భక్తిరసశతకసంపుటము/మొదటిసంపుటము/సింహాద్రి నారసింహశతకము
పీఠిక
ఈనరసింహశతకము రచించినకవి గోగులపాటి కూర్మనాథుఁడు. ఇతఁడు విశాఖపట్టణమండలనివాసి. [1]లక్ష్మీనరసింహసంవాదము (పద్యకావ్యము) మృత్యుంజయవిలాసము (యక్షగానము) అను రెండుపొత్తము లీకవి రచించినవి మేము చూచితిమి. కవి క్రీ. శ. 1750 ప్రాంతమునందుండి యుండును. ఇతని యితరగ్రంథములవలన నితఁడు ఆపస్తంబుఁ డగు ముద్గలగోత్రుఁడనియు నాఱువేలనియోగియనియుఁ బెద్దింటి సంపత్కుమార వేంకటాచార్యులశిష్యుఁడని తెలియును.
ఆంధ్ర దేశములో సింహాచలము సుప్రసిద్ధమగు నృసింహక్షేత్రము. తురకదండు ఆంధ్రదేశమునకు దాడి వెడలి మార్గమధ్యమున నున్న గ్రామములు గాల్చుచు జనులఁ బీడించుచు సతులమానభంగము గావించుచు పొట్నూరు, భీమసింగి, జువ్వి, చోడవరము లోనగు గ్రామములలోని దేవాలయముల రూపు మాపి సింహాచలము ముట్టడించెను. ఆలయమండపములలో గోహత్య గావించి బ్రాహ్మణాదుల బరాభవించి సతుల యభిమానధనములు చూఱగొని తురక లెన్నియో దుండగములకుఁ బాల్పడిరి.
కూర్మనాథుఁ డాసమయమున ధర్మసంరక్షణార్థము లెమ్మని సింహాద్రి నారసింహస్వామిని చుఱుకుపలుకులతోఁ బ్రోత్సహించి, నిందించి, కటూక్తులాడి ఆలయము ముం దేకపాదమున నిలిచి యఱువదియెనిమిది పద్యములను రచించెను. తురక లీపేదబాపని లక్ష్యపెట్టక దురంతములు గావింపసాగిరి. కూర్మనాథుని పలుకువాఁడికి నొచ్చి నృసింహస్వామి [2]కందిరీగల తెట్టెను లేపఁగా నది తురకలం గుట్టి నానానస్థలఁ బెట్ట దిక్కు చెడి తలకొకదిక్కై నిలువ నీడలేక యవనులు పాఱిపోయిరి.
జనపరంపర చెప్పుకొను నీకథ విశ్వాసపాత్ర మనుటకు అఱువది యెనిమిదపపద్యము మొదలు “నీదు కరుణఁగంటి మిప్పుడు ” "జయమయ్యె యవనరాట్సంతమసము బాసె” అని నృసింహుని కవి సంకల్పసిద్ధుఁడై ప్రశంసించుటయే దృష్టాంతము కాఁగలదు.
కూర్మనాథుకవి మృదుపదగుంభితము. ఇతని నుడి పొందికలో శిలల కైన జీవశక్తి గలిగించు నొకయమోఘశక్తి గలదు. లోపముల నెత్తిపొడిచి యచేతనమగు శిలావిగ్రహముచేఁ బనిగొన్న యీ కవిశక్తి ప్రశంసార్హము. కార్యాంతమున భగవం తుని గటువచోహతిచే నొప్పించితినని కవి పరితపించు దీనవాక్యములు హృదయదారణములు. ఏతదుత్తమశతకరచనమూలమున నీకవికీర్తి యాచంద్రతారమై వెలుగుచున్నది.
ఈశతకము యుక్తియుక్తములగు సామెతలతో మృదుమధురములగు మాట పొందికలతో శతకవాఙ్మయమునకు భూషణప్రాయముగనున్నది. ఆంధ్రదేశమును యవనదళములు ముట్టడించి చేసినకల్లోలములకు, దేశీయులు లంచగొండులై వారి ధాటి కవకాశము లొసంగి యాత్మహత్యాసమమగు నాత్మవంచనమునకుఁ బాలుపడినందుల కీశతకము తార్కాణము కాగలదు.
ఇట్టి విప్లవపరిస్థితులలో రచింపఁబడిన వెంకటాచలవిహారశతకము, మట్టపల్లి నృసింహశతకము లోనగునని చూచుట కాంధ్రప్రపంచ మాతురపడుచున్నది. వావిళ్లవా రాగ్రంథముల లోకమున కొసంగ బ్రార్థితులు.
ఇట్లు,
- నందిగామభాషాసేవకులు,
- 1-1-25శేషాద్రిరమణకవులు
శ్రీరస్తు
సింహాద్రి
నారసింహశతకము
సీ. శ్రీమద్రమారమణీమణీరమణీయ
సరసచిత్తాబ్జబంభర! పరాకు
శంఖచక్రగదాసిశార్ఙ్గచాపాదిభా
సురదివ్యసాధనకర! పరాకు
ప్రహ్లాదనారదవ్యాసశుకాధిక
భక్తసంరక్షణపర! పరాకు
బహుతరబ్రహ్మాండభాండపరంపరా
భరణలీలాదురంధర! పరాకు
గీ. నీకు సాష్టాంగవినతు లనేకగతులఁ
జేసి విన్నప మొనరింతుఁ జిత్తగింపు
చెనఁటి వీఁ డనిమదిలోనఁ గినుక మాను
వైరిహరరంహ! సింహాద్రినారసింహ!1
సీ. అవధారు దేవ చిత్తావధానతఁ గోరు
వనజజాదులు సేయు వందనములు
సెలవె రాత్రిందివస్థితిగతుల్ దెలుపఁగా
సోమపద్మాప్తు లిచ్చో నిలిచిరి
మందారతరుసూనమాల్యముల్ గొని యింద్రుఁ
డేతెంచె నిందుల కేమి యాజ్ఞ
గంధర్వకిన్నరుల్ కరగతవీణులై
తడవాయె వచ్చిరి దర్శనేచ్ఛ
గీ. ననుచు జయవిజయులు దెల్ప హాయి యనుచు
నిందిరను గూడియుంటివీ వింటికన్న
గుడి పదిలమంచు యవనుల గొట్టవయ్య
వైరిహరరంహ! సింహాద్రినారసింహ!2
సీ. చటులసోమకహర స్ఫుటతారాటోపంబు
కుంభినీభరణ విజృంభణంబు
ఖలహిరణ్యాక్ష శిక్షణరూక్షదక్షత
క్షుభిత హిరణ్యరక్షోభిదాత్మ
బలిమహావైభవ భంజనమహిమంబు
నుర్వీశ గర్వాంతకోర్వతిశయ
మతిదుష్టదశకంఠహరణ బాహాశక్తి
ప్రబల ప్రలంబ దారణవిధంబు
గీ. పురవధూవ్రతభంగ విస్ఫురణసరణి
భువనములఁ బ్రోవగావించి జవనయవన
సేన నణఁచుట కిటుజాగు సేయఁదగునె
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!3
సీ. [3]మొఱవవోయెనొ వక్రముఖనక్రహరమహా
సంపర్కనిర్వక్రచక్రధార
వాసిదప్పెనొ హతోద్భాసిసుమాలి మ
హాసురశార్ఙ్గబాణాసనంబు
పదునువాసెనొ మధుప్రముఖేంద్రరిపురాజ
బృందాంతకారకనందకంబు
కడిమి దప్పెనొ సౌంభకమధప్రథవిధాన
చండమై దగుగదాదండపటిమ
గీ. జబ్బుపడియుంటివేల మాయబ్బయొక్క
దెబ్బతియ్యక తురకలయుబ్బు చెడదు
గొబ్బునఁ జెలంగు మిఁకనైన నిబ్బరముగ
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!4
సీ. చుట్టబెట్టెను మహారట్టజంబులతోడ
నిఖిలరాజ్యము పఠానీలపౌఁజు
మట్టిమల్లాడెను మదసామజంబుల
పురజనపదములు తురకబలము
కొట్టి కొల్లలువెట్టె గురువిప్రమానినీ
ఘనగోగణంబుల ఖానుసమితి
పట్టిపల్లార్చిరి బహుదుర్గవర్గముల్
సరభసౌద్ధత్య పాశ్చాత్యచయము
గీ. మించి భూస్థలి నిటులాక్రమించి రాఁగ
నలుక రాదేమి నగరివారలనుదోఁచఁ
బొంచియుంటివి యవనుల ద్రుంచు మిఁకను
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!5
సీ. మొగిసి రక్కసుని బొండుగఁ జించు నీగోళ్ళు
చితిలెనో సిరికుచశిఖరిఁ దాకి
యరులపై భగభగలాడు కోపజ్వాల
లారెనో శ్రీకటాక్షామృతమునఁ
బరవీరగర్భము ల్పగిలించు బొబ్బప
ల్కదో రమానందగద్గదికచేత
ఖలుల దండింపగాఁ గఠినమౌ నీగుండె
కరఁగెనో శ్రీలక్ష్మి సరసకేళి
గీ. నహహ! నీభీకరోద్వృత్తి నల్పు లనక
యవనరాజుల నడఁచివ్రేయంగవలయుఁ
పిన్నపామునకైనను బెద్దదెబ్బ
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!6
సీ. పొదలలో డాగెనో పొట్నూరులో నున్న
రమణీయకోదండ రామమూర్తి
యెక్కడికేగెనో యెఱుగంగరాదుగా
పటుభీమసింగి గోపాలమూర్తి
సాధ్వసోద్వృత్తి నెచ్చటికేగియుండెనో
జామి నార్దన స్వామిమూర్తి
యెన్నిపాట్లను బడుచున్నాడొ చోడవ
రంబులో గేశవరాజమూర్తి
గీ. నిబిడ యవనుల భయశంక నీవు నింక
పరుల కగపడకుండుమీ పక్కనున్న
గాయ మిప్పటికిని మానదాయె నయయొ!
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!7
సీ. పాశ్చాత్యుల నమాజుపై బుద్ధిపుట్టెనో
మౌనుల జపముపై మనసు రోసి
యవనుల కందూరియం దిచ్చ చెందెనో
విప్రయజ్ఞములపై విసువు బుట్టి
ఖానజాతి సలాముపై నింపు పుట్టెనో
దేవతాప్రణతిపై భావ మెడలి
తురకల యీదునందు ముదంబు గల్గెనో
భక్తనిత్యోత్సవపరత మాని
గీ. వాండ్రు దుర్మార్గు లయ్యయో వ్రతము చెడ్డ
సుఖము దక్కదు వడి ఢిల్లి చొరఁగఁదోలు
పారసీకాధిపతులఁ బటాపంచలుగను
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!8
సీ. నీకొండపై నెక్కి నియతులౌ భక్తుల
గొట్టి నానావస్థఁ బెట్టకుండ
గంగాధరాతీర కలితమంటపముల
మద్యపానము చేసి మలయకుండ
నీవంటశాలలో నిశ్శంకతో మాంస
ఖండమ్ము ల్మెండుగా వండకుండ
నీగుడిఁ జొచ్చి దుర్నీతిఁ గామాధులై
పరవధూటుల భంగపఱచకుండఁ
గీ. బౌరుషంబునఁ దురకలఁ బారఁదరుము
వేఁటకాఁ డిల మెత్తనౌవేళ లేడి
మూఁడుకాళ్ళను నడుచు నిర్మూలితాంహ
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!9
సీ. సెలవైన భైరవుం డలుకచే వైరుల
నెత్తి బల్గదచేత మొత్తలేఁడె
యాజ్ఞ యిచ్చిన వీరహనుమంతుఁ డహితుల
ఘనవాలమున నేలఁ గలుపలేఁడె
యంపించితే త్రిపురాంతకుం డరిసేన
ఘోరశూలమ్మున గ్రుమ్మలేడె
కనుసన్నఁ జేసిన వినతాతనూజుండు
విమతుల నెగిరిపో విసరలేఁడె
గీ. యింతతాలిమి చేయుదే యిప్పటికిని
మట్టుకొని వచ్చె శత్రుసమాజ మెల్ల
ప్రజల రక్షింపు యవనేశుబలము గూల్చి
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!10
సీ. యవనేశుధాటికి నడలి సర్వస్వమ్ము
విడిచి మందిరములు వెడలువారు
వెడలియుఁ దలదాచ వెరవేమి గానక
నడవుల నిడుములఁ బడెడువారుఁ
బడియు నెచ్చటఁ గూడుఁ బట్టగానక తమ
శిశువులతో వెతఁ జెందువారు
జెంది డెందము గుంద గాందిశీకత నభి
మానార్థులై ఖేద మందువారు
గీ. నైరి యొక్కొక్కభార్యతో నవనిఁబ్రజలు
అష్టమహిషులపైఁ బదియారువేల
సతులతో నీవు వలస కెచ్చటి కరిగెదు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!11
సీ. దర్పణాకృతిఁ దళత్తళలాడు కంబాలు
డంబై చెలంగు బేడాహొరంగు
చెప్పఁజూపఁగరాని యొప్పున నుప్పురం
బప్పళించెడు వంక కొప్పుచొప్పు
చిత్రవిచిత్రమౌ చిత్రంపుబొమ్మల
గులుకు చక్కనిగుళ్ళు గోపురములు
నమృతోపమానమై యలరారుగాంగధా
రాముఖ్యసకలధారాజలంబు
గీ. నెంత ముచ్చటపడి సృజియించినావొ
యిల్లు చెడగొట్టుకొనకు న న్నేలినయ్య
ఘనతురుష్కులఁ బడగొట్ట మనసుబెట్టు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!12
సీ. యవనధాటికి భయ మందియే కాఁబోలు
నక్కజంబుగఁ గొండ నెక్కినావు
ఖానుల కడలియె కాఁబోలు సంపూర్ణ
పౌరుషంబునఁ గత్తిఁ బట్టవైతి
వఖిలపాశ్చాత్యుల నలమలేకయపోలు
తాపసిగతి జడ దాల్చినావు
మ్లేచ్ఛనాయక బలాలికి జంకి కాఁబోలు
మిక్కిలి గంధంబు మెత్తినావు
గీ. గట్టిగా నీవు తురకలు ముట్టకుండ
నవవరాహాకృతి ధరించినావు సామి
వలదు నిందలఁ బడ తురుష్కుల వధింపు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!13
సీ. పటుతరస్తంభంబు పటపటబద్దలు
గా జనించిన నీయఖండమహిమ
చటులతరంబుగాఁ బెటపెటదంష్ట్రలు
కొరుకుచువచ్చు నీ ఘోరవృత్తి
స్ఫుటతరోద్భటవృత్తి జిటచిటధ్వనిమీరు
నీనిటలాక్ష వహ్నిక్రమంబు
కుటిలనఖంబుల సొటసొట నెత్తురు
జింద రక్కసి రొమ్ముఁ జించు కినుక
గీ. యెందుఁబోయెనొ నేఁడు మహీజనంబు
గుంద నౌద్ధత్యమున వచ్చు ఘోరయవన
బృందములయందుఁ జూపు తద్భీకరగతి
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!14
సీ. నట్టువ ల్ద్రొక్కఁగా నవయామునీయకూ
లంబు గాదు రణస్థలంబు గాని
కొట్టితోలగ నీకు గోవృషభంబుల
బాజు గాదు గుఱాల పౌఁజు గాని
పట్టిచూడఁగ నీకు పసిగాపుచెలుల పా
లిండ్లు గావు ఫిరంగిగుండ్లు గాని
ముట్టిముక్కలు సేట ముదిసిన యర్జున
తరులు గా వరివీరతరులు గాని
గీ. యవనబలములతోడఁ బోట్లాడలేవు
శూరుఁడౌ జరాసంధుండు చుట్టుకొనిన
నాఁటితీ రయ్యె మేల్నీకు నవ్వుగాదు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!15
సీ. కాంతలఁ జెరబట్టఁ గనుగొనుచుంటివి
పాంచాలి వెత యెట్లు బాపినావొ
గోవధ సేయ గన్గొనుచుంటి విప్పుడు
కరుణతోఁ గరి నెట్లు కాచినావొ
ద్విజులు బాధలుపడఁ దిలకించుచుంటివి
భువిఁ గుచేలుని నెట్లు ప్రోచినావొ
సత్ప్రభురాజ్యనాశన మొందఁగంటివి
ధ్రువుని కెట్లిచ్చితో దొడ్డపదవి
గీ. దుష్టశిక్షణ మొనరించి శిష్టరక్ష
జేయకుండినఁ బూరవప్రసిద్ధి జెడును
నార్తరక్షణ బిరుదంబు హానిజెందు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!16
సీ. సముదగ్రమగు సముద్రముఁ జొచ్చి యీఁదుటో
కొండ నెత్తినిఁ బెట్టుకొంట యొక్కొ
ధరణీస్థలిఁ ద్రవ్వి తల నెత్తుకొంటయో
గొబ్బున సింగంపుబొబ్బయిడుటొ
యడుగిడి త్రైలోక్య మాక్రమించుటయొక్కొ
వేయిచేతులవాని వేయుటొక్కొ
యొకశరాగ్రమ్మున నుధధి నింకించుటొ
కరిపురం బెల్ల బెగల్చుటొక్కొ
గీ. కరుణ జగములఁ బ్రోచుటో తురగ మెక్కి
ఘనరిపులఁ గొట్టుటో తురష్కవధ యెంత
కొండ యెక్కెదు బ్రతిమాలుకొనినకొలఁది
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ17
సీ. కురుపాలు ప్రొద్దునఁ గ్రోలక నొకక్షణ
మైనఁ దాళవుకదా యాకటికిని
బాగుగామెయి మలాకీగంధ మలఁదక
యింపుపుట్టదుగదా యెప్పటికిని
తనువునిండఁగ ధగద్ధగిత పట్టాంబరం
బవధరింపక మాన వహరహంబు
నాటపాటలు మొదలగు వినోదంబుల
నుబుసుపుచ్చకకాని యుండలేవు
గీ. భక్తులెల్లను దుర్మార్గపరతురష్క
రాజిచే నొందిరిదె పడరానిపాట్లు
భోగరాగంబు లిఁక నీకు బొసఁగుటెట్లు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!18
సీ. పుట్టినప్పుడు వీకఁబోకార్చితివి భళీ
పూతనాఖ్యోపేత యాతుధాని
పుడమిపైఁ గడు తప్పు టడుగిడునప్పుడు
బండిరక్కసుమేను చండినావు
ఆటప్రాయమున దృణావర్త బకధేను
కాది దైత్యకులంబు నణఁచినావు
యౌవనంబున నృశంసావతంసక కంస
విధ్వంసనరిరంస వెలసినావు
గీ. భూసురులఁ బ్రోవవేమి మహాసురారి
యిప్పు డేటికిఁ ద్రుంప వే ళ్ళెగసనైన
బుద్ధిదిగసన వచ్చెనో పో! మఱేమి
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!19
సీ. ఎలమితో సోమయాజుల పెద్దఝారీలు
గుడిగుడీలుగఁ జేసికొనెడువారు
యజ్ఞవాటికలలో నగ్నిహోత్రంబుల
ధూమపానము చేసి త్రుళ్ళువారు
యాగపాత్రలు దెచ్చి హౌసుగావడిలుడి
కీచిప్పలుగ జేసి కేరువారు
స్స్రుక్స్రువముఖ్యదారు మయోపకరణము
ల్గొని వంటపొయి నిడుకొనెడువారు
గీ. నగుచు యవనులు విప్రులఁ దెగడుచుండ
సవనభోక్తవు నీ విట్లు సైఁపఁదగునె
దినఁదినఁగ గారెలైనను గనరువేయు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!20
సీ. చింపికుళాయైన శిరమున దాలిచి
దివ్యకిరీటంబు దీసిదాచు
వనమాలికయె చాలు వక్షంబున ధరింపఁ
గౌస్తుభరత్నంబు గట్టిసేయు
పూడకుండగ చెవి పుడకైన నిడుకొని
మకరకుండలములు మాటుసేయు
కటిధగద్ధగితమౌ కనకచేలం బేల
మొలచుట్టు మొకపాటి ముతకగుడ్డ
గీ. దొడ్డసరుకులు తురకలు దోచుకొనిన
కష్టమౌ కానివేళ జగత్కుటుంబి
వీవు వేషంబు చెడిన నీ కెట్లు గడచు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!21
సీ. నా మొఱాలింపవు నారదగానంబు
వినుచుంటివో వేడ్క వీను లలరఁ
గరుణ జూడవు మమ్ముఁ గమలమహాదేవి
కన్నులు మూసెనో కౌతుకమున
మముఁ బ్రోవరావేమి కమలభవాదులు
భక్తితోఁ బాదముల్ పట్టుకొనిరొ
యాదరకలన మాటాడవు భూనీల
లలరఁగా ముచ్చటలాడుమండ్రొ
గీ. యిట్టులున్న ననాథుల కేది దిక్కు
సమయమా? యిది కేళికాసౌఖ్యమునకు
దుష్టుల వధించి ప్రోవు సాధువుల నెల్ల
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!22
సీ. పాలియ్య వచ్చిన భామినిప్రాణంబు
లపహరించి చెలంగినట్లుగాదు
యాగోత్సవంబున కతిమోదమునఁబిల్వ
నపుడు మామను ద్రుంటినట్లుగాదు
చేతగా కొక నరుచేత చుట్టంబుల
నందఱఁ జంపించినట్లుగాదు
తుంగకల్పించి యత్తుంగవంశద్రోహ
మాచరించి చెలంగునట్లుగాదు
గీ. పరబలంబది నీప్రజ్ఞ పనికిరాదు
లె మ్మిఁకను మీనమేషము ల్లెక్కయిడక
చొరవతురకలు గొట్టగాఁ జుక్కలెదురె
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!23
సీ. అవని మూఁడడుగు లిమ్మని వేడవచ్చిన
బలి నణంచినదేమి ప్రాభవంబు
ఇనకుమారునిమది కిచ్చకంబుగఁ బొంచి
వాలిని జంపు టే వీలు నీకుఁ
గడుఁగాలయవనున కడలి యాముచుకుందు
పాలి కేతెంచు టే పౌరుషంబు
భువి జరాసంధుతోఁ బోట్లాడగా లేక
ద్వారకఁ జేరు టే ధైర్యవృత్తి
గీ. యౌర నిజమాడు నిష్ఠురం బౌనటండ్రు
గాక రోషంబు గలిగినఁ గఠినయవన
సేన నిర్జించి యీయాంధ్రసృష్టి నిలుపు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!24
సీ. నీరుహుక్కా పకడోరె గద్దాయని యా
హితాగ్నుల నెత్తు లణచకుండ
పాముథోనేకు తుం పాని లారే యని
తివిరి శ్రోత్రియుల మర్దింపకుండ
ఘూసులారే అరే గాండూ యనుచు శిష్ట
తతులపైఁ బడి బిట్టు తన్నకుండ
కులితీ పకావురే జలిదీ యటంచు మా
ధ్వుల మెడ వడిఁబట్టి త్రొయ్యకుండ
గీ. బహులహాలామదావిలపరుషయవన
రాజి నిర్జింపు నీవంటి ప్రభువు గల్గ
బ్రాహ్మణుల కిన్నిపాట్లు రారాదు గాదె
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!25
సీ. అగ్రజపీడితుండైన విభీషణు
ఠీవిముం దయజూచినావుగావొ
అలమున భీతుఁడౌ నంబరీషుని యార్తి
నాదంబు మున్ను విన్నావుగావొ
బహుభాదితుండైన ప్రహ్లాదునకును ము
న్నీవు ప్రత్యక్షమైనావు గావొ
ధ్రువముఖ్యులైన భక్తులనెల్ల మున్ను సం
తసమున రక్షించినావుగావొ
గీ. నాఁటి మదిలేదొ? కరుణ నన్గనవు వినవు
రావు ప్రోవవు వేగ పురాణపురుష
తాతతాతవు ముదిమదితప్పినావు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!26
సీ. గ్రామంబులన్నియుఁ గాల్చి దీపారాధ
నలు చేసి రౌర! యానందముగను
వడి సాధుజనుల సర్వస్వమ్ము గొని శఠ
గోపంబు బెట్టిరి గురుతరముగఁ
బటఘటాదుల పోవ బ్రతిమాలువారి కే
మియ్యక ఘంటవాయించి రహహ!
పెద్దలకడ దుడ్డుపెట్టి ప్రసాదంబు
వడ్డించి తగ [4] పరవశులఁ జేసి
గీ. రవుర! యవనార్చకులు నీకు నాప్తులైరి
భూసురులు చేయు పూజలు పొసఁగవొక్కొ?
యకట! యిది యేమి పాపమునకు వెరువవు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!27
సీ. వాసవు పిడుగులవానకు వెరవవు
కడు ఫిరంగీగుండ్ల కడలనేల
వెరవవు భీష్మాదిభీష్మబాణాళికి
బాణాలకేటికి భయపడంగ
దవవహ్ని దిగమ్రింగితివిగాని జంకవు
భయమేల యీయరబ్బులకు నీవు
గణియింప కధికరాక్షసుల శిక్షించితే
మ్లేచ్ఛుల నణఁచు టేలెక్క నీకు
గీ. నీ కలిమి నీ వెఱుంగవుగాక లోక
కర్తవగు నీకొక యసాథ్యకార్యమేది?
పామరులు నవ్వకుండగఁ బరులఁ దరుము
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!28
సీ. సమధికప్రేమచే శబరి యెంగిలిజేసి
యొసగినపండ్లెల్ల మెసగి మెసగి
చెలగి కుచేలుండు జీర్ణచేలంబున
బొదవు ముక్కటుకులు బొక్కి బొక్కి
వనములో పాంచాలి వండిన శాకభాం
డములోని బలుసాకు నమిలి నమిలి
బంచుండి యాదుర్గబోయనబోటితో
కొర్రగింజలు కొన్ని కొరికి కొరికి
గీ. మింగి తిప్పుడు భక్తులపుణ్యమునను
భోగమోయప్ప యీతిప్ప బోర్లబడిన
....మి భుజియింతు పరులదుర్వృత్తి నణచు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!29
సీ. తనుదానె కౌఁగలించెను రుక్మిణీదేవి
యలసత్యయును పొలయలుకమానె
క్షణమైన బాయదు జాంబవతీదేవి
మేనుమే న్గదియించె మిత్రవింద
భద్రయు న్భవదూరుభద్రపీఠిక నెక్కె
వదలకుండె సుదంత వామకరము
కాళింది నిజపాదకమలము లొత్తంగ
లక్షణ మైదీఁగె లాగదొణగె
గీ. రాఁగనోపవొ? పాశ్చాత్యరాడ్బలంబు
సాధుతతిఁ గొట్టిదోఁచఁఘాఁ జకితులయిరి
తుది పనికివచ్చెలే నీకు తురకగుద్దు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!30
సీ. తపనీయకశిపుండు దండించుతరువాత
కాని ప్రహ్లాదుని గానలేదు
కురురాజు పాంచలి కొప్పు పట్టీడిపిం
చినవెన్కఁగాని రక్షింపలేదు
కరిరాజు మొసలిచేఁ గడుకష్టపడిన
పిమ్మట గాని వేంచేసి మనుపలేదు
పాండవు ల్బాధలఁ బడిన యనంతరం
బునగాని సిరులిచ్చి బ్రోవలేదు
గీ. భక్తు లిప్పుడు కొన్ని యాపదలఁబడక
ముందుఁ బోషింపనట్లయౌఁ గొందఱికిని
మును శిశువు నేడిపింపక ముద్దురాదు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!31
సీ. జడవిప్పి జులపాలు సవరింపు మిరువంక
బలు కిటికిరీటీరాల పాగఁజుట్టు
బొట్టునెన్నుదుటిపై బొత్తిగా దుడుచుకో
పోగులూడ్పుము చెవు ల్పూడవిడువు
వడిగ నంగీయిడార్డొడుగు దట్టీజుట్టు
కైజారుదోపు డాల్కత్తిఁ బట్టు
బీబినాంచారిని బిలుపింపు వేగమే
తుదకభ్యసింపుమీ తురకభాష
గీ. శక్తిలేకున్న నిట్టివేషంబు పూను
మన్న సరి! లోకవంద్యుఁడవయిననీవె
నీచులకును సలామ్ సేయ నే సహింప
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!32
సీ. గోవర్ధననగంబు గొడుగుగాఁ బట్టిన
నాఁడు కేలుననొప్పి నాఁటెనొక్కొ
సరిదెబ్బలాడుచో జాంబవంతునిగుద్దు
కోరెక్క లో గుంట్లు పారెనొక్కొ
నరుని సారథివైననాఁడు భీష్మునిచేతి
కఱకుటమ్ములు ఱొమ్ముగవిసెనొక్కొ
దుగ్గన బోయనితూఁపు నాఁటినపక్క
గాయ మిప్పటికిఁ బోదాయెనొక్కొ
గీ. యక్కట యవనరాట్సేనఁ జక్కుజేసి
యుక్కణఁప వెందుచోత నీ వోపలేవు
పేదపుండెల్ల బయలను బెట్టవలయు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!33
సీ. కనిపించుకోవుగా ఖలులు మార్గస్థులఁ
రొంకక ముక్కులుఁ గోయునపుడు
ఆలకింపవుగదా యయ్యయో! ప్రజఘోష
ధూర్తులు వడినిళ్ళు దోఁచునపుడు
జలిగాదాయెగా చటులతురుష్కులు
భామినులను జెఱ ల్పట్టునపుడు
అలుకలేదాయెగా యవనులు సత్ప్రభు
వసుమతిమట్టుకో వచ్చునపుడు
గీ. మంకుతనమేమి? మాతండ్రి! మఱచినాఁడ
మానునే గొల్లపాల్ ద్రావ మందబుద్ధి
దేవకీదేవిపాల్ ద్రావఁ దెలివిరాదె
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!34
సీ. అల విప్రభార్యయౌ నదితిపాల్ ద్రావుట
బలి యాచనావృత్తి పాదుకొనియె
క్షత్రియకన్యయౌ కౌసల్యబాల్ ద్రావ
రావణాదులఁ ద్రుంచి బ్రబలినావు
గొల్లయౌ నందుని కులసతి పాల్ ద్రావఁ
బసులగాచెడుబుద్ధి పట్టువడియె
నిసుమంత విసపురక్కసిపాలు చవిచూడఁ
గాబోలు మాపట్ల కఠినవృత్తి
గీ. పాలకాగ్రణియైన గోపాలబాల!
పాలబుద్ధులు మాని మాపాలఁ గలిగి
పాలన మొనర్చవయ్య! కృపాలవాల
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!35
సీ. బేగీ అరేఅరబ్బీ పడోరే యని
బోడిసన్యాసుల బొడచువారు
మత్రఖోమూపరుమాటీ యనుచు వైష్ణవుల
బొట్టుదుడుపఁగఁ బోవువారు
పత్థరుకాయకు బందియారేచోడ్
దేవని శైవులఁ దిట్టువారు
కాలటీకాతూనికా ల్దేవటంచు మా
ధ్వుల ప్రల్లదమ్మాడి త్రోయువారు
గీ. నైరి యవనులు మిమ్ము నిట్లడగఁజేయ
నట్టివాండ్రకు ద్విజులెంతయౌఁ గద గుడి
మ్రింగువానికి లింగ మూర్బిండివడెము
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!36
సీ. విషవహ్ని బ్రజకెల్ల వెతఁజేయు కాళీయు
పడగలు వడిద్రొక్కు పటిమ యేది
వడిగ బిడౌజుండు పిడుగులు వర్షింప
శైలమెత్తిన నాఁటి శక్తి యేది
దుర్యోధనాదులు దొరకించుకొనువేళ
విశ్వరూపము సూపు వింత యేది
ముర నరకాది ముష్కరదుష్కరాదుల
మర్దించి చెలఁగు నీమహిమ యేది
గీ. ఇట్లు ఖలు లేచ దీనుల నెన్నఁటికిని
కరుణజూచెదొ? కలవాఁడు గాదెదీయు
దనుక బీదలప్రాణముల్ తాళుటెట్లు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!37
సీ. ఆభీరగృహముల నారగాగినపాల
మీగడల్వడి దిగమ్రింగఁగలవు
తల్లియిచ్చినచల్ది తగబ్రహ్మ వచ్చిన
వెనుకజూడక వేగ విసరఁగలవు
రాధికామధురాధరామృతధారలు
గుటుకుగుటుక్కునఁ గ్రోలఁగలవు
భక్తులెల్లను తిరుపణ్యారము లొసంగఁ
జెలిఁ లోలోన భక్షింపగలవు
గీ. గాని యవనులపై వడిబూనలేవు
కబళమన నోరు దెరతువు కళ్ళెమన్న
మోముద్రిప్పు హయగ్రీవమూర్తి వహహ
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!38
సీ. అల విభీషణుపల్కు లాదరించినవాఁడె
యతిదుష్టుఁడౌ రావణాసురుండు
వసుదేవముఖ్యుల వరబోధ వినియెనే
దుండగీఁడైన కంసుండు నాఁడు
విదురాదిబుధులఁ వివేకము ల్దెలిసెనే
క్రోధాత్ముఁడైన దుర్యోధనుండు
భీష్మాదు లెంతసెప్పిన నిచ్చగించెనే
బాలిశుఁడగు శిశుపాలకుండు
గీ. గొట్టకుండఁగ ధూర్తుల వట్టిశాంతి
తాలిమేటికిఁ దురకలు తరిమిరాఁగ
నొదిగిచూచెదు కలిబోయ నుట్లదిక్కు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!39
సీ. నిదురించినావొ నిర్ణిద్రభద్రాకార!
కలితభోగీంద్ర భోగంబుమీఁద
శయనించినావొ శైశవమూర్తితోఁ బయః
పాథోధిపటువటపత్రసీమఁ
బవళించినావొ శ్రీభామినీదోర్మూల
కూలంకషస్తనకుంభయుగళిఁ
బడకగావించితో భక్తసమ్రాణ్మన
స్సంకల్పితానల్పశయ్యయందు
గీ. నిబిడపాశ్చాత్యభీతులై నిఖిలజనులు
కదసి మొరవెట్ట నీకెట్లు నిదురపట్టె?
లెమ్ము నాసామి! జాగేమి! చిమ్ము రిపుల
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!40
సీ. నినుఁ బూజ గావింప ఘనవిప్రు లేటికి
కొదువగాకుంజ సయ్యదులె కలరు
వినుతింప శాస్త్రజ్ఞవిద్వాంసు లేటికి
వీలుగా మించు మౌల్వీలె కలరు
ఆత్మకీర్తన సేయ హరిభక్తు లేటికిఁ
గేకలు వేయ ఫకీర్లు కలరు
పూతాత్ములగు ననుష్ఠాతలు నీకేల
తఱచుగా పీరుజాదాలె కలరు
గీ. వట్టియాశల నిటు మెడవట్టిత్రోయఁ
జూరువట్టుక వ్రేలాడినార మిట్టి
ముచ్చటకె నీవు పశ్చిమముఖుఁడ వౌట
వైరహరరంహ! సింహాద్రి నారసింహ!41
సీ. జయవిజయీభవ జగదవనాసక్త
జయవిజయీభవ శౌర్యయుక్త
జయవిజయీభవ శాశ్వతకళ్యాణ
జయవిజయీభవ నయధురీణ
జయవిజయీభవ సర్వంకషప్రజ్ఞ
జయవిజయీభవ సన్మనోజ్ఞ
జయవిజయీభవ సాధుజనాధార
జయవిజయీభవ భయవిదూర
గీ. యనుచు జయవాక్యముల జను ల్వినుతిసేయఁ
జక్రహస్తుఁడవై రిపుక్షయ మొనర్చి
ధరణిఁ బాలింపు మాచంద్రతారకముగ
వైరిహరరంహ! సింహాద్రినారసింహ!42
సీ. చాటకపోఁజుమీ! చాలఁబ్రోవకయున్న
నాఁటి వ్రేపల్లెలో రోటిమాట
ప్రకటింతుజుమి! మమ్ము రక్షింపకుండినఁ
దగ గొల్లచెలుల వస్త్రములమూట
దాచనుజుమి! మమ్ము దరిజేర్పకుండినఁ
గొంకక మధురలోఁ గుబ్జమాట
బైటఁబెట్టెదజుమీ! పాలింపకుండినఁ
గాలయవనునాఁటి కానిమాట
గీ. మర్మమెఱిఁగినవారితో మానువాదు
బైసి పోగొట్టుకోకు మాపాలఁ గలిగి
సాధురక్షణ, దుష్టశిక్షణ మొనర్పు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!43
సీ. ఖలపదార్థమునందు నిలయమొందితి వంటి
నలవెన్నదొంగిలి తనుటలేదు
లక్ష్మియౌ రుక్మిణీలలనఁ గూడితివంటి
వలరాధ మరిగితి వనుటలేదు
అవనిఁ బాలింపఁగా నవతరించితివంటిఁ
బశుపాలకుఁడవని పలుకలేదు
దుష్టులౌ రాజదైత్యుల హరించితివంటి
వల నరసారథి వనుటలేదు
గీ. యయ్య యెదురాడ నామాట లనకమున్నె
ఖలుల వధియించి నీసిగ్గు నిలుపుకొమ్ము
పరులు నవ్వఁగ నపకీర్తిపాలుగాక
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!44
సీ. గ్రామదాహకకర్మ గతిమానుపుమటన్న
వెస నదేమఱియుఁ గావించె దీవు
పథికుల దోపించు పనిమానుపు మటన్న
వెస నదేమఱియుఁ గావించె దీవు
చెరలు జూరలుపట్ట సేగి మాన్పు మటన్న
వెస నదేమఱియుఁ గావించె దీవు
బహుసస్యనాశనార్భి మానుపు మటన్న
వెస నదేమఱియుఁ గావించె దీవు
గీ. వేడుకొనుకొద్ది లావాయె వెఱ్ఱివాఁడ!
యోడముంచకు మనురీతి యొనరు మాకు
బుద్ధి తెచ్చుక యవనుల పొంక మణఁచు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!45
సీ. మామిడిచిగురు సొంపేమిలక్ష్యంబనఁ
గరచరణాంబుజకాంతి వెలుఁగఁ
గలకలనవ్వు చక్కని ముద్దు నెమ్మోము
పద్మసౌభాగ్యంబుఁ బరిహసింప
వెలిదమ్మిరేకుల వెలవెలబోఁజేయు
సోగకన్నులజూపు చోద్యపఱుఁప
నిద్దంపు నునుఁజెక్కుటద్దంబులందును
మొలకనవ్వులతేట ముద్దుగులుక
గీ. నపుడు బుట్టిన పసిబిడ్డఁ డనఁగఁ బాల
కడలి మఱ్ఱాకుపైఁ బండిఁ కరుణ జగము
బ్రోతువఁట! మమ్ముఁ గావ విప్పు డది యేమి?
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!46
సీ. పుడమిపై నడుగిడి నుడువనేరనివారిఁ
దీవ్రతపరువు లెత్తించినావు
పైమీఁది దుప్పటి బరువని వారిచే
మించైనమూట మోయించినావు
గడపదాటని కులకాంతామణులఁ బృథ్వి
నెల్లడఁ గలయఁ ద్రిప్పించినావు
షడ్రసోపేతాన్నసంభోక్తజన పరం
పరబలుసాకు పాల్పఱచినావు
గీ. భళిర! యఘటనఘటనాప్రభావ మెల్ల
దీనజనులందె చూపితి దెలిసివచ్చె
“నయ్య సామెల్ల నింట నే”యన్నమాట
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!47
సీ. భవదీయముఖభవబ్రాహ్మణోత్తముల కా?
యవనులచేత నాయాసపడుట
భవదీయబాహుసంభవరాజవరుల కా?
మ్లేచ్ఛనాథుల గెల్వలేకయుంట
భవదూరుసంభవబహువైశ్యకోటి కా?
తురకలచే నిట్లు దోపుబడుట
భవదీయపాదసంభవసూద్రజనుల కా?
విమతులౌ తురకలవెట్టిచేత
గీ. మాకుఁ జెప్పకు మెట్లైన మంచిదిగద!
లోకకర్తకు నపకీర్తి నీకు వచ్చు
వలదు నాయన్న! యిఁకనైన ఖలుల నణఁచు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!48
సీ. రాఘవ మముఁబ్రోవ రావయ్య! ఖగయాన
రాకున్న మీ దశరథునియాన
శీఘ్రంబు మమ్ము రక్షింపు శేషశయాన!
జాగుచేసినను కౌసల్యయాన
మదిఁ గఠినతమాని మనుపుము మాయాన
మనుపకున్న వశిష్ఠమౌని యాన
పాలింపు మమ్ము నీపరమసత్కృప యాన
పాలింపకున్న శ్రీభామ యాన
గీ. యానబూన సమర్థుండ వఖిలజగము
నానఁదప్పక పోషింపు మావతారి
తగవుదప్పి నటింపఁగా ధర్మ మగునె?
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!49
సీ. అరులఁ గొట్టఁగ సింహగిరిగుహ డాఁగిన
నవని నిన్ బిఱికివాఁ డందురయ్య!
నీవు రక్షింపక నీలాద్రి కేగిన
నవని ని న్మొండివాఁ డందురయ్య!
పోషింపఁగాలేక శేషాద్రి కేగిన
నతిలోభి వనుచు ని న్నందురయ్య!
తగ నాదరింప కంతర్వేది కేగిన
నతిలోభి వనుచు ని న్నందురయ్య!
గీ. నాథ! యిటు లోకనటనం బొనర్చు నీకు
నహహ! నిందలు వచ్చును నదియు విడచి
యొడ్డుకొనఁబోకు వెసఁబ్రోవు ముర్విజనుల
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!50
సీ. అరిసైన్యధూళి సూర్యాక్రాంతమై మించె
నిఁకనేమి దయజూచె దీవు మమ్ముఁ
బరభేరిభాంకృతు ల్పగిలించె దిశల నిం
కేమి నామొర వినియెదవు నీవు
ధరశత్రుహరిఖుర దళితమయ్యె నింకేమి
వచ్చెదవయ్య ప్రోవంగ మమ్ము
వైరితేజశ్శిఖ దజ్వలియించె నిం కేమి
మొగమునఁ జూచెదు జగతిజనుల
గీ. నీపయికి వచ్చునప్పుడు నీవెఱుంగ
వేమి? మసలకు మింక దిక్కేది మాకు
జాగరూకుండవై రిపుక్షయ మొనర్పు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!51
సీ. ప్రజలెల్ల విసికిరి పాశ్చాత్యరాట్చమూ
భీతులై మిమ్మును బిలిచిపిలిచి
జనులు వేసారిరి సమదతురుష్కుల
వెతలచే మిమ్మును వేడివేడి
పరులెల్ల స్రుక్కిరి నానాయవనహృత
రుక్ములై మిమ్మును మ్రొక్కి మ్రొక్కి
ప్రాణిసంతతి భంగపడియె ఖానులు సేయు
దరిలేని వెత మిమ్ముఁ దలఁచి తలఁచి
గీ. యిందుఁ గలఁ డందు లేఁడని సందియంబు
జెందవలదన వేదవాగ్బృందమెల్ల
నెందు వెదకినఁ గానరావేమి యిపుడు
వైరి హరరంహ! సింహాద్రి నారసింహ!52
సీ. బహుఫణాదీప్తుఁడౌ ఫణిరాజుపైఁ బండి
గాలివారకయుండఁ గాచె దీవు
వరగరుద్విస్ఫురద్గరుడునిపైఁ జెంది
చిరసుఖగతుల రక్షించె దీవు
వేత్రాధిగత జగద్వితతి విష్వక్సేను
దరిఁ జేర్చి బలయుక్తి దనిపె దీవు
ఘనభుజాబలవంతు హనుమంతు నెదఁజేరి
యెలమి బ్రహ్మానంద మిచ్చె దీవు
గీ. పొసఁగ నీరీతిఁ దలబోయఁ బొడుగుచేతి
వానిపణ్యార మాయెఁగా దీనపాల!
పృథుబిరుదలీల! యేమూలఁ బెట్టినావు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!53
సీ. మామొఖాసాకు గ్రామంబు నిమ్మనలేదు
కొంపలు గాల్పింపఁగూడ దంటి
కరిహయాదుల మేము కాంక్షింపఁగా లేదు
గోవధ మాన్పించి ప్రోవుమంటి
మాకు మిమ్ములను సామ్రాజ్య మిమ్మనలేదు
జనులఁ దోపింపఁగా జనదటంటి
స్వామి! మాకొఱ కేమి కామింపఁగా లేదు
క్షితిలోనఁ బ్రజల రక్షింపుమంటిఁ
గీ. జెలఁగి నీపదసేవలు సేయు మాకు
వేరె కోరిక లేటికి వెన్నగలుగ
నహహ! నేటికి నేతికి నంగలార్ప
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!54
సీ. భక్తసంరక్షకకృపాపరజలజాక్ష
నరహరి గోవింద హరి ముకుంద
సంసారతారక సజ్జనాధారక
సత్యసంకల్ప శేషాహితల్ప
నీలాంబుదశ్యామ నిఖిలదైవలలామ
సర్వపాపవినాశ జగదధీశ!
శ్రీరమానాయక శ్రితఫలదాయక
శృంగారదరహాస చిద్విలాస
గీ. భవ దచలపాదకదులైరి యవను లయయొ!
అలుక మానక తరుము, వాండ్రంద సిగయు
నందకుండినఁ గాల్పట్టుకొందు రయ్య
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!55
సీ. దశకంఠకంఠమర్దన దుర్దమాటోప
రామనామకమౌ ఫిరంగిదెబ్బ
తతమేఘనాదభేదక మోదలక్ష్మణ
ప్రకటనామకమౌ ఫిరంగిదెబ్బ
ఖర హిరణ్యాక్ష శిక్షకరూక్ష నిజనృహ
ర్యక్ష నామకమౌ ఫిరంగిదెబ్బ
కుంభినీభరణ విజృంభణ శ్రీకూర్మ
నామకమౌను ఫిరంగిదెబ్బ
గీ. తగిలివచ్చియు చావక ధరణిఁ దిరిగె
యవనబలము సుదర్శనాహతమహోగ్ర
రాహువన నట్లు గాకుండ రహి జయింపు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!56
సీ. గ్రామముల్ నిర్ధూమధామము లాయెను
సస్యంబులెల్ల నాశనము జెందె
దొడ్లలో శాకముల్ దుంపశుద్ధిగఁ బోయె
దోచిరి సర్వంబు గోచిదక్క
చెట్టొకపిట్టయై చెదిరిరి దిక్కులఁ
బలువెతఁ బడరాని పాట్లు పడిరి
యన్న మందరికిని నమృతోపమం బయ్యె
వరుసగా నటమీఁద వానలేదు
గీ. ప్రజల పస దీరె నిఁక మొద ల్పదిలమయ్యె
దరిదరికి వచ్చె నిదె మెండు తురకదండు
చిత్తమునఁ జూచుకోవయ్య! శీఘ్రబుద్ధి
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!57
సీ. శ్రీదేవి మరి తనుఁ జేర రానీదని
భూదేవి వదలక బొదివె ననఁగ
మోక్షధనంబని మునులు మహాపేక్ష
చేతినిక్షేపంబు జేసి రనఁగ
భక్తాగ్రగణ్యుఁడై బలి పూజసేయఁగా
బలిసద్మముననుండి వెలసె ననఁగ
బ్రహ్మాదిహృదయసారసములతోడ దా
గుడుమూఁత లాడుచుండెడు ననంగ
గీ. ధరణి గుప్తములైన పాదములతోడఁ
బాఱిపోలేవు యిఁక నేదిఁబ్రతుకుత్రోవ
పౌరుషము చాలదు తురష్కబలముఁ ద్రుంప
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!58
సీ. నిఖిలవిశ్వంబును నీయందు దాగియుండు
విశ్వంబులో నీవు వెలసినావు
వాగ్రూపకుడవు విశ్వమయుండవు
విశ్వసాక్షివి విశ్వవిభుఁడ వీవు
విశ్వసర్గస్థితి విదళనకరుఁడవు
విశ్వంబునకు నీకు వేఱు లేదు
కినుక విశ్వద్రోహ మొనరించు దుష్టల
శిక్షించి ప్రజల రక్షింపు మీవు
గీ. యింత బతిమాల మాకేల యెట్టులైనఁ
గాని శుభకంద కందకు లేనిదూల
బచ్చలికి నేల గలుగునో పరమపురుష
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!59
సీ. ఉరమున శ్రీదేవి యొఱపైన మెఱుపుగా
గంభీరవాగ్ధార గర్జితముగ
హారమౌక్తికకళ లల వడగండ్లుగా
భ్రూలత హరిచాపలీల మెరయ
కోరిక భక్తమయూరముల్ నటియింప
దీనచాతకపంక్తి తృప్తిఁ జెందఁ
దనువదనసుప్రభ దశదిశల్ నిండఁగా
పృథ్వీస్థలిని కృపావృష్ఠి నించి
గీ. (......వగ్రీష్మతేజంబు శాంతపరచి)
సత్ప్రజాసస్యసంరక్ష సలుప నిదియె
సమయ మోయయ్య! యిక మాను జాగు సేయ
నన్ను గన్నయ్య రక్షింపు నల్లనయ్య
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!60
సీ. నిడుదకడానిశా ల్నడుమున బిగియించి
తీరైన గండపెండేర మూని
రమణీయమణిశిరస్త్రాణ మౌదలఁ బూని
స్ఫుటవజ్రమయమైన జోడు దొడిగి
తూణంబు లిరువంకఁ దోరణంబుగఁ గట్టి
విలసితశరమైన విల్లు వట్టి
పరవైరిహరమైన తలవార్లు ధరియించి
దాపలఁ జికిలికటారి చెక్కి
గీ. రామవేషంబుతో సుమిత్రాసుతుండు
నీవు రణరంగమున నిల్చి నిబిడశత్రు
జాలముల నేలపా ల్సేయులీలనెరపు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!61
సీ. గాధేయయజ్ఞవిఘ్నకరాసురావళి
జక్కు జేసినయట్టి శౌర్యనిధివి
పరవీరభీకర పరశురాముని పరా
క్రమము బెండుగఁ జేయు ఘనభుజుఁడవు
పదునాల్గువేల దుర్మదరాక్షసులతోడ
ఖరునిమర్దించిన వరబలుఁడవు
బంతులాడినరీతిఁ బంక్తికంఠుని తల
ల్ఖండించు చండప్రచండరుతివి
గీ. నీకు నొక దొడ్డకార్యంబె? నీచయవన
సేన నిర్జించుపని ప్రజ ల్సేసికొనిన
కర్మమున నీదుచిత్తంబు కరఁగదాయె
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!62
సీ. కోటిసూర్యోజ్జ్వలత్కోటీరమణులతో
రమణీయమణికుండలములతోడ
శంఖచక్రాగదాసిశార్ఙాయుధములతోఁ
బ్రస్తుతప్రభఁగౌస్తుభంబుతోడ
వలిపె బంగరువల్వ వలెవాటు నీటుతోఁ
బొక్కిలి తామరపువ్వుతోడ
గంగను గన్న చక్కని పదాబ్జములతో
మిసిమి చామనచాయ మేనితోడఁ
గీ. బక్కిగుఱ్ఱంబుమీఁదను నెక్కి నాదు
మ్రొక్కుఁ గైకొని శౌర్యంబు పిక్కటిల్ల
నొక్కట యవనరాట్సేన చిక్కుసేయు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!63
సీ. దండంబు నీకు నుద్దండతేజశ్చండ!
జోహారు భక్తదుర్మోహనాశ!
మ్రొక్కెదఁ గోను జలముక్కాయ రుక్కాంత
వందనం బిదె చిదానందకంద!
నుతిసేతు శతధృతిస్తుతియుతోన్నతచర్య!
ప్రణతిఁజేసెద మునిప్రణుతచరణ!
సాష్టాంగ మిదె నీకు సాష్టాపదాంబర
కేలు మోడ్చెద జగత్కేళిలోల!
గీ. వలదు వలదు పరాకు భావమున నీకు
దీనజనములఁ గృపబోవ దిక్కు నీవ
దుష్టుల వధించి పోషింపు శిష్టజనుల
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!64
సీ. గరుడాచలంబుపైఁ గడకతో వసియించి
సత్యభామాతటిచ్ఛాయ నలరి
వరచాపమనియెడి హరిచాప మమరించి
వివిధభక్తుల కృపావృష్టి ముంచి
అమరమయూరవారము మోద మందించి
దీనచాతకములఁ దృప్తినించి
క్షత్రకన్యాకామ సస్యము ల్పండించి
జగముల చల్లనై నెగడఁజేసి
గీ. నవఘనస్ఫూర్తిచే మురనరకధేను
ఖరదవానలమార్చిన కడక నిపుడు
రిపుల శిక్షించి రక్షించు పృథ్విజనుల
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!65
సీ. నీపాదరజమున నిమిషంబులోపల
బాపురే సతియయ్యెఁ జాపరాయి
నీబాహుబలమున నిలవక పెళ్ళున
ముక్కంటి చాపంబు ముక్కలయ్యె
నీయాజ్ఞచే గిరుల్ నీట దెప్పునఁ దేలెఁ
కడఁక సముద్రంబు గట్టువడియె
నీప్రతాపాగ్నిచే నిఖిలరాక్షసకోటి
మాడి దోమలపోల్కి మడసిపోయె
గీ. బాగులే! యిట్టినెరవైన ప్రాపు గల్గి
యల్పులకు లొంగి తిరుగలేమయ్య! మేము
కర్మమా! మాకు గజమెక్కి గంతదూర
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!66
సీ. మున్ను తాటకప్రాణము ల్గొన్న బాణంబు
మెఱసి సుబాహు దున్మినవిశిఖము
మించి విరాధు ఖండించిన ప్రదరంబు
ఖరదూషణాదు సంహారశరము
మాయలమారీచు మదమణంచినతూపు
ఘోరకబంధుని గూల్చుచిలుకు
వాలి మహాశాలి గూలనేసిన కోల
జలధి నింకించిన సాయకంబు
గీ. రావణాదిమహాసురరాజి నణఁచు
చండకాండంబు లేమాయె చటులయవన
ఖండనము సేయ నయ్యంబకములఁ బఱపు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!67
సీ. ఖలహిరణ్యాక్షముఖ్యులనెల్ల ఖండించి
దేవతాతతి బ్రోచు దివ్యమహిమ
రావణకుంభకర్ణప్రముఖులనెల్ల
గొట్టి మౌనులఁ బ్రోచి దిట్టతనము
శిశుపాలకాది దుశ్శీలురఁ బరిమార్చి
క్షితి దీనజనుల రక్షించు కడక
కంసాది దుష్టవిధ్వంసనం బొనరించి
ధరణి బాలించు నుదారకరుణ
గీ. వినుటయే కాని కన్నులఁ గనుట లేదు
కంటి మిప్పుడు యవనుల గర్వమణఁచి
ప్రజల రక్షించు నీదు ప్రభావమెల్ల
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!68
సీ. కారుణ్యదృష్టిచేఁ గని మిమ్ము రక్షింప
నీరజేక్షణ నేఁడు నీవు బంపఁ
బారసీకుల దండుపైఁ గొండలోనుండి
గండుతుమ్మెదలు నుద్దండలీల
గల్పాంతమున మిన్ను గప్పి భీకరమైన
కాఱుమేఘంబులు గవిసినట్లు
దాఁకి భోరున రక్తధారలు గురియగా
గఱచి నెత్తురు పీల్చి కండలెల్ల
గీ. నూడిపడ నుక్కుమూతుల వాఁడి మెఱసి
చించి చెండాడి వధియించెఁ జిత్రముగను
నొక్కొక్కని చుట్టుముట్టి బల్ మిక్కుటముగ
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!69
సీసపద్యగీతము.
అరులఁ బరిమార్చి వైశాఖపురసమీప
గిరిబిలంబున డాఁగె బంభరము లెల్ల
అదిమొదల్ తుమ్మెదలమెట్ట యండ్రు దాని
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!70
సీ. జయమాయె యవనరాట్సంతమసము బాసె
భవదీయభాస్వత్ప్రభాబలమున
భువనజాతంబులు పొలుపుచేఁ చెన్నొందె
దిక్చక్రములు చాలఁ దెలివినొందెఁ
గమలజాదుల నుతుల్గణ సేయని నీవు
లీల నామనవి చెల్లించినావు
బ్రహ్మాండభాండసంభరణలీలాఘను
నిల నిన్ను మెచ్చి యే మియ్యగలను?
గీ. తోఁచ దిఁక నెట్టు లిదె నాకు దోఁచినట్టు
తులసిదళ మొక్క టిత్తు సంతోషమొందు
మదియె యగణితపూజగా నవధరింపు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!71
సీ. అపరాధినపరాధి నార్తరక్షణదక్ష!
యపరాధినపరాధి నంబుజాక్ష!
యపరాధి నపరాధి నద్భుతగుణధుర్య!
యపరాధి నపరాధి నధికశౌర్య!
యపరాధి నపరాధి నంబోధిగంభీర!
యపరాధి నపరాధి నత్యుదార!
యపరాధి నపరాధి నానందపరిపూర్ణ!
యపరాధి నపరాధి నభ్రవర్ణ!
గీ. నేర్చియైనను మిక్కిలి నేరకైన
నిష్ఠురోక్తులఁ బల్కితి నిన్ను నాదు
తప్పు సైరించి దాసుని దయతలంపు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!72
సీ. వీరాధివీరుండవై రాజిల్లెడు నిన్ను
బిఱికివాఁ డంటిని భీతిలేక
జగదేకవితరణాశ్రయమూర్తి వగు నిన్ను
బహులోభి వనుచును బలికినాఁడఁ
బరిపూర్ణకరుణాస్వభావుండ వగు నిన్ను
నిర్దయుం డంచు నిందించినాఁడ
నద్భుతానందకళ్యాణగుణుండవౌ
నినుఁ గూర్చి పలికితి నిర్గుణుఁడని
గీ. యలుక జనియించి దుష్టుల నణఁచుకొఱకు
పడుచుఁదనమున నిటులంటి భక్తవరద!
మదపరాధసహస్రముల్ మది క్షమింపు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!73
సీ. పరమమోహాంధుండ పాపస్వభావుండ
దుశ్శీలపరుఁడను దుర్మదుండ
దుష్కామయుక్తుండ దుర్మార్గసక్తుండఁ
గ్రోధాంతరంగుఁడఁ గుటిలమతిని
లోభిని నింద్రియలోలుండఁ జపలుఁడ
దంభవృత్తుండ మాత్సర్యయుతుఁడ
దుష్టుండ దుస్సంగదూష్యుండ శమదమ
హీనుఁడ శౌర్యవిధానపరుఁడ
గీ. నైన శరణొందితిని నన్ను నాదరింపు
సజ్జనులకైన మిగుల దుర్జనులకైన
సౌఖ్య మొసఁగదె కల్పవృక్షంబునీడ
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!74
సీ. తే నమో రక్షిత దేవరాయ సురేంద్ర
సేవితాయ మునీంద్రభావితాయ
తే నమో నిత్యసుధీరతాయ సుమేరు
ధీరతాయ యశుభవారణాయ
తే నమో నిర్జితదీనతాయ భృతాప్త
మానవాయ దళితదానవాయ
తే నమో జ్ఞానసుధీహితాయ చిరాయు
తాకృతాయ బుధోరరీకృతాయ
గీ. “పాహిమాం పాహి మా మన్యధా హి నాస్తి
శరణమరుణాబ్జదృక్కోణకరుణ” ననుచు
వందనము చేసి కొల్తు భావమున నిన్ను
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!75
సీ. స్నానసంధ్యాద్యనుష్ఠానశక్తుఁడఁ గాను
పరమయోగాభ్యాసపరుఁడఁ గాను
విమలదివ్యక్షేత్రగమనదక్షుఁడఁ గాను
ఘనవరదానసంగతుఁడఁ గాను
భవదీయపదపద్మభక్తియుక్తుఁడఁ గాను
నిరుపమాజ్ఞానమానితుఁడఁ గాను
పరమోపకారసంభరితచిత్తుఁడఁ గాను
శమదమసత్యనిశ్చలుఁడఁ గాను
గీ. వినుము దీనావన! యనాధజనుఁడ నయ్య!
నేను మిక్కిలి తెలియఁగానేర నయ్య!
దేవ నిర్హేతుకృప నన్నుఁ బ్రోవవయ్య!
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!76
సీ. ధరణిగుప్తంబైన చరణయుగ్మముతోడ
నలరారు ప్రక్కగాయంబుతోడ
రమణీయమైన వరాహాననముతోడ
ఘనతరఫాలలోచనముతోడ
నిగనిగలాడు బల్నిడుదకీల్జడతోడ
నవ్యగోక్షీరవర్ణంబుతోడ
మైనిండ నలఁదిన మంచిగంధముతోడ
నిమితభక్తానుగ్రహముతోడ
గీ. నఖిలలోకావనము సేయ నవతరించి
యున్న మిమ్ముల వినుతింప నోపలేరు
హిమకరకిరీటముఖులు నే నెంతవాఁడ
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!77
సీ. సోమకాభిఖ్య రక్షోనేత, ధృతిచేత
నామ్నాయజాతము లపహరించి
మధ్యేనదీనాథమగ్నుఁడై డాఁగినఁ
ధత్ఖలు దునిమి వేదములు మరల
ధాత కొసంగఁగా దలఁచి నీ వల మత్స్య
మూర్తివౌటను తపస్స్పూర్తివేళఁ
దొడరి ధీవరులు సద్గుణజాలముల నుంచి
నిలుపు దురాత్మ మందిరములందు
గీ. కాన నిను భక్తరసపూరకలిత లలిత
మామకీనమనస్సరోమహితుఁ జేతు
శీఘ్ర మిష్ట మొసంగ వేంచేయవయ్య
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!78
సీ. చలవగాఁ బన్నీట జలకంబు లొనరించి
విలువలేని కడాని వలువ గట్టి
కలికి మానికముల గులుకు గద్దియ నిల్పి
తిలకంబు నొసల జెన్నలర దిద్ది
కలపంబు మైనిండ నలఁది బల్మగరాల
తళతళలాడు సొమ్ములు ధరించి
యలరు నెత్తావిదండలు వీలుగా వేసి
కలితరసాన్న మింపొలయఁ బెట్టి
గీ. విడె మొసఁగి పద మొత్తెద వేడ్కతోడఁ
బవ్వళింపుము మన్మనః పద్మశయ్య
నలరిపుల నెల్ల మర్దించి యలసినావు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!79
సీ. భువనము ల్కుక్షిలోఁ బూని రక్షించి తా
భువనంబులో నిక్కముగఁ జరింతు
పరమాణురూప విభ్రాజమానసుఁడ వయ్యుఁ
దామేటిరూపంబు దాల్పనేర్తు
నసమవైరాగ్యమానసుఁడ వయ్యు వినోద
గతితోన మందరాగము ధరింతు
వతినిర్భరాత్ముఁడవై వెలిఁగియుఁ నీ వ
నంతరూపంబు ధరింతు నెప్పు
గీ. డనుచు లోకోపకారార్థ మవతరించి
మించి తా క్రియ లొనరించి మిగులఁ జెలఁగు
కూర్మనాయక న న్నేలుకొనఁగదయ్య!
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!80
సీ. అతితిగ్మరుచి మండలాక్షి యుగ్మచ్ఛాయ
వలయాద్రిదావాగ్నివలె వెలుంగ
రిక్కింప తనురుహశ్రేణి గాడిన యఖం
డాళి సూచ్యగ్రముక్తాంచితముగ
గురుదివాభేదకఘుర్ఘురధ్వని క్షయ
స్తనయిత్ను గర్జకుం జదువు సెప్ప
పదఘట్టనలఁ జిమ్ము ప్రళయోదకము నభ
స్థలము నామ్రేడితార్క్షముగఁ జేయఁ
గీ. గిటితనువుతో హిరణ్యాక్షు గీ టడంచి
క్షమ ధరించితి చర్వణసమయలగ్న
మేఘశకలంబుగతి దంష్ట్రమీఁద నడర
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!81
సీ. నతిఁ జేతు నిదె నీకు నాసికానిస్సృత
జంఝానిలోద్ధూతశైలజాత
వందనం బిదె నీకు ప్రహ్లాదశుకపరా
శరధీరహృదయగహ్వరవిహార
సాష్టాంగ మిదె నీకు స్వర్భానుహిమధామ
జేతృప్రతాప నృసింహరూప
మ్రొక్కెద నిదె నీకు క్రూరసంహారక
సాగరపూరకోదారకరుణ
గీ. పాలన మొనర్పు నఖరకుద్దాలదళిత
కనకకశిపుదానవఘనతను విదళన
జాతకీలాలపరితృప్త భూతనివహ
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!82
సీ. దేవతాతతికోర్కె దీర్పగా సమకట్టి
జనకతార్థికిఁ గశ్యపునకుఁ బుట్టి
యుదుటుగా నుదుట మృదూర్ధ్వపుండ్రము బెట్టి
కింశుకదండంబు కేలఁ బట్టి
పసపునిగ్గులుదేరు పచ్చగోచియుఁ గట్టి
మధ్యస్థలంబున మౌంజిఁ జుట్టి
వర్ణనీయద్విజవర్తివై పొడగట్టి
బాలార్కశతశతాభ గను పట్టి
గీ. ధరణి గగనము రెండుపాదముల మట్టి
మరి తృతీయాంఘ్రి నబ్బలి మట్టివట్టి
వామనా! ప్రేమ నామనస్సీమ నుండు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!83
సీ. కార్తవీర్యార్జునకరచయారణ్యంబు
దారుణాగ్రకుఠారధార దునిమి
చిరతరక్షత్రియక్షేత్రముల్ సొంపుగా
భీమేశుహలముల బెగడదున్ని
తన్నృపమస్తకతతులు గుట్టలు వైచి
మిగులఁజిత్రంబుగా మెట్లు గట్టి
తత్తనుకీలాల ధారాసరిత్తుల
నవనవంబులుగఁ గాలువలు దిద్ది
గీ. ఘనయశస్సస్య మవని నాకసము నిండఁ
బ్రబలజేసితివౌ భళీ! పాదుకొనియె
భావిహలమూర్తి పరశురామావతార
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!84
సీ. మనువంశభూషణ మహిమచేఁ జెన్నొంది
ఘనకళాసాంగత్యకలనఁ జెంది
సకలసాయకవర్ణసంగతి నింపొంది
సద్గుణరీతిఁ బ్రశస్తి నొంది
యత్రానపటలలీలాత్మతఁ జెలువొంది
నిర్దోషగతులచే నెరపు సెంది
సకలజగన్నుతసంపద జెన్నొంది
సుకుమారరత్నసంశుద్ధి నొంది
గీ. సరసదశరథపత్ని కౌసల్యగర్భ
మనెడు గనియందు హరినీలమన జనించి
రామసంజ్ఞ మెలంగు ని న్బ్రస్తుతింతు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!85
సీ. ఫణిరాజశయ్యపై బవ్వళించెడి నీవు
పండితి కౌసల్య ప్రక్కలోన
బ్రహ్మాండగోళము ల్ప్రాకియాడెడు నీవు
రహిఁ బాకిరితి దశరథునియింట
బహువేదశాస్త్రప్రభావుండవౌ నీవు
నవ్యక్తవాక్యము లాడినావు
సకలచరాచరసంచారివగు నీవు
మహిఁ దప్పుటడుగుల మసలినావు
గీ. తల్లిభాగ్యముననొ? తండ్రితపముగతినొ?
పురజనంబుల తొల్లిటిపుణ్యముననొ?
భూవ్రతంబుననో? యిట్లు పుట్టి తీవు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!86
సీ. చిరుతకూకటిఘటించిన రావిరేకము
త్యములు నెన్నొసటిపై దుముకుచుండ
నిద్దంపుఁజెవుల చెందిన పెద్దమగరాల
మద్దికాయలజత ముద్దుగులక
పులిగోరునాటిన బలుపద్మరాగంబు హార
మక్కునఁ దళుక్కనుచు మెఱయఁ
గంకణధ్వని మొలగంటలరొదయు కిం
కిణరావములను నేకీభవింప
గీ. భరతలక్ష్మణశత్రుఘ్న బాలకేళి
దనరుఁ నినుఁగన్నతలిదండ్రు లనఘు లెన్న
జిన్నిరామన్న! నన్ను రక్షింపుమన్న!
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!87
సీ. రత్నకీలితతనుత్రాణంబు ధరియించి
కస్తూరికాతిలకంబు దిద్ది
బాణాసనసబాణతూణీరముల దాల్చి
యందంపుజాభరాగంధ మలఁది
మొసలివా నెరబాకు మొలఁజక్కగాఁ జెక్కి
కలికి బంగరురంగుకాసెఁ గట్టి
భీకరంబుగ గండపెండేరములు బూని
నవరత్నమయభూషణములు దాల్చి
గీ. వీరశృంగారరసములు వెలయ నీవు
కౌశికునితోఁ జనుట తాటకావధంబు
సలుప జానకి బెండ్లాడఁ దలఁచియె కద
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!88
సీ. శిల డాసినప్పుడె చికురభావము దోఁచెఁ
బదపద్మకలితషట్పదము లనఁగ
నడిగిడినప్పుడె యాననం బేర్పడె
నఖతారగతి నిశానాథుఁ డనఁగ
నంజవేయఁ గుచద్వయము గనుపట్టెను
రతియుక్తకోకదంపతు లనఁదగి
కలయఁగ్రుమ్మరువేళఁ గాంతయయ్యె దనూజ
నొసఁగ నల్లునిఁజూచు నుర్వి యనఁగ
గీ. నంత గౌతమునతివ యహల్య యగుచు
నతిథిసత్కారములు సల్పెనఁట త్వదంఘ్రి
రజము నుతిసేయఁ దరమె శ్రీరామచంద్ర
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!89
సీ. జనకరాజన్య సంసన్మధ్యమున నుండి
గొబ్బున లేచి వే నిబ్బరముగ
మణిలసత్కంకణ మంజుధ్వనులచేత
రాజన్యమనములు రగులఁజేసి
సామిలంబుగఁ గంఠసరములు దాలిచి
యీశ్వరచాపంబు నెత్తి హస్తి
హస్తాగ్రహమున బిస మవలీలఁ గొనులీలఁ
గొని నారి దివియ ఫెల్లునను విరిగె
గీ. విరిగె రాఘవ! తద్ధ్వనిఁ దరులు గిరులు
విరిగె నృపులమనస్సులు విరిగె నృపుల
నడుము ఫెల్లున నీభుజౌన్నత్యగరిమ
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!90
సీ. కనకశలాకశృంగారతరంగంబు
రాజమరాళసామ్రాజ్యలక్ష్మి
మదనబాణము నవమాలిక మాణిక్య
వల్లరి చంచలావల్లి చంద్ర
కళ ధగద్ధగితనక్షత్రంబు నవరత్న
మంజరి కందర్పమదగజంబు
లావణ్యసరసి విలాసపేటిక మనో
జవనవాటిక ఘనసారఘుటిక
గీ. జాతరూపసమేత భూజాత జనక
జాత దృగ్జిచనవవనజాత సీతఁ
బరిణయంబగుఁ నీమూర్తిఁ బ్రస్తుతింతు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!91
సీ. కల్యాణవేదికఁ గౌతుకంబులు దాల్చి
యందంపు మైగంద మలఁది ప్రేమఁ
దెరవైచి బాసవాల్తెరవలు దీవింప
లోలోనఁ జూచు మేల్చూపుసొగసు
తోరంపుముత్యాలు దోసిళ్ళఁ గీలించి
తలఁబ్రాలు వోయు బిత్తరపుఁగోపు
మంగళసూత్రసంబంధవేళాన్యోన్య
పులకితస్విన్నాంగముల మెఱుంగు
గీ. చెట్టపట్టులతో నలసీత నీవు
గురువులకు వందనము సేయు కూర్మిభక్తి
రంగు మీరంగ మిథిలాపురంబునందుఁ
జూచు పుణ్యాత్ము లేనోము నోచినారొ
భద్రయుతకీర్తి శ్రీరామభద్రమూర్తి
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!92
సీ. తమ్ములు నీవు నందమ్ముతోఁ బెండిలి
కొడుకులై సతులతోఁ గూడి చనుచు
పరశురాముని భంగపఱచి యయోధ్యాపు
రంపు వైభవము మీరంగఁజేరి
కోరిక ల్మీరఁగాఁ గొన్నాళ్ళు వసియింప
దశరథేశుఁడు మీకు ధర్మనియతి
యువరాజ్యపట్టణోద్యోగంబుఁ గావింపఁ
గడుఁ జూడఁజాలక కైక మిమ్ము
గీ. సకలలోకైకనిందకు జడియ కకట!
యడవులకు నేగుమనఁగ నోరాడె నెట్లు
కైక నననేల? నీదు సంకల్ప మట్లు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!93
సీ. అంటినఁ గందెడు నడుగుదమ్ములతోడ
నడవికి జానకి యెట్లు నడచెనయ్య!
పుడమి యేలుట మాని జడదారులగు మిమ్ముఁ
దల్లిఁ గన్గొని యెట్లు తాళెనయ్య!
యనుఁగుఁదమ్ముఁడు సుమిత్రాత్మజుఁ డొక్కఁడె
మిముఁ గొల్చి వెతమాని మెలఁగెనయ్య!
నీదుపావలు రాజ్యనేతలుగాఁ గొల్చె
భరతుఁ డక్కట! యెంత భక్తుఁడయ్య!
గీ. చిత్రకూటాద్రిఁ గడుఁ దప్పు జేసినట్టి
చెడుగుకాకము మరల రక్షించినావు
రామ! నీ వెంత కరుణాంబురాశివయ్య!
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!94
సీ. దండకారణ్యదైత్యావళిఁ బరిమార్చి
సాపరాధు విరాధు రూపుమాపి
మునుహేతి జుప్పనాతిని విరూపినిఁ జేసి
ఖరకృత్యు ఖరదైత్యు గండణంచి
మాయాతినీచుని మారీచుఁ బరిమార్చి
దుర్మదాంధునిఁ గబంధుని వధించి
తతవక్రశీలముల్తాళముల్ ఖండించి
వాలి దోర్బలశాలిఁ గూలనేసి
గీ. తొడరి సుగ్రీవ హనుమదాదులను గూడి
వనధి గర్వ మడంచి రావణునిఁ ద్రుంచి
ఘనవిజయ మొందు వీరరాఘవుఁడ వీవు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!95
సీ. శాశ్వతంబుగ విభీషణునకు లంక ని
శ్చలకృప నొసఁగుట దలఁచుకొన్నఁ
జెఱబడ్డ సురసిద్ధగంధర్వకాం
తల విడిపించుటఁ దలఁచుకొన్న
నిఖిలలోకంబులు నిష్కళంకములుగా
నలరఁ బ్రోచినవింత దలఁచుకొన్న
కొలచినవారికిఁ గొంగుబంగారమై
తగుకోర్కె లిచ్చుట దలఁచుకొన్న
గీ. ముదముగాను ధరాసుత ముద్దరాలిఁ
బరమపావని వినరాని పలుకు లాడి
యగ్నిఁ జొరఁజేయుటయె మాకు నలుకపుట్టె
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!96
సీ. అభినవాయోధ్యాపురాంతఃపురమునందు
మిసిమిబంగరురంగుమేడలోన
జిలుగు మేల్ రతనాలసింహాసనముమీఁద
వామాంకమున సీత ప్రేమ గులుక
హనుమంతుఁ డగ్రంబునందు భక్తిఁ జెలంగ
ఛత్రంబు వెనుక లక్ష్మణుఁడు పట్ట
భరతశత్రుఘ్నులు పార్శ్వస్థులై వీస
వాయువ్యతటి జాంబవద్విభీష
గీ. ణేనంగజాదముఖులు పెంపెసఁగ మధ్య
నీల జలరుహరుచిమీరు నిన్ను రాము
రమ్యగుణధాము పట్టాభిరాముఁ గొల్తు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!97
సీ. మానితమూర్తియై మహిమచేఁ జెన్నొంది
కామపాలాభిఖ్య గరిమ జెంది
పంకజాతంబులఁ బరిమార్చుకళ మించి
యరిభయంకరగతి నధిగమించి
శుభకరధవళాంగశోభచే దనరారి
రేవతీరమణాంక రీతిమీరి
సద్బలభద్రప్రశస్తిచేఁ జెన్నొంది
ఘనతరామాకృతిని జెలంగి
గీ. చంద్రుఁ డన భూజనాహ్లాదసరణి మీఱు
నిన్నుఁ గొనియాడదరమె వాఙ్నేతకైన
నతులసంకర్షణస్వరూపాభిరామ
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!98
సీ. నీమహామహిమ వర్ణింపఁగాఁ దరమౌనె
ఫణిపతికైన వాక్పతికినైన
సకలలోకంబులు జననంబు నొందింప
రక్షింప శిక్షింప రాజ వీవ
యఖిలజగత్కంటకాకృతి నుగ్రులౌ
త్రిపురరాక్షసుల మర్దించుకొఱకుఁ
తద్వధూనికరవ్రతంబులు భంజించి
దుష్టసంశిక్షయు శిష్టరక్ష
గీ. జేయఁగా బుద్ధమూర్తి ప్రసిద్ధిఁగన్న
యతులకారుణ్యమూర్తి ని న్నభినుతింతు
నీపదంబులపై భక్తి నిలుపఁజేయు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!99
సీ. అయ్యారె! నెమ్మెము నొయ్యారమౌ భళీ!
నిక్కువీనులు ముక్కు చక్కఁదనము
ఔర కైజామోర! యల్లార్చునుద్ధతి
సేబాసు రొమ్ములో జిగిబెడంగు
అన్నన్న! చిత్రతరాంఘ్రిధారాగతి
వాహువా! సుందరబాహులీల
ఆహా! సమస్తశుభావరత్విస్ఫూర్త
బాపురే! విపులమౌ వీపు! కోపు
గీ. అనుచు సకలజనుల్ చోద్యమంది పొగడ
ఘనతరాశ్వంబుపై నెక్కి కలికిమూర్తి
వగుచుఁ బాశ్చాత్యవరులను నణచె దీవు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!100
సీ. దేవకీసతి వసుదేవనందనుఁడవై
నందయశోద లానందమొంద
సమదాత్మపూతనాశకటతృణావర్త
ధేనుకముష్టికాదికులఁ ద్రుంచి
గొల్లచేడెల వల్వ లుల్లంబులు హరించి
మామ కంసుని ద్రుంచి మధుర నలరి
రుక్మిణి ముఖ్యసరోజేక్షణలఁ గూడి
ద్వారక వసియించి ధర్మసరణిఁ
గీ. బాండవులఁ బ్రోచి కౌరవబలము నడఁచి
భక్తరక్షణ శిక్షచే బ్రబలినట్టి
కృష్ణ! గోవింద! మాధవ! కేశవ!హరి
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!101
సీ. మాణిక్యపీఠికామధ్యపద్మస్థితు
రవికోటితేజోవిరాజమానుఁ
గందర్పశతకోటిసుందరాకారుని
శంఖచక్రగదాశార్ఞ్గధరుని
శ్రీభూమి యువతి సంశోభిపార్శ్వద్వయు
నంచిత పుండరీకాయతాక్షు
శ్రీవత్సకౌస్తుభ శ్రీహారయుతవక్షుఁ
గటిలసన్మణికాంతి కనకచేలు
గీ. మకుటకుండలకేయూరమహితకంక
ణాంగుళీయకముఖ్యభూషాంగు విశ్వని
లయు నారాయణస్వామి నిన్నుఁ గొల్తు
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!102
సీ. తిరుమల పెద్దింటిధీర సంపత్కుమా
రార్య సద్వేంకటాచార్య శిష్యు
సురుచిరాపస్తంబసూత్ర మౌద్గల్యస
గోత్రు, గోగులపాటి కులజ గౌర
మాంబికాశ్రిత బుచ్చనామాత్య వరపుత్త్రుఁ
గూర్మదాసాఖ్యు నన్ గూర్మి నీదు
చరణదాస్య మొసంగి సంతరించితి భళీ!
యే రచించిన యట్టి యీశతకము
గీ. వినినఁ జదివిన వ్రాసిన వివిధజనుల
కాయురారోగ్య మైశ్వర్య మతిశుభంబుఁ
గరుణ దయచేసి పాలింపు కమలనాభ!
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!103
సీ. శార్ఙ్గశరాసనసాయకంబులు బూని
చక్రాదిసాధనచయము మెరయ
కౌస్తుభరత్నంబు కాంచనసూత్రంబు
కనకచేలంబును ఘనత మీర
కమనియ్యనూపురకంకణముద్రికా
లంకారములరుచు లంకురింప
చలితకాదంబినీకలితవిద్యుల్లతా
లలతియై యురమున లక్ష్మి వెలుగ
గీ. గరుడగమనుడవై దేవగణము గొల్వ
వెడలి వైరుల బరిమార్తి పుడమిప్రజల
బ్రోచు నీకథ శతకమై పూర్తి నొందె
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!104