బారిష్టరు పార్వతీశం - ప్రథమ భాగము/అధ్యాయము 2
2
రైలు ఆగీ ఆగడముతో వందమంది కూలీలు సామాను ఏమన్నా ఉందా అంటూ రైలులోకి వచ్చిపడ్డారు. పెట్టె నెత్తిన బెట్టుకొని నేనూ దిగాను. నా చుట్టూ ఇరవై మంది కూలీలు చేరి, నేను తీసుకు వస్తా నంటే నేను తీసుకు వస్తానని నా నెత్తిమీదివి లాక్కుని వాళ్లల్లో వాళ్లు దెబ్బలాడుకుని ఆఖరుకు ఒకడా సామాను పుచ్చుకొని పరుగెత్తాడు. సామాను తీసుకొని పారిపోతాడేమో నని గబగబ పరుగెత్తి వాడి నందుకున్నాను. ఆగ మంటే ఆగడు, ఎంత ఇవ్వాలంటే మాట్లాడడు. తిన్నగా బండ్ల దగ్గిరికి తీసుకు వెళ్ళి దింపాడు.
ఒక పాతిక మంది బండ్ల వాళ్ళు నా చుట్టూ మూగారు. ' ఎక్కడ పోవాలె సామీ ? రండిమీ, నేనుదా జల్దీగా కొంచు పోతా ' నంటూ రెక్కపట్టుకు లాగేవాళ్ళు, సామాను లాక్కు పొయ్యే వాళ్లూను. ఎక్కడికి వెళ్లడానికీ తోచదు. నే నెవళ్లనీ ఎరుగను. పోనీ ఏ హోటలుకైనా వెడదామా అంటే హోటలు పేరుగాని, వీథి పేరు గాని తెలియదు. ముందు వీళ్ల గోల వదలితే నయ మని నేనెక్కడికీ వెళ్లను, నాకు బండి అక్కరలే దని నా పెట్టెమీద కూర్చున్నాను. అయినా కానీ నా కేలాగూ బండి కావా లని వా ళ్లూహించిన ట్లున్నారు, వాళ్లుమట్టుకు నన్ను విడిచి పోలేదు. 'ఎందుకు సామీ, అంత కోపము చేస్తావు. మీ యిష్టము వచ్చిన బండిదా చేసుకొని పోండిమీ. ఈ ఎండలో ఎష్టదాపోతావు. మేము భద్రముగా కొంచుపోతాము సామీ ' అని అక్కడే నిలబడ్డారు. సామాను మోసుకు వచ్చినవాడు కూలి ఇమ్మని తొందర పెట్టాడు.
'ఏమి యివ్వాలి?'
'ఏమి సామీ, మీరు నన్నడుగుతారే, మీకు తెలియదా!'
'నాకు తెలియ' దన్నాను.
'ఏమి సామీ తమాషా చేస్తారు. యిచ్చెయ్యండి పోవాల.'
అర్ధణా అణా యిస్తే బాగుండ దని రెండు అణాలు తీసి పుచ్చుకో మన్నాను. నాకేసి ఒకమాటు, డబ్బుల కేసి ఒక మాటూ చూచి వాడు,
'ఏమి సామీ, ఏమిది, నేను ముష్టివా డనుకొంటివా ఏమి? బిచ్చము వేసినట్లు రెండు అణాదా తీసుకోమంటువే?' అన్నాడు.
నేను నిర్ఘాంతపోయి 'పోనీ అని ఎక్కువ యిస్తే ముష్టి అంటాడేమిటి? ఈ ఊళ్ళో ముష్టివాళ్ళకి అంతా బేడలూ పావలాలూ యిస్తారా ఏమిటి చెపుమా' అనుకుని,
'మరి అయితే ఎంత యిమ్మంటావు?' అన్నాను.
'ఒక రూపాయ.'
నా గుండె బద్ధలైంది! సరే తీసుకు పొమ్మని ఇంకో రెండు అణాలు తీసి చేతిలో పెట్టాను. వాడది నామీదికి గిరాటువేసి రూపాయకు ఒక దమ్మిడీ తక్కువైనా పుచ్చుకో నన్నాడు. పుచ్చుకోకపొతే మానివెయ్య మన్నాను. అంత దర్జాకు పోయిన వాడు పుచ్చుకోకుండా పోతాడేమో నను కున్నాను- పోలేదు. నన్ను తిట్టడము ఆరంభించాడు. చుట్టూ నిలబడ్డ బండ్లవాళ్ళు తీర్పు తీర్చడము మొదలుపెట్టారు. సరే వీడితో పేచీ ఎందుకని యింకొక పావలాకూడాయిచ్చాను. ముందు అదికూడా పుచ్చుకోనని నన్నూ, నా మొహాన్నీ, నా ముక్కునూ, నా మూతిని నా ధర్మగుణాన్నీ, తక్కిన ఆంధ్రులనీ, ఆంధ్రదేశాన్నీ కలిపి ఏకంగా తిట్టి ఆ అర్ధరూపాయి తీసుకొని చక్కా పోయినాడు.
ఒక దరిద్రము వదలింది కదా అని సంతోషించాను. ఇంక ఊళ్ళోకి వెళ్ళడముసంగతి ఎలాగా అనుకున్నాను. బండ్లవాళ్ళు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడ్డారు. 'ఈ ఊళ్ళో బస చేయడానికి వీలుగా ఏదైనా హోటలైనా సత్రమైనా ఉందా " అన్నాను వాళ్ళతో.
'ఉంది సామీ, కిట్టనే రామసామి మొదలి సత్రము ఉంది సామి.'
'అక్కడ గదులూ అవీ ఉంటవా, స్నానానికి దానికీ వీలుగా ఉంటుందా?'
'అంతా ఉండును సామీ, నిండా సౌకర్యముగా ఉండును సామీ.'
'మరి భోజనము సంగతి ఏలాగు?'
'దుడ్డు తీసుకుని అక్కడే వేస్తరు.'
భోజనము సంగతి అడిగితే దుడ్డు తీసుకుని వేస్తారంటాడేమిటా అనుకొని 'అది కాదు. భోజనము హోటలు కూడా సత్రానికి దగ్గిర వుందా?' అన్నాను.
'అదిదా సామి, చెప్పితిని. సత్రములోదా అన్నముకూడా వేస్తరు. దుడ్డుమాత్రము తీసుకొందురు.'
అని అభినయరూపంగా వ్యాఖ్యానము చేసి నా బోటి అజ్ఞాను లకు అర్ధ మయ్యేటట్టు చెప్పాడు. అయితే బండికేమి యివ్వాలన్నాను.
'మూణు రూపాయి'
'ఇక్కడి కెంతదూరము ఉంటుంది?'
'రెండుమైలు సుమారు ఉండును.'
'అయితే రెండుమైళ్లకి మూడు రూపాయ లెవరిస్తారు? నేనివ్వను'
'మీదయ సామీ, మా మామూలు మేము చెప్పాము, నీ వేమి ఇస్తావో చెప్పూ.'
'ఒక్కరూపాయి ఇస్తా.'
'ఏమి సామీ, అట్లా చెపుతారు. ఇది నాటుపుర మనుకొంటివా మాటువండి అనుకొంటివా, పారు సామీ, అది కుధరె వండి. గుర్రము సూస్తివా, నిండా బాగా పోను '
ఇంకా మనకు బోలెడు పనిఉంది పోనీ, త్వరగా పోదామని ఇంకో అర్ధరూపాయి ఎక్కువిస్తానన్నాను.
'ఏమి సామీ, ఒక్క పెట్టి రైలులోనుంచి ఇక్కడ పెట్టినందుకే అర్ధరూపాయి యిస్తివే! రెండు మైలుదా పోవాలె, నేనూ గుర్రమూ బతకాలె ఎట్లా సామీ! ఊఁ మీతో బేరమెందుకు సామీ, మీకు తెలియదా రెండు రూపాయి ఇచ్చెయ్యండి, ఎక్కండి.'
నేను ఇవ్వనందా మనుకొంటూ ఉంటేనే పెట్టి బండిలో పెట్టి నన్నెక్క మన్నాడు. వాడు చెప్పింది సబబుగానే ఉందని ఆలోచించి, మాట్లాడ కుండా బండి ఎక్కాను. ఎక్కగానే తక్కిన బండ్ల వాళ్ళంతా రూపాయిన్నరకే బండ్లు కడతా మన్నారు. వీడు మోసము చేశాడు పోనీ దిగుదామా అనుకొంటూ ఉంటే వాళ్లందరినీ తిడుతూ వాళ్ల నెప్పుడూ నమ్మ వద్దని నాకు హితోపదేశము చేస్తూ నా బండివాడు గబగబ బండి తోలాడు: తోవ పొడుక్కీ కష్టము చాలదనీ ఆ రోజున ఉదయము నుంచీ, బేరము లేకపోవడా న్నుంచీ, తక్కిన వాళ్ళు కట్టి వేస్తారేమోననే ఆదుర్దా కొద్దీ, తక్కువకు ఒప్పుకున్నాననీ, ఇంకొక కాలు రూపాయి అయినా వాడి కష్ట మాలోచించి ఇమ్మనీ ప్రాధేయ పడుతూ, పదినిమిషాల్లో సత్రము దగ్గిర దింపాడు.
అప్పుడే రెండు మైళ్ళు వచ్చామా అనుకుంటూ, అయినా పట్నవాసములో దూరము అట్టే తెలియ దని సమాధానము చెప్పుకొని, గుర్రము బహుత్వరలో వచ్చిందని సంతోషించి బండివాడికి రెండుంబేడ ఇచ్చివేశాను. ఇంకోబేడ ఇమ్మని చాలాసేపు బతిమాలి, కోపపడి, తిట్టి, చక్క పోయినాడు.
సత్రములో జనము కిటకిట లాడుతున్నారు. ఇంతమంది పొరుగూరు జనమిక్కడి కెందుకు వచ్చారా అనుకున్నాను. లోపలికి వెళ్ళాను. గూడకట్టు కట్టుకుని అది మోకాలుపైకి మణిచి, జుట్టు కొప్పెట్టుకుని, నెత్తిమీద నుంచి చమురు మొహము మీదికి కారుతూ, నల్లగా లావుగా శిలావిగ్రహములాగా ఒక మనిషి కనపడ్డాడు. కాళ్ళు ఎడముగా పెట్టుకుని నిలబడి నాకేసి ఎగాదిగా చూసి 'ఎన్నా వేణుం' అన్నాడు.
'మీరన్న దేమిటో నాకు తెలియదు కాని నా కొకగది కావాలి ముందు.'
'ఓ అష్టనా! నీవు ఎవరు బ్రాహ్మణుడా కాదా? మీది యావూరు? ఎన్ని దినా లుండబోతావు? ఎక్కడ పోతావు? ఈ వూరెందుకు కొచ్చావు?' అని ఆరంభించాడు. 'మేము బ్రాహ్మణులమేను. ఇక తక్కిన సంగతంతా మీ కెందుకూ? గదివుంటే ఇవ్వండి, మీకు తెలియకపోతే ఎవరిని అడగాలో చెవ్పండి.'
'నిండా గట్టివాడుగా వున్నావే? ఎన్ని దినము లుండేదీ చెప్పక పోతే ఎష్టదా గది యిస్తును? మూడు దినాలు కంటే వుండేదానికి లేదు.'
'నేను మూడు రోజులుకూడా ఉండను. మళ్లీ ఈ రోజు సాయంత్రమో రేపో వెళ్ళి పోతాను.'
'అయితే సరే, ఈ గదిలో ఉండవచ్చు' నని ఒక గది చూపించాడు.
నే నాగదిలో ప్రవేశించి సామానక్కడ భద్రపరచుకొని బయటికివచ్చి స్నానముచేసి పట్టుబట్ట కట్టుకొని మొహాన్ని బొట్టు పెట్టుకొని చెంబు తీసుకుని భోజనాల సావిటిలోకి వచ్చాను. అక్కడంతా చొక్కాలతోటి, కోట్లతోటి భోజనాలు చేస్తున్నారు. కొందరు వడ్డించేవాళ్ళుకూడా బనియన్ తొడుక్కుని వడ్డిస్తున్నారు. ఈ అనాచారమంతా చూసి అక్కడ భోజనము చెయ్యబుద్ధి అయింది కాదు. అయినా గత్యంతరము లేక ఖాళీగా ఉన్న విస్తరి దగ్గిరికి వెళ్ళి కూర్చున్నాను. భోజనము చేస్తున్నవాళ్లూ వడ్డించేవాళ్లూ కూడా నన్ను చూసి లోపల నవ్వుకోడము మొదలు పెట్టారు. వాళ్ళతోటి మనకెందుకని యధావిదిగా పరిషించి భోజనానికి కూర్చున్నాను.
ఇంకా వడ్డన అవుతుండగానే నాపంక్తిని కూర్చున్న అరవ వాళ్ళు కూర ముక్కలు వట్టి నోటినే తినివెయ్యడము మొదలు పెట్టారు. వడ్డన అయ్యే అవడముతోటే గబగబా నెయ్యి, మనిషికి రెండు గరెటల చొప్పున, ఒకాయన వడ్డించుకు వెళ్ళాడు. నా పక్కని కూర్చున్న అరవవాళ్ళు కొంతమంది చెయ్యిపట్టి ఆ నెయ్యి దాహము పుచ్చుకున్నారు. ఏమిటా ఇలా పుచ్చుకుంటున్నా రనుకొన్నాను. కొందరు ఒక ముద్దలో వేసుకొని ఆ వట్టినెయ్యీ అన్నమూ తిన్నారు! నేనూ వేయించుకొన్నాను. నెయ్యి పాడువాసన. ఈ నెయ్యే తాగుతున్నారు మొగము వాచినట్లు; అప్పుడు కాచిన ఇంటినెయ్యి లభ్యమయితే వీళ్ళు చెంబుల తోటి మంచినీళ్లవలే దాహము పుచ్చుకుంటారు కాబోలుననుకొన్నాను.
నేతివడ్డన అవుతుండగానే ఇంకొకాయన పులుసు తీసుకు వచ్చాడు. ప్రతివాళ్లూ, ఒక పప్పు కలుపుకోడము లేదు. కూర కలుపుకోడము లేదు. పచ్చడి కలుపుకోడము లేదు; ఏమీలేదు. ముందుగా పులుసు పోసుకున్నారు, అందులో పప్పు కలుపుకున్నారు. నెయ్యిలేకుండా వట్టి అన్నము తింటూ అందులోనే కూరా, పచ్చడీ, నంజుకున్నారు. ఏమిటీ అడివి తిండి! పాపము, వీళ్ళు తిండి తినడముకూడా ఎరగరే అని జాలిపడ్డాను. నేను శుభ్రముగా పప్పు కలుపుకున్నాను; పులుసు వద్దనే సరికి అంతా తెల్లపోయి నాకేసి చూశారు. కాకులకు కోకిలరూపు చాలా అందవికారముగానూ, కంఠము కఠోరముగానూ ఉంటుందట. అలాగే ఈ అరవ వాళ్లకి నేను వట్టి అనాగరికుడుగా కనబడ్డాను. ఆశ్చర్య మేమిటి! పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిగా కనపడుతుంది.
తరువాత నేను కూర కలుపుకున్నాను. కలుపుకుని నెయ్యి తీసుకురమ్మన్నాను. ఏ కుళ్ళునెయ్యి అయినా వేసుకొనడము తప్పుతుంది గనకనా! తీసుకువచ్చి 'అది ఎక్ట్స్రా సార్!' అన్నాడు. 'ఏది ఎక్ట్స్రా?'
'ఈ నెయ్యి'
'ఎక్ట్స్రా ఏమిటి నీ పిండాకూడు!'
'ఇప్పుడు మళ్ళీ వేసుకుంటిరే ఒక స్పూన్, అది ఒక కాలణా అవును సార్?'
'అయితే ఏ మంటావు?'
'వేసేదా సార్?'
'వెయ్యి, మరి వెయ్యడానికి కాకపోతే నీ సౌందర్యాతి శయము చూచి ఆనందించడానికి పిలిచా ననుకొన్నావా!' నే నన్నదివాడికి పూర్తిగా అర్ధముకాలేదు. పాపము కొంచెము నవ్వుకుని, 'ఏమి సార్, అష్టా గేలి సేస్తారు!' అన్నాడు.
తన్నేదో స్తోత్రము చేశానుకున్నాడు కాబోలు పాపము. వెనుకటికి ఒక డిప్టీ కలక్టరుగారు ఒక అమాయకపు కరణాన్ని, ఏదో సందర్భములో, నువ్వు వట్టి బుద్ధిహీనుడులాగా ఉన్నావే అన్నారట. ఆ కరణము తన్నేదో మెచ్చుకుంటునారనుకుని 'చిత్తము, చిత్తం మహాప్రభో, ఏలినవారి కటాక్షము! తమబోటి పెద్దలందరిచేతా అలాగే అనిపించు కుంటున్నా' అన్నాడట. అలాగ్గా ఉంది ఈ వడ్డనవాడి సంగతి.
తక్కినవాళ్లంతా పులుసూ అన్నమూ తినగానే చారు వడ్డించుకున్నారు. నాకు ఊరికే నవ్వు వచ్చింది వాళ్ల తిండి వరసచూసి. పులుసో చారో, ఏదో ఒకటి కాని, రెండూ ఏమిటి వీళ్ళ తలకాయనుకొన్నాను. సరే! వీళ్లేలా తింటే నాకెందుకని త్వరగా రెండు మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చాను. అక్కడ వరసంతా చూస్తే భోజనము చేసినట్లే లేదు నాకు. అంతా అనాచారమే, అన్నము చేత్తోటే నేతి మజ్జిగలు ముట్టుకోడము, ఆచేత్తోటే మంచినీళ్ళు ఇవ్వడము. చేతులు కడుక్కునే చోటంతా మెతుకుల మయము. అంత అనాచారముగా ఉంటారు, వీళ్ళ కసహ్యము ఎలా లేదా అనుకున్నాను.
భోజనము చేసి నాగదిలోకి వచ్చి కాస్సేపు విశ్రమించి చొక్కాలు తొడుక్కుని ఊళ్లోకి బయలుదేరాను. నాకు జుట్టు ముడి, గిరజాలూ ఉండేవి. అవి తీసివేయించి దొరటోపీ ఒకటి కొనుక్కుని తరవాత రైలు సంగతి కనుక్కుని వద్దామని ఉద్దేశం.
వీధిలోకి రాగానే నడిరోడ్డుమీద ఇంజన్ లేకుండా రైళ్ళు పరుగెడు తున్నవి. పొద్దున బండివాడిని అవేమిటని అడిగితే ట్రాంకార్లు అని చెప్పాడు. వాట్లకు స్టేషనులూ అవి అక్కరలేదుట. ఎక్కడపడితే అక్కడ ఆగడమేను. ఈ ఏర్పాటు చాలా బాగుందను కున్నాను.
అక్కడొక పెద్ద మనిషిని పిలిచి 'మంచి షాపు లెక్కడుంటా ' యన్నాను. మౌంటురోడ్డులో వుంటా యన్నాడు. 'అయితే అక్కడికి వెళ్ళడ మెలాగ ' అన్నాను. 'ఇక్కడ ట్రాము యెక్కితే నేరుగా పూడ్చు' నన్నాడు. ఇలా మాట్లాడుతుండగానే ట్రాముకారొకటి వచ్చింది. దానిమీద రాయపురమని వ్రాసివుంది. అక్కడ ఆగకుండా అది వెళ్ళిపోతున్నది. అయ్యో పోతున్నదే అనే ఆదుర్దాకొద్దీ నాతో మాట్లాడుతున్నాయన మాట పూర్తిగా వినిపించు కోకుండానే, 'ఆపండి, ఆపండి ' అని కేకలువేస్తూ పరుగెత్తాను. బండి కొంత దూరాన ఆగింది. సరే నా కేక వినపడి ఆపారుగదా, వెళ్ళేదాకా ఆగుతుందనుకుని పరుగు కొంచెము తగ్గించాను. బండి మళ్ళీ బయలుదేరింది. 'ఆపండోయ్ ' అని మళ్ళీ కేకలు వేస్తూ పరుగెత్తాను. ఓ మాటు ఆగినట్లే ఆగడము, మళ్ళీ పరుగెత్తడము, ఈలాగ సుమారు మైలు పరుగెత్తి ఆఖరుకు ఎలాగైతే నేమి అందుకున్నాను. యెక్కి ఒక్క క్షణము ఆయాసము తీర్చుకునే లోపలనే ఏ రంగోకూడా తెలియని అలుకు గుడ్డ లాంటి కోటూ, యిజారూ, తొడుక్కుని జుట్టు ముడిమీద టోపీ పెట్టుకుని, మెళ్ళో తోలుసంచీ ఒకటి తగిలించుకుని 'టికాయట్ సార్, టికాయట్ సార్, యెక్కడ పోవాలా ' అని ఒకడు వచ్చాడు. ఒక పావలా అతని చేతిలోపెట్టి మౌంటు రోడ్డన్నాను. 'ఏందయ్యా, యిందుకా యింతదూరము వోడివస్తివి? నిండా గట్టివాడు. యెందుకయ్య, దిగు దిగు జల్ది. బండి వస్తోంది. అందులో పోవాలయ్యా ' అన్నాడు అంటూండగానే యెదురుగా ట్రాముకారు యింకొకటి వచ్చింది. అది తప్పిపోకుండా అందుకుందాము: యిప్పటికే చాలా ఆలస్యమైందని బండి అట్టే త్వరగా పోవడము లేదుకదా అనీ టిక్కట్టు యిచ్చే అతను ఆగమంటున్నా వినక కింద కురికాను. వురకడములో మొహము బద్దలయ్యేటట్టు ముందుకి పడ్డాను. ట్రాముకారు ఆపి వాళ్ళు వచ్చి లేవదీసి అంత తొందరపడి దిగినందుకు నాలుగు చివాట్లువేసి వాళ్ళదారిని వాళ్ళు చక్కాపోయినారు. వీథిలోకి వచ్చేటప్పుడు, పొద్దుటి ఆ నల్లటి అరవాయన యెదురుగుండా వచ్చాడు. అందుకే యిలాటి అవస్థలు వచ్చినాయి అనుకున్నాను.
ఇవ్వాళ మరి ట్రాముకారు ఎక్కకూడ దనుకొని నిమ్మళంగా బండి ఏదైనా చేసుకు వెళితే సావకాశంగా అన్నీ చూస్తూ వెళ్ళవచ్చు ననుకుని ఒంటెద్దుబండి ఒకటి కుదుర్చుకుని బయలు దేరాను. చెన్నపట్నము మొత్తముమీద చాల పెద్ద ఊరూ, అందమైన ఊరూను. ఆ రోడ్ల వైశాల్యము, షాపుల సౌందర్యము, అంతా చూసి చాలా సంతోషించాను. ఓహో ఎంతపట్టణ మనుకున్నాను. ఇంగ్లండులో ఇంత గొప్ప పట్టణా లుంటాయా, లండ నింతకంటే పెద్దదా, చిన్నదా? అని ఆలోచించాను. అయినా పెద్దదెలా అవుతుంది? ఇంగ్లండు చిన్న ద్వీపము కదా, ఇంగ్లండంతా కలిపి చెన్న పట్నమంత ఉంటుందేమో అని అలా తర్కించుకొంటూ నిమ్మళంగా బండిలో ఊగిసలాడుతూ వెడుతుండగా ఒక చోట 'పెరీజయన్ హేర్ కట్టింగ్ సెలూన్ ' అని కనపడ్డది. పుట్టు వెంట్రుకలు తీయించుకో వలసిన అవసరం వుంది కదా అనుకుని బండి ఆపమని దిగాను. దిగి గుమ్మము దగ్గిర నిలుచుని లోపలికి తొంగిచూశాను. కాళ్ళు ముందుకు సాగలేదు. గుండెలు గబగబా కొట్టుకోడ మారంభించినయి. ఇదివర కెప్పుడూ, నేను భోజనా నంతరము క్షౌరము చేయించుకో లేదు. నేటి కది సంప్రాప్త మయింది. పైగా ఈ బట్టలతోటి చేయించుకోడము, స్నానమైనా చేయకుండా అన్నీ ముట్టుకోడము, ఇదంతా మనసుకు చాల కష్టము తోచింది. ఏమి చెయ్యను, తప్పుతుందా. ఇదంతా ఊరికే తుంటరితనము కోసము కాదు కదా. దేశోపకారము కోసము కదా యింత తలపెట్టింది, ఇటువంటి కష్టములెన్ని లేకుండా కార్య సాధన అవుతుందా అని మనసుకు సమాధానము చెప్పుకున్నాను.
లోపలికి తొంగిచూస్తే నాకు బహు ఆశ్చర్యము వేసింది. గదంతా పరిశుభ్రముగా అద్దములాగా ఉంది. పైన ఎలక్ట్రిక్ దీపాలూ, గోడలో కమర్చి తెల్లని పెద్ద పింగాళి గిన్నెలూ, వాట్లలో చిన్న కుళాయిలూ, వాట్లపైన నిలువుటద్దాలు, వాట్లముందు మంచి పరుపులు వేసిన కుర్చీలూ వున్నాయి. గుమ్మము దగ్గిర ఒకాయన కుర్చీ వేసుకుని మేజామీద ఏదో వ్రాసుకుంటూ కూర్చున్నాడు. ఒక పెద్ద బీరువానిండా ఏవో సీసాలు చిన్న అట్ట పెట్టెలూ, రకరకాలు కనపడ్డయి. వీధి గుమ్మాని కెదురుగుండా గోడ కొక చక్కని రంగుల అద్దకపు గుడ్డతెర కట్టి ఉంది. ఒక గోడకి బట్టలు తగిలించుకునే వంకె లున్నయి. నా కిదంతా చూసేసరికి మంగలి దుకాణమవునా కాదా అనే సందేహము తోచింది. పొరపాటున ఏదైనా ఆఫీసులోకి రాలేదు కదా అనుకున్నాను; లేకపోతే ఇది ఏదో పెద్ద మందుల షాపై ఉండవచ్చు. అయితే పైన బల్ల అలా కట్టడానికి కారణ మేమిటి చెప్మా అనుకొని, ఒకవేళ మేడమీద ఉందేమో మంగలి దుకాణ మనుకుని మళ్ళీ వాకిట్లో వున్న బల్ల కేసి చూశాను. చూస్తే మేడమీదేమీ కనుపించలేదు. ఆ బల్ల దీనికి సంబంధించినట్లే తోచింది. ఇది మంగలి దుకాణ మవునా కాదా అని అక్కడ కూర్చున్న మనిషిని అడిగి తెలుసుకుందామని అనుకుంటూ ఉంటే, నా అవస్థ గ్రహించి కాబోలును, అతనే నన్ను పలకరించాడు.
నా కింగ్లీషు రాదనుకున్నాడు కాబోలు. అరవాన్ని మాట్లాడాడు. నా కరవము రాదన్నాను. 'ఓ రాదా, తెలుగువాడా మీరు. రండి ఏం కావాలా? షేవ్ కావాల్నా? ఎందు కక్కడనే నిలుస్తారు? లోన రండిమీ' అన్నాడు. దానితోటి అది మంగలి దుకాణమేనని నిశ్చయ పరచుకుని ఆశ్చర్య పోతూ నా కాళ్ళమట్టి అంటుకుని నేల మురికవుతుందేమోనని భయపడుతూ, లోపలికి వెళ్ళి నిలబడ్డాను. 'కూర్చోండి ' అని ఒక అద్దము ఎదర ఉన్న కుర్చీకేసి చూపించాడు. హడలిపోతూ దానిమీద కూర్చున్నాను. ఇంతలోకే గోడనున్న తెర వెనకాలనుంచి శుభ్రమైన బట్ట కట్టుకుని కోటు తొడుగుకున్న మనిషి ఒకడు వచ్చాడు. వచ్చి ఒక సబ్బు తీసుకొని ఒక కుంచె తీసుకుని నన్ను కుర్చీలో వెనక్కు జార్లా పడమని నా మెడ కొక తెల్లని ఇస్త్రీగుడ్డ కట్టి ఆ కుంచెతోటి సబ్బు నా గడ్డానికి రాయడము మొదలు పెట్టాడు. ఇలా ఎందుకు రాస్తాడా అని ఆశ్చర్యపోతూ, అయినా ఏం జరుగుతుందో చూద్దాము, అడగడమెందు కని లోపల ఒక దణ్ణము పెట్టుకుని నా ముఖము వాడి అధీనములో విడిచిపెట్టాను.
'వాడి చిత్తము వచ్చినట్లు సబ్బునురగ నా ముఖాన్ని అరిచేతి దళసరిని పామి, కత్తితీసుకువచ్చి రాతిమీద నూరకుండానే క్షౌరము చేయడ మారంభించాడు. కత్తి నూరకుండా చేస్తావేమి తెగుతుందా అని అడుగుదా మనుకుని తెగకపోతే అప్పుడే అడగవచ్చునని ఊరుకున్నాను. అదేమి కత్తోగాని నూరకపోయినా బహు చక్కగా తెగింది. పని చేయించుకున్నట్టే లేదు. సాపుగా వెళ్ళిపోయింది. అది సబ్బు విశేషమో కత్తి విశేషమో తెలియలేదు. మా ఊళ్ళో ఎప్పుడు పని చేయించుకున్నా మా మంగలి పనసకాయ చెక్కినట్టు చెక్కేవాడు. ఇటు తిప్పీ, అటుతిప్పీ నాకు మెడనరము పట్టించకుండానూ, నా రక్తము కళ్ళ చూడకుండానూ, వాడెప్పుడూ విడిచి పెట్టేవాడుకాదు. మళ్ళీ పక్షముదాకా జ్ఞాపక ముండేటట్లు చేసేవాడు. అలాంటిది క్షౌరమెంత సుఖంగా ఉంది! ఆ గదికి తగినట్టుంది.
గడ్డమయిన తరువాత మామూలు ప్రకారము ఇక్కడ కూడా సాపు చేయమని బాహుమూలాలు ప్రదర్శిద్దా మనుకున్నాను. అలాచేస్తే వాడికేమి కోపము వస్తుందో అనుకొని ఆ ప్రయత్నము మానివేసి లోపలినుంచి పొంగివస్తున్న దుఃఖాన్ని ఆపుకుని వేడి కన్నీటి బిందువు లివతల పడకుండా, కళ్ళు మూసుకుని జుట్టు తీసివెయ్యమన్నాను. చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా పోషించిన బారెడు జుట్టూ వాడు గబగబా రెండు కత్తిరింపుల్లో కత్తిరించి వేశాడు. అద్దములో నా ముఖము నాకే కొత్తగా ఉంది. కడివెడు దుఃఖమూ దిగమింగి చేష్టలుడిగి అద్దములో చూసుకుంటూ ఉంటే, 'షాంపూ చేసేదా సార్ ' అన్నాడు. అదేమిటో నాకు తెలియలేదు. కాని ఇంత వరకూ వచ్చిన తరువాత ఇక ఏమిచేస్తే ఏమని గుండెరాయిచేసుకుని మొండిబ్రతుకుగనక 'కా' నిమ్మన్నాను.
నామెడచుట్టూ పెద్ద బురఖాలాంటిగుడ్డ ఒకటి కట్టినా తల పింగాళీ గిన్నెలోకి వంచి కుళాయి తిప్పాడు. తలమీదుగా నీళ్ళు పడ్డయి. తరువాత నా నెత్తి మీద ఏదో అరఖు పోసి తల రుద్దాడు. ఆపైన మళ్ళీ తలంతా శుభ్రముగా కడిగి తుడిచివేసి కొంచము సువాసన నూనెరాచి తల దువ్వాడు. అమ్మయ్య అనుకుని లేచాను. మొదట నన్నాహ్వానించిన మనిషి ఒక రసీదు నాచేతి కిచ్చి మూడు రూపాయ లిమ్మన్నాడు. నిర్ఘాంతపోయి బారెడుజుట్టూ పుచ్చుకొని పైగా పావలా కాదు, అర్ధకాదు, మూడు రూపాయలిమ్మంటా డేమిటా అనుకుని ఇక వాడితో వాదనలోకి దిగితే అసలే లాభముండదు. మొదటనే నిర్ణయము చేసుకోవలసిం దనుకొని కుక్కిన పేను లాగ మాట్లాడకుండా మూడు రూపాయలూ వాడిచేతిలో పెట్టి బిక్క మొగము వేసుకుని ఇవతలకు వచ్చాను.
బండి దగ్గరకు వచ్చేటప్పటికి బండివాడు ఆలస్యము చేశానని కోప పడడము మొదలు పెట్టాడు. వాడి కేదో ఇంకొక అణో బేడో ఎక్కువిచ్చుకుంటానని చెప్పుకుని మళ్ళీ బండెక్కి 'వైటెవేలెయిడ్ లో ' అనే పెద్దషాపు కనబడితే టోపీ కొనుక్కోవచ్చుగదా అని అక్కడ దిగాను. ఆ షాపు పైనుంచి చూసేటప్పటికే నాకు బ్రహ్మానంద మైపోయింది. ఆ షాపులో దొరికే సామానులన్నీ ఎంతో ముద్దుగా, అందముగా, అమర్చి వాట్లముందు పెద్ద గాజులతలుపు గోడలా పెట్టేశారు. రోడ్డే పోయే వాళ్ళంతా అక్కడ నిలబడి వాళ్ళకే వస్తువు కావాలో చూసుకోవచ్చు. ఏమీ కొనదలుచుకోకపోయినా, ఊరికే గంటల తరబడి నిలబడి వాటికేసి చూడ బుద్ధవుతుంది. నాగరికత అంటే దొరలదే కాని మన కేమి ఉంది?
ఇలా అనుకుంటూ గుమ్మంలో అడుగు పెట్టాను. లోపల కేవలము ఇంద్రభవనమే! ఆ సౌందర్యము వర్ణించ డానికి నా బోటి వాడికి శక్యంగాదు. ఎక్కడ చూచినా దొరలూ దొరసానులూ, అమ్మేవాళ్ళూ జాతివాళ్ళే, కొనుక్కునే వాళ్ళూ జాతివాళ్లే. నడవడానికి నేలమీద తివాసులు పరచి ఉన్నాయి, షాపు పొడూక్కి సన్నని మేజా ఒకటి ఉంది. అమ్మేవాళ్లు, అమ్మే సరకులూ అన్నీ దానివెనకాల, కొనేవాళ్ళంతా దాని ఇవతల, చెప్పవద్దూ, ఆ షాపూ, ఆ సరకులూ, ఆ దొరసానులనీ చూస్తే భయంవేసింది. ఊరికే వెర్రిమొహము వేసుకుని గుడ్లు ఒప్పజెప్పి నోరు తెరుచుకుని నాలుగు మూలలూ చూస్తూ నిలబడ్డాను. కొంతసేపటికి ఒక ముసలిదొర నాదగ్గరికి వచ్చి 'మీరేమన్నా కొనడానికి వచ్చారా ' అన్నాడు. 'అవును ఒక టోపీకావా 'లన్నాను. టోపీలు మేడమీద ఉంటయి, మీకేం భయము లే ' దన్నాడు.
తిన్నగా మేడమీదికి వెళ్ళాను. ఆ అంతస్థంతా ఎక్కడ చూచినా టోపీలే. అనేక రకాలు. ఒకచోట అమ్మేవాడు మొగవాడు. ఇంకోచోట అమ్మే మనిషి ఆడది. మొగవాడి దగ్గరికి వెళ్ళి టోపీ ఒకటి కావాలన్నాను. 'ఎలాంటి ' దన్నాడు. ఎలాంటిదని చెప్పను? చెన్నపట్నంలో అందరికీ సరి పడ్డన్ని టోపీలున్నాయి. అందులో నాకు ఫలానిది కావాలని చెప్పడానికి తోచలేదు. చూడగా చూడగా ఆ ఆడమనిషి అమ్మే టోపీలు కొంచెము పెద్దవిగానూ, అందముగానూ ఉన్నట్టు కనబడ్డయి. ఆ దొరతో చెప్పాను, అక్కడి టోపీ కావాలని. తిన్నగా నన్నాదొరసాని దగ్గరికి తీసుకువెళ్ళి, 'ఈయనకు టోపీకావాలటచూడ' మన్నాడు. 'ఏ సైజ్ ' అన్నది. ఏం చెప్పటానికి తోచిందికాదు. టోపీకి సైజేమిటనుకున్నాను. నాకే అన్నాను. వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. నాకు సిగ్గేసింది. 'ఎలాంటి ' దన్న దా దొరసాని. సన్నని ఖర్జూరపాకులతో అల్లిన పెద్దటోపీ ఒకటి చూపించి, అది కావాలన్నాను. అది తీసి నా నెత్తిన ఒకసారి పెట్టి చూసి 'ఇది సరిపోయింది పుచ్చుకోం'డని ఆ టోపీ ఒక కాగితపు సంచిలో పెట్టి యిచ్చారు. దాని ఖరీదు ఇచ్చేసి టోపీ పుచ్చుకొని మాట్లాడకుండా తలవంచుకుని చక్కావచ్చాను. నా వెనకాల ఆ దొరా, దొరసానీ ఒకటే నవ్వుకోడము.
కిందికి వచ్చి, మనము స్టీమరుమీద ఉండాలి కదా, గడియారము లేకపోతే టయిము ఎలా తెలుస్తుందని రెండున్నర పెట్టి శుభ్రమైన 'టెంపసు' వాచి ఒకటి కొన్నాను. స్టీమరు మీదనుంచి మళ్లీ ఎన్నాళ్ళకు దిగుతామో, పనిచేయించుకోకుండా గెడ్డము పెంచుకుంటే బాగుండదని స్టీమరుమీద మంగలివాళ్ళుండరని తోచి, రూపాయి పావలాకి బుల్లి సేఫ్టీరేజరొకటి కొనుక్కుని బయట పడ్డాను. మూడు గంటలయింది. ఆకలిగా ఉంది. బండివాడికి డబ్బులిచ్చి పంపి వేశాను. ఈసారిమట్టుకు వా డాట్టే పేచిపెట్టలేదు. సమీపంలో ఉన్న కాఫీ హోటలులోకి వెళ్ళాను. నేనూ చాలా కాలము పట్నవాసములో ఉన్నా ఎప్పుడూ కాఫీ హోటలులోకి వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. కుర్చీలూ, బల్లలూ ఉన్నాయి. చాలామంది ఫలహారాలు చేస్తున్నారు. ఒకాయన యజమాని కాబోలు, గుమ్మం దగ్గిర కుర్చీ వేసుకుని కూర్చొని డబ్బు వసూలు చేస్తున్నాడు. ఫలహారాలు చాలా రకా లున్నాయి. నేనూ వెళ్ళి ఫలహారాల బల్లకి దగ్గరగా ఉన్న కుర్చీమీద కూర్చున్నాను. నల్లని తుండులాంటి కుర్రవాడు నాదగ్గిరకు వచ్చి ఏమికావాలన్నాడు. ఏ మడగడానికీ నాకేమీ తోచలేదు. గుక్క తిప్పుకోకుండా, ఏవో యిరవై వస్తువులు ఏకరువు పెట్టాడు. ఒకటీ నాకు సరిగ్గా వినపడలేదు. ఆ బల్లకేసి చూపించి నాకు కావలసిన వస్తులేవో తెప్పించుకు తిన్నాను. కాఫీ తెమ్మన్నాను. రెండు ఇత్తడి గిన్నెలు తెచ్చి కాఫీ అందులో చల్లారబోయడము మొదలు పెట్టాడు. ఆపద్ధతి నాకు బహు తమాషాగాఉంది. ఓ గిన్నెలోనుంచి ఓగిన్నెలోకి నిలువు ఎత్తునా ఎత్తిపోయడము మొదలు పెట్టాడు. ఆ వేడి వేడి కాఫీ అంతా వాడి కాలిమీదో, నానెత్తిమీదో, పడుతుందని హడిలిపోతూ కూచున్నాను. మొత్తముమీద అటువంటి ప్రమాదమేమీలేకుండా, వేడి తుంపురులు మట్టుకు వెదజల్లి, నా కాఫీ నాకు ఒప్పజెప్పాడు.
కాఫీ పుచ్చుకుని ఎంతయిందన్నాను. 'చెపుతా లెండి. అక్కడకూచున్నాయనకు ఇవ్వం 'డన్నాడు. సరేనని ముందుకు వచ్చాను. నా వెనకాలే వచ్చి 'అంజేకాలణా' అని, ఒక ఊరంతా వినపడేటట్టు పెద్ద పొలికేక వేశాడు. నే నులిక్కిపడి వెనక్కి తిరిగి 'ఏమిటి, గాడిద గుడ్డులాగా ఝడిపిస్తావు' అన్నాను. వాడికర్ధము గాక మాట్లాడకుండా చక్కాపోయాడు. తెలుగు తెలిసిన వాళ్ళొకరో యిద్దరో నవ్వారు. యజమాని నన్ను పిలిచి డబ్బులు పుచ్చుకుని పంపివేశాడు.
నేను గుర్రపుబండి చేసుకుని తిన్నగా నా బసలోకి వచ్చి పొద్దుటి నల్ల బ్రాహ్మణ్ణి రైలుసంగతి అడిగాను. ఎక్కడికంటే, 'ఇలా యింగ్లండు వెడుతున్నాను. కొలంబో దాకా వెళ్ళే రైలెప్పుడుం' దన్నాను. సాయంత్రమారు గంటలకని చెప్పి ఫలాని స్టేషన్ కు వెళ్ళమన్నాడు. నా చేతిలో ఉన్న కాగితపు సంచి చూచి అదేమిటి అన్నాడు. టోపి అన్నాను: చూపించమంటే చూపించాను. చూసి అక్కడినుంచి ఒకటే నవ్వు. వీడికేం మతీ గితీ పోయిందా అనుకుని ఎందుకల్ల నవ్వుతావు, అన్నాను. 'ఏమయ్య, పైతకారివలె ఉన్నావు. ఇది ఆండవాళ్ళు పెట్టుకునే టోపీ అయ్యా' అన్నాడు. అనేటప్పటికి నిర్ఘాంతపోయి ఒకమాటు టోపీకేసి, ఒకమాటు ఆయనకేసి చూచి, అక్కడ షాపులో వాళ్ళిందుకే కాబోలు నవ్వారనుకున్నాను. సరే ఏమైనా కానీ, ఈ అరవవాడి ఎదుట లోకువ కాకూడదనిపించింది. 'అయితే ఏ మంటా ' నన్నాను. 'నీ కెందుకయ్యా ఈ ఆండవాళ్ళ టోపీ ' అన్నాడు. 'ఓయి వెర్రినాయనా, కొలంబోలో నే ఎరిగున్నవాళ్ళున్నారు. వాళ్ళకి బహుమతి చేయడానికి తీసుకు వెడుతున్నా' నని చెప్పాను. కాని నా మాటలు అతనుమట్టుకు నమ్మినట్టు కనబడలేదు.
టోపీ తీసుకుని నా గదిలోకి వెళ్ళి సామాను సర్దుకుని రైలుకి వెళ్ళాను. సాయంకాల మయిదున్న రయ్యేసరికి బీచిస్టేషన్ దగ్గరకు వచ్చాను. రైలు బయలు దేరడానికి అట్టే టయిము లేదన్నారు. నేను కొలంబో వెళ్ళాలి. ఎలా అన్నాను. 'మీరు సెకండుక్లాసులో వెళ్ళితే ఏకంగా టిక్కట్టు ఇస్తాము. శ్రమలేకుండా వెళ్ళవచ్చును; మూడో క్లాసులో వెడితే చాలా యిబ్బంది పడవలసి వస్తుం' దన్నాడాయన. ఇంగ్లండు వెడుతున్న వాళ్లము సెకండు క్లాసు టిక్కెటు కొనడానికి ఆలోచనేమిటని, 'సరే, అయితే సెకండుక్లాసు టిక్కట్టే ఇప్పించం' డన్నాను. టిక్కట్టిచ్చి 'మీరు రేపు సాయంకాలానికి ట్యూటికొరిన్ వెళ్తారు. అక్కడ దిగి స్టీమరెక్కినట్లయితే మరునా డుదయానికి కొలంబో చేరగలరని' చెప్పాడు. 'అయితే ఒక రాత్రి స్టీమరులో ఉండాలా. రైలు తిన్నగా కొలంబోదాకా వెళ్ళదా' అన్నాను. నా ముఖముకేసి చూసి అదివర దాకా నాతోటి మాట్లాడుతున్న గౌరవస్వరము మార్చి 'అబ్బే, వెళ్లడము లేదండి యీ మధ్య, పూర్వము రాములవారి వారధి బాగుండేటప్పుడు వెళ్ళేదిట. కాని దరిమిలా అది, సికస్తుపడి సముద్రము మామూలుగా అడ్డుగా ఉండటమువల్ల ఇప్పుడు వెళ్ళడము మానివేసింది. అది బాగుచేయడానికి మళ్ళీ ఆంజనేయులుగారికి కబురు చేద్దామనుకుంటే, వారి అడ్రసు సరిగా తెలియలేదు. అసలు తిన్నగా కొలంబోదాకా రైలు వెళ్ళవలెననే మా ఉద్దేశముకూడా' అన్నాడు.
మారు మాట లేకుండా నా టిక్కట్టు తీసుకుని రైలు దగ్గిరికి వెళ్ళాను. గార్డు స్వయంగా వచ్చి సెకండుక్లాసు పెట్టెలో ఎక్కించాడు. మీకు సౌఖ్యంగా ఉంటుందనీ, ఎవ్వళ్లూ అట్టేమంది ఎక్కరు మీరు సుఖంగా పడుకోవచ్చుననీ, చెప్పి వెళ్ళబోతున్నాడు. 'అట్టే మందేమిటి, అసలే ఎవ్వళ్ళూ ఇందులో ఎక్కగూడదు. అడ్డమయిన వాళ్ళూ ఎక్కడము మొదలుపెడితే నాకు మహా అసహ్యంగా ఉంటుంది. ప్రతి వాళ్ళతోటీ కలిసి తిరగడము నాకిష్టములేదు. ఈ రోజుల్లో ఎంతసేపూ దూరంగా వుంటే గౌరవము కాని, అంతటివారు కూడా మనతో తిరుగుతున్నారు అగౌరవము మనకే నన్నమాట ఆలోచించరు. అటువంటి మర్యాదా, అదీ, లేదు గనుకనే మావాళ్ళు అంత నీచస్థితిలో ఉండటము. ఆ గౌరవమూ అదీ మీ దొరలకే చెల్లింది. మీ మట్టుకు మీరు చూడండి. నా మర్యాదా గౌరవమూ అదీ ఆలోచించి యింత యిదిగా మాట్లాడారా? స్టేషన్ మాస్టరు చూడండి. నేటివ్ కనుక ఏమీ ఆలోచించకుండా చాలా తెలివితక్కువగా మాట్లాడాడు. నాకు చాలా కోపం వచ్చింది. తగిన సమాధానము చెప్పి పరాభవిద్దాముకున్నాను. కాని ఎందు కనవసరంగా నని ఊరుకున్నాను. బురదలో రాయి వేస్తే మనమీదికే చిందుతుందని మా మామ్మ చెప్పిన సామెత జ్ఞాపకము వచ్చింది. ముసలివాళ్ళు విద్యావిహీనులని మనము తోసివేస్తాము కాని వాళ్ళకున్నంత ప్రపంచ జ్ఞానము మరొకళ్ళకు లేదు. వాళ్ళ పాండిత్య మంతా, పాటల్లోనూ, సామెతల్లోనూ ఇమిడి వుంది.' అని ఇంకా ఏమన్నా మాట్లాడా లనుకుంటే 'మళ్ళీ దర్శనము చేస్తానండి ' అని ఆయన వెళ్ళబోతున్నాడు ధనమూల మిదం జగత్తని మాతాత చెపుతుండేవాడు. డబ్బుదగ్గిర ఏ పని బడితే ఆ పని చెయ్యగల సామర్థ్యముందని చాలామందివల్ల విన్నాను. చిన్నక్లాసు మాష్టర్లకి లక్ష్మిప్రసన్నము చేస్తే పైక్లాసులోకి సుళువుగా ప్రమోషన్ కావచ్చు నన్న సంగతి నా అనుభవంలోదే. పోలీసు వాళ్ళు కొంత మంది దొంగలకు ధనాపేక్ష చేత సహాయు లవుతారని ప్రతీతి. కొంతమంది అన్యాయ వర్తనులైన మేజెస్ట్రీటులు, ముద్దాయిల దగ్గిర లంచము పుచ్చుకుని కేసులు కొట్టి వెయ్యడము మామూలని వినికిడి. రిజిస్ట్రారాఫీసులో పదిరూపాయల నోటు జూపిస్తే నిముషములో మన పని అయి యివతల పడతాము. అనవసర ప్రశ్నలేమీ లేకుండా. పి.డబ్లియు వారికి వాళ్ళ మామూళ్లు ఇచ్చేస్తే కాలవకు ఎన్ని గండ్లు కొట్టుకున్నా వారికి కనపడవు.
ఇదంతా గ్రహించి ఏదో గార్డు పేదవాడు, కుటుంబీకుడు, మన బోటివాళ్ళొకరూపాయి ఇవ్వకపోతే వారి కెవళ్లిస్తారు గనుక, జీతము రాళ్ళతోటి సంసారము జరగడమెల్లాగా, ఇంతకీ మనకేదో సదుపాయంకూడా చేశాడని కొంచము ముందువెనుకలూ, కష్టసుఖాలు ఆలోచించేవాణ్ణి గనుక, పోబోతున్న గార్డుని పిలిచి, ఒక రూపాయి యిచ్చాను.
తీరా చెయ్యి జారినతరువాత వాడేమనుకుంటాడో కదా, వాడి స్వభావము తెలియకుండా యిచ్చాను. మనకేమి తంటా వస్తుందోను. పోనీ ఇచ్చినవాళ్ళము ఇంకొక రెండు రూపాయలన్నా ఇవ్వకుండా ఒక్క రూపాయే ఇచ్చాము. అధిక్యతవల్ల దోషము లోపిస్తుందేమో నని పరిపరివిధాల మనసు పశ్చాతాప పడడము మొదలు పెట్టింది. ఆ గార్డు నాకేసి ఒకసారి చూసి, ఒకసారి రూపాయకేసి చూసి, మాట్లాడకుండా జేబులో వేసుకుని నవ్వుకుంటూ చక్కా పోయినాడు.
ప్రపంచ మింతే కదా అనుకున్నాను. వీడేమన్న అనుకుం టాడేమో నని నేను పరితపిస్తుంటే, చడీ చప్పుడూ లేకుండా, రూపాయి జేబులో వేసుకు చక్కాపోయినాడు. ఔరా! డబ్బెంత పని చేస్తుందనుకున్నాను. సరే వెధవరూపాయి పోతే పోయింది కాని మనకి సుఖంగా వుందనుకున్నాను.