భారతీయ నాగరికతా విస్తరణము/చంపారాజ్యము

వికీసోర్స్ నుండి

భారతీయ నాగరికతా విస్తరణము.

6. చంపా రాజ్యము.

ఇండోచైనాయనునది మలేద్వీపకల్పమునకును, చైనాకును మధ్యగల దేశము. ఇందు నేడు నయాం రాజ్యమును ఫ్రెంచి ఇండొచైనాయును గలవు. భారతీయనాగరికతా విస్తరణచరిత్రమున కీభాగము మిగులముఖ్యమైనది. పూర్వ మిందు చంపా, కాంభోజ యను హిందూరాజ్యములును, నేటికినివర్దిల్లుచున్న నయాం రాజ్యము నుండెడివి. హిందూదేశనాగరికతా భినివేశము లిట విజృంభించియుండుటచే వీని చరిత్రమును సంగ్రహముగ బేర్కొనవలసియున్నది.

నేటి అన్నాంలోని క్వాంగ్‌నాం (Quang-nam) బిన్ తూన్ అన్ (Bin Thuan) అను దక్షిణభాగములు పూర్వపు చంపారాజ్యములో నుండినవి. ప్రాచీన యాత్రికుల కీరాజ్యము పరిచితమై యుండెను. క్రీ. శ. 2 వ శతాబ్దమునాటి టాలెమీ యను గ్రీసుదేశీయుడు దీనిని "జబ" యని పేర్కొనినాడు. మార్కుపోలో దీనిని "అజంబ" యనెను. అరబ్బులవ్రాతలలో నీరాజ్యమునకు "కౌఫ్" అను పేరున్నది. హ్యూన్‌ష్వాంగ్ దీనిని "మోహోచంపో" (మహాచంపా) యని ప్రశంసించియున్నాడు. హిందూ దేశమున చంపారాజ్యము సుప్రసిద్ధమైయున్నది. దానినుండి యీభారతేతర రాజ్యమును విడమరచుటకై హ్యూన్‌ష్వాంగ్ దీనిని మహాచంపాయని పేర్కొనియుండెను. చైనాదేశ చరిత్రమున నీచంపారాజ్యమునకు "లిస్‌ఈ" యను నామ మొసంగబడియున్నది. ఈరాజ్యనిర్మాణమునుగూర్చి పెక్కుగాథలు గాంచనగుచున్నవి. హున్‌టియస్ అనుబ్రాహ్మణు డీరాజ్యముపై దండెత్తి, యిచటిరాణిని బరిణయమాడి యీదేశమునకు రాజయ్యెనని చైనాదేశీయుల వ్రాతలు దెలుపుచున్నవి. ఈహున్‌టియన్ అనునతడే కౌండిన్యుడనియు, నీవృత్తాంతము క్రీ. శ. 1 వ శతాబ్దమున జరగెననియు, పెలియట్ అను ఫ్రెంచిపండితుడు వ్రాసియున్నాడు. మరికొన్ని చైనాచరిత్రములలో క్రీ. శ. 2 వ శతాబ్దాంతమున చైనాదేశమును హ్యాన్‌వంశీయులేలుచుండగా "కెయులియన్" అను నతడు చంపారాజ్యమును స్థాపించెనని యున్నది. చంపాలోవోకాన్ అనుచోట దొరికిన క్రీ. శ. 3 వ శతాబ్దినాటి సంస్కృతశాసనమున నాకాలమున శ్రీమారునిసంతతివారు చంపాపాలకులుగనుండిరని చెప్పబడినది. దీనినుండి మాస్బేర్స్ అను ఫ్రెంచిపండితుడు కియున్‌లియన్‌ను, శ్రీమారుడు నొక్కరేయనియు, నీతడు క్రీస్తుశకము రెండవయంత్యభాగమున చంపారాజ్యమును స్థాపించెననియు వ్రాసియున్నాడు. కాని కియన్ లియన్ అనునది కౌండిన్యుని పేరనియు, నాతడే యీరాజ్యమును క్రీ. శ. 1 వ శతాబ్దిలో నిర్మించెననియు, దీనిని రెండవశతాబ్దమునుండి శ్రీమారుడు నాతనిసంతతివారు నేలిరనియు జెప్పుట సమంజసముగ నుండును. ఏది యెట్లున్నను క్రీస్తు శకారంభమున భారతీయు లిచటికి వలసవచ్చిరని స్పష్టమగుచున్నది. అయినచో వీర లెచటివారు? అను సమస్యయొకటి బయల్వెడలును. "చంపా" యను నీరాజ్యనామమును బట్టి వీరార్యావర్తమునందలి ప్రాగ్భాగమునుండి వచ్చిరేమోయని తోచుచున్నది. కాని వోకాన్ శాసనము దక్షిణహిందూదేశమును సూచించుచున్నది. ఈశాసనమునందలి భాషయు, లిపియు, క్షత్రపరుద్రదాముని గిర్‌నార్ శాసనమును, ఆంధ్రవాసిష్ఠీపుత్రుని కన్హేరిశాసనమును పోలియున్నవి. ఈవిషయముల నన్నిటిని చర్చించి జదునాథ్ సర్కారుగారు "చంపారాజ్యమునేలిన మొదటి రాజవంశము గోదావరీ కృష్ణా నదీతీరములనుండి వచ్చిరని చెప్పవలసి యున్న"దని నిశ్చయించినారు. ఈప్రదేశము లాంధ్రదేశములోనివే యగుటచే, ఆంధ్రులు క్రీ. శ. 1, 2 శతాబ్దములలో ఇండోచైనాకు వలసపోయి యిచట నొకహిందూరాజ్యమును స్థాపించిరను ముఖ్యాంశము సర్కారుపండితుని వ్రాతలనుండి స్పష్టమగుచున్నది.

చంపారాజ్యచరిత్రమును రచించుటకు పెక్కు సంస్కృత శాసనములును, తాత్కాలికులవ్రాతలు నుపకరించుచున్నవి. క్రీ. శ. 1 వ శతాబ్దమున చైనాలో చేరియుండిన యీభాగమున అమరావతి యనుచోట శ్రీమారుడు తనస్వాతంత్ర్యమును బ్రకటించెను. అతని కాలమున నీరాజ్యమున పాండురంగ, విజయ, కౌథారయను మరిమూడువిభాగములుండినవి. అతని సంతతివారు మాతృదేశమునందలి హిందూమతము నిచట వ్యాపింపజేసిరి. దేవాలయములెల్లెడలను నిర్మింపబడినవి. స్థానికులగు చామ్‌ప్రజలు త్వరలో నీహిందూమతమును, హిందువుల యాచారవ్యవహారములను స్వీకరించిరి. ఈశ్రీమారవంశమునకు బిమ్మట క్రీ. శ. 336-420 నడుమ నొకక్రొత్తవంశము చంపాసింహాసనము నధిష్ఠించెను. ఈవంశీయులలో మూడవవాడగు భద్రవర్మ మిక్కిలి గొప్పవాడు. 'ధర్మమహారాజ' యను నితని బిరుదము దక్షిణహిందూదేశపు పల్లవ, వాకాటక, కదంబరాజుల బిరుదులను పోలియున్నది. ఈతడు మీనన్ అనుచోట తనపేరిట భద్రేశ్వరస్వామియాలయమును గట్టించెను. ఈతని తనయుడగు గంగరాజు విరాగియై, రాజ్యమును త్యజించి, గంగానదిని దర్శించుటకై హిందూదేశమున కేగెను.

క్రీ. శ. 420-530 నడుమ నీరాజ్యమునం దంత:కలహములో వినవి. చంపారాజ్యవిజృంభణమును గాంచి యోర్వలేక చైనాదేశీయు లీయదనున నీరాజ్యముపై దండెత్తి, రాజధానిని దోచి, దేవళములను కాల్చిరి. పిమ్మట క్రీ. శ. 530 లో శ్రీరుద్రవర్మయనునతడు చైనాదేశీయులచే చంపారాజ్యమున కభిషిక్తుడయ్యెను. ఈమూడవ రాజవంశము క్రీ. శ. 758 వరకును చంపారాజ్యము నేలెను. వీరిలో ప్రకాశధర్ముడను నతడు ముఖ్యుడు. "చంపాపుర పరమేశ్వర మహారాజశ్రీ ప్రకాశ ధర్మ"యనున దీతనిపేరు. ఇశానేశ్వర, ప్రభవేశ్వరాది దేవాలయము లెన్నియో యీతనిచె నిర్మింపబడినవి. క్రీ. శ. 758 లో చంపాసామంతులు పాండురంగపురాధీశ్వరుడగు పృథివీంద్ర వర్మను చంపాసింహాసనమున గూర్చుండబెట్టిరి. ఈతని వంశీయులు క్రీ. శ. 9 వ శతాబ్ది మధ్యభాగము వరకును రాజ్యమేలిరి. క్రీ. శ. 774 లో యపద్వీపవాసులు చంపాపైదండెత్తి, కౌధారవిషయమును కొల్లగొని, యచటి శంభుదేవాలయమును పాడుచేసి, లింగమును గొనిపోయిరి. పిమ్మట నప్పటిచంపారాజగు శ్రీపత్యవర్మ శత్రువులతో సముద్రముపై యుద్ధమొనర్చి వారిని దరిమివైచి, కౌథారమున నొక చక్కని యాలయమును గట్టించి తనపేరిట సత్యముఖలింగమును నెలకొల్పెను. రాజధానియగు బాండురంగపురమున నిత డొక గొప్ప సౌధమునునిర్మించెను. ఈవంశములోని ఇంద్రవర్మ క్రీ. శ. 787 లో యవద్వీపవాసుల దండయాత్రను ప్రతిఘటించి, యనేక శివాలయములను స్థాపించెను. ఈతనికాలమున శంకరనారాయణ విగ్రహములును, వాని యారాధనము, వ్యాప్తిలోనికి వచ్చినవి. చంపారాజ్యములోని హిందూమతపరివర్తనమునం దిది యొక ముఖ్యాంశము. ఈరాజు వెనుక చంపారాజ్యము నేలినవాడు నీతని తమ్ముడనగు మొదటి హరివర్మ. చంపారాజులలో నగ్రగణ్యుడు. క్రీ. శ. 803 లో నితడు చైనాలోని గొన్ని భాగములను జయించి రాజాధిరాజ బిరుదమును వహించెను. ఇతని తనయుడును యువరాజునగు విక్రాంతవర్మ కాంభోజదేశముపై దాటివెడలి యచటి రాజునోడించెను. ఈవంశీయుల పాలనము క్రీ. శ. 860 లో నంతమయ్యెను. అటుపై మహారాజాధిరాజ ఇంద్రవర్మయు, నాతని పుత్రుడగు జయసింహవర్మయు క్రీ. శ. 900 వరకును రాజ్యమేలిరి. ఈకాలమున మహాయాన బౌద్దమతము చంపారాజ్యమున వ్యాపించెను. క్రీ. శ. 900-1071 నడుమ మూడువంశములు చంపారాజ్యమును పాలించినవి. ఈకాలమున నెన్నియో యుపద్రవములు జరిగినవి. క్రీ. శ. 945 లో కాంభోజ దేశీయులును, 982, 1034, 1069 సంవత్సరములలో అన్నామ్ దేశీయులును చంపారాజ్యముపై దండెత్తియాకాలపు రాజులను చంపియు, దేశమును కొల్లగొని దేవాలయములను కట్టడములను ద్వంసముచేసియు, నల్లకల్లోల మొనర్చిరి. ఇదేసమయమున శ్రీవిజయ పాండురంగవిషయాదిపులు విద్రోహ మొనర్చిరి. కాన చంపారాజవంశములకు స్థైర్యము లేకుండినది. ఈకాలమున శాక్తధర్మ మీరాజ్యమున ప్రబలినది. క్రీ. శ. 1075 లో మూడవ హరివర్మమహారాజు అన్నాం, కాంభోజదేశములనోడించి, చంపారాజ్యము నాక్రమించెను. ఈవీరాగ్రణి శత్రువులచే నాశమొనర్పబడిన హిందూదేవాలయముల నన్నిటిని బాగుచేయించి, క్రొత్తవాని నెన్నిటినోనిర్మించెను. చంపారాజ్యమున తిరిగీ శాంతిసౌఖ్యములు ప్రబలినవి. ఈరాజు మరణించినపుడు రాణులు నల్గురు సహగమనమొనర్చిరి. అనంతర మీతని పుత్రుడు బాలుడగుటచే నీతనితమ్ముడగు పరమబోధిసత్వుని బ్రజలెల్లరును దమ కేలికగ నెన్నుకొనిరి. ఈక్రొత్తరాజు బౌద్దమతము నవలంబించెను. పాండురంగ విషయాధిపు డీకాలమున విద్రోహమొనర్చెను గాని శీఘ్రకాలముననే యణంచబడెను. క్రీ. శ. 1139-1144 నడుమ పదునొకటవ రాజవంశము పరిపాలనమునకు వచ్చెను. ఈకాలమున శైవబౌద్దమతములు రెండును చంపారాజ్యమునవర్థిల్లినవి. క్రీ. శ. 1192 నుండియు నీరాజ్యము క్షీణించెను. ఇంతటితో నిచటి హిందూరాజుల ప్రతిభ నశించినది. ఉత్తరమున శ్రీవిజయ విషయము కాంభోజరాజుచే జయింపబడెను. పాండురంగ విషయమును స్థానికులగు చాము లాక్రమించిరి. క్రీ. శ. 1203-1220 నడుమ చంపారాజ్యమంతయు కాంభోజసామ్రాజ్యమున గల్పుకొనబడెను. క్రీ. శ. 13 వ శతాబ్దిమూడవపాదమున చెంగిస్‌ఖాన్ తనయుడగు కుబిలైఖాన్ అను మంగోలురాజు చంపాపై యనేకసార్లు దండెత్తెను. తుదకు క్రీ. శ. 1318 ప్రాంతమున అన్నాందేశీయులు చంపా రాజ్యమును వశపరచుకొనిరి. ఇంతటితో చంపా హిందూరాజ్యచరిత్ర ముగిసినది. క్రీ. శ. 1 వ శతాబ్దినుండి 13 వ శతాబ్దివరకునుండిన యీహిందూరాజ్యపు నాగరికత నించుక పరిశీలింపవలసియున్నది. హిందూదేశమునందువలె చంపారాజ్యమునగూడ దేవాలయములు ముఖ్యనిర్మాణములుగ నుండినవి. వానిని సాధారణముగ నిటుకలతోను, అరుదుగ రాతితోను నిర్మించుచుండిరి. వీనిలోపలిభాగము దారునిర్మితము. ఒక యాల యాంతర్భాగము మంచిగందపుకఱ్ఱతో గట్టబడి, బంగారు వెండిరేకులమలామాను గలిగియుండెను. మరియొక దాని గోపురమునకు వెండిరేకువేయబడినది. ఈ యాచారము హిందూదేశమునగూడ నుండెడిది. చంపారాజ్యమున శైవ మతము ప్రబలముగ నుండినది. శర్వ, భవ, ఈశాన, పశుపతి, ఉగ్ర, రుద్ర యనుపేరులుగల్గి, నటరాజ, యోగి, లింగరూపములలో శివు డీదేశమున నారాధింపబడుచుండెను. చంపాశైవమతమున రెండు క్రొత్త విషయములు గలవు. అందు మొదటిది ముఖలింగపూజ. రాజులనేకులు తమ పేరిట బ్రతిష్ఠింపుచుండిరి. ఇందు సామాన్యమగు లింగమునకు పైభాగమున ముఖమొకటి కల్పింపబడుచుండెడిది. ఇట్టి ముఖలింగములను నిర్మించుటలో ఆయారాజులను శివునితో సరిచేయుటయే ముఖ్యోద్దేశమై యుండవచ్చును. శైవముతోపాటు శాక్తమును వ్యాపించినది. ఉమా, గౌరీ, చండీ, కాళి, భగవతీ యను పేరిట జనులా కాలమున శక్తినారాధించుచుండిరి. నంది, విఘ్నేశ్వరుడు నీశైవాలయములలో సామాన్యముగ స్థాపింపబడెడివి. చంపాశైవమున రెండవయంశము శంకర నారాయణపూజ. శివకేశవుల యభెదమును దెల్పుటకై యొక పార్శమున శివుని, మరియొక పార్శ్వమున విష్ణువును జూపు విగ్రహములు నిర్మింపబడినవి. శివునకుబిమ్మట విష్ణువు విశేషముగ నీరాజ్యమునం దారాదింప బడుచుండెను. ఇతనితోపాటు లక్ష్మియు, గరుడును పూజింపబడుచుండిరి. క్రీ. శ. 7 వ శతాబ్దినుండి యీదేశమున బౌద్దమతమును ప్రబలినది. ఇచట ననేకములగు విహరములు నిర్మింపబడినవి. నాగారోహకుడగు బుద్దుడు నవలోకితేశ్వరుడు నిట బూజింపబడిరి. కాని చంపాలోని బౌద్దశిల్పములు తేజోహీనములై సామాన్యమైనవిగనున్నవి. మతమునకు బిమ్మట పేర్కొనవలసినది వాఙ్మయము. స్థానికమగు చామ్‌భాష యీదేశమునం దుండినను సంస్కృతమే రాజభాషగ పరిగణింప బడినది. హిందూవిజ్ఞానము చాలభాగము చంపాలో వ్యాపించినది. వ్యాకరణము, జ్యౌతిషము, ధర్మశాస్త్రము, మీమాంస, శైవోత్తరకల్పము, అఖ్యానము, రామాయణము, మహాభారతము మున్నగునవి. యీదేశీయులకు చక్కగ దెలిసియుండినవి. మతమును, వైదుష్యమునేగాక చంపారాజులు హిందూదేశమునుండి సాంఘికపద్దతులనుగూడ తమ దేశమునకు గొనితెచ్చిరి. ఇచటగూడ బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాది చతుర్వర్ణములు నుండినవి. రాజు లందరును క్షత్రియులుగ నుండిరి. అయినను వారు బ్రాహ్మణులతో మాత్రము వైవాహిక సంబంధములను గలిగియుండిరి. రాజపుత్రులు బ్రాహ్మణకన్యలను, బ్రాహ్మణయువకులు రాజ కన్యకలను బరిణయమాడు టాచారమైయుండినది. అందుచే గొందరు చంపారాజులు తాము బ్రహ్మ క్షత్రియకులజులమని చెప్పుకొను చుండిరి. వివాహము హిందూపద్దతినే జరుగుచుండెడిది. చంపాలో హిందూదేశము నందువలెనే రాజు రాష్ట్రమునం దగ్రగణ్యుడుగ నుండెను. సాధారణముగ నధికారము తండ్రివెనుక జ్యేష్ఠపుత్రునికే చెందుచుండెను. కొన్నిసమయములలో సామంతులును, మంత్రులును జేరి రాజు నెన్నుకొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాజులు దత్తతచేసి కొనుటయు జరగెడివి. రాజ్యాభిషేకము హిందూధర్మశాస్త్రముల ననుసరించియే జరుపబడుచుండెడిది. అ సమయమున రాజులు క్రొత్తనామములను, బిరుదములను గైకొనుచుండిరి. జ్యేష్ఠపుత్రుడు యౌవరాజ్యాభిషిక్తుడై మహాసేనాపతిగ నుండెను. చంపారాజ్యము మూడువిభాగములుగ నుండెను. అందు మొదటిది అమరావతీ విషయము ఉత్తరముననున్న యీవిషయము నేటి అంగ్‌నాం (Quang-nam)కు సరియగును. విజయ యను రెండవవిషయము రాజ్యము మధ్యనుండెడిది. ఇయ్యదినేటి బిన్‌గడిన్ (Bing-Dinh) కు సరిపోవును. ఇందేశ్రీవిజయ అను రేవుపట్టణ ముండెడిది. మూడవది దక్షిణముననుండెడి పాండురంగవిషయము. ఇదియే నేటి పన్‌రన్ (Panran) అను విభాగము. ఈవిషయములలో నొక్కొక్క దానిపై నొక్కొక రాజప్రతినిధి యుండెను. కేంద్రప్రభుత్వము యిర్వురు సామాన్యోద్యోగులయొక్కయు, నిర్వురు, ఘనోద్యోగుల యొక్కయు, మంత్రుల యొక్కయు, సాహాయ్యముతో రాజుచే నిర్వహింపబడుచుండెడిది. చంపారాజ్యము ప్రబలముగనుండినది. ఇందు గజాశ్వపదాతి బలములుండెడివి. ఖడ్గములు, బల్లెములు, డాలులును యుద్ధములలో నుపయోగింప బడుచుండెడివి. నగరములచుట్టును దిట్టములగు గోడలుండెడివి.


______________