భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/అక్బరీ బేగం

వికీసోర్స్ నుండి

ప్రసంగాలతో ప్రజలను ఉద్యమ దిశగా నడిపిన దిట్ట

అక్బరీ బేగం

ప్రజా పోరాలలో మహిళలు పాల్గొనటం ఒకవంతైతే ఆ పోరాలలో పాల్గొనటమే కాక, తోటివారిని కూడ పాల్గొనట్టు చేయటం గొప్పవిద్య. అది ఆయా వ్యకుల స్వచ్చమైన ప్రవర్తన, నిజాయితీ, నిబద్ధతల మీద ఆధారపడి ఉంటుంది. ఈ మేరకు జాతీయోద్యమం తొలిదశలో జరిగిన ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమం దిశగా మహిళలను కార్యోన్ముఖులను చేయటమే కాకుండ, ఆయా స్త్రీల కుటుంబ సభ్యులను కూడ పోరాట దిశగా నడిపించే సత్తాగల ఆలోచనాత్మక ప్రసంగాలను చేసిన యోధురాలిగా శ్రీమతి అక్బరీ బేగం ఖ్యాతిగాంచారు.

ఆమె ప్రముఖ స్వాతంత్య్రోద్యమకారుడు, న్యాయవాది ఆసఫ్‌ అలీ తల్లి. ఆమె భర్త అహసన్‌ అలీ. ఆయన పోలీసు అధికారి. స్వమతం పట్ల అత్యంత భక్తిప్రపత్తులున్నా ఇతర మతాల పట్ల వివక్షత చూపని విశాల హృదయం ఆమెది. ఆమె కుమారుడు హిందూ యువతి అరుణా గంగూలిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె కొంత కినుకు వహించినా ఆ తరువాత అరుణా ఆసఫ్‌ అలీని ఆదరించి కూతురు స్థానం కల్పించారు. ఆరుణా అసఫ్‌ అలీకి ఆమె ఉర్దూ నేర్పారు. ఆమెతో కలసి అక్బరీ

101 బేగం పలు జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

(Aruna Asaf Ali, GNSRaghavan, NBT, India, 1999)

ఖిలాఫత-సహాయనిరాకరణ ఉద్యమాలు ఉధృతంగా సాగుతున రోజులవి. 1920 మే మాసంలో ఢిల్లీలో మహిళల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అక్బరీ బేగం ఉత్తేజపూరిత ప్రసంగం చేసి బ్రిటిష్‌ పోలీసుల ఆగ్రహానికి గురయ్యారు. ఆనాడు ఆమె చేసిన ప్రసంగం ఈ విధంగా సాగింది.

మీరంతా మీ కుటుంబాల పాలకులు, శాసకులు సంపూర్ణాధికారులు కారా? అది నిజమైతే మనం మన కుటుంబాలలోని మగవాళ్లందర్నీసహాయ నిరాకరణ ఉద్యమంలో నిష్టగా పొల్గోనేట్టు ప్రోత్సహించాలి. ఉద్యమం పట్ల నిబద్ధతతో వ్యవహరించేలా చూడాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సాంఫిుకంగా బహిష్కరించాలి. మన మగవాళ్ళను కర్మ నిష్టాపరు లను చేయాలి. మీ హృదయాలలో భగవంతుడిని, మహమ్మద్‌ ప్రవక్తను సన్నిహితంగా ప్రతిష్తించుకోవాలంటే, స్వర్గంలో బీబీ ఫాతిమా సేవలో నిమగ్నం కావాలన్న అభిలాష మీకున్నట్టయితే ధర్మపోరాటం పట్ల దృఢచిత్తులై వ్యవహరించండి. (భారత్‌కి స్వాతంత్ర్యసంగ్రామం మే ముస్లిం మహిళావోంకా యోగ్ దాన్‌, డాక్టర్‌ ఆబెదా సమీయుద్దీన్‌, ఇస్టిట్యూట్ ఆఫ్‌ ఆబ్జెక్టివ్‌ స్టడీస్‌, న్యూఢిల్లీ, 1997 పేజి.313)

అక్బరీ బేగం మతసామరస్యానికి, విభిన్న మతస్థుల మధ్య స్నేహసంబంధాల పిష్టతకు ఎంతగానో కృషిచేశారు. ఆమె తన ప్రసంగాలకు ఆధ్యాత్మికతా సుగంధాన్ని అద్దారు. ఆ కారణంగా ఆమె ప్రసంగాలు మహిళలను ప్రధానంగా ముస్లిం మహిళలను ఉద్యమ దిశగా నడిపాయి. మతసామరస్య పటిష్టతకు దోహదపడ్డాయి. ఆ ప్రసంగాల ద్వారా మహిళలు కదలి వచ్చి ఖిలాఫత్‌- సహాయ నిరాకరణోద్యామంలో పాల్గొనేట్టు ఆమె కృషి సాగింది.

ఈ మేరకు ఖిలాఫత్‌ ఉద్యమంలో ఆమె ప్రదాన పాత్ర వహించారు. పలు పర్య టనలు జరిపారు. అనేక సభలు-సమావేశాలలో ప్రసంగించారు. ఆసఫ్‌ అలీ లాంటి ప్రముఖ జాతీయోద్యకారుడ్ని విముక్తిపోరాటానికి అందించి, స్వరాజ్యం కోసం పోరాడుతున్న జాతీయోద్యమకారులకు ప్రేరణగా నిలిచి స్వాతంత్య్రోద్యమ చరిత్రలో తనదైన స్థానాన్ని ఆక్బరీ బేగం సొంతం చేసుకున్నారు.

102