Jump to content

బసవపురాణము/సప్తమాశ్వాసము

వికీసోర్స్ నుండి

సప్తమాశ్వాసము

శ్రీ శ్రితకంధర శ్రీపాదయుగ స - మాశ్రిత సంగనామాత్య సత్కృత్య
మఱియును భక్తధీమణి లసత్కీర్తి - కఱకంఠభక్తాగ్రగణ్యుఁడుత్తముఁడు
నసలార శివనాగుమయ్య సంప్రీతి - బసవనిచేఁబ్రణిపత్తిఁగైకొనుచు
ననయంబు భక్తిసుఖామృతాపార - వనధి నిమగ్నుఁడై వర్తింపుచుండ
బుడిబుళ్లువోవుచు భూసురులెల్లఁ - బుడమీశుకొలువుకుఁబోయి యిట్లనిరి
వ్యక్తిగా విను పెద్దభక్తులు వెద్ద - భక్తులంచును మన బసవయ్య వారిఁ
గడుఁగడుఁగొనియాడుఁబడుఁగాళ్లమీఁద - కుడిచిడించిన యది గుడుచు వెండియును
వెఱవక సభ్యునివిధి మిమ్ముఁ గదియుఁ - దఱియంగఁజొచ్చు నంతర్ని వాసములు
వారును బురవీథి వచ్చుచోఁదమ్ముఁ - జీరికిఁగైకోరు [1]సెంబలివారు
కథలేల కళ్యాణకటక మంతయును - బ్రథితంబు మాలల పాలయ్యె నింక
నెక్కడివర్ణంబు లెక్కడినీతు - లెక్కడిధర్మంబు లి ట్లేల చెల్లు
రాజులఁబొరయుఁదద్రాష్ట్రంబుపాప - మోజమాలినవారి నొగిఁబర్పకున్న
వినఁజెప్పకున్నఁదజ్జననాథుపాప - మనఘ పురోహితులను నవశ్యమును
బొందుఁగావునఁజెప్ప భూమీశ వలసె - నెందుఁబాపం బింకఁబొందదు మమ్ము
ధ్రువము"రాజా నుమతో ధర్మ" యనుట - యవనీశ యెఱుఁగవే యనుడుఁగోపించి
వసుధేశ్వరుఁడు బసవనఁబిల్వఁబనుప - నసమా[2]ను నందలం బర్థి నెక్కించి
శివనాగుమయ్యకుఁజే యిచ్చికొనుచుఁ - దివిరి యేతేరఁదద్ద్విజులు వీక్షించి
యదిగో మహారాజ యంతటఁబోక - కదియవచ్చెడు [3]మాలఁగలప నిచ్చటికి
డెందంబునను భయం బందమి సూడు - మందలం బెక్కించి యతనిఁదెచ్చెడిని
ఇంక నేరి కితండు శంకించు ననినఁ - గింకతో నగరివాకిలి సొరకుండ
వెలుపలికొల్వున విభుఁడున్న యెడను - నులుకక బసవయ్య యున్నతంబుగను
శివనాగుమయ్యకు సింహాసనముగ - భువిఁదనపై [4]చీర పుచ్చి పెట్టుచును

“బిలిచినపని యేమి పృథివీశ” యనినఁ - గలుషంబు గ్రమ్మ బిజ్జలుఁడిట్టులనియె
“నాదిఁదలంప వర్ణాష్టాదశముల - భేదంబులవి నేఁడు వేర్కొన్నయవియె
కులసంకరము సేయఁగూడునే మాఁల[5] - గలపితి కళ్యాణకటక మంతయును
నీతలఁబుట్టెనే నిటలాక్షుభక్తి - నీతి [6]హీనుఁడ కుర్యునే వర్ష మింకఁ
బండునే యింక మీరుండినభూమి - యొండేల మీకు మే మోడుదు” మనుడు
వసుధేశ్వరునకు నవార్యవీర్యుండు - బసవఁడు సద్భక్తిపండితుండనియె
“మనుజేశ గొడ[7]గర మాచలదేవి జెనసి యుత్తమవంశఁజేసెద మనుచు
స్వర్ణధేనువులోన సతి నుంచి మునుఁగ - నిర్ణిమిత్తమ పాలు నిండఁగఁబోసి
యా పోయెఁబూర్వాశ్రయం బని తార - యాపడఁతికి మ్రొక్కి యంతటఁబోక
[8]యంగద యట్టిగ్రామాంత్యజురాలి - యెంగిలిపాల్ద్రావి [9]రేవంబు లేక
నదియేల వేయును ననఁగథ లందు - గదుగదుకేమి యక్కనకధేనువును
వండఁదర్గినమాడ్కి ఖండముల్గాఁగఁ - జెండుచుఁదమలోనఁజే వ్రేసికొనుచు
బనత సోమాదుల బలగంబుపాలు - వెనుకచట్టలు సతుర్వేదులపాలు
కోలెమ్ము దా నుపాద్దేలయ్యపాలు - వాలమ్ము బ్రహ్మవిద్వాంసులపాలు
బరులు షడంగులపాలు మున్నుడుక - లురముసైతము ప్రభాకరభట్లపాలు
సమపొట్ట సన్నపుటెముకలుఁబ్రక్క - టెముకలు వ్యాకరణమువారిపాలు
తొలఁకుజల్లియుఁద్రివేదులవారిపాలు - బలుడెక్క సిఱుడెక్క వాళ్లమిక్కిళ్లు
పరదేశి విద్యార్థిపాలంచు నిట్లు - చెరలుచు గోహత్య సేసినయూర
[10]మాలల యీ త్రాటిమాలల పచ్చి - మాలలమాటలు వోలునే వినఁగ
వేదంబు లాదియో విధికల్పితంబు - లాదియో జాతుల కది యెట్టు లనినఁ
జనువేదచోదితజాతులు రెండు - వినుము ప్రవర్తకంబును నివర్తకము
భవకర్మసంస్కారి భువిఁబ్రవర్తకుఁడు - శివకర్మసంస్కారి భువి నివర్తకుఁడు
సన్నుతవేదార్థచరితంబు లుండ - మొన్నఁ బుట్టినకులమ్ములమాట లేల
[11]స్రష్టుక్తమగునట్టిజాతులు గావె - యష్టాదశంబులు నవియేల చెప్ప
మిక్కిలి పదునెనిమిదివర్ణములకు - నిక్క మారయ భక్తనిచయంబుకులము
భాగ్యహీనుండు దాఁబసిఁడిఁబట్టిన న - యోగ్యంపులోష్టమై యున్నట్లు శివుని

ప్రతిబింబమూర్తియౌ భక్తుఁడు భవికి - మతిఁజూడఁమానవాకృతి నుండు ధరణిఁ
గావున శివభక్తగణములమహిమ - భావింపఁదలఁప నీ ప్రాప్తియే చెపుమ
కరివైరితోడఁగుక్కలు వోల్ప సరియె - కరితోడ గ్రామసూకరములు సరియె
జడధితో నిలఁజౌటిపడియలు సరియె - వడి గంగతో వెడవ్రంతలు సరియె
తపనుతో ఖద్యోతతతు లెల్ల సరియె - యుపమింపఁజంద్రుతో నుడుపంక్తి సరియె
మేరువుతోఁబెఱమెట్టలు సరియె పారిజాతంబుతోఁబ్రబ్బిళ్లు సరియె
శివనాగుమయ్యతోఁజెనఁటి యీ ద్విజులు - నవనీశ సరియుఁగా రది యెట్టులనిన
భక్తుండు శ్రీపతిపండితుండీశు – భక్తుని కిలఁగోటిబ్రాహ్మణులైన
నెన యన్ననాలుక నేఁ గోసివైతు - ననుచు ననంతపాలుని సభాస్థలిని
నెక్కొనఁగాఁజండ్రనిప్పులు గాదె - చక్కన పొత్తిపచ్చడమున ముడిచె
తా నేమి చెప్ప భక్తానీక మిండ్ల - శ్వానంబులకు ద్విజు ల్సరిరామి వినవె

కల్లిదేవయ్యగారి కథ


యల్లహావినహాళ యనుపురంబునను - కల్లి దేవయ్య నాఁగా [12]మహాత్ముండు
శ్రీరుద్రు నపరావతారంబు గాని - ధారుణి మనుజావతారుండు గాఁడు
ఒకరాత్రి పరదేశి యున్న నయ్యూర - నొకవాముసంపుచు నుండు సంతతము
అప్పాటఁగల్లి దేవయ్యను గఱచి - యప్పాము దాఁజచ్చె నఖిలంబు నెఱుఁగ
కరుణాకరుఁడు గాన కల్లిదేవయ్య - యురగంబుఁబడసి యయ్యూరన యుండ
సహజసన్నుతశీల సంబంధయుక్తి - మహిమ దుల్కాడంగ మఱియొక్కనాఁడు
తమదాసి యర్ఘ్యపణ్యములకుఁబోవు - సమయంబునందొక్కసద్ద్విజుచేయి
తన్నుఁజోఁకుడు నప్డ తనతలకడువ - నన్నేలపై వ్రేసి యచ్చోన పాఁతి
యత్తఱి భసితాంగి యగుచు వేఱొక్క - క్రొత్తబిందియ మోచికొని పోవఁగాంచి
కొత్తిఁజూడుఁడు గండక్రొవ్వుఁదనంబు - నుత్తమద్విజుఁడు దా నొఱసెఁదన్ననుచు
భాండ మచ్చోటనే పాఱంగ వైచి - యొండు భాండముఁగొని యోరవోయెడిని
[13]ఎచట బ్రాహ్మణులకు నితరులముట్ట - నుచితంబు గాదుగా కొరులకు ద్విజుల
ముట్టఁగ రా దనునిట్టి ధర్మములు - పుట్టునే యని కూడి భూసురు లపుడు
కలియుగరుద్రునిఁగల్లి దేవయ్యఁ - బిలిపించి కౌటిల్యకలితవాక్యములఁ
'దలపోయ నూరిలోపల నొక్కమాట - పలు కెన్నఁడును వినఁబడదు మీ వలన

కల్లి[14]దేవయగారు వ్రల్లదు లనఁగ - నెల్లెడ వినము మీ రల్లసర్పమును
బడసిననాఁడొండెఁబొడగంటి మిపుడు - పొడగంటి మెన్నఁడుఁబొడగానరాదు
మంచివారని మిమ్ము మన్నింతు మేము - క్రించుబోయత మమ్ముఁగొంచెంబుసేసెఁ
[15]జంటివిప్రుఁడు గాఁడు సాక్షాద్వసిష్ఠు - [16]వంటియుత్కృష్టవిద్వాంసుఁడట్లయ్యు
వేదులవారి దామోదర[17]యజ్వ - గాదిలియగు త్రివిక్రమసోమయాజి
సమిధల కీగుళ్లసంది వోవంగఁ - బ్రమసెనో దాను నప్పాట వచ్చుచును
దనుఁజోఁకె వీరిచే యనుచు మీదాసి - తనతలకడువ యత్తఱి వ్రేసెఁ బగుల
వినుము శూద్రులుముట్టినను బ్రాహ్మణులకు - మును సచేలస్నానములు సేయవలయు
నని చెప్పుఁగాక యీ యధమవంశజుల - కును ద్విజులను ముట్టఁజన దని కలదె
యేనీతి యేధర్మ మేపురాణోక్తి - యేనాఁటిభక్తి సహింపఁగఁదగునె
మగువ నచ్చోటన మాయించు టపుడు - దగవుగా దని కాక దండింపలేఁడె
భూమిఁబుట్టనిమార్గములు సేయఁదగునె - యే మెదురెదుర మి మ్మేమందుమింక'
ననవుడుఁగల్లి దేవయ్య యింకేల - ననుమాన మనుచు నిట్లనియె వారలకు
'నింటిదాసులకు నెట్లంటనౌ భక్తు - లింటికుక్కలకు మి మ్మంట [18]రా దనిన
బ్రాహ్మణులేమీరు? "బ్రహ్మచరంతి - బ్రాహ్మణా” యన మీకు బ్రాహ్మ్యమెక్కడిది
పాన లేటికిఁబరబ్రహ్మం బనంగ - దీనికి నర్ధంబుఁదెలుపుఁడా చాలుఁ
బరమేశ్వరుండన్నఁబరమాత్ముఁడన్నఁ - బరికింపఁగాఁబరబ్రహ్మం [19]బటన్న
హరుఁడె కా కొరులకుఁబరశబ్ద మెద్ది - పరశబ్ద ముత్కర్ష పరము గావునను
నొరులకుఁగల్గునే యుత్కర్ష పదము - హరియును బ్రహ్మయుఁబరమాత్ము లెట్టు
లరయంగ వేదశాస్త్రార్థంబులందు - హరిముఖ్యు లెల్ల జీవాత్ముల కాన
ధరణిఁబరబ్రహ్మ హరుఁడు బ్రహ్మంబు - చరియించువారు మా సద్భక్తవరులు
హరియును బ్రహ్మయు నమరవల్లభుఁడు - పరము నర్చనసేయుభక్తులు గారె
ధృతిని "'బ్రహ్మాధిపతి ర్బ్రహ్మణో౽ధి - పతీ” యనియెడుఁగాదె శ్రుతిసమూహంబు
కావున బ్రహ్మమార్గం బెద్ది మిమ్ము - భావింప ముట్ట సంభాషింపఁదగునె
యేతెఱంగునఁబాసె నెఱుఁగరే మీరు - జాతిశూద్రత్వంబు వ్రేతవిముక్తి
రుద్రేతరక్రియల్ రూపింపఁ[20]గలవొ - రుద్రుండు దక్కంగ శ్రుతికర్త గలఁడొ
మృడునిభక్తులతోడ మీ రెల్ల సరియె - నుడువులు గలవేని నో రెత్తుఁ' డనిన

'నక్కటా యిదియేల యందర[21]మమ్ముఁ - గుక్కలకంటెను దక్కువగాఁగఁ
బలికెదు మీపిన్న పాపచెయ్దంబు - కొలఁదియే మొదలికి గుద్దలిగొంటి
ముదలింప ముదలింప ముల్లు(లుపు?)చ్చి పెద్ద - పద రడ్చినట్లయ్యె నది సెప్పనేల
చదివింతుగాక మీ శ్వానంబు నొక్క - పదఖండవర్గంబు వనన యెం దైన'
నని విప్రు లందఱు నాగ్రహింపంగ - విని కల్లిదేవయ్య విప్రులఁజూచి
యనియె 'రోఁకటి పాట లట్ల వేదములు - [22]పనుగొన మా శివభక్తులయిండ్ల
సారమేయములకు ధారుణి' ననుచు - నారంగఁగల్లిదేవయ్య నవ్వుచును
దాఁబిల్చె వేదపితామహాఖ్యుండు - నాఁ బొల్చుశునకంబు నలిఁజిట్ట [23]మిడిచి
'యుచ్చుచ్చి రే శంకరోచ్ఛిష్టభోగి - యుచ్చుచ్చిరే ప్రణవోదాత్తయోగి
యుచ్చుచ్చి రేయాగమో త్కృష్టభోగి - యుచ్చుచ్చిరే మహాంహోదూరచరిత
యుచ్చుచ్చిరే వీరసచ్చరనిరత - యు(చ్చు)చ్చి రేయపునర్భవోన్నతస్థిరత'
యని యిటులెలుఁగించునమ్మాత్రలోనఁ - జనుదెంచిశునకంబు దనకు మ్రొక్కుడును
వరదయాంచితసుధావార్ధి నోలార్చి - యరుదొందఁగల్లిదేవయ్య యిట్లనియె
'నేవేదమం దైన నెత్తి యందొక్క - ఠా వనుష్ఠింపుమా యీ విప్రులెదుర'
ననవుడు శునకచర్మావృతరుద్రుఁ - డనుషక్తిఁ బద్మాసనాసీనుఁడగుచుఁ
గఱకంఠు నాత్మాబ్జకర్ణికఁజేర్చి - గుఱి నాదిశక్తి నాకుంచనఁగూర్చి
యాసూర్యు మెట్టి సుధాసూతిఁగట్టి - నాసాగ్రమునదృష్టి నలి నాఁటుకొలిపి
యకలంక మృదుమధురకళానియుక్తి - సుకరనాదోక్తి విశుద్ధస్వరమునఁ
ద్ర్యక్షరబిందు నాద ప్రయుక్తాంచి - తాక్షర మోంకారమట్లుచ్చరించి
నంతలోననె తద్ధరామరానీక - మంతంతధరణి సాష్టాంగంబు లిడఁగ
దయనుదాత్తానుదాత్తస్వరిత ప్ర - చయములు సాంగమై సంధిల్లి తనరఁ
బదమును గ్రమమును [24]బాటయు జటయు -విదితంబుగా నాల్గు వేదంబు లందు
నొక్కొక్కఠావెత్తి యొగి ననుష్ఠింపఁ - గ్రక్కునఁదాలేచి కల్లిదేవయ్య
హోమానువేదపితామహా" యనుచుఁ - దామాన్చెశునకమధ్యయనంబుసేఁత
వింటిరే చెవులార విప్రు లందఱును - గంటి రే భక్తుల ఘనమహత్త్వంబు
ననుచు నా కల్లిదేవయ్య వేదంబు - జను లెఱుంగఁగఁగుక్కఁజదివించె మఱియు
నఘవైరి సిద్ధరామయ్యగారింట - నుఘెకాళికాఁడన నొక గుక్క గలదు

దీనికి గురు వది దానిమహత్త్వ - మేనైన నొకనాఁటి కెఱుఁగ వెండియును
గారవింపఁగ మహా [25]కాళయ్యగారి - సారమేయంబును జంబూరిలోన
వాదంబునం దిట్లు వేదంబు సదివెఁ - గాదె యీ మర్త్యలోకం బెల్ల నెఱుఁగఁ
గాన విప్రులు భక్తగణములయిండ్ల - శ్వానంబులకు నెట్లు సరి యనవచ్చు
శివచిత్తుఁడన నొక్క శివభక్తిపరుఁడు - తవిలి విప్రులతోడి తర్కంబునందు
సకలవేద పురాణశాస్త్రపారీణు - లొకకోటివిప్రులు నొక్కభక్తునకు
సరియుఁగా రని వేదశాస్త్రంబులందు - విరచించి [26]చెప్పుడు ద్విజులంతఁబోక
చర్చలు సదువులు సమ్మతికలిమిఁ - గూర్చి యాడుట శబ్దకోవిదత్వంబు
కాన, యిన్నియు నేలకలదె ప్రత్యయము - దీని కింతయుఁజెప్పఁగా నేమి యనిన
విద్దెలాడుచుచున్న ద్విజులతో నొక్క - పెద్దభక్తునిచెప్పువెట్టి తూఁచుడును
నూరిభూసురు లెల్ల నొక్కటఁదూన్కి - రారైరి యాపాదరక్షకుఁ దొల్లి
కాన విప్రులు భక్తగణములచెప్పు - తో నైన నెనగారు వాన లేమిటికి

బిబ్బ బాచయ్యగారి కథ


గొబ్బూరిలోపల నిబ్బరంబుగను - బిబ్బ బాచయగారి పృథుమహత్త్వంబు
వర్ణింప శివునకు వశముగా దనిన - వర్ణింప నెంతటివాఁడ నట్లయ్యు
[27]నీ మాజనము వారిచే మున్నువడ్డ - బాములు సెప్పెద భూమీశ వినుము
జంగమలింగప్రసాదంబు దనకు - నంగంబుఁబ్రాణంబునై చరింపుచును
నగ్రహారంబులో నం దొక్కపాల - నగ్రగణ్యుఁడు నాఁగ నాశ్రమధర్మ
మతలోకపథవివర్జితుఁడౌచు వేద - మతభక్తిపథము సుస్థితిగా భజించి
యామట రెండు మూఁడామటఁబదిటఁ - గామించి ఘనదేవకార్యంబు లైనఁ
గర మర్ధి బాహుకంధరకర్ణవితతి - నురమున శిరమున నుపవీతముగ[28]ను
జెన్నొంద భక్తుల చెప్పులబిళ్ల - లున్నతి ధరియించి యొగి భస్మ మలఁది
బండియుఁబొణకయుఁబచ్చెనవెట్టి - బండి నెల్లెడ నందిపడగలు గట్టి
యెలమి దలిర్ప మువ్వలు నురుగజ్జి - యలు ఘంటలును నందియలు సామరములు
భాసురరుద్రాక్ష బహువలయములు - బాసికంబులు స్వర్ణపట్టము ల్వూన్చి
గోరాజమూర్తిఁగైకొన్న కుఱ్ఱలను - గారవంబున బండి గట్టి ముందటను
జాఁగు బళా యను శబ్దముల్ మ్రోయఁ - గాఁ గేళికలతోడఁగర మర్థి నేఁగి
శరణపదాంభోజ సంస్పర్శఫాల - సురుచిరభక్తిమై సొంపు నింపార

స్ఫుటచరణాబ్జ సంఘట రేణుపటల - ఘటితోత్తమాంగుఁడై ఘనహర్ష మలర
లీలఁదత్పాదసలిల సుధావార్ధి - కేళీవిలోలైక మేళనం బొలయ
ఘనతర దివ్యలింగ ప్రసాద సద - య నమోనమస్తే మహాలింగ యనుచు
శ్రీగురుప్రతిబింబ సిద్ధలింగోప - భోగోపభోగానురాగుఁడై మఱియు
నొలికిన డించిన యున్న ప్రసాద - మలరుచు ముంచి గంపల బండిఁబోసి
యప్రతిలీల గణప్రసాదంబు - సుప్రసన్నాత్మ నుత్సుకత దుల్కాడ
నెప్పటివినుకులు నెప్పటిచెన్ను - నొప్పారఁదెచ్చి గొబ్బూరిలోపలను
సుప్రసిద్ధముగఁ దా రాప్రసాదంబు - ముప్పొద్దుఁగుడువంగ విప్రవర్గంబు
బుడిబుళ్లువోవుచున్నెడఁనొక్కభక్తుఁ - డడరఁబండువుసేయ నయ్యూరిలోనఁ
బరితోషమతి బిబ్బబాచయ్యగారు - కరమర్థిఁదొల్లిటిక్రమమున నేఁగి
జంగమశ్రీపాద జలజసౌరభ్య - సంగతరుచిరోత్తమాంగుఁడై పొంగి
యలరుచుఁజెందుచు వలసినవన్ను - వలఁబ్రసాదామృత వనధి నోలాడి
నలి దీటుకొనఁదద్గణప్రసాదంబు - నిలఁజిల్కకుండ గంపల ముంచి పోసి
ముందటిక్రియ బండిముందట వెనుక - నందంబుగా నిట యట నటింపంగ
గొ[29]డగులు గొడగులు గూడి క్రిక్కిఱియఁ - బడగలుఁబడగలు ముడివడి వాల
మంగళారవములు మధురమై చెలఁగ - సంగీతరీతులు సరసమై యులియఁ
బాయక చాఁగు బళాయనురవము - ఘే యని యటుగూడి మ్రోయుచునుండ
బొబ్బలు వొడువంగ నుబ్బి యార్వంగ - బిబ్బబాచయగారు గొబ్బూరుసొరఁగ
వినఁబడె మున్నెల్ల వీరిదుర్జనత - కనుఁగొనఁబడియె నేఁడనుచు భూసురులు
నేతెంచి “హో నిలుఁడెందువచ్చెదరు - మీ తెఱం గిదియేమి మిగిలియున్నదియు
పెండ్లి [30]కేఁగుటొ యిట్లు బండ్లిదియేమి - దండ్లువచ్చెనొ మీఁదఁదల్లడంబేల
యంకాన కేఁగెద రార్పు బొబ్బలను - శంకరభక్తుండు నచ్చెనో యిట్లు
పోలంగఁగొంగనిఁబొడిచి వంగనిని - వ్రాలంగఁ దిగచితి రేల బింకంబు
సడగరంబులు వట్టిచాఁగుబళాలు - గొడుగులుఁబడగలు దడఁబడుటలును
జేరమవలె నొండె శివపురంబునకు - బోరన నిపుడేమి పోవుచున్నారొ
యక్కుమాలిన భంగి నగ్రహారంబు - చక్కన మీకెట్లు చనఁజేర వచ్చు

నిలఁగులభ్రష్టులయిండ్ల యెంగిళ్లు - గులహీనులెంగిళ్లుఁగూడంగఁదేవి
బండినిండగఁబోసి పైఁజీరగప్పి - తండుఁజేకొని పెద్దగొండసేసెదరు
ప్రకటింప నింతేల పట్టినఁ జూప - నొకవిశేషంబైన నున్నదే యిందు
విద్దె లాడక యూరు వెడలుఁడీ యింత - పెద్దఱికముతోన పెక్కులే లనిన
చా! కాఱు లేమని చదువుచున్నారు! - మీ కొలఁదియె మమ్ము మీఱి పల్కంగఁ
బన్నగధరుభక్తిపరులకు మీకు - నెన్ని చాళులపెట్టు లెన్ని చూడంగఁ
దలఁప మీ నోరికిఁదగుకడిఁ గొనరు - వెలి కుఱుకవెగ్రుడ్లు కొలఁదిమీఱినను
మీ రేడ మే మేడ మీకును మాకుఁ - గారణంబేమి యీ యూరేల మాకు
జంగమలింగప్రసాదంబు బ్రమసి - యెంగి లెంగిలి యంచుఁద్రుంగి చూచెదరు
శరణప్రసాదదూషకు లతిఘోర - నరకాగ్నిఁ బడుదురు నా మున్ను వినరె
యటమీఁదిచే టింక నదియేల చెప్ప - నిట వచ్చు మరణంబు నెఱుఁగరు మీరు
ప్రణుత ప్రసాదప్రభావ ప్రశక్తి - గణుతించి చూడ డగ్గఱఁగ మీవశమె
భక్తులపాలికిఁబరమామృతంబు - భక్తిహీనుల కిది ప్రళయానలంబు
వలదు కార్చిచ్చులోపలి మిడ్తలట్లు - పొలిసిపోవనెకాక నిలువఁగఁగలరె
మీఱిపల్కుటయెల్ల మీకుండెఁగాక - పాఱులఁజంపుట పరమశౌర్యంబె
యనవుడు బిబ్బ బాచయ్యగారలను - గనుఁగొని యవ్విప్రజను లాగ్రహించి
యెంగిలికూడు భుజంగమో పులియొ - శృంగియో యబ్చూచిగొంగఁజేసెదరు
బట్టులపిన్న యప్పనగారిమంచ - చట్టన పెద్ద విశస్తులకూచి
దుష్టదామోదర ధూర్తభాస్కరుఁడ - శిష్టులబలభద్ర చిమ్మికేతప్ప
తొలఁగు మాఱటదోవతుల దర్భసంబె - లలఁబెట్టి యష్టికోలలు గొనిరండు
పట్టుఁడా యెడ్లను బలుపులు దెగఁగఁ - గొట్టుఁడా చని కూడముట్టుఁ డింకేల
చింపుఁడు మొగవాడ ద్రెంపుఁడు వడగ - లుంపుఁడు బండివోకుండఁజూతండు
అని సందడించునయ్యధమ[31] పౌరులను - గని బిబ్బ బాచయ్యగారు గోపించి
యోడులా రేటికి నుత్తలపడఁగఁ - జూడ శక్యంబేనిఁజూతురుగాక
తొలతొలఁడనుచు విప్రుల నదల్చుచును - నలిఁబ్రసాదముమీఁదివలువఁబోనూకి
యంజలి ముంచెత్తునమ్మాత్రలోన - కెంజాయయో యెఱ్ఱసంజయో మెఱపొ
హా కాదు నిప్పులో యది మంట యనుచు నాకులతను విప్రు లతిభీతిఁబొంద

నదె చూడుఁడని చల్లునమ్మాత్రలోన - పొదలి భుగుల్భుగుల్భుగులన నెగసి
నిటలతటాంబకోత్కట చటులాగ్ని - పటుదృష్టిఁ బురము లొక్కటఁగాలునట్లు
నట యిట విప్రాలయంబులన్నియును - నటుగూడ దరికొని యాహుతుల్గొనఁగ
శ్రీధరభట్టిల్లు సిచ్చునఁగలసె - మాధవప్పనయిల్లు మంటపా లయ్యె
గ్రుడ్డిగోవిందుని గుడిసెయుఁగమరె - దొడ్డభాస్కరునిల్లు దొడిఁదొడిఁగాలె
కొమ్మనఘటశాసి కొంపయుఁ గమలె - బమ్మనభట్టిల్లు భగ్గన మండె
వామనప్పనయిల్లు వాసము ల్సిక్కె - సోమయాజులయిల్లు సురసురఁగమరె
త్రేదులవారిల్లు దెరువునఁగలసె - నాదిత్యకూచియి ల్లప్పుడ పొలిసె
మచ్చతాడనయిల్లు మంటిపాలయ్యె - బచ్చలికేశవుపాకయు మడిసె
వాసుదేవునియిల్లు వహ్నిసేకొనియె - మాసకొమ్మనయిల్లు మసిమసియయ్యె
వసిగొని సన్న్యాసివామనమఠము - వసదిమంటపమును బసుమానఁగలసెఁ
గుశదర్భపిన్నయ్యకొంప పైఁజిచ్చు - నశనంబువారియి ల్లది యందికొనియె
నీడాడ యననేల యిన్నియు మడిసెఁ - గూడఁగ శివదూషకుల యిండు లనుచుఁ
బ్రళయాగ్నిలోనార్చు ప్రమథులయట్టు - లలరి భక్తానీక మార్వఁగ ద్విజులు
మసలి యిండులతోన మడిసెడువారు - వెసనేఁగుదెంచుచు [32]వెండీల్గువారు
తలలం[33]టుకొని కాలఁదల్లడపడుచు - నిల గుళ్లలోపలి కేఁగెడువారు
గడ్డము ల్మీసలు గమరంగ నచటి - గడ్డిగబావులు గని యుర్కువారు
చీరలు దరికొనఁజిడిముడిపడుచు - మారారిభక్తుల మఱువుగొన్వారు
మించఁగాలకమున్న మృడుభక్తులిండ్లఁ - బంచలఁ బెరడులఁబొంచుండువారు
తనువుల శిఖి దరికొని కాలఁగాలఁ - జని చని భక్తుల శరణనువారు
పఱుపకమును బిబ్బ బాచయ్యగారి - పిఱుఁదన నిల్చి యుబ్బఱి మ్రొక్కువారు
చిచ్చునవెడవెడ వెచ్చుచు సగము - సచ్చియు నిబ్భంగి సగము సావకయుఁ
బప్పుకేశవభట్టు దొప్పన పెద్ది - తప్పకం టైతన బొప్పనత్రేది
సింగరా జాదెన చిప్పనకూచి - మంగన ఘడిసాసి నంగన్నపిన్న
దబ్బరాదిత్యుండు సబ్బనయ్యయును - గబ్బుమైలారుండు సుబ్బనమంచి
యడ్డగాలైతన దొడ్డనకూచి - బొడ్డు రాఘవభట్టు గడ్డము పెద్ది
వీరాదిగాఁగ గొబ్బూరిగ్రామణులు - మారారిభక్తుల మాకు దిక్కనుచుఁ

బశువుల మనుచు నబ్రహ్మణ్యమనుచు - దిశలకు నోళులు దెఱచి యేడ్చుచును
వెక్కుచు నంతంతఁజిక్కుచుఁగూడ - స్రుక్కుచు ధరఁజాఁగి మ్రొక్కుచుఁజేరి
దీనుల నపగతజ్ఞానుల దురభి - మానులఁబుణ్యవిహీనుల ఖలుల
భ్రష్టుల నవగుణాశ్లిష్టుల నధిక - దుష్టుల నిలఁగడుఁగష్టుల జడులఁ
గ్రోధుల నధికాపరాధుల నతివి - రోధుల జ్వలననిరోధుల మమ్ముఁ
గావరే దీవనఁబ్రోవరే తప్పు - [34]ద్రావరే చలిగాలఁద్రోవరే యింక
నూరు మున్ జనమేజయుఁడు [35]సేసె నగ్ర - హార మింతటనుండి మీ రుద్ధరించి
పొరిని బునర్ధారఁబోయరే [36]మాకుఁ - గరుణించి మీ [37]బ్రహ్మపురుల మే మనుచు
నా విప్రజనులు సాష్టాంగులై మ్రొక్కి - లేవకయున్న నాలించి లెండనుచు
నా ప్రసాదమునకు నంజలియొగ్గి - సుప్రసన్నాత్ముడై చూడఁగఁదడవ
గహనప్రసాదాగ్ని గ్రక్కున నాఱి - సహజ సంసిద్ధ ప్రసాదభావమునఁ
బ్రస్తుతింపఁగ బిబ్బ బాచయ్యగారి - హస్తంబులందుఁబ్రశస్తమై నిలిచె
నిప్పాటఁబాఁపల యిండు లన్నియును - నెప్పటిక్రియ నొప్పె నెఱుఁగ రే జనులు
యెన్నఁగ ధరణీశ యేండ్లుఁబూండ్లేల- మొన్నటివార్త యింకిన్నియు నేల
యసమాక్షుఁగొలువని యగ్రజుండైన - వసుధమాలలమాల వాఁడ కాకెట్లు
మాలఁడు శివుఁగొల్చి మాలఁడువెంపు - మాలఁడు రెంటికి మాలఁడీయుక్తి
మాలఁడే యీతని మాలఁ డన్ త్రాటి - మాలల భువిఁబచ్చి [38]మాలలు గాక
సెంబలియనియెనే చెన్నయ్యయింట - నంబకళముగ్రోలునప్పుడు శివుఁడు
మాదరచెన్నయ్య [39]మహిమయెఱింగి - మా దేవభక్తులు మాలలు నాఁగఁ
గూడునే బాఁపనకూళ[40]రువులకుఁ - గాడుగాఁడని నీచగతి విరోధింప.

మాదర దూడయ్యగారి కథ


నవనీశ వినవెట్లు శివునిభక్తుండు - ధ్రువకీర్తి మాదరదూడయ్య నాఁగ
మఱియొప్పు నా యయ్య మహిమ యెట్లనిన - నెఱయఁగ మెయిచెడ్డకఱకుఁబాఱుండు
[41]పసివెన్క నడురేయి వెసఁబోయిపోయి - మసలకదూడయ్య మందిరంబఱుత
సారమజ్జన జలపూరితపంక - మూరులు దరియంగ నొగిఁజొచ్చి వెడలి
కూడఁగాళ్లు గడిగికొని ప్రభాతమునఁ - జూడఁబూర్వచ్ఛాయ శోభిల్లియున్న

నా విప్రుఁడత్యద్భుతాక్రాంతుఁడగుచు - భావించి యప్పుడ పరు విడి యేఁగి
మాదర దూడయ్య మజ్జనోదకని - పాదితం బగుఱొంపిఁబడి పొర్లిపొర్లి
యాడుచుఁదనువు దివ్యాంగమై యున్న - నాడనా మాదర దూడయ్యగారి
పాదాబ్జములమీఁదఁబడి కృపవడసి - భూదేవకులుఁడంతఁబోయె నింటికిని
జూడుఁడా మాదర దూడయ్య యిట్టు - లాడినచోటినీ ళ్లప్పయగారు
[42]పడిలేచి ఱొంపిఁదాఁగడిగిన యంత - నడఁగెఁగుష్ఠవ్యాధి హరహరా తొల్లి
యాదిత్యుఁడును మనోహరుఁడనుగణము - పాదోదకములను బడసెఁ దా మేను
ననిచెప్ప వినబఁడు నాద్యోక్తులందుఁ - గనుఁగొంటిమిపుడు నిక్కంబుగా ననుచు
వినుతింపుచును నరుల్ విభ్రాంతిఁబొంద - విని వారివారికిఁజనుదెంచి యచటఁ
బొరల నేడ్నూర్వురు భూసురోత్తముల - కరయఁగుష్ఠవ్యాధులణఁగుట వినవె.

బానస భీమయ్యగారి కథ


పృథివిలో బానస భీమయ్య నాఁగఁ - బ్రథితుండు మెయిసెడ్డ పాఱులకెల్ల
మేనులు కృప[43]సేయుటేనాఁట వినవె - భూనాథ! జనులెల్లఁబొగడఁగమఱియుఁ
జక్కన ముచ్చట్లు జరపఁగనేల - యిక్కర్మచండాలు రెంతటివారు

శ్వపచయ్యగారి కథ


సామవేదులు నాఁగఁసద్బ్రాహ్మణుండు - శ్రీమతి నాకాశగామియై యరుగ
శ్వపచయ్య నాఁగ నీశ్వరభక్తుఁడొకఁడు - విపినాంతరమున సద్విధి నోగిరంబు
లొనరించుచును మీఁదఁజనుసామవేదిఁ - గని పొందునో వీని కర్మంపుదృష్టు
లనుచు నోగిరముఁ జెప్పున మూయఁదడవ - కని సామవేదులు కలకల నగుచు
శ్వపచుండుఁదాను మాంసంబు వండెడిని - కపటుండు మా పొడగని మూసెఁజెప్పు
ఇట్టి దుర్జనుఁడగునే యని తలఁపఁ - జట్టనఁదన్మంత్రశక్తి యణంగి
యంతరిక్షంబున నాడు దోవతులు - నంత నబ్బువిఁబడ్డ నతఁడప్డు వచ్చి
శ్వపచయ్యగారి శ్రీ చరణాబ్దములకు - నపరిమిత ప్రీతి నందంద మ్రొక్కి
శివదీక్ష వారిచే శిష్యుఁడై పడసి - సవిశేషమగు తత్ప్రసాదంబు మహిమఁ
జేసి కొంపోవఁడే శివలోకమునకు - నాసక్తి ముప్పదియా ఱూళ్ల వారిఁ
గాన పురాతనగణములనాఁడు - లేనిమార్గము వుట్టెనే నేఁడు భక్తి

శ్వపచుఁడైననులింగసహితుఁడైయున్న - నుపమింపసద్బ్రాహ్మణోత్తమోత్తముఁడు
త్రిపురారిఁగొల్వని ద్విజముఖ్యుఁడైన - శ్వపచాధములకంటెఁజాలంగఁగీడు

ఉద్భటుని కథ


[44]అదిగాక బల్లకియను పురంబునను - నుదుబటుఁడన నొప్పు నొక్క భక్తుండు
వరభోజరాజను నరనాయకునకు - గురువయి శివదీక్షఁగరుణించి మఱియు
వేదశాస్త్రార్థ సంపాదితయుక్తి - నా దేశమున నన్యవాదంబు లణఁచి
క్షోణీశునకుఁబాడు జొమ్మవ్వనాఁగఁ - [45]బ్రాణేశసద్భక్తి పరురాలుగాన
నతివయుఁదాను సమంచితభక్తి - గతినిరంతర సుఖస్థితిఁదేలుచుండ
మనుజు లత్యద్భుత మానసులగుచుఁ - బనువుచు నిట్టి సద్బ్రాహ్మణోత్తముఁడు
కులహీనులను దాను గూడియున్నాఁడు - తలఁపంగఁబెద్దలు దార యిబ్బువిని
ననుచు నబ్భోజరాజున కెఱిఁగింప - వినియుఁదొల్లిటియట్ల కొనియాడుచుండఁ
బరమేశ్వరుండు నుద్భట్టయ్యగారి - వరభక్తి మహిమ యివ్వసుమతిలోన
నరుదుగా మెఱయింతునని యమ్మహాత్ముఁ - గరమర్థితోఁదన్న కాఁగూర్చుకొనుడు
దహనక్రియలుసేయఁదత్సమీపమున - మహి నెదురేచూచు మఱ్ఱిభూతములు
[46]గిదియొక్కటి సాల కేణ్నూరు నచటి - పొగదాఁకి కైలాసమున కప్డు వోవ
నందొక్క భూత మాహారార్థమేఁగి - వందుచు మఱుపూఁట వచ్చి భూతములఁ
గానక యేడ్చుచుఁగటకటాయనుచు - మానక వాచర్వమహి యెల్ల నద్రువ
గూయిడ నిది యేమొకో యంచు జనని - కాయంబు భోజుండు గ్రక్కున వచ్చి
యెవ్వ రేడ్చినవార లేమికారణము - నెవ్విధంబునఁగాని యేడ్పుడుగ వన
“వినవయ్య పండ్రెండు వేలేండ్లనుండి - మనుజేశ యుద్భటు మరణంబుఁగోరి
యేడునూ [47]ఱీమఱ్ఱి నెలమి భూతములు - నేడకు నేఁగక యెదురు సూచుచును
నుండె నే నేఁగితి నుదరాగ్నిఁజేసి - యుండంగఁజాల కొక్కండ చిక్కితిని
పెనుపొందఁగాఁగూటిపేద దోడ్దప్పె - నని యాడుమాట నాయంద సంధిల్లె
నెలమి నొక్కటిసాలకేడ్నూఱుభూత - ములునుద్భటునిఁగాల్చు పొగ దాఁకఁదడ
కైలాసమున కేఁగ గతిచెడి తాన - భూలోకమునఁజిక్కి పొగిలెదఁదండ్రి
గ్రచ్చఱ నీనంగఁగాచి నక్కలకు - నిచ్చినయ ట్లయ్యె నీడితకీర్తి.

మఱియేలవేయును నెఱయఁబండించి - యఱప డిగ్గినయట్టు లయ్యెనుర్వీశ
మును వెల్లవేగియుఁదినికి చా బిడ్డఁ - గనిన చందంబయ్యె జనపాలతిలక!
తివిరినిండఁగముంచి [48]యవియఁగఁద్రోచు - నవివేకి నైతిఁబేరాసగాఁజేసి
యింతగాలంబుంట యిది వృథయయ్యెఁ - జింతింపకెట్లు ధరింతు భూనాథ
యింక నైనను గట్టెలిందువైపించు - బొంకు [49]గాదేఁ గెదఁ, బొగదాఁకఁదడవ
వినుము నేఁగైలాసమునకు నేఁగుటకు - జనులకు నెల్ల దృష్టముగ నీయున్న
వటము వేళులతోన వడిఁబెఱికికొని - యిటయందఱునుజూడనటయేఁగుదాన
ననవుడుఁబౌరులత్యద్భుతంబంద - జననాథుఁ డౌఁగాక యనుచు హర్షించి
గ్రక్కున మలయజకాష్ఠము ల్వేర్చి - యక్కజంబంద దివ్యాంబరావలులు
పేని ముప్పిరిగొల్పి పేరిన నేతి - లో నించి యాయగ్నిలో దరికొల్ప
భుగులు భుగుల్లనఁబొగ మఱ్ఱిమీఁది - కెగయులోనన దిగదిగఁ బఱతెంచి
భోజుఁడుఁదనమిత్రపుత్ర బాంధవులు - నాజనావళియును సమ్మఱ్ఱివ్రాఁక
భూతంబుపైఁబొగ వొలయంగఁదడవ - ఖ్యాతిగా మఱ్ఱివృక్షముఁగూడఁబెఱికి
కొనుచు నక్కైలాసమున కేఁగె భోజ - జననాథజనయూధ సహితంబుగాఁగఁ
దెల్లమీ యుద్భటదేవుని మహిమ - ముల్లోకముల ధరావల్లభ వినవె

కక్కయ్య కథ


నిక్కంబు వెండియు నిఖిలేశ్వరుండ - ముక్కంటిగణము దాఁగక్కయ్యనాఁగ
నీ ద్విజులకు వైరి యెఱుఁగవే యొక్క - విద్వాంసుఁడీనగరద్వారమందుఁ
బాటియైన పురాణభట్టును బోలెఁ - గాటెర్కులెల్ల నక్కజమందివినఁగఁ
బరగఁగ బ్రహ్మకపాలంబు వట్టి - హరుఁడు భిక్షించె మున్ననియెడిఁగాని
వఱలుశూలమున విష్వక్సేనుఁబొడిచి - మఱివిష్ణునడిచిన తెఱఁగు సెప్పండు
వెరవున బలిఁగట్టి వెండియుఁబెఱిగి - హరిమీఁదికెత్తెఁగా లనియెడిఁగాని
యట్టి త్రివిక్రము నెట్టెమ్ము విఱిచి - పట్టె నీశ్వరుఁడని ప్రతిభసెప్పండు
వ్యాసుండు చేయెత్తె ననియెడిఁగాని - వ్యాసుని చేయి నిహతమైన దనఁడు
హరుఁడు యజ్ఞములోన నలిగి కేశవుని - శిరము ద్రుంచినచోటు సెప్పెండు సదివి
నరసింహరూపమై హరి హిరణ్యాక్షు - హరియించె మున్ను దా ననియెడిఁగాని
శరభ రూపముదాల్చి నరసింహుఁ ద్రుంచి - హరుఁడు దిత్తొల్చిన [50]యది సదువండు

మసలి "సర్వం విష్ణుమయ” మనుచోటు - నెసఁగఁజెప్పెఁడుగాని యసమలోచనుఁడు
నరుదగు సర్వసంహారంబుసేయ - హరియు సర్వము ద్రుంగెనని చదువండు
హరికర్త జగముల కనియెడిఁగాని - హరికిని భర్త యీశ్వరుఁడని యనఁడు
హరి విశ్వనామాంకుఁడనియెడిఁగాని - హరుఁడు విశ్వేశ్వరుఁడని చదువండు
హరి వరాశక్తి దా ననియెడిఁగాని - హరుఁడు వరాపరుఁడని చదువండు
హరి మహామాయ దాననియెడిఁగాని - హరుఁడు మహాదేవుఁడని చదువండు
హరిహరుఁడనెడు శబ్దార్థ మెర్గమిని - హరిహరుఁడన నొక్కఁడనియెడిఁగాని
హరిని హరించుట యదిగారణముగ - హరిహరుఁడును మారహరుఁడు ననండు
పక్షపాతి పురాణభట్టు యథార్థ - మీక్షింపఁడఱచెడు నితరేతరముల
శివనిందచేసెడి యవినీతుఁజంప - నవుఁబుస్తకము గాల్ప నవుఁబథం బిదియ
యనుచు మా కక్కయ్య యా శివద్రోహిఁ - బొనరుచు నలిగి [51] డొంకెనఁబడఁబొడిచి
తలదర్గి పొట్టలోపల [52]బెట్టికట్టి - యలరుచు నున్నెడ నక్షణంబునన
ప్రక్కలైచూడఁబౌరాణికుమేను - విక్కన విరియుచు విలవిల యనుచు
బ్రువ్వులప్రోఁకయై రూపఱియున్న - నివ్విప్రు లెఱుఁగరే యిన్నియునేల
డోహరకక్కయ్య మాహాత్మ్యమెఱిఁగి - యూహింప భక్తుల నొం డనఁజనునె

భోగయ్యగారి కథ


మఱియుఁ గెంబాగిలో మహిఁజెప్పనొప్పు - కఱకంఠభక్తుఁడకల్మషకీర్తి
భోగయ్యనాఁగ నెప్పుడుఁబరమాను - రాగుఁడై జంగమార్చన సేయఁజేయఁ
గఱకంఠుఁడాయయ్య మెఱయింపఁదలఁచి - పెఱవానిక్రియనొక్క వెయ్యశవంబు
మోచికొనుచు రుద్రముద్రాసమేతుఁ - డై చూప ఱద్భుతం బంద నేతేరఁ
బొడగని సర్వాంగములుఁ బొందమ్రొక్కి - మెడనున్న పెయ్యఁ దామెడఁబెట్టుకొనుచు
దొడుకొనివచ్చి యుత్సుకలీలతోడ - నడుగులుగడుగ నామృడమూర్తి యనియెఁ
జచ్చిన పెయ్యమాంసము నారగింప - నిచ్చ నేమముగాఁగ నిన్న నేఁబోయి
ధీయుత వినవయ్య దేడరదాసిఁ - బేయఁబాకము సేసిపెట్టవే యనిన
నడిగి వచ్చెద దుగ్గళవ్వఁదా ననుచు - నెడసేసె నాఁకొంటి నింక నీవైనఁ
బెట్టవే వండించి పెయ్య నా కనిన - నట్టిదకా కంచు నపుడు భోగయ్య

క్షారామ్లలవణయుక్తముగ మాంసంబు - సారంబుగా వండి చయ్యన మఱియు
శాకము ల్గావించి సంధిల్లఁబెక్కు - వాకంబు లొడఁగూర్చి భద్రమూర్తికిని
ఆరగింపఁగఁబెట్టునంత నయ్యగ్ర - హారంబు భూసురు లందఱుఁగూడి
గుండులు బడియలు గొని పాఱిపాఱి - యొండొరుఁగడవంగనుద్వృత్తి నరిగి
నఱకుఁడుతలతల్పు లుఱుకుఁడు గుడిసెఁ - బెఱుకుఁడు భోగయ్యఁబఱవుఁడు వెదకి
పట్టుఁడు దల వచ్చిబడియలఁబగులఁ - గొట్టుఁడు మాదిఁగకొయ్యఁబోనీక
నగ్రహారంబు గాదయ్యె నిట్లనుచు - నాగ్రహంబున విప్రులందఱుఁబలుక
హరమూర్తియును నంతనట్లదృశ్యముగ - వరకీర్తి భోగిదేవయ్య గోపించి
యంత్యజు లంత్యజు లని యఱచెదరు - అంత్యజులకుఁజొర నది యెట్లువచ్చు
నరుదుగ మీయట్టి యగ్రజన్ములకు - హరభక్తులిండులు సొరఁగరా దనిన
నిటలాక్షభక్తుల నిందించి మీకుఁ - బటురౌరవము లందఁబ్రాప్తియే చెపుఁడ
కూడదు శివదూషకుల మిమ్మునంటఁ - [53]జూడఁగఁబ్రతిమాటలాడఁగావునను
ఖలులార! యిండ్లువృత్తులు నూరు మీరు - తలఁ [54]గట్టికొనుఁడు మాదాతలు మేముఁ
బోయెదమనుచు నబ్భోగయ్యవెడలి - యాయూరి మునిమంద కరుగ నయ్యెడను
శైవులయిండుల శైవలింగములు - దేవాలయములు ప్రతిష్ఠలింగములు
నమితస్వయంభు లింగాదిలింగములు - తమతమ సింహాసనములను విడిచి
తలుపులు వడనూకి తారు లింగములు - జలదారిగాఁదూఱి చనులింగములును
పూవుఱా వడనూకి పోవులింగములు - బావి నదృశ్యమై పఱచులింగములు
కలయ నంతంత గంతులువైచివైచి - యలరుచుఁజెలఁగుచు నరుగులింగములు
[55]నురవడి వట్రిల్ల నొండొంటిఁ గడవఁ - బరువడిఁదమకించి పాఱులింగములు
నెల్లవారును జూడ నిలమీఁద నొక్క - నల్లేటిపొడవున డొల్లు లింగములు
ఖేచరత్వమున నేఁగెడు లింగములను - భూచరత్వంబునఁబోవులింగములు
ననిలవేగంబున నరుగులింగములు - చనలేక మెల్లన చనులింగములును
నీ విధంబునను గెంబావిలింగములు - భావించి భోగయ్యపజ్జనె యరుగ
లింగపర్వత మేఁగులీలఁబొల్పార - లింగభక్తాలి గేలికలు సేయుచును
నాడుచుఁబాడుచు నరుగ నిక్కడను - బాడువాఱెను బురిభాగ్యంబు దొలఁగె
నవని గంపించె సస్యావలులెండె - భువివృక్షములు వ్రాలెఁబొడిచెఁజుక్కలును

నప్పురి నిండంగ నంధకారంబు - గప్పి నెల్లెడ వంటకంబులు వ్రుచ్చె
బావులుఁజెఱువులుఁ బద్మాకరములు - వావిరి నూతులు వరువట్లు వట్టె
వనములు ఫలపుష్పవాటిక ల్గమరెఁ - గనుఁగొనఁ బశుపక్షిగణ మర్వఁదొణఁగె
ధరణిఁద్రొక్కినఠావు దరికొని కాల - దొరకొనియెను గాలి ధూళియు నెగసెఁ
తవిలి యిబ్బంగి నుత్పాతము ల్వుట్ట - భువిసర్వజనులు నబ్భూసురావలియు
భోగయ్య వోవఁగఁబురములింగములు - భోగయ్య వెనుకొనిపోయెఁబోవుటయు
నింతింతగార్యంబు లిలఁబుట్టె ననుచు - సంతాపచిత్తులై చయ్యన నేఁగి
శరణుసొచ్చితి మంచు జయజయయంచు - నరికట్టుకొనుచు సాష్టాంగంబు లిడుచుఁ
గావవే మముఁబాపకర్ముల భోగి - దేవయ్య దెస దిక్కు నీవ మా కనుచు
నవుదల ల్వంచుచు నయ్య మీధర్మ – కవిలెల మంచును గడుదైన్యపడుచు
సభయాత్ములై యున్న చండివిప్రులను - నభయంబులొసఁగి భోగయ్య తత్క్షణమ
మరలి కెంబావికి నరుదెంచె లింగ - పరికరుఁడగుచు నన్నరులు గీర్తింప
నాలింగములు భక్తి కటశాసనముగ - నోలి నన్యోన్యశివాలయంబులను
బెద్దపీఠంబులఁబిన్నలింగములు - బెద్దలింగంబులుఁబిన్న పీఠములఁ
భీమలింగంబులు రామపీఠముల - రామలింగంబులు భీమ పీఠములఁ
స్ఫటికలింగంబులు బాణపీఠముల - స్ఫటికపీఠంబుల బాణలింగములు
గనుఁగొన నిబ్భంగిఁగ్రక్కున నిలిచె - జనులకు నిదియె దృష్టప్రత్యయముగఁ
బొనరుచుఁగెంబావి భోగిదేవయ్య - వెనువెంటఁజనివచ్చి వీటఁ బీఠముల
నిలిచిన లింగమూర్తులు సాక్షిగాదె - మలహరుభక్తులు కులజులౌటకును

గుడ్డవ్వగారి కథ


నరనాథ గుడ్డవ్వ నాఁగ వెండియును - బరు లెల్లఁ దను బెద్దభక్తురా లనఁగఁ
బట్టినంతన తెగిపడియెడి కుష్ఠు - వట్టి రూపఱియున్న నట్టిచో నొక్క
నాఁడు నావిందిగె నాఁబురవీథిఁ - బోఁడిగా గుడ్డవ్వ వోవ భూసురులు
“నలుకలే కీ యగ్రహారంబులోని - కులిపి [56]జంగెత రాక నిలునిలు మనుడుఁ
బాపిష్ఠులగునట్టి పాఱులఁజూచి - శాపించుచును నింక సౌరాష్ట్ర మేఁగి
కాయంబువడయ కీ గ్రామంబు సొత్తు - నే యంచు నాత్మఁబ్రాణేశ్వరు నిలిపి
[57]ముదిత సౌరాష్ట్రాభిముఖియౌచుఁబోవఁ - బదయుగము విరిసి కదలరాకున్న

[58]మోఁకఱించుచువంగి మొగినేఁగ నేఁగ - మోఁకాళ్లుఁజేతులు మురియ నిల్వకయు
గ్రక్కునఁద్రోవఁబొరలిపొర్లి [59]పోవ - వ్రక్కలై మే నెల్ల విక్కనవిరియ
నంతలో నధికదయార్ద్రభావమునఁ - గంతుసంహరుఁడు స్వాకారంబుఁదాల్చి
యచ్చుగా సౌరాష్ట్రమందుండి యెదురు - వచ్చి సోమేశుండు వనిత దేహంబు
దివ్యాంగముగఁజేయఁదెఱవ మ్రొక్కుడును - భవ్యుండు వెండియుఁబటుదయామతిని
అడు గడ్గు నీ కీప్సితార్ధ మిచ్చెదను - బడఁతి మెచ్చితి నీదుభక్తికి ననిన
మన్మనోరమ్య నిర్మలభావగమ్య - సన్మతి మీ పదాబ్జప్రేక్షణమున
జన్మమునేఁడు దా సఫలతనొందె - నున్మదవ్యాధి గుణోద్వృత్తి యణఁగె
నసమాక్ష యింక నొండభిమతార్థముల - దొసఁగేలఁబెన్నిధి దొరకొనియుండఁ
జరగడుగఁగఁబోవు వెరవిండ్లుగలరె - వరద నీ విట్లు సుస్థిలలీలఁదనరి
యిక్కడ నుండు నాకింతియ చాలుఁ - దక్కినవరములచిక్కు లేనొల్ల
ననుడు నావిందిగె యను పురంబునను - దనరు సోమేశుఁడత్యద్భుతలింగ
మూర్తిఁజేకొనియుండె ముదితగుడ్డవ్వ - కీర్తి లోకముల నంకింపంగఁబడియె
నటమీఁదనాయమ్మపటుభక్తి మహిమ - మట యీశ్వరునకైన నరిదిదానెన్న
వనిత మున్నపహసించిన ద్విజాధముల - తనువులు సెడియె గుష్ఠనిరూఢివలన
గుడ్డవ్వయని ధరఁగొనియాడుచుండ - గుడ్డవ్వభక్తికి గుడ్డయై పఱగె
నటుగాన కులహీనులన నెట్లువచ్చు - నిటలాక్షుభక్తుల నిఖిలేశ్వరుండ
కని ప్రతిష్ఠాపూర్వకం బైన పిదపఁ - జెనసి లింగమకాక శిల యనఁజనునె
యతిశయలింగదీక్షితుఁడైనయట్టి - వ్రతి నంత్యజుండనిమతిఁజూడనగునె
హరసన్నిహితుఁబూర్వమరయుటయెల్ల - హరుశిలయన్న యట్లధికపాతకము
మేదినీవల్లభ మేరువు సోఁకి - కాదె తచ్ఛాయన కాకి వట్రిల్లు
భృంగసంస్పర్శఁబతంగంబుదొంటి - యంగంబునకుఁబాయుటది దెల్లగాదె
వారిధిఁదటినీ ప్రవాహముల్ గలయఁ - బేరున్నదే వేఱె పెక్కు లేమిటికి
సిద్ధరసస్పర్శఁ జేసి యౌఁగాదె - శుద్ధసువర్ణంబు శుద్ధతామ్రంబు
గురుకరస్పర్శచేఁగులమొక్కఁడౌట - యరిదియేయట్ల యంత్యజుఁడు నగ్రజుండు
ధర"నుమామాతాపితారుద్ర”యనఁగ - సరినొక్కదల్లి ప్రజలకు వేఱెద్ది
యొప్పెడుమాణిక్య మొక మసికోక - నెప్పాటఁబొదివిన నిలఁగాంతి సెడునె

హరభక్తుఁడధమజాత్యావృతుఁడయ్యు - ధర నున్న నేమి యాతనిప్రాప్తి సెడునె
రాజీవ మరయఁబంకేజంబు గాదె - పూజకు నది యెట్లు పూజ్యమై పరగెఁ
గాష్ఠోద్భవంబయ్యుఁగాదె పవిత్ర - నిష్ఠితంబై పొల్చె నెరి ననలంబు
యెట్టిదుర్జాతిని బుట్టిననేమి - యెట్టును శివభక్తుఁడిలఁబవిత్రుండు
నీ యగ్రజన్ముల కెల్లను గురువు - బోయెతకును గాదె పుట్టె వ్యాసుండు
పూర్వద్విజాచార్యుఁడుర్వి వసిష్ఠుఁ - డూర్వశియను లంజె కుదయించెఁగాదె
మాతంగుఁడనఁగ బ్రహ్మర్షి యొకండు - మాతంగికిని గాదె మహిఁబ్రభవించె
శునకగార్దభ మ్లేచ్ఛశుకదర్దురాది - జనితమునీంద్రాదిజాతము లెల్ల
శివభక్తిఁగాదె విశిష్టమై పరగె - నవనీశ యెఱుఁగవే యందఱ ననిన
విని బిజ్జలుఁడు రోషవిహ్వలుఁడగుచుఁ - గనుఁగొని బసవరాజునకు నిట్లనియెఁ
“బనిలేనిమాటలుఁబాటలుఁగథలు - విన విరుద్ధము లాడ వేసర వీవు
బత్తులఁజిదిమినఁబాలు గాఱెడినె - నెత్తురు గాఱెడినే యొడ్లఁజిదుమ
యిట్టిమార్గములు మున్నెఱుఁగ మే” మనిన - దట్టుఁడు బసవయ్య దా నంత లేచి
“భర్గునిఁగాదని పలుద్రోవ లేఁగు - దుర్గుణు లగు శివద్రోహులతోడ
నడరఁగ వేదభరాక్రాంతు లనఁగఁ - బడిన బ్రాహ్మణ గార్దభంబులతోడ
మహితప్రణవదివ్యమంత్రోపదేశ - రహితులై చను వ్రతభ్రష్టులతోడఁ
జాల దధీచ్యాదిశాపాగ్ని శిఖలఁ - గాలిన కర్మచండాలురతోడఁ
బట్టిప్రాణముతోడఁబశువు వధించు - కట్టిఁడు లగు పశుకర్ములతోడ
[60]జన్నెనుదొరలినఁజాగఁగఁబెట్టు - మన్నట్టి యధికపాపాత్ములతోడ
వీసానకై యెట్టి దోసాన కైనఁ - జేసాఁచికొను కర్మజీవులతోడ
మానుగా సురపాటిగా నర్థి సోమ - పానంబు గావించు పాఱులతోడ
నిన్నియుఁజెప్పంగ నేల తాఁజంపి - జన్ని సంపె నను దుర్జాతులతోడఁ
బ్రతిసేసి యాడినఁబాపంబు వచ్చుఁ - బ్రతినసూపమి భక్తిపంతంబుగాదు
శివనాగుమయగారి శ్రీహస్తమంద - నివిడి చూపెదఁబాలు నీ వన్నయట్లు
నీ మహీసురులలో నెన్నఁగఁబడ్డ - సోమయాజులఁదర్గి చూపుఁడా నీళ్లు
అటుగాక తక్కినఁగటకంబుచుట్టుఁ - గుటిలాత్ములను [61]దొడుగులఁబఱపింపు
మనుచు బిజ్జలభూసురానుమతమునఁ - జని సదాసిద్ధ బసవచక్రవర్తి

శివనాగుమయగారి శ్రీపాదములకు - భువి సమస్తాంగము ల్వొందంగ మ్రొక్కి
సన్నుత లింగపసాయితశస్త్ర - సన్నద్ధుఁడై మదిఁజెన్ను దుల్కాడ
సరస మాడినయట్లు పొరి నాగుమయ్య - కరతలాంభోజంబు గరములఁబట్టి
యొత్తుడుఁబింజించి యుడువీథిఁదాఁకి - యత్తఱి క్షీరధారావలి వర్వె
శివభక్తి కామధేనువు బసవనికిఁ - దవిలి చన్నవిసి యిబ్బువిఁగాఱునట్లు
కరుణించి శంభుండు గనకవర్షంబు - కరికాల[62]చోడుకుఁగురియించె నాఁడు
యసలార నేఁడు దివ్యామృతవృష్టి - [63]బసవనికిఁగురిసె భక్తవత్సలుఁడు
దుర్మలత్రితయ విధూతమైనట్టి - నిర్మలదేహంబు నిజ మట్ల కాదె
రుధిరమాంసాది నిరూపితంబగునె - యధమదేహులకుఁగాకని నరు ల్వొగడ
దివ్యామృతాంగ దీధితి దేజరిల్లెఁ - బ్రవ్యక్తమై జగత్ప్రత్యయంబమర
నఖిలభక్తౌఘంబు నసదృశలింగ - సుఖసమేతాత్ములై చూడ బిజ్జలుఁడు
నందందనాగి దేవయ్యపాదార - విందంబులకుఁజాఁగి వినమితుఁడగుచు
సకలలోకంబులు జయవెట్టుచుండ - నకుటిలభక్తిమై నంతంత మ్రొక్కి
యజ్ఞానజీవుల మపగతమతుల - మజ్ఞుల మధికగర్వాపరాధులము
శరణన్నఁగాచు మీబిరుదు నేఁడింకఁ - బరమాత్మ మఱవంగఁబాడియే యనుచు
శరణువేఁడుచు నున్న చండివిప్రులను - గరుణఁజూచుచు వారిఁగాంచి నవ్వుచును
బసవఁడుద్యత్సముల్లసనంబెలర్ప - నసమగజంబు నాగయ్య నెక్కించి
తానును బిఱుఁదెక్కి తననివాసమున - కానందలీల నొప్పారంగ నరిగె
శివనాగుమయగారి ప్రవిమలచరిత - మవిరళప్రీతి దుల్కాడంగ వినినఁ
జదివినవ్రాసిన సద్భక్తిమహిమ - లొదవు చతుర్వర్గపదములు సెందు

కళ్యాణపురమునఁ గల భక్తులు


(రుద్రునిమాఱట రూపంబు లనఁగ - భద్రేభసంహరు ప్రతినిధు లనఁగ
కళ్యాణమున నిత్యకల్యాణభక్తి - లౌల్యనిరర్గళ లాలిత్యముగను
మడివాలు మాచయ్య, మాదిరాజయ్య - బడవరబ్రహ్మయ్య, బాచిరాజయ్య
కిన్నర బ్రహ్మయ్య, గేశిరాజయ్య - కన్నడ బ్రహ్మయ్య, గల్లిదేవయ్య
మాళిగ మారయ్య, ముసిఁడిచౌడయ్య - శూలద బ్రహ్మయ్య సుఱియ చౌడయ్య
కలికేత బ్రహ్మయ్య గక్కయ్యగారు - తెలుఁగేసు మసనయ్య దెలుఁగు జొమ్మయ్య
శాంతదేవుండును జమ్మయ్య బాస - వంతుకేసయ్య యేకాంత రామయ్య

యుత్తమాంగదకేశి హొన్నయ్య గండ - గత్తెర నాచయ్య గాలాగ్నిరుద్రి
శృంగి బొప్పయగారు [64]సిగురుచందయ్య - డింగరి మల్లయ్య సంగమేశ్వరుఁడు
కదిరె రెమ్మయ మహాకాళయ్యగారు - పదుమరసును బురాణదమాయిభట్టు
నుదరదరామయ్య యోగి దేవయ్య - యుదయమరసుగారు హొన్నయ్యగారు
ధవళయ్యగారు బొంతాదేవిగారు - సవరద [65]చిక్కయ్య సారెనాయండు
శివముద్దుదేవుండు సిక్కదేవుండు - శివరాత్రిసంగయ్య యవిముగతయ్య
చండేశు చామయ్య ముండ బ్రహ్మయ్య - బండి [66]యరేవణ్ణ [67]యిండె సోమన్న
హాటకేశ్వరుని బ్రహ్మయ మహాబలుఁడు - కోటేశు చామయ్య గొగ్గయ్యగారు
దుమ్మద బ్రహ్మయ్య ధూర్జటికేశి - యెమ్మె సంగయ గపిలేశు విస్సయ్య
నొణిమేశు చిక్కయ నులుక చందయ్య - గణదాసి మాదన్న [68]గంటి మల్లయ్య
మురహాట కేతయ్య హరవి హొల్లయ్య - గిరిగీఁటు సింగయ్య గురజ కాళవ్వ
బానస భీమయ్య భాస్కరయ్యయును - గోనియ మల్లయ్య గొగ్గయ్యగారు
అల్లయ్య మధుపయ్య యనిమిషకేశి - హొల్లయ్య గోడల మల్లయ్యగారు
ఓలె బ్రహ్మయ కరహాళ మల్లయ్య - బాలబ్రహ్మయగారు పణిహారిబాచి
కవిలె బ్రహ్మయ బందికార మల్లయ్య - యవకర కేతయ్య శివనాగుమయ్య
నిజలింగ చిక్కయ్య నిర్లజ్జశాంతి - నిజభావుఁడును నిత్యనేమదమైలి
యంక బ్రహ్మయ గరహాళ బ్రహ్మయ్య - సుంకేశు బంకయ్య లెంక మంచయ్య
యేలేశు బ్రహ్మయ్య యీడె బ్రహ్మయ్య - మైలన బ్రహ్మయ్య మాయి దేవయ్య
చక్కెర బ్రహ్మయ్య శరణయ్యగారు - చిక్క బ్రహ్మయ్యయు సిరిగిరయ్యయును
వీరమారయ్యయు వీరలింగయ్య - వీరబ్రహ్మయ్యయు వీరభావయ్య
వీరనాగయ్యయు వీరకల్లయ్య - వీరభోగయ్యయు విమలదేవయ్య
[69]కక్కయ్య గల్లయ్య గాటకోటయ్య - చిక్కయ్య వీర్య శ్రీసూరసాని
కొండగుడ్కేతయ్య గుండయ్యగారు - చండేశుబ్రహ్మయ్య శంకరయ్యయును
అమృతదేవయ్యయు ననిమిషయ్యయును - విమలదేవుండును వీరాదిగాఁగ)
శివభక్తిసంపదల్ సిలివిలివోవ - సవిశేషభక్తి దృష్టప్రత్యయములఁ
జూపుచు సద్భక్తి సురుచిరమహిమ - నేపారు వీరమాహేశ్వరావలికి

భక్తమహత్త్వంబు భక్తాభివృద్ధి - భక్తచరిత్ర ప్రభావవైభవము
కన్నవారలు సెప్ప విన్నవారలును - నున్నతశివభక్తి యుక్తిమైఁదగిలి
దేవలకులు మంత్రదీక్షాన్వితులును - శైవపాశుపతాదిశాసనధరులు
వారివారిక లింగవంతులై చూచి - వారివారిక లింగవంతులై కూడి
వీరమాహేశ్వరాచార నిరూఢి - భూరిప్రసాదోప భోగులై నడవ

బోయలతగవు


బోయ లందఱుఁగూడి భూమీశుకడకుఁ - బోయి "యుత్పాతముల్వుట్టె నీపురిని
శ్రీకంఠశివులు గౌరీనాథశివులు - లోకేశశివులు ద్రిలోచనశివులు
నీశానశివులు మహేశ్వరశివులు - పాశమోచనశివు ల్వరమాత్మశివులు
శాశ్వతశివులు గణేశ్వరశివులు - విశ్వేశ్వరశివులును విమలాత్మశివులు
త్రిపురాంతకశివులు ద్రినయనశివులు - ద్విపదైత్యహరిశివు ల్దేవేశశివులు
నురులింగశివులును నుగ్రాక్షశివులు - హరశివులును బరమానంద శివులు
ధర్మశివులును విద్యాధరశివులు - నిర్మలశివులును నిష్కలశివులు
మొదలుగాఁగల శైవముఖ్యు లందఱును - నిదియేమి మతములో యెఱుఁగంగ రాదు
బసవయ్యతోయంపు భక్తులఁజూచి - వసుధఁదారును లింగవంతుల మనుచుఁ
దొడఁగి ప్రసాదంబుఁగుడుచుచున్నారు - నడరఁగ మా కించు కైనను నిడరు
నియ్యూరిలో మల్లజియ్యయు బొల్ల - జియ్యయు నిత్తురే చెల్లునే యిట్లు
విను మహారాజ మావృత్తి నిర్మాల్య - మొనరఁగ మాకు వచ్చినతొంటి విధము
పనులఁగావఁగఁబోయి బాలుఁడు దొల్లి - యిసుకలింగముసేసి యెలమిఁబైఁబిదుక
నేలరా మొదవుల పాలెల్ల నేల - పాలు సేసెద వంచుఁగాలఁదన్నుడును
గఁడగి తండ్రియనక గ్రక్కునఁగాళ్లు - గడికండలుగఁజేసి మృడుని మెప్పించి
మా దేవుచేతఁబ్రసాదంబు వడసి - యాదిఁ జండేశ్వరుఁడట్ల మాకిచ్చె
నంతటనుండి భోగింతు మిట్టులు ని - రంతరవంశ పరంపర మేము
నిప్పురి వీరమాహేశ్వరు లనఁగ - నిప్పు డేలా చెల్ల నిచ్చెద మనుచు
బసవయ్య యంత్రము ల్వన్నుటఁజేసి - పొసపరి మాతోడఁబోరుచున్నారు
చెల్లింపఁదగు నని చెప్పుగాదేని - వల్లభ నీ యింటి వాకిట నగ్ని
గుండముల్ ద్రవ్వించికొని కాల్దు” మనిన - నిండుఁగోపముతోడ నిఖిలేశ్వరుండు
బసవయ్యఁ దోడ్తేరఁ బనుచుడు బసవఁ - డసమానలీలమై నరుగుదెంచుడును
“గెడ గూడి బోయలఁగెడపుటిదేమి - వడిఁబ్రసాదము మీరు గుడుచుటిదేమి

యాదిమార్గమొ బల్మియో దీనిఁజెపుమ - కాదేని నాడికో కార్య మేమైన
యూరక కుడుచుట యుచితమే యనిన - ధారుణీశ్వరునితోఁదా నిట్టు లనియె
నిచ్చుట గలదు సండేశున కభవుఁ - డిచ్చిన తెఱఁగు మీ రెఱుఁగ రే వినుడు
బాణలింగములందుఁబటికంబులందు - బ్రాణలింగములందుఁబౌష్యరాగాది
లింగంబులందును లేదు ప్రసాద - మంగజహరునికి నాగమోక్తముగ
ధర మానవులు మహేశ్వరు ప్రసాదంబు - ధరియించినను గొన్నఁదారు సూచినను
నరయక దాఁటిన నరకాగ్నిశిఖల - నెరియుదురని శ్రుతు లెందును వినరె
శ్రీగురుకరుణానురాగ ప్రసాద - మాగమవిధ్యుక్త మగు ప్రసాదంబు
సుప్రసన్నానంద శుద్ధప్రసాద - మప్రతర్క్యాది లింగప్రసాదంబు
పరమపవిత్ర సంపత్ప్రసాదంబు - స్థిరభవరోగౌషధీ ప్రసాదంబు
సత్యప్రసాదంబు నిత్యప్రసాద - మత్యుత్తమోత్తమం బగు ప్రసాదంబు
గరళకంధరు కృపాకలితప్రసాద - మరుదగు సంగమేశ్వరు ప్రసాదంబు
మలదేహులకు మీకుఁదలమె భోగింప - మలహరుభక్తుల యిలుపుట్టువృత్తి
పూని లింగప్రసాదానూనసుఖము - మానవులకుఁబొందఁగా నెట్లువచ్చు
నేనుఁగుపన్నగునే గాడిదలకు - నేనాఁటఁగన్నులఁ గానరు గాక
యిచ్చుచోఁగెడిపితిమే ప్రసాదంబు - నిచ్చినకొన్న చోటెన్నఁడుగలదె
యిదియేల వెడగథ లిన్నియుఁబన్న - గుదగుదపడక నెమ్మదినుండుఁ"డనిన
“వారణాసి గయఁ గేదారంబునందు - సౌరాష్ట్రమునను దాక్షారామమునను
శ్రీగిరియందును సేతుపురోగ - మాగమస్థానంబులందెల్ల మాకుఁ
జెల్లఁగ మీరెట్లు చెల్లఁగనీరు - బల్లిదమైన మా ప్రాణంబులైన
విడుతుముగాక మామడిగూటివృత్తి - విడుతుమే యిదియేమి విపరీత[70]వృత్తి”
యనుచు బోయలులేచి కనుకనిఁబలుకఁ - గనుఁగొని బసవయ్య గన్నులనగుచు
వట్టియాకులు గాలి వడిఁదూలుఁగాక - మెట్టలు దూలునే యెట్టిగాడ్పునను
బెండ్లు దేలెడిఁగాక పేరేట నైన - గుండ్లు దేలునె మఱి తండ్లవియేల
బలువునఁగొన హరిబ్రహ్మాదులకును - గొలఁది గాదనిన మీ కొలఁదియె తొరల
[71]వలదు మీ రెంతటివారు గావునను - చల ముడ్గి తొలఁగుఁడు తెలివిడిఁగొనుఁడు
శైవశివాలయస్థానంబు దక్క - నే వీట నేనాఁట నిలఁదొల్లి నేఁడు.

నెన్నఁడే వీరమాహేశ్వరు లిండ్లఁ - గొన్నచోటులు దెల్పికొనుఁడ యిచ్చెదము
యారయ మును శైవు లైననునేమి - వీరమాహేశ్వరాచారు లైరేని
గనుకనిఁబ్రాణలింగప్రసాదంబుఁ - గొననిత్తురే మీకుఁగుటిలాత్ములార!
కొలాస లేల పైఁగొసరఁగుచంబు - గూలఁబడ్డ ట్లగుఁగూడనిమ్మనిన
[72]నేదియునేల మీ కిష్ట మేనియును - మా దేవునకును శ్రీ మన్మహేశునకు
బాలచంద్రప్రభా భాసురాంకునకుఁ - గాలకాలునకు మా నీలకంఠునకు
సర్పకుండలునకు సంగమేశ్వరున - కర్పింతుఁగాలకూటాదులు నేఁడు
రండ ప్రసాదంబు గొండ యిచ్చెదము - పొండ యింతకుఁజాలకుండి”న ననుడు[73]
“నక్కటా బసవయ్య! యందఱమమ్ము - నొక్క వెట్టునఁజంప నొండుపాయమునఁ
జాలక యిదిమేలు మేలు వో శృంగి - కాలకూటంబు మ్రింగంగఁబంచెదవు
నలి దీటుకొసఁగఁ బ్రాణంబు గల్గినను - బలుసాకు దిని యైన బ్రదుకంగ వచ్చు
నద్దిరా తాఁజచ్చి యది గుడ్తు రెవరు - దొద్దవో బసవయ్యతోడివాదంబు
వడిఁగొఱుకున కేఁగి బడిగంటఁజావఁ - బడిన మూషకములభంగి వట్రిల్లె
నేచి కొల్లకుఁబోయి యెదు[74]రెదుర్‌గాను - బైచీర గోల్పడ్డభావన దోఁచు
జాలిఁబడి కనకసాములు దమక - వేలిచికొన్న యావిధ మగుఁదమకుఁ
బగవారిబిడ్డల నగవులఁజంపు - పగిదిఁ జేసిన జోదు బసవనమంత్రి!
యీరసం బిదియేల యే మింతవెఱ్ఱి - వారము గామువో వలవ దిన్నియును
ధర భక్తు లెవ్వరే హరునకుఁదొల్లి - గరళ మర్పించుట గలదేని యిమ్ము
తవిలిచెప్పుము ప్రసాదంబని విషము - నెవరేని మునుగొన్న నేముఁగొనెదము
మేలిప్రసాదంబు మ్రింగ మీసాలు - కాలకూటంబు మాపాలె నేఁడింక
నెట్టిచ్చెదయ్య కీమాశుప్రసాద - మట్టవుఁబో విష మనియె యిచ్చెదవొ
నీవకో విషములు దేవుని కిచ్చి - చావకున్నను దత్ప్రసాదంబు మీర
చేకొండు వేయేల మీకును మాకుఁ - బ్రాకటంబుగ నింక బాస దా నిదియ
యనుడుబిజ్జలుఁడుభయానుమతమునఁ - జనుదెంచె దేవదేవుని గుడికడకు
బుడిబుళ్లునోవుచు బోయలు వచ్చి - రడరఁగఁదమకాకిపడగలు దూల

బసవన్న విషమారగించుట


బసవఁడసంఖ్యాతభక్తులుఁదాను - నసమానలీలమై నరిగియచ్చటను

గాలకూటము శృంగి ఘనవత్సనాభి - హాలాహలంబును నాదిగాఁగలుగు
విషము లన్నియుఁగూర్చి వేగ నూఱించి - విషమతరంబగు విషసౌరభంబు
గాలి సోఁకినమాత్ర నోలి జంతువులు - వ్రాలి యచ్చటన జీవంబులు విడువఁ
బై నాకసంబునఁబాటువిహగ వి - తానంబు దొప్పన ధరఁబడి చావ
రాగిల్ల నూఱినఁబ్రేగులు దెగెడిఁ - ద్రాగిన బ్రదుకంగఁదా నెట్లువచ్చు
ననుచు నబ్బోయలు కనుకనిఁ బఱవ - ఘనఘోరగరళంబు లెనయంగఁగలపి
పసిఁడికొప్పెరల నిం పెసఁగఁగ నినిచి - యసమసద్భక్త సభాభ్యంతరమునఁ
గొప్పెర ల్దీయించి కూడ నర్పించి - యప్పుడు ధూపదీపాదు లొనర్చి
పంచమహావాద్యపటలంబు లులియ - సంచితకీర్తి బసవచక్రవర్తి
యా మడివాలు మాచయ్యయాదిగను - కామారిసద్భక్త గణలింగములకు
నతిభక్తి సాష్టాంగుఁడై ప్రణమిల్లి - చతురత సరససంస్తుతిపూర్వకముగ
ముద్రవుచ్చుడును విషోద్రేకవహ్ని - రుద్రుమూఁడవకంటి రౌద్రాగ్ని కరణి
భుగులుభుగుల్లనఁబొగలి కెంబొగలు - నెగయ విషార్చుల గగనంబుఁగప్పెఁ
బటువహ్నిగొని చెఱిపాఱె భానుండు - నిటయట పడియె నీరేడు లోకములు
భూలోకమెల్లఁగల్లోలంబు నొందె - వ్రాలి మూర్ఛిల్లె జీవంబు లన్నియును
నిల మంగలమునఁబ్రేలులు[75] సిట్లుగొన్న - పొలుపున ధరణిఁజుక్కలు ద్రెళ్లిపడియెఁ
పొగగొన్నమాత్రన దిగులు సొచ్చుడును - విగతచేతనులైరి దిగధీశులెల్ల
నిండె ధూమంబు బ్రహ్మాండమంతయును - గొండలు గాటుకకొండలై తోఁచె
బడబానలంబున జడధులు గలఁగె - నడరెఁగల్పాంతాగ్ని యని బ్రహ్మవడఁకె
నీలవర్ణంబు దా నెక్కొన్ననాఁటి - హాలాహలం బని హరి దల్లడిల్లె
గుత్తుకవిష మెట్లొకో పోయె వెడలి - నత్తఱి నని రుద్రుఁడతిభయంబందె
నెగసె రుద్రునిఫాలనేత్రాగ్ని యనుచు - నొగి గణాడంబరోద్యోగంబు దనరె
నేలయు నింగియు నెక్కొన నిట్టి - హాలాహలాగ్నిమయంబగు నంత
మా యీశుభక్తుల మహిమ లిన్నియును - బోయలార వినుండు బుడిబుళ్లు మాని
కంటిమి కానము వింటిమి వినము - నుంటిమి లే మను నుక్తులు వలదు
అరయంగ నఖిలలోకాలోకములను - బరమేశుభక్తులు పరమపావనులు
నద్వితీయుండు పినాకియే కర్త - సద్విధి నేమె ప్రసాదయోగ్యులము
నిట్టిద కాదనునట్టి ద్రోహులకుఁ - గట్టితి [76]నెఱిగెల్తుఁగాలకూటాగ్ని

శాపింతు నఱికింతు సందుసందులకుఁ - ద్రోపింతు వాండ్ర నధోగతి ననుచు
దండియై బసవనదండనాయకుఁడు - చండేశనుతుఁడు శ్రీ సంగమేశునకు
సర్పాంకునకుఁదద్విషంబు సద్భక్తి - దర్పం బెలర్ప సమర్పణచేసి
పసిగమై నారగింపఁగ నార్చిపేర్చి - వెస ననివారితోద్వృత్తిఁజెలంగి
యరగలిగొనక కొప్పెరలకు నొరగి - పరమ మాహేశ్వరప్రకర ముప్పొంగి
జుష్టంబు “బ హ్వపి స్తోక మేవాపి - శిష్ట మన్నం విమిశ్రిత” మనుఁగాన
పసిఁడిగలంతెలఁబసిఁడికోరలను - బసిఁడికర్పరములఁబసిఁడిముంతలను
వారక యిటుగూడ వడ్డించికొనుచు - మారారి కర్పించి మహనీయలీల
“చిందక క్రోలుము సిక్కయ్యదేవ - సందడిసేయకు సంగయ్యదేవ
తెచ్చెదఁజుమ్మయ్య త్రిపురారిదేవ - విచ్చేసి కూర్చుండు విమలాత్మదేవ
కాలకంఠయ్యకుఁజాలదు దెండు - చాలుఁబో నీకు సిరాళ దేవయ్య
వేగ మింతేలయ్య విరుపాక్షదేవ - యీ గరిఁటెఁడుఁజాలు భోగయ్య కింకఁ
జాలదో తెత్తునా శంకరాచార్య - ఫాలలోచన పట్టు పట్టు మీసారె
యెంతైన నాస్వాదమే పురాతయ్య - చింతింపలేదువో శివదేవుఁడింక
మిగిలిన నాక చూ జగదేవతందె - నగవులఁబోదువో గగనేశ్వరుండ
కొంకకు గొంకకు శంకరదేవ - యింకను దెత్తునా లెంక మంచయ్య
పాడియే వలదనఁబర్వతదేవ - కూడ వడ్డింపుఁడీ గురుదేవనికిని
శివశివ తనియండు సిన్న దేవుండు - ప్రవిమలదేవుండు బాస సెల్లించె
ముద్దులాడక పట్టు మూర్తి దేవయ్య - దొద్దయే యెంతైన ధూర్జటిదేవ
సంబరపడకయ్య సర్వజ్ఞదేవ - కెంబావిభోగయ్య గేలియే నీకు
నీకొలఁదెఱుఁగమే నిజభావదేవ - పట్టుము మహలింగదేవ
సంతసంబే నీకుఁజంద్ర శేఖరుఁడ - మంతనం బేల నిర్మలదేవ నీకు
[77]నుసులకు నుసులకు గుసుమేశ్వరుండ - కసిమసంగెదవేల కల్లి దేవయ్య
[78]సడ్డ లిం తేలయ్య షొడ్డలదేవ - వడ్డింతుమే నీకు దొడ్డలింగయ్య
మీసలు దీర్పకు మిండసంగయ్య - బాసలువలుకకు బల్లాణదేవ
కడుపారఁగ్రోలుమా కళ్యాణదేవ - గుడికెఁడు దెత్తునా గొల్లవరాయ
చిక్కంగనీకుమా శ్రీగిరినాథ - మొక్కలం బిదియేల ముదునూరిదాసి

గ్రక్కునఁగ్రోలుమీ కఱకంఠదేవ - వెక్కసం బేలయ్య విమలాత్మదేవ
గొగ్గవ్వ మహదేవి గుడ్డలదేవి - దుగ్గళదేవి సద్యోజాతదేవి
యమ్మవ్వ సకళవ్వ యచలదేవమ్మ - నిమ్మవ్వ శాంతవ్వ బమ్మలదేవి
కాళవ్వ గేతవ్వ గామలదేవి - షోళశి బసవమ్మ సోమలదేవి
సంగవ్వ శివదేవి సాకలదేవి - లింగవ్వ రెబ్బవ్వ మంగళదేవి
ప్రమథవ్వ బాచవ్వ పదుమలదేవి - విమలవ్వ సెల్లవ్వ వీరభద్రవ్వ
చిక్కలరామవ్వ సిద్ధలదేవి - యక్కవ్వ సోడవ్వ యానందదేవి
హొల్లవ్వ గల్లవ్వ హొన్నలదేవి - హల్లవ్వ మల్లవ్వ యనిమిషదేవి
కేతలదేవి పురాతవ్వ మీర - లేతెంచి కూర్చుండుఁడీ బంతి ననుచు
సల్లీల వెండియుఁజతురతాన్యోన్య - సల్లాపసూక్తులు సరసమై తనర
నిట్టిసందడి యెన్నఁడెఱుఁగ మే మనుచు - దట్టుఁడు బసవన దా నెర్గుననుచు
దమ్మయ్య కడు పారెఁదడవకు మనుచు - నిమ్మాటికిని మిక్కి లింకఁదే ననుచు
నోయన సడలింపు మొడ్డాణ మనుచు - నీయాన నా పొట్ట నిండెరా యనుచుఁ
గడుపు దిగ్గెడిని నీల్గకుము నీ వనుచుఁ - గడుపు వెర్గినఁదెత్తుగాకేమి యనుచు
నయ్యకుఁదలమున్కలయ్యెఁబొమ్మనుచు - నియ్యయ్య కింతట నేమయ్యెననుచు
నిది వెద్ద గాదువో యీ యయ్య కనుచు - వదలింపు గట్టినవలువ నీ వనుచుఁ
బోనిత్తునే [79]నుస్లిపోయిన ననుచు - మానుఁడా సరసము ల్మాతోడ ననుచు
నాయయ్యఁ జూడుఁడీ యాస్వాదమనుచు - నీ యందు నేమేనిఁబోయెనే యనుచు
నుత్తమాంగమున నో రున్నఁగాకనుచుఁ - జిత్తము నున్నట్లు చెప్పెఁబొమ్మనుచు
గప్పెర నిండినఁగాని పోననుచు - గుప్పునఁదెమ్ము వేర్కొని గ్రుక్కెఁడనుచుఁ
దలయూఁపులకు రాకు దండ్రి నీ వనుచు - వలెనటె మాతోడ వాగ్వాద మనుచుఁ
గడుపు దా మాయయ్య వడసెరా యనుచు - బడుగుమాటలవేల బంతిలో ననుచు
దప్పిపోవునె యూఁది త్రావిన ననుచుఁ - గొప్పెరకును గంతు గొందుఁగా కనుచుఁ
[80]క్రేళ్లువాఱక యారగింపు రమ్మనుచు - నల్లవో బలిసెరా నా యయ్య యనుచు
నేలతెచ్చెదు దేకు మిచ్చటి కనుచు - మేలుబంతికి [81]నీవ చాలుదే యనుచు
నోయయ్య తెత్తునా యొక్కింత యనుచు - నా యయ్య చాలురా నాకింక ననుచు
ద్రేన్పకపోదునే దేవ యే ననుచు - ద్రేన్పఁగ నైనను దెఱపి లే దనుచుఁ

బళ్లెరం బలుఁగులువాఱెరా యనుచుఁ - బెల్లు వడ్డించితి వ్రేలెద వనుచు
నొలుకఁబోయకు మఱి యోయయ్య యనుచు - నొలికినబసవనికుండుఁగాకనుచు
దెరలోని కొప్పెరల్ దెండు దెండనుచు - హరహర దాఁచెదమయ్య నీ కనుచుఁ
గొనితెచ్చి వడ్డింపఁగ్రోలుచు భక్త - జనులఁదోతెండంచు ననురాగలీల
శివున కర్పింపుచు శివశివ యనుచు - నవధానవంతులై యారగింపుచును
జుఱ్ఱుజుఱ్ఱనఁగొని సొగయుచు గఱ్ఱు - గఱ్ఱనఁద్రేన్చుచుఁగాళ్లు సాఁచుచును
నిక్కుచు నీల్గుచు నక్కిలింపుచును - జొక్కుచుఁజోలుచుఁజక్కిలింపుచును
నక్కిలిపడి ఱెప్పలల్ల మోడ్చుచును - గ్రుక్కిళ్లు మ్రింగుచుఁగుత్తుక బంటి
గ్రోలుచు [82]నలరుచుఁ గ్రాలుచు నాత్మ - సోలుచు సుఖవార్దిఁదేలుచు వేడ్క
వ్రాలుచు మెఱయుచు వక్షంబులందు - నోలిఁబళ్లెరముది క్కొయ్యన మరలి
చూచుచు నించుకించుక వుచ్చికొనుచు - లేచుచుఁజెలఁగుచు లీలఁదలిర్ప
నాడుచుఁగప్పెర లఱచేత నొలయఁ - బాడుచు నుఱుకుచుఁబరువు వెట్టుచును
మురియుచుఁగునియుచు [83]ముఱకటింపుచును - యొరగాలనిలుచుచు సరసమాడుచును
నేతెంచి మ్రొక్కుచుఁ జేతులుసాఁచి - ప్రీతిఁబ్రసాదంబుఁబెట్టించికొనుచుఁ
గర మనురక్తిమైఁగౌఁగిలింపుచును - నరుదొంద బొత్తుల నారగింపుచును
నొండొరుముందట నున్న పళ్లెరము - లొండొరు లొడియుచు నుబ్బి యార్చుచును
విషమాక్షసద్భక్త వితతి యిబ్భంగి - విషమవిక్రమలీల విషకేలి సలుప
దండియై బసవనదండనాయకుఁడు - చండేశవరద ప్రసాదశేషంబు
గొట్టరువులవారిఁగుంచెలవారి - గొట్టుబోయల నాలవట్టాలవారి
పట్టపుదేవుల భ్రాతల హితులఁ - జుట్టాలఁబక్కాల సుతులఁబౌత్రులను
బండారులను నడబాళ్లఁబ్రెగ్గడల - దండనాయకులను దంత్రపాలకుల
దాసజనులను విశ్వాసుల భట్ల - దాసీజనముల విలాసినీజనులఁ
దతవితతాది వాద్యవిశారదులను - జతురగాయక నిజస్తవపాఠకులను
బండిత నర్తక పరిహాసకులను - మండితసత్కవి మండలి నెల్లఁ
బంతులు సాగఁగఁబంచి వారలకు - వింతవేడుక వుట్ట విషము వోయింపఁ
గాలకూటము వారిపాలికి నెయ్యి - పాలునై యుండఁగ బసవన్న మఱియుఁ
గాలాగ్ని రుద్రుని గణనాథు దాయ - కోలాహలంబును గుంజరోత్తంసు

గంగాధరప్రియు సంగరవిజయు - లింగసన్నాహంబు మంగళకీర్తి
జవుదంతితిలకంబు జగదేకవీరు - భవదుఃఖభంజనుఁబంచాస్యబలుని
నంతకదర్పసంహారు దుర్విప్ర - దంతభగ్నంబు సదాశివమూర్తి
భద్రేభసుందరుఁబరవాదివీర - విద్రావణుని వీరభద్రావతారు
నప్రమత్తునిఁద్రిపురాంతకు జంగ - మ ప్రసాదము దెండు మావంతులార
యనుచుఁబేర్కొని యివి యాదిగాఁ గలుగు - వినుతేభవితతి నుద్వృత్తిఁ దెప్పించి
యప్రతిబలుఁదెండు హయరాజుఁదెండు - సుప్రసన్నునిఁ దెండు సుభగునిఁదెండు
ధర్మకీర్తినిఁరెండు దవరాజుఁదెండు - కర్మసంహరుఁదెండు నిర్మలుఁదెండు
వాయువేగునిఁదెండు వరదునిఁదెండు - దాయఱంపముఁదెండు దత్త్వజ్ఞుఁదెండు
సృష్టిపాలకుఁదెండు సిత్రాంగుఁదెండు - దుష్టమర్దనుఁదెండు దుర్దాంతుఁదెండు
చంద్రాతపముఁదెండు శాశ్వతుఁదెండు - ఇంద్రాయుధమ్ముఁదెం డీశానుఁదెండు
చేరమప్రియుఁదెండు శృంగారిఁదెండు - వారణాసినిఁదెండు వాహకులార
యనుచుఁబేర్కొని యివియాదిగాఁగలుగు - వినుతాశ్వవితతి నుద్వృత్తిఁదెప్పించి
కూడ నేనుఁగులకు గుఱ్ఱంబులకును - వేడుకఁబోయించె విషమెల్లసమయ
నడలుచుబోయలు గడగడ వడఁక - మృడుభక్తమండలి మెచ్చి కీర్తింపఁ
బ్రమథకారుణ్య విస్ఫారప్రసాద - విమల పుష్పాంచితవృష్టి వైఁగురియ
గగనస్థులై రుద్రగణములు సూడ - నొగి దివ్యదుందుభు లొక్కట మ్రోయ
బిజ్జలుఁడద్భుతోపేతుఁడై మ్రొక్క - యజ్జనౌఘంబు వాయక జయవెట్ట
భవలతాంచితదాత్ర పరమపవిత్ర - శివగణస్తోత్ర విశిష్టచారిత్ర
సదమలగాత్ర ప్రసాదైకపాత్ర - విదితసజ్జనమిత్ర విజ్ఞాననేత్ర
ప్రోద్గతసూత్ర మహోద్గురుపుత్ర - సద్గుణైకచ్ఛత్రజంగమక్షేత్ర
యతిదయామాత్ర దుఃఖాబ్దివహిత్ర - ప్రతివాదిజైత్ర సద్భక్తికళత్ర
చన "నరిర్మిత్రం విషం పథ్య” మనఁగఁ - బనుపడు శ్రుత్యుక్తి బసవ! నీకయ్యె
బాపురే మా తండ్రి భక్తివర్ధనుండ - బాపురే మా యయ్య ఖ్యాపితశౌర్య
నల్లవో బసవయ్య నందీశమూర్తి - నల్లవో బసవ యనశ్వరకీర్తి
గరళంబు దొల్లి జగద్ధితార్థముగ - హరుఁడారగించుచో నట మ్రింగ వెఱచి
కాదె విషంబుంచెఁగంఠంబునందు - నా దేవు మాహాత్మ్య మది యెంత వెద్ద
కాలకూటముకంటెఁగడు నుగ్రవిషము - తా లెక్కసేయక దండనాయకుఁడు

అంచితభక్త హితార్థంబుగాఁగ - వంచనలే కారగించెఁగడ్పార
నమృతంబు ద్రావియు నమరసంఘంబు - సమసుప్తిఁబొందెడు జగ మెల్ల నెఱుఁగ
బసవయ్యఁజూడుఁడా విసముద్రావియును - నసమానలీల దివ్యాంగుఁడై నిలిచె
ననుచు లోకము లెల్ల నచ్చెరువంది - వినుతింప బోయలు విభ్రాంతిఁబొంది
సంతాపచిత్తులై సంస్తుతింపుచును - నంతంత సాష్టాంగులై ప్రణమిల్లి
“యభయమే బసవయ్య! యతికృపాంభోధి!! - యభయమే బసవయ్య ! యద్భుతచరిత!!
యిమ్మెయి సరివారమే బసవయ్య - తమ్ముఁబఱుప మీకుఁదలఁప శౌర్యంబె
పోల దుర్జనుతోడి పొందునకంటె - జాల మేలండ్రు సజ్జనవిరోధంబు
కావున, మము నెట్లుఁగాచి రక్షింపు - మావికలతఁద్రోచి దీవనఁబొందు
దేవ దెసయు దిక్కు నీవ మా” కనుచు - వేవిధంబుల నిట్లు విన్నవించుడును
జూచె దయాదృష్టిఁగాచె వీడ్పడఁగఁ - ద్రోచె వాదములెల్ల నేచెఁ బ్రఖ్యాతి
మాపె బోయలపెంపుఁజూపెఁబ్రసాద - మోపి లే దనినూకెఁబాపె బోయలను
నిలిచెఁజలింపక తలఁచెఁబ్రస్తవము - గెలిచె సద్భక్తిమైఁబొలిచె బీరమునఁ
జేర్చె భక్తావలిఁగూర్చె నాద్యోక్తిఁ - దీర్చె సన్మార్గంబు నోర్చెఁదర్కమునఁ
బండించె నిశ్చలభక్తిలోకముల - నిండించె బసవయ్య నిర్మలకీర్తి

జగదేవ దండనాయకుని కథ


వెండియు జగదేవ దండనాయకుఁడు - నిండారుసద్భక్తి నిధి కర్మయోగి
యభిమతలీలమై విభవంబుమెఱసి - శుభకార్య మాచరించుచు నొక్కనాఁడు
నేతెంచి వీరమాహేశ్వర తిలక - ప్రీతియెలర్ప విభూతిఁగైకొనుము
అసలార మాయింట నారగించినను - బసవనమంత్రి యేఁబ్రదుకుదు ననిన
నగుమొగం బలరార జగదేవమంత్రి - నొగిఁజూచి బసవయ్య యొండేమి చెప్ప
సర్వజ్ఞనెట్టణ శరణులరాక - కోర్వఁగ నెమ్మెయి నోపుదే యనిన
నవుఁగాక యనుచు రయంబున నేఁగి - వివిధపక్వాన్నాది వితతులు గూర్చి
సరసర బసవయ్య సనుదేరకమున్న - గరమభిషేకంబుఁగావింత మనుచుఁ
[84]జానపిప ట్లల్కి సద్భక్తియుక్తి - గానక బాఁపల కాళ్లు గడ్గుటయుఁ
బరిచారకునిచేత బసవయ్య యెఱిఁగి - యరుగుట సాలించి యాగ్రహింపంగ
జగదేవుఁడంతలోఁజనుదేరఁగాంచి - భుగభుగ కోపాగ్ని యెగయ ముందటను
తెరచీర వట్టించి చొర నెట్లువచ్చు - నరుగుము భక్తజనాళిలో వెడలి

కులదైవ మిలువేల్పు మలహరుఁడుండఁ - బలుద్రోవలనుబోవఁబాడియే నీకుఁ
గఱకంఠు శుద్ధనిష్కలభక్తియుక్తి - జఱభుల కదియేల సమకూడుఁజెపుమ
ముల్లోకనాథుని ముట్టఁగొల్చియును - గల్లరిలోకుల [85]క్షణియింపఁదగునె
హరునకు మజ్జనంబార్చుచేతులను - [86]సరవి విప్రులకాళ్లు సరి గడ్గఁదగునె
శివపాదజలములు శిరమునఁదాల్చి - భవుల కాళుల నీళ్లు వై నల్కఁదగునె
శ్రీమహాదేవుఁబూజించుచేతులను - నామాలకుక్కల నర్చింపఁదగునె
పురహరార్చితునకు మున్నెత్తుకలు - ధరనెత్తఁగూడునే త్రాటిమాలలకు
సదమలలింగ ప్రసాదజీవికిని - విదిత మీశ్వరభక్తి విముఖులైనట్టి
కర్మచండాలురఁగలసి కుడ్చుటయుఁ - గర్మంబు గుడుచుటగాదె యెట్లనిన
నదియును దివ్యాగమార్థంబులందు - మదనారిసద్భక్త మందిరంబులను
మెలఁగుపుత్రకళత్ర మిత్రగోత్రాది - బలఁగంబు లింగాన్వితులు గాకయున్న
నొండేమి యిలఁగూడియున్న యంతటను - చండాలమిశ్రదోషంబు వాటిల్లు
దర్శనా దపి పాపదా” యనుఁగాన - దర్శనాలాప సంస్పర్శన శయన
సంపర్కభోజనాసన దానములకు - నింపారునే భక్తుఁడితరులయెడను
బశుపతిసద్భక్తి పథ మేమిచెప్పఁ - బశువులసద్భక్తి పరులఁజేయండె

ఏలేశ్వరు కేతయ్యగారి కథ


ఖ్యాత మేలేశ్వరు కేతయ్యనా న - జాతభక్తుండు దచ్చరిత మెట్లనిన
చిత్ర మత్యద్భుత శీలప్రయుక్తి - పుత్రమిత్రకళత్రగోత్రవర్గంబు
బానిస బంటు గోపాలుండు వశువు - శ్వానంబు మఱియు మార్జాల మాదిగను
గృహచారకుల నెల్ల మహనీయలీల - మహిఁబ్రాణలింగసన్నిహితులఁజేసి
తానును భవులను దలఁపఁ డల్లంత - నైనఁజూడఁడు మాటలాడఁడు వినఁడు
ముట్టఁడు వరసీమ మెట్టఁడెయ్యెడలఁ - బెట్టఁడు వారిచేఁబెట్టించికొనఁడు
తావిల్వఁడమ్మఁడెంతయు భాగ్యమునను - బోవఁడెరవువోయి పొందిడికొనఁడు
తానయై పొరయఁడింతటి కేమి యనఁడు - మానుగా నావంతయేనిఁబోనీఁడు
భవి పరిత్యాగులై భువిఁబ్రవర్తింప - శివభక్తులకు నిది శిష్టత్వ మనఁగ
నిట్టు వర్తింప నేలేశుకేతయ్య - నెట్టణభక్తివినీతిని జనులు
నెడనెడ నొక్కొక్క యెగ్గొనరింపఁ - దొడిఁబడ కా యయ్య నడచుచునుండఁ

బుడుకఁడు భవులంచుఁబోయి పొందీఁడు - నడుగఁడు భక్తుఁడ ననుచు నింకేల
వెదపద న్సెడకుండ విత్తులు సేన - వెదవెట్టుఁగాకేమి యిది సూతఁడనుచు
నలిగి విత్తులగాదియలఁజిచ్చువెట్టి - యలరుచు ద్రోహు లంతంత వీక్షింప
నేలేశుకేతయ్య యెఱిఁగి నవ్వుచును - గాలుఁగా కేమని గ్రక్కున నచటి
నీరు [87]పొణ్కలనిండ నించి తెప్పించి - యారకుండఁగఁజేన నంతటఁగలయ
విత్తించికొని కొండ్రవేలకు మిగుల - నత్తఱిఁ బండించె ననురాగలీల
మును హీళ్లహాళ బ్రహ్మన నాఁగ భువిని - వినఁ జెప్పఁజిత్రంబు విత్తు లల్కకయ
చేను వండించె నాఁజెప్పఁగఁబరగుఁ - దా నేఁడు వీరిచేఁగానఁగఁబడియె
మదనారిభక్తుల మహిమ దలంప - నిది సోద్యమే యంచు నిల బుధు ల్వొగడఁ
బనువుచు వెండియుఁబాపిష్ఠులైన - జను లంతఁబోక యసహ్యభావమునఁ
బసు లేడ తా రేడ బగి తేడ జగతిఁ - బసరించి కుడిచెడి పగిది గా కనుచు
జంత్రంబువన్ని కచ్చఱమ్రుచ్చులకును - యంత్రించి పసులఁదారంతఁబట్టింపఁ
దలర కొక్కటియును దప్పకయుండఁ - [88]బొలమునపసులకు బొలమున వెడల
నటుగొనిపోవుచో యనుగుచునుండి - యిటప్రాణనాథుఁడుండుటఁజేసి పసులు
పండిన పొలమునఁబదువయు మొలవ - నిండినకొలఁకుల నీర్గలచోట
మఱచియైనను బులు గఱవక నీరు - దఱియుచో మూతులు దడియంగనీక
యేడునాళ్లునుగూడ నిటు సనుచుండ - చూడ నక్కజ మైనఁజోరు లూహించి
యిది యేమి చోద్యమో యిట వట్టి తెచ్చి - నది యాదిగా మేయ వంటవునీళ్లు
నుండిన ఫలమేమి రెండుమూన్నాళు - లుండినఁజచ్చు నొక్కండును మనదు
వట్టి కర్మంబేల కట్టికొనంగ - నిట్టున్న భంగిఁబోనిం డని విడువ
గ్రక్కున మగిడి యుబ్బెక్కి యంతంత - నెక్కడ నిలువక యెగసి దాఁటుచును
తోఁకలు వీపులతోఁగీలుకొలిపి - వీఁక వచ్చినదారి విడువక పట్టి
యేడునాళ్లకు మును పేతెంచు తెరువు - నేడుజాలకుఁగూడనేఁగుడు నిచట
నేలేశు కేతయ్య యెడదవ్వులందు - కీలరుఁబొడగాంచి కినియుచు దొడ్డి
పలుగాఁడి నిడి వ్రతభ్రష్టుల దిక్కు - పలుకుట సూచుట వాతకంబనుచుఁ
జొరనీక నూకుడుఁజొప్పయుఁగసువు - పరులు వాపంబంచుఁబడిగొనివైవఁ
గొప్పదిక్కున నంత సూడక వ్రతము - తప్పమయ్యా యని తా[89]రర్చునట్లు

నెలుఁగెత్తి కూడి యంబేయని [90]యఱచుఁ - దల లెత్తివంచు నాల్కలు వెడలించు
తెట్టుపై మూతులువెట్టి యన్నగరి - చుట్టును వాచర్చు శోకంబు లడర
దొడ్డిలోపలఁదారు దొల్లి భజించు - దొడ్డలింగముఁదొంగితొంగి చూచుచును
దాఁటఁగ దలపోయు [91]దర్పంబుపేర్మి - దాఁటఁగ నోడుఁ గేతయ్య రమ్మనక
యాపసు లిభ్భంగి నలమటపడఁగ - లోపలఁగట్టిన క్రేపులి ట్లెఱిఁగి
తప్పునో తమతమతల్లులు నియమ - మప్పాటనని యర్వ కాలింపకున్న
లేఁగలఁబుడుకుచు లీలఁగేతయ్య - మూఁగియర్చుచు మేఁతముట్టకుండుటయు
శీలము ల్దప్పమి వోలఁగా నెఱిఁగి - యాలోకు లత్యద్భుతాక్రాంతులుగను
బలుగాళ్లు దెఱపింప నలరుచుఁబసులు - వలివేగమున వచ్చివచ్చి యొండొండ
[92]యూఁకర ల్గొట్టుచు నుత్తలపడుచు - వీఁకఁగన్నులు విచ్చివిచ్చి చూచుచును
దలలు లింగంబుతోఁదాఁకించికొనుచు - వలగొని వచ్చుచు వడి మూరుకొనుచు
నిట లింగవిముఖులై యేఁగుటఁగోలె - నట పూరికఱ్ఱయు నంటకుండుటకు
సత్యమీ లింగంబు సాక్ష్యమన్నట్లు - నిత్యలింగస్పర్శ నియమము ల్సలిపి
గ్రక్కున కేతయ్యగారి పాదముల - కొక్కింత వంగుచు మ్రొక్కి తత్క్షణమ
ముప్పిరిగొనిపాఱి చొప్పయుఁగసువు - నప్పుడు దమ కడుపార మేయుచును
నెడనెడ నుదకంబు లేఁగి త్రావుచును - వడి నాకుచును జాఁగఁబడుచు లేచుచును
బొదుగులు సేపంగఁబొదలి నెయ్యమున - మొదవు లంబే యని మునుకొని యఱవఁ
బసులఁగేతయ్య నేపట్టుట యెఱిఁగి - పసిగొని క్రేపులు వార కర్చుచును
విడువఁదల్లులడాసి కుడువఁగ నియతి - నడరంగనఱచెఁ దా రట్ల కావునను
నేలేశు కేతయ్య యింటియీ పసులు - పాలింపఁగా శివభక్తుల యనిన
నితరులఁగలయంగ నెవ్విధిఁగూడు - మతిఁదలఁపఁగ [93]గురుమార్గమే యిదియు

సవరద నాచయ్య కథ


సవరదనాచయ్య యువిదకుఁదొల్లి - కవలవా రుదయింప గ్రక్కున మున్న
యుదయించు బాలున కొక్క లింగంబు - నుదయించు లోనన నొగి సమర్పించి
యున్న బాలునికి వేఱొక్క లింగంబు - మున్ను గల్పింపమి నన్నాతి దడసి
పతికిని వినిపింపఁబథిహీనుఁడయ్యె - సుతుఁబాఱవైపుఁడు చూడఁగరాదు
శరణోక్తి గురులింగ సన్నిహితంబు - నరయ నర్ధోదయంబైనప్డ వలయు

నని నాచిదేవయ్య యఖిలంబు నెఱుఁగఁ - దనయు విసర్జించె ననుచు నాద్యోక్తి
మార్గంబులుండఁగుమార్గంబులూఁది - మార్గమే యీ త్రాటిమాలలఁగలయఁ
బశుపాశపతి యుండఁబశువులౌ [94]పంద - పశుజీవులకుఁబెట్టు పందలఁబట్టి
సోడంబుతో ముక్కు మోడుగాఁగోసి - కూడ నిట్టికఁబ్రామ కేడఁబోవచ్చు
ఖండేందు ధరుఁడిట్టికర్ముల యొద్ద - నుండునే మా భక్తు లొద్దనే కాక
రాచిన శుద్ధశివాచార మహిమ - నాచుఁడ యెఱుఁగంగ నీ కేలవచ్చు
దృష్టిహీనుండు దా దీప మే మెఱుఁగు - నష్టకర్ణునకును నాద మేమిటికి
జ్వరపీడితుఁడు వాలచవి యే మెఱుంగు - సరి గప్ప లెఱుఁగునే జడనిధిలోఁతు
వానరం బెఱుఁగునే వరరత్నమహిమ - శ్వానం బెఱుంగునే స్వర్గలోకంబు
రా నేర్చునే పుష్పరసమున కీఁగ - కాన నేర్చునె రవిఁగౌశికవితతి
యజ్ఞానజీవుల కతులితభక్తి - ప్రాజ్ఞత యిదియేల ప్రాపించుఁజెపుమ
ముంగిటిపెన్నిధి దంగేటిజున్ను - నంగిటనూరెడు నమృతంబనంగఁ
జను నేకలింగ నిషాభక్తియుక్తిఁ - జనకదుష్పథములఁజరియించు టెల్ల
రాజితాంచితరత్న రాజ ముండంగ - గాజుపెంచిక లేఱ గమియించినట్లు
తవరాజ మమరి ముందఱఁబ్రోఁకయుండ - తవుడు బొక్కుదునని తలఁచినయట్లు
దొడ్డిలోసురధేను [95]వొడ్డుగాఁగురియ - గొడ్డుఁ [96]బిదుకఁగుండఁగొనియేఁగినట్లు
నక్కజంబగుచు వజ్రాయుధంబుండ - మొక్కలసురియకు మోహించినట్లు
పొట్టపొర్వునఁగల్ప భూరుహంబుండ - వట్టివృక్షమునకు వడి నేఁగునట్లు
నొదవంగ వఱ్ఱేట నోడ యుండంగ - వద రూఁదినట్టు లీ వసుమతిలోన
మంగళంబగు భక్తిమార్గముండంగ - వెంగలులై కర్మవిధి యూఁది చెడుట
స్మృతి తేన సహ సంవ సే”త్తని మ్రోయ - మతిహీనులకు నేల గతమగుబుద్ధి
నెఱి నెన్నిమాఱులు నీళ్లలోపలను - గొఱుపడంబుదికిన మఱి తెల్లనగునె
యేనాఁట బ్రద్దల నెంత గట్టినను - శ్వానంబుతోఁక దాఁజక్కన యగునె
మానక జలములలోన నేప్రొద్దు - నానిన శిల మెత్తగానేర్చు నెట్లు
నెడపక పాలు దానెన్నివోసినను - విడుచునే సర్పంబు విస మొకింతైనఁ
బొలుపుగాఁదేనియ వోసి నూఱినను - నిలఁదీయనై యుండునే వేఁపనార
పన్నుగానే లెంత వ్రామి కడిగిన - మన్నుఁదాఁబోవునే మఱియట్లుఁగాక
పసిఁడినాఁగటఁబెక్కుభంగుల దున్ని - వెస ముల్కవిత్తులు వెదవెట్టినట్లు

ఘనసారవృక్షముల్ ఖండించి వెల్గు - పెనుజెముళ్లకుఁ జుట్టుఁబెట్టినయట్లు
నగ్గిలోపల మూత్ర మఱిముఱిఁబోసి - డగ్గఱి వేల్వఁదొడంగినయట్టు
లచ్చుగా నర్ఘ్య[97]పణ్యమ్ములు దెచ్చి - యిచ్చఁగుక్కల కాళు లిలఁబూన్చినట్టు
లోడునఁబోసిన యుదకంబులట్లు - నీడమాలిన ధరణీరుహంబట్లు
రాజితలింగపరాఙ్ముఖానేక - పూజలు నిష్ఫలంబులు గావె తలఁపఁ
ద్ర్యక్షపరాఙ్ముఖక్రతు వాచరించి - దక్షుఁడెఱుంగవే తలఁగోలుపడియెఁ
బరశురాముఁడు దొల్లి బాఁపల కర్థి - ధర యిచ్చి యెఱుఁగవే తా నేమి గనియె
నిల యెల్ల నెఱుఁగ విప్రులనె పూజించి - బలి బంధనంబునఁబడఁడె తెల్లముగ
నడరంగ గౌతముఁ డగ్రజన్ములకుఁ - గుడవఁబెట్టియ కాదె గోహత్యఁజెందె
వేదజ్ఞులగు కోటివిప్రుల కన్న - మాదటఁబెట్టిన యట్టి ఫలంబు
త్ర్యక్షభక్తున కొక్కభిక్షంబు వెట్టు - నక్షయఫలమున కసమాన మనుట
వ్యక్తమైయుండఁ గుయుక్తుల నడవ - భక్తియుఁజెడు దానఫలము నిష్ఫలము'
నని పెక్కు భంగుల నానతిచ్చుడును - విని శోకజలసమన్వితనేత్రుఁడగుచు
జగదేవుఁ డాభక్త జననికాయంబు - మొగిఁబ్రస్తుతింపుచు మోడ్పుఁగే లమరఁ
“గర్మబద్ధుఁడనైతిఁ గష్టుఁడ ఖలుఁడ - దుర్మదోపేతుఁడ దుష్కృతాలయుఁడఁ
బ్రజ్ఞావిహీనుఁడఁ బరమపాతకుఁడ - నజ్ఞాని నధికసర్వాపరాధుండ
శంకమాలిన యనాచారుండ దీని - కింకఁబ్రాయశ్చిత్త మేమియు లేదు
పాన లేటికి విడుఁబ్రాణంబు గెలస - మానతి యిండు ఆన” కని మ్రొక్కి నిలువఁ
గనుఁగొని బసవయ్య ఘనభక్తవితతి - యనుమతంబునఁగూడ నతని కిట్లనియె
“గొంకక విను మఱికొన్ని దినముల - కింక శివద్రోహ మిట పుట్టఁగలదు
మడియింపు ద్రోహిని మా కెక్కెఁగెలస - మడరఁ బ్రసన్నుఁడయ్యెడి శివుఁడప్డు
ఈ నిర్ణయమునకు నీశానగణ వి - తాన మెంతయు మెచ్చి తత్ర్పస్తవంబు
నిమ్ములఁగరుణించి యిచ్చిరి నీకు - నమ్ము ముమ్మాటికి లెమ్ము లె” మ్మనుడు
[98]నంగద మోడ్పుఁగే లలికంబుఁజేర్చి - పొంగుచు వీరతాంబూలంబు గొనుడు
జగదేవశరణుని నగరికి బసవం - డగణిత భక్తసహాయుఁడై యరిగె
నసలార నుచితక్రియాదులఁదనిసి - బసవన్న యసమసద్భక్తులుఁదాను
ననయంబు భక్తిసుధామృతాపార - వనధి నిమగ్నుఁడై వర్తింపుచుండె

అల్లయ్య మధుపయ్యల కథ

మఱియంత నల్లయ్య మధుపయ్య యనఁగఁ - గఱకంఠుభక్తు లకర్మసంచయులు
లింగైకనిష్ఠావిలీనమానసులు - జంగమారాధనాసక్తచేతసులు
పరమశివాచార పరవర్త్మనిరతు - లురుతరకీర్తి నియుక్తులు నాఁగ
నసమానలీలఁగళ్యాణంబునందు - బసవఁడు దారు నప్పాట వర్తింప
నంత బిజ్జలుఁడు దాఁ గొంతకాలమున - కంతకు ప్రోలికి నరుగంగఁదలఁచి
బసవని మహిమయు భక్తి మహత్త్వ - మెసకంబు నెఱిఁగియు నెఱుఁగనియట్లు
పొదలిన యజ్ఞానబోధగాఁజేసి - మదియించి యల్లయ్య మధుపయ్యగారి
తప్పేమియునులేక చొప్పుగా దనక - రప్పించి కన్నులు వుప్పించె నంత
'కాలకాలునిభక్త గణముల మహిమ - లేల తా మున్నును నెఱుఁగునుగాదె
యక్కట చెడఁజూచె నవనీశుఁడింక - నిక్కటకంబున కెక్కడిబ్రదుకు
మృడుభక్తు లలిగినఁజెడఁడె తా” ననుచు - జడిగొని నరులెల్ల బుడిబుళ్లువోవ
బసవఁడు మొదలుగా నసమాక్షుభక్తు - లసమకోపోద్దీపితాంగులై పొంగి
మసలక యల్లయ్య మధుపయ్యగారి - కసలారఁగాఁగన్ను లప్పుడ పడసి
'యింక నుండఁగఁగూడ దీయూర' ననుచు - శంకరభక్తులు జగదేవమంత్రిఁ
'బనిచినతొల్లింటి బాసగైకొనుము - తునుము శివద్రోహి' ననుచు బిజ్జలుని
నొసలిరేఖలు గసిబిసిచేసి రాజ్య - మసమాక్షుకవిలియ నటు దుడిపించి
బల్లహుకటకంబు వదటిపా ల్సేసి - యెల్లవారును జూడ నీక్షణంబునను
'బాడగుఁ [99]గటకంబు వాడగుఁగూడఁ - బాడగు' ననుచు శాపంబు లిచ్చుచును
రాచిన మడివాలు మాచయ్యగారు - నాచౌడరాయఁడేకాంతరామయ్య
కిన్నర బ్రహ్మయ్యయు గేశి రాజయ్య - కన్నడ బ్రహ్మయ్య గక్కయగారు
మాది రాజయ్యయు మసణయ్యగారు - నాదిగా నప్పురి యఖిలభక్తులును
దండిజంగమకోటి దనతోడ నడవ - బండారు బసవనదండనాయకుఁడు
నెసఁగఁ గప్పడి సంగమేశ్వరంబునకు - వెస నేఁగె బిజ్జలు నెసకంబు దలఁగ
గటకటా కఱకంఠు గణములు వోవఁ - గటకంబుభాగ్యంబు గ్రక్కునఁదొలఁగె
భూకంపమయ్యెను భువి నర్ధరాత్రి - కాకు లఱచె వంటకంబులు వ్రుచ్చె
ధరఁబడె నుల్క లత్తఱి ఱాల వాన - గురిసె భాస్కరచంద్రపరివేషమయ్యె
దివిదీటుకట్టె వేసవి మూఁగె మంచు - గవిసెను మధ్యాహ్న కాలంబు నందు

కడు నుగ్రరూపుఁడై కాలుండు గానఁ - బడియెను బట్టణ ప్రాంతదేశమునఁ
బొరిఁబొరి గవిసెఁగావిరి యెల్లయెడల - ధరణీశ్వరుఁడు గాంచెఁదలలేని నీడ
రవి యుదయించు తత్ప్రస్తవంబునను - దివిఁబ్రతిసూర్యులు దీపించి రింక
నెంతగానున్నదో యిట మీఁదననుచు - సంతాపచిత్తులై జనులు భీతిల్ల
నిక్కడ జగదేవుఁడింటి కేతేరఁ - జక్కన నాయయ్య జనని వీక్షించి
“శివగణద్రోహంబు సెవిఁబడ్డయపుడ - యవిచారమున వారి హరియింపవలయుఁ
జాలరేఁదారేని సమయంగవలయుఁ - గాలకాలుని భక్తగణమార్గ మిదియు
సమయింపఁజాలక చండియై తాను - సమయనిప్రాణవంచక కుటిలునకుఁ
గుపితున కజ్ఞున కపజీవితునకు - విపరీతచరితుండు విషమలోచనుఁడు
మెచ్చునే వానికి మిక్కిలిభక్తి - యిచ్చునే కూర్చునే యిన్నియునేల
క్రితము నీ ప్రాణ పరిత్యాగమునకు - మతిమెచ్చి యవసరోచిత మిచ్చి నిన్నుఁ
బంచి యేఁగిరి కాక భక్తు లాద్రోహిఁ - ద్రుంచుట కోడియే తొలఁగిరె చెపుమ
యందొక్కఁడలిగిన నవికలాజాండ - సందోహములు గాలి డిందకయున్నె
దక్షుఁడు క్రొవ్వి యదక్షుఁడై తొల్లి - దక్ష మఖక్షయదక్షుఁబల్కుటయు
వినఁగఁజాలక తాన తనకోపవహ్నిఁ - గనలుట వినవె యా గౌరి తత్క్షణమ
యదిగాక యుపమన్యుఁడభవునినింద - మది విన కపుడ భస్మంబయ్యెఁగాదె
కావున శివభక్త గణనింద వినియు - నీ వూరకుండుట నీతియే వానిఁ
జంపియే కుడువఁగఁజనుదెంచి తిపుడు - పంపుడుకళ్లు నీ కింపారు నెట్లు
చీ! కుక్క! చేఁజేత శివుప్రసాదంబు - చేకొని కుడువఁగ సిగ్గెట్టులేదు
వచ్చి కక్కుదుగాక [100]శ్వానంబునట్లు - నుచ్చుచ్చురే” యని యొగిఁజిట్టమిడిచి
వెడలి వాకిటిదెస మృడుప్రసాదంబు - కుడుకతోఁగొనివచ్చి పుడమిఁబోయుడును
'దగ వగు' ననుచును దాఁగుక్క భాతి - జగదేవుఁడిట్లు ప్రసాదంబు గుడువ
మల్లబ్రహ్మయ లన మహి వీరభక్తి - కెల్లయై వర్తిల్లు నెడ నర్ధరాత్రి
నీ వార్త విని జగదేవునికడకు - వేవేగఁజనుదెంచి వెండివొత్తునను
దారును నా ప్రసాదం బారగించి - యా రాత్రి కొల్వున కరిగి బిజ్జలుని
నల్లంతఁబొడగని యలుఁగులు వెఱికి - జల్లున నలిగి యా సభ దల్లడిల్ల
నొక్కట మువ్వురు నుద్వృత్తి నెగసి - చక్కడ్చి పొడ్చి జర్జరితంబు సేసి
యలుకమై గెడిగెడి యనుచు బిజ్జలుని - తలగోసి పొట్టలోపలఁబెట్టి కిట్టి

'తా నసంఖ్యాతుల యానతి యదియు - నీ నరాధముఁబొలియించితి మేము
అధికులౌ భక్తులకహితంబుసేయు - నధములందఱును నివ్విధిఁబోదు'రనుచు
గాయముల్[101] బిగియుచుఁగతులుద్రొక్కుచును - రాయముల్గొనుచుదండలనటింపు
బొంగిబొబ్బిడుచుఁజెలంగి యార్చుచును - లింగభక్తులకెదుర్లేరు వొండనుచు
బిండుగాఁబౌరులు బిజ్జలునితల - గుండుగండా! యని ఘూర్ణిల్లుచుండ
మగిడి యా మల్లబ్రహ్మయగారుఁ దాను - నగరువెల్వడి తన నగరికి వచ్చి
తల్లికి నందంద ధరఁజాగిమ్రొక్కి - సల్లలితాంగి ప్రసాదంబు వడసి
'పరమపాతకు నట్టి భక్తనిగ్రహునిఁ - బొరిగొన్నయంతన పోవ దాద్రోహి
నప్పుడేచంపక యరుదెంచినట్టి - తప్పున కింకొండు దండమున్నదియు'
ననుచు నజ్జగదేవుఁడంతలోపలను - తన శిరంబున కల్గికొని విమానములఁ
బుత్రమిత్రకళత్ర గోత్రాదులను వి - చిత్రంబుగా నప్డ శివలోకమునకుఁ
గొనిపోయెఁ గటకంబుజనులెల్లబెదరి – కనుకనిఁబఱవంగఁ గ్రందువుట్టుటయుఁ
గన్నభక్తులు వార్తవిన్నభక్తులును - నున్నభక్తులుఁబోయి రొక్కొక్కయెడకు
నంతరాజ్యార్థమై యనిచేసి యతని - సంతానమెల్ల నిస్సంతాన మయ్యె
వీఁకఁ గొట్టములలో వెలిఁగె గుఱ్ఱములు - తోఁకల నిప్పులు దొరుగ నక్షణమ
కరులును గరులును గన్నంత నెదిరి - పొరిఁబొరిఁదాఁకి జర్జరితమైపడియె
బ్రసి యమాత్యాది భటవర్గమెల్లఁ - దమలోనఁ జచ్చిరి సమరంబుసేసి
బసవని సత్యశాపమునఁగాఁజేసి - పసచెడి కటకంబు వాడయ్యె నంత
వినియె నంతయు నట చనియెఁ గూడలికి - గనియె సద్గురువు సంగయదేవునచట
భక్తులుఁదానును బరమానురాగ - యుక్తి నబ్బసవయ్య యుండె సంప్రీతి
నంత నా గురువు సమంచితనాద - సంతతపూజాది సత్క్రియావలుల
ముంచి భజించి కీర్తించి మెప్పించి - మించి విన్నపమాచరించి ప్రార్ధించి
“దేవ సద్గురుమూర్తి దివ్యలింగాంగ - దేవ నా సంగయ్యదేవ ప్రాణేశ
నీదుసద్భక్తప్రసాదంబుఁగుడిచి - యాదట బ్రదికి యింతైతిఁ గావునను
భవభవంబుల వారి పన్నఁగాఁదగుదు - భువివారి ఋణమునఁబోవుటగలదు
అంతియకాని నిన్నడిగినచోటు - నెంతైన నేమైన నిచ్చినచోటు
గలతప్పుసైరించి కాచినచోటు - గలదేని చెప్పుమా కానమీయందు
పుట్టినమొదలును బోఁకయుఁబొరయ - వట్టికొల్వున నిన్ను ముట్టఁగొల్చితిని
వెట్టిచేసిన నీకు వెయ్యేఁడులైన - నెట్టును మేలకా కెగ్గేమి తలఁప

నూర కిట్లనుచుట యుచితమే నీకు - నారంగఁ బ్రమథులయాన నీయాన
వృషభవాహన విన్నవించుట వినక - వృషభంబు నీకెట్లు విడువంగ వచ్చు
నొల్లనొండేమియు నోటంబుగాదు - వల్లభ[102] యడుగను వరమిఁక నిన్ను
బరమపరానంద పరవశీభూత - నిరవధితత్త్వవిస్ఫురణ పెంపునకు
గతిమనోవాక్కాయ కర్మచైతన్య - రతులు నీయంద [103]విశ్రాంతంబు నొంద
జేయుము నీయాజ్ఞఁజేసి యేతెంచి - చేయంగఁగల పనుల్సేసితి నింక”
ననుడు దయామతి నగ్గురుమూర్తి - తన తొంటి భావంబుదాల్చి యక్షణమ
సంగయదేవుఁడు సదనాంతరంబు - భంగిగా వెడలుడు బసవయ్యసూచి
సన్నుత తద్గురు చరణాబ్దయుగము - [104]నెన్నుదు రిఱియంగ నన్నుతిమ్రొక్కి
యానందబాష్ప సమంచితవార్ధి - తా నిట్టవొడువ గద్గదకంఠ మమర
ముత్పులకలు మేన మొగినిండ హర్ష - తత్పరుఁడైయున్నఁ దనయు లే నెత్తి
చక్కన తనదు ప్రసాదంబువెట్టి - యక్కున నందంద యప్పళింపుచును
గొడుకు లోపలఁజేర్చికొని గురుమూర్తి - గుడిసొచ్చె నిరువురఁబొడగానరాదు
పసగొని సకలభక్త సమూహిసూడ - బసవయ్య గురువుగర్భంబుసొచ్చుటకు
సంగయదేవుండు సద్గురుభాతి - భంగిగా నేతెంచి బసవయ్యనిట్టు
తనయందు సంధించికొనుటకు నంత - ఘనతరలీల జంగమకోటి యలర
నరుదగులింగ తూర్యంబులు మ్రోయ - ధరఁ బుష్పవృష్టిదాఁబరిగొని కురియఁ
గోయని భక్తనికాయమెల్లెడల - గేయని బలుమాఱుఁ గీర్తనసేయ
జయజయారవములు సందడింపంగఁ - గ్రియఁగొని వినుకులుఁగేళికల్దనర
మాదిరాజయ్యయు మాచిదేవుండు - నాదిగాఁ గలభక్తులనురాగలీల
గలవె యుత్పత్తిస్థితిలయప్రపంచ - ములు బసవయ్యకుఁ దలఁచిచూడంగ
గాలిలోపల సురగాలినాఁబుట్టి - గాలిలోనన వెండిఁగలసియట్లు
శరనిధిఁగడలునా జనియించి వెండి - శరనిధిలోనన సమసిన యట్లు
నుడువీథియందు విద్యుల్లతవుట్టి - యుడువీథియందుఁ దా నడఁగినయట్లు
జలములయందు వర్షాఫలంబమరి - జలములలోనన సమసినయట్లు
సద్గురుకారుణ్య సంగతిఁబుట్టి - సద్గురుకారుణ్య సంపదఁదనరి
సద్గురుగర్బవిశ్రాంతిమై నిపుడు - తద్గతుఁడై లింగ తత్త్వంబుఁ బొందె
నట్టిదకాదె గుర్వంఘ్రియుగంబు - ముట్టఁగఁ గొల్చినయట్టి భక్తాలి
హృదయాంబుజంబుల నీ బసవయ్య - కదలక పువ్వును గంపునుబోలె
నలి నున్నవాఁడుగా కిలవేఱుగలదె - మలహరుభక్తులఁగలకాల మెల్ల

భక్తహితార్ధమై ప్రభవించెఁగాక - వ్యక్తిగా నతఁడీశ్వరాంశంబ కాఁడె
యని నుతింపుచుఁదొంటియట్ల సద్భక్తి - జనితసుఖామృత వనధిమధ్యమున
నోలలాడుచు నుండి రురుతరానంద - లీలమై నటు గొంతగాలమింపారఁ
బ్రస్తుతింపంగ సద్భక్తి విస్ఫురణఁ - బ్రస్తుతికెక్కిన బసవని చరితఁ
జెప్పితి భక్తులచే విన్నమాడ్కిఁ - దప్పకుండఁగను యథాశక్తిఁజేసి
యిమ్మహి నీశున కెఱుఁగంగరాని - యమ్మహాబసవని యద్భుత చరిత
వర్ణింప నెంతటివాఁడ నట్లయ్యు - వర్ణనచేసితి వారిన కాని
యేయెడ నన్యధా యెఱుఁగ నే ననెడి - యీ యొక్క బలిమి మహిష్ఠతకలిమి
నదియునుగాక మహాభక్తవరుల - సదమల దివ్యప్రశంసగాఁజేసి
భావించినాదు వాక్పాననార్థంబు - గావింప మేటి యీ కథ రచించితిని
బసవపురాణంబుఁబాటించి వినిన - నసలారుఁబో ప్రసాదానందసిద్ధి
బసవపురాణంబుఁబాటించి వినిన - వసియించు సద్భక్తి వాసనమహిమ
బసవపురాణంబుఁబాటించి వినిన - బసిగమైఁబ్రాపించు భక్తులకరుణ
బసవపురాణంబుఁబాటించి వినిన - బసరించు లింగానుభవనిత్యసుఖము
బసవపురాణంబుఁబాటించి వినిన - నెసకంబుతోఁగల్గు నీప్సితార్థములు
బసవపురాణంబు భక్తి వ్రాయించి - వసదిగాఁజదివెడు వారలకెల్ల
దురితము లాపదల్ ద్రోహంబులెల్ల - హరియించు నెంతయు హరుకృపఁజేసి
యీ పురాణం బెవ్వరేఁదమ యింట - నేపార నిడికొన్న నిహపరసిద్ధి
శరణోపకార బసవపురాణార్థ - విరచితత్రిభువన విఖ్యాత చరిత!
శరణోపకార బసవపురాణార్థ - వరభుక్తిముక్తి సంవర్ధనభరిత !
శరణోపకార బసవపురాణార్థ - సరససమంచిత సత్యవాగ్జాల!
గొబ్బూరి మాదన్న కూరిమిశిష్య! - గొబ్బూరిసంగ సద్గుణ సముత్తుంగ!
ఇది యసంఖ్యాత మాహేశ్వర దివ్య - పదపద్మసౌరభభ్రమరాయమాణ
జంగమలింగప్రసాదోప భోగ - సంగత సుఖ సుధాశరధి నిమగ్న
సుకృతాత్మ పాలుకురికి సోమనాథ - సుకవిప్రణీతమై శోభిల్లి తనరి
చరలింగఘనకరస్థల విశ్వనాథ - వరకృపాంచిత కవిత్వసూర్తిఁబేర్చి
చను బసవపురాణ మనుకథయందు - ననుపమంబుగ సప్తమాశ్వాసమయ్యె.

  1. సెంబలినారు
  2. మాన
  3. మాలుఁ
  4. కప్పు
  5. లు
  6. హీనకురియు
  7. వల
  8. యంగన
  9. రేహ్యంబు
  10. మాలుల(లర)
  11. స్రప్టోక్త
  12. మహత్తరుఁడు, మహోత్తముఁడు
  13. ఎచటనుబ్రాహ్మల కితరుల
  14. దేవ(వు)నివారు
  15. జంది
  16. నంది
  17. యొజ్జ
  18. ఁగా
  19. బునన్న
  20. గలరో
  21. ఁదమ్ము
  22. పనుగొను
  23. లిడుచు
  24. పాది, పాడి
  25. కాళవ్వ
  26. చెపుడుదద్ద్విజు
  27. భూమీసురులు
  28. డు
  29. కేఁగెదరేమి, కేఁగెదరిట్లు
  30. పాఱులను
  31. వేనీల్గు
  32. దుకొనికాల్వ
  33. గ్రోవరే
  34. విడ్చి, విడిచి
  35. తమకు
  36. ధర్మ
  37. మా(లులు)లరు
  38. మెర్గియెర్గి
  39. ఱపు, పుర్వు
  40. పసియేఁగవెనుకను
  41. పడియులేచిన ఱొంపిగడిగికొన్నంత
  42. సేయుటేనియు
  43. అద్భుతంబుగబల్లకనుపట్టణమున నుద్భటుం
  44. బాణిస
  45. గసి, గిరి
  46. నూర్భూతములీ మఱ్ఱినెలమి
  47. యవయగ
  48. నాకే
  49. యచటుసద్వండు
  50. బొడ్చితిగిచి
  51. కుట్టి
  52. జూడఁగాఁబ్రతిమాటలాడఁగారాదు
  53. బొడ్చు, నడ్చు
  54. ఉరువడి
  55. జంగత
  56. మురిసి
  57. మోఁకరించుకొ
  58. పొరల్‌వోవ
  59. జన్నని
  60. దోడుగుల
  61. చోడన్కి(డుకై)
  62. బసవన్కిఁ గురియించె
  63. శివకుమారుండు
  64. చక్కయ్యగారు
  65. యుదే
  66. మిండ
  67. కరియ
  68. చిక్కబ్రహ్మయ్యయు శ్రీగిరయ్యయును - కక్కయ్య నల్లయ్య కాటకోటయ్య
  69. మింక
  70. వలవదుమీ రెంత
  71. కాదేని శుద్ధలింగప్రసాదంబు, నేదియునేల
  72. నాఁడు, ఊరకుండుండు మీర లుర్వీశునొద్ద- వీఱిఁడిమాటలు విడఁబుచ్చి యనిన
  73. రుగుదురుగ
  74. సిట్లినట్టి
  75. నొర, నెడ
  76. మసులకు మసులకు మాహే
  77. స్రడ్డ
  78. నుసుల్ వో
  79. కెల్లు
  80. నిదిసాలునే
  81. నాత్మలోఁగొని సుఖవార్ధిఁ - దేలుచు వేడ్కలఁగ్రాలుచు మఱియు
  82. ముఱుకటింపుచును
  83. చానిపి, చానమి
  84. క్షమియింపఁ
  85. నరకవిప్రుల
  86. పాణంకల
  87. బొలములో పసులనుఁ బొలములోవిడిచి
  88. రార్చు
  89. అఱువ
  90. తప్పనుమతిని
  91. యూఁకరుల్
  92. నిదిమార్గంబు మఱియు
  93. బండ
  94. వొడ్డుక, వొడ్డుకొన్కు
  95. జీఁటఁగ
  96. పాద్యమ్ములు
  97. సంగతి నిటలానఁ గెంగేలుసేర్చి
  98. గళ్యాణపట్టణంబింకఁ
  99. వుగాకచ్చగుక్కనుచు
  100. బిగిచియుఁ గతికిఁ ద్రొక్కొనుచు
  101. నాకు నీ వరమడ్గఁదడవ
  102. రతిమతుల్ నీయందశ్రమమునఁబొంద
  103. చెన్నొందగదిసీసము