Jump to content

ప్రసార ప్రముఖులు/విజయవాడ కేంద్రం

వికీసోర్స్ నుండి

విజయవాడ కేంద్రం

1948 డిసెంబరు 1వ తేది ఆంధ్రుల సాంస్కృతిక కేంద్రమైన విజయవాడలో ఆకాశవాణి నెలకొంది. రెవిన్యూమంత్రి శ్రీ కళా వెంకట్రావు దాన్ని ప్రారంభించారు. 1 KW మీడియం వేవ్ పై ప్రసారాలు సాగేవి. ప్రసారశక్తి ఆరువేల చదరపు కిలోమీటర్లు. విజయవాడలో PWD ఎగ్జిక్యూటివ్ యింజనీర్ బంగళాలో ఆరెకరాల స్థలంలో దీన్ని స్థాపించారు. అప్పట్లో బెజవాడ క్లబ్ అక్కడ వుండేది. దాన్ని అద్దెకు తీసుకున్నారు. 120 అడుగుల ఎత్తుగల రిలే టవర్ నెలకొల్పారు. N. S. రామచంద్రన్ తొలి స్టేషన్ డైరక్టరు. M. S. నారాయణస్వామి స్టేషన్ యింజనీరు. మదరాసు ' బి ' కేంద్రం నుండి తెలుగు కార్యక్రమాలు రిలే చేసేవారు. తర్వాత కొంతకాలానికి 1950 లో డా. అయ్యగారి వీరభద్రరావు స్టేషన్ డైరక్టరుగా చేరారు. రెండేళ్ళ పరిపాలనలో ఆయన ప్రసారాలలో నూతనత్వాన్ని కలిగించారు.

సంగీతంలో ఉత్తమ ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం కావాలని 1948లోనే నిలయ విద్వాంసుల్ని నియమించారు. వారిలో ప్రసిద్ధులు శ్రీయుతులు అన్నవరపు రామస్వామి, దండమూడి రామమోహనరావు, N. Ch. కృష్ణమాచార్యులు. కార్యక్రమ నిర్వాహకులుగా ఈ కేంద్రంలో ఎందరో ప్రముఖులు పనిచేశారు. సర్వశ్రీ బుచ్చిబాబు, బందా కనకలింగేశ్వరరావు, డా. రజనీ కాంతరావు, పింగళి లక్ష్మీకాంతం, G. V. కృష్ణారావు, ఉషశ్రీ, డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సంధ్యావందనం శ్రీనివాసరావు, M. V. రమణమూర్తి, ఉషశ్రీ, ప్రయాగ నరసింహశాస్త్రి, శ్రీ గోపాల్, భద్రవ్రత, శంకరమంచి సత్యం, వోలేటి వెంకటేశ్వర్లు - ఇలా ఎందరో.

ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బహుమతుల్ని ఈ కేంద్రం గెలుచుకొంది. గోదావరి నదిపై రూపొందించిన ' కొండ నుండి కడలి దాకా ' రూపకానికి రజనికి విద్యా ప్రసారాలలో "హోనబంకా" అవార్డు లభించింది. వ్యవసాయ విభాగంలో Y. హనుమంతరావుకు ' మధురక్షణాలు ' నాటకానికి బహుమతి వచ్చింది. శ్రీ గోపాల్ సమర్పించిన విక్రాంతగిరి శిఖరం, అరుణాచల జ్యోతి బహుమతులందుకొన్నాయి. శ్రీ రామం సమర్పించిన నీలినీడలు, నిశ్శబ్దం గమ్యం, మెట్లు, మహా విశ్వ అవార్డులు పొందాయి. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సమర్పించిన అమరారామం, వర్షానందిని, నేనుకాని నేను జాతీయస్థాయిలో వన్నెకెక్కాయి. K. V. హనుమంతరావు రూపొందించిన శ్రమఏవజయతే, కృష్ణవేణి ప్రశంసలందుకొన్నాయి. పన్నాల సుబ్రహ్మణ్య భట్ సమర్పించిన నాదబంధం, మార్గబంధం బహుమతులందుకొన్నాయి. కలగా కృష్ణమోహన్, M. వాసుదేవమూర్తి - ఇలా ఎందరో బహుమతులు పొందారు. 1988లో ఉత్తమస్థాయి సాంకేతిక కేంద్రంగా గుర్తింపు లభించింది.

20 కిలోవాట్ల ప్రసారశక్తికి విజయవాడ కేంద్రస్థాయిని 1957 జనవరి 20న పెంచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. తొలినాళ్ళలో స్టేషన్ డైరక్టర్లుగా సర్వశ్రీ M. V. రాజగోపాల్, S. K. బోస్, G. P. S. నాయర్ వ్యవహరించారు.

విజయవాడ కేంద్రం ప్రసారం చేసే భక్తిరంజని బహుళ జనామోదం పొందింది. కూచిపూడి సాంప్రదాయానికి ప్రాచుర్యం తెచ్చింది విజయవాడ కేంద్రం. కర్ణాటక సంగీత, లలిత సంగీత కార్యక్రమాలు బాలమురళి, వోలేటి, మల్లిక్, రమణమూర్తి సారధ్యంలో నిర్వహించబడ్డాయి. శ్రీరంగం గోపాలరత్నం సుమధుర గాత్రం ఈ కార్యక్రమాలకు వన్నె తెచ్చింది. 1982 నుండి జానపద సంగీతానికి కూడా పట్టం కట్టి అణగారిపోతున్న జానపదకళలకు ఆదరణ కల్పించింది.

1962 ఆగష్టులో అప్పటి కేంద్ర ప్రసార సమాచార శాఖామాత్యులు డా. బెజవాడ గోపాలరెడ్డి వివిధ భారతి ప్రసారాల ' బి ' కేంద్రాన్ని ప్రారంభించాయి. 1971 మార్చి నుండి వాణిజ్య ప్రసారాలు ఆరంభమయ్యాయి. వ్యవసాయ ప్రసారాలు 1966 జూన్ 7 నుండి ప్రారంభమయ్యాయి. నిడుదవోలులో జరిగిన సభలో నీటి పారుదల శాఖామాత్యులు T. V. రాఘవులు వ్యవసాయ ప్రసారాలు ప్రారంభించారు. గుమ్మలూరు సత్యనారాయణ, కె. వి. సుబ్బారావు, వై. హనుమంతరావు, వ్యవసాయ విభాగానికి అధిపతులుగా మూడు దశాబ్దాలు ఈ కార్యక్రమాలను తీర్చిదిద్దారు. 1995 జూన్ లో మూడు దశాబ్దాల వార్షికోత్సవాన్ని వ్యవసాయ శాఖామత్యులు శ్రీ కోటగిరి విద్యాధరరావు బాపట్ల వ్యవసాయ కళాశాలలో జరిగిన సభలో నిర్వహించారు. ఈ విభాగం జాతీయస్థాయిలో ఎన్నో బహుమతులు పొందింది.

రేడియో నాటకానికి విజయవాడ కేంద్రం ప్రాణం పోసింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బందా కనకలింగేశ్వరరావు నాటక ప్రయోక్తగా ఎన్నో ఉత్తమ నాటకాలు ప్రసారం చేశారు. ఆకాశవాణి నుండి నటులెందరో సినీరంగానికి తరలిపోయారు. సర్వశ్రీ విన్నకోట రామన్నపంతులు, రామచంద్రకాశ్యప, బచ్చా పూర్ణానందం, గొల్లపూడి మారుతీరావు, నిర్మల, సుత్తి వీరభద్రరావు, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎ. వి. సుబ్రమణ్యం, గుండు హనుమంతరావు సినీనటులు కావడానికి ముందు ఆకాశవాణి నటులు. జంధ్యాల ఆకాశవాణి నాటక రచయితగా పేరు పొందారు. ఉత్తమ నాటకాలు ఎన్నో ఈ కేంద్రం నుండి ప్రసారమయ్యాయి. శ్రీనండూరి సుబ్బారావు, సి. రామమోహనరావు, శంకరమంచి సత్యం మంచి నాటకాలు రూపొందించారు.

విజయవాడ ఆకాశవాణి కేంద్ర పరిదిలో గుంటూరుజిల్లా, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, ఉభయగోదావరి, ఖమ్మం జిల్లాలు వచ్చాయి. ఇటీవల తూర్పు గోదావరి విశాఖపట్టణం పరిదిలోకి వెళ్ళింది. కొత్తగూడెం PM కేంద్రం 1989లో ప్రారంభమైన తర్వాత ఖమ్మం జిల్లా ఆ కేంద్ర పరిధిలోకి వెళ్ళింది. మార్కాపురం కేంద్రం ఒంగోలు జిల్లా శ్రోతలకు పరిమితం. 1973వ సంవత్సరంలో రజినిగారి పర్యవేక్షణలో రజతోత్సవాలు వైభవంగా జరిపి రజతోత్సవ సంచికను వెలువరించారు.

విజయవాడ కేంద్రంలో ఎందరో హేమాహేమీలు గత అర్థశతాబ్ది కాలంలో పనిచేసి ప్రఖ్యాతి గడించారు. సర్వశ్రీ పింగళి లక్ష్మీకాంతం, ఉషశ్రీ, కందుకూరి రామభద్రరావుశ్రీగోపాల్, ప్రయాగ నరసింహశాస్త్రి, N. C. V. జగన్నాదాచార్యులు వింజమూరి శివరామరావు, జదుక్‌శాస్త్రి, G. V. కృష్ణారావు, M. S. శ్రీరాం, రాచకొండ నరసింహమూర్తి, కేశవపంతుల నరసింహశాస్త్రి, వింజమూరి లక్ష్మి, డాక్టర్ లత, బుచ్చిబాబు, శ్రీవాత్సవ, నాగరత్నమ్మ, కూచిమంచి కుటుంబరావు ఎందరో మహానుభావులు ఈ కేంద్రం ప్రసారాలను సుసంపన్నం చేశారు.

పున్నమ్మ తోటలోని పాత భవనాల స్థానంలో బందరురోడ్డుపై నూతన కార్యాలయ భవనం, స్టూడియోలు వెలిశాయి. 1980లో ఈ భవనాలలోకి ఆకాశవాణి మారింది. ప్రాంతీయ వార్తా ప్రసార విభాగం 1981లో స్థాపించారు. ప్రతిరోజు దాదాపు 12గంటలు విజయవాడ 'ఎ' కేంద్రం, 12 గంటలు 'బి' కేంద్రం ప్రసారాలతో శ్రోతల్ని అలరిస్తున్నాయి. నంబూరులోని ట్రాన్స్‌మీటర్ స్థాయిని 1989లో 20కిలో వాట్లనుండి 100 కిలోవాట్ల మీడియంవేవ్ శక్తికి పెంచారు. కోస్తా జిల్లాలు తుపాను తాకిడికి గురిఅయినప్పుడు భారతీయ వాతావరణ కేంద్రం వారు హెచ్చరికలు అందించేందుకు అనువుగా యంత్ర పరికరాలను 1986లో అమర్చారు. అవి తుఫాను హెచ్చరికలు అందిస్తాయి. తుఫాను సమయంలో 24 గంటలపాటు - ఆకాశవాణి ప్రసారాలు జరుపుతుంది.

1976-96 రెండు దశాబ్దాల కాలంలో స్టేషన్ డైరక్టర్లుగా వ్యవహరించిన సర్వశ్రీ పి. శ్రీనివాసన్, సి. ఆర్. రెడ్డి, అయూబ్, కులకర్ణి దుర్గా భాస్కర్, డా. ఆర్. అనంత పద్మనాభరావు, ఆకాశవాణి ప్రసారాలు బహుళనా మోదం పొందడానికి కృషిచేశారు.

శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు (1928-1989)

ఆకాశవాణి శ్రోతలకు, సంగీత రసికులకూ విస్తృత పరిచయమున్న మహా విద్వాంసులు శ్రీ వోలేటి. సంగీతాన్ని భక్తి శ్రద్ధలతో, శుద్ధమైన మనస్సుతో ఆసక్తితో పాడిన అరుదైన విద్వాంసుడు శ్రీవోలేటి. వీరి నేతృత్వంలో ప్రసారమైన ఎన్నో సంగీత రూపకాలు, యక్షగానాలు, విజయవాడ రేడియో కేంద్రానికి దేశవ్యాప్తంగా కీర్తి నార్జించి పెట్టాయి.

వోలేటి గారి జననం 1918 ఆగస్టు 27. తల్లిదండ్రులు నరసింహారావు, అచ్చికామలు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం స్వగ్రామం. గుడివాడలో చతుర్వేదుల అచ్యుత రామశాస్త్రిగారి వద్ద సుమారు 20 వర్ణాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత 1935 సం||లో కాకినాడకు మకాం మారటంతో వీరి సంగీతాభ్యాసం సుగమమైంది. కాకినాడలో శ్రీరామగాన సమాజంలో, ఆరోజుల్లో ఉచిత భోజన వసతి కల్పిస్తూ, సంగీతం నేర్పేవారు. ఆ సంస్థను ఉదారంగా నడిపిన మహనీయుడు కీ||శే|| మునుగంటి వేంకట్రావు పంతులుగారు. పది సంవత్సరాల పాటు పంతులుగారి వద్ద సంగీతాభ్యాసం చేశారు. శ్రీవోలేటి.

1950 సంవత్సరంలో డా||శ్రీపాద పినాకపాణి గారి పరిచయంతో వోలేటిగారు 3, 4 సం||లు సంగీతంలోని మెళుకువల్ని, ముఖ్యంగా తంజావూర్ బాణీని పాణిగారి దగ్గర గ్రహించారు.

1956 సం|| నుంచి విజయవాడ కేంద్రంలో ప్రొడ్యూసర్‌గా వుంటూ సంగీతశాఖను సమర్థవంతంగా నిర్వహించారు. వోలేటిగారు మనస్సు పెట్టి నిర్వహించిన ముఖ్యకార్యక్రమం 'సంగీత శిక్షణ'. మూర్తిత్రయంతోపాటు, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, పూచి శ్రీనివాస్ అయ్యంగార్, పొన్నయ పిళ్ళెవంటి విద్వాంసుల కృతులతోనూ, అన్నమాచార్య కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, నారాయణ తీర్థులవారి తరంగాలు, సంప్రదాయశైలిలో బోదించారు.

విజయవాడ కేంద్రానికి దేశవ్యాప్తంగా కీర్తి నార్జించి పెట్టిన కార్యక్రమాల్లో 'భక్తిరంజని' ఒకటి. G. P. S. నాయర్ గారు డైరక్టర్‌గా వున్న రోజుల్లో, Dr. బాలాంత్రపు రజనీకాంతరావు గారి నేతృత్వంలో, వీరిరువురి ప్రేరణతో 'భక్తిరంజని' కార్యక్రమ రూపకల్పన జరిగింది. ఇందులో త్యాగరాజు దివ్యనామ కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, రామదాసు కీర్తనలు, తరంగాలు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు, కర్ణాటక సంగీత బాణీలోని మాధుర్యం విడవకుండా చక్కని సంప్రదాయ శైలిలో పాడించిన ఘనత వోలేటిగారిదే.

కాళహస్తి సంస్థానంలోవుండే మునిపల్లె సుబ్రహ్మణ్యకవి విరచిత అధ్యాత్మ, రామాయణ కీర్తనలు, జొన్నలగడ్డ శివశంకరశాస్త్రిగారి ముఖత:విని స్వరం నిర్ధారించి ప్రముఖ విద్వాంసుల చేత పాడించటంలో వోలేటి గారు చేసిన కృషి శ్లాఘనీయం. కర్ణాటక సంగీత విద్వాంసుడు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, నాట్యాచారులు చింతాకృష్ణమూర్తిగారి లాంటి వారి సహకారంతో శశిరేఖా పరిణయం, రామనాటకం, ఉషాపరిణయం, రుక్మాంగద చరిత్రము, ప్రహ్లాద, హరిశ్చంద్ర, మార్కండేయ లాంటి యక్షగానాలెన్నో రూపకల్పన చెంది వోలేటి గారి కృషిని చాటాయి.

హిందూస్థానీ ఉస్తాదులకు తమ పాట కచేరిలలో, కర్ణాటక సంగీతపు బాణీలో ఒక్కపాటైనా పాడే సంప్రదాయం లేదు. కానీ, కర్ణాటక సంగీత కచేరీలలో చివరి భాగంలో హిందూస్తానీ బాణీలో టుమ్రీ, గజల్, భజన్ పాడే అలవాటు స్థిరంగా నిలిచింది. హిందూస్తానీ బాణీ పాడగలిగే గాయకులు, ఆంధ్ర, తమిళ, కర్ణాటక ప్రదేశాలలో చాలామంది వున్నారు.

వోలేటి వారందరిలోనూ మేటి. మరెవ్వరికీ ఆపకడ్ స్వాదీనం కాలేదు. హిందూస్తానీ గాయకులలో అమీర్ ఖాన్, బడేగులాం అలీఖాన్, గులాం అలీ వంటి గాయకులనాదర్శంగా భావించి, చిన్ననాటి నుండి అలవాటైన స్వరజ్ఞానం, గాత్ర సౌలభ్యం, తోడురాగా శ్రీవోలేటికి హిందూస్తానీ గాయకులను కూడా అలరింప గలిగిన బాణీ అలవడింది. వోలేటి గారి కంఠంలో త్రిస్థాయిలూ పలికేవి. పరమ శృతి శుద్దం. అటూ యిటూ అసియాడని లయ.

ఎంత క్లిష్టమైన సంగతులైనా సునాయాసంగా పలికేవి. పాడుతున్నప్పుడు ముఖవర్చస్సు కొంచెం కూడా మారేదికాదు. గోముఖంలో నుంచి గంగ వెలువడినట్లు, ఆయన సంగీతం ధారగా వచ్చేది రాగాలాపనలో మధ్యమ, దురిత కాలపు సంచారాలు అవలీలగా పలికి ఆశ్చర్యం గొలిపేవి.

వోలేటిగారిది ప్రత్యేకమైన సొంత బాణీ.

బందా కనకలింగేశ్వరరావు 1907-1968

బందా కనకలింగేశ్వరరావు 1907లో కృష్ణాజిల్లా ఆటపాకలో జన్మించారు. మద్రాసులో లా పట్టభద్రులై 1934 నుండి ఏలూరులో కొంతకాలం న్యాయవాద వృత్తి చేశారు. ఏలూరు తాలూకా బోర్డు సభ్యులయ్యారు. నాటకాలు ఆయనకు ఆరవప్రాణం. బందా కృష్ణుడు, సారంగధరుడు, బిల్వమంగళుడు పాత్రలలో పేరుతెచ్చుకొన్నాడు. ఒకసారి బళ్ళారిలో చిత్రవశీయం నాటక ప్రదర్శనలో బాహుకుడి పాత్ర పోషించారు బందా. బళ్ళారి రాఘవ బందాని బహుధా ప్రదర్శించారు.

బందా పౌరాణిక, చారిత్రక నాటకాలు ఎన్నో ప్రదర్శించారు. వివిధ పాత్రలు పోషించారు. కర్ణుడు, కణ్వుడు, రాముడు, అభిమన్యుడు, సారంగధరుడు, ప్రతాపరుద్రుడు, గిరీశం, అల్లూరి సీతారామరాజు పాత్రలు సమర్థవంతంగా నిర్వహించే వారు. బందా వారి తండ్రి శ్రీశైలంగారు కొల్లేటిలంకలకు కరణం బందరులో బి. ఏ. పూర్తిచేసి, మదరాసు లా చదివారు. ఏలూరులో న్యాయవాదిగా ఉండగా తాలూకా బోర్డు సభ్యులుగా ఎంపికయ్యారు. అప్పుడే ప్రభాత్ ధియేటర్స్ పేర ఒక నాటక సమాజం స్థాపించి 40 ఏళ్ళపాటు నాటకరంగ సేవ చేశారు.

1935లో చిత్రసీమ ప్రవేశం చిత్రంగా జరిగింది. ద్రౌపదీ మానసంరక్షణంలో బందా కృష్ణపాత్ర ధరించారు. తర్వాత తర్వాత సారంగధర, కాలచక్రం, పాదుక, బాలనాగమ్మ చిత్రాలలో నటించారు. అక్కడి అలవాట్లు నచ్చక 1942లో తిరిగి ఏలూరు రాక తప్పలేదు. నాటకరంగ పరిశీలన కోసం 1955లో రష్యా, పిన్లెండ్, చెకొస్లోవాకియా దేశాలు పర్యటించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1956లో నాటక ప్రయోక్తగా ప్రవేశం చేసి 12 సంవత్సరాల పాటు ఎన్నో నాటకాలు ప్రసారం చేశారు. కూచిపూడి నాట్య సంప్రదాయానికి ఊపిరిపోసింది బందా. కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సభ్యత్వాలు లభించాయి. అభినవకృష్ణ, నటశేఖర బిరుదులతో సత్కరించారు. ఉత్తమనటుడుగా 1963లో రాష్ట్రపతి అవార్డు పొందారు. రేడియో నాటికలు సంపుటిగా ప్రచురించారు. కూచిపూడి నృత్యంపై వీరి రచన ప్రామాణికం

1968 డిసెంబరు 3న నాటకరంగంలో ధృవతార రాలిపోయింది. ఇప్పటికీ కూచిపూడిలో బందా వర్థంతి ఏటా జరుగుతుంది. కూచిపూడిలో సిద్దేంద్ర కళాక్షేత్ర నిర్మాణానికి ఆయన కృషి అపారం.

వీరి తర్వాత జ్ఞప్తికి తెచ్చుకోవలసిన వ్యక్తి ఆమంచర్ల గోపాలరావుగారు వీరు నాటక విభాగ ప్రయోక్తగా విజయవాడలో పనిచేసి పదవీ విరమణ చేశారు. చాలాకాలం మదరాసులో కూడా పనిచేశారు. {{ {{}}యండమూరి సత్యనారాయణ (శ్రీవాత్సవ) 1913 }} శ్రీవాత్సవగా ప్రసిద్ధి చెందిన యండమూరి సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా పసలపూడిలో 1913 మే 21న జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం గావించిన సత్యనారాయణ ఆకాశవాణిలో విజయవాడ, మదరాసు కేంద్రాలలో కార్యక్రమ నిర్వహకులుగా చాలాకాలం పనిచేశారు. ఆపైన అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా ఢిల్లీ బదలీ అయి వెళ్ళారు.

శ్రీవాత్సవ విమర్శకులుగా పేరు తెచ్చుకొన్నారు. భారతి, జయంతి, ఆంధ్ర పత్రిక తదితర పత్రికలలో సాహిత్య సింహావలోకనాలు ఏటా ప్రచురించేవారు. ఉష:కిరణాలు, శారదాధ్వజం గ్రంథాలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1966లో బహుమతి ప్రకటించింది. తంజావూరు నాయకరాజుల సాహిత్య భాషను శారదా ధ్వజంలో వివరించారు. ఆనాటి సాంఘిక సాంస్కృతిక రాజకీయ చారిత్రక స్థితిగతులు ఆయన ఆ గ్రంథంలో విశ్లేషించారు. జలతారు జాబిల్లి పేరుతో బాలలకు ఒక పుస్తకం వ్రాశారు. వయోజన విద్యావ్యాప్తిలో భాగంగా టెలివిజన్ కథ రంగురంగుల పూలు అనే గ్రంథాలు వ్రాశారు. వీరి రచనలకు కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. పెళ్లాడే బొమ్మ, తీరని కోరికలు నాటకాలు, నాగరిక, చెట్లు గేయ సంపుటిని రచించారు. వీరు 1968 మార్చిలో ఢిల్లీలో చనిపోయారు. వీరి కుమారులు రామచంద్రరావు జర్నలిస్టుగా విజయవాడలో స్థిరపడ్డారు.

పింగళి లక్ష్మీకాంతం (1894-1972)

పింగళి లక్ష్మీకాంతంగారు 1894 జనవరి 10న కృష్ణాజిల్లాలో ఆర్తమూరులో జన్మించారు. రేపల్లె, మచిలీపట్నం, మదరాసులలో చదువు పూర్తి చేసుకొని ఎం. ఏ. పూర్తి చేశారు. మచిలీపట్నంలో చదువుకొంటుండగా చెళ్ళపిళ్ళవారి శిష్యరికం లభించింది. కవితాధార ఉవ్వెత్తువ లేచింది. బందరులో తాను చదివిన కళాశాలలోనే ఆంధ్ర పండితులుగా చేరారు. కొంతకాలం తర్వాత ఆంధ్ర విశ్వకళా పరిషత్‌లో ఆచార్య పదవి నిర్వహించారు. అక్కడ రిటైరైన తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యక్షులుగా వ్యవహరించి 1965 జూన్‌లో పదవీ విరమణ చేశారు.

'తొలకరి' రచనతో కాటూరి వెంకటేశ్వరరావుతో కలిసి జంట కవులుగా వ్యవహరించారు. సౌందరనందము జంటగా వ్రాసి గురువులైన తిరుపతి కవుల కంకితం చేశారు. మధుర పండితరాజం, పండితరాయల కవితా మాధుర్యం, సాహిత్య శిల్ప సమీక్ష, ఆంధ్ర సాహిత్య చరిత్ర, గౌతమ వ్యాసములు వీరి రచనలు.

ఆకాశవాణిలో తెలుగు ప్రసంగశాఖ ప్రయోక్తగా వ్యవహరించిన సమయంలో సూక్తి రత్నావళి కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. సరళ వ్యావహారిక భాషలో పదాల మిగళింపు ఆయన సొత్తు. సంస్కృత నాటకాలు ఎన్నో ఆయన సమర్పించారు. ఉత్తమ పరిశోధకులుగా, అధ్యాపకులుగా ఎందరో గురువులను తీర్చి దిద్దిన ఆచార్యుడాయన.

గౌతమ వ్యాసాలు, సంస్కృత వ్యాకరణం తెలుగు సాహిత్య విద్యార్థులకు కరదీపికలు.

'మాబిడిక్‌' నవలను, 'ఆంగ్లదేశపు చరిత్ర' అనే చారిత్రక గ్రంథాన్ని అనువదించారు. నటుడుగా ఆయన ప్రసిద్ధుడు. ధర్మరాజు, రాక్షసమంత్రి పాత్రలను సమర్థవంతంగా పోషించేవారు. ప్రాచ్య పాశ్చాత్య విమర్శనా ధోరణులను సమన్వయ పరచి తెలుగులో సాహిత్య విమర్శ చరిత్రకు నాందీ ప్రవచనం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులుగా, ఆంధ్రప్రదేశ అకాడమీ విశిష్ట సభ్యులుగా పనిచేశారు. 1972 జనవరి 10న ఆయన పరమ పదించారు.

G. V. కృష్ణారావు :

గనిని వెంకట కృష్ణారావు గుంటూరు జిల్లా కూచిపూడిలో 1914లో జన్మించారు. బక్కపలచటి శరీరం, ఆలొచనాత్మకమైన చూపులు, సునిశిత మేధ ఆయన లక్షణాలు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో పట్టభద్రులై, బెనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో ఎం. ఏ. పూర్తి చేశారు. కాశీలో వుండగా మార్క్స్ సిద్ధాంతాల ప్రభావం ఆయనపై పడింది. మార్క్స్ సిద్ధాంతాల జాడలో కావ్య జగత్తు అనే సాహిత్య గ్రంథం వ్రాశారు.

కారక్రమేణా యం. యన్. రాయ్ ఉద్యమ ప్రభావానికి లోనయ్యారు. విగ్రహవ్యావర్తిని అనే తాత్విక సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. నాగార్జునాచార్యుని -న్యవాదాన్ని తెలుసుకోవడానికి ఈ గ్రంథం బాగా ఉపకరిస్తుంది. ప్రాచ్య పాశ్చాత్య తత్వవేత్తల సరళిని కృష్ణారావు ఆకళింపు చేసుకొన్నారు. ప్లేటో ఆదర్శ రాజ్యాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ వారికి తెలుగులోకి అనువదించారు.

జేగంటలు, కీలుబొమ్మలు, వరూధిని శివరాత్రి, యుగసంధ్య ఈయన ఇతర రచలు. బొమ్మ ఏడ్చింది, భిక్షా పాత్ర వంటి నాటికలు ఆదర్శ శిఖరాలు అనే పేరుతో సంపుటిగా వెలువరించారు. కీలుబొమ్మలు నవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనిని ఆంగ్లంలోకి అనువదించారు. పాపికొండలు, రాగరేఖలు, జఘన సుందరి వీరి నవలల్లో ప్రసిద్ధాలు. గ్రామీణ జన జీవనాన్ని అద్దంపట్టే కథలు చైత్రరథం పేరుతో సంపుటిగా వేశారు. ఉదబిందువులు యితర రచనల సంపుటి. నవ్యతోరణం వేదవ్యాస సంపుటి ప్రకటించారు.

Studies in Kalapoornodayam" అనే సిద్ధాంత గ్రంథాన్ని పరిశోధనకు సమర్పించి Ph.D. పట్టా మదరాసు విశ్వ విద్యాలయం నుండి పొందారు. పింగళి సురనపై యిది యిప్పటికీ అత్యుత్తమ పరిశోధనా గ్రంథం. తత్వవేత్త అయిన కాంట్ పరతత్వ వాదాన్ని ఆయన సునిశితంగా పరిశీలించారు.

పొన్నూరు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా కృష్ణారావు సాహితీసేవ చేశారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ 1963 నుండి ఒక దశాబ్దిపాటి ప్రసంగ శాఖలొ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా పని చేశారు. ఆంధ్ర విశ్వ విద్యాలయ పాలకవర్గ సభ్యుడుగా వ్యవహరించారు. 1978 ఆగష్టు 23న కృష్ణారావు పరమపదించారు.

నవలా రచయితగా, కథా రచయితగా వ్యాసకర్తగా ప్రసార ప్రముఖునిగా సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణారావు.

డా. బాలాంత్రపు రజనీకాంతరావు (1920)

జంట కవులైన వెంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన వెంకటరావుగారి కుమారులు. రజనీకాంతారావు. 'రజని ' గా పిలవబడే వీరు 1920 జనవరి 29న జన్మించారు. బాలాంత్రపు నళినీ కాంతారావు వీరి అగ్రజులు. రజని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ నుండి 1940లో ఎం.ఏ. తెలుగులో చేరారు. పింగళి లక్ష్మీకాంతం గారు వీరి గురువులు. దేవులపల్లివారు ఆత్మీయ మిత్రులు.

రజని శతపత్ర సుందరి గీత సంపుటి. రెండు వందలపైగా గీతాలున్నాయి. ఈ గ్రంథానికి 1953లో తెలుగు భాషా సమితి పురస్కారం లభించింది. విశ్వవీణ రేడియో నాటకాల సంకలనం. ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ఉత్తమ పరిశోధనా గ్రంథం. 1958లో తెలుగు భాషా సమితి పోటీలలో ఈ గ్రంథం బహుమతి పొందింది. 1961లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వీరికి లభించింది.

ఎన్నో గేయ నాటకాలు, సంగీత రూపకాలు రజని రసమధురంగా రచించారు. చండీదాసు, మేఘసందేశం, మధురానగరిగాథ, సుభద్రార్జునీయం వీరి సంగీత రూపకాలలో ప్రసిద్ధాలు. రేడియో కోసం రజని వందలాది గీతాలను రచించారు. స్వరకర్తగా ఆయన ప్రసిద్ధులు. క్షీరసాగర మధనం, విప్రనారాయణ రూపకాలకు గీతాలు సంగీతం సమకూర్చారు. కొండ నుండి కడలి దాకా రూపకం సమర్పించి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. జపాన్ దేశానికి చెందిన టోక్యో బహుమతి ఈ రూపకానికి 1972లో లభించింది. గేయకవిగా, సినీ గాయకుడుగా రజని ప్రసిద్ధుడు. 1977లో మేఘసందేశ రూపకానికి బెంగుళురులొ ఉండగా ఉత్తమ సంగీత రూపక బహుమతి లభించింది.

భానుమతి, రజని కలిసి పాడిన పాటలు చిత్రసీమలొ గణన కెక్కాయి. ప్రోగ్రాం అసిస్టెంట్ గా మదరాసులో 1944లో చేరి బెంగుళురు కేంద్రంలో 1978 జనవరిలో స్టేషన్ డైరక్టరుగా పదవీ విరమణ చేశారు. 1988 నుండి 90 వరకు తెలుగు విశ్వ విద్యాలయం రాజమండ్రిలో గౌరవాచార్యులుగా పనిచేశారు. 1979 నుండి 82 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర కళాపీఠం డైరక్టరుగా వ్యవహరించారు. ఆకాశవాణి, దూరదర్శన్ లకు ఎమిరిటస్ ప్రొడ్యూసర్ గా 1982 నుండి 85 వరకు పనిచేశారు. ఏది చేసినా రజని ముద్ర ప్రత్యేకం. స్వర్గసిమ, గృహప్రవేశం ఇత్యాదిచిత్రాలకు పాడారు. 1944 మేలో ఆకాశవాణి మదరాసు కేంద్రంలో కార్యక్రమ నిర్వాహకులుగా చేరారు. 1966లో అసిస్టెంట్ డైరక్టరుగా పదోన్నతిపై పశ్చిమ బెంగాలులోని కర్సియాంగ్ స్టేషన్ కెళ్ళారు. కర్సియాంగ్ నుండి ఢిల్లీలోని ట్రాన్స్క్రిప్షన్ సర్విసులో చేరారు. 1970లో స్టేషన్ డైరక్టరై అహమ్మదాబాదు వెళ్ళారు. 1971 నుండి 76 వరకు విజయవాడ కేంద్రం డైరక్టరు. 76 నుండి 78 జనవరి వరకు బెంగుళూరు కేంద్ర డైరక్టరుగా పనిచేసి జనవరి 31న రిటైరయ్యారు.

వీరి రచనలు జేజిమామయ్య పాటలు చిన్న పిల్లలకు నర్సరీ గీతాలు. విశ్వ తాము రచించిన సంగీత రూపకాలు 1964లో ప్రచురించారు. త్యాగరాజు, శ్యామశాస్త్రి జీవిత గ్రంథాలను ప్రచురించారు. తండ్రిగారి ఏకాంత సేవకు ఆంగ్లంలో Alone with spouse divine అనువాదం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారికి క్షేత్రయ్యపై ఆంగ్లంలో (Amourse of the Divine Cowherd) గ్రంథం వ్రాశారు. మువ్వ గోపాల పదాలను ఆంగ్లంలొకి అనువదించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదంతో (1980), నాదసుధార్ణవ బిరుదంతో మదరాసు మురళీరవంళి ఆర్ట్ అకాడమీ వీరిని సత్కరించాయి.

డా: మంగళం పల్లి బాల మురళీ కృష్ణ:

పారు పల్లి రామ కృష్ణయ్య పంతులు శిష్యులలొ అగ్ర గణ్యులు మంగళం పల్లి బాల మురళీ కృష్ణ. బాల మురళి 1930 జూలై 6 న తూర్పు గోదావరి జిల్ల శంకర వంతంలో పట్టాభి రామయ్య గారికి జన్మించారు. తండ్రి ప్రసిద్ధ సంగీత విద్వాంసులు. వారి వద్ద శిక్షణ పూర్తి చేసుకొని విజయ వాడలో పారు పల్లి రామ కృష్ణయ్య పంతులు వద్ద విద్యాభ్యాసానికి చేరారు. ఆయన బాల గందర్వుడు. చిన్న తనం నుండి సంగీతంలో ప్రావీణ్యం చూపారు. కర్ణాటక సంగీగంలో 8వ ఏట సంగీత కచేరీ నిర్వహించిన దిట్ట.

వయెలిన్, వయోల, మృదంగ వాదనలలో ప్రావీణ్యం సంపాదించారు. 1965 వ సంవత్సరం ఆకాశ వాణి., మదరాసు, విజయ వాడలలో సంగీత శాఖ ప్రొడ్యూసర్ గా పని చేసి విశిష్ట సేవలు చేశారు. ఆ తర్వాత రాజీనామా చేశారు. విజయ వాడలో ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా కొంత కాలం పని చేశారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అధ్యక్షులుగా వ్యవహరించారు. 1966 నుండి విదేశాలలో సంగీతసభలు దిగ్విజయంగా జరిపారు. 1943లో ఆయనకు 13వ ఏట ఆంధ్ర సారస్వత పరిషత్ గాన సుధాకర బిరుదు నిచ్చినది. 1971లో భారత ప్రభుత్వం పద్మశ్రీ యిచ్చింది. ఆ తర్వాత పద్మభూషణ బిరుదంతో సత్కరించింది. ఎన్నో విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ పట్ట సత్కారం చేశాయి, తెలుగు విశ్వవిద్యాలయానికి 1993లో ప్రో ఛాన్సలర్ గా వ్యవహరించారు. అకాడమీల రద్దుకు నిరసనగా బాలమురళి సంగీత కచేరీలు ఆంధ్రదేశంలో కొంతకాలం చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ కచేరీలు మొదలెట్టారు.

'సంగీత' కంపెనీవారికి నూరు క్యాసెట్లు రికార్డుచేసి ఒక రికార్డు సృష్టించారు. సినిమాలలో అనేక పాత్రలు ధరించారు. అనేక చిత్రాలకు నేపథ్య సంగీతము, సంగీత దర్శకత్వమూ నిర్వహించారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలకు పనిచేశారు. రేడియో, టెలివిజన్ వారికోసం బెంగాలీలో రవీంద్ర సంగీతం పాడి రికార్డు చేశారు. భక్తప్రహ్లాద చిత్రంలో నారదపాత్ర ప్రముఖం.

గాయకశిఖామణి, వాగ్గేయకార వాచస్పతి, సంగీత మహోపాధ్యాయ, సంగీత సార్వభౌమ, సంగీత భూపతి, గాన సుధాకర, నాద సుధార్ణవ వంటి బిరుదులెన్నో వారి నలంకరించాయి. మదరాసులోని సంగీత అకాడమీ 1979లో 'సంగీత కళానిధి' బిరుదు ప్రధానం చేసింది. విజయవాడ పురపాలక సంఘం పౌర సన్మానంచేసి వీరి పేర ఒక వీధికి నామకరణం చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన ఆస్థాన విద్వాంసులు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్సు, రష్యా, మలేషియా, శ్రీలంక, సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాలు విరివిగా పర్యటించి కచేరీలు యిచ్చారు. ఎన్నో కొత్త రాగాలకు సృష్టికర్త అయ్యారు. 400 కృతులు రచించారు. మేళకర్త రాగాలు సృష్టించారు. సంగీతం ద్వారా రోగ నివారనికి కృషిచేస్తున్న బాలమురళి బహుముఖ ప్రజ్ఞాశాలి.

ఉషశ్రీ (1928-1990)

'ఉషశ్రీ' అనబడే పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు 1928లో కాకరపర్రులో జన్మించారు. తండ్రి పురాణపండ రామమూర్తికి 'గురువు'గారని పశ్చిమ గోదావరి జిల్లాలో మంచిపేరు. గజారోహణం, స్వర్ణపతక సన్మానం పొందిన సుప్రసిద్ధ పౌరాణికులు రామమూర్తిగారు. వారి కుమారులలో రాధాకృష్ణమూర్తి రాజమండ్రిలో ప్రవచనాలు చేస్తూ యశస్సు సంపాదించారు. రంగనాధ్ జర్నలిస్టుగా, నాటక రచయితగా పేరు తెచ్చుకొన్నారు.

ఉషశ్రీ అందరిలోకి పెద్ద కుమారుడు. ఆలమూరు, భీమవరం, కాకినాడలో విద్య గడించారు. విశ్వనాథకు ప్రియ శిష్యుడుగా పేరు తెచ్చుకొన్నారు. రచయితగా పేరు గడించారు. ఉద్యోగపర్వం 1961 లో హైదరాబాదులో ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్ ఎడిటర్ గా ఆరంభమైంది.

1965లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో చేరారు. ఆ తర్వాత సీనియర్ స్క్రిప్ట్ రచయితగా విజయవాడ బదిలీ అయ్యారు. పురాణ ప్రవచనంలో తనకు తానే సాటిగా, గంభీర స్వరంతో 'ధర్మ సందేహాలు' కార్యక్రమం దశాబ్దిపైగా నిర్వహించారు. రామాయణ, భారత, భాగవతాలను అరటిపండు వొలిచినట్లు ఒక దశాబ్ది (1974-84) ప్రవచించి ప్రసంగాలకు కొత్త వొరవడి తెచ్చారు. వ్యావహారిక శైలికి భాష్యం చెప్పారు.

1975లో తెలుగు ప్రసంగ శాఖ ప్రయోక్తగా విజయవాడలో పదోన్నతి పొంది 1986లో రిటైరయ్యేంతవరకు ఆపదవిలో కొనసాగారు. జ్వరితజ్వాల, అమృతకలశం, మల్లిపందిరి, రాగహృదయం ఆయన రచనలు, రామాయణ, భారత, భాగవతాలను వచన రూపంలో తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు. వ్యాఖ్యాతగా ఆయన కాయనేసాటి. హేతువాద దృష్టితో పురాణాలకు భాష్యం చెప్పే తీరు ఆబాలగోపాలాన్ని మైమరపింప జేసెది

రేడియో కళాకారులలో మిమిక్రీ చేయడంలో ఉషశ్రీవి మొదటగా ఎన్నుకొనేవారు. 1990 సెప్టెంబరులో ఆయన గళం మూగపోయింది.

గుమ్మలూరి సత్యనారాయణ

వ్యవసాయ ప్రసారాలకు నాందీ ప్రవచనం చేసిన ప్రముఖులలో శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ ఆద్యులు. 1966 జూన్ లో తొలకరినాడు విజయవాడ కేంద్రం నుండి వ్యవసాయ కార్యక్రమాలు ' పంటసీమలు ' పేర ప్రారంభించబడ్డాయి. సత్యనారాయణ ఆ కార్యక్రమాల తొలి ప్రయోక్త. అప్పటికే ఆయన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలో మూడు దశాబ్దులు (1937-66) పనిచేశారు. పాడిపంటలు మాసపత్రికలో కొంతకాలం పనిచేశారు. రాష్ట్ర వ్యవసాయ సమాచార విభాగాధికారిగా, బాపట్ల వ్యవసాయ కళాశాల ఉపన్యాసకులుగా, మదరాసు స్పెషల్ వెజిటబుల్ డెమాన్‌స్ట్రేటర్ గా సామర్లకోట ఫారం మేనేజరుగా వ్యవహరించారు.

1911 జూన్ 3న శ్రీకాకుళం జిల్లా సంగం అగ్రహారంలో సత్యనారాయణ జన్మించారు. కోయంబత్తూరు వ్యవసాయ కళాశాల నుండి 1934లో వ్యవసాయ పట్టభద్రులై కొంతకాలం శాంతి నికేతన్ లో రవీంద్ర కవీంద్రుని అంతేవాసిగా చేరారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1966-69 మధ్యకాలంలో వ్యవసాయ కార్యక్రమాల ప్రయోక్తగా పనిచేశారు. 1955-59 మధ్యకాలంలో హైదరాబాదులో పంచవర్ష ప్రణాళిక ప్రాంతీయ ప్రచారాధికారిగా కార్యభారం నిర్వహించారు. 1970 నుండి సర్వారాయ షుగర్స్, చెల్లూరులో చెరకు ఆఫీసరుగా విశిష్ట కృషి చేశారు. 15 సం. పైగా యిక్కడ పనిచేశారు. 1979లో అమెరికా, ఇంగ్లాండు దేశాలు, 1981 లో మలేషియా పర్యటించారు. 1980లో శాస్త్రీయ విజ్ఞాన సమితి కాకినాడలో స్థాపించారు.

సత్యనారాయణ గ్రంథకర్త కూడా, 1975లో డెల్టా శిల్పి-ఆర్థర్ కాటన్ అనే ఉద్గ్రంథం వ్రాశారు. రామాయణ హితోపదేశం పేర రామాయణ రహస్యాలను వెలువరించారు. నేటి రైతాంగం పేర 1969 నుండి ఆంధ్రప్రభ దినపత్రికలో ధారావాహిక వ్యాసాలు ప్రచురించారు. మాలి, చిన్నయ చెరువు, బ్రతుకు తెరువు, కళాపాసి నాటకములు వ్రాశారు. హాలిక సూక్తులు శతకం వెలువరించారు.

పశ్చిమ గోదావరి జిల్లా కృషిక్ సమాజ్ సంస్థవారు వ్యవసాయ కళోద్ధారక బిరుదంతో సత్కరించారు. కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం వారి కొరిక మేరకు వీరు రచించిన గోదావరి కిన్నెర రూపకానికి జాతీయ స్థాయి పోటీలలో 1990 సం.లో బహుమతి లభించింది. సహస్ర మాసొప జీవియైన గుమ్మలూరు చరమ జీవితాన్ని హైదరాబాదులో గడుపుతున్నారు.

డా. లత

'లత' గా సాహితీలోకానికి సుపరిచితురాలైన హేమలత విజయవాడ సమీపంలోని నిమ్మలూరులో జన్మించారు. నవలా, కథా రచయిత్రిగా ఆమె ప్రఖ్యాతి గడించారు. 116 నవలలు వ్రాసి ఆనాటి యువతరాన్ని స్వేచ్ఛాప్రణయ గాథలలో ఉర్రూత లూగించారు. ' వంశీ ' కలం పేరుతో ఆమె కథలు, నవలలు వ్రాశారు. రేడియో నాటికలు, నాటకాలు, సాహిత్య వ్యాసాలు, కవితలు వ్రాశారు. ' లత సాహిత్యం ' ఆనాటి మధ్యతరగతి యువకుల్ని బాగా ప్రభావితం చేసింది. ఆమె స్వతంత్ర భావాలు భవిష్యద్దర్శనానికి ప్రతీకలు. తాను నమ్మినది నిర్భయంగా నిష్కర్షగా చెప్పగల, వ్రాయగల రచయిత్రిగా ఆమెకు పేరు.

1977లో ఆంధ్ర విశ్వకళా పరిషత్తువారు ఆమెకు గౌరవ డాక్టరేట్ పట్టాతో సత్కరించారు. తెలుగు విశ్వవిద్యాలయం 1996వ సంవత్సరంలో సాహితీ పురస్కారంతో సన్మానించింది. వంశీ విజ్ఞానపీఠం వారు లక్షరూపాయల విజ్ఞాన పురస్కారంతో ఆమెను గౌరవించారు.

చలాన్ని తలపించే ఆమె రచనలు ఒక్కొక్కసారి విశ్వనాథను కూడా ప్రశ్నించేవిగా వుండేవని జ్ఞానపీఠ బహుమతి గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి లత సాహిత్యం గురించి వ్యాఖ్యానించారు. ఆమె మోహన వంశీ నవలను చదివి ప్రజాహితమై వంశీ సాంస్కృతిక సంస్థను 25 సం.ల క్రితం స్థాపించారు. స్త్రీల సమస్యలను ఆధునిక భావాలతో పరిశీలనాదృష్టితో అధ్యయనం చేయటం లత సొత్తు అని డా. వాసిరెడ్డి సీతాదేవి ప్రశంసించారు. ఆకాశవాణిలో తనదంటూ ప్రత్యేకతను నిలుపుకున్న లత ఆధునికాంధ్ర సాహిత్యంలో మణిపూస.

తెన్నేటి హేమలత ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ 1955 నుండి ఒక దశాబ్దికాలం అనౌన్సరుగా పనిచేసి పదవీ విరమణ చేసారు. 58 వసంతాలు చూసిన లత విజయవాడలో స్థిరపడ్డారు. గోపీచంద్ అవార్డు, సుశీలా, నారాయణరెడ్డి అవార్డు, తిక్కన అవార్డు, గృహలక్ష్మీ స్వర్ణకంకణం (1963) ఆమె కీర్తి కిరీటంలో పొదిగిన మణులు. 1963లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి సభ్యురాలుగా నామినేట్ చేయబడి ఉపాధ్యక్షురాలుగా కొంతకాలం పనిచేసారు. బిలాస్‌పూర్ ఆంధ్ర సంఘంవారు గండపెండేరంతో లతను సత్కరించారు. స్వర్ణసీత, ప్రేమ రాహిత్యంలో స్త్రీ, రామాయణ విషవృక్ష ఖండనం లత రచనల్లో విశిష్టాలు.

శ్రీ గోపాల్ (1938-1986):

కొంపెల్ల గోపాలకృష్ణమూర్తి 1938 సం|| జనవరి 20వ తేదీన కాకినాడలో జన్మించారు. మదరాసు విశ్వవిద్యాలయం నుండి M.A. ఫిలాసఫీలో స్వర్ణపతకాన్ని పొందారు. ప్రతిభా వ్యుత్పత్తులు కలిగి శ్రీగోపాల్ గా ప్రసిద్ధులయ్యారు. 1965లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రములో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా సెలక్టు అయ్యారు. అంతకు ముందు ఫ్రీలాన్స్ రాజకీయ కార్టూనిస్ట్ గా పనిచేశారు.

తర్వాత వివిధ హోదాలలో ఆకాశవాణి మదరాసు, పోర్ట్ బ్లయర్, గోవా, విజయవాడ, కడప కేంద్రాలలో పనిచేశారు. శ్రవ్య మధ్యమంలో శక్తిని గ్రహించి అనేక రూపకాలు, నాటకాలు రూపొందించి ప్రసారం చేశారు. యువవాణి విభాగం అధిపతిగా యువశక్తికి ప్రోత్సాహం కలిగించారు.

ఆకాశవాణి వార్షిక పోటీలలో నాలుగు బహుమతులు శ్రీ గోపాల్ పొందడం విశేషం. టెన్జింగ్ ఎవరెస్టు శిఖరారోహణను గూర్చి విద్యా ప్రసారాలలో విక్రాంత గిరిశిఖరం అనే రూపకం ప్రసారం చేశారు. 1974వ సంవత్సరంలో ఆ రూపకానికి జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. భగవాన్ రమణ మహర్షిపై యువవాణి విభాగంలో సమర్పించిన రూపకానికి బహుమతి లభించింది. కొండ నుండి కడాలి దాకా అనే రూపకాన్ని గోదావరి నదిపై రజని నిర్వహణలొ శ్రీ గోపాల్ ఒక రూపకం ప్రసారం చేసి ప్రశంసా బహుమతులందారు. చలం నవల మార్తా ఆధారంగా పుర్ణమానవుడు అనే రేడియో నాటకాన్ని రూపొందించి వార్షిక పోటీలలో బహుమతి పొందారు. 1979వ సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన ఇండో అమెరికన్ డ్రామా ప్రొడ్యూసర్ల సెమినార్ కి ఆంధ్ర రాష్ట్రం నుండి శ్రీ గోపాల్ ప్రతినిధిగా ఎంపికయ్యారు.

రేడియో కార్యక్రమాల రూపశిల్పిగానే గాక రచయితగా, కార్టూనిస్ట్ గా, చలనచిత్ర నటుడుగా, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా శ్రీ గోపాల్ తన ప్రత్యేకతను నిల్పుకొన్నారు.

జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన శంకరాభరణం చిత్రంలో సంగీతం మాష్టారు దాసు గా శ్రీ గోపాల్ పాత్రపోషణ ప్రేక్షకులకు చిరకాలం గుర్తువుంటుంది. ఇంకా మంచుపల్లకి, స్వాతిముత్యం, ఆలాపన, తాయారమ్మ బంగారయ్య చిత్రాలలో కూడా ఆయన నటించారు.

1979 నుండి 82 వరకు హైదరాబాదు దూరదర్శన్ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. కడప ఆకాశవాణిలో పనిచేస్తూ అనారోగ్యంతో 1986 సం|| మే 18న హైదరాబాద్ లో శ్రీ గోపాల్ తనువు చాలించారు.

మల్లిక్ (1921-1996)

1921లో బందరులో జన్మించిన కందుల మల్లికార్జునరావు చక్కటి సంగీత విద్వాంసులు. లలిత సంగీత విభాగంలో జానపద సంగీతంలో తన ప్రత్యేకతను కొన్నారు. మచిలిపట్నంలో క్రోవి సత్యనారాయణ వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1942లో ఆకాశవాణి మదరాసు కేంద్రంలో లలిత సంగీత గాయకులుగా ఆ తరువాత విజయవాడ కేంద్రానికి 1972లో బదిలీపై వచ్చారు. లలిత సంగీత విభాగంలో సీనియర్ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్ గా పనిచేశారు. సినీరంగంలో కొంతకాలం పనిచేసి కీర్తి గడించారు. వెంపటి చినసత్యంగారితో కలిసి నృత్య నాటికలకు సంగీతం సమకూర్చారు. జానపద, శాస్త్రీయ సంగీతాలలో ఆయన తనదైన బాణీ నిలుపు కొన్నారు. భక్తిరంజని కార్యక్రమాలకు వీరు వొరవడి పెట్టారు.

ఆయన మదరాసు, హైదరాబాదు, విజయవాడ కేంద్రాలలో 38 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసి, 1981లో పదవీ విరమణ చేశారు.

అదిగో అల్లదిగో హరివాసము, తందనాన భళా తందనాన అన్నమయ్య కీర్తనలు వీరు పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు. రజనీకాంతరావు గారి పర్యవేక్షణలో మదరాసు కేంద్రంలో లలితసంగీత విభాగంలో పనిచేసి తర్వాత విజయవాడకు బదిలీ అయ్యారు. జానపద, లలిత సంగీత బాణీలలో తనదైన ముద్రవేసి పాడేవారు. స్వరపరచేవారు. ఎన్నో సంగీత, నృత్య రూపకాలకు సంగీతం సమకూర్చారు.

కలకత్తాలోని పంకజ్ మల్లిక్ చాలా ప్రసిద్ధులు. ఆ పేరుతో మల్లిక్ - లోకానికి పరిచితులు. లలిత సంగీతం ఆడిషన్ బోర్డు మెంబరుగా ఆకాశవాణికి సలహా సంప్రదింపులు అందించారు.

మల్లిక్ బంగారుపాప, భాగ్యరేఖ, వింధ్యరాణి, సంపూర్ణ రామాయణం, భక్త శబరి, జయభేరి, చరణదాసి చిత్రాలలొ పాడారు. తమిళ చలనచిత్రరంగంలో కూడ నేపథ్యగాయకుడు మల్లిక్ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రలేఖ అనే తమిళచిత్రానికి తొలిసారిగా నేపథ్యగానం చేశారు.

1952 నుండి 1993 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా వ్యవహరించారు. ప్రతియేటా అన్నమాచార్య ఉత్సవాలలో పాల్గొన్నారు. ఆయనకు వెంకటేశ్వరునిపై అపార భక్తిప్రపత్తులు. అందుకేనేమో 1996 ఏప్రిల్ శనివారం 76వ ఏట విజయవాడలో ఆయన సునాయాస మరణం పొందారు.

వింజమూరి శివరామారావు (1908-82)

శివరామారావు పిఠాపురం తాలూకా చంద్రపాళెంలో 15-5-1908లో జన్మించారు. ప్రముఖ అభ్యుదయ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి వీరి మేనమామ. శివ రామారావు కలం పేరు 'గౌతమి'.

శివరామారావు ఆకాశవాణిలో రెండు దశాబ్దాలు (1949-68) స్క్రిప్ట్ రైటరుగా విజయవాడ కేంద్రంలో పనిచేశారు. ఆకాశవాణిలో చేరడానికి ముందు పత్రికలలో పనిచేశారు. ' జ్వాల ' పత్రికలోను, నవోదయ పత్రికలోను సహాయ సంపాదకులుగా వ్యవహరించారు. పద్యాలను, గేయాలను సమప్రతిభతో వ్యాయగల నేర్పరి. ఆకాశవాణికి ఎన్నో లలిత గీతాలను, రూపకాలను వ్రాసి ప్రసారం చేశారు. 600 రేడియో నాటికలు వ్రాశారు. ఈయన అనువాద రచనలో కూడా సమర్ధులు. అమరుకం, మొపాసా కథలు, గోర్కీ కథలు వీరి అనువాద సామర్థ్యాన్ని చాటిచెబుతాయి. కల్పవల్లి ఈయన ఖండ కావ్య సంపుటి. విజయపతాక, కళారాధన, రజకలక్ష్మి, కళోపాసన, కృష్ణదేవరాయలు, విశ్వామిత్ర నాటకాలుగా ప్రసిద్ధాలు. 1982లో వింజమురి శివరామారావు విజయవాడలో కాలధర్మం చెందారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ వింజమూరి వారిని కళాప్రపూర్ణ బిరుదంతో సత్కరించింది.

ఏడిద కామేశ్వరరావు:

రేడియో అన్నయ్యగా పరిచితులైన ఏడిద కామేశ్వరరావు 1913 సెప్టెంబర్ 12న తూర్పుగోదావరి జిల్లా ఏడిదలో జన్మించారు. మండపేట, రాజమండ్రిలో విద్యాభ్యాసం చేశారు. 1930 లో శాసనోల్లంఘ నోద్యమంలో జైలు శిక్ష అనుభవించారు. 1935-40 మధ్యకాలంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.

1936లో మదరాసు ఆకాశవాణి కేంద్రంలో బాలల కార్యక్రమంలో ప్రయోక్తగా చేరారు. అంతకుముందు గృహలక్స్ఝి, ప్రజామిత్ర, మాతృభూమి పత్రికలలో ఉప సంపాదకులుగా పనిచేశారు. 1949 నుండి ఆకాశవాణి విజయవాడలో పిల్లల కార్యక్రమాల ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

1952లో బాలబంధు బిరుదుతో కామేశ్వరరావు సత్కరింపబడ్డారు. సుమారు 500 పాటలు, 500 బాలల నాటికలను వ్రాసి ఆకాశవాణి ద్వారా ప్రసారం చేశారు. పదవీ విరమణ చేసి 1996 తొలిభాగంలో కామేశ్వరరారు పరమపదించారు.

ప్రయాగ నరసింహశాస్త్రి :

తన ప్రత్యేక కంఠస్వరంతో ఖంగుమని పలుకుతూ, జానపద శైలిలో పాడుతూ శ్రోతల్ని వుర్రూత లూగించిన వ్యక్తి శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రి. మూడు దశాబ్దాలు ఆకాశవాణిలో పనిచేసి ' సెబాస్ ' అనిపించుకొన్న వ్యక్తి. 1936 లో ప్రయాగ ఆకాశవాణి మదరాసు కేంద్రంలో నిలయ విద్వాంసుడుగా చేరారు. ' బావగారి కబుర్ల ద్వారా వీరు శ్రోతలకి చేరువయ్యారు. విరు, గాడేపల్లి సూర్యనారాయణ గారు కలిసి బావగారి కబుర్లు నిర్వహించేవారు. అవి శ్రోతల జీవనంలో భాగమైపోయాయి. ' ఏమండోయ్ బావగారు ! రావాలి ! రావాలి ! ' అనే పలకరింపులు సహజమయ్యాయి. స్క్రిప్టు లేకుండా యధాలాపంగా అనర్గళంగా తన సంభాషణలతో వినోదాన్ని అందించేవారు ప్రయాగ.

నరసింహశాస్త్రి 1909 నవంబరు 20 న విశాఖ జిల్లా పెదగాడి గ్రామంలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. బాల్యం నుండి సంగీత సాహిత్యాలపై అపారమైన ప్రీతి. విజయనగరం మహారాజా కళాశాలలో చదువుకొని పట్టభద్రులయ్యారు. శ్రీశ్రీ, ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి వీరి సహాధ్యాయులు. ఆదిభట్ల నారాయణ దాసు గారి వద్ద హరికథా గానంలో మెళుకువలు నేర్చుకొన్నారు. చక్కని గాత్రము రూపము ఉన్న ప్రయాగ 1935లో చలన చిత్రరంగ ప్రవేశం చేశారు. భీష్మ చిత్రంలో విచిత్రవీర్యుని పాత్రను పోషించారు. నాగయ్య గారి త్యాగయ్య చిత్రంలో గణపతి పాత్రను పోషించారు. అనేక చిత్రాలకు పాటలు వ్రాశారు. 1969లో ఆకాశవాణిలో పదవీ విరమణ చేసిన తర్వాత మళ్లీ చిత్రరంగంలో ప్రవేశించారు. చీకటి వెలుగులు, అందాల రాముడు, డబ్బుకు లోకం దాసోహం వంటి సినిమాలలో నటించారు.

ఆకాశవాణి మదరాసు కేంద్రంలొ 1936 నుండి రెండు దశాబ్దాలు పనిచేశారు. అక్కడ వీరు ప్రసారం చేసిన మొద్దబ్బాయ్ HMV గ్రామఫోన్ రికార్డు కంపెని వారు రికార్డు చేసి విడుదల చేశారు. 20కి పైగా HMV రికార్డులు ప్రయాగ రిలీజ్ చేశారు. శ్రోతలలో వీరికంత ప్రశస్తి వుండేది. 1956లో ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి బదలీ అయి వచ్చారు. అక్కడ సర్వశ్రీ పింగళి లక్ష్మీకాంతం, బందా కనకలింగేశ్వరరావు, బాలాంత్రపు రజనీకాంతారావు, జరుక్ శాస్త్రి, బాలమురళి, ఓలేటి వంటి పండితుల సాహచర్యం లభించింది. విజయవాడలో ప్రయాగ గ్రామీణ కార్యక్రమాల ప్రయోక్తగా పని చేశారు. ఎన్నొ జానపద గేయాలను పాడి, పాడించి శ్రోతల మన్ననలందుకొన్నారు. హరికథలు స్వయంగా రచించి గానం చేశారు. త్యాగరాజ చరిత్ర, కన్యాకుమారి, గాంధీజీ, శంకర విజయం హరికథలు ప్రముఖాలు. 1962లో భారత ప్రధాని శ్రీ నెహ్రూ సమక్షంలో గాంధీజీ బుర్రకథను వినిపించి బంగారు పతకంతో సన్మానించబడ్డారు. వీరి బుర్రకథలు HMV గ్రామఫోను రికార్డులుగా విడుదలైనాయి.

వినోదాల వీరయ్యగా విజయవాడ కేంద్రం నుండి ఎన్నో కార్యక్రమాలు సమర్పించారు. ఆకాశవాణి ప్రయాగకు ఆరోప్రాణం. 1969లో పదవీ విరమణ చేసేంతవరకు ఆయన ప్రయోక్తగా ఎన్నో కార్యక్రమాలు వెలువడ్డాయి. 1970 నుండి ఐదు సంవత్సరాలు కేంద్ర సంగీత నాటక అకాడమీవారి పక్షాన ' బాలాజీ ఆర్ట్ థియేటర్ ' పేరుతో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. 1980 నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంగీత కళా పీఠంలో యక్షగానాలు, హరికథల అధ్యాపకులుగా పనిచేశారు. హిందు ధర్మ ప్రచార పరిషత్ లో జానపద కళా ప్రచారకులుగా వ్యవహరించారు. 1983 సెప్టెంబరు 11న పరమపదించారు. మాట, పాట, ఆటలతో శ్రోతల్ని సంబరపెట్టిన ప్రయాగ నిత్యోత్సాహి. ప్రయాగ నరసింహశాస్త్రి కుమార్తె వేదవతి ఆకాశవాణిలో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా నిజామాబాద్ లో పనిచేస్తున్నారు.

జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి (1914)

జరుక్ శాస్త్రి గా ప్రసిద్ధులైన వీరు చిట్టి గూడురు సంస్కృత కళాశాలలో ఉభయభాషా ప్రవీణులయ్యారు. ఆంధ్రపత్రిక ఉపసంపాదకులుగా కొంతకాలం పనిచేశారు. మదరాసు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలలో స్క్రిప్టు రైటర్ గా పనిచేశారు. నవ్యాంధ్ర సాహిత్యోద్యమంలో ప్రధాన పాత్ర వహించారు. పేరడీ శాస్త్రి గా మంచి పేరు. దేవయ్య స్వీయచరిత్ర (నవల) ప్రచురించారు. ఆనంద వాణిలో ' తనలో తాను ' శీర్షిక నిర్వహించారు. సమకాలీన కవుల రచనలకు పేరడీలు వ్రాసి మెప్పు పొందారు. 1968లో పరమపదించారు. వీరి కుమారులు ప్రసాద్ ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో అకౌంటెంటు.

రాచకొండ నరసింహశాస్త్రి

సుప్రసిద్ధ రచయిత అయిన రాచకొండవారు విజయవాడ కేంద్రంలో హిందీ విభాగంలో రచయితగా పనిచేశారు. వీరి ఆధ్వర్యంలొ హిందీలో అనేక కార్యక్రమాలు రూపొందార్యి. హిందీ పాఠాలకు వొరవడి పెట్టిన రాచకొండవారు పదవీ విరమణ చేసి దివంగతులయ్యారు. రెండు దశాబ్దాలు పనిచేశారు.

శ్రీ N. Ch. కృష్ణమాచార్యులు

శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు 1923 సెప్టెంబరు 15న కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తర్క, వ్యాకరణ, అలంకాల శాస్త్రాలను చదవటమే గాక సంగీతంలోనూ అందెవేసిన చేయి. 1948 డిసెంబరులో ఆకాశవాణి విజయవాడ కేంద్రం స్థాపించారు. అప్పుడే వీరు వైలిన్ కళాకారులుగా ఉద్యోగంలో చేరారు. 35 సంవత్సరాలు విధి నిర్వహణ గావించి, 1983లో పదవీ విరమణ చేశారు. వీరు ప్రస్తుతం వయోలిన్ A Top కళాకారులు. హరికథా గానంలోను స్వీయ రచనలలోనూ ప్రతిభావంతులు. విప్రనారాయణ చరిత్ర వంటి యక్షగాన రచనలు, అష్టావధాన ప్రదర్శనలు వీరి ప్రతిభకు నిదర్శనలు. సంస్కృతాంధ్రాలలో 25కు పైగా గ్రంథాలు వ్రాశారు.

ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమి వారు ' గాన కళాప్రపూర్ణ ' బిరుదుతో సత్కరించారు. ' సంగీత సాహిత్య కలానిధి ', ' హరికథా చూడామణి ' వీరి ఇతర బిరుదులు. సునిశిత హాస్యానికి ఆచార్యులవారు మారుపేరు. బిడాల మోక్షం పేరుతో వీరు వ్రాసిన కావ్య ప్రహసనం ఈ కోవకు చెందినది. గోదా గ్రంథమాల వారు వీరి త్యాగరాయ చరితము, పరకాల విలాసము, శఠగోప చరితము, శ్రీనృసింహ తాండవము ప్రచురించారు.

ఆచార్యులవారి సప్తతి పుర్తి మహోత్సవాలను అసంఖ్యాకమైన వారి శిష్య కోటి 1995 అక్టోబరులో విజయవాడలో ఘనంగా జరిపింది. కళాతపస్వి కృష్ణామాచార్యులని చినజియ్యర్ స్వామి ప్రశంసించారు. బాలమురళి, అన్నవరప, N. Ch. త్రయం పారుపల్లి రామకృష్ణయ్యగారి శిష్య పరంపరకు చెందినవారు. కృష్ణమాచార్యుల తండ్రిగారు తిరువేంకటాచార్యులూ గొప్ప పండితులు. సంస్కృతం లోనూ కృష్ణమాచార్యులవారు నౌకా చరిత్రం, శఠ గోప చరితం, భూప్రశంస అనే గ్రంథాలు వ్రాశారు. నౌకా చరితము త్యాగరాజు తెనుగు గ్రంథానికి సంస్కృత అనువాదము. సంగీత సాహిత్యముల పరస్పరోపకారము ఈ రచనలో ప్రతిఫలించుచున్నదని రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ప్రశంసించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి యైన ఆచార్యుల వారివద్ద ఎందరో గాత్ర సంగీతము వయోలిన్ వాదనము అభ్యసించారు. N.C.V. జగన్నాధాచార్యూలు, N. Ch. నరసింహాచార్యులు వీరి బంధు వర్గములోని వారు. వారు కూడా ఆకాశవాణిలో పనిచేయటం విశేషం.

అన్నవరపు రామస్వామి :

పారుపల్లి రామకృష్ణయ్య శిష్యులలో బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు ప్రసిద్ధులు. అన్నవరపు రామస్వామి 1926 ఆగష్టు 7న సోమవరప్పాడులో జన్మించారు. తండ్రి పెంటయ్య ప్రముఖ నాదస్వర విద్వాంసులు. అన్నయ్య అన్నవరపు గోపాలం మృదంగ విద్వాంసుడుగా చాలా కాలం ఆకాశవాణిలో కళాకారులుగా పనిచేసి పదవీ విరమణ చేసి మరణించారు.

ఐదు దశాబ్దాల కాలంలో రామస్వామి వాయులీన విద్వాంసులుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. ఆయన వయోలిన్ పై సహకరించని ప్రముఖ కళాకారులు లేరు. సహకార వాద్యంగానే గాక స్వతంత్రంగా కచేరీలు చేసి రసజ్ఞఉల మన్ననలు ఖండ ఖండాంతరాలలో పొందారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1948 నవంబరులో చేరారు. అప్పటి కింకా విజయవాడ కేంద్రం ప్రారంభం కాలేదు. N. S. రామచంద్రన్ గారు వీరిని, కృష్ణమాచార్యులను, దండమూడిని సెలక్టు చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. వీరు కళాకారులుగా 1986 వరకు పనిచేశారు. ఆయన యిప్పుడు ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ వాద్యకారుడు.

అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, శ్రీలంక, సింగపూరు, మలేషియా, బెహరిన్, దుబాయ్, మస్కట్ వంటి అనేక దేశాలలో పర్యటించి కచేరీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ ఫెలోగా ఎంపికయ్యారు. విజయవాడ, రాజమండ్రి, భీమవరాలలో కనకాభిషేకము, సువర్ణఘంటా కంకణం పొందారు. 1986 లో వీరి షష్టిపూర్తి మహోత్సవాలు వైభవంగా విజయవాడలో జరిపారు.

నాద సుధార్ణవ, వాయులీన కళాకౌముది, వాద్యరత్న, కళా సరస్వతి వంటి బిరుదులతో ఆంధ్రదేశం ఆయనను సత్కరించింది. గురుకుల పద్ధతిలో ఆయన వద్ద ఎందరో శిష్యులు విద్య నభ్యసించి ప్రసిద్ధులయ్యారు. గాత్రంలోను, వయొలిన్, వీణ, వేణువు, క్లారినెట్ వంటి కళలలో ఆయన వద్ద ఎందరో శిక్షణ పొందారు. అందులో ప్రపంచం సీతారాం ప్రముఖులు. ఆకాశవాణి డైరక్టర్ జనరల్ కార్యాలయంలో సంగిత విభాగం డైరెక్టర్ గా రెండేళ్లు పనిచేసిన సీతారాం వేణుగాన కళలో జగత్ప్రసిద్ధి పొందారు.

దండమూడి రామమోహనరావు :

సుప్రసిద్ధ మార్దంగికులలో దండమూడి విశిష్ట వ్యక్తి రామస్వామి చౌదరి కుమారులుగా రామమోహనరావు 1933 మార్చి 18న విజయవాడలొ జన్మించారు. పళని సుబ్రహ్మణ్యం పిళ్లె, కొండపాటూరి రంగనాయకుల వంటి గురువుల వద్ద మృదంగ విద్యను అభ్యసించారు. తన ఆరవ ఏట శ్రీ యస్ దొరై సంగీత కచేరీకి మృదంగం వాయించి పండితుల ప్రశంసలు అందుకొన్నారు.

కర్ణాటక సంగీతంలోని ప్రసిద్ధులు పారుపల్లి రామకృష్ణయ్య, ద్వారం వెంకట స్వామినాయుడు, దాలిపర్తి పిచ్చిహరి, వోలేటి, ఈమని, చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్లె, బాలచందర్, చెంబై వంటి ఆ తరం వారికి మృదంగ సహకారం అందించారు. నేటి సంగీత కళాకారులలో ఆయన సహకరించని ప్రసిద్ధులు లేరనడం ఆశ్చర్యం కాదు. రామమోహనరావు ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ ఆర్టిస్టుగా ఎంపికయ్యారు. 1944 నుండి ఆకాశవాణి కళాకారుడుగా పేరుపొందారు. 1949 లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ మృదంగ విద్వాంసులుగా చేరి 1993 లో పదవీ విరమణ చేశారు. కేంద్ర సంగీత నాటక అకాడమి 1995 లో వీరిని సత్కరించింది. వాద్యరత్న నాద భగీరథ, కళా ప్రవీణ వంటి బిరుదులతో పాటు కనకాభిషిక్తులయ్యారు. ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇటలీ, నార్వే, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఇతర యూరప్ దేశాలు విస్తృతంగా పర్యటించి కచేరీలు చేశారు. పాంప్ విశ్వవిద్యాలయంలో పాఠాలు బోధించారు. ఎందరో సంగీత విద్వాంసుల్ని తయారుచేశారు. వీరి సతీమణి శ్రీమతి సుమతి విజయవాడ సంగీత ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి :

రామకృష్ణశాస్త్రి గుంటూరులో 1932 జనవరి 6వ జన్మించారు. తండ్రి సీతారామశాస్త్రి గారి వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1947 నుండి సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. 1956 నుండి ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సంగీతవాద్యాల పరిరక్షకులుగా (Care taker, Musical Instruments) 1962 వ సంవత్సరంలో చేరారు. భక్తిరంజని, సంగీత శిక్షణ, సంగీత రూపకాలు, కచేరిల ద్వారా శ్రోతల మన్ననలు పొందారు. 1980 లో తంబురా కళాకారులుగా నియుక్తులయ్యారు. 1992లో పదవీ విరమణ చేసేంతవరకు రామకృష్ణశాస్త్రి తమ గాత్రమాధుర్యంతో శ్రోతల నలరించారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీవారు శాస్త్రి ప్రతిభను గుర్తించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సంగీత విభాగానికి Visiting Professor గా కొంతకాలం వ్యవహరించారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు వీరి సేవలను పరిక్షాధికారిగా వినియోగించుకొంటున్నారు. శాస్త్రి విజయవాడలో స్థిరపడ్డారు.

ఎల్లా వెంకటేశ్వరరావు :

తనదైన ప్రత్యేక బాణీలో నవ మృదంగ సమ్మేళనం నిర్వహించి యావద్భారత ఖ్యాతిని గడించిన ఎల్లా వెంకటేశ్వరరావు విజయవాడలో జన్మించారు. వీరి తండ్రి ఎల్లా సోమన్న ప్రముఖ మృదంగ విద్వాంసులు. చిన్నతనంలోనే మృదంగ వాద్యాన్ని అభ్యసించారు ఎల్లా. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో తొలుత నిలయ కళాకారులుగా చేరారు. ఆ తర్వాత హైదరాబాదు కేంద్రంలో మృదంగ విద్వాంసులుగా సుమారు రెండు దశాబ్దాలు పనిచేశారు. 1961లో ఆకాశవాణి జాతీయ సంగీత పోటీల్లో ప్రథమ బహుమతిని డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారి వద్దనుండి పొందారు.

దేశ విదేశాలలో ప్రదర్శనం ద్వారా ఖ్యాతి గడించారు. విదేశాలలో సుదీర్ఘకాలం పర్యటించి వారి ప్రశంస లందుకొన్నారు. ఎందరో శిష్యులను తయారు చేశారు. 24 గంటలపాటు అఖండ మృదంగ విన్యాసాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంవారు వీరిని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు. యావద్భారత దేశంలో వివిధ సంస్థలు వీరిని గౌరవించాయి. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ సంపాదించారు.

డా|| ఎల్లా వెంకటేశ్వరరావు హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయం వారి సంగీత విభాగంలో ఆచార్యులుగా గత 8 సం||లుగా వ్యవహరిస్తున్నారు. సంగీత నృత్య విభాగానికి డీన్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికా, జపాన్, కెనడా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా మొ|| దేశాలు పర్యటించారు.

విజయవాడ కేంద్రంలో సంగీత విభాగంలో పనిచేసిన ఎందరో ప్రముఖులు స్మరించదగ్గ వారున్నారు. సర్వశ్రీ క్రొవ్విడి హనుమంతరావు, క్రొవ్విడి సీతారాం, దత్తు వెంకటేశ్వరరావు, జొన్నలగడ్డ సింహాచలశాస్త్రి, రామవరపు సుబ్బారావు వంటి ప్రముఖులు పనిచేశారు.

ఈ తరానికి చెందినవారిలో సర్వశ్రీ అరిపోలు మురళీకృష్ణ (వయొలిన్), కె. వి. కృష్ణ (వేణువు), నాగరాజ్ (ప్లూట్), సుబ్రహ్మణ్యేశ్వరరావు (క్లారినెట్), బి. వి. యస్. ప్రసాద్, సతీష్, సద్గురు చరణ్ (మృదంగం), మల్లాది శ్రీరాం ప్రసాద్, మోదుమూడి సుధాకర్, కుమారి శిష్ట్లా శారద చెప్పుకోదగినవారు. M. S. బాబు, గోవాడ సుబ్బారావు హఠాన్మరణం పొందారు.

P. R. రెడ్డి :

పెనుమల్లి రామిరెడ్డి 1934 జూలై 5న కృష్ణాజిల్లాలో మోరంపూడిలో జన్మించారు. శాంతినికేతన్‌లో ఎం. ఏ. పూర్తి చేశారు. 1957 లో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ పదోన్నతి పొందారు. 1978లో A. S. D. గా బొంబాయి వెళ్ళారు. 1981 లో స్టేషన్ డైరక్టర్‌గా పదోన్నతి పొంది బొంబాయి వివిధభారతి కార్యకలాపాలు చూశారు. అక్కడనుండి విజయవాడ కేంద్రంలో 83 మార్చి - 86 ఫిబ్రవరి మధ్య కాలంలో పనిచేశారు. విజయవాడ నుండి కడప బదిలీ అయి రెండేళ్ళు పనిచేశారు. విదేశీ ప్రసార విభాగం డిల్లీలో డిప్యూటీ డైరక్టర్‌గా పనిచేశారు. అక్కడనుండి సెలక్షన్ గ్రేడ్ పొంది 1989లో వరంగల్ కేంద్రం డైరక్టర్‌గా వెళ్ళారు. రెడ్డి 90 లో హృద్రోగంతో వరంగల్‌లో హఠాన్మరణం చెందారు.

ముక్కుకుసూటిగా వెళ్ళే అధికారిగా రెడ్డి పేరు పొందారు.

కలకత్తా, రాజ్‌కోట్, గౌహతి కేంద్రాలలో పనిచేశారు.

వీరు ఆకాశవాణిలో చేరడానికి ముందు డిల్లీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సబ్ - ఎడిటర్‌గా పని చేశారు.

వీరి కుమారులు శంకర్‌రెడ్డి విజయవాడ కేంద్రంలో పనిచేస్తున్నారు.

P. శ్రీనివాసన్ :

శ్రీనివాసన్ 1924 నవంబరులో జన్మించారు. మదరాసులో 1950 దశకంలో వీరు ఆకాశవాణిలో చేరారు.

శ్రీనివాసన్, సుభద్రా శ్రీనివాసన్ దంపతులు ఆకాశవాణిలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లుగా సుప్రసిద్ధులు. కొహిమావంటి క్లిష్టమైన కేంద్రాలలో వీరు పనిచేశారు. విజయవాడ కేంద్రం డైరక్టర్ గా రెండేళ్ళు పనిచేశారు. వీరి కాలంలో వివిధ కార్యక్రమాలు శ్రోతలను ఆకట్టుకొన్నాయి. కొంతకాలం హైదరాబాదులోని ప్రాంతీయ శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశారు. 1982 నవంబరులో పదవీ విరమణానంతరం విశాఖపట్టణంలో స్థిరపడ్డారు.

డా. ఆర్. అనంతపద్మనాభరావు

రేవూరు అనంత పద్మనాభరావు 1947 జనవరి 29న నెల్లూరు జిల్లా చెన్నూరులో జన్మించారు. నెల్లూరు వి. ఆర్. కళాశాల నుండి బి. ఏ. పట్టభద్రులైనారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎం. ఏ. లో సర్వ ప్రథములుగా స్వర్ణ పతకాన్ని 1967లో పొందారు. 1967 నుండి 75 వరకు కందుకూరు ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పని చేశారు. ఆ కాలంలో 50కి పైగా అష్టావధానాలు చేశారు. కవిగా, రచయితగా పద్మనాభరావు 35 గ్రంథాలు ప్రచురించారు. కందుకూరి రుద్రకవిపై పరిశోధన చేసి పి. హెచ్.డి. పట్టా పొందారు.

1975 ఆగష్టు 16న ఆకాశవాణి కడప కేంద్రంలొ తెలుగు ప్రసారాల ప్రొడ్యూసర్ గా చేరి 75-82 మధ్యకాలంలో కడప, విజయవాడలలో పని చేశారు. 1982 అక్టోబరు నుండి ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా (UPSC సెలక్షన్) 85 జనవరి వరకు పని చేశారు. 85-87 మధ్య కాలంలో వాణిజ్య ప్రసార విభాగం అధిపతిగా చేశారు. 1987 ఏప్రిల్ నుండి 88 వరకు ఢిల్లీ లోని Staff Training Instititue లో పని చేశారు. 1988 లో UPSC ద్వారా డైరక్టర్ గా సెలక్టయి డైరక్టరేట్ జనరల్ కార్యాలయంలో ప్రసంగాల శాఖ డైరక్టర్ గా (Director of Programmes, Spoken word) గా పనిచేశారు. 88-90 మధ్య ఢిల్లీ స్టాఫ్ ట్రైయినింగ్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరక్టర్ గా రెండేళ్ళు పనిచేశారు. 1990 ఆగష్టు నుండి అనంతపురం ఆకాశవాణి తొలి డైరక్టరుగా మూడేళ్లు పనిచేశారు. సెలక్షన్ గ్రేడ్ డైరక్టరుగా 93-95 మధ్యకాలంలో కడప కేంద్ర డైరక్టర్ గా పనిచేశారు. 1995 మార్చి నుండి విజయవాడ కేంద్ర డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రారంభ సమయంలో 1989 మార్చిలో ఆయన తొలి డైరక్టరు.

కవి, నవలా రచయిత, వ్యాసకర్తగా పద్మనాభరావు ప్రసిద్ధులు. వి. వి. గిరి, ప్రకాశం రాయలసీమ రత్నాలు వంటి జీవిత చరిత్రలు రచించారు. రుద్రకవి, ప్రకృతికాంత, భక్తి సాహిత్యం విమర్శనా గ్రంథాలు. హరివంశం ధారావాహికంగా రేడియోలో ప్రసారమై ప్రచురితమైంది.

కేంద్ర సాహిత్య అకాడమీ వారికి "ప్రభాతవదనం" తెలుగులోకి అనువదించారు. ముల్క్‌రాజ్ ఆనంద్ "Morning Face" కు అది తెలుగు అనువాదం. ఈ గ్రంథం 1993లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ అనువాదకుని బహుమతి తెచ్చిపెట్టింది. ఛాయారేఖలు, ఆంధ్రమణిహారం రామాయణమ్లో స్త్రీ పాత్రలు, యశోద, నీరు, భక్తి సాహిత్యం, భయం వేస్తోందా భారతీ, ఇతర రచనలు. వీరి మారని నాణెం, సంజ వెలుగు, వక్రించిన సరళరేఖ నవలపై శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో శ్యాంప్రసాద్ పరిశోధన చేసి M. Phil. పట్టా పొందారు. జర్మనీ రేడియో వారి ఆహ్వానం మేరకు 1996 ఆగష్టు నెలలొ ప్రసార మాధ్యమాలపై జర్మనీలోని కొలోన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పద్మనాభరావు భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 12 దేశాల ప్రతినిధులు యిందులో పాల్గొనడం విశేషం.

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో శ్రీకాంతశర్మ 29-5-44లో జన్మించారు. సుప్రసిద్ధకవి ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి వీరి తండ్రి. ఎం. ఏ. పట్టభద్రులై ఆంధ్రజ్యోతి వారపత్రిఅక్లో (విజయవాడ) సబ్-ఎడిటర్ గా 1969-76 మధ్య పనిచేశారు. అభ్యుదయ కవిగా శర్మ ప్రసిద్ధులు.

1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరారు. తెలుగు ప్రసంగాల శాఖకు ఉషశ్రీకి సహాయకులుగా సంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. శర్మ చక్కని రూపకాలు రచించారు. వీరు రచించిన అమరారామం రూపకం 1981 లో జాతీయ స్థాయిలో బహుమతి పొందింది. 1986లో ' వర్షానందిని ', ' నేను కాని నేను ' బహుమతులు జాతీయస్థాయిలో అందుకోవడం విశేషం 1994లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా నిజామాబాద్ కేంద్రంలో చేరారు. 1995లో స్వచ్చంద పదవీ విరమన చేసి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంపాదకులుగా చేరారు.

కవిగా రచయితగా శ్రీకాంతశర్మ లబ్ధప్రతిష్టులు. వీరి రచనలు అలనాటి నాటకాలు శిలామురళి, పొగడపూలు, ఆలొచన, గాధావాహిని, సాహిత్య పరిచయం ప్రసిద్ధాలు. రూపక రచయితగా, గేయ రచయితగా శ్రీకాంతశర్మ శ్రోతలకు పరిచితులు. కొన్ని సినీ గీతాలు కూడా శర్మ వ్రాశారు. శర్మ స్నేహశీలి. వీరికి నూతలపాటి గంగాధరం సాహితీ పురస్కారం, ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించాయి.

సుత్తి వీరభద్రరావు :

ఆకాశవాణి నుండి ఎందరో కళాకారులు సినీ రంగానికి వెళ్ళి ధృవతారలయ్యారు. అలాంటివారిలో వీరభద్రరావు ఒకరు. ఆయకు ' సుత్తి ' పదం పేరులో భాగమైంది. సినీరంగంలో చేరి 50కి పైగా చిత్రాలలో నటించి ఎనలేని కీర్తి సంపాదించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా చేరి రెండు దశాబ్దాలు పనిచేసి 1980లో చిత్రపరిశ్రమలో చేరారు. 1988 జూన్ 30 న వీరభద్రరావు మదరాసులో కన్నుమూశారు. విజయవాడ కేంద్రంలో ఆయన నాటక విభాగములో చాలాకాలం పనిచేశారు. మంచి నటుడు, ప్రయోక్త.

నాటక రంగాన్ని పరిపుష్టం చేసిన మరికొందరిని స్మరించాలి. వేమవరపు శ్రీధరరావు నటుడుగా ప్రసిద్ధి గడించారు. అలానే కూచిమంచి కుటుంబరావు, వెంపటి రాధాకృష్ణ, సి. రామమోహనరావు, నండూరి సుబ్బారావు, నాగరత్నమ్మ, వి.బి. కనకదుర్గ, A.B. ఆనంద్, కమలకుమారి, నాటక విభాగంలో విశేష కృషి చేశారు. విజయవాడ నాటకాలంటే శ్రోతలు అప్పటికీ, యిప్పటికీ చెవులు కోసుకొంటారు. శ్రీ. S. A. పద్మనాభరావు ట్రాన్సిమిషన్ ఎగ్జిక్యూటివ్ గా 1978లో చేరి ప్రజా సంబంధాలు పటిష్టం చేశారు. 1991లో PEX అయ్యారు.

జె. వరలక్ష్మి, జె. శ్యామసుందరి హైదరాబాదు, విజయవాడ కేంద్రాలలో కొద్దికాలం పనిచేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్న V. S. రమాదేవి కొంతకాలం హైదరాబాదు కేంద్ర మహిళా విభాగం వ్యాఖ్యాతగా పనిచేశారు.

మోతీ వేదకుమారి విజయవాడ సంగీత విభాగంలో కొంతకాలం పనిచేసి పదవీ విరమణ చేసి ఏలూరు నియోజకవర్గ కాంగ్రెసు అభ్యర్ధిగా లోక్‌సభ సభ్యురాలుగా 1957లో ఎన్నికయ్యారు. ఇదొక విశేషం. ఇలానే హైదరాబాద్ లో అనౌన్సర్ గా పనిచేసిన సాదత్ అలీ ఖాన్ ప్రధానమంత్రి నెహ్రుకు విదేశాంగ కార్యదర్శిగా పనిచేసి పార్లమెంటు సభ్యులు కావడం విశేషం. వార్తా విభాగంలో 15 సంవత్సరాలుగా పనిచేస్తూ విజయవాడ కేంద్రానికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తులలో శ్రీప్రయాగ రామకృష్ణ, శ్రీ కొప్పుల సుబ్బారావు ముఖ్యులు. రామకృష్ణ అనౌన్సర్‌గా విజయవాడ కేంద్రంలో చేరి 1979లో న్యూస్ రీడర్ అయ్యారు. చిన్నపిల్లలకు అనేక గ్రంథాలు వ్రాశారు. వ్యాఖ్యాతగా మంచిపేరు తెచ్చుకొన్నారు. ఆధ్యాత్మిక విషయ సంపన్నుడు రామకృష్ణ. కొప్పుల సుబ్బారావు 1976లో ప్రొడక్షన్ విభాగంలోఓ చేరి 1980లో న్యూస్‌రీడర్‌గా మారారు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో విశేషంగా దళితులకై కృషి చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే సలహా సంఘ సభ్యులుగా పనిచేశారు.

నండూరి మదన గోపాల రామకృష్ణ :

(N. M. G. రామకృష్ణ)

మధ్యవయసులో విధి కాటు వేసిన వ్యక్తులలో రామకృష్ణ ఒకరు. 1941 మార్చి 27న వైష్ణవ కుటుంబంలో జన్మించిన రామకృష్ణ ఎం. ఏ. పట్టభద్రులయ్యారు. 1963లో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఆకాశవాణిలో చేరి వివిధ కేంద్రాలలో PEXగా పనిచేశారు. విజయవాడలో చాలాకాలం (1975-80ల మధ్య) పనిచేశారు. డెప్యుటేషన్‌పై వార్తా విభాగములో కరస్పాండెంట్‌గా కొంతకాలం (సంవత్సరంన్నర) విజయవాడలో పనిచేశారు. అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌ ప్రమోషన్ వదలుకొని విజయవాడలోనే ఉండిపోయారు. 1981 లో ASDగా రత్నగిరి (మహారాష్ట్ర) వెళ్ళారు. అక్కడనుంచి అదిలాబాదు వెళ్ళారు. 1988లో కొత్తగూడెం కేంద్రానికి తొలిస్టేషన్ డైరక్టర్‌గా వెళ్ళారు. 1991లో హఠాన్మరణం పొందారు. కొత్తగూడెం కేంద్రంలో వీరు రూపొందించిన కిన్నెరసాని రూపకానికి జాతీయస్థాయిలో బహుమతి లభించింది. రామకృష్ణ మంచి రచయిత. వీరి శ్రీమతి విజయవాడ యన్. ఆర్. ఆర్. కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.

నండూరి సుబ్బారావు :

విజయవాడ కేంద్రం నాటక విభాగంలో డ్రామా వాయిస్‌గా మూడు దశాబ్దాలు పనిచేసిన సుప్రసిద్ధులు నండూరి సుబ్బారావు. ఆయన బందా కనక లింగేశ్వరరావు హయాంలో ఆకాశవాణిలో చేరి ఎన్నో నాటకాలు నాటికలు వ్రాశారు. స్వయంగా రచయిత, నవలా కారుడు. వీరిగణపతి పాత్ర పోషణ, సక్కుబాయిలో కాశీపతి పాత్ర, వరవిక్రయం శ్రోతల్ని అలరిస్తూ వుంటాయి.

1933 జులై 7న కృష్ణాజిల్లా ఆరుగొలనులో జన్మించిన సుబ్బారావు బందా వారి సౌజన్యంతో 1960 ఆగస్టులో రేడియోరంగ ప్రవేశం చేశారు. 1961 జనవరి నుండి Drama Voiceగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి 1990 ఆగస్టు 31 న రిటైరయ్యారు.

20 నవలలు, రెండు రేడియో నాటక సంపుటాలు ప్రచురించారు. వీరి నవలల్లో ఆటబొమ్మ, దీపంజ్యోతి, అతకని బ్రతుకులు, విరిగిన కెరటాలు, వెన్నెల విలువెంత? మన శీనయ్య సంసారం, రాగరంజిక ప్రముఖాలు. పిల్లల నాటికల సంపుటి గూడా ప్రచురితమైంది. వీరు విశ్రాంత జీవితాన్ని విజయవాడలో గడుపుతున్నారు.

విక్రాంతగిరి శిఖరం, భగవాన్ రమణ మహర్షిరూపకాలలో వీరు శ్రీ గోపాల్‌తో కలిసి ప్రొడక్షన్ టీమ్‌లో పనిచేసి జాతీయస్థాయి ఆకాశవాణి బహుమతులందుకొన్నారు.

సంగీత కళాకారులు

శ్రీరంగం గోపాలరత్నం :

తనదైన మధుర కంఠస్వరంతో భక్తిరంజని ద్వారా శ్రోతల హృదయాలలో స్థానం సంపాదించుకున్న కుమారి శ్రీరంగం గోపాలరత్నం విజయవాడ కేంద్రంలో దాదాపు 20 సంవత్సరాలు స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత పదవీ విరమణ చేసి సికిందరాబాదు సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 1994 లో వీరు అనారోగ్యంతో మరణించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత సభల ద్వారా, భక్తిరంజని ద్వారా, రేడియో నాటకాల ద్వారా వీరు ఆంధ్రలోకానికి పరిచితులు

సంధ్యావందనం శ్రీనివాసరావు :

అనంతపురానికి చెందిన శ్రీ శ్రీనివాసరావు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో తొలినాళ్ళలో పనిచేశారు. చక్కటి కర్ణాటక బాణీలో గానం చేయగల వీరు అనేక భక్తరంజని కార్యక్రమాలు రూపొందించారు. 1994లో వీరు మరణించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రలో వీరు చక్కటి పేరు సంపాదించారు. మదరాసులో మ్యూజిక్ సూపర్‌వైజర్ గా చేరారు. వాద్యగోస్టులు నిర్వహించేవారు. విజయవాడలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. సంగీత కళాశాల (training) మదరాసు ప్రిన్సిపాల్‌గా చేశారు.

సుందరపల్లి సూర్యనారాయణమూర్తి :

క్లారినెట్ విద్వాంసులుగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో మూడు దశాబ్దాలు పనిచేసి పదవీ విరమణ చేశారు. యావద్భారత దేశంలో క్లారినెట్ వాద్యసభలద్వారా రసజ్ఞుల మన్ననకు పాత్రులయ్యారు.

సూర్యనారాయణమూర్తి 1931 అక్టోబరు 21న విశాఖపట్టణము జిల్లా చోడవరంలో జన్మించారు. తండ్రి నాగన్న వద్ద క్లారినెట్ నేర్చుకున్నారు. 1957 నవంబరు నుండి 1991 అక్టోబరు వరకు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో క్లారినెట్ కళాకారులుగా వ్యవహరించారు. 1983లో రాష్ట్రసంగీత నాటక అకాడమీ వారు కళాప్రవీణ బిరుదంతో సత్కరించారు.

దత్తాడ పాండురంగరాజు :

పాండురంగరాజుగారు వయొలిన్ విద్వాంసులుగా విజయవాడ కేంద్రంలో పని చేసిన వారిలో ప్రసిద్ధులు. వయొలిన్ వాయిస్తూ వారి స్వగృహంలో కాలధర్మం చెందారు.

N. C. V. జగన్నాథాచార్యులు :

నల్లాన్ చక్రవర్తుల వారి వంశంలో ఎందరో సంగీత విద్య నభ్యసించి ప్రసిద్ధులయ్యారు. అందులో జగన్నాథాచార్యులు గాత్రం ద్వారా బహుళ ప్రశస్తి పొందారు. లలిత సంగీతం ద్వారా, భక్తిరంజని కార్యక్రమాల ద్వారా ఆయన శ్రోతలకు పరిచితులు. వారు హఠాన్మరణం పొందారు. వారి స్మారక సంగీత పోటీలు వారి మిత్రులు ఏటా నిర్వహిస్తున్నారు. వారి సోదరులు నరసింహాచార్యులు ప్రస్తుతం అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా డిల్లీ కేంద్రంలో పనిచేస్తున్నారు. ప్రముఖ రచయిత శ్రీ నిరించి వీరి అన్నయ్య. ఆకాశవాణి నిలయ కళాకారులుగా కొందరు ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు స్వీకరించగా మరి ఎందరో ఆకాశవాణి ద్వారా తమ కళా నై పుణ్యాన్ని ప్రదర్శించి శ్రోతల మన్ననలు అందుకొంటున్నారు.

మలాది సూరిబాబు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో చక్కటి పేరు గడించారు. వీరి కుమారులు మల్లాది సోదరులు పేర గాత్రకచేరీలు నిర్వహిస్తున్నారు. సూరిబాబు రేడియో అనౌన్సర్‌గా రెండున్నర దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. శ్రీరామప్రసాద్, రవికుమార్ వీరి కుమారులు. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఆరితేరినవారుగా వేదుసూరి కృష్ణమూర్తిగారి వద్ద విద్య నభ్యసించారు.

కుమారి కౌతా ప్రియంవద స్వరకర్తగా మంచి పేరు తెచ్చుకొన్నారు. సుప్రసిద్ద చిత్రకారులు కౌతా రామమోహన్ శాస్త్రిగారి పుత్రిక. వీరు విజయవాడ, కడప కేంద్రాలలో పనిచేసి పదవీ విరమణ చేశారు. కర్ణాటక లలిత సంగీతాలలో అందె వేసిన చేయి. విష్ణుభొట్ల సోదరులు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. విష్ణుభొట్ల ముకుంద శర్మ విశాఖపట్టణ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. రెండవ సోదరుడు ఉదయశంకర్ మృదంగ విద్యాప్రవీణుడు. వీరి సోదరీమణులు కృష్ణవేణి, సరస్వతి సంగీత విదుషీమణులు కావడం విశేషం. సరస్వతి భర్త B. V. S. ప్రసాద్ విజయవాడ కేంద్రంలో పనిచేస్తున్నారు. మోదుమూడి సుధాకర్, మంగళగిరి ఆదిత్య ప్రసాద్, శిష్ట్లా శారద, సద్గురు చరణ్, బి. వి. యస్. ప్రసాద్, సతీష్ విజయవాడ కేంద్ర నిలయ కళాకారులుగా విశేష సేవ చేస్తున్నారు. సుధాకర్ స్వరకర్తగా మంచి పేరు తెచ్చుకొన్నారు. వీరి సతీమణి అంజని గాత్ర విదుషీమణి.

ఆకాశవాణి దశాబ్దాలుగా కళారంగానికి ఎందరో మహనీయులను అందించి కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవ చేస్తోంది. భారతదేశంలోని సుప్రసిద్ధ విద్వాంసులు ఆకాశవాణిలో పని చేయడం విశేషం. డా|| మంగళంపల్లి బాలమురళీకృష్ణ, యం. యస్. సుబ్బలక్ష్మి (ఎమిరిటస్ ప్రొడ్యూసర్) మంచాళ జగన్నాథరావు, వింజమూరి వరదరాజ అయ్యంగార్, N. S. శ్రీనివాసన్, వింజమూరి సీతాదేవి, ఓలేటి వెంకటేశ్వర్లు, సంధ్యావందనం శ్రీనివాసరావు, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ యిలా ఎందరో ఆకాశవాణి కొత్త పుంతలు తొక్కడానికి మార్గదర్శకు లయ్యారు.

ఏల్చూరి విజయరాఘవరావు :

వేణుగానలోలురైన ప్రపంచ ప్రఖ్యాతిగన్న వ్యక్తి ఏల్చూరి విజయరాఘవరావు. నయాగరా కవులలో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యం వీరి అగ్రజులు. ఆయన సోవియట్ లాండ్ కార్యాలయంలో సంపాదకులుగా పనిచేశారు. నరసరావు పేటలో జన్మించిన రాఘవరావు యింతింతై వటుడింతయై అన్నట్లు జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. బొంబాయిలోని ఫిల్మ్స్ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తూ ఎన్నో డాక్యుమెంటరీలు తీశారు. సంగీత దర్శకత్వం వహించారు. స్వయంగా నటులు. ఉదయశంకర్‌తో కలిసి పనిచేశారు. ఎన్నో సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు. భారత ప్రభుత్వం వీరిని పద్మశ్రీ బిరుదంతో సత్కరించింది.

ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి కుమారులు మురళీధర్ ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1978-81 మధ్య డ్యూటీ ఆఫీసర్ గా పనిచేశారు. చక్కని పద్యరచన చేయగల సమర్థులు. ఆకాశవాణి పదవికి రాజీనామా చేసి కొత్త ఢిల్లీలోని వెంకటేశ్వర కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్నారు. పరిశొధన చేసి Ph.D. డిగ్రీ పొందారు. పురాణాలకు వ్యాఖ్యానం వ్రాసిన దిట్ట.

వింజమూరి లక్ష్మి :

గానకోకిలకు ప్రతిరూపం వింజమూరి లక్ష్మీ స్టాప్ ఆర్తిస్టుగా విజయవాడలో చేరి తర్వాత ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయ్యారు. ఆకాశవాణిలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా విజయవాడ, మదరాసు కేంద్రాలలో 20 ఏళ్లు పనిచేసి స్వచ్చంద పదవీ విరమణ చేశారు. మదరాసులో స్థిరపడ్డారు. కర్ణాటక లలిత సంగీతాలలో ప్రావీణ్యం పొందారు.

ద్వారం మంగతాయారు, పెమ్మరాజు సూర్యారావు, M. V. రమణమూర్తి, సంగీత విభాగంలో పనిచేసిన మరికొందరు ప్రముఖులు. కుటుంబయ్యగారు, తంబురా కళాకారులే అయినా వ్యవసాయ విభాగంలో 'మార్కెట్ రేట్లు' రెండు దశాబ్దాలకు పైగా చదివారు. మిమిక్రీ కళాకారులు వీరిని అనుకరించడం కద్దు.

ఆమంచర్ల గోపాలరావు (1907-69) :

నెల్లూరు జిల్లా కావలిలో 1907 సెప్టెంబరు 26న ఆమంచర్ల గోపాలరావు జన్మించారు. చిన్ననాటి నుండి స్వాతంత్రోద్యమంలో విరివిగా పాల్గొన్నారు. సహాయ నిరాకరణోద్యమంలో వాలంటీరుగా పనిచేశారు. జాతీయోద్యమంలో భాగంగా 1930వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. ప్రముఖ రాజకీయ నాయకులు డా|| బెజవాడ గోపాలరెడ్డిగారికి వీరు జిల్లా కాంగ్రెసు రాజకీయాలలో సమకాలికులు. గుంటూరులో యూత్‌లీగ్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కొంతకాలం తెరవెనుక ఉండి పోవలసి వచ్చింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో 1952 లో వీరు పనిచేశారు.

గోపాలరావు చక్కని రచయిత. వీరి రచనలలో విశ్వంతర, హిరణ్యకశిపుడు ప్రముఖ నాటకాలు. మాట పట్టింపు, మల్లమ్మ ఉసురు, అపరాధి నాటికలు, చలనచిత్రరంగంలో గోపాలరావు కృషి శ్లాఘనీయం. తెలుగు చలన చిత్రాలలోనే గాక హిందీ చలన చిత్రాలలో గూడ సహాయ దర్శకులుగా పనిచేశారు. 'కాలచక్రం', 'ఒకరోజు రాజు' తెలుగు చిత్రాల దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మరికొన్ని చిత్రాలకు ఆర్ట్ డైరక్టరుగా పనిచేశారు.

చిత్రకారుడుగా గోపలరావు ప్రకృతి దృశ్యం చిత్రీకరణపట్ల ఆకర్షితులయ్యారు. చిత్రకళపై ఆయన అనేక వ్యాసాలు వ్రాశారు. అనంతపురం జిల్లాలోని లేపాక్షి కుడ్య శిల్పాల సౌందర్యాన్ని గూర్చి ఇంగ్లీషులో చక్కని గ్రంథం వ్రాశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆమంచర్ల వారు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో కొంతకాలం అసిస్టెంట్ ప్రొడ్యూసర్‌గా కార్మికుల కార్యక్రమాలు రూపొందించారు.

గోపాలరావు 1969 ఫిబ్రవరి 7న తనువు చాలించారు.

కందుకూరి రామభద్రరావు :

అమలాపురం తాలూకా రాజోలుకు చెందిన విద్యావినయసంపన్నులైన రామభద్రరావు విద్యావిభాగం ప్రొడ్యూసర్ గా విజయవాడ కేంద్రంలో పని చేశారు. వీరి కాలంలో విద్యాప్రసార రంగంలో కొత్త పోకడలు సృష్టించారు. స్వయంగా దేశభక్తి గేయాలు, ప్రణయ గీతాలు వ్రాశారు. కృష్ణశాస్త్రి భావకవితోద్యమ స్ఫూర్తిని పొందారు. స్వయంగా కొంతకాలం అధ్యాపకులుగా పని చేశారు. దూరదర్శన్‌లో పనిచేసే ఓలేటి పార్వతీశంగారికి మాతామహులు. వీరి కుమారులు కందుకూరి సూర్యనారాయణ రెండున్నర దశాబ్దాలపాటు ఢిల్లీ తెలుగు వార్తా విభాగంలో 'న్యూస్ రీడర్‌' గా పనిచేసి 1996 లో రిటైరయ్యారు. వీరి సతీమణి వెంకటలక్ష్మి రచయిత్రి.

వేమవరపు శ్రీధరరావు :

ఆకాశవాణి విజయవాడ కేంద్రం పరిపాలనా విభాగంలో రెండు దశాబ్దాలు పనిచేసిన శ్రీధరరావు చక్కని నటులు, భీమ పాత్రధారిగా ఆయన యావదాంధ్ర దేశానికి పరిచితులు. చక్కని గాత్ర, వాచికాభినయం గల శ్రీధరరావు పౌరాణిక నాటకాల ద్వారా ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొన్నారు.

మరికొందరు :

రేడియోలో కొద్దిరోజులు పనిచేసి వివిధ రంగాలలోకి వెళ్ళినవారు ఎందరో ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాటక విభాగానికి ఆచార్యులుగా పనిచేసి హైదరాబాదు కేంద్ర విశ్వ విద్యాలయంలో పనిచేసిన ఆచార్య మొదలి నాగభూషణశర్మ తొలి రోజుల్లో రెండేళ్ళపాటు ఆకాశవాణి పూనా కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. అలానే మచిలీపట్టణంలో జాతీయ కళాశాలలో ఆంగ్లశాఖ రీడర్‌గా పనిచేస్తున్న శ్రీ P. V. G. కృష్ణశర్మగారు భొపాల్ కేంద్రంలో రెండేళ్ళు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 'మల్లిక్‌'గా కథా, నవలా రచయితగా వారపత్రికల ద్వారా పరిచితులైన 'మల్లిక్‌' హైదరాబాద్ వివిధభారతి కేంద్రంలో కొద్దికాలం పనిచేసి రాజీనామా చేశారు. ప్రస్తుతం విశాఖపట్టణంలో పోలీసు కమీషనర్‌గా పనిచేస్తున్న శ్రీ R. P. మీనా కొంతకాలంపాటు రాజస్థాన్‌లోని ఆకాశవాణి కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఇలా ఇంకెందరో !