బ్రహ్మోత్తరఖండము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

పంచమాశ్వాసము

క.

శ్రీలక్ష్మీరమణార్చిత
బాలేందువతంస భక్తపంకజహంసా
నీలగ్రీవాంబాపుర
హేలా వనవాస పార్థివేశ గిరీశా.

1


వ.

దేవా యవధరింపు మశేషపురాణకథాకథనదక్షుం డయిన
సూతుం డమ్మహామునుల నవలోకించి వెండియు ని ట్లనియె.

2

విభూతిమహత్వము - వామదేవోపాఖ్యానము

ఉ.

ఓమునులార యాఋషభయోగిమహత్వము వింటి రింక ను
ద్దామతపోబలాఢ్యుఁడు సదాశివతుల్యుఁడు వామదేవుఁ డా
శ్రీమహితప్రభావునిచరిత్రము భస్మమహత్వసంపదన్
బ్రేమ దలిర్పఁ దెల్పెద నభీప్సితరీతి వినుండు మీ రిఁకన్.

3


మ.

కలఁ డత్యుగ్రమహాతపోధనుఁడు నిష్కాముండు నిర్ద్వంద్వుఁడుం
గలుషారణ్యదవానలుండు నిరహంకారుండు ధీరుండు ని
ర్మలచిత్తుం డనపేక్షితాలయకళత్రాపత్యుఁ డైనట్టియు
జ్జ్వలతేజోనిధి వామదేవుఁ డనువిప్రశ్రేష్ఠుఁ డుర్వీస్థలిన్.

4


చ.

మఱియు నతండు శాంతరసమగ్నుఁడు భస్మవిలేపితాంగుఁడున్
సురుచిరవల్కలాంబరుఁడు శుద్ధపిశంగజటాకలాపుఁడుం
బరశివతత్వవేదియును భైక్షపరిగ్రహజీవనుండు నై
ధరఁ జరియింపుచుండ జగదాదరణోత్సుకమానసంబునన్.

5

వ.

ఇట్లు భూతలంబెల్లఁ గలయం గ్రుమ్మఱుచుండి యొక్క
నాఁడు.

6


క.

అంచితగతి నమ్ముని శివ
పంచాక్షరజపవిశుద్ధభావుం డగుచున్
గ్రౌంచారణ్యపథంబున
సంచారము జేయుచున్న సమయమునందున్.

7

వామదేవభక్షణాసక్తిచే బ్రహ్మరాక్షసుండు చనుదెంచుట

తే.

అద్భుతాకారుఁ డధికక్షుథాతురుండు
రూక్షకేశుండు నతిఘోరవీక్షణుండు
వాయుజవమునఁ జనుదెంచె వామదేవ
భక్షణాపేక్ష నొకబ్రహ్మరాక్షసుండు.

8


క.

అత్తఱి నయ్యోగీంద్రుఁడు
వ్యాత్తానను దీర్ఘకాయు నత్యుగ్రమదో
న్మత్తుని రక్కసుఁ గనుఁగొని
చిత్తంబున భయలవంబుఁ జెందక యుండెన్.

9


తే.

అట్లు నిర్భయుఁ డై యున్న యమ్మహాత్ము
మ్రింగుదు నటంచు వేవేగ మీఁది కురికి
బాహువులు సాచి బిగఁబట్టెఁ బాపబుద్ధి
నాక్షణంబున నాబ్రహ్మరాక్షసుండు.

10


సీ.

పరఁగు చింతామణిస్పర్శంబుచే లోహ
        మతిశుద్ధకాంచనం బైనపగిది
మానససరసీనిమగ్నమై కాకంబు
        మానుగా రాయంచ యైనరీతి
నమృతపానము జేసినట్టిమనుష్యుండు

      చెలఁగి దేవత్వంబుఁ జెందినట్లు
లలితజంబూనదీజల మంటి మృత్తిక
        మానితసౌవర్ణ మైనకరణి


తే.

నమ్మహాత్మునిదివ్యదేహమ్ము సోఁకి
నంతమాత్రన రక్కసుం డక్కజముగ
దురితబంధంబు లన్నియుఁ దొలఁగఁద్రోచి
నిర్మలజ్ఞానహృదయుఁడై నిలిచెనపుడు.

11

వామదేవమహామునియొక్క దేహస్పర్శనముచే బ్రహ్మరక్షస్సు తనరాక్షసభావము వదలి పూర్వజ్ఞానముచే స్తుతియించుట

ఉ.

తాపసగాత్రలగ్నభసితాంకితనైజశరీరతాస్థితిం
బాపపురక్కసుండు జడభావము వీడి భవాంతరస్మృతి
ప్రాపణశేముషీబలవిరాజితుఁ డై మునినాథుభాసుర
శ్రీపదపద్మము ల్దనదుశీర్షము సోఁకఁగ మ్రొక్కి యిట్లనెన్.

12


శా.

సర్వప్రాణిభయంకరాకృతి నజస్రక్షుత్పిపాసార్తుఁడ
న్గర్వాంధుండను బ్రహ్మరాక్షసుఁడ దుర్గారణ్యసంచారుఁడన్
దుర్వాసాఘవినిందితాంగుడ మహాదుష్కర్మశీలుండ నో
యుర్వీదేవకులావతంస నను ధన్యుంజేసి రక్షింపవే.

13


క.

కరుణింపుము మునినాయక
కరుణింపు మహానుభావ గాంభీర్యనిధీ
దురితాబ్ధినిమగ్నుని ననుఁ
దరియింపఁగఁ జేయవలయుఁ దథ్యముగాఁగన్.

14


వ.

మహాత్మా భవదీయసందర్శనంబునంజేసి మదీయచిత్తము పరి
పూర్ణప్రబోధాయత్తంబైయున్నయది న న్నుద్ధరింపవలయు

నని ప్రార్థింపుచున్న యాబ్రహ్మరాక్షసునకు వామదేవ
మహామునీంద్రుం డి ట్లనియె.

15


క.

నీవెవఁడవు ఘోరాకృతి
నీవనమున సంచరింప నేటికిఁ దెలియ
న్నీవృత్తాంతం బంతయు
భావించి సవిస్తరముగఁ బల్కు మటన్నన్.

16


సీ.

ఆబ్రహ్మరాక్షసుం డనియె నమ్మునితోడఁ
        బొలుపొంద విను మేను పూర్వమునను
బంచవింశతి యైనభవనమున యావన
       రాష్ట్ర మేలుచు నుందు రాజసమునఁ
జండశౌర్యుఁడ యథేచ్ఛావిహారుండను
       గారుణ్యహీనుండఁ గలుషరతుఁడ
దుర్జయుం డనువాఁడ దుష్పార్థివుండను
       దుర్మదాంధుండను దుర్గుణుండ


తే.

నగుదు నూతనసతుల నిత్యంబు దెచ్చి
ప్రతిదినంబున నొక్కొక్కపడఁతిసౌఖ్య
మనుభవింపుచు నంత గృహంబునందు
వారి నరికట్టియుండుదు ధీరవర్య.

17


మ.

ద్విజరాజన్యపుళిందహూణసతుల న్విట్ఛూద్రకన్యావళిన్
రజకాభీరకవారకాంతలసహస్రంబు ల్వడి న్దెచ్చి భా
వజకేళిం జరియింతు రేయిఁబవలు న్వాంఛాసమాయత్తత
న్నిజచిత్తంబును దృప్తిఁ బొంద దెపుడు న్నిక్కంబు విప్రోత్తమా.

18


క.

ఈరీతిని వర్తింపఁగ
దారుణకామానలాభితప్తుఁడ నగుటన్

ఘోరములగురోగముల శ
రీరము శోషింపఁ దొడఁగె దృఢమాంద్యంబై.

19


ఉ.

అంతట శత్రుపీడితుఁడ నై యనపత్యుఁడ నై దురామయా
క్రాంతుఁడ నై విముక్తబలగర్వుఁడ నై నిజబంధుమిత్రసా
మంతవివర్జితుండ నయి మత్కృతకర్మఫలానుభూతి కా
లాంతముఁ బొంది ఘోరనిరయంబును జెందితిఁ బుణ్యహీనతన్.

20


క.

మునివర దుష్కృతకలుషం
బునఁ జేసి మదీయపూర్వపురుషులు స్వర్గం
బుననుండి వచ్చి నరకం
బున వసియించిరి సమస్తపుణ్యచ్యుతు లై.

21


వ.

వెండియుఁ గృతాంతకింకరులు నన్నుం గొనిపోయి రేతః
కుండీనరకంబునఁ బడఁద్రోచిన నందుఁ బదివేలసంవత్స
రంబులు రేతఃపానంబు గావింపుచుఁ గింకరబాధితుండనై
యుండి యనంతరంబునఁ బాపావశేషంబునఁ గ్రమ్మఱ నిర్జనం
బైనవనంబునఁ బిశాచత్వంబున నుండి నిరంతరంబు
క్షుత్తృష్ణాసమాకులుండ నై దివ్యవర్షశతంబు లుండి యనంత
రంబ ద్వితీయభవంబున సకలప్రాణిభయంకరం బైన
వ్యాఘ్రంబ నై జనియించితి మఱియుఁ గ్రమంబునఁ దృతీయ
భవంబున ఘోరంబైనయజగరంబును జతుర్థభవంబున వృకం
బును బంచమభవంబున విడ్వాహారంబును షష్ఠభవంబునఁ
గృకలాసంబును సప్తమంబున సారమేయంబును నష్టమ
జన్మంబున సృగాలంబును నవమజన్మంబున మృగంబును
నేకాదశంబునఁ గర్కటకంబును ద్వాదశంబున శశకంబును
ద్రయోదశంబున నకులంబును జతుర్దశమున వాయస

మును బంచదశజన్మంబున భల్లూకంబును షోడశజన్మంబున
వనకుక్కుటంబును సప్తదశజన్మంబున గార్దభమ్మును నష్టాదశ
జన్మంబున మార్జాలమ్మును నేకోనవింశతిభవంబున మత్స్యం
బును ద్వావింశతిభవంబున మూషకమును ద్రయోవింశతి
భవమున నులూకమును జతుర్వింశతిభవమున గజమును
బంచవింశతిజన్మమున నివ్వనమున బ్రహ్మరాక్షసుండ నై
జన్మించి క్షుధార్తుండ నై యుండి మిమ్ముం గాంచి భక్షణా
సక్తతం బఱతెంచి భవదీయదేహస్పర్శనమాత్రంబున సంప్రాప్త
పూర్వజన్మజ్ఞానుండ నై నిర్మలహృదయుండ నైతి నట్లు
గావున భవత్ప్రభావంబు దెలియం బలుకవలయు శరణా
గతుం డగు నన్నుద్ధరింపు మని వినయవినమితశిరస్కుం డై
ప్రార్థింపుచున్న యా బ్రహ్మరాక్షసునకు యోగీంద్రుం డి
ట్లనియె.

22

వామదేవుండు బ్రహ్మరాక్షసునకు భస్మప్రభావంబు దెలుపుట

క.

భసితత్రిపుండ్రరేఖా
లసితాచ్ఛమదీయగాత్రలగ్నాంగుఁడ వై
యసురత్వభావదూరుఁడ
వసమానజ్ఞాని వైతి వద్భుతరీతిన్.

23


క.

విస్మయము లొదవ రోగా
పస్మారచయంబు లడఁచుఁ బావనకరమౌ
భస్మము దానిప్రభావం
బాస్మరహరునకును దక్క నలవియె తెలియన్.

24


సీ.

విను పూర్వమునను ద్రావిడదేశవాసుండు
         వసుధామరుండు భవాదృశుండు

గలఁ డొక్కరుండు సత్కర్మపరిత్యాగి
        చౌర్యవర్తనుఁ డనాచారపరుఁడు
శూద్రాంగనామణి సురతకేళిఁ జరింప
        నారాత్రి యొకశూద్రుఁ డరుగుదెంచి
యాయుధప్రహతిచే నావిప్రు వధియించి
        యూరికి వెలుపలఁ బారవైచె


తే.

నంత నవ్విప్రశవముపై నచట నొక్క
సారమేయంబు వచ్చి భస్మానులిప్త
పాదములఁ ద్రొక్కి చరియించెఁ బలలరక్త
ఖాదనాపేక్ష మదికి నాహ్లాదమొదవ.

25


ఉ.

ఆసమయంబునందు నరకాలయమందు వసించియున్న యా
భూసురుఁ బట్టి క్రమ్మఱను బుష్పక మెక్కఁగఁజేసి బల్మిచే
నాసమవర్తికింకరుల నందఱ మోది మహేశుదూత లు
ల్లాసముతోడఁ బోవఁగని లజ్జితుఁడై రవిసూనుఁ డిట్లనున్.

26


మ.

కులవిభ్రష్టుఁ డసత్యవాది జడుఁడున్ ఘోరుండు మూఢుండు చం
చలచిత్తుండు వివేకహీనుఁడు దురాచారుండు నైనట్టి యీ
ఖలునిం దివ్యవిమానమధ్యగతునిం గావించు టర్హంబె ని
ర్మలకైవల్యపదంబుఁ జేర్చుదురె దుర్మార్గుండు వీఁ డారయన్.

27


వ.

అని పలికిన శమనునిం గాంచి యాశంకరకింకరు లి ట్లనిరి.

28


చ.

కనుఁగొను మీద్విజన్ముశవకాయమునందు లలాటవక్షము
ల్పనుపడఁ గక్షదేశములు భస్మవిలిప్తము లయ్యె గావున
న్మనసిజవైరిశాసనమునం గొనిపోయెద మోకృతాంత నీ
మనమున సంశయింపకుము మాన్యులు గారె త్రిపుండ్రధారణుల్.

29

ఆ.

అనుచుఁ దెలియఁ బలికి యాశంభుదూతలు
శమను వీడుకొనుచు సకలజనులు
చూచుచుండ భూమిసురుఁ జేర్చి రప్పుడు
ప్రాకటంపుఁబుణ్యలోకమునకు.

30


వ.

అట్లు గాన సమస్తపాపక్షయంబును మహేశ్వరవిభూషణం
బును నైన భస్మంబు నిరంతరంబు నాచేత ధరియింపంబడు
చుండు ననిన విని యాబ్రహ్మరాక్షసుండు క్రమ్మఱ భస్మ
ప్రభావశ్రవణకుతూహలుం డై యమ్మునీంద్రున కి ట్లనియె.

31


క.

మునినాథ భవద్దర్శన
మున ధన్యుఁడ నగుచు నఘవిముక్తుఁడ నయితిన్
దనరుచు జన్మాంతరకృత
ఘనతరసుకృతప్రభావకారణమహిమన్.

32


మ.

అలఘుప్రాభవ పూర్వజన్మమున సస్యారామవాటీలస
త్సలిలక్షేత్ర మొసంగితిన్ యవనభూపాలుండనై యొక్క ని
శ్చలచిత్తుం డగుబ్రాహ్మణోత్తమునకున్ సంప్రీతితోఁ గావునన్
గలుషవ్రాతములెల్ల వీడెను భవత్కారుణ్యలేశంబునన్.

33


క.

ఇరువదియే నగుభవమున
నురుతరతేజుఁ డగునొక్కయోగీంద్రుకృపన్
దురితంబులఁ బాయుదువని
తరణిసుతుం డానతిచ్చెఁ దథ్యము గాఁగన్.

34


తే.

అట్లు గావున నిర్జనం బైనవనము
నందుఁ ద్వత్సంగతి ఘటించె నద్భుతముగ
నింక భస్మంబు ధరియించియేని దురిత
కర్మములఁ బాయువాఁడ నిక్కము మహాత్మ.

35

సీ.

ఈభస్మధారణం బేరీతి నొనరింతు
        నెయ్యది తన్మంత్ర మెద్ది ఫలము
నెయ్యది దేశంబు నెయ్యది కాలంబు
        నెయ్యది విధిఁ దీని నెఱుఁగఁ బలుక
గాఁ దగు మీవంటిఘనులు మహాత్ములు
        పుణ్యవంతులు సర్వభూతహితులు
సదమలచిత్తులు సతతంబుఁ గల్పవృ
        క్షముకైవడిఁ బరోపకారపరులు


తే.

గాన దుర్జన్మసహితు విజ్ఞానహీను
బాపనిబిడాంధకారకూపప్రవిష్టు
నుగ్రకాయునిఁ బతితు నన్నుద్ధరింపు
భస్మదానం బొసంగి తాపసవరేణ్య.

36

వామదేవమహామునిపాపవిముక్తుఁ డగుబ్రహ్మరాక్షసునకు నితిహాసరూపంబున భస్మధారణవిక్రమం బెఱింగించుట.

వ.

అని బహుప్రకారంబులఁ బ్రార్థింపుచున్న యాబ్రహ్మరాక్షసు
నకు విభూతిమహత్త్వంబు సవిస్తరంబుగా నితిహాసరూప
మునం జెప్పెద నాకర్ణింపు మని వామదేవమునీంద్రుం డి
ట్లని చెప్పందొడంగె.

37


క.

పూర్వమున మందరాహ్వయ
పర్వతవరశిఖరమునకుఁ బ్రమథులు గొలువన్
నిర్వాణఫలప్రదుఁ డగు
శర్వుం డేతెంచె నొక్కసమయమునందున్.

38


మ.

గరుడాభాస్వరసిద్ధచారణమరుద్గంధర్వవిద్యాధరు
ల్సురయక్షోరగసాధ్యరుద్రవసురక్షోభూతవిశ్వాశ్విను

ల్హరివైశ్వానరముఖ్యదిక్పతులు సేవార్థంబు గౌరీమనో
హరుసాన్నిధ్యముఁ జేరవచ్చిరి విమానారూఢులై యందఱున్.

39


వ.

మఱియును సనకసనందనాదిబ్రహ్మర్షులును నారదాగస్త్య
మార్కండేయజాబాలిప్రముఖానేకదేవర్షులును దక్షాది
ప్రజాపతులును ఊర్వశీపురోగమాప్సరోగణమ్ములును జండి
కాదిమాతృకాగణములును నందిమహాకాళాదిశంకరకింక
రులును శంఖకర్ణఘంటాకర్ణవీరభద్రకుంభోదరవృకో
దరమహోదరకర్ణధామాదిభూతనాథులును రక్తనీల
పాండువర్ణులును ధూమ్రధూసరకర్బురపాలాశవర్ణులును
వ్యాఘ్రసూకరభల్లూకదంతావళసారమేయసృగాల
మర్కటోలూకసింహశరభభేరుండగృధ్రముఖులును ఏక
వక్త్రద్వివక్త్రబహువక్త్రనిర్వక్త్రులును ఏకహస్తద్విహస్త
చతుర్హస్తబహుహస్తులును ఏకనేత్రచతుర్నేత్రబహు
నేత్రులును దీర్ఘవామనదేహులు నయినభూతగణంబులు
పరివేష్టింప సింహాసనాసీనుం డయియున్నసమయమ్మున సన
త్కుమారుం డనుమహామునీంద్రుం డరుగుదెంచి సూర్య
కోటిసమప్రభుండును బిశంగజటాపటలశోభితుండును నా
లోలఫాలనయనుండును ఖండేందుశేఖరుండును నీలగ్రీవుం
డును నాగేంద్రభూషణుండును వ్యాఘ్రచర్మధారణుం
డును ఘంటాదర్పణమండితుండును ఖట్వాంగపాశాంకుశ
త్రిశూలధారణుండును నప్రధృష్యుండును ననిర్దేశ్యుండును
గాలాగ్నిరుద్రుండును నయిన పరమేశ్వరునకు నమస్కరించి
బహువిధములఁ బ్రశంసింపుచుఁ గృతాంజలిబద్ధుండును
వినయవినమితశిరస్కుండు నై యమ్మహాదేవువలన సకల

ధర్మంబులు ప్రశ్నోత్తరంబులవలన నాకర్ణింపుచుండి వెండియు
నమ్మహామునీంద్రుం డి ట్లని విన్నవించె.

40


సీ.

సర్వజ్ఞ పరమాత్మ సర్వలోకశరణ్య
        సుఖరూప విను భవన్ముఖమువలన
నపవర్గహేతువు లైనధర్మంబులు
        వింటి నన్నియును సవిస్తరముగ
నేధర్మమార్గంబు లెంచి చూచినను బ
        హ్వాయానజనకంబు లగుచు నుండు
నటుగాన నేధర్మ మప్రయాసకరంబు
        నఘనాశనంబు మహాఫలంబు


తే.

నాగమోక్తంబు ముక్తిదం బగుచునుండు
నట్టిధర్మంబుఁ దెలియ నా కానతిమ్ము
భక్తవత్సల యనినఁ గృపాళుఁ డగుచు
నిందుశేఖరుఁ డమ్మౌని కిట్టు లనియె.

41


తే.

ధర్మములలోన నుత్తమధర్మ మగుచు
వ్రతములందెల్ల నంచితవ్రతము నగుచు
నఖిలజంతురహస్యమై యలరుచుండుఁ
దాపసేంద్ర త్రిపుండ్రసంధారణంబు.

42

సాంబమూర్తి సనత్కుమారునకు భస్మప్రభావం బెఱింగించుట.

చ.

అన విని మౌని యిట్లనియె నాజగదీశ్వరుతోఁ ద్రిపుండ్రసా
ధనమున కెద్ది ద్రవ్యమధిదైవము లెవ్వరు దత్ప్రమాణముల్
ఘనతరశక్తి యెద్ది కుతుకంబున నన్నియు లోకరక్షణం
బునకు వచింపఁగావలయు భూతగణేశ కృపాపయోనిధీ.

43


క.

అని యడిగిన మునిపతి కి

ట్లనియెన్ శంకరుఁడు రౌద్ర మన నాగ్నేయం
బనఁగఁ జను దగ్ధగోమయ
మనిశము నది ధారణార్హ మగు విప్రులకున్.

44


ఆ.

నాల్గువర్ణములును నాలుగాశ్రమముల
వెలయునట్టిమనుజవితతి కెపుడు
భస్మధారణమునఁ బాతకం బగునుప
పాతకమ్ము లెల్ల భస్మ మగును.

45


సీ.

వర్ణనీయం బాదివర్ణత్రయంబును
       వహ్నిత్రయంబు తత్త్వత్రయంబు
సవనత్రయంబును శక్తిత్రయంబును
       వేదత్రయంబును విమలమైన
సత్యాదిగుణము లీశానుండును ద్రిపుండ్ర
       కాధిదైవతములై యలరుచుండు
నీవేల్పులకు మ్రొక్కి యెలమి ననామికా
      మధ్యమాంగుష్ఠాగ్రమానితముగ


ఆ.

బ్రహ్మమయము లైన పంచమంత్రంబుల
మఱి త్రియంబకాదిమంత్రములను
మంత్రితముగఁ జేసి మహితఫాలంబున
దగ్ధగోమయంబుఁ దాల్పవలయు.

46


క.

జలసమ్మిశ్రితభస్మము
నలవడ ఫాలమున నురమునందు భుజముల
న్వెలయఁగఁ బూసిన నరులకుఁ
గలిమియు బలిమియును గల్గుఁ గలకాలంబున్.

47


ఆ.

మనుజు లెవ్వరేని మంత్రంబుఁ దెలియక

భూతిరేఖ నుదుటఁ బూసిరేని
వారలయిన దురితవర్జితు లై పరి
శుద్ధు లగుచు నుందు రిద్ధచరిత.

48


సీ.

పరసతీగమనంబు పరధనాపేక్షయుఁ
        బరవృత్తిహరణంబు పరధనంబు
కూటసాక్షిత్వంబు కుత్సితభావంబు
        పైశున్యమును సురాపానరతియు
నీచసంసేవయు నీచప్రతిగ్రహ
        మారణ్యదాహంబు ననృతభాష
కన్యారజస్వలాగణికాదికామినీ
        సంగమంబును దివాసంగమంబు


తే.

వేదవిక్రయమన్నాదివిక్రయంబు
నాదిగాఁ గల్గు కలుషంబు లణఁగిపోవుఁ
దక్షణంబున భస్మసంధారణమున
భవ్యగుణగణ్య దివ్యతాపసవరేణ్య.

49


క.

శివభక్తులనిందనమును
శివధనహరణంబు మఱియు శివహేళనమున్
భువి నొనరించిన నరులకుఁ
బ్రవిమలనిష్కృతులు లేనిపాపము లొదవున్.

50


క.

ఏజాతివారలైనను
భూజనములు నుదుట భూతిఁ బూసినమాత్రం
దేజమున సర్వమానవ
పూజితు లై శివపదంబుఁ బొందుదు రనఘా.

51


వ.

మఱియును మహేశ్వరవ్రతనిష్ఠాపరు లైనమానవులు శత

కల్పంబులు బ్రహ్మలోకమునను శతత్రయకల్పములు విష్ణు
లోకంబునను వసియించి తదనంతరమునఁ బునరావృత్తి
రహితం బయిన పరమేశ్వరలోకంబునందు ధ్రువంబుగా
నుందురు మునీంద్రా సర్వభూతరహస్యం బైనత్రిపుండ్ర
మాహాత్మ్యంబు నీకుం దెలియఁ బలికితి నీయర్థంబు నీచేతఁ
బ్రయత్నంబుగా గోపనీయంబు గావలయు నని నిర్దేశించి
యప్పరమేశ్వరుం డంతర్ధానంబు నొందు నంత సనత్కుమా
రుండు బ్రహ్మలోకమునకుం జనియె నని చెప్పి క్రమ్మఱ
యోగీంద్రుండు బ్రహ్మరాక్షసున కి ట్లనియె.

52


తే.

దివ్యఫలదాయి మామకదేహలిప్త
భస్మసంపర్కమున నీకు భద్రమైన
తెలివి చెందెనుగాన నిర్మలమనీష
సారభసితంబుఁ దాల్చు విజ్ఞాన మొదవు.

53


వ.

అని పలికి.

54


చ.

అగణితసత్కృపాకలితుఁడై మునినాథుఁడు శైవమంత్రితం
బుగ నొనరించి ఫాలమున భూతివిలేపన మాచరించినన్
విగళితపుణ్య మైనయపవిత్రజగద్భయదాత్మదేహమున్
దెగడుచు బ్రహ్మరాక్షసుఁడు దివ్యశరీరము దాల్చె నంతటన్.

55


చ.

గురుచరణారవిందములకుం బ్రణమిల్లి తదాజ్ఞఁ గాంచి దా
నరుణనిభప్రభాకలితుఁ డై మణిదీప్తవిమానయానుఁ డై
హరుపదముం భజించెఁ దగ నాదరణీయుఁడు వామదేవుఁడున్
ధరణిఁ జరింపఁగా నరిగె ధన్యతనార్తజనాళిఁ బ్రోవఁగన్.

56


క.

ఈకథవిన్నమహాత్ములు
ప్రాకటముగఁ జదివినట్టి భద్రాత్ములు దా

రాకల్పంబుగ నుందురు
శ్రీకంఠపురంబునందుఁ జిరతరభక్తిన్.

57


తే.

పుస్తకమునందు భువనప్రశస్త మైన
భస్మమహిమంబు వ్రాసి సద్భక్తి నభవు
భక్తకోటుల కొసఁగినపాత్రులకును
బాపములు వాయు హరుకృప భాగ్యమొదవు.

58


చ.

శివచరణారవిందములు చిత్తమునన్ భజియింపుచుండుఁడీ
భువనగణేశునిం దలఁచి భూతి లలాటమునన్ ధరింపుఁడీ
సవనవిరోధికీర్తనము సమ్మతిఁ జేయుఁడు సార్వకాలముం
దివిజమునీంద్రులార జననీస్తనదుగ్ధము లాన రెన్నఁడున్.

59


వ.

అని చెప్పిన విని యమ్మహామునీంద్రులు ప్రహృష్టాంతరంగు
లై క్రమ్మఱ సూతున కి ట్లనిరి.

60


ఉ.

శ్రీగిరిజాధినాథపదసేవనసక్తమనోవిచక్షణ
శ్రీగురువర్యవాక్సరణిచే నుపదేశముఁ గాంచువారికిన్
బాగుగ ముక్తి గల్గు నని పల్కితి కేవలదేశికోక్తిచే
నేగతి నిష్టసిద్ధి యగు నీకథఁ దెల్పుము మాకు నేర్పడన్.

61


వ.

అని యడిగిన సూతుం డి ట్లనియె.

62

సూతుండు శౌనకాదిఋషులకు భక్తిశ్రద్ధాస్వరూపంబుల నితిహాసరూపంబుగా నెఱింగించుట

క.

శ్రద్ధయె లోకహితం బగు
శ్రద్ధయె నిజజననిపగిది సౌఖ్యము లొసఁగున్
శ్రద్ధాపరుల నభీష్టస
మృద్ధులుగాఁ జేయుచుందు రెల్లసుపర్వుల్.

63


శా.

శ్రద్ధాభక్తిసమేతు లై విబుధులన్ సంప్రీతిఁ బూజించిన

న్సిద్ధించు న్నిజకామితార్థములు నిశ్శ్రేయఃపదప్రాప్తియున్
శ్రద్ధాహీనులపూజ వంధ్యతరుపుష్పప్రాయ మై యిష్టసం
సిద్ధిం జేయదు సర్వమానవులకు న్సిద్ధంబు ధాత్రీస్థలిన్.

64


ఆ.

ఓమహాత్ములార యుపదేశమునకన్న
శ్రద్ధ గలిగి యునికి సిద్ధి దనరు
నిమ్మహార్థమునకు నితిహాస మొక్కటి
విన్నవింతు వినుఁడు వీను లలర.

65


క.

ప్రాంచద్విపులసరస్వ
త్కాంచీస్థలి వెలయునట్టి ఘనతరబహుష
ట్పంచాశద్విషయములను
బాంచాల మనంగ నొక్కపట్టణ మలరున్.

66


మ.

అనిశం బప్పుర మేలు ఖండితసమస్తారాతిసంఘాతుఁ డై
హనుమత్కేతుఁడు విక్రమస్ఫురణమానాభ్యున్నతిన్మారుతా
శనరాట్కేతుఁడు సత్కృపారసమునన్ సర్పారికేతుండు భూ
జనవిఖ్యాతుఁడు సింహకేతుఁ డనురాజశ్రేష్ఠుఁ డుద్యన్మతిన్.

67


ఉ.

సారబలాఢ్యుఁ డానృపతిచంద్రునకుం బ్రభవించె వైరిసం
హారుఁడు దుర్జయుం డనుకుమారుఁడు శౌర్యకుమారుఁ డర్థిమం
దారుఁడు శైలజాధిపపదాబ్జవిచారుఁడు సింధురాజగం
భీరుఁడు మేరుధీరుఁ డరవిందశరోపమసుందరాంగుఁ డై.

68


వ.

అంత.

69


క.

జననాథనందనుం డొక
దినమున మృగయాభికాంక్ష దీపింప ధను
స్సునిశితబాణధరుం డై
చనియెం గాంతారమునకు శబరులుఁ గొలువన్.

70

వ.

ఇవ్విధంబున నమ్మహారణ్యముం బ్రవేశించి యచ్చటం బర
తెంచు వేదండగండకపుండరీకభల్లూకవరాహమహిషాది
దుష్టమృగముల విదళింపుచు విహరింపుచున్నసమయమునఁ
దద్భటుం డయిన యొక్కశబరుండు చండకుం డనువాఁడు
మృగాన్వేషణపరుం డై వనమునం దిరుగుచు నొక్కయెడ
జీర్ణం బైనదేవాలయమునందు స్ఫుటితం బయినలింగము
గావించి దైవనియోగమున దానిం గొనిదెచ్చి యారాజ
నందనునకుం జూపి యిమ్మహాలింగమున కేను బూజనం
బొనరించెద దీనిం బూజించువిధానం బెట్టిది సవిస్తరముగా
నానతీయవలయు నని ప్రార్థించినశబరునకుఁ బరిహాసముగా
నారాజకుమారుం డి ట్లనియె.

71

చండకుండను శబరోపాఖ్యానము

సీ.

ఇమ్మహాలింగంబు నెమ్మితోఁ బూజించు
        క్రమ మెఱిఁగింతు సాంగంబు గాఁగ
విను మీవు సంకల్పవిధిపూర్వకంబుగా
       నవవారి నభిషేచనం బొనర్చి
యొప్పుగాఁ బీఠమం దునిచి యాపిమ్మట
       నతిశుభ్రపుష్పగంధాక్షతముల
నర్పించి ధూపదీపాదికంబు లొసంగి
       నెమ్మదిలోన ధ్యానమ్ముఁజేసి


తే.

మొదలఁ జితిభస్మ ముపహారముగ నొనర్చి
యంత నాత్మోపయుక్తాన్న మాదరమున
మరల నైవేద్య మొనరించి మంత్రపుష్ప
వందనాదులు గావింపవలయు నెపుడు.

72

క.

క్రమ్మఱఁ బూజించి ప్రసా
దమ్ము ధరింపఁ దగు సంతతమును జితాభ
స్మమ్ము నివేదించిన శీ
ఘ్రమ్మున సంతుష్టిఁ జెందు గంగాధరుఁడున్.

73


క.

అని యుపదేశించిన విని
జననాథకుమారుపలుకు సత్యం బనుచున్
దనలో నెంచుచు దృఢమతిఁ
జనియెన్ శబరుండు దనదు సదనంబునకున్.

74


చ.

నిరుపమభక్తి నాత్మతరుణీసహితంబుగ నీశ్వరార్చనా
పరత వహించి యంతఁ జితిభస్మనివేదన మాచరించి క్ర
మ్మఱ నిజభోగవస్తుచయమంత యొసంగుచుఁ దత్ప్రసాదమున్
శిరమునఁ దాల్చి పిమ్మట భుజించు నతండు మనంబు రంజిలన్.

75


వ.

ఇట్లు శబరీసమేతముగా శబరుం డమ్మహేశ్వరలింగమునకు
దృఢభక్తిపరుండై నిరంతరము పూజనం బాచరింపు
చున్నంతఁ గొన్నిదినంబులకుఁ జితాభస్మరహితం బైన
పాత్రము నిరీక్షించి తత్సంగ్రహణార్థముగా నలుదెసలం
బరికించి యెందునుం గానక మఱలి నిజనివాసమునకు వచ్చి
విషణ్ణచిత్తమున మౌనవ్రతుండై యున్న నిజవల్లభుంగాంచి
తత్కుటుంబిని యి ట్లనియె.

76


క.

నీ వేటికి చింతించెదు
శైవసమర్చనము లేల సమకూర్పవు నీ
భావముఁ దెలియం బలుకుము
నా విని యాశబరుఁ డనియె నతవదనుం డై.

77


తే.

అతివ విను మీదినంబున నీశ్వరోప

హారమునకుఁ జితాభస్మ మబ్బదయ్యె
శైవపూజాంతరాయంబు సంభవించెఁ
గాన నిఁక నేమి యొనరింతుఁ గమలవదన.

78


క.

గురువాక్యోల్లంఘనమున
దురితంబులు వొందుగానఁ దొయ్యలి వినుమా
పరమేశ్వరుఁ బూజింపక
తిరముగ భుజియింప నొల్ల దృఢమతి నెపుడున్.

79


వ.

అని ఇవ్విధమున నుడివిన ప్రాణవల్లభునకుఁ దత్కళత్రం
బి ట్లనియె.

80


సీ.

ప్రాణేశ దీనికై బరితాపమేటికి
        నిపు డొక్కసదుపాయ మేను గంటి
బహుదారుమయనిజగృహదాహ మొనరించి
        తనమేను వైచి దగ్ధంబుఁ జేతుఁ
దద్భస్మమున నివేదన మాచరింపుము
        పరమేశ్వరునకు సాదరత మెఱయ
నని విన్నవించినఁ దనపత్ని వీక్షించి
       శబరుండు పలికె విస్మయము నొంది


తే.

సరసధర్మార్థకామమోక్షముల కెపుడు
సాధనంబు సుఖార్హంబు సకలభోగ
భాజనమును దయావనం బైనతనువు
నెట్లు విడిచెదు సంతానహీన వగుచు.

81


వ.

అని పలికిన శబరునిఁ జూచి శబరి యి ట్లనియె.

82


క.

పరజనులకుఁ దా నిచ్చిన
శరీరమున సుకృత మొదవు సాక్షాజ్జగదీ

శ్వరున కొసంగిన తనువుల
వరపుణ్యం బెన్నఁదరమె వాక్పతికైనన్.

83


ఉ.

పూర్వభవాంతరంబులను బుణ్యములెన్ని యొనర్చియుంటినో
పర్వతకందరస్థలిఁ దపంబుల నేక్రియ సల్పియుంటినో
సర్వసరిజ్జలంబుల భృశంబుగ మజ్జన మాడియుంటినో
శర్వసమర్చనంబునకు సారనిజాంగ మొసంగఁ గాంచితిన్.

84


వ.

అని పలికి నిజవల్లభు నొడంబఱిచి పుణ్యజలావగాహనం
బాచరించి శుచీభూతగాత్ర యై హరిద్రాంజనకుంకుమ
గంధపుష్పాద్యలంకృత యై నిజగృహద్వారంబున ననలముఁ
దరికొల్పి ప్రదక్షిణత్రయం బొనరించి యవ్వీతిహోత్రునకు
నభిముఖంబుగా నిలిచి గురువందనంబు గావించి యమ్మహా
దేవుం దనమనంబునఁ దలంపుచుఁ గృతాంజలియై యి ట్లని
స్తుతియించె.

85


ఉ.

దేవ మదింద్రియంబులు ప్రదీప్తసుమంబులు దేహ మిష్టసం
భావితగంధధూప మతిభాసురచిత్తము దీప మెన్నఁ బ్రా
ణావళియే హవిస్సు కరణంబులు మీకు సితాక్షతంబు లై
జీవితపూజనం బిపుడు చేసెదనయ్య కృపాపయోనిధీ.

86


తే.

సర్వలోకాధిపత్యంబు స్వర్గమైన
బ్రహ్మపదమైన వలదు మీపాద మాన
తావకపదాబ్జభక్తి చిత్తంబునందు
వెలయఁజేయుము భవశతంబులకు నైన.

87


క.

అని ప్రార్థింపుచు శబరుని
వనితామణి ధీరవృత్తి వహ్నిజ్వాలన్
మన మలరఁ బ్రవేశింపుచుఁ

దనమేను దహింపఁజేసెఁ దక్షణమందున్.

88


క.

అంతఁ జితాభస్మము త
త్కాంతుఁడు దా సంగ్రహించి తగఁగఁ గుటీరో
పాంతంబున శైలసుతా
కాంతుని పూజన మొనర్చెఁ గౌతుకమతి యై.

89


సీ.

శబరుండు శివపూజ సలుపుచు వివశుఁడై
       మహితప్రసాదసంగ్రహణమునకు
నెప్పటియట్ల తా నొప్పుగాఁ బిలిచినఁ
       దనపత్ని వచ్చి ముందటను నిలిచె
నంత నాశబరుఁ డత్యద్భుతస్వాంతుఁడై
       ప్రాంజలి యై యున్నపణఁతిఁ గాంచి
నిర్దగ్ధదేహ వై నీ వెట్లు వచ్చితి
       విపుడు నిజాలయం బెట్లు పొడమె


తే.

దేజమున నగ్ని దహియించు దినకరుండు
కిరణములను దహించు భూవరుఁడు దండ
మునను దహియించు మనమున భూసురుండుఁ
దగ దహించుట శాస్త్రసిద్ధంబు దలఁప.

90


క.

అటు గావున గృహయుతముగఁ
జటులజ్వాలాగ్నిదగ్ధసర్వాంగిక వై
యెటువలె వచ్చితి విప్పుడు
నిటలాక్షునిమహిమఁ దెలియ నేర్తురె మనుజుల్.

91


వ.

అని విస్మయాక్రాంతచిత్తుం డై యడిగిన శబరునకు శబరి
యి ట్లనియె.

92


మ.

దహనజ్వాలలయందుఁ జొచ్చి సుఖనిద్రంజెంది నిర్మాల్యసం

గృహణార్థంబుగఁ బిల్వఁగా వినుచు జాగ్రత్త్వంబు సంధిల్లినన్
గృహముం దేహము పూర్వరూపములభంగిం జెంద నేతెంచితిన్
మహితం బైనశివప్రసాద మిడి న న్మన్నించు ప్రాణేశ్వరా.

93


సీ.

అని యివ్విధంబున నతిశయహృదయాను
        రాగంబు దోఁపఁ బరస్పరంబు
శబరదంపతులు దా సంభాషణము సేయు
        నవసరంబున విస్మయము జనింప
దివినుండి వచ్చె దేదీప్యమానం బగు
        మణిమయం బైనవిమాన మొకటి
యంత నయ్యిరువుర నతిమైత్రిఁ బుష్పకా
        రూఢులఁ జేసిరి రుద్రభటులు


తే.

భవ్యశివపారిషదకరస్పర్శనమున
విమలతరమైనదివ్యదేహములు దాల్చి
సిద్ధచారణగంధర్వసేవ్యమైన
శ్రీసదాశివలోకంబుఁ జేరి రపుడు.

94


వ.

ఇట్లు శబరదంపతులు శ్రద్ధాపూర్వకంబుగాఁ బరమేశ్వర
పూజనం బాచరించి నిజదేహంబులతో మహాయోగిజన
సంభావితం బయినశివలోకంబునకుం జని పరమానందం
బున నుండిరని చెప్పి సూతుం డి ట్లనియె.

95


క.

కులవిద్యాచారంబులు
దలఁపఁగఁ బనిలేదు భక్తితాత్పర్యముచే
నలికాక్షుని బూజింపుచు
విలసిల్లెడుఘనుని బోలు విజ్ఞులు గలరే.

96


క.

ఈశబరోపాఖ్యానము

వ్రాసిన జదివినను విన్నవారలకు భవా
నీశుకరుణాకటాక్షా
వేశంబునఁ జెందు సిరులు విద్యాసిద్ధుల్.

97


వ.

అని చెప్పి సూతుం డి ట్లనియె.

98


చ.

స్తుతమతులార క్రమ్మఱ విశుద్ధత మీఱ నుమామహేశ్వర
వ్రతపరిపూర్ణపుణ్యకథ రంజిలఁ దెల్పెద నాలకింపుఁడీ
సుతపశుమిత్రబాంధవయశోబలవర్ధన మార్యవంద్యమున్
సతతశుభాస్పదం బదియు శాశ్వతముక్తిఫలప్రదం బగున్.

99

ఉమామహేశ్వరవ్రతమునందు శారదోపాఖ్యానము

క.

జనసుతుఁ డార్యావర్తం
బున విశ్వరథుం డనంగ భూసురవర్యుం
డనఘాత్ముఁడు గలఁ డొకరుఁడు
మనసిజమదహరణభక్తిమార్గరతుం డై.

100


క.

ఆవిప్రకులోత్తమునకు
దైవనియోగమునఁ జేసి తనయారత్నం
బావిర్భవించె నొక్కతె
సావిత్రీప్రతిభ గలిగి శారద యనఁగన్.

101


సీ.

ఆకన్యకారత్న మప్పు డష్టమవర్ష
        మున నుండఁ జూచి తజ్జనకుఁ డంత
వైవాహిక మొనర్ప వలయు నటంచును
        మది నిశ్చయించి సమ్మదమువలన
నొకవిప్రసుతునకు నకలంకమతి నిచ్చె
       నంత నాద్విజుఁడు మధ్యాహ్నసమయ
మునఁ గృతోద్వాహుఁడై మొనసి సాయం

       కాలమున సరోవరతీరమునకు నరిగి


తే.

యచట సంధ్యాదికృత్యంబు లాచరించి
పేర్మిఁ జనుదెంచునెడ విధిప్రేరణమునఁ
జేసి పన్నగదష్టుఁడై చేష్ట లుడిగి
యాధరామరుఁ డపగతప్రాణుఁ డయ్యె.

102


వ.

తదనంతరంబ సకలబంధుజనములు బరతెంచి హాహాకార
ములతో విలాపము లాచరింపుచు నిజకర్మయోగమున
మరణము నొందినయావిప్రునకు నౌర్ధ్వదైహికాదివిధా
నము లాచరించి రంత నాభూసురాంగనయును నిజపతి
వియోగమునంజేసి విరహితాలంకారయు నత్యంతదుఃఖా
క్రాంతయు నై నిజజనకమందిరమ్మున నుండు నెడ.

103

శారద దీర్ఘసుమంగలి యగుట

శా.

శ్రుత్యాచారపరాయణుండు జపనిష్ఠుం డాగమాంతజ్ఞుఁడుం
బ్రత్యాహారసమాధిధారణముఖప్రవ్యక్తయోగాఢ్యుఁ డా
దిత్యద్యోతనుఁ డీశ్వరాంఘ్రికమలాధీనస్వచేతస్కుఁ డై
జాత్యంధుండునునై ధ్రువుండను మహాక్ష్మాదేవు డేతెంచినన్.

104


క.

ఆనాతియు నాద్విజునకు
స్నానాదికములను మధురసాహారములన్
మానితమహోపకారవి
ధానంబులఁ బూజ సేసెఁ దద్దయు భక్తిన్.

105


తే.

ఇట్లు పూజించి మ్రొక్కిన యింతి మెచ్చి
యాద్విజన్ముఁడు జాత్యంధుఁ డగుటఁ జేసి
లలన విశ్వస్త యగుట దాఁ దెలియలేక
పలికె దీర్ఘసుమంగలీ భవ యటంచు.

106

క.

ఈవిధమున నావిప్రుఁడు
దీవించిన యింతి యనియె ధీరోత్తమ నే
నేవిధి చిరంటి నగుదును
దా విశ్వస్త నని నుడివెఁ దథ్యము గాఁగన్.

107


వ.

మహాత్మా మీర లమోఘసంకల్పులును యథార్థవాదు
లును మహర్షిసత్తములు గావున భవదాశీర్వచనం బెట్లు
సంఘటింప నేర్చు దురంతచింతాభరాక్రాంతనైయున్న న
న్నుద్ధరింప మీరలు దక్క నొండు శరణంబు లేదని చరణం
బుల వ్రాలియున్న శారదం గటాక్షించి యత్యంతకరుణా
రసపూర్ణహృదయుఁడై యమ్మహామునీంద్రుం డిట్లనియె.

108


చ.

కమలదళాక్షి యే నిపుడు కన్నులు గాననివాఁడ నౌట నె
య్యము దళుకొత్తఁగా నిను శుభాంగివి గమ్మని యే వచించితిం
బ్రమదము దోఁప నీదయినభక్తికి మెచ్చితిఁ గాని నిన్ను ని
క్కముగఁ జిరంటిఁ జేతుఁ గలకాలము నుల్లము పల్లవింపఁగన్.

109


క.

చతురత నుమామహేశ
వ్రతనియమ మొనర్చి వృషభవాహు భవాని
న్మతి నిల్పి పూజ సల్పిన
నతిశయసౌభాగ్య మొదవు ననవరతంబున్.

110


వ.

అనిన శారద యి ట్లనియె.

111


క.

మునినాథ నీయనుగ్రహ
మునఁ జేసెద నీవ్రతంబు ముదము దలిర్పన్
జనవినుత సవిస్తరముగ
వినుపింపుము దానితెఱఁగు విశదముగాఁగన్.

112


వ.

అని యడిగిన నమ్మహానుభావుం డి ట్లనియె.

113

తే.

చైత్రమున నైన మార్గశీర్షమున నైన
శుక్లపక్షంబునందుల శుభదినములఁ
దనరులస దష్టమీచతుర్దశులయందు
వ్రతము సలుపంగవలయు నవశ్యముగను.

114

ఉమామహేశ్వరవ్రతక్రమము దెలుపుట

సీ.

ప్రత్యూషమున సరిత్పావనోదకముల
       స్నానం బొనర్చి నిష్కలుషమతిని
ధౌతవస్త్రంబులు ధరియించి దేవర్షి
       పితృతర్పణములు సంప్రీతిఁ జేసి
క్రమ్మఱ నిజమందిరమ్మున కేతెంచి
       ఫలపుష్పతోరణభ్రాజితంబు
నతిరమ్యమును వితానాలంకృతంబును
       మణిమయం బైనట్టిమంటపమునఁ


తే.

బంచవర్ణవిరాజితపంచపద్మ
రంగవల్లులు దీర్చి సంరంభ మెసఁగఁ
దండులన్యస్తకలశవస్త్రములమీఁదఁ
గనకమయపార్వతీశుల నునుపవలయు.

115


మ.

కలుషాపద్వినివారణార్థముగ సంకల్పంబుఁ గావించి ని
శ్చలభావంబునఁ బార్వతీశ్వరుల శశ్వద్భక్తిఁ బూజించి యం
జలిబద్ధుండు నిమీలితేక్షణుఁడు నై సంతానసౌభాగ్యము
ల్వెలయం బ్రార్థన సేయఁగాఁ దగు యథావిధ్యుక్తమార్గంబునన్.

116


తే.

అనిన శారద పలికె నోమునివరేణ్య
సిద్ధముగ మన్మనోరథసిద్ధి గాఁగ
సమ్మతంబుగ మీర లిచ్చట వసించి

యిమ్మహావ్రతరాజ మీడేర్పవలయు.

117


క.

అని చెప్పిన మునివరుశా
సనమున నుత్సాహ మొదవ శారదయును స
జ్జనబంధుసమ్మతంబుగఁ
బనుపడఁ దద్ర్వత మొనర్చెఁ బ్రాకటభక్తిన్.

118


పంచచామరము.

మహాప్రసూనభాసమానమంటపాంతరంబున
న్మహీసురోత్తమోపదిష్టమంత్రతంత్రదీక్షలన్
మహేంద్రముఖ్యదేవమౌనిమాన్య మైనయాయుమా
మహేశ్వరవ్రతం బొనర్చె మంజువాణి యంతటన్.

119


క.

కూర్పాసకాంశుకంబులు
శూర్పయుగంబులును గంఠసూత్రములు లస
త్కర్పూరవీటికాదులు
నర్పించె సువాసినులకు నతిదృఢభక్తిన్.

120


వ.

ఇవ్విధంబున నాశారదావధూటి దనకు నై ధ్రువమహా
మునీంద్రుం డాచార్యుండుగా మార్గశీర్షమాసమున శుక్ల
పక్షచతుర్దశీదినమున నుమామహేశ్వరవ్రతం బుపక్ర
మించి యథావిధ్యుక్తంబుగా భక్తిశ్రద్ధాసమన్వితయై
యొక్కసంవత్సరము సాంగముగా నాచరించి తదనంత
రమున వ్రతోద్యాపనము గావింప సమకట్టి నిజమందిరం
బలంకృతంబు గావించి క్రమ్మఱఁ బూర్వోక్తం బైనదినంబు
నం దుపవసించి పుణ్యతీర్థజలస్నాతయు ధౌతపరిధానధారి
ణియు మౌనవ్రతపరాయణయు నై సాయాహ్నసమయం
బున గృహంబుఁ బ్రవేశించి యచ్చట కదళికాస్తంభశోభిత

మును నవామ్లపల్లవతోరణమాలికాలంకృతంబును బహు
విధఫలపుష్పమంజరీసమేతమును రక్తరాంకవవితానాలం
కృతమును స్వస్తికపద్మకాదివిచిత్రరంగవల్లీవిరాజమానము
నైనమంటపప్రదేశమున సువర్ణఖచితం బైనభద్రపీఠము
నందు జాతరూపమయము లగుభవానీశంకరప్రతిమలు
తండులన్యస్తకలశవస్త్రోపరిభాగమున నిలిపి భూసురకృత
పుణ్యాహమంత్రఘోషణములును ననేకవిధమంగళవాద్య
ధ్వనులును జెలంగ సంకల్పం బొనర్చి హృత్పద్మమధ్యమున
గౌరీశ్వరధ్యానము గావింపుచు నావాహనాసనార్ఘ్య
పాద్యంబులను బంచామృతస్నానవిధులను రుద్రసూక్తాభి
షేకములను దుకూలాంబరయజ్ఞసూత్రసమర్పణంబులను
మణిమయభూషణములును ఘుమంఘుమితగంధలేపనము
లను హరిద్రాకుంకుమాక్షతములను గమలకల్హారమాలతీ
మల్లికాదిప్రసూనార్చనములను గాలాగరుదశాంగధూప
ములను కర్పూరనీరాజనంబులను మధురఫలోపహారము
లను మంత్రపుష్పప్రదక్షిణనమస్కారములను ననేకవిధ
ములం బూజింపుచు నారాత్రి ప్రథమ ద్వితీయ తృతీయ
యామంబులు గడపి జాగరణం బొనరింపుచుండు నంత
దైవవశంబునం దన్మహోత్సవసందర్శనార్థసమాగతపౌర
జానపదసువాసినీబ్రాహ్మణజనములు నిద్రావశులై యున్న
సమయంబున.

121


తే.

శారదయు నైధ్రువుండు నిశ్చలమనీష
నాలుగవయామమునఁ బూజనములు సలుప
గజముఖునితల్లి యాశ్రితకల్పవల్లి

యంబికాదేవి ప్రత్యక్ష మయ్యె నపుడు.

122


ఉ.

ఆసమయంబునందుఁ దగ నంధకుఁడైన మహామునీంద్రుఁడున్
భూసురకాంతయు న్భుజగభూషణుసాధ్వికి సాఁగి మ్రొక్కి పా
ద్యాసనసంవిధానముల నర్చితగా నొనరించిన న్మహో
ల్లాసముతో భవానియును లాలితభాషల వారి కిట్లనెన్.

123


క.

మీభక్తిశ్రద్ధలకును
మీభాస్వద్వ్రతమునకును మెచ్చితి భవదీ
యాభీష్టార్థ మొసంగెద
నో భూసురవర్య వేఁడు ముత్సాహమునన్.

124


వ.

అని యానతిచ్చిన యమ్మహాదేవికిఁ బ్రణమిల్లి ద్రువమహా
మునీంద్రుం డి ట్లనియె.

125


శా.

దైవాధిష్ఠితకర్మయోగమున జాత్యంధుండ నై యుండ నో
దేవీ నిష్పతి యైన యీవనిత భక్తిశ్రద్ధఁ బూజింప నేఁ
జూవే దీర్ఘసుమంగలీ భవ యటంచున్ స్వస్తిగాఁ బల్కితి
న్నావాక్యంబు యథార్థమౌనటుల నానందాప్తిఁ గావింపవే.

126


క.

పతితోడుతఁ జిరకాలము
నతిమైత్రి మెలంగునట్లు నాపిమ్మట స
త్సుతు నొకనిఁ బడయునట్లుగ
నతివకు వర మిమ్ము మది మహాదర మొదవన్.

127


క.

అని ప్రార్థించిన విప్రుని
వినయోక్తుల కలరి శైలవిభుకన్యక నె
మ్మనమున దయ దళుకొత్తఁగ
వనిత న్వీక్షించి పలికె వాక్యప్రౌఢిన్.

128

శారదయొక్క పూర్వజన్మవృత్తాంతము దెలుపుట.

ఉ.

ఓవసుధామరేంద్ర విను మొక్కటి చెప్పెద నీలతాంగి మున్
ద్రావిడదేశమం దొకధరామరవర్యుద్వితీయపత్ని యై
పావనశీలవృత్తముల భావజతంత్రకలానుభూతి నా
నావిధకైతవంబుల మనం బలరించుచు నుండె భర్తకున్.

129


తే.

ఆద్విజన్మాగ్రగణ్యుఁ డహర్నిశంబుఁ
జిఱుతప్రాయంపుపత్ని మచ్చికలు దగిలి
యగ్రభార్యాపరిత్యాగ మాచరింప
నదియు ననపత్యయై మృత్యుపథముఁ జెందె.

130


క.

ఆరెండవభార్యయు శృం
గారవిభూషణదుకూలకలితాంగిక యై
గౌరీపూజలు సలుపుచు
సారాచారముల వెలసె జనులు నుతింపన్.

131


మ.

స్ఫురదాకారవిలాసవిభ్రమములం బొల్పారి ప్రాణేశత
త్పరయై భామ యటంచు పేరు వెలయం బ్రఖ్యాతయై యుండఁగాఁ
బొరుగింట న్వసియించువిప్రుఁ డొకఁ డాపూబోణి వీక్షించి త
త్సురతాపేక్షితుఁడయ్యె మన్మథశరక్షుణ్ణాంతరంగంబునన్.

132


తె.

ఆద్విజన్ముఁడు వశ్యమంత్రౌషధాది
సాధనము లెన్ని చేసిన జడతలేక
తను వరింపనిభామను గని తదీయ
సంగమాపేక్ష గ్రుక్కిళ్లు మ్రింగుచుండె.

133


వ.

ఇట్లు దురంతరం బైనవిప్రగేహినీవ్యామోహంబున విప్ర
లంభవ్యథాశిథిలీకృతమానసుం డై కోపతామ్రాక్షి యగు
నక్కామినిచే నివారితుం డై యాకాముకభూసురుండు

నిరాశుండై కొంతకాలమునకుఁ దదీయధ్యానపరాయణ
త్వమునఁ గాలవశత్వమునం జెంది క్రమ్మఱ విప్రకులమున
సంభవించి యీజన్మమున దీనిం బాణిగ్రహణము గావించి
యావిధంబున నిధనంబు నొందె నిమ్మత్తకాశినియుఁ బతివ్రత
యగునిజసపత్నికి భర్తృవియోగం బొనరించెం గావునఁ
దద్దోషమున నీభవమున నిట్టిదురవస్థ ప్రాప్తించె నని
యానతిచ్చి యమ్మహాదేవి వెండియు ని ట్లనియె.

134


తే.

ఆద్విజన్మకులావతంసాగ్రపత్ని
పతివియోగాభితప్తయై పలవరించి
కాలగతిఁ జెంది భుజగియై క్రౌర్యమునను
గలుషమతి దీనిభర్తను గరచి చనియె.

135


క.

సతిపతుల కెడలు వాపిన
యతివలు కౌమారసమయమందులను విని
ర్గతభర్తృకలై యుందురు
సతతమును ద్రిసప్తజన్మసముదయమందున్.

136


మ.

విను మీశారద పూర్వజన్మమున నుర్వీదేవతాపత్ని యై
నను బూజించుట నిమ్మహావ్రతము సానందంబుగాఁ జేయుట
న్నిను లోకోత్తరునిన్‌ భజించుటను ఖండీభూతదుర్దోషయై
ఘనకల్యాణముఁ జెందఁగాఁ గలదు నిక్కం బారయన్ భూసురా.

137


సీ.

ఆభామహృదయేశుఁ డగు భూసురేంద్రుండు
       దనపత్ని మదిలోనఁ దలఁచి తలఁచి
కొంతకాలంబున కెంతయుఁ దనమేను
       విడిచి క్రమ్మఱఁ బాండ్యవిషయమునను
విప్రుఁడై జన్మించి వేదశాస్త్రజ్ఞుండు

        ధనవంతుఁడును గృతోద్వాహుఁ డగుచు
నున్న వాఁ డిచటికి మున్నూటయిరువది
       యోజనంబులదూర ముర్వియందు


తే.

నాద్విజన్ముసమాగమం బందుచుండు
స్వప్నసమయంబులందు నీచంచలాక్షి
యంతమీఁదట వేదవేదాంతతత్త్వ
ధన్యుఁ డైనట్టి యొక్కనందనునిఁ గాంచు.

138


వ.

అని యమ్మహామునీంద్రునకుఁ దెలియంబలికి శారదం గాంచి
గౌరీదేవి యి ట్లనియె.

139


మ.

యువతీ పూర్వభవప్రసిద్ధపతిసంయోగాప్తి నీయందు సం
భవమున్ జెందుఁ గుమారుఁడొక్కరుఁడు రూపఖ్యాతుఁ డామీఁదటన్
ధ్రువమాంగల్యత నీవిభుం గలసి సంతోషంబు వర్థిల్ల నీ
భువిలోన న్విహరించి శాంకరపదంబున్ జేరు మారూఢిగన్.

140


క.

అని నిర్దేశించి జగ
జ్జనని తిరోహితము నొందె సంయమివర్యుం
డును శారదచేఁ దగఁ బూ
జన మంది నిజేచ్ఛ నరిగె సమ్మదలీలన్.

141


వ.

తదనంతరంబ ప్రభాతసమయమున నాశారదయుఁ గాల్య
కరణీయములు నిర్వర్తించి వ్రతాంగం బైనహోమము
గావించి కుటుంబసంపన్నులును శ్రోత్రియులు నైన
బ్రాహ్మణజనములకు గోభూహిరణ్యాదిదానములును వస్త్ర
కలశద్వయసమేతములైన ప్రతిమాయుగ్మములును దానము
లొనరించి బ్రాహ్మణసమారాధనములు గావించి తదా
శీర్వాదములు గైకొని తానును విఘసాన్నప్రాశనయై

యనుదినమును భవానీశంకరులం దనమనమున నారాధిం
పుచుఁ బితృగేహంబున సుఖమ్మున నుండె నని చెప్పి క్రమ్మఱ
సూతుం డి ట్లనియె.

142


క.

అంతట నాశారదయును
సంతసములు జెంది స్వప్నసమయములందున్
మంతనమునఁ బ్రతిదినమును
గాంతునితోఁ గలయుచుండె గౌరీమహిమన్.

143


ఆ.

ఆధరామరుండు నటు ప్రతినిశియందు
సమ్మదమున స్వప్నసమయమందు
నావధూటిసురత మనుభవింపుచు నుండె
దైవమాయఁ జేసి తథ్యముగను.

144


వ.

ఇట్లు గౌరీప్రసాదమున వరము వడసి ప్రతిరాత్రియందు
నాత్మేశ్వరుం డైనభూదేవునిసమాగమంబుఁ జెందియుండ
నంతట కతిపయదినముల కవ్వధూటి యంతర్వత్నియై
యున్నఁ దల్లక్షణముల పరీక్షించి పురమునం గలుగువృద్ధ
బాంధవజనములందఱు నయ్యింతిం గాంచి యిది పుంశ్చలి
యని మనంబున సంశయించి యందఱు నొక్కయెడకుం
జనుదెంచి యబ్బాలిక నచ్చోటికి రావించి తిరస్కార
పూర్వకంబుగా నందఱు నైకమత్యంబున ని ట్లనిరి.

145


ఆ.

భామ నీవిభుండు పరలోకగతుఁ డయ్యె
నిపుడు నీకు గర్భ మెట్లు కలిగెఁ
దథ్యముగ వచింపు తబ్బిబ్బులాడిన
శిక్ష కర్హురాల వీక్షణమున.

146


క.

అని భర్జింపుచు నడిగిన

జనములవాక్యముల కులికి సంత్రాసమున
న్వనితయు సిగ్గు జనింపఁగఁ
బనుపడ వారలకు మారు పలుకక యుండెన్.

147


వ.

ఆసమయంబున.

148


ఉ.

ఆదర మింతలేక యపు డార్యజనంబులు మంతనంబునన్
వేదపురాణశాస్త్రపదవిం బరికింపుచు జారికాగుణో
న్మాదిని దీని నీక్షణమున న్వపనంబును గర్ణనాసికా
చ్ఛేదము గోత్రదూరతయుఁ జేయుదమంచును నిశ్చితాత్ములై.

149


ఆ.

శారదయును దనకు శరణ మెవ్వరు లేక
మానభంగభీతి మదిని దోఁప
ధీర యగుచుఁ బార్వతీపరమేశులఁ
జిత్త మలరఁగా భజింపుచుండె.

150


వ.

ఆసమయంబున.

151


సీ.

కామినికిని బహిష్కారంబు గావింపఁ
        దలఁచిన సభికులతలఁ పెఱింగి
సందేహములు మాని యందఱు వినుచుండ
        నశరీరవాణి యిట్లనుచుఁ బలికె
నీసాధ్వి సౌజన్యభాసమానసుశీల
        సరసవివేకభాస్వచ్చరిత్ర
యీమానవతి దేవతామహత్త్వంబున
       గర్భంబుఁ దాల్చె నిష్కలుషవృత్తి


తే.

నీవధూటిని బురజను లెవ్వరేని
జారకాంత యటన్న నాక్షణమునందు
వారిజిహ్వలు తునియలు వ్రయ్యలగుచు

జగతిపైఁ బడు మదికి విస్మయము దోఁప.

152


క.

అని భయ మొదవఁగఁ బలికిన
విని యందఱు పరమహర్షవిస్ఫారితలో
చనులై తమమనముల నా
వనిత పతివ్రత యటంచు వర్ణించి రొగిన్.

153


వ.

ఆసమయంబున నివ్వెఱగంది యున్నసభ్యులం గనుంగొని
తత్త్వవిదుం డైనయొక్కవృద్ధవిప్రుం డి ట్లనియె నీప్రపంచం
బంతయు నీశ్వరమాయామయం బీసంసారచక్రంబునందు
భావ్యాభావ్యంబులు లేవు నీయర్థంబు భగవంతుం డైన
పరమేశ్వరుం డెఱుంగుఁగాని యితరులకుం దెలియ నలవి
గాదు తొల్లి యువకేతుం డనురాజర్షివీర్యంబు జలంబులం
బడినఁ దజ్జలపానం బొనరించి యొక్కకన్యక గర్భంబు ధరి
యించె విభాండకమహామునీంద్రుశుక్లంబు పానంబు సేసి
యొక్కహరిణి గర్భంబు దాల్చి ఋశ్యశృంగుం డనుమహా
మునిం గాంచె సురాష్ట్రుం డనురాజుదేహంబు స్పృశియించి
యొక్కకురంగి గర్భిణియై తామసుం డనుమనువుం బడసె
నిత్తెఱంగున నుపరిచరుం డగువసురాజవీర్యంబు యమునా
జలంబులం బడిన నం దొక్కమత్స్యంబు ద్రావుటం జేసి
తద్గర్భంబున సత్యవతి సంభవించె మహిషీగర్భంబున
మహిషాసురుండు జనియించె సత్యపురంబునం గల్గునారీ
జనంబు లొక్కకారణంబున గర్భము దాల్చిరి. వసుదేవ
సమాగమంబు లేక రోహిణీదేవి గర్భంబు దాల్చి బల
భద్రునిం గాంచె జాంబవతీనందనుం డైనసాంబునిజఠరం
బున మహర్షిశాపంబునం జేసి యొక్కముసలం బుద్భవించె

యువనాశ్వుం డనురాజు మునీంద్రాభిమంత్రితంబు లైన
జలంబులు ద్రావ తద్గర్భంబున మాంధాత యనురా జుద్భ
వించెఁ గావున నివ్వనితయు వారలయట్ల మహావ్రతప్రభా
వంబువలనను మహర్షిపాదసేవనంబువలనను ననిందితంబైన
గర్భంబుఁ దాల్పఁబోలు దీనికి సంశయింప వలవ దేత
ద్గర్భలక్షణంబు నారీజనంబులు రహస్యంబుగా నడిగిన
నీయర్థంబు విస్పష్టం బగు నని పలికిన నావృద్ధబ్రాహ్మణువచ
నంబులకు సమ్మతించి యోషిజ్జనంబు లేకాంతంబుగా నాశా
రదావధూటి సాంత్వనవచనంబుల నాశ్వాసించి యి ట్లనిరి.

154


ఆ.

పురుషసంగమమునఁ బొలఁతులు గర్భంబుఁ
దాల్చుచుందు రెపుడు ధాత్రియందుఁ
బురుషహీన వగుచుఁ బొందుగా గర్భణి
వగుట కేమి హేతు వంబుజాక్షి.

155


క.

లోకంబులోన నిట్టి వ
నేకంబులు గలవు దలఁప నిది యబ్బురమే
యేకాంతభావ మొప్పఁగ
నోకోమలి మాకుఁ దెలుపు ముల్లం బలరన్.

156


సీ.

అనిన శారద యిట్టులనిన వారలతోడ
       వినుఁ డొకదినమున విప్రవరుఁడు
జాత్యంధుఁ డైనట్టిసంయమి చనుదెంచి
       యస్మత్కృతార్చన కాత్మనలరి
మాంగల్యవతి వగు మని పల్కి యటమీఁద
       నాదువృత్తాంతమంతయును దెలిసి

తనవచనంబు దథ్యంబు సేయఁదలంచి
         రంజిల్లు గౌరీశ్వరవ్రతంబు


తే.

సేయ నియమించె నట్ల నేఁ జేయుచుండ
నంత గౌరి ప్రసన్నయై యానతిచ్చె
వత్స త్వత్పూర్వభవపతిస్వప్నసంగ
మంబున జనించు నీకుఁ గుమారుఁ డనుచు.

157


తే.

ఇదియ మామకవృత్తాంత మింతకన్న
నన్య మొక్కటి యెఱుఁగ నోయతివలార
సకలమునకును భగవంతుఁ డొకఁడె సాక్షి
యితరజనులకు నీయర్థ మెఱుఁగ నగునె.

158


క.

అని శారద వచియించిన
విని యందఱు నిది దలంప విధికృత మనుచున్
ఘనసంశయవిరహితు లై
చనిరి నిజస్థానములకు సమ్మదలీలన్.

159


వ.

అంత.

160


క.

పదియగునెల నాశారద
సదమలగుణహారు వేదశాస్త్రవిచారున్
మదమాత్సర్యవిదూరు
న్మదననిభాకారు నొకకుమారునిఁ గాంచెన్.

161


వ.

అంత నవ్వనితయుఁ బితృసోదరమాతృబంధుమిత్రసమేతం
బుగా నాత్మనందను నుపలాలనం బొనర్చుచు సుఖంబున
నుండునెడఁ గొన్నిదినంబులకు నొక్కపర్వకాలంబున గోకర్ణ
క్షేత్రమునకుఁ బ్రాగ్దక్షిణపశ్చిమోత్తరదేశంబులం గల్గు
సమస్తజనంబులుం జనుదెంచుచున్నయెడ నాశారదయుఁ

గుమారపిత్రాదిసహితంబుగా నాస్థలంబునకుం జని యందు
స్నానదానాదికంబుల రుద్రాభిషేకపూజామహోత్సవంబుల
భూసురసమారాధనంబులం గొంతప్రొద్దు గడపి యొక్క
మంటపప్రదేశంబునఁ గూర్చుండి సకలప్రజాసందర్శనంబు
గావింపుచుండునెడ నచ్చటికి దైవవశంబున మున్ను ప్రతి
రాత్రియందు స్వప్నసమయంబునం గానంబడుచున్న
పాండ్యదేశసమాగతబ్రాహ్మణునిం గాంచి భవాంతరనిజ
వల్లభుండు గావలయు నని సంశయావిష్టచిత్తయై తదేక
ధ్యానమున నిరీక్షించుచుండ నాసమయమున నాభూసుర
శ్రేష్ఠుం డమ్మానినిం గనుంగొని తనకు సార్వకాలమును
స్వప్నసమాగమం బొనరించునింతి యిదియ కావలయు నని
మనమున సందేహింపుచు నాకామిని ముఖలక్షణంబులు
నిరీక్షింపుచుఁ దత్సమీపంబునకు వచ్చి యక్కోమలితో
ని ట్లనియె.

162


క.

మదిరాక్షి నీస్థలం బె
య్యది నీతలిదండ్రు లెవ్వ రభిధానం బె
య్యది యీబాలకుఁ డెవ్వఁడు
హృదయేశ్వరుఁ డెవఁడు నుడువు మింతయుఁ దెలియన్.

163


మ.

అనిన న్శారద యాద్విజేంద్రునకు నాద్యంతంబుగాఁ బాష్పలో
చన యై యాత్మకథానులాపములు లజ్జానమ్రవక్త్రంబుతో
వినుపింప న్విని యెంతకష్ట మనుచు న్విప్రుండు కారుణ్యమున్
జనియింపం దలయూఁచి సస్మితముగాఁ జంద్రాస్యతో నిట్లనున్.

164


ఆ.

వనిత నీవివాహదినము దప్పకయుండ
నీవిభుండు దీర్ఘనిద్రఁ జెందె

నీకుమారతిలక మెట్లు నీకు జనించెఁ
దెలియఁ బలుకవలయు దీనివిధము.

165


క.

అని పరిహాసముగాఁ బలి
కిన విప్రునివాక్య మాలకింపుచు లజ్జా
వనతాస్య యగుచు నప్పుడు
వనితామణి యూరకుండె వచనరహితయై.

166


సీ.

ఇవ్విధంబున నుండి యెలనాఁగ యొక్కింత
        తడవు విచారించి ధైర్యమూఁది
యాభూమిసురున కి ట్లని పల్కె నప్పు డో
        యనఘ నీ విట్లు న న్నడుగ నేల
నను నీ వెఱుంగుదు నిను నే నెఱుంగుదు
        మనల కిర్వురకును మనసు సాక్షి
సంతతం బగుస్వప్నసమయంబునందుల
        నన్యోన్యసౌహార్ద మలరుచుండ


తే.

నుదయమందెను శారదేయుం డనంగ
ధీరుఁ డితఁ డని సర్వంబుఁ దెలియఁబల్కి
తద్వ్రతఫలంబులోన నర్ధం బొసంగి
నిజతనూభవు నిచ్చె నాద్విజున కపుడు.

167


ఉ.

భూసురశేఖరుండు నిజపుత్త్రకుఁ గౌఁగిట గారవించి సం
త్రాసములేక దానితలిదండ్రులచేత ననుజ్ఞ గాంచి సో
త్ప్రాసము మీర ధాతృలిఖితంబు యథాస్థితిఁ దప్పకుండఁగా
నాసతిఁ జెట్టఁబట్టుకొని యాత్మపురంబున కేఁగె లీలతోన్.

168


మత్తకోకిల.

ఇత్తెఱంగున నద్ధరామరుఁ డింటికిం జనుదెంచి య

మ్మత్తకాశిని నాత్మగేహినిమాడ్కి నెమ్మది నెంచుచున్
నృత్తగీతకళాదివిద్యల నెమ్మిఁ గాలముఁ బుచ్చుచున్
జిత్తసంభవకేళిఁ దేల్చె విచిత్రబంధము లొప్పఁగన్.

169


వ.

ఇవ్విధమున నాదంపతు లశ్రాంతరతికాములై రతికాముల
చందమునం బ్రవర్తింపుచు ననేకసంవత్సరములు భూతల
మున యథేష్టభోగము లనుభవింపుచుండిరి యంతఁ గొంత
కాలమున కావిప్రుండు విగతజీవుం డైన నతనితోడ
నాశారదయు ననుగమనంబు గావించెఁ దదనంతరం
బయ్యిరువురు దివ్యదేహములు ధరియించి విమానా
రూఢులై శివలోకమునకుం జని సుఖమున నుండి రని చెప్పి
సూతుం డమ్మునీంద్రుల కి ట్లనియె.

170


చ.

యతివరులార భక్తివినయంబులు మీఱ నుమామహేశ్వర
వ్రతకథ యెవ్వరేనియును వ్రాసిన విన్నఁ బఠించినంత సం
తతబహుపుత్త్రపౌత్రధనధాన్యచిరాయురుపేతులై విని
ర్గతభయశోక మైనగరకంఠనివాసముఁ గాంతు రెప్పుడున్.

171

రుద్రాక్షమహత్త్వము

ఉ.

అక్షయభోగదాయక మఘాపహరంబు శుభప్రదంబు ఫా
లాక్షమనఃప్రియంబు సకలద్విజబృందనిమేషణార్హమున్
మోక్షఫలప్రదంబును సముజ్జ్వలగాత్రపవిత్ర మైనరు
ద్రాక్షమహత్వ మెన్నెదను దాపసులార వినుండు వేడ్కతోన్.

172


క.

రుద్రాక్షవిభూషితు లగు
భద్రాత్ములు నిష్కళంకభాగ్యాన్వితు లై
యద్రిసుతావిభుకృప నిరు
పద్రవులై యుందు రెపుడు ప్రజలు నుతింపన్.

173

ఆ.

భక్తిరహితుఁ డైన భక్తియుక్తుం డైన
నిర్మలాత్ముఁ డైన నీచుఁ డైన
భద్రఫలద మైన రుద్రాక్షము ధరించి
పాపచయమువలనఁ బాయు నరుఁడు.

174


సీ.

వేయురుద్రాక్షము ల్కాయంబున ధరింపఁ
       బ్రణమిల్లుచుండు దేవవ్రజంబు
పదియాఱు పదియాఱు బాహుయుగ్మములందు
       సికయందు రుద్రాక్ష మొకటిఁ జేర్చి
కరమున నఱువది కరములఁ బండ్రెండు
        నొక్కటొక్కటి గర్ణయుగమునందు
నతులితాష్టోత్తరశతము వక్షమునందు
        ధరియించెనేని శంకరునిపోల్కిఁ


తే.

బూజితుండగు మనుజుండు దేజ మలరఁ
గనకముక్తాప్రవాళార్కకలిత మైన
విమలరుద్రాక్షసరము కంఠమునఁ దాల్చి
నరుఁడు బ్రత్యక్షశివుఁడన ధరణి వెలయు.

175


సీ.

మంత్రంబు రుద్రాక్షమాలిక గణియింప
        జప మొక్కటి యనంతసౌఖ్య మొసఁగుఁ
దలను రుద్రాక్షంబు దాల్చి మజ్జనమాడ
        సమకూఱు జాహ్నవీస్నానఫలము
రుద్రాక్షధారిమర్త్యుని జెంద వఘములు
        కమలబాంధవుని చీఁకట్లకరణి
రుద్రాక్షధరుఁడు దరిద్రుఁడైనను మహా
        సామ్రాజ్యయోగనిశ్చలతఁ జెందు

ఆ.

రుద్రరూపమైన రుద్రాక్షమును విమ
లాంబుబిందుసేచనంబుఁ దక్కఁ
బుష్పగంధములను బూజించిరేనియు
శివసమర్చనంబు సేసినటుల.

176


క.

ఏకత్రిపంచసప్తన
వైకాదశబహుముఖముల నెసఁగుచు నుండున్
శ్రీకరరుద్రాక్షంబులు
శ్రీకంఠమయంబు లగుట సిద్ధం బరయన్.

177


క.

ఇందుల కొకయితిహాసం
బిందుకళాధరుహితం బభీష్టప్రద మా
నందకరం బగునది మీ
సందేహము పాయ వినుఁడు సన్మునులారా.

178


సీ.

శ్రీసింధుమేఖలాసీమంతరత్నమై
       దీపించు కాశ్మీరదేశమునను
భద్రసేనుం డనుపార్థివోత్తముఁ డుండు
       సకలప్రజానురంజనకరుండు
అమ్మహీవిభునకు నాత్మజుం డుదయించెఁ
       దరణితేజుండు సుధర్ముఁ డనఁగ
మఱియు నారాజసుమంత్రికి నందనుం
       డొకరుఁడు గలఁడు దారకుఁ డనంగ


తే.

వార లిరువురు బాల్యభావమునఁ జేసి
శయనపానాన్నభోజనసమయములను
శాస్త్రపఠనాదివిద్యాప్రసంగములను
జోడువాయక యుందురు వేడుకలర.

179

మ.

రణదుద్యన్మణిదీప్యమానకనకగ్రైవేయకోటీరకం
కణహారాంగదనూపురాదుల నలంకారంబు గావించినన్
క్షణమాత్రంబునఁ బాయఁద్రోచి కడువేడ్క ల్మీఱ రుద్రాక్షభూ
షణము ల్దాల్తురు వారలిర్వురు మహోత్సాహంబు దీపింపఁగన్.

180


క.

అక్షీణకృపాకలితక
టాక్షములఁ దదీయజనకు లనురాగమునన్
శిక్షించిన విడువక రు
ద్రాక్షతతు ల్దాల్తు రెపుడుఁ దన్మాణవకుల్.

181

పరాశరుండు భద్రసేనుసభకు వచ్చుట

తే.

అంతఁ గొన్నిదినంబుల కరుగుదెంచె
ముదము దోఁపఁ బరాశరమునివరుండు
భద్రమతి భద్రసేనభూపాలుసభకు
వాసవునిఁ జేర గురుఁడు విచ్చేసినట్లు.

182


క.

ఎదురేఁగి మ్రొక్కి భూపతి
ముదమున నర్ఘ్యాదివిధుల మునిసుత్రామున్
సదమలమతిఁ బూజించెను
మృదుతరగంభీరమధురమితవచనుం డై.

183


తే.

ఇట్లు పూజించి యమ్మానవేశ్వరుండు
విమలమణిమయకనకపీఠమున నునిచి
కుశలసంప్రశ్న మొనరించి కొన్నివార్త
లడిగి ప్రస్తావమున మౌని కనియెఁ బ్రీతి.

184


వ.

మునీంద్రా మదీయనందనుం డైనసుధర్ముండు నస్మత్ప్రధాని
కుమారుం డయినతారకుండను వీర లిరువురు బాలకులు
మణిమయాభరణంబులు విసర్జించి రుద్రాక్షభూషణాలంకృత

శరీరులై యుండుదురు వీర లిట్లుండుట కెద్దిహేతువు సర్వ
జ్ఞులు త్రికాలజ్ఞులు నైనమీర లీయర్థంబు సవిస్తరముగా
మాకుం దెలుపవలయు నని యడిగిన భద్రసేనభూపాలు
నకుఁ బరాశరమహామునీంద్రుం డి ట్లనియె.

185

పరాశరుండు సుధర్మతారకులవృత్తాంతంబు దెలిపెడుకథ

క.

జననాథ విను భవన్నం
దనవరయుష్మత్ప్రధానతనయులగుణముల్
ఘనచరితంబులు దెలియఁగ
వినుపించెద వీరిపూర్వవృత్తాంతంబుల్.

186


క.

నందిగ్రామం బనుపుర
మందముగా నుండు కోసలావని సతతం
బందుండు నొక్కతె మనో
నందిని యనువారవనిత నవయౌవన యై.

187


సీ.

చతురంతయానము ల్చామరఛత్రము
       ల్భాసురతరములౌ పాదుకలును
లాలితామూల్యదుకూలాంబరంబులుఁ
       దపనీయపర్యంకతల్పములును
జిత్రమాల్యములు దాసీదాసజనములు
       గోమహిష్యాదికస్తోమములును
కర్పూరమృగమదగంధలేపనములు
       మణికాంచనవిరాజమానగృహము


తే.

భూషణంబులు మృష్టాన్నభోజనంబు
నప్రమేయధనంబు ధాన్యాదికములు
గలిగి పరిపూర్ణభోగభాగ్యముల వెలయు

శంబరాంతకఘోటి వేశ్యావధూటి.

188


మ.

శివనామస్తవమున్ శివార్చనములున్ శ్రీకంఠసంసేవయు
న్శివభక్తాంఘ్రిసరోజవందనములున్శీలంబు ధర్మంబు స
త్యవచోరక్తియు విప్రభక్తియును సౌహార్దం బొగిం గల్గియ
య్యువతీరత్నము కామచారిణియునై యుండు న్బ్రమోదంబునన్.

189


క.

తలపొడవు ధన మొసంగిన
పలుగాకులతోడ మద్యపానీయులతోఁ
గులహీనులతోడను రతి
సలుపదు తద్వారకాంత స్వప్నమునందున్.

190

కుక్కుటకథనము

క.

అక్కామిని క్రీడార్థము
మక్కువతోఁ బెనిచె నొక్కమర్కటవరమున్
గుక్కుటమును దద్ద్వితయం
బక్కజముగ నింతిమ్రోల నాడుచు నుండున్.

191


తే.

వానరమునకు రుద్రాక్షవలయహార
కంకణాంగదముద్రికాకర్ణకుండ
లాద్యలంకారము లొసంగి యబల యొకటి
చూళికను గట్టె నలతామ్రచూడముగను.

192


చ.

అనిశము తద్విలాసవతి యాప్తులు గొల్వఁగ నాట్యమంటపం
బున కరుదెంచి వాద్యరవము ల్చెలఁగ న్నటియింపుచుండఁగాఁ
గనుఁగొని యభ్యసించి కుతుకం బలరం గమనీయగీతన
ర్తనములు సల్పుచుండుదురు దారును వారును తామ్రచూడముల్.

193


వ.

ఇవ్విధంబున నవ్వారాంగనారత్నం బనేకవిధములం గ్రీడిం
పుచు నభీష్టభోగంబు లనుభవింపుచుండు నంతటఁ గొన్నిదిన

ములకు భూతిత్రిపుండ్రరుద్రాక్షమాలికాధారణుండును
జటిలుండును ప్రకోష్ఠభాగప్రదీపితమణికంకణుండును మహా
ధనికుండును శివవ్రతుండును నగు నొక్క వైశ్యుండు
రంభాసమాగమంబునకుం జనుదెంచు నలకూబరువిధమునఁ
దద్గృహమునకు వచ్చినం గని యతని నర్ఘ్యపాద్యాది
సత్కారముల సంతుష్టుం గావించి సాదరముగాఁ బీఠమునఁ
గూర్చుండ నియమించి సరసానులాపములం గొంతప్రొద్దు
పుచ్చి వెండియుఁ బరిహాసమ్ము దోఁప నవ్వారకామిని యి
ట్లనియె.

194

వేశ్యావైశ్యసంవాదము

క.

శంకరునిభుఁడవు భూషా
లంకృతదేహుఁడవు భద్రలక్షణుఁడవు నా
మాంకంబుగ ముంజేతను
గంకణము ధరింప నేమి కారణ మధిపా.

195


క.

నీ కేటికి వైశ్యోత్తమ
యీకంకణరాజ మిమ్ము హితమతి వెలయన్
నాకభిమతమై యున్నది
వీకన్ ధరియింతు లోకవిఖ్యాతముగన్.

196


చ.

అన విని వైశ్యుఁ డిట్లనియె నంబుజలోచన నాదుకంకణం
బనుపమరత్నసంయుత మనర్ఘ్యము గావున దీనిమూల్య మెం
తని వచియింపఁగాఁ దగు మహాధనకోటిశతంబు లిచ్చి నీ
మన మలరన్ ధరింపు మిఁక మచ్చికతోడుత నీ కొసంగెదన్.

197


మ.

అనిన న్వారవధూటి యిట్లనియె వైశ్యాధీశ మీబోంట్లకుం
జనునే వేశ్యల కిచ్చిమూల్య మడుగన్ సంభోగవాంఛారతిన్

ధనరత్నాభరణాదు లిచ్చు టరుదే ధన్యుండ వీ వట్లుగా
వున నీకంకణమిచ్చి చిత్త మలరన్‌ భోగింపు మత్యాదృతిన్.

198


వ.

అనిన విని వైశ్యుఁ డిట్లనియె.

199


చ.

విను హరిణాక్షి యిద్ధరను వేడుకకు న్వెలలేదు గావున
న్గొను మిదె రత్నకంకణముఁ గూరిమి నిచ్చెదనైన దీనికిన్
దినములసంఖ్య దెల్పుము మదీయమనోరథసిద్ధికై యన
న్విని కలకంఠి పల్కె పృథివీస్పృశుఁ జూచి గభీరభాషలన్.

200


తే.

యామినీత్రయపర్యంత మాత్మనాథ
నాదుదేహంబు భవదధీనం బొనర్తు
సత్య మీపల్కు దీనికి సాక్షు లర్క
చంద్రులని చాటి చెప్పె నాచంద్రవదన.

201


క.

విహితక్రియ వర్తింతును
సహధర్మిణి నగుదు నంచు సమ్మతముగ న
మ్మహిళారత్నము వైశ్యుని
మహితోరఃస్థలము ముట్టె మమత దలిర్పన్.

202


సీ.

అప్పుడు పల్లవుం డైన వైశ్యాగ్రణి
        కాంతకు రత్నకంకణ మొసంగి
మఱియును దా నొక్కమణిమయలింగంబు
        నతిగోప్యముగ దాఁచు మనుచు నిచ్చె
నెప్పుడు భిన్న మౌ నిమ్మహాలింగంబు
        నప్పుడు విడుతుఁ బ్రాణానలముల
నని వచించిన నట్ల యగునంచు నాట్యమం
        టపమున నొక్కచో డాచి వచ్చి


తే.

యాలయంబున కేఁగి మృష్టాన్నపాన

ములను బరితుష్టిఁ బొంది నిర్మలసువర్ణ
తల్పముల వైశ్యవిటుఁడును దానుఁ గూడి
పంచశరకేళి నటు పవ్వళించియుండె.

203


క.

ఈరీతిని శయనింపఁగ
నారేయి నహేతుకముగ నగ్నిజ్వాలా
ఘోరంబై యల నాట్యా
గారము సందగ్ధమయ్యెఁ గర్మానుగతిన్.

204


ఆ.

అంత వారకాంత యచ్చటి కేతెంచి
చిత్తసాధ్వసంబుఁ జెందియున్న
కీశకుక్కుటముల పాశంబు లూడ్చిన
బంధముక్తి దనరఁ బరచె నవియు.

205


సీ.

స్తంభంబుతోడ నిర్దగ్ధమై శకలీకృ
        తం బైన రత్నలింగంబుఁ గాంచి
వైశ్యుండు వేశ్యయు వ్యధఁ జెంది రప్పు డ
        య్యతివకు నాతఁ డిట్లనుచుఁ బలికె
నంగన విను శివలింగంబు నిర్భిన్న
        మైయుండ జీవించు టర్హమగునె
కావున నీదు కింకరుల నియోగించు
        చితిసేయఁ బంపుము సిద్ధముగను


తే.

నిప్పు డఖిలామరులును బ్రహ్మేంద్రవిష్ణు
లాదిగా వచ్చి వలవదటన్న వినక
నభవు మది నిల్పి దహనంబునందుఁ జొచ్చి
యిపుడ ప్రాణపరిత్యాగ మాచరింతు.

206

వ.

ఇట్లు దృఢనిశ్చయుం డై యున్న యతనియభిప్రాయం
బెఱిఁగి యవ్వేశ్యయుఁ బురబాహ్యప్రదేశంబునఁ జితి
గావించిన నవ్వైశ్యుండు సూర్యోదయానంతరంబునఁ గాల్య
కరణీయంబులు నిర్వర్తించి యచ్చటికిం జనుదెంచి శంకర
పదధ్యానం బొనరింపుచుఁ బ్రజ్వలితాగ్నికిఁ బ్రదక్షిణత్రయం
బొనరించి సకలజనంబులు కనుంగొనుచుండ నందుఁ
బ్రవేశించె నంత నవ్వనితయుఁ దన్మరణంబునకు బాష్ప
పూరితలోచన యై నిర్వేదించి నిర్మలం బయినధర్మంబు
మనంబున విచారించి తాను నవ్వైశ్యునితోడ ననుగమ
నంబుఁ జేయుదునని నిశ్చయించి నిజబంధుజనంబుల నవ
లోకించి యి ట్లనియె.

207


తే.

ఇతనిచే రత్నకంకణ మే గ్రహించు
సమయమున సూర్యచంద్రైకసాక్షికముగ
బాస యిచ్చితి నే నీకు భార్య నగుదు
మూఁడహోరాత్రములటంచు ముదితలార.

208


క.

కావున దైవవశంబున
నీవైశ్యుఁడు మృతిని బొందె నిపు డట్టుల నీ
పావకుముఖమున నేనును
నావల్లభుతోడఁ గూడ నరిగెద ననినన్.

209


వ.

అపుడు వార లి ట్లనిరి.

210


మ.

తగునే వారవధూటికి న్విటులతోఁ దా వహ్ని సొత్తేరఁగా
నగరే తోడికులాంగనామణులు విన్నం బూర్వ మేదైన ని
జ్జగతిన్ బెద్దలు చెప్పఁగా వినము నీచారిత్ర మత్యద్భుతం
బగు నోహో యిఁకఁ జాలు నెక్కడివి వేశ్యాస్త్రీలకున్‌ సత్యముల్.

211

మ.

విటుల న్మచ్చిక చేసి మైత్రి మెఱయ న్విత్తంబు లార్జించుటో
ఘటికాసిద్ధియు మంత్రసిద్ధి యనురక్తు ల్మీఱ సాధించుటో
స్ఫుటవీణాదికహృద్యవాద్యముల నేప్రొద్దు న్విచారించుటో
చటులజ్వాలకృశానునందుఁ జొర వేశ్యాస్త్రీలకున్ ధర్మమే.

212


క.

అని పలికిన బాంధవులం
గనుఁగొని యక్కాంత యనియెఁ గలలో నైనం
జనునే బొంకులు పలుకఁగఁ
దనువులు నర్థములు సిరియుఁ దగు నిత్యములే.

213


తే.

సత్యభాషణ మిహపరసాధకంబు
సత్యవాక్యంబు ధర్మంబు జయకరంబు
సత్యమున సర్వశుభములు సంఘటిల్లుఁ
గాన సత్యంబు జనులకుఁ గలుగవలయు.

214


క.

రవి పడమట నుదయించినఁ
గువలయబంధుఁడు మహోష్ణగుణుఁడై యున్నన్
భువిపైఁ దారలు డుల్లినఁ
బ్రవిమలసత్యోక్తి విడువ భామినులారా.

215


వ.

అని యిట్లు దృఢనిశ్చయంబుగాఁ బలికి బాంధవజనముల
నొడంబఱిచి యవ్వారకామిని యాక్షణమున మంగళ
స్నానము గావించి జంబూనదాంబరయుగ్మధారిణియై హరి
ద్రాంజనసిందూరకాదులు ధరియించి పురంబునం గల
బ్రాహ్మణోత్తముల రావించి తనగృహమునం గల ధనకనక
వాహనంబులును నమూల్యకాంచనమణిమయాభరణ
ములు ననేకగోమహిషశిబికాసనశయ్యాప్రముఖసర్వ
వస్తువులును వారలకు సమర్పించి పరమేశ్వరధ్యానంబుఁ

గావింపుచు హుతాశనునకుఁ ద్రివారముగాఁ బ్రదక్షిణ
నమస్కారంబు లాచరించి భూసురోత్తములకుం బ్రణమిల్లి
పౌరజానపదవర్గంబు లాబాలవృద్ధంబుగా నిరీక్షింపుచుండ
ముకుళీకృతకరకమలయై దహనంబునం బ్రవేశించుసమయం
బున.

216

మనోరంజనికి సాంబమూర్తి ప్రత్యక్షంబగుట

మ.

ధవళాంగుండు శశాంకశేఖరుఁడు భక్తత్రాణపారీణుఁ డిం
ద్రవిరించ్యాదులు చుట్టుఁ గొల్వ వృషభోద్యద్వాహనారూఢుఁ డై
భువియు న్నింగియు వెల్గుచుండ గిరిరాట్పుత్రీసమేతంబుగా
శివుఁ డేతెంచి కరంబుఁ బట్టి తిగిచెన్ శీఘ్రంబు వారాంగనన్.

217


వ.

అంత.

218


శా.

ఆవేశ్యాంగన ఫాలలోచను శశాంకాదిత్యకోటిప్రభున్
దేవర్షిస్తవనీయపాదకమలున్ దేదీప్యమానాంగునిన్
భావాతీతచరిత్రుఁ గాంచి విలసద్భక్తిన్ బ్రణామంబులన్
సేవ ల్సేయుచునుండె భీత యగుచున్ జిత్తంబు రంజిల్లఁగన్.

219


సీ.

అంత నాపరమేశుఁ డయ్యింతిఁ గనుఁగొని
       పలికెఁ గారుణ్యార్ద్రభావమునను
నీదుధర్మమ్మును నిర్మలజ్ఞానంబు
       సత్యంబు దృఢభక్తిసౌష్ఠవంబు
శీలంబుఁ దగఁ బరీక్షించుటకై యేను
       వైశ్యరూపముఁ బూని వచ్చి తబల
మంటపదాహంబు మణిలింగభిన్నంబు
       నింతయు నామాయ యెంచిచూడ

తే.

నిన్ను మెచ్చితిఁ గోరుము నీకు వలయు
నట్టివరము లొసంగెద నాదరమున
నాయురారోగ్యభాగ్యసౌఖ్యాదికముల
ననిన హరుఁ జూచి పలికె నయ్యంబుజాక్షి.

220


తే.

వేవ తావకపదయుగసేవ దక్క
నన్యవర మొల్ల మఱి త్రిలోకాధిపత్య
మైన నటుగాక బంధుమిత్రాదులకును
దనకుఁ గైవల్య మొసఁగు నిస్తంద్రతేజ.

221


చ.

అన విని యమ్మహాత్ముఁడు దయారస ముప్పతిలంగఁ బల్కె నో
వనజదళాక్షి బంధుపరివారయుతంబుగ దివ్యపుష్పకం
బున వసియింపుమన్న విరిబోణియు నట్ల యొనర్చి వేడుకన్
జని పరమేశలోకమున సంతసమందుచు నుండె నంతటన్.

222


క.

జననాథ దగ్ధమంటప
మున నుండక వెడలి దూరముగ నరిగిన య
వ్వనచరము నీతనూజుఁడు
దనరఁగఁ గుక్కుటము మంత్రితనయుం డయ్యెన్.

223


క.

అరయఁగ నీబాలకులకు
మురువుగఁ దమపూర్వజన్మమున రుద్రాక్షా
భరణములు దాల్చుకతమున
హరుకృప నుత్తమకులోదయము గల్గె నృపా.

224


వ.

అని యివ్విధమునఁ దెలియఁబలికిన నమృతోపమానము
లగు పరాశరమహామునీంద్రువచనము లాకర్ణించి సంతుష్ట
హృదయుండై భద్రసేనమహీనాథుం డమ్మహాత్మునితో
వెండియు ని ట్లనియె.

225

క.

మునినాథ భవద్దర్శన
మున నజ్ఞానంబు పాసె ముక్తి లభించె
న్మన మలరఁగ సత్సంగతి
జనవితతికిఁ గామధేనుసదృశము గాదే.

226


క.

అటు గావున నే నిఁక నొ
క్కటి యడిగెద నిక్కుమారుకథ తెలియుట కీ
విటమీఁద నితనియాయుః
పటుతరకీర్తిప్రతాపబలములు చెపుమా.

227


వ.

అని యడిగిన నారాజునకు వసిష్ఠపౌత్రుం డి ట్లనియె.

228


ఆ.

వాచ్యమయినపలుకు వచియింపఁగా దగుఁ
బలుకఁ దగనిపలుకు పలుకఁగూడ
దెంతధీరులైన సంతాప మందుదు
రట్లు గాన నిక్క మాడఁ జనదు.

229


క.

అయినను నిష్కపటంబగు
మానసమున నడిగె దీవు మనుజేంద్ర భవ
త్సూనునివార్త యథాస్థితి
యేను వచించెద మదీయహితుఁడవు గానన్.

230


క.

నరవర నీనందనునకుఁ
బరమాయుర్వత్సరములు పండ్రెం డగు ముం
దఱఁగా నష్టమదినమున
మరణము ప్రాపించు నీకుమారున కనఘా.

231


క.

అని నిశ్చయముగఁ బలికిన
మునివచనము కర్ణశూలముగఁ దోఁపఁగ నా
జనపతి భీతాత్మకుఁడై

విని శోకాక్రాంతుఁ డగుచు వివశుం డయ్యెన్.

232


ఆ.

అంత నామునీంద్రుఁ డత్యంతకృపతోడ
నానరేంద్రచంద్రు నాదరించి
వత్స భయముఁ జెందవలవదు విను మింక
హితమృదూక్తు లిప్పు డే వచింతు.

233


క.

వేయేటికి శ్రీరుద్రా
ధ్యాయజపస్నానముల యథావిధి సలుపన్
బాయక నీసుతునకు దీ
ర్ఘాయుర్దాయంబు గల్గు నవనీనాథా.

234


వ.

అని చెప్పిన యమ్మహామునీంద్రునకు నరనాథుం డి ట్లనియె.

235


క.

శ్రీరుద్రాధ్యాయజపం
బేరీతి నొనర్పవలయు నెవ్వరు దైవం
బారయఁ దత్ఫల మెయ్యది
యారూఢిగఁ దెలియఁ బల్కు మాదరమొదవన్.

236


వ.

అని యడిగిన రాజునకు మునీంద్రుం డి ట్లనియె.

237

పరాశరుండు భద్రసేనమహారాజునకు రుద్రాధ్యాయప్రభావం బెఱింగించుట

సీ.

ఆదికాలంబున నభవుఁ డొక్కఁడు దక్క
        నొగి జగంబులు లేక యుండు నంత
నజుఁ డవ్యయుఁడు సచ్చిదానందమయమూర్తి
       యాద్యుఁడు శంకరుం డైనశివుఁడు
తనరజోగుణమున ధాతను నిర్మించె
       సృష్టికార్యం బెల్లఁ జేయుటకును

వేదంబుల నొసంగి వేదార్థసారమై
        యెసఁగు రుద్రాధ్యాయ మిచ్చెనపుడు


తే.

అమ్మహాధ్యాయమును బూర్వులైనమునులు
భృగుమరీచ్యత్రిముఖులు సంప్రీతి దోఁప
నభ్యసించిరి వారలయనుమతమున
సంగ్రహించిరి భువిలోనిసకలబుధులు.

238


మ.

ధరణీనాథ తదీయశిష్యసుతసంతానోపదేశంబులన్
ధరణింగల్గిన మానవోత్తములు రుద్రాధ్యాయపాఠంబునన్
దురితోచ్చాటనదక్షులై మఱియు నిర్దుష్టాత్ములైయుండఁగా
నరకావాసము శూన్యమైనఁ గని కీనాశుండు దైన్యంబునన్.

239

యముండు బ్రహ్మసభకుఁ బోవుట

క.

ఆనలినజుసన్నిధికిని
భానుసుతుం డరిగి భక్తిఁ బ్రణమిల్లుచుఁ ద
న్మానసమునఁ గృప దోఁపఁగ
దీనోక్తులఁ బలికె నిట్లు దివిజులు వినఁగన్.

240


సీ.

ఓపద్మగర్భ నే నొకవార్త వినుపింతు
       నది యథార్థంబు మహాద్భుతంబు
నరులు రుద్రాధ్యాయనిరతు లై యనిశంబు
       విగతదోషులును బవిత్రచరితు
లగుచు దీర్ఘాయుష్కులై సుఖంబుననుండి
       కడపట శంకరుకరుణచేత
సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య
       ముక్తులు గాంతురు ముదము వెలయ


ఆ.

నస్మదీయలోక మంతయు శూన్యమై

కాంతిరహిత మగుచుఁ గానఁబడియె
నిష్ప్రయోజనతను నే నెట్లు వసియింతు
దీని కొకయుపాయ మానతిమ్ము.

241


క.

చిత్రుఁడును జిత్రగుప్తుఁడు
పత్రంబులు గట్టి మూలఁ బడవైచిరి హృ
చ్చిత్రంబుగ మద్భృత్యులు
సత్రపులై యుందు రాత్మసదనములందున్.

242


సీ.

బ్రహ్మఘ్నులును సురాపాయులు కాంచన
       తస్కరు ల్వనగృహదాహకులును
ధర్మహీనులును గృతఘ్నులు పుష్పిణీ
       గమనులు విశ్వాసఘాతకులును
గుటిలవంచకఖలక్రూరపాతకులును
      వేదాన్నకన్యకావిక్రయులును
హరిహరద్వేషులు నాత్మకర్మత్యాగు
      లత్యహంకారాత్ము లాదియైన


తే.

జనులు నిరతంబు మత్పురంబునకు వచ్చి
యుండుదురు కోటిసంఖ్యల నుత్కటముగ
నట్టిపురమున కిపు డొక్కఁడైనఁ జేరఁ
డేమనుచు విన్నవింతు నే నోమహాత్మ.

243


వ.

అని విన్నవించిన సమవర్తికిఁ బరమేష్టి యి ట్లనియె.

244


మ.

అరుదై పొల్తు రవిద్యకుం దుహితలై యశ్రద్ధయు న్మందతా
కరదుర్మేధయు వీర లిర్వురు దగన్ క్ష్మాలోకముం జేరి యా
నరసంఘంబులచిత్తము ల్చలన మందం జేతు రట్లైన య
న్నరకస్థానము పూర్ణమై వెలయు సంతాపంబు నీ కేటికిన్.

245

క.

అని పలికి కమలగర్భుం
డిననందను వీడుకొలిపి హితము దలిర్ప
న్మన మలరఁగ నయ్యిరువుర
కనుమతి గావించి పనిచె నవనీస్థలికిన్.

246


ఆ.

అట్లు గాన నరుల కశ్రద్ధతోఁ జేయు
నిఖిలకార్యములును నిష్ఫలములు
శ్రద్ధతో నొనర్చు జపతపఃపూజాది
సకలధర్మచయము సత్ఫలంబు.

247


క.

ఇది ముఖ్యం బగుమంత్రం
బిది పరమం బైనతపము నిది సర్వసుఖా
స్పద మిదియె ముక్తిసాధన
మిది బహుపాతకహరంబు నెల్లజనులకున్.

248


వ.

అట్లు గావున.

249


శా.

రుద్రాధ్యాయపరాయణుండు ఫణిహారున్ సచ్చిదాకారునిన్
రుద్రు న్నద్యుదకాభిషిక్తునిగ నిర్దోషస్థితిం జేసి ని
ర్నిద్రప్రజ్ఞఁ దదంబుమజ్జనముఁ దా నిత్యంబు గావింపఁగా
భద్రారోగ్యచిరాయురున్నతలు సంభావించు నెల్లప్పుడున్.

250


వ.

అని యానతిచ్చి వెండియు ని ట్లనియె.

251


చ.

అనఘులు శాంతమానసులు నాగమవేదులు సంశితవ్రతుల్
ఘనతరశైవసూక్తము లఖండితవృత్తి నెఱుంగునట్టిస
న్మునులు జపంబు చేసిన నమోఘతదీయతపోవిభూతిచే
జనవర నీతనూభవుఁ డజస్రశుభంబులు పొందియుండెడున్.

252


తే.

ఇట్లు నియమించినట్టి మునీశ్వరునకు
నమ్మహీపతి వందన మాచరించి

యిమ్మహాకార్యమంతయు హితము మెఱయ
నిచట మీ రుండి తగ నిర్వహింపవలయు.

253


మ.

అని ప్రార్థించిన సమ్మతించి కృపతో నాశక్తిపుత్త్రుండు స
న్మునిసంఘంబులఁ బిల్వఁబంచి తగఁ దాను న్వారలం గూడి పెం
పునఁ పుణ్యద్రురసప్రయుక్తకటికంబు న్నిల్పి రుద్రాగమం
బున సంసిక్తునిఁ జేసి రానృపసుతుం బూర్ణప్రభావస్థితిన్.

254


వ.

ఇవ్విధమున నారాజనందనుండు మహామును లభిషేచనము
గావింపుచుండునంత సప్తమదినమ్మున నందఱుఁ గనుం
గొనుచుండ మూర్ఛాగతుండై మహామునీంద్రరక్షితుండు
గావునఁ గ్రమ్మఱఁ గొంతప్రొద్దునకుం దెలిసి వారలం గనుం
గొని యి ట్లనియె మహాత్ములారా వినుండు దీర్ఘదంష్ట్రుం
డును భయానకుండును దండహస్తుండును నైన యొక్క
మహాపురుషుండు వచ్చి పాశబద్ధుం జేసి నన్నుఁ గొనిపోవు
చుండునంత నతండు మహాబలపరాక్రమవంతు లైన
పురుషులచేత బద్ధుండై దూరంబుగాఁ జనినవిధంబునం
గానంబడియె నేనును భవత్కటాక్షప్రభావంబున లబ్ధ
జీవుండ నైతి నని విన్నవించిన ముదంబంది యమ్మహామును
లన్నరేంద్రనందనుం గటాక్షించి యనేకాశీర్వచనంబుల
నభినందించిరి ఆభూపాలుండును నిర్భయుం డై యుండె
నంత.

255


శా.

ఆరాజేంద్రుఁడు సంప్రహృష్టహృదయుండై భూసురేంద్రాళికిన్
భూరిప్రాభవ మొప్ప దక్షిణలు తాంబూలంబులున్‌ హేమవా
సోరత్నాదు లొసంగి బాంధవవయస్యోపేతుఁడై షడ్రసా
హారంబు ల్భుజియించియుండెఁ గొలువై యాస్థానమధ్యంబునన్.

256

భద్రసేనుసభకు నారదమహాముని వచ్చుట

ఉ.

పారదశారదాభ్రహిమభానుసుధాఘనపాండురాజసా
కారుఁడు పాకశాసనముఖత్రిదశస్తుతసచ్చరిత్రుఁడు
న్వారిజగర్భనందనుఁ డవార్యమహామహిమానుభావుఁ డా
నారదమౌని వచ్చె నటనంబులు సల్పుచు వీణె మీటుచున్.

257


తే.

ఇట్లు విచ్చేయుమునిపతి కెదురువచ్చి
యర్ఘ్యపాద్యాదిసత్కృతు లాచరించి
విమలకాంచనపీఠోపవిష్టుఁ జేసి
పలికె నరపాలుఁ డంజలీబద్ధుఁ డగుచు.

258


ఉ.

మీరు మహాతపోధనులు మిత్రసమానులు సర్వలోకసం
చారులు పుణ్యమూర్తులు నిజంబుగ నద్భుత మైనవార్త లే
మారసి చూచి వచ్చితిరొ యంతయు మా కెఱిగింపుమన్న నా
నారదమౌని పల్కె నరనాథునిఁ జూచి విచిత్రవైఖరిన్.

259


సీ.

మునిపుంగవులు నీవు వినుఁడు భూపాలక
        యొకవార్త వినుపింతు నుల్ల మలర
భవదాత్మజుని గతప్రాణునిఁ గావింపఁ
        దలఁచి మృత్యువుతోడ దండధరుఁడు
చనుదెంచి యుండ నాసమయంబున శివుండు
        దెలిసి కోపాగ్నిప్రదీపుఁ డగుచుఁ
దనపుత్త్రు వీరభద్రునిఁ బంప నాతండు
        ప్రమథయుక్తముగ శీఘ్రముగ వచ్చి


తే.

త్వత్సుతాలంబచిత్తుఁ గృతాంతుఁ బట్టి
యాక్షణంబునఁ బెడకేల నంటఁగట్టి

ముష్టినిహతుల నొప్పించి యష్టమూర్తి
సభకు రమ్మని యీడ్చె నిశ్శంకుఁ డగుచు.

260

వీరభద్రయమవివాదము

మత్తకోకిల.

అప్పు డర్కతనూజుఁ డెంతయు నబ్బురంబుగ సాధ్వసం
బుప్పతిల్లఁగ మేను గంపము నొందఁగాఁ బ్రణమిల్లి మా
యప్ప యేమిటి కింతకోప మహీనవిక్రమశీల నా
తప్పు సైఁచుము వీరభద్ర కృతాపరాధుఁడ నెంతయున్.

261


మత్తకోకిల.

ఈనరేంద్రకుమారకుం డిపు డెన్నఁగా గతజీవితుం
డైనవాఁ డటుగాన మృత్యుసహాయతం జనుదెంచితిం
గాని నేరము లేదు న న్నిటు గాసిసేయఁగ నేల యో
దీనరక్షక సోమనందన దేవదేవ జగత్పతీ.

262


క.

అని వేఁడిన రవినందనుఁ
గనుఁగొని హరతనయుఁ డనియెఁ గడువడి మాన్యుం
డనఘాత్ముఁడు శతశతహా
యనజీవితుఁ డతనిఁ ద్రుంప నర్హం బగునే.

263


తే.

నీకు సంశయమైన నోనీరజాప్త
తనయ మీచిత్రగుప్తు రాఁ బనుపు మిటకు
నితఁడు నిజముగఁ బదివేలయేండ్లుఁ బ్రదుకు
రుద్రసూక్తాభిషేచనారూఢుఁ డగుట.

264


క.

అనిన విని చిత్రగుప్తుని
నినతనయుఁడు పిలువనంపి హితమతి నడుగన్
విని యతఁడు వచించెను హా

యనములు పదిరెండు నితని కాయు వటంచున్.

265


వ.

అని విన్నవించిన చిత్రగుప్తుని వచనంబు లాకర్ణించి యవ్వీర
భద్రుండు కృతాంతునిం గనుంగొని యీరాజకుమారుండు
వర్షాయుతప్రమాణజీవితుండు నీ విందులకు సందేహింపవలదు
యీయర్థంబు నీమనంబున దృఢంబుగా నిశ్చయించి క్రమ్మఱ
దశసహస్రవర్షప్రమాణజీవితుంగా లిఖియింపు మని యాన
తిచ్చిన వల్లె యని యమ్మహాదేవువాక్యంబులకు సమ్మతించి
మహాభీతుండై యాశమనుం డన్నరేంద్రనందను మృత్యు
బంధంబువలనఁ బాపి తదాజ్ఞాప్రకారంబున లిఖియింపంజేసి
తానును వీరభద్రుచేత బంధముక్తుం డయి మృత్యుకింకర
సమేతంబుగా నిజలోకంబునకుం జనియె వీరభద్రుండును
బ్రమథగణపరివృతుండై తనలోకంబున కరిగె నేను నీవృత్తాం
తంబంతయుం దెలిసి మీసమీపంబునకు వచ్చితి నని పలికి
వెండియు నారదుం డిట్లనియె.

266


శ.

కదనమున వైరివీరుల
మద మణఁచి భవత్సుతుండు మహి నేలుచుఁ దాఁ
బదివేలేండ్లు వసించును
ముదమున నని చెప్పి చనియె మునివరుఁ డంతన్.

267


క.

ఈరుద్రాక్షమహత్వము
ధీరమతిన్ విన్నజనులు దీర్ఘాయుష్మ
త్త్వారోగ్యభాగ్యయుతులయి
ధారుణి వర్ధిల్లుదురు సదాశివుకరుణన్.

268


వ.

ఇవ్విధమున నారదమహామునీంద్రుం డరిగినఁ దదనంతరమునఁ

బరాశరాదిమహర్షులు తమతమ యాశ్రమములకుఁ జనిరి
కాశ్మీరనాథుం డగుభద్రసేనభూపాలుండు శ్రీరుద్రాధ్యాయ
ప్రభావంబున నిర్ధూతకల్మషుండై నిజపుత్త్రసమేతముగా
రాజ్యభోగము లనుభవింపుచు సుఖమున నుండె నని చెప్పిన
శౌనకాదిమహామునులు పరమహర్షరసావేశపులకీకృతశరీరులై
సూతుం బ్రశంసించి యి ట్లనిరి.

269


క.

భూతేశభక్తిపరులకు
ఖ్యాతిగఁ గైవల్య మొదవు నజ్ఞానమహా
పాతకసింధునిమగ్నుల
కేతెఱఁగున ముక్తి గలుగు నెఱిఁగింపఁగదే.

270

పురాణశ్రవణమాహాత్మ్యము

వ.

అని యడిగిన నమ్మహామునీంద్రులకు సూతుం డి ట్లనియె.

271


ఆ.

వేదబాహ్యులకును విప్రబంధులకును
బుద్ధిహీనులకును బుణ్యులకును
శిష్టసేవ్యమైన శివకథాశ్రవణంబు
ముక్తి నొసఁగు మౌనిముఖ్యులార.

272


క.

నరు లెవ్వరేని నిద్ధరఁ
బురహరుచరితంబు భక్తిబూర్వకముగా నా
దర మొప్ప నాలకించిన
నరయఁగ శ్రీరుద్రతుల్యు లగుదురు వారల్.

273


క.

అవిరతముగ శైవకథా
శ్రవణం బొనరింప శక్తిచాలకయున్నన్
భువి నొకముహూర్తమైనను
వివరముగఁ దదర్ధమైన వినఁగా వలయున్.

274

ఆ.

సకలతీర్థములను సకలయజ్ఞంబుల
సకలదానములను జపతపములఁ
గలుగుసుకృత మొదవు క్షణమాత్ర మభవుని
కథలు వినిన మనుజగణములకును.

275


క.

కలియుగమున మానవులకుఁ
దలఁపఁగ నీశ్వరపురాణతత్త్వశ్రవణం
బులు దక్క నొండుధర్మము
గలదే కైవల్య మొసఁగఁ గలుషము లణఁపన్.

276


చ.

అల సుధఁ ద్రావి మర్త్యుఁ డజరామరభావముఁ జెందు నొక్కఁడే
సలలితశైవకీర్తనము శంభుకథాశ్రవణంబుల న్విని
శ్చలత నొనర్చుమానవుని సంతతికిం దనకుం దలంపఁగాఁ
గలుగు సమస్తసౌఖ్యము లఖండితవీతజరామరత్వమున్.

277


క.

దీనుం డైనను బాలకుఁ
డైన వయోవృద్ధుఁ డైన నభవుపురాణ
జ్ఞానంబు గలుగునాతఁడు
మానవులకు వంద్యుఁ డగు సమంచితబుద్ధిన్.

278


తే.

దేహిధారిణులకుఁ గామధేనువైన
శివపురాణంబు వచియించు శిష్టజనుల
నీచబుద్ధినిఁ బల్కఁగాఁ జూచెనేని
వాఁడు దుర్గతిఁ జెందు నవశ్యముగను.

279


మ.

వరభూతేశపురాణయుక్త మగుచున్‌ వ్యాఘ్రాసనాసీనుఁడై
తరుణుం డైనమహీసురుండు బహువృద్ధబ్రాహ్మణు ల్వచ్చినం
బురసంహారుకథాప్రసంగ మొగి సంపూర్ణంబు గాకుండినం
గురుభక్తిం బ్రణమిల్లఁగాఁ దగరు సాంగోపాంగ మౌనంతకున్.

280

క.

దుర్జనశూద్రశ్వాపద
వర్జన మగునెడల విప్రవరసభల వృషో
పార్జన సుక్షేత్రంబుల
నర్జునవర్ణునికథాళి నారయవలయున్.

281


తే.

శ్రద్ధ వెలయంగ శివకథాశ్రవణ మాచ
రించిన ఫలంబు గనుట సమంచితమ్ము
శ్రద్ధ లేకున్న నదియె నిష్ఫలతఁ జెందు
సత్య మిది మౌనులార భూజనుల కెపుడు.

282


క.

అంబరకేశునికథ హృ
ద్యంబుగ పఠియించునట్టి ధన్యులకును హే
మాంబరమణిభూషణధన
తాంబూలము లొసఁగవలయు ధార్మికమతు లై.

283


క.

శివదేవసత్పురాణ
శ్రవణావసరంబులందుఁ జయ్యన జనినన్
నవభోగమధ్యవేళల
నవిరళసంపద్వినాశ మగు వారలకున్.

284


సీ.

ఉష్ణీషధారియై యొగిఁ బురాణము విన్న
       జనుఁడు భల్లూకమై సంభవించుఁ
దాంబూలవరచర్వణం బొనర్చుచు విన్నఁ
       దినుచుండు దుర్గతి శునకమలము
నున్నతాసనమున నుండి యాకర్ణింప
       వాయసంబై పుట్టు వసుధయందు
వీరాసనస్థుఁ డై విన్న దుర్మానవుం
       డర్జునపాదపం బై జనించు

ఆ.

పవ్వళించి వినిన పాపపుమనుజుండు
కొండచిలువ యగుచు నుండు ధరణి
వక్తృసమత వెలయ వచియించినఖలుండు
గాంచు గురుకళత్రగమనఫలము.

285


క.

పౌరాణికు నిందించిన
క్రూరాత్ముఁడు రౌరవాదిగురునరకములన్
ధారుణి బాధలఁ బొందుచు
ధారుణిపై శ్వానయోనిఁ దగ జనియించున్.

286


చ.

ఘనపురజిత్కథాశ్రవణకాలమునందు దురుక్తులాడున
మ్మనుజుఁడు గర్దభంబగు క్రమంబునఁ దాఁ గృకలాసదేహియై
జననము నొందుఁ గ్రమ్మరను శంకరసంహిత లాలకింప కీ
సునఁ జనినట్టివాఁడు వనసూకరమై ప్రభవించు ధారుణిన్.

287


పంచచామరము.

పురాణపుణ్యసత్కథానుభూతికార్యమంతయున్
విరోధవృత్తి సాగనీక విఘ్న మాచరించు న
న్నరాధము ల్యమాలయంబున న్వసించి క్రమ్మఱన్
గతాసులై జనించుచుంద్రు గ్రామసూకరాకృతిన్.

288


సీ.

చిత్తంబు రంజిల్ల శివకథ ల్వినువారిఁ
       బ్రాపించు ధ్రువమైన బ్రహ్మపదము
శ్రవణం బొనర్పక సంతోష మందిన
       నరులైనఁ గాంతురు పరమపదము
పౌరాణికునకుఁ గంబళవస్త్రశయ్య ల
       ర్పించిన ఘను లుండ్రు త్రిదివమునను

బురభేదనుపురాణమునకు సూత్ర మొసంగు
        జనులకుఁ గలుగు విజ్ఞానసిద్ధి


తే.

బ్రహ్మహత్యాదిదుర్భరపాతకోప
పాతకము లాచరించినపతితుఁ డైన
సంతతపురాణసత్కథాశ్రవణములను
జెందు నిర్మలమోక్షలక్ష్మీసుఖంబు.

289

విదురవంజుళోపాఖ్యానము

వ.

ఈయర్థంబునకు సకలపాపక్షయకరంబును సర్వజనమనోహ
రంబును నతివిచిత్రంబును పురాతనంబు నైనయొక్కయితి
హాసంబు గలదు దానిం జెప్పెద నాకర్ణింపుం డని
సూతుండు చెప్పందొడంగెఁ దొల్లి దక్షిణదేశంబున
బాష్కళసంజ్ఞికం బైనయొక్కగ్రామంబు గల దాస్థలం
బున వసించు ప్రాకృతజనులు మూఢులును ధర్మవర్జితులై
యుండుదు రచ్చటిబ్రాహ్మణులు దురాచారులును వేద
శాస్త్రపరాఙ్ముఖులును లాంగలధరులును గౌటిల్యమార్గ
సంచారులును ధర్మజ్ఞానవైరాగ్యశూన్యులును నై యుండు
దురు మఱియు నప్పురంబునఁ గలుగుకామినీజనంబులు పాప
రతులును స్వైరిణులును దుష్టబుద్ధులును నాచారవర్జితలు
నై యుండుదురు మఱియును.

290


క.

ఆగ్రామమునందు దురా
త్మగ్రామణి యనృతవాది మాయావి మహో
దగ్రుఁడు కువిచారుఁడు జా
రాగ్రణి విదురుఁ డన నొకధరామరుఁ డుండున్.

291

ఆ.

ఆద్విజాధముఁడు నిజాంగన వర్జించి
నిరత మరిగి వేశ్యనిలయమునకు
మదనశరవిభిన్నహృదయుఁడై దానితో
సంతతంబుఁ గ్రీడ సలుపుచుండు.

292


చ.

అతనివధూటి వంజుల సమంచితరూపవిలాసవిభ్రమా
న్విత నవయౌవనాగమవివేకవివర్జిత యై స్మరాంబకా
హతి బెగడొంది కుందుచు నహర్నిశము న్సుకుమారజారసం
గతి విహరింపుచుండె బహుకామకళాకలనైకచాతురిన్.

293


తే.

ఇట్లు జారునితోడుత నింపుమీఱ
సంగమక్రీడ నుండు నాసమయమునను
వచ్చి తద్భర్త యొకనాఁ డవార్యవృత్తిఁ
బల్లవాధరహృదయంబు జల్లుమనఁగ.

294


క.

జారుఁడు కంపము నొందుచు
నారేయి పలాయమానుఁడై యేగినచో
నారమణి నప్పుడు బలా
త్కారంబునఁ గొప్పుఁ బట్టి ధరఁ బడ నీడ్చెన్.

295


తే.

ఇవ్విధంబునఁ బడఁద్రోచి యింతిఁ బట్టి
జానుకూర్పురచరణహస్తప్రహార
ములను మర్దింపుచుండ నమ్ముదిత భీతి
యడరఁ దనభర్తఁ జూచి యిట్లనుచుఁ బలికె.

296


క.

ధరణీసురవర నీతో
సురతసుఖం బెన్నఁడెఱుఁగ సుస్నిగ్ధవయః

పరిపూర్ణగాత్రి నగుటను
జరియింతు యథేష్టగతుల జారులతోడన్.

297


వ.

అని పలుకుచున్ననిజపత్నివాక్యంబు లాకర్ణించి సంతప్త
హృదయుండై యాబ్రాహ్మణుఁడు భీతచిత్తుండుమ గంపితశరీ
రుండు నయి పరస్త్రీగమనంబున మహాపాతకం బగునని
పలుకఁబడినశాస్త్రంబు మనంబునం దలంచి యల్పసుఖంబున
కయి దుర్గతిం బ్రవేశింపవలసె స్మరవిహ్వలంబును మహా
పాపకారణంబు నయినమదీయశరీరంబు వ్యర్థంబు ప్రాణావ
సానకాలంబున భయంకరు లయిన కాలకింకరులం గాంచి
యేవిధంబున ధైర్యం బవలంబించి యుండుదు నేరీతి
సంతప్తక్షారకర్దమాదిఘోరనరకంబులబాధ లనుభవింతుఁ
గ్రమ్మఱ ననేకకోటిజన్మంబులఁ గ్రిమికీటకాదియోనులం
బుట్టి నిరంతరదుఃఖపీడితుండ నయి యె ట్లుండనేర్తు నా
మనంబు వేశ్యాజనసంగమం బపేక్షించియుండుఁ గాని నిజ
భార్యాగమనం బభిలషింపకున్నయది యే నేమి సేయుదు
భృగుపాతనశూలాధిరోహణాదిబాధలకన్నఁ గోటిగుణితం
బైనసంతాపంబు సమకూరె హాదైవమా పంచశరసాయకా
పాతంబుల నిశీధినిసమయంబు లెట్లు గడపుదు నని వగచు
చున్నభర్తృవచనంబు లాకర్ణించి నిర్భయం బయినచిత్తం
బున నిజవల్లభునకు నాబ్రాహ్మణి యి ట్లనియె.

298


శా.

వారస్త్రీరతి నీవు రేయిపవలు న్వర్తింపఁగాఁ జూచి నే
ధీరుండైన మహీసురేంద్రు ననురక్తిం గూడి భోగించితిన్
దారుణ్యస్థితి నుండుకాంతలకు రత్యాసక్తి లేకుండునే
మేర ల్గా విటు కోపము ల్నెరప నామీఁదన్ ద్విజన్మాగ్రణీ.

299

క.

అని పలికిన యాకామినిఁ
గనుఁగొని బ్రాహ్మణుఁడు పలికెఁ గారుణ్యమునన్
వనితా హిత మగువాక్యము
వినుపించెద వినుము నీదువీనులు దనియన్.

300


మ.

తరుణీ నీ విఁకఁ దావకీనవిటలబ్ధం బైనచిత్తంబు వే
సరవోకుండఁగఁ దెచ్చి యిచ్చినను వేశ్యాస్త్రీల కే నిచ్చి త
త్సురతక్రీడల సంచరించెదను సంతోషంబుగాఁ గామత
త్పరజారావళిఁ గూడియుండుము మహోత్సాహంబు సంధిల్లఁగన్.

301


తే.

అనుచు నొడఁబాటు జెంది నెయ్యంబు మీఱ
నాదురాచారు లిద్దఱు హర్ష మొదవ
నొగి యథేచ్ఛావిహారులై యుండునంతఁ
గాలగతిఁ జెందెఁ బతి గొంతకాలమునకు.

302


క.

ఆకామినియును గామో
ద్రేకంబునఁ గొన్నినాళ్లు దిరుగుచు నంతన్
గోకర్ణక్షేత్రమునకుఁ
బ్రాకటమతిఁ జనియె నొక్కపర్వమునందున్.

303


వ.

అట్లు చని యావంజులయు నమ్మహాస్థలంబునఁ బుణ్యతీర్థం
బులయందుఁ గృతస్నాతయై విభూతిలిప్తఫాలభాగయు
రుద్రాక్షమాలికాధారిణియు నయి యొక్కశివాలయంబు
నకుం జని ప్రదక్షిణనమస్కారంబు లాచరించి యచ్చటఁ
బౌరాణికుండయిన యొక్కవిప్రుండు పురాణపఠనం బొన
రింపుచున్నం గాంచి తానును దత్సభాసదులతోడఁ గలసి

తత్కథాశ్రవణం బొనరింపుచున్నంతఁ బ్రసంగవశంబునఁ
బరపురుషసంగమంబు గావించిన పుంశ్చలీజనంబుల మదన
మందిరంబులందు నరకంబున యమకింకరులు సంతప్తలోహ
పరిఘంబులు ప్రవేశింపఁజేయుదు రని వచియించిన బ్రాహ్మ
ణునివాక్యంబు లాకర్ణించి యాయింతి మహాభీతచిత్తయై
కొంతదడవునకు నావిప్రునకుఁ బ్రణమిల్లి రహస్యంబుగా
ని ట్లనియె.

304


మ.

గతదోషం బగునశ్వమేధతతి గంగాస్నానకోటిన్ మహో
న్నతిఁ గావించిన నైననిష్కృతులు చెందన్‌ రానిపాపంబు లే
నతికామాతురవృత్తిఁ జేసితి మహాహంకారతం గ్రొవ్వి యే
గతి నెవ్వారల నాశ్రయింతు నిఁక దుష్కర్మంబుల న్మాన్పఁగన్.

305


క.

గురుఁడవు తల్లివి దండ్రివి
నరయఁగ న న్నుద్ధరింప నర్హుండవు భూ
సురవర మన్నరకార్ణవ
తరణోపాయంబుఁ దెలుపు దయ సంధిల్లన్.

306


క.

అని మది నిర్వేదింపుచుఁ
దనపదముల వ్రాలియున్నతరుణిం గని యా
ఘనవిప్రుఁడు గారుణ్యం
బునఁ గరముల లేవనెత్తి పొందుగఁ బలికెన్.

307


మ.

తరుణీ నీ విఁక భీతిఁ జెందకు మహోద్యద్దైవయోగంబునం
బరమజ్ఞానము దోఁచె నిప్పుడు భవత్పాపౌఘవారాశిసం
తరణోపాయ మెఱుంగఁబల్కెదను జింతం బాసి వైరాగ్యత
త్పరవై ధర్మపురాణము ల్వినుము కైవల్యాప్తి నీ కయ్యెడిన్.

308

క.

పాపచయంబులు పశ్చా
త్తాపంబున శుద్ధిఁ బొందుఁ దద్దయు నుచిత
వ్యాపార మార్యసేవ యు
మాపతిభజనంబు ముక్తిమార్గము లరయన్.

309


క.

అవిరతముగఁ బుణ్యకథా
శ్రవణం బొనరింపు మార్యసాంగత్యమునన్
శివదేవుని భజియింపుము
ప్రవిమలకైవల్య మొదవుఁ బాపము లణఁగున్.

310


తే.

శంకరధ్యాననామసంస్మరణములును
దత్కథాకర్ణనములు సంతత మొనర్ప
సమయు నఘములు దొల్లి యజామిళుండు
నామము వచించి కాదె ధన్యాత్ముఁడయ్యె.

311


మ.

వనితా నీవు పురాణము ల్విను మనోవాక్కాయకర్మంబులం
దును గావించినపాపము ల్సమయుఁ జెందు న్సత్క్రియాసిద్ధి పు
ణ్యనదీస్నానఫలంబు లబ్బు శివలోకావాప్తి చేకూఱెడున్
ఘనవిజ్ఞానవిశిష్టమార్గ మొదవుం గల్గుం జతుర్వర్గమున్.

312


వ.

అని హితోపదేశం బొనరించిన యమ్మహీసురోత్తముని
పాదంబులకు సద్భక్తిపూర్వకంబుగా వందనంబులు గావించి
తదీయాజ్ఞాప్రకారంబున నప్పుణ్యక్షేత్రంబునందు నిత్యం
బును తీర్థంబులం గ్రుంకుచుఁ బరమేశ్వరధ్యానం బొనరిం
పుచుఁ బురాణకథాశ్రవణంబు సేయుచు నిర్ధూతకల్మషయై
యావిప్రభామిని కొన్నిదినంబులకుఁ బంచత్వంబు నొంది
దివ్యశరీరంబుఁ దాల్చి విమానారూఢయై సిద్ధగంధర్వులు

సేవింపఁ బరమేశ్వరలోకంబునకుం జని యచ్చట భవానీ
శంకరులకు సాష్టాంగదండప్రణామంబు లాచరించి గౌరీ
సమ్ముఖంబున సుఖంబుండి యొక్కసమయంబున నయ్యింతి
భవానికిం బ్రణమిల్లి యి ట్లనియె.

313


తే.

తల్లి మామకభర్త భూతలమునందు
సకలదుష్కర్మములు చేసి చనియె నట్టి
బాడబుం డిప్పు డెచట నున్నాఁడొ తెలియ
నానతిమ్మని వేఁడిన నగజ పలికె.

314


మ.

హరిణీలోచన నీవిభుం డిపుడు వింధ్యారణ్యభూమి న్భయం
కరపైశాచికరూపుఁడై పథికులం గాఱింపుచున్నాఁడు ము
న్నరకావాసముఁ జేరి కింకరవితానక్రూరశూలాహతిన్
బరితాపంబును జెందియుండెనని చెప్పన్‌ దుఃఖితస్వాంత యై.

315


సీ.

కారుణ్య ముదయింపఁ గాంతాశిరోమణి
       గిరితనూజకు నమస్కృతి యొనర్చి
శాంకరీదేవి యస్మద్విభుం డట్లుండ
       నే నిట్టు లుండుట నీతి యగునె
యేయుపాయంబున నీదుస్స్వభావుండు
       పైశాచరూపంబుఁ బరిహరించు
నావిధం బెఱిఁగింపు మనవుడుఁ గ్రమ్మఱ
       నగరాజతనయ యిట్లనుచుఁ బలికెఁ


ఆ.

జెలువ నీమగండు శివకథాశ్రవణంబుఁ
జేసెనేని పిదపఁ జెందు ముక్తి
యనిన నవ్వధూటి యది యెట్లు సమకూఱు
దేవి నీవ యానతీయవలయు.

316

మ.

అనుచు న్వేఁడిన సత్కృపాకలితయై యాదేవియుం దుంబురుం
డనుగంధర్వుని జేరి నీ విపుడు వింధ్యారణ్యముం జేరి యా
వనమం దొక్కపిశాచరూపుఁ డగుచు న్వర్తించువిప్రుండు త
ద్ఘనపాపంబు లడంగ శంకరకథాగానంబు గావింపుమా.

317


ఆ.

అటుల నాచరించి యతని ముక్తునిఁ జేసి
యిటకుఁ దోడితెమ్ము హితము వెలయ
ననుచు నాజ్ఞ యొసఁగ నాతుంబురుండును
జనియె నపుడు వింధ్యశైలమునకు.

318


క.

నారదసఖుఁ డగు తుంబురుఁ
డారణ్యస్థలిఁ జరించునట్టిదురాత్మున్
ఘోరపిశాచశరీరు న
వారితనాదంబు గలుగువానిం గాంచెన్.

319


ఆ.

విపులరక్తనేత్రు వికటాట్టహాసునిఁ
బాశబద్ధుఁ జేసి పట్టి తెచ్చి
యొక్కచోట నునిచి ముక్కంటికథలు వీ
ణారవమున గాన మాచరించె.

320


శా.

ఆపైశాచికదేహుఁ డీశుకథ లట్లాలించి నిర్ధూతదు
ష్పాపవ్యూహకుఁడై పిశాచతనువు న్వర్జించి దివ్యస్ఫుర
ద్రూపంబుం ధరియించి ముక్తుఁ డగుచున్ రుద్రాక్షమాలాధరుం
డై పంచాక్షరమంత్రపూతహృదయుండై చెందెఁ గైవల్యమున్.

321


క.

ఆపతితుఁడు మును పశ్చా
త్తాపంబు వహించెఁ గానఁ దత్సుకృతమునం

దీపిత మగుశివలోకము
ప్రాపించె నిరస్తకర్మబంధుం డగుచున్.

321


క.

పతియాజ్ఞ శిరమునం దిడి
హితముగ విటలబ్ధవిత్త మిచ్చినకతనన్
సతి గాంచెను సద్గతి దా
నతిశయదుష్కర్మరహిత యై మోదమునన్.

323


వ.

ఇవ్విధంబునం దుంబురుండు జగజ్జననీశాసనంబున నాబ్రాహ్మ
ణుని పైశాచత్వంబు నివారించి దివ్యవిమానారూఢునిం
జేసి తోడ్కొనివచ్చి పరమేశ్వరసన్నిధానంబున నునిచిన
నాబ్రాహ్మణుండును నిజభార్యాసమేతంబుగాఁ బ్రణమిల్లిన
నుమామహేశ్వరులు సంతసించి బహుకాలంబు మద్భక్తు
లరై యథేచ్ఛావిహారులరై యుందురని వరం బొసంగినఁ
బ్రమోదంబున నుండిరని చెప్పి సూతుం డి ట్లనియె.

324


సీ.

మునులార వినుఁడు ముముక్షుజనార్హంబు
        భద్రప్రదంబు నభంగురంబు
నాయుష్కరంబు నిత్యారోగ్యకరమును
        ధన్యంబు సర్వపాతకహరంబు
కామ్యార్థధర్మమోక్షప్రదాయకమును
        సామ్రాజ్యఫలదంబు సౌఖ్యకరము
నింద్రాదిసేవితం బీశ్వరాభిమతంబు
       విజ్ఞానహేతువై వెలయునట్టి


ఆ.

యీపురాణరాజ మెవ్వరు చదివిన
వినిన వ్రాసినను సవిస్తరముగ

భవ్యుఁ డొసఁగు పుత్రపౌత్రాభివృద్ధియు
సకలవాంఛితములు శాశ్వతముగ.

325


శా.

దానక్షాత్రపరోపకారసుగుణోద్యజ్జ్యోతిరామన్నల
క్ష్మీనారాయణమంత్రివర్యులు సదా శ్రీమంతు లంబాపుర
స్థానాధిష్ఠితపార్థివేశ్వరునకు న్సద్భక్తి నర్పించి ర
జ్ఞానక్షేపణ మీపురాణ మిల నాచంద్రార్కమై వర్ధిలన్.

326


శా.

కైలాసాచలవాస భక్తజనరక్షాదీక్ష ఫాలాక్ష చం
ద్రాలంకారనిజోత్తమాంగ మునిహృద్రాజీవరోలంబకా
లేలీహానవిభూషితాంగ విబుధాళిస్తుత్యపాదాంబుజా
శూలప్రోజ్జ్వలబాహుదండ గజరక్షోవీరసంహారకా.

327


క.

కరుణాకర పరభీకర
పురసంహర భక్తవరద పోషితభువనా
సురకుత్కీలశరాసన
పరమేశ్వర మృత్యుహరణ పరమాత్మ శివా.

328


ఉత్సాహ.

శ్రీపురాణపూరుషాభ్రసింధుజూట భానుజా
టోపభేదనక్రియాపటుప్రభావ కుక్షిసం
దీపితాబ్జజాండభాండ దేవదేవ భాసురాం
బాపురస్థలీనివాస పార్థివేశ శంకరా.

329


పంచచామరము.

పినాకినీతటప్రచారభిల్లవేషభాసురా
పినాకహస్త కృత్తివాస భీమరూప శంకరా
ఘనాఘనాభనీలకంఠ కామదర్పసంహరా
సనందనాదిమౌనిసేవ్య శైలజామనోహరా.

330

గద్యము.

ఇది శ్రీరామభద్రకరుణాకటాక్షవీక్షణసమాలబ్ధ
గీర్వాణాంధ్రభాషాకవిత్వకళాధురంధర సూరిజనవిధేయ
బడగలనాటి కన్నడవంశపయఃపారావారరాకాసుధాకర
ఆశ్వలాయనసూత్ర భారద్వాజసగోత్ర శ్రీధరమల్లె
అయ్యనార్యతనయ సూరిజనవిధేయ వేంకటరామనామ
ధేయప్రణీతం బైనబ్రహ్మోత్తరఖండం బనుమహాపురా
ణంబునందు విభూతిమహత్త్వంబును వామదేవబ్రహ్మ
రాక్షససంవాదమును శ్రద్ధాలక్షణంబును శబరోపాఖ్యా
నంబును ఉమామహేశ్వరవ్రతమహత్త్వంబును శారదాచరి
త్రంబును రుద్రాక్షప్రభావంబును కీశకుక్కుటకథనంబును
వేశ్యావైశ్యసంవాదంబును రుద్రాధ్యాయప్రకరణమును
శమనుండు బ్రహ్మసభకుం జనుటయు భద్రసేనుసభకు
నారదుం డరుదెంచుటయు వీరభద్రయమవివాదంబును
బురాణశ్రవణమాహాత్మ్యంబును విదురవంజుళోపాఖ్యా
నంబు ననుకథలంగల సర్వంబును బంచమాశ్వాసము.


సీ.

శకవర్షగణనంబు శైలరామమునీంద్రు
      పరిమితంబై ధాత్రిఁ బరఁగుచుండు
యువనామసంవత్సరోపేతకార్తిక
      మాసరాజితపౌర్ణమాసియందు
ధన్యులు విష్ణువర్ధనసగోత్రులు జ్యోతి
      సుబ్బన్నపుత్రులు సుగుణమణులు
రామన్న లక్ష్మీనారాయణ చెంగల్వ
     రాయఁడు నన మువ్వు రమలయశులు

తే.

చిత్తముల భక్తి వెలయ బ్రహ్మోత్తరాఖ్య
ఖండ మాంధ్రప్రబంధంబుగా ఘటించి
యెలమి నంబాపురము పార్థివేశ్వరునకు
భాసురముగ సమర్పణ చేసి రపుడు.

349


శా.

శ్రీనారాయణుఁ డార్తరక్షకుఁడు రాజీవాయతాక్షుండు వి
జ్ఞానానందమయస్వరూపుఁ డగుకృష్ణస్వామి రక్షించు న
క్షీణప్రజ్ఞుల సుబ్బనార్యుసుతులన్ శ్రీజ్యోతిరామన్న ల
క్ష్మీనారాయణుల న్వదాన్యమణియౌ చెంగల్వరాయాగ్రణిన్.

350


బ్రహ్మోత్తరఖండము సంపూర్ణము