Jump to content

భారత సావిత్రి (వచనము)

వికీసోర్స్ నుండి
క.

శ్రీరామా! సీతాహృ
త్సారస రవి! భానువంశ సాగరచంద్రా!
భూరి దయారస సాంద్రా!
సారసపత్రాక్ష! రామచంద్ర నరేంద్రా!


వ. అవధరింపుము ధర్మరాజు ద్వారకా నగరంబుననున్న శ్రీకృష్ణదేవునిం బిలిపించి గౌరవులకును దమకును సంధిసేయవలెనని ప్రార్ధించి రాయబారం బనుప నద్దేవుండట్లగు గాక యని హస్తినాపురంబునకు వచ్చి తన సారధి యైన దారకునిం బిలిచి విదురునింటికి రధము పోవనిమ్మనిన నాతండట్లు చేసెను. అంత విదురుండు  గోపాలదేవునెదుర్కొని సాష్టాంగ దండ ప్రణామములాచరించి   “లోకనాయకా! మేలుగలుగ విజయము చేసితిరి. మీ చరణారవిందములు గనుగొనుటవలన నే నెల్లభంగుల గృతార్థుడనైతినిప్పుడు నా జన్మంబు సఫలంబయ్యె, నా తపంబు ఫలించె, నా పుణ్యంబులీడేరె, దామోదరా! మీరు నా గృహమునకు వేంచేయటంచేసి జన్మాష్టమియు, మహానవమియు, ఆనందచతుర్దశియు,  దక్షిణాయన పుణ్యకాలమును, నుత్తరాయణ సంక్రాతియు, తులా మేష సంక్రాంతులును, దశమియు, నేకాదశియు, ద్వాదశియు, నమావాస్యయు లోనుగా గల పుణ్యదినంబులు మాకు సమకూడె, ననుటయు”- నవ్వసుదేవనందనుండు విదురునింజూచి “యతిశయించిన ప్రజ్ఞయు సకలశాస్త్ర జ్ఞానంబును గల నీ పలుకులకు మెచ్చితి; గావలసిన వరంబును వేడుమిచ్చెద”, ననిన నవ్విదురుండు సంతోషించి, “పురుషోత్తమా! నాయింట వేలకొలది బ్రాహ్మణులు భుజియింప వలయు, నా మందిరంబున బంధుజనంబులు నిండియుండ వలయు నే శయనించుతరి గొడుకులుం గూతుండ్రునుం గలసి సందడిగా నిండి యుండవలయు, నట్టివరంబు దయసేయవలయు” ననిన నద్దేవుం“డట్లగుగాక” యని వరంబొసగె. అంత శ్రీకృష్ణదేవుని రాక యెఱింగి, రాజరాజగు దుర్యోధనుండు విదురుని సదనంబునకు వచ్చి, మధుసూదనుని నవలోకించి “కమలాక్షా! భీష్మద్రోణుల నుల్లంఘించి మాయింటికి రాక శూద్రునియింట భుజించుట యర్హంబే” యనిన విని రుక్మిణీవల్లభుండు సుయోధనునింజూచి యిట్లనియె “పరమ భాగవతోత్తముని యన్నంబును, గంగాతోయంబును, శ్రీ విష్ణుదేవుని పాదపద్మ ధ్యానంబును, నేకాదశీవ్రతంబును బరిశుద్ధంబని పెద్దలవలన నెఱుంగవే.  విష్ణుభక్తి పరాయణుండయిన మనుజుండు నాలవజాతిని జన్మించినవాడయినను శూద్రుండుగాడు. పరమ భాగవతోత్తముండయిన బ్రాహ్మణుం డనంబరగు. సకలజాతుల యందును విష్ణుభక్తిలేనివాడు శూద్రుడనం బరుగు. నాయెడ భక్తిగలిగిన చండాలురయిన నవమానించుట బుద్ధిమంతుల కుచితంబుగాదది యెఱుంగక నా భక్తుల దూషించిన నరాధములు రౌరవాది నరకంబుల జెందుదురు. రాజేంద్రా! యాదరంబే యడుగవలయుగాని భోజనం బడుగం బనియేమి? యన్నంబు జాములోన జీర్ణంబగు నాదరంబు శాశ్వతంబయి యుండు. బగవాని యింట భుజించుటయును, బగవానికి భోజనం బిడుటయును నర్హంబుగాదు. నీవు మాకు బగవాడవగుటంచేసి నీ యింట భుజింపరాదు. అది యెట్లంటేని, పాండవులు మాకు బరమాప్తు లగుటంచేసి వారియెడ చేసిన యపరాధంబు నాయందు నిత్యం బయ్యె. మాకు పాండవులు ప్రాణప్రదంబగుట యెఱుంగవే. ప్రియపూర్వకంబుగా బిలిచిన వారియింట భుజించుట యుచితంబు. అన్నంబులేకున్న నాపత్కాలంబునం దెవ్వరియింటనైన భోజనంబు సేయందగును. మీకు మాయెడ బ్రేమంబు లేదు. మేము అన్నంబు లేనివారము కాము. సుయోధనా! యాదరంబుమీద నొసంగిన శాకమాత్రంబేనియు మామనంబున మమృతోపమానంబై యుండును. భక్తిలేక యిచ్చిన అమృతంబేనియు నిస్సారముగా నెన్నుదుము. నాపలుకులు విన గలవాడ వైతివేని దురభిమానంబు విడిచి పాండునందనులకు సమభాగంబుగా భూమిం బంచి యిచ్చి మీరు నూరుగురును వారైదుగురును గలసి సుఖమున నుండవలయు. గులంబునకు హానిఁ దేవలదు. మీరు నూటయేవురు నేకీభవించి యుండుట కార్యంబు. అదిగాక కాననాంతరంబునం బండ్రెండేండ్లు వనవాసంబును, నొక్కయే డజ్ఞాతవాసంబునుం జేసి వచ్చిన ధర్మనందనాదు లేవు రైదూళ్ళడుగుచున్నవారు. అవి యేవంటేని, ఇంద్రప్రస్థంబును, అవంతియు, మయప్రస్థపురంబును, వారణావతంబును నివి నాలుగు గ్రామములు మఱియు హస్తినాపురమును కోరుచున్నవారు. గావున నవశ్యముగా నియ్యందగినవి” అనిన విని దుర్యోధనుండు శ్రీకృష్ణదేవునిం జూచి యిట్లనియె. “కేశవా! కయ్యంబుసేయక కాని యేను వాడిగల సూదిమొన మోపినంత మాత్రంబేనియు భూమి బంచి యివ్వగల వాడనుగాను.” అనుటయు, శ్రీకృష్ణదేవుండు దుర్యోధనుంజూచి యిట్లనియె “ధృతరాష్ట్రనందనా! కపిధ్వజంబును గాండీవంబును మెఱయ బాండవమధ్యముండైన యర్జునుండు, నుద్దండ గదాదండంబు మెరయ గిరగిరం ద్రిప్పుచు వేదండమునుంబోలె వృకోదరుండును రణమునకు వచ్చి నిలిచినప్పుడు సకలరాజ్యము నీవే పంచి యిచ్చెద” వనిన విని దుర్యోధనుండు శ్రీకృష్ణదేవునిం జూచి యిట్లనియె. “కుందనంబు చందనంబున నందంబైన దేహకాంతులు వెలుంగ మదపుటేనుగు విడివడిన కరణి మహామేఘంబునం బోలె గర్జిల్లుచు నెదిరించిన శత్రు సైన్యముల నుక్కడగించుచు నారథము బఱపి చిత్రగతుల నడపింపజేయుచు నాదిత్య నందనుఁడైన కర్ణుండు సమరంబున తేజరిల్లునెడ నీవే చూడగలవాడ” వనినంత శ్రీకృష్ణదేవుండు సుయోధనుం జూచి యిట్లనియె. “ఈ బలమును నమ్మితివేని నీ వేనుంగులు, గుఱ్ఱములు, రథములు లేక యొంటరివై పాదచారమున బలాయనంబు సేయంగలవాడ” వని శ్రీకృష్ణుండు మఱియును సుయోధనుంజూచి యిట్లనియె. “అటులగాక యుండునేని ధర్మశాస్త్రకర్తలును యాజ్ఞవల్క్య ప్రభృతులును మధ్యపానంబు జేసినవానియట్లు ఆసత్యవాదులగుదురు గాక! ఉత్తర గోగ్రహణమునాఁడు మీ దలపాగలు గోయనిచ్చినప్పుడు పరాజయము నొంది మగుడి యుద్ధమునకుంబూనిన దుర్యోధనుం డొక్కరుండు, తొల్లి త్రేతా యుగమున నాంజనేయుం డొక్కరుండు వచ్చి లంక నిశ్శంక జొచ్చి యశోకవనము విరిచి రావణుని పుత్రుఁడైన యక్షునిం జంపి లంకానగరమును దహించి జయంబుఁ జేకొనుట యెఱింగి మరలఁ గయ్యమునకుఁ బూనిన రావణుం డొక్కరుండు. మీరిరువురు పురుషులు లోకమున మూర్ఖులనంబరగుదురు” అనుటయు, ద్రోణాచార్యుఁ డిట్లనియె. “కృష్ణార్జును లేకీభవించిన, శుక్రుండు స్వాతీగతుండై యతివృష్టిం గురియు చందంబున గాల్బలంబుల మీద నాలుగేసి బాణంబులును, అశ్వంబులపై బదునాఱేసి సాయకంబులను, యేనుంగుల మీద నూరేసి యమ్ములను, రథంబులపయి నూరేసి నిశిఖంబుల నేసి బాణ వర్షంబులు గురియింపగలవా” రనిన, అంతట సంజయుండు ధృతరాష్ట్రులనుద్దేశించి కేల్మొగిచి సాష్టాంగదండ ప్రణామంబాచరించి “స్వస్తి శ్రీకర శ్రీకంఠ వరప్రసాద సహస్రనగబలసంపన్న అగ్నిస్తంభన జలస్తంభన ఇంద్రజాల మహేంద్రకాల విద్వాంసయుక్తుండవయిన ధృతరాష్ట్రా! నీనందనుండగు దుర్యోధనచక్రవర్తి నూరుగురు తమ్ములును, నూటొక్క తనయులును, నిరువదివేల లక్ష బంధువర్గంబులును, నూరుకోట్ల నియోగులును, యేడుకోట్ల యయోనిసంభవులును, బదునాలుగు కోట్ల లలాటపట్టవర్ధనులును, మూడు కోట్ల దండనాయకులును, జతుష్కోటి సామంతులును, కోటి యీటెకోలల వారును, దుష్టాపతులు లక్షయును, నేబదివేలు బానిసలును, కోటి తొమ్మిది లక్షల యుద్ధవీరులును, నలువది వేల ధానుష్కులును, నాలుగు లక్షల సంగ్రామ విజయులును, బదియేను లక్షల భద్రజాతి యేనుంగులును, నయిదు లక్షల సంగ్రామదంతలును, అఱులక్షల మహామంత్రులును, యేడు లక్షల డెబ్బదితొమ్మిదివేల దళంబును గలిగి విభవంబు తోడ నేలినది హస్తినాపురంబును, నెక్కినది కనకరథంబును, బెట్టినది మాణిక్య కిరీటంబును, దన పేరు రాజరాజని వహించి నిత్యకల్యాణంబును, బచ్చలతోరణంబులు గలిగి నవఖండమహీ మండలాధీశ్వరుండై యాఱుఖండంబుల దానేలుచు, మూడు ఖండంబుల వారిచేతం గప్పంబులు గొనుచు, కన్నుల చింతామణియు, చేతుల స్పర్శవేదియుం, బాదముల పద్మరేఖలు గలిగినట్టి దుర్యోధన చక్రవర్తికి వయిరియై, భూభారంబు హరియింప గోరి కిరీటికి సారథ్యంబు సేయంబూనిన యచ్యుతునకు, హృషీకేశునకు, ద్రివిక్రమునకు, జక్రధరునకు శ్రీకృష్ణదేవునకు దండప్రమాణము గావించితి” ననియెను. తదనంతరమున వేదవ్యాస మునీంద్రుండు ధృతరాష్ట్రున కిటులనియెను “బ్రాహ్మణులతోడ సద్గోష్టియు, గంగాస్నానమును, విష్ణుపాద సందర్శనమును, భారత కథా శ్రవణంబును దుర్లభంబులు. నైదవ వేదంబనంబరగు భారతంబును జదివినను వినినను సర్వపాపములనుండి విముక్తుడై విష్ణుసాయుజ్యము నందు” దరని భారతరణప్రకారంబు ధృతరాష్ట్రునకు వినుపింప సంజయుని నియోగించి చనియె. అంత ధృతరాష్ట్రండు సంజయుం గనుంగొని “మహాత్ములయిన పాండవులకు, గౌరవులకు ఘోరయుద్ధంబు వాటిల్లునెడ నిరువాగుల నెవ్వరెవ్వరు మొనమానిసులై యుండిరి? యెవ్వరెవ్వ రతిరథ మహారథ సమరథార్థ రథాతిరథశ్రేష్టులు? ఎవ్వరెవ్వరిచేత నెవ్వరెవ్వరు హతులైరి? భీష్మద్రోణులెత్తెరంగున బడిరి? దుర్యోధనుండు భీమ సేనునిచేత నెత్తెరంగునంబడియె? నది సవిస్తరంబున వినుపింపు” మనుటయు సంజయుండు దృతరాష్ట్రునుద్దేశించి యిట్లనియె “గౌరవ బలంబులోన సుయోధనుండునుఁ, గృతవర్మయు, శల్యుండును, భూరిశ్రవుండును, బాహ్లికుండును, సోమదత్తుడును, హలాయుధుండును నతిరథులు. సైంధవుండును, నీలుండును, వృషసేనుండును మహారథులు. బృహద్బలుండును, శకునియు, భగదత్తుడును, లక్ష్మణకుమారుడును సమరథులు. దండధారుండును, కర్ణుండును, విందానువిందులును నర్థరధులు. కృపుండును, నశ్వత్థామయును, ద్రోణుండును, భీష్ముండును నతిరథ శ్రేష్ఠులు. పాండవ సైన్యమున యుధిష్ఠిరుండును, గుంతీభోజుండును నతిరథులు. భీముండును నభిమన్యుండును, సాత్యకియును, దృష్టద్యుమ్నుండును, ఘటోత్కచుండును నతిరథశ్రేష్ఠులు. నకుల సహదేవులును, పాండ్యుడును సమరధులు, ద్రౌపదీపుత్ర పంచకంబు, నుత్తరుండును, ద్రుపదమాత్స్యులును, శిఖండియును, దుష్టకేతుండును మహారథులు. వివ్వచ్చుం డీతరము వాడని నాకు వాకొన, నీకు నూకొన గలదిగాదు. పదునెనిమిది యక్షౌహిణులు నొక్కటియై యెత్తి వచ్చెనేనియు నొక్క నిమిషమాత్రమున సంహరింప నోపు. ద్రోణుండు దినత్రయమునను, కర్ణుందైదుదివసముల, నశ్వత్థామ నర్థదినమునఁ బాండవ బలములం దెగటార్తురు. అర్జునుండొక్కరుండు మన బలముల నర్ధనిమిషమున బ్రతాపించి పొరిగొను”నని చెప్పి వెండియు సంజయుడిట్లనియె “ఆదిపర్వమును, సభాపర్వమును, ఆరణ్యపర్వమును, విరాటపర్వమును, ఉద్యోగపర్వమును నివి యాదిపంచకంబు. భీష్మపర్వమును, ద్రోణపర్వమును, గర్ణపర్వమును, శల్యపర్వమును, సౌప్తికపర్వమును నివి యైదు యుద్ధ పంచకము. స్త్రీపర్వమును, శాంతిపర్వమును, అనుశాసనికపర్వమును నివి మూడు శాంతిత్రయము. అశ్వమేధపర్వమును, ఆశ్రమవాసపర్వమును, మౌసలపర్వమును మహాప్రస్థానిక పర్వమును, స్వర్గారోహణ పర్వమును నివి యశ్వమేథ పంచకము. ఈ పదునెనిమిది పర్వములు కృష్ణద్వైపాయనుండు రచియించె. మార్గశీర్షమాసము శుక్లపక్ష త్రయోదశీ దినమున భరణి నక్షత్రమున భారతయుద్ధము ప్రవృత్తంబయ్యె. నందు గృష్ణసప్తమి దివసంబున శిఖండిని ముందు నిడుకొని యర్జునుండు భీష్ముం బడవేసె. నష్టమీ దివసంబున భగదత్తుడును, నవమినాడు జయద్రథుండును, దశమినాడభిమన్యుండును, యేకాదశి దినమున సైంధవుండును, అర్ధరాత్రమున ఘటోత్కచుండును, ద్వాదశిని వేకువ జామున విరాటద్రుపదులును, ఆ మధ్యాహ్నమున ద్రోణాచార్యుండును, త్రయోదశి దినమున ననేక రాజసంఘంబులును, చతుర్దశి మధ్యాహ్నమున దుశ్శాసనుండును, నా సాయం సమయంబున మహారథుండైన గర్ణుండును రణంబునం బడిరి. పిదప దుర్యోధను సైన్యము దైన్యమునొంద, భేరిమృదంగాది వాద్యఘోషము లేక, వీరాలాపములుమాని. హర్షములు తొలంగి సూర్యుండు లేని దినంబునుం బోలెఁ. జంద్రుండులేని రాత్రిపగిది కాంతిహీనంబై కనుపించె. కమల దళంబుల వంటి కన్నులు గలిగిన దుర్యోధను ముఖంబు కళావర్జితంబై కానంబడియెను. ఇటులు  కౌరవ సైన్యంబు కర్ణరహితంబై శోభింపదయ్యె. తదనంతరం అమావాస్యయందు శకునియు, నులూకుండును సహదేవుచేత దెగటారిరి. ఆ మధ్యాహ్నంబున శల్యుండు ధర్మరాజుచేతం జచ్చె. ఆ సమయమున భీమసేనుని గదాఘాతంబున దొడలువిఱిగి దుర్యోధనుండు పడియె. దృష్టద్యుమ్నుడును, శిఖండియు ద్రౌపదీపుత్రులేవురు నారాత్రియం దశ్వత్థామచేత హతులైరి.   ఈ విధంబున బదునెనిమిది యక్షౌహిణుల బదునెనిమిది దినంబుల సమసె. భీష్ముండొక్కనాఁడు పదివేల గుఱ్ఱంబులను, తొమ్మిదివేల యేనుంగులను, ఏవురు మూర్ధాభిషిక్తులైన రాజులం జంపి సమరంబును చాలించె.  భీష్ముండు పది దినములు, ద్రోణుండు ఐదు దినములు, కర్ణుండు రెండు దినములు, శల్యుండర్థదినమును పోరిరి. దుర్యోధను డర్థదినంబే గదాయుద్ధము జేసి భీమసేను చేత  సమసె. సకల క్షత్రియ క్షయకాఱణంబుగ   కురుక్షేత్రంబున నిత్తెరంగు భారత యుద్ధము ప్రశస్తంబయ్యె. తొమ్మిది వేల యేనుంగులును, నేనుంగునకు నూరేసి రథములును, రథమునకు వేయ్యేసి గుఱ్ఱములును, గుఱ్ఱమునకు నూర్వురు కాల్బలము నిది ధర్మనందనునకు మూలబలము. కురుక్షేత్రంబు యజ్ఞవేదియు, జనార్ధనుండు యూపంబును, దుర్యోధనుండు పశువు,  కర్ణుండు హవిస్సు, పాంచాలి యరణియు, భీమసేనుండగ్ని, యర్జునుండు హోతయు భీష్మద్రోణు లాజ్యములు. యీ రణంబను యాగమున ధర్మరాజు యజమానుండై గాండీవమను బాణము లనియెడు స్రుక్స్రువంబులచే సమస్తరాజసంఘంబు లనియెడు హవ్యద్రవ్యంబుల హోమమును జేయించె. ఇది భారతసారసంగ్రహము భారతసావిత్రి యనంబరఁగు.” నెవ్వరేనియు బ్రాతఃకాలమున, మద్యాహ్ననమున సాయంసమయమున సంకటకాలమున, భయముఁ దోచినయెడల నీ భారతసావిత్రిని పఠించిన, వారికి సకల కార్యములు సిద్ధించి, సంవత్సరోపార్జితములైన దురితములు తొలంగు. స్వర్ణమాలికాలంకృతములగు వేయి ధేనువులు సత్పాత్రమున దానము చేసిన ఫలము కలుగునని వేదవ్యాస వచనము గలదు.

ఇది చదివినవారికి వినినవారికి సకలైశ్వర్య భోగములు గలిగి పుత్ర పౌత్రాభివృద్ధి సామ్రాజ్యవృద్ధి గలిగి తదనంతరమున విష్ణు సాయుజ్యము గలుగును.

భారత సావిత్రి – సంపూర్ణము