భీమేశ్వరపురాణము/విజ్ఞప్తి
శ్రీ
విజ్ఞప్తి.
ఆంధ్రులారా!
మన భాషయం దనేక కవిసార్వభౌము లనేక కబ్బంబుల వ్రచియించి మించిరి. అవియెల్ల నాశుశుక్షణిశిథిలబంధనాది పీడలచేఁ దఱచుగ నశింపఁగా మిగిలినవి కొన్నియేయున్నవి. తక్కినవి కొన్ని నామమాత్రావశిష్టంబులై గ్రంధాంత రోదాహృతస్వపద్యంబులచే వానిమహిమనూహింపఁజాలు పండితవరేణ్యులమనంబులం గడలేని చింత రగుల్కొనఁజేయఁ జాలి యున్నవి. ముద్రాయంత్రాద్యుత్తమ సాధనానుపపత్తిచేఁ బూర్వ మీపీడ యనివార్యంబై యుండె. గాని యిక్కాలంబున నేమో, మిగిలినవానిని భద్రపఱుచుకొని మనకును మన వెనుకటివారికిని భద్రంబొనగూర్పఁదగు నుపాయంబు లనేకము లేర్పడియున్నవి. వీనిని మన మెట్లుపయోగించుచున్నాము? దాన మన భాషయందలి గ్రంథసంచయ మెంత రక్షనొందినయది? యనుట నాలోచింపవలసియున్నది.
ప్రకృతమందు మన భాషయందు విలువకుం దొరకు గ్రంథముల రెండు తెఱంగుల విభజింపనగు. ఉల్లిపొరలవంటి కాగితంబులపైఁ దగిలియుఁ దగులక యచ్చొత్తింపఁబడి తప్పులకుప్పలై యతి దూష్యంబులై నెగడు 'గుజిలీ' పుస్తకములు కొన్ని, ఇపుడుండెడు పుస్తకములలో మూఁడుపాళ్లిట్టివియే. వీని వెల సులభమ కాని ఫలము సున్న. వీనియందువర్ణలోపంబులె లెక్కకుమిక్కుటంబులై యున్నవన నిఁకఁగేవలము పండితవేద్యంబు లగుగణయతిప్రాసాదిలక్షణవైపరీత్యంబుల సంగతి వేఱుగఁ జెప్ప వలయునా? దీనికి నుదాహరణంబుగ నిట్టిగ్రంథ మొకదానినుండి యీ క్రిందిపద్య ములందున్న రీతిని ముద్రింపించుచున్నాము. చూడుఁడు.
కం. "అటువచ్చినహరుడల్ల, మతటుకునదయ జూచిలేచి తనపీఠిక నొ
క్కటనునిచియిష్టబాషలు, నిడియించియతండరుగ గౌరినాధునికనియెన్."
కం.“సాకారుం డొదలపగని, రాకారుడొ యాదిపురుషాకృతి యిపుడుం, గైకొనిన
ఘనుడో యిట్లని, యాకలాత్మజుడైన నలవియె బొగడన్."
యిటుగాక మంచికాగితములపై నచ్చొత్తింపఁబడి చదువుటకుముందు చూచుట కింపగునట్లు సంపుటీకరణముగావింపఁబడియుండు నొక కొన్ని గ్రంథంబు లిపుడిపుడు పొడసూపుచున్నయవి. ఇవి పండితపరిష్కృతంబులై నెగడుటచే వీనియందుఁ దప్పులు నంతగఁ గానరావు. అయినను వీని వెల యధికమగుటచేఁ బైకనిన 'గుజిలీ' పుస్తకములకును వీనికిని సవతిపోరు వాటిల్లఁగాఁ జిన్నతనంబుచే వన్నె కెక్కు నయ్యవి యే పామరులకు గ్రాహ్యములై మించెడివ. నిష్ప్రయోజనమగు వస్తువున కిడిన యది యెంతయైనను నష్టమెకా యనివీరరయలేక యటు చేసినను గుణగ్రాహులగు కొందఱు మాత్ర మీయుత్తమగ్రంథంబులనె కొనియెదరు. అయిన నట్టివారి సంఖ్య కొద్ది యగును గ్రంథముల వెల యధికమ కావలయు. ఇందువలన నట్టి యుద్యమములయం దుత్సాహము కొఱవడును. ఈ కొఱఁతను వారింపఁదగు నుపాయమెయ్యది? దీర్ఘాలోచనపై నీ ప్రశ్న కిది తగునుత్తరమని మాకుఁ దోఁచె. అది యెద్దియనిన కొంతసష్టమున కోర్చియైనను ‘గుజిలీ’ పుస్తకముల విలువయు నొండువానిగుణము నొక్కటఁ గూర్పవలయు. అట్లు చేయుటవలన రెండువిధములైన లాభముకల్గును. తక్కువ వెలఁ బెట్టి యీ గ్రంథములఁ బామరులుఁ గొనఁజాలుదురు. దానవారికి వీనికిని ‘గుజిలీ’ పుస్తకములకుఁ గల తారతమ్యము లేర్పడును. అంత నభ్యాసముచే గుణగ్రాహకత్వ మేర్పడ గుణరహితమగు వస్తువులయం దరుచిపుట్టును. ఇది యొక లాభము. గ్రంథముల ముద్రింపించువారును మునుపటివలె నత్యధిక లాభముఁ గోరక కొంతలాభముతోనె తృప్తిఁబొందవలసి వచ్చెను. దాన నుద్గ్రంథముల విలువయుం దగ్గును. ఇది మఱియొక లాభము. ఈ రెండును గూడిన నాంధ్రప్రపంచంబునఁ గల గ్రంథసంఖ్యయుఁ జదువరుల సంఖ్యయు హెచ్చక మానదు.
ధనశాస్త్రసూక్ష్మతల నింతగఁ జర్చించు మేము మాకు నష్టముకలుగు యత్నముం జేయుదుమనియు, దాన నీయుద్యమము కొనసాగదనియుఁ దలఁపవలదు. విశేషలాభమును మేము కోరలేదకాని, నష్టమున కేమాత్ర మొడిగట్టలేదు. కావున మాయత్నము సఫలంబగుననుట కెంతమాత్రమును సందియంబు లేదు. ఇక నది యెట్టి దనుట వివరించదము కనుఁడు.
“శ్రీజ్ఞానప్రసూనమాలిక” యను పేరఁ గ్రమంబుగఁ బుస్తకరాజిఁ బ్రకటించుచుందుము. మాచేఁ బ్రకటింపఁబడు గ్రంథములెల్ల నునుపుచే మించు దళసరికాగితములపైఁ జక్కగ నచ్చొత్తింపఁబడి పండితపరిష్కృతములై వెలయ. పద్యంబు లెల్ల బాదమునకొకపఙ్క్తియు యతిస్థానములంగుర్తును గలిగియుండును. సంపుటీకరణమును దృఢముగఁ జేయింతుము. ఇంతచేసియు వెల యించుమించుగ ‘గుజిలీ’ పుస్తకములకుంబలె యుండునట్ల నియమింతుము!! ఈ కాలపుఁ దేనె లొలుకుమాటలంగల ప్రకటనలచే మోసపోయిన యనేకులు కాలక్రమంబున మాచేఁ బ్రకటింపఁబడు గ్రంథముల గౌరవముఁ గొనియాడఁగలరని నమ్ముచున్నాము. మాకుఁ ‘జందాలు’ ముందుగఁ బంపనక్కఱలేదు. భాషాభిమానులందఱు నీ గ్రంథములం గన్నులారం జూచినపిదప నాదరించినఁజాలు.
ఇట్లని విన్నవించు సుజనవిధేయులు,
ర. వేంకటసుబ్బయ్య, ఎమ్. ఏ., క్రొ. వేంకటపద్మనాభశాస్త్రి.