భారతీయ నాగరికతా విస్తరణము/కాంభోజరాజ్యము

వికీసోర్స్ నుండి

భారతీయ నాగరికతా విస్తరణము.

7. కాంభోజ రాజ్యము.

ఈప్రాచీనహిందూరాజ్యము నేటి కాంబోడియాకు సరియగును. మొదటిలోనియ్యది యీనాటి కొచిన్, చైనా, నయాం, మలేద్వీపకల్పములకు వ్యాపించిన వూనన్ రాజ్యములో చేరియుండి క్రీ. శ. 600 లో స్వతంత్రరాజ్యమయ్యెను. యీ కాంభోజరాజ్యోత్పత్తినిగూర్చి వివిధములగు గాథలుగలవు. స్థానికులగు ఖ్మేర్ (Khmer) ప్రజలు కంబుస్వాయంభువను నార్యదేశపురాజు కాంభోజదేశమున కేగి, యొక నాగరాజుకూతురును పెండ్లాడి యాదేశమున కధిపతియయ్యెనని చెప్పుదురు.మరియొక గాథననుసరించి ఆదిత్యవర్మయను నింద్రప్రస్థపురరాజు తన రెండవకుమారుడు దేశమునుండి వెడలగొట్టెననియు, నా రాజపుత్రు డోడపై కాంభోజప్రాంతమునుజేరి, యచటి రాజునోడించి, దానె రాజయ్యెననియు, నొకసారి సముద్రతీరమున విసారించుచు నొక నాగకన్యను గాంచి మోహితుడై, యామెనుబరిణయ మాడెననియు, నంతట నాతనిమామగారగు నాగరాజు సముద్రములో గొంత నీటిని ద్రాగి, బయల్వెడలిన భూమికి తన యల్లునిరాజును జేసి, దానికి కాంభోజ యను నామము నిడెననియు, దెలియుచున్నది. ఇట్టి నాగరాజులతోడి వైవాహిక సంబంధమువలన రాజ్యాధికారమును బడయుట దక్షిణహిందూదేశములోని పల్లవ రాజవంశ చరిత్రమునను గలదు. చంపారాజ్యోత్పత్తిని పేర్కొనునపుడు కౌండిన్యుడను బ్రాహ్మణు డీప్రాంతమును క్రీ. శ. 1 వ శతాబ్దిలో జయించెనని చెప్పియుంటిమి. చైనాదేశీ యుల వ్రాతలలో కాంభోజదేశమునకు మరియొక కౌండిన్యుడేతెంచి యప్పటి కట రాణిగనున్న సోమయను నామెను పెండ్లియై బ్రజలచే రాజుగ నెన్నుకొన బడెనని యున్నది. యీగాథలనుండి దక్షిణహిందూదేశమునకును కాంభోజరాజ్యోత్పత్తికిని సన్నిహితమగు సంబంధముగలదని తెలియుచున్నది. జదునాథ్ సర్కార్‌పండితు డీయూహకే మరి రెండుకారణముల నొసంగుచున్నాడు. (1) వర్మయను కాంభోజరాజుల నామాంత్యము (2) ఇచటి దేవాలయ శిఖరములు దక్షిణహిందూదేశపు గోపురములనుపోలియుండుట. వీనినిబట్టి కాంభోజదేశమునకు మొదట వలస వచ్చినవారు కళింగము ఉత్తరసర్కారులనుండి, ముఖ్యముగ కృష్ణాగోదావరీతీరములనుండి వచ్చియుండిరని పైపండితుని యభిప్రాయము.

యీ రాజ్యముయొక్క చరిత్రను ప్రారంభించుటకు Baksey Chang Krang అనుచోట గన్గొనబడిన సంస్కృతశాసన ముపకరించుచున్నది. ఆది కంబుస్వాయంభువ శృతవర్మన్ , శ్రేష్ఠవర్మన్, భావవర్మన్ అను మరి మూడు సమకాలిక పురుషాంతరములను తెల్పుచున్నది. ఇందు రెండవ వరుసలోని కౌండిన్యుడే క్రీ. శ. 4 వ శతాబ్దమున కాంభోజదేశమునకు వచ్చినవాడు, రుద్రవర్మ క్రీ. శ. 570 ప్రాంతమున నుండెను. విష్ణువుతోడను, దిలీపునితోడ నీతడు సరిపోల్పబడినాడు. యీ కాలమునకు హిందూ ఆయుర్వేద మీదేశమునకు వ్యాపించినది. రాజువద్ద అశ్వినులను పోలిన యిర్వురువైద్యులుండిరట. రుద్రవర్మతనయుడగు భావవర్మ క్రీ. శ. 580-600 నడుమ రాజయ్యెను. యీరాజు తమ్ముడు చిత్రసేనుడను నతడు పూనన్‌రాజు నోడించెను. ఇంతటితో కాంభోజము స్వతంత్రరాజ్యమయ్యెను. భావవర్మసోదరి సామవేదపారగుడగు సోమశర్మయను నతనిని పెండ్లాడెను. యీసోమశర్మ విష్ణుభక్తుడు. విష్ణ్వాలయములను, సూర్యాలయముల నెన్నిటినో గట్టించి యీతడు వానికి మహాభారత రామాయణ పురాణాదిగ్రంథములను సమర్పించెను. రాజు శైవుడగుటవలనను, శక్తి పూజ యాకాలమున ప్రబలముగ నుండుటవలనను, రాజ్యమున శివాలయములుగూడ బయల్వెడలినవి. క్రీ. శ. 604 లో చిత్రసేనుడు మహేంద్రవర్మయను నామముతో కాంభోజసింహాసనమునకు వచ్చి యిరువదియేడు సంవత్సరములు పాలించెను. యీకాలమున నొక బ్రాహ్మణుడు శివపాదమును బ్రతిష్ఠించి దానిపై నొకయాలయమును గట్టించెను. ఇయ్యది హిందూదేశములోని విష్ణు బుద్దపాదముల యారాధన జ్ఞప్తికి దెచ్చుచున్నది. తరువాత రాజ్యమునకు వచ్చి క్రీ. శ. 627-639 నడుమ రాజ్యమేలిన యీశానవర్మకాలము మిగుల ముఖ్యమైనది. యీశానపుర, తామ్రపుర, చక్రాంకపుర, భీమపురాది నగరములెన్నియో యీసమయమున నిర్మింపబడినవి. శంకరనారాయణ పూజగూడ నీకాలమున వ్యాప్తినందినది. యీరాజు నీతనిసామంతులును బౌద్ధులసంఘారామములవలె హిందూ ఆశ్రమములను స్థాపించి వానిని కపోధరుల కాశ్రయములుగ నొనర్చిరి. క్రీ. శ. 665-690 నడుమ రాజ్యమేలిన మొదటి జయవర్మకాలమున బౌద్దమత మీదేశమును బ్రవేశించెను. క్రీ. శ. 8 వ శతాబ్దము కాంభోజచరిత్రమునం దందకారమయముగనున్నది. యీ కాలమున శంభుపురము, వ్యాధపురము, అనిందితపురము నను మూడు చిన్నరాజ్యములుగ దేశమంతయు విభజింపబడి యంత:కలహములకు లోనయ్యెను. క్రీ. శ. 802 లో రెండవ జయవర్మ శాంతిని నెలకొల్పి చంపారాజ్యము నంతటిని క్రీ. శ. 820 వరకు నేలెను. మహేంద్రపర్వతముపై నీత డొక నూతనరాజధానిని నిర్మించెను. రాజేంద్రదేవి, నరేంద్రలక్ష్మి యను వా రీతని భార్యలు. క్రీ. శ. 877-889 నడుమ పరిపాలించిన మొదటి యింద్రవర్మగూడ నెన్నియో యాశ్రమములను స్థాపించెను. పిమ్మట సింహాసనమునకు వచ్చిన యశోవర్మ కాంభోజపాలకులలో నగ్రగణ్యుడు. సామశివుడను మహామునికీతడు శిష్యుడు. ఈకాలమున జనులు శివుడు, విష్ణువు, శక్తి, గణపతి కార్తికేయుడు మున్నగుదేవతల నారాధించుచుండిరి. చాతుర్వర్ణవ్యవస్థ యీ దేశమునందుండెను. శుశ్రుతాచార్యుని వైద్యశాస్త్రమున యశోవర్మప్రవీణుడు. రెండవ జయవర్మ ప్రారంభించిన రాజధానిని పూర్తిచేసి దాని కీతడు యశోధరపురమని పేరిడెను. ప్రపంచమున కంతటికిని విస్మయముగొల్పు అంగ్‌కోర్‌థామ్ అను కట్టడ మీతనిచే నిర్మింపబడినది. క్రీ. శ. 944-968 నడుమ రాజ్యమేలిన రాజేంద్రవర్మకాలమున మహాయానబౌద్దమతము ప్రబలినది. బౌద్దదేవాలయములెన్నియో బయల్వెడలినవి. ఈరాజుపుత్రుడగు నైదవ జయవర్మకాలమున హిందూమత ముజ్జీవనము నందెను. ఈరాజు సోదరియగు ఇంద్రలక్ష్మి భారతదేశమునందలి యమునానదీ తీరమునుండి యేతెంచిన దివాకరుడను బ్రాహ్మణుని పెండ్లాడెను. దీనినుండి మాతృదేశమునుండి యీశాఖా రాజ్యముల కేగినవారల కాకాలమున జూపబడుచుండెడి గౌరవము తెలియుచున్నది. దివాకరు డెన్నియో యాలయములను స్థాపించెను. పిమ్మట సూర్యవర్మ క్రీ. శ. 1002-1049 నడుమ రాజ్యమునకు వచ్చెను. యోగీశ్వరుడను మహాపండితు డీతనియాచార్యుడు. ఈ రాజగురు నీకాలమున శైవమతమున కెంతయో ప్రాబల్యము లభించెను. శివాచార్యుడను మరి యొక పండితుడు వర్ణవ్యవస్థను సంస్కరించెను. పతంజలీ వ్యాకరణనేత్తయగు శంకరపండితుడుగూడ నీకాలముననే యుండెను. సూర్యవర్మ మహాతంత్రజ్ఞుడు. చైనా చంపారాజ్యములతో మైత్రినిపాటించి నీతడు అన్నాం రాజ్యముపై దండెత్తెను. క్రీ. శ. 1112-1152 నడుమ కాంభోజదేశమునకు నాటిరాజగు రెండవసూర్యవర్మ విశేషమగు ఖ్యాతి నొనగూర్చెను. ఈరాజు మలక్కాదీవులను జయించి తనరాజ్యమును విస్తరింప జేసెను. ఈకాలమున కాంభోజరాజ్యమునకు తూర్పున చంపారాజ్యమును, పడమట పెగూరాజ్యమును, దక్షిణమున మలేరాజ్యము నుండెడివి. చైనాకు రెండురాయబారముల నంపియు, చంపారాజు ననేకసారు లోడించియు నీతడు శతృ భయంకరుడై యుండెను. దివాకరుడను పండితాగ్రణి యీరాజునకు గురువు. ఏడవజయవర్మ కాంభోజరాజులలో కడపటివాడు. క్రీ. శ. 1182-1201 నడుమ నీతడు రాజ్యమేలెను. చంపారాజ్యము తోడి యుద్ధము నీతడు జయప్రదముగ నిర్వహించి, బర్మాలో కొంతభాగమును జయించెను. ఈకాలమునం దెల్లెడలను వైద్యశాలలు నెలకొల్పి బడినవి. క్రీ. శ. 14 వ శతాబ్దిలో కాంభోజరాజ్యము క్షీణించెను. రాజులు బలహీనులుగనుండిరి. ఒక వంకనుండి చంపాపాలకులును, మరియొక వంకనుండి నయాంరాజులును కాంభోజముపై ననేకసారులుదాడి వెడలి తుదకు దానిని రూపుమాపిరి.

కాంభోజదేశనాగరీకత యనేకవిషయములలో హిందూదేశనాగరీకతను పోలియున్నది. ఇచటి దేవాలయములు రాతితోను యిటుకలతోను కట్టబడినవి. ఇందు దక్షిణహిందూదేశమునందలి గ్రామదేవతలయొక్కయు, చిల్లరదేవతలయొక్కయు గుళ్ళవలె త్రికోణాకృతిగలవియు, పెద్దగోపురములు గలిగి విశాలములైనవియు, ననేకవిథములగు నాలయములు గలవు. ఆలయముచుట్టును ప్రహరీగోడయు ప్రధానద్వారముపై గోపురము నిటగూడనుండెడివి. శైవమతమీదేశమున బ్రధానముగనుండినది. శివుడు, పరమేశ్వర, త్ర్యంబక, శంభు, గౌరీశ, జగత్పత్యాదినామములతో నారాధింపబడుచుండెను. నందివాహన, నటరాజ, పంచముఖ - లింగరూపములు శిల్పమున గాంచనగుచున్నది. పాశుపత వీరశైవ శాఖలును, వేదాంత శైవమును నీరాజ్యమున ముఖ్యములుగ నుండినవి. ఇచట విశేషమగు నొక శైవాచారముండెడిది. రాజులు చంపాలోవలెనే తమపేరిట ముఖలింగములను స్థాపించుచుండిరి. వారికి మరణానంతరము శైవబిరుదము లొసంగబడుచుండెడివి. జయవర్మన్, ఈశ్వరలోక, యశోవర్మన్ పరమశివలోక, హార్షవర్మన్-రుద్రలోక మున్నగుబిరుదము లిందులకు నిదర్శనములు. పారమేశ్వర - స్పందవృత్తి పరమేశ్వర తంత్రమున్నగు శైవగ్రంథము లీదేశమున రచింపబడినవి. కాంభోజదేశమునందలి శైవమతమున శివవిష్ణులింగ, శంకరనారాయణ విగ్రహారాధన మింకొక నూతనాంశము. ఇచటను శివపాదమునకు దేవళములను గట్టించు టాచారమైయుండెను. ఉమ, పార్వతి, భవాని, గౌరీరూపములలో శక్తియు, శివ, విష్ణు, బ్రహ్మ, సరస్వతి, గంగా, శ్రీ, చండీ, గణేశ, గరుడ, నంది, కాళ్యాది యితరదేవతలు నీదేశమునం దారాధింపబడుచుండిరి. క్రీ. శ. 7 వ శతాబ్దమున బౌద్దమత మీదేశమున ప్రబలినప్పటినుండియు మైత్రేయ, అవలోకితేశ్వర, వజ్రపాణి, ప్రజ్ఞాపారమితా, దివ్యాదేవి, లోకనాథాది మహాయాన బౌద్దదేవత లారాధింప బడుచుండిరి. చంపాలోవలె కాంభోజదేశమునగూడ హిందూవాఙ్మయము వ్యాపించినది. ఋగ్వజుస్సామవేద పారంగులెందరో యిటనుండిరి. తంత్రములు, నాగమములును, రామాయణ మహాభారతములు నిచ్చటివారికి కరతలామలకములుగ నుండినవి. శాసనములలో వేదాంతజ్ఞానసారులును, స్మృతిపథనిరతులు, సష్టాంగయోగ ప్రకటితకరణులునగు బ్రాహ్మణుల ప్రశంసగలదు. కాణాద న్యాయసూత్రములును, పతంజలి మహాభాష్యమును, జ్యోతిశాస్త్ర శబ్దశాస్త్రములును, ఆయుర్వేదమును, శిల్ప గీత నాట్యశాస్త్రములును, ధర్మశాస్త్రము, నర్థశాస్త్రము నీకాంభోజదేశమున విశేషముగ వ్యాప్తినందినవి. ఇచటి కట్టడములలో అంగ్‌కోర్‌వాట్ అను విష్ణ్వాలయము ముఖ్యమైనది. ఇందలి గోడలపై రామాయణ మహాభారత హరివంశములలోని ఘట్టణులు చిత్రింపబడినవి. అంగ్‌కోర్‌థాం అను రాజధానీనగరము దీని కెనయగును. హిందూకాంభోజ (Indo-Combodian) కళ కీరెండు కట్టడములు నుత్కృష్ట నిదర్శనములు.



_________________