Jump to content

భారతీయ నాగరికతా విస్తరణము/యవద్వీపము

వికీసోర్స్ నుండి

భారతీయ నాగరికతా విస్తరణము.

11. యవద్వీపము (జావా)

యవద్వీప ప్రశంస.

హిందూవాఙ్మయమునం దనేకస్థలములలో యవద్వీపప్రశంస గలదు. సీతాన్వేషణార్థమై దన యనుచరుల ననేక దిశలకు బంపుచు సుగ్రీవుడు వారలు మార్గమునం దతిక్రమింపవలసిన దేశములను బేర్కొని యున్నాడు. అందుబ్రాగ్దిశకేగువారలు గంగానదీముఖద్వారమును దాటి, సువర్ణద్వీపము నతిక్రమించి, యనేకములగు బంగారపు గనులు గలిగి యేడు రాజ్యములుగ విభజింపబడిన యవద్వీపము నన్వేషింపవలసి యుండెను.

క్రీ. శ. 2 వ శతాబ్దమునం దనేకదేశములను దిరిగి యొక భూగోళశాస్త్రమును రచించిన "టాలెమీ" (Ptolemy) యను యవనదేశీయుడు "జబడియా అనగా యవలుపండు ద్వీపమని యర్థము. ఇచ్చటిభూమి కడు సారవంతమైనది. ఇందనేక బంగారుగనులు గలవు" అని వ్రాసియున్నాడు. బౌద్దగ్రంథములగు మిలిందపన్హశ్లోక సంగ్రహ మున్నగు వానిలో నావికులకు బ్రాగ్భాగమున గాంచనగు నౌకాశ్రయస్థానములు వర్ణింపబడియున్నవి. వానిలో తక్కోల, కలముఖ, మరణపర, వెనుంగ, వెరపధ, జవ, తామ్రలిప్తి, వంగ, సువర్ణకూట, సువర్ణభూమి మున్నగునవి ముఖ్యములు. క్రీ. శ 5 వ శతాబ్దమున జీవించిన ఆర్యభటుడను జ్యౌతిశ్శాస్త్రజ్ఞుడు "సింహళమున సూర్యోదయమగునపుడు యవకోటిలో మధ్యాహ్నమును, రోమకదేశమునం దర్ధరాత్రమునై యుండు" నని వ్రాసియున్నాడు. అదేకాలమున రచింపబడిన 'సూర్యసిద్దాంత' మను జ్యోతిషగ్రంథమునందు "భూమియొక్క చుట్టుకొలతలో నాల్గవభాగమున, తూర్పుదిశకు స్వర్ణకుడ్యబ్వాశోభితమగు 'యవకోటి' యనునగరము గల" దని వ్రాయబడి యున్నది. క్రీ. శ. 8 వ శతాబ్దమున రచింపబడిన "మంజు శ్రీమూలకల్ప"మను బౌద్దగ్రంథమున జావా, బీలిద్వీపములలోని భాషయస్పష్టమైన దనియు, 'ర' యనుశబ్దమందు తరచుగ వచ్చుచుండుననియు జెప్పబడియున్నది. 'నవకనాడు^' అనునామాంతరముగల యవద్వీపమునందలి నాగపురమునందు ఇంద్రుని సంతతివారగు భూమచంద్ర, పుణ్యరాకయనువార లిర్వురు రాజ్యమేలిరని "మణిమేఖల" యను ద్రవిడకావ్యమున జెప్పబడియున్నది. క్రీ. శ. 11 వ శతాబ్దమునాటి యొక నేపాళదేశ లిఖిత గ్రంథమునందు "యవద్వీపమున దీపంకర అతిశుండు" అనుపేరిట నొక చిత్రము వ్రాయబడియున్నది. 'రసమాల' యను గుజరాతీ గ్రంథమున "జావాకుపోయినవాడు తిరిగిరాడు. అదృష్టవశమున దిరిగివచ్చినచో రెండు పురుషాంతములకు సరిపడువెండి మూటలతో వచ్చును" అను నొకసామెత గలదు. ఈ ప్రశంసలనుండి క్రీస్తుశకారంభమునుండియు హిందూదేశమునకును యవద్వీపమునకును సన్నిహితమగు సంబంథముండెడిదని స్పష్టమగుచున్నది.

మొదటి రాజులు

జావాద్వీపపు సమగ్ర చరిత్రమును రచించుటకు వలయుసాధనము లింకను లభింపవలసి యున్నవి. చైనా దేశీయుల వ్రాతలనుండియు జావా, బోర్నియో, సుమాత్రాదీవులందు దొరకిన శాసనముల నుండియు క్రీ. శ. 2 నుండి 10 వ శతాబ్దమువరకును గల యవద్వీపచరిత్రమునందలి విశేషాంశములు గొన్ని తెలియనగుచున్నవి. ఈ కాలమునందీ ద్వీపమునకు దక్షిణ హిందూదేశముతో నెక్కుడు సంబంధముండెడిది. బోర్నియో ద్వీపమున మిక్కిలి ప్రాచీనములగు శాసనములు లభించినవి. వీనిలిపి దక్షిణ హిందూదేశము నందలి ప్రాచీన పల్లవశాసనములను బోలియుండుటచే చరిత్రకారు లియ్యవి క్రీ. శ. 4 వ శతాబ్దమునాటివని నిర్ణయించిరి. ఈ సంస్కృతభాషాశాసనములనుండి యీ ప్రాంతమునం దశ్వవర్మ తనయుడగు మూలవర్మ రాజ్యమేలెననియు, నాతడు బ్రాహ్మణులచే శిలాయూసములను నిర్మింపజేసి 'బహుసువర్ణక' మను యజ్ఞమును జేసెననియు దెలియుచున్నది. ఈ రాజనామములు పల్లవ రాజులగు స్కందవర్మ, మహేంద్రవర్మ మున్నగువారి నామములవలె నున్నవి. యజ్ఞములను బ్రాహ్మణ సన్మానమును జేయుటయుగూడ పల్లవుల యాచారములే.

పశ్చిమ జావా :- క్రీ. శ. 5 వ శతాబ్దమునకు బశ్చిమ జావారాజ్యము ప్రసిద్దికెక్కినది. పల్లవగ్రంథలిపితో లిఖింపబడిన యీ కాలపు శాసనములు కొన్ని పూర్ణవర్మయను రాజునుగూర్చి విశేషాంశములను దెలుపుచున్నవి. ఈతండు తరుమర నగరాధీశ్వరుడు. చంద్రభాగా, గోమతియను పేరిట రెండు కాల్వల నితడు త్రవ్వించెను. ఈతని రాజ్యకాలమున 'ఫాహియన్‌' పశ్చిమ జావాకు వచ్చెను. అప్పటి కచట బౌద్దమతము ప్రబలియుండక దేశమునం దనేకులగు బ్రాహ్మణు లుండిరట. ఈ దేశమునకును చైనాకును వర్తక వ్యాపారము జరుగుచుండెడిది. క్రీ. శ. 413 లో 200 మంది హిందూవర్తకులతో నిండియుండిన యోడపై ఫాహియన్ చైనాకు బయల్వెడలెను. క్రీ. శ. 423 లో కాశ్మీర రాజపుత్రుడగు గుణవర్మ యీ రాజ్యమున గొంత కాలము బౌద్దమత ప్రచారమొనర్చి, యటనుండి 'నంది' యను నొక హిందువు యోడలో చైనాకు పోయెను. క్రీ. శ. 6 వ శతాబ్దమున పశ్చిమ జావారాజ్యము క్షీణించినటుల చైనా దేశీయుల వ్రాతలనుండి తెలియుచున్నది. ఈ కాలపు రాజులలో నొక యాత డసమర్దుడగుటచే ప్రజలు శూరుడగు నొక రాజబంధువు నాశ్రయింపసాగిరి. అంతట రాజీతనని దేశమునుండి వెడలగొట్టెను. ఈ శూరుడు హిందూదేశమునకేగి యచటి రాజపుత్రి నొకయామెను పెండ్లాడి, జావారాజు మరణించిన పిమ్మట తానాదేశమునకు రాజుగా నేతెంచెను. ఇటుపై నీ పశ్చిమ జావా చరిత్రము దెలియుటలేదు.

మద్యజావా :- క్రీ. శ. 7 వ శతాబ్దమున మధ్యజావాలో నొక రాజ్యము నిర్మింపబడి త్వరలో బ్రసిద్దికెక్కెను. 674 నాటి కిచ్చట 'సోమా' యనురాజ్ఞి యేలికగనుండెను. ఆమె పరిపాలనమున బ్రజలు మిక్కిలి నీతిపరులుగను దర్మ బుద్దిగలవారుగ నుండిరనియు, నొకచోట నొకవర్తకునిచే బరీక్షార్ద ముంచబడిన బంగారపు పేటిక తిరిగి యావణిజుడు గైకొనువరకును మూడు సంవత్సరముల కాలమటులే యుండెననియు అరబ్ దేశీయులు వ్రాసియున్నారు. క్రీ. శ. 654 నాటి శాసనమొగటి యీ మధ్య జావాలో దొరికినది. ఇది సంస్కృతభాషలో పల్లవ గ్రంథలిపిలో వ్రాయబడినది. 'కుంజరకుంజ' యను పుణ్యక్షేత్రమునం దొక శివాలయము పునరుద్దరింపబడెనని యీ శాసనము దెలుపుచున్నది. ఈ రాజ్యమును బూర్వము నన్నహూడనునతడు మనువువలె నేలుచుండెనట. అతనివెనుక నాతని పుత్రుడగు సంజయుడు రాజ్యమునకు వచ్చెను. మహాపరాక్రమశాలియగు నతడు జావాద్వీపమునంతటిని జయించి, సుమాత్రా, బాలిద్వీపపాలకులవలనను, మలేద్వీపకల్పపు రాజుల వద్దనుండియు కప్పములను గొనెను.

ఇటుపై క్రీ. శ. 760 నాటి మఱియొక శాసనము గజయనుడను రాజుగూర్చి విశేషములను దెల్పుచున్నది. ఒకప్పుడు వర్షాభావము గల్గుటచే నీ రాజు తన పూర్వులు దేవదారు కఱ్ఱతో నిర్మించిన అగస్త్యమహర్షి విగ్రహమును జూచి నీలశిలతో దానికొక ప్రతికృతిని జేయించెను. పిమ్మట నీ విగ్రహము 'మహర్షిభవన' మను నాలయములో నొకనాడు కుంభలగ్నమున బ్రతిష్ఠింప బడెను. గజయన రాజు బ్రాహ్మణ భక్తుడుగూడ నైయుండెను.

క్రీ. శ. 8 వ శతాబ్దినాటి కీశైవరాజులు మధ్యజావాలో క్షీణించిరి. ఈ భాగమంతయు సుమాత్రాద్వీపమునుండి రాజ్యమేలుచుండిన శైలేంద్ర వంశీయుల యాధిపత్యమునకు లోనయ్యెను. ఈ కాలముననే జావాద్వీపమున శిల్పకళ యపూర్వశోభను గాంచినది. క్రీ. శ. 778 లో శైలేంద్ర వంశపు రాజొకడు మధ్యజావాలోని కలస్సనులో నత్యద్భుతమగు నొక దేవాలయమును నిర్మించి 'తారా' యను బౌద్దదేవతనందు బ్రతిష్ఠించెను. ఈ రాజు లందరును మహాయానబౌద్దులు. ఇంతటినుండియు మహాయాన శైవమత సమ్మేళన మూలమున శిల్పకళకు నూతనోత్తేజము గల్గినది. జావాశిల్పములలో నగ్రగణ్యమును, విశ్వవిఖ్యాతమునగు బొరొబుదుర్ దేవాలయ మీ కాలము నాటిదే. ఈ శిల్పములు భారతదేశమునందలి గుప్తవంశీయుల శిల్పముల కెనయగుచున్నవి. క్రీ. శ. 10 వ శతాబ్దమున జావాద్వీపమునందలి విదేశీయ పరిపాలన మంత మందెను. ఇంతవరకు నాద్వీపమునందలి తూర్పు భాగమున దలదాచుకొనిన హిందూరాజులు, శైలేంద్రరాజ ప్రతి నిధుల నోడించి మధ్యజావాను స్వాధీనము చేసికొనిరి. ఇటుపై నీదేశమునం దనేకములగు హిందూదేవాలయములు బయల్వెడలినవి. వీనిలో 'ప్రాంబసన్‌' ఆలయ మగ్రగణ్యము. ఇందు రామాయణమంతయు శిల్పమున జిత్రింపబడినది. పదియవ శతాబ్దాంతమునకు మధ్యజావా రాజ్యము నశించినది. తుదకొక యగ్నిపర్వత మీ దేశమును నాశమొనర్చుటచే బ్రజలు దీనిని విడనాడిరి.

తూర్పు జావా :- పిమ్మట యవద్వీపమునందలి దూర్పు భాగమునందొక రాజ్యము బయల్వెడలినది. దీనిని సిందక్ అనునతడు నిర్మిం చెను. ఈతని మనుమరాలు బాలిద్వీప రాజప్రతినిధియగు ఉదయనుని బెండ్లాడెను. వీరికి ఎర్లస్‌గుడుదయించెను. బాల్యమునందితడు శత్రువులచే బాధింపబడి, కొంతకాల మరణ్యవాసమొనర్చెను. క్రీ. శ. 1035 నాటి కీతడు శత్రువులనెల్ల నిర్జించి జావాద్వీపమున కంతటికిని యేలిక యయ్యెను. ఈతని రాజ్యకాలము కడుప్రసిద్ధమైనది. ఎర్లస్‌గుని ప్రోత్సాహముచే అర్జున వివాహము, విరాటపర్వము మున్నగు గ్రంథములు పూర్వజావా భాషయగు కావీభాషలో లొఖింపబడినవి. అంతియగాక మహాభారతమును రామాయణమును గూడ దేశభాషలోనికి బరివర్తింపబడినవి. క్రీ. శ. 1042 లో నీరాజు తన రాజ్యమునంతటిని కెదిరి జంగల యను పేరిట రెండు భాగములుగ జేసి తన యిర్వురు తనయులకునొసంగి తాను విరాగియై వనములకేగెను.

కెదిరి రాజ్యము :- ఇంతటినుండియు కెదిరి రాజ్యచరిత్ర మారంభమగును. కానీవాఙ్మయాభివృద్ధి కీరాజ్యము మూలస్తంభము. క్రీ. శ. 1104 లో వర్షజయు డిచ్చట రాజుగనుండెను. ఈతని యాశ్రితుడగు త్రిగుణుడనుకవి సుమసనసంతక, కృష్ణజనన యను రెండు కావ్యములను కావీభాషలో రచించెను. క్రీ. శ. 1120 లో కామేశ్వరుడు కెదిరికి రాజయ్యెను. ఇతని భార్య జంగలరాజ పుత్రి. ఈ రాజు కొలువు దీర్చునపుడు స్వర్ణసింహాసనమున గూర్చొను చుండెనట. ధర్మజుడను నతడాస్థాన కవిగనుండి యీ కాలమున స్మరదహసమను కావ్యమును రచించెను.

1135-55 ల నడుమ జయభయుడు కెదిరి రాజ్యమును పాలించెను. ఈతని పోషణముననుండి పెనూలూ యను కవి భారత యుద్దమును, హరివంశమును రచించెను. జయభయుడు జావాద్వీప వాసులచే నవతార పురుషుడుగ బరిగణింప బడుచున్నాడు. మహాభారత యోధులలో నీతడుగూడ బేర్కొనబడియున్నాడు, భావికాలమున నాతడు తిరిగి జావా ద్వీపమున కేతెంచి దర్మము నుద్దరించునని యచటివారి నమ్మకము. జయభయరాజు వైష్ణవుడు. ఈకెదిరిపాలకులు విదేశములందు సహితము తమ ప్రతిభను నెలకొల్పిరి. అరభ్ దేశీయుల వ్రాతలనుండి జావావాసులా కాలమున ఆఫ్రికాఖండమున మెడగాస్కర్ ద్వీపమున కెదురుగనున్న పోఫల దేశముతో వర్తకము నెఱపుచుండిరని తెలియుచున్నది. జావారాజుల కొలువులో నెందరో నీగ్రోలు బానిసలుగ నుండిరి. Ferrand అను పండీతుడు క్రీ. శ. 1 వ శతాబ్దముననే జావా సుమాత్రాదీవులనుండి హిందువులు మెడగాస్కర్ దీవికి వలసపోయి యటస్థిరపడిరనియు, నటుపై 10 వ శతాబ్దమున మలేరాజ్యమునుండి మఱిగొందఱు హిందువులట కేగిరనియు వ్రాసియున్నాడు. 13 వ శతాబ్దప్రారంభమున నీ కెదిరి రాజ్యము నశించినది. ఈ కాలమున కెన్‌అరోక్ అను నొక మహాబలశాలి బయల్వెడలెను. స్వార్థపరుడై యాతడు తన మేథాబలములను దుర్మార్గముల నుపయోగించి తానొక విశిష్టమానవుడనని తలంచుచు, శౌర్యము, హత్య మున్నగువాని మూలమున స్వార్దము నభివృద్ధి పఱచుకొనుచుండెను. అంతట నాతని కొక బ్రాహ్మణుడు సహకారి యయ్యెను. కెదిరి రాజులకు సామంతులుగ సింగనరి రాజ్యము నేలుచుండిన రాజువద్ద నీక్రూరు డుద్యోగమును సంపాదించెను. అనతికాలముననే యీతడు మహా సౌందర్యవతియును, దనయేలిక భార్యయునగు డీడిస్ (Dedes) అనునామెను మోహించి, రాజును జంపి, యామెను పెండ్లాడి సింగనరి రాజ్యమును వశపఱచుకొనెను. పిమ్మట నీతడు కెదిరి, జంగల రాజ్యములను జయించెను. యింతటితో కెదిరి రాజ్యచరిత్రము ముగిసినది.

సింగసరి రాజ్యము

క్రీ. శ. 1220 లో పైవిధమున అరోక్ వలన సింగసరి రాజ్యము ప్రాముఖ్యతనందెను. ఈతని కాలమున జావాశిల్పములలోనెల్ల ప్రఖ్యాతి వహించిన ప్రజ్ఞాపరిమితా విగ్రహము నిర్మింపబడినది. రాణియగు డీడిస్ సౌందర్యమున కిది ప్రతి కృతియట. అరోక్ క్రీ. శ. 1227 లో హత్య చేయబడెను. అతనికి నాల్గవతరమువాడగు కృతసగరుని రాజ్యకాలము (1268-92) మిగుల ముఖ్యమైనది. ప్రజలీ తనిని శివబుద్దుల యపరావతారమని కొనియాడిరి. కాని వాస్తవముగ నాతని రాజనీతి ప్రమాదకరముగ నుండెను. స్వరాజ్యమున తన యధికారమును బలపఱచుకొనకుండగనే యీతడు, బాలి, వకుళపురాది రాజ్యములకు యుద్దయాత్రలను సాగించి, కడువ్యయప్రయాసలకు లోనయ్యెను. మహాగర్వముచే నాతడు చైనా చక్రవర్తిపంపిన రాయబారి నవమానించెను. ఈ యదనున కెదిరి రాజుల సంతతివాడును సామంతుడునగు జయకటంగ్ అను నతడు విద్రోహమొనర్చి, కృతసగరుని యల్లుడగు విజయుని నిర్జించి, రాజధానియగు సింగసరిని బ్రవేశించి, రాజునుజంపి, సింహాసనము నధిష్ఠించెను. విజయుడు జావాకుత్తరమునగల మధురాద్వీపమునకు పాఱిపోయి, కొంతకాలమునకు బిమ్మట సింగసరికి వచ్చి జయకటంగ్‌వద్ద కొలువుండెను. అప్పటినుండియు విజయుడు పగదీర్చుకొన నవకాశమునకై వేచియుండెను. క్రీ. శ. 1293 లో కృతసగరుని గర్వము నణంచుటకై చైనా చక్రవర్తి జావాద్వీపముపై గొంత బలమును బంపెను. విజయు డీవిదేశీయులయెడ గపటస్నేహమును జూపి, వారలను జయకటంగ్‌పై కనిపెను. యుద్దమున కటంగ్ మరణించెను. పిమ్మట విజయుడు చైనాసేనల నెదుర్కొని చెల్లాచెదరు గావించెను. ఇంతటితో సింగసరి రాజ్యమంత మందెను.

బిల్వతిక్త రాజ్యము

ఇటుల శత్రువులెల్లరును నిర్జించి విజయుడు క్రీ. శ. 1294 లో 'కృతరజన జయవర్ధన' యను బిరుదముతో దానిధివరలో నిర్మించిన బిల్వతిక్తి (మజపహిత్) నగరమున సింహాసనము నధిష్ఠించెను. ఇంతటినుండియు నీ నూతన రాజ్యచరిత్ర మారంభమగును. కృతరజసునిపుత్రు డవినీతిపరుడు. అతనికి బిమ్మట నాతని చెల్లెలగు త్రిభువనోత్తుంగ దేవీ జయవిష్ణువర్దని యనునామె రాజ్యమునకు వచ్చెను. ఈమె చెలియలగు రాజదేవియు మాతయగు గాయత్రీ దేవియుగూడ రాజ్యసన్మానము నందుచుండిరి. విష్ణువర్దని దేవిభర్త రాజ్యమునకంతటికిని ప్రథాన న్యాయాధిపతిగా నుండెను. రాణికి బిమ్మట గజమదుడను బ్రధానమంత్రి ముఖ్యుడుగ నుండెను. ఒక నాడీమంత్రిపుంగవుడు పశ్చిమ జావా, బాలి, బకుళపురము, సుమాత్రా, సింగపుర రాజ్యములను జయించినగాని తనయాస్తిలో నొక చిల్లిగవ్వనైనను ముట్టనని శపథమొనర్చెను. రాణియాజ్ఞను బడసి యాతడు క్రీ. శ. 1343 నాటికి బాలిద్వీపపాలకుని జయించి, యాతని పాలనమునందుండిన జావాకు తూర్పునగల ద్వీపములను, మధుర యను దీవిని, సెలిబిస్ ద్వీపమున గొంతభాగమును వశపరచుకొనెను. వాఙ్మయమును శిల్పమునుగూడ నారాజ్ఞి పెంపొందించెను. శాంతి సౌఖ్యము లెల్లడలను బ్రబలినవి. ఈమె సర్వవిధములను భారతదేశ రాజ్ఞీమణులగు కాకతీయరుద్రాంబ, రెజీయబేగం మున్నగు వారిని జ్ఞప్తికి దెచ్చుచున్నది. క్రీ. శ. 1350 లో నీమెతనయుడగు హ్యంవురుక్ (Hyam Wuruk) ప్రాయమునందుటతోడనే రాజభారము నాతనిపైనుంచి తన యైహిక ప్రవృత్తిని జాలించెను. అంతట నీరాజపుత్రుడు శ్రీరాబననగరయను బిరుదముతో మజదహిత్ లేక బిల్వతిక్త రాజ్యమును బరిపాలింప మొదలిడెను. వగరకృతాగమ, పరరటన్ అను కావీగ్రంథములనుండి యీతని రాజ్యకాలచరిత్రము దెలియనగుచున్నది. ఈతడు బలపరాక్రమ ములచే తల్లిని మరపించి, బిల్వతిక్త రాజ్యము నొక మహాసామ్రాజ్యము నొనరించెను. గజమదు డీకాలమునగూడ మంత్రిగనుండెదు. అకాలమున జావా, న్యూగినీదీవులును, వాని మధ్యనుండు ద్వీపములు, బోర్నియో, సెలిబెస్, బుటన్, బురు, పెరం, బంద, మొలక్క, టలట్, ద్వీపములును కెడ, కెలంగ్, సింగపూర్, పహాన్‌గ్, కెనన్‌టన్ మున్నగు మలేభాగములును, సుమాత్రాద్వీపములోని శ్రీవిజయ రాజ్యము - ఇవియన్నియు బిల్వతిక్తపుర సామ్రాజ్యమున జేరియుండినవి. వీనిని జయించుటలో నలుడను నౌకాబలాధికారి గజమదమంత్రి కెక్కుడుగ తోడ్పడెను. ఇంతియగాక నయాంలోని అయోధ్య రాజపురి రాజ్యములును, మరుత్మ, కాంభోజ, చంప, యవన, (ఉత్తర అనాంలోనిది) మున్నగు రాష్ట్రములును, బిల్వతిక్త సామ్రాజ్యముతో మైత్రిని బాటించినవి. సామంతద్వీపములన్నియు నేటేటను గప్పములను జెల్లించుచుండెడివి. వాని యోగక్షేమములనరయుటకై పురుక్ చక్రవర్తి మంత్రులు, భుజంగులు నను నుద్యోగులను నియమించుచుండెను. ఈ భుజంగులలో శైవభుజంగులు, బౌద్దభుజంగులు నని రెండు తెగలుండెడివి. వీరు రాజకీయ ధర్మములను నిర్వర్తించుటయేగాక తమతమ మతములనుగూడ బ్రవర్తింపుచుండిరి. రాజాజ్ఞల నుల్లంఘించువారిని జలధిమంత్రులు (Admirals) శిక్షించుచుండిరి. రాజబంధువులు వివిధభాగములను బ్రతినిధులుగ నేలుచుండిరి. చక్రవర్తి పట్టమహిషికి శ్రీపరమేశ్వరి యను బిరుదముండెడిది. రాజధానీనగర ముద్యానములతోడను, కేసరీచంపకాది వృక్షములతోడను, చక్కని బజారులు, హర్మ్యములు భవనములు మున్నగు వానితోడను విరాజిల్లు చుండెడిది. అందలి ప్రాగ్భాగమున బ్రాహ్మణులును, దక్షిణమున బౌద్దులును, పశ్చిమమున క్షత్రియులు రాజోద్యోగులు మొదలగువారును నివసించుచుండిరి. ఈ రాజ్యమునందలి ధనికులుమాత్రమే బౌద్దమతము నవలంభించిరి. ప్రజాసామాన్యమున హిందూమతమే ప్రబలినది. క్రీ. శ. 1389 లో పురుక్ చక్రవర్తి మరణించినపిమ్మట బిల్వతిక్తపుర సామ్రాజ్యము క్షీణించెను. అనతికాలమునకేయాతని పుత్రుడును, అల్లుడును సింహాసనమునకై తగవులాడిరి. ఈ యదనున బోర్నియో, సుమత్రా, మలక్కాన్ మున్నగుదీవులు స్వతంత్రించినవి. దీనికితోడుగ నొక పెద్ద కఱవు జావాద్వీపమునంతటిని దుడిచివేసినది. పురుక్ మనుమరాలగు మహితాదేవికాలమున కెదిరిరాజ్యము దహయనువాని నాయకత్వమున తిరుగబడి స్వతంత్రించెను. ఆమెకు పిమ్మట నామెతమ్ముడు కృతవిజయుడు రాజ్యమునకు వచ్చెను. ఈతడు చంపారాజపుత్రికను వివాహము చేసికొనెను. ఆమె మహమ్మదీయమతమునెడ నాదరముజూపెను. ఇంతటినుండియు నామతము జావాద్వీపమున బ్రబలి తుదకచ్చటి హిందూరాజ్యనాశమునకు ముఖ్యకారణముమైనది. బిల్వతిక్త రాజులలో కడపటి వాడను నైదవవిజయునికాలమున మహమ్మదీయులు స్వామిద్రోహులై తమకుపకారమొనర్చినరాజును తుదముట్టించిరి. అవసానకాలమునం దీరాజుదేశాంతరములనుండి మఱియొకజాతివా రేతెంచితురుష్కులపై పగదీర్చుకొందురని శపించెను. డచ్చివారు దాని కనుగుణ్యముగ నీదీవులలో మహమ్మదీయులను హతమార్చిరి. ఇంతటితో హిందూజావాచరిత్రమును, బిల్వతిక్తపుర సామ్రాజ్యచరిత్రమును ముగిసినవి.