భారత నీతికథలు/సంవరణ చరిత్రము - పురోహితప్రభావము
నుండియు నీయంగార పర్ణత్వమును విడిచి చిత్రరథుండను పేర సంచరించుచుందు. నేను స్త్రీలోలుండనై యుండుటచేతను నీవు బ్రహ్మచర్య వ్రతస్థుండవగుటచేతను, నీవు జయించుటయు నే నోడుటయుఁ దటస్థించినవి. మఱియొకఁ డీ యర్ధ రాత్రంబున నన్ను గెలిచి పోజాలఁడు.
గీ. పాండుపుత్ర ! నీవు బ్రహ్మచర్యస్థుండ
వగుటఁ జేసి మన్మథార్తునన్ను
నొడిచి తిందు రాత్రి యుద్ధంబుసేసి కా
మోపభోగ నిరతుఁ డోటువడఁడె ?
- ___________
2. సంవరణ చరిత్రము - పురోహితప్రభావము.
నాటి యర్ధరాత్రమునఁ బాండవులును జిత్రరథుఁడును జాలసేపు సంభాషించిరి. ఆగంధర్వుఁడు వారికిఁ గడుంగూర్చు మిత్రుఁడయ్యెను. పాండవులును వానికిమిత్రులైరి. నాటిరాత్రి సంభాషణములోఁ జిత్రరథుఁడు “పాండుకుమారులారా ! పవిత్రచరిత్రుఁడును ధర్మజ్ఞుఁడునగు నొక బ్రాహణుని మీరు పురోహితునిగా నెంచుకొనుఁడు. అట్టి పురోహితునిఁ బురస్కరించుకొను రాజులకుఁ బాపభయంబును నపజయంబును గలుగవు. మీపూర్వుఁడైన సంవరణుండను రాజు పురోహితుని యనుగ్రహంబుననే తపతియను కన్యకను బడయఁగల్గెనని చెప్పెను. తోడనే పాండవులు సంవరణ చరిత్రంబును బురోహిత ప్రభావంబును దమకెఱింగింప వలసినదనికోరిరి. గంధర్వుఁడిట్లుచెప్ప నారంభించెను.
సూర్యునకు సర్వశుభలక్షణ లక్ష్మి తాంగియగు తపతి యను కూఁతురు గలిగెను. కాలక్రమంబున నక్కన్యారత్నము రూపగుణ విద్యాసమృద్ధినియై వర్ధిలుచు, యౌవన ప్రాపయై నంతనే యాదిత్యుఁ డామె వివాహమునుగూర్చి విచారంప సాగెను. సర్వవిధములఁ దపతి కనుగుణుండైన పతిం బడయుటకుఁ దపనుఁడు నిరంతరము ప్రయత్నించుచుండె, అట్టియెడ భరతవంశజుండును , అజామీళుని కుమారుండునగు సంవరణుండనురాజు తపతి గుణరూప విద్యావిశేషములను విని యామె యందు బద్ధాను రాగుఁడయ్యెను. కాని తనప్రభుత్వ గౌరముచేత సామాన్యరాజకన్యను బడయఁగల్గినట్లు సంవరణుం డాదిత్యకన్యను బడయఁజాలడుక దా! అందుచే సూర్య భగవానుఁడు తనకుఁ బ్రసన్న డై తపతీసతిని దన కనుగ్రహించుటకైయా రాజు జపోపవాసాది విధులతో నిత్యమును వాని నారాధించు చుండెను. భగవంతుఁడైన భాస్వంతుడు వానిభక్తి కెంతయు మెచ్చి గగన మండలమున నధిక ప్రభతో నేను వెలుంగునట్లే భూమండలమున సుప్రసిద్ధుఁడై వెలుంగు సంవరణుండే నా పుత్రికిం దగిన వరుండని నిశ్చయించుకొనెను.
ఇట్లు సూర్యోపాసనాయత్త చిత్తుండై రాజు కాలము గడపుచు నొకనాడు మృగయా వినోదార్థము వనమునకరిగెను. ఆ వనంబున వేటతమకంబున సంచరించుచు సంవరణుని తురంగము క్షుత్పిపాసా పీడితయై నేలవ్రాలినది. అందువలన నతఁడు పాదచారియయి సంచరించుచుఁ గ్రమక్రమముగ నొక పర్వత ప్రదేశమును సమీపించి, మూకస్మికముగ నచ్చట నిరతిశయ రూపలావణ్యాతి శయములుగలయొక కన్యాలలామంగాంచెను. సంవరణుండామెసు జూచినంతనే యనిమిషలోచనుండై" ఓ హో ఈ హేమగాత్రి తన కాంతిచే నీవృక్ష లతాదులన్నియు బంగారు వికారము నొందుచున్నవి. ఈమె త్రిభువన సామ్రాజ్యలక్ష్మియో, యక్ష కాంతయో, సిద్ధకన్యకయో, యమర సుందరియో కావలయును ! దివ్యాంగనలకైన నిట్టిరూపవిలాస సంపదలుండుట యసంభవము”అని పలువిధముల శ్లాఘించుచు మెల్లఁగ నామెను సమీపించెను. సమీపించి రాజు తత్సౌందర్యావలోకనమునందు నిశ్చలత్వము నొందిన తనచూపు లామె యందె నిలిపి, అబలా! నీ వెవ్వరిదానవు? ఒంటరిగ నివ్వనంబున నేల మెలంగు దానవు?" అని యడిగెను. వాని మాటల కక్కన్య నిరుత్తరయై మేఘమధ్యమున సౌదామినివోలెఁదటాలున మాయమైనది.
ఇట్లదృశ్యయైన యక్క న్యం గానక సంవరణుండు ప్రలాపించుచు మిక్కిలి దుఃఖించుచుండఁ గొంతసేపునకు వానిం గరుణించి మఱల నాసుందరి ప్రత్యక్షమై యిట్లే ల వగచెదవని యడిగెను. తోడనే యతఁడత్యానంద భరితుఁడై, “సుందరీ! అధికప్రతాప బలదర్పంబున రాజలోకమున కెల్ల నేనే పెద్ద . మున్నెవ్వరికి నెందును భయంపడనివాఁడను. నేడు నీయెడ భయార్తుఁడ నైతిని. ప్రాణదానముగావించినన్ను రక్షింపుము . గాంధర్వ వివాహంబున నన్ను వరింపు"మని ప్రార్ధించెను. రాజు మాటలకు లజ్ఞావనతవదనయైన యా మదవతి కొంతవడికి మొగంబెత్తి, రాజేంద్రా! భువనైక దీపకుండగు సవితృనకు నేను దనూజను. సావిత్రి కనవరజను. తపతియనుదానను. నా యందు నీకుఁ బ్రియంబుగలదేని మాతండ్రినడుగుము, అతండు నన్ను నీ కీయఁగలండు. ఇట్టి సందర్భముల గన్యలకు స్వాతంత్ర్యంబు లేమి నీ వెఱుఁగుదువుగదా! కావున నాకై యాదిత్యు నారాధింపు" మని చెప్పి, తపతి సూర్యమండలమున కరిగెను.
తపతి యరిగినంతనే సంవరణుండు మూర్చాగతుండయ్యెను. ఆప్పుడు వాని మంత్రులలో నొకండువచ్చి రాజును శీతలోపచారంబుల సేదదీర్చేను. సంవరణుఁడా పర్వతమున సూర్యునతిభక్తి నారాధించుచు నొకనాడు తన పురోహితుఁడైన వసిష్ఠమహర్షినిఁ దలంచుకొనెను. బ్రహ్మసమానుండును మహాతపశ్ళాలియు నగు వసిష్ఠమహాముని వానికిఁ బ్రత్యక్షమై వ్రతోపవాస కృశీభూత శరీరుండై యున్న ప్రభువుంజూచెను . చూచి, చూచినమాత్రముననే యాతఁడు తపనత నూజయైన తపతియందు బద్ధానురాగండై యుండుట యోగదృషిచే గ్రహించి సంవరణునకు శుభంబొనగూర్ప నిశ్చయించి, యాక్షణమయప్రతిహత ప్రభావుండగు నమ్మునికుల తిలకుండ సంకల్పమాత్రంబుననే యాదిత్యమండలమును సమీపించి, లోకలోచనుండైన కమల బాంధవుని సందర్శించి వేదమంత్రంబులనెంతయు సన్నుతించెను. మునీశ్వర వరిష్ఠుండై న వసిష్ఠుని లోకబాంధవుఁ డతిగౌరవంబున సంభావించి “మహాత్మా ! మీ యాగమనంబునకుం కారణంబే" మని యడిగెను. తోడనే వసిష్ఠుఁడు, ప్రభాకరా! మా రాజు సంవరణుఁడు. విద్యాగుణ సౌందర్య లావణ్యాదులయందు నీ తనయకుం దగిన వరుండు. కూఁతుంగన్న ఫలంబుగా నీవక్కన్నియనాతని కొసంగవలయు " నని యడిగెను. భగవానుడాతని నెంతయు నాదరించి, మహాత్మా ! రాజవంశకరుండైన సంవరణుండే తపతికిం దగినపతి" యని పలుకుచు, నాక్షణమె యక్కన్యా రత్నమును వసిష్ఠువెంటఁ బుత్తెంచెను.
ఇట్లొక్క నిమిషార్ధంబున రెండువేల యోజనంబులు నడచు నాదిత్యురధంబుతో నశ్రమంబుననరిగి తపనదత్తయైన తపతిం దోడ్కొనివచ్చి, వసిష్ఠుండు విధివంతంబుగాఁ తన రాజునకు వివాహంబు చేసెను. కావున మహాత్ములైన పురోహితులం బడసిన రాజులకు నిష్టశుభంబులగుట నిశ్చయంబు.
ఉ. వేదము వేదియుంగలుగు విప్రనరేణ్యుఁడగణ్య పుణ్య సం
పాదివురోహితుండయినఁ బాపమువొందునెభూపతింబ్రతా
పోదయ కాన మీదగు గుణోన్నతికిందగు ధర్మతత్వ సం
వేదిఁ బురస్కరింపుఁడు ఫవిత్రచరిత్రు మహీసురోత్తమున్
- ____________