బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మూడవ ప్రకరణము

వార్తాపత్రిక - పరారి

ఇట్లు, గ్రంధావలోకన కుతూహలాయత్త చిత్తుండై, కాలమును బెంజమిను గడపుచుండ, నాస్తికాభిప్రాయములు కొన్ని యబుద్ధి పూర్వకముగ నితని నాక్రమించెను. ఇవి మనస్సును వ్యాకుల పెట్టినందున, మిక్కిలి దు:ఖాక్రాంతుడై, కాలక్రమమున యుక్తాయుక్తవిచక్షణ సంపన్నుడై, వీనిని వదలిపెట్టెను. ఇట్లు మనస్సును శుద్ధిచేసి మతమున కెట్టియుపద్రవము రాకుండ, కల్లోలావృతమైన యౌవనకాలమును దాటించినందున కిత డెంతయు కృతజ్ఞత కలవాడై, వృద్ధాప్యమునగూడ పరమేశ్వరుని ధ్యానించుచుండెను.

జేమ్సు ఫ్రాంక్లిను వ్యాపారము నానాట వృద్ధిపొందసాగి, సోదరు లిరువురికి యుత్తరోత్తర మైహిక సుఖములను సంఘటించుకాలము సమకూరెను. బోస్టను పట్టణమందలి 'తపాలాఫీసు' యజమాని యొక వార్తాపత్రికను బ్రచురింపించి ప్రకటన చేయుచుండెను. అచ్చట వ్యవహారరీతిచే మనస్పర్థలు కలిగినందున, నతనిని యా యుద్యోగమునుండి తొలగించి, కొందఱు ప్రముఖులు తమ శ్రేయస్సును బురస్కరించుకొని, మొదటి పత్రికకు ప్రతిగా, మఱియొక పత్రికను తమ వ్యవహారానుకూలముగ ముద్రింపించి ప్రచురించుటకు పూనుకొనిరి. తపాలాఫీసు యజమానత్వమునకు క్రొత్తగ వచ్చినవానిని వీరు ప్రోత్సాహపఱచుటకు నిశ్చయించుకొనిరి. ఇదియంతయు బెంజమిను పనిలోబ్రవేశించిన రెండవసంవత్సరమున జరిగెను. ఈవార్తా పత్రికకు తనను సంపాదకునిగా నియోగించెద రని నితనియన్న యువ్విళ్లూరుచుండి తుదకు విఫలమనోరధుడై "బోస్టనుగెజెటు" అను పేరుతో, నూతనముగ వార్తాపత్రికను సిద్ధపఱచుటకై చాలధనమును వ్యయపఱచెనుకాని, అచ్చట తుదకు స్వల్ప కలహములు తటస్థింప దానినిగూడ విడువవలసిన వాడాయెను. తక్కుంగలవారు ఈపత్రికను మఱియొకనిచే నడిపింపసాగిరి. వారటులు చేయుట ద్రోహమనియెంచి, జేమ్సు తన స్నేహితులు యెంత చెప్పినను వినక, కార్పణ్య బుద్ధివహించి, యొక పత్రికా ప్రచారమునకే యెడములేని సందర్భమున మూడవ పత్రికను బ్రచురించుట కుద్యుక్తుడై, 1721 సంవత్సరము ఆగష్టు 17 తేది సోమవారమున, "న్యూఇంగ్లాండుకో రాన్టు" అను వార్తాపత్రికయొక్క ప్రధమసంచికను స్వంతముగ ప్రచురము జేసెను.

నూతన సీమలలో బ్రచురింపబడు పత్రికలయందుల బ్రముఖమై, లోకోపకార బుద్ధిగలిగి, సాహసముతోను సరసముగాను చదువరులకు ప్రకరణములను ప్రదర్శించు చున్నందున, 'కోరాన్టు' పత్రికను నలుగురు శ్లాఘించుచుండిరి. కడమ పత్రికలేక రీతిని నుండుటచే విరసములై యంతగ శ్లాఘనీయములై యుండలేదు. "కోరాన్టు" పత్రిక లోక వార్తలను, వ్యాసములను, కట్టుకధలను, ప్రకటించుచు తాత్కాలిక వ్యవహారములను నిష్పక్షపాతముగ విమర్శించుచుండెను. ఇట్లు ధైర్య స్థైర్యములతో గూడిన దగుట, నిది పురవాసులకు అనుకూల ప్రతికూల విషయములను చర్చింపునెడ వారికి క్రమముగ హర్ష రోషములను బుట్టించుచుండెను.

ఇక్కాలమంతయు మన బెంజమిను యక్షరముల కూర్చుచు, వివాదాభిలాషియైనను, యే విధమైన వివాదములోను దిగక, తన పనిని చూచుకొనుచుండెను. సోదరభావ మంత:కరణ పూర్వకము కానిదిగా, సోదరు డితనిని కూలివానిగ జూచుచు, మనస్సులు కలియనందున, మాటలను వ్యయపఱచుచు, నొక్కొక్కప్పుడితనిని గొట్టుచు వచ్చెను. మరికొన్ని సమయములయందన్న దమ్ముల వివాదములను దండ్రి బరిష్కరించి బెంజమిను పక్షమున తీర్పు చెప్పుచుండెను. ఈ దుర్భావము కలవాడై, తమ్ముని యభిలాషలను చదువును గుర్తెఱుంగ లేనందున, 16 సంవత్సరముల యీడురాకపూర్వమె, బెంజమిను యించుమించుగ శైలిలోను ధోరణిలోను 'అడిసను'ను పోలి వ్యాసములను వ్రాయుశక్తిగలవాడను సంగతి యన్న తెలిసికొనజాలడయ్యె. పత్రికలోనొక ప్రకరణమును వ్రాయనిశ్చయించి, బెంజమిను రహస్యముగ వ్రాసి, శాలాధికారి కార్యస్థానమున బడ వేసెను. ప్రభాతానంతరమున సమావేశమైన పత్రికాలేఖకులందఱు క్రమముగ తనవ్యాసమునుచూచి విమర్శించి సంతసించినందున, నతడును మిక్కిలి యుప్పొంగి కన్నుల నానంద బాష్పములను విడిచెను. తదనంతరమది వార్తా పత్రికయందు ముద్రిత మయ్యెను.

రానురాను, 'కోరాన్టు' వార్తాపత్రిక మహాతుంటరియై, పాపాత్ముల కానందసంధాయియై, ధర్మాత్ముల కాగ్రహజనితయై, విచ్చలవిడిగ బోస్టను పట్టణాధికారుల చర్యలు, చట్టములు, సిద్దాంతములు, పరువును సహితము పరిహసించినందున, నధికారులు కాలమునకు నిరీక్షించి 12 మాసము లూరకుండిరి. తుదకు వారి శాంతమును పోగొట్టునంతటి వ్యాసమొకటి ముద్రితమైనందున, వారు దానినిజూచి పత్రికాధిపతియైన జేమ్సు ఫ్రాంక్లినును విచారణకుదెచ్చి, విమర్శనానంతరమున నతనిని కారాగ్రహవాసిగ జేసిరి. కారాగృహమునం దొక వారము వాసముచేసి, తన మూర్ఖత్వము, కుభావము నొప్పుకొని, వినయవిధేయ పూర్వకముగ నపచార క్షమాపణ పత్రికను వ్రాసి, దొరతనము వారికి బంపుకొనెను. వారు కటాక్షించి, విడుదల కాజ్ఞనొసంగ, కారాగృహ విమోచనమై, ఇతను బయ టికు వచ్చునప్పటికి నెలదినములాయెను. మఱికొన్ని యంత:కలహలములచే బత్రిక తుద కంతరించెను.

తదనంతర మన్న దమ్ముల కలహమధికమైనందున, బెంజమి నన్న నుండి విడిపోయి, సమీపముననున్న 'న్యూయార్కు' పట్టణమునకు బోవుటకు ప్రయత్నించెను. తన పూర్వపు స్నేహితుడు "జానుకాలిన్సు" తాను పడవమీద బోవుటకు దగిన యేర్పాటుచేసినందున, బెంజమిను కొన్ని పుస్తకముల నమ్మి, యాసొమ్ముతో బడవచీటినిగొని ప్రయాణమైపోయెను.

ఈ ప్రయాణములో నొక వింత జఱిగెను. పడవ గడపువారందఱు 'కాడు' చేపలను బట్టుకొని, వానిని మూకుడులో వేసి వేయింపసాగిరి. శాకభక్షకుడైన బెంజమినుకు వానివాసన సోకెను. అంత నతడు మతిచెడి, దీక్షకువ్యతిరిక్తముగ, వానిని తినుట కుద్యుక్తు డయ్యెను.

ప్రయాణము చేయునాటికి, బెంజమిను 18 సంవత్సరముల వయస్సుగలవాడు. మూడురోజులు ప్రయాణముచేసిన పిదప, న్యూయార్కు పట్టణమున కతడు వచ్చెను; పట్టణమం దెవరి నెఱుగడు; చేతిలో డబ్బులేదు; ఎవరిని జూచుటకును తనవద్ద యోగ్యతా పత్రికలు లేవు.

7, 8 వేల జనసంఖ్య గల, న్యూయార్కు పట్టణములో జూచునది వినునది యంతయు 'హోలాందు' మయమై యుండెను. అందుచే నక్కడి ముద్రాక్షరశాలలం దాంగ్లేయుల కంతగ బనిలేదు. 1723 సంవత్సరమున నీపట్టణమునకు బెంజమిను వచ్చుసరి కక్కడ పుస్తకాలయ మనునదియే లేదు. పేరుకు మాత్ర మొక ముద్రాక్షరశాల కలదు. ఇతను శాలాధ్యక్షుని జూచుటకు వెళ్లి, తన పూర్వోత్తరములను జెప్పుకొని, తన నేపనిలోనైన నియోగింపమని వేడెను. సమయమున కే పనియు లేదని శాలాధికారి చెప్పి, ఫిలడర్ ఫియాలో నొక ముద్రాక్షర శాలాధికారిగ నున్న తన కుమారుని కొక పనివా డత్యావశ్యకముగ గావలసి యుండునని చెప్పి, బెంజమినును బంపివేసెను. ఇప్పటికి, సముద్రపు ప్రయాణమునందలి యుత్సాహము తీరినందున, నింటికి తిరుగు ముఖమగుటయో లేక పని నిమిత్త మన్యపట్టణమునకు బోవుటయో యను మీమాంసలో నతడుబై గ్రామమునకు బోవుటయే యుక్తమని యెంచి, తన వస్తువులను తూపించి పడవలోవేసి తానొక పడవనెక్కి బయలుదేరెను.

ఈ పడవ శిథిలమై చిఱిగిపోయిన తెరచాపతో, యొక కళాసుచే గడపబడుచుండెను. తప్ప త్రాగి మైమఱచిన హోలాందావా డొకడు బెంజమినుతో వచ్చుచు బడవలోనుండి నీటిలో బడగా, వాని జుట్టు పట్టుకొని పైకి లాగి బెంజమిను వానిని బడవలోవేసెను. ఇటులు గొంతదూరముపోయి, "లాం గై లెండు" దీవి యొడ్డున ప్రబలముగ గాలి, వీచుచు, కెరటములు భయంకరముగ గొట్టుకొనుచున్నందున, పడవ గుద్దుకొనునను భయము కలిగి, దానిని జాగ్రత్తతో గడపి, వీ రొడ్డునవచ్చి చేరిరి. సముద్రపు టొడ్డునకు కొందఱు మనుజులు వచ్చుట వీరు చూచి, గట్టిగ కేకలువేసి వారిని వీరు పిలిచినను, కెరటముల ధ్వనిచే, వారు వినలేదు. 'రం' సారాబుడ్డి తప్ప, పడవలో తినుబడి పదార్థములేవియు లేనందున, వీరాకలికొనిన వారైనను, గాలి తగ్గువఱకొడ్డున గూర్చుండవలసి వచ్చెను. పడవలో నిదురపోవలెనని వీరు ప్రతత్నించిరిగాని, గాలి హోరున వీచుచు, కెరటముల తుంపరలుమీద పడుటవలన, రాత్రి యంతయు నిదురలేక శ్రమతో గడిపిరి. మరుసటి దిన ముదయముననే గాలి తగ్గినందున, పడవను దీసి గడపుట కారంభించి, యపరాహ్ణము తిరిగిన పిదప, 'అంబాయి' యను పట్టణమును జేరిరి. ముప్పది గంటల కాలము నిద్రాహారములు లేక గాలి దెబ్బలు తిన్నందున, బెంజమిను దేహమంతయు బడలి సలసల లాడెను. ఉష్ణము వచ్చుటకు పూర్వము శీతలోదకమును విస్తారము బుచ్చుకొనిన తగ్గునని చదివిన సంగతి బెంజమిను జ్ఞప్తికిదెచ్చుకొని, చల్లని నీరు సంతుష్టిగ త్రాగి, విశ్రమించి, నిదురపోయి, మరుచటి దినముదయమున నుష్ణపు చిహ్నములు స్వస్థతతో లేచెను. డెల వేరు నదీతీరముననున్న 'బర్లింగుటను' పట్టణము అంబాయి పట్టణమునుండి, యేబది మైళ్లదూరము. ఈపట్టణమునకు వెళ్లుట కుద్యుక్తుడై, మరుచటి దిన ముదయ ప్రభృతి క్షోణి పాతముగ వర్షించుచున్నను, బయలుదేరి, దినమంతయు నడిచి, సాయంత్రమునకు దారిలోనుండిన పూటకూలి యింటిలో బసచేసెను; ఇన్ని దినముల కితని మనోధైర్యము చెడి, స్వగృహ మెందుకు విడిచితినని బెంజమిను విచారించెను. పరారియై వచ్చిన తన నెవరైన నిరోధింతు రనుభయము కలిగి, వ్యాకులచిత్తుడయ్యెను. తానుధరించిన వస్త్రములు వర్షములో దడిసి నలిగిపోయినందున, బెంజమిను కర్తవ్యాంశము తోపక యుండెను. వికసిత ముఖారవిందము, శరీర సౌష్టవము గలిగి, భవిషదుద్యోగార్హు డైనను, ప్రస్తుతము దురవస్థలో జిక్కెను.

మఱుసటి దినము బయలుదేరి పోయిపోయి, సాయంత్రమునకు బర్లింగుటనుకు పదిమైళ్ల దూరములో బసచేసి, రెండవదినము శనివార ముదయమున పట్టణము జేరెను. ఫిలడల్‌ఫియాకు పదునేడుమైళ్లు మీదుగ, బర్లింగుట నున్నది. నదీతీరమునకు బోవలెనని వీధుల వెంబడి బెంజమిను వెళ్లెను. ఏ ముదుసలి దానివద్ద తినుటకు రొట్టెను కొనెనో, నామె, జీర్ణ వస్త్ర ధారియైన బెంజమిను మహత్తుకలవాడని, యెంచెను. నదీతీరమునకుబోయి, ప్రతిశనివారమును ఫిలడల్‌ఫియాకు వెళ్లు పడవ బయలుదేరి పోవుటవిని, బెంజమిను ఖిన్నుడై, ఏమియుదో చక, తిరిగి యాముదుసలి దానివద్దకువచ్చి, జరిగిన సంగతి నామెతో జెప్పెను; అతడుండు మంగళవారము వఱకు తన గృహమున బసచేయు మని యామె కోరినందున, మార్గాయాసముచే బడలిన బెంజమి నందుకు సమ్మతించెను.

ఒకనాడు సాయంకాలమందు; నదీతీరమున విహరించుచుండ, దైవికముగ, రాధారి మనుజుల నెక్కించుకొని ఫిలడల్‌ఫియాకు బోవు పడవను బెంజమిను చూచెను. ఇతనిని తీసికొని వెళ్లుటకు పడవవా రంగీకరించినందున, పడవలోనికి బెంజమిను వెళ్లెను. గాలిలేనందున, వీరుపడవను నడుపవలసి వచ్చెను. ఆదివార ముదయమున, 8, 9 గంటలకు "ఫిలడల్ ఫియాకు" పడవచేరెను. ఇతని వద్ద కొన్ని రాగిడబ్బులు, మూడురూప్యములు మాత్రముండెను. ఇతనుకూడ పడవను నడపినందున, నితని వద్ద రుసుము పుచ్చుకొనుటకు కళాసు లిష్ట పడక పోయిరి. అయినను, వారిని నిర్భంధముచేసి, తన రాగిడబ్బు లన్నియు బెంజమిను వారి కిచ్చివేసెను. "ధనము కలిగియున్న సమయములలో గాక, ధనము లేని సమయములలోనే, మనుజుడు తన యౌదార్యమును జూపించును. తనవద్ద కొంచెము ధనమున్నదని నితరులకు తెలియకుండుటకు కాబోలు వాడిటులు చేయును" అని బెంజమిను వ్రాసెను. క్షుద్బాధాయుతుడై కడుడస్సి, నిదుర లేక నీరసించి, రేవులో బెంజమిను దిగెను. పట్టణమునకు బోవుచు, రొట్టెను బట్టుకొని వచ్చు బాలు నొకనిని దారిలోజూచి, వానివలన రొట్టె లమ్మబడు స్థలమునుగనుగొని, వెంటనేనక్కడకుబోయి మూడురొట్టెలనుగొని, వానిని తనజేబులలో బెట్టుకొనుటకు వీలు లేక, రెండు పొట్లములుగట్టి చంకక్రిందనుంచుకొని, మిగిలిన దానిని తినుచు, మార్కటు వీధిని బోవుచుండెను. ఇట్లు పోవుచు, రీడు ధొరగారి యింటిమీదుగ నతడు నడచుట తటస్థించెను. అప్పుడు ద్వారమువద్ద నిలుచుండిన 'కన్యకరీడు' బెంజమిను వైఖరినిజూచి, యాశ్చర్యమొందెను. ఈమెకు 18 సంవత్సరముల వయస్సు. ఈమె ముందుకు గృహిణిఫ్రాంక్లిను కాగలదు. కాని ఈమె చూపులను బెంజమిను గమనింపక 7000 వేల ప్రజాసంఖ్య కలిగి, ఉత్తమక్షేత్రగృహారామములతో వెలయుచున్న ఆ పట్టణమును విలోకించుచుబోయెను. వీధులన్నియు దిరిగి తిరిగి, రేవునకు వచ్చి, బెంజమిను తన దారిని నిరీక్షించుచున్న ముదుసలికి, దాని కుమారునకు, శేషించిన రెండు రొట్టెల నిచ్చివేసెను.

అక్కడినుండి తిరిగి వచ్చునపుడు, మార్కటు వీధిని బెంజమిను రాగా, దారిలో మతపరిషత్తునకు బోవు వారిని గలిసి, వారితో బోయి, సభలో గూర్చుండి, నిశ్శబ్దముగ నుండు టచే నిదురపోయెను. సభ ముగిసినతరువాత నొక డితనిని లేపినందున, నతనితో బెంజమిను గలిసిపోయి, యతడు చూపించిన పూటకూలియింటిలో బసచేసెను. పనిపాటలు లేక పదునొకండు దినములు బెంజమిను వ్యయము జేసెను.Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf