బసవపురాణము/అనుబంధము 2
అనుబంధము - II
బసవోదాహరణము
కర్త
పాల్కురికి సోమనాథుడు
పరిష్కర్త
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి
ప్రచురణ
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాాఙ్మయపీఠం
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి
2013
తొలిపలుకు
బసవోదాహరణము
ప్రథమావిభక్తి :
ఉ. శ్రీగురులింగతత్పరుఁ డ
శేషజగన్నిధి శుద్ధతత్త్వసం
యోగ సుఖప్రపూర్తి వృష
భోత్తమమూర్తి యుదాత్తకీర్తి ది
వ్యాగమమార్గవర్తి బస
వయ్య కృపాంబుధి మాకు దివ్యసం
భోగములం బ్రసాదసుఖ
భోగములంగరుణించుఁగావుతన్
కళిక -
వెండియుఁ ద్రిభువనవినుతిసమేతుఁడు
మండిత సద్గుణ మహిమోపేతుఁడు
సురుచిర శివసమసుఖసంధానుఁడు
పరమపరాపరభరితజ్ఞానుఁడు
విదితానందాన్వీతమనస్కుండు
సదమలవిపులవిశాలయశస్కుఁడు
శ్రీవిలసితపదచిరతరభద్రుఁడు
గావున సాక్షాత్కలియుగరుద్రుఁడు
ఉత్కళిక -
భువనోపకారా భవమోదవీరా
భక్తిసంయోగా ముక్తిసంభోగా
సౌఖ్యాబ్దిలోన ముఖ్యుఁడై తాన
వెలయు శుభకరుఁడు ఇలవిశ్వగురుఁడు
ద్వితీయా విభక్తి :
చ. వసిగొని యెవ్వఁడేని బస
వా యను నీ సుకృతాక్షరత్రయం
బెసఁగఁ బఠించెనేని గిరి
జేశుని కాతనివక్త్ర గహ్వరం
బసదృశగేహమన్న యవి
యార్యులవాక్యములట్లు గావునన్
బసవనఁబుణ్యమూర్తిఁదలఁ
పంగదె చిత్తమ పాయకెప్పుడున్
కళిక -
వెండియును భక్తాభివృద్ధిఁబెంచినవాని
బంధమాయాచారపథముఁద్రుంచినవాని
సద్వైతవాక్యసంహారుఁడై చనువాని
విద్వత్తముంగెల్చి వీరుఁడైమనువాని
మీమాంసకులముక్కు మిగులఁ గోసినవాని
తామసధ్వాంతంబుతగులుఁ బాసినవాని
పెక్కుదైవంబులన్ పేరుమాపినవాని
నొక్కఁడే రుద్రుఁడని యుక్తిఁ జూపినవాని
ఉత్కళిక -
ప్రకృతివాదము దుడిచి వికృతివేషములుడిగి
సకలవాదులనోర్చి సుకృతమార్గము దీర్చి
భూమిభారముఁబాపఁగా మించుగతిఁజూప
నెమ్మిఁజాలినవాని మమ్ము నేలినవాని.
తృతీయావిభక్తి :
ఉ. జంగమపాత్రుచే సమయ
సమ్మతుచే భవరోగవైద్యుచే
మంగళమూర్తిచే బసవ
మర్దనుచే నసమానశౌర్యుచే
లింగకుమారుచే బసవ
లింగముచే బసవయ్యచేఁగృపా
సంగతుచేఁ బ్రసాదసుఖ
సౌఖ్యమునొందెద భక్తిఁజెందెదన్.
కళిక -
వెండియును వేదోక్తవిలసచ్చరిత్రుచే
దండిభవబంధనలతాచయ లవిత్రుచే
విధినిషేధాతీతవినుతైకగణ్యుచే
బుధజనప్రోద్గీత భువనాగ్రగణ్యుచే
ప్రవిమలశివాచారభవ్యప్రసారిచే
భవిజనపరిత్యాగి భక్తిబండారిచే
శివచిన్మయాపరిచ్ఛిన్న ప్రమోదీచే
పరమార్ధతత్త్వానుభవసుఖాస్వాదిచే
ఉత్కళిక -
సన్నతులగరిగట్టి మన్ననలతుదముట్టి
ప్రమథకవిలియకెక్కి విమలసంపదనిక్కి
శివలీలపెంపార భువి బసవఁడనుపేర
మెఱయు సువిధజ్ఞుచే నెఱయుతత్త్వజ్ఞుచే
చతుర్థీవిభక్తి :
చ. అతని ప్రసాదసౌఖ్యమున
కంగము కీర్తికిఁగర్ణముల్ గుణ
స్తుతులకు జిహ్వయుం జరణ
తోయజ సంగతికిన్ మనంబు స
మ్మతగుణ దివ్యమూర్తికి న
మస్కృతియున్ విధియించికూడ న
ట్లతులితపుణ్యుఁడైన బస
వయ్యకునై ప్రణమిల్లు చిత్తమా!
కళిక -
వెండియును నిర్మలపవిత్రగోత్రునకునై
పండితస్తవనీయపాత్రగాత్రునకునై
దురితభంజనకళాధుర్యచరితునకునై
సరవి నిష్టవ్రతాశ్చర్యభరితునకునై
సవిశేషవిమలగుణజాలలోలునకునై
శివయోగసంధానశీలపాలునకునై
............................
...........................
ఉత్కళిక -
లింగచిహ్నలు మోచి దొంగలుండఁగఁజూచి
కొంగులనుబొదిగొన్న వంగకాయలుమున్న
లింగములుగాఁదెల్పి జంగమేచ్ఛలు సల్పి
భవరోగహరునకై శివరూపధరునకై
పంచమీ విభక్తి :
చ. పొసపరి పోరుదూషకుల
పొంగణఁగించి వధించి మించి య
వ్విసము ప్రసాదియై యనుభ
వించి జగంబులనెల్ల మంచి పెం
పెసఁగఁగ దేజరిల్లెడు మ
హిష్ఠయశోనిధి గాన యెప్పుడున్
బసవనదండనాథువలనన్ భజి
యింతుఁ బ్రసాదసౌఖ్యముల్.
కళిక -
వెండియును జగదేకవీరసత్తమువలన
బండారుబసవ సత్పండితోత్తమువలన
వీరమాహేశ్వరాన్వీత వర్తనువలన
ఘోరసంసారసంక్షోభకర్తనువలన
సుకృతదుష్కృతశుభాశుభవిదూరగువలన
సకలనిష్కళతత్త్వసౌఖ్యపారగువలన
నాదవిద్యాసుధార్ణవ విహారునివలన
ఆదిఋషభేంద్రాపరావతారునివలన
ఉత్కళిక -
సారజీవన్ముక్తి కారణంబగుభక్తి
చేకూరుసమ్మతమ్మేకలింగవ్రతము
త్రోవఁబొండని పనుపదైవజ్ఞులను మనుప
నోపుధీరునివలనఁ బాపహారునివలన
షష్ఠీవిభక్తి :
ఉ. దుస్తరకర్మభూసురులు
దూషకులై కులమెత్తి పల్కుచున్
నాస్తికలౌచుఁజూడ శివ
నాగయగారి గుఱించి వారి శ్రీ
హస్తతలంబునందు విమ
లామృతధారలు వెల్లిఁగుర్వ నా
ర్యస్తుతినించు నబ్బసవ
రాజున కే నతి భక్తిసేయుదున్
కళిక -
వెండియుండ కారసార విదితముదిత మేళనునకు
పండినిండిపొలుపు సలుపుభక్తియుక్తి పాలనునకు
భవ్యసేవ్యశరణ చరణపద్మసద్మఖేలనునకు
నవ్యదివ్య లలితగళితనాదభేదలోలనునకు
యమనియమ నిరంతరాంతరాంగ సాంగవర్తనునకు
నమితశమితవిషమవిషయహారిభూరికీర్తనునకు
నత్యనిత్యభోగయోగయంత్రతంత్రదూరగునకు
సత్యనిత్యశుద్ధబుద్ధసత్త్వతత్త్వపారగునకు.
ఉత్కళిక -
మహిఁబురాతనోక్త భక్తి
మహితతత్త్వయుక్తి శక్తి
యిమ్ముగొనఁగ లింగజంగ
మమ్ము ప్రాణలింగమునకు
సమ్మతముగ విభుని వెలసి
ప్రమథ లీల సొలసి యొలసి
యున్న గణవిరాజితునకుఁ
జెన్నబసవపూజితునకు
సప్తమీ విభక్తి :
చ. అసమగుణాఢ్యునందు శర
ణాగతవత్సలునందు జంగమ
వ్యసనమహిష్ఠునందు భవ
వారణకారణమందు భక్తమా
నసపరిపూర్ణునందు గణ
నాథునియందు దయాపయోధి మా
బసవనియందు మా బసవ
పాత్రునియందు వసింపు చిత్తమా!
కళిక -
వెండియు(ను) శివార్యు(శివవీర్యు)[1]నందుఁ జండమదనశౌర్యునందు
దురితభయవిదూరునందు సరసభక్తసారునందు
సుకరశరణసూత్రునందు సకలవిషయజైత్రునందు
భువనసత్ప్రబుద్ధునందు శివగణ ప్రసిద్ధునందు
ఉత్కళిక -
శరణజనుల వరువుఁబనుల
తగవు దనువు ధనముమనము
సమసి సంగతముగ లింగ
నిజమునందు విజయునందు.
సంబోధన ప్రథమావిభక్తి :
చ. ఎసఁగ లలాటవహ్నిఁ గుసు
మేషు దహించిన కాలరుద్ర! మున్
గసిమసిఁజేసి దక్షునిమ
ఖంబు హరించిన వీరభద్ర! యి
వ్వసుమతిఁబుట్టి భక్తజనవ
శ్యుఁడవైన కృపాసముద్ర! యో
బసవ! భవత్ప్రసాదసుఖ
భాజనుఁజేయవె నన్ను నర్మిలిన్
కళిక -
వెండియును సమస్తలోకవిదిత విమలభక్తి బీజ
దండితేంద్రియ ప్రచండతరళవిషమగుణసమాజ
సంగమప్రసాదభోగసారసౌఖ్యశరధిమగ్న
లింగసంగతానుభావలీలశరధి నౌవిలగ్న
అతులసకలభువన పావనావతారపుణ్యమూర్తి
సతతవితతవిమలతత్త్వసారసౌఖ్యజనహతార్తి
భవభయప్రసారదూర భవ్యసులభ సుకృతి కాయ
దివ్యబృందవందితద్వితీయశంభునామధేయ
ఉత్కళిక -
పరమగురుమతానుకూల భరితసుగుణగతివిలోల
లింగపూజనావిధేయ జంగమార్చకానపాయ
శ్రీవృషేంద్రదివ్యమూర్తి శైవసమయచక్రవర్తి
భక్తిసత్క్రియాధురీణ భక్తిముక్తిదప్రవీణ
సార్వవిభక్తికము :
ఉ. నీవు దయాపయోనిధివి,
నిన్ను నుతించినఁ గల్గుభక్తి, నీ
చే వరవీరశైవరతి చేకుఱు,
నీ కయియిత్తుఁ గబ్బముల్
నీ వలనం గృతార్థత జ
నించును నీకు నమస్కరింతు నా
భావమునందు నుండి ననుఁ
బాయకుమీ బసవయ్య, వేఁడెదన్
- ↑ 'శివవీర్యు' అని ఉదాహరణ వాఙ్మయచరిత్ర, పు-80