బిస్మిల్లా ఇర్రహిమా నిర్రహీం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉతికి ఆరేసుకున్న హృదయం మీద ఎక్కడిదో ఒక పాడు కాకి అపనమ్మకం రెట్ట వేసిపోయింది ఇన్నాళ్ళూ ‘జీతే రహో బేటా’ అని మనసులోనే దీవించిన మౌల్వీ సాబ్‌ ఇపుడు శిథిలాల కింద నుంచి శోకాల అల్బిదా గీతమై నన్ను చుక్కలు చుక్కలుగ ద్రవీకరిస్తున్నాడు

ఎక్కడా సాంబ్రాణి ధూపాలు పరిమళించడం లేదు ఏ జెండా చుట్టూ నిర్భయత్వపు పచ్చ జెండాలు ఊపడం లేదు నిన్నటి దాకా ఆనందం దూద్‌ సెమ్యాగా తాగిన గజల్‌ కచేరీల వహ్వాల్లేవు ఉర్సుల్లేవు, ఫాతెహాల్లేవు, నమాజుల్లేవు.

దేవుడంటే నాలుగు ఇటుకలు గుప్పెడు సిమెంటు కాదని చెప్పే మాధ్యమం కూలిపోయాక నేనొక కొత్త భాషని వెతుక్కోక తప్పడం లేదు

ఇంకా ఆలస్యమెందుకుగాని ఏదో ఒక త్రిసభ్య కమిషనో వేసి బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుక్కూచ్చున్న మా ప్రార్థనా స్థలాలను పంచనామా చేసి చిరుగాలి తాకిడికి ఛిద్రమై పోయాయని రికార్డులు రాసి ఫైళ్ళూ మూసెయ్యండి సుహృద్భావ సమగ్రతా సామరస్యాల పూలగుత్తులు మా చెవుల్లో గుచ్చండి ఔరంగజేబొచ్చి ముసలి థాకరే దేవుడి గదిలో కూర్చుని దద్దోజనాన్ని చప్పరించుకుంటూ తింటున్నాడనీ హెద్గేవారొచ్చి అమానుల్లా ఖానోళ్ళ దఫ్తర్‌ మీద కూర్చుని ఆవు మాంసం పలావు ఆరగిస్తున్నాడనే అందమైన నివేదికల్ని ఆకాశవాణి, దూరదర్శన్‌ చెంచాలతో తినిపించండి అయినా బాబూ కత్తి దుయ్యాలన్న కడుపు మంట బద్దలవ్వాలే గానీ గంగానది అసలు పేరు యూఫ్రతీస్‌ అని మధురా నగరం నా దాదీమా స్మృతిచిహ్నమనీ అదని ఇదనీ నీ తలకో రోకలి చుట్టలేమా నీ పిర్ర జేబులో నాలుగు ఏనుగుల్ని కట్టేయలేమా !

శుభ్రంగా ఉతికి ఆరేసుకున్న హృదయం మీద ఎక్కడిదో ఒక పాడు కాకి అవమానం రెట్ట వేసిపొయింది అంత మాత్రాన హృదయాన్ని విసిరి అవతల పడేయలేం కదా

ఇప్పుడు ఈ నేలలోంచి ఎక్కడ గుప్పెడు మట్టి తీసుకున్నా నాకు కోటాను కోట్ల దర్గాలు సాక్షాత్కరిస్తున్నాయ్‌