Jump to content

మహర్షుల చరిత్రలు/మంకణమహర్షి

వికీసోర్స్ నుండి

మహర్షుల చరిత్రలు

మంకణ మహర్షి

జననము

తొల్లి మాతరిశ్వుఁ డను తపశ్శాలి సుకన్య యనుకన్యను బెండ్లియాడి యామెవలన నొకసుపుత్తుని గాంచెను. అతఁడు మంకణుఁ డనియు, మంకణకుఁ డనియు నామముల నొప్పి, వయసు వచ్చినంతనే తలిదండ్రుల యనుజ్ఞ గైకొని వెడలి సప్తసారస్వత మనుతీర్థప్రదేశమున నాశ్రమమును తపోనిమిత్తము నిర్మించుకొనెను.

ఆశ్రమము

సద్ర్బహ్మచారి, సత్తపః ప్రవణుఁడు నగుమంకణమహర్షి యాశ్రమము నానాద్విజగణ సమన్వితము. అందు బదరములు, ఇంగుదములు, శాశ్మర్య, ప్లక్ష, విభీతక, అశ్వత్థము లను వివిధ వృక్షములు, కంకోలములు, పలాశ, కరీరు, పీలుజాతుల చెట్లును బహుమనోహర భంగులఁ బెరిగి యా ప్రదేశము నతిమనోజ్ఞ మొనర్చెను. అందుఁ బెరిగిన కదళీవనములో జలవాయుఫలపర్ణాహారులు, దంతోలూఖలికులు, అశ్మకుట్టులు, వానేయులు నగుపెక్కు విధముల మునులు జపతపో ధ్యానాసక్తులై నివసించుచుండిరి. వారి యునికి వలన ఆ ప్రదేశము నిరంతర స్వాధ్యాయఘోషతోను, సాధు మృగశతములతోడను, అహింసకులు, పరమ ధర్మపరులు నగుజనములతో నొప్పారుచుండెను.

సప్తసారస్వతము

పూర్వ మొకప్పుడు బ్రహ్మ ఋషీశ్వరుల నెల్ల రిని బిలిపించి సర్వకామసంసిద్ధిదమగు సత్ర యాగము నొకదానిని జేయ సమకట్టెను. ఆ యజ్ఞదీక్షితుఁడై పితామహుఁ డుండఁగాఁ గొందఱు ఋషులు సరస్వతీనది యటఁ బ్రవహింపనిలోపము దక్క నింకేలోపము లేదనుకొనిరి. ఆ మాట విన్న బ్రహ్మ ఋషులయెడ దయాళువై సరస్వతిని స్మరించెను. వెంటనే సరస్వతి ప్రత్యక్షమై 'సుప్రభ' యను పేర నటఁ బ్రవహించెను. మహర్షు లెల్లరు నానంద భరితులైరి.

తరువాత, నైమిశారణ్యమునులు సత్ర యాజులై తన్నుఁ బ్రార్థింపఁగా సరస్వతి వచ్చి " కనకాక్షి ' యను పేర నటఁ బ్రవహించి వారికి సంతోషమును సమకూర్చెను.

మఱియొకప్పుడు గయుఁ డనుమహారాజు యజ్ఞముచేయుచు యాగదిక్షితుఁడై యా సరస్వతిని బ్రార్థింప నామె విచ్చేసి కరుణా కటాక్షము మెఱయ గయదేశములఁ దడుపుచు ‘విశాల' యను పేరం బ్రవహించెను.

ఇంకొకప్పుడు ఉద్దాలకుఁ డనుమహర్షి యజ్ఞముచేయుచు మునీంద్రులకుఁ జేతోమోదము కలిగించుకొఱ కామెఁ బ్రార్థింప సరస్వతివిచ్చేసి వల్కలాజినధారు లగు మునివరుల కోరికచొప్పున ‘మనోరమ' యను పేర నటఁ బ్రవహించెను.

తదుపరి, కురుక్షేత్రమున కురువు చేయు యాగవేళఁ బ్రత్యక్షమై సరస్వతి ‘సురేణువు ' లేక ' సురతన్వ' అను పేరఁ బ్రవహించెను.

మఱియొకప్పుడు వసిష్ఠమహర్షి చేయు యజ్ఞమునకుఁ బిలువఁబడి సరస్వతి 'ఓఘవతి' లేక 'ఓఘమాల' యనుపేరఁ బ్రవహించెను.

ఇంకొక్క వేళఁ బరమేష్ఠి చేయు యజ్ఞవేళల విచ్చేసి సరస్వతి 'విమలోదక' 'సువేణి' యను పేళ్ళతో రెండువిధములఁ బ్రవహించెను. ఈ యేడునదులు కలిసినతావే సారస్వత తీర్థము. అదియే మంకణ మహర్షి యేర్పఱుచుకొన్న ఆశ్రమోపాంతప్రదేశము.

మంకణుని మహిమ

మంకణమహర్షి యస్ఖలితవీర్యుడైఁ గౌమార బ్రహ్మచర్యమున నుండఁగా నొకనాఁడు సరస్వతీనదిలో స్నానము చేయుచుండఁగా సమీపమున నొకయప్సరస అతిమనోహరదేహసౌందర్యము దిశలఁ బ్రకాశింప దిగంబరయై కానవచ్చెను. ఆమెను జూడఁగనే మంకణునికి వీర్యస్థలనము కా నుండెను. మహాతపుఁ డగునాతఁడు వీర్యము నొక కలశమున విడిచి తీసికొనిపోయి కాపాడెను. ఆ కలశమున నా వీర్య మేడు శకలము లయ్యెను. క్రమముగా నందుండి వాయువేగుఁడు, వాయుబలుఁడు, వాయుఘ్నుఁడు, వాయుమండలుఁడు, వాయుజ్వాలుఁడు, వాయు రేతుఁడు, వాయుచక్రుఁడు అను నేడుగురు మహర్షులు జనించిరి. వీరే తరువాత మరుద్గణములకు జనకు లయి విలసిల్లిరి. దీనితో మంకణుని మహిమ ముల్లోకముల వ్యాపించెను.*[1]

మంకణుని మహిమ నృత్యము

తపః ప్రవణుఁ డగుమంకణుని శరీరమున కొకప్పుడొక దర్భ గ్రుచ్చుకొనెను. దానినుండి యాశ్చర్యకరముగా శాకరసము స్రవింపఁ దొడఁగెను. అది చూచి యాతఁడు మిగుల సంతోషించి తన తపము మిక్కిలి శక్తివంత మైనదని యానందాతిరేకమున గంతులు వేయుచు నృత్యము చేయఁ దొడఁగెను. ఆతనితోపాటు జంగమస్థావరము లన్నియు నొక్క పెట్టున ముగ్ధమై నృత్యముచేయ మొదలిడెను. దానితో గొప్పకోలాహలము బయలుదేఱెను. తెగతెంపు లేని యా మహర్షినృత్యము, దాని ననుసరించిన యావజ్జంగమస్థావరకోటినృత్యము కారణముగా లోకములు తల్లడిల్లఁ జొచ్చెను. దేవతలు గజగజలాడిరి. అపుడు బ్రహ్మాదులు మహర్షులఁ దీసికొని మహాదేవుఁ డగుశివుని దర్శించి యా మహర్షి నృత్యము నాతనివెంట సకలస్థావర జంగమనృత్యము, దానివలనఁ గలిగిన లోకోపద్రవము విన్నవించుకొని యానృత్య మాఁగిననే కాని లోకమున స్తిమిత ముండదని ఘోషించిరి.

మహేశ్వరుఁడు వారి కభయ మిచ్చి వెంటనే మంకణుఁడు తపము చేయుప్రదేశమునకు విచ్చేసి దేవహితముఁగోరి “మహాత్మా ! తపః ప్రధానజీవనుఁడగు నీ కీనృత్య మేల? నీ వింతహర్షభరితుఁడ వగుటకుఁ గారణమేమి”? యని యడిగెను. " మహాత్మా! నాచేతినుండి శాక రసము స్రవించినది. అదియే నానృత్యమునకుఁ గారణ" మని మంకణుఁడు బదులు చెప్పెను. వెంటనే మహేశ్వరుఁడు " ఇది యెంతటి విశేషము? తపము లిట్టివే? చాలు నర్తనము మాను" మని యా ముని యంగుష్ఠమును తన వ్రేలితో గీఱెను, ఆ గాయమునుండి మంచును మించిన బూడిద కాఱెను. తత్త్క్షణము మంకణుఁడు మహేశ్వరుని పాదములపై వ్రాలి తనతపోగర్వ మణఁగిన దనియుఁ దన్ను క్షమించి తనకుఁ దపః పతనము కలుగకుండఁ జేయు మని

“దైవమెల్లఁ దలఁప నీవ సమస్తజ
          గంబులకును నేడుగడయు నీవ
 కర్మఫలదుఁడవును గర్మ ప్రదుండవు
          నీవ కరుణ నన్నుఁగావు మభవ ! "
                          భార. శల్య. 2 ఆ. 162

అని మఱిమఱి ప్రార్థించెను.

అంత శివుఁడు ప్రసన్నుఁడై మంకణుని తపఃప్రభావ మక్షిణ మగునట్లు తాను సప్తసారస్వతమున నిలిచి దానిని సేవించువారి కిహపరము లిచ్చెదనని వరమిచ్చి చనెను. అంతట మంకణ మహర్షి నృత్యము మానెను. ఆతనితో స్థావరజంగమ ప్రకృతి యంతయు నృత్యము మానెను. జగముల సంక్షోభము శాంతించెను. *[2]

మంకణుని కుమారునికథ

మంకణమహర్షి పరమగుణో త్తరుఁడయి కాలక్రమమున నొక కన్యం బెండ్లాడి గృహస్థధర్మముల ననుపమానముగా జరిపి యొక సుపుత్రుని గాంచెను. ఆతఁడు ఆకథుఁ డనుపేరఁ బెరిగి యుక్త వయస్కుఁ డయ్యెను.

ఆకథుఁడు వయసు గన్నంతనే సుశోభన యనుకన్యామణిని గాంతగా గ్రహించి తపోజీవనము గృహస్థజీవనము సమ్మిళిత మొనర్చి కపోతవృత్తిని జీవించుచుండెను. ఆ పుణ్యదంపతులకు యదృచ్ఛా లాభసంతుష్టి న్యాయపథ గమనము రెండే సంసారమున ముక్తిసాధనము లయ్యెను. అన్యాయ మార్గమున లభించినది మేరువంత బంగారమైనను వారు ముట్టరైరి.

ఒకప్పుడు న్యాయమార్గమున నా దంపతుల కన్నము దొరకదాయెను. అందుచే వారై దుదినము లుపవసించిరి. ఆఱవ నాఁడించుక యన్నము వారికి లభించెను. అదియే పదివే లసుకొని ఆకథుఁ డాయన్నమును దేవతార్చన మైనపిదప రెండు భాగములుచేసెను. సుశోభన పతి కాకు వైచి యందులో సగ మన్నమును వడ్డించి యారగింపు మను వేళకు "అమ్మా ! అతిథిని " అను కేక వారికి వినఁబడెను. ఆకథుఁడు వెంటనే లేచి ద్వారముకడ కరిగి అతిథి నతిగౌరవమునఁ దీసికొనివచ్చి తనకయి వడ్డించుకొన్న యాకునఁ గూర్చుండఁబెట్టి యాతనిచేత నాపోశన వడ్డించెను. ఆ యతిథి ఆ యన్న మారగించి యా దంవతుల నాశీర్వదించి వెడలెను.

ఇంతలో నింకొక యతిథి యంగవికలుఁడయ్యు ననుపమతేజస్వియై వచ్చి యాఁకలి గొన్న వాఁడ; నన్న మిడుఁ డని ప్రార్థించెను. ఆకథుఁడు వెంటనే లోని కరిగి తన కాంతను బిల్చి “కాంతా ! మిగిలిన సగ మన్నము రెండు భాగములు చేసి యొకభాగ మతిథి కిడి రెండవ భాగమును నీవు తిని ప్రాణములు నిలుపుకొను” మని పలికెను. అంత నాసాధ్వి “నాథా ! ప్రాణబంధువైన అతిథిని, ప్రాణాధికుఁడైన పతిని విడిచి నేను తిందునా? మీ యుభయులకు వడ్డించెదను, కుడువుండు. అది పతివ్రతనగు నా ధర్మము:

"తాను జేసిన ధర్మంబె తన్నుఁ గావ
 వలయుఁగాని మఱొక్కఁ డెవ్వఁడును రాఁడు
 కంఠమునఁ జుట్టి పాశంబుఁ గాలభటులు
 కనికరము లేక లాగెడి కాలమందు ”
                               పద్మ. పాతాళ. 2245

అని పలికెను.

ఆకథుఁ డా పలుకుల కానందించి “గృహస్థ ధర్మమతిథి పూజ. కావున, ముందు మన మతిథికిఁ గడుపునిండఁ బెట్టి తద్భుక్త శేషాన్న మేమైన నున్నచో మనసంగతి చూచుకొందము. నీవు సర్వము సిద్ధము చేయు" మని భార్య కాదేశించి యతిథిని లోనికిఁ గొనివచ్చి పీఁట వేసి కూర్పుండఁ బెట్టఁగా నామె పాత్ర యుంచి యం దన్న మంతయు వడ్డించి భుజింపఁ బ్రార్థించెను. ఆ దంపతుల యతిథిపూజా విధానమున కత్యంత మలరి యా యతిథి శివుఁడై నిలిచెను. ఆ దంపతు లాతని పాదములఁ బడి యాతని పదపంకజభక్తి నిమ్మని ప్రార్థించిరి. శివుఁడు వారి కా వర మనుగ్రహించి యదృశ్యుఁడయ్యెను.*[3]


  1. *భారతము ఆరణ్యపర్వము, శల్యపర్వము.
  2. *భారతము. పద్మపురాణము ఆదిఖండము.
  3. *పద్మపురాణము, పాతాళఖండము.