శివపురాణము/విద్వేశ్వర ఖండము/బిందువు - నాదము - లింగము

వికీసోర్స్ నుండి

సూతమహర్షి శ్రీ శివమహాపురాణశ్రవణమందలి చివరి ఖండమైన విద్వేశ్వర సంహితను ప్రారంభించాడు. నాడు పన్నెండో రోజు. ద్వాదశ సంహితా సంయుత పరివ్యాప్తమై; నిఖిల పుణ్య సంపత్తులకు నిలయమై; భక్తి ముక్తిదాయకమైన శ్రీ శివపురాణ శ్రవణానంతరం చేయదగ్గ మహాసంతర్పణకు గాను కల్పవృక్షం - కామధేనువులను రప్పించారు. ఆ ఏర్పాట్లు అవి పర్యవేక్షిస్తుండగా పురాణశ్రవణం మొదలైంది.

రోమహర్షణుడు చెప్తున్నాడు:

"శివోక్తమంతా శివోధార్యంగా గ్రహించినవారు మొట్టమొదట విరించీ - విష్ణుమూర్తీ. ఆ తర్వాతనే అది అందరికీ అందింది.

ఈ జగత్ అనే సంసారం తామరతంపరగా పెంపొందడమే సృష్టి. దీన్ని ఓ క్రమంలో ఉంచడమే స్థితి. ఈ స్థూల సృష్టిని సూక్ష్మంగా మార్చడమే లయం .

శివారాధనాపరులైన జీవులందర్నీ బంధవిముక్తులను చేయడం అనుగ్రహం .

లయస్థితి నుంచి - పునః సృష్టి వరకూ సూక్ష్మీకరించబడిన దాన్ని పరిరక్షించడం తిరోధానం .

ఈ ఆయిదు కార్యాలు నెరవేర్చేది ఆ పరముడే అయినప్పటికీ ; సృష్టి ని బ్రహ్మకు, స్థితిని విష్ణువుకు, లయ - తిరోధానాలను రుద్ర మహేశులకు స్వంతం చేసి అనుగ్రహాన్ని / సాయుజ్యాన్ని మాత్రం ఆదిదేవుడే నిర్వహిస్తున్నాడు.

పంచాక్షరీ మంత్రాన్ని స్వయంగా ఆ పరమ మాహేశ్వరుడే, బ్రహ్మ - విష్ణువులను ఉత్తర ముఖంగా కూర్చోబెట్టి వారి చెవులలో ఉపదేశించాడు. ఆ తరువాతనే వారి కోరికమేరకు సమస్త యంత్ర తంత్ర మంత్రాలను అనుగ్రహించారు.

కనుక, ఓ మునీశ్వరులారా! ఆరుద్రా నక్షత్ర యుక్త చతుర్దశి నాటి పుణ్య సమయాన శివపంచాక్షరి అఖండ సత్ఫలితాల్ని ఇస్తుంది. అదే మహాశివరాత్రి అని మీకందరికీ తెలిసిందే! ఈ మాహాత్మ్యాన్ని గురించిన గాధలు, ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం!

బిందువు - నాదము - లింగం

బిందువు శక్తి, నాదం శివుడు, బిందునాద కళాధారిత్వమే ఈ జగత్తు. కనుక పునః పునః అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ - ఇదంతా శివశక్త్యాత్మకం! ఇవి రెండూ పరస్పరాధారితాలు.

శివాంగమాల రీత్యా ఆరేసి చొప్పున ద్వివిధ లింగాలు ద్వాదశ లింగాలుగా పరిఢవిల్లాయి.

అవి ఇవి :

అ కారంలో - అచార లింగం ; గురులింగం

ఉ కారంలో - గురులింగం ; చర లింగం

మ కారంలో - శివలింగం ; ప్రతిష్ఠిత యంత్ర లింగం

బిందువులో - చర లింగం ; బిందులింగం

నాదంలో - ప్రసాద లింగం ; నాద లింగం

ప్రణవంలో - మహా లింగం ; ప్రణవ లింగం

పైన చెప్పబడిన ఈ లింగములను గురుముఖతా తెలుసుకొని ఆరాధించి మహానివేదన సమర్పించాలి. విభూతిధారణ - రుద్రాక్ష ధారణ - శివపంచాక్షరీ జపం - శివలింగారాధన.. ఈ నాలుగూ శివభక్తుల కనీస విధులు.