భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/ముకుందశతకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పీఠిక

ముకుందశతకము వ్రాసినకవి దూపాటి తిరుమలాచార్యులు. ఇతఁడు లోహితసగోత్రుఁడు. దూపాటికొండమాచార్యులు రంగనాయకమ్మలకు జ్యేష్ఠకుమారుఁడు. తిరుమల సింగరాచార్యగురువర్యుని శిష్యుఁడు. ఈకవి సంస్కృతాంధ్రములందుఁ దనజనకునివద్ద విద్యార్థిగా నిరర్గళపాండిత్యము నార్జించి కవితారచనమున మిగులఁ బ్రతిభ గాంచెను. ఈకవి రావిపాటి కామశతకమను పేరుతో రామాయణకథ నంతయు సీసపద్యములు 108 లో నిమిడించి వేఱొకశతకము వ్రాసియున్నాఁడు. ముకుందశతకమునందలికవిత చిత్రమగుగమనికలతో మనోహరముగా నున్నది. ప్రతిపద్య మొకవిశేషముతోఁ గూడి శ్రావ్యమగు నడకతో వీనులకు విందుఁ గొలుపుచున్నది. కవితలో లాక్షణికవిరుద్ధములగు లోపములు గానరావు.

ఈకవి నివాసస్థానము బాపట్లకు పది మైళ్ల దూరమున సముద్రతీరమునందున్న ఓడరేవు. చిరకాల మీకవి యటనుండి వయస్సుదీరినపిదపఁ దన యెనుబదవయేడు పరమపదవి చేరెను. ఈకవి సోదరుఁడగు శేషాచార్యకవి ప్రౌఢకవి. ఈయన రంగధామ, నకరి . కంటి నృసింహాదిశతకములు, శకుంతల ధనంజయవిలాసాదిగేయప్రబంధములు వ్రాసినాడు. మాపితామహులగు శేషాచార్యుల కీతిరుమలాచార్యకవి యగ్రజాతుఁ డగుకతన మే మీకవిజీవితము నీవిధముగాఁ దెలుపఁగలిగితిమి. కవిమనుమ లిపుడు ఓడరేవులో నివసించియున్నారు. ఇంక నట నేమేని పుస్తకము లుండెనేమో విచారింపవలసియున్నది.

ఈకవి గతించి యిప్పటికి ముప్పదిసంవత్సరములు దాఁటినవి. తిరుమలాచార్యుఁడు స్ఫురద్రూపి యనియు ఆజానుబాహుఁడనియు సంగీతసాహిత్యవిద్యాకుశలుఁడని మాపెద్దవాండ్రు చెప్పుచున్నారు. శతకవాఙ్మయములో నెన్నఁదగినవానిలో నీముకుందశతక మొకటిగ నున్నది.

నందిగామ.

ఇట్లు భాషాసేవకులు,

5-2-25

శేషాద్రిరమణకవులు, శతావధానులు.

శ్రీరస్తు

దూపాటి తిరుమలాచార్యప్రణీత

ముకుందశతకము

అంత్యనియముపద్యములు

క.

శ్రీకర లక్ష్మీచిత్తవ
శీకర సద్గుణజితాబ్ధిశీకర కారు
ణ్యాకర తేజోవిజితవి
భాకర దాక్షిణ్యయుక్త భావముకుందా.

1


క.

బందీకృతసురబృందా
మందస్మితవిజితకుంద మహితానందా
సుందరతనుజితకందా
నందితముచికుంద నతసనంద ముకుందా.

2


క.

దనుజసముదాయశిక్షా
సనకాదిమునీంద్రపక్ష సజ్జనరక్షా
వనజభవాండాధ్యక్షా
వనరుహపత్రాక్ష విపులవక్ష ముకుందా.

3


క.

మానవపావనరామా
సూనేషుశతాభిరామ సుగుణస్తోమా

మౌనిజనహృదయధామా
దానవజనభీమ కుసుమదామ ముకుందా.

4


క.

పవనజనుతపరితోషా
కవిసముదయపోష రత్నఖచితవిభూషా
భువనమనోహరవేషా
భవజలనిధిశోష మధురభాష ముకుందా.

5


క.

శతపత్త్రపత్త్రనేత్రా
శతధృతిసన్నుతచరిత్ర శశినిభవక్త్రా
శతకోటిమదనగాత్రా
శతకోటిధరారినివహజైత్ర ముకుందా.

6


క.

సురుచిరకౌస్తుభహారా
శరనిధిగంభీరకామ సదృశాకారా
మురరిపువిపినకుఠారా
సురమునిమానససరోజసూర ముకుందా.

7


క.

పరమమునిహృదయశరణా
పరిపాలిత దేవవరుణ భవభయహరణా
సురుచిరరత్నాభరణా
శరణాగతభరణ కమలచరణ ముకుందా.

8


క.

బృందారకరిపుకదనా
వందారుబుధాళిహృదయవనరుహసదనా
కుందముకుళాభరదనా
మందస్మితవదన మదనమదనముకుందా.

9

క.

సవినయవినతతనూజా
సువదనజితరాజ ధరణిసురసురభూజా
కవినుతపాదసరోజా
రవిశతశతతేజ దైవరాజ ముకుందా.

10


క.

పశుపతివిదితవిలాసా
విశదాబ్జవికాస హాసవిద్యుద్వాసా
దశరథరాజోల్లాసా
దశవదననిరాస ముదితదాసముకుందా.

11


క.

కమనీయాంబుధరాంగా
కమలాహృత్కమలభృంగ ఖగపతురంగా
విమలాంతరంగ దానవ
సముదాయవిభంగ మౌనిసంగ ముకుందా.

12


క.

గగనమణిసుప్రతాపా
నిగమాంతోల్లసితరూప నిత్యశ్రీపా
అగణితసుగుణకలాపా
జగదవనధృతోగ్రరూపచాప ముకుందా.

13


క.

అనుదినరక్షితదీనా
సనకాదిమహామునీంద్రసంఘాధీనా
కనకోజ్జ్వలపరిధానా
దనుజారణ్యానలాభిధాన ముకుందా.

14


క.

ద్యుమణికరోల్లజితాంబుజ
రమణీయముఖప్రభావరాజితచంద్రా

కమలజభవముఖవర్ణిత
శమదమశాంతాదిసుగుణసాంద్ర ముకుందా.

15

ఏకసమాసపద్యములు

క.

కులిశసరోరుహకేతన
కలశరథాంగాబ్జమకరకల్పమహీభూ
హలయవజలచరరేఖా
విలసన్మృదుపాదవినతవేద ముకుందా.

16


క.

ద్రుహిణాండాంతస్స్థితజల
దహనపయోనిధిసమీరతారాపథభూ
గహనాద్రికమలబాంధవ
తుహినకరోల్లసితలోకతుంద ముకుందా.

17


క.

పారదశారదనీరద
నారదమౌక్తికసుపర్వనగహాయగజక
ర్పూరేందుకుందసుమశివ
హీరహిమసమానకీ ర్తిబృంద ముకుందా.

18


క.

సురగరుడోరగవిద్యా
ధరరక్షోయక్షసిధ్ధతపనోడుపకి
న్నరగంధర్వానిలకిం
పురుషస్తుతిపాత్రసుగుణ(?)బృంద ముకుందా.

19


క.

కమలాననహైమవతీ
రమణాశుగకిన్నరాధిరాజపయోరా

డమరేంద్రకర్బురానిల
శమనాదిసుపర్వవినుతచరిత ముకుందా.

20


క.

హీరాబ్జరాగమౌక్తిక
చారుమణీప్రకరతప్తజాంబూనదకే
యూరమకుటాంగుళీయక
హారాదివిభూషభూషితాంగ ముకుందా.

21

శ్లోకరూపపద్యములు

క.

రామం రావణదనుజవి
రామం జనకాత్మజాభిరామం సుజనా
రామం వంచితభార్గవ
రామం త్వాం హృది సదాస్మరామి ముకుందా.

22


క.

శాంతం సన్నునిహృదయని
శాంతం పద్మజభవాదిసంస్తుతిభరితా
శాంతం స్థాపితసుజనా
శాంతం త్వాం హృది సదాభజామి ముకుందా.

23


క.

కాండావాస పిచండా
కాండోద్భవ కాండరూప ఖగసంతతిరా
ట్కాండమహాహవ సునిశిత
కాండ విదారితనిశాటకాండ ముకుందా.

24


క.

గోమద్గోరుహగోయుగ
గోమర్దితదనుజజాల గోకులపాలా

గోమద్గోనిలయార్చిత
గోమజ్జారాధితాంఘ్రిగోజ ముకుందా.

25


క.

శ్రుతివిదితగతిని వైష్ణవ
మత ముద్ధరణం బొనర్చి మహి నొప్పిన శ్రీ
యతిపతిని మతిని సతతము
స్తుతు లతులితముగ నొనర్తు సుగుణముకుందా.

26


క.

వరతిరుమలవంశాంబుధి
పరిపూర్ణసుధాకరుండు పరమౌదార్యా
కరుఁడగు సింగరసద్గురు
నిరతము సేవింతు మదిని నిల్పి ముకుందా.

27


క.

అందంబై కవిహృదయా
నందంబై యొప్పునందనందనగుణస
త్కందశతమనెడు వికసిత
కుందకుసుమసరములిత్తు గొనుము ముకుందా.

28

దశావతారవర్ణనము

క.

శకులాకారము గైకొని
సకలామరు లెన్న వేదసముదాయము సో
మకుని బరిమార్చి బ్రహ్మకుఁ
బ్రకటముగా నొసఁగలేదె పరమముకుందా.

29


క.

అమరాసురు లన్యోన్యము
క్రమమున క్షీరాబ్ధి తరువ గమకించుతఱిన్

గమఠాకృతి మందరగిరి
సమధికత వహింపలేదె సదయ ముకుందా.

30


క.

ధరణీమండల మెల్లను
సుర లద్భుతమందఁ జాపచుట్టినగతి దాఁ
బరగించిన హేమాక్షుని
హరియింపఁగలేదె దంష్ట్రి వగుచు ముకుందా.

31


క.

డింభకవిద్వేషిని గని
స్తంభమున నృసింహలీలఁ దాల్చి తునుమ వే
అంభోరుహసంభవభవ
జంభాంతకముఖులు వినుతి సలుప ముకుందా.

32


క.

బలిదైత్యుని మూఁడడుగులు
బలిమిని భూదాన మడిగి ప్రాబల్యమునన్
జలజభవాండము రెండడు
గులు గొలువవె వటుఁడవై వికుంఠ ముకుందా.

33


క.

పరశువు గైకొని నృపులను
దురమున ముయ్యేడుసార్లు దునుమాడి యశం
బరుదుగ జగములు నిండఁగఁ
బరప భార్గవుఁడ వగుచుఁ బరమముకుందా.

34


క.

దశరథునకుఁ బుత్త్రుఁడవై
దశవదనముఖోగ్రదైత్యతతి నణఁచిననీ
యశమును గొనియాడఁగ నల
దశశతవదనునకునైనఁ దరమె ముకుందా.

35

క.

ముసలహలంబును గైకొని
వసుధం గలదుష్టదైత్యవర్గము నెల్లన్
గసిమసఁగఁజేసి త్రుంచవె
రసికులు కీర్తింపఁగ బలరామ ముకుందా.

36


క.

కాంచి చతుర్ముఖషణ్ముఖ
పంచముఖసహస్రముఖులు భక్తిమెయిం గీ
ర్తించఁగ మెలఁగెడునిను సే
వించెద గోపాలకృష్ణవేష ముకుందా.

37


క.

శుద్ధాత్మలఁ ద్రిపురాసుర
శుద్ధాంతాంగనలవ్రతము చూఱలుగొనవే
బౌద్ధావతారమున సుర
సిద్ధాదులు పొగడ భక్తసేవ్య ముకుందా.

38


క.

కలికిమహారూపుఁడవై
ఖలులగు మ్లేచ్చులను దునిమి కారుణ్యమునం
గలిదోష మడఁతువౌగద
సలలితఘననీల సుగుణజాల ముకుందా.

39


క.

దశరూపములను బూని త్రి
దశులు నమోనమ యటంచుఁ దద్వేళల నీ
యశముఁ గొనియాడఁగా దు
ర్దశలను బాపుదువుగాదె దయను ముకుందా.

40

దశమస్కంధపూర్వోత్తరభాగకథాసూచకపద్యములు

క.

వసుదేవుఁడు దేవకియును
వసుదేవముఖుల్ నుతింప వాత్సల్యమునన్
వసుమతి నిను బుత్త్రునిగాఁ
గుసుమాయుధరూప కనరె గోరి ముకుందా.

41


క.

నందయశోదామిథునము
నందనుఁడవటంచు నిన్ను నమ్మియుఁ బరమా
నందాబ్ధిమగ్నమౌ లోఁ
జెందినప్రేమాతిశయముచేత ముకుందా.

42


క.

కృష్ణాష్టమియం దిలపై
కృష్ణాఖ్యను జనన మొంది కితపతతిని వ
ర్ధిష్ణుఁడవై తునిమితివౌ
యుష్ణాంశునికాశతేజ మొప్ప ముకుందా.

43


క.

సుజనచకోరము లలరఁగఁ
గుజనాంభోజాతతతి ముకుళత వహింపన్
ద్విజరాజవంశశరధికి
ద్విజరాజవు కావె దివిజనినుత ముకుందా.

44


క.

కలుషధ్వాంతము విరియఁగ
విలసితపుణ్యాంబుజములు వికసిల్లఁగ భూ
తలమున శ్రీకృష్ణాఖ్యను
జలజాప్తునివిధము గొనవె సదయ ముకుందా.

45

క.

నీచిన్నారికరంబులు
నీచారుపదాంబుజములు నీచిఱునగవుల్
నీచక్కఁదనము పొడఁగని
వాచస్పతికైనఁ బొగడవశమె ముకుందా.

46


క.

రాజిలుచు నిన్ను గోపక
రాజస్యలు శయ్య నునిచి రాగముతోడన్
జోజోయని పాడుదురఁట
రాజీవదళాక్ష లోకరక్ష ముకుందా.

47


క.

రుచిరాకారముచే విష
కుచయగురక్కసిని బట్టి కూల్చితివఁట నీ
ప్రచురప్రభావములు సుర
నిచయము గొనియాడ శరదనీల ముకుందా.

48


క.

నిండినతేజము గదురగఁ
జండోగ్రనికాశకోపసంయుక్తుఁడవై
బండిని గూల్చితివౌ నీ
దండితనం బెన్న నెవరితరము ముకుందా.

49


క.

సల్లలితమృదులకరపద
పల్లవములు దగుల నెలమి పాల్ద్రావుతఱిన్
ముల్లోకంబులు ముఖమునఁ
దల్లికిఁ గనఁబఱుపలేదె దయను ముకుందా.

50


క.

చక్రానిలదనుజుఁడు నిను
విక్రమమునఁ గొనుచు గగనవీథి జనుతఱిన్

శక్రాదులు గొనియాడ న
వక్రతఁ గూల్చితివి భక్తవరద ముకుందా.

51


క.

పలుకుల నమృతరసంబులు
చిలుకఁగఁ బాదాంబుజములఁ జిఱుగజ్జెలు ఘల్
ఘలుఘలుమని మ్రోవఁగ గం
తులు వైవవె శైశవంబు దోఁప ముకుందా.

52


క.

పన్నగరాజునకైనను
సన్నుతి జేయంగరానిజన్నంబుల నీ
కెన్నఁడు తృప్తియు లేదఁట
వెన్నలు మ్రుచ్చిలుట లెంతవింత ముకుందా.

53


క.

వాత్సల్యముతోడను గో
వత్సములను మేపుచుండి ప్రబలత మెఱయన్
వత్సాసురుఁ దునుమవె శ్రీ
వత్సాంకితవక్ష సుజనపక్ష ముకుందా.

54


క.

ఒకకొండరీతిగ భయా
నకరూపము దాల్చి తిరుగు నానాగతులం
బకదైత్యుని దునిమితివా
సకలాశ్రితజాల దివిజసాల ముకుందా.

55


క.

ఖరుఁ డఘదైత్యాధముఁ డజ
గరగతిమార్గమున కెదురుఁగా నిలువఁగ భీ
కరకరములఁ జీల్పవె చూ
పరు లద్భుతమొంద భక్తపాల ముకుందా.

56

క.

కాళియఫణిఫణములపై
హేలాగతి పాదచిహ్న లేర్పడ నటనన్
వాలాయముగ నొనర్పవె
జాలిం దత్సతులు సుతులు సలుప ముకుందా.

57


క.

వత్సార్భకతతి నజుఁ డతి
కుత్సితమతి యగుచు నొక్కగుహ నిడి చన త
ద్వత్సరము తత్తదాకృతి
వత్సలత వహింపలేదె వరద ముకుందా.

58


క.

నతుఁడై భయభక్తుల నా
చతురాననుఁ డప్రమేయసౌందర్యశ్రీ
యుతతావకరూపము గని
స్తుతు లొనరింపంగలేదొ సొలసి ముకుందా.

59


క.

యమునాజలములఁ దోఁగెడి
కమలాస్యలహాస్య మెసఁగఁ గన్గొని తచ్చే
లములఁ గొని మరల నీయవె
విమలాత్మక లగుచు నిన్ను వేఁడ ముకుందా.

60


క.

సురపతి కోపాన్వితుఁడై
పరుపోపలవృష్టి వ్రజముపైఁ గురియుతఱిన్
వెఱవకుఁడని గోవర్ధన
గిరి యెత్తవె యొక్కలీలఁ గేల ముకుందా.

61


క.

మానితయమునాతటభూ
కాననమున గోగణంబుఁ గాచుచు మురళీ

గాన మొనర్పఁగ నిను వ్రజ
మానవతుల్ గోరలేదె మదిని ముకుందా.

62


క.

బృందావనమున గోపక
సుందరులను రాసకేళి సొక్కించి మహా
నందమునఁ గూడియాడవె
బృందారకు లలర సుగుణబృంద ముకుందా.

63


క.

ముజ్జగములు కుదురుగ బల్
బొజ్జన ధరియించునిన్నుఁ బొలుపుగ వ్రజయో
షిజ్జనము వలచె మోహక
మజ్జనమున విటుఁడ వనుచు మమత ముకుందా.

64


క.

ఇరుగడలను గోపికలును
పరగఁగ మధ్యమున నుభయపార్శ్వంబుల నీ
వరుదుగ నిలువవె మండల
సరణిన్ రాసోత్సవంబు సలిపి ముకుందా.

65


క.

ముద్దులుగులికెడుపలుకుల
వద్దికను భ్రమించి గోపవనితామణు లే
ప్రొద్దు నిను గూడుదురుగద
సద్దివిజమునీంద్ర దేవసాల ముకుందా.

66


క.

పరిపరివిధముల మెలఁగుచు
దురమున వృషశంఖచూడతురగాసురులన్
బరిమార్చి దుష్టనిగ్రహ
మరుదుగ నొనరింపలేదె హారి ముకుందా.

67

క.

వక్రాత్ముండగు కంసుం
డక్రూరుని గాంచి యోమహాత్మ చని మహా
విక్రములగు బలకృష్ణుల
నక్రూరత్వమునఁ బిలువమనఁడె ముకుందా.

68


క.

వచ్చిన యక్రూరుని గని
విచ్చేసె మహాత్ముఁ డనుచు వేడ్కదలిర్పన్
బొచ్చెము లేని సపర్యల
హెచ్చుగఁ జేసితివిగాదె యెలమి ముకుందా.

69


క.

స్యందనమునఁ దొలుతను గా
ళిందీజలములను నీదులీలాకృతి కా
నందింపఁడె యక్రూరుఁడు
వందనము లొనర్చి దాసవరద ముకుందా.

70


క.

మధురాపట్టణసురుచిర
మధురాధర లపుడు నీదుమదనాకృతియున్
మధురాలాపంబులు బహు
విధములఁ గొనియాడలేదె వేడ్క ముకుందా.

71


క.

కంసముఖదుష్టభూపనృ
శంసుల చక్రాదిదివ్యసాధనములచే
హంసతురగుండు మేలన
హింసింపఁగలేదె జగము లెన్న ముకుందా.

72


క.

జననీజనకులఁ గనుఁగొని
వినయమున నమస్కరించి విపులాహ్లాదం

బొనరించి యుగ్రసేనుని
జననాథుని జేయలేదె సదయ ముకుందా.

73


క.

బృందారకగురుసముఁడగు
సాందీపునివలన వేదశాస్త్రంబుల నా
నందమున నేర్చి గురునకు
నందను నొసఁగవె భళీ! యనంగ ముకుందా.

74


క.

కనికరముతోడ గోపక
వనితల నోదార్చుకొఱకు వాత్సల్యమునన్
బనుపవె యుద్ధవు వ్రజమున
కనవరతదయాంబురాశి వగుచు ముకుందా.

75

అష్టభార్యలవివాహము

క.

క్రూరులగు చైద్యముఖనృప
వీరులను నిరాకరించి విశ్వజననియౌ
శ్రీరుక్మిణీసతీమణి
నారూఢి పరిగ్రహించి తౌర ముకుందా.

76


క.

జాంబూనదరుచిరాంగియుఁ
గంబుగ్రీవయు విశాలకమలాక్షియునౌ
జాంబవతిం గైకొనవే
యంబుజశరకోటిసుందరాంగ ముకుందా.

77


క.

సత్రాజిత్తుఁడు తనప్రియ
పుత్త్రికయగు సత్య నెలమి పూజించుచు స

త్పాత్రుఁడవని నీ కొసఁగఁడె
మిత్రత్వము జగములందు మెఱయ ముకుందా.

78


క.

ఇందీవరలోచన నీ
లేందీవరచికురపద్మినీశసుత సదా
నందద సద్గుణయగు కా
ళిందీసుదతిని గ్రహింపలేదె ముకుందా.

79


క.

కమనీయరూపఘనవి
శ్రమసుగుణవతీలలామ పరమానందన్
రమఁబోలు మిత్రవిందను
సుమహితమతి గొనవె మహిమ జూపి ముకుందా.

80


క.

భగ్నం బొనర్చి నృపతుల
నగ్నిప్రభ నొప్పుశౌర్య మలర శుభశ్రీ
లగ్నంబునఁ జేకొనవే
నాగ్నజితిన్ లోకపూతనామ ముకుందా.

81


క.

రుద్రాదు లెన్న జలచర
ముద్రితయంత్రంబుఁ దునిమి మోహనలీలన్
భద్రన్ శమదమసుగుణస
ముద్రం గైకొనవె కృష్ణమూర్తి ముకుందా.

82


క.

వనరుహలోచన చంద్రా
నన సద్గుణ మద్రరాజనందన యగుల
క్ష్మణ నటు గైకొంటివిగద
జననాథులు మెచ్చ దివ్యచరిత ముకుందా.

83

క.

షోడశసహస్రరమణుల
వేడుకఁ బరిణయము నొంది వివిధాకృతులన్
గూడి పరమాద్భుతంబుగఁ
గ్రీడింపవె నరకదనుజు గెలిచి ముకుందా.

84


క.

పతిశుశ్రూషామతులగు
సతులకు నీ కుదయమైన సవినయశౌర్యా
న్వితులగు సుతుల గణింపఁగ
శతధృతిశర్వులకు వశమె సదయ ముకుందా.

85


క.

శిశుపాలదంతవక్త్రుల
నిశితసుదర్శనముచేత నిర్జించి వెసన్
యశము జగంబులు నిండఁగ
విశద మొనర్చితివి వేదవేద్య ముకుందా.

86


క.

అటుకులు కుచేలుఁ డొసఁగఁగఁ
దటుకున భక్షించి లోకతతికందని స
త్పటుతరసంపద లొసఁగితి
వఁట నీదాసత్వ మెన్న నరుదు ముకుందా.

87


క.

నిను ద్రౌపది కౌరవసభ
ఘనపరిభవ మొంది కృష్ణ కావుమటన్నన్
గనికరముతోడ వెఱువకు
మని యక్షయపటము లొసఁగితౌర ముకుందా.

88


క.

నతుఁడై బహుతరదైన్యా
న్వితుఁడై భూసురుఁడు నిన్ను వేఁడిన గృపమున్

మృతులైనసుతుల గ్రమ్మఱ
బ్రతికించి యెసంగితార పరమముకుందా.

89


క.

శ్రుతులు నిను మాగధులు భూ
పతి నెటు గీర్తింతు రటులఁ బటుతరభక్తిన్
నుతు లొనరింపవె సతతము
చతురాననవినుతపాదజలజ ముకుందా.

90

షోడశోపచారపూజ

క.

ధ్యాన మొనర్చెద మామక
మానసకంజాతపీఠమధ్యంబున నీ
నూనదళమృదుపదంబులు
మానసమున నిల్పి శ్రీరమాప ముకుందా.

91


క.

ఆవాహన మొనరించెద
శ్రీవనితారమణిఁ గూడి చెలువారంగా
వేవేగ రమ్ము మామక
సేవకుఁడని కనికరంబుచేత ముకుందా.

92


క.

భాసురకాంచనమణిసిం
హాసన మొసఁగెదను బంకజాక్ష కృపను నీ
వాసీనుఁడవై బ్రోవుము
శ్రీసతితోఁ గూడి గుణధురీణ ముకుందా.

93


క.

ముదమున నర్ఘ్య మొసంగెద
సదయుఁడవై గొనుము దివిజసన్నుతచరితా

విదురముఖభ క్తవరదా.
మదనశరోల్లసితరూపమహిత ముకుందా.

94


క.

విద్యాధరముఖసురనుతి
వేద్య కృపారసనివేశ విశ్వేశ్వర శ్రీ
విద్యోతన గైకొను మిదె
పాద్యం బొసఁగెదను భక్తపాల ముకుందా.

95


క.

నాచిత్తంబుజపీఠిని
నీచక్కనివిగ్రహంబు నిల్పి నతుఁడనై
యాచమనీయం బొసఁగెద
వాచస్పతివినుత గొనుము వరద ముకుందా

96


క.

అభయప్రద జగదద్భుత
విభవసమస్తాగమాంతవేద్య రమేశా
ఇభరాజవరద గైకొను
మభిషేక మొనర్చెదను కృపాబ్ధి ముకుందా.

97


క.

సీతారమణికళత్రా
శీతాంశుఖరాంశునేత్ర చిత్రచరిత్రా
పీతాంబర మొసఁగెదఁ గొను
చేతోమోదాతిశయముచేత ముకుందా.

98


క.

కందర్పసదృశవిగ్రహ
మందరసమధైర్య సంకుమదకలితశ్రీ
చందన మలఁదెదఁ గైకొను
మందముగా మానసాబ్జట మలర ముకుందా.

99

క.

మొల్లల జాజులఁ బొగడల
మల్లెలఁ జేమంతిపూల మరువక తులసీ
పల్లవముల సంపెంగల
ఫుల్లాంభోజముల సేతు పూజ ముకుందా.

100


క.

ధూప మొనర్చెద సర్వ
వ్యాపక పద్మాక్ష గరుడవాహన ధర్మ
స్థాపక లక్ష్మీనాయక
గోపాలస్వామి కృపను గొనుము ముకుందా.

101


క.

శ్రీరాజనం బొనర్చెదఁ
గారుణ్యాకర రమేశ గైకొను పారా
వారగభీర పరాత్పర
నూరిజనావనశమాదిసుగుణ ముకుందా.

102


క.

క్షీరాన్నము దధ్యోదన
మారూఢిగ వడలు సుఖియ లతిరసములు నిం
పార పుళిహోర పొంగలి
కూరిమి నర్పింతుఁ గృపను గొమ్ము ముకుందా.

103


క.

ఏలాలవంగవరహిమ
వాలుకసత్క్రముకచూర్ణవర్ణితమగు తాం
బూల మొసంగెదఁ గైకొను
శ్రీలలనారమణ మృదులశీల ముకుందా.

104


క.

అంగీకరించి కృప ను
ప్పొంగుచు నొసఁగెదను మంత్రపుష్పము విద్వ

త్సంగరిపుభంగ గరుడతు
రంగదయాస్వాంతరంగ రంగ ముకుందా.

105


క.

సీతావల్లభ వలఁగొని
ప్రీతాత్ముఁడనై నమస్కరించెదఁ గరుణో
పేతాంతరంగ మామక
పాతకము లడంచి బ్రోవు పరమముకుందా.

106


క.

దూపాటికొండమార్యసు
ధీపుంగవునకును సుతుఁడఁ దిరుమలకవినా
దీపించినాఁడ నీకృప
నీపద్యావళి యొనర్చి తెలమి ముకుందా.

107


క.

సతతము తావకనామాం
చితశతకము జదువుజనుల సిరిసంతతులన్
శతవత్సరములు విభవా
న్వితులుగఁ గృప సేయవయ్య వేడ్క ముకుందా.

108


ముకుందశతకము సంపూర్ణము.