Jump to content

బ్రహ్మోత్తరఖండము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ప్రథమాశ్వాసము



కథాప్రారంభము

సీ.

కపిలమార్కండేయకణ్వకౌశికముఖ్య
           బహుతాపసాశ్రమబ్రాజితంబు
మునికన్యకాహస్తవనజాతధృతఘటీ
           వారివర్ధితవృక్షవాటికంబు
వైఖానసోత్సంగవర్జితనాభినా
           ళస్ఫురన్మృగశాబలక్షితంబు
సంయమ్యనుష్ఠానసమయోచితస్వచ్ఛ
           పులినశోభితనదీభూషితంబు


తే.

హంససారసచక్రవాకాదిపక్షి
కలకలారావకాసారకలిత మగుచు
వెలయు జగతీతలంబున విబుధవరశ
రణ్య మొప్పారు నైమిశారణ్య మెపుడు.

1


ఆ.

బ్రహ్మపాఠరతులు బ్రహ్మసమానులు
యాగదీక్షితులును యోగరతులు
బ్రహ్మనిష్ఠు లైన బ్రహ్మర్షివరులచే
నొప్పుచుండు నవ్వనోత్తమంబు.

2


వ.

మఱియు నమ్మహారణ్యంబు గాలవ శాండిల్య పిప్పల కింశుక
ప్లక్ష వట తింత్రిణీ రసాల సాల తమాల చందనా ద్యనేక

వృక్షవాటికావిరాజితంబును, సింహ శరభ శార్దూల
గండక భేరుండ వరాహ సారంగ గజ గవయ రోహిష
మహిషాది మృగసంకులంబును భరద్వాజ శుక శారికా
నీలకంఠ క్రౌంచరవముఖరితదిఙ్ముఖంబును, వికసిత కమల
కైరవామోదఘుమంఘుమిత జలప్రపూరిత కమలాకరం
బులుం గలిగి, భువనపావనంబు నై యొప్పు నవ్వనంబునందు
శౌనకాదిమహామునులు వ్యాసశిష్యుండును రోమహర్షణ
కుమారుండును నైన యుగ్రశ్రవసుం డనుపేరంబరంగిన
సూతునివలన సకలపురాణేతిహాసంబులు వినుచుండి యొక్క
నాఁడు వెండియు సూతుం జూచి యమ్మహామును లిట్లనిరి.

3


క.

ధన్యుండవు విద్వజ్జన
మాన్యుండవు కుశలమతివి మానితగుణసౌ
జన్యుండవు మానవసా
మాన్యుండవె నీవు నీసమానులు గలరే?

4


శా.

వేదవ్యాసమునీంద్రుఁ డాద్యుఁడు మహావిద్వద్వతంసుండు దా
వేదార్థంబు పురాణసంహితలుగా విఖ్యాతి నిర్మించి వి
ద్యాదానంబుగ నీకొసంగ నవి యాద్యంతంబుగానట్టు స
మ్మోదస్ఫూర్తిఁ జెలంగఁ బల్కితివి సంపూర్ణాంతరంగుండవై.

5


శా.

ఉల్లంబందుల నన్యకర్మకలనం బూహింపఁగా నేటికిన్
ముల్లోకంబుల కాదిదేవుఁడు జగత్పూజ్యుండు గౌరీశుఁ డు
ద్యల్లక్ష్మీఫలదుండు శంభుఁడు శివుం డట్లౌట నేతత్కథా
సల్లాపంబులఁ బ్రొద్దుఁబుచ్చుము భవజ్జన్మంబు ధన్యంబుగన్.

6

ఉ.

వింటిమి సర్వధర్మములు వింటి మశేషపురాణసంహితల్
వింటిమి పూర్వరాజులపవిత్రచరిత్రము లార్యవృత్తముల్
వింటిమి విష్ణుసత్కథలు వీనులవిందుగ నింక మాకు ము
క్కంటిచరిత్రముల్ వినఁగఁ గౌతుకమయ్యెడిఁ దెల్పు మేర్పడన్.

7


సీ.

కాలు నిర్జించి మార్కండేయమునికిఁ గ
         ల్పాంతపర్యంతదీర్ఘాయు వొసఁగె
దశకంధరుఁడు దేవదానవాభేద్యుఁడై
         భాసిల్ల నొకచంద్రహాస మొసఁగె
భక్తవత్సలుఁ డౌట బాణాసురునియింటఁ
         గావలియుండె సత్కరుణ మెఱసి
గాండీవిరథముచెంగట నుండి శూలియై
         కౌరవ్యబలముల నీఱుజేసెఁ


ఆ.

బార్వతీప్రియుండు పరమపవిత్రుండు
చంద్రశేఖరుండు శంకరుండు
నమ్మహానుభావు నాశ్రయించినవార
లిందునందు శుభము లందు టరుదె?

8


క.

ముంగొంగుపసిఁడి వాఁకిలి
ముంగిటఁ గల్పద్రుమంబు మొగి గోష్ఠములో
నం గల్గు కామధేనువు
తంగెడుజు న్నరయఁగా సదాశివుఁ డెందున్.

9


వ.

అట్లుకావునఁ బరమేశ్వరచరిత్రంబులును, దత్కవచవ్రత
ప్రభావంబులును, దద్భక్తలక్షణంబులును సవిస్తరంబుగాఁ
దెలియం బలుకవలయునని, శౌనకాదిమహామునులు శివ

కథాశ్రవణకుతూహలచిత్తు లై యడిగిన, రోమహర్షణ
కుమారుం డగు సూతుండు పరమానందకందళితాంతరంగుం
డై యమ్మహర్షుల కి ట్లనియె. మహాత్ములారా సర్వజ్ఞులైన
మీకుం దెలియరానియర్థంబులుం గలవే యైనను మీరు
న న్నడిగినప్రశ్నలకు నుత్తరంబీవలయుం గావున నాకుం
దోఁచినంతయుఁ జెప్పెద సావధానులరై వినుండని కృష్ణ
ద్వైపాయనుం దలంచి గురువందనంబు గావించి పంచా
క్షరీమహత్త్వం బి ట్లని చెప్పం దొడంగె.

10

పంచాక్షరీప్రభావము

క.

పంచాక్షరీమహత్త్వము
లెంచఁగ శక్యంబె జగతి నెవ్వరికైనన్
బంచాస్త్రజనక శక్రవి
రించి ప్రముఖులు దలంతు రిష్టముగాఁగన్.

11


ఆ.

పుణ్యకాలమందు పుణ్యతీర్థములందు
పుణ్యవంతులైన పురుషవరుల
కృపకుఁ బాత్రు లగుచు నుపదేశములు గొన్న
వారిమహిమ లెన్న వశముగాదు.

12


వ.

అట్టిపుణ్యతీర్థపుణ్యకాలాదు లెయ్యవి యనిన.

13


మ.

మధురాద్వారవతీచిదంబరమహామాయాకురుక్షేత్రముల్
మిథిలావంతిగయాప్రయాగములు రామేశాదిపుణ్యస్థలుల్
నిధులున్ సూర్యసుతాసరస్వతులు వేణీతుంగభద్రాకళా
నిధిపుత్త్రీమణికర్ణికాదినదులున్ నిశ్శ్రేయసస్థానముల్.

14

ఆ.

వ్యాసపూర్ణిమలును హరివాసరంబులు
ద్వాదశులును భానువాసరములు
సంక్రమణము లర్కచంద్రోపరాగంబు
లెలమిఁ బుణ్యకాలములు దలంప.

15


క.

గతదోషులు మితభాషులు
జితకామవిచారు లాత్మశిష్యప్రియులున్
మతిమంతులు నతిశాంతులు
గుతుకాత్మకు లైనఘనులు గురువులు దలఁపన్.

16


క.

చిత్తమున శుద్ధిగలిగియు
మత్తత్వము లేక విగతమత్సరు లగుచున్
సత్తామాత్రంబుగ సుగు
ణోత్తరు లయినట్టిశిష్యు లుపదేశార్హుల్.

17


మ.

పరమక్షేత్రములందు సాధుజనసంభావ్యైకకాలంబునన్
గురువక్త్రోదిత మైన శాంకరమహాగుప్తార్థమంత్రంబు నె
వ్వరికైనన్ శుభమోక్షసత్ఫలదమై భాసిల్లు నెట్లన్న శం
బరరాశిస్థితశు క్తిసంపుటపతత్స్వాత్యంబుబిందుక్రియన్.

18


క.

సలలితముగ నిమ్మంత్రముఁ
దలఁపఁగ నుపదేశహోమతర్పణదీక్షా
దులు లేకున్నను జపితల
కలవడ నిష్టార్థ మొసఁగు నఘము లడంచున్.

19


సీ.

రమణీయతరమంత్రరాజంబులందెల్ల
          నధికమై యొప్పుఁ బంచాక్షరంబు
ఆగామిసంచితప్రారబ్ధపాతక
          హరణకారణము పంచాక్షరంబు

గణుతింప ధర్మార్థకామమోక్షము లతి
         దక్షత నిచ్చుఁ బంచాక్షరంబు
కౌశికాగస్త్యాదిఘనమునీంద్రులు దెల్పు
         లక్షణం బరయ పంచాక్షరంబు


తే.

జపపరాయణులకు సాధుజనుల కెల్ల
నక్షయఫలప్రదంబు పంచాక్షరంబు
పూర్వజన్మకృతానేకపుణ్యసాధ్య
మాగమోక్తంబు శైవపంచాక్షరంబు.

20


క.

ఇమ్మంత్రము ప్రణవసహా
యమ్ముగ జపియింప నది షడక్షరమగు మీ
రెమ్మెయి భజియించిన నది
సమ్మతమగు శంకరునకు సన్మునులారా.

21


మ.

కలుషధ్వాంతదివాకరం బమృతమార్గస్వచ్ఛదీపంబు ని
శ్చలతాపత్రయదావపావకము సంసారాబ్ధిపోతంబు ని
ర్మలకల్యాణఫలప్రదంబు విలసన్మంత్రాధిరాజంబు నై
యలరున్ శైవషడక్షరంబు నిఖిలార్యస్తుత్యమై నిత్యమున్.

22


తే.

తారకలయందు శశియును దరువులందుఁ
గల్పకము శైలములయందుఁ గనకగిరియు
నరయ మంత్రంబులందు షడక్షరంబు
శ్రేష్ఠతరమనఁ దగు మునిశ్రేష్ఠులార.

23


వ.

మఱియు నీయర్థంబునకుఁ బురాతనం బయిన యొక్క యితి
హాసంబు గలదు దానంజేసి మీసంశయంబులు దొలంగు
నది సమస్తదురితభంజనంబును సుజనమనోరంజనంబును

ముక్తినిధానాంజనంబును నగుదానిం జెప్పెద వినుం డని
సూతుం డిట్ణని చెప్పందొడంగె.

24

కాశీపురవర్ణన

సీ.

అవనిలోఁ గల్గుపుణ్యక్షేత్రములకంటె
         సిరి మించి యుండుఁ గాశీపురంబు
బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి సముదాయ
         సేవ్యమై యుండుఁ గాశీపురంబు
కైవల్యసంధాయకంబు నై భువనప్ర
         సిద్ధమై యుండుఁ గాశీపురంబు
బ్రహ్మహత్యాదిపాపములు భస్మములుగాఁ
         జేయుచు నుండుఁ గాశిపురంబు


తే.

మహితజలరాశిమధ్యనిమజ్జమాన
పటుచరాచరజాలకల్పాంతకాల
కాలభైరవకరధృతకఠినశూల
శిఖరసంస్థాపితంబు గాశీపురంబు.

25


క.

కాశీక్షేత్రమహత్త్వము
గాశీశునకైనఁ గమలగర్భునకైనం
గౌశికునకైన నెన్నం
గా శక్యముగాదు నీలగళునకుఁ దక్కన్.

26


ఆ.

కాలబైరవుండు గణనాయకుండును
బిందుమాధవుండు నిందుధరుఁడు
పార్వతియును గుహయు భాగీరథియు మణి
కర్ణికయును వెలయుఁ గాశియందు.

27

ఉ.

ఎప్పుడు గాశికిం జనుదు నెప్పుడు గాంతును విశ్వనాథు నే
నెప్పుడు భైరవేశ్వరున కింపుగ మ్రొక్కుదు నిండువేడ్కతో
నెప్పుడు గాంగతోయముల నిమ్ముగఁ దోఁగుదు నంచు భక్తితో
నెప్పుడుఁ బల్కుమానవుల కీశ్వరుఁ డిచ్చు నఖండసంపదల్.

28


వ.

మఱియును.

29


సీ.

దిగ్గజంబులనైన ధిక్కరింపఁగఁజాలు
           బలములు గలిగిన భద్రకరులు
కమలబాంధవరథాశ్వముల నెక్కసమాడు
           జవములు గలిగిన సైంధవములు
పర్వతంబుల నైనఁ బరిహసింపఁగఁజాలు
           నమితమహోన్నతస్యందనములు
కంఠీరవంబులగర్వంబు మాయించు
           ఘనశౌర్యములు గల్గు కాల్బలములు


తే.

బ్రహ్మతోనైన వాదించు బ్రాహ్మణులును
భార్గవునితో నెదుర్కొను పార్థివులును
యక్షపతితుల్యులైనట్టి యార్యజనులు
బలునిమెచ్చనిహాలికుల్ గలరు పురిని.

30


వ.

మఱియు నమ్మహానగరంబునం గనకమయసముత్తుంగసౌధ
ప్రాకారగోపురాట్టాలకభ్రాజమానంబును, విచిత్రమణిమయ
గృహద్వారతోరణవితర్దికాదేహళీకుడ్యవాతాయనకుసూల
స్తంభవిటంకకేతనాలంకృతంబును, బ్రతిగృహప్రాంగణవిర
చితరంగవల్లీవిరాజితంబును, సమస్తవస్తువిస్తారనిస్తులప్రశస్త
విపణిమార్గప్రదేశంబును, ఘనసారమృగమదచందనసమ్మిశ్ర
హిమజలపరిషిక్తరాజమార్గంబును, హారకుండలమంజీరకంకణ

కింకిణీమేఖలాదిరత్నహాటకమయభూషణాలంకృతవారకామినీ
నర్తనఝళంఝళాయమానరంగస్థలంబును, సాలవకులకదళి
కాశ్వత్థనారంగమాతులుంగనారికేళక్రముకపనసజంబీరఖర్జూర
మాలూరసౌవీరచందనమందారనింబజంబూకదంబాదితరుషం
డమండితోద్యానవససమంచితకీరమయూరకోకిలారావాకోలా
హలంబును మాలతీమల్లికాసేవంతికాకురంటకచంపకాద్య
నేకపుష్పవాటికాశోభితంబును, గంగానదీప్రవాహసంభూత
బహువిధకుల్యాజలప్రవర్ధమానఫలితరసాలకలమాదిసస్య
పరిపూర్ణంబును, బకబలాహచక్రవాకకోయష్టికకారండవ
కలహంసముఖరజలపతంగవిహరణసముల్లసత్కమలకైరవ
కల్హారపరాగసుగంధవాసితసలిలసారరమ్యంబును, విశ్వేశ్వర
మహోత్సవసందర్శనార్థసమాగతచతుర్విధవర్ణాశ్రమజననిరం
తరకలకలారావసమన్వితంబును, మృదంగపటహనిస్సాణ
వేణువీణాదివాద్యహృద్యంబునునై, బ్రహ్మసదనంబునుంబోలె
బ్రహ్మర్షిసేవ్యంబయి, మహేంద్రభవనంబునుంబోలె బహు
విబుధాకీర్ణంబయి, మానససరోవరంబునుంబోలె సముల్లస
ద్రాజహంసంబై, చంద్రమండలంబునుంబోలె నమృతాస్పదం
బయి నారాయణాశ్రమంబునుంబోలె జగత్పావనంబయి
యొప్పుచుండు.

31

కాశిరాజుచరిత్రము

క.

ఆకాశీపుర మేలెడు
భూకాంతుఁడు శక్రతుల్యభోగుఁడు వినుత

శ్రీకంఠుఁడు శరచందన
రాకేందుయశుండు కాశిరా జన వెలయున్.

32


సీ.

తనభవ్యతరకీర్తి దశహరిద్భామినీ
       ధమ్మిల్లములఁ బుష్పతతులు గాఁగఁ
దనప్రతాపస్ఫూర్తి దగఁ జక్రవాళాద్రి
       చరమభాగతమిస్రజాల మడఁపఁ
దననిరంతరదానధారాప్రవాహంబు
       జలరాసులకు మహోత్సవ మొనర్పఁ
దనరూపవిభవంబు ధనదాత్మజ వసంత
       మదనేంద్రజులకు విస్మయ మొనర్పఁ


తే.

దనభరణశక్తి దిగ్దంతిఫణికులేంద్ర
జరఠకచ్ఛపములకు విశ్రాంతి యొసఁగ
లాలితంబుగఁ దత్పురం బేలుచుండె
జిష్ణుశుభలక్షణుండు గాశీవిభుండు.

33


క.

ఆరాజురాజ్య మతిచో
రారాతిక్షామడాంబరాదికరక్షో
మారీభయవిరహిత మై
ధారుణి నిరుపద్రవముగఁ దనరుచు నుండెన్.

34


క.

ఈవిధమున నాభూపతి
దేవీసహితుండు నగుచుఁ దేజము మెఱయన్
శ్రీవిశ్వేశ్వరుకరుణను
భూవలయం బేలుచుండె బుధులు నుతింపన్.

35


ఉ.

సంతతిలేక యీనృపతిసత్తముఁ డెంతయు నిష్ఠ మీఱఁగా
నింతియుఁ దాను సువ్రతము నీశ్వరపూజలు దానధర్మముల్

శాంతికపౌష్టికక్రియలు సంయమిసేవలు సేయుచుండఁ ద
త్కాంతకుఁ జూలు నిల్చెఁ గుతుకంబునఁ బౌరులు సంతసిల్లఁగన్.

36


మ.

భరమయ్యె న్మణిభూషణంబులు దలంపన్‌ గౌను లావయ్యె ని
ద్దురమబ్బుల్ ఘనమయ్యె దేహమునఁ గాంతు ల్మించె నాహారమున్
విరసంబయ్యెఁ జనించెఁ గోరికెలు నీవీబంధమున్ హెచ్చె న
త్తరుణీరత్నము నాఁటినాఁటికిని యంతర్వత్నియై వర్ధిలన్.

37


తే.

నెలఁత కీరీతిఁ దొమ్మిదినెలలు నిండ
దశమమాసంబునందు సంతస మెలర్ప
గ్రహము లొక్కట శుభదృష్టిఁ గనుచునుండ
నవ్యగుణధన్య యొక్కకన్యక జనించె.

38


వ.

ఇ ట్లుదయించిన యక్కన్యకారత్నంబునకు జాతకర్మాదిసం
స్కారంబులు నిర్వర్తించి యాభూపాలుండు పరమానందం
బున భూసురసమారాధనంబులు చేసి భూహిరణ్యాదిదానం
బులు గావించి హైమవతిం గాంచిన హిమవంతునివిధం
బున సంతుష్టాంతరంగుం డై యుండె నంత.

39


క.

శ్రీమతియును ధీమతియును
భామతియును నగుటఁ జేసి బ్రాహ్మణజనముల్
నామక్రియ లొనరించిరి
ప్రేమఁ గళావతి యనంగ బింబాధరికిన్.

40


క.

ఆకన్యక నానాఁటికి
భూకాంతునిగృహమునందుఁ బోషిత యగుచుం

శ్రీకాంతికలిత యగుచును
బ్రాకటబాలేందురేఖపగిదిఁ దనర్చెన్.

41


చ.

కమలదళంబులం దెగడుకన్నులు కుందములన్‌ హసించి దం
తములు వినూత్నసైకతనితంబము చందురుఁ గేరుమోమునుం
భ్రమరనిభాలకంబులును బల్లవకోమలపాదహస్తముల్
సమదమరాళయానమును జక్కెరమోవియు నొప్పె నింతికిన్.

42


క.

శైశవముతఱిని మేధా
కౌశలమునఁ గావ్యనాటకాలంకారా
భ్యాసంబులు గావించెను
గాశీవిభుకూర్మిపుత్రి గౌతుక మొదవన్.

43


వ.

అంత.

44


క.

వాసవముఖసురగణసం
త్రాసనకరఘనతపోవిలాసుఁడు యోగా
ధ్యాసుఁడు దూర్వాసుండను
భూసురుఁ డేతెంచె రాజపుంగవుసభకున్.

45


శా.

దుర్వారస్వతపోబలాసుభవనిర్దూతాఘుఁ డాత్రేయుఁడు
న్నిర్వాణప్రమదాసమేతుఁడు భవానీశాంశజుం డైన యా
దూర్వాసుం డరుదెంచినం గని బుధస్తోమంబునున్‌ దాను న
య్యుర్వీశుం డెదు రేగుదెంచె యతి కభ్యుత్థానపూర్వంబుగన్.

46


తే.

ఇవ్విధంబున నమ్ముని కెదురునడిచి
యర్ఘ్యపాద్యంబు లొసఁగి యర్హాసనమున

నునిచి యభివాదన మొనర్చి మనుజవిభుఁడు
నిష్ఠమాధుర్యభాషల నిట్టులనియె.

47


మ.

స్థరనధ్యాత్మకమృచ్ఛిలామయము లౌతీర్థంబులుం దేవత
ల్చిరకాలంబున ముక్తినిత్తురు మహర్షిశ్రేష్ఠులైనట్టి మీ
చరణాంభోజపరాగలేశమున మోక్షప్రాప్తి సిద్ధించు స
త్వరమార్గంబున దివ్యయోగికులచంద్రా సత్కృపాంభోనిధీ.

48


ఉ.

ఓమునిసార్వభౌమ మహిమోజ్జ్వల మీ రిట కేగుదెంచుట
న్నామది సంతసం బొదవె నాదుగృహంబు పవిత్రమయ్యె మ
త్కామితము ల్ఫలించెఁ గడు ధన్యుఁడ మాన్యుఁడ నైతి నంచు నా
భూమివిభుండు పల్కుచును బూజ లొనర్చె మహాముదంబునన్.

49


క.

తదనంతరమున మునిపతి
సదమలమృష్టాన్నపానసంతృప్తునిఁగా
ముద మొనరఁగఁ గావించియుఁ
బదపద్మము లొత్తుచుండఁ బార్థివుఁ డంతన్.

50


వ.

ఇట్లు పరిచర్య లొనరింపుచున్న యన్నరనాథునిం గని పర
మానందకందళితహృదయారవిందుం డయి యమ్మహా
మునీంద్రుం డారాజేంద్రున కి ట్లనియె.

51


మ.

ధరణీనాయక ధర్మపద్ధతి భవద్రాజ్యంబు పాలింతువే
పురముల్ రాష్ట్రము దుర్గముల్ బలములున్ బూర్ణానుభోగంబులే
తురగానేకపగోగణంబులును సంతుష్టంబులై యుండునే
తరుణీబాంధవపుత్త్రమిత్త్రులకు భద్రంబేకదా నిత్యమున్.

52

క.

అని యడిగిన యమ్మునితో
జననాయకుఁ డపుడు వేడ్క జనియింపఁగ మీ
ఘనతరకారుణ్యంబున
ననిశము సర్వమును గుశల మని పల్కెఁ దగన్.

53


ఆ.

మఱియు నిట్టులనియె మనుజాధినాయకుం
డోమునీంద్రచంద్ర సేమమలర
నస్మదీయగృహమునందుఁ గొన్నిదినంబు
లుండవలయుఁ గనులపండువుగను.

54


క.

అని పలికి యమ్మహాముని
యనుమతిఁ గైకోలు వడసి యవనీపతి నె
మ్మనమున నుప్పొంగుచు నిజ
తనయఁ గలావతిని జూచి తా నిట్లనియెన్.

55


క.

అమ్మా విను నామాట ని
జమ్ముగ నిమ్మునికి వినయసత్కారములన్
సమ్మతముగ భోజనపా
నమ్ముల సంతుష్టిఁజేయు నలినదళాక్షీ.

56


తే.

ఇమ్మహాత్ముఁడు దనహృదయమ్మునందు
సంతసిల్లిన జగములు సంతసిల్లు
నట్లుకావున నన్నపానాదికములఁ
బూర్ణకాముని గావింప బొదలు శుభము.

57


క.

అని జనకుఁడు నియమించిన
వినయమ్మున సమ్మతించి విలసన్మతి ని
మ్మునిసార్వభౌముఁ బ్రమదా
వనమధ్యగరత్నభవనవాసునిఁ జేసెన్.

58

సీ.

ప్రతిదివసంబును బ్రత్యూషవేళల
          సరసపుణ్యోదకస్నాతుఁ జేయుఁ
బ్రకటసౌవర్ణశాటికలు గట్టఁగ నిచ్చు
          ఘుమఘుమామోదగంధములు పూయుఁ
దులసికామాలూరదళముల నర్పించుఁ
          బరిమళధూపదీపంబు లొసఁగు
భక్ష్యభోజ్యంబులఁ బరితుష్టిఁ గావించుఁ
          దగ శీతజలముల దప్పి దీర్చు


తే.

హస్తపాదాంబురుహశుద్ధి యాచరించు
నాచమింపఁగఁ జేయు హిమాంబువులను
మృదులశయనతలంబునఁ బదములొత్తు
నాకళావతి లబ్ధవివేకి యగుచు.

59


క.

ఈరీతిఁ గొన్నిదివసము
లారాజతనూజ మౌని నారాధింపన్
కారుణ్య మొదవి తాపసుఁ
డారమణీమణికి నిట్టు లనియె ముదమునన్.

60


ఆ.

బాల వినుము నీసుశీలవృత్తములకు
వినయమునకు నీవివేకమునకు
నిజము మెచ్చినాఁడ నీకుఁ బంచాక్షరి
నిత్తుఁ గొనుము వేగఁ జిత్త మలర.

61


వ.

అని పలికి.

62


క.

అక్షీణకృపాకలితక
టాక్షామృతదృష్టిఁ జూచి యమ్మునిచంద్రుం

డాక్షణమున నింతికిఁ బం
చాక్షరి నుపదేశ మొసఁగి చనియె యథేచ్ఛన్.

63


వ.

ఇవ్విధంబున నక్కన్యకారత్నంబు దూర్వాసమహామునీంద్రు
వలనఁ బంచాక్షరీమంత్రోపదేశంబు వడసి నిరంతరంబు
దన్మంత్రానుష్ఠానపరాయణత్వంబు గలిగి తదేకధ్యానసమాధి
లక్షణంబునఁ గాలంబు గడుపుచు విధూతకల్మషయు వినిర్మల
స్వాంతయు సదాచారపవిత్రయుఁ బుణ్యచరిత్రయు నై
యుండె నంత.

64


శా.

ఆకాశీవిభుకూర్మిపట్టికిని బాల్యాతీతకాలంబునం
దాకర్ణాంతము లయ్యె నేత్రములు నూగా రుద్భవంబందె న
స్తోకంబయ్యె నితంబ మున్నతము లై చూపట్టె వక్షోజముల్
రాకేందుప్రతిమాన మయ్యె ముఖ మభ్రస్ఫూర్తు లయ్యెన్ గురుల్.

65


ఉ.

బంగరువంటిదేహము నభంబన నొప్పెడుకౌను దీఁగెసం
పంగిని బోలునాసికము పాటలగంధము కెంపుమోవి యు
త్తుంగకుచద్వయంబు శరదుత్పలనేత్రము లొప్పుచుండఁగా
నంగజరాజ్యలక్ష్మి యన నాశుకవాణి చెలంగె నెంతయున్.

66


క.

ఈవిధమున నవయౌవన
భావంబు వహించి యున్న భామామణికిన్
వైవాహికప్రయత్నము
గావింపఁగఁ దద్గురుండు ఘనమతిఁ దలఁచెన్.

67


వ.

ఇ ట్లమ్మహీనాయకుండు సంప్రాప్తతారుణ్యయు సకలసద్గుణ
గణ్యయు సర్వజనమాన్యయు సౌజన్యధన్యయు నై యున్న

యక్కన్యకకుం దగినవరుం డెవ్వం డగునో యని విచారింపు
చుండె నాసమయంబున.

68


క.

విధుకులనృపపాలితమై
మధుభోజాంధకదశార్హమానిత మగుచున్
బుధజనరంజనకరమగు
మధురాపురి వెలయు ధరణిమండన మనఁగన్.

69


మ.

మదనప్రోజ్జ్వలవిగ్రహుండు మృదువాఙ్మాధుర్యధుర్యుండు దు
ర్మదవైరిక్షితిమండలేంద్రగజహర్యక్షుండు దక్షుండు శ్రీ
యదువంశాంబుధిపూర్ణచంద్రుఁ డన దాశార్హక్షమాపాలకుం
డుదితార్కప్రతిమానతేజుఁ డొకఁ డుండుం దత్పురం బేలుచున్.

70


క.

ఆరాజతనయుఁ డభినవ
తారుణ్యవిలాసశౌర్యధైర్యాదిగుణో
దారుం డని జను లెన్నఁగ
ధారుణిలోఁ బేరు గాంచె ధార్మికమతి యై.

71


క.

ఆదాశార్హమహీశుని
సాదరమతిఁ బిలువనంపి సమ్మద మొదవన్
వేధోక్తవిధి వివాహము
గాదిలిసుత నిచ్చి చేసె గాశీవిభుఁడున్.

72


వ.

సకలజననయనోత్సవంబుగా దాశార్హమహీపాలునకుఁ దననందన
యగు కళావతిని బాణిగ్రహణంబు చేయించి హయగజ
స్యందనవిలాసినీశతంబులు గోసహస్రంబులు నపరిమితంబు
లైనసువర్ణమణిమయాంబరాభరణంబులును నాదిగాఁ గల

సమస్తవస్తువులు నరణం బిచ్చినం గైకొని యవ్వధూవరులు
తూర్యఘోషంబులు చెలంగ మధురాపురంబునకుం జను
దెంచి రత్నస్తంభవిభ్రాజితంబును హరిన్మణిస్థాపితద్వార
దేహళీసమేతంబును స్ఫాటికోపలకుడ్యవాతాయనప్రదీప్తం
బును నవాశ్వత్థరసాలపల్లవతోరణమాలికాలంకృతంబును
నై యొప్పుచున్ననిజశుద్ధాంతభవనంబు సకలకల్యాణమహో
త్సవంబుతో శుభలగ్నంబునం బ్రవేశించి దేవతావిప్రసంతర్ప
ణంబులు గావించి నిజసామ్రాజ్యభోగంబు లనుభవింపుచు
సుఖంబున నుండి రంత.

73


మ.

అమరేంద్రప్రతిమానభోగుఁ డగుదాశార్హుండు దైవజ్ఞకౢ
ప్తముహూర్తంబున నాఁటిరాత్రి నిజకాంతాసంగమాపేక్షుఁ డై
కమలాప్తప్రభ గల్గునట్టి శయనాగారంబున న్మల్లికా
సుమశయ్యన్ శయనించి మన్మథవిలాసుం డుండె మోదంబునన్.

74


వ.

అంత.

75


సీ.

రాజమండలవినిర్గతకురంగమురీతిఁ
         జెఱకువిల్కానిరాచిల్కభాతి
మానససంచరన్మదమరాళముపోల్కి
         వార్షికాంబుదతటిద్వల్లికరణి
గగననిష్యందనక్షత్రంబుచాడ్పున
         సాకారహేమశలాకచాయ
మయవినిర్మితరత్నమయపుష్పకము మాడ్కి
         దీపించు మోహినీదేవిలీల

తే.

నిర్మలసువర్ణరత్నమాణిక్యఖచిత
భూషణంబులు దాల్చి సంతోష మొదవ
వచ్చి నిలుచుండి జీవితేశ్వరునిమ్రోల
నాకలావతి దన్మనోహరతఁ దనరి.

76


తే.

ఇట్లు తనమ్రోల నిలిచినయింతిఁ జూచి
సంగమాసక్తిఁ బిలిచె నజ్జనవిభుండు
పలుదెఱంగులఁ బిలిచినఁ బలుకకున్న
నువిదఁ జెయివట్టి తిగువ నుద్యుక్తుఁ డయ్యె.

77


వ.

అప్పు డాకళావతి పతిసంభ్రమం బెఱింగి యిట్లనియె.

78


శా.

ఓరాజన్యకుమార చాలు నిఁక నోహో రాకు నన్నంటఁగా
వారస్త్రీకులటాదికామినులతో వర్తింపుచు న్నిర్మలా
చారం బేమియు లేక నీవు మధుమాంసద్రవ్యలోలుండవై
ధీరోదాత్తునిభంగిఁ జీఱెదవు భ్రాంతిం జెంద నీకేటికిన్.

79


చ.

వ్రతములఁ జేయునింతి యుపవాసము లున్నవధూటి గర్భిణీ
సతియు సుదీర్ఘరోగిణియు సంగమయోగ్యులు గారు శంకర
వ్రతజపమంత్రతంత్రముల వన్నియకెక్కినదానఁ గాన నే
నతిపరిశుద్ధురాల నను నంటఁగ శక్యమె యంచుఁ బల్కఁగన్.

80


శా.

జాయారత్నముపల్కుఁ గైకొనక హస్తస్పర్శముం జేయఁ ద
ప్తాయఃపిండసమాన మైనసతిగాత్రంబు న్విలోకించి చిం
తాయత్తం బగుమానసంబున భయోత్కంపంబు సంధిల్లఁగా
నాయుర్వీశ్వరుఁ డాకళావతి విమోహభ్రాంతుఁడై యిట్లనున్.

81


తే.

ఇంతి నీమేను గ్రాఁగిన యినుపముద్ద
కరణి నుండుట కిది యేమి కారణంబు

దంపతులపట్ల నిట్టిచందములు గలవె
నా కెఱింగింపు మింతయు నలిననయన.

82


క.

సతియుఁ బతితోడఁ గూడిన
రతి జగతి సుతోదయాకరం బగు భార్యా
రతి పుత్రఫలప్రద యని
శ్రుతి పలుకఁగ వినఁగలేదె సోమనిభాస్యా.

83


వ.

అని పలికిన ప్రాణవల్లభునకుఁ గళావతి యిట్లనియె.

84


ఉ.

తపనద్యోతనుఁ డత్రిపుత్రుఁడు త్రినేత్రాంశావతారుండు మం
త్రపురాణాగమతత్త్వవేది యగు దుర్వాసుండు పంచాక్షరం
బుపదేశించె నకీలకంబుగను విధ్యుక్తంబుగా నేను దు
జ్జపనిష్ఠారతిచేఁ బవిత్రనయితిన్ సర్వంసహాధీశ్వరా.

85


క.

నీవు సదాచారుండవు
గావు దురాచారవృత్తి గలిగిన నీకుం
భావింప నింక సద్గురు
సేవ యొనర్చుటను మేలు చేకుఱు నధిపా.

86


క.

అని పలికిన నయ్యింతిం
గనుఁగొని పంచాక్షరంబుఁ గారుణ్యమునం
దన కుపదేశింపు మనన్
వనితామణి పల్కెఁ బ్రౌఢవాక్యస్ఫురణన్.

87


ఉ.

భర్తవు నీవు నీకయిన భార్యను నే నుపదేశ మీయఁగాఁ
గీర్తియె నీకు గర్గమునికిన్ బ్రణమిల్లి భజింపు మిప్పు డ
య్యార్తిహరుండు నిన్నుసుకృతాత్మునిఁగా నొనరించుసత్కృపా

స్ఫూర్తి మహామహుండు కృతపుణ్యుఁడు నీ కుపదేశకుం డగున్.

88


క.

కలుషంబు లడఁపఁ గోర్కులు
ఫలియింపఁగఁ దెలియ లబ్ధబాశకుఁ డస్మ
త్కులగురు వతని భజించినఁ
దెలియఁగఁ బంచాక్షరోపదేశ మొసంగున్.

89


ఆ.

అనుచు విన్నవించి యావిభావరియందు
దంపతులు మహాముదంబు మీఱ
జనిరి గర్గమౌనిసదనంబుఁ జేరంగ
నితరజనము లెవ్వ రెఱుఁగకుండ.

90


క.

భర్గసమానుని జితష
డ్వర్గుని సంభావితాపవర్గుని సత్సం
సర్గుని నిర్గళితాఘుని
గర్గమహామునివరేణ్యుఁ గాంచిరి వారల్.

91


క.

కని భయభక్తులు దోఁపఁగ
దనపదముల కెఱఁగియున్నదంపతులఁ గనుం
గొని యాసంయమివర్యుఁడు
ఘనభాషల నిట్టు లనియె కారుణ్యమునన్.

92


క.

ఈరేయి భవచ్ఛయ్యా
గారంబుఁ బరిత్యజించి కౌతుకమొదవ
న్మీ రిచ్చటి కరుదెంచిన
కారణ మది యేమొ తెలుపఁగాఁ దగు మాకున్.

93

వ.

అని యడిగిన నమ్మునీంద్రునితోఁ గళావతి యిట్లనియె మహాత్మా
యిమ్మహీపాలుండు ప్రాకృతపురుషుండును సదాచారవర్జి
తుండు నయియుండుఁ గావున మీర లిప్పు డీనృపాలునకుం
గటాక్షించి భోగమోక్షప్రదంబును నిహపరసాధకంబును
బరమపవిత్రంబును మంత్రరాజంబు నయినశైవపంచాక్షరం
బుపదేశింపవలయు నట్లయిన నితండు కృతార్థుం డగు నాగామి
సంచితప్రారబ్ధంబు లయినదుష్కర్మంబులుం దొలంగి సకల
శుభంబులుం బ్రాపించునట్లుగాఁ బ్రసాదింపవలయునని విన్న
వించిన నమ్మానిని మృదుమధురభాషణంబుల కలరుచు నట్ల
సేయుదునని సమ్మతించిన.

94


సీ.

ఆరాజమిథునంబు నమ్మెయిఁ దోడరా
          యమునానదీసమీపమున కేఁగి
వనజాక్షి తత్తీరమున నుండ నియమించి
          భూపాలు సంకల్పపూర్వకముగ
నఘమర్షణస్నాన మాచరింపఁగఁజేసి
          లలితవిభూతి ఫాలమున నలఁది
సిద్ధాసనస్థుగాఁ జేయుచు నిజపాద
          తలమున నతనిహస్తముల నునిచి


తే.

మౌనివర్యుండు విధ్యుక్తమార్గమునను
హస్తమస్తకసంయోగ మాచరించి
శైవపంచాక్షరోపదేశం బొనర్చెఁ
గరుణ వెలయంగ దాశార్హధరణిపతికి.

95


క.

అంతట నజ్జనపతి యే
కాంతమతిం దేవదేవు గజచర్మధరుం

గంతుద్వేషిని మదిలోఁ
జింతింపుచు నిష్ఠ జపము సేయుచునుండెన్.

96


వ.

తదనంతరంబ.

97


శా.

శ్రీకంఠుం గిరిజాసమేతు మదిలోఁ జింతింపుచు న్నిష్ఠతో
భూకాంతుండు జపింపఁగాఁ దనుసముద్భూతంబులై వాయసా
నీకంబుల్ శతకోటిసంఖ్య వెడలె న్నిర్దగ్ధపక్షంబులై
కాకారావము జేయుచుం బడియె నక్కాళిందిమధ్యంబునన్.

98


తే.

ఈమహాశ్చర్య మంతయు నేర్పడంగఁ
జూచి యాదవవీరుండు చోద్యమంది
తమకులాచార్యునకు వందనములు సేసి
విస్మయంబుగ నీవార్త విన్నవించె.

99


క.

నావిని మునివరుఁ డి ట్లను
భూవల్లభుఁ జూచి నీదు పూర్వభవకృతం
బై వెలయుఁ గలుషసముదయ
మీవాయసతతి యదగుచు నిట్టుల వెడలెన్.

100


క.

పంచాక్షరమంత్రంబు జ
పించిన మాత్రమునఁ బాపబృందము లణఁగు
న్నించుక యనలము సోఁక ను
దంచితమగుతూలరాశి దగ్ధము కాదే.

101


వ.

అట్లు కావున సదాశివానుగ్రహంబున నిమ్మహామంత్ర
రాజంబు ప్రాప్తం బయ్యె దానం జేసి నీవు ధర్మశీలుండవైతివి
గావున నీ వింక భవద్దేవీసహితంబుగా సమ్మదంబున సుఖం
బుండుదువు భవద్వంశంబున భగవంతుం డైన శ్రీవిష్ణుండు

కృష్ణాభిధానంబున నవతరించు మీకులంబు పావనం బగు
నని చెప్పి యారాజదంపతుల నాశీర్వదించి వారలం
దోడ్కొని క్రమ్మఱ నిజనివాసంబునకు వచ్చిన యమ్మహా
మునీంద్రుచరణంబులకుఁ బ్రణామంబు గావించి యవ్వధూ
వరు లమ్మహాత్ముని యనుజ్ఞ వడసి.

102


మత్తకోకిల.

రాజదంపతు లీవిధంబున రాజసంబు జనింపఁగా
రాజధానికి వచ్చి క్రమ్మఱ రాజరాజనిశాంతవి
భ్రాజితం బగునాత్మసౌధము రాజహంససముల్లస
త్తేజము ల్వెలయంగఁ జొచ్చిరి ధీరచిత్తము లొప్పఁగాన్.

103


శా.

ఆకేళీగృహమందుఁ బుష్పమయపర్యంకప్రదేశంబునన్
రాకాచంద్రముఖిన్ సరోజనయనన్ రంభాంగనారూపఱం
టాకన్ జందనచంద్రశీతలను వేడ్కన్ గౌఁగిటన్ జేర్చె నా
భూకాంతుండుఁ గళావతిన్ గుణవతిన్ బూర్ణప్రభావోన్నతిన్.

104


వ.

తదనంతరంబున.

105


చ.

లలితకళాభిమర్శనములన్ గిలిగింతలఁ గౌఁగిలింతలం
గిలకిల నవ్వుచున్ నిడుద కీల్జడవ్రేటుల గుబ్బపోటులన్
బలుమొనకాటులన్ జతురబంధములన్ వదనాదిచుంబనం
బులఁ బరితృప్తు లైరపుడు పుష్పశరాసనకేళి నిర్వురున్.

106


వ.

ఇవ్విధంబున నాదంపతులు పరస్పరప్రేమానురాగంబుల
సురతసౌఖ్యంబు లనుభవించుచుఁ బరిపూర్ణమనోరథులై
యుండుసమయంబున.

107

చ.

తెలతెల నయ్యెఁ దూర్పు నలుదిక్కుల సంతమసంబు విచ్చెఁ జెం
గలువలు మోడ్చెఁ దమ్ములు వికాసతఁ జెందెఁ బదాయుధధ్వను
ల్నలువుగఁ బిక్కటిల్లె గగనంబునఁ జుక్కలు మాసె శీతలా
నిలములు వీచె జక్కవలు నెమ్మది నుండె నహర్ముఖంబునన్.

108


తే.

సకలదేవర్షిసంఘప్రశస్యమాన
దివ్యతేజంబు వెలుఁగ మందేహదనుజ
సముదితాటోపహృత్సుదర్శన మనంగ
నుదయశైలంబుపైఁ దోఁచె నుష్ణకరుఁడు.

109


వ.

అయ్యవసరంబున.

110


చ.

శివపదపద్మచింతనముఁ జేయుచు మాగధవందిపాఠక
స్తవములఁ దూర్యఘోషముల సామజబృంహిత వాజిహేషికా
రవముల మేలుకాంచిరి దరస్మితవక్త్రము లొప్ప మేదినీ
ధవుఁడుఁ దదీయపత్నియును దత్పరివారము నుల్లసిల్లఁగన్.

111


సీ.

నిద్దురమేల్కాంచి నిర్మలచిత్తుఁ డై
         మహనీయవిధ్యుక్తమార్గమునను
స్నానసంధ్యాద్యనుష్ఠానజపంబులుఁ
         గమలబాంధవనమస్కారములును
బంచాక్షరీమంత్రపఠనంబు లాదిగాఁ
         గలిగినసత్కర్మముల నొనర్చి
భూసురాతిథిదేవపూజలు గావించి
         మృష్టాన్నపానసంతృప్తుఁ డగుచు

తే.

మహితవర్ణాశ్రమాచారమార్గములను
దప్పకుండఁగ ధారుణీతలమునందు
బ్రజలఁ బాలింపుచును నిజరాజ్య మేలె
ధర్మచరితుండు దాశార్హధరణివిభుఁడు.

112


క.

బ్రహ్మవిచారము దేవ
బ్రాహ్మణభక్తియును గల్గి పార్థివుఁ డుర్విన్
బ్రహ్మోత్తరముగ నేలెను
బ్రహ్మాపత్యాదిమునులు ప్రస్తుతిసేయన్.

113


చ.

ప్రతిదివసంబు శంకరజపవ్రతమంత్రపరాయణత్వస
మ్మతియును గల్గి భర్తయెడ మజ్జనభోజనపానతల్పస
త్కృతుల ముదంబొనర్చుచును దియ్యనిమాటల నాదరింపుచున్
జతురత నాకళావతియు సమ్మదమొప్ప మెలంగె నత్తఱిన్.

114


తే.

తాను గురుసేవఁ జేసి కృతార్థయయ్యెఁ
దనమనోవల్లభునిఁ బుణ్యతమునిఁ జేసె
నుభయవంశంబులను దోన యుద్ధరించె
నాకళావతిసాటి యెందైనఁ గలదె?

115


శా.

శ్రీమంతంబు శివస్వరూపమును దూరీభూతతాపత్రయం
బామోదప్రద మార్యసమ్మతము తత్త్వార్థప్రదీపంబు శ్రీ
రామాగస్త్యమహర్షిలోకభజనార్హం బైనపంచాక్షర
శ్రీమంత్రంబు నమశ్శివాయ యనుచున్ జింతింపుఁ డశ్రాంతమున్.

116

క.

ఈకథ యాకర్ణించినఁ
బ్రాకటమగుభక్తితోడఁ బఠియించిన సు
శ్లోకులగుమానవులకును
శ్రీకంఠుఁ డొసంగు నెపుడు సిరులు శుభంబుల్.

117


వ.

అని యిట్లు సూతుండు శౌనకాదిమహామునులకు శైవ
పంచాక్షరీమహత్త్వం బెఱింగించిన విని సంతుష్టాంతరంగు
లై వెండియు శివకథాశ్రవణకుతూహలతత్పరులై శివ
మహత్వంబు లెఱింగింపుఁ డని యడిగిన.

118


మత్తకోకిల.

చంద్రశేఖర సత్కృపాకర చంద్రికాధవళాంగ ని
స్తంద్రవైభవ మౌనిరంజన దక్షయాగవిభంగ నా
గేంద్రభూషణ భక్తపోషణ కేశవప్రియ హేమశై
లేంద్రకార్ముక దేవదేవ మహేశ్వరా భవ శంకరా !

119


క.

అంబాపురాధినాథ స
దంబరచరవినుతపాద హరిణాంకధరా
స్తంబేరమదనజాంతక
సాంబసదాశివ గిరీశ సకలాధీశా !

120


మాలిని.

రవిశశిశిఖినేత్రా రాజరాజైకమిత్రా
భువనభరణసూత్రా పుణ్యభాస్వచ్చరిత్రా
భవహరపురజైత్రా ప్రస్ఫురచ్ఛుభ్రగాత్రా
శివపరమపవిత్రా శ్రీభవానీకళత్రా.

122

గద్య.

ఇది శ్రీమద్రామభద్రకరుణాకటాక్షవీక్షణసమాలబ్ధ
గీర్వాణాంధ్రభాషాకవిత్వకళాధురంధర బడగలనాటికన్నడ
వంశపయఃపారావారరాకాసుధాకర ఆశ్వలాయనసూత్ర
భారద్వాజసగోత్ర శ్రీధరమల్లె అయ్యనార్యతనయ సూరిజన
విధేయ వేంకటరామనామధేయబ్రణీతంబయిన బ్రహ్మోత్తర
ఖండంబను మహాపురాణంబునం దిష్టదేవతాప్రార్థనంబును
వంశానుచరితంబును సూతమునీంద్రసంవాదంబును గాశికా
నగరవర్ణనంబును దూర్వాసాగమనంబును గళావతీవివాహం
బును దాశార్హభూపాలునకు గర్గమహామునీంద్రుండు పంచా
క్షరీమంత్రం బుపదేశించుటయుఁ బంచాక్షరప్రభావంబును
ననుకథలు గల ప్రథమాశ్వాసము.