Jump to content

మహర్షుల చరిత్రలు/ఆరణ్యకమహర్షి

వికీసోర్స్ నుండి

మహర్షుల చరిత్రలు

ఆరణ్యక మహర్షి

శ్రీ రామనామోపాసకు లయి పరమేశ్వరసాయుజ్యము నందిన మహనీయులలో ఆరణ్యకమహర్షి యొకఁడు. అరణ్యమునబుట్టు యరణ్యమున బెరిగి యరణ్యమున మహాతప మొనరించి యరణ్యము తక్క నొం డెఱుగని ఈ మహనీయునికి అరణ్యకుడను పేరు వచ్చెను. ఈతని జననీజనకులయు మాతామహ పితామహులయు చరిత్ర మేమియు దెలియరాదు.

ఆశ్రమము

ఆరణ్యక మహర్షి రేవానదీ తీరమున నొక యాశ్రమమును నిర్మించు కొని యందు దప మొనరించు చుండెను. అతని యాశ్రమము పరమ పవిత్రమై యొప్పారు చుండెను. అశ్రమమునకు దశదిశలను ఆమడ మేర మహా ప్రశాంత వాతావరణము వెల్లి విరియు చుండెను. ఆ మహర్షి తపః ప్రభావమున మహాక్రూర జంతువులు సైతమా యామడ మేర పరమ శాంతితో బ్రవర్తించును. రామనామోపాసకుడగు నా మహర్షి ధ్యానానంతరము చేయు రామ స్మరణముతో ప్రకృతి యంతను శ్రుతిగలుపును. పండుటాకులు రాలినను, ఎండు కట్టెలు విఱిగినను, చీమ చిటుక్కు మన్నను రామ శబ్దముగనే యా మయరణ్యమున ధ్వనించును; ప్రతి ధ్వనించును; రామ మంత్రము, రామ ధ్యానము, రామ స్మరణము, రామ పూజనము, రామ చింతనము, రామ మననము - వీనితో కూడిన యారణ్యకమహర్షి యాశ్రమము శ్రీ రామ మయముగ జెలగు చుండెను.

శత్రుఘ్నుని రాక

ఇట్లుండ శ్రీరాము డశ్వమేధయాగ మొనరించి యశ్వమును విడిచిన పిదప దానివెంట శత్రుఘ్నుడు పరివార సహితుడై యుత్తర ప్రాంతారణ్యములకు విచ్చేసెను. అతని దిగ్విజయయాత్రలో యజ్ఞా శ్వము ఆరణ్యకమహర్షి యాశ్రమ ప్రాంతమునకు వచ్చెను. దాని వెన్నంటి వచ్చు శత్రుఘ్నుడును ఆరణ్యకమహర్షి యాశ్రమోపాంతమునకు వచ్చి, యది యారణ్యకమహర్షి యాశ్రమ మని యెఱింగి పాదచారియై తగువారుమాత్రమే కూడ రాగా, ఆరణ్యకుని దర్శించి స్వనామ గోత్రములు చెప్పుకొని మహర్షికి సాష్టాంగ నమస్కార మొనరించెను.

ఆనందపారవశ్యము

ఆరణ్యకమహర్షి యపరిమితానందమున నాతని కర్ఘ్యపాద్యాదు లొసగి యాదరించి క్షేమ మడిగి వచ్చినపని యడిగెను. శత్రుఘ్నుడన్న శ్రీరాముడు చేయు నశ్వమేధయాగము సంగతి దెలిపి యశ్వ మా ప్రాంతమునకు వచ్చుటచే దానును వచ్చుటయు ఋషిసందర్శనాశీర్వచ్న కుతూహలమున బాదచారియై వచ్చి ప్రణమిల్లుటయు జెప్పెను. శత్రుఘ్నుడు పలికిన రామనామమును విన్నంతనే యానందబాష్పములు ప్రవాహములై కన్నుల వెంట బ్రవహింప దేహమును మరచి, కన్నులు ముసి మ్రోడువలె గదలిక లేక ఆరణ్యక మహర్షి శత్రుఘ్నాదుల కాశ్చర్యభయ సంభ్రమములు గల్గించెను. కొంతకాల మట్లు సమాధి నిమీలితాక్షుడైన మహర్షి పిదప దెలివంది కన్నులు తెరచి గద్గదస్వరమున రామనామశ్రవణము, రామసోదరదర్శనము, రామస్మరణసమాధి కలిగినందుల కానందించి

" అల్పపుణ్యప్రదంబు లైనట్టియాగ
ములును యోగంబులును వ్రతంబులును సరియె ?
తెగని సంసారబంధంబు త్రెంచివైచి
క్షేమ మొనగూర్చు శ్రీరామనామమునకు."

అని పల్కెను.

ఆరణ్యకుని ఆత్మకథ

అంత శత్రుఘ్నుడు "మహాత్మా ! నేను రామసోదరుడనై యున్నను నీ వందిన యానందములో వందవవంతైన నందలేనైతిని. ఇంత మహాభక్తుడవు నీ కెట్లు రామనామము లభించెనో తెలుపు " మని వేడుకొనెను.

శత్రుఘ్నకుమారా ! చెప్పెదను. వినుము. " నేను బాల్యము నుండియు దత్త్వజ్ఞానమును సంపాదింప గోరి లెక్కలేనన్ని తీర్థములకు దిరిగితిని. ఎక్కడను ఒక్కడును నాకు జ్ఞాన ముపదేశింప లేడయ్యెను. ఇట్లుండ నా పూర్వపుణ్యమున లోమశమహర్షి దేవలోకము నుండి వచ్చుచు నా కంట బడెను. నే నాతని నెరిగి పాదముల కెరగి " మహాత్మా ! సంసారసాగరమును దరించు నుపాయమును జెప్పి యనుగ్రహింపు " మని ప్రార్థించితిని. దాని కాతడు " వత్సా ? మార్గము లనేకము లున్నవి. కాని, రామమంత్రముకంటె సంసారమునుండి దాటించు మంత్ర మింకొకటి లేదు. ఇది వేదశాస్త్ర పరమ రహస్యము. ఇంతకంటె వేరు వ్రతములు, క్రతువులు, యోగము, యాగము, దానము, మౌనము లేవు. రామస్మరణమున చండాలుడైనను ముక్తిపొందునన్న వేదశాస్త్రవివేకము గల బ్రాహ్మణునిగూర్చి చెప్పనేల ? నీవు నన్నతి విధేయత నడిగితివి గాన జెప్పితిని. నీ వీ పరమరహస్యమును నాస్తికులకు, శ్రద్ధాహీనులకు, భక్తిహీనులకు, కామక్రోధాదిదూషితులకు, భక్తనిందకులకు, శాంతిరహితులకు, దురహంకారులకు నెన్నడును జెప్పకుము." అని పలికెను.

నే నపరిమానంద మంది యాతని పాదపద్మములను విడువక " తండ్రీ ! నాకు రామధ్యానపద్ధతి దెలిపి కరుణింపు " మని వేడితిని. అంత గరుణారసము వెల్లివిరియ నా మహామహు డిట్లు చెప్పదొడగెను.

లోమశమహర్షి ప్రబోధము

అయోధ్యలో జిత్రమండపముతో నొప్పు కల్పవృక్షము మూలమున నవరత్నస్థగిత మగు బంగారుసింహాసనమున గూర్చుండి పూర్ణచంద్రుని బోలు ముఖపద్మముతోడను, దూర్వాదళ శ్యామ మగు దేహము తోడను, మణికిరీటముతోడను, నీలకుంతలములు, మకర కుండలములు, వైదూర్యమణులవంటి పలువరుసలు, పూవువంటి నాలుక, శంఖమువంటి కంఠము, సింహోన్నతములు నగు భుజములు, శుభలక్షణములుగల నాసిక, వివిధభూషణములతో నొప్పు ఆజానుబాహువులు, లక్ష్మీయుతము, శ్రీవత్సాంకితము నగు విపుల వక్షఃస్థలము, గంభీరనాభి, గొప్ప ఉదరము, రత్నకాంచివంటి నడుము, మనోహరము లగు తొడలు, జంఘలు, వజ్ర యవాంకుశరేఖలు గల కోమలచరణములు గలిగి దేదీప్యమాను డగు శ్రీరామచంద్రుని మనసార ధ్యానించి, చేతులార బూజించి నోరార భజించి, పరమ సులభముగ మోక్షము నందవచ్చును. ఇంతకంటెను సులభోపాయ మిం కెక్కడను లేదు."

"దేవా ! వీనుల విందగు శ్రీరామకథ నాకు సంక్షేపముగా దెలుపగదవే" యని నేను ప్రార్థించితిని. నాకోరిక మన్నించి యాత డిట్లు తెలిపెను.

రామకథా సంగ్రహము

"వత్సా ! సంసారమగ్ను లగు సజ్జనుల నుద్ధరింప విష్ణుమూర్తి త్రేతాయుగమున సూర్యకులమున నాలుగు రకముల యాకారములతో జన్మించి పూర్ణాకృతి యగుతాను రాము డనుపేరు వడసెను. రాముడు తండ్రి యానతి దలదాల్చి లక్ష్మణసహితుడై విశ్వామిత్రునివెంట నరిగి తాటకను జంపి కౌశికుని యజ్ఞభూమినిజేరి మారీచునిగొట్టి సుబాహుని జంపి యహల్యాశాపవిమోచనము గావించి మిథిల కేగి శివధనుస్సు విరిచి సీతను బెండ్లాడెను. రామునకు బదునైదవ వత్సరము సీత కారవవత్సరము, పండ్రెండేండ్ల యైనపిదప దశరథుడు రామునకు యౌవరాజ్యాభిషేకము చేయదల పెట్టెను; అది కైకేయీ వరద్వయమున జరుగకపోగా, రాముని బదునాలుగేం డ్లరణ్యవాసము చేయుటకు, భరతుని యౌవరాజ్యము ననుభవించుటకు నేర్పరచెను.

రాము డంత సీతాలక్ష్మణసమేతుడై బయలుదేరి మూడు దినములు జలాహారము, నాలుగవ దినమున ఫలాహారము గైకొని యైదవనాడు చిత్రకూటము జేరి యందు బండ్రెండేండ్లు నివసించి పదు మూడవ సంవత్సరమున బంచవటియందు కాముకురాలగు శూర్పణఖను విరూపను గావించెను. పిదప జ్యేష్ఠకృష్ణాష్టమినాడు రావణుడు వచ్చి సీతను గొనిపోవుచుండ నామె యింటలేని రామునికై రామ రామ యని యేడ్చెను. ఆ యేడుపువిని జటాయువు రావణుని కడ్డువెళ్ళి యాతడు రెక్కలు నరుక గ్రిందబడిపోయెను. సంపాతి వానరులకు సీతజాడ చెప్పెను. మార్గశిరశుద్ధ యేకాదశినాడు హనుమంతుడు మహేంద్ర పర్వతమునుండి యెగిరి రాత్రికి లంకనుజేరి తెల్లవారుకట్ట సీతను గని సంచార ముడిగి విశ్రమించి, ద్వాదశినాడు శింశుపావృక్షము నెక్కినాటి రాత్రి చేతులు జోడించి సీతకు నమస్కరించి నమ్మకము కలుగునట్లు పలికి త్రయోదశినాడు అక్షకుమారుడు మున్నగు రాక్షసుల జంపి చతుర్దశినాడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమున బద్ధుడైనట్లు నటించెను. రాక్షసు లానందించి యాతనితోకకు నూనెగుడ్డలుచుట్టి యంటింప దానితో నాతడు లంకాదహనము కావించెను. పూర్ణిమనాటికి హనుమంతుడు తిరిగి మహేంద్రగిరికివచ్చి వానరులతో గూడి యైదు దినములు నడచి యారవ దినమున మధువనము జొచ్చియందు మధువు గ్రోలి చెట్ల జెల్లాచెదరుచేసి పయనించి యేడవ దినమున రామునిజేరి యానవా లొసంగెను.

శ్రీరాముడు ఉత్తరఫల్గునీనక్షత్రయుక్తమగు అష్టమినాడు బయలుదేరి యేడుదినములు సముద్రతీరమున స్కందావారముననుండి పుష్యశుద్ధప్రతిపత్తు మొదలు తదియ వరకు సేనలు నడపి సముద్రము జేరి చవితినాడు విభీషణునకు శరణొసగి పంచమినాడు మొదలు నాలుగు దినములు ప్రాయోపవేశము గావించెను. సముద్రుడు వర మొసగ దశమినాడు సేతువును గట్ట నారంభించి త్రయోదశికి బూర్తిచేసి చతుర్దశినాడు సైన్యమును సువేలాద్రి జేర్చెను. పూర్ణిమమొదలు విదియవరకు రాముడు సపరివారముగా సముద్రము దాటి దశమివరకు నెనిమిది దినములు లంకావరొధము గావించెను. ఏకాదశినాడు శుకసారణులరాకయు ద్వాదశినాడు సైన్యసమీకరణము త్రయోదశి మొదలు అమావాస్య వరకు మూడు దినములు సైన్యము లెక్కించుటజరుగ నుత్సాహము నందెను. మాఘశుద్ధ ప్రతిపత్తునాడు అంగద రాయబారము, విదియ మొదలు అష్టమి వరకు యుద్ధము, మాఘశుద్ధనవమి నాటి రాత్రి ఇంద్రజిత్తు రామలక్ష్మణుల నాగపాశమున బంధించుటయు, దశమినాడు వాయువు శ్రీరాముని చెవిలో స్వరూపము జపించుటయు వెంటనే నాగపాశములు వదలుటయు, గరుడుని రాక, ఏకాదశీ ద్వాదశు లందు ధూమ్రాక్షవధ, త్రయోదశిని అకంపనవధ, మాఘశుద్ధచతుర్దశి మొదలు కృష్ణప్రతిపత్తు వరకు ప్రహస్తవధ, మరిమూడు దినములు సంకులయుద్ధము, పంచమిమొదలు అష్టమివరకు కుంభకర్ణుని మేలుకొలుపు, పిదప నారు దినములలో కుంభకర్ణునివధ, అమావాస్యనాడు శోకమున యుద్ధవిరామము, ఫాల్గునశుద్ధ ప్రతిపత్తు మొదలు నాలుగుదినములు బిసతంతుడు మున్నగు రాక్షసులవధ, పంచమిమొదలు సప్తమివరకు అతికాయవధ, అష్టమి మొదలు ద్వాదశివరకు కుంభనికుంభులవధ, పిదప మూడు దినములలో మకరాక్షాదుల చావు, ఫాల్గునబహుళ ప్రతిపద్ద్వితీయలలో ఇంద్రజిత్తు విజృంభణము, తదియ మొదలు సప్తమివరకు విషాదకారణమున యుద్ధవిరామము, త్రయోదశి నా డింద్రజిద్వధ, చతుర్దశిని యుద్ధవిరామము, అమావాస్యనాడు రావడుడు యుద్ధమునకు బయలుదేరుట, చైత్రశుద్ధప్రతిపత్తు మొదలు పంచమి వరకు బెక్కురు రాక్షసులవధ, షష్టి మొదలు లష్టమివరకు మహాపార్శ్వాది రాక్షస సంహారము, నవమినాడు లక్ష్మణశక్తిభేదనము రావణ పలాయనము, ఆంజనేయుడు ద్రోణాద్రిని దెచ్చుట, దశమినాడు రాముడొక్కసారి పెక్కురురాక్షసుల జంపుట. ఏకాదశినా డింద్రుని పంపున యాతని దివ్యరథమునుదెచ్చి శ్రీరాముని కర్పించుట, శుక్లద్వాదశిమొదలు కృష్ణచతుర్దశివరకు ఘోరాతిఘోరయుద్ధము జరుగుత. ఆనాడే రావణవధ శ్రీరామ విజయము సంభవించెను. మాఘశుద్ధ ద్వితీయ మొదలు చైత్రబహుళ చతుర్దశివరకు జరిగిన యుద్ధములో యుద్ధవిరామ దినములు పదునైదు తీసివేయగా డెబ్బదిరెండు దినములు మహాయుద్ధము జరిగెను. వైశాఖశుద్ధ ప్రతిపత్తునాడు శ్రీరామచంద్రుడు సకల సురజేగీయమానుడయ్యెను. విదియనాడు శ్రీరాముడు విభీషణపట్టాభిషేకము గావించెను. తదియనాడు సీతా పాతివ్రత్యశుద్ధి యయ్యెను. చవితినాడు సీతాసహితుడై రాము డయోధ్యకు బుష్పకవిమానమున బయలుదేరెను. పంచమినాటికి బదునాలుగు సంవత్సరములు నిండగా శ్రిరాముడు సపరివారుడై భరద్వాజాశ్రమము బ్రవేశించెను. షష్ఠినాడు నందిగ్రామమున భరతసమావేశము జరిగెను. సప్తమినాడు శ్రీరాము డయోధ్యలో బట్టాభిషిక్తుడయ్యెను. రాముని కపుడు నలువదిరెండు సంవత్సరములు సీతకు ముప్పదిమూడు సంవత్సరములు. సీత రావణునింట నున్నది పదునొకండు నెలల పదునాలుగు దినములు.

వత్సా ! రాము డయోధ్య బాలించుచుండగా అగస్త్యమహర్షి విచ్చేసి యాతనిచే నశ్వమేధయాగము చేయించును. ఆ గుర్రము నీ యాశ్రమమునకు వచ్చును. దానివెంట వచ్చిన రామపరివారము నీ వయోధ్య కేగి శ్రీరాముని దర్శింతువు. నాటికి నీ కర్మపూర్తియై నీ తపము ఫలించును. నీవు శ్రీరామసాయుజ్యమునంది మోక్షమంద గలవు."

ఆరణ్యకతపఃఫలాగమము

ఈవిధముగా సెలవిచ్చిన లోమశమహర్షికి నేను సాష్టాంగనమస్కారము చేసి యాతని యాజ్ఞ గైకొని నాటినుండి శ్రీరామమంత్రజప భజన పరాయణుడనై యుంటిని. లోమశ మహర్షి వాక్రుచ్చినట్లే అశ్వము వెంబడి మీరు వచ్చితిరి. నాకును గర్మఫల సమాప్తి పరిపూర్ణము కానున్నది. నా తపఃఫలమును త్వరలోనే నేను గనం గందునుగదా " యని పలికి యారణ్యకమహర్షి యానందపరవశు డయ్యెను.

శత్రుఘ్ను డామహర్షికథ యంతయు విని మిక్కిలి యాశ్చర్యపడి యాతని నయోధ్యాపురికి దగుపరివారముతో బంపి తాను అశ్వము వెంట ముందునకు బోయెను.

రామదర్శనము : సాయుజ్యప్రాప్తి

అయోధ్యాపురము సమీపింపగనే ఆరణ్యకమహర్షి రథమును దిగి పాదచారియై సరయూనదీతీరమున యజ్ఞదీక్షితుడై యున్న శ్రీరామచంద్రుని సమీపించి యాతని రూపమును గనులార గాంచెను. తత్క్షణ మాతడు పులకితశరీరుడై జలజల మని యానంద బాష్పములు రాలుచుండ, గన్నులు మూతపడ, భక్తివశమున దేహమును మరచి పోయెను. కరుణాసముద్రుడగు శ్రీరాముడు లేచి యాతని కెదురేగి, కౌగిలించుకొని చేతులు పట్టుకొని తీసికొని వచ్చి యుచితాసనమున గూర్చుండబెట్టి పాదములు కడిగి యా జలములు తలపై జల్లుకొని, గంధపుష్పాదులచే ఆ మహర్షిని పూజించి, పాడియావు నొసంగి, మార్గశ్రమము పోవున ట్లుచితోపచారము లొనర్చి " స్వామీ ! నీ సందర్శనమున నా యిల్లు పవిత్ర మయ్యెను. నేను ధన్యుడ నైతిని. నేటితో నాయశ్వమేధ యాగముకూడ బూర్తి కానున్నది. మహదాగమనము సకలఫలప్రదముగదా !" యని యాతని ననేక విధముల సంప్రీతు నొనర్చెను.

అంత, ఆరణ్యకమహర్షి శ్రీరాముని పాదపద్మములపై సాష్టాంగపడి "దేవ దేవా ! నీ నిర్వ్యాజకటాక్షవీక్షణమున నా జన్మము ధన్య మయ్యెను. నా తపస్సు పండెను. నేను తరించితిని. సంసార సాగరమును దరించితిని. పరంధామా ! నీ సాయుజ్యప్రాప్తి నా కొసంగి రక్షింపుము. ఈ సుదినమునకై యెదురు చూచుచుంటిని. పాంచభౌతిక మగు నా యీ పాడుదేహమును విడిచి పుచ్చి తత్క్షణమే నీలో నైక్యమై బ్రహ్మజ్ఞానసంపన్నులు, యోగీశ్వరేశ్వరులు, భక్తిసంపన్నులు, పొందు నపునరావృత్తి రహిత శాశ్వతబ్రహ్మలోకనివాససిద్ధి నందుదు" నని పలుకగనే యా మహర్షి బ్రహ్మకపాలము పఠిల్లున బ్రద్దలై యందుండి యొకదివ్యతేజ మా శ్రీరామచంద్రునిం గలిసెను. దేవతలు పుష్పవర్షము గురిసిరి. కిన్నరకింపురుషులు గంధర్వులు "జయజయ ! సాయుజ్యమోక్షము నందిన ఆరణ్యకా ! జయ జయ " అను ధ్వను లొనర్చిరి. సెలయేరు వచ్చిచొచ్చిన మహాసముద్రునివలె శ్రీరామచంద్రు డతిగంభీరప్రశాంతదివ్యతేజస్వియై మెరసెను.