భారతీయ నాగరికతా విస్తరణము/యవద్వీపకళ

వికీసోర్స్ నుండి

భారతీయ నాగరికతా విస్తరణము.

12. యవద్వీపకళ.

భారతదేశమునుండి ప్రాచీనభారతీయులు భారతీయనాగరికతాధినివేశములను దేశాంతరములకు గొనిపోయి వానినట బాదుకొల్పిరి. ఈనూతన భావములును సంస్థలును స్థానికములగువానితోగలసి యీదేశాంతరములలో విలక్షణమగు నాగరికతవర్థిల్లినది. భారతభూమిలో గనియెరుంగని పరిణామమును భారతీయాదర్శము లీ దూరదేశములలో గాంచినవి. ఇందులకు శిల్పకళ ప్రబలమగు నుదాహరణము. అందునను యవద్వీపమునం దీకళ నిరుపమమగు రీతి నభివృద్దినందినది. కాననీయవద్వీపకళను బరీక్షించినచో ప్రాచీనకాలమునం దొకసువిశాలమగు నైతికసామ్రాజ్యమునకు నాయికయై భారతదేశ మెట్టియున్న తాదర్శములను ప్రపంచమున కొసంగెనో దెలియు చున్నది. ఇటుపై యవద్వీపమునందలి కట్టడములును వాని ప్రాశస్త్యమును సంగ్రహముగ వర్ణింపబడుచున్నవి.

యవద్వీపమున చారిత్రశిథిలము లెన్నియో గలవు. వీనినన్నిటిని నేటి ప్రభుత్వములు జాగరూకతతో సంరక్షించుచున్నవి. ఈ శిథిలములకు హిందూదేశమునందలి తాత్కాలిక నిర్మాణములకును సన్నిహితమగు సంబంధము గలదు. యవద్వీప శిథిలములలో నారిటినిమాత్రము బరిశీలించినచో తత్కళాధిక్యత యవగతము కాగలదు.

బొరొబుదుర్ దేవాలయము

ఈ యాలయము యవద్వీపశిల్పములలో నెల్ల నగ్రగణ్యము. వర్ణనాతీతమగు నీ కట్టడము చూపరులను విస్మయావిష్టుల నొనర్పుచున్నది. అలంకారములతోడను విగ్రహములతోడను నిండి యెన్నియో యంతరువులు గల యీ నిర్మాణము వివిధదేశములందలి కళాభిమానుల నాకర్షించు చున్నది.

ఇచ్చటి శిల్పియొక్క నైపుణ్యము స్థలనిర్దేశముననే గనవచ్చుచున్నది. జావాలో "కెడు" అను నొక మైదానము గలదు. ఇయ్యది సశ్యశ్యామలమై మనోహరముగ నుండును. ఇందసంఖ్యాకములగు చిన్న చిన్నకట్టడములు గలవు. యీ మైదానమునకు చుట్టును పర్వతములున్నవి. మధ్య నొక కొండగలదు. దానిపైనుండి నలుదిశలను బరికించినచో నొకవంక పచ్చని పైరులును, మఱియొకవంక సాయంసమయమున నీలమేఘములలో విలీనమగు కొండలును, మఱియొకచో ధూమమును విరజిమ్ము నగ్నిపర్వతములును గనుపింపగలవు.

ఇట్టియాలయము దేశాంతరములలోనేగాక భారత దేశమునందు గూడ లేదు. ఇందొక నూతన నిర్మాణపద్దతి యవలంబింపబడినది. మొదట నొకకొండను యెత్తుపల్లములులేక సమముగా చెక్కిరి. దీనిపై చదునైన రాతిపలకల నతికి యటుపై కట్టడములను నిర్మించిరి. యీ కొండపైన మధ్యగా నొకస్థూప మున్నది. దీనిచుట్టు నొకదానిలోనొకటిగ మూడువలయములున్నవి. వీనిలో డెబ్బది రెండు చిన్న స్థూపములు గలవు. యీత్రికోణాకృతిగల కొండకు మూడు వైపులను మూడు ద్వారములున్నవి. వీనిద్వారా నొకదానిపై నొకటిగానున్న స్థూపవలయములకు బోవుటకు మెట్లవరుసలున్నవి. బొరొబుదుర్ ఆలయమునం దేడంతస్థులు గలవు. భూమట్టమునుండి పైయంతస్థువరకును, చుట్టునుగూడ నిరుపమములగు శిల్పము లున్నవి. యీ విధమున మూడుమైళ్ళ చుట్టుకొలతగల యీ యాలయమున బౌద్దులచరిత్రము, గాథలు, తత్త్వమును చిత్రింపబడినవి. పైపేర్కొనినటుల నీస్థూపవలయములలో నొక్కొకటి యొక్కొక ప్రదక్షిణ మార్గము. యీ మార్గముల బ్రదక్షిణమొనర్చు భక్తులు గోడలపైనను స్థూపములపైనను లలితవిస్తారము, దివ్యావదానము, జాతకమాల, చండ వ్యూహము మున్నగు బౌద్ద గ్రంథముల ననుసరించి చిత్రింపబడిన బుద్ధుని జీవితమునుగాంచి తన్మయులగు చుండిరి. ఇటులే బోధిసత్వుల చరిత్రము కూడ చిత్రింపబడినది, యీ విధముగ నిచ్చటి గోడలలో నేర్పరుపబడిన శిల్పఫలకములసంఖ్య 1300. ఇవిగాక నీ యాలయపు క్రింది భాగమున మఱి 160 ఫలకములు గలవు.

యీ బొరొబుధుర్ ఆలయమున నిలచిచూచినచో మినొరెయను పర్వతముయొక్క శిఖరము గన్పించును. ఇది యొక మనుష్యుని ముఖమువలె నున్నది. యవద్వీపవాసు లీశిఖరము బొరొబుదుర్ ఆలయమును నిర్మించిన గుణధర్ముని ముఖమని చెప్పుదురు.

యీ యాలయరాజ మెపుడు నిర్మింపబడెనను విషయమున దెల్పు శాసనము లింతవరకును దొరకియుండలేదు. శాసనాధారముపై కాలనిర్ణయ మొనర్పనగు నితర కట్టడములను బొరొబుదుర్ ఆలయమును సరిపోల్చి చూచి కళాపద్ధతి నాధారముగ గొని క్రోఘ్ అను పండితు డీయాలయము క్రీ. శ. 8 వ శతాబ్ది యుత్తరార్థమున నిర్మింప బడియుండునని వ్రాసి యున్నాడు.

బొరొబుదుర్ ఆలయముయొక్క స్వభావమేమి? ఏ మహాత్ముని యస్థికలపై నైనను దీనిని నిర్మించిరా? లేక నేదోనొక మహాకార్యమును సూచించుటకై దీనిని గల్పించిరా? ఇది స్థూపమా, చైత్యమా, విహారమా? యను సమస్యలకు సరియగు సమాధానముల నొసంగవలనుపడదు. పైకట్టడముల లక్షణము లన్నియు నిందుగలవు. యీ యాలయ మనిర్వాచ్యమును, వర్ణానాతీతమునగు నొక శిల్పవినోదము. ఇందు శిల్ప కేవలమును మతావేశ పూరితుడై తన యావేశమునంతటిని వ్యంగ్యమును,విస్మయకరమునగు శిల్నముగ బరిణమింపజేసెను. ఇందు గృత్రిమత్వ మిసుమంతము లేదు. అయినను కళానైపుణ్యమున కేమియు కొదవలేదు. నిశ్చలమును, గంభీరమునగు నిచటికళ ప్రేక్షకులకు నూతనమగు భావప్రబోధమును గల్గించుచున్నది. సుప్రసిద్ధ కళాభిజ్ఞుడగు హావెల్ (Havell) పండితుడు గ్రీసుదేశ శిల్పశిఖామణియగు 'పార్దినస్‌' శిల్పమున కీయాలయ మిసుమంతయు దీసిపోదని వ్రాసియున్నాడు.

తారా దేవాలయము

దీనికి 'చండికలస్సస్‌' అనిపేరు. ఈ యాలయము గూడ క్రీ. శ. 8 వ శతాబ్దముననే మహాయాన బౌద్దమత మీద్వీపమునం దుచ్చ దశలోనుండినపుడు నిర్మింపబడినది. ఇచ్చటి యొక శాసనమునుండి క్రీ. శ. 778 లో సుమాత్రా దీవినుండి విశాలరాజ్యము నేలిల శైలేంద్ర వంశీయుడగు నొకరాజు తారా యను బౌద్దదేవీవిగ్రహము నిచటయాలయమున బ్రతిష్ఠించెనని తెలియుచున్నది. ఈయాలయశిల్పము బొరొబుదుర్ శిల్పము ననుసరించుచున్నది.

చండీ సేపూ

యవద్వీపమునందు బౌద్దమతము క్రీ. శ. 8, 9 శతాబ్దములలో ప్రబలముగ నుండినను, హిందూమతముగూడ వర్దిల్లుచుండెను. చండీ సేపూయనగా వేయిగడులని యర్దము. ఇవియన్నియు శిథిలావస్థలో నున్నవి. బొరొబుదుర్‌కు సమీపమున 'చండీబనన్‌' యను శివాలయము గలదు. ఇందు శివ, విష్ణు, బ్రహ్మ, అగస్త్య విగ్రహములున్నవి. వీనికిని దాత్కాలిక భారతదేశ శిల్పములకును సన్నిహితమగు సంబంధముగలదు. ఇచటిదేయగు నొక దర్గానుండి యుద్దరింపబడిన శివుని శిరస్సు యీ కాలమున చోళరాజుల పాలనమునందుండిన దక్షిణ హిందూదేశమున నిర్మింపబడిన విగ్రహభాగమును పోలియున్నది.

డీ-యింగ్ పీటభూమి (Di-ing Plateau)

యవద్వీపమున డీ-ఇంగ్ అను నొక నిర్జనమగు పీటభూమిగలదు. ఇది సముద్రమట్టమునకు 6500 అడుగులయెత్తున నున్నది. ఇందుజీర్ణావస్థనున్న యాలయము లయిదుగలవు. వీనికి మహాభారత వీరులగు పాండవుల పేరిట చండిపుస్తదేవ (యుద్ధిష్టిర) చండీ భీమ, చండీ అర్జున చండీశ్రిఖండీ, చండీసేనుభద్ర యని నామములున్నవి. ఇయ్యవి నగరములకును గ్రామములకును సమీపమునగాక నిర్జన స్థలమునందుండుటచే యాత్రాస్థలములని దోచుచున్నది. జైను లిట్టిపద్దతి నవలంభించిరి. ఇయ్యవి బొరొబుదుర్‌వలె మనోహరములు గాకున్నను, హిందూదేవతల యారాధనకై, హిందూపద్దతుల ననుసరించి నిర్మింపబడి యుండుటచే మనకు ముఖ్యములు. ఇందలి శిల్పము నిరాడంబరము. ఇచ్చటి త్రిమూర్తుల విగ్రహములు రెఖశిల్పమునకు చక్కనిదృష్టాంతములు. ఈ యాలయములు క్రీ. శ. 9 వ శతాబ్దారంభమునాటివి. ఇయ్యవి దక్షిణ హిందూదేశములోని యాలయములను పోలియున్నవి. కొందరు పండితులు పట్టడకల్, బహోల్, బేలూరు, హళేబీడు మున్నగు స్థలములందలి చాళుక్య కట్టడముల నీ యవద్వీపాలయము లనుకరించుచున్నవని దలచుచున్నారు. మఱికొందరు దక్షిణహిందూదేశమునందలి పల్లవచోళ దేవాలయములకు నీ పీటభూమియందలి యాలయములకును సామ్యమున్నదని చెప్పుచున్నారు.

పవటరన్ దేవాలయము

యవద్వీపమధ్యభాగమున సింగసరి మున్నగురాజ్యములు ప్రబలినపుడు బౌద్దమత ముచ్ఛదశనందినది. పిమ్మట దూర్పుజావాలో బిల్వితిక్తపుర సామ్రాజ్యము నిర్మింపబడిన తోడనే శైవమతప్రాబల్య మారంభమయ్యెను. మొత్తము మీద నీద్వీపమునందలి నిర్మాణకళలో నీరెండు మతముల ప్రభావమును గాంచనగుచున్నది. బిల్వతిక్త రాజులు నిర్మించిన కట్టడములలో బ్లిటర్ నగరమునకు సమీపమునందున్న పనటరన్ దేవాలయ మగ్రగణ్యము. ఇట నొక ప్రధానాలయమును, గొన్ని చిన్న దేవళములును గలవు. ఇదియొక శివాలయము. ఇందలి గోడల క్రిందభాగమున రామాయణ మహాభారతములలోని భాగములు చెక్కబడియున్నవి. ఈ శివాలయములో నీ వైష్ణవశిల్పము లుండుటనుబట్టి యీ దేశమునందుండెడి మతసహిష్ణుత వ్యక్తమగుచున్నవి.

చండి మెండట్ (Chandi-Mendut)

ఈ బౌద్దాలయము బొరొబుదుర్‌కు మైలున్నర దూరములో నున్నది. ఇందు మూడంతరువులున్నవి. అడుగు దానిలో నిరువది నాలుగును, రెండవదానిలో పదునారును, మూడవదానిలో నెనిమిదిని చిన్న స్థూపములును, మూడవ యంతరువు మధ్యగా నొక పెద్ద స్థూపము నిట గలవు. ఇందలి గోడలపైనను, ద్వారములపైనను హిందూదేవతలవిగ్రహములున్నవి. ఆలయమునందలి ప్రధాన విగ్రహము బుద్దునిది. మరిరెండు బోధిసత్వుల విగ్రహములుగూడ నిటగలవు. ఈమూడు విగ్రహములును బౌద్దశిల్పమునం దగ్రగణ్యములనియు, నియ్యవి హిందూదేశములోనిగుప్త శిల్పముల కెనయగుచున్నవనియు ఫెర్గుసన్ పండితుని యభిప్రాయము. ఈ యాలయములోని శిల్పకళ బొరొబుదుర్‌కంటె యభివృద్ధిని జూపుచున్నది.

ప్రాంబనస్-ఆలయము

ఈ యాలయముగూడ జావాద్వీప 'శిల్పుల కళానైపుణ్యమును జాటుచున్నది. భారతదేశముననేగాక, భారతీయ నాగరికత విస్తరించిన దేశములన్నిటియందునుగూడ వాల్మీకి రచించిన రామాయణము విశేషముగ బ్రేమింపబడి గౌరవింపబడినది. నయాంభాషలో 'రామకియన్, అనియు, మలేభాషలో హికాయత్ సెరిరామ, యనియు నీ గ్రంథము గాంచనగుచున్నది. యవద్వీపమునం దియ్యది విశేష వ్యాప్తి నందెను. దీనికి 1200 భాషాంతరీకరణములు ప్రాచీన జావాభాషలో గలవు. అంతియగాక వనటరన్, ప్రాంబనన్ దేవాలయములలో నీ-కథయంతయు శిల్పమున జిత్రింపబడినది. వనటరన్ శిల్పములలో నీ చరిత్రము శ్రీరామచంద్రుడు లంకాద్వీపమున కేగునప్పటినుండి ప్రారంభమగు చున్నది.

నుకు దేవాలయములు

యవద్వీపములో మధ్యభాగమున లోవిస్ (Lowes) పర్వతములకు సమీపమున నీ దేవాలయము గలదు. యవద్వీపకళా చరిత్రమున కియ్యది మిగుల ముఖ్యమైనది. ఇందలిభాగములు క్రీ. శ. 1435-1440 ల నడుమ అనగా బిల్వతిక్తపుర సామ్రాజ్యమును, హిందూమతమును గూడ నీ ద్వీపమునం దంతరించుటకు గొంచెము ముందుగా నిర్మింపబడినవి. ఇందలికళ క్షీణావస్థను సూచించుచున్నది. ఇయ్యది వైష్ణవాలయము. ఇందు మూడంతరువులును, వానిపై నొక గోపురమును గలవు. ఈ కట్టడము మధ్య అమెరికాలోని యుకటస్, మెక్సికో అను స్థలముల నున్న కట్టడములను బోలియున్నది. ఇందుమూలమున యవద్వీపవాసు లమెరికాకేగిరా? లేక నమెరికనులే యీ ద్వీపమున కేతెంచిరా? యను సమస్యలు బయల్వెడలు చున్నవి. బహుశ: యీ రెండు స్థలములందును గూడ నొకేజాతివారలు నివసించి యొకేజాతి కట్టడములను నిర్మించి యుందురు. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయము.