ప్రసార ప్రముఖులు/ఢిల్లీ తెలుగు వార్తలు
జనమంచి రామకృష్ణ :
తొలి తరం ప్రసార ప్రముఖులలో జనమంచి రామకృష్ణ ప్రముఖులు. మదరాసు కేంద్రంలో స్టాఫ్ ఆర్టిస్టుగా 1948లో చేరి చాలాకాలం అక్కడే పనిచేశారు. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా సెలక్టు అయి హైదరాబాదు చేరుకొన్నారు. వీరి ఆధ్వర్యంలో నాటకాలు బహుళ జనామోదం పొందాయి. స్వయంగా రచయిత. కొంత కాలం ఢిల్లీ నుండి తెలుగు వార్తలు చదివారు. 1980లలొ హైదరాబాదు కేంద్రంలో పదవీ విరమణ చేసి కొంతకాలం తర్వాత తనువు చాలించారు. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీ రమేష్ పాత్రో వీరి సన్నిహిత బంధువులు.
M. S. శ్రీరాం :
శ్రీరాం సంగీత దర్శకుడుగా చలనచిత్రరంగంలో లబ్ద ప్రతిష్ఠులు. మంచి రోజు, పెళ్ళి రోజు చిత్రాలకు జమున నాయికగా వీరి దర్శకత్వంలో వెలువడ్డాయి. 1977లో UPSC ద్వారా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా నియమితులై విజయవాడ కేంద్రంలో చేరారు. రెండేళ్ళ తర్వాత కడప బదిలీ అయ్యారు. అక్కడ నుండి మదరాసు దూరదర్శన్ కేంద్రానికి బదిలీ అయ్యారు. అక్కడే అసిస్టెంట్ డైరక్టర్ గా పదోన్నతి పొందారు. అక్కడ పనిచేస్తుండగా హఠాన్మరణం పొందారు. ఈమని శంకరశాస్త్రిగారు వీరికి మేనమామ.
చక్కటి సంగీత కార్యక్రమాల రూపకల్పన చేసిన శ్రీరాం ప్రసార రంగంలో చెప్పుకోదగిన ప్రముఖులు.
ఢిల్లీ తెలుగు వార్తలు
"తెలుగులో వార్తలు - చదువుతోంది కొంగర జగ్గయ్య' అని తన సుమధుర గళంతో వార్తలు వినిపించారు జగ్గయ్య. అది స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళు. ఢిల్లీనుండి తెలుగులో వార్తలు రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నుండి ప్రసార మౌతున్నాయి. శ్రీశ్రీ వంటి సుప్రసిద్ధులు తెలుగువార్తలు తొలిరోజుల్లో చదివారు. జగ్గయ్య ఆ తర్వాత సినీరంగం ప్రవేశించి హీరోగా పేరు తెచ్చుకొన్నారు. కొంత కాలం ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా (కాంగ్రెసు) వ్యవహరించారు. కపిల, కాశీపతి, శ్రీ వాత్సవ, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, పన్యాల రంగనాధరావు, వనమాలి ప్రసాద్, జోళిపాళ మంగమ్మ, కందుకూరి సూర్యనారాయణ, తిరుమలశెట్టి శ్రీరాములు, అద్దంకి మన్నార్, వావిలాల రాజ్యలక్ష్మి, దుగ్గిరాల పూర్ణయ్య, ఏడిద గోపాలరావు - మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి వార్తలు చదవడంతో తెలుగువారి హృదయాలకు సన్నిహితులయ్యారు.
ప్రస్తుతం వార్తలు డిల్లీ నుండి సమ్మెట నాగ మల్లేశ్వరరావు, గద్దె దుర్గారావు, యండ్రపాటి మాధవీలత, వడ్లమూడి రాజేశ్వరి చదువుతున్నారు. వీరుగాక క్యాజువల్‌గా మరికొందరు వార్తలు చదువుతున్నారు. నరసింగరావు, న్యూస్ రీడర్‌గా కొంతకాలం పనిచేసి వ్యాధిగ్రస్తులై మరణించారు. సూర్యదేవర ప్రసన్నకుమార్ వార్తలు చుదువుతున్నారు.
వనమాలి ప్రసాద్ డైరక్టర్, వార్తా విభాగంగా ఢిల్లీలో పనిచేశారు.
ఏడిద గోపాలరావు 1996 సెప్టెంబరు 30 న ఢిల్లీ వార్తా విభాగంలో న్యూస్ రీడర్ గా పదవీ విరమణ చేయడంతో ఒక పాత శకం అంతరించింది. రంగస్థల నటుడుగా, దర్శకుడుగా, కార్యకర్తగా ఆయనకు మంచిపేరు. ఢిల్లీలో 'సరస నవరస' అనే నాటక, సాంస్కృతిక సంస్థను స్థాపించి రెండు దశాబ్దాలు పోషించారు. వందకు పైగా నాటకాలు ఆ సంస్థ ద్వారా ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ నాటక అకాడమీ గౌరవ సభ్యులుగా కొంతకాలం పనిచేశారు. 'ధియేటర్ ఆర్ట్స్'లో డిప్లొమా పొందారు. ఉత్తరాదిలో దక్షిణాది ప్రముఖుల పేర వివిధ పత్రికలలో వ్యాసాలు ప్రచురించారు. మాస్కో రేడియోలో 1982-86 మధ్యకాలంలో పనిచేశారు. అక్కడ వారికి పత్ని వియోగం కలిగింది. ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు వీరి సోదరులు. 1996 సెప్టెంబరులో వీరు పదవీ విరమణ చేశారు.
శ్రీశ్రీ (1910-1983) :
1910 జనవరి 2న విశాఖపట్టణంలో జన్మించిన శ్రీరంగం శ్రీనివాసరావు ఆధునికాంధ్ర కవిత్వంలో విశిష్టకవి. ప్రకృతి శాస్త్రంలో మదరాసు విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన తర్వాత కొన్నాళ్ళు పత్రికలలో ఉపసంపాదకులుగా పనిచేశారు. ఆ తర్వాత 1950లో చలన చిత్రరంగంలో చేరి విశిష్ట స్థానం సంపాదించారు. మాటలు, పాటలు వ్రాసి ప్రేక్షకుల ఆదరం సంపాదించారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి తెలుగు వార్తలు కొంతకాలం చదివేవారు.
శ్రీశ్రీ మొదటి కవితా సంపుటి ప్రభవ 1928లో ప్రచురితమైంది. మహా ప్రస్థానం, ఖడ్గసృష్టి, మూడు యాభైలు కవితా సంపుటాలు ! + 1, చతురస్రం గయోగ నాటికలు, వ్యాసాలు, ప్రసంగాలు, నాటకాలు ఆకాశవాణి ద్వారా ప్రహరితమయ్యాయి. ఆకాశవాణి ఉగాది కవి సమ్మేళనాలలో ఆయన పాల్గొనడం ఒక హైలైట్. 1979 లో వారికి రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు లభించింది. 1973లో ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు.
1971 లో శ్రీశ్రీ షష్టిపూర్తి సంఘం శ్రీశ్రీ సాహిత్య సంపుటాలను ప్రచురించింది. 'విరసం' ఆవిర్భావానికి ఆయన కారకులు. తొలి అధ్యక్షులు. 1966 లో సోవియట్ భూమి నెహ్రూ అవార్డు పొంది సోవియట్ యూనియన్‌లో పర్యటించారు. 'గర్జించు రష్యా', అన్న వీరి కవిత ప్రసిద్ధం. 1930-33 మధ్య వ్రాసిన కవితలు మహాప్రస్థానంగా ప్రకటించారు. అభ్యుదయ సాహిత్యో ఉద్యమానికి రథసారది ఆరుద్రతో బాంధవ్యం వుంది. తన 74వ ఏట (15-6-83) శ్రీశ్రీ కాలధర్మం చెందారు.
అవిభక్త మదరాసు రాష్ట్ర శాసనమండలిలో సభ్యులుగా శ్రీశ్రీ వ్యవహరించారు. ఆంధ్రంలోను, ఆంగ్లంలోను సమానంగా సామర్థ్యం చూపగల దిట్ట. 1946లో 'వారం వారం' అనే వచన రచనల సంకలనం, 1956లో మరో ప్రపంచం ఇవే రేడియో నాటికల సంపుటి. 1957లో చరమరాత్రి కథల సంపుటి ప్రచురించారు. ప్రానక్రీడల పేరుతో కార్టూన్ కవిత్వానికి నాంది పలికింది శ్రీశ్రీ ------- అనే హాస్యధోరణిలో కవితలు వ్రాశారు. 1943లో అభ్యుదయ రచయితల సంఘ అధ్యక్షులయ్యారు. సాహిత్యోద్యమాలతో నిరంతరం అనుబంధం పెంచుకున్న వ్యక్తి శ్రీశ్రీ. ఇరవై శతాబ్ది తెలుగు సాహిత్యంలో విలక్షణ కవితాయుగ ప్రవర్తకుడు శ్రీశ్రీ.
కొంగర జగ్గయ్య :
కంచు కంఠంతో ఆంధ్ర సినీ ప్రేక్షకులను మూడు దశాబ్దాలు అలరించిన కొంగర జగ్గయ్య రేడియోలో వార్తలు చదివారంటే ఈ తరానికి తెలియదు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమయ్యే తెలుగు వార్తలను ఒక సంవత్సరంపాటు 1947 ప్రాంతాలలో చదివారు జగ్గయ్య. జగ్గయ్య దుగ్గిరాల (గుంటూరు జిల్లా) లో 1920 దశకంలో జన్మించారు. బి.ఏ. పూర్తిచేసి రేడియోలో పనిచేస్తున్న కాలంలో సినీ దర్శకుల దృష్టిలో పడ్డారు. వందలాది చలన చిత్రాలలో పనిచేశారు. చాలా సినిమాలలో డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు. స్వయంగా చిత్రాలు నిర్మించారు.
1971 లో పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు పక్షాన నిలబడి ఒంగోలు లోక్‌సభ స్థానానికి ఎంపికయ్యారు. లోక్‌సభలో సాంస్కృతిక విషయాలను ప్రస్తావించి సభ్యుల దృష్టిని ఆకర్షించారు.
స్వయంగా రచయిత అయిన జగ్గయ్య రవీంద్ర గీతావళిని తెలుగులోకి అనువదించి ప్రచురించారు. చక్కటి పద్యరచన చేయగల సమర్ధులు జగ్గయ్య. ఆత్రేయగారి మీద అభిమానంతో ' మనస్విని ' ప్రచురణలు వెలువరించారు. జగ్గయ్య మదరాసులో స్థిరపడ్డారు.
విదేశీ తెలుగు కార్యక్రమాలు
రేడియో మాస్కో నుండి 1968 నుండి తెలుగులో అరగంట కార్యక్రమాలు ఆసియా దేశాలకు ప్రసారమయ్యేవి. కమ్యూనిస్టు రష్యా విడిపోయి ముక్కలైన తర్వాత ఈ ప్రసారాలు నిలిచిపోయాయి. ఢిల్లీ వార్తల విభాగం నుండి ఎందరో మాస్కోకి డెప్యుటేషన్‌మీద రెండేళ్ళపాటు వెళ్ళి అక్కడ ఒకరిద్దరు ఉద్యోగుల సహకారంతో తెలుగు కార్యక్రమాలు రూపొందించారు.
వారిలో శ్రీయుతులు తిరుమలశెట్టి శ్రీరాములు, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, భండారు శ్రీనివాసరావు (హదరాబాదు) చెప్పుకోదగినవారు. వారు ఆ దేశీయుల ప్రేమాదరాలకు పాత్రులయ్యారు.
ఆకాశవాణి విదేశీ ప్రసార విభాగం ఓవర్‌సీస్ ప్రసారాలలో తెలుగు ప్రసారాలను 1990 ఉగాది నుండి ప్రారంభించింది. అప్పట్లో కేంద్ర ప్రసారశాఖా మంత్రిగా పర్వతనేని ఉపేంద్ర ఉండేవారు. ఉదయం 4-30 ని. ల. ప్రాంతంలో 30 నిముషాలు ఈ ప్రసారాలు ఢిల్లీ నుండి జరిగేవి. 1995 నుండి ఈ విదేశీ ప్రసారాలు హైదరాబాదు కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. South East Asia దేశాల