ప్రబోధచంద్రోదయము/పీఠిక

వికీసోర్స్ నుండి

ప్రబోధచంద్రోదయము

పీఠిక

తాళపత్రపత్రులు

ఈ కావ్యమునకు తాళపత్రప్రతులు తంజావూరు సరస్వతీమహలునందుగాని – ఆంధ్రసాహిత్య పరిషద్భాండాగారముగాని లేవు - అవి మదరాసు ప్రాచ్యలిఖితపుస్తకభాండారమునందే యుండెడివి. ప్రస్తుతము తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయములో నున్నవి. వాని వివరములు.

1.

R- 50 (C) Fol. 171-a-214–b సమగ్రము కాని కృత్యవతరణికయందు గృతిపతి వంశవర్ణన పద్యములు పెక్కు విడనాడబడెను. వ్రాత చక్కనై యున్నది. తప్పులు లేవు. శైథిల్యములేదు. గ్రంథపాతము లంతకంటె లేవు. లేఖన కాలము - విలంబి కార్తీక బహుళ విదియ.


2.

D. 578 - పత్రములు 76.
సమగ్రము. వ్రాతమంచిది. పత్రమున నొకవైపు పేరు వ్రాయబడినది - తప్పులుగలవు. శైథిల్యము గలదు. గ్రంథపాతములు లేవు.


3.

R. 446. 53 పత్రములు.
సమగ్రము. వ్రాత యంతమంచిది గాదు. తప్పులు లేవు. శైథిల్యగ్రంథపాతములు లేవు - లేఖకుడు బహుధాన్య మార్గశిర శుద్ధ విదియా ఆదివారమునాటికి పూర్తిచేసినాడు. ఇది క్రీ. శ. 29-11-1818తో సరిపోవును.

ముద్రణ ప్రతి

ఈ గ్రంథమును తొలుత (1900) ముద్రించినవారు వీరేశలింగముపంతులుగారు. వారు దీనిని తమ చింతామణీముద్రాక్షరశాల (మదరాసు)లో ముద్రించినారు. దీని ప్రథమముద్రణ ముఖపత్రము నిందుతో నిచ్చితిని - క్రీ. శ. 1904లో వీరేశలింగముగారే ఈచింతామణి ముద్రాక్షశాలలో ఈ కృతికర్తల వరాహపురాణమును ముద్రించి యున్నారు.

గ్రంథకర్తలు – జంటకవులు

(నంది మల్లయ - ఘంట సింగయలు)

వీరిచరిత్ర నెఱుంగుటకు వీరికృతులు రెండుమాత్రమే మనకు లభ్యములగుచున్నవి.

1. వరాహపురాణము. 2. ప్రబోధచంద్రోదయము వీరిపేరున వినబడు మఱి యొకగ్రంథము కవులషష్ఠము భాగవత షష్ఠస్కంధము) ఇందు కొన్నిపద్యములు మాత్రము లభ్యమగుచున్నవి. లభ్యములైన వానిరెండింటినుండి వీరిచరిత్రను గూర్చిన వివరములు:-

వరాహపురాణము-
సీ.

అపుడు సభావేది కాగ్రస్థితులమైన
                          మమ్ము వాగీశ్వరీమంత్రరాజ
సిద్ధి పారగులఁ గౌశిక భరద్వాజగో
                          త్రుల మహాదేవాంఘ్రిజలజభక్తి
పరతంత్రమతుల నాపస్తంబసూత్రుల
                          గురుదక్షిణామూర్త్యఘోరశివుల
శిష్యుల నతిశాంతచిత్తులఁ దనకు నా
                          శ్రితుల భాషాద్వయకృతి నిరూఢ


గీ.

శేముషీభూషణుల నంది సింగనార్య
తనయు మల్లన కవికులోత్తముని ఘంట
నాదధీమణి కూర్మినందనుని మలయ
మారుతాంకితు సింగయమంత్రిఁ జూచి.

(1-31)

సీ.

కలరు కౌశికగోత్రకలశాంబురాశి మం
                          దారంబు సంగీతనంది నంది
సింగమంత్రికిఁ బుణ్యశీల పోచమ్మకు
                          నాత్మసంభవుఁ మల్లయమనీషి
అతని మేనల్లుఁ డంచితభారద్వాజగో
                          త్రారామచైత్రోదయంబు ఘంట
నాగధీమణికిఁ బుణ్యచరిత్ర యమ్మలాం
                          బకుఁ గూర్మితనయుండు మలయమార్ము


గీ.

తాహ్వయుఁడు సింగనార్యుఁడు నమృతవాక్కు
లీశ్వరారాధకులు శాంతు లిలఁ బ్రసిద్ధు
లుభయభాషల నేర్పరు లుపమరులు స
మర్థు లీకృతిరాజనిర్మాణమునకు.

(1-24)

పైరెండు కృతులలో నాశ్వాసాంతగద్య లొకే తీరున నున్నవి.

"ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారస్వతాభినంది నంది సింగయామాత్యపుత్ర మల్లయమనీషితల్లజ మలయమారుతాభిధాన నాగయ ప్రధాన తనయ సింగయకవిపుంగవప్రణీతంబైన..........ప్రథమాశ్వాసము"

పైగద్యయందేగాక, వరాహపురాణమున వీరిరువురు నెల్లప్పుడు నొకరి నొకరు విడువక శరీరప్రాణమువలె నుండువారని యిట్లు తెలుపబడినది.-

క.

మీరిరువురు నెప్పుడును శ
రీరప్రాణములక్రియఁ జరింతురు మిగులం
గూరిమిఁ గృతిఁ బ్రతిపద్యము
చారుఫణితి చెప్పఁగలరు చాటువు గాఁగన్.

(1-32)

ఇందువలన వీరిరువురు [1]జంటకవులని స్పష్టము.

నివాసము

వీరిరువురి నివాసము మైసూరు రాష్ట్రమున కోలారు మండలమున చికబల్లారము తాలూకా నందిగ్రామమని యొక పరిశోధకులు తెలిపిరి[2]. ఇందువలన వీరు దాక్షిణాత్యకవు లగుచున్నారు. కాని కర్నూలు మండలమున గల మహానంది క్షేత్రమును బట్టియు - వీరిలో నొకడైన ఘంటసింగయ గురువు - అఘోర శివాచార్యుల నివాసము కడప మండలమున పుష్పగిరి యగుట చేతను వీరు తెలుగుదేశపు కవులే యనుట నిశ్చితము.

వంశ వివరణ

నంది మల్లయ—

ఇతడు కౌశికగోత్రుడు. ఆపస్తంబసూత్రుడు. దక్షిణామూర్తి గురుశిష్యుడు. నంది సింగమంత్రికి పోచమ్మకు పుత్రుడు.

ఘంట సింగయ—

ఈతడు భారధ్వాజగోత్రుడు. ఆపస్తంబ సూత్రుడు. ఘంట నాగయకు అమ్మలాంబకు పుత్రుడు. అఘోర శివాచార్యుల శిష్యుడు. నంది మల్లయకు ఘంట సింగయ మేనల్లుడని పైనచెప్పబడినది. వారిసంబంధము నీ క్రిందివిధముగా నుండునని యూహింపవచ్చును.

నందిమల్లయ చెల్లెలు — అమ్మలాంబ ఘంటసింగయ తల్లి యగుటచేత, నందిమల్లయకు ఘంటసింగయ మేనల్లుడు.

పారిజాతపహరణమును రచించిన నంది తిమ్మన తను మలయమారుతకవీంద్రునకు అనగా ఘంట సింగయ్యకు మేనల్లుడనని యిట్లు చెప్పుకొన్నాడు.

సీ.

కౌశికగోత్ర విఖ్యాతుఁ డాపస్తంబ
                          సూత్రుఁ డార్వేల పవిత్రకులుఁడు
నంది సింగామాత్యునకు దిమ్మాంబకుఁ
                          దనయుండు సకలవిద్యావివేక
చతురుఁడు మలయమారుతకవీంద్రునకు మే
                          నల్లుండు కృష్ణరాయక్షితీశ
కరుణాసమాలబ్ధఘనచతురంతయా
                          నమహాగ్రహారసన్మానయుతుఁడు


గీ.

తిమ్మయార్యుండు శివపరాధీనమతి య
ఘోర గురువరు శిష్యుండు పారిజాత
హరణమను కావ్య మొనరించె నాంధ్రభాష
నాదివాకరతారాసుధాకరముగ.

(5-108)

పైపద్యమున నందితిమ్మన ఘంటసింగయ్య మేనల్లుడని స్పష్టపడినది. నందిమల్లయ్యకు ఘంటసింగయకు - మేనల్లుడుకాగా, ఆతనిమేనల్లుడు నందితిమ్మన యని మనకు విశదమైనది. అప్పుడు సంపూర్ణవంశవృక్ష మిట్లుండును—

మలయమారుత బిరుదాభిధానులు

ఘంట సింగయమంత్రి మలయమారుతాంకితుడు. ఈవిషయము తానే చెప్పుకొన్నాడు. ఇక్కవి పారిజాతపహరణ కర్తయగు నందితిమ్మనకు మేనమామ. తిమ్మన నీతనిని "విద్యావివేకచతురఁడని" (5-108) స్తుతించినాడు. ఈ బిరుదుధారులలో సర్వన్నయనుకవి యొకడు కలడు. అతనిషష్ఠస్కంధము నుండి యొకసీసపద్యము ప్రబంధరత్నాకరమున పెదపాటిజగ్గన (1600 ప్రాంతము)చే నుద్ధ రింపబడినది[3]. ఇక మూడవవాడు మల్లన యనుకవి. ఇతని కూర్మపురాణమునుండి యొక కందపద్యము ఆనందరంగరాట్ఛందమున (3-208) పేర్కొనబడినది. దీనినిబట్టి ఇట్టిచిత్రమైన బిరుదము కలవారు మువ్వురు కలరని స్పష్టము.

మలయమారుతమునకు -గల మూడు గుణములలో సౌరభ్యము లేక పరిమళ మొకటి కలదు. కవిత్వమున పరిమళము గుబాళించునట్లు చేయగల కవి కిట్టిబిరుదము లభించును. సంస్కృతమున పరిమళ కాళిదాసు గలడు. అట్లే ఘంట సింగనయు పరిమళయుక్తమైన కవిత చెప్పుటచే నీతనికి

"మలయమారుతకవి"

అనుబిరుదు లభించినట్లు మనము గ్రహింపవచ్చును.

ఇట్టి కవితాసాహితీవిద్యావైదుష్యముగలవారుగాన వీరికి తెలుగు సారస్వతమున - జంటకవులలోనేగాక, కవులలోను ఉన్నతస్థానము లభించినది.

అఘోరశివాచార్యుడు

క.

నెలకొన్నభక్తి సద్గురు
కులచూడారత్నమగు నఘోరశివాచా
ర్యుల దివ్యపాదపద్మం
బులకు నమస్కృతు లొనర్చి పూతాత్ములమై.

(వరాహ-1-19)

అని వరాహపురాణమునను, "అఘోరశివుల భజించి యేకాగ్రచిత్తమునను” అని ప్రబోధచంద్రోదయమునను - ఈశివాచార్యుడు ప్రస్తుతింపబడినాడు. పారిజాతపహరణకర్త నంది తిమ్మనకు నీతడే గురువు. రాజశేఖరచరిత్రకర్త మాదయగారి మల్లనకూడ అఘోరశివాచార్య గురుకరుణావిశేషలబ్ధసారస్వతుడే. అందువలన నీత డాకాలమున ప్రసిద్ధశివాచార్యుడని మనము గ్రహింపవచ్చును[4].

జంటకవుల విద్యావైదుష్యము

వీరు "వాగీశ్వరీ మంత్రసిద్ధిపారగుల" మని చెప్పుకొన్నారు, వాగీశ్వరీ అనగా సరస్వతి - వీరు సరస్వతీమంత్రసిద్ధు లగుటయేగాక - శివప్రసాదలబ్ధసారస్వతు లగుటచేత వీరివిద్యావైదుష్యము ఆధ్యాత్మికవిశేషము గలదని మనము గ్రహింపవచ్చును.

"సంగీతనంది నంది సింగన" అని ప్రబోధచంద్రోదయ ప్రారంభంబునను ఆశ్వాసాంతగద్యలలో 'సారస్వతాభినంది నందిసింగన' అని చెప్పబడియుండుటచేతను నందిసింగన సంగీతసాహిత్యముల యందు రెండింటను ప్రవీణుడని తెలియుచున్నది. కావున సంగీతసాహిత్యములు వీరికి వంశానుగతము.

వీ రుభయభాషాకవితాదక్షులని యీ క్రింది యుదాహృతులు తెలుపుచున్నవి.

"ఉభయభాషల నేర్పరులు”
"భాషాద్వయకృతి నిరూఢశేముషీభూషణులు"

కాలనిర్ణయము

ప్రబోధచంద్రోదయము, వరాహపురాణము, కవులషష్ఠము అనువీరి మూడుకృతులలో మొదటది ప్రబోధచంద్రోదయము.

ప్రబోధచంద్రోదయము

ఇది అనంతామాత్యుని గంగమంత్రికి కృతి - ఆతడు క్రీ.శ. 1460 ప్రాంతముననున్న పూసపాటి బసవభూపాలుని మంత్రియని యీ కావ్యముననే గలదు-

......తమ్మయామాత్య విభుకుమార
వీరబసవక్షమాచక్రవిభునిచేత
మన్ననలు గాంచి మించిన మహితుఁ డితఁడు
మనుజమాత్రుండె గంగయామాత్యవరుఁడు.

(1-16)

కావున నీకృతి రచనాకాలము క్రీ శ. 1460 ప్రాంతము కావలెను. ఈకృతియందు.

"శ్రీకర నరసింగ నృపవశీకర నయవిద్యాకరణ"

(2-1)

యనుపద్యములలో నరసింగనృపతి యొకడు పేర్కొనబడియున్నాడు.

ఈనరసింగనృపతి సాళువనరసింగరాయలే యైనచో నీతడు విజయనగరరాజ్యమును సంగమవంశీయుల వెనుక క్రీ శ. 1486నుండి క్రీ.శ. 1493వఱకు పాలించెను. అప్పుడు ప్రబోధచంద్రోదయము - క్రీ.శ. 1493 మధ్య రచితము కావలెను.

కీర్తిశేషులు శేషయ్యగారు మాత్రము పైకృతి కాలనిర్ణయమున భిన్నాభిప్రాయము కనబఱచినారు

"సాళువ నరసింగరాయని జీవగ్రాహముగా బట్టుకొనుటలో పురుషోత్తమగజపతికి బసవనృపాలుడు విశేషసహాయము చేసి యుండును. ఆఘనకార్యము సాధించుటకు గంగయమంత్రి బుద్ధిచాతుర్యము ప్రధానకారణమైయుండును. ఈభావమే “నరసింహ నృపవశీకరనయవిద్యాకరణ" అను వాక్యములో సూచింప బడినది. పురుషోత్తమగజపతి క్రీ.శ.1366 మొదలు 1396వఱకు రాజ్యము చేసినాడు. సాళువ నరసింహరాయలను 1367 ప్రాంతమున గజపతి పట్టుకొని యుండును—క్రీ.శ.1370 ప్రాంతమున ప్రబోధచంద్రోదయము నీకవులు రచించియుందురు"[5]

ఇచట శేషయ్యగారు శతాబ్దము నిచ్చుటలో పొరబడినారు. పురుషోత్తమగజపతి క్రీ.శ. 1466 మొదలు 1496 వఱకు పాలించినాడు. 1467 ప్రాంతమున గజపతి పట్టుకొని యుండును. క్రీ.శ. 1470 ప్రాంతమున ప్రబోధచంద్రోదయము నీకవులు రచించి యుందురు అని యుండవలెను.

గజపతితో నరసింగరాయలు విడివడి సంధి చేసుకొనుటకు గంగమంత్రి సహాయము చేసిన విషయమును పురస్కరించుకొని నందిమల్లయ ఘంటసింగయ కవులు పైరీతిని చెప్పియుందురు. ఈ సంఘటన క్రీ.శ. 1468లో జరిగినది. ఇది యైన మఱికొన్నియేండ్లకు ప్రబోధచంద్రోదయరచన జరిగియుండవలెను. అది సుమారు క్రీ శ. 1470 ప్రాంతము, ప్రబోధచంద్రోదయరచనాకాల మిది యని చెప్పవచ్చును - తక్కిన కృతులు వరాహపురాణము, కవులషష్ఠము రెండును ప్రబోధచంద్రోదయము తరువాతివి. కావున వీరి రచనలలో ప్రబోధచంద్రోదయము మొదటిది.

వరాహపురాణము

వరాహపురాణము తుళువనరసరాజున కంకిత మీయబడినది. ఈ తుళువనరసరాజు సాళువవంశీయుల వెనుక విజయనగరరాజ్యమును - క్రీ. శ. 1493 మొదలు క్రీ. శ. 1505 వఱకు పాలించెను. కావున వరాహపురాణము క్రీ శ. 1490-1500 మధ్య రచితము కావలెను. కృతిపతి తుళువ నరసరాజు విజయనగరసామ్రాజ్యము పరిపాలించిన సాళ్వ నరసింగరాయల దండనాయకుడు. ఈవిషయము వరాహపురాణమునం దిట్లు చెప్పబడినది.

"నరసింహ నృపాల దండనాయకతిలకా”

(11–1)

"తదనంతరంబ కృతిపతికిం బతిమైన సాళువనరసింగరాజ రాజమౌళి పావనాన్వయంబు మొదల వర్ణింతము" (1-20)

"అట్టి (సాళ్వ) నరసింగరాజరత్నంబుచేత మన్నన వడసి సైన్యనాయకపట్టభద్రత్వంబున (1-24)"

ఈ నరసరాజు మండువా, బెడద, మాహురాది దుర్గములు జయించెనని యీకృతియందు గలదు. నందితిమ్మన పారిజాతపహరణమున నింకను మఱికొన్నివిజయములను సాధించెనని నరసరాజును వర్ణించినాడు. ఇవి యన్నియు సాళ్వ నరసింగరాయల కొఱకేయని విజయనగరచరిత్రకారు లేకగ్రీవముగా నంగీకరించియున్నారు.

వరాహపురాణము క్రీ.శ. 1490 ప్రాంతమున రచింపబడియుండవచ్చును.

"వరాహపురాణము క్రీ.శ.1490 సంవత్సరమునకు పూర్వమునను-క్రీ.శ. 1485 సంవత్సరమునకు బిమ్మటను రచియింపబడియె" ననుట నిశ్చయము అని శేషయ్యగారు వ్రాసినారు.[6]

ద్వాదశాశ్వాస పరిమితమైన నీగ్రంథము కృష్ణరాయలవారితండ్రి తుళువ నరసనాయకున కంకిత మీయబడినది. కృతిస్వీకారము నాటికి నరసరాజు సాళ్వనరసింగరాయలయొద్ద సైన్యనాయకుడు. దీనిని కృతిపతి కోరికపై వీరు రచించలేదు. ఈజంటకవుల "కృతిప్రారంభమును కర్ణాకర్ణికావశంబున" నరసరాజు విని వీరిని పిలిపించి

"కావున మీరు దలంచిన
శ్రీవారాహంబు మంచికృతి మా పేరం
గావింపుఁ డనుచు"

(1-14)

కప్పురము వీడ్యము నిచ్చి కృతి తనపేర వెలయించుకొన్నాడు. ఇట్లే కాశికాఖండరచనాప్రారంభమును వీరభద్రారెడ్డి కర్ణాకర్ణికావశంబున వినియే తత్ కృతికర్త యైన శ్రీనాథుని బిలిపించి సముచితాసనమున కూర్చుండ నియమించి యచట్చనున్న వీరభద్రారెడ్డి యన్నయగు వేమారెడ్డి 'ఇపుడు చెప్పఁదొడంగిన యీ ప్రబంధ మంకితము సేయు వీరభద్రయ్యపేర” అని శ్రీనాథునికి కర్పూరతాంబూలసహితజంబూనదాంబరాభరణంబు లిచ్చి చెప్పించికొన్నాడు. ఈ విధముగా ప్రఖ్యాతులైనకవులు గ్రంథరచన కుపక్రమించుటయు, నద్దానిని రాజులు విని యంకితము బుచ్చుకొనుటయు జరుగుచుండును.

సాళ్వతుళువాన్వయముల సంధికాలమున బుట్టిన ఈ గ్రంథము చరిత్రకారుల కత్యంతము విలువైనది. బ్రౌను, సీతారామాచార్యులవారు వారినిఘంటువులయందు నీ జంటకవుల గ్రంథములను గ్రహించినట్లు కానరాదు. వీరేశలింగంపంతులుగారి దయవలన నీ రెండు గ్రంథములు సూర్యాలోకమును బడసినవి. టేకుమళ్ళ అచ్చుతరావుగా రీగ్రంథముపై చక్కనివిమర్శ వ్రాసిరి[7]. రాయలవారికాలమున హరిభట్టు వరాహపురాణము నాంధ్రీకరించెను[8]. ఈ వరాహపురాణద్వయతులనాత్మకసమీక్ష రెండు గ్రంథములు లభ్యములైననాడుగాని చేయుటకు వీలుండదు.

వరాహపురాణము చారిత్రకముగానేగాక సాంఘికముగా గూడవిలువైనది.

కవులషష్టము

కవులషష్ఠ మనియు, శృంగారషష్ట మనియు దీనిని లాక్షణికులు పేర్కొనిరి. ఆంధ్రభాగవతమున పోతన షష్ఠస్కంధము నాంధ్రీకరించలేదు. ఏర్చూరిసింగన హరిభట్టు, సర్వన, రాచమల్లుకవులు (వీరిదే కవులషష్ఠమను నష్టప్రాయమైన గ్రంథము) షష్ఠస్కంధము నాంధ్రీకరించిరి. కాని ఈ షష్ఠస్కంధములలో ఏర్చూరి సింగన కృతమైన గ్రంథమే ఆంధ్రభాగవతమునందు కుదురుకొన్నది. తాళపత్రయిలందును నట్లేకలదు. అయినను హరిభట్టు కృతషష్ఠస్కంధములోని పద్యములుకొన్ని సింగనకృతిలో చేరకపోలేదు. అదెట్లు జరిగినదో చెప్పుట కష్టము. షష్ఠస్కంధకవులు ఇంచుమించు సమకాలీనులు. కవులషష్ఠమని బహువచనరూపము చెప్పబడుటచే నీగ్రంథము నందిమల్లయ, ఘంటసింగయ్యలదే యని చెప్పవచ్చును.

ఈగ్రంథము లభ్యముకాలేదు. కాని యిందలి మొదటిపద్యము ఆడిదము సూరన తన కవిసంశయవిచ్ఛేదము అను లక్షణగ్రంథమున నుదాహరించినాడు.

శ్రీరామామణి సీతనాథుని యురస్సీమన్ నిజచ్చాయఁ గ
న్నారం గన్గొని యాత్మ నన్యవని తేర్ష్యం బూనఁ దత్కంధరన్
హారం బున్పుచు నింకఁ జూడు మన దానౌటం ద్రపం జెందఁ జె
ల్వారున్ రాముఁడు బ్రోఁచుఁగాత చికతిమ్మాధీశు తిమ్మాధిపున్”

(1-99)

గణపవరపు వేంకటకవి, కవులషష్ఠము - అని ఆంధ్రప్రయోగరత్నాకరమున తిమ్మయతనూజుడు తిమ్మరాజని చికశబ్దము లేకుండనే వాడియున్నాడు.

చండాంశు ప్రభవీక్ష తిమ్మయతనూజా తిమ్మ! విధ్వస్తపా
షండంబైన త్రిలింగ భాగవత షష్ఠస్కంధ భాగంబు నీ
కుం డక్కెన్ జతురాననత్వగుణ యుక్తుల్ మీఱ వాణి మనో
ఖాండారోద్ధతి చూఱకార బిరుద ప్రఖ్యాతిసార్థంబుగాన్.

ఇందువలన చికతిమ్మరాజునకు తిమ్మరాజను పేరున్నట్లు స్పష్టము.

ముద్దరాజు రామన కవిజనసంజీవనిలో (1-84) పైవద్యములోని రెండు మూడు పాదము లుదాహరింపబడినవి.

కవులషష్ఠము కృతిపొందిన తిమ్మరాజు క్రీ.శ 1521 సంవత్సరమున నున్నట్లుగా నీక్రింది కన్నడశాసనము తెలుపుచున్నది.

తిమ్మరాజు శాసనము

స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవరుషంగళు 1443 నైయ విక్రమ సంవత్సరద మాషుశు 7 లూ శ్రీమతు రామచంద్ర వీరభాండారతె ఉత్తమగండ గండరగండ; గండభేరుండ సరస్వతీమనోభండార చూఱకాఱ బిరుదాంకిత రాదయేఱువసింహసనాధీశ్వర శ్రీమత్కాశ్యపగోత్రద శ్రీమన్మహామండలేశ్వర చికతిమ్మయదేవ మహాఅరసుగళ కొమారరు తిమ్మరాజగళు తొట్టు ధర్మశాసనద క్రమవెంతంతెందెరే శ్రీరామచంద్రదేవర అమృతపడిగె శ్రీ వీర కృష్ణరాయ మహారాయరు సమర్పిస్త సొండూరు సీమె వొళిగణ తాళూరగ్రామదలు ఇత్యాది.[9]

దీనివలన తిమ్మరాజు క్రీ.శ. 1521-1522లో యేఱువసీమకు నాయకుడుగా నున్నట్లు స్పష్టము. ఇది కృష్ణదేవరాయల కాలము.[10]

పై వివరములనుబట్టి వీరిగ్రంథరచనాక్రమ మీరీతిగా నిర్ణయింపవచ్చును:

1. ప్రబోధచంద్రోదయము — క్రీ.శ. 1470-80 ప్రాంతము
2. వరాహపురాణము — క్రీ.శ. 1480-90 ప్రాంతము
3. కవులషష్ఠము — క్రీ.శ. 1500-1510 ప్రాంతము

ఇందువలన నందిమల్లయ ఘంటసింగయ కవులు క్రీ.శ. 1450 క్రీ.శ. 1520 మధ్యప్రాంతమున జీవించియుండిరని మనము నిశ్చయింపవచ్చును.

ఇతరేతర గ్రంథములు

వీరిరువురు వేర్వేఱుగా గ్రంథరచన చేసినట్లు ప్రబంధరత్నావళియను సంకలన గ్రంథమువలన తెలియుచున్నది. అందు నందిమల్లయ మదనసేనము అనుకావ్యమునుండి నాలుగు పద్యము లుదాహరింపబడినవి.

నందిమల్లయతండ్రి సింగన “సారస్వతాభినంది' కదా— ఆతడు వామనపురాణమును, బలరామవిజయమును రచించెను. ఆగ్రంథములలోని పద్యములు ఆనందరంగరాట్ఛందమున నుదాహరింపబడినవి.
నంది సింగన - వామనపురాణము[11]
క.

కాంతాలలామ ని న్నే
కాంతంబునఁ బల్కరింతుఁ గల్గిన కార్యం
బెంతయు ముద మలర విను
మంతట నీమదికిఁ దెలివిడై యుండు జుమీ!

(3-175)


గీ.

సరసచిత్రాన్నములును రసాయనములు
భక్ష్యములు నూఱుఁబిండ్లును చాలుజున్ను

(3-172)

ఇందు రెండు పాదములే యుదాహరింపబడినవి.

నంది సింగన - బలరామవిజయము

క్షత్రియధర్మంబున మాం
ధాత్రుఁడు రాజ్యంబు నీతిఁ దగఁ బాలించెన్
శాత్రవరహితంబుగ నిజ
గోత్రము వెలయంగఁ బ్రజలు గొనియాడంగన్.

(3-71)


ఇక కవులషష్టమునుండి మదనసేనమునుండి లభ్యమైన పద్యములను

ననుబంధములో నిచ్చియున్నాను.

కృతిపతి అనంతామాత్యుని గంగయమంత్రి

తెలుగున కావ్యప్రబంధము లందన్నిట సాధారణముగా కృత్యాదిలో ఇష్టదేవతాస్తుతి, సుకవిస్తుతి, కుకవినింద, ఆవెనుక కృతిపతి కవిని పిలిపించి గ్రంథము వ్రాయుమనుట, కవియు కృతిపతి వంశమును వర్ణించి, అట్టివంశమున జన్మించిన యతనికి తనకృతి నంకిత మొసగుచున్నానని షష్ఠ్యంతములు చెప్పుట పరిపాటియై యున్నది. కాని తెలుగు ప్రబోధచంద్రోదయమున నాందీ ప్రస్తావనలతో కూడిన నాటకారంభమువలె నుండియు షష్ఠ్యంతము లుండెడు ప్రబంధమువలె అవతారిక ముగియుచున్నది. ఇదియొక క్రొత్తపద్ధతి.

నాంది[12]

1. శంకరస్తుతి
2. గౌరీస్తుతి
3. విఘ్నేశ్వరస్తుతి
4. లక్ష్మీనారాయణస్తుతి
5. సరస్వతీబ్రహ్మస్తుతి.

ప్రస్తావన

కృతిపతి గంగమంత్రి సభానాయకుడు. ఆతడు బ్రహ్మసంతతివాడు. బ్రహ్మపౌత్రుడైన కశ్యపుని గోత్రమువాడు. అందుచే వంశవర్ణనతో నిది ప్రారంభ మగుచున్నది.

గంగమంత్రి శివపూజానంతరము గోష్ఠిలో నచ్చటివారు "నీవంటి ఆధ్యాత్మికప్రవృత్తిగలవారికి తగిన వేదాంతగ్రంథ మొకటి గలదు. అది సంస్కృతముననున్న ప్రబోధచంద్రోదయము అను నాటకము. అది తెలుగుభాషలో నీ కంకితమైన కస్తూరిపరిమళము బంగారమునకు, బంగారముకాంతి కస్తూరికి వచ్చినట్లగును" అని విన్నవించి ప్రబోధచంద్రోదయ ప్రశస్తిని గూర్చి తెలిపిరి. (20-21) దానిని తెలుగుచేయుటకు నందిమల్లయ ఘంటసింగయకవులు సమర్థు లనియు సభవారిచేతనే చెప్పించుట జరిగినది. ఇట్లు కవిపేరు చెప్పుట నాటకప్రస్తావనపద్దతి.

కృతిపతి వంశవివరములు

గంగమంత్రి పూసపాటి మాధవవర్మ వంశీయుడైన బసవభూపాలునియెుద్ద మంత్రిగా నుండెడివాడు.

సీ.

మాధవవర్మ భూమండలేశ్వరు వంశ
                          జలధికి నేరాజు చందమామ
యేరా జుదయశైల మెలమిని భేదించెఁ
                          గపటాహితమదాంధకార మడఁగ
గజపతి సురధాణి గడిదుర్గముల కెల్ల
                          నే రాజు వజ్రంపుబోరుతల్పు
మహిమచే నేరాజు మఱపించె నల భగీ
                          రథపృథుమాంధాతృరఘురమణుల


గీ.

నట్టి గుణశాలి తమ్మరాయనికుమార
వీరబసవక్షమాచక్రవిభునిచేత
మన్ననలు గాంచి మించిన మహితుఁ డితఁడు
మనుజమాత్రుండె గంగయామాత్యవరుఁడు.

గంగమంత్రియేగాక అతనికి ప్రభువైన యీ బసవరాజును కవిపోషకుడు. ఈతడు నెల్లూరిమండలమున ఉదయగిరి రాజ్యమున కధిపతియై ఉదయగిరిలో నుండువాడు. దూబగుంట నారాయణకవి తన పంచతంత్రమను కృతిని నీ బసవరాజునకే అంకితము గావించెను. గంగమంత్రి బసవరాజు మంత్రి గావున నాతడు ఉదయగిరి వాస్తవ్యుడై యుండెనని మనము గ్రహింపవచ్చును.

వంశ విశిష్టత

ఈ గంగమంత్రి ఆర్వేలనియోగిశాఖీయుడు. కాశ్యపగోత్రుడు. ఈగ్రంథమున నాతడు "పెసరవాయాన్వవాయ" అని సంబోధింపబడుటచేత నీతని ఇంటిపేరు పెసరవాయవారని చెప్పవచ్చును. ఈ గ్రంథమున నిచ్చిన యాతని వంశవృక్షము

పెసరవాయవారి వంశము[13]

శ్రీనాథుని బావమరదియగు దగ్గుపల్లి దుగ్గన కృతమైన నాచికేతోపాఖ్యానమును గంగమంత్రి కృతినందినట్లుగా నీగ్రంథమున నిట్లుగలదు.

ప్రఖ్యాత నాచికేతూ
పాఖ్యాన మహాప్రబంధపరిమళితసుధీ
వ్యాఖ్యానశ్రవణోదిత
సౌఖ్యాసంఘటిత చిత్తశంకరసఖ్యా!

(4-72)

ఇందును వంశవృక్ష మీయబడినది. రెండు గ్రంథములయందును వంశవృక్షములు నొకటియేగావున ప్రత్యేకముగా నుదాహరింపలేదు.

గ్రామనామము

తెలుగులో చాలమంది ఇంటిపేర్లవలె పెసరవాయ గ్రామనామమే. కాని యీ గ్రామ మెచ్చటనున్నదో ఎవ్వరు నిర్ణయించి తెలుపలేదు. ఈ పెసరవాయ యెచ్చటిదోయని కీ శే చాగంటిశేషయ్యగారు వ్రాసిరి. ఈ గ్రామము కాకతి ప్రతాపరుద్రునికాలమున క్రీ శ 1299 అలంపురం బ్రహ్మేశ్వరాలయమందలి యొక శాసనములో పేర్కొనబడినది (తెలంగాణాశాసనములు రెండవసంపుటము కాకతీయ శాసనములు) అలంపురం మహబూబునగర మండలమున నున్నది. పెసరవాయ అజిల్లాలోనే యుండియుండవచ్చును.[14]

పెసరవాయగంగమంత్రి అత్తవారును పెసరువాయాన్వయులే. గంగన అత్తవారుసు పెసరువాయాన్వయులే యని తెల్పుటకు దుర్గాభైరవరాజు వంశములోని లక్కసానమ్మభర్త ఆదిరాజు క్రీ శ. 1489 లో తిరుపతిలో ఒక శాసనము వేయించెమ. (నెం. 52 తి.తి.దే. సాళువనరసింహునికాలపు శాసనములు) అందు లక్క సానమ్మ పెసరువాయాన్వయమునకు సంబంధించినదని తెలుపబడియున్నది.

దుగ్గన నాచికేతూపాఖ్యానమున గంగమంత్రి చెందలూరి గంగమంత్రిగా పేర్కొనబడినాడు “చెందలూరిగ్రామము ఒంగోలు తాలూకాలో కడపకుదురు రైల్వేస్టేషనుకు 18 మైళ్ల దూరమున నున్నది"[15]. గంగమంత్రి యిచ్చట చాలకాలము నివసించియుండవచ్చును. నాసికేతూపాఖ్యానకాలమున చెందలూరిలో నివసించి యుండవచ్చును. కావున తత్కర్త యట్లువ్రాయుట తటస్థించినది. ఆదిగాక దుగ్గన అనంతామాత్యుని గంగయవంశము వర్ణించినను కొన్ని వివర ములు విడిచినాడు. అప్పటి కాతనికి తెలిసిన గంగయవంశవివరములు మాత్రమే వ్రాసియుండును, ప్రబోధచంద్రోదయకర్తలు మరికొన్ని యంశములు హెచ్చుగా తెలిసికొని గ్రంథస్థము చేసిరి.

మంత్రిత్వము గంగనప్రతిభ

గంగమంత్రి పూసపాటి మాధవవర్మ సంతతివాడైన బసవభూపాలుని మంత్రి. ఈతడు గజపతిరాజులకు సామంతుడు. గజపతిరాజు కపిలేంద్ర గజపతి. క్రీ.శ. 1460 ప్రాంతమున కపిలేంద్రగజపతి ఉదయగిరి దుర్గమును స్వాధీనము చేసికొని బసవరాజు తండ్రియైన తమ్మభూపాలుని అధిపతిగ నియమించెను. తమ్మభూపాలుని తరువాత కుమారుడు బసవరాజు క్రీ.శ. 1471 లో ఉదయగిరి రాజ్యమున కధీశు డయ్యెను[16]. ఆప్పుడు కపిలేంద్రగజపతి కుమారుడు పురుషోత్తమ గజపతి రాజుగానుండెను.

గంగమంత్రి నీతియుగంధరుడుగా పేర్కొనబడినాడు.

క.

“నీతియుగంధర సుకవి
వ్రాతప్రస్తుతయశోధురంధర

(2-80)

ఇచట నీతి యనగా రాజనీతి. యుగంధరుడు ప్రాచీనమంత్రులలో ప్రసిద్ధుడు. గంగమంత్రి రాజనీతి విశారదత్వమును వెల్లడించు నొకసన్నివేశ మీగ్రంథముననే కలదు.

"శ్రీకర వీక్షణదాన
శ్రీకర నరసింహనృపవశీకర నయవి
ద్యాకరణ”

(2-1)

అని గంగమంత్రి నరసింహనృపవశీకరనయవిద్యాకరణుగా వర్ణింపబడినాడు. నరసింహనృపవశీకర అనగా నరసింహభూపతిని వశపఱచుకొనగలిగిన నైపుణ్యము గలవాడు అని అర్థము. ఆచారిత్రకసందర్భ మిది:

క్రీ.శ. 1470 లో కపిలేశ్వరగజపతి అస్తమించగానే విజయనగరరాజైన సాళువసరసింహరాయలు నెల్లూరి మండలములోని ఉదయగిరి దుర్గము నాక్రమించెను.

కపిలేశ్వరగజపతి కుమారుడైన పురుషోత్తమ గజపతి సాళ్వనరసింహుని స్వాధీనమైన ఉదయగిరిపై దండెత్తగా సాళ్వనరసింహరాయ లాతని ప్రతిఘటించెను కాని మహాబలవంతుడగు పురుషోత్తమగజపతి ధాటికి తట్టుకొనలేక అతనికి జీవగ్రాహముగా పట్టుబడెను. ఈ విషయము పురుషోత్తమగజపతి రచితమైన సరస్వతీవిలాసమున నాతని ఆనంతవరతామ్రశాసనమున చెప్పబడినది. బసవభూపాలుడు గజపతుల సామంతుడేగాన పురుషో త్తమగజపతి అతని సహాయమును కోరి యుండును. గంగమంత్రి తనరాజనీతి చాకచక్యముచేత నరసింహరాయలు జీవగ్రాహముగా పట్టుబడుటకు విశేషముగా సహాయ్యము చేసియుండెను. దీనిని పురస్కరించుకొనియే

“నరసింహనృప శీకరనయవిద్యాకరణ" అని గంగమంత్రిని సంబోధించినాడు.

పురుషోత్తమగజపతి జీవగ్రాహముగా పట్టుకొనినయతడు సాళ్వనరసింహరాయలేయని చరిత్రకారులు వాఙ్మయచరిత్రకారులు అంగీకరించినను కీ.శే. మల్లంపల్లి సోమశేఖరశర్మగారు మాత్ర మంగీకరింపలేదు.[17]

గంగమంత్రి - శివయోగి

గంగమంత్రి లోకికముగా మంత్రియై రాచకార్యములలో నిమగ్నుడైనను ఆతడు సాంసారికముగా జీవితము గడపినను తక్కినవారివలెగాక తామరాకుపై నీటి చందమున అంటిఅంటకయుండునట్లు యోగివలె జీవితము సాగించెనని యీగ్రంథమున నిట్లు వర్ణితమైనది.

సరిలేనినీతిచాతురిచేత రాజ్యతం
                          త్రంబును నడిపిన నడుపుగాని
యనిశంబు పుష్పచందనవనితాదిసౌ
                          ఖ్యంబుల నందిన నందుగాని
సంగీతసాహిత్యసరసవిద్యావినో
                          దంబులఁ దగిలిన దగులుగాని
స్వామిహితాసక్తి సదనవనాస దనుశా
                          సనలీల జరపిన జరపుగాని
నీళ్లలోపలి సరసిజినీదళంబు
సరణి నిర్లేపుఁడైన సంసారయోగి
సందియము లేదు ప్రత్యక్షశంభుమూర్తి
యీయనంతయ గంగమంత్రీశ్వరుండు.

(1-18)

శివయోగానుభవము

గంగమంత్రి శివయోగానుభవ మిట్లు వర్ణితమైనది.

జలకము మూర్థ్నిచంద్రసుధ షట్కమలంబులు బూజధూప ము
జ్జ్వలతరబోధశాసననివాళి సుషుమ్నవెలుంగు సౌఖ్యముల్
తలఁపున నీగిబోనము సదా తననాదము ఘంట గాఁగ ని
ష్కలుషత నీయనంతవిభుగంగన గొల్చు నిజాత్మలింగతన్.

(1-17)

ఆత్మలింగమనగా గురుదత్తమైన లింగముగాక తాను స్వయముగా సంపాదించిన లింగము శివయోగరహస్యశేవధి (1-38)

శివారాధనతత్పరత

దగ్గుపల్లి దుగ్గన నాసికేతూపాఖ్యానమున గంగమంత్రి శైవాచారతత్పరత యిట్లు వర్ణితమైనది.

శివచింతామయ మంతరంగము శివశ్రీపాదపద్మార్చనా
ప్రవణంబులే కరపంకజంబులు, శివాసాదిప్రసిద్ధాగమా
శ్రవణోదీర్ణము కర్ణయుగ్మము శివప్రాసాదపంచాక్షరీ
వ్యవహారజ్ఞరసజ్ఞ యిమ్మహి ననంతామాత్యు గంగయ్యకున్.

(అవతారిక)

శివపూజానియతి

గంగమంత్రి యఖండశివపూజాధురంధరుడు. ఈ విషయ మాగ్రంథమం దవతారికయందు, ఆశ్వాసాంతపద్యములందు స్పష్టముగా పేర్కొనబడినది.

“తత్సమయ సంపూజా లసచ్చంభుమూర్థనవీనేందుకళాసుధాసురభిగంధంబైన హస్తాంబుజంబున" (1-26)

“గౌరీనాయక పూజనాకలితహృత్కర్పూరనీరాజనా" (1-85)

“శివభక్తి స్పుటప్రసవషట్చరణా" (1-86)

"భవానీశంకరారాధనాసాహిత్యస్థిరచిత్త" (2-79)

"సంఘటితచిత్తశంకరసఖ్యా" (4-71)

సంస్కృత ప్రబోధచంద్రోదయము

సంస్కృతనాటకసాహిత్యమున ప్రబోధచంద్రోదయమున కొక ప్రత్యేకస్థానము గలదు. శృంగారవీరరసములలో నేదైనయొకటి నాటకమున విధిగా నుండవలయునన్న యాలంకారికమతమునకు (ఏకవివభవేదంగీ శృంగారోవీర ఏవవా) విలక్షణముగా శాంతరసప్రధానమగు నీనాటకమును కృష్ణమిశ్రు డనుకవి రచియించెను. కృష్ణమిశ్రుడు కవీశ్వరుడేకాక యతీశ్వరుడు. ఈత డద్వైతవిద్యాపారంగతుడై, చేదిదేశపురాజైన కీర్తివర్మ పట్టాభిషేకసమయమున నీనాటకము ప్రదర్శింపజేసెను. కీర్తివర్మకాలము క్రీశ 1100 ప్రాంతమగుటచే కృష్ణమిశ్రు డాకాలమునాటివాడు.

నాటకరచనోత్పత్తి కారణములు

దీనికి రెండు కథలు గలవు:

1. కృష్ణమిశ్రుని కనేకశిష్యులు గలరు. వారిలో నొకశిష్యుడు వేదాంతాదివిషయకగ్రంథముల చదువ నొల్లక, శృంగారరసవిషయికములైన గ్రంథములే చదువుచుండెడివాడు. అతనికి వేదాంతసార ముపదేశించి, శృంగారవిముఖునిగా చేయుటకు గురువగు కృష్ణమిశ్రుడు ప్రబోధచంద్రోదయము నాటకముగా రచించెను.

2. రాజైన కీర్తివర్మకు కృష్ణమిశ్రు డెన్నివిధముల నద్వైతమతము బోధించినను అతని మది కెక్కలేదు. అప్పుడు కామక్రోధాదులగు దుర్గుణములను మతి, వివేకాదులకు సద్గుణములను, పాత్ర లనువుగా జేసి యుద్ధమును జానాజ్ఞానములకు కల్పించి నాటకముగా రచించి దానిని ప్రదర్శింపజేసి కీర్తివర్మ కద్వైతమునం దభిరుచి గల్గించెను.

ఈ రెండు కథలుసు వాస్తవములై యుండవచ్చును. విషయప్రబోధమునకుగాని విషయప్రచారమునకు గాని నాటకము పరమసాధనమని గ్రహించి కృష్ణమిశ్రు డీవేదాంతనాటకము రచించెను.

అద్వైతపరముగా నీనాటకము వెలసిన వెనుక వేదాంతదేశికులు (1270-1372) విశిష్టాద్వైతపరముగా సంకల్పసూర్యోదయము అను నాటకమును ఆ వెనుక మల్లనారాధ్యుడను నాతడు శివాద్వైతపరముగా "శివలింగసూర్యోదయము” అను నాటకమును రచించిరి. కాని ప్రబోధచంద్రోదయమునకు వచ్చిన కీర్తి వీనికి రాలేదు కేవలము ఆనుకరణములుగా నిలిచిపోయినవి.

ఈ నాటకమునకు క్రీ.శ. 1520లో కొండవీటి దుర్గాధ్యక్షుడు కృష్ణరాయల మహామంత్రి సాళ్వతిమ్మరసు మేనల్లుడునగు నాదిండ్లగోపమంత్రి "చంద్రిక" అను పేర నొకవ్యాఖ్యానము రచించినాడు. ఆవ్యాఖ్యానముతోడనే ఈ నాటకము ముద్రితమైనది (1924). ఇటీవల పోడూరి సుబ్రహ్మణ్యసుధి ప్రౌఢప్రకాశ యను పేర నీనాటకమును వ్యాఖ్యానించెను. తంజావూరి ఘనశ్యాముడు కూడ నొకవ్యాఖ్య రచించెను. (D12560 మ.ప్రా.లి.పుస్తకశాల).

నాటకవిశిష్టత

ఈ నాటకవిశిష్టతను జంటకవు లి ట్లవతారికలో పేర్కొన్నారు.

సీ.

వివరింపనిది సర్వవేదాంతసారంబు
                          తలఁపగా నిది గట్టి తెలివిత్రోవ
ఇది భోగమోక్షసంపదలకు మూలంబు
                          మోస లేదిది ఘనంబులకు ఘనము
జ్ఞానకర్మరహస్యసాధనంబును నిది
                          యిది నవరసముల నీనుసురభి
షడ్దర్శనంబులు సరవి నిందున్నవి
                          సందేహములు దీఱ విందుగాని


గీ.

యిమ్మహారసపాకము నెఱిఁగినట్టి
జనుఁ డెఱుంగడు మఱి తల్లిచన్నుపాలు
దీనిసరి చెప్ప మఱి లేవు త్రిభువనముల
దొరక దీకృతి నీవంటి దొరకు గాని.

(1-21)

పై వద్యమునుబట్టి ఇది "సర్వవేదాంతసారము" అని తెలియుచున్నది. విద్ అనగా జ్ఞానము. వేదము అనగా జ్ఞానము ప్రసాదించునది. అది కర్మజ్ఞానమును తెలుపును. వేదాంతమనగా వేదములకు చివర నుండునది. వేదాంతము కేవలము జ్ఞానమును దానిని యనంతత్వమును దెలిపి బ్రహ్మను నిరూపించును. బ్రహ్మ ఆనందస్వరూపము. ఆ బ్రహ్మానందము సిద్ధించుకొఱకు మార్గము జ్ఞానమార్గము. ఇదియే అద్వైతతత్వము. ప్రబోధచంద్రోదయ మీ అద్వైతతత్వమును విశదీకరించును గాన నిది సర్వవేదాంతసారమని చెప్పబడినది.

ఇం దద్వైతమతమేగాక ద్వైతము, పాశుపతము, కాపాలికము మొదలగు ఆస్తీకమతములెగాక, బౌద్ధము, జైనము అను నాస్తికమతములు ప్రసక్తములై, ఖండితములైనవి. అనగా సరియైన మతములు కావని సిద్ధాంతీకరింపబడియున్నవి. న్యాయ వైశేషిక పూర్వోత్తర మీమీంసాది షడ్దర్శనముల ప్రస్తావన యిందున్నది. అద్వైతవేదాంతమునకు మూలమైన ప్రస్థానత్రయము (బ్రహ్మసూత్రములు ద్వాదశోపనిషత్తులు భగవద్గీత) ప్రస్తకి యిందుగలదు. భిన్న భిన్న మతములవలన గలుగు సందేహముల నిది నివర్తించును. గ్రంథవిషయమును బట్టి యిది శాంతరసప్రధాన మయ్యును నిందు తక్కినరసములు సందర్భానుసారముగా గలవు. ఐహికజీవితము నడపుట కిది యౌపదేశికమేగాక, దీనిని పఠించినవానికి తిరిగి జన్మకలుగదు.[18]

పైవివరణమును పరిశీలించినయెడల ప్రబోధచంద్రోదయము ఆధ్యాత్మికవిషయప్రపూర్ణమై, అద్వైతవేదాంతతత్త్వజ్ఞానోపదేశికగ్రంథ మని స్పష్టమగుచున్నది. అందువలన నిది ఐహికమును వదలి ఆముష్మికదృష్టితో జీవయాత్ర గడపు ముముక్షువులకు ఆధ్యాత్మికవస్తువిచారణయందు కాలము గడపు వైరాగ్యశీలురకు నభిరుచి నభినివేశము గలిగించు గ్రంథములలో ప్రధానమైనదని నిశ్చితమగుచున్నది.

ఆధ్యాత్మికేతివృత్తము

నాటకము

ఇంతటి మహాగంభీరమైన ఆధ్యాత్మికేతివృత్తము కేవలము నైహికమగు లౌకికానందము గలిగించునాటకముగా కృతికర్త రచించుటలోగల యాంతర్యార్థమును గ్రహింపవలయును

కృతిక ర్తయగు కృష్ణమిశ్రు డీయద్వైతవేదాంతప్రతిపాదకగ్రంథమును ఒకకావ్యరీతిని రచింపక నాటకముగానే వ్రాయుటకు గలకారణమును కీర్తిశేషులు మేడేపల్లి వేంకటరమణాచార్యులుగా రిట్లు సమర్థించినారు.[19]

నాటకమందు ప్రతిపాదింపబడు నర్థమంతయు నభినయప్రధానమైనది గదా! ప్రబోధచంద్రోదయముందు ప్రతిపాదింపబడు వేదాంతార్థమునకు గల్గెడు ప్రాకట్యాతిశయము పరోక్షోపదేశ ర్యవసాయులగు భాష్యాది గ్రంథములయందు గలుగనేరదు. ఇంతియేకాక బ్రహ్మాజ్ఞానసాధనములగు శ్రవణమనననిధిద్యాసనవస్తువిచారాదులు వేఱువేఱుగా నొక్కొక్కటియే చిరకాలాభ్యాసవశ్యములుగా గానవచ్చుచున్నవి. అట్టిసాధనములకు బ్రత్యక్షప్రయోగప్రదర్శనాత్మకమగు నభినయమువలనగాని విశదతమజ్ఞానము సంభవింపనేరదు. ఎట్లన యాజ్ఞికుడు కల్పసూత్రాదులను బాగుగఁ జదివినవాడైనను యాగశాలలయం దాచరింపఁబడుచుండెడు శ్రోతకర్మలప్రయోగము దాఁ బ్రత్యక్షముగా నీక్షించిన గాని ప్రయోగకౌశలము నొందజాలడు. మఱియు యోగి గురుముఖముగా యోగశాస్త్రము జదివినను, గురువుచే బ్రత్యక్షముగా గనపఱచబడు స్వస్తికాద్యాసనబంధముల గన్నులార జూచినగాని యోగప్రావీణ్యము బడయజాలడు. అట్లనే ముముక్షువుగూడ వేదాంతశాస్త్రమును కూలంకషముగా జదివినవాడైనను బ్రహ్మనిష్ఠులచే నభినీయమానంబగు వస్తువిచారాదికము బలుమారు ప్రత్యక్షీకరించినగాని బ్రహ్మజ్ఞానసంపాదనసాధనపటిష్ఠుడు గానేరడు.

ఇదిగాక దీనియందు మఱియొకవిశేషము గలదు. తైత్తరీయోపనిషత్తు (ఆనందవల్లి)

"తేయే శతం మానుషా ఆనందాః
సఏకో మనుష్య గంధర్వాణా మానందం"

అనుశ్రుత్యుక్తరీతిగ నుత్తరోత్తరశతగుణితనిరతిశయానందరూపుడగు పరబ్రహ్మ యొక్కనిది ద్యాసనమందు నెట్టి యానందభూయస్త్వము గలదో యట్టి యానందమంతయును మునుము న్నుపాసకుని బుద్ధి నారోహింపదు. కావున తొలుదొలుత నేదో సజాతీయమైన యొకయానందము నవలంబించి క్రమక్రమముగా దాని నుత్తరోత్తరాతిశయసంపన్నమగుదానిగా ననుసంధించిన యెడల కొస కభ్యాసపాటవము కుదిరి పూర్ణబ్రహ్మానందము బుద్ధ్యారూఢమగును.

నాటకమునం దభిజ్యమానమగు సజాతీయానంద మెట్టిదన:

“లోకేప్రమదాదిభిః కారణాదిభిః స్థాయ్యను మాన్నే భ్యాస పాటవతాం కావ్యేనాట్కేచ తైరేవ కారణ త్యాదిపది హారేణ విభావనాది వ్యాపార వత్తాద లౌకిక విభావాది శబ్ద వుపహార్యైర్మమై వెతే। శత్రోలేవైతె। తటస్యవేతె। నమమై వైతె। నశత్రోరేవైతె। నతటస్థస్యై। వైతఇతి సంబంధి విశేషస్వీకార పరిహార నియమానవసాయా త్సాసాధరణ్యేన ప్రతీతైరరభివ్యక్త స్సామ్మాజికానాంవాస నాత్మతయాస్థితస్థాయీ రత్యాదికోనియత ప్రమాతృగతత్వేన స్థితోపి సాధారణోపాయ బలాత్త్కత్కాల విగళిత ప్రతినియతప్రమాతృ గతత్వేన స్థితోపి సాధారణోపాయ బలాత్తత్కాల విగళిత నియత ప్రమాత్కృతా వశోన్మిషితవేద్యాంతర సంపర్కశూన్యాపరిమిత భావేనప్రమాత్రా సకలహృదయ సంవాదభాజా సాధారణ్వీనస్వాకార ఇవాభిన్నోపి గోచరీకృతశ్చర్య మాణతైకప్రాణో విభావాది జీవితాతభిఃపానకరసన్యాయేన చర్వ్యణః పురఇవ, పరిస్క్ఫురన్ హృదయమివ ప్రవిశనే సర్వాంగీణమివాలింగనన్యత్సర్వ మివతిరోదధత్ బ్రహ్మానందస్వాద మివాను భావయన్న లౌకిక చమత్కారకారీ శృంగారాది కోసరసః" కావ్యప్రకాశిక 4.ఉ అని మమ్మటాద్యాలంకారికులచే నిర్వచింపబడిన రసమే

“రసోవైసఃరసగ్ హ్యేవాయంలబ్ద్ఠ్వానందీ భవతి" అను శ్రుతివలన బ్రహ్మరసస్వరూపుడని నిరూపింపబడుటచే ధ్యానావలంబనీ భూతరసాభి వ్యంజకము గావున నీనాటక మావశ్యకము"

పైయుదాహృతభాగమున ఆచార్యులవా రెంతలోకోత్తరముగా ప్రబోధచంద్రోదయ నాటకావశ్యకతను నిరూపించిరో తెలియగలదు. ఇందలి ప్రధానాంశములు రెండు. 1. అభినయము;

అభినయప్రధానమైన నాటకము గ్రంథాదులమూలమున గలుగు పరోక్షజ్ఞానము కన్న ప్రత్యక్షజ్ఞానము గలిగించును. ఈ జ్ఞానమువలన ఆయా కళలయందు, కౌశల మేర్పడును. వేదాంతపరిభాషలో ఈ జ్ఞానము సజాతీయము. బ్రహ్మసూత్ర భగవద్గీతోపషదుక్తమైన జ్ఞానము విజాతీయము. ఈ నాటకమున పరోక్షమైన ఆ విజాతీయజ్ఞానము ప్రత్యక్షము గావింపబడినది.

2. రసము

నాటకప్రదర్శనమున సామాజికులయందు రస ముత్పన్నమగును. కాని అది లౌకికమైన ఆనందమును మాత్రమే సమకూర్చును. అది భౌతికమైన పాత్రలచే ప్రదర్శితమగును గాన నది సజాతీయానందము.

రసము బ్రహ్మస్వరూపము. అందువలన ఆధ్యాత్మికమైన పాత్రములమూలమున ప్రదర్శితమైన నాటకము విజాతీయమైన బ్రహ్మానందము గలిగించును. జీవుడు బ్రహ్మముతో నైక్యసిద్ధిపొందును. ఇదియే రససిద్ధి ఆద్వైతవేదాంతసిద్ది.

సంస్కృత ప్రబోధచంద్రోదయ నాటకమునకు మూలము

సంస్కృత ప్రబోధచంద్రోదయ నాటకమునకు మూలము పురంజనోపాఖ్యానము. ఇది భాగవతము చతురస్కంధమున 25, 26, 27, 28 అధ్యాయములలో నున్నది.

పురంజనోపాఖ్యానము కథాసంగ్రహము

"స్వకర్మానుసారముగా ననేకశరీరములు ధరించువాడు గావున పురంజనుడనగా జీవుడు. పురము శరీరము ఇతని సఖుడగు నవిజాతుడనువా డీశ్వరుడు. స్త్రీతామసబుద్ధి దానివెంటవచ్చు పదునొకండ భృత్యులు ఏకాదశేంద్రియములు. (కర్మేంద్రియము లైదు జ్ఞానేంద్రియము లైదు మనస్సు ఒకటి) ఐదుతలలు గల సర్పము పంచప్రాణవృత్తి. పురమునకు నవద్వారములనగా శరీరముయొక్క నవరంధ్రములు. మృగయావిహారమే విషయోపభోగము. వార్థకము కాలకన్య. దాని సైనికులు - ఆదివ్యాధులు.

ఈ శరీరమందున్న జీవుడు తామసబుద్ధికి లోనై, సంసారమందు దగిలి దారపుత్రాదిసంగమము స్థిర మనిపించి కుటుంబపోషణకై నానావిధతాపముల నొందుచు సుఖప్రదములను భ్రాంతిచే దుర్విషయములను సేవించుచు నరిషడ్వర్గములకు జిక్కి లేశమైనను సుంసకృతము చేయనొల్లక పాపరతియై స్త్రీలచే క్రీడామృగమువలె నాడింపబడుచుండును.

అత డప్రమత్తుడై కాలము బుచ్చుచుండ తుద కనేకవ్యాధులు శరీరమంతట నిండి పీడింపగా నాబాధ సహింపజాలక మృతినొందును. నిర్యాణకాలమందు దా నెద్ది స్మరించుచు కళేబరము విడుచునో యదియై పుట్టును. ఆజన్మమం దీశ్వరకటాక్షమునకు బాత్రుడై సదాచారసమాశ్రయణమువలన సంసారము హేయమనియు భగవచ్చరణారవింద ముపాస్య మనియు దెలిసికొని సంస్కృతిబంధవిముక్తు డగును."

ఇది యీ గ్రంథమునకు మూలమైన పురంజనోపాఖ్యానము తాత్పర్యసంగ్రహము;[20]

అద్వైతమతసిద్ధాంతమును ప్రతిపాదించు పురంజనోపాఖ్యానము మూలముగా గైకొని, కృష్ణమిశ్రుడు అద్వైతవేదాంతసిద్ధాంతము ప్రతిపాదక మైన ప్రబోధచంద్రోదయము రచించినాడు. ప్రబోధము - జ్ఞానమనెడి; చంద్ర - చంద్రునియొక్క; ఉదయము - ప్రబోధచంద్రోదయము.

నాటకసంవిధానము

ఈ నాటకసంవిధానమును గూర్చి యొకకథ గలదు. కృష్ణమిశ్రుడు రాజైన కీర్తివర్మకు అద్వైతమతతత్త్వ మెంత బోధించినను మనసునకు పట్టలేదు. అంతట నాతడు కామక్రోధలోభాదిగుణములను పాత్రలుగా చేసి అవి అరిషడ్వర్ధములుగాన రాజులకు శత్రువులతో యుద్ధము చేయుట ప్రియముగాన అరిషడ్వర్గములైన కామాదులకు, మతి, వివేకము, క్షమ, వైరాగ్యము, శాంతి, మనము అనువానిని పాత్రలను గావించి, వారిరువురకు యుద్ధమును గల్పించి తుదకు ప్రబోధము జ్ఞానము జయించెనని నాటకము సమాప్తి చేసినాడు.

ఇచట కామాదులు, వివేకాదులు అను రెండు పక్షములున్నవి. గావున నీరెండు పక్షములను దాయాదులనుగా నిందు పాత్రీకరించినాడు. మహాభారతమున కౌరవ పాండవులకు యుద్ధము దాయభాగము మూలముననే జరిగినది గావున అందు అధర్మప్రవర్తకులైన కౌరవులను ధర్మప్రవర్తకులైన పాండవులు జయించినట్లుగా నీ నాటకమున కామాదులను వివేకాదులు జయించినట్లు చెప్పబడినది.

శ్లో.

ఏకామిష ప్రభవమేవ సహోదరాణాం
ముజ్జృంభతే జగతి వైరమితి ప్రసిద్ధమ్
పృథ్వీనిమిత్తమ భవత్కురు పాండవానాం
తీవ్రస్తయాహి భువనక్షయ కృద్విరోధ్రపిః

(1-28)


మ.

అవలేపంబున నన్నదమ్ములగు మోహాదుల్ వివేకాదులున్
భువనైకాధిపతిత్వకాంక్షఁ దమలోఁ బోరాడి రేకామిషో
ద్భవలాభంబునఁ బోరకుండరు గదా దాయాదులైయున్న కౌ
రవులుం బాండవులున్ ధరిత్రికయి హోరాహోరిఁ బోరాడరే

(1-43

కామాదులకు వివేకాదులకుగల దాయాదిత్వ మిట్లు నాటకమున నిరూపితమైనది.

పై వంశవివరణము వలన - కామక్రోధాధులు వివేకాదులు దాయాదు లైనారు. ఇర్వురు సపత్నులయందు సమానమైన రాజ్యకాంక్ష యుదయించిన కతకమున కౌరవ పాండవులకు రాజ్యవిషయమై యుద్ధము జరిగినట్లుగా నీనాటకమున ఇరుపక్షములవారికి తగువులు గలుగుచుండెను. ఆనాడు దుర్యోధనునివలె, ప్రవృత్తిసతులలో మోహుడు రాజ్యము నాక్రమింపగా, పాండవులలో ధర్మరాజు వంటి వివేకుడు కొంతకాలము పైదొలగి, ఆ వెనుక విద్యాప్రబోధచంద్రులవలన మోహుని జయించి సామ్రాజ్యము నాక్రమించి ఆనందు డై వెలసెను.

వివేకునకు మతి ఉపనిషత్తరుణి యను నిరువురు భార్యలు. వారివలన సుతు లుదయించిరి. ఆ వివరణ

ఈ ప్రబోధచంద్రుడే మోహుని జయించు గావున నీనాటకమున కాతనిపేరనే ప్రబోధచంద్రోదయముగా వెలసినది.

సమానత్వము - విలక్షణత్వము

1. ఆనాడు కౌరవులకు సంబంధించిన యుద్ధము ప్రత్యక్షము — నాటకమున ప్రతిపాదించిన యుద్ధము పరోక్షము
2. ఇందు స్థూలశరీరపాత్రలు — సూక్ష్మశరీరపాత్రలు
8. నేత్రగోచరులు — మానసికగోచరులు
4. బహిరంగము — ఆంతరంగికము
5 ఐహికసామ్రాజ్యము భౌతికసుఖము పర్యవసానము — మానసికసామ్రాజ్యము బ్రహ్మానందము పర్యవసానము

ఇట్లు భౌతికేతివృత్తముగల నాటకము ఆధ్యాత్మికేతివృత్తనాటక మైనది.

నాటకాలంకారశాస్త్రసమన్వయము

ప్రబోధచంద్రోదయము దశవిధరూపకములలో నాటకము" అనువిభాగమునకు చెందినది. అలంకారశాస్త్రానుసారముగా నీ నాటకము నిట్లు సమన్వయింప వచ్చును.

నాయకుడు — వివేకుడు (ఆధ్యాత్మికభావవివేకము)
నాయకి — ఉపనిషద్దేవి (విద్యాప్రబోధము)
స్థాయిభావము — నిర్వేదము
ఉద్దీపనభావము — క్షేత్రప్రసక్తి
సాత్వికభావము — హర్షపులకాదులు
వ్యభిచారీభావము — మతి ధృతి హర్షాదులు
రసము — శాంతము
గుణము — ప్రాసాదమాధుర్యము

ఈ సమన్వయము సంస్కృతనాటకమునకేగాక తెలుగు అనువాదమునకు సరిపోవును.

అంకములు - విషయవిభజనము

ప్రథమాంకము - వివేకమహామోహపక్షవిచారము
ద్వితీయాంకము - మహామోహవిలాసము
తృతీయాంకము - పాషండవిడంబనము
చతుర్థాంకము - వివేకోద్యోగము
పంచమాంకము - వైరాగ్యప్రాదుర్భావము
షష్ఠాంకము - జీవన్ముక్తి

ఇందు ప్రతిపాదింపబడిన మతములు

అద్వైతము

సత్వమైన పదార్థము బ్రహ్మ యొక్కటియే మిగిలిన దంతయు మిథ్య. మాయ బ్రహ్మకల్పితము. బ్రహ్మము మాయతో కలిసి యొకపరమపురుషుడగును. అగ్నినుండి నిప్పురవలు బయలుదేరినట్లు బ్రహ్మనుండి వివిధచేతనాచేతనరూపములైన సమస్తము పుట్టినవి. వస్త్రమునందలి నూలు వస్త్రమునకు ముఖ్యకారణమై దానియందుండెడు రీతిని బాహ్యమైన ఆ బ్రహ్మము సమస్తమునకు ముఖ్యకారణమై అంతయు నిండియున్నది; ప్రతిజీవుని హృదయమునందు ప్రకాశించుచున్నది.

పరమపురుషునియందు మాయ సత్వగుణమునే కలిగియుండి అవిద్య అనబనుచున్నది. జీవుడు అవిద్యతో కలిసి యుండువరకు సత్యపదార్థమునకును తాను చూచుచున్నట్టి యితరమైన పదార్థములకును తాను భిన్నమని భావించును. అవిద్య జ్ఞానముచే నశించును. అవిద్య నశించినచో జీవమునకు బ్రహ్మైక్యము కలుగును. ఇదియే మోక్షము.

అవిద్యచేత బ్రమనొందుటయే సంసారము. తత్త్వమస్యాది వాక్యజన్యజ్ఞానంబున నవిద్య నశించును. ఇదియే మోక్షము.

ప్రబోధచంద్రోదయ నాటకమున బ్రహ్మము ఈశ్వరునిగను - అవిద్య లేక అజ్ఞానము ప్రబోధ చంద్రోదయము - జ్ఞానోదయముగను నిరూపితమై, జీవేశ్వరైక్యము ప్రతిపాదిత మైనందున నిది అద్వైతవేదాంతప్రతిపాదికనాటక మైనది. ఆ బ్రహ్మయే సత్యమను ఆస్తికత్వము నిర్ధారించినది. ఇతరములైన నాస్తికమతము లిందు ఖండితములైనవి. వాని వివరములు.

చార్వాకమతము

దీనికి లోకాయతమతమనియు బృహస్పతి లేక వాచస్పతి మతమనియు పేర్లు గలవు. ఈ మతమున భూమి, జలము, అగ్ని, వాయువు అని నాలుగే తత్త్వములు. ఈ మతానుయాయులు ప్రత్యక్షప్రమాణము తప్పతక్కిన వానిని యొప్పుకొనరు. అందువలననే పంచభూతములలో ప్రధానమైన ఆకాశము వీరిమతమున లేదు. భూతముల సంబంధమున - ప్రాణము, శరీరము కలుగుచున్నది. ఇదియే స్వాభావికము. దేహమే సత్యము. ఆత్మ, దేవుడు, మోక్షము అనునవి లేవు. ఇహలోకానుభవమే జీవితపరమార్థము. స్త్రీసంభోగము - సుఖము. ఆదివ్యాధులు దుఃఖము మరణానంతరమున దేహము నాల్గుభూతములలోను అంతర్భూతమగుచున్నదిగాన మరణమే ముక్తి. ఈ మతమున చతుర్విధపురుషార్థములలో లౌకికమగు అర్థకామములే పురుషార్థములు గాన, అలౌకికపురుషార్థమగు మోక్షమును చార్వాకు లంగీకరింపరు. నిరీశ్వరమైనందువలన నీమతము నాస్తికమైనది.

అర్హతమతము లేక జైనమతము

ఈ మతమున జగత్తు కార్యరూపముగా నసత్యము, భిన్నము, అనిత్యము. కారణరూపముగా సత్యము అభిన్నము నిత్యము, ఆత్మ దేహానురూపపరిణామము గలది. ఈ మతస్థులు బ్రాణిహింసనుమాని దిగంబరులై విషయవైరాగ్యము నవలంబించి దేహమునందు మలము బూసికొని పాణిపాత్రభోజనులై కేశఖండనము చేసుకొని మౌనవ్రతులై యుండవలెను. మలధారణాదికమువలనను. ఆత్మజ్ఞానము వలనను ఊర్థ్వగతి బొందుట మోక్షము. ఈ మతము నిరీశ్వరమత మగుటవలన నాస్తికమతము.

జైనమతములోని సన్యాసులను “క్షపణకులు" అని యందురు. నాటకమున క్షపణక ప్రస్తావన యున్నది. (3-26)

"నిర్గ్రంథో౽ర్హః క్షపణకః శ్రమణోజిన ఇత్యపి" అని వైజయంతి ప్రతిదినకేశలుంఠనత్వము దిగంబరత్వము - వారి ముఖ్యలక్షణములు. దశకుమారచరిత్ర అపహారవర్మ కథలో క్షపణకులు వత్తురు. జైనులలో రెండు తెగలు.

1 దిగంబరులు, 2. శ్వేతాంబరులు

ప్రబోధచంద్రోదయమున దిగంబరులగు క్షపణకులు మాత్రమే పేర్కొనబడినారు.

బౌద్ధమతము

దీనికి సౌగత మతమని మరియొకపేరు. దీని స్థాపకుడు సుగతుడు, సిద్ధార్థుడు అను నామాంతరములుగల బుద్ధుడు. వీరి సిద్ధాంతమున నాలుగుభావనలు

1. సర్వము క్షణికము క్షణికవిజ్ఞానమాత్మ
2. సర్వము దుఃఖము
8. సర్వము స్వలక్షణము
4. సర్వము శూన్యము

ఈ బౌద్ధులలో నాలుగుతెగలవా రున్నారు. వారు

1. సౌత్రాంతికులు - బాహ్యనుమేయత్వవాదులు
2. వై భాషకులు - బాహ్యర్థప్రత్యక్షవాదులు
3. యోగాచారులు - బాహ్యశూన్యత్వవాదులు
4. మాధ్యమికులు - సర్వశూన్యవాదులు

జై నమతమువలె బౌద్ధమతము నాస్తికమే అయినకు కొంతభేద మున్నది. భారతీయులు బుద్ధుని విష్ణువు దశావతారములలో నొకయవతారముగా పరిగణించినారు. అయినను, నాస్తిక మగుటవలన మనదేశమున ప్రచారములో లేదు. చైనాదేశమున నేటికి ప్రచారమునందున్నది.

నాటకమున యొకబుద్ధముని ప్రసక్తి కలదు. 3వ అశ్వాసము

ఆస్తికమతములు

పాశుపతమతము

ఇది శైవాగమసిద్ధము. ఆగమములచే ననుగ్రలహీతుడైనవాడు శివుడు. ఈతడే జగములకు నిమిత్తకారణము పరమాణువులు ఉపాదానకారణము. శైవాగమమందు జెప్పబడిన కంఠిక, రుచకము, కుండలము, శిఖామణి, భస్మము, యజ్ఞోపవీతము అను నారుముద్రలను ధరించుటయు, సురాకుంభస్థాపనము, శ్మశానభస్మస్నానము, ప్రణతపూర్వకధ్యానము మొదలగు కర్మలచే నణుస్వరూపము నశించి జీవునకుగల మలత్రయము నివారించును. అది కారణమే శివసాయుజ్యము. అదియే మోక్షము.

పాశుపతులు నాటకమున తృతీయాశ్వాసమున పేర్కొనబడిరి.

ద్వైతము

ఈ మతమున ఈశ్వరునికి జీవునికి పరస్పరభేదము - మోక్షానందము తారతమ్యము జీవుడు పరతంత్రుడై ఈశ్వరానుగ్రహము వలన ఈశ్వరసామీప్యాదుల స్థితులను బొందును.

ఇం దీశ్వరు డనగా విష్ణువు. భగవత్కృపవలన ఆత్మకు మోక్షము గలుగుచున్నది. ఆయన సర్వోత్కృష్టత గుఱుతెఱిగినవారికి భగవత్కృప గలుగును. భగవత్ ధ్యానముద్వారా ఆత్మ లాయన కృపను బొందును. భగవత్ జ్ఞానము పొందుట కన్ని ఆత్మలకు సాధ్యముకాదు. మంచి ఆత్మలు జ్ఞానము పొంది భగవత్కృపను సంపాదించుకోనును, సర్వశక్తిగల భగవంతుడైన విష్ణుని సేవించుట వలన ఆత్మలు భగవత్ జ్ఞానము పొందును.

ఈ మతమువారు ద్వితీయాశ్వాసమున పేర్కొనబడిరి.

మీమాంసమతము

ఇది రెండు విధములు.


1.

పూర్వమీమాంస - జైమిని ప్రతిపాదకము, కర్మప్రాధాన్యము. ఇందుఖాట్ట ప్రభాకరములను రెండు తెగలు గలవు.

2.

ఉత్తరమీమాంస - వ్యాసప్రతిపాదకము - జ్ఞానప్రాధాన్యము.

పూర్వమీమాంస - సిద్ధాంతములు.

1) ప్రపంచము సత్యము. మిథ్యకాదు. 2) దాని కాద్యంతములు లేవు 8) వేదము లాద్యంతములు లేనివి. 4) అవి నీతిమతబోధకములు. 5) ఆత్మ ఆద్యంతము లేనిది. 6) తమతమ కర్మానుసారముగా ఆత్మలకు పునర్జన్మకలదు. 7) యజ్ఞములు వేదవిహితమైన కర్మలు చేయుటవలన ఆత్మలకు స్వర్గము లభించును. 8) యజ్ఞములు స్వర్గసుఖమునేగాక ప్రాపంచికసుఖమును నిచ్చును. 9) ద్విజులకు మాత్రమే యజ్ఞాది కర్మలు చేయుటకు అధికారము గలదు.

భాట్టమతము

ఇది పూర్వమీమాంస సంబంధమైనది. ఆత్మ జడరూపమున చేతనరూపమున నున్నది. అది మెఱుపుతీగవలె ప్రకాశనరూపముగను, అప్రకాశరూపముగను నున్నది. చేతనముయొక్క ఆభాస సహిత అజానానందమయకోశము ఆత్మ అభాసమును దాటి కర్మజ్ఞానము గలుగుటయే మోక్షము.

ప్రాభాకరమతము

ఇందు ఆనందమయకోశమే ఆత్మవిజ్ఞానమయకోశమం దుండుబుద్ధి ఆత్మయొక్క జ్ఞానగుణము. ఆనందమయకోశమునందుండు చేతనము గుప్తమై యున్నది. వివేకము లేనివాని కది ప్రతీతము లేదు. సుషుప్తియందు ఆత్మకు జ్ఞానము లేదు. గావున ఆత్మ జడ మనబడెను. ఆత్మస్వరూపమైన నిత్యజ్ఞానము జీవునియందు లేదు. అనిత్యజ్ఞాన మున్నది. ఆనందమయకోశము ఆత్మ గాదు. బుద్ధి దాని గుణముగా నున్నది. భాట్టమతము ద్వితీయాశ్వాసమున మీమాంస తృతీయాశ్వాసమున ప్రసక్తము లైనవి.

జైమిని కర్మమీమాంసమతమును వ్యాపకము చేసినవాడు కుమారిలభట్టు. అతని ప్రశంస పంచమాశ్వాసమున గలదు.

ఉత్తరమీమాంస

వేదవ్యాసప్రతిపాదకము. ఇది జ్ఞానమార్గమునకు సంబంధించినది. ఆత్మ సత్యము. జగత్తు మిథ్యయను నద్వైతసిద్ధాంతమును తొలుత సిద్ధాంతీకరించిరి. వాసోద్దిష్టమైన ఉత్తరమీమాంసయే. ఇదియే "వ్యాససరస్వతి" అని ద్వితీయాశ్వాసమున పేర్కొనబడినది.

నైయాయిక వైశేషికమతము

ఈశ్వరుడు నిమిత్తకారణము. అట్టి ఈశ్వరు డున్నా డనుటకు జగము సావయము గావున ఘటాదులవలెనే పుట్టినది. ఘటాదిజననము దానిప్రయోజనము లెరింగినవానిచేతనే చేయబడును. కాబట్టి జగము నిర్మించునేర్పు గలవాడును, కర్మపరవశులైన జీవులకంటే విలక్షణుండగు నొకసర్వజ్ఞుఁ డుండవలయు నతడు సాధకము ఆతడే ఈశ్వరుడు. ఈశ్వరప్రీత్యర్థకముగా వేదోక్తకర్మంబుల నాచరింపుచు తత్ప్రసాదలబ్ధంబైన అష్టాంగయోగమున దుఃఖనివృత్తియైన మోక్షంబు బడయును.

ఈ మతప్రసక్తి తృతీయాశ్వాసమున గలదు.

కాపాలికమతము

ఇది శైవమతములోన నాంతరభేదము. ఈ మతానుయాయులకు, శివుని ననుసరించి కపాలబిక్షాటనము, శ్మశానవాసిత్వము, దిగంబరత్వము గలదు శైవమున సన్యాసము లేదు గాన నీమతస్థులు భార్యలతో నుందురు. ఈ మతానుయాయుని సోమసిద్ధాంతి యనియందురు.

కపాలబిక్షాటనము ప్రధానసిద్ధాంతముగాన వీరలకు కాపాలికులు అని పేరువచ్చినది.

ఇందు తృతీయాశ్వాసమున కాపాలికప్రసక్తియేగాక కాపాలినిప్రసక్తి వచ్చును. మతములో సాంఖ్యమతము గూర్చి యీ నాటకములో చెప్పబడలేదు.

క్షేత్రములు

క్షేత్రములు మతసంబంధమైనవి. అందువలన నీ నాటకమున రెండుక్షేత్రములు వర్ణితము లైనవి.

వారణాసీక్షేతము

ఇది భారతదేశమున ఆద్వైతులకేగాక స్మార్తులందరికి సేవ్యమానమైన దివ్యక్షేత్రము. ఈకాశీక్షేత్రమహిమను శ్రీనాథుడు కాశీఖండమున నీకవులకుముందే చాటినాడు. ముఖ్యముగా యతీశ్వరుల కిది స్థానము. నాటకకర్త కృష్ణమిశ్రుడు యతీశ్వరుడు గావున వారణాసీక్షేత్రమును నాటకమున ప్రస్తావించినాడు.

పురుషోత్తమక్షేత్రము

ఇది వైష్ణవక్షేత్రము. ఉత్కళదేశము(ఒరిస్సా) లో నున్నది. ప్రబోధచంద్రోదయమున దీని ప్రసక్తి గలుగుటకు ఇందు విష్ణుభక్తి యోగినిగా ప్రవేశపెట్టబడుటయే హేతువు.

ఈ కవులకుముందు, ఎఱ్ఱనయు, శ్రీనాథుడును నీపురుషోత్తమక్షేత్రము (నేడు పూరీజగన్నాథక్షేత్రము)ను తమకృతులలో నృసింహపురాణ భీమఖండములలో ప్రశంసించిరి.

కథాసంగ్రహము

జ్యోతిర్మయంపుకోటలును అమృతంపుబరిఖలును నైర్మల్యంపుమేడలును గల చిదానందనగరియందు ఈశ్వరుడను రాజు రాజ్యపాలనము చేయుచుండెను. అతనికి మాయ యనెడి పట్టమహిషి వలన మనస్సు అనెడి తనయుడు గలిగెను. ఆ రాజకుమారునకు ప్రవృత్తి యనియు, నివృత్తి యనియు నిద్దరుభార్యలు గలరు. ప్రవృత్తిదేవి వలన మహామోహుడు మున్నగు సుతులును, నివృత్తిదేవివలన వివేకుడను పుత్రులును జనించిరి.

ఈ ఇరువురు సపత్నుల పుత్రులయందును సమానమగు రాజ్యకాంక్ష యుద్భవించినకతన కౌరవపాండవులకు రాజ్యవిషయమున పోరు కల్గినట్లు ఈ యుభయపక్షములవారికి భువనైకాధిపత్యముకొఱకు నిరంతరము తగవు గలుగుచుండెను. జ్యేష్ఠవర్గమగు మహామోహాదులయందు జనకునకు పక్షపాత ముండుటచేత వివేకాదులు సమరమున నిలవలేక చెల్లాచెదరై పారిపోవలసివచ్చెను.

మహామోహుడు రాజ్యము స్వీకరించి సాపత్నీయులగు వివేకాదులను నిర్మూలము చేయ నుద్దేశించి వా రెక్కడెక్కడ దాగియుందురో వెతకించుటకు చారులను పంపెను. వారు విశ్వమునగల పురములన్నిటిని వెదకి యచ్చటచ్చట వివేకాదులు పొడసూపుట ఎరిగినవారై తమయేలికసంగతి విన్నవించిరి. మోహు డుగ్రుడై పేరోలగమున తనతమ్ముల విలోకించి వివేకాదుల నెట్లు భంజింపవలయునో తగు నుపాయము తెల్పుడని సోదరామాత్యవర్గముల కాజ్ఞాపించెను. అంత కాముడు తన అద్భుతప్రాభవమును ప్రకటించుచు వాసంతికా, నవమల్లికా వికసితవల్లీమ తల్లులవలె నుల్లసిల్లెడు పల్లవాధరలు తనబలానీకములో నుండగా వివేకాదు లె ట్లాహవమున నిలువనోపుదురని యుత్కటగర్వమున ప్రగల్భించెను. రతి కొంతప్రతివచనము కొనిసాగించియు లాభము లేదని యూరకుండెను.

మహామోహుడు సభాంతరమున రహస్యాలోచనము చేయుచుండినపుడు దుర్గుణుడను వేగులవాడు వచ్చి వివేకమహారాజు ఉపనిషద్దేవిని పునఃపరిగ్రహించుటకును ఆ యిరువురిసంయోగమువలన విద్య ప్రబోధచంద్రు లుదయించుటకు ప్రయత్నములు జరుగుచున్న వనియు నవి నిర్నిఘ్నముగా నెఱవేరుటకు శమదమాదులు సకలపుణ్యతీర్థములకు బోయి దేవతాప్రార్థనలు చేయ సమకట్టియున్నారనియు, పిడుగువంటి వార్త వినిపించెను. మహామోహుడును భయవిహ్వలుడై తన ముఖ్యసచివుడగు దంభుని జూచి "మిత్రమా పుణ్యతీర్థములో ప్రశస్తమైన కాశీనగరంబునకు బోయి వివేకుని ప్రయత్నములకు భంగము కావింపవలయునని చెప్పిపంపెను.

మహామోహు డొనరించిన యాలోచనలును దంభాదులకు నియోగించిన యాజ్ఞావిశేషములను రహస్యముగా గనిపెట్టి సదాచారు డనెడు చారుడు తత్వృత్తాంతము పూసగుచ్చినట్లు వివేకమహారాజునకు నివేదించెను. ఆ మహీపతి చింతాకులుడై తన యగ్రమహిషియగు మతిని రావించి యా యుదంతము సర్వము నామెకు దెలిపెను. విద్యాప్రబోధచంద్రు డె ట్లుద్భవింతురని యామె ప్రశ్నింప తనతో కలహించి, చని, తన వియోగమవలన కృశించుచున్న యుపనిషద్భామినికి తనతో పునస్సమాగమము గలుగునేని విద్యాప్రబోధచంద్రు లుదయింతురని చెప్పిన నా సాధ్వీలలామ యందుల కీయకొనెను.

మహామోహునిచే నాజ్ఞాపితుడై దంభుడు వారాణాసీపురమున కేగి యచ్చట నివాస మేర్పఱచుకొని రాజకార్యనిర్వహణమున నప్రమత్తుడై యుండెను. ఒకానొకదినమున వానియింటి కొకపురుషుడు యాదృచ్ఛికముగా వచ్చి యాతిథ్యమును గ్రహింపనొల్లక దురహంకృతి కనబఱచగా వారి కిరువురకు జరిగిన సంభాషణక్రమమున నా నూతనపురుషు డహంకారుడని తెలియవచ్చినది. అప్పుడు దంభు డహంకారునకు మ్రొక్కి తాను లోభుని కుమారుడనియు, నందుచే అహంకారునకు మనుమడనియు బంధుత్వము తెలుపుకొనెను. పిమ్మట నిరువురును తమ తమ యాచరణీయవిషయములను చర్చించి మహామోహుని యాజ్ఞానుసారముగా నుభయులును కాశీక్షేత్రమునకు వచ్చిన ట్లెఱిగికొనిరి.

ఇట్లుండ మహామోహమహారా జాసమయమున కాశీపురమున సపరివారముగా ప్రవేశించెను. దంభాదిబంధువర్గమును క్షపణకబౌద్ధకాపాలికాదిపరివారనికరమును నా మహారాజును చుట్టుకొని సంతోషసంభ్రమకోలాహలంబున చెలరేగిరి. మహామోహరాజు తనబంధుమిత్రాదులకు తననాస్తికమతప్రకారము సర్వమును బోధించి శరీరము వేఱనియు, ఆత్మ వేఱనియు చెప్పు వేదవాక్యము లబద్ధములనియు పంచభూతపరిపాకప్రాప్తచైతన్యమగు నీదేహమే ఆత్మ యనెడు సిద్ధాంతము సత్యమనియు వాక్రుచ్చి, వేదచోదితకర్మాచరణులను నిర్మూలము గావింపవలసినదని గాంభీర్యమున జెప్పుచుండ, తనమతాచార్యవర్యుడైన చార్వాకుడు శిష్యసమేతుడై విచ్చేసి మహారాజును దీవించి సమస్తము దేవరపంపున సాధింపబడెనని నివేదింప మహామోహాదిసమస్తరాజన్యలోకము కడుంగడు సంతసించె. విష్ణుభక్తియను కల్లరిపిల్ల మాత్ర మింకను లొంగకుండ సిలుగులు పెట్టుచున్నదని కొంతనంకోచముగా చెప్పెను. అంత చార్వాకుని మాటలు విని మహామోహుడు నిట్టూర్పు నిగిడించి యామూర్ఖురాలు పట్టిపట్టు విడువదుగాని కామక్రోధాదులముందఱ నామె త్రుళ్లగింతలు సాగవని యూరడిల్లె. అయినను శత్రువర్గములోనిదైన చిన్ననిసువునైనను నుపేక్షింపకూడదని తన సేవకవర్గమున కాజ్ఞాపించెను.

ఆలోన నొకప్రతీహారి వచ్చి పురుషోత్తమదేవాలయమున నున్న మదమాదులు దేవరవారి కొకవిజ్ఞానపత్రిక పంపిరని చెప్ప మహామోహమహారా జాపత్రిక గైకొని శ్రద్ధయు, ఆమె కొమార్తెయగు శాంతియు గలసి వివేకమహారాజునకు ఉపనిషద్భామినికి పొత్తు కలుగునట్లు దౌత్యము నడుపుచున్నా రనియు ధర్మము వైరాగ్యము మున్నగు పెద్ద లీకార్యసంఘటనము నిమిత్తము సహకారులుగా నున్నారనియు వ్రాసినసంగతులను చదువుకొనెను. పిమ్మట కామక్రోధలోభులను పిలిచి ధర్మములు కట్టిపెట్టుమని కామునికిని శాంతిని బంధింపుమని క్రోధలోభులకు నానతు లిచ్చి శ్రద్ధను వశము చేసికొనుటకు నాస్తికతతప్ప వేఱొకరు సమర్ధులు గారని యూహించి మిథ్యాదృష్టి పేరబరగు నాస్తికతను తోడితెమ్మని విభ్రమావతిని యనుదాసిని పంపెను. ఆమె శీఘ్రమే పోయి మిథ్యాదృష్టిని తోడ్కొని వచ్చెను. అంత మహామోహుడు తనకత్యంత ప్రియతమయైన మిథ్యాదృష్టిని జూచి పరమానందభరితుడై ఆమె యాలింగనసుఖమున కొంతదనుకు శృంగారలీలల దేరిన యామెతో నామె రప్పించిన కార్యము తెలిపి శ్రద్ధను మాయోపాయములచే బద్దురాలిం జేయ పంపెను.

అట్లు మహామోహుని యాజ్ఞానువర్తియై మిథ్యాదృష్టి శ్రద్ధాలలనయొద్దకు బోయి తన కపటోపాయములచేత నామెను వేదమార్గమునుండి తప్పించి, పాషండమతవశంవదను చేసి మరుగుపెట్టెను. శాంతికన్య తనతల్లిని కానలేక విభ్రాంతి నొంది తిరుగులాడుచు, విలపించుచు, పాషండసదనమునైన నున్నదేమో యని వెదకికొన నుద్దేశించి, తననెచ్చెలియగు కరుణతోగూడ పోవుచుండెను. ఆ సమయమున నొకవికృతాకారుడగు పురుషు డాదారినే వచ్చుచుండుట చూచి,రాక్షసుడో, పిశాచమో అని సంశయించి, భయభ్రాంతులై కొంతసేపటికి తెప్పిరిల్లి యానూతనపురుషు డొకదిగంబరసన్యాసియని తెలిసికొనిరి. అప్పుడు శాంతి తనతల్లి యామనుష్యునియొద్ద నుండునేమోయని కనుగొనుట కచటనే నిలువ బడెను. ఇంతలో నా దిగంబరుడు "అర్హంత” “అర్హంత” అని తనశ్రావకవర్గమును పిలిచి స్వమతోపదేశమును చేయుచు శ్రద్ధను రావించి వారికి సేవ చేయుమని వినియోగించెడు. ఆ వచ్చిన స్త్రీని శాంతిచూచి తన తల్లియని భ్రమించెను. కాని మరికొంతసేపటి కామె తనతల్లి కాదని, “తామసి" అనునది యని నిశ్చయించుకొనేను.

తరువాత బౌద్ధమందిరములనైన తనతల్లి యుండునేమో యని వెదకుటకు తిరుగుచుండగా నంతలో బౌద్ధభిక్షు డొకడు చేత పుస్తకములను పట్టుకొని యెదురు పడెను. ఆతని యొద్దను తామసియే యున్నది గాని తన తల్లి శ్రద్ధ లేదని యామె గ్రహించెను.

ఇట్లుండ దిగంబరుడైన క్షపణకుడు బౌద్ధభిక్షువుతో మతవిషయమున వాదములాడ మొదలిడ తుదకు వాని దూషింపసాగెను. వీరిద్దరు కలహమాడుచుండగా సోమసిద్ధాంతు డొకడు చేత కత్తిని పట్టుకొని యచ్చటికి వచ్చెను. వీరు మువ్వురు మతాభినివేశమువలన తమతమ మతములను గూర్చి చర్చింపసాగిరి. కొంతవడికి కాపాలికుడు రోషకషాయితాక్షుడై, క్షపణకుని బొడుచుటకు చేయి సాచెరు అంత బౌద్ధుడును క్షపణకుడును బెగడుపడి ఆసోమసిద్ధాంతిని క్షమాపణ వేడిరి. అంత సోమసిద్ధాంతి తాను గ్రోలుచున్న మదిరామదమును కొంత వారి కిచ్చి వారిని తన మతమున చేర్చుకొనెను. వారు మువ్వురును నట్లు సఖ్యపడి "అద్దిరా! మన చక్రవర్తి మహామోహుని యాజ్ఞను మరచి మన మిచ్చోట కాలవిలంబనము చేయుచున్నాము. శ్రద్ధాదేవిని బట్టితెమ్మని మనఱేని యానతిగదా! ఆమె విష్ణుభక్తి చెంతను దాగియున్నది. కాబట్టి ఆమెను వెంటనే కొనితేవలయును అని కాపాలికుడు తన భైరవీశక్తి నాకర్షించి పంపెను. ఇంతలో శాంతియు కరుణయు శ్రద్ధయొద్ద కేగిరి. వీరిట్లుండగా శాద్రరసావిష్ట యగుభైరవీశక్తి భీకరాకారముతో గగనమున కెగసి పావురమును డేగ పట్టుకొనునట్లు శ్రద్ధాలలమ బట్టికొని యెగిరి వచ్చుచుండగా విష్ణుభక్తి యడ్డుపడి భైరవిని పారద్రోలి శ్రద్ధను విడిపించెను.

(4)

విష్ణుభక్తిమహాదేవి శ్రద్ధను విడిపించి యామెతో నిట్లు నుడివెను. శ్రద్ధా! నీవు వేవేగమే పోయి వివేకమహారాజుతో నిట్లు చెప్పవలెను. “మోహాదివర్గ ముల నిర్జించుటకు సైన్యముల నన్నింటిని చేరగూర్చుకొని యాయత్తపడియుండవలెను. విష్ణుభక్తిమహాదేవి కావలసిన సాయ మొనరించుటకు సిద్ధముగా నున్నది." ఆమాటలు విని శ్రద్ధాదేవి యవిలంబితముగా వివేకమహారాజు కడ కేగి విష్ణుభక్తిదేవి నుడివిన పలుకులు యథారీతిగా విన్నవించెను. అంత వివేకనృపాలు డెరిగి బలము లన్నిటిలో ప్రోడయగు కాముని జయింప సమర్థు డెవ్వడని యోచించి వస్తువిచారునకు వర్తమానము పంపెను. అంత నాతడు వచ్చి తాను కాముని సునాయాసముగా జయింపగలనని ప్రతిజ్ఞ చేసెను. క్రోధుని భంజించుటకు క్షమను, లోభుని నిరోధించుటకు సంతుష్టిని నియోగించి తదితరబలానీకంబులనెల్ల గలయంజూచి యందరను ద్వరితముగా కాశికానగరమునకు సమరోత్సాహమున ప్రయాణు డగుడని యాజ్ఞాపించి జయభేరిని మ్రోగింప శాసించెను.

వివేకమహారాజు మహానీకసమేతుడై కాశీనగరంబు జొచ్చి ఆదికేశవుని దర్శించి, స్థుతించి ధర్మయుద్ధమునకు సిద్ధముగా నుండెను.

మహామోహాదివీరులును సంగ్రామమునకు తమతమ సేనలను కూర్చుకొని పేర్చి కాశీనగరముననే విడిసియుండిరి. ఇ ట్లుభయసైన్యంబులును జయధ్వానములతో దిక్కులు పిక్కటిల్ల నార్చుచు సమరకోలాహలమున సంభ్రమింపుచుండిరి. రుధిరధారాసిక్తమగు యుద్ధభూమిని చూడనొల్లక విష్ణుభక్తిమహాదేవి "శ్రద్ధా! యుద్ధానంతరమున జయాపజయంబుల పర్యవసానము సత్యముగా నాకు జెప్పుమని యాజ్ఞాపించి శాంతితో గూడ సాలగ్రామశిఖరమున నున్న చక్రతీర్థమునకు బోయెను.

యుద్ధము ప్రారంభమైనది. వివేకాదియోధులయెదురు మహామోహాదివీరులు నిలువలేక పరాజితులై పికాపికలై చెదరి పారిపోయిరి.

మహామోహు డెక్కడ యణగెనో ఎరుక పడలేదు. వివేకమహారాజు జయజయధ్వానములతో కాశీపురము ప్రవేశించెను. ఈ వృత్తాంతమంతయు శ్రద్ధాదేవి సత్వరముగా నేగి విష్ణుభక్తిమహాదేవికి నివేదించెను.

మహామోహాదులపరిభవము విని తండ్రియగు మనస్సు పలువిధముల శోకించి పలవరించుచున్న సమయమున విష్ణుభక్తిమహాదేవి వ్యాససరస్వతిని బంపి మనస్సునకు వైరాగ్యము కలుగునట్లుగా నుపదేశము చేయుమని నియమించెను. వ్యాససరస్వతియు నట్లే మనస్సునకు ననేకవిధముల బోధించి భావము లనిత్యము లనియు, పాంచభౌతికమగు శరీరములు నశ్వరము లనియు బ్రహ్మమే సత్య మనియు ఇత్యాది వేదాంతవిషయములను చక్కగా తెలియజెప్పి విచార ముడుగుమని యుపదేశించెను కాని యామె యెంత జెప్పినను మనస్సునకు దుఃఖ ముపశమింపలేదు. వేదాంతసరస్వతి మాత్రము విసుగుజెందక సకలలోకరక్షణదక్షుడగు నిందిరాధవునిగాని ఇందుధరునిగాని పొందగలనాయని తలంచి యుండుమనియు, మోహపాశబంధములు తమంతటతామే సడలిపోవుననియు చెప్పిన మనస్సు ఊరడిల్లి కృతార్థుడ నైతినని వ్యాససరస్వతీదేవి పాదముల కెరగిన యామె మనస్సును జూచి వత్సా! నీహృదయం బుపదేశక్షమం బయ్యెనుగాని మఱియొకరహస్యము జెప్పేదనని, "జడున కసారసంసారవిభ్రాంతి గలుగునుగాని వివేకవంతునకు గలుగదు. వివేకున కిదియంతయు విరక్తి కారణంబే” యని వేదాంతపరమరహస్యమును దెలిపెను. ఇంతలో వైరాగ్యుడు రాగా భారతీదేవి మనస్సుతో “వత్సా! నీతనయుడు వైరాగ్యుడు వచ్చినాడు వానిని సంభావింపుము" అని కోరెను అప్పుడు మనస్సు వైరాగ్యుని కౌగలించుకొనెను. అంత సరస్వతీదేవి మనస్సుతో నిట్లనెను.

ప్రథమభార్యయగు ప్రవృత్తిదేవి పుత్రశోకమువలన మరణించినది. కావున విచారింపక రెండవపత్నియగు నివృత్తిదేవిని రావించి కూడియుండ వలసిన దానియు తత్సంజనితులగు వివేకాదులను యౌవరాజు స్థాపితులు జేసి సామ్రాజ్యము వహింపుమనియు నుపదేశించి దీవించి, శ్రద్ధను జీవమహారాజు నొద్దకు బోయి చేయవలసిన కార్యముల ననుసంధింపు మనియె శాంతిని వివేకమహారాజుకడకేగి యూడిగంబులు సలుపుమనియు చెప్పి మిగిలిన కార్యములను సంఘటించుటకు దాను వెడలిపోయెను.

వివేకమహారాజు శాంతితో తన ప్రేయసియగు నుపనిషద్దేవిని తోడి తెమ్మని చెప్పిపంపెను. ఆమె యట్లు పోవుచుండగా దారిలో తల్లియగు శ్రద్ధను గాంచి యానందభరితురాలై ఆమె యెచ్చటికి ససంభ్రమముగా బోవుచున్నదని ప్రశ్నించెను. ఆమె జీవేశ్వరుడు నిష్కంటకముగా సామ్రాజ్య మేలుచుండగా విచారమునకు హేతు వేమి యాని మారుపల్కె మహామోహుడట్లు యుద్ధమున నిర్ణీతుండై నీను జీవపురు షుని వశీకరించుటకు మధుమతియను మోహుని స్త్రీని బంప యామె తన యింద్రజాలవిద్య చూపి నానావిధములగు నింద్రియసుఖభోగములను గల్పించి యాతని పరిభ్రమింపజేసి తనవలలో వేసికొన్నది. అని శ్రద్ధ తిరిగి చెప్పగానే శాంతి విషణ్ణచిత్తయై, ఇంతశ్రమ పడినను తుదకు ఫలము గలుగలేదని దుఃఖించి, ఈ పరిణామమునకు ప్రతీకారవిధాన మెద్దియేని కలదో యని యడిగెను.

అంత శ్రద్ధాదేవి శోకించుచున్న తనపుత్రికను సమాశ్వాసించి తనయా! ఊరడిల్లు మూరడిల్లుము తర్కమునీశ్వరుడు జీవేశ్వరుని వద్దకుపోయి "ఈశ్వరా ఇట్లేల సంసారవిభాంతిజ్వాలల జిక్కుకొన్నావు" అని యడుగగా జీవేశ్వరు డదిరిపడి "తర్కా! మేలుమేలు నేనెంత మూఢుడనైతిని నన్ను మేలుకొలుపితివి. మేలుచేసితివి" అని మెచ్చుకొనుచు మధుమతిని చాల ధిక్కరించెను. కావున మనకు నిశ్శంకముగ నానందదాయకములగు వైభవోత్సవములే కలుగుచున్నవి అని శ్రద్ధ చెప్పి తాను వివేకుని జీవేశ్వరుని కడకు దెచ్చుటకు పోవుచున్నానని తెలిపెను. అంత శాంతి తానుగూడ నుపనిషద్దేవిని వివేకునికడకు తోడి తెచ్చుటకు బోవుచున్నానని తల్లితో నుగ్గడించి తనదారిని బోయెను అంత జీవేశ్వరుడు విష్ణుభక్తిదేవిమహిమకు గడు సంతసించి తాను కష్టముల నన్నింటిని నతిక్రమించి నిత్యనిర్మలసుఖములను బొందగలుగుట యాదేవి కృపాకటాక్షముననే యని వాక్రుచ్చి సంతోషించు సమయమున వివేకమహారాజు శ్రద్ధాంగనాసమేతుడై జీవేశ్వరునిసన్నిధి కేతెంచెను.

(6)

వివేకమహారాజు జీవేశ్వరునికి మ్రొక్కి దీవనెలు పొంది ప్రస్తుతించు సమయమున ఉపనిషద్దేవి శాంతిలలను దోడ్కొని వివేకమహారాజు సమక్షమునకు చనెను. అంత జీవేశ్వరు డుపనిషత్తరుణిని సంభావింప, ఆమె వివేకున కభివందనములాచరించి యుపాంతస్థలమున నధిష్ఠించెను జీవేశ్వరు డుపనిషదాంగనతో భామా! నీవు భర్తవలన నెడబాటు నొంది పెక్కుకడగండ్లుండి కాలము గడపుచుంటివని మేమెఱుగుదము ఎచ్చటెచ్చట నేవిధమునైన బాధల బొందితివో మాకు నెఱుగజెప్పుమనిన యామె యిట్లనియే "కృష్ణాజినాజ్య సమిధాసుధాది గృహీత హస్తయజ్ఞ విద్యాదేవి నన్ను నొల్లక నాతో బురుడించి వేరుచోటికి న న్నరుగుమని వెళ్ల గొట్టెను. అంతట కర్మమీమాంసాతరుణి యొద్దకు నే బోవ నామెయు యజ్ఞవిద్యాదేవివలెనే న న్నోర్వలేక పొమ్మని దారి జూపెను. తరువాత తర్కవిద్యలవద్దన జేరగ వారు నానావిధకర్కశభాషణములను నన్ను రెచ్చగొట్టి చెలరేగి నన్ను బంధించుట కనుసంధించుచుండ నేభయభ్రాంతనై పాఱుచున్న నన్ను జూచి విష్ణుభటులు వెఱవకు వెఱవకుమని నా కభయ మిచ్చి యాకఠినహృదయలగు నాతర్కవిద్యలను మోది చెదరగొట్టిరి. అంత నాపుత్రికయగు శ్రీగీత మచ్చికమున వచ్చి కౌగలించి న న్నూరడించెను. ఇ ట్లనన్యసామాన్యవిషయావస్థలను బొంది తిరిగి ఏలినవారిప్రాపున జేరగలితిని" అని పలికి జీవేశ్వరునితో "నీవు పరమాత్మవు నీకును పరమేశ్వరునకు భేదము లేదు" అని చెప్పిన జీవేశ్వరు డామాటల యాథార్థ్యమును గ్రహింపనేరక వివేకుని వంక చూచెను. ఆమహానుభావుడు యుపనిషద్దేవి మాటలను వివరముగా వినిపింప జీవేశ్వరుడు గ్రహించి సంతసించుచున్నసమయమున నిధిధ్యాసమును శాతోదరి వారిని సమీపించి యుపనిషద్దేవికి సంజ్ఞ చేసి యిట్లు చెప్పె.

"విష్ణుభక్తిమహాదేవివలన ఈ సందేశమును మీకు గొనివచ్చితిని. వివేకమహారాజు సన్నిధానమున నీ వుండినమాత్రమున సంకల్పజననివై విద్యాప్రబోధచంద్రుల నీగర్భమున దాల్చితివి. నీవు నీ తనూజయగు విద్యాకన్యను మనసునందు ప్రవేశపెట్టి ప్రబోధచంద్రుని పురుషునియందు నిల్పి నీవు వివేకుని దోడ్కొని యామెకడకు జేరుమని యామె యాజ్ఞాపించినది" అని యిట్లు చెప్పి నిధిద్యాసము జీవేశ్వరునియం దంతర్థాన మయ్యెను.

తరువాత విద్యుల్లతాప్రభాసియగు విద్యాకన్యయు నిర్మలసహజప్రకాశమానుడగు ప్రబోధచంద్రుడును నావిర్భవించిరి. జీవేశ్వరు డపారమగు సంతోషమును బొంది వారిని గౌరవించి యతిశయించుచున్న సమయంబున విష్ణుభక్తిమహాదేవి చనుదెంచెను. జీవేశ్వరు డామెకు వినమితోత్తమాంగు డై ప్రణమిల్లి దీవనలు పొంది యామె యానతిచొప్పున వివేకుని మంత్రిగా జేసికొని శ్రద్ధమతి, శాంతి మున్నగు నారీమణుల వనితల కాస్పదుండై నిరుపమానవైభవమున సదానందసామ్రాజ్యము నేలుచుండెను.

పాత్రలు

పురుషులు
వివేకుడు ప్రధాననాయకుడు
వస్తువిచారుడు వివేకుని కింకరుడు
సంతోషుడు వివేకునిసహచరుడు
పురుషుడు ఉపనిషత్పతి
ప్రబోధచంద్రుడు వివేకుని పుత్రుడు
మహామోహుడు వివేకుని ముఖ్యశత్రువు
చార్వాకుడు మహామోహుని మిత్రుడు
కాముడు
క్రోధుడు
లోభుడు మహామోహుని అమాత్యాదులు
దంభుడు
అహంకారుడు
మనస్సు సంకల్పాత్మకము
వైరాగ్యము
నిధిద్యాసనము మనస్సువలన జన్మించినవారు
సంకల్పుడు
దిగంబరుడు జైనుడు
బిక్షువు
క్షపణకుడు బౌద్ధులు
కాపాలికుడు కాపాలికమత ప్రవర్తకులు
జాల్ముడు కామునిదూత
వటువు
శిష్యుడు ఇతర పరివారము
పురుషుడు
దౌవారికుడు
స్త్రీలు
మతి వివేకునిపత్ని
ఉపనిషద్దేవి వివేకునిపత్ని
శాంతి వివేకునితోడ బుట్టినది
కరుణ శాంతిసఖురాలు
శ్రద్ధ వివేకుని మంత్రిణి
మైత్రి శ్రద్ధసఖురాలు
విష్ణుభక్తి ఉపనిషత్సఖి
సరస్వతి విష్ణుభక్తి సఖురాలు
గీతాదేవి విష్ణుభక్తి సఖురాలు
క్షమ వివేకునిదాసి
రతి కామునిపత్ని
కాపాలిని కాపాలికునిభార్య
మిథ్యాదృష్టి మహామోహునిపత్ని
విభ్రమావతి మిథ్యాదృష్టి సఖురాలు
హింస క్రోధునిపత్ని
తృష్ణ లోభునిపత్ని

దౌవారికుడు, ప్రతీహారి మున్నగువారు కలరు.

నాటకమున స్త్రీ పురుషపాత్రల సమన్వయము

సృష్టి యంతయు స్త్రీ ప్రజయోగాత్మకము. అందువలన నిందు సుగుణదుర్గుణములు కామమోహాదులకు వివేకాదులకు దాంపత్యము కల్పింపబడినది.

పురుషపాత్రలు స్త్రీపాత్రలు
ఈశ్వరుడు మాయ
ప్రవృత్తి కాముడు రతి
మోహుడు మిథ్యాదృష్టి
క్రోధుడు హింస
లోభుడు తృష్ణ
నివృత్తి వివేకుడు మతి
ఉపనిషత్తరుణి

పైవానిలో మనకు సాహిత్యమున ప్రత్యక్షమగునది రతి మన్మథులు లేక కాముడు మాత్రమే తక్కినవా రీనాటకమునందు మాత్రమే గానవత్తురు.

ఇతర పాత్రలు
పురుషులు స్త్రీలు
ప్రవృత్తి
చార్వాకుడు మహామోహుని మిత్రుడు విభ్రమావతి మిథ్యాదృష్టి చెలికత్తె
దంభుడు మోహుని మంత్రి
దుర్గుణుడు మోహునిచారుడు
నివృత్తి
సంతోషుడు వివేకుని మిత్రుడు శాంతి వివేకుని సోదరి
వస్తువిచారుడు వివేకుని సేవకుడు శ్రద్ధ శాంతితల్లి
సదాచారుడు వివేకుని చారుడు కరుణ శాంతికి సఖి
మైత్రి శ్రద్ధకు సఖి
విష్ణుభక్తి ఉపనిషత్సఖి
సరస్వతి విష్ణుభక్తికి సఖి
క్షమ వివేకునిదాసి
అద్వైతవేదాంతమునకు మూలమైన మూడును నిచ్చట స్త్రీపాత్రలైరి.
బ్రహ్మసూత్రములు వ్యాససరస్వతి
ద్వాదశోపనిషత్తులు ఉపనిషత్సఖి పైన చెప్పబడినవి
భగవద్గీత భగవద్గీతావనిత
ఇచట ఉపనిషత్తు గీతా శబ్దములు రెండును సంస్కృతమున స్త్రీలింగములే గనుక విశేష్యవిశేషణములు లింగసమన్వయము కుదిరినది.

మతమునకు సంబంధిన పాత్రలు

అద్వైతమతము ఇతరములైన బౌద్ధజైనాదిమతములు ఖండించినది. ఆమతము లిందు పుంస్త్రీరూపములు దాల్చినవి.

పురుషులు స్త్రీలు
బుద్ధముని నాస్తికవిలాసిని
జైనుడు
క్షపణకుడు
దిగంబరుడు
భిక్షువు
సోమసిద్ధాంతి
పాశుపతుడు
కాపాలికుడు కాపాలిని
కామక్రోధలోభజంభాహంకారములు తామసి
మోహునిమంత్రులు
యమనియమాసనధ్యానధారణ
ఊశిత్వ నశిత్వ ప్రాకామ్యములను నెనమండుగురుదర్శనములు మధుమతి
చార్వాకుడని తర్కముని
పూర్వమీమాంస మీమాంసాతరుణి యజ్ఞ
విద్యాదేవి
ఇ ట్లీనాటకమున 32 పురుషపాత్రలు 30 స్త్రీపాత్రలు గలవు.

అనువాదవిధానము

సంస్కృతమున ప్రబోధచంద్రోదయము ఆరంకముల దృశ్యకావ్యము. దానిని తెలుగున నీకవులు 5 ఆశ్వాసముల శ్రవ్యకావ్యముగా సంతరించినారు. వారు మాతృకలోని కథాప్రణాళికను గాని, పద్యగద్యక్రమము గాని, భావస్థితిని గాని సాధారణముగానే మార్పు లేకుండగనే స్వీకరించిరి. దృశ్యకావ్యము శ్రవ్యకావ్యముగా చేయుటచే ప్రారంభముననే మార్పు చేయవలసి వచ్చినది.

మూలమున నాద్యంతమున నటీసూత్రధారుల ప్రస్తావన యైనవెనుక తెర యెత్తిన వెంటనే కాముడు రతియు ప్రవేశించి నాటకకథావిషయము సంభాషణమూలమున దెలుపుదురు.

తెలుగున నిది ప్రబంధము గావున ప్రబంధపద్ధతిని పురవర్ణనతో ప్రారంభమైనది.

చిదానందనగరి యను పురముగలదు. ఆపురమునకు ఈశ్వరుడు రాజు. మాయ యాతనిభార్య. ఆతనికి మనసనెడు కుమారుడు గలడు. ఆతని కిరువురుభార్యలు. వారివలన పుత్రులు గలిగిరి. ఆపుత్రులు దాయాదులుగాన రాజ్యముకొఱకు తగవు లారంభమైనవి. పెద్దభార్య కొడుకు రాజ్య మాక్రమించు రెండవభార్య కొడుకులను తరుమగొట్టుట కొకయాలోచనసభ కావించెను. అని కథాక్రమము తెలిపిన తరువాత ఆఆలోచనసభలో రతికాములసంభాషణ ప్రవేశపెట్టబడినది.

నాటకములో పాత్రలే కథాక్రమమును వివరింతురు. ఇది కావ్యము గాన కవియే కథాక్రమము దెలుపును. ఇదియే రెండింటికిగల భేదము. దృశ్యకావ్యము శ్రవ్యకావ్యముగా చేయుటచేత అనువాదమున ప్రారంభముననేగాక కథాప్రణాళికలో కొన్ని మార్పులు ప్రవేశపెట్ట వలసి వచ్చినది.

1) మూలమున కాశీనగరమున మహామోహమహారాజు ప్రవేశించినప్పుడు కొంతపరివార మున్నదని మాత్రము గలదు. గాని కాముడు క్రోధుడు మొదలగువారు మోహుని దగ్గఱ నున్నట్లులేదు ప్రతిహారిని పంపి వారిని పిలువ నంపెను.

ప్రబంధమున నట్లుగాక మహామోహునితోడనే వారందఱు ప్రవేశించినట్లు గలదు.

2) మూలమున నుపనిషద్దేవి శాంతిసహితయై ప్రథమమున జీవేశ్వరునికడకు బోయినట్లుగ నున్నది. తెలుగున జీవేశ్వర మహారాజే మొదట ప్రవేశించినట్లుగా నున్నది.

3) మూలము నాటకముగాన నందు వర్ణనలు లేవు. తెలుగున నిది ప్రబంధము గావునను, ప్రబంధమునకు వర్ణనలు నియతమగుట చేతను నీకవులు వర్ణనలను ప్రవేశపెట్టవలసివచ్చినది. కావ్యప్రారంభమున పురవర్ణన యుండవలెను గాన చిదానందనగరిని కల్పించి మహామోహునకు వివేకునకు యుద్ధము మొదలగుటకు పూర్వము సాయంకాలవర్ణన కల్పితమైనది. ఇది మూలమున లేదు.

మూలములో సంభాషణలు వచనముగా నుండగా నిది శ్రవ్యకావ్యము గావున పద్యములతో నున్నది.[21]

4) మూలమున నారు అంకములు గలవు. కాని తెలుగున అయిదాశ్వాసములు గలవు.

ప్రథమాంకము ప్రథమాశ్వాసము
ద్వితీయాంకము ద్వితీయాశ్వాసము
తృతీయాంకము తృతీయాశ్వాసము
చతుర్థాంకము
పంచమాంకము చతుర్థాశ్వాసము
షష్ఠాంకము పంచమాశ్వాసము

మూలమునగల 4,5,6 అంకములు తెలుగున 4,5 ఆశ్వాసములలో సంగ్రహింపబడినది. అనగా కథాక్రమము సక్రమముగానున్నది. మూలమువలె ఆరు అంకములకు ఆఱాశ్వాసములు చేసిన యెడల, ఆశ్వాసములు చాల చిన్నవి యగును. అందువలన కవు లిట్లు చేసినారని మనము భావించవలెను.

మూలమున చతుర్ధాంకము "మైత్రి" అను పాత్రతో ప్రారంభము. కాని తెలుగున - ఆ పాత్ర తృతీయాశ్వాసముననే ప్రవేశపెట్టబడినది. వివేకమహారాజు స్వగతము. ఆవెనుక వస్తువిచారుడు వచ్చుట గలదు. పంచమాంకమున గల కథయంతయు. చతుర్థాశ్వాసముననే చెప్పబడినది. ఇందుమూలమున సంస్కృతమూలమునగల ఆఱు అంకములు తెలుగున ఆయిదాశ్వాసము లైనవి.

గ్రంధకర్తలు శైవులు. శివుడు పంచముఖుడు గాబట్టి మూలమున 6 అంకములున్నను, తెలుగున 5 ఆశ్వాసములుగా వ్రాసిరని మనము సమర్థించుకొనవరెను.

ఈసంస్కృతనాటకము యథామూలముగానె అనువదింపబడినది. కాని సంస్కృతమునగల శ్లోకములు, తెలుగున సీసపద్యములు వ్రాయునపుడు మూల భావములు మూడు పాదములలో నిమిడిన నాలవపాదమున ఎత్తుగీతియందు స్వంతకల్పన కథాసందర్భమున చేసిరి.

(i) మూలమునలేని భావములు చేర్చుట -
(i)శ్లో.

అహల్యాయై జారః సురపతిరభూరాత్మా తనయాం
ప్రజానాథోయాసీ దభజతగు రోరిందురబలామ్
ఇతిప్రాయః కోవాన పథమనదే కార్యతమయా
శ్రమోమద్బాణానాం కఇవ భువనోన్మాదవిధిషు.

(1-14)


సీ.

 తనకన్నకూతును దాన పెండ్లాడఁడే
                          వారిజగర్భుండు వావి దప్పి
బలభేది గౌతముభార్య నహల్యఁ గా
                          మించి చేయడె నల్లమేఁకతప్పు
కడలేనిరట్టడి కొడిగట్టుకొనియైనఁ
                          గమలారి గురుతల్పగతుఁడు కాఁడె

తపనసూనుఁడు తారఁ దా నాక్రమింపఁడె
                          యన్నప్రాణములకు నఱ్ఱుఁదలఁచి


గీ.

మఱియు నిట్లు జగంబుల మరులు కొలిపి
ఎట్టి నియతాత్మకులనైన గుట్టుచెఱిచి
కానిత్రోవల నడిపించు కడిమి నాదు
వాలుతూపులగమి కవలీలగాదె.

(1-50)

మూలశ్లోకములో, బ్రహ్మ - కూతురు సరస్వతి, అహల్య - ఇంద్రుడు, చంద్రుడు - తార అను మూడు దృష్టాంతములు మాత్రమే యున్నవి. సీసపద్యములో నీయనువాదము సాగినది గాన, నాలుగవపాదమున సమతత్వముకొఱ కింకొకదృష్టాంతము కావలసియున్నది. దానిపై నాల్గవపాదమున వాలి తారను లేవదీసుకొని పోవుట రామాయణమునుండి గ్రహింపబడినది.

శ్లో.

శ్రీదేవీ జనకాత్మజా దశముఖస్యాసీత్ గృహేరక్షసో
నీతాచైవ రసాతలం భగవతీ వేదత్రయీ దానవైః
గంధర్వశ్చ మదాలసాంచతనయాం పాతాళకేతుశ్చలాత్
దైత్యేంద్రోపజహారహస్తవిషమావామావిధేర్వృత్తయః

(3-4)


సీ.

చాపచుట్టఁగఁ జుట్టి చంకఁబెట్టుక పోఁడె
                          ధరణి హిరణ్యాక్ష దానవుండు
వేదత్రయీకాంత వెస మ్రుచ్చిలింపఁడె
                          చూఱపట్టిన యట్లు సోమకుండు
సాక్షాన్మహాలక్ష్మి జనకభూపాలనం
                          దనఁ జెఱపట్టఁడే దశముఖుండు
కొసరక యమ్మదాలసఁ గొనిపోఁడె పా
                          తాళకేతుఁ డనునక్తంచరుండు


గీ.

కాన నింతేసివారముగా యనంగ
రాదుపో యెట్టి పుణ్యవర్తనున కైన

సహజవక్రంబుగాన సజ్జనులమేలు
చూడఁజాలక విధి తప్పఁజూచెనేని

(2-11)

పైపద్యమున మొదటిపాదము “చాపచుట్టగఁ జుట్టి చంకఁ బెట్టుకపోడె ధరణి హిరణ్యాక్ష దానవుండు" అనునది అమూలకము. నీ పద్యము నాలుగుపాదములు పూర్తికావలెను. మూలమున మూడు దృష్టాంతములు మాత్రమే యున్నవి. అందుకొరకు నాల్గవది చేర్చినారు. ఈ కథ వరాహపురాణములోనిది.

వ.

మహామోహాః భోఅసత్సంగ ఆదిశ్యంతాంకామ క్రోధ లోభ మదమాన
మాత్సర్యాదయః యథా యోగినీ విష్ణుభక్తి భవావద్భిరే నావహితైర్విహంతవ్వేతి

(2-26)

యోగిని యగు విష్ణుభక్తిని సంహరించుటకు ప్రయత్నములు సల్పుమని మహామోహుడు కామక్రోధాదుల కసత్సంగునిద్వారా వర్తమాన మంపినట్లు మూలములో నున్నది.

తెలుగున కామక్రోధాదు లెదుట నున్నట్లును వారితోనే మహామోహు డీవార్త చెప్పినట్లున్నది.

మ.

పడతీ! దల్లిని దండ్రిఁ జంపుట తృణప్రాయంబు తోఁబుట్టులన్
మడియం జూచుట లెక్క గాదనిన జన్మజ్ఞాతి కీటంబులన్
గెడపం బూనుట నాకు దొడ్డె గుడి మ్రింగేవానికిన్ దల్పు ల
ప్పడము ల్గావునఁ బిల్ల పిల్ల తరమున్ భక్షింతు దాయాదులన్.

(2-67)

ఇందు మూలములో లేని లోకోక్తి యొకటి చేర్చబడినది.

శ్లో.

నిత్యంస్మరన్ జలదనీలము దారహార
కేయూరకుండల కిరీటి ధరంహరింవా
గ్రీష్మేసుశీతమివ వావ్రాద మస్తశోకం
బ్రహ్మపవ్రిశ్యభవ నిర్వృతి మాత్మనీనాం

(4-28)

లయగ్రాహి.

నందకధరున్ ఘనపురందరమణిప్రతిము నిందిరమనోహరు ముకుందు హరిఁ గానీ
చందనమరాళబిసకుందధవళాంగు గిరిమందిరు నుమారమణు నిందుధరుఁ గానీ
పొందుగ సదా మనసునం దలఁచి యైనఁ జిర మందమగుఁ దత్పరమునిం దలఁచియైనం
డెందముల పాపములు వడిం దలఁగు ఘర్మమునఁ గుంది మడుగుం దదయడిందుపడు లీలన్

(5-33)

మూలములో "హరి" కృష్ణుని స్తుతి మాత్రమే యున్నది. కృష్ణమిశ్రుడు వైష్ణవమతస్థుడుగాన శ్రీకృష్ణుని మాత్రమే పేర్కొన్నాడు. తెలుగున నంది మల్లయ ఘంటసింగయలు శైవు లగుటచే హరికృష్ణునితో సమానముగా హరుని శివుని గూడ పేర్కొన్నారు.

విష్ణు ప్రశంస మాతృకానుసారము
శివప్రశంస స్వంతకల్పనము

ఇచట నింకొకవిశేష మున్నది. అనువాదకులు పెద్దవృత్తమగు లయగ్రాహిని గ్రహించినారు. ఆ వృత్తము పూర్తియగుటకు క్రొత్తకల్పన యవసరము. అందుచే శివుని గూడ జేర్చినారు.

హరిహరు లొక్కరేయని హరివంశప్రతిపాదన గావున నీ కల్పనయెంతియు నౌచితీసంపాదనమై యున్నది.

మూలశ్లోకభావవిస్తరణ

శ్లో.

సమ్మోహయంతి మదయంతి విడంబయంతి
నిర్భర్త్సయంతి రమయంతి విషాదయంతి
ఏ తాప్రవిశ్యసదయం హృదయం నరాణాం
కింనామ వాసనయనాన సమాచరంతి

(1-22)

సీ.

వన్నెలు పచరించి కన్నుసన్నలు చేసి
                          వెడమాటలను బ్రేమ గడలు కొలిపి
తరితీపునటనలఁ దమకంబుఁ బుట్టించి
                          వట్టి ప్రియంబుల గుట్టు తెలిపి
కలికితనంబున కాఁకలు గావించి
                          తోడి నీడలు వోలె గూడి మాడి
యలుకల నలయించి కలయిక వలపించి
                          బానల నడియాస పాదుకొల్పి


గీ.

మనసు కరగించి బ్రమయించి మస్తరించి
మిగులఁ జొక్కించి యెంతయు దగులు పఱచి
పాసి యెడఁ బాసి తమబంటు చేసికొనరె
వామలోచన లెంతటివారినైన.

(1-75)

ఇది సంస్కృతమూలమునకు చక్కని వ్యాఖ్యానానువాదము.

శ్లో.

క్షేత్రగ్రామవనాది పత్తనపురద్వీపక్షమామండల
ప్రత్యాశాయతసూత్రబద్ధమనసాం లబ్దాధికం ధ్యాయతాం
తృష్ణేదేవీ యదిప్రసీదసి తనోష్యంగాని తుంగానిచే
త్తద్భోఃపిప్రాణభృతాంకుతః శమకథా బ్రహ్మాండ లక్షైరపి

(2-32)


సీ.

పుడమిలో మాన్యంపుమడి కొంత గలవాఁడు
                          గ్రామమెల్లను నేలఁగా దలంచు
గ్రామ మేలెడువాఁడు కాంక్షించు గిరివన
                          స్థలజలదుర్గవద్రాజ్య మేల
రాజ్య మేలెడువాడు రాజ్యవైభవమున
                          హెచ్చి తా నొకద్వీప మేలఁగోరు
ద్వీప మేలెడువాఁడు తేజస్వియై మహీ
                          వలయ మెల్లను నేల వాంఛ సేయు

గీ.

నిట్లుకడలేని యాసాస లీనుచుండ
జనులు బ్రహ్మాండకోటులఁ దనివినొంద
రనిన శాంతికి, గాలూదనైనఁ గలఁదె
యెడము మదిఁ దృష్ట నీవింత వెడలితేని

(2-64)


శ్లో.

నరాస్థినూలాకృత భూరి భూషణః
శ్మశానవాసీ నృకపాలభోజనః
పశ్యామి యోగాంజనశుద్ధదర్మనో
జగన్మిధోభిన్న మభిన్న మీశ్వరాత్

(2-12)


సీ.

పుట్టింప రక్షింపఁ బొలియింపఁ గర్తయౌ
                          భైరవేశ్వరుడు మాపాలివేల్పు
ప్రమదనటద్భూతభయదశ్మశానశృం
                          గాటకంబులు మాకు నాటపట్లు
నక్షత్రపటలీవలక్షంబు లైనన
                          రాస్థిఖండములు మాహారతతులు
నీహారకరబింబనిభమానవశిరఃక
                          పాలము ల్మాభుక్తిభాజనములు


గీ.

గాఁ జరింతుము తమలో జగంబులెల్ల
వేరువేరైన శివునితో వేరుగా వ
టంచుఁ జూతుము సిద్ధయోగాంజనపు
దీపితంబైన సుజ్ఞానదివ్యదృష్టి.

(3-32)

ఇచ్చటను చిన్నవృత్తమునకు నీపద్యము చేకొనబడినది. భైరవేశ్వరుడు మాపాలివేల్పు అనునది యనువాదమున చేర్చబడినది. ఇచటను మూలమున మూడువిశేషణములు మాత్రమే కలవు. శ్మశానవాసము, కపాలభోజనము, అస్తిహారము. నాల్గవపాదపూరణమునకై భైరవేశ్వరుడు చేర్చబడినాడు. ఇది

యుచితమే.

కాపాలికులు శైవులలో నొకశాఖ. కావున శైవులైన యనువాదకులు భైరవేశ్వరుని జేర్చిరి. కాలభైరవుడు కాపాలికులు కొల్చెడి వేల్పు.

భావసంగ్రహణము

మధ్యాహ్నార్కమరీచి కాస్వివపయః పూరోయద జ్ఞానతః
ఖంవాయుర్జ్వలనోజలం క్షితిరితి త్రైలోక్యమున్మీలతి
యత్తత్ప్యం విదుషాని మీలతిపునఃస్రద్బోగి భోగోపమం
సాంద్రానంద ముపాస్మహే తదమలంస్వాత్మావ బోధంమహః

(1-1)


అంతర్నాడీనియమిత మరుల్లంఘిత ప్రాణరంధ్ర
స్వాంతేశాంతి ప్రణయినిసము న్మీలదానందసాంద్రమ్
ప్రత్యగ్జ్యోతిర్జయతి యమినః స్పష్టలాలాటనేత్ర
వ్యాజవ్యక్తీతమవ జగద్వ్యాపిచంద్రార్థమోళేః

(1-2)

ఈ రెండు నాందీశ్లోకములను నీకవు లొక్కపద్యమున తెలుగు చేసినారు.

సీ.

ఎఱుఁగనివారికి నేదేవుఁడు ప్రపంచ
                          మేమరీచికలు నీరైన కరణి
నెఱిఁగినవారికి నేదేవుఁడు జగంబు
                          గాఁడు పగ్గము పాముగాని కరణి
నేదేవుఁడు వెలుంగు నాదిశక్తియుఁ దాను
                          నెలయును నిండువెన్నెలయుఁబోలె
బ్రహ్మనాడ్యాగత ప్రత్యక్పరంజ్యోతి
                          నామించు నేదేవునడిమినేత్ర


గీ.

మట్టి సర్వేశుతోడిఁ తాదాత్మ్యమహిమ
గలిగి పరిపూర్ణభావవిఖ్యాతుఁడైన
దక్షిణామూర్తి దేశికోత్తము నఘోర
శివుల భజియించి యేకాగ్రచిత్తమునను.

(1-32)

మూలమున నాందీశ్లోకములలో మొదటిది అద్వైతబ్రహ్మమును, రెండవది శివుని తెలుపును. చంద్రార్థమౌళి యని కవియే స్పష్టపఱచినాడు. తెలుగున నీరెండుశ్లోకములును శివునిపరముగా నన్వయింపబడినవి.

రెండవశ్లోకములో మూలమున “శాంతిప్రణయిని" అని అద్వైతపరముగా యుండగా తెలుగున ఆదిశక్తి అని శివశక్తిపరముగా నున్నది.

తెలుగున కవులిద్దరు నీశ్వరారాధకు లగుటవలన అనగా శివారాధకులైన శైవు లగుటచేత అద్వైతపరముగా నున్నదానిని శివపరముగా మార్చినారు.

గురుస్తుతి

పైరెండుశ్లోకముల పద్యానువాదము తమ గురువగు దక్షిణామూర్త్యఘోరశివాచార్యుల పరముగా చెప్పబడినది. గురువు సాక్షాత్తు శివస్వరూపుడు.

"గురురహ్మ గురుర్విష్ణు గురుసాక్షా న్మహేశ్వరః
గురుశ్చ మాతాపితరౌ తస్మైశ్రీ గురువేనమః"

అనిసూక్తి.

అద్వైతబ్రహ్మమును, శివునితో, తమగురువుతో సమన్వయము చేసి స్తుతించుటవలన ఇచట దైవపరమగు శివస్తుతిగాక దైవస్వరూపమానవుడైన తమ గురుస్తుతి యైనది.

యథామూలానువాదములు

1)

వేశ్యావేశ్మసుసీధుగంధలలనావక్త్రానవామోదితై
ర్నీత్వా నిర్బరమన్మథోత్సవరసైరున్నిద్ర చంద్రాక్షపాః
సర్వజ్ఞాఇతి దీక్షితా ఇతిచిరాత్రప్రాప్తాగ్నిహోత్రాయితి
బ్రహ్మజ్ఞాఇతి తాపసాయితి దివాధూర్యై జగద్వంచతి

2 అం. 1శ్లో


మ.

రతులన్ సీధురసంపుక్రోవులగు వారస్త్రీల కెమ్మోవులన్
మతి నుప్పొంగుచుఁ గ్రోలి వెన్నెలల నానందించి రేపాడి దీ
క్షితులై తాపసులై సదాజపితలై క్షీరోదకాహారులై
యతులై దంభత మోసపుచ్చుదురు మర్త్యశ్రేణి ధూర్తోత్తముల్

(2-3)

2)

నీవారాంకితసైకతాని సరితం కూలానివైఖానసో
రాక్రాంతాని నమిచ్చషాలచమసవ్యాప్తాగృహాయజ్ఞనామ్
ప్రత్యేకంచనిరూపితాః ప్రతిపదంచత్వార ఏమాశ్రమాః
శ్రద్ధాయాఃక్వచి దప్ఠ్యహూ ఖలుమయావార్తాపినాకర్ణితా

3అం3శ్లో


మ.

చెలియా! యింతకుమున్ను మౌనివిసరక్షిప్తోచ్ఛషష్ఠాంశసం
కులనానాతటినీవిశాలపులినక్షోణీసమీపంబు లు
జ్జ్వలస్రుగ్దర్భసమిచ్చషాలచమసవ్యాప్తాధ్వరాగారముల్
గలయం జూచితిఁ దల్లి నేకడ వినం గానంగ లేనక్కటా!

(3-9)

అమూలకములు

ఈ క్రింది పద్యములు రెండును చతుర్థాశ్వాసమున నున్నవి. మూలము లేదు.

ఆ.

ఇట్టి మోహభూత మిరవగు సంసార
సాలమనవబోధమూలయుతము
కాన నీశ్వరాంఘ్రికమలార్చనాజాత
బోధగజము చేరి పోవ వైచు.

(4-4)


సీ.

నికటమలద్వారనిర్గతదుర్గంధ
                          వాతూలసంఘాతవాసితంబు
వితతకోణత్రయీవిస్తారితానేక
                          సాంద్రకంటకరోమసంవృతంబు
కలుషభూరిరజోవికారసముద్భవా
                          సారశోషితపంకసంకులంబు
విస్రగంధాలయాజస్రపరిస్రవ
                          బహుతరప్రస్రావవల్లవంబు


గీ.

నైనభవదీయమందిరప్రాంగణమున
కెట్టు దివిచెదు యోగ్యులై నట్టిఘనుల

భృంగమౌర్వీనినాదకంపితసమస్త
పటువియోగిజనప్రాణ! పంచబాణ!

(4-10)

వీనికి మూలము లేకపోవుటచే వీరేశలింగముగారు “ఇది యొకప్రతియం దున్నది ప్రక్షిప్తమై యుండును. ఇదియొక ప్రతిలోనే యున్నది. ప్రక్షిప్త మని తోచుచున్నది." అని అధోజ్ఞాపికలు వ్రాసి యున్నారు.

అననువాదములు

ఇట్టిది యొకటియే యున్నది.

నిహతస్యపశోర్యజ్ఞే
స్వర్గప్రాప్తిర్యదీక్షితే
స్వపతాయజ మానేన
కింనతస్మాన్నిహన్యతే

(6-25)

ఈ శ్లోకము ప్రబోధచంద్రోదయనాటకమున నున్నను నది కృష్ణమిశ్రరచితముగాదు. కృష్ణమిశ్రుడే ఉపనిషద్దేవిచేత ఈ శ్లోకమును పలికించినాడు. ఈ శ్లోకము భగవద్గీత 18వ అధ్యాయమున 19వ శ్లోకము. కావుననే నీ కవులు దానిని విడిచిపెట్టిరి. యథానువాదము గావించిన యధునాతనకవులు దీనిని యాంధ్రీకరింపలేదు. ఒక్క గట్టి లక్ష్మీనరసింహశాస్త్రిగారు మాత్రమే యనువదించిరి.

జంటకవులు దీనిని విడిచి పెట్టుటకు నింకొకహేతు వున్నది. వీరు శైవులు. శైవులకు భగవద్గీత ఎంతమాత్రమును ప్రమాణగ్రంథము గాదు. వారి కాగమములే ప్రమాణములు.

వర్ణనలు

కృతిపతియైన గంగన కవులను ప్రబంధరీతిని ప్రభోదచంద్రోదయనాటకమును రచింపుడని యభిలషించినట్లు గలదు.

క.

అనవుడు ననంతవిభు గం
గన వారలఁ జూచి యిట్టి ఘననాటకముం

దెనుఁగునఁ "బ్రబంధశయ్యను"
నొనగూర్పఁగ నేర్చు సుకవు లుర్విం గలరే.

(1-22)

కృతిపతి యభిలాషప్రకారము కవులు నీ నాటకానువాదమున ప్రబంధవర్ణనలు నెలకొల్పి చంపూప్రబంధముగా మార్చి వేసిరి.

1. కృతిపతి కొలువుకూటము వర్ణన

వచనము (1-25)

2. పురవర్ణన

సీ.

అనుపమ జ్యోతిర్మయంపుఁ గోటలుచుట్టు
                          రాజిల్లుచుండు నేరాజధాని
సరిలేని యమృతంపుఁబరిఖ లేపట్టణం
                          బున నగాధంబులై తనరుచుండు
మరి సాటిలేని నైర్మల్యంపుమేడ లే
                          వీట మిన్నుల కను మీదుమిగులు
ప్రతిలేని సహజసౌరభ్యంపుఁదోఁట లే
                          పుటభేదనంబునఁ బొలుపుమీఱు


గీ.

సంతతరిరంసపరమహంసప్రమోద
కారణమహావికస్వరకమలచక్ర
పూర్ణసదమలసరసు లేపురమునందుఁ
గ్రందుకొనుచుండు నాచిదానందనగరి.

(1-89)

3. జైత్రయాత్ర

సీ.

కటితటీకటదానగంధభ్రమత్భృంగ
                          భీకరకరిఘటాబృంహితముల
భీషణవిద్వేషివేషియథోచిత
                          వేషఘోటకఘోరహేషితముల
ధనురాదివివిధాయుధధ్వజాధిష్ఠిత
                          నిష్ఠురస్యందననిస్వనముల

ఖడ్గమయూఖాంధకారితాశాముఖ
                          వీరభటప్రోద్భటారభటులఁ


గీ.

గాహళారవభేరిభాంకారములను
గంచుకివ్యూహభూరిహుంకారములను
పద్మజాండంబు బీటలు వాఱుచుండ
దళదశంబులు చక్రతీర్థంబు వెడలె.

(4-87)

4. ఉద్యానము

క.

చంచల గురుదంచలమద
సంచరదళి సంచయాతి సంభన్నదళో
దంచిత సుమకంచు కితము
వెంచఁ గొలఁదిగాక మించే నివె పూఁదోఁటల్

(4-42)

5. సూర్యాస్తమయము

చంద్రోదయ సూర్యోదయములు

శా.

అంత గుంకుమపంకపాటలిమతోనస్తాద్రిపై నిల్చె భా
స్వంతుఁ డిందుఁడు నింద్రగోపరుచి పూర్వక్ష్మాధరం బెక్కె వా
రెంతేఁ జూడఁగ నొప్పి రప్పుడు వివేకేశప్రతాపప్రభా
ప్రాంతంబందలి వెంటసంజవలెఁదద్రాకాదినాంతంబునన్

(4-48)


సీ.

మోహుపక్షమువారి మొగములపగిది యం
                          భోరుహవ్రాతంబు ముచ్చముణిఁగె
వికసించె దొగలు వివేకునిపక్షంబు
                          వారల చిత్తోత్సవంబుకరణి
మోహుని బంధుసమూహంబు కైవడిఁ
                          గోకసమూహంబు శోకమందెఁ
జెలఁగెఁ జకోరకములు వివేకక్షమా
                          ధవుని నెయ్యంపుబంధువులపగిది

గీ.

ముదిసె నిశ మోహురాజ్యసంపద యనంగఁ
దెల్లవాఱె వివేకునితెలివి యనఁగ
దొలఁగెఁ జుక్కలు మోహునిబల మనంగఁ
దరణి పొడచె వివేకప్రతాప మనఁగ.

(4-49)

6. యుద్ధము

క.

కరికరి హరిహరి నరదం
బరదము భటుభటుఁడు దాఁకి యయ్యిరుమొనలన్
సరిఁ బోరిరి శరముద్గర
కరవాలప్రముఖశస్త్రఘట్టన మమరన్.

(4-57)


మహాస్రగ్ధర.

ప్రవహించెన్ సైనికాళీపలలనికరముల్ పంకము ల్గా మదేభ
ప్రవరోత్తుంగాంగశైలప్రకరహతరయాపాండురచ్ఛత్రపంక్తుల్
కవలై క్రీడించు చక్రాంగముల గములుగాఁ కముల్ రంకముల్ గా
వివిధాస్త్రచ్ఛిన్నభిన్నద్విషదవయవజోద్వృత్తరక్తస్రవంతుల్

(4-68)

మఱియు వచనము (4-69) 13 పంక్తులు యుద్ధవర్ణన

రసము

ఇతివృత్తము ననుసరించి ఇది శాంతరసప్రధాన మగు నాటకము. అయినను తక్కిన రసములు కొన్ని సందర్భానుసారముగా కానవచ్చుచున్నవి.

శృంగారము

ఇది ప్రథమాశ్వాసమున రతిమన్మథసంభాషణయందు గలదు.

లోలకనీనికాకుల విలోచనద్వీప్తులు క్రేళ్లు దాటఁగాఁ
జాలభయంబున న్వడకు చక్కనిచన్ను లురంబు మోపఁగా
జాలమనోజ్ఞకంకణభుజాలతలన్ తనుదానె యీగతిన్
బాల గవుంగలించిన మనంబున దుఃఖము లంటనేర్చునే

(1-29)
ద్వితీయాశ్వాసము మోహుడు నాస్తికతను కౌగలించిన ఘట్టము (2-72,73)

తృతీయాశ్వాసమున కాపాలిని బౌద్ధుని కౌగలించుకొను ఘట్టము

క.

జవరాలగు కాపాలిని
గవుకిటతనమేను గజరు గజరులు వోగా
నవిరళసుఖమున హృదయం
బివతాళింపంగ బౌద్ధుఁ డిట్లని పలికెన్.

(3-44)


క.

వెనుకను నెందరు రండల
ఘనకఠినస్తనుల రతులఁ గౌఁగిటఁ జేర్చన్
గన నెన్నఁడు నాకాపా
లినికౌఁగిఁటిలోని సుఖము లేశంబయినన్.

(3-47)
కరుణరసము

తృతీయాశ్వాసమున శాంతి తన జననిగూర్చి ప్రలాపించు ఘట్టము.

క.

కుడువవుగా నేఁ బోత్తునఁ
గుడువక నేఁ బ్రక్కలేక గూర్కవుగా యే
యెడ నన్ను బాసి నీవర
గడియయు నిలువంగ లేవుగా యోజననీ

(3-5)

అని శాంతి ప్రలాపించును.

పంచమాశ్వాసమున మనసు మోహాదులు వివేకునిచే నిర్జితులైనపుడు విలపించు ఘట్టము.

సీ.

హా! కామరాగమదాది పుత్రకులార!
                          కానరారేల నాకూనలార!
కడుపు చుమ్మలు చుట్టగా నెట్లు నే నిర్వ
                          హించెద నను నూఱడించరయ్య!
హా! యసూయాది కన్యకలార! న న్ననా
                          థను విడ్చియిట్లు పోజనునె మీకు
అక్కటా! హింసాదులైన కోడండ్రార!
                          యెక్కడ నున్నారు దిక్కు నాకు

గీ.

నేది యేదితి మిమ్ముల నిన్నినాళ్లు
పాపకర్మపుదైన్య మీగతిని మిమ్ము
నొక్కరునిఁ జిక్కకుండఁగ నుక్కడంచె
బాపురే నాదురంతదౌర్భాగ్యమహిమ.

(5-8)
భీభత్సము

మోహునిచే లోకము మోసపోయినపుడు వివేకమహారాజు విచారించుఘట్టము (4-8)

గీ.

వికటదుర్గంధభీభత్సవేష మలరు
నాలయంబులు చర్మమాంసాస్థిపంజ
రములునైన వధూశరీరంబులకును
వ్యాధిగృహముల కింతైన వాసి గలదె.

భయానకము

శా.

ఏమింకేమనిం జెప్పుదుం జెలి మహాహిక్రూరనిశ్వాసయున్
నానామర్త్యకపాలకుండలియు దంష్ట్రాచంద్రరేఖాంతర
స్థానప్రోల్లసజిహ్వయున్ హుతవహుజ్వాలాక్షియుం ఘోరశై
లానూనాంగియునైన భైరవి మహాహంకారహుంకారయై

(8-76)

అలంకారములు

అర్థాంతరన్యాసము

క.

క్రతువునుఁ గర్తయు ద్రవ్య
ప్రతతియుఁ జెడఁదమకు స్వర్గఫలము గలుగునే
వితతదవానలదగ్ధ
క్షితిరుహముల ఫలము మిగుల చేరువకాదే

(2-35)


ఆ.

చచ్చినట్టి జనుఁడు శ్రాద్ధంబుచేఁ దృప్తి
బొందు ననెడి మాట పొందుగాదు

తీరవారినట్టి దివియ మండునె భూమి
నెంత చమురు పోసిరేని పిదప

(2-88)


క.

పరిమిశ్రితదుఃఖం బని
నిరసింతురు విషయసుఖమున నీరసబుద్ధుల్
ధర నుముకకుగాఁ విడుతురె
సరిబియ్యము వచ్చు దీనసరి ధాన్యంబున్

(2-90)

రూపకము

ఆ.

.................................సంసార
సాల మనవబోధమూలయుతము
కాన నీశ్వరాంఘ్రికమలార్చనాజాత
బోధగజము చేరి పోవవైచు

(4-4)

ఉపమ

ఇది హెచ్చుగా వాడబడినది.

ఈతఁ డెవ్వరొకొ గర్వభరంబున మండుకైవడిన్ (2-3)
ఒడిసి వడి న్నెగయు గృధ్రియంబలె (3-73)
వెనకయ వెసల యిచ్చినవిధమున (3-79)
గాండీవి జయద్రథుఁ జంపినకైవడి (4-19)
మరుదాకంపితకంపవిరహితాబ్దియుఁ బోలెన్ (4-22)
దేవి లులాయదానవు వధించి నాలీల (4-25)
కేళ్లంగి వేసినట్లు (5-3)

ఉల్లేఖము

చ.

మరగిన కామధేనువులమందలు, సిద్ధరసప్రవాహముల్
దొరికిన కల్పవృక్షములతోఁటలు, జంబునదీసమూహముల్
సురపతి రత్నపుంజములు, శుద్ధసుధాఘుటికల్, కవీశ్వరో
త్కరముల కీయనంతవిభు గంగయమంత్రి కృపాకటాక్షముల్.

1-15

ఉత్ప్రేక్ష

చ.

జలకము మూర్ధ్ఖ్నచంద్రసుధ షట్కమలంబులు బూజధూప ము
జ్జ్వలతరబోధవాసననివాళి సుషుమ్నవెలుంగుసౌఖ్యముల్
తలఁపున నీగి బోనము సదానత నాదము ఘంట గాఁగ ని
ష్కలుషత నీయనంతవిభు గంగన గొల్చు నిజాత్మలింగతన్

1-17

ఇందు శివపూజాసమయమున శివయోగానుభవము బ్రహ్మానందసంధాయి యగు యోగానుభవముగా ఉత్ప్రేక్షింపబడినది.

కవితారీతి

శైలి

“శైలి' యనుపదము ఏ సంస్కృతాలంకారికులు వాడలేదు[22]. రీతి యని వాడిరి. కాని తెలుగున ప్రాచీనకాలమున నీపదము ప్రయుక్తమైనది. పండితారాధ్యచరిత్రలో పర్వతప్రకరణమున నీశైలిపదము ప్రయుక్తమైనది.

ద్వి.

చరితంబులును శ్రీ బసవపురాణంబు
నేలలు వెట్టంగ నింపు సొంపార
శైలి మై గ్రాలుచుఁ జదివెడివారు.

(పుట 488)

(1939 ముద్రణము.)

ఈ ప్రయోగము క్రీ.శ. 1200 నాటిది కావున లభ్యమైన ప్రయోగములలో ప్రాచీనతరము.

ఈ పదము నేటిసాహిత్యవిమర్శకులందఱును వాడుచునేయున్నారు.

ఈ జంటకవుల రచనారీతి యత్యంతహృద్య మైనది. ప్రత్యేకవిశిష్టత గలది. దీనిని గూర్చి ప్రసిద్ధవిమర్శకులగు కీ.శే. టేకుమళ్ల అచ్యుతరావుగారి యభిప్రాయములను నుదాహరించిన పాఠకలోకమునకు విశదమగును. వీరి కవిత "ధారాశుద్ధి సహజమై సమగతి కలదియై విరాజిల్లును.

“సుకుమారమై మృదులమై ప్రతి పద్యరససురితమై హృదయంగమముగానుండును."

అచ్యుతరావుగారు వరాహపురాణమును ప్రభోధచంద్రోదయమును తలస్పర్శగా నవలోకించి యీక్రింది యభిప్రాయమును ప్రకటించిరి.

"వీరు రచించిన రెండు గ్రంథములలోను ప్రబోధచంద్రోదయమే ఎక్కువ గణనీయమైనదని నే నభిప్రాయ పడుచున్నాను. దీని శయ్యారీతులు లేబ్రాయపురచనను బొడసూపుచున్నవి. అయినను రసపుష్టిచే నిగనిగలాడు దాక్షాఫలమంజరులవలె కోమలమై మృదులమై సర్వవిధముల మనోహరమై యున్నది. అందలి పద్యరచన యెంతరమణీయముగా నున్నదో గద్యరచనయు నంతసరళముగాను మనోజ్ఞముగాను నున్నది. వీరిగద్యము పింగళిసూరనార్యుని గద్యమువలె దీర్ఘసంస్కృతసమాసములు లేక చిన్నచిన్నశబ్దములతో గూర్చబడి అనుప్రాసమాత్రశబ్దాలంకారశోభితమై ముత్యంపుసరులవలె, విరాజిల్లుచున్నది."[23]

అచ్యుతరావుగా రన్నట్లు గద్యరచన ముత్యపుసరులవలె నుండుటయేగాక పద్యరచనయు ముత్యంపుసరులవలె నున్నది. ఈ సందర్భమున నీకవులు కావ్యారంభమున నిట్లు చెప్పుకొన్నారు.

క.

నేరుపరి సోహణించిన
హారమువెల యెక్కులీల నతిశయముగ నా
పేరఁ దెనిఁగింపవలయును
సారపుఫణితులఁ బ్రబోధచంద్రోదయమున్

(1-25)

అని కృతిపతి పలికిన మాటలు అనగా హారము కూర్పుచేత, నెంత రమణీయముగా మది, మనోహర మగునో నీకావ్యమును తమకూర్పు నేర్పుచేత కమనీయముగను, మనోరమముగను దిద్దితీర్చి యున్నారు.

ప్రబోధచంద్రోదయము సానల దీఱిన జాతిరత్నము. ఈ కావ్యము సభలో పండితకవులు దీనిని పరిశీలించిరనియు, వారి పరిశీలన మూలమున నిది మెఱుగెక్కినదనియు, నీ కవులే యిట్లు తెలిపినారు.

క.

పొరి పొరి నొప్ప సలాకల
నొరసిన కుందనపుఁ బూదెయును బోలె సభన్
సరసుల సంఘర్షణమున
వరకవి కావ్యంబు మిగుల వన్నియ కెక్కున్.

(1-22)

గంగమంత్రి సభలో కవి పండితు లీకావ్యమును నామూలచూడముగా పరీక్షించిరనియు, వారి పరీక్షలో నిది నిలిచి, వారి ఆమోదముద్ర బడసినదని పైపద్యతాత్పర్యము.

తక్కిన కవు లెవ్వరును నిట్లు సభలో పండితకవులను ప్రత్యేకముగా పేర్కొనలేదు. రాజాస్థానములలో పండితకవులు మాత్సర్యగస్తులు, వా రెప్పుడను తప్పులు వెదకుటకే ప్రయత్నించి, కావ్యమును ప్రభు వంకితము గొనకుండ చూచెదరు. ఇది వీరి సౌమనస్యము తెలుపుచున్నది. అట్టి పరిస్థితులలో, నీకవులకృతి ప్రబోధచంద్రోదయము, కవిపండితుల పరీక్షను నిలిచిన కృతి యగుటచేతనే, నేటికిని నీకృతి పండితకవివిద్వన్మాన్యమై యలరారుచున్నది.

పూర్వకవుల యనుసరణలు

నన్నెచోడకవి కుమారసంభవము

క.

కరిఁగరి భటుభటుఁ డరదం
బరదంబు హయంబు హయము నని మొత్తములై
గర గరి జమ జము డిలనిల
శరనిధి శరనిధియుఁ దాఁకుచాడ్పున దాఁగెన్

(కు.సం. 11-108)

క.

కరిఁ గరి హరి హరి నరదం
బరదము భటు భటుఁడుఁ దాఁకి రయ్యిరుమొనలున్
సరి బోరిరి శశముద్గర
కరవాలప్రముఖశస్త్రఘట్టన మమరన్.

(ప్రబో.4-87)

ముద్రాలంకారము

వృత్తముపేరు కథాసందర్భానుసారముగా నావృత్తమునందే నిముడ్చుట.

దీనిని తెలుగున ప్రవేశపెట్టినవాడు నన్నెచోడకవి. మత్తేభములు క్రీడించు సందర్భమున మత్తేభవిక్రీడితము, క్రౌంచములను వర్ణించునపుడు క్రౌంచపదము, స్వాగత మిచ్చునపుడు స్వాగతము, కుమారుడు పుట్టినపు డుత్సాహ, కావ్యాంతమున మంగళమహశ్రీ వృత్తములను నౌచిత్యముతో చోడుడు వాడినాడు.

ఈ కావ్యమున నన్నెచోడని ముద్రాలంకారానుసరణము గలదు.

భుజంగప్రయాతము.

నయప్రాపితోత్తేజనప్రౌఢశౌర్యో
దయోద్భూతవిద్వేషిధాత్రీభుజంగ
ప్రయాతావధిక్ష్మాధరస్థాపితోద్య
జయస్తంభసంభారిజంభారిభోగా

(4-72)

శ్రీనాథుడు కాశీఖండము

శా.

కింకుర్వాణపురం దరాదికమహాగీర్వాణకోటీకిరీ
టాంకస్థాపితనూత్నరత్నరుచిధారాశ్లేషకిమ్మీరహృ
త్సంకేజుండు హరుండు జంతువులకున్ బ్రాణాంతకాలంబునం
దోంకారాక్షరమంత్రరాజము జెవిన్ యోజించు గాశీస్థలిన్

(7-16)


క.

పరమజ్ఞానం బెఱుఁగని
నరులకు నీవారణాసినగరిని విశ్వే

శ్వరుఁ డంత్యకాలమున సు
స్థిరకరుణం దారకోపదేశము చేయున్

(ప్ర.2-25)

పోతన భాగవతము

ఉ.

ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు బరమేశ్వరుఁ డెవ్వఁడు మూలకారణం
బెవ్వఁ డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు సర్వము దానయైనవాఁ
డెవ్యఁడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేఁడెదన్


ఉ.

ఎవ్వనియందు విశ్వ ముదయించు నడంగు దలంప నీజగం
బెవ్వనిదీప్తి గానఁబడు నెవ్వనితేజము చిత్సుఖాత్మకం
బెవ్వనిఁ బుణ్యులెల్ల గుణియింపుచు ద్వైతతమంబు వాసి తా
రెవ్వలనన్ భవంబునకు నేగరు వాని నుతింతు నక్రియన్

5.82

కావ్యపౌరాణిక సూచనలు

రామాయణము

సీ.పా.

తపనసూనుడు తారఁ దా నాక్రమింపఁడె
              అన్నప్రాణములకు నఱ్ఱుఁ దలచి.

(1-50)


సీ.పా.

సాక్షాన్మహాలక్ష్మి జానకభూపాలనం
              దనఁ జెఱపట్టఁడే దశముఖుండు

(3-11)


లోభ రావణునికి దాశరథి నయ్యెద -

(4-25)

మత్స్యపురాణము

సీ.పా.

వేదత్రయీకాంత వెస మ్రుచ్చిలింపఁడే
             చూఱపట్టినయట్లు సోమకుండు.

(3-11)

వరాహపురాణము

సీ.పా.

చాపచుట్టగ జుట్టి చంకఁ బెట్టుకపోఁడె
              ధరణి హిరణ్యాక్షదానవుండు.

(3-11)

మార్కండేయపురాణము

సీ.పా.

కొసరక యమ్మదాలసఁ గొనిపోఁడె పా
              తాళకేతుఁడను నక్తంచరుండు

(3-11)

దేవీభాగవతము

ఉ.

చండికాదేవి లులాయ దానవు వధించినలీల

(4-25)

భారతము

క.

గాండీవి జయద్రథుఁ జంపిన
కైవడి పరబలము ద్రుంచి కాము జయింతున్

(4-19)

వ్యాకరణము

వ్యావహారికపదప్రయోగములు

ప్రబోధచంద్రోదయము నాటకమున కనువాదము గావునను, నాటకములు సంభాషణప్రధానములు గావునను, సంభాషణలో వ్యావహారికపదప్రయోగము తప్పనిసరి యగుటచేత నీకవులు కావ్యమునంతయు సలక్షణభాషలో రచించినను వ్యావహారికపదములను ప్రయోగించి ఈకావ్యమునకు నాటకీయముగా నొకప్రత్యేకవిశిష్టత సంపాదించినారు. ఈ విషయమును గూర్చిన వివరణము.

సంధి

క్వార్థక ఇకారము

అణగుండె అణగి + ఉండె(1-44)
ఎఱిగెఱింగి యొక ఎఱింగి + ఎఱింగి (4-7)
తత్సమాకారసంధి
వచ్చెబో యిది నాప్రాణవల్ల భనుచు ప్రాణవల్లభ + అనుచు
ఆత్మను ఆత్మ + అను(2-19)
మిథ్యౌట మిథ్య + ఔట(5-28)

స్త్రీవాచకసంధి

అడవెల్ల గాల్చి అడవి + ఎల్ల గాల్చి(1-62)
రోతని రోత + అని(3-58)

టుగాగమలోపసంధి

ద్వైతాద్వైతపడవి — ద్వైతాద్వైతపుటడవి

రుగాగమసంధి

జోగురాలి గూడితంటరాకుమన్న(3-49)

ఇచట జోగురాలులో “రా” వ్యంజనమునకు యతి. బాలవ్యాకరణము ననుసరించి కర్మధారయమున ఆలుశబ్దమునకు స్వరమునకే అచ్చునకే యతి.

పేదాదిశబ్దముల కాలుశబ్దము పరంబగునపుడు కర్మధారయంబునందు రుగాగమం బగు(సంధి-30)

కర్మధారయంబున దత్సమంబుల కాలుశబ్దము పరంబగునపుడు దత్సమంబున కుత్వంబును రుగాగమంబు నగు(సంధి.31సూ)

ద్రుతద్విత్వసంధి

ఒడిసి వడి న్నెగయు గృధ్రియుంబలె నున్నన్ - వడినే + ఎగయు వడినెగయు(2-7)
ఇది ద్రుతద్విత్వసంధిగా కనుపట్టినను వాస్తవముగా నిది ద్రుతద్విత్యసంధి గాదు ఇచట
వడిన్ + ఎగయు - అనుసంధిలో ఎగయు శబ్దము, అజాదిగా కాక హలాదిగాకూడ నున్నది.

ఏనికి "నేని" అను రూపమున్నట్లు 'ఎగయు' కు "నెగయు" అనురూపమున్నది.

నీటిలోననుండి నెగయుదెంచె (భార-ఆది-3-197)

క్రియలు

చేతు ప్రాయశ్చిత్తము చేతు (1-53)

1. చువర్ణంబు తోడ దుగ్గకారంబు తకారంబగు నిలుతురు, పిలుతురు, అడతురు, వచింతురు, చేతురు, కోతు రిత్యాదు లసాధువులని యెఱుఁగునది.(క్రియా 108సూ)

"ఏమి సేతు మందవేళ" అని మారన మార్కండేయపురాణము 1-22లో నింతకన్న పూర్వప్రయోగము గలదు.

2. పట్టుక2-32

చుటుక3-11

కొనిధాతువు పరంబగునపు డిగాగమంబు బహుళంబుగా నగుక్రియా.53

గుప్తార్థప్రకాశికలో చేసికొని చదువుకొని ఇత్యాదిక్త్వాంతంబులకు బదులుగా చేసుక, చదువుక ఇత్యాది క్త్వాప్రత్యయాంతసంగ్రహరూపము లనంతామాత్యాతిమ్మకవ్యప్పకవ్యాదిలక్షణికులచే తమగ్రంథములయందు వాడబడినది. కాని రూపంబు సూత్రంబున నిరూపింపబడలేదు. అని వ్యాఖ్యలో వ్రాసినారు.

ఇట్టివి కవిత్రయమువారిలో లేవుగాని శ్రీనాథునికాలమునుండి క్రీ.శ. 1420-30 ప్రాంతములనుండి కవిప్రయోగములు కానబడుచున్నవి.

మ్రింగేవాడు - గుడి మ్రింగేవానికిన్ దల్పు లప్పడముల్2.67
గుడి మ్రింగెడువానికి అని యుండవలెను.
"తృవర్ణకార్థంబునం దెడియెడు వన్నియలగు(క్రియా-44)
ప్రహరించెడివాఁడు ప్రహరించెడువాఁడు
పొగడేవు. 2.20

"పొగడినావు" అనునది సరియగురూపము. పైసూత్రమే దీనికి వర్తించును. ఇట్టివి క్రీ.శ. 1500లకు ముందులేవు.

త్రుళ్లడము

కేళ్లంగివేసినట్లు
త్రుళ్లడమున (5-3)

త్రుళ్లుధాతువులకు భావార్థమున త్రుళ్లుట అనియేగాని త్రుళ్లడము అను అడమాంతరూపము రాదు. ప్రతిక్రియ మదాంతత్వంప్రతీతంతున గీయతే అథర్వణ కారికావళి(అజ.సూ.93)

చిన్నయసూరి కృదాంతపరిచ్ఛేదమున టవర్ణకం బాద్వాదులకగు ననుచు నంత లోపంబగు (సూ7) తేరు అని టకారమే సూత్రించి ఆడు, ఊరు, ఏఁకరు, ఓడు, ముదలగు ధాతువుల నిచ్చినాడు. దీనిని బట్టి ఆతడును ఆడడము ఊరడము ఓడడము తేరడము మున్నగు రూపములు నిషేధింపబడినవి.

శ్రీనాథమహాకవి కాశీఖండము అడమాంతరూపము ప్రయోగించినారు.

గీ.

...........అగ్ని
మొదట కాశీపురమునకు ముట్టడముగ
సకలగృహముల దనమూర్తి సంగ్రహించె

కాశీ 5-301

శ్రీనాథునిప్రయోగము ననుసరించి ఈకవులును పైరూపమును వాడియుండిరి.

ఇంకా నొకకొన్ని 2-60
ఇంకయు నొకకొన్ని అనునది గ్రాంథికరూపము.
ఇట్టిరూపము ప్రయోగించుటలో తొలికవులు ప్రయోగ మందలిదే. దీనితరువాత ఆధునికకృతియగు (18వ శతాబ్ది) పట్టాభిరామాయణమున ఇంకాగల పాఠ్య మేమి" అని ప్రయోగము గలదు.

(బాలకవి శరణ్యము-94పుట)
దినాలు-(2–7)
వేదాలు-(2-7)
దండాలు-(2–43)

ఇవి వ్యావహారికరూపములే యైనను వీనికి గ్రాంథికభాషాసూత్ర మున్నది.

"లులనలు పరంబులగు నపు డొకానొకచో ముగాగమునకు లోపంబును దత్పూర్వస్వరంబునకు దీర్ఘంబును విభాషనగు

వజ్రాలు, వజ్రాలను, వజ్రాన, పగడాలు, పగడాలను, పగడాన ఒకానొకచోట ననుటచే నీకార్యంబునకు ప్రయోగవైరళ్యము సూచింపబడియె."

(తత్సమ 43సూ)

నన్నయలో నిట్టివి లేవు గాని, శివకవుల కృతులయందును తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాథాదులం దిట్టివి గలవు. కాని అవి చాలా విరళము. అందునకే ప్రయోగవైరళ్యము చెప్పబడినది.

వ్యావహారికభాషాప్రవర్తకులైన కీ.శే. గిడుగు రామమూర్తి పంతులుగారు పై ప్రబోధచంద్రోదయప్రయోగములను బాలకవిశరణ్యమున నుదాహరించినారు. కీ.శే. మల్లాది సూర్యనారాయణ శాస్త్రులుగారు, తమ ఆంధ్రభాషానుశాసనమున 'ప్రయోగ విశేషములు' అను శీర్షికలో పైప్రయోగములను సంగ్రహించియున్నారు.

తత్సమపద ప్రయోగములు

1. అంబులు (5-15) అంబువులు — ఉత్త్వలోపము

2. ప్రౌఢిమ-చతురామ్నాయ ప్రౌఢిమ (1-10)

ప్రౌఢిశబ్ధమునకు "ఇమనిచ్" ప్రత్యయము రాదని వామనోక్తి (సర్వంకషవ్యాఖ్య 372పుట) కాని శ్రీనాథకవి ననుసరించి యీకవులు 'ప్రౌఢిమ' అనివాడినారు.

3. బృసి-బృసీనివిష్టులై (2-8)

బృసి యనగా ఋషుల యాసనము. ఇది ఈకారాంత స్త్రీలింగశబ్దముగాన 'బృసీ' అను రూపము వచ్చినది. పైప్రయోగము బృసీశబ్దము ఈకారాంతమని నిర్థారణ చేయుచున్నది.

4. వారణసి — దీనికి సరియగు రూపము వారణాసి

“ఈ వారణసిని”యని (2-5)లో గలదు.

5. సుహృత్తు (5-53)

సుహృత్ శబ్దము తకారాంతము
‘హలంతంబు ప్రథమైక చనాంతతుల్యం బిందు నామంబగు
'ఉగాగమంబును ద్విత్వంబును దుది హల్లునకగు" (తత్సమ.67,68)

పై సూత్రములచేత సుహృత్ శబ్దమునకు సుహృత్తు అను రూపము వచ్చినది.

ఛందస్సు

గద్యపద్య సంఖ్య

1-ఆ. 87
2-ఆ. 81
3-ఆ. 86
4-ఆ. 72
5.ఆ. 117
— — — —
       443
— — — —

యతివిశేషములు

ఉపసర్గయతి

“స, మర్థు లీకృతిరాజనిర్మాణమునకు" (1-25) సమ్ అర్థ — సమర్థ. ఇచట సమర్థ శబ్దమునకు వ్యంజనయతి.

"ని, ర్ణయమతి గ్లేశపంచక పరాజ్ముఖుఁడయ్యె" (5-46) ఇచట పరాక్ శబ్దమునకు వ్యంజనయతి. నన్నయ దీనికి వ్యంజనయతి పాటించినాడు. "రక్కసు లెల్ల నాహవపరాఙ్ముఖు లైరి" (ఆర 4-12), తిక్కనలోను వ్యంజనయతి.

సీ.పా.

దానశీలురు పరధన పరదార ప
              రాఙ్ముఖచిత్తులు బ్రాహ్మణప్రియులు

శాంతి (5-11)

ఎఱ్ఱన మాత్రము స్వరయతి పాటించినాడు.

సీ.పా.

ప, రాఙ్ముఖు లార్యభావానుగతులు

హరి.పూ (8–54)

రాగమ సంధియతి

జోగు, రాలి గూడితంట రాకుమన్న(3-49)

ఇట రాలు (రు అ) శబ్ధములో వ్యంజనయతి. అప్పకవి రాగమసంధివళులనుపేర 'రాలు ధర్మాత్మురా లన రాక్షసారి' (3-215) అని దీనికి లక్షణము చేసినాడు. కాని చిన్నయసూరి ననుసరించి రాలు శబ్దము (రు అ) అని పదచ్ఛేద మగుటచే దానికి స్వరయతియేగాని వ్యంజనయతిలేదు. “ఏకాంతమునందు నున్న జవరాండ్ర" అని అతడే యుదాహరణ నిచ్చినాడు (చూ. సూత్రము 30 సంధి పరిచ్ఛేదము) దీనిని గూర్చి నేను పూర్తిగా చర్చించి రాలు శబ్దములలో స్వర, వ్యంజన యతులు రెండును నుండవచ్చునని నిర్ణయించినాను.[24]

సోదర శబ్దము

స్వరయతి

సోదర వధా వ్యసన సంభవోరువహ్ని(4-52)
ఇచట స ఉదర అని పదచ్ఛేదము. సహోదరశబ్దమున సః ఉదర అని పదచ్ఛేదము

సుకవిమనోరంజనము[25]

1) అఖండవడి—

శ్రీనిత్యంబుగ నుండు గావుత.....................................
......................................................................భో
ధాసందైకమయుండు శంకరుఁ డనంతస్వామి గంగయ్యకున్ (పుట100)

(1-1)

2) అభేదవడి - దడలకు

నావుడుఁ దద్ద్విజుం డహహ నాదగు శీలము వర్తనంబునున్
భావనముం గులంబునను బాగగువిత్తలు గౌడదేశరా
ధావరపట్టణంబునఁ గడాని మదీయగృహంబు తండ్రి ధా
త్రీవినుతుండు తత్సుతులు శ్రేష్ఠులు నే నధికుండ వారిలోన్.

(2-12)
రాధావరపట్టణంబునఁ గడాని — ముద్రితపాఠము (పుట 152)

3) ప్లుతయతి అచ్చునకు

సీ.

ఏజెంత బోధించెనే తల్లి
ఏబొడ్డి బోధించెనే యింత
ఏరండ యెడబాపెనే తల్లి
ఏలంజె భ్రమియించెనే తల్లి (పుట 265)

(3-3)

4) ప్రభునామయతి

సీ.పా.

 సింగమంత్రికి పుణ్యశీలయౌ పోచమ్మ
కాత్మసంభవుఁడు మల్లయమనీషి

(1-24) (పుట 357)

ప్రాసలు

ఖండాఖండప్రాస క. గాటపు సంసారాంబుధి, దాఁట (5-62) గీతము (5-57)లో ప్రాస పాటింపబడినది.

స్వమరు, సమయ- భ్రమర - సమర

వృత్తములు

1. హరిణీవృత్తము (1-71)

2. పృథ్వీవృత్తము (8-86)

నన్నయలో పృథ్వీవృత్తమునకు 9వయక్షరము యతి. అదే యీ కవులును పాటించిరి.

"ప్రధాన కులభూషణా ప్రధితజగన్నిమేషణా" పెద్దనాదులు 14వ యక్షరముపై యతి పాటించిరి.

3. దండకము మూలమున నిది దండకమే

“జయజయ వినయానతేంద్రాది బృందాకరకశ్రేణి చూడామణీ రాజితోపాంత పాదద్వయాంభోజ” (4-46)

"విద్వాంసులెల్లన్ హకారంబెకానీ, నకారంబెగానీ, సకారంబెకాని వచింపదగున్" అని అప్పకవీయమున దండకలక్షణము (4-253)

పైదండకము సకారముతో ప్రారంభమగుచున్నది. అప్పకవి ననుసరించి నమస్తే నమస్తే నమః. అని దండకము చివర నుండవలెను. కాని యిం దట్లు లేదు. "భక్తిన్ పునర్నమ్రుఁడై " అని మాత్రమే గలదు. ఇది 5 మాత్రలుగల ఖండగతిని నడచును.

వినయాన - 5 లఘువులు లేక మాత్రలు
తేంద్రాది -
బృందార -

ఇట్లే దండకమున ప్రయుక్తమైనవి కావున నిది ఖండగతి నడచు దండకము.

దండకములకు రగడవలె గతి భేదములున్నవి. నన్నయ భారతమున తొలిదండకమున “శ్రీకంఠ - లోకేశ - లోకోద్భ -వస్థాన సంహార - కారీము" అని తకారముతో ప్రారంభము. ఇదియు ఖండగతినే నడచును.

శ్రీకంఠ 5 లఘువులు లేక మాత్రలు

పైరీతిగా దండకములను తాళప్రధానములుగా పరిశీలింపవలసిన ఆవశ్యకత యున్నది.

4. ఉత్సాహవృత్త మిందు ఆశ్వాసాంతమున నున్నది. ఆశ్వాసాంతపద్యములలో ఉత్సాహవృత్తము వాడరు. ఈ కవులు మాత్రము వాడినారు.

5. భుజంగప్రయాతము (4-72.) భుజంగప్రయాత మిందు ఆశ్వాసాంతమున నున్నది. ఇదియు నాశ్వాసాంతముల వాడుకలేదు. పైదానివలెనే క్రొత్తవాడుక.

6. మణిగణనికరము ఈవృత్తము నన్నెచోడాది ప్రాచీనకవులు వాడిరి.

ఇది 15వది యగు ఆతిశక్వరీ ఛందస్సున బుట్టినది.

అనవుడు మనసును నతిముదమున న
వ్వనరుహభవనుని వనజవదనా
తనయుని పలుకు లితరమరయఁగ నా
మనసునఁ గలిగిన మమతయుఁ దొలఁగెన్

(5-40)

ఇందునాలుగు నగణములు చివర సగణ మున్నది.

న న న న స
అనవు | డుమన | సునున | తిముద | మునన | వ్వ

అప్పకవీయమున నిట్లే కలదు.

మణిగణనికరము మను లఘు గురువై (4-305)
మణివిరమణమయి మనుదనుజహరున్.

మణివిరణమనగా 9వ యక్షరముపై యతి. మణు లనగా రత్నములు, రత్నములు తొమ్మిది.

7. విద్యున్మాల (5-78)

అమ్మ యిన్నా ళ్లత్యంతాయా
సమ్ముం జెందం సచ్చన్నాకా
రమ్ముం జొప్పారంగా నెచ్చో
నెమ్మే నెమ్మొందున్ నీవుంటన్.

ఈ వృత్తము 8 వడియగు అనుష్టుప్ ఛందస్సులోనిది. అప్పకవీయలక్షణమునకు సరిగా నున్నది.

మ మ గగ
అమ్మాయిన్నాళ్లంత్యంతాయా

ఈ వృత్తము సాధారణముగా కవులు వాడుక చేయలేదు.

8. చిత్రకవిత - గర్భకవిత

ఇందొక్కచో గర్భకవిత కలదు.
కందగర్భిత మణిగణనికరము

కలికి యొకతె యలకము లలి బలమున్
బలె నలికతలముపయిఁ గడలుకొనన్
గలకల నగియెడు కనుగవతళుకుల్
తళతళ మెఱయఁగఁ దను బలుకుటయున్.

(5-56)

ఇందలి గర్భితకందము

క.

కలికి యొకతె యలకము లలి
బలమున్ బలె నలికతలముపయిఁ గడలుకొనన్
కలకల నగియెడు కనుఁగవ
తళుకుల్ తళతళ మెఱయఁగఁ దను బలుకుటయున్.

దీనివలన నీకవులు చిత్రకవితయందు సామర్థ్యము గలవారని తెలియుచున్నది.

అశ్రుత వ్యాఖ్యాన మాశుకవిత్వంబుం అని 64 పద్యమున ఆశుకవిత్వప్రశంస గలదు. ఇందువలన కావ్యమధ్యమున ఆశుకవితాప్రసక్తి తెచ్చుటచేత వీరు ఆశు, మధుర, చిత్ర, విస్తర కవిత్వములో మధురకవిత (యక్షగానాదులు) తప్ప తక్కినవానియందు నేర్పరులని గ్రహింపవచ్చును.

మంగళమహాశ్రీ వృత్తము

ఈ కావ్యాంతమున (5–117) మంగళమహాశ్రీ వృత్త మున్నది. కావ్యము శ్రీతో ప్రారంభించి మంగళమహాశ్రీ వృత్తముతో సమాప్తముచేయు సంప్రదాయము పూర్వ ముండెడిది.[26] నన్నెచోడమహాకవి తన కుమారసంభవమున నీ సంప్రదాయము ప్రారంభించినాడు. ఆవెనుక శ్రీనాథయుగము తరువాతను నీ సంప్రదాయ ముండెడిది. నన్నెచోడని వెనుక

1) జక్కన విక్రమార్కచరిత్ర
2) మడికి సింగన పద్మపురాణము, జ్ఞానవాసిష్ఠము
3) నందిమల్లయ ఘంటసింగయకవుల ప్రబోధచంద్రోదయము

వీనియందు కలదు.

ప్రబంధయుగమున నీసంప్రదాయము ముగ్గురుకవులు పాటించిరి.

1) ముక్కు తిమ్మన పారిజాతాపహరణము
2) వెన్నెలకంటి సూరన విష్ణుపురాణము
3) కాణాదము పెద్దన సోమయాజి అధ్యాత్మరామాయణము

జాతీయములు

"ఉముకకు (ఊఁక) ధాన్యమి విడుచు"
"కడుపు చుమ్మలుచుట్టు" "కాలిలో ములుగాడకుండ”
"క్రూకటివే ళ్లుండగా మూసిడికొనలు విఱుచుట"
“నల్లమేఁకతప్పు"

మొదలగు జాతీయము లిందుగలవు. వానిలో నల్లమేకతప్పు అనుదాని వివరణ ఆవశ్యకము.

నల్లమేఁకతప్పు (1-50) "సీ.పా. బలభేది గౌతము భార్యనహల్య, గామించి చేయడె నల్లమేఁకతప్పు”

ఇంద్రు డహల్యను కామించి గౌతము డెప్పుడును నింటివద్దనే యుండుటచే తెల్లవారుజామున యుండడని గ్రహించి కోడియైకూసి ఆతడు ప్రాతస్నానమునకు వెడలగానే ఆహల్యతో భోగించెను. గౌతముడు తిరిగి వచ్చుచుండగా ఇంద్రు డాతని కంటబడెను. జరిగినది తెలిసికొని గౌతము డింద్రుని ముష్కములు తెగిపోవునట్లు శపించెను. అవి తెగిపోయినవి. అంత దేవత లది చూచి నల్లమేక ముష్కముల నతికించిరి.

సామెతలు

గుడి మ్రింగేవానికి తలుపు లప్పడములు (2-65)
రెంటికిం జెడిన రేవడు (3-24)
వెనకయ్య చేతికి వెసల యిచ్చిన విధమున (4-29)

వైవానిలో వెనకయ్య చేతికి వెసలు యిచ్చిన విధమున అనుదాని యర్థము సరిగా నింతవఱకు వివరింపబడలేదు సూ.ని.లో వెసలు క్రింద యిది చూపబడి "తాను చెడి యితరునిగూడ చెఱచుట" అను నర్థమీయబడియున్నది. (సం. 7 పుట 851)

ఈ సామెతను నాచన సోము డుత్తరహరివంశమున ప్రయోగించినాడు (3-50) సూ.ని. దీనిని యుదాహరించినది. దీనియర్థ మిది "ఇచట వెనకయ్య అనగా మన విఘ్నేశ్వరుడుగాడు. వినాయక శబ్దభవము వెనకయ్య ఈవినాయక శబ్దము గణపతినేగాక, బుద్ధుని బోధించును" బుద్ధో వినాయకః అని అమరము.

బౌద్ధబిక్షుకులు వారికి వెసలు వంటపాత్రలతో ప్రమేయములేదు. కోమటి బౌద్ధునికి వంటపాత్ర లిచ్చి తాను చెడుటయేగాక ఇతరకోమట్లను చెఱుచును. అందువలననే సూ.ని. యం దిచ్చిన యర్ధము సరియైనది. ఇది బౌద్ధమతసంబంధమైన సామెత యని గ్రహింపవలెను. [27]

సంస్కృత సూక్తులు

ఇందు పైసూక్తులు రెండు మాత్రమే గలవు.

"స్త్రీముఖం సదాశుచిః" 2-55

స్త్రీ ముఖం సదాశుచి యన్న సూక్తికి తెలుగున నీక్రింది పద్యము వాడుకలో నున్నది.

క.

జిగిగల పడతుల మోవికి
యగణితముగ నీళ్ళబావి కమృతంబునకున్
తగ నుచ్చిష్టము లేదని
ఖగవాహనుతోడ గరళకంఠుఁడు పలికెన్.

అహింసాపరమోధర్మ 8-40
ఉష్ణ ముష్ణేన శామ్యతి 5-12

విశిష్టపదములు - అర్థములు

అనుభోగించు. సం స క్రి అనుభవించు

తనువునకు నాత్మ వేఱఁట
యనుభోగించు నట పిదప
నాముష్మికమున్

(2-31)

ఈ పదమున కిది యొక్కటే ప్రయోగము (సూ.ని)[28]

అనూనయించు. సం.స.క్రి (ఇందలి యడాగమము విచార్యము) అనూనినుగాఁ జేయు, గౌరవించు, పూజించు

"ఉపనిషద్దేవిని ననూనయించి తోకొంచు రండని పలికి (1-84)

ఈ పదమునకు మొదటి ప్రయోగ మిది. సూ.ని.లో, రంగారాయచరిత్ర, "అని యనూనయించుచు", (1-15-16) అనియు “ధాత ననూనయించి" సేతు ఖండము (1-41) అను రెండు ప్రయోగములు గలవు. కాని ఈ రెండు ప్రయోగలు అర్వాచీనములు.

అవధాని సం. విణ న్.నీ న్ అవధానము కలవాఁడు (సూ.ని. సం.1 325 పుట)

దీనికి ప్రయోగము చూపబడలేదు. అర్థము సరిగాలేదు. అవధాని శబ్దమునకు రెండర్థములు. ఒకటి వేదములు చదువువాడు "అర్థంబు తెలియక యఱచెద రవధాను లూరక వేదాలు నోరికొలది." (2-7) అని యిందు ప్రయోగము. రెండు అష్టావధాని — అష్టావధానము చేయువాడు, శతావధాని — సాహిత్యమున శతావధానము చేయువాడు అనియు వాడుకలో నున్నవి. అహంబ్రహ్మీభవించు: సం. అ. క్రీ. అహంబ్రహ్మ అనుకొనువాడగు, నేనే బ్రహ్మ మని యనుకొను "అహం బ్రహ్మీభవించి తల్లికిం దగినబిడ్డ కలిగెనన మెలంగుచుండు" (1-76) చల్లాసూరయకవి దీనిని తన వివేకవిజయమున ప్రయోగించెను. (పుట 88) (సూ.ని.)

ఆగ్రహముచేయు సం. స.క్రి - కోపముచేయు సూ.ని.లో ఆగ్రహము సం.వి. అ.పు. 7వ యర్థము కోపము ఈ యర్థము తెనుగు గ్రంథములయందును వాడుకలోను గాన్పించుచున్నది.

"ఆగ్రహ మాత్మలోఁ బొడము నట్లుగ" వి.పు. 1.13 (పుట390. ఇచ్చట ఆగ్రహము విశేషముగా నున్నది. గాని క్రియగా లేదు)ఆగ్రహము చేయు

“చెఱచెదనంచు నాగ్రహము చేయుగాని" (5-51) అని యందు ప్రయోగముకలదు. ఇది నిఘంటువుల కెక్కలేదు.

ఆశుకవిత్వము సూ.ని.లో "ఆశుకవి " పదమున్నదిగాని ఆశుకవిత్వము లేదు. శబ్దరత్నాకరానుబంధమున (పుట 11) నేను చేర్చితిని. అశ్రుతవ్యాఖ్యాన మాశుకవిత్వంబు 5-56.

ఆలు ప్రత్యయ ప్రయోగములు

కులస్థురాలు- అభాసురాలు 8-95
జోగురాలు 3-49
భావకురాలు 5-57
వృథారంజకురాలు 1-73
సేవకురాలు- 2-54
విహ్వలురాలు 3-74

పైవానిలో 'జోగురాలు' ఆను పదమునకు మాత్రమే నిఘంటువులలో ప్రయోగము గలదు. తక్కినవానికి లేవు. జోగురాలి శబ్దమును మొదట ప్రయోగించిన దీకవులే. ఇవతాళించు ఇవతాళింపుగ బౌద్ధుఁ డిట్లని పలికెన్ (3–46) ఇవతాళించు అనగా చల్లనగు శీతమగు అని యర్ధము.

దీనిని శ్రీనాథు డింతకు మున్ను ప్రయోగించినాడు, ఇవతాళించు విదర్భరాజతనయా హృద్యస్తనద్వంద్వమున్ (నైష 3-34)

ఇవతాళించు పదమునకు పైరెండు ప్రయోగములుగాక విక్ర. (4-158) లో ప్రయోగముకలదు.

ఉత్సార్యం జేసి (5–86) ఉత్సార్యము అనగా తొలగింపబడునట్లు చేయుట అని యర్థము. దీనికి నిఘంటువులలో ప్రయోగములేదు.

ఎడమపెని వెట్టు (1-81) పాడుచేయు వ్యతిరేకముచేయు పెనిమిటి ధర్మమున కెడమపుని పుట్టుదునే

ఇది నేతకు సంబంధమైనది. నేతిగాండ్రు సాధారణత్రాళ్లు కుడివైపునకు పెనవెట్టిన పేటలతో నేయుదురు. అందొకపేట ఎడమపెన పెట్టినదైనచో అది తక్కినవానితో గలియదు. నేత సరిగా జరుగదు. ఈ క్రియకు నీగ్రంథప్రయోగ మొకటియే కలదు. (సూ.ని.)

గాణు-గాడు హాని ఈపదమునకు నిర్ధారకముగా నొక్కటే ప్రయోగమిందున్నది. క. రాణించి – ప్రాణేశ్వర - జాణ - గాణు (ప్రాస) (వావిళ్లనిఘంటువు)

గ్లౌ-చంద్రుడు "గ్లౌ వంశ యనంతమంత్రి కమలజగంగా". ఇది 'గ్లౌ" అను శబ్దస్వరూపము నిర్ధారించును గ్లౌ-క- ఇది శ్రీనాథుని నుండి గ్రహించినదే.

"కంఠేకాల కిరీట విటంక గ్లౌరుచి, చుళుకితజల మణికర్ణిక" కాశీ. (6-125) చిన్నయసూరి ననుసరించి “గ్లౌ” శబ్ధమును “గ్లో" అను రూపాంతరము గలుగును. రై గ్లౌ శబ్దంబుల కొత్వంబు విధాషనగు తత్సమ. 64 సూ. కాని "గ్లౌ" శబ్దమునకేగాని గ్లో శబ్దమునకు నిర్ధారకప్రయోగములు లేవు.

జముకాణ (ళ)ము. జంబుకాణము జంబుఖానము

జమ్ముఖానము. వి. (హిం జమ్ ఖానా.) కూర్చుండుటకు ముతుకనూలితో నేసి క్రింద పఱచెడి ఆస్తరణవిశేషము. (సూ. ని. 3 సం. 398 పుట) సూ. ని. లో మనుచరిత్ర, చంద్రభానుచరిత్ర, ప్రబంధరాజమునుండి ప్రయోగము లీయబడియున్నవి గాని ప్రబోధచంద్రోదయ మందలి ప్రయోగమును మాత్రము వావిళ్లనిఘంటు విచ్చినది. జంబుకాణమునకు, ప్రయోగములు నవీనములే. ఇది అన్యదేశ్యము. ఈ యన్యదేశ్యము తొలుత నుపయోగించిన కవులు, ఈ కృతికర్తలే.
క.

...... ....తచ్ఛాసన
మున చేరువ జమ్ముఖానమునఁ గూర్చుండన్.

ఇది జమ్ముఖాణము - అను రూపమునకు నిర్థారకము.

జంత, వి. (క. జంతె) గయ్యాళి. సూ. ని. లో నీపదముకు సుదక్షిణాపరిణయము, ఉత్తరహరిశ్చంద్రోపాఖ్యానము నుండి ప్రయోగము లీయబడినవి. (3 సం 850 పుట). కాని యిందలిప్రయోగమే మొదటిది. "ఏజంత బోధించినే" 3-3.

తలనొప్పి వి 1. శిరోవేదన తలనొచ్చుట; 8. తలనొప్పి సూ.ని. (3సం 728పుట) ఇందు 17వ శతాబ్దినాటి శుకసప్తతినుండి మాత్రమే ఈ పదమునకు ప్రయోగ మీయబడిది. కాని తొలిప్రయోగ మీపదమునకు నిందేకలదు. "తలనొ ప్పేమియు జెందకే హృదయసంతాపంబునుం జెందకే” (4-23)

తామ్రంపుగిండి రాగిపాత్ర తామ్రంపుగిండి నంబువులిడ (2-14)

ఇది నిఘంటువుల కెక్కలేదు.
నిబద్ధి సత్యము “ఇది నిబద్ధి తప్పదు మీపాదమాన" (2-53)

ఈపదమునకు నిదియే మొదటి ప్రయోగము సూ.ని. (4సం. 351 పుట)లో నిది చూపబడినది. ప్రయోగము లన్నియు సానందోపాఖ్యానము, భాస్కరశతకము, చెన్నబసవపురాణము లోనివి. ఈకృతులు కర్వాచీనములు. వావిళ్ల నిఘంటువు దీనిని గ్రహించినది.

పరామర్శించు. సం సక్రి. చక్కగా విచారించు అని ఉత్తరరామాయణమునుండి ప్రయోగ మీయబడినది (సూ.ని. 5 సంపుట 202) ఇది 17వ శతాబ్ది ప్రయోగము కాని ఇంతకన్న పూర్వప్రయోగ మిది.

విరాళి "దిగంబరా ఇవ్విరాళిె బరామర్శింపుము" (3.-65)

వావిళ్ల నిఘంటువున భాగవతము (4-777) నుండి ప్రయోగము గ్రహించినది.

పల్లఱపులు వి.బ (పలు అఱపులు) నీచపుమాటలు దుర్భాషణములు.

"శాస్త్రంపు పల్లఱపులు" (3-2)

ఈ పదము నీకవులు తమ వరాహపురాణమున వాడినారు.

"నీవఱచు పల్లఱపుల్ సహించితి"(11-91)

ఈకవులకు సమకాలికుడగు నారాయకవి పంచతంత్రమున దీనిని వాడినారు.

పల్లఱపులు మాని(1-199)

వావిళ్ల నిఘంటు వీపదమును గ్రహించినది కాని ఈప్రయోగము చూపలేదు.

బోడి బోడ (క.బోడి), వి. సన్యాసి. ముండవిధవ. నిందాద్యోతకము

సీ.పా.

ఏబోడి గావించె యింత విరిపోటు తల్లీ నీ కుపనిషత్తరుణితోడ

ప్రబోధ 3-3

(సూ.ని. 5సం. పుట 1173)

ఈ పాదముననేగాదు తక్కిన పాదములలోని స్త్రీవాచకములు నిందార్థద్యోతకములే.

సీ.

ఏ జంత బోధించెనే
ఏ బోడి గావించెనే

ఏ ముండ యెడ బాపెనే
ఏ రండ బ్రమయించెనే

ఇందు మొదటిది మహద్వాచకము దాసరిబోడి, వైజ 4-32. రెండవది మహతీవాచకము

బోడి శబ్దమునకు మహతీవాచకమున ప్రబోధచంద్రోదయ ప్రయోగ మొకటియే యున్నది.

పూఁబోఁడి-సమాసములో బోడి శబ్దము గలదు. కాని ఇది సార్థబిందుకము. "బహువ్రీహిని స్త్రీవాచ్యం బగుచో నుపమానంబు మీది మేనునకుఁ బోడియగు" అని సూరి (సమా 23సూ.) నేటివ్యాకరణములో "బోఁడి"లో అరసున్న యున్నది గాని - సూరి సూత్రాంధ్రవ్యాకరణమున "మేనుర్బోడి స్యాత్" అని నిరనుస్వారముగా నున్నది.

పూబోడిలోని బోడి విశేషణము
బోడి వ్యస్తముగా విశేష్యము

మనవి పత్రము మి.స. మనవిపత్రము రాజులకు విన్నవించెడి పత్రికారూపమైన మనవి మాటలచే కానిది అని యర్థము.

గీ.

అనుచు మనవిపత్ర మర్పింత

ప్రబోధ (2-52)

ఈ శబ్దము సూ.ని. లో లేదు.

ముండ వి ఈ పదమునకు 1 విధవ, 2. దాసి, 3. ఉంపుడుకత్తె, 4. ధూర్తురాలు; వంచకురాలు అను నాలుగర్థములు సూ.ని. లో గలవు. వానిలో ఇందు 4వ యర్థమున "ఏ ముండ యెడబాపె" (3-3) అను ప్రయోగము చూపబడినది. (సం 6 పుట 357)

మృద్బిందులు సం.వి.అ. పుం, మట్టికలిసిన నీటికణములు మృద్బిందులు దాల్చి 2-10 (ఇది సూ.ని.లో లేదు)

లక్కముద్ర వి లక్కతో ముద్రవేసిన పత్రము, ఈశబ్దము సూ.ని.లో లేదు.

గీ.

అనుచు మనవిపత్ర మర్పింపఁ దత్పత్ర
మునకు నిడిన లక్కముద్రఁ జూచి

2-52

ఈ పదమున కిదియే తొలిప్రయోగము. ఆవెనుక నీపదము చదలువాడమల్లన విప్రనారాయణచరిత్రమున గలదు

వై లక్కముద్ర పెట్టి

విరాకులవిత్తు. విణ (విరియు + ఆకు + విత్తు) చెడినది

"అలవడ వేదమార్గమున విరాకుల విత్తుగ. (2-45)

(సూ.ని. 7సం. 344పుట)

ఈ పదమునకు నొక్కటే ప్రయోగము లభించినది. వ్యుత్పత్తినిబట్టి "పూర్తిగా, సమూలముగా చెడిన" యనునర్థము నిచ్చుచున్నది "విరాకు” అనుపదము సంస్కృతమున లేదు ఈ పదము అ, యతితో నుండుటచే వ్యుత్పత్తి సరియైనది.

విరాళి వి (స.విరహః) 1 మోహము వలపు 2. భక్తి వీణ, మోహము కలది.

సూ.ని. (7సం. 345 పుట)

ప్రయోగములు ధనాభిరామమున "తరితీపరి గాక విరాళిగాక" అనియు 'విరాళికల్కి' అని రాజవాహనవిజయమునుండి ప్రయోగము లీయబడినవి కాని విరాళికి తొలిప్రయోగ మిందేకలదు. "దిగంబరా, ఇవ్విరాళిం బరామర్శింపుము" సూ.ని.లో ఈప్రయోగము లేదు.

విరుద్ధపరచు మి.స.క్రి విరోధింపఁజేయు “వేద మార్గోపనిషత్తుల తోడ శ్రద్ధను విరుద్ధపరచి" ప్రబోధ (3-2) విరుద్ధపడు మి.అ.క్రి ప్ర.చం (4-58) (వా.ని.) (సూ.ని. 7సం. 355 పుట) పైప్రయోగ మొక్కటియే చూపబడినది. ప్రయోగాంతరము లభ్యము కాలేదు.

సంకటపరచు. మి.స. క్రి బాధించు, పీడించుఁ చపలునికిం క్రొత్తచేసి సంకటపఱచెన్. (ప్రబోధ 3-70) (సూ.ని. 8సం, 767పుట)

ఈ పదమున కిది యొకటియే ప్రయోగము.

సంబెల, వి.వక్కలాకులతిత్తి సంబెళ- సంపుటము. దర్భలు మొదలగువానితో నల్లిన సజ్జ అను నరములు చూపబడినవి. (సూ.ని. 8సం 828 పుట) ఈగ్రంథమునందలి "సంబెళలోపలిదేవపూజలున్" అను ప్రయోగము చూపబడినది. (2-8) (కాశీ 1-85 వా.ని.)

సాహో. హిం అవ్య. పరివారజనముచేయు హెచ్చరిక ఈ పదము ప్రయోగించుటకు తొలి కవులు వీరే. “సాహో యని కటికవారు సందడిజడియం" (2-29) వరాహపురాణమున 'సురలు సాహొ యనగన్' (6-42) అని తరువాతి ప్రయోగములు దీని ననుసరించినవి.

సురధాణి. సురధాణ తురకదొర (హిం. సుల్తాన్) చక్రవర్తి

గజపతి సురధాణి గడిదుర్గములకెల్ల
రాజువజ్రంపు బోరుతప్ప

ప్రబోధ చం (1-19) సూ.ని. 8సం 1067పుట

బోరుతప్ప అనుట తప్పు - బోరుతల్పు అని యుండవలను.

ఇట్టితప్పు లీయెనిమిదవసంపుటమున చాల గలవు. ఈ సంపుటము పూర్తిగా సంస్కరింపదగినది

తెలుగున ప్రబోధచంద్రోదయములు

తెలుగుభాషలో ప్రబోధచంద్రోదయము మొదటిసారిగా నవతరింపజేసినవారు నందిమల్లయ ఘంటసింగయకవులే, వారి వెనుకనే తక్కిన కవులు దీని పద్య ద్విపదలో రచించిరి.

పద్యకావ్యము

కొటికెలపూడి వేంకట కృష్ణ సోమయాజి (1764-1864) ఈతడు బొబ్బిలి సంస్థానకవి నూరేండ్లు జీవించినకవి. ఈతని గ్రంథ మముద్రితము.[29]

ద్విపదకావ్యము

కావ్యకర్త రాచూరి వేంకటలింగమంత్రి. ఇది యైదాశ్వాసములు గలది. అముద్రితము.[30] ఈతడు దాక్షిణాత్యకవి. క్రీ.శ. 1800 ప్రాంతమువాడు.

ఆధునికయుగము

సంస్కృతనాటకమునకు యథానువాదనాటకకర్తలు కందుకూరివీరేశలింగము (1892) వడ్డాది సుబ్బారాయడు (1893) ఆకుండ వ్యాసమూర్తిశాస్త్రి (1911)[31] వీనిలో నేవియు ప్రచారములోనికి రాలేదు.

శ్రీగట్టి లక్ష్మీనరసింహశాస్త్రిగారి యనువాదము క్రిందటియేడు క్రీ.శ. (1975) ప్రకటితమైనది.

అద్వైతపరముగా నీ నాటకము రచించిన వెనుక సంస్కృతమున దీని కనుకరణములు బయలు వెడలినవి. వానిలో పేర్కొనదగినవి రెండు-

1 సంకల్ప సూర్యోదయము - ఇది విశిష్టాద్వైతపరముగా రచింపబడినది. కృతికర్తలు మహాప్రసిద్ధులు వేదాంత దేశికులు (1270-1372)

2 శివలింగసూర్యోదయము - ఇది శివాద్వైతపరముగా మల్లనానారాధ్యులచే రచితమైనది.

పైరెండును రచించినకవులు ప్రతిభావంతులే యైనను, కేవలము అనుకరణములుగా నిలిచిపోయినవేగాని ప్రచారములోనికి రాలేదు.

పైవివరణములనుబట్టి సంస్కృత ప్రబోధచంద్రోదయనాటకము మహాగంభీరమైన అద్వైతవేదాంతమును ప్రతిపాదించు ఆధ్యాత్మికనాటకమని మనకు స్పష్టమైనది.

అనుసరణలు

తెలుగున ప్రబోధచంద్రోదయ నాటక మవతరించిన వెనుక, అట్టిదే మఱియొకకావ్యము తెలుగున వెలసినది. దాని పేరు జగన్నాటకము.

ఇది ప్రబోధచంద్రోదయమువలె సంస్కృత నాటకానువాదముకాదు. తెలుగు ప్రబోధచంద్రోదయము ననుసరించిన స్వతంత్రకావ్యము.

ఈకావ్యకర్త ఏదుట్ల శేషాచలుడు.[32] ఇతడు తెలంగాణ ప్రాంతమువాడు. కృత్యాదియం దీతడు చేసిన కవిస్తుతిలో పింగళి సూరన కడపటివాడు గావున నీతడు క్రీ.శ. 1700 ప్రాంతమున నుండియుండును.

ప్రబోధచంద్రోదయమువలె నిదియు నైదాశ్వాసముల పద్యకావ్యము. ఈకావ్య మముద్రితమగుటచేత ఇందుగల యాశ్వాసములందలి విషయములను వివరించుచున్నాను.

ఇందు మొదటి రెండాశ్వాసములకన్న తరువాతి మూడాశ్వాసములలోను నీ నాటకకథ హెచ్చుగా నున్నది.

ప్రథమాశ్వాసము

సత్స్వరూపంబైన పరబ్రహ్మంబునందు, జీవప్రకృత్యాదిజననంబును నతండు వినోదార్థంబుగా భరతశాస్త్రానురూపాధ్యాత్మవిద్యానుసారంబుగా త్రివిధాండంబులు బుట్టి వికసించిన తద్భూతత్రిశక్తి త్రిమూర్తు లన్యోన్యపరిగ్రహసామర్థ్యంబున నాట్యసామాజికసంపత్తి పరబ్రహ్మనిర్దేశంబున నిరూపితులై నిలుచుటయు తత్పరమేశ్వరుండు సభాసదనంబు గల్పించి పేరోలగం బున్న సమయంబున మార్దంగికాది సామాజికజనంబు నతనిం బ్రశంసించుటయు బుద్ధివిదూషకుడు మనస్సూత్రధారి యనునుతంబున విప్రమాతృకాగమనసూచనము చేయుటయు ననునవి గలవు.

ద్వితీయాశ్వాసము

విప్రమాతృకాగమంబును ఆయ (...)ంబు వాచికాభినయంబుల జెప్ప(—) దను గమ్యమానులైన విప్రులు వేదశ్రోతజ్యోతిషసాముద్రికశకునస్వప్నసాహిత్యవైద్యాదివిద్యలు ప్రసంగించుటయు క ( ) దాచ్చా ఆంగికాభినయంబును ( ) తత్పురోభాగమున చతురంగబలసమేతులై రాజమంత్రులు చనుదెంచుటయు తమతమ...టయు... నాట్యాభినయంబు చూపుటయు మాగధులు స్తోత్రంబులు చేయుటయు వైశ్యమాతృక యేతెంచి యాహార్యంబున నభినయించుటయు తద్వ్యవహారగోత్రమాతులకన్యావివాహనిర్ణయంబును శూద్రమాతృక చనుదెంచి సాత్వికంబున నభినయించి వర్ణభేదంబు దెలుపుటయు సకలశక్తిప్రకారంబు సేయుటయు ననునవి గలవు.

తృతీయాశ్వాసము

మహాకావ్యంబునందు అహంకారుండు మమకారియను భార్యసమేతుండై వచ్చితనప్రభావంబు వక్కాణించుటయు, మోహుం డేతెంచి తనస్థితిని జెప్పుటయు కామాగమనంబును రతివర్ణనంబును లోభుండు తృష్ణ యను పత్నితోడం గూడి చనుదెంచి తననడక చెప్పుటయు క్రోధుండు హింసయను మహిషీసమేతంబుగా మదమత్సరులం గూడి వచ్చి తనప్రభావంబు రూపించుటయు గాణాపత్య, సత్య, బౌద్ధ, జైన, చార్వాక, శాక్తేయు లేతెంచి తమస్థితులు వచించటయు శైవ, వైష్ణవ సంవాదంబుచే యుద్ధం బగుటయు సుమతియని సాధ్విసహితంబుగా వివేకు డరుదెంచి కలహంబు మాన్చుటయు ననునవి గలవు.

చతుర్థాశ్వాసము

ద్వైతవిశిష్టాద్వైతు లేతెంచి, భేద భేదాభేద భేదంబుచేత బ్రహ్మస్వరూపంబు నిరూపించుట యనునవి గలవు.

పంచమాశ్వాసము

జగన్నాటకంబను మహాకావ్యంబునందు విరాడ్విగ్రహుం డహంకారభార్య యైన మమ శాంతిని వానికిచ్చి పెండ్లిచేసి, నిరహంకారుండని పేరు పెట్టుటయు శాంతి పరిచయంబును నొందుటయు చంద్రవాయుమన్మథాద్యుపాలంభంబును పూజావిధానంబును శాంతిగర్భంబును జ్ఞానదేవుండు జనియించి జగన్నాటకంబునకు వచ్చుటయు జ్ఞానోపదేశంబును భూమీశు నితిహాసంబు దెలుపుటయు ఉదయాస్తమయవర్ణనంబును శాంతి నిరహంకార జ్ఞానదేవులు జనులకు సంశయపరిచ్చేదంబుగా పలుకుటయు సకలజనులు నప్పరమపురుషుని మతినిలుపుటయు ననునవి గలవు.

ప్రబోధచంద్రోదయము : జగన్నాటకము భేదసాదృశ్యములు

జగన్నాటకమున పైని వివరించిన కథాక్రమమునుబట్టి చూడ నది పూర్తిగా ప్రబోధచంద్రోదయము నాదర్శముగా పెట్టుకొని దాని ననుసరించినదే యగుట స్పష్టము. అందువలె నిందును నైదాశ్వాసములు గలవు. రెండింటియందు ఈశ్వరుండైన పరబ్రహ్మంబునందు జీవప్రకృత్యాదిజననము వర్ణితమైనది. అందువలె నిందును వివేకుడు మతి కాముడు రతి క్రోధుడు హింస లోభుడు తృష్ణ అహంకారుడు అనుపాత్రలు వత్తురు. అందు ప్రబోధచంద్రుడు ఇందు జ్ఞానదేవుడు జనించును. బౌద్ధ, జైన, చార్వాకాది మతప్రసక్తి రెంటియందు సమానమే.

భేదములు

ప్రబోధచంద్రోదయము జగన్నాటకము
1 అద్వైతవేదాంతప్రతిపాదకము జీవబ్రహ్మైక్యము 1 విశిష్టాద్వైతవేదాంతప్రతిపాదకము జీవబ్రహ్మభేదము
2 ఈశ్వరునికి మాయవలన మనసు మనసునకు ప్రవృత్తి నివృత్తి 2 ఇందు పరబ్రహ్మమునకు జీవప్రకృత్యాదిజననము ద్వైతవిశిష్టాద్వైతమున
భార్యలవలన కామక్రోధాదులు వివేకాదుల జననము మాయలేదు
3 అహంకారుని భార్య పేరులేదు 3 ఇందు మమకారి యను భార్యగలదు.
4 జైన బౌద్ధ చార్వాకాది సంవాదము 4 శైవ వైష్ణవ సంవాదము
మోహునికి వివేకునికి యుద్ధము వారిరువురకు యుద్ధము
5 వివేకునకు ఉపనిషద్దేవి వలన ప్రబోధచంద్రుని జననము. 5 నిరహంకారునికి శాంతివలన జ్ఞానదేవుని జననము

దృశ్యకావ్యములు

యక్షగానములు

జగన్హాటకము శ్రవ్యకావ్యము కాని దృశ్యకావ్యములైన యక్షగానములలో వేదాంతపరమైన యక్షగానములుకలవు. అవి ప్రబోధచంద్రోదయానుసరణములే.

ముక్తికాంతాపరిణయము

పరమానందతీర్థరచితము ఈతడు క్రీశ 1680 ప్రాంతమునాడు. “సచ్చిదానందపురాధీశ్వరుడు తన పుత్రికయగు మోక్షకన్యకకు స్వయంవరము చాటించుట - వివిధమతాధిపతులును దేశాధీశులు విచ్చేయుట - మోక్షకాంత నొక్కొక్కరి నొక్కొక్కనెపమున రప్పించి అద్వైతవేదాంతమతస్థుడగు వివేకుని పెండ్లియాడుట నిందలి యితివృత్తము.

ముక్తికాంతావిలాసము

తరిగొండ వెంగమాంబ రచితము (1784-1868) జగదీశ్వరుడు మాయను వీడి ముక్తికాంతను బొందగోరి యామె మందిరమునకువచ్చుట విజ్ఞానకాంత (చెలికత్తె) తలుపుమూయుట - తలుపుకడ నావల నీవల నాయకానాయకుల సంవాదములు - మాయాశక్తి వైరాగ్యజ్ఞానశక్తులతో వాదించుట మున్నగునవి యిందలి ఇతివృత్తము.

సుజ్ఞానఎఱుక

రామబ్రహ్మయోగిరచితము. క్రీశ 17వ శతాబ్ది ప్రతిలేని నిర్గుణిని పతిగాను మతి కోరినబుద్ధి కాంతకడ "ఎఱుక” (జ్ఞానము) అను నెఱుకత వచ్చి వేదాంతగోష్ఠి నెఱపుట ఇందలి ఇతివృత్తము.[33]

నాటకము

వివేకవిజయము

ఇది చల్లాసూరయకవిరచితము. ఈతడు క్రీశ. 16వ శతాబ్దివాడు. దాక్షిణాత్యకవి తంజావూరిదగ్గర పొందవాక గ్రామనివాసి. ఇత డద్వైతమతానుయాయి. సదానందయోగి శిష్యుడు. ఇతడు జంటకవుల తెలుగు ప్రబోధచంద్రోదయమును, వివేకవిజయము అనుపేర నాటకముగా రచించినాడు. ఇందు అంకవిభజన లేదు. నాటకమువలె పద్యములున్నను యక్షగానరీతిని తాళప్రధానము లైన త్రిపుటలు, జంపెలు, దరువులు మున్నగు గేయరచనా భేదములుగలవు. ఎడనెడ చిన్నవచనము లున్నవి. ద్విపదలు గలవు. కవి గ్రంథాంతమున దీనిని నాటక మనియే యిట్లు పేర్కొన్నాడు.

చ.

అలరగ నీవివేకవిజయాభిదనాటక మెవ్వరేని ని
శ్చలమగు భక్తిచేఁ జదువఁజాలి తదీయపదార్థభావముల్
సలలితచిత్తవృత్తి ననిశంబును చింతన చేసిరేని వా
రలఘుతరాత్మతత్వపద మంది శుభస్థితి గాంతు రెప్పుడున్.

పద్య ప్రబోధచంద్రోదయమున కిది హృద్యమైన నాటకానువాదము. అందలి కథాక్రమమే యిందలి కథాక్రమము, అందలి పాత్రలే ఇందలి పాత్రలు. చిదానందనగిరి- ఈశ్వరుడు-మాయ-మనస్సు - ప్రవృత్తి నివృత్తి భార్యలు - కామమోహాదులు-దంభుని, మోహుని కాశీనివాసము - బౌద్ధజైనచార్వాకాది మతప్రసక్తి -వివేకునికి ఉపనిషద్దేవికి సమాగమము- ప్రబోధచంద్రుని జననము తూచాతప్పక యున్నవి. నాటకాంతమున మాత్రము సూరయకవి మార్పుచేసినాడు.

ఈ నాటకమున ప్రబోధచంద్రుని జననమైన తరువాత, వివేకుడు ముక్తికన్యను గాంచును. ఆ కన్య పెద్దదియైన వెనుక స్వయంవరము చాటించును. ఈ స్వయంవర మంతయు విష్ణుభక్తి నడపును. ఆ స్వయంవరమున శైవవైష్ణవ, ద్వైతాద్వైతాది సకలమతాధిపతులును వత్తురు. వారినందరిని విష్ణుభక్తియే పరిచయము చేయును. ముక్తికాంత అద్వైతపతిని వరించును.

ఈతడు క్రీ.శ. 16వ శతాబ్దివాడగుటచేత జంటకవుల ప్రబోధచంద్రోదయమున లేని విశిష్టాద్వైతమును మాధ్వమతమును నిందు చేర్చినాడు.

అనుసరణలు

1.

అహంబ్రహ్మీభవించు
"అహంబ్రహ్మీభవించి
తల్లికిం దగినబిడ్డ
కలిగెనని మెలంగుచుండు”

(1-76)

ప్రబోధచంద్రోదయము

"పరగ నప్పరమేశు
సంసారి యనిపించి
పరగ దానవుఁ దహం
బ్రహ్మీభవించెన్"

వివేకవిజయము

2.

నుదుటన్ ముక్కునఁ జెక్కులన్ జుబుకమందున్ గండపృష్ఠంబులన్
బెదవిన్ ఱొమ్మునఁ గుక్షి నూరువుల మృద్బిందుల్ ప్రకాశింప ద
ర్భదళంబుల్ శిఖలోపలం గటితటిన్ బాణిద్వయిం న్మించ గా
నిదెపో దంభము మూర్తిదాల్చె ననఁగా నీయయ్య చూపట్టెడున్

(2-10)

ప్రబోధచంద్రోదయము

నొసటన్ ముక్కునఁ జెక్కులన్ బెదవియందున్ గండభాగంబులం
దసమాంసంబులఁ గుక్షి రొమ్మునను జాన్వగ్రంబునన్ మృత్తికల్
పసగాఁ గన్నడఁగా శిఖిన్ జెవులు నాపాణిద్వయిన్ రొంటినిన్
వెస దర్భాగ్రము లుంచి యున్న యితఁడే వేసాన దంభుండెపో

(పుట 75)

వివేకవిజయము

క.

రాజులు నీతనిపాదాం
భోజంబులు ముట్టవెఱచి పొనపొన దవులన్
రాజితమకుటమణిచ్ఛవి
రాజుల నీరాజనంటు రచియింతు రనన్

(2-16)

ప్రబోధచంద్రోదయము

కల్యాణి.

రాజు లెల్ల నితని పాదపూజ సేయవెఱచి
రాజితాచ్ఛమకుటకాంతిరాజిచేతను
ఓజమీఱఁ బాదనీరాజనంబు లిచ్చి మ్రొక్కె
జేజె విడుచు నుతిశతంబు చేయుచుందురు.

(77 పుట)

వివేకవిజయము

సీ.

పుట్టింప రక్షింపఁ బొలియింపఁ గర్తయౌ
                          భైరవేశ్వరుఁడు మాపాలివేల్పు
ప్రమదనటద్భూతభయదశ్మశానశృం
                          గాటకంబులు మాకు నాటపట్లు
నక్షత్రపటలీవలక్షంబులైన న
                          రాస్థిఖండములు మాహారతతులు
నీహారకరబింబనిభమానవ శరఃక
                          పాలములే మాభుక్తిభాజనములు
గాఁ జరింతుము తమలో జగంబులెల్ల
వేరువేరైన శివునితో వేరుగా వ
టంచుఁ జూతుము సిద్ధయోగాంజనప్ర
దీపితంబైన సుజ్ఞానదివ్యదృష్టి.

(3-32)

ప్రబోధచంద్రోదయము

ద్వి.

వినవోయి మాదైన వృత్తంబు చాల
ఘనుఁడు భైరవుఁడు మాకల్తైనవేల్పు

ప్రకటనటద్భూత భయదశ్మశాన
నికటశృంగాటకనివహంబు లెపుడు
రచ్చపట్టులు మాకు రమ్యవరాస్థు
లెచ్చైన హారము లిందుబింబాభ
నృకపాలపాత్రిక నిండిన సురయు
నొకటఁ గ్రోలుచు....

(పుట 102)[34]

వివేకవిజయము

పై సంవాదములనుబట్టి సూరయకవి జంటకవుల రచన నెంతసన్నిహితముగా తూచా తప్పక యనుసరించెనో తెలియగలదు.

పై యనుసరణలను బట్టి యీ కావ్యప్రాశస్త్యము గ్రహింపవచ్చును.

శృంగారషష్టము లేక కవుల షష్టము

1.శా.

శ్రీరామామణి సీతనాథుని యురస్సీమ న్నిజచ్ఛాయ గ
న్నారం గన్గొని యాత్మ నన్యవనిషేర్ష్యం బూన దత్కంధరన్
హారం బున్పుచు నింకఁ జూడుమన దానౌటం ద్రపంజెందఁ జె
ల్వారున్ రాముడు బ్రోచుఁ గాత చికతిమ్మాధీశుతిమ్మాధిపున్.

(కవిసంశయవిచ్ఛేదము)

2.మ.

 తనతో నల్గిన వాణిపాదముల మీదన్ వ్రాల లేనెత్తి నొ
య్యన పాశ్చాత్యనిజాస్యతన్ముఖములం దన్యోన్య మొక్కప్డు చుం
బన మబ్బంగఁ జతుర్ముఖత్వము ఫలింపం జొక్కు పద్మాసనుం
డనవద్యాయురుదీర్ణుఁ జేయు చికతిమ్మాధీశుఁ దిమ్మాధిపున్.

(సర్వలక్షణసారసంగ్రహము. 1-297)

3.శా.

 చండాంశుప్రభ! చిక్కతిమ్మయతనూజా! తిమ్మ! విధ్వస్తపా
షండం బైన త్రిలింగ భాగవత షష్ఠస్కంధకావ్యంబు నీ
కుం డక్కెం జతురాననత్వగుణయుక్తుల్ మీఱ వాణీమనో
భండారోధ్ధత చూరకారబిరుద ప్రఖ్యాతి సార్థంబుగన్.

సర్వలక్షణసారసంగ్రహము 1.210

అప్పకవీయము

4.సీ.గీ.

వలవదు భయంబు వారెంత వారలైన
నట్టివారలు మనకర్హమైనవారు
వారు నిరయంబునకుఁ గాపువచ్చువార
లనుచు బుద్ధిగఁ జెప్పె మార్తాండ(సుతుఁడు).

3.180

అని యుదాహరింపబడిన గీత పద్యమునకు పైనున్న రెండు సీసపాదములను కీ. శే. మానవల్లి రామకృష్ణ కవిగారు తమ కుమారసంభవము ప్రథమభాగము అనుబంధములో నిట్లిచ్చినారు.

సీ.

వారిధిశయనుఁ జెయ్యారఁ బూజింపని
                   ఖలు గట్టి పెడకేలఁ గట్టి తెండు
హరిమందిరమున కధీశుఁడై నడవని
                   హీనాత్ముఁ గాల్బట్టి యీడ్చి తెండు

(మలయ మారుతము సింగన్న షష్ఠస్కంధము.)

పై సీసపద్యములో రెండు పాదములు కవిగారి కెట్లు లభించినవో తెలియరాలేదు. కవులషష్ఠము వారు చూచి యుందురని పైదానిని బట్టి విశదమగుచున్నది, లేదా వేరొక లక్షణగ్రంథకర్త యెవడైన నుదాహరించెనేమో తెలియరాదు.[35]

5.క.

 అనుటయుఁ గృష్ణద్వైపా
యనతనయుం డిట్టు లనియె నవహితమతియై
వినుమతి గుహ్యము నారా
యణ కవచము భక్తివాంఛితార్థప్రదమున్.

3.338


6.సీ.గీ.

(ఎసగఁ బాత్రిక నోగిరం బిడకమున్నె
యతిరయంబునఁ బరిషేచ మాచరించు)
దత్తరమున నాపోశన మెత్తఁబోయి
భూసురుం డెత్తు నుత్తరాపోశనంబు.

3.164


7.

గీ. తల్లియును దండ్రి దైవంబు దలఁప గురుఁడ
కాఁడె యతఁ డేమి చేసిన గనలఁ దగునె
నాస్తికాధమ యోరి యన్యాయవృత్తి
"నాస్తి తత్త్వం గురోః పర" మ్మనఁగ వినవె.

3.146

సర్వలక్షణసారసంగ్రహము

8.క.

మనుజులలోపలఁ గర్మం
బొనరుచువారెల్ల దండ్యులో వారలలోఁ
గనుఁగొనఁ గొందఱె దండ్యులొ
యనవుడు హరిభటుల కనిరి యప్పార్శ్వచరుల్.

1.134


9.చ.

 అదలిచి నిల్వ వారిఁ గని యంతకకింకరు లెవ్వరయ్య మీ
రిదె యమునాజ్ఞ ద్రోచితిరి యెచ్చటనుం డిట వచ్చినార లె
య్యది గత మడ్డ పెట్టుటకు నెవ్వరివార లెఱుంగఁ జెప్పుఁడా
యదితి తనూజులో సురలొ యక్షులొ సిద్ధులొ కాక సాధ్యులో.

1.137

10 సీ. పా.

 చిగురాకుబోఁడి మైచెమట పన్నీటిలో
              నానుట త్రిషవణస్నానమయ్యె

(1-175)


11 శా.

శీఘ్రం బేటికి వచ్చి సంసృతి భవశ్రీసౌఖ్యగంధంబె చా
నాఘ్రాణింపని మత్తనూజుల దురాత్మా! భిక్షులం జేసినన్
శుఘ్రాదిన్యసమగ్నుఁ జేసితి కృపాశూన్యుండవై గోముఖ
వ్యాఘ్రం బింతియగాక నీవు ఋషివే యాహా వితర్కింపఁగన్.

(1-275)


12. మ.

పదముల్ దొట్రిలఁ గౌనుఁదీవ వెలయింపన్ గేశము ల్దూలఁ బ
య్యెద వక్షోరుహపాళి చేర కనుదోయిం బాష్పముల్ గ్రమ్మ గ
ద్గదకంఠంబున వాక్యముల్ తడబడన్ దద్గేహముం జొచ్చి యా
సుదతీరత్నము గాంచె బాలుని మనశ్శోకానలజ్వాలునిన్

(1-317)


13. గీ.

ఇవ్విధంబున మఱియు ననేకగతుల
లలితశృంగారచేష్టల లాచిలాచి
చూచుచున్నట్టి ప్రమ్లోచఁ జూచి మునికి
మనసు గురుగురమనియె ఝమ్మనియె నొడలు.

(2-244)


14.ఉ.

హంససమానగామినికి నట్టి వినూతనగర్భశుద్ధికిన్
పుంసవనాదికృత్యములు భూపశిఖామణి యార్యసంపదా
శంసితకర్మకర్మఠత సాంగముగా నొనరింప నన్వయో
త్తంసుఁ గుమారునిన్ గనియె దర్పకు నిందిర గన్న కైవడిన్.

(2.268)


15.క.

ఇంటికిఁ జనుటయు మానెన్
నంటొనరింపంగఁజాలె నాగరికులతో
కుంటెనకాడుల గూడెన్
గొంటరియై యతఁ డసాధుగోష్ఠీపరతన్.

(2-354)


16.చ.

పెరిగిన యీసున న్నెమలిపింఛములన్ పురివిప్పఁబోలు నీ
సరసిరుహాక్షివేనలికి సాటిగ నిల్వఁగనోడి చొచ్చె నిం

దిరశరణంబు తేఁటిగమి నీలము లింద్రుని పేరు గాంచె పె
న్నిరులు గుహాశ్రయంబు గనియెన్ నెఱిగల్గినవారి కోర్తురే.

(3-68)


17.క.

నెరసె నెఱసంజ చక్రక
సరసీరుహవిరహభేదసంసూచకమై

(3-133)


18.మ.

గురుబంధుల్ దనుఁ జుట్టి రాదిగిచి యాక్రోశింప నిశ్చేష్టుఁడై
యెరలం దన్ను నెఱుంగలేక యసహృత్ వ్యూఢార్తి ముంజెంది చూ
పరతన్ మ్రోయుచుఁ బో వివర్ణతమెయిం బాటిల్ల

(3-160)


19.క.

అరిగి సమిత్ప్రసవకుశాం
కురపక్వఫలోత్కరంబుఁ గొని గృహమునకున్
మరలి యట వచ్చునప్పుడు
ధరణీసురనందనుండు దనకట్టెదురన్.

(3-177)


20.ఉ.

ఱెక్కలతో సరాగము నెఱిం బరికింపఁడు వేడ్కఁ జెంది యో
యక్కనకాచలంబు విబుధాధ్వమునం జనుదెంచుచున్న

(3-192)


21.ఉ.

జాఱుటయుం దదూరుయుగసాంద్రరుచుల్ కటిమీఁదనుండి దై
వాఱఁగఁ గాంచి పంచశరపంచశరీపరికంపితాత్ముఁడై
పాఱుఁడు దాబహుశ్రుతము బల్మియు భావవిశుద్ధి కల్మియున్
మీఱిన నెమ్మనంబు గడిమి న్నిలుపోపఁగలేక లోలతన్.

(3-251)


22.సీ.పా.

రాయైన తబిసి పేరంటాలిఁ గ్రమ్మర
గలిగించు నడుగుచే వెలసినాఁడు

(3-291)

నందిమల్లయ - మదనసేనము

నదిమల్లయ మదనసేనము అనుకావ్యమును రచించినట్లు పెదపాటి జగ్గన ప్రబంధరత్నాకరమునుండి యీ క్రింది పద్యములవలన మనకు తెలియుచున్నది.

గీ.

అపుడు తానావసానంబునందు మధ్య
కీలితంబయి యొప్పెఁ గెంగేలు వలికి
నవియవు గదా యటంచు నానడిమితీగ
నుపచరింపఁగ వచ్చినదో యనంగ


సీ.

తళతళమను పతాకల తోడ రవికాంతిఁ
                          దలతలమనెడి రత్నములతోడఁ
గనఁగన సొబ గధికంబైన పొడవుతో
                          గనకనమను హేమకాంతితోడఁ
గలకలఁబల్కు చిల్కలతోడ గృహదీర్ఘ
                          కలఁ గలహంససంఘములతోడఁ
బరిపరినాడు బర్హులతో నిజో
                          పరిపరిగతి మేఘపంక్తితోడఁ


గీ.

దముల విహరించు పారావతములతోడ
భ్రమదళివ్రాతసుమవితానములతోడ
బ్రమద వనవాననలచేతఁ బ్రమద మొసఁగి
నెనయు నీమేడతోఁ బ్రతి నెనయగలదె.

(341)


సీ.

పరిపుల్లహల్లకప్రభలు నిండినచోట
                          సాంధ్యరాగద్యుతి చౌకళింప
వికచనీలోత్పలప్రకరస్థలంబుల
                          గీఱిగొన్న చీకట్లు క్రేళ్లు దాఁట
నిర్ణిద్రకుముదవనీప్రదేశంబులఁ
                          దేటవెన్నెల పిల్లతీపులాడ
వికసితకనకారవిందబృందంబులఁ
                          బెరయునీరెండ పింపిళ్లుగూయఁ


గీ.

బగలురేయును దమలోనఁ బగలుమాని
కలిసిమెలిసిన బాగూన గడలుకొల్పి

వివిధమహిమలఁ దనరు నావిమలసరసిఁ
జూచి నివ్వెఱవడి రాజసూనుఁ డపుడు.

(342)


సీ.

మెఱుఁగుశృంగములందు మెదలక యున్నవి
                          నీలమేఘంబులు నీరజాస్య!
వెన్నెలపులుగులు వేకువ చంద్రువైఁ
                          దేలుచన్నవి చూడు తియ్యఁబోఁడి!
మింట నాగడపలు మెల్లమెల్లగ విచ్చి
                          కానరావయ్యెనో కలువకంటి!
పారిజాతపుదీగ బహువర్ణపుష్పభా
                          రంబు మోవఁగలేదు కంబుకంఠి!


గీ.

ననుచుఁ దమలోన గర్భోక్తు లాడుకొనుచుఁ
దనకు నుపచారములు సేయు ననుఁగుజెలులఁ
జూచి నవ్వుచు సహజన్య చూడనొప్పెఁ
జారుదోహదలక్షణసహితయగుచు

(343)[36]

సంస్కృతనాటకములు - ప్రబంధానువాదములు

పూర్వకవులు సంస్కృతవాటకములను ప్రబంధములుగా ననువదించుటకు హేతువు “ఆంధ్రనాటకములు - రంగస్థలములు" అను గ్రంథమున నిట్లుగలదు.[37] “మనప్రబంధములు సంస్కృతనాటకములకును సంస్కృతకావ్యములకును మధ్యవర్తులు. వీనియందు నాటకములయొక్కయు కావ్యములయొక్క యు లక్షణములు సామాన్యముగా నుండుటచే వేఱుగా నాటకములు వ్రాయునవసరము లేకపోయినది.”

కాని యింతకంటె బలవత్తరమైన కారణము నా కీసందర్భమున పొడగట్టుచున్నది. అది సంస్కృతనాటకము లందున్న

భాషావైవిధ్యము - ప్రాకృతము

సంస్కృతనాటకములలో సంస్కృతభాషయే ప్రధానమైనను అందు ప్రాకృతభాషలకు స్థానము గలదు. అందు ఉత్తమపాత్రలకు సంస్కృతమును మధ్యమాధమ లేక నీచపాత్రలకు ప్రాకృతభాషయు నుపయోగింపబడును. ఆపాకృతమైనను నొకటికాదు. ఆరు విధములైన ప్రాకృతములు వాడబడును. శ్రీనాథుడు, కొఱవి గోపరాజు వంటివారు మన పూర్వకవులలో కొందరు సంస్కృత, ప్రాకృతభాషానిష్ణాతులు, కావున యీ భాషావైవిధ్యములమూలననే పూర్వకాలమున సంస్కృతనాటకములు యథామాతృకముగా గద్యపద్యాత్మికముగా తెలుగులోనికి ననూదితములు కాలేదని గ్రహింపవలసియున్నది. ప్రాచీనకవులు ప్రబంధరీతినే యనువదించిరి. అట్టివానిలో మొదటిది.

కేయూరబాహుచరిత్రము (క్రీ.శ. 1300)

ఇది మంచెనకవి ప్రణీతము క్రీ.శ. 1300 ప్రాంతము నాటిది. ఇది సంస్కృతమున రాజశేఖరమహాకవి రచించిన “విద్ధసాలభంజిక” అనునాటికకు తెలుగు. నాటికలో నాలుగంకములే యుండును. గాన నిందు నాల్గశ్వాసములే కలవు. నాటికాకథాక్రమము ననుసరించిన దయ్యు నిందు, నిరువదిరెండు నీతికథలు సంధర్భానుసారముగా చొప్పింపబడినవి. ఇట్లున్నను కావ్యము రసవంతముగా చేయు నేర్పు మంచెనయం దంచితముగా గలదు. దీనికి సుసంస్కృతముద్రణము రావలసియున్నది.

క్రీడాభిరామము (క్రీ.శ. 1430)

ఇది రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతభాషలో రచించిన "ప్రేమాభిరామము" అను నాటకమునకు తెలుగు. ఇది దశరూపకములలో 'వీథి' అను నాటకభేదము ఇది చాలావ్యాప్తమైనది. కాని దీని కర్తృత్వమును గూర్చి భిన్నాభిప్రాయములు గలవు మానవల్లివారు, వేటూరివారు దీనిని శ్రీనాథకృతిగా గ్రహింపగా తక్కిన కవిచరిత్రకారులు వినుకొండ వల్లభరాయనిదిగా గ్రహించిరి.

అప్పకవి స్పష్టముగా శ్రీనాథుని వీథినాటకము అని రెండు పద్యములను అప్పకవీయమున నుదహరించినాడు. (కుసుమంబద్దిన 3-139 కందుకకేళి 3.379) కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసంగ్రహములో "ఒచ్చెం బింతయు (1-66) కుసుమంబద్దిన" అనుపద్యములను శ్రీనాథుని వీథినాటకమునుండి యని ఉదహరించినారు. ప్రథమాంధ్రకవిచరిత్రకారులు గురుజాడ శ్రీరామమూర్తిగారు వీథినాటకము శ్రీనాథునిదిగా వ్రాసియున్నారు.

శృంగారశాకుంతలము (క్రీ శ. 1480)

పిల్లలమఱ్ఱి పినవీరన కవితాగౌరవమువలన నిది విశేషప్రచారములోనికి వచ్చినది. కథలోమార్పులు గలవు.

ప్రభోధచంద్రోదయము (కీ.శ.1480)

నందిమల్లయ ఘంటసింగయ కవులు, దీనినిగూర్చి సవిస్తరముగా ముందు తెలిపితిని ప్రబోధచంద్రోదయము, నాటక కథాక్రమముననే మార్పులు లేక యధామాతృకముగా ననువదింపబడినది. ఈ పద్ధతికి వీరే ప్రారంభకులు.

ప్రసన్నరాఘవనాట్యప్రబంధము (క్రీ.శ. 1550)

ఇది బొడ్డుచెర్ల చినతిమ్మనరచితము. జయదేవుని ప్రసన్నరాఘవనాటకమునకు యథానువాదము.[38] ఇందు ఆశ్వాసములకు బదులు అంకము లనియే యున్నది.

అనర్ఘరాఘవము (క్రీ.శ. 1700)

ఇది బిజ్జుల తిమ్మభూపాలకృతము. మురారి యనర్ఘరాఘవ నాటకమునకు ప్రబంధపరివర్తనము యథామాతృకము. ఇది ముద్రితమైనది.[39]

తెలుగులో జంటకవులు

తెలుగున జంటకవులనుగూర్చి పరిశోధించిన నీక్రిందివారు గన్పట్టుచున్నారు.

కాచవిభుడు-విఠలరాజు

వీరిరువురు రంగనాథరామాయణోత్తరకాండను ద్విపద గావించిరి.[40] వీరిరువురు సోదరులు. తెలుగున తొలిజంటకవులు వీరే. వీరు క్రీ. శ 1350 ప్రాంతమువారు.

నందిమల్లయ, ఘంట సింగయ్య

ప్రబోధచంద్రోదయ, వరాహపురాణాంధ్రీకరణకర్తలు.

తురగా రాజకవి - అయ్యంకి బాలసరస్వతి

వీరిరువురు కలిసి 'నాగర ఖండము' అను పద్యకావ్యము రచించిరి. కీ. శ. 1608 ప్రాంతమువారు.

కేసన-మల్లన కవులు.

వీరిరువురు దాక్షాయణీపరిణయము అను ప్రబంధము రచించినవారు. వీరిరువురు సోదరులు. బమ్మెర పోతనవంశీయులు. పోతనకు మునిమనుమలు. క్రీ. శ. 1850 ప్రాంతమువారు.

అయ్యలరాజు, అయ్యల భాస్కర కవులు.

వీరిరువురును కలిసి “రెట్టమతము" ఆను జోతిశ్శాస్త్రమును పద్యములలో రచించిరి.

ఆధునిక యుగమున చాలమంది జంటకవులు[41] వెలసిరి. వారిలో సుప్రసిద్ధులు.

తిరుపతి వేంకట కవులు

1. దివాకర్ల తిరుపతిశాస్త్రి. 2. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

కొప్పురపు సోదర కవులు[42]

1. కొప్పరపు వేంకట సుబ్బరాయకవి. 2. వేంకట రమణకవి.

వేంకటరామకృష్ణకవులు

1. ఓలేటి వేంకటరామశాస్త్రి. 2. ద్వివేది రామకృష్ణశాస్త్రి

రామకృష్ణశాస్త్రి, వేంకటరామశాస్త్రికి మేనత్త కొడుకు. వీరు పీఠికాపురసంస్థానకవులు, శతావధానులు, గ్రంథకర్తలు.

వేంకట పార్వతీశ్వర కవులు

1. బాలాంత్రపు వేంకటరావు. 2. ఓలేటి పార్వతీశము.

వీరు పద్యకావ్యరచయితలగు కవులేగాక ప్రసిద్ధ నవలారచయితలు. ఇది వీరి ప్రత్యేకత.

శేషాద్రిరమణ కవులు

1 తిరుమల శేషాచార్యులు. 2. దూపాటి వేంకటరమణాచార్యులు

శ్రీనాథయుగము కావ్యవిభజనము

ప్రబోధచందోద్రయ వరాహవురాణ కృతికర్తలైన నందిమల్లయ ఘంటసింగయకవులు తెలుగు సాహిత్యమున శ్రీనాథయుగమునకు జెందినవారు.

శ్రీనాథయుగము

ఆంధ్రవాఙ్మయచరిత్రమున క్రీ.శ. 1400-1500 అని నిర్ణీతమైనది. ఈ కవుల కృతులనుబట్టి వారు శ్రీనాథయుగమున చివరి రెండు దశాబ్దులలో ననగా క్రీ.శ. 1480–1500 ప్రాంతమున నుండెడి వారని చెప్పనగును.

ఆంధ్ర వాఙ్మయమున శ్రీనాథయుగ మొకవిశిష్టయుగము.యుగమున పద్యకవితయేగాక పదకవితయు వర్ధినది. శ్రీనాథుని సమకాలికులగు తాళ్లపాక అన్నమయ్య, తిరుపతి క్షేత్రమున శ్రీవేంకటేశ్వరునిపై వేలకొలది పదములు పాడినారు. ఆయన పదకవితాసార్వభౌముడు. ఇట్లు పద పద్యకవితాసార్వభౌము లిరువురును, సమకాలికులుగా నుండుట మన సాహిత్యచరిత్రమున నొక సంస్మరణీయమైన సన్నివేశము.

శ్రీనాథయుగమున పురాణములు, అనువాదకావ్యములు, కథాకావ్యములు, చారిత్రికకావ్యములు, క్షేత్రమాహాత్మ్యములు, శాస్త్రగ్రంథములు, ద్విపదకావ్యములు వెలసినవి, వానితోపాటు క్రీడాభిరామమను రూపకము వెలసినది. సంస్కృతనాటకములు పద్యకావ్యముగా నీ యుగమున వెలసినవి. పిల్లలమఱ్ఱి పినవీరన కాళిదాసు శాకుంతలనాటకము నందిమల్లయ, ఘంటసింగయ కవులు ప్రబోధచంద్రోదయనాటకము ప్రబంధానువాదములు గావించినారు.

శ్రీనాథయుగమున కృతులయందలి విభాగము పైనచెప్పిన పినవీరభద్రకవి శృంగారశాకుంతల పీఠిక (పుట 4) యం దిట్లుగలదు.[43]

“ఈయన (పిల్లలమఱ్ఱి పినవీరన) శృంగారశాకుంతలము శ్రీనాథయుగలక్షణములకు నిర్దుష్టమైన యుదాహరణము.

ఈ యుగమునందలి కావ్యములన్నిటిని మూడు విభాగములు చేయవచ్చును.

1. పురాణములను పరివర్తించుట:-

1 వరాహవురాణము 4 భాగవతదశమస్కంధము
2 జైమినిభారతము 5 వాసిష్ఠరామాయణము
3 పద్మపురాణోత్తరఖండము 6 ప్రబోధచంద్రోదయము

2. పురాణాంతర్గతకథలను ప్రబంధములుగా చెప్పుట:-

1 శృంగారశాకుంతలము 4 భీమఖండము
2 హరవిలాసము 5 శృంగారనైషధము
3 కాశీఖండము 6 నాచికేతూపాఖ్యానము

3 వివిధకథలను గూర్చి యేకకావ్యముగా రచించుట:-

1 విక్రమార్కచరిత్ర 3 సింహాసనద్వాత్రింశిక
2 భోజరాజీయము 4 పంచతంత్రము

అని యున్నది. దీనికి కొంతవిమర్శన యావశ్యకము.

2. జైమినిభారతము. ఇది పురాణపరివర్తనము కాదు. సంస్కృతమున భారతము ఇతిహాసము గాని పురాణముకాదు.

(జనమేజయుండు ...... నివ్వినుతేతిహాసంబు విని భార. స్వర్గా. 79)
.

4. భాగవతదశమస్కంధము. సంస్కృతమున భాగవతము పురాణము. శ్రీనాథయుగమున వెలసి ఆబాలగోపాల మెఱిగిన పోతన భాగవతమును విడిచి ఒక్క దశమస్కంధము మాత్రమే యెట్లు పేర్కొనబడినదో తెలియుటలేదు.

మడికి సింగన భాగవతదశమస్కంధము ద్విపద యున్నది. ఇది పద్మపురాణోత్తరఖండ కృతికర్తయైన మడికి సింగనదే. భాగవతదశమస్కంధము పైద్విపదకృతి యనుకొనవలెను.

5. వాసిష్ఠరామాయణము. రామాయణము తెలుగువారి వ్యవహారమును బట్టి పురాణము కావచ్చును కాని సంస్కృతమున నది కావ్యము. ప్రథమకావ్యము ఆదికావ్యము. ఇది ఒక్క వాల్మీకిరామాయణమునకు మాత్రమే చెల్లును. రామాయణము పేరితో నున్న తక్కినవాని కిది చెల్లదు. ఇంతకు వాసిష్ఠరామాయణము (ఇదియు మడికి సింగనదే)నకు, అసలు రామాయణమునకు సంబంధము లేదు. మడికి సింగన రచించినది జ్ఞానవాసిష్ఠ రామాయణము వేదాంతగ్రంథము.

16. ప్రబోధచంద్రోదయము. సంస్కృత నాటకమునకు ననువాదమగుచుండగా నిది పురాణముగా నెట్లు పరిగణింపబడినదో దురూహ్యము.

పైయైదింటిలో వరాహపురాణము, పద్మపురాణము, భాగవతము మాత్రమే పురాణములు

పురాణాంతర్గతకథలను ప్రబంధములుగా చెప్పుట

2.1. శృంగారశాకుంతలము : శృంగారశాకుంతలమున భారతకథ ప్రస్తావన యుండుటచేతను, భారతము పురాణమను నూహతోను, ఈ భాగములో చేర్చినారు పీఠికారచయితలు. శృంగారశాకుంతలమంతయు భారతకథనే తూచాతప్పక పూర్తిగా ననుసరించిన నిందుచేర్చుట సమంజసమే కాని, పినవీరభద్రకవియే

"భారతప్రోక్త కథ మూలకారణముగ
కాళిదాసుని నాటక క్రమముకొంత" (1-27)

అని స్పష్టముగా కాళిదాసుని నాటకక్రమమునుగూడ ననుసరించినట్లు చెప్పుటచేతను పేరు "శాకుంతలము" అని పెట్టుటయు నిది నాటకానువాదముక్రిందవచ్చును. కేవల భారతకథయే యైన పినవీరన దీనికి "శకుంతలోపాఖ్యానము" అని పేరు పెట్టునుగాని శాకుంతలమని పెట్టడు. ఇది నాటకానువాదమని విమర్శకుల యభిప్రాయము.[44] భారతము పురాణముకాదు. 2. హరవిలాసము. ఇది యేకైకముగా నొకపురాణమునుండి గ్రహింపబడినకథలు కలదికాదు. కథాకావ్యము.

1,2 ఆశ్వాసములు చిఱుతొండనంబి కథ బసవపురాణములో నున్నది. కాని బసవపురాణము మనపురాణముల వంటిది కాదు.
3, 4 ఆశ్వాసములు గౌరీకల్యాణము కాళిదాసు కుమారసంభవమున కనువాదము.
5వ ఆశ్వాసము ఈశ్వరలింగావిర్భావము.
6వ ఆశ్వాసము హాలాహల భక్షణము.
7వ ఆశ్వాసము కిరాతార్జునీయము (ఇది నన్నయ కిరాతార్జున కథాభాగమునకు నకలు.)

3, 4. కాశీఖండ భీమఖండములు (భీమఖండ కాశీఖండములని క్రమము) స్కాందపురాణాంతర్గతములు కాని ఇందు భీమఖండము మూలము శ్రీనాథునిదిగాని వ్యాసునిది కాదని నిర్ణయింపబడినది.[45]

5. నైషధీయచరితమను శ్రీహర్షునికావ్యమునకు ననువాదము.

6. నాచికేతూపాఖ్యానము. దీనిని పురాణాంతర్గతకథగా చేర్చినారు. దీనికి కరోపనిషత్తు మూలము. భారతమున నీకథ కలదు. దగ్గుపల్లి దుగ్గన తెలుగుకృతికి మూలము సంస్కృతములో నున్న నాసికేతచరితమను కావ్యము.[46]

కావున నీవిభాగములో చెప్పదగినవి రెండే - భీమఖండము, కాశీఖండము. సంస్కృతనాటకానువాదములు అని యొకవిభాగము చేసి అందు

1. క్రీడాభిరామము
2. శృంగారశాకుంతలము
3. ప్రబోధచంద్రోదయము

చూపిన సమంజసముగా నుండెడిది. శ్రీనాథయుగమును గూర్చి నేను ప్రత్యేకగ్రంథము రచించియున్నాను. అది ముద్రితము కావలసియున్నది.

గ్రంథసూచిక

కవితములు

గురుజాడ శ్రీరామమూర్తి (1898) నంది తిమ్మనచరిత్రలో నందిమల్లయ, ఘంటసింగయ కవుల చరిత

ఆంధ్రకవుల చరిత్ర: కందుకూరి వీరేశలింగము ప్రథమభాగము (1917)

ఆంధ్రకవితరంగణి: చాగంటి శేషయ్య. 6వ సంపుటము

సమగ్రాంధ్రసాహిత్యం ఆరుద్ర తొలిరాయలయుగం - నందిఘంటలజంట

మఱుగుపడిన మాణిక్యాలు: డా. బి రామరాజు

విజయనగరసామ్రాజ్యాంధ్రవాఙ్మయచరిత్ర (మొదటి భాగము) టేకుమళ్ల అచ్యుతరావు (1938)

వ్యాసములు

గాండీవి (శ్రీవంతరాంరామకృష్ణరావు) ప్రబోధచంద్రోదయము 1960, ఆం.సా.ప.ప. శార్వరి 50. సం (92) పుట 46.

సంస్కృతము

1. గోపమంత్రికృత చంద్రికవ్యాఖ్యతో కూడిన ప్రబోధచంద్రోదయము (సంస్కృతము) సంపాదకులు వాసుదేవ లక్ష్మణశాస్త్రి (1935)

2. సంస్కృత ప్రబోధచంద్రోదయము: సంపాదకులు కె.సాంబశివశాస్త్రి త్రివేండ్రమ్ (1988)

3. ప్రబోధచంద్రోదయము: పండిట్ రామచంద్రమిశ్రగారి "ప్రకాశ" సంస్కృత హిందీ వ్యాఖ్యానములతో చౌకాంబా విద్యాభవన్ వారణాశి-1 (1968)

  1. చూడుడు: తెలుగులో జంటకవులు అను శీర్షిక.
  2. అష్టదిగ్గజకవిసమాజములో రాయల నాశ్రయించిన తొలికవి ఎవరు? - శ్రీ కే. యస్. కోదండరామయ్య. పుటలు, 62-63 (1972)
  3. ప్రబంధరత్నావళి - కొత్తకూర్పు - 469 పద్యము. (1976)
  4. ఈతని గూర్చిన వివరములు ఆంధ్రదేశ చారిత్రక భూగోళ సర్వస్వము మొదటి సంపుటములో చూడనగును.
  5. ఆంధ్రకవితరంగిణి 6వ సంపుటము - నందిమల్లయ ఘంటసింగయ కవులు, పుట 145.
  6. ఆంధ్రకవి తరంగిణి - పూర్వోక్తము పుట 133
  7. చూ. విజయనగరసామ్రాజ్యాంధ్రవాఙ్మయము, ప్రధమభాగము
  8. హరిభట్టు వరాహపురాణమును డాక్టరు దేవరకొండ చిన్నికృష్ణశర్మగారు (రాజధాని కళాశాల-మద్రాసు0 పరిష్కరించి, అచ్చొత్తించిరి.
  9. శృంగారషష్ఠము. డా. నేలటూరి వెంకటరమణయ్య. కిన్నెర, జూలై 1953, పుటలు 531-588
  10. శృంగారషష్ఠము. డా. నేలటూరి వెంకటరమణయ్య. కిన్నెర, జూలై 1953, పుటలు 531-588
  11. తెలుగున వామన పురాణరచయితలలో- నందిసింగన మొదటివాడు. తరువాత
    1. లింగమగుంట రామకవి - క్రీ శ. 1550
    2. ఎలకూచి బాలసరస్వతి - క్రీ.శ. 1600 (అలభ్యము)
    3. పోన్నతోట ఔబళకవి - క్రీ.శ. 1650 (లభ్యము)
    వామనపురాణము నాంధ్రీకరించిరి.

  12. మూలమునందలి నాందీశ్లోకములకు తెలుగు. వానిని విమర్శభాగమున చూడనగును.
  13. దేవమ్మ, దుగ్గమ్మ ఈ రెండు పేర్లును గంగమంత్రి కృతినందిన నాసికేతూపాఖ్యానమునుండి గ్రహింపబడినవి.
  14. అనంతామాత్యునిగంగయ - నిడుదవోలు శివసుందరేశ్వరరావు ఆంధ్రదేశచరిత్ర
    భూగోళసర్వస్వము మొదటిసంపుటము- పుట209 212

  15. అనంతామాత్యునిగంగయ - నిడుదవోలు శివసుందరేశ్వరరావు ఆంధ్రదేశచరిత్ర
    భూగోళసర్వస్వము మొదటిసంపుటము- పుట209 212

  16. ఈ వివరములకు పూర్వోక్తగ్రంథవ్యాసము చూడుడు. అనంతామాత్యుని గంగయ. పుటలు 210-211
  17. ఆంధ్రదేశచారిత్రకభూగోళసర్వస్వము ప్రథమసంపుటము పుట 211
  18. ఈ సందర్భమున అద్వైతవేదాంతప్రతిపాదకమైన భాగవతమును తెనిగించుచు బమ్మెరపోతన చెప్పిన వాక్యము గమనింపదగినది.
    "మజ్జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండఁగన్" (1-21)
  19. ప్రబోధచంద్రోదయవిమర్శనము ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక తృతీయసంపుటము. 6వ సంచిక 1914. పుటలు 400-424.
  20. ప్రబోధచంద్రోదయవిమర్శనము పూర్వోక్తము. ఆంధ్రభాగవతమున నీపురంజనోపాఖ్యానము చతురస్కందమున 742 పద్యము మొదలుకొని 851 వరకును 109 గద్యపద్యములలో గలదు.
  21. పద్యకావ్యములలో నొక్క సముఖము వేంకట కృష్ణప్పనాయని రాధికాసాంత్వనమున నాటకమునందువలె పద్యములలోనే సంభాషణగలదు.
  22. ఈ పదమును గూర్చి పింగళివారి ఆంధ్రవాఙ్మయచరిత్రలో గలదు. తెలుగున నిది కావ్యములలో శ్రీనాథుని కాలమునుండి యున్నదని శ్రీ నాగళ్ల గురుప్రసాదరావుగారు నిరూపించిరి. (చూ. కలగూరగంప - ఆంధ్రవాఙ్మయచరిత్ర, భారతి - (సెప్టెంబరు 1976 పుట 58))
  23. విజయనగరసామ్రాజ్యాంధ్రవాఙ్మయచరిత్ర పథమభాగము పుట 268-270
  24. ఈ రాలు శబ్దమునుగూర్చి చూడుడు Annals of Oriental Research Madras University పత్రిక యందు సం. 18(1968) లో నావ్యాసము “రాలుప్రత్యయచరిత్ర”
  25. ఈ లక్షణగ్రంథము నూరేండ్లక్రిందట కూచిమంచి తిమ్మకవి సార్వభౌముని కైదవతరమువాడైన కూచిమంచి వెంకటరాయకవిచే రచితము. ఇందు ప్రబోధచంద్రోదయమునుండి నాలుగు పద్యము లుదాహరింపబడినవి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారిచే నూతనముగా ప్రకటితము (1976) పరిష్కరణ - కోవెల సంపత్కుమారాచార్య.
  26. దీనిని గూర్చి చూడుడు నాఉదాహరణవాఙ్మయచరిత్ర పుట 47.
  27. చూ. హంసడిభకోపాఖ్యానము నావ్యాఖ్య పుట 109
  28. సూ.ని. సూర్యరాయాంధ్రనిఘంటువు మొదటి సంపుటము.
  29. మదరాసు ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారము కాగితపుప్రతి
  30. మదరాసు ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారము తాళపత్రప్రతి 715(సమగ్రము)
  31. ఆంధ్రవాఙ్మయసూచిక పుట 118
  32. మఱుగుపడిన మాణిక్యాలు. డాక్టరు బి. రామరాజు ఏదుట్ల శేషాచలుడు - గోలకొండ పత్రికా ప్రచురణ 1961 ఈ శీర్షికయందలి విషయములన్నియు నిందుండి గ్రహింపబడినవి పైగ్రంథకర్తకు కృతజ్ఞుడను.
  33. పై మూడును డాక్టరు యస్వీజోగారావుగారి ఆంధ్రయక్షగానవాఙ్మయమునుండి గ్రహింపబడినవి. ఆంధ్రవిశ్వకళాపరిషత్తు ముద్రణ (1964)
  34. వివేకవిజయము - యక్షగానములు సంపుటము 4 ఆంధ్రవిశ్వకళాపరిషత్ప్రకటితము. 1959.
  35. మానవల్లికవి రచనలు వుట 16. ప్రస్తుత పరిష్కర్త పీఠికా సహితము ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణ 1978.
  36. ప్రబంధరత్నావళి వేటూరి ప్రభాకరశాస్త్రి ద్వితీయ ముద్రణము 1976. పుటలు 72,78. ఇందు ప్రస్తుత గ్రంథపరిష్కర్త పీఠిక కలదు.
  37. టేకుమళ్ల అచ్యుతరావు. విజయనగరసామ్రాజ్యాంధ్రవాఙ్మయచరిత్ర పుట 168-169
  38. ఈ గ్రంథము నూతనముగ 1982లో డాక్టరు బి. రామరాజుగారిచే సంపాదితమై పీఠికాపరిష్కరణములతో ముద్రితమైనది.
  39. ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీవారు దీనికి తిరిగి సుపరిష్కృతముద్రణ గావించుచున్నారు.
  40. ఈ ద్విపద ఉత్తరరామాయణము పూర్వము “సరస్వతిపత్రికలో కొంతభాగము ఆ వెనుక చెలికాని లచ్చారావుగారి ఆంధ్రభాషావిలాసిని గ్రంథమాలలో చాలవఱకు ముద్రితమైనది. దీనికి సుసంస్కృతమైన శుద్ధప్రతి చాల యావశ్యకము.
  41. జంటకవులను గూర్చి చూ.
    1. ఈయూణ్ణి వీరరాఘవాచార్యులు సంస్కృతమున జంటకవులు. భారతి ఫిబ్రవరి 1988.
    2. AAN Raju: Handbook of Pseudonymous Authors in Telugu (1974)
  42. వీరినిగూర్చి సంపూర్ణవివరములు నాచేత రచింపబడిన “కొప్పరపుసోదరకవులచరిత్ర" అను గ్రంథమును చూడనగును.
  43. శృంగారశాకుంతలము, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారి ప్రచురణ. పీఠికారచయిత డాక్టరు శ్రీమతి నాయని కృష్ణకుమారి, సంపాదకురాలు, 1967.
  44. విజయనగర సామ్రాజ్యమందలి ఆంధ్రవాఙ్మయ చరిత్రము - పిల్లలమఱ్ఱి పినవీరన - శృంగారశాకుంతలము పుట 167 టేకుమళ్ల అచ్యుతరావు (1933)
  45. శ్రీనాథుడు. డాక్టరు కొర్లపాటి శ్రీరామమూర్తిగారి సిద్ధాంతగ్రంథము. (పుటలు 287-424)
  46. విజయనగరసామ్రాజ్యమునందలి ఆంధ్రవాఙ్మయము పుట 185.