Jump to content

భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/రుక్మిణీపతిశతకము

వికీసోర్స్ నుండి

పీఠిక

ఈశతకము రచించిన కవి దిట్టకవి రామయోగి దీక్షితులు. ఇతఁడు కాశ్యపగోత్రుఁడు. నందిగామ తాలూకా గొట్టుముక్కలనివాసి, చిరకాల మీకవి నూజనీటిలో నారయప్పారావు బహద్దరు వారి యాస్థానమునందుఁ బౌరాణికుఁడుగ నున్నటులఁ గవివంశీయులు చెప్పుచున్నారు. ఇక్కవి రంగారాయచరిత్రము రచించిన నారాయణకవిమనుమఁడు. ఈయనతండ్రి సుందరరామసూరి. తాత యాదవరాయకవి. జనకపితామహుల ప్రతిభావిశేషములు తెలియవు.

రామయోగికవి సంస్కృతమున నసాధారణపండితుఁడు. ఒకమా టీకవి తమ ప్రభువర్యునితోఁ గాంచీనగరమున కేగి యటనున్న మహాపండితులతో వ్యాకరణశాస్త్రమునఁ జాలదినములు వివదించి విజయ మంది బ్రహ్మరథము పీతాంబరసత్కృతి నూటపదియాఱురూపాయలు సభాసత్కారము సేలువులు బహూకృతి పొంది గృహాభిముఖుఁ డాయెనఁట. నాఁడు మొదలు నేఁటివఱకుఁ గాంచీనగరవాసులు ఆంధ్రులు విద్యావాదములలో గడుసరులనియు నెవరిచే జయింపఁబడని కాంచీనగరపండితుల నాంధ్రనియోగి జయించెననియుఁ జెప్పుకొనుచుందు రని కవి వంశీయులు చెప్పుచున్నారు. వ్యాకరణశాస్త్రపారంగతుఁడును పండితోత్తముఁడు నగురామయోగి రచించిన యీశతకప్రశస్తినిగూర్చి ప్రత్యేశముగా మేము చెప్పవలసిన దేమియు లేదు. ఇక్కవి సంస్కృతమునఁ బెక్కుగ్రంథములకు వ్యాఖ్యానములు మతవిషయికఖండనగ్రంథములు రచించెను. కవి తన యుత్తరవయస్సులోఁ దన గ్రంథసముదాయముతో మచిలీపురమునందు నివాస మేర్పఱచికొనెను. ఉప్పెన వచ్చుటచేఁ గవివ్రాసిన గ్రంథములన్నియుఁ జరాస్తియంతయు సముద్రార్పితమైనదనియు నెటులో దైవవశమున రుక్మిణీపతిశతకముమాత్రము బైటపడినదనియుఁ గవివంశీయు లెఱింగించిరి. మాకు లభించినరుక్ష్మిణీపతిశతకమాతృక కొండపల్లి పీచుకాగితములపై అగురుసిరాతో వ్రాయఁబడియుండెను. పుస్తకము ఒకటి రెండుమాఱులు సముద్రస్నానము గావించినటులె యుండెను. కొన్నిచోటుల వర్ణములు పద్యపాదములు చెరిగిపోయెను. కావుననే పూర్వగ్రంథములన్నింటికిఁ బ్రత్యంతరములు వ్రాసినలేఖకులు దీనిని ముట్టుకొనరైరి. ఇంక నుపేక్షించినయెడల నీపుస్తక మదృశ్యమగునేమో యని శ్రమ చేసి యథాశక్తిని శుద్ధప్రతిని సిద్ధపఱచి ముద్రణమున కొసంగఁగలిగితిమి.

ఈకవి వ్రాసిన రెండుశ్లోకము లొకజీర్ణపత్రముమీఁదనుండఁగ యథారూపముగ వ్రాసితిమి. ఈశ్లోకద్వయమువలన నీకవి సంస్కృతకవితానైపుణ్యము బోధ కాఁగలదు.

శ్లో.

మేమస్సర్వనీరదఘనాఘనతా ప్రసిద్ధి
స్సంపశ్య కేవలఘనం సరదం ప్రసిద్ధం
శ్రీనారయప్రభువరం సరదం ప్రసిద్ధం
సంపశ్య కేవలఘనం ముఖవర్ణభేదీ
మోఘోభవ త్యనుపమోహి సరాజవర్యః.


శ్లో.

విరాజతే తోకవిరాజిరాజతా
విభాకరే సంస్థితి మేతిహంసతా
సరాజహంస స్సమదీపి సర్వదా
సదాఖ్యయా నారయ భూపవర్యః.

ఈకవి కాంధ్రకవితయం దంతనైపుణ్యము లేదు. శాని సుప్రసిద్ధకవివంశజుఁడును పండితోత్తముఁడు నగుటచే నీశతకమును రామయోగి మనోజ్ఞముగ వ్రాసియున్నాడు. చిరకాలమునుండి మూలఁబడియున్న యీశతకము శుద్ధప్రతి వ్రాసికొనుట కిచ్చి ముద్రణమున కవకాశము కల్పించినఁ గవితమ్ముని కుమారు లగుదిట్టకవి సుందరరామయ్య శర్మపాకయాజిగారిని బ్రశంసించుట ధర్మము.

కవి రమారమి యేఁబది సంవత్సరములపై కాలమున నూజవీటిలో మరణించెను.

నందిగామ.

ఇట్లు భాషాసేవకులు,

1-4-25

శేషాద్రిరమణకవులు, శతావధానులు.

శ్రీరస్తు

దిట్టకవి రామయోగిప్రణీత

రుక్మిణీపతిశతకము

ఉ.

శ్రీకర సారవాగమృతశీకర చారుకలాకరాస్వచా
మీకరచేల భీకర సమీకరమాకర వారిజాత మై
త్రీకర పాదపల్లవసుధీనుతమానిత దీనమానవా
నీక రథాంగబంధురజనీకరలోచన రుక్మిణీపతీ.

1


చ.

జలధరనీలగాత్ర దనుజవ్రజకంఠఖనిత్ర కల్యవా
గలఘుసుపర్వరాణ్ణుతియుతాత్మవిచిత్ర చరిత్రవర్తులా
కలితకళత్ర పాపలతికాశితదాత్ర పతత్రినేతృప
త్త్ర లలితవక్త్ర సంకుమదరాజితచిత్రక రుక్మిణీపతీ.

2


ఉ.

బాల నిశాకరాకలితఫాల దయాసువిశాలలోలనీ
లాలకజాల గైరికసమంచితచేల తమాలభూమిజా
తాలలితాంగజాలపదయాన భవస్తుతశీల దేవతా
పాల విరోధికాల శిశుపాలవిషాలక రుక్మిణీపతీ.

3

ఉ.

దండితవైరితండహిమధామ సమంచితతుండవాజిరా
ట్కాండ విశాలకుండలయుగద్యుతిమండిత గండసుప్తవే
దండపిచండ సద్మగతదండక పాతకసంతమిశ్రమా
ర్తండ నమస్క్రియాపరసుధాశనిమండల రుక్మిణీపతీ.

4


ఉ.

భూసురవారతోష పరిపూర్ణసుధాసమభాష దేవతా
గోసముదాయపోష జితఘోరతరాద్భుతదోష భూషణో
ద్భాసితవేష దాసజనపంకజపూష చతుర్ముఖాదిశ
స్తాసమసన్మనీష విబుధాహితశోషణ రుక్మిణీపతీ.

5


ఉ.

అంగజరూపసన్నుతసితాంగ విహంగతురంగ సత్కృపా
పాంగరథాంగసంగ పరిపాలితదేవకదంబ మౌనిసా
రంగతమఃపతంగ కలుషాంగద భంగరథాంగభీతిమ
త్సంగరరంగఖండితనిశాకరపుంగవ రుక్మిణీపతీ.

6


ఉ.

దేవ మహానుభావ ఖనదీధరసన్నుతభావ దైత్యవి
ద్రావ భయానతౌఘగదదావ సమంచితభూరికంకణా
రావ ముఖాంబుజాతవిసరన్నయభావ కరాంగుళీధృత
గ్రావ దయాకటాక్షపరిరక్షితసేవక రుక్మిణీపతీ.

7


ఉ.

రక్షితనాగభాసురపరాగ భయంకరశౌర్యవేగసం

శిక్షితదైత్యపూగ మునిసేవితపాదపరాగ సత్కటా
క్షక్షణయోగ యోగబలఖండితకిల్బిషరోగ రాగర
క్తక్షపణానురాగ కృతదైవతభోగక రుక్మిణీపతీ.

8


ఉ.

రాజితతేజ గుప్తగజరాజమనోజ్ఞకళామనోజసా
మ్రాజబిడౌజ వక్త్రసదృశాంబుజరాజనికారిలోచనాం
భోజ దయాకటాక్షపరిపోషితగోపసమాజభక్తగో
భూజ గృహీతసర్వజనపూజ గదాగ్రజ రుక్మిణీపతీ.

9


ఉ.

కోమలనీలదేహ మునికుంజరనిర్మలచిత్తగేహ పు
త్రామితమోహ భక్తనివహాపదుషర్బుధవారివాహ ఘో
రామరవైరిదాహ విశదాననవాహవిపూరితవ్రజ
స్తోమలసత్సమీహ నతశోకతమోపహ రుక్మిణీపతీ.

10


చ.

చతురవచఃకలాప మణిచారుకలాప మనోజరూప స
స్తుతిపరమేరుచాప పరిశోధితదారుణపాపగోప దు
ర్మతిదురవాప ఘోరరివురాడ్తతిగర్వవిలోప శాపసం
హృతమునితాప భక్తజనహృత్కమలాతప రుక్మిణీపతీ.

11


ఉ.

పాతకకాననవ్రజనిపాతసుహేతి వినాశితామరా
రాతి మనోహరాకృతివిరాజితనాథవిచింతనప్రణ

త్తాతతభీతి వర్ధితపదాబ్జయుగాశ్రితమానవౌఘస
ద్భూతి ముఖాంబుజాతపరిభూతనిశాపతి రుక్మిణీపతీ.

12


ఉ.

విశ్వనివాస విశ్వకర విశ్వవిదూరక విశ్వవంద్య యో
శాశ్వత విశ్వరూప భవశాసననిర్మలనిర్వికార లో
కేశ్వర దేవదేవ నీను నెంతటివాఁడ నుతింప నోప త
త్ర్యశ్వపురాణపూరుష చిదాత్మనిరంజన రుక్మిణీపతీ.

13


ఉ.

బంగరుచేలగప్పి సదపాంగవిలోకనలీలనొప్పి న
వ్యాంగదముఖ్యభూషణసమంచితవేషముతోడఁ గూడి సా
రంగమునందుఁ బూని ననయంబున నాకు భవత్పదాంబురు
ట్సంగతి నీయఁ గోరెదను సారసలోచన రుక్మిణీపతీ.

14


ఉ.

దండము గోపయౌవతకదంబకుచస్థలపత్రలేఖనా
ఖండచమత్క్రియాంచితనఖక్షతచందిరఖండలాలిత
(?)త్కాండజలోచనావృతసకాశసుదేశలసత్కువేల స
త్తాండవవర్తి నేత్రయుగతామరసాంఘ్రిక రుక్మిణీపతీ.

15


చ.

దరదరవిందలోచన సుధారసభాసురహాసయోధరా
ధరధర దారితారి జనతారక తారపటీరహీరకుం
దరసమరాళగౌర యశతామరసోదరభక్తసాదరా

ఖరకరచారుతేజ భవకాననపావక రుక్మిణీపతీ.

16


ఉ.

తమ్ముల కెమ్మెచే మలినదమ్మగు నెమ్మొగమున్ గరమ్ము భ
వ్యమగుసొమ్ము కెంజిగురుటమ్ములవేలుపుటమ్మకున్ నివా
సమ్మగుఱొమ్ము నెమ్మిపురిసమ్మిళితంబగు వేణికుందదం
తమ్ములు గల్గుదేవ మిము దల్చెద నెమ్మది రుక్మిణీపతీ.

17


ఉ.

పాతకతూలసంహతికిఁ బావకకీల నిరంతరంబు కం
జాతభవాప్తబంధువునిశాకరకోటికిఁ జిత్తభీకరం
బాతతభూతసంతతుల కానగణింపఁగ నీదునామమౌ
రా! తలఁపంగ రక్తకజరాజితపాదక రుక్మిణీపతీ.

18


ఉ.

వందన మాచరింతు సురవందితసుందరపాద దేవకీ
నందన భక్తచందన సనందముఖస్తుత మామనోకజేం
దిందిగ మందహాసమునఁ దీరగుతావకవక్త్రకంజ మిం
పొందఁగఁజూపు మీకనుల నొప్పుగఁ జూచెద రుక్మిణీపతీ.

19


ఉ.

సంచితపుణ్యరాశి యగుచంద్రనిభానన నీవు గల్గఁగాఁ
గొంచెపుదేవతాతతులఁ గొల్తురు ధీబలహీనతన్ బయో
దంచితగాంగసైకతమునందు జలార్థము ద్రవ్వులీల స
త్కాంచననూపురోల్లసితకమ్రపదాంబుజ రుక్మిణీపతీ.

20

ఉ.

భక్తచకోరజాలపరిపాలనచంద్ర ధురావహంబులై
దిక్తటసంచరద్రుచుల దీప్తములౌ భవదీయపాదసు
వ్యక్తనఖాంకురంబు లనయంబును మామకచిత్తవీథి సం
సక్తత నొందఁజేయఁగదె సారసలోచన రుక్మిణీపతీ.

21


ఉ.

నందునియందు నాద్రుపదనందినియందు యశోదయందు నా
మందలయందు మౌనిజనమండలమందును భీష్మునందు నే
చందమునన్ గనంబడెనొ చక్కనిమీకరుణాకటాక్ష మా
చందము నమ్ము దైచ్ఛికము సల్పుము నీ విఁక రుక్మిణీపతీ.

22


ఉ.

శంకరమిత్ర నీచరణసారస మాత్మ నిరంతరంబు ని
శ్శంకఁ దలంచువారల కసాధ్య మొకించుక లేదటంచు నే
భాంకరణంబుమీఱఁగ శుభంకరభేరిగజంబు నెక్కి యా
తంకము లేక సాటెదను దారగుణాకర రుక్మిణీపతీ.

23


ఉ.

కోరితి మీపదాంబుజము కూరిమిచేఁ బరదేవతాతతిన్
జేర నదెట్లటన్న; మదసిక్తమతంగజగండమండలీ
చారుతరస్థితిం బరగుషట్పద మొందును గాక యుజ్జ్వల
త్సైరిభ మొందునే వికచసారసవాసన రుక్మిణీపతీ.

24


ఉ.

మిమ్ముల నమ్ముకొంటి నిటమీఁద మఱెవ్వరి వేఁడనంటి మీ

తమ్ముల గేరునెమ్మొగ ముదంచితరీతిని జూపుమంటి నా
సొమ్మును నీవ యంటి మధుసూదన న న్గరుణింపుమంటి నా
నెమ్మది మీపదాబ్జముల నిల్పుమటంటిని జానకీపతీ.

25


చ.

గజపతిఁ బ్రోచినాఁడవని కామిని కోర్కు లొసంగితంచు స
ద్విజుని గుచేలు నేలితనివించు భవచ్చరణంబు వేఁడితిన్
భజనముజేయువారలఁ గృపామతిఁ బ్రోచెడి తండ్రి పాతక
వ్రజము లడంచి బ్రోవఁగదె పంకజలోచన రుక్మిణీపతీ.

26


ఉ.

చల్లడమున్ జెఱంగు నిరుచక్కిఁ జెలంగెడుగట్టిజాళువా
పిల్లనగ్రోవి ముత్యములపేరును మేల్మొలనూలు మించులన్
గల్ల యొనర్చు కుందనపుఖండువ యొప్పఁ గళిందజాతటిన్
సల్లలితప్రచారములు సల్పినదేవర రుక్మిణీపతీ.

27


చ.

పరమపవిత్రతావక సుపాదసరోజపరాగరాజి సం
వరణధురీణతామహిమ భాసిలు గోపకుమారపేటికా
స్ఫురదురుభాగ్యరేఖల సమున్నతిఁ బెంపు నుతింప శక్యమే?
హరిహయహేమగర్భనిటలాక్షులకైనను జానకీపతీ.

28


ఉ.

పంకజనేత్ర మీపతితపావననామసుధారసంబు ని
శ్శంకత నాను సత్పురుషసంతతి కెంతపనుల్ పరేతరా

ట్కింకరచక్రవాళకముగీ టడఁగించుట మోక్షలక్ష్మీచే
సంకలితత్వ మొందుటయు సారసలోచన రుక్మిణీపతీ.

29


ఉ.

శక్ర విరించి శంభునుతి చక్రవిరాజిత భూరిభూష ని
ర్వక్రపరాక్రమక్రమ నివారితవైరిభవల్లసత్కరో
పక్రమణప్రభావము గృపామతి మాకు నొసంగుమయ్య యో
నక్రవినాశ సంతుషితనాగకులాధిప రుక్మిణీపతీ.

30


ఉ.

నెమ్మది నమ్ముకొంటి శయనీకృతవేషఫణామణిప్రభా
సమ్మిళితాత్మదేహరుచిచక్రవిడంబితగోత్రభిధ్ధను
స్సమ్మహితాంబువాహ విలసద్ద్యుతితావకదివ్య పాదప
దమ్ములు భక్తమానవుల దాపుడుసొమ్ములు రుక్మిణీపతీ.

31


ఉ.

దండము దేవదేవ హరి దండము కుండలదీప్తిసమ్మిళ
ద్గండ మహాత్మ యోవికచకాండజలోచన యోముకుంద యో
దండితరాక్షసప్రకరదండము దండము దండమయ్య యో
కుండలితల్ప మంజురుచి కోమలవిగ్రహ రుక్మిణీపతీ.

32


ఉ.

నీరధిలోన భూరితరనిర్మలనైజరుగావళుల్ మహా
చారుత మీఱఁజొచ్చి ఘనసారసమేతమదోత్కటత్రయీ

చోరక సోమకాసురనిషూదనతన్ దొలుపల్కులోలిమై
వారిజగర్భు నందిడినవారిచరాత్మక రుక్మిణీపతీ.

33


ఉ.

కవ్వము గాఁగ మందరనగంబు భుజంగమరాజు రజ్జుగా
నివ్వటిలం బయోదధి ననేకసురాసురకోటి మొత్తమై
క్రొవ్వునఁ ద్రచ్చుచుం; బిదపఁ గొందల మందఁగ నద్రి కూర్మతన్
నివ్వెఱఁగొందఁ దాల్చి కరుణించితి వారల రుక్మిణీపతీ.

34


ఉ.

భీకరసూకరాత్మకత బిట్టదరంగ నజాండభాండముల్
వీఁక ధరిత్రిజుట్టి యతివీరు హిరణ్యవిలోచనున్ మహో
ద్రేకముతో విఘాతమొనరించి విషాణమునందు నీధరన్
జోక యొనర్చి పూని మునుచొప్పున నుంచితి రుక్మిణీపతీ.

35


చ.

పటపటలీనఁ గంబమున బల్విడి వెల్వడి శాతహేతి ను
త్కటనఖరాగ్రఘాతకలధౌతకశిప్వరివిగ్రహాంత్రసం
ఘటితశిరోధివై విబుధకంటకసూతిని బ్రోచి తీవె కా
పటునరసింహరూపత సుపర్వులు మెచ్చఁగ రుక్మిణీపతీ.

36


ఉ.

వేదపురాణశాస్త్రముఖవిద్య నమేయత దేవతావనా
పాదనమంచు వామనత బాగుగఁ బూని పదత్రయంబు స
మ్మోదముతోడ దైత్యకులముఖ్యు బలీంద్రుని వేఁడి లోక మ
త్యాదరణంబునన్ బలికి నర్పణ జేసితి రుక్మిణీపతీ.

37

చ.

పరువడి రాజసంఘములఁ బట్టి కఠోరకుఠారధారతో
నిరువదియొక్కమాఱు వధియించి భయంకరతత్తనూత్కరో
త్సరదురురక్తపూరదివిషన్నదిఁ బైతృకతర్పణంబు నిం
పరయఁగఁ జేసి భార్గవత భాసిలితౌగద రుక్మిణీపతీ.

38


ఉ.

దేవత లుబ్బఁగాఁ బితృనిదేశమునన్ బహుజంతుసంతతో
గ్రావని కేఁగి యం దనుచరాయితవాయుసుతుండవై లస
ద్రావణకుంభకర్ణముఖరాక్షసవీరవినాశనంబు స
ద్భావతఁ జేసి రాఘవత భాసిలితౌగద రుక్మిణీపతీ.

39


చ.

హలహతిచేఁ గళిందతనయాపరిభేదన మాచరించి దో
ర్బల మలరంగ దుష్టమతి బాలిశధేనుకముష్టికాసురా
విలయ మొనర్చి లోకముల విశ్రుతిఁ జెందిన యోగ్రసాధనా
కలితకరుండవై బలతఁ గాంచినదేవర రుక్మిణీపతీ.

40


ఉ.

సుందరరూపలౌ త్రిపురసుందరులన్ వరియించి బౌద్ధతన్
బొంది రయంబున ద్రిపురపూర్వసుపర్వులఁ జంపునప్పు డా
చందురుదాల్చుదేవరకుఁ జాపశరాసన సాధనంబు లా
నందము మీఱఁగా నని నొనర్చితివౌగద రుక్మిణీపతీ.

41


చ.

తురగము నెక్కి ఘోరతరదుష్కృతసాంద్రమలీమసంబునౌ

తరతమతావిహీనభువి దార్కొని చేత నసిన్ ధరించి స
త్వరతఁ దురుష్కసంతతి హతం బొనరించి బుధావనంబుచేఁ
బరగినకల్కిరూపమున భాసిలుదేవర రుక్మిణీపతీ.

42


ఉ.

మీఱు మనోజుమేనిపస మీఱు సొబంగులతీఱు ముత్తెపుం
బేరుసదీడితవ్యమగుపేరు మతంగజచారుయానమున్
దూరు నొయారినెన్నడ; విధున్ రుచిగేరుమొగంబు సౌరునున్
వారిజజాదిరక్ష గలవారుగదా హరి రుక్మిణీపతీ.

43


ఉ.

వాసవుఁ డల్కమీఱి జడివాన మహాశనిసంయుతంబుగాఁ
జేసిన గోపకుల్ భయము జెంది పరుంగును నొందఁ గందుకా
భ్యాసకలీలఁ గేల గిరివర్యము బూని సమస్తబంధుతన్
వేసటఁ దీర్చి కాచితిని వేగ జనార్దన రుక్మిణీపతీ.

44


ఉ.

ఘోరదరిద్రతాభరవిఘూర్ణితమానసుఁడౌ కుచేలుఁ డా
దారి వచింపఁగా భవదుదంచితపాదసరోజచింతనా
గౌరవ మొప్పఁ గాచి పిటకంబులు చేరెడు దెచ్చినన్ మహేం
ద్రోరుపరార్థసంపదల నొందఁగఁ జేసితి రుక్మిణీపతీ.

45


ఉ.

వేణునినాదవిశ్రుతిని వ్రేతలమానసముల్ హరించి యా
జాణలఁ జిత్తభూపరవశత్వయుతాత్మలఁ జేయుచున్ విని

ద్రాణమనోజకేళికల రంజిలఁజేసిన మీకథాసుధన్
మానసపాత్రమందు నియమంబుగ నానెద రుక్మిణీపతీ.

46


ఉ.

ముద్దియలెల్ల మొఱ్ఱలిడ బుద్ధులు సెప్ప యశోద ఱోట ని
న్నొద్దికమీఱఁ గట్ట మదినోడక వేఁగొని తెచ్చి దాని బ
ల్మద్దుల రెంటిమధ్యను నమర్చి యగల్చిన వేల్పుపెద్ద నీ
సుద్దుల నెన్న రద్దు లజశూలిమహేశులు రుక్మిణీపతీ.

47


ఉ.

నమ్మను నెమ్మనంబున ననాథజనావన నిన్ను మిన్న నే
నిమ్మహి నన్యదైవముల నెన్న నమందమరందబిందుజా
లమ్ముల నొప్పు నవ్యకమలంబున సమ్మద మొందుతుమ్మెదల్
క్రమ్ముకొనంగ నేర్చునె వికర్తనమందున రుక్మిణీపతీ.

48


చ.

కరమున పాదపద్మము ముఖంబునఁ జేర్చి పయఃపయోధి ని
ర్భరరమణీయలీల వటపత్రముపై శయనించి యోగమా
ర్గరతిని సర్వలోకతతిరక్షణమందున జాగరూకతం
బరగిన దేవదేవ నను బాగుగ నేలుము రుక్మిణీపతీ.

49


ఉ.

ద్రోణసుతప్రయుక్తఖరరోపముచే హతినొంది కుంది ని
స్త్రాణకుఁడై జనన్యుదరసంగతుఁ డాయభిమన్యుసూతి ని

ర్వాణఫలప్రదాత యదువర్ధన కృష్ణ ముకుంద యన్యనిన్
జాణతనంబునన్ వినుతి సల్పినఁ గాచితి రుక్మిణీపతీ.

50


ఉ.

వ్రేతలచేలముల్ మిగులవేడుక మ్రుచ్చిలితెచ్చి వారి న
త్యాతతమానభంగమున నానతశీర్షలఁ జేయుచున్ మనో
జాతనికేతనంబులకుఁ జాటుగనుంచ కపాలమందునన్
జేతులు మోడ్ప వస్త్రములు శీఘ్రత నిచ్చితి రుక్మిణీపతీ.

51


ఉ.

చిన్నతనంబునన్ విసపుచేవునఁ బాలనొసంగుపూతనన్
మన్నిగొనంగఁజేసితివి మద్దులఁ గూల్చితి బండి సాకునన్
భిన్నము గాఁగఁ దన్నితి వభీరుత నీచరితంబు నెన్నఁగాఁ
బన్నగభూషణుండయినఁ బాల్పడ నేర్చునె రుక్మిణీపతీ.

52


ఉ.

కొన్నిదినంబు లజ్ఞతను గొన్నిదినంబులు శైశవంబునన్
గొన్నిదినంబు లంగనలకూరిమినిన్ మఱికొంతకాల మ
త్యున్నతచింతచే వగలనొందుచు నుందురుగాక నెన్నఁగా
నెన్నఁడు మీపదాబ్జముల నెన్నరు మూర్ఖులు రుక్మిణీపతీ.

53


ఉ.

నీవె ధనంబు బంధుఁడవు నీవె సఖుండవు నీవె తల్లియున్
నీవె గురుండు దాతయును నీవె శరణ్యుఁడవంచు నెమ్మదిన్
దేవరవారిపాదములు దిక్కని నమ్మితి నింకనైన నన్
గావుము దేవదేవ హరి కంజవిలోచన రుక్మిణీపతీ.

54

ఉ.

బంధువు లేమి చేయుదురు భార్యయుఁ దల్లియుఁ దండ్రియైననున్
బంధురసత్కృపామతి శుభంబు మఱేమి యొనర్తు నుగ్రనీ
రంధ్రపరేతరాట్కృతదురాపద లొంద భవత్పదాబ్జసం
బంధమెతక్క నన్యసదుపాయము గల్గునె రుక్మిణీపతీ.

55


ఉ.

పాణితలంబునందు మృదుభవ్యనినాదతరంగయుక్తమౌ
వేణువు వేణియందుఁ బరివీతములైనమహాశిఖండముల్
నాణెపుముక్కుముత్తెము గనంబడ నందునిమందయందునన్
జాణతనంబు మీఱ రతిసల్పినదేవర రుక్మిణీపతీ.

56


ఉ.

కందసమానగాత్ర పరకందఖనిత్ర మునీశకీరమా
కంద మురారి శౌరి హరి కందళిత ప్రథితార్ద్రభావుక
స్కందకుమారగీతయశకందర రక్షితగోసమూహ మా
కందము జూపు మీప్రజలకందఱకున్ గతి రుక్మిణీపతీ.

57


ఉ.

పంకజపత్రవారివిధి పారదభంగి నిరంతరంబు నా
తంకయుతంబునై వగలఁదాల్చు శరీర మనిత్యమం చెదన్
గొంకక మీపదస్మృతిని గోరినవారలకున్ బరేతరా
ట్కింకరభీతిఁ జెందదఁట కృష్ణ మురాంతక రుక్మిణీపతీ.

58


ఉ.

ఏమితపంబు చేసెనొ కరీశుఁడు నందుఁడు పూర్వజన్మమం

దేమిమహావ్రతంబు జను లెంచఁగఁ జేసెనొ గోపకౌఘ మే
మేమి యొనర్చినో యవియు నెన్నికఁజేయ విరించిశంభుసు
త్రాములశక్యమే హరిణతామరసేక్షణ రుక్మిణీపతీ.

59


ఉ.

శ్రీస్తనభూరిభూమిధరసీమల నండలనుండి సర్వలో
కస్తవనీయవైభవము గాంచి ఘనత్వనిరూఢి నొందు కృ
ష్ణస్తనయిత్నుతల్లజమనన్ సుఖజీవన మొందఁజేయు మో
కౌస్తుభరత్నజంభరిపుకార్ముకశోభిత రుక్మిణీపతీ.

60


ఉ.

మాధవ శౌరి శార్ఙ్గి వనమాలి మురారి మనోజ్ఞహారి ని
ర్భాధవిహారి చక్రి హరి భావుకశీలి ఘనాభమూర్తి పృ
థ్వీధరధారి పత్రిపతివీతి సుధీరచితామితస్తుత
స్వాదుతరాకృతీ విబుధజాలకృతానతి రుక్మిణీపతీ.

61


ఉ.

కొంకక కృష్ణకృష్ణ యనుకోరికకున్ మతిబుట్టునట్లుగా
శంక యొకింతలేక మురశాసన! మీ పదపద్మ మాత్మలో
సంకము గాఁగఁ జేయ నిసితాంగతురంగుని దూరుచుందు! న
న్నింక భవత్ప్రసాదమున నేలుము దేవర రుక్మిణీపతీ.

62


ఉ.

బాలత నాయశోదచనుబాలు రయంబున నానుచున్ విలో
లాలకజాలమాంద్యమున కందము లీనఁగ సూపసక్తజం

బాలముతోడ నందునినివాసము ముంగిట నాడుచుండుగో
పాలకవేషధారివగు బ్రహ్మమ వీవవు రుక్మిణీపతీ.

63


ఉ.

ఏకమతిన్ భవత్స్మరణ మెప్పుడు జేయక యంతమందునన్
బైకొని కాలకింకరులు బాధలు పెట్టెడికాల మబ్బినన్
శోకము నొందినన్ గలదె చోరత బూని తుదిన్ నిబద్ధుఁడై
కాకలనొంద నేమిటికిఁ గంజవిలోచన రుక్మిణీపతీ.

64


ఉ.

బంధురసత్కృపామతిని బంకజలోచన మీపదాబ్జసం
బంధిని జేసి న న్నితరబంధములన్ విడఁజేయుమయ్య! యీ
దంధన మేలనయ్య! ఫలదాయక! నాయక నీవె దిక్క యో
కంధరనీలవర్ణ నను గావుము వేగమె రుక్మిణీపతీ.

65


ఉ.

ఆడుచు గోపకామినులయంబరముల్ మఱపించితెచ్చి బల్
పోఁడిమి మీఱఁగా గుబురుపొన్నల నెక్కినదేవదేవ నన్
వేడుక మీఱఁగా నెపుడు వీడక నేలుము పూర్ణతారకా
రాడమలాస్యకృష్ణ యదురాజశిఖామణి రుక్మిణీపతీ.

66


ఉ.

అన్యుల వేఁడఁ దావకపదాబ్జమె మా కిఁకఁ దోడునీడఁగా
ధన్యత నొందువాఁడ మిము దల్చుమహాత్ముల వీడ దుష్టరా

జన్యులఁ జూడఁ గామ్యముల సౌఖ్యపుజాడలఁ గూడ సన్నస
ద్ధన్యుల కాపదంబునిధి దాఁటఁగ నోడవు రుక్మిణీపతీ.

67


ఉ.

వేసటఁ జెంది వేసములు వేయివిధంబులుగా నొనర్చుచున్
వీసముడబ్బుచొప్పునను విత్తములక్ష గడించినన్ దుదిన్
గాసును వెంటరాఁగలదె కాండజనేత్ర గణించినన్ భవ
ద్భాసురపాదభక్తి వసువారముదక్కువ రుక్మిణీపతీ.

68


చ.

పిలిచినఁ బల్కవేమిటను బేదలపాలిటి దైవరాయ నిన్
గొలచెద నింకనైన ననుగూరిమి నేలుము నేలవేనియున్
బలుచందనంబు నీకు నిదె పాల్పడకుండునె లోకమందునన్
బలుచల మేల నాపయిని పంకజలోచన రుక్మిణీపతీ.

69


ఉ.

సుందరఫాలమం దిడిన చొక్కపుఁగస్తురిచుక్కయందు నం
దందు నుయాలలూగుచు సమంచితకాంతిని రావిరేక చె
న్నొందఁగ నందమందిరమునొద్ద నమందముగా యశోద నా
నందముఁ జెందఁజేయు యదునాయక కేశవ రుక్మిణీపతీ.

70


ఉ.

ఆసలఁ జెంది విత్తముల నన్యుల కీయక యంత్యమందునన్
గాసును జెందలేక నరకంబుల నొంది తపించుచుంద్రు నీ
దాసులునై నిరంతరపదద్వయభక్తిఁ జెలంగువారికిన్
వేసట లేల చెందు యదువీరశిఖామణి రుక్మిణీపతీ.

71

ఉ.

భూతికి ధాతవై స్థితివిభుత్వము నొందఁగ నచ్యుతుండవై
ఘాతము నొంద శూలివయి గణ్యత నొందుసమస్తరూపునిన్
మాతరమా నుతింప నిను మాధవ నీపదపంకజద్వయిం
జేతులు మోడ్తు నింక నను జేకొని కావుము రుక్మిణీపతీ.

72


చ.

పరువులు గోరి విత్తముల పాలిటి యాసల నొంది మోహసం
వరణముచేత చిక్కుపడువ్యర్థపునాదుమదిన్ భవత్పద
స్మరణముచే నిరంతరము సద్గతి నొందఁగఁజేయుమయ్య యో
సురవరమౌనిజాతనతశోభితపద్యుగ రుక్మిణీపతీ.

73


చ.

క్రతుశతముల్ మనోహరముగా నొనరించిన సంతతంబు సు
వ్రతము లొనర్చినన్ సురతరంగిణిగాహన మాచరించినన్
గొతుకక మీపదంబులను గొల్చుటకున్ సమమౌనె యెన్నఁగా
నతసురమౌనిజాల నిను నమ్మితి నెమ్మది రుక్మిణీపతీ.


చ.

సరసిజనేత్ర మీకథలు సైపక దుర్మతికర్ణవీథి దు
స్తరతరఘంటికారవము సల్పిన రాక్షసవీరు మున్ను స
త్కరుణ దలిర్ప నేలితివి కారుణికోత్తమ తావకీనప
త్స్మరణ యొనర్చువారలను సాకుట కష్టమె రుక్మిణీపతీ.

75


ఉ.

అష్టమిరోహిణీభమున నంచితలీలల రోహిణీసుద
త్యష్టమగర్భమందున రయం బమరన్ జనియించి లోకసం

తుష్టిగ దుష్టకంసు నని దున్మి యవక్రపరాక్రమంబునన్
శిష్టజనావనం బెలమిఁ జేసినదేవర రుక్మిణీపతీ.

76


ఉ.

ధీరదయాసరిద్వర సుధీరచితస్తవ మౌనిచిత్తకా
సారసితాంగ చారుతరసారసలోచన భక్తవారమం
దారధరాధరోద్ధరణ తారకరాడవ హేలనక్రియా
పారగతాస్యమండలశుభంకర కేశవ రుక్మిణీపతీ.

77


ఉ.

మీచరణంబులన్ మదిని మేలొదవన్ బచరించువాని కు
గ్రాపద లేల చెందును బుధావన లోకవిలోచనార్చిసం
దీపన మొందఁ; జీఁకటు లతిత్వరితంబునఁ గాక నిల్చునే
పాపవిదూర కృష్ణ హరి పంకజలోచన రుక్మిణీపతీ.

78


ఉ.

పాపము నొందువేళఁ బరిపంథిభయంబగువేళ భూరిఘో
రాపద లబ్బువేళ వికచాంబుజలోచన నీవు భక్తహృ
త్తాపములన్ మరల్చి నిరతం బవనం బొనరింతువందు రో
తాపసచిత్తగేహ యది తథ్యము సేయవె రుక్మిణీపతీ.

79


ఉ.

ప్రాణభయంబుచేనయినఁ బాపసమాగమచింతనైన ని
స్త్రాణముచేతనైన సుకృతప్రతిపత్తినినైన సద్విని
ద్రాణమనంబుచే మిము నిరంతర మెవ్వఁడు సంస్మరించు నా
జాణ భవత్పదాబ్జముల చక్కి వసింపఁడె రుక్మిణీపతీ.

80

ఉ.

మిమ్ములఁ గొల్చి నమ్మి మనుమేటి భవాభియుతాత్ముఁడైన గ
ర్మమ్ములఁ జెందఁ డెట్లన నమందనిషత్పరసంస్థమైననుం
గుమ్మరపుర్వు పంకమునఁ గుందునె నెమ్మది నెంచిచూడఁగా
నిమ్మహి దేవదేవ రజనీశవిలోచన రుక్మిణీపతీ.

81


ఉ.

దీనశరణ్య కృష్ణ నతదేవముకుంద మహానుభావ దు
ర్దానవగర్వసంహర మదావళరక్షక యంచు మిమ్ములన్
మానసమందు వేఁడిన నమందదయామతితోడ ద్రౌపదిన్
మానము గాచి దుర్దశల మాన్పితివౌగద రుక్మిణీపతీ.

82


ఉ.

నిత్యనిరాదిమధ్యలయ నిర్గుణవిశ్వనివాసవేదసం
స్తుత్యదయాప్రభావభవతూలధనంజయసర్వభూతసం
భూత్యురువర్తనాంతకరభూతపతిప్రముఖావిచింత్య యో
ప్రత్యయరూప నిర్మల నిరంజన మాధవ రుక్మిణీపతీ.

83


చ.

కరమనురక్తి మీచరణకంజము లాత్మదలంచువారికిన్
సురుచిరమోక్షసంపదలు చొప్పడు టేమి విచిత్రమౌ భవ
చ్చిరతరవైరభావమును జెందియుఁ జైద్యముఖావనీపతుల్
పరమపదంబు గైకొనరె పంకజలోచన రుక్మిణీపతీ.

84


ఉ.

దండము కృష్ణ నీకు యమదండన మింకిటఁ జేరనీకు నీ
దండయె రక్షరేకు హరిదాసుని నన్ విడఁబోకు మోపత

త్కాండచయాపరాకు భవకాననసంస్థితి బల్ చికాకు వే
దండమురీతి నాకిఁక ముదం బొనరింపుము రుక్మిణీపతీ.

85


ఉ.

చక్రముఖామరుల్ వినుతి సల్పఁగ నట్టె యపారసత్త్రియన్
జక్రముఁ జేతఁ బూని రభసంబున నక్రము సంహరించి ని
ర్వక్రవికాస ముప్పతిల వారణనాథునిగాచుసత్కృపో
పక్రమ దేవదేవ హరి పంకజలోచన రుక్మిణీపతీ.

86


ఉ.

శారద మేఘపార్వణనిశాకరపారదశారదానిలా
హారతుషారకుందశరహారశతారకతారతారమా
రారివరామరేభరజతాద్రిపటీరసమానకీర్తిసంపూ
రిత దిగ్విభాగసురపూజిత కేశవ రుక్మిణీపతీ.

87


ఉ.

ఓయదునాథ కృష్ణపురుహూతముఖామరవంద్య చక్రి నా
రాయణ వేదవేద్య కరిరక్షణ కేశవ శౌరి ఘోరదై
తేయసమూహభంజన సుధీనుతమాధన దేవదేవ ప
ద్మాయతనేత్ర హాటకసమంచితశాటిక రుక్మిణీపతీ.

88


ఉ.

దాసచకోరచంద్రహరితామరసేక్షణ భూరివాసఘో
రాసురవారసంహర దయాకర కేశవ చిన్మయాత్మ కం
జాసన పాకశాసనముఖామరవంద్య నిరంజన స్వభూ
భాసురరూపచక్ర మురభంజన శ్రీధర రుక్మిణీపతీ.

89

ఉ.

బోటులతోడ నాటపరిపూర్ణవికాసముతోడ నాడుచున్
జాటున కేగి కన్నుఁగవఁ జక్కఁగ గీటుచు మాటిమాటికిన్
నీటు దలిర్ప గోపరమణీమణిపంక్తుల వెన్నదొంగవై
బూటక మొంద దేవ హరిపుణ్యపురాతన రుక్మిణీపతీ.

90


ఉ.

మామనవిన్ మదింగొనుము మామతసంస్తుతశీల పూర్ణిమా
మారుచిరాస్య శౌరి హరి మామనసప్రదదానలోల హే
మామలచేల కృష్ణ యసమామహితప్రథితప్రభావ మే
మా! మిము సన్నుతింపఁగను; మామకదైవమ రుక్మీణీపతీ.

91


ఉ.

హార మనోజ్ఞసంవిదుపహార మదాంధసురారివారసం
హార సమస్తహేయపరిహార విరించిపులోమజేశ మా
హా రమణాశ్వసన్నుతవిహార సుశోభితవత్సభాగ నీ
హారమయూఖవక్త్ర హరి యంచితనామక రుక్మిణీపతీ.

92


చ.

పరుసము సోకి లోహము సువర్ణతఁ జెందునటుల్ భవత్కథా
విరచిత మైనపద్య మది విశ్రుతమూఢజనోక్తమైననున్
సురుచిరమై చెలంగి పరిశుద్ధసువర్ణతఁ బొందకుండునే?
పరువడి వించినన్ వికచపంకజలోచన రుక్మిణీపతీ.

93


చ.

పరమమునీంద్రవంద్య మురభంజన కృష్ణ హరీ ముకుంద మం
దరధర దీనరక్షక సుధారసభాషణ చంపకోత్పలా

ప్తరుచిరమాధురీభరితభాషితభాసితసూనమాలికా
విరచితపూజ గైకొనుము వేగ జనార్దన రుక్మిణీపతీ.

94


ఉ.

కొందఱు నిర్గుణుండనుచుఁ గొంద ఱమేయగుణుండవంచు ని
న్నందురు నందు నిందు ననయంబును నిశ్చితబుద్ధి లేనిమ
మ్మందఱయోగ్యమార్గముల నందఁగఁజేసి భవత్కృపాయుతిన్
మందతఁ బాపి బ్రోవుమ రమాధిప కేశవ రుక్మిణీపతీ.

95


ఉ.

మాయను గూడి లోక మసమాయనవైఖరి గూర్చి యబ్బయ
మ్మాయనుమాయనున్ వచనమా యన యాయనయన్ మొదల్గర
మ్మాయను నాదిగాఁగఁ బదమంజరియున్ నిఖిలార్థజాతమున్
మాయనె పెంచి యంతయును మాయఁగఁ జేసిన దేవ నీపయిన్
మాయనురక్తి నేర్పరుపుమా యని వేఁడెద రుక్మిణీపతీ.

96


ఉ.

ఏమని యేర్పరింతు మది నేమని పాడుదు యుష్మదీయమా
యామహిమంబుఁ గన్గొనఁగ నంబుజజన్మశచీపతీశము
ఖ్యామరరాజికేనియు నగమ్యము విస్తృతఘోరపాతక
స్తోమ మడంచి నన్ను దయఁజూడుము కేశవ రుక్మిణీపతీ.

97


ఉ.

కృష్ణ ముకుంద శౌరి హరి కేశవ మాధవ వాసుదేవ చం
ద్రోష్ణకరాంబకప్రకలితోరువిచిత్రచరిత్ర భూరిరా

జిష్ణువిహార నందసుత సేవకరక్షక దేవదేవ స
త్కృష్ణ సుమంగళాంగ హరి గీష్పతిసన్నుత రుక్మిణీపతీ.

98


ఉ.

గోపకగోపికాజనము గోపదరీతిభవాబ్ధి దాఁటఁగా
నోపికతో భజించుభువనోద్భవశోభనపాదయుగ్మమున్
బాప తమఃపతంగదశ పాల్పడ మామకమానసంబునన్
జూపఁగదయ్య యోభువనసుందరరూపక రుక్మిణీపతీ.

99


ఉ.

యోగము లెన్మిదింట నవయోగము చెందఁగనీక చక్రసం
యోగఫణీంద్రమస్తకము నూర్ధ్వముఁ జేసి ఫణాసుధాప్తిచే
నూగఁగనీని దేహముల నొప్పుమునీంద్రులచిత్తవీథులన్
రాగిలు పాదపద్మము శిరంబునఁ జేర్పుము రుక్మిణీపతీ.

100


ఉ.

యాదవరాయ భక్తవరయాదవరాయసుపౌత్రుఁడన్ దయా
శ్రీదగుణాభిరామజనశేఖరసుందరనూరిపుత్రుఁడన్
మీదయ రామయోగియను మేలగునామముగన్న నేను మీ
మీఁద రచించుపద్యముల మేలుగ నందుము రుక్మిణీపతీ.

101

రుక్మీణీపతిశతకము సంపూర్ణము.