భారతీయ నాగరికతా విస్తరణము/సుమాత్రాద్వీపము

వికీసోర్స్ నుండి

భారతీయ నాగరికతా విస్తరణము.

10. సుమత్రా ద్వీపము.

సుమత్రా ప్రశంస.

హిందూవాఙ్మయమునం దనేక స్థలముల సుమత్రాద్వీపప్రశంస గలదు. శ్రీమద్రామాయణమున సీతాన్వేషణార్థము వానరులనంపుచు సుగ్రీవుడు తూర్పుదిశకేగు వారలు గంగా బ్రహ్మపుత్రా ముఖద్వారములను దాటి ఇండోచైనామీదుగా బంగారపు గోడలుగల సువర్ణద్వీపమున కేగవలెనని యాజ్ఞాపించెను. బృహాత్కథాసారమగు శ్లోక సంగ్రహమునను, నిద్దేశ మిలింద పన్హొయను బౌద్ద గ్రంథములందును, చైనానుండి సముద్రముపై దక్షిణముగ బోవువారలు జూచుదేశములలో బర్మాదేశమును జావాసుమత్రా దీవులును బేర్కొనబడినవి. బౌద్దవాఙ్మయమునుండి ప్రాచీనకాలమున సుమాత్రాద్వీపమున బంగారము విశేషముగ దొరుకునను నాశతో నెల్లరు నటకేగు చుండిరని తెలియుచున్నది. క్రీ. శ. 7 వ శతాబ్దమున "ఈత్ సింగ్‌" అను చైనాదేశ యాత్రికుడు సుమాత్రాలోని శ్రీవిజయ రాజ్యమునకేగి, యటనుంచి హిందూదేశమునకు రాక పోకలను జరుపు నారాజు యోడలలో నొకదానిపై బయనము చేసి తామ్రలిప్తి నగరమునుజేరెను. దక్షిణహిందూదేశమున రాజ్యమేలిన చోళరాజుల శాసనములలో శ్రీ విజయరాజ్య ప్రశంస గలదు. 11 వ శతాబ్దమున దక్షిణ హిందూదేశమునందలి నాగపట్టణములో శ్రీ విజయరాజగు చూడామణి వర్మ యొక బౌద్దాలయమును గట్టింప నాతని పుత్రుడగు మారవిజయోత్తుంగవర్మ దానిని బూర్తిచేసెను. అదేకాలమున రాజేంద్రచోళుడు సుమత్రాద్వీపముపై నొక నౌకాదళమును పంపి, యచ్చటిరాజగు సంగ్రామ విజయోత్తుంగుని జయించి, విశేషధనరాసులను కొల్లగొనెను. వీర రాజేంద్ర చోళుడుగూడ మరియొకతూరి యిటులే విజయమునందెను. ఉత్తరహిందూదేశ శాసనములలో గూడ సువర్ణద్వీప ప్రసంశగలదు. నాలందాలో 9 వ శతాబ్దినాటి యొక తామ్రశాసనము దొరకినది. దానినుండి, దర్మసేతువను శ్రీవిజయరాజు యవద్వీపరాజపుత్రికను వివాహమయ్యెననియు, వారి పుత్రుడగు మహారాజ బాలపుత్ర దేవుడు బుద్దభక్తుడగుటచే నాలందా విద్యాపీఠమునందొక విహారమును నిర్మించెననియు, దెలియుచున్నది. 10 వ శతాబ్దమున నాలందా విశ్వవిద్యాలయమునం దద్యక్షుడుగ నుండిన దీపంకర అతీశుడు స్వర్ణభూమికేగెను. ఆదేశపు రాజపుత్రు డొకడు జంబూద్వీపమున కేగి బుద్దగయలో ఆచార్యమహాశ్రీరత్నయను భిక్షువువద్ద ధర్మోపదేశమునంది, స్వదేశమునకు మరలి బౌద్దదర్మమును ప్రచారము చేసెను. అతీశుడు సుమాత్రాలో 12 సంవత్సరములుండి యాకాలపు బౌద్దపండితులలో నప్రతిముడగు దర్మక్రీర్తివద్ద తత్వమును నేర్చుకొనెను. 11 వ శతాబ్దమునాటి యొక నేపాళదేశ లిఖిత గ్రంథమున "స్వర్ణభూమిలోని శ్రీ విజయపురము నందు లోకనాథాచార్యుడు" అను శీర్షికతో నొక చిత్రముగలదు. బృహత్కథలో హిందూవర్తకులు స్వర్ణద్వీపముతో వాణిజ్యము సేయుచుండిరని యున్నది. యీ యాధారముల నుండి బూర్వము హిందూదేశమునకును సుమాత్రా ద్వీపమునకును సన్నిహితమగు సంబంధ ముండెడిదని తెలియుచున్నది.

శ్రీ విజయ రాజ్యము:

సుమాత్రా ద్వీపమున శ్రీ విజయమను పట్టణము రాజధానిగా నొక రాజ్యముండెడిది. దీనిని శైలేంద్ర వంశోద్భవులగు రాజులు పాలించు చుండిరి. క్రీస్తుశకారంభమునకే యీ ద్వీపము హిందూమతము నవలంచినది. చైనాదేశీయులు శ్రీవిజయ రాజ్యమును "పాలెంబాన్‌గ్" (Palembang) అని పిలచిరి. 5 వ శతాబ్దమునందీ రాజ్యముండినదని వారు వ్రాసియున్నారు. 7 వ శతాబ్దమున సుమాత్రాకును మలేద్వీపకల్పమునకును నడుమగల పంకాద్వీప మీ రాజ్యమున జేరియుండెను. మఱుసటి శతాబ్దమునం దీ రాజ్యము మలేదేశమున చాలవరకును వ్యాపించెను. ఈ కాలమున మధ్యజావాద్వీపము శైలేంద్ర రాజులచే జయింపబడినది. ఈ రాజులలో నొకడిచ్చట "కలన్సస్" అనుచోట తారాదేవి కొక యాలయమును గట్టించెను. ఇందత్యద్భుతములగు శిల్పములున్నవి. శ్రీవిజయరాజ్య నౌకాదళమును చంపారాజ్యము (Annam) నకును కాంభోజ రాజ్యము (Cambodia) నకును గూడ నేగి విజయములను గాంచినవి. ఈశైలేంద్ర రాజులు మహాయాన బౌద్దులు. నాలందా విద్యాలయాచార్యుడగు ధర్మపాలుడిచటనే దనయవసాన కాలమును గడపెను. ఈ రాజుల శాసనములు చాలభాగముత్తర హిందూదేశమున 8, 9 వ శతాబ్దములందుండిన లిపిలోనే వ్రాయబడియున్నవి. కానపాలవవంశీయుల కాలమున మగధ వంగదేశములలో బ్రబలిన మహాయాన బౌద్దమే యీ కాలమున సుమాత్రాద్వీపమునకు వ్యాపించెనని స్పష్టమగుచున్నది. ఇంతకు పూర్వమిట హిందూశైవమతము ప్రబలినది. ఈ రెండు మతముల సంమిశ్రణమువలనను తాంత్రిక సిద్దాంత మీద్వీపమున ప్రబలినది. 10, 11 శతాబ్దములలో దక్షిణహిందూదేశమునుండి చోళరాజులు సువర్ణద్వీపముపై ననేకసారులు దాడి వెడలిరని యిదివరలో దెలిపితిమి. ఇటులు చోళులకు సామంతులగుటచేతనే శైలేంద్ర రాజులిర్వురు నాగపట్టణమున - బౌద్దాలయమును నిర్మింపగల్గిరి. ఈసమయమున శ్రీ విజయరాజ్యమునకు లోబడియుండిన జావాద్వీపము స్వతంత్రించినది. 12 వ శతాబ్దమున శ్రీ విజయరాజ్యము మిగుల బ్రఖ్యాతివహించి, జావా రాజ్యముతో సరియగు పదవి నలంకరించినది. 13 వ శతాబ్దము సుమాత్రాద్వీప చరిత్రమున నిరుపమమైనది. ఈ కాలమున చైనా చక్రవర్తి పక్షమున సుంకాధికారిగ నుండిన యొక చైనా దేశీయుడు సువర్ణద్వీపమును గూర్చి యీ క్రింది విశేషాంశములను వ్రాసియున్నాడు.

"శ్రీ విజయ రాజులు నౌకావిహార మొనర్చునపుడు బంగారుబల్లెములను ధరించుభటులు వారితో నేగుదురు. ప్రజలు నీటిపైన తెప్పలమీద నివసింతురు. వారేమియు సుంకములు నీయరు. యుద్దసమయములలో సైనికులు నాయకులను తామే యెన్నుకొనెదరు. శత్రువులను నిర్జించుట యందును, మృత్యువును దృణప్రాయముగ నెంచుట యందును వారగ్రగణ్యులు. వీరు సంస్కృతభాషనే వ్రాతకోతల కుపయోగింతురు. ఇచ్చటి శాసనము లతికఠినములు. వ్యభిచారమును జేసినవారికి మృత్యుదండనము విధింపబడును. ఇచటి రాజుచనిపోయినచో ప్రజలు శిరోముండనము జేయించుకొని తమ విచారమును బ్రకటింతురు. రాజభృత్యులు శవముతో సహగమనము జేయుదురు. క్రొత్తరాజులు సింహాసము నెక్కుటకు బూర్వము బంగారముతో దమప్రతికృతిని చేయింతురు. ప్రజలీ విగ్రహమునకు గానుకల నర్పించెదరు. శైలేంద్రవంశీయులకు "నాగరాజ" యనునది బిరుదము. ఈ దేశీయులు విదేశములనుండి ముత్యములు, పన్నీరు, ఇంగువ, దంతము, పగడములు దూదిబట్టలు మున్నగువానిని దిగుమతిచేయుదురు. విదేశీయులిటనుండి బంగారము పట్టు, పంచదార, కర్పూరము మున్నగువానిని గొనిపోదురు."

ఈ కాలమున పహంగ్, కెడ, కిలంటన్ మొదలగు మలేప్రాంతములును, పశ్చిమ జావా, సింహళద్వీపములును మఱి పండ్రెండు రాజ్యములును శైలేంద్రవంశీయులు యాధిపత్యమునం దుండినవి. 13 వ శతాబ్ది యుత్తరార్థమున శ్రీవిజయ రాజ్యము క్షీణించినది. 1277 లో జావాలో ప్రసిద్ధికెక్కిన సింగ నరిరాజులు సుమాత్రాలో చాలభాగమును జయించిరి. వారికి బిమ్మట రాజ్యమేలిన బిల్వొతిక్తపుర రాజులీద్వీపమును క్రమముగ స్వాధీనము జేసికొనిరి. ఈ జావా రాజులు సుమాత్రాద్వీపమును సంరక్షింపక, నయ్యది తిరిగి తలయెత్తి తమ కపాయమును గూర్చుననుభయమున దానిని వదిలివేసిరి. అంతట చైనాదేశీయు లనేకు లిటజేరి, వాణిజ్యనౌకలను కొల్లగొట్టుచు జీవించుచుండిరి. క్రీ. శ. 9-13 శతాబ్దములలో మహాకీర్తిని గడించి, సుభిక్షమగు భూమిగల యీ ద్వీపము క్రీ. శ. 14 వ శతాబ్దమున కేవలము నోడదొంగల కాశ్రయస్థానమై నశించినది.

బౌద్ద శిల్పకళాచరిత్రమున క్రీ శ్రీ విజయరాజ్య చరిత్రమెంతయు ముఖ్యమైనది. జావాద్వీపములోని కలస్సన్, బొరొబుదుర్ శిల్పములు భారతీయ శిల్పముల కెనయగునవి పండితుల యభిప్రాయము. ఈ శిల్పములను శైలేంద్రవంశీయులే నిర్మింపజేసిరి. స్థూపములను బోలు కట్టడములను భారతదేశమునుండి యీ రాజులే సూమాత్రాదీవిలోనికి దెచ్చి యటనుండి జావా, బోర్నియోలకు వ్యాపింపజేసిరి. అలంకార శిల్పమునందును, కట్టడముయొక్క బాహుళ్యతకు సరియగునటుల వివరములను నిర్మించుట యందును, బౌద్దవాఙ్మయమునకును, ఇతిహాసమునకును సరియగు ప్రతికృతులను శిల్పములను నిర్మించుటయందును, సూమాత్రాద్వీపవాసు లగ్రగణ్యులని కళాభిజ్ఞులు పొగడియున్నారు. ఇటుల ప్రాచీన భారతదేశముతో సన్నిహిత సంబంధమును గలిగియుండి, యిచ్చటి నాగరికతను విదేశములలో వ్యాపింపజేసి, బూర్వహిందూదేశముయొక్క విశ్వవిఖ్యాత ప్రవృత్తికి ప్రబలనిదర్శనమైయున్న యీ శ్రీ విజయపురాదీశ్వరులగు శైలేంద్రరాజుల చరిత్రము చిరస్మరణీయమై యొప్పుచున్నది.