Jump to content

బాలకాండము/సర్గము 1

వికీసోర్స్ నుండి
(బాలకాండము - సర్గము 1 నుండి మళ్ళించబడింది)

బాలకాండము - మొదటిసర్గము - సంక్షిప్తరామాయణము

నారదుడువాల్మీకి మహర్షికి రామాయణమును సంక్షిప్తముగా తెలుపుట.

వాల్మీకి రామాయణము
రామాయణ కాండములు
1. బాలకాండము
2. అయోధ్యాకాండము
3. అరణ్యకాండము
4. కిష్కింధకాండము
5. సుందరకాండము
6. యుద్ధకాండము
7. ఉత్తరకాండము

తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం |

నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం |1-1-1|

తపశ్శీలుడును, వేదాధ్యయననిరతుడును, వాక్చతురులలొ అగ్రేసరుడును, ముని శేఖరుడును, ఐన నారదుని గొప్ప తపస్వియైన వాల్మీకిమహర్షి జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించెను. [1-1-1]


కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః |౧-౧-౨|

"ఓ మహర్షీ! సకల సద్గుణసంపన్నుడును, ఎట్టి విపత్కర పరిస్థితులలోను తొణకని వాడును, సామాన్య విశేష (లౌకికాలౌకిక) ధర్మములను ఎఱిగినవాడును, శరణాగతవత్సలుడును, ఎట్టి క్లిష్టపరిస్థితులయందును ఆడితప్పనివాడును, నిశ్చలమైన సంకల్పము గలవాడును అగు పురుషుడు ఇప్పుడు ఈ భూమండలమున ఎవడు? [1-1-2]


చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |

విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః |1-1-3|

సదాచారసంపన్నుడును, సకలప్రాణులకును (తనయెడ విముఖులైన వారికిని) హితమును గూర్చువాడును, సకలశాస్త్ర కుశులుడును, సర్వకార్యధురంధరుడును, తనదర్శనముచే ఎల్లరకును సంతోషమును గూర్చువాడును ఐన మహాపురుషుడెవడు? [1-1-3]


ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |

కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే |1-1-4|

థైర్యశాలియు క్రోధమును (అరిషడ్వర్గమును) జయించినవాడును, శొభలతో విలసిల్లువాడును, ఎవ్వరిపైనను అసూయ లేనివాడును, రణరంగమున కుపితుడైనచో, దేవాసురులను సైతము భయకంపితులను జేయువాడును అగు మహాపురుషుడు ఎవడు? [1-1-4]


ఏతత్ ఇచ్ఛామి అహం శ్రోతుం పరం కౌతూహలం హి మే |

మహర్షే త్వం సమర్థోఽసి జ్ఞాతుం ఏవం విధం నరం |1-1-5|

ఈ విషయములనుగూర్చి తెలిసికొనుటకు నేను మిక్కిలి కుతూహలపడుచున్నాను. ఓ మహర్షీ! మీరు సర్వజ్ఞులు, ఇట్టి మహాపురుషునిగుఱించి తెలుపగల సమర్థులు మీరే." [1-1-5]


శ్రుత్వా చ ఏతత్ త్రిలోకజ్ఞో వాల్మీకేః నారదో వచః |

శ్రూయతాం ఇతి చ ఆమంత్ర్య ప్రహృష్టో వాక్యం అబ్రవీత్ |1-1-6|

త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకిపలుకులను ఆలకించి, ఎంతయు సంతోషించెను. పిమ్మట అతడు " ఓ మహర్షీ! సరే! వినుము" అని వాల్మీకితో ఇట్లనెను. [1-1-6]


బహవో దుర్లభాః చ ఏవ యే త్వయా కీర్తితా గుణాః |

మునే వక్ష్ష్యామి అహం బుద్ధ్వా తైః ఉక్తః శ్రూయతాం నరః |1-1-7|

"ఓ మునీ! నీవు ప్రస్తుతించిన బహువిధములైన ఆ ఉదాత్త గుణములు ఒక్కరియందే కుదురుకొనియుండుట సాధారణముగ దుర్లభము. ఐనను స్మృతికి దెచ్చుకొని, అట్టి గుణములు గల ఉత్తమపురుషునిగూర్చి తెలిపెదను వినుము. [1-1-7]


ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః |

నియత ఆత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ |1-1-8|

బుద్ధిమాన్ నీతిమాన్ వాఙ్గ్మీ శ్రీమాన్ శత్రు నిబర్హణః |

విపులాంసో మహాబాహుః కంబు గ్రీవో మహాహనుః |1-1-9|

మహోరస్కో మహేష్వాసో గూఢ జత్రుః అరిందమః |

ఆజాను బాహుః సుశిరాః సులలాటః సువిక్రమః |1-1-10|

ఇక్ష్వాకువంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తరపురుషుడైన శ్రీరాముడు అందవతరించి, ఎంతయు జగత్ప్రసిద్ధుడాయెను. అతడు మనోనిగ్రహము గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిఱునవ్వుతో మితముగా మాటలాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్యసంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్ఠమైన బాహువులు గలవాడు, శంఖమువలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు (చెక్కిలి పైభాగములు) గలవాడు, విశాలమైన వక్షఃస్థలము గలవాడు, బలమైన ధనస్సు గలవాడు, పుష్టిగా గూఢముగానున్న సంధియెముకలుగలవాడు, అంతశ్శత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, అర్థచంద్రాకారములో ఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీరమైన నడక గలవాడు, [1-1-8, 9, 10]


సమః సమ విభక్త అంగః స్నిగ్ధ వర్ణః ప్రతాపవాన్ |

పీన వక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభ లక్షణః |1-1-11|

ధర్మజ్ఞః సత్యసంధః చ ప్రజానాం చ హితే రతః |

యశస్వీ జ్ఞానసంపన్నః శుచిః వశ్యః సమాధిమాన్ |1-1-12|

ప్రజాపతి సమః శ్రీమాన్ ధాతా రిపు నిషూదనః |

రక్షితా జీవలోకస్య ధర్మస్య పరి రక్షితా|1-1-13|

రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా |

వేద వేదాఙ్గ తత్త్వజ్ఞో ధనుర్వేదే నిష్ఠితః |1-1-14|

సర్వ శాస్త్ర అర్థ తత్త్వజ్ఞో స్మృతిమాన్ ప్రతిభానవాన్ |

సర్వలోక ప్రియః సాధుః అదీనాత్మా విచక్షణః |1-1-15|

శ్రీరాముడు అంతగా పొడవుగాని పొట్టిగాని గాక ప్రమాణమైన దేహము గలవాడు, సమానమైన కరచరణాది - అవయవ సౌష్ఠవము గలవాడు, కనువిందు గావించు దేహకాంతి గలవాడు, పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షఃస్థలము గలవాడు, విశాలమైన కన్నులుగలవాడు, పొంకమైన అవయవములపొందిక గలవాడు, సాటిలేని శుభ లక్షణములు గలవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకొనుటయే పరధర్మముగా గలవాడు, ఆడిన మాటను తప్పనివాడు, ప్రజలకు హితమొనర్చు స్వభావము గలవాడు, ఆ విధముగా ఖ్యాతికెక్కినవాడు, సకలశాస్త్ర పారంగతుడు, స్వయముగా పవిత్రుడు, ప్రాణికోటిని పవిత్ర మొనర్చువాడు, భక్త (ఆశ్రిత) పరాధీనుడు, ఏకాగ్రచిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడై, ప్రజాపతి బ్రహ్మవలె జనులను సృష్టించువాడు, విష్ణువువలె అఖండైశ్వర్య సంపన్నుడై పోషించువాడు, సాధుపురుషులను బాధించువారిని పరిమార్చుటలో హరునివంటివాడు, స్వ-పర భేదములు లేక అందఱిని రక్షించువాడు, ధర్మమును స్వయముగా ఆచరించుచు, లోకులచే ఆచరింప జేయుచు దానిని కాపాడువాడు, స్వధర్మమును పాటించువాడు, తనను ఆశ్రయించిన వారు ఎట్టివారైనను వారిని రక్షించువాడు, వేదవేదాంగముల పరమార్థములను ఎఱిగినవాడు, ధనుర్వేదము నందును (యుద్ధ విద్యలయందు) ఆరితేరినవాడు, సకలశాస్త్రములను సాకల్యముగా ఎఱిగినవాడు, శాస్త్రాదివిషయములయందు ఏమరుపాటు లేని వాడు, సమస్త వ్యవహారములయందు చక్కని స్ఫూర్తి గలవాడు, సమస్త జనులకును ప్రీతి పాత్రుడు, సౌమ్య స్వభావము గలవాడు,ఉదారస్వభావుడు, సదసద్వివేక సంపన్నుడు, [1-1-11, 12, 13, 14, 15]


సర్వదా అభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః |

ఆర్యః సర్వసమః చ ఏవ సదైవ ప్రియ దర్శనః |1-1-16|

స చ సర్వ గుణోపేతః కౌసల్య ఆనంద వర్ధనః |

సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవాన్ ఇవ |1-1-17|

విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియ దర్శనః |

కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథ్వీ సమః |1-1-18|

నదులు సముద్రమునుగలిసినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేరుచుందురు. అతడు అందఱికిని పూజ్యుడు, ఎవ్వరి యెడలను వైషమ్యములుగాని తారతమ్యములు గాని లేక మెలగువాడు. ఎల్లవేళల అందఱికిని ఆయన దర్శనము ప్రీతిని గొల్పుచుండును. కౌసల్యానందనుడైన ఆ రాముడు సర్వ సద్గుణవిలసితుడు, అతడు సముద్రునివలె గంభీరుడు, ధైర్యమున హిమవంతుడు, పరాక్రమమున శ్రీమహావిష్ణువు, చంద్రునివలె ఆహ్లాదకరుడు, సుతిమెత్తని హృదయము గలవాడేయైనను తన ఆశ్రితులకు అపకారము చేసినవారియెడల ప్రళయాగ్నివంటివాడు. సహనమున భూదేవి వంటివాడు. [1-1-16, 17, 18]


ధనదేన సమః త్యాగే సత్యే ధర్మ ఇవ అపరః |

తం ఏవం గుణ సంపన్నం రామం సత్య పరాక్రమం |1-1-19|

జ్యేష్టం శ్రేష్ట గుణైః యుక్తం ప్రియం దశరథః సుతం |

ప్రకృతీనాం హితైః యుక్తం ప్రకృతి ప్రియ కామ్యయా |1-1-20|

అమోఘపరాక్రమశాలియైన శ్రీరాముడు ఇట్టి సద్గుణములతో ఒప్పుచుండువాడు. సోదరులలో పెద్దవాడు, దశరథునకు ప్రియపుత్రుడు. ప్రజలకు హితమును గూర్చుటలో నిరతుడు, అట్టి సకలగుణాభిరాముడు ఐన శ్రీరామచంద్రుని తన మంత్రులవిజ్ఞప్తిమేరకు ప్రజల క్షేమము గోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజపట్టాభిషిక్తునిగా చేయుటకు సిద్ధపడెను. [1-1-19, 20]

యౌవ రాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతిః |

తస్య అభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యా అథ కైకయీ |1-1-21|

పూర్వం దత్త వరా దేవీ వరం ఏనం అయాచత |

వివాసనం చ రామస్య భరతస్య అభిషేచనం |1-1-22|

శ్రీరామునియువరాజపట్టాభిషేకమునకై జరుగుచున్న ఏర్పాట్లను దశరథుని ప్రియభార్యయైన కైకేయి (తన దాసియైన మంథర ద్వారా) ఎఱింగెను. పూర్వము (శంబరాసురుని జయించిన సందర్భమున) దశరథుడు ఆమెకు రెండు వరములను ఇచ్చియుండెను. రాముని వనములకు పంపుమనియు, భరతుని యువరాజ పట్టాభిషిక్తునిగా జేయుమనియు - ఆ రెండు వరములను ఇప్పుడు ఆమె తన భర్తనుకోరెను. [1-1-21, 22]


స సత్య వచనాత్ రాజా ధర్మ పాశేన సంయతః |

వివాసయామాస సుతం రామం దశరథః ప్రియం |1-1-23|

స జగామ వనం వీరః ప్రతిజ్ఞాం అనుపాలయన్ |

పితుర్ వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియ కారణాత్ |1-1-24|

సత్యసంధుడైన ఆ దశరథమహారాజు ధర్మ(పాశ)మునకు కట్టుబడి, ప్రియతమసుతుడైన శ్రీరాముని వనములకు పంపవలసి వచ్చెను. వీరుడైన శ్రీరాముడు కైకేయికి ప్రియమును గూర్చుటకై తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి, పితృవాక్య పరిపాలనకై వనవాసమునకు బయలుదేరెను. [1-1-23, 24]


తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణః అనుజగామ హ |

స్నేహాత్ వినయ సంపన్నః సుమిత్ర ఆనంద వర్ధనః |1-1-25|

సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు శ్రీరామునకు ప్రియసోదరుడు, మిక్కిలి వినయసంపన్నుడు, రామునియందు భక్తితత్పరుడు. అన్న అడవులకు బయలుదేరుచుండగా స్నేహాతిరేకముతో లక్ష్మణుడును ఆయనను అనుగమించెను. [1-1-25]


భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రం అను దర్శయన్ |

రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణ సమా హితా |1-1-26|

జనకస్య కులే జాతా దేవ మాయేవ నిర్మితా |

సర్వ లక్షణ సంపన్నా నారీణాం ఉత్తమా వధూః |1-1-27|

జనకునివంశమున పుట్టిన సీతాదేవి శ్రీరామునకు ధర్మపత్ని. ఆమెపై ఆయనకు గల ప్రేమ అపారము, ప్రాణసమానురాలు, దేవ మాయ వలె (దేవతలను సైతము మోహింపజేసిన మోహినివలె) అపూర్వమైన సౌందర్యము గలది, సర్వ శుభలక్షణ శోభిత, దశరథుని కోడలు, స్త్రీలలో ఉత్తమురాలు. ఆమెయు చంద్రుని రోహిణివలె శ్రీరాముని అనుగమించెను. [1-1-26, 27]


సీతాప్య అనుగతా రామం శశినం రోహిణీ యథా |

పౌరైః అనుగతో దూరం పిత్రా దశరథేన చ |1-1-28|

శృంగిబేర పురే సూతం గంగా కూలే వ్యసర్జయత్ |

గుహం ఆసాద్య ధర్మాత్మా నిషాద అధిపతిం ప్రియం |1-1-29|

దశరథుడును ద్వారమువఱకు వారిని అనుసరించెను - పౌరులును (ఆయనను విడిచియుండలేక) చాల దూరము ఆయనను అనుగమించిరి. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగాతీరమున గల శృంగిబేరపురమున తనకు భక్తుడు, నిషాదులకు రాజు ఐన గుహుని గలిసికొనెను. పిమ్మట రథసారథిని (రథమును) వెనుకకు పంపివేసెను. [1-1-28, 29]


గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా |

తే వనేన వనం గత్వా నదీః తీర్త్వా బహు ఉదకాః |1-1-30|

చిత్రకూటం అనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ |

రమ్యం ఆవసథం కృత్వా రమమాణా వనే త్రయః |1-1-31|

శ్రీరాముడు సీతాలక్ష్మణులతోడను, గుహునితోడను గూడి వనములలో సాగిపోవుచు, గుహుని సాయముతో జలసమృద్ధిగల గంగానదిని దాటెను. పిమ్మట భరద్వాజమహర్షి ఆదేశమును అనుసరించి, సీతారామలక్ష్మణులు మందాకినీ నదీతీరమునగల చిత్రకూటమునకు చేరిరి. అచట చక్కని పర్ణశాలను నిర్మించుకొని ఆ ముగ్గురును దేవగంధర్వసదృశులై సుఖముగా ప్రశాంతముగా నివసింపసాగిరి. [1-1-30, 31]


దేవ గంధర్వ సంకాశాః తత్ర తే న్యవసన్ సుఖం |

చిత్రకూటం గతే రామే పుత్ర శోక ఆతురః తథా |1-1-32|

సీతారామలక్ష్మణులు చిత్రకూటమునకు చేరగా (అయోధ్యలో) దశరథమహారాజు పుత్రశోకకారణముగా సుతునికై విలపించుచు స్వర్గస్థుడాయెను. [1-1-32]


రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతం |

గతే తు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైః ద్విజైః |1-1-33|

నియుజ్యమానో రాజ్యాయ న ఇచ్ఛత్ రాజ్యం మహాబలః |

స జగామ వనం వీరో రామ పాద ప్రసాదకః |1-1-34|

దశరథుడు మృతిచెందిన పిమ్మట వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారమును స్వీకరింపుమని భరతుని కోరిరి. అందులకు ఆ మహావీరుడు సమ్మతింపలేదు. రాజ్యకాంక్ష లేని ఆ భరతుడు పూజ్యుడైన రాముని అనుగ్రహమును పొందగోరినవాడై, వనములకు బయలుదేఱెను. [1-1-33, 34]


గత్వా తు స మహాత్మానం రామం సత్య పరాక్రమం |

అయాచత్ భ్రాతరం రామం ఆర్య భావ పురస్కృతః |1-1-35|

ప్రసన్నహృదయుడు, సత్యసంధుడు ఐన శ్రీరాముని జేరి, భరతుడు మిక్కిలిపూజ్యభావముతో "ఓ ధర్మజ్ఞా! జ్యేష్ఠుడవు, శ్రేష్ఠుడవు ఐన నీవే అయోధ్యకు రాజు కాదగినవాడవు". అని పలుకుచు సోదరుడైన శ్రీరాముని వేడుకొనెను. [1-1-35]


త్వం ఏవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచః అబ్రవీత్ |

రామోఽపి పరమోదారః సుముఖః సుమహాయశాః |1-1-36|

మిక్కిలి ఔదార్యము గలవాడును, ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉండువాడును, వాసిగాంచినవాడును ఐన శ్రీరాముడు అర్థుల ప్రార్థనలను మన్నించువాడే ఐనప్పటికిని తండ్రిఆదేశమును అనుసరించి రాజ్యాధికారమును చేపట్టుటకు ఇష్టపడలేదు. [1-1-36]


న చ ఇచ్ఛత్ పితుర్ ఆదేశాత్ రాజ్యం రామో మహాబలః |

పాదుకే చ అస్య రాజ్యాయ న్యాసం దత్త్వా పునః పునః |1-1-37|

అనంతరము రాముడు తనకు ప్రతినిధిగా తన పాదుకలను న్యాసముగా భరతునకు ఒసంగి, పలువిధములుగా నచ్చజెప్పి, అతనిని అయోధ్యకు పంపెను. [1-1-37]


నివర్తయామాస తతో భరతం భరత అగ్రజః |

స కామం అనవాప్య ఏవ రామ పాదౌ ఉపస్పృశన్ |1-1-38|

"అయోధ్యకు శ్రీరాముని తీసుకొని రావలెను" - అను తన లక్ష్యము నెరవేఱకున్నను, భరతుడు రాజప్రతినిధిగా రామ పాదుకలను సింహాసనమున ప్రతిష్ఠించి, వాటిని సేవించుచు నందిగ్రామముననే యుండి, రామునికై ఎదురుతెన్నులు చూచుచు రాజ్యపాలన చేయసాగెను. [1-1-38]


నంది గ్రామే అకరోత్ రాజ్యం రామ ఆగమన కాంక్షయా |

గతే తు భరతే శ్రీమాన్ సత్య సంధో జితేంద్రియః |1-1-39|

రామః తు పునః ఆలక్ష్య నాగరస్య జనస్య చ |

తత్ర ఆగమనం ఏకాగ్రో దణ్డకాన్ ప్రవివేశ హ |1-1-40|

భరతుడు అయోధ్యకు మఱలివెళ్ళెను. సత్యసంధుడు, జితేంద్రియుడు ఐన శ్రీరాముడు తన దర్శనమునకై తఱచుగా పౌరులు జానపదులు అచటికి వచ్చుచుండుట గమనించి ఆ కారణముగా అచటి మునులతపశ్చర్యలకు విఘ్నములు ఏర్పడునని భావించెను. పిమ్మట అతడు దండకారణ్యము చేరుటకు నిశ్చయించుకొనెను. సావధానముగా సీతా లక్ష్మణులతో గూడి దండకారణ్యమును జేరెను. [1-1-39, 40]

ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవ లోచనః |

విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ హ |1-1-41|

దండకవనమున ప్రవేశించిన పిమ్మట రాజీవలోచనుడైన శ్రీరాముడు "విరాధుడు" అను రాక్షసుని సంహరించెను. శరభంగమహర్షిని దర్శించెను. అట్లే సుతీక్ష్ణుని, అగస్త్యమునిని, ఆయనసోదరుని దర్శించెను. [1-1-41]

సుతీక్ష్ణం చ అపి అగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా |

అగస్త్య వచనాత్ చ ఏవ జగ్రాహ ఐంద్రం శరాసనం |1-1-42|

శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారము ఆయననుండి ఇంద్రచాపమును, ఖడ్గమును, అక్షయములైన బాణములుగల తూణీరములను గ్రహించి పరమప్రీతుడాయెను. [1-1-42]


ఖడ్గం చ పరమ ప్రీతః తూణీ చ అక్షయ సాయకౌ |

వసతః తస్య రామస్య వనే వన చరైః సహ |1-1-43|

వనవాసులతోగూడి, సీతలక్ష్మణులతో శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచుండగా పరిసరములలోనున్న ఋషీశ్వరులందఱును తమను బాధించుచున్న రాక్షసులను వధింపుమని కోరుటకై శ్రీరామునికడకు విచ్చేసిరి. [1-1-43]


ఋషయః అభ్యాగమన్ సర్వే వధాయ అసుర రక్షసాం |

స తేషాం ప్రతి శుశ్రావ రాక్షసానాం తథా వనే |1-1-44|

ప్రతిజ్ఞాతః చ రామేణ వధః సంయతి రక్షసాం |

ఋషీణాం అగ్ని కల్పానాం దండకారణ్య వాసీనాం |1-1-45|

శ్రీరాముడు దండకారణ్యమున నివశించుచున్న ఆ మునుల యొక్క ప్రార్థనను ఆలకించెను. అగ్నితుల్యులైన ఆ ఋషీశ్వరుల యెదుట "ఆ వనములలోని రాక్షసులను అందఱిని యుద్దమున మట్టుపెట్టెదను" - అని అతడు ప్రతినబూనెను. [1-1-44, 45]

తేన తత్ర ఏవ వసతా జనస్థాన నివాసినీ |

విరూపితా శూర్పణఖా రాక్షసీ కామ రూపిణీ |1-1-46|

ఆ దండకారణ్యమున రావణునిసేనానివేశస్థానమున "శూర్పణక" అను రక్కసి నివసించుచుండెను. శ్రీరాముడు లక్ష్మణునిచే కామరూపిణియైన ఆ రాక్షసి యొక్క ముక్కుచెవులను కోయించి, ఆమెను వికృతరూపను గావించెను. [1-1-46]


తతః శూర్పణఖా వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వ రాక్షసాన్ |

ఖరం త్రిశిరసం చ ఏవ దూషణం చ ఏవ రాక్షసం |1-1-47|

నిజఘాన రణే రామః తేషాం చ ఏవ పద అనుగాన్ |

వనే తస్మిన్ నివసతా జనస్థాన నివాసినాం |1-1-48|


అనంతరము శూర్పణకచే రెచ్చగొట్టబడిన ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు అను రాక్షస ప్రముఖులు అసంఖ్యాక రాక్షసులతోగూడి, యుద్ధసన్నద్ధులై వచ్చిరి. అంతట శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసులైన పదునాలుగు వేలమంది రాక్షసయోధులను, ఖరదూషణ త్రిశిరులను రణభూమికి బలిగావించెను. [1-1-47, 48]


రక్షసాం నిహతాని అసన్ సహస్రాణి చతుర్ దశ |

తతో జ్ఞాతి వధం శ్రుత్వా రావణః క్రోధ మూర్ఛితః |1-1-49|

రావణుడు తన దాయాదులైన ఖరదూషణ త్రిశిరులను శ్రీరాముడు వధించిన వార్తను శూర్పణఖ ద్వారా విని, క్రోధముతో ఉడికిపోయెను. పిమ్మట అతడు మారీచుడు అను రాక్షసుని కడకు వెళ్ళి (సీతాపహరణ విషయమై) అతని సహాయమును అర్థించెను. [1-1-49]


సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం |

వార్యమాణః సుబహుశో మారీచేన స రావణః |1-1-50|

న విరోధో బలవతా క్షమో రావణ తేన తే |

అనాదృత్య తు తత్ వాక్యం రావణః కాల చోదితః |1-1-51|

అప్పుడామారీచుడు "శ్రీరాముడు నీకంటెను శక్తిమంతుడు, అంతటివానితో విరోధము నీకు తగదు" అని పలికి, రావణుని పెక్కువిధముల వారించెను. వాని హెచ్చరికలను పెడచెవిన బెట్టి, ఆయువు మూడిన రావణుడు మారీచుని వెంటబెట్టుకొని, శ్రీరాముని ఆశ్రమ (పంచవటి) సమీపమునకు చేరెను. [1-1-50, 51]


జగామ సహ మారీచః తస్య ఆశ్రమ పదం తదా |

తేన మాయావినా దూరం అపవాహ్య నృప ఆత్మజౌ |1-1-52|

జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం |

గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీం |1-1-53|

రాఘవః శోక సంతప్తో విలలాప ఆకుల ఇంద్రియః |

తతః తేన ఏవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం |1-1-54|

పిమ్మట రానణుడు మాయావియైన మారీచునిసహకారముతో రామలక్ష్మణులను వారిఆశ్రమమునుండి దూరముగా పంపి, సీతాదేవిని అపహరించుకొని పోయెను. దారిలో తనకు అడ్డుతగిలిన "జటాయువు" అబు గృధ్రమును ప్రాణము అన్నుబట్టునట్లుగా గాయపఱచెను. పిమ్మట శ్రీరాముడు ప్రాణావసానదశలోనున్న జటాయువును చూచెను. ఆగృధ్రము రావణుడు సీతదేవిని అపహరించుకొని పోయిన వార్తను దెలిపి, రామునిపాదసన్నిధిలో కన్నుమూసెను. జటాయువుమృతికి శ్రీరాముడు వ్యాకులపాటుతో శోకసంతుప్తుడై విలవిలలాడెను. అట్లుశోకమున మునింగియు శ్రీరాముడు జటాయువునకు అంత్యసంస్కారములను నిర్వహించెను. [1-1-52, 53, 54]


మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ |

కబంధం నామ రూపేణ వికృతం ఘోర దర్శనం |1-1-55|

శ్రీరాముడు సీతాదేవికై అడవులలో అన్వేషించుచు కబంధుడను పేరుగల రాక్షసుని గాంచెను. అతడు వికృతాకారముతో చూడ భయంకరుడైయుండెను. మహాబాహువైన శ్రీరాముడు ప్రాణులను హింసించుచున్న ఆ దానవుని హతమార్చి, అతని కోరికమేరకు ఆ కళేబరమును దహింపజేసెను. ఫలితముగా అతనికి స్వర్గప్రాప్తికలిగెను. [1-1-55]


తం నిహత్య మహాబాహుః దదాహ స్వర్గతః చ సః |

స చ అస్య కథయామాస శబరీం ధర్మ చారిణీం |1-1-56|

శాపవిముక్తుడైన కబంధుడు దివ్యరూపముతో స్వర్గమునకు ఆకాశమున కొంతతడవాగి, శ్రీరామునితో "ఓ రామా! ఈ సమీపముననే నీ భక్తురాలైన శభ్రి గలదు. గురువులను సేవించుట ఆమె స్వభావము, అతిథి సత్కారముల యందు ఆమె నిరతురాలు. ఆమె సన్య్యాసిని, నీవు ఆ శబరి యొద్దకు వెళ్ళుము" అని పలికెను. [1-1-56]


శ్రమణాం ధర్మ నిపుణాం అభిగచ్ఛ ఇతి రాఘవ |

సః అభ్య గచ్ఛన్ మహాతేజాః శబరీం శత్రు సూదనః |1-1-57|

శత్రువులను రూపుమాపువాడును, మహాతేజశ్శాలియు ఐన శ్రీరాముడు శబరికడకు వెళ్ళెను. శబరి భక్తిశ్రద్ధలతో కొసరి కొసరి ఫలములను అర్పించి, ఆయనను పూజించెను. [1-1-57]


శబర్యా పూజితః సమ్యక్ రామో దశరథ ఆత్మజః |

పంపా తీరే హనుమతా సంగతో వానరేణ హ |1-1-58|


పంపాసరస్సుతీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలిసికొనెను. ఆ వానరోత్తమునిసూచనను అనుసరించి, రాముడు సుగ్రీవుని కడకు వెళ్ళెను. [1-1-58]


హనుమత్ వచనాత్ చ ఏవ సుగ్రీవేణ సమాగతః |

సుగ్రీవాయ చ తత్ సర్వం శంసత్ రామో మహాబలః |1-1-59|

మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తనవృత్తాంతమును అంతయును దెలిపెను. మఱియు సీతాపహరణ గాథను గూడ ఆయనకు పూర్తిగా వివరించెను. [1-1-59]


ఆదితః తత్ యథా వృత్తం సీతాయాః చ విశేషతః |

సుగ్రీవః చ అపి తత్ సర్వం శ్రుత్వా రామస్య వానరః |1-1-60|

చకార సఖ్యం రామేణ ప్రీతః చ ఏవ అగ్ని సాక్షికం |

తతో వానర రాజేన వైర అనుకథనం ప్రతి |1-1-61|

సుగ్రీవుడును శ్రీరాముడు చెప్పిన విశేషములను అన్నింటిని వినెను. శ్రీరామునకు తోడ్పడుటవలన తనకు ప్రయోజనము కలుగునని భావించి, అతడు శ్రీరామునితో అగ్నిసాక్షిగా మైత్రిని నెఱపెను. పిమ్మట సుగ్రీవుడు దుఃఖితుడై యుండుట గమనించి, శ్రీరాముడు "నీ దుఃఖకారణమేమి?" అని అతనిని అడిగెను. అప్పుడు సుగ్రీవుడు తనపై మొదట వాలికిగల ప్రేమ విశ్వాసములను, పిదప వాలితో తనకు ఏర్పడిన వైరగాథను (తనదురవస్థను) అంతయును రామునకు మిక్కిలి దుఃఖముతో విపులముగా దెలిపెను. [1-1-60, 61]


రామాయ ఆవేదితం సర్వం ప్రణయాత్ దుఃఖితేన చ |

ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలి వధం ప్రతి |1-1-62|


అనంతరము రాముడు "వాలిని వధింతును" అని ప్రతిజ్ఞ చేసెను. పిమ్మట సుగ్రీవుడు వాలియొక్క (అసాధారణ) బలపరాక్రమములను గూర్చి శ్రీరామునకు వివరించెను. [1-1-62]


వాలినః చ బలం తత్ర కథయామాస వానరః |

సుగ్రీవః శంకితః చ ఆసీత్ నిత్యం వీర్యేణ రాఘవే |1-1-63|

రాఘవః ప్రత్యయార్థం తు దుందుభేః కాయం ఉత్తమం |

దర్శయామాస సుగ్రీవః మహాపర్వత సంనిభం |1-1-64|

ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చ అస్తి మహాబలః |

పాద అంగుష్టేన చిక్షేప సంపూర్ణం దశ యోజనం |1-1-65|

వాలిని హతమార్చుటకు శ్రీరామునకుగల పరాక్రమ విషయమున సుగ్రీవుని మనస్సులో సందేహము మెదలుచుండెను. ఆయన బలపరాక్రములను తెలిసికొనుటకొఱకు వాలిచే హతుడైన "దుందుభి"యను రాక్షసుని కళేబరమును సుగ్రీవుడు ఆయనకు చూపెను. మహాపర్వతసదృశమైన ఆఅస్థిపంజరమును జూచి, మహాబాహువైన రాముడు ఒక చిఱునవ్వు నవ్వి, "ఇంతేనా " అనియనుచు దానిని తన కాలిబొటనవ్రేలికొనతో అవలీలగా చిమ్మెను. అప్పుడా కళేబరము పూర్తిగా పదియొజనముల దురమున పడిపోయెను. [1-1-63, 64, 65]


బిభేద చ పునః సాలాన్ సప్త ఏకేన మహా ఇషుణా |

గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తథా |1-1-66|

సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసము కలిగించుటకై రాముడు ప్రయోగించిన బాణము రివ్వున సాగి, వరుసగానున్న ఏడు మద్దిచెట్లను, ఆ సమీపమునే ఉన్న ఒకపర్వతమును, రసాతలమును భేదించి, అదేవేగముతో వచ్చి ఆయన తూణీరమున జేరెను. [1-1-66]


తతః ప్రీత మనాః తేన విశ్వస్తః స మహాకపిః |

కిష్కింధాం రామ సహితో జగామ చ గుహాం తదా |1-1-67|

తతః అగర్జత్ హరివరః సుగ్రీవో హేమ పింగలః |

తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః |1-1-68|

అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః |

నిజఘాన చ తత్ర ఏనం శరేణ ఏకేన రాఘవః |1-1-69|

తతః సుగ్రీవ వచనాత్ హత్వా వాలినం ఆహవే |

సుగ్రీవం ఏవ తత్ రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్ |1-1-70|

అప్పుడాసుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని పరాక్రమును జూచి, ఎంతయు సంతోషించెను. సుగ్రీవునకు అతని పరాక్రముపై పూర్తిగా నమ్మకము కుదురుకొనెను. పిమ్మట అతడు రామునితో గూడి కొండలమధ్య గుహవలెనున్న కిష్కింధను సమీపించెను. బంగారు పింగళవర్ణములు గలవాడు, కపిశ్రేష్ఠుడు ఐన సుగ్రీవుడు బిగ్గరగా గర్జించెను. ఆ మహానాదమును విని, వానర ప్రభువైన వాలి తనగృహమునుండి బయటికి వచ్చెను. "సుగ్రీవునితో యుద్దము చేయుటకు వెళ్ళవలదు" అని వారించుచున్న తారను సమాధానపఱచి, వాలి సుగ్రీవునితో తలపడెను. అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క బాణముతో వధించెను. సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజునుగా జేసెను. [1-1-67, 68, 69, 70]


స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః |

దిశః ప్రస్థాపయామాస దిదృక్షుః జనక ఆత్మజాం |1-1-71|

అనంతరము వానరప్రభువైన సుగ్రీవుడు వివిధ ప్రదేశముల యందున్న వానరులనందఱిని రప్పించి, సీతాన్వేషణకై వారిని నలుదెసలకు పంపెను. [1-1-71]


తతో గృధ్రస్య వచనాత్ సంపాతేః హనుమాన్ బలీ |

శత యోజన విస్తీర్ణం పుప్లువే లవణ అర్ణవం |1-1-72|

పిమ్మట (సీతాదేవిని వెదకుటకై జాంబవదాదులతో దక్షిణదిశకు వెళ్ళిన) మహాబలసంపన్నుడైన హనుమంతుడు గృధరాజైన సంపాతి సూచన మేరకు నూఱు యోజనముల విస్తీర్ణము గల లవణసముద్రమును ఒక్కగంతులో దాటెను. [1-1-72]


తత్ర లంకాం సమాసాద్య పురీం రావణ పాలితాం |

దదర్శ సీతాం ధ్యాయంతీం అశోక వనికాం గతాం |1-1-73|

అంతట ఆ రామబంటు రావణునిచే పాలింపబడుచున్న లంకకు చేరెను. క్రమముగా సీతాదేవికొఱకు వెదకుచు అతడు అశోక వనమున అడుగిడి, అచట రామధ్యానమున నిమగ్నయైయున్న జానకిని కనుగొనెను. [1-1-73]


నివేదయిత్వా అభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ |

సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం |1-1-74|

పిదప ఆంజనేయుడు సీతాదేవికి "రామసుగ్రీవుల మైత్రిని దెలిపి, రామనామాంకితమైన ఉంగరమును ఆమెకు ఆనవాలుగా సమర్పించెను. ఆమెకై శ్రీరాముడు పరితపించుచున్నతీరును వివరించి, ఆమెను ఓదార్చెను, పిమ్మట అశోకవనమును ధ్వంసము చేసెను. [1-1-74]


పంచ సేన అగ్రగాన్ హత్వా సప్త మంత్రి సుతాన్ అపి |

శూరం అక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ |1-1-75|

అస్త్రేణ ఉన్ముక్తం ఆత్మానం జ్ఞాత్వా పైతామహాత్ వరాత్ |

మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణః తాన్ యదృచ్ఛయా |1-1-76|

వాయుసుతుడు ఐదుగురు సేనాపతులను అంతమొందించెను, ఏడుగురు మంత్రిపుత్రులను మట్టిగఱపించెను. శూరుడైన అక్షకుమారుని హతమార్చెను. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బుద్ధిపూర్వకముగా కట్టుబడెను. నిరుపమాన పరాక్రమశాలియైన వాయునందనుడు బ్రహ్మవరప్రభావమున బ్రహ్మాస్త్రమునుండి అప్రయత్నముగా తాను విముక్తుడైనట్లు తెలిసికొనెను. ఐనప్పటికిని హనుమంతుడు రామకార్యమును సాధించుటకై బ్రహ్మాస్త్రమునకు బద్ధుడైయున్నట్లు నటించుచు, రాక్షసులుపెట్టు బాధలను సహించెను. [1-1-75, 76]


తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీం |

రామాయ ప్రియం ఆఖ్యాతుం పునః ఆయాత్ మహాకపిః |1-1-77|

సః అభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం |

న్యవేదయత్ అమేయాత్మా దృష్టా సీతా ఇతి తత్త్వతః |1-1-78|

(రావణాజ్ఞననుసరించి, రాక్షసులు తనతోకకు నిప్పంటింపగా) మారుతి తనవాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలమునుదప్ప లంకను దగ్ధము గావించెను. సీతాదేవికుశలవార్తను దెలిపి, శ్రీరామునకు ప్రీతిని గూర్చుటకై ఆ హనుమంతుడు అతి శీఘ్రముగా ఆ ప్రభువుసమీపమునకు మఱలివచ్చెను. మహాబుద్ధిశాలియైన పవనసుతుడు "కనుగొంటిని సీతమ్మను" అని పలికి, రామునకు ప్రదక్షిణమొనర్చెను. సీతాదేవి యెడబాటునకు లోనయ్యును, నిశ్చలుడై యున్న ఆ ప్రభువునకు ఆ వాయుసుతుడు యావద్వృత్తాంతమును వివరించెను. [1-1-77, 78]


తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహా ఉదధేః |

సముద్రం క్షోభయామాస శరైః ఆదిత్య సన్నిభైః |1-1-79|

దర్శయామాస చ ఆత్మానం సముద్రః సరితాం పతిః |

సముద్ర వచనాత్ చ ఏవ నలం సేతుం అకారయత్ |1-1-80|

హనుమంతుడు తెలిపిన సమాచారమును గ్రహించిన పిమ్మట, శ్రీరాముడు సుగ్రీవాదులతోగూడి, మహాసముద్ర తీరమునకు చేరెను. అనంతరము అతడు సూర్యకిరణములవలె తీక్షములైన బాణములతో సముద్రమును అల్లకల్లోలమొనర్చెను. అంతట సముద్రుడు రామునకు నిజరూపమును ప్రదర్శించెను. సముద్రుని సూచనలను అనుసరించి, శ్రీరాముడు సముద్రముపై నలునిద్వారా సేతువును నిర్మింపజేసెను. [1-1-79, 80]


తేన గత్వా పురీం లంకాం హత్వా రావణం ఆహవే |

రామః సీతాం అనుప్రాప్య పరాం వ్రీడాం ఉపాగమత్ |1-1-81|

తాం ఉవాచ తతః రామః పరుషం జన సంసది |

అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ |1-1-82|

ఆ సేతువుద్వారా లంకను జేరి, శ్రీరాముడు రావణుని రణరంగమున హతమార్చెను. తదనంతరము సీతను సమీపించి, పరుల పంచననున్న ఆమెను స్వీకరించుటకు (లోకోపవాదశంకతో) వెనుకాడెను. (సీతాదేవి సౌశీల్యమునుగూర్చి ఎల్లరకును విశ్వాసము కలిగించుటకై) అందఱియెదుట శ్రీరాముడు పరుష వచనములను పలికెను. సాధ్వియైన ఆ సీతాదేవి ఆ కఠినోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించెను. [1-1-81, 82]


తతః అగ్ని వచనాత్ సీతాం జ్ఞాత్వా విగత కల్మషాం |

కర్మణా తేన మహతా త్రైలోక్యం స చరాచరం |1-1-83|

పిదప అగ్నిదేవుడు ప్రత్యక్షమై "సీతాదేవి త్రికరణశుద్ధిగా పరమసాధ్వి, దోషరహిత" అని ప్రకటించెను. అంతట శ్రీరాముడు పరమసంతుష్టుడాయెను. రామునిధర్మనిరతిని దేవతలందఱును కొనియాడిరి. [1-1-83]


స దేవర్షి గణం తుష్టం రాఘవస్య మహాత్మనః |

బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వ దేవతైః |1-1-84|

మహాత్ముడైన శ్రీరాముడు ఆదుష్టరావణుని అంతమొందింపగా దేవతలతో, ఋషులతో, సకలచరాచరములతోగూడిన ముల్లోకములును సంతసించినవి. [1-1-84]


అభ్యషిచ్య చ లంకాయాం రాక్షస ఇంద్రం విభీషణం |

కృతకృత్యః తదా రామో విజ్వరః ప్రముమోద హ |1-1-85|

పిదప శ్రీరాముడు రాక్షసశ్రేష్ఠుడైన విభీషణుని లంకా రాజ్యమునకు పట్టాభిషిక్తునిగావించెను. అట్లు కృతకృత్యుడైన రాముడు ప్రసన్న మనస్కుడయ్యెను. [1-1-85]


దేవతాభ్యో వరాం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ |

అయోధ్యాం ప్రస్థితః రామః పుష్పకేణ సుహృత్ వృతః |1-1-86|

తనవిజయమును శ్లాఘించుటకై వచ్చిన దేవతలనుండి వరమును పొంది, శ్రీరాముడు ఆ వరప్రభావముతో రణరంగమున మృతులై పడియున్న వానరులను పునర్జీవితులను గావించెను. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవవిభీషణాదిమిత్రులతో, వానరులందఱితోగూడి పుష్పకవిమానముపై అయోధ్యకు బయలుదేఱెను. [1-1-86]


భరద్వాజ ఆశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః |

భరతస్య అంతికం రామో హనూమంతం వ్యసర్జయత్ |1-1-87|

శ్రీరాముడు తనవారితో భరద్వాజాశ్రమమునకు చేరెను. "పదునాలుగుసంవత్సరములు పూర్తియైన వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వత్తును" అని భరతునకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుటకై శ్రీరాముడు ముందుగా హనుమంతుని భరతునియొద్దకు పంపెను. [1-1-87]


పునః ఆఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహితః తదా |

పుష్పకం తత్ సమారూహ్య నందిగ్రామం యయౌ తదా |1-1-88|

సుగ్రీవాదులతో పుష్పకవిమానమును అధిరోహించి, శ్రీరాముడు ప్రయాణసమయమున భరతునిగూర్చిన విశేషగాథలను వారికి తెలుపుచు నందిగ్రామమునకు చేరెను. [1-1-88]

నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో అనఘః |

రామః సీతాం అనుప్రాప్య రాజ్యం పునః అవాప్తవాన్ |1-1-89|

చక్కగా పితృవాక్యపరిపాలనమొనర్చివచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నందిగ్రామమున తనసోదరులను కలిసికొని, జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితోగూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టేను. [1-1-89]


ప్రహృష్టో ముదితో లోకః తుష్టః పుష్టః సుధార్మికః |

నిరామయో హి అరోగః చ దుర్భిక్ష భయ వర్జితః |1-1-90|

శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరును సంతోషముతో పొంగిపోవుచు, ఆయన పాలనలో సుఖఃసౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తితత్పరులై ధర్మమార్గమున ప్రవర్తించుదురు, ఆరోగ్యభాగ్యములతో హాయిగానుందురు, కఱువు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుచుందురు. [1-1-90]


న పుత్ర మరణం కేచిత్ ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ |

నార్యః చ అవిధవా నిత్యం భవిష్యంతి పతి వ్రతాః |1-1-91|

న చ అగ్నిజం భయం కించిత్ న అప్సు మజ్జంతి జంతవః |

న వాతజం భయం కించిత్ న అపి జ్వర కృతం తథా |1-1-92|

న చ అపి క్షుత్ భయం తత్ర న తస్కర భయం తథా |

నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్య యుతాని చ |1-1-93|

రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును, స్త్రీలు పాతివ్రత్యధర్మములను పాటించుచు నిత్యసుమంగళులై వర్థిల్లుచు ఉందురు. అగ్నిప్రమాదములు గాని, జలప్రమాద(మరణ)ములు గాని, వాయు భయములుగాని లేకుండును. జ్వరాదిబాధలు, అట్లే ఆకలిదప్పుల బాధలు, చోరభయములు మచ్చుకైనను ఉండవు - (ఆధ్యాత్మిక - ఆధిదైవిక - ఆధి భౌతిక బాధలు లేకుండును). రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడిపంటలతో తులతూగుచుండును. జనులు కృతయుగమునందువలె ఎల్లవేళల సుఖశాంతులటో వర్థిల్లుచుందురు. [1-1-91, 92, 93]


నిత్యం ప్రముదితాః సర్వే యథా కృత యుగే తథా |

అశ్వమేధ శతైః ఇష్ట్వా తథా బహు సువర్ణకైః |1-1-94|

గవాం కోట్యయుతం దత్త్వా విద్వభ్యో విధి పూర్వకం |

అసంఖ్యేయం ధనం దత్త్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః |1-1-95|

అనేకములైన అశ్వమేథాదిక్రతువులను, సువర్ణ్క యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్లకొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమొనర్చి, వాసికెక్కును. [1-1-94, 95]


రాజ వంశాన్ శత గుణాన్ స్థాపయిష్యతి రాఘవః |

చాతుర్ వర్ణ్యం చ లోకే అస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి |1-1-96|

దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ |

రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మ లోకం ప్రయాస్యతి |1-1-97|

రాఘవుడు క్షత్రియవంశములను నూరురెట్లు వృద్థిపఱచును. నాలుగు వర్ణములవారిని ఈ లోకమున తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు పదునొకండువేల సంవత్సరములకాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి, అనంతరము వైకుంఠమునకు చేరును. [1-1-96, 97]


ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైః చ సంమితం |

యః పఠేత్ రామ చరితం సర్వ పాపైః ప్రముచ్యతే |1-1-98|

ఏతత్ ఆఖ్యానం ఆయుష్యం పఠన్ రామాయణం నరః |

స పుత్ర పౌత్రః స గణః ప్రేత్య స్వర్గే మహీయతే |1-1-99|

ఈ శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్రమొనర్చును, సర్వపాపములను రూపుమాపును, పుణ్యసాధనము, వేదార్థమును ప్రతిపాదించునదియు గావున ఇది సర్వవేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించువారి పాపములు అన్నియును పటాపంచలై పోవును, ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును, వారిపుత్త్రపౌత్త్రులకును, పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును. మఱియు అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును. [1-1-98, 99]

పఠన్ ద్విజో వాక్ ఋషభత్వం ఈయాత్ |

స్యాత్ క్షత్రియో భూమి పతిత్వం ఈయాత్ |

వణిక్ జనః పణ్య ఫలత్వం ఈయాత్ |

జనః చ శూద్రో అపి మహత్త్వం ఈయాత్ |1-1-100|

ఈ రామాయణమును పఠించిన ద్విజులు వేదవేదాంగములయందును, శాస్త్రములయందును పండితులు అగుదురు. క్షత్రియులు రాజ్యాధికారమును పొందుదురు. వైశ్యులకు వ్యాపారలాభములు కలుగును. శూద్రులు తోడివారిలో శ్రేష్ఠులు అగుదురు. ఈ రామాయణమును పఠించినవారును, వినినవారును పొందెడి ఫలము అనంతము, అద్వితీయము. [1-1-100]


ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ప్రథమ స్సర్గః |1-1|

వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు మొదటిసర్గము సమాప్తము