భారత నీతికథలు/అంగారపర్ణుఁడు — గర్వభంగము

వికీసోర్స్ నుండి

భారతనీతికథలు

రెండవ భాగము.

1. అంగారపర్ణుఁడు - గర్వభంగము.

పాండవులు బ్రాహ్మణవేషములతో నేకచక్రపురమున జీవించుచు నొకనాఁడు ద్రౌపదీ స్వయంవర వార్తను వినిరి. ద్రౌపది పాంచాల దేశాధీశ్వరుండైన ద్రుపదునికూఁతురు. లోకమునఁ జాటింపఁబడిన యామెస్వయంవర వార్తవిని ప్రసిద్ధులైన రాజకుమారులెల్లరుఁ బాంచాల రాజధానియగు కాంపిల్యనగరమునకుఁ బ్రయాణమగుచుండిరి. స్వయంవరోత్సవమున బహువిధ దక్షిణలం బడయ గలమని వేదాధ్యయన సంపన్నులగు బ్రాహ్మణులుఁగూడ బాంచాలవురము చేరుకొనుచుండిరి. ఆ దినములలోఁ బట్టణయుల యందును బల్లెలయందును బ్రజలలో నిదియే ప్రసంగము.

ఈ వార్తలన్నియు వినుచుండుటచేత ద్రౌపదీ స్వయంవరమును దర్శింపవలయునని పాండవుల కుత్సాహము కలిగినది. తల్లియైన కుంతి కుమారుల యభీష్టమును గ్రహించి చాలకాలమైనది. ఇంకెంతకాల మిందుండఁగలము? ఉన్నను నేమిలాభము ? మఱియు నొరులయింట నింతకాలముండుట యుచితముకాదు. దక్షిణ పాంచాలదేశములు మిక్కిలి రమ్యంబులనియుఁ బాంచాలరాజు పరమధార్మికుం డనియును మనము వినుచుందుము. అంతియెగాక, యా దేశమునందలి గృహస్థులు కోరకయే బ్రాహ్మణులను దమంత పిలిచి సత్కరించు చుందురఁట. కావున మన మింకఁ బాంచాల రాజ్యమునకుఁ బోవుద”మని చెప్పెను. ధర్మరాజాదు లామాటల కమందానందమునుజెంది, “తల్లీ ! నీ యాజ్ఞాను సారమే కావించెద"మనిరి.

ఇట్లు ప్రయాణమును నిశ్చయించుకొని, తమయింటి బ్రాహ్మణునకుఁ జెప్పి సెలవుగైకొని, యొక శుభదినంబున బాండవులు తల్లితోఁ గాంపిల్యనగరమునకు బయలుదేఱిరి. అడవులు, గొండలు, నేఱులు, నదులు దాటుకొనుచు వారు. పెక్కుదినములు ప్రయాణము చేసిరి. ఒకనాటి ప్రయాణములో వారికి మార్గమధ్యమున మహావిష్ణు సమానుఁడగు వ్యాసమహర్షి కానవచ్చెను. పాండవులును గుంతియు మిక్కిలి భక్తివినయములతో నాతనికి నమస్కరించిరి. వ్యాసుఁడు వారియెడఁ బసన్నుఁడై , “ధర్మమూర్తులగు మీ కందఱకు శుభంబగుఁగాక ! మీ రుపేక్షించక కాంపిల్య నగరంబున కేగుఁడు! అక్కడ మీకు మేలు కాఁగల” దని యాశీర్వదించి తనత్రోవం జనియెను. వ్యాసుని మహదాశీర్వాదమునకుఁ దల్లియు గొడుకులు నమితానంద భరితులై మార్గాయాసంబునుఁ బాటింపక రాత్రులును బగళ్లును బయనము సాగించుచుండిరి.

ఆ ప్రయాణములో నొకనాటి యర్థ రాత్రమునఁగటిశ చీకటిలో దారి తెలియుటకు, మండుచున్న యొక కొఱవి చేతఁ బట్టుకొని యర్జునుఁడు ముందు నడచుచుండెను. తక్కినవారా వెలుఁగులో వానివెనుక వచ్చుచుండిరి. గంగానది యందలి సోమశ్రవంబను పుణ్యతీర్థంబున స్నానము చేయవలయు నని వారి సంకల్పము. అందుచే వారాతీర్థపు మార్గముననే పోవుచుండిరి. వారు గంగను సమీపించుసరికి, భార్యతో జలక్రీడార్థము వచ్చిన యంగార పర్ణుఁడను గంధర్వఁడు పాండవుల పాదధ్వనివిని, యాగ్రహించి విల్లునమ్ములు ధరించి ముందు నడచుచున్న యర్జను నడ్డగించెను. వానిం జూచిన తోడనే యర్జనుడును దక్కినవారుసు దటాలుననిలిచిపోయిరి. అప్పుడంగార పర్ణుండు గంభీరధ్వనితో వారికిట్లనియె. "అర్థ రాత్రములు ను సంధ్యలును, భూత యక్ష దానవ గంధర్వులు సంచరించెడు సమయములు. ఈ రెండు వేళల యందును నెంతటి బలవంతులైన రాజులైన నీ ప్రాంతముల సంచరింప నేరరు. ఇదంతయు నేను విహరించుచుండు ప్రదేశము, నే సంగారపర్ణుండను గంధర్వుఁడను. కుబేరుని సఖుండను. ఈ వనంబున గంగయు నంగారపర్ణయను పేరున నొప్పుచుండు. మీరెవ్వరు ! ఇట్లేలవచ్చితిరి ! నన్నెన్నఁడును మీరు వినలేదా?" వాని మాటల కర్జునుఁడు నవ్వచు, ఓయీ! గంధర్వా! అర్థరాత్రములయందును సంధ్యలయందు నిందు సంచరించుట కశక్తులుగాని మేమట్లు భయపడము. ఎప్పుడైనను నెచ్చటనైనను మేము స్వేచ్చగావిహరింపఁగలము. మఱియుఁ బుణ్య నదియైన యీ భాగీరథి లోకమునకెల్ల సేవ్యమేకాని, యొక్క నీ సొమ్ముకానేరదు. జననీ భ్రాతృ సహితుండనై నే నిప్పుడు గంగాభిషేకార్థమువచ్చితి. నీవు వలదన్న నుడుగు వాఁడనుగా" నని పలికెను. అప్పు డంగారపర్ణుఁడు క్రోధో ద్దీపిత మానసుండై యట్లయిన నింకఁ గాచుకొమ్మని పలుకుచు నర్జునునిపై నఖండ బాణవర్షమును గురియించెను. చేతంగల కొఱవి ద్రిప్పుచునయ్యమ్ములు తన్నుఁ దాకకుండఁ గాచుకొని పార్థుఁడా గంధర్వునిపై నాగ్నేయాస్త్రమును విడిచెను. అయ్వస్త్రమునుండి వెడలిన పెనుమంట లా గంధర్వుని రథముపైఁ గ్రమ్మి దానిని భస్మ మొనరించినవి. అంగారపర్ణుఁడు నేలగూలి సొమ్మసిల్లి పడియె.

నేలఁ గూలినంతనే యర్జునుఁడు వానిం గొప్పుపట్టిధర్మజాదులకడకీడ్చి తెచ్చెను. అప్పుడు గంధర్వభార్యయైన కుంభీనస బోరన నేడ్చుచువచ్చి, ధర్మరాజు పాదములపైఁబడి, తనకుఁ బతిదానమును గావింపుమని ప్రార్థించెను. కుంతీ ధరనందను లామెనుగరుణించి యోదార్చి యంగారపర్ణుని విడిచిరి. అట్లనుగ్రహింపఁబడిన యా గంధర్వుఁడు ముకుళిత హస్తుఁడై యర్జునున కిట్లనియె. “నీచేతఁ బరాజితుండ నగుటచే నేటి నుండియు నీయంగార పర్ణత్వమును విడిచి చిత్రరథుండను పేర సంచరించుచుందు. నేను స్త్రీలోలుండనై యుండుటచేతను నీవు బ్రహ్మచర్య వ్రతస్థుండవగుటచేతను, నీవు జయించుటయు నే నోడుటయుఁ దటస్థించినవి. మఱియొకఁ డీ యర్ధ రాత్రంబున నన్ను గెలిచి పోజాలఁడు.

గీ. పాండుపుత్ర ! నీవు బ్రహ్మచర్యస్థుండ
    వగుటఁ జేసి మన్మథార్తునన్ను
    నొడిచి తిందు రాత్రి యుద్ధంబుసేసి కా
    మోపభోగ నిరతుఁ డోటువడఁడె ?

___________

2. సంవరణ చరిత్రము - పురోహితప్రభావము.

నాటి యర్ధరాత్రమునఁ బాండవులును జిత్రరథుఁడును జాలసేపు సంభాషించిరి. ఆగంధర్వుఁడు వారికిఁ గడుంగూర్చు మిత్రుఁడయ్యెను. పాండవులును వానికిమిత్రులైరి. నాటిరాత్రి సంభాషణములోఁ జిత్రరథుఁడు “పాండుకుమారులారా ! పవిత్రచరిత్రుఁడును ధర్మజ్ఞుఁడునగు నొక బ్రాహణుని మీరు పురోహితునిగా నెంచుకొనుఁడు. అట్టి పురోహితునిఁ బురస్కరించుకొను రాజులకుఁ బాపభయంబును నపజయంబును గలుగవు. మీపూర్వుఁడైన సంవరణుండను రాజు పురోహితుని యనుగ్రహంబుననే తపతియను కన్యకను బడయఁగల్గెనని చెప్పెను. తోడనే పాండవులు సంవరణ చరిత్రంబును