బసవరాజు అప్పారావు గీతములు/మానవవాంఛా నిష్ఫలత్వము
ఇంకెన్నాళ్లు?
(పాట: యమునా కల్యాణి)
ఈ విధి నింకెన్ని నా
ళ్ళిలను నేను కష్టపడుట? (పల్లవి)
కామ్యపదవు లందకయే
వ్యామోహమ్మున దగులక నీవిధి||
దారేషణచే పరగతి
దలప కంధకారమ్మున నీవిధి||
చేజే నీకై కూర్చిన
రోజాపూదండ వాడి
మోజు సన్నగిల్లిపోయి
రోజులు చింతతో గడుపు చీవిధి||
మానవవాంఛా నిష్ఫలత్వము
ఆకసమ్మున చుక్క లల్లుకొనుచుండె
పక్షులు వినువీధి బర్వుచునుండె
సాయంతనపుగాలి చల్లగా వీచె
బయటను ప్రకృతి సంపదగాంచబోదు
నాటుటమాత్రమే నావంతు సుమ్ము
ఫలము గాంచుట నీదు పనియె వృక్షమ్మ!
మన్మథక్రీడయే మనుజకృత్యమ్ము
పుత్రోద్భవం బౌట పూర్వపుణ్యంబు
కాలమ్మురానిదే కలుగదు సుఖము
కర్మమ్ము తొలగకే కష్టమ్ము పోదు
ఆరటపడినంత యబ్బునే జయము?
రమ్మన్న వచ్చునే రాత్రి సూర్యుండు?
లైలా మజ్నూన్
"లైలనోయీ ప్రియా, కన్నులార గనవె!"
యనుచు పిలిచిన గొంతుక నానవాలు
బట్టినట్లుగ కనులిట్టె పైకి నెత్తి
చటుకునను మూసి, మజ్నూను సంచలింప
కుండ జపమాలికం ద్రిప్పుచుండ జూచి,