Jump to content

మహర్షుల చరిత్రలు/ధౌమ్యమహర్షి

వికీసోర్స్ నుండి

మహర్షుల చరిత్రలు

ధౌమ్యమహర్షి

తొల్లి ధర్మాత్ముఁడు, మహాతపశ్శాలి, పుణ్యచరిత్రుఁడు, వేద వేదాంగవేత్త, స్మృతికారుఁడునగు వ్యాఘ్రపాదుఁ డను మహర్షి యుండెను. ఆతనికి ధర్మపత్ని యం దిరువురు కుమారులు కలిగిరి. వారిలో మొదటి వాఁడు ఉపమన్యువు, రెండవవాఁడు ధౌమ్యుఁడు.*[1]

ఈ సోదరు లిరువురు బాల్యమునఁ దోడి ముని బాలురతో నాడుకొనుచు నొకమునియింటి కేగిరి. అక్కడ నొక యావును బాలు పితుకుట తొలిసారిగా వారు కాంచిరి. ఆ తెల్లనివేమని వారు తోడి బాలుర నడుగఁగా వా రవి ఆవు పా లనియుఁ జాల రుచికరములుగా నుండుననియు, అవి త్రావవచ్చు; వానితో క్షీరాన్నము చేసికొనవచ్చు. ఆ క్షీరాన్నము చాల బాగుండుననిచెప్పిరి. అది విన్న యా సోదరులకు క్షీరపాన, క్షీరాన్న భోజనకాంక్ష కలుగ వారింటికి వచ్చి తల్లిని బిలిచి "అమ్మా! మాకు క్షీరాన్నము పెట్టవే!” అని యడిగిరి.

అమాయకులగు బాలురను దల్లి కౌఁగిలించుకొని ముద్దుపెట్టుకొని వారి కోరిక దీర్పఁ దనయింటఁ బాలు లేమికి విచారించి, ఐనను బసిబిడ్డలమనస్సు నొప్పించుట కిష్టపడక, ఉపాయమూహించి యట్లే పెట్టెద నని వారి నూఱడించి మెత్తనిపిండి నీళ్ళలోఁ జిక్కగఁ గలిపి వారికి బెట్టెను. ఆ పసికందు లదియే క్షీరాన్నమనుకొని తిని మునిబాలు రన్నంత రుచికరము కాదు క్షీరాన్న మనుకొనిరి. కొన్నా ళ్లయిన పిదప, నొక నాఁడు బాలు రిరువురు తండ్రితోఁగూడ బంధువులింట యజ్ఞము జరుగు చుండ నచటికిఁ బోయిరి. అచట యజ్ఞకర్త వచ్చినవారి కతిమధురమగు పాయసాన్నము వడ్డించెను. భోజన వేళ నది తిని క్షీరాన్న మన్న నది యని వారు గ్రహించి మునిబాలురు చెప్పినది నిజమే యనియుఁ దమతల్లి పెట్టినది క్షీరాన్నము కాదనియు వారు నిశ్చయించుకొని యింటికిఁ దిరిగి వచ్చిన తరువాతఁ దల్లిని జేరి "అమ్మా! మన బంధువు లింట క్షీరాన్నము పెట్టిరే. అది అమృతమువలె నున్నదే. నీవు పెట్టిన క్షీరాన్నము చప్పగ డోకు వచ్చినది. నీవు పెట్టినది క్షీరాన్నము కాదే ! " యని పలికిరి. బిడ్డలతొక్కుఁ బల్కులకుఁ దల్లి సంతోషించి కౌఁగిలించుకొని ముద్దు పెట్టుకొని “ బిడ్డలారా ! నిజమే. ఆవును కొనుటకు మనము ధనవంతులము కాము. దానము పట్టుటకు మీ తండ్రి యంగికరింపరు. ఆవు లేనిదే పాలు రావుకదా; పాలు లేనిదే క్షీరాన్న మెట్లుచేసి పెట్టఁగలను? ఈ సంగతి చెప్పినచో మీరు బాధపడుదురని మీకు మెత్తని పిండి నీళ్ళలోఁ గలిపి పెట్టితిని ” అని బదులు చెప్పెమ.

తల్లి మాటలు విని పిల్లలు “అమ్మా! మాకు క్షీరాన్నము కావలెనే ! అది మా కెట్లు లభించునో ఉపాయము చెప్పుము. అట్లుచేసి మేము సంపాదించి నీకును బెట్టుదు” మని పలికిరి. వారి మాటలకు సంతోషించి యా సాధ్వి “ వత్సలారా ! ఆకలములు, కాయకూరలు తినుచు, నదీజలములు త్రాగుచు, పర్వతారణ్యతీర్థ ప్రదేశములఁ గాఁవురముండు మనవంటి తపోజపపరాయణులకుఁ బరమశివుఁడే పరమగతి. మన కేది కావలసినను, ఇహమైనను బరమైనను, చిన్న కోరిక యైనను, బెద్ద కోరికయైనను ఆ మహా దేవునే మనము ప్రార్థింపవలయును. ఆతని దయకలిగినదా మనకు క్షీరాన్న మే యేల, ఇహపరముల నెప్పు డేది కోరిన నది సిద్ధించును. ఏ కోరికలు లేని మీ తండ్రి యా పరమేశ్వరుని పాదపద్మములను మదిఁబట్టి నిర్వికల్పసమాధిలో నిర్మలానంద మనుభవించుచు నిలిచియున్నారు. మీకుఁ గోరిక లున్న చోఁ గోరికలఁ దీరుపఁ గల శివునే భజింపుఁ" డని యా బాలుర కుపదేశించెను.

ఆ పుణ్య సాధ్వీగర్భశుక్తిముక్తాఫలములగు నా బాలురంత “అమ్మా! తప్పక మే మట్లు చేసెదము. కాని, ఆ పరమ శివుఁ డెట్లుండును? ఎచ్చట నుండును? ఏమి చేసిన మాకుఁ బ్రసన్నుఁడగును? తెలుపు" మని ప్రార్థించిరి. పరమేశ్వర పాదారవిందభజనోత్సేకము వారికి రేకెత్తించిన యాతల్లి వారికి ఈశ్వర రహస్యోదారవిజ్ఞాన మంతయు పూసగ్రుచ్చినట్లు, అరటిపండొలిచి చేతఁ బెట్టినట్లు సమగ్రముగ స్పష్టముగ నుపదేశించెను. ఆహా! ఆ సాధ్వి మాట లెంత పాటవములు! నిజమాతృధర్మము నామె యెంత యద్భుతముగా నిర్వహించినది! “తల్లి హరిఁజేరు మని యెడి తల్లి తల్లి కదా ! " మిగిలినతల్లులో. పిల్లులు, బల్లులు, నల్లులు !

ఆ తల్లిమాటల కుల్లములు పల్లవింప, ఉత్సాహము నూఁతగాఁగొని ఉపమన్యు ధౌమ్యు లుభయులు పరమేశ్వరునిగుఱించి యుగ్రతప మొనరింపఁ దొడంగిరి. నిష్టాగరిష్ఠులై వారు కొన్నేండ్లు వామ పాదాం గుష్ఠములపై నిలిచియు, కొన్నేండ్లు ఫలాహారులై యుండియు, కొన్నేండ్లు జీర్ణపర్ణాహారులై యుండియు, మఱికొన్నేండ్లు జలపాన మాత్రులై యుండియు. నిఁకఁ గొన్నేండ్లు వాయుభక్షులై యుండియు మహాతప మొనరించిరి.

పిదప నొకనాఁడు వీరినిష్ఠఁ బరీక్షించుటకై మహేశ్వరుఁ డింద్ర రూపమున వీరికడ కేతెంచి ‘‘మీ తపమునకు మెచ్చితిని. నే నింద్రుఁడను. ఏమికోరిన నది యిచ్చెదను. కోరుకొం” డని పలికెను. ఉప మన్యుఁ డా మాటలువిని “అయ్యా! నీ దారిని నీ వేఁగుము. నిన్ను గుఱించి మేము తపము చేయలేదు. నీ దర్శనము మా కక్కఱలేదు. నీ వరములు మా కంతకంటె నక్కఱలేదు. సర్వలోకేశ్వరుఁడై న శర్వుని గుఱించి మేము తప మొనరించితిమి. మా కోరికలఁ దీరుప నాతఁడే నేరుపరి. మమ్ముఁ గాపాడినను. ఱాపాడినను, రక్షించినను, శిక్షించినను ఆతఁడే మాకుఁ గావలయును. ఆతని దాసత్వముతక్క మా కింద్రత్వము వలదు. బ్రహ్మత్వము వలదు” అని పెక్కువిధములఁ దమ యనన్య భక్తిభావమును వెల్లడించెను.

ఇంద్రుఁ డిఁక నేమి చెప్పిన నేమి యడిగిన నాలింపక యుప మన్యువు నిరర్గళపరమేశ్వరభక్తి ప్రసంగ పారవశ్యమున సమాధిస్థితి నందెను. అపు డింద్రుఁ డంతర్హితుఁ డయ్యెను. ఆతని వెనుక నింద్రుని యైరావతము హంసకుందేందు సమానమగు ధావళ్యముతో రజత మృణాళ కాంతులు రమ్యముగ వెలుంగ ప్రత్యక్షమైన క్షీరసాగరమో యన్నట్లు మనోహర సర్వాంగములతోఁ గానవచ్చెను. ఆ సోదరు లిరువు రై రావతమును దిలకించుచుండఁగానది యైరావతము కాక హిమవత్పర్వత శిఖరమంతయెత్తు గలిగి అతిస్వచ్చ మైనతెల్లని మహామేఘమువలె నొప్పు మిగిలిన వృషభ వాహనము నెక్కి జగన్మాతాపిత లగుపార్వతీపరమేశ్వరులు విచ్చేయుచుండిరి. వారి దివ్యతేజము భూనభోంతరాళములు గ్రమ్మి కోటి సూర్యబింబము లుదయించిన ట్లయ్యెను. వెంటనే శివుని మాయచే నా తేజమంతయు నుపసంహృత మయ్యెను. పిదప సర్వసౌందర్యనిధు లగుపార్వతీపరమేశ్వరులు కాననై రి. వారి ననుసరించి దివ్యరూపు లగుననుచరు లుండిరి. బాలేందుకిరీటుఁడై తెల్లనిశరీర చ్చాయ వెలయ, ముగ్గురు సూర్యులట్లు ప్రకాశించు మూఁడు కన్నులతో, పినాకపాణియై, సర్పహారుఁడై శివుఁడు కాననయ్యెను. అతని కుడిప్రక్క హంసవాహనారూఢుఁడై బ్రహ్మయు, నెడమప్రక్క గరుడ వాహనుఁడగు విష్ణువు నుండిరి. పార్వతిప్రక్క మయూరవాహనుఁ డగుకుమారస్వామి యుండెను. వారియెదుటనంది యుండెను. స్వాయంభువాదు లగుమనువులు, భృగ్వాదులగు మహర్షులు, ఇంద్రాదు లగుదేవతలు వారిని బరివేష్టించి యుండిరి. మఱియు సకలపరివార సమేతుఁడగు సర్వేశ్వరునిగాంచి ఉపమన్యుధౌమ్యు లమితభక్తి నాతనికి సాష్టాంగ నమస్కారము లొనరించి వేదమంత్రములచే సహస్రనామములచే స్తుతించిరి.

పరమేశ్వరుఁ డుపమన్యుని భక్తి కెంతయు నలరియాతని నేదేని వరము కోరుకొను మనెను. ఉవమన్యువు నిత్య శివభక్తి, అతీతానా గతవర్తమాన సర్వవిషయ జ్ఞానము కోరుకొని "ఓ దేవా! గోక్షీరములు, క్షీరాన్నము వీనిపైఁ గల కాంక్ష కారణముగా సర్వలోకప్రభువవగు నీ దర్శనము లభించినది. కావున నాకే కాక నా వంశమువా రెల్లరకు గోక్షీర సమృద్ధి ననుగ్రహింపుము. న న్ననుసరించిన నా తమ్ముని ధౌమ్యుని గూడఁ గటాక్షింపు” మని ప్రార్థించెను.

పరమశివుఁడు పరితోష మంది " వత్సలారా ! మీరు దుఃఖవర్జితులై జరామరణశూన్యు లగుదురు. సర్వజ్ఞులు ప్రియదర్శనులు నగుదురు. అక్షయ మగు యౌవనము, అగ్ని సమాన మగు తేజము, మీకుఁ గలుగును. మీరున్న ప్రదేశములం దెల్ల గో సంపద్వృద్ధి, క్షీరసమృద్ధియై క్షీరసాగరమే యటఁ బ్రవహించును. కల్పాంతమున మీరు బంధువు లతో నన్నుఁ గలియుదురు. నీ తమ్ముఁ డగు ధౌమ్యుఁడు దేవగణ మునిగణమాననీయుఁడై హరిప్రియులగు పాండవులకు గురువై శ్రీకృష్ణ కటాక్షము నంది చెలువొందు" నని చెప్పి పరివారసమేతముగా నంతర్హితుఁ డయ్యెను.

పిదప ఉపమన్యువు మహర్షిశ్రేష్ఠుఁడు, పరమ విజ్ఞాని, బ్రహ్మభావసంపన్నుఁడు, సర్వజనపూజ్యుఁడై వెలుఁగొందెను. ధౌమ్యుఁ డన్నకడ సెలవుగై కొని పోయి భాగీరథిం దాఁటి యవ్వలియొడ్డునఁ గల “ ఉత్కచ " మను తీర్థమున కరిగి యాశ్రమమును నిర్మించుకొని పరమత పోజీవితమును గడపుచుండెను. *[2]

పాండవులు దౌమ్యుని బురోహితునిగా వరించుట.

అంగారవర్ణుఁడను గంధర్వరాజు అర్జునునిచే నోడి పాండవులతోఁ జెలిమి నెఱపి వారిక్షేమముఁ గోరి వేదవేదాంగ విశారదుఁడు, జపహోమయజ్ఞ ప్రశస్తుఁడు, సత్యవచనుఁడు. విప్రోత్తముఁడు చతుర్వర్గసాధకుఁడు, సదాచారుఁడు, సూరిజన స్తవనీయుఁడు నగునొకమహర్షిని బురోహితునింగా వరించి శుభంబులందుఁ డని సూచించెను. అగ్ని పరిగ్రహణము, బ్రాహ్మణ సంగ్రహము లేనియెడల నెంతటి మహారాజైన వంతలపాలు గాక తప్పఁ డనియు, అవి గలవాఁడు సర్వకష్టములను దాఁటి సుఖించి శుభముల నందునని యాతఁడు సోదాహరణముగాఁ జెప్పెను. అప్పు డర్జునుఁడు;

“మాకు నతి ప్రియుండవు సమ స్తవిదుండవు చెప్పుమయ్య యీ
 లోకములోని వర్తనములుం దగువారి నెఱుంగు దెవ్వనిం
 బ్రాకటధర్మతత్త్వవిదు బ్రాహ్మణముఖ్యు పురోహితుండుగాఁ
 జేకొను వార మట్టిబుధసేవితుఁగానఁగ మాకు నెందగున్ ?”
                                                   (భార . అది. 7. 156. )

అని ప్రార్థించెను. త్రికాలవేది యగు నంగారపర్ణుఁ డాలోచించి తత్సమీపమున 'ఉత్కచ ' మను తీర్థమునఁ దపముచేయు ధౌమ్యమహర్షి యన్ని విధముల నుత్తమ బ్రాహ్మణుఁ డనియు నాతనిని బురోహితునిగా వరించినఁ బాండవులకు సర్వశుభములు సమకూరుననియు సూచించెను. పొండవు లాతఁడు చెప్పిన చొప్పున ‘ఉత్కచ' తీర్థమున కరిగి జగత్పూత చరిత్రుడు, సాధుజన పూజితుడు, ధార్మికుఁడు, మహాత్ముఁడు. హితమితభాషణుఁడు, బ్రాహ్మణకుల భూషణుఁడు నగు ధౌమ్యమహర్షిని బొడగాంచి యాతనికి నమస్కారము లొనరించి తమవచ్చినపనిఁ దెలిపి తమకుఁ బౌరోహిత్య మంగీకరింపు మని ప్రార్థించిరి. ధౌమ్యుఁడు వారి నతిపిరితి నాదరించి వారికిఁ బురోహితుఁడుగా నుండ నంగీకరించెను. ఇట్లు తేజోవచోరూప బుద్ధివిభవములచే బృహస్పతి సమానుఁడై , వేద వేదాంగవేది, ఋషిసత్తముఁడు నగు ధౌమ్యుని పాండవులు పురోహితుం గావించుకొనిరి.

పాంచాలీపరిణయము

పిదప, పాంచాలాధిపతి వీటికి వ్యాసప్రేరితులు, బ్రాహ్మణజన చోదితులునై పాండవు లేగిరి. అట జరగు ద్రౌపదీస్వయంవరమునకు వా రేగిరి. అందు రాజన్యుఁ డెవనికిని సాధ్యముకాని మత్స్యయంత్రము నర్జునుఁ డేసి ద్రౌపదిని గడించెను. కుంతి యానతిని, వ్యాసభగవానుని యనుమతిని పాంచాలిని బంచపాండవులకు నిచ్చి పరిణయము గావింప ద్రుపదుఁ డంగీకరించెను.

శుభలగ్నమున వివాహ మొనరింప ధౌమ్యుఁడు పౌరోహిత్యము వహించెను. పాండవులు మంగళ స్నానములు చేసి, వివాహోచిత వేషములు ధరించి, రత్నభూషణములఁ దాల్బి విచ్చేసిరి. ద్రౌపది పూర్ణేందువదనయై విదగ్ధ పుణ్యాంగన లలంకరింవ లలితప్రసాధనాలంకృతాంగియై కమలాక్షి కమనీయ కాంతాసహస్రముతో నరుదెంచెను. అపుడు మహావిప్రుల పుణ్యాహరవము, మంగళగీత వాద్య మధురరవము పణవవేణు వీణారవము దిశలు మార్మోగునట్లు మ్రోయ వివాహమంగళ మారంభమాయెను. ధౌమ్యమహర్షి వివాహప్రయుక్తము లగుమంత్రా హుతులను బుధసమ్మతముగా నగ్నిహోత్రమున వేల్బేను. పెద్దల యనుమతిని ధౌమ్యుఁడు తొలుత ద్రౌపదిని ధర్మజునకుఁ బాణిగ్రహణము చేయించెను. వెనువెంటనే యామె యీశ్వర వరప్రసాదమునఁ గన్యాత్వ దూషిత కాకుండఁ గౌమార దశ నందెను. అట్లామెను గ్రమముగా భీమార్జున నకులసహదేవులకును బాణిగ్రహణంబు చేయింవ సర్వజన సమ్మోదకరముగా దేవతల పుష్పవృష్టియు, భూదేవతల యాశీర్వృష్టియు, దేవదుందుభినాద దివ్యవృష్టియుఁ గురిసెను.

పిమ్మట ద్రౌపదీసహితులై పాండవులు ధౌమ్య పురస్సరులై హస్తినాపురమునకు వచ్చి ధృతరాష్ట్రుఁ డర్ధరాజ్య మీయ విశ్వకర్మ యింద్రప్రస్థపురము నిర్మించియొసంగ వానిని స్వీకరించి రాజ్యపాలనము చేయుచుండిరి. తరువాత, నియమ భంగ మొనరించిన .యర్జునుఁ డన్నల యనుమతిని ద్వాదశమాసికవ్రతము సలుపుచు తీర్థయాత్రలకుఁ బోయి ఉలూచి, చిత్రాంగదాదులఁ బాణిగ్రహణముచేసికొని ద్వారకాపురి కేఁగి కపటయతి వేషమున సుభద్ర పరిచర్యఁ బడసి కృష్ణు ననుమతి నామెఁ బరిణయమై వ్రతాంతమున నామెం దీసికొని యింద్రప్రస్థపురమునకు వచ్చి యామెయందు వంశకీర్తి కరుఁ డభిమన్యుఁ డనువీర పుత్రుం గాంచెను. ధౌమ్యమహర్షి యభిమన్యునికి జాతకర్మచౌలోప నయనాదు లొనరించి వేదవేదాంగములం దాతని నతిప్రవీణు నొనరించెను.

ధర్మరాజు నారద! పేరితుఁడై రాజసూయయాగమును జేయఁ దలపెట్టియు భయపడఁగా ధౌమ్యుఁ డాతని కభయ మొసఁగి శ్రీకృష్ణానుమతి రాజసూయ మొనర్పు మని ప్రేరేచెను. పిదప ధర్మరాజు అనంతవేదమూర్తులైన పైల ధౌమ్యులు హోతలుగా, యాజ్ఞవల్క్యుఁ డధ్వర్యుఁడుగా, కృష్ణద్వైపాయనుండు బ్రహ్మగా, సుసాముఁ డుద్గాతగా, వీరిపుత్రశిష్య గణములు మిగిలిన యాజ్ఞికులుగా, నారదాది బ్రహ్మర్షులు సదస్యులుగా, భీష్మాది రాజర్షులు సహాయులుగా, సర్వక్రియా సమగ్రముగా షడంగసమృద్ధిగా, సంపూర్ణ దక్షిణా సనాథముగా, సకలధనధాన్యసమన్వితముగా జగన్నాథ రక్షితముగా, సకలజనానందకరముగా రాజసూయ మొనర్చి జగద్విఖ్యాతి నార్జించెను.

అనంతరము కపటద్యూతమున ధర్మజుఁ డోడి సోదరులతోడను ద్రౌపదితోడను అరణ్య వాసమునకుఁ బోవ వారితోఁగూడ రౌద్రయామ్య సామగానములు చేయుచు ధౌమ్యమహర్షి వెడలెను. ధౌమ్యునితో పాటు వేలకొలఁది యుత్తమబ్రాహ్మణు లగ్ని హోత్రములఁ గైకొని యధర్మ పరుఁడగు దుర్యోధనుని రాజ్యమున నుండ నిచ్చగింపక పాండవుల ననుసరించిరి. అరణ్యమున వీరినందఱ నెట్లు పోషించుట యని ధర్మరాజు దుఃఖింప శౌనకమహర్షి యాతని నోదార్పెను. పిదపఁ దమ్ములతో ధర్మజుఁడు ధౌమ్యుని చరణముల వ్రాలి “మహాత్మా! రాజ్యమంతయుఁ గోల్పోయిననేను మహారణ్యమున బ్రాహ్మణప్రవరుల నెట్లు పోషింతు? ఉపాయముఁ జెప్పు” మని ప్రార్థించెను. ధౌమ్యుఁ డాలోచించి “ధర్మరాజా! మొదట భూతజాలములు పుట్టి యాఁకలితో బాధపడుచుండఁ జూచి సూర్యభగవానుఁడు దయకలిగి యుత్తరాయణ గతి నుర్వీరసము గైకొని దక్షిణాయనగతియై యోషధులఁ బడసి రాత్రులఁ జంద్రకిరణామృతమున వానిం దడుపుచు వర్ధిల్లఁజేసి యం దన్నము పుట్టించి ప్రజాప్రాణములను గాపాడఁ దొడఁగెను. ఇది యెఱిఁగి తొల్లిటిమహారాజులు యోగసమాధినిష్ఠులై యన్న మాదిత్య మయమని సూర్యుని భజించి యన్నముఁ బడసి ప్రజల నాపదలనుండి కాపాడిరి. కనుక, నీవును సూర్యోపాసన మొనరించి సూర్యానుగ్రహమున భూసురులఁ బోషింపు" మని యాతనికి సూర్యస్తోత్రము అష్టోత్తర శత నామ మంత్రము నుపదేశించెను.

ధౌమ్యుని యుపదేశము తలధరించి ధర్మజుఁడు పవిత్ర భాగీరథి జలస్నాతుఁడై పరమపూతుఁడై సూర్యు నారాధింప నాతఁడు ప్రత్యక్షమై పాండవు లరణ్యవాసము చేయు పండ్రెండేండ్లును వన్యఫలమూలములు ద్రౌపది వంటచేయ అక్షయములు అనంతవిధము లగుశాకపాకములు చతుర్విధాహారములు నగు నని వర మొసంగి యంతర్హితుఁ డయ్యెను. దాన ధర్మరాజు భూసురశ్రేణి కభిమతార్థము లొసంగుచు, భోజనమునఁ దృప్తిపొందించుచు సేవించుచు నుండెను.

తదనంతరము నారదుఁడు పాండవుల కడకు వచ్చి ధర్మరాజుం గాంచి ధౌమ్యానుమతమున రోమశమహర్షి చెప్పినట్లు తీర్థయాత్ర చేయుమని సూచించి వెడలెను. వెంటనే రోమశమహర్షి వచ్చి తా నింద్ర నియోగమునఁ బాండవులచేఁ దీర్థయాత్ర చేయింప వచ్చితి ననియుఁ దానును ధౌమ్యునితోఁ బాండవులకడ నుందుననియుఁ జెప్పెను. ధర్మజుఁ డానందించి తీర్థయాత్ర లారంభించెను.

ధౌమ్యుఁడు పాండవుల నోదార్చుట

పండ్రెండువత్సరము లరణ్యవాస మైనపిదప నొకయేఁడజ్ఞాత వాసము చేయవలసినసమయ మాసన్న మయ్యెను. అంతవఱకుఁ దనతో నగ్నిహోత్రములు తోడన కల్గి వర్తిల్లిన బ్రాహ్మణోత్తములఁ జూచి ధర్మజుఁ డిట్లనెను. "మహనీయులారా ! మీతో అరణ్యవాసము ననాయాసముగాఁ గడపితిమి. ఇఁక మిమ్ము విడిచి యజ్ఞాతవాసము చేయవలసియున్నది. అందు మేము విఘ్నములు కలుగకుండ బయట పడుటకు మీ యమోఘాశీర్వచన మత్యంతావశ్యకము. కావున మ మ్మట్లాశీర్వదించి యనుగ్రహించి సెలవొసంగుఁ" డని కోరి, విషణ్ణ హృదయుఁడై డగ్గుత్తికవెట్ట దౌమ్యమహర్షి ధర్మజుని కుత్పాహంబుఁ బుట్టింప నిట్లనెను.

"ధర్మనిరూపకత్వమున ధైర్యమునన్ మహనీయవృత్తి స
 త్కర్మ విధిజ్ఞతం జతురతామహిమన్ దృఢబుద్ధి నెవ్వరున్
 ధర్మజుపాటి గా రనఁగ ధాత్రిఁ బ్రసిద్ధుఁడవై న యట్టి నీ
 పేర్మికి నీడె దుర్దశల పెల్లునకున్ దురపిల్లు టారయన్ ?"
                                              భార, విరా. 1. 51.

"ధర్మజా! నీవే కాదు. దేవతలైన నొక్కొక్కప్పుడు శత్రువుల నోర్చుటకై తగినకాలమునకు వేచియుండ వలయును. నిషధ పర్వతమున దేవేంద్రు నంతటివాఁడు మాఱువేషమున మసలలేదా ! విష్ణుమూర్తి యంతటివాఁడు అదితి గర్భమున వామనాకారత నణఁగి యుండలేదా ? ఔర్వుఁడు తల్లి యూరు ప్రదేశమున నతి నిగూఢముగా డాఁగియుండ లేదా ? మార్తాండుఁడు గోశరీరవిలీనుఁడై యజ్ఞాతముగా నుండలేదా? వీరు కష్టముల కోర్చి తుదకు సుఖసంపద లంది సుఖించిరిగదా ! నీవు నట్లే యీ కష్టముల సహించి శుభము లందు” మని బోధించెను. ధౌమ్యునిమాటలకు ధర్మజుని మనస్సు నందలి కలంక దీఱెను. అపుడు భూసురు లంద ఱొక్కస్వరమున “మీకు దైవమనుకూలించుఁ గాక ” యని పాండవుల నాశీర్వదించి ధర్మజుచే ననుజ్ఞాతులై తమతమ యగ్నిహోత్రములం గైకొని పునర్దర్శనమగుఁ గాక యని తమ తమ కోరిన చోటుల కేఁగిరి.

ధౌమ్యుఁడు పాండవులకు సేవాధర్మము లెఱింగించుట

ఆ తరువాతఁ బాండవు లైదుగురు ద్రౌపది విరాటరాజు పాలి కేగి తాము మెలఁగెడు తెఱఁగుల నేర్పఱుచుకొని కార్యనిర్ణయము చేసికొనిరి. పిదవ ధర్మజుఁడు అగ్నిహోత్రములం గాపాడ ధౌమ్యుని, ద్రుపదు పురమునకుఁ బోయి నిలచునట్లు కొందఱను, ద్వారకానగరమున కేఁగి యుండునట్లు ఇంద్రసేనాదులను, నియోగించి వారెవ్వరినై న నెవ్వరైనఁ బాండవు లేమై రని యడిగిన ద్వైతవనమున మమ్ము విడిచిపోయిరి. తరువాత నేమైరో మే మెఱుఁగ” మని చెప్పుఁ డని కోరి యభ్యంతర పరివారము నెల్లఁ బంపివేసెను. అపుడు ధౌమ్యుఁడు పాండవుల కిట్లనెను. “మీ శుభము కోరినవాఁడ నగుట మీ రెఱిఁగిన వారైనను మీకుఁ గొన్ని విషయములు చెప్పెదను. మీ రొరులను గొలిచి యెఱుఁగరు. కావున, మీ ప్రవర్తనలో నేదైన తొందరవచ్చిన ముందు కార్యగతి తప్పును. కావున మీకు సేవాధర్మములను సంక్షేపముగాఁ జెప్పెదను. సావధాన మనస్కులై యాలకింపుఁడు.

రాజగృహము చొచ్చి యుచితమైన స్థానమున వికారరహిత వేషమునఁ గూర్చుండవలయును. సమయ మెఱిఁగి రాజును సేవింపవలయును. రాజాభిమానము పొంది “నాకే ' మని గర్వపడి మరియాద తప్పిన పురుషార్థమునకు హాని కలుగును. రాజగృహముకంటె నందముగా నిల్లుగట్టుట కాని రాజు చేసిన పనులు చేయుట కాని యాతని విహారముల ననుకరించుట కాని తగదు. రాజు లలిగినచో పుత్ర పౌత్ర భ్రాతృ మిత్రు లనుభేదముఁ జూపరు. పూర్వపు మంచి చూడరు. రాజు మనసు చూరగొంటిమి కదాయని పలువురకు సంకటము కలుగు పను లేమి చేసినను ప్రాజ్ఞులు సంతసింపరు. అట్టివారు తప్పక తమ చేటు తామే తెచ్చుకొన్నవా రగుదురు. కొలువులో రాజుముఖముననే దృష్టినిలిపి యాతని చూపులు చేష్టలు గ్రహింపవలయును. రాజగృహమందలి వార్తలు పైని వినిపింపరాదు. అంతఃపురస్నేహ మెంతవారి కై నఁ బ్రమాద హేతువు. అంతకన్నఁ బ్రమాద హేతువు అందలి కుబ్జ వామన కాంతాదుల పొందు. ఉత్తమాసన వాహనాదులు రా జీయనిదే రాజసేవకులు తమంత దాము గ్రహింపరాదు. రాజు మన్నన నుబ్బక అవమానమునకు స్రుక్కక మెలఁగిన శుభము అందుదురు.

ఆవులింత, తుమ్ము, నవ్వు, ఉమియుట ఇవి బహిరంగముగాఁ గాక గుప్తములుగా నొనరింపవలయును. వైరుల దూతలతో మనసిచ్చి మాటాడరాదు. రాజునకు సంబంధించిన యేనుఁగుతోఁ గాని దోమతోఁ గాని వైరము వలదు. తా మెంత బలవంతులై నను రాజు సేవకులకు జనులపొందు మేలు. కలిమికి భోగము ఫల మనుకొని విచ్చలవిడి భోగింపక తనకెంత యున్నను అడఁకువతో భోగము లనుభవింప వలయును.”

ఇట్లెన్నియో సేవాధర్మములు ధౌమ్యుఁడు వినిపింప విని పాండవులు:

“తల్లియుఁ దండ్రియు దైవము
 నెల్ల సుహృజ్జనము మీర యిట్లు గొలిచి వ
 ర్తిల్లెడు తెఱంగు లెంతయుఁ
 దెల్లము చేసితిరి బ్రదికితిమి మీకరుణన్.”
                               భార. విరా. 1. 142

అని కృతజ్ఞతఁ దెలిపిరి. ధౌమ్యుఁడు జాగ్రత్త యని వారిని హెచ్చరించి అజ్ఞాతవాస నిర్విఘ్నపరిసమాప్తికి హృదయ పూర్వకముగా నాశీర్వదించెను.

పాండవులు ధౌమ్యుని వీడ్కొనుట

పిదప ధౌమ్యుఁడు శ్రద్ధతో పాండవుల ప్రయాణ సమయ మంగళార్థము లగుమంత్రములు జపించుచు నగ్నిని ప్రజ్వలింపఁ జేసి కామ్య పూజ గావించెను. అంతఁ బాండవులు పాంచాలితోఁ గూడి అగ్నిహోత్రునకు, పురోహితునకు ప్రదక్షిణ నమస్కారము లొనరించి ధౌమ్యునితో బయలుదేరి వెడలిరి. వా రట్లు చని చని తుదకు విరాటరాజు పట్టణము పొలిమేరలు చేరఁగనే ధౌమ్యుని వీడ్కొని ముందున కేగిరి. ధౌమ్యుఁడును దన కర్తవ్యమును నిర్వర్తించి తన పుణ్యాశ్రమమున కేగి వసించెను.

ధౌమ్యుఁడు ధర్మరాజు పట్టాభిషేకంబు గావించుట

తుదకు భారతఘోర రణమున విజయమును సాధించి కృష్ణుని నియోగమున బ్రాహ్మణ ప్రేరణమున ధర్మరాజు పట్టాభిషేకమున కంగీకరించెను.

పిదప సర్వసంభారములు సమకూరినతరువాత ధౌమ్యమహర్షి కృష్ణు ననుమతిఁ గొని తూర్పు పశ్చిమములకు వేదిక నలంకరించి నవరత్నఖచితము దృఢపాదము నగు భద్రపీఠమును బ్రతిష్టించి పులి చర్మముఁ గప్పి పూజించి దానిచుట్టు బంగారము, వెండి, రత్నములు మున్నగు వానితో నిండిన కుంభము లమర్చి వాని నిండ గంగాది పవిత్ర నదులనుండి కొనితెచ్చిన జలములను బోసి యన్నింటికి రత్నమంగళ తరుత్వక్పల్లవ కుసుమములను, పంచగవ్యములను సమంత్రకముగా సంస్కరించి మహా మంత్రములు చదువు బ్రాహ్మణ పుంగవులతో ధర్మజుని దీసికొనివెళ్లి యా పీఠమునఁ గూర్చుండఁబెట్టి శుభాలంకృతులతో నభిరామయై యొప్పు ద్రౌపదీదేవిని బ్రక్కఁ గూర్పుండఁబెట్టి అగ్నిహోత్రు నాముఖము చేసికొని హోమమంత్రములు చదువుచు శుభముహూర్తవేళ కాఁగానే కృష్ణుని లెమ్మనెను. శంఖచక్రధరుఁడగు నతఁడు శంఖమె త్తి పృథివి కధిపతి వగుమని ధర్మరాజున కభిషేకము కావించెను. అంత వ్యాసభగవానుఁడు ముందునకువచ్చి ప్రతిష్ఠిత కలశములలో నుజ్జ్వలమైనదానిని ధౌమ్యుఁ డందీయఁ గైకొని ధర్మరాజు నభిషేకించెను. తరువాతఁ బెద్దలగు రాజులు ప్రజలలోఁ దగినవారు వచ్చి ధర్మజు నభిషేకించిరి. అపుడు పట్టాభిషేకానంతరము ధర్మజుఁ డెల్ల ర బహూకరించి యందఱి యాశీస్సుల నంది భీమసేనుని యువరాజపదంబున నిలిపెను. కర్తవ్యవిచార నిశ్చయములకు సంధివిగ్రహాదులకు విదురుని నియోగించెను. ఆయవ్యయాదు లెఱింగించుటకు సంజయు నేర్పఱిచెను. భృత్యుల జితనాతములకుఁ గర్మకలాపములకు నకులు నాజ్ఞాపించెను. దర్పితుల మర్దించుటకు, పరరాజుల జయించుటకు నర్జును నియోగించెను. బ్రాహ్మణ కార్యములకు శ్రౌతస్మార్త కృత్యానుష్ఠానములకు ధౌమ్యు నేర్పఱిచెను. నిరంతర పార్శ్వవ ర్తిగా సహదేవు నుంచుకొనెను. సమస్తవైదికకర్మ దానధర్మాదులకు ధౌమ్యునికి సర్వాధికారము లొసంగెను. అంతేకాదు. ధర్మరాజు ధౌమ్యునకు సగౌరవముగా సకల సంపదల నిచ్చి యాతనివలన దేవ పితృ పూజనములు, అతిథి తర్పణములు, వై దేశిక విప్రార్చనములు దీనానాథపోషణములు పరమసంతోషముతో నిర్వర్తింపఁ జేసెను.

ఈ విధముగా మొదటినుండి తుదివరకు ధౌమ్యమహర్షి పాండవ పౌరోహిత్య మద్భుతముగ నెఱపి సకలజన జేగీయమానుఁడై ముక్తి నందెను.*[3]



  1. *భారతము. అనుశాసనిక పర్వము. దేవలుని సోదరుఁడు ధౌమ్యుడని భారతాది పర్వమునఁ గలదు.
  2. *భారతము ఆనుశాసనిక పర్వము.
  3. *భారతము ఆదిపర్వము. అరణ్యపర్వము, విరాటపర్వము, శాంతిపర్వము.