బసవరాజు అప్పారావు గీతములు/సర్వ సమత్వము
పూలకిరీటము
(శాఫోగీతము)
పువ్వులదండల గుచ్చవె చెలియా,
మవ్వపు నీకురులన్ జుట్టంగన్
నల్లలితములౌ మొగ్గల సరముల
నల్లవే నీ మెత్తనిచేతులతో
పూలకిరీటము దాల్చినవారిని
పూజింతురు దేవత లని యందుదు
పూలదండలను దాల్చనివారిని
పొమ్మనందురట ప్రేమను జూడకె
పువ్వులదండల గుచ్చవె చెలియా
మవ్వపు నీకురులన్ జుట్టంగన్,
------
సర్వ సమత్వము
(శాఫోగీతము)
వేగుచుక్కచే నోడినతారల
పోగుజేయు నా యంగారకుడు
వెన్నెల గొఱ్ఱెలమందల గూర్చీ,
బిడ్డలతల్లుల రొమ్మున జేర్చీ,
లోకమున నెల్ల మృదువుం బ్రియమౌ
నాకన్నెయెదకు నన్నుం దార్చు.
-----
ప్రియ నిరీక్షణము
(శాఫోగీతము)
గున్నమావి కొమ్మలందు గువ్వలు
గుసగుసలాడుచు నుండెన్
వాడినయాకులు నిదుర జరించెడి
వాడల నాడుచునుండెన్
ఇవ్వని మాడ్చెడు మధ్యాహ్న మెల్ల
నిట్లె కాచుకొనియుంటిన్
సంజను గబగబ వచ్చు నీ యడుగు
చప్పుడు వినబడనా యంచున్.