ప్రభుత్వము/శాసనవివరణస్వరూపము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దురదృష్టమును, మహాయుద్ధముల విపత్తునకు సిద్ధమయి యుండ వ్రాసిన దుర్దినమును రష్యాకు తప్పనందున స్టాలినుబోటివానికి గూడ ఏకాధిపత్యదుష్కీర్తి సంభవించినది. లోకమునందు యంత్రయుగముపై కల్గిన జుగుప్స కొలది ఆయుగప్రాబల్యము తరిగి గృహపరిశ్రమ లెక్కువగా నాధారపరచుకొని శాంతిజీవసము నడుపుకొను దినములు లోకమునకు కలిగినప్పుడు సోవియెట్టు లేదా పంచాయతిరాజ్యములో నిరంకుశుడు లేక దాసుడు లేక అందరును సమానులుగా ప్రజోపయోగకార్యకరణదక్షులుగా సుఖపడగలరు. మన భారతభూమికిగల మితజీవనదృష్టి, అహింస, సత్యాన్వేషణపరత్వము, వీనితో మనమును ఈ పరిణామమునకు తోడ్పడవలసియున్నది. తోడ్పడగలము.

_________

శాసనవివరణస్వరూపము

(న్యాయ విచారణశాఖ)

భాషయొక్క స్వభావము ననుసరించియే శాసన వివరణ మవసరమగుచున్నదని ఇదివరలో వ్రాయబడియెను. సంఘముయొక్క స్వభావమును ఇందునకు అనుకూలమగుచున్నది. మానవుడు మానవుడుగా నున్నంతకాలము స్వార్థపరత్వము పూర్ణముగా భువిని వీడి చను ననుటకల్ల. ఉత్తమప్రకృతులలోనే స్వార్థపరత్వము కార్యకారణమగుచుండుట తప్ప లేదు. అట్టి సందర్భమున సామాన్యప్రకృతులమాట చెప్పనేల ? ఒక్కరితో నొక్కరు వివాదములుపడుట మానవులకు సహజము. లోకము నాగరకవంతమయినట్లెల్ల ఈవివాదధోరణి హెచ్చగుటయు ప్రస్తుతయుగమున కానవచ్చుచున్నది.

విభేదముల తీర్మానము

సంఘములోని ప్రజలందరును ఒక్కచోట గుమిగూడి ఆలోచించుకొని సమ్మతినిచ్చినను ఈయకున్నను మొత్తముమీద వారియందర మౌనాంగీకారము కలదగుటచేతనే ప్రభుత్వము అనునట్టి ప్రకృతి లోకమున ప్రత్యేకముగా నేర్పడుచున్నది. ఏర్పడినపిదప ప్రభుత్వమను పదార్థమొక్కటియు ప్రజయను పదార్థమొక్కటియునై ఈరెంటికిని విభేదములు కలుగుచున్నవి. ప్రభుత్వమునందును ప్రత్యేకవ్యక్తు లుందురు, ప్రజయందును ప్రత్యేక వ్యక్తులుందురు. ప్రభుత్వము నందుండు ఒక్కొక్క ప్రత్యేకవ్యక్తియు ప్రభుత్వముకాదు. ఆత డధికారియాత్రమగును. ప్రజయందలి యొక్కొక్క వ్యక్తియు ప్రజకాదు. అతడు పౌరుడు మాత్రమగును. కాబట్టి నేటి సంఘజీవితమునందు అయిదువిధములైన విభేద కారణములు కలవు. 1 మానవునకు మానవునకు గలుగునట్టివి, 2 సంఘమునకు ప్రభుత్వమునకు కలుగునట్టివి, 3 పౌరునకు ప్రభుత్వమునకు కలుగునట్టివి, 4 పౌరునకు అధికారికి కలుగునట్టివి, 5 అధికారికి అధికారికి కలుగునట్టివి.

వీనిలో సంఘమునకును ప్రభుత్వమునకును కలుగునట్టి విభేదములను ప్రజాపరిపాలితదేశముల యందు ఎన్నికలలో ప్రజూనుకూలముగ ప్రభుత్వమును మార్చుకొనుట చేతను తదనుగుణశాసననిర్మాణముచేతను తీర్చుకొనుచున్నారు. ప్రజూపరిపాలన పూర్ణముగాలేని దేశములయందును అంకితములైన దేశములలోను ఆయాదేశములకు తగినరీతిని ఆందోళనము సలిపి ప్రభుత్వమును ప్రజ తమదారికి దెచ్చుకొనుటకు జూచుచు సాధ్యమైనంతమట్టుకు తీర్చుకొను చుందురు.

అధికారికి అధికారికి కలుగునట్టివిభేదములు రెండు తెరంగులు. సమానాధికారములుకలవారికి కలుగు విభేదములు ఒక తెగ. ఎక్కువయధికారికి తక్కువ యధికారికి కలుగు విభేదములు ఇంకొక తెగ. ఈరెండవ తెగకు సంబంధించిన విభేదములను మనము గమనింపనక్కరలేదు. దేశములోని యుత్తమాధికారి వరకుంగల పరంపరలో నెవ్వరేని యొక్క రీవిభేదములను సమపరచుచున్నారు. సమానాధికారము కల యధికారులవిషయముమాత్ర మాలోచింపదగినది. ప్రత్యేకము ప్రత్యేకము స్వాతంత్ర్యములు కలిగియు అమెరికాసంయుక్తరాష్ట్రములలోవలె రాష్ట్రము లనేకము లొక్క సంయుక్త రాష్ట్రముగా చేరినప్పుడు సమానాధికారుల విభేదముల మాట యాలోచనకు వచ్చును. అట్టి విభేదములు ఆరాష్ట్రముల ప్రతినిధులచే నేర్పడు శిష్టసభలో తీర్మానమగుచున్నవి.

తక్కుంగల మూడువిధములగు విభేదములను తీర్చునట్టి యధికారము నేటిదినము ఎక్కువగా ప్రభుత్వమునకే సంక్రమించి యున్నది. సంక్రమించుచున్నది. పూర్వకాలమునందు- నేటి నవీననాగరకము లోకమును తన స్వాధీనము చేసికొనుటకు ముందు - మానవునకును మా నవునకునుగల విభేదములేమి, పౌరునకు ప్రభుత్వమునకు కల విభేదములలో ననేకములేమి పంచాయతుల మూలకముగా తీర్మానమగు చుండినవి. కాని పూర్వకాలములు మారి పరిపూర్ణ ప్రజాపరిపాలనము లేర్చడు భవిష్యత్కాలము లింకను రాకయుండు మధ్యకాలములందు చాల యెక్కువగా న్యాయవిచారణాథికారము, అనగా శాసనవివరణాధికారము, అధికారవర్గమువారి చేతుల లోనికే పోయినది. ప్రజాపరిపాలన తలసూప నారంభించినతోడనే మరల పంచాయతులకు బల మేర్పడుట సంభవించుచున్నది. న్యాయవిచారణ క్రమక్రమముగా మరల ప్రజలకే సంక్రమించుచున్నది. అందుచేత న్యాయవిచారణశాఖ ఎల్లదేశములలోను బహు జాగరూకతతో నియమించుచున్నారు. అధికారవర్గమునకు న్యాయవిచారణ శాఖ యంకితమయిపోయి ప్రజాపీడ జరుగకుండుట కెన్ని ఏర్పాటులు, కావింపవలయునో యేర్పాటులును నాగరకరాష్ట్రములు చేసికొనుచున్నవి.

రెండు ముఖ్యగుణములు

అందుచేతనే న్యాయవిచారణాధికారులు రెండు ముఖ్యగుణములు కలవారుగానుండుట యవసరమని సర్వరాష్ట్రములును అంగీకరించినవి (1) శాసనముల జ్ఞానము వారికి సంపూర్ణముగా నుండవలెను. ఇది సులభసాధ్యము కాదు. (2) వారు సంపూర్ణముగా నిష్పాక్షిక బుద్ధి కలవారుగా నుండవలెను. ప్రభుత్వమునకే వ్యతిరేకమయిన తీర్మానము చెప్పవలసివచ్చినను నిస్సంశయ ముగా చెప్పునంతటి స్వాతంత్ర్యము కలవారుగా నుండవలెను.

మూడుపాయములు

ఇట్టివారిని సంపాదించుటకు నాగరకరాష్ట్రములు మూడుపాయముల నవలంబించియున్నవి. మొదటి యుపాయము వారిని నియమించుపద్ధతికి సంబంధించినది. రెండవ యుపాయము వారి యధికారమునకు సంబంధించినది. మూడవయుపాయము వారు పొందవలసిన ప్రతిఫలమునకు సంబంధించినది.

న్యాయవిచారణాధికారులను నియమించు నధికారమును శాసననిర్మాణసభలు పెట్టుకొననగునాయని న నదియంత ఫలవంతమగునని చెప్పుటకురాదు. శాసననిర్మాణసభయం దొక్కకక్షి, యెల్లప్పుడును బలవత్తమముగా నుండును, కాబట్టి న్యాయవిచారణకర్త ఏకక్షికి చేరిన వాడోయను ఆలోచన రావచ్చును. నిజముగా న్యాయవిచారణ చేయవలసినవాడు ఏకక్షికిని చేరియుండరాదు. అది యట్లుండ శాసననిర్మాణముచేయు సభయే, శాసన వివరణకర్తలను నియమించుటకు, తీసివేయుటకు నధికారము కలదయినచో దాని యధికారము విపరీతము కావచ్చునని కొందఱ యభిప్రాయము. ఏవంవిధమగు నాక్షేపమే అధికారవర్గమువారు న్యాయవిచారణకర్తలను నియమింప రాదను సిద్ధాంతమునకు ఆధారమైనది. పోనిండు ప్రజాసమూహమే వీరిని నిర్వచింపవచ్చు నందమా ? న్యాయవిచారణకర్తల కార్యము సామాన్యముగాదు. అట్టి కార్యమున కర్హతగలవారిని నేర్పరచుభారము సహస్రశీర్షంబగు ప్రజ ధరింపగలదా ?

న్యాయవిచారకర్తలను నియమించు నధికారమును మరి నాగరికలోక మెవ్వరికి ప్రసాదించినది? ఉత్తమాధికారికి, అనగా నధికారివర్గమునకు. ఇక న్యాయవిచారణ కర్తల స్వాతంత్ర్యము గతియేమియని సందియము పడవలదు. ఉత్తమాధికారికి సామాన్యముగా నియమించు నధికారము మాత్రమున్నది. తీసివేయునధికారము లేదు. జీతము తగ్గించు నధికారములేదు. సాధారణముగా మార్చునట్టి యధికారముకూడ లేదు. న్యాయవిచారణాధికారిని నియమించిన తరువాత దుర్మార్గప్రవర్తకుడు కానంతకాలము న్యాయవిచారాణాధికారిని, తాకుటకైనను ఉత్తమాధికారికి స్వాతంత్ర్యమ లేదు. ఇదియే నాగరక రాష్ట్రములు అవలంబించిన రెండవయుపాయము. తన పదవినుండి తన్ను తొలగించు నధికార మెవ్వరకునులేదని తెలిసినప్పుడు మానవుడు చూపగల స్వాతంత్ర్యము మిక్కిలి యెక్కువ. ఈ యుపాయమేకాక మరియొక యుపాయమును నాగరకలోక మవలంబించినది. తగిన యాదాయములేనినాడు మానవుడు పదిరూపాయల లాభముదొరుకు ననినయెడల భ్రమప్రమాదముల పాలగుట సంభవింపవచ్చును. న్యాయవిచారణకర్త లిట్టి భ్రమ ప్రమాదములకు లోనగుదురేని న్యాయవిచారణ యంతయు నెదురుదిరుగును. కాబట్టి లోకములోని నాగరకరాష్ట్రము లంతటను న్యాయవిచారణకర్తలకు మిక్కిలి యెక్కున జీతములు నిర్ణీతములయి యున్నవి. ఏమాత్రము వ్యామోహమునకును ఎడమీయనియంత సౌఖ్యమునకు దగిన జీతములు వీరి కేర్పడవలయుననుట సిద్ధాంతము.

వైపరీత్యములు

ఇంతటి యాలోచనలు చేసియు న్యాయవిచారణకర్తలు ఇంకను కొన్నిదేశములలో పరిపూర్ణస్వాతంత్ర్య మును కనుబరచుటలేదు. ఇటాలియారాజ్యమునందు న్యాయవిచారణకర్తలను ఒక తావునుండి యొకతావునకు మార్చునట్టి యధికారము అధికారశాఖవారికి నుండుటను బట్టి అచ్చటి న్యాయవిచారణాధికర్తలు కొంతకుకొంత స్వాతంత్ర్యము గోలుపోయినవారుగ నున్నారట! ఆంగ్ల సామ్రాజ్యములోని మనదేశమునందు అధికారశాఖవారికే న్యాయవివరణాధికారము చేతి కబ్బియున్నది. జిల్లా కలెక్టరునకును, అతనికి లోబడిన యధికారులకును న్యాయవివరణకు సంబంధించిన యధికారములు ఎక్కువగాకలవు. అందుచేతనే అధికారవర్గమువారు తలధరించు నధికారమునకును మేరలేకయున్నది. మనదేశమునందు ప్రాంతములకు ఉత్తమన్యాయస్థానములు ను, జిల్లాలలో జడ్జీల విచారణయుకలదు. కాని ఉత్తమన్యాయస్థానములోనే కొన్నిపదవులు తాత్కాలికములుగా గణించి వానికి మన గవర్నరులే తమకు తోచినవారిని నియమించుట సంభవించుచున్నది. ఈయెల్ల సందర్భములును న్యాయవిచారణాధికారుల స్వాతంత్ర్యమునకు భంగ కరములు. న్యాయవిచారణకర్తలకు ముఖ్యమంత్రితో సమానమైన జీతములుకలవు. అమెరికా సంయుక్తరాష్ట్రమునందు ఉత్తమాధికారియైన యధ్యక్షునకు తరువాత జీతముకలవాడు ఉత్తమన్యాయాధికారి. ఇతనికి జీతము 15,000 డాలర్లు (సంవత్సరమునకు) ఇతనితోడి న్యాయవిచారణకర్తలకు, 14, 500. రాష్ట్రములోని ఇతరోద్యోగులలో నెవ్వరికిని 12,000 డాలరులకు పై బడిన జీతము లేనేలేదు.

క్రొత్తగవర్నమెంటు అఫ్ ఇండియాశాసనము క్రింద మనదేశమునకు నొక యుత్తమన్యాయస్థానము నేర్పరచినారు. దీనిపేరు ఫెడరలుకోర్టు అనినారు. ఈకోర్టు జడ్జీలను ఇంగ్లండులోనుండు రాజు నియమించును. బ్రిటిషు ఇండియాలోని హైకోర్టులోగాని బ్రిటిషు ఇండియా ప్రభుత్వముతో ఫెడరేటు చేసుకొనే (కొన్ని కార్యాలకు ఒక్కటిగా చేరుకొనే) స్వదేశసంస్థానపు హైకోర్టులోగాని ఐదుసంవత్సరాలైనను జడ్జిగానుండి యున్న వారై నను, అట్టి హైకోర్టులలో పది సంవత్సరములుగా ప్లీడరీ చేసినవారై నను, ఇంగ్లండు ఐర్లండులలో పదేండ్లు బారిస్టరీచేసిన వారైనను స్కాట్లండులో పదేండ్లు అడ్వకేటుగా నున్న వారైనను, అయిననే తప్ప ఈ జడ్డీపదవులకు నియమితులు కారాదు. అందులో చీఫ్ జస్టిసుగా ఉండడానికి పదునేనేండ్ల అనుభవమును, ఇతర నియమాలును కలవు. ఈ జడ్డీలకు 65 ఏండ్ల వయసు వచ్చేవరకు వీరు అధికారమునందుందురు. వీరే రాజీనామా యిచ్చినా, లేదా దేహదౌర్బల్య మనోదౌర్బల్యముగాని దుష్టప్రవర్తనగాని కారణముగా రాజు స్వహస్తాక్షరిక్రింద తీసివేసినా తప్ప వీరిని పనినుంచి తొలగించు అధికారము వేరులేదు. వీరి జీతము బత్తెములు నిర్ణ యము చేయునట్టి అధికారము రాజుది. ఒక్కపర్యాయము నిర్ణయముచేసినపిదప నియమితుడైన జడ్డీ అధికారమునందుండగా అతనికి నష్టమగురీతిగా జీతములు బత్తెములు మార్చే అధికారము రాజుకుకూడలేదు. ఇట్టి విధానములే హైకోర్టుజడ్జీలవిషయమునందును అమలులో నున్నవి. గవర్నమెంటు అఫ్ ఇండియాఆక్టుకు సంబంధించియు దానిక్రిందచేసే ఆర్డర్సు ఇన్‌కౌన్సిలుకు సంబంధించియు స్వదేశసంస్థానములు ఇతరరాజ్యాంగముల బాంధవ్యములకు సంబంధించియు అసలు అధికారము ఫెడరల్ కోర్టుదే. క్రింది. హైకోర్టులు ఈసంబంధములో చేయు తీర్పులపై న ఈకోర్టుకు అప్పీలుండగలదు. ఇండియా శాసనసభలవారు శాసనముచేసి హైకోర్టులమీద సివిలు కేసులలో ఫెడరలుకోర్టును అప్పీలుకోర్టుగా నిర్ణయించవచ్చును. ప్రీవికౌన్సిలుకు అప్పీళ్ళట్టి సందర్భాలలో పోకూడదని నియమింపవచ్చును. గవర్నమెంటు అఫ్ ఇండియా ఆక్టుక్రింద ఆర్డర్సు ఇన్‌కౌన్సిలు స్వదేశసంస్థానముల ఇన్‌స్ట్రుమెంటు అఫ్ అక్సెషనుక్రింద అసలు వ్యాజ్యెములు ఫెడరలుకోర్టులో వేసినప్పుడు ప్రీవికౌన్సిలుకు అప్పీళ్లుండును. ఇతరకేసులలో ఫెడరలు కోర్టువారియొక్కగాని, గాని ప్రీవికౌన్సిలువారియొక్క అనుమతి పొందిననే అప్పీలు పెట్టవచ్చును. ఇండియను శాసనసభలు తీర్మానముచేసిన సందర్భాలలో అప్పీలుండదనుట స్పష్టము.

రెండు ముఖ్యాంగములు

న్యాయవిచారణశాఖయందు రెండు ముఖ్యాంగములు గమనింపదగినవి. వానిని 1 కోర్టులు 2 పంచాయ తులు అని యనవచ్చును.

కోర్టులు

కోర్టులు సాధారణముగా అచ్చట విమర్శింపబడు వ్యాయోగములను బట్టి రెండగొప్పశాఖలుగా నేర్పడి యున్నవి. సివిలు కోర్టులు, క్రిమినలు కోర్టులు. ఇది యెల్లరును దినదినమును అనుభవమున నెఱిగిన సంగతియే, ఈవిభేదమునకు కారణము తెలిసికొనందగి యున్నది. మనుష్యునకు మనుష్యునకు వివాదము అనేకవిధముల కలుగవచ్చును. అప్పుతీసికొని యీయకపోయినప్పుడు వివాదము కలుగవచ్చును. భూమిపంపకము విషయములలో కలుగవచ్చును. వ్యాపారమునందు ఎవ్వరెవ్వరికి నెంతెంత భాగము లాభము చేరవలయునను విషయమై వివాదము కలుగవచ్చును. ఆస్తియేదైనను ఎవ్వనికి చేరినది యని నిర్థరించుకొనుటలో వివాదము కలుగవచ్చును. వీనియందు నిర్ణయము కావలసిన విషయము రెండు పక్షములవారికి మాత్రము పరస్పరము సంబంధించినది. ఈ వివాదములవలన చెడినను బ్రతికినను ఆరెండు పక్షములవారికి మాత్రమే అది యన్వయమగును. ఇందువలన సంఘమునకు కలుగునట్టి యపాయము ఏమియులేదు. మరి యింకొక విధమగు వివాదముల నాలోచింతము. ఒకనిసొత్తు నింకొక డపహరించినాడు. ఒకని యాస్తి నింకొకడు దొంగిలినాడు. ఒకని నెత్తి నింకొకడు బద్దలు కొట్టినాడు. పదుగురుచేరి బజారులో నల్లరిచేసినారు. ఇవియన్నియు సంఘమున కపకారము చేయునట్టి పనులు. వీనిలో కొన్ని పరస్పరము ఇరువురకేగలుగు వివాదములైనను వీనివలన సర్వసంఘమునకును విపత్తుగలుగుటకు అవకాశమున్నది. కాబట్టి వివాదములు ఇట్టివిపత్తునకు నాకరమైనవి, యిట్టి విపత్తునకు ఆకరముకానివి యని రెండుతెగలుగా నేర్పడియున్నవి. ఈరెండుతెగల వివాదములను తీర్చు కోర్టులకు క్రిమినలుకోర్టులు, సివిలుకోర్టులు అనువ్యవహారము కలిగినది.

గోపురాకారము

ఈరెండుతెగల కోర్టులును సామాన్యముగా గోపురాకారముగా క్రిందినుండిపైకి అంతస్థులు అంతస్థులుగా నియమితములయియున్నవి. మరీ చిన్న వ్యవహారములను సివిలుక్రిమినలు రెంటిని విచారించు గ్రామన్యాయస్థానములు ఈరెండుగోపురములకు బునాది. అందుపైన నొక్కగోపురమున మునసబుకోర్టులు, సబుకోర్టులు, జిల్లాకోర్టులు, హైకోర్టు, ఫెడరలుకోర్టు, ప్రీవికౌన్సిలు ఈరీతిని నంతస్తులు కలవు. అదేవిధముగా క్రిమినలు గోపురమున మేస్ట్రీటుకోర్టులు, అందులో తరగతులవారి - జిల్లాకలెక్టరు, జిల్లాజడ్డీ, హైకోర్టుమున్నగు నంతస్థులున్నవి. ఇతర దేశములందును నేవంవిధమగు నంతస్థులుకాననగును. క్రిందియంతస్థున ప్రారంభించి ఆయావ్యాయోగస్వభావము ననుసరించి శిఖరాగ్రమువరకును వ్యవహారములు నడుపుకొనవచ్చును. కాని వ్యవహారములు విశేషభాగము పంచాయతులయెదుట తీరిపోవునట్లేర్పరచుటే యుత్తమము. ఇతర దేశములలో పంచాయతులకు

సామ్యముగల పద్ధతులుగలవు. వానిని జ్యూరీలనియు, మరియితర పేళ్ళతోను వ్యవహరింతురు.

భిన్న జాతులు

అయిన నీపద్ధతికి భేదము లేనే లేదనుకొనరాదు. కోర్టులలోను అనేకవిధములయిన భిన్నజాతు లేర్పడి యున్నవి. ఈ భిన్నజాతులలో ముఖ్యతమమయినది అధికారులుచేయు దోషములను విచారించు న్యాయస్థానము. ఇట్టి జాతికోర్టులు ఆంగ్లభూమిలో లేవు. కాబట్టి మనభూమికిని ప్రాకలేదు. దోషస్థుడు ముఖ్యమంత్రికానిండు, సామాన్యుడగు కనిస్టేబిలుకానిండు ఎంతటి యధికారియైనను ఆంగ్ల సీమలో సామాన్యప్రజలకు ఏన్యాయస్థానము లేర్పడియున్నవో ఆన్యాయస్థానములలో విచారణ నందితీరవలెను. తనకు ప్రత్యేకము న్యాయాధికారి కావలయునని కోరుటకురాదు. ఈకారణముచేత నే 'బ్రిటిషు న్యాయవిచారణ'యనిన నుత్తమోత్తమమని లోకమున పేరుపడియున్నది. అందువలననే మన దేశములో న్యాయవిచారణయందక్రమములు జరిగినప్పుడు మననాయకులు 'బ్రిటిషున్యాయము' పేరు చెరుపవలదని అధికారులకు హెచ్చరిక చేయుచుందురు. "నేను తెల్లవాడను, నా జేసినతప్పులు విచారింప తెల్లవాడేతగినవాడు. కాబట్టి నన్ను సామాన్య న్యాయస్థానమునకు గొనిపోవలదు” అని ఒక్కజాతివారు కోరు నేర్పాటు సరికాదని ఖండించుచుందురు. అదియట్లుండ నిండు. ఐరోపాఖండములోని నాగరకదేశములలో అనేక దేశములందు ఆంగ్లభూమిలోవలె గాక అధికారుల తప్పులనువిమర్శించు కోర్టులు వేరుగా నేర్పడియున్నవి. ప్రభుత్వాధికారులను సామాన్యజనులవలె నెంచి సామాన్యజనులవలె విమర్శకు భాజనులను చేసినయెడల ప్రభుత్వము నెడ లోకులకు మదింపు చెడునను సిద్ధాంతమె ఈకోర్టుల యునికికి మూలాధారము. ఈసిద్ధాంతము తప్పనుట స్వయంప్రకాశము. అయినను ప్రత్యేకము కోర్టులు నేటికి రేపటికి నున్నవనుట నిజము. కోర్టులజాతులు ఇతరవిధములైనవిగలవు. మతవిషయకమైన కోర్టులు సాధారణముగా పాశ్చాత్య దేశము లన్నిటను గలవు. సైనికవిషయక దోషములను పరీక్షించు కోర్టులు సైనికాధికారులతో జేరినవి యెల్లయెడలను నున్నవి. వ్యాపారవాణిజ్యములు వ్యాపించి ప్రత్యేకమగు సాంకేతికవ్యవహారములు పెరిగినప్పుడు వాని తీర్పునకు ప్రత్యేకన్యాయస్థానములు కొన్ని దేశములయం దేర్పడియున్నవి. శిక్షకు సంబంధించిన సిద్ధాంతములు మారుకొలదిని నేటిదినము పిల్ల లకు ప్రత్యేకన్యాయస్థానము లేర్పడవలసి వచ్చినవి.

విపరీతములు వీడ్వడుట

న్యాయవిచారణకు మిక్కిలి సున్నితమైన సాధనము లేర్పడినవి. నిజమరయగా, ప్రాచీనకాలముల యందు అనేక దేశములలో ప్రజలలో అంతస్థులేర్పడి ఒకేనేరమునకు నొక్కొక యంతస్థునందలి మనుష్యునకు నొక్కొక్క రీతి దండన నియమితమై యుండినది. పాశ్చాత్యభూములలో బానిసలు ఎక్కువగా నుండువారు. యజమాని వారి నేమి చేసినను చేయవచ్చును. అతనికి శిక్షయేలేదు. భార్యలను భర్తలెంత హింసించినను దిక్కు లేదు. బిడ్డలు తండ్రులసంగతియు నదేగతి. మధ్యమయుగమున నైరోపాలో మతాచార్యులు తప్పుచేసిన నొక్కదండన, సామాన్యుడు అదేతప్పు చేసిన వానికి వేరుదండన. ప్రభువు తప్పు చేసిన నొక్కదండన. ప్రజ యదేతప్పుచేసిన నింకొకదండన. మనదేశమునందును ఇట్టిస్థితిగతు లొక్క కాలమున నుండెననుట మనుస్మృతి ఇత్యాదులవలన దెలియుచున్నది. నేటిదిన మిట్టి విపరీతము లన్నియును నశించినవి. న్యాయస్థానమున సర్వజనులును సమానులనుట సిద్ధాంతమైనది.

ఇంతేకాదు. నేటిదినము న్యాయవిచారణపద్ధతులును సున్నితములయినవి. ముక్కోణములకు కట్టి కొట్టి నేరములను నొప్పుకొనునట్లు చేయుకాలములు గతించినవి. మల్లయుద్ధములు, పిస్తోలు యుద్ధములుచేసి న్యాయమును స్థాపించు దినములు గడచినవి. అగ్గినురికి, నీటమునిగి, బాసలుచేసి తీర్శానముచేయునట్టి యుగములు మారినవి. దోషస్థుడనిన కాళ్లుకోసి, చేతులుగోసి, కఠినకారాగార ములలోత్రోసి దోషమున నాత డింకను నెక్కువగా మునిగి పగతీర్చుకొనుటకు పట్టుపట్టునట్లుచేయు కాలము లంతరించినవి. తుదకు అధికారులు ఇష్టమువచ్చినవానిని ఇష్టమువచ్చినట్లుగా పట్టి నిర్బంధించు నేర్పాటులును తగ్గుచున్నవి. మనదేశములో నింకను నెక్కువగా నీవిషయమున సౌకర్యమేర్పడుట లేదు. ఇంకను నిచ్చట 'జనరలు వారంటు'లకు నెడమున్నది. అనగా ఊరుపేరులేక ఇట్టి నేరమనియైనను వ్రాయక న్యాయాధికారులు అధికారవర్గములోని వారిచేతికి వారంటులు వ్రాలుచేసి యిచ్చుటకు వీలున్నది. ఏసబ్ ఇనస్పెక్టరో తన యిష్టముకొలది ఈవివరములు తరువాత వ్రాసికొనవచ్చును. ఇట్టి వారంటులు ఇంగ్లండులో చెల్లవు. అంతేకాక ఇంగ్లండులో కోర్టువారికి కారణము కనుబరచక యెవ్వరిని నిర్బంధమున నుంచుటకేలేదు. మనదేశములోను ఇట్టి యేర్పాటు లత్యవసరములని పెద్దలు కోరుచున్నారు.

ఇంతటి సున్నితములయిన సాధనములు న్యాయవిమర్శకు ఏర్పడియు, ఏర్పడుచుండియుగూడ కోర్టులలో న్యాయమే జరుగుటలేదనువార్త లోకమంతటను మెండైనది.

ఇందుకు కారణ మరయవలయును. న్యాయవిచారణకు ముఖ్యాధారము సాక్ష్యము. స్థానమువదలి పోయిన సాక్ష్యము మాఱిపోవును. స్థానికులకు సమాచారములు తెలిసినంత బాగుగ తదితరులకు తెలియవు. అంతియగాక స్థానికుడుగా నుండువాడు అదేస్థానమున నబద్ధములాడి యొరునకు చెరుపుచేసి కాలుదన్ని నిలుచుట కష్టము. అదియుంగాక తమతమ ప్రదేశములలో న్యాయమే జరిగితీర వలయుననుట తత్తత్ప్రదేశజులకు పట్టుదలగానుండును. ఏలయన, సర్వజనులు సుఖముగా నుండుటకు అక్రమములు జరుగకుండుటయు, జరిగినప్పుడు ఆక్రమపరుడు శిక్షితుడగుటయు నత్యవసరము. అట్లు జరుగక అక్రమమే న్యాయస్వరూపముదాల్చి దంభముగా తిరుగ నారంభించునేని లేనిపోని కలతలు కలిగి కష్టములుతోచి యొక్కరిపై నొక్కరికి విశ్వాసము లేక యునికియే దుర్భరమగును. కాబట్టి యెల్లప్పుడు నలుగురుస్థానికులు న్యాయముచెప్ప నర్హులనుట ఉత్తమనాగరకరాష్ట్రములలో నంగీకృతమయినది. పరస్పరసహాయసానుభూతులే జీవితమునకు బునాదులైన యీభారతభూమిలో ననాదిగా పంచాయితికి ప్రబలాధికార మీయబడినది. బ్రిటీషుకోర్టు లేర్పడు వరకు పంచాయతులే మనకు పరమాధారములుగానుండినవి. ఎల్లవిషయములకు పంచాయతులే. న్యాయవిచారణకు పంచాయతులు. మతవివాదవిచారణకు పంచాయతులు. కోర్టులకు కొల్లబెట్టు కొరమా లినతనము పెరిగిన తరువాత పంచాయతులపేరు అదృశ్యమైనది. ఒక్కమతాచార విషయములకుమాత్రము - ఉత్తమజాతులు బీడువడగా తక్కువజాతులవారు ఈపంచాయతులను ప్రచారమున నుండనిచ్చినారు. ఇప్పటికి బహుకాలముగా మనదేశస్థులు కోర్టులమూలకముగానందిన మహారిష్టములు దిలకించి ప్రభుత్వమువారు మరల పంచాయతులను ప్రచారములోనికి దెచ్చుట కేర్పరచుచున్నారు. సంతోషము.

ఆంగ్లభూమిలో బహుళతమముగా వ్యాప్తియందుండునట్టియు, మనదేశమునందును కొంచెముగా నవలంబింప బడినట్టియు 'జ్యూరి' (అసెసరుతో సహా) పద్ధతి యీపంచాయతిపద్ధతికి సహోదరము. ఇంగ్లండులో నేటికిని న్యాయవిచారకర్తలు ఆయా ప్రాంతములలో సమావేశమయి ఆయాప్రాంతముల ప్రజలలోనుండి 'పండ్రెండుమంది. “జ్యూరరు” లను సివిలు క్రిమినలు వ్యాజ్యెములన్నిటను నేర్పరచి తీర్మానములను జేయుచున్నారు. పండ్రెండుమందిలో ఒక్కడువిభేదపడినను ప్రతివాది నిరపరాధియే. బ్రిటిషుపౌరుడు తనసోదరులు పండ్రెండుగురు తన్ను విచారింపనర్హులుగాని, తదితరు లర్హులుగారని ఘంటాపథముగ జెప్పుకొనుచున్నాడు.

ఈయాచారము ననుసరించి మనదేశములో 'జ్యూరరు' లను 'అసెసరు'లను ఏర్పరచుచున్నారు. కాని వీర లకు ఇంగ్లండులోని జ్యూరరులకు నున్న యధికారము గాని ఆవకాశములుగాని లేవు. ఇచ్చట “జ్యూరరు" లున్నచోటికి న్యాయవిచారణకర్త లేగుటలేదు. న్యాయస్థానములున్నచోట “జ్యూరరు” లేర్పడుచున్నారు. సివిలు వ్యాజ్యములలో జ్యూరరుల కధికారములేదు. క్రిమినలులో మాత్రము, అదియు ఎక్కువయైన నేరములకే, ఈసంస్థ లుపయోగపడుచున్నవి. ఒక్క 'జ్యూరరు' విభేదపడి నప్పు డిచ్చట ప్రతివాది సురక్షితు డగుటలేదు.

పంచాయతులకును “జ్యూరీ” లకును ఇంత ప్రాముఖ్యము కలుగుటకు మరియొక్క కారణమును కలదు. ఒక్కని యాలోచనకంటె పదుగురయాలోచన న్యాయపక్షముగా నుండును. ఈయర్థమును బురస్కరించుకొనియే కొన్నికొన్ని సందర్భములలో న్యాయాధికారులు ఒంటిగా కూర్చొని సంగతులను విచారింపక న్యాయస్థానములో కలవారిరువు రిరువురుగానో, మువ్వురు మువ్వురుగానో, అవసరమగు నెడల అందరును ఏకముగానో కూర్చొని వ్యా యోగములను వినుచున్నారు. మన యుత్తమన్యాయ స్థానముల పద్ధతుల నెరింగిన వారలకు ఈసంగతులన్నియు కరతలామలకములే.


__________