మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/వ్యర్థ ప్రసంగం, వ్యాకులత

వికీసోర్స్ నుండి

3. వ్యర్థ ప్రసంగం, వ్యాకులత

వ్యర్థ ప్రసంగం, వ్యాకులత - రెండూ చిత్రంగా ఒకలాంటివే. రెండూ మనస్తిమితం లేకపోవడం వల్ల వచ్చేవే. మనస్తిమితం లేని మనస్సుకి ఏదో ఒక వ్యాపకం, ఎప్పటికప్పుడు వైవిధ్యం ఉండాలి. ఎప్పుడూ ఏదో హడావిడిలో ఉండాలి. ఎన్నో అనుభూతులూ, చిన్న చిన్న సరదాలూ కావాలి. వ్యర్థ ప్రసంగం చేయటంలో ఇవన్నీ ఉంటాయి.

గంభీరతకీ, చిత్తశుద్ధికీ విరుద్ధమైనది ఊరికే కబుర్లు చెప్పటం. ఇంకొకరి గురించి మంచిగా గాని, చెడ్డగాగాని మాట్లాడటం అంటే తన్ను తాను తప్పించుకోవటమే. ఈ తప్పించుకోవటమే వ్యాకులతకి కారణం. తప్పించుకోవటంలోనే ఉంటుంది సహజంగా - అస్తిమితత్వం. ఇతరుల వ్యవహారాల గురించి తాపత్రయ పడటమే కొందరి పని. లెక్కలేనన్ని పత్రికలు, పేపర్లూ వాటిలోని కబుర్ల గురించీ, హత్యల గురించీ, విడాకులు లాంటి గొడవల గురించీ చదవటంలో ఆ తాపత్రయం కనిపిస్తుంది.

ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అని బాధ పడతాం కాబట్టి వాళ్లందరి గురించీ మనం అన్నీ తెలుసుకోవాలనుకుంటాం. దీన్నుంచే అనేక రకాలుగా, మోటుగా, నాజూగ్గా గొప్పలు పోవటం, అధికారాన్ని ఆరాధించటం జరుగుతుంది. ఈవిధంగా మనకి అంతకంతకి పై పటారం పెరిగి, లోపల శూన్యం మిగులుతుంది. పైడాబు ఎంతగా ఉంటే, అన్ని అనుభూతులూ, అన్ని ఆకర్షణలూ ఉండాలి మనకి. దీనితో మనస్సు ఎప్పుడూ స్తిమితంగా ఉండదు - దేన్నైనా శోధించటానికి గాని, కనుక్కోవటానికి గాని.

వ్యర్థ ప్రసంగం ద్వారా వ్యక్తమయేది స్తిమితంలేని మనస్సు. మౌనంగా ఉన్నంత మాత్రాన ప్రశాంతమైన మనస్సు అని సూచన కాదు. ప్రశాంతత ఏదైనా మానుకున్నందువల్లగానీ, వద్దనుకున్నందువల్లగానీ రాదు. ఉన్నదాన్ని అర్థం చేసుకోవటంతో వస్తుంది. ఉన్నస్థితిని అర్ధం చేసుకోవాలంటే చురుకుగా తెలుసుకోగలిగి ఉండాలి, ఎందుచేతనంటే ఉన్నది ఎప్పుడూ స్థిరంగా ఉండదు కనుక.

మనం వ్యాకుల పడకుండా ఉంటే మనం జీవించటం లేదనే అనుకుంటారు మనలో చాలమంది. ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉండటమే బ్రతుకు లక్షణం అని చాలా మంది అనుకుంటారు. సమస్యలేని జీవితాన్ని మనం ఊహించలేం. ఏదైనా సమస్యతో ఎంత హడావిడిగా ఉంటే అంత చురుకుగా ఉన్నామనుకుంటూ ఉంటాం. నిత్యం ఏదో ఒక సమస్యతో సతమత మవుతూ ఉండటంవల్ల - ఆలోచనలే సమస్యల్ని పుట్టిస్తాయి కాబట్టి - మనస్సు మొద్దుబారిపోయి, సున్నితత్వాన్ని కోల్పోయి, అలిసి పోతుంది.

ఏదో ఒక సమస్యతో నిత్యం సతమతమవటం ఎందుకు? ఆందోళన పడినంత మాత్రాన సమస్య తీరిపోతుందా? లేక, సమస్యకి పరిష్కారం మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు స్ఫురిస్తుందా? కాని, చాలా మందికి ప్రశాంతమైన మనస్సు భయంకరంగా తోస్తుంది. ప్రశాంతంగా ఉండాలంటేనే భయంవాళ్ళకి. ఏమో, తమలో ఏం కనుక్కుంటారో ఎవరికి తెలుసు. అందుకని ఆందోళన ఆటంకంగా ఉంటుంది. ఏదైనా కనుక్కోవటానికి భయపడే మనస్సు ఎప్పుడూ తన్ను తాను సంరంక్షించుకుంటూనే ఉంటుంది. అస్తిమితంగా ఉండటమే దానికి కారణం.

నిత్యం పడే శ్రమతో, అలవాట్లతో, పరిస్థితుల ప్రభావంతో మనస్సు యొక్క చైతన్యపు పొరలు ఆందోళనకీ, అస్తిమితతకీ గురి అయివుంటాయి. మనస్సుకి ఒక విధమైన రక్షణ నిచ్చే బాహ్య చర్యల్నీ, చాంచల్యాన్నీ ఆధునిక జీవితం ప్రోత్సహిస్తుంది. రక్షణ ఉంటే ప్రతిఘటన ఉంటుంది. అది అవగాహనశక్తిని నిరోధిస్తుంది.

వ్యర్థ ప్రసంగం చేయటంలో లాగే, వ్యాకులపడటంలో కూడా కొంత తీవ్రమైన, గంభీరమైన పోకడ లేకపోలేదు. కాని, పరీక్షగా చూస్తే తెలుస్తుంది - అది ఆకర్షణ వల్ల ఏర్పడినదేగాని, చిత్తశుద్ధి వల్లకాదని. ఆకర్షణ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. అందువల్లనే వ్యాకుల పడే సందర్భాలు, వ్యర్థ ప్రసంగాల్లోని విషయాలూ మారుతూ ఉంటాయి. కాని, మార్పు అంటే, కొనసాగుతున్న దానికి కొద్దిగా మెరుగులు పెట్టటం మాత్రమే. మనస్సులోని వ్యాకులతని అర్దం చేసుకొన్నప్పుడే, ఊరికే కబుర్లు చెప్పటం, వ్యాకులపడటం అంతమౌతాయి. మానేసినందువల్లా, తగ్గించినందువల్లా ప్రశాంతత రాదు. మనస్సు మరింత మొద్దుబారి, సున్నితత్వాని కొల్పోయి, పరిమితమైపోతుంది.

కుతూహలం కనపరచటం అర్థం చేసుకోవటానికి మార్గం కాదు. స్వీయజ్ఞానంతోనే అవగాహన కలుగుతుంది. బాధపడే వాళ్ళు ఎప్పుడూ కుతూహలం కనపరచరు. ఉత్తి ఊహలతో కూడిన కుతూహలం ఆత్మజ్ఞానానికి అవరోధం. కుతూహలం కూడా ఊహించటం లాగే వ్యాకులతని సూచిస్తుంది. స్తిమితంగా లేని మనస్సు ఎంత గొప్పదైనప్పటికీ, అవగాహననీ, ఆనందాన్నీ నాశనం చేస్తుంది.