్.

196


వ.

కరంధమరాజనందనుండు గంధర్వరాజనందనయు నిట్లు మనోహరము లగుమనో
భవవిహారముల సుఖయించుచుండి రంతఁ గొంతకాలంబునకు.

మరుత్తుజననము

క.

గంధర్వరాజనందన, సంధుక్షితతేజుఁ బ్రబలు సత్సుతుఁ గనిన
న్గంధర్వలోక ముత్సవ, బంధుర మై యొప్పె నభము ప్రవిమల మయ్యెన్.

198


సీ.

ఎలమి నవేక్షితుఁ డెంతయు రంజిల్లెఁ గిన్నరగంధర్వగీతతతులు
పణవవీణావేణుపటహమృదంగానేకాదినాదంబులు నతిశయిల్లె
నప్సరోవనితలయాటలు విలసిల్లె వెసఁ బుష్పవర్షంబు విస్తరిల్లె
నవిరళమృదుగంధపవనంబు శోభిల్లె దిక్కులన్నియుఁ గడుఁ దేజరిల్లె


తే.

నపుడు గంధర్వనగర మత్యంతరమ్య, మయ్యె సురసిద్ధసాధ్యవిద్యాధరాహి
గరుడఖేచరయక్షకింపురుషవరుల, సంకులమ్మున సంయమిసంకులమున.

199


వ.

అట్టిసమయంబునఁ దుంబురుం డాబాలునికి జాతకర్మహోమాదిసముచితక్రియా
కలాపంబు నిర్వర్తించి స్వస్తివచనపూర్వకంబుగా నిట్లని స్తుతియించె.

200


క.

నీవు మహనీయుఁడవు తే, జోవీర్యధనుండ వురుయశుండవు భూభృ
ద్దేవుఁడవు చక్రవర్తివి, శ్రీవిలసితుఁడవు కుమార జితరిపువీరా!

201


క.

శతమఖముఖనిఖిలసుర, ప్రతిపక్షనిరాసనిపుణ! భవదీయభుజా
తతబలశౌర్యంబులు ప్ర, స్తుతించెదరు వివిధయజ్ఞసుకృతప్రవణా!

202


వ.

అని మఱియును రజోరహితంబుగా నల్లన వీచుచున్న ప్రాఙ్మరుత్తు నీకు శుభంబును
దక్షిణమరుత్తు నీకు విమలత్వంబును బశ్చిమమరుత్తు నీకు భుజవీర్యంబును నుత్తరమ
రుత్తు నీకు బలంబును నొసంగుం గాత యని దీవించినయనంతరం బాకాశంబున
నుండి యశరీరవాణి యెల్లవారు వినుచుండ నీగురుం డైనతుంబురుండు కుమారు
నికి మరుత్తులు శుభం బొసంగు నని పెక్కుమాఱులు పలికె నది కారణంబుగా
నితండు మరుత్తనామంబునం బ్రఖ్యాతుం డగు మహీపతు లెల్ల నీతనిశాసనంబు
శిరంబుల ధరియింతు రీవీరుండు సకలరాజచూడామణి యగు నీమహత్తుండు భుజ

వీర్యపరాక్రమంబులం బరచక్రపతుల నాక్రమించి సప్తద్వీపాలంకృతం బగుమహీ
చక్రంబు దాన యేలి చక్రవర్తి యగు నీమహనీయమూర్తి యజ్ఞకర్త లైనమహీ
భర్తలలో నగ్రేసరుం డై వర్తిల్లు నని చెప్పినవచనంబు లాకర్ణించి నాకౌకసులు
గంధర్వులు నవేక్షితుండును భామినియుం బరమానందంబు నొంది యావాక్యం
బులు బహువిధంబులం బ్రస్తుతించి రంత.

203

పుత్త్రాదులతో నవేక్షితుఁడు నిజనగరమున కేఁగి తండ్రిం దనుపుట

సీ.

ఆనృపాత్మజుఁడు నిజాత్మజుఁ గొని తాను వనితయు గంధర్వపతులు గొలువ
తనపురంబున కేఁగి మనుజేంద్రపరివృతుండైనతండ్రికి వినయమున మ్రొక్కి
యధిప! నీతోఁ బల్కినట్టులు చేసితి నిదె చూడు పౌత్రునివదన మర్థి
నని సుతు నుత్సంగమున నిడి పడసిన వృత్తాంత మంతయు విన్నవించు


ఆ.

టయుఁ గరంధముండు నయనంబు లుత్కటా, నందవారిబిందుసుందరములు
గా ననూనభాగ్యకలితుండ నైతి నే, నంచు బాలుఁ గౌఁగిలించె వేడ్క.

204


తే.

అతఁడు మనుమని మఱియు నందంద ప్రీతి, యడర నాలింగనము చేసి యర్ఘ్యపాద్య
గంధపుష్పాదిపూజలఁ గరము నెమ్మి, నఖిలగంధర్వులకుఁ బ్రియ మాచరించె.

205


ఉ.

పౌరులు మానవేంద్రునకుఁ బౌత్రుఁడు గల్మికి మిన్ను మోసి సొం
పారఁగఁ జేసి రుత్సవము లఫ్డు పురం బభిరామ మయ్యె శృం
గారఁము లొప్పఁ జేసి పురకాంతలు మంగళగీతవాద్యము
ల్బోరున మ్రోయ నృత్యము లపూర్వముగా నొనరించి రెంతయున్.

206


క.

భూసురుల రత్నకాంచన, వాసోలంకారధేనువసుధాదాన
శ్రీసొంపున సంపన్నుల, జేనెఁ గరంధముఁడు ప్రీతచిత్తుం డగుచున్.

207


వ.

అంత.

208


మ.

సితపక్షంబున నాఁడునాఁటికిఁ గడుం జెన్నొందుశీతాంశున
ట్లతిలావణ్యవిలాసభాసురతనుం డై తల్లికిం దండ్రికి
న్సతతాహ్లాద మొనర్చుచుం బెరిఁగి యాచార్యోపదేశంబునం
జతురుం డయ్యె మరుత్తుఁ డాగమముల న్శాస్త్రమ్ముల న్విద్యలన్.

209


తే.

అభిమతముగ ధనుర్వేద మధిగమించి, ప్రీతి దివ్యాస్త్రచయము పరిగ్రహించె
నఖిలశస్త్రవిద్యలు వేడ్క నభ్యసించెఁ, గ్రమముతో మరుత్తుండు భార్గవునివలన.

210


వ.

అంత.

211


క.

తనకూఁతుతెఱఁగు దౌహి, త్రునిజననము నతని శౌర్యదోర్వీర్యములు
న్విని నిర్భరహర్షరస, మ్మునఁ దేలె విశాలరాజపుంగవుఁడు మదిన్.

212

కరంధముఁడు మరుత్తునకుఁ బట్టాభిషేక మొనర్చి యడవి కేఁగుట

వ.

అంతఁ గరంధముం డరణ్యంబున కరుగం దలంచి యొక్కనాఁ డవేక్షితుం బిలిచి
యిట్లనియె.

213

చ.

వినుము కుమార! యెంతయును వృద్ధుఁడ నైతి నరణ్యభూమికి
న్జనియెద నేఁ గృతార్థుఁడన సర్వమునందును నీకుఁ బట్టబం
ధన మొనరించునీకొఱఁత దక్కను నొండుగొఱంత లేదు నా
కనుపమ మైనరాజ్యముఁ బ్రియంబునఁ గైకొను మీవు నావుడున్.

214


ఉ.

ఆనతవక్త్రుఁ డై యనియె నాతఁడు రాజ్యము సేయ నొల్ల దం
డ్రీ! నెఱ నాడియున్నయది యీధర కన్యు నొనర్పు రాజుగా
హీనత నొంది నీకతన నేఁ జెఱఁ బాసినయప్డ పౌరుష
శ్రీ ననుఁ బాసెఁ బౌరుషగరిష్ఠుఁడు గాక ధరిత్రి యేలునే?

215


క.

ఏపురుషునియాపద లెడఁ, బాపంబడు నొరులచేతఁ బరికింపంగా
నాపురుషుఁడు దా స్త్రీధ, ర్మోపేతుఁడు నిష్ప్రభావుఁ డుర్వీనాథా!

216


వ.

కావున నీచేత మోక్షితుండ నై స్త్రీసమానధర్ముండ నైన నేను మహీభర్త నగుదునే?
స్త్రీకి శూరుం డగుపురుషుండు గదా భర్త యగు ననినఁ దండ్రి యిట్లనియె.

217


తే.

కొడుకునకుఁ దండ్రి తండ్రికిఁ గొడుకు వేఱు, గామి యది పరమార్థంబు గానఁ దండ్రి
నైననాచేత మోక్షితుఁ డైతి గాక, యొరునిచే ముక్తుఁ డైతివే యురుగుణాఢ్య?

218


క.

అనినం దండ్రికి సుతుఁ డి, ట్లను నీచెప్పినది నిక్క మగు నైనను నా
మన సొడఁబడ దే నీచే, విని మోక్షితుఁ డగుట నాకు వ్రీడన సేయున్.

219


తే.

ఒనరఁ దండ్రిచే లక్ష్మిఁ గైకొనునతండు, తండ్రిచేఁ గ్లేశములఁ బాసి తనరునతఁడు
తండ్రిచేతన వెలయు నతఁడు మదీయ, కులమునందును లేకుండవలయుఁ దండ్రి!

220


వ.

అని పెక్కుభంగులఁ జెప్పిన కొడుకు నొడఁబఱుపనేరక మరుత్తునిం బిలిచి నీవు
మహీరాజ్యంబు పూను మనిన నతండు తండ్రిపంపున నొడంబడియె నంత నామను
జేంద్రుండు మనుమనికిం బట్టంబు గట్టి భార్యాసమన్వితుండై వనంబునకుం జని
వేయివత్సరంబులు ఘోరతపంబుఁ జేసి శరీరంబు విడిచి సురలోకప్రాప్తుం డయ్యెఁ
దదీయపత్ని వీరమహాదేవి మఱియు శతవర్షంబులు ఫలమూలకృతాహారయై పతి
సాలోక్యంబు గోరి భార్గవుం డైనయార్వునాశ్రమంబున మునిశుశ్రూష
సేయుచుం దపోవృత్తినుండే నని చెప్పిన విని కోష్టుకి మార్కండేయున
కిట్లనియె.

221

మరుత్తచక్రవర్తిచరిత్ర

చ.

అనుపమధర్మమూర్తియు నయాదరవర్తియుఁ జగ్రవర్తియు
న్ఘనభుజవీర్యుఁడు న్రిపువినాశకరోద్భటశౌర్యుఁడు న్జగ
జ్జననుతకీర్తిధుర్యుఁడును శాంతుఁడు దాంతుఁడు నై నయమ్మరు
త్తునిచరితం బొగి న్వినఁ గుతూహల మయ్యెడు నాకుఁ జెప్పవే.

222

చ.

అనుఁడు మృకండుసూనుఁడు మహాత్మ! పితామహుచేత నమ్మరు
త్తనృపతి వేడ్క పెంపెసఁగఁ దా పృథురాజ్యపదస్థుఁ డై మహీ
జనములఁ గాచుచు న్సవనసంపద నొందుచు నెల్లదీవులం
దనఘనచక్ర మప్రతిహతం బగుచుండఁగ నత్యుదగ్రతన్.

223


క.

తనరథగతి యాకాశం, బున బాతాళమున నుదకములయందును నెం
దు నకుంఠిత మై మెఱయఁగ, ననఘుండు మరుత్తుఁ డేలె నఖిలావనియున్.

224


తే.

ఇతరవర్ణులు నమ్మేదినీశువలన, నధికధనములు వడసి నిరంతరంబు
నాస్థతో నిష్టపూర్తము లాదిగాఁగఁ, గలుగుధర్మము ల్సేసిరి గారవమున.

225


సీ.

ఆంగిరసుండు బృహస్పతితోఁబుట్టు వతులతపోవిభవాధికుండు
సంవర్తుఁ డనియెడుసంయమి తనకు ఋత్విజుఁ డయి ముంజవద్దివ్యనగము
శిఖరంబు నిజశక్తి క్షితిఁ బడఁ జేసి యందపరిమితం బైనయర్థసంచ
యమ్ముఁ జూపినఁ గొని యమ్మరుత్తుఁడు హేమకుట్టిమస్థలములఁ గొమరు మిగుల


తే.

హర్మ్యశాలాదినానాగృహముల బహువి, ధోపకరణములను మహాయూపములను
గనకమయములఁ గావించి క్రతువు లోలిఁ, జెసి దివిజులఁ దృప్తులఁ జేసె నర్థి.

226


వ.

ఇట్లు మరుత్తుండు సోమంబున నింద్రాదిదేవతలను సమగ్రదక్షిణల మహీదేవత
లను దృప్తి నొందించి సువర్ణమయంబు లగుప్రాసాదాదిసమస్తవస్తువులను
బ్రాహ్మణుల కొసంగి మహోత్కృష్టుం డై మహీపాలనంబు సేయుచుండ నొక
తపోధనుండు చనుదెంచి యానరపతిం గాంచి యేను భవత్పితామహికడనుండి
వచ్చితి నాయవ్వ నీకుం జెప్పు మనిన వాక్యంబు లాకర్ణింపుము.

227

మరుత్తునితో ముని చెప్పిన నాయనమ్మసందేశము

ఆ.

ధరణి ధర్మయుక్తిఁ దగఁగఁ బాలించి నీ, తాత చనియె దివిజధామమునకుఁ
దపము సేయుచున్నదాన నౌర్వాశ్రమ, స్థలమునందు శాంతి దనర నేను.

228


తే.

పుడమి పాలించి చనినమీపూర్వనృపుల, యందు ము న్నేతరమ్మున నైన నుర్వి
కెన్నఁడును బుట్ట దేకీడు నెచట నకట!, నీతరంబున నొకకీడు నేఁడు పుట్టె.

229


క.

సురుచిరభోగాసక్తిం, బొరసియొ సతతాధ్వరేచ్ఛ పొందియొ యకటా!
చరనరనాథుఁడవై నీ, వరయవు దుష్టులు నదుష్టు లగువారి నిలన్.

230


వ.

అది యెట్లంటేని.

231


సీ.

అధికదర్పోన్నతి నహిలోకముననుండి చనుదెంచి ఘోరభుజంగమములు
మునుల వినిర్మలమూర్తుల నేడ్వురఁ గఱచి వేగమ మృత్యుగతులఁ జేసి
విలసజ్జలాశయములు నిజస్వేదమూత్రపురీషముల దూషితములు సేసిఁ
గడఁగి హవిస్సులు గాసి చేసిన వాని సమయింప సంయము ల్శక్తులైన

తే.

వారు దండింప నొడయలు గారు నీవ, యొడయఁడవు నృపోత్తమ! ధర్మయుక్తి నెంత
దాఁక నభిషేకజలము లదలకు రావు, రాకొమరుఁ డంతదాఁక భోగైకపరుఁడు.

232


క.

అట మీఁద ధరణిపాలన, పటుకర్మములందుఁ దగిలి బహుదుఃఖము లం
దుట గాక యతని కత్యు, త్కటభోగపరత్వ మొండు గలదె నరేంద్రా.

233


క.

మహివల్లభునకు దేహ, గ్రహణము భోగములకొఱకుఁ గాదు ధరిత్రీ
వహననిజధర్మపాలన, బహుదుఃఖనిరంతరానుభవమునకు నృపా!

234


క.

ఇహలోకమున మహీపతి, బహుదుఃఖము లనుభవించి పరలోకమున
న్బహుకాల మప్సరోవర, మహిళాసంభోగసౌఖ్యమహనీయుఁ డగున్.

235


వ.

కావున నింతయు విచారించి రాజ్యభోగంబులు పరిత్యజించి ధరణీపాలనక్లేశంబు
లంగీకరింపు మచారుండ వగుటం జేసి భుజంగకృతద్విజమరణంబు గాన నేర వైతి
వేయును జెప్పనేల దుష్టనిగ్రహం బొనరించి శిష్టప్రతిపాలనంబునం దదీయధర్మం
బునం దాఱవభాగం బందుము రక్షింపక యుపేక్షించి తేని దుష్టకృతదురితం
బంతయు నిన్నుఁ బొందు నిది యసందిగ్ధం బని నిజపితృజనని చెప్పఁ బనిచినవిధంబు
సమస్తంబును జెప్పితి నిందు నీమనంబున కెయ్యది రుచి దానిని చేయు మనిన
మునివచనంబులు విని మరుత్తుండు లజ్జాయతచిత్తుం డగుచుఁ దన్నుం దాన
నిందించుకొని నిట్టూర్పునిగిడించి యప్పుడు.

236

మరుత్తుఁడు సంవర్తాస్త్రముచే నాగలోకముఁ దపింపఁ జేయుట

క.

ధనువును దివ్యాస్త్రంబులు, గొని యౌర్వునియాశ్రమమునకుం గడువేగ
మున నేఁగి పితామహికిని, మునులకుఁ బ్రణమిల్లి రాజ్యముఖ్యుం డెదురన్.

237


ఉ.

పాములచేతఁ జచ్చి భువిఁ బడ్డమునీంద్రులఁ గాంచి పార్థివ
గ్రామణి యుల్ల ముమ్మలికఁ గాలఁగఁ బల్మఱుఁ దన్ను దిట్టుకొం
చేమఱి యింతపాపమున కే నెలవైతినె? దుష్టపన్న గ
స్తోమము నాభుజబలముసొంపునఁ బెంపును నేపు దించెదన్.

238


చ.

అని పటుకోపపావకశిఖారుణితాంబకదీప్తవక్త్రుఁడై
యనిమిషయక్షకిన్నరవియచ్చరమానవులార! చూడుఁడీ
యనుపమపుణ్యమూర్తుల మహాత్ముల నిమ్మునుల న్విషాగ్నిఁ ద్రుం
చినయహికోటి నెల్ల నెటు చేసెదనో భుజవీర్యసంపదన్.

239


క.

అని పలికి మరుత్తుఁడు రయమున సంవర్తకమహాస్త్రముం దొడి పవనా
శననాశమునకు నై యేసిన నది దుర్వారవహ్నిశిఖ లెగయంగన్.

240

శా.

పాతాళం బఖిలంబునుం బరగి సర్పశ్రేణుల న్సర్వలో
కాతంకంబుగఁ గాల్పఁ జొచ్పుటయు హాహారావము ల్సేయుచు
న్భీతిం దల్లులఁ దండ్రుల న్దనయుల న్వే చీరుచు న్బన్నగ
వ్రాతము ల్హనార్చుల న్బడగలు న్వాలంబులు న్రాలఁగన్.

241


క.

కర మార్తిఁ బొంది వస్త్రా, భరణంబులు దిగ్గ విడిచి పాతాళముఁ జె
చ్చెర వెడలి మరుత్తజనని, శరణము వేఁడుచు రయమునఁ జనిరి మునీంద్రా!

242


మ.

చని యాభామినిఁ గాంచి యార్తి యడర న్సర్పంబు లందంద వం
దనము ల్సేసి సగద్గదస్వనముల న్దల్లీ! దయ నాకు ని
చ్చినయానాఁటివరంబు నేఁడు మదిలోఁ జింతింపు యుష్మత్సుతా
స్త్రనితాంతాగ్ని నశింపకుండఁగ వెస న్రక్షింపు మమ్మందఱన్.

243


క.

ఘోరాస్త్రానలమున విపు, లోరగలోకంబు గాల్పకుండఁగఁ దల్లీ!
వారింపుము నీపుత్రకు, నేరూపున నైనఁ గావు మీయహికులమున్.

244


క.

స్ఫురితామర్షోద్దీపిత, మరుత్తఘోరాస్త్రవహ్ని మాఁడెడుమాకు
న్గరుణింపు నీవు దక్కఁగ, శరణం బగువారు లేరు సాధుచరిత్రా!

245


వ.

అనినయురగంబులవచనంబులు విని వారికిం దొల్లి తనయిచ్చినవరంబునుం దలంచి
సంభ్రమంబునం బతి నాలోకించి పాతాళంబునకు నన్నుం దోడ్కొని పోయి
ప్రార్థించిన వీరికి నభయం బిచ్చినదాన నాపలు కసత్యంబు గాకుండ నీకొడుకు
వారింపు మనిన నవేక్షితుం డత్యపరాధం బొనర్చిన యాదర్వీకరంబులందు భవ
న్నందను కోపంబు దుర్వారం బై యున్నయది యెట్లు మాన్పింపవచ్చునని తలం
చెద ననిన దందశూకంబులు తల్లడిల్లి మహాత్మా! యట్లనకుము శరణాగతులము
మాకుం బ్రసన్నుండ నగుము క్షత్త్రియులశస్త్రధారణం బార్తప్రాణకారణంబు
గాదె యని ప్రార్థించిన నతండు.

246


క.

శరణాగతార్తదర్వీ, కరదీనోక్తుల మనంబు గడుఁగరుణాసం
భరిత మయిన ని ట్లనియెను, ధరణీనాయకుఁడు ప్రీతిఁ దనసతితోడన్.

247


క.

తరుణీ! యే నీపంపున, మరుత్తు వారింతుఁ గాతు మానుగ సర్పో
త్కరము నవశ్యమును విను, శరణాగతులం ద్యజింపఁ జన దెవ్వరికిన్.

248

భామినివాక్యమున నవేక్షితుఁడు పాముల రక్షింపఁ బ్రతిజ్ఞ చేయుట

క.

విను నావచనంబున నీ, తనయుం డత్యుగ్ర మైనతనయస్త్రము చ
య్యన సంహరింపకున్నను, ఘనదివ్యాస్త్రహతి దానిఁ గ్రాతుం దరుణీ!

249


మ.

అని రాజన్యవరుం డవేక్షితుఁడు పూజ్యం బైనచాపంబు న
స్త్రనికాయంబును దాల్చి తాను సతియు న్రాజిల్లునౌర్వాశ్రమ

మ్మునకుం బోయి మహోగ్రకార్ముకరుచిస్ఫూరద్భుజుం దామ్రలో
చను దివ్యాస్త్రసముద్గతానలశిఖాసంవ్యాప్తరోదోంతరున్.

250


తే.

దారుణానలాస్త్రంబు పాతాళమునకు, నుగ్రమూర్తియై చొనుపుచు నున్నవాని
నమ్మరుత్తుని గని డాయ నరిగి యిట్టు, లనియె నల్పస్వరమున వీరాత్మజుండు.

251

పాములకై మరుత్తావేక్షితుల సంవాదము

క.

చనునయ్య యింతకోప, మ్మున బటుసాహసము సేయ భూపోత్తమ! నీ
కనురూపంబే యిది స, య్యన నీ వుపసంహరింపు మస్త్రానలమున్.

252


క.

అనినట్టితండ్రిపలుకులు, విని తప్పక చూచి చేత విల్లుండఁగ న
జ్జనపతి సగౌరవంబుగ, జననికి జనకునకు మ్రొక్కి చండస్ఫూర్తిన్.

253


శా.

ఏమీ యస్త్రము సంహరింపఁ దగునంటే తండ్రి! మద్వీర్యము
న్సామర్థ్యంబు తృణీకరించి యిటు లీసప్తర్షుల న్సభ్యుల
న్సామర్షాతకు లై యకారణమ యీ వ్యాళాధముల్ గ్రూరు లు
ద్దామక్రోధులు చంపి యుండఁగను నీత ప్పేను సైరింతునే?

254


క.

కావున నీబ్రహ్మఘ్నుల, కై వసుధాధీశ! యడ్డ మాడకు మింక
న్నీ వించుక యుడుగను నే, నేవిధమున ననిన నయ్యవేక్షితుఁ డనియెన్.

255


క.

ఈమునివర్యులఁ జంపిన, పాములు నరకంబునందుఁ బడుఁగా కవి నీ
కేమి వెస వస్త్ర ముడుపుము, నామాట ప్రియంబుతో నొనర్పుము పుత్రా!

256


ఆ.

అనిన నమ్మరుత్తుఁ డతిపాపు లగువీరి, నిగ్రహింప కున్న నిరయమునకు
నేను బోదుఁ గాక యీపాము లేఁగునే, దండ ముడుగు మనుట దగునె తండ్రి!

257


వ.

అని మఱియు నత్యంతాపరాధు లైనయీదుష్టోరగములకు నే నుపశమింప మదీయ
ధర్మంబు విడిచి నీపంపును నే నొనరింప ననినం గరంధమనందనుండు కటకటంబడి
కొడుకున కి ట్లనియె.

258


చ.

వల దని యెంత చెప్పినను వారక మచ్ఛరణాగతాహుల
న్బొలియఁగఁ జేయఁ జూచె దది పొర్లగఁ జేసెద వస్త్రవేది వీ
విల నరయంగఁ నొక్కరుఁడవే! వివిధాస్త్రము లే నెఱుంగనే?
నిలుచునె నీదురాగ్రహము నేర్పును నాయెదుర న్దురాత్మకా!

259


సీ.

అని కడుఁ గోపించి యయ్యవేక్షితుఁడు దామ్రాక్షుఁ డై యుగ్రశరాసనమునఁ
బటుతరానలశిఖాభయదకాలాస్త్రంబు సంధించుటయు నిల సంచలించె
నయ్యస్త్రఘోరత్వ మమ్మరుత్తుఁడు సూచి యిట్లనుఁ దండ్రితో నేను దుష్ట
దమనార్థ మిమ్మహాస్త్రము ప్రయోగించితిఁ గాని నీపై నేయఁ గడఁగ నీవు


ఆ.

ధర్మపద మొకింత దప్పనినామీఁద, నీశరంబు దొడుగ నేల చెపుమ?
ప్రజలఁ బాడితోడఁ బరిపాలనము సేయు, నన్నుఁ జంపఁ గారణంబు గలదె?

260

తే.

అనిన నయ్యవేక్షితుఁడు భయార్తరక్ష, యేను గావింపఁ బూనితి దాని కీవు
గడఁగి విఘ్నం బొనర్చితి గాన నీకు, బ్రదికి పోవంగ రాదు నాయెదుర నింక.

261


క.

నను నీవొండె శరానల, మున నీఱుగఁ జేసి సర్పములఁ ద్రుంపు వెస
న్నిను నే నొండె శరానల, మున నీఱుగఁ జేసి సర్పములఁ గాతు వెసన్.

262


క.

అతిభీతుఁ డైనశరణా, గతు నార్తుని శత్త్రు నైనఁ గడుకొని కరుణా
న్వితుఁడై రక్షింపనిదు, ర్మతి యగుకుత్సితునిబ్రతుకు బ్రతుకే తలఁపన్?

263


ఆ.

క్షత్రియుండ నాకు శరణాగతాతురో, రగవితాన మది దురాత్మ! తదప
కారకారి నీవు కావున వధ్యుండ, వనినఁ దండ్రి కిట్టు లనియెఁ గొడుకు.

264


క.

తనబాంధవుండు మిత్రుఁడు, జనకుఁడు గురుఁ డనక కడఁగి చంపవలయు భూ
జనపరిరక్షావిఘ్నం, బోనరించిన నీతి యూఁది యుర్వీశునకున్.

265


క.

కావున నిన్ను వధించెద, నీ వలుగకుమీ నరేంద్ర! నృపధర్మం బే
గావించెదఁ గాని యమ, ర్షావేశము లే దొకింత యైనను నాకున్.

266


వ.

అని యిట్లు తండ్రియుం గొడుకును నొండొరులం జంపు తెంపుసొంపునం బ్రచండ
మూర్తు లై యున్న నయ్యిరువురకడకు నతిసంభ్రమంబున నరుదెంచి యౌర్వాది
మునిజనంబులు వారల వారించిన నత్తపోధనుల నాలోకించి మరుత్తుండు మహీ
పతినైననాకు నీదుష్టోరగంబుల దండించుట నిజధర్మంబు గాదే? యిందు నాచేసిన
యపరాధంబు గలదే? యనిన నవేక్షితుం డి ట్లనియె.

267


చ.

శర ణని వచ్చి చొచ్చిరి భుజంగవరు ల్కరుణాత్ములార ! నా
కరయఁగ రక్షితవ్యులు తదార్తులఁ జంపుమదాత్మజుండు ని
ష్ఠురుఁ డపరాధి కాఁడె యనుడు న్మును లూర్జితధర్ము లైనయ
య్యిరువురఁ జూచి మీరు వినుఁడీ భుజగంబులపల్కు లేర్పడన్.

268


సీ.

దుష్టపన్నగవిషనష్టచేతను లైనయిమ్మహామౌనుల నీక్షణంబ
యుజ్జీవితులఁ గాఁగ నొనరింతు మనియెద రిదె తల్లడిల్లి యహీంద్రు లెల్లఁ
గావున నింక విగ్రహము మీ కేటికి వలదు మానుఁడు ప్రసన్ను లరు గండు
సత్యప్రతిజ్ఞులు సద్ధర్మపరులు మీ రిరువురు నిఖిలరాజేంద్రులందు


ఆ.

ననిరి వీర యప్పు డయ్యవేక్షితు డాసి, నీసుతుండు గరము నెమ్మి నాదు
పనుపుఁ జేసి పాపపదుపుఁ గీటడఁప ను, ద్యమము చేఁత సఫల మయ్యె ననఘ!

269


వ.

మృతు లైనమునిపతులు సంజీవితు లగుటం జేసి నీసుతుండును గృతార్థుండు భవ
దీయశరణాగతులు వీతభయజ్వరు లైరి కావున నీవును ధన్యుండవ యని కొడు
కును దీవించి నంత నాభామిని తనయత్తకు నమస్కరించి యురగులరక్షణార్థంబు
పతికిం దననియోగించినతెఱఁ గంతయు నెఱిఁగించి దేవీ! నీప్రసాదంబున నీపుత్త్ర
పౌత్త్రులకు శోభనంబు దొరఁకొనియె నని పలికిన నయ్యిరువురుం దమదివ్యా
స్త్రంబు లుపసంహరించిరి తదనంతరంబ.

270

ఆ.

విషహరంబు లైనవివిధదివ్యౌషధ, ముల భుజంగవరులు మునులఁ బరమ
శాంతిఘనుల నపుడు సంజీవితులఁ జేసి, చనిరి భుజగభువనమునకు నెలమి.

271


చ.

ఘనుఁడు మరుత్తుఁ డప్పు డధికప్రమదంబున వచ్చి తండ్రికి
న్వినయ మెలర్ప మ్రొక్కుటయు వేడుక గ్రక్కునఁ గౌఁగిలించి య
జ్జనపతి పుత్ర! సత్యజయసంపదయు న్బహుపుత్రపౌత్రవ
ర్ధనమును నాయురాప్తియును రాజ్యవిభూతియు నీకుఁ గావుతన్.

272


చ.

అని సుతుఁ బెక్కుదీవనల నవ్విభుఁ డెంతయు గారవించి య
మ్మునులకుఁ దల్లికిం దగఁగ మ్రొక్కి క్రమమ్మున వారి నెల్ల వీ
డ్కొని బహురత్ననూత్నరుచిగుచ్ఛమనోజ్ఞరథమ్ము నెక్కి నం
దనుఁడును దాను నాలును ముదం బెసఁగ న్జని రంత వీటికిన్.

273


వ.

ఇట్లు ప్రవేశంబు సేసి.

274


మహాస్రగ్ధర.

భవనప్రాసాదహర్మ్యోపరితలవిలసద్బాలికాలోచనోద్య
ద్ధవళాంశుశ్రేణితోడ న్దనపయి సితముక్తాసమేతాక్షత ల్ప
ర్వ వరిష్ఠుం డామరుత్తావనిపతి చనియె న్వైభవ ముల్లసిల్ల
న్వివిధాలంకారశోభావిభవవిరచనావిస్ఫురద్రాజవీథిన్.

275


తే.

పురమువిభవంబు సూచుచు భూరితరవి, భూతి నల్లల్లఁ జని రాజపుంగవుండు
నగరు సొచ్చె సమస్తజనంబు చంద్రు, నుదయమునను జలధులట్టు లుబ్బుఁ జెంద.

276


వ.

అంత నిఖలరాజోత్తముం డగుమరుత్తుండు మహిమాయత్తుం డై మహీరాజ్యంబు
సేయుచు విదర్భరాజనందన యైనవైదర్భియు సువీరపుత్రి యైనప్రభావతియును
మాగధతనయ యైనసుకేశియు కేకయసుత యైనకైకేయియు సురంధ్ర మహీపతిత
నయ యైనసౌరంద్రియు సింధునృపతిప్రభవ యైనవపుష్మతియు చేదిపతితనయ యగు
సుశోభనయు ననుకన్యల వివాహం బై వారియందు నరిష్వంతాదు లైనకొడుకులం
బదునెనమండ్రం బడసి సంపత్పరంపరాభివృద్ధి నొంది.

277


సీ.

చెలువొందు నేడుదీవులయందుఁ దనచక్ర మప్రతిహతవృత్తి నతిశయిల్లఁ
గొమరారుమూఁడులోకములందు నెప్పుడు తనరథం బతిరయోద్ధతిఁ జరింపఁ
బొలుచుచతుర్దశభువనంబులందును దనచారుకీర్తి నర్తన మొనర్ప
విలసిల్లుబ్రహ్మాండవివరంబునం దెల్లఁ దనతీవ్రతేజంబు దనరి వెలుఁగ


తే.

లోనిశత్త్రులు వెలిశత్త్రులును నిజప్ర, శాంతివిక్రాంతివిస్ఫూర్తి శాంతిఁ బొంద
లీలఁ జతురంతధాత్రి పాలించుచుండె, సతతకీర్తి మరుత్తాఖ్యచక్రవర్తి.

278


క.

అనఘుం డైనమరుత్తుని, జననము చరితంబు వినినజనులకుఁ గలుగున్
ధనధాన్యపుత్రపౌత్రా, ద్యనుపమవిభవములు నిర్భరానందంబున్.

279


వ.

అని చెప్పి మార్కండేయుండు గ్రోష్టుకికి సూర్యప్రభవంబు లైనరాజవంశంబులు
వంశానుచరితంబులును లౌకికవైదికపారమార్థికంబు లైనయర్థజాతంబులు నీయడిగిన

విధంబునం బరిపాటిఁ దేటపడ నెఱింగించితి నేతత్పురాణకథ లాకర్ణించితే! భవదీయ
హృదయంబు పరమజ్ఞానదీప్తం బైనయదియే? సమస్తసంశయములు నివృత్తము
లయ్యెనే? యనవుడు నతండు.

280


చ.

అనుపమభార్గవాన్వయసుధాంబుధిచంద్ర! మహామునీంద్ర! స
ర్వనిగమసారబోధజనిరంజితచిత్తపవిత్రపుత్రవం
దన! రతిసంశ్రితార్థిజనతాహరిచందన! శ్రీమృకండునం
దన! సకలంబు నాకు విదితంబు కృతార్థుఁడ నైతి నీకృపన్.

281


ఆ.

అనఘ! నీప్రసాదమున నిమ్మహాపురా, ణార్థజాత మెల్ల నర్థి నాదు
సంశయంబుఁ బాపె సర్వంబు నెఱిఁగితి, వినుతదివ్యబోధఘనుఁడ నైతి.

282


వ.

అని కోష్టుకి ప్రహృష్టహృదయుండై మార్కండేయు బహువిధంబులం బ్రస్తుతించి
నమస్కరించి వీడ్కొని నిజాశ్రమంబున కరిగి పరమానందంబునం దప మాచరించు
చుండే నని పరమజ్ఞానచక్షు లైనపక్షు లాపారాశర్యశిష్యుం డైనజైమినికి మార్కం
డేయపురాణకథావృత్తాంతం బెఱింగించి యిట్లనియె.

283

ఫలశ్రుతి

క.

శ్రీమార్కండేయపురా, ణామృతరససేవఁ జేసి యజరామరు లై
ధీమంతులు గాంతు రొగి, న్భౌమస్వర్గాపవర్గపదసుఖలీలన్.

284


సీ.

అతిభక్తితో నిమ్మహాపురాణము సభాస్థలమున నప్పుడుఁ జదువువారు
వినియెడువారును గొనియాడువారును వ్రాయువారలును దీర్ఘాయురర్థ
బహుపుత్రధనధాన్యమహిమఁ బ్రసిద్ధు లై, పెను పొందుదురు వారి కనుదినంబు
నతులతపఃప్రభావాన్వితుం డైనమార్కండేయసంయమికరుణఁ జేసి


తే.

సర్వతీర్థఫలములును సర్వదాన, ఫలములును సర్వమఘఫలములును గలుగుఁ
బాయు నాపద లెల్ల శుభము లొలయ, ననుపమజ్ఞాన ముదయించు మునివరేణ్య!

285


క.

అని చెప్పిన విని జైమిని, మన మానందమునఁ దేల మధురోక్తుల నిం
పొనరఁగ నాద్విజవరులకు, వినుతి గడు న్జేసి యధికవినయముతోడన్.

286


వ.

ఇట్లు భవదీయవాదేవతాప్రసాదంబున మార్కండేయకథితమహాపురాణజాతార్థం
బంతయు విని కృతార్ధుండ నైతి నని యాపుణ్యపక్షుల దీవించి వీడ్కొని నిజాశ్ర
మంబునకుం జని పరమానందభరితుం డగుచు నుండె.

287

ఆశ్వాసాంతము

చ.

సకలకళాచతుర్ముఖ! యశశ్శ్రితదిఙ్ముఖ! బాహుదండవి
స్ఫురదురుశక్తిషణ్ముఖ! వచోవిలసన్ముఖ! వైరిభీమసం
గరముఖ! నిత్యపోషణవికాసిసుహృన్ముఖ! కాకతిక్షితీ
శ్వరపురపాలనప్రకటశౌర్యవిశేషణ! వంశభూషణా!

288

క.

శ్రీకీర్తివిజయనిత్యా!, లోకజనస్తుత్య! మర్త్యలోకాదిత్యా!
స్వీకృతసంతతసత్యా!, శ్రీకంఠశ్రీశభృత్య! శ్రీకరకృత్యా!

289


మాలిని.

ప్రలలితబుధకామా! భామినీచిత్తధామా!
కులజలనిధిసోమా! కోవిదస్తుత్యనామా!
బలవదహితభీమా! బాహువీర్యాభిరామా!
విలసితగుణభామా! విస్ఫురత్కీర్తిదామా!

290


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజిప్రసాదలబ్ధసరస్వతీపాత్ర
తిక్కనామాత్యపుత్ర మారయనామధేయప్రణీతం బైనమార్కండేయమహాపురా
ణంబునందుఁ బ్రాంసుచరితంబును ఖనిత్రచరిత్రంబును క్షుపోపాఖ్యానంబును వీర
నృపసంభవంబును వివింశోపాఖ్యానంబును ఖనిత్రనేతృచరితంబును గరంధమో
పాఖ్యానంబును నవేక్షితచరితంబును మరుత్తోపాఖ్యానంబును నను కథలం గల
యష్టమాశ్వాసంబు సర్వంబును సంపూర్ణము


ఆ.

చచ్చెనేని యోగిచాడ్పున ముక్తికి
పాఱిపోయినయంతనే బ్రతుకు లేదు
బ్రతికెనేని యుభయబలములుఁ బొగడంగ
నుండు సమరకేళి యొప్ప దెట్లు.

సకలనీతిసమ్మతము 934