Jump to content

ప్రాణాయామము/ప్రశ్నోత్తరములు

వికీసోర్స్ నుండి

ప్రశ్నోత్తరములు

____(0)____

ప్రశ్న: రాజయోగమునకు ప్రాణాయామము అనవసరమా ?

జ: కాదు. ప్రాణాయామము రాజయోగమునందలి అష్టాంగములలో నొకటి.

ప్ర: గురుసాహాయ్యము లేకుండా ప్రాణాయామా భ్యాసముచేయుట అపాయకారియా ?

జ: ప్రజలు అనవసరముగ సందేహింతురు. సామాన్య ప్రాణాయామములను గురువు లేకుండగనే చేయవచ్చును. దీర్ఘ కుంభకము, ప్రాణాపానములను ఐక్య మొనర్చుటలను అభ్యసించ గోరువారికి గురువు అవసరమే. గురుసాహాయ్యము దొరకనిచో యోగసిద్ధి పొందినవారు రచించిన గ్రంథముల సహాయము గైకొనవచ్చును. ఎటులైనను ఒకగురుని ఏర్పఱచుకొని, అతనితో కనీసము ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారానైనను సందేహములను నివర్తించు కొనుటమంచిది. 1 2 లేక 1 లేక 2 నిమిషములవరకు ఏ భయము లేకుండ కుంభకము చేయ వచ్చును. నీకు తగిన గురువు లభించనిచో, నీ కన్న ఉచ్చస్థితికి వచ్చిన సాధకుల సహాయమును గైకొమ్ము.

ప్ర: ప్రాణాయామాభ్యాసము చేసినంత మాత్రముననే కుండలినీ శక్తి లేచునా ?

జ: అవును. ఆసనములు, బంధములు, ముద్రలు, ప్రాణాయామము, జపము, ధ్యానము, దృడేచ్ఛ, గురుకృప, భక్తి - యివన్నియు కుండలినీ శక్తిని లేపగలవు.

ప్ర: ఖేచరీ ముద్రవల్ల కలుగు ఫలములేమి ?

జ: ఇది శ్వాసను నిరోధించుటకు సాయపడును. దీనివల్ల ధారాణ ధ్యానములు చక్కగా నిలచును. ఆకలి దప్పులు తగ్గును. శ్వాసను ఒక ముక్కునుండి మరొక ముక్కుకు సులభముగ మార్చవచ్చును. కేవలకుంభకము సులభముగ సిద్ధించును.

ప్ర: ప్రాణవాయువు సుషుమ్న గుండా పోవుచున్నదని తెలసికొనుటకును, ప్రాణాపానములు ఐక్యమైనవని తెలసికొనుటకును గల నిదర్శనము లేవి ?

జ: ప్రాణాపానములు ఏకమై, అవి సుషుమ్న గుండా పోవునప్పుడు, అట్టివాడు ప్రాపంచిక విషయములతో సంబంధము లేనివాడుగ వుండును. అన, శరీర స్మృతి వుండదు; పరిసరములు, ప్రాపంచిక స్మృతికూడ వుండదు. కాని స్పృహగలిగియే వుండును. అతనికి మొట్ట మొదటి సాధారణ సమాధులలో ఆత్మానందము లభించును. తరువాత క్రమక్రమముగ ఒక్కొక్క చక్రము వరకు ప్రాణము పోయినప్పుడు, యిదివరలో చెప్పబడిన వివిధములగు అనుభవములు కలుగును. సహస్రారమునకు చేరుటచే సమాధి లభించును.

ప్ర: ప్రాణాయామమందు మూలబంధములో అంత టను పూరక కుంభక రేచకములను 1 : 4: 2 నిష్పత్తిలోనే పాటించవలెనా ?

జ: అవును.

ప్ర: బంధత్రయ ప్రాణాయామ సాధనలో పూరకము 10 మాత్రలు, కుంభకము 40 మాత్రలు, రేచకము 20 మాత్రలసేపు చేసెననుకొనుడు, ఇందులో ఎంతసేపు శుద్ధకుంభకము వుండవలెను ! ఉద్యాణబంధముతో పాటు రేచకము చేయుటకు ఎంత విరామమివ్వవలెను ?

జ: ప్రారంభకులు బంధత్రయ సాధనలో రేచకమునకు విరామమివ్వనక్కరలేదు. ఉచ్చస్థితికి వచ్చిన వారు 5, 6 సెకండ్ల సేపు విరామ మివ్వవచ్చును. బంధత్రయములో ప్రాణాపానైక్యమునకు పూరక కుంభక రేచకముల నిష్పత్తి 1 :4 :2 చాలును.

ప్ర: తాడనక్రియ, మహావేధలలో గల భేదమేమి ?

జ. తాడనక్రియలో ఏవిధముగనైన గాలిని పీల్చ వచ్చును. కాని మహావేధ ప్రాణాయామములో బంధత్రయములో చెప్పబడిన రీతిని చేయవలెను.

ప్ర: భగవద్దర్శనము పొందుటకు ప్రాణాయామము అవశ్యకమా ?

జ: కాదు.

ప్ర: బ్రహ్మరంధ్రమునకు ప్రాణము గొంపోవబడినపుడు గుండుసూదితో పొడిచినట్లుండునా ? జ: ఉండదు.

ప్ర: ఊర్ధ్వ రేత ప్రాణాయామ మననేమి ?

జ. సుఖపూర్వక ప్రాణాయమము లేక అనులోప విలోమ ప్రాణాయామము చేయునప్పుడు వీర్యము ఓజస్సుగనే మారి, తలయందు గల సామాస్రారము వైపు ప్రవహించు చున్నటుల భావించుటే, ఊర్ధ్వ రేత ప్రాణాయామము.

ప్ర: ప్రాణాయామ సమయమున 1 : 4 : 2 నిష్పత్తిని పాటింప గోరుచో ఇష్ట దైవమును ధ్యానించ లేకుండా వున్నాను. ఇష్ట దైవముపై మనస్సు నిలిపిన పై నిష్పత్తిని పాటించ జాల కున్నాను. తమ సలహా ఏమి ?

జ: మొదట రెండు మూడు మాసములవరకు పై నిష్పత్తిని పాటించుటను అలవరచుకొనుము. ఇటుల చేయుటవల్ల నిష్పత్తిని పాటించుట అనునది అభ్యాస మగును. ఆ పిమ్మట యిష్టదేవతను ధ్యానించుటను అలవరచు కొనుము.

ప్ర: ఒకే ముక్కుతో పూరక రేచకములు చేయు మనుటలో గల భావమేమి ?

జ: ఇది శ్వాసను క్రమ పరచి, మనస్సును నిలుకడ గలదిగా చేయును. సుషుమ్నా నాడియందు ధ్యానము చేయుటకు అనుకూలముగ వుండులాగున, వాయు సంచారము జరుగు లాగున చేయును. శరీరమును ప్రశాంతముగ నుంచును.

ప్ర: కొందరు తలచు రీతిని ప్రాణాయామము అపాయ కారియా ?

జ: నీ యింగితజ్ఞానము నుపయోగించి, జాగ్రత్తగా చేసినచో ఏ అపాయమురాదు. అజాగ్రతగా చేసినచో ప్రతిదీ అపాయకారియే

ప్ర: నేను సాధనను సక్రమముగా చేయుచున్నాను. ఇంకనూ అప్పుడప్పుడు చురుకుచురుకుమని శరీరమున అనిపించు చున్నది. కారణమేమి ?

జ. ప్రాణాయామము, ధ్యానములను చేయుటచే జీవాణువులు, రక్తనాళములు మొదలగువానికి పున:ప్రాణ ప్రాప్తి కలుగుటచే యిట్టివి ప్రారంభస్థితిలో సంభవించును. త్వరలోనే యిట్టిచురుకులు లేకుండపోవును.

ప్ర: ఆధునికశాస్త్ర సిద్ధాంతరీత్యా ప్రాణాపానములు ఎచట కలియును ?

జ: అపానమువల్ల ప్రాణవాయువు తయారు కాదు. అపానము శక్తి. అపానము పొత్తి కడుపునందలి మూలాధార ముండుచోటగు, గుదము, గుదనాళిక యందుండును. ఇది క్రిందికిపోవు స్వభావముగలది. ఇది మూత్రము, వాయువు, మలములను బయటకునెట్టును. కేవల కుంభకము, కుంభకము, మూలబంధము, జాలంధర ఉడ్యాణ బంధములవల్ల ప్రాణాపానములు ఐక్యమగును. ఇవి బొడ్డునందలి మణిపూర చక్రమువద్ద కలియును.

ప్రపంచమందు సంభవించుచుండు అనేకములగు అపాయములకు మూలకారణము అజాగ్రత్తయే. జాగ్రత్తగావున్నచో అనేకములగు అపాయములనుండి సులభముగ తప్పించుకొనవచ్చును. కావున నీవు ఆహారమునందు కట్టుబాటుకలిగి యుండుము. మితిమీరి మెక్కకుము. సులువుగ జీర్ణమగు ఆహారమును తినుము. శక్తికి మించిన సాధనచేయకుము. మొదట ఒకటి రెండు మాసములు పూరక రేచకములను మాత్రమే చేయుము. తరువాత క్రమక్రమముగా పూరక కుంభక రేచకముల నిష్పత్తిని 1 : 4 : 2 నుండి 16 : 64 : 32 వరకు పెంచుచూ రమ్ము. క్రమక్రమముగ నెమ్మదిగ పెంచుచూరమ్ము. ఈ నియమములను జాగ్రత్తగా పాటించినచో ప్రాణాయామ మందుగాని తదితర యోగసాధనలందుగాని నీ కేవిధమగు అపాయమురాదు.