భక్తిరసశతకసంపుటము/మొదటిసంపుటము/ప్రసన్నరాఘవశతకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పీఠిక

ఈ ప్రసన్న రాఘవశతకము వ్రాసినది నరసింహకవియను నామాంతరముగల వంగూరి ముద్దునరసకవి. ఇతని తండ్రి పేరు లక్ష్మయ్య, ఈశతకమునందు రామాయణకథ యంతయు నిముడఁబడియున్నది. ఇందు రెండువందల పద్యములుంటచేఁ గవి దీని నొకమాఱు శతకద్వయమనిగూడ వ్యవహరించియున్నాఁడు.

రాక్షసులచే బీడింపఁబడి దేవతలు తమదురవస్థలు శ్రీమహావిష్ణునితో విన్నవించుట మొదలుకొని రాముఁడు సీతాసహితుఁడై పట్టాభిషిక్తుడగునంతవఱకుఁ గలకథ ప్రథానాంశములు పోవనీక యీశతకమున నిముడ్పఁబడియున్నది.

ఇక్కవి తాను సరసులు మెచ్చునట్లు వ్రాయుచుంటిననియు వరకవిననియుఁ జెప్పుకొనెనుగాని యీవిశేషణములకుఁ బుస్తకమునందుగల రచనమునకు సంబంధము లేదు. పద్యములలోఁ జాలతావుల యతిగణప్రాస లేకున్నవి. ధారయు తృప్తికరముగ లేదు. గణనియమమునకు లోనై శబ్దములనే తారుమాఱుఁ జేసి పద్యములలో నిమిడ్చికొనియున్నాఁడు.శతకకవులలోఁ గొందఱు లాక్షణికులయ్యు రసపారవశ్యముస వ్యాకరణనియమము లుల్లంఘించుటచే వారికవిత కది యలంకారముగనె చూపట్టుచున్నది. ఈకవి యట్లుగాక భాషావిషయమున సా మాన్యపరిచయముగలవాఁ డగుటచేఁ బద్యములలో భావలోపములు, శబ్దలోపములు, వ్యాకరణలోపములు విరివిగాఁ గనుపడుచున్నవి. సామాన్యజనులకు రామాయణకథ నెఱుంగఁజేయుట కీశతక ముపకరించును.

కవినివాసము కాలము కులము నిరూపింపఁదగిన యాధారము లీశతకమున లేకుంటచే శాఖాచంక్రమణము చేయవలసి వచ్చినది. ఇతఁ డాధునికుఁ డయియుండవచ్చును. “రాఘవేశ్వరుచారిత్రము నెంద ఱెన్నిగతులన్ వర్ణించినన్ గ్రాలదే” యన్నటుల పావనమగు రామకథ నెవ రెటుల వ్రాసినను బఠనయోగ్యమనుటలో నపవర్గదాయక మనుటలో ఆస్తికులు సంశయింపరు.

"ఛందము లక్షణం బెఱుగఁ జక్కఁగ ధైర్యముతోడఁ జెప్పితిన్, దొందర లేదు తప్పులని తోఁచిన” యని కవి తనశక్తిసామర్థ్యములు ధైర్యస్థైర్యములు స్వయముగఁ జెప్పికొనెను. తప్పులతడకగా నుండి పఠనయోగ్యము గాని పూర్వముద్రితప్రతుల సంస్కరించి ముద్దులొలుకునటు లీశతకము ముద్రించిన వావిళ్లవారు ఆంధ్రసోదరులకు స్మరణీయులు.

నందిగామ

ఇట్లు, భాషాసేవకులు,

8-8-26

శేషాద్రిరమణకవులు, శతావధానులు

శ్రీరస్తు

వంగూరి ముద్దునరసకవిప్రణీత

ప్రసన్నరాఘవశతకము

ఉ.

శ్రీహరి జానకీరమణ శ్రీరఘునాయక మీమహత్త్వమున్
బాహుబలంబు శౌర్యమును భానుకులంబునఁ బుట్టురీతియుం
బోహణఁ జేసి రాముకథ పూర్వులు చెప్పఁగ విన్నయంత నా
దాహము తీఱె సూక్ష్మముగఁ దల్చెద నేను ప్రసన్నరాఘవా.

1


ఉ.

మానవజన్మ మెత్తి బహుమాయలతోఁ బచరిందు మాటకే
కానల కేఁగి జానకిని గానక తంత్రముఁ బన్ని ప్రాపుగా
వానరసేనఁ గూర్చుకొని వాలిని జంపి పయోధి దాఁటియుం
దానవులందఱం దునిమి ధన్యుఁడ వైతి ప్రసన్న...

2


ఉ.

రామునిపుట్టుపూర్వమును రాముఁడు వచ్చుట సీతఁ దెచ్చుటల్
రాముఁడు కాన కేగుటలు రాక్షసులందటి సంహరించుటల్
రాముఁ డయోధ్య నేలుటయు రాజ్యముఁ జేసి సుఖాననుండుటల్
రాముకథంతఁ జెప్పెదను రంజిలు వేడ్కఁ బ్రసన్న...

3

చ.

ఇరువదినాల్గువేలకథ యిన్నుఱుపద్యములన్ ముగించెదన్
అరయఁగ నాఱుకాండగల యర్థము నొక్కదినుస్సుపద్యముల్
వరుసయుఁ దప్పనీక కథవర్ణనఁ జేసెద సూక్ష్మమార్గముల్
సరసులు చూచియుం జదివి సంతసమందఁ బ్రసన్న...

4


చ.

వరతనయుండ నేఁ గనుక వర్ణనఁ జేసెద నిన్ను వేడుకన్
వరకవి చెప్పె పద్యములు వాక్కున నీవును వెళ్లనాఁడఁగా
నిరతము నీకటాక్షమును నిశ్చలము న్మముఁ బ్రోచుచుండఁగా
సరసిజనాభ నామనసు సంభ్రమమాయెఁ బ్రసన్న...

5


ఉ.

సంగతిగాను రాముళ్ళ సల్పియు భక్తులఁ గొల్చి లోపలన్
వంగురుముద్దునర్సకవి వర్ణనగా శతకద్వయంబునున్
బొంగుచు విన్నవించెదను బొం దెడఁబాయక లక్ష్మినాయకుల్
రంగుగ నుండి దగ్గఱను రంజిలు వేడ్కఁ బ్రసన్న...

6


ఉ.

ఇంచుక యంతఁ జెప్పెదను యిష్టముఁ జేసుక చిత్తగింపుమీ
యెంచక [1]రామచంద్ర రఘునాయక న న్గరుణించి వేగమే
వంచన సేయ కీవు [2]జనరక్షక యింతటినుండి మమ్ములన్
అంచితభోగభాగ్య[3]ముల సొంపునఁ బెంపు ప్రసన్న...

7

ఉ.

దానవులంత దేవతల దారుణకర్మముఁ జేయఁ జూచి పో
వానరులై జనింపుఁడని వారికి గట్టడఁ జేసి లక్ష్మితో
లోన రహస్యముం దెలుప లోకులు సీత యనంగ లంకలో
మానవజన్మ మెత్తి జనమంత వెలుంగఁ బ్రసన్న...

8


ఉ.

తారకబ్రహ్మమూర్తియును ధారుణిలో నొకరూపు నాలుగై
ధీరుడు భానువంశకులదీపుఁ డయోధ్యను నేలురాజుకుం
గారవ మొప్ప వేడ్క గల కారణజన్మము నెత్తి లీలఁగా
భూరమణీవిలాసముగఁ బుట్టఁగఁ దల్చెఁ బ్రసన్న...

9


ఉ.

పుత్త్రులు లేమికి న్వగచి పూర్వవిధానముఁ జేయ జన్నమున్
మిత్త్రుఁడు నగ్నిహోత్రుఁడును మెచ్చి ప్రసాదము నిచ్చినప్పుడే
శత్త్రుపలాయనంబుగను శంఖము చక్రము శేషుఁడున్ హరిన్
పుత్త్రులు నల్గురై వరము పూనిక దీర్పఁ బ్రసన్న...

10


ఉ.

రాముఁడు లక్ష్మణుం డనఁగ రంజిలుచు న్నొకయంశభూతులై
తాము జనించి రాక్షసులదండనఁ జేయఁగ సత్ప్రసిద్ధిగా
రామునిఁ బట్టి పృధ్వి నిఁక రాక్షసులందఱి సంహరించు నా
రాముడె యాదివిష్ణువని యందఱు నండ్రు ప్రసన్న...

11

ఉ.

బాలురరీతి నల్వురును బాలును నేయియుఁ బండ్లు దేనెలన్
జాలఁగఁ దృప్తినొందుచును సారెకు స్తన్యములానుచున్ గడున్
మూలము దెల్ప కే మిగులమోహము వారికిఁ బుట్టఁజేయుచున్
లీలగనుండి రయ్యెడను లీల నటించి ప్రసన్న...

12


ఉ.

అద్దును ముద్దుఁ జూపి జనులందఱుఁ జూడఁగ గంతు లేయుచున్
బ్రొద్దున లేచుచున్ నగుచు పూర్ణశశాంకముఖుండు వేడుకన్
ముద్దుగఁ దల్లులండఱును మోహమునొందుచు భ్రాంతి నొందఁగా
వద్దను బాయకుండుదురు వా రని ప్రేమఁ బ్రసన్న...

13


ఉ.

అన్నిటఁ గీర్తిమించి విలునమ్ములు చాలధరించి తేజము
న్వెన్నెలకన్న మించి విలువిద్యఁ బ్రతాపమునందు మేటియై
యున్న జగద్గురుం గనియు నుబ్బుచు దేవత లెల్ల నాత్మలో
నిన్ను స్మరించి గాంచి రిల నీటుసుఖంబు ప్రసన్న...

14


ఉ.

లంకలొ సీత పుట్టె యిది లక్షణయుక్తమొ కీడొ యంచు బ
ల్శంక మెలంగి రావణుఁడు చయ్యన విప్రులఁ బిల్వఁబంచి యీ
పంకజగంధి యున్న మనపట్టణమం దిఁక నెగ్గు రాదుగా
శంకను వీడి పల్కుఁడనె సాదరదృష్టిఁ బ్రసన్న...

15

ఉ.

చెప్పిరి పెద్ద లప్పుడును సీతయు లంకను బుట్టినప్పుడే
ముప్పగు లంక కంచు మఱి మోసము నీకును బ్రాణహానియున్
దప్పక రాక్షసావళికిఁ దత్పరత న్వధియింపఁ బాపమౌ
నిప్పు డుపాయ మిద్దియని యెంచరె చెప్పఁ బ్రసన్న...

16


ఉ.

చందుగలోన బెట్టి యది సాగరమందున లోతునీళ్లలో
ముందుగ నుంచుమంచు మునుమున్నుగఁ దెల్పిరి పెద్ద లింతలో
సుందరి సీత రాఁగ నల సొంపుగఁ జందుగ నుంచి యెంతయున్
సందడి లేక నిల్పి యట సాఁగగఁజేసెఁ బ్రసన్న...

17


ఉ.

పెట్టె మునుంగనీక తనబిడ్డ యటంచు సముద్రుఁ డప్పుడున్
గట్టున దెచ్చి పెట్టినను గ్రక్కున నెత్తుక భూమిదేవి తా
గట్టున గర్భమం దునిచి కొన్నిదినంబులు దానివేడ్కతో
మట్టియు మీఁదఁగప్ప సుఖమగ్నత నుండెఁ బ్రసన్న...

18


ఉ.

యాగము సేయఁబూని భువియం దెది మంచిదొ చూడుమంచుఁ దా
వేగమె వెంట వచ్చియును విశ్రమమై బయలున్న దియ్యెడన్
నాఁగలి గట్టి చూడుఁడని నాథుఁడు సెప్పఁగ దున్నుచుండఁగాఁ
గాఁగలకార్య మున్నగతిఁ గానఁగవచ్చె ప్రసన్న...

19

ఉ.

కఱ్ఱను దాఁకి మందసము కంగుమనం జనకుండు చూడఁగా
మిఱ్ఱున ద్రవ్వ లోతునను మేదినిలోపల నున్నపెట్టెయుం
బుఱ్ఱునఁ దెచ్చి కానుకగ భూపతిముందఱఁ బెట్ట వారికిన్
గుఱ్ఱము లిచ్చె తాఁ దొడుగఁ గోకల నిచ్చెఁ బ్రసన్న...

20


ఉ.

తాళము తీసి చూడఁగనె తామరసానన మేనికాంతియున్
చాలభయమ్మున న్మఱియు సంభ్రమమున్ మెలివేసినట్లుగా
బాలను జూచిచూచి తనభాగ్యముకున్ దల యూఁచి యూఁచియున్
జాలునటంచు సంతసిలె సంతతిఁ గాంచి ప్రసన్న...

21


ఉ.

స్వామికటాక్ష మావఱకుఁ జక్కఁగఁజూడఁ గొమార్తెగల్గె యీ
భూమిజ యాదిలక్ష్మి ననుఁ బూజ్యుని జేయఁ బ్రసన్నుఁ జేయఁగా
నేమిట నాకుఁ దక్కు విఁక నిందునిభాసన సీత యుండఁగాఁ
గామితమైన వస్తువులు కావలె నంచుఁ బ్రసన్న...

22


ఉ.

శ్రీకరమైన యాజనకశేఖరుఁడున్ సుతపుట్ట వేగమే
భీకరశాలి తమ్మునికి బిడ్డలు నిర్వురు గల్గినంతకున్
ప్రాకటవస్తుసంపదలు భాగ్యములున్ మితిలేని వేడ్కలున్
ఆఁకలి దప్పి దీఱి విభుఁ డాత్మ సుఖించెఁ బ్రసన్న...

23


ఉ.

సీతను గూడి నల్వురును జిన్నికుమార్తెను జూచి యాత్మలోఁ.

బ్రీతి మెలంగి యాకులుకు బిడ్డలకు న్నిఁకఁ బెండ్లి కావలెన్
ఖ్యాతిగ నొక్కనిర్ణయము కట్టడఁ జేతునటంచుఁ బెద్దలన్
బ్రీతినిఁ బిల్వఁబంచి వినిపింతునటంచుఁ బ్రసన్న...

24


ఉ.

మూఁడుపురంబుల న్గెలిచి మూర్ఖులనందఱి సంహరించి యా
నాఁడు హరుండు దా విలును నాపురిలోపల వేసె నద్ది యీ
నాఁడు తొడంగఁపోలునరనాథున కిచ్చెద నాదుబిడ్డ నే
నాడినమాట తప్ప నిఁక నమ్ముఁ డనంగ ప్రసన్న...

25


ఉ.

రామునిరూపురేఖయును రాజసమున్నతి ప్రీతిభక్తియున్
రామునికీర్తిశౌర్యమును రాజగుణంబుల నన్ని చూచియున్
రామ గుణాభిరామ రఘురామునికే తగు నంచు నాత్మలో
రామునిఁ జూడ తండ్రిమది రంజిలుచుండెఁ బ్రసన్న...

26


ఉ.

దేహము కోటిసూర్యకళదీప్తియుఁ జూచి మహాద్భుతంబుగా
సాహస మెంచిచూచినను సాధ్యుఁడు కాఁడు సురారికేనియున్
బాహుబలుండు నేండ్లకును బాలుఁడు భక్తులపారిజాతమున్
శ్రీహరి నాకుమారుఁడని చెప్పఁగ నేల ప్రసన్న...

27


ఉ.

తమ్ములయందుఁ బ్రేమయును తథ్యముగాఁ దనయందు భక్తియున్
తమ్ములు దాను నొక్కటిగఁ దాల్చిరి రూపును నల్గురై తగన్

దమ్ములఁ గూడి రాఘవుఁడు ధారుణిలో జనియించి వారు క్రొ
త్తమ్మలసేవ సేయుదురు తప్పక వారు ప్రసన్న...

28


ఉ.

తప్పకయన్నమాట విని దాసులరీతిగ సేవఁ జేయుచున్
ఎప్పుడు పిల్చునో యనుచు నేమపచారము సేతునో యటం
చొప్పుగఁ బిల్చునప్పటికి నోరిమి ముగ్గురు గొల్చుచుండఁగా
నప్పుడు చూచువార లతియబ్బురు లైరి ప్రసన్న...

29


ఉ.

ఇక్కడ రామభద్రుఁ డొకయీశ్వరుఁడై జగమంత యేలఁగా
నక్కడ సీత లక్ష్మి యయి యందఱికి న్ప్రభుతాప్తి నొందఁగా
గ్రక్కున రామచంద్రునకుఁ గ్రన్న ప్రయత్నముఁ జేసి తండ్రియున్
జక్కనిసీత పెండ్లి యని చాటిరి వారు ప్రసన్న...

30


ఉ.

విల్లును దెండి పొండి యన వేగమ తెచ్చిరి కోటిమందియున్ దల్లడమంద దేవతలు దానవరుద్రపయోధియంచు భీ
తిల్లఁగ రాజవల్లభుఁడు తెచ్చిటు నిల్పిరి యజ్ఞశాలలో
నెల్లవిధంబుల న్విఱువ నేరికిఁ గాదు ప్రసన్న...

31


ఉ.

కౌశికు ధర్మయాగమును గావఁగఁ దెచ్చెనటంచు రామునిన్
కౌశికుఁ డప్పుడు న్మదిని కాఁగలయర్థము చూచి యందఱన్

కౌశికుఁడం తయోధ్యకును గ్రక్కున వచ్చియు రాముఁ దెమ్మనెన్
కౌశికు రాజు చూచి భయకంపితుఁడయ్యెఁ బ్రసన్న...

32


ఉ.

రాముఁడు సీతకే తగును రామునికే తగు సీత యంతకున్
రామునిసీత యంచు రఘురామునిదేవి యటంచు దేవతల్
దామును మోదమందియును దత్పరతన్ మది సంభ్రమంబునన్
రాముని సీతఁ జేకొనును రాజిలు మాకుఁ బ్రసన్న...

33


ఉ.

బాలుఁడు రామభద్రుఁడన బాణము చక్కఁగఁ బట్టలేఁడు నీ
కేలను నేనె వచ్చెదను కీర్తిని యాగము నేనె కాచెదన్
కాలఖరాసిఁ దాటకిని ఖండన చేసి జయించి వచ్చెదన్
జాలదళంబు గూడి యిదే చయ్యన వత్తుఁ బ్రసన్న...

34


ఉ.

అందుకుఁ గౌశికుండు గడు నాగ్రహదృష్టిని జూచి రాజు నీ
వెందుకు వచ్చి నీబలము నెందుకు పంపవు రాముఁ బంపుచుం
ఇందుమతీసుతు న్నలుక నిప్పుడ యోర్చెద రాక్షసాళి నా
చంద మెఱుంగవా యనుచుఁ జక్కఁగఁ బల్కె ప్రసన్న...

35


ఉ.

కంపము నొంది రాజు గడు గౌరవదృష్టిని రాములక్ష్మణున్
దెంపునొనర్చి పంపె నతిదీర్ఘతరంబగుదృష్టిలో జనుల్

పంపుమటన్న తల్లు లతిభారముగా మదిఁ జింతిలంగ నా
శాంతయశోవిరాజిఘనశక్తి యెఱింగి ప్రసన్న...

36


ఉ.

రాముడు మ్రొక్కెఁ దల్లులకు రామ లొసంగిరి దీవనల్ గడున్
రామప్రసాదమంది యల రామునితమ్ముఁడు లక్ష్మణుండు దా
మోమున కౌశికార్యుఁ డతిమోదము గన్పడ నిచ్చె నస్త్రముల్
కామితమౌ బలాతిబలకార్ముకవిద్య ప్రసన్న...

37


ఉ.

దూరము లేదు రాక్షసులదుందుడు కిచ్చట మీరు బాలు రే
నారయ మౌనివర్యుఁడను నారజనీచరు లేమి చేయలే
రారయ మమ్మనన్ ఋషివరా తమసద్దయ యున్న యంతటన్
వైరులు ముట్టలేరనుచు వారకయంటి ప్రసన్న...

38


ఉ.

దేవర యేల చింతిలఁగ దీనపువాక్యము లాడనేటికిన్
కావరపడ్డరాక్షసులగర్వ మడంచెదఁ గార్ముకంబులన్
దేవులు దానవావళులు దెంవుగ సాయము వచ్చిరేనియున్
భావములోన వే వెఱచిపాఱనటంటి ప్రసన్న...

39


ఉ.

బాలురు చూడ నివ్విధిని భద్రములాడుటఁ జూచి తిచ్చటన్
బాలురు కారు మీరు గుణభాసురు లంచు నుతించి మౌనిస
చ్ఛీలురు మిమ్ము నేఁ బొగడఁ జెప్పఁగ శక్తుఁడఁగాను శ్రీరమా
లోలుఁడ వీవు శేషుఁ డితఁడు న్గననంచుఁ బ్రసన్న...

40

ఉ.

ముందఱ రామలక్ష్మణులు ముచ్చటలాడుచు మౌని వెంటయున్
సందడిఁ జేయుచు న్నడువఁ జయ్యన వచ్చెను రాక్షసాళి న
య్యందఱఁ గూల్చె లక్ష్మణుఁడు నందఱు మెచ్చి నుతించుచుండఁగా
జిందరవందరన్ సలిపి శీఘ్రము చంపె ప్రసన్న...

41


ఉ.

రామునిపాదపద్మములు ఱాతికి సోఁకినయంతమాత్రమే
కామునిబాణమో యనఁగఁ గంజదళాక్షి స్వకీయరూపయై
ప్రేమను మ్రొక్కి నిల్చె తన పేరును గౌతముఁ డిచ్చుశాపమున్
భామ వచించె మేటి తన భాగ్యమటంచుఁ బ్రసన్న...

42


ఉ.

కోపముఁ బూని యామునియుఁ గొండశిలాకృతిఁ దాల్చి పొమ్మనన్
శాపముకున్ బ్రతిక్రియను సాగిలి మ్రొక్కి వచించుమంచనన్
బాపము పోవు రాఘవునిపాదరజం బది యంటినప్పుడే
శాపవిమోచ మం చనెను సన్నుతి తొల్లి ప్రసన్న...

43


ఉ.

అంతయు విన్నవించుటకు నాజ్ఞ యొసంగెను రాముఁ డింతికిన్
అంతయుఁ జూచి యామునియు నచ్చెరువున్ భయమంది యప్పుడే
సంతసమంది యామునియు సర్వజగత్ప్రభుఁడంచు నమ్మి తా
నంతట యజ్ఞశాలకడ కాతఁడు నేఁగెఁ బ్రసన్న...

44

ఉ.

రాక్షసబాధ లేక యల రాముకటాక్షముచేత యాగమున్
రక్షణగా నొనర్పఁబడె రాముని కిచ్చె సదస్త్రపంక్తిఁ దా
రాక్షసులన్ జయింపుమని రాజితకీర్తి మునీశ్వరుండు ప్ర
త్యక్షములైరి యస్త్రముననౌ సురలెల్ల ప్రసన్న...

45


చ.

మిథిలకు నేలికైన యల మేటిప్రతిజ్ఞలఁ జేసియుండినన్
బృథివిని బ్రోచురామునకుఁ బెంపుగ నెట్లయినన్ స్వకన్యకన్
విధిగ నొసంగ నెంచికొనె వేయివిధంబుల విఘ్న మొచ్చినన్
మధుహరుభక్తిచేత నిఁకమాఱునె బుద్ధి ప్రసన్న...

46


ఉ.

వేగమె రామలక్ష్మణులు వెంటను గొల్వఁగ నమ్మునీంద్రుఁడున్
రాఁగనె రాజుఁ దోడుకొని రమ్యము రాజ్యము పూజ్యమాయటం
చాగతిఁ బల్కి మ్రొక్కి యలయర్థము కావలెనంచుఁ బల్కి సం
యోగము చేయమంచనె [4]జనావళిలోనఁ బ్రసన్న...

47


చ.

దశరథరాజపుత్రులును ధర్మపరు ల్హరిధీరశౌర్యులున్
విశదము నీకుఁ దెల్పెదను విల్లుప్రభావము నీప్రతిజ్ఞయున్
దశదిశలందుఁ జెప్పఁగను దామును జూచెదమందు వచ్చి రీ
విశదసుకీర్తివంతులనె విశ్వము మెచ్చ ప్రసన్న...

48

ఉ.

ఱాతిని నాతిఁ జేసి బలురాక్షసులందఱి సంహరించి వి
ఖ్యాతిగ నాదుయాగమును గాచె మహాత్ముఁ డటంచుఁ బల్కఁగాఁ
బ్రీతిఁ బెనంగి నాకులుకుబిడ్డలకున్ దగఁ బెండ్లిఁ జేసెదన్
రాముఁడె యల్లుఁడైనఁ గడురంజిలు నంచు ప్రసన్న...

49


ఉ.

సీతను జూచి రమ్మనుచుఁ జెప్పెను లక్ష్మణుతోడ రాముఁడున్
భూతదయాపరుం డయినభూనుతకీర్తి మునీంద్రుఁ డెంతయున్
క్షేత్రములోన సమ్మతిలె సీతను సజ్జనపూతఁ జూడఁగా
నాతఁడు సమ్మతించెఁ జనె లక్ష్మణుఁ డంత ప్రసన్న..."

50


ఉ.

రాముని జూచి రమ్మనుచు రమ్యసఖీజన మంపె సీతయున్
రాముని వారు సీత నల రాజసుతుండును దెల్ప రాముఁడున్
బ్రమ మునింగె సీతయును బెంపుగ సంతసమందె భూమిలో
రామునకుద్ది సీతయని రామలు పల్క ప్రసన్న...

51


ఉ.

చూచియు రాముఁ డమ్మగువ చోద్యముగాఁ దనపూర్వపుణ్యమం
చాచెలినోముపంటయని యాతనినెమ్మది మెచ్చె నంతలోఁ
దోఁచెను సూచనంబు లవి తోడనె మంగళచిహ్నితంబులై
లేచిరి యమ్ముహూర్త మది వేగమెయౌటఁ బ్రసన్న...

52

ఉ.

తల్లడమంద దేవతలు దానవులున్ రఘురాముఁ డిప్పుడున్
వి ల్లవలీలఁగా దునిమె వేడుక మెచ్చ నృపాలుఁ డాత్మలో
నల్లుఁడు రామభద్రుఁడన నాదిసురేశ్వరుఁడంచు సీతయున్
బల్లవపొణి యాత్మఁ దనభాగ్యము మెచ్చె బ్రసన్న...

53


ఉ.

శ్రీమదయోధ్యయేలికకుఁ జెన్నుగఁ గమ్మలిఖించిపంపె నా
భూమిసుతాసుతుండు తమపుత్త్రున కిచ్చె దనాదుపుత్త్రికన్
గామితవస్తుజాతముల గౌరవదృష్టిని గైకొనంగ మీ
కామినులు న్సుబంధుహితకారు లటంచుఁ బ్రసన్న...

54


ఉ.

సంతసమంది పెండ్లికని సంభ్రమలీలఁ బెనంగి రాజు దా
నింతులు ముగ్గురు న్సుతులు నిష్టజనంబును బంధువర్గము
ల్దంతితురంగవాద్యములు తప్పెటభేరిమృదంగ వాద్యముల్
మంతన మాడుచు న్వెడలె మంత్రులతోడఁ బ్రసన్న...

55


ఉ.

పున్నమనాఁటి లగ్నముకుఁ బోవలెనంచు ససంభ్రమంబునన్
వెన్నెలలోఁ బ్రయాణముల వేడుక మీఱఁగఁ జేయుచున్ గడు
న్వన్నెలమీరు వారజనవారము వారకసేవఁ జేయ నా
పన్నశరణ్య రాముపయి భక్తిని గూడి ప్రసన్న...

56


ఉ.

వచ్చిరి పెండ్లివా రనినవార్తల నాజనకుండు తాను ము

న్ముచ్చటగా నెదుర్కొనుచు మ్రొక్కుచు నారఘువంశనాయకున్
గ్రుచ్చి కవుంగలించుకొనఁ గోరిక మీరఁగ రాముతండ్రియున్
మెచ్చి కవుంగలించుకొనె మిక్కిలిప్రేమ ప్రసన్న...

57


చ.

విడిదులు చూపి వారలకు విందులఁ బెట్టఁగ మోదమంది యా
కొడుకుల దోడుకొంచు ముని గొబ్బునరాఁగ ససంభ్రమంబున
న్విడిదిని వారిఁ గూడికొని వేడుక మీరఁగ మ్రొక్కె మౌనికిన్
బడి సుఖవార్తలన్ బలికి భద్రము గాంచెఁ బ్రసన్న...

58


చ.

వరుస మునీంద్రులుం గొలువ వచ్చె వసిష్ఠమునీశ్వరుండు దా
నరుదుగ ఋష్యశృంగుఁడును నత్రిమునీశ్వరుఁడాదిపెద్దలున్
బరువడి రాఁగఁ జూచి తగభాగ్యమటంచు నిజాత్మజాతుఁడున్
గురునకు వచ్చినట్టిమునికోటికి మ్రొక్కె ప్రసన్న...

59


ఉ.

రాముని పెండ్లిసంభ్రమము రాజులు కాంతలు పౌరకాంతలున్
బ్రేమను జూడ వచ్చి రిలఁ బెంపుగ టిసుగాయకోత్తము
ల్సాములు నర్తకుల్ విటులు చేటులు బీదలు భాగ్యవంతులుం
గోమలవందిపాఠకులు కూర్మిసభాళి ప్రసన్న...

60

ఉ.

అంగనలెల్లఁ గూడి తలలంటిరి వేడ్కను రామచంద్రుకున్
మంగళహారతిచ్చి తగ మజ్జన మాడఁగఁ జేసి రప్పుడున్
పొంగుచుఁ బట్టువస్త్రములు భూషణస్రగ్వరచందనంబులున్
రంగుగఁ దాల్పఁజేసి రలరాముని వేడ్కఁ బ్రసన్న...

61


ఉ.

పెండ్లికుమారుఁ డంచుఁ దగఁ బెట్టిరి బొట్టును కండ్లఁ గాటుకన్
బెండ్లికుమారు రామ యని వేడ్కను బిల్చిరి పెద్ద లందఱున్
బెండ్లికుమారైఁ జేసి కడుఁ బెట్టిరి సొమ్ములు చాల సీతకున్
బెండ్లి కలంకరించియును బేరిమిఁ జూచి ప్రసన్న...

62


చ.

మదగజయాన సీతకును మంగళసూత్రము గట్టి రాముఁడున్
మదనునితండ్రికిన్ మగువ మచ్చికతోఁ దలఁబ్రాలు వోసె యా
ముదితశిరంబున న్బ్రియుఁడు ముత్యములన్ దగ నిల్పి యప్పు డీ
మదవతి కండ్లు చేతులును మాటికిఁ జూచె ప్రసన్న ...

63


ఉ.

దేవతలెల్ల రత్తఱిని దివ్యసుమావళిఁ జల్లు సేయఁగా
భావజరూపుఁ బెండ్లికయి వచ్చిన బంధుజనంబు మెచ్చి రా
భావజమాత సీత తన భావములో రఘు రాము మెచ్చి స
ద్భావముతోడఁ గోర్కులను బాగుగఁ గోరి ప్రసన్న...

64

చ.

ముదమున రాముఁ డవ్విధిని ముద్దియఁ గైకొనె నంతఁ దమ్ములున్
సదమల నూర్మిళన్ బిదప సాధ్విని మాండవి నత్యుదారయై
గెదలు మహానుభావ శ్రుతకీర్తిని సాధ్విని సజ్జనావనన్
విదితసుకీర్తులన్ జనము వేడుకఁ జూడఁ బ్రసన్న...

65


ఉ.

కల్గెను నాకుమార్తెలకు గారవమైనటువంటియల్లురున్
గల్గెను నాదుభాగ్యమునఁ గంజదళాక్షునివంటిప్రాపు మున్
గల్గెను భుక్తిముక్తియును గర్మవిమోచన మాయె నేటికిన్
గల్గె నటంచు బిడ్డలను గ్రక్కున నంప ప్రసన్న...

66


ఉ.

వారికి వీరు వీరికిని వారు నొసంగిరి యన్నివస్తువుల్
కూరిమితోడ వియ్యములు కోరికగా బిగికౌఁగిలింతలున్
దారకమూర్తి రాఘవుఁడు తమ్ములుఁ దండ్రియుఁ దల్లులు న్దగన్
జేరుక సీత వచ్చె (నంత) తనమిత్రులు గొల్వ ప్రసన్న...

67


ఉ.

భార్గవరాముఁ డంతఁ గని భంగముఁ జేతునటంచు నుగ్రుఁడై
మార్గము గాచియుండెఁ బలుమాఱును రాముఁడు రాముఁ డేడియన్
భార్గవుగర్వము న్నణఁచి బాహుబలంబును జూపి వేగమే
మార్గముఁబ ట్టయోధ్యకును మత్తవిలోకప్రసన్న...

68

ఉ.

పట్టణమందు నున్నపరివారము లందఱుఁ దోడ్కొనంగ దాఁ
బట్టముఁ జొచ్చి రాఘవులు భార్యలు గూడను రాఁగ రాఘవు
ల్పట్టముఁ జూచుచుం జనకు పట్టియుఁ దాను రథంబు నెక్కి రాఁ
బట్టణవాసు లంగనలు పాటలు బాడ ప్రసన్న...

69


ఉ.

వీథులు తోరణంబులును విప్రజనంబులు వేదమంత్రముల్
వీథు లలంకరించి తగ వేడుకలన్నియుఁ జేయుచున్న యా
వీథుల వారకన్యకలు వేడుక నాడిరి పాడి రంత నా
వీథుల నన్నిఁ జూచుచును వేడ్కను వచ్చెఁ బ్రసన్న...

70


ఉ.

మేళములున్ మృదంగములు మిక్కుటమైనటువంటి బూరగల్
తాళము తప్పెటల్ మిగుల తద్ధిమిలాడెడు వారకాంతలున్
వీళవిచిత్రనాట్యములు వింతవినోదపుటాటపాటలున్
గేళికలాడుచున్ మిగులఁ గేళులఁ గూడెఁ బ్రసన్న...

71


ఉ.

ద్వారమునందు రాముఁడును [5]సీతయు తేరును డిగ్గి రెంతయున్
ధీరులు తమ్ములందఱును దేరులనుండి దిగంగఁ జూచియున్
వారును వారిభార్యలును వచ్చిరి మంత్రి పురోహితావళుల్
గూరిమి గొల్వఁగా నృపుడు కోర్కుల మీఱఁ బ్రసన్న...

72

ఉ.

సీతను వెంటఁబెట్టుకొని శీఘ్రముగా రఘురాముఁ డప్పుడున్
ఖ్యాతిగ నిల్లుఁ జొచ్చి కనకాసనులై రఘ రామ సీతలున్
బ్రీతిగ నుండి రిద్దఱును బ్రేమయు మిక్కుటమై చెలంగఁగా
నాతతకీర్తిశాలు రతియాదర మొప్పఁ బ్రసన్న...

73


చ.

సకలగుణాభిరాముఁడగు సారసనేత్రుఁడు రాముఁడు న్సుమి
త్రకుఁ దనయుండు లక్ష్మణుఁడు రాజితకీర్తియుఁ గైకపుత్రుఁడున్
ప్రకటగుణుండు నాభరతరాజు జఘన్యుఁడు పత్ను లందఱిన్
బ్రకటితభక్తిఁ గొల్వ సుఖభావమునందె ప్రసన్న ...

74


చ.

భరతసుమిత్రనందనులు భాషితులై తనమేనమామల
న్నరుదుగఁ జూడఁబోయి మఱి యక్కడినుండి ప్రమోదలీలల
న్నిరవు నయోధ్యపట్టణము నిష్టజనంబులతోడ రాజులుం
బరువడి రామభద్రునికిఁ బట్టము గట్ట ప్రసన్న...

75


ఉ.

రా జపు డానతిచ్చె రఘురాముని రాజును జేయ నంతలో
రాజును జూచి కైకయును రాజ్యము నాసుతు కిచ్చి రామునిన్
రాజిగఁ బంపు కానలకు రంజిలు నామదిలోన వేగమే
రాజుగఁ జేయవే భరతు రాజ్యముఁ గట్టి ప్రసన్న...

76

చ.

పిడుగులవంటి మాటలకుఁ బిమ్మటఁ బో యటు రాజశేఖరుం
డుడుగక తాఁ జలించె మఱి యొప్పుగ నిప్పులఁ గ్రాఁగురీతిగా
నడవడివించు రాఘవుఁడు నా కిది ధర్మము నీతిమార్గమున్
బడి యడవిం జరింప నగుపద్ధతి యంచుఁ బ్రసన్న...

77


ఉ.

తల్లికి ముందుగాను బినతల్లికి దండము పెట్టి కన్నులన్
గొల్లున నేడ్వఁగా నపుడు ఘూర్ణిలుచున్నది యేమి సేతు నే
నొల్లను రాజ్యభోగముల నోరిమి వచ్చెదఁ బాయలేను నా
తల్లడమంద నాకొడుక తాళఁగఁజాల ప్రసన్న...

78


ఉ.

సత్యము దప్పరాదు జనసంఘసుతా మఱి చింత యేల నా
నిత్యపరాక్రముండు మదినిశ్చలతన్ వర మిచ్చినప్పుడే
సత్యము తండ్రివాక్యముకు సమ్మతినొందినవాఁడె పుత్రుఁడున్
సత్యము శీలమౌ పురుషసన్నిధినుండఁ బ్రసన్న...

79


ఉ.

ఒక్కఁడె రాముఁ డావనము నొందుటఁ జూచియు లక్ష్మణుండు దాఁ
గ్రక్కున తర్లగా మఱియుఁ గంజదళాక్షియు సీత పైనమై
యిక్కడ నేమి నాకుఁ బతి యెక్కడనుండిన నక్క డుండెదన్
జక్కనివార్త కాంతుకడ సాధ్వి మెలంగ ప్రసన్న...

80

ఉ.

తెమ్మనె రాముఁడున్ రథము తెచ్చిన సూతుఁడు నల్వు రెక్కినన్
సమ్మతి పట్నమున్ వెడలి చయ్యన తల్లి గుహాశ్రమంబునన్
సొమ్మసిలంగఁ జేరి రిఁక సూతుఁడు నీవు రథంబు దీసికో
పొమ్మని పంపవచ్చెఁ బురి జొచ్చుట కేడ్చె ప్రసన్న...

81


ఉ.

రాముఁడు తర్లిపోయెనని రాజుకు సూతుఁడు వచ్చి చెప్పినన్
భామల మాటవింటి నెడఁ బాసితి రాము గుణాభిరామునిన్
రాముని దల్చి తల్చి మది ఱంపముగాఁ దెగఁగోసినట్లుగాఁ
బ్రేమను జీవము న్విడచిపెట్టెను రాజు ప్రసన్న...

82


ఉ.

సంగతి రాత్రియు న్నిలిచి చయ్యన నాగుహుఁ గూడి వేడుక
న్గంగయు దాఁటి తా జడలు గ్రక్కునఁ దాల్చియు రాముఁ జూచియు
న్నంగన చాలదుఃఖపడె నందుకు లక్ష్మణుతోడఁ గైక హా
భంగము చేసె నిట్టిరఘుపట్టముఁ గట్ట ప్రసన్న...

83


ఉ.

అక్కడినుండి రాఘవుఁడు నంగనఁ జూచి విచారమంది తాఁ
గ్రక్కునఁ జెట్టఁ బట్టుకొని కంజదళాక్షిని గారవించియు
న్మక్కువ నూఱడించి పలుమాఱును మోమున మోముఁ జేర్చె నా
చక్కెరబొమ్మ కాల్నడలఁ జయ్యన వచ్చె ప్రసన్న...

84


ఉ.

వచ్చి భరద్వజాశ్రమము వద్దను జేరి మునీంద్రుఁ గాంచి తా

మచ్చటఁ జేరి రాత్రి సుఖమందియు వేడుక దర్లి లేచియున్
ముచ్చట లాడుచు న్నడువ ముందర జూచియుఁ జిత్రకూటము
న్నచ్చట పర్ణశాల నొకఁ డప్పుడు గట్టి ప్రసన్న...

85


చ.

భరతుని వేగరమ్మనుచుఁ బంపిరి లేఖలు వ్రాసి వేగమున్
వరుసను దమ్ముఁడు న్గొలువ వచ్చుటఁ జూచి అయోధ్యపట్నమున్
సిరి తొలఁగింది యేమొ యని చింతిలుచుండిన నాడకాడకున్
గుఱుతులు చెప్పఁగాను విని గొబ్బున వచ్చె ప్రసన్న ...

86


ఉ.

తల్లిని జూడ రోసి తమతండ్రికి నగ్నిమఖంబుఁ జేసియున్
సల్లలితంబులైన నృపసాధ్వులకాంతులు మాయఁజూచియున్
మెల్లఁగ రాముఁ దెత్తుమని మిక్కిలిప్రేమను మంత్రివర్గమున్
వెళ్లిరి రామమార్గమున వేడుకనంత ప్రసన్న...

87


ఉ.

వచ్చినమూకఁ జూచి గుహుఁ డోడయు వేయకయున్న నాతనిన్
సచ్చరితుండునౌ భరతసాధుఁడు సంగమమైత్రిఁ జూపియున్
వచ్చె భరద్వజుం గనియు వార్తలనెల్ల నెఱింగి యంతటన్
వచ్చిరి చిత్రకూటముకు వారిని జూచి ప్రసన్న...

88


చ.

భరతుఁడు రాముపాదములఁ బట్టుక యేడ్చియుఁ గన్నతండ్రియున్

పరమపదంబు కేగెనని పల్కిన రాముఁడు శోకచిత్తుఁడై
పరక్రియ లగ్నిఁ జేసి తనపాదుక లిచ్చియుఁ బంపెఁ దమ్మునిన్
భరతుఁడు రామపాదుకల భక్తిని దెచ్చె ప్రసన్న...

89


చ.

భరతుఁడు దీక్ష జేసి యలపట్టముఁ జేరక తాను తాపసై
భరము వహింపఁ దమ్ముఁడును భారతపాదము గొల్వసాగె నా
భరతుఁడు రాముపాదుకలె భద్రమటంచును సేవఁ జేసె నా
భరతునిఁ బంపి రాఘవుఁడు పైనముఁ జేసె ప్రసన్న...

90


ఉ.

అత్రిమహామునీశ్వరునియాశ్రమముం దగఁ జేరి వేడుకన్
శ్రోత్రి యుఁ డాతఁ డిచ్చినసుశోభితమౌ సరసంపుటన్నమున్
పాత్రగఁబొంది యాయతిథిభాగము రాముఁడు సీత లక్ష్మణుల్
శ్రోత్రియవర్గ మంప జనె సొంపుగ నెప్డు ప్రసన్న...

91


ఉ.

చొచ్చిరి దండకాటనిని జూచి విరాధుని జంపి యంత భీ
మచ్చరశూన్యులైన మునిమండలి నాశరభంగుఁ డాదిగా
ముచ్చటలాడవచ్చుమునిముందు నగస్త్యమునీంద్రుని గాంచి యా
సచ్చరితాత్ములన్ గొలిచి శస్త్రములందె ప్రసన్న...

92


ఉ.

మాయమృగంబుఁ జూచి పలుమాఱును సీతయుఁ బట్టి తెమ్మనెన్
బాయక దానివెంబడిని బట్టెదనంచును బోవుచుండఁగా

మాయ యటంచు రాఘవుఁడు మర్మ మెఱింగియుఁ గోపచిత్తుఁడై
సాయకమేయ లక్ష్మణుఁడ చచ్చితినంచు ప్రసన్న...

93


ఉ.

రాముఁడు నిన్నుఁ దల్చె మఱి రాక్షసులందఱునేమొ లక్ష్మణా
తామసమేల వేగచను వేగము వేగ మటంచుఁ బల్కినన్
ఏమిభయంబు లే దనఁగ నించుకమాటల నాడె సీతయున్
రాముని జేర లక్ష్మణుఁడు రావణుఁ డంత ప్రసన్న...

94


చ.

కపటము చేసి వచ్చుటయుఁ గంజదళాక్షియు జూచి వేడుకన్
దపసియటందు వచ్చుటయు దగ్గఱవచ్చిన రూపుఁజూపుటన్
విపదము నొంద సీత తన వేడుక గాలిరథంబునం దిడెన్
చపలుఁడు తిన్నఁగా జనెను సాగరలంకఁ బ్రసన్న...

95


ఉ.

పాటలగంధి సీతయును బాష్పజలంబులుగా స్రవించుచున్
మాటికిమాటికిం దలఁచు మానసమందున రామరామ ఘో
రాట జటాయువంత విని రావణుగుఱ్ఱపుఁగ్రొందలంబునున్
వాటము పేర్చి తన్నె మఱి వాడునుఁ గూలె ప్రసన్న...

96


ఉ.

లంకకుఁ గొంచుఁబోవ తన లక్షణయుక్తములైన సొమ్ములన్
బంకజగంధి తీసికొని పైఁటచెఱంగునఁ గట్టివేసినన్

శంకయు లేక రావణుఁడు సాగరు దాఁటి వనంబులోపల
న్బంకజగంధి నుంచెఁ దనపాలిటిమృత్యు ప్రసన్న...

97


ఉ.

వచ్చినఁ జూచి తమ్మునిని వారిజనేత్రను సీత డించి యే
వచ్చితివన్న నావదినె యాడనిమాటల నాడి పొమ్మనెన్
వచ్చితినంచు నిధ్దఱును వార్తలనాడుచు నున్నచోటికిన్
వచ్చిన సీత గానకను వారలు నేడ్చె ప్రసన్న...

98


చ.

అడవిని జాడల న్వెదుక నక్కడఁబడ్డజటాయుఁ జూచి నీ
వెవఁడ వటంచుఁ బల్క నవు డేర్పడఁజెప్పెను సీతజాడలన్
వడి దహనంబుఁ జేయుఁడని వారిజనాభుని వాని గాల్చి తా
కడపట తర్లి రాక్షసుఁ గబంధునిఁ జంపె ప్రసన్న...

99


ఉ.

వచ్చిరి పంపతీరమున వాసముకున్ శబరుండు వేగమే
వచ్చియు పండ్లుఁ దెచ్చియును వారిజనాభుని కిచ్చి భక్తితో
నచ్చటనుండి తర్లియును నప్పుడు చూచిరి ఋష్యమూకము
న్వచ్చెడివాయుపుత్రు ననివారణఁ జూచె ప్రసన్న...

100


ఉ.

ఎక్కడినుండి వచ్చితిరి యెవ్వరు మీరు కులంబు నెద్ది యే
దిక్కుల నేలు మీమహిమ తేటఁగ దెల్పుఁడు రాకకుం గతం
బిక్కడి కన్న లక్ష్మణుఁడు నీతఁడు రాముఁడటంచు సర్వమున్

జక్కఁగ స్వీయమౌకథను చాటి వచించె ప్రసన్న...

101


చ.

ధరణి నయోధ్య నేలునృపు ధర్మపుటాజ్ఞకు బద్ధుఁడై విభుం
డు రయముతోడ దండకను దొడ్డగ నిల్చి ఖరాదివీరులన్
బొరిగొనవచ్చి యిచ్చటను పూతచరిత్రను సీత రావణుం
డు రహిని గొంచునేగఁగను దోరపుదృష్టి ప్రసన్న...

102


ఉ.

తమ్ముఁడ నేను లక్ష్మణుఁడ దాసుఁడ సేవ యొనర్పవచ్చితిన్
మ మ్మడుగంగఁ దెల్పితిమి మాన్యుఁడ నీచరితంబుఁ దెల్పవే
యిమ్మహి నన్న మ్రొక్కి యిదె యేర్పడఁ దెల్పెద వాయుపుత్రుఁడ
న్సమ్మతి సూర్యపుత్రునకు సన్నిధిబంటు ప్రసన్న...

103


ఉ.

అంజనదేవిపుత్రకుఁడ నాప్తుఁడ నీకును బంట నేను మీ
కంజదళాక్షిఁ జూపెదను గ్రక్కున రం డిఁక ఋష్యమూకమున్
మంజులవాణి సీత గనుమార్గము సేతు నటంచుఁ బల్కినన్
రంజితమైన ప్రేమయది రాజిలఁబోయె ప్రసన్న...

104


ఉ.

అందుకు రామలక్ష్మణులు నాతఁడు సంతసమంది రప్పుడే
కొందలమందు నాతఁ డిఁకఁ గొంకక సర్వచరిత్ర దెల్పినన్

ముందు ప్రయోజనం బనఁగ మోదముతో నలవాలి కోడుటన్
కొందఱితోడ ఋష్యగిరి కూడుట దెల్పె ప్రసన్న...

105


ఉ.

అంజనిపుత్రుఁ డాపిదప నారవినూనున కన్ని దెల్పియున్
రంజితమైన చిత్తమున రాఘవుఁ జేర్చెను సూర్యపుత్రునిన్
మంజులరీతి రామునకు మాటికి మ్రొక్కెను వానరేశుఁడున్
శింజితమైన వాక్యములఁ జేరిచె నంత ప్రసన్న...

106


ఉ.

వాలికి నీకు నిద్దఱికి వాద మదేలను వచ్చె నన్న నా
యాలిని లోన వేసికొని న న్నపు డట్టులఁ జంపవచ్చినన్
జాలక నాదుబల్మి యగచాట్లను బొం దిటు డాఁగినాఁడ నా
పాలిటి దైవ మీ వనుచుఁ బల్కెను బ్రేమ ప్రసన్న...

107


ఉ.

మంచిది వాలిఁ జంపెదను మర్కటనాథ యటంచుఁ బల్కినన్
నంచితమైన సొమ్ములను సామికి జూపిన మోహతాపమున్
మించియు మూర్ఛపోయె మఱి మెల్లన తాఁ దెలివొంది లేచియు
న్నించుకసేపు దుఃఖపడి యింతి దలంచె ప్రసన్న...

108


ఉ.

వాలియు నీవు నిద్దఱును వాదములాడుచుఁ బోరుచుండినన్
వాలిని సంహరించెదను వచ్చెద వెంటను దర్లి పొమ్మనెన్

వాలినిఁ బిల్వ రోషపడి వచ్చియు యుద్ధము చేయునప్పుడున్
వాలినిఁ గూల్చి సూర్యసుతు వైరము దీర్చె ప్రసన్న...

109


ఉ.

వాలిని జూచి తారయును వారక మాటికి మోదుకొంచుఁ దా
వాలి ప్రతాపశాలియని వర్ణన సేయుచు నెట్లు తాళుదున్
జాలఁగఁ బ్రేమఁ జూచి నను సారెకుసారెకు గారవించి నీ
బాలునిఁ జూడు మంగదుని భద్రుని నంచు ప్రసన్న...

110


ఉ.

రామునియాజ్ఞచేత కపిరాజ్యము నారవిపుత్రు కిచ్చినన్
ప్రేమను తారఁ గూడి యతిప్రీతి యొనర్చుచునుండి వేడుకన్
వేమఱు వానకాలమును వెళ్లగ రాముఁడు పిల్వఁబంపినన్
భూమిని నున్నవానరులు బోరున మ్రోయ ప్రసన్న...

111


ఉ.

వానరకోటి గొల్వఁగను వచ్చె దివాకరపుత్రుఁ డప్పుడున్
వానరులందఱం గనియు వారిజనాభుఁడు సీతఁ జూడఁగా
నానయుఁ జేసే సీత గని యచ్చటివార్తలఁ దెల్ప నంగదుం
బూనెను మారుతాత్మజుఁడు నుంగ్రముఁ బట్టి ప్రసన్న...

112


చ.

పడమర తూర్పు నుత్తరము బంపఁగఁబోయిరి వానరాధిపుల్
వడి తన చేతిముద్రికయు వాయుతనూజునిచేతి కిచ్చినన్

దడయకపోయె వానరులతండము నప్పుడు దాక్షిణంబుగన్
బుడమిని జాడల న్వెదుకఁబోయిరి వారు ప్రసన్న...

113


ఉ.

వచ్చి సముద్రతీరమున వానరులు న్బవళించినప్పుడున్
జచ్చుజటాయువాక్యములు సారెకుఁ జెప్పఁగ దుఃఖమంది తా
వచ్చి జటాయువన్న మఱి వారితొఁ జెప్పెను సీతపోలికల్
మెచ్చుగ లంకమార్గమును మేటిగఁ జెప్పె ప్రసన్న...

114


ఉ.

ప్రొద్దున లేచి వానరులు పోయి సముద్రపుఁదీరమంతయున్
దద్దయఁ జూచి యంగదుఁడు దాఁటఁగలేమని చెప్పుచుండఁగాఁ
బద్దుకు నాంజనేయుఁడును బర్వత మెక్కె మహాద్భుతంబుగాఁ
బెద్దయుఁ బెంచి వాలమును భీకరమంద ప్రసన్న...

115


ఉ.

పాదములూని బిట్టెగసి పావని దాఁటి సముద్ర మప్పుడున్
మోదము నొంది రాఘవుల మూర్తిమహత్త్వమటంచు వేగము
న్పాదుగ లంకఁ జొచ్చియును బల్లవపాణిని సీతఁ గానకన్
లేదని నిశ్చయించియును లేకటురాత్రి ప్రసన్న...

116


ఉ.

రావణుభోగమున్ సుఖము రాజ్యవిలాసము రూపురేఖయున్
భావజుకేళిముచ్చటయు భామలు చేసెడు మంగళార్తియున్

భావములోనఁ జూచి యిఁక భాగ్యములు న్బెడఁబాయు వీనికిన్
గావరమంది రాఘవులకాంతను దెచ్చె ప్రసన్న...

117


చ.

తెలతెలవాఱవచ్చినను ధీరుఁడునౌ హనుమంతుఁ డప్పుడున్
కలవరమంద సీత నటుగానక రావణుఁ డేమి చేసెనో
తెలియ దిఁకేమి సేతు నని దీనతతో వనమంతఁ జూడఁగా
నెలఁతనుఁ గాంచె నొక్కతెను నేడ్చుచునుండ ప్రసన్న...

118


ఉ.

అన్నిట రూపురేఖలును నందము చందము మోముకాంతియున్
నన్నియు నానవాలులును నక్కడ రాముఁడు చెప్పినట్లుగా
నున్నని సీతయే యనుచు నుబ్బుచు భూజము నెక్కుచుండఁగాఁ
గన్నులఁగప్ప రావణుఁడు గ్రక్కున వచ్చె ప్రసన్న...

119


ఉ.

వచ్చినవానిమాటలును వారిజనాభునిదేవిమాటలున్
మెచ్చియు రాక్షసాధముఁడు మేలుగ నాశది దీఱ కేగుటల్,
ఇచ్చట సీత యేడ్చుటయు నింతులు కావలియున్నచందమున్
ముచ్చట దీఱఁ జూచి యలముద్రిక నిచ్చెఁ బ్రసన్న...

120


ఉ.

రామునిచేతిముద్రికను రామకు నిచ్చి శుభంబుఁ జెప్పియున్
భామశిరస్సునందుఁ గల భాసురరత్నముఁ దాల్చి పిమ్మటన్

వేమఱు నాజ్ఞఁ దీసికొని వేగమె తా వనమంతఁ గూల్పఁగా
తామసమంది రావణుఁడు దానవమంపె ప్రసన్న...

121


ఉ.

వచ్చిన రాక్షసావళిని వాలమునం దెగటార్చివైచి తా
నిచ్చకు వచ్చినట్లుగను నెల్లగ వచ్చినవారిఁ జంపె నా
వచ్చినయక్షయుం దునిమె వారక వానికిఁ బెద్దవాఁడు నౌ
మ్రుచ్చును నింద్రజిత్తు నొకమూలకుఁ జేసి ప్రసన్న...

122


ఉ.

ఏమిర వానరాధముఁడ యెచ్చటనుం డిటు వచ్చితన్న నే
భూమిజఁ గాంచ వచ్చితిని బోయెదరా నినుఁ జూచి రావణా
భామిని సీత నిమ్మనఁగఁ బాపము నెంచక పంపుఁడన్న స
త్ప్రేమ విభీషణుండు వినిపించెను రీతి ప్రసన్న...

123


ఉ.

తోఁకయుఁ గాల్చిన న్నెగసి ధూళిగ దుమ్ముగఁ జేసె మేడలన్
వీఁకను పట్నమంతయును వేగముగా దహనంబుఁ జేసి ని
ర్భీకరవృత్తిఁ జూచి యల భీతమృగాక్షిని రాముపత్ని న
స్తోకవిధాన మూని యలతోయధి దాఁటి ప్రసన్న...

124


ఉ.

వచ్చినవాయుపుత్రుఁ గని వానరు లున్నతిఁ బ్రీతి నొందఁగా
నచ్చటివారలం దెలిపి యాదరబుద్ధిని వారిఁ గూడి మే

లచ్చుపడంగ నంగదునియాజ్ఞను వానరపంక్తిఁ గూడియున్
మెచ్చుచు నా మధూపవనమిత్తుల రైరి ప్రసన్న...

125


ఉ.

అంతకుమున్ను వానరులు నందఱు వచ్చిరి సీత గాన క
త్యంతపుఁబ్రేమ నుండిరి ఘనాత్ములు రాముఁడు లక్ష్మణుండు ప్ర
త్యంతమునందునున్న యలయార్యులపల్కులచేత వీరికై
ప్రాంతములం గనుంగొనఁగ వారును వచ్చెఁ బ్రసన్న...

126


ఉ.

సీతనుఁ జూచి వచ్చితిమి శ్రీరఘునాయక లంకలోపలన్
బ్రీతిగ ముద్రి కిచ్చితిమి ప్రేమ నొసంగఁగఁ దెచ్చినార మా
నాతి యొసంగురత్నమును నాతీ మిముం దలపోయుచుండు బ్ర
ఖ్యాతిగ లంకఁ గాల్చితిమి కాంచితి మిమ్ము ప్రసన్న...

127


ఉ.

వచ్చి సముద్రతీరముకు వానరు లారఘురామునాజ్ఞచే
నచ్చటఁ దెచ్చి పర్వతములన్నియు నీలుని చేతి కిచ్చినన్
మెచ్చుగఁ గట్టగట్టి యలమేటిపరాక్రమశాలి వేడుకన్
ముచ్చటతోడ వానరులు మూఁకలు గాంచె ప్రసన్న...

128


ఉ.

అంత విభీషణుండు తనయన్నకుఁ జెప్పెను రామ సీత నీ
వింతట నిచ్చినన్ బ్రతుకు నిష్టజనంబు లటన్న నుగ్రుఁడై

యంతటఁ దన్నెఁ దమ్మునిని నప్పుడె లంకయుఁ బాసె నాతఁడు
న్బ్రాంతమునందు రాముదరి భద్రముగాంచె ప్రసన్న...

129


ఉ.

రమ్ము విభీషణా యనుచు రాఘవుఁడుం దయఁ జేసినప్పుడే
హుమ్మను వాసరావళియు నోర్పును జెందెను లంకపట్టమున్
సమ్మతిఁ గట్టి రాఘవుఁడు సైన్యముతోడను బంపి లంకపై
యమ్మహితుండు వానరుల నందఱిఁగూడెఁ బ్రసన్న...

130


ఉ.

ఉత్తరగోపురంబునకు నొప్పుగఁబోయెను దానవుండు దా
నత్తఱిఁబట్టుఛత్రములు నాకసమందునఁదోఁచె నెండకున్
సత్తువపోయె వానరులు సారెకు వాసిని గొట్టఁబోవఁగా
నత్తఱి కాదటం చనియె నాసురవైరి ప్రసన్న....

131


ఉ.

చూడు విభీషణా యనుచు సుస్థిరుఁడై రఘురాముఁ డప్పుడున్
వేడుక బాణమొక్కటియు వేసినతోడ ననేకమస్త్రముల్
గూడియు ఛత్రసంఘములఁ గుంభినిఁ గూల్చినఁ జూచి రావణుం
డాడెను రాముసాటి యెవరంచును దాను ప్రసన్న...

132


ఉ.

రావణుతోడ నంగదుఁడు రాముని సీతను బుచ్చి లంకయున్
కావఁగ నేలుకొమ్మనినఁ గావర మందియు రావణుండు తా

భావములోన నంగదుని జంపెదనంచుఁ దలంచ రావణా
చావది నీకు సిద్ధమనె సాగుచు నంత ప్రసన్న...

133


ఉ.

అండజయాన రావణుని యంగన సీతను బుచ్చుమంచనెన్
మండుచు రావణాధముఁడు మానిని వేగమె లేచి పొమ్మనెన్
దండధరుండు నాయెదుటఁ దాళఁగలేఁ డిఁక వీరు లెక్కయే
పొండనె రాక్షసాధములఁ బోయిరి పోర ప్రసన్న...

134


ఉ.

వచ్చిన రాక్షసావళిని వాలమునం దెగటార్చుచుండినన్
జచ్చుచు రాక్షసావళులు సారెకు సారెకు వచ్చుచుండగా
జచ్చితి రింక మీర లని చయ్యన మూలబలంబుతోడుగా
వచ్చెను రావణాసురుఁడు వాస వైరి ప్రసన్న...

135


ఉ.

రావణుఁ డివ్విధంబునను రాజితమౌ బలపంక్తిఁ బోరఁగా
రావణుపైకిఁ బోయె నల రావణుతమ్ముఁడు రామునాజ్ఞచే
రావణుఁ డాగదన్ విడచె రాముఁడు చూచుచునుండినంతలో
రావణుతమ్ముఁ డాగద ధరాతలిఁ జేర్చె ప్రసన్న...

136


చ.

తరలనిశక్తి నేసి యిఁక తప్పక పాపుము నాఁగ నంతలో
మెఱుపులు గ్రుమ్ముబాణముల మ్రింగుచు వచ్చెడిశక్తిఁ జూచియు

న్గరుణ దలిర్ప లక్ష్మణుఁడు గ్రక్కున నడ్డము వచ్చి నిల్చినన్
బొరలుచు దానికి లక్ష్మణుఁడు మూర్ఛయుఁ బోయె ప్రసన్న...

137


ఉ.

తమ్మునిఁ జూచి రాఘవుఁడు తాలిమి దూలఁగఁ బట్టి యేడ్చియు
న్నిమ్మహి రావణాసురుని నిప్పుడె కూల్చెద నంచు నుగ్రుఁడై
క్రమ్మశరంబు లేసినను కాకకుఁ దాళఁగలేక లంకకున్
సమ్మతి నిల్వలేక చనెఁ జచ్చితి నంచు ప్రసన్న...

138


ఉ.

సంజివి తేను బంపవలె జాగిఁక సేయక వేగ మిప్పుడే
యంజనిముద్దుబిడ్డనని యంపిరి రామసుషేణు లాతఁడు
న్నంజలిఁ జేసి పోయి కడునాదర మొప్పఁగ విక్రమంబునన్
సంజివికొండఁ దెచ్చెఁ దనసాహస మొప్పఁ బ్రసన్న...

139


ఉ.

ఆక్షణమందు సంజివియు నాతని కిచ్చిన యంతలోపలన్
వీక్షణ జేయుచుండఁగనె వేగమె లక్ష్మణుఁ డొక్కమాటు ప్ర
త్యక్షము నయ్యెఁ దెల్విగను కొండను మారుతి డించివచ్చె నా
రాక్షసమూఁక చింతఁగనె రాముఁడు నవ్వె ప్రసన్న...

140


ఉ.

లంకయు నెప్పటట్ల మఱిలగ్గుల కెక్కఁగఁ జూచి రాక్షసుల్
ఇంక మఱేమిజీవమని యేడ్వఁగ రావణుఁ డంతలోపలన్

శంకయుఁ దక్కి వానరులు సారెకు రాక్షసపంక్తిఁ దున్మఁగా
లంకను బ్రోచు రావణుఁడు లజ్జ వహించె ప్రసన్న...

141


ఉ.

రాతిరి నింద్రజిత్తు రఘురాముని తమ్ముని సేననంతయున్
ఖ్యాతిగ నాగపాశములఁ గట్టియుఁ బ్రీతిని లంక జొచ్చియున్
సీతది దక్కెఁగా యనుచుఁ జెప్పఁగ మిక్కిలి ప్రీతిఁ జెందె ది
వ్యాతతకీర్తి రావణుఁడు నాతడు పోయె ప్రసన్న...

142


చ.

గరుడుఁ దలంప రాఘవుఁడు గ్రక్కున వచ్చినఁ బాఱిపోయె నా
ఖరతరసర్పసంచయము కాంక్షను గొన్నిఁటి జంపి రాముచే
సరగున నాజ్ఞఁ గైకొనుచు సాగె నతండును వానరాళియున్
బరువడి తొల్లియున్నయటు భాసురులైరి ప్రసన్న...

143


చ.

భయముఖులైనరాక్షసుల భగ్నముఁ జేసిరి వానరాధిపుల్
చెలువతనం బడంగఁగను చింత వహించెను రావణుండు
బలమది పోవ రోయుచును బంపెను పుత్త్రుల లక్షమంది నా
బలమును జచ్చె వానరులు భద్రము గాంచె ప్రసన్న...

144


ఉ.

అంతట రావణాసురుఁడు నాత్మ విచారము నొందుచుండగా
నింతవిచార మొంది యిటు లేల కృశించెదు భూమిలోన నీ

యంతటివాఁడె చింతిలఁగ నౌనొకొ కార్యము లంచు నింద్రజి
త్తంత రథంబు నెక్కి ఘనతంతయుఁ జూపె ప్రసన్న...

145


చ.

కొడుకులు చచ్చిపోయిరని కోపముతోడను రావణుండు తా
నడలుచునుండఁగా నపుడు నగ్రసుతుండగు మేఘనాథుఁడు
న్వడిపడి నూఱడించియును భర్గుని గూర్చి తపంబుఁ జేసి యా,
గడియనునచ్చుతద్రథము గ్రక్కున నెక్కె ప్రసన్న...

146


ఉ.

గుంపుల రాక్షసావళులఁ గూల్చిరి వానరు లంత వేగమున్
దెంపుగ రావణాసురుఁడు దీనతనొందియు నావలించియున్
గంపము చేతవచ్చె నల కోటలనేడిటి దాఁటి రాముపై
నంపలగుంపు లేయుచును నందఱిఁ గూల్చి ప్రసన్న...

147


ఉ.

ఇక్కడివార్తయంత విని యింద్రవిజేతయు నీక్షణంబునన్
గ్రక్కున వారి సంగరముఖమ్మున ఖండనఁ జేసి వచ్చెదన్
జక్కనఁ జూడు తండ్రి యని చాపము చేతనె పూని తేరునుం
గ్రక్కునఁ దోలె యుద్ధమునకై చనె నయ్య ప్రసన్న...

148


ఉ.

వాఁడు మహెూగ్రకోపమున వానరులం దిగమ్రింగ నార్చుచు
న్నేఁడు వధింతు రాముఁ డతఁ డెచ్చట నుండె నటంచు రాఁగ నా

వేఁడిమి చూచి రాఘవులు వీఁడు విభీషణ యెవ్వఁడన్న దా
వాఁడనె కుంభకర్ణుఁ డని వాఁడని చెప్పె ప్రసన్న...

149


చ.

బలమగుదివ్యబాణములఁ బాపునిపై నటుపంప నంతలో
బలమును వానిమాయలును భగ్నము లయ్యెను బ్రహ్మబాణమున్
దలఁచియు వానిపైఁ బనుపఁ దత్క్షణమే యది వాని ద్రుంచె నా
కులగిరి కూలినట్లుగను గూలెను వాఁడు ప్రసన్న...

150


ఉ.

చచ్చెను గుంభకర్ణుఁడన స్వాంత మెఱుంగక మూర్ఛవోయి తా
నచ్చట లేచి రాఘవుల నందఱఁ జంపెద నంచు నుగ్రుఁడై
మచ్చర కొంత దీర్చుమని మానక నయ్యతికాయుఁ బంపెఁ దా
వచ్చెను రాముఁ డే డనుచు వానిని జూచి ప్రసన్న...

151


ఉ.

కోపముచేత లక్ష్మణుడు కూల్చిన నాయతికాయుఁ డప్పుడున్
బాపము మేఘనాథునకు భగ్నము చేయఁగ హోమమంతయున్
గోపముఁ బూని వచ్చె నలఘూర్ణిలు హోమము నవ్విభీషణుం
డోపికఁ జెప్ప వానరులు నొద్దికఁ జేరె ప్రసన్న...

152


ఉ.

అంగదవాయుపుత్రకులు నప్పుడు దెచ్చిరి ధాన్యమాలినిన్
రంగుగ యజ్ఞవిఘ్నమును రక్తిగఁ జేయఁగ నెంచి యంతలో

మ్రింగుచు వానరావళుల మ్రింగఁగ నాజ్ఞ యొసంగి సేనకున్
భంగము సేయఁగాఁ దివిరి వచ్చెను వాఁడు ప్రసన్న...

153


ఉ.

ముందఱ రావణాసురుఁడు మూలబలంబు లనేకరాక్షసుల్
కొందలమంద వచ్చియును గూయుచునుండ విభీషణుండు తాఁ
జిందులు ద్రొక్కుమూఁకలను జెప్పెను రావణుసేనయంచు నా
చందమునంతయు న్వినియె సారెకు నప్డు ప్రసన్న...

154


ఉ.

ఒక్కొకరాక్షసాధముఁడు నొక్కొకరాముఁ డనంగ నప్పుడు
న్బెక్కువిధంబులం బలిమి భీకరమూర్యవతార మైన తా
నెక్కడఁ జూడ రాఘవుఁడు నేమి మహత్త్వమొ రాక్షసాధము
ల్గ్రక్కునఁ గూడి రందఱును గయ్యము దీఱె ప్రసన్న...

155


చ.

రథమును నెక్కి రావణుఁడు రాఁ గని యింద్రుఁడు రామచంద్రుకు
న్గ్రథమును మాతలిం బనుప రాఘవుసన్నిధి కొచ్చి నిల్చినన్
రథ మది యెక్కి రాఘవుఁడు రంజిల నాకపులంత వేడుకన్
రథముల రామరావణులు రాజిలఁజూచె ప్రసన్న...

156

ఉ.

రాముఁడు గెల్చునంచు సురరాజును వానరు లంత వేడుకన్
వేమరు గెల్చు రావణుఁడు వేగ మటంచు పిశాచ రాక్షసుల్
భూమిని జూచుచుండఁగను బోరిరి సింహము నేన్గుచాడ్పునన్
రాముఁడు రావణుండు నల రాక్షసమూక ప్రసన్న...

157


ఉ.

అంతట రామలక్ష్మణులు నస్త్రములం దగఁ బోరిపోరియు
న్నంతటఁబోక నిద్దఱను నయ్యిరువాఁగులవారుఁ బూన్కితో
వింతగఁ జూచుచు న్మిగుల విభ్రమమూనియుఁ బోరుచుండగా
నంతట రావణాసురుని యాయువు దీఱె ప్రసన్న...

158


చ.

పదియు శిరంబులు న్దునిమి బాహులు నిర్వచి ద్రుంచివేసిన
న్నదరిపడంగ నంతటను నప్పుడె మాటికిఁ బుట్టుచుండఁగా
మది దలపోసి రాముఁ గని మర్మముఁ జెప్పి విభీషణుండు నా
సదయుఁడు నగ్నిబాణమున సత్తువ దీసె ప్రసన్న...

159


ఉ.

దేవతలుం బిశాచములు దిక్కులు కొండలు వానరాధిఫుల్
భావజవైరియున్ మఱియు బ్రహ్మలు నందఱు భీతినొందఁగా
భావములోన నస్త్రమున బాహుల దీసియుఁ దీవ్రముష్టిచే
జావుము రావణా యనుచు జయ్యన నేసె ప్రసన్న...

160

ఉ.

అంతట కూలె రావణుఁడు నద్భుతసంతస మంది దేవతల్
వింతగఁ బుష్పవర్షములు వేడుక రాఘవు ముంచి దేవ మా
కెంతసుఖంబుఁ జేసితివి కేశవ రామ యటంచు మ్రొక్కుచున్
గాంతలు మంగళార్తులను గౌరవమిచ్చె ప్రసన్న...

161


ఉ.

రాముడు విల్లునంబులును రంజిలుతమ్ముని చేతి కిచ్చినన్
భామయు వచ్చి రావణుని భామిని బాష్పజలంబు కారఁగాఁ
బ్రేమను బ్రాణవల్లభుని పేర్మియుఁ జూచుచు మీద వ్రాలియున్
గామిని యేడ్చె రాముఁడును గాంచెను దాని ప్రసన్న...

162


ఉ.

అన్నకు రావణాసురుని కగ్నివిధానము నాచరించి యా
సన్నుతగాత్రి నంపె నలసర్వజనంబులతోడ లంకకున్
సన్నుతులైనవానరుల జాగ్రతఁ జెప్పెను రాఘవుండు నా
సన్నులఁ జూచి యిట్టులనే సారెకుఁ బ్రేమ ప్రసన్న...

163


ఉ.

భీకరలంక నిప్పుడు విభీషణుఁ బట్టముఁగట్టి రమ్మనెన్
బ్రాకటవానరాధిపులఁ బావనిమున్నగువారలన్ గడున్
భీకర మొప్ప దోడ్కొనుచు భేరిమృదంగములుం జెలంగఁగా
శ్రీకరమైన రాజ్యమును జెల్వుగఁగట్టె ప్రసన్న...

164


ఉ.

అప్పుడు సీతఁ దెమ్మనుచు నాజ్ఞ యొసంగెను రాఘవుండు నా

కప్పురగంధి దోడుకొని గ్రక్కున వచ్చె విభీషణాదులున్
దెప్పుగఁ జూచి రాఘవులు తెంపుగ మాటలనాడె లక్ష్మణా
చెప్పుము సీత నగ్నిఁ జొర సీతయుఁ బూనె ప్రసన్న...

165


ఉ.

రామునిచిత్తముం దెలిసి రంజిలునగ్నిని సీత చొచ్చియున్
భామను వీతిహోత్రుఁడును బట్టె గరంబులఁ దెచ్చి యప్పుడే
స్వామికి నప్పగించినను సంభ్రమమందిరి దేవదానవుల్
ప్రేమతొఁ గన్నతండ్రి మునిపీఠముఁ జొచ్చె ప్రసన్న...

166


ఉ.

వచ్చినవారికందఱికి వంద నమప్పుడు చేసె రాముఁడు
న్వచ్చినవారు సీతకును వారకబుద్ధులు సెప్పి రెంతయున్
ముచ్చటదీఱ నాముదిత మోదమునం దరిఁ జేర్చి యప్పుడే
సచ్చరితుండు రాఘవుఁడు సమ్మతి నుండె ప్రసన్న...

167


ఉ.

వేగ మయోధ్యఁ జూడవలె వేకువ లేచియు మూఁడునాళ్లకున్
ఏగతిఁ జేరవచ్చు నన నిష్టముతోడ విభీషణుం డనున్
పోఁగలయట్టిపుష్పకము పూర్వమునుండియు నున్న దిచ్చటన్
శ్రీగలభాగ్యశాలి యది శీఘ్రము చేరు ప్రసన్న...

168


ఉ.

తెమ్మని రామచంద్రుఁడును దెచ్చి విభీషణుఁ డంత వేడుకన్
సమ్మతి సీత రాముఁడును సైన్యము లక్ష్మణుఁ డేగ నంతయున్...

గొమ్మయుఁ జూచుచుండగను కోరిక దీఱఁగ రాముఁ డంత వే
గమ్మున వార్తలం దెలుపఁ గాంచెను సీత ప్రసన్న...

169


ఉ.

లే చటు తర్లెఁ బుష్పకము లెక్కయు లేనటువంటిదూరమున్
బూచినవృక్షముల్ నదులు పూర్వమువచ్చినయట్టిమార్గముల్
జూచియు దాను నాతికిని జూపుచు రాముఁడు వేడ్కలన్నియున్
యోచనఁ జేసి రందఱును యోధులు గూడి ప్రసన్న...

170


ఉ.

చేరిరి చిత్రకూటమును జెల్వుగ రాముఁడు మున్ను గాఁగ నా
ధీరుఁడు నైనతమ్మునకుఁ దెల్పఁగ మారుతి నాతఁ డేగి యా
భారతరాజ్యభూమికిని భద్రములన్నియు కేకయాత్మజుం
గూరిచి చెప్పె నాతఁ డతికూర్మి వహింప ప్రసన్న...

171


ఉ.

తల్లుల దమ్ములం గనియు దండములం బిగికౌఁగిలింతలన్
జల్లఁగఁ గల్గె సీతకును జక్కఁగ మ్రొక్కిన రాష్ట్రపుంజనుల్
చల్లనిచూపులం దనిపె జానకి వారల నంత దేవతా
వల్లభుఁడాదిగా జనులు వారక మెచ్చె ప్రసన్న...

172


ఉ.

వచ్చి రయోధ్యపట్నముకు వాద్యములుం జెలుగంగ వేడుక
న్వచ్చిరి యిష్టభృత్యులును వానరసేనలు గొల్వఁగా మఱి

న్వచ్చియు నిల్లుఁ జొచ్చియును వారిజనాభుఁడు కొల్వుదీర్పఁగా
వచ్చిరి దేవసంఘములు వర్ణనఁ జేయ ప్రసన్న...

173


ఉ.

రాముఁడు సీతఁ గూడుకొని రంజిలుచు న్మణిపీఠమందునన్
బ్రేమతొ నున్న నందఱును బ్రీతి యొనర్పుచుఁ గొల్చుచుండఁగా
రామునిఁ జూడవచ్చి రటు రాజకుమారులు బంధువర్గమున్
భూమినిగల్గు నాప్రజలు పొందుగ రాఁగఁ బ్రసన్న...

174


చ.

గురువు వసిష్ఠుఁ గౌశికుఁడు కూరిమిబంధుఁడు ఋష్యశృంగుఁడున్
వరుస మునీంద్రవర్గములు వచ్చిరి వేడ్కను రాముఁ జూడఁగా
సరసులు రాజవల్లభులు సత్కులజాతులు బంధువర్గమున్
గరుణతొవచ్చి యాజనకుఁ గ్రక్కు.న జూడఁ బ్రసన్న...

175


చ.

పరువడి బ్రహ్మనారదులు పార్వతిఁ గూడి సదాశివుండునున్
మఱి శశిదేవి యింద్రుఁడు విమానము లెక్కియు వేడ్కఁజూచుచున్
మెఱువడి రంభ యూర్వశియు మేనక ముందుగ నాట్యమాడగాఁ
దరుణులు చూచి వేడుకలు దర్లకఁ జూచె ప్రసన్న ...

176


ఉ.

కిన్నరయక్షముఖ్యు లొకగీతముఁ బాడఁగ నష్టదిక్కులున్
జెన్నుగ మండలాధిపులు సిద్ధులు సూర్యశశాంకు లెల్లరున్

[6]సన్నను నావీమానములఁ జక్కగఁ జూచుచునుండ నెవ్వరున్
[7]తన్నట వేడ్కఁ జూచు టది తప్పకయుండె ప్రసన్న ...

177


ఉ.

మింట మృదంగనాదములు మిక్కుటమై చెలఁగంగ నిక్కడన్
దంటబలీయమేళములు తప్పెటబూరలు పిల్లఁగ్రోవులన్
మింటనె గప్పి పుష్పముల మేదిని నాముని వేషభాషలన్
అంటె చెలంగుభాషణుల నంతట నప్డు ప్రసన్న...

178


ఉ.

వీథు లలంకరించి రటు విప్రులు రాజులు వైశ్యశూద్రులున్
వీథుల తోరణంబులును వింతవినోదము లైనచోద్యముల్
వీథులఁ బచ్చికస్తురియు వేడుకగా మఱి మేళరాజ్యముల్
వీథులవీథులం బ్రజలు వేడ్కలు సేయఁ బ్రసన్న...

179


ఉ.

 ఏనుఁగులు న్రథంబులును నెక్కుడుగుఱ్ఱములు న్మహోష్ట్రముల్
మానుగ మంత్రివర్గమును మంచిపదాతులు సర్వసేనలున్
వానరసేనలు న్మఱియు వారలభేదము భల్లుకంబులున్
దానవమూఁకలుం గదిసి తర్లకయుండెఁ బ్రసన్న...

180

ఉ.

అప్పు డయోధ్యపట్ణమున నన్నియు నొప్పెను రాజధానియై
యెప్పుడు చూచినన్ భ్రమసి యెవ్వరి నెవ్వరి తాము చూచుచున్
అప్పురమందుఁ గాంతలను నందముఁజూచిన జందమామనున్
దప్పులఁ బట్టువారు పరతంత్రులు కారె ప్రసన్న...

181


ఉ.

అందు వసిష్ఠకౌశికులు నత్రిమహామును లాదిబెద్దలు
న్నందఱుఁ గూడి రామునకు నన్నిట మంచిదినంబుఁ జూచియున్
బొందుగ జైత్రశుద్ధ మగుపూర్ణిమ నుత్తమవేళ వేడుకన్
అందముఁ జూచి పట్టమును నప్పుడు గట్టి ప్రసన్న...

182


ఉ.

తెచ్చి సముద్రతీరమున ధీరతతోడుత నాంజనేయులున్
ముచ్చటఁ బూర్ణకుంభముల ముందఱగా మునులంత గూడియున్
అచ్చట సీతరాములకు నందఱు గూడియుఁ దానమార్చిరా
నెచ్చుగఁ జేయువేడుకల నెంతని చెప్ప ప్రసన్న...

183


ఉ.

కట్టిరి బాసికంబులను గంజదళాక్షికి రామచంద్రుకున్
బెట్టిరి చేత ముద్రికను భీకరమై జగమంత వెల్గఁగాఁ
బట్టిరి ఛత్రచామరము ప్రాంతములందునఁ దమ్ములున్ హితుల్
కట్టిరి చేత కంకణము కావు మటంచుఁ బ్రసన్న...

184

చ.

భరతుఁడు లక్ష్మణుండు నెలబాలుఁడు శత్రునిహంత భక్తితో
నిరవుగ నిల్చి రాఁ బిదప నెంతయు రాముఁడు సత్కటాక్షముల్
పఱపెను వారియందు సతిపంకజనేత్రులఁ జూచెఁ బ్రేమతో
సరసముతోడ నిష్టముల సాగఁగఁ జేసి ప్రసన్న...

185


ఉ.

సన్నిధినున్నయట్టి యలసాధ్వికి కోసలరాజపుత్త్రికిన్
పన్నుగ నాసుమిత్రకును బాగుగ దండముఁ బెట్టి రందఱున్
అన్నము భక్ష్యభోజ్యములు నందఱు గూడియు నారగించి రా
యన్నిట సౌఖ్య మంది రలయాప్తులు గూడి ప్రసన్న...

186


చ.

గురువులకున్ సుకవిప్రముఖకోటికి రాముఁడు మ్రొక్కి నిల్చియున్
అరయఁగ మీకటాక్షమున నన్నిశుభంబులు గల్గె వేడుకన్
దిరముగ దివ్యవస్త్రములు దివ్యసుమాళులు కోర్కి తీఱఁగా
సరగునఁ బంచె నందఱికి సారెకు రాజు ప్రసన్న ...

187


చ.

గురువు వసిష్ఠుఁ డత్రిమునికూటములెల్లను వేదమూర్తులై
పరగెడువారి రాఘవుఁడు భక్తిని మ్రొక్కిన యంతలోపలన్
వరమునివర్గ మెల్లఁ గృప వర్ధిలుమంచును దీవనంబిడన్
సురుచిరమందహాసమున శోభిలె నంత ప్రసన్న...

188

ఉ.

సీతను గూడి రాఘవుఁడు చిత్తజుకేలిని నోలలాడుచుం
బ్రీతిగనుండి రిద్దఱును బ్రేమను మించి సమానరూపులై
ఖ్యాతిగఁ దమ్ములందఱును గాంతలు గూడి సుఖంబు నొందియున్
సీతకు రామచంద్రులకు సేవలు చేయు ప్రసన్న...

189


చ.

దయగలవాఁడు రాఘవుఁడు ధన్యుఁడు రాముఁడు రాజ్య మేలఁగా
భయమును లేదు కల్మి యెడఁబాయదు సర్వవిధంపుభాగ్యముల్
ప్రియమును ధర్మము న్గలిగి ప్రేమఁ బెనంగి మహావిభూతులై
ప్రియసఖులున్ సఖీజనులు పేర్మిని గూడి ప్రసన్న...

190


ఉ.

అట్టిదయాపరుండవని యంజలిఁ జేసితి నన్నుఁ గావుమీ
గట్టిగ లేదు పొమ్మనక కంజదళాక్ష కటాక్ష ముంచుమా
పట్టిననాదుదుర్దశలఁ బాఱఁగఁగొట్టి భయంబు దీర్చుమా
చుట్టము లేదు ని న్విడువఁ జుట్టము నీవె ప్రసన్న...

191


ఉ.

దాసజనానుపోష ఫలదాయక పాయక రావె కావవే
యీసమయాన నీకరుణ యించుక నిల్పుము జాగు సేయకన్
దాసులదాసదాసుఁడను ధన్యునిగా ననుఁ జేయు వేగమే
మాసరివారిలో మిగుల మన్నన నిమ్ము ప్రసన్న...

192

ఉ.

కీ డొనరించిన న్మరియుఁ గ్రిందికిఁ ద్రోయక నన్ను గావవే
వేడఁగ నీవె కాక మఱి వేఱెవ రింకను దిక్కు దేవ నా
తోడ వసించి యెప్పటికి దోడును గావఁగదయ్య దేవ నా
పోఁడిమి దీర్చి బంధువునిపూనిక దీర్చు ప్రసన్న...

193


ఉ.

కింకరు లెల్లఁ గూడి యొకకీడు దలంచక వేసియున్నయీ
సంకెల లూడఁదీసి నను జక్కఁగ మొక్కలివీడ్చి తెచ్చి యో
పంకజనాభ నీకృపకుఁ బాత్రుఁడ నే గరుణించి యేలి యో
వేంకటశైలనాథ గృప వేడుకఁ గావు ప్రసన్న...

194


ఉ.

 ఇంతట మ్రొక్కన న్విడచి యీప్సితమున్ రఘునాథుఁ డిచ్చె నే
సంతసమంది యీసుకవిసన్నుతుఁ డైన ప్రసన్నరాఘవుం
డెంతమహాత్ముఁడైన మఱి యెంతటివారయినన్ మహాత్మునిన్
బంతముతోడ గొల్చియును భద్రములందు ప్రసన్న...

195


ఉ.

శ్రీకరమైన రామునకు సీతకుఁ బ్రీతిగఁ బద్యవాక్యముల్
బ్రాకటమైన వైభవము భాష్యము గోరికఁ జెప్పికొంటిఁ దాఁ
జేకొని చిత్తగించు మిఁక చెల్వముగా నెడబాయకుండుమీ
లోకములోన నీవె గతి లోలుఁడ ప్రోవు ప్రసన్న...

196

ఉ.

మంగళమౌను రామునకు మంగళమౌ ననుఁగన్నతల్లికిన్
మంగళమౌను లక్ష్మికిని మంగళమౌ మముఁగన్న సీతకున్
మంగళమౌను జానకికి మంగళమౌ నను బాయకుండుమీ
మంగళమౌను నిద్దఱికి మమ్మును గావు ప్రసన్న...

197


ఉ.

 ఛందము లక్షణం బెఱుఁగఁ జక్కఁగ ధైర్యముతోడఁ జెప్పితిన్
తొందర లేదు తప్పు లనితోచినఁగాని రఘూత్తమాది మీ
యందఱిపాదభక్తుఁడను లక్ష్మణపుత్రుఁడ నారసింహుడన్
వందన మాకవీంద్రులకు వారిజనాభ ప్రసన్న...

198


ఉ.

రాజులమేటిరాజు రఘురాజమహాత్మకు రాజమాన్యుఁడై
రాజితకీర్తిశాలి యగురాముఁడు రాజ్యపుప్రేమయుక్తుఁడై
యీజగ మేలురాజులకు నిష్టజనంబులు నింపొనర్చె మా
భూజనభక్తరక్షుఁడయి భూతిఁదలంచె ప్రసన్నరాఘవా.

199

ప్రసన్నరాఘవశతకము సంపూర్ణము.

  1. మాధవా రఘుకులేశ్వర
  2. జనపాలక
  3. నిచయంబులఁబెంపు
  4. జనౌఘములోన
  5. ధాత్రిజ
  6. సరగున
  7. తరుణులు