భోగీరలోయ, ఇతర కథలు/భోగీరలోయ

వికీసోర్స్ నుండి

భోగీరలోయ


పగపట్టిన పన్నగిలా ఆ లోయలోనికి చొచ్చుక పొయ్యాను.

ప్రతివంకరకూ ప్రత్యక్షమైన ప్రకృతి దృశ్యసౌందర్యం మహాకావ్యం లో పుటలు తిప్పినప్పటి రసానుభూతిలా గున్నది.

నాలుగు మెలికలు. ఒక్కొక్కమెలిక మూడువందల ధనువులు. అర్థానుస్వారరూపమై ఎప్పటికప్పుడు ఆఖరులా తోచిన ఆ మెలికలో రెండువైపులా నదీ దేవత సంతరించిన నలభై నిలువుల యెత్తు నల్ల రాతిగోడలు. చెట్లు దట్టంగా పెరిగిన కొండచరియలు, వాటిపై నీలాలశిఖరాలు, కారు దున్నల్లా, భయంకరమైన ఖడ్గమృగాలల్లా పడివున్న నల్లరాతిబండల్లో, ముప్పైధనువుల వెడల్పున రాగమాలికలు పాడుకుంటూ భోగీర ప్రవహిస్తున్నది.

పారిజాతవనాలు, అడవిమల్లెలు, ఇప్పచెట్లు, చీకటి మానులు, నల్లమద్దులు, రేగులు ఆ కొండచరియలనిండా ఉన్నవి. దూరాన్నుంచి ఘంటానాదాలు, భిఖ్కుల మంత్రస్వనాలు తుమ్మెదల ఝంకారాలతో, పక్షుల కలకూజితాలతో కలిసి వినవస్తూన్నవి.

విహారానికి వచ్చిన మృగినై ఆ లోయ చొచ్చుకు పోతిని. మా వాండ్లు వెనకనే నెమ్మదిగా వస్తూ ఉండిరి. “అమ్మాయీ! ఒంటరిగా ముందు వెళ్ళి పోకమ్మా!” అని మా అమ్మ అన్నమాట ఎక్కడో దూరాన్ని వినబడింది. ఒక మలుపు మళ్లింది. ఎట్టయెదుట దివ్యదర్శనం.

భోగీర ఉత్తరవాహిని అయిన అర్ధచంద్రాకారంలో నదికి ఇరవైధనువులయెత్తున రూపెత్తిన మంత్రప్రదర్శనంలా గుహలు, చైత్యాలు, విహారాలు ఒక శిల్పమాలిక, దూరాన్నుంచి కళ్లల్లో ఇంద్రధనువులాడుతూన్నవి. స్తంభాల శిల్పవిన్నాణము, చిత్రకౌశలం, విగ్రహాల సుసౌష్ఠవమూర్తిత్వము, ఆహారే! భిఖ్కుల కౌశేయ కాశ్మీర కుసుమవర్ణ వికాసము, విద్యార్థుల ధవళవర్ణ ధౌతవిలాసము, నాగరుల జానపదుల వివిధవర్ణ వినీత విచిత్రత్వము - ఒక్క పెద్దచిత్రంలా ప్రత్యక్షమైంది.

కళ్లు మూసుకొని తధాగతుని ధ్యానించుకొన్నాను. భోగీరాశ్రమ మహాపరిషత్తు సంఘారామానికి హృదయంలో చేయెత్తి జోహారు లర్పించుకొన్నాను.

నీళ్ళకు నదిలోకి దిగేవాళ్లు, రంగురంగుల కలశాలను భుజాలమీద అలంకరించుకొని మెట్లేక్కేవాళ్లు, యోషలు, పురుషులు, బాలికలు, భిఖ్కులు; ఒకసారి భావాలు హృద యాన్ని నింపి వేస్తుండగా, ఒకసారి భావాలు లేని చైతన్య రహిత హృదయం కలదాన్ని అవుతూ ఆగిపోతిని. పై నుండి విద్యార్థులు, భిక్షకులు, నా కేసి తేరిపార చూస్తున్నది నేను గమనించనే లేదు. ఆ ప్రధమదర్శన ముహూర్తము పరమ పూజ్యమైంది.

ఆ పవిత్రప్రదేశంలో అడుగుపెట్టి అపశ్రుతి మ్రోయించలేదు గదా నేను? ఏదో సిగ్గు అలుముకుపోయింది.

మా గురువులు శిల్పార్ణవులు. ఆయనమోము హిమాలయశిఖరం లా శాంతిపూరితమైంది. ఆయన సాధారణంగా మాట్లాడరు. అనే నాలుగుముక్కలూ సూక్తాలై, సూత్రాలై ప్రత్యక్ష మవుతూ ఉంటవి.

చిన్నతనాన్నుంచీ చిత్రలేఖనాది కళలంటే చెలిమి కత్తెల్లా ఆడుకొంటూ ఉన్న నన్ను ఆ ఉత్కృష్ట విద్యలో సంపూర్ణ యోగనిష్ఠాపరిపూర్ణను చేయడానికై మాళవ మహారాజ్యభార ధౌరంధర్యులైన మాతండ్రిగారు, మహా మంత్రులు ఆనందవసువులవారు నన్ను ఈ ఆశ్రమానికి ఒక్క పవిత్రముహూర్తాన పంపించినారు. మా కుటుంబం అంతా వచ్చి మా నాయనగారు ఇదివరకే నిర్మించిన గుహా చైత్యాన్ని అలంకరింపించ ఆజ్ఞ యిచ్చినారు. అలంకారాదికాలన్నీ పూర్తికాగానే మహోత్సవంతో ఆశ్రమచార్యులకు సమర్పించాలని మా నాన్నగారి సంకల్పము.

ఆ గుహా విహారానికి ప్రాంగణమంటపము పూర్తి అయ్యింది. స్తంభాలు, శిల్పాలు, విగ్రహాలు, భిఖ్కులు

నివసించడానికి లోనిగదులు, శిలాతల్పాలు, ద్వారశిల్పాలంకారాలు, గర్భగృహశిల్పాలు, తధాగత గంభీర శిల్పమూర్తి, ఆసనము, ఛత్రము, తోరణాలు, ధర్మచక్రము - అన్నీ పూర్తిఅయ్యాయి, వివిధదేశాలనుంచి శిల్పము, చిత్రలేఖనము నేర్చుకోవచ్చిన శిష్యులు, పనివాండ్రు చిత్రలేఖనాలంకారము పూర్తి చేస్తున్నారు.

మహాశిల్పి, చిత్రభవన నిర్మాణ కళాకౌశలి మా గురువులున్నూ తమ శిష్యులతోపాటు మధ్యమండప మంతా జాతకగాథలు, అలంకారచిత్రములు వేస్తున్నారు.

ఒకచోట ఒకశిష్యుడు చిత్రకల్పనచేసి గురువులకు చూపిస్తున్నాడు. గురువులు దానిని సవరించి వేయవలసిన వర్ణాలు చెప్పి వేరొక చోటకు వెళ్తారు. వర్ణాలు పూర్తిచేసి వేరొకశిష్యుడు నివేదిస్తాడు. గురువులు రంగుల పాత్రలలో తూలికలు ముంచి చిత్రంలో తప్పు దిద్దుతున్నారు. గురువులే వేరొకచోట రూపకల్పన కల్పించి నలువురు శిష్యులచే వర్ణాలు నింపించుతున్నారు. చిత్రకల్పన, రూపసృష్టి, వర్ణికా పూర్ణము అంతా మా గురువులే కొన్ని చోట్ల సంకల్పించి అద్భుతభావాత్మక కళావైదగ్ధ్యము ప్రత్యక్షముచేస్తున్నారు. దినముదినమూ ఆ విచిత్రోత్సవము సందర్శిస్తూ గుండెలు నృత్యాలుసల్ప ముగ్ధనైపోతూ ఉంటిని. నా కళ్లు అరమూతలు పడినై; నా యవ్వనము పొంగి దిశలంటినది. నా అంగుళులు విధాతృసృజనా భావాలై కల్పనకై యోగనిష్ఠ వహింప ఉన్ముఖాలైనవి. ఆజ్ఞ కై గురువుల కడ మోకరిల్లి నాను.

2

ఎవరో బాలిక నా యెదుట మోకరించింది. ఆ మూర్తి వస్తూఉన్నదని గ్రహించడం తోనే కన్నులు చటుక్కున మూసుకున్నాను.

“ఎవ రీ మె?”

ఆమెతోకూడా వచ్చిన ఒక వృద్ధ -

“స్వామీ, ఈ బాలిక మాళవప్రభుని మేనమరదుల వారున్ను, మాళవదేశానికి ముఖ్యమంత్రులున్ను అయిన ఆనందవసువులవారి ఏకతనయ. చిన్నతనాన్నుంచీ చిత్ర లేఖనములో మంచి చాతుర్య మలవరచుకొన్నది. ఐనా ఆమె శక్తికి తగిన గురువులు లభించకపోవటంచేత విద్య వృద్ధిపొందినది కాదు. జినదేవుని ధర్మప్రచారం లా, తమ కీర్తిన్నీ లోకాల్ని ఆవరిస్తూ వుండటం చేత తమ పాదసన్నిధిని శుశ్రూషచేయటానికని మా అమ్మాయిగారు వచ్చారు. చిత్ర విద్య ద్వారా నిర్వాణ మార్గాన్న న్వేషించటానికి మా అమ్మాయిగారికి దీక్ష యివ్వవలసినదని ఆనందవసువుల వారున్నా, మేమున్నూ ప్రార్థిస్తున్నాము.”

“ఎవరయ్యా, అక్కడ? ఈ పిశాచాలని నాదగ్గర కెవరయ్యా వదిలిపెట్టింది? గురుద్రోహం తలపెట్టిన పాపాత్ము లైన శిష్యు లెవరయ్యా వారు?” అని పెద్ద గొంతుకతో అరచినాను.

ఆ వృద్ధ అంతట “అమ్మాయిగారు! లెండిపోదాము” అనుచుండ, నేను చెంగున ఆమె పైనుండి దాటి ఏదోగొణుగు కొంటూ వెళ్ళిపోయినాను. వాఘీరాశ్రమ సంఘాచార్యులైన సత్యశీల భిక్షాచార్యుల కడకు చేరుకొన్నాను. సత్యశీలాచార్యులు నూరేండ్ల వృద్ధు. సర్వశాస్త్ర సంపన్నుడు. ఇంతైనా వీడిపోని శక్తిసంపన్నుడైన ఆ మహాత్ముడు నన్ను ప్రక్కనున్న కుశాసనముపైన అధివసింపజేసి, “తండ్రీ! ఏమంత తొందరపాటుతో వస్తూన్నావు?” అని ప్రశ్నించాడు.

పవిత్రులైన ఆచార్యుల వారి పాదాలకు నమస్కరించి “భయంకరమైన ఒక విషయాన్ని తమకు చెప్పదలచుకొన్నాను. ఈ ఆశ్రమానికి ప్రథమంలో నేను వచ్చినప్పుడు నాకు రెండవ జీవితంలాంటి ఆశయాల్ని కొన్నిటిని తమతో మనవిచేసి, తమ ఆజ్ఞతో పరమశ్రమణకుడు నాకు ప్రసాదించిన ఈ నా కొద్దివిద్యను సంఘానికీ, లోకానికీ అర్పించాలని ఈ సంఘారామం ప్రవేశించాను.”

“అవును, ఆ ఆశయాలకు భంగం యేమి వచ్చింది తండ్రీ?”

“ఒక బాలికకు నేను చిత్రవిద్య నేర్పాలట, స్వామీ!”

“మాళవ మహామంత్రి ఆనందవసువు పాప మెరగని తన కుమార్తెకు నీచేత విద్య నేర్పించాలని ఆశించి తథా గతుని పాదంమ్రోల ఆశ్రయిస్తున్నాడు, బాబూ!” “నా నియమానికి వ్యతిరేకం గదా, ఆచార్యదేవా?”

“అంత కఠిననియమం యెందుకు పూనావో నేను తెలుసుకోడానికి ప్రయత్నంచేయలేదు. నిన్నూ అడగలేదు. పురుషునికి బద్ధశత్రువు కాదగిన అవమానం స్త్రీ యేమి చెయ్యగలదు, తండ్రీ? పురుషుని ఉత్తమశక్తిని పైకి విజృంభింప చేయడానికి స్త్రీయున్నూ, స్త్రీయొక్క పవిత్రశక్తిని తేజరిల్ల జేయడానికి పురుషుడున్నూ వుద్భవించారు. పవిత్రులయిన నాగార్జునాచార్యులవారి ఉపదేశం అట్టిదే; తథాగతుని పవిత్ర ధర్మమూ అదే!”

“అలాగయితే భిక్షుక, భిక్షుణీ దీక్షలెందుకు గురుదేవా?”

“ఓయి వెఱ్ఱివాడా! దీక్షలేనిదే నిర్వాణమార్గం యెట్లా అన్వేషిస్తావు? ప్రాపంచిక దూరుడవై ప్రాపంచికాతీతమైన ధర్మాన్ని అన్వేషించాలి. ఆ దీక్షలో, ఆ తపస్సులో స్త్రీ పురుషు లొకళ్ళకొకళ్లు అడ్డం రాకూడదు; అంటే, స్త్రీపై పురుషునికి వాంఛా, పురుషునిపై స్త్రీకి వాంఛా పోవాలి. అంతవరకు ప్రపంచంలో వుండి జినభక్తులై ధర్మ మార్గావలంబకులై చివరకు ప్రపంచం వీడి నిర్వాణార్హులు కావాలి.”

“ప్రభూ! నాగార్జునాచార్యదేవులు నివసించిన పవిత్ర సంఘారామం వున్న శ్రీపర్వతపురం కృష్ణాతీరాన్న వున్నది.”

“అవును, ధాన్యకటక నగరానికి యెగువను.” “అక్కడ ఒక శిల్పి ఆంధ్రబ్రాహ్మణ యువకుడు వుండేవాడు. అతడు సాంఖ్యాయన సగోత్రుడు. ఇక్ష్వాకు మహాప్రభువుల ఆస్థాన శిల్పి.”

“బౌద్ధ దీక్ష వహించినవాడా?”

“బుద్ధదేవుని విష్ణుని తొమ్మిదవ అవతారమని నమ్మిన వాడు. శిల్ప కర్మ రీత్యా మోక్షం చూరగొనా లన్న సంకల్పం కలవాడు. సౌందర్య తత్త్వోపాసి.”

“బుద్ధుడే పరమావతారం. ఆతని పూర్వ అవతారాలలో ఒకటి విష్ణు అవతారం.”

“ఆ శిల్పికి వసంతపుష్పాల సౌరభము, నీలాకాశము, మేఘాల నీలి అంచులు, చిరుగాలిలో పుట్టిన చిన్న కెరటాల మీద ప్రసరించి తళుకుమనే చంద్రకిరణాలు, సెలయేటి పతనాల తుంపురులు, ఇంద్రధనస్సు అంచులు, లేడి కూనల ముట్టెలు, సుందరీమణుల అపాంగ వీక్షణాలు పులకరాలు కలుగజేసి అతన్ని శ్వేతతారాదేవి పాదాల కడ మోకరిల్ల జేసేవి.”

“ఇంత నశ్వరమైన సౌందర్యాన్నా అతను ఆరాధించినది?”

“ప్రభూ? సంఘారామంలో, రాజ ప్రసాదాలలో అతడూ, అతని శిష్యులూ సృష్టించిన శిల్పాలూ, చిత్ర లేఖనాలూ, ఆ యా నగరాలలో ఆతడు నిర్మించిన భవనాలూ, స్థూపాలూ లోకమోహనమై వెలిగాయి.” “పరమదేవుడైన మహాశ్రమణకుని గొప్ప భక్తుడే.”

“చిత్తం? ఆతడు ఇక్ష్వాకు రాజకుమారి నొకర్తెను ప్రేమించాడు. ఆమె అతని దివ్యప్రేమను గౌరవించి తిరిగి ప్రేమించినట్లు అభినయించింది.”

“ప్రేమించనే లేదా యేమిటి?”

“స్వామీ! ఆమె శుష్కహృదయ, వృథాడంబరం కలిగిన విచిత్రస్వరూపమైన శూన్య జీమూతం వంటిది. అతని ప్రేమ లోకాల నావరించింది. ఆమె అంతకన్న అనంతమైన ప్రేమలో ఆతన్ని ముంచివేస్తున్నట్లు నటించింది.”

“ఏ మా వెఱ్ఱి ఆ బాలికకు?”

“స్వామీ! స్త్రీ హృదయం యెవ్వరు యెరుగగలరు? రాజబంధువైన ఆమె తండ్రిని ఆమె పాణిగ్రహణానికై ఆ శిల్పి యాచించాడు. తండ్రి సంతోషముతో అనుమతి యిచ్చాడు. కాని కపట నటనానటి, కర్కశహృదయమైన ఆ బాలిక ‘నే నేమిటి! ఈతనిని పెండ్లి చేసికోవట మేమి’టని వెడనవ్వు నవ్వింది. ఆ శిల్పి హృదయంలో చీకటి ఆవరించుకుంది. భయంకరమైన తుఫానుమబ్బులు పట్టినవి. దావానలం అడవుల్ని మండించినప్పుడు వుద్భవించే పొగ అతని జీవితాన్ని క్రమ్మివేసింది. ఆతనికి దైవం లేడు, బుద్ధుడు లేడు, ధర్మం లేదు, ప్రేమ లేదు.”

“ఎంత వెఱ్ఱివాడై పోయినాడు!”

“వెఱ్ఱివాడు కాదు స్వామీ! సర్వజ్ఞానమూ నశించి పోయిన పిచ్చివా డయిపోయినాడు. ఆతని జీవితంలోని దుర్భర విషాదము హాలహలమై సమస్త భువనాలూ దహించటానికి బయలుదేరినట్లయింది. దేశాలు తిరిగి తిరిగి ఈ ఆశ్రమానికి చేరుకొన్నాడు.”

“ఓయి వెఱ్ఱిబాలుడా! ఇంత విషాద గాధా నీది? అందుకనా స్త్రీలోకం మీద నీ కింత కోపము?”

“కోపము కాదు, భయము స్వామీ! తమ పాద సన్నిధి చేరుకుని కొంత వూరట పొంది జగద్గురువైన పరమ శ్రమణకుని అవతార మూర్తులైన మీకు నా సేవ అర్పించి భౌతిక వాసనల నుండి దూరమై నిర్వాణానికి అర్హత సంపాదించుకోటానికి దీక్ష వహించాను. నేను పూనిన ప్రతిజ్ఞలు తమకు నివేదించి శిల్పకళాదీక్షకు పూనాను. ఈ విషాద చరిత్రుణ్ణి ఒక బాలికకు గురువుకమ్మని ఆజ్ఞాపించటం నా మోక్షానికి నన్ను దూరం చేయటం అని మనవి చేసుకొంటూన్నాను.”

“బాపూ! బుద్ధదేవుని పరమ కరుణచేత అనన్యమైన మానవసేవ నాకు లభించింది. లోకాన్ని సంతరించటానికి పూనుకొన్న నాకు మానవహృదయం పూర్తిగా తెలుసును. శిల్పివైన నీ చిత్తవృత్తిలో ప్రేమ నశింపక లోతుల అణగి వున్నది నిర్వాణ పథార్థివై యున్న నీవు స్త్రీ విషయమై భయము సంపూర్ణంగా నాశనము చేసికో వలసి వుంటుంది. స్త్రీ మాయాదేవి యొక్క అంశ; ప్రజ్ఞాపరిమిత, శ్వేతతారాదేవి. ఈ బాలికకు నీవు చిత్రలేఖన విద్య నేర్పి నీ తపస్సు పూర్తి చేసికో. భయపిశాచము నీ హృదయాన్ని ముక్కలు చేయకుండా చూచుకో!”

మేము ఒక్క విఘటికాకాలము నిశ్చలులమై, వేణు వనము అను పేరుగల ఆ మహాచైత్యంలో సంధ్యాకాలము దోరరంగుల పాకించేవరకు ధాన్యకటకపు పాలరాతి బుద్ధదేవుని విగ్రహాలల్లా కూర్చుండిపోయాము. నా హృదయంలో జడత్వ మావరించింది. దూరాలపుట్టి యోజనశతాలు ప్రవహించి, ప్రవహించి, వొడ్డుకుచేరి విరిగిపోయే కెరటంలా నా ఆలోచనలు వికలాలు అయిపోయినవి.

3

జ్యోత్స్నాప్రియ నాములైన మా చిత్రాచార్యులు విసవిస వెళ్ళిపోవడం తోనే అక్కడ ఆగలేక పరుగిడిపోయినాను. నా హృదయం పచ్చి మృణ్మయపాత్రలా ఛిన్నమై పోయినది. దాసీజనము ఆశ్చర్య పడుతూ వుండగా, తల్లి వెల వెలపోతూ వుండగా, విస విస నడిచి ‘మాళవ మహారాజ విహార’గుహలోనికి పరువిడిపోయి మంచముపై నాథునిచే నిరసింపబడిన ఉమాదేవి చేతిలోని పూలదండలా ఒళ్లుతప్పి పడిపోయాను.

నాకు మెలుకువ వచ్చేటప్పటికి విహారమంతా చీకటిలో వున్నది. ఎక్కడో రెండు నేతి దీపాలు మినుకు మినుకుమంటూ మిణుగురులులా వున్నవి. ఆ చీకట్లోంచి గుహ లోని స్త్రీ పురుష చిత్రమండల మంతా నా వైపే కరుణ హాసావలోకనములతో పరిశీలిస్తున్నది. నా మంచానికి దగ్గిరగా మహాగురువు సత్యశీల భిక్షాచార్యులవారు కాలాతీతమైన స్వరూపంతో, పరమదయను ప్రసరించే వెన్నెలలు నింపే చూపులతో, ఆ ముదుసలి పెదవుల వరపూరితమైన నవ్వుల వెలిగిపోతూ వుండగా చూస్తూవున్నారు.

మత్తు నెమ్మది నెమ్మదిగా విడిపోయి బుద్ధి నిర్మలమై లోకజ్ఞానమువచ్చి చటాలున లేచి నిలుచుంటిని. పడబోయిన నన్ను మా వృద్ధదాసి పట్టుకొని “ఆచార్యులవారికి నమస్కారము చేయి తల్లీ,” అని ఉపదేశించింది.

ఆ వృద్ధాచార్యుల పాదాలకడ మోకరిల్లి పోయినాను.

“అమ్మాయీ! నీ దీక్షకు చాలా సంతోషము. ఎందుకమ్మా శిల్పమంటే నీకింత మమకారము?”

“స్వామీ! .......”

“ఊరడిల్లి చెప్పమ్మా, తల్లీ! తొందరలేదు.”

దాసీజనము భక్తితో కొనివచ్చి అర్పించిన పీఠముపై శాంతపవిత్రులైన ఆ వృద్ధ భిక్షులు అధివసించినారు. ఆయన కడనే తలవంచి కూరుచున్నాను.

నా గొంతులో నుండి వినబడీ వినబడని స్వరము మాత్రమే ప్రవహించినది.

“స్వామీ! చిత్రకళ నేర్చికోని నాడు నా జన్మం వృథా! నా పూజ నుసి అయిపోతుంది. నే నింక తీరని యీ గాఢపవిత్ర వాంఛను భరించనూ లేను; తోలి వేయనూ లేను.”

“అదేమిటమ్మా వెఱ్ఱిబాలికా! ఇంక నీకు చిత్రకళ నేర్పే వారే లేరూ?”

నేను చటాలున లేచి కూచున్నాను. “స్వామీ! నేను అందరి చిత్రలేఖనాసామర్థ్యమూ పరిశీలించినాను. ప్రజ్ఞా రహితులదగ్గిర అభ్యాసము వున్న విద్య కొంచమూ నశింప జేసుకోడానికే గదా?”

“సరే నమ్మా! జ్యోత్స్నా ప్రియశిల్పాచార్యులవారిని నీకు చిత్ర విద్య నేర్పడానికి వొప్పించాను. కాని వారు కొన్ని నియమాలు కోరారు. వారు చిత్రిస్తోవుంటే వెనక నుంచి చూచి నేర్చుకోవాలట; ఎదుట బడకూడదు. వారు లేనప్పుడే గోడలపై చిత్రలేఖనము కల్పించాలట. అది వారు తర్వాత దిద్దగలరు. ఫలకాలపై రచించిన నీ చిత్రాల్ని వారికడకు సేవకులచేత పంపిస్తే వారు సరిచూడగలరు...”

“స్వామీ! ఏలాంటి నియమము శాసించినా సరే, నాకు చిత్రవిద్య ప్రసాదిస్తేచాలు. నేను ధన్యురాల్ని; నా జన్మం అంతా తరించింది.”

కులపతి సత్యశీలాచార్యులు వృద్ధత్వములోకూడా కాంతి వీడని తన కన్నులతో నవ్వుకొంటూ వెళ్ళిపోయారు.

ఈ వరము నా కేలా ప్రసాదింపబడింది! ఎంతటి అపూర్వ సంఘటన! ఈ భిక్షను, పూవు మధువును దాచు కొని సంభావించినట్లు యెంత పూజింపగలనో : తీగలలో స్వరాలు చేరినట్లు, వసంతంలో సౌరభాలు పొదువుకు పోయినట్లు నాలో ఈ శిల్పవిద్య హత్తుకు పోవాలిగాక!

4

త్వరలో శుభముహూర్తం చూసి నా కడ ఈ విచిత్రపద్ధతిని చిత్రవిద్యను అభ్యసింప దీక్ష వహించింది అబాలిక. ఆమెపేరు కల్హారమాల యట. విషాలు హృదయాలల్లో దాచుకొన్న ఈ పాపజన్మలకు, మారపిశాచి ఆయుధాలకు చక్కని పేర్లుమాత్రం పెడ్తారు వెఱ్ఱివాళ్లయిన పురుషులు. జినదేవుడు స్త్రీత్వంతో లోకాలు ఎందుకు మలినంచేశాడో! బుద్ధ దేవునికి పవిత్రమైన ఆ నలభైరోజుల మహాతపస్సులో జరిగిన పరీక్ష నాకు ఎన్నిసంవత్సరాలు జరుగనుందో.

ఆ బాలిక రచించే చిత్రాలల్లో ప్రజ్ఞ ఉన్నది. వర్ణ జ్ఞానమూ బాగానే తెలుసును ఆడవాళ్లు రేఖానైపుణ్యం ఎలా సంపాదించుకోగలరు చెప్మా. ఈ చిన్నది తీరైనరేఖలు ప్రవహింపజేస్తో వుంది. ఎక్కడో తప్పువస్తూ ఉన్నది, నిజమే కొందరు విద్యార్థులు ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంటూ గూడా ఇప్పటికీ రేఖాశక్తి అలవడజేసుకో లేకుండా ఉన్నారు. ఆమె కుంచెలు ఆమే కట్టుకుంటుందిట - విచిత్రమే. అతిలలితాలైన వేళ్ళల్లో శక్తి ఉండదుకదా! ఈ బాలిక వేళ్లు పురుషునివేళ్లల్లా ఉంటవేమో. ఆ బాలికే పురుషునిలా ఉంటుందేమో, మెరుములా వచ్చి నా దగ్గిర వాలినప్పుడు అస్పష్టంగా తోచింది నా కా మూర్తి. ఆ రూపము సుందర విగ్రహమే. ఛీ! ఈ స్త్రీనామక పిశాచిని ఎందుకు తలపోసు కొంటున్నానో.

ఆమె రచించిన చిత్రాలు సవరించడం నా కా రోజుల్లో ఎంతో హేయమైన పనై వేధించింది. నేను సృష్టింప సంకల్పించిన శిల్పాలుగాని, చిత్రాలుగాని నా హృదయం లోనే ఇంకిపోయినవి. కీలుబొమ్మలా ఏదో దిద్దేవాణ్ణి, లోలోన మన్యపుజ్వరం బాధించేవాడిలా చిక్కిపోయినానట. నెమ్మదిగా చేతులకు ఒణుకు ప్రారంభిస్తుందా అన్న భయము అంకురించింది. ముప్పదిఐదేండ్లు నడుస్తూ ఉన్న నా జవ సత్వాలు నాకు దూరమైపోతున్నవి. తప్పనిసరిగా విద్యార్థులకు విద్య నేర్పడం ఎల్లాగో పెట్టుకున్నాను. తక్కిన కాలాలు మా విహారగుహలో అంతరకందరంలో ఆ కఠినశిలావేదికపై పండుకొని ఉండడమే తప్ప అడవులలోనికి విహారానికి వెళ్లలేకపోయే వాడను.

ఒకరోజున కల్హారమాల రచించిన చిత్రము సవరించ డానికి మాళవమంత్రిగారి విహారానికి పోయినాను. నేను రచించిన బోధిసత్వునిప్రక్కనే ఒక బాలికామూర్తి చిత్రాన్ని చూచినాను. ఎవరు చిత్రించినారు ఆ బొమ్మను? ఎందుకు చిత్రించినారు? నా ఆజ్ఞ లేనిదే ఏ మూర్ఖుడు చిత్రించ సాహసించాడు? ఆ విగ్రహము విస్తుపోయినట్లు నా వైపు చూస్తూ ఉన్నది : గాలి పీలుస్తున్నట్లే ఉన్నది. కొంచెము సంప్రదాయ విరుద్ధముగా ఉన్నది. సమభంగాకృతిని త్రిభంగమూర్తి కడ కల్పించుట అపశ్రుతిభూయిష్ఠము.

ఇంతలో ఆ విగ్రహము కదిలి నెమ్మదిగా చేతులు జోడించి తలవంచుకొన్నది. అది మూర్తికల్పన కాదు; ప్రాణపూరితమైన బాలికామూర్తి. నా గుండె ముడుచుకొని పోయింది, విస్ఫారితమైపోయింది. మహావేగాన భేరీభాంకారాలు వాయించ నారంభించింది. చైతన్య రహితుడనై అట్లనే నిలుచుండిపోయాను.

ఆ సౌందర్యము అలౌకికము. ఆమెముఖాన నిశ్చలత్వము, ప్రజ్ఞాపరిమితత్వము, శాంతి, నిర్మలకోమలకాంతి, అత్యంత నిగూఢసత్యము తాండవమాడుతున్నాయి. స్త్రీ మొఖము చూడనన్న నా ప్రతిన నట్టేట సుడిగుండాలలో మునిగిపోయినది.

“నువ్వు దేవబాలికవా?” అని గబగబ ముందుకు బోయి ఆమెను ప్రశ్నించాను.

“ప్రభూ! - నేను - కల్హారమాలను - మాళవమంత్రి - కుమార్తెను -”

“నా శిష్యవా ? హ, హ, హ, హ...” అని వెడనవ్వు నవ్వుతూ చివాలున వెనక్కితిరిగి ఆ అడవులలోకి మహావేగాన వెళ్ళిపోయినాను. నా హృదంతరాళాల కారు చీకట్లు కానట్టి, వెలుగు కానట్టి శూన్యమేదో ఆవరించుకుంది. నా ఒళ్లు కంపించింది. నేను భరించలేని భయంకరానందము పరవళ్లు కట్టి నన్ను ముంచి, సుళ్లలో తిప్పి, అతిలోతులకు లాగి, ఎక్కడకో విసిరికొట్టింది.

భయంకర మృగాలు ఆ అడవులలో సంచరించుతూ వుంటవనే మాట మరచిపోయి నేనే నిశాచరమైన వ్యాఘ్రము వలె ఆ చెట్ల నీడల్లో పడివుంటిని. రాత్రల్లా దూరాన తోడేళ్లు, చిరుతలు అరుస్తూ వున్న విషయమే గ్రహించ లేదు.

నాకు పెనుభూతాలు కనబడలేదు; పాముల బుసలు వినబడలేదు. విషపుచెట్టుయొక్క లేత ఆకు యెంత కోమల సుందరమై వున్నప్పటికీ, అది విషపూరితమే అయినట్లు, సౌందర్యం పుంజీభవించిన స్త్రీ మూర్తులన్నీ విషపూరితలే. ఈ విషయము సేవించిన్నీ దహించబడకుండా జినదేవుని కరుణ వల్ల ఒకనాడు బయట పడ్డాను. నేడు మళ్ళీ ఈ విష ప్రయోగం యే మహత్తర కారణం చేత నన్ను తాకిందో! అమిత జాగ్రత్తతో గమనిస్తూవున్న నా దీక్ష కర్కశహస్తాల పాలబడి, కటిక నేలబడిన మట్టి బొమ్మలా ముక్కలు ముక్కలైపోయింది. ప్రపంచానికి దూరంగా వుంది గదా అని ఈ సంఘారామానికి చేరాను. ప్రపంచమే తరుముకుని తరుముకుని, ఇంద్రుణ్ణి తరుముకు వెళ్లిన బ్రహ్మహత్యా పాతకంలా, నన్ను వెంబడించింది. ఏనాటి ప్రారబ్ధ మిది?”

ఆ బాలిక యెంత నిర్మల చరిత్రం నటిస్తూన్నది! అతి నిర్మలమైన నీళ్లు కలిగిన కాసారం లాంటి హృదయం కలిగిన మనిషిలా వుంది. ఆమె దివ్య సౌందర్యాన్ని రసపూర్ణమైన కళాస్వరూపం లోనికి దింపటానికి సమయాలు పాటింప నవసరం లేని దివ్యచిత్రమూర్తిత్వంలా వున్నది. ఇంత అందము విషపూరితమై వుండగలదా? ఆ ఇక్ష్వాకు బాలిక మాత్రం సౌందర్యవతికాదా? చలించిన ఈ నా మనస్సును కట్టివేయటానికి తపస్సులో నా మనస్సును పవిత్రం చేసికోవాలి.

ఇంతట్లో తూర్పుదెసను యెఱ్ఱజీరలు సాగినవి. ఏలాగో ఆశ్రమానికి చేరుకొన్నాను. ఈ బాలికకు యింక విద్య చెప్పకుండా వుండడానికి వీలులేదు. సత్యశీలాచార్యులవారి ఆజ్ఞ అనుల్లంఘనీయము. ఈ దివ్యవృద్ధుడు తన ఆజ్ఞతో నన్ను కట్టివేసినాడు. ఆ బాలికకు చదువు చెప్పమని నన్ను వొప్పించే సందర్భంలో యేవో విచిత్రమైన - భావగర్భితమైన మాటలన్నారు. ఆయన మాట లమోఘములు: సత్య స్వరూపములు. ఇప్పుడు జరిగినదంతా వారికి నివేదించి వారి యాదేశానుసారంగా నడుచుకోవటమే నా ధర్మం అని నిశ్చయించు కొన్నాను.

దర్శించిన మరుక్షణంలో సత్యశీల భిక్షాచార్యులవారు చిరునవ్వు నవ్వుతూ నన్ను కూర్చుండమని సైగచేసి, ‘నాయనా! నీలో శుభపరిణతి ఆసన్నమయ్యే ధర్మసమయం వచ్చింది. నీ సంఘసేవ సంపూర్ణత తాల్చాలి...’

“స్వామీ! నేను అవమానం పొందటమే ధర్మసేవా? వేళాకోళమే ఎరగని తమ మాట యీ రోజున యీలాగున చిరునవ్వులతో నిండియున్న దేమి? అది నా కర్మ మనుకొని నేను వూరడిలాలి గాక!”

“ఓయీ! సౌందర్యతత్త్వోపాసీ! నీ చిత్రలేఖన విద్యలో ఒక్క చిన్న దోషమున్నదని నీవు గ్రహించలేదు. కరుణ నీ విగ్రహాలల్లో మూర్తించలేదు. సంప్రదాయ జనితాలై, మూర్తిలో-రూపకల్పనలో ఏ మాత్రమూ లోటు లేని చిత్రాలను యెన్ని కల్పించినా, వాటిలో కరుణ తొణికిసలాడటం లేదు. తండ్రీ! కరుణ నశించిపోయిన మరుభూమి యైన నీ ప్రజ్ఞ “ఏకోరసః కరుణఏవ” అనే మాట మరచి పోయింది. నీ బోధిసత్త్వుల చూపుల్లో కర్కశత్వం వున్నది. యోగం వున్నది. బుద్ధుడు పరమకరుణామూర్తి తండ్రీ! అహింసాపూర్ణావతారము. చేతిముద్రలలో, భంగిమాలలో, వివిధస్వరూపములైన దృష్టులలో సంపూర్ణ సత్యమైన దివ్యత్వం లేదు. ప్రాపంచికరూపమైన దివ్యత్వమే కరుణ. ఈ ముక్కలు నే నన్నానని విషాదపడకు. కొరతవడిన నీ పూజ పరిపూర్తి చెందవద్దా!”

మరిన్నీ కలవరంలోపడి మా విహారం యెలాగో చేరుకొని అక్కడ దివ్యభిక్షుని విగ్రహం మ్రోల నా తల వాల్చి కాంతికై యాచించాను. ఘటికలు జరిగిపోయినవి. వరములా నా మార్గము నాకు ప్రత్యక్షమైంది. “నా బొమ్మలలో కర్కశత్వ మున్నదా, ప్రభూ? ఇన్ని సంవత్సరాలూ నా తపస్సులో చంద్రగ్రహణంలా అసంపూర్ణత్వం వరించుకొనే వుందా?” “నీ నియమాలని భగవంతుని కర్పించి మానవ శీల మందు విశ్వాసంతో చిత్రకళాదీక్ష నెరపవయ్యా” అని నాకు పరమగురుని ఆదేశం వినబడి న ట్లయింది.

5

నన్ను చూస్తూనే మా గురుదేవులు, తాను తా గానట్లు “నువ్వు దేవబాలికవా?” అని ప్రశ్నించినప్పుడు యేదో నిర్వచింపజాలని ఆనందంతో వొణికిపొయ్యాను. సామాన్యమైన మూర్తైనా అనన్యమైన యేదో వెలుగుతో మహాసౌందర్య మూర్తిలా తోస్తారు. ఉత్తమ శిల్పమూర్తి లక్షణాలు ఆయనలో కొరతపడినా కొరత పడినట్లే వుండవు. ఆ రావడం వచ్చి నా బుజాలు చేతులతో అదిమిపట్టి ఇటు అటు వూపి, ‘ఏల ఈ తప్పిదం చేశా’వని నన్ను శిక్షిస్తే, నా జన్మ పవిత్రమైందని వూహించుకొనేదాన్ని. ఆ క్షణంలో ఆయన దివ్యుడే అయిపోయినాడు. ఆయన వేపు న న్నేదో విచిత్ర శక్తి ఆకర్షణ చేసింది. ఇంతలో ఆయన మటు మాయమై పోయినాడు. నా తప్పిదానికి నివృత్తి వున్నదా? ఈ సత్పురుషుని తపస్సు భంగం చేయటాని కుద్భవించిన పాపినా నేను? పవిత్రమైన ఆయన నియమానికి భంగం చేశాను తత్ఫలితంగా, ఏ నియమాలూ లేకుండా చిత్రవిద్య నేర్చుకోనటాని కందరూ రావచ్చునని ఆయన ప్రకటన చేశారు. ఆ మరునాటి నుంచీ ఆయన నన్ను తన కడకే పిలిపించుకొని చిత్రవిద్యలోని రహస్యాలు మహా గాంధర్వంలా ఉపదేశించ మొదలుపెట్టారు. ఆయన రూపమే మారి పోయింది. ఏదో వింత శక్తి చేత అలుముకుపోయినారు. కొద్ది మాటలతో మాత్రమే వినేవాళ్ళ తృప్తిని తీర్చే ఆయన ఆ నాటి నుంచీ ఝరీవేగంతో, తియ్యని గొంతుకతో ఘటికలు ఘటికలు మాట్లాడేవారు. ఎందుకో? ఏవేవో ప్రశ్నలు నాపై వర్షము కురిపించే వారు. ఆ రోజుల్లో నాకు కలిగిన ఆనందాన్ని వర్ణించలేను. ఆయన కడ సంతతము వుండ బుద్ధి. ఆయన పాదాంగుళులను పువ్వుల మొగ్గలను ముట్టినట్లు ముట్టి కళ్ళ కద్దుకోవటానికి కాంక్ష. ఉన్నట్లుండి నా కేదో వివశత్వం!

“కల్హారమాలికా! ఈ చిత్రవిద్య పూర్తియైన ఆ వెనక నీ వేమి చేయదలచుకొన్నావు?”

“బుద్ధదేవుని చరిత్ర రచించుకొంటూ నా జీవితం పవిత్రం చేసుకోవాలన్న కోరికే నన్ను కదిల్చి వేస్తోంటుంది. అంతకన్న నా మొరకు హృదయాని కేమీ తోచదు.”

“మానవుల్లోని దివ్యత్వమే కళాస్వరూపమై వెలువడు తుంటుంది. నిశ్చయమే. కాని వివాహమైన వెనక నీ దీక్ష యెట్లా సాగుతుంది కుమారీ?”

“ప్రభూ! నేను వివాహమే చేసుకోను.”

“అది అసంభవము. మీ తండ్రిగా రేరాజన్యునికో నిన్ను నివేదిస్తారు. నీవు మహారాణివి కావలసిన యోగమున్నప్పుడు ఆ యోగాని కెట్లెదురీదగలవు?” “నా జన్మమంతా తమ పాదాల దగ్గరే విద్య నేర్చుకొంటూ శుశ్రూష చేస్తూంటాను!”

“ఓ వెఱ్ఱిపిల్లా! ఆడవాళ్ళకి సహజమైన మాయ మాటలు మరచిపోయినావుకావు.”

మా గురుదేవుని మాటలకు నా మనస్సు వికలమై పోయింది. నావి మాయమాట లేలాగు? నా సర్వస్వము గురుదేవుని పాదాలకడ సమర్పించటానికి సిద్ధంగా లేనా?

మా గుహలో మా గురుదేవును రచించిన బోధిసత్త్వునిప్రక్క ఆయన దేవేరిని రచింప సంకల్పించాను. ఆ చిత్రము పూర్తి అయిన వెనుక అది దివ్య భావపూరితము, చిత్రకళకు దివ్యమణి వంటిది అని గురుదేవులు, తోటి శిష్యులు రసజ్ఞులు మెచ్చుకుంటూ వుంటే నాకు సిగ్గువేసింది.

మా గురుదేవులను ఒక్క నిమేషమాత్రము విడిచి వుండలేక పోయేదాన్ని. ఆయన నిజంగా జ్యోత్స్నాప్రియులే. ఆయన గుహకుపోయి శయ్యాదు లమరించడం యెంత సంతోష దాయకమై వుండేది!

ఆయన కళ్ళల్లో ఒక్కొక్కప్పుడు జ్యోత్స్నలే ఆడేవి. ఒక్కొక్కప్పుడు ఆయన చూపులు మబ్బుపొదివిన నెలబాలుని కిరణాలై మరుగుపడేవి. ఆయన యేదేని కారణాంతరాన నాకు వుపదేశిస్తూ నన్ను ముట్టి నప్పుడు నా సర్వ రూపమూ కరిగి సుళ్లుచుట్టేది. ఆలాంటి దివ్యక్షణాలలో ఆయనా, నేనే - లోకాల హృదయం మధ్య.

6

ఈ బాలికాహృదయతత్వం నాకు అర్థంకాలేదు. ఈమె జీవితమే నాకు కొత్త అయినది. ఈమె తక్కిన స్త్రీల కన్న వేరా? ఇక్ష్వాకురాజవంశజ అయిన ఆనాటి ఆ బాలిక అందము ఆడుపులి అందము. ఇది వెన్నెల రేఖ. వెన్నెలలోని శిరీషకుసుమము. పాల వెల్లువ తరగ ఈమె అందంలో యేమి వంక వున్నది? నిజముగా ఈమె హృదయం పవిత్రమైనది. ఓహో! కల్హారమాలికయా ఈమె?

ఈ బాలిక నన్ను విడిచి ఒక్క క్షణం వుండదు. ఆమె స్వయంగా పచనం చేసి విచిత్రరుచుల భోజనము కొనివచ్చేది. నా పాదసంవాహనం చేయ సిద్ధపడిన నాడు ఆమె నా పాదాల స్పృశించి నప్పుడు నాలో విద్యుల్లతికలు అలుముకు పోయినవి. ఆమెను నా కౌగిలిలో అదిమివేయక ఏలాగు నిగ్రహించుకోగలను? నేను అధఃపతితుడను కావడం లేదు గదా?

ఆమె పెదవులు జేగుర్లునిండి అతిలలితాలైన చిగుళ్లు. ఆమె కళ్లు యెంత పవిత్ర కాంతుల్ని సేకరించుకొన్నవి! స్వచ్ఛమైన కదలికలేని చెరువు నీటిలో ప్రతిఫలించిన తారకాకాంతు లవి.

ఆమె అందము నిర్మల నీలాకాశంలో తేలిపోయే తెల్లని పక్షి. ఆమె అందము ఆ పక్షి గొంతుకలోంచి విడిపోయి ఆ నీలంలో తొణికిసలాడే పాట, ఆమె అందము పండినపంటలోని పచ్చదనములోని పరిమళము. ఆమె అందము వెన్నెలప్రసరింపు జిడ్డు గల తీపి అయ్యో! ఆ అందం నా దేహంలో, నా హృదయంలో, నా ఆత్మలో లీనం చేసికొనక నా జన్మ వృధా.

ఆమె గుహలో ఒంటిగా చిత్రించుకునే కాలంలో ఆమెను, కల్హారమాలాదేవిని కలుసుకోడానికి వెళ్ళాను. భగవానుడా! అతికోమలమైన ఆమె జీవితాన్ని పరీక్ష చేయడానికి వెళ్ళే నేను అందమయిన రెక్కలతో పూలలో ఎగిరే సీతాకోకచిలుకను పొంచుండి కబళింపబోయే ఊసరవెల్లిలా వున్నాను. చిత్రించుకొంటూవున్న ఆ బాలిక ప్రజ్ఞా పరిమితలా వున్నది.

“ఏమిటి, ను వ్వీరోజు చిత్రించుకుంటున్నది?”

“ఉన్న ఒక్క వస్త్రమూ బుద్ధదేవునికి అర్పిస్తున్న ఆ పవిత్ర చరిత్ర చిత్రము రచిస్తున్నాను.”

“ఏమిటీ! నన్ను చూడనీ. ఓహో! ఎంత అద్భుత సృష్టి! బాలికా! నీ కింక శుశ్రూష అవసరము లేదు. నీ విద్య పూర్తిఅయినది.”

ఈటె దెబ్బ తిన్న గువ్వలా ఆమె వణికిపోయింది. “ప్రభూ! నన్ను మీరు ప్రేమించడంలేదా? నాకై నియమాలన్నీ వదులుకొని నన్ను ఆమ్రపల్లి కన్న ధన్యురాల్ని చేసి ఒక్కసారిగా నన్ను అవసరములేని పుష్పంలా విసరి పారవేస్తారా?”

“నీకు ప్రేమను గురించి ఏమి తెలుసును?” “ప్రభూ! ఆ దివ్యవరము ప్రసాదింపబడినప్పుడు ఏమి తెలుసుకోవాలి?”

“వెఱ్ఱిదానా! చటుక్కున ‘నన్ను ప్రేమించడంలేదా’ అని ప్రశ్న వేశావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?”

“వెన్నెల అంటే కలవలకు ప్రేమా? సూర్యకాంత పుష్పము సూర్యుణ్ణి కోరుతుందా? పుష్పము తేనెను కోరుతుందా? ప్రభూ! నన్ను స్వీకరించుకోండి. నేను మీ ప్రేమ భిక్ష లేనినాడు హోమం లోని నుసిని కదా!

“నేను ముప్పదియైదు ఏళ్ళ ముసలి వాడను. నువ్వు నవయౌవనంలోని పదునెనిమిదేళ్ళ మిసిమి పడుచువు.”

“ప్రేమకు ఈడుందా ప్రభూ?”

“నేను ఈ క్షణం నీ దేహాన్ని కోరితే నీ శీలం నలిపి వేసికొని నా కాంక్ష తీర్చగలవా?”

“ప్రభూ! మీ ప్రేమ, మీ దివ్యప్రణయము ఆశిస్తున్నాను. నా నాశనానికి వెఱవను. మీకు అర్పణ చేసుకోవడమే నా జీవితానికి పరమమోక్షము. ఇదిగోనా మూర్తి! నన్ను మీ హృదయానికి గాఢంగా గాఢంగా అదుముకోండి. నా విద్యలు మీవి; నాకలలు మీవి; నా ఆత్మ మీది.”

మా దేహం వణికిపోయింది. ఎంత పవిత్ర జీవన ప్రవాహము! ఆమెను తనివోవ బిగియార నా బాహువుల అదిమివేసి కౌగలించుకొన్నాను.

“కల్హారమాలికా! నన్ను వివాహంచేసుకోగలవా? నా ఆత్మేశ్వరీ! ఇట్టి మహదానంద సమయం కోసమేనా జిన దేవుడు ఆ నాడు నన్ను రక్షించినాడు. నువ్వు నా కోసమే యిన్ని సంవత్సరాలు యెదురుచూస్తూ వున్నావా? ఈ నీ దివ్యమూర్తి నాదేనా? ఈ అద్భుతమైన మోము, భారమైన ఈ తలకట్టు, ఈ దివ్యలోచనాలు, శ్వేతతారాదేవి చేతిలోని కమలాలైన నీ యీ పవిత్ర వక్షాలు, నీ యీ పరమ దేహకాంతీ - నా వేనా? నువ్వు నా దానవేనా? జినప్రభూ! నీ కరుణ యిదేనా? రా! ఆత్మేశ్వరీ, రా! మోకరిల్లు. పరమశ్రమణకుడే మనని ఆశీర్వదిస్తాడు!”

“ఆ ప్రభుని దాసుడ నైన నేనున్నూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను - దివ్యదంపతులైన మిమ్ము” అని సత్యశీలాచార్య గురుదేవులు, లేచి ఆయన కడ మోకరిల్లాము.