భారతి మాసపత్రిక/సంపుటము 8/జనవరి 1931/హరిద్వారము
Appearance
మిగుల రమణీయములగు నైసర్గిక సౌందర్యములకాలవాలములై ప్రతి సంవత్సరము లెక్కకు మిక్కిలిగ యాత్రికజనుల నాకర్షించు పుణ్యక్షేత్రములలో ప్రస్తుతము హరిద్వారము కూడ నొకటి. ఇది ఆగ్రా, అయోధ్యా సంయుక్త ప్రాంతమందలి షహర్ పూరు జిల్లాలో నొక ముఖ్యపట్టణము. గంగానది యొక్క దక్షిణ పార్శ్వమున గట్టబడియున్నది. ఇతిహాసమునకు గోచరముగాని మిక్కిలి పురాతనకాలమున నిచట కపిలమహర్షి వసించుచుండెననియు, నందుచే నీప్రదేశము కపిలమను పేర బరగుచుండెననియు నొక జనశ్రుతి కలదు. ఇప్పటి హరిద్వారపు రైలుస్టేషను కొకమైలు సుమారు దక్షిణముగ మాయాపురియు, మాయాదేవి మందిరమును ఉన్నవి. ఈ మాయాపురీమాహాత్మ్యములో హరిద్వారము గంగాద్వార మను పేర వ్యవహరింప బడియున్నది. క్రీ. శ ఏడవ శతాబ్దియందు భారతవర్ష భ్రమణార్థ మేగు దెంచిన హౌనుత్సి యాంగ్ అను చీనాదేశపు చరిత్రకారుడు అచట మోయూలో లేక మయూరా నామక నగరముండెననియు, దానికి బూర్వోత్తరముగ గంగాద్వారమను పేరుగల బ్రాహ్మణుల దేవాలయ ముండెననియు వ్రాసియున్నాడు. ఈతని మొయూలో మాయాపురమని తెలపబడుటచే దన్మాహాత్మ్యమున వర్ణింపబడిన లాగు అచట గంగాద్వార మనుస్థాన నుండెననుట స్పష్టము. హిమాలయపర్వతశ్రేణులందలి యగాధములగు లోయలగుండ బ్రహహించుచు వచ్చి గంగ ఇచటనే పర్వతావాసమును వదలి సమతలమును బ్రవేశించి యున్నది. డేరాడూను నగరము మొదలుకొని ఇంతవరకు వ్యాపించియున్న పర్వతసమూహము లన్నియు శివాలిక్ పర్వతములని పిలువబడుచున్నవి. కాని హరిద్వారము దగ్గర గంగకు వామభాగమున నున్న కొండలు చండీపర్వతములని కాని లేక నీలపర్వతములని కాని వాడబడుచుండును. ఇందులకు గారణము ముందు విశదము కాగలదు. వామదిశయందలి యీపర్వతములును, దక్షిణపార్శ్వమందలి శివాలిక్కుల అంతిమభాగములును బ్రహ్మాండములగు ద్వారబంధములుగ నేర్పడ నిచట నొక మహాద్వారముయొక్క ఆకృతియే కన్పించును. కావుననే ఈప్రదేశము గంగాద్వారమను సార్థకనామదేయము కలిగియుండును. కాని కాలక్రమమున నీపేరు మారిపోయి ముసల్మానుల ఆగమనానంతరము కావచ్చును హరిద్వార మను పేరు కలిగినది. ప్రస్తుతము శైవపక్షపాతులందరు దీనిని హరద్వారమని పిలుచుచుందురు. ఎందుచేతనన కేదారనాథ మనునది హిమాలయపర్వతపుణ్యక్షేత్రములలో నొకటి. ఇందలి ప్రధానదైవము కేదారేశ్వరమహాదేవుడు. ఈ క్షేత్రమునకు బోవలయుననిన నీమార్గముననే పోవలయును. కాబట్టి శైవులందరు హరద్వారమనుచుందురు. ఇక కేదారనాథమునకంటె నెక్కువ రాకపోకలుగల ప్రసిద్ధమగు బదరీ నారాయణమునకు బోవలసివచ్చినను ఈదారినే పోవలయును. కావున వైష్ణవులందరు హరిద్వారమని పిలుచుచుందురు. అదిగాక దీనికి స్వర్గద్వారమని వేరొక పేరుకూడ గలదు. ఇదియు దీనికి అక్షరశః సార్థకమనియే చెప్పనగును. సహజ సౌందర్యమున కావాసములైన హిమాలయపర్వతారణ్య ప్రదేశములన్నియు గేవలస్వర్గతలములేకాని వేరుకాదు. ఈకారణముననే మన ప్రాచీనులీ యుత్తరఖండమందలి పుణ్యభూములను స్వర్గసీమలనియు, దక్షిణఖండభాగములను పృథివియనియు నాకొనుచువచ్చిరి. ఈ ఖండద్వయమునకు సరిహద్దుగనుండినది స్వర్గద్వారము. కాని మహమ్మదీయులు వచ్చిన పిదప హరిద్వార మను పేరుగాంచి నేటివరకు నదియే వ్యవహరింపబడుచున్నది. కాళిదాసు మేఘదూతకావ్యములో యక్షునిద్వారా మేఘమునకు రామగిరినుండి అలకానగరమువరకు గల మార్గమును నిరూపించి వర్ణించు నవసరమున కనఖలపురమును మాత్రము బేర్కొనియున్నాడు. ఈ కనఖలపురము ప్రస్తుతపు మాయాపురము నంటుకొని గంగాతీరముననే మైలు మైలున్నర దక్షిణముగ వ్యాపించియున్నది. కాబట్టి మిక్కిలి ప్రాచీనకాలమున జనావాసయోగ్యములగు గృహములేమియు లేక కేవలము గంగాద్వారమనుపేర గుడియొకటి మాత్రముండెననుట స్పష్టము. కాని యా స్థలము చుట్టుప్రక్కల నొప్పు రమణీయ ప్రాకృతికసౌందర్యముచే ఆకృష్టులై సంసారవిముఖులైన యోగులు, తపస్వులు, మౌనులు లోనగు నేకాంతవాసాభిలాషులు వారివారి కనువగు ప్రదేశములలో పర్ణ కుటీరములు నిర్మించుకొని ధర్మాచరణములు సలుపుకొనుచు వచ్చిరి. ఈ మహాత్ముల దర్శించి వారి నుండి హితోపదేశములు బడయుటకై సాధారణ గృహస్థులే కాక సంస్థానాదీశులు, రాజులు, మహారాజులుగూడ వచ్చుచుండిరి. పుట:Bhaarati sanputamu 8 sanchika 1 jan 1931.pdf/152 పుట:Bhaarati sanputamu 8 sanchika 1 jan 1931.pdf/153 పుట:Bhaarati sanputamu 8 sanchika 1 jan 1931.pdf/154 పుట:Bhaarati sanputamu 8 sanchika 1 jan 1931.pdf/155 పుట:Bhaarati sanputamu 8 sanchika 1 jan 1931.pdf/156 పుట:Bhaarati sanputamu 8 sanchika 1 jan 1931.pdf/157
హరిద్వారము