భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/రమాధీశ్వరశతకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పీఠిక

ఈశతకమునకు మాతృక జీర్ణాతిజీర్ణమగు వ్రాఁతప్రతి భువనగిరి(నిజామురాష్ట్రము)లోలభించెను. ప్రతి కాగితముపైఁ జిరకాలముక్రింద వ్రాయఁబడియుంటచేఁ గాకితములు చివికి వర్ణస్వరూపము నశించియుండెను. వ్రాఁతలోపములు మిక్కుటముగాఁ గలవు. లేఖకుఁడు భాషాపరిచయుఁడు కాకపోవుటచేఁ దెలియక కొన్నిచోటులఁ బద్యభాగములలో విడచిపెట్టెను. ఇట్టి జీర్ణాతిజీర్ణమగుప్రతి మామిత్రులగు మక్కపాటి వేంకటరత్నకవిగారివద్దఁ గైకొని పఠింపఁ గవి గొప్పవాఁడై యుండుననియు లేఖకలోపములచే శతకప్రశస్తి మాటుపడెనని నిశ్చయించి ప్రత్యంతరము మిగుల శ్రమమీఁద వ్రాసితిమి. పిదప వేంకటరత్కవిగారి సహాయముతో మాతృకానుసారముగఁ బ్రత్యంతరమును సవరించితిమి. మూలమునందె కొన్నిపద్యము లన్వయదుష్టములై యుంట చేఁ గవ్యభిప్రాయము తెలియరామిచే నటులెయుంచి సామాన్యములగు లేఖకప్రమాదములు సవరించితిమి.

ఈశతకరచయిత యెవరో యేకాలమున నుండెనో కాల మేదియో యెఱుంగనగు నాధారము లిందుఁ గానరావు. శైలిని బట్టిచూడ శతకము ప్రాచీన మనుటలో సంశయము లేదు. శతకమునందలి "నాగేంద్రాఖ్యుఁడ” ననుపద్యమువలనఁ గవి నాగసమాఖ్యుఁడని తెలియును. పదమూఁడవశతాబ్దిలో రేచెర్లగోత్రీయుల యాస్థానమునందున్న నాగనాథుఁడే శతకకర్తయై యుండునేమో తెలియదు.

త్రయ్యంతార్థము, జియ్యాళ్వారు, శ్రీసూక్తి, ప్రపన్నులు లోనగు పదములవలన నీకవి విశిష్టాద్వైతియని తోఁచును. ఈశతకమునందలి పద్యములు శ్రావ్యముగ మనోజ్ఞముగ నున్నవి. శతకములందు సహజముగాఁ గాననగు వ్యాకరణదోషములుగూడఁ గలవు. గాని గుణగణమునం దవి గణనీయములుగావు. ఈయుత్తమశతక మింక నుపేక్షించిన సంతరించునేమోయని యథోపలభ్యముగ సంస్కరించి యిప్పటి కీసంపుటమునఁ బ్రచురింపఁగలిగితిమి. ఈకవి నిజామురాష్ట్రమునందలి ఓరుగల్లుప్రాంతనివాసియై యుండును.

నందిగామ

ఇట్లు భాషాసేవకులు

1.1.25

శేషాద్రి రమణకవులు, శతావధానులు.

.

.

శ్రీరస్తు

రమాధీశ్వరశతకము

శా.

శ్రీదేవీకుచకుంభసమ్మిళితకాశ్మీరంబు వక్షోమణిన్
దాఁ దాస్యంబు ఘటింప వామకరపద్మస్పర్శనాలింగన
స్వేదాంభోరుహదివ్యమూర్తియగు లక్ష్మీవిష్ణుదేవున్ మిమున్
వేదాంతుల్ మది గాంచి మ్రొక్కుదురు గోవిందా రమాధీశ్వరా.

1


శా.

క్షోణిన్ మర్త్యుఁడు మోక్షసాధ్యపదవిన్ గోవిందనామాంకని
శ్రేణిన్ గాంచుటఁ జూచి మీనుతులు నేఁ జేయంగ మైకొంటి నా
వాణీదేవియు మీప్రసాదగరిమన్ వాక్యంబు లందిచ్చుచో
వీణాపుస్తకపాణియై నిలుచు గోవిందా రమాధీశ్వరా.

2


శా.

నాగేంద్రాఖ్యుఁడ నౌదుఁగాని ముఖముల్ నా కేమి వేయున్నవో
భోగానందసువర్ణధర్మగుణసంపూర్ణప్రభావుండనో
ధీగంభీరపదశ్రుతిస్ఫురణ గీర్తింతున్ వచోరూఢి నీ
వే గీర్వాణమునీంద్రవంద్యపద గోవిందా రమాధీశ్వరా.

3

మ.

జయనారాయణ వాసుదేవ కమలాక్షా పద్మనాభా ధనం
జయ సన్మిత్రపవిత్రగోత్ర హరి కృష్ణా రుక్మిణీశా సదా
ద్వయనిష్టాపరుఁడైన సాత్వికునకున్ బ్రత్యక్ష మైయుందు శ్రీ
ప్రియ నీవున్ హృదయాబ్జమధ్యమున గోవిందా రమాధీశ్వరా.

4


మ.

నవనీతప్రియ భక్తపాలన జగన్నాథా హృషీకేశ కే
శవ దామోదర దేవకీతనయ కంజాతాక్ష దేవేశ మా
ధవ వైకుంఠనివాస భూధర ముకుందా భక్తచింతామణీ
వివిరాట్కేతన తే నమో౽స్తు హరి గోవిందా రమాధీశ్వరా.

5


శా.

ఓకంజాతదళాక్ష చక్రధర సర్వోత్కృష్ట సర్వజ్ఞ శాం
తాకారా ఫణిరాజతల్ప పరమాత్మా కోటికందర్పమూ
ర్తీ కళ్యాణగుణాభిరామ శరణార్థిన్ నన్ను రక్షింపరా
వే కంసాంతక నామనంబునకు గోవిందా రమాధీశ్వరా.

6


శా.

శ్రోత్రానందము మిమ్ము విన్న ప్రతిమారూపంబు వీక్షించినన్
నేత్రానందము మీకథాసరణి వర్ణింపంగ వాక్సిద్ధి మీ
గాత్రధ్యానము చిత్తశుద్ధి సకలాంగప్రీతి మీభక్తి య
వృత్రారాతినుత ప్రతాప హరి గోవిందా రమాధీశ్వరా.

7

మ.

గుహునాత్మన్ శబరీనికేతనమునన్ గోవర్ధనాద్రిస్థలిన్
గ్రహరాజద్విజరాజబింబముల రంగక్షేత్రవాటిన్ మహీ
మహిళాశ్రీకుచమధ్యదేశముల నామ్నాయాంతవీథిన్ బలెన్
విహరింపంగదవయ్య నామదిని గోవిందా రమాధీశ్వరా.

8


శా.

కొన్నంబుణ్యము మీపదోదకము నిగ్గుల్ దేరు మీమూర్తిఁ గ
న్గొన్నన్ బుణ్యము నామరత్నములు పెక్కుల్ వాని నేపాటి పే
ర్కొన్నన్ బుణ్యము మీపదార్చకులలోఁ గూర్చుండి తా వీనులన్
విన్నం బుణ్యము మీకథాకృతులు గోవిందా రమాధీశ్వరా.

9


శా.

ఏజా తైనను నేమి మిమ్ము మదిలో నేప్రొద్దు చింతించి హృ
త్పూజాదీక్షితుఁడైన మానవుఁడు పో పుణ్యాత్ముఁ డెల్లప్పుడున్
రాజీవాయతనేత్ర మీకృపకు దూరం బైన సద్విప్రుఁడున్
వేజన్మంబుల గాంచునే సుగతి గోవిందా రమాధీశ్వరా.

10


శా.

త్రెంపంజాలుదుఁ గర్మబంధముల నాధివ్యాధులం గెల్తు నే
జెంపంగొట్టెదఁ బంచభూతముల నిర్జింతున్ మహామోహమున్

గుంపుల్ గూడిన పాపపుంజముల నుగ్గుల్ సేతు మీబంటునై
వెంపర్లాడుదుఁ గాలకింకరుల గోవిందా రమాధీశ్వరా.

11


మ.

నిఖిలామర్త్యకిరీటసంఘటితమాణిక్య ప్రదీపావళీ
ముఖనీరాజవిరాజమానసుమహాముగ్ధేందుసంకాశప
న్నగపంక్తిప్రభచేత నాహృదయసంతాపంబు వారింపుమీ
వికసత్పూజ్యపదారవింద హరి గోవిందా రమాధీశ్వరా.

12


శా.

కేడీలాడు మదీయపాతకములన్ గెంటించి మత్కర్మముల్
పీడల్ పెట్టినఁ బెట్టనీక బలిమిన్ విప్పించి నీవింక యే
జాడన్ బోవక నిల్వఁగావలయు నాసంకల్పసౌధాగ్రమో
వీడుంబంటు భవత్పదంబులకు గోవిందా రమాధీశ్వరా.

13


శా.

వేదాంతోపనిషత్ప్రపంచముల నన్వేషించి తర్కించి మీ
పాదధ్యానపరాయణాత్ములకుఁ దప్పన్ మోక్ష మెవ్వారికిన్
లేదంచున్ సకలప్రమాణములఁ దొల్లే సాటరే దిక్కులన్
వేదవ్యాసపరాశరాదికులు గోవిందా రమాధీశ్వరా.

14


మ.

సురభూమీరుహనవ్యపల్లవచయస్ఫూర్తిన్ విడంబించి శం
కరజూటాగ్రసరిత్సముద్భవశరత్కాలారుణాంభోరుహ

స్ఫురణల్ మించి రహించు మీపదయుగంబున్ నామనోవీథిలో
విరివిం బొంది చరింపఁగావలయు గోవిందా రమాధీశ్వరా.

15


మ.

అపవర్గప్రదనిర్మలస్థల మయోధ్యన్ బాసి నీరంధ్రపా
దపఘోరాటవి పర్ణశాలకడ సీతాదేవి వాంఛింపఁగాఁ
గపటాకారమృగంబు వెంటఁబడి వీఁకంబాఱు మీపాదముల్
విపులాభూషణముల్ దలంచెదను గోవిందా రమాధీశ్వరా.

16


మ.

మతి నేగొల్చెద శంఖచక్రనలినీమత్స్యాదిరేఖావిరా
జితమై తీర్థగరిష్ట మై శ్రుతివసీమంతసిందూరరం
జితమై దేవకిరీటకీలితమణిశ్రేణీనవీనప్రభా
న్వితమై యొప్పెడి మీపదద్వయము గోవిందా రమాధీశ్వరా.

17


మ.

రుచిరస్ఫూర్తి దలంతు నామది నుమారుద్రాబ్జగర్భేంద్రవా
ఙ్నిచయాగమ్యము లైనమజ్జనసుఖాన్వీతంబు లై రాధికా
కచభార ప్రభవప్రపూజితము లై కన్పట్టు బృందావనీ
విచరత్తావకపాదపద్మములు గోవిందా రమాధీశ్వరా.

18


మ.

ధ్వజ వజ్రాంకుశ శంఖచక్ర హల మత్స్యచ్ఛత్ర కోదండ పం
కజ కల్పద్రుమ కుండలాది శుభరేఖాలంకృతం బై లస

ద్వ్రజకాంతాకుచకుంకుమాంకితభవత్పాదద్వయం బాత్మలో
విజయస్ఫూర్తి చెలంగఁ గొల్తు హరి గోవిందా రమాధీశ్వరా.

19


శా.

రంగద్వేదశిరోచితంబులు సదారాధింపఁగా యోగిరా
డ్భృంగంబుల్ మకరందబిందువుల సంప్రీతాత్మతన్ గ్రోలఁగా
గంగాకారణపాదపంకజము మోక్షశ్రీ లనంజాలదే
వెంగాత్ముల్? మదిగానలేరు హరి గోవిందా రమాధీశ్వరా.

20


శా.

శ్రీదై వారఁగ నామదిం దలఁతు లక్ష్మీఫాలకస్తూరికా
స్వాదంబుల్ నరయోగిబృందహృదయజ్ఞానామృతస్వర్ధునీ
నాదంబుల్ నవరత్ననూపురి తనానాధాతుశబ్దక్రియల్
వేదంబుల్ భవదీయపాదములు గోవిందా రమాధీశ్వరా.

21


మ.

విలువల్ వేతురుగాక రత్నచయమున్ వీక్షించి తచ్ఛాస్త్రవే
త్తలు మీపాదసరోరుహద్వితయచింతారత్నరింఛోళికిన్
బలుమాఱున్ మతిగట్టి పన్నగపతి బ్రహేంద్రరుద్రాదులున్
వెల యింతింతని తెల్పఁగాఁగలరె గోవిందా రమాధీశ్వరా.

22


మ.

అవతంసం బఖిలాగమంబుల కహల్యాశాపనిర్ముక్తహే
తువు లక్ష్మీకరలాలితంబు విబుధస్తోమామరానోకహం

బు వియత్సింధుజనిప్రదేశము భవత్పుణ్యాంఘ్రియుగ్మంబు నే
వివిధోపాయములన్ భజింతు హరి గోవిందా రమానాయకా.

23


శా.

జ్ఞానంబొందఁగ నీవ మానసమరాళంబుఁ భవత్పాదుక
ధ్యానానందసుధాబ్ధివీచికల నోలాడ బ్రబోధించుచో
మేనుబ్బన్ బ్రమదాశ్రువుల్ దొరఁగ నామీఁదన్ దయల్ వారుచో
వీనుల్ నిండును మీకథామృతము గోవిందా రమాధీశ్వరా.

24


శా.

చూడ్కుల్ తావకపాదపద్మమధుపస్తోమాభిరామంబు లై
వేడ్కన్ గ్రీడలు సల్పఁగా శమదమావిర్భావయోగీంద్రు లే
మాడ్కి నిన్ను భజింతు రానిగమకామ్యజ్ఞానిగాఁ జేయవే
వీడ్కొందున్ భవరోగదుఃఖముల గోవిందా రమాధీశ్వరా.

25


శా.

కంబుగ్రీవము కౌస్తుభాభరణముల్ కర్ణాంతవిశ్రాంతనే
త్రంబుల్ చారులలాటమున్ వదనపద్మంబున్ సునాసాపుటీ
బింబోష్ణోరుకిరీటకుండలములున్ బీతాంబరంబుం గడున్
వెంబైయుండఁగ నిల్వు నామదిని గోవిందా రమాధీశ్వరా.

26


శా.

కోటీరాంగదకుండలప్రభల దిక్కుల్ తేజరిల్లన్ గటీ

శాటీకాంతులు క్రొమ్మెఱుంగులఁ దిరస్కా రంబు గావింపఁగా
సూటిన్ నాహృదయంబులో నిలువు మోసూనాస్త్రకోదండమౌ
ర్వీటంకారభయప్రశాంతికర గోవిందా రమాధీశ్వరా.

27


శా.

కౌసల్యాత్మజ రామనామమున వేడ్కల్ మీఱ వాల్మీకిహృ
త్కాసారంబున రాజహంసముగతిం గన్పట్టి రక్షించునీ
వ్యాసంగంబు దలంతు నోయదుకులాధ్యక్షా దయన్ జూపరా
వే సర్వేశ్వర నామంబునకు గోవిందా రమాధీశ్వరా.

28


శా.

ప్రాణస్థానమునందు నెల్లపుడు నే భావించెదన్ మీయురో
మాణిక్యంబును నాసికాభరణమున్ మందస్మితంబున్ జపా
శోణశ్రీమధురాధరంబును -గనచ్ఛుబ్రాబ్జనేత్రంబులున్
వేణీబంధము పింఛదామమును గోవిందా రమాధీశ్వరా.

29


శా.

ఉల్లంబందుఁ దలంతుఁ బాదనలినీయుగ్మంబు మాణిక్యమున్
ఇల్లాలుం గలవక్షమున్ గటితటీహేమాంబరస్ఫూర్తియున్
అల్లోనేరెడుపండుచాయ తిరుమే నాదివ్యభూషావళిన్
విల్లున్ శంఖగదాసిచక్రముల గోవిందా రమాధీశ్వరా.

30

.

శా.

అస్వర్గస్థుఁడు ముక్తుఁడౌనిది రహస్యజ్ఞానసారంబు శు
ద్ధస్వాంతోజ్జ్వలపుండరీకపురమధ్యస్వర్ణసింహాసనున్
భాస్వత్కౌస్తుభరత్నహారతులసీపద్మాంకితోరస్థలున్
విస్వామిధ్వజు మిమ్ముఁ గొల్తు హరి గోవిందా రమాధీశ్వరా.

31


శా.

షట్కోణాక్షరమంత్రరాజనిలయున్ జక్రాబ్జపుండ్రేక్షువి
భ్రాట్కోటీరలతాంతబాణమురళీపాశాంకుశున్ వాహినీ
రాట్కన్యాదిసమేతపోడశసహస్రస్త్రీమనోనాథు ప్రా
వృట్కాలాంబుదదేహునిన్ గొలుతు గోవిందా రమాధీశ్వరా.

32


శా.

ఇష్వంభోజగదాసిచక్రధరశ్రీహేలాకుచద్వంద్వపా
రిష్యాంగోత్పులకాంచితాగ్రమదనోర్వీఫల్గునస్యందనా
భీష్వారంజితహస్తనిర్మళితవిజ్ఞానప్రపూర్ణాంచితా
విష్వక్సేనఖగేంద్రసేవ్య జయ గోవిందా రమాధీశ్వరా.

33


శా.

ఖద్యోతప్రతిమానకౌస్తుభము వక్షంబందు రంజిల్లఁగా
హృద్యంబై వనమాలికావిరచితశ్రీగంధ మింపొందఁగా
నుద్యత్కాంతులు వింతలై చెలఁగ నాయుల్లంబులోనుండు మీ
విద్యున్మేఘసమానభావమున గోవిందా రమాధీశ్వరా.

34

మ.

అసమానాకృతి దేవకీవిమలగర్భాంభోధిచంద్రుండు నా
వసుదేవాత్మతపఃఫలం బనఁగ దేవా నీవు జన్మించుటన్
వసుధన్ బూవులసోనవాన గురిసెన్ వర్ణించి రద్దేవతా
విసరంబుల్ సురదుందుభుల్ మొరసె గోవిందా రమాధీశ్వరా.

35


మ.

బలిమిన్ బూతన మీగృహంబునకుఁ దా బాలెంతయై వచ్చి పొ
త్తులలోఁ బాపని నిన్ను నెత్తికొని వాదుల్ దాదులాడన్ హలా
హలపూర్ణంబగుచన్ను నీ కొసఁగి మోక్షావాప్తురా లైనచో
వెలయన్ భక్తులు ముక్తులౌ టరుదె గోవిందా రమాధీశ్వరా.

36


మ.

రమణన్ మృత్తిక నేల తింటివి కుమారా బుద్ధి కాదంచుఁ గ్రో
ధముతోడన్ మిముఁ గొట్టఁబూనిన యశోదాదేవికిన్ మీముఖా
బ్జమునన్ బద్మభవాండపంక్తులు విరాజత్స్ఫూర్తి గావించి సా
ధ్వీమణిన్ విస్మయమందఁజేసితివి గోవిందా రమాధీశ్వరా.

37


శా.

విందుల్ వచ్చిరటంచు గోపతరుణుల్ వేభంగులన్ వచ్చి మో
విం దేనెల్ వడియంగ ముద్దుగురియన్ వేంచేసి మాకౌఁగిటన్
విందైనాఁడవటంచు నెత్తుకొన నీవీబంధముల్ జేర్చుటల్
విందున్ భాగవతాదిశాస్త్రముల గోవిందా రమాధీశ్వరా.

శా.

వాదీంద్రుల్ బహుశాస్త్రకోవిదులు తత్వజ్ఞానభిన్నాత్ములై
నేదేనే? మనంగ నెయ్యెది మనోనేత్రేంద్రియాగమ్యమై
నీదివ్యాకృతి నిల్చు పద్మజభవానీశంకరాద్యంతమై
వేదాదిప్రణవార్థరూపమున గోవిందా రమాధీశ్వరా.

39


శా.

జను లింపొందఁ ద్రివిక్రమాకృతి సురస్వర్లోకపాతాళముల్
ఘనవిస్ఫూర్తి నతిక్రమించి దివిషద్గంగానదీజహ్నుక
న్యను భోగావతి గన్నదేవ భవదీయం బైనపాదాబ్జముల్
వినుతింతున్ బ్రణుతింతు నెంతు హరి గోవిందా రమాధీశ్వరా.

40


మ.

ఘుటికాసిద్ధునిభంగి వెన్నఁ దినఁగా గోపాంగనల్ రాచలోఁ
గిటిలోఁ జెప్పఁగఁబోయినన్ వెఱచి మ్రొక్కేవానిచందంబునన్
దిటమై యడ్డము వచ్చి వింతరతులన్ దేలించి చోరత్వమున్
విటరాజత్వము జూపినాఁడవట గోవిందా రమాధీశ్వరా.

41


మ.

ఘనమై మీపదకాంతి కాళియఫణాగ్రస్థానమాణిక్యదీ
ప్తిని మాయింపఁ దదీయకాంతలు మహాభీతాత్మలై దుష్టనా
శనముం జేసితి వింకఁజాలు బతిభిక్షాదాన మిమ్మన్న ద
ద్వినయోక్తుల్ విని యాదరించితివి గోవిందా రమాధీశ్వరా.

42

శా.

చూడారత్నకిరీటకుండలరుచుల్ శోభిల్లఁ గాసారసం
క్రీడాసక్తల గోపకన్యకల నాక్షేపించి తద్వస్త్రముల్
గూడా నెత్తుకపోయి తీరవిలసత్కుంజాధిరూఢుండవై
వ్రీడాశూన్యలఁ జేయవే సతుల గోవిందా రమాధీశ్వరా.

43


శా.

క్షోణీజంబు లిగిర్చె మేఁత లుడిగెన్ గోవత్ససంఘంబు బా
షాణంబుల్ కఱఁగెన్ భుజంగములు చంచద్భక్తి నాడెన్ వ్రజ
శ్రేణీరాగరసంబు వెల్లివిరిసెన్ శృంగారలీలాభవ
ద్వేణుధ్వానము సోకినంతటనె గోవిందా రమాధీశ్వరా.

44


శా.

చాణూరుం దెగటార్చి ముష్టికునితేజంబెల్ల మాయన్ రణ
క్షోణిం గూలఁగవైచి కంసు నతులక్రోధాతిరేకంబునన్
ప్రాణంబుల్ గొని యుగ్రసేను మథురన్ బట్టంబు గట్టింపవే
వేణీమాధవ గోపికారమణ గోవిందా రమాధీశ్వరా.

45


శా.

శౌర్యాడంబరలీల కుండినపురిన్ జైద్యాదులన్ సంగర
స్థైర్యాటోపము జూపి పోదరిమి మోదం బొప్పఁగా రుక్మిణీ
భార్యారత్నము దెచ్చుకొంటివి భవత్ప్రఖ్యాతసౌందర్యదో
ర్వీర్యప్రాభవ మెన్న నాతరమె గోవిందా రమాధీశ్వరా.

46

మ.

యదువంశోత్తముఁడైన నిన్నుఁ గ్రతుపూజార్హుండు గాఁడన్నదు
ర్మదునిన్ జైద్యుని జేతిచక్రమునఁ దన్మస్తంబు వేద్రుంచి ద్
పదిమానంబును గాఁచి శక్రజునకున్ బ్రత్యక్షమై విందవై
విదురాక్రూరుల మెచ్చినాఁడవట గోవిందా రమాధీశ్వరా.

47


శా.

సద్యోముక్తికరంబు పావనము సంసారాబ్ధిపోతంబు సం
పద్యోగంబు విరించిపంచముఖసంభావ్యంబు మంత్రోత్తమం
బద్యారాధ్యము భక్తలోకపరమాహ్లాదంబు సౌమ్యక్రియా
విద్యాసారము మీశుభాహ్వయము గోవిందా రమాధీశ్వరా.

48


శా.

సుశ్రావ్యంబులు పుణ్యమూలములు వస్తుజ్ఞానసామర్థ్యయో
గశ్రీకారములు సుధాసదృశముల్ కైవల్యసోపానముల్
మిశ్రంబుల్ నిగమాంతసారములలో మీనామసంకీర్తనల్
విశ్రాంతంబులు దివ్యదేశములు గోవిందా రమాధీశ్వరా.

49


శా.

కత్తుల్ మోహలతావిభంజనకృతిన్ గైవల్యవృక్షంపుఁబూ
గుత్తుల్ యుక్తులు సర్వమంత్రములకున్ ఘోరాహిత శ్రేణికిన్
మిత్తుల్ భక్తులు నారదాదులకుఁ దా మీనామసంకీర్తనల్

విత్తుల్ యోగిహృదాలవాలముల గోవిందా రమాధీశ్వరా.

50


మ.

సుమనస్సిద్ధరసాయనంబు ఖలరక్షోరామబాణంబు సం
యమిచింతామణి సత్యవాగుపనిషత్ప్రాణేశ్వరం బాదిగా
జమృగాంకంబు రమాచకోరహిమతేజం బైనమీనామ మా
విమతాహివ్రజగారుడాంబకము గోవిందా రమాధీశ్వరా.

51


మ.

అధరీభూతసమస్తమంత్రనివహం బజ్ఞానసంసారవా
రిధిసంశోషణబాడబానలము వైరిగ్రామదంభోళిజ
న్మధునీతారణకారణోత్తమము మీనామంబు జంభద్విష
ద్విధిరుద్రార్చితపాదపీఠ హరి గోవిందా రమాధీశ్వరా.

52


మ.

మహి పాపాత్మకుఁ డయ్యజామిళుఁడు కర్మజ్ఞానమోక్షక్రియా
రహితుండయ్యుఁ బ్రయాణవేళ సుతు నారా యన్నమాత్రన్ సుఖా
వహకైవల్య పదం బొసంగితి మనోవాక్కాయసమ్యక్తపో
విహితాచారుల కే మొసంగుదువొ గోవిందా రమాధీశ్వరా.

53


మ.

శివునిం బార్వతి నాపగేయుని గజశ్రేష్ఠున్ వశిష్ఠున్ శుకున్
ధ్రువుఁ బ్రహ్లాదు బలిన్ విభీషణుని నక్రూరున్ నరున్ నారదున్

రవిజున్ శేషుని నంబరీషుని బరబ్రహ్మణ్యులం జేయవే
వివరింపన్ భవదీయనామరుచి గోవిందా రమాధీశ్వరా.

54


శా.

అప్రత్యక్షకథానిరంకుశులు మాయావాదదూరుల్ వివే
కప్రామాణ్యవచోనిరూఢులు సమీక్షాజ్ఞానవిద్యాధరుల్
గోప్రఖ్యాతనితాంతకీర్తులు జితక్రోధుల్ భవచ్ఛేదకుల్
విప్రాచార్యమతప్రవర్తకులు గోవిందా రమాధీశ్వరా.

55


శా.

సప్రేమాతిశయంబుతోడ గురువిశ్వాసంబునన్ బూర్వజ
న్మప్రారబ్ధము లూడ్చి పుణ్యుఁ డగుపో మర్త్యుండు తన్మంత్రసే
వాప్రాబల్యము బోయవానిఁ గృపతో వాల్మీకిఁగాఁ జేయవే
విప్రశ్రేష్ఠుల కెల్ల నెక్కుడుగ గోవిందా రమాధీశ్వరా.

56


మ.

నిగమార్థజ్ఞులు నిత్యసత్యచరితుల్ నిర్మత్సరుల్ నిస్పృహుల్
సుగుణాఢ్యుల్ సురలోకపూజితులు సుశ్లోకుల్ సుధర్మాన్వితుల్
నగధీరుల్ నలినాప్తతేజులు సదానందాత్మకుల్ వైష్ణవుల్
విగతక్రోధులు విష్ణుసేవకులు గోవిందా రమాధీశ్వరా.

57


మ.

క్రతుకర్మంబులసందడిం బడరు తీర్థస్నానముల్ గోర రు

గ్రతపోదాంభికవృత్తికిం జొరరు లోకభ్రాంతిదూరుల్ మహా
కృతకృత్యుల్ నిగమార్థకోవిదులు మీశ్రీపాదనీరేరుహ
ద్వితయధ్యానపరాయణాత్మకులు గోవిందా రమాధీశ్వరా.

58


మ.

భగవద్భక్తజనప్ర(ముక్తమగు) తత్పాత్రావిశిష్టాన్నముల్
తగువేడ్కన్ భుజియించి ముక్తతనుఁడై దాసీసుతుం (డీడ్యుఁడౌ)
పగిదిన్ నారదుఁడైనవాఁ డనిన నీభక్తిప్రభావంబు లు
ర్వి గణింపం గడునద్భుతంబులగు గోవిందా రమాధీశ్వరా.

59


మ.

పరమానందముతోడ మిమ్ము మదిలో భావించి నిల్పంగ భూ
వరుఁడుం గాంచె నిమిత్తమాత్రముననే వైకుంఠ మన్నట్టిచోఁ
జిరకాలంబు భవత్పదంబులు మదిం జింతించుపుణ్యాత్మకుల్
విరజావాహిని దాటు టేమరుదు గోవిందా రమాధీశ్వరా.

60


శా.

అగ్రత్వం బొకయింత లేక సముఁడై యక్షప్రయత్నంబు తో
యగ్రాహ్యంబులు మాని దేశికకటాక్షారూఢసంపన్నుఁడై
జాగ్రత్స్వప్నసుషుప్తులందు మిముఁ గాంక్షం గొల్చు పుణ్యుండు దా

విగ్రామణ్యుఁడు విష్ణులోకమున గోవిందా రమాధీశ్వరా.

61


శా.

బౌద్ధగ్రాహ్యకుమంత్రతంత్రముల సంపాదించి బోధించుదు
రుద్దుల్ తెల్పినత్రోవలం జనక సంపూర్ణాగమాంతార్థవా
సిద్ధాంతంబు దృఢంబుగాఁ దెలిసి మీసేవానుకూలాత్ముఁడై
వృద్ధాచారపరుండు గావలయు గోవిందా రమాధీశ్వరా.

62


మ.

నడువంగావలె విష్ణుతీర్థములకున్ నారాయణబ్రహ్మమున్
దడవంగావలె మీప్రసాదము మహా తాత్పర్యచి త్తంబుతో
నడుపంగావలే హీనకర్మచయమున్ నానావిహారంబులన్
విడువంగావలె మీప్రపన్నులకు గోవిందా రమాధీశ్వరా.


శా.

పొట్టాసత్సమనాప్రసిద్ధ మిది యేపో ధన్యులై యుందురే
పుట్ట న్నొల్లరు చావనొల్లరు జగత్పూజ్యుల్ భవత్సేవకుల్
ధట్టప్రౌఢకృతాంతకింకరగదాదండానలజ్వాలచే,
బెట్టంబొందక సార్వకాలమును గోవిందా రమాధీశ్వరా.

64


శా.

శ్రీరామానుజదేశికోత్తమ మహాసిద్ధాంతమార్గక్రియా
సారాచారవిశేషతీర్థతనుఁడై స్వాంతంబులో నెప్పుడున్

క్రూరత్వంబు శమింపకుండిన వివేకుల్ చూతు రాపుణ్యునిన్
వీ రేమన్న పురాతిశైత్య మది గోవిందా రమాధీశ్వరా.

65


శా.

గోత్రంబొక్కటి కేలనూనితివి మీగోత్రంబువారందఱున్
గోత్రానేకపరాయణుండ వనఁగా గోత్రంబు వారందఱున్
చిత్రంబౌగద యేమి చెప్పుదుఁ గురుక్షేత్రంబునం దోత్రమున్
వేత్రంబుం గొని తేరు దోలితివి గోవిందా రమాధీశ్వరా.

66


శా.

మాయింతుఁన్ దురితంబులన్ గురుకృపన్ మత్కీర్తిచంద్రప్రభల్
గాయింతున్ భవదీయపద్యములు దిక్కాంతాకపోలంబులన్
వ్రాయింతున్ బరవారణాంకుశము మారామానుజుండంచు నే
వేయింతున్ జయభేరి లోకముల గోవిందా రమాధీశ్వరా.

67


మ.

అదలింతున్ గుటిలారిసంఘములఁ బ్రాణాంపానసంధానినై
కదలింతున్ నిజమూలకుండలిని మోక్షశ్రీఫలప్రాప్తికై
బొదలింతున్ భవదీయమూర్తిలతికన్ బోధాలవాలంబుగా
విదలింతున్ బహుజన్మదుఃఖముల గోవిందా రమాధీశ్వరా.

68


శా.

త్రెంతున్ బ్రాకృతకర్మబంధముఁ బ్రబోధింతున్ భవద్భక్తి గ

ల్పింతున్ మానసభద్రపీఠము సమర్పింతు విభూషాదు ల
ర్పింతున్ శ్రీగురుమంత్రమార్గమునఁ జర్చింతున్ మహామూర్తి సే
వింతున్ నీచరణాంబుజద్వయము గోవిందా రమాధీశ్వరా.

69


శా.

ఒప్పింతున్ నిజధర్మకర్మచయమున్ యుష్మత్ప్రియార్థంబుగా
రప్పింతున్ భవదంఘ్రరియుగ్మము మనోరాజీవపీఠంబుపై
మెప్పింతున్ మహనీయభాగవతులన్ మీపాదభాస్వంతుచే
విప్పింతున్ హృదయాంధకారమును గోవిందా రమాధీశ్వరా.

70


శా.

విఘ్నేశుండు సనత్కుమారుఁడు చతుర్వేదంబులున్ బ్రహ్మయున్
విఘ్నేశానుజుఁ డైనషణ్ముఖుఁడు దేవీయుక్తుఁడై వేడుకన్
విఘ్నేశున్ దగఁగన్నతండ్రి మిము మీవిఖ్యాతి వర్ణింపఁగా
విఘ్నం బెన్నఁడు లేదు మీకృతికి గోవిందా రమాధీశ్వరా.

71


మ.

నిజరూపంబున నింతవాఁడవని వర్ణింపంగ నొండేల స
ర్వజగత్పూర్ణుఁడవౌట సాటుగద దూర్వాగంధపుష్పాక్షతల్
గజచర్మాంబరజూటకోటరమునన్ గాన్పించె మోకాట నా
విజయుం డీశ్వరపూజ సేయుటయు గోవిందా రమాధీశ్వరా.

72

మ.

ఫలితౌదుంబరశాఖిచందమున నీబ్రహ్మాండజాలంబులో
గలమీదివ్యవిభూతి జీవులకు వక్కాణింప శక్యంబె త
త్ఫలసంకీలితతన్మహీరుహమహత్వం బెన్నఁగా శక్యమే
విలయార్కానలకోటితేజహరి గోవిందా రమాధీశ్వరా.

73


శా.

ఐశ్వర్యప్రదమంత్రతంత్రములు వశ్యాకర్షణోచ్చాటనల్
విశ్వాసంబునఁ జేయఁబూనక సదా విజ్ఞానసంపూర్ణుఁడై
శశ్వన్మోక్షఫలప్రదాతయగు నాచార్యాన్వయగ్రామణిన్
విశ్వశ్రేష్ఠునిగా నెఱుంగవలె గోవిందా రమాధీశ్వరా.

74


శా.

త్రయ్యంతార్థవిచారగమ్యభగవత్సంబంధదీక్షాంగియై
జియ్యాళ్వారిమహాప్రబంధనిగమశ్రీసూక్తినిం దేలియున్
లియ్యంబైనరుచిప్రపన్నులయెడన్ లేకున్నఁ దచ్చిహ్నముల్
వెయ్యారైనను మీఁదుమిక్కిలివి గోవిందా రమాధీశ్వరా.

75


మ.

అమితం బవ్యయ మాదిమూలరుచిరం బానందకందంబు ను
త్తమ మాచార్యకటాక్షలబ్ధపరిశుద్ధజ్ఞానవిద్యానిధా
నము పంచోపనిషత్స్వరూపము ప్రపంచజ్యోతియంచున్ మిమున్
విమలాచారధురీణు లెన్నుదురు గోవిందా రమాధీశ్వరా.

76


శా.

వింటిన్ నీభుజశక్తి దానవులదోర్వీర్యంబు మాయింపఁ బూ

వింటన్ లోకము లెల్ల గెల్చుత్రిజగద్వీరుండు మీపట్టి పూ
వింటన్ బుట్టినప్రోడ మీకరుణచే నిన్నింటికిన్ గర్తయే
వెంటన్ మీసవతన్యదైవములు గోవిందా రమాధీశ్వరా.

77


మ.

శ్రితమంత్రాక్షరదివ్యమంగళమహాశ్రీమూర్తి వేదార్ణవా
మృతసారోషనిషత్స్వరూపవననీరేజాతభృంగంబు సం
భృతపాపౌఘదవానలాంబుదము భూరిబ్రహ్మకైవల్యసం
వృత మంచున్ మిము నార్యు లెన్నుదురు గోవిందా రమాధీశ్వరా.

78


మ.

బడిగావేల్పుల నెన్న నేటి కితఁడే బ్రహ్మణ్యదైవంబు క
వ్వడికిం జూపఁడె విశ్వరూప మని దివ్యజ్ఞానసంపన్ను లె
ప్పుడు మీమూర్తి భజింతు రాత్మల భవాంభోరాశిలో నుండియున్
వెడమాయం బెడబాసి ధైర్యమున గోవిందా రమాధీశ్వరా.

79


మ.

పొగచుట్టుండినవహ్నిచందమున నీభూలోకపూర్ణుండవై
జగదుత్పత్తికి రక్షణంబునకు శిక్షావృత్తికిం గర్తవై
పొగడన్ మించితి వెల్లలోకములలోఁ బుష్పంబులం గల్గుతా
విగ వెన్నంగలనేతిచందమున గోవిందా రమాధీశ్వరా.

80

శా.

వాగర్థంబులభంగిఁ బాయక జగద్వ్యాప్తుండవై మ్రానిలోఁ
జేగంబోలి శరీరకోశములలో జీవాత్మవై యాత్మవై
యోగం బెప్పుడు కల్గియుండక సముద్యోగంబునన్ ముక్తికై
వేగం బేటికి భక్తకోటి కిఁక గోవిందా రమాధీశ్వరా.

81


మ.

అభయంబన్న బలిన్ విభీషణు ధ్రువున్ ఆచంద్రతారార్కమై
విభులై యుండఁగ మూఁడులోకములకు వేదాంతరాయుండవౌ
ప్రభురత్నంబవు పుణ్యమూర్తివి జగద్రక్షాధురీణుండ వీ
విభవంబున్నదె యెల్లవేల్పులకు గోవిందా రమాధీశ్వరా.

82


శా.

తృష్ణాదూరులు నిత్యశాంతులు బృహద్వేదాంతసారైకవ
ర్ధిష్ణుల్ సత్యతపోగరిష్ఠులు సమాధిజ్ఞాననిష్ఠుల్ మహా
జిష్ణుల్ వ్యాసపరాశరాదులు మదిం జింతింతు రెల్లప్పుడున్
విష్ణుబ్రహ్మశివాఖ్యుఁ డంచు మిము గోవిందా రమాధీశ్వరా.

83


శా.

త్రిణ్మూర్తిన్ శశిఁగన్నదేవు నణుమాత్రీభూతులం జేయు మీ
ప్రాణ్మాహాత్మ్యము గల్గ నట్టిపరమబ్రహ్మణ్యజీవాత్మనై
త్రిణ్మోహాదులఁ జిక్కినాఁడ శరణార్థిం జూచి రక్షింపు మీ
విణ్మూత్రోజ్జ్వలదేహభాజనుని గోవిందా రమాధీశ్వరా.

84

మ.

గయకుం బోవగ నేల కాశికి చనంగా నేల భాగీరథీ
నియతస్నానముఁ జేయ నేటికి మనోనేత్రంబునం దత్త్వని
శ్చయరాద్ధాంతనిరూఢి నిన్నుఁ గనుఁగో సర్వజ్ఞుఁడౌగాదె భూ
వియదంభోనలవాయురూపధర గోవిందా రమాధీశ్వరా.

85


శా.

రంజిల్లన్ భవదీయరూపము మనోరంగంబునం గాంచి మీ
యంజం డాగినయోగికిం బొడము సమ్యఙ్మోషసంసక్తియున్
కంజాతాక్షులు దివ్యరత్నములు బంగారంబులున్ జీరలున్
వింజామర్లును వాహనంబులును గోవిందా రమాధీశ్వరా.

86


శా.

పణ్యాహారశిలోంఛవృత్తియుఁ దపోవ్యాపారముల్, పంచభి
క్షాన్యాయంబులు తీర్థయాత్రలు మహాశాస్త్రార్థవాదంబులున్
సన్యాసత్వము రిత్త మీచరణకంజధ్యానరూఢిన్ మనో
విన్యాసంబునఁ గూడకున్న హరి గోవిందా రమాధీశ్వరా.

87


మ.

ఘనకర్పూరము మెత్తినన్ బురదతోగన్ బూసినన్ భిక్షసే
యను రాజాన్నము దెచ్చిపెట్టినను కూరాకే సమర్పించినన్
తను దీవించిన తిట్టినన్ దడయఁ డెంతన్ లక్ష్యశీలుండు తా

విని చౌడున్ గని గ్రుడ్డియున్ వెలయ గోవిందా రమాధీశ్వరా.

88


శా.

బోధాగ్రంథము లాదరించి చదువంబోఁబోక మిథ్యామనో
వ్యాధిం జెందక నిత్యమున్ శ్రుతి విరుందచ్ఛాయయౌ కాలుసే
బాధం బొందక మిమ్ముగొల్వవలె సద్భక్తుండు సంతోషియై
వేదస్తుత్యపదారవింద హరి గోవిందా రమాధీశ్వరా.

89


శా.

ఆధారంబు నపాన మూర్ధ్వగతి నత్యంతప్రయత్నంబుతో
స్వాధిష్ఠానము మీదికిం జొనిపి ప్రాణాపానముల్ కుంభక
ప్రాధాన్యంబున నిర్వహించి సుగుణబ్రహ్మానురక్తిన్ మనో
వీథిన్ మిమ్ము భజింతు రుత్తములు గోవిందా రమాధీశ్వరా.

90


శా.

క్రోధావేశనిరూఢమాససులు దుర్గోష్ఠీసమేతుల్ మనో
బోధాయుక్తులు సర్వవర్జితులు ప్రాపుల్ సత్వరగ్రస్తులై
సాధుప్రాణులహింస సేతురు వృథాసంసారమాయాపురీ
వీథీనాటక మాత్మనమ్మి హరి గోవిందా రమాధీశ్వరా.

91


శా.

అక్రూరస్థితి నుండఁగావలయు రాజాస్థానమధ్యంబునన్
వక్రింపం బని లేదు ధర్మపదవిన్ వక్రింపఁగా వచ్చినన్

శుక్రాచార్యులకన్నుఁ బోఁజొనుపవే సూటిం గుశాగ్రంబుచే
విక్రీతాఖలలోకజాతమున గోవిందా రమాధీశ్వరా.

92


శా.

అభ్రప్రాయశరీరకామకృతకర్మాయత్తసంసారశం
కుభ్రాంతాత్మకులైన వంచకులనేకు ల్ద్వంద్వశీలుర్ పర
శ్వభ్రాన్వేషణబుద్ధితో సమధికాశాపాశనిర్వ్యూఢధీ
విభ్రాంతుల్ మిముఁ గొల్వనోపుదురె గోవిందా రమాధీశ్వరా.

93


శా.

కొండల్ వంటికవీశ్వరుల్ శతకముల్ కోటానకోట్లంతకున్
మెండై నిన్నును జెప్పఁబూనిరిగదా మీసాటి రా దొక్కటే
వండేనేర్పులఁ బెక్కుభంగులరుచుల్ వర్తింపవే శాకముల్
వెండిన్ నామన వాలకింపఁదగు గోవిందా రమాధీశ్వరా.

94


శా.

అచ్చంబైనభవత్ప్రసాద మతిభక్త్యావేశపూర్ణాత్ముఁడై
నిచ్చంగైకొని మర్త్యుఁ డేమఱక నిన్నే కీర్తనల్ చేయ వా
క్రుచ్చంగాఁ బని యేమి పాతకము లాక్రోశింపవే పోవుచో
విచ్చు న్మొగ్గవిరాళి మాన్యగతి గోవిందా రమాధీశ్వరా.

95


శా.

మిన్నుల్ ముట్టిన దుగ్ధవార్ధినడుమన్ మీరుంట వ్రేపల్లెలో
వెన్నల్ నేతులు పాలు మ్రుచ్చిలుటకున్ వేడ్కయ్యెనో మీకు

నోయన్నా గోపవధూటులం గలసి సయ్యాటంబు లాడంగ నీ
విన్నాణంబులు విన్నఁ జోద్యములు గోవిందా రమాధీశ్వరా.

96


శా.

ఇండ్లన్ గాపురమున్నగోపికలపాలిం డ్లంటినావంచు రో
కండ్లన్ రోళ్లను బాఁదినన్ వెఱపు మీ కావంతయున్ లేక పెం
డ్లిండ్లన్ జేయనివత్సలన్ బలిమికూర్మిన్ విప్రభావంబు లా
వేండ్లున్ మాడలు పోలబెట్టితివొ గోవిందా రమాధీశ్వరా.

99


శా.

రోలంగట్టిన తల్లి కోలకొలఁదిన్ మ్రోదంగ చేయెత్తినన్
రోలంబాలకఁ జూచి భీతకుఁడవై రో లుద్దతిన్ లాగి మీ
హేలాసత్వముఁ జూపి పేర్లు పెకలన్ యిర్మద్దులన్ ధాత్రిపై
 వ్రీలంగూల్చితి పిన్నపాపఁడవె గోవిందా రమాధీశ్వరా.

100


శా.

వెళ్లన్ దోలుకపోయి లేగల రణోర్విన్ మేపి కాళిందిలో
నీళ్లం బెట్టఁగఁబోయి చల్దిగుడువన్ నీతోడిగోపార్భకుల్
వెళ్లంజూచుచుఁ గండ్లు బెట్టుకొని మీవెన్వెంట నేతేర ను
వ్విళ్లూరించుట నామదిందలఁతు గోవిందా రమాధీశ్వరా.

101


శా.

హస్తాబ్జంబుల వేణుదండ మధురాస్యస్థంబు గావించి మీ
కస్తూరీతిలకంబు లేఁజెమట దోగన్ గానముల్ చేయవే

అస్తోకస్తనభారముం గదల నాట్యంబాడుగోపాంగనా
విస్తీర్ణాక్షిసరోజమిత్రుఁడవు గోవిందా రమాధీశ్వరా.

102


శా.

కాళిందీతటినీనవాంబుజపరాగచ్ఛన్నబృందావనీ
కేళీపుష్పితమాధవీమృదులతాగేహంబులన్ వల్లవీ
నాళీకాక్షుల నాదరించితి వనూనాలింగలీలానిశా
వేళన్ సంగమసౌఖ్యముల్ మఱపి గోవించా రమాధీశ్వరా.

103


మ.

శివుఁడున్నాఁడు పురోపకంఠమున నాచేతుల్ సహస్రంబు నే
భవపాదాంబుజభక్తులంద సముఁడన్ బాణాసురాఖ్యుండ నా
సవ తెవ్వాఁడని ధిక్కరింపఁగను హస్తద్వంద్వముల్ సిక్కఁగా
వివశుం జేయదె మీసుదర్శనము గోవిందా రమాధీశ్వరా.

104


శా.

చంచత్కాంచనకర్ణకుండలభుజాసంఘర్షివై వేణువున్
కించిత్కుంచితకోమలాధరముతోఁ గీలించి మీటింపుచున్
కాంచీదామనిబద్ధరత్నరుచి మత్కళ్యాణచేలంబుతో
వేంచేయంగదవయ్య నామదిని గోవిందా రమాధీశ్వరా.

105


మ.

ప్రకృతిభ్రాంతవిమూఢచిత్తులకుఁ జేరన్ రాక ధర్మార్థకా
మకృతాచారుల కందరాని మునిగమ్యంబైన కైవల్యమున్

సకృదుచ్చారితతావకీనమను రాజ్యం బిచ్చు నీధాత్రి పై
వికృతిం బొందెడివేళ జీవులకు గోవిందా రమాధీశ్వరా.

106


శా.

వింటన్ జెల్లదు విష్ణునామమని విద్వేషంబుతో వీనులన్
ఘంటల్ గట్టి ఘణంఘణంఘణమనంగా భూమివ ర్తించు నా
ఘంటాకర్లున కిచ్చినాఁడవు భవత్కైవల్యతేజంబులన్
వింటే మోక్షము గల్గు టేమరుదు గోవిందా రమాధీశ్వరా.

107


శా.

గట్రాలన్ బెనుకానలన్ గుహల గంగాసింధుదేశాదులన్
వట్రారావుల దేహమెల్ల బడలన్ వర్తింపుచున్ మేరువున్
జుట్రా నెన్న?బిమార్లు వచ్చినను నస్సిద్ధుండు గాఁడేని నా
వేట్రావానిప్రయాస మంతయును గోవిందా రమాధీశ్వరా.

108


రమాధీశ్వరశతకము సంపూర్ణము.