Jump to content

భారత అర్థశాస్త్రము/సంపాదకీయం

వికీసోర్స్ నుండి

సంపాదకీయం

ఒకజాతి ప్రతిభ బైటపడాలన్నా, ఆ జాతి భాష అభివృద్ధి చెందుతోండాలన్న, పరిపాలన, విద్యాబోధన, నిత్యవ్యవహారాలూ సమగ్రంగా అ జాతి మాతృభాషలో కొనసాగించిననాడే అది సాధ్యం : ఇది తిరుగులేని సత్యం. ఈ సత్యాన్ని గుర్తించే భాషాప్రయుక్తరాష్ట్ర నిర్మాణం కావాలని మన జాతీయ కాంగ్రెస్ మహాసంస్థ ఏనాడో నినాదం యిచ్చింది. దాని ఫలితమే 1953 లో ఆంధ్రరాష్ట్రావతరణము. అనక విశాలాంధ్ర నిర్మాణాన్ని ప్రజలు సాధించారు. ఇలా స్వరాష్ట్రం సాదించబడి అయిదారేళ్ళు దొర్లి పోయినై. కానీ ప్రజాశయం నెరవేరలేదు. స్వరాష్ట్రానికి అధిపతులుగా తయారైకూర్చున్న మన నాయకమణ్యులు యీ ప్రజాశయాన్ని గమనించినట్లు కనిపించడంలేదు. ఎందుచేతనంటే; గతసంవత్సరంలో మన రాష్ట్ర విద్యాశాఖామాత్యుని మాటలుబట్టి బోధనాభాష తెలుగు ఏనాటికీకాదని ; ఆంగ్లంలోనే సాగాలని శలవివ్వడం, తర్వాత అసెంబ్లీ కార్యక్రమాలు, పరిపాలనలో తెలుగు ప్రవేశం ప్రస్తుతాని కింకా సాధ్యంకాదని (అసలు సాధ్యంకాదనే వారివుద్దేశ్యం) సారిసారికి అసెంబ్లీలో యీ ప్రశ్న లేవనెత్తినప్పుడు మంత్రులు చెప్పడంవల్ల ఈ మా అనుమానం దృడమవుతోంది. ఇదే నిజమైతే చాలా సిగ్గుచేటు విషయమని ; పిరికివారి మార్గమని చెప్పక తప్పదు.

ఈ సమాదాన మిచ్చేవారి ఉద్దేశ్యంలో రాష్ట్రపాలన, బోధనా తెలుగులో 'సాధ్యమా' అని. ఎందుక్కాదు. పైన మేం చెప్పినట్లు ఏ భాషన్నా అ యా వ్యవహారాలన్నిటికీ అనుగుణ్యంగా అభివృద్ధికావాలంటే అన్నివ్యవహారాలు అందులో జరపడం ఆరంభించిననాడే సాధ్యం. నాడు భాష నిత్యనూతనంగా (ఆంగ్లంవలె) వర్దిల్లగలదు. అంతేకాని 'ఆలీలేదు సూలీలేదు సోమలింగం పేరేమిట' న్నట్లుగా మాతృభాషలో వ్యవహారాలు నడపకముందే పిరికిపడి వెనుకడుగువేయడం సరికాదు. గనక మరేమాత్రం ఆలశ్యంచేయక మన నాయకగణం ఈ ప్రజాభీష్టసిద్ధికోసం నడుంకడుందనే ఆశిద్దాం.

అసలు విషయం. మాతృభాష అభివృద్ధిని, విజ్ఞానాభివృద్ధిని దృష్టిలో వుంచుకొనే గత అర్ధ శతాబ్దంక్రితం విజ్ఞానచంద్రిక గ్రంధమండలి కొన్ని ఉత్తమ ప్రచురణములు వెలువరించి దేశానికందించింది. ఆ మండలి ఆశయాన్ని సాఫల్యం చేయడానికి అనేక విద్వత్తులు తెలుగులో గ్రంథరచన కొనసాగించడం ఆరంభించారు. అట్టివారిలో శ్రీ కట్టమంచివారొకరు. వీరు విద్యాప్రకర్షలో ఆంధ్రకేకాక అఖిల భారతానికే ధృవజ్యోతి : వీరి కృషిఫలితమే ఈ 'అర్థశాస్త్రం'. ఈ గ్రంథ ప్రధమముద్రణ 50 ఏండ్లనాడు విజ్ఞానచంద్రికవారిచే కావించబడి నేటికి మళ్ళీ మాచే పునర్ముద్రణ సాధ్యపడేటట్లు సహాయంచేసి ప్రోత్సాహమిచ్చిన పూజ్యశ్రీ ఆచంట లక్ష్మీపతి గారికి మా నమస్సులు.

ఇటువంటి శాస్త్రీయ గ్రంథాలు విరివిగా తెలుగులో వెలువరించి భాషాభివృద్ధికి, విజ్ఞానాభివృద్ధికి ఎంతోకొంత సేవచేయాలనేదే మా ప్రథానోద్దేశ్యం. తెలుగు పఠితలోకం మా కృషికి ఇతోధిక ప్రోతాహమిస్తారనే ఆశిస్తున్నాము.

ప్రకాశకులు.