భారతీయ నాగరికతా విస్తరణము/ఆంధ్రదేశము–ప్రాగ్భారతదేశములు

వికీసోర్స్ నుండి

భారతీయ నాగరికతా విస్తరణము

9. ఆంధ్రదేశము - ప్రాగ్భారత దేశములు.

ఇంతవరకును దక్షిణహిందూదేశమునకును బ్రాగ్భారతభూములకునుగల సంబంధమును పేర్కొని యుంటిమి. ఈ దేశాంతరములలో భారతీయనాగరికతను విస్తరించునెడ నాంధ్రదేశ మెక్కుడుగ బాల్గొనియుండెను. ఈ విషయమై గొన్నివివరము లిట పేర్కొనబడుచున్నవి.

ఆంధ్రదేశమున దక్షిణమున పులికాట్‌చెరువు మొదలుత్తరమున కళింగపట్టణము వరకును దీర్ఘమగు సముద్రతీర ముండుటచే, సముద్ర యానమునకు సౌకర్య మెక్కువగనుండినది. వంశధారా, గోదావరీ, కృష్ణా, పినాకినీ నదులమూలమున లోభాగములకుగూడ నౌకలు పోవుచుండినవి. క్రీ. శ. 12 వ శతాబ్దములనాటివగు (Pariplus of the Erythrian Sea and Ptolemy's Geography) లలోనా కాలమున కృష్ణాగోదావరీ ముఖద్వారములనుండి నౌకలు దూర్పునకేగుచుండెడివని వ్రాయబడినది. ఈ కాలమున రెండురకముల నౌకలుండెడివి. ఒక విధమైనవానిని తీరమునందలి వాణిజ్యమునకును, మరియొక విధమగు వానిని విదేశవాణిజ్యమునకు నానాటి యాంధ్రులుపయోగించు చుండిరి.

బహుప్రాచీన కాలమునుండియు నాంధ్రదేశవాణిజ్యప్రశంస గలదు, భీమసేన జాతకమునం దీదేశము నేతపరిశ్రమకు ముఖ్యస్థానమని చెప్పబడియున్నది. పర్తియాలలో వజ్రపు గనులును, వినుకొండలో రాగి గనులును, పల్నాడులో సీసము చలువరాళ్ళుగలగనులు నాకాలమునం దుండెడివి. శాతవాహానాంధ్రులకాలమున వాణిజ్యమభివృద్దినందెను. టగర ప్రతిష్ఠాన నగరములందలి బజారులలో కృష్ణాగోదావరీనదులమూలమున విదేశములనుండి గొనితేబడిన మస్లినులును (Muslins) వర్ణవస్త్రములు నమ్మబడుచుండెడివి. పినాకినీముఖద్వారమును, మనర్ప కొట్టిన్, కృష్ణముఖద్వారములు, కొస్టకొప్పల, కొడ్డుర, అల్గొస్గైనిమున్నగు నౌకాశ్రయస్థానములను టాలెమీ పేర్కొనియున్నాడు. మనర్భ యనునది నేటి నెల్లూరుజిల్లాలోని మన్నేరుపైనున్నది. కొట్టిన్‌రేవు గుంటూరు జిల్లాలోని అల్లూరు కొత్తపట్టణమునకును, కొంటకోస్సల బందరువద్దగల ఘంటసాలకును, కొడ్డూర బందరువద్దనున్న్న గూడూరుకును, అల్లొస్గైని గోదావరీముఖద్వారమునకును సరియగుచున్నవి. ప్రాగ్భారతదేశమునందలి రేవులలో అరకాన్‌కు ముఖ్యపట్టణమగుత్రిలింగనగరమును, నయాంలోని కాకుళనగరమును, మలేద్వీపకల్పములోని సింహపురమును, బ్రహ్మపుత్రానదికిని అరకాన్‌కును నడుమగల పెంటపలిస్‌పట్టణము నాంధ్రదేశమునందలి శ్రీకాకుళమును, విక్రమసింహపురమును (Nellore) మోటుపల్లిని సూచించుచున్నవి. శాతవాహనులయొక్కయు బల్లవులయొక్కయు నాణెములపైనుండు నౌకాచిత్రములు విదేశీయసంబంధమును సూచనజేయుచున్నవి. ఈ విధమున నీసంబంధము దినదినాభివృద్ది నందినది.

అరకాన్ నయాందేశములలో వేంగీ చాళుక్యరాజులగు శక్తివర్మయొక్కయు, రెండవ రాజరాజుయొక్కయు నాణెములు దొరకుటచే క్రీ. శ. 12 వ శతాబ్దము వరకునుగూడ నాంధ్రదేశమున కీప్రాగ్భారతదేశములతో సంబంధముండినటుల దెలియుచున్నది. ఈ కాలమున నిట్టిసంపర్కమునకు లోనైన దేశముల చరిత్రము సంక్షేపముగా నీదిగువ వ్రాయబడుచున్నది.

(1) బర్మా :- బర్మాలోని పెగూతీరమునకు "కళింగ" మనియు, దాని కించుక బశ్చిమోత్తరముగనుండు భాగమునకు 'ఉత్కళ, మని యు నామములుండెడివి. ఈ దేశములో కృష్ణాగోదావరీ తీరస్థులు పెగూలోనికి వలసవచ్చిరని యొకగాథగలదు. బర్మాలోని 'త్రైలింగులు, త్రిలింగ దేశవాసుల సంతతివారైయుందురు. ప్రాచీన త్రైలింగభాషలో సంస్కృత పదములును, ఆంధ్రదేశ ప్రశంసయు గాంచనగుచున్నది. ఈత్రైలింగ్ లిపి క్రీ. శ. 4 వ శతాబ్దపు వేంగిలిపిని బోలియున్నది. ప్రోం జిల్లాలో క్రీ. శ. 1 వ శతాబ్దిలో నాంధ్రదేశమున లిఖింపబడిన శాసనముల లిపినిబోలు లిపిలో వ్రాయబడిన శాసనమొకటి గన్గొనబడినది. ఇచ్చటనే యొక బౌద్దస్థూపమునం దాంధ్రదేశపు తెలుగు కన్నడ లిపిలో వ్రాయబడిన మఱియొక శాసనమున్నది. బర్మాలోని పెగన్ (Pegan) లో బూర్వము రాజ్యమేలిన 'శాన్ లన్ క్రోం, (San Lan Krom) అను రాజు బర్మాలో బౌద్ధమతమును వ్యాపింపజేసెనని శాసనాలంకార మనుగ్రంథమునుండి తెలియుచున్నది. ఈ రాజు క్రీ. శ. 3-5 శతాబ్దములలో వేంగీదేశము నేలిన శాలంకాయనుల సంతతివాడనియు, నీవేంగీరాజులు బర్మాలో నొక రాజ్యమును నెలకొల్పి దమవంశీయు నొకనిని దత్పాలకునిగ నియమించిరనియు, బండితుల యభిప్రాయము.

(3) మలేద్వీపకల్పము :- ఇచటి తూర్పుతీరమునందలి 'లిగోర్‌' నగర మశోకుని వంశీయునిచే నిర్మింపబడెననియొక గాథగలదు. పల్లవవంశమునందొక యశోకుడు పేర్కొనబడియున్నాడు. అతడే యీ స్థాపకుడై యుండునేమో. సాల్మొనీయను పండితుడు లిగోర్‌నగరమునందలి హిందూశిల్పము ఎల్లోరా మహాబలిపుర శిల్పములను పోలునని వ్రాసియున్నాడు. స్వర్గలోక (Sanvan Kolak) మను మఱియొక స్థలమున దొరికిన కంచు ప్రతిమలకు, ఆంధ్రదేశమునందలి గుంటూరు జిల్లాలోని 'బుద్దాణీ, విగ్రహమువలె కోలముఖములును, స్ఫుటములగు కేశములును, చంద్రవంకలబోలు కన్బొమలును, కొక్కెమలవంటి ముక్కులును, నగు మోములును గలవు. (3) ఇండోచైనా :- ఇందలి వోకన్ [Vocon] అను చోట దొరకిన శిలాశాసనము రుద్రదాముని గిర్‌నార్ శాసనమును సర్వవిధముల ననుకరించుచున్నది. చంపా రాజ్యము [ఇప్పటి Annam] నేలిన మొదటి భద్రవర్మకు "దర్మమహారాజ" అను బిరుద ముండెడిది. ఇది యాంధ్ర పల్లవరాజుల బిరుదము. ఈ ప్రాంతమునందుండిన హిందూరాజ్యములలో పూనన్ [Funon] మఱియొకటి దీనిని స్థాపించి హిందూమతమును వ్యాపింపజేసిన కౌండిన్యుడను బ్రాహ్మణుడు ద్రోణాచార్యుని తనయుడగు నశ్వద్దామవద్దనుండి యొక యీటెనుగొని యీదేశమున బ్రతిష్ఠించెననియు, నిచట నొక నాగకన్యను వివాహమై రాజ్యభారమును వహించెననియు, క్రీ. శ. 579 నాటి యొక శాసనము దెల్పుచున్నది. ఆంధ్రపల్లవులలో చూతపల్లవుని కుమారుడగు వీరకూర్చవర్మ నాగకన్యనుద్వాహమై రాజ్యమును సంపాదించెను. ఈ పైకౌండిన్యునిగాథ యీ చారిత్రక విషయమునకు సరియగుచు, బల్లవుల కీ పూనన్ రాజ్యముతోగల సంబంధమును జూపుచున్నది. వేంగీరాజ వంశీయుల నామములగు చంద్రవర్మ, దేవవర్మ, జయవర్మయను నామము లీ పూనన్ రాజులకుగూడ గాంచనగుచున్నవి. చంపా రాజ్యమునను, కళింగదేశమునను గూడ ఇంద్రవర్మాభిరిధులగు రాజులు పెక్కుండ్రుగలరు. ఇండోచైనాలోని శాసనములన్నియు సంస్కృత భాషయందును, చాళుక్యలిపిలోను వ్రాయబడియున్నవి. వీనిలో శాలివాహన శకముగూడనున్నది.

(4) సింహళద్వీపము :- ఆంధ్రదేశమునకు ను సింహళ ద్వీపము [Ceylon] నకును సన్నిహితమగు సంబంధ ముండెడిది. దుత్తగామినియగు భిక్షు నాంధ్రదేశమునుండి బుద్దుని యవశేషములను సంపాదించి, దంతపురమున స్థాపించియొక స్థూపమును గట్టించెను. ఆసమయమున జరగిన సమావేశమునకు పల్లవ భోగమునుండి వేలకొలది భిక్షువు లేగిరి. ఈ పల్లవ భోగము నిప్పటి గుంటూరు మండలములోని పల్నాడు [పల్లవ - నాడు] తో బండితులు సమన్వయించియున్నారు. ఈ ద్వీపమున గుంటూరుజిల్లాలోని ఉండవల్లి గుహలవంటి గుహలుకూడ గలవు.

పైవిధముల భారతీయ నాగరికతను దేశాంతరములలో విస్తరించు నెడ నుత్తరాపథ దక్షిణాపథములు రెండును సమముగ బాల్గొనినవి. ఆఫ్‌గనిస్థానము, కాష్‌ఘర్, యార్‌కండ్, కోటాన్, టిబెట్, చైనా, జపాన్ దేశముల కుత్తరాపథమునుండియు, బర్మా, ఇండోచైనా, నయాం, మలేద్వీపకల్పము, జావా, బలి, సుమాత్రా, బోర్నియో, మొలక్కన్, సెలిబిస్ మున్నగు దేశములకు దక్షిణ హిందూదేశమునుండియు భారతీయ నాగరికత వ్యాపించినది. ఈ నాగరికతా విస్తరణమునందు బ్రాచీనాంధ్రులు విశేషముగ బాల్గొనియుండిరి. క్రీస్తుశకారంభమునుండి సుమారు పండ్రెండవ శతాబ్దమువరకునుగూడ భారతదేశము ఆసియాఖండమునందు సువిశాలమగు వైజ్ఞానిక సామ్రాజ్యము నేలుచు ప్రాచ్య ప్రపంచమున కధినేతయై యుండెను.